[[@YHRK]] [[@Spiritual]]

MānDūkya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


అధర్వణవేదాంతర్గత

13     మాండూక్యోపనిషత్

(A STUDY OF THE AWAKENED, DREAMY, DEAD-SLEEPY AND THE TRIO-OPERATOR PHASES / FORMS / STATES)

శ్లోక తాత్పర్య పుష్పమ్

NOTE: ముక్తికోపనిషత్తులో ఈ విధముగా చెప్పబడినది.
శ్రీరాముడు : ఓ హనుమా! ఒక్క మాండూక్యోపనిషత్ యొక్క తత్త్వసారమును అధ్యయనము చేసినంత మాత్రముచేతనే ముముక్షువు - ఇక్కడే ఇప్పుడే ముక్తిని సంతరించుకోగలడు. ఒకవేళ మాండూక్యోపనిషత్ …. పరిశీలించిన తరువాత కూడా ఆ ముముక్షువుకు “నేను సర్వదా ముక్తుడనే" … అనే భావన సుస్థిరము కాకపోతే, దశోపనిషత్తులు (ఈశ - కేన - కఠ - ప్రశ్న - ముండక - మాండూక్య - తైత్తరీయ - ఐతరేయ - ఛాందోగ్య - బృహదారణ్యకములు) అధ్యయనము చేయటం చేత ఆత్మారామ జ్ఞానము లభించి, నా ధామమును ఆతడు చేరగలడు.

శ్లో।। అద్వైతామృత వర్షాయ।
శ్రుత్యాకాశ విహారిణే।
చిద్ఘనాయ ప్రసన్నాయ
శంకరాయ నమో నమః॥
(జీవ-జగత్-పరబ్రహ్మ ఐక్య రూపమగు) ‘అద్వైతామృతము’ను వర్షింపజేయువారు, (‘కేవలమగు ఎరుక’ - అను) ‘‘చిద్ఘనానంద స్వరూపులు’’ - అగు శంకర భగవానునకు, శంకరభగవత్పాదులకు నమస్కరిస్తున్నాము.


ఓం।
భద్రం కర్ణేభిః శృణుయామ దేవా।
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః।
స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిర్వ్యశేమ దేవహితం యదాయుః।
భద్రం నో అపి వాతాయ మనః।
ఓం శాంతిః శాంతిః శాంతిః॥
ఓం।
భద్రం కర్ణేభిః శృణుయామ దేవా।
భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః।
స్థిరైః అంగైః తుష్టువాగ్ంసః తనూభిః।
వ్యశేమ దేవహితమ్ యత్ ఆయుః।
స్వస్తి నః ఇంద్రో వృద్ధశ్రవాః।
స్వస్తి నః పూషా విశ్వ వేదాః।
స్వస్తి నః తార్క్ష్యో అరిష్టనేమిః।
స్వస్తి నః బృహస్పతిః దధాతు।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః॥
మా ఈ రెండు చెవులతో శుభప్రదమైన శాస్త్రవాక్యములు, వాటి అర్థ ప్రవచనములు వినుచుండెదము గాక!
మేమంతా యజ్ఞ కర్మ నిష్ఠులమై శుభప్రదమైన ఆత్మ-తత్త్వమునే దర్శించుచుండెదము గాక! స్థిరమైన అంగములు - తుష్టి అయిన శరీరములు గలవారమై సత్యతత్త్వ వాక్కులనే గానం చేస్తూ దేవతా ప్రసాదితమైన ఆయుష్షు శుభప్రదము చేసుకొనెదము గాక।
• పురాతనుడు, ప్రసిద్ధుడు, విశేష కీర్తిమంతుడు అగు ఇంద్రభగవానుడు,
• ఈ విశ్వముయొక్క యదార్థతత్త్వము ఎరిగి నట్టి పూషా-యశశ్వుడగు సూర్యభగవానుడు,
• మిక్కిలి వేగవంతులగు గరుడుడు, వాయువు,
• ఆధ్యాత్మిక సంపదకు పరిరక్షకుడగు బృహస్పతి భగవానుడు - మాకు స్వస్తి (ఉత్సాహ సాహస ధైర్యములు) ప్రసాదించెదరు గాక।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।

ఓం ఇత్యేతదక్షరమిదగ్ం సర్వం తస్యోపవ్యాఖ్యానం
భూతం భవద్ భవిష్యదితి సర్వమోంకార ఏవ
యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ .. 1..
1. ‘ఓం’ ఇతి ఏతత్ ‘అక్షరమ్’
ఇదగ్ం సర్వమ్।
- తస్య ఉప-వ్యాఖ్యానమ్।
- భూతమ్-భవత్-భవిష్యత్-ఇతి-
సర్వమ్ ఓంకార ఏవ।
యచ్ఛ (-యత్ చ) అన్యత్ త్రికాలాతీతమ్,
తదపి ఓంకార ఏవ।।
ఈ కనబడుచున్న సర్వ దృశ్య జగత్తు మార్పు-చేర్పులు లేనట్టి అక్షరమగు, ఓంకార రూపమే! (పూర్ణమగు పరమానంద స్వరూపమే)।
అద్దానిని సమీప్య-స్వానుభవ విశేషముగురించి ఇప్పుడు వివరించుకుందాము. వ్యాఖానించుకుందాము.

ఇతఃపూర్వం కనిపించింది,ఇప్పుడు కనిపిస్తున్నది, ఇకముందు కనిపించబోయేది - సమస్తము, సర్వము ‘ఓం’ కారమే!
ఒకవేళ భూత-వర్తమాన-భవిష్యత్తులకు ఆవల - కాలాతీతంగా ఏదైనా ఉన్నదనిపిస్తూ ఉంటే - అదంతా కూడా ఓం కారమే! అఖండాత్మ విన్యాసమే!

సర్వం హ్యేతద్ బ్రహ్మాయమాత్మా బ్రహ్మ సోఽయమాత్మా చతుష్పాత్ .. 2..
2. సర్వగ్ం హి ఏతత్ బ్రహ్మ।
అయమ్ ఆత్మా బ్రహ్మ।
సోఽయమ్ (సో అయమ్) ఆత్మా చతుష్పాత్।।
అనుక్షణికంగా మార్పు-చేర్పులు పొందుతూ సందర్భంగా మాత్రమే అయి ఉంటున్న - ఈ కనబడేదంతా వాస్తవానికి బ్రహ్మమునకు భిన్నం కాదు! బ్రహ్మమే!
సందర్భానుచితంగా ఆత్మగా (జీవాత్మగా) కనిపిస్తున్నప్పటికీ- ఈ జీవాత్మ సర్వదా-సదా బ్రహ్మమే! పరబ్రహ్మమే! సదాశివమే।
అట్టి ఈ జీవబ్రహ్మైక్య రూపమగు - ఆత్మ (జీవాత్మ) నాలుగు పాదములు (లేక) నాలుగు అవస్థలు కలిగినదై, ప్రదర్శనమౌతోంది.


జాగరితస్థానో బహిష్ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః
స్థూలభుగ్వైశ్వానరః ప్రథమః పాదః .. 3..
3. జాగరిత స్థానో బహిః ప్రజ్ఞః।
సప్తాంగ(7)- ఏకోనవిశంతి(19) ముఖః
స్థూలభుక్ ‘‘వైశ్వానరః’’
ప్రథమః పాదః।।
(1) బహిర్ ప్రజ్ఞ-జాగ్రత్ అవస్థ - వైశ్వానరుడు
ఆత్మనుండి బయల్వెడలుచున్న బహిర్ ప్రజ్ఞాపురుషుడు. జాగ్రదవస్ధ / స్థానమును సంచార-స్థానముగా కలిగి ఉంటున్నాడు. విశ్వాభిమాని అయి, ‘వైశ్వానరుడు’ అని పిలువబడుచున్నాడు.
సప్తాంగములు: 1. (అశరీర దివ్య ప్రజ్ఞారూపవాసులు నివాసము కలిగి ఉండే) ద్యులోకము - శిరస్సు 2. సూర్యుడు - నేత్రములు 3. వాయువు - ప్రాణము 4. ఆకాశము - దేహమధ్య భాగము 5. జలము - మూత్ర స్థానము 6. భూమి - పాదములు 7. అగ్ని - నోరు - ఇవి విశ్వ దేహి సప్తాంగములుగా వ్యాఖ్యానించబడుచున్నాయి.
ఏకోన వింశతి ముఖః (19 ముఖములు) :
(1) జ్ఞానేంద్రియములు : చెవులు (వినికిడి), కనులు (చూపు), చర్మము (స్పర్శ), నోరు (రసము), ముక్కు (ఘ్రాణము / వాసన). పంచ జ్ఞానేంద్రియములు. - (5)
(2) కర్మేంద్రియములు: 1. వాక్కు, పాణి (చేతులు), పాదములు, పాయువు (మలవిసర్జనం), ఉపస్థ (మూత్ర విసర్జనము) పంచ కర్మేంద్రియమలు - (5)
(3) ప్రాణములు: 1. ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు (పంచ ప్రాణములు). - (5)
(4) అంతరంగ చతుష్టయము: 1. మనన రూపమగు ‘‘మనస్సు’’, నిశ్చయాత్మక రూపమగు ‘‘బుద్ధి’’, ఇష్ట-అయిష్ట వృత్తుల రూపమగు ‘‘చిత్తము’’, అభిమానరూపమగు ‘‘అహంకారము’’. (4) (5+5+5+4=19)
ఇవి పరమాత్మ యొక్క ‘19’ ముఖములుగా ఇక్కడ అభివర్ణించ బడుచున్నాయి.
బహిర్ముఖమైన ప్రజ్ఞాస్వరూపుడు. ‘7’ అంగములు, ‘19’ ముఖములు కలవాడుగా ఉంటున్నాడు. విశ్వాభిమాని కాబట్టి ‘విశ్వుడు’.
స్థూల విషయములయొక్క భోక్త అయినట్టి ‘‘వైశ్వానరుడు’’ (విశ్వ సంబధింతుడగు ప్రజ్ఞా సమన్వితుడు)…ఆత్మయొక్క మొదటి పాదము (లేక మొదటి అవస్థ).


స్వప్నస్థానోఽన్తఃప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః
ప్రవివిక్తభుక్తైజసో ద్వితీయః పాదః .. 4..
4. స్వప్నస్థానో ‘‘అంతః ప్రజ్ఞః’’।
సప్తాంగ(7)- ఏకోనవిశంతి(19) ముఖః
ప్ర-వివిక్త భుక్, ‘‘తైజసో’’ ద్వితీయః పాదః।।
(2). అంతర్ ప్రజ్ఞ - స్వప్నావస్థ - తైజసుడు
స్వప్నావస్థ (స్వప్న స్థానము) సంచార స్థానముగా కలవాడు. అంతరమైన ప్రజ్ఞ కలవాడు. భౌతిక వస్తు రహిత - మనోకల్పిత విషయానుభవుడు.
‘7’ అంగములు- 19 ముఖములు (నోర్లు) కలవాడు- (వివరణ =పైన చెప్పినవి)
పై 7 + 19 - భావనా నిర్మితంగా ఆస్వాదించు ప్రజ్ఞ - తైజస పురుషుడు.
స్వప్న దృశ్యమును తనకు వేరైన దానివలె ఆస్వాదించువాడు- అనుభవించు వాడు…, తైజసుడు అనే పేరుతో చెప్పబడుచున్నవాడు. అట్టి తైజస స్వరూపుడు - జీవాత్మయొక్క ద్వితీయ పాదము లేక రెండవ అవస్థ.


యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం
పశ్యతి తత్ సుషుప్తం . సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన
ఏవానందమయో హ్యానందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః .. 5..
5. యత్ర సుప్తో
- న కంచన కామమ్ కామయతే…,
- న కంచన స్వప్నమ్ పశ్యతి…,
- తత్ ‘‘సుషుప్తమ్’’।
సుషుప్త స్థాన ఏకీభూతః।
(3). ప్రజ్ఞాన ఘనము-సుషుప్త్యవస్థ - ప్రాజ్ఞుడు
ఎక్కడైతే ఈ నిద్రిస్తున్న జీవుడు :-
- ఎట్టి కోరికలు ఏమాత్రమూ కలిగియుండడో….,
- ఎట్టి స్వప్న దృశ్యమును చూడనివాడై ఉంటాడో…,
అదియే ‘‘సుషుప్త-అవస్థ’’। ఈ స్థితిలో అతనికి వేరై ఏదీ ఉండదు కాబట్టి- ‘‘ఏకీభూతుడు’’.

ప్రజ్ఞాన ఘన ఏవ,
ఆనందమయో హి, ఆనంద భుక్।
చేతో ముఖః। ‘‘ప్రాజ్ఞః’’ - తృతీయః పాదః।।
అట్టి గాఢనిద్రాపరవశుడు-విషయరహితమగు ఏకాంతమే సంచార స్థానముగా కలవాడు అయి ఉంటున్నాడు. అనేకత్వము లేనివాడై ఉంటున్నాడు. ఏకత్వానుభూతిపరుడై ఉంటున్నాడు. ‘‘ఘనీభూతమైన విషయరహిత ప్రజ్ఞ’’ను మాత్రమే స్వరూపముగా కలిగి ఉంటున్నాడు.
తనయందు తాను, ఆనందరూపుడై, ఆనందమయుడై, ఆనందత్వము మాత్రమే ఆస్వాదిస్తున్నవాడై, దర్శిస్తున్నవాడై, అనుభూతిపరుడై - అనుభవిస్తున్నవాడై ఉంటున్నాడు.
చేతన స్వరూపుడై - కేవల చేతనస్థుడై ఉండే… సుషుప్తిస్థాన సంచారుడు ప్రాజ్ఞుడు. ఇది జీవాత్మ యొక్క మూడవ పాదము.


ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏషోఽన్తర్యామ్యేష యోనిః సర్వస్య
ప్రభవాప్యయౌ హి భూతానాం .. 6..
6. ఏష సర్వేశ్వర । ఏష సర్వజ్ఞ।
ఏషో అంతర్యామి।
ఏష యోనిః
సర్వస్య ప్రభవ అపి అయౌ హి
(సర్వస్య ప్రభవాప్యయౌ హి)
భూతానామ్।।
(4) సర్వజ్ఞుడు - తురీయావస్థ - తురీయపురుషుడు
కేవల ప్రజ్ఞాస్వరూపుడు. అట్టి విషయరహిత ప్రాజ్ఞుడే (ఈ జాగ్రత్-స్వప్న - సుషుప్తుల విషయాలన్నిటికీ) సర్వేశ్వరుడు. అన్నిటికీ ఈశుడు. తురీయ పురుషుని స్వకీయ సంచార కల్పనలే - జాగ్రత్, స్వప్న, సుషుప్తులు.
ఆతడు సర్వము (జాగ్రత్ - స్వప్న రూపములేమిటో) ఎరిగినవాడు. ఆతడే (జాగ్రత్-స్వప్నావస్థలలో పొందబడే - దర్శించబడే వాటికన్నిటికీ) అంతర్యామి। యజమాని। నియామకుడు। తనయొక్క జాగ్రత్ స్వప్న సుషుప్తి భూములలో సంచారి.
ఆతడే సర్వ అనుభూతజాలములకు ఉత్పత్తి-లయ స్థానము. తురీయ పురుషుడు. (నాలుగవది అయినవాడు).
ఈ తురీయ పురుషుని నుండే జాగ్రత్ (వైశ్వానరుడు) - స్వప్న (తేజసుడు) - సుషుప్తి (పాజ్ఞ) పురుషులు ఒకప్పుడు బయల్వెడలి - మరొకప్పుడు ఆయనయందే లయించినవారగుచున్నారు.

నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం
న ప్రజ్ఞం నాప్రజ్ఞం . అదృష్టమవ్యవహార్యమగ్రాహ్యమలక్షణం
అచింత్యమవ్యపదేశ్యమేకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం
శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః .. 7..
7. న అంతః ప్రజ్ఞం।
న బహిః ప్రజ్ఞం।
న ఉభయతః ప్రజ్ఞం।
న ప్రజ్ఞాన ఘనం।
న ప్రజ్ఞం। న అప్రజ్ఞం।
(అదృశ్యమ్) అదృష్టమ్। అవ్యవహార్యమ్।
అగ్రాహ్యమ్। అలక్షణమ్।
జాగ్రత్ - స్వప్నముల జనన స్థానమగు సుషుప్తి తనదైన (చ) తురీయుడు ఎట్టివాడు? ఆతడు కేవలుడగు ఆత్మపురుషుడే।
- స్నప్నరూపమైన అంతర్ ప్రజ్ఞ కాదు.
- జాగ్రత్ రూపమైన బహిర్ ప్రజ్ఞ కాదు.
- ఆ ఉభయము కలిపి కూడా కాదు.
(ఆ ఉభయము ఆత్మయొక్క చిత్కలాంశా విశేషాలు మాత్రమే).
- ఆత్మ→ సుషుప్తిలో ప్రజ్ఞానఘనము కూడా కాదు. అది కూడా ఆత్మ యొక్క మరొక చిత్కళయే!
- ప్రజ్ఞా రూపము కాదు. అప్రజ్ఞా రూపము కూడా కాదు.
- ఆ తురీయ రూపమగు ఆత్మ - కళ్ళకు కనిపించే నామ- రూపాత్మక మైనదేదీ కాదు.
- వ్యావహారికంగా దేనితోనో సంబంధమును కల్పించి చెప్పగలిగేది, తెలుసుకో గలిగేది కాదు.
- మనస్సుతో ‘‘ఇది అది - ఇట్టిది’’ అని చెప్పితే కూడా - అనుభూతానికి వచ్చేది కాదు.
- కొన్ని లక్షణములుగా వర్ణించి చెప్పగలిగేదీ కాదు.
అంచింత్యమ్। అవ్యపదేశ్యమ్।
ఏకాత్మ ప్రత్యయ సారం।
ప్రపంచ - ఉపశమమ్।
శాంతం। శివమ్। అద్వైతమ్।
- చతుర్థం మన్యంతే।
స ఆత్మా। స విజ్ఞేయః।।
- ఊహించి, ‘‘ఇది ఇటువంటిది’’ అని ఊహగా చెప్పగలిగేది కాదు.
- నిర్వచించి - నిర్దేశించగలిగేదీ కాదు. ఒకరికి వివరించి తెలియపరచ గలిగేది కాదు.
- అన్ని అవస్ధలలో ఏకమే (ఒక్క తీరే) అయి ఉండి అనునిత్యమై ఉండేది. సమస్త అవస్థలు తనదైనట్టిది.
- మహావాక్య ప్రత్యయముల యొక్క సారము. నేను, నీవు, అతడు, ఇతడు, ఆమె, వారు, వీరు మొదలైన ప్రత్యయములన్నిటికీ సారము (The Essence of it).
- జాగ్రత్ - స్వప్న ప్రపంచాలు ఎందులో ఉపశమిస్తున్నాయో… అయ్యది కూడా అదే!
సర్వము సశాంతించినప్పటికీ శేషించేదికాబట్టి పరమశాంతము. సర్వశేష్యము. ఆది శేష్యము.
సర్వ సుఖాలకు ఆలవాలము. శుభప్రదము.
ద్రష్టకు (లేక ఆత్మోపాసకునకు) వేరైనది కానట్టిది. అనన్యమైనది.
అది జాగ్రత్ కాదు. స్వప్నము కాదు. సుషుప్తి కాదు. ఆ మూడిటిలో ప్రవేశించి-వెనుకకు మరలేది-అని అనవచ్చు కాబట్టి,- చతుర్ - 4వది.
- తురీయం + చ = నాలుగు కూడా అదే అని చెప్పుకోబడుచున్నది.
అదియే మనందరి ఆత్మ! అదియే (1) తెలుసుకోవలసినది (2) తెలుసు కొంటున్నది, (3) తెలియబడుచున్న ఈ సమస్తము అయి ఉన్నట్టిది, (4) ‘తెలివికలవాడు’ అయిఉన్నది - కూడా।

సోఽయమాత్మాధ్యక్షరమోంకారోఽధిమాత్రం పాదా మాత్రా మాత్రాశ్చ పాదా
అకార ఉకారో మకార ఇతి .. 8..
8. సోఽయమ్ ఆత్మా….
అధ్యక్షరమ్ (అధి-అక్షరమ్) ‘‘ఓం’’కారో
అధిమాత్రమ్
పాదా మాత్రా।
మాత్రాశ్చ పాదా -
‘అ’కార- ‘ఉ’ కార- ‘మ’ కార ఇతి।।
జాగ్రత్ - స్వప్న సుషుప్తి :: వైశ్వానర - తైజస - ప్రాజ్ఞపురుషులు గాను, చ (తురీయము)గాను మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఆ ఈ ఆత్మ అక్షరముగా చెప్పుకుంటున్నప్పుడు ‘ఓం’ కారము.
మాత్రల రూపముగా వర్ణిస్తున్నప్పుడు :-
‘‘అ కారము + ఉ కారము + మ కారము’’।
మాత్రలే → పాదములు.
అ ఉ మ → జాగృత్-స్వప్న-సుషుప్తి-అనబడే త్రి-అవస్థలు తనవే అయి ఉన్నట్టిది కాబట్టి తురీయమే ‘ఓం’కారము.

జాగరితస్థానో వైశ్వానరోఽకారః ప్రథమా మాత్రాఽఽప్తేరాదిమత్త్వాద్
వాఽఽప్నోతి హ వై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద .. 9..
9. జాగరితస్థానో - వైశ్వానరో।
- ‘అ’కారః।
ప్రథమా మాత్రా, ఆప్తేః - ఆది
మత్వాద్వా ఆప్నోతి హ వై
సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి,
య ఏవం వేద।।
జాగ్రత్ అనుభవ పురుషకారమును ‘‘వైశ్వానరుడు’’ అని అంటూ ఉన్నారు.
జాగ్రదవస్థయందు - జాగ్రదవస్థగా సంచారము గల వైశ్వానరుడే ‘అ’కార మాత్రగా చెప్పబడుచున్నాడు. (విశ్వానుభవి/అభిమాని కాబట్టి వైశ్వానరుడు).
ఎందుకంటే….,
‘అ’కారము - అక్షరములన్నిటిలో విస్తరించి ఉన్నట్లే, జాగ్రత్‌ప్రజ్ఞయే దృశ్య జగత్తంతా విస్తరించినదై ఉండటం జరుగుతోంది.
అనగా,
అవస్థగా → జాగ్రత్
మాత్రగా → ‘అ’కారము
అట్టి ఆత్మయొక్క జాగ్రత్ స్వరూప-అకార మాత్రను (లేక) వైశ్వారుని ఎవ్వరు తత్త్వతః (మత్వా) ఎరుగుచున్నాడో…., అట్టివాడు సర్వలోక సంబంధమైన కోరికలకు ఆవల ఉన్న స్వస్వరూపమునందు ప్రకాశించగలడు.

స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రోత్కర్షాత్
ఉభయత్వాద్వోత్కర్షతి హ వై జ్ఞానసంతతిం సమానశ్చ భవతి
నాస్యాబ్రహ్మవిత్కులే భవతి య ఏవం వేద .. 10..
10. స్వప్న స్థానః తైజస
‘ఉ’ కారో…, ద్వితీయా మాత్రా।
ఉత్కర్షాత్ - ఉభయత్వాత్ వా ఉత్కర్షతి హ వై।
జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి,
న అస్య అబ్రహ్మవిత్ కులే భవతి, య ఏవం వేద।।
- స్వప్న స్థానంలో సంచారంచేసే భావనా పురుషుడు ‘తైజసుడు’.
- ‘ఓం’ అక్షరంలో ద్వితీయమాత్ర ‘ఉ’ సంజ్ఞగా చెప్పబడువాడు.
స్వప్నము : మనస్సులో అంతరంగా అనుభూతమైయ్యేది, జాగ్రత్- సుషుప్తుల మధ్యగా ఉండేది. (అ కార-మ కారముల మధ్యగా ఉండేది) - కనుక ‘ఉ’కారమని అనుచున్నారు.
స్వప్నానుభవముగా నాపట్ల ఏర్పడుచున్నదంతాకూడా - ‘‘నా భావనయే. (లేక) ఊహయే, (లేక) కల్పనయే’’ అని ఎరిగినవాడు - బ్రహ్మకులజాతుడు అగుచున్నాడు.

సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్తృతీయా మాత్రా మితేరపీతేర్వా
మినోతి హ వా ఇదం సర్వమపీతిశ్చ భవతి య ఏవం వేద .. 11..
11. సుషుప్త స్థానః ప్రాజ్ఞో -
‘మ’ కారః తృతీయా మాత్రా।
మితేః అపీతేః వా మినోతి హ వా
(మితేరపీతేర్వా మినోతి హవా)
ఇదగ్ం సర్వమ్ అపీతిశ్చ భవతి, -
య ఏవం వేద।।
సుషుప్తి: సుషుప్త స్థానంలో సంచరించువాడు కేవల ప్రజ్ఞావిశేష స్వరూపుడగు ప్రాజ్ఞుడు. తృతీయమాత్రయగు ‘మ’-అక్షరముచే ఉద్దేశ్యించబడి చెప్పబడుచున్నవాడు.
మితే: మిగతా జాగ్రత్ - స్వప్నములకు మితేః - పరిమాణము (కొలవబడునది) అయిఉన్నది.
సుషుప్తిచే జాగ్రత్, స్వప్నములు - ‘పరిమితము’ చేయబడుచున్నాయి కాబట్టి ‘మితే’ అనబడుతోంది.
‘మ’కారం ‘అ ఉ మ’ల చివ్వరిది కూడా కదా!
ఈవిధంగా ‘మ’కారము సుషుప్తికి సంజ్ఞగా వర్ధిల్లుచున్నది.
అట్టి సుషుప్తిని ఆత్మయొక్క ఒకానొక విన్యాసంగా ఎవరు ఎరుగు చున్నారో… అట్టివాడు సర్వమునకు చివ్వరివాడై (దాటినవాడై) వెలుగొందుచున్నాడు.

అమాత్రశ్చతుర్థోఽవ్యవహార్యః ప్రపంచోపశమః శివోఽద్వైత
ఏవమోంకార ఆత్మైవ సంవిశత్యాత్మనాఽఽత్మానం య ఏవం వేద .. 12..
12. అమాత్రః చతుర్థో అవ్యవహార్యః
ప్రపంచ ఉపశమః (ప్రపంచోపశమః)।
శివో అద్వైత -
ఏవం ‘ఓం’కార ఆత్మైవ।
సంవిశత్ యః ఆత్మన్
‘‘ఆత్మానం’’ య ఏవం వేద।
య ఏవం వేద।।
ఆత్మ ఎట్టిదంటే…,
• ‘‘అ-ఉ-మ - అర్ధమాత్ర’’ … ఈఈ మాత్రలు లేనిది.
• చతుర్ధో- ‘తురీయా చ। జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు వేరైన- నాలుగవది.
• ‘‘వికారమయ సత్త’’ .. అనబడే ఈ ప్రపంచమంతా ఉపశమించినప్పుడు కూడా శేషించి ఉండేది. నిర్వికారమై వెలుగొందునది. అది సర్వదా నిరాకాకరమే।
• ఎప్పుడూ కూడా ఏ ఆకార-వికారములు పొందనట్టిది.
• శివము - పరమానందమైనది.
• అద్దానికి రెండవది లేనిది. అద్వైతము.
• ఉపాసకుని నిజరూపమునకు (లేక) సహజరూపమునకు అభిన్నమైనది.
ఇవి తురీయముయొక్క సహజరూప వర్ణనలు.
ఈ తురీయము లేక చతుర్థమును తెలుసుకొన్నవాడు ‘ఆత్మ’యే తానై ప్రకాశిస్తున్నాడు.
అది తెలుసుకుని సర్వస్వరూపుడై సర్వసాక్షియై సర్వాత్మకుడై విరాజిల్లుచున్నాడు. సమస్తము ఆత్మగా దర్శించు అభ్యాసికి ఆత్మ-తనకు తానై-విశదీకరణమౌతోంది.
మాండుక్యోపనిషత్ సమాప్తా।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
ఇతి మాండుక్యోపనిషత్
మహర్షిభ్యోం నమో-నమో-నమో నమః।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।




అధర్వణవేదాంతర్గత

13     మాండూక్య ఉపనిషత్

(A STUDY OF THE AWAKENED, DREAMY, DEAD-SLEEPY AND THE TRIO-OPERATOR PHASES / FORMS / STATES)

అధ్యయన పుష్పము

ముక్తికోపనిషత్ : శ్రీరామచంద్ర ప్రవచనము
ఆంజనేయస్వామి: ఇయం కైవల్యముక్తిస్తు కేన ఉపాయేన సిద్ధ్యతి? శ్రీరామచంద్రా! ‘కైవల్యముక్తి’ సిద్ధించటానికి తేలికైన ఉపాయము ఏది? దయతో చెప్పండి.
శ్రీరామచంద్రుడు: ‘మాండూక్యం’ ఏకమేవ అలం ముముక్షూణాం విముక్తయే। తథాపి అసిద్ధంచేత్ జ్ఞానం, దశోపనిషదం పఠ। ఓ ఆంజనేయా! ముముక్షువులు జీవన్ముక్తులవటానికి మాండూక్యోపనిషత్ ఒక్కటే చాలు. చాలదని నీకు ఇంకా అనిపిస్తే, దశోపనిషత్తులు (ఈశ - కేన - కఠ - ప్రశ్న - ముండక - మాండూక్య - తైత్తరీయ - ఐతరేయ - ఛాందోగ్య - బృహదారణ్యకములు) అధ్యయనము చేయి.

{ఇంకా కావలెనన్నచో 32 ఉపనిషత్తులు, లేదా 108 ఉపనిషత్తులు అధ్యయనము చేయి.}

శ్రీమత్ భగవత్ పూజ్యపాద శ్రీ శంకరాచార్యకృత మంగళ శ్లోకద్వయము

1. ప్రజ్ఞానాంశు ప్రతానైః
స్థిర చర నికర వ్యాపిభిః
వ్యాప్య లోకాన్,
భుక్త్వా భోగాన్ స్థవిష్ఠాన్,
పునరపి ధిషణోః
భాసితాన్ కామ జన్యాన్,
ఏ కేవల ప్రజ్ఞానంద స్వరూపము -
‘‘జాగ్రత్’’ను ధరించి తనయొక్క ప్రజ్ఞా (The Factor of ‘Knowing’) స్వరూపముతో ‘ఎరుక’ అను తన కిరణములచే ఇక్కడి స్థిర - చర (స్థావర- జంగమ) వృక్ష జంతురూపములుగా వ్యాపించి, తనకు తానే ఆస్వాదిస్తోందో,
అత్యంత స్థూలము (స్థవిష్టము) అగు ఇంద్రియార్థములతో ప్రసరించి (Like Electricity Passing through Electric wires) - బుద్ధి - కామము (ఇష్టము) మొదలైన వాటిచే జాగ్రత్‌నందు భోగముల రూప దృశ్యమును భోజనముగా ఆస్వాదించుచున్నదో?
పీత్వా సర్వాన్ విశేషాన్
స్వపితి మధుర భుక్
మాయయా భోజయన్నః,
మాయా సంఖ్యా, ‘తురీయం’
పరమ్, అమృతమ్, అజం,
‘‘బ్రహ్మ’’ యత్

తత్ నతోఽస్మి।।
- స్వప్నము రూపము ధరించి తన యొక్క తేజస్సునందు నానా విధములైన కామ - వాసనా విశేషములను త్రాగుచూ ఆనందించుచున్నదో,
- ఇంతలోనే సమస్తము బయటనే వదలి సుషుప్తిలో మౌనము వహిస్తోందో,
తనకు తానే మాయావి అయి (Like a Magician / గారడీవానివలె) జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు ఆవల నాలుగవదై (తురీయమై) సమస్తమునకు పరమై, అమృతస్వరూపమై, అజమై (జన్మాదులకు సంబంధించకయే) ఉన్నదో, -

అట్టి పరబ్రహ్మమునకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము.
2. యో విశ్వాత్మా విధిజ విషయాన్
ప్రాశ్య భోగాన్ స్థవిష్ఠాన్,
ఏ పరమపురుషుడైతే-
జీవాత్మ స్వరూపుడు అగుచూ, జాగ్రత్ (విశ్వ) పురుషుడై జాగ్రత్ అవస్థను అంగీకరించి, ఈ సమస్త విశ్వమునకు ఆయా విధి - విధానములగు వ్యవహారపరంపరములను-స్వకీయకల్పిత చేతనములగు ఇంద్రియముల ద్వారా - స్థూలమైనదంతా భుజించుచున్నారో, భోగించుచున్నారో,
పశ్చాత్ చ అన్యాన్ స్వమతి విభవాన్
జ్యోతిషా, స్వేన సూక్ష్మాన్,
సర్వాన్ ఏతాన్ పునరపి శనైః
స్మాత్మని స్థాపయిత్వా,
అటు తరువాత ‘స్వప్నావస్థ’ను కల్పించుకొని (తైజసపురుషుడై) స్వకీయమగు ‘విభవము’ అనే జ్యోతి వెలుగులో సూక్ష్మరూపంగా (బాహ్యవస్తురహితంగా) అంతర్వృత్తిచే దృశ్యకల్పనను తనకుతానై రచించుకొని ఆస్వాదిస్తూ ఉన్నారో,
మరల ఇంతలోనే సుషప్త (ప్రాజ్ఞ) పురుషుడై నెమ్మదిగా జాగ్రత్ - స్వప్న కల్పనలన్నీ స్వాత్మయందు స్థాపించుకొని ఉంటున్నారో,
హిత్వా సర్వాన్ విశేషాన్
విగత గుణ గణః ।

పాతు అసౌ నః ‘తురీయః’।
సమస్త దృశ్య - త్రిగుణ విశేషాలన్నీ త్యజించి, సమస్తమునకు ఆవలివారై (Beyond All) స్వయం ప్రకాశమానులై విరాజిల్లుచున్నారో….

అట్టి స్వాత్మ - స్వస్వరూప - సమస్త స్వరూప తురీయ పురుషుడు మమ్ములను అజ్ఞాన సందర్భములనుండి రక్షించి, కేవలము - స్వాభావికము అగు ‘‘స్వస్వరూపానుభవము’’ను సిద్ధింపజేయుదురు గాక!

నారాయణం, పద్మభువం, వసిష్ఠంశ, శక్తిం చ, తత్పుత్ర పరాశం చ। వ్యాసం, శుకం, గౌడపదం, మహాంతం।
గోవింద యోగీంద్రం అధాస్య శ్రీశంకరాచార్యం, పద్మపాదం చ, హస్తామలకం చ శిష్యం,
తం తోటకంవార్తిక కారమన్యాం, అస్మత్ గురుం సంతత మానతోఽస్మి ।।
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం, కరుణాలయం। నమామి భగవత్పాదమ్। శంకరం। లోక శంకరమ్।।

మాండూక్యము
‘‘కప్ప’’ = ‘‘పరమాత్మ స్వరూపము’’. ‘‘కేవలము’’.
ఆయనయొక్క నాలుగు పాదములు - జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయములు.


1వ మంత్రము

వేదోపనిషత్తుల సారము ‘‘ఓం’’

ఎట్టి హెచ్చు తగ్గులు, మార్పు-చేర్పులు ఏ సమయమందునూ ఉండనట్టి అక్షరమగు ఓంకారమే ఈ అనుభవమయ్యే సమస్తము యొక్క వాస్తవ సహజస్వరూపము.
అట్టి ఓంకార పరమ పురుషుని గురించిన వివరణలు, నామ రూప-ఉపాసనములే- వేద, వేదాంగ, పురాణ, గీతాదులన్నీ కూడా!

అగు అట్టి అంతాకూడా ‘ఓం’కారమే। ఆత్మయే ‘ఓం’కారము। కనుక ఈ సమస్తము ఆత్మస్వరూప విశేషమే।

(ఈ భౌతిక శరీరము కాలాంతర్గతము. కేవలమగు మనో బుద్ధి చిత్త అహంకారములు కాలమునకు ఆవలవి).

‘ఓం’ కారమే బ్రహ్మమును ధ్యానించటానికి, ఉపాసించటానికి, ఆత్మత్వము సిద్ధించటానికి ముఖ్యావలంబనము. ‘ఓం’ కారముతో ఆత్మానుసంధానము నిర్వర్తించబడు గాక - అని వేద హృదయము. ఆత్మయొక్క ‘వాక్’ సంజ్ఞా - రూపము ‘ఓం’కారము.

దృష్టాంతము : ఒక బీజములో కొమ్మలు, ఆకులు, పూవులు, కాయలు, పునః బీజములు మొదలైన వృక్ష ధర్మములన్నీ అంతర్గతమై ఉన్నట్లుగా, ‘ఓం’ కారమునందే (ఆత్మయందే) సమస్తము సంకల్పితరూపములై ఉన్నాయి. ఆత్మయందే ఈ జగద్దృశ్యము యొక్క సృష్టి, స్థితి, లయములు (జలములో తరంగములవలె) ఏర్పడినవై ఉన్నాయి.


2వ మంత్రము

సర్వమ్ హి ఏతత్ బ్రహ్మ।
ఆయమ్ ఆత్మా బ్రహ్మ। సోయమాత్మా చతుష్పాత్

ఆత్మయే దేహములో అత్యంత విశిష్టము, శ్రేష్ఠము కాబట్టి బ్రహ్మము. బ్రహ్మమునే ‘ఓం’ అని పిలుస్తున్నారు.

సర్వమ్
- కార్య - కారణములుగా జనించేదంతా, పరిణమించేదంతా - ఆవల, ఈవలతో సహా బ్రహ్మమే।
- కర్తృత్వములుగాను, భోక్తృత్వముగాను పరిదృశ్యమయేదంతా బ్రహ్మమే।
- ప్రత్యక్ష - పరోక్ష - అపరోక్షము (ప్రత్యక్ష పరోక్షములు కానిది) అంతా అదే.

[ ప్రత్యక్షము = Seen with eyes here.
పరోక్షము = Not seen physically here. Is somewhere else!
అపరోక్షము = ఆత్మ ఇంద్రియములకు కనబడేది కాదు. మరెక్కడో ఉన్నది కాదు. ప్రత్యక్ష-పరోక్షములకు అవిషయమైనది. కానీ, స్వస్వరూపమే అయి ఉన్నట్టిది.]

అయం ఆత్మా బ్రహ్మ
‘‘నేను’’ అని గుండెలపై అరచేయి పరచి దేనిని చెప్పుకుంటున్నామో, దేనికి మెలకువ - కల - గాఢనిద్ర తనవై ఉన్నవో - అట్టి

I am

I am existing = ‘‘సత్’’
I am knowling = ‘‘చిత్’’
I am experiencing / enjoying = ‘‘ఆనందము’’తో కూడిన ఈ జీవాత్మ → బ్రహ్మమే।

అట్టి ప్రతి ఒక్కరిలోని ‘‘ఆత్మ’’ బ్రహ్మమే. వ్యక్తిగతంగా చెప్పుకొనేడప్పుడు దేనిని ‘‘జీవాత్మ’’ అని పిలుస్తున్నామో - అది సర్వగతమగు, సర్వాంతర్యామిగా ‘‘పరమాత్మ’’యే. జీవుని పరాకాష్ఠ తత్త్వము కాబట్టి అదియే ‘బ్రహ్మము’

ఇప్పుడు అట్టి ‘‘నేను’’ అను అనుభూతి తనదైన ‘‘ఆత్మ’’ గురించి మరికొంతగా విశ్లేషించుకుంటూ వివరించుకుంటున్నాము. అభివర్ణించుకుంటున్నాము.

సోఽయమ్ ఆత్మా చతుష్పాత్
అట్టి ‘‘నేను’’ అను భావ ప్రకటన తనదైయున్న ఆత్మకు ‘4’ పాదములు (Four Phases / Legs, Four Presentative Appearences)
= ‘4’ పురుషకారములు. (Functional Features).
= ‘4’ అవస్థలు (Four States).
= ‘4’ స్థితిగతులు (Four Placement cum Movements).

ఒక రాజుగారు రాజసభలోను, అంతఃపురములోను, ఉద్యానవనములోను, దేశమంతటాగీసాధికారంగా పాల్గొనుచున్న / ఏర్పడి ఉన్న తీరుగా)
[1/4 + 1/4 + 1/4 + 1/4] అంతర్గతమై స్వాభావికమైనట్లు ఆత్మకు నాలుగు పాదములు.

(1) జాగ్రత్ - స్థూల పురుషకారము - బహిర్ ప్రజ్ఞ - విశ్వుడు- ‘‘వైశ్వానరుడు’’
(2) స్వప్నము - సూక్ష్మపురుషకారము - అంతర్‌ప్రజ్ఞ - ‘‘తైజసుడు’’
(3) సుషుప్తి - మౌన పురుషకారము - విషయాతీత/నిర్విషయ ప్రజ్ఞ -‘‘ప్రాజ్ఞుడు‘‘
(4) తురీయ - జాగ్రత్ స్వప్న సుషుప్తులు - తనవైన పురుషకారము. ఈ పురుషుని కేవల ప్రజ్ఞ- ‘‘తురీయుడు’’

ఆత్మయొక్క పై నాలుగు (లేక) పాదములు (లేక) విన్యాసములు (లేక) విశేషములు గురించి ఇప్పుడు వివరించుకుంటున్నాము.


3వ మంత్రము

ఒకటవ అవస్థ - వైశ్వానర ప్రథమ పాదః
1. జాగ్రత్ • బహిర్ - ప్రజ్ఞ • జాగ్రత్ అవస్థ • జాగ్రత్ పురుషకారము • విశ్వుడు • వైశ్వానరుడు
(జాగ్రత్ నాదైన ‘‘నేను’’)

జాగరిత సాస్థానో బహిర్- ప్రజ్ఞః। జాగ్రత్ మాధుర్య ఆస్వాదనకు - కళ్లు చెవులు ముక్కు నోరు చర్మము మొదలైన ఇంద్రియములన్నీ ఉపకరణములు. వీటిని ఉపయోగించు ఆత్మ బాహ్యమున - అంతరమున వ్యవహారశీలమై ఉన్నది.

‘‘బాహ్యప్రజ్ఞ’’యే జాగరితము (Awakened state of operation of Indrias) గా ‘ఓం’ కారము యొక్క (నాలుగిటిలో) మొదటి పాదము. విశ్వము (దృశ్యము) పట్ల అభిమాని కాబట్టి ‘‘వైశ్వానరుడు’’. (External Interstedness).

ద్రష్ట అగు తనకు అన్యముగా (దృశ్యముగా) కనిపిస్తూ ‘ఉనికి’ ఉన్నట్లుగా తోచేది ‘బహిర్‌ప్రజ్ఞ’ యొక్క ప్రదర్శనము. ఇంద్రియము ద్వారా బాహ్య విషయముల గురించిన అనుభూతి. బాహ్య సంబంధములు అభ్యాసవశంచేత బంధములు (Bondings) అయినప్పుడు - అదియే ‘‘భవబంధము’’.

ఈ బహిర్ ప్రజ్ఞ యొక్క (జాగ్రత్ కల్పనకు), (లేక) ‘వైశ్వానరుడు’ అను ఆత్మయొక్క అంశపురుషునికి (విశ్వునికి) - అంగములు ‘‘7’’, (సప్తాంగస్య). అవి విశ్వాంగములుగాను, దేహాంగములుగాను పరిఢవిల్లుచున్నాయి.

Ⅰ. విశ్వాంతర్గత సప్త : బాహ్యమగు దృశ్యమునకు (లేక) విశ్వమునకు సంబంధించిన విశ్వపురుషుని (జాగ్రత్ పురుషుని) సప్తాంగములు.
(1) విశ్వ నిర్మాణము, విశ్వ విన్యాసములలో పాలు పంచుకుంటూ ఉన్న దివ్య - అశరీర పురుషులగు, తేజోరూపదేవతలు. వారు ఉండే స్థానము - ‘ద్యులోకము’.
(2) సమస్తమునకు వెలుగు తేజస్సు ప్రసాదించుచున్న సూర్యుడు.
(3) ప్రాణములకు పరిపోషకుడు, సంరక్షకుడు అగు - వాయువు (చేతన విశేషుడు).
(4) సమస్తము స్థానము పొందుచున్న ‘ఆకాశము’.
(5) జీవత్రాణ అగు ‘జలము’.
(6) ఆహారప్రసాది అగు ‘భూమి’.
(7) తేజో - ఉష్ణమయమగు ‘అగ్ని’.

Ⅱ. శరీరాంతర్గత సప్త : ఈ భౌతిక శరీరమునందు ప్రవర్తనము కలిగియున్న సప్తాంగములు.
(1) జ్ఞానేంద్రియములన్నీ అమర్చబడిన - శిరస్సు (Head).
(2) చూపు స్థానమగు - నేత్రములు (కళ్లు) (Seeing).
(3) వాయు ప్రసరణశక్తి రూపమగు - ప్రాణము (Energy).
(4) దేహమధ్యగా అంతర్గతమైయున్న - ఆకాశము (Space).
(5) దేహములో అధిక విశేషభాగమైయున్న - జలము (Liquid).
(6) శరీరమును నడిపింపజేయు - పాదములు (Walking Movements).
(7) శబ్దము - ఆహారస్వీకారస్థానమగు - నోరు (Mouth).

వైశ్వానరుడు (విశ్వుడు) - అను (ఆత్మాంతర్గతుడగు) జాగ్రత్ పురుషుని ‘‘19’’ ముఖములు.

(i) ‘‘పంచ’’ జ్ఞానేంద్రియములు - (5)
(1) శ్రోత్రము (చెవులు)
(2) చక్షువులు (చూపుస్థానము)
(3) స్పర్శ స్థానమగు చర్మము
(4) ‘రుచి’ని ఆస్వాదించు రసనేంద్రియము (నాలుక)
(5) వాసనానుభవము అందించు ఘ్రాణము (ముక్కు)

(ii) ‘‘పంచ’’ కర్మేంద్రియములు - (5)
(1) వాక్కు (మాట్లాడు) నోరు / నాలుక.
(2) వస్తువులను ధారణ చేయగల (పట్టుకోగల) చేతులు (ప్రాణి).
(3) ‘నడకను’ నిర్వర్తించు కాళ్లు (పాదములు).
(4) విసర్జనను నిర్వర్తించు ‘పాయువు’.
(5) విసర్జన - కామన ధర్మము నిర్వర్తించు ‘‘ఉపస్థ’’.

(iii) పంచ వాయువులు (లేక) పంచ ప్రాణములు (5)
(1) ప్రాణము (వాయువుయొక్క శరీర ప్రవేశ వాయుచలనము)
(2) అపానము (వాయువుయొక్క బాహ్యమునకు పోవు వాయు చలనము)
(3) వ్యానము (శరీరమంతా వ్యాపించి ఉండువాయు చలనము)
(4) ఉదానము (కంఠమునందు, పొట్టనందు ఉండి కొన్ని శారీరక ధర్మములు నిర్వర్తించు వాయుచలనము.
(5) సమానము (నాభియందు స్థానము కలిగి, శారీరక - సమన్వయ - సమానత్వములను నిర్వర్తించు వాయువు. సమత్వ చలనము).

(పై 5x3 = 15) తరువాత
(16) మనస్సు : మననము చేయు విభాగము (Phase of Thinking). ఆత్మయొక్క స్వకీయ భావనా-స్వాభావిక విశేషము. స్వాధికారము చేతను, లీలా క్రీడా చమత్కారమువలనను ‘మననము’ ఏర్పడినదై ఉంటోంది.

అట్టి అన్య వస్తు విషయ, సంబంధ, సంఘటన, అనుబంధ, బాంధవ్య - ఇత్యాది విశేషములు మననముచే కల్పితరూపము పొందిన ఈ మనస్సు - ఆత్మభావనను కప్పివేసి ఉంచుతోంది. అట్టి ఈ మనస్సు ఎంతటి చమత్కారమైనదంటే…,
- తానే ఉన్నట్లు
- ఆత్మ ఏమో లేనట్లు -
తాత్కాలికంగా భ్రమింపజేస్తోంది. (అందుచేత ‘‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో। బంధస్తు విషయాసక్తిః’ - అని చెప్పబడుచున్నది). ఆత్మస్వరూపుడగు ఈ జీవునిపట్ల (స్వకీయంగా కల్పించబడికూడా) - సంబంధము ఏర్పరచి, ‘బంధము’ రూపముగా అగుచున్నది. ఇది ‘‘కథలోని ఒక సంఘటన-ఆ కథా రచయితను బంధింపజేయుచున్నది’’ - అను హాస్య కల్పిత వాక్యమువలె ప్రసిద్ధమౌతోంది.

(17) బుద్ధి : ఇది ఈ జీవునియొక్క నిర్ణయాత్మక విభాగము. విచక్షణ - విమర్శన - అవగాహన ధర్మములు నిర్వర్తించు ముఖము.

అట్టి బుద్ధి ఈ జీవుని స్వకీయ సంపత్తి విశేషమే అయినప్పటికీ - అల్పమైన, కాలబద్ధమైన వస్తు - విషయ మనోసంబంధములను నమ్మకముతో అన్వయించుచున్న కారణంగా-ఆశ్రయించి అల్పత్వము, దోషత్వము కలిగినదై ఉంటోంది. సంకుచితమై ఉంటోంది. (కొన్ని సందర్భములలో) సమగ్రమగు సదవగాహనను కలిగి ఉండటం లేదు.

అట్టి ‘‘బుద్ధిని నిర్మలము, సునిశితము, విస్తారము, ఏకాగ్రము’’ చేయటమే ఆత్మా-హమ్ భావనను పునరుద్ధరించు ఉపాయము. ఇక తదితర ‘భక్తి, ధ్యానం, జ్ఞాన, యోగాదులన్నీ కూడా అందుకు సుందరము, ఉత్తిష్ఠము అగు ఉపాయములు’’.

(బుద్ధౌ శరణమన్విశ్చ। కృపణా ఫల హేతవః - సమస్త కర్మల నిర్వహణముల ఉత్తమాశయము బుద్ధి యొక్క ఏకాగ్రతయే. ఇక ‘‘దృశ్యములో ఏమి పొందాము?’’ అను కర్మఫలాశయములు అల్పమైన ఆశయములేగాని, మహదాశయము కాదు - భగవద్గీత - సాంఖ్యయోగము)

(బుద్ధం శరణం గచ్చామి - బుద్ధి యొక్క ఉన్నతికై ఉద్దేశ్యిస్తున్నాను - బుద్ధభగవానుడు).

(18) చిత్తము : ఆత్మయొక్క ‘ఇచ్ఛాశక్తి’ లేక ‘ఇష్టము’ అనునదే ఈ 18వ ముఖము. ఇష్టము (చిత్తము)ను అనుసరించే మనోబుద్ధులు వర్తిస్తున్నాయి. ‘ఆత్మయే అన్నిటికన్నా ప్రియమైనది. తనంటే తనకు ఎవరికైనా ఎంతో ఇష్టము కదా! అందుచేత ఇష్టము (లేక) చిత్తమును ఆత్మగురించిన సమాచారము కొరకై నియమించుట చేతనే ఆత్మోపాసన, ఆత్మజ్ఞానము, ఆత్మా-హమ్ భావన, ఆత్మానుభవము లభించగలవు.

(ఆత్మావా అరే ద్రష్టవ్యః, శ్రోతవ్యో, మన్తవ్యో, నిదిధ్యాసితవ్యో। ఆత్మనోవా అరే దర్శనేన శ్రవణేన, మత్యా విజ్ఞానేన ఇదగ్ం సర్వం విదితమ్। ఆత్మను తెలుసుకుంటే అంతా తెలిసిపోతుంది - బృహదారుణ్యకోపనిషత్ 6వ అధ్యాయము-పంచమ బ్రాహ్మణము).

(19) అహంకారము : ‘‘నేను కర్మలకు సంబంధించిన కర్తను. భోక్తను. ఆధారుడను. పరిమితుడను. బద్ధుడను’’ - అను ముఖము. ఇద్దాని నుండి ‘‘నేను ఈఈ విశేషములకు చెందినవాడను. ఇవి నాకు చెందినవి’’ అను పరిమితమగు, సంకుచితమగు స్వస్వరూపముగురించిన నిర్వచనము స్వయం కల్పితంగా రూపము దిద్దుకుంటోంది.

పరిమితము, సంకుచితము అగు అహంకారముచే (ఆత్మస్వరూపుడే అయి ఉన్న) ఈ జీవుడు ‘బద్ధుడు’గా ను, అల్పుడుగాను తనకుతాను అనుభవము అగుచున్నాడు. ‘‘అయ్యో! నా గతి ఏమిటి?’’ అని తలచుచూ, తన గురించి తానే కృపణుడు, జాలిపొందువాడు అగుచున్నాడు.

‘‘ఇదంతా నాయొక్క కల్పనామహిమయే’’ అను మహదహంకార దృష్టిచే ఈ జీవునిపట్ల సర్వ నిబద్ధతలు తొలగి, ‘‘నాకు బంధము మొదలే లేదు’’ - అను రూపంగా మోక్షభాగుడగుచున్నాడు.

స్థూలభుక్ - ఈ విధంగా ఆత్మ సప్తాంగముల (7 అంగములచే) ఏకోనవింశతి (19) ముఖములచే స్థూలము (The Material World) గా ‘‘అనుభూతి అనుభవము’’ ను ఆహారము స్వీకరిస్తూ ఉన్నది.

ఆత్మయొక్క ఒక అంశ అగు - ‘‘భౌతిక ప్రపంచానుభవి’’ (లేక) ‘‘స్థూలభుక్’’ అనే పురుషుడు ‘‘జాగ్రత్ అనుభవము’’ అనే పురుషకారము నిర్వర్తించు సందర్భములో ‘‘విశ్వానుభవి, వైశ్వారుడు’’ అని చెప్పుకుంటున్నాము.

(కారును నడుపువానిని ‘‘కార్ డైవర్’’ అని పిలుస్తున్నట్లుగా, విశ్వానుభవి ‘విశ్వుడు’ అని పిలువబడుచున్నాడు).

‘‘జాగ్రత్ అనుభవము’’ అనునది ఆత్మయొక్క ఒక పురుషకారమై, ఆ పురుషుని ‘విశ్వ-అనం’’ (విశ్వమును అనుభవిస్తూ) - వైశ్వానరుడుగా చెప్పబడుచున్నాడు.

‘‘ఈ విశ్వమును భుజించటము లేక ఆస్వాదించటము’’ అనే వైశ్వానరత్వము ప్రమ పాదము (First of the Focus/ Roles / States).

వైశ్వానరుడు - కొన్ని శబ్దార్థ నిర్వచనములు

మనము జాగ్రత్‌లో ఉండి జాగ్రత్ - స్వప్న - సుషుప్తి తురీయములను పరిశీలిస్తూ ఉన్నాము. అందుచేత జాగ్రత్ మొదట (ప్రథమ) పాదముగా చెప్పుకుంటున్నాము.

ఈ వైశ్వానరుడే (విశ్వముపరంగా) ‘‘విరాట్’’ అని కూడా చెప్పబడుచున్నారు. అట్టి ‘విరాట్’ - ‘పంచీకృతస్థూలభూతములు (G) కార్యకారణ కర్తృత్వ సమన్వితము’’ - అయి ఉంటోంది. ఆత్మయొక్క విరాట్ ప్రదర్శనమే ఈ ‘‘విశ్వము (లేక) జగత్తు’’.


4వ మంత్రము

రెండవ అవస్థ - తేజసో ద్వితీయ పాదః।
2. అంతర్‌ప్రజ్ఞ • స్వప్నావస్థః • స్వప్న పురుషకారము • తేజసము • తేజసుడు • ‘‘హిరణ్యగర్భుడు’’.
(స్వప్నము నాదైన ‘‘నేను’’. నాయొక్క స్వప్నమాధుర్యము.)

స్వప్న స్థానో - అంతర్ ప్రజ్ఞః।

ఈ జీవుడు కొంతసేపు జాగృతానుభవము పొందిన తరువాత, తనయొక్క ప్రజ్ఞను ఇంద్రియ - బాహ్య దృశ్యమానమగు ‘విశ్వము’ నుండి ఉపసంహరించి, - అట్టి దృశ్యమువంటిదే అగు, ఊహతో నిర్మితమైన - దృశ్య వ్యవహారమును అంతరమున కల్పించుకొనుచున్నాడు. అట్టి పురుషకారము ‘‘అంతర్‌ప్రజ్ఞ’’ (Inner Visualising Wisdom) అనబడుతోంది.

తన ‘ప్రజ్ఞ’ అనే తేజస్సుతో అంతరమున ‘‘తనకు వేరా?’’ అని అనిపించు అనుభవమును ‘స్వప్నదృశ్యం’గా కల్పించుకొంటూ, ‘‘ఇదియే నిజము’’ అను అనుభవమునకు పురుషకారుడు అగుచున్నాడు. కాబట్టి ‘‘తైజసపురుషకారుడు’’ - అనబడుచున్నాడు.

అయితే, ఉభయ పురుషకారములు ఏకస్వరూపమగు ‘ఆత్మ’కు చెందినవే అయి ఉన్నాయి.

సప్తాంగ (3) - ఏకోనవింశతి ముఖః (19)।

‘‘స్వప్నదృశ్యము’’ అనే ఆహార భోజనము సందర్భములో కూడా జాగ్రత్‌లోలాగానే - ‘7’ అంగములు, ‘19’ ముఖములు కల్పితమై ఉంటున్నాయి.

జాగ్రత్‌లో - పంచేంద్రియములు ఉపయోగించబడుచున్నాయి. విషయములు బాహ్యముగా పొందబడుచున్నాయి.

స్వప్నములో - బాహ్య వస్తువులు లేకుండానే, ఇంద్రియార్థానుభవములు (శబ్ద స్పర్శ రూప రస గంధానుభూతులు) కొనసాగుతూ ఉండగా దృశ్యము కల్పితమై, ఆత్మచే ఆస్వాదించబడుతోంది.

మనస్సే-మనో ప్రపంచముగా అగుచున్నది. స్వప్న జగత్తు - ఆత్మకు ఆహారముగాను, వినోద కాలక్షేపముగాను - స్వయం కల్పితమౌతోంది.
స్వప్నములలో కూడా జాగ్రత్ వలెనే…..అంతరముగా ‘‘బాహ్యత్వము, అన్యత్వము’’ అనుభవముగా అగుచున్నది. స్వప్నము సమయములో స్వప్నదృశ్యము, జాగ్రత్ సమయంలో జాగ్రత్ దృశ్యము ‘సత్యము’గా అనిపిస్తూ, పరస్పరము (ఒకదానికి దృష్ట్యా మరొకటి) కల్పితమాత్రమే అవుతున్నాయి.

జాగ్రత్‌ను విడచి స్వప్నమును కల్పించిన తరువాత కూడా ఇంద్రియాపేక్ష ఇంద్రియ లోలుత్వము కొనసాగుతోంది. చేతితో తిప్పే చక్రము చేయి, ఆపిన తరువాత కూడా - తిరగడం కొంతసేపు కొనసాగుతుంది కదా! అట్లాగే, దృశ్యానుభవము స్వప్నములో పాల్గొనుచూనే ఉంటోంది.

అయితే ఈ తతంగమంతాకూడా, (జాగ్రత్-స్వప్నములు రెండూ కూడా) - ‘అంతరహృదయము’లోనే జరుగుతోంది. హృదయమనే తెర (Screen) పై ప్రసరితములు అగుచున్న చిత్రప్రదర్శనములే ఈ జాగ్రత్-స్వప్న దృశ్యములు.

అంతరమున ప్రజ్ఞ కొనసాగుచూ, కల్పితమును ఆశ్రయించటముచేత స్వప్న సందర్భములో ఆత్మను ‘అంతః ప్రాజ్ఞఃపురుషుడు’ అని చెప్పుకుంటున్నాము.

బాహ్య విషయములు లేకుండానే కేవల ప్రకాశము (Absolute Manifestation)చే విషయత్వము కొనసాగించటముచేత ‘‘తైజసుడు’’ అని పిలుస్తూ ఉన్నాము. [తేజో మాత్రములో (In the mere enlightenment) సాకారము కల్పించుకొను పురుషకారము]

తాత్కాలికంగా మనస్సును మనస్సునందే ప్రకాశింపజేసి స్వప్న - దృశ్య విషయముల ‘కర్త’గా అగుచుండటంచేత కూడా స్వప్న పురుషుడు ‘తైజసుడు’ అనబడుచున్నాడు.

విశ్వునికి (వైశ్వానరునికి)- స్థూలవస్తువులతో సంయోగముచేతను, ప్రజ్ఞ - ప్రేరేపణను స్వీకరించటంచేతను - భోగములు (Experiences) కలుగుచున్నాయి.

తైజసునికి - స్వప్న విశేషములన్నీ కూడా ఎట్లా కలుగుచున్నాయి? వాసనలను అనుసంధానము చేసి, భోగములను (Experiences) స్వకీయ ప్రజ్ఞచే కల్పించుకొని ఆస్వాదించటము చేతనే కలుగుచున్నాయి. జాగ్రత్‌లో సంపాదించిన వాసనలే స్వప్నములో ఊహానిర్మితమై ప్రజ్ఞకు అనుభవములుగా అగుచున్నాయి.

ప్రవిభక్త భుక్ : స్వప్న స్థానము స్వీకరించిన ఆత్మకు భౌతికమైన ఇంద్రియములు ఉపయోగించకుండానే, వాసనా మాత్రమైన ప్రజ్ఞ- ‘‘భోగ్యవస్తువు’’గా అవుతోంది. అనగా, స్థూల విషయములు లేకుండానే, వాసనలే (Tendencies themsleves) నామరూపాత్మకంగా కల్పితమవటంచేత ‘ప్రభవిక్త భుక్’ అని తైజసుడు పిలువబడుచున్నాడు.

చేతస్సే (visualisation) స్వప్నదృశ్యమునకు ద్వారము అయి స్వప్నానందము అనుభవించబడుచూ ఉండటంచేత స్వప్నపురుషుడగు తైజసుడు - ‘‘సూక్ష్ముడు’’ అని కూడా పిలువబడుచున్నాడు.

తనకు వేరుగా ఇంద్రియానుభవములను భావనచేస్తూ, భుజిస్తూ ఉండటంచేత ‘ప్రవిభక్త భుక్’ అగుచున్నాడు.

‘జాగ్రత్ నుండి స్వప్నములోనికి’ అనునది అందరికీ ప్రతిరోజు అనుభవమౌతోంది. కాబట్టి ఈ తైజసపురుషుని ‘‘ఆత్మయొక్క ద్వితీయ పాదము’’ - అని ఇక్కడ చెప్పుకుంటున్నాము.


5వ మంత్రము

మూడవ అవస్థ - ప్రాజ్ఞో తృతీయ పాదః
{ సుషుప్తి - నిర్విషయ ప్రజ్ఞ. ప్రాజ్ఞుడు. సుషుప్తి పురుషకారము. సుషుప్తి పురుషుడు.ఊ
(సుషుప్తి నాదైన ‘నేను’ - నాయొక్క సుషుప్తి మాధుర్యము)

సుషుప్తి -
శ్లో।। యత్ర సుప్తో న కంచన కామం కామయతే,
న కంచన స్వప్నం పశ్యతి - తత్ ‘‘సుషుప్తమ్’’।।

ఎప్పుడైతే - (వాస్తవానికి ఆత్మస్వరూపుడే అయి ఉన్న) ఈ జీవుడు, అటు ‘జాగ్రత్’ కానీ, ఇటు స్వప్నమునుగాని పొందక, తనకు తానే తనయందు ఏర్పడినవాడై, తాను ‘‘విషయ రహిత నిశ్శబ్ద మౌనము’’ వహించినప్పటి స్థితి - ‘సుషుప్తి’ అనబడు మూడవ పాదముగా చెప్పబడుతోంది.

అట్టి సుషుప్తి సందర్భములో
* జాగ్రత్, స్వప్నములందువలె కాకుండా, ఏదీ కోరుకుంటూ ఉండడు. దేనిగురించీ ఆలోచించడు. ఆశించడు.
* దేనినీ భావించడు. వేదన చెందడు. అనుభూతి కలిగి ఉండడు.
* ఏకీభూతః : ఏకస్వరూపుడై, తనకు అన్యమును ఏమాత్రము కలిగి ఉండని వాడై ఉంటాడు. జాగ్రత్ స్వప్న ప్రజ్ఞలను సుషుప్త ప్రజ్ఞయందు ఏకము చేసివేసి ఉంటాడు.
* ప్రజ్ఞాన ఘన : ‘బంగారపుముద్ద’వలె (ఆభరణత్వము అస్రదర్శితము అయి ఉన్నతీరుగా) కేవలమగు (ద్వితీయమే లేని) ‘ప్రజ్ఞానఘన’ స్వరూపుడై ఉంటాడు. శిల్పముగా మలచబడని శిలవలె ఘనీభూతుడై, నిర్విషయ విశేషుడై ఉంటాడు.

‘‘తెలివి-తెలియబడేది’’ అనే ద్వంద్వము నుండి తెలియబడేదంతా త్యజించి కేవలము ‘‘తెలివి (Absolute state of knowing without performing the function of knowing something else / something outside)’’ - రూపము సంతరించుకొన్నవాడై ఉంటాడు.
జాగ్రత్-స్వప్న వృత్తులన్నీ ఏకం చేసివేసి ఉంటున్నాడు.

అంతః ప్రజ్ఞ - బహిర్ ప్రజ్ఞలను ‘మౌనప్రజ్ఞ’ యందు ‘అనన్యము’ చేసివేసి ఉంటాడు. అనేకమంతా దాచివేసి, ‘ఏకము’ను మాత్రమే ఆస్వాదించువాడై ఉంటాడు. తాను ఉంటాడు. విషయములన్నీ అప్రదర్శితమై ఉంటాయి.

ఆత్మానందమయో : అన్యమే సంకల్పించకపోవటం చేత ఆత్మ (జీవుడు) తనయొక్క ‘ఏకతత్వము’చే ఆత్మానందుడై ఉంటాడు.
(అయితే ఇది జాగ్రత్-స్వప్న వృత్తులను దాచుకుని ఉన్న కించిత్ ఏమరచిన స్థితియే గాని, ‘వృత్తి రహిత, వృత్తి అతీత కేవలాత్మానందస్థితి’’ కాదు).

ఆనందభుక్ : జాగ్రత్‌లో భౌతిక రూపనామములు, స్వప్నములో ఊహారూపనామములు భోజనము (Food Stuff) అగుచుండగా, సుషుప్తి సందర్భములో మౌనానందమే, (మరియు) ఆత్మయొక్క సమీప్యానందమే ఆ జీవునకు ‘‘భోజనము’’ (That being consumed and enjoyed) అగుచున్నది. విషయము కలిగిస్తున్న స్పర్థలు, వేదనలు ఇక్కడ అప్రదర్శితము. కాబట్టి - ‘ఆనంద భుక్’ - అని చెప్పబడుచున్నాడు.

చేతోముఖః : మనస్సు మౌనము వహించి ఉంటుంది. చేతస్సు (తెలివి)ని ముఖముగా కలిగి, ‘‘తెలివితో తెలివిని మాత్రమే’’ చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు. ‘‘విషయములపై వ్రాలటము’’ అనే శ్రమలేనివాడై ఉంటాడు. దర్శన - అదర్శన వృత్తులు రెండూ తనయందు మరెక్కడో దాచిబెట్టినవాడై, వృత్తిరహిత నిజరూపసామ్యమును, సామీప్యమును ఆస్వాదిస్తూ ఉంటాడు.

జాగ్రత్ స్వప్నముల కంటే - ‘సుషుప్తి (మౌనరూపము ధరించుటచే)’ కొంత భిన్నమైనది. (ఎందుకంటే) జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో తన సహజమైనట్టి ‘‘ఆవలి (పర) రూపము’’ - యొక్క సామీప్యత సుషుప్తిలో అధికంగా అనుభవమవటంచేత.

అయితే, సుషుప్తి కూడా ఒకానొక ‘వృత్తి’ (లేక) రూపమే. అంతేకాని, జ్ఞాన - ఆనందరూపమగు ఆత్మాస్వాదన కానేరదు, కాజాలదు. ‘‘ఆత్మాహమ్ / సో-హమ్’ స్థానముతో సమానము కాదు. (ఎందుకంటే, వృత్తులు దాచబడి ఉన్నాయేగాని, ‘రహితం’ కాలేదు కదా!).

యత్ర సుషుప్తిః? ఏ స్థానమునందైతే బాహ్యమగు పాంచభౌతిక దర్శనవృత్తులు, అంతరమగు మనోబుద్ధి చిత్త అహంకార ప్రయుక్త వృత్తులు నిశ్శబ్దము వహించనై ఉంటాయో, అదియే ‘సుషుప్తి’. (Dead-Silence. Dead-Sleep).

ఆ స్థానమును ఈ జీవుడు ‘సుషుప్తి పాదము’గా ధారణచేయువాడై ఉంటాడు. (It is one Phase).

అది జాగ్రత్ - స్వప్న వృత్తులను తనయందు దాచుకొన్న స్థితియే కాబట్టి ‘సుషుప్తి - అవస్థితుడు’ అని చెప్పుకుంటున్నాము.

ఇక్కడ ‘‘జీవుడు’’ ద్వైత జాతమంతా దర్శించడు.

ఇది బాహ్య నివృత్తి - అంతర నివృత్తి సహిత పదము (లేక) స్థానము.

చీకటిలో వస్తుభేదములు కనిపించని రీతిగా గాఢనిద్రలోఉన్నవానికి ఆతని దృష్టిలో భేదభావములు (చీకటిలో ఉన్నవాటివలె) కనిపించనివై ఉంటాయి. అందుచేతనే సుషుప్తిని ‘ఏకీభూత స్థితి’ అంటున్నాము. (భేదములన్నీ ఏకమైయున్న స్థితి).

‘ప్రజ్ఞ’ ఏకరూపమై ‘‘ఏకీభూతప్రజ్ఞ’’గా అగుటచే ‘‘ప్రజ్ఞానఘనము’’ అని కూడా పిలుస్తున్నారు. నీరుగడ్డ కట్టినప్పుడు ‘జల ప్రవాహ ధర్మము’ వీడి ఉన్నతీరుగా, ప్రజ్ఞ - ప్రవహించు ధర్మమును వీడి (విషయత్వము వదలి) ఘనీభూతమై ఉండటంచేత ‘‘ప్రజ్ఞానఘనము’’ అనిపించుకుంటోంది.

ప్రజ్ఞ సర్వ సందర్భములలో ఏకమే అయి ఉన్నది (ప్రజ్ఞానమే బ్రహ్మము). అయితే ఈ ప్రజ్ఞ - ఒకప్పుడు జాగ్రత్ (బాహ్యవృత్తులు), మరొకప్పుడు అంతర్ (సూక్ష్మ-భావనామాత్ర) వృత్తులు, ఇంకొకప్పుడు వృత్తిరాహిత్యము (సుషుప్తి) ధారణ చేస్తూ ఉంటోంది.

జాగ్రత్ స్వప్నములలో ‘అన్యము’ నుంచి వచ్చే ఆనందము దుఃఖ - మిశ్రితము (లేక) దుఃఖ పరిణామ స్వరూపము. వృత్తిరహిత ప్రాజ్ఞుడు సుఖదుఃఖ ద్వంద్వములను దాటివేసిన విషయరహితమగు మౌనానందము, ఆస్వాదించువాడై ఉంటున్నాడు.

ఆనంద భుక్ : జాగ్రత్ - స్వప్నములలో ఏర్పడుచున్న బాహ్య - అంతర్ (అభ్యంతర) వృత్తుల ప్రదర్శనా - ఆయాసము సుషుప్తిలో ఉండదు. కనుక - సుషుప్తి పురుషుని (ప్రాజ్ఞ పురుషుని) స్థితి (In Relation to Jagruth and swapna) ‘‘ఆనందమయము, ఆనందభుక్ ’’ - అని అనబడుతోంది. అయితే, అది వృత్తులు వదలకయే, వృత్తి నుండి కాసేపు నివృత్తి పొందిన స్థితి మాత్రమే. అనగా నిత్యానందము బ్రహ్మానందము కాదు - అని మరల గుర్తు చేసుకుంటున్నాము.

ప్రాజ్ఞుడు : ప్రాజ్ఞుడే ‘ప్రజ్ఞ’ అనే నావ ఎక్కి జాగృత్, స్వప్న స్థానములన్నీ చుట్టి, తిరిగి సుషుప్తి అనే గూటికి చేరుతున్నాడు. ప్ర + ఆఙ్ + జానాతి ఇతి ప్రాజ్ఞః? ‘‘ఇది నా జాగ్రత్ ప్రదర్శనము. ఇది నా స్వప్న ప్రదర్శనము. ఇది నా సుషుప్తి ప్రజ్ఞ’’ - అనురూపముగా సుషుప్తి పురుషునికి మూడిటికి సంబంధించిన ఎరుక ఉండటంచేత (అనగా, సమస్తము తెలిసినవాడు కాబట్టి) - ‘ప్రాజ్ఞుడు’ అనబడుచున్నాడు. ఈ ప్రాజ్ఞ పురుషుడు జాగృత్‌లోను, స్వప్నములోను ప్రవేశించి, తిరిగి ‘సుషుప్తి’ అనే సొంత ఇంటికి చేరుచున్నాడు.

త్రైకాలిక ప్రాజ్ఞ సిద్ధాంతము : సుషుప్త సమయంలో మనోబుద్ధి చిత్త అహంకారములు కేవల ప్రజ్ఞయందు లీనమై ఉండటంచేత, సంస్కారములు కూడా ‘‘ప్రాజ్ఞ ఏకత్వము’’ వహిస్తూ ఉంటున్నాయి. జాగ్రత్ - స్వప్నములలో ఎదురుపడే భోగ్యకర్మల సంస్కారములు తమ రూపము కోల్పోయి ఉంటాయి.

ప్ర-అజ్ఞః = ప్రదర్శనము విషయములో అజ్ఞుడు అయినప్పటికీ ‘‘హాయిగా నిద్రపోయాను. ఒళ్ళు తెలియనే లేదు’’ అని జీవుడు నిదురలేచిన తరువాత అంటున్నాడు. కాబట్టి, సుషుప్తిలో ఆనందము ఎరుగుచున్నవాడే అయి ఉంటాడు. (అనగా) - ఎరగటము. (The feature of / function of ‘knowing’) - అనునది లేకుండా పోలేదు.

సుషుప్తిలో అన్ని ఆనందములు తెలిసియే ఉంటున్నాడు. కనుక ‘‘త్రైకాలిక ప్రాజ్ఞుడు’’. అంతేగాని ‘అజ్ఞుడు’ కాదు. (He is aware of all thru states).

ప్రాజ్ఞ - కేవల స్వరూపజ్ఞాని - అకారణానందుడు : కేవల స్వరూపము యొక్క సామీప్యతచే ఆత్మయొక్క మౌన - అతీత - అకారణానంద స్థితి అనుభవమౌతుంది. కాబట్టి ‘‘ప్రజ్ఞప్తిమాత్రం, ఆస్వ ఏవ అసాధారణం రూపమితి - ప్రాజ్ఞ’’ - అంటున్నారు. జాగ్రత్ - స్వప్నముల కంటే కూడా విశిష్టమైన ఆత్మవిజ్ఞానానందయుతుడు. (అనగా) తనయొక్క స్వస్వరూపముతో సామీప్యము అధికంగా పొందడము చేతనే గాఢనిద్ర అకారణానందమగుచున్నది. (జాగ్రత్-స్వప్నములలోవలె ఆనందమునకు కారణము - ఇక్కడ అవసరముండదు).

అట్టి సుషుప్తానందమును భక్తి - యోగ - జ్ఞానాభ్యాసములచే ఆత్మతత్త్వజ్ఞులు జాగ్రత్ - స్వప్న సందర్భములలో కూడా స్వాభావికంగా తెచ్చి పెట్టుకొనియే ఉండగలుగుచున్నారు. ఈ చంచలజగత్తులో నిశ్చంచలువై, నిశ్చింతులై, నిర్విషయులై, పరానందస్వరూపులై వర్తిస్తున్నారు. ‘నాటకంలో నటుడు - తాను పాత్రకు వేరైన తీరుగా, - జాగ్రత్ స్వప్నముల నుండి వేరుపడి, ‘ప్రశాంతత’ పొందుచున్నాడు.

‘బ్రాహ్మీ దృష్టి’చే ‘‘చంచలరహిత సుషుప్తి మౌనస్థితి’ ముముక్షువుకు జాగ్రత్-స్వప్నములలో కూడా స్వాభావికమై సిద్ధించగలదు.


6వ మంత్రము

నాలుగవ అవస్థ - తురీయ పురుషుడు

(1) జాగ్రత్ నాదైన ‘నేను’ - విశ్వురుడు / వైశ్వానరుడు
(2) స్వప్నము వాదైన ‘నేను’ - తైజసుడు
(3) సుషుప్తి నాదైన ‘నేను’ - ప్రాజ్ఞుడు అని అనుకున్నాము కదా!

ఇక, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు ‘‘నావైన నేను’’ - తురీయుడు  (చమరీయుడు - 4వవాడు) అగుచున్నాడు.

అట్టి ‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తులకు వేరై, ఆ మూడు నావైన ‘నేను’ అగు ఈ జీవుని యొక్క (మూడిటికి ఆవలి) నాలుగవ (చతురీయ / తురీయ) స్వరూపము ఎట్టి లక్షణ విశేషములు కలిగి ఉన్నట్టిది? ఇది వివరించుకుందాము.

ఏష సర్వేశ్వరః : చతురీయుడుగా (నాలుగవవాడుగా) ‘నేను’ అనునది - జాగ్రత్ - స్వప్నసుషుప్తులుగా స్వకీయ కల్పితమాత్రమై విస్తరించి ఉన్నట్టిది. అంతేగాని, ఆ మూడిటిలోని ఒక దానిలో చిక్కుకున్నది కాదు. జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో విస్తరించి ఉండటంచేత,తురీయుడగు ‘నేను’ - ‘సర్వేశ్వరుడు’ అయినట్టివాడు. ఈ జీవుడు స్వతఃగా తురీయుడేగాని, జాగ్రత్-స్వప్న సుషుప్తు పరిమితుడు కాదు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనదైనట్టిది.

ఒక రాజు గారి అధికారము అంతఃపురములోను, ఉద్యానవనములోను, రాజసభయందు, రాజ్యమంతా విస్తరించియున్న తీరుగా మన తురీయ పురుషకారము యొక్క ఆధిపత్య ప్రదర్శనములే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు. అనగా తురీయ పురుషకారము = ‘‘నేనే జాగ్రత్ - స్వప్న - సుషుప్త స్థానములను విహరిస్తున్నాను’’ - అను స్వకీయ పురుషకారము.

ఈ విధంగా తురీయుడనగు నేను - సర్వమునకు (జాగ్రత్ స్వప్న) సుషుప్తులలో కల్పితమగుచూ ఉన్న సమస్తమునకు ఈశ్వరుడను. సర్వేశ్వరుడను - అను ఎరుక ఈ జీవునిలో ప్రకాశమానమైయ్యే ఉన్నది.

ఏష సర్వజ్ఞః : అట్టి (చ) తురీయ పురుషునికి అన్యమైనదంతా స్వయం కల్పితము. ‘‘సమస్తమునకు వేరై, సమస్తము నేనే అయి ఉన్నాను’’ - అను ఎరుక కలిగి ఉన్నట్టిది. ఈవిధంగా తురీయ పురుషుడుగా ఈ జీవుడు ‘సర్వజ్ఞుడను’.

‘‘జాగ్రత్ - స్వప్న - సుషుప్తు స్వయం కృత లీలా - క్రీడ - వినోద విశేషములే’’ అని ఈ జీవుని యొక్క తురీయ పురుషుడు ఎరిగియే ఉండటంచేత సర్వజ్ఞుడు అన్నీ ఈతనికి తెలుసు’’ - అని లక్షణముగా చెప్పబడుతోంది.

ఏషో అంతర్యామి : ఒక నాటకములోని నాయకుడు, నాయకి, ప్రతి నాయకుడు (Hero, Heroine, Villain) మొదలైన పాత్రలు అన్నిటికీ అంతర్యామి ఎవరు? ఆ నాటకరచయితే కదా! రచయిత పాత్రల పరస్పర సంబంధముల మధ్యగా చిక్కుకొని ఉంటాడా? లేదు. నాటక రచన - రచయిత యొక్క కల్పన మాత్రమే.

జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఆత్మయొక్క ‘‘నాటక రచనా చమత్కారము’’ వంటి సంప్రదర్శనమే. అంతేగాని ఆత్మ వాటిలోని ఒక సందర్భములోనో, సంఘటనలోనో చిక్కుకున్నట్టిది కాదు.

‘‘నాటక రచనలోని నాయకుడు - ప్రతినాయకుడుల మధ్య నాటక రచయిత చిక్కుకున్నాడు’’ అని ఎప్పుడూ అనము కదా!

అట్లాగే, నేను జాగ్రత్ స్వప్న సుషుప్తులలోని ఒక సంబంధము చేతనో, సంఘటనచేతనో బద్ధుడను ఎట్లా అవుతాను? అవను.

అట్టి ఈ ద్రష్ట - దృశ్య - దర్శనానుభవములకు అంతర్యామిని ‘‘నేనే’’ - అను నిశ్చలావగాహనయే తురీయస్థానము.

బంగారు ఆభరణమునకు బంగారమువలె, తరంగములకు జలమువలె నేను జాగ్రత్ స్వప్న సుషుప్తులకు (తురీయుడుగా) అంతర్యామిని.

ఎందుచేత? జాగ్రత్ పురుషుడు, స్వప్నపురుషుడు, సుషుప్తిపురుషుడు (విశ్వుడు/వైశ్వానరుడు, తేజసుడు, ప్రాజ్ఞుడు) అనబడేవి నాయొక్క త్రివిధ పురుషకారములే కాబట్టి.

‘‘పురుషుడు’’ = పురుషకారము తనదైన వాడు (The worker)

పురుషకారము = The works of ‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తి’’ are nothing else other than my own workmanship.

ఒక చిత్రకారుడు (Paints) తయారుచేసిన చిత్రము (Painting) లో కనబడే మనుష్యులకు, జంతువులకు, ప్రకృతి దృశ్యమునకు అంతర్యామి ఎవరు? చిత్రకారుడే కదా!

అట్లాగే, నాకు అనుభవమగుచున్న జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు చిత్రకారుడు (The Painter) నేనే అయి ఉండి, అ అంతటిలో ‘అంతర్యామి’ని అయి ఉన్నాను - అనునదే ‘‘తురీయ భావన’’

యేష యోనిః : నాకు అనుభవమయ్యే ఈ జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు ఎందులో జనిస్తున్నాయి? నాయందే! అంతేగాని బాహ్యమున కాదు. కనుక అనుభవమయ్యే సమస్తము యొక్క జనన స్థానము, ఉనికి స్థానము (లేక) ఏర్పడియున్న చోటు (లేక) యోని స్థానము నేనే। ఆత్మనగు నాయందే - సమస్తము ఏర్పడినవై ఉన్నాయి.

మాండూక్య-ఉపనిషత్-తురీయాతీతం

నేనే విశ్వ - తేజో - ప్రాజ్ఞులుకు ‘ఉనికి స్థానము’ అయి ఉన్నాను. అందుచేత సమస్తమునకు ‘యోని’ నాయొక్క తురీయ పురుషకారముతో కూడిన నేనే। = అనునదే తురీయానుభవము।

సర్వస్య ప్రభవాసి, యయౌహి భూతానామ్ : జలములో తరంగములు బయలుదేరి, జలమునందే ప్రదర్శనమై, చివరికి జలమునందే ‘లయము’ పొందుతాయి కదా!

నాకు జాగ్రత్ - స్వప్నములలో నాదేహము, తదితర దేహములు, దేహిలు, దృశ్యము - ఇవన్నీ నాకు ఇంద్రియముల ద్వారా అనుభవమౌచున్నాయి. వారంతా ఎవరు? నాయొక్క భావనా తరంగ రూపములే.

నేను భావించినప్పుడే ఎవ్వరైనా, నాకు అనుభవమగుచున్నారు. ఏదైనా నాకు అనుభవమౌతోంది. కాబట్టి జాగ్రత్ - స్వప్నములలో కనిపించుచూ, అన్యముగా అనిపించే జీవజాలమంతా. నాయెక్క ఆత్మసాగర భావనా తరంగ రూపములే!

అందుచేత నాయొక్క తురీయానంద - ఆత్మ స్వరూపమునందే భూతజాలమంతా బయల్వెడలి, కొంతసేపు ఉనికిని పొంది, తిరిగి - లయిస్తోంది.

నా కల్పన, నాయందే బయల్వెడలి, నాయందే సంచరించి, నాయందే లయిస్తున్నట్టి నేనైన నేనే ‘‘నేను’’. అట్టి నేనైన నేనే తురీయము.

‘‘నా గర్భమే ఈ 14 లోకముల ఉనికి-లయస్థానము. ఈ ఇంద్రియములకు తారసబడేదంతా ‘నేనే’-యోనిగా కలిగి ఉన్నదై ఉన్నది’’- అనునదే తురీయుని అనుభవము.

ఏక ఏవ త్రిధా స్మృతః
ఒక్కటే మూడుగా ప్రదర్శనమగుచున్నది

ఒకడు →
ఇంటిలో → గృహస్థుడుగా,
పనిచేసేచోట → ఉద్యోగి (లేక) వ్యాపారి (లేక) రైతు మొదలైనవాటిగా,
సాయంకాలము క్రీండించునప్పుడు క్రీడాకారుడుగా → ఉండవచ్చు గాక!
ఆ గృహస్థుడు, ఉద్యోగి, క్రీడావినోది తానుగా ఒక్కడేగాని ‘మూడు’గా అగుచున్నాడా? లేనే లేదు. ఆతడు ఎల్లప్పుడు ‘ఒక్కడే’ అయి ఉన్నాడు.

అట్లాగే…
(1) బహిః ప్రజ్ఞో విభుర్విశ్వః : నా జాగ్రత్‌లో బాహ్య ప్రజ్ఞచే విశ్వవిభుడను (వైశ్వానరుడను / విశ్వుడను) (లేక) విశ్వపురుషాకారుడను.
(2) అంతః ప్రజ్ఞస్తు తేజసః । నాయొక్క స్వప్నములో తైజసుడను (లేక) తైజసపురుషాకారుడను,
(3) ఘనప్రజ్ఞ స్తదా ప్రాజ్ఞః నాయొక్క సుషుప్తిలో ఘనీభూతమైన, ఎటూ ప్రసరించని ప్రాజ్ఞ పురుషాకారుడను.

ఈ మూడు పురుషకారముల సందర్భములలో ప్రజ్ఞ ఏకస్వరూపమేగాని, మూడుగా అవటము లేదు.

ఆ మూడిటిలో ‘నేను’ ప్రవర్తిస్తూ ఉండగా, ఆయా సందర్భములలో నేను ‘నేను’గానే ఉంటున్నది. (ఉంటున్నాను). మూడు సందర్భములలోను ‘ప్రజ్ఞ’ ఒక్కటే। మూడుగా అవటము లేదు. ఏక ఏవ త్రిధా స్మృతాః।

ఈ విధంగా ఏక ప్రజ్ఞా స్వరూపుడనే గాని మూడు ప్రజ్ఞలు లేవు. మూడు ‘నేను’లు లేవు.

‘‘అట్టి త్రివిధములుగా ప్రదర్శనమగు కేవలప్రజ్ఞాస్వరూపమే - బ్రహ్మము’’ - అను అర్థమునే ‘‘ప్రజ్ఞానం బ్రహ్మ’’ అను వేదోపనిషత్ మహావాక్యము సూచిస్తోంది.

అట్టి ప్రజ్ఞయే బ్రహ్మము। నేనే బ్రహ్మమును। కేవలమగు ప్రజ్ఞయే నేను।

ప్రజ్ఞ ఎల్లప్పుడు ఏకమే అయి ఉండి తనయొక్క ప్రదర్శనా వినోదముగా జాగ్రత్ స్వప్న సుషుప్తములను నిర్మించుకొనుచూ, తత్ తత్ పురుషకారములను (Respective Workmanships) స్వీకరించుచున్నది. (Is taking up).

ప్రజ్ఞ = తెలివి :

తెలివితో అనేక విషయాలు తెలుసుకోవచ్చుగాక! కానీ తెలివి ఎప్పుడు ఒక్కటే! జాగ్రత్ స్వప్న సుషుప్తులను, వాటిలోని అంతర్ విశేషములను తెలుసుకుంటున్న ప్రజ్ఞ - ఏకమేగాని, అనేకము కాదు. అనేకముగా అవదు. దేహ-దేహాంతరములు కూడా- అట్టి ‘‘ప్రజ్ఞ’’ యొక్క సమక్షములో జరుగుచున్నవే।

ఒకనికి కళ్లలో ‘చూపు’ గా ఒక ‘తెలివి’, చెవులతో ‘వినికిడి’ గా మరొక ‘తెలివి’, చర్మములో ‘స్పర్శజ్ఞానము’గా ఒకానొక తెలివి, నాలుకపై ‘రుచి’గా వేరొక తెలివి, ముక్కులో ‘సువాసన’గా మరేదో తెలివి ఉండదు. తెలివి ఒక్కటే।

అట్లాగే ‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ప్రజ్ఞ ఒక్కటే. అట్టి ఏకస్వరూప ప్రజ్ఞయే నేనై ఉన్నాను’’ - అనునదే తురీయానుభవము.

అట్టి సర్వ అనుభవముల సందర్భములలో ‘ఏకమే’ అయి ఉన్న ప్రజ్ఞయే సమస్త జీవులలో కూడా ‘ఏకమే’ అయి ఉన్నది. త్రిమూర్తులలోను, ఒక పురుగులోను ఏర్పడినదై ఉన్న అట్టి కేవలమగు ‘ప్రజ్ఞ’యే ‘‘బ్రహ్మము’’.


7వ మంత్రము

త్రివిధములైన పురుషకారములు తనవైన పురుషోత్తముడు (ఉత్తమ పురుషః - The ‘I’ at its absolute) ఏదేది కాదో ‘‘నేతి నేతి’’ మార్గంగా వివరించుకుంటున్నాము.

ఆత్మయే నేనైన ‘‘నేను’’ → ఏదేది అయి ఉండను? (what I am not becoming as..)


న అంతః ప్రజ్ఞం।

అంతర్-ప్రజ్ఞ అగు స్వప్నపురుషుడుగా (తేజసుడుగా) నేను అవటము లేదు. సర్వదా ఆవలయే ఉన్నాను.

ఒకడు కూరగాయలు అమ్మటానికి వస్తే, ‘‘ఓ కూరగాయల అబ్బాయీ!’’ - అని పిలుస్తాము. అంతమాత్రంచేత ఆతడు కూరగాయలు అమ్మువాడుగా మారిపోతున్నాడా? లేదు. అది ఆతని పట్ల ఒకానొక సందర్భము మాత్రమే. ఆతనికి ఇల్లు, భర్త, తండ్రి, కొడుకు మొదలైన పాత్రలు లేకుండా పోతాయా? పోవు.

అట్లాగే బాహ్యమున విశ్వపురుషుడుగా, అంతరమున స్వప్నము పొందుచున్నప్పుడు ‘‘తైజసుడు - స్వప్న పురుషుడు’’ గా మనము చెప్పుకొంటున్నప్పటికీ, ‘‘నేను నేనైన ఆత్మ’’ - విశ్వపురుషుడుగా, తైజస పురుషుడుగా, ప్రాజ్ఞపురుషుడుగా అయిపోవటము లేదు. అది ఆత్మకు ఒకానొక ప్రదర్శనా సందర్భము మాత్రమే! కనుక ఆత్మ ‘అంతర్ ప్రజ్ఞ’ కాదు.

మనో బుద్ధి చిత్త అహంకారములు నా అంతరంగ చతుష్టయము. అవి ‘నావి’ కావచ్చునేమోగాని, నేను ‘అవి’గా అవటము లేదు. వేరుగానే ఉన్నాను. కనుక నేను అంతర్ ప్రజ్ఞను కాను.

న బహిర్ ప్రజ్ఞం।

బాహ్యమున దృశ్యము -ద్రష్ట, దేహము - దేహి, అనుభవము - అనుభవి - ఇవన్నీ కూడా నా ప్రజ్ఞారూప ప్రదర్శనములు కావచ్చుగాక। అంతమాత్రంచేత అవిగా నేను అవటంలేదు. అవన్నీ కూడా (అంతర్ ప్రజ్ఞ వలెనే) ‘నావి’ కాని, ‘నేను’ కాదు. ‘నేను’ అనబడు ఆత్మ బాహ్య ప్రజ్ఞగా అవటం లేదు. అవదు. కనుక బ్రహిర్ ప్రజ్ఞ నేను కాదు.

బాహ్యముగా ఉన్న - ‘‘తెలివి గలవాడు. అది తెలుసు. ఇది తెలియదు’’ మొదలైనవి నా గురించిన సందర్భానుచిత వాక్యము-మాత్రమే, నాయొక్క సహజ-స్వాభావిక ప్రజ్ఞ సమస్త విశేషములకు ‘కారణ-కారణము’ అయి ఉన్నది.

న ఉభయ ప్రజ్ఞ।

స్వప్న - జాగ్రత్‌లో రెండింటిలో - ఏ ‘‘తెలివి’’ (ప్రజ్ఞ) వర్తిస్తోందో, అది నేను (ఆత్మ) కాదు. ‘తెలివి నాది’ అయి ఉండవచ్చునేమోగాని, అంతరంగ - బహిరంగములలోని ‘తెలివి’గా నేను అవటములేదు.

కార్యాలయము (ఆఫీస్)లోను, ఇంటివద్ద నేను ఆయా సందర్భానుచితమైన తెలివితేటలతో వర్తిస్తూ ఉన్నప్పటికీ….ఆయా రూపములుగా నేను అగుచుండటంలేదు - నేను ‘వేరే’ అయి ఉన్నాను.

ఈవిధంగా ఆత్మ అంతర్ - బహిర్ ప్రజ్ఞలకు ‘‘వేరేనే’’ అయి ఉన్నది.

న ప్రజ్ఞాన ఘనం।

సుషుప్తిలో నేను ఘనీభూతమైన ప్రజ్ఞ (Intelligence without any internal or external factors of whatever being known) కలిగి ఉంటున్నాను. అయినాకూడా అట్టి ఘనీభూతమైన తెలివి (తెలియబడేది ఆశ్రయించనట్టి తెలివి) ‘‘నాది’’ అయి ఉండవచ్చునేమో గాని, అట్టి ప్రజ్ఞాన ఘనముగా ‘‘నేను’’ అయిపోవటము లేదు. విడిగానే ఉన్నాను. తెలివి నాదైన నేనే నేను.

ఈ విధంగా ఆత్మ ప్రజ్ఞాన ఘనము కాదు.

అంతర్ ప్రజ్ఞ, బహిర్ ప్రజ్ఞ, ప్రజ్ఞాన ఘనములు - ఆత్మయొక్క ‘‘ఒకానొక సందర్భ ప్రదర్శనము’’ మాత్రమే. అనగా నాయొక్క ఆయా సందర్భములలోని ‘‘విన్యాసములు’’ - మాత్రమే అయి ఉన్నాయి.

న ప్రజ్ఞః।

నేను కేవలమగు ‘తెలివి’గా అగుచుండటము లేదు. తెలివి ‘‘నాది’’ కావచ్చు గాక। అది నాయొక్క చిత్కళ మాత్రమే.

కనుక ఆత్మ ప్రజ్ఞారూపము (జాగ్రత్ ప్రజ్ఞ, స్వప్న ప్రజ్ఞ, సుషుప్తి ప్రజ్ఞలలో ప్రజ్ఞగా) అగుచుండటములేదు. ఆత్మయొక్క సలక్షణ విశేషమే - ప్రజ్ఞ. (చిత్, సత్, ఆనందములు కూడా అట్టి సలక్షణ చమత్కారములే! అంతేగాని ఆత్మ వాటివాటిచే పరిమితము కాదు).

న అప్రజ్ఞః।

సమస్తము నేనే! నేను కానిదేమీ లేదు. విశ్వము-విశ్వుడు, స్వప్నము-తేజసుడు, సుషుప్తి-ప్రాజ్ఞుడు, ఇవన్నీ నాకు వేరై లేవు. (‘సర్వం ఖల్విదం బ్రహ్మ’’-అను మహావాక్యార్థముగా) ప్రజ్ఞ ఆత్మస్వరూపమునకు వేరు కాదు.

కాబట్టి, అప్రజ్ఞను (ప్రజ్ఞారహిత రూపుడను) కాదు.

ఆత్మనగు నేను ఆత్మగానే ఉన్నాను. అంతేగాని, ప్రజ్ఞగా అవను. కానీ, ‘ప్రజ్ఞ’గా కనిపిస్తున్నది నేనే. అట్లాగే జాగ్రత్, స్వప్న సుషుప్తులుగా కనిపిస్తూ ఉన్నదీ నేనే। నాకు అన్యము లేదు కదా।


అదృష్టమ్ : ‘‘ఇంద్రియములకు నియామకుడను, నిర్మించుకొనువాడను - అగు నేను ఇంద్రియములకు విషయమును కాను.

అందుచేత ఈ దృశ్యము నేను కాదు. నాయొక్క స్వయం - కల్పిత ద్రష్టత్వముచే నేను కల్పించుకొను స్వకీయ చమత్కారమే ఈ దృశ్యము.

అట్టి దృశ్యములో నేనెట్లా కనిపిస్తాను? నవలా రచయిత నవలలో ఉండడు కదా! నవలంతా తానై, వేరై కూడా ఉంటాడు.

స్వప్నము తానైనవాడు స్వప్నములో తారసపడడు కదా।

అవ్యవహార్యమ్ : ప్రపంచమంతా నాయొక్క కల్పితమే। ఆత్మచే లీలా వినోద కల్పితము. ఆత్మగా ప్రపంచంలో వ్యవహరించువాడను కాను. దృశ్యానుభవమంతా నాయొక్క (ఆత్మయొక్క) ఒక వ్యావహార్యము. నేను దృశ్యమునకు చెందిన ఒక వ్యవహారము (context) వంటివాడను కాను.
- నవలా రచయిత నవలలో ఒకచోట కనిపించేవాడు కాదుకదా! ఒక వ్యక్తివలెనో, వస్తువు వలెనో ఆత్మ కనిపించేది కాదు.
- దృశ్యమునకు ద్రష్ట వేరై ఉన్నతీరుగా, ఆత్మ-ద్రష్టకు కూడా వేరై ఉన్నది. ఆత్మ జగత్తులో ఒక వ్యవహారము / సందర్భము కాదు. జగత్తంతా ఆత్మకు వ్యావహార్యమే. (A kind of form of Avocation) కనుక ఆత్మ అవ్యవహార్యము. ఈ జగత్తు ఆత్మకు (నాకు)- వ్యవహరించు ఒక ‘రంగము’ (Stage of Drama) వంటిది.

అగ్రాహ్యమ్ : ఆత్మ బుద్ధికి కూడా విషయము కాదు. ఆత్మ ఇంద్రియములచేతనో, మనస్సుచేతనో గ్రహించబడేదీ కాదు. మరి? అది నిర్మల హృదయమునకు ‘‘స్వస్వరూపమే’’గా అనుభవమగునట్టిది.
అది ఒకరు మరొకరిని గ్రహింపజేసేది కూడా కాదు. ఎవరికి వారే తమ స్వరూప - ఔన్నత్యము గ్రహించవలసినదేగాని, మరొకరు ఎట్లా గ్రహింపజేస్తారు? అది ప్రతి ఒక్కరికి తనయందు సాక్షి అయి - ‘తానే’ అయిన స్వస్వరూపము కదా। అయితే- శాస్త్రములు, గురువులు అట్టి ఆత్మగురించి గుర్తుచేస్తున్నారు. శ్రద్ధగలవారు అది తెలుసుకోగలుగుచున్నారు.

అలక్షణమ్ : ఆత్మకు సత్ (ఉనికి), చిత్ (ఎరుక), వినోది (ఆనందము)గా (సచ్చిదానంద లక్షణ సమాన్వితముగా) చెప్పుకోబడుచున్నప్పటికీ, ‘‘ఆత్మ’’ - దేనియొక్క లక్షణము కాదు. స్వభావికము, స్వాతంత్ర్యము అయినదానిని ఏ లక్షణములతో పరిమితం చేసి చెప్పగలం?

అచిన్త్యమ్ : చింతనలన్నీ ఆత్మవేగాని, అది చింతనకు విషయము కాదు. (It is a common sense). ఆలోచన చేయువాడు ఆలోచనలలో లభ్యమవడు కదా! అయితే, చింతనలన్నీ ఆత్మయొక్క ప్రదర్శనా చమత్కారమే।

అన్యపదేశ్యమ్ : ఒకరు మరొకరికి వాక్కు ద్వారా అందించగలిగేది కాదు. శ్రవణము (వింటున్న విశేషములను) మననం చేసి ఎవరికివారే ఆత్మ (The Absoulte Self) యొక్క ఔన్నత్యమును స్వానుభవముగా (నిదిధ్యాసగా) తెచ్చుకోవలసినది మాత్రమే।

ఏకాత్మ ప్రత్యయ సారమ్। : భూమి అనేక గ్రామ - పట్టణ - దేశ - ఖండ - ఖండాతరములుగా చెప్పబడుచున్నప్పటికీ - భూమి అంతా ఒక్కటే!

• వాయువు వస్తువులలోను, దేహములలోను, బాహ్యమున - అనేక ధర్మములు నెరవేరుస్తూ ఉన్నప్పటికీ వాయువు ఒక్కటే।
• అనేకచోట్ల జలము ఉన్నప్పటికీ జలమంతా ఒక్కటే.
• దేహి దేహములో - చూడటము, వినటము, స్పర్శానుభవము, రుచి, వాసన - ఇవన్నీ వేరువేరైనవి పొందుచున్నప్పటికీ - అనుభవి అన్నిటికీ, ఎన్నటికీ ఒక్కటే.

అట్లాగే…,
ఆత్మ అనేక దేహములలో, అనేక జీవ-జీవజాతులుగా కనబడుచూ ఉన్నప్పటికీ ఆత్మ సర్వదా ‘ఏకమే’ అయి ఉన్నదిగాని,…అనేకముగా అగుచుండటములేదు. అది సర్వదా అఖండము. జీవాత్మగాను, జగత్తుగాను, అనేక జీవాత్మలుగాను అగుటయేలేదు.

సముద్రంలో ఎన్నితరంగాలు బయల్వెడలినాసరే, సముద్రజలము ఏకమేగాని, ‘అనేకము’గా అవదు కదా!

అందుచేత - అనేకముగా కనిపిస్తూ ఉన్న ఈ దృశ్య జీవులలో ఏకాత్మయే సర్వదా వెలుగొందుచున్నది.

(తరంగముగా → సర్వాభూతస్థమ్ ఆత్మానమ్। నా ఆత్మయే అన్ని జీవులలోఆత్మగాను,
జలముగా → సర్వభూతాని చ ఆత్మని। నా ఆత్మలోనే సర్వ - భూతజాలము.
- ఈక్షత్ యోగ యుక్తాత్మా
- అనునది గీతాచార్య యోగయుక్తాత్మ నిర్వచనము. ఏకాత్మప్రవచనము.)

ప్రపంచోపశమనం : తరంగాలన్నీ కూడా జలంలోంచే బయల్వెడలి, తిరిగి జలమునందే లయిస్తున్నట్లుగా,…ఈ ప్రపంచము యొక్క ఉపశమ ( withdrawal) స్థానము ఆత్మయే అయి ఉన్నది.

నాచే అన్యముగా అనుభవము చేసుకోబడుచున్న ఈ దృశ్యతరంగ వ్యావహారమంతా (ఆత్మస్వరూపుడనగు) నాయందే బయల్వెడలి, నాయందే స్థానము కలిగియుండి, పునఃగా మమాత్మయందే ఉపశమించి సశాంతిస్తోంది. (ఓం శాంతిః। శాంతిః। శాంతిః).

శాంతమ్ : ఆత్మ స్వాభావికముగానే, సహజంగానే ‘పరమ శాంతస్వరూపము’. ఇక్కడి జన్మ-కర్మ-కర్మఫలములుగాని, జన్మ-జీవన్- మరణాదులుగాని, జన్మ-జన్మాంతరములుగాని, 14 లోకములలో జరిగే కార్యక్రమ సంబంధములుగాని, పాప-పుణ్యములుగాని, విజ్ఞాన-అజ్ఞానములు మొదలైనవిగాని - పరమశాంతమగు ‘ఆత్మ’ యందు ఏమాత్రము అశాంతి కలిగించలేవు. ఆత్మయొక్క స్వాభావిక ప్రశాంతత్వమునకు అవరోధములు అవజాలవు.

శివమ్ : ఆత్మ - సర్వులలో ఆనందస్వరూపమై సర్వదా వేంచేసియే ఉన్నది. శుభ - శాంతి - ఐశ్వర్య - ఆనందముగా అఖండమగు ఆత్మ సర్వదా సంప్రకాశమానమైయే ఉన్నది.

అద్వైతమ్ : దేనికి ‘జీవాత్మ, జగత్తు, లోకములు’ మొదలైనవి ద్వితీయము కావో, అదియే ఆత్మ. ఆత్మకు అన్యము లేదు. కవియొక్క కల్పనకు వేరై కవిత్వములో ఏమి ఉంటుంది?

పై విశేషములు కలిగియున్నదే - స్వస్వరూపము, అఖండము, సమస్త భూతముల స్వరూపము అగు → ‘‘ఆత్మ’’.

అట్టి ఆత్మయే అధ్యయనము చేసి తెలుసుకోవలసిన అసలైన వస్తువు. తదితర యోగ - భక్తి - జ్ఞాన - సమర్పణ - గుణాతీత మొదలైనవన్నీ అందుకు సముత్సాహపూర్వక సంసిద్ధతలు. ఆత్మజ్ఞాన-ఆత్మదర్శన-ఆత్మమేవాహమ్ భావనలకు పూజ్యులగు తత్త్వవేత్తలు ప్రసాదిస్తున్న ఉపాయములు.


8వ మంత్రము

ఓంకార - మాత్రల సమన్వయము

ఈ విధంగా ఓంకారము యొక్క అర్థమగు ‘‘ఏక-అక్షరరూప’’ - ఆత్మగురించిన అధ్యయనము కొరకై జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయ పురుషకారములుగాను, చతురవస్థలుగాను, 4 పాదములుగాను చెప్పుకున్నాము. ‘‘ఆత్మ ఏది కాదు? ఏది అయి ఉన్నది?’’ అనే విశేషాలు చెప్పుకున్నాము.

ఇంకా కూడా ‘‘అ-ఉ-మ-అర్ధమాత్ర’’ అను చతుర్ (4) మాత్రలుగా (ఆత్మయే) వర్ణించబడుతోంది. ఉపాసించబడుతోంది.

అ-ఉ-మ

ఓంకారము యొక్క

పాదము పురుష-అధిపతి అవస్థ రూపము ప్రజ్ఞ

(1) ప్రథమ పాదము - ‘అ’కారము

విశ్వుడు.వైశ్వానరుడు.

జాగ్రత్ మాధుర్యము

స్థూలదేహము
జాగ్రత్ ప్రజ్ఞ

(2) ద్వితీయ పాదము - ‘ఉ’కారము

తైజసుడు.

స్వప్న మాధుర్యము

స్వప్న దేహము, సూక్ష్మదేహము
స్వప్న ప్రజ్ఞ

(3) తృతీయ పాదము - ‘మ’ కారము

ప్రాజ్ఞుడు.

సుషుప్తి మాధుర్యము

ఆనందమయ దేహము (కారణ దేహము)
మౌనప్రజ్ఞ

(4) అర్ధమాత్ర- (మ్… కేవలనాదము)

తురీయుడు.

తురీయము (మాధుర్య ఆస్వాదుడు)

సాక్షీ (జాగ్రత్‌స్వప్న సుషుప్తులు తనవైనవాడు)
కేవల ప్రజ్ఞ


9వ మంత్రము

(1) జాగ్రత్ పురుషకారము - ‘అ’

వ్యాప్తిచే - మొదటిదై ఉండటంచేత జాగ్రత్ మొట్టమొదటి మాత్ర - ‘అ’. ఇదియే ‘ఆదిమత్’ (మొట్టమొదటిది). జాగ్రత్‌నందే మూడు అవస్థలవిచారణ సుసాధ్యము కనుక. ‘ఆదిమత్’ అనబడుతోంది.

జాగ్రత్ పాదము సర్వత్రా దృశ్యమంతా వ్యాపించి ఉన్నట్టిది. ఈ విధంగా సమస్త జాగ్రత్‌ను ఆత్మయొక్క (తనయొక్క) - పురుషకారలక్షణముగా ఎవడు తెలుసుకుంటాడో ఆతడే జాగ్రత్ గురించి ఎరిగినవాడు.

స్వకీయ జాగ్రత్ పురుషకార - విశేషమే. ‘‘జాగ్రత్ అనుభవ విశ్వము’’ యొక్క రూపముగా తెలుసుకొన్నవాడు -
య ఏవం వేద, సర్వాన్ కామాన్ ఆప్నోతి। తాను కోరుకున్నవన్నీ పొందగలడు.


10వ మంత్రము

(2) స్వప్న పురుషకారము - ‘ఉ’

‘తేజస’ - స్వప్నస్థానము ‘ఉ’ కారము. అ-ఉ-మలలో ద్వితీయమాత్ర. మధ్యలోది. అంచులు రెండువైపులా ఉండటంచేత, ‘‘జాగ్రత్ - సుషుప్తుల మధ్యగా ఉన్నదై - ఆ రెండిటి ఉత్కర్షరూపము’’.

ఎవడు స్వప్నమును జాగ్రత్ - సుషుప్తులను ఉత్కర్షించునది (ప్రేరేపించునది)గా తెలుసుకుంటాడో - అట్టివాడు జ్ఞానసంతతిని వృద్ధి చేసుకొనగలడు. అట్టివాడు బ్రహ్మవేత్తల కులములోనే జన్మలు పొందుతాడు. ఆతనికి ‘అబ్రహ్మవిత్ కులము’లో (బ్రహ్మము గురించి ఎరుగని వంశములో, పరిసరములలో) జన్మలు పొందడు. బ్రహ్మము గురించి ఎరిగిన మహనీయుల మధ్యమాత్రమే స్థానము పొందినవాడై ఉంటాడు. ఆతని పరిసరములు, సంతానము తత్త్వజ్ఞులు కాగలరు.


11వ మంత్రము

(3) ‘‘సుషుప్త పురుషకారము’’ - ‘‘మ’’

ఈ మూడవ మాత్రకు

‘మ’కారము (అ-ఉ-మలో మూడవమాత్ర)గా, సుషుప్తి రూపముగా చెప్పబడుతోంది. (మితి = కాలమానము)

(ధాన్యమును కొలిచే ‘మరకము’ అనే పాత్రవలె) - జాగ్రత్ స్వప్న సంస్కారములకు, వాసనలకు కొలుచు పాత్రవంటిది సుషుప్తి. జాగ్రత్ స్వప్నములు - సంస్కారములకు, వాసనలకు ధాన్యము వంటిది. సుషుప్తియో - కొలుచు పాత్ర వంటిది.

అకారముతో, ప్రవేశము (రాక) ‘ఉ’ కారము నిర్గమించటము, (పోక) ‘మ’కారముతో - లయము జరుగుచున్నది. అందుచేత మకారము (లేక) సుషుప్తి - ‘‘అకార, ఉకారములకు స్పర్శించునదై’’ ఉన్నది.

ఆపీతే : సుషుప్తి సర్వము ఏకముగా చేసివేయు స్వభావము కలిగి ఉన్నది.

ఉపరమతే : విశ్వుడు, తైజసుడు, సుషుప్తిని తమ ఉపరమ ( withdrawal) స్థానముగా కలిగి ఉంటారు.

విశ్వుడు, తైజసుడు బాహ్యముగా జాగ్రత్ - స్వప్నములు పొందుచూ ఉంటారు.

విశ్వ, తైజసులు చివరికి ప్రాజ్ఞుని యందు ఉప-రమిస్తున్నారు. (getting withdrawal)
ప్రాజ్ఞుడు ‘ఓ-న-మ’లలోని ‘మ’కారము వంటివాడు. ‘జగత్తు లేనిదే’ అనిపించునది ప్రాజ్ఞ - పురుషుని చేతనే కాబట్టి ‘అ-క్ష’లకు లయము ‘మ’కారమునందు జరుగుతోంది.

మాండూక్య-ఉపనిషత్-అవస్థాత్రయ-అనుభవం

మరికొంత వివరణగా….

‘మ’కారమ్ - సుషుప్తి - ‘మితే’

ఓం కారములోని ‘అ’, ‘ఉ’ లు చివరికి ‘మ’ కారముచే ముగింపు పొందుచు, ‘మ’ కారముచే పరిమితము పొందుచున్నాయి. అందుచేత మకారము అను మాత్ర ముగింపు (లేక) లయ స్థానముగా చెప్పబడుతోంది. మరల జాగ్రత్-స్వప్నములకు ప్రారంభ స్థానము కూడా।

‘మ’కారము ‘ఓం’కారమునకు ముగింపు. ఆ తరువాత మరల ‘ఓం’ ప్రారంభమౌతోంది.
[(‘ఓం’ (అ-ఉ-మ్) - మకారము ముగిసిన తరువాత, తిరిగి ‘అ’ కారముతో కూడిన ‘ఓం’ ప్రారంభము)].

దీనినే అవస్థల దృష్ట్యా చూస్తే,

జాగ్రత్ - స్వప్న సుషుప్తులలోని (1) “అ-ఉ-మ”ల (లోని) ప్రథమ పాదమగు జాగ్రత్ (మ) నకు, రెండవ పాదమగు స్వప్నము (ఉ)నకు- చెందిన ‘‘ఆలోచన, భావన, అనుభవము, అనుభూతి, సుఖదుఃఖ నిర్వచనస్వీకారము, అభిప్రాయ - అభిరుచులు మొదలైనవన్నీ కూడా సుషుప్తియందు ఏకీభూతమై ‘మౌనము’ వహించుచున్నవగుచున్నాయి. సుషుప్తి నుండి మరల స్వప్న - జాగ్రత్‌లకు నాంది పలుకబడుచున్నాయి.

ఈ విధంగా సమస్త జాగ్రత్ స్వప్న కల్పితములు సహజమగు సుషుప్తిలో ఏకీకృతమగుచున్నాయి. మరల మరొకప్పుడు సుషుప్తి నుండి బయల్వెడలుతున్నాయి - అని సుషుప్తి గురించి గమనించబడుతోంది. (శంకర భాష్యము).

అనగా

అందుకే కొందరు యోగులు యోగాభ్యాసములో ‘‘జాగ్రత్‌లో సుషుప్తి’’ని అభ్యాసముగా నిర్వర్తిస్తూ, సమస్త వ్యవహారములపట్ల ‘మౌనత్వము’ ను, ‘అతీతత్వము’ను వహించువారై ఉంటారు. ‘విషయ రాహిత్యము’ను ధారణ చేస్తూ ఆత్మయొక్క సామీప్యమును అభ్యాసిస్తూ ఉంటారు. (అట్టి అభ్యాసము స్వాభావికము చేసుకొన్నవారిని ‘మౌని’ ‘ముని’ ‘మనీశ్వరుడు’ - అని అంటున్నాము. (విషయములపట్ల మౌనము, ఆత్మపట్ల ధ్యానము గలవాడు - ‘ముని’)

అట్టి మౌని స్వాభావికంగానే -

అభ్యాసముగా కలిగి ఉండి - మౌనభావనను సుస్థిరము, నిశ్చలము చేసుకుంటున్నారు. అట్లాగే - మునులు.

మినోతి హ వా సర్వమ్ అపీతిశ్చ భవతి।

సుషుప్తియందు జాగ్రత్ - స్వప్నములలోని భేదభావన అంతా తొలగిపోయినదై ‘మౌనము’ ‘విషయరాహిత్యము’, ‘ఏకీభూతత్వము’ సిద్ధిస్తున్నాయి.

ఈ విధంగా సుషుప్తియందు ప్రాజ్ఞునకు ‘ఏకీకరణము’ అను సామ్య రూప సామాన్యత్వము ఏర్పడి ఉండటంచేత ‘‘అపీతశ్చ భవతి।’’ అనబడుతోంది. సుషుప్తిలో ఉన్నవాడు అపీతుడు (Non Drunkerd, Sans - Experiencer) అగుచున్నాడు.

అట్టి సుషుప్తియొక్క ‘స్థాన’ ధర్మములను ఎరిగినవాడు - జాగ్రత్ - స్వప్న సందర్భములలో భేదములన్నీ స్వీకరించనివాడు అగుచున్నాడు. సమస్త భేదమును ‘తననుండియే’ అని గ్రహించి వాటిని తనయందు లయము చేసుకున్నవాడు అయి ఉంటున్నాడు. జాగ్రత్-స్వప్న-సందర్భములలో కూడా నిశ్చల సుషుప్తిని (నిర్విషయ) ధారణను విడువకయే ఉండగలడు. ఇది అభ్యాసముచే సుసాధ్యమే।

12వ మంత్రము

(4) తురీయము (చతురీయము - 4వ స్థానము)

‘తురీయము’ యొక్క అనుభవము ఎటువంటిదంటే…,

మాండూక్య-ఉపనిషత్-తురీయ-అనుభవం

అవ్యవహార్య : తురీయము = తనకు అన్యమైన వ్యవహారములేవీ లేనట్టిది.

అనగా సమస్త తరంగములను జలము దృష్టితో చూడటమువలె, సమస్త ఆభరణములను, ‘బంగారము’ దృష్టిగా గమనించటమువలె, సర్వమట్టి బొమ్మలను మట్టి (మృత్తి కేవ సత్యమ్) అను అవగాహన కలిగి ఉండటమువలె ..,

జాగ్రత్, స్వప్న, సుషుప్తులను, అందలి ఆయా విశేష చమత్కారములను (అగ్నియొక్క కణములు అగ్నికి వేరుకానట్లుగా) ఆత్మరూపముగా దర్శించటము, ఆత్మ చమత్కారముగా ఆస్వాదించటము - ‘‘అవ్యవహార్య తురీయ దృష్టి.

ప్రపంచోపశమనమ్ : మట్టి - జల - తేజో (అగ్ని, Heat, Light) - వాయు (vapour) - ఆకాశ (space) రూపములు మిశ్రమ ప్రదర్శనమగు ప్రపంచమును (ప్ర విశేషమైన, పంచమ - ‘‘5’’ వస్తువులను) - ఆత్మభావనతో, ఆత్మకు స్వస్వరూపమునకు అనన్యముగా దర్శించు ప్రపంచ ఉపశమన స్థానమే ‘తురీయము’.

శివమ్ : కేవలమగు ఆత్మానుభవ స్థానము అవ్యాజమైన శుభమును, సుఖమును ప్రసాదించునట్టిది.
శవము వంటి పాంచభౌతిక దేహములో సర్వాత్మకమైనట్టి ‘ప్రశాంత - సర్వాతీత - పరమానంద - కేవలమగు శివతత్త్వము’ దర్శించుటకు చేసే యత్నమే ‘‘ముముక్షుత్వము’’.

అట్టి జ్ఞానమయ దృష్టియొక్క సిద్ధియే తురీయసిద్ధి.

అద్వైతమ్ : బంగారమునందే సమస్త బంగారు ఆభరణములు ఏర్పడినవై ఉన్నట్లు, శిలయందే శిల్పముయొక్క సర్వ విభాగములు అవ్యక్తీకరణంగా స్థానము పొందియున్నట్లు,

ఈ సమస్త ప్రపంచము, సమస్త జీవులు, మనందరి బాహ్య - అంతరంగములు, నాలోని నేనైన నేనే। మనయొక్క జాగృత్-స్వప్న-సుషుప్తుల సాక్షిరూపమగు తురీయమునకు ద్వితీయము కానివై ఉన్నాయి. అహమ్ తురీయ-అద్వితీయ సహజ స్వరూపమస్మి।

అందుచేత మన తురీయ స్వరూపము అద్వితీయము. జగద్దృశ్యమంతా తానే అయినట్టిది.
మనము సర్వదా అట్టి తురీయాత్మానంద స్వరూపులమే. న సందేహః।

ఓంకారమ్ ఆత్మైవ।

ఇది తెలుసుకున్నవాడు ఈ కనబడే సమస్తమును ‘‘ఆత్మయందే ఆత్మ’’గా దర్శిస్తాడు. ఇదియే తెలియవలసినది. తెలిసి, అనునిత్య నిశ్చల - నిశ్చిత స్వాభావకమైనట్టి స్వానుభవముగా సుస్థిరీకరించుకోవలసినట్టిది.


ఇతి మాండూక్యోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।