[[@YHRK]] [[@Spiritual]]

Maitrȃyani Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


సామవేదాంతర్గత

9     మైత్రాయణ్యుపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


వైరాగ్యోత్థభక్తియుక్తబ్రహ్మమాత్రప్రబోధతః .
యత్పదం మునయో యాంతి తత్త్రైపదమహం మహః ..

మైత్రాయణీ కౌషితకీ బృహజ్జాబాలతాపనీ .
కాలాగ్నిరుద్రమైత్రేయీ సుబాలక్షురమంత్రికా .
శ్లో।। వైరాగ్యోత్థ భక్తియుక్త
బ్రహ్మమాత్ర ప్రబోధతః
యత్ పదం మునయో యాన్తి
తత్ త్రైపదమ్ అహం మహః।।
వైరాగ్య - భక్తియుక్త ప్రబోధముగాను, బ్రహ్మ సూత్ర (జ్ఞాన) యుక్తంగాను ఏది మునులు పొందుచున్నారో- అట్టి త్రైపద మహత్ అగు ‘అహమ్ (I Am)’ తత్త్వమే-మనందరి మహదాశయము. అట్టి పరమాత్మకు నమస్కారము.



ప్రథమ ప్రపాఠకః - జ్ఞానమేవ గతిః


ఓం బృహద్రథో హ వై నామ రాజా రాజ్యే జ్యేష్ఠం పుత్రం
నిధాపయిత్వేదమశాశ్వతం మన్యమానః శారీరం
వైరాగ్యముపేతోఽరణ్యం నిర్జగామ స తత్ర పరమం తప
ఆస్థాయాదిత్యమీక్షమాణ ఊర్ధ్వబాహుస్తిష్ఠత్యంతే సహస్రస్య
మునిరంతికమాజగామాగ్నిరివాధూమకస్తేజసా
నిర్దహన్నివాత్మవిద్భగవాంఛాకాయన్య ఉత్తిష్ఠోత్తిష్ఠ వరం
వృణీశ్వేతి రాజానమబ్రవీత్స తస్మై నమస్కృత్యోవాచ
భగవన్నాహమాత్మవిత్త్వం తత్త్వవిచ్ఛృణుమో వయం స త్వం నో
బ్రూహీత్యేతద్వృతం పురస్తాదశక్యం మా పృచ్ఛ
ప్రశ్నమైక్ష్వాకాన్యాన్కామాన్వృణీశ్వేతి శాకాయన్యస్య
చరణవభిమృశ్యమానో రాజేమాం గాథాం జగాద .. 1..
1. ఓం।
బృహద్రథో హ వై నామ రాజా।
రాజ్యే జ్యేష్ఠం పుత్రం నిధాపయిత్వా
‘‘ఇదం అశాశ్వతమ్’’ మన్యమానః శరీరమ్,
వైరాగ్యమ్ ఉపేతో, అరణ్యం నిర్జగామ।
‘ఓం’ కార స్వరూపుడగు పరమాత్మకు నమస్కరిస్తున్నాము.
బృహద్రథుడు అనే ఆయన ఇక్ష్వాకు వంశ ప్రభువు. ఆయన ‘‘ఈ శరీరము శాశ్వతము కాదు కదా! శేషించిన ఆయుష్షును మోక్ష మార్గములో సద్వినియోగము చేసుకోవాలి’’ - అని భావించారు. పెద్ద కుమారుని పట్టాభిషిక్తుని చేశారు. వైరాగ్య భావాలతో విరాగి అయి సర్వము త్యజించి ఏకాంతవాస రూపమైన అరణ్యవాసము ఆశ్రయించారు. (బృహద్రథుడు సూర్యుని పుత్రుడైన నిమి తనయుడు. ఈయన కుమారుడు సుదాసుడు - భాగవతము).
స తత్ర పరమం తప ఆస్థాయ
ఆదిత్యమ్ ఈక్షమాణ ఊర్ధ్వబాహుః తిష్ఠత,
అంతే సహస్రస్య।
ఒకానొక ప్రశాంత నిర్జన ప్రదేశములో తపస్సు ప్రారంభించారు. హృదయంలో ఆదిత్యుని (సూర్యభగవానుని) ప్రతిక్షేపించుకొని ఊర్ధ్వ బాహువులతో అనేక సంవత్సరముల సుదీర్ఘ కాలము ఓర్పుగా తపస్సు కొనసాగించారు. (సహస్రాంత సూర్యోపాసన చేయసాగారు).
మునేః అంతికం ఆజగామ,
అగ్నిరివ అధూమకః తేజసా, నిర్దహత్ ఇవ,
ఆత్మవిత్ భగవాన్ శాకాయన్యః।।
ఒకానొక రోజు సూర్యభగవానుని సంకల్పముచే మహా తేజో సంపన్నుడగు శాకాయన్య మునీంద్రులవారు బృహద్రథ మహారాజుకు ఎదురుగా ప్రత్యక్షమైనారు. ఆయన పొగలేని అగ్నియొక్క తేజస్సుతో వెలుగొందు చున్నారు.
‘‘ఉత్తిష్ఠోతిష్ఠ! వరం వృణీష్వ’’। …. ఇతి-
రాజానమ్ అబ్రవీత్।
స తస్మై నమస్కృత్య - ఉవాచ।।
భగవంతుడగు శాకాయన్యులు: ‘‘ఓ బృహద్రథా! లేవయ్యా! లే"! నీ తపస్సు ఫలించింది. ఏమి వరం కావాలో కోరుకో, నాయనా!’’ - అని రాజుతో పలికారు.
బృహద్రథ మహారాజు ఆ మధురమైన ఆప్యాయతతో కూడిన శాఖాయన్య మహర్షుల వారి మాటలు విని తపస్సు చాలించి కనులు తెరిచారు. భక్తితో మహర్షికి పాదాభివందనము, పాదపూజ సమర్పించారు. రెండు చేతులు జోడించి నమస్కరించారు.
‘‘భగవన్! న అహమ్ ఆత్మవిత్।
త్వమ్ తత్త్వవిత్।
శృణుమో వయం స త్వమ్ (సత్వన్) నో బ్రూహి’’ ఇతి।।
బృహద్రథ మహారాజు: భగవన్! మహర్షీ! నేను ఆత్మవేత్తను కాను (ఆత్మ గురించి తెలుసుకున్న వాడిని కాను). తమరో, తత్త్వవేత్త!
ఆత్మయొక్క తత్త్వమేమిటో దయతో నాకు వినిపించండి! బోధించండి!
‘‘ఏతత్ వృత్తం పురస్తాత్ అశక్యం।
మా పృచ్ఛ ప్రశ్నమ్, ఇక్ష్వాకాన్।
అన్యాన్ కామాన్ వృణీష్వ!’’ - ఇతి।।
శాకాయన్య మహర్షి: ఓ ఇక్ష్వాకా! నీవు ఆత్మతత్త్వము గురించా, అడుగుచున్నావు? అది మొదలే చెప్పటానికి అశక్యమైన విషయము. అది వద్దులే। ఇంకేదైనా వరము కోరుకోవయ్యా। ఇస్తాను.
(బృహద్రథో) - శాకాయన్యస్య చరణాః
అభిస్పృశ్యమానో రాజేమాం గాథాం జగాద।।
బృహద్రథ మహారాజు శాకాయన్యుల వారి పాద పద్మములను కళ్లకు అద్దుకొని, ఇక వరము విషయంగా ఇట్లా విన్నవించుకోసాగారు.

భగవన్నస్థిచర్మస్నాయుమజ్జామాంసశుక్రశోణితశ్లేష్మాశ్రుదూ
షితే విణ్మూత్రవాతపిత్తకఫసంఘాతే దుర్గంధే
నిఃసారేఽస్మింఛరీరే కిం కామోపభోగైః .. 2..
2. బృహద్రథ ఉవాచ
భగవన్! అస్థి - చర్మ - స్నాయు - మజ్జా - మాంస -శుక్ర - శోణిత - శ్లేష్మ - అశ్రు దూషితే,
విణ్మూత్ర వాత పిత్త కఫ సంఘాతే,
దుర్గంధే, నిస్సారే
అస్మిన్ శరీరే కిం కామ భోగైః?
బృహద్రథ మహారాజు: భగవన్! ఈ శరీర సుఖము కోసమై ఏదైనా కోరుకోమంటున్నారా? ఇది స్వతఃగా లేని వస్తువు. బొమికలు, చర్మము, నరములు, క్రొవ్వులతో తయారైన ఒక తోలు బొమ్మ! శుక్రము, శోణితము, శ్లేష్మము, కన్నీరు…. ఇటువంటి దోష పూరితమైన పదార్థాలన్నీ తనయందు కలిగి ఉన్నట్టిది. మలము, మూత్రము, వాత-పిత్త- కఫములచే దుర్గంధ భూయిష్టమైనది. వాస్తవానికి సారమైన వస్తువు అంటూ ఈ దేహములో ఏదీ లేదు. అటువంటి ఈ అల్పవస్తువగు భౌతిక దేహము యొక్క కామ ఉప భోగములు కోరుకొని ఏమి లాభము? ఏమి ఆనందము?

కామక్రోధలోభభయవిషాదేర్ష్యేష్టవియోగానిష్టసంప్రయోగక్షు
త్పిపాసాజరామృత్యురోగశోకాద్యైరభిహతేఽస్మింఛరీరే కిం
కామోపభోగైః .. 3..
3. కామ-క్రోధ-లోభ-మోహ-భయ-విషాద-
ఈర్ష్య-ఇష్ట వియోగ-అనిష్టనం ప్రయోగ,
క్షుత్-పిపాసా-జరా-మృత్యు-రోగ-శోకాద్యైః
అభిహతే, అస్మిన్ శరీరే కిం కామ ఉప భోగైః?
ఇంకా వినండి. ఈ దేహమును వెంటనంటి అనేక మనో వికారాలు - కామము, క్రోధము, లోభము, మోహము, భయము, విషాదము, ఈర్ష్య - ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి.
- ఇష్టమైనవాళ్ళు దూరంగా ఎక్కడో ఉండటముతో విరహము.
- అయిష్టమైన వాళ్ళతో స్నేహ బంధుత్వాలు అనివార్యం కావటంతో విషాదము,
- ఆకలి, దాహము, ముసలితనము, మృత్యువు, రోగము, శోకము… ఇటువంటి కామ-ఉపభోగ విషయాలతో ఈ దేహము జీవితాంతము తాడనము పొందుతూనే ఉంటోంది.

సర్వం చేదం క్షయిష్ణు పశ్యామో యథేమే
దంశమశకాదయస్తృణవన్నశ్యతయోద్భూతప్రధ్వంసినః .. 4..
4. సర్వం చ ఇదమ్ క్షరియిష్ణు పశ్యామో,
యథే మే దంశ-మశక ఆదయః।
తృణవత్ నశ్యత, యో
ఉద్భూత - ప్రధ్వంసినః।।
ఏదేది నాదని అనిపిస్తోందో,… అదంతా కూడా నశించటం అనివార్యము. ఇది కనబడుచూనే ఉన్నది కదా!
ఉదాహరణకు ఈగలు, దోమలు రోజూ పుడుచున్నాయి. అక్కడ-ఇక్కడ వ్రాలుచున్నాయి. ఇంతలోనే నశిస్తున్నాయి. ఈ దేహాలన్నీ ఇట్టితీరైనవే కదా! ఇవన్నీ నేలపై గడ్డిమొక్కలు మొలచినట్లు పుట్టుచున్నాయి. నశిస్తున్నాయి.

అథ కిమేతైర్వా పరేఽన్యే మహాధనుర్ధరాశ్చక్రవర్తినః
కేచిత్సుద్యుమ్నభూరిద్యుమ్నేంద్రద్యుమ్నకువలయాశ్వయౌవనాశ్వవద్ధియా
శ్వాశ్వపతిః శశబిందుర్హారిశ్చంద్రోఽమ్బరీషో
ననూక్తస్వయాతిర్యయాతినరణ్యోక్షసేనోత్థమరుత్తభరతప్రభృతయో
రాజానో మిషతో బంధువర్గస్య మహతీం శ్రియం
త్యక్త్వాస్మాల్లోకాదముం లోకం ప్రయాంతి .. 5..
5. అథ కిం ఏతైర్వా పరే అన్యే-
మహా ధనుర్ధరాః చక్రవర్తినః కేచిత్ -
సుద్యుమ్న, ఇంద్రద్యుమ్న, కువలయాశ్వ,
యౌవనాశ్వ, వధ్రియాశ్వ, అశ్వపతిః
శశిబిందుః, హరిశ్చంద్రో, అంబరీషో
అననుక్తః,-స్వయాతి, యయాతిః,
అనరణ్యో, అక్షసేన ఆదయో,
ఈ దేహ సంబంధ-సంపద బాంధవ్యములను అజ్ఞానముచేతనే నమ్ముకొని ఆయుష్షు వృథా చేసుకుంటున్నామే! విజ్ఞులు, మహాధనుర్థారులు, గొప్ప రాజ్యములు ఏలినవారు అగు - కొందరి విషయము వేరుగా ఉన్నది.
సుద్యుమ్నుడు, ఇంద్రద్యుమ్నుడు, కువలయాశ్వుడు, యౌవనాశ్వుడు, వధ్రియాశ్వుడు, అశ్వపతి, శశిబిందు, హరిశ్చంద్రుడు, అంబరీషుడు, అనునక్తుడు, స్వయాతి, యయాతి, అనరణ్యుడు, అక్షసేనుడు మొదలైన వారంతా, (అట్లాగే) మరుత్తు, భరతుడు మొదలుగా గల మహనీయులంతా కూడా…, ఏమి చేసారో తమకు తెలిసిందే కదా!
అథ మరుత్, భరత ప్రభృతయో
రాజానో మిషతో (సూక్ష్మబుద్ధితో)
బంధువర్గస్య, మహతీం శ్రియం
త్యక్త్వా అస్మాత్ లోకాత్
అముం లోకం ప్రయాంతి।
…. వారి వారి బంధువర్గమంతా అట్లా చూస్తూ ఉండగానే, గొప్ప గొప్ప సంపదలను - లోక విషయాలను త్యజించి, చివరికి ఏకాంత వాసాన్ని పరతత్త్వము కొరకై ఆశ్రయించారు కదా!
వారెవ్వరూ కూడా ప్రాపంచిక విశేషములగు ధన-జన-వస్తు-వాహన-మహా రాజ్యాధిపత్యాదులను పట్టుకొని వ్రేలాడుచూ ఉండలేదే।

అథ కిమేతైర్వా పరేఽన్యే
గంధర్వాసురయక్షరాక్షసభూతగణపిశాచోరగగ్రహాదీనాం
నిరోధనం పశ్యామః .. 6..
6. అథ కిమ్ ఏతైర్వా పరే అన్యే
గంధర్వ - అసుర - యక్ష -
రాక్షస - భూత గణ - పిశాచ-ఉరగ
గ్రహాదీనాం నిరోధనం పశ్యామః?
‘‘ముందుగా ఇహ విషయాలు - పరతత్త్వానికి అప్పుడే ఏం తొందర?’’ అని రోజులు గడపడం ఉచితమా? ఎప్పుడు జీవితంలో ఏమి జరుగుతుందో ఎవ్వరికి తెలుసు? గంధర్వ-యక్ష, రాక్షస-భూత, పిశాచ-సర్ప-గ్రహ వీక్షణల వలన జీవులకు అనేక నిరోధములు, విఘ్నములు కలగటం అందరమూ చూస్తున్న విషయమే!

అథ కిమేతైర్వాన్యానాం శోషణం మహార్ణవానాం శిఖరిణాం (కిమేతైర్వార్ణ్యానాం)
ప్రపతనం ధ్రువస్య ప్రచలనం (వ్రశ్చనం వాతరజ్జూనాం)
(స్థానం వా తరూణాం)
నిమజ్జనం పృథివ్యాః స్థానాదపసరణం సురాణం
సోఽహమిత్యేతద్విధేఽస్మిన్సంసారే కిం
కామోపభోగైర్యైరేవాశ్రితస్యాసకృదిహావర్తనం దృశ్యత
ఇత్యుద్ధర్తుమర్హసీత్యంధోదపానస్థో భేక ఇవాహమస్మిన్సంసారే
భగవంస్త్వం నో గతిస్త్వం నో గతిః .. 7..

ఇతి ప్రథమః ప్రపాఠకః ..
7. అథ కిమ్ ఏతై తు-
వన్యానాం శోషణం మహార్ణవానాం-
శిఖరిణాం ప్రపతనం। ధృవస్య ప్రచలనమ్।
అస్థానం వా తరూణాం। నిమజ్జనం పృథివ్యాః।
స్థానాత్ అపసరణం సురాణం।
అసలు ఇక్కడ శాశ్వతమైనదంటూ ఏమున్నది, చెప్పండి?
గొప్ప వనములు ఎండిపోతున్నాయి. ప్రసిద్ధ పర్వతాలు నేల కూలుచున్నాయి. సముద్రాలే ఇంకిపోతున్నాయి.
ఎత్తైన శిఖరాలు కృంగిపోతున్నాయి, మట్టిలో కలిసిపోతున్నాయి. అత్యంత ధృవంగా కనిపించేవి కూడా కాలగతిచే వీగిపోతున్నాయి.
గొప్ప వృక్షాలు ఎప్పుడో తమ స్థానం కోల్పోతున్నాయి. విశాల భూ ప్రదేశాలు సముద్రాలలో కలిసిపోతున్నాయి.
దేవతలంతటివారు స్థానభ్రంశం పొందుచున్నారు.
సో అహమ్ ఇతి ఏతస్మిం తు
సంసారే కిం కామోపభోగైర్యైః
ఏవ ఆశ్రితస్య అసకృత్
ఇహ ఆవర్తనం దృశ్యత?
ఇతి ఉద్ధర్తుం అర్హసి। ఇతి।।
ఇటువంటి క్షణమొకరీతిగా కనిపించే సంసారములో అహంకారముతో ప్రవేశించి, నేను ఏవేవో కావాలనే కోరిక కలిగి సంచరించటం, అసత్ కార్యక్రమములలో నిమగ్నమవటం, ఈ దృశ్య విషయాలు నమ్మి ఉండటం ఎంతవరకు శాశ్వత ప్రయోజనం? ఇందులో ఏమి సుఖం? ‘‘ఈ దృశ్య వ్యవహారముల నుండి ఎట్లారా ఉద్ధరణ?’’…. అనునదే ఉచితం కదా!
అంధ-ఉదపానస్థో ‘భేక’ ఇవ
అహమ్ అస్మిన్ తు సంసారే, భగవన్!
త్వన్నోగతిః। త్వన్నోగతిః। ఇతి।।
(త్వమ్ నో గతిః।। ఇతి।।)
నూతిలో బ్రతికే కప్పవలె మావన్నీ కూడా అల్ప విషయ సంబంధమైన ఆశయాలు, నిరీక్షణలూను. వీటిలో నేను ఎన్నో జన్మలుగా చిక్కుకున్నాను. స్వామీ! ఇప్పుడు మీరే గతి! మీరే నాకు ఆత్మ జ్ఞాన సమాచారము ప్రసాదించి కాపాడాలి!

ద్వితీయ ప్రపాఠకః - జడ దేహములో చైతన్య పురుషుని మహిమ


అథ భగవాంఛాకాయన్యః సుప్రీతోఽబ్రవీద్రాజానం మహారాజ
బృహద్రథేక్ష్వాకువంశధ్వజశీర్షాత్మజః కృతకృత్యస్త్వం
మరున్నామ్నో విశ్రుతోఽసీత్యయం వా వ ఖల్వాత్మా తే కతమో
భగవాన్వర్ణ్య ఇతి తం హోవాచ ఇతి .. 1..
1. అథ భగవాన్ శాకాయస్య సుప్రీతో,
అబ్రవీత్ రాజానం :
మహారాజ! బృహద్రథ।
ఇక్ష్వాకు వంశ ధ్వజ శీర్ష।
ఆత్మజ్ఞః! కృతకృత్యః త్వమ్।
‘మరుత్’ నామ్నో విశ్రుతో అసి! ఇతి।।
బృహద్రథ మహారాజు పలికిన విజ్ఞాన పూరితమైన వైరాగ్య వాక్యములు విని శాకాయన్య మహర్షి సుప్రీతులైనారు. రాజుతో ఇట్లా పలుకసాగారు.
శాకాయన్య మహర్షి : ఓ మహారాజా! బృహద్రథా! ఇక్ష్వాకు వంశమునకు ధ్వజ శీర్షము వంటివాడా! ఆత్మజ్ఞా! ఎందుకు మనము పుట్టామో అది నీవు సాధించినట్లేనయ్యా! కృతకృత్యుడవు! ‘మరుత్తు’ అనే పేరుతో లోక ప్రసిద్ధుడవు. ఇక క్రొత్తగా చెప్పవలసినది ఏమున్న
(బృహద్రథౌవాచ)
అయం వావ-ఖలు ‘‘ఆత్మా తే, కతమో; భగవాన్! వర్ణ్య’’। ఇతి।।
తగ్ం హోవాచ ।। ఇతి
బృహద్రథ మహారాజు : అయ్యా! ఆత్మ అనగా ఏమిటి? ఎవరు? … హే భగవన్! ఈ విషయమే వర్ణించి నాకు దయామయులై బోధించ ప్రార్థన.
అప్పుడు శాకాయన్య మహర్షి ‘‘సరే"’’ - అని పలుకుచు ‘ఆత్మ’ గురించిన విశేషములను ఇట్లు చెప్పటం ప్రారంభించారు

య ఏషో బాహ్యావష్టంభనేనోర్ధ్వముత్క్రాంతో
వ్యథమానోఽవ్యథమానస్తమః ప్రణుదత్యేష ఆత్మేత్యాహ
భగవానథ య ఏష సంప్రసాదోఽస్మాంఛరీరాత్సముత్థాయ
పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యత ఏష ఆత్మేతి
హోవాచైతదమృతమభయమేతద్బ్రహ్మేతి .. 2..
2. (భగవాన్ శాకాయన్యౌవాచ।)
య ఏషో బాహ్య - అవష్టంభనేవ ఊర్ధ్వమ్ ఉత్క్రాంతో,
వ్యథమానో - అవ్యథమానః తమః
ప్రణుదతి (స్తుతించబడునది)
ఏష ఆత్మేతి। ఆహ।
భగవంతుడగు శాకాయన్య మహర్షి : ఈ ఇంద్రియ సంబంధమైన బాహ్య విషయాలన్నీ అనేక వ్యధలకి దారి తీస్తున్నాయి కదా! అట్టి ఈ బాహ్యేంద్రియములను, వాటి వాటి విషయములను దాటివేసి (లేక) నిర్వీర్యము - నిరోధము చేసివేసి, ఊర్ధ్వముగాను, ఇంద్రియములకు ఆవలగాను (పరముగాను) ఉన్నట్టి సర్వ వ్యధల చరమ స్థానమును చేరగా అనుభవమయ్యేదే ఆత్మ. అదే భగవంతునికి సంబంధించిన అనుభూతి స్థానము.
భగవాన్। అథ య ఏష సంప్రసాదో
అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరంజ్యోతిః ఉప సంపద్య
స్వేన రూపేణ అభినిష్పద్యత
ఏష ఆత్మేతి హోవాచ।
ఏతత్ అమృతమ్, అభయమ్। ఏతత్ బ్రహ్మేతి।।
ఇంద్రియ సంబంధమైన తమస్సును (చీకటిని) జయించి, నిర్మలమైన బుద్ధి కలవాడై, ఈ శరీరమును అధిగమించి దాటివేసి… ‘‘శరీరి’’ అను పరంజ్యోతి స్వరూపముగా సంతరించుకోవటమే ఆత్మత్వము. ఈ జీవుడు తన నిజరూపముగాగల స్థితియే ఆత్మ. అది అమృత స్వరూపము. అభయ స్థానము. (బ్రహ్మమే తానవటము).

అథ ఖల్వియం బ్రహ్మవిద్యా సర్వోపనిషద్విద్యా వా రాజన్నస్మాకం
భగవతా మైత్రేయేణ వ్యాఖ్యాతాహం తే
కథయిష్యామీత్యథాపహతపాప్మానస్తిగ్మతేజస ఊర్ధ్వరేతసో
వాలఖిల్యా ఇతి శ్రుయంతేఽథైతే
ప్రజాపతిమబ్రువన్భగవఞ్శకటమివాచేతనమిదం శరీరం
కస్యైష ఖల్వీదృశో మహిమాతీంద్రియభూతస్య
యేనైతద్విధమిదం చేతనవత్ప్రతిష్ఠాపితం ప్రచోదయితాస్య కో
భగవన్నేతదస్మాకం బ్రూహీతి తాన్హోవాచ .. 3..
3. అథ ఖలు ఇయమ్
బ్రహ్మవిద్యా - సర్వోపనిషత్ విద్యావా
రాజన్! అస్మాకం భగవతా మైత్రేయేణ వ్యాఖ్యాతా..!
అహమ్ తే కథయిష్యామి ఇతి యథా।।
ఇంద్రియ - ఇంద్రియార్థ విషయాలకు ఆవల కేవల సాక్షియగు ఆత్మ స్థానము అనునిత్యానుభవము అయి ఉండటమే బ్రహ్మ విద్య, ఉపనిషత్ విద్య కూడా!
ఓ రాజా! ఒకప్పుడు మా గురు దేవుడగు, భగవంతుడగు మైత్రేయుల వారు ఆత్మతత్త్వానుభవము గురించి విశదీకరించి, వ్యాఖ్యానిస్తూ బోధించటం జరిగింది. ఇప్పుడు నీకు ఆ విషయాలే చెప్పబోవుచున్నానయ్యా!
అపహత పాప్మానస్తిగ్మ తేజస
ఊర్ధ్వ రేతసో వాలఖిల్యా ఇతి శ్రూయంతే,
అథ ఏతే ప్రజా ప్రజాపతిం అభ్రువన్।।
ఉత్తమ తపస్సుచే పాప-అల్ప దృష్టులను త్యజించి - అధిగమించినవారు, సుతీక్షణా దివ్య తేజో సంపన్నులు, ఊర్ధ్వ రేతస్కులు (తేజో కిరణములతో సహస్రారమును అధిగమించినవారు) అయినట్టి వాలఖిల్యమునులు. ఆ మునీశర్వరులు ఒకసారి ప్రజాపతియగు బ్రహ్మ దేవుని దర్శించారు. మహనీయులెప్పుడూ మహత్తరమైన విషయమునే సంభాషించు కుంటారు కదా! ఆ మునీశ్వరులు కూడా బ్రహ్మదేవులవారిని ఇట్లు ప్రశ్నించారు.
‘‘భగవన్! శకటమివ అచేతనం ఇదం శరీరమ్।
కస్య ఏష ఖలు వ ఈదృశో
మహిమా అతీంద్రియ భూతస్య
యేన ఏతత్ విద్ధమ్ ఇదమ్
చేతనవత్ ప్రతిష్ఠాపితమ్? ప్రచోదయితాస్య?
కో భగవన్! ఏతత్?
అస్మాకం బ్రూహి!’’ ఇతి।।
‘‘హే భగవన్! ప్రజాపతీ! ఆత్మజ్ఞాన నిష్ఠతో ఒక ప్రశ్నను తమ ముందు ఉంచుచున్నాము. ఒక బండి (శకటము) తనకు తానుగా కదలదు కదా! అట్లాగే ఈ శరీరము స్వతఃగా జడము, అచేతనము. అట్టి ఈ జడవస్తువగు భౌతిక దేహము ఎవరియొక్క అతీంద్రియమైన మహిమచేత చేతనమువలె కదలగలుగుతోంది? దీనియొక్క ప్రేరకుడు- కదల్చుచున్నవాడు ఎవ్వడు? ఎవరి తెలివిచే ఇది ప్రవర్తిస్తోంది? ఈ విషయము మాకు చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాము.

యో హ ఖలు వాచోపరిస్థః శ్రూయతే స ఏవ వా ఏష శుద్ధః
పూతః శూన్యః శాంతో ప్రాణోఽనీశత్మాఽనంతోఽక్షయ్యః స్థిరః
శాశ్వతోఽజః స్వతంత్రః స్వే మహిమ్ని తిష్ఠత్యనేనేదం శరీరం
చేతనవత్ప్రతిష్ఠాపితం ప్రచోదయితా చైషోఽస్యేతి తే
హోచుర్భగవన్కథమనేనేదృశేనానిచ్ఛేనైతద్విధమిదం
చేతనవత్ప్రతిష్ఠాపితం ప్రచోదయితా చైషోఽస్యేతి కథమితి
తాన్హోవాచ .. 4..
తాన్ హోవాచ :
4. యో హ ఖలు వాచోపరి సః శ్రూయతే, స వా ఏష
శుద్ధః। పూతః। శూన్యః। శాంతో।
అప్రాణో। అనీశాత్మా। అనంతో
అక్షయః। స్థిరః। శాశ్వతో। అజః। స్వతంత్రః।
స్వే మహిమ్ని తిష్ఠతి అనేన ఇదం
శరీరమ్ చేతనవత్ ప్రతిష్ఠాపితం
ప్రచోదయితా చ। ఏషో అస్య ఇతి।।
ప్రజాపతి : ఏ పరమాత్మ ఇచ్ఛా రహితులై, వాక్కుకు - శబ్దములకు అవిషయమై, వాటికి ఉత్పత్తి స్థానమైయున్నారో, ఏ మహాత్ముడు పరమశుద్ధుడు, పవిత్రుడు, విషయశూన్యుడు, శాంత స్వరూపుడు, (ప్రాణము కూడా కానట్టి) ప్రాణేశ్వరుడు, ఏదీ కానట్టి అనీశాత్ముడు, అనంతుడు, (క్షయమనునదే లేనట్టి) అక్షయుడు, అచంచలుడు (స్థిరుడు), శాశ్వతుడు, (జన్మరహితుడు) కాబట్టి అజుడు, (దేనిచేతను బద్ధుడు కానట్టి), స్వతంత్రుడు అయి ఉన్నారో…, అట్టి అఖండాత్ముని చైతన్య మహిమచేతనే ఈ జడ భౌతిక దేహాలు చేతనములవలె ప్రదర్శితము అగుచున్నాయి.
తే హ ఊచుః :
‘‘భగవన్! కథమ్ అనేన ఈదృశేన
అనిచ్ఛేన ఏతత్ విధమ్
ఇదమ్ చేతనవత్ ప్రతిష్ఠాపితమ్?
ప్రచోదయితా చ ఏషో అస్య ఇతి (కథమితి)?
వాలఖిల్య మునులు : అట్లాగా స్వామి! హే భగవన్! అయితే మరొక సందేహము. అట్టి పరమాత్మ స్వతఃగా ఇచ్ఛారహితుడు కదా! ఇచ్ఛా రహితుడగు ఆయనచే ఎందుకు ఈ జడ దేహములు చేతనములుగా ప్రతిష్ఠాపితము అగుచున్నాయి? ఏ కారణముగా పరమాత్మచే ఈ దేహములు ప్రచోదనమగుచున్నాయి? కదిలే దేహములను కదిల్చే పరమాత్మ ఏమి ఉద్దేశ్యించి కదల్చుచున్నారు?

స వా ఏష సూక్ష్మోఽగ్రాహ్యోఽదృశ్యః పురుషసంజ్ఞకో
బుద్ధిపూర్వమిహైవావర్తతేంఽశేన సుషుప్తస్యైవ బుద్ధిపూర్వం
నిబోధయత్యథ యోహ ఖలు వావాఇతస్యాంశోఽయం
యశ్చేతనమాత్రః ప్రతిపూరుషం క్షేత్రజ్ఞః
సంకల్పాధ్యవసాయాభిమానలింగః ప్రజాపతిర్విశ్వక్షస్తేన
చేతనేనేదం శరీరం చేతనవత్ప్రతిష్ఠాపితం ప్రచోదయితా
చైషోఽస్యేతి తే హోచుర్భగవన్నీదృశస్య కథమంశేన
వర్తనమితి తాన్హోవాచ .. 5..
తాన్ హోవాచ :
5. సవా ఏష సూక్ష్మో, అగ్రాహ్యో, అదృశ్యః
పురుష సంజ్ఞో, బుద్ధి పూర్వమ్
ఇహ ఏవ ఆవర్తతే అంశేన
సుషుప్త్యస్య ఏవ బుద్ధి పూర్వం నిబోధయతి।
ప్రజాపతి : ఆ చైతన్య స్వరూపుడగు పరమాత్మ సూక్ష్మాతిసూక్ష్ముడు. ఇంద్రియములచే గ్రహించబడేవాడు, గమనించబడేవాడు కాదు. దృశ్యముగా ఉన్నవాడు కాదు. అదృశ్యుడు. పురుషుడు అనే పేరుతో చెప్పబడేవాడు. ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులు, జన్మ-కర్మలు ఆతని పురుషకారమే.
ఆయన బుద్ధి పూర్వకముగా దేహములందు తన చేతన శక్తిచే ఈ దేహములను సచేతనము చేస్తున్నారు. ఆతని అంశయే గాఢ నిద్రలో ఉన్నవానిని బుద్ధి పూర్వకముగా నిద్రలేపుచున్నది.
అథ యోహ ఖలు వా వ ఏతాస్య అంశో
అయం యత్ చేతనమాత్రః
ప్రతి పూరుషం - క్షేత్రజ్ఞః
సంకల్ప-అధ్యవసాయ-అభిమాన లింగః
ప్రజాపతిః విశ్వాక్షః తేన చేతనేన
ఇదం శరీరమ్ చేతనవత్ ప్రతిష్ఠాపితమ్।
ప్రచోదయితా చ ఏష ఏషో అస్య ।।ఇతి।।
అట్టి పరమాత్మయొక్క చేతనాంశయే సచేతనమై ప్రతి జీవునియందు క్షేత్రజ్ఞుడుగా ప్రకాశిస్తూ…,
సంకల్పము (Visualization / Ideation),
అధ్యవసాయము (Workmanship),
అభిమానము (Sense of Belongingness),
లింగము (Form of self),గా…
ప్రదర్శనమగుచున్నది.
సర్వాత్మకుడగు ఆయనయే।
- ప్రజాపతి (సృష్టికి కర్త).
- విశ్వాక్షుడు విశ్వమును తన చూపుయందు కలిగి ఉండి అనుభూతిగా పొందుచూ దర్శించువాడు
ఆయన యొక్క చేతనత్వమే ఈ జడశరీరములను చేతన వంతముగా ప్రచోదనము చేయుచున్నది! ఇదంతా ఆ మహాత్ముని సంప్రదర్శనలే!
తేహో వాచ : (తేహోచు) :
‘‘భగవన్! ఈ దృశస్య కథమ్
అంశేన వర్తనమ్’’? - ఇతి।।
తాన్ హో వాచ!
వాలఖిల్య మునులు : భగవన్! అట్టి పరమాత్మ అంశరూపుడై అచేతన దేహములను ఎట్లా, ఎందుకు కదల్చుచున్నారు? ‘‘కదల్చువాడు’’ …. కదిలే దేహములను ఎట్లు ఎందుకు ధరిస్తున్నారు? జీవాత్మాంశ కలిగి ఉండటములో పరమాత్మకు అగత్యము ఏమైనా ఉన్నదా?

ప్రజాపతిర్వా ఏషోఽగ్రేఽతిష్ఠత్స నారమతైకః స
ఆత్మనమభిధ్యాయద్బవ్హీః ప్రజా అసృజత్త అస్యైవాత్మప్రబుద్ధా
అప్రాణా స్థాణురివ తిష్ఠమానా అపశ్యత్స నారమత
సోఽమన్యతైతాసం ప్రతిబోధనాయాభ్యంతరం ప్రావిశానీత్యథ స
వాయుమివాత్మానం కృత్వాభ్యంతరం ప్రావిశత్స ఏకో నావిశత్స
పంచధాత్మానం ప్రవిభజ్యోచ్యతే యః ప్రాణోఽపానః సమాన
ఉదానో వ్యాన ఇతి .. 6..
6. (ఇతి హో వాచ)
ప్రజాపతిర్వా ఏషో అగ్రే తిష్ఠత।
స న ‘‘ఆరమత ఏకః’’-
స ఆత్మానమ్ అభిధ్యాయన్
బహ్వీః ప్రజా అసృజత్।
తా అస్మైవా అప్రబుద్ధా స్థాణురివ
తిష్ఠమానా అపశ్యత।
స నా రమత।
ప్రజాపతి : నాయనా! ఆత్మ భగవానుడే ప్రజాపతి. ఈ దేహములను వాటి అనుభవములకు మునుముందే ఉన్నట్టి కేవల చైతన్య స్ఫూర్తి. నిర్విషయుడు. అనేకత్వమనునదే లేనివాడు. ఏక స్వరూపుడు. అట్టివాడు- ‘‘స్థానువువలె ఏక స్వరూపుడై ఉండటము నాకు రమ్యము కాదు. సరదాగా లేదు!!’’ అని తలచారు. అప్పుడు అ మహదాత్ముడు తన ఆత్మను ధ్యానించుచు వివిధ నామ-రూపాలును ఆ ధ్యానమునుండి కల్పించుకున్నారు. వారందరు అప్రబుద్ధులుగాను, కొయ్య-రాయిలాగా స్థాణువులుగా కనిపించారు. అది కూడా ఆయనకు ఆనందం కలిగించలేదు.
సో అమన్యత, ఏతాసాం ప్రతిబోధనాయ
అభ్యంతరం ప్రవిశానీత్
అథ స వాయుమ్ ఇవ ఆత్మానం
కృత్వ అభ్యంతరం ప్రావిశత్।
అప్పుడు ఆయన ‘‘నాచే క్రీడగా కన్పించబడిన ఈ తోలుబొమ్మ భౌతిక దేహములకు సంచలనము ఉండుటకై ప్రబోధ స్వరూపుడనై ప్రవేశించెదను గాక’’ … అని తలంచారు!
తనను తాను వాయు చలనశక్తి స్వరూపుడుగా తీర్చిదిద్దుకొని ఆ కల్పిత వివిధ భౌతిక రూపములతో కదలిక - వాయుచలనతత్త్వంగా ప్రవేశించారు.
స ఏకో న అవిశత్।
స పంచధా ఆత్మానం ప్రవిభజ్య ఉచ్యతే యః
ప్రాణో-అపానః-సమాన-ఉదానో-వ్యాన ।।ఇతి।।
గాలి రూపముగా మాత్రమే ప్రవేశించలేదు. తాను ధారణ చేసిన ఆ వాయు రూపము 5 విధములుగా వివర్తించుకున్నారు. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అను ఐదురీతులుగా చలనము ప్రదర్శించసాగారు.

అథ యోఽయమూర్ధ్వముత్క్రామతీత్యేష వావ స ప్రాణోఽథ
యోయమావంచం సంక్రామత్వేష వావ సోఽపానోఽథ యోయం
స్థవిష్ఠమన్నధాతుమపానే స్థాపయత్యణిష్ఠం చాంగేఽఙ్గే
సమం నయత్యేష వావ స సమానోఽథ యోఽయం పీతాశితముద్గిరతి
నిగిరతీతి చైష వావ స ఉదానోఽథ యేనైతాః శిరా
అనువ్యాప్తా ఏష వావ స వ్యానః .. 7..
7. అథ యో అయమ్ ఊర్ధ్వమ్ ఉత్క్రామతి-ఇతి
ఏష వావ స ‘‘ప్రాణో’’।
అథ యో అయం అవాఞ్చం సంక్రామతి
ఏష వావ సో ‘‘అపానో’’।
అథ యో యం సవిష్ఠమ్ అన్నధాతుమ్
అపానే స్థాపయతి।
అణిష్ఠం చ అంగే-అంగే సమున్నయతి,
ఏష వావ స ‘‘సమానో’’।
ఊర్ధ్వమునకు (పైవైపుగా) ఉత్క్రామించునది (ప్రవహించునది) - ‘ప్రాణము’.
క్రిందవైపుగా ప్రసరించుచున్న ప్రాణ (వాయు) ప్రసరణము- ‘అపానము’.
అన్న ధాతువును శరీరములో స్థాపింపజేసి దేహము యొక్క పుష్ఠిని కలిగించునది ఈ అపాన ప్రాణ వాయువు.
దేహములోని అంగాంగముల యొక్క అణువణువు అన్నధాతువును (అన్న రసమును), జేర్చునది - ‘‘సమాన ప్రాణవాయువు’’ (ఉత్తేజ పరచునది).
అథ యో అయం పీతాశితమ్ ఉద్గిరతి,
నిగిరతీతి చ ఏష వావ స ‘‘ఉదానో’’।
అథ ఏన ఏతాః సిరాః అనువ్యాప్తా
ఏష వావ స ‘‘వ్యానః’’।।
ఈ దేహి త్రాగినదానిని, తిన్న దానిని క్రింద వైపుగాను, పైవైపుగాను కదలుస్తూ పంపుచున్నట్టిది - ‘ఉదాన ప్రాణవాయువు’.
అన్న రసమును, ధమనులకు, సిరలకు ఏ శక్తి అనువ్యాప్తపరుస్తోందో, నర-నరములకు తీసుకొని పోవుచున్నదో…, అది- ‘‘వ్యాన ప్రాణవాయువు’’.

అథోపాంశురంతర్యామ్యమిభవత్యంతర్యామముపాంశుమేతయోరంతరాలే
చౌష్ణ్యం మాసవదౌష్ణ్యం స పురుషోఽథ యః పురుషః
సోఽగ్నిర్వైశ్వానరోఽప్యన్యత్రాప్యుక్తమయమగ్నిర్వైశ్వానరో
యోఽయమనంతః పురుషో యేనేదమన్నం పచ్యతే యదిదమద్యతే
తస్యైష ఘోషో భవతి యదేతత్కర్ణావపిధాయ శృణోతి స
యదోత్క్రమిష్యన్భవతి నైనం ఘోషం శృణోతి .. 8..
8. అథ ఉపాంశుః అంతర్యామిః
అభిభవతి, అంతర్యామమ్ ఉపాంశుమ్
ఏతయోః అంతరాళే చ ఔష్ణ్యం
ప్రాస్రవత్ యత్, ఔష్ణ్యం స ‘‘పురుషో’’।
అటుపై ఇంకా కూడా,
1) అంతర్యామి (The Author for the Experiencing) 2) ఉపాంశువు (Supporting Factor) అయి ఈ ఉభయములుగా పరమాత్మ అగుచున్నారు. ఈ రెండింటి అంతరంగా ఔష్ఠ్యము (తేజో రూపము) ప్రసరించుచున్నది. అట్టి ఔష్ఠ్య రూపుడే ‘‘పురుషుడు’’.
అథ యః పురుషః సో
అగ్నిః (తు) వైశ్వానరో-పి అన్యత్రాపి ఉక్తమ్।
ఔష్ఠ్య స్వరూపమే జీవాత్మ. అతడే అగ్ని. దేహములోని అగ్ని స్వరూపమగు వైశ్వానరుడు ఆయనకు వేరైనవాడు కూడా. ఇదే ఇంకొక రీతిగా చెప్పబడింది.
అయమ్ అగ్నిః వైశ్వానరో
యో అయమ్ అంతః పురుషే
యేన ఇదం అన్నం పచ్యతే
యత్ ఇదమ్ అద్యతే, (ఇదమద్యతే)
1) ఎవ్వనిచే అన్నము తినబడుచున్నదో…,
2) అన్నము దేహములో పచనము చేయబడుచున్నదో…,
ఆతడే అంతఃపురుషుడు, వైశ్వానరుడు కూడా! ఆ జీవాత్మ యొక్క దేహములోని ఉనికి ‘‘ఘోష’’ శబ్దముగా వినబడుచూ ఉంటోంది!
తస్య ఏష ఘోషో భవతి।
యత్ ఏతత్ కర్ణావపిధాయ శృణోతి,
స యత్ ఉత్క్రమిష్యన్ భవతి,
న ఏనం ఘోషం శృణోతి।।
చెవులు మూసుకొని ఉన్నప్పుడు వినబడే పురుషుని యొక్క (జీవాత్మ యొక్క) ఉనికి శబ్దమే-ఆ ‘ఘోష’. ఈ జీవుడు ఎప్పుడు ఈ దేహమును త్యజించుచున్నాడో, అప్పుడు ప్రాణవాయు చల సంబంధమైన ఘోష ఆ భౌతికదేహము నుండి ఇక వినబడటం ఉండదు.

స వా ఏష పంచధాత్మానం ప్రవిభజ్య నిహితో గుహాయాం
మనోమయః ప్రాణశరీరో బహురూపః సత్యసం కల్ప ఆత్మేతి స వా
ఏషోఽస్య హృదంతరే తిష్ఠన్నకృతార్థోఽమన్యతార్థానసాని
తత్స్వానీమాని భిత్త్వోదితః పంచభీ రశ్మిభిర్విషయానత్తీతి
బుద్ధీంద్రియాణి యానీమాన్యేతాన్యస్య రశ్మయః కర్మేంద్రియాణ్యస్య
హయా రథః శరీరం మనో నియంతా ప్రకృతిమయోస్య ప్రతోదనేన
ఖల్వీరితం పరిభ్రమతీదం శరీరం చక్రమివ మృతే చ
నేదం శరీరం చేతనవత్ప్రతిష్ఠాపితం ప్రచోదయితా
చైషోఽస్యేతి .. 9..
9. స వా ఏష పంచధా ఆత్మానం
ప్రవిభజ్య నిహితో గుహాయాం-
(1) మనో మయః (2) ప్రాణ శరీరో (3) ‘భా’రూప
(4) సత్య సంకల్ప (5) ఆత్మ - ఇతి।।
ఆ పరమాత్మ తనను తాను ‘ఐదు’ విధములుగా విభజించి జీవుని (జీవుల) హృదయగుహలో ఉంచుచున్నారు.
1) మనోమయము 2) ప్రాణశరీరము 3) భాస (వెలిగించు) రూపము 4) సత్య సంకల్పము 5) ఆత్మ.
స వా ఏషో అస్య హృదంతరే
తిష్ఠత్ ‘న కృతార్థో’ అమన్యతా।
అర్థాత్ న అశ్నామి ఇత్యతః
స్వానీమాని భిత్వా ఉదితః
పంచభీ రశ్మిభిః విషయాన్ ‘అత్తి’ ఇతి
బుద్ధీంద్రియాణి యాని ఇమాని
ఏతాని అస్య రశ్మయః।
‘‘హృదయాంతరములో ఈ ఐదు రూపాలు స్థాపించాను. అయితే కూడా ఈమాత్రముచే కృతార్థుడను (తృప్తుడను) కాదు’’ - అని పరమాత్మ తలచారు. ‘‘పంచ ఇంద్రియార్ధములను (శబ్ద స్పర్శ రూప రస గంధముల) అనుభవించినప్పుడే కదా కృతార్థుడను!’’ …. అనే ఇచ్ఛ పొందారు. పంచ రూపములను భేదించుకొని పంచ కిరణములతో పంచ విషయములను అనుభవించ దలచారు.
- పంచ బుద్ధీంద్రియములే జ్ఞానేంద్రియములు. అవియే ఆయన యొక్క కిరణములు. చూపు-వినికిడి-స్పర్శ-రుచి-వాసనలే-ఆత్మయొక్క దేహములోని కిరణములు.
కర్మేంద్రియాణి అస్య హయా।
రథః శరీరమ్।
మనో నియంతా।
పంచ కర్మేంద్రియములు ఆత్మచే నిర్మించబడిన గుర్రములు. ఇవన్నీ పనిచేసే శరీరము - రథము!
మనస్సు ఈ దేహ రథము యొక్క నియంత (లేక) సారధి.
ప్రకృతమయో అస్య ప్రతోదనేన ఖలు (వ) ఈరితం
పరిభ్రమతి। ఇదం శరీరం చక్రమివ-
మృతేచ, న ఇదం శరీరం
చేతనవత్ ప్రతిష్ఠాపితం
ప్రచోదయితాచ ఏషో అస్యేతి।।
ప్రకృతమయమగు మనస్సు (ఆలోచన)- అనే తోలుకర్రతో ప్రేరేపించబడి ఈ శరీరము - ఆట స్థలములో త్రోయబడే చక్రము వలె - పరిభ్రమిస్తోంది.
తోయబడిన ఇనుప చక్రము కొంతసేపు పరిభ్రమించి ఆగిపోతుంది, పడిపోతుంది చూచారా? ఆ రీతిగా, చేతన వస్తువువలె దృశ్యములో పరిభ్రమిస్తున్న ఈ శరీరము మరణము యొక్క సంభవముచే అచేతనమై పడిపోతోంది. కనుక ఈ ఈ భౌతిక దేహమునకు మనస్సే ప్రేరకుడు. మనస్సుకో, ఆత్మ ప్రేరకుడు.

స వా ఏష ఆత్మేత్యదో వశం నీత ఇవ సితాసితైః
కర్మఫలైరభిభూయమాన ఇవ ప్రతిశరీరేషు
చరత్యవ్యక్తత్వాత్సూక్ష్మత్వాదదృశ్యత్వాదగ్రాహ్యత్వాన్నిర్మమత్వా
చ్చానవస్థోఽకర్తా కర్తేవావస్థితః .. 10..
10. స వా ఏష ఆత్మేతి యదో వశం నీత ఇవ
సితాసితైః కర్మఫలైః
అభిభూయమాన ఇవ
ప్రతి శరీరం చరతి।
ఒక ఆశ్చర్యకరమైన విషయం. పరాత్మ-మనస్సుకు-దేహమునకు కర్తయే అయి ఉండి కూడా తాను మనస్సుకు - శరీరమునకు వశము అయినవాని వలె అగుచున్నాడు. శుభ-అశుభ కర్మలచే పీడింపబడుచున్నట్లు అగుపించటం, అనిపించటం జరుగుతోంది. అఖండమగు ఆత్మ వేరు వేరు దేహములలో వేరు వేరు రీతులలో కర్మ-జ్ఞాన సంబంధమై నిబద్ధము అగుచున్నట్లు చూడబడుతోంది.
అవ్యక్తత్వాత్, సూక్ష్మత్వాత్,
అదృశ్యత్వాత్, అగ్రాహ్యత్వాత్,
నిర్మమత్వాత్ చ
అనవస్థో, అకర్తా..-
‘‘కర్తేవావ స్థితః’’।।
వాస్తవానికి ఆత్మ…,
అవ్యక్తము, సూక్ష్మము, అదృశ్యము, అగ్రాహ్యము, మమకార రహితము, అవస్థాత్రయ రహితము, అకర్త అయి ఉండి కూడా…., దేహ-మనో-బుద్ధి- చిత్త-అహంకారాదుల కార్యక్రమములకు కర్తృత్వము పొందుచున్నదానివలె స్థితి పొంది ఉంటోంది.

స వా ఏష శుద్ధః స్థిరోఽచలశ్చాలేపోఽవ్యగ్రో నిఃస్పృహః
ప్రేక్షకవదవస్థితః స్వస్య చరితభుగ్గుణమయేన
పటేనాత్మానమంతర్ధీయావస్థిత ఇత్యవస్థిత ఇతి .. 11..

ఇతి ద్వితీయః ప్రపాఠకః ..
11. సవా ఏష శుద్ధః, స్థిరో, అచలశ్చ,
అలేపో, అవ్యగ్రో, నిస్పృహః,
ప్రేక్షకవత్ అవస్థితః।
సర్వ దేహులలోని (దేహములలోని) సర్వదా బాహ్య-అభ్యంతరములలో వేంచేసియున్న దేహి రూపుడగు పరమాత్మ యొక్క స్వరూపము-
- శుద్ధము, స్థిరము.
- అచలము. దేనిచేతనూ అంటబడనట్టి అలేపము. అసంగము.
- దేనిచేత కూడా వ్యగ్రత పొందనట్టిది. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవల నిస్పృహయై ఉన్నట్టిది.
ఇంకా కూడా, -
నాటకము చూస్తున్న ప్రేక్షకుని వలె కేవల సాక్షిగా అవస్థితమై ఉన్నట్టిది.
స్వ స్వచరితభుక్ గుణమయేన, పటే న,
ఆత్మానమ్ అంతర్థాయ అవస్థిత।
ఇత్యవస్థిత।। ఇతి।।
అట్టి ఆత్మ తనచే రచించుకొనబడిన ఊహా చరితమును తానే జన్మ-కర్మల రూపముగా ఆస్వాదిస్తున్నది. గుణమయము అనే రూపము గల అంగవస్త్రముతో తనను తానే ఆచ్ఛాదనముగా కప్పుకున్నట్టిది అగుచున్నది.
ఆత్మ ఈవిధంగా అందరిలోను, అందరుగాను అవస్థితమైయున్నది.
ఓ బృహద్రథా!
నీవు సర్వదా అట్టి ఆత్మస్వరూపుడవే అయి ఉన్నావు.
ఇతి ద్వితీయ పాఠకః।
తత్త్వమసి।।
ఇతి ద్వితీయ పాఠకః।

తృతీయ ప్రపాఠకః


తే హోచుర్భగవన్యద్యేవమస్యాత్మనో మహిమానం సూచయసీత్యన్యో
వా పరః కోఽయమాత్మా సితాసితైః కర్మఫలైరభిభూయమానః
సదసద్యోనిమాపద్యత ఇత్యవాచీం వోర్ధ్వాం వా గతం
ద్వంద్వైరభిభూయమానః పరిభ్రమతీతి కతమ ఏష ఇతి
తాన్హోవాచ .. 1..
1. తే హ ఊచు :
భగవన్! అద్యైవమ్ అపి ఆత్మనో
మహిమానం సూచయతి।
వాలఖిల్య మునీశ్వరులు : భగవన్! హే ప్రజాపతీ! మీరు చెప్పే విషయములన్నీ కూడా ఇప్పటికే నేనై ఉన్న ‘‘ఆత్మ మహామహితాత్మ మైనది’’ …. అనియే సూచిస్తున్నాయి కదా!
అన్యోవ అపరః (కిం)?
కో అయమ్ ఆత్మా? - యో అయం
సితాసితైః కర్మఫలైః
అభిభూయమానః
సత్-అసత్ యోనిం ఆపద్యత,
ఇతి అవాచీం వ ఊర్ధ్వాం వా గతిం
ద్వంద్వైః అభిభూయమానః పరిభ్రమతీతి
కతమ ఏష? ఇతి।।
తాన్ హో వాచ।
మరి ఆత్మకు మరొక అపరమగు ఆత్మ ఉన్నదా? (పరమాత్మకు చెందినదై ‘జీవాత్మ’ అనబడునది వేరుగా ఉన్నదా?) ఏ ఆత్మ శుభాశుభ కర్మఫలముల చేత పీడింపబడుచున్నదో, సత్-అసత్ జన్మలను పొందటం జరుగుతోందో, ఊర్ధ్వ - అధోగతులచే (సుఖ దుఃఖ) ద్వంద్వములచే బాధింపబడుతూ పరిభ్రమిస్తోందో…. ఆ రెండవ ఆత్మ ఎవరు? ఎక్కడి నుండి వచ్చియున్నది? ‘‘ఇహాత్మ’’ (లేక) ‘‘భూతాత్మ’’ (లేక) ‘‘జీవాత్మ’’ - అనునది ఉన్నదా? ఒకవేళ వేరుగా ఉంటే, ఎట్టిదై ఉన్నది? నాకు వేరైనదా? ఎక్కడి నుండి జనించి, ఇక్కడకు వచ్చి చేరుతోంది? అట్టి ‘జీవాత్మ’ (లేక) భూతాత్మ యొక్క కార్యక్రమములు, వాస్తవ స్వరూపము ఎట్టివి?

అస్తి ఖల్వన్యోఽపరో భూతాత్మా యోఽయం సితాసితైః
కర్మఫలైరభిభూయమానః సదసదయోనిమాపద్యత ఇత్యవాచీం
వోర్ధ్వాం గతిం ద్వంద్వైరభిభూయమానః
పరిభ్రమతీత్యస్యోపవ్యాఖ్యానం పంచ తన్మాత్రాణి
భూతశబ్దేనోచ్యంతే పంచ మహాభూతాని
భూతశబ్దేనోచ్యంతేఽథ తేషాం యః సముదాయః
శరీరమిత్యుక్తమథ యో హ ఖలు వావ శరీరమిత్యుక్తం స
భూతాత్మేత్యుక్తమథాస్తి తస్యాత్మా బిందురివ పుష్కర ఇతి స వా
ఏషోఽభిభూతః
ప్రాకృత్యైర్గుణైరిత్యతోఽభిభూతత్వాత్సంమూఢత్వం
ప్రయాత్యసంమూఢస్త్వాదాత్మస్థం ప్రభుం భగవంతం
కారయితారం నాపశ్యద్గుణౌఘైస్తృప్యమానః
కలుషీకృతాస్థిరశ్చంచలో లోలుప్యమానః సస్పృహో
వ్యగ్రశ్చాభిమానత్వం ప్రయాత ఇత్యహం సో మమేదమిత్యేవం
మన్యమానో నిబధ్నాత్యాత్మనాత్మానం జాలేనైవ ఖచరః
కృతస్యానుఫలైరభిభూయమానః పరిభ్రమతీతి .. 2..
2. అస్తి ఖలు అన్యో అపరో భూతాత్మా, యోయం
సితాసితైః, కర్మఫలైః అభిభూయమానః
సత్-అసత్ యోనిమ్ ఆపద్యత,
ఇతి, అవాచీం వ ఊర్ధ్వామ్ గతిం
ద్వంద్వైః అభిభూయమానః పరిభ్రమతి।
ఇతి అస్య ఉపవ్యాఖ్యానం।।
ప్రజాపతి : అవును! రెండవదగు అపరమగు ‘భూతాత్మ’ అని చెప్పబడేది ఉన్నది. ఏ భూతాత్మ అయితే శుభాశుభ కర్మ ఫలాలచే బంధించ బడుతోందో, సత్-అసత్ దేహములలో (లేక) యోనులలో మజిలీలతో కూడిన సుదీర్ఘ ప్రయాణాలు నిర్వర్తిస్తోందో,
ఊర్ధ్వ - అధో మార్గములలో వెఱ్ఱితో కూడిన బాటసారివలె సంచారాలు సలుపుతోందో, అనేక ద్వంద్వములను మూటలుగా మోస్తూ కట్టుబడి పరిభ్రమిస్తోందో - అదియే జీవాత్మ (లేక) ఇహాత్మ. అట్టి భూతాత్మ గురించి వివరించుకుందాము. ‘‘భూత + ఆత్మ’’ … అను దానిలో భూతము అనగా?
→ పంచతన్మాత్రాణి ‘భూత’ శబ్దేన ఉచ్యంతే।
→ పంచమహా భూతాని ‘భూత’ శబ్దేన ఉచ్యంతే।
- శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములనే పంచతన్మాత్రలను ‘భూత’ శబ్దముచే ఉద్దేశ్యించబడుతోంది.
అట్లాగే - భూ - జల - అగ్ని - వాయు - ఆకాశములనబడే పంచ మహాభూతములను కూడా ‘భూత’ శబ్ద-ఉద్దేశ్యము!
అథ తేషాం యః సమవాయః శరీరమ్ ఉక్తమ్।
అథ యో హ ఖలు వావ ‘శరీరమ్’ ఇత్యుక్తమ్-
స ‘భూతాత్మ’ ఇతి ఉక్తమ్।
పంచ తన్మాత్రల + పంచ మహాభూతముల సమవాయమే (లేక ఇవన్నీ మేళవించబడిన రూపమే) … శరీరము అనే పేరుతో చెప్పబడుతోంది.
ఏది ఇక్కడ ‘శరీరము’ అని చెప్పుకుంటున్నామో అదియే ‘భూతాత్మ’ అని కూడా - చెప్పబడుతోంది.
అథ అస్తి తస్య ఆత్మా బిందురివ పుష్కర ఇతి।
స వా ఏషో అభిభూతః।
ప్రాకృతైః గుణైః ఇతి అతో
అభిభూత్వాత్ సంమూఢత్వమ్
ప్రయాత్య, సమ్మూఢత్వాత్ ఆత్మస్థం
ప్రభుం, భగవంతం, కారయితారం
న అపశ్యత్ గుణౌఘైః తప్యమానః
కలుషీకృతశ్చ, అస్థిరః, చంచలో,
లోలుప్యమానః -స స్పృహో, వ్యగ్రశ్చ,
అభిమానిత్వం ప్రయాత।
తామరాకుయందు జల బిందువు ఉంటుంది చూచావా? ఆవిధంగా భూతాత్మ యందు పరమాత్మ ఉంటోంది.
భూతాత్మ ప్రకృతి సంబంధమైన ప్రాకృత గుణములచే పీడింపబడుచూ సమ్మూఢత్వము పొందుచున్నది.
అట్టి సమ్మూఢత్వము కారణంచేత ఈ భూతాత్మ (జీవాత్మ)- తన ఆత్మస్థుడు, తన ప్రభువు, భగవంతుడు, సర్వ పంచ జ్ఞాన-కర్మేంద్రియ ములకు కారయిత (నిర్వర్తింప జేయువాడు-నియమించువాడు)- అగు పరాత్మను (తనలోని ఆవలి ‘శాశ్వత-సహజ’ స్వరూపమును) దర్శించలేకపోతున్నాడు. గమనించలేకపోతున్నాడు. ఫలితం? త్రిగుణములచే తపించబడుచు, కలుషీకృతుడై, దోష భూయిష్టుడై, అస్థిరుడై, చంచలుడై, ఆశ-కోరికలకు బద్ధుడై, జ్ఞానవీక్షణ స్పృహ లేనివాడై, వ్యగ్రుడై, దేహ దురభిమానియై ఉంటున్నాడు.
‘‘ఇతి అహమ్-స మమ’’ - ఇదమ్
ఇత్యేవమ్
మన్యమనో, … నిబధ్నాత్
ఆత్మన ఆత్మానమ్ జాలేనేవ ఖచరః,
కృతస్య అనుఫలైః అభిభూయమానః పరిభ్రమతి ।।ఇతి।।
‘‘ఇది నేను. అది నాది. ఇది ఇంతే’’ అని తలచుచు తన ఆత్మకు తానే బంధము ఆపాదించుకొంటున్నాడు. వలలో (జాలము)లో చిక్కుకున్న పక్షివలె అనేక కర్మ పరంపరలు. వాటివాటి ఫలములు. ఫలముల కారణంగా నిర్వర్తించవలసి వస్తున్న ఉత్తరోత్తర కర్మలయందు కట్టుబడి- ఈ విధంగా సంసారారణ్యములో కుంటుకుంటూ పరిభ్రమిస్తున్నాడు.

అథాన్యత్రాప్యుక్తం యః కర్తా సోఽయం వై భూతాత్మా కరణైః
కారయితాంతఃపురుషోఽథ యథాగ్నినాయఃపిండో వాభిభూతః
కర్తృభిర్హన్యమానో నానాత్వముపైత్యేవం వావ ఖల్వసౌ
భూతాత్మాంతఃపురుషేణాభిభూతో గుణైర్హన్యమానో
నానాత్వముపైత్యథ యత్త్రిగుణం చతురశీతిలక్షయోనిపరిణతం
భూతత్రిగుణమేతద్వై నానాత్వస్య రూపం తాని హ వా ఇమాని
గుణాని పురుషేణేరితాని చక్రమివ చక్రిణేత్యథ యథాయఃపిండే
హన్యమానే నాగ్నిరభిభూయత్యేవం నాభిభూయత్యసౌ
పురుషోఽభిభూయత్యయం భూతాత్మోపసంశ్లిష్టత్వాదితి .. 3..
3. అథ అన్యత్ర అపి ఉక్తమ్।।
యః కర్తా, సో అయంవై ‘భూతాత్మా’।
కరణైః కారయిత-అంతః పురుషో।
ఇంకా కూడా ఇట్లా అని శాస్త్రములు వేరు వేరుచోట్ల చెప్పుచూనే ఉన్నాయి.
‘‘కర్మలకు కర్తను నేనే!’’ అని భావించుచూ, సర్వాంతర్యామిని ఏమరచువాడే భూతాత్మ. ఈ భూతాత్మయే ‘అంతః పురుషుడు’ కూడా!
అథ యథా అగ్నినా అయః పిండోవా
అభిభూతః కర్తృభిః హన్యమానో నానాత్వమ్ ఉపైతి।
ఏవం వావ ఖలు అసౌ భూతాత్మా అంతః పురుషేణ
అభిభూతో గుణైః హన్యమానో నానాత్వమ్ ఉపైతి।
అగ్నితో కాలిన ఇనుపగోళమును కమ్మరిచే గుణపపు సుత్తిచే మోదినప్పుడు అనేక ముక్కలుగా అగుచున్నది కదా!
అట్లాగే, అంతఃపురుష రూపుడగు ఈ భూతాత్మకూడా ‘త్రిగుణములు’ అనే కమ్మరి ఉలి (సుత్తి)తో కొట్టబడి నానా ప్రకారములుగా అగుచున్నది.
అథ యత్ త్రిగుణం చతురశీతి లక్ష (84 లక్షల)
యోని పరిణతమ్, భూత గణమ్ ఏతద్వై
నానాత్వ స్వరూపం
తాని హవా ఇమాని గుణాని పురుషేణ ఈరితాని।
త్రిగుణముల నానావిధములైన సమ్మేళనమే సృష్టిలోని 84 లక్షల జీవజాతులు (భూతాత్మగణము).
ఈ త్రిగుణ సమ్మేళణములు భూతాత్మచే ప్రేరేపించబడినవై 84 లక్షల జీవ జాతులలో (ఈ భూతాత్మ లేక పురుషుడు లేక జీవుడు)-చక్ర యంత్రమును ఎక్కినవానివలె - సంచారములు చేస్తున్నాడు.
చక్రమివ చక్రిణేతి ।
అథ యథాయః పిండే హన్యమానే
న అగ్నిః అభిభూయతి,
ఏవం న అభిభూయతి। అసౌ పురుషో-
అభిభూయతి అయం భూతాత్మా
ఉప సంశ్లిష్టత్వాత్ ।।ఇతి।।
అయితే, ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించండి! కాలుచున్న ఇనుపగుండు అగ్ని గోళమును కమ్మరి సుత్తితో మోదుచున్నప్పుడు ఇనుపగుండు అనేక ముక్కలుగా (84 లక్షల జీవ జాతులవలె) అగుచుండవచ్చు గాక! కానీ అగ్ని ఖండములుగా అగుచున్నదా? లేదు. అగ్నికి అనేకత్వము ఉండదు. అట్లాగే…,
భూతాత్మ 84 లక్షల విధములైన జీవజాతి ఉపాధులలో గుణముల ప్రభావంచే చక్రభ్రమణము వలె సంచరించ వచ్చును గాక! కానీ పరమ పురుషుడగు ఆత్మకు ఖండత్వమనునదే ఉండదు.
కేవలస్వరూపుడగు పరాత్మ సర్వదా అఖండమే. స్వయం కల్పితమాత్రుడగు భూతాత్మ మాత్రమే జన్మ-కర్మ బాధలన్నీ పొందటం జరుగుతోంది!

అథాన్యత్రాప్యుక్తం శరీరమిదం మైథునాదేవోద్భూతం
సంవిదపేతం నిరయ ఏవ మూత్రద్వారేణ
నిష్క్రామంతమస్థిభిశ్చితం మాంసేనానులిప్తం
చర్మణావబద్ధం విణ్మూత్రపిత్తకఫమజ్జామేదోవసాభిరన్యైశ్చ
మలైర్బహుభిః పరిపూర్ణం కోశ ఇవావసన్నేతి .. 4..
4. అథ అన్యత్రాపి ఉక్తమ్।
శరీరమ్ ఇదమ్ మైధునాత్ ఏవ ఉద్భూతమ్।
సంవిత్ అపేతం, నిరయ ఏవ।
మూత్రద్వారేణ నిష్క్రాంతమ్।
అస్థిభిః చితం।
మాంసేన అనులిప్తం।
చర్మణావ బద్ధమ్।
విణ్మూత్ర-పిత్త-కఫ-మజ్జా-మేదో వసాభిః,
అన్యైశ్చ మలైః బహుభిః పరిపూర్ణం
కోశ ఇవ ధనేన ।।ఇతి।।
ఇదే (వేదాంత శాస్త్రములో) ఇంకా ఈ రీతిగా కూడా చెప్పబడుతోంది!
ఈ భౌతిక దేహము మైధునము (స్త్రీ-పురుషుల కలయికచే) పుట్టుచున్నది. ఇది జడము. అనగా, జ్ఞాన రహితమైనది. నరకప్రాయమైనది. మూత్ర ద్వారము నుండి వెలువడినట్టిది. ఎముకల గూడు, మాంసమయము అయి, చర్మముచే కప్పబడి ఉంటోంది.
మల-మూత్రములు, పిత్తము, కఫము, చీము, మజ్జ, మేదస్తు, క్రొవ్వు
మొదలుగా అనేక రకములైన మాలిన్యములతో నిండియున్నది. ఇది కాక ఒక ధనాగారము వలె అనేక పదార్థములు కలిగి ఉన్నట్టిది!

అథాన్యత్రాప్యుక్తం సంమోహో భయం విషాదో నిద్రా తంద్రీ వ్రణో
జరా శోకః క్షుత్పిపాసా కార్పణ్యం క్రోధో నాస్తిక్యమజ్ఞానం
మాత్సర్యం వైకారుణ్యం మూఢత్వం నిర్వ్రీడత్వం
నికృతత్వముద్ధాతత్వమసమత్వమితి తామసాన్వితస్తృష్ణా స్నేహో
రాగో లోభో హింసా రతిర్దృష్టివ్యాపృతత్వమీర్ష్యా
కామమవస్థితత్వం చంచలత్వం జిహీర్షార్థోపార్జనం
మిత్రానుగ్రహణం పరిగ్రహావలంబోఽనిష్టేష్వింద్రియార్థేషు
ద్విష్టిరిష్టేశ్వభిషంగ ఇతి రాజసాన్వితైః పరిపూర్ణ
ఏతైరభిభూత ఇత్యయం భూతాత్మా
తస్మాన్నానారూపాణ్యాప్నోతీత్యాప్నోతీతి .. 5..

తృతీయః ప్రపాఠకః ..
5. అథ అన్యత్రాపి ఉక్తమ్।
సంమోహో, భయం, విషాదో, నిద్రా, తంద్రీ, వ్రణో,
జరా, శోకః, క్షుత్పిపాసా, కార్పణ్యం, క్రోధో, నాస్తిక్యమ్,
అజ్ఞానం, మాత్సర్యం, నైష్కారుణ్యం,
మూఢత్వం, నిర్ర్వీడత్వం, నికృతత్వం,
ఉద్ధతత్వమ్, అసమత్వమ్
ఇతి తామసాన్వితః।।
ఇంకా కూడా ఇందులో ప్రత్యక్షమై ఉంటున్న త్రిగుణములు మొదలైనవాటి గురించి ఇట్లా గమనించబడుతోంది.
ఈ దేహములోని తామస గుణములు :
సంమోహత్వము (Illusion and Misconception), భయము, విషాదము, నిద్ర, బద్ధకము (సోమరితనము), పుండ్లు, వార్ధక్యము, శోకము, ఆకలి, దాహము, (కొందరి గురించి) దిగులు (మరికొందరిపై) కోపము, (మరణానంతరము నేను ఉండను. దైవము లేదు - అనే) నాస్తిక్యము, అజ్ఞానము, మత్సరము, (కొందరిపై జాలి - అనే) కారుణ్యము, మూఢత్వము, నిర్లజ్జ, నీచత్వము, (నేను అంతటివాడిని కదా - అనే) గర్వము, (వారు వేరు - వీరు వేరు అనే) అసమత్వము మొదలైనవి.
తృష్ణా, స్నేహో, రాగో, లోభో,
హింసా, రతిః, దృష్టిః, వ్యాపృతత్వం,
ఈర్ష్యా, కామమ్, అస్థిరత్వమ్,
చంచలత్వమ్, జిగీషా, అర్ధోపార్జనమ్,
మిత్రానుగ్రహణమ్, పరిగ్రహ, అవలంబో,
అనిష్టేషు ఇంద్రియార్థేషు ద్విష్టిః,
ఇష్టేషు అభిష్వంగ। -
ఇతి రాజసాన్వితైః।।
ఇందులోని రాజస గుణములు: (ఇంకేదో ఇంకా పొందాలి, కావాలి - అనే) తృష్ణ, (వారు పరాయివారు - అనే) అస్నేహము, (వీరు మా వారు - అనే) రాగము, (ఉన్నది పోతుందేమోననే) లోభము, (ఇతరులను బాధించటము - అనే) హింస, విషయములలో రమించాలనే కామ దృష్టి, (క్షణమొక ఆలోచన చేసే) వ్యాపృతత్వము, ఈర్ష్య (లేనిదేమో లభించటంలేదనే), కామము, (పట్టుకున్నది వదలలేని) అవస్థిత్వము, చంచలత్వము, పరుల సంపద, పర స్త్రీ వ్యామోహ రూపమైన జిగీష, ధన సంపాదనపై ధ్యాస, స్నేహితులనుకొన్నవారిపై అనుగ్రహము, జాలి, (దగ్గిరకు చేరినవారిపట్ల అవలంబించే) ఆవేశము, (‘‘వారికి నేనే ఆలంబనము, నాపై ఆధారపడి ఉన్నారే! తరువాత ఏమౌతారు?’’ అను) మమకారము, (అయిష్టమైన ఇంద్రియార్ధముల పట్ల) ద్వేషము, (ఇష్టమైన విషయము లందు) ఆసక్తి…. ఇవన్నీ రాజసాన్వితమైనవి!
(ఇతి రాజసాన్వితైః) పరిపూర్ణ, ఏతైః అభిభూత ఇతి,
అయం భూతాత్మా। తస్మాత్
నానా రూపాణి ఆప్నోతి ఇతి।।
ఆప్నోతి ఇతి।।
ఇటువంటి తామస-రాజస గుణములచే హృదయమంతా నిండి ఆక్రమించుకొనబడినవాడై, వాటిచే ఈ భూతాత్మ కప్పబడినవాడై ఉంటున్నాడు. తత్ఫలితం? నానా రూపాలను (84 లక్షల జీవజాతుల రూపాలను) పొందటం ఒక చక్రభ్రమణము వలె జరుగుతోంది! చర్విత చరణంగా అనేక జన్మలు ఎత్తుచున్నాడు.
ఒక దేహము తరువాత మరొకర దేహములోనికి - ప్రవేశ నిష్క్రమణములు అవిశ్రాంతంగా చేస్తూ, చేస్తూపోతున్నాడు.

చతుర్థ ప్రపాఠకః - ఆత్మ ఏవ ఇదగ్ం సర్వమ్


తే హ ఖల్వథోర్ధ్వరేతసోఽతివిస్మితా అతిసమేత్యోచుర్భగవన్నమస్తే
త్వం నః శాధి త్వమస్మాకం గతిరన్యా న విద్యత ఇత్యస్య
కోఽతిథిర్భూతాత్మనో యేనేదం హిత్వామన్యేవ సాయుజ్యముపైతి
తాన్హోవాచ .. 1..
1. తే హ ఖలు అథ, ఊర్ధ్వరేతసో అతివిస్మితా।
అభి సమేత్య ఊచుః :
‘‘భగవన్ నమస్తే! త్వన్ నః శాధి। (త్వన్నోశ్శాధిః)।
త్వమ్ అస్మాకమ్ గతిః। అన్యా న విద్యత। ఇతి।।
అస్య కో విథిః భూతాత్మనో
యేన ఇదమ్ హిత్వాత్
ఆత్మన్యేవ సాయుజ్యమ్ ఉపైతి’’?
తాన్ హో వాచ.
ఇదంతా విని ఊర్థ్వరేతస్కులు, తపో సంపన్నులగు వాలఖిల్య మునులు విస్మితులైనారు! ఆశ్చర్యం పొందారు! భూతాత్మ పొందే సంసార చక్ర భ్రమణమునకు ‘భయము’ పొందారు.
వారు ప్రజాపతితో ఇట్లా పలుకసాగారు.
వాలఖిల్య మునీశ్వరులు: హే ప్రజాపతీ। బ్రహ్మ భగవన్! మీకు నమస్కరిస్తున్నాము. శరణు వేడుచున్నాము. ‘కిం కర్తవ్యమ్?’ గురించి మీరు మమ్ములను ఆజ్ఞాపించండి! మీరే మాకు గతి! మాకు వేరే దిక్కు లేదు.
ఈ విషయం మాకు చెప్పండి. ఈ జన్మ-కర్మల చక్రముల చిక్కుకున్న భూతాత్మయొక్క గతి ఏమిటి? భూతాత్మగా మాగతి ఇంతేనా? ఈ భూతాత్మకు ఎట్లా, దేనిచేత ఈ తామసిక-రాజసిక గుణఫలములు తొలగగలవు? సంసార చక్రాంతర్గత భ్రమణమును వదలి ఆత్మ సాయుజ్యము మేము పొందేది ఎట్లా?
ఈ ప్రశ్న విని ప్రజాపతి ఇట్లా సమాధానము ఇవ్వసాగారు.

అథాన్యత్రాప్యుక్తం మహానదీషూర్మయ ఇవ నివర్తకమస్య
యత్పురాకృతం సముద్రవేలేవ దుర్నివార్యమస్య మృత్యోరాగమనం
సదసత్ఫలమయైర్హి పాశైః పశురివ బద్ధం
బంధనస్థస్యేవాస్వాతంత్ర్యం యమవిషయస్థస్యైవ
బహుభయావస్థం మదిరోన్మత్త ఇవామోదమమదిరోన్మత్తం పాప్మనా
గృహీత ఇవ భ్రామ్యమాణం మహోరగదష్ట ఇవ విపదృష్టం
మహాంధకార ఇవ రాగాంధమింద్రజాలమివ మాయామయం స్వప్నమివ
మిథ్యాదర్శనం కదలీగర్భ ఇవాసారం నట ఇవ క్షణవేషం
చిత్రభిత్తిరివ మిథ్యామనోరమమిత్యథోక్తం .. శబ్దస్పర్శాదయో
యేఽర్థా అనర్థా ఇవ తే స్థితాః . యేష్వాసక్తస్తు భూతాత్మా న
స్మరేచ్చ పరం పదం .. 2..
2. అథ అన్యత్రాపి ఉక్తమ్!
మహానదీషు ఊర్మయ ఇవ నివర్తకమ్!
అస్య యత్ పురాకృతం సముద్ర వేలేవ దుర్నివార్యమ్।
అన్య మృత్యోః ఆగమనమ్।
సత్ - అసత్ ఫలమ్ అయైర్హి
పాశైః పశురివ బద్ధమ్।
ఇదియే అనేకచోట్ల కూడా చర్చించబడింది, వివరించబడింది సుమా!
ఈ భూతాత్మ సంసారములో సంచరిస్తూ తనయొక్క పర స్వరూపమును ఏమరచి ఉంటున్నాడు. స్మరించటం లేదు.
మహా నదిలో తరంగము నదీ జలంలోనే చిక్కుకుని ఒడ్డుకు చేరని విధంగా…,
ఈ భూతాత్మ పూర్వకర్మలు-ఫలములు అనే మహా సముద్రములో చిక్కుకుని ఉంటున్నాడు. కర్మఫలములు, కర్మలు ఆతనిపట్ల ఆగక దుర్నివార్యం అగుచున్నాయి.
ఒకవైపు మృత్యువుయొక్క ఆగమనము, మరొకవైపు సత్-అసత్ కర్మఫలములు పాశములై ఈ జీవాత్మ (లేక) భూతాత్మను పశువువలె బంధించి ఉంచుచున్నాయి.
బంధనస్థ ఏవ అస్వాతంత్ర్యం
యమ విషయస్థ ఇవ బహుభయావస్థమ్
మదిరోన్మత్త ఇవ మోహ మదిరోన్మత్తమ్
పాప్మనా గృహీత ఇవ భ్రమ్యమాణం
మహా-ఉరగ దష్ట ఇవ విషయ దష్టమ్
అనేక బంధనములలో ఇరుకుకొన్నవాడై, అస్వాతంత్రుడై, యముని దృష్టిలో పడినవాడై బహు భయావస్ధలో ఉండి ఉంటున్నాడు.
కల్లు త్రాగి మత్తెక్కినవాని వలె దృశ్య విషయ-మత్తుడై దృశ్యములో ఆనందం కోసం వెతకుచున్నాడు.
పాప దేవతకు పట్టుబడినవానివలె అనేక భ్రమలలో తిరుగాడుచున్నాడు.
గొప్ప విష సర్పము (పాము) కరచిన వానివలె అనేక విపత్తులలో మ్రగ్గుచున్నాడు.
మహాంధకార ఇవ రాగాంధమ్
ఇంద్రజాలమ్ ఇవ మాయామయమ్
స్వప్న ఇవ మిథ్యా దర్శనమ్
కదళీగర్భ ఇవ అసారమ్!
మహాంధకారములో చిక్కుకొన్నవానివలె ‘రాగము’చే కళ్ళు మూసుకొనిపోయి ఉంటున్నాడు.
ఇంద్రజాలము వలె మాయామయమైన విశేషాలెన్నిటికో పట్టుబడి ఉంటున్నాడు.
కల కంటున్నవాని వలె మిధ్యా విషయాలన్నీ సత్యము వలె దర్శిస్తున్నాడు.
అరటి చెట్టు కాండము మధ్యలో ఏమీ ఉండనట్టు, హృదయంలో నిస్సారుడై ఉంటున్నాడు.
నట ఇవ క్షణ వేషమ్!
చిత్ర భిత్తిరివ మిథ్యామనోరమమ్।
ఇతి అథ ఉక్తమ్। (ఇత్యథోక్తమ్)।।
శబ్ద-స్పర్శాదయో యే అర్థా
అనర్థా ఇవ తే స్థితాః।
యేషామ్ సక్తస్తు భూతాత్మా
న స్మరేత్ చ పరంపదమ్।।
నటునివలె క్షణమొక వేషం వేస్తున్నాడు. గోడమీద చిత్రించిన సరస్సులో దాహం తీర్చే నీళ్ళుంటాయా? అట్లా తీరని మిధ్యా మనోరథములు ఆశ్రయిస్తున్నాడు. అర్థరహితములు, అనర్థములు కూడా - అయినట్టి శబ్ద స్పర్శ రూప రస గంధములకు ఏవేవో అర్థములను కల్పించుకొని వాటియందు మునిగి తేలుచున్నాడు.
ఈవిధంగా శబ్ద స్పర్శాదులందు ఆసక్తత కల్పించుకొనియున్న ఈ భూతాత్మ తన ఆస్తి (His own Property) యగు ‘పరమపదము’ను గుర్తించటము లేదు. స్మరించటము లేదు.

అయం వా వ ఖల్వస్య ప్రతివిధిర్భూతాత్మనో యద్యేవ
విద్యాధిగమస్య ధర్మస్యానుచరణం స్వాశ్రమేష్వానుక్రమణం
స్వధర్మ ఏవ సర్వం ధత్తే
స్తంభశాఖేవేతరాణ్యనేనోర్ధ్వభాగ్భవత్యన్యథధః పతత్యేష
స్వధర్మాభిభూతో యో వేదేషు న స్వధర్మాతిక్రమేణాశ్రమీ
భవత్యాశ్రమేష్వేవావస్థితస్తపస్వీ చేత్యుచ్యత ఏతదప్యుక్తం
నాతపస్కస్యాత్మధ్యానేఽధిగమః కర్మశుద్ధిర్వేత్యేవం హ్యాహ ..

తపసా ప్రాప్యతే సత్త్వం సత్త్వాత్సంప్రాప్యతే మనః .
మనసా ప్రాప్యతే త్వాత్మా హ్యాత్మాపత్త్యా నివర్తత ఇతి .. 3..
3. అయం వావ ఖలు అస్య ప్రతివిధిః భూతాత్మనో।
- యత్ ఏవ విద్యాధిగమః-
- స్వధర్మస్య అనుసరణమ్।
- స్వ ఆశ్రమేషు ఏవ అనుక్రమణమ్।
స్వధర్మ ఏవ సర్వం ధత్తే స్తంభశాఖే
చేతరాణ్యనేన ‘‘ఊర్ధ్వభాగ్’’ భవతి।

[ భగవద్గీత - శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్।
జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే।
ధ్యానాత్ కర్మఫల త్యాగః।
త్యాగాత్ శాంతిః అనంతరమ్।।
]
ఇదీ పరిస్థితి! ఇప్పుడు ఈ భూతాత్మయొక్క సంసారారణ్య బంధస్థితికి ప్రతివిధి (Counter Action) ఏమిటి? విచారణ చేద్దాము.
1) ఆత్మతత్త్వ విచారణ. ఆత్మ విద్యను అభ్యసించటము.
2) స్వధర్మమును శ్రద్ధగా నిర్వర్తించటము. స్వ ఆశ్రమ సంబంధమైన శాస్త్ర ప్రవచిత విధి విధానములను అనుకరించటము.
3) ప్రాణాయామాది యోగోపాయములు.
స్వధర్మము (విహితమైనట్టి ధర్మము) అనే స్థంభమును గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు కర్మపరంపరల అరణ్యము నుండి ఆ స్వధర్మమే (ధర్మో రక్షతి రక్షితః) ఈ భూతాత్మను ఊర్ధ్వమునకు తేగలదు. (కర్మఫలత్యాగము).
అన్యథా, అధః పతతి।
ఏష స్వధర్మ అభిభూతో యో వేదేషు
న స్వధర్మాతిక్రమేణ అశ్రమీ భవతి।
ఆశ్రమేషు ఏవ అవస్థితః ‘‘తపస్వీచేత్’’ ఉచ్యత।
ఏతదపి ఉక్తం।
అట్లా కాకుండా, జన్మ పొందినందుకు కృతజ్ఞత అయినట్టి స్వధర్మము ఏమరచబడిందా, ఇక అధఃపతనము (అల్ప జన్మలు) తప్పేవి కావు.
(1) ఏదేది వేదములచే, వేద వాక్కులచే ‘విహితము’ (చెయ్యాలి) అని చెప్పబడుచూ వస్తోందో, అది నిర్వహించటము.
(2) నిషేధమైన కర్మలు నిర్వర్తించకపోవటము
- ఇదియే స్వధర్మము. స్వధర్మమును అతిక్రమిస్తే, అట్టివాడు అనాశ్రమి, మార్గము తప్పువాడు అగుచున్నాడు.
ఏ ఆశ్రమ వాసి అయితే, ఆ ఆశ్రమ ధర్మములను శ్రద్ధ-భక్తులతో స్వ ధర్మముగా నిర్వర్తించాలి. నిర్వర్తిస్తూ ఉంటే ‘‘ఆశ్రమి-ఆశ్రమ తపస్వి’’ అగునని చెప్పకోబడుచున్నాడు. (మనుధర్మము, భారత రామాయణ భాగవతములు - మొదలైనవి విధినిషేధములను విస్తారంగా నిర్వచించి చెప్పుచున్నాయి).
న అతపస్కస్య ఆత్మజ్ఞానాధిగమః।
కర్మశుద్ధిర్వ ఇత్యేవం హి ఆహ।
తపసా ప్రాప్యతే సత్త్వమ్।
సత్త్వాత్ సంప్రాప్యతే మనః।
మనసా ప్రాప్యతే తు ఆత్మా హి।
ఆత్మా ఆప్త్యా న నివర్తత।।
।।ఇతి।।
స్వధర్మ నిరతి తపస్సే అవుతుంది.
• అతపస్కుడు (తపస్సు లేనివాడు) ఆత్మజ్ఞానమునకు అర్హుడు కాలేడు.
• కర్మ - బుద్ధియొక్క శుద్ధి కొరకే శాస్త్రములచే, తత్త్వజ్ఞులచే … మొదలైన వాటిచే ఉద్దేశ్యించ బడుతోంది. చెప్పబడుతోంది.
• తపస్సుచే బుద్ధి రజో-తమములను వదలి సత్త్వస్థితి పొందుతుంది. సాత్త్వికమైన భావాలు బలపడతాయి.
• సత్త్వ స్థితిచే మనస్సు నిర్మలమౌతుంది.
• నిర్మలమైన మనస్సుకు ఆత్మయొక్క అనుభవము ప్రాప్తించ గలదు. ఆత్మానుభవముచే అన్ని దుఃఖదోషములు, జన్మ-కర్మ బంధాలు వాటికవే నివర్తిస్తాయి. తొలగుతాయి. ఆత్మ జ్ఞానముచే ‘పునరావృత్తి దోషము’ - కడిగివేయబడగలదు.

అత్రైతే శ్లోకా భవంతి ..

యథా నిరింధనో వహ్నిః స్వయోనావుపశామ్యతి .
తథా వృత్తిక్షయాచ్చిత్తం స్వయోనావుపశామ్యతి .. 1..

స్వయోనావుపశాంతస్య మనసః సత్యగామినః .
ఇంద్రియార్థావిమూఢస్యానృతాః కర్మవశానుగాః .. 2..
(అత్రైతే శ్లోకా భవంతి।)
4. యథా నిరింధనో వహ్నిః స్వయోనా ఉపశామ్యతి,
తథా వృత్తిక్షయాత్ చిత్తం స్వయోనా ఉపశామ్యతి।
స్వయోనా ఉపశాంతస్య మనసః సత్యగామినః।
ఇంద్రియార్థా విమూఢస్యాత్ అనృతాః, కర్మవశానుగాః।
ఇదియే మహనీయులచే గానము చేయబడుతోంది. ఇంకా ఇట్లా చెప్పబడుతోంది.
ఏవిధంగా అయితే కట్టెలు (ఇంధనము) తరిగిపోతూ ఉండగా, - అగ్ని స్వయంగా ఉపశమిస్తుందో…, ఆ రీతిగానే,
• దృశ్య సంబంధమైన వృత్తులు (ఇంద్రియార్థములకు సంబంధించిన ఆవేశ పూరిత ఆలోచనలు) తొలగుచుండగా చిత్తము తనకు తానే క్షయిస్తూ వస్తుంది.
• అసత్యములగు ఇంద్రియార్థములను వదలి, సత్యము-నిత్యము అయిన ఆత్మపట్ల శ్రద్ధ - ఆసక్తి పెంపొందించుకొంటుంటే, ఆ సత్యకామి పట్ల - చిత్తము (లేక) మనస్సు తేలికగా ఉపశాంతించగలదు.
• అసత్యము, సందర్భ పరిమిత మాత్రము అగు ఇంద్రియార్థముల విషయముల పట్ల ఆశ-నిరాశల విమూఢత్వముచేత కర్మబంధము కొనసాగగలదు. పెంపొందగలదు. కనుక జాగరూకులై ఉండాలి.

చిత్తమేవ హి సంసారస్తత్ప్రయత్నేన శోధయేత్ .
యచ్చిత్తస్తన్మయో భవతి గుహ్యమేతత్సనాతనం .. 3..

చిత్తస్య హి ప్రసాదేన హంతి కర్మ శుభాశుభం .
ప్రసన్నాత్మాత్మని స్థిత్వా సుఖమవ్యయమశ్నుతే.. 4..
చిత్తమేవ హి సంసారః। తత్ ప్రయత్నేన శోధయేత్।
యత్ చిత్తః తన్మయో భవతి, గుహ్యమ్ ఏతత్ సనాతనమ్।
నాయనలారా! చిత్తము యొక్క రూపము? ఇష్టము. అట్టి చిత్తమే సంసారము. ఈ జీవునికి చిత్తమునకు వేరైన సంసారమంటూ ఏదీ లేదు. అందుచేత ఈ చిత్తమును అనుక్షణం శోధిస్తూ ఇద్దానిలోనించి ఇంద్రియార్ధ సమాచారములపట్ల అభిలాషను తొలగించి ఆత్మ సమాచారముతో నింపాలి. చిత్తము ఎటువెళ్ళుతూ ఉంటే అది తానే ఆయా ఆయా అనుభవముయే సమస్త దృశ్యానుభవములుగా, జగదనుభవముగా అవుతుంది. ఇదియే చిత్తము గురించిన సనాతన సత్యము. (స్వకీయ ఇష్ట - అభిలాషలే జగదనుభవముయొక్క రహస్యమైన రూపము)
చిత్తస్య హి ప్రసాదేన హంతి కర్మ శుభాశుభమ్।
ఈ చిత్తము నిర్మలము అవుతూ ఉంటే, ఇక శుభాశుభములతో కూడిన కర్మలు, వాటి వలన కలిగే బంధములు వాటికవే తొలగగలవు.
ప్రసన్నాత్మా ఆత్మని స్థిత్వా, సుఖమ్ అవ్యయమ్ అశ్నుతే।
చిత్తము ఇంద్రియార్థ దోషములను తొలగించుకొని ఆత్మభావనయందు స్థితి పొందుతూ ఉంటే ఏ సుఖము ఈ జీవుడు పొందగలడో, అది ‘అవ్యయ సుఖము’. (చిత్త కల్పిత సుఖమో? వ్యయము కాబోయే సుఖము).

సమాసక్తం యదా చిత్తం జంతోర్విషయగోచరే .
యద్యేవం బ్రహ్మణి స్యాత్తత్కో న ముచ్యేత బంధనాత్ .. 5..
సమాసక్తం యథా చిత్తమ్ జంతోః విషయగోచరే,
యత్ ఏవమ్ బ్రహ్మణస్యాత్
తత్ కో న ముచ్యేత బంధనాత్?
ఈ చిత్తము ఏ రీతిగా ఇంద్రియ గోచరములందు (విషయములందు) ఆసక్తి పొంది లగ్నమౌతోందో…,
అదే రీతిగా ఆ చిత్తము బ్రహ్మమునందు లగ్నమౌతూ ఉంటేనో? ఏమౌతుంది? ఇక ఆతనికి జన్మ-కర్మల సంసార బంధము నుండి విముక్తి ఎందుకు లభించదు? తప్పక లభిస్తుంది.
మననము చేత ‘మనస్సు’, ఇష్టముచేత చిత్తము ఏర్పడుచున్నాయి.

మనో హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ .
అశుద్ధం కామసంకల్పం శుద్ధం కామవివర్జితం .. 6..
మనో హి ద్వివిధమ్ ప్రోక్తమ్।
శుద్ధంచ అశుద్ధ మేవ చ।
అశుద్ధమ్ → కామ సంకల్పమ్।
శుద్ధమ్ → కామ వివర్జితమ్।।
ఈ మనస్సు (లేక చిత్తము) రెండు రీతులుగా ఉండటం జరుగుతోంది. 1) శుద్ధము 2) అశుద్ధము.
• కామ సంకల్పములచేత - అశుద్ధ చిత్తము (లేక) అనిర్మలమైన మనస్సు,
• కామ సంకల్పములు త్యజించటం చేత - శుద్ధ చిత్తము (లేక) నిర్మలమైన మనస్సు- నిర్మితమౌతున్నాయి.

లయవిక్షేపరహితం మనః కృత్వా సునిశ్చలం .
యదా యాత్యమనీభావం తదా తత్పరమం పదం .. 7..
లయ-విక్షేప రహితమ్, మనః కృత్వా సునిశ్చలమ్, -
యదా యాతి ‘‘అమనీ’’ భావమ్,
తదా తత్ ‘పరమమ్ పదమ్’।
ఎప్పుడైతే (ఆత్మ సమాచారము-ఆత్మధ్యాస-సమాత్మ భావనలచే) మనస్సు నిశ్చలము, విక్షేప రహితము అవుతుందో- అప్పుడు ‘‘అమనీ (విషయాతీత) భావము’’ పొందుచున్నది. ఇక అప్పుడు అదియే పరమపదము!

తావదేవ నిరోద్ధవ్యం హృది యావత్క్షయం గతం .
ఏతజ్జ్ఞానం చ మోక్షం చ శేషాస్తు గ్రంథవిస్తరాః .. 8..
తావత్ ఏవ నిరోద్ధవ్యమ్
హృది యావత్ క్షయం గతమ్।
ఏతత్ జ్ఞానం చ - మోక్షం చ ।
శేషాస్తు గ్రంథ విస్తరాః।।

హృదయములో జగత్ (లేక) దృశ్య భావావేశముల దోషము ఉన్నంత వరకు, స్వధర్మము-ఆశ్రమ ధర్మము మొదలైన వాటిచే చిత్తమును నిరోధించే ప్రయత్నాలు కొనసాగవలసిందే! ఇదియే జ్ఞానము (ఆత్మ భావనయే), మోక్షము కూడా. ఈ విషయమే అనేక గ్రంములలో విస్తారంగా చెప్పబడింది. (అనగా, ‘‘మోక్షమునకు కర్మయోగము, భక్తి, క్రియా యోగాభ్యాసముల’’ మిశ్రమము - మార్గము).

సమాధినిర్ధూతమలస్య చేతసో
నివేశితస్యాత్మని యత్సుఖం లభేత్ .
న శక్యతే వర్ణయితుం గిరా తదా
స్వయం తదంతఃకరణేన గృహ్యతే .. 9..
సమాధి నిర్ధూత మలస్య చేతసో
నివేశితస్య ఆత్మని యత్ సుఖం భవేత్,
న శక్యతే వర్ణయితుం గిరా।
తదా స్వయమ్ తత్ అంతఃకరణేన గృహ్యతే।
‘‘ఆత్మౌపమ్యేవ సర్వత్ర’’ అను సమాధి యొక్క అభ్యాసముచే బుద్ధి, మల, ఆవరణ రహితమై ఆత్మయందు నియోగము-నిశ్చలము అవుతుంది. అప్పుడు లభించు ఆత్మసుఖము మనము మాటలలో వర్ణించుకో గలిగేది కాదు. అది స్వయముగా స్వీయ అంతఃకరణమునకు అనుభవమయ్యేది. ఆత్మ సుఖము అనుభవించేవారికే తెలుస్తుంది.

అపామపోఽగ్నిరగ్నౌ వా వ్యోమ్ని వ్యోమ న లక్షయేత్ .
ఏవమంతర్గతం చిత్తం పురుషః ప్రతిముచ్యతే .. 10..
ఆపః అప్సు, అగ్నిః అగ్నౌ వా
వ్యోమ్మి వ్యోమ న లక్షయేత్,
ఏవమ్ అతర్గతం చిత్తమ్
పురుషః ప్రతిముచ్యతే।
నీరు నీరులోను, అగ్ని అగ్నిలోను, ఆకాశము ఆకాశములోను ఎట్లు స్వభావసిద్ధంగానే అభేదమై కలిసి పోతాయో, ఆరీతిగా బాహ్య విషయముల నుండి మరలినట్టి, అంతర్గతమైనట్టి - ఈ చిత్తముకూడా (సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు అగు) పరమపురుషుని యందు ఏకము అగుచున్నది.

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః .
బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతమితి .. 11..
మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః।
బంధాయ విషయాసక్తమ్।
ముక్తైః నిర్విషయమ్ స్మృతమ్ ।।ఇతి।।

ఈ భూతాత్మ స్వతఃగా ఆత్మ స్వరూపుడే కదా! మరి ఆత్మకు బంధమెక్కడినుంచి వస్తోంది? లేదు. ఆత్మకు బంధమనే ప్రసక్తియే లేదు. మనస్సే (లేక) విషయములపట్ల ఆసక్తియే - ఈ జీవుని పట్ల బంధము. నిర్విషయత్వమే - ముక్తి. (మనన రూపమైనట్టి) మనస్సే బంధ-మోక్షములకు కారణము ఇంతకు మించి బంధము లేదు. ముక్తీ లేదు.

అథ యథేయం కౌత్సాయనిస్తుతిః ..
అథ యథేయం కౌత్సాయనీ స్తుతిః।
ఓ వాలఖల్య మునులారా! పుత్రులారా! ఇప్పుడు ‘‘కౌత్సాయినీస్తుతి’’ అను బ్రహ్మతత్త్వ జ్ఞానగానము - స్మరిస్తున్నాము. వినండి.

త్వం బ్రహ్మా త్వం చ వై విష్ణుస్త్వం రుద్రస్త్వం ప్రజాపతిః .
త్వమగ్నిర్వరుణో వాయుస్త్వమింద్రస్త్వం నిశాకరః .. 12..

త్వం మనుస్త్వం యమశ్చ త్వం పృథివీ త్వమథాచ్యుతః .
స్వార్థే స్వాభావికేఽర్థే చ బహుధా తిష్ఠసే దివి .. 13..

విశ్వేశ్వర నమస్తుభ్యం విశ్వాత్మా విశ్వకర్మకృత్ .
విశ్వభుగ్విశ్వమాయస్త్వం విశ్వక్రీడారతిః ప్రభుః .. 14..

నమః శాంతాత్మనే తుభ్యం నమో గుహ్యతమాయ చ .
అచింత్యాయాప్రమేయాయ అనాదినిధనాయ చేతి .. 15.. .. 4..
త్వమ్ బ్రహ్మా। త్వం చ వై విష్ణుః।
త్వమ్ రుద్రః। త్వమ్ ప్రజాపతిః।
త్వమ్ అగ్నిః వరుణో వాయుః।
త్వమ్ ఇంద్రః। త్వమ్ నిశాకరః।
త్వమ్ మనుః। త్వమ్ యమశ్చ।
త్వమ్ పృథివీ। త్వమ్ అథ అచ్యుతః।
కౌత్సాయనీస్తుతి-తత్త్వమసి
ఓ జీవుడా!
నీవే బ్రహ్మవు! నీచే అనుభవముగా పొందుచున్నదంతా నీవే కల్పించుకొంటున్నావు. నీవే సర్వత్రా ఏర్పడి ఉన్నావు కాబట్టి నీవే విష్ణువువు!
సర్వము ప్రకాశింపజేయుచున్నది, లయింపజేసుకొంటున్నది నీవే కాబట్టి నీవే రుద్రుడవు! నీవే సమస్త జీవులు ధారణచేయు ప్రజాపతివి! అగ్నివి! వరుణుడవు! వాయువు. నీవే ఇంద్రుడవు! చంద్రుడవు! నీవే మనువువు! నీవే యముడవు! నీవే పృథివివి! నీవే అచ్యుతుడవు! చ్యుతి రహితుడవు!
‘స్వా’ - అర్థే, స్వా-భావికే అర్థే చ
బహుధా తిష్ఠసే దివి।
విశ్వేశ్వర నమస్తుభ్యం, విశ్వాత్మా, విశ్వకర్మ కృత్।
విశ్వభుగ్। విశ్వమాయః త్వమ్।
విశ్వక్రీడా రతి ప్రభుః।
నమః శాంతాత్మనే తుభ్యమ్।
నమో గుహ్యతమాయ చ।
నీ క్రీడగా నీ కొరకై నీవే స్వాభావికంగా స్వభావ ప్రదర్శనము నిర్వర్తిస్తూ, ఆకాశములో అనేకత్వము వహిస్తున్నావు!
విశ్వేశ్వరుడవు! ఈ విశ్వమునకు ఆత్మవు! విశ్వకర్మ నిర్వర్తించువాడవు! నీకు నమస్కరిస్తున్నాను.
ఈ విశ్వమును ఆస్వాదించువాడవు! ఈ విశ్వమాయ నీకు చెందినదే! ‘‘విశ్వము’’ అనే క్రీడయందు రమించేదీ నీవే! ఈ విశ్వమునకు ప్రభువువు కూడా నీవే. తత్త్వమసి। తత్త్వమసి।
ఓ శాంతాత్మస్వరూపా! నమస్తుభ్యమ్! నమో నమః!
అచింత్యాయ । అప్రమేయాయ।
అనాది నిధనాయ చ ।।ఇతి।।
రహస్యములలో కెల్లా రహస్యము నీవే! బాహ్యముగా కనిపించేది భ్రమ. సమస్తమునకు ఆధారమైయున్నదే నీలోని రహస్యము. మనస్సుతో కూడా దర్శించలేనిది నీ రూపము అచింత్యము. నీ స్వరూపము గుణములకు- దేహములకు- సందర్భములకు సంబంధించినది కాదు. కనుకనే అప్రమేయము! ఆద్యంత రహిత స్వరూపుడవు! అనాదినిధనుడవు!

తమో వా ఇదమేకమాస తత్పశ్చాత్పరేణేరితం విషయత్వం
ప్రయాత్యేతద్వై రజసో రూపం తద్రజః ఖల్వీరితం విషమత్వం
ప్రయాత్యేతద్వై తమసో రూపం తత్తమః ఖల్వీరితం తమసః
సంప్రాస్రవత్యేతద్వై సత్త్వస్య రూపం తత్సత్త్వమేవేరితం
తత్సత్త్వాత్సంప్రాస్రవత్సోంఽశోఽయం యశ్చేతనమాత్రః
ప్రతిపురుషం క్షేత్రజ్ఞః సంకల్పాధ్యవసాయాభిమానలింగః
ప్రజాపతిస్తస్య ప్రోక్తా అగ్ర్యాస్తనవో బ్రహ్మా రుద్రో విష్ణురిత్యథ
యో హ ఖలు వావాస్య రాజసోంఽశోఽసౌ స యోఽయం బ్రహ్మాథ యో హ
ఖలు వావాస్య తామసోంఽశోఽసౌ స యోఽయం రుద్రోఽథ యో హ
ఖలు వావాస్య సాత్వికోంఽశోఽసౌ స ఏవం విష్ణుః స వా ఏష
ఏకస్త్రిధాభూతోఽష్టధైకాదశధా ద్వాదశధాపరిమితధా
చోద్భూత ఉద్భూతత్వాద్భూతేషు చరతి ప్రతిష్ఠా
సర్వభూతానామధిపతిర్బభూవేత్యసావాత్మాంతర్బహిశ్చాంతర్బహిస్
హ్చ .. 5..

చతుర్థః ప్రపాఠకః ..
5. తమో వా ఇదమ్ ఏకమ్ ఆస।
తత్ పశ్చాత్ తత్పరేణ ఈరితమ్।
విషయత్వం ప్రయాతి। ఏతత్ వై రజసో రూపమ్।
తత్ రజః ఖలు ఈరితం విషయత్వం ప్రయాతి
ఏతత్ వై తమసో రూపమ్।
తత్ తమః ఖలు ఈరితమ్।।
మొట్టమొదట ‘తమము’ ఉన్నది. అది ఒకప్పుడు (తరువాత) అద్దానికి వేరైన దానిచే ప్రేరేపించబడి విషయత్వమును పొందుచున్నది. ప్రేరేపించబడునదే ‘తమము’. ప్రేరేపిస్తున్నది ‘రజము’.
రజోగుణముచే ప్రేరేపించబడి విషయత్వమంతా వచ్చిపడుతోంది. రజోగుణము తమస్సుచే ప్రేరేపించబడి తమస్సుగా కూడా అగుచున్నది. ఈ విధంగా తమో రజములు పరస్పరము సహకారి కారణములు.
తమసః సంప్రాస్రవత్ ఇత్యేతత్ వై
సత్త్వస్య రూపమ్।
తత్ సత్త్వమేవ ఈరితమ్।
తతో రసః సంప్రాస్రవత్
సో అంశో అయం యత్ చేతనమాత్రః।
ప్రతిపూరుషమ్ ‘క్షేత్రజ్ఞః’
ఆ తమస్సు సత్త్వముచే ప్రేరేపించబడినప్పుడు సత్త్వరూపముగా ఉన్నది.
తమస్సు → రజోగుణముచే ప్రేరేపించబడి → రజము।
తమస్సు → తమస్సుచే ప్రేరేపించబడి → తమము।
(తమము సత్త్వముచే ప్రేరేపించబడి సత్త్వముగా అగుచున్నది).
ఆత్మయొక్క చేతనావిన్యాసమే రస స్వరూపమై ప్రతి జీవునియందు ‘క్షేత్రజ్ఞుడు’ గా అగుచున్నది. సంకల్పము, అధ్యవసాయము (క్రియాశీలము), అభిమానముల చిహ్నమే ‘క్షేత్రజ్ఞుడు’.
సంకల్ప-అధ్యవసాయాభిమాన లింగః।
ప్రజాపతిః తస్య ప్రోక్తా।
అగ్ర్యాః తనవో బ్రహ్మా, రుద్రో, విష్ణుః ఇతి।
అథ యో హ ఖలు వావ,
అస్య రాజసో అంశో అసౌ
స యో అయం బ్రహ్మా
అథ యో హ ఖలు వావ,
అస్య తామసాంశో అసౌ
స యో అయం రుద్రో
అథ యో హ ఖలు వావ
అస్య సాత్త్వికాంశో అసౌ
సయో అయమ్ విష్ణుః
స వా ఏష ఏకధా, త్రిధా
భూతో అష్టధా, ఏకాదశధా, ద్వాదశధా
పరిమితధా చ ఉద్భూత।
ప్రప్రథమముగా ఉన్నది పరమాత్మయే. ఆయనయే (అనేకములైన సంకల్ప రూపములు - అనునవిగా) - అగుచున్నారు. అదియే ‘ప్రజాపతిత్వము’ - అని చెప్పబడుతోంది.
• ఆ ప్రజాపతియొక్క శ్రేష్ఠమైన శరీరములే త్రిమూర్తులు అయినట్టి బ్రహ్మ-విష్ణు-రుద్రులు.
• ఆత్మయే అన్నిటియందు అన్నీగా (బంగారమే ఆభరణములవలె) అగుచున్నది.
• ఆత్మయొక్క రాజసాంశయే బ్రహ్మదేవుడు - సృష్టికర్త.
• అద్దాని తామసాంశ ‘రుద్రుడు’ రూపమును దాల్చుచున్నది. అద్దాని సాత్వికాంశయే విష్ణువు.

ఆత్మ సర్వదా ‘ఏకము’ అయి ఉండియే,
• త్రివిధములుగాను,
• అష్టవిధ ప్రకృతిగాను..,
• ఏకాదశ (11) అంశలుగాను (ఏకాదశ రుద్రులుగాను),
• అపరిమితమైన అంశములుగాను -
ఉద్భూతమగుచున్నది!
ఉద్భూతత్వాత్ భూతేషు చరతి ప్రతిష్ఠా-
సర్వ భూతానామ్ అధిపతిః బభూవ ।।ఇతి।।
అసావాత్ ఆత్మా అంతర్బహిశ్చాం -
తత్ బహిశ్చ।।
అట్లా ఉద్భూతము పొంది (రూపము దాల్చి) సర్వభూత జాలములు గాను, భూతజాలములందును సంచరించుచున్నది!
సర్వ భూతజాలములకు ఆత్మయే అధిపతికూడా!
ఆత్మయే…..,
• ఈ సృష్టికి మూలము అయి ఉన్నది.
• ప్రతి ఒక్క జీవునికి అంతర్-బహిశ్చరూపమై ఉన్నది!
ఆత్మ ఏవ ఇదగ్ం సర్వమ్।।

పఞ్చమః ప్రపాఠకః - సర్వం ఖల్విదమ్ బ్రహ్మ


ద్విధా వా ఏష ఆత్మానం బిభర్త్యయం యః ప్రాణో
యశ్చాసావాదిత్యోఽథ ద్వౌ వా ఏతావాస్తాం పంచధా
నామాంతర్బహిశ్చాహోరాత్రే తౌ వ్యావర్తేతే అసౌ వా ఆదిత్యో
బహిరాత్మాంతరాత్మా ప్రాణో బహిరాత్మా
గత్యాంతరాత్మనానుమీయతే. గతిరిత్యేవం హ్యాహ యః
కశ్చిద్విద్వానపహతపాప్మాధ్యక్షోఽవదాతమనాస్తన్నిష్ఠ
ఆవృత్తచక్షుః సోఽన్తరాత్మాగత్యా బహిరాత్మనోఽనుమీయతే
గతిరిత్యేవం హ్యాహాథ య ఏషోఽన్తరాదిత్యే హిరణ్మయః పురుషో
యః పశ్యతి మాం హిరణ్యవత్స ఏషోఽన్తరే హృత్పుష్కర
ఏవాశ్రితోఽన్నమత్తి .. 1..
ప్రజాపతౌవాచ:
1. ద్విధా వా ఏష ఆత్మానం భిభర్త్యయం।
యః ప్రాణో యశ్చ ఆసావత్ ఆదిత్యో।
ప్రజాపతి:
ఆత్మ తన ప్రకృతి యొక్క తత్త్వమును రెందు రీతులుగా భరించుచున్నది (లేక ధరించుచున్నది)
1) ప్రాణశక్తి 2) అసావదిత్యుడు
అథ ద్వౌవా ఏతావ అస్తాం పంచధా నామ।
అంతర్-బహిశ్చ అహో-రాత్రే
తౌ వ్యావర్తతే అసౌవా ఆదిత్యో।
బహిరాత్మ అంతరాత్మా ప్రాణో। బహిరాత్మ గత్య
అంతరాత్మా న అనుమీయతే।
గతిః ఇతి ఏవం హి ఆహ।
ఈ రెండూ కూడా ఐదు విధములుగా అగుచున్నది.
వెలుగు-చీకటిగా, పగలు-రాత్రి ఇవియే ఆదిత్యుని (ఆత్మసూర్యుని) బహిరాత్మ-అంతరాత్మలు!
బహిః-అంతరాత్మ ప్రాణస్వరూపమై బాహ్యముగా-(బయటికి)గా వచ్చినది, (ప్రదర్శనమగుచున్నదిగా) - అగుచున్నది. ఆత్మయే అంతరాత్మను బహిరాత్మగా ఆస్వాదించుచున్నది. ఇదియే ఆత్మయొక్క ‘‘స్థితి నుండి గతి’’గా వర్ణించబడుతోంది!
యః కశ్చిత్ విద్వాన్ అపహత పాప్మా
అధ్యక్షో అవదాత మనాః
తన్నిష్ఠ, అవృత్త చక్షుః
సో అంతరాత్మా ఆగత్య…,
బహిరాత్మనో అనుమీయతే।
ఒకానొక విద్వాంసుడు పాప-అల్ప దృష్టులను తొలగించుకొనుచున్నాడు. నియామక సామర్థ్యము సంపాదించుకొని సమస్త ఇంద్రియములను అధ్యక్షత్వము వహించినవాడగుచూ, స్వచ్ఛమైన మనస్సుతో, ఆత్మయే నిష్ఠగా కలవాడై దృష్టిని బాహ్యము నుండి అంతరంగములోనికి త్రిప్పుచున్నాడు. బాహ్యత్వాన్ని అధిగమించి అంతరాత్మను చేరుకుంటున్నాడు. సమస్తమును ఆత్మకు (‘నేను’-కు) అనన్యముగా సందర్శించుచున్నాడు.
గతిః ఇత్యేవం హి ఆహ-
అథయ ఏషో అంతరాదిత్యే
హిరణ్మయః పురుషో
యః పశ్యతి మాం హిరణ్యవత్,
స ఏషో అంతరే హృత్ పుష్కర ఏవ
ఆశ్రితో అన్నమత్తి।।
వెలుపల - అంతరమునగల సమస్తమును ఆత్మయొక్క స్థితి-గతిగా గమనించుచున్నాడు.
(1) ఆదిత్యునియందు హిరణ్మయ పురుషునిగాను,
(2) సృష్టికర్తనగు నన్ను హిరణ్మయముగాను,
(సృష్టిని హిరణ్మయముగాను) చూచువాడు ఆత్మదర్శనం చేస్తున్నాడు.
ఆతడు హృత్ పుష్కరమును (ఆత్మయందు హృత్‌కళను) ఆశ్రయించినవాడై ఈ ఇంద్రియ విషయ రూపమును అన్నముగా (లేక) బ్రహ్మముగా సందర్శించుచున్నాడు. (అన్నమ్ బ్రహ్మ).

అథ య ఏషోఽన్తరే హృత్పుష్కర ఏవాశ్రితోఽన్నమత్తి స
ఏషోఽగ్నిర్దివి శ్రితః సౌరః కాలాఖ్యోఽదృశ్యః
సర్వభూతాన్నమత్తి కః పుష్కరః కిమయం వేద వా వ
తత్పుష్కరం యోఽయమాకాశోఽస్యేమాశ్చతస్రో దిశశ్చతస్ర
ఉపదిశః సంస్థా అయమర్వాగగ్నిః పరత ఏతౌ
ప్రాణాదిత్యావేతావుపాసీతోమిత్యక్షరేణ వ్యాహృతిభిః సావిత్ర్యా
చేతి .. 2..
2. అథ య ఏషో అంతరే
హృత్ పుష్కర ఏవ ఆశ్రితో అన్నమ్ అత్తి।
స ఏషో అగ్నిః।
దివి శ్రితస్సౌరః
కాలాఖ్యో అదృశ్యః సర్వభూతాన్ అన్నమత్తి।
కః పుష్కరః? కిమ్ అయమ్ వేదమ్ వావ
- తత్ పుష్కరమ్ యో అయమ్ ఆకాశో।।
అస్య ఇమాః చతస్రో దిశశ్చ,
చతస్ర ఉపదిశః సంసాస్థా…,
అయమ్ అర్వాక్ అగ్నిః,
పరత ఏతౌ ప్రాణాదిత్యా వేతా ఉపాసీత
‘ఓం’ ఇతి అక్షరేణ, వ్యాహృతీభిః-సావిత్ర్యా చ ।।ఇతి।।
ఏ ఆత్మ స్వరూపుడైతే తనలోపల హృదయ పుష్కరమునందు ఆశ్రయించి అన్నభోక్తగా (దృశ్య భోక్తగా) ఉన్నాడో…. ఆత్మస్వరూపుడై ఉన్నాడో…, ఆతడే అగ్ని స్వరూపుడుగా కూడా ఉన్నారు. ఆతడే ఆకాశమును ఆశ్రయించి, సూర్యస్వరూపుడై, కాలమును రచిస్తూ, కాలస్వరూపుడై, అదృశ్యస్వరూపముగా ‘సర్వభూత జాలములు’ అనే అన్నము భుజిస్తున్నాడు.
అట్టి పుష్కరము (తీర్థప్రదేశము) ఏది? అద్దానికి తెలియబడుచున్నదేది?
ఆకాశమే ఆ పుష్కరము. (లేక) తెలియబడేదంతా పుష్కరమే। అదియే ఆత్మాకాశము।
తెలుసుకొనువాడు - తెలియబడేది - ‘‘ఆత్మయే’’ (పుష్కరమే)।
కనుక, స్వస్వరూపాత్మయే నాలుగు దిక్కులలోను నాలుగు ఉప దిక్కులలోను నిండి ఉన్నట్లు,
క్రింద అగ్నిరూపంగా ఉన్నట్లు, పైన ప్రాణ-ఆదిత్యులుగాను ఉన్నట్లుగా - ఉపాసించాలి.
సర్వత్రా సమస్తమును ఆత్మగా ఉపాసించటమే ఆత్మోపాసన.
ఆత్మను
- ‘ఓం’ అను అక్షరముతోను,
- భూః-భువః-సువః …. అను వ్యాహృతులతోను, సావిత్రీ-గాయత్రీ ఛందస్సుల శబ్దార్థములతోను ఉపాసించెదరు గాక!

ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చామూర్తం చాథ యన్మూర్తం
తదసత్యం యదమూర్తం తత్సత్యం తద్బ్రహ్మ యద్బ్రహ్మ
తజ్జ్యోతిర్యజ్జ్యోతిః స ఆదిత్యః స వా ఏష ఓమిత్యేతదాత్మా స
త్రేధాత్మానం వ్యకురుత ఓమితి తిస్రో మాత్రా ఏతాభిః సర్వమిదమోతం
ప్రోతం చైవాస్మిన్నిత్యేవం హ్యాహైతద్వా ఆదిత్య ఓమిత్యేవం
ధ్యాయంస్తథాత్మానం యుంజీతేతి .. 3..
3. ద్వే వావ బ్రహ్మణో రూపే
మూర్తం చ, అమూర్తం చ।
అథ యత్ మూర్తం-తత్ అసత్యమ్।
యత్ అమూర్తం-తత్ సత్యమ్। తత్ బ్రహ్మ।
యత్ బ్రహ్మ, తత్ జ్యోతిః।
యత్ జ్యోతిః, స ఆదిత్యః।
స వా ఏష ‘ఓం’ ఇతి ఏతత్ ఆత్మా!
మూర్తమూర్తములు
బ్రహ్మము రెండు రూపములు కలిగి ఉంటోంది.
1) మూర్తము (సాకారము) 2) అమూర్తము (నిరాకారము).
• ఏది ఆకార సహితమై మూర్తివంతముగా కనిపిస్తోందో - అది అసత్యము. (లేక) కల్పిత మాత్రము. భావనా కల్పితము.
• ఏది అమూర్తము - ఆకార రహితము అయి ఉన్నదో, అదియే సత్యము! అదియే బ్రహ్మము. కదిలేది అసత్యము. కదిలించేది బ్రహ్మము!
ఏది బ్రహ్మమో, అది జ్యోతి స్వరూపము కూడా! ఏది జ్యోతి స్వరూపమో, అదే ఆదిత్యుడు!
ఆ ఆదిత్యుడే ‘ఓం’ సంజ్ఞచే చెప్పబడుచున్న ‘ఆత్మ’. ఆత్మ పురుషుడు
త్రేధ ఆత్మానం వ్యకురుత।
‘ఓం’ ఇతి త్రిస్రోమాత్రా ఏతాభిః
సర్వమ్ ఇదమ్
ఓతమ్ - ప్రోతమ్ చ ఏవ।
అస్మిన్ నిత్యేవం హి ఏహి
ఏతత్ వా ఆదిత్య।
‘‘ఓం’’ ఇత్యేవం ధ్యాయం,
తథా ఆత్మానమ్ యుంజీత ।।ఇతి।।
ఆ ఆత్మ పురుషుడు (ఓంకార స్వరూపుడు) తనను మూడు రీతులుగా విభజించుకుంటున్నాడు. (త్రి-మాత్రలు).
‘ఓం’…. ఇతి = అ + ఉ + మ → మూడు మాత్రలు కలిగి ఉన్నట్టిది.
అట్టి ఓంకారమునందే (కేవలాత్మయందే) ఈ సర్వము (14 లోకాలు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు) ఓత-ప్రోతమై ఉన్నాయి.
అట్టి ఆదిత్యుడే నిత్యుడు. మిగతాదంతా అనిత్యము. అట్టి ఆదిత్యుని (మొట్టమొదటే ఉండి ఉన్న ఆత్మను) ‘ఓం’కార నాదముతో, అర్థభావములతో ఉపాసించాలి. ధ్యానించాలి.
అప్పుడు ఆత్మయే పొందబడుచున్నది. (సమస్తము స్వస్వరూపాత్మగా అనుభవము కాగలదు).

అథాన్యత్రాప్యుక్తమథ ఖలు య ఉద్గీథః స ప్రణవో యః ప్రణవః
స ఉద్గీథ ఇత్యసావాదిత్య ఉద్గీథ ఏవ ప్రణవ ఇత్యేవం
హ్యాహోద్గీథః ప్రణవాఖ్యం ప్రణేతారం నామరూపం విగతనిద్రం
విజరమవిమృత్యుం పునః పంచధా జ్ఞేయం నిహితం
గుహాయామిత్యేవం హ్యాహోర్ధ్వమూలం వా ఆబ్రహ్మశాఖా
ఆకాశవాయ్వగ్న్యుదకభూమ్యాదయ ఏకేనాత్తమేతద్బ్రహ్మ
తత్తస్యైతత్తే యదసావాదిత్య ఓమిత్యేతదక్షరస్య
చైతత్తస్మాదోమిత్యనేనైతదుపాసీతాజస్రమిత్యేకోఽస్య రసం
బోధయీత ఇత్యేవం హ్యాహైతదేవాక్షరం పుణ్యమేతదేవాక్షరం
జ్జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్ .. 4..
4. అథ అన్యత్రా అపి ఉక్తమ్।
అథ ఖలు య ఉద్గీథః, స ప్రణవో।
యః ప్రణవః స ఉద్గీథః।
ఇదియే వేరు వేరుచోట్ల వేరువేరు రీతులుగా చెప్పబడుతోంది కూడా!
ఉద్గీథము - సామవేద ప్రణవనాదము, - స్వరము
ఏది ఉద్గీథమో (స్వరమో) అదియే ప్రణవము! ఏది ప్రణవమో అదియే ఉద్గీథము! (గీథ = పాట, సంగీతము. సామవేదగానము - ప్రణవము = ఓం)
ఇతి అసావాదిత్య ఉద్గీథ। ఏష ప్రణవ।
ఇత్యేవం హి ఆహ ఉద్గీథః-
ప్రణవాఖ్యం। ప్రణేతారం నామ రూపం।
విగత నిద్రం। విజరం। అవిమృత్యుం।
పునః పంచధా జ్ఞేయం।
నిహితం గుహాయామ్ ।।ఇతి।।
ఏది ఉద్గీథమో అదే అసావాదిత్యుడు (ప్రశంసనీయుడగు మొట్టమొదటి తత్త్వము-ఆదిత్యుడు). ఏది అసావాదిత్యుడో,…. ఆతడే ప్రణవము!
ఇదియే (ఆత్మయే) ఉద్గీథ గానము.
ప్రణవాఖ్యుని, ప్రణేతారును (One who manifests) , నామరూపిని, నిద్రారహితుని, జరలేని వానిని, మృత్యువు లేనివానిని తిరిగి ‘‘ఆత్మపురుషుడు’’ అంటున్నాము. ఆయననే - ‘‘పంచ (5) విధములుగా జ్ఞేయుడు (తెలియబడుచున్నాడు)’’ అని చెప్పుచున్నారు. హృదయ గుహలో నివసించు ఆత్మయొక్క ప్రదర్శనమే పంచవిధములుగా తెలుసుకొనెదరు గాక।
ఏవం హి ఆహ-ఊర్ధ్వ మూలమ్ వా
ఆ బ్రహ్మ శాఖా। ఆకాశః-వాయుః-అగ్నిః-
ఉదక-భూమ్యాదయ ‘ఏకేన’ అత్తమ్ ఏతత్ బ్రహ్మ।
తత్ తస్యై తత్తే యత్
అసావాదిత్య ‘ఓం’ ఇతి
ఏతత్ అక్షరస్య చ
ఏతత్ అస్మాత్ ‘ఓం’ ఇతి
అనేనైతత్ ఉపాసీత అజస్రమ్
ఇతి ఏకో రసం అబోధయీత।
ఇత్యేవం హి య హి (ఇహ)
ఏతదేవ ‘అక్షరమ్’ పుణ్యమ్।
ఏతత్ ఏవ అక్షరమ్ జ్ఞాత్వా….,
యో యత్ ఇచ్ఛతి తస్య తత్।।
ఆత్మయే ఊర్థ్వమూల స్వరూపుడు। సర్వమునకు ఆది।
ఆ బ్రహ్మము అనే శాశ్వత మహావృక్షపు శాఖలే ఆకాశము, వాయువు, అగ్ని, ఉదకము, భూమి కూడా. ఐదుగా కనిపిస్తూ కూడా ఏక స్వరూపము అయి ఉన్నదే బ్రహ్మము!
‘ఓం’ అనే అక్షరమే ఆసావాదిత్య స్వరూపము!
అట్టి అక్షర పరబ్రహ్మమే ‘ఓం’ అయి ఉన్నది. అక్షరమగు ఆత్మను ‘ఓం’గా ఉపాసించాలి.
అనేకముగా కనిపిస్తున్నప్పటికీ ఏకమే అయి ఉన్న, ఏక రస స్వరూపుడై వున్న ‘ఓం’ యొక్క సంజ్ఞార్థమును భావన చేస్తూ, అనుకుంటూ ఉపాసించాలి. అనేకముగా కనిపిస్తూ ఉన్నదంతా, ఒక్కటిగా అనిపిస్తూ ఉండాలి.
అట్టి అక్షర సర్వస్వరూప ఉపాసనయే సర్వ పుణ్య కార్యముల ఆచరణ ఫలము.
అట్టి ఆ అక్షరము ఎవ్వరు తెలుసుకొంటారో, వారు ఏది ఎట్లు ఇచ్ఛగిస్తే అది అట్లే అవగలదు. లభించగలదు.

అథాన్యత్రాప్యుక్తం స్తనయత్యేపాస్య తనూర్యా ఓమితి
స్త్రీపుంనపుంసకమితి లింగవత్యేషాథాగ్నిర్వాయురాదిత్య ఇతి
భాస్వత్యేషాథ రుద్రో విష్ణురిత్యధిపతిరిత్యేషాథ గార్హపత్యో
దక్షణాగ్నిరాహవనీయ ఇతి ముఖవత్యేషాథ ఋగ్యజుఃసామేతి
విజానాత్యేషథ భూర్భువస్వరితి లోకవత్యేషాథ భూతం
భవ్యం భవిష్యదితి కాలవత్యేషాథ ప్రాణోఽగ్నిః సూర్యః ఇతి
ప్రతాపవత్యేషాథాన్నమాపశ్చంద్రమా ఇత్యాప్యాయనవత్యేషాథ
బుద్ధిర్మనోఽహంకార ఇతి చేతనవత్యేషాథ ప్రాణోఽపానో వ్యాన
ఇతి ప్రాణవత్యేకే త్యజామీత్యుక్తైతాహ ప్రస్తోతార్పితా
భవతీత్యేవం హ్యాహైతద్వై సత్యకామ పరం చాపరం చ
యదోమిత్యేతదక్షరమితి .. 5..
5. అథ అన్యత్రాపి ఉక్తమ్।
స్వ నయతి ఏషా అస్య తనూర్యా ‘ఓం’ ఇతి
స్త్రీ పుం నపుంసకమ్ ఇతి।
లింగవత్ ఏషా -
ఇదే ఆయా వివిధ రీతులుగా చెప్పబడుతోంది కూడా!
స్వశరీరము ఓంకార స్వరూపమే - అనికూడా గానము చేయబడుతోంది. గానవతి స్వరూపము.
అక్షరము ఓంకార స్వరూపమే ఈ స్త్రీ-పురుష-నపుంసక లింగ రూపములన్నీ కూడా. రూపవతి, లింగవతి స్వరూపము.
అథ అగ్నిః-వాయుః-ఆదిత్యః ఇతి భాస్వతి। (।ఇతి।)
ఏషా అథ బ్రహ్మ-రుద్రో-విష్ణుః ఇతి అధిపతిః ।ఇతి।
ఏష అథ గార్హపత్యో, దక్షిణాగ్నిః,
ఆహవనీయ - ఇతి ముఖవత్।
ఏష అథ ఋక్-యజుః-సామేతి విజానాత్।
ఏష అథ భూః భువః సువః ఇతి లోకవత్।
అగ్ని-వాయువు-సూర్యుడుగా భాసిస్తున్నది కూడా అదే! భాసవతి!
బ్రహ్మ-విష్ణు-రుద్ర తత్త్వములకు అధిపతి ఓంకార రూప పరబ్రహ్మమే। త్రిమూర్తి రూపిని. అధిపతి స్వరూపము.
అద్దాని ముఖముచే గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని మొదలైన అగ్నులు! అగ్నిపతి స్వరూపము.
ఋక్-యజు-సామవేదముల సారము. అవి ఆరాధిస్తున్నది, వర్ణిస్తున్నది- ఉపాసనగా ప్రతిపాదిస్తున్నది కూడా… ఆ ఓంకారమే. వేదవతి-స్వరూపము.
ఆ పరతత్త్వమే భూ-భువర్-సువర్ లోక దేవత. లోకవతి స్వరూపము.
ఏష అథ భూతం భవ్యం భవిష్యత్ ఇతి కాలవత్।
ఏష అథ ప్రాణో అగ్నిః సూర్య ఇతి ప్రతాపవత్।
ఏష అథ అన్నమ్ ఆపః చంద్రమా ఇత్యాఅప్యాయనవత్।
ఏష అథ బుద్ధిః మనో అహంకార ఇతి చేతనవత్।
ఏష అథ ప్రాణో అపానో వ్యాన ఇతి ప్రాణవత్ ఏకే త్యజామి।।
భూత-వర్తమాన-భవిష్యత్ రూప కాలవతి కూడా అదే!
అద్దాని ప్రతాపమే ప్రాణశక్తి, అగ్ని, సూర్య శక్తి కూడా! ప్రతాపవతి అదియే!
అన్నము, జలము, చంద్రుని రూపముగా పోషవతి! ఆప్యాయవతి
పరబ్రహ్మమే బుద్ధి-మనో-అహంకారములుగా చేతనవతి.
ప్రాణ-అపాన-వ్యాన రూపములుగా ప్రాణవతి.
ఇతి ఉక్తైః తాహహ ప్రస్తోత అర్పితా భవతి।
ఇత్యేవం హ్యాహి ఏతత్ వై
సత్యకామ పరం చ - అపరం చ -
యత్ ‘ఓం’ ఏతత్ అక్షరమ్ ఇతి।।
ఈ విధంగా ఏకమగు బ్రహ్మమే గానవతి, రూపవతి, భాసవతి, త్రిమూర్తివతి, అగ్నివతి, వేదవతి, లోకవతి, కాలవతి, ప్రతాపవతి, ఆప్యాయవతి, చేతనవతి, ప్రాణవతి కూడా!
ఆత్మ ఒక్కటే ‘‘ప్రస్తోతము (ఋత్విజుడు) - అర్పితము (నేయి)’’ కూడా అయి ఉంటున్నది.
ఈ ఓంకారోపాసము - సత్యకామము, పరము, అపరముగా కూడా! (ఇహములో-పరములో కూడా) కోరుకొన్నది ప్రసాదించ గలిగినది. అదియే ఓంకార అక్షరోపాసన - అయి ఉన్నది.

అథ వ్యాత్తం వా ఇదమాసీత్సత్యం ప్రజాపతిస్తపస్తప్త్వా
అనువ్యాహరద్భూర్భువఃస్వరిత్యేషా హాథ ప్రజాపతేః స్థవిష్ఠా
తనూర్వా లోకవతీతి స్వరిత్యస్యాః శిరో నాభిర్భువో భూః పాదా
ఆదిత్యశ్చక్షురాయత్తః పురుషస్య మహతో మాత్రాశ్చక్షుషా
హ్యయం మాత్రాశ్చరితి సత్యం వై చక్షురక్షిణ్యుపస్థితో హి
పురుషః సర్వార్థేషు
వదత్యేతస్మాద్భూర్భువఃస్వరిత్యుపాసీతాన్నం హి
ప్రజాపతిర్విశ్వాత్మా విశ్వచక్షురివోపాసితో భవతీత్యేవం
హ్యాహైషా వై ప్రజాపతిర్విశ్వభృత్తనూరేతస్యామిదం
సర్వమంతర్హితమస్మిెంశ్చ సర్వస్మిన్నేషాంతర్హితేతి
తస్మాదేషోపాసీతేతి .. 6..
ఓం భూర్భువస్సువః
6. అథ వ్యాత్తం వా ఇదమ్ ఆసీత్ సత్యం ప్రజాపతిః।
తపః తప్త్వా, అనువ్యాహరత్ ‘భూర్భువస్సువః’ ఇతి।।
ఏషా హ అథ ప్రజాపతేః స్థవిష్ఠా తనూర్వా లోకపత ఇతి।
వ్యాప్తి - ప్రజాపతి సృష్టి యొక్క వ్యాప్తి కొరకై తపస్సు చేస్తూ ‘‘భూర్భువ స్స్వః’’… అని ఉచ్ఛరించారు!
ఆ స్వరమే ప్రజాపతి యొక్క లోకపతిత్వము. లోకతనువు. ఆయన తపో స్వరమే ఈ లోకముల రూపము.
‘స్వః’ ఇతి అస్యాః శిరోః। నాభిః భువో।
భూః పాదా। ఆదిత్యః చక్షుః।
ఆయత్తః పురుషస్య,
స్వర్లోకము ‘‘ఆయన శిరస్సు’’. భువర్లోకము ఆయన యొక్క నాభి (బొడ్డు). భూలోకము ఆయన పాదములు. ఆదిత్యుడు ఆయన చక్షువులు. ఆ మహత్పురుషునికి పంచతన్మాత్రలే (శబ్ద స్పర్శ రూప రస గంధములే)
మహతో మాత్రాః చక్షుషా హి, అయం మాత్రాః చరతి।
సత్యం వై చక్షుః అక్షిణి ఉపస్థితో హి
పురుషః స సర్వార్థేషు వదతి।
చెవులు, చర్మము, కళ్లు, నాలుక, ముక్కులు ఆయన పంచతన్మాత్రలలో చరించుచున్నారు. చూచేది ఆయనయే. చూడబడేది ఆయనయే.
సత్యమే (సత్ స్వరూపమే) ఆయన కన్నులు. మన కళ్ళముందు ఉపస్థితుడై ఉన్నవాడు ఆయనయే. సర్వార్థములు ఆయన పలుకులు.
ఏతస్మాత్ ‘భూర్భువస్సువః’ ఇతి ఉపాసీత।
అన్నం హి ప్రజాపతిః।
విశ్వాత్మా-విశ్వచక్షురివ ఉపాసితో భవతి।
ఇత్యేవం హి యా హైషా వై ప్రజాపతిః విశ్వభృత్ తనూః
ఏతస్యామ్ ఇదం సర్వమ్ అంతర్హితమ్।
కనుక ఆయనను ‘‘భూర్భువస్సువః’’ అను మంత్రములో త్రిలోక స్వరూపుడుగా ఉపాసించుచున్నాము.
అన్నము పరబ్రహ్మ స్వరూపము. అనుభవమగుచున్నదంతా అన్న స్వరూపము. అన్నమే ప్రజాపతి!
ఆయనను విశ్వాత్ముడు గాను, ఈ విశ్వమంతా చక్షువులు కలవాడు గాను మనలచే ఉపాసించబడుచున్నారు. ప్రేమించబడుచున్నారు.
అనుభవమయ్యేదంతా విశ్వభృత్ (భరించువాడు) అగు ఆ ప్రజాపతియొక్క శరీరమే.
ప్రజాపతి యొక్క దేహమునందే ఈ కనబడేదంతా అంతర్హితమై యున్నది. బహిర్-ప్రదర్శనమైకూడా ఉన్నది.
అస్మింశ్చ సర్వస్మిన్ ఏష అంతర్హిత ఇతి,
తస్మాత్ ఏష ఉపాసీత ఇతి।।
(నవలలో ప్రతి సంఘటన రచయితయొక్క రచనయే అయినట్లుగా) ప్రపంచములోని అణువణువునందు ఆ ప్రజాపతియే అంతర్హితమై యున్నారు. అందుచేత ఆ పరమాత్మయగు ప్రజాపతిని - సర్వమునందు అంతర్హిత స్వరూపునిగాను, ఈ సర్వము ఆయనయందు అంతర్హితమై ఉన్నట్లు గాను - ఉపాసించబడును గాక!. ఇష్టపడబడును గాక. దర్శించబడును గాక!

తత్సవితుర్వరేణ్యమిత్యసౌ వా ఆదిత్యః సవితా స వా ఏవం
ప్రవరణాయ ఆత్మకామేనేత్యాహుర్బ్రహ్మవాదినోఽథ భర్గో దేవస్య
ధీమహీతి సవితా వై తేఽవస్థితా యోఽస్య భర్గః కం
సంచితయామీత్యాహుర్బ్రహ్మవాదినోఽథ ధియో యో నః ప్రచోదయాదితి
బుద్ధయో వై ధియస్తా యోఽస్మాకం
ప్రచోదయాదిత్యాహుర్బ్రహ్మవాదినోఽథ భర్గ ఇతి యో హ వా
అస్మిన్నాదిత్యే నిహితస్తారకేఽక్షిణి చైష భర్గాఖ్యో
భాభిర్గతిరస్య హీతి భర్గో భర్జతి వైష భర్గ ఇతి
బ్రహ్మవాదినోఽథ భర్గ ఇతి భాసయతీమాెంల్లోకానితి
రంజయతీమాని భూతాని గచ్ఛత ఇతి
గచ్ఛత్యస్మిన్నాగచ్ఛత్యస్మా ఇమాః
ప్రజాస్తస్మాద్భారకత్వాద్భర్గః శత్రూన్సూయమానత్వాత్సూర్యః
సవ్నాత్సవితా దానాదాదిత్యః
పవనాత్పావమానోఽథాయోఽథాయనాదాదిత్య ఇత్యేవం హ్యాహ
ఖల్వాత్మనాత్మామృతాఖ్యశ్చేతా మంతా గంతా స్రష్టా
నందయితా కర్తా వక్తా రసయితా ఘ్రాతా స్పర్శయితా చ
విభువిగ్రహే సన్నిష్ఠా ఇత్యేవం హ్యాహాథ యత్ర ద్వైతీభూతం
విజ్ఞానం తత్ర హి శృణోతి పశ్యతి జిఘ్రతీతి రసయతే చైవ
స్పర్శయతి సర్వమాత్మా జానీతేతి యత్రాద్వైతీభూతం విజ్ఞానం
కార్యకారణనిర్ముక్తం నిర్వచనమనౌపమ్యం నిరుపాఖ్యం కిం
తదంగ వాచ్యం .. 7..
7. ‘తత్ సవితుః వరేణ్యమ్’ ఇతి।
అసౌ వా ఆదిత్యః సవితా।
స వా ఏవం ప్రవరణాయ ఆత్మకామేన
ఇత్యాహుః బ్రహ్మవాదినో।
బ్రహ్మవాదులు ‘‘తత్ సవితుః వరేణ్యమ్’’ అని పలుకుచున్నారు.
ఆదిత్యుడే (మొట్టమొదట గల ఆత్మ స్వరూపమే) సవిత్తు. (సత్-విత్-తత్)
ఆయన యొక్క ఆత్మ కామముచేతనే ఈ జగద్దృశ్యము అనుభూత రూపము అగుచున్నది…. అని బ్రహ్మవాదులు చూస్తున్నారు. సర్వము బ్రహ్మముగా, ఆప్త కామముగా గమనిస్తున్నారు
అథ ‘‘భర్గో దేవస్య ధీమహి’’ - ఇతి సవితా వై
తే అవస్థితా। యో-స్య భర్గః
కం సంచింతయామి - ఇత్యాహుః
బ్రహ్మవాదినో।
అథ ‘ధియోయోనః ప్రచోదయాత్’
ఇతి బుద్ధయో వై।
ధియ స్తాయో అస్మాకమ్,
‘ప్రచోదయాత్’ ఇతి ఆహుః బ్రహ్మవాదినో!
‘భర్గోదేవుని ధీ (బుద్ధి) మహిమను చింతిస్తున్నాను’ - ఆతడు సవితా తేజోరూపుడు.
‘భర్గః’ అని ఎవరిని చింతించాలని బ్రహ్మవేత్తల ఉద్దేశ్యము?
థియోయనః ప్రచోదయాత్! ధియో… అనగా? ‘‘బుద్ధులు’’. బుద్ధినే ప్రార్థిస్తున్నాము. భర్గో దేవుడు బుద్ధి స్వరూపుడే.
మాయొక్క బుద్ధులు - ‘‘ప్రచోదయాత్ - ప్రేరేపించు గాక’’ - అనునదే ప్రార్థన. ‘‘ఆత్మబుద్ధిని ప్రేరేపించును గాక! ప్రయోజనముగా సత్యము దర్శించగలము’’ అని ఉపాసించాలి. ఇదియే బ్రహ్మవేత్తల ఉద్దేశ్యము.
అథ ‘భర్గ’ ఇతి యో హ వా
అస్మిన్ ఆదిత్యే నిహితః తారకే అక్షిణి చ।
ఏష భర్గాఖ్యోభా ‘‘అభిర్గతిః అస్య హి ఇతి భర్గో।’’
భర్జతివ ఏష భర్గః।
భర్గుడు
భర్గః - అనగా ఆదిత్యునియందు కంటిలో కనుపాపవలె ఉన్నవాడు. కంటిలో ఉన్న ‘చూపు’ కిరణ స్వరూపుడు! (The vitality of seeing).
కిరణములతో కూడుకొని గమనము కలవాడు కాబట్టి భర్గుడు!
ఇతి రుద్రో బ్రహ్మవాదినో
అథ భర్గ ఇతి -
భాసయతి ఇమాన్ లోకాన్ ఇతి।
రంజయతి ఇమాని భూతాని।
సర్వులను భయపెట్టి సమస్తము నిర్వర్తింపజేయువాడు కాబట్టి భర్గుడు!
ఉపసంహార రూపమగుటచే భర్గుడే ‘రుద్రుడు’… అని బ్రహ్మవాదుల వ్యాఖ్యానము।
ఈ లోకములకు భాసింపజేయువాడు, ప్రకాశింపజేయువాడు కాబట్టి భర్గుడు। రుద్రుడు।
రంజింపజేయువాడు కాబట్టి రుద్రుడు! భర్గుడు!
‘గచ్ఛత’ ఇతి, గచ్ఛతి అస్మిన్।
న ఆగచ్ఛతి అస్యా ఇమాః (ప్రజాః।) తస్మాత్,
భారకత్వాత్ భర్గః।
శత్రూన్ తు సూయమానత్వాత్ సూర్యః।
ప్రజలు ఈయనవైపుగానే వచ్చుచున్నారు కాబట్టి అందరూ ఎటువైపు వెళ్ళుచున్నారో… ఆయనయే భర్గుడు!
భారము కలవాడు కాబట్టి భర్గుడు.
శత్రువులను జయింపజేయువాడు సూర్యుడు.
సూర్యుడే భర్గుడు.
సవనాత్ సవితా।
ఆదానాత్ ఆదిత్యః।
పవనాత్ పావమానో।
అథ యో అధాయనాత్ ఆదిత్యః।
ఇత్యేవం హి ఆ హ ఖలు।।
ఆత్మని ఆత్మా అమృతాఖ్యః
సవితః - ప్రజలను కనుచున్నవాడు కాబట్టి సవిత. ఇంకా కూడా ఆయనయే -
• సర్వము గ్రహించువాడు కాబట్టి ఆదిత్యుడు.
• పవిత్రముగా చేయువాడు కాబట్టి పావనుడు.
• సర్వమునకు స్థానము కల్పించువాడు కాబట్టి - అథ ఆయనాత్ ఆదిత్యః!
ఈ రీతిగా నిర్వచించి వివరించబడుతోంది.
చేతా-మంతా-గంతా-స్రష్టా - ఆనందయితా -
కర్తా-వక్తా - రసయితా-ఆఘ్రాతా స్పర్శయితా చ।
విభు విగ్రహే సన్నివిష్టా ఇత్యేవం హి ఆహ।
అథ యత్ర ద్వైతీ భూతమ్ విజ్ఞానం
తత్ర హి శృణోతి। పశ్యతి। జిఘ్రాతీతి।
రసయతి। ఏచ ఏవ స్పర్శయతి।
సర్వమ్ ఆత్మా జానీతేతి।
ఆత్మ ఆత్మకు మధురము. అమృతము. ఆత్మయే చేతా (నిర్వర్తించు వాడు), మంతా (మననము చేయువాడు), గంతా(పొందువాడు), స్రష్ఠా (సృష్టించువాడు), ఆనందయితా (ఆనందించువాడు), కర్తా (సర్వమునకు కర్త), వక్తా (చెప్పువాడు), రసయితా (తన కల్పనకు తానే రసజ్ఞుడు), ఆఘ్రాతా (వాసన చూచువాడు), స్పర్శయిత కూడా। విభు స్వరూపుడై వేంచేసి ఉన్నవాడు. ద్వైతీభూతుడైనప్పుడు వింటున్నవాడు, చూస్తున్నవాడు మొదలైనవన్నీగా అగుచున్నాడు. ఆత్మను తెలుసుకొనుచున్నవాడు కూడా - ఆయనయే.
యత్ర అద్వైతీభూతం,
విజ్ఞానం కార్య-కారణ నిర్ముక్తం,
అనిర్వచనమ్, అనౌపమ్యమ్, నిరుపాఖ్యమ్
- కిం తత్ అంగ వాచ్యమ్?
→ ఏదైతే ఈ జీవుడు - జగత్తు అనువాటికి ద్వితీయము కాదో, అద్వైతము అయి ఉన్నదో,
→ విజ్ఞాకార్య స్వరూపమో,
→ కేవల విజ్ఞాన స్వరూపమో,
→ అనిర్వచనీయమో, ఉపమానములతో చెప్పలేమో,
→ కార్యకారణ నిర్ముక్తమో - నిర్వచించలేమో,
(అద్వైతంగా ఉన్నప్పుడు) అట్టి ఆత్మను ఏమని వర్ణించగలము? చెప్పశక్యమయ్యేదికాదు!

ఏష హి ఖల్వాత్మేశానః శంభుర్భవో రుద్రః
ప్రజాపతిర్విశ్వసృడ్ఢిరణ్యగర్భః సత్యం ప్రాణో హంసః శాంతో
విష్ణుర్నారాయణోఽర్కః సవితా ధాతా సమ్రాడింద్ర ఇందురితి య
ఏష తపత్యగ్నినా పిహితః సహస్రాక్షేణ హిరణ్మయేనానందేనైష
వావ విజిజ్ఞాసితవ్యోఽన్వేష్టవ్యః సర్వభూతేభ్యోఽభయం
దత్త్వారణ్యం గత్వాథ
బహిఃకృతేంద్రియార్థాన్స్వశరీరాదుపలభతేఽథైనమితి
విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం
తపంతం . సహస్రరశ్మిః శతధా వర్తమానః ప్రాణః
ప్రజానాముదయత్యేష సూర్యః .. 8..

ఇతి పంచమః ప్రపాఠకః ..
8. ఏష హి ఖలు ఆత్మా …,
ఈశానః శంభుః, భవో రుద్రః ప్రజాపతిః విశ్వసృష్ట్,
హిరణ్యగర్భః సత్యం ప్రాణ
నీయందు - నాయందు సర్వాధారుడై ఉన్న ఆతడే ఆత్మ. ఆత్మయే ఈశానుడు, శంభుడు, రుద్రుడు, ప్రజాపతి, విశ్వసృష్టిరూపుడు, హిరణ్యగర్భుడు, సత్యుడు, ప్రాణస్వరూపుడు. పరమహంస. శాసించువాడు. విష్ణువు. నారాయణుడు. అర్కుడు (సూర్యుడు). సవిత!
హంసః శాస్తా విష్ణుః నారాయణో అర్కః సవితా
దాతా సమ్రాట్ ఇంద్ర ఇందుః ఇతి।
య ఏష తపతి,
అగ్నినా, పిహితః సహస్రాక్షేణ హిరణ్మయేన ఆనందే।
దాత! సామ్రాట్! ఇంద్రుడు! చంద్రుడు!
ఇవన్నీ ఆత్మయే. ఆత్మభగవానుడే సర్వమును తపింపజేయువాడు కూడా. అగ్నిచేతను, సహస్రాక్షుని చేతను, హిరణ్మయముచేతను తన ఆనంద స్వరూపము కప్పబడి ఉన్నవా
న ఏష వావ విజిజ్ఞాసితవ్యో అన్వేష్టవ్యః
సర్వ భూతేభ్యో అభయం దత్వా, అరణ్యం గత్వా,
అథ బహిః కృత ఇంద్రియార్థాన్ స్వశరీరాత్ ఉపలభతే।
అట్టి స్వస్వరూప పరమాత్మయే జిజ్ఞాసితవ్యుడు. జిజ్ఞాస కలిగి ఉండ వలసినవాడు.
ఆత్మ గురించే అన్వేషించాలి! సర్వజీవులకు అభయ ప్రదాత ఆయనయే! ఆత్మకు వేరుగా మరొక అభయ ప్రదాత లేడు.
అరణ్యము (ఏకాంతము)నకు వెళ్ళి ఇంద్రియార్ధములను బహిష్కరించి, స్వశరీరమునందే ఆత్మను వెతికి దర్శించాలి! ఓ వాలఖాల్యమునులారా! ఓ సమస్త జీవులారా! ఆయన స్వశరీరమునందే ఉపలభ్యుడు. ఆత్మ భగవానుని కోసం బయట వెతికి ఏమి లాభం?
అథైనమ్ (అథ ఏనమ్) ఇతి విశ్వరూపమ్।
హరిణమ్। జాతవేదసమ్। పరాయణమ్।
జ్యోతిః ఏకమ్ తపంతమ్।
సహస్ర రశ్మిః శతథా వర్తమానః
ప్రాణః ప్రజానామ్ ఉదయతి-ఏష సూర్యః।।
ఆయనయే విశ్వరూపుడు! హరిణుడు (సర్వ స్థితి-గతులు ఆయనవే). జాతవేదసుడు. అగ్ని రూపుడు. అందరు పారాయణముచేయవలసిన వాడు. అఖండజ్యోతి స్వరూపుడు. సర్వము తపింపజేయువాడు. వేలాది కిరణములతో వందలాది చోట్ల వర్తించువాడు. ప్రజలందరికి ప్రాణప్రదుడు. సర్వ జీవులలో సర్వదా ఉదయిస్తున్నది ఆత్మ సూర్యుడు!
ఆయనను స్వ-శరీరమునందే వెతికి, గుర్తించండి (Please search and find “PARAMATHMA” in you yourselves.)
ఇతి మైత్రాయణ్యుపనిషత్
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః


ఇతి మైత్రాయణ్యుపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః


సామవేదాంతర్గత

9     మైత్రాయణి ఉపనిషత్

అధ్యయన పుష్పము

మం.శ్లో।। మైత్రాయణీ కౌషీతకీ
బృహజ్జాబాల తాపనీ।
కాలాగ్ని రుద్ర మైత్రేయీ
సుబాల క్షురి మంత్రికా।।

ఏతత్ ఉపనిషత్ మాతరమ్ నమామ్యహమ్।।

ఈ ఉపనిషత్‌లో ప్రస్తావనకు వచ్చియున్న కొందరు పురాణ పురుషుల గురించిన సంగ్రహ విశేషాలు.

1.) సుద్యుమ్నుడు (భాగవతము): ఈయన వైవస్వతుని కుమారుడు. మొదట స్త్రీగా జన్మించి వసిష్ఠ మహర్షి అనుగ్రహముచే పురుషరూపము పొందారు. రాజయ్యారు. ఈయన నగరము ‘‘ప్రతిష్ఠా నగరము’’. అయితే, ఒకసారి నాట్యము చేస్తూ పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్న ‘‘కుమారవనము’’ (శరవనము)నకు వెళ్ళారు. ఏకాంతము భంగపరచిన కారణంగా పార్వతీదేవిచే శపించబడి తిరిగి స్త్రీ రూపము పొందారు. ఆ తరువాత చంద్రుని కుమారుడైన బుధుని ప్రేమించి వివాహము చేసుకొని పురూరవుని (షట్చక్రవర్తులలో ఒకరు) కుమారునిగా పొందారు.

తాను స్త్రీ అవటము భరించలేక కొంతకాలము తరువాత తిరిగి వసిష్ఠుని ప్రార్థించారు. ప్రేమ హృదయుడగు వసిష్ఠుడు తనను పురుషత్వము కొరకై అర్థిస్తున్న సుద్యుమ్నుడు - పురుషత్వము పొందటానికై శంకరుని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు ‘‘పార్వతీ దేవి శాపము - వసిష్ఠుని శిష్య వాత్సల్యము’’ - ఈ రెండింటికి భంగము కాకుండా ‘‘ఒక నెల స్త్రీ గాను మరొక నెల పురుషుడుగాను ఉండే తీరు’’గా అనుగ్రహించారు. అప్పుడు సుద్యుమ్నుడు తిరగి ప్రతిష్ఠా నగరము వచ్చి రాజుగా రాజ్యము ఏలసాగారు.

ఆ తరువాత సుద్యుమ్నునకు ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే ముగ్గురు కుమారులు కలిగారు. వార్థక్యము పొడచూపగానే, ఒక శుభదినాన రాజ్య భారమును పురూరవునికి అప్పజెప్పి, సర్వ సంపదలు త్యజించి సుద్యుమ్నుడు తపస్సుకై వనములు ప్రవేశించారు.

2.) ఇంద్రద్యుమ్నుడు (బ్రహ్మపురాణము): అవంతీపుర రాజు. అనేక సంపదలతో కూడి రాజ్యమును ఏలారు. కొంత కాలమైన తరువాత ‘‘ఈ రాజ్యము నాకు శాశ్వతము కాదు. నాకు నేనే శాశ్వతము. అట్టి స్వస్వరూపానుభవము పట్ల సర్వ సంశయములు తొలగటానికై సాధనకు ఉపక్రమించాలి’’ అని తలచారు. రాజభోగములన్నీ త్యజించారు. ‘‘మనో నిగ్రహము కొరకై ‘విగ్రహము’ కావాలి’’ అని బోధింపబడినవాడై, భగవత్ప్రతిమను సంపాదించటానికి స్థిర సంకల్పముతో దక్షిణాపథమునకు వచ్చారు.

ఒక ప్రదేశంలో ఆసీనులై విష్ణు భగవానుని ధ్యానించసాగారు. ఒకరోజు విష్ణువు ఇంద్రద్యుమ్నుని కలలో కనిపించారు. ‘‘స్వామీ! నాకు భగవత్ ప్రతిమను సంపాదించే ఉపాయము చెప్పండి’’ - అని విష్ణు దేవుని ఇంద్రద్యుమ్నుడు అభ్యర్థించారు. అప్పుడు విష్ణువు ఆతనికి అందుకు ఉపాయము (మార్గము) సూచించారు.

కలలో కనిపించి విష్ణువు దైవ ప్రతిమ పొందటానికి చెప్పిన ఉపాయములను విని, నిదురలేచిన తరువాత ఆ ఇంద్రద్యుమ్నుడు సముద్రతీరము చేరాడు. అక్కడ గల ఒక అశ్వత్థ వృక్షము (రావిచెట్టు) క్రింద విప్ర వేషములో ఉన్న ఇద్దరు కనిపించారు. ‘‘అయ్యలారా! దయతో నాకు మీరు బ్రహ్మ - విష్ణు - మహేశ్వరుల ప్రతిమలను నిర్మించి ఇవ్వండి’’ అని ఇంద్రద్యుమ్నుడు ఆ ఇద్దరు విప్రులను బ్రతిమలాడారు. ఆ ఇద్దరిలో ఒకరు విశ్వకర్మ. ఆ విశ్వకర్మ ఇంద్రద్యుమ్నుడు కోరిన ప్రకారము త్రిమూర్తుల (బ్రహ్మ విష్ణు మహేశ్వరుల) విగ్రహములు తయారు చేసి ఇచ్చారు. అవి దివ్య మంగళముగా ప్రకాసిస్తూ ఉన్నాయి. ఇక అక్కడి నుండి ఆ విగ్రహములను ప్రతిరోజు పూజించసాగారు.

క్రమంగా ఇంద్రద్యుమ్నునిలో వివేకము, బ్రహ్మజ్ఞానము వికసించ సాగాయి. తనకు విగ్రహమును చేసి ఇచ్చిన వారు భగవత్ స్వరూపులుగా భావించుచూ పూజ కొనసాగించారు.

ఆవిధంగా విగ్రహములు పూజిస్తూ, ఆత్మతత్త్వమును స్వాభావికము, అనునిత్యము చేసుకొన్నారు. కొన్నాళ్ళ తరువాత సన్న్యసించి, సిద్ధిని పొందారు.

3.) యౌవనాశ్వుడు (భాగవతము): విష్ణు భక్తుడు, ద్వాదశవ్రత సిద్ధుడు అగు అంబరీషుని కుమారుడు. యౌవనాశ్వుడు ‘ఆత్మ విద్యయే జీవితము’ అని గ్రహించినవారై, రాజ్యమును కుమారుడగు హరితునికి బాధ్యతగా ఇచ్చివేసి దంపత సమేతంగా గురు ఆశ్రమంచేరారు. గురు సేవ చేస్తూ, బ్రహ్మ విద్యను అభ్యసించి పునీతులైనారు. ( మాంథాతృ గోత్రమువారికి అంబరీషుడు, యౌవనాశ్వుడు, హరీతుడు - ‘ప్రవర’లో చెప్పబడు త్రి-ఋషులు).

4.) కువలయాశ్వుడు (మార్కండేయ పురాణము): ఈయన శత్రుజిత్తు కుమారుడు. జన్మించినప్పుడు పెట్టిన పేరు ‘ఋతధ్వజుడు’. కాశీ రాజ్యము పాలించిన వారిలో ఒకరు. తత్త్వ శాస్త్రమును, వేద శాస్త్రమును చక్కగా ఎరిగిన మహనీయుడుగా ప్రసిద్ధుడు. గొప్ప తత్త్వవేత్త.

గాలవుడు అనే ముని ఏకాంతంగా కాశీరాజ్యములోని ఒకానొక ప్రదేశములో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒక రాక్షసుడు తన వినోదము కొరకై ఎగతాళిగా అనేక రూపములలో వచ్చి గాలవుని తపస్సుకు భంగముకలిగిస్తూ ఉండేవాడు. గాలవుడు తన తపో శక్తితో ఆ దనుజుని శిక్షించగలడు. కానీ ఈవిధంగా తలచాడు.

‘‘దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రాజు పని కదా! ఇందుకొరకై నా తపోశక్తిని నేనెందుకు వృధా చేసుకోవాలి? అంతగా అయితే, రాజు యొక్క పాలనా సామర్ధ్యము కొరకై ఉత్తమ ఉపకరణమును నా తపస్సుచే నిర్మించి - రాజుకే ఇస్తాను. అది దేశమునకు శ్రేయోదాయకము అగును గాక!’’

ఈ విధంగా తలచి గాలవముని ఒకచోట ఆశీనులై, ప్రశాంతముగా ఆకాశమువైపు చూచారు. అప్పుడు ఆకాశము నుండి ఆకాశవాణి మూడు లోకములలో సంచరించగల ఒక గుఱ్ఱమును పంపి, ‘‘ఓ గాలవమునీ! మీరు అనుకున్నది యుక్తి యుక్తము. నేను ఇస్తున్న ఈ కువలయాశ్వమును కాశీరాజు కుమారుడైన ఋతధ్వజరాజకుమారునికి ఇవ్వండి. ఈ కువలయాశ్వము త్రిలోకములలో సంచరించగలదు’’ - అని సూచించింది.

గాలవముని ఆ గుఱ్ఱమును ‘గర్గుడు’ అనే వ్యక్తిచే రాజకుమారుడగు ఋతధ్వజునికి పంపి ‘‘రాక్షసుని సంహరించండి’’ - అను మునివాక్యము అందించారు. అప్పుటి నుండి ఋతధ్వజుడు ‘కువలయాశ్వుడు’గా కూడా నామధేయుడైనారు.

ఆ గుఱ్ఱమును వాహనంగా చేసుకొని కువలయాశ్వుడు గాలవమునిని బాధిస్తున్న రాక్షసుని శిక్షించటానికై ఆతని వెంటబడ్డాడు. ఆ రాక్షసుడు ‘‘వరాహము (పంది)’’ రూపము దాల్చి, ఒకచోట భూమిపై గల ఒక బొరియలో దూరాడు. ఆ బొరియలోకి కువలయాశ్వమును అధిరోహించిన కువలయాశ్వుడు (ఋతధ్వజుడు) తాను కూడా ప్రవేశించారు. అక్కడ ఆతనికి అతి లావణ్యవంతులగు ఇద్దరు స్త్రీలు కనిపించారు. వారు కుండల, మదాలసలు. కుండల ఋతధ్వజుని గుర్తించి, ఇట్లా పలికింది.

కుండల: ఓ ఋతధ్వజా! నేను ఫుష్కరశాలి అనువాని భార్యను. ఈమె నా చెల్లెలు మదాలస. మా ఇద్దరినీ ‘పాతాళకేతుడు’ అనే రాక్షసుడు తన మాయచే బలాత్కారంగా తెచ్చి ఈ బిలములో దాచాడు. మా ఇద్దరినీ రక్షించండి. నా సోదరి మదాలసను మీరు ధర్మపత్నిగా స్వీకరించండి.

స్వధర్మ నిరతుడగు కువలయాశ్వుడు పాతాళకేతుని యుద్ధములో సంహరించి, ఇరువురు స్త్రీలను చెరవిడిపించి మదాలసను ధర్మపత్నిగా స్వీకరించారు.

పాతాళకేతు సోదరుడు తాళకేతువు. ఆతడు ఋతధ్వజునిపై తన అన్నను చంపినందుకు పగతీర్చుకోదలచాడు. అయితే పరాక్రమముచే ఆతని ముందు తాను నిలువలేనని తెలుసు. అవకాశం కోసం వేచిచూడసాగాడు.

కువలయాశ్వుడు ఒకరోజు జదనపదములను రక్షించటానికై గుఱ్ఱము ఎక్కి సంచరిస్తూ ఉన్నారు. తాళకేతువు ఒక ముని రూపము దాల్చి కువలయాశ్వుని సమీపించి, ‘‘ఓ కువలయాశ్వా! ఋతధ్వజా! కాశీ రాజ్యము ఏలువారలలో ఉత్తమ ధర్మ నిరత శ్రేష్ఠా! నేను ఒక క్రతువును తలబెట్టాను. అందుకు సహాయంగా మీ కంఠహారము నాకు ఇవ్వండి’’ - అని కోరాడు.

వెంటనే కువలయాశ్వుడు తాను ధరించియున్న కంఠహారాన్ని క్రతు నిర్వహణను ఉద్దేశ్యించి తాళకేతువుకు సంతోషంగా (మునిగా భావించి) ఇచ్చివేశారు.

కంఠహారము దానంగా పొందిన తాళకేతువు, ‘‘ఓ కువలయాశ్వా! ఋతధ్వజా! మీరు ఇక్కడే ఉండండి. నేను స్నానం చేసి వచ్చి ఆశీర్వదిస్తాను’’ - అని పలికి రాజుని ఒకచోట కూర్చోమని, తాను మాత్రం రాక్షస మాయను ఉపయోగించి నిముషముకాలములో రాజు యొక్క నగరము (కాశీనగరము) ప్రవేశించాడు. అంతఃపుర ద్వారము వద్ద - ‘‘ఓ కాశీరాజ ప్రజలారా! ఓ అంతఃపుర జనులారా! మీ రాజు హతుడు అయ్యాడు. ఇదిగో,… గుర్తు ఈ కంఠహారము’’…. అని వారలకు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వార్త విని, కంఠహారము కళ్లతో చూచిన మదాలస వెంటనే భర్తపై మనస్సు నిలపి ప్రాణము విడచింది. నగరమంతా శోక సాగరమయింది.

కొన్ని రోజులకు కువలయాశ్వుడు నగరం చేరాడు. ఆతనిని చూచి ప్రజలంతా విస్మయము, సంతోషము పొందారు. జరిగినదంతా తెలుసుకొని, ‘‘ఇదంతా రాక్షసమాయ కదా!’’… అని గమనించారు. ఋతధ్వజుడు ముదాలస మరణించినదని తెలుసుకొని విరక్తి చెందాడు. ఇక రాజ్య విషయాలు పట్టించుకోకుండా ఏకాంతంగా దుఃఖిస్తూ ఉండిపోయారు. అది గమనించిన ఆతని స్నేహితులగు నాగేంద్రుని పుత్రులు (నాగకుమారులు) తమ తండ్రి నాగరాజుకు తెలిపారు. ఆ నాగరాజు పేరు అశ్వతరుడు.

నాగరాజు అశ్వతరుడు - కువలయాశ్వుని (ఋత్వధ్వజుని) సమీపించి ‘‘ఓ ఋతధ్వజా! నీవు మహారాజువు. జ్ఞానివి. మహాపరాక్రమ వంతుడవు. ప్రజలందరికీ అత్యంత ప్రియమైన రాజువు. ప్రయత్నిస్తే సిద్ధించలేనిది ఏదీ ఉండదని నీకు తెలుసు.

నీవు సరస్వతీ దేవి భక్తుడవు. ఆ చల్లటి తల్లిని ప్రార్థించి ‘శివస్తుతి’ని గానం చేయనారభించు. శివుని నీ ప్రార్థనతో మెప్పించు. ఆయన మెచ్చితే మదాలస తిరిగి జీవించవచ్చు.

ఆ మాటలు విని, కువలయాశ్వుడు దుఃఖమును విడచిపెట్టి, వివేకమును నిదురలేపి, ఉపాసనాశీలుడైనారు. ముందుగా సరస్వతీ సహస్రమును పఠించి, ఇక అప్పుడు శివుని స్తుతించసాగారు. శివుడు ఆ స్తుతులకు సంతోషించి ‘‘నీ భార్య తిరిగి జన్మించి నిన్ను సమీపించును గాక!’’ అని అనుగ్రహించారు.

మరణించిన మదాలస నాగరాజు అశ్వతరునికి పుత్రికగా జన్మించింది. అశ్వతరుడు తన కుమార్తెను కువలయాశ్వునికి ఇచ్చి వివాహం చేసారు.

ఆ తరువాత కాలక్రమేణా మదాలస - కువలయాస్వ దంపతులకు విక్రాంతుడు, సుబాహువు, శత్రుమర్దనుడు, అలర్కుడు అనే నలుగురు కుమారులు కలిగారు.

ఆ తరువాత కువలయాశ్వ బిరుదాంకితుడగు ఋతధ్వజుడు సంసారభావములన్నీ జయించి సర్వాంతర్యామియగు పరమాత్మతో మమేకమగు మోక్షమార్గాశయుడయ్యారు. పెద్ద కుమారుని రాజ్యాభిషిక్తులను చేసి మదాలసా సమేతుడై వానప్రస్థాశ్రమము స్వీకరించారు.

అశ్వపతి (భారతము మరియు ఛాందోగ్యోపనిషత్) : ఈయన కేకయ దేశపు రాజు. ఈయన కుమార్తె కైకేయి. కుమారుడు యథాజిత్తు. ఒకసారి అశ్వపతి గొప్ప యజ్ఞము తలబెట్టారు. యజ్ఞము ప్రారంభమవటానికి ముందు ముగ్గురు బ్రాహ్మణులు అశ్వపతి యొక్క అంతఃపురము ప్రకాశించారు.

కేకయరాజు అశ్వపతి : ఓ ఉద్దాలక, ప్రాచీనశాల, సత్యయజ్ఞ - ఉత్తమ బ్రాహ్మణోత్తములారా! ఈ యజ్ఞప్రారంభ శుభ ఘడియలలో బ్రహ్మ తేజో విలాసులగు మీ రాక - ఈ యజ్ఞవాటికను, యజ్ఞ కార్యక్రమమును పరమ పవిత్రము చేస్తున్నాయి. మీకు సుస్వాగతము. ఇప్పుడు అధికంగా కాలము లేదు కాబట్టి మీకు ధనము, గోవులు మొదలైన వాటిని సమర్పించుకొని, మేము యజ్ఞ గృహములో ప్రవేశిస్తాము. దయచేసి స్వీకరించండి.

బ్రాహ్మణులు : ఓ అశ్వపతీ! కేకయ రాజ్య రాజపుంగవా! మీ ధనముతో మాకు పనిలేదు.

అశ్వపతి : మరి? ఏమి మీ ఆజ్ఞ? ధనము స్వీకరించ తిరస్కరిస్తున్నారా? మీకు సమర్పించుటకు నాకు అర్హత లేదని గాని భావిస్తున్నారా? ఓ సద్బ్రాహ్మణులారా! నేను సమర్పిస్తున్న ధనము దోషమైనదేమీ కాదు. నేను వ్యక్తిగతంగా శ్రమించి ప్రోగుచేసిన స్వార్జిత ధనమునే సమర్పిస్తున్నాను. మా రాజ్యములో దొంగలుగాని, దాత కాని ధనవంతుడు గాని, అధికారి అయి కూడా యజ్ఞము చేయనివాడుగాని లేరు. స్వైరిణి (పర పురుష సహవాసము చేయు స్త్రీ) గాని, స్వైరి (పరస్త్రీ సహవాసము చేయు పురుషుడు)గాని లేరు. అప్పుడు మీకు నేను సమర్పించు ధనము స్వీకరించటానికి అభ్యంతరమేమి? నేను ఇచ్చు ధనము సరిపోదని శంకిస్తున్నారా ఏమి? అట్లా అయితే, మీరు ఈ యజ్ఞము అయ్యేదాకా ఇక్కడే ఉండండి. ఈ యజ్ఞ కార్యము కొరకు నియమించబడిన ఋత్విక్కులతో సమానంగా మీకు ధనము మొదలైనవి సమర్పించగలను.

బ్రాహ్మణులు : బ్రహ్మజ్ఞా! అశ్వపతీ! మేము ధనముకొరకై రాలేదు. బ్రహ్మము యొక్క స్వరూపము గురించి మీ వద్ద శ్రవణము చేయటానికి విద్యార్థులమై అధ్యయన దృష్టితో సమిత్పాణులముగా వచ్చాము.

అది విని అశ్వపతి అందుకు అంగీకరించి యజ్ఞ కార్యక్రమ విరామ సమయములలో ఆత్మతత్త్వమును బోధించసాగారు.

ఈ విధంగా కేకయ దేశపు రాజు అశ్వపతి రాజ్యము పాలిస్తూ, యజ్ఞ-యాగాదులు నిర్వర్తిస్తూ కూడా ఆత్మ జ్ఞాన దీక్షను ఏక్షణమందు విడువక రాజ్యపాలన చేసారు. సరి అయిన సమయంలో రాజ్యము కొడుకులకు ఇచ్చివేసి వానప్రస్థము ఆశ్రయించారు.

శశిబిందు (భారతము): ఈయన యదు మహారాజు కుమారులలో రెండవవాడగు ‘క్రోష్టు’ వంశజుడగు చిత్రరథుని కుమారుడు. ఈయనకు అనేక మంది భార్యలు, పుత్రులు ఉన్నారు. ఆయన కుమారులలో ముఖ్యులు ఆరుగురు.

  1. పృథుశ్రవుడు 2. పృథుదాసుడు 3. పృథుకీర్తి 4. పృథు జయుడు 5. పృథుకర్ముడు 6. పృథుయశుడు.

ఈయన ‘‘చతుర్దశ మహారత్నుడు’’ అయిన చక్రవర్తిగా లోక ప్రసిద్ధుడు.

చతుర్దశ మహారత్న వివరణ

చక్రం రధో మణిః ఖడ్గం చర్మ రత్నంచ పంచమమ్।  
కేతుః నిధిశ్చ సప్తైవ ప్రాణహీనాని చక్షతే।  
భార్యా పురోహితశ్చ అవసే సేనానీ రధ కృచ్చయః।  
పత్యశ్వకల భాశ్చేతి ప్రాణినః సప్త కీర్తితః।

ఆ తరువాత ఈయన తాను పాలిస్తున్న మహా సామ్రాజ్యమును, పుత్ర-మిత్ర ఇత్యాదులను తృణప్రాయంగా త్యజించి వానప్రస్తుడై ఆత్మతత్త్వ జ్ఞాని అయినారు.

హరిశ్చంద్రుడు (భాగవతము) : సూర్య వంశపు రాజు. త్రిశంకుని కుమారుడు. నారదుని బోధను అనుసరించి వరుణ వ్రతము ఆచరించారు. పుట్టిన కుమారుని వరుణునికి యాగ పశువుగా ఇవ్వటానికి అంగీకరించి రోహితాస్యుడు అనే కుమారుని పొందారు. ఇంద్రునిచే బోధించబడి రోహితాస్యుడు (1) పుణ్య కథలను వినడం (2) పుణ్య నదులలో స్నానము చేయసాగాడు.

ఆ తరువాత హరిశ్చంద్రుడు-రోహితాస్యునికి బదులుగా అజీగర్తుని మధ్య పుత్రుడగు శునశ్శేపుని యాగపశువుగా చేసి వరుణుని ఉద్దేశ్యించి ‘‘పురుషమేధ యాగము’’ ప్రారంభించారు.

ఆ యాగమునకు హోత విశ్వామిత్రుడు. ఆధ్వర్యుడు భృగువు. సామగానము చేయువారు వశిష్ఠుడు. ఆ యాగమునకు మెచ్చి ఇంద్రుడు బంగారు రథమును ప్రసాదించారు. విశ్వామిత్రుడు అత్యంత ప్రీతుడై ముఖ్య జ్ఞానము బోధించారు. వరుణడు సంతోషించి హరిశ్చంద్రుని కోరికపై శునశ్శేపునికి తిరిగి జీవితము ప్రసాదించారు.

హరిశ్చంద్రుడు (మార్కండేయపురాణము) : ఇంద్రసభలో జరిగిన ‘‘సత్యము’’ గురించిన ఒక చర్చలో వసిష్ఠుడు హరిశ్చంద్రుని గురించి స్తుతించిన ‘‘సత్యనిరతి’’ గురించి విశ్వామిత్రుడు, - ‘‘మీరు హరిశ్చంద్ర పురోహితులు కాబట్టి అట్లా అంటున్నారు. నేను అబద్ధము ఆడించగలను’’ అని ప్రతిజ్ఞ-పందెము పలికారు.

ఆ తరువాత విశ్వామిత్రుడు హరిశ్చంద్రునివద్ద విశేష ధనము యాగ నిర్వహణ కొరకై దానముగా అర్థించి, స్వీకరించారు. ‘‘ధనము తరువాత తీసుకొనిపోతాను’’ - అని చెప్పి వెళ్లిపోయారు.

జంతువుల నుండి గ్రామ పజల - పంటల రక్షణకై వేటకు వెళ్లిన హరిశ్చంద్రుని సమక్షంలో విశ్రాంతి సమయములో - విశ్వామిత్ర కల్పితమగు మాతంగ కన్యల నృత్యము చేసారు. అది మెచ్చి హరిశ్చంద్రుడు ఆభరణములు బహుమానముగా ఇవ్వబోయారు. ఆ మాతంగ కన్యలు అది నిరాకరించి ‘‘మీతో మేము పొందు కోరుకుంటున్నాము. మమ్ములను పెళ్ళి చేసుకోండి’’ - అని కోరారు. ఏకపత్నీవ్రతస్తుడు అగు హరిశ్చంద్రుడు వారికి బుద్ధి చెప్పి పంపివేశారు. ఆ కన్యలు పొందుకై (వివాహమునకై) తిరస్కరించబడ్డారని వారినుండి విన్న విశ్వామిత్రుడు కోపగించగా, హరిశ్చంద్రుడు ‘‘నేను రాజ్యమునైనా మీకు సమర్పిస్తాను గాని నా ఏకపత్నీవ్రతము త్యజించను’’ - అని పలికారు.

అప్పుడు విశ్వామిత్రుడు ‘‘ఓహో! అట్లాగా! అయితే నీ సమస్త రాజ్యము నాకు ఇచ్చివేయి’’ - అని అనగానే హరిశ్చంద్రుడు నిస్సందేహముగా, సంతోషముగా రాజ్యమును దానము చేసి, అయోధ్యారాజ్యము నుండి భార్య చంద్రమతి, కుమారుడు రోహితాస్యునితో బయలుదేరారు.

అప్పుడు విశ్వామిత్రుడు ‘‘నాకు దానము ఇచ్చిన ధనము మాట ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ‘‘రాజ్యమంతా దానము చేసాను కదా! మీకు దానమిచ్చిన ధనము మీకు ఇవ్వటానికి నెల గడువు ఇవ్వండి!’’ - అని పలికాడు. అప్పుడు హరిశ్చంద్రుని వెంట విశ్వామిత్రుడు బాకీ వసూలుకై తన శిష్యుడు నక్షత్రకుని పంపారు. చివరికి కాశీనగరంలో తన భార్య చంద్రమతిని అమ్మి తనను తాను కూడా అమ్ముకొని బాకీ చెల్లించారు. ఆ తరువాత కాటికాపరిగా,-మరణించిన కుమారుని కాటి సుంకము విషయములోకూడా తన ధర్మము వీడలేదు. సాధ్వీమణి అగు భార్య చంద్రమతి శిరస్సు ఖండించటానికి వెనుకాడలేదు. ఆయన ఖడ్గము పూలదండగా మారింది.
- సత్యము ఆత్మయే।
- ఇదంతా మాయమయ జగత్తు।
- ఇది నిత్యమనుకున్నంతకాలము రాజు కింకరుడౌతాడు, కింకరుడు రాజు - అవుతాడు.

అని ప్రపంచానికి చాటిచెప్పి సత్యమును వీడక దిగ్విజయుడైనాడు. విశ్వామిత్రుడు అనుకున్న ప్రకారము తన తపస్సులో సగము ఫలము హరిశ్చంద్రునికి ధారపోశాడు. శంకర భగవానుడు ఆయన కుమారుడు రోహితాస్యుని పునరుజ్జీవింప జేసారు.

‘‘ఆధ్యాత్మిక సత్యము ముందు ఈ జగత్ సంపద - ఆపదలు దిగదుడుపే’’ - అని హరిశ్చంద్ర-విశ్వామిత్ర-వసిష్ఠులు లోకములకు నిరూపించి చూపారు.

అంబరీషుడు (భాగవతము) : నాభాగుని కుమారుడు. విష్ణు భక్తుడు. చక్రవర్తి. ద్వాదశీ వ్రతము నిర్వర్తిస్తూ ఉండగా దుర్వాసుడు అభ్యాగతి అయి వచ్చారు. స్నాన-సంధ్యా వందనములు ముగించుకొని రమ్మన్నారు. ద్వాదశ గడియలు గడచిపోకముందు జలము త్రాగినందుకు దుర్వాసుడు ఇచ్చిన శాపములను విష్ణుభగవానుడు తాను స్వీకరించారు.

మత్స-కూర్మ-వరాహ-నారసింహ-వామన-పరశురామ-దశరధరామ-బలరామ-బౌద్ధ-కల్కి శాపములు తాను స్వీకరించారు.

ఆ తరువాత విష్ణుచక్రము దుర్వాస మహర్షి వెంటబడగా, త్రిమూర్తులు కూడా ఆ దుర్వాసుని రక్షించటానికి ‘అశక్తత’ ప్రకటించారు. చివరికి విష్ణుచక్ర ఘాతము నుండి దుర్వాసుని అంబరీషుడు తన భక్తి-ప్రపత్తులచే రక్షించారు. భక్తి-సత్యముల ఔన్నత్యము, ఆత్మతత్త్వ ధ్యానముల మహత్తర ప్రభావము లోకాలకు అంబరీషుడు నిరూపించి చూపారు. అంబరీషుడు మట్టిని బంగారమును సమదృష్టితో చూచు భక్తి-జ్ఞాన యోగములను లోకమునకు సోదాహరణ - దృష్టాంతముగా బోధనచే లోకపావనులైనారు.

యయాతి (భారతము) : చంద్రవంశపు రాజు. నహుషునికి, ప్రియంవదకు కలిగిన ఆరుగురు కుమారులలో ఒకడు. నహుషుని తరువాత మహారాజు. శుక్రాచార్యుల కుమార్తె దేవయానను, ఆమె చెలికత్తె శర్మిష్ఠను వివాహము చేసుకొన్నారు.

దేవయాన వలన - యదువు, తర్వసులను, శర్మిష్ఠ వలన - ద్రుహ్యుడు, అనువు, పూరుడులను - కుమారులుగా పొందారు. దేవయాని తండ్రి శుక్రాచార్యులచే (దేవయాని యొక్క చెలికత్తె శర్మిష్ఠతో దాంపత్యము పొందినందుకు) - ‘‘నీవు వృద్ధుడవుగా ఉండెదవు గాక’’ - అని శపించబడ్డారు. శాప విమోచనముగా ‘‘నీ కుమారులలో ఒక్కడు ఎవడైనా నీ వార్థక్యము అంగీకరించి స్వీకరిస్తే మరల యౌవనవంతుడవు కాగలవు’’ అని శుక్రాచార్యులు వరమిచ్చారు. ఆఖరి పిల్లవాడు పూరుడు మాత్రమే వార్థక్యము స్వీకరించి తన యౌవనము తండ్రికి ఇవ్వటానికి ఒప్పుకున్నాడు.

ఆ యౌవనము అనుభవించిన తరువాత తిరిగి యౌవనము పూరునికి తిరిగి ఇచ్చి తన వార్థక్యము తిరిగి తీసుకొన్నారు. పూరుని తన తరువాత చక్రవర్తిగా అభిషేకించారు.


‘‘నజాతు కామః కామానామ్ ఉపభోగేన శామ్యతే।’’
కోరికలు ఎంతగా సిద్ధించినా కోరికలు తీరవు. అగ్నిలో ఆజ్యము పోసినప్పుడువలె పెరుగుతూనే ఉంటాయి. కోరికలు కోరుకోవటం విరమించటము మాత్రమే ఉపాయము.


అని సమస్త జనులకు పాఠ్యాంశముగా ఎలుగెత్తి చెప్పినవారు యయాతి.

అనరణ్యుడు (రామాయణము) : సూర్యవంశపు రాజు. రావణుడు రాజులందరి మీదకు యుద్ధానికి వెళ్లినప్పుడు వారంతా భయపడుతూ ఉండేవారు. కానీ అనరణ్యుడు మాత్రము అయోధ్యపై దండయాత్రకు వచ్చిన రావణునితో యుద్ధము చేసి ఓడిపోయారు. రావణుడు హేళన చేస్తూ అనరణ్యుని శిరస్సు ఖండించారు.

అప్పుడు అరణ్యుని శిరస్సు ఇట్లా పలికింది.


ఓ రావణా! ఇదంతా నీ ప్రతాపము - అని అనుకోకు. విధి చిద్విలాసము. నాటకములో సంఘటనలన్నీ ‘‘రచయిత కల్పితము. సత్యము కాదు’’… అనునది ఏ తీరైనదో, ఈ జగత్ సంఘటనలన్నీ అటువంటివే! సూర్యవంశములో పుట్టబోవు శ్రీరాముడు అనువాని చేతిలో నీవు సంహరించబడగలవు. అయితే అది కూడా జగన్నాటక చమత్కారమే! కనుక దేహాహంకారమును జయించి, ఆత్మాహంకారమును ఆశ్రయించు।’’ - అని సూచించారు. రావణుడు ఆ మహత్ వాక్యములను తెలిసికూడా, పెద్దగా పట్టించుకోలేదు.




వాలఖిల్యులు

బ్రహ్మవైవర్త పురాణము : బ్రహ్మదేవుని పుత్రులు. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వర కళ్యానము చూడటానికి వెళ్లారు. పీటమీద కుర్చుని ఉన్న పార్వతీ పరమేశ్వరుల మహత్తర సౌందర్యము చూస్తూ ఉండగా బ్రహ్మకు ‘‘రేతః పతనము’’ అయింది. ఆ రేతస్సు నుండి వాలఖిల్యులు జన్మించారు.

బ్రహ్మ పురాణము : బ్రహ్మ ఒక రోజు స్వర్గలోకమునకు వెళ్లటం జరిగింది. అప్పుడు రంభ మొదలైన అప్సరసలు ఎదురుగా వచ్చారు వారిని చూడగానే బ్రహ్మదేవునికి దైవ విలాసంగా రేతఃపతనము అయింది. దానిని ఆయన కాలితో కప్పి ఉంచారు. రేతస్సుతో ఇసుక రేణువులు కలిసాయి. అందులోంచి వాలఖిల్యులు జన్మించారు.

బ్రహ్మాండ పురాణము : ‘క్రతువు’ అణు మునియొక్క కుమారులు. వీరి తల్లి సన్నతి (క్రియ). వీరు నిత్య బ్రహ్మణాకారులు ఊర్థ్వ రేతస్కులు. వీరు సూర్యుని సప్తాశ్వరథములో ప్రవేశించి సంచరిస్తూ ఉంటారు.

భారతము : వాలఖిల్యులు అంగుష్ఠ (బొటనవ్రేలు) ప్రమాణము గల దేహము కలవారు. వారు ఒక సందర్భములో కశ్యప ప్రజాపతి పుత్ర కామేష్టి యాగము చేస్తూ ఉండగా ఆ యాగమును సేవించదలచినవారై పుష్పములను తెస్తూ పుష్పముయొక్క బరువు వలన వణుకుచుండసాగారు. ఆవిధంగా వాలఖిల్యులు స్వల్పపు బరువునకే వణకటం చూచిన ఇంద్రుడు ఎగతాళిగా నవ్వారు. సిగ్గుపడి దోషము పొందిన వాలఖిల్యులు ‘‘ఈ కశ్యప ప్రజాపతి చేస్తున్న ‘పుత్రకామేష్టి’ ఫలంగా జనించే పుత్రుడు రెండవ ఇంద్రుడు కాగలడు!’’ - అని పలికారు. అది విని భయపడిన ఇంద్రుడు కశ్యప ప్రజాపతిని సమీపించి ‘‘ప్రజాపతీ! రక్షించండి’’ - అని అర్థించారు. ప్రజాపతి చిరునవ్వు నవ్వి, ‘‘పుట్టబోయేవాడు ఖగేంద్రుడు. విష్ణు భక్తుడు. విష్ణు భగవానుని వాహనుడు. లోక కళ్యాణమూర్తి. కాబట్టి నీకు వచ్చిన భయమేమీ లేదు లే"!’’ - అని ఓదార్చారు.



కౌత్సుడు

రఘువంశము : వీరు వరతంతు మునీశ్వరుని శిష్యుడు. విద్య నేర్చిన తరువాత ఒకరోజు తన గురు దేవుని సమీపించారు.

కౌత్సుడు : గురుదేవా! వరతంతు మునివర్యా! తమరు ‘‘గురుదక్షిణ’’ ఆజ్ఞాపించమని వేడుకొంటున్నాను.

వరతంతు ముని : అవసరము లేదు నాయనా! నేను నేర్పిన విద్యను సద్వినియోగం చేయి. లోక కళ్యాణమునకై ఉపయోగించు. నాకు అంతే చాలు.

కౌత్సుడు : అట్లా కాదు స్వామీ! మీరు నావద్ద గురుదక్షిణ తప్పక స్వీకరించాలి. మీరు నాకు 14 విద్యలు నేర్పియున్నారు కదా!

వరతంతు ముని : అయితే నీ ఇష్టము. నీకు నేర్పిన 14 విద్యలకు 14 కోట్ల సువర్ణ నాణెములు ఇవ్వవచ్చును.

అప్పుడు కౌత్సుడు గురుదక్షిణ ఇవ్వటానికై సిద్ధపడి రఘుమహారాజును ఆశ్రయించారు. కానీ అప్పటికే ‘విశ్వజిత్’ యాగము నిర్వర్తించిన రఘుమహారాజు సమస్త ధనము దానము ఇచ్చివేసి ఉన్నారు. తన తగ్గిర ధనము లేనికారణంగా కౌత్సునకు మట్టి పాత్రలో కాళ్లు కడిగి మట్టిపాత్రతో త్రాగు జలము ఇచ్చారు. ‘‘అయ్యో! నేను వచ్చిన పని వాకిట్లోనే నెరవేరనిది అయిందికదా!’’ అని కౌత్సుడు అనుకోసాగారు. రఘుమహారాజు ప్రశ్నించి కౌత్సుకుని రాక వెనుకగల ఉద్దేశ్యము తెలుసుకొని ‘‘రెండు రోజులు వేచి ఉండండి’’ - అని అభ్యర్థించారు. ఆ తరువాత కుబేరునివద్ద ధనము సంపాదించి, గురుదక్షిణ చెల్లించుకోవటానికి కౌత్సుకునికి ఆతడు అడిగిన ధనము సమర్పించారు. ఇవన్నీ పురాణ విశేషాలు.


ఇక మనము మైత్రాయణ్యుపనిషత్ అధ్యయనములో ప్రవేసిస్తున్నాము.



ప్రమ ప్రపాఠకః-వైరాగ్యము-జ్ఞానావస్యకత

‘ఓం’ ఆనంద స్వరూపుడగు పరమాత్మకు నమస్కరిస్తూ…

- - -

ఇక్ష్వాకు వంశములో జన్మించినట్టి బృహద్రథుడు అనే మహారాజు. ఈయన సత్యవ్రతుడు. మహాధీరుడు. ప్రజ్ఞాశాలి. ప్రజలను కన్నబిడ్డలవలె ప్రేమిస్తూ బహుకాలము రాజ్యమును పరిపాలించారు. అనేక యజ్ఞ-యాగాలు నిర్వర్తించారు.

ఒకరోజు ఆయన ఉద్యానవనములో విహరిస్తూ చల్లని వెన్నెలలో ఒక మహావృక్షము క్రింద ఏకాంతంగా ఆశీనులైనారు. ఆయనలో వైరాగ్య భావాలు ఉదయించసాగాయి.


ఆహా! ఈ నా భౌతిక శరీరము శాశ్వతమా? కానేకాదు. ఇది ఏదోరోజు నన్ను విడిచి తన త్రోవ తాను చూచుకోవడం అనివార్యము. ఈ దేహముతో బాటే ఈ రాజ్యసంపద, ధన-జన-నారీ సంపద, పుత్ర -మిత్ర-బంధు జనాది సంబంధాలు నా నుండి విడివడనున్నాయి. ఈ సిరి-సంపదలను చూచుకుంటూ ఆయుష్షు మొత్తం గడపివేయటము తెలివితక్కువయే. అందుచేత ఇక శేషించిన ఆయుష్షును మోక్షమార్గములో తపస్సు చేస్తూ సద్వినియోగపరచుకోవటమే ఉచితము, మానవ జన్మకు ప్రయోజనము, సద్వినియోగము.


… ఇట్లా ఆలోచించసాగారు.

ఆ మరునాడే రాజసభను సమావేశపరచారు. ప్రజల అంగీకారము పొంది తన పెద్దకుమారుడు సుదాసునకు (భాగవతము) మహారాజుగా పట్టాభిషిక్తుని చేశారు. విరాగి అయి, సర్వమును అప్పటికప్పుడే త్యజించి అరణ్యవాసమును ఆశ్రయించారు. ఒక ఏకాంత -ప్రశాంత -నిర్జన ప్రదేశములో ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేయటం ప్రారంభించారు. హృదయములో ఇష్టదైవమగు సూర్యభగవానుని ప్రతిష్ఠించుకొని, ఊర్ధ్వంగా చేతులు ఎత్తి ఓర్పుతో సుదీర్ఘ కాలము తపస్సు చేయసాగారు. సహస్రారమునకు ఆవల (శిరస్సుపైన బ్రహ్మరంధ్రమునకు ఊర్థ్వముగా 12 అం।।ల ఆవలి స్థానములో) బుద్ధిని కలిపి సూర్యోపాసన చేయసాగారు.

ఒకానొకరోజు…,

పొగ-కట్టెలు లేని అగ్నివలె వెలుగొందుచు, మహాతేజోసంపన్నులగు శ్రీ శాకాయన్యమహర్షి సూర్యభగవానుని సంకల్పానుసారం బృహద్రథ మహారాజుకు ఎదురుగా ప్రత్యక్షమైనారు.

శాకాయన్యమహర్షి: ఓ బృహద్రథ మహారాజా! నీ తపస్సుకు, శ్రద్ధకు, భక్తికి సవిత్రు మండల మధ్యవర్తియగు సూర్యనారాయణులు మెచ్చారయ్యా! ఇక తపస్సు చాలించు! ఉత్తిష్ఠ! ఉత్తిష్ఠ! ఏమి కోరి తపస్సు చేస్తున్నావో… నిరభ్యంతరంగా కోరుకో! వరము రూపముగా సిద్ధింపజేస్తాను!

బృహద్రథుడు : దివ్యతేజస్సుతో సంపన్నులై వెలుగొందుచున్న ఓ శాకాయన్య మహర్షీ! నాయీ భక్తి పూర్వక ప్రదక్షిణ నమస్కారములు, పాదాభివందనములు స్వీకరించ ప్రార్థన! మీ దర్శనముచే నేను పునీతుణ్ణి అయ్యాను!

హే భగవన్! నేను ఆత్మవేత్తను కాదు. ‘‘ఆత్మ అనగా ఏమి? ఎట్టిది? ఏది ఉపాసిస్తే ఆత్మ సాక్షాత్కారమౌతుంది?’’ … ఈ ఈ విషయాలు తెలుసుకోవలెననే ఉత్సుకత మాత్రము కలవాడిని.

ఇక మీరో! సూర్యలోకవాసులు. బ్రహ్మజ్ఞులు. ఆత్మవేత్తగా మునిలోకప్రసిద్ధులు. ఈనాడు నాకు సుదినము. ఆదిత్య భగవానుని కరుణచే మహామహనీయులగు మీ దర్శనమైనది. మహాపురుషుల దర్శనము మహత్తరమైన ప్రయోజనము ప్రసాదిస్తుంది కదా! మహాపురుష సంశ్రయము (ఆశ్రయము) దైవానుగ్రహంగా మీ రూపముగా నాకు ప్రసాదించబడుతోంది.

అందుచేత ‘‘సత్యస్వరూపమగు ఆత్మ’’ గురించి బోధించవలసినదిగా మిమ్ములను అర్ధిస్తున్నాను.

శాకాయన్యులు : నాయనా! ఇక్ష్వాకా! అవాక్ మానసగోచరమగు ఆత్మయొక్క వృత్తాంతమును వాక్కుతో చెప్పటం సులభమా? కాదు. అశక్యము కూడా. నీవు ఆత్మ గురించి విశేషములు అడగటం నాకు ఆశ్చర్యము కలుగజేస్తోంది! లోకములలోని స్థితిగతుల సంబంధమైన సిరి-సంపదలను వరంగా కోవటమే లోకరీతి. ఆత్మజ్ఞాన సమాచారాన్ని వరంగా కోరుకోవటం లోకరీతి కాదు. అందుచేత ఆత్మజ్ఞాన విషయం అట్లా ఉంచి, మరింకేదైనా వరం కోరుకోవయ్యా! అన్యాత్కామాన్ వృణీష్వ!

బృహద్రథ మహారాజు లేచి శాకాయన్య మహర్షి యొక్క పాదపద్మములకు మరల సాష్టాంగ దండప్రణామము ఆచరించారు. వారి చరణములను పుష్పములతో పూజించారు. పాదములు కడిగి జలమును శిరస్సుపై చల్లుకొన్నారు.

బృహద్రథ మహారాజు : హే భగవాన్! శాకాయన్య మహర్షీ! మీరు కూడా ఈ భౌతిక శరీర సుఖము కొరకై వరము కోరుకోమంటున్నారా స్వామీ? ఈ దేహము ఎటువంటిదో మీకు తెలియనిదా? కాదు.

భగవన్! చర్మ, అస్థి, స్నాయు మజ్జా మాంస శుక్ర శోణిత శ్లేష్మ అశ్రు దూషితే, విణ్మూత్ర వాత పిత్త కఫ-సంఘాతే, దుర్గంధే, నిస్సారే - అస్మిం శరీరే కిం కామోపభోగైః?

ఇది బొమికలు - చర్మము-నరములు - క్రొవ్వులను ఒకచోటికి చేర్చబడి ప్రకృతిచే మిశ్రమముగా తయారు చేయబడినట్టి ఒక తోలుబొమ్మ. జడము. జడమే అయి ఉండి కూడా ఈ భౌతిక దేహము మాకు అనేక బంధములను, దుఃఖములను కలుగజేస్తోందే!

ఇది శుక్రము (రేతస్సు) -శోణితము-శ్లేష్మము-కన్నీరు ఇటువంటి అనేక దోషపూరితమైన పదార్ధములన్నీ తన యందు కలిగియున్నట్టిది. మలము, మూత్రము, వాత-పిత్త-కఫములచే బహు దుర్గంధభూయిష్టమైనట్టిది. ‘‘ఇది-ఇందులో సారభూతమైన వస్తువు’’… అని ప్రకటించుకోగలిగినదంటూ ఈ భౌతికదేహములో ఏదీ లేదు. అటువంటి ఈ భౌతిక వస్తువు వంటి దేహమును ఉపయోగించి, ఇందుకొరకై ఏవో భౌతిక పదార్థములను సముపార్జించి, … ఆ సంఘాతము (Association)చే పొందగలిగే కామోపభోగముల వలన ఏమి ఆనందము? ఏమి లాభము? ఎంతవరకు ప్రయోజనకరం? నాకేమీ ఏ మాత్రమూ కనిపించటమే లేదు!

హే మహర్షీ!
ఇంకా వినండి. నాయొక్క ఆలోచనలేమిటో వినిపిస్తాను.

అనేక మనోసంబంధమైన దోషాలు ఈ దేహమును వెంటనంటి ఉంటున్నాయి.
• ఏదో, ఇంకేదో కావాలి కదా?.. అనే కామము.
• కోరుకొన్నది పొందటములో అడ్డుపడుచున్నారని ఎవరెవరి మీదో కోపము, క్రోధము.
• ‘‘ ‘నాది’ అనుకొన్నది మరెవ్వరైనా లాక్కుపోతారేమో? కోల్పోతానేమో? పోగొట్టుకుంటానేమో? నావి మరెవ్వరికైనా ఇవ్వవలసి వస్తుందేమో’’… అనే లోభము.
• నామ-రూపములకు ఆకర్షితులమై సత్యము-నిత్యము పరిశీలించలేనట్టి మోహము.
• ‘‘ఎప్పుడు ఏది ఎట్లా కానున్నదో? ఎవరి వలన ఏమి ప్రమాదమో?’’… అనే రూపము గల భయము.
• హృదయంలో అనేకచోట్ల గూళ్లు కట్టుకున్నట్టి - ఎందుకోకూడా చెప్పుకోలేని విషాదము. ఏవేవో దిగుళ్లు.
• కొందరంటే ఇష్టపడటం. వాళ్లు దూరమగుచున్నప్పుడు చెప్పరాని వేదన.
• మరికొందరంటే అయిష్టము. వాళ్ళు దగ్గిరకు వస్తూ ఉంటే, ఏదో చెప్పరాని విసుగు, నిస్సహాయత.

ఇవి కాక..,

ఆకలి, దాహము, వార్ధక్యము, మృత్యువు, రోగము, శోకము - ఇటువంటి అనేక విషయాలతో శరీరము అనుక్షణము తాడనము పొందుతూ ఉన్నది. ఇదీ ఇక్కడి పరిస్థితి. ఇటువంటి అనేక దోషములతో కూడిన ఈ భౌతిక శరీరమును సుఖపరచటానికై ఏవైనా దృశ్యసంబంధమైన కామోపభోగములు కోరుకొని ఏమి ప్రయోజనము? ఏమీ ప్రయోజనము లేదని నా నిశ్చితాభిప్రాయము.

ఇంకా కూడా చెప్పాలంటే…,

ఏదేది ఇప్పటికి ‘‘నాదే కదా!’’ అని అనిపిస్తోందో, ఏదేది ఆయా ప్రయత్నములలో - ప్రయాసలతో సంపాదించుకోబోతామో… అవన్నీ కూడా కాలగతిచే నశించటము అనివార్యమేకదా! మృత్యువుతో అన్నీ ముగుస్తాయి మరి. ఈగలు- దోమలు రోజూ పుడుచున్నాయి. అక్కడ-ఇక్కడ వ్రాలుచున్నాయి. ఒకటి-రెండు రోజులలో నశిస్తున్నాయి. ఈ దేహాలన్నీ ఆతీరైనవేకాక మరేమున్నది? ఇవన్నీ కాలగతిచే గడ్డిపోచలవలె పుట్టుకొస్తున్నాయి. కాసేపు ప్రకృతిలో తైతక్కలాడుచున్నాయి. మరల కాలగతిచే నశిస్తున్నాయి. ఇంతలోనే క్రొత్తక్రొత్త దేహాలు పుట్టుకొస్తున్నాయి.

ఇక అల్పజీవులమగు మాగతి చూడండి! ఈ భౌతిక దేహపరమైన సంబంధ-సంపద-సందర్భ బంధుమిత్ర కళత్రాది వ్యవహారములను ఆశ్రయించి, జీవితకాలమంతా నమ్మి ఉంటున్నాము. ఆత్మజ్ఞాన విహీనంగా ఆయుష్షు - అనే అవకాశమును వృధా చేసుకుంటున్నాము. నిరుపయోగ పరచుకుంటున్నాం. దుర్వినియోగ పరచుకొంటున్నాము కూడా. ఇదంతా మా పట్ల అజ్ఞానకారణంగా దౌర్భాగ్యమే అగుచున్నది.

ఇక, మరికొందరు. వారు-మహాధనుర్ధారులు, గొప్ప సంపదలకు - మహాసామ్రాజ్యములకు అధిపతులై కూడా, ఆత్మజ్ఞానము కొరకై వాటిని తృణప్రాయంగా త్యజించి, సత్య-జ్ఞానములను ఆశ్రయించి ఉన్నారు. అట్టి ఎందరో మహనీయులు, మహాశయులు కూడా ఉన్నారు కదా! దృష్టాంతంగా…,

సుద్యుమ్నుడు; ఇంద్రద్యుమ్నుడు; కువలయాశ్వుడు, యౌవనాశ్వుడు; వధ్రియాశ్వుడు; అశ్వపతి; శశిబిందుడు; హరిశ్చంద్రుడు; అంబరీషుడు; అననుక్తుడు; స్వయాతి; యయాతి; అనరణ్యుడు; అక్షసేనుడు; మరుత్తు; భరతుడు →

మొదలైన మహామహనీయులు తమ బంధువర్గం చూస్తూ ఉండగా… సూక్ష్మ బుద్ధితో, మహతీం శ్రియం విహాయ - గొప్ప గొప్ప సంపదలన్నీ పాము కుబసమువలె త్యజించారు. వారు పరతత్త్వము కొరకై అరణ్యవాసమును, ఏకాంతవాసమును ఆశ్రయించినట్లుగా చరిత్రలను చదివాము.

‘‘ముందుగా ఎదురుగా ఉన్న భౌతిక సంపదలను అనుభవించటం కొనసాగిద్దాం. ఆ తరువాత ఎప్పుడో జ్ఞాన సంపద విషయానికి వద్దాములే’’ - అని తలచటము తెలివిగల వాక్యము కానే కాదు. ‘‘తొందరలేదు’’ అని అనుకుంటూ ఆత్మవిచారణకు ఉపక్రమించకుండా రోజులు గడిచిపోతూ ఉంటే, మేము పట్టీ-పట్టనట్లుగా చూస్తూ ఉండటం ఉచితమా? ఏ మాత్రం కాదు! ఎందుకంటారా? ఈ జీవితంలో ఎప్పుడు ఏది ఎట్లు జరుగుతుందో, ఏది ఏ మలుపు తిరుగుతుందో ఏమి చెప్పగలం? ఎవరికి తెలుసు? గంధర్వుల వలన, యక్షుల వలన, రాక్షసులవలన, భూతగణముల వలన, పిశాచముల వలన, సర్పముల వలన, గ్రహవీక్షణల వలన అనేక నిరోధములు, విఘ్నములు జీవితకాలంలో కలుగుతూ ఉంటాయి కూడా కదా!.
అసలు ఇక్కడ ‘ఇది శాశ్వతము’ అని నిశ్చయంగా చెప్పుకోగలిగినది ఏమున్నదో చెప్పండి!

• సుందర పుష్ప లతలతో కూడిన గొప్పగొప్ప వనములు కొంతకాలానికి ఎండి ఎడారులగుచున్నాయి.
• ఎత్తైన పర్వతాలు నేలకూలుచున్నాయి.
• సముద్రాలే ఇంకిపోయి ఇసుక ఎడారులుగా అగుచున్నాయి.
• సమున్నత శిఖరాలు కొంతకాలానికి భూమిలోకి కృంగిపోయి కనబడకుండాపోతున్నాయి.
• దృఢంగా కనిపించే ధృవతార వంటివి కూడా అధృవమై, అదృశ్యమైపోతున్నాయి.
• విశాల ప్రదేశమును ఆక్రమించిన మహావృక్షములు ఒక్క క్షణంలో గాలి - వానకు నేలపై ఒరిగిపోతున్నాయి.
• సుందరమైన నగరములు, ప్రసిద్ధమైన విశాల భూప్రదేశములు ఒక భూకంపముతో నామ రూపాలు కోల్పోతున్నాయి. సముద్ర జలంలో కొట్టుకుపోతున్నాయి.
• దేవతలంతటివారు కాలగతిచే స్వస్థానాలు కోల్పోతున్నారు. స్థానభ్రంశము పొందుచున్నారు!

క్షణమొక రీతిగా కనిపించే ఈ మనోకల్పనా రూపమగు దృశ్యప్రపంచములో ఏవేవో పొందాలని ఆకాంక్షించటము, పొందినవాటిని లెక్కించుకుంటూ సంతోషించటము - ఎంత తెలివి తక్కువతనము? (What a Foolishness??)

• అసత్ కార్యక్రములలో ఆవేశపూరితముగా నిమగ్నమై ఆయుష్షును వెచ్చించటము,
• ఈ దృశ్య విషయాలు వాస్తవమని, శాశ్వతమని నమ్మి ఉండటము..,

…. వీటన్నిటి వలన ఏమి ప్రయోజనము? ఇందులో లాభించగల సుఖము ఏమున్నది? ఎంతమాత్రమైనది? ఎంతకాలం వెంటనంటి ఉంటుంది?

‘‘ఈ దృశ్యవ్యవహారములను నమ్ముకొని, అనేక ఆవేశ-కావేశ-ఆశ-నిరాశ-నిస్పృహలతో రోజులు గడుపుచూ, వీటి యందు పీకల దాకా మమతానురాగులమై ఇరుక్కున్న మేము వీటి నుండి ఎలా బయటపడతామా..?’’ అనునదే ఇప్పటి అతి ముఖ్యమైన సమస్య మాకు. అట్టి మార్గమునకై ప్రయత్నించటమే ఉచితం కదా!

ఇప్పటి మా స్థితిగతులు, ఆలోచన-ఆవేదనలు ‘‘చీకటి నూతిలో చిక్కుకున్న కప్ప’’వలె ఉన్నాయి. ఈ ఇంద్రియ వ్యవహారములలో మేము అనేక జన్మలుగా బద్ధులమై సంచరిస్తున్నాము.

స్వామీ! ఇప్పుడు మీరే నాకు గతి! మీరు అందించే ఆత్మ సమాచారమే నాకు దివ్యౌషధము. ఆత్మజ్ఞాన సమాచారము ప్రసాదించి మీరు నన్ను కాపాడవలసినదిగా పునీతుని చేయవలసిందిగా.. మరల వేడుకుంటున్నాను.

- - -

ద్వితీయ ప్రపాఠకః - ఆత్మ నిత్య శుద్ధము! బంధము కల్పితము

బృహద్రథమహారాజు చెప్పుకుంటూ వస్తున్న సాత్విక వైరాగ్య భావాలు విన్న శ్రీశాకాయన్య మహర్షి బహు సుప్రీతులైనారు.

శాకాయన్య మహర్షి: మహారాజా! బృహద్రథా! ఇక్ష్వాకువంశ శ్రేష్ఠా! మీ వంశమునకు ధ్వజశీర్షము వంటివాడా! ఆత్మజ్ఞానీ! జీవుడు మానవ జన్మను ఏ ఆశయముతో పొందుచున్నాడో అట్టి సత్ఫలమును నీవు సిద్ధింపజేసుకొన్నట్లేనయ్యా! కృతకృత్యుడవయ్యావు. ‘మరుత్తు’ (వాయు విజయుడు) - అను బిరుదుకు సార్ధక నామధేయుడవు! ఇంక క్రొత్తగా నీవు తెలుసుకొనవలసినదేమున్నది? అయినా, అడుగు. తెలిసినంత వరకు చెప్పుతాను. ఏఏ విశేషాలు విందామనుకుంటున్నావు?

బృహద్రథమహారాజు: మహర్షీ! ఆత్మ అనగా ఏమి? ఎవ్వరు? ఎక్కడిది? అద్దాని ప్రభావము ఎట్టిది? మాకు బంధము ఎందుకు వచ్చిపడుతోంది? ఎట్లా తొలగగలదు? ఈఈ విషయాలు, తదితరమైన సంబంధిత విశేషాలతోసహా బోధించవలసినదిగా మిమ్ములను శరణువేడుతూ అర్థిస్తున్నాను.

శాకాయన్య మహర్షి: ఈ జీవుని పట్ల ఆతని యొక్క ఇంద్రియ సంబంధమైన బాహ్య విషయాలు అనేక వ్యధలకు, బంధనములకు, అల్పమైన-పరిమితమైన అవగాహనలకు దారితీస్తున్నాయి కదా! అట్టి ఇంద్రియార్ధములు బాహ్య విషయముల నుండి ఉపసంహరించ బడాలి. మనస్సుతో సహా అంతరమున (లేక) ఊర్ధ్వస్థానమున ఉన్న ఆత్మవైపుగా నియమించబడాలి. ఈ విధంగా సర్వప్రాపంచక విషయ-వ్యవహారములకు ఆవల (చరమ) స్థానముగా - {వ్యధ- అవ్యధలను (Worries or Non-worries)లను దాటిపోగా} శేషించే కేవల ‘స్థానము’ ఉన్నది. దాని గురించి బ్రహ్మజ్ఞులచే ‘‘సర్వతత్త్వ స్వరూపముగా, సర్వాత్మస్వరూపము’’గా స్తుతించబడుతోంది. అది ప్రపంచ రహిత, విషయరహితమగు నిర్మలబుద్ధికి మాత్రమే అనుభవమౌతోంది. అట్టి స్థితిలో నిర్మల మనస్సుకు (సర్వప్రాపంచక వ్యధలను స్వల్ప విషయములుగా చూడగల దృష్టికి) ఏది అనుభవమౌతోందో…

ఏష ఆత్మేతి!.. అదియే ‘ఆత్మ’ అని పిలువబడుతోంది!
ఏష ఆహ భగవాన్।….. ఆ సర్వ శేష్య మనో అనుభవమే భగవంతుడు - భగదనుభవము అని కూడా పిలుస్తున్నారు.

మరొక రీతిగా చరెప్పుకోవాలంటే…,

ఎవ్వరి బుద్ధి అయితే.., నిర్మలమై - శరీరత్వమును, ఇంద్రియత్వమును, మనో-బుద్ధ్యత్వమును అధిగమించివేసినదై…,
… సర్వజీవాత్మజ్యోతులకు వెలుగైయున్న, వెలిగించుచున్నదైయున్న ‘‘పరంజ్యోతి స్వరూపము’’ ను సమీపించి, సమస్తము తానే అయి చెన్నొందుచున్నదో…, అదియే ‘‘ఆత్మ’’.

సర్వ హృదయాలలో వెలుగొందుచున్న పరంజ్యోతి స్వరూపమే తానై ఏది ప్రకాశిస్తూ ఉంటోందో…,

అట్టి అమృతరూపము, అభయస్థానము, బ్రహ్మము అగు ఆత్మ గురించి విశదపరచే విద్యయే…,

ఓ బృహద్రథ మహారాజా! అట్టి ఆత్మ విద్య ఇప్పుడు నేను నీకు నా భావనగానో, అనుభూతిగానో, నేను కనిపెట్టినదిగానో - చెప్పవలసిన పని లేదు. అది మహనీయులకు తపోఫలముగా స్వీయానుభవమై, గురు-శిష్య పరంపరంగా బోధింపబడుచూ వస్తున్నదే! ఇతిహాస-పురాణములలోను, వేద-ఉపనిషత్తులలోను గ్రంథస్థమైనట్టిదే.

అందుచేత అస్మత్ సద్గురువు, భగవత్ స్వరూపులు అగు శ్రీమైత్రేయమహర్షి - శిష్యులమగు మాకు ఏది వ్యాఖ్యానిస్తూ బోధించారో, ఆ పరతతత్త్వము గురించిన ఆ విశేషాలనే ఇప్పుడు నీతో ముచ్చటిస్తున్నాను. చెప్పబోవుచున్నాను. శ్రద్ధగా వినుచుండెదవు గాక!

శ్రీ మైత్రేయమహర్షి మాకు, ఆత్మ విద్య గురించి నీ వలెనే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానంగా…,
వాలఖిల్యాది మునులకు…,
ప్రజాపతి యగు బ్రహ్మదేవునికి

మధ్య జరిగిన సంవాదమును ఈ విధంగా వినిపించారు.

* * *

బ్రహ్మమాసపుత్రులగు వాలఖిల్యమునులు లోకసంచారాలు చేస్తూ ఒకానొక సమయంలో ‘‘భగవంతుడు, ప్రజాపతి, సృష్టికర్త’’యగు బ్రహ్మదేవుని దర్శనార్ధమై బ్రహ్మలోకమునకు వెళ్లటం జరిగింది. వారు బ్రహ్మదేవుని దర్శించి నిర్మల హృదయపుష్పాలతో శ్రీసరస్వతీ సమేతులైన బ్రహ్మదేవుని పూజించారు. వేద వచనములతో స్తోత్రములు సమర్పించారు. పరమాత్మయగు బ్రహ్మదేవుడు వారి పూజలకు, భక్తితో కూడిన వేదవాఙ్మయయుక్తమైన స్తోత్రములకు ఎంతో సంతోషించారు.

శ్రీ ప్రజాపతి : బిడ్డలారా! మీ భక్తి - ప్రపత్తులు నాకు ఎంతో సంతోషమును కలుగజేస్తున్నాయి. మీ అభీష్టములు సిద్ధింపజేయు ఉత్సాహము నాకు కలిగింది. ఏమి కావాలో, వరములు కోరుకోండి!

వాలఖిల్య మునులు : తండ్రీ! ప్రజాపతీ! ఆత్మజ్ఞానార్తులమై మిమ్ములను దర్శించవచ్చాము. మిమ్ములను శరణువేడుచున్నాము.

హే భగవాన్! ఒకానొక చోట ఒక కొయ్యలచే నిర్మితమైన శకటము (బండి) ఉన్నది! అది తనంతట తానుగా ఒకచోట నుండి మరొకచోటికి కదలగలుగుతుందా? లేదు. అది జడము కదా! అది అక్కడి నుండి మరొక చోటికి వెళ్లటానికి సచేతనుడగు ‘కదల్చువాడు’ కావాలి కదా!
అట్లాగే…,
ఆ శకటము (బండి)వలెనే ఈ భౌతికదేహము జడము. జడమైన వస్తువు తనకు తానుగా ఎట్లా కదలుతుంది? కదలలేదు! ఇప్పుడు మా ప్రశ్న వినండి!

ఏ అతీంద్రియ (ఇంద్రియాతీత) చేతన తత్త్వము యొక్క మహిమచే ఈ జడమగు భౌతికదేహము చేతనము వలె ప్రతిష్ఠితమై ఉంటోంది? ఎద్దాని తెలివిచే ఈ దేహము తెలివిని పొందినదానివలె, తానే తెలివి గలదానివలె ప్రచోదనము పొందుచున్నది? కదిలే దేహములను కదల్చుచున్న ఇంద్రియాతీత చేతన శక్తి ఏది? ఎట్టిది? (లేక) ఎవరిది?

ఈ విషయము గురించి సవిస్తరంగా మాకు బోధించండి.

ఇదియే మీ నుండి మేము అభ్యర్ధించే వరము.

ప్రజాపతి : పుత్రులారా! అడగవలసినదియే, తెలుసుకొని తీరవలసినదే మీరు అడిగారు. చాలా సంతోషము. చెప్పుచున్నాను. వినండి!

***

సర్వ దృశ్యములకు ఆవల(పరముగా) ఒకానొక పరతత్త్వచైతన్య పురుషుడు ఉన్నారు. ఆయననే ‘పరమాత్మ’ అని, ‘పరబ్రహ్మము’ అని పిలుస్తున్నాము. ఆయన వాస్తవానికి వాక్‌కు ఆవల ఉన్నవారు. అవాక్-మానస గోచరుడు. అయితే నిర్మల బుద్ధికి అనుభవమగువాడు. వేదోపనిషత్తులచే ప్రవచించబడుచున్నవారు. ఆయన ఎట్టివారంటారా?

శుద్ధుడు → విషయములన్నిటికీ ఆవల, వేటిచేతనూ స్పృశించబడనివాడు. కేవలుడు. కాబట్టి పరమశుద్ధుడు!

పూతుడు → పవిత్రుడు. ఈ దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకార దోషములచే కించిత్ కూడా స్పృశించబడనివాడు. అస్పృశ్యుడు. అందుచేత పరమపవిత్రుడు.

శూన్యుడు → ఆయన యందు లోకములు, లోకాంతర్గత విశేషములు లేనేలేవు. విషయ శూన్యుడు!

శాంతో → సర్వము సశాంతించగా కూడా శేషించి ఉన్నవాడు. సర్వజగత్-దృశ్యములకు మునుముందుగానే ఉన్నవాడు. పరమశాంతుడు. ఆ పరమపురుషుని యొక్క ‘పరమశాంతత్వము’నకు విఘాతము కలిగించగలిగేది - ఎక్కడా ఏదీ ఏమాత్రము లేదు.

అప్రాణో → ప్రాణశక్తి ఆయన నుండి వెలువడుచున్నదై, ఆయనకు చెందినదై ఉన్నది. ప్రాణశక్తికి మునుముందే ఉన్నవాడు. ఆయన యొక్క సంకల్పశక్తి నుండి ప్రాణశక్తి ప్రదర్శితమౌతోంది. కనుక అప్రాణస్వరూపుడు. ప్రాణశక్తి తనదై, అద్దానికి మునుముందే ఉన్నట్టివాడు.

అనీశాత్మా → ఆయనను నియమించునది మరేదీ లేదు. సర్వదా యథాతథుడై ఉన్నాడేగాని, ఏ రూపము గాను అగుచుండుట లేదు. అందువలన అనియమితుడు! అనీశుడు. ఆత్మభగవానుని నియమించు ఈసుడు మరొకడెవడూ లేడు.

అనంతో → ఈ లోకాలకు, లోకాంతర్గతమైన దేహాలకు ‘ ఇది మొదలు- ఇది చివర’ అనునది ఉండవచ్చుగాక! వీటి నియామకుడు, వీటి సంకల్పుడు అగు ఆ పరమాత్మకు ఆదిగాని, అంతముగాని లేదు. కనుక అనంతుడు (Infinite). దేశ - కాల - దేహాదులచే ముగియటమనేదే లేనివాడు.

అక్షయః → ఈ సృష్టిలో కనిపించే ప్రతి వస్తువు కాలముచే పుడుతోంది. కాలముచే క్షయిస్తోంది. పరమాత్మయో? కాలఃకాలుడు. కాలనియామకుడు. కాలముచే బద్ధుడు కానట్టివాడు. వృద్ధి-క్షయములు లేనట్టివాడు! అక్షయుడు.

స్థిరః → ఆయన మరొక రూపము పొందడు. మరొక చోటికి పోయి -వచ్చువాడు కాదు. సుస్థిరుడు.

శాశ్వతో → ఆతడు ఎప్పుడో ఉండి, ఇప్పటికి లేక, మరెప్పుడో ముందుముందు ఉండువాడు కాదు. ఇప్పుడు - అప్పుడు - ఎప్పుడూ ఉండియే ఉండు నిత్యసత్ స్వరూపుడు. ఎల్లప్పుడు ఉండువాడు. కనబడేదంతా అశాశ్వతము. కాని ఆయన మాత్రమే శాశ్వతము. శాశ్వతో-యమ్ పురాణో!

అజః → ఆయన జన్మలకంటే మునుముందే ఉన్నట్టివాడు. ఆయన సమక్షంలో జన్మలు। అంతేగాని జన్మలచే ప్రారంభమగువాడు కాదు. జన్మలు లేనప్పుడు కూడా ఆయన ఉన్నారు. కనుక అజుడు. జననమే లేనివాడు.

స్వతంత్రః → ఆయన సంకల్పిస్తే లోకాలు. ఆయనయొక్క సంకల్పము ఉపశమిస్తే లోకాలు ఉపశమిస్తాయి. లోకాలు ఆయనపై ఆధారపడి ఉన్నాయి. అట్లాగే దేహాలు కూడా. ఆయన దేనిపై ఆధారపడి లేడు. ఆయనను నియమించునదేదీ లేదు. కాబట్టి సర్వస్వతంత్రుడు. (He is independent by himself in all beings with his equal presence).

ఓ వాలఖిల్యమునులారా! మీరు అడిగిన ప్రశ్నకు ఇంకా కూడా సమాధానము వినండి.

ఇప్పటివరకు మనము చెప్పుకున్న విశేషములతో కూడిన పరమాత్మ యొక్క మహిమయే ఈ సమస్త దేహములలో వేంచేసియున్నది. ఆయన యొక్క చిత్ చైతన్యశక్తిచేతనే స్వతఃగా జడమగు భౌతికదేహములు చేతనవంతమువలె ప్రతిష్ఠితమై ప్రబోధము పొందుచూ ప్రవర్తిస్తున్నాయి. కదిలే దేహములు వాటికవే కదలటము లేదు. కదిలించే పరమాత్మచైతన్యము యొక్క ప్రభావముచేతనే ఈ దేహములు కదలుచున్నాయి. ఆయన ‘అహమ్’ రూపుడై సర్వదేహుల బాహ్య-అభ్యంతరములలో వేంచేసి ఉంటున్నాడు కాబట్టే-ఈ భౌతిక దేహాలు తైతెక్కలాడుచున్నాయి.

వాలఖిల్యమునులు : అట్లాగా స్వామీ? అయితే, మాది మరొక సంశయము.

ఆ పరమాత్మ శుద్ధచైతన్యస్వరూపుడు, నిర్విషయుడు కదా! ‘నాకు ఇది కావాలి’ అను రూపము గల ఇచ్ఛయే అవసరము లేనివారు. అనిచ్ఛిన్నుడగు ఆయన ఏకారణముచేత ఈ జడదేహములను చేతనవంతముగా చేస్తున్నారు. వీటిని చేతనముగా ప్రతిష్ఠాపితము చేయవలసిన అవసరము ఆయనకేమున్నది? ఏ ప్రయోజనము ఆశించి ఆయన భౌతిక దేహములను ప్రబోధనముగా (Inspiring, operative) చేస్తున్నారు?
దయతో ఈ విషయము వివరించండి! విశదపరచండి!

ప్రజాపతి : అవును. ఆ పరమాత్మ →

సూక్ష్మా : స్థూలుడు కాదు. ఇంద్రియములకు, ఆలోచనారూపమైన మనస్సుకు అవిషయుడు. అభౌతికస్వరూపుడు. సూక్ష్ముడు. (Very subtle).

అగ్రాహ్యో : అవిషయుడు కాబట్టి గ్రహించుటకు శక్యముకానివాడు. ‘ఇది’ అని ఆయనను మాటలతో పరిమితము చేసి చెప్పలేము. వర్ణించనలవికాదు. ఒకడు ఒక దృశ్యమును గ్రహించి, మరొకరికి చెప్పవచ్చునేమోకానీ, ఆత్మ అట్లా గ్రహించబడునది కాదు!

అదృశ్యః : కంటికి కనబడేదీ, చెవులకు వినబడేదీ కానివాడు. దృశ్యములోనివాడుకాదు. అందుచేత అదృశ్యుడు.

పురుష సంజ్ఞో : అయితే ఈ కనబడేదంతా ఆయన యొక్క సంకల్ప నిర్మితమే! దీనికంతటికీ పురుషకారము ఆయనకు చెందిందే! (He is the worker of the universe). అందుకని ఆయన గురించి ‘‘పురుషుడు - పరమ పురుషుడు’’ అను సంజ్ఞలతో చెప్పుకుంటూ ఉంటారు.

అట్టి సూక్ష్ముడు, అగ్రాహ్యుడు, అదృశ్యుడు, పురుష సంజ్ఞాస్వరూపుడు అగు పరమాత్మ యొక్క స్వకీయ బుద్ధి ప్రేరేపణయే ఈ సమస్త భౌతిక దేహాలు కూడా. ఆయన యొక్క అంశయే బుద్ధిపూర్వకంగా ఈ సర్వజడదేహాలలో ప్రేరణ-ప్రబోధన స్వరూపమై వెలయుచున్నది.

ఆ ఆత్మ భగవానుడే - ఒకానొకప్పుడు తనకై తానే తనయందు ‘అన్యము’ అను (ఊహా-భావనా నిర్మిత) తోటను, ‘అనుభవి’ అనే తోటమాలిని, అనుభవములు అను పుష్పలతలను నిర్మించుకొని వినోద-విషాములన్నీ పొందుచూ, తనయందు తానే విహరిస్తున్నారు. తనను తానే ఏమరచినప్పుడు - బద్ధుడు కూడా అగుచున్నారు. కారణము? ‘‘అనిర్వచనీయమగు వినోదము’’ - అనియే సమాధానము.

దృష్టాంతానికి..,

ఒకడు నిద్రిస్తూ కలకంటున్నాడు. ఆ కలలో బుద్ధిపూర్వకంగా అనేక నామరూపాలను, జనులను కల్పించుకొనుచున్నాడు. వారి వలన ప్రేమ-భయము-ఇష్టా యిష్టములు… ఇవన్నీ ఆస్వాదిస్తున్నాడు. ఎందుకు? ఏమీ చెప్పలేము. అట్లాగే, పరమాత్మ తన చేతన శక్తి యొక్క అంశచే బుద్ధిపూర్వకంగా (మరియు) అకారణంగా ఈ దేహములను సచేతనము చేస్తున్నారు.

ఆయనయొక్క చేతనాంశయే గాఢనిద్రలో ఉన్నవానిని నిద్రలేపి మెళుకువకు తెచ్చి, తదనంతర అనుభవములను ఆతని ముందుంచుచున్నది.

కల కనువాడు కలలో తనయొక్క స్వప్న చైతన్యాంశచే తనకు వేరైనట్లుగా కనిపించే / అనిపించే నామ రూపాలను కల్పించుకొని, వాటిని భావనారసపూర్వకంగా సచేతనముగా చేస్తున్నాడు. (ప్రేమ-కోపము ఇత్యాదులు కలిగి ఉండేట్లు చేసి), ‘‘ఇది నా ఊహాకల్పన’’ - అనునది ఏమరచి ‘‘ఇప్పటికిది నిజం’’ అను తీరుగా ఆస్వాదిస్తున్నాడు!! ఎందుకు? స్వకీయక్రీడ-లీల అనవలె!
పరమాత్మ యొక్క ఇహలోక జడదేహ సచేతన క్రియావిశేషములు కూడా అట్టివే. ఇదంతా అకారణము, క్రీడావిశేషము… అనవచ్చునేమో! కనుక ఈ కనబడేదంతా పరమాత్మ యొక్క అంశయే. ఆయన వాస్తవానికి సదా నిష్క్రియుడు.

వాలఖిల్య మునులు : హే భగవాన్! ఈ కనబడేదంతా ఆ పరమాత్మ యొక్క అంశకు సంబంధించిన చైతన్యవిశేషమే అని అంటున్నారు కదా! ఆయన చేతనాంశ ఈ భౌతిక దేహములలో ఏ రీతిగా ప్రవేశించి వీటిని చేతనముగా చేస్తోంది?

ప్రజాపతి : ఆ ఆత్మ భగవానుడు ప్రజాపతి (the maker of all beings)గా అగుచున్నారు. ఆయన ఈ సర్వ జీవాత్మలకు, దేహనిర్మాణములకు మునుముందే (సత్‌స్వరూపులై) ఉండి ఉన్నారు!

ప్రజాపతిర్వా ఏష అగ్రే తిష్ఠత్। మొట్టమొదటగా (At the basic begining) ఆయన ఏకస్వరూపులై ఉన్నారు. అద్వితీయులు. అనగా ఆయనకు ద్వితీయము అనునది లేకుండినది. ‘‘ఈ జీవాత్మ-జగత్-జగదనుభవములు’’ మొదలైనవేవీ లేవు.

అట్టి ఏక-అద్వితీయ-స్వయమానందస్వరూపులే అయినప్పటికీ.. ‘‘నేను ఒక్కటిగా మాత్రమే ఉండటము సంతోషముగా లేదు. న రమత ఏకః!’’ అని తలచారు. నిద్రించువాడు తాను ఒక్కడే అయి ఉండి, ‘‘ఊరికే నిద్రిస్తే ఏమి వినోదము? నా స్వప్న చైతన్యమును ప్రేరేపించి స్వప్నములో - నా స్వప్నచైతన్యమునకు అభిన్నమైన-అనేక హావ-భావ ప్రదర్శనములతో కూడిన నామరూపు దృశ్యములు కల్పించుకొని వినోదిస్తాను’’… అని తలచి స్వప్న దృశ్యమును కల్పించుకుంటున్నాడు కదా! ఎందుకు?

అకారణం. అదే రీతిగా ప్రజాపతి కూడా తన యొక్క కల్పనా చైతన్యమును ప్రేరేపించి అనేక రూపములను (ప్రజలను) కల్పించుకొనుచున్నారు. సృష్టించుకొనుచున్నారు.

అప్పుడు…,

ఆ రూపములన్నీ అప్రబుద్ధులై (స్వీయ బుద్ధి వికాసము లేనివై, కొయ్యబొమ్మలవలె, రాతి విగ్రహముల వలె స్థాణువులై) ఉన్నాయి.

స నా రమత! అట్టి అప్రబుద్ధమైనట్టి స్థాణు రూపముల కల్పన ఆ ప్రజాపతికి ఆనందము కలిగించనే లేదు. అందుచేత ‘‘ఈ జడరూపములు తమకు తాముగా కదిలే చైతన్యత్వము (ప్రాణము) కలిగి ఉంటే (If these forms have their own independent life force to move by themselves, it would be more playful)మరింత వినోదము కదా!’’… అని తలచారు. వాటినన్నిటి యందు - స వాయుమివ ఆత్మానం కృత్వా। వాయువు బూరలలో ప్రవేశించు తీరుగా, ఆ పరమాత్మ ప్రాణాత్మ స్వరూపులై ఆ భౌతిక రూపముల అభ్యంతరమున ప్రవేశించారు.

అట్లా ప్రాణవాయు రూపంగా ప్రవేశిస్తున్నప్పుడు ‘ఒక్క’ రూపంగా ప్రవేశించలేదు. మరి? పంచథా ఆత్మానం ప్రవిభజ్య - ఆత్మరూపమగు వాయువును ఐదు విధములుగా విభజించుకొని ప్రవేశించటం జరిగింది. (1) ప్రాణము (2) అపానము (3) సమానము (4) ఉదానము (5) వ్యానము… అను ఐదు రూపాయలు అవధరించసాగారు.

(1) ప్రాణము : యో అయమ్ ఊర్ధ్వమ్ ఉత్క్రామతి ఇతి ఏషవావ-స ‘ప్రాణో।… ఊర్ధ్వముగా ప్రసరించు (లేక) ప్రవహించు వాయుశక్తి ప్రసరణము. బయటి నుండి (ముక్కు పుటములకు 12 అంగుళముల దూరము నుండి) దేహములోనికి తెచ్చుకు రాబడుచున్న వాయు ‘ప్రసరణము’ - ‘ప్రాణము’ అనబడుతోంది. ఇది ఊర్ధ్వమార్గంగా ప్రయాణించు ధర్మము కలిగి ఉన్నట్టిది.

(2) అపానము : యో అయం అవాఞ్చమ్ సంక్రామతి ఏషవావ-స అపానో।.. ఆ ఆధారమార్గంగా (క్రింద వైపుగా) ప్రసరించు ప్రాణ ప్రసరణ శక్తి. యోయం స్థవిష్ఠమ్ అన్నధాతుమ్ అపానే స్థాపయతి। ఈ అపానవాయువు అన్నధాతువును శరీరములో మిక్కిలి స్థూలముగా స్థాపింపజేసి దేహమునందు పుష్టిని (కండర పుష్టి, మాంస పుష్టి మొదలైనవి) కలుగజేయు ప్రాణశక్తి ప్రసరణము. (స్థవిష్ఠమ్ = చాలా స్థూలముగా).

(3) సమానము : యత్ అణిష్ఠంచ అంగే-అంగే సమున్నయతి ఏష వావ ‘సమానో’। - దేహములోని అంగాంగములకు, అణువణువుకు అన్నధాతువును, అన్నరసమును జేరవేయుచున్నట్టి ప్రాణశక్తియే ‘సమానము’.

(4) ఉదానము : యో అయం పీతాశితమ్ ఉద్గిరతి-నిగిరతీతి చ-ఏషవావ, స ‘ఉదానో’। ఈ భౌతికదేహము తాగినదానిని, తినిన దానిని ఆయా సందర్భములను అనుసరించి క్రిందవైపుగా గాని, పై వైపుగాగాని కదలుస్తూ పంపుచున్నట్టి ప్రాణవాయుశక్తి - ‘ఉదానము’।

(5) వ్యానము : యేన ఏతాః సిరాః అనువ్యాప్తా, ఏషవావ స ‘వ్యానః’। రక్త ప్రసరణము జరుగుచున్న ధమనులను - సిరలను, ఆశ్రయించి, నరనరములు అనువ్యాప్తమై, అన్నరసమును మూలమూలాలకు తీసుకొని పోవుచున్నట్టిది - ‘వ్యానము’.

ఈ విధముగానే కాకుండా, ఆ పరమాత్మ మరి రెండు ముఖ్యరూపాలుగా ఆత్మస్వరూపుడై ప్రవేశిస్తున్నారు.

    (1) అంతర్యామి (రచయిత)     (2) ఉపాంశువు (పాత్ర)

ఆ రెండిటి మధ్య తాపము రూపమైన ఔష్ణ్యము (విజ్ఞాన తేజస్సు, అనుభూతి) - కల్పించబడినదై ప్రవర్తిస్తోంది.

ఆ ఔష్ణ్యరూపము……… → అగ్ని, జఠరాగ్ని
అగ్ని…………….→ వైశ్వానరుడు

ఆ అంతఃపురుషుడే వైశ్వానరుడు। అట్టి వైశ్వానరాగ్ని వలననే దేహములో ప్రవేశించిన అన్నము (ఆహారము) పచనమై రసరూపమగుచున్నది.
ఇంకొక రీతిగా :-
(1) ఎవ్వనిచే అన్నము తినబడుచున్నదో, ఆతడు.
(2) ఎవ్వనిచే దేహములో ప్రవేశించిన అన్నము పచనము చేయబడుచున్నదో,… ఆతడు. (వైశ్వానరుడు).

ఈ ఉభయులు ఆత్మయొక్క అంశయగు అంతఃపురుషుని క్రియాక్రమ విన్యాసాలే!

(ఆత్మాంశయగు) అంతఃపురుషుని (లేక) జీవాత్మ యొక్క ఉనికి ‘‘ఉమ్‌మ్‌మ్’’ అను ఘోష (Sound wave)గా ఉంటుంది. చెవులు మూసుకొన్నప్పుడు వినిపించే ఆఘోష జీవాత్మ యొక్క ఉనికిని సూచిస్తుంది. ఆ జీవాత్మ ఈ దేహమును విడచి బహిర్గతుడు అయినప్పుడు ఆ ఘోష దేహమునందు వినిపించదు. అనగా జీవాత్మ చైతన్యము దేహము నుండి బహిర్గతమైతే,… ఈ భౌతికశరీరము ఒక జడమగు మాంసపు ముద్ద వంటిది మాత్రమే!

అంశాత్మకుడై ఈ దేహమునందు ప్రవేశింనట్టి పరమాత్మ తనను తాను ఐదు రీతులుగా (పంచ అంశలుగా) విభజించుకొని దేహమునందు ఉనికిని కొనసాగిస్తున్నారు.
(1) మనోమయము (Thinking factor)
(2) ప్రాణశరీరము (Energy factor)
(3) భావరూపము (Knowing / enlightening factor. Thinking and feeling Factor)
(4) సత్యసంకల్పము (Factor of making conclusions viz., “This is true” and “that is not” etc.,)
(5) జీవాత్మ [Possesive (viz., “This is mine”) - Factor]

ఇవన్నీ గా ఈ దేహములో అవతరించిన తరువాత కూడా పరమాత్మకు తృప్తి కలుగలేదు. ‘‘ఈ ఐదు రూపాలు స్థాపించుకున్నాను. బాగానే ఉన్నది. అయినా కూడా నేను కృతార్ధుడను, కృతకృత్యుడును కాను’’… అని పరమాత్మకు అనిపించసాగింది. ‘‘ఇవన్నీ ఉంటే ఏం లాభం? ఏమున్నదంట? వినటం, స్పర్శానుభవము, చూడటం, రుచి, వాసన అనబడే ఇంద్రియార్థాల అనుభవము ఉంటే కదా, నాకు వేడుక!’’.. అని తలచారు. తన నుండి బయల్వెడలే పంచకిరణములను పంచ ఇంద్రియార్ధములుగా రూపం ఇచ్చుకోసాగారు. ఇవే ఆత్మయొక్క పంచబుద్ధీంద్రియకిరణ జాలములు. (వినికిడి, స్పర్శ, చూపు, రుచి, వాసనలు).

ఈ శరీర రథము (1) ఆ పరమాత్మయొక్క సాక్షిత్వమునందు (2) జీవాత్మ యొక్క స్వకీయ కల్పిత-ప్రకృతి యందు చక్రములోని ఉపచక్రము వలె పరిభ్రమిస్తోంది. తిరుగాడుతోంది.

‘మరణము’చే (ప్రాణశక్తి యొక్క బహిర్గతము కారణంగా) ఇక ఈ భౌతిక శరీరము అచేతనమగుచున్నది. ఇందులోని ఆత్మాంశయగు ప్రాణశక్తియొక్క ప్రచోదత్వము ఉపశమించినదగుచున్నది. అయితే ప్రాణశక్తి ఆత్మాంశను వెంటనంటియే ఉంటోంది!

ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విశేషము!

పరమాత్మ వాస్తవానికి దేహమునకు, జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు, వైశ్వనరాగ్నితత్త్వమునకు, మనో- ప్రాణ-భాస-సత్యసంకల్ప-జీవాత్మలకు యజమాని. ఇవన్నీ పరాత్మయొక్క అంశా ప్రదర్శనములే. ఇట్లయి ఉండి కూడా…,

వాస్తవానికి ఆత్మ ధర్మములు - దేహధర్మములకు వేరై, అప్రమేయమై ఉన్నాయి.

ఆత్మయొక్క ధర్మములు ఆత్మ యొక్క ధర్మములు
అవ్యక్తము (Non-manifesting)
వ్యక్తీకరణ అగుచున్నట్టిది (That being manifested)
సూక్ష్మము (Subtle)
స్థూలము (Solid)
అదృశ్యము (Beyond the scenary)
దృశ్యాంతర్గతము (Part of the Scenary)
అగ్రాహ్యము (Beyond the experience of Eyes, Ear etc)
ఇంద్రియములకు గ్రాహ్యము (Within the experience of Eyes, Ears, etc.)
మమకార రహితము (Has no sense of belonging)
మమకార సహితము (Has the sense of belonging)
జాగ్రత్-స్వప్న-సుషుప్త అవస్థాత్రయ రహితము(Beyond the states like awaking etc)
అవస్థాత్రయ సహితము (Within the states of Awakening, etc.)
అకర్త - అభోక్త (No Sense of subject or object)
కర్తృత్వ - భోక్తృత్వ భావ సమన్వితము (Has the Sense of subject and object)

ఈ విధంగా ఆత్మ సర్వదా సర్వదృశ్యాంతర్గత విశేషాలకు విలక్షణమై ఉన్నది.
అవ్యక్తము - సూక్ష్మము- అదృశ్యము - అగ్రాహ్యము - నిర్మమము - అనవస్థ- అకర్త అయి ఉన్నది.
అయితే, అదంతా ఏ మరచి, కర్తృత్వ - భోక్తృత్వములచే పరిమితము వలె అనుభూతి పొందుచున్నది!
[స్వప్నము చూచేవాడు తన యొక్క (స్వప్నమునకు బయట ఉన్నట్టి) జాగ్రత్ స్థితిని ఏమరచుచున్న విధంగా].

తన యొక్క క్రీడావిశేష సంబంధమైన (లేక) ‘రమించెదనుగాక’ అను రూపమైన ఇచ్ఛతో అనేకత్వమును కల్పించుకొనుచున్న ఆత్మ వాస్తవానికి -

అయితే కూడా…,
ఆత్మ తన వినోదము కొరకై తానే రచించుకొన్న ఊహాచరితములను (Visual sequences) తనకు తానే జన్మ-కర్మ పరంపరల రూపంగా రచించుకొని పొందుచున్నది. నాటకము చూస్తున్నవాడు నాటకములోని సంగతి. సందర్భము, సంఘటనలకు సుఖ దుఃఖములు పొందుచూ ప్రవర్తిస్తాడు చూచారా? ఆత్మ కూడా తన కల్పనలో ప్రవేశించి…,

ఈ విధంగా దృశ్య విభాగమునందు అవస్థితమైయున్న స్వస్వరూపాత్మ - తాను అప్రత్యక్షమైనట్లుగాను అంతర్ధానమైనట్లుగాను ఏమరపు చేత అనుభూతము పొందుచున్నది.

కనబడని ‘నేను’ ఎల్లప్పుడూ ఉన్నట్టిది. కనబడే ‘నాది’ మొదలే లేనట్టిది.

- - -

తృతీయ ప్రపాఠకః - ‘ఆత్మ’ - అద్వితీయమా? ద్వితీయ సమన్వితమా?

వాలఖిల్యమునులు : హే భగవాన్! ప్రజాపతీ। మీరు చెప్పుచున్న ఆయా విశేషాలను అనుసరించి, ‘‘ఆత్మ మహామహితాన్వితమైనది’’.. అనియే సూచించబడుచున్నది. ఇంతలోనే ‘‘ఆత్మ అనేకమును కల్పించుకొని, అందులో ప్రవేశించి, స్వకీయ కల్పనామాత్రమగు ఇంద్రియ విషయములలో చిక్కుకొంటోంది’’ అనికూడా మీరు చెప్పుచున్నారు. ఆత్మ సర్వదా శుద్ధము, స్థిరము, అచలము, నిర్మలము, అవ్యగ్రము, కేవలప్రేక్షక రూపము అని కూడా మీరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పుడీ విషయం చెప్పండి! ఆత్మ అద్వితీయమా? ద్విత్వముతో కూడినదా?

జగత్తు - జీవాత్మ - పరమాత్మలు - ‘3’ వేరువేరైన విశేషాలా?

సమస్త లోకములను తనయందు కల్పించు సామర్థ్యము గల మొదటి ఆత్మ ఎవరు? కర్మఫలబంధములందు, దేహమునకు సంబంధించిన జన్మ-జరా-మృత్యువులందు చిక్కుకుని పరిభ్రమిస్తున్న ఆ రెండవ ఆత్మ ఎవరు? ఏది శుభాశుభకర్మ ఫలబంధములచే పీడింపబడుతోందో, సత్-అసత్ జన్మలను చర్విత చర్వణంగా అనివార్యమై పొందుతోందో, ద్వంద్వములచే బాధింపబడుచూ పరుగులు తీస్తోందో, పరిభ్రమిస్తోందో, అట్టి ఆ రెండవ ఆత్మ ఎక్కడి నుండి, ఎవరి ప్రోద్బలంచేత బయలుదేరుతోంది? ఆ రెండవ ఆత్మ మొదటి ఆత్మకు బంధము ఎందుకు కలిగిస్తోంది?

ప్రజాపతి : విను. కేవలాత్మ యొక్క ఒకానొక అంశయే- అయినట్టి ‘‘భూతాత్మ’’ అనునది స్వయం - కల్పితమై దృశ్యమునందు ప్రదర్శనమటం జరుగుతోంది. అద్దాని గురించి మనం ఇప్పుడు వివరించుకుందాము.

(1) అంశ తనదైన ఆత్మ (2) అంశరూపాత్మ (భూతాత్మ) - అను రెండిటికీ సంబంధించిన ‘ఆత్మ’ ఒక్కటే!

• దేహ-దేహాంతరములు : పాంచభౌతిక దేహములను ఆశ్రయిస్తూ ఈ భూతాత్మ ఒక సుదీర్ఘ బాటసారి వలె ప్రయాణములు - మజిలీలు కొనసాగిస్తూ పోతోంది. (ఒకడు ఒక వాహనములో కొందరితో ప్రయాణిస్తూ, ఇంతలోనే ఆ వాహనము దిగి, మరొక వాహనములో వేరేవారితో ప్రయాణిస్తూ సుదీర్ఘయానము చేస్తున్న మహాప్రయాణీకుని వలె) - ఇక్కడ భూతాత్మపట్ల దేహ-దేహాంతరములు ఒకదాని తరువాత మరొకటి ప్రవర్తమానమగుచున్నాయి.

(Just like getting down from one bus and getting into another bus in a very long journey. the mutual relationships are just like that of various co-travellars that one comes accross in each of the bus travels.) ఈ పరస్పరమైన సంబంధముల రాక-పోకలు అనుభవిస్తూ ‘‘జీవాత్మ’’ అనబడు ఈ భూతాత్మ దేహ-దేహాంతర ప్రయాణములు కొనసాగిస్తోంది!

• శుభాశుభకర్మలను నిర్వర్తించటం, వాటికి ఫలితంగా కొన్ని జన్మలు, ఆ జన్మలలో మరికొన్ని కర్మల నిర్వహణ, వాటి ఫలితంగా మరికొన్ని జన్మలు……..,

… ఈ విధంగా భూతాత్మయొక్క దేహ-దేహాంతర ప్రయాణాలు కొనసాగుచున్నాయి. ఈ దేహము గతిస్తోంది. మరల ఇంకొక దేహము ఎక్కడినుంచో వచ్చి ఈ జీవునిపట్ల చిగురిస్తోంది.

భూత+ఆత్మ = పాంచభౌతిక రూపాభిమాని. అట్టి భూతాత్మ గురించి మరికొంత వివరించుకొందాము.

భూత… అనగా?

పంచ తన్మాత్రాణి ‘భూత’ శబ్దేన ఉచ్యంతే। శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములనబడే పంచతన్మాత్రల పట్ల తీవ్ర ధ్యాస కలిగి ఉండటము, కొనసాగించటము - ఇక్కడ ‘భూత’ అను శబ్దము యొక్క ఉద్దేశ్యము.

పంచ మహాభూతాని ‘భూత’శబ్దేన ఉచ్యంతే। భూమి(Solid forms), జలము/రసము; అగ్ని(heat); వాయువు (చలనము); ఆకాశము(place) … ఇవి కూడా ‘భూత’ శబ్దోద్దేశ్యమే.

యో సమవాయుః -స శరీరమ్ ఉక్తమ్!। పంచతన్మాత్రల+ పంచభూతముల సమవాయువు (మేళవింపు)యే ‘శరీరము’

యో శరీరమ్ - స ‘భూతాత్మ’ ఇత్యుక్తమ్। అట్టి శరీరమునే ‘భూతాత్మ (లేక జీవాత్మ)’ అని ఇక్కడ చెప్పుకుంటున్నాము.

ఇక భూతాత్మకు → ప్రత్యగాత్మకు (పరమాత్మకు) గల సంబంధం ఏమిటి? వినండి.

తామరాకుపై నీటి బిందువు!

అథ అస్తి తస్య ఆత్మా బిందురివ పుష్కర ఇతి! తామరాకుపై జల బిందువు ఉన్నట్లు,.. భూతాత్మయందు పరమాత్మ ఉంటోంది.

→ జల బిందువు తామరాకుచే పీల్చబడదు.
→ తామరాకుని జలబిందువు స్పృశించదు.
→ తామరాకు యొక్క రంగు జలబిందువుకు అంటదు.
→ జలబిందువు యొక్క తడి (wetness) తామరాకు పొందదు.
→ తామరాకు-జలబిందువు కలిసియే ఉన్నప్పటికీ వేరువేరుగానే ఉంటాయి. ఒక దానితో మరొక దానికి ఏ దృష్ట్యా కూడా సంబంధమే లేదు!

భూతాత్మ ప్రకృతి సంబంధమైన ప్రాకృతగుణములచే పీడించబడుచూ సమ్మూఢత్వము పొందుచున్నాడు. అట్టి సమ్మూఢత్వము కారణముగా తాను ఎద్దానికి ‘అంశ’యే అయి ఉన్నాడో, అట్టి పరమాత్మను దర్శించటమూ లేదు. గుర్తించటమూ లేదు.

పరమాత్మ → ఆత్మస్థుడు। భూతాత్మకు ప్రభువు। భగవంతుడు। (సమస్తము వెలిగించువాడు। కర్మేంద్రియ-జ్ఞానేంద్రియముల నియామకుడు (నియమించువాడు). గుణాతీతుడు। నిర్మలుడు। జ్ఞానస్వరూపుడు। అభిమానరహితుడు।
(జన్మలు నావైన ‘‘నేను’’)। తామరాకుపై జలబిందువు వంటివాడు.

భూతాత్మ → త్రిగుణములచే తపించువాడు। కలుషీకృతుడు। దోషభూయిష్టుడు। చంచలుడు। ఆశాబద్ధుడు। జ్ఞానవీక్షణ స్పృహ లేనివాడు. అనేక లోక విషయములచే వ్యగ్రుడు! (worried) దేహాభిమాని। దృశ్యాభిమాని।
‘‘ఇది నేను - అది నాది - నేను ఇంతే!’’ అని తలచుచు తన ఆత్మకు తానే బంధము అవిచారణచే ఆపాదించుకొనుచున్నట్టివాడు. (జన్మలలోని ‘‘నేను’’)। తామరాకు వంటిది.

పరమాత్మ → నిత్యముక్తుడు.

భూతాత్మయో → నిత్యబద్ధుడు. వలలో చిక్కుకున్న పక్షివలె దృశ్యముతో కల్పించుకున్న సంబంధములందు చిక్కి….
→ అనేక కర్మపరంపరలు, వాటి ఫలములు (కర్మఫలములు)
→ ఆ కర్మఫలములు అనుభవించు సమయంలో అనివార్యము అగుచున్న మరికొన్ని కర్మపరంపరలు

… ఈ విధంగా సంసారారణ్యములో చిక్కుకొని బంధములను త్రెంచుకోలేక ఆక్రోశిస్తున్నాడు.

సంసారారణ్యములో పరిభ్రమిస్తున్నాడు. అనేక ఉపాధులలో ప్రవేశిస్తున్నాడు. నిష్క్రమిస్తున్నాడు.

పరమాత్మ నిత్యముక్తుడై ఉండగా…, భూతాత్మ నిత్యబద్ధుడై ఉంటున్నాడు.

ఇంకా ఈ భూతాత్మ యొక్క స్థితి ఏమిటో వినండి. - ‘‘నేను కర్మలను కర్తను’’ అను కర్తృత్వ-భోక్తృత్వ భావికుడు - భూతాత్మ.
- అట్టి భూతాత్మయే దేహములోని అంతఃపురుషుడు.

పరమాత్మకు → బంధము లేదు. మోక్షము లేదు. జన్మ లేదు. కర్మలేదు.
భూతాత్మయో → బంధము, జన్మ-కర్మ-వ్యవహారాదులు నిత్యము, అనుక్షణికంగా పొందుచున్నాడు.

అగ్నితో ఎఱ్ఱగా కాలిన ఇనుపగుండును కమ్మరి ఉక్కుబండతో మోదినప్పుడు ఆ గుండు ముక్కలు ముక్కలుగా అగుచున్నది కదా!

అట్లాగే.. ఈ భూతాత్మ…, త్రిగుణముల యొక్క (సత్వ-రజో-తమోగుణముల యొక్క) అనేక విధములై సమ్మేళనములచే - చతురశీతి లక్షయోని పరిణతం। 84 లక్షల జీవజాతులలోఉపాధులను పొందుచూ పోవుచున్నాడు.

చక్ర యంత్రమును ఎక్కిన వానివలె జన్మపరంపరలతో క్రిందికి-పైకి తిరుగాడుచున్నాడు.

ఇక్కడ ఒక చమత్కారము గమనించబడు గాక! ఇందాక తీసుకున్న దృష్టాంతమే మరల చెప్పుకుందాము.

యథా యః పిండే హన్యమానే న అగ్నిః అభిభూయతి,  
- ఏవం న అభిభూయతి అసౌ పురుషౌ।  
- అభిభూయతి అయం భూతాత్మ ఉపసంశ్లిష్టత్వాత్ - ఇతి।।

కమ్మరి బండ సుత్తితో ఎర్రగా కాలిన ఇనుపగుండును మోదుతూ ఉంటే, ఆ ఇనుపగుండు అనేక చిన్న ముక్కలై అటూ-ఇటూ పడతాయి. ఖండఖండములౌతాయి. అయితే, అగ్ని ఖండ-ఖండములుగా అవుతోందా? లేనేలేదు.

అట్లాగే, భూతాత్మ పురుషుడు - దృశ్యవ్యాపకము కారణంగాను, శుభాశుభకర్మలచేతను, త్రి-గుణముల చేతను ప్రేరితుడై అనేక భౌతిక దేహ పరంపరలలో (అనేక జీవజాతులలో) ప్రవేశ-నిష్క్రమణలను నిర్వర్తించుచుండవచ్చు గాక!

పరమాత్మపురుషుడు - (… ఇనుపగుండును కాల్చు అగ్నివలెనే) జన్మకర్మల చేతను, సుకృత-దుష్కృత-కర్మల చేతను స్పృశించబడనివాడై, పరమశాంతుడై, సర్వమునకు పరమై, కేవల ప్రేక్షకుడై, అకారణకారణుడై, సర్వత్రా ప్రకాశమానుడై వెలుగొందుచున్నాడు.

కనుక…,

భూతాత్మగా బంధము ఉన్నప్పుడు కూడా…, పురుషునిగా (లేక) పరాత్మగా మీకు (ఆత్మగా) బంధము లేదు! ఎవ్వరూ కలిగించనూ లేరు. (1) ఆత్మకు బంధము ఉండజాలదు. (2) మీరు సహజంగా ఆత్మస్వరూపులే.

- - - - -

ఓ వాలఖిల్యాది మునివర్యులారా!

ఇంకా ఇంకా కూడా…,

ఇందులో తామస గుణ దోషములు, రాజస గుణ దోషములు మనో అంతర్గతంగా దాగి ఉన్నాయి.

తామస గుణములు (గుణ దోషములు) -

సంమోహనత్వము (IIlusion); భయము (Fear); విషాదము (Meloncholy/ Dissatisfaction); నిద్ర (drowsy); తంద్రీ (Relatedness); వ్రణములు (Pains); జరా (Old age); శోకము (Worry); క్షుత్ (Hunger); పిపాస (Thirst); కార్పణ్యము (Pessimism about related others); క్రోధము (Revenge sense); నాస్తిక్యము (Atheism); అజ్ఞానము (Ignorance); మాత్సర్యము (Cruelty); నైష్కారుణ్యము (Non Sympathetic).

మూఢత్వము: ( ‘నేను ఎవరు’ - గురించిన జిజ్ఞాస ఉండకపోవటము. పరిమితమైన పరిధులలో ఉండిపోవటము.

మూర్ఖత్వము: పట్టుకొన్నది అవిచారణతో వదలకపోవటము. వదల లేకపోవటము;
నిర్లజ్జత్వము / నిర్ర్వీడత్వము: నిర్లజ్జ.‘‘ఎవ్వరేమన్నానుకొన్నా సరే. నేను ఇట్లాగే ఉంటాను’’- అనే మొండితనము;

నికృతత్వము: నీచమైన భావపరంపరలు. (ఇంకా కూడా) పని చేయాలని తెలుసు, కానీ చేయబుద్ధి కాకపోవటము. ధర్మమని తెలుసు. చేయబుద్ధి కాకపోవటము. అధర్మమని తెలుసు. విరమించ బుద్ధి కాకపోవటము, బద్ధకము (Lazyness, inactive, morose).

ఉద్ధతత్వము: అనేక విషయములతో, సహజనులతో బంధము కలిగి ఉండటము.

అసమత్వము: వాళ్ళు - వీళ్ళు, ఐనవాళ్లు-కానివారు, తక్కువవారు-ఎక్కువవారు… ఈ రీతిగా సమత్వబుద్ధి కోల్పోవటము- ఇవన్నీ ‘తామసాన్వితములు’.

ఇవన్నీ కూడా ఈ దేహమునందు (ఇంద్రియ - ఇంద్రియార్ధ - మనో - బుద్ధి - చిత్త - అహంకార స్థానములలో) దాగి, పేరుకొనియున్న తామస సంబంధమైన గుణముల ముఠా. ఇవి ఈ జీవునికి బంధమై, తన యొక్క సహజము, కేవలము అగు పరస్వరూపానుభవమునకు అడ్డుగోడలై ఉంటున్నాయి.


రాజసిక గుణములు (గుణ దోషములు) -

తృష్ణ → ‘‘పొందినవి తక్కువ, చాలదు. ఇంకేదో, ఏదేదో పొందాలి! పొందాలసిందే’’.. అనే దాహము. (Greedy)

అస్నేహో → ‘‘వీరు పరాయివాళ్లు. వీరితప్పులు ఇవి. వారు శత్రువులు’’ - మొదలైన అస్నేహ-శత్రుభావాలు. (Enimity)

రాగో → బంధు జనముపట్ల, వస్తువుల పట్ల ‘‘నావి - నావే’’ అనే వ్యామోహము. ‘‘ఇవి లేనిదే నేను ఉండలేను. నాకు ఉండాలి. నాకే ఉండాలి! పోకూడదు’’ … అనే భావావేశము. (Attachment)

లోభో → దాచుకొని అర్హులైనవారితో కూడా పంచుకోకపోవటము. (లోభి తన వస్తువును చెడితే పారవేస్తాడేగాని, బాగున్నప్పుడు పంచుకోడు. దానము చేయడు). (Miserly)

హింసా → మాటలతో - చేతలతో ఇతరులను బాధించటము. ఇతరులకు కష్టము - బాధ కలిగించటానికి వెనుకాడకపోవటం. ఇతరుల కష్ట-నష్టములకు ప్రోద్బలమవటం. ఇతరులను బాధపెట్టటం. తన మాట - చేతల వలన ఇతరులకు కలిగే కష్ట-నష్టములు గమనించకయే పోవటము. (Violence, teasing)

రతిదృష్టిః → వాస్తవానికి మనోకల్పిత భ్రమయే మూలముగా కలిగి ఉన్నట్టి అనేక దృశ్య వ్యవహారములలో ‘‘ఇంకా ఏదో రమించాలి’’ అనే దృష్టి. నామ-రూపములు, సంబంధ-అనుబంధ-బాంధవ్యములు, సంపద - ఆపదలకు పరిమితమై, ఆత్మ-జ్ఞాన జిజ్ఞాస లేకుండినట్టి దృష్టి. తీవ్ర శృంగారభావావేశములు. (Craving for Enjoyments)

వ్యాపృతత్వం → వ్యాపార దృష్టి - ‘లాభము పొందాలి, లభించాలి’ అనే ఆత్రుత. (Thirst to go on earning)

ఈర్ష్య → ఇతరుల పట్ల అసూయ. నిష్కారణమైన ద్వేషభావాలు, దురభిప్రాయాలు. తప్పులు ఎంచే స్వభావము. ‘‘ఆతనికి అంత ఎందుకుండాలి! నాలాగా బాధలు పడాలి’’… అనే భావోద్రేకం. (Hatred)

కామమ్ → అనుక్షణం అసంఖ్యాకంగా కోరికలు కలిగి ఉండటము.
- ఇంద్రియ నిగ్రహము లేకపోవటము.
- ఇంద్రియ విషయముల పట్ల ఆవేశపూరితంగా ఆకర్షించబడటము.
- ‘‘ఇంకా చాలా చాలా కావాలి. ఇకప్పుడు-ఆత్మగురించి’’ - అని తలంచుచూ, వర్తమానమును ఇంద్రియార్థములకు పరిమితము చేసివేసి ఉండిపోవటము. (Desires and expectations from worldly scenery).

అవస్థితత్వమ్ → ఒక స్థితిని అభిప్రాయమును పట్టుకొని, ఇక దానిని వదలలేకపోవటము. లౌకిక విషయాలతో అవస్థిత్వము. ఆత్మశాస్త్ర విచారణలలో అనవస్థిత్వము. (Getting Attatched deeply in some Assumptions and Pressumptions).

చంచలత్వము → అనుక్షణం మారే అభిప్రాయాలు. అనేక విషయాల మధ్యగా విషయ లోలుత్వబుద్ధి. ఊరికే ఉండక కాలుకాలిన పిల్లిలాగా మనో సంచారాలు చేయటము. పురాణాలు వింటూ పురుళ్ల గురించి చెప్పుకోవటము. (Distraction and restless thoughts).

జిగీష → అతిశయము. ఆత్మస్తుతి-పరనింద. ఏదో ఏదో పొందాలనే తపన తదితరులను తక్కువగా చేసి చూడటము. (Superiority complex).
అర్థోపార్జనము → ‘‘ఇంకా ఎట్లా ధనము సంపాదించాలిరా?’’ అనే ఆరాటము (Craving for Properties).

మిత్రానుగ్రహణము → ‘తన బంధువులు - మిత్రులు’ అనుకున్నవారి పట్ల తప్పులు చాలాచిన్నవిగాని, ఒప్పులు గొప్పగొప్పవిగాను భావించటం. వారికై ఏమైనా సరే చేయాలని అనుకోవటం. వారినే పరిగ్రహించటం. వెంటబడటం.. అవలంభనము ‘‘నా వారు మరి! ఏమౌతారో?’’ అని ఆవేదన. అమిత్రులపట్ల తిరస్కార బుద్ధి. (Bothering about relatives etc)

పరిగ్రహావలంబో → కొన్ని వస్తువులు పరిగ్రహించి, వాటిని వదలక, వాటి వెంటే ఉండు ఆవేశము. వదలలేనంత ఇష్టము. (Too much relatednes towards the liked people).

అవిష్టేషు ఇంద్రియార్థేషు ద్విష్టి → తనకు ఇష్టములేని వారి పట్ల, కొన్ని కొన్ని ఇంద్రియార్థముల పట్ల ద్వేషము పెంపొందించుకొని ఉండటము.

ఇష్టేషు అభిష్వంగః → ఇష్టమైనవారిని, విషయములను పట్టుకొని వదలలేకపోవటము. ఇష్టాయిష్టములమధ్యగా ఇరుకుకొని ఉండటము.

ఇవన్నీ దేహమునందు దాగి ఉన్న రాజసిక గుణదోషములు. ఇవి కూడా ఈ జీవుని యొక్క ఆత్మ సందర్శనమునకు అడ్డుగా నిలుస్తూ, సంసారారణ్యము నుండి బయల్వెడలనీయుట లేదు.

* * *

మనము ఇప్పుడు చెప్పుకొన్న గుణసంబంధమైన అభ్యాసాలు ఈ భూతాత్మ (జీవాత్మ) యొక్క హృదయమును అనేక ఉపాధి పరంపరా రూపముగా ఆక్రమించుకొని ఉండటం జరుగుతోంది. అవన్నీ-ఆతని ఆత్మావగాహనను, ఆత్మభావనను, ఆత్మదర్శనమును, ఆత్మానుభూతులను కప్పి ఉంచుచున్నాయి. అడ్డుగా ఉంటున్నాయి. ఆతడు తన ఆత్మను స్మరించటమే లేదు! ‘‘నేను ఎవరు? ఈ ప్రపంచము ఎట్టిది? దీనితో ఏ సంబంధము ఉచితము? ఏ సంబంధము అనుచితము? ఏది దుఃఖ-బంధప్రదము?’’- అని ప్రశ్నించుకోవటమే లేదు.

ఫలితం?

ఈ భూతాత్మ 84 లక్షల నానావిధ యోనుల రూపాలను పొందటం, ఈ దృశ్యచక్రములో చర్వితచర్వణంగా మహాపరిభ్రమణము సుదీర్ఘంగా కొనసాగించటము జరుగుతోంది.

- - -

చతుర్థప్రపాఠకః - సంసార ఉపశమన మార్గములు

ఇదంతా వింటున్నటి

అగు వాలఖిల్యమునులు విస్మితులైనారు. ఆశ్చర్యచకితులైనారు. తమలో తమ గురించిన భయమును పొందారు.

వాలఖిల్య మునులు : హే భగవాన్! మీకు మరల మరల హృదయపూర్వకముగా నమస్కరిస్తున్నాము! ప్రణిపాతులమగుచున్నాము! శరణు వేడుచున్నాము!

మీరు చెప్పిన భూతాత్మయొక్క మనోగతమైనట్టి రజో-తమోగుణ దోషములన్నీ కలిగియుండటం చేతనే కాబోలు, మేము సహజరూపమగు స్వాత్మమహిమను గ్రహించలేకపోతున్నాము, ఏ మాత్రము సమీపించలేకపోతున్నాము.

అయ్యా। ఇప్పుడు మీరేమాకు గతి। దిక్కు। మమ్ములను రక్షించండి। ఆజ్ఞాపించండి।

అస్మాకం గతిః అన్యా న విద్యత ఇతి। మా భూతాత్మత్వము యొక్క సంసారారణ్య సంచారవేదనముల గతి ఇంతేనా? వేరే గతి లేదా? ఇప్పుడు మేము ఆశ్రయించవలసిన ఉపాయము లేమిటి? మాకు దృశ్యముతో బంధము తొలిగేది ఎట్లా?

అస్య కో విధిః భూతాత్మనో యేన ఇదం హిత్వ, ఆత్మన్యేవ సాయుజ్యమ్ ఉపైతి? మా యొక్క భూతాత్మ సంబంధమైన తామసిక-రాజసిక గుణాభ్యాసములను వదలించుకొనే మార్గమేమిటి? సంసార చక్రపరిభ్రమణము నుండి బహిర్గతులమై ఆత్మయందు సాయుజ్యము పొందేది ఎట్లా? మాకు మార్గము అనుగ్రహించండి.

ప్రజాపతి : వాలఖిల్యముని శ్రేష్ఠులారా! బ్రహ్మజ్ఞులచే వేదాంతశాస్త్రములో సిద్ధాంతీకరించబడిన కొన్ని మార్గవిశేషాలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. మీరంతా శ్రద్ధగా వినండి!

* * *

మహానదిలోని తరంగాలు ఒడ్డును అధిగమించలేక నదీజలంలోనే చిక్కుకొని, ఈ చివరి నుండి ఆ చివర వరకు సంచరిస్తూ ఉంటాయి చూచారా! ఆ విధంగా ఈ భూతాత్మ జన్మ-కర్మల మహాసాగరంలో చిక్కుకొని బయల్వెడలలేకపోతున్నాడు.

కర్మ-జన్మల పరంపర ఈ జీవాత్మ పట్ల అనివార్యము - దుర్నివార్యము అగుచున్నది.

వీటన్నిటి మధ్య ఈ భూతాత్మ త్రాళ్ళతో కట్టుబడిన పశువువలె అనేక బంధనములు పొందినవాడై ఉంటున్నాడు.

పశురివ బద్ధం। బంధనః తస్యైవ అస్వాతంత్ర్యమ్। - అస్వాతంత్రుడై దిక్కుతోచక అనేక దిగుళ్ళతో మ్రగ్గుచున్నాడు. పైకి మాత్రం ఏవేవో వ్యవహారాలు కల్పించుకొని ‘‘మేము బాగే! మీరు బాగున్నారా?’’… అని చెప్పుకుంటూ కాలము వెళ్లబుచ్చుచున్నాడు.

యమ విషయస్థ ఇవ, బహు భయావస్థమ్। మృత్యువు అనే పిల్లి వెంటనంటి ఉన్న ఎలుక వలె, - యముని (మృత్యుదేవత) దృష్టిలో పడియే ఉన్నవాడై బహు భయావస్థలలో ఉంటున్నాడు.

మదిరోన్మత్తయివ మోహ మదిరోన్మత్తమ్। కల్లు పీకలదాకా త్రాగి మత్తెక్కి ఉన్నవాడి స్థితి వలె - ‘‘దృశ్య విషయములు - పరస్పర సంబంధ- అనుబంధములు’’… అనే మత్తుతో జగత్తులో ఏదో ఆనందము పొందాలని ఈ భూతాత్మ నిస్సారమగు ఈ దృశ్య ప్రపంచంలో దేని దేనికోసమో వెతుకుచున్నాడు. ఇక ఇక్కడ మోదము లభిస్తోందా? గుప్పెడు సుఖాలుంటే, గంపెడు ఆదుర్దాలు, మోపెడంత దుఃఖాలు, వగైరా!

పాప్మనా గృహీత ఇవ భామ్ర్యమాణమ్। క్రూరమైన వృద్ధ మాంత్రికురాలికో, ఏదో పాప యక్షిణికో పట్టుబడినవానివలె అనేక భ్రమపరంపరలలో తిరుగాడుచున్నాడు - భ్రామ్యమానుడై ఉంటున్నాడు!

మహా ఉరగ ద్రష్ట ఇవ విషయ దష్టమ్। విషపు పాము కరచినప్పటివానివలె విషయములచే బాధించబడుచున్నాడు. విష పాముచే కాటుకు దగ్గిరగా ఉన్నవానివలె- ‘‘ఏవైనా విపత్తులు వచ్చి మానెత్తి మీద పడతాయేమో? మరి ఏమి జరుగుతుందో, ఏమో?’’.. అని తలచుచు లోలోన ఏవేవో బాధలు, భయములు, వేదనలు కలిగి ఉంటున్నాడేగాని, ‘’అమ్మయ్య! ఇక నుంచి ఎప్పటికీ నాకు ఏదిగులూ లేదు’’.. అని ప్రశాంత పడలేకపోతున్నాడు.

మహాంధకార ఇవ రాగాంధమ్। ఒకడు కరకర ఆకలి వేయటం చేత మెళుకువ వచ్చి నిదుర లేచాడు. కానీ ఆతడు తెలియనిచోట గాడాంధకారములో చిక్కుకున్ని ఉన్నాడు. ఏవైనా తినే పదార్థాల కోసము, పానీయము కోసము కటికచీకటిలో తడిమితడిమి వెతుచుండటం ప్రారంభించాడు. ఆతనికి చేతికేమీ తినగలిగినవి దొరకటం లేదు. ఏమీ కనబడటము లేదు. ఎటువైపుగా కదలాలో తెలియటము లేదు.. పరిస్థితి ఎట్లా ఉంటుంది?

ఈ భూతాత్మ కూడా, ‘‘ఇవి నాకు ప్రియము! వీరు నావారు. కనుక ప్రియులు.. ఇవి-ఇవన్నీ ఎట్లాగైనా నాకే ఉండాలి. వీటికి-వీరికి ఏవైనా ఇబ్బందులు ఉంటే, అవన్నీ నావే!’’ అను ‘రాగము’ అనే అంధకారములో ప్రవేశించి ఉంటున్నాడు. అతిచంచలమగు దృశ్యవిషయముల పట్ల రాగము కలవానికి మనోనిశ్చలత ఎక్కడిది? అనునిత్యము మనస్సు చంచలమే అవుతోంది. చంచలమగు మనస్సుకారణంగా తన యొక్క ఆత్మస్వరూపము పట్ల నిశ్చయము ఏర్పడటం లేదు. ఎందుకంటే, - మనస్సంతా రాగాంధకారముతో నిండి ఉంటోంది.

ఇంద్రజాలమివ మాయామయమ్। ఇంద్రజాలము చూస్తున్నవారు,… అందులో కల్పించి చూపబడేవన్నీ ‘నిజమే’ అన్నట్లుగా చూస్తూ ఆశ్చర్యచకితుడవటం, వినోదించటం చేస్తూ ఉంటాడుకదా! ఈ భూతాత్మ కూడా ‘‘తాను చదువుచున్న కథలోని సంఘటనలు’’ వంటి ఈ దృశ్యాంతర్గమైన సందర్భములను చూచి, వీటిని నమ్మి ఉంటున్నాడు. ఫలితం? తన యొక్క దివ్యమైన ఆత్మత్వము వైపు దృష్టి - అవగాహనలను సారించటమే లేదు! (He is not extending his looks towards his own divine self)

స్వప్న ఇవ మిధ్యా దర్శనమ్। ఒకడు తన గుడిసెలోపడుకొని నిద్రలేచి, అటూ - ఇటూ చూచి ఏడవటం ప్రారంభించాడు. ఆ ప్రక్కవారు ‘‘ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైంది?’’.. అని అడిగారు. ఇక నిద్రలేచిన ఆయన చెప్పుకోవటం ప్రారంభించాడు.

‘‘నాకు కలిగిన నష్టం గురించి ఏడుస్తున్నాను. రాత్రి నిదురించానా! కలలో నాకు ఒక గొప్ప భవనము ఉన్నది. ఆ భవనములో నేను హుందాగా పచార్లు చేస్తున్నాను. ఇంతలో మెళుకువ వచ్చింది. చూస్తే, తిరిగి ఈ పూరి గుడిసెలో ఉన్నాను. అనగా, ఆ కలలోని భవనమును పోగొట్టుకొన్నానా? లేదా? పోగొట్టుకొన్నాను. అందుకే ఇప్పుడు ఏడుస్తున్నాను!’’ అని వాపోయాడుట.

ఈ విధంగా స్వప్న సంఘటనల వలె ‘‘మిథ్యామాత్రమే!’’ అయి ఉన్న అనేక దృశ్యాంతర్గతమైన విషయాలను, విశేషాలను చూస్తూ ఆయుష్షు గడుపుచున్నాడు. ‘‘ఆత్మస్వరూపుడనగు నా యొక్క సహజ తత్త్వము ఇట్టిది కదా!’’.. అని గమనించటమే లేదు! భ్రమలయందే మ్రగ్గుచున్నాడు.మాయామయుడై రాత్రి - పగలు గడుపుచున్నాడు.

కదళీగర్భ ఇవ అసారమ్। అరటి చెట్టు కాండమును ఒలుచుకొంటూ పోతే, లోపల చివరిగా మరొక విలువైనదేదైనా ఉంటుందా? ఉండదు కదా! అట్లాగే, ఈ సంసారములో సారమైనవస్తువేదీ ఉండదు. అసార-నిస్సార సంసార భ్రమచే ఈ భూతాత్మ తన యొక్క ఆత్మత్వముపై దృష్టి నిలుపుకోలేకపోతున్నాడు. అపారమైన సంసారములో సుఖములకై వెతుకుచూ,… ఫలితంగా దుఃఖములనే పొందుచూ ఆయుష్షు వృధాగా గడుపుచున్నాడు.

నట ఇవ క్షణ వేషమ్। ఒక నటుడు వేరువేరు నాటకములలో వేరు-వేరు పాత్రలను నిర్వర్తిస్తూ ఉన్నట్లుగా ఈ భూతాత్మ వేరువేరు ఉపాధులలో వేరువేరు దృశ్యకథన సన్నివేశములలో పాల్గొనుచూ, దేహ-దేహానంతర పరంపరలలో మునిగి తేలుచున్నాడే గాని, అప్రమేయమగు ఆత్మను ఎరుగుచుండుటలేదు.

చిత్ర భిత్తరివ మిథ్యా మనోరమమ్। ఒక గొప్పచిత్రకారుడు రంగుకుంచెలతో చిత్రించిన సౌందర్యరాసియగు అప్సరసను చూచి, ఒక రాజకుమారుడు ప్రేమించగా, ఆ రాజకుమారునికి ‘‘అయ్యా! ఆ చిత్రము (Painting)లోని సుందర స్త్రీ నా చిత్రకళానైపుణ్యమేగాని, అటువంటి సుందరి ఎక్కడా లేదు’’… అని ఆ మిత్రుడగు చిత్రకారుడు వివరించి చెప్పవలసి వచ్చింది.

ఆ తీరుగా గోడపై రంగులతో చిత్రించిన కళాఖండములోని దృశ్యము వలె ఈ దృశ్యమంతా మనోకల్పనావిలాసమే. మిథ్యామనోరథ కల్పితమే! ఈ దృశ్య ప్రపంచానుభవములో కనిపించే అర్థములన్నీ అనర్థములే.

ఈ జీవుడు ద్రష్ట అయి- దర్శించుచూ, భావావేశముచే తన్మయమగుచున్న సంసారదృశ్య భ్రమ గురించి ఆత్మజ్ఞులచే ‘‘ఇది ఇటువంటిది సుమా!’’ సుస్పష్టపరచబడుచూనే ఉన్నది.

ఈ భూతాత్మ శబ్ద-స్పర్శ-రూప-రస-గంథ విషయ- విశేషాలను చిలవలు-పలవలుగా మనోకల్పన చేసుకొనుచున్నాడు. అనర్ధములైన అర్ధములు కల్పించుకొని, వాటియందు స్థితి పొందినవాడై ఉంటున్నాడు. (శబ్ద స్పర్శాదయో యే అర్థా, అనర్థా ఇవ తే స్థితాః।)

యేషామ్ సక్తస్తు భూతాత్మ న స్మరేత్ చ పరంపదమ్। ఇటువంటి ఆయా అనేక విషయ-విశేష-సంబంధ-అనుబంధ- బాంధవ్య- ఆశ-నిరాశల మధ్యలో చిక్కుకున్న భూతాత్మ పరమపదమును స్మరించుటయే లేదు! ‘‘నా సహజ నిత్య - సత్యస్వరూపము ఏమై ఉన్నది?’’ అనేది తెలుసుకోవాలని ప్రయత్నించటమే లేదు. ప్రయత్నములేనివానికి ఏదైనా కానీ, ఎట్లా సిద్ధిస్తుంది?

- - -

ఓ వాలఖిల్యాది మునులారా! మీరంతా భూతాత్మ యొక్క స్థితి ఏమిటో, గతి ఏరీతిగా ఉంటోందో.., ఆయా విశేషాలు విన్నారుకదా!
ఇప్పుడు మనము ‘‘ఈ భూతాత్మస్థితికి ప్రతివిధి (How to counter)’’ - అనే విషయమును పరిశీలిద్దాము.

(1) ఆత్మ విద్యను అభ్యసించటము. ఆత్మతత్త్వ విచారణ. (ముముక్షుత్వ-తత్త్వాధ్యయనములు)
(2) శ్రద్ధ-ఉపాసనాభావములతో యోగాభ్యాసము - భక్తిగుణముల ఆశ్రయము.
(3) స్వ - ఆశ్రమ సంబంధమైన (బ్రహ్మచర్య-గృహస్త-వానప్రస్త-సన్న్యాస ఆశ్రములకు చెందిన) కర్మలను, ధర్మములను శాస్త్రములు సూచించు విధంగా ఉపాసన- సమర్పణ భావముతో నిర్వర్తించటము. (కర్మయోగము)


స్వధర్మాచరణము

…. ఈ విధంగా ‘విహిత ధర్మనిర్వహణ’ (Attentively attending to allotted activities / functions) అనే స్థంభమును (ధర్మ స్థంభమును) సమర్పితభావముతో, ఉపాసనా భావముతో, శ్రద్ధగా పట్టుకోవాలి.

‘‘ఎందుకు నా ధర్మము నేను నిర్వర్తించటము?’’.. అనే విషయంలో ఉత్తమ సమాధానబుద్ధి పెంపొందించుకున్న భూతాత్మ (లేక జీవుడు) ధన్యుడే। ఎందుకంటే, ఉపాసనాభావంగా స్వధర్మము నిర్వర్తిస్తూ ఈ సంసార మహాసముద్రము నుండి బహిర్గతుడు కాగలడు.

‘‘విద్యుక్త ధర్మము నన్ను సంసారగతి నుండి రక్షించగలదు (రక్షతి రక్షితః।). నన్ను సముద్ధరించటానికి ఇవ్వబడిన ఉపాయము’’ అని అనుకోబడుగాక! లేదా? అన్యథా అధః పతతి! స్వధర్మము పట్ల బద్ధకించినా (లేక) ఉపాసనగా కాకుండా దృశ్యములో పొందవలసిన ప్రయోజనముగా భావించినా కూడా, ఆతడు చేస్తున్న కర్మ-బంధములు కలిగించగలదు. దోష-దుష్ట కర్మలచే దుఃఖము, బంధనము, భయము కలిగించు స్థితిగతుల వలన అధఃపతనము అనివార్యము.

స్వధర్మము అనగా? - ఏష ‘స్వధర్మ’ అభిహితో యో వేదేషు! ఏది వేదములచే ‘ధర్మము’గా చెప్పబడుచున్నదో, అది స్వధర్మముగా స్వీకరించబడు గాక! మను ధర్మము, భారత-రామాయణాది పురాణములు, లోక శ్రేయోభిలాషులగు ఆర్యులు, పెద్దలు - ‘‘ఇది చేయండి, ఇది చేయకూడదు. ఇది తప్పక నిర్వర్తించాలి. ఇది అనుసరించండి’’ - అని చెప్పునది ఆశ్రయించటచమే ‘‘ధర్మము’’।

ఎవరు ఏ (బ్రహ్మచారి - గృహస్థ - ఉద్యోగ - వ్యాపారి ఇత్యాది) ఆశ్రమములో ఉంటే, ఆ ఆశ్రమ ధర్మముగా ఏదేది చెప్పబడిందో.., అది శ్రద్ధతో, సమర్పిత-ఉపాసనా భావములతో నిర్వర్తించువాడు ‘తపస్వి’యే సుమా! ఆశ్రమేషు ఏవ అవస్థితః త ‘తపస్వీ చేత్’ ఇతి ఉచ్యతే! అది నిర్వర్తించటమే శుభప్రదము. (కర్మణా జాయతే భక్తిః। భక్తిః జ్ఞానం అజాయతే। జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః। - ఇతి శాస్త్రేషు నిర్ణయః।। - అని ఆర్యవాక్యము).

న అతపస్కస్య ఆత్మజ్ఞానాధిగమః । అతపస్కుడు (తపోధనము సంపాదించుకోనివాడు) ఆత్మ జ్ఞానమునకు అర్హుడు కాలేకపోవుచున్నాడు. ‘కర్మ’ అనునది బుద్ధి యొక్క శుద్ధికొరకే ఉద్దేశ్యించ బడుతోంది. కర్మః శుద్ధిర్వ ఇత్యేవం హి ఆహ! కర్మయోగికి తనయొక్క సమర్పిత కర్మలే తపస్సు.

తపసా ప్రాప్యతే సత్త్వమ్ । - ‘విద్యుక్త ధర్మనిర్వహణ’ మొదలైన రూపముగా తపస్సు నిర్వర్తించటము చేత రాజసిక-తామసిక గుణములు సన్నగిల్లి, క్రమంగా సాత్త్వికగుణములు అభ్యాసంగా (As a habit) అవగలవు.

సత్త్వాత్ సంప్రాప్యతే మనః । సాత్విక గుణముల అభ్యాసముచే మనస్సు నిర్మలము అవగలదు.

మనసా ప్రాప్యతే ఆత్మ । నిర్మలమైన మనస్సు జగదత్వమును వదలి ఆత్మత్వమును సంతరించుకోగలదు. నిర్మలమైన మనస్సుకు ఆత్మ యొక్క స్థానము, ఆత్మయొక్క సహజ స్వభావము, ఆత్మతో అభిన్న-అద్వైతత్వము క్రమంగా అనుభవము కాగలదు.

ఆత్మా ఆప్త్యా న నివర్తతే । ‘ఆత్మ’ను తెలుసుకొని, ఆత్మత్వము నందు ప్రవేశించిన తరువాత, ఇక అట్టివాడు మరల సంసారమున పడడు. చేతిలోని మధురపదార్ధమును వదలి, బాట ప్రక్కన గల చేదు-మురికి పదార్థములను ఎవడు కోరుకుంటాడు? ఈ విషయమే వివిధ మహనీయులచేత (వివిధ మత గురువులచేత) వివిధ రీతులుగా, వివిధ సిద్ధాంతముల రూపంగా గానం చేయబడుతోంది. బోధించబడుతోంది.


చిత్త వృత్తులు - ఉపశమనము

ఏ విధంగా అయితే ఇంధనము తరుగుచూ ఉండగా అగ్ని స్వయముగా ఉపశాంతిస్తుందో, అదే రీతిగా వృత్తులు (Avocations) క్షయిస్తూ ఉండగా చిత్తము, స్వయముగా ఉపశాంతిస్తూ రాగలదు.

ఎవరైతే సత్యము (That which is permanent and ever-lasting) వైపే దృష్టి-ధ్యాసలను కొనసాగిస్తూ ఉంటాడో,… అట్టి సత్యకామి యొక్క మనస్సు తనకు తానే ఉపశమించగలదు. నిర్మలమై, నిత్య నిర్మలమగు ఆత్మతో ‘మమేకము’ పొందగలదు.

బిడ్డలారా! ఒక ముఖ్య విషయము జాగ్రత్తగా గమనిస్తూ, గుర్తుపెట్టుకొని ఉండండి.

చిత్తమేవహి సంసారః। తత్ ప్రయత్నేన శోధయేత్। చిత్తమే ‘సంసారము’ అయి ఉన్నది. చిత్తమునకు వేరుగా సంసారము అనునది ఎక్కడా ఏదీ లేదు. అందుచేత ఈ భూతాత్మ (లేక) జీవుడు ‘‘నా చిత్తము ఎట్లున్నది? వేటి వేటిపై వ్రాలి ఆశ, కామము, దుఃఖము కొనసాగిస్తోంది?’’.. అనే విషయం ఎల్లప్పుడూ శోధన చేసుకుంటూ (keep on overseeing and examining) ఉండాలి. చిత్తమునందు ఇంద్రియార్థములయినటువంటి శబ్ద-స్పర్శ-రూప-రస-గంథ సంబంధమైన (లోక సంబంధమైన) సమాచారములను తగ్గిస్తూ, ఆత్మశాస్త్ర సంబంధమైన సమాచారమును అధికాధికం చేసుకుంటూ రావాలి!

ఈ చిత్తమునకు ఒకానొక ధర్మమున్నది. యత్ చిత్తః తన్మయో భవతి। చిత్తము దేనిని ఆశ్రయిస్తే, అది తానే అగుచూ వస్తుంది. చిత్తముయొక్క - ఆశ్రయములే ఈ జీవునిపట్ల ఆయా - తదనంతర రూపములుగా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అట్టి ఈ చిత్తమును → గుహ్యమ్ ఏతత్ సనాతనమ్। పరమ రహస్యము, సనాతనము అగు - ఆత్మవైపే ఎక్కుపెట్టబడి, నడుపబడిందా…, అప్పుడు ఈ చిత్తము సనాతనమగు ఆత్మరూపము సంతరించుకోగలదు। అత్ర అస్య న సందేహః।।

చిత్తము నిర్మలమౌతూ ఉండగా క్రమంగా శుభ-అశుభ కర్మల ద్వంద్వ మోహ వ్యవహారములు నశించుచూ రాగలవు. అట్టి నిర్మలచిత్తము సులభముగా ఆత్మయందు స్థితి పొందగలదు. ఆత్మయందు స్థితింపబడిన చిత్తము అవ్యయమగు ఆనందమును పొందగలదు.

ఈ చిత్తము ఎదురుగా కనిపిస్తున్న విషయములవైపుగా ఏరీతిగా ప్రసరిస్తూ ఉంటోందో, అదే రీతిగా ఇది బ్రహ్మము వైపుగా ప్రసరించటం ప్రారంభించిందనుకో, → ఇక అట్టివాడు (విషయములు ఏమాత్రము బంధము కాబట్టి) బంధ విముక్తుడు ఎందుకుకాడు? తప్పక అవుతాడు! శుద్ధమనస్సు స్వయముగా బంధముక్తి పొందగలదు.


మనో ద్వివిధం ప్రోక్తమ్

ఈ మనస్సు రెండు విధములుగా ఉండటం జరుగుతోంది. (1) శుద్ధము (2) అశుద్ధము.

అశుద్ధమ్ → కామ సంకల్పమ్!
శుద్ధమ్ → కామ వివర్జితమ్!

అందుచే ఓ వాలఖిల్యాది మునులారా! ‘‘ఈ మనస్సు ఎందుకు అశుద్ధముగా అగుచున్నది?’’.. అను విషయము ఎవరికివారే జాగ్రత్తగా గమనించాలి. అందుకు ముఖ్యంగా రెండు మూలకారణాలు చెప్పబడుచున్నాయి.

క్రీడ చూస్తున్నవాడు ఆ క్రీడ (Game eg. Football, Cricket etc.,) లోని సంఘటనలలో లీనమై ఉత్సాహ-నిరుత్సాహములు పొందుచూ, చిట్టచివరకు అలసిపోయి నిస్తేజమై పోతాడు చూచారా? అదే రీతిగా ఈ మనస్సు దృశ్య విషయములు-సంగతి సందర్భ సంఘటనలలో అనుక్షణము పాల్గొనుచూ దుర్భలమైపోతోంది. క్రమంగా బుద్ధి - చిత్తములను కూడా అవివేకముచే నింపి ఉంచుతోంది.

ఆత్మయే సనాతన (ఆది) స్వరూపముగా గల ఈ జీవుడు

కథ చదువుచూ, అందులో లీనమైనవాడు, అట్టి కథా గమనములోని హర్ష-విషాద కల్పనలను తన అనుభూతులుగా మలచుకొను విధంగా ఈ జీవుడు ఇంద్రియ విషయ రూపమగు దృశ్యములలో మగ్నుడు అగుచున్నాడు. విక్షేపము, ‘లయము’ అనే మనోదోషములను తనయందు ప్రవృద్ధి చేసుకొంటున్నాడు (Distraction and Immersing).

ఈ మనస్సు క్షణమొక విధంగా ఉంటోంది. ఇష్టమైనవారితో ఒకతీరుగా, అయిష్టమైనవారితో మరొక తీరుగా। తనకొక నీతి మరొకరికి మరొకటి. ఎదుటివారి గుణములను ఎంచటం! తన తప్పులు గమనించకయే పోవటము - ఈ రీతిగా ఏకాగ్రతయే ఉండటం లేదు. ఇంకెక్కడి అప్రమేయ - స్వస్వరూపానుభవం?

ఎప్పుడైతే తన యొక్క భూతాత్మత్వమును స్వధర్మోపాసనాభావముల చేతను, భక్తి-జ్ఞాన-వైరాగ్యములచేతను, యోగాభ్యాసము మొదలైనవాటి చేతను (1) మనో మల-విక్షేపరహితము, (2) బుద్ధి సునిశ్చలము - చేస్తూ ఉంటాడో, ఇకప్పుడు అమనీభావము (లేక) నిర్మలభావము (లేక) దృశ్యాతీత భావము సంతరించుకొంటూ, ఆ యోగి పరమపద స్థానము చేరుచున్నాడు.

ఎంతెంతవరకైతే హృదయములో అనేకత్వరూపమైన ఇంద్రియార్ధ వ్యవహార విశేషాలు క్షయిస్తూ ఉంటాయో, అంతంత వరకు ఏకము-అఖండము అగు ఆత్మభావన పెంపొందుతూ వస్తుంది. ఇదియే జ్ఞానము. ఇదియే మోక్షము - ఏతత్ జ్ఞానంచ మోక్షంచ।

ఇక తదితర సమాచారమంతా - ఈ విషయముయొక్క గ్రంథ విస్తరణయే! శేషాస్తు గ్రంథవిస్తరాః !

సమ + అధి → సమత్వము యొక్క సముపార్జనము.
సమాధి = తన ఆత్మను సర్వ జీవజాలమునందు, సర్వ జీవజాలమును తన ఆత్మయందు స్వాభావిక సందర్శనము. (Seeing All-pervading, All-equal Divinity in all beings and adoring)

సమాధి యొక్క అభ్యాసముచే చిత్తము యొక్క మలములు (దోషములు) తొలగిపోవుచుండగా, అట్టి చిత్తము ఆత్మనివేదనము పొందుచున్నది. ఆత్మత్వమునకు అర్పితమగుచూ వస్తుంది. అట్టి ఆత్మ సమర్పితమైన నిర్మలచిత్తము వలన ఎట్టి సుఖానుభావము కలుగుతుందో, అది అనుభవైకవేద్యము మాత్రమే! మాటలతో మనము వర్ణించి చెప్పుకోగలిగినది కాదు! నిర్మలమైన చిత్తము ప్రసాదించగల సుఖము నిర్మలాంతః కరణునకే అర్ధం కాగలదు! నిర్మలాంతకరణమునకే నిర్మల చిత్తప్రభావమగు ఆత్మసుఖము యొక్క ఔన్నత్యము, సౌందర్యము అవగాహనం అవుతోంది.
→ నీరు నీటిలోను,
→ అగ్ని అగ్నిలోను,
→ ఆకాశము ఆకాశములోను
కలిసిపోయినప్పుడు ఏ విధంగా భేదము, ఇక కనబడదో,….
ఆ రీతిగా ‘‘ఆత్మ దృష్టి’’ (లేక) విషయములు అంతర్హితమైనప్పటి ‘‘అంతర్గత చిత్తము’’ (బాహ్య విషయముల నుండి మరలి) - పరమ పురుషునియందు (ఆత్మయందు) అభేదము సంతరించుకోగలదు.

- - - - -

వాలఖిల్యాది మునులు : స్వతఃగా ఆత్మస్వరూపుడే అగు ఈ భూతాత్మకు (లేక జీవునికి) అసలు దేనివలన ఎందుచేత ‘బంధము’ అనునది కలుగటం, ‘మోక్షము’ అనేది ఆవస్యకమవటం జరుగుతోంది?

ప్రజాపతి : ఆత్మకు ఎప్పుడూ బంధము లేదు. అది నిత్యస్వాతంత్ర్య స్వరూపము. ఇక దేహము విషయానికి వస్తే.. ఇది స్వతఃగా జడము. జడమైన వస్తువుకు బంధమేమిటి? మోక్షమేమిటి? అందుచేత…,

మం।। శ్లో।। మన ఏవ మనుష్యాణాం కారణం బంధ-మోక్షయోః ।
బంధాయ విషయాసక్తమ్। ముక్తైః నిర్విషయమ్ స్మృతమ్।।

ఎవ్వరికైనా కూడా…, మనస్సే బంధము! మనస్సే మోక్షము! మనస్సు అనగా? దృశ్యము గురించిన మననము యొక్క ఘనీభూతరూపమే మనస్సు. ఇంతకుమించి మనస్సుకు వేరే రూపమేదీ లేదు.
మనస్సు విషయాసక్తి సహితమై ఉండటమే బంధము. విషయాసక్తి రహితమై ఉంటే,… అదియే మోక్షము.

ఇప్పుడిక మీకు ఒక మహనీయుని తత్త్వానుభవ గానమును వినిపిస్తున్నాను.


కౌత్సాయని స్థుతి - గురువుచే స్తోత్రము! (గురువు శిష్యుని ఉద్దేశించి స్వస్వరూప బోధనకై వినిపిస్తున్న ‘‘తత్త్వమసి’’ స్తుతి.)

ఓ ప్రియ మిత్రమా! శిష్య భగవన్! ‘‘ఆత్మ’’ అను మహత్తర విశేషము గురించి చెపుతున్నాను విను.

నీవే ఆత్మ స్వరూపుడవయ్యా! తత్త్వమసి!

మంత్రము - 
త్వం బ్రహ్మా। త్వం చ వై విష్ణుః। త్వం రుద్రః। త్వం ప్రజాపతిః।  
త్వం అగ్నిః వరుణో వాయుః। త్వం ఇంద్రః। త్వం నిశాకరః।  
త్వం మనుః। త్వం యమశ్చ। త్వం పృథివీ। త్వం అథ అచ్యుతః।

నీవే బ్రహ్మదేవుడవు. నీవే విష్ణువువు! నీవే రుద్రుడవు! నీవే ప్రజాపతివి! అగ్నివి। వరుణుడవు! వాయువువు! ఇంద్రుడవు! చంద్రుడవు! మనువువు! పృథివివి! అచ్యుతుడవు కూడా। నీవే బ్రహ్మమువు. ఉన్న సత్యము ఇదే!

స్వార్థే స్వాభావిక అర్థే చ బహుధా తిష్ఠసే దివి। నీ వినోదము కొరకై నీ స్వభావమును ప్రేరేపించి నీకు నీవే ఇంద్రియార్ధములను కల్పించుకొని, ద్రష్ట-దృశ్యము-ద్రష్టత్వములను కల్పించుకొంటున్నావయ్యా! నిర్విషయాకాశములో విషయ సృష్టి రూపమున నీకు కనిపిస్తున్నది నీ యొక్క స్వయంకృత కల్పనయే! ఇదంతా నీవే కూడా! నీలోనే సర్వము ఉన్నది. నీవు కానిది ఏదీ లేదు. ఓ పరమాత్మా! ఇదంతా నీ దివ్యరూపమే!

మంత్రము - 
విశ్వేశ్వర నమస్తుభ్యం। విశ్వాత్మా। విశ్వకర్మ కృత్।  
విశ్వభుగ్ విశ్వమాయాస్త్వం, విశ్వక్రీడా రతి ప్రభుః।।

విశ్వమునకు ఈశ్వరుడవగు నీ ఆత్మ స్వరూపమునకు నమస్కరిస్తున్నాను! నీవు ఈ విశ్వమునకు ఆత్మవు! విశ్వాత్ముడవు! ఈ విశ్వమును నిర్మించే విశ్వకర్మవు (Engineer and Architect of the universe)! విశ్వకర్మ కృత్! ఈ విశ్వము యొక్క ఆస్వాదుడవు (Enjoyer of this creation for which you yourself are the worker of the universe)! విశ్వభుక్!
ఈ విశ్వమనునది నీ యొక్క మాయయే! విశ్వమాయాః త్వమ్! ఈ విశ్వము అనే క్రీడారతికి ప్రభువువు నీవే!

మంత్రము -  
నమశ్శాంతాత్మనే తుభ్యం। నమో గుహ్య తమాయ చ।  
అచింత్యాయ। అప్రమేయాయ। అనాది నిధనాయ చ। ఇతి।।

శాంతాతత్మ స్వరూపుడవగు నీకు నమస్కరిస్తున్నాను!
రహస్యములకెల్ల రహస్యమైనట్టి నీకు.. నమో నమః!

అచింత్యుడవు! దేనికీ సంబంధించినవాడవు! అప్రమేయుడవు! ఆద్యంత రహితడవు! సర్వమునకు స్థానమైన ఆత్మస్వరూపుడవు! నమస్తే! తే నమః! నమో నమః! ఓ పరమాత్మా! పరంధామా! పరమేశ్వరా! ‘శిష్యుడు’గా నా దగ్గిరకు వచ్చి సంభాషిస్తున్న పరతత్త్వమా! నీకు నమస్కారము.


త్రిగుణ-ఆవిర్భావము

వాలఖిల్యాది మునులు: స్వామీ! సద్గురూ! ప్రజాపతీ! ఈ సత్య-రజో-తమోగుణ విశేషముల గురించి మాకు వివరించి చెప్పమని ప్రార్థన!

ప్రజాపతి : అన్నిటికీ ఆత్మయే-ప్రప్రధమము, తదనంతరము, వర్తమానము, భవిష్యత్-అనునిత్య సత్యము-కూడా అయి ఉన్నది.
అట్టి ఆత్మను ఆత్మయొక్క స్వకీయ కల్పిత గుణములు ఆశ్రయించటం జరుగుతోంది. ఇద్దాని గురించిన కొన్ని విశేషాలు వినండి!

మొట్టమొదట తమము మాత్రమే ఉండినది. (మొదటగా విషయములేవీ లేవు కాబట్టి, అట్టి ‘‘స్వస్వరూపకేవలము’’ను ‘‘తమము’’ అని అంటున్నారు).
అది ఏకమై ఉండిఉన్నది. అట్టి తమము ఒకప్పుడు అద్దానికి వేరైన (స్వరూపముగా వేరై, స్వభావముగా వేరుకానట్టి) దానిచే ప్రేరేపణ (Inspiration) పొందినదై ‘విషయత్వము’ను పొందటం జరుగుచున్నది! అట్టి ‘‘ప్రేరేపణ’’ (Inspiration, Inclination) యే ‘రజము’.

    ప్రేరేపించబడునది →    తమము  
    ప్రేరేపించుచున్నట్టిది →  రజము

తమము ప్రేరేపించబడి రజముగా విషయ రూపముగా అగుచున్నది. రెండూ కూడా ఆత్మయొక్క చమత్కార విశేషములే.

ఆ తమము మరొకప్పుడు సాత్త్వికము (Positiveness)చే ప్రేరేపించబడటం చేత ‘సత్త్వము’ రూపమును దాల్చుచున్నది.

    తమము    -   రజముచే  → రజోరూపము,  
    సత్త్వముచే  → సత్వరూపము - దాల్చుచున్నది.

ఇది ఇలా ఉండగా…, తత్ సత్త్వమేవ ఈరితం తతో ‘రసః’ సంప్రా స్రవత్‌సో అంశో-అయం-యత్ చేతన మాత్రతః। ఆత్మయందు ఆత్మకు అభిన్నమైనట్టి, చేతన రూపము (A form of Inclination) -ఆత్మయొక్క రసస్వరూపమగు అంశగా బయల్వెడలుతోంది.

ఆ చేతన రూపము యొక్క అంశయే సర్వదేహములలో ‘క్షేత్రజ్ఞుడు’గా - అంశో-యమ్ యత్ చేతన మాత్రః, ప్రతిపూరుషమ్ క్షేత్రజ్ఞంః, సంకల్ప అధ్యవసాయ మాత్ర లింగః। - ‘‘సంకల్పనము- అనుభూతి - ప్రయత్నము’’ ల రూపాలుగా వేంచేసిఉన్నది. ఆత్మయే ఈ రీతిగా ‘ప్రజాపతి’ అని చెప్పబడుచున్నది. ఆ ప్రజాపతి యొక్క శ్రేష్ఠమైన శరీరమే బ్రహ్మ-విష్ణు-రుద్ర రూపములుగా (సృష్టి - స్థితి - లయ అభిమానములుగా) మొట్టమొదట ప్రదర్శితమగుచున్నది.

ఆత్మ సర్వదా ఏకమే। ఆత్మ ‘అన్యము’, ‘అనేకము’ అయ్యే ప్రసక్తియే లేదు. అట్లు అయిఉండియే…,

(ఆత్మ అపరిమిత రూపములుగా ఉద్భూతము పొందినదై (రూపములను దాల్చినదై),

ఉద్భూతత్వముచే చరించుచున్నది. ఈ విధంగా సర్వభూతజాలములకు అధిపతి ఆత్మయే!

ఆత్మభగవానుడే సమస్త జీవులకు ‘అంతర్యామి’ అయి….
- ఈ సృష్టి రూపముగాను,
- సృష్టిలోని ప్రతిజీవుని యొక్క అంతర్ - బహిశ్చ రూపము గాను →
పరివేష్ఠించియున్నారు. ప్రకాశించుచున్నారు. ఆసావత్ ఆత్మా అంతరశ్చ। బహిశ్చ।

- - -

పఞ్చమః ప్రపాఠకః - ఇదగ్ం సర్వం ‘ఓం’కారమేవ।

సమస్తమునకు ‘పరము’, సమస్తమునకు ‘ఆది’ (That which, the ‘Beyond’ aswell as the ‘Begining’) అయినట్టి పరతత్త్వము-సమస్త దేహములలో రెండు విధములైన రూపములను ధరించి ఈ దేహములను భరించచు, ధారణ చేయుచున్నది.

        (1) ప్రాణశక్తి    (2) అసావదాత్యుడు

ఈ రెండు కూడా మరల ఐదు విధములుగా (పంచ ప్రాణములుగా) అగుచున్నది.

ప్రాణము అంతరాత్మ. అద్దాని ‘గతి’ బహిరాత్మ.

ఆకాశసూర్యుని-చీకటి-వెలుగుల వలె భూతాత్మ యొక్క అంతరంగము-బాహ్య రూపములుగా ఆదిత్యుడు రూపుదాల్చుచున్నాడు.

అంతరాత్మ తన యొక్క అంతరాత్మత్వము నుండి ప్రాణస్వరూపముగా బయల్వెడలి ఇంద్రియజగత్ రూపమును తన యొక్క బహిరాత్మ స్వరూపముగా (ఈ విశ్వమును) ఆస్వాదించుచున్నది.

‘‘దృశ్యము’’ → (1) ద్రష్ట యొక్క, (2) దృక్ (Witness) స్వరూపుని యొక్క → స్వయంకృత కల్పనలే!

ఆత్మ → ‘సాక్షి’ (లేక) దృక్ స్వరూపి అయి, తన యొక్క ప్రాణశక్తి ప్రభావము చేత తన అంతరంగమున (లేక) స్వహృదయమున తానే బాహ్య రూపమువలె జాగ్రత్-స్వప్న-సుషుప్తులుగా కల్పన చేసుకొనుచున్నది. వాటికి ద్రష్ట అగుచున్నది. తానే వేడుకగా, వాటి యందు అనుభవపరంపరలను కల్పించుకొనుచున్నది. తానే వాటియందు (స్వప్న ద్రష్ట స్వప్నమునందు వలె) చిక్కుకొని ఉంటున్నది.

‘‘నేను బద్ధుడను! నా దుఃఖాలు పోయేదెట్లా?’’ అని దిగులుపడుచున్నది.

అనగా…,
ఈ జీవుడు ఆత్మ స్థితి నుండి స్వయంకృతకల్పనలో బాహ్యగతిని అనుభవిస్తున్నాడు.
ఆత్మయే ఆత్మయందు ఆత్మలో, ‘‘ఆత్మరూప వివిధ కల్పనలు’’ చేసుకొని ఆత్మతో ఆస్వాదిస్తోంది.

ఇదంతా ఇట్లా జరుగుచుండగా..,

మం।।శ్లో।। -
యః కశ్చిత్ విద్వాన్ అపహత పాప్మా, అధ్యక్షో అవదాత మనాః తన్నిష్ఠ,
ఆవృత్త చక్షుః - సో అంతరాత్మా ఆగత్య బహిరాత్మనో అనుమీయతే।।

ఈ అనేక భూతాత్మలలో ఒకానొకడు ఆత్మ గురించి జ్ఞానము కొరకై జ్ఞాన తపస్సు ఆశ్రయిస్తున్నాడు. ‘‘ఇదంతా ఏమై ఉన్నది?’’.. అనే ప్రశ్నకు ఉత్తమబుద్ధితో పరిశీలించనారంభిస్తున్నాడు.

శాస్త్రములు ప్రవచిస్తున్న భక్తియోగ-క్రియా యోగ- సర్వసమర్పణయోగ-కర్మయోగ-జ్ఞాన యోగ సాధనల ద్వారా బుద్ధిని సునిశితము, నిశ్చలము, విస్తారము, నిర్మలము చేసుకొంటూ ‘‘వివేకి, విజ్ఞాని, పండితుడు, విద్వాంసుడు’’ అగుచున్నాడు. అట్టి విద్వాంసుడు క్రమంగా మనోగతమైన పాపదృష్టులను తొలగించుకొన నారంభిస్తున్నాడు.

‘‘జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో నేను చిక్కుకోవటం లేదు. వాస్తవానికి అవి నా అధ్యక్షతలో నాయందు రూపుదిద్దుకొని, నా సంకల్పానుసారం ప్రవర్తిస్తూ, నా యందే లయిస్తున్నాయి" - అని గమనించుచున్నాడు.

‘‘నేను ప్రకృతికి బద్ధుడనుకాదు. ప్రకృతియే స్వీయ సంకల్పానుసారము నా నుండి నా యందే బయల్వెడలుచున్నదగుచున్నది’’ .. అను అవగాహనను, భావమును, బుద్ధిని సునిశ్చితము చేసుకోసాగుచున్నాడు.

ఆత్మయందే - తన్నిష్ఠః - నిష్ఠను కలిగి ఉండి, క్రమంగా ఎదురుగా కనబడే దృశ్యమును ఆత్మభావనచే, ఆత్మకు అభిన్నమైనదిగా దర్శించటం అభ్యాసం చేయసాగుచున్నాడు.

ఆ వృత్త చక్షుః, సో అంతరాత్మా ఆగత్య…, బహిరాత్మనో అనుమీయతే! దృష్టిని మనోబుద్ధిచిత్త అహంకారముల నుండి మరల్చుచున్నాడు.

‘‘తనలోను, సర్వులలోను ఆత్మను, ఆత్మయే తానుగాను, సర్వులు గాను’’ దర్శించే దృష్టిని ప్రవృద్ధము చేసుకుంటున్నాడు. బహిరాత్మత్వమును త్యజించివేస్తున్నాడు.

‘‘నాకు బాహ్యమనేది ఏదీ లేదు. ఈ సర్వము మమాత్మ స్వరూపమునకు అభిన్నము’’… అనునది సునిశ్చితము చేసుకుంటున్నాడు.

‘‘ఇదంతా నా అనుమతి చేతనే ఈ రూపమగు కల్పనగా ఏర్పడుచున్నది’’ - అనురూపముగా స్వీయ స్వాతంత్ర్యమును గమనిస్తున్నాడు.

అనునది సునిశ్చలముగా అవధరించుచున్నాడు!

ఈ విధమై స్వయత్నముతో అంతరముననే వేంచేసియున్న అంతరాదిత్యుడు, హిరణ్మయ పురుషుడు అగు ఆత్మ యొక్క సాక్షాత్కారమును సిద్ధింపజేసుకొంటున్నాడు. ఆత్మ సందర్శనము చేయనారంభిస్తున్నాడు.

హృదయసరోవరములోని సహస్రదళ (కిరణ) ప్రకాశమానమగు ఆత్మ పద్మమును ఆశ్రయించినవాడై ‘‘అన్నమ్ బ్రహ్మ-అహమ్ బ్రహ్మ-భోక్తా చ బ్రహ్మ’’ అను
→ ఇంద్రియాహార రూపమగు పంచేంద్రియార్ధ ఆహారమును (ప్రకృతిని) ఆత్మయొక్క ఆహారముగా, ఆహార్యముగా దర్శించటం)
→ ‘అహమ్ బ్రహ్మ’।
→ సర్వులు బ్రహ్మమే (తత్త్వమ్)।
- అను స్వస్థానమును చేరుచున్నాడు. అన్నమత్తి. బ్రహ్మమే తానై బ్రహ్మత్వము సముపార్జించుకుంటున్నాడు. సర్వము నిత్య-నూతన హృదయాంతర్గతముగా అన్నమ్- (బ్రహ్మము)గా ఆస్వాదిస్తున్నాడు.

* * *

నాయనలారా! ఈ కనబడేదంతా ఆత్మయే. ఆత్మకు భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు. ఇదంతా ఉన్నది మీయొక్క హృదయ పుష్కరము (తీర్థప్రదేశము) నందే। హృదయపట్టణమునందే।

మీ హృదయాకాశములో ప్రకాశిస్తున్న ‘‘ఆత్మపద్మ’’ పుష్పకాంతి వీచికలే ఈ దృశ్యాంతర్గతమైన సర్వముగా, మీరుగా, నేనుగా, సర్వులుగా వెలుగొందుచున్నాయి. అట్టి పరాత్పర స్వరూపమగు ఇహపరాత్మయే…,
→ ‘‘అగ్ని’’ - రూపముగాను,
→ ఆకాశములో సంచరించే ‘‘సూర్యుడు’’ - రూపముగాను,
→ ‘‘ఆకాశము’’ రూపముగాను, వేంచేసి ఉన్నది. అంతేకాకుండా,

ఇక్కడి తూర్పు-పడమర-ఉత్తరము-దక్షిణము, ఆయా ‘‘దిక్కులుగా-దిక్కులలో’’ మనకు కనిపిస్తున్నదంతా ఆత్మస్వరూపమే। ఆత్మ చమత్కారమే! ఆత్మ విన్యాసమే! ఉపదిశలగు ఆగ్నేయము, నైరృతి, వాయువ్యము, ఈశాన్యము.. అంతా ఆత్మ రూపమే!
- అగ్ని ఏ శక్తి చేత ప్రజ్వలించబడుతోందో … అది ఆత్మయొక్క కళావిన్యాసమే!
- ప్రాణము - ప్రాణేశ్వరుడు (ఆదిత్యుడు) కూడా ఆత్మయే! ఆత్మయే ప్రాణరూపంగా సర్వదేహాలలో వేంచేసియున్నది
- ‘ఓం’ అను అక్షరము, వ్యాహృతి (వచనము, పలుకు)
- గాయత్రీ-సావిత్రీ-సరస్వతి (గాయత్ రతి ఇతి, సత్-విత్ రతి ఇతి, సత్-రసవతి-ఇతి)
… ఇవన్నీ ఆత్మయే!

ఆత్మ సర్వదా సర్వమునకు అనన్యముకదా! అందుచేత ఏదేది మీకు అన్యముగా అగుపిస్తోందో,… అదంతా మీకు ‘అనన్యము’ అయి అనుభూతమగు గాక ।
ఇతి మంగళశాసనమ్।।

* * *

ద్వేవావ బ్రహ్మణోరూపే -
బ్రహ్మము రెండు రూపములుగా విన్యాసము సలుపుతోంది।
(1) మూర్తము (సాకారము) (form) (2) అమూర్తము (నిరాకారము) (formless)

యత్ మూర్తమ్, తత్ అసత్యమ్।
యత్ అమూర్తమ్, తత్ సత్యమ్। తత్ బ్రహ్మ।

అట్టి ఆత్మ త్రివిధ రూపములగు జాగ్రత్-స్వప్న-సుషుప్తులను, తదంతర్గత జగత్తులను ధారణ చేస్తోంది! ధరిస్తోంది। అ+ఉ+మ= ‘ఓం’కారము. (1) (అ = కేవలమగు ‘నేను’. (2) ఉ = అనుభవరూపముగా ఉన్న ‘నేను’. (3) మ = ‘‘అనుభవి’’ రూపమైయున్న ‘నేను’. (4) అర్ధమాత్ర = సమస్తము అగుచు, సమస్తమునకు వేరై ఉన్న ‘‘నేను’’।)

ఈ సర్వము ఆత్మయే! ఆత్మస్వరూపమే!

బంగారపు ఉంగరములో బంగారముగా ఉన్నది, ఉంగరము (ఆభరణము)గా ఉన్నది… రెండూ కూడా బంగారులోహమే కదా! బంగారమే ఉంగరము ఓతము (Made up of) - ప్రోతము (Made as) కదా!

అట్లాగే..,
ఓంకార సంజ్ఞార్ధమగు మనందరియొక్క అఖండమగు ఆత్మయే, బ్రహ్మమే, జ్యోతి స్వరూపమే - సత్యము. బాహ్య అంతరంగములలో ఈ సర్వము నందు ఓతము (Made up of) -ప్రోతము (Made as)గా ఉన్నది ఆత్మయే అని గమనించండి!
ఆత్మయే నిత్యము. సత్యమైనది మాత్రమే నిత్యము. మిగతాదో? అనిత్యము। అసత్యము। (న తు సత్యమిహ అణ్వపి)

- - -


అట్టి ఆత్మను ‘ఓం’ అను శబ్దోచ్ఛారణచే ధ్యానించండి!

ఓంకార ధ్యానముచే ఆత్మయే పొందబడగలదు. ‘‘నేను సహజముగా ఆత్మస్వరూపుడను’’ అనబడునది ఆస్వాదించబడగలదు!

ఇదియే తత్త్వ సారము! తత్త్వశాస్త్ర ప్రవచనము. వేదమహావాక్యార్థము కూడా.

ఇదియే మరొక విధముగా ఇట్లా చెప్పబడింది-

ఆత్మపురుషుడే పంచవిధములుగా (దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారాలుగా), (దృశ్యము - దేహము - ప్రాణము - జీవాత్మ- ఈశ్వరుడు) తెలియబడుచున్నాడు. ఇవన్నీ ఆత్మపురుషుని వివిధ రూపములుగా తెలుసుకొనబడును గాక!

ఆత్మయే ఊర్థ్వమూలమ్! సర్వమునకు మూలము (Basis).

బ్రహ్మము అనే ఆ ఆత్మ యొక్క శాఖలు → ఆకాశము, వాయువు, అగ్ని, ఉదకము, భూమి. ఏకమగు బ్రహ్మమే అనేకముగా రూపములు దాల్చుచున్నది.

ఆ ‘ఓం’ కారామే ఆదిత్యస్వరూపము, అక్షరము. అనేకముగా కనిపిస్తూ ఏకరూపమై ఉన్నట్టిది. ఆత్మజ్ఞులకు ఏకముగానే అనిపిస్తూ ఉన్నట్టిది.

అట్టి ‘ఓం’ లేక ఆదిపురుషునే ధ్యానము చేయాలి.

సర్వము ఓంకారరూపముగా భావన చేయాలి. ఉపాసించాలి.

ఏతదేవ అక్షరమ్ పుణ్యమ్। అట్టి అక్షర పరబ్రహ్మోపాసనచే అన్ని పుణ్యాలు వాటికవే లభిస్తాయి. ఏతదేవ అక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్యతత్। బ్రహ్మమును ఉపాసించువాడు ఇచ్ఛగించినది పొందగలడు!

స్వస్వరూపమే ఓంకారము. స్వదేహము ‘ఓం’కారమును భజించు మందిరము.

ఆత్మయే కాల రూపమున - భూత, వర్తమాన, భవిష్యత్ రూపముగా సంప్రదర్శనమగుచున్నది.

ఆత్మయే (ఓంకారమే) ప్రాణ-అగ్ని-సూర్య రూపములుగా కనిపిస్తోంది.

ఆత్మ యొక్క ఆప్యాయతయే అన్నము, జలము, చంద్రుని రూపములు.

మనో-బుద్ధి-చిత్త-అహంకారములు వస్తుతః జడములు. అవన్నీ కూడా చేతనముల వలె ప్రవర్తిస్తున్నది-ఆత్మయొక్క చైతన్యత్వము చేతనే!

ఆత్మయే ‘ప్రాణవతి’ అయి, ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన సమానరూపములుగా సమస్త దేహములను సముత్తేజపరుస్తోంది.

ఈ విధంగా ఏకమగు బ్రహ్మమే.., ఓంకారము. ఆత్మయే బ్రహ్మగానము. ఉద్గీథము, రూపవతి. భాసవతి. త్రిమూర్తవతి. అగ్నివతి. వేదవతి. లోకవతి. కాలవతి. ప్రతాపవతి. ఆప్యాయవతి. చేతనవతి. ప్రాణవతి.

నీ రూపము నా రూపము: సర్వుల సహజరూపము కూడా - బ్రహ్మయే।

ఆత్మయే ప్రస్తోత (ఋత్విజుడు, వేదగానము చేయువాడు), అర్పితము (గానము, సమర్పించబడునది) కూడా. దేహి, దేహము, దృశ్యము కూడా ఆత్మయే!

ఇట్లు భావించటమే ఓంకారోపాసన!

ఏతద్వై సత్యకామ పరంచ - అపరంచ-యత్ ‘ఓం’ ఇతి ఏతత్ అక్షరమ్ - ఇతి।

ఓంకారోపాసకుడగు సత్యకామునకు ఆత్మయే పర-అపరరూపములుగా అనుభూతమగుచున్నది!

ఓంకారమే (ఆత్మయే) అక్షరము! మార్పు-చేర్పులు లేనిది!

తదితరమైనదంతా క్షరము. మార్పు చెందు స్వభావము కలిగి ఉన్నట్టిది. స్వతఃగా ఉన్నది కాదు. కల్పిత సందర్భములకు చెందినది మాత్రమే.

Ⅰ. ఓం। భూర్భువస్సువః।

ఆత్మయే ప్రజాపతి. ఆయన సృష్టికి పూర్వమే ఉన్నట్టివారు.

కర్త → కర్మకు మునుముందే ఉండి ఉండాలి కదా!

అట్టి ఆత్మభగవానునికి (ప్రజాపతికి) ‘‘ఏకమగు నేను అనేకమును కల్పించుకొని ఆస్వాదించెదనుగాక!’’… అనే ఉత్సుకత కలిగింది. అప్పుడు తపస్సు చేయనారంభించి (తపనను ఆశ్రయించినవారై) ‘‘భూ-భువ-స్సువః’’… అని ఉచ్ఛరించారు (అనువ్యాహరన్). ఆ స్వరమే లోక తనువు. స్వరకర్తయే లోకపతి.

→ లోకపతి ఆత్మయే. ప్రజాపతి కూడా ఆతడే.

→ లోకతనువు - ఆత్మపురుషుని తనువే.

స్వర్లోకము      ...     ఆ లోకపురుషుని శిరస్సు. (అనుభవి).  
భూలోకము       ...     ఆయన పాదములు (అనుభవమగుచున్నది).  
భువర్లోకము      ...     ఆయన నాభి (అనుభవము, అనుభూతి).  
ఆదిత్యుడు (సూర్యుడు)  ...     ఆయన చక్షువులు. (అనుభవియొక్క మునుముందే గల ‘‘ఆదిత్య స్వరూపము’’).  
దేహియే          ...     ఆ పురుషుడు.  
పంచతన్మాత్రలు     ...     ఆయన దృష్టి సారిస్తున్న ప్రదేశాలు. ఆయన సంచరించే స్థానాలు.  
                (శబ్ద-స్పర్శ-రూప-రస-గంథములు)  
సత్యము (సత్‌భావన)   ... ఆయన దృష్టి.  
చూపు            ...     ఆయన ఉనికి స్థానము!

అందుచేత ఆ పరమాత్మను ‘‘భూర్భువస్సువః’’ అను వ్యాహృతి గాయత్రీ మంత్రముయొక్క అంతర్విభాగమై, ప్రాజ్ఞులచే ఉపాసించబడుతోంది!

ఆస్వాదించబడేదంతా ‘అన్నమ్’ అను శబ్దముచే ఉద్దేశ్యించబడుతోంది. ఊహ ఊహించువాని రూపమేకదా!
అట్లాగే అన్నమే ప్రజాపతి.

ఆ పరమాత్మను…,
- అన్నమ్ (అనుభవించబడుచున్నదంతా)।
- ప్రజాపతి।
- విశ్వాత్మా।
- విశ్వచక్షుః।
అని ఉపాసించబడుగాక। తద్వారా ఉపాసించువాడు సర్వము తానే అగుచున్నాడు.

ఈ కనబడేదంతా ప్రజాపతి యొక్క తనువుగా భావించాలి.

ఈ సర్వమునందు ప్రజాపతి హృదయాంతరంగుడై, తనయందే ఈ సర్వము కలవాడై.., బంగారు ఆభరణములోని బంగారము వలె, అంతర్హితుడై ఉన్నారు.

ఇదంతా ప్రజాపతి (ఆత్మ) యందే ఉన్నది.

ఆత్మయే... ఇద్దాని అంతర్లీన తత్త్వము.  
ఆత్మయే... ఇదంతా.

ఈ విధంగా పరమాత్మను ఉపాసించాలి. అప్పుడు ఆ జీవునికి తన పరమాత్మత్వము తనయందే, క్రమంగా నిత్యానుభూతము కాగలదు.


Ⅱ. ‘‘తత్ సవితుః వరేణ్యమ్’’

- ఇత్యసౌ వా ఆదిత్యః సవా ఏవం ప్రవరణాయ ఆత్మకామేన - ఇత్యాహుః బ్రహ్మవాదినో।

బ్రహ్మమును నిర్వచించు బ్రహ్మవాదులు ‘‘ఇదంతా స్తోత్రము చేయతగినవాడు, ఆరాధనకు అర్హరులగు ఆ సవితృ పరమాత్మయే’’ అని చేతులెత్తి గానం చేస్తున్నారు. (సవితృ = సత్ + విత్ + ఋత్)

… అని బ్రహ్మవాదులు నిర్వచిస్తున్నారు.

కనుక,
నిర్వికారము - నిరంజనము అగు ఓంకార స్వరూపుడనగు నేను…..,

→ ఆస్వాదిస్తున్నాను…..
అను అవగాహనతో వరేణ్యుడగు సవితృ దేవతోపాసన చేయుచుండెదరు గాక।


Ⅲ. ధియో యోనః ప్రచోదయాత్

ఇతి బుద్ధయోవై ధియస్తాయో అస్మాకం ప్రచోదయాత్ - ఇతి ఆహు బ్రహ్మవాదినో।

ఆ ప్రేరేపణచే మా బుద్ధితో సత్యమును దర్శించటము,

చూచి తెలుసుకోవటం, తెలుసుకొని ప్రవేశించటము,

ప్రవేశించి తదభిన్నంగా, తన్మయముగా అవటం…,

ఇదియే గాయత్రీ మంత్రము యొక్క పరమార్థమగు ఫలశ్రుతి విభాగము।


Ⅳ. భర్గోదేవస్య

అథ ‘భర్గ’ ఇతియో హ వా అస్మిన్ అదిత్యే నిహితః।

అస్మిన్ అక్షిణిచ నిహితః తారకేవ భర్గః। కంటిలో చూపు రూపమున దాగి ఉన్నవాడే భర్గుడు.

‘భర్గోదేవస్య’ అనునప్పుడు నా కళ్ళలో చూపు (చూచే) శక్తి స్వరూపము - అని ఉపాసించుచున్నాము.

‘‘ఓ కంటిలోని దృష్టి శక్తి స్వరూపుడా! భర్గుడా! భర్గోదేవస్య!’’ - అని గానము చేయుచున్నాము.

ఏష భర్గాఖ్యో భా-భిర్గతిః అస్యహి - ఇతి భర్గో! కనులు - అనే ఉపకరణము నుండి ‘చూపు’ అనే శక్తి స్వరూపముగా బహిర్గతుడై దృశ్యము నందు గమనము కలవాడు కాబట్టి ‘భర్గుడు’… అని గానం చేయబడుచున్నాడు!

భర్జతి వైష ‘భర్గః’ ఇతి। ‘దృశ్యము’ అను తేజోరూపముగా కనులకు (దృష్టికి) ఎదురుగా కనిపించువాడు కాబట్టి భర్గుడు.
సర్వమును ‘ఎరుక’ రూపముగా వెలిగించుచున్నట్టివాడు. కనుక భర్గుడు.

అనగా, ఆత్మను..,
→ కనులలో వేంచేసి ఉన్న ‘దృక్-చూచువాడు’ అనే కారణ రూపంగాను,
→ ‘చూపు’ అను రూపముగా బహిర్గతమగుచున్న ప్రేరణ రూపముగాను,
→ ‘దృశ్యము’ అను కార్య రూపముగాను,
ఉపాసించటమే ఆత్మోపాసన!

‘భర్గోదేవస్య’.. అని ఉచ్ఛరించేడప్పుడు - ‘‘చూచువాడుగా, చూపుగా, చూడబడునదిగా ఏర్పడి ఉన్న ఓ భర్గోదేవా!’’ అను వర్ణనను మననము చేస్తున్నాము.

ఉపసంహార రూపుడు కూడా అయి ఉండటం చేత భర్గుడే రుద్రుడు కూడా! ‘‘ఇతి రుద్రో, అథ భర్గ ఇతి’’ బ్రహ్మవాదినః। - అని బ్రహ్మవాదులు ‘భర్గః’ శబ్దమును వ్యాఖ్యానిస్తున్నారు!

భర్గ - ఇతి భాసయతి ఇమాన్ లోకాన్ భర్గః । - ఈ లోకములన్నిటినీ భాసింపజేయుచుండటము చేత, భావమును, భావార్థములను, దృశ్యమునకు ప్రసాదిస్తూ ఉండటం చేత (బుద్ధి స్వరూపులై దృశ్యమును అనుభవముగా మరల్చుచుండటము చేత) ‘‘భర్గుడు’’.

భర్గ-ఇతి భాసయితి ఇమాన్ లోకాన్ । - ఈ లోకములన్నీ భాసింపజేయువాడు - భర్గుడు.

రంజయతి ఇమాని భూతాని। - ఈ జీవులందరికీ దృశ్యముగా అనుభూతమగుచు, సర్వులను ఆనందింపజేయటము చేత
‘‘భర్గుడు’’ → అని కూడా ‘భర్గోదేవస్య’ అని అంటున్నప్పుడు భావన.

గచ్ఛైతి గచ్ఛాతా ఇమాః ప్రజాః యస్మిన్ → మీరు, నేను, సర్వజీవులు ఎందు నుండి బయల్వెడులుచున్నారో… ఆయనయే భర్గుడు.

న ఆగచ్ఛతి ఇమాః ప్రజాః → ఎందులో ఉండి, ఏ మాత్రము వేరుగా అవటం లేదో, బయటకు.. వెళ్లటం లేదో… ఆతడే భర్గుడు.

భారకత్వాత్ భర్గః → సర్వమును భరించువాడు కాబట్టి భర్గుడు.
భర్గుడే సూర్యుడు, ఆదిత్యుడు, పావనుడు సవనుడు కూడా! జీవులలో ‘నేను’ భావన రూపుడుగా ప్రత్యక్షమై ఉన్నవారు-కాబట్టి భర్గుడు.

సూర్యః

శత్రూన్ తు సూయమానత్వాత్.. సూర్యః! సవిత్రు దేవత యొక్క ప్రత్యక్ష రూపమే సూర్యుడు. ‘అజ్ఞానము’ అనే దుఃఖ-బంధ భావనాకారకమగు అంతశ్శత్రువును జయింపజేస్తారు కనుక సూర్యుడు.

ఈ అవగాహనతో కూడిన మనస్సుతో సూర్యోపాసన చేస్తున్నాము.!

సవనాత్ సవితా → సవన-స్వరూపుడు (యజ్ఞ పురుషుడు) అగుటచే సవితుడు. తనకు వేరైనదంతా తానే స్వీయకృతంగా చూస్తున్నారు కనుక సవితుడు!

ఆదానాత్ ఆదిత్యః → సర్వమును గ్రహిస్తున్నారు కనుక ఆదిత్యుడు.

పవనాత్ పావమానో → సర్వము పవిత్రము చేస్తూ ప్రసరిస్తున్నారు కాబట్టి పావమానుడు.

అథయో ఆధాయనాత్ ఆదిత్యః → సర్వమునకు ఆధారము - స్థానము కల్పించువాడు అవటం చేత కూడా ఆదిత్యుడు.

ఈ రీతిగా గాయత్రీమంత్రార్ధము వివరించబడుతోంది. ఇట్టి అవగాహన బుద్ధియందు ప్రేరేపించుకుంటూ సావిత్రీ (సవిత్రు-సత్+విత్+ఋత్) సరస్వతీ (సత్-రసత్) స్వరూప గాయత్రీ మంత్రమును ఉచ్ఛారణతో కూడుకొనిన ఉపాసన నిర్వర్తిస్తూ రాగా, ఆత్మత్వము అనుభూతము కాగలదు.

* * *

ఆత్మకు ఆత్మయే వాస్తవానికి మధురము. తదితరమైనదేదీ శాశ్వతంగా మాధుర్యము కాదు! ఆత్మ అమృతస్వరూపము!

ఆత్మయే -
చేతా → చేతనాస్వరూపము.
మంతా → మననము చేయువాని స్వస్వరూపము.
గంతా → మననముచే పొందబడునది ఆత్మయే.
స్రష్టా → జగత్ కల్పన నిర్వస్తున్నది ఆత్మయే.
ఆనందయతా → ఆత్మ ఆనంద స్వరూపమై, తన ఆనందము కొరకే స్రష్టా (సృష్టికర్త) ఇత్యాదులుగా అగుచున్నది.
కర్తా → సర్వమునకు కర్త ఆత్మయే.
వక్తా → పలుకులన్నీ పలుకుచున్నది (The speaker behind speach) - ఆత్మయే.
రసయితా → జలంలో రుచిలాగా ఈ సర్వమునకు రసస్వరూపము ఆత్మయే.
ఆఘ్రాతా → వాసన చూస్తూ ఆస్వాదిస్తున్నది ఆత్మయే.
విభుః → సర్వమునకు యజమాని (Owner) విభుడు ఆత్మయే.
విగ్రహే → విగ్రహస్వరూపుడు, నామరూపాత్మకుడు ఆత్మయే. సమస్త విశ్వము తన శరీరముగా కలవాడు.
సన్నివిష్టా → ఆత్మయే సర్వదా సర్వత్ర సర్వమునందు సర్వముగా వేంచేసి ఉన్నవారు. సామీప్యముచే సమస్తమును చేతన పరచువారు. సర్వత్రా ఆసీనుడై ఉన్నవారు.

ఈ రీతిగా గాయత్రీ మంత్ర మననము ద్వారా ఆత్మోపాసన ఉద్దేశ్యించబడుతోంది!

* * *

ఏకమగు ఆత్మ సర్వదా ఏకమే. అనేకముగా అగుట లేదు. ద్వైతముగా కనబడునదంతా ఏకమగు ఆత్మయే.

ద్వైతముగా కనబడుచున్నప్పుడు ద్వంద్వముగా (రెండుగా) అనిపిస్తోంది.
→ వింటున్నవాడు - వినబడునది.
→ చూస్తున్నవాడు - చూడబడుచున్నది,
→ విజ్ఞాని - విజ్ఞానము.
గా కనబడుతోంది!

ద్వైతీభూతుడైనప్పుడు → ఆత్మ గురించే విజ్ఞాతవ్యమ్!

ఆత్మ అనిర్వచనీయము. అనౌపమ్యము (ఉపమానములచే చెప్పబడజాలనిది). కార్య-కారణరహితము. నిరూపించి చూపబడ జాలనిది (నిరుపాఖ్యమ్!).

మరి ఇంక మాటలతో ఏమని చెప్పగలము?

కిం తత్ అంగవాచ్యమ్?

ఓ వాలఖిల్యాది మునులారా! మీయందు, నాయందు, సర్వజీవులయందు, స్థాణువులయందు, పంచభూతములయందు, సర్వమునందు - (కథాగమనమునకు ఆ కథా రచయిత వలె) ఆధారభూతుడై ఉన్నవాడే ఆత్మ. ఆత్మయే ఈ సర్వము. ఈ సర్వము ఆత్మకు అభిన్నము.

ఆత్మయే ఈశానుడు. శంభుడు. రుద్రుడు. ప్రజాపతి. విశ్వసృష్టిస్వరూపుడు. హిరణ్యగర్భుడు. సత్యుడు. నిత్యుడు. ప్రాణస్వరూపుడు. - ప్రాక్ స్వరూపుడు। పరమహంస। సోహ-మ్-హంసోఽహమ్। శాస్త। సర్వమును శాశించువాడు।

విష్ణువు। నారాయణుడు। అర్కుడు (సూర్యుడు)। సవిత। దాత। విధాత। సామ్రాట్। ఇంద్రుడు। చంద్రుడు కూడా।

ఇవన్నీ తాను కాకుండానే యథాస్థానములో ఉంటూనే, ఇవన్నీ తానే అయినవాడే ఆత్మ. ఆత్మయే రమ్యము. గమ్యము.

య ఏష తపతి। సర్వమును తపింపజేస్తున్నవాడే ఆత్మ.

ఆత్మపురుషుడు తనను తానే తన యొక్క ఆనంద స్వరూపమును అగ్ని చేతను, సహస్రాక్షుడగు ఇంద్రుని (లేక ఇంద్రియ కార్యక్రమముల యజమాని) రూపము చేతను, హిరణ్మయము (సృష్టి కర్తృత్వము) రూపము చేతను కప్పి ఉంచుకొని జీవుని వలె వ్యవహరిస్తున్నారు.

అట్టి స్వస్వరూపాత్మ స్వరూపమే మనమందరము. ఇదే సర్వదా ఎరుగవలసినది. విజ్ఞాసితవ్యో।

సర్వదా వెతకవలసినది ఆత్మకొరకే. అన్వేషితవ్యః।

సర్వభూతే భ్యో అభయం దత్వా। ఆత్మయే, ఆత్మాన్వేషణయే, ఆత్మజ్ఞానమే, ఆత్మతో అద్వితీయత్వమే → సర్వజీవులకు అభయము ప్రసాదించగలిగిన స్థానము.

మరల గుర్తు చేస్తున్నాను!

అరణ్యమునకు (ఏకాంతమునకు) వెళ్ళండి. వెళ్లి ఇంద్రియార్ధములన్నీ మీకు సంబంధించని బాహ్యవస్తువులుగా చూస్తూ ఉండండి.
చివరికి ఆ ఆత్మను మీ శరీరము నందే అన్వేషించి (వెతికి) విశ్లేషించి బుద్ధితో పట్టుకోండి. సమస్తము స్వస్వరూపాత్మ యందే దర్శించండి.

మీ ఆత్మయే (ఆత్మపురుషుడే)
→ ఈ విశ్వము యొక్క రూపము.
→ సర్వస్థితి-గతులు ఆయన యొక్క సంపదయే. ఆయనకు చెందినవే.

ఆత్మదేవుడే జాతవేదసుడు. అగ్ని స్వరూపుడు. పరాయణుడు. అందరు పారాయణము చేస్తున్నది ఆయననే.

ఈ కనబడే జీవులంతా జ్యోతిరూపాలయి ఉండగా, ‘‘ఆత్మ భగవానుడు అఖండజ్యోతి స్వరూపుడు’’ - అని భావిస్తూ గ్రహించండి!

ఒక దీపముతో అగ్ని (జ్యోతి) ఆద్యంతాలు పొందదుకదా! అట్లాగే, ఆత్మ దేహముతో ఆద్యంతాలు పొందదు. సర్వమును తపింపజేయువాడు ఆ ఆదిపురుషుడగు ఆత్మజ్యోతి స్వరూపుడే.

వేలాది కిరణములతో (జీవాత్మలుగా) వందలాది చోట్ల వర్తిస్తున్నవాడు. సర్వజీవులకు ప్రాణప్రదుడు.

సర్వజీవులలో సర్వదా ఉదయిస్తున్నది, నిత్యోదయుడై ఉన్నది - ఆ ఆత్మ సూర్యుడే.

తత్ స్వస్వరూప-సర్వస్వరూప-నిత్యసత్య- అప్రమేయ ఆత్మ భగవానునికి నమస్కరిస్తున్నాను.

* * *

గురుదేవులగు మైత్రేయులవారి వద్ద శ్రవణం చేసియున్న శ్రీశాకాయన్య మహర్షి వివరించి చెప్పిన, శ్రీ మైత్రాయ మహర్షి ప్రవచితమైన - ‘‘ప్రజాపతి-వాలఖిల్యాది మునుల సంవాదము’’ విని ఇక్ష్వాకు వంశజ్ఞుడగు బృహద్రథమహారాజు పరమానంద భరితులైనారు. స్వస్వరూపమగు ఆత్మ ఎట్టిదో ఎరిగినవారై ఆత్మసాక్షాత్కారం ఆస్వాదించసాగారు.

అట్టి స్వస్వరూప ఆత్మమహిమను సుస్పష్టపరచినట్టి సద్గురు వరేణ్యులగు శ్రీ శాకాయన్య మహర్షులవారికి చరణాలను కృతజ్ఞతతో స్పృశించి కళ్ళకు అద్దుకుంటున్నాము.


ఏకాదశ రుద్రులు

మార్కండేయ పురాణము : బ్రహ్మ వైవర్త పురాణము : సృష్టిని నిర్వర్తించటానికై బ్రహ్మ - తన మనస్సునుండి జనింపజేసిన బ్రహ్మమానసపుత్రులకు సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనస్సుజాతుడు మొదలైనవారు - ఒకప్పుడు ఊర్థ్వరేతస్కులై, సృష్టికార్యము నిర్వర్తించటమును నిరాకరించసాగారు. అప్పుడు బ్రహ్మకు కోపమువచ్చింది. సృష్టి కొనసాగటానికై తానే తన లలాటమునుండి స్త్రీ-పురుషరూపములు దాల్చారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుని లలాటమునుండి ఏకాదశరుద్రులు జన్మించారు.

(1) మహత్తుడు (2) మహాత్మ (3) మతిమంతుడు (4) భీషణుడు (5) భయంకరుడు (6) ఋతధ్వజుడు (7) ఊర్థకేశుడు (8) పింగళాక్షుడు (9) రుచి (10) శుచి (11) కాలాగ్ని రుద్రుడు.

భారతము : సురభికి మార్తాండునివలన జనించిన ఏకాదశరుద్రులు (1) అజపాదుడు (2) అహిర్బుధ్న్యుడు (3) త్ర్యంబకుడు (4) వృషాకపి (5) శంభుడు (6) జపాలి (7) రైవతుడు (8) హరుడు (9) బహురూపుడు (10) ఉగ్రుడు (11) విశ్వరూపుడు.


ద్వాదశ ఆదిత్యులు

భాగవతము : శ్రీమన్నారాయణ స్వరూపుడైన సూర్యుడు సర్వదా ఏకస్వరూపుడే. కాల-దేశ - క్రియ మొదలైన భేదముల దృష్ట్యా అనేక క్రమములను ఋషులు వర్ణించారు. ఒక్కొక్క మాసములో సూర్యుడు ఒక్కొక్క పేరుతో ఉపాసించబడుచూ ఉంటారు.

మాసము
సూర్యుని నామధారణ
అప్పటి సూర్యుని పరిజనము
1. చైత్రము ధాత కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురుడు.
2. వైశాఖము అర్యముడు పులహుడు, భోజుడు, ప్రహేలి, పూజికస్థలి, నారదుడు, కంజనీరుడు.
3. జ్యేష్ఠము మిత్రుడు అత్రి, పౌరుషేయుడు,తక్షకుడు, మేనక, హాహా, రథస్వనుడు.
4. ఆషాఢము వరుణుడు వసిష్ఠుడు, రంభ, సహజన్యుడు, హూహువు, శుక్రుడు, చిత్రస్వనుడు.
5. శ్రావణము ఇంద్రుడు విశ్వావసువు, శ్రోత, ఏలాపుత్రుడు, అంగీరసుడు, ప్రమ్లోచి, చర్ముడు.
6. భాద్రపదము వివస్వంతుడు ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, ఆసారణుడు, భృగువు, అనుమ్లోజుడు, శంఖపాలుడు.
7. ఆశ్వయుజము త్వష్ట (ఋచీక తనయుడు) కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు, ఇషంభరుడు.
8. కార్తీకము విష్ణువు అశ్వతరుడు, రంభ, సూర్యవర్చసుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఘోపేతుడు.
9. మార్గశిరము తర్యముడు కశ్యపుడు, తార్ష్యుడు, ఋతసేనుడు, ఊర్వశి, విద్యుచ్ఛతువు, మహాశంఖుడు.
10. పుష్యము భగుడు స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊరుణాడు, ఆయువు, కర్కోటకుడు, పూర్వజిత్తి.
11. మాఘము పూషుడు ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతాచి, గౌతముడు.
12. ఫాల్గుణము క్రతువు వర్యసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు.

ఇతి మైత్రాయణి ఉపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।