[[@YHRK]] [[@Spiritual]]

Vajrasūchika Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


సామవేదాంతర్గత

12     వజ్రసూచికోపనిషత్

(లేక) వజ్రసూచ్యుపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



చిత్సదానందరూపాయ సర్వధీవృత్తిసాక్షిణే .
నమో వేదాంతవేద్యాయ బ్రహ్మణేఽనంతరూపిణే ..
శ్లో।। చిత్ సదానంద రూపాయ-సర్వ ‘ధీ’ వృత్తి సాక్షిణే।
నమో వేదాంత వేద్యాయ-బ్రహ్మణే, అనంతరూపిణే।।
ఓ చిత్ - సదానందరూపా। సమస్త జీవుల బుద్ధి వృత్తుల సాక్షి స్వరూపా! వేదాంతవేద్యా! అనంతరూపా! పరబ్రహ్మమా! నమో నమః

యజ్ఞానాద్యాంతి మునయో బ్రాహ్మణ్యం పరమాద్భుతం .
తత్రైపద్బ్రహ్మతత్త్వమహమస్మీతి చింతయే ..
శ్లో।। యత్ జ్ఞానాత్ యాంతి మునయో-బ్రాహ్మణ్యమ్ పరమాద్భుతమ్, తత్ త్రైపద బ్రహ్మతత్త్వమ్-అహమస్మి- ఇతి చింతయే।।
‘‘ ఏ జాగ్రత్ స్వప్న సుషుప్తి త్రిపదములకు, త్రైలోక్యములకు ఆవలగల బ్రహ్మతత్త్వమును తమ తపో-ధ్యానములచే ఎరిగిన మునివరేణ్యులు అట్టి పరమాద్భుత తత్ స్థానముగా ప్రకటించుచున్నారో - అట్టి పరమాత్మతత్త్వమే నేనైయున్నాను’’- అను అనుచింతన చేయుచుండెదము గాక।



ఓం వజ్రసూచీం ప్రవక్ష్యామి శాస్త్రమజ్ఞానభేదనం .
దూషణం జ్ఞానహీనానాం భూషణం జ్ఞానచక్షుషాం .. 1..
ఓం।
1. వజ్రసూచీం ప్రవక్ష్యామి-
శాస్త్రమ్ అజ్ఞాన భేదనమ్।
దూషణం జ్ఞాన హీనానాం।
భూషణం జ్ఞానచక్షుషామ్।।
అజ్ఞానమును మొదలంట్లా ఛేదించగలిగినట్టిది, జ్ఞానహీనత్వము (జ్ఞానరాహిత్యము)ను దూషించి దులిపివేయునది, జ్ఞానచక్షువులు కలవారికి ఆభరణమై ప్రకాశించగలిగినది, ఆత్మజ్ఞాన ప్రతిపాదకము అయినట్టి వజ్రపు సూచిక (సూది)తో సమానమైన శాస్త్ర సమన్వయ విశేషము ఇప్పుడు చెప్పుకుంటున్నాము.

బ్రాహ్మక్షత్రియవైష్యశూద్రా ఇతి చత్వారో వర్ణాస్తేషాం వర్ణానాం బ్రాహ్మణ ఏవ
ప్రధాన ఇతి వేదవచనానురూపం స్మృతిభిరప్యుక్తం .
తత్ర చోద్యమస్తి కో వా బ్రాహ్మణో నామ కిం జీవః కిం దేహః కిం జాతిః కిం
జ్ఞానం కిం కర్మ కిం ధార్మిక ఇతి ..
2. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రా
ఇతి చత్వారో వర్ణాః।
తేషాం వర్ణానాం ‘బ్రాహ్మణ’ ఏవ ప్రధాన।
- ఇతి వేదవచనానురూపం।
- స్మృతిభిః అపి ఉక్తమ్। (అప్యుక్తమ్)।
తత్ర చోద్యమస్తి।।
చతుర్వేదములు, స్మృతులు, పురాణములు ఈ విధంగా చెప్పుకొస్తున్నాయి.

వర్ణములు → బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్రులనబడు నాలుగు విధములైనవని. వీటిలో బ్రాహ్మణవర్ణము ప్రధానమైనది.

అట్టి వాక్యముయొక్క ఉద్దేశ్యమేమిటో అందులోని విశేషము ఎటువంటిదో - విచారణ చేయవలసినదై ఉన్నది.
3. కోవాబ్రాహ్మణో నామ?
కిం జీవః?
కిం దేహః?
కిం జాతిః?
కిం జ్ఞానం?
కిం కర్మ?
కిం ధార్మికః? - ఇతి
వేద-ఇతిహాస పురాణములలో చెప్పుచున్న ‘‘బ్రాహ్మణుడు’’ అనగా ఎవరు? ఎవరినిని ఆ పేరుతో చెప్పుతూ, ‘ప్రధానుడు’ అని అంటున్నారు?
- ఆతడు అందరివంటి జీవుడేనా? కాదా? ఏ జీవుడు ‘బ్రాహ్మణుడు’గా అనబడుచున్నారా?
- దేహము దృష్ట్యా (జన్మతఃగా) బ్రాహ్మణుడుగా చెప్పబడుచున్నారు?
- జాతిచేత ఒకడు బ్రాహ్మణుడని వేద - స్మృతుల ఉద్దేశ్యమా?
- లేక ఒకని ‘జ్ఞానము’ను అనుసరించి ఆతడు ‘బ్రాహ్మణ’ నామధేయమునకు అర్హుడగుచున్నాడా?
కాక ‘‘ఈ ఈ కర్మలు నిర్వర్తించు వారు బ్రాహ్మణులు. కర్మలచేత బ్రాహ్మణులగుచున్నారు?’’….అనునది వేద - స్మృతులు అభిప్రాయమా?
- అట్లా కాకుండా ఒకడు ఆచరించే దాన ధర్మమును అనుసరించి బ్రాహ్మణుడని నిర్వచనమా? (ధార్మికతను అనుసరించియా?)

తత్ర ప్రథమో జీవో బ్రాహ్మణ ఇతి చేత్ తన్న . అతీతానాగతానేకదేహానాం
జీవస్యైకరూపత్వాత్ ఏకస్యాపి కర్మవశాదనేకదేహసంభవాత్ సర్వశరీరాణాం
జీవస్యైకరూపత్వాచ్చ . తస్మాత్ న జీవో బ్రాహ్మణ ఇతి ..
4. తత్ర ప్రథమో జీవో
‘బ్రాహ్మణ’ ఇతి చేత్, తత్ న।
అతీతాన్ ఆగతాన్ అనేక దేహానాం
జీవస్య ఏకరూపత్వాత్।
జీవులలో జన్మానుసారము మొట్టమొద{గా పుట్టినవారు బ్రాహ్మణులా? కాదు. జీవులందరి జన్మలు ఒకతీరైనవే కదా।
‘బ్రాహ్మణుడు’ అనగా ఒక ప్రత్యేకమైన ‘జీవుడు’ అనునది సమాధానం కాదు. ‘జీవులలో ఒక విభాగము’ కాదు. జన్మతః వచ్చేది బ్రాహ్మణ్యము కాదు. దేహము దృష్ట్యా బ్రాహ్మణుడు ప్రత్యేకమైనవాడా? ‘జన్మనా జాయతే శూద్రః’ అని కదా స్మృతివాక్యము। అందుచేత ‘బ్రాహ్మణుడు’ - అనగా జీవులలో ఒక విశేషమైన దేహముకలవాడు కాదు.
అట్లాగే, ఒకానొక జీవునిపట్ల - గడచిపోయినట్టి, రాబోవునట్టి అనేక దేహములు జీవునికి సమానమైనవే గాని, ‘ఒక దేహము బ్రాహ్మణ దేహము, మరొకటి కాదు’ - అనునదేమీ ‘దేహి’కి ఉండదు.
ఏకస్యాపి కర్మవశాత్
అనేక దేహసంభవాత్
సర్వ శరీరాణాం జీవస్య
ఏకరూపత్వాత్ చ।
తస్మాత్ న జీవో ‘బ్రాహ్మణ’ ఇతి।।
జీవుడు సర్వదా ఒక్కడే అయి కూడా కర్మవశంగా ఆతనిపట్ల అనేక దేహములు సంభవిస్తూ ఉంటున్నాయి. (వస్తూ-పోతూ ఉంటున్నాయి).
ఒక జీవుడు పొందే అన్ని దేహములలోను జీవుడు ఏకరూపుడేగాని, ఒక్కొక్కదేహములో ఒక్కొక్కరూపుడుగా (Different to Different) అవడుకదా! అందుచేత ‘‘జీవులలో కొందరే బ్రాహ్మణులు’’ అనలేము. అట్టి ఒక దేహమును ఉద్దేశ్యించి ‘‘జీవులలో మొట్టమొదటి విభాగము బ్రాహ్మణులు’’ - అన వీలు కాదు.

తర్హి దేహో బ్రాహ్మణ ఇతి చేత్ తన్న . ఆచాండాలాదిపర్యంతానాం మనుష్యాణాం
పంచభౌతికత్వేన దేహస్యైకరూపత్వాత్
జరామరణధర్మాధర్మాదిసామ్యదర్శనత్ బ్రాహ్మణః శ్వేతవర్ణః క్షత్రియో
రక్తవర్ణో వైశ్యః పీతవర్ణః శూద్రః కృష్ణవర్ణః ఇతి నియమాభావాత్ .
పిత్రాదిశరీరదహనే పుత్రాదీనాం బ్రహ్మహత్యాదిదోషసంభవాచ్చ .
తస్మాత్ న దేహో బ్రాహ్మణ ఇతి ..
5. తర్హి దేహో ‘బ్రాహ్మణ’ ఇతి చేత్‌ న।
ఆచాండాలాది పర్యంతానాం
మనుష్యాణాం పాంచభౌతికత్వేన
దేహస్య ఏకరూపత్వాత్,
జరామరణ ధర్మ-అధర్మాది సామ్య దర్శనాత్,
ఒకని ‘‘భౌతిక దేహమును అనుసరించి ఈ జీవుడు ‘బ్రాహ్మణుడు’ (లేక) బ్రాహ్మణ దేహమును ఇప్పుడు ధరించుచున్నాడు’’ - అని కూడా అనలేము.
చండాలుడుగా చెప్పబడువాడు మొదలుకొని, ఏ మనుష్య దేహమైనా కూడా పృథివి-జల-తేజో-వాయు-ఆకాశములనబడే పంచభూతముల చేతనే నిర్మించబడుచున్నది. (ఎవ్వరి భౌతిక దేహమైనప్పటికీ పాంచభౌతిక నిర్మాణమే). కాబట్టి దేహములన్నీ ఏకరూపములే. ఒక ముక్కు, రెండు కళ్లు మొదలైనవి అందరికీ సమానమే కదా!
- భౌతిక దేహములన్నిటికీ జరామరణ - జన్మ కర్మ ధర్మములు ఒక తీరైనవే కదా!
‘‘బ్రాహ్మణః-స్వేతవర్ణః, క్షత్రియో - రక్తవర్ణః,
వైశ్యః - పీతవర్ణః, శూద్రః - కృష్ణవర్ణ’’ …
ఇతి నియమ-అభావాత్।
- ‘‘బ్రాహ్మణులంటే తెల్లగా ఉంటారు. క్షత్రియులు ఎర్రగా ఉంటారు. వైశ్యులు పసుపుపచ్చగా ఉంటారు. శూద్రులు నల్లగా ఉంటారు’’ అను నియమము ఏదీ శాస్త్రములచే, వేదములచే చెప్పబడటము లేదు. ప్రపంచములో అట్లా కనబడటము లేదు.
పిత్రాది శరీర దహనే పుత్రాదీనాం
బ్రహ్మహత్యాది దోష(q) సంభవాచ్చ।
తస్మాత్ న దేహో
‘బ్రాహ్మణ’ ఇతి।
ఒకవేళ పాంచ భౌతికదేహమునుబట్టి ఒకడు ‘బ్రాహ్మణుడు’ అని అనవలసి వస్తే, మరణానంతరము ఆయన దేహమును దహనము చేస్తున్నప్పుడు ఆ కుమారుడు మొదలైనవారికి ‘బ్రహ్మహత్యాదోషము’ ఆపాదిస్తామా? అట్లా అంటుతోందా? లేదే! అందుచేత జన్మతఃగాని, భౌతికదేహమును అనుసరించిగాని - ‘‘ఈతడు బ్రాహ్మణుడు. చాతుర్వర్ణ్యములలో శ్రేష్ఠుడు’’…అనే మాట కుదరదు.

తర్హి జాతి బ్రాహ్మణ ఇతి చేత్ తన్న . తత్ర
జాత్యంతరజంతుష్వనేకజాతిసంభవాత్ మహర్షయో బహవః సంతి .
ఋష్యశృంగో మృగ్యాః, కౌశికః కుశాత్, జాంబూకో జాంబూకాత్, వాల్మీకో
వాల్మీకాత్, వ్యాసః కైవర్తకన్యకాయాం, శశపృష్ఠాత్ గౌతమః,
వసిష్ఠ ఉర్వశ్యాం, అగస్త్యః కలశే జాత ఇతి శృతత్వాత్ . ఏతేషాం
జాత్యా వినాప్యగ్రే జ్ఞానప్రతిపాదితా ఋషయో బహవః సంతి . తస్మాత్
న జాతి బ్రాహ్మణ ఇతి ..
6. తర్హి జాతిః బ్రాహ్మణ
ఇతి చేత్, తత్ న।

తత్ర జాతి అంతర జంతుషు
అనేక జాతి సంభవాత్।
మహర్షయో బహవః సంతి।
ఋష్యశృంగో→ మృగః।
‘జాతి’ని బట్టి ఒకడు ‘బ్రాహ్మణుడు’ అని వేదముల ఉద్దేశ్యమా? కానే కాదు.
ఎందుకంటారా?
అన్ని జాతులలో బ్రాహ్మణులు ఉండవచ్చుకూడా।
ఒక జాతినుండి కాలక్రమేణా మరల అనేక జాతులు విస్తరించి లోక ప్రసిద్ధమై ఉన్నాయి. బ్రహ్మణునకు పుట్టినవాడు ‘బ్రాహ్మణుడు’ - అను జాతిక్రమవాక్యం లోక పరిభాష అవవవచ్చుగాక। అది వేదనిర్వచనమునకు
కౌశికః → కుశాత్।
జంబూకో→ జంబుకాత్।
వాల్మీకో → వల్మీకాత్।
వ్యాసః → కైవర్తక న్యాయామ్।
శశపృష్ఠాత్ - గౌతమః।
వసిష్ఠ - ఊర్వశ్యామ్।
అగస్త్యః - కలశే జాత।
సరిపోదు. ‘మహత్ ఋత్’ (పరమ సత్యమును) సిద్ధించుకున్న సుప్రసిద్ధులగు మహర్షుల జననముల గురించి అనేకవిధములైన చరిత్రలను పురాణములు అభివర్ణిస్తున్నాయి. వారందరు ‘బ్రాహ్మణ’ శబ్దముచే సగౌరవించబడుచున్నారు.

ఉదాహరణకు :
ఋష్యశృంగమహర్షి - జింక గర్భము నుండి జన్మించారు.
కౌశికమహర్షి - దర్భలనుండి పుట్టారు.
జంబూకమహర్షి - జంబూకము (నక్క) గర్భము నుండి పుట్టారు.
వాల్మీకి మహర్షి - మొట్టమొదట ‘రత్నాకరుడు’ అను పేరుతో ఒక ఆటవిక జాతివాడై, ఆ తరువాత వల్మీకము (పుట్ట)నుండి బయల్వెడలారు.
వ్యాసమహర్షి - కైవర్తక (జాలరి) న్యాయముచే చేపలు పట్టు వృత్తిగల మత్స్యగంథి గర్భము నుండి జనించారు.
గౌతమమహర్షి - శశి పృష్ఠము నుండి (కుందేటి వీపునుండి) పుట్టారు.
వసిష్ఠ మహర్షి - ఊర్వశి (అనే శ్రీమన్నారాయణుని తొడ నుండి పుట్టిన) అప్సరసకు పుట్టారు.
అగస్త్యమహర్షి - కలశము (కుండ) నుండి జన్మించారు.
ఇతి శ్రుతత్వాత్।
ఏ తేషాం జాత్యా వినాపి అగ్రే,
జ్ఞాన ప్రతిపాదితా
ఋషయో బహవః సంతి।
తస్మాత్ న జాతిః
బ్రాహ్మణ ఇతి।।
ఈ విధంగా శ్రుతులు ఏరులా - పారులా మహనీయుల జన్మలగురించి వర్ణించాయి. మరి జాతి భేదం చేత వారు బ్రాహ్మణులు కారా? అట్లా అన వీలు కాదు. వారు జాతి సంబంధరహితులు. కానీ బ్రాహ్మణశబ్దమును పుణికిపుచ్చుకుని ఉన్నారు.
వారందరూకూడా జన్మతః జాతిచేత బ్రాహ్మణులు కానప్పటికీ జ్ఞాన ప్రతిపాదనచే పూజ్యులగు బ్రాహ్మణులుగా - చారిత్రకంగాను, పౌరాణికం గాను, ఐతిహాసికంగాను ఆరాధ్యులు. ఇట్టి ఋషుల చరిత్రలు ఈ తీరుగా ఇంకెన్నెన్నో. అందుచేత ‘ఒకడు జాతి చేత బ్రాహ్మణుడు’ - అన వీలు కాదు.

తర్హి జ్ఞానం బ్రాహ్మణ ఇతి చేత్ తన్న . క్షత్రియాదయోఽపి
పరమార్థదర్శినోఽభిజ్ఞా బహవః సంతి . తస్మాత్ న జ్ఞానం బ్రాహ్మణ ఇతి ..
7. తర్హి జ్ఞానం ‘బ్రాహ్మణ’ ఇతి చేత్, తత్ న।
క్షత్రియ ఆదయోఽపి
పరమార్థదర్శినో అభిజ్ఞా
బహవః సంతి।
తస్మాత్ న జ్ఞానం ‘బ్రాహ్మణ’
ఇతి।
‘‘ఒకని వద్ద జ్ఞాన సమాచారము ఉన్నది. శాస్త్ర సారవిషయాలు ఆయనకు తెలుసు. జ్ఞానము చేత ఆతడు బ్రాహ్మణుడు’’ అని అందామా? అది కూడా అన వీలులేదు.
ఎందుకంటే శాస్త్రములు తెలిసినవారు, జ్ఞానసమాచారము కలిగి ఉన్నవారు జన్మతః బ్రాహ్మణులలోను, క్షత్రియులలోను, వైశ్యులలోను, శూద్రులలోను ఎందరో ఉన్నారు. పరమార్ధ విజ్ఞానము కలవారు ఎందరు ఏ జాతిలో లేరు? (ఉదాహరణకు భారతములో కౌశిక బ్రాహ్మణునకు వ్యాధుడు బోధించిన ‘‘వ్యాధగీత’’) అయితే, వారిని (శాస్త్రములలో) ‘బ్రాహ్మణులు’ అని అననరు. అందుచేత ‘‘జ్ఞానము చేత ఈతడు బ్రాహ్మణుడు’’ - అని కూడా సిద్ధాంతీకరించలేము.

తర్హి కర్మ బ్రాహ్మణ ఇతి చేత్ తన్న . సర్వేషాం ప్రాణినాం
ప్రారబ్ధసంచితాగామికర్మసాధర్మ్యదర్శనాత్కర్మాభిప్రేరితాః సంతో జనాః
క్రియాః కుర్వంతీతి . తస్మాత్ న కర్మ బ్రాహ్మణ ఇతి ..
8. తర్హి కర్మ బ్రాహ్మణ
ఇతి చేత్, తత్ న।

సర్వేషాం ప్రాణినాం
ప్రారబ్ధ - సంచిత - ఆగామి
కర్మ సాధర్మ్య దర్శనాత్।
కర్మాభి ప్రేరితాః ।
మరి ‘‘కర్మలను అనుసరించి ఈతడు బ్రాహ్మణుడు’’ అని అనగలమా? లేదు. అనలేము.
సమస్త ప్రాణులూ కూడా ప్రారబ్ధము - ఆగామి - సంచితములనబడే కర్మలు సాధర్మర్మ్యములు (సంగతి - వ్యవహారములు) కలిగియే ఉంటున్నారు. త్రిగుణాత్మకంగా కర్మలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ‘‘బ్రాహ్మణునకు అట్టి త్రివిధ కర్మలు ఉండవు. క్షత్రియ వైశ్య సూద్రులకైతే ఉంటాయి’’ అనునదేమీలేదు. అసలు ఆగామి-సంచిత-ప్రారబ్ధ - ఇత్యాదులన్నీ ప్రకృతికి సంబంధించినవి గాని ఆత్మకు సంబంధించినవేకావు. ప్రకృతి చేత కర్మ
సంతో జనాః క్రియాః కుర్వంతి।
ఇతి।
తస్మాత్ న కర్మ బ్రాహ్మణ ఇతి।
ప్రేరితులై జీవులందరు కర్మలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. (ప్రకృత్యైవ చ కర్మాణి క్రియ మానాని సర్వశః). అందుచేత ‘‘కర్మలను అనుసరించి ఒకడు బ్రాహ్మణుడగుచున్నాడు’’ - అనునది చెప్పజాలము. ఉపనయనముచే ద్విజుడు, వేదాధ్యయనముచే విప్రుడు - లోకసంబంధమైనవి మాత్రమే.

తర్హి ధార్మికో బ్రాహ్మణ ఇతి చేత్ తన్న . క్షత్రియాదయో హిరణ్యదాతారో బహవః
సంతి . తస్మాత్ న ధార్మికో బ్రాహ్మణ ఇతి ..
9. తర్హి ధార్మికో బ్రాహ్మణ
ఇతి చేత్, తత్ న।

క్షత్రియ ఆదయో - హిరణ్య దాతారో
బహవః సంతి।
తస్మాత్ న ధార్మికో
‘బ్రాహ్మణ’ ఇతి।।
ఒకడు ధర్మనిరతుడు, ధార్మికుడు అయితే అట్టివారిని ‘బ్రాహ్మణుడు’ అని అంటామా? అనలేము. ఎందుచేతనంటారేమో!
క్షత్రియులలో అనేకమంది (శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు, కరుణాడు మొదలైన వారు) బంగారము మొదలైన సంపదలు దానము చేసినవారు ఉన్నారు. చిన్న సందర్భములో తమకున్నదంతా సమర్పించివేసినవారు ఉన్నారు. ఆ మాత్రంచేత ‘వారు బ్రాహ్మణులు’ అగుచున్నారా? లేదు.
ఒకడు పరమధార్మికుడు అయినంత మాత్రంచేత ‘బ్రాహ్మణుడు’ అని వేద - స్మృతి - శ్రుతి వాఙ్మయముచే పిలువబడటములేదు.

తర్హి కో వా బ్రహ్మణో నామ . యః కశ్చిదాత్మానమద్వితీయం జాతిగుణక్రియాహీనం
షడూర్మిషడ్భావేత్యాదిసర్వదోషరహితం సత్యజ్ఞానానందానంతస్వరూపం
స్వయం నిర్వికల్పమశేషకల్పాధారమశేషభూతాంతర్యామిత్వేన
వర్తమానమంతర్యహిశ్చాకాశవదనుస్యూతమఖండానందస్వభావమప్రమేయం
అనుభవైకవేద్యమపరోక్షతయా భాసమానం కరతళామలకవత్సాక్షాదపరోక్షీకృత్య
కృతార్థతయా కామరాగాదిదోషరహితః శమదమాదిసంపన్నో భావ మాత్సర్య
తృష్ణా ఆశా మోహాదిరహితో దంభాహంకారదిభిరసంస్పృష్టచేతా వర్తత
ఏవముక్తలక్షణో యః స ఏవ బ్రాహ్మణేతి శృతిస్మృతీతిహాసపురాణాభ్యామభిప్రాయః
అన్యథా హి బ్రాహ్మణత్వసిద్ధిర్నాస్త్యేవ .
తర్హి కోవా బ్రాహ్మణో నామ?
10. యః కశ్చిత్ ఆత్మానమ్
అద్వితీయమ్।
జాతి గుణ క్రియా హీనం।
మరి ఎవరిని ‘బ్రాహ్మణుడు’ అను శబ్దముచే మనము పిలువ గలుగుతాము? శబ్దార్థానికి ఎవరు సరిపోతారు? సరితూగుతారు?
ఎవ్వడైతే (లేక) ఎవ్వరైనా సరే… స్వస్వరూపము గురించి - ఈవిధంగా- అనుకుంటాడో-ఆతడే ‘బ్రాహ్మణుడు’. ::
‘‘ఈ సర్వము అఖండమగు ఆత్మయే. కనుక నేను, తదితరులు సర్వదా నిర్హేతుకంగా కేవలమగు ఆత్మ స్వరూపులము. జీవులంతా ఆత్మయే సహజమగు స్వస్వరూపముగా కలిగియున్నారు. ‘ద్వితీయము’ అనునది ఏనాడూ లేనేలేదు. ఉండ జాలదు కూడా’’ అని గ్రహించినవాడు బ్రాహ్మణుడు.
- దేహమునకు సంబంధించిన జాతి, కులము, మతము మొదలైనవిగాని, జగన్నాటకములోని జీవాత్మపాత్రకు సంబంధించిన సత్వ-రజో- తమోగుణములుగాని, క్రియా- అక్రియలుగాని ఆత్మగా నాకు కించిత్ కూడా లేనేలేవు - అని నిస్సందేహముగా గమనించువాడు ‘బ్రాహ్మణుడు’.
షట్ (6) ఊర్మి, షట్ (6) భావ
ఇత్యాది సర్వదోష రహితం।
సత్య - జ్ఞాన - ఆనంద - అనంత
స్వరూపం।
‘‘ఆకలి - దప్పిక - శోకము - మోహము - జర - మరణములనబడే షట్ (6) ఊర్ములు భౌతిక దేహసంబంధమైనవేగాని, ఆత్మగా నాకు సంబంధించినవి కావు. ఆత్మగా ఏ జీవునికి సంబంధించినవి కావు.
- జన్మించాలనే ఆవేశము, పుట్టుక, బాల్యయవ్వన వార్థక్యములు, వృద్ధి క్షయములు, మరణము - అను భౌతిక ధర్మములు ఆత్మగా నాకు గాని, ఆత్మగా మరెవ్వరికిగాని సంబంధించినవికావు. అవి దేహ-మనో వికారములు.
సర్వదా సహజమగు ఆత్మస్వరూపులమైయున్నట్టి మనమంతా-సత్య- జ్ఞాన - ఆనంద -అనంత స్వరూపులము - అను భావన కలవాడు బ్రాహ్మణుడు.
స్వయం నిర్వికల్పమ్।
అశేష కల్పాధారమ్।
అశేష భూత-అంతర్యామిత్వేన
వర్తమానమ్।
‘‘సర్వకల్పనలు ఎందులోంచి బయల్వెడలుచున్నాయో…అట్టి ఆత్మానంద స్వరూపుడను. సమస్త కల్పనలకు మునుముందే ఉన్నవాడను. సమస్తమునకు ఆధారుడను. ఆది కారణుడను. నిర్వికల్పుడను. అట్లాగే నీవు కూడా.
- కథలోని పాత్రల స్వరూప - స్వభావ - సంప్రవర్తనలన్నిటికీ కథా రచయితయే అంతర్యామి అయి ఉన్నతీరుగా, ఈ అశేష (సమస్త) భూతజాలమునకు అంతర్యామి అయి ప్రదర్శితమగుచున్నవాడను. ప్రతి ఒక్క జీవుని నిత్య సత్యము ఇట్టిదే’’- అను జ్ఞప్తి వీడని వాడు బ్రాహ్మణుడు.
అంతర్బహిశ్చ ఆకాశవత్
అనుస్యూతమ్।
అఖండానంద స్వభావమ్।
- ‘‘ఏ విధంగా ఆకాశము సమస్త వస్తువులకు బాహ్య- అభ్యంతరములలో తెంపు లేకుండా వ్యాపించి ఉన్నదో, ఆ తీరుగా ఈ విశ్వమంతా బాహ్య - అభ్యంతరములలో ఆత్మాకాశస్వరూపమే విస్తరించి ఉన్నది.
- అఖండ - ఆనంద స్వభావమగు ఆత్మానందమే ఇదంతా - అను అనుభూతి కలవాడు బ్రాహ్మణుడు.
అప్రమేయమ్। అనుభవైక వేద్యమ్।
అపరోక్షతయా భాసమానమ్।
కరతల-ఆమలకవత్ సాక్షాత్
అపరోక్షీ కృత్య, కృతార్థతయా।
నేను, నీవు, వారు, వీరు అట్టి చైతన్య స్వరూపులమే. మనమంతా కూడా
• దృశ్యములో దేనితోనూ ఏ మాత్రము సంబంధము లేనివాడను. కల తనదైనవానికి కలలోని వస్తువులతో బంధమేమి? సంబంధమేమి? ఈవిధంగా - అప్రమేయులము.
• చెప్పటానికి, వినటానికి కూడా విషయులమే కాము. కేవలము అనుభవమునకు మాత్రమే లభించువారము.

కళ్ళకు ప్రత్యక్షమైనవారము కాము.పరోక్షముగా ఉన్నవారము కూడా కాము. మరి? అపరోక్ష జ్ఞానముచేత మాత్రమే బుద్ధికి అనునిత్యానుభవముగా భాసించువారము. తదితరమైనదంతా ‘మనోచాపల్యసంగ్రహణము’ మాత్రమే.

అట్టి సర్వాత్మకుడగు స్వస్వరూప అఖండ - అప్రమేయ పరమాత్మను - అరచేతిలో ఉంచిన ఉసిరికాయను చూచు విధంగా - చూస్తూ కృతార్థుడనై ఉంటున్నాను! అపరోక్ష దర్శనముచే సర్వము సుస్పష్టపరచుకొన్నట్టి వాడను’’ - అను అనుభూతుడు - బ్రాహ్మణుడు.

నేను, నీవు - జగత్తులు ఆత్మతత్త్వ స్వరూపమే!

ఈవిధంగా బ్రాహ్మణ నామధేయుడు - సమస్త సహజీవులను ఆత్మకు అనన్యంగాను, అఖండ స్వస్వరూపమునకు అభిన్నంగాను దర్శించుటచే - సర్వత్రా ఆత్మీయ దృష్టిని కలిగి ఉంటారు. అట్టివాడే బ్రాహ్మణుడు.
కామ-రాగాది దోషరహితః।
శమ-దమాది సంపన్నో
భావ-మాత్సర్య తృష్ణ - ఆశా మోహాది రహితో।
దంభ అహంకారాదిభిః
అసంస్పృష్ట చేత ఆవర్తతే।
సర్వత్రా ఆత్మీయ దృష్టి గల ఆతడు :-
న స్వభావంగానే కామము, రాగము మొదలైన దోషములు లేనట్టివాడు.
న శమ (అంతరింద్రయనిగ్రహము) దమ (బాహ్యేంద్రియ నిగ్రహ) సమన్వి తుడు. మాత్సర్య తృష్ణా ఆశా మోహ రహితుడు.
న ఇంకా కూడా ఆత్మదృష్టియొక్క స్వాభావిక ప్రయోజనంగా దంభ, అహంకారము మొదలైన ఆసురీసంపత్తి రహితుడైనవాడు.
న జగత్ సంఘటనలచే స్పృశించబడజాలని సర్వాతీమగు నిర్మల బుద్ధి సమన్వితుడై వర్తించువాడై ఉంటాడు.

సర్వము స్వస్వరూపంగా సర్వదా సందర్శించువాడే బ్రాహ్మణుడు.
ఏవ ముక్త లక్షణో యః,
స ఏవ ‘బ్రాహ్మణ’-
ఇతి =
శ్రుతి స్మృతి పురాణ
ఇతిహాసానామ్ అభిప్రాయః।
అన్యథా బ్రాహ్మణత్వ సిద్ధిః నాస్త్యేవ।
ఇట్టి ఆత్మభావితమగు సద్గుణ - సదవగాహన - స్వాభావ సర్వాతీత లక్షణములు కలవాడే ‘బ్రాహ్మణుడు’ అగుచున్నాడు. ఇదియే శ్రుతులు, స్మృతుల, పురాణముల, ఇతిహాసము ల, వేదముల ‘బ్రాహ్మణ’ శబ్దార్ధముపట్ల అభిప్రాయము, ఉద్దేశ్యము అయి ఉన్నది.
బ్రహ్మీదృష్టిచే అనన్యమైన భావన-దృష్టి-అవగాహనలు లేనివానిపట్ల ‘బ్రహ్మాణత్వము’ ‘‘సిద్ధింపనిదే’’ అగుచున్నది. బ్రాహ్మణత్వ సిద్ధిః నాస్త్యేవ।।

సచ్చిదానాందమాత్మానమద్వితీయం బ్రహ్మ భావయేదిత్యుపనిషత్ ..
11. సత్ చిత్ ఆనందమ్ ఆత్మానమ్,
అద్వితీయమ్ - బ్రహ్మ భావయేత్।।
ఆత్మానం సచ్చిదానందం
బ్రహ్మ భావయేత్।। ।।ఇతి।।

అట్టి బ్రాహ్మణత్వము సిద్ధించటానికి మార్గమేమిటి? పైన చెప్పిన సత్-చిత్-ఆనందరూపమగు ఆత్మయొక్క విశేషలక్షణముల అభ్యాసమే అందుకు ఉపాయం. ‘‘ఇదంతా సర్వదా మమాత్మానంద స్వరూపమే కదా!’’ - అను అనునిత్య (Always), అవ్యాజ (unconditional) పూర్వక మననమే మార్గము. సర్వత్రా బ్రహ్మము యొక్క సందర్శనమే బ్రాహ్మణత్వము.
4 వేదములలోను (శ్రుతులలోను), స్మృతులలోను (జీవిత విధానమును విశ్లేషించి, వివరించి, నిర్దేశించి చెప్పే పారాశర్య స్మృతి, మనుస్మృతి ఇత్యాదులందును), (రామాయణ, మహాభారత, భాగవతాది) ఇతిహాసములలోను, మత్స్య-కూర్మ ఇత్యాది వ్యాస విరచిత పురాణములలోను) - ‘చత్వారోవర్ణానమ్ బ్రాహ్మణ ఏవ ప్రధానం’ అని చెప్పుచున్నప్పుడు - బ్రాహ్మణుడు’ అనగా ‘‘యః కశ్చిత్ ఆత్మానమ్ అద్వితీయమ్’’ మొదలురాగల పైన చెప్పిన రీతిగా బ్రహ్మమును దృష్టియందు స్థిరముగా నిలుపుకొన్న వారి గురించియే.

ఇతి వజ్ర సూచికోపనిషత్
(లేక) వజ్రసూచ్యుపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః।।



సామవేదాంతర్గత

12     వజ్రసూచిక ఉపనిషత్

(లేక) వజ్రసూచ ఉపనిషత్

అధ్యయన పుష్పము
(బ్రహ్మయతీతి బ్రాహ్మణః)

శ్రీ గురుభ్యోం నమః

శిష్యజనులు : గురుదేవాయ! నమో నమః। హే పరమేశ్వర! నమో నమః। ‘ఓం’కారాయ! నమో నమః। ప్రశాంత స్వరూపా। నమో నమః। మహాత్మా! ఆత్మతత్త్వజ్ఞానార్థినై సందేహనివృత్తి కొరకై, (జ్ఞానస్సంచ్ఛిన్న సంశయః)… మీ పాదారవిందములను కళ్ల కద్దుకుంటూ, మిమ్ములను శరణు వేడుచున్నాను స్వామీ।

గురుదేవుడు : బిడ్డలారా! మమాత్మానంద కేవలీస్వరూపులారా! స్వాగతము. మీరు దేనిగురించి ముఖ్యముగా సందేహ నివృత్తికై అడగదలచుకొన్నారో, నిస్సంకోచంగా అడగండి. నేను ఎరిగినంతవరకు విశదీకరించుటకై సంసిద్ధుడనై ఉన్నాను. స్మృతి - శ్రుతి - పురాణార్థపూర్వకంగా, కరుణామూర్తియగు ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణను ఆశ్రయిస్తూ మనము చెప్పుకుందాము.

శిష్యులు : మహాత్మా। భగవన్। గురుదేవా। వేద ఇతిహాస పురాణాలలోను (మరియు) లోక ప్రసిద్ధమై కూడా చెన్నొందుచున్నట్టి - ‘‘చాతుర్వర్ణ్యములలో బ్రాహ్మణ శ్రేష్ఠత్వము, బ్రాహ్మణ పూజనీయత్వము’’ గురించి తాత్త్విక, ఆధ్యాత్మికార్థపూర్వకంగా మీవద్ద శ్రవణం చేయ అభిలషిస్తున్నాను. నా ఈ అభ్యర్ధన యుక్తియుక్తమైతే, ‘‘బ్రాహ్మణులు దేవతలకు కూడా పూజనీయులు’’ అనువాక్యములోని పరమార్థమును తత్త్వశాస్త్రీయంగా వివరించమని వేడుకొంటున్నాను.

గురుదేవుడు : చిరంజీవా। నీ ప్రశ్న సముచితము. తప్పక మనము విచారించాలిసిందే. (Yes. It is an aspect to be analysed and be understood with clarity).

వేదోపనిషదాత్మకంగా ‘బ్రాహ్మణుడు’ అను శబ్దమునకు ముఖ్యోద్దేశ్యము ముముక్షువులు తెలుసుకొని తీరవలసిందే. నీవు అడిగిన ‘‘బ్రాహ్మణో పూజనీయం సదా’’ అను విశేషము ‘‘వజ్రసూచికము’’ అను పేరుతో తత్త్వశాస్త్ర అంతర్విభాగంగా పూజనీయులగు తత్త్వజ్ఞులచే ప్రవచించబడుతోంది. అట్టి శాస్త్ర ప్రవచితమైన ‘వజ్రసూచి’ (వజ్రపు సూది) - అజ్ఞానమును తొలగించివేయగలదు. అల్పజ్ఞానము’’ - అనే దోషమునకు గొప్ప ఔషధము. మనము చెప్పుకోబోవుచున్న వజ్రసూచికా పాఠ్యాంశమును (లేక) పరమార్థమును జ్ఞాన చక్షువులు గల మహనీయులు ఎరిగియే ఉన్నవారై, తమకు భూషణముగా అలంకరించుకొంటున్నారయ్యా।
ఈ ‘వజ్ర సూచి’ (ఇంద్రుని వజ్రమువలె) అపార్థములను, అల్పార్థములను ఖండించివేసి - పరమార్థము ప్రసాదించునది. అట్టి విశేషములు ఇప్పుడు చెప్పుకొంటున్నాము. శ్రద్ధగా శ్రవణము చేసెదరు గాక।

- - -

‘ఓం’కార పరమార్థ స్వరూపుడు, ఏక-అక్షరుడు అగు పరమాత్మకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

చాతుర్వర్ణ్యములు : చతుర్వేద - ఇతిహాస - పురాణ - స్మృతులచే నాలుగు వర్ణములు వివరించి చెప్పబడుచున్నాయి.
(1) బ్రాహ్మణ (2) క్షత్రియ (3) వైశ్య (4) శూద్ర.

శ్లో।। బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రా ఇతి చత్వారో వర్ణాః।
‘‘తేషాం వర్ణానాం బ్రాహ్మణ ఏవ ప్రధాన’’ - ఇతి వేదవచనానురూపమ్। స్మృతిభిః అపి యుక్తమ్।

4 వర్ణములలో బ్రాహ్మణులు ప్రమ స్థానము అలంకరించువారు - అని వేదవచనముల రూపంగాను, (మనుస్మృతి, పరాశరస్మృతి మొదలైన మహనీయుల ప్రవచితమగు) స్మృతులలోను, ఇతిహాస పురాణములలోను ఆయాచోట్ల అభివర్ణించబడుతోంది. ఇది మరికొంత వివరణగా తప్పక చెప్పుకోవలసియున్నది. (లేకుంటే జనులచే ‘ఆచరణ’గా తగినంతగా సిద్ధించదు).
- కోవా బ్రాహ్మణో నామ? ‘బ్రాహ్మణుడు’ అనే పేరుతో 4 వేదములలోను, పురాణ - ఇతిహాసములలోను, స్మృతులలోను చెప్పుచున్నది ఎవరి గురించి?
- కో జీవః? జీవజాతులలో (లేక జనులలో) ఏ జాతివారిని ‘బ్రాహ్మణులు’ అని అంటాము?
- ఎటువంటి దేహములు కలవారు బ్రాహ్మణులు?
- ఏ గుణములు కలవారు బ్రాహ్మణులు?
- ఏ జ్ఞానముచే బ్రాహ్మణులుగా గుర్తించబడగలరు?
- ఎట్టి కర్మలు నిర్వర్తిస్తున్న వారిని ‘బ్రాహ్మణులు’ అని ఉద్దేశ్యిస్తున్నారు?
- ధార్మిక గుణముల (దానగుణము)చే ఒకడు ‘బ్రాహ్మణుడు’ అనవచ్చునా?

‘బ్రాహ్మణుడు’ అనునది జీవులుగా సృష్టించబడువారిలో ఒక విభాగమా? ఒక తీరైన ప్రత్యేక దేహముగలవారా? లేక, అనేక జాతులలో ఒక జాతివారా? శాస్త్రజ్ఞానము, ఆత్మతత్త్వ జ్ఞానము శాస్త్రీయముగా తెలియుటచేట ‘బ్రాహ్మణులు’గా నిర్వచించబడువారా? ఇంకేవైనా కర్మలను, ధార్మిక స్వభావములను అనుసరించి కొందరు బ్రాహ్మణులా? ఎవ్వరైనాసరే, సాధనచే ‘బ్రాహ్మణ’ - శబ్దమునకు అర్హులు కాగలరా?

ఈ విశేషాలు అధ్యాత్మ శాస్త్రార్థపూర్వకంగా వివరణ చేసుకుందాము.

- - -

ప్రమో జీవో ‘బ్రాహ్మణ’ ఇతి తత్ చేత్ ‘న’। ‘‘సృష్ట్యభిమాని, సృష్టికర్త అగు ప్రజాపతి (బ్రహ్మదేవుడు) మొట్టమొదటగా బ్రాహ్మణులను సృష్టించారు’’ - అని అందామా? అది కుదిరే మాట కాదు. సమస్తము సృష్టిలోని సమస్వరూప విశేషమే కదా!

‘జీవుడు’ అనగా ఒక దేహము కాదు. అతీతాన్ - ఆగత అనేక దేహానాం జీవస్య ఏకరూపత్వాత్। ఈ జీవుని పట్ల అనేక దేహములు గడచిపోయినాయి. రాబోవుచున్నాయి. ఈ విధంగా వస్తూ పోతూ ఉండే దేహాలన్నీ దృశ్యములోని కల్పిత విశేషాలే। సమానమైనవే।

అటువంటప్పుడు ‘‘సృష్టిలో మొదటి దేహము బ్రాహ్మణుడు’’ అనునదేముంటుంది? ‘జీవుడు’ అనబడువాడు ఒక్కడే అయి ఉండి కూడా కర్మలవశంగా ఏవేవో దేహాలు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి, వాటిలో ‘‘మొదటిది బ్రాహ్మణ దేహము, తరువాతది కాదు’’ అనునదేమీ లేదు. జీవుడు సర్వదా ఏకస్వరూపుడే కదా! వచ్చి-పోయే దేహానుసారంగా జీవుడు మారడు. వచ్చే పోయే దేహాలనుబట్టి జీవుడు ఒకప్పుడు బ్రాహ్మణుడు - మరొకప్పుడు కాదు’’ - అనవీలుకాదు.

అందుచేత, ‘బ్రాహ్మణుడు’ ‘ప్రథమజీవుడు’ అనునది కూడా యుక్తయుక్తం కాదు. (సృష్టిలోని సమస్త విశేషములు ఒక్క క్షణమునందే సృష్టి కల్పనగా బయల్వెడలుచున్నాయి - అనేది వేద ప్రమాణవాక్యము)

ఇక, పాంచభౌతికంగా కనిపించే ఈ అసంఖ్యాక మానవ దేహములలో కొన్ని ప్రత్యేక జన్మలు (దేహములు) బ్రాహ్మణ దేహములు (లేక) బ్రాహ్మణ జన్మలు - అని అందామా? తర్హి దేహో ‘బ్రాహ్మణ’ ఇతి చేత్ న।

ఆ విధంగా కూడా చెప్పలేము!

ఎందుకంటే…
ఇంద్రియసుఖములే జీవిత పరమావధి (Main purpose) అని అనుకునేవాడు - ‘‘చండాలుడు’’ అనబడతాడు. అట్టి చండాలుడు మొదలుకొని - బ్రాహ్మణుల వరకు, శూద్రుడు అనబడువాడు మొదలుకొని - బ్రాహ్మణుల వరకు సాంఘికంగా సృష్టిలో కనిపించే మానవదేహములన్నీ కూడా తల్లి గర్భంలోంచే బయల్వెడలుచున్నవే.

‘పంచభూతములు’ అనే మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశముల సమ్మేళన పదార్థము(Raw-Material)లతోనే భౌతిక దేహములన్నీ నిర్మితమవుతున్నాయి. దేహముల దృష్ట్యా మానవదేహాలన్నీ కాళ్ళు - చేతులు - తల - కళ్లు - చెవులు…మొదలైనవన్నీ ఒకే మూసలో తయారగుచున్నవే. భౌతిక దేహాలన్నీ కూడా బాల్య - యౌవన - వార్థక్య - జరా - మరణ ధర్మములు కలిగి ఉన్నట్టివే. దేహమునుబట్టి బ్రాహ్మణుడు అవడు. అందరికీ ప్రకృతియే ఆహార ప్రదాత, జీవన ప్రదాత కూడా. అందుచే, జన్మానుసారంగా ఒకడు ‘బ్రాహ్మణుడు’ - అని పరమార్థంగా అనబడడు.

రంగు బట్టి బ్రాహ్మణుడా?
ఈ అసంఖ్యాక మానవ దేహాలలో కొన్ని తెల్లగాను(U.K), కొన్ని ఎర్రరంగు(India)గాను, కొన్ని పీతవర్ణముగాను (పసుపుపచ్చగాను) (Chinese), మరికొన్ని నల్ల రంగుగాను (Negros) కనిపిస్తూ ఉన్నాయి.

ఎవ్వరైనా -
బ్రాహ్మణులు → తెల్ల రంగు గాను,
క్షత్రియులు → రక్తవర్ణము (ఎరుపు) గాను,
వైశ్యులు → పసుపుచ్చ (పీతవర్ణము) గాను,
శూద్రులు → నల్ల రంగుగాను -
ఉంటారని అనగలమా? ఇటువంటి రంగుల నియమమేదీ బ్రాహ్మణ - క్షత్రియాది చాతుర్వర్ణ్య విభాగములలో ఏమాత్రము కనిపించదు. శాస్త్రములు ఆ తీరుగా చెప్పటమూలేదు.

‘బ్రాహ్మణుడు’ - అనునది శరీర సంబంధమైనది కాదు.

ఒకవేళ ‘శరీరము’ను అనుసరించి ఒకడు బ్రాహ్మణుడు అని అనవలసివస్తే, అప్పుడు,… పిత్రాది శరీర దహనే బ్రహ్మహత్యాది దోష సంభవాచ్చ కిం? మరణించినట్టి ఒక బ్రాహ్మణుని దేహమును దహనము చేసినప్పుడు, ఆ శవమును తగులబెట్టినట్టి పుత్రుడు మొదలైనవారందరికీ ‘‘బ్రాహ్మణహత్యా దోషము’’ అంటాలి మరి. ఆ విధంగా అంటుతుందా? అదేమీ లేదే। శాస్త్రములు ఆవిధంగా చెప్పటం లేదు కదా!

తస్మాత్ దేహో న బ్రాహ్మణ ఇతి। కాబట్టి జన్మను బట్టియో, దేహమునుబట్టియో, రంగునుబట్టియో ఒకానొకడు బ్రాహ్మణుడు కాదు. అది ‘బ్రాహ్మణ’ నిర్వచనము కానేకాదు.

మరి? ఒకడు ‘జాతి’ చేత బ్రాహ్మణుడు అవుతాడా? కానే కాదు. తర్హి జాతిః బ్రాహ్మణ ఇతి చేత్, తత్ న। ఈ భూమిమీద అనేక అనేక జాతులు, అట్టి జాతులలో అనేక అనేక ఉపజాతులు ఉన్నాయి. (ఉదా . బ్రాహ్మణులలో వైదీకులు, నియోగులు, పూజారులు మొదలైనవారు, కోమటులలో కోమటి, భేరీ కోమటి మొదలైనవారు). మహనీయులు అన్ని జాతులలో ఉన్నారు. ఆయా అన్ని జాతులలో మూర్ఖులు కూడా ఉంటారు.

ఈ సందర్భంలో స్వానుభవమగు ఆత్మగురించిన ‘ఋతము’ను గానం చేసిన అనేకమంది ఋషుల జన్మలగురించి పురాణాలలో వివరించిన విధానంగా ఏ ఋషి ఏ జాతివాడని అనగలం? జన్మతః దృష్ట్యా చూచినప్పుడు ‘బ్రాహ్మణ’ అనవీలు లేదు. కానీ, వారు ‘బ్రాహ్మణప్రాజ్ఞులు’-అని పౌరాణికంగా వర్ణించబడుచున్నారు.

కొన్ని దృష్టాంతాలు చెప్పుకుందాము.

ఋష్య శృంగ మునీంద్రులు :- వారు ఎక్కడ ఉంటే అక్కడ సకాలవర్షాలు, ప్రశాంత వాతావరణము స్వాభావికము అవుతాయి. ఆయన దశరధ మహారాజుకు అల్లుడు. వారిచే ‘పుత్రకామేష్టి’ చేయించిన పురాణ ప్రసిద్ధులు. లోక కళ్యాణమూర్తులు. అట్టి మహనీయులు, ఋష్యశృంగమహర్షి - జింక గర్భమునుండి జన్మించారు. విభాండకుడు అనే ముని నదిలో స్నానం చేస్తూ ఉండగా, - ఆకాశంలో ‘ఊర్వసి’ని చూచారు. రేతః పతనము అయింది. ఒక జింక నీళ్లు త్రాగటానికి వచ్చి ఆ ‘వీర్యము’ను త్రాగింది. ఆ జింక గర్భమున జన్మించిన శిశువును దివ్య దృష్టితో విభాండకుడు గుర్తించారు. ఆశ్రమమునకు తెచ్చి పెంచారు. ఆయనే ఋష్యశృంగుడు.

వారు ఏ జాతికి చెందుటచే ‘బ్రాహ్మణుడు’ అనబడగలరు? ఎట్లా యాజ్ఞీకుడు అయ్యారు? ఋత్విక్కు అయి ఎట్లా దశరథ మహారాజు చేసే ‘పుత్రకామేష్ఠి’ యాగమునకు ఋత్విక్ అయ్యారు? జన్మ దృష్ట్యా కాదు. తపోధ్యాన సంపద చేతనే - ఆయన ‘బ్రాహ్మణ’ శబ్దార్హుడు అయ్యారు.

కౌశిక మహర్షి :- కుశముల నుండి (దర్భలనుండి) పుట్టారు.

జంబూక మహర్షి :- జంబూకము (నక్క) గర్భము నుండి జన్మించారు.

శ్రీ వాల్మీక మహర్షి :- వీరు రామాయణమును, యోగవాసిష్ఠమును లోకమునకు అందించిన మహర్షి.
బ్రహ్మదేవుని శాపవశంగా బోయజాతివాడై ఉండి, ‘రత్నాకరుడు’ అను పేరుకలవారు. సప్తర్షులచే ప్రాపంచక బంధముల భ్రమ గురించి బోధించబడి, తపస్సు ప్రారంభించి - వల్మీకము (పుట్ట) నుండి బయల్వెడలారు. వీరికి జాతి ఎక్కడిది? కానీ, బ్రాహ్మణ శ్రేష్ఠులలో ఉత్తములగు బ్రహ్మర్షులైనారు. ఛందో నిబద్ధంగా సంస్కృతంలో కవనము సృష్టించిన మొదటికవి కాబట్టి, ‘ఆదికవి’ అని పిలువబడువారు.

కృష్ణ ద్వైపాయన వేద వ్యాసమహర్షి :- వసిష్ఠ వంశజుడగు పరాశర మహర్షికి మత్స్యరాజకుమార్తెయగు మత్స్యగంధికి (యోజనగంధికి) సద్యోగర్భంగా జనించిన వారు. (ద్వీపంలో జనించుటచే) ద్వైపాయనుడు. (నల్లగా ఉండటంచేత) కృష్ణ మహర్షి. (వేదములు విభజించి ప్రసాదించుటచే) వేదవ్యాసమహర్షి. సత్యవతీపుత్రుడు. (జాతియే బ్రాహ్మణత్వమును నిర్ణయించగలిగితే), - ఏ జాతి సూత్రానుసారంగా మత్స్యగంధి కుమారుడు వేదవ్యాసమహర్షి అయ్యారు? కైవర్తక న్యాయంచే తల్లి కన్నెత్వము చెడకుండా జనించినవారికి జాతి ఏమున్నది? ‘బ్రాహ్మణుడు’ అనునది తల్లి ననుసరించియా? తండ్రిని అనుసరించియా?
- మత్స్యగంధికి జనించుట చేత ఏ జాతి వారు?
- పరాశర మహర్షి కుమారుడు కాబట్టి ఏ జాతివారని అనాలి?
శ్రీ వ్యాసమహర్షి లోక కళ్యాణార్థము వేద - వేదాంగముల విభజన, అష్టాదశ పురాణాలు, పంచమ వేదమగు భారతము, బ్రహ్మసూత్రములు మొదలైనవాటిని రచించిన మహనీయులు. లోకకళ్యాణమూర్తులు, చిరస్మరణీయులు, బ్రాహ్మణపూజార్హులు అయినారు.

గౌతమ మహర్షి :- సగము ఈనిన గోవుకు ప్రదక్షణం చేసి భూప్రదక్షి ఫలముగా ‘అహల్య’ను ధర్మపత్నిగా పొందినట్టివారు. ఈ దంపతుల కుమారుడు - శాతానీకుడు, లోక కళ్యాణమూర్తి అయినట్టి గౌతమి (గోదావరి)నదిని ప్రసాదించిన గౌతమమహర్షి (ప్రచేతసుని మానసపుత్రుడుగా) కుందేటి వీపు (శశి పృష్ఠము) నుండి జనించారు. (బ్రహ్మవైవర్తి పురాణము) వారు జన్మతః ఏ జాతితో సంబంధముచే మహర్షి అయ్యారు? లోక సంబంధమైన ‘జాతి’ని వారికి ఏమని ఆపాదించాలి?

శ్రీ వసిష్ఠ మహర్షి :- నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేస్తూ ఉండగా దేవతాస్త్రీలు వారి తపస్సు భంగము చేయటానికి యత్నించారు. నిశ్చలాత్ముడగు శ్రీ నారాయణస్వామి, ‘‘ఓ దేవతాస్త్రీలారా! మీ సౌందర్యమును చూచుకొని గర్విస్తూ మా తపస్సు పాడుచేయ యత్నిస్తున్నారా? ఇదిగో! ఇటుచూడండి’’- అంటూ తన ఊరువు నుండి మహత్ సౌందర్యరాశి అగు ఒక కన్యను సృష్టించారు.

ఒకనాడు సూర్యుడు, వరుణుడు కలసి ఆకాశమార్గంలో కలసి వస్తూ ఉన్నారు. వారికి ఒకచోట ఊర్వసి కనిపించింది. ఆమెయొక్క సౌందర్యం చూడగానే వారిద్దరికి రేతః పతనము అయింది. అప్పుడు ఊర్వసి వారిరువురి వీర్యములను ఒక కుంభము (కుండ)లో భద్రపరచారు. ఆ కుంభము నుండి వసిష్ఠుడు, అగస్త్యుడు పుట్టారు. ఈవిధంగా వారిద్దరు కుంభ స్తంభవులు. శ్రీ వసిష్ఠమహర్షి సప్త ఋషులలో ఒకరు.

ఊరువు నుండి జనించిన ఊర్వశి వలన సూర్యుని రేతస్సు నుండి కుండలో కుమారుడుగా జన్మించిన బ్రహ్మణ్యులగు వసిష్ఠ మహర్షియొక్క జాతి ఏది? వీరు శ్రీరామచంద్రుని గురువులు. 16 సంవత్సరాల వయసుగల శ్రీరామునికి బోధరూపంగా యోగవాసిష్ఠ మహాగ్రంథము ప్రవచించినవారు. అట్టి ఆ మహనీయుడు బ్రహ్మణ్యుడగు బ్రాహ్మణుడు కారా?

అగస్త్య మహర్షి :- ఆకాశంలో ఎత్తుగా ఎదిగి సూర్యమార్గమును నిరోధించిన వింధ్య పర్వతము అగస్త్యునికి తలవంచి నమస్కరించగా, ఆయన లోకకళ్యాణార్థమై ‘‘నేను మరల తిరిగి వచ్చే వరకు తలవంచియే ఉండుము’’ అని ఆజ్ఞాపించి తనకు అత్యంత ప్రియమైన ‘కాశి’ని వదలి వింధ్యను దాటి దక్షిణ దిశగా మలయాద్రిపై నివాసమును ఆశ్రయించిన త్యాగమూర్తి శ్రీ అగస్త్యమహర్షి. రామ-రావణయుద్ధ సందర్భములో శ్రీరామచంద్రమూర్తికి ‘ఆదిత్యహృదయస్తుతి’ అనుగ్రహించి పునః ప్రత్యుత్సాహపరచినట్టి మహనీయులు. అట్టి అగస్త్య మహర్షి మట్టి కలశము నుండి జనించారు. వారిది ‘ఇదీ జాతి’ అని ఏమీ అని అనలేముకదా! మరి వారు బ్రాహ్మణ్యులు కాదా? (వీరు వరుణుని రేతస్సు నుండి ఊర్వసిచే కుండలో జన్మించినవారు).

అట్లాగే, సూత మహర్షి, శౌనకుడు మొదలైన పురాణ పురుషుల జన్మలు ఇట్టివే. (శౌనకుడు = శునకమునకు జన్మించినవాడు).

ఇవన్నీ శ్రుతులలోను, ఇతిహాస పురాణాలలోను చెప్పబడింది. ఇంతేకాకుండా మహత్తర జ్ఞానసంపన్నులగు ఎందరో మునీశ్వరులు, ఋషులు మొదలైనవారంతా అన్ని జాతులలోను ఉన్నారు. జాతియొక్క వివరణయే లేనట్టి మహనీయులగు ఆత్మజ్ఞులు మరెందరో ఉన్నారు.

అందుచేత ఎవ్వడూ జాతి చేత బ్రాహ్మణుడు అవడు. ‘బ్రాహ్మణత్వము’ అనునది జాత్యానుసారంగా చెప్పలేము. అది శ్రుతి, స్మృతి, పురాణముల ఉద్దేశ్యము కూడా కాదు.

జ్ఞానమును అనుసరించి ఒకడు బ్రహ్మణుడు అని అంటామా? అదీ కుదరేమాటకాదు. ఎందుకంటే…

క్షత్రియులలో కూడా (జనకుడు, శిబిచక్రవర్తి, భగీరథుడు, బలిచక్రవర్తి, రఘుమహారాజు మొదలైన) అనేకమంది ఆత్మజ్ఞానులు ఉన్నారు. వారందరినీ ‘బ్రాహ్మణ’ శబ్దముతో పిలువరు. అట్లాగే వైశ్య - శూద్రులలో కూడా ఆత్మజ్ఞానులు ఎందరో (వ్యాధుడు మొదలైనవారు) ఉన్నారు. అందుచేత శాస్త్ర జ్ఞానము కలిగియున్నమాత్రంచేత వారందరినీ ‘బ్రాహ్మణ’ శబ్దముతో చెప్పుకోబడటం లేదు కదా!

కర్మ విశేషములను అనుసరించి,

అందుచేత ఒకడిని నియమితమైన కర్మలను అనుసరించి బ్రాహ్మణుడు అవజాలడు. ఉపనయనముచే ‘ద్విజుడు’, వేదాధ్యయనముచే ‘విప్రుడు’ అగుచున్నారు. అంతమాత్రంచేత వారు ‘బ్రాహ్మణ’ శబ్దములో చెప్పజాలము.

ధార్మికో బ్రాహ్మణః కిం?
ఒకడు గొప్ప ధార్మికుడైతే (ధర్మపరుడైతే) ‘బ్రాహ్మణుడు’ అని అనబడుతోందా? లేదు. తర్హి ధార్మికో బ్రాహ్మణ ఇతి చేత్, తత్ న।
క్షత్రియులలోనూ (కరుణాడు, శిబి చక్రవర్తి, సత్యహరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి మొదలైన) ఎందరో ధార్మికులు ఉన్నారు. అట్లాగే వైశ్య సూద్రులలో కూడా ధార్మికులు ఉన్నారు. వారందరినీ ‘బ్రాహ్మణులు’ అని వేదములు, శ్రుతులు చెప్పటంలేదు. క్షత్రియ ఆదయో హిరణ్య దాతారో బహవః సంతి। వారందరు దానగుణము గల మహనీయులే అయినప్పటికి ‘బ్రాహ్మణులు’ అని అనజాలము.

తర్హి కోవా బ్రాహ్మణః?
మరప్పుడు ‘బ్రాహ్మణుడు’ అని ఎవరిని అంటాము? ఏఏ విలక్షణ లక్షణములచే ఒకానొక జీవుని - బ్రాహ్మణములు, శ్రుతులు, స్మృతులు, పురాణములు, సంహితలు మొదలైనవి - ‘‘బ్రాహ్మణుడు’’ అని ఉద్దేశ్యిస్తున్నాయో,…ఆయా లక్షణ విశేషములను ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము.

తత్త్వమ్ - సోఽహమ్ - తత్ సర్వమిదమ్

అద్వితీయమ్: - ఎవ్వడైతే తనను తాను అఖండమగు ఆత్మగా ఎరుగుచూ, అట్టి తనయొక్క కేవల-సహజ ఆత్మానందస్వరూపమునకు ద్వితీయమేలేదని, సర్వము సర్వులు - అట్టి ఆత్మయొక్క అద్వితీయ లీలా విలాసమేనని ఎరుగుచున్నాడో, ….అట్టివాడు బ్రాహ్మణుడు.

అనన్యమ్ : - పరమాత్మకు అన్యమైనదేదీ లేదు (శివాత్ పరతరమ్ నాస్తి)। అట్టి పరమాత్మయే ‘‘నాతో సహా’’ - ‘‘ఈ సమస్త రూపములలోను’’, ‘‘ఈ సమస్త రూపముగాను’’ ఉన్నారు - అను భావనయే అనన్య భావన (లేక) అద్వితీయానుభవము.

తత్ త్వమ్: - ‘నీవు’గా కనిపించేదంతా పరమాత్మయే ।

సోఽహమ్ : - ‘నేను’గా ప్రదర్శనమగుచున్నది కూడా పరమాత్మయే।

‘‘నీవు - నీది, నేను - నాది అనబడేదంతా సర్వాత్మకుడగు పరమాత్మకు చెందినదే’’ అను ఎరుకచే సమస్తమును పరమాత్మను అద్వితీయంగా దర్శించువాడు బ్రాహ్మణుడు.

జాతి గుణ క్రియా విహీనమ్ : ఎవరి దృష్టిలో బ్రహ్మమునకు జాతి - గుణ - క్రియా - అల్ప - అధిక వ్యవహారములు వాస్తవానికి ఏమాత్రమూ కూడా ఉండజాలవో, వాటన్నిటికీ అతీతమైనట్టిది అగు ఆత్మయే సర్వత్రా ప్రదర్శనమగుచున్నట్లు స్వానుభవమగుచున్నదో - ఆతడు బ్రాహ్మణుడు. దేహమునకు సంబంధించిన జాతి-కుల-మతములు, స్వభావమునకు సంబంధించిన మంచి-చెడు-సత్త్వ రజో తమో గుణములు, క్రియా వ్యవహారములు - ఇవన్నీ జగన్నాటకములోని జీవాత్మ సంబంధించినవేగాని, (సందర్భమాత్ర సత్యములేగాని) కేవలాత్మవు కావు - అని ఎరిగి ఉన్నవాడు, సమస్త జీవులను బ్రాహ్మీభావనతోను - స్వస్వరూప-అనన్యముగాను దర్శించువాడు ‘బ్రాహ్మణుడు’.

అస్మత్ స్వరూపము ‘బ్రహ్మమే’ అని ఎరిగి ఉన్నవాడు, ‘తత్ త్వమేవ’ అను దృష్టి కలవాడు బ్రాహ్మణుడు.

షడూర్మి - షట్ భావం ఇత్యాది సర్వదోష రహితం।

సమస్త దేహములలోను సమముగా సిద్ధించినదైయున్న ఆత్మ → దేహమునకు చెందినట్టి షట్ ఊర్ములగు ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణములచే స్పృశించబడనిది. అవన్నీ భౌతిక దేహమునకు సంబంధించినవి మాత్రమే. ఆత్మను స్పృశించవు. స్పృశించ లేవు కూడా।

సర్వాత్మకమగు ఆత్మ - దృశ్య - దేహ, అనురక్త-విరక్త, జ్ఞాన-అజ్ఞాన, జన్మ-జాతి, దేశ - కాల, జీవన్-మరణ షట్ (6) భావములచే స్పృశించబడనిదిగా గమనిస్తూ, గ్రహిస్తూ ఉండువాడు ‘బ్రాహ్మణుడు’. ఆతడే శ్రుతి-స్మృతులను అనుసరించి వందనీయుడు. పూజనీయుడు. ‘బ్రాహ్మణ ఏవ ప్రధాన’ అను వేదస్తుతికి ఉద్దేశ్యించబడుచున్నవాడు.

సత్యజ్ఞాన ఆనంద అనంత స్వరూపమగు ఆత్మయే నా సహజ సత్యము/స్వరూపము/స్వభావము

సత్ : - జాగ్రత్ స్వప్న సుషుప్తులకు, దేహముల రాకపోకలకు ఆవల సాక్షి అయి, కేవల సత్ (ఉనికి) స్వరూపము - (సత్‌స్వరూపుడను)

చిత్ : ‘ఎరుక’ అను లక్షణముచే ‘ఎరుగువాడు - ఎరుగుబడునది’లను వెలిగించుచున్నట్టిది. (చిత్ స్వరూపుడను)

ఆనందమ్ : అన్యమైనదంతా (జగత్తులు, దేహముల రాకపోకలు, బంధ-మోక్షములు మొదలైనవన్నీ కూడా) ఆత్మకు స్వకీయ ఆనందరూపము. (All else is the pleasure of the Absolute self)

అనంతమ్ : ఆత్మ = దేహ మనో బుద్ధి చిత్త అహంకారభావములచేతగాని, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులచేతగాని, పంచభూత దృశ్య ప్రపంచముచేతగాని పరిమితము కానట్టిది,

- అట్టి ఎరుక, అవగాహన, అనుభూతి కలవాడు బ్రాహ్మణుడు.

తనయొక్క, తదితర సమస్త జీవుల యొక్క సర్వ కల్పనాతీత స్వస్వరూపము → సర్వదా సత్యజ్ఞానానంద అనంత ఆత్మస్వరూపమే - అను దృష్టి, నిశ్చలానుభూతి కలిగియున్నవాడు బ్రాహ్మణుడు.

స్వయం నిర్వికల్పం : సమస్త జీవుల నిర్వికల్ప స్వరూపమే ఆత్మ. సంకల్ప - వికల్పముల కంటే మునుముందే ఉన్న ఆత్మయే జాగ్రత్‌లోను, స్వప్నములోను, దేహమున్నప్పుడు, దేహము లేనప్పుడు కూడా జగద్దృశ్యముగా భాసిస్తోంది - అను ఎరుక బ్రాహ్మణుని స్వాభావిక లక్షణము.

అశేష కల్ప ఆధారమ్ : కల్పనలోనే ‘జాగ్రత్, స్వప్న’ జగదనుభవమంతా ఇమిడి ఉన్నది. అట్టి కల్పనకు ఆధారమైనట్టిదే ‘ఆత్మ’. కాల కల్పనకు కూడా ఆవల ఉన్నట్టిది. కల్పన ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఆ కల్పన చేయువాడు యథాతథము కదా! ఆత్మ ఎల్లప్పుడు యథాతథము.

అశేష భూత - అంతర్యామిత్వేన వర్తమానమ్ : ఆత్మ ఇప్పుడే ఇక్కడే భూతజాలమంతా తన అనంత కల్పనా చమత్కారముగా కలిగినదై యున్నది. కథలోని పాత్రలన్నిటికీ రచయితయే అంతర్యామి అయినట్లుగా, ఆత్మ సమస్త దేహములలోను, సమస్త దృశ్యమునందు అంతర్యామి అయి ఉన్నది.

అంతర్బహిశ్చ ఆకాశవత్ అనుస్యూతమ్ : ఆకాశము ఏ విధంగా ఒక వస్తువుయొక్క బయట - లోపల కూడా ఏర్పడినదైయున్నదో, ఆవిధంగా…,
→ అంతరమగు మనో బుద్ధి చిత్త (చేత) ఆహంకారములందు,
→ దేహములోని చూపు, వినికిడి, స్పర్శ, రుచి, వాసన మొదలైన ఇంద్రియ శక్తులందు,
→ బాహ్యమున ఇంద్రియ దృశ్య జగత్తునందు, -

సర్వత్రా ఆత్మయే విస్తరించినదైయున్నది. కల కనేవాని ఊహాచైతన్యమే కల అంతటా ఏర్పడినదై ఉన్నట్లు, ఆత్మ చైతన్యమే సర్వే సర్వత్రా వెల్లివిరిసియున్నది. ఇట్టి ‘‘అచ్యుత దృష్టి, నిశ్చల బుద్ధియొక్క స్థితి’’ కలవాడే బ్రాహ్మణుడు.

అఖండానంద స్వభావమ్ : ఆత్మ స్వతఃగా స్వభావరీత్యా అఖండానంద స్వరూపము. జీవాత్మత్వము పరమాత్మయొక్క స్వకీయ లీలా కల్పనా వినోదము. ‘‘జీవాత్మ-దృశ్యము’’, ‘‘జీవాత్మ-దేహము’’, ‘‘జీవాత్మ-దేహి’’లతో పరాత్మకు ఉన్న సంబంధము = ‘‘వినోదము కొరకు కథ చదువువాడు - కథలోని విశేషములు’’ అను ఈ రెండిటికి గల సంబంధము వంటిది మాత్రమే. ‘‘కల తనదైనవాడు - కలలోని విషయములు’’ ఈ ఉభయములకు గల సంబంధము వంటిదే।

జీవాత్మగా ఉన్నది పరమాత్మయే। పరమాత్మయే జీవాత్మగా కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఏదైతే దృశ్య - దేహ జీవాత్మ - ఈశ్వరాత్మ - పరమాత్మగా కనిపిస్తూ ఉన్నా కూడా, తనకు ‘ఏకముగా’ అనిపించుచున్నదో - అట్టివాడే బ్రాహ్మణుడు.

ఒక నటుడు (1) కేవలుడుగా (2) నటనా చాతుర్యము కలవాడుగా, (3) నాటకంలో పాత్రగా - ఒకే సమయంలో అఖండుడై ఉన్నట్లుగా, పరమాత్మ-జీవాత్మ-జగత్తులుగా విభాగము పొందకయే, అట్టి సమస్తము తనయొక్క అఖండస్వరూపముగా కలిగియున్నట్టిదే ఆత్మ. అట్టి ఆత్మ ‘తానే’ అయి ఉన్నవాడే ‘బ్రాహ్మణుడు’.

అప్రమేయమ్ : నాటకంలో నటిస్తున్న ఒక నటునికి సంబంధించి, ఆ పాత్రయొక్క సుఖ - దుఃఖ, మాన-అవమాన, పాత్రప్రవేశ-నిష్క్రమణములతో ఆతనికి నాటకీయ సంబంధమేకాని, సహజమగు ఎట్టి సంబంధము ఉండడుకదా! ‘‘ఈ దేహ-దేహిలతో సంబంధ బాంధవ్య అనుబంధములతో కూడిన మనో - చిత్త బుద్ధి అహంకార ప్రదర్శనలతో ఆత్మకు ఎట్టి సంబంధము లేదు’’ అని ఎరిగి, ‘త్వమ్’ పట్ల ఆత్మదృష్టిని ఏమరువనివాడు బ్రాహ్మణుడు. ‘‘తత్ త్వమ్ (అదియే నీవు)’’ యొక్క అభ్యాసముచే సోఽహమ్ (అదియే నేను) - అని సిద్ధింపజేసుకుంటున్నవాడు - బ్రాహ్మణుడు.

అనుభవైక వేద్యమ్ : ‘ఆత్మ ఇట్టిది’ అని మాటలతో వర్ణించి చెప్పగలిగేది కాదు. (యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ). మరి ఆత్మను తెలుసుకొనేది ఎట్లా? అది తెలియబడేది కాదు, - తెలుసుకుంటున్నదే ఆత్మకాబట్టి. పోనీ ఆత్మ అనుభవమమవదా? ఆత్మ అనుభవమునకు సర్వదా సిద్ధమే. అది అనుభవైక వేద్యమే. ఎవరికి వారికి వారియొక్క స్వానుభవము అగుచున్నదే. బుద్ధి (common sense) కు తెలియబడగలిగినట్టిదే।

అపరోక్షతయా భాసమానమ్
- ఇంద్రియములకు (కంటికి, చెవులకు మొదలైన వాటికి) విషయము కాదు కాబట్టి ఆత్మ-జగత్తులోని ఒక వస్తువువలె ‘ప్రత్యక్షము’ కాదు.
- ఈ జీవునికి వేరై మరెక్కడో ఉన్నట్టిది కాదు కాబట్టి ఆత్మ పరోక్షము కూడా కాదు.
- ప్రతి జీవునికి ఎల్లప్పుడూ స్వానుభవమే కాబట్టి అపరోక్షము. ఈ విధంగా, ‘‘ఆత్మ సర్వదా సర్వత్రా అపరోక్షమై భాసిస్తున్నది’’ - అను అనుభవముచే (అపరోక్షానుభవముచే) ఈ జీవుడు ‘బ్రాహ్మణుడు’ అగుచున్నాడు.

కరతల-ఆమలకవత్ సాక్షాత్ అపరోక్షీ కృత్య కృతార్థతయా : బ్రహ్మము (లేక) ఆత్మ ఎప్పుడో ఎక్కడో ఏవేవో సాధనల అనంతరము సిద్ధింపజేసుకోవలసి ఉన్నట్టిది కాదు. ఇప్పుడే ఇక్కడే ‘సర్గము’ను (The Relatedness with contexts and incidents) జయించినవాడు పరబ్రహ్మమును అరచేతిలోని ఉసిరగపండువలే (కరతల ఆమలకమువలె) సాక్షాత్‌గా అపరోక్షి అయి దర్శించగలడు. అట్టి కరతలామలక - సాక్షాత్ అపరోక్షిత్వము సిద్ధించుకొని కృతార్థుడైనవాడే (కృతకృత్యుడైనవాడే) బ్రాహ్మణుడు.

(స్వాభావతః) కామ రాగాది దోషరహిత, శమ దమాది సంపన్నో, మాత్సర్య తృష్ణా ఆశా మోహాది రహితో - బ్రాహ్మణః।

సర్వము స్వస్వరూపాత్మగా దర్శించువానికి (ఇంకా ఏదో పొందవలసి ఉన్నది -అనురూపముగల) కామము, లభించిన - లభించని వస్తు, విషయ-బంధుజనులపట్ల (వీరు నావారు, వారు కాదు అను రూపముగల) రాగము- స్వభావముగానే దూరంగా వెళ్ళిపోతాయి.

అంతర దృష్టిచే అట్టి కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములను జయించినవాడు, శమము (అంతరింద్రియ నిగ్రహము) - దమము (బాహ్యేంద్రియ నిగ్రహము-ఇంద్రియములు బాహ్య విషయములపై వాలటము నిగ్రహించటమును) లను స్వాభావికము చేసుకొన్నవాడే బ్రాహ్మణుడు.

ఏదో ఇంకా అనుభవించాలనే తృష్ణ, ‘‘నేను ఈతనికంటే గొప్పవాడిని కదా’’-అనే మాత్సర్యము, ఆశ నిరాశ దురాశ పేరాశలు, సత్యమును ఏమరచి నామరూపక్రియా విశేషములచే మోహితుడై ఉండటము-వీటన్నిటిపై యుద్ధము ప్రకటించి, సర్వత్రా ఆత్మభావనయందు లయింపజేయుచున్నవాడే బ్రాహ్మణుడు. వాటినన్నిటినీ ఆతడు కల్పిత భ్రమవిశేషములుగా చూచువాడు బ్రాహ్మణుడు.

దంభ అహంకారాదిభిః అసంస్పృష్ట చేతావర్తతే : తనయొక్క ‘‘అహం బ్రహ్మాస్మి - తత్ త్వమ్’’ అను తేజస్సు హృదయమున అనుక్షణికమై ప్రకాశించుచుండగా -‘దంభ - దర్ప, అభిమాన, క్రోధ, పారుష్య, అజ్ఞాన, ఆభిజాత్య’’…మొదలైన అజ్ఞానాంధకార భ్రమలకు హృదయమున చోటు కించిత్ కూడా దొరకనివాడై ప్రకాశించువాడు బ్రాహ్మణుడు.

- - -

ఓ మమాత్మానంద స్వరూపా! బిడ్డా! శిష్యదేవా!

ఏవ ముక్త లక్షణో యః స ఏవ బ్రాహ్మణః।। మనము ఇప్పుడు చెప్పుకున్న ‘ముక్తి లక్షణములు’ ఎవరిపట్ల ఏర్పడినవై వెంటనంటి ఉంటాయో, ఆతడే ‘‘బ్రాహ్మణుడు’’ సుమా!

‘బ్రాహ్మణ’ అనునది బుద్ధియొక్క పరిపక్వతకు సంబంధించినదేగాని - బాహ్యలక్షణము కాదు. ఇదియే బ్రాహ్మణుడు అను పదము ఉపయోగించు సందర్భములలో బ్రాహ్మణములు, తదితర వేద విభాగములు, శ్రుతి స్మృతి పురాణ ఇతిహాసముల అభిప్రాయము కలిగినవై ఉంటున్నాయి. ఇతి శ్రుతి స్మృతి పురాణ ఇతిహాసానామ్ అభిప్రాయః।।

ఇక,
అన్యథా బ్రాహ్మణత్వసిద్ధిః నాస్త్యేవ। కేవలము శాస్త్ర విజ్ఞానము చేతనో, కర్మలచేతనో, జాతి చేతనో, జన్మ చేతనో, పాండిత్యము చేతనో, వేద పఠణముల చేతనో - ఒకడు (వేద-వేదాంగ-పురాణాదుల ఉద్దేశ్యములో) ‘బ్రాహ్మణుడు’ అగుచుండటం లేదు.

- - -

శిష్యులు : హే సద్గురూ। భగవాన్। మహానుభావా। మీరు చెప్పుచున్నట్టి అట్టి ‘‘బ్రాహ్మీ స్థితి సమన్వితమగు బ్రాహ్మణత్వ సిద్ధి’’ లభించేది ఎట్లా? దయతో సెలవీయండి. దారి చూపండి. శాసించి ఆజ్ఞాపించండి.

గురుదేవులవారు : నాయనా! అసలు ఆత్మస్వరూపుడవగు నీకు ఈ బంధము ఎక్కడినుండి వచ్చిపడుతోంది? ఇంద్రియములకు విషయముల రూపంగా ఎదురగుచున్న విశేషములతో అనేకసార్లుగా ఏర్పరచుకొన్న ‘భావనారూప సంబంధము’ అనే వ్యసనము చేతనే.

అందుచేత,
అట్టి ‘భావించటము’ అను అభ్యాసమును ఉపకరణముగా చేసుకొని, ‘‘అఖండము - అప్రమేయము - సర్వదా స్వస్వరూపము’’ అగు బ్రాహ్మీభావనను ఆశ్రయించటం చేత - బ్రాహ్మీస్థితి సిద్ధించి, ఈ జీవుడు వేద - ఇతిహాస - పురాణ స్మృతుల ఉద్దేశ్య పరమార్థమగు ‘బ్రాహ్మణ’ నామధేయమునకు అర్హుడగుచున్నాడు.

అందుచేత -,
సత్‌చిత్ ఆనందమ్ ఆత్మానమ్ అద్వితీయమ్ బ్రహ్మ భావయేత్।। త్వమ్‌గాను, ఈ జగత్తుగాను కనిపించేదంతా → సచ్చిదానంద ఆత్మకు అద్వితీయమని, ఇదంతా ఆత్మయేనని భావనను అభ్యాసపూర్వకంగా ఆశ్రయించువాడవై ఉండుము.

ఆత్మానం సచ్చిదానందం బ్రహ్మ భావయేత్ । ‘‘మమాత్మ సచ్చిదానంద బ్రహ్మమే’’అని ఆత్మచే భావన చేయాలి.
అనుకుంటూ, అనుకుంటూ ఉంటే - తప్పక అనిపిస్తుంది.

ఆత్మ (In ones own absloute self) యందు ఈ సమస్త జగత్తును, జగత్తునందు అంతటా ఆత్మను భావించాలి. అట్టి బ్రాహ్మీదృష్టిని స్వాభావికము, అనుక్షణికము చేసుకొనెదవు గాక।


ఇతి వజ్రసూచిక ఉపనిషత్ (లేక) వజ్రసూచ ఉపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।