[[@YHRK]] [[@Spiritual]]

Paramahamsa Parivrȃjaka Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అథర్వణ వేదాంతర్గత

15     పరమహంస పరివ్రాజకోపనిషత్

శ్లోకతాత్పర్య పుష్పమ్

పరమహంస: ‘సో౽హమ్ పరమ్’ ‘‘సమస్తమునకు ఆవలగల నేనైన నేనే నేను’’ అను ఎరుక కలవాడు.
పరివ్రాట్: అట్టి కేవలమగు ‘సో౽హమ్’ నందు సంచరిస్తూ సమస్తమును స్వస్వరూపంగా దర్శించువాడు.

శ్లో।। పారివ్రాజ్య ధర్మవన్తో
యన్(త్) జ్ఞానాత్ బ్రహ్మతాం యయుః
తత్ బ్రహ్మ ప్రణవైకార్థం
తుర్య తుర్యమ్ అహం భజే।।
ఏది తెలుసుకొని ‘పరివ్రాజ్య’ ధర్మము ఆశ్రయించిన వారు బ్రహ్మము తామే అగుచున్నారో, అట్టి ప్రణవ-ఏకార్థము అయినట్టిది, తురీయమునకే తురీయమైనది - అగు ‘తత్’ అర్థ బ్రహ్మమును స్తుతించుచున్నాము.
మం।। శ్లో।।
1. అథ పితామహః -
స్వ పితరమ్ ఆదినారాయణమ్
ఉపసమేత్య, ప్రణమ్య పప్రచ్ఛ :
ఓం
ఒకానొక సందర్భములో పితామహులగు బ్రహ్మభగవానుడు - వారి పిత్రుదేవులగు శ్రీమన్ ఆదినారాయణ స్వామిని దర్శించి హృదయపూర్వక ప్రణామములు సమర్పించారు. అనేక విశేషాలు శ్రవణం చేసి, ఇంకా ఈ విధంగా అడిగారు.
భగవన్! త్వత్(న్) ముఖాత్
వర్ణాశ్రమ ధర్మ క్రమం
సర్వం శ్రుతం విదితమ్, అవగతమ్।
ఇదానీం పరమహంస పరివ్రాజక
లక్షణం వేత్తుమ్ ఇచ్ఛామి।
బ్రహ్మదేవుడు: హే భగవన్! ఆదినారాయణ స్వామీ! మీరు నాకు వర్ణాశ్రమ ధర్మక్రమము గురించి అనేక విశేషాలు చెప్పగా, అవన్నీ విని నేను అనేక విశేషాలు అవగతము చేసుకోవటం జరిగింది.
ఇప్పుడిక పరమహంస-పరివ్రాజక లక్షణముల గురించి మీ వద్ద నుండి శ్రవణం చేయాలనే ఇచ్ఛ, ఉత్సుకత కలిగి ఉన్నాను. దయతో వివరించి చెప్పండి.
కః పరివ్రజనాధికారీ?
కీదృశం పరివ్రాజక లక్షణమ్?
కః పరమహంసః?
పరివ్రాజకత్వం కథమ్?
తత్ సర్వం మే బ్రూహి।। ।।ఇతి।।
‘‘పరివ్రాజకుడు’’ అని పిలువబడటానికి పరివ్రజన - అధికారి (అర్హుడు) ఎవరు?
పరివ్రాజక లక్షణములు ఏమేమి?
‘‘పరమహంస’’ అనగా ఎవరు?
‘‘పరివ్రాజకత్వము’’ అనేది ఎట్లా సిద్ధించగలదు?
ఈ ఈ విశేషాలన్నీ దయచేసి నాకు బోధించండి.
2. సహో వాచ భగవాన్ ఆదినారాయణః :
సద్గురు సమీపే సకల విద్యాపరిశ్రమజ్ఞో భూత్వా,
విద్వాన్ సర్వమ్
ఐహిక ఆముష్మిక
సుఖశ్రమం జ్ఞాత్వా,
ఆదినారాయణ భగవానుడు: హే! బ్రహ్మదేవా! చెప్పుకుందాం వినండి.
ఎవరి బోధను ‘సత్ రూపము’ అగు తత్త్వజ్ఞానము (you are that) ఆశ్రయించి ఉంటుందో, అట్టి సద్గురువును ముముక్షువులు సమీపించెదరు గాక. ఆత్మతత్త్వము గురించి పరిశ్రమించి అధ్యయనము చేసెదరు గాక. ఐహికమైనవి, ఆముష్మికమైనవి అగు సుఖములన్నీ అనేక దుఃఖములు పర్యవసానముగా కలిగి ఉన్నదని గ్రహించెదరు గాక!
ఈషణా త్రయ, వాసనా త్రయ
మమత్వ-అహంకారాదికం
వాన్తాన్నమివ హేయమ్
అధిగమ్య, మోక్షమార్గైక సాధనో
బ్రహ్మచర్యం సమాప్య, గృహీ భవేత్।।
- (భార్యేషణ, పుత్రేషణ, ధనేషణ అనే) ఈషణా త్రయమును,
- (‘‘దేహివాసన, దృశ్యవాసన, శాస్త్రవాసన’’ అనబడే) వాసనాత్రయమును,
- ‘‘ఇదంతా నాది. నాకు చెందినది. నేను దీని దీనికి చెందినవాడను. నేను ఇంతటి వాడను. ప్రత్యేకమైన వాడను’’- మొదలైన అహంకారరూప ఆయా సంబంధ బాంధవ్య అనుబంధములను -
‘కక్కినకూడు’ వలె ఈ జీవులు వదలి (అధిగమించి) ఉండెదరు గాక!
‘మోక్షము’నకు బీజము అయినట్టి బ్రహ్మచర్యము (సమస్తము బ్రహ్మముగా భావన చేయుటము)ను బాల్యములోనే అభ్యసించాలి.
- అప్పుడు ‘‘బ్రహ్మజ్ఞాన దృష్టితో సంఘములో ఎట్లా ఉండాలి?’’ - అనే సూత్ర విధానము (శాస్త్రవిధానము) ఎరిగినవాడై గృహస్థాశ్రమము స్వీకరించు గాక!
గృహాత్ వనీ భూత్వా ప్రవ్రజేత్।
యదివ ఇతరథా, బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్।
గృహాద్వా వనాద్వా, అథ పునః అవ్రతీ వా,
వ్రతీ వా, స్నాతకో వా, (అస్నాతకో వా)
ఉత్సన్నాగ్నిః, సాగ్నిః అనగ్నికో వా
యత్ అహరేవ విరజేత్
తత్ అహరేవ ప్రవ్రజేత్।।
గృహస్థాశ్రమము నుండి-ప్రపంచమును (సాంఘిక జీవితమును) దాటివేయు, ప్రపంచాతీతత్వము వహించు అర్థముగల వానప్రస్థా శ్రమమును - ఆశ్రయించును గాక।
లేదూ, బ్రహ్మచర్యము నుండే కూడా ‘‘వానప్రస్థము’’ స్వీకరించవచ్చు.
ఒకడు గృహస్థుడుగా ఉన్నా, (లేక) వానప్రస్థుడుగా ఉన్నా, (లేక) వ్రతములు చేయనివాడైనా, చేయువాడైనా, స్నానశీలరతుడైనా, అస్నాతుడు (స్నానము చేయనివాడు) అయి ఉన్నా, ఉత్సన్నాగ్నికుడు (ఎల్లప్పుడు అగ్నిని వెలిగించి ఉంచుతూ ఉపాసన చేయువాడు) (నిత్య అగ్నిహోత్రుడు) అయినా, నిరగ్నిమంతుడైనా, అగ్నిమంతుడు అయినా కూడా →
- ఏరోజు ‘విరక్తుడు’ అయితే ఆరోజే ప్రవ్రజుడు (Leaving the Social Life) అయి, సమస్తము వదలి సన్న్యాసమును స్వీకరించును గాక.
3. ఇతి బుధ్వా సర్వ సంసారేషు
విరక్తో బ్రహ్మచారీ గృహీ వానప్రస్థో వా,
పితరం మాతరం కళత్రం పుత్రమ్
ఆప్తబంధువర్గం తత్ అభావే
శిష్యం సహవాసినం వా
అనుమోదయిత్వా,
‘‘(త్యాగేనైవతు కైవల్యమ్) - ఈ కనబడేవన్నీ దేహముతో సహా నన్ను విడువకముందే, నేను వీటిని మనస్సుతో విడచివేసి ఉండెదను గాక’’- అను బుద్ధిని సంపాదించుకొనును గాక. ఒకడు బ్రహ్మచారి అయినా, గృహస్థుడు అయినా, వానప్రస్థుడు అయినా కూడా - ఈ దృశ్యముపట్ల విరక్తుడై సన్యాసాశ్రమము స్వీకరించి, బుద్ధిని నిశ్చలపరచుకొనుచు విరక్తుడు అయి ఉండును గాక।
తండ్రి, తల్లి, భార్య, కుమారులు, తదితర ఆప్త బంధువుల వద్ద తన సన్న్యాసస్వీకారమునకు అంగీకారము పొందాలి. ఒకవేళ దగ్గిర బంధువులు లేకుంటే శిష్యుల వద్ద, సహవాసులవద్ద (తన తోటి వారివద్ద) అట్టి అనుజ్ఞ పొందును గాక!
తద్థైకే (తత్ హి ఏకే) ప్రాజాపత్యామే వేష్టిం కుర్వన్తి।
తదు తథా న కుర్యాత్
ఆగ్నేయ్యామేవ కుర్యాత్।
ఆవిధంగా సన్న్యాసము స్వీకరించువారిలో కొందరు ముందుగా ప్రజాపత్యేష్టి అనే (అగ్న్యోపాసనతో కూడిన) వ్రతము చేయుచున్నారు.
అది నిర్వర్తించలేని వారు ‘అగ్నేయాష్ఠి’ అనేది చేయవచ్చును.
అగ్నిర్హి ప్రాణః। ప్రాణమేవ ఏతయా కరోతి।
త్రైధాతవీయామేవ కుర్యాత్ ఏతయైవ
‘త్రయో’ ధాతవో యదుత
‘సత్త్వం రజః తమ’ ఇతి।
అగ్నియే ప్రాణము. అట్టి ప్రాణ శక్తియే ఈ సమస్తమును నిర్వర్తించు చున్నది.
అట్టి అగ్నికి త్రి (3) ధాతువులు. (1) సత్త్వము (2) రజము (3) తమము. అవియే త్రిగుణములు. ప్రాణశక్తి నిర్వర్తిస్తున్న ధారణయే త్రిగుణములు.
మాయొక్క అశుచికరమగు ఇంద్రియ విషయములన్నీ కూ&
అయం తే యో నిరృత్వియో
యతో జాతో అరోచథాః।
తం జానన్ అగ్న ఆరోహా
అథానో వర్ధయారయిమ్।।
నాశనశీలములు, అభాగ్యములు. దుఃఖమే పరిణామముగా కలిగి ఉంటు న్నాయి. కాబట్టి నిరృతములు. అరుచియే అయి ఉన్న ఇంద్రియ విషయ వ్యవహారమంతా అగ్నిచేత భస్మము చేయబడు గాక! మేము ఋతము (సత్యము)ను ఆశ్రయించెదము గాక! అట్టి ఆత్మభావనచే ఆత్మయందు వర్ధనము (Progress) పొందెదము గాక! సత్యమగు ‘ఆత్మ- ఆత్మభావన’యందు ప్రవేశించి ఉండెదము గాక!
ఇతి అనేన మంత్రేణ అగ్నిమ్ ఆజిఘ్రేత్।
ఏష వా అగ్నేః (యోనిర్యః ప్రాణః।
ప్రాణం గచ్ఛ స్వాం యోనింః।
గచ్ఛ స్స్వాహేతి ఏవమ్ ఏవై తదాహ।
ఈ విధమైన ఆయా మంత్రములతో అగ్నిని ఉపాసిస్తూ, వాసన చూడాలి.
ప్రాణము అగ్ని నుండి జనిస్తూ అగ్నిని యోనిగా కలిగి యున్నది. అట్టి ప్రాణము ప్రాణేశ్వరుడగు ఆత్మదేవునియందు ప్రవేశించి సశాంతించి ఉండును గాక।
(తదాహ) గ్రామాః శ్రోత్రియాగారాత్ అగ్నిమ్ అహృత్య
స్వ విధ్యుక్త క్రమేణ పూర్వవత్ అగ్నిమ్ ఆజిఘ్రేత్।
శ్రోత్రియాగారము (పవిత్రమైన యజ్ఞశాల, దేవాలయము మొదలైన ప్రదేశము) నుండి అగ్నిని తీసుకురావాలి. వేదజ్ఞులచే నియమించిన విద్యుక్త విధిగా (As is commanded by ఋత్విజులు) అగ్నికి ఆహుతులను సమర్పించాలి. పైన చెప్పిన విధంగా అగ్నిని వాసన చూచి, ఇక సన్న్యాసాశ్రమమును స్వీకరించాలి,
యత్ ఆతురోవా అగ్నిం న విందేత్।
అప్సు జుహుయాత్
ఆపో వై సర్వా దేవతాభ్యో జుహోమి। (స్వాహా)।
(ఆతురసన్న్యాసము: మరణము సమీపిస్తున్నప్పుడు అగ్ని విధులను పాటించే సమయము, మంత్రములను అనుష్ఠించే శరీర స్థితి లేనప్పుడు స్వీకరించు సన్న్యాసము). అట్టి ‘‘ఆతుర సన్న్యాసము’’ స్వీకరించునప్పుడు అగ్ని కార్యమునకు అవకాశము సమయము లేకపోతే - అప్పుడు ‘‘ఆపోవై సర్వా దేవతాభ్యో జుహోమి స్వాహా।’’ అను మంత్రముతో నీటిలోనే సమస్తము సన్న్యసిస్తూ ‘హోమము’ చేయవచ్చును.
4. స్వాహేతి హుతా ఉద్ధృత్య
ప్రాశ్నీయాత్ ఆజ్యం
హవిః అనామయమ్ ఏష విధిః।
‘‘స్వాహా’’ అని పలుకుచూ ఆజ్యము (నేయి)తో కూడిన హవిస్సును స్రువముతో (నేయిని ఆహుతి చేయటానికి ఉపయోగించే మాని గరిటెతో) చేయి ఎత్తి అగ్ని ద్వారా అనామయుడగు పరమాత్మకు సమర్పించాలి. ఇది వేదవిహితమగు విధి విధానము.
వీరాధ్వానేవ, అనాశకే వాసం ప్రవేశేవ
అగ్ని ప్రవేశే, మహాప్రస్థానే వా।
యత్ ఆతురః స్యాత్
మనసా వాచా వా సన్న్యసేత్।
వీరాధ్వాన విధిగా కాని, నాశక విధిగాకాని, (సంప్రకాశవిధిగాగాని, అగ్నిప్రవేశ విధియందుగాని), మహాప్రస్థాన విధియందుగాని ‘‘స్వాహా’’ అను మంత్రముచే హవిస్సును సమర్పించటమే విధి - విధానము.
ఆతురసన్న్యాసమైతే - ‘నాది’ అనబడు సమస్తమును మనస్సుతోను, వాక్కుతోను సన్న్యసించెదరుగాక. (అగ్నికార్యముయొక్క అవసరము లేదు)
ఏష పంథాః స్వస్థః క్రమేణైవ చేత్
‘‘ఆత్మ శ్రాద్ధం’’, ‘‘విరజా హోమం’’ కృత్వా,
అగ్నిమ్ ఆత్మని ఆరోప్య,
లౌకిక వైదిక సామర్థ్యం
స్వ చతుర్దశ కరణ ప్రవృత్తిం చ
పుత్రే సమారోప్య,
తదభావే శిష్యే వా,
తదభావే స్వాత్మన్యేవ వా,
సన్న్యసించునప్పుడు స్వస్థుడు (peaceful) అయి క్రమమును పాటిస్తూ ఆత్మశ్రాద్ధము, విరజాహోమము నిర్వర్తించాలి.
ఆ తరువాత ఆత్మను అగ్నియందు ఆరోపించాలి. ‘‘ ఈ సృష్టి అనబడే సమస్తమునకు ముందుగా అగ్నియే జ్వాజ్వల్యమై ఉన్నది’’ అని మననము చేయాలి. (అగ్నిమీళే పురోహితే)।
లోకసంబంధమైన, వైదిక సంబంధమైన సమస్త సామర్థ్యములను, స్వకీయమైన కరణ ప్రవృత్తులను పుత్రుని పట్ల సమారోపణ చేయాలి. కుమారుని బ్రహ్మముగా (ఆత్మగా) భావించాలి. కుమారుడు లేకుంటే శిష్యునిపట్ల సమారోపణ చేయవచ్చును.
శిష్యుడు కూడా లేకుంటే స్వాత్మ (స్వకీయ జీవాత్మ) (one’s own Self) యందు సమారోప్యము చేయవచ్చును.
‘‘బ్రహ్మా త్వమ్। యజ్ఞః త్వమ్।’’
- ఇతి అభిమంత్ర్య,
బ్రహ్మ భావనయా ధ్యాత్వా,
సావిత్రీ ప్రవేశపూర్వకమ్
అప్సు సర్వ విద్యార్ధ స్వరూపాం
బ్రాహ్మణ్యాధారాం
- వేద మాతరమ్ క్రమాత్
వ్యాహృతిషు త్రిషు ప్రవిలాప్య,
ఓ కుమారా! (లేక) ఓ శిష్యా! (లేక) ఓ ఆత్మపురుషా! (లేక) మమ ప్రకృతి- అంతర్గత జీవాత్మ స్వరూపమా!
‘‘నీవే బ్రహ్మవు! నీవే (ఈ సృష్టి) యజ్ఞమువు’’ అని అభిమంత్రించాలి. బ్రహ్మభావనను ధ్యానించాలి.
సావిత్రీ ప్రవేశపూర్వకంగా, - సర్వ విద్యాధ్యయన స్వరూపి, బ్రహ్మవిద్యకు ఆధారము అగు వేదమాతకు జలతర్పణంగా వేదవిహితక్రమంగా ‘3’ సార్లు వ్యాహృతులు ప్రవిలాపనము చేయాలి. (సమర్పించాలి).
వ్యాహృతి త్రయమ్ - ‘అ’కార, ‘ఉ’కార
‘మ’కారేషు ప్రవిలాప్య,
తత్ సావథానేవ ఆపః ప్రాశ్య
ప్రణవేన శిఖామ్ ఉత్కృష్య
‘‘వ్యాహృతిత్రయము’’ అయినట్టి ‘అ’ కార, ‘ఉ’కార, ‘మ’కారము లందు సమస్తము ప్రవిలాప్యము చేయాలి (సమర్పించాలి).
తత్ పరబ్రహ్మతత్త్వ భావనయందు సావధానుడై (Fixed Attention), (‘‘ఓం’’) అని ప్రణవమును ఉచ్ఛరిస్తూ శిఖ (పిలక)ను ఛేదించాలి.
5. యజ్ఞోపవీతం ఛిత్త్వా
వస్త్రమపి భూమౌ వా
అప్సు వా - విసృజ్య,
‘‘ఓం భూః స్వాహా। ఓం భువః స్వాహా।
ఓగ్ం సువః స్వాహా।’’ - ఇతి।
- యజ్ఞోపవీతమును త్రెంచాలి.
- వస్త్రములను కూడా భూమిపైగాని, నీటిలోగాని వదలివేయాలి.
‘‘ఓం భూః స్వాహా! ఓం భువః స్వాహా! ఓగ్ం సువః స్వాహా!’’ అని పలుకుచూ పరమాత్మకు సమర్పించాలి. [ (1) The Matter (2) The Thought (3) The Thinker (Individual Self) - All three be submitted to Al-mighty ].
(ఇతి) అనేన జాతరూప ధరో భూత్వా
స్వరూపం ధ్యాయన్,
పునః పునః ప్రణవం
వ్యాహృతి పూర్వకం
పుట్టినప్పటినుండి - వర్తమాన క్షణము వరకు ఏర్పడినవై ఉన్న సమస్త సంబంధ అనుబంధములను త్యజించి, అప్పుడే పుట్టిన పిల్లవానివలె స్వస్వరూపమును ధారణ చేయాలి.
‘ఓం’ అను ప్రణవమున మరల మరల ‘‘అ-ఉ-మ’’ - వ్యాహృతిపూర్వకంగా పలుకుచూ, ‘‘ప్రాపంచకమైన సమస్తమును మనసా, వాచా వదులు చున్నాను’’ అని పలుకుచూ వదలివేయాలి.
మనసా వచసా౽పి -
‘‘సన్న్యస్తం మయా। సన్న్యస్తం మయా।’’
‘‘సన్న్యస్తం మయ।’’ - ఇతి
- మంద్ర మధ్యమ తార ధ్వనిభిః
మనస్సుతోను వాక్కుతోను కూడా -
‘‘నాచేత సమస్తము సన్న్యసించబడుతోంది’’ - అనే భావనతో ‘‘సన్న్యస్తం మయా’’ - అని 3 సార్లు మంద్రముగాను, మధ్యమ - తార (ధీర్ఘ) ధ్వనులతోను ధ్వని చేస్తూ ఉండాలి.
త్రివారం త్రిగుణీకృత ప్రేషోచ్ఛారణం కృత్వా,
ప్రణవైక ధ్యాన పరాయణః సన్
అ(న)భయగ్ం సర్వ భూతేభ్యో మత్తః స్వాహేతి।
(పైన చెప్పినట్లు) మూడుసార్లు త్రిగుణీకృతంగా ప్రేష - ఉచ్ఛారణ చేస్తూ, ప్రణవైకంగా ధ్యానపరాయణుడై ఉండాలి.
‘‘అభయగ్ం సర్వభూతేభ్యో మత్తస్వాహా’’ అంటూ, చేతులెత్తి ‘‘సర్వ భూతజాలమును మమాత్మస్వరూపమే! కనుక అభయుడను’’ అని ఎలిగెత్తి పలకాలి.
ఊర్ధ్వ బాహుః భూత్వా ‘‘బ్రహ్మాహమస్మి’’
ఇతి ‘‘తత్త్వమసి’’ ఆది
వాక్యార్థ స్వరూప సంధానం కుర్వన్,
రెండు చేతులూ పైకి ఎత్తి
• నేను బ్రహ్మమునే అయి ఉన్నాను-బ్రహ్మాహమస్మి।
• ‘నీవు’ గా కనిపిస్తు ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉన్నది-తత్త్వమసి।
అను వేదోపనిషత్ మహావాక్యముల స్వరూపార్థమును అనుసంధానము చేస్తూ ఉండాలి. (సో౽హమ్ - తత్వమ్ మహావాక్యముల అర్థ మననము).
ఉదీచీం దిశం గచ్ఛేత్
జాతరూప ధరశ్చరేత్ - ఏష సన్న్యాసః।
దిగంబరుడై (వస్త్రములు విడచి), 10 దిక్కులను తన వస్త్రముగా (ఆత్మస్వరూపుడై) భావన చేస్తూ, ఉత్తరదిశగా అభిముఖుడై నడువ నారంభించాలి.
ఇది ‘‘సన్న్యాసము’’ అనబడుతోంది.
తత్ అధికారీ భవేత్, యది (If) గృహస్థః
ప్రార్థనా పూర్వకమ్, అభయగ్ం
సర్వభూతేభ్యో మత్తః సర్వం ప్రవర్తతే।।
గృహస్థుడు పైరీతిగా సన్న్యాసమునకు అధికారి అయితే, ‘‘అభయగ్ం సర్వభూతేభ్యో। మత్తః సర్వం ప్రవర్తతే।’’ - ‘‘సర్వభూతజాలముల అభయ స్వరూపమగు ఆత్మనగు నేనే। ఆత్మనగు నాచేతనే సమస్తము ప్రవర్తింపజేయబడుచు, క్షేమము పొందుచున్నది.
- ఆత్మపురుషుడునగు నాచేతనే (14 లోకములలోని) సమస్తము ప్రవర్తనశీలమగుచున్నది।’’
- అని మననమును నిశ్చితము, నిశ్చలము చేసుకొనును గాక।
ఓ ప్రార్థనా దేవీ (లేక) జపాదేవీ! నాయొక్క రక్షకుడగు సంజ్ఞుడవు నీవే। ఇంద్రుని వజ్రమువంటి దానవు! మాలోని దుష్టత్వమును, దుర్వార్తలను, పాపదృష్టులను తొలగించుము. ఆత్మానందము ప్రసాదించెదవు గాక.
6. ‘‘సఖా మా గోపాయోజః, సఖాయో అసి।
ఇంద్రస్య వజ్రో౽సి, వార్త్రఘ్నః శర్మ మే భవ
యత్ పాపం తన్నివారయ’’ - ఇతి।
(ఇతి) అనేన మంత్రేణ
ప్రణవపూర్వకగ్ం సలక్షణం వైణవం
దండం కటిసూత్రం కౌపీనం
కమండలుం వివర్ణ వస్త్రమ్ ఏకం పరిగృహ్య,
మంత్రార్థము - కౌపీనము, దండము మొదలైన స్నేహితులారా! మీరు నా ఈ సన్న్యాసయోగమునకు రక్షకులై, సఖులై ఉండండి. ఇంద్రుని వజ్రమువలె ప్రాపంచక వ్యవహారములనుండి దోష దృష్టుల నుండి రక్షించండి.
‘‘సఖా మా గోపాయోజః - - తన్నివారయ’’ - మంత్రమును పలుకుచు ప్రణవపూర్వకంగా సంజ్ఞగా - చక్కటి లక్షణములుగల వైణవదండము (వెదురు దండము)ను వైణవ కటిసూత్రము (నడుముకు కట్టే త్రాడు)ను, కౌపీనము (గోచి)ను, కమండలువు (జలపాత్ర)ను, వివర్ణ అంగవస్త్రమును పరిగ్రహించాలి.
సద్గురుం ఉపగమ్య, నత్వా
గురుముఖాత్ ‘తత్ త్వమ్ అసి’
- ఇతి వాక్యమ్ ప్రణవపూర్వకమ్ ఉపలభ్య।
సద్గురువును సమీపించి వారికి నమస్కరించి గురుముఖతః ‘‘తత్త్వమసి’’ ‘‘నీవుగా కనిపించే సమస్తము తత్ - పరమాత్మయే’’ అను మహావాక్యార్థమును శ్రవణ - మనన - బుద్ధి పూర్వకంగా పొందాలి.
అథ జీర్ణ వల్కలాజినమ్ ధృత్వా,
అథ జలావతరణమ్ ఊర్ధ్వగమనమ్
ఏకభిక్షాం పరిత్యజ్య, త్రికాలస్నానమ్ ఆచరన్-
వేదాంత శ్రవణపూర్వకం
‘ప్రణవ’ అనుష్ఠానం కుర్వన్,
జీర్ణమైన నారబట్టలను ధరించుచు,
జలములో ప్రవేశ - నిష్క్రమణములను వదలివేసి, ఏకభిక్షను కూడా పరిత్యజించుచు,
వేదాంత శాస్త్రపూర్వకంగా ప్రణవ అనుష్ఠానమును రోజుకు మూడుసార్లు ఆచరించును గాక।
బ్రహ్మమార్గే సమ్యక్ సంపన్నః
స్వాభిమతమ్ ఆత్మని గోపయిత్వా
నిర్మమో, అధ్యాత్మనిష్టః।
బ్రహ్మమార్గములో సమ్యక్ (సర్వ సమదృష్టి) యోగ సంపదా సంపన్నుడగు చుండును గాక।
సమస్త స్వాభిమతములను ఆత్మయందు (ఆత్మభావనయందు) లయింపజేసివేయును గాక।
‘నాది’ అను మమకారము త్యజించినవాడై,
సర్వత్ర ‘ఆత్మ సందర్శనము’ అను ‘ఆధ్యాత్మనిష్ఠ’ ను ఆశ్రయించును గాక!
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య
దంభ దర్ప అహంకార అసూయా
గర్వ ఇచ్చా ద్వేష హర్ష - ఆమర్ష
మమత్వాదీంశ్చ హిత్వా….
‘‘ఇంకా ఏదో కావాలి’’ అనే కామమును,
పగ-కోపావేశరూపమగు క్రోధమును,
దాచుకొనే - మమకార స్వభావమగు లోభమును,
అవివేకరూపమగు మోహమును,
ధన-జన-బల-అధికారరూపమగు మదమును,
ఇతరులను బాధించే (sadism) మత్సర్యమును (గర్వమును), ఇచ్ఛను, ద్వేషమును,
సంతోష దుఃఖ రూపములగు హర్ష-అమర్షములను,
‘‘నాకు వీరు చెందినవారు. నేను వీరికి చెందిన వాడిని’’ - అను రూపముగల మమత్వము మొదలైన (ఆసురీ) సంపత్తిని త్యజించును గాక।
జ్ఞానవైరాగ్యయుక్తో,
విత్త స్త్రీ పరాఙ్ముఖః। శుద్ధమానసః।
ఆత్మజ్ఞానమును ఆశ్రయిస్తూ, క్రమంగా దృశ్యముపట్ల వైరాగ్యమును పెంపొందించుకొనును గాక।
ధనము, స్త్రీ మొదలైన సంపద విశేషములపట్ల విరక్తుడై ఉండును గాక।
(మనస్సును ‘ఆత్మతత్త్వ మననము’ నందు నియమిస్తూ) శుద్ధ మానసుడై ఉండును గాక।
సర్వ ఉపనిషదర్థమ్ ఆలోచ్య।
‘‘బ్రహ్మచర్య’’, ‘‘అపరిగ్రహా’’ ‘‘అహింసా’’
సత్యం - యత్నేన రక్షయన్।
ఉపనిషత్తులు ఎలుగెత్తి చెప్పుచున్న స్వస్వరూపాత్మయొక్క తత్త్వమును విచారణ చేయుచుండును గాక! (సమస్తము బ్రహ్మముగా భావన చేయు అభ్యాసమగు) బ్రహ్మచర్యము, (దృశ్యమును బాహ్యముననే త్యజించి ఉండు) ‘‘అపరిగ్రహము’’ను, అహింసను, సత్యమును, ధ్రుతమును ప్రయత్నపూర్వకంగా పరిరక్షించుకుంటూ ఉండును గాక.
7. జితేంద్రియో బహిరంతః
స్నేహవర్జితః శరీర సంధారణార్థం
త్రిషు వర్ణేషు అభిశస్త పతిత వర్జితేషు
పశు అద్రోహీ భైక్షమాణో
బ్రహ్మభూయాయ భవతి।
ఈ విధంగా బాహ్యేంద్రియములైనట్టి శబ్ద స్పర్శ రూప గంధములకు, అంతరింద్రయములైనట్టి మనో - బుద్ధి చిత్త అహంకారములకు వశము కానివాడై ఉండునుగాక’’. ‘‘ఇది నాకు చెందినది. నేను దీనికి చెందిన వాడను’’ - అను రూపముగల స్నేహబంధములను, (రాగ- లోభములను) వదలియుండును గాక।
త్రివర్ణములలో అభిశస్తులను, పతితులను వదలి, మిగిలినవారి ఇళ్ళలో భిక్ష స్వీకరిస్తూ జీవించును గాక।
[ అభిశస్తులు = (1) ఇతరులకు హాని చేయు ఉద్దేశ్యము కలవారు. (2) హింసించువారు (3) దోషారోపణములు చేయటమే అలవాటుగా కలవారు (4) ఎల్లప్పుడు నిందారోపణలు చేయువారు ].
పతితులు = పాప అభ్యాసులు, పశుస్వభావులు.
ఇట్టి స్వభావము గలవారి వీరి వీరి ఇళ్లలో భిక్ష అడుగక, తదితరుల అందరి ఇళ్లలో భిక్ష స్వీకరించును గాక! ఎవ్వరిపట్ల కూడా దోషబుద్ధి కలిగి ఉండ కుండును గాక! అట్టి బ్రహ్మతత్త్వాభ్యాసి-బ్రహ్మమును సిద్ధించు కొనగలడు.
సర్వేషు కాలేషు లాభ - అలాభౌ సమౌ భూత్వా,
కరపాత్ర - మాధూకరణేన అన్నమ్ అశ్నన్
మేదోవృద్ధిమ్ అకుర్వన్
లాభ - అలాభముల పట్ల సమదర్శి అయి ఉండునుగాక. చేతులనే ‘‘భిక్షపాత్ర’’గా కలిగియుండి మధూకరవృత్తిగా (భిక్షాటణగా) లభించిన ఆహారమును స్వీకరిస్తూ, ఆకలి తీరటమే లక్ష్యమై ఉండు గాక. అంతేగాని ‘‘మేదో (కండ) పుష్టి’’ మొదలైనవి లక్ష్యము అవకుండును గాక.
కృశీభూత్వా
‘‘బ్రహ్మాహమస్మి’’ - (బ్రహ్మమ్-అహమస్మి)
ఇతి భావయన్,
కృశీభూత్వా: శరీరమును, ఇంద్రియములను బ్రహ్మజ్ఞాన-అధ్యయనము నందు నియమిస్తూ శమదమములు అభ్యసించునుగాక।
‘‘నేను బ్రహ్మమునే’’ అను భావమును గుర్తు చేసుకుంటూ సమస్తము బ్రహ్మముగా భావించువాడై ఉండును గాక!
గుర్వర్థమ్ గ్రామమ్ ఉపేత్య,
ధ్రువశీలో। అష్టౌమాస్య ఏకాకీ చరేత్।
ద్వావేవ ఆచరేత్।
గురువు కొరకై (ఆహారము కొరకు, గురువాక్యములు ప్రచారము కొరకు) గ్రామగ్రామములు సంచరించు శిష్యుడై ఉండునుగాక! (కుటీచక సన్న్యాసి)
సంవత్సరములో ‘8’ మాసములు ఒకచోట నిలువక సంచారములు నిర్వర్తించుచు, 4 నెలల (లేక) 2 నెలల కాలము చాతుర్మాస్యము (ఒకచోట ఉండటము) అవకాశానుసారంగా (బహూదక, హంస, పరమహంస మొదలైనవారు) నిర్వర్తించెదరు గాక।
యదా అలం బుద్ధిః భవేత్ తదా-
కుటిచకో వా, బహూదకో వా,
హంసో వా, పరమహంసో వా
బుద్ధియొక్క-విషయములనుండి విరామము (అలం) రూపమగు నిర్మలత్వము సిద్ధించాలనే ఆశయముతో చతుర్విధ సన్న్యాసులగు (1) కుటీచక (3) బహూదక (3) హంస (4) పరమహంస జీవిత విధానములలో ఒకానొకటి నిర్వర్తించును గాక.
తత్ తత్ మంత్ర పూర్వకం
కటిసూత్రం, కౌపీనం దండం,
కమండలుం - సర్వం అప్సు విసృజ్య
అథ, ‘‘జాతరూపధరః’’ చరేత్।।
శాస్త్రములు సూచిస్తున్న విధంగా సన్న్యాసము ఆశ్రయించును గాక। మంత్రపూర్వకంగా (కుటీచక, బహూదక, హంస, పరమహంసల సన్న్యాసవిధులను అనుసరించి) కటిసూత్రము (మొలత్రాడును), కౌపీనమును, (బ్రహ్మదండమునకు గుర్తు అయిన) దండమును, కమండలము - జలములో వదలివేసి జాతరూపధరుడై - (అప్పుడే పుట్టిన బిడ్డయొక్క విషయసంబంధ రహిత మనోబుద్ధులు కలవాడై) చరించును గాక।
8. గ్రామ - ఏకరాత్రమ్।
తీర్థే - త్రిరాత్రమ్।
పట్టణే - పంచరాత్రమ్।
క్షేత్రే - సప్తరాత్రమ్।
పరమహంస, పరివ్రాజకులు - నివాస సమయము
- గ్రామములో అయితే - ఒక్క రాత్రి (రోజు) మాత్రమే,
- తీర్ధప్రదేశములో - మూడు రాత్రులు మాత్రమే,
- పట్టణములో - ఐదు రాత్రులు మాత్రమే,
- ముఖ్యక్షేత్రములలో - ఏడు రాత్రులు మాత్రమే,
నివసించువారై ఉంటారు.
అనికేతః। స్థిరమతిః। అనగ్నిః।
సేవీ। నిర్వికారో….
నియమ - అనియమమ్ ఉత్సృజ్య,
ఈ విధంగా ఒకచోట స్థిరనివాసము కలిగి ఉండక ‘అనికేతుడు’ అయి ఉంటున్నారు.
పరబ్రహ్మోపాసనపట్ల నిశ్చలచిత్తుడు అగుచున్నారు.
అగ్నికార్యములు (యజ్ఞ యాగములు మొదలైనవి) నిర్వర్తించటము వారికి ఉండదు.
సమస్త జగద్విషయములపట్ల నిర్వికారులై ఉంటారు.
నియమ అనియములను (శాస్త్రములు చెప్పే చేయవలసినవి - చేయకూడనివి) మొదలైన ఆచారములకు వారు పరిమితులు కారు.
ప్రాణసంధారణార్థం అయమేవ
లాభాలాభౌ సమౌ భూత్వా,
గోవృత్త్యా భైక్షమ్ ఆచరన్।
ఉదకస్థల కమండలుః।
అబాధక రహస్యస్థల వాసో।
ప్రాణ - సంధారణను ఉద్దేశించి మాత్రమే ఆహారము స్వీకరించువారై ఉంటారు. (అంతేగాని రుచి ఇష్టము మొదలైనవాటి దృష్టితో కాదు)
లభించువాని గురించి, లభించనివాటి గురించి వారు సమదృష్టి - కలిగి ఉంటారు.
గోవు ఏది లభిస్తే, అదే సంతోషముగా స్వీకరించువిధంగా, భిక్షాటణనము (భిక్షము)చే స్వాభావికంగా (In its natural course) లభించినది స్వీకరించు వారై ఉంటారు.
జలము కొరకు మాత్రమే కమండలము కలిగి ఉంటారు. (అంతేగాని ఆయా విలువైన వస్తువులు దాయటానికి కాదు)
ఎవ్వరికీ బాధ కలిగించరు. ఏకాంతవాసి (Alone) అయి ఉంటారు.
న పునః లాభాలాభ రతః।
శుభాశుభ కర్మ నిర్మూలనపరః।
సర్వత్ర భూతల శయనః।
క్షౌరం కర్మ పరిత్యక్తో।
యుక్త చాతుర్మాస్య వ్రతనియమః।
లాభ నష్టముల గురించి, శుభ అశుభ కర్మల వ్యవహారముల గురించి వ్యసనము కలిగి ఉండక, వదలి ఉంటారు.
ఈ భూమి అంతా వారికి శయన మందిరమే.
క్షౌరకర్మల వదలి ఉంటారు. అవకాశములను అనుసరించి చాతుర్మాస వ్రతుడు (లేక) ద్విమాస వ్రతుడు అయి ఉంటారు.
శుక్ల ధ్యాన పరాయణో।
‘‘అర్థ, స్త్రీ, పుర పరాణ్ముఖో।
అనున్మత్తో౽పి ఉన్మత్తవత్ ఆచరన్।।
సాత్త్విక గుణములతో, కేవలమగు పరబ్రహ్మము గురించి ధ్యాన పరాయణులై ఉంటారు.
ధనము - స్త్రీ - పురనివాసముల పట్ల పరాన్ముఖులై (స్వీకరించని వారై, దరిచేరనివారై) ఉంటారు.
పరమహంస పరివ్రాజకుడు బ్రహ్మజ్ఞానముచే మహాప్రాజ్ఞుడు. ‘దృశ్యవ్యసనము’ అనే ఉన్మత్తత ఆతనిని స్పృశించదు. అట్లయి కూడా, లోకసంబంధమైన విషయాలపట్ల ‘పిచ్చివాడు’ (లేక) ‘తెలియనివాడు’, సామాన్యుడు - వలె కనబడుతూ ఉంటారు.
అవ్యక్త లింగో, అవ్యక్త ఆచారో,
దివా నక్తమపి వా అస్వప్నః
స్వరూపానుసంధాన బ్రహ్మ
ప్రణవత్ ధ్యాన మార్గేణ, బహిః సన్న్యాసేన
దేహత్యాగం కరోతి,
స ‘‘పరమహగ్ంస పరివ్రాజకో’’ భవతి।
ఈవిధంగా అవ్యక్తమైన (బయటకు కనబడని) - ఆత్మభావన సమన్వితమగు అంతరంగమును, ఆచారములను (Not outwardly exhibited, Inner Heart and inner practices ) కలిగి ఉంటారు. రాత్రింబవళ్లు ఆత్మోపాసనయందే నియమితులు అయి ఉంటారు. జగద్దృశ్యముపట్ల కల్పనలన్నీ త్యజించి ఉంటారు.
ఎల్లప్పుడు స్వస్వరూపానుసంధానము (Connection with permanent self) కలవాడై, ఆత్మధ్యాని అయిఉంటారు.
బాహ్య-అభ్యంతర సన్న్యాసముచే దేహము నశించిన వస్తువుగా దర్శించు వాడు, దేహభావములన్నీ వదలినవాడు - పరమహంస పరివ్రాజకుడు.
బ్రహ్మౌవాచ :
9. ‘‘భగవన్। బ్రహ్మ ప్రణవః కీదృశ?’’ -
- ఇతి బ్రహ్మా పృచ్ఛతి।
బ్రహ్మదేవుడు: భగవాన్! శ్రీమన్ నారాయణస్వామీ! బ్రహ్మప్రణవము ఎట్టిదో విశదీకరించి చెప్పండి.
శ్రీమన్నారాయణుడు: బ్రహ్మ ప్రణవము ‘‘16’’ మాత్రలు కలిగిఉన్నట్టిది.
సహోవాచ నారాయణః :
బ్రహ్మ ప్రణవః
షోడశ మాత్రాత్మకః।
సో అవస్థా చతుష్టయ గోచరః।
- ‘‘జాగ్రత్’’ అవస్థాయాం జాగ్రదాది
చతస్రో అవస్థాః ।
- ‘‘స్వప్నే’’ స్వప్నాది చతస్రో అవస్థాః।
- ‘‘సుషుప్తౌ’’ సుషుప్త్యాది చతస్రో అవస్థాః।
- తురియే తురీయాది చతస్రో అవస్థా భవంతీతి।
అది 4 అవస్థలలో గోచరమై (కనబడుచూనే) ఉన్నట్టిది.
జాగ్రత్‌లో - (జాగ్రత్ జాగ్రత్, జాగ్రత్ స్వప్నము, జాగ్రత్ సుషుప్తి, జాగ్రత్ తురీయము అను) - జాగ్రదాది చతుర్ అవస్థలు.
స్వప్నములో - (స్వప్న జాగ్రత్, స్వప్న స్వప్న, స్వప్న సుషుప్తి, స్వప్న తురీయ - అను) - స్వప్నాది నాలుగు అవస్థలు.
సుషుప్తిలో - (సుషుప్తి జాగ్రత్, సుషుప్తి స్వప్నము, సుషుప్త సుషుప్తి, సుషుప్తి తురీయము - అనబడే - సుషుప్యాది చతుష్టయ అవస్థలు)
తురీయములో - (తురీయ జాగ్రత్, తురీయ స్వప్నము, తురీయ సుషుప్తి తురీయ తురీయము అనబడే నాలుగు తురీయావస్థలు ఏర్పడినవై ఉన్నాయి.
జాగ్రత్ అవస్థాయాం విశ్వస్య -
చాతుర్విధ్యమ్।
(1) ‘‘విశ్వవిశ్వో (2) విశ్వతైజసో (3) విశ్వప్రాజ్ఞో
(4) విశ్వతురీయ’’ - ఇతి।
స్వప్నావస్థాయాం తైజసస్య
చాతుర్విధ్యమ్।
(1) తైజస విశ్వః (2) తైజస తైజసః
(3) తైజస ప్రాజ్ఞః (4) తైజస తురీయ - ఇతి।
జాగ్రత్ సంబంధమైన పురుషకారము విశ్వుడు. అట్టి విశ్వుడు 4 విధములుగా ప్రదర్శితుడు.
(1) విశ్వవిశ్వుడు (2) విశ్వతైజసుడు (3) విశ్యప్రాజ్ఞుడు (4) విశ్వ తురీయుడు.
స్వప్నావస్థకు సంబంధించిన పురుషకారము - తైజసుడు
ఆతడు 4 రీతులుగా ప్రదర్శితుడు
(1) తైజస విశ్వుడు
(2) తైజస తైజసుడు
(3) తైజస ప్రాజ్ఞుడు
(4) తైజస తురీయుడు
సుషుప్త్యవస్థాయాం ప్రాజ్ఞస్య
చాతుర్విధ్యం చ।
(1) ప్రాజ్ఞ విశ్వః (2) ప్రాజ్ఞతైజసః
(3) ప్రాజ్ఞప్రాజ్ఞః (4) ప్రాజ్ఞతురీయ - ఇతి।
సుషుప్త్యవస్థకు సంబంధించిన పురుషకారమును ‘ప్రాజ్ఞుడు’’ అని అంటున్నారు. అట్టి ప్రాజ్ఞుడు 4 రీతులు గా ప్రదర్శమగుచున్నాడు.
(1) ప్రాజ్ఞ విశ్వుడు (2) ప్రాజ్ఞ తైజసుడు (3) ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు (4) ప్రాజ్ఞ తురీయుడు
తురీయావస్థాయాం తురీయస్య చ
చాతుర్విధ్యమ్।
(1) తురీయ విశ్వః (2) తురీయ తైజసః
(3) తురీయ ప్రాజ్ఞః (4) తురీయ తురీయ ఇతి।।
తే క్రమేణ షోడశమాత్ర ఆరూఢాః।।
తురీయమునకు సంబంధించి 4 తురీయ పురుషకారములు:
(1) తురీయ విశ్వుడు (2) తురీయ తైజసుడు (3) తురీయ ప్రాజ్ఞుడు (4) తురీయ తురీయుడు.
ఈ విధంగా జాగ్రత్ స్వప్నషుషుప్తి తురీయా పురుషకారములు ‘‘4x4 = 16’’ షోడశమాత్రలు (16 Types of Appearances) - ఆరూఢత (occupation, documented) ఏర్పడి ఉంటున్నాయి.
10. ‘అ’కారే జాగ్రత్ విశ్వః।
‘ఉ’కారే జాగ్రత్ తైజసః।
‘మ’కారే జాగ్రత్ ప్రాజ్ఞః।
అర్ధమాత్రా యాం జాగ్రత్ తురీయః।
‘అ’కారము - జాగ్రత్ విశ్వుడు
‘ఉ’కారము - జాగ్రత్ తైజసుడు
‘మ’కారము - జాగ్రత్ ప్రాజ్ఞుడు
అర్ధమాత్ర - జాగ్రత్ తురీయుడు
బిందౌ స్వప్న విశ్వో।
నాదే స్వప్న తైజసః।
కలాయాం స్వప్న ప్రాజ్ఞః।
కలాతీతే స్వప్న తురీయః।
బిందువు - స్వప్నవిశ్వుడు
నాదము - స్వప్నతైజసుడు
కలా - స్వప్నప్రాజ్ఞుడు
కాలాతీతము - స్వప్నతురీయము
శాంతౌ - ‘‘సుషుప్త విశ్వః’’।
శాంత్యతీతే - ‘‘సుషుప్త తైజసః’’।
ఉన్మన్యాగ్ం - ‘‘సుషుప్త ప్రాజ్ఞః’’
మన ఉన్మన్యాగ్ం (మనోన్మన్యాగ్ం)
- ‘‘సుషుప్త తురీయః’’।
శాంతి - సుషుప్త విశ్వము
శాంత్యతీతము - సుషుప్త తైజసము
ఉన్మని - సుషుప్త ప్రాజ్ఞము
మనోన్మన్యము - సుషుప్త తురీయము
→ వైఖర్యాం - తురీయ విశ్వః।
→ మధ్యమాయాం - తురీయ తైజసః।
→ పశ్యంత్యాం - తురీయ ప్రాజ్ఞః।
→ పరాయాం - తురీయ తురీయః।
వైఖరీ - తురీయ విశ్వము
మధ్యమము - తురీయ తైజసము
పశ్యంతి - తురీయ ప్రాజ్ఞము
పర - తురీయ తురీయము
→ జాగ్రన్మాత్రా - చతుష్టయమ్
‘అ’ కారాగ్ంశమ్।
→ స్వప్నమాత్రా - చతుష్టయమ్
‘ఉ’ కారాగ్ంశమ్।
→ సుషుప్తి మాత్రా చతుష్టయమ్
‘మ’ కారాగ్ంశమ్।
→ తురీయమాత్రా చతుష్టయమ్
అర్థమాత్రాగ్ంశమ్।।
అయమేవ ‘‘బ్రహ్మప్రణవః’’।।
జగత్‌మాత్రా చతుష్టయము -‘‘అ’’కారాంశము.

స్వప్నమాత్రా చతుష్టయము -‘‘ఉ’’కారాంశము.

సుషుప్తిమాత్రా చతుష్టయము -‘‘మ’’కారాంశము.

తురీయామాత్రా చతుష్టయము - -‘‘అర్ధమాత్ర’’అంశము.

ఇదియే ‘‘బ్రహ్మప్రణవము’’
11. స పరమహగ్ంస తురీయాతీత
అవధూతైః ఉపాస్యః।
తేనైవ బ్రహ్మప్రకాశతే।
తేన విదేహ ముక్తిః।
ప్రియ బ్రహ్మదేవా! సృష్టికర్తా! మనము చెప్పుకున్న ‘బ్రహ్మప్రణవము’ - అనునది పరమహంస, తురీయాతీత, అవధూతలచే స్వానుభవరూపంగా ఉపాసించబడుతోంది.
అట్టి షోడశమాత్రోపాసనచే బ్రహ్మతత్త్వము ప్రకాశమానమవగలదు. అద్దానిచే ‘విదేహముక్తి’ సిద్ధిస్తోంది.
(బ్రహ్మౌవాచ)
‘‘భగవన్। కథమ్ అయజ్ఞోపవీతీ,
అశిఖీ సర్వకర్మ పరిత్యక్తః?
కథం బ్రహ్మనిష్ఠా పరః?
కథం బ్రాహ్మణ?’’
= ఇతి బ్రహ్మా పృచ్ఛతి।
బ్రహ్మదేవుడు: భగవాన్! ఆత్మానారాయణా! యజ్ఞోపవీతుడు, శిఖ ధరించినవాడే సన్న్యాసమునకు అర్హుడని శాస్త్రవచనము కదా! మరి అయజ్ఞోపవీతుడు, అశిఖి (ఆ రెండు లేనివాడు) - సర్వకర్త పరిత్యాగ రూపమగు పరమహంస పరివ్రాజకత్వము ఎట్లా - ఆశ్రయించగలడు? అసలు ఎవరు బ్రహ్మనిష్ఠాపరుడు? ఎవరు బ్రాహ్మణుడు? బ్రాహ్మణుడు అను శబ్దమునకు అసలైన అర్థమేమై ఉన్నది?
సహోవాచ విష్ణుః :
భో భో అర్భక।
యస్యాస్తి అద్వైతం, ఆత్మజ్ఞానం
తదేవ యజ్ఞోపవీతం।
విష్ణుభగవానుడు: ఓ అర్భకుడా! అమాయకబాలుడా! పరమహంస బ్రహ్మనిష్ఠాపరుడు, బ్రాహ్మణుడు, పరివ్రాజకుడు మొదలైనవి భౌతికమైనవా? యజ్ఞోపవీతము, వస్త్రధారణ, నివసించే ప్రదేశమునకు సంబంధించినవా? కానే కావు.
‘‘ఆత్మకు ద్వితీయమైనదే లేదు. ఈ సమస్తము ఆత్మస్వరూపుడుగా నాకు అన్యము కానేకాదు’’ - అనునదే యజ్ఞోపవీతము.
తస్య ధ్యాననిష్టైవ శిఖా।
తత్ కర్మ స పవిత్రమ్।
స సర్వ కర్మ కృత్। స బ్రాహ్మణః।
స బ్రహ్మనిష్ఠాపరః।
స దేవః। స ఋషిః। స తపస్వీ।
స శ్రేష్ఠః। స ఏవ సర్వ జ్యేష్ఠః।
స ఏవ జగద్గురుః।
స ఏవ అహం విద్ధి।
ఆత్మతత్త్వమును గురించిన నిష్ఠయే (ఆత్మగా అనుకునే అభ్యాసమే) ‘శిఖ’।
ఆత్మభావనతో కర్మ నిర్వహణయే పవిత్రము (పితృకార్యములలో ధరించే దర్భముడి).
‘‘సమస్తము పరమాత్మ యొక్క స్వకీయ ప్రదర్శనా చమత్కారమే’’ అను భావన కలవాడు సర్వకర్మలు నిర్వర్తించినట్లే. అట్టి వాడే బ్రాహ్మణుడు. ఆతడే బ్రహ్మనిష్ఠాపరుడు. ఆతడే దేవత. ఆయనయే ఋషి, ఆతడే సర్వశ్రేష్ఠుడు, సర్వజ్యేష్ఠుడు కూడా. ఆయనయే జగద్గురువు.
ఓ బ్రహ్మదేవా! సమస్తము ఆత్మగా దర్శించువాడు విష్ణు స్వరూపుడేనయ్యా! నేనే ఆతడు. ఆతడే నేను.
లోకే పరమహగ్ంస
పరివ్రాజకో దుర్లభతరో, -
యత్ ఏకో౽స్తి।
స ఏవ నిత్యపూతః।
స ఏవ వేదపురుషో।
మహాపురుషో,
యః తత్ చిత్తమ్ మయ్యేవ అవతిష్ఠతే।
అహం చ తస్మిన్ ఏవ అవతిష్ఠతః।।
‘‘ఈ కనబడే సమస్తము మమాత్మ ప్రదర్శనమే’’ అను స్వాభావిక బ్రహ్మతత్త్వ దర్శనము చేయు పరమహంస పరివ్రాజకులు ఎక్కడో గాని ఉండరు. సుదుర్లభులు. వారు ఎక్కడున్నా కూడా పవిత్ర స్వరూపులై, సమస్తమును పవిత్రముగా చేయువారై ఉంటారు. వారే వేదపురుషులు.
వారి చిత్తము ‘‘సర్వాత్మకుడు సర్వ తత్త్వ స్వరూపుడు’’ అగు నాయందే సర్వదా అవతిష్ఠితమై ఉంటుంది.
నేను కూడా వారియందే సర్వదా అవతిష్ఠితుడనై ఉంటాను.
12. స ఏవ నిత్య తృప్తః।
స శీతోషణా సుఖదుఃఖ మానావమాన వర్జితః।
స నిందా ఆమర్ష సహిష్ణుః।
స షడూర్మి వర్జితః।
షట్ భావ (షడ్భావ) వికారశూన్యః।
స జ్యేష్ఠ - అజ్యేష్ఠ వ్యవధాన రహితః।
సర్వత్రా సమమగు ఆత్మదర్శనముచే పవిత్రదృష్టి సంపాదించుకున్న ఆ మహనీయులు -
- సర్వదా స్వాభావికంగానే నిత్య తృప్తులై ఉంటారు.
- శీత-ఉషణా, సుఖ-దుఃఖ, మాన అవమానముల పరిధులను దాటివేసినవారై ఉంటారు.
- నింద-అమర్షములను (అసహనములను) ఓర్చుకొనగలిగినవారు అయి ఉంటారు.
- ‘‘ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము’’ అనబడే షట్ భావములను జయించి వేసి ఉంటారు.
వారి దృష్టిలో వారికి షట్‌భావ వికారములు (పుట్టుక - అగుట - కలుగుట - పెరుగుట- తరుగుట - నశించుట అనునవి) లేవు.
వారికి ‘‘తక్కువవాడు- ఎక్కువవాడు - సమానుడు అనే వ్యవధానములు (సంగతి, సందర్భములు) ఉండవు. సమస్తము అఖండమగు ఆత్మయే అయి ఉండగా ఇక ఎక్కువ- తక్కువలు ఏముంటాయి? దేనికి ఏది సమానము? ఏది దేనికంటే అధికము (లేక) అల్పము?
సః స్వ వ్యతిరేకేణ, న అన్య ద్రష్టా - ఆశాంబరో।
- న నమస్కారో।
- న స్వాహాకారో। న స్వధాకారశ్చ।
- న విసర్జన పరో।
నిందా స్తుతి వ్యతిరిక్తో।
న మంత్ర తంత్రోపాసకో।
దేవాంతర ధ్యానశూన్యో।
(ఒక నవలా రచయిత తాను వ్రాసిన నవలను చదువుచూ, ఆ నవలలోని పాత్రలన్నీ తన రచనా కల్పిత రూపములుగానే చూడు విధంగా) - పరమహంస తన స్వరూపమునే సర్వత్రా సమస్త సహ జీవరూపములుగా స్వకీయ కల్పిత వినోద చమత్కారంగా చూస్తాడు. తనకు అన్యముగా దేనికీ ‘ద్రష్ట’ అయి (వేరుగా) ఉండడు.
- దేనినీ ఆశించువాడై ఉండడు.
- తనకు వేరైనట్లుగా భావించి ఎవ్వరికీ నమస్కరించడు.
- ఎవరో బాహ్య దేవతలను ఉద్దేశ్యించి ఆహూతులను, పితృదేవతలను ఉద్దేశ్యించి ‘స్వధామ’ అని తర్పణములు సమర్పించడు. దేవతలను, పితృ దేవతలను ఆత్మకంటే వేరైన వారిగా భావించడు.
- దేనినీ విసర్జించువాడై ఉండడు. సమస్తము తానే అయి ఉంటాడు.
- దేనినీ నిందించడు. స్తుతించడు.
- మంత్ర తంత్ర ఉపాసకుడై ఉండడు. స్వస్వరూపాత్మకు వేరుగా దేవతను గమనించువాడై ఉండడు. అనగా దేవతలను అనన్య భావనతో ధ్యానించడు.
లక్ష్య అలక్ష్య నిర్వర్తకః
సర్వ ఉపరతః।
లక్ష్యము - అలక్ష్యములేవీ ఆ పరమహంస పట్ల ఏర్పడి ఉండవు.
- సమస్త దృశ్య ప్రపంచము నుండి ఉపరతుడు అయి ఉంటాడు.
సచ్చిదానంద అద్వయ చిద్ఘనః
సంపూర్ణానందైక బోధో ‘‘బ్రహ్మైవాహమస్మి’’
సత్ చిత్ ఆనందములను (ఉనికి - ఎరుక - వినోదములను) తనయొక్క ముఖ్య (కేవల) రూపముగా కలవాడై, సమస్తము తానే అయి ఉండటంచేత అద్వితీయుడై, ‘‘నేను బ్రహ్మానంద బోధ స్వరూపమగు బ్రహ్మమును’’ అని ఎరిగి ఉంటాడు.
ఇతి అనవరతం
బ్రహ్మ ప్రణవ-అనుసంధానేన
యః కృతకృత్యో భవతి, స (యేవ) -
‘‘పరమహగ్ంస పరివ్రాట్’’
పరమహంస పరివ్రాజకోపనిషత్ సమాప్తా
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
ఈవిధంగా ఎవ్వరైతే అనవరతము (ఎల్లప్పుడు కూడా, Always and at all times )’’ బ్రహ్మప్రణవ అనుసంధానము’’ చేస్తూ ఉంటారో, అట్టి అనుసంధానమునందు కృతకృత్యులు (Well performed and established) అవుతారో, అట్టివారు పరమహంస పరివ్రాట్ అయి తుర్య తుర్యస్థితి సంపన్నులు - అగుచున్నారు.

ఇతి పరమహంస పరివ్రాజకోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।


అథర్వణ వేదాంతర్గత

15     పరమహంస పరివ్రాజకోపనిషత్

అధ్యయన పుష్పమ్

‘‘పరివ్రాజ’’ ధర్మమును అనువర్తిస్తున్న మహనీయులు క్రమంగా ఏ విధంగా ‘‘బ్రహ్మము’’ రూపము సంతరించుకుంటున్నారో, అట్టి ప్రణవ ఏకార్థమైనట్టి ‘తుర్యతుర్య (తుర్యమునకే తుర్యమైన) స్థానము’నకు నమస్కరిస్తున్నాము.

ఒక సందర్భములో సృష్టికర్త, సృష్టిపాలకుడు అగు బ్రహ్మదేవులవారు బ్రహ్మలోకము నుండి సంచారముగా బయలుదేరారు. ఆయా లోకాలలోని జనులు వారి వారి ధర్మమార్గములను వదలి చరిస్తూ, ఫలితంగా అనేక దుఃఖ స్థితి గతులను అనుభవిస్తూ ఉన్నారు. జన్మ - కర్మ - చక్ర పరంపరలలో ఇరుక్కొని అనేక మనోకల్పిత బంధనములలో మ్రగ్గుతూ ఉన్నారు.

అయ్యో! ఆనందము కొరకై నేను లోకాలను సృష్టిస్తూ ఉంటే, ఈ జీవులు ధర్మమార్గము విడచి, ‘‘నవ్వుతూ తప్పులు చేయటము - ఏడుస్తూ అనుభవించటము - (హసతా క్రియతే కర్మా! రుతతా పరభుధ్యతే।)- జరుగుతోందే? దుఃఖములు పొందుతూ కూడా, అజ్ఞాన జనితమైన ఆవేశము, అవిచారణ, (ఇంద్రియానుభవముల వంటి) అల్ప లక్ష్యములను గొప్పవిగా భావించటము - ఇవన్నీ జీవులు సుదీర్ఘ దురభ్యాసంగా ఆశ్రయిస్తున్నారు.

వీరు ధర్మమును ఏమరచి అనేక కష్టములు తెచ్చిపెట్టుకొంటూ కూడా, సరి అయిన మార్గము విచారించటము లేదు, అనుసరించటమూ లేదు. చివరికి నా సృష్టిలోని లోకాలన్నీ దుఃఖము, భయము, అల్పత్వము, హీనత్వము మొదలైన వాటితో కప్పివేయబడుచున్నాయి. సుందరముగా నాచే సృష్టించబడే ఈ సృష్టి జీవులు ఆనందించటానికి బదులుగా, చివరికి వారిపట్ల అనేక బంధనములకే దారితీస్తోందే? ఏమి ఉపాయము?’’ - అని యోచించసాగారు. ఈ విధంగా గమనించిన సృష్టికర్త తన బిడ్డలగు జీవుల దౌర్భాగ్యస్థితిగతులకు తానే దుఃఖము పొందినవారై, తన పితృదేవులు, సర్వజగత్ రక్షకులు అగు శ్రీమన్ విష్ణు భగవానుని దర్శించటానికై వైకుంఠము వెళ్లారు. జీవులు పడుతున్న యాతనలన్నీ వరిణాంచి చెప్పి ‘‘తండ్రీ! జీవునికి దుఃఖములు తొలగే మార్గము నాకు చెప్పండి’’ - అని అభ్యర్థించారు.

అప్పుడు విష్ణుదేవుడు పద్మసంభవుడగు బ్రహ్మదేవునికి - ఈ జీవులు ఆశ్రయించవలసిన జీవనవిధానము గురించి, చాతుర్వర్ణ్య ధర్మములను ఆశ్రయించటము గురించి, ధర్మము ఏమరచినప్పటి పర్యవసానముల గురించి విశదీకరించి చెప్పారు.

విష్ణు భగవానుడు : అత్యంత సుందరమగు సృష్టిని కల్పిస్తూ ఉన్న మహామేధావీ! కుమారా! బ్రహ్మదేవా! సృష్టిలో ధర్మములు ఉన్నాయి. ఈ మానవులు వారి వారి ధర్మములు ఏమరచటము చేతనే దుఃఖములు వచ్చి పడుచున్నాయి. తాము తల్లిదండ్రులపట్ల, సహజీవులపట్ల తదితరలపట్ల నిర్వర్తించవలసిన ధర్మములు ఏమరుస్తున్నారు. పర్యవసానంగా ఋణగ్రస్తులగుచున్నారు. చివరికి (తదితరులు నిర్వర్తించవలసిన ధర్మములు) తమపట్ల నిర్వర్తించబడక - అధర్మ ప్రవర్తనచే అధర్మఫలములు పొందుచూ దుఃఖిస్తున్నారు.

[ ‘సృష్టి’ అనేది ఒకరిది కాదు. అందరిదీను. అందరూ కలసి ధర్మములు నిర్వర్తించాలి. ‘‘ఇంటి ఇల్లాలు, ఇంటి యజమాని, కొడుకు, కోడలు, పిల్లలు, కూతుళ్ళు, అల్లుళ్ళు’ - ఈ విధంగా వేరువేరు వారంతా కలసి ఒక కుటుంబము. ఒకడు - తాను ధర్మము నిర్వర్తించక, తనపట్ల తదితరులు ధర్మము నిర్వర్తించటము లేదని వగచి ఏమి ప్రయోజనం? ఒక కార్యక్రమము సరిగ్గా జరగటానికి అందరి ధర్మములు (Duties of all) వేరువేరుగా ఉంటాయి. సంఘ పరిరక్షణ కొరకే వేరు వేరు జనులకు వేరు వేరు ధర్మములు (Division of Labour) కేటాయించబడ్డాయి. ]

‘‘బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర’’ - ధర్మములు

బ్రాహ్మణ ధర్మములు :

క్షత్రియ ధర్మములు :

వైశ్య ధర్మములు :

శూద్ర ధర్మములు :

‘‘గుణములను అనుసరించి స్వధర్మము’’ను సశాస్త్రీయంగా గమనించి, సందర్భానుసారంగా వారివారి స్వకీయ ధర్మములు నిర్వర్తించువారికి, వారి వారి ధర్మనిరతియే మోక్షమునకు మార్గము కాగలదు.

ఇట్లాగే శాస్త్రములు బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థ - సన్న్యాస ధర్మములు ప్రవచిస్తున్నాయి.

ధర్మ నిరతిచే ఈ ఈ జీవుడు నిర్మలుడు, పునీతుడు కాగలడు.

క్రమంగా ఈతడు జీవితపరమాశయము వైపుగా దృష్టి సారించాలి. ధర్మబలంతో అర్హుడై క్రమంగా జ్ఞాని అయి, బ్రహ్మచర్య - గృహస్థ ధర్మములు నిర్వర్తిస్తూ పరమహంస పరివ్రాజకుడై ‘జీవితము’ అనే అవకాశమును సద్వినియోగపరచుకొనెదరు గాక!

ఈవిధంగా ‘విశ్వధర్మము’ అనబడే స్వధర్మము యొక్క ఆశ్రయము, వర్ణాశ్రమధర్మములు మొదలైనవి విష్ణు భగవానుడు బోధించారు. ‘పరమహంస పరివ్రాజకత్వము’ అను మహదాశయము కలిగి ఉండాలని విశదీకరించారు. అప్పుడు సర్వ జీవుల పితామహుడగు బ్రహ్మదేవుడు ఇట్లా సంభాషణను కొనసాగించారు.

లోకపితామహుడగు బ్రహ్మదేవుడు: హే భగవాన్! ఆదినారాయణా! త్వన్ముఖాత్ వర్ణాశ్రమక్రమం శ్రుతం విదితం అవగతమ్। మీరు బోధిస్తూ వస్తున్న ధర్మ నిరతి వలన ప్రయోజనములు, ధర్మచ్యుతి వలన కలిగే అనర్థములు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, ధర్మనిరతి, పరమహంస ధర్మముకు అర్హత - మొదలైనవన్నీ విన్నాము. చాలా సంతోషము. మీ అనుగ్రహం చేత అవన్నీ హృదయస్తము అగుచూ ఉండగా, - ‘‘అవి నాకు, సమస్త లోక జీవులకు సర్వదా ఆచరణీయములు, ఆత్మ బలము ప్రసాదించునవి’’ - అని తెలుసుకొన్నాను.

స్వామీ! ఇదానీం పరమహంస - పరివ్రాజక లక్షణం వేత్తుమ్ ఇచ్ఛామి। ఈ జీవుడు ఏవిధంగా త్రిమూర్తులకు కూడా పూజనీయుడగు ‘పరమహంస-పరివ్రాజకుడు’ కాగలడు? పరమహంస పరివ్రాజక లక్షణములు ఏవేవి?

ఎవడు ఏ లక్షణములచే పరవ్రాజకమునకు అధికారి (Deserved, qualified) అవుతాడు?

‘పరమహంస’ అనగా ఎవరు?

‘పరివ్రాజకత్వము’ ఎట్లా సిద్ధిస్తుంది?

ఈఈ విశేషాలు దయతో వివరించండి.

భగవంతుడగు ఆదినారాయణ స్వామి : నాయనా ప్రియపుత్రా! బ్రహ్మ దేవా! మీరు అడిగిన విశేషాలు చెప్పుకుందాము. వినండి.

‘మానవ జీవితము’ అనునది ఈ జీవునిపట్ల తన యొక్క ‘‘విష్ణుత్వము, శివత్వము, బ్రహ్మత్వము, ఆత్మత్వము’’ - తెలుసుకోవటానికి మహత్తరమైన అవకాశము.

ముందుగా స్వధర్మ నిరతిచే బుద్ధిని సాత్వికము, విస్తారము, నిశ్చలము, సునిశితము చేసుకోవాలి.

సద్గురువు - ‘శిక్ష, సాధన, శోధన, సత్‌వస్తు బోధన’ చేయువారై ఉంటారు. ‘‘పరమసత్యమగు పరమాత్మ అనగా నీయొక్క నిజ - నిత్య - సత్య - శాశ్వత రూపము’’ అని ఆయన తన వాక్కు బోధచే సంశయనివారణ చేయువారు. పరిభాషణలచే స్వస్వరూపము గురించి సుస్పష్టపరచువారు సద్గురువు.

అట్టి సద్గురువును సమీపించాలి. శ్రద్ధగా భక్తి - జ్ఞాన - యోగాభ్యాసములకు చెందిన విద్యలను శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తున్నది శ్రద్ధగాను, సవిచారణగాను, స-విచక్షణాపూర్వకంగాను మననము చేయాలి. విషయములను మూల - మధ్య - అంతఃపూర్వకంగా పరిశీలించి విద్వాంసుడు కావాలి.

ఈ జీవుడు దృశ్యములో - సర్వం ఐహికాముష్మిక సుఖశ్రమం జ్ఞాత్వా।
- ఏదో పొందాలి
- ఇది ఇలా ఉండకూడదు. అట్లా ఉండాలి.
- నా గురించి ఇలా అనుకోకూడదు. అలా అనుకోవాలి.
- ఇది ఇలా అయితే సుఖము. అలా అయితే దుఃఖము.

ఈ విధమైన భావనలన్నీ ‘భావనాజనిత శ్రమ’ (సుఖము కొఱకు శ్రమ) అనబడుతోంది. ‘కావాలి - పొందాలి - వదలాలి - అనుకోవాలి - అనిపించాలి’- అను శ్రమలన్నీ క్రమంగా నెమ్మది నెమ్మదిగా జయించివేయబడు గాక.

ఈషణాత్రయ హేయం అధిగమ్య :- భార్య - పుత్ర - ధనములపట్ల ‘‘నేను అనుకున్నట్లే ఉండవేమి?’’ - అనే ఈషణాత్రయమును దాటి ఉండాలి.

వాసనాత్రయమ్ హేయం అధిగమ్య :- ‘‘దేహవాసన, దృశ్యవాసన, శాస్త్రవాసన’’ అనే వాసనాత్రయమును అధిగమించివేయాలి.

మమత్వమ్ అధిగమ్య :- ‘‘ఈ జనులలో కొందరు నాకు చెందినవారు. కొందరు కాదు. ఈ వస్తు సముదాయము నాకు చెందినది. నేను ఈఈ విషయ - వస్తు సముదాయమునకు చెందినవాడను. వీటి వీటితో నాకు అవినాభావ సంబంధము ఉన్నది’’ మొదలైన సంబంధిత, అసంబంధిత మమత్వమును త్యజించినవాడై ఉండాలి.

అహంకారమ్ హేయమ్ అధిగమ్య :- ‘‘నేను - నాది. నాకు చెందినవాటిచేత నేను ప్రత్యేకతగలవాడను. ఎక్కువవాడిని (లేదా) తక్కువవాడిని. ధన - జన - విద్య - జ్ఞానములచే ఎక్కువ వాడిని (లేక) తక్కువ వాడిని’’ మొదలైన లక్షణముల రూపమగు అహంకారమును జయించివేయాలి.

ఈవిధంగా ఐహికాముష్మిక సుఖాశయశ్రమను, ఈషణా త్రయమును, వాసనా త్రయమును, మమత్వ - అహంకారములను, వమనము చేసిన అన్నము (కక్కిన కూడు, వాన్తాన్నము) వలె వదలివేయాలి. అధిగమించివేయాలి. ‘మోక్షము’ అను ఏకైక సాధనము (The only objective) ను స్వీకరించాలి. మిగతా లౌకిక ఆశయములను (కక్కిన పదార్థమువలె) త్యజించి, క్రమంగా దాటివేయాలి.

I. బ్రహ్మచర్యము : పై ఆశయములతో, జాగరూకతలతో ‘బ్రహ్మచర్యాశ్రమము’ను గురు సమక్షములో సంపూర్తి చేయాలి. (బ్రహ్మచర్యము = బ్రహ్మమునందు సమస్తము సమన్వయించుకోవటము).

II. గృహస్థాశ్రమము : బ్రహ్మచర్యము తరువాత (బ్రహ్మము గురించిన అధ్యయన, సమాశ్రయముల తరువాత) గురు అనుజ్ఞతో గురువు నియమించిన శాస్త్రములను, బోధిస్తున్న నియమ నిష్ఠలను మనోబుద్ధులలో పదిలపరచుకొంటూ, గృహస్థాశ్రమము స్వీకరించాలి. (బ్రహ్మజ్ఞానము కలిగియుండి, లోకసంబంధమైన సందర్భ - సంగతి - సంబంధ - అనుబంధ - బాంధవ్య - సంపద - ఆపదల సందర్భములను ఎట్లా స్వీకరించాలో-ఎట్లా స్వీకరించకూడదో గ్రహించి, ఆవిధంగా నిర్వర్తించటము - గృహస్థాశ్రమము).

[ గ = శ్రేష్ఠమైన విధంగా    ఋహస్త = ఋత్ (సత్యము)ను వదలక - ఆశ్రమ = ఆశ్రయించి జీవించటము. ]

III. వానప్రస్థాశ్రమము : ఉచిత సమయమంలో బాధ్యతలు తరువాతి తరానికి అప్పగించి, ఏకాంత జీవన ఉపాసనల నిమిత్తమై స్వీకరించు ఆశ్రమము.

[ అనేక విషయముల మధ్యగా ఉంటూ కూడా బుద్ధిని విషయరహితంగా ధారణ చేయటము కూడా వానప్రస్థమే. వనము = Forest. Hands in the world, while Head in the Forest. ]

IV. సన్న్యాసము : ఉపాసనలు, సాధన పరికరములు మొదలైనవన్నీ ప్రక్కకుపెట్టి ‘సత్’ను మాత్రమే న్యాసము (ఆశ్రయించటము) - సన్న్యాసము (లేక) సన్న్యాసాశ్రయము.
(న్యాసము = ఆశ్రయించటము, నిర్వర్తించటము. ఉదాహరణకు - ఉపన్యాసము).

ఒకడు గృహస్థుడు అయినా, (లేక) వానప్రస్థుడు అయినా, వ్రతస్తుడు (వ్రతములు చేయువాడు) అయినా, అవ్రతుడు అయినా, స్నాతకుడు అయినా కాకపోయినా , అగ్నికార్యములందు ఉత్సాహవంతుడై ఉన్నా, ఉండకపోయినా, దైనందికంగా(Everyday) అగ్నికార్యములు చేయువంశపారంపర్య ’’అగ్నికుడు’’ అయినా, (లేక) అనగ్నికుడు అయినా కూడా…, యత్ అహరేవ విరజేత్, తత్ అహరేవ ప్రవ్రజేత్।। ఏరోజు, ఏ సమయములో విరక్తుడైతే అప్పటికప్పుడే ఆరోజుననే ‘‘సన్న్యాసము’’ (మనోగతంగా) స్వీకరించును గాక।

సాంఘికమైన సందర్భములను, వ్యవహారములను (మానసికంగా) త్యజించి, పరమాత్మతో మమేకత్వమే మహదాశయముగా స్వీకరించి, తదితరమైన సమస్త కర్తృత్వ - భోక్తృత్వ వ్యవహారములన్నీ సత్ (ఆత్మ గురించిన) ఉపాసనగా అవధరించి ఉండటమే వాస్తవమైన సన్న్యాసము.

సన్న్యాసాశ్రమము స్వీకరించు విధి

అఖండమగు పరమాత్మ తత్త్వమును పరమాశయముగా ఏవిధంగా గ్రహించాలి?

• బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, (లేక) వానప్రస్థుడైనా ‘సన్న్యాసము’నకు సంసిద్ధుడు అవవచ్చును.
• సమస్త దృశ్య (సాంసారిక) వ్యవహారములపట్ల అనురక్తిని మొదలంట్లా త్యజిస్తూ, ‘‘విరక్తి’’ (Non- relatedness)ని అభ్యాసముగా కలిగి ఉండును గాక।
• తల్లి, తండ్రి, గురువు ముఖ్య బంధువుల అంగీకారము పొందును గాక।
• తండ్రిని, తల్లిని, భార్యని, పుత్రుడుని, (వారెవరూ కాకపోతే) శిష్యునికిగాని, సహవాసిని గాని పిలచి తనపట్ల శేషించియున్న అనివార్య కార్యక్రమములు అప్పగించివేయును గాక!
• పైవారిలో ఒకరిని ఆత్మపురుషునిగా భావిస్తూ ప్రజాపతియేష్ఠి (యాగము) నిర్వర్తించును గాక।
• అది కుదరని సందర్భములో అగ్నిని సాక్షిగా సన్న్యాసాశ్రమము స్వీకరిస్తూ, ‘అగ్నియజ్ఞము’ నిర్వర్తించును గాక।

త్రైదాతవీయము

అగ్నియే ‘ప్రాణము’ రూపముగా విశ్వమంతా, (మరియు) సమస్త దేహములలోను వేంచేసినదై ఉన్నది.

అట్టి ప్రాణశక్తి వలననే జగత్తంతా నిర్మితమై ప్రదర్శనమౌతోంది.

అట్టి అగ్నికి సత్త్వ - రజో - తమో త్రిగుణములు త్రిధాతువులుగా జగత్ కల్పన కొరకై రూపము పొందినవై ఉంటున్నాయి. ఇప్పుడు సన్న్యసించువాడు ఇట్లు పలుకుచున్నాడు.

అగ్నిర్హి ప్రాణః। ప్రాణమేవ ఏతయా కరోతి। త్రైధాతవీయామేవ కుర్యాత్।
ఏతయేవ త్రయో ధాతవో యదుత। ‘‘సత్త్వం రజః తమ’’ ఇతి।।

‘‘అగ్నియే ప్రాణశక్తి అయి ఈ సమస్త జగద్ద్వ్యవహారము నిర్వర్తిస్తోంది. అట్టి అగ్ని యొక్క త్రి-ధాతువులే సత్త్వ-రజో-తమో త్రిగుణములు’’.

‘‘అయం తే యో నిరృత్వియో, యతో జాతో అరోచధాః।
తం జానన్ అగ్న ఆరోహా, అథా నో వర్ధయా రయిమ్’’।।

నేను అగ్నిసాక్షిగా అట్టి త్రిగుణములను దాటివేస్తూ, నిరృత్తి (అభాగ్యము, మృత్యురూపము) అగు ఇంద్రియ విషయముల గురించి తెలుసుకొని, నాయొక్క దృశ్య సంబంధములన్నీ అగ్ని యందు ప్రేల్చివేసి, ‘ఆత్మతత్త్వము’ అనే తేజో-వర్ధమానము కొరకై అగ్నిదేవుని శరణువేడుచున్నాను.

ఇతి అనేన మంత్రేణ అగ్నిం ఆజిఘ్రేత్। ఈఈ విధములైన మంత్రములతో - అర్థము, అంతరార్థము తెలుసుకొంటూ, మననము చేస్తూ అగ్నియేష్టిని నిర్వర్తిస్తూ ‘‘సన్న్యాసము’’నకు సంసిద్ధుడగునుగాక!

‘‘అగ్నే యోనిర్యః ప్రాణః,
ప్రాణం గచ్ఛ స్వాం యోనిం గచ్ఛ స్వాహా।’’
- ఇత్యేవమ్ ఏవై తదాహ।

ఈ ప్రాణము అగ్నినుండే బయల్వెడలి, అగ్ని ప్రసాదముగా నావెంట నంటి ఉంటోంది. తిరిగి ప్రాణము అగ్ని ప్రవేశము చేయబోవుచున్నది. కనుక ప్రాణమును అగ్నిదేవునికి చెందినదిగా భావించి సమర్పిస్తున్నాను. స్వాహా!!

ఈ విధమైన మంత్రములతో (సన్న్యాస స్వీకారమునకు ముందుగా) శాస్త్రములు చెప్పే సంవిధానము (సన్న్యాస భావనయొక్క అవగాహన, సుస్థిరత, నిశ్చలత కొరకై) పాటించబడు గాక!

సన్న్యాస స్వీకార సమయంలో నిర్వర్తించే అగ్నికార్యము కొరకై - అగ్నిని శ్రుతులను (వేదములను) ఉపాసించేచోటున ఉండే యజ్ఞగుండము (లేక) అగ్ని కార్యముల నుండి అగ్నిని తెచ్చి, (శ్రోత్రియాగారము నుండి అగ్నిని తెచ్చి) :-

ఆతురసన్న్యాసము

కొందరు వ్యాధి కారణంగానో, వార్ధక్యము చేతనో శాస్త్రములు నియమించిన ఆయా అగ్నియేష్టి మొదలైన అగ్నికార్యములను నిర్వర్తించగలిగే పరిస్థితి, శారీరక స్థితి ఉండకపోవచ్చును. అట్టివారికి ‘ఆతురసన్న్యాసము’ సూచించబడుతోంది. అట్టి వారు పైన మనము చెప్పుకున్న ప్రజాపతియేష్టిగాని, ‘అగ్నియేష్టి’గాని నిర్వర్తించవలసిన అవసరము ఉండదు.

అట్టివారు - ‘‘ఆపోవై సర్వదేవతాభ్యో జుహోమి స్వాహా’’ అని పలుకుచూ, అగ్నిలో ఆజ్యము (నేయి) గాని, అగ్ని - ఆజ్యములు దొరకనిచోట - నీటితోగాని ‘‘ఆత్మాగ్ని (The Fire of Absolute self) హోమము’’ చేస్తూ ఆతురసన్న్యాసము స్వీకరించవచ్చును.

యేష్టి: ‘‘స్వాహా’’ అని పలుకుచు, హోమగుండము నిర్మించి యజ్ఞ (అగ్ని) పురుషుని హవము (Invite) చేస్తూ, హవిస్సు (అగ్నిహోత్రము నందు వ్రేల్చుటకొరకై ఇవురబెట్టినట్టి అన్నమును, నెయ్యిని) ప్రాశనము (సమర్పించటము) మంత్రముగ్ధంగా చేయటమే ‘‘యేష్టి’’ (లేక) ‘‘యజ్ఞము’’. ఇది శాస్త్రములు చెప్పే విధి - విధానంగా చేయబడును గాక!

వీరాధ్వానముగాని, (అ)నాశకమునగాని, సంప్రవేశనగాని, అగ్ని ప్రవేశమునగాని, మహాప్రస్థానమునగాని శాస్త్రీయ విధివిధానంగా యేష్టిని నిర్వర్తించాలి. (ఇవన్నీ యాగవిధిలో వివిధ విధాన విభాగములు).

యత్ ఆతురః స్యాత్ - మనసా వాచా వా సన్న్యసేత్। ఏష పంథాః। అనారోగ్య పరిస్థితులలో ఆతుర సన్న్యాసము మనస్సు చేతను, వాక్కు చేతను ‘‘సన్న్యాసం మయా’’ అని (3 సార్లు గాని, 11 సార్లు గాని, 32 సార్లు గాని) పలుకుచు ఆతుర సన్న్యాసము స్వీకరించవచ్చు. ఇది శాస్త్ర విధియే అవుతుంది.

ఆ ఆతుర సన్న్యాసి తిరిగి స్వస్థుడైతే - (ఆరోగ్యవంతుడైతే), ఆ తరువాత సన్న్యాసము కొరకై చెప్పిన విధులన్ని యథావిధిగా ఆచరించాలి.

సన్న్యాసము తీసుకొనేడప్పుడు ఆచరించవలసిన విధానము :-

(1) ఆత్మశ్రాద్ధము.

(2) విరజా హోమము.

(3) అగ్ని యందు సమస్తము ఆరోపణ (Attribution and submission) చేయటము.

(4) లౌకికమైన, ప్రాపంచకమైన వ్యవహార సామర్థ్యము, బాధ్యతలును తనయొక్క ‘‘14’’ విధములైన కర్మేంద్రియ - జ్ఞానేంద్రియ - మనోబుద్ధి చిత్త అహంకారముల ప్రవృత్తులను, - ఇవన్నీ కూడా →
* పుత్రుని పరమాత్మగా భావించి ‘‘పుత్రా! త్వం బ్రహ్మ’’ మంత్రముతో పుత్రునికి సమారోపణము (Handing over) చేయాలి.
* కుమారుడు లేనప్పుడు పై విధంగా శిష్యునికి సమారోపణ చేయవచ్చు.
* శిష్యుడు కూడా లేనప్పుడు ‘‘స్వాత్మ’’ యే (స్వకీయ జీవాత్మయే) పరమపురుషునిగా (లేక) బ్రహ్మముగా భావించు సమారోపణ చేయవచ్చు.

‘‘పుత్రా! బ్రహ్మత్వం। యజ్ఞః త్వమ్।’’ ఈ విధమైన శాస్త్రములో చెప్పబడిన మంత్రములతో సమారోపణము చేయాలి.

(5) ‘‘సావిత్రీ ప్రవేశపూర్వకమ్ అప్సు సర్వవిద్యార్థ స్వరూపాం, బ్రహ్మణ్యాధారాం, క్రమాత్ వ్యాహృతిషు త్రిషు ప్రవిలాప్య। సావిత్రీ (యో-సావై బ్రహ్మ)’’ మంత్రములను పఠిస్తూ సర్వదా విద్యాధ్యయనుడు (విద్యార్థి) అయి ఉండాలి. వేదమాతకు వ్యాహృతులతో బ్రహ్మమును ఉద్దేశించి త్రివ్యాహృతలతో జలములో ప్రవిలాపనము చేయాలి (వదలాలి).

(6) వ్యాహృతి త్రయము - ‘అ’ కారము, ‘ఉ’కారము, ‘మ’కారములందు సమస్తము మంత్రోచ్ఛారణతో సమస్త జగత్ ధోరణులను ప్రనిలాపనము చేయాలి.

(7) తత్ సావథానే ఆపః ప్రాశ్య ప్రణవేన శిఖం ఉత్కృష్య। జలమును సావధానంగా ప్రణవపూర్వకంగా ప్రాస్యము చేసి (పానము చేసి, త్రాగి) శిఖ, (పిలక)ను తొలగించాలి.

(8) యజ్ఞోపవీతము త్రెంచాలి.

(9) వస్త్రములను భూమిమీదగాని, నీటిలోగాని వదలాలి.

(10) ‘‘ఓం భూః స్వాహా। భువః స్వాహా। ఓగ్ం సువః స్వాహా।’’ అను మంత్రము దీర్ఘముగా పఠిస్తూ ఇక ఆపై ‘‘జాతరూపధారణ’’ చేయాలి. ఏవిధంగా అప్పుడే పుట్టిన బిడ్డకు బంధు-మిత్ర-మమకార-అహంకార-సాపేక్ష-అధిక-అల్ప భావసంబంధములు ఉండవో, ఆ విధంగా అప్పుడే పుట్టిన బిడ్డవలే మనో బుద్ధులను కేవలరూపంగా ధారణ చేయాలి. జాతరూపధరుడు కావాలి.

(11) ‘ఓం’ ‘ఓం’ ‘ఓం’ - అను ప్రణవమును వ్యాహృతము చేయును గాక। (అనగా) ఓం అని మరల మరల ఎలుగెత్తి ఉచ్ఛరించును గాక। (Out speaking) పైకి పలుకును గాక।

(12) సమస్తమునకు ‘సాక్షి’, కేవలము, మనో బుద్ధి - చిత్తములకు ఆవలిది - అగు కేవల స్వస్వరూపమును ధ్యానిస్తూ ప్రణవ (ఓం) - వ్యాహృతము (పలకటము) అనేకసార్లు చేయుచుండును గాక।

• ‘‘ఓం’’ అని వ్యాహృతము. ఉచ్ఛారణ.
• ‘‘సర్వాత్మకము, సర్వాతీతము, సర్వ - బాహ్య అభ్యంతర స్వరూపము’’ అగు ‘‘ఆత్మ’’ గురించి ధ్యాసతో కూడిన ధ్యానము

ఉచ్ఛారణ-ధ్యానముల రెండిటినీ ఒక్కసారిగా నిర్వర్తించును గాక.

(13) మంద్ర (Low Pitch), మధ్య (Medium Pitch), తారధ్వని (High Pitch) లలో - మనసా, వాచా (At inner zone of feelings, Thoughts and psycho attributes as well as by expression) -

• సన్న్యస్తం మయా! (మంద్ర ధ్వని।)
• సన్న్యస్తం మయా! (మధ్యమ ధ్వని।)
• సన్న్యస్తం మయా! (తారాస్థాయి ధ్వని)

3 x 3 సార్లు పలుకును గాక।

(14) ఈ విధంగా ప్రేషోచ్చారణము (ఎలుగెత్తి పలకటం)తో కూడిన ఆజ్ఞాపిస్తున్న ధ్వనితో, ప్రణవముమాత్రమే పలుకుచుండును గాక।

(15) ప్రణవైకధ్యాన పరాయణుడై ఈ క్రింది వాక్యములు మరల మరల ఎలుగెత్తి పలుకును గాక।

‘‘అభయగ్ం సర్వ భూతేభ్యో మత్త స్వాహా।’’
సమస్త సహజీవులకు నేను అభయముగా(భయము తొలగుంచువానిగా) అగుచు, నన్ను నేను (ఆత్మతత్త్వమునకు) సమర్పించుకుంటున్నాను.

‘‘అహం బ్రహ్మాస్మి। బ్రహ్మైకమస్మి। తత్త్వమసి। సర్వంఖలు ఇదం బ్రహ్మ।’’
ఈవిధంగా తత్త్వర్థపూర్వకమగు సత్-భావనను (అనేకసార్లు) గొంతెత్తి పలుకును గాక।

(16) ఇక ఈ సన్న్యసించిన స్థానము నుండి లేచి నిలబడి, పరిసములను, జీవులను ఆత్మ భగవానుని ప్రత్యక్షరూపముగా మనస్సుతో నమస్కరిస్తూ, అప్పుడే పుట్టిన పిల్లవానివలె (జాతరూపధరుడై), ఎవరితోగాని, ఏవస్తు విషయ - ఇల్లు మొదలైన వాటితోగాని ఏ సంబంధము, పరిచయము లేని వానివలె బయల్వెడలాలి.

(17) ఉత్తరదిక్కుగా నడుచుకుంటూ వెళ్ళాలి.
ఈవిధంగా సన్న్యాసాధికారి సన్న్యాసము స్వీకరించే విధి (Method / Procedure) చెప్పబడుతోంది.

నిత్య సన్న్యాసి

‘సన్న్యాసము’ అనునది వస్తుతః మనో సంబంధమైన స్థితి. ఎప్పుడైతే దేనిపట్ల ద్వేషముగాని, ఏదో కావాలనిగాని ఉండవో, అట్టి స్థితియే నిత్య సన్న్యాస స్థితి. (జ్ఞేయస్య నిత్య సన్న్యాసీ యో న ద్వేష్టి, న కాంక్షతి - భగవద్గీత) ।

గృహస్థుడు సన్న్యాసము స్వీకరించినప్పుడు పాటించు విధానము :-

(1) ముందుగా శరీర భావనను, లోకసంబంధమైన అనుబంధ బాంధవ్యములను మొదలంట్లా త్యజించి ఉండటము ప్రారంభించాలి. వాటికి అతీతత్వము సిద్ధించుకొని ఉండును గాక।

పై మంత్రమును (గృహస్థుడైనా కూడా) మానసికంగా మననము చేయుచుండునుగాక। ఈవిధంగా నిత్య సన్న్యాసి అయి, ఇక క్రమంగా లోకాశ్రయములన్నీ ఒక్కొక్కటిగా వదలివేస్తూ ఉండును గాక।

సన్న్యాస వస్తు సేకరణము :-

ఇక సన్న్యసించటానికై ఉపకరణ, సేకరణము చేయునుగాక।

సలక్షణమైనటువంటి
(A) వైణవం దండము (వెదురు దండము).
(B) కటి సూత్రము (మొలత్రాడు).
(C) కౌపీనము (గోచీ).
(D) కమండలువు (సన్న్యాసులు జలము ఉంచుకునే పాత్ర).
(E) వివర్ణవస్త్రము.
ఇవన్నీ సేకరించును గాక।

ఉపాసనా మంత్రము :-

‘‘సఖా మా గోపాయోజః
సఖాయో అసి। ఇంద్రస్య వజ్రోఽసి।
వార్త్రఘ్న శర్మ మే భవ।
యత్ పాపం తన్నివారయేతి।।’’

అను మంత్రమును ఉపాసించెదరు గాక।

(దండము కౌపీనము మొ।।న సన్న్యాసాశ్రమ ఉపకరణములారా! నా ఈ ఉపాసనను స్నేహితులై సంరక్షించండి. ఇంద్రుని వజ్రమువలె మా యొక్క పాప దృష్టులను పెకలించివేయండి).

(2) సద్గురుమ్ ఉపగమ్య, నత్వా। తత్త్వదర్శిని (తత్-త్వమేవ అను పాఠ్యాంశమును బోధించు సమర్ధుడగు సద్గురువును) ఆశ్రయించునుగాక। ‘‘అమృతము, అఖండము, సహజము, నిత్యము, సమస్తమునకు అతీతము అగు ఆత్మపురుషుడవే నీవు అయి ఉన్నావు’’ -అను నిరూపణవాక్యములను బోధించువారే-సద్గురువు. స్వకీయ సాంసారిక ఉద్దేశ్యములను, అభియోగములను, అభిప్రాయములను ప్రక్కకుపెట్టి ఆ సద్గురువు చెప్పే ‘‘నీవు పూర్ణమగు ఆత్మవే’’ అనే అర్థమును మననం చేయాలి.

(3) గురు ముఖాత్ ‘‘తత్త్వమసి’’ ఇతి వాక్యం ప్రణవపూర్వకం ఉపలభ్యా। అట్టి సద్గురువు బోధించు ‘‘తత్త్వమసి’’ వాక్యములు విని, సందేహములు తొలగించుకోవాలి. ప్రణవపూర్వకంగా ఆకళింపు చేసుకోవాలి. ‘‘నేను చావు-పుట్టుకల మధ్యగా పుట్టుకొస్తున్న ఒక జీవుడను. అల్పుడను’’ - మొదలైన బలహీన భావములను - ‘‘అనుమాన నివృత్తి’’ పూర్వకంగా వదలించుకోవాలి.

(4) అథ జీర్ణ వల్కాజనమ్ ధృత్వా। జీర్ణ జింక చర్మవస్త్రములు ధరించును గాక।

(5) జలావతరణము (తలంటి స్నానము), ఊర్థ్వ గమనము (సాంసారిక వ్యవహారములలో తిరుగుడు), ఏకభిక్ష (నేననుకున్నదే జరగాలి - అనే ఆవేశము) మొదలైనవి త్యజించును గాక।

(6) ‘త్రికాలస్నానమ్ ఆచరేత్’। త్రికాలములలోను ఆత్మభావనయందే స్నాన-సంచారములు నియమించుకొనునుగాక।

(7) వేదాంతశ్రవణపూర్వకం ప్రణవానుష్ఠానమ్ కుర్వన్। ఈ ఇహ-పర, జీవాత్మ-పరమాత్మ, దేహ-దేహాంతర, కాల - కాలాంతర అనుభవమంతా ‘‘స్వస్వరూపసంజ్ఞ’’ అగు ‘ఓం’కారముతో ఏకంచేసి, ప్రణవానుష్ఠానమును సర్వకాల - సర్వావస్థలలో ఆశ్రయించును గాక!

(8a) సమ్యక్ సంపన్నః । ‘‘అనేకముగా కనిపిస్తూ ఉన్న ఈ సమస్తము ఏకమే - అయి ఉన్న ఆత్మతత్త్వముచే సర్వదా సుసంపన్నము’’ - అను తత్త్వదృష్టిని ఆశ్రయించును గాక!

(8b) స్వాభిమతమ్ । ‘‘సమస్తము మామాత్మయొక్క చిత్త (ఇష్ట) ఆనంద ప్రదర్శనమే’’ - అను భావన, అనుభూతి పదిలపరచుకొనునుగాక।

(9) ఆత్మని గోపయిత్వా। సర్వత్రా ఆత్మభావనను హృదయాంతరంగముగా పరిరక్షించుకుంటూ, రహస్య - అరహస్యములుగా ఆస్వాదిస్తూ ఉండును గాక।

(10) నిర్మమో। ‘‘హే సర్వాంతర్యామీ। నాది - నాది అని నేను అనుకుంటున్నదంతా ‘నాది’ కాదయ్యా! నీది’’ - అను భావమును ఆశ్రయించి మమకార రహితుడు అగుచుండును గాక!

(11) అధ్యాత్మ నిష్ఠః। సర్వదా ‘‘ఆ పరమాత్మయే ఈ సమస్త రూపములుగా నాకు అగుపిస్తున్నారు’’ - అను ఆధ్యాత్మనిష్ఠను ఆశ్రయించును గాక।

(12) ఇక ఎల్లప్పుడు వదలి ఉండవలసినట్టివి:

(i) కామము - ‘‘ఇంకా ఏదో పొందవలసి ఉన్నది’’ అనే ఆవేశపూర్వకమైన ఆశ - పేరాశ - దురాశ - నిరాశలు మొదలైన వ్యసనములు.

(ii) క్రోధము - కోపావేశము, పగ, తప్పులెన్నటము, బాధించే ఉద్దేశ్యములు - మొదలైనవి.

(iii) లోభము- ‘‘నావే। నాకే చెందినవి।’’ - అనే మమకారముతో దాచుకోవటము, దోచుకోవటము. పంచుకోకపోవటము.

(iv) మోహము - ‘సత్యము - శాశ్వతము’ ఏమిటో విచారించకుండా ‘‘ఆపాదితము - అశాశ్వతము’’లను పట్టుకొని భ్రమలు వీడక, సంకుచితుడై ఉండటము.

(v) మదము - తనను తాను గొప్ప చేసుకొని, ఇతరులను అల్పదృష్టితో చూడటము. గర్వము.

(vi) మాత్సర్యము - ఇతరులను బాధించు స్వభావము. తనవలన ఇతరులకు కష్ట - నష్టములను ఉద్దేశ్యపూర్వకంగా అధికము చేయటము.

(vii) దంభము - లేని గొప్పలను చూపి, గుర్తింపుకై పాకులాడటము. తాను పొందుచున్నవి ఏమరచి, తాను ఇస్తున్నవి అధికముగా భావించటము.

(viii) అహంకారము - ‘నేను-నాది’ అను స్వభావమును వీడక ఉండటము.

(ix) అసూయ - ఇతరులకు కలిగే ‘మంచి’ చూచి ఓర్వలేకపోవటము.

(x) గర్వము - తన గొప్ప తానే అధికము చేసి భావించటము.

(xi) ఇచ్ఛా-ద్వేష, హర్ష-అమర్షములు - ‘‘వీరంటే ఇష్టము. వారంటే నాకు ద్వేషము. ఇది నాకు సంతోషము. అది నాకు దుఃఖము’’ - మొదలైనవి కలిగి ఉండటము.

(xii) మమత్వము - ఇల్లు, గ్రామము, జాతి, భాష మొదలైనవాటి పట్ల ‘‘నావి। నాకొరకై। నాకు చెందినవి। నాకు చెందనవి’’ - ఇటువంటి భావావేశములు.

ఈ ఈ మొదలైన ‘‘సాంసారికములు, సంకుచిత దృష్టిప్రదాతలు’’ అగు అభ్యాసములను తొలగించుకొనును గాక!

సన్న్యాసాశ్రమ నిష్ఠ (మరికొంతగా)

జ్ఞాన-వైరాగ్యయుక్తో :

(1) దృష్టినంతా ‘‘ఆత్మజ్ఞాన, ఆత్మ మనన, ఆత్మధ్యాస - ఆత్మభావన’’ లతో జ్ఞానమును ఆశ్రయిస్తూ, దృశ్య వ్యవహారముల పట్ల విరాగి (Non attached / Non Related) అగుచుండును గాక।

(2) ధన - జన - స్త్రీ వ్యవహారముల నుండి దృష్టిని వెనుకకు మరల్చుచూ ‘పరాఙ్ముఖుడు’ (పరాత్-ముఖుడు) అగును గాక।

(3) మనస్సు నుండి వ్యతిరిక్త (Negative) యోచనలను తొలగించి ‘శుద్ధమనస్కుడు’ అగును గాక!

(4) ఉపనిషత్ వాఙ్మయము ఎలుగెత్తి గానము చేస్తున్న ‘స్వస్వరూపాత్మ’ యొక్క స్వాభావికమైన ఔన్నత్యము గురించి విచారణ (Analysing) చేయుచుండును గాక।

(5,6) ‘‘సమస్తము బ్రహ్మమే’’ - అను భావనను ఆశ్రయించి ‘బ్రహ్మచర్యము’ స్వీకరించును గాక।

(7) అపరిగ్రహా। దేనినీ స్వీకరించక, సమస్తమునకు అతీతుడై ఉండును గాక।

(8) ‘అహింస-సత్యము’లను వ్రతముగా స్వీకరించును గాక।

(9) జితేంద్రియో। ‘‘ఇంద్రియములు నాచే స్వీకరించబడి, నన్ను సేవించుటకై ఉన్నాయి. అంతేగాని, ఇంద్రియ - ఇంద్రియ విషయములకు నేను దాసుడను కాను’’ అను బుద్ధి స్థితిని కలిగియుండి, జితేంద్రియుడు - అగును గాక।

(10) బహిరంతః స్నేహవర్జితః - బాహ్యమున (In the outside) అంతరమున (Inside) కూడా దేనిపట్ల ప్రేమాభిమానపూర్వక ఆవేశము కలిగి ఉండకుండునుగాక। దేనితోను అవినాభావ సంబంధము పొందకుండును గాక।

(11) శరీర సంధారణార్థం త్రిషు వర్ణేషు అభిశస్త పతితవర్జితేషు, పశుః అద్రోహీ, భైక్షమాణో।
శరీర సంధారణ కొరకు మాత్రమే భిక్షను నిర్వర్తించునుగాక। అట్టి భిక్షాటణము 3 వర్ణముల వారి ఇళ్లల్లో నిర్వర్తించవచ్చు. అట్టివాడు క్రమంగా బ్రహ్మీ తత్త్వమును సమీపించగలడు.

(12) సన్న్యాసాశ్రమి సర్వకాలములందు సర్వత్రా సమదర్శి అయి ఉండాలి.

(1) పరమాత్మ ఏక - అఖండ - అప్రమేయ - నిత్యానంద స్వరూపుడు.
(2) ఆ పరమాత్మయే జీవులందరిలోను వేంచేసి ఉన్నారు.
(3) సమం సర్వేషు భూతేషు। పరమాత్మ సమస్త జీవులుగాను సమస్వరూపుడై వేంచేసి ఉన్నారు.
(4) ‘‘అట్టి పరమాత్మయే నాకు ఉపాసన వస్తువు’’
అనునదే సన్న్యాస యోగుల ముఖ్య లక్షణమగు సమదర్శనము. (అట్టి సమదర్శనము చాతుర్వర్ణ్యముల వారికి మోక్ష మార్గముగా శాస్త్రములచే విధించబడుతోంది).

(13) సన్న్యాసయోగిః - ‘‘ఇది లాభము - ఇది నష్టము’’ అను ద్వంద్వదృష్టిని దాటి ఉంటాడు. లాభ-అలాభములను సమదృష్టితో చూచువాడై ఉంటాడు.

‘‘నాకు భిక్షవేయువాడు [ (లేక) దానము చేయువాడు ] మంచివాడు. భిక్షవేయనివాడు చెడ్డ’’ అను దృష్టిని జయించి వేసి ఉంటాడు.

(14) అఱచేతులనే ‘‘మధూకరపాత్ర’గా ధరించి ఆహారము భిక్షగా స్వీకరిస్తూ ఉంటాడు.

(15) ‘‘నాకు బలము ఇచ్చే రుచికర పదార్థములనే భిక్షగా ఇవ్వాలి’’ - అనే మేదోవృద్ధి (క్రొవ్వు వృద్ధి) ఆశయము కలిగి ఉండరు.

(16)
(i) ఈ సమస్తము బ్రహ్మమే।
(ii) నేను బ్రహ్మమునే।
(iii) నేనే ఈ సమస్తము అయి ఉన్నాను అను ‘‘బ్రహ్మాహమస్మి’’ భావనను వీడని వారై ఉంటారు.

(17) గుర్వర్థం గ్రామమ్ ఉపేత్య । గురువుకు ఆహారము సమర్పించటానికై గ్రామములో సంచరిస్తూ భిక్షను స్వీకరించటమును ఆశ్రయించాలి. లభించిన భిక్షను గురువుయొక్క ఆజ్ఞానుసారంగా ప్రసాదంగా స్వీకరించాలి.

(18) ధృవ శీలో । సాత్త్వికమైన, ధృవమైన (క్షణ క్షణ చాంచల్యము పొందని) ప్రవర్తన కలిగి ఉండాలి. అరవటం, భయపెట్టటం, శపించటము వంటి క్రియలు చేస్తూ భిక్షాటనము చేయరాదు.

(19) అష్టౌ మాస్య ఏకాకీ చరేత్। చాతుర్మాస్య వ్రతము : సంవత్సరములో 8 మాసములు ఎక్కడా ఒకచోట నివాసము కలిగి ఉండకుండా, సంచారుడై ఉండాలి. 4 మాసములు (వర్షాకాలంలో) గాని (అది సాధ్యపడకపోతే) - 4 పక్షములుగాని (రెండు నెలలుగాని) ఒకచోట ఇతరులతో నివసించువ్రతము - అనబడే ‘‘చాతుర్మాస్యవ్రతము’’ (లేక) ‘‘చాతుర్పక్ష వ్రతము’’ నిర్వర్తించువాడై ఉండాలి.

అట్టి సన్న్యాస జీవనము - ‘‘ఇకచాలు’’ - అని అనిపించినప్పుడు - ఇక ఆపై (1) కుటీచకుడుగానో (2) బహూదకుడుగానో (3) హంసగానో (4) పరమహంసగానో జీవనమును ఆశ్రయించాలి. వాటి వాటి జీవములను మంత్రపూర్వకంగా స్వీకరించునుగాక.

జాతరూపధరుడు

(Disconnected from entire social life)

వీరు సన్న్యాస పరాకాష్ఠ అగు కుటీచక, బహూదక, హంస, పరమహంస లక్షణములను ఆశ్రయించువారు. మంత్రపూర్వకంగా కటిసూత్రము (మొలత్రాడు), కౌపీనము (గోచి), దండము (బ్రహ్మదండము), కమండలువు (త్రాగే నియమైన పాత్ర)ల నియమములను కూడా విసర్జించి ఉంటున్నారు.

సన్న్యాస ఆచార నియమములు (మరికొన్ని) :-

సన్న్యాసి సంవత్సరములో (చాతుర్మాస్యము కాకుండా మిగిలిన) 8 మాసములు ఒకేచోట నివాసము కలిగి ఉండడు.

గ్రామములో అయితే - ఒక రాత్రి (1) మాత్రమే. (మరుసటి రాత్రి వేరే గ్రామము)।

తీర్ధ స్థలములలో - మూడు (3) రాత్రులు మాత్రమే।

పట్టణంలో అయితే - ఐదు (5) రాత్రులు మాత్రమే।

క్షేత్ర ప్రదేశములలో (కాశీ, రామేశ్వరము వంటి చోట) - ఏడు (7) రాత్రులు మాత్రమే - నివాసి అయి ఉంటారు.

ఎందుకంటే - సన్న్యాసి ‘నివాస స్థలము’తో ఎట్టి మనో సంబంధము (Relatedness) కలిగి ఉండడు - ‘‘అనికేతః।’’.

స్థిరమతిః। - ఉపాసన ఎందుకు? చంచలమగు మనస్సును నిశ్చలం చేయటానికి. నిశ్చలమగు మనస్సుకు ఆత్మయొక్క ఔన్నత్యము స్వాభావికంగానే అనుభవము అవుతుంది. సన్న్యాసి తన మనస్సును, వాక్కును, ఆచరణను అదుపులో పెట్టుకొని ‘స్థిరమతి’ అయి ఉంటాడు.

అనగ్నిః। - సన్న్యాసి అగ్ని కార్యములను కూడా వదలి ఉంటాడు.

సేవీః। - ఆతడు ‘నేను సేవకుడను’ అను భావన కలిగి ఉంటాడు. అంతేగాని ‘‘సన్న్యసించాను కాబట్టి నేను తదితర బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థులకంటే గొప్ప గొప్ప వాడిని’’ అని ఆలోచించడు. ‘‘నేను పరమాత్మకు సర్వదా సేవకుడను’’ అని తలుస్తాడు.

నిర్వికారో - దుష్టమైన, చాడీలు చెప్పే బుద్ధిని జయించి ఉంటాడు. సానుకూల్య - ప్రాతికూల్య సందర్భములలోను, సుఖ-దుఃఖ సంఘటన, సందర్భములలోను వికారములకు (కోపము, దుఃఖము, ఆవేశములకు) లోను కాకుండా, నిర్వికారుడై ఉంటాడు.

నియమ-అనియమమ్ ఉత్సృజ్య - మడి, ఆచారములు అగ్ని కార్యము మొదలైన సాంఘికమైన నియమ అనియమములు వదలివేసి ఉంటారు.

గోవు లభించిన దానినే తృప్తిగా భుజించువిధంగా, పరమహంస - పరివ్రాజకులు ఏ ఆహారము భిక్షగా లభిస్తే అదియే ప్రీతిగా స్వీకరించువారై ఉంటారు. నీరు దొరికిన చోట కమండలువును త్రాగునీరుతో నింపుకొని ఉంటారు. ‘‘నావే బాధలు’’ అనే కార్పణ్యము (Self Sympathy) కలిగి ఉండరు. దేవాలయ ప్రాంగణము, నది ఒడ్డు, గుహ మొదలైనచోట్ల రహస్యస్థల - నివాసులై ఉంటారు. ‘‘ఇది లభించాలి’’ అది ‘‘లభించకూడదు’’ మొదలైన లాభ అలాభ భావములు కలిగి ఉండరు. శుభాశుభ కర్మ నిర్మూలన పరః। శుభ - అశుభ కర్మఫల ధ్యాసలు విడచి ఉంటారు. ఆయనకు భూమి అంతా శయనాగారమే. అరుగుపైగాని, మరెక్కడైనా గాని, హాయిగా నిదురించుచూ ఉండగలరు. జుట్టు నాజూకుగా కత్తిరించటము మొదలైన క్షౌర కర్మలు పరిత్యజించి ఉంటారు. చాతుర్మాస్యము యోగాభ్యాసములచే యుక్తులై గడుపుతూ ఉంటారు. చాతుర్మాస్యము కాలములో కుదరకపోతే చాతుర్ - అర్ధ మాస (2 నెలల) ఏక ప్రదేశ నివాసవ్రతము (చాతురర్ధమాస్యము) ఆచరిస్తూ ఉంటారు.

అనున్మత్తో-పి ఉన్మత్తవత్ ఆచరన్। ప్రజ్ఞచే స్వస్వరూప-సమస్తత్వము గురించిన - ఆత్మజ్ఞానము ఎరిగి ఉండి కూడా, బయటకు మాత్రం పిచ్చి వానివలెనే ఉంటారు.

బయటగా కనబడని :-

‘‘ప్రణవ సన్న్యాస మార్గం’’గా బాహ్యమంతా సన్న్యసించి, ‘‘దేహము నాకు సంబంధించినది కాదు. నేను దేహమునకు సంబంధించిన వాడిని కాను’’ అను నిశ్చల నిశ్చయముతో దేహమును విడచివేసినవారై ఉంటారు.

ఈవిధంగా ఆతడు ‘‘పరమహంస పరివ్రాజకుడు’’ అగుచున్నారు.

శ్రీమన్నారాయణ - బ్రహ్మదేవ సంవాదము

బ్రహ్మ ప్రణవ నిర్వచనము

బ్రహ్మదేవుడు : భగవాన్! శ్రీమన్నారాయణ దేవా! ‘బ్రహ్మ ప్రణవము’ అనగా ఎటువంటిది? దాని రూపమేమిటి? అద్దాని గురించి దయతో వివరించి చెప్పండి.

శ్రీమన్నారాయణుడు : సృష్టికర్తా! హిరణ్యగర్భా! వినండి. బ్రహ్మ ప్రణవమునకు -
షోడశ (16) మాత్రలు (జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయ: 4 x 4).

Image for Brahma Avasthas

(1) జాగ్రత్ అవస్థా పురుషుడు (విశ్వుడు) - జాగ్రత్ మాత్ర చతుష్టయం. ‘అ’కారాంశము.
(i) విశ్వ విశ్వ అవస్థ - ‘‘అ’’ (జాగ్రత్‌లో జాగ్రత్ అవస్థ)।
(ii) విశ్వ తైజస అవస్థ - ‘‘ఉ’’ (జాగ్రత్‌లో స్వప్నావస్థ)।
(iii) విశ్వ ప్రాజ్ఞ అవస్థ - ‘‘మ’’ (జాగ్రత్‌లో తురీయ సాక్షీ అవస్థ)।
(iv) విశ్వ తురీయ అవస్థ - ‘‘అర్ధమాత్ర’’ [ జాగ్రత్‌లో తురీయ (సాక్షీ) అవస్థ) ]।

(2) స్వప్న - అవస్థా పురుషుడు - (తైజసుడు) (అవస్థలు) - స్వప్నమాత్రాచతుష్టయం. ‘‘ఉ’’కారంశము.
(i) తైజస విశ్వుడు - ‘‘బిందు’’ (స్వప్నములో జాగ్రత్ అవస్థ)।
(ii) తైజస తైజసుడు - ‘‘నాద’’ (స్వప్నములో స్వప్నావస్థ)।
(iii) తైజస ప్రాజ్ఞుడు - ‘‘కలాయం’’ (కల) (స్వప్నములో సుషుప్యవస్థ)।
(iv) తైజస తురీయుడు - ‘‘కలాతీతః’’ (కలాతీతము) (స్వప్నములో తురీయావస్థ)।

(3) సుషుప్తి అవస్థా పురుషుడు (ప్రాజ్ఞుడు) - సుషుప్తి మాత్రా చతష్టయం. - ‘మ’కారంశము.
(i) ప్రాజ్ఞ విశ్వుడు - ‘శాంతి’ (సుషుప్తిలో జాగ్రత్ అవస్థ)।
(ii) ప్రాజ్ఞ తైజసుడు - ‘శాంత్యతీత’ (సుషుప్తిలో స్వప్నావస్థ)।
(iii) ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు - ‘‘ఉన్మనీ’’ (సుషుప్తిలో సుషప్త్యవస్థ)।
(iv) ప్రాజ్ఞ తురీయుడు - ‘‘మనోన్మన్యాగ్ం’’ (మన-ఉన్మని) (సుషుప్తిలో తురీయావస్థ)।

(4) తురీయ పురుషుడు - తురీయమాత్రా చతుష్ఠయం - ‘‘అర్ధమాత్రాంశము’’.
(i) తురీయ విశ్వుడు - ‘‘వైఖరీ’’ (తురీయములో జాగ్రత్ అవస్థ)।
(ii) తురీయ తైజసుడు - ‘‘మధ్యమా’’ (తురీయములో స్వప్నావస్థ)।
(iii) తురీయ ప్రాజ్ఞుడు - ‘‘పశ్యంతీ’’ (తురీయములో సుషుప్త్యవస్థ)।
(iv) తురీయ తురీయుడు - ‘‘పర’’ (తురీయములో తురీయావస్థ)।

పైన చెప్పుకున్న ‘‘4 x 4 = 16’’ మాత్రలను, అంశలను (షోడశాంశలను) ‘‘బ్రహ్మ ప్రణవము’’ అని తత్త్వజ్ఞులు శాస్త్రీయంగా వివరించి చెప్పుచున్నారు.

అట్టి బ్రహ్మ ప్రణవము పరమహంస తురీయాతీత - అవధూతలకు ఉపాస్యము (Object of Adoration) అయిఉంటోంది.

అట్టి అధ్యయన - అవగాహనలచే బ్రహ్మము స్వానుభవమై ప్రకాశించగలదు. బ్రహ్మము యొక్క అసంశయ స్వాభావికానుభవము సిద్ధించగలదు. అదియే ‘విదేహముక్తి’గా కూడా చెప్పబడుతోంది.

బ్రహ్మదేవులవారు : భగవాన్! శ్రీమన్‌నారాయణ దేవాది దేవా! పరమహంస, తురీయాతీతుడు అగు అవధూత - సమస్తము సన్న్యసించి ఉంటాడుకదా? అతడు ‘బ్రాహ్మణుడు’ అవుతాడా?

నారాయణ భగవానుడు : అవును. సమస్తము మొదలంట్లా సన్యసించి ఉంటాడు. సమస్త కర్మలు త్యజించి ఉంటాడు. ‘బ్రాహ్మణుడు’ అని చెప్పబడతాడు.

బ్రహ్మదేవుడు : అనగా ‘‘పరమహంస (మరియు) అవధూత అయజ్ఞోపవీతి - అశిఖి (యజ్ఞోపవీతము, శిఖ త్యజించిన వాడు) అయినవాడు ఇంక దేనిని త్యజించి పరమహంస (మరియు) అవధూత - అనే బ్రహ్మనిష్ఠాపరుడు అవుతాడు? యజ్ఞోపవీతము బ్రహ్మనిష్ఠ కలిగి ఉండటానికి గుర్తు కదా మరి?

నారాయణ భగవానుడు : బిడ్డా! బ్రహ్మదేవా! భో అర్భక! చిన్న పిల్లవానివలె (అర్భకునివలె) అడుగుచున్నావయ్యా! అవధూత (మరియు) పరమహంస విషయములో దూది నిర్మితమైన యజ్ఞోపవీతము (జందెము, జంద్యము, జందియము)తో పని ఏమున్నది? ఏమీ ఉండదు.

యస్య అస్తి అద్వైతమ్ ఆత్మజ్ఞానం, తదేవ ‘యజ్ఞోపవీతమ్’। - ‘‘ఈ సమస్త జీవులు, జగత్తు కూడా ఆత్మస్వరూపమే. ఆత్మకు ద్వితీయము అనునదే లేదు’’ - అను స్వస్వరూపమునకు చెందిన ఆత్మతత్త్వ జ్ఞానమే - ‘యజ్ఞోపవీతము’. అట్టి యజ్ఞోపవీతము వారు ధరించియే ఉంటారు.

తస్య ధ్యాన నిష్ఠైవ‘శిఖా’। - సమస్తము ఆత్మగా ధ్యాస (ధ్యానము) నిర్వర్తించటమే ‘శిఖ’.

ఆత్మభావనయే ఆతడు చేయు సత్కర్మ.

స సర్వ కర్తకృత్। - అట్టి వాడు (సమస్తము స్వస్వరూపాత్మకంగా సందర్శించువాడు) సమస్త కర్మలు నిర్వర్తించినట్లే.

స బ్రాహ్మణః - ఈ సమస్తము బ్రహ్మముగా దర్శించువాడు బ్రాహ్మణుడు।

స బ్రహ్మనిష్ఠాపరః ।- సమస్తము బ్రహ్మముగా చూడటమే ఆయనయొక్క బ్రహ్మనిష్ఠాపరత్వము. అద్వైత - ఆత్మజ్ఞానియే బ్రహ్మనిష్ఠాపరుడు (అంతేగాని దారము సంబంధమైన యజ్ఞోపవీతము ధరించిన మాత్రం (లేక) విడచినంతమాత్రం చేతకాదు).

స దేవః ।- అట్టి బ్రహ్మసంభావనయే దివ్యమగు దైవీతత్త్వము. దేవత। ఆ అద్వైత జ్ఞానియే దేవత।

స ఋషి। - అట్టి (సమస్తము బ్రహ్మముగా) అనుభవమే ‘ఋత్’. ‘ఋత్’ను (అద్వైత జ్ఞానమును) ఆశ్రయించి ఉన్నవాడే ఋషి।

స తపస్వీ। - ఆతడే తపస్సు చేయువాడు. ఆత్మజ్ఞాన, ఆత్మతత్త్వానుభవముల గురించిన తపనయే తపస్సు.

స శ్రేష్ఠః। - అట్టి అఖండాత్మానుభవము కలవాడే ‘శ్రేష్ఠుడు’.

స ఏవ సర్వజ్యేష్ఠః। - ఆతడే అందరికంటే జ్యేష్ఠుడు.

స ఏవ జగద్గురుః। - ఆతడే జగద్గురువు కూడా.

‘‘అట్టి ఆత్మయే నేను’’ - అని ఈ జీవుడు తెలుసుకొని ‘పరమహంస’ అగుచున్నాడు.

పరమహంస = ‘‘సో౽హమ్-పరమమ్’’
- ‘‘ఆవల గల నేనైన నేనే నేను’’. (సందర్భ సత్యమునకు ఆవలగల సహజమైయున్న నేనైన నేనే - సో౽హమ్-‘‘నేను’’).

పరివ్రాజకుడు = తన సంచారమంతా అట్టి ఆత్మయందే కలిగి ఉన్నవాడు. అట్టి పరమహంస అయిన పరివ్రాజకుడు ఈ వేలాది, లక్షలాది జీవులతో ఎక్కడోగాని తారసపడడు. (మనుష్యాణాం సహస్రేషు। దుర్లభతరో, యత్ ఏకో అస్తి।)

స ఏవ నిత్య పూతః - అతడు నిత్యనిర్మలమగు పరమాత్మయే। ఆయనయే వేదపురుషుడు. తెలియబడే సమస్తము తనయొక్క ‘పురుషకారము’గా ఎరుగువాడు. ఓ బ్రహ్మదేవా! ఆతని చిత్తము ఎల్లప్పుడు నాయందే ఏర్పడినదై ఉంటోంది. యః తత్ చిత్తం మయ్యేవ అవతిష్ఠతి।

అంతేకాదు. నేను ఎల్లప్పుడు ఆతనియందే ఏర్పడినవాడనై ఉంటాను. అహం చ తస్మిన్ ఏవ అవస్థితః।

బ్రహ్మదేవుడు: స్వామీ! నారాయణ భగవాన్! ఎవ్వడైతే ‘‘ఆవల ఉన్న ఆ అమృతానంద రూపమగు ఆత్మయే నేను’’ - అను పరమహంస భావమును సంపాదించుకొని, సమస్త అన్యభావములనుండి విడివడినవాడై, అవధూతత్వము సంతరించుకుంటాడో, అట్టి వాని లక్షణములు ఇంకా కూడా ఏతీరుగా ఉంటాయి?

శ్రీమన్నారాయణుడు: బ్రహ్మదేవా! ఈ ప్రపంచంలో ఏదైనా కూడా, అభ్యాసముచేతనే సిద్ధించగలదు కదా! మనము చెప్పుకోబోతున్న ఈఈ అభ్యాస, లక్షణములచే ఏ జీవుడైనా సరే, తప్పక పరమహంస-పరివ్రాజకుడు కాగలడు.

(1) నిత్యతృప్తః । - నిత్య తృప్తుడై ఉంటాడు. ఈ దృశ్య ప్రపంచంలో కనిపిస్తున్న దేహములు, జన్మ-మృత్యువులు, సందర్భములు, సంఘటణలు, సంబంధములు, మనో-బుద్ధి-చిత్త-అహంకారములు ప్రదర్శించే కార్యక్రమములు మొదలైనవేవీ ఆతని స్వాభావిక, అప్రమేయ, అవ్యాజమగు ‘ఆత్మతృప్తి’ని కించిత్ కూడా ‘అసంతృప్తి’ వైపుగా మరల్చలేవు.

(2) స శీతోష్ణ సుఖదుఃఖ, మానావమాన వర్జితః । - ఆతడు ద్వంద్వ మోహములైనట్టి శీత - ఉషణాములను, సుఖ - దుఃఖములను, మాన - అవమానములను మొదలంట్లా జయించినవాడై, త్యజించినవాడై ఉంటాడు.

(3) స నింద - అమర్ష సహిష్ణుః । - ఆయన నిందను (దూషణ, తిరస్కారములను), స్తుతి (పొగడ్త)ని, అమర్షమును (కోపము, ఇతరుల ఓర్వలేనితనము-అసహనములను) స్వాభావికంగానే చిరునవ్వు వీడక, సహించువాడై ఉంటాడు.

(4) షడూర్మి వర్జితః । - ‘‘ఆకలి, దాహము, శోకము, మోహము, జర (వార్థక్యము), మరణము (చావు)’’ - అను ఆరు ఊర్మిలను దాటి, తన ఆత్మస్వరూపమును ఆవలగా దర్శిస్తూ ఆనందించువాడై ఉంటాడు. ఆతని దృష్టిలో భౌతిక శరీరముయొక్క ‘రాక’- జన్మ కాదు. ‘పోక’ - మృత్యువు కాదు. (ఊర్మి = ప్రవాహ వేగము).

(5) షట్‌భావ వికారశూన్యః । - ‘‘శరీరభావాశ్రయము, శరీరము యొక్క పుట్టుక, బాల్యము, యౌవనము, వార్థక్యము, మరణము’’ అనబడు షట్ (6) భావవికారములు తనయందు లేనివాడై ఉంటాడు.

(6) స జ్యేష్ఠ - అజ్యేష్ఠ వ్యవధాన రహితః ।- ఆతడు సర్వే సర్వత్రా ఆత్మనే దర్శిస్తాడు. ‘‘మట్టితో చేసిన బొమ్మలు అనేకం కావచ్చు. కానీ, మట్టి ఒక్కటే కదా! బంగారు ఆభరణాలు అనేకం కావచ్చు. కానీ, బంగారము ఒక్కటే కదా! అట్లాగే ఏకమగు ఆత్మయే అనేకముగా కనిపిస్తోంది।’’ - అను దృష్టిని నిశ్చలము, సుస్థిరము, అకలంకము అనుక్షణికము చేసుకొని ఉంటాడు. అందుచేత ఆయన- ‘‘ఈతడు గొప్పవాడు. ఆతడు తక్కువవాడు. ఇతను జ్యేష్ఠుడు. ఆతడు కనిష్ఠుడు’’…మొదలైన భేదభావములు ఏమాత్రము కలిగి ఉండడు. అట్టి వ్యవచ్ఛేదములు (విభాగభేదములు), వ్యవధానములు (మఱుగు, అంతరము) ఆతనికి వస్తుతః అనిపించవు. కనిపించవు.

(7). స స్వ-వ్యతిరేకేన। న అన్యత్ ద్రష్టా।

పరమాత్మను భావించే (5) విధానములు:

(i) ఎక్కడో దూరాన పరమాత్మ (వైకుంఠములోనో, కైలాసంలోనో, మణిపురంలోనో, దేవాలయములోనో పఠములోనో వేంచేసియున్న స్వామి) → యొక్క అర్చన (God at some distance).

(ii) పరమాత్మ నేను చూచే సర్వదేహములలో వేంచేసి ఉన్నారు. → అనే మనన-ఉపాసన. (God in all).

(iii) ‘‘పరమాత్మ సమస్త జీవులుగా, సర్వదేహములలోని ‘దేహి’గా ప్రదర్శనమగుచున్నారు’’. → అను సర్వత్రా దర్శనము. ‘నిదిధ్యాస’ - స్థితి ‘తత్త్వము’ (God as all). (తత్ త్వమ్)।

(iv) ‘నేను’గా ప్రదర్శనమగుచున్నది ఆ పరమాత్మయే → ‘అదియే నేను’ - అను రూపము గల ‘సో౽హమ్।’ తత్త్వము. (I am that as well).

(v) నేనే ఈ సమస్త లోకాలుగా లోకపాలకులుగా, లోకస్థులుగా ఆత్మనై ప్రదర్శనము అగుచున్నాను → మయా తతమ్ ఇదమ్ సర్వమ్ జగత్ - అవ్యక్త మూర్తినా। → అందరిలోని నేనైన నేనే నేను. ఇది సమాధి స్థితి. (All this and that is what am I).

ఈ ఐదు అభ్యాస స్థితులను కరతలామలకుము చేసుకొన్నవాడై, పరమహంస పరివ్రాజకుడు (సో౽హమ్ - తత్త్వమ్ ఏకార్థమై) ప్రకాశించుచున్నారు. అందుచేతన ఈయన ‘‘నాకు వేరైనది లోకాలలోగాని, లోకములకు ఆవలగాని ఎక్కడా ఏదీలేదు’’ - అను స్వాభావిక, అవ్యాజ, అనునిత్యానుభవం (Non conditioned and always experiencing) పొందుచున్నారు. తత్ - స్వాభావికుడై ఉంటున్నాడు. ‘‘లోకాలలో నేను ఉన్నట్లే, లోకాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి’’ అను ఏక అక్షర బ్రాహ్మీదృష్టి- ని ఆశ్రయించి ఉంటున్నాడు. అందుచేత-స్వవ్యతిరేకేన న అన్యత్ ద్రష్ట। తనకు వేరైన దేనికో తాను- ‘‘ద్రష్ట’’ అయి ఉండడు. తాను చూచే సమస్తము తానే అయి ఉంటాడు. పరమహంసకు సమస్తము తానేనను నిశ్చయము సర్వదా చెక్కు చెదరదు.

(8) న అన్యత్ ఆశా అంబరో। ‘‘నాకు ఇంకేదో కావాలి. ఇంకా కూడా ఏదో పొందాలి’’ - అనే ఆశ, దురాశ, పేరాశ, నిరాశలకు చోటు ఇవ్వడు. ‘‘సమస్తము నేనే అయి ఉండగా, ఇంక నేను - ఈ నేనే అయి ఉన్న 14 లోకముల నుండి - పొందవలసినది ఏముంటుంది? ఏమీ ఉండదు’’ - అనే అవగాహనచే ‘ఆశించటము’ను జయించివేసి ఉంటాడు. ఆశ అనే వస్త్రము ధరించవలసిన పని ఆతనికి ఉండదు. ఆశకు అవకాశమే ఇవ్వడు. ‘‘నేనే అయిన నానుండి నేనేమి కోరుకోవాలి?’’ - అని ప్రశ్నిస్తాడు.

(9) న నమస్కారో। న స్వాహాకారో। న స్వథాకారశ్చ । న విసర్జనపరో। అట్టి పరివ్రాజకుడు అనన్య భావనను సంతరించుకొన్నవాడై, అనన్య భావనా ప్రభావితుడై ఎవరికీ నమస్కరించడు. ఎదురుగా చూడబడే దేవతనుగాని, సహజీవుని గాని తనకు వేరుగా భావన చేయడు. తానే ‘తత్’ అయి ఉన్నట్లు తత్ ఏ ‘తాను’ అయి ఉన్నట్లు స్వానుభవుడై ఉంటాడు.

న స్వాహా కారో। దేవతలకు సమర్పణ చేయువాడు, పిత్రు దేవతలకు సమర్పించువాడు అయి ఉండడు. అవన్నీ తానేగా దర్శిస్తూ ఉంటాడు.

న స్వధాకరో। న విసర్జనపరో : ‘పితృదేవతలు కూడా ఆత్మనగు నాకు అనన్యమే’ అని ఎరిగి, ఏదీ ‘స్వధా’గా సమర్పించనివాడై ఉంటాడు. దేనినీ వదలడు. పట్టుకోడు. ఏది చేస్తూ ఉన్నా, (లేక) చేయకున్నా నిర్వికారుడై ఉంటాడు.

(10) నిందాస్తుతి వ్యతిరిక్తో - నింద, స్తుతులు పొందుచున్నప్పుడు దేనికీ వ్యతిరేకుడై ఉండడు.

(11) న మంత్ర - తంత్ర ఉపాసకో - ఒక మంత్రమునకో, ఒక తంత్రము (విధానమునకో) పరిమితుడు అయి ఉండడు.

(12) దేవాంతర ధ్యానశూన్యో। - బాహ్యదేవతలను ధ్యానించువాడై ఉండడు.

(13) లక్ష్య - అలక్ష్య నిర్వర్తక । సర్వ ఉపరతః। - లక్ష్యములను, అలక్ష్యములను (ఆశయములను, అనాశయములను, చేయవలసినవి - చేయకూడనివి) ఆయా విధములుగా నిర్వర్తిస్తూనే-సమస్త లోకసంబంధమైన విషయ-విశేష-వ్యవహార-సంబంధ- బాంధవ్యముల నుండి ఉపరతుడై (Having completely withdrawn) ఉంటాడు. సర్వత్రా నిర్వర్తనుడు (వర్తనలేనివాడై) ఉంటాడు.

(14) సర్వదా - సత్ (ఉనికి) చిత్ (ఎరుక) ఆనంద (ఆనంద) సహజస్వరూపుడై వెలుగొందుతూ ఉంటాడు.

(15) చిద్ఘనః- కేవల ‘చిత్’ (ఎరుగుట) స్వరూపుడై, ఎరుగబడేదంతా ‘ఎరుగుట’ అనుదానియందు ఘనీభూతము చేసినవాడై ఉంటాడు.

(16) సంపూర్ణా - ఇంక ‘పొందవలసినది’ అంటూ ఏదీ ఆతనిపట్ల శేషించి ఉండదు. కాబట్టి తనయందు, సర్వభూతములయందు సదా సంపూర్ణత్వమును సందర్శిస్తూ ఉంటాడు.

(17) సంపూర్ణ - ఆనందైక రూపో - అట్టి ‘పూర్ణమదః’। పూర్ణమిదమ్ । పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే’ అను భావనతో సర్వత్రా ఆనందైక రసరూపుడై ఉంటాడు. జలబిందువు కొత్తగా జలముగా అవవలసిన పనేముంటుంది?

(18) బ్రహ్మైవాహమస్మి। ‘‘బ్రహ్మము’’ అని వేద - ఉపనిషత్తులచే, తత్త్వజ్ఞులచే ఎలుగెత్తి పిలువబడుచున్నది నాగురించే। నేను అట్టి బ్రహ్మమే అయి ఉన్నాను’’ - అని ఎలుగెత్తి చేతులెత్తి ‘‘ఆత్మగానం’’ చేయువాడై ఉంటాడు.

ఇతి అనవరతమ్
బ్రహ్మప్రణవ - అనుసంధానేన
యః కృతకృత్యో భవతి,
స ‘‘పరమహంసగ్ం పరివ్రాట్।

పైన మనం చెప్పుకుంటున్న ‘18’ సూత్రములను కలిపి ‘‘బ్రహ్మప్రణవ అనుసంధానము’’ అని అంటారు. అట్టి అనుసంధానముచే క్రమంగా కృతకృత్యుడు అయినవాడు - ‘‘పరమహంస పరివ్రాట్’’ అని చెప్పబడుచున్నాడు.

ఓ బ్రహ్మదేవా! ‘‘కః పరివ్రజనాధికారీ? కీదృశం పరివ్రాజక లక్షణం? కః పరమహంసః? పరివ్రాజకత్వం కథమ్?’’ అనే మీ ప్రశ్నకు సమాధానంగా -
- పరివ్రాజకత్వమునకు అర్హుడు ఎవరో,
- పరివ్రాజక లక్షణములు ఏమేమిటో
- పరివ్రాజకత్వము ఏవిధంగా సిద్ధించగలదో

ఆయా విశేషాలు, తత్త్వవేత్తల ప్రవచనముల, వేదాంతర్గతములైనట్టి ఉపనిషత్తుల - సారముగా మనము ఇప్పుడు చెప్పుకున్నాము.

(బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాస-ఇత్యాది)- ఏ ఆశ్రమంలోవారైనా సరే పైన మనము చెప్పుకున్న పరమహంస - పరివ్రాజక లక్షణములను అభ్యాసపూర్వకంగా అనుష్ఠానము చేస్తూ ఉంటే, అట్టివాడు పరమహంస పరివ్రాజకుడు కాగలడు. ఇది నిశ్చయము.

ఇతి పరమహంస పరివ్రాజకోపనిషత్

ఓం శాంతిః శాంతిః శాంతిః

Paramahamsa Parivrȃjaka Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 5
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com