[[@YHRK]] [[@Spiritual]]

Chāndōgya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


సామవేదాంతర్గత

16     ఛాందోగ్యోపనిషత్

విషయ సూచిక :


సామవేదాంతర్గత

Ⅰ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - మొదటి అధ్యాయము

1–1. ప్రథమ ప్రపాఠకః - ప్రథమః ఖండః - ఉద్గీథ విద్య

ఉద్గాత = యజ్ఞ విధియందు ‘సామగానము’ నిర్వర్తించువారు.
ఉద్గాతము = పాడటము - సామగానము చేయటము.
ఉద్గీథము = సామవేదాంగ - గానామృత విభాగ


.. ప్రథమోఽధ్యాయః ..

ఓమిత్యేతదక్షరముద్గీథముపాసీత .
ఓమితి హ్యుద్గాయతి తస్యోపవ్యాఖ్యానం .. 1.1.1..
1. ఓం ఇతి ఏతత్ అక్షరం ఉద్గీథం ఉపాసీత।
ఓం ఇతి హి ఉద్గాయతి।
వేద విభాగములైనట్టి - సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులచే ఏ ‘‘ఏకము, అక్షరము’’ అగు తత్త్వము ‘ఓం ఇతి’ అని ఉద్గాతము (ప్రకటనము) చేయబడుతోందో, ఎలుగెత్తి గానము చేయబడుచున్నదో - అట్టి పరమాత్మతత్త్వ సంజ్ఞాక్షరమును ఉద్గీథము (కర్మల ప్రయత్నముల ద్వారా) చేయుచున్నాము. ఉపాసించు చున్నాము. నమస్కరిస్తున్నాము.
అట్టి ఓంకారమే సమస్త హృదయములలో గానామృతమై వెలుగొందుచున్నది.

తస్య ఉపవ్యాఖ్యానమ్।
అట్టి ‘ఓం’కార అక్షరార్థమగు పరబ్రహ్మము అనిర్వచనీయము, అవాక్‌మానసగోచరము. అయినప్పటికీ - అద్దాని సామీప్యతను (స్వానుభవ అనుక్షణ-అనునిత్యము సిద్ధించటానికై) వ్యాఖ్యానించు కుంటున్నాము.

ఏషాం భూతానాం పృథివీ రసః పృథివ్యా అపో రసః .
అపామోషధయో రస ఓషధీనాం పురుషో రసః
పురుషస్య వాగ్రసో వాచ ఋగ్రస ఋచః సామ రసః
సామ్న ఉద్గీథో రసః .. 1.1.2..
2. ఏషాం భూతానం పృథివీ రసః।
పృథివి రసస్వరూపమై యున్నది.
ఈ భౌతిక జీవులందరు పృథివి (భూమి) యొక్క రసస్వరూపులు. పృథివియొక్క రసమునుండే సమస్త దేహములు రూపుదిద్దుకుంటున్నాయి.
పృథివ్యా ఆపో రసః।
ఈ పృథివి జలముయొక్క రసస్వరూపము. జలముయొక్క సారమే పృథివీ రూపము.
అపాం ఓషధయో రసః।
ఓషధులే జలము రూపము సంతరించుకుంటున్నాయి. ఓషధుల రసరూపము, (లేక) సారరూపము - ‘జలము’.
ఓషధీనాం పురుషో రసః।
ఓషధులు పురుషుని రసరూపము. ఓషధుల రసస్వరూపము (సారరూపము) పురుషుడు.
పురుషస్య వాక్ రసో
వాచ ఋక్ రసః।
పురుషుని యొక్క రస రూపము ‘వాక్కు’. వాక్కు ఋక్ యొక్క రసము।
ఋచః సామ రసః।

అట్టి వచనములు - వాక్కుల సారరూపమే ఋగ్వేదములో గానము చేయబడుచున్న ‘ఋక్కులు’.

సామ్న - ఉద్గీథో రసః।
ఋక్కుల (మంత్రముల) సారము -స్తుతిరూపమగు సామగానములు. ఉద్గీథము (ప్రవచనముల వర్ణనముల) సారమే సామగానములు.

స ఏష రసానాగ్ం రసతమః పరమః పరార్ధ్యోఽష్టమో
యదుద్గీథః .. 1.1.3..
3. స ఏష రసానాగ్ం
రసతమః, పరమః
పరార్థ్యో అష్టమో
యత్ ఉద్గీథః।
అట్టి సామవేద-సామగానముల రస స్వరూపము (సారము-The Essence) - తమము (Superlative), పరమము (The Finest), పరతత్త్వము అగు ఏ ‘‘ఓం’’కారార్థ (కేవల స్వరూప) తత్త్వమే (ఏడు భూమికలకు ఆవల గల) తురీయాతీతము. అట్టి ఆత్మయే ‘ఓం’ అక్షరార్థముగా ప్రవచనము, వ్యాఖ్యానము, గానము చేయదగిన పరబ్రహ్మ తత్త్వము.

కతమా కతమర్క్కతమత్కతమత్సామ కతమః కతమ ఉద్గీథ
ఇతి విమృష్టం భవతి .. 1.1.4..
4. కతమా కతమత్ ఋక్?
కతమత్ కతమత్ సామ?
కతమః కతమ ఉద్గీథ?
ఇతి విమృష్టం భవతి।।
ఏది ఏది ఋక్కుల సారము?
ఏది ఏది సామగానముల సారము?
ఏది ఏది ఉద్గీథము?
అనునది ఇక్కడ విశ్లేషణపూర్వకంగా వివరించుకుంటున్నాము.

వాగేవర్క్ప్రాణః సామోమిత్యేతదక్షరముద్గీథః .
తద్వా ఏతన్మిథునం యద్వాక్చ ప్రాణశ్చర్క్చ సామ చ .. 1.1.5..
5. వాక్ ఏవ ఋక్। ప్రాణః సామ।
‘ఓం’ ఇతి ఏతత్ అక్షరం ఉద్గీథః।
తద్వా ఏతత్ మిథునం - యత్ వాక్ చ,
ప్రాణః చ, ఋక్ చ, సామ చ।।
‘‘వాక్కు’’ (Speaking) ఋక్ స్వరూపము. ప్రాణము-సామగానము (సామము).
అట్టి వాక్-ప్రాణములు అక్షరమగు ‘ఓం’గా వ్యాఖ్యానించబడుతోంది. అట్టి వాక్ - ప్రాణముల పరస్పర ఏకత్వము, ఋక్-సామముల ఏకరస స్వరూపమే ‘‘మిథునము’’ (The Couple Association).

తదేతన్మిథునమోమిత్యేతస్మిన్నక్షరే సగ్ంసృజ్యతే
యదా వై మిథునౌ సమాగచ్ఛత ఆపయతో వై
తావన్యోన్యస్య కామం .. 1.1.6..
6. తత్ ఏతత్ మిథునం ఓం ఇతి
ఏతత్ అస్మిన్ అక్షరే సంసృజ్యతే।।
అట్టి వాక్-ప్రాణముల మిథునము (కలయిక) అక్షరమగు తత్త్వముచే స్వకీయముగా కల్పన చేయబడుతోంది. అక్షరమగు ‘ఓం’కారము నందు వాక్-ప్రాణముల మిథునము (సంయోగము) అగుచున్నది.
యదా వై మిథునౌ సమాగచ్ఛత
ఆపయతో వై తావన్యోన్యస్య కామమ్।।
అది ప్రకృతి-పురుషుల (Me-I am) అన్యోన్యముల వలె పరస్పర ఇచ్ఛలచే పూర్ణము సంతరించుకోవటముగా జరుగుతోంది. అట్టి మిథున స్థానమగు ఏకము, అక్షర ఓంకార తత్త్వమును ఉపాసిస్తున్నాను.

ఆపయితా హ వై కామానాం భవతి య ఏతదేవం
విద్వానక్షరముద్గీథముపాస్తే .. 1.1.7..
7. ఆపయితా హ వై
కామానాం భవతి।
య ఏతత్ ఏవం విద్వాన్ -
అక్షరం ‘‘ఉద్గీథం’’ ఉపాస్తే।
ఎవ్వరైతే అట్టి ఇహ-పరముల, జీవాత్మ-పరమాత్మల, వాక్-ప్రాణముల మిథునమును (పరస్పర ఇచ్ఛాపూర్వక స్వామ్యత్వమును, ఏకత్వమును) అక్షరమును దర్శించుచూ, గమనిస్తూ, ఉపాసిస్తూ ఉంటారో వారే విద్వాంసులు.

అట్టి అక్షర ఉద్గీథము (ఆత్మోపాసన) చేయుచున్నవాడు - కోరుకొన్నది కోరుకొన్నట్లుగా పొందగలడు. సమస్తము తానే అయి ఉన్న ఆత్మయొక్క తత్త్వమును సంతరించుకోగలడు.

తద్వా ఏతదనుజ్ఞాక్షరం యద్ధి కించానుజానాత్యోమిత్యేవ
తదాహైషో ఏవ సమృద్ధిర్యదనుజ్ఞా సమర్ధయితా హ వై
కామానాం భవతి య ఏతదేవం విద్వానక్షరముద్గీథముపాస్తే .. 1.1.8..
8. తత్ వా ఏతత్ ‘‘అనుజ్ఞాక్షరం’’।
యత్ హి కించ అనుజానాతి -
ఓం ఇతి ఏవ తదా హ
ఏషో ఏవ సమృద్ధిః యత్ అనుజ్ఞా।
సర్వ దైవ ఉపాసనలు అనుజ్ఞ స్వీకారరూపంగా ‘ఓం’ అని ప్రారంభమౌతున్నాయి. ‘‘స్వామీ! మిమ్ములను పూజిస్తున్నాను. అనుజ్ఞ ప్రసాదించండి!’’ - అని పలుకుచుండగా అనుజ్ఞ వృద్ధి చెందుచున్నది. అందుకని ‘ఓం’ను సమృద్ధి ప్రవచనంగా స్వీకరించబడుతోంది.
సమర్థయితా హ వై కామానాం భవతి,
య ఏతత్ ఏవం విద్వాన్
అక్షరం ఉద్గీథమ్ ఉపాస్తే।।
ఎవ్వరైతే సర్వ దైవ-పితృ కార్యములందు ‘ఓం’ అను అనుజ్ఞాక్షరము పలికి ఉపాసనకు, యజ్ఞవిధికి సంకల్పించి ఉంటాడో- అట్టివాడు తత్ పరమాత్మను గానం చేస్తూ సమర్థుడు అగుచున్నాడు. అక్షరమగు ‘ఓం’కారమును ఉపాసించిన అట్టివానికి సర్వకామములు నెరవేరగలవు.

తేనేయం త్రయీవిద్యా వర్తతే ఓమిత్యాశ్రావయత్యోమితి
శగ్ంసత్యోమిత్యుద్గాయత్యేతస్యైవాక్షరస్యాపచిత్యై మహిమ్నా
రసేన .. 1.1.9..
9. తేన ఇయం త్రయీ విద్యా వర్తతే।
‘ఓం’ ఇతి ఆశ్రావయతి।
‘ఓం’ ఇతి శగ్ం సత్య -
‘ఓం’ ఇతి ఉద్గాయతి।
ఏతస్య ఏవ అక్షరస్య అపచిత్యై।
మహిమ్నా రసేన।।
‘ఓం’ కారముతో కార్యక్రమములు ప్రారంభించుచుండగా ‘త్రయీవిద్య’ (ధర్మార్థకామముల)యొక్క ప్రతీతి సిద్ధిస్తుంది.

యజ్ఞమును నిర్వర్తింపజేస్తున్న పర్యవేక్షకుడగు అధ్వర్యుడు ‘ఓం’ అని వినిపిస్తూ కార్యక్రమము యొక్క శ్రావ్యమునకు ‘నాంది’ పలుకుచున్నారు.

‘ఓం’ అని కార్యక్రమము యొక్క శుభ ప్రయోజనములకై ‘శం - సత్యం - ఓం’ అని ఎలుగెత్తి గానము చేయుచున్నారు.

అట్టి ఏకము - అక్షరము అగు ఓంకారోచ్చారణ మహిమ వలన సమస్త కర్మలు, కర్మవిభాగములు ప్రవర్తమానము అగుచున్నాయి.

తేనోభౌ కురుతో యశ్చైతదేవం వేద యశ్చ న వేద .
నానా తు విద్యా చావిద్యా చ యదేవ విద్యయా కరోతి
శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతీతి
ఖల్వేతస్యైవాక్షరస్యోపవ్యాఖ్యానం భవతి .. 1.1.10..

.. ఇతి ప్రథమః ఖండః ..
10. తేన ఉభౌ కురుతో యత్ చ తత్ ఏవం వేద,
యత్ చ న వేద।
నానా తు విద్యా చ అవిద్యా చ।।
‘ఓం’ కారము యొక్క ఏకాక్షర తాత్త్వికార్థము తెలిసి కొందరు, అట్టి రహస్యార్థము తెలియకుండానే మరికొందరు కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నారు. పరమాత్మ తత్త్వము తెలిసి - విద్యాపూర్వకంగా, మరికొందరు అవిద్యాపూర్వకంగా (ఓంకారము యొక్క ముఖ్యోద్దేశ్యము తెలియకుండానే) ఓంకార మంత్రమును ఉపాసిస్తున్నారు.
యత్ ఏవ విద్యయా కరోతి, శ్రద్ధయా ఉపనిషదా,
తత్ ఏవ వీర్యవత్తరం భవతి।
ఇతి ఖలు ఏతస్య ఏవ అక్షరస్య
ఉపవ్యాఖ్యానం భవతి।।
‘‘ఓంకారము’’ యొక్క అంతరార్థమగు వ్యక్తావ్యక్త పరమాత్మ యొక్క ముఖ్యార్థమును తెలుసుకొని, అట్టి పరమాత్మతో ‘సామీప్యత’ భావించుకుంటూ కర్మలు నిర్వర్తిస్తారో, అట్టి వారు వీర్యవంతులు అగుచున్నారు. ఉత్తమోత్తమ ప్రయోజనం సిద్ధించుకుంటున్నారు.
ఇతి - ఓంకారము యొక్క ఉపవ్యాఖ్యానము.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమ అధ్యాయే ప్రథమ ఖండః


1–2. ప్రథమ ప్రపాఠకః - ద్వితీయ ఖండః - అధ్యాత్మ ఉద్గీథము

(ఓం ప్రాణేశాయ నమః। అంగీరస ఋషయే నమః। బృహస్పతి ఋషయే నమః।
ఆయాస్యు ఋషయే నమః। బక ఋషయే నమః। ఉద్గాత నమః)


దేవాసురా హ వై యత్ర సంయేతిరే ఉభయే ప్రాజాపత్యాస్తద్ధ
దేవా ఉద్గీథమాజహ్రురనేనైనానభిభవిష్యామ ఇతి .. 1.2.1..
1. దేవ, అసురా హ వై యత్ర సంయేతిర
ఉభయే ప్రాజాపత్యాస్తద్ధ,
దేవా ఉద్గీథమ్ అజహ్రుః।
అనేన ఏనాత్ అభిభవిష్యామ ఇతి।।
ఒకానొకప్పుడు ప్రజాపతి పుత్రులు అయినట్టి దేవతలు, అసురులు తమలో తాము వైరము పెంచుకొని యుద్ధమునకు దిగారు. దేవతలు అసురులపై విజయము పొందటానికై ఉద్గీథోపాసనను ఓంకారోపాసనతో ప్రారంభించారు. ఆత్మశక్తిని ఉపాసించసాగారు.

తే హ నాసిక్యం ప్రాణముద్గీథముపాసాంచక్రిరే
తగ్ం హాసురాః పాప్మనా వివిధుస్తస్మాత్తేనోభయం జిఘ్రతి
సురభి చ దుర్గంధి చ పాప్మనా హ్యేష విద్ధః .. 1.2.2..
2. తే హ ‘‘నాసిక్యం ప్రాణం’’ ఉద్గీథం ఉపాసాంచక్రిరే।
తగ్ం హ అసురాః పాప్మనా వివిధుః।
వారు ఇక్కడ ఆత్మదేవతను ఉపాసించి ప్రాణవాయువు ముక్కు ద్వారా ప్రవేశించు నాసేంద్రియమును అవలంబిస్తూ ఉన్న ఆత్మశక్తిని ఉద్గీథము చేయసాగారు (ఉపాసించసాగారు).
కానీ అసురులు ఆ స్థానమునందు ప్రవేశము పొంది పాప భావములను ప్రవేశింపజేసి వేధించసాగారు.
తస్మాత్ తేన ఉభయం జిఘ్రతి - సురభి
చ దుర్గంధి చ - పాప్మనా హి ఏష విద్ధః
అందుచేతనే ఘ్రాణేంద్రియములలో సుగంధ - దుర్గంధ - మిశ్రమముల యొక్క ఉభయ కర్మల అనుభవము ఏర్పడసాగింది.

‘‘వాసన చూడగలిగినవి - వాసన చూడకూడనివి’’ ఏర్పడి పాపములు ఏర్పడసాగాయి. (ఆత్మను ఏమరచునట్లు చేసేవే పాపములు).
(అందుచేత - దేవతలు అసురులను నిరోధించలేకపోయారు)

అథ హ వాచముద్గీథముపాసాంచక్రిరే తాగ్ం హాసురాః పాప్మనా
వివిధుస్తస్మాత్తయోభయం వదతి సత్యం చానృతం చ
పాప్మనా హ్యేషా విద్ధా .. 1.2.3..
3. అథ హ ‘వాచం’ ఉద్గీథం ఉపాసాంచక్రిరే।
తాగ్ం హ అసురాః పాప్మనా వివిధుః
దేవతలు వాక్కును అవలంబించి ఉద్గీథోపాసన చేయసాగారు। అక్కడికి అసురులు కూడా ప్రవేశించి పాపకర్మలను ప్రవేశింపజేయ సాగారు.
తస్మాత్ తయా ఉభయం
వదతి, సత్యం చ, అనృతం చ
పాప్మనా హి ఏషా విద్ధా।।
అందుకు ఫలితంగా వాక్కులో సత్యము, అనృతము (అసత్యము) ప్రవేశించి పాప వాక్కు కూడా (దుష్ట దూషణ నిషిద్ధ వాక్కు కూడా) ప్రవేశము పొందింది.
(అందుచేత దేవతలు అసురులను ఓడించలేకపోయారు)

అథ హ చక్షురుద్గీథముపాసాంచక్రిరే తద్ధాసురాః
పాప్మనా వివిధుస్తస్మాత్తేనోభయం పశ్యతి దర్శనీయం
చాదర్శనీయం చ పాప్మనా హ్యేతద్విద్ధం .. 1.2.4..
4. అథ హ ‘‘చక్షుః’’ ఉద్గీథం
ఉపాసాంచక్రిరే।
తద్ధ అసురాః పాప్మనా వివిధుః తస్మాత్
తేన ఉభయం పశ్యతి
దర్శనీయం చ, అదర్శనీయం చ
పాప్మనా హి ఏతత్ విద్ధమ్।
దేవతలు చక్షువులను ఉద్గీథము (ఉపాసన / ప్రత్యుత్సాహము) చేసి చూపుశక్తిని ప్రవర్తింపజేయసాగారు. ఇంతలోనే అసురులు ‘‘చూపు’’లో పాపదృష్టిని ప్రవేశింపజేశారు.

అందుచేత కంటిలోంచి బహిర్గతమగుచున్న చూపు - చూడతగిన వాటిపై చూడకూడని వాటిపై కూడా ప్రసరించసాగాయి. ‘‘నిర్దోష-దోష’’ దర్శనములు సృష్టిలో ఏర్పడటం జరుగసాగింది.

ఈ విధంగా ‘‘పుణ్య-పాపములు, మంచి చెడులు’’ - అను ద్వంద్వము ఏర్పడుతోంది. మంచితోబాటే చెడును చూడాలనే ఇష్టము వెంటనుండసాగింది.

దేవతలు చూపుతో పరమాత్మను మాత్రం ఉపాసించుకోలేకపోయారు.

అథ హ శ్రోత్రముద్గీథముపాసాంచక్రిరే తద్ధాసురాః
పాప్మనా వివిధుస్తస్మాత్తేనోభయగ్ం శృణోతి శ్రవణీయం
చాశ్రవణీయం చ పాప్మనా హ్యేతద్విద్ధం .. 1.2.5..
5. అథ హ ‘శ్రోత్రం’ ఉద్గీథమ్
ఉపాసాంచక్రిరే।
తద్ధ అసురాః పాప్మనా వివిధుః।
తస్మాత్ తేన ఉభయగ్ం శృణోతి -
శ్రవణీయం చ, అశ్రవణీయం చ।
పాప్మనా హి ఏతత్ విద్ధమ్।
అప్పుడు దేవతలు ఆత్మోపాసనచే ‘వినికిడి’ని కల్పించి ఉత్తేజితం చేసి ప్రదర్శించసాగారు. అప్పుడు ఆ చోట అసురులు పాపము (దోషపూరితము) అగు గుణమును వినికిడిలో ప్రవేశింపజేశారు.

అప్పుడు ‘‘వినతగినవి - వినకూడనివి’’ ఉభయము ఏర్పడినవయ్యాయి.

ఈ విధంగా వినతగినవి - వినకూడనవి కూడా వినికిడి వెంటనంటి ఉండి, వినికిడిని తాడనము పొందించసాగాయి.

(దేవతలు అసురుల అడ్డంకులను తొలగించలేకపోయారు. పరమాత్మయందు వినికిడి నిలుపలేకపోయారు)

అథ హ మన ఉద్గీథముపాసాంచక్రిరే తద్ధాసురాః
పాప్మనా వివిధుస్తస్మాత్తేనోభయగ్ం సంకల్పతే సంకల్పనీయంచ
చాసంకల్పనీయం చ పాప్మనా హ్యేతద్విద్ధం .. 1.2.6..
6. అథ హ ‘‘మన’’ ఉద్గీథం
ఉపాసాంచక్రిరే।
తద్ధ అసురాః పాప్మనా వివిధుః।
తస్మాత్ తేన ఉభయం సంకల్పయతే,
‘‘సంకల్పనీయం’’ చ, ‘‘అసంకల్పనీయం’’ చ।
పాప్మనా హి ఏతత్ విద్ధమ్।
అప్పుడు దేవతలచే ‘మనస్సు’ అనబడేది ఉపాసించబడగా, సంకల్పముల - ఆలోచనల రూపమగు ‘మనస్సు’ - ప్రవర్తించసాగింది. ఇంతలో అసురులు ఆలోచనలలో పాపము (దోషమును) తెచ్చి ప్రకాశింపజేసారు.

అప్పుడు ‘సంకల్పన’ అనునది ‘సంకల్పించతగినవి - సంకల్పించకూడనివి’ ఉభయము ప్రవర్తించసాగింది.

ఈ విధంగా మంచి చెడుల ద్వంద్వము ప్రవర్తించసాగింది.

ఈ విధంగా ద్వంద్వములు దేవతల కార్యక్రమములను వశం చేసుకొని, దివ్యతత్త్వములను చాటు చేయసాగాయి.

అథ హ య ఏవాయం ముఖ్యః ప్రాణస్తముద్గీథముపాసాంచక్రిరే
తగ్ంహాసురా ఋత్వా విదధ్వంసుర్యథాశ్మానమాఖణమృత్వా
విధ్వగ్ంసేతైవం .. 1.2.7..
7. అథ హ య ఏవ అయం ‘‘ముఖ్యః ప్రాణః’’
తమ్ ఉద్గీథం ఉపాసాంచక్రిరే।
తగ్ం హ అసురా ఋత్వా విదధ్వంసుః।
యథా అశ్మానం ఆఖణమ్ ఋత్వా విధ్వగ్ంసేత।
అప్పుడు దేవతల ఆత్మోపాసన యజ్ఞోపాసనలనుండి ‘‘ముఖ్యప్రాణము’’ అను ప్రాణశక్తి సముత్పన్నము అవసాగింది.

అప్పుడు ఆ ముఖ్యప్రాణములోనికి అసురులు పాపము (దోషమును) ప్రవేశింపజేయాలని తలచారు. ప్రయత్నించారు. కానీ వారికి అది ఏమాత్రము సాధ్యము కాలేదు.

అప్పుడు అసురులు దేవతలను ఓడించలేక - ఒక మట్టి బెడ్డను బండరాయితో కొట్టినప్పుడు - ఆ మట్టిబెడ్డ వలె తామే చెల్లాచెదరు అయిపోయారు - విధ్వంసము పొందారు.

యథాశ్మానమాఖణమృత్వా విధ్వగ్ంసత ఏవగ్ం హైవ
స విధ్వగ్ంసతే య ఏవంవిది పాపం కామయతే
యశ్చైనమభిదాసతి స ఏషోఽశ్మాఖణః .. 1.2.8..
8. ఏవం యథా అశ్మానం ఆఖణం ఋత్వా విధ్వగ్ంసత,
ఏవగ్ం హ ఏవ స విధ్వగ్ంసతే।
య ఏవం విది, పాపం కామయతే,
యః చ ఏనం అభిదాసతి, స ఏషో అశ్మా ఆఖణః।
ఏవిధంగా అయితే పాఱతో కొట్టబడిన మట్టిగడ్డ ముక్కలు అయిపోతుందో, ఆ విధంగా ముఖ్యప్రాణముయొక్క ఉపాసనచే పాపములు, దూషణములు అనే అసుర స్వభావములు, దుష్ట సంకల్పములు ఆతనిని తాకలేవు. అవి ముక్కలు ముక్కలుగా అయిపోయి నశించగలవు.

గొడ్డలికి బండరాయి పగలని విధంగా ధూషణము మొదలైన సాంసారిక సందర్భములలో ఆతడు పగలని రాయి వలె ఉండగలడు.
(అశ్మానం = రాయి; ఆఖణం = పాఱ, గొడ్డలి)

నైవైతేన సురభి న దుర్గంధి విజానాత్యపహతపాప్మా హ్యేష
తేన యదశ్నాతి యత్పిబతి తేనేతరాన్ప్రాణానవతి ఏతము
ఏవాంతతోఽవిత్త్వోత్క్రమతి వ్యాదదాత్యేవాంతత ఇతి .. 1.2.9..
9. నైవైతేన (న ఏవ ఏతేన) సురభి,
న దుర్గంధి విజానాతి
అపహత పాప్మా హి ఏషః।
తేన యత్ అశ్నాతి యత్ పిబతి,
తేన ఇతరాన్ ప్రాణాన్ అవతి।
ఏతము ఏవ అంతతో అవిత్త్వా ఉత్క్రామతి
వ్యాదదాతి ఏవ అంతత ఇతి।
ప్రాణోపాసన :

ఎవడు తినటము, త్రాగటము మొదలైన వాటితో ముఖ్యప్రాణమును సేవించు భావనతో నిర్వర్తిస్తాడో - అట్టివాడు సువాసన - దుర్వాసనలకు పరిమితుడు కాడు. తినకూడనివి, త్రాగకూడనివి అగు పాపములను (దోషములను) జయించివేస్తాడు. తినటము, త్రాగటము, వినటము మొదలైన వాటిచే బంధించబడడు.

‘ప్రాణ-అపాన’ సంయమ అభ్యాసముచే ముఖ్యప్రాణస్వరూపుడై - పాపరూపులగు అసురులను జయిస్తాడు. ముఖ్యప్రాణస్వరూపముచే దేహములలో ప్రాణముయొక్క ప్రవేశము-నిష్క్రమణములను తన స్వాధీనమునందు కలిగియుండి, క్రమంగా ఆవల గల ఆత్మతత్త్వమును అవధరించగలడు.

ముఖ్యప్రాణోపాసనను ఇంద్రియముల ద్వారా అర్చించుచున్న భావన కలవాడు, జన్మ-కర్మల పట్ల పారతంత్ర్యము జయించి స్వాతంత్ర్యుడు (Independent) కాగలడు.

తగ్ం హాంగిరా ఉద్గీథముపాసాంచక్ర ఏతము ఏవాంగిరసం
మన్యంతేఽఙ్గానాం యద్రసః .. 1.2.10..
10. తగ్ం హ అంగిరా ఉద్గీథమ్
ఉపాసాంచక్ర ఏతము
ఏవ అంగిరసం మన్యంతే,
అంగానాం యత్ రసః।
‘‘ఈ విధంగా ఇంద్రియములను ప్రాణదేవతా - ఉపాసనగా భావించి వర్తించి, ఆత్మతత్త్వమును సిద్ధించుకోవటము’’ అను ఆత్మతో సంయోగాభ్యాసమును అంగిరస మహముని లోకములకు బోధించియున్నారు.

అందుచేత ఈ ఉద్గీథము (ఉపాసన) - ‘అంగిరసము’ అని చెప్పబడుతోంది.

అంగములను రసస్వరూపముగా తీర్చిదిద్ది రసస్వరూపమగు ప్రాణదేవతను ఉపాసించటము కాబట్టి ‘అంగిరసము’. ప్రాణములు దేహ అంగములకు సర్వస్వము కాబట్టి ‘అంగిరసము’.

తేన తగ్ం హ బృహస్పతిరుద్గీథముపాసాంచక్ర ఏతము ఏవ బృహస్పతిం
మన్యంతే వాగ్ఘి బృహతీ తస్యా ఏష పతిః .. 1.2.11 ..
11. తేన తగ్ం హ బృహస్పతిః
ఉద్గీథం ఉపాసాంచక్ర ఏతము ఏవ
బృహస్పతిమ్ మన్యంతే
వాగ్ఘి బృహతీ తస్యా ఏష పతిః।।
‘‘ఈ విధంగా బృహస్పతి ప్రాణదేవతను సేవించుటయందు ఇంద్రియములను నియమించు భావన’’ - అను ఉద్గీథము (సేవ)ను ఉపాసించారు. (ఇంద్రియ) దేవతలకు గురుస్థానము అలంకరించారు.

ప్రాణమునకు ‘బృహస్పతి’ అని సార్థక నామము.

విస్తారము - పెద్దది (బృహత్) అగు వాక్కుకు ప్రాణదేవతయే పతి కాబట్టి ప్రాణము (ఇంద్రియ దేవతలకు పతి అయి) - ‘బృహస్పతి’గా అభివర్ణించబడుతోంది.

తేన తగ్ం హాయాస్య ఉద్గీథముపాసాంచక్ర ఏతము ఏవాయాస్యం
మన్యంత ఆస్యాద్యదయతే .. 1.2.12..
12. తేన తగ్ం హ ఆయాస్య
ఉద్గీథం ఉపాసాంచక్ర
ఏతము ఏవ ఆయాస్యం
మన్యంత-ఆస్యాద్యదయతే।
అట్టి ఇంద్రియములచే ప్రాణోపాసనను ఆయాస్యఋషి ఉద్గీథము చేస్తూ ఉపాసించారు.

ప్రాణము ఆయాస్యము (నోరు) నుండి రాకపోకలు చేస్తూ ఉండటంచేత ప్రాణము ‘ఆయాస్యము (రాక-పోకలు-గలది)’గా చెప్పబడి ఉపాసించబడుతోంది. అద్దాని ఋషి ఆయాస్యుడు.

తేన తగ్ంహ బకో దాల్భ్యో విదాంచకార .
స హ నైమిశీయానాముద్గాతా బభూవ స హ స్మైభ్యః
కామానాగాయతి .. 1.2.13..
13. తేన తగ్ం హ బకో
దాల్భ్యో విదాంచకార।
స హ నైమిశీయానామ్ ఉద్గాతా బభూవ।
స హ స్మైభ్యః కామాన్ ఆగాయతి।।
దాల్భ్యుని కుమారుడు బకఋషి కూడా స్వానుభవంగా ‘‘ఇంద్రియములతో ప్రాణోపాసన’’ - అను ఉద్గాథమును తెలుసుకొని ఉపాసించారు.

ఆయన నైమిశారణ్యంలో తపస్సు చేయు మునులకు, ఋషులకు ఉద్గాత (Trainer) అయినారు.

‘‘మీరు కోరుకొన్నది లభించగలదు’’ అను ఫలశృతిని ప్రాణ ఉద్గీథోపాసన గురించి ప్రవచించారు.

ఆగాతా హ వై కామానాం భవతి య ఏతదేవం
విద్వానక్షరముద్గీథముపాస్త ఇత్యధ్యాత్మం .. 1.2.14..
14. ఆగాతా హ వై కామానాం భవతి।
య ఏతత్ ఏవం
విద్వాన్ అక్షరం ఉద్గీథం
ఉపాస్త ఇతి అధ్యాత్మమ్।

.. ఇతి ద్వితీయః ఖండః ..
ఎవ్వరైతే ప్రాణోపాసనను అక్షర (ఓంకార) ఆత్మోపాసనముగా ఉద్గీథోపాసన నిర్వర్తిస్తారో - వారు కోరుకున్నవి లభించగలవు.

ఇతి అధ్యాత్మమ్। ఇంద్రియములను ప్రాణదేవతా సమర్పణగా ఉపాసించటమే అధ్యాత్మజ్ఞానము అయి ఉన్నది.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే ద్వితీయః ఖండః


1–3. ప్రథమ ప్రపాఠకః - తృతీయః ఖండః - ఉద్గీథము యొక్క అధిదైవిక రూప ఉపాసన

(ఉద్గీథము = గానము)


అథాధిదైవతం య ఏవాసౌ తపతి
తముద్గీథముపాసీతోద్యన్వా ఏష ప్రజాభ్య ఉద్గాయతి .
ఉద్యగ్ంస్తమో భయమపహంత్యపహంతా హ వై భయస్య
తమసో భవతి య ఏవం వేద .. 1.3.1..
1. అథ అధిదైవతం।
య ఏవ అసౌ తపతి
తమ్ ఉద్గీథం ఉపాసీత।
ఉద్యన్వా ఏష ప్రజాభ్య ఉద్గాయతి।
ఇక ఇప్పుడు ఉద్గీథము (అక్షరగానము) యొక్క ‘‘అధిదైవికమైన రూపమును ఉపాసించటము’’ గురించి చెప్పుకుంటున్నాము.

ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యుని సామగానరూపంగా ఉపాసించటము అధిదైవికోపాసన.

అట్టి సూర్యుడు ‘‘ఉదయించటము’’ అనే ఉద్యమముచే జనులందరిని ఉద్గానముగా చేస్తున్నారు.
ఉద్యగ్ంస్తమో భయం
అపహంతి, అపహన్తా హ వై భయస్య
తమసో భవతి, య ఏవం వేద।
సూర్యుడు సమస్త జీవులకు చీకటి భయమునుండి విముక్తి ప్రసాదిస్తున్నారు. ‘భయము’ అనే చీకటి తొలగటానికై అట్టి సూర్యభగవానుని ఉద్గీథోపాసన చేయుదురు గాక। సూర్యుని స్వయం ప్రకాశ తత్త్వమును ఎరిగినవారు, ఉపాసించువారు అజ్ఞాన చీకటినుండి బయటపడి ఆత్మసూర్యుని యందు ప్రవేశించగలరు.
(భాస్కరాయ విద్మహే, మహద్యుతికరాయ ధీమహి। తన్నో ఆదిత్య ప్రచోదయాత్।)

సమాన ఉ ఏవాయం చాసౌ చోష్ణోఽయముష్ణోఽసౌ
స్వర ఇతీమమాచక్షతే స్వర ఇతి ప్రత్యాస్వర ఇత్యముం
తస్మాద్వా ఏతమిమమముం చోద్గీథముపాసీత .. 1.3.2..
2. సమాన ఉ ఏవ అయం చ
అసౌ చ ఉష్ణో
అయం ఉష్ణో అసౌ।

‘స్వర’ ఇతి ఇమం ఆచక్షతే
స్వర ఇతి ‘‘ప్రత్యాస్వర’’
ఇతి। అముం తస్మాత్ వా
ఏతం ఇమం, అముం చ,
ఉద్గీథమ్ ఉపాసీత।
ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ, ఉష్ణమును ప్రసాదిస్తూ ఉన్నట్లే, దేహములో ప్రాణము సూర్యునివలె ప్రకాశిస్తూ ఉష్ణమును ప్రసాదిస్తోంది. (ఈవిధంగా) సాదృశంగా సమాన రూపములే। గుణము దృష్ట్యా ఒక్కటే. ఉభయము ఉష్ణమే!

ప్రాణమునకు ‘స్వర’ అని మరొక పేరు.

సూర్యునికి - ‘‘స్వర ప్రత్యాస్వర’’ అని పేరు.

అందుచేత దేహములో ప్రాణభగవానుని, ఆకాశంలో సూర్యభగవానుని ఇరువురియొక్క ‘సామ్య - తేజో’ రూపములను సామగానాలతో స్తుతిస్తూ ఉపాసించెదము గాక।

అథ ఖలు వ్యానమేవోద్గీథముపాసీత యద్వై ప్రాణితి
స ప్రాణో యదపానితి సోఽపానః .
అథ యః ప్రాణాపానయోః సంధిః స వ్యానో
యో వ్యానః సా వాక్ .
తస్మాదప్రాణన్ననపానన్వాచమభివ్యాహరతి .. 1.3.3..
3. అథ ఖలు ‘వ్యానమ్’
ఏవ ఉద్గీథం ఉపాసీత।
యత్ వై ప్రాణ ఇతి, స ‘‘ప్రాణో’’।
యత్ అపాన ఇతి సః అపానః।
అథ యః ప్రాణ - అపానయోః
సంధిః, సః ‘‘వ్యానః’’
యో వ్యానః, సా ‘వాక్’।
తస్మాత్ అప్రాణన్ అనపానన్
వాచమ్ అభివ్యాహరతి।।
ఇప్పుడిక ‘‘వ్యానము’’ రూపమును ఉద్గీథోపాసన (గానోపాసన-praying by singing) చేసెదము గాక।

లోనికి వాయువును తెచ్చుచున్న ‘శక్తి’యే - ‘ప్రాణము’.

లోనుండి బయటకు వెళ్లుటకు వాయువును కదలించు శక్తి - ‘అపానము’.

ప్రాణ - అపానముల సంధిలో స్థానము పొందియుండు వాయుశక్తి ‘వ్యానము’.

ఏది వ్యానమో అదియే ‘వాక్కు’ రూపముగా అగుచున్నది. మనము మాట్లాడుచూ ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస - ప్రశ్వాస ప్రక్రియలను ఆపితేనే మాట్లాడగలుగుతాము. అందుచేత వ్యానమే (ప్రాణ అపానముల సంధియే) ‘వాచము’ రూపమగుచూ, మాటలు వెలువడుచున్నాయి - అని చెప్పబడుతోంది.

యా వాక్సర్క్తస్మాదప్రాణన్ననపానన్నృచమభివ్యాహరతి
యర్క్తత్సామ తస్మాదప్రాణన్ననపానన్సామ గాయతి
యత్సామ స ఉద్గీథస్తస్మాదప్రాణన్ననపానన్నుద్గాయతి .. 1.3.4..
4. యా వాక్ స ఋక్।
తస్మాత్ అప్రాణన్, న అనపానన్
ఋచం అభివ్యాహరతి। య ఋక్ తత్ సామ।
- ఏది వాక్కుయో, అదియే ఋక్కు (స్తోత్ర మంత్రము)
- ఋక్కులు పలుకుచున్నవాడు ప్రాణ - అపానముల కదలని స్థితికి తెచ్చి మాత్రమే - పలుకగలుగుచున్నాడు.
ఏది ఋక్‌యో అదియే సామము (గానము, ఉద్గీథము).
తస్మాత్ - అప్రాణన్ న అపానన్
న సామ గాయతి। యత్ సామ,
స ఉద్గీథః తస్మాత్ అప్రాణన్,
న అనపానన్ ఉద్గాయతి।
అనగా ‘ప్రాణ - అపానము’లను చలన రహితము చేసినప్పుడే సామగానము సిద్ధిస్తోంది.

ఏది సామమో అదియే (ఓంకారాక్షరోపాసన రూపమగు) ఉద్గీథము.

అందుచేత ఉద్గీథము (సామగానము) ప్రాణ - అపానములు కదలిక త్యజించినప్పుడే జరుగుచున్నది. ఆ రెండిటి నిశ్చలమగు మధ్యస్థానమే ఉద్గానము (లేక) పైకి గానము చేయటము.

అతో యాన్యన్యాని వీర్యవంతి కర్మాణి యథాగ్నేర్మంథనమాజేః
సరణం దృఢస్య ధనుష ఆయమనమప్రాణన్ననపానగ్ంస్తాని
కరోత్యేతస్య హేతోర్వ్యానమేవోద్గీథముపాసీత .. 1.3.5..
5. అతో యాని అన్యాని వీర్యవన్తి కర్మాణి
యథా అగ్నేః మంథనమ్ ఆజేః
సరణం దృఢస్య ధనుష ఆయమనం
‘‘అప్రాణన్ న అనపానగ్ంస్తాని కరోతి।
సామగానము చేస్తున్నప్పుడే కాకుండా, తదితరమైన ఆయా అనేక పనులు దేహముతో చేస్తూ ఉన్నప్పుడు ప్రాణ-అపానములు రహితం అయినప్పుడే (సమస్థితికి వచ్చినప్పుడే) నిర్వర్తించబడుచున్నాయి.

ఉదాహరణకు చెక్కలను రాపిడి చేసి మంధనము చేయటము, దూరంగా ఉన్న ఒక చోటికి వెళ్ళాలనే లక్ష్యంగా పరుగులు తీయటము, గట్టిగా ధనస్సును లాగి బాణము ఎక్కుబెట్టటము -ఈ ఈ మొదలైన కర్మలన్నిటిలో ప్రాణ-అపానములు నిర్వ్యాపారము (Non Functional) అయి ఉంటాయి.
ఏతస్య హి ఏతోః వ్యానం ఏవ
ఉద్గీథం ఉపాసీత।
అందుచేత ప్రాణ - అపానములు కదలిక చేయనట్టి ‘వ్యానప్రాణము’ను ఉద్గీథోపాసన చేయుచుండెదరు గాక।

అథ ఖలూద్గీథాక్షరాణ్యుపాసీతోద్గీథ ఇతి
ప్రాణ ఏవోత్ప్రాణేన హ్యుత్తిష్ఠతి వాగ్గీర్వాచో హ
గిర ఇత్యాచక్షతేఽన్నం థమన్నే హీదగ్ంసర్వగ్ంస్థితం .. 1.3.6..
6. అథ ఖలు ఉద్గీథ
‘‘అక్షరాణి’’ ఉపాసీత।
ఇక - మనము ‘‘ఉద్గీథ’’ యొక్క అక్షరములను (వర్ణములను, ‘‘ఉత్-గీ-థ’’లను) విశ్లేషించెదము గాక! - (నామ అక్షరాణి ఇత్యర్థః। - ఉద్గీథలోని అక్షరములు - విచారణ చేస్తున్నాము).
ఉద్గీథ ఇతి ప్రాణ ఏవ ఉత్ (కిం తు)
ప్రాణేన హి ఉత్తిష్ఠతి।
వాక్ ‘గీ’ః।
వాచో హ ‘గిర’ ఇతి - ఆచక్షతే।
అన్నం ‘థమ్’।
అన్నే హి ఇదగ్ం సర్వగ్ం స్థితమ్।
‘‘ఉద్గీథ’’ పదములో (‘‘ఉత్-గీ-థ’’లలో) ‘‘ఉత్’’ అనగా ‘‘ప్రాణము’’, ఎందుకంటే ప్రాణశక్తిచేతనే ఒకడు లేచి నిలబడగలుగుతాడు.
వాక్కును ‘‘గీ’’। వాక్కును ‘గిర’ అని కూడా పిలుస్తారు.

‘‘అన్నము’’ - ‘థమ్’’
థమ్ = అంతటా స్థితి కలిగియున్నది.

సర్వము అన్నమునుండే ప్రతిష్ఠితమై ఉండటముచేత అన్నమునకు ‘థమ్’ అని (ఉద్గీథను) అర్థము చెప్పుచున్నారు.


ద్యౌరేవోదంతరిక్షం గీః పృథివీ థమాదిత్య
ఏవోద్వాయుర్గీరగ్నిస్థగ్ం సామవేద ఏవోద్యజుర్వేదో
గీరృగ్వేదస్థం దుగ్ధేఽస్మై వాగ్దోహం యో వాచో
దోహోఽన్నవానన్నాదో భవతి య ఏతాన్యేవం
విద్వానుద్గీథాక్షరాణ్యుపాస్త ఉద్గీథ ఇతి .. 1.3.7..
7. ద్యౌః ఏవ ‘ఉత్’।
అన్తరిక్షం ‘గీః। పృథివీ ‘థమ్’।
ఆదిత్య ఏవ ఉత్।
వాయుః ‘గీః।
అగ్నిః ‘థగ్ం’।
‘‘ఉత్-గీ-థమ్’’

ద్యౌః = (ద్యులోకము, స్వర్గలోకము) - ‘‘ఉత్’’। పైన ఉండటంవలన ఉత్ - ద్యౌః)

అంతరిక్షము = గీః। లోకములు తనయందు ఇముడ్చుకోవటంచేత అంతరిక్షమే గిరణము - ‘‘గీః’’।

పృథివి = థమ్। ప్రాణులకు స్థానము అగుచుండటంచేత పృథివియే అన్నము - థమ్

ఆదిత్యుడు = ‘ఉత్’। సూర్యుడు ఆకాశంలో పైన ఉండటంచేత ఆదిత్యుడే ఉత్

వాయువు = గీః। అగ్ని మొదలైన దేవతలను తనయందు ఇముడ్చుకోవటంచేత వాయువుయే ‘గీః’

అగ్ని = థమ్। యజ్ఞములో సమస్త కర్మలకు అధిష్ఠానం అవటంచే అగ్నియే ‘థమ్’।
సామవేద ఏవ ‘ఉత్’।
యజుర్వేదః ‘గీః’।
ఋగ్వేదః థమ్।
దుగ్ధే అస్మై వాక్ దోహం,
యో వాచో దోహో,
అన్నవాన్ అన్నాదో భవతి।
య ఏతాని ఏవం
విద్వాన్ ఉద్గీథ అక్షరాణి
ఉపాస్త ఉద్గీథ ఇతి।
సామవేదము - స్వర్గలోకముతో సమానంగా ‘ఉత్’। సామము చెప్పుబడుతోంది కాబట్టి ‘ఉత్’

యజుర్వేదము - ‘స్వాహా’ అను మంత్రముతో హవిస్సును దేవతలు స్వీకరిస్తున్నారు కాబట్టి ‘గీ’

ఋగ్వేదము - సామ ఋక్కునందు అధిష్ఠించి ఉండటంచేత ‘‘థమ్’’

ఎవ్వరైతే ‘‘ఉద్గీథము’’ను పైన మనం చెప్పుకున్న తీరులుగా ఉపాసిస్తాడో, అట్టివాని వాక్కు పాలవలె మాధుర్యము సంతరించుకోగలదు. అట్టివాడు అన్నవంతుడు, అన్నాదుడు (కలిగినవాడు, ఇచ్చువాడు) కాగలడు.

ఉద్గీథాక్షరములు ఈ విధంగా ఉపాసించువాడు ‘‘ఉత్తమ అనుభవి’’ అగుచున్నాడు.
(The Finest will have its admission into his zone of experience)

అథ ఖల్వాశీఃసమృద్ధిరుపసరణానీత్యుపాసీత
యేన సామ్నా స్తోష్యన్స్యాత్తత్సామోపధావేత్ .. 1.3.8..
8. అథ ఖలు ఆశీః సమృద్ధిః।
ఉపసరణాని ఇతి ఉపాసీత।

యేన సామ్నా స్తోష్యన్ స్యాత్
తత్ సామ ఉపధావేత్।

ఉద్గీథము - కామసిద్ధి

ఇప్పుడు మనము - తాను అనుకున్నవి జరగటానికి, కోరికలు ఈడేరటానికి, సమృద్ధి పొందటానికి - ఎట్లా ఉద్గీథోపాసన చేయాలో చెప్పుకుందాము.

సామము (వాక్కు సంగీతము)తో ఏ దేవతను ఉపాసిస్తూ ఉన్నారో, ఆ దేవతా సామమును - ఉత్పత్తి, ఛందస్సు మొదలైన విశేషములతో భావన చేయాలి. మననము చేయాలి.

యస్యామృచి తామృచం యదార్షేయం తమృషిం యాం
దేవతామభిష్టోష్యన్స్యాత్తాం దేవతాముపధావేత్ .. 1.3.9..
9. యస్యాం ఋచి తామ్ ఋచం।
యత్ ఆర్షేయం తం ఋషిం।
యాం దేవతాం అభిష్టోష్యన్ స్యాత్
తాం దేవతాం ఉపధావేత్।
ఆ సామము ఏ ఋక్కు (గానము వాక్కునందు) అధిష్ఠితమైయున్నదో ఆ ఋక్కును కూడా (ఆ శబ్దార్థము కూడా) - అద్దాని దేవత, ఛందస్సు మొదలైన వాటితో చేర్చి భావన చేయాలి.

ఏ ఆర్షమునందు ఉన్నదో - ఆ ఋషిని (ఉద్గాతను) స్తుతించుచూ, ఆ దేవతను కూడా భావన చేయుదురు గాక।

యేన చ్ఛందసా స్తోష్యన్స్యాత్తచ్ఛంద ఉపధావేద్యేన
స్తోమేన స్తోష్యమాణః స్యాత్తగ్ంస్తోమముపధావేత్ .. 1.3.10..
10. యేనత్ ఛందసా స్తోష్యన్ స్యాత్,
తత్ ‘ఛన్ద’ ఉపథావేత్।
ఏన స్తోమేన స్తోష్యమాణః స్యాత్
తగ్ం స్తోమం ఉపధావేత్।।
ఏ మంత్రమును ఏ ఛందస్సుతో స్తుతించబోవుచున్నారో - ఆ ఛందస్సును స్తుతిస్తూ (మననము చేస్తూ) ఉద్గీథ గానము చేయాలి.

ఏ స్తోమను (సామయందలి ఆ దేవతను స్తుతించే సంఖ్యా విశేషమును) స్తుతిస్తున్నారో - ఆ వేద - ఉపాంగ - సంఖ్యా విశేషములను కూడా భావన చేయాలి. ఆ దేవతను (స్తోమను) భావన చేస్తూ ఉద్గీథము నిర్వర్తించెదరు గాక।

యాం దిశమభిష్టోష్యన్స్యాత్తాం దిశముపధావేత్ .. 1.3.11..
11. యాం దిశం అభిష్టోష్యన్ స్యాత్
తాం దిశం ఉపధావేత్।
ఉద్గాత (యజ్ఞవిధిలో సామగానముతో పరమాత్మను స్తుతించుచున్న వాడు) ఏ దిక్కుగా స్తుతిస్తున్నాడో (ఉద్గీథము చేయుచున్నాడో) ఆ ‘దిక్కు’ను కూడా ధ్యానించెదరు గాక। ఆ దిక్కుగా ఆత్మను మననము చేసెదరు గాక।

ఆత్మానమంతత ఉపసృత్య స్తువీత కామం
ధ్యాయన్నప్రమత్తోఽభ్యాశో హ యదస్మై స కామః సమృధ్యేత
యత్కామః స్తువీతేతి యత్కామః స్తువీతేతి .. 1.3.12..

.. ఇతి తృతీయః ఖండః ..
12. ఆత్మానం అన్తత
ఉపసృత్య స్తువీత। కామం ధ్యాయన్।
న ప్రమత్తో అభ్యాశో హ యదస్మై
స కామః సమృధ్యేత
యత్ కామః స్తువీత ఇతి,
యత్కామః స్తువీత ఇతి।।
ఆ తరువాత స్వకీయమగు జీవాత్మత్వమునకు ఆవలగల పరమాత్మ (లేక) కేవలాత్మతత్త్వమును సమీపించి సర్వలోక సంబంధమైన కోరికలను త్యజించినవాడై ధ్యానము చేయును గాక।

అప్రమత్తుడై (Non-Lazy, Non-drowsy) అయి అట్టి ఉపాసన నిర్వర్తించు గాక।

అట్టివాడు సకాముడైతే, ఆతడు ఏ సమృద్ధి కోరుకొని ధ్యానిస్తాడో - అట్టి కోరుకొన్నవన్నీ లభించగలవు. కోరుకొన్నవి కోరుకొన్న రీతిగా త్వరితముగా పొందబడగలవు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే తృతీయః ఖండః


1–4. ప్రథమ ప్రపాఠకః - చతుర్థః ఖండః - ఓంకార ఉద్గీథము


ఓమిత్యేతదక్షరముద్గీథముపాసీతోమితి హ్యుద్గాయతి
తస్యోపవ్యాఖ్యానం .. 1.4.1..
1. ‘ఓం’ ఇతి ఏతత్
అక్షరం ఉద్గీథం ఉపాసీత।
‘ఓం’ ఇతి హి
ఉద్గాయతి, తస్య ఉపవ్యాఖ్యానమ్।
‘ఓం’ యొక్క పరాకాష్ఠార్థమైనట్టి అక్షరము (బ్రహ్మము) యొక్క గానమును ఉపాసించెదము గాక.

అట్టి ‘ఓం’ అని ఏది గానము చేయబడుచున్నదో - అద్దాని గురించి ఉపాఖ్యానము (వ్యాఖ్యానము) చేసుకొంటున్నాము.

దేవా వై మృత్యోర్బిభ్యతస్త్రయీం విద్యాం ప్రావిశగ్ంస్తే
ఛందోభిరచ్ఛాదయన్యదేభిరచ్ఛాదయగ్ంస్తచ్ఛందసాం
ఛందస్త్వం .. 1.4.2..
2. దేవా వై మృత్యోః బిభ్యతః।

త్రయీం విద్యాం ప్రావిశగ్ంస్తే
ఛందోభిః అచ్ఛాదయన్ యత్
ఏభిః అచ్ఛాదయగ్ం
తత్ ఛందసాం ఛందస్త్వమ్।।
ఒక సందర్భములో దేవతలు మృత్యువు గురించిన భయమును పొందసాగారు.

త్రయీ విద్యలయినట్టి వేదములలో చెప్పబడిన ధర్మ - అర్థ - కామముల గురించిన మంత్రములను ఆశ్రయించారు. వేద ఛందస్సులచే (ఆయా త్రైవిద్యా కార్యక్రమములచే) ఆచ్ఛాదనము (En-covered, en-compassed) పొందారు. వేదమంత్రములలో సూచించబడిన కర్మల విభాగమును బాగుగా అనుష్ఠించసాగారు.

వేదములలో ధర్మార్థకామ విభాగములు ఆశ్రయించారేగాని, వేద హృదయమగు పరమాత్మతత్త్వము ఏమిటో వారు అప్పుడు దృష్టిలో పెట్టుకోలేదు.

తాను తత్ర మృత్యుర్యథా మత్స్యముదకే పరిపశ్యేదేవం
పర్యపశ్యదృచి సామ్ని యజుషి .
తే ను విదిత్వోర్ధ్వా ఋచః సామ్నో యజుషః స్వరమేవ
ప్రావిశన్ .. 1.4.3..
3. తాను తత్ర మృత్యుః
యథా మత్స్యమ్ ఉదకే
పరిపశ్యేత్ - ఏవం పరి అపశ్యత్।
ఋచి సామ్ని యజుషి, తే ను
విదిత్వ ఊర్ధ్వా ఋచః
సామ్నో యజుషః ‘స్వరం’ ఏవ ప్రావిశన్।
సకల సంహారరూపిణియగు మృత్యుదేవత దేవతల కొరకై వెతుకసాగింది. వారు వేదోపాసనలలోని ధర్మార్థకామముల చాటుగా కనిపించనే కనిపించారు.

నిర్మలమైన నీటిలో చేపలు కనబడుతూ ఉంటాయి చూచారా! నిర్మల జలంలోని చేపలను చూచు విధంగా తమను మృత్యుదేవత చూస్తూ ఉన్నదని, త్రైవిద్యోపాసనచే మృత్యువు తమచే జయింపబడలేదని ఆ దేవతలు గమనించారు.

త్రైవిద్యా మంత్రములు (ఋక్=శాస్త్రీయ స్తుతి మంత్రములు, యజుః = యజ్ఞ - యాగ ప్రాధాన్యములగు యజుర్వేద మంత్రములు, స్తుతి ప్రాధాన్యములగు సామవేద మంత్రములు) తమను మృత్యు పరిధులనుండి బయటకు తేలేవని గమనించారు.

అప్పుడు ఋక్-యజుః-సామవేదములలోని ‘స్వరము’ రూపము, ఏకాక్షరము అగు ‘ఓం’కారార్థమును అధ్యయనము చేయసాగారు. ఉపాసించసాగారు. ‘ఓం’ కారమును సమస్త విధానములలో మొదట - చివరగా ఏర్పరచుకొని త్రైవిద్యను ఉపాసించసాగారు.

యదా వా ఋచమాప్నోత్యోమిత్యేవాతిస్వరత్యేవగ్ంసామైవం
యజురేష ఉ స్వరో యదేతదక్షరమేతదమృతమభయం తత్ప్రవిశ్య
దేవా అమృతా అభయా అభవన్ .. 1.4.4..
4. యదా వా ఋచం
ఆప్నోతి ‘ఓం’ ఇతి ఏవ
అతి స్వరతి ఏవగ్ం।
సామ ఏవం యజుః
ఏష ఉ స్వరో
అందుచేతనే ఋగ్వేద ఋచములు పఠిస్తూ ఉన్నప్పుడు ‘ఓం’ అను అక్షరతత్త్వార్థ స్వరముతో ప్రారంభించటం జరుగుతోంది. సర్వాత్మకమగు పరాత్మను జ్ఞాపకం పెట్టుకొని ఋగ్వేద ఋక్కులు గానం చేయబడుచున్నాయి.

అట్లాగే యజుర్వేద మంత్రములను, సామవేద మంత్రములను కూడా ‘ఓం’ కార ఉచ్చస్వరముతో ప్రారంభించసాగారు. ‘ఆత్మోపాసన’ను జోడించి మంత్రోపాసన ప్రారంభిస్తున్నారు.
యత్ ఏతత్ అక్షరం।
ఏతత్ అమృతం। అభయం।
తత్ ప్రవిశ్య, దేవా అమృతా
అభయా - అభవన్।
ఆ విధంగా ఏ ‘ఓం’తో ఋక్ - యజు - సామములను, త్రైవిద్యను - దేవతలు అధ్యయనము ప్రారంభించారో, అట్టి ‘ఓం’ యొక్క పరమార్థము :-

ఏదైతే జన్మ-కర్మ మొదలైనవాటిచే తరుగుదల - పెరుగుదల పొందటంలేదో - ‘అక్షరము’। - క్షరము లేనిదో - అది అద్వితీయమగు ‘పరమాత్మ’ లేక ‘పరబ్రహ్మము’నకు సంజ్ఞ. కాబట్టి అభయము. రెండవది ఉంటే కదా భయము? (ద్వితీయం వై భయం భవతి)!

అట్టి అక్షరము - అద్వితీయము అగు కేవల సాక్షీరూపమగు ‘ఆత్మ’ యందు ప్రవేశించి దేవతలు అమృత స్వరూపులైనారు. అభయమును సిద్ధించుకొన్నారు.

స య ఏతదేవం విద్వానక్షరం ప్రణౌత్యేతదేవాక్షరగ్ం
స్వరమమృతమభయం ప్రవిశతి తత్ప్రవిశ్య యదమృతా
దేవాస్తదమృతో భవతి .. 1.4.5..

.. ఇతి చతుర్థః ఖండః ..
5. స య ఏతత్ ఏవం విద్వాన్
అక్షరం ప్రణౌతి,
ఏతత్ ఏవ అక్షరగ్ం
‘స్వరం’ అమృతం, అభయం ప్రవిశతి।
తత్ ప్రవిశ్య యత్ అమృతా
దేవాః తత్ అమృతో భవతి।।
ఏ నిత్యానిత్య వివేకియగు విద్వాంసుడైతే - అట్టి ప్రణవమగు అక్షరమును, సమన్వయిస్తూ, దర్శిస్తూ, ఉపాసిస్తూ ఉంటాడో - అట్టివాడు అక్షరము (‘ఓం’కార) స్వరరూపము, అమృతము, అభయము అగు పరస్వరూపము నందు ప్రవేశిస్తాడు. దేవతలవలెనే అమృత స్వరూపుడౌతాడు. అమృత తుల్యుడౌతాడు. తానే అభయము - నిత్యము - సహజము అగు అఖండ ఆత్మానంద స్వరూపుడై విరాజిల్లుతాడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే చతుర్థఖండః


1–5. ప్రథమ ప్రపాఠకః - పంచమః ఖండః - (‘ఓం’కార) ప్రణవమే ఉద్గీథము

(ఉద్గాతం = గానము చేయటము)


అథ ఖలు య ఉద్గీథః స ప్రణవో యః ప్రణవః స ఉద్గీథ
ఇత్యసౌ వా ఆదిత్య ఉద్గీథ ఏష ప్రణవ ఓమితి
హ్యేష స్వరన్నేతి .. 1.5.1..
1. అథ ఖలు య ఉద్గీథః
స ప్రణవో। యః ప్రణవః
స ఉద్గీథ - ఇతి। అసౌ వా
ఆదిత్య ఉద్గీథ। ఏష ప్రణవః ।
‘ఓం’ ఇతి హి ఏష స్వరన్ ఏతి।।
ఏది సామగాన (స్తోత్ర) సంబంధమైన ఉద్గీథమో, అదియే ‘ప్రణవము’. ఏది ప్రణవమో, అదియే ఉద్గీథము కూడా।

ప్రణవమే సూర్యుడు.

అట్టి ఏకాక్షరమగు ఆత్మ ‘ఓం’ స్వరముయొక్క ఉపాసనచే అనుభవమగుచున్నది.

‘అన్నము’ కూడా అదియే. ‘అనుభవి - అనుభవము’ - ఈ రెండూ ప్రణవ స్వరూపముగా ఉద్గీథోపాసన (గానోపాసన)తో ఉపాసించబడుచున్నాయి. ఏకరూపముగా దర్శించబడుచున్నాయి.

సూర్యుడు ‘ఓం’ - ప్రణవము ఉద్గీథము (గానము) చేస్తూనే ఆకాశంలో స్వయంప్రకాశకుడై సంచరిస్తున్నారు.

ఏతము ఏవాహమభ్యగాసిషం తస్మాన్మమ త్వమేకోఽసీతి
హ కౌషీతకిః పుత్రమువాచ రశ్మీగ్ంస్త్వం పర్యావర్తయాద్బహవో
వై తే భవిష్యంతీత్యధిదైవతం .. 1.5.2..
2. ఏతము ఏవ అహమ్
అభ్యగాసిషం,
తస్మాత్ మమ త్వమ్ ఏకో అసి ఇతి
హ-కౌషీతకిః పుత్రం
ఉవాచ - రశ్మీగ్ం స్త్వం
పర్యావర్తయాత్ బహవో
వై తే భవిష్యన్తి ఇతి ‘‘అధి దైవతమ్’’।
సూర్యుడు తన కుమారుడైనట్టి కౌషీతకీ మహర్షికి ఈ విధంగా బోధించారు.
‘‘ప్రియపుత్రికా! కౌషీతకీ। నేను ప్రణవ గానము చేస్తూ ఆకాశంలో స్వయం ప్రకాశకుడినై సర్వత్రా వెలుగును నింపుచున్నాను. నీవు నన్ను ఆత్మతత్త్వ పురుషుడుగాను, నా కిరణములను ఉద్గీథముగాను భావించి ఉపాసించుము. నా తేజస్సు ఏకమే అయినప్పటికీ అనేక రూపములుగా పర్యావర్తనము అగుచున్న తీరుగా, ఏకము-అక్షరము అగు ఆత్మయే అనేకముగా పర్యావర్తనమై ప్రదర్శనమౌతోంది’’.

సూర్యుడు చెప్పినట్లు ఉపాసించిన (ప్రజాపతి) కౌషీతకీ మహర్షి తన కుమారునితో ‘‘నాయనా! కావున నీవు నాకు ఒక్కడివే పుత్రుడవు. దేవతలు సూర్యుని కిరణములను ఉద్గీథోపాసనకు విషయము (ఉపాస్యము)గా భావించి ధ్యానిస్తున్నారు. నీవు అట్లే నిర్వర్తించు. నీకు బహు సంతానము కలుగును’’ - అని బోధించారు.

అథాధ్యాత్మం య ఏవాయం ముఖ్యః
ప్రాణస్తముద్గీథముపాసీతోమితి హ్యేష స్వరన్నేతి .. 1.5.3..
3. అథ అధ్యాత్మం।
య ఏవ అయం ముఖ్యః ప్రాణః
తం ఉద్గీథం ఉపాసీత -
‘ఓం’ ఇతి హి ఏష స్వరన్ ఏతి।।
అధ్యాత్మము
ఇప్పుడిక ‘‘అధ్యాత్మము’’ గురించి చెప్పుకుందాము.

అధ్యాత్మము: ఇది తన శరీరమును, తదితర శరీరములను ఉపాసించటము. అయితే భౌతిక రూపంగా కాదు. దేహములన్నీ ముఖ్యప్రాణ ప్రదర్శనా రూపముగా భావన చేయటము - ఉద్గీథోపాసన చేయటము, (‘ఓం’) ప్రణవోపాసన (లేక) ‘స్వరోపాసన’ అగుచున్నది. నోటితో ఉచ్చరించే ప్రణవమే ప్రాణము.


ఏతము ఏవాహమభ్యగాసిషం తస్మాన్మమ త్వమేకోఽసీతి హ
కౌషీతకిః పుత్రమువాచ ప్రాణాగ్ంస్త్వం
భూమానమభిగాయతాద్బహవో వై మే భవిష్యంతీతి .. 1.5.4..
4. ఏతము ఏవ అహమ్
అభ్యగాసిషం। తస్మాత్
మమ త్వమ్ ఏకో అసి ఇతి
హ కౌషీతకిః పుత్రం
ఉవాచ - ప్రాణాగ్ంస్త్వం
భూమానం అభిగాయతాత్
బహవో వై మే భవిష్యంతి ఇతి।।
కౌషీతకీ మహర్షి ఇంకా ఈ విధంగా చెప్పుచున్నారు.

నేను ప్రాణమును ప్రణవ స్వరూపంగాను, ‘‘ఈ ప్రాణమే నాకు పుత్రుడు’’- గాను భావిస్తూ ‘‘ఆత్మా వై పుత్ర నామాసి’’ అను స్తుతి నిర్వర్తిస్తూ ఉన్నాను.

‘‘ప్రాణమును పుత్రునిగాను భావించి, బహుసంతతి ప్రసాదించటానికై ప్రాణములను ఉద్గీథోపాసనగా చేస్తున్నాను.
ప్రాణమే ప్రణవ స్వరూపంగా, బహు (అధికము)గా భావించుటము నిర్వర్తించబడుచున్నప్పుడు సర్వజీవులు నాకు మమప్రాణస్వరూపంగా అనుభవమగుచున్నారు’’.

అథ ఖలు య ఉద్గీథః స ప్రణవో యః ప్రణవః
స ఉద్గీథ ఇతి హోతృషదనాద్ధైవాపి
దురుద్గీథమనుసమాహరతీత్యనుసమాహరతీతి … 1.5.5..
5. అథ ఖలు య ఉద్గీథః స ప్రణవః।
యః ప్రణవః స ఉద్గీథః।
ఇతి హోతృషదనాత్ హ ఏవ అపి
దురుద్గీతమ్ అనుసమాహరతి - ఇతి।
అనుసమాహరతి ఇతి।।

.. ఇతి పంచమః ఖండః ..
ఏది ఉద్గీథమో (స్తుతిగానమో) అదియే ప్రణవము.

ఏది ప్రణవమో, (ప్రాణశక్తియో) - అదియే ఉద్గీథము కూడా!

ఈ విధంగా ఆధ్యాత్మికంగా శరీరములనే ప్రాణస్వరూపంగా, ప్రాణములనే ప్రణవముగా ఏకరూపం చేసి ఉద్గీథము చేస్తున్నప్పుడు వేదమంత్రములను పలుకుటలో ఉచ్చారణ దోషములు ఉన్నప్పటికీ కూడా (ప్రాణమే - ప్రణవము, ప్రాణమే దేహము - అను గానముచే) - అట్టి పలుకు దోషములు సమాహరతము (దోషము తొలగుట) పొందబడగలవు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే పంచమ ఖండః


1–6. ప్రథమ ప్రపాఠకః - షష్ఠః ఖండః - పరమపురుషుడే ఉద్గీథము


ఇయమేవర్గగ్నిః సామ తదేతదేతస్యామృచ్యధ్యూఢగ్ం సామ
తస్మాదృచ్యధ్యూఢగ్ంసామ గీయత ఇయమేవ
సాగ్నిరమస్తత్సామ .. 1.6.1..
1. ఇయం ఏవః అగ్నిః సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్
ఋచి అధి ఊఢగ్ం సామ।
తస్మాత్ ఋచి అధి ఊఢగ్ం సామగీయతే।
ఇయం ఏవ సా అగ్నిః।
అమః తత్ సామ।।
ఈ అగ్నియే ‘సామము’.
అట్టి సామము ‘ఋచమ్’ పై ఆధారము.
‘సా’ = భూమి (Basis)
‘అమ’ = అగ్ని.
ఈ విధంగా అగ్నియే సామవేదము.
అగ్ని ప్రాణరూపము.
గానము ప్రాణశక్తియొక్క క్రియా ప్రదర్శనము.
ప్రాణమునకు ఆధారము ఋచము (ఆత్మ).
ఇదంతా అగ్ని (ప్రాణ) స్వరూపమై ‘సామము’గా ప్రదర్శనమగుచున్నది.
(ఊఢము = పొందబడినది, మోయబడినది.
అధ్యూఢము = ఒకటిచే మరొకటి పొందబడినది - మోయబడినది)

అంతరిక్షమేవర్గ్వాయుః సామ తదేతదేతస్యామృచ్యధ్యూఢగ్ం సామ
తస్మాదృచ్యధ్యూఢగ్ం సామ గీయతేఽన్తరిక్షమేవ సా
వాయురమస్తత్సామ .. 1.6.2..
2. అన్తరిక్షం ఏవ ఋక్।
వాయుః సామ।
తత్ ఏతత్ ఏతస్యాత్
ఋచః అధ్యూఢగ్ం సామ।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం
సామ గీయతే, అన్తరిక్షం ఏవ సా వాయుః।
అమః తత్ సామ।।
అంతరిక్షమే → ‘ఋక్కు’
వాయువు → ‘సామము’
అట్టి సామము ఋక్‌పై ఆధారము.
ఋక్కుపై ఆధారితమై సామము గానము చేయబడుతోంది.
సా = ఆకాశము
అమ = వాయువు
ఆకాశము + వాయువు యొక్క కలయికయే(రమయే) - ‘‘సామ’’

ద్యౌరేవర్గాదిత్యః సామ తదేతదేతస్యామృచ్యధ్యూఢగ్ం సామ
తస్మాదృచ్యధ్యూఢగ్ం సామ గీయతే ద్యౌరేవ
సాదిత్యోఽమస్తత్సామ .. 1.6.3..
3. ద్యౌః ఏవ ‘ఋక్’।
ఆదిత్యః ‘సామ’ ।
తదేతత్ ఏతస్యామ్
ఋచః అధ్యూఢగ్ం
సామ। తస్మాత్ ఋచః
అధ్యూఢగ్ం సామ గీయతే
ద్యౌః ఏవ - సా ఆదిత్యః ।
అమః తత్ ‘‘సామ’’।।
ద్యులోకము (స్వర్గలోకము) - ‘ఋక్’
ఆదిత్యుడు (సూర్యుడు) - సామము
- అట్టి సామము (ఆదిత్యుడు) ఋక్‌పై ఆధారము.
- ‘ఋక్’ ఆధారముగా సామము గానము చేయబడుతోంది.
‘‘సా’’ = స్వర్గము (ద్యులోకము)
‘‘అమ’’ = సూర్యుడు (ఆదిత్యుడు)
ద్యులోకము (దివ్యలోకము/స్వర్గలోకము) + ఆదిత్యుడు → ఈ రెండిటి కలయికయే ‘‘సామము’

నక్షత్రాన్యేవర్క్చంద్రమాః సామ తదేతదేతస్యామృచ్యధ్యూఢగ్ం సామ
తస్మాదృచ్యధ్యూఢగ్ం సామ గీయతే నక్షత్రాణ్యేవ సా చంద్రమా
అమస్తత్సామ .. 1.6.4..
4. నక్షత్రాణి ఏవ ఋక్।
చంద్రమాః సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్
ఋచః అధ్యూఢగ్ం ‘సామ’।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం
సామ గీయతే నక్షత్రాణి
ఏవ సా చంద్రమా
అమః - తత్ సామ।।
నక్షత్ర మండలము - ‘‘ఋక్’’
చంద్రుడు - ‘సామము’
అట్టి సామము → ఋక్‌పై ఆధారితము
అందుచేత ‘ఋక్’ ఆధారంగానే సామము గానము చేయబడుతోంది.
‘‘సా’’ = నక్షత్రమండలము
‘‘అమ’’ = చంద్రుడు
నక్షత్రమండలము + చంద్రుడు
సా (ఋక్) + (అమ) ఈ రెండూ కలిస్తేనే ‘సామ’.

అథ యదేతదాదిత్యస్య శుక్లం భాః సైవర్గథ యన్నీలం పరః
కృష్ణం తత్సామ తదేతదేతస్యామృచ్యధ్యూఢగ్ం సామ
తస్మాదృచ్యధ్యూఢగ్ం సామ గీయతే .. 1.6.5..
5. అథ యత్ ఏతత్ ఆదిత్యస్య
శుక్లం భాః స ఏవ ఋక్।
అథ యత్ నీలం, పరః కృష్ణం తత్ సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్ ఋచః అధ్యూఢగ్ం సామ।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం సామ గీయతే।।
ఆదిత్యుని కాంతి - శుక్లము (తెలుపు) ‘సా’
ఆదిత్యుని నీలము, పరము అగు కృష్ణము (నలుపు) - ‘‘అమ’’
ఈ శుక్లము, కృష్ణముల చేరిక → ‘సామ’.
తెలుపు నలుపుపై ఆధారము.
‘ఋచము’పై ఆధారము కలదై ‘సామ’గానము (అద్వఢగ్ం = ఆధారమై ఉన్నది)
తెలుపుపై నలుపువలె ‘ఋక్’ పై ‘సామ’ గానము చేయబడుతోంది.
(ఋక్ = Lyric, సామ = Music)

అథ యదేవైతదాదిత్యస్య శుక్లం భాః సైవ
సాథ యన్నీలం పరః కృష్ణం తదమస్తత్సామాథ
య ఏషోఽన్తరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే
హిరణ్యశ్మశ్రుర్హిరణ్యకేశ ఆప్రణస్వాత్సర్వ ఏవ
సువర్ణః .. 1.6.6..
6. అథ యత్ ఏవ ఏతత్ ఆదిత్యస్య శుక్లం,
భాః స ఏవ ‘సా’ అథ యత్ నీలం
పరః (పరా) కృష్ణం। తత్ అమః తత్ ‘సామ’।
అథ య ఏషో అంతర ఆదిత్యే
హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్య
శ్మశ్రుః హిరణ్య కేశ
ఆప్రణఖాత్, సర్వ ఏవ సువర్ణః।।
ఆదిత్యునియందు ఏ శుక్లము (తెలుపు) భాసిస్తోందో - అదియే నీలము, నలుపుగా రూపు కలిగి ఉంటోంది.
సూర్యునిలో ప్రకాశమానుడగుచున్నవాడే ‘‘పురుషుడు’’.
ఆ పురుషుడు (worker of the universe) ‘ఆదిత్యుడు’గాను, హిరణ్మయుడుగాను (కూడా) చెప్పబడుచున్నాడు.
అట్టి హిరణ్మయపురుషుడు బంగారు కేశములతో, బంగారు రంగుతో ప్రకాశమానుడుగా ఉపాశ్య - ఉపదేశ్య రూపముగా అభివర్ణించ బడుచున్నారు.

తస్య యథా కప్యాసం పుండరీకమేవమక్షిణీ
తస్యోదితి నామ స ఏష సర్వేభ్యః పాప్మభ్య ఉదిత
ఉదేతి హ వై సర్వేభ్యః పాప్మభ్యో య ఏవం వేద .. 1.6.7..
7. తస్య యథా కప్యాసం
పుండరీకం ఏవం అక్షిణీ।
తస్య ‘ఉత్’ ఇతి నామ।
స ఏష సర్వేభ్యః పాప్మభ్య
ఉదిత ఉత్ ఏతి హ వై
సర్వేభ్యః పాప్మభ్యో య ఏవం వేద।
సమస్త కల్పకు పురుషకారుడు, ఆధారుడు అగు ఆ హిరణ్యగర్భ పురుషుడు
- ఎరుపు రంగుతో ప్రకాశించు తామరపువ్వు వంటి కనులతో,
- ‘ఉత్’ శబ్దార్థుడై అజ్ఞానమాలిన్యము నుండి బయటకు తెచ్చువాడై సముద్ధరించువాడై,
- సమస్త పాప దోషముల నుండి బయటపడటానికి మార్గదర్శకుడై, పాపములు పోగొట్టువాడై యోగజ్ఞులచే దర్శించబడి, సాధక జనుల కొరకై సారూప్యముగా ప్రసాదించబడుచున్నారు.
ఇది ఎరుగుచున్నవారు సర్వ దోషముల నుండి విడివడుచున్నాడు.

తస్యర్క్చ సామ చ గేష్ణౌ
తస్మాదుద్గీథస్తస్మాత్త్వేవోద్గాతైతస్య హి గాతా
స ఏష యే చాముష్మాత్పరాంచో లోకాస్తేషాం చేష్టే
దేవకామానాం చేత్యధిదైవతం .. 1.6.8..

.. ఇతి షష్ఠః ఖండః ..
8. తస్య ఋక్ చ సామ చ, గేష్ణౌ।
తస్మాత్ ఉద్గీథః। తస్మాత్ త్వ ఏవ ఉద్గాత।
ఏతస్య హి గాతా।
స ఏష యే చ ఆముష్మాత్పరాంచో లోకాః।
తేషాం చేష్టే దేవకామానాం చ
ఏతి అధిదైవతమ్।।
ఆ పరమపురుషుడే ఋగ్వేద యజుర్వేదములు గృహముగా కలవారు.
- ఆయనయే ఉద్గీథము (స్తోత్ర గాన స్వరూపము) కూడా!
- ఆయనయే గానము చేయు ఉద్గాత, ఉద్గాతను ఆహ్వానిస్తున్న యజ్ఞకర్త కూడా।
- ఆయనయే గానలహరి।
- ఆయనయే ఆముష్మిక (పరలోక) ప్రయోజనరూపుడు.
- ఆయనయే దేవతలు కోరుకొనే పరాకాష్ఠతత్త్వుడు. లోకములకు కూడా ఆవలివాడు.
ఇదియే ‘అధిదైవతము’.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే షష్ఠః ఖండః


1–7. ప్రథమ ప్రపాఠకః - సప్తమః ఖండః - పరమ పురుష సామ ఉపాసన


అథాధ్యాత్మం వాగేవర్క్ప్రాణః సామ తదేతదేతస్యామృచ్యధ్యూఢగ్ం
సామ తస్మాదృచ్యధ్యూఢగ్ంసామ గీయతే.
వాగేవ సా ప్రాణోఽమస్తత్సామ .. 1.7.1..
1. అథ అథ్యాత్మం।
వాక్ ఏవ ‘‘ఋక్’’। ప్రాణః సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్ ఋచః అధ్యూఢగ్ం సామ।
ఈ శరీరమునకు సంబంధించిన సాధనా వ్యవస్థయే ‘అధ్యాత్మము’.
- వాక్కు (Speaking)యే - ‘ఋక్’.
- ప్రాణమే - ‘సామము’.
అట్టి సామము (శబ్ద సంగీత సౌందర్యము) ఋక్కుపై (సత్యవాక్కు - ఆత్మతత్త్వముపై) ఆధారపడి గానం చేయబడుతోంది.
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం సామ గీయతే।
వాక్ ఏవ ‘సా’ ప్రాణో ‘అమః’ - తత్ సామః।।
అందుచే అట్టి ఋక్కునకు (పరమసత్యమగు ఆత్మతత్త్వమునకు) ఆధారమై సామము గానము చేయబడుచున్నది.
వాక్కుయే ‘సా’
ప్రాణము - ‘అమ’
తత్ పరమాత్మ స్వరూపమే సామగానము. వాక్కు - ప్రాణముల కలయికయే ‘సామ’.

చక్షురేవర్గాత్మా సామ తదేతదేతస్యామృచ్యధ్యూఢగ్ంసామ
తస్మాదృచ్యధ్యూఢగ్ంసామ గీయతే .
చక్షురేవ సాత్మామస్తత్సామ .. 1.7.2..
2. చక్షుః ఏవ ఋక్। ఆత్మా సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్ ఋచః అధ్యూఢగ్ం సామ।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం సామ గీయతే।
చక్షుః ఏవ ‘సా’ ఆత్మా అమః తత్ సామ।।
చక్షువులు (కన్ను) - ‘ఋక్కు’
చూచువాడు / నేత్రేంద్రియము → ‘సామ’
కన్నుపై చూపు ఆధారపడు విధంగా - ఋక్కుపై సామ ఆధారితము. ఋక్కు ఆధారంగానే సామము గానము చేయబడుతోంది.
నేత్రములు, చూపు ఏకరూపమే.
నేత్రము (కన్ను) → ‘సా’
ఆత్మ (నేత్రేంద్రియము) → ‘అమ’
ఈ నేత్రము - జీవాత్మల కలయికయే సామ।

శ్రోత్రమేవర్ఙ్మనః సామ తదేతదేతస్యామృచ్యధ్యూఢగ్ంసామ
తస్మాదృచ్యధ్యూఢగ్ంసామ గీయతే .
శ్రోత్రమేవ సా మనోఽమస్తత్సామ .. 1.7.3..
3. శ్రోత్రం ఏవ ‘‘ఋక్’’ మనః ‘సామ’।
తత్ ఏతత్ ఏతస్యామ్ ఋచః అధ్యూఢగ్ం సామ।
తస్మాత్ ఋచః అధ్యూఢగ్ం సామ గీయతే।
శ్రోత్రం ఏవ ‘సా’। మనో - అమః।
తత్ సామ।।
శ్రోత్రము (చెవి) (వినికిడి) - ‘ఋక్కు’.
మనస్సు - ‘సామ’
అట్టి సామము ఋక్కుపై ఆధారపడి యున్నది.
చెవి - ‘సా’
మనస్సు - ‘అమ’
చెవి మనస్సుల కలయికయే ‘సామ’

అథ యదేతదక్ష్ణః శుక్లం భాః సైవర్గథ యన్నీలం పరః
కృష్ణం తత్సామ తదేతదేతస్యామృచ్యధ్యూఢగ్ంసామ
తస్మాదృచ్యధ్యూఢగ్ంసామ గీయతే .
అథ యదేవైతదక్ష్ణః శుక్లం భాః సైవ సాథ యన్నీలం పరః
కృష్ణం తదమస్తత్సామ .. 1.7.4..
4. అథ యత్ ఏతత్ అక్ష ణాః (ఋక్-అక్షః)
శుక్లం। భాః స ఏవ ఋక్ అథ యత్ నీలం పరః
కృష్ణం తత్ సామ।
తత్ ఏతత్ ఏతస్యామ్
ఋచ అధ్యూఢగ్ం సామ।
నేత్రములోని శుక్ల (తెలుపు) విభాగముగా భాసించుచున్నది - ‘ఋక్కు’.
తెలుపుకు వేరుగా నీల - నలుపులతో కూడిన నల్లని విభాగము - ‘సామ’
సామము (గానము) ఋక్కు నుండి (మంత్రము - వాఙ్మయము నుండి) బయల్వెడలుచున్నది. అనగా సామము ఋక్కుపై ఆధారపడి ఉన్నది. కంటిలో తెల్లటి విభాగముపై (విస్తరణవలె) నల్లటి విభాగము చోటుపొందుచున్నది.
తస్మాత్ ‘ఋక్’చ అధ్యూఢగ్ం సామ గీయతే।
అథ యత్ ఏవ ఏతత్ అక్ష ణాః
శుక్లం భాః స ఏవ ‘సా’।
అథ యత్ నీలం పరః
తత్ ‘అమ’। తత్ సామ।
‘ఋక్కు’ను ఆధారము చేసుకొని సామము గానము చేయబడుతోంది.
ఈ విధంగా కంటిలో తెల్లగా ప్రకాశమానమై యున్నది - ‘సా’.
నీలమునకు పరమై నలుపు విభాగము - ‘అమ’.
ఆ రెండిటి కలయికయే ‘సామ’.

అథ య ఏషోఽన్తరక్షిణి పురుషో దృశ్యతే సైవర్క్తత్సామ
తదుక్థం తద్యజుస్తద్బ్రహ్మ తస్యైతస్య తదేవ రూపం యదముష్య రూపం
యావముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ యన్నామ తన్నామ .. 1.7.5..
5. అథ య ఏషో అంతః అక్షిణి పురుషో
దృశ్యతే స ఏవ ఋక్ తత్ సామ
తత్ ఉక్థం- తత్ యజుః తత్ బ్రహ్మ।
తస్య ఏతస్య తత్ ఏవ రూపం
యత్ అముష్యరూపం
యా అవముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ।
యత్ నామ, తత్ నామ।
ఏ పురుషుడు నేత్రములో అంతరముగా చూచువానిగా దృశ్యమానమై యున్నారో (As a perceiver) -
ఆయనయే ఋక్కు
ఆయనయే ‘సామము’ కూడా।
ఆయనయే ‘ఉక్థ (ప్రాణము) (సామవేదము)
ఆయనయే - ‘‘యజుర్వేదము’’
ఆయనయే - ‘‘బ్రహ్మము’’

ఈ నేత్రములలో నివాసము కలిగియున్న రూపమే (చూచువాడే) అముష్యరూపము. సూర్యునిలో నివసించుచున్న రూపము కూడా ఆయనయే.

పురుషుడు - సూర్యునిలో నివసించుచున్నవాని పేరు, ఈ నేత్రములలో నివసిస్తున్నవారి పేరు ఒక్కటే. ఆతడే ‘పురుషుడు’।

ఆ పురుషుడే సర్వజీవులలో ‘‘ఉత్తమపురుషగా’’ (The First Persion, ‘I’ గా) వెలయుచు - పురుషోత్తముడుగా సుత్తించబడుచున్నాడు.


స ఏష యే చైతస్మాదర్వాంచో లోకాస్తేషాం చేష్టే మనుష్యకామానాం
చేతి తద్య ఇమే వీణాయాం గాయంత్యేతం తే గాయంతి
తస్మాత్తే ధనసనయః .. 1.7.6..
6. స ఏష యే చ ఏతస్మాత్ అర్వాంచో
లోకాః తేషాం చేష్టే మనుష్య కామానాం చ ఇతి।

ఆ పురుషుడే
- జగత్తులో సర్వజీవుల ఇష్టము, వాంఛ, ఆశయముల రూపంగా ప్రదర్శనమగుచున్నారు. (అహమ్ ఆత్మ సర్వభూతాయ స్థితః)
- ఆయనయే లోకముల రూపంగాను, లోకములలోని సర్వ దృశ్యములుగాను వెలయుచున్నారు.
- ఆయనయే మనుష్యులలో (జీవులలో) కామములను చేష్టితము చేయుచున్నవారు.
(He is the Inspirer of all desires/Expectations of all beings, just like a Drama writer for all Roles)

తద్య ఇమే వీణాయాం గాయన్తి।
ఏతం తే గాయన్తి తస్మాత్ తే ధనసనయః
ఎవ్వరైతే అట్టి సమస్తమునందు వసించుచున్న వాసుదేవ భగవానుని (లేక) వాసుదేవ పురుషుని వీణాగానముతో పాడుచున్నారో (స్తుతిస్తూ పాట పాడుచున్నారో) - వారు ఏది ‘మాకు కావాలి’ అనుకుంటే అవన్నీ పొందగలరు.

అథ య ఏతదేవం విద్వాన్సామ గాయత్యుభౌ స గాయతి
సోఽమునైవ స ఏష చాముష్మాత్పరాంచో
లోకాస్తాగ్ంశ్చాప్నోతి దేవకామాగ్ంశ్చ .. 1.7.7..
7. అథ య ఏతత్ ఏవం విద్వాన్
సామ గాయతి ఉభౌ స గాయతి।
ఎవ్వరైతే అట్టి దేవదేవుని ఎరుగుచు సామగానము చేయుచున్నారో, వారు (ఇహ-పర రూపములగు) ఉభయము - ఋక్ (వాక్) - సామ అర్థోపాసనలను ఉపాసించువారగుచున్నారు.
సో అమున ఏవ స ఏష యే చ అముష్మాత్
పరాంచో లోకాన్ తాగ్ం చ
ఆప్నోతి దేవ కామాగ్ంశ్చ।।
అట్టి పరమాత్మను ఎవ్వరైతే ఉద్గీథ గానము ద్వారా ఉపాసిస్తున్నారో వారు పరమునగల దివ్యలోకములు ప్రాప్తించుకోగలరు. దివ్యపురుషులగు దేవతలచే (హిరణ్యగర్భునిచే) దేవతా లోక భోగములు ప్రసాదించబడుచున్నారు.

అథానేనైవ యే చైతస్మాదర్వాంచో లోకాస్తాగ్ంశ్చాప్నోతి
మనుష్యకామాగ్ంశ్చ తస్మాదు హైవంవిదుద్గాతా బ్రూయాత్ .. 1.7.8..
8. అథ అనేన ఏవ యే చ ఏతస్మాత్
అర్వాంచో లోకాః తాగ్ంశ్చ
ఆప్నోతి మనుష్య కామాగ్ంశ్చ।
తస్మాత్ ఉ హ ఏవం విత్
ఉద్గాతా బ్రూయాత్।
యజ్ఞవిధులందు యజ్ఞకర్తను, తదితరులను ఉద్దేశించి ఉద్గాత (సామగానము చేయు యజ్ఞవిధిలోని నిర్వాహకుడు) ఏ ఏ ఉత్తమ ఆశీర్వాదములు పలుకుచున్నాడో - అట్టి తాము కోరుకొన్న ఉత్తమ లోకములను - ఆ పరమపురుషుని ఉపాసించు మానవులు, సర్వత్ర పరమాత్మ సంకల్పములను దర్శించువారు పొందగలరు.
(వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్త్రయమ్। సర్వభూత నివాసోఽసి, శ్రీ వాసుదేవ నమోస్తుతే)

కం తే కామమాగాయానీత్యేష హ్యేవ కామాగానస్యేష్టే య
ఏవం విద్వాన్సామ గాయతి సామ గాయతి .. 1.7.9..

.. ఇతి సప్తమః ఖండః ..
9. కం తే కామం ఆగాయనీతి ఏష హి ఏవ
కామాగానస్య ఈష్టే య ఏవం విద్వాన్
సామ గాయతి। సామ గాయతి।।
ఉద్గాత సామగానము చేస్తూ యజ్ఞకర్తకు, శ్రోతలకు, సభికులకు ఏఏ ‘భవతు’ అని గానం చేస్తున్నారో, అట్టి సామగాన ప్రయోజనములు - ‘పరమపురుషోపాసన’ చేయుచున్నవారికి స్వాభావికంగానే సిద్ధించగలవు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే సప్తమః ఖండః


1–8. ప్రథమ ప్రపాఠకః - అష్టమః ఖండః - సామ యొక్క గతి ఏది?


త్రయో హోద్గీథే కుశలా బభూవుః శిలకః శాలావత్యశ్చైకితాయనో
దాల్భ్యః ప్రవాహణో జైవలిరితి తే హోచురుద్గీథే
వై కుశలాః స్మో హంతోద్గీథే కథాం వదామ ఇతి .. 1.8.1..
1. త్రయో హ ఉద్గీథే
కుశలా బభూవుః।
శిలకః శాలావత్యః
చైకితాయనో దాల్భ్యః
ప్రవాహణో జైవలిః - ఇతి।।
అట్టి ఉద్గీథము (సామ) గానము చేయగల నిష్ణాతులైనవారు (కుశలురు) ముగ్గురు ముఖ్యమైనవారిని తలచుకొని నమస్కరిస్తున్నాము.
(1) శాలవత్యుని కుమారుడు - శిలక ముని
(2) దాల్భ్య వంశీయుడు - చైకితాయన ముని
(3) జీవలుని కుమారుడు - ప్రవాహణముని, జైవలి.
తే హ ఊచుః
ఉద్గీథే వై కుశలాః
స్మః హంత ఉద్గీథే
కథాం వదామ ఇతి।।
మహనీయులగు అట్టి ముగ్గురు మునీశ్వరులు - ఒక సందర్భంలో కలుసుకొని ఈ విధంగా సంభాషించసాగారు.
ముగ్గురు మునీశ్వరులు : ఓ మునివర్యులారా! ఉద్గీథగానము (తత్త్వవర్ణన, తత్త్వ ప్రశంస) యందు కుశలురమైనాము కనుక, మీరు ఇష్టపడితే మనము ఉద్గీథ గానము గురించి సంభాషించుకుందాము.

తథేతి హ సముపవివిశుః స హ ప్రావహణో జైవలిరువాచ
భగవంతావగ్రే వదతాం బ్రాహ్మణయోర్వదతోర్వాచగ్ం శ్రోష్యామీతి .. 1.8.2..
2. తథా ఇతి హ సముపవివిశుస్స హ
ప్రవాహణో జైవలిః ఉవాచ
భగవంతౌ అగ్రే వదతాం బ్రాహ్మణ
యోః వదతోః వాచగ్ం శ్రోష్యామి ఇతి।
మునుల సభ ప్రారంభమైనది.
ప్రవాహణో జైవలి మునీంద్రుడు : (లేచి నిలుచుని) ఓ శాలవత్య కుమారులగు శిలకమునీంద్రా! దాల్భ్య వంశీయులగు చైకితాయన ముని సత్తమా! మీరిద్దరు అగ్రతాంబూలార్హులు. నాచే నమస్కారార్హులు. మీరు ముందుగా బ్రాహ్మణములను గానం చేయండి. మేమంతా శ్రవణము చేస్తాము.

స హ శిలకః శాలావత్యశ్చైకితాయనం దాల్భ్యమువాచ
హంత త్వా పృచ్ఛానీతి పృచ్ఛేతి హోవాచ .. 1.8.3..
3. స హ శిలకశ్శాలావత్యః
చైకితాయనం దాల్భ్యం ఉవాచ
హంత త్వా పృచ్ఛానీతి పుచ్ఛేతి హ ఉవాచ।।
శిలక శాలావత్యుడు : (చైకితాన దాల్భ్యునితో) అయ్యా। చైకితాన దాల్భ్య మహాశయా! నాదొక చిన్న ప్రశ్న! అనుజ్ఞ అయితే అడుగుతాను. ఈ రీతిగా ఈ సత్సంగ సందర్భమును మనిద్దరము ప్రారంభిద్దాము.
చైకితాన దాల్భ్యుడు : శిలక శాలవత్య మునీంద్రా! అట్లాగే అడగండి. నాకు తెలియవచ్చినంతవరకు మీ ప్రశ్నలకు సమాధానము మనవి చేస్తాను.

కా సామ్నో గతిరితి స్వర ఇతి హోవాచ స్వరస్య కా
గతిరితి ప్రాణ ఇతి హోవాచ ప్రాణస్య కా
గతిరిత్యన్నమితి హోవాచాన్నస్య కా గతిరిత్యాప
ఇతి హోవాచ .. 1.8.4..
4. కా సామ్నో గతిః ఇతి?
‘‘స్వర’’ ఇతి హ ఉవాచ।
స్వరస్య కా గతిః? ఇతి ।
‘‘ప్రాణ’’ ఇతి హ ఉవాచ ।
ప్రాణస్య కా గతిః? ఇతి
‘‘అన్నమ్’’ ఇతి హ ఉవాచ।
అన్నస్య కా గతిః? ఇతి।
‘‘ఆప ఇతి’’ హ ఉవాచ।
(గతి = పోక; త్రోవ; ఉపాయము; శరణము; విధము; దశ; ఆధారము; చలనము; నడక; ప్రవేశము; ప్రాప్తి; దిక్కు; ఫలితము)
శిలక శాలవత్యుడు : ‘సామ’ యొక్క గతి (ఆశ్రయము) ఏమైయున్నది?
చైకితాన దాల్భ్యుడు : ‘స్వరము’.
శిలక శాలవత్యుడు : స్వరముయొక్క గతి ఏది?
చైకితాన దాల్భ్యుడు : ‘‘ప్రాణము’’
శిలక శాలవత్యుడు : ప్రాణముయొక్క ‘గతి’ ఏది?
చైకితాన దాల్భ్యుడు : ‘‘అన్నమ్’’ (ఇంద్రియములకు ఆహారమగుచున్న శబ్ద స్పర్శ రూప రస గంధ విషయములు)
శిలక శాలవత్యుడు : ‘అన్నము’ యొక్క గతి ఏది?
చైకితాన దాల్భ్యుడు : ఆపః (జలము)

అపాం కా గతిరిత్యసౌ లోక ఇతి హోవాచాముష్య లోకస్య
కా గతిరితి న స్వర్గం లోకమితి నయేదితి హోవాచ స్వర్గం
వయం లోకగ్ం సామాభిసంస్థాపయామః స్వర్గసగ్ంస్తావగ్ంహి
సామేతి .. 1.8.5..
5. అపాం కా గతిః? ఇతి
‘‘అసౌ లోక’’ - ఇతి హ ఉవాచ।
అముష్య లోకస్య కా గతిః? ఇతి।
శిలక శలావత్య ముని : అపాం (జలము)నకు గతి ఏది?
చైకితాయన దాల్భ్య ముని : ఆ లోకము (స్వర్గలోకము; అముష్యలోకము)
శిలక శలావత్య ముని : అముష్యలోకము ఎటు గతిస్తోంది?
న స్వర్గం లోకం అతినయేత్ - ఇతి।। హ ఉవాచ।
స్వర్గం వయం
లోకగ్ం సామ అభిసగ్ంస్థాపయామః
స్వర్గసగ్ంస్తావగ్ం హి సామ ఇతి।।
చైకితాయన దాల్భ్య ముని : స్వర్గమునకు ఆవల ఇంకేమీ లేదు. అందుచేత స్వర్గలోకమునకు ఆవల స్తుతించవలసిన మరొక ‘గతి’ లేదు. ‘సామము’నే స్వర్గముగా వర్ణించుచున్నారు కదా!
స్వర్గములోనే సామము సంస్థితము. అందుచేత స్వర్గమునందే ‘సామము’ కొరకై వెతకి పట్టుకోవాలి. సామము స్వర్గలోకము దాటి వెళ్లవలసినది ఏదీ లేదు.

తగ్ం హ శిలకః శాలావత్యశ్చైకితాయనం
దాల్భ్యమువాచాప్రతిష్ఠితం వై కిల తే దాల్భ్య సామ
యస్త్వేతర్హి బ్రూయాన్మూర్ధా తే విపతిష్యతీతి మూర్ధా తే
విపతేదితి .. 1.8.6..
6. తగ్ం హ శిలకః శాలవత్యః
చైకితాయనం దాల్భ్యం ఉవాచ -
అప్రతిష్ఠితం వై కిల తే దాల్భ్య
సామ యస్తు ఏతర్హి బ్రూయాన్
మూర్ధా తే విపతిష్యతి - ఇతి।
మూర్ధా తే విపతేత్ - ఇతి।।
శిలక శాలవత్య ముని : ఓ చైకితాయన దాల్భ్య మునివర్యా! మీరు వర్ణించిన సామగానము గురించిన ముగింపులో ఒక అప్రతిష్ఠము (లేక) దోషము ఉన్నదని నా మనవి.
మీరు చేసిన సామగానము గురించిన ముగింపు - మీ శిరస్సు నేలకూలదని చెప్పగలరా?
- ఓ దాల్భ్యా! మీ బుఱ్ఱ (తల) క్రింద పడగలదు సుమా! (అనగా విజ్ఞుల సభలో మీరు తల వంచవలసి వస్తుంది - అని భావన)

హంతాహమేతద్భగవతో వేదానీతి విద్ధీతి హోవాచాముష్య
లోకస్య కా గతిరిత్యయం లోక ఇతి హోవాచాస్య లోకస్య
కా గతిరితి న ప్రతిష్ఠాం లోకమితి నయేదితి హోవాచ
ప్రతిష్ఠాం వయం లోకగ్ం సామాభిసగ్ంస్థాపయామః
ప్రతిష్ఠాసగ్ంస్తావగ్ం హి సామేతి .. 1.8.7..
7. హంతా। అహం ఏతత్
భగవతో వేదాని ఇతి
విద్ధీతి, హ ఉవాచ।
అముష్య లోకస్య కా గతిః? ఇతి।
‘అయం లోక’ - ఇతి। హ ఉవాచ।
అస్య లోకస్య కా గతిః? ఇతి।
న ప్రతిష్ఠాం లోకమ్
అతినయేత్ ఇతి। హ ఉవాచ
ప్రతిష్ఠాం వయం లోకగ్ం
సామ అభిసగ్ంస్థాపయామః
ప్రతిష్ఠా సగ్ంస్తావగ్ం హి సామ - ఇతి।।
చైకితాయన దాల్భ్యా ముని : హే భగవాన్! శిలకమునీశ్వరా! నాకు ఇంతకు మించి తెలియదు. అందుచేత మీరు ‘సామగానము’ గురించి నేను చెప్పిన ‘స్వర్గలోకము’నకు మించి ఉత్తరోత్తర సత్యము ఏదైనా ఉంటే నాకు బోధించండి. నేను వింటాను.
శిలక శాలావత్య ముని : ఓ! తప్పకుండా! అడగండి. చెపుతాను.
చైకితాయాన దాల్భ్య ముని : అముష్య (స్వర్గ) లోకమునుండి ఆపై గతి ఏది?
శిలక శాలావత్యముని : ఈ భూలోకమే।
చైకితాయాన దాల్భ్య ముని : ఈ (భూ)లోకమునకు తరువాత గతి ఏది? సారాంశము ఏది?
శిలక శాలవత్యముని : సారాంశము సామగానమే. అట్టి సామగానమును ఎవ్వరు లోకమునుండి మరొకచోటికి తీసుకుపోలేరు.
సామగానమును ఈ లోకముననే సిద్ధించుకోవాలి.
సామగాన సారాంశమే ‘పృథివి’.

తగ్ం హ ప్రవాహణో జైవలిరువాచాంతవద్వై కిల తే
శాలావత్య సామ యస్త్వేతర్హి బ్రూయాన్మూర్ధా తే విపతిష్యతీతి
మూర్ధా తే విపతేదితి హంతాహమేతద్భగవతో వేదానీతి
విద్ధీతి హోవాచ .. 1.8.8..

.. ఇతి అష్టమః ఖండః ..
8. తగ్ం హ ప్రవాహణో జైవలిః ఉవాచ
అంతవత్ వై కిల తే శాలావత్య సామ
యస్తు ఏతర్హి బ్రూయాన్ మూర్ధా తే
విపతిష్యతి ఇతి। మూర్ధా తే విపతేత్ ఇతి।।
ప్రవాహణ జైవలి : ఓ శిలక శాలపత్యమునీ! ‘సామగానము’ మరొక రీతిగా విశదీకరించబడుతోంది. ఆ మీరు చెప్పినదానికి మరొక వేరైన వివరణను విన్నవారు ‘‘మీ శిరస్సు నేలవాలుతుంది’’ - అని చెప్పగలరు.
మీ శిరస్సు నేల కూలగలదు. (నీవు వారి అభిప్రాయము ముందు తలవంచవలసి వస్తుంది?)
హంత అహం ఏతత్
భగవతో వేదాని ఇతి
విద్ధి ఇతి హ ఉవాచ।।
శిలక శాలవత్యముని : మహనీయా! ప్రవాహణ జైవలి మునీంద్రా। భగవాన్। మీ దృష్టిలో ఉన్న అట్టి - ఆ పై విద్యాక్రమము ఏమిటో మీరే దయచేసి వివరించండి. నేను శ్రవణము చేసి నేర్చుకోవటానికి సంసిద్ధుడనై ఉన్నాను.
ప్రవాహణ జైవలి : అట్లే చెప్పుతాను. వినండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే అష్టమః ఖండః


1–9. ప్రథమ ప్రపాఠకః - నవమః ఖండః - సామ యొక్క గతి ఆత్మయే!


అస్య లోకస్య కా గతిరిత్యాకాశ ఇతి హోవాచ
సర్వాణి హ వా ఇమాని భూతాన్యాకాశాదేవ సముత్పద్యంత
ఆకాశం ప్రత్యస్తం యంత్యాకాశో హ్యేవైభ్యో జ్యాయానకాశః
పరాయణం .. 1.9.1..
1. అస్య లోకస్య కా గతిః ఇతి?
ఆకాశ ఇతి హ ఉవాచ
సర్వాణి హ వా ఇమాని భూతాని
ఆకాశాత్ ఏవ సముత్పద్యంత।
ఆకాశం ప్రత్యస్తం యన్తి
ఆకాశో హి ఏవ ఏభ్యో జ్యాయాన్
ఆకాశః పరాయణమ్।।
శిలక శాలావత్యముని : ఈ లోకముయొక్క లోకానంతరపు గతి ఏది?

ప్రవాహణ జైవలి : లోకము యొక్క గతి ‘‘ఆకాశము’’. ఎందుకంటే, ఈ జీవులంతా ఆకాశమునుండే పుట్టుచున్నారు. తిరిగి ఆకాశమునందే లీనము అగుచున్నారు.
సమస్తము ఆకాశమునుండే బయల్వెడలుతోంది. కనుక పంచభూతములలో ఆకాశమే తదితర భూ-జల-అగ్ని-వాయువుల కంటే గొప్పది. పెద్దది. శ్రేష్ఠము. ఆకాశమే ఆధారము. అందుచేత ఆకాశతత్త్వమే పరాయణము (శ్రేష్ఠాతిశ్రేష్ఠము).

స ఏష పరోవరీయానుద్గీథః స ఏషోఽనంతః పరోవరీయో
హాస్య భవతి పరోవరీయసో హ లోకాంజయతి
య ఏతదేవం విద్వాన్పరోవరీయాగ్ంసముద్గీథముపాస్తే .. 1.9.2..
2. స ఏష పరోవరీయాన్ ఉద్గీథః।
స ఏషో అనంతః పరోవరీయో
హ అస్య భవతి।
పరోవరీయ, సో హ లోకాన్
జయతి య ఏతత్ ఏవం విద్వాన్
పరోవరీయాగ్ం సముద్గీథమ్ ఉపాస్తే।
అట్టి అత్యంత సూక్ష్మము, శ్రేష్ఠము అగు ఆకాశముకంటే కూడా ఆత్మతత్త్వగాన రూపమగు ‘ఉద్గీథము’ ఎంతో సూక్ష్మము, శ్రేష్ఠము కూడా.

అట్టి ఆత్మ గురించిన ఉద్గీథా వాక్యంగా - ఆత్మ అనంతము!

‘‘అట్టి పరోవరీయమే (పరమాత్మ స్వరూపమే) ఈ సమస్తము అయి ఉన్నది’’ - అని ఎరిగినవాడు దివ్య - (స్వర్గ) లోకముతో సహా సమస్త లోకములను జయించి వేయగలడు.

అట్టి పరోవరీయమ్ (పరమాత్మయే) విద్వాంసులు సముద్గీథము (గానము) చేస్తూ ఉపాసించవలసిన పరాకాష్ఠగా భావిస్తున్నారు.

తగ్ం హైతమతిధన్వా శౌనక ఉదరశాండిల్యాయోక్త్వోవాచ
యావత్త ఏనం ప్రజాయాముద్గీథం వేదిష్యంతే పరోవరీయో
హైభ్యస్తావదస్మిగ్ంల్లోకే జీవనం భవిష్యతి .. 1.9.3..
3. తగ్ం హ ఏతం అతిధన్వా శౌనక ఉదర
శాండిల్యాయ ఉక్త్వా ఉవాచ
యావత్ త ఏనం ప్రజాయాం
ఉద్గీథం వేదిష్యన్తే పరోవరీయో హి ఏభ్యః,
తావత్ అస్మిన్ లోకే జీవనం భవిష్యతి।।
శునక మహాముని కుమారుడు శౌనకుడు - అతిధన్వా నామధేయుడు, ఉదర శాండిల్యునికి ఈ విధంగా బోధిస్తూ - ఇంకా ఇట్లు చెప్పసాగారు.

అట్టి పరోవరీయము ఉద్గీథా గానముగా ఉపాసించుచుండగా వారు పరంపరగా ఉత్తమ జీవనము పొందగలరు. ఈ లోకములో జీవితము యొక్క సార్థకత సిద్ధించుకోగలరు.

తథాముష్మిగ్ంల్లోకే లోక ఇతి స య ఏతమేవం విద్వానుపాస్తే
పరోవరీయ ఏవ హాస్యాస్మిగ్ంల్లోకే జీవనం భవతి
తథాముష్మిగ్ంల్లోకే లోక ఇతి లోకే లోక ఇతి .. 1.9.4..
4. తథా అముష్మిన్ లోకే లోక ఇతి।
స య ఏతత్ ఏవం
విద్వాన్ ఉపాస్తే పరోవరీయ ఏవ హ
అస్య అస్మిన్ లోకే జీవనం భవతి,
తథా అముష్మిన్ లోకే లోక ఇతి,
లోకే లోక ఇతి।।

.. ఇతి నవమః ఖండః ..
అంతేకాదు. అట్టి పరోవరీయోపాసనచే ఆముష్మిక (ఉత్తరోత్తర - స్వర్గ - దివ్య) లోకములలో కూడా కీర్తిమంతులు కాగలరు.

పరోవరీయ ఉద్గీథము (ఆత్మోపాసన) ఎరిగినవారు ఐహిక-ఆముష్మిక లోకములలో విజయము పొంది, లోక-లోకములలో ప్రకాశవంతులై, లోకాతీత స్థానము సిద్ధించుకోగలరు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే నవమః ఖండః


1–10. ప్రథమ ప్రపాఠకః - దశమః ఖండః - యజ్ఞములకు ప్రస్తావ - ప్రతిహర్త దేవతలు ఎవరు?


మటచీహతేషు కురుష్వాటిక్యా సహ జాయయోషస్తిర్హ
చాక్రాయణ ఇభ్యగ్రామే ప్రద్రాణక ఉవాస .. 1.10.1..
1. మటచీ హతేషు కురుషు ఆటిక్యా
సహ జాయయా ఉషస్తిః హ
చాక్రాయణ ఇభ్యగ్రామే
ప్రద్రాణక ఉవాస।।

‘కురు’ అనే దేశంలో ఒకానొక సమయంలో తుఫాను - వడగళ్ళ వానల కారణంగా పంటలన్నీ పాడైపోయినాయి. ఆ దేశంలోగల ‘ఇభ్య’ అనే మావటివారి నివాస గ్రామంలో చక్రాయణుడు అను మరొక పేరుగల ఉషస్తి ముని, ఇంకా యవ్వనము కూడా రాని వారి ధర్మపత్నితో నివసిస్తూ ఉండేవారు.
అది పేదలు నివసిస్తున్న ఒక మారుమూల గల పల్లెటూరు.


స హేభ్యం కుల్మాషాన్ఖాదంతం బిభిక్షే తగ్ం హోవాచ .
నేతోఽన్యే విద్యంతే యచ్చ యే మ ఇమ ఉపనిహితా ఇతి .. 1.10.2..
2. స హ ఏభ్యం కుల్మాషాన్ ఖాదన్తం బిభిక్షే।
తగ్ం హ ఉవాచ ।
న ఏతో అన్యే విద్యన్తే యత్ చ,
యే మ ఇమ ఉపనిహితా ఇతి।।
ఆ ఉషస్తి ముని ఒకరోజు ఒక మావటివాని ఇంటి దగ్గర నిలబడి భిక్షాం దేహి అని భిక్షము అడిగారు.

మావటివాడు : ఓ ఉషస్తి మునీశ్వరా! మీకు తెలుసు కదా, ఇవి కరువుకాటకపు రోజులని! ఇంట్లో ఉలవ గుగ్గిళ్ళు (గుర్రాలకు ఆహారము) (లేక పుచ్చిన మినుగులు) మాత్రమే ఉన్నాయి. మరింకేమీ లేవు. ఈ గుగ్గిళ్ళు మాత్రం ఉడకపెట్టి మీకు ఇవ్వగలను. తీసుకొంటారుగా మరి?
(కుల్మాషము = గుగ్గిళ్ళు, కుడితినీరు)
(మినుగులు - అని కూడా అర్థం చెప్పబడింది)

ఏతేషాం మే దేహీతి హోవాచ తానస్మై ప్రదదౌ
హంతానుపానమిత్యుచ్ఛిష్టం వై మే పీతగ్ంస్యాదితి హోవాచ .. 1.10.3..
3. ఏతేషాం మే దేహి ఇతి। హ ఉవాచ
తాన్ అస్మై ప్రదదౌ హంత
అనుపానమ్ ఇతి ఉచ్ఛిష్టం వై।
‘‘మే పీతగ్ం స్యాత్ ఇతి’’ హ ఉవాచ।।
ఉషస్తి ముని (చక్రాయణుడు) : నాయనా! మీరు కలిగియున్నవే తినటానికి నాకు ఇవ్వండి. నాకు చాలా ఆకలి వేస్తోంది. మీ దగ్గర లేనివాటి గురించి మీరు మాత్రం ఏమిచేస్తారు?

మావటివాడు : అయ్యా! ఇదిగో పుచ్చి ఉన్న ఈ గుగ్గిళ్ళు మీకు సంతోషంగా ఇస్తున్నాను. అయితే త్రాగటానికి మంచినీరు లేదు. మురికి నీరు మాత్రమే ఉన్నది. అవి ఎంగిలివి కూడా! (జంతువులు ఎంగిలి చేసాయి).

ఉషస్తి ముని : బిడ్డా! అట్లాగే! మీరు ఇంట్లో ఏ నీరు త్రాగుచున్నారో, ఆ నీరే ఇవ్వండి. నేను సంతోషంగా త్రాగుతాను. ఎంగిలి నీరైనా కూడా - దాహం తీరుస్తాయా? లేదా? అనేది ముఖ్యం. జగత్తులో ఎంగిలి కానిదేముంటుంది?

న స్విదేతేఽప్యుచ్ఛిష్టా ఇతి న వా
అజీవిష్యమిమానఖాదన్నితి హోవాచ కామో మ
ఉదపానమితి .. 1.10.4..
4. న స్విత్ ఏతే అపి ఉచ్ఛిష్టౌ ఇతి న వా?
ఆజీవిష్యం ఇమాన్ అఖాదన్ ఇతి
హ ఉవాచ।
కామో మ ఉదకపానం ఇతి।

(గుగ్గిళ్ళు తిన్న తరువాత)
‘‘నాయనా! ఆకలి తీర్చటానికి ఉపయోగపడుచూ ఉన్నప్పుడు - ఏ పదార్థమైనా నీచము’ అని, మరొకదానిని ఉచ్చము అని ఎట్లా అంటాము? అందుచేత చక్కగా తిన్నాను. నీవు ఇచ్చిన నీళ్లు కూడా నా దాహం తీర్చింది. నాకు సంతోషము’’ - అని ఆ మావటివానిని ఉషస్తముని ఆశీర్వదించారు.


స హ ఖాదిత్వాతిశేషాంజాయాయా ఆజహార సాగ్ర ఏవ
సుభిక్షా బభూవ తాన్ప్రతిగృహ్య నిదధౌ .. 1.10.5..
5. స హ ఖాదిత్వా అతిశేషాన్ జాయాయా ఆజహార।
సా అగ్ర ఏవ సుభిక్షా బభూవ తాన్ ప్రతిగృహ్య నిదధౌ।
తాను తిన్న తరువాత మిగిలిన కొంచము గుగ్గిళ్ళను భార్య యొక్క ఆహారము కొరకై ఇంటికి తీసుకొనిపోయారు. ఆమె భిక్షము ఎత్తుకొని వచ్చి అప్పటికే ఆహారము భుజించియున్నందువల్ల భర్త తెచ్చిన గుగ్గిళ్ళను ఇంటిలో దాచిపెట్టింది.

స హ ప్రాతః సంజిహాన ఉవాచ యద్బతాన్నస్య లభేమహి
లభేమహి ధనమాత్రాగ్ంరాజాసౌ యక్ష్యతే స మా
సర్వైరార్త్విజ్యైర్వృణీతేతి .. 1.10.6..
6. స హ ప్రాతః సంజిహాన ఉవాచ
యత్ బత అన్నస్య లభేమహి లభేమహి ధనమాత్రామ్
రాజా అసౌ యక్ష్యతే స మా సర్వైః
ఋత్విజైః వృణీత ఇతి।।
ఆ మరునాడు నిదురలేచిన తరువాత ఆ చాక్రాయణ ఉషస్తిముని ఇట్లా పలికారు.

‘‘ఓ భార్యామణీ! ఆహా! మరికొన్ని గుగ్గిళ్ళు ఉంటే బాగుండేది. హాయిగా తినే వాళ్ళం. ఇదంతా ధనం లేక పోవటంవలనే కదా! ధనం సంపాదించదలిచాను. ఈ సమీపంలోగల ఒక ప్రదేశంలో రాజుగారు ఒక యజ్ఞం చేస్తున్నారని విన్నాను. వెళ్లి వారి యజ్ఞ కార్యక్రమములోని ఋత్విజులలో ఒకడినై యజ్ఞ కార్యక్రమమును సేవిస్తాను. వారు నన్ను స్వీకరించవచ్చు కదా! అప్పుడు ఋత్విజ సంభావన రాజుగారు ఇవ్వవచ్చు కదా!"

తం జాయోవాచ హంత పత ఇమ ఏవ కుల్మాషా ఇతి
తాన్ఖాదిత్వాముం యజ్ఞం వితతమేయాయ .. 1.10.7..
7. తం జాయా ఉవాచ
హంత। పత ఇమ ఏవ
కుల్మాషా ఇతి తాన్
ఖాదిత్వా అముం యజ్ఞం వితతం ఏయాయ।।
చక్రాయణ నామధేయ ఉషస్తిముని మాటలకు ఆయన భార్య సంతోషించారు. రాత్రి తాను దాచిపెట్టిన ఉలవచిక్కుళ్ళ గుగ్గిళ్ళు (కుల్మాషములు) తెచ్చి ఇచ్చి, యాగము జరిగేచోటికి వెళ్లి ఋత్విక్కుగా పాల్గొనమని ప్రోత్సాహం చేసారు.
ఆ కుల్మాషములు తిని ఆ ఉషస్తి ముని యజ్ఞము చేయుచున్న చోటికి వెళ్లారు. యజ్ఞకర్తయగు రాజును దర్శించారు.

తత్రోద్గాతౄనాస్తావే స్తోష్యమాణానుపోపవివేశ
స హ ప్రస్తోతారమువాచ .. 1.10.8..
8. తత్ర ఉద్గాతౄన్
ఆస్తావే స్తోష్యమాణ
అనుపోపవివేశ,
స హ ప్రస్తోతారం ఉవాచ।
యజ్ఞ వేదిక వద్ద:-
ఆ తరువాత స్తోత్రములు చేయుచున్న ఉద్గాతలు (ఋత్విక్కుల) మధ్యగా వెళ్లి కూర్చున్నారు.
ఇక యజ్ఞం ఆరంభం కాబోతోంది.
ఉషస్తిముని అక్కడ యజ్ఞ ప్రదేశములో గల ‘ప్రస్తోత’తో ఇట్లు పలికారు.

ప్రస్తోతర్యా దేవతా ప్రస్తావమన్వాయత్తా తాం చేదవిద్వాన్ప్రస్తోష్యసి
మూర్ధా తే విపతిష్యతీతి .. 1.10.9..
9. ప్రస్తోతః యా దేవతా
ప్రస్తావం అన్వాయత్తా
తాం చేత్ అవిద్వాన్ ప్రస్తోష్యసి
మూర్ధా తే విపతిష్యతి ఇతి।।
ఉషస్తిముని : అయ్యా ప్రస్తోతగారూ! మీరు ప్రస్తావం (Introduction) చేస్తూ ఏ దేవతను ప్రస్తుతిస్తున్నారో, తెలుసు కదా? అట్టి ప్రస్తావ దేవతయొక్క తాత్త్విక ప్రయోజనమైన పరమార్థమును తెలుసుకొనియే చేస్తున్నారు కదా? ఒకవేళ ‘ప్రస్తావ దేవత’ పరమార్థమును తెలియకుండానే చేస్తున్నారా ఏమి?
తెలియకుండా, దేవతా స్తుతులు మాత్రం గానం చేస్తూ ఉంటే - మీరు ఎప్పుడో మీ తల దించుకోక తప్పదు.
ప్రస్తావ దేవత తెలియకుండా ఉన్నవారైతే మీ తల ఆ విధంగా తెగి నేలకూలుతుంది.

ఏవమేవోద్గాతారమువాచోద్గాతర్యా దేవతోద్గీథమన్వాయత్తా
తాం చేదవిద్వానుద్గాస్యసి మూర్ధా తే విపతిష్యతీతి .. 1.10.10..
10. ఏవం ఏవ ఉద్గాతారం ఉవాచ
ఉద్గాతః యా దేవత ఉద్గీథం అన్వాయత్తా
తాం చేత్ అవిద్వాన్ ఉద్గాస్యసి,
మూర్ధా తే విపతిష్యతి ఇతి।।
ఆ తరువాత ఉగ్దాతారునివైపు చూచి, ఆ ఉద్గాతారునితో ఇట్లా అన్నారు.

ఓ ఉద్గాతారా! ఏ దేవత గురించి మీరు‘‘ఉద్గీథ గానము’’ చేస్తూ ఉన్నారో, అట్టి దేవత ఎవరో తెలియకుండా (అవిద్వాన్) - గానము మాత్రము చేస్తూ ఉంటే (ఉద్గాస్యసి-కిం) - అప్పుడు మీరు శిరస్సు వంచుకోవలసి వస్తుంది. విదిత వేద్యుల సభలో మీ శిరస్సు తెగి క్రింద పడగలదు.

ఏవమేవ ప్రతిహర్తారమువాచ ప్రతిహర్తర్యా దేవతా
ప్రతిహారమన్వాయత్తా తాం చేదవిద్వాన్ప్రతిహరిష్యసి మూర్ధా తే
విపతిష్యతీతి తే హ సమారతాస్తూష్ణీమాసాంచక్రిరే .. 1.10.11..

.. ఇతి దశమః ఖండః ..
11. ఏవం ఏవ ప్రతిహర్తారమ్ ఉవాచ
ప్రతిహర్తః యా దేవతా ప్రతిహారమ్
అన్వాయత్తా, తాం చేత్
అవిద్వాన్ ప్రతిహరిష్యసి।
మూర్ధా తే విపతిష్యతి ఇతి।।
అటు తరువాత ఉషస్తిముని అక్కడి ప్రతిహర్తారుని స్థానంలో ఆసీనులైన ప్రతివర్తారుని చూచి ఇట్లా పలికారు.

ఓ ప్రతిహర్తార ఋత్విక్కు మహాశయా! మీరు కనుక ప్రతిహర్తార దేవత ఎవరో, పరమార్థమును తెలియకుండా ప్రతిహార (ద్వారపాలక) గానము చేస్తూ ఉంటే (స్వాగత ప్రవచనాలు పలుకుతూ ఉంటే)
- మీరు అవిద్వాంసులై ప్రతీహారము (Punishment) పొందగలరు సుమా! మీరు శిరస్సు దించుకోవలసిన సమయం వస్తుంది, అనగా మీ పాండిత్యపు శిరస్సు తెగిపోగలదు. అందుచేత ప్రతిహర్తార్య దేవతను తెలుసుకొని ఉన్నారని అనుకుంటున్నాను.
తే హ సమారతాః తూష్ణీం
ఆసాంచక్రిరే।।
అట్టి ఉషస్తిముని వాక్యములు విని యజ్ఞకర్త అక్కడ యజ్ఞము నిర్వర్తిస్తున్న వారు, పర్యవేక్షిస్తున్నవారు, ఆ కార్యక్రమంలో ఉపాసకులై పాల్గొనుచున్న వారు - వారంతా కూడా, వారివారి పనులను ఆపి - ఉషస్తిముని ఆసీనులై ఉన్నచోట దృష్టి సారించసాగారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే దశమః ఖండః


1–11. ప్రథమ ప్రపాఠకః - ఏకాదశః ఖండః - ఆదిత్యుడు ప్రస్తావ దేవత, అన్నమే ప్రతిహర్త


అథ హైనం యజమాన ఉవాచ భగవంతం వా అహం
వివిదిషాణీత్యుషస్తిరస్మి చాక్రాయణ ఇతి హోవాచ .. 1.11.1..
1. అథ హ ఏనం యజమాన ఉవాచ-
భగవన్ తం వా అహం వివిదిషాణీ ఇతి।
ఉషస్తిః అస్మి చాక్రాయణ
ఇతి హ ఉవాచ।।
యజ్ఞముయొక్క యజమాని (యజ్ఞకర్త అయిన రాజుగారు):
అయ్యా। భగవాన్। మీరెవ్వరో, ఎందుకు వచ్చారో, ఏమి ఉద్దేశ్యమో ఈ యజ్ఞప్రాంగణ సభకు ముందుగా వివరిస్తూ తెలియజేయమని నా ప్రార్థన.

ఉషస్తిముని : అయ్యా, నేను చక్రాయణ మహర్షి కుమారుడను. చాక్రాయణుడను. ఉషస్తి మునిగా మునుల లోకంలో పిలువబడువాడను.

స హోవాచ భగవంతం వా అహమేభిః సర్వైరార్త్విజ్యైః
పర్యైషిషం భగవతో వా అహమవిత్త్యాన్యానవృషి .. 1.11.2..

భగవాగ్ంస్త్వేవ మే సర్వైరార్త్విజ్యైరితి తథేత్యథ
తర్హ్యేత ఏవ సమతిసృష్టాః స్తువతాం యావత్త్వేభ్యో ధనం
దద్యాస్తావన్మమ దద్యా ఇతి తథేతి హ యజమాన ఉవాచ .. 1.11.3..
2. స హ ఉవాచ -
భగవన్తం వా అహం ఏభిః సర్వైః ఆర్త్విజ్యైః
పర్య ఏషిషం భగవతో వా
అహం అవిత్త్యా అన్యాన్ అవృషి।।
భగవాగ్ంస్త్వ (త్వ) ఏవ మే సర్వైః
ఋత్విజైః ఇతి ।
ఋత్విక్కు (మరియు) యజమాని :
హే భగవాన్। నమో నమః। మీరు ఉద్గీథ గాన దేవత యొక్క తాత్త్వికార్థము ఎరిగి ఉండుటము గురించి ప్రశ్నిస్తున్నారు కదా. సంతోషము. మిమ్ములను ఋత్విజునిగా ఈ యజ్ఞమునకు ఆహ్వానించాలని మేము అనుకొన్నాము. మీ గురించి అన్వేషించి ప్రయత్నించాము కూడా. మీరు మా వార్తాహరులకు దొరకలేదు. అందుచేత వేరే ఋత్విజులను నియమించాము. సరే"! ఇప్పుడు ఈ యజ్ఞమును ఋత్విజులై పర్యవేక్షించవలసినదిగా మా విన్నపము.
3. తథా ఇతి।

అథ తర్హి ఏత ఏవ సమతిసృష్టాః
స్తువతాం యావత్ తేభ్యో ధనం
దద్యాః తావన్ మమ దద్యా ఇతి
తథా ఇతి హ యజమాన ఉవాచ।
ఉషస్తిముని :
భగవాన్। యజమానీ! ఈ యజ్ఞమును నిర్వహించటానికి నేను సిద్ధమే. అందుకు రెండు నియమములు మీరు అంగీకరించెదరు గాక!
(1) నేను ఋత్విజునిగా యజ్ఞము నిర్వహిస్తుండగా ఋత్విజులంతా నేను చెప్పిన రీతిగా, నా ఆధ్వర్యంలో స్తుతిగానములు అర్థము తెలుసుకొంటూ చేయుచుండెదరు గాక।
(2) ఈ ఋత్విజులందరికీ ఎంత ధనము ఇస్తున్నారో, అంతమాత్రమే ధనమును నాకు కూడా ఋత్విజ తాంబూలముగా ఇప్పించండి, అంతకుమించి వద్దు.
యజమాని : మీ రెండు నియమములు నాకు అంగీకారమే.

అథ హైనం ప్రస్తోతోపససాద ప్రస్తోతర్యా దేవతా
ప్రస్తావమన్వాయత్తా తాం చేదవిద్వాన్ప్రస్తోష్యసి మూర్ధా తే
విపతిష్యతీతి మా భగవానవోచత్కతమా సా దేవతేతి .. 1.11.4..
4. అథ హ ఏనం ప్రస్తోత ఉపససాద।
ప్రస్తోతః యా దేవతా ప్రస్తావం
అన్వాయత్తా తాం చేత్ అవిద్వాన్
ప్రస్తోష్యసి, - మూర్ధా తే విపతిష్యతి ఇతి।
మా భగవాన్ అవోచత్
కతమా సా దేవతా? ఇతి।।
ప్రస్తోత (దేవతాహ్వానములను, తదితర మంత్రములను ప్రస్తావన చేస్తూ విస్తరించి సవివరించు ఋత్విక్కు ):-
హే ఉషస్తి భగవాన్! ప్రస్తుతించబడుచున్న దేవత ఎవరో తెలుసుకోకుండా, అవిద్వాంసుడై - ప్రస్తావన (Introductory) గానము చేస్తూ ఉంటే శిరస్సు దించవలసిన సందర్భం వస్తుందని (శిరస్సు ఖండింపబడగలదని) మీరు ఇప్పుడు అని ఉన్నారు కదా! హే భగవాన్! ఈ యజ్ఞములో ఉద్గీథ గానము చేయబడు దేవత ఎవరు? మీకు తెలిసి ఉంటుంది. దయచేసి వివరించండి.

ప్రాణ ఇతి హోవాచ సర్వాణి హ వా ఇమాని భూతాని
ప్రాణమేవాభిసంవిశంతి ప్రాణమభ్యుజ్జిహతే సైషా దేవతా
ప్రస్తావమన్వాయత్తా తాం చేదవిద్వాన్ప్రాస్తోష్యో
మూర్ధా తే వ్యపతిష్యత్తథోక్తస్య మయేతి .. 1.11.5..
5. ‘‘ప్రాణ’’ ఇతి హ ఉవాచ।
సర్వాణి హ వా ఇమాని భూతాని
ప్రాణం ఏవ అభిసంవిశంతి। ప్రాణం అభి ఉజ్జిహతే।
స ఏషా దేవతా ప్రస్తావం అన్వాయత్తా।
తాం చేత్ అవిద్వాన్ ప్రాస్తోష్యో
మూర్ధా తే వ్యపతిష్యత్
తథా ఉక్తస్య మయా ఇతి।।
స్తిముని :

యజ్ఞమునకు ముఖ్యమైన, ముందుగా ప్రస్తావించవలసిన ప్రస్తోత దేవత - ‘‘ప్రాణదేవతయే’’!

ఈ సృష్టిలో కనిపిస్తున్న చరాచరములన్నీ కూడా చివరికి ‘‘ప్రాణశక్తి’’ యందే లయమగుచున్నాయి.
ప్రాణమునందే సృష్టి సమయంలో తిరిగి ఉద్భవిస్తూ ఉన్నాయి.
అందుచేత ప్రస్తావ గానమునకు దేవత ‘‘ప్రాణమే’’। - అని పూజ్యులగు వేదవిదుల నిర్ణయము.

అట్టి ప్రాణదేవత గురించి మీరు తెలుసుకోకుండా (లేదా - ఋత్విక్కుగా నేను సభకు తెలియజేయకుండా), కేవలము ఉద్గీథ గానము నోటితో మాత్రమే పలుకుతూ ఉంటే - అర్థం తెలియకుండా ప్రస్తావ గానమును చదువుతూ ఉంటే అట్టి ఋత్విజుడు ఎప్పటికైనా ఎక్కడో తలవంచుకొని సిగ్గుపడక తప్పదు. అందుచేత ‘‘శిరస్సు తెగిపోగలదు’’ అని నాచే జాగ్రత్త చెప్పబడింది.

అథ హైనముద్గాతోపససాదోద్గాతర్యా దేవతోద్గీథమన్వాయత్తా
తాం చేదవిద్వానుద్గాస్యసి మూర్ధా తే విపతిష్యతీతి
మా భగవానవోచత్కతమా సా దేవతేతి .. 1.11.6..
6. అథ హ ఏనం ఉద్గాత ఉపససాద ఉద్గాతః
యా దేవతా ఉద్గీథం అన్వాయత్తా।
తాం చేత్ అవిద్వాన్ ఉద్గాస్యసి
మూర్ధా తే విపతిష్యతి ఇతి మా భగవాన్
అవోచత్ కతమా సా దేవతా ఇతి।
ఉద్గాత ఋత్విక్కు :
హే చక్రాయణ ఉషస్తిమునివర్యా! ఉద్గానముతో మనము ప్రశంసిస్తున్న (లేక) స్తోత్రము చేయుచున్న (లేక) ప్రస్తావము చేయుచున్న దేవతయొక్క ‘పరార్థము’ (తాత్త్వికార్థము) తెలియకుండానే అవిద్వాంసుడై ఉద్గీథస్తుతి పలుకుతూ ఉంటే - అట్టి అవిద్వాంసుడగు ఉద్గాతగా నా శిరస్సు నేలకూలగలదని మీరు ఇందాక హెచ్చరించారు కదా!

ఇప్పుడు మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాను.

యాగములలో ఉద్గీథగానము చేస్తున్నాము కదా! అట్టి గానము చేయబడుచున్న దేవత ఎవరు? దయచేసి చెప్పండి! నేను మీనుండి ఎరుగుటకు సంసిద్ధుడను.

ఆదిత్య ఇతి హోవాచ సర్వాణి హ వా ఇమాని
భూతాన్యాదిత్యముచ్చైః సంతం గాయంతి సైషా
దేవతోద్గీథమన్వాయత్తా తాం చేదవిద్వానుదగాస్యో
మూర్ధా తే వ్యపతిష్యత్తథోక్తస్య మయేతి .. 1.11.7..
7. ‘‘ఆదిత్య’’ ఇతి హ ఉవాచ
సర్వాణి హ వా ఇమాని భూతాని
ఆదిత్యమ్ ఉచ్చైః సన్తం గాయన్తి!
స ఏషా దేవతా ఉద్గీథం అన్వాయత్తా।
తాం చేత్ అవిద్వాన్ ఉదగాస్యో -
మూర్ధా తే వ్యపతిష్యత్
తథా ఉక్తస్య మయా ఇతి।
ఉషస్తిముని :
అట్టి ఉద్గీథము (లేక) ఉద్గీథ గానము ఉద్దేశ్యించు ప్రస్తావ దేవత ‘‘ఆదిత్యుడు (లేక) సూర్య భగవానుడే’’।
ఆదిత్యుడు ఉదయించగానే ఈ చరాచర ప్రకృతి అంతా, ఈ భూతజాలమంతా కూడా ఉత్తేజితమై నిదుర లేస్తోంది. ఆ సూర్యభగవానుని ఉద్గీథ (మహాత్మ్య) గానము చేస్తూ ‘జాగ్రత్’ను స్వీకరిస్తోంది.

ఈ విషయము ఎరిగి - వేదగానము చేస్తూ యజ్ఞ / యాగ విధానము ప్రారంభం చేయాలి. ‘‘ఈ సూర్యుడే పరమాత్మ’’ అని ఎరుగకుండా, ప్రస్తావ దేవతగా భావించకుండా ప్రస్తావన స్తుతులు గానం చేస్తూ ఉంటే, అట్టివాడు తలవంచవలసి ఉంటుంది. (శిరస్సు తెగి నేలపై పడుతుంది) - అని గుర్తు చేయటానికే ‘‘ప్రస్తోత ప్రస్తావ దైవమును ఎరిగి ఉండాలి’’ - అని నేను చెప్పాను.

అథ హైనం ప్రతిహర్తోపససాద ప్రతిహర్తర్యా దేవతా
ప్రతిహారమన్వాయత్తా తాం చేదవిద్వాన్ప్రతిహరిష్యసి
మూర్ధా తే విపతిష్యతీతి మా భగవానవోచత్కతమా
సా దేవతేతి .. 1.11.8..
8. అథ హ ఏనం ప్రతిహర్తా ఉపససాద ప్రతిహర్తః
యా దేవతా ప్రతిహారం అన్వాయత్తా,
తాం చేత్ అవిద్వాన్ ప్రతిహరిష్యసి,
మూర్ధా తే విపతిష్యతి ఇతి।
మా భగవాన్ అవోచత్
కతమా సా దేవతా ఇతి।
ప్రతిహర్త (అడ్డగించు, విరుద్ధ, విరాస్త, తోసిపుచ్చు చమత్కారి) :
ఓ చక్రాయణ ఉషస్తి మునీశ్వరా! భగవాన్!

‘‘ప్రతిహర్తగా దేవత ఎవరో, దివ్యతత్త్వము ఏమిటో - తెలుసుకోకుండా ప్రతిహర్తగా గానం చేస్తూ ఉంటే, తత్త్వార్థము పట్ల అవిద్వాంసుడై (పరమార్థము తెలియకయే) ప్రతిహారము నిర్వర్తిస్తూ ఉంటే - అప్పుడు తలదించవలసి ఉంటుంది (తల తెగిపడినట్లు అవుతుంది) - అని మీరు అభిప్రాయము చెప్పారు కదా!

అట్టి ప్రతిహర్త (ప్రతిహర) దేవత ఎవరై ఉన్నారో - దయతో వివరించండి. నేను మీ వద్ద ఈ విషయం అధ్యయనుడను అవుతాను.

అన్నమితి హోవాచ సర్వాణి హ వా ఇమాని భూతన్యన్నమేవ
ప్రతిహరమాణాని జీవంతి సైషా దేవతా ప్రతిహారమన్వాయత్తా
తాం చేదవిద్వాన్ప్రత్యహరిష్యో మూర్ధా తే వ్యపతిష్యత్తథోక్తస్య
మయేతి తథోక్తస్య మయేతి .. 1.11.9..
9. ‘‘అన్నం’’ ఇతి హ ఉవాచ।
సర్వాణి హ వా ఇమాని భూతాని
అన్నం ఏవ ప్రతిహరమాణాని జీవన్తి।
స ఏషా దేవతా ప్రతిహారం అన్వాయత్తా
తాం చేత్ అవిద్వాన్ ప్రతిహరిష్యో,
మూర్ధా తే వ్యపతిష్యత్ తథా ఉక్తస్య మయా ఇతి।
తథా ఉక్తస్య మయా ఇతి।

.. ఇతి ఏకాదశః ఖండః ..
ఉషస్తిముని :

అట్టి దేవత ‘‘అన్నము’’. ఎందుకంటే, ఈ చరాచర జీవరాసులంతా అన్నముయొక్క ప్రతిక్రియచేతనే జీవిస్తూ ఉన్నారు కదా।
ప్రతిహార గాన యుక్తము ‘‘అన్నము’’ అని తెలియక గానము చేస్తే, అర్థము తెలియకుండా గానము చేయటం చేత (అవిద్వాంసుడు అవటంచేత) అట్టి ప్రతిహర్యము వలన ఎప్పుడో తలవంచవలసి వస్తుంది. అందుకే తల తెగగలదు, అని నాచేత చెప్పబడింది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే ఏకాదశః ఖండః


1–12. ప్రథమ ప్రపాఠకః - ద్వాదశః ఖండః - శ్వేత శునకములు సామగానం చేయుట


అథాతః శౌవ ఉద్గీథస్తద్ధ బకో దాల్భ్యో గ్లావో వా
మైత్రేయః స్వాధ్యాయముద్వవ్రాజ .. 1.12.1..
1. అథ అతః శౌవ ఉద్గీథః।

తద్ధ బకో దాల్భ్యో గ్లావో వా మైత్రేయః
స్వాధ్యాయం ఉద్వవ్రాజ।।
(అర్థము / దేవతయొక్క తత్త్వార్థము తెలియకుండా ఉద్గీథ గానము చేయటం విషయంలో) - కుక్కలు కూడా ఉద్గీథ గానము చేయగలవు కూడా!
ఒకప్పుడు దాల్భ్య బకముని మైత్రేయ గ్లావ ఋషి దగ్గిరకు వెళ్లి అక్కడ ఆశ్రమంలో స్వాధ్యాయము చేయనారంభించారు. అక్కడి గ్రామ సమీపంలోగల ఆశ్రమంలో వేదములు అభ్యసించసాగారు.

తస్మై శ్వా శ్వేతః ప్రాదుర్బభూవ తమన్యే శ్వాన
ఉపసమేత్యోచురన్నం నో భగవానాగాయత్వశనాయామవా
ఇతి .. 1.12.2..
2. తస్మై శ్వా శ్వేతః ప్రాదుః బభూవ।

తం అన్యే శ్వాన ఉపసమ ఇతి ఊచుః

అన్నం నో భగవాన్।
అగాయతి అశనాయామ వా ఇతి।।
కుక్కల (శ్వా-శ్వేతః) రూపందాల్చి అక్కడికి తెల్లటి కుక్కల రూపంలో వేదగాన దేవతలు వచ్చారు.

అక్కడ ఒక తెల్లటి కుక్క వేదాధ్యయనులను సమీపించి ఇట్లా పలకసాగింది -

ఓ దివ్యవేదాధ్యయన దేవతలారా! మాకు ఆకలి వేస్తోంది. అన్నము ఇప్పించండి. మీకు వశముగా ఉండి మేము కూడా గానం చేస్తాము

తాన్హోవాచేహైవ మా ప్రాతరుపసమీయాతేతి తద్ధ బకో దాల్భ్యో
గ్లావో వా మైత్రేయః ప్రతిపాలయాంచకార .. 1.12.3..
3. తాన్ హ ఉవాచ
ఇహ ఏవ మా ప్రాతః
ఉపసమీయాత -ఇతి।
తత్ హ బకః దాల్భ్యో గ్లావో వా మైత్రేయః
ప్రతిపాలయాంచకార।
ఉద్గీథ దేవతా శ్వేత శునకములు ఇట్లు చెప్పెను -
‘‘రేపు ఉదయం మా దగ్గరకు రండి’’.

బకముని (దాల్భ్య బకముని), మైత్రేయ గ్లావ ఋషి ఆ సమీపమున వేచి ఉండసాగారు (నిరీక్షించసాగారు). ఉద్గీథమును గానము చేస్తున్న శ్వేత శునకరూప గానదేవతలను గమనిస్తూ ఉండసాగారు.

తే హ యథైవేదం బహిష్పవమానేన స్తోష్యమాణాః సగ్ంరబ్ధాః
సర్పంతీత్యేవమాససృపుస్తే హ సముపవిశ్య
హిం చక్రుః .. 1.12.4..
4. తే హ యథ ఏవ ఇహ బహిః పవమానేన
స్తోష్యమాణాః సగ్ంరబ్ధాః
సర్పన్తి ఇతి ఏవం ఆససృపుః
తే హ సముపవిశ్య హిం చక్రుః।
ఆ దేవతా శునకములు ఋత్విక్కులు గానం చేసే విధంగానే - అవయవములు త్రిప్పుతూ, మధురంగా ఉద్గీథగానము చేయసాగాయి. ఆ తరువాత ఆ శునకములు మంత్రములు చెప్పుచూ కూర్చుండిపోయాయి.
‘‘ఓ యజ్ఞపురుషుడా! ఓ యాగకర్తా। నమస్కారము।
ఓం। మమ్ములను ‘అన్నము’ తిననీయండి.
‘ఓం’। పానీయములు త్రాగనీయండి
అని సమీపమున కూర్చుని అర్థించసాగాయి.

ఓ3మదా3మోం3పిబా3మోం3 దేవో వరుణః ప్రజపతిః
సవితాఽన్నమిహాఽహరదన్నపతే3ఽన్నమిహాఽహరాఽహరో3మితి .. 1.12.5..

.. ఇతి ద్వాదశః ఖండః ..
5. ఓం ఆదామ ఓం పిబామ
ఓం దేవో వరుణః, ప్రజాపతిః,
సవితా, అన్నం ఇహ ఆహరత్
అన్నపతే! అన్నం
ఇహ ఆహర ఆహర ఓం ఇతి।
ఓం। మమ్ములను ఆహారము తిననీయండి. త్రాగనీయండి. పాడనీయండి।
దేవదేవుడగు వరుణ భగవానుడు, ప్రజాపతి, సవిత్రు (సూర్య) దేవుడు మాకు అన్నమును ప్రసాదించెదరు గాక।
ఓ అన్నదేవతా! అన్నపూర్ణాదేవీ! మీరు మాకు అన్నము చేకూర్చండి. ఇక్కడ మేమున్నచోటనే ప్రసాదించండి. మాకు అన్నమును సమకూర్చమని అభ్యర్థన। ఇక్కడకు తెమ్ము! తెమ్ము! ఓం - ఇతి।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ప్రథమాధ్యాయే ద్వాదశః ఖండః


1–13. ప్రథమ ప్రపాఠకః - త్రయోదశః ఖండః - సామగాన స్వరములకు దేవతలు


అయం వావ లోకో హాఉకారః వాయుర్హాఇకారశ్చంద్రమా
అథకారః . ఆత్మేహకారోఽగ్నిరీకారః .. 1.13.1..
1. అయం వావ లోకో ‘హా’ ‘ఉ’కారః - వాయుః।
‘హా’ ‘ఇ’కారః చన్ద్రమా అథకారః।
ఆత్మా ‘‘ఇహ’’కారో।
అగ్నిః ఈకారః।
ఈ లోకము ‘హా’ ‘ఉ’కారము.
వాయువు ‘హా’ ‘ఇ’కారము.
చంద్రుడు ‘అథ’ కారము
ఆత్మ (జీవాత్మ) (ఇహ) ‘ఇ’ కారము
అగ్ని ‘ఈ’ కారము.

ఆదిత్య ఊకారో నిహవ ఏకారో విశ్వే దేవా
ఔహోయికారః ప్రజపతిర్హింకారః ప్రాణః స్వరోఽన్నం యా
వాగ్విరాట్ .. 1.13.2..
2. ఆదిత్య ‘ఊ’ కారః।
నిహవ ‘ఏ’కారః।
విశ్వేదేవా ఔహోయికారః।
ప్రజాపతిః ‘హిం’కారః।
ప్రాణః స్వరో।
అన్నం యా।
వాక్ విరాట్।
ఆదిత్యుడు - ‘ఊ’ కారము
నిహవము (ప్రార్థన) - ‘ఏ’ కారము
విశ్వేదేవతలు - ‘ఔ’ ‘హో’ ‘ఇ’కారములు
ప్రజాపతి - ‘హిం’ కారము
ప్రాణము - స్వరము
అన్నము - ‘యా’ అనే స్తోభయందు భాసించవలెను (ప్రాణమును నిలుపునది)
విరాట్ - వాక్కు

అనిరుక్తస్త్రయోదశః స్తోభః సంచరో హుంకారః .. 1.13.3..
3. అనిరుక్తః త్రయోదశః
స్తోభః సంచరో ‘హుం’కారః।
‘హుం’కారము అనిర్వాచ్యమగు (That which cannot be told by speaking) 13వ అక్షరము - స్తోభ.
స్తోభ = ‘హుం’ కార సంచారము, అనిర్వాచ్యము, వాక్కుకు అందనిది.

దుగ్ధేఽస్మై వాగ్దోహం యో వాచో దోహోఽన్నవానన్నాదో భవతి
య ఏతామేవగ్ంసామ్నాముపనిషదం వేదోపనిషదం వేదేతి .. 1.13.4..

.. ఇతి త్రయోదశః ఖండః ..

.. ఇతి ప్రథమోఽధ్యాయః ..
4. దుగ్ధే అస్మై ‘వాక్’ దోహం యో వాచో
దోహో అన్నవాన్, అన్నాదో భవతి
య ఏతాం ఏవగ్ం సామ్నాం ఉపనిషదం వేద।
ఉపనిషదం వేద।। ఇతి।।
అట్టి సామగానము చేయువారు పాలవలె మధురము అగు అమృతరూపము సంతరించుకోగలరు.
అట్టి వారికి అన్నము అధికముగా లభించగలదు.
ఆతడు అన్నమును (ఇంద్రియములతో ఇంద్రియ విషయములను) తృప్తిగా భుజించగలడు.
పవిత్రమగు సామగానము చేయువారు పూతాత్ములు (నిర్మలాత్ములు). ఈ ఉపనిషత్ ఎరిగినవారు ధన్యులు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమోధ్యాయే త్రయోదశః ఖండః

🌺 ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమోఽధ్యాయః సమాప్తః 🌺


సామవేదాంతర్గత

Ⅱ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - రెండవ అధ్యాయము

2–1. ద్వితీయ ప్రపాఠకః - ప్రథమః ఖండః - సమస్త సామోపాసన


.. ద్వితీయోఽధ్యాయః ..

సమస్తస్య ఖలు సామ్న ఉపాసనగ్ం సాధు యత్ఖలు సాధు
తత్సామేత్యాచక్షతే యదసాధు తదసామేతి .. 2.1.1..
1. ఓం। సమస్తస్య ఖలు సామ్న ఉపాసనగ్ం సాధు।



యత్ ఖలు సాధు తత్ సామ ఇతి ఆచక్షతే।


యత్ అసాధు తత్ అసామ ఇతి।
సామ ఉపాసన గురించి ఎరిగియున్న సాధు పురుషులకు నమస్కారము.
పరమాత్మతత్త్వము ఎరుగుచూ, స్తుతిస్తూ గానము చేయటమే ‘‘సామగానము’’.
సమస్త ఉపాసనలలో ‘‘సామోపాసన’’ శుభప్రదము.

ఎదైతే సాధువో (దైవీగుణములో, అమానిత్యాది జ్ఞాన లక్షణములు, అద్వేష్టాది భక్తినిర్వచములు) - అదంతా సామమే। మనము చేస్తున్న సామగానమే!

ఏది శాస్త్రముల చేత, అనుభవజ్ఞులగు పెద్దల చేత, సహజములగు సాత్విక జనుల చేత ‘‘అసాధు’’ (Not Appropriate) అనబడుచున్నదో అదంతా ‘‘అసామమే!’’

తదుతాప్యాహుః సామ్నైనముపాగాదితి సాధునైనముపాగాదిత్యేవ
తదాహురసామ్నైనముపాగాదిత్యసాధునైనముపగాదిత్యేవ
తదాహుః .. 2.1.2..
2. తత్ ఉత అపి ఆహుః
సామ్న ఏనమ్ ఉపాగాత్ ఇతి।
‘సాధున ఏనం ఉపాగాత్’, ఇతి ఏవ।
ఎవ్వరైనా, ‘‘సామగానముతో అభ్యర్థిస్తున్నారు. విన్నవిస్తున్నారు’’ - అని చెప్పితే అట్టివారు ‘‘సద్బుద్ధితోనే అది అడుగుచున్నారు’’ - అని గమనించాలి. గ్రహించాలి. వారు త్యాగబుద్ధితోనే అడుగుచున్నారని అనుకోబడుతోంది.
తత్ ఆహుః అసామ్న ఏనం ఉపాగాత్ ఇతి।
అసాధు న ఏనం ఉపాగాత్ ఇతి ఏవ - తత్ ఆహుః।।
అట్లా కాకుండా, ఎవ్వరైనా ‘‘ఆయన అసామగానముతో అది అడుగుచున్నారు’’ - అని చెప్పితే, దాని అర్థం - ‘‘అట్టివారు సంకుచితమగు, స్వార్థపూరితమగు, కామపూరితమగు బుద్ధితో మాత్రమే అడుగుచున్నారు’’ - అని గ్రహించాలి.

అథోతాప్యాహుః సామ నో బతేతి యత్సాధు భవతి సాధు బతేత్యేవ
తదాహురసామ నో బతేతి యదసాధు భవత్యసాధు బతేత్యేవ
తదాహుః .. 2.1.3..
3. అథ ఉత అపి ఆహుః
సామ నో బత ఇతి
యత్ - సాధు భవతి।।
సాధు బత ఇతి ఏవ తత్ ఆహుః
అసామ నో బత ఇతి
యత్ అసాధు భవతి,
అసాధు బత ఇతి ఏవ తత్ ఆహుః।।
‘‘ఇదిగో, ఇది సామగానము. ఇది సామనము (సకల జనుల శ్రేయస్సును తమ దృష్టిలో కలిగియున్న మనస్సు). ఈ గాన శ్రవణము (సంభాషణ, శ్రవణము), సద్బుద్ధితో గానము - శ్రవణము పుణ్యప్రదము. ఇది ‘సాధు’.

సామ ఇంద్రియానము (లేక) లోకసంబంధమైన ఆనందము ఆశయముగా కలిగినది ‘అసాధు’ అగుచున్నది.

కామ్యబుద్ధితో, పాపము కలిగించునది అయి ఉన్నదంతా ‘అసాధు’ - ‘అసామ’। ఏది ‘సాధు’యో, ఏది ‘అసాధు’యో గ్రహించి ఉండాలి.

స య ఏతదేవం విద్వానసాధు సామేత్యుపాస్తేఽభ్యాశో హ యదేనగ్ం
సాధవో ధర్మా ఆ చ గచ్ఛేయురుప చ నమేయుః .. 2.1.4..

.. ఇతి ప్రథమః ఖండః ..
4. స య ఏతత్ ఏవం
విద్వాన్ సాధు ‘సామ’
ఇతి ఉపాస్తే, అభ్యాశో,
హ యత్ ఏనగ్ం సాధవో
ధర్మా ఆ చ గచ్ఛేయుః
ఉప చ నమేయుః।।
ఎవరైతే ‘సాధు’, ‘అసాధు’ అగుచున్న గానములేవో గ్రహించి, వివేకి అయి, విద్వాంసుడై ‘సామ’ను ఉపాసిస్తాడో, అభ్యాసం చేస్తాడో అట్టి సాధు - ధర్మ-ఆచరణను ఆశ్రయిస్తూ సర్వశుభములను, సంపదలను పొందుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ప్రథమః ఖండః


2–2. ద్వితీయ ప్రపాఠకః - ద్వితీయః ఖండః - పంచవిధ పృథివి సామోపాసన


లోకేషు పంచవిధగ్ం సామోపాసీత పృథివీ హింకారః .
అగ్నిః ప్రస్తావోఽన్తరిక్షముద్గీథ ఆదిత్యః ప్రతిహారో
ద్యౌర్నిధనమిత్యూర్ధ్వేషు .. 2.2.1..
1. లోకేషు పంచవిధగ్ం
సామా ఉపాసీత।

లోకంలో ‘‘సామము’’ - యొక్క ఐదు (5) విధములైన ‘ఉపాసన’
(1) ‘హిం’ ఆహ్వానము (Welcome)
(2) ప్రస్తావము (Introduction)
(3) ఉద్గీథము - మహిమ స్తుతి (Literary description)
(4) ప్రతిహారము - వ్యతిరిక్త ఖండనము
(5) నిధనము (సమాప్తి - End up / Conclusion)
పృథివీ ‘హిం’కారః।
అగ్నిః ‘ప్రస్తావో’
అన్తరిక్షం ‘ఉద్గీథ’।
ఆదిత్యః ‘‘ప్రతిహారో’’
ద్యౌః ‘‘నిధనం’’।
ఇతి ఊర్ధ్వ ఏషు।
పృథివి పంచవిధ సామోపాసనా!
(1) పృథివి - ‘హిం’ కారము (ఆహ్వానము)
(2) అగ్ని - ప్రస్తావము (దేవత గురించి ప్రస్తావించటము)
(3) అంతరిక్షము (ఆకాశము) - ఉద్గీథము (ఔన్నత్య వర్ణనము)
(4) ఆదిత్యుడు - ప్రతిహారము (వ్యావిరిక్తభావముల ఖండనము)
(5) ద్యౌః (ద్యులోకము, దేవతాలోకము, స్వర్గలోకము) - నిధనము (సమాప్తి)
ఈ విధంగా తెలుసుకొని ఉపాసిస్తూ ఈ జీవుడు ఊర్ధ్వగతులను ఊర్ధ్వస్థానములను సిద్ధించుకోగలడు.

అథావృత్తేషు ద్యౌర్హింకార ఆదిత్యః
ప్రస్తావోఽన్తరిక్షముద్గీథోఽగ్నిః ప్రతిహారః పృథివీ
నిధనం .. 2.2.2..
2. అథ ఆవృత్తేషు
ద్యౌః ‘హిం’ కార।
ఆదిత్యః ‘‘ప్రస్తావో’’
అన్తరిక్షం ‘‘ఉద్గీథో’’
అగ్నిః ‘‘ప్రతిహారః’’
పృథివీ ‘‘నిధనమ్’’
ఇప్పుడిక ఆవృత్తమునందు (తిరిగి నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు) (లేక) అనుక్రమమునందు
(1) ద్యులోకము స్వర్గలోకము యొక్క స్వరము - ‘హిం’కార ఉపాసన
(2) ఆదిత్యము యొక్క స్వరము - ‘‘ప్రస్తావ’’ ఉపాసన
(3) ఆకాశము (అంతరిక్షము) యొక్క స్వరము - ‘ఉద్గీథ’ ఉపాసన
(4) అగ్ని యొక్క స్వరము - ‘ప్రతిహార’ ఉపాసన
(5) భూమి యొక్క స్వరము - ‘‘నిధన’’ ఉపాసన

కల్పంతే హాస్మై లోకా ఊర్ధ్వాశ్చావృత్తాశ్చ య ఏతదేవం
విద్వాగ్ంల్లోకేషు పంచవిధం సామోపాస్తే .. 2.2.3..

.. ఇతి ద్వితీయః ఖండః ..
3. కల్పన్తే హ అస్మై లోకా
ఊర్ధ్వాశ్చ, ఆవృత్తాశ్చ
య ఏతత్ ఏవం విద్వాన్ లోకేషు
పంచవిధం సామా ఉపాస్తే।।
ఈవిధంగా ఊర్ధ్వలోకములను (కిందనుంచిపైకి), ఆవృత్తములను (పైనుండి క్రిందికి) - స్వరములను గురించి తెలుసుకొని సామగానమును ‘5’ (పంచ) విధములుగా ఉపాసిస్తున్నారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ద్వితీయః ఖండః


2–3. ద్వితీయ ప్రపాఠకః - తృతీయః ఖండః - పంచవిధ సామగాన ‘‘వృష్టి’’ ఉపాసన


వృష్టౌ పంచవిధగ్ం సామోపాసీత పురోవాతో హింకారో
మేఘో జాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీథో విద్యోతతే
స్తనయతి స ప్రతిహార ఉద్గృహ్ణాతి తన్నిధనం .. 2.3.1..
1. పృష్టౌ పంచవిధగ్ం
సామా ఉపాసీత।
పురోవాతో ‘హిం’ కారో
మేఘో జాయతే స ప్రస్తావో
వర్షతి స ఉద్గీథో
విద్యోతతే స్తనయతి।
స ప్రతిహారః।
వృష్టులు (కురిపించటము) 5 విధములగు సామములుగా ఉపాసించ బడుగాక।
(1) తూర్పు వాయువు - ‘హిం’కారోపాసనగా
(2) మేఘమును - ‘ప్రస్థాన’ ఉపాసనగా
(3) వర్షమును - ‘ఉద్గీథము’ ఉపాసనగా
(4) మెఱుపులను, పిడుగులను - ‘ప్రతిహార’ ఉపాసనగా
ఉపాసించబడు గాక!

వర్షతి హాస్మై వర్షయతి హ య ఏతదేవం విద్వాన్వృష్టౌ
పంచవిధగ్ంసామోపాస్తే .. 2.3.2..

.. ఇతి తృతీయః ఖండః ..
2. ఉత్ గృహాణాతి తత్ ‘నిధనమ్’।


వర్షతి హ అస్మై వర్షయతి హ
య ఏతత్ ఏవం
విద్వాన్ వృష్టౌ
పంచవిధగ్ం సామా ఉపాస్తే।
(5) ఉపసంహారము (లేక) విరమించటమును - నిధనముగాను,
గానము చేస్తూ ఉపాసించబడుతోంది.

ఈ విధంగా వృష్టిని (వర్షమును) ప్రకృతియొక్క మహత్తరమైన ప్రసాదముగాను, పరమాత్మయొక్క కరుణా రసముగాను విద్వాంసులచే ఉపాసించబడుచున్నది.
ఇది విద్వాంసుల యొక్క ‘వృష్టిరూప పంచవిధ సామోపాసన।’

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే తృతీయః ఖండః


2–4. ద్వితీయ ప్రపాఠకః - చతుర్థః ఖండః - పంచవిధ జల సామోపాసన


సర్వాస్వప్సు పంచవిధగ్ంసామోపాసీత మేఘో యత్సంప్లవతే
స హింకారో యద్వర్షతి స ప్రస్తావో యాః ప్రాచ్యః స్యందంతే
స ఉద్గీథో యాః ప్రతీచ్యః స ప్రతిహారః
సముద్రో నిధనం .. 2.4.1..
1. సర్వాన్ అప్సు పంచ
విధగ్ం సామా ఉపాసీత।
మేఘో యత్ సంప్లవతే స ‘‘హింకారః’’।
యత్ వర్షతి స ప్రస్తావో
యాః ప్రాచ్యః స్యన్దంతే స ఉద్గీథో
యాః ప్రతీచ్యః స ‘‘ప్రతిహారః’’।
స సముద్రో ‘నిధనమ్’।
సమస్త జలములను ‘5’ విధములుగా ‘సామగానోపాసన’ చేయుదురు గాక।
(1) మేఘముల సమూహము రూపుదిద్దుకోవటము - ‘హిం’కారోపాసన।
(2) వర్షించటము - ప్రస్తావోపాసన।
(3) జలము ప్రాచీ (తూర్పు) దిశగా ప్రవహించటము - ఉద్గీథము
(4) జలము ప్రతీచ్యదిశగా (పడమట - ప్రవహించటము) - ప్రతిహారము
(5) సముద్రమే - నిధనము (సమాప్తి)

న హాప్సు ప్రైత్యప్సుమాన్భవతి య ఏతదేవం విద్వాన్సర్వాస్వప్సు
పంచవిధగ్ంసామోపాస్తే .. 2.4.2..
2. స హ అప్సు ప్రైత్యప్సుమాన్ భవతి
య ఏతత్ ఏవం విద్వాన్ సర్వాః
అప్సు పంచ విధగ్ం సామా ఉపాస్తే।।

.. ఇతి చతుర్థః ఖండః ..
ఈ విధంగా ‘పంచసామోపాసన’ గురించి ఎరిగియున్నవాడు, జలోపాసన చేయుచున్నవాడై ‘జలపంచ సామము’ తత్త్వము ఎరిగియున్న విద్వాంసుడగుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే చతుర్థః ఖండః


2–5. ద్వితీయ ప్రపాఠకః - పంచమః ఖండః - పంచవిధ ఋతు సామోపాసన


ఋతుషు పంచవిధగ్ం సామోపాసీత వసంతో హింకారః
గ్రీష్మః ప్రస్తావో వర్షా ఉద్గీథః శరత్ప్రతిహారో
హేమంతో నిధనం .. 2.5.1..
1. ఋతుషు పంచవిధగ్ం - సామా ఉపాసీత।
వసన్తో ‘హిం’కారః।
గ్రీష్మః ‘‘ప్రస్తావో’’
వర్షా ‘‘ఉద్గీథః’’।
శరత్ ‘‘ప్రతిహారః’’।
హేమన్తః ‘‘నిధనమ్’’।
ఋతువులను పంచ (5) విధములైన సామోపాసన నిర్వర్తించెదరుగాక।
(1) వసంత ఋతువు → ‘హిం’కారోపాసన
(2) గ్రీష్మ ఋతువు → ప్రస్తావనోపాసన
(3) వర్ష ఋతువు → ఉద్గీథము
(4) శరత్ ఋతువు → ప్రతిహారము
(5) హేమన్తము → నిధనము (ఉపసంహారము/సమాప్తి)
(గమనిక - ఇక్కడ సంవత్సరమును ఆరు కాకుండా ఐదు ఋతువులుగా చెప్పబడెను.)

కల్పంతే హాస్మా ఋతవ ఋతుమాన్భవతి య ఏతదేవం
విద్వానృతుషు పంచవిధగ్ం సామోపాస్తే .. 2.5.2..

.. ఇతి పంచమః ఖండః ..
2. కల్పన్తే హ అస్మా ఋతవ
ఋతుమాన్ భవతి,
య ఏతత్ ఏవం విద్వాన్ ఋతుషు,
పంచవిధగ్ం సామా ఉపాస్తే।
ఎవ్వరైతే వసంత - గ్రీష్మ - వర్ష - శరత్ - హేమన్త ‘పంచ’ (5) ఋతువులను సామము యొక్క ‘హిం’కార, ప్రస్తావన, ఉద్గీథ ప్రతిహార - నిధనములుగా తెలుసుకొని విద్వాంసులై ‘పంచ ఋతు సామగానము’ను ఉపాసిస్తారో - వారు ఋతువులచే రక్షించబడి, ఋతువులలోని ఆయా సంపదలు పొందగలరు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే పంచమః ఖండః


2–6. ద్వితీయ ప్రపాఠకః - షష్ఠః ఖండః - పంచవిధ పశు సామోపాసన


పశుషు పంచవిధగ్ం సామోపాసీతాజా హింకారోఽవయః
ప్రస్తావో గావ ఉద్గీథోఽశ్వాః ప్రతిహారః
పురుషో నిధనం .. 2.6.1..
1. పశుషు పంచవిధగ్ం
సామా ఉపాసీత।
అజా ‘‘హిం’’కారో
అవయః ‘‘ప్రస్తావో’’
గావ ‘‘ఉద్గీథో’’
అశ్వాః ‘‘ప్రతిహారః’’
పురుషో ‘‘నిధనమ్’’।
పశువుల గురించిన పంచ (5) విధ సామోపాసన ఈ విధంగా ఉంటుంది.
(1) అజములు (మేకలు) - ‘హిం ’కారోపాసన।
(2) అవయములు (గొఱ్ఱెలు) - ప్రస్తావోపాసన।
(3) గోవులు (ఆవులు) - ఉద్గీథోపాస।
(4) అశ్వములు (గుఱ్ఱములు) - ప్రతిహారోపాసన।
(5) పురుషుడు (మానవుడు) - నిధనము (సమాప్తి)

భవంతి హాస్య పశవః పశుమాన్భవతి య ఏతదేవం
విద్వాన్పశుషు పంచవిధగ్ం సామోపాస్తే .. 2.6.2..
2. భవన్తి హ అస్మా పశవః
పశుమాన్ భవతి -
య ఏతత్ ఏవం విద్వాన్
పశుషు పంచ విధగ్ం సామా ఉపాస్తే।।

.. ఇతి షష్ఠః ఖండః ..

ఇట్టి పంచవిధ పశు సామోపాసన ఎరిగి, నిర్వర్తించువాడు సమృద్ధియగు పశుసంపద పొందగలడు.
అట్టి ‘‘పంచవిధ పశు సామోపాస’’ ఎరిగినవాడు లోటు లేనివాడై ఉంటాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే షష్ఠః ఖండః


2–7. ద్వితీయ ప్రపాఠకః - సప్తమః ఖండః - ఇంద్రియ సామోపాసన


ప్రాణేషు పంచవిధం పరోవరీయః సామోపాసీత ప్రాణో
హింకారో వాక్ప్రస్తావశ్చక్షురుద్గీథః శ్రోత్రం ప్రతిహారో
మనో నిధనం పరోవరీయాగ్ంసి వా ఏతాని .. 2.7.1..
1. ప్రాణేషు పంచవిధగ్ం
పరోవరీయః సామా ఉపాసీత।
ప్రాణో ‘‘హిం’’ కారో
వాక్ ‘‘ప్రస్తావః’’।
చక్షుః ఉద్గీథః। శ్రోత్రం ‘‘ప్రతిహారః’’।
మనో ‘నిధనం’ పరోవరీయాగ్ంసి వా ఏతాని।।
పంచవిధ పరోవరీయ (శ్రేష్ఠి) సామోపాసన
పరోవరీయోపాసన (లేక) పంచవిధ (శ్రేష్ఠాతిశ్రేష్ఠ) సామోపాస ఈ విధమైనది.
(1) ప్రాణము → ‘హిం’కార ఉపాసన।
(2) వాక్ (మాట్లాడటం) → ప్రస్తావనోపాసన।
(3) చక్షువులు (కన్నులు) → ఉద్గీథోపాసన
(4) శ్రోత్రములు (చెవులు) → ప్రతిహారోపాసన
(5) మనస్సు → నిధనము (సమాప్తి ముగింపు)
ఇవి ‘‘పరోవరీయ పంచవిధ సామోపాసనలు’’.

పరోవరీయో హాస్య భవతి పరోవరీయసో హ లోకాంజయతి
య ఏతదేవం విద్వాన్ప్రాణేషు పంచవిధం పరోవరీయః
సామోపాస్త ఇతి తు పంచవిధస్య .. 2.7.2..

.. ఇతి సప్తమః ఖండః ..
2. పరోవరీయో హ అస్య భవతి।
పరోవరీయసో హ లోకాన్ జయతి।
య ఏతత్ ఏవం విద్వాన్ ప్రాణేషు
పంచవిధం పరోవరీయః
సామా ఉపాస్త
ఇతి తు పంచవిధస్య।।
అట్టి పంచవిధ పరోవరీయ సామోపాసన ఎరిగినవాడు, ధ్యానము చేయువాడు లోకాలు జయించివేయగలడు. (లోకములలో నేను ఉన్నాను. లోకాలు నాలో అదే సమయంలో ఉన్నాయి - అను) సిద్ధిని పొందగలడు.
అట్టి ‘‘ప్రాణేషు పంచవిధ పరః పరీయ సామోపాసన’’చే విద్వాంసుడై దివ్యలోకప్రవేశమునకు అర్హులౌతారు.
పంచవిధ ఉపాసన, సర్వదా ఉత్తమ ప్రయోజనము ప్రసాదించగలదు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే సప్తమః ఖండః


2–8. ద్వితీయ ప్రపాఠకః - అష్టమః ఖండః - ‘వాచి (వాక్)’ సప్తవిధ సామోపాసన


అథ సప్తవిధస్య వాచి సప్తవిధగ్ం సామోపాసీత
యత్కించ వాచో హుమితి స హింకారో యత్ప్రేతి స ప్రస్తావో
యదేతి స ఆదిః .. 2.8.1..
1. అథ సప్తవిధస్య వాచి
సప్తవిధగ్ం సామా ఉపాసీత।
యత్ కించ వాచో
హుం ఇతి స ‘‘హింకారః’’।
యత్ ప్ర ఇతి స ‘‘ప్రస్తావో’’
యత్ ఏతి స ‘‘ఆదిః’’।
‘‘7’’ విధముల వాచి (వాక్కు) - ‘‘సప్తవిధ సామోపాసన’’ గురించి ఉపాసన కొరకై చెప్పుకుంటున్నాము.
1. ఏది ‘హుం’ అని ఏ కొంచము కూడా అయి, అనబడుచున్నదో → అది ‘హిం’కారము. (వాక్కులో ‘హుమ్’ అను స్వరమే ‘హిం’కారము)
2. ‘‘ప్ర’’ అను స్వరము → అది ‘ప్రస్తావము’.
3. ఏది ‘అ’ ఆదియో → అదియే ‘ఆది’. (That is at the begining of all else).
‘‘అ’’ - అను స్వరమే - ఆది। అదియే ‘‘ఓం’’.

యదుదితి స ఉద్గీథో యత్ప్రతీతి స ప్రతిహారో
యదుపేతి స ఉపద్రవో యన్నీతి తన్నిధనం .. 2.8.2..
2. యత్ ఉత్ ఇతి - స ‘‘ఉద్గీథో’’
యత్ ‘ప్రతి’ ఇతి స ‘‘ప్రతిహారో’’
యత్ ఉప ఇతి స ఉపద్రవో
యత్ ‘ని’ ఇతి తత్ ‘‘నిధనమ్’’।
4. ఏ ఉత్ (ఆది నుండి - ఆదికి అనన్యంగా) బయల్వెడలుచున్నదో (జలము నుండి తరంగంలా) → అది ‘ఉద్గీథము’. ఉత్ అను స్వరమే ఉద్గీథము.
5. ఏది ప్రతి అయి ఉన్నదో - ఈ కనబడే దానికి వేరై విడిగా ఉన్నదో → అది ‘ఆది’. ‘‘ప్రతి’’ - అను స్వరమే ‘‘ప్రతిహారము’’.
6. ఏది ఉప అను స్వరమో → అదియే ‘ఉపద్రవము’.
7. ‘‘ని’’ - అనునదే ఆ యొక్క ‘నిధనము’ → ‘ని’ అను స్వరమే ‘నిధనము’ (ముగింపు/సమాప్తి).

దుగ్ధేఽస్మై వాగ్దోహం యో వాచో దోహోఽన్నవానన్నాదో భవతి
య ఏతదేవం విద్వాన్వాచి సప్తవిధగ్ం సామోపాస్తే .. 2.8.3..

.. ఇతి అష్టమః ఖండః ..
3. దుగ్ధే అస్మై వాక్ దోహం యో
వాచో దోహః।
అన్నవాన్ అన్నాదో భవతి
య ఏవం విద్వాన్
వాచి సప్త విధగ్ం సామా ఉపాస్తే।।
అట్టి ‘‘సప్తవిధ వాచి (వాక్)-సప్తవిధ సామము’’గా తెలుసుకొని ఉపాసించు వాడు పితికిన పాలు పోసియున్న పాత్రను - పొందు రీతిగా (పాల పాత్రను పొందు విధంగా) - ‘‘వివేకి అయి వాక్-అమృతమును’’ పొందుచున్నాడు.
అన్నము (బ్రహ్మము)ను కోరుకొని అన్నమే (బ్రహ్మమే) అగుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే అష్టమః ఖండః


2–9. ద్వితీయ ప్రపాఠకః - నవమః ఖండః - ఆదిత్య సప్తవిధ సామోపాసన


అథ ఖల్వముమాదిత్యగ్ంసప్తవిధగ్ం సామోపాసీత సర్వదా
సమస్తేన సామ మాం ప్రతి మాం ప్రతీతి సర్వేణ
సమస్తేన సామ .. 2.9.1..
1. అథ ఖల్వముమ్ (ఖలు అముమ్)
ఆదిత్యగ్ం సప్తవిధగ్ం సామా ఉపాసీత।



సర్వదా ‘‘సమః’’ తేన సామ।
మాం ప్రతి మాం ప్రతి ఇతి
సర్వేణ సమః తేన సామ।
ఇక ఆపై, సూర్యుని (ఆదిత్యుని) సప్తవిధ సామగానములుగా (సప్తాశ్వ రథమ్ ఆరూఢునిగా, సప్త వర్ణముల కిరణ స్వరూపునిగా) ఉపాసించటము గురించి చెప్పుకుంటున్నాము.


‘‘సూర్యుడు సర్వదా సమత్వమునందు అధిరోహితులై, సర్వదా ప్రకాశిస్తూ, నా వైపు సమీప్యుడై ఉన్నారు. సర్వత్రా సమస్తులై సమముగా ప్రకాశించువారు. సర్వులపట్ల సమభావన, స్వయంప్రకాశకము, నిత్య జాగరూకత, సర్వత్రా సమవత్ స్థితి’’- మొదలైన ఆత్మతత్త్వ నిర్వచనములు పుణికి పుచ్చుకున్నవారు’’ - అను సామగానముతో స్తుతించెదరు గాక. ప్రతి ఒక్కరికి సమీపమున ఉన్నారు కాబట్టి ఆయనయే ‘సామగానము’ (స-ఆమ).

తస్మిన్నిమాని సర్వాణి భూతాన్యన్వాయత్తానీతి
విద్యాత్తస్య యత్పురోదయాత్స హింకారస్తదస్య
పశవోఽన్వాయత్తాస్తస్మాత్తే హిం కుర్వంతి
హింకారభాజినో హ్యేతస్య సామ్నః .. 2.9.2..
2. తస్మిన్ ఇమాని సర్వాణి
భూతాని అన్వాయత్తాని ఇతి విద్యాత్।
తస్య యత్ పురోదయాత్, స ‘హిం’కారః।
తత్ అస్య పశవః అన్వాయత్తాః।
తస్మాత్ తే ‘హిం’ కుర్వంతి,
హింకార భాజినో,
హి ఏతస్య సామ్నః।
సమస్త భూతజాలము ఆ సూర్యభగవానునిపై ఆధారపడి మాత్రమే జీవించగలుగుచున్నారని గ్రహించబడు గాక।

ఆ సూర్యుడు ఉదయించటానికి ముందుగా - ‘హిం’ కారము

ఆయన ‘హిం’ కార మహిమపైననే జీవుల మనుగడ అంతా ఆధారపడి ఉన్నది. అందుచేత జీవులంతా ‘జీవించటము’ను ఆధారముగా పొందుతూ, ‘హిం’ కార శబ్దమును చేస్తూ నిదురలేస్తున్నారు.

అట్టి ‘హిం’కార స్వరూపులే అయి జీవించటమే ‘‘ఆదిత్య సప్తవిధ సామోపాసన’’ అనబడే ‘‘సామగానము’’.

అథ యత్ప్రథమోదితే స ప్రస్తావస్తదస్య మనుష్యా
అన్వాయత్తాస్తస్మాత్తే ప్రస్తుతికామాః ప్రశగ్ంసాకామాః
ప్రస్తావభాజినో హ్యేతస్య సామ్నః .. 2.9.3..
3. అథ యత్ ప్రథమా ఉదితే స ‘‘ప్రస్తావః’’।
తత్ అస్య మనుష్యా ‘‘అన్వాయత్తాః’’।
తస్మాత్ తే ప్రస్తుతి కామాః ప్రశగ్ంసా
కామాః ప్రస్తావ భాజినో
హి ఏతస్య సామ్నః।।
(1) సూర్యుని (ఆదిత్యుని) ఉదయించటానికి మునుముందటి రూపము -‘హిం’ కారము.
(2) మొట్టమొదటి ఉదయ కిరణములు - ప్రస్తావము.

జీవుల జీవనము అట్టి సూర్యోదయముపై ఆధారపడి ఉన్నది. వారి ప్రత్యక్ష - రక్షణ, పరోక్ష దేహ మనోబుద్ధులను నిర్మలము చేయటము, ఇవన్నీ ప్రశంసించటమే ‘‘సామగాన-ప్రస్తావన’’.

అథ యత్సంగవవేలాయాగ్ం స ఆదిస్తదస్య వయాగ్ంస్యన్వాయత్తాని
తస్మాత్తాన్యంతరిక్షేఽనారంబణాన్యాదాయాత్మానం
పరిపతంత్యాదిభాజీని హ్యేతస్య సామ్నః .. 2.9.4..
4. అథ యత్ సంగవ
వేలాయాగ్ం స ఆదిః।
తత్ అస్య వయాగ్ంసి అన్వాయత్తాని।
తస్మాత్ తాని అన్తరిక్షే అనారంబణాని
ఆదాయ ఆత్మానం పరిపతంతి
ఆది భాజీని హి ఏతస్య సామ్నః।
ఆయన కిరణములు లోకమంతా విస్తరించుచుండు సందర్భమే ‘ఆది’. ఆదిత్యుని లోని ‘ఆది’।

సూర్యాకారముగా పక్షులు ఆకాశంలో ఎగురుచున్నాయి. పక్షులు సూర్యునిపై ఆధారపడియే ఎగురుచున్నాయి.

అట్టి చిన్న ఆకారముగల (అల్పబలము, మేధస్సుగల) పక్షులు అంతరిక్షములో సూర్యోదయము ఆరంభము అగుచూ ఉండగా, చెట్లుపైనుండి కిలకిలారవములతో ఆకాశములోకి ఎగురుచూ ఉన్న శక్తి యొక్క దృశ్యమే ‘ఆదిత్య సామగానము’। ఆ కిలకిలా శబ్దాలే సూర్యస్తోత్రము.

అథ యత్సంప్రతిమధ్యందినే స ఉద్గీథస్తదస్య
దేవా అన్వాయత్తాస్తస్మాత్తే సత్తమాః
ప్రాజాపత్యానాముద్గీథభాజినో హ్యేతస్య సామ్నః .. 2.9.5..
5. అథ యత్ సంప్రతి
మధ్యన్ దినే స ‘‘ఉద్గీథః’’।
తత్ అస్య దేవా ‘‘అన్వాయత్తాః’’।
తస్మాత్ తే సత్తమాః
ప్రాజాపత్యానాం ఉద్గీథ భాజినో
హి ఏతస్య దేవాః (సామ్నా)।
మధ్యాహ్న సమయంలో సూర్యుడి ప్రకాశమాన ప్రత్యక్ష రూపము - ఉద్గీథముగా ఉపాసన.

అట్టి మధ్యాహ్న సూర్యుని నుండియే తేజస్సు పొందుతూ, దేవతలు ప్రకాశించుచున్నారు. మధ్యందిన ప్రకాశముపై ఆధారపడి ఉన్నారు. అట్టి మధ్యాహ్న సూర్యతేజస్సును పొందుచున్న దేవతలు, అట్టి తేజోవిభవము గురించి ప్రజాపతి పుత్రులగు దేవతలు ఉద్గీథ గానము చేస్తూ ఉన్నారు. అట్టి ఉద్గీథ గానమే ‘‘మధ్యందిన ఆదిత్య ఉద్గీథ-సామ గానము’’.


అథ యదూర్ధ్వం మధ్యందినాత్ప్రాగపరాహ్ణాత్స
ప్రతిహారస్తదస్య గర్భా అన్వాయత్తాస్తస్మాత్తే
ప్రతిహృతానావపద్యంతే ప్రతిహారభాజినో
హ్యేతస్య సామ్నః .. 2.9.6..
6. అథ యత్ ఊర్ధ్వం మధ్యన్ దినాత్
ప్రాక్ - అపరాహ్ణాత్ స ‘‘ప్రతిహారః’’।
తత్ అస్య గర్భా ‘‘అన్వాయత్తాః।’’
తస్మాత్ తే ప్రతిహృతా న అవపద్యంతే
‘ప్రతిహార’ భాజినో హి, ఏతస్య సామ్నః।।
మధ్యాహ్నకాలము గడుచుచూ ఉండగా, ఏర్పడియున్న సాయం సూర్యప్రకాశము - ‘‘ప్రతిహారము’’ (1 PM to 3 PM)

అట్టి మధ్యాహ్నానంతర సూర్యప్రకాశముపై తల్లి గర్భములోని పిండములు ఆధారపడి రక్షణ పొందుచున్నాయి.

అట్టి ప్రతిహార - ఆదిత్య సామగానమువలననే గర్భస్థ పిండములు క్రిందకు పడకుండా గర్భములో మధ్యగా వ్రేలాడుచూ, జీవశక్తిని పొందసాగుచున్నాయి. మధ్యాహ్నానంతర సూర్యప్రకాశ - గర్భస్థ శిశుస్థాన రక్షణయే ‘‘ఆదిత్య-ప్రతిహార సామగానము’’.


అథ యదూర్ధ్వమపరాహ్ణాత్ప్రాగస్తమయాత్స
ఉపద్రవస్తదస్యారణ్యా అన్వాయత్తాస్తస్మాత్తే పురుషం
దృష్ట్వా కక్షగ్ంశ్వభ్రమిత్యుపద్రవంత్యుపద్రవభాజినో
హ్యేతస్య సామ్నః .. 2.9.7..
7. అథ యత్ ఊర్ధ్వం అపరాహ్ణాత్
ప్రాక్ - అస్తమయాత్
స ‘‘ఉపద్రవః’’
తత్ అస్య అరణ్యా ‘‘అన్వాయత్తాః’’।
తస్మాత్ తే పురుషం దృష్ట్వా
కక్షగ్ం శ్వభ్రమితి ఉపద్రవన్తి।
ఉపద్రవ భాజినో హి,
ఏతస్య సామ్నః।
(అపరాహ్ణము = పగటి చివరి భాగము. ఒక పగటిని మూడు సమాన భాగాలు చేసినప్పుడు - చివరి 3వ భాగము)

పగటిలో చివరి భాగము, సూర్య అస్తమయానికి ముందు ప్రకాశించు సూర్యుడు ‘‘ఉపద్రవము’’ ( 3 pm 5 pm )

అట్టి ఉపద్రవ - సూర్యునిపై అరణ్య మృగములు జీవము, రక్షణ పొందినవై ఉంటున్నాయి.

అట్టి అపరాహ్ణ - ప్రాక్ (Before) అస్తమయ సూర్యుని రూపము ‘‘ఉపద్రవ సూర్యరూపము’’గా ఉపాసించబడు గాక।

అథ యత్ప్రథమాస్తమితే తన్నిధనం తదస్య
పితరోఽన్వాయత్తాస్తస్మాత్తాన్నిదధతి నిధనభాజినో
హ్యేతస్య సామ్న ఏవం ఖల్వముమాదిత్యగ్ం సప్తవిధగ్ం
సామోపాస్తే .. 2.9.8..

.. ఇతి నవమః ఖండః ..
8. అథ యత్ ప్రథమా
అస్తమితే తత్ ‘‘నిధనం।’’
తత్ అస్య పితరో ‘‘అన్వాయత్తాః’’।
తస్మాత్ తాన్ నిదధతి,
నిధన భాజినో హి।
సూర్యుడు అస్తమించగానే ఆ మరుక్షణ సూర్యుని ‘‘నిధనము’’ (ఉపసంహార - ఆటవిడుపు).

అట్టి నిధన సూర్యునిపై పితరులు ఆధారపడినవారై ఉంటారు.

అట్టి నిధనరూప సూర్యతత్త్వము వలననే పితరులు ఆధారపడి పోషింపబడుచున్నారు.
ఏతస్య సామ్న ఏవం ఖల్వముమ్
ఆదిత్యగ్ం సప్తవిధగ్ం సామా ఉపాస్తే।।
ఈ విధంగా సప్త (7) విధ సామగానంగా ఆదిత్యుని సామగానం చేస్తూ ఆరాధించెదరు గాక।

(1) పురా ఉదయ ఆదిత్య హింకార సామగానము
(2) ప్రథమ ఉదిత ఆదిత్య సామగానము
(3) ఉషోదయానంతర - ఆదిత్య సామగానము
(4) మధ్యందిన ఉద్గీథ సామగానము
(5) అపరాహణా ఊర్ధ్వ - ప్రాక్ అస్తమయ ఆదిత్య సామగానము
(6) అస్తమయ ఆదిత్య సామగానము (ఉద్గీథోపాసన)
(7) అస్తమయానంతర ఆదిత్య సామగానము
- ఉపాసించబడు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే నవమః ఖండః


2–10. ద్వితీయ ప్రపాఠకః - దశమః ఖండః - ‘‘అతిమృత్యు సామోపాసన’’


అథ ఖల్వాత్మసంమితమతిమృత్యు సప్తవిధగ్ం
సామోపాసీత హింకార ఇతి త్ర్యక్షరం ప్రస్తావ
ఇతి త్ర్యక్షరం తత్సమం .. 2.10.1..
1. అథ ఖలు - ఆత్మ సంమితమ్
‘‘అతిమృత్యు’’, సప్తవిధగ్ం
సామా ఉపాసీత।
హింకార ఇతి।
త్రి అక్షరం (త్ర్యక్షరం) ప్రస్తావ ఇతి।
త్రి అక్షరం (త్ర్యక్షరం) తత్ సమమ్।
ఇక ఇప్పుడు - మృత్యువుకు ఆవలగల (మార్పు చేర్పులకు ఆవలగల) సర్వత్రా సమరూపమైయున్న ఆత్మయొక్క ‘అతిమృత్యురూప’ (Beyond Change Factors) సప్తవిధ ‘సామోపాసన’ గురించి చెప్పుకుంటున్నాము.
‘‘హిం-కార’’ - ఇతి । 3 అక్షరముల శబ్దము
‘‘ప్రస్తావ’’ - ఇతి। 3 అక్షరముల శబ్దము
ఈ రెండు సమస్వరూపమైనవి.

ఆదిరితి ద్వ్యక్షరం ప్రతిహార ఇతి చతురక్షరం
తత ఇహైకం తత్సమం .. 2.10.2..
2. ‘‘ఆదిః’’ ఇతి ద్వి అక్షరం (ద్వ్యక్షరం)।
‘‘ప్రతిహార’’ ఇతి చతుః అక్షరం।
తత ఇహ ఏకం తత్ సమమ్।
‘‘ఆది’’ - ఇది ‘2’ అక్షరముల శబ్దము.
‘‘ప్రతిహార’’ - ఇది ‘4’ అక్షరముల శబ్దము
‘ప్రతిహారము’ నుండి ఒక అక్షరమును తీసుకొనివచ్చి ‘ఆది’కి చేర్చాలి.
అప్పుడు ఆ రెండు సమము అవగలవు.
(ఆది = మొట్టమొదటే ఉన్న ‘నేను’. ప్రతిహారము = కల్పన, ఊహ, భావన, మాయ).

ఉద్గీథ ఇతి త్ర్యక్షరముపద్రవ ఇతి చతురక్షరం
త్రిభిస్త్రిభిః సమం భవత్యక్షరమతిశిష్యతే
త్ర్యక్షరం తత్సమం .. 2.10.3..
3. ఉద్గీథ ఇతి త్రీక్షరం। (త్ర్యక్షరం)।
‘‘ఉపద్రవ’’ ఇతి చతుః అక్షరం।
త్రిభిః త్రిభిః సమం భవతి।
అక్షరం అతి శిష్యతే।
త్రీక్షరం తత్ సమమ్।।
‘ఉద్గీథ’ - ఇది ‘3’ అక్షరములు.
‘ఉపద్రవ’ - ఇది ‘4’ అక్షరములు.
పై అక్షరములు ‘3+3’ = 6 ఏకము చేస్తే అప్పటికిక ఏడిటిలో (Out of 7) ఒక అక్షరము శేషిస్తోంది.
ఆ విధంగా త్రి అక్షరం - త్రి అక్షరం సమము అయి ‘‘సర్వత్రా సమము’’ మాత్రమే ఏర్పడియున్నదగుచున్నది.
మిగిలిన ఒక అక్షరము కూడా మూడు అక్షరములతో సమముగానే చెప్పబడెను.

నిధనమితి త్ర్యక్షరం తత్సమమేవ భవతి
తాని హ వా ఏతాని ద్వావిగ్ంశతిరక్షరాణి .. 2.10.4..
4. ‘‘నిధనం’’ ఇతి త్రి అక్షరం (త్ర్యక్షరం)।
తత్ సమం ఏవ భవతి।
తాని హ వా ఏతాని
ద్వావిగ్ంశతిః(22) అక్షరాణి।
‘నిధనం’ (సమాప్తి, ముగింపు) - అనునది ‘త్రి’ అక్షరం (3 అక్షరములతో ఉన్నది).
అంతా అక్షరమే కనుక మిగతా త్రి-అక్షరములతో సమమే (Equal) అయి ఉన్నది.
ఈ విధంగా సప్తవిధి సామగానోపాసనకు ‘‘22"అక్షరములు కలిగి ఉన్నది.

Ⅰ. ‘‘హిం’’ ‘‘కార’’ = 3;
Ⅱ. ‘‘ప్రస్తావ’’ = 3;
Ⅲ. ఆది = 2;
Ⅳ. ప్రతిహార = 4;
Ⅴ. ఉద్గీథ = 3;
Ⅵ. ఉపద్రవ = 4;
Ⅶ. నిధనం= 3

3+3+2+4+3+4+3 = 22 అక్షరములు


ఏకవిగ్ంశత్యాదిత్యమాప్నోత్యేకవిగ్ంశో వా
ఇతోఽసావాదిత్యో ద్వావిగ్ంశేన పరమాదిత్యాజ్జయతి
తన్నాకం తద్విశోకం .. 2.10.5..
5. ఏకవిగ్ంశతి (21) ఆదిత్యం ఆప్నోతి।

ఏకవిగ్ంశః వా ఇతిః (21వ వాడు) అసావాదిత్యో

ద్వావిగ్ంశేన (22) పరమాదిత్యాత్ జయతి।
తత్ నాకం। తత్ విశోకమ్।
సమస్వరూపములైన 21 ఆదిత్య (మొట్టమొదటి స్వరూపమగు ఆత్మయొక్క) తత్త్వము తెలుసుకొంటారో, వారు ‘ఆదిత్యము’ (The Beginning of Everything) సిద్ధించుకుంటారు.

ఈ 21 అక్షరములుగా కనిపిస్తున్నది సర్వత్ర వేంచేసి, సమస్తము తానే అయి ఉన్న ఆదిత్యుడే!

22వది అక్షరమగు పరమాదిత్యము (ఆదిత్యునికి కూడా పరమైనది. ఆవలది). అట్టి పరమాదిత్యము, దివ్యలోకము శోకరహితమైనది. అట్టి పరమాదిత్యము (కేవలాత్మ, పరస్వరూపము, పరమాత్మ) తెలుసుకొంటే ద్రష్టయొక్క (జీవునియొక్క) ద్రష్టత్వముచే దృశ్యము నుండి పొందుచున్న దుఃఖములన్నీ శమిస్తాయి. (All worries of Indria-jagath vanish /subside).

ఆప్నోతీ హాదిత్యస్య జయం పరో హాస్యాదిత్యజయాజ్జయో
భవతి య ఏతదేవం విద్వానాత్మసంమితమతిమృత్యు
సప్తవిధగ్ం సామోపాస్తే సామోపాస్తే .. 2.10.6..

.. ఇతి దశమః ఖండః ..
6. ఆప్నోతి హ ఆదిత్యస్య జయం పరో హ।
అస్య ఆదిత్య జయాత్ జయో భవతి।
య ఏతత్ ఏవం విద్వాన్ ఆత్మ,
సంమితం అతిమృత్యు సప్త విధగ్ం
సామా ఉపాస్తే। సామా ఉపాస్తే।
ఈ లోకమున ప్రకాశమానుడైయున్న ఆదిత్యునికి (సూర్యునికి) 21 అక్షరములు. 22వ అక్షరం సూర్యునికి ఆవలి లోకము. అది ఆదిత్యమును కూడా దాటినట్టి (కేవలమగు ఆత్మ) స్థానము.

అట్టి ఆదిత్యలోకము దాటి అమృతమగు ఆత్మలోకము (ఆత్మస్థానము) ఎరిగిన విద్వాంసుడు సమస్తమునందు ఆత్మను, ఆత్మయందే సమస్తమును దర్శించుచూ, సప్తవిధ సామములను ఉపాసిస్తూ - క్రమంగా మృత్యుపరిధులను దాటివేస్తాడు. అట్టి ఏకవింశతి అక్షర సామోపాసనచే అమృతస్వరూపమును సిద్ధించుకొంటాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే దశమః ఖండః


2–11. ద్వితీయ ప్రపాఠకః - ఏకాదశః ఖండః - గాయత్ర సామోపాసనా


మనో హింకారో వాక్ప్రస్తావశ్చక్షురుద్గీథః శ్రోత్రం ప్రతిహారః
ప్రాణో నిధనమేతద్గాయత్రం ప్రాణేషు ప్రోతం .. 2.11.1..
1. మనో ‘‘హింకారో’’ వాక్ ‘‘ప్రస్తావః।
చక్షుః ‘‘ఉద్గీథః’’।
శ్రోత్రం ‘‘ప్రతిహారః’’।
ప్రాణో ‘‘నిధనం’’।
ఏతత్ గాయత్రం
ప్రాణేషు ప్రోతమ్।।
‘మనస్సు’ - ‘హిం’ కారము
వాక్ - ‘ప్రస్తావ’
చక్షువులు - ‘‘ఉద్గీథ’’
శోత్రములు (చెవులు) - ‘‘ప్రతిహార’’
ప్రాణము - ‘నిధనం’

అట్టి ప్రాణశక్తితో ఆయా (5) రూపములుగా ప్రోతమై (నిండినదై) ఉన్నదే - ఏతత్ గాయత్రం। (అదియే గాయత్రి)।

స ఏవమేతద్గాయత్రం ప్రాణేషు ప్రోతం వేద ప్రాణీ భవతి
సర్వమాయురేతి జ్యోగ్జీవతి మహాన్ప్రజయా పశుభిర్భవతి
మహాన్కీర్త్యా మహామనాః స్యాత్తద్వ్రతం .. 2.11.2..

.. ఇతి ఏకదశః ఖండః ..
2. స య ఏవం ఏతత్
గాయత్రం ప్రాణేషు ప్రోతం
వేద ప్రాణీ భవతి।
సర్వం ఆయుః ఏతి।
జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా, మహామనాః స్యాత్,
తత్ వ్రతమ్।
ప్రాణము ‘గాయత్రి’చే ప్రోతమై ఉన్నట్లే గాయత్రి ప్రాణముచే ప్రోతమైయున్నది.

వేదము (తెలియబడేది / తపస్సు) ప్రాణిగా అగుచున్నది.

అట్టి ‘‘ప్రాణస్వరూప గాయత్రి సామగానము’’. తెలుసుకొని గాయత్రీ - ప్రాణోపాసన చేయువారు జ్యోతిస్వరూపులై జీవించగలరు. వారి జీవితమే జ్యోతి (స్వయంప్రకాశ) రూపమవగలదు। ఆత్మజ్యోతియగు (కేవల శివ స్వరూపము సంతరించుకోగలరు).

అట్టివారు గొప్ప జన, పశు, సంపద పొందగలరు.
గొప్ప కీర్తిమంతులు అగుచున్నారు. అట్టి ‘మహామనోసిద్ధి’యే ‘‘గాయత్రీ - ప్రాణోపాసనా వ్రతము’’.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ఏకాదశః ఖండః


2–12. ద్వితీయ ప్రపాఠకః - ద్వాదశః ఖండః - రథంతరమగ్ని సామోపాసనా


అభిమంథతి స హింకారో ధూమో జాయతే స ప్రస్తావో
జ్వలతి స ఉద్గీథోఽఙ్గారా భవంతి స ప్రతిహార
ఉపశామ్యతి తన్నిధనగ్ం సగ్ంశామ్యతి
తన్నిధనమేతద్రథంతరమగ్నౌ ప్రోతం .. 2.12.1..
1. అభిమంథతి స ‘హిం’కారో।
ధూమో జాయతే స ప్రస్తావః।
జ్వలతి స ‘‘ఉద్గీథః’’
అంగారా భవంతి స ‘‘ప్రతిహార’’
ఉపశామ్యతి తత్ ‘‘నిధనగ్ం’’
సగ్ంశామ్యతి తత్ నిధనం
ఏతత్ ‘‘రథంతరం అగ్నౌ’’ ప్రోతమ్।
అరణి కొయ్యలతో మథనము (రెండు కొలతో ఒరిపిడి చేయటము) - ‘హిం’ కారము.
ధూమము పుట్టటము - ‘‘ప్రస్తావము’’.
అగ్నిజ్వాల జననము - ‘ఉద్గీథము’’.
అగ్నికణములు - విస్ఫులింగములు - ‘‘ప్రతిహారము’’.
ఆ విధంగా జ్వలిస్తున్న అగ్ని ఉపశాంతి పొందటము, (అనగా) ఉపశమించటము - ‘నిధనము’ .
అట్టి ‘సంశామ్య’ (Subsiding) రూపమగు అగ్ని - రథంతరాగ్నిగా జగత్తంతా ప్రోతమై(Filled up) ఉన్నది.

స య ఏవమేతద్రథంతరమగ్నౌ ప్రోతం వేద బ్రహ్మవర్చస్యన్నాదో
భవతి సర్వమాయురేతి జ్యోగ్జీవతి మహాన్ప్రజయా
పశుభిర్భవతి మహాన్కీర్త్యా న ప్రత్యఙ్ఙగ్నిమాచామేన్న
నిష్ఠీవేత్తద్వ్రతం .. 2.12.2..

.. ఇతి ద్వాదశః ఖండః ..
2. స య ఏవమ్ ఏతత్ రథంతరం
అగ్నౌ ప్రోతం వేద, బ్రహ్మవర్చసి అన్నాదో భవతి।
సర్వం ఆయుః ఏతి।
జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా
న ప్రత్యఙ్ అగ్నిం ఆచామేత్ న నిష్ఠీవేత్ తత్ వ్రతమ్।
అట్టి రథంతరంగా ప్రోతమైయున్న (జగత్తంతా ఓతప్రోతమైయున్న) అగ్నితత్త్వమును తెలుసుకొన్నవాడు బ్రహ్మవర్చస్సు పొందగలడు. సమస్తమును పొందిన ‘అన్నాదుడు’ - కాగలడు.
- వారి ఆయుష్షు పవిత్రము కాగలదు (ఉత్తమమైన ఆయుష్షు పొంద గలరు).
- జ్యోతిస్వరూపులై జీవించగలరు.
- ఉత్తమ సంతానము, పశుసంపద పొందగలరు.
- గొప్ప కీర్తిమంతులుగా కాగలరు.
అందుచేత సర్వత్రా మౌనంగా ఉన్న అగ్ని (లేక) ప్రాణశక్తిని ఉపాసించటమును ‘వ్రతము’ (Regular Practice)గా కలిగి ఉండెదరు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ద్వాదశః ఖండః


2–13. ద్వితీయ ప్రపాఠకః - త్రయోదశః ఖండః - వామదేవం మిథున సామోపాసన


ఉపమంత్రయతే స హింకారో జ్ఞపయతే స ప్రస్తావః
స్త్రియా సహ శేతే స ఉద్గీథః ప్రతి స్త్రీం సహ శేతే
స ప్రతిహారః కాలం గచ్ఛతి తన్నిధనం పారం గచ్ఛతి
తన్నిధనమేతద్వామదేవ్యం మిథునే ప్రోతం .. 2.13.1..
1. ఉపమన్త్రయతే స ‘‘హిం’’కారః।
జ్ఞపయతే స ప్రస్తావః।
స్త్రియా సహః ఏతే స ఉద్గీథః।
ప్రతి స్త్రీం సహః ఏతే స ‘‘ప్రతిహారః’’।
కాలం గచ్ఛతి తన్నిధం
పారం గచ్ఛతి తత్ ‘‘నిధనం’’।
ఏతత్ వామదేవ్యం మిథునే ప్రోతమ్।
[ఉపమంత్రణము = పిలుపు, బుజ్జగింపు మంత్రోచ్చారణ]

ఉపమంత్రయతము - మంత్రోచ్ఛారణ - ‘హిం’కారము
జ్ఞాపకము - ప్రస్తావము
స్త్రీ సంగమము (ప్రకృతితో కలిసి ఉండటము) - ఉద్గీథము
ప్రతి స్త్రీ సహము(మిథునము । కలయిక) - ప్రతిహారము।
కాలము గడచిపోవటము, చివరికి చేరటము - నిధనము (సమాప్తి)
అట్టి వామదేవ మిథునము (కేవలమగు ఆత్మతో కల్పన చేరి సమాగమము)తో ఇదంతా ఏర్పడినది అగుచున్నది.

స య ఏవమేతద్వామదేవ్యం మిథునే ప్రోతం వేద
మిథునీ భవతి మిథునాన్మిథునాత్ప్రజాయతే
సర్వమాయురేతి జ్యోగ్జీవతి మహాన్ప్రజయా పశుభిర్భవతి
మహాన్కీర్త్యా న కాంచన పరిహరేత్తద్వ్రతం .. 2.13.2..
2. స య ఏవం ఏతత్ వామదేవ్యం
మిథునే ప్రోతం వేద మిథునీ భవతి।
మిథునాన్ మిథునాత్ ప్రజాయతే।
సర్వం ఆయుః ఏతి। జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా, పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా న కాంచన పరిహారేత్
తత్ వ్రతమ్।।

.. ఇతి త్రయోదశః ఖండః ..
అట్టి ‘ఆ వామదేవ మిథునము’చే ప్రోతము (Made up of) - తెలుసుకొన్నవాడు ‘మిథునీ’ అగుచున్నాడు.

మిథునముచే మిథునము వృద్ధి చెందుచున్నది. మిథునము (కలయిక) ప్రవృద్ధమవగలదు. అట్టి ఏకత్వ దర్శన ధ్యానముచే ఆయుష్షు పవిత్రమవగలదు. జగజ్యోతి స్వరూపము ఆవిష్కరణము కాగలదు. ఉత్తమ సంతానము, పశుసంపద ప్రాప్తించగలదు. ఉత్తమ కీర్తి లభించగలదు. అట్టి వామదేవ మిథునము (అనుభవి - అనుభవముల ఏకత్వము) వ్రతముగా ఆచరించబడు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే త్రయోదశః ఖండః


2–14. ద్వితీయ ప్రపాఠకః - చతుర్దశః ఖండః - ‘బృహదాదిత్య’ సామోపాసన


ఉద్యన్హింకార ఉదితః ప్రస్తావో మధ్యందిన ఉద్గీథోఽపరాహ్ణః
ప్రతిహారోఽస్తం యన్నిధనమేతద్బృహదాదిత్యే ప్రోతం .. 2.14.1..
1. ఉద్యన్ ‘‘హింకార’’।
ఉదితః ‘‘ప్రస్తావః’’।
మధ్యందిన ‘‘ఉద్గీథః’’।
అపరాహ్ణాః ‘‘ప్రతిహారః’’।
అస్తం యత్ ‘‘నిధనం’’।
ఏతత్ ‘‘బృహత్ ఆదిత్యే’’ ప్రోతమ్।
సూర్యుడు
ఉదయించు సూర్యుడు - ‘హిం’కారము.
ఉదయిస్తున్నప్పుడు - ‘ప్రస్తావము’
మధ్యాహ్న సూర్యుడు - ఉద్గీథము
అపరాహ్ణా (మధ్యాహ్నానంతర-సాయంత్ర) సూర్యుడు - ప్రతిహారము
సూర్యాస్తమయం - ‘నిధనము’
ఇది ‘బృహత్ ఆదిత్యము’ అనబడుతోంది.

స య ఏవమేతద్బృహదాదిత్యే ప్రోతం వేద తేజస్వ్యన్నాదో
భవతి సర్వమాయురేతి జ్యోగ్జీవతి మహాన్ప్రజయా
పశుభిర్భవతి మహాన్కీర్త్యా తపంతం న నిందేత్తద్వ్రతం .. 2.14.2..

.. ఇతి చతుర్దశః ఖండః ..
2. స య ఏవం ఏతత్ బృహత్
ఆదిత్యే ప్రోతం వేద,
తేజస్వి అన్నాదో భవతి।
సర్వం ఆయుః ఏతి। జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా। తపన్తం న నిందేత్। తత్ వ్రతమ్।
అట్టి ఆ యొక్క ‘బృహత్ ఆదిత్యము’ ఏ విధంగా సర్వత్రా ప్రోతమైయున్నదో ఎరిగి ఉపాసిస్తున్నవాడు తేజోవంతుడు, సమస్తము అనుభవముగా పొందువాడు అగుచున్నాడు. ఆయుష్మంతుడు కాగలడు. జగత్‌జ్యోతి స్వరూపుడు కాగలడు. ఉత్తమ జనసంపద, పశుసంపద పొందగలడు।
గొప్ప కీర్తిమంతుడగుచున్నాడు.
అట్టి బృహత్ ఆదిత్యుని తీవ్రతను నిందించరాదు.
అట్టి ఆరాధన ‘వ్రతము’గా ఆచరించబడు గాక!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే చతుర్దశః ఖండః


2–15. ద్వితీయ ప్రపాఠకః - పంచదశః ఖండః - వైరూప పర్జన్య సామోపాసన


అభ్రాణి సంప్లవంతే స హింకారో మేఘో జాయతే
స ప్రస్తావో వర్షతి స ఉద్గీథో విద్యోతతే స్తనయతి
స ప్రతిహార ఉద్గృహ్ణాతి తన్నిధనమేతద్వైరూపం పర్జన్యే ప్రోతం .. 2.15.1..
1. అభ్రాణి సంప్లవన్తే స ‘‘హింకారో’’
మేఘో జాయతే స ‘‘ప్రస్తావో’’
వర్షతి స ‘‘ఉద్గీథో’’
విద్యోతతే స్తనయతి, స ‘‘ప్రతిహార’’
ఉత్ గృహాణాతి తత్ ‘‘నిధనమ్’’
ఏతత్ వైరూపం పర్జన్యే ప్రోతమ్।
మబ్బుల సంప్లవన్తము (సమూహము ఏర్పడటం) - ‘హిం’కారము
దట్టమైన మేఘములు - ప్రస్తావము
వర్షించటము - ఉద్గీథము
మేఘపు మెఱుపులు - ‘ప్రతిహారము’
వర్షానంతరము (మేఘములు । ఆకాశము) - ‘‘నిధనము’’
అట్టి మేఘముల తత్త్వము ‘‘పర్జన్యము’’తో ప్రోతమైయున్నది.

స య ఏవమేతద్వైరూపం పర్జన్యే ప్రోతం వేద
విరూపాగ్ంశ్చ సురూపగ్ంశ్చ పశూనవరుంధే
సర్వమాయురేతి జ్యోగ్జీవతి మహాన్ప్రజయా పశుభిర్భవతి
మహాన్కీర్త్యా వర్షంతం న నిందేత్తద్వ్రతం .. 2.15.2..
2. స య ఏవం ఏతత్ వైరూపం
పర్జన్యే ప్రోతం వేద విరూపాగ్ంశ్చ
సురూపాగ్ంశ్చ పశూన్ అవరుంధే,
సర్వం ఆయుః ఏతి। జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా, వర్షంతం।
న నిందేత్ తత్ వ్రతమ్।।

.. ఇతి పంచదశః ఖండః ..
అట్టి పర్జన్యమును సామోపాసన చేయువారు - సామగానము చేయువారు, (అనగా) పర్జన్యముతో ఆత్మోపాసన చేయువారు
- పశు సంపద పొందగలరు.
- ఆయుష్మంతులు కాగలరు.
- జగజ్జ్యోతి స్వరూపులగుచున్నారు.
- ఉత్తమ ప్రజలను, పశుసంపద పొందగలరు.
- గొప్ప కీర్తిమంతులు కాగలరు.
‘వర్షము’ను నిందించరాదు. ఇది వ్రతము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే పంచదశః ఖండః


2–16. ద్వితీయ ప్రపాఠకః - షోడశః ఖండః - వైరాజ ఋతు సామోపాసన


వసంతో హింకారో గ్రీష్మః ప్రస్తావో వర్షా ఉద్గీథః
శరత్ప్రతిహారో హేమంతో నిధనమేతద్వైరాజమృతుషు ప్రోతం .. 2.16.1..
1. వసన్తో ‘‘హింకారః’’।
గ్రీష్మః ‘‘ప్రస్తావః’’।
వర్షా ‘‘ఉద్గీథః’’।
శరత్ ‘‘ప్రతిహారః’’।
హేమంతః ‘‘నిధనం’’।
ఏతత్ వైరాజమ్ ఋతుషు ప్రోతమ్।
వసంత ఋతువు - ‘హిం’కారము
గ్రీష్మ ఋతువు - ‘ప్రస్తావము’
వర్ష ఋతువు - ‘ఉద్గీథము’
శరత్ ఋతువు - ‘ప్రతిహారము’
హేమంతము - ‘నిధనము’
ఇది ‘‘వైరాజ ఋతు సామగానోపాసన’’. కాలము ఆత్మయందు ఓతప్రోతమైయున్నతీరును ఉపాసించటము- ‘‘వైరాజ ఋతుపాసన’’.

స య ఏవమేతద్వైరాజమృతుషు ప్రోతం వేద విరాజతి
ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన సర్వమాయురేతి
జ్యోగ్జీవతి మహాన్ప్రజయా పశుభిర్భవతి
మహాన్కీర్త్యర్తూన్న నిందేత్తద్వ్రతం .. 2.16.2..
2. స య ఏవం ఏతత్ వైరాజమ్
ఋతుషు ప్రోతం వేద
విరాజతి ప్రజయా పశుభిః।
బ్రహ్మవర్చసేన, సర్వం ఆయుః ఏతి।
జ్యోక్ జీవతి। మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్య। ఋతూన్ న నిందేత్। తత్ వ్రతమ్।।

.. ఇతి షోడశః ఖండః ..

అట్టి ఆ ‘‘వైరాజ ఋతు ప్రోతము’’ ఎరిగినవాడు ప్రజ - పశు సంపదతో విరాజిల్లగలడు.
బ్రహ్మవర్చస్సుతో ఉత్తమ ఆయుష్షు కలిగి యుండగలడు.
స్వయంజ్యోతి స్వరూపుడు కాగలడు.
ఉత్తమ ప్రజా సంపద, పశు సంపద కలిగి యుండగలడు.
ఋతువులను (చలి - ఎండ - వేడి కదా…అని తలచుచూ) నింద చేయరాదు. ఇది వ్రతము।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే షోడశః ఖండః


2–17. ద్వితీయ ప్రపాఠకః - సప్తదశః ఖండః - శక్వరీ లోక సామోపాసన


పృథివీ హింకారోఽన్తరిక్షం ప్రస్తావో ద్యౌరుద్గీథో
దిశః ప్రతిహారః సముద్రో నిధనమేతాః శక్వర్యో
లోకేషు ప్రోతాః .. 2.17.1..
1. పృథివీ ‘‘హింకారో’’
అంతరిక్షం ‘‘ప్రస్తావో’’
ద్యౌః ఉద్గీథో
దిశః ‘‘ప్రతిహారః’’
సముద్రో ‘‘నిధనం’’
ఏతాః శక్వర్యో లోకేషు ప్రోతాః।।
పృథివి (భూమి) - ‘హిం’కారము
అంతరిక్షము - ‘ప్రస్తావము’
ద్యులోకము (దివ్యలోకము) - ‘ఉద్గీథము’
దిక్కులు - ‘దిశలు’
సముద్రము - ‘నిధనము’
ఇది లోకమునందు ‘‘శక్వరీ సామగానము’’.

స య ఏవమేతాః శక్వర్యో లోకేషు ప్రోతా వేద లోకీ భవతి
సర్వమాయురేతి జ్యోగ్జీవతి మహాన్ప్రజయా పశుభిర్భవతి
మహాన్కీర్త్యా లోకాన్న నిందేత్తద్వ్రతం .. 2.17.2..

.. ఇతి సప్తదశః ఖండః ..
2. స య ఏవం ఏతాః శక్వర్యో లోకేషు
ప్రోతా వేద లోకీ భవతి।
సర్వం ఆయుః ఏతి। జ్యోగ్జీవతి
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా।
లోకాన్ న నిందేత్
తత్ వ్రతమ్।
ఎవ్వరైతే ఇట్టి లోక సంబంధమైన శక్వరీ సామగానోపాసన చేయుచున్నారో, అట్టివాడు లోకతత్త్వమును ఎరిగినవాడై ‘వేద లోకీ’ - అగుచున్నాడు.
• అట్టివాని ఆయుష్షు పవిత్రమగుచున్నది.
• స్వయంజ్యోతి జీవన స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు.
• మహనీయులగు జనసంగమము, పశుసంపద పొందుచున్నాడు.
• గొప్ప కీర్తిమంతుడు కాగలడు.
అంతేగాని లోకనింద చేయరాదు. ఇది వ్రతము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే సప్తదశః ఖండః


2–18. ద్వితీయ ప్రపాఠకః - అష్టాదశః ఖండః - రేవతీ సామగానోపాసన


అజా హింకారోఽవయః ప్రస్తావో గావ ఉద్గీథోఽశ్వాః ప్రతిహారః
పురుషో నిధనమేతా రేవత్యః పశుషు ప్రోతాః .. 2.18.1..
1. అజా ‘‘హింకారో’’
అవయః ‘‘ప్రస్తావో’’
గావ ‘‘ఉద్గీథో’’
అశ్వాః ‘‘ప్రతిహారః’’
పురుషో ‘‘నిధనం’’
ఏతా రేవత్యః పశుషు ప్రోతాః।
రేవతీ గానము:
అజములు (మేకలు) - ‘హిం’కారము
గొఱ్ఱెలు - ప్రస్తావము
గోవులు (ఆవులు) - ఉద్గీథము
గుఱ్ఱములు - ‘ప్రతిహారము’
పురుషుడు (మానవుడు) - ‘నిధనము’
ఈ విధమైన ఉపాసన ఆత్మోపాసనకు దారితీస్తూ ఉన్నది.

(గమనిక: 2–6 ఖండములో కూడా చెప్పబడిన పశు ఉపాసన)


స య ఏవమేతా రేవత్యః పశుషు ప్రోతా వేద
పశుమాన్భవతి సర్వమాయురేతి జ్యోగ్జీవతి
మహాన్ప్రజయా పశుభిర్భవతి మహాన్కీర్త్యా
పశూన్న నిందేత్తద్వ్రతం .. 2.18.2..

.. ఇతి అష్టాదశః ఖండః ..
2. స య ఏవం ఏతా
రేవత్యః పశుషు ప్రోతా
వేద - పశుమాన్ భవతి।
సర్వం ఆయుః ఏతి।
జ్యోక్ జీవతి। మహాన్ ప్రజయా
పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా।
పశూన్ న నిందేత్ తత్ వ్రతమ్।।
అట్టి రేవతీ సామగానముచే ‘పశువు’ (మేకలు - గొఱ్ఱెలు - గోవులు - గుఱ్ఱములు, పురుషుడు) లను ఉపాసించు అభ్యాసి,
- పశు సంపదా సమృద్ధి పొందగలడు.
- ఆయుష్షు పావనము కాగలదు.
- జ్యోతిస్వరూప జీవనము (స్వయంజ్యోతి, అఖండజ్యోతి రూపము) స్వానుభవముగా పొందగలడు.
- ప్రజ - పశు సంపదలు పొందగలడు.
- గొప్ప కీర్తి పొందగలడు.
పశువులను నిందించరాదు. ఇదంతా వ్రతమై ఉండును గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే అష్టాదశః ఖండః


2–19. ద్వితీయ ప్రపాఠకః - ఏకోనవింశః ఖండః - యజ్ఞ యజ్ఞీయ అంగ సామగానోపాసన


లోమ హింకారస్త్వక్ప్రస్తావో మాగ్ంసముద్గీథోస్థి
ప్రతిహారో మజ్జా నిధనమేతద్యజ్ఞాయజ్ఞీయమంగేషు
ప్రోతం .. 2.19.1..
1. లోమ ‘‘హింకారః’’।
త్వక్ ప్రస్తావో।
మాగ్ంసమ్ ఉద్గీథః।
అస్థి ‘‘ప్రతిహారో’’।
మజ్జా ‘‘నిధనం’’।
ఏతత్ యజ్ఞా యజ్ఞీయమ్
అంగేషు ప్రోతమ్।
లోమము (రోమము) - ‘హిం’కారము
త్వక్ (చర్మము) - ప్రస్తావము
మాంసము - ఉద్గీథము
బొమికలు (అస్థి) - ప్రతిహారము
మజ్జ (ఎముకలలోని పొడి పదార్థము) - నిధనము

శరీరావయవ సంబంధితమైన ఈ ‘‘యజ్ఞా-యజ్ఞీయ సామోపాసన’’ ఎరిగియున్నవారు - ఉత్తమ అంగములు కలిగి ఉండగలరు.

స య ఏవమేతద్యజ్ఞాయజ్ఞీయమంగేషు ప్రోతం వేదాంగీ భవతి
నాంగేన విహూర్ఛతి సర్వమాయురేతి జ్యోగ్జీవతి
మహాన్ప్రజయా పశుభిర్భవతి మహాన్కీర్త్యా సంవత్సరం
మజ్జ్ఞో నాశ్నీయాత్తద్వ్రతం మజ్జ్ఞో
నాశ్నీయాదితి వా .. 2.19.2..
2. స య ఏవం ఏతత్ యజ్ఞా యజ్ఞీయం
అంగేషు ప్రోతం వేదాంగీ భవతి।

న అంగేన విహూర్ఛతి।
సర్వం ఆయుః ఏతి। జ్యోక్ జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా।
సంవత్సరం మఙజ్ఞో (మనోజ్ఞో)
న అశ్నీయాత్। తత్ వ్రతమ్।।
మఙజ్ఞో న అశ్నీయాత్ ఇతి వా।।

.. ఇతి ఏకోనవింశః ఖండః ..
అట్టి యజ్ఞ యజ్ఞీయ అంగదృష్టి కలిగియున్నవాడు (అంగ యజ్ఞో పాసకుడు) వేదములు (తెలియబడే సమస్తము) తన అవయవములుగా భావన సిద్ధించుకొని ‘‘వేదాంగి’’ - కాగలడు.
- ఆతడు అంగములచే బాధించబడడు.
- ఉత్తమ ఆయుష్షు పొందగలడు.
- జ్యోతివలె స్వయం ప్రకాశకుడై వెలుగొందగలడు.
- ఉత్తమ కీర్తిమంతుడు కాగలడు.
సంవత్సరమంతా (ఎల్లకాలము) స్వీకరించకూడనివి ఎరిగి స్వీకరించక ఉండాలి. శాస్త్ర - గురు - ఆర్య వాక్యానుసారం శుభప్రదమైనవి, జ్ఞానప్రదమైనవి మాత్రమే స్వీకరించాలి.
ఇది ‘వ్రతము’గా అనువర్తించబడు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ఏకోనవింశః ఖండః


2–20. ద్వితీయ ప్రపాఠకః - వింశః ఖండః - దేవతా రాజన సామగానోపాసన


అగ్నిర్హింకారో వాయుః ప్రస్తావ ఆదిత్య ఉద్గీథో
నక్షత్రాణి ప్రతిహారశ్చంద్రమా నిధనమేతద్రాజనం
దేవతాసు ప్రోతం .. 2.20.1..
1. అగ్నిః ‘‘హింకారో’’
వాయుః ‘‘ప్రస్తావ’’।
ఆదిత్య ఉద్గీథో।
నక్షత్రాణి ‘‘ప్రతిహారః’’
చంద్రమా ‘‘నిధనం’’
ఏతత్ రాజనం దేవతాసు ప్రోతమ్।
అగ్ని - ‘హిం’ కారము।
వాయువు - ‘‘ప్రస్తావము’’।
ఆదిత్యుడు - ‘‘ఉద్గీథము’’।
నక్షత్రములు - ‘‘ప్రతిహారము’’।
చంద్రుడు - ‘‘నిధనము’’
ఇది ‘‘దేవతా రాజన సామ గానము’’గా చెప్పబడుతోంది.

స య ఏవమేతద్రాజనం దేవతాసు ప్రోతం వేదైతాసామేవ
దేవతానాగ్ంసలోకతాగ్ంసర్ష్టితాగ్ంసాయుజ్యం గచ్ఛతి
సర్వమాయురేతి జ్యోగ్జీవతి మహాన్ప్రజయా పశుభిర్భవతి
మహాన్కీర్త్యా బ్రాహ్మణాన్న నిందేత్తద్వ్రతం .. 2.20.2..

.. ఇతి వింశః ఖండః ..
2. స య ఏవం ఏతత్
రాజనం దేవతాసు ప్రోతం వేద,
ఏతా సామా ఏవ దైవతానాగ్ం
సలోకతాగ్ం సార్‌ష్టితాగ్ం
సాయుజ్యం గచ్ఛతి।
సర్వం ఆయుః ఏతి। జ్యోగ్జీవతి।
మహాన్ ప్రజయా పశుభిః భవతి।
మహాన్ కీర్త్యా బ్రాహ్మణాన్ న నిందేత్।
తత్ వ్రతమ్।।
అట్టి ‘‘రాజనం దేవతాసు సామగానోపాసనం’’ ఎరిగినవాడు దేవతా తత్త్వమును ఎరిగినవాడై లోకపరిధులను దాటి వేయగలడు. ‘సాయుజ్యము’ సిద్ధించుకోగలడు.
- ఆయుష్షు సద్వినియోగపడగలదు.
- స్వయంజ్యోతి స్వరూపుడు కాగలడు.
- మహాన్ ప్రజ - పశు సంపద పొందగలడు.
- మహాన్ కీర్తిమంతుడగుచున్నాడు.
బ్రహ్మతత్త్వజ్ఞులగు (బ్రాహ్మణముల అంతర్గానము ఎరిగిన) బ్రాహ్మణులను నిందించరాదు. ఇది వ్రతము।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే వింశః ఖండః


2-21. ద్వితీయ ప్రపాఠకః - ఏకవింశః ఖండః - సర్వస్మిన్ సామగానోపాసన


త్రయీ విద్యా హింకారస్త్రయ ఇమే లోకాః స
ప్రస్తావోఽగ్నిర్వాయురాదిత్యః స ఉద్గీథో నక్షత్రాణి
వయాగ్ంసి మరీచయః స ప్రతిహారః సర్పా గంధర్వాః
పితరస్తన్నిధనమేతత్సామ సర్వస్మిన్ప్రోతం .. 2.21.1..
1. త్రయీ విద్యా ‘‘హింకారః’’।
త్రయ ఇమే లోకాః ‘‘ప్రస్తావో’’
అగ్నిః వాయుః ఆదిత్యః స ‘‘ఉద్గీథో’’
నక్షత్రాణి వయాగ్ంసి మరీచయః, స ‘‘ప్రతిహారః’’।
సర్పా గంధర్వాః పితరః తత్ ‘‘నిధనం’’।
ఏతత్ సామ సర్వస్మిన్ ప్రోతమ్।।
త్రయీ విద్యా(ఋక్-యజుః-సామ వేదములు) - ‘హిం’ కారము
భూర్-భువర్-సువర్ త్రైలోకములు - ‘‘ప్రస్తావము’’
అగ్ని-వాయు-ఆదిత్య త్రయీ దేవతలు - ‘‘ఉద్గీథము’’
నక్షత్రములు, పక్షులు, సూర్యకిరణములు - ‘‘ప్రతిహారము’’
సర్పములు, గంధర్వులు, పితృదేవతలు - ‘‘నిధనము’’
ఇదంతా ‘‘సామ సర్వస్మిన్’’ లేక ‘‘సర్వస్మిన్ సామోపాసన’’ - అనబడుతోంది.


స య ఏవమేతత్సామ సర్వస్మిన్ప్రోతం వేద సర్వగ్ం హ
భవతి .. 2.21.2..
2. స య ఏవం ఏతత్ సామ సర్వస్మిన్
ప్రోతం వేద సర్వగ్ం హ భవతి।
అట్టి సర్వస్మిన్ సామగానోపాసన ఎరిగినవాడు వేదవిద్వాంసుడు, వేదహృదయము ఎరిగినవాడు.
సర్వులకు సంబంధించిన సామగానము హృదయమునందు దర్శించగలడు.


తదేష శ్లోకో యాని పంచధా త్రీణీ త్రీణి
తేభ్యో న జ్యాయః పరమన్యదస్తి .. 2.21.3..
3. తత్ ఏష శ్లోకః, యాని
పంచధా త్రీణి త్రీణి తేభ్యో।
న జ్యాయః పరం అన్యత్ అస్తి।
దీనికి సంబంధించిన మనన రూపమంత్రము ‘‘5’’ విధములుగా ‘3’ విభాగములుగా (5x3=15) ఏర్పడి ఉపాసించబడుచున్నాయి.
అట్టి ‘15’ అక్షరముల సామగానము (సర్వస్మిన్ వేద సామగానము) మించిన ఉపాసన మరొకటి లేదు.


యస్తద్వేద స వేద సర్వగ్ం సర్వా దిశో బలిమస్మై హరంతి
సర్వమస్మీత్యుపాసిత తద్వ్రతం తద్వ్రతం .. 2.21.4..

.. ఇతి ఏకవింశః ఖండః ..
4. యః తత్ వేద స వేద సర్వగ్ం।
సర్వా దిశో బలిం అస్మై హరంతి।
‘‘సర్వం అస్మి’’ - ఇతి ఉపాసీత।
తత్ వ్రతం తత్ వ్రతమ్।।
ఈ స్వర్వస్మిన్ సామవేదగానము తెలిసినవారు సర్వము ఎరిగిన వారగుచున్నారు.
వారికి సర్వదిక్కులు తమ బలమును ప్రసాదిస్తూ ఉండగా, వారు ఆత్మబలము పునికిపుచ్చుకోగలరు.
‘‘ఈ సమస్తము నేనై ఉన్న నేను’’ను ఉపాసించెదరు గాక।
ఇది వ్రతమగు గాక। ఇదియే వ్రతమగు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ఏకవింశః ఖండః


2–22. ద్వితీయ ప్రపాఠకః - ద్వావింశః ఖండః - వినర్ది సామోపాసన


వినర్ది సామ్నో వృణే పశవ్యమిత్యగ్నేరుద్గీథోఽనిరుక్తః
ప్రజాపతేర్నిరుక్తః సోమస్య మృదు శ్లక్ష్ణం వాయోః
శ్లక్ష్ణం బలవదింద్రస్య క్రౌంచం బృహస్పతేరపధ్వాంతం
వరుణస్య తాన్సర్వానేవోపసేవేత వారుణం త్వేవ వర్జయేత్ .. 2.22.1..
1. వినర్ది సామ్నో వృణే పశవ్యమ్ ఇతి।
అగ్నేః ఉద్గీథో। అనిరుక్తః ప్రజాపతేః।
నిరుక్తః సోమస్య మృదు శ్లక్‌ష్ణం వాయోః।
శ్లక్‌ష్ణం బలవత్ ఇంద్రస్య।
క్రౌన్చం బృహస్పతేః అపధ్వాంతం వరుణస్య।
తాన్ సర్వాన్ ఏవ ఉపసేవేత
వారుణం తు ఏవ వర్జయేత్।।
పైన చెప్పుకుంటూ ఉన్నట్టి ‘‘సామగానము’’చే సర్వత్రా విస్తారమగు ఆత్మ అనుభవమవగలదు.
వినర్ది (ఎద్దుతో పోలిన) గానము పశువులకు హితకరము.

అగ్ని - ఉద్గీథముగా
ప్రజాపతి - అనిరుక్తముగా
చంద్రుడు - నిరుక్తముగా
వాయువు - మృదువుగా, ప్రియముగా, పిల్లవాయు తరంగాలుగా
ఇంద్రుడు - ప్రియము, బలములతో కూడి
బృహస్పతి - క్రౌంచముగా (కొండగా)
వరుణుడు - అపధ్వాంతముగా (తిరస్కరించవలసినవి తిరస్కరించుటకు శక్తిగా) సామగానములన్నిటినీ ఉపసేవించాలి. సాధన చేయాలి.

వారుణము అనబడు అపధ్వాంతము (దూషణలను) విసర్జించాలి.

అమృతత్వం దేవేభ్య ఆగాయానీత్యాగాయేత్స్వధాం
పితృభ్య ఆశాం మనుష్యేభ్యస్తృణోదకం పశుభ్యః
స్వర్గం లోకం యజమానాయాన్నమాత్మన ఆగాయానీత్యేతాని
మనసా ధ్యాయన్నప్రమత్తః స్తువీత .. 2.22.2..
2. అమృతత్వం దేవేభ్య
ఆగాయని ఇతి ఆగాయేత్।
స్వధాం పితృభ్య।
ఆశాం మనుష్యేభ్యః।
తృణ ఉదకం పశుభ్యః।

స్వర్గం లోకం యజమానాయ।
అన్నమ్ ఆత్మన ఆగాయానీ ఇతి।
ఏతాని మనసా ధ్యాయన్
అప్రమత్తః స్తువీత।।

ఈ ‘‘అగ్ని, ప్రజాపతి, చంద్ర, ఇంద్ర, బృహస్పతి, వరుణ’’ - సామగానోపాసనచే ఓ ఆయా దేవతలారా! మాకు అమృతత్వము ప్రసాదించండి!’’ - అని సామగానము చేయుదురు గాక!

ఓ దేవతలారా! నన్ను అమృతత్వమునకు జేర్చండి. మా పితృదేవతలకు తృప్తిగా స్వధామ - భోజనము అందించండి. మా పశువులకు గడ్డి, నీరు లభించును గాక।

యజమానికి స్వర్గలోకం లభించును గాక।

నాకు అన్నము (బ్రహ్మము। బ్రాహ్మీస్థితి) ప్రసాదించండి.

ఈ విధంగా మనస్సును నియామకం చేసి అప్రమత్తతతో సామస్తుతి సమర్పిస్తూ ధ్యానించెదరు గాక।


సర్వే స్వరా ఇంద్రస్యాత్మానః సర్వ ఊష్మాణః
ప్రజాపతేరాత్మానః సర్వే స్పర్శా మృత్యోరాత్మానస్తం
యది స్వరేషూపాలభేతేంద్రగ్ంశరణం ప్రపన్నోఽభూవం
స త్వా ప్రతి వక్ష్యతీత్యేనం బ్రూయాత్ .. 2.22.3..

3. సర్వే స్వరా ఇంద్రస్య ఆత్మనః।

సర్వ ఊష్మాణః ప్రజాపతేః ఆత్మానః।

సర్వే స్పర్శా మృత్యోః ఆత్మానస్తం

యది స్వరేషు ఉపాలభేత్
ఇన్ద్రగ్ం శరణం ప్రపన్నో

అభూవం స త్వా ప్రతివక్ష్యతి


ఇతి ఏనం బ్రూయాత్।
సమస్త స్వరములు ఇంద్రభగవానుని రూపములే।

ఊష్మములు (ఉష్ణములు, ఉత్తేజములు) అన్నీ కూడా ప్రజాపతి రూపములే।

స్పర్శలన్నీ కూడా ‘మృత్యువు’ యొక్క రూపములే।

స్వరములో ఏవైనా దోషములు ఉంటే - ‘‘స్వామీ! ఇంద్రదేవా! మిమ్ములను శరణువేడి ఈ స్వరము పలుకుచున్నాను’’ - అని నమస్కరించుదురు గాక।

‘‘ఇంద్రదేవా! మీరు సమాధానము ప్రసాదించెదరు గాక। దోషములు తొలగించి నన్ను ఉద్ధరించండి’’ అని ప్రార్థన చేసి స్వరం పలికెదరు గాక।

దోషములు చూపువారితో ‘‘అయ్యా! క్షమించండి! ఇంద్రదేవుడు సరిచేయుటకై ప్రార్థిస్తున్నాను’’-అని వినమ్రులై పలికెదరు గాక। ఇంద్రుని ఆ రీతిగా వేడెదరు గాక।

అథ యద్యేనమూష్మసూపాలభేత ప్రజాపతిగ్ంశరణం
ప్రపన్నోఽభూవం స త్వా ప్రతి పేక్ష్యతీత్యేనం
బ్రూయాదథ యద్యేనగ్ం స్పర్శేషూపాలభేత మృత్యుగ్ం శరణం
ప్రపన్నోఽభూవం స త్వా ప్రతి ధక్ష్యతీత్యేనం బ్రూయాత్ .. 2.22.4..


4. అథ యది ఏనం ఊష్మసు ఉపాలభేత
ప్రజాపతిగ్ం శరణం,
ప్రపన్నో అభూవం,
స త్వా ప్రతిపేక్ష్యతి -
ఇతి ఏనం బ్రూయాత్।



అథ యది ఏనగ్ం
స్పర్శేషు ఉపాలభేత
మృత్యుగ్ం శరణం
ప్రపన్నో అభూవం
స త్వా ప్రతిధక్ష్యతి
ఇతి ఏనం బ్రూయాత్।।
(ఊష్మములు = గాలిని ఊదుచూ పలుకు వర్ణములు. ‘‘శ-ష-స-హ’’ అను వర్ణములు. జిహ్వమూలీయము ‘క’ కార ‘ఖ’ కారములకు ముందు వచ్చే విసర్గలు. అనుస్వారము)

గాలిని ఊదుతూ పలికే శ-ష-స-హ వర్ణములు, ‘క’కార-‘గ’కార విసర్గలు, అనుస్వారములు - మొదలైన ఊష్మములలో దోషము ఎవరైనా చూపుతూ ఉంటే, ‘‘నేను ప్రజాపతిని ఈ విషయంలో శరణు వేడుచున్నాను. క్షమించబడుదును గాక।’’ - అని నమస్కరిస్తూ ప్రజాపతిని వేడెదరు గాక।


‘‘స్పర్శ’’లో ఏవైనా దోషములున్నాయేమోనని అనుకుంటే ‘‘నేను మృత్యు దేవతను శరణువేడుచున్నాను. నమస్కరించి సరిచేయమని ప్రార్థన’’ అని నమస్కరిస్తూ ప్రతిధ్యక్షిస్తూ (అభ్యర్థన చేస్తూ)
దోష నివృత్తికై - ప్రార్థన పలకాలి.
‘‘మృత్యుదేవత దోషములను దహించును గాక’’ - అని భావపూర్వకంగా శరణాగతుడవాలి.

సర్వే స్వరా ఘోషవంతో బలవంతో వక్తవ్యా ఇంద్రే బలం
దదానీతి సర్వ ఊష్మాణోఽగ్రస్తా అనిరస్తా వివృతా
వక్తవ్యాః ప్రజాపతేరాత్మానం పరిదదానీతి సర్వే స్పర్శా
లేశేనానభినిహితా వక్తవ్యా మృత్యోరాత్మానం
పరిహరాణీతి .. 2.22.5..

.. ఇతి ద్వావింశః ఖండః ..
5. సర్వే స్వరా ఘోషవన్తో
బలవన్తో వక్తవ్యా।
ఇంద్రే బలం దదాని ఇతి।


సర్వ ఊష్మాణో అగ్రస్తా అనిరస్తా,
వివృతా వక్తవ్యాః।



‘‘ప్రజాపతేః ఆత్మానం పరిదదాని’’
ఇతి సర్వే స్పర్శా లేశేనాన్
అభినిహితా వక్తవ్యా।

మృత్యోః ఆత్మానం పరిహరాణి। ఇతి।।
సప్త స్వరములను (‘‘స-రి-గ-మ-ప-ద-ని’’) ఎలుగెత్తి బలమైన నాదముతో, సుశబ్దంగా భావన చేసి గట్టిగా, సుస్పష్టంగా పలకాలి.
‘‘ఇంద్ర భగవానుడు మాకు శబ్ద - నాద బలము ప్రసాదించు గాక’’ - అని భావించి ఉచ్చరించాలి.


సర్వ ఊష్మాణములను (గాలిని ఊదుతూ పలికే ‘శ స ష హ’ వర్ణములను, అనుస్వరములను) - అగ్రములుగా (ప్రాముఖ్య భావనా సహితంగా), అనిరస్తములుగా (అనిరుక్తముగా - సుస్పష్టంగా, నిర్దుష్టంగా) వివృత్తంగా (విడివిడిగా), భావనాపూర్వకంగా పలకాలి.



‘‘జగద్రచయిత అగు ప్రజాపతికి నా ఈ సర్వము సమర్పిస్తున్నాను. ఆత్మార్పణము చేయుచున్నాను’’ - అని భావన చేస్తూ సర్వ శబ్దస్పర్శలను (ఒక శబ్దభావనతో మరొక శబ్దభావన కలిసిపోకుండా) పలకాలి.

‘‘మృత్యువు నుండి నేను రక్షింపబడెదను గాక’’ - అని అమృతస్థాన, మహాశయముతో పలకాలి. అమృతస్థానమును ఉపాసించెదరు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే ద్వావింశః ఖండః


2–23. ద్వితీయ ప్రపాఠకః - త్రయోవింశః ఖండః - త్రయీ విద్యా - భూః భువః సువః - ‘‘ఓం’’


త్రయో ధర్మస్కంధా యజ్ఞోఽధ్యయనం దానమితి ప్రథమస్తప
ఏవ ద్వితీయో బ్రహ్మచార్యాచార్యకులవాసీ
తృతీయోఽత్యంతమాత్మానమాచార్యకులేఽవసాదయన్సర్వ
ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మసగ్ంస్థోఽమృతత్వమేతి .. 2.23.1..
1. త్రయో ధర్మ స్కంధాః।
యజ్ఞో, అధ్యయనం, దానం ఇతి ప్రథమః।


తప ఏవ। ద్వితీయః।

బ్రహ్మచారీ ఆచార్య కులవాసీ తృతీయో।
అత్యన్తం ఆచార్యకులే అవసాదయః।
సర్వ ఏతే పుణ్యలోకా భవన్తి।

బ్రహ్మసగ్ంస్థో, అమృతత్వం ఏతి।
మూడు ధర్మ స్కందములు (విభాగములు, సమూహములు)
(1) యజ్ఞము, (2) అధ్యయనము, (3) దానము - వీటికి ముందుగా సంసిద్ధులం కావాలి. ఇది మొదటిది.

‘‘తపస్సు’’ రెండవది.

బ్రహ్మచర్యము ఆర్యకుల వాసము (గురుకుల వాసము) మూడవది.
అన్నిటికీ శ్రేష్ఠము ఆచార్యకుల అవసాదయము (సేవనము). అట్టి గురుసేవచే పుణ్యలోకములు లభించగలవు.

అట్టి తపో బ్రహ్మచర్య గురుకుల వాసములచే బ్రహ్మమునందు బుద్ధి నిశ్చలమైనదై (సంస్థితమై) అమృతత్వము లభించగలదు.

ప్రజాపతిర్లోకానభ్యతపత్తేభ్యోఽభితప్తేభ్యస్త్రయీ విద్యా
సంప్రాస్రవత్తామభ్యతపత్తస్యా అభితప్తాయా ఏతాన్యక్షరాణి
సంప్రాస్ర్వంత భూర్భువః స్వరితి .. 2.23.2..
2. ప్రజాపతిః లోకాన్ అభ్యతపత్
తేభ్యో అభితప్తేభ్యః త్రయీ విద్యా
సంప్రాస్రవత్ తాం అభ్యతపత్।


తస్యా అభితప్తాయా ఏతాని అక్షరాణి
సంప్రాస్రవన్త ‘‘భూర్భువః స్వః’’ ఇతి।
ప్రజాపతి లోకములను తపస్సు - సంకల్పము నుండి సృష్టిస్తూ త్రయీ విద్యలను (తపస్సు, బ్రహ్మచర్యము, గురుకల సేవలను) అభితప్యేభ్యముగా (ఆచరణ మార్గములుగా) కల్పించారు.


త్రయీ విద్యనుండి త్రయీ (ఋక్ - యజుర్ - సామ)వేదములను, (అ+ఉ+మ) త్రయీ అక్షరములను, భూర్ (Matter) - భువర్ (Thought and Feelings) - స్వర్ (దివ్య) వ్యాహృతులు అను త్రైలోకములను కల్పించారు.

తాన్యభ్యతపత్తేభ్యోఽభితప్తేభ్య ఓంకారః
సంప్రాస్రవత్తద్యథా శంకునా సర్వాణి పర్ణాని
సంతృణ్ణాన్యేవమోంకారేణ సర్వా వాక్సంతృణ్ణోంకార ఏవేదగ్ం
సర్వమోంకార ఏవేదగ్ం సర్వం .. 2.23.3..

.. ఇతి త్రయోవింశః ఖండః ..
3. తాని అభ్యతపత్
తేభ్యో అభితప్తేభ్య
‘ఓం’కారః సంప్రాస్రవత్।।

తత్ యథా శంకునా సర్వాణి
పర్ణాని సన్తృణ్ణాని।

ఏవం ‘ఓం’కారేణ సర్వా వాక్ సన్తృణ్ణ।

‘ఓం’కార ఏవ ఇదగ్ం సర్వమ్।
‘ఓం’కార ఏవ ఇదగ్ం సర్వమ్।।

వాటి ‘‘అభితపము’’ నుండి ‘ఓం’ కారము జనిస్తోంది.
అట్టి ‘ఓం’కారము నుండి సమస్త జగత్తు బయల్వెడల సాగుతోంది.

సర్వపర్ణములు (ఆకులవలె) మనో బుద్ధి చిత్త అహంకారములన్నీ జీవకణములుగా బయల్వెడలుచున్నాయి.

‘ఓం’కారము నుండే సమస్త ‘వాక్’ బయల్వెడలుచున్నది.

కనుక ఈ సమస్తము ‘ఓం’ కారమే।
ఓంకారమే ఈ సమస్తము।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే త్రయోవింశతి ఖండః


2–24. ద్వితీయ ప్రపాఠకః - చతుర్వింశః ఖండః - సవనము (యజ్ఞము)

అగ్ని = అష్టదిక్పాలకులలో ఒకరు. పూర్వ దక్షిణ దిక్ దేవత (ఆగ్నేయము) - భార్య = స్వాహాదేవి,
పట్టణము = తేజోవతి, వాహనము = మేషము, ఆయుధము = శక్తి. అష్ట వస్తువులకు రాజు కూడా!


బ్రహ్మవాదినో వదంతి యద్వసూనాం ప్రాతః సవనగ్ం రుద్రాణాం
మాధ్యందినగ్ం సవనమాదిత్యానాం చ విశ్వేషాం చ
దేవానాం తృతీయసవనం .. 2.24.1..
1. బ్రహ్మవాదినో వదన్తి
యత్ వసూనాం ప్రాతః సవనగ్ం।
రుద్రాణాం మాధ్యన్ దినగ్ం సవనం।
ఆదిత్యానాం చ విశ్వేషాం చ
దేవానాం తృతీయ సవనమ్।
బ్రహ్మతత్త్వజ్ఞుల ప్రవచనము:
ప్రాతః (ఉదయ) సవనము ఉపాసన → (అష్ట) వసువుల నిమిత్తము
మధ్యాహ్న సవనము - (ఏకాదశ) రుద్రుల నిమిత్తము
సాయం సవనము - (ద్వాదశ) ఆదిత్యుల నిమిత్తము, విశ్వేదేవుల నిమిత్తము నిర్వర్తించాలి.

క్వ తర్హి యజమానస్య లోక ఇతి స యస్తం న విద్యాత్కథం
కుర్యాదథ విద్వాన్కుర్యాత్ .. 2.24.2..
2. క్వ తర్హి యజమానస్య లోక ఇతి
స యః తమ్ న విద్యాత్
కథం కుర్యాత్? అథ విద్వాన్ కుర్యాత్।
యజమాని (యజ్ఞకర్త) ఉన్న లోకము ఏది? ఆయనచే అన్ని లోకములు స్వాధీనపరచుకోబడుచున్నాయి.

ఈ విధంగా ప్రాతః మధ్యాహ్న సాయం వసు - ఆదిత్య - రుద్ర - యజమాన లోక యజ్ఞవిధులు తెలియకుండా కర్త యజ్ఞము ఎట్లా చేయగలరు? చేయలేరు. అందుచేత యజ్ఞతత్త్వము లక్ష్యము యజ్ఞకర్త, యజ్ఞాభిమానులు, యజ్ఞము చేయించే వారు, యజ్ఞములో పాల్గొనువారు కూడా త్రైసవనములను తెలుసుకొనెదరు గాక। వసు - ఆదిత్య - రుద్ర - విశ్వేదేవ తత్త్వములను ఎరిగి ఉండెదరు గాక।

పురా ప్రాతరనువాకస్యోపాకరణాజ్జఘనేన
గార్హపత్యస్యోదాఙ్ముఖ ఉపవిశ్య స వాసవగ్ం
సామాభిగాయతి .. 2.24.3..
3. పురాప్రాతః అనువాకస్య ఉపాకరణాత్
జఘనేన గార్హపత్యస్య ఉదఙ్ముఖ
ఉపవిశ్య స వాసవగ్ం సామ అభిగాయతి।
ఉదయ అనువాకము (సవనము / ఉపాకరణము) ప్రారంభిస్తున్నప్పుడు యజ్ఞకర్త - ‘గార్హపత్యాగ్ని’కి ఉత్తరదిక్కుగా ఆసీనుడై ‘‘సవాస-సం సామగానము’’ గానము చేస్తూ యజ్ఞ యాగ హోమ కార్యక్రమము ప్రారంభిస్తున్నాడు.

లో3కద్వారమపావా3ర్ణూ 33 పశ్యేమ త్వా వయగ్ం
రా 33333 హు 3 మ్ ఆ 33 జ్యా 3 యో 3 ఆ 32111
ఇతి .. 2.24.4..
4. లో3క ద్వారమ్ అపావాℨరూణా ℨℨ పశ్యేమ
త్వా వయగ్ం రా ℨℨℨℨℨ
హు3మ్ ఆ ℨℨ జ్యాℨ యోℨ
ఆ ℨ 𝟚𝟚𝟚𝟚 - ఇతి
‘‘ఓ అగ్నిదేవా। నా విజ్ఞాపన వినండి. మా కొరకై ఊర్ధ్వలోకముల ద్వారములను తెరువండి। ఊర్ధ్వలోకములలో మాకు జ్ఞానదర్శనము ప్రసాదించండి।
ఆ తరువాత ఆహుతులను (1) (5) సార్లు అగ్నికి సమర్పిస్తూ ఉన్నాను’’
- అని యజమాని స్వరబద్ధంగా గానము చేయుచున్నాడు.


అథ జుహోతి నమోఽగ్నయే పృథివీక్షితే లోకక్షితే
లోకం మే యజమానాయ విందైష వై యజమానస్య లోక
ఏతాస్మి .. 2.24.5..
5. అథ జుహాతి నమో అగ్నయే। పృథివీ క్షితే।
లోక క్షితే లోకం మే యజమానాయ
వింద ఏష వై యజమానస్య లోక ఏతాఽస్మి।
‘‘విశ్వమంతా వ్యాపించియున్న ఓ అగ్నిదేవా! నమోనమః । ఈ అగ్ని కార్యమునకు యజమానినగు నాకు దర్శనమివ్వండి.
భూమిని, లోకములను దాటివేసి నన్ను ఉద్ధరించడానికి ఈ నేనున్న స్థానము చేరి మమ్ములను ఉద్ధరించండి।’’ అని ప్రార్థించెదరు గాక।


అత్ర యజమానః పరస్తాదాయుషః స్వాహాపజహి
పరిఘమిత్యుక్త్వోత్తిష్ఠతి తస్మై వసవః ప్రాతఃసవనగ్ం
సంప్రయచ్ఛంతి .. 2.24.6..
6. అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహా।
అపజహి పరిఘం ఇతి।
ఉక్త్వా ఉత్తిష్ఠతి।
తస్మై వసవః ప్రాతః సవనగ్ం సంప్రయచ్ఛన్తి।
‘‘యాగకర్త యొక్క పరతత్త్వాయుష్షు కొరకై ఈ ఆహుతి (నేయి) సమర్పిస్తున్నాను। స్వాహా"!’’
‘‘ఆయుర్దాయము పూర్తి అయిన తరువాత ఉత్తరగతుల కొరకు ‘‘స్వాహా’’ అని హోమము చేయుటకై సంసిద్ధుడను! పరిఘము (గడియ)ను తీసివేయుము’’ అని పలుకుచున్నారు.
అప్పుడు ‘‘అగ్నిదేవా! ఈ స్థానముకు రండి!’’ అని చెప్పుచూ యజమాని నిదుర లేస్తున్నారు.
ఆ ప్రాతః సవనము స్వీకరించి వసువులు యజమానికి వరప్రసాదులు అగుచున్నారు.

పురా మాధ్యందినస్య
సవనస్యోపాకరణాజ్జఘనేనాగ్నీధ్రీయస్యోదఙ్ముఖ
ఉపవిశ్య స రౌద్రగ్ంసామాభిగాయతి .. 2.24.7..
7. పురా మాధ్యన్ దినస్య సవనస్య ఉపకరణాత్,
జఘనేన అగ్నీధ్రస్య ఉదన్ముఖ ఉపవిశ్య
స రౌద్రగ్ం సామ అభిగాయతి।
మధ్యాహ్న సవనము (యజ్ఞము) ప్రారంభించటానికి ముందుగా యజమాని దక్షిణాగ్నికి వెనుకవైపు ఆసీనుడై, ఉత్తరదిక్కుగా చూస్తూ, ఏకాదశ రుద్రుల గురించి స్వాగత - ఆహ్వానాలు పలుకుచున్నారు. సామగాన పూర్వకంగా పలికెదరు గాక।

లో3కద్వారమపావా3ర్ణూ33 పశ్యేమ త్వా వయం
వైరా33333 హు3మ్ ఆ33జ్యా 3యో3ఆ32111ఇతి .. 2.24.8..
8. లోℨ క ద్వారం అపావా ℨ రూణా ℨℨ పశ్యేమ? త్వా వయం వైరా ℨ-ℨ-ℨ-ℨ-ℨ హు ℨ మ్
ఆ ℨ-ℨ జ్యా ℨ యో ℨ ఆ ℨ 𝟚𝟚𝟚𝟚- ఇతి।।

‘ఓ అగ్నిదేవా! ఊర్ధ్వలోకముల ద్వారములు మా కొరకై తెరిపించండి। ‘3’ ‘3’ ‘3’ సార్లు మంత్రములు, హవిస్సు సమర్పిస్తున్నాము. స్వామీ! మేము విరాట్ పదము కొరకై సమర్పిస్తున్నాము. మిమ్ములను ఆకాశంలో సందర్శించెదము గాక।’’.

హుం। హుం। హుం।
జ్యా। జ్యా। జ్యా। యో। యో। యో।
ఆ ఆ ఆ ఆ

అంటూ మంత్రములు గానము చేస్తూ హవిస్సులను ఆహుతి (సమర్పణ) చేయాలి.

అథ జుహోతి నమో వాయవేఽన్తరిక్షక్షితే లోకక్షితే
లోకం మే యజమానాయ విందైష వై యజమానస్య లోక
ఏతాస్మి .. 2.24.9..
9. అథ జుహోతి నమో వాయవే
అంతరిక్షక్షితే లోకక్షితే।
లోకం మే యజమానాయ
వింద ఏష వై యజమానస్య లోక ఏతాస్మి।
అంతరిక్షమున సంచరిస్తూ లోకరక్షణ చేస్తూ ఉన్న ఓ వాయుదేవా!

ఈ యజ్ఞమునకు యజమానినైయున్న నేను ఈ స్థానమునకు (ఇచ్చటకు) విచ్చేయుటకై ఆహ్వానము పలుకుచున్నాను సుస్వాగతం

అత్ర యజమానః పరస్తాదాయుషః స్వాహాపజహి
పరిఘమిత్యుక్త్వోత్తిష్ఠతి తస్మై రుద్రా
మాధ్యందినగ్ంసవనగ్ంసంప్రయచ్ఛంతి .. 2.24.10..
10. అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహా

అపజహి పరిఘం
ఇతి ఉక్త్వా ఉత్తిష్ఠతి।

తస్మై రుద్రా మాధ్యన్
దినగ్ం సవనగ్ం సంప్రయచ్ఛంతి।।
‘‘యజమాని పరతత్త్వ ఆయుష్షు అనుగ్రహించటానికై - హవిస్సును ఆహుతిగా సమర్పిస్తున్నాము. స్వాహా!’’

ఈ బెత్తపు దెబ్బతో యజమానిని (యజ్ఞకర్తను) ‘ఉత్తిష్ఠ’ అని విప్రులు లేపుచున్నారు.
(బెత్తపు దెబ్బ = ఉత్తేజితుని, సంసిద్ధుని చేయటము)

ఈ విధంగా మధ్యాహ్న సవనము స్వీకరించు రుద్రులు మధ్యాహ్న వరప్రసాదులై ఆశీర్వాదములు అందజేయుచున్నా

పురా తృతీయసవనస్యోపాకరణాజ్జఘనేనాహవనీయస్యోదఙ్ముఖ
ఉపవిశ్య స ఆదిత్యగ్ంస వైశ్వదేవగ్ం సామాభిగాయతి .. 2.24.11..
11. పురా తృతీయ సవనస్య
ఉపకరణాత్ జఘనేన ఆహవనీయస్య
ఉదన్ముఖ ఉపవిశ్య స ఆదిత్యగ్ం
స వైశ్వదేవగ్ం సామ అభిగాయతి
మూడవ సవనము (సాయంత్ర సవనము)నకు ముందుగా ఆహవనీయాగ్నికి ప్రక్కగా - ఉత్తరంగా ఉపవిశ్యము (Placed) అయినవాడై, ఆదిత్యుని గురించి (ఆదిస్వరూపము గురించి), విశ్వదేవతల గురించి - యజ్ఞకర్త సామగాన స్తోత్రము గానము చేయుచుండెదరు గాక.

లో3కద్వారమపావా3ర్ణూ33పశ్యేమ త్వా వయగ్ం స్వారా
33333 హు3మ్ ఆ33 జ్యా3 యో3ఆ 32111 ఇతి .. 2.24.12..
12. లోℨ క ద్వారం అపావా3 రూణా ℨ-ℨ పశ్యేమ,
త్వా వయగ్ం స్వారా ℨ-ℨ-ℨ-ℨ-ℨ హు ℨ మ్
ఆ ℨ-ℨ జ్యా ℨ యో ℨ ఆ ℨ𝟚𝟚𝟚𝟚 - ఇతి।
‘‘ఓ ఆదిత్యా! ఈ లోకములో మేము చిక్కుకొని ఉన్నాము. ఈ లోకముయొక్క ముఖద్వారము తెరవండి। మేము ‘స్వారాజ్యము’ కొరకై మిమ్ములను దర్శించగలము.
‘‘ఓ అగ్నిదేవా! స్వర్గతలముయొక్క ద్వారమును మాపై కరుణకలవారై, మా కొరకు దారిచూపండి. దివ్యలోకములు పొందుట కొరకై మేము మిమ్ములను శరణువేడుచున్నాము. మీ దర్శనభాగ్యము ప్రసాదించండి’’.
ఇది ఆదిత్యుల గురించిన సామగానము।

ఆదిత్యమథ వైశ్వదేవం లో3కద్వారమపావా3ర్ణూ33 పశ్యేమ
త్వా వయగ్ంసామ్రా33333 హు3మ్ ఆ33 జ్యా3యో3ఆ 32111
ఇతి .. 2.24.13..
13. ఆదిత్యమ్ అథ వైశ్వ దేవం లో3క ద్వారం
అపావా ℨరూణా ℨℨ పశ్యేమ।


త్వా వయగ్ం సామ్రాℨ-ℨ-ℨ-ℨ-ℨ హు ℨ మ్
ఆ ℨ-ℨ జ్యా ℨ యో ఆ ℨ𝟚𝟚𝟚𝟚 - ఇతి।
‘‘ఓ అగ్నిదేవా! స్వర్గభూములు మేము చేరటానికి ముఖద్వారము మీరు తెరిపించండి. మమ్ములను దేవతాలోకము చేరుటకై సహకరించ వలసినదిగా అభ్యర్థిస్తున్నాము’’ - అని యజమాని అగ్నిదేవునికి సాయంకాల సవనమును నుతులతో ప్రారంభం చేస్తున్నారు.

‘‘ఓ అగ్నిదేవా! మేము సమర్పిస్తున్న హోమద్రవ్యములను ఆహుతులుగా స్వీకరించి మమ్ము స్వర్గధామము జేర్చండి’’ - అని యజమాని అగ్నిదేవుని వేడుకొంటున్నారు.
ఓ విశ్వదేవతలారా! లోకము యొక్క ద్వారం తెరవండి. ఆత్మ సామ్రాజ్యము కొరకై మీ దర్శనం ఇవ్వండి।

అథ జుహోతి నమ ఆదిత్యేభ్యశ్చ విశ్వేభ్యశ్చ దేవేభ్యో
దివిక్షిద్భ్యో లోకక్షిద్భ్యో లోకం మే యజమానాయ
విందత .. 2.24.14..
14. అథ జుహోతి నమ ఆదిత్యేభ్యశ్చ।
విశ్వేభ్యశ్చ। దేవేభ్యో దివిక్షిద్భ్యో లోకక్షిద్భ్యో।
లోకం మే యజమానాయ విందత।
ఇప్పుడు ఆదిత్యునికి ఆహుతులు యజమానిచే సమర్పించ బడుచున్నాయి.

విశ్వదేవునికి (The worker of the universe) - దేవతా లోకములోని దేవతలకు, లోకపాలకులకు హవిస్సులు సమర్పిస్తున్నాను.

యజమానినగు నేను ఈ ఆహుతులు సమర్పిస్తున్నాను. స్వీకరించి యజమానినగు నాకు సంతోషము కలుగజేసెదరు గాక।

ఏష వై యజమానస్య లోక ఏతాస్మ్యత్ర యజమానః
పరస్తాదాయుషః స్వాహాపహత పరిఘమిత్యుక్త్వోత్తిష్ఠతి .. 2.24.15..
15. ఏష వై యజమానస్య లోక ఏతా అస్మి
అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహా।


అపహత పరిఘం ఇతి ఉక్త్వా ‘‘ఉత్తిష్ఠ’’ ఇతి।
హే ఆదిత్య భగవాన్। యజమానినగు నేను ఈ ఆహుతులు హవ్య వాహనుని ద్వారా సమర్పిస్తున్నాను. నాకు పరతత్త్వజ్ఞానముతో నిర్మితమగు ఆయుష్షును ప్రసాదించెదరు గాక। స్వాహా।

బెత్తపు దెబ్బచే యజమాని ఉతిష్ఠితుడు (Awakened) అగుచున్నాడు.


తస్మా ఆదిత్యాశ్చ విశ్వే చ దేవాస్తృతీయసవనగ్ం
సంప్రయచ్ఛంత్యేష హ వై యజ్ఞస్య మాత్రాం వేద య ఏవం వేద
య ఏవం వేద .. 2.24.16..

.. ఇతి చతుర్వింశః ఖండః ..

.. ఇతి ద్వితీయోఽధ్యాయః ..
16. తస్మా ఆదిత్యాశ్చ విశ్వే చ
దేవాః తృతీయ సవనగ్ం,
సంప్రయచ్ఛన్తి ఏష వై
యజ్ఞస్య మాత్రాం వేద,
య ఏవం వేద।
య ఏవం వేద।।
అప్పుడు యజమాని ఈ విధంగా ఉత్తిష్ఠితుడు (నిదురలేచినవాడు) అగుచూ ఇట్లు అంటున్నాడు.
- ఇదియే ఆదిత్య ముఖద్వారము.
- ఇదే విశ్వేశ్వరుని సమక్షము
- ఇదే దేవతలను జ్ఞాపకము చేసుకొను తృతీయ సవనము।

ఈ విధంగా అట్టి యజ్ఞపురుషుని స్థానము పొందగలము.
ఆయనను తెలుసుకొని పునీతులము అగుచున్నామ.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - ద్వితీయాధ్యాయే చతుర్వింశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది - ద్వితీయో అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅲ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - మూడవ అధ్యాయము

(మధు విద్యా ఉపాసన : 3–1 నుండి 3–11 వరకు)
(మధు = తేనె; తిరశ్చీనవగ్ం = తేనెపట్టు ఉన్న బొంగు; మరీచి = కిరణములు; మధునాడ్యః = తేనె తాగినవాడు)

3–1. తృతీయ ప్రపాఠకః - ప్రథమః ఖండః - సూర్యుని తూర్పు కిరణముల ఉపాసన


.. తృతీయోఽధ్యాయః ..

అసౌ వా ఆదిత్యో దేవమధు తస్య ద్యౌరేవ
తిరశ్చీనవగ్ంశోఽన్తరిక్షమపూపో మరీచయః పుత్రాః .. 3.1.1..
1. ఓం।
అసౌ వా ఆదిత్యో దేవ మధు।

తస్య ద్యౌః ఏవ తిరశ్చీనవగ్ంశో
అన్తరిక్షం అపూపో మరీచయః పుత్రాః।
‘ఓం’!
ఆకాశంలో ప్రకాశించు ఆదిత్యుడే (ఆది = The beginning Point of everything) దేవతలకు మధు (తేనె)

ద్యులోకమే (అమృత లోకము) తేనె పట్టు ఉన్న బొంగు వంటిది.
అట్టి ద్యులోకమునకు స్థానము అరూపమగు అంతరిక్షము. అట్టి అంతరిక్షము - తేనెపట్టు.
ఆదిత్యుని (లేక) సూర్యుని కిరణములు ఆదిత్యుని పుత్రులు- ‘‘తేనెటీగలు’’.

తస్య యే ప్రాంచో రశ్మయస్తా ఏవాస్య ప్రాచ్యో మధునాడ్యః .
ఋచ ఏవ మధుకృత ఋగ్వేద ఏవ పుష్పం తా అమృతా
ఆపస్తా వా ఏతా ఋచః .. 3.1.2..
2. తస్య యే ప్రాంచో రశ్మయస్తా ఏవ
అస్య ప్రాచ్యో మధునాడ్యః।
ఋచ ఏవ మధుకృత।
ఋగ్వేద ఏవ పుష్పమ్।।
తా అమృతా ఆపః।
తా వా ఏతా ఋచః।
అట్టి (తూర్పు నుండి) ఆదిత్యుని (సూర్యుని) నుండి ప్రసరిస్తున్న కిరణములే మధునాడ్యములు - తూర్పు మధు నాడ్యములు.

ఋగ్వేదములో ఋక్కులు - మధుకృతములు (తేనెటీగలు)
ఋగ్వేదము - ‘‘పుష్పము’’
అందలి జలమే (తేనెయే) - ‘‘అమృతము’’

అట్టి తత్త్వజ్ఞుల పరమాత్మ గురించిన ప్రవచన గానములే ఋగ్వేదము.


ఏతమృగ్వేదమభ్యతపగ్ంస్తస్యాభితప్తస్య యశస్తేజ
ఇంద్రియం వీర్యమన్నాద్యగ్ంరసోఽజాయత .. 3.1.3..
3. ఏతమ్ ఋగ్వేదం అభ్యతపన్,

తస్య అభితప్తస్య యశః
తేజ ఇన్ద్రియం వీర్యం
అన్నాద్యగ్ం రసో అజాయత।
పరమాత్మ స్వరూప స్వభావములను అభివర్ణించు తత్త్వము సదా ఉపాసించబడు గాక। భావించబడు గాక।

ఈ విధంగా - ‘‘సూర్యుడే దేవతలకు మధువుగాను, మధువు (అమృత తత్త్వముతో) స్వర్గము జేర్చునని, ఆకాశమే మధువుకు ఆధారమని, సూర్యకిరణములే మధుపుత్రులని, ఋక్కులు మధుపములని (పంచామృత విశేషములని), ఋగ్వేదమే యజ్ఞపుష్పమని, అందలి ఆత్మతత్త్వ స్తుతులే అమృతమని, ఆత్మతత్త్వము గానము చేయు ఋషులే తేనెటీగలనీ-ఎరిగి భజించువాడు - యశస్సు, తేజస్సుతో కూడిన ఇంద్రియములు, వీర్యము, అన్నాద (బ్రాహ్మీ) రసము పొందగలడు

తద్వ్యక్షరత్తదాదిత్యమభితోఽశ్రయత్తద్వా
ఏతద్యదేతదాదిత్యస్య రోహితగ్ంరూపం .. 3.1.4..

.. ఇతి ప్రథమః ఖండః ..
4. తత్ వ్యక్షరత్ తత్ ఆదిత్యమ్
అభితో అశ్రయత్।
తద్వా ఏతత్ యత్ ఏతత్
ఆదిత్యస్య రోహితగ్ం రూపమ్।।
అట్టివాడు స్వాభావికంగా ఇక్కడే, ఇప్పుడే ఆదిత్య లోకము ఆశ్రయించిన వాడై, సిద్ధించుకోగలడు. దాటివేయగలడు కూడా।
ఆదిత్యుని ఎఱ్ఱని రూపము ఉపాసిస్తూ ఆదిత్య భగవానుని ఆత్మస్వరూపునిగా గ్రహించినవాడై, క్రమంగా తానే ఆఖండాత్మానంద స్వరూపుడై విరాజిల్లగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ప్రథమః ఖండః


3–2. తృతీయ ప్రపాఠకః - ద్వితీయః ఖండః - సూర్యుని దక్షిణ కిరణముల ఉపాసన


అథ యేఽస్య దక్షిణా రశ్మయస్తా ఏవాస్య దక్షిణా
మధునాడ్యో యజూగ్ంష్యేవ మధుకృతో యజుర్వేద ఏవ పుష్పం
తా అమృత ఆపః .. 3.2.1..
1. అథ యే అస్య దక్షిణా రశ్మయస్తా
ఏవ అస్య దక్షిణా మధునాడ్యో।
యజూగ్ం షి ఇవ మధుకృతో।
యజుర్వేద ఏవ పుష్పం।
తా అమృతా ఆపః।
సూర్యునికి దక్షిణముగా ఏ కిరణములు ఉన్నాయో, అవియే దక్షిణమువైపుగల ‘‘మధునాడులు’’.
యజుర్వేదములోని మంత్రములు - తేనెటీగలు (మధుకృతములు, తుమ్మెదలు)
యజుర్వేదమే పుష్పము (తేనెటీగలు తేనె తెచ్చు స్థానములు)
తేనెయే అమృతము
(మార్పు చేర్పులు లేనట్టి - మధురమగు కేవల స్వస్వరూపము)

తాని వా ఏతాని యజూగ్ంష్యేతం
యజుర్వేదమభ్యతపగ్ంస్తస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియం
వీర్యమన్నాద్యగ్ంరసోజాయత .. 3.2.2..
2. తాని వా ఏతాని యజూగ్ంషి
ఏతం యజుర్వేదం అభ్యతపన్।
తస్య అభితప్తస్య యశః
తేజ ఇన్ద్రియం వీర్యం
అన్నాద్యగ్ం రసో అజాయత।।

యజుర్వేద మంత్రములు (యజస్సులు) యజుర్వేదమును - (తేనె పట్టును తేనె తీగలవలె) ఆలింగనము చేసుకొని ఉన్నాయి.
అట్టి యజస్సుల (మంత్రముల) యజుర్వేద ఆలింగనము వలన (ఆశ్రయము వలన) రసము రూపంగా (తేనె రూపంగా) యశస్సు, తేజస్సు, ఇంద్రియ బలము, వీర్యము, భోజనము (అన్నము) - ఇవన్నీ లభిస్తున్నాయి.


తద్వ్యక్షరత్తదాదిత్యమభితోఽశ్రయత్తద్వా
ఏతద్యదేతదాదిత్యస్య శుక్లగ్ం రూపం .. 3.2.3..

.. ఇతి ద్వితీయః ఖండః ..
3. తత్ వ్యక్షరత్ తత్ ఆదిత్యం
అభితో అశ్రయత్ తద్వా ఏతత్
యత్ ఏతత్ ఆదిత్యస్య శుక్లగ్ం రూపమ్।।
అట్టి యజస్సుల (మంత్రముల) తేనెతీగలు ఆశ్రయించియున్న ‘తేనెపట్టు’ వంటి యజుర్వేదమునుండి (ఆత్మానంద మాధుర్యము అనే) తేనె పొంగిపొరలి (జ్ఞాన) సూర్యుని చుట్టూతా ఆశ్రయించాయి.
అట్టి తేనె (యజస్సుల అంతరార్థము) ఆక్రమణయే ఆదిత్యుని ‘‘తెల్లటి రూపము’’ అయి ఉన్నది.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ద్వితీయః ఖండః


3–3. తృతీయ ప్రపాఠకః - తృతీయః ఖండః - సూర్యుని పడమర కిరణముల ఉపాసన


అథ యేఽస్య ప్రత్యంచో రశ్మయస్తా ఏవాస్య ప్రతీచ్యో
మధునాడ్యః సామాన్యేవ మధుకృతః సామవేద ఏవ పుష్పం
తా అమృతా ఆపః .. 3.3.1..
1. అథ యే అస్య ప్రత్యంచో
రశ్మయస్తా ఏవ అస్య ప్రతీచ్యో
మధునాడ్యః సామాని ఏవ మధుకృతః।
సామవేద ఏవ పుష్పం తా అమృతా ఆపః।।
సూర్యునియొక్క పడమరదిక్కు కిరణములే మధునాడ్యములు (తేనె తుట్టెలోని నాడ్యములు)
సామ గానములే (సామములే) - తేనెటీగలు (మధుకృతములు)
సామ వేదమే - (తేనెటీగలు తేనె తెస్తున్న) పుష్పములు
తేనెతుట్టెలోని తేనె రసము వలె సామవేదములోని రసమే / జలమే
- ‘‘అమృతము’’ (జన్మ-కర్మలకు ఆవలిదగు, మార్పుచేర్పులు లేని ఆత్మరూపము).

తాని వా ఏతాని సామాన్యేతగ్ం
సామవేదమభ్యతపగ్ంస్తస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియం
వీర్యమన్నాద్యగ్ంరసోఽజాయత .. 3.3.2..
2. తాని వా ఏతాని సామాని
ఏతగ్ం సామవేదం అభ్యతపన్
తస్య అభితప్తస్య యశః
తేజ ఇన్ద్రియం వీర్యం
అన్నాద్యగ్ం రసో-జాయత।।
సామములు (సామవేద గానములు) తేనెపట్టును తుమ్మెదల వలె - సామవేదమును ఆశ్రయించి, చోటు చేసుకొని ఉన్నాయి.
అట్టి సామముల (సామగానముల, సామమంత్రముల) సామవేద- ఆలింగనము నుండి యశస్సు, తేజస్సు, ఇంద్రియముల జ్ఞానసాధనముల ఆశ్రయము అనే బలము, (ఆత్మజ్ఞానము అనే) వీర్యము అనబడు రసము (తేనె) లభిస్తోంది. (‘‘రసము’’ = తత్త్వజ్ఞానము, తత్త్వానుభవము)

తద్వ్యక్షరత్తదాదిత్యమభితోఽశ్రయత్తద్వా
ఏతద్యదేతదాదిత్యస్య కృష్ణగ్ంరూపం .. 3.3.3..

.. ఇతి తృతీయః ఖండః ..
3. తత్ వ్యక్షరత్, తత్ ఆదిత్యం అభితో అశ్రయత్।
తత్ వా ఏతత్ యత్ ఏతత్ ఆదిత్యస్య కృష్ణగ్ం రూపమ్।
అట్టి రసము (ఆత్మజ్ఞానము అనే తేనె) ఆదిత్యుని ఆశ్రయించుటచేత ఏర్పడిన నలుపుయే ఆదిత్యుని కృష్ణవర్ణము.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే తృతీయః ఖండః


3–4. తృతీయ ప్రపాఠకః - చతుర్థః ఖండః - సూర్యుని ఉత్తర కిరణముల ఉపాసన


అథ యేఽస్యోదంచో రశ్మయస్తా ఏవాస్యోదీచ్యో
మధునాడ్యోఽథర్వాంగిరస ఏవ మధుకృత
ఇతిహాసపురాణం పుష్పం తా అమృతా ఆపః .. 3.4.1..
1. అథ యే అస్య ఉదంచో రశ్మయస్తా ఏవ
అస్య ఉదీచ్యో మధునాడ్యో
అథర్వ అంగిరస ఏవ మధుకృత।
ఇతిహాస పురాణం పుష్పం।
తా అమృతా ఆపః।

ఇక సూర్యుని ఉదీచ్యదిశ (ఉత్తరదిక్కు) కిరణములు.
- అట్టి ఉత్తరదిక్కు మధునాడ్యములు (నాడులు).
- అథర్వ వేద మంత్రములే ఆ ‘‘తేనెటీగలు’’.
- ఇతిహాస పురాణములు ఆత్మ మాధుర్యము కొరకు వెతకు తేనెటీగలు వ్రాలు ‘‘పుష్పములు’’.
- అందు లభించే జలమే (తేనెయే) అమృతము.


తే వా ఏతేఽథర్వాంగిరస ఏతదితిహాసపూరాణమభ్యతపగ్ం
స్తస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియాం
వీర్యమన్నాద్యగ్ంరసోఽజాయత .. 3.4.2..
2. తే వా ఏతే అథర్వ అంగిరస
ఏతత్ ఇతిహాస పురాణం అభ్యతపన్।
తస్య అభితప్తస్య యశః తేజ
ఇంద్రియం వీర్యం అన్నాద్యగ్ం
రసో అజాయత।।
అట్టి అథర్వ మంత్రములయొక్క అథర్వవేదమనే తేనెతుట్టెను ఆలింగనము చేసుకొనియుండటముచే ఇతిహాస పురాణములు లభిస్తున్నాయి.
- అట్టి ఇతిహాస పురాణములలోని (ఆత్మతత్త్వము అనే) మధురసము గ్రోలుటచే యశస్సు, తేజస్సు, వీర్యము, అన్నాదము (భుజించు మధుర పదార్థములు) లభిస్తున్నాయి.
(అంగీరసము = సమస్తము స్వస్వరూపాత్మగా దర్శించుచున్నప్పుడు లభించే మాధుర్యము)

తద్వ్యక్షరత్తదాదిత్యమభితోఽశ్రయత్తద్వా
ఏతద్యదేతదాదిత్యస్య పరం కృష్ణగ్ంరూపం .. 3.4.3..

.. ఇతి చతుర్థః ఖండః ..
3. తత్ వ్యక్షరత్ తత్ ఆదిత్యం
అభితో ఆశ్రయత్।
తత్ వా ఏతత్ యత్ ఏతత్
ఆదిత్యస్య పరం కృష్ణగ్ం రూపమ్।
అట్టి మధుర రసము (ఇతిహాస, పురాణములలోని ఆత్మతత్త్వరసము) పొంగి పొరలి సూర్యునిచుట్టూ ఏర్పడటము జరుగుతోంది. అట్టి అథర్వమంత్రముల రసరూపమగు ఇతిహాస పురాణ సారమే ఆదిత్యునిలో కనిపిస్తున్న నలుపురంగు ఆచ్ఛాదనము

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే చతుర్థః ఖండః


3–5. తృతీయ ప్రపాఠకః - పంచమః ఖండః - సూర్యుని ఊర్ధ్వ కిరణముల ఉపాసన


అథ యేఽస్యోర్ధ్వా రశ్మయస్తా ఏవాస్యోర్ధ్వా
మధునాడ్యో గుహ్యా ఏవాదేశా మధుకృతో బ్రహ్మైవ
పుష్పం తా అమృతా ఆపః .. 3.5.1..
1. అథ యే అస్య ఊర్ధ్వా రశ్మయస్తా ఏవ।
అస్య ఊర్ధ్వా మధునాడ్యో
గుహ్యా ఏవ ఆదేశా మధుకృతో।

బ్రహ్మైవ పుష్పం తా అమృతా ఆపః।
సూర్యునియొక్క ఊర్ధ్వ దిక్కువైపు కిరణములే మధునాఢ్యము (తేనెతుట్టె)

ఆత్మ గురించి గురుముఖతః లభిస్తున్న తత్త్వరహస్యమగు ఆదేశములు తుమ్మెదలు.

బ్రహ్మమే - ‘‘పుష్పము’’
జలము (రసము, తేనె) - ‘‘అమృతము’’.

తే వా ఏతే గుహ్యా ఆదేశా ఏతద్బ్రహ్మాభ్యతపగ్ం
స్తస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియం
వీర్యమన్నాద్యగ్ంరసోఽజాయత .. 3.5.2..
2. తే వా ఏతే గుహ్యా ఆదేశా
ఏతత్ బ్రహ్మ అభ్యతపన్।
తస్య అభితప్తస్య యశః
తేజ ఇంద్రియం వీర్యం
అన్నాద్యగ్ం రసో అజాయత।
బ్రహ్మతత్త్వజ్ఞులగు మహనీయుల శ్రేయోవాక్యపూర్వక తత్త్వరహస్య బోధలు బ్రహ్మమును ఆలింగనము చేయిస్తున్నాయి.

అట్టి రహస్య బోధలు ఏ ప్రణవ స్వరూపమగు ఆత్మను ఆలింగనము చేస్తున్నాయో, అట్టి బోధలు శ్రవణ మననములు చేసి, ధ్యాసను ఏకాగ్ర పరచువాడు యశస్సు, తేజస్సు, ఇంద్రియముపై అజమాయిషీ, వీర్యము, ఉత్తమానుభవముల రూపమగు అన్నాద రసములు పొందగలడు.

తద్వ్యక్షరత్తదాదిత్యమభితోఽశ్రయత్తద్వా
ఏతద్యదేతదాదిత్యస్య మధ్యే క్షోభత ఇవ .. 3.5.3..
3. తత్ వ్యక్షరత్ తత్ ఆదిత్యం అభితో ఆశ్రయత్।
తత్ వా ఏతత్ యత్ ఏతత్
ఆదిత్యస్య మధ్యే క్షోభత ఇవ।
అట్టి మధువు (తత్త్వరహస్య బోధల సారము) ఆదిత్యుని ఆశ్రయించి చుట్టూ స్థానము పొందుచున్నాయి.
ఆ మధు తత్త్వము పొంగిపొరలి సూర్యుని మధ్యగా క్షోభవలె ఆక్రమించుచున్నది.

తే వా ఏతే రసానాగ్ంరసా వేదా హి రసాస్తేషామేతే
రసాస్తాని వా ఏతాన్యమృతానామమృతాని వేదా
హ్యమృతాస్తేషామేతాన్యమృతాని .. 3.5.4..

.. ఇతి పంచమః ఖండః ..
4. తే వా ఏత రసానాగ్ం రసాః।
వేదా హి రసాః తేషాం ఏతే రసాః।।
తాని వా ఏతాని అమృతానాం అమృతాని
వేదా హి - అమృతాః
తేషాం ఏతాని అమృతాని।।
అట్టి మధువుయొక్క రసామృతము చేతనే వేదములు నిండి ఉన్నాయి. వేదముల సారము అట్టి మధుర రసామృతమే। ఆత్మమాధుర్య మార్గదర్శకత్వమే। ఆత్మయొక్క కేవల స్వరూప ఆనందరసమే అటు సూర్యుని, ఇటు వేదములను తమ కాంతి - ఎరుక తేజోవిభవముతో నింపి ఉంచుచున్నది.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే పంచమః ఖండః


3–6. తృతీయ ప్రపాఠకః - షష్ఠః ఖండః - అరుణాదిత్యోపాసన (లేక) సూర్యోదయాది కాంతుల ఉపాసన


తద్యత్ప్రథమమమృతం తద్వసవ ఉపజీవంత్యగ్నినా ముఖేన న వై
దేవా అశ్నంతి న పిబంత్యేతదేవామృతం దృష్ట్వా
తృప్యంతి .. 3.6.1..
1. తత్ యత్ ప్రథమం అమృతం

తత్ వసవ ఉపజీవన్తి అగ్నినా ముఖేన।

న వై దేవా అశ్నన్తి। న పిబన్తి।

ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి।
సూర్యోదయ వసువుల ఉపాసన
అరుణ (ఎర్రటి) రూపములో ఉన్నట్టిది ప్రథమ అమృతము.

అగ్ని ముఖంగా, అగ్నిదేవుని రూపంగా ప్రాతఃసవనమునకు అధిపతులగు - (అష్ట) వసువులు ఆ అమృతమును అనుభవముగా పొందుచున్నారు.

అయితే, దేవతలు అట్టి అమృతమును భుజించటము లేదు, త్రాగటము లేదు.

అమృతము (మార్పుచేర్పులు లేని స్వస్వరూప మాధుర్యము)ను చూస్తూ ఆనందిస్తున్నారు. తృప్తి పొందుచున్నారు.

త ఏతదేవ రూపమభిసంవిశంత్యేతస్మాద్రూపాదుద్యంతి .. 3.6.2..
2. త ఏతత్ ఏవ రూపం అభిసంవిశంతి।
ఏతస్మాత్ రూపాత్ ఉద్యన్తి।
అట్టి అమృత రూపములో లీనమగుచున్నారు.
వారు ఆత్మరూపము (లేక) అమృతరూపము పట్ల ఉద్యుక్తులు అగుచున్నారు. ఉద్యమిస్తున్నారు.

స య ఏతదేవమమృతం వేద వసూనామేవైకో భూత్వాగ్నినైవ
ముఖేనైతదేవామృతం దృష్ట్వా తృప్యతి స య ఏతదేవ
రూపమభిసంవిశత్యేతస్మాద్రూపాదుదేతి .. 3.6.3..
3. స య ఏతత్ ఏవం అమృతం వేద,
వసూనాం ఏవ ఏకో భూత్వా అగ్నిన ఏవ
ముఖేన ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।।
‘అట్టి మార్పు చేర్పులకు ఆవలిదైనట్టి అమృతరూపము ఎవరు తెలుసుకుంటారో, వారు వసువుల రూపము పొందుచూ, అగ్నిదేవుని ఉన్ముఖంగా అమృతత్వము సిద్ధించుకొనెదరు’’.

అట్టి అరుణకాంతుల సూర్యుని ఆత్మభావనకై ఉపాసించువారు మార్పుచేర్పులచే స్పర్శించబడని అమృతదృష్టిచే అసంతృప్తులను జయించగలరు. ‘ఆత్మతృప్తి’ని పొందగలరు. ‘ఆత్మమేవాహమ్’ భావనను ఆశ్రయించినవారై ఆత్మయందు నిత్యోదితులై ఉండగలరు.

స యావదాదిత్యః పురస్తాదుదేతా పశ్చాదస్తమేతా
వసూనామేవ తావదాధిపత్యగ్ంస్వారాజ్యం పర్యేతా .. 3.6.4..

.. ఇతి షష్ఠః ఖండః ..
4. స యావత్ ఆదిత్యః పురస్తాత్
ఉదేతా పశ్చాత్ అస్తమేతా
వసూనాం ఏవ తావత్
ఆధిపత్యగ్ం స్వారాజ్యం పర్యేతా।
అట్టి అరుణోదయ కాంతులను ( ధ్యేయత్ సదా సవితృమండల మధ్యవర్తిమ్…., సప్త అశ్వ రథం ఆరూఢం, ప్రచండం, కశ్యపాత్మజం, భాస్కరాయ విద్మహే, మహద్ధ్యతి కరాయ ధీమహి। తన్నో ఆదిత్య ప్రచోదయాత్ మొదలైన మంత్రములతో) - ఆత్మోపాసన చేయువారు -
సూర్యుడు తూర్పున ఉదయిస్తూ పడమర అస్తమిస్తున్నంతకాలము వసువుల ఆధిపత్యము పొందినవారై స్వయం ప్రకాశత్వమగు స్వారాజ్యము సిద్ధించుకోగలరు

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే షష్ఠః ఖండః


3–7. తృతీయ ప్రపాఠకః - సప్తమః ఖండః - మధ్యాహ్న సూర్య - రుద్రుల ఉపాసన


అథ యద్ద్వితీయమమృతం తద్రుద్రా ఉపజీవంతీంద్రేణ
ముఖేన న వై దేవా అశ్నంతి న పిబంత్యేతదేవామృతం
దృష్ట్వా తృప్యంతి .. 3.7.1..
1. అథ యత్ ద్వితీయం అమృతం
తత్ ‘రుద్రా’ ఉపజీవన్తి, ఇన్ద్రేణ ముఖేన।

న వై దేవా అశ్నన్తి న పిబన్తి।

ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యన్తి।
ఇప్పుడు ఇక ద్వితీయమగు సూర్యుని శుక్ల (తెల్లని) రూప - అమృతమును (ఏకాదశ) రుద్రులు ఇంద్రుని ముఖంగా, ఇంద్రుని రూపంగా పొందుచున్నారు.

దేవతలు ఈ అమృతము కూడా తినటం లేదు, త్రాగటం లేదు.

అయితే దేవతలు - ఆ అమృతమును (The Self beyond any change) సర్వత్రా దర్శించుచు తృప్తిచెందుచున్నారు.

త ఏతదేవ రూపమభిసంవిశంత్యేతస్మాద్రూపాదుద్యంతి .. 3.7.2..
2. త ఏతత్ ఏవ రూపం అభిసంవిశంతి।
ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి।
వారు ఆ సూర్యుని తెల్లటి రూపమునందు ప్రవేశించి, ఆ రూపమును ఉద్యమింపజేస్తున్నారు.

స య ఏతదేవమమృతం వేద రుద్రాణామేవైకో భూత్వేంద్రేణైవ
ముఖేనైతదేవామృతం దృష్ట్వా తృప్యతి స ఏతదేవ
రూపమభిసంవిశత్యేతస్మాద్రూపాదుదేతి .. 3.7.3..
3. స య ఏతత్ ఏవం అమృతం
వేద రుద్రాణాం ఏవ-ఏకో భూత్వా,
ఇంద్రేణ ఏవ ముఖేన ఏతత్
ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి।
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।
ఎవ్వరైతే అట్టి ఆదిత్యునియొక్క తెల్లటి ‘‘అమృత’’ రూపము తెలుసుకొంటూ ఉంటున్నారో అట్టి ఉపాసనపరుడు ఏకాదశ రుద్రులలో ఒకడుగా అగుచు, ఇంద్రుని సహాయముతో అట్టి అమృతమును సర్వదా దర్శించుచు ‘ఆత్మతృప్తుడు’ అగుచున్నాడు.
- అట్టి అమృత రూపములో విలీనుడు అగుచున్నాడు.
- తత్ రూపమునందు ఉదితుడై (ఉదయించి) స్వయం అమృతరూపుడగుచున్నాడు. స్వయంప్రకాశమగు నిత్య ప్రకాశాత్మానందరూపుడై విరాజిల్లుచున్నాడు.

స యావదాదిత్యః పురస్తాదుదేతా పశ్చాదస్తమేతా
ద్విస్తావద్దక్షిణత ఉదేతోత్తరతోఽస్తమేతా రుద్రాణామేవ
తావదాధిపత్యగ్ంస్వారాజ్యం పర్యేతా .. 3.7.4..

.. ఇతి సప్తమః ఖండః ..
4. స యావత్ ఆదిత్యః
పురస్తాత్ ఉదేతా।
పశ్చాత్ అస్తమేతా।
ద్విస్తావత్ దక్షిణత ఉదేత।
ఉత్తరతో అస్తమేతా।
రుద్రాణాం ఏవ,
తావత్ ఆధిపత్యగ్ం
స్వారాజ్యం పర్యేతా।
ఎవ్వడైతే - అట్టి అనన్యమగు అమృతమును (లేక) అట్టి స్వస్వరూపామృత తత్త్వమును ఎరుగుచున్నాడో అట్టివాడు సూర్యోదయాస్తములు ఉత్తర - దక్షిణములలో జరుగుచున్నంత కాలము (ఆచంద్రార్కము) ‘కాలము’ ప్రవర్తించునంతకాలము, ‘‘రుద్రస్థానము’’ పొంది ఉండగలడు.

ఇంకా, దక్షిణ దిక్కుతో ఉదయించి ఉత్తరదిక్కుతో అస్తమించు కాలము (అనగా, రెట్టింపు కాలము) - రుద్రుల ఆధిపత్యమగు స్వారాజ్యము (ఈ సమస్తము స్వయంకృతమగు స్వయం - ఆత్మస్వరూపమే - అను స్వస్వరూపాస్వాదన) సిద్ధించుకొనుచూ రుద్రానందము పొందగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే సప్తమః ఖండః


3–8. తృతీయ ప్రపాఠకః - అష్టమః ఖండః - సాయంకాల - ఆదిత్యుల ఉపాసన


అథ యత్తృతీయమమృతం తదాదిత్యా ఉపజీవంతి వరుణేన
ముఖేన న వై దేవా అశ్నంతి న పిబంత్యేతదేవామృతం
దృష్ట్వా తృప్యంతి .. 3.8.1..
1. అథ యత్ తృతీయం అమృతం -
తత్ ఆదిత్యా ఉపజీవన్తి, వరుణేన ముఖేన।
న వై దేవా అశ్నన్తి। న పిబన్తి।
ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యన్తి।
సూర్యభగవానుని మూడవ రూప విభాగము మూడవ అమృతము. అట్టి మూడవ అమృతమును వరుణ ముఖముగా వరుణుని రూపముగా ఆదిత్యులు ఆస్వాదనచేస్తూ ఉన్నారు. (ఇది సాయంకాల సూర్యుని ఉపాసన)
దేవతలు అట్టి సాయం - అమృతతత్త్వమును దేవతలు భుజించటము లేదు. త్రాగటము లేదు. అయితే అట్టి సాయంకాల సూర్య అమృత తత్త్వమును చూస్తూ ఆనందిస్తున్నారు. తృప్తులగుచున్నారు.

త ఏతదేవ రూపమభిసంవిశంత్యేతస్మాద్రూపాదుద్యంతి .. 3.8.2..
2. త ఏతత్ ఏవ రూపం అభిసంవిశన్తి
ఏతస్మాత్ రూపాత్ ఉద్యన్తి।
ఆదిత్యులు అట్టి అమృతరూపమునందు లీనమై తత్ రూపమును పొందినవారై ఉంటున్నారు.

స య ఏతదేవమమృతం వేదాదిత్యానామేవైకో భూత్వా వరుణేనైవ
ముఖేనైతదేవామృతం దృష్ట్వా తృప్యతి స ఏతదేవ
రూపమభిసంవిశత్యేతస్మాద్రూపాదుదేతి .. 3.8.3..
3. స య ఏతత్ ఏవం అమృతం వేద,
ఆదిత్యానాం ఏవ ఏకోభూత్వా,
వరుణేన ఏవ ముఖేన ఏతత్ ఏవ
అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపమ్ అభి సంవిశతి,
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।।
అట్టి సూర్యుని సాయం సూర్య అమృత తత్త్వము ఎరిగినవాడు ద్వాదశాదిత్యులలో ఒకడై, వరుణముఖంగా ‘అమృతము’ (మార్పు- చేర్పులకు ఆవలగల కేవలమగు స్వస్వరూపమును) దర్శించుచూ తృప్తుడగుచున్నాడు.

అట్టి అమృత రూపముతో విలీనము పొంది, అమృతరూపుడై ఉదయిస్తున్నాడు.

స యావదాదిత్యో దక్షిణత ఉదేతోత్తరతోఽస్తమేతా
ద్విస్తావత్పశ్చాదుదేతా పురస్తాదస్తమేతాదిత్యానామేవ
తావదాధిపత్యగ్ంస్వారాజ్యం పర్యేతా .. 3.8.4..

.. ఇతి అష్టమః ఖండః ..
4. స యావత్ ఆదిత్యో దక్షిణత ఉదేత।
ఉత్తరతో అస్తమేతా ‘ద్వి’స్తావత్।
పశ్చాత్ ఉదేతా।
పురస్తాత్ అస్తమేతా।
ఆదిత్యానాం ఏవ,
తావత్ ఆధిపత్యగ్ం
స్వారాజ్యం పర్యేతా।।
అట్టివాడు సూర్యోదయాస్తమయము జరుగుచున్నంతకాలమునకు రెండంతలు కాలము (అనగా)
ఎంతకాలము సూర్యుడు దక్షిణ దిక్కులో ఉదయించి ఉత్తర దిక్కునందు అస్తమిస్తాడో…(మరియు)
ఎంతకాలము సూర్యుడు పశ్చిమ దిక్కుగా ఉదయించి, తూర్పు దిక్కుగా అస్తమిస్తాడో…
అంత కాలము ద్వాదశాదిత్యుల స్వారాజ్యము, సంపదలు పొందగలరు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే అష్టమః ఖండః


3–9. తృతీయ ప్రపాఠకః - నవమః ఖండః - సూర్యాస్తమయ - మరుత్తుల ఉపాసన


అథ యచ్చతుర్థమమృతం తన్మరుత ఉపజీవంతి సోమేన
ముఖేన న వై దేవా అశ్నంతి న పిబంత్యేతదేవామృతం
దృష్ట్వా తృప్యంతి .. 3.9.1..
1. అథ యః చతుర్థం అమృతం
తత్ మరుత ఉపజీవన్తి - సోమేన ముఖేన।

న వై దేవా అశ్నన్తి। న పిబంతి।
ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యన్తి।
సూర్యదేవుని నల్లని రూపము నాలుగవ అమృతము.
‘‘చంద్రముఖం’’గా మరుత్తులు ఆ చతుర్థ నల్లని రూపమును అనుభవముగా పొందుచున్నారు.

దేవతలు అట్టి నల్లటి అమృత రూపమును భుజించటము లేదు. త్రాగటము లేదు. అయితే, అట్టి అమృత చతుర్థ రూపమును చూస్తూ తృప్తిని పొందుచూ ఉన్నారు.

త ఏతదేవ రూపమభిసంవిశంత్యేతస్మాద్రూపాదుద్యంతి .. 3.9.2..
2. త ఏతత్ ఏవ రూపం అభిసంవిశన్తి,
ఏతస్మాత్ రూపాత్ ఉద్యన్తి।
ఎవ్వరైతే ఈ వివరములను తెలుసుకొంటున్నారో, ఉపాసిస్తున్నారో, అట్టివాడు మరుత్తులలో ఒకడుగా అగుచున్నాడు. సోమముఖంగా ఆ నాలుగవ అమృతరూపమును పొందుచున్నాడు. అట్టి రూపముతో ఉద్యన్తుడు అగుచున్నాడు.

స య ఏతదేవమమృతం వేద మరుతామేవైకో భూత్వా సోమేనైవ
ముఖేనైతదేవామృతం దృష్ట్వా తృప్యతి స ఏతదేవ
రూపమభిసంవిశత్యేతస్మాద్రూపాదుదేతి .. 3.9.3..
3. స య ఏతత్ ఏవం అమృతం వేద,
మరుతాం ఏవ ఏకో భూత్వా
సోమేన ఏవ ముఖేన।
ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి,
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।
- ఆ విధంగా మరత్తులలో ఒకడై, అట్టి అమృతరూపమును పొంది,
- తత్ రూపమునందు ప్రభవించుచు,
- తత్ అమృతరూపమును దర్శించుచు తృప్తుడగుచున్నాడు.
అట్టి సూర్యాస్తమయం (సూర్యుని) నాలుగవ రూపమును ఉపాసించి ఆత్మోపాసన చేయువారు, అట్టి సూర్యాస్తమయ సూర్యతత్త్వమును సంతరించుకొని ఆదిత్యునియందు ఉదయించువారు అవగలరు.

స యావదాదిత్యః పశ్చాదుదేతా పురస్తాదస్తమేతా
ద్విస్తావదుత్తరత ఉదేతా దక్షిణతోఽస్తమేతా మరుతామేవ
తావదాధిపత్య్గ్ంస్వారాజ్యం పర్యేతా .. 3.9.4..

.. ఇతి నవమః ఖండః ..

4. స యావత్ ఆదిత్యః।
పశ్చాత్ ఉదేతా।
పురస్తాత్ అస్తం।
ఏతా ‘ద్వి’స్తావత్
ఉత్తరత ఉదేతా।
దక్షిణతో అస్తమేతా।
మరుతాం ఏవ,
తావత్ ఆధిపత్యగ్ం
స్వారాజ్యం పర్యేతా।।
సూర్యుడు ఎంతవరకు పశ్చిమదిక్కుగా ఉదయించి తూర్పుదిక్కుగా అస్తమిస్తున్నాడో, అంతకు రెండింతలు -
ఉత్తర దిక్కుగా ఉదయించి దక్షిణ దిక్కుగా అస్తమించు కాలము అంతకాలము - సూర్యుని నాలుగవ అమృత రూపము ఎరిగి ఉపాసించువాడు మరుత్తులలో ఒకడై ఆధిపత్యము, స్వారాజ్యము పొందియుండగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే నవమః ఖండః


3–10. తృతీయ ప్రపాఠకః - దశమః ఖండః - సాధ్యుల - ఆదిత్య అంతరాంతర - బ్రహ్మోపాసన


అథ యత్పంచమమమృతం తత్సాధ్యా ఉపజీవంతి బ్రహ్మణా
ముఖేన న వై దేవా అశ్నంతి న పిబంత్యేతదేవామృతం
దృష్ట్వా తృప్యంతి .. 3.10.1..
1. అథ యత్ పంచమం
అమృతం తత్ సాధ్యా ఉపజీవన్తి,
బ్రహ్మణా ముఖేన।।

న వై దేవా అశ్నన్తి। న పిబన్తి।
ఏతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యన్తి।
సూర్యభగవానుని అంతర (లోపలి) రూపము ‘పంచమ’ అమృత రూపము.
అట్టి పంచమ అమృతరూపమును బ్రహ్మదేవుని (ప్రజాపతి) ముఖంగా సాధ్యులు ఆశ్రయించి జీవిస్తున్నారు.

దేవతలు అట్టి అంతర్గత పంచమ అమృత రూపమును తినటము లేదు. త్రాగటము లేదు. అయితే అట్టి సూర్య అంతరామృతమునే దర్శిస్తూ తృప్తులు అగుచున్నారు.

త ఏతదేవ రూపమభిసంవిశంత్యేతస్మాద్రూపాదుద్యంతి .. 3.10.2..
2. త ఏతత్ ఏవ రూపం
అభిసంవిశన్తి ఏతస్మాత్
రూపాత్ ఉద్యన్తి।
అట్టి ఐదవ అంతరామృత రూపమును చూస్తూ సర్వదా ఆ అమృత రూపమునందే సాధ్యులు - నిత్యోదితులై ఉంటున్నారు.

స య ఏతదేవమమృతం వేద సాధ్యానామేవైకో భూత్వా
బ్రహ్మణైవ ముఖేనైతదేవామృతం దృష్ట్వా తృప్యతి స ఏతదేవ
రూపమభిసంవిశత్యేతస్మాద్రూపాదుదేతి .. 3.10.3..
3. స య ఏతత్ ఏవం
అమృతం వేద సాధ్యానాం ఏవ
ఏకో భూత్వా బ్రహ్మణైవ ముఖేన
ఎతత్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యతి।
స ఏతత్ ఏవ రూపం అభిసంవిశతి।
ఏతస్మాత్ రూపాత్ ఉదేతి।।
అట్టి అంతర - అమృతరూపమును ఎరిగినవారు సాధ్యులలో ఒకరై, బ్రహ్మదేవుని (ప్రజాపతి) ముఖంగా అమృతదర్శనం చేస్తూ ఆత్మతృప్తులవగలరు.
అట్టి రూపములో ప్రవేశము పొంది అమృతస్వరూపులుగా ఉదయించగలరు.

స యావదాదిత్య ఉత్తరత ఉదేతా దక్షిణతోఽస్తమేతా
ద్విస్తావదూర్ధ్వం ఉదేతార్వాగస్తమేతా సాధ్యానామేవ
తావదాధిపత్యగ్ంస్వారాజ్యం పర్యేతా .. 3.10.4..

.. ఇతి దశమః ఖండః ..
4. స యావత్ ఆదిత్య ఉత్తరత ఉదేతా।
దక్షిణతో అస్తమేతా ద్విస్తావత్
ఊర్ధ్వ ఉదేతా। అర్వాక్ అస్తమేతా।
సాధ్యానాం ఏవ తావత్ ఆధిపత్యగ్ం
స్వారాజ్యం పర్యేతా।।
అట్టి అంతరాంతర అమృత తత్త్వము ఎరిగినవారు
- సూర్యుడు ఉత్తరమున ఉదయించి దక్షిణమున అస్తమించుచున్నంత కాలమునకు రెండంతలు,
- ఊర్ధ్వమున ఉదయించి, అధోభాగమున అస్తమించుచున్నంత కాలము, సాధ్యులలో ఒకరై ఆధిపత్యము, స్వారాజ్యము సిద్ధించుకొన్నవారై ఉండగలరు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే దశమః ఖండః


3–11. తృతీయ ప్రపాఠకః - ఏకాదశః ఖండః - మధు విద్యా ఉపాసనకు పరాకాష్ఠ


అథ తత ఊర్ధ్వ ఉదేత్య నైవోదేతా నాస్తమేతైకల ఏవ
మధ్యే స్థాతా తదేష శ్లోకః .. 3.11.1..
1. అథ తత ఊర్ధ్వ ఉదేత్య, న ఏవ ఉదేతా।
న అస్తం ఇతి।
ఏకల ఏవ మధ్యే స్థాతా।।

తత్ ఏష శ్లోకః।।
ఆ తరువాత అట్టి ఉపాసకుడు - సూర్యుడు ఊర్ధ్వంగా తాను వెళ్లి - అక్కడ ఉదయాస్తములు లేనివాడై (ఉదయించనివాడై, అస్తమించనివాడై) అక్కడే మధ్యగా నివాసము కలిగి ఉంటున్నాడు.

అట్టి ఉదయాస్తమయాతీతమగు సూర్యస్థానము వర్ణిస్తూ శాస్త్రీయమగు ఈ శ్లోకము చెప్పబడుచున్నది.

న వై తత్ర న నిమ్లోచ నోదియాయ కదాచన .
దేవాస్తేనాహగ్ంసత్యేన మా విరాధిషి బ్రహ్మణేతి .. 3.11.2..
2. న వై తత్ర న నిమ్లోచ
న ఉదియాయ కదాచన।
దేవాః తేన అహగ్ం
సత్యేన మా విరాధిషి బ్రహ్మణా ఇతి।।

ఆత్మసూర్యుడు ఏ కార్యములు చేయనివాడై, ఉదయ - అస్తమయములు ఏమాత్రము ధర్మములుగా లేనివాడై (Sans the Functions of Dawn and Dusk)
- ‘బ్రహ్మము’ అను స్థానమును వీడనివారై ఉంటున్నారు.

ఓ దేవతలారా! నేను అట్టి సత్యమగు బ్రహ్మస్వరూపమునందే నిత్యనివాసిని।


న హ వా అస్మా ఉదేతి న నిమ్లోచతి సకృద్దివా హైవాస్మై
భవతి య ఏతామేవం బ్రహ్మోపనిషదం వేద .. 3.11.3..
3. న హ వా అస్మా ఉదేతి।
న నిమ్లోచతి। సకృద్దివా హి
ఏవ అస్మై భవతి - య ఏతాం
ఏవం బ్రహ్మోపనిషదం వేద।।
ఓ శ్రోతలారా। దేవతలారా। నేను ఈ సర్వాత్మకమగు స్వస్థానము నుండి రాను - పోను - వృద్ధి పొందను. గ్లాని-హాని పొందను.
బ్రహ్మమును సమీపించి, బ్రహ్మమునకు సమీపముగా ఆసీనుడై
- బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాను. బ్రహ్మోపనిషదుడనై విరాజిల్లుచున్నాను.

తద్ధైతద్బ్రహ్మా ప్రజాపతయ ఉవాచ ప్రజాపతిర్మనవే
మనుః ప్రజాభ్యస్తద్ధైతదుద్దాలకాయారుణయే జ్యేష్ఠాయ పుత్రాయ
పితా బ్రహ్మ ప్రోవాచ .. 3.11.4..
4. తత్ హ ఏతత్
బ్రహ్మా ప్రజాపతయ ఉవాచ।
ప్రజాపతిః మనవే। మనుః ప్రజాభ్యః।
తత్ హ ఏతత్ ఉద్దాలకాయ, అరుణయే,
జ్యేష్ఠాయ పుత్రాయ
పితా బ్రహ్మ ప్రోవాచ।।
ఈ ‘మధు విజ్ఞానము’ను ఒకప్పుడు సృష్టికి ఆదిస్వరూపుడగు బ్రహ్మభగవానుడు, ప్రజలకు పతి అగు ప్రజాపతికి చెప్పి ఉన్నారు.
- ప్రజాపతి మనువుకు బోధించి ఉన్నారు.
- మనువు ఇక్ష్వాకుడు మొదలైన అనేకమంది జనులకు బోధించారు.
ఈ బ్రహ్మ జ్ఞానమును అరుణి తన పెద్ద కుమారుడగు ఉద్దాలకునికి ఉపదేశించారు.

ఇదం వావ తజ్జ్యేష్ఠాయ పుత్రాయ పితా బ్రహ్మ
ప్రబ్రూయాత్ప్రణాయ్యాయ వాంతేవాసినే .. 3.11.5..
5. ఇదం వావ తత్
జ్యేష్ఠాయ పుత్రాయ పితా
బ్రహ్మ ప్రబ్రూయాత్।
ప్రణాయ్యాయ వా అన్తేవాసినే।।
అట్టి ఈ బ్రహ్మజ్ఞానమును బ్రహ్మజ్ఞుడైనవాడు తన జ్యేష్ఠ పుత్రునికి, మరియు అర్హులు, ప్రియులు అగు శిష్యులకు పరంపరగా ఉపదేశించెను.

నాన్యస్మై కస్మైచన యద్యప్యస్మా ఇమామద్భిః పరిగృహీతాం
ధనస్య పూర్ణాం దద్యాదేతదేవ తతో భూయ ఇత్యేతదేవ
తతో భూయ ఇతి .. 3.11.6..

.. ఇతి ఏకాదశః ఖండః ..
6. న అన్య అస్మై కస్మై చ న
యది అపి అస్మా ఇమాం అద్భిః
పరిగృహీతాం, ధనస్య పూర్ణాం దద్యాత్।
ఏతత్ ఏవ తతో భూయ ఇతి।
ఏతత్ ఏవ తతో భూయ ఇతి।।
అర్హతగల సంతానమునకు, శిష్యులకు కాకుండా, తపోధ్యానాదుల అభ్యాసములేని అనర్హులకు ఉపదేశించరాదు.
ఈ బ్రహ్మవిద్య సముద్రమంత సంపదకన్నా కూడా ఉత్తమోత్తమ మైనది. అందుచే ధనము, అధికారము మొదలైనవి బ్రహ్మవిద్యకు అర్హత కాదు.
ఈ బ్రహ్మవిద్య సమస్త లోకసంబంధమైన, ధనార్జనా సంబంధమైన అన్ని విద్యలకంటే కూడా మహత్తరమైనది, మహనీయమైనది.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ఏకాదశః ఖండః


3–12. తృతీయ ప్రపాఠకః - ద్వాదశః ఖండః - గాయత్రీ ఉపాసన


గాయత్రీ వా ఈదగ్ం సర్వం భూతం యదిదం కిం చ వాగ్వై గాయత్రీ
వాగ్వా ఇదగ్ం సర్వం భూతం గాయతి చ త్రాయతే చ .. 3.12.1..
1. గాయత్రీ వా ఇదగ్ం సర్వం
భూతం యత్ ఇదం కిం చ।
వాక్ వై గాయత్రీ।
వాక్ వా ఇదగ్ం సర్వం భూతం।
గాయతి చ త్రాయతే చ।।
సర్వలోకములలోని సమస్త భూతజాలము (కొంచము నుండి భూరివరకు), సమస్తము గాయత్రీ గాన స్వరూపమే।

వాక్కు గాయత్రీ స్వరూపము। ఈ సర్వము గాయత్రీ గానముగా ఉపాసించుటచే అట్టి గాయత్రీ మననము రక్షణ ప్రసాదించగలదు.

(గాతయత్ త్రాయతే యస్మాత్ ‘‘గాయత్రీ’’ ఇతి అభిధీయతే - గానముచే రక్షించునది కాబట్టి ‘గాయత్రీ’।)

యా వై సా గాయత్రీయం వావ సా యేయం పృథివ్యస్యాగ్ం హీదగ్ం
సర్వం భూతం ప్రతిష్ఠితమేతామేవ నాతిశీయతే .. 3.12.2..
2. యా వై సా గాయత్రీ
ఇయం వావ సా యేయం పృథివీ।
అస్యాగ్ం హి ఇదగ్ం సర్వం
భూతం ప్రతిష్ఠితం
ఏతాం ఏవ న అతిశీయతే।।
ఏది గాయత్రియో, అదియే ఈ సమస్త పృథివి, ఈ సమస్త జీవుల స్వరూపము కూడా।
‘‘గాయత్రి’’ తత్త్వమునందే ఈ జీవులంతా ప్రతిష్ఠితులై ఉన్నారు. గాయత్రియందే నివాసము కలిగియున్నారు.
ఏదీ కూడా గాయత్రీతత్త్వమును అధిగమించి లేనేలేదు.
సమస్త బ్రహ్మాండములు ‘‘గాయత్రి’’ యందు (దర్పణంలో దృశ్యమువలె) అంతర్గతమై ఉన్నాయి.

యా వై సా పృథివీయం వావ సా యదిదమస్మిన్పురుషే
శరీరమస్మిన్హీమే ప్రాణాః ప్రతిష్ఠితా ఏతదేవ
నాతిశీయంతే .. 3.12.3..
3. యా వై సా పృథివీ ఇయం వావ సా యత్ ।

ఇదం అస్మిన్ పురుషే శరీరం
అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితా
ఏతత్ ఏవ న అతిశీయన్తే।
ఏది పృథివియో అది గాయత్రియే।

ఈ పురుషుని భౌతిక శరీరము, ఇందలి పంచప్రాణములు, ఇంద్రియములు, ‘శబ్ద స్పర్శ రూప రస గంధ’ - ఇంద్రియార్థములు, ఆ ఇంద్రియార్థములకు విషయములతో కూడిన దృశ్యజగత్తు - ఇదంతా గాయత్రీయందే సంప్రతిష్ఠితమైయున్నది. గాయత్రిని దాటి ఏదీ లేదు.

యద్వై తత్పురుషే శరీరమిదం వావ తద్యదిదమస్మిన్నంతః
పురుషే హృదయమస్మిన్హీమే ప్రాణాః ప్రతిష్ఠితా ఏతదేవ
నాతిశీయంతే .. 3.12.4..
4. యత్ వై తత్పురుషే
శరీరం ఇదం వావ, తత్
యత్ ఇదం అస్మిన్
న అంతః పురుషే హృదయం।
అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితా,
ఏతత్ ఏవ న అతిశీయన్తే।
గాయత్రియే తత్పురుష శరీరము. ఆద్యంతరహిత పురుషుడే గాయత్రి।

ఈ పురుషుడు, ఆలోచనలకు జననస్థానమగు ఆతని హృదయము, పురుషకారమునందు ప్రవర్తమానమైయున్న ఇందలి ప్రాణతత్త్వము - గాయత్రియందే సుప్రతిష్ఠితమై ఉన్నాయి.

గాయత్రిని అధిగమించినదై ఏదీ లేదు।

సైషా చతుష్పదా షడ్విధా గాయత్రీ తదేతదృచాభ్యనూక్తం .. 3.12.5..
5. స ఏషా చతుష్పదా
షడ్విధా గాయత్రీ।
తత్ ఏతత్ ఋచా అభ్యనూక్తమ్।
గాయత్రీ షట్ విధా : ఆరేసి (6) అక్షరములుగల నాలుగు (4) పాదములతో కూడిన ఛందస్సు.

అట్టి గాయత్రి - వాక్కు, ప్రాణులు, పృథివి, దేహము, హృదయము, ప్రాణములు అనే ఆరు (6) రూపములుగా ఉన్నది.

అట్టి గాయత్రీదేవి జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములనే ‘చతుష్పాదము’ అయి (నాలుగు పాదములు) మరియు (మనో బుద్ధి చిత్త అహంకార-జీవ-ఈశ్వరులనే) ఆరు పాదములు ప్రదర్శనముగా కలిగియున్నది.

ఆ గాయత్రీ ఋక్కులచే స్తుతించబడుచున్నది.

తావానస్య మహిమా తతో జ్యాయాగ్ంశ్చ పూరుషః .
పాదోఽస్య సర్వా భూతాని త్రిపాదస్యామృతం దివీతి .. 3.12.6..
6. తావాన్ అస్య మహిమా
తతో జ్యాయాగ్ంశ్చ పూరుషః।
పాదో అస్య సర్వా
భూతాని త్రిపాదస్య
అమృతం దివి ఇతి।।
వాక్కు, ప్రాణులు, పృథివి, దేహము, హృదయము, ప్రాణములు - అనే ఆరు రూపములు గాయత్రీ మహిమా విశేషములు. వాటన్నిటికంటే అధిక మహిమగలవాడు ‘‘పురుషుడు’’.

అట్టి పురుషునిలో
Ⅰ. నాలుగవ వంతు - సమస్త భౌతిక రూప - భూతజాలము. మార్పు - చేర్పుల విభాగమైయున్నది.
Ⅱ. మిగతా మూడు పాదములు - అమృతస్వరూపమై దివ్యలోకములను నిండి ఉన్నది.

యద్వై తద్బ్రహ్మేతీదం వావ తద్యోయం బహిర్ధా
పురుషాదాకాశో యో వై స బహిర్ధా పురుషాదాకాశః .. 3.12.7..
7. యత్ వై తత్ బ్రహ్మ ఇతి ఇదం వావ।
తత్ యో అయం బహిర్ధా పురుషాత్ ఆకాశో।
యో వై స బహిర్ధా పురుషాత్ ఆకాశః।
గాయత్రీ దేవీ రూపమగు అట్టి పరబ్రహ్మమే ఇక్కడి ఈ శరీరము చుట్టూ ఆకాశరూపముగా (బహిరాకాశంగా) వ్యాపించి ఉన్నది.

అయం వావ స యోఽయమంతః పురుష అకాశో యో వై సోఽన్తః
పురుష ఆకాశః .. 3.12.8..
8. అయం వావ స యో
అయం అంతఃపురుష ఆకాశో
యో వై సో అంతఃపురుష ఆకాశః।

ఆ పరబ్రహ్మమే అంతఃపురుష ఆకాశ పురుషుడై, దేహములోపల అంతఃపురుషాకాశము రూపముగా సర్వత్రా నిండియున్నది.


అయం వావ స యోఽయమంతర్హృదయ ఆకాశస్తదేతత్పూర్ణమప్రవర్తి
పూర్ణమప్రవర్తినీగ్ంశ్రియం లభతే య ఏవం వేద .. 3.12.9..

.. ఇతి ద్వాదశః ఖండః ..
9. అయం వావ స యో అయం
అంతర్హృదయ ఆకాశః।
తత్ ఏతత్ పూర్ణం అప్రవర్తి
పూర్ణాం అప్రవర్తినీగ్ం।
శ్రియం లభతే, య ఏవం వేద।।
అట్టి పరబ్రహ్మమే ‘‘అంతర-హృదయాకాశము’’లో కూడా హృదయమంతటా నిండి ఉన్నది.
హృదయములో ఏ పరబ్రహ్మము బ్రహ్మాకాశమై విస్తరించి ఉన్నదో, అది స్వతఃగానే పూర్ణము. అది ప్రవర్తితము కాదు. అప్రవర్తితము. ఎటువంటి ప్రవర్తనలేనిదై నిశ్చలమై, సుస్థిరమై, యథాతథమై, నిర్వికారమైయున్నది.
అట్టి ఆత్మ గురించిన తత్త్వము ఎరిగినవాడు సర్వశ్రేయస్సులు పొందగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ద్వాదశః ఖండః


3–13. తృతీయ ప్రపాఠకః - త్రయోదశః ఖండః - హృదయాంతర్గత సుషిర ఉపాసన


తస్య హ వా ఏతస్య హృదయస్య పంచ దేవసుషయః
స యోఽస్య ప్రాఙ్సుషిః స ప్రాణస్తచ్చక్షుః
స ఆదిత్యస్తదేతత్తేజోఽన్నాద్యమిత్యుపాసీత
తేజస్వ్యన్నాదో భవతి య ఏవం వేద .. 3.13.1..
1. తస్య హ వా ఏతస్య
హృదయస్య పంచ దేవ సుషయః।
స యో, అస్య ప్రాక్ సుషిః
స ప్రాణస్తః చక్షుః।
స ఆదిత్యః తదేతత్ ‘‘తేజో’’।
‘‘అన్నాద్యం’’ ఇతి ఉపాసీత।
తేజస్వి అన్నాదో భవతి,
య ఏవం వేద।।
(సుషి = రంధ్రము, దారి)
అట్టి గాయత్రీస్వరూపమై ప్రకాశించుచున్న హృదయస్థానము సిద్ధింపజేయుటకు పంచ విధములైనట్టి దేవ సుషులు (దేవలోకమునకు ద్వారములు / మార్గములు / త్రోవలు / దారులు) ఉన్నాయి.

(1) తూర్పు సుషి (మార్గము) - ప్రాణదేవత : ద్వారపాలకుడు ‘ప్రాణము’. ప్రాణదేవుడే దేహములో నేత్రములు (చూపు)గానున్నారు. ఆకాశంలో ఆదిత్యుడై (సూర్యభగవానుడై) ఉన్నారు. ఆయనను పంచప్రాణములలోని ‘‘ప్రాణము’’ను హృదయము యొక్క తూర్పు సుషిగా పూజించాలి.
ఇంకా, అట్టి ప్రాణదేవతను తేజోరూపముగాను, అన్నాదుడుగాను (ఆహారప్రదాతగాను) ఉపాసించెదరు గాక।

అట్టి ప్రాణేశ్వరుని (మోక్ష) ద్వారపాలకునిగాను, తేజోరూపునిగాను, అన్నాదునిగాను ఎరుగువాడు - తేజోవంతుడు, అన్నాదుడు అగుచున్నాడు.

అథ యోఽస్య దక్షిణః సుషిః స వ్యానస్తచ్ఛ్రోత్రగ్ం
స చంద్రమాస్తదేతచ్ఛ్రీశ్చ యశశ్చేత్యుపాసీత
శ్రీమాన్యశస్వీ భవతి య ఏవం వేద .. 3.13.2..
2. అథ యో అస్య దక్షిణః సుషిః స‘‘వ్యానః’’।
తత్ శ్రోత్రగ్ం। స చన్ద్రమాః।
తత్ ఏతత్ శ్రీః చ। యశః చేతి ఉపాసీత।
శ్రీమాన్ యశస్వీ భవతి, య ఏవం వేద।
(2) దక్షిణ సుషి - ‘‘వ్యానము’’ : ఈయనయే చెవి, వినికిడిగా, ఆకాశంలో చంద్రుడుగా, దర్శించాలి. ఈయనయే ఐశ్వర్యప్రదాతగా ఉపాసించాలి.

ఎవ్వరైతే (పంచ ప్రాణములలోని) వ్యానదేవతను శ్రవణశక్తి గాను, ఔషధి రూపంగాను, ఆహారము అనుగ్రహిస్తున్నవారు గాను, యశోప్రదాత గాను (రక్షకుడుగాను) తెలుసుకొని ఉంటారో, అట్టివారు శ్రీమాన్ (సంపదకలవారు)గాను, కీర్తిమంతులుగాను (యశస్విగాను) అగుచున్నారు.

అథ యోఽస్య ప్రత్యఙ్సుషిః సోఽపానః
సా వాక్సోఽగ్నిస్తదేతద్బ్రహ్మవర్చసమన్నాద్యమిత్యుపాసీత
బ్రహ్మవర్చస్యన్నాదో భవతి య ఏవం వేద .. 3.13.3..
3. అథ యో అస్య ప్రత్యక్ సుషిః
సో ‘‘అపానః’’ సా వాక్। సో ‘‘అగ్నిః’’।
తత్ ఏతత్ బ్రహ్మవర్చసం,
‘‘అన్నాద్యం’’ ఇతి ఉపాసీత।
బ్రహ్మవర్యస్య అన్నాదో భవతి, య ఏవం వేద।
(3) ప్రత్యక్ - (పశ్చిమ) సుషి (ద్వారము) -‘‘అపానము’’:
అట్టి అపాన దేవతయే - (అపానద్వారమే) ‘వాక్’ స్వరూపము. (మరియు) అగ్ని స్వరూపము. అట్టి అపానదేవతను ‘‘బ్రహ్మవర్చస్సు’’ గాను, అన్నాదుడు (అన్నప్రదాత)గాను ఉపాసించెదరు గాక।
అపానమును వాక్ రూపముగాను, (Talking Ability) అగ్నిరూపము గాను, బ్రహ్మవర్చో ప్రదాతగాను, అన్నాదుడుగాను ఎరిగి ఉపాసించు వాడు బ్రహ్మవర్చస్సు, ఆహార సమృద్ధి పొందగలడు.

అథ యోఽస్యోదఙ్సుషిః స సమానస్తన్మనః
స పర్జన్యస్తదేతత్కీర్తిశ్చ వ్యుష్టిశ్చేత్యుపాసీత
కీర్తిమాన్వ్యుష్టిమాన్భవతి య ఏవం వేద .. 3.13.4..
4. అథ యో అస్య ఉదఙ్ సుషిః స ‘‘సమానః’’।
తత్ మనః। స పర్జన్యః।
తత్ ఏతత్ కీర్తిశ్చ వ్యుష్టిశ్చ।
ఏతి ఉపాసీత।
కీర్తిమాన్, వ్యుష్టిమాన్ భవతి
య ఏవం వేద।
(4) హృదయమునకు ఉత్తరంగా గల రంధ్రము - ‘‘సమానము’’:
- అది ‘‘మనస్సు’’.
- అదియే పర్జన్యుడు
అట్టి సమానప్రాణబ్రహ్మమును మనస్సుగాను, పర్జన్యుడుగాను, పరబ్రహ్మముయొక్క ‘కీర్తి’గాను, వర్షించు అనుగ్రహముగాను ఉపాసించబడుగాక।

ఈ విధంగా హృదయ ఉత్తర సుషియమును సమానప్రాణ-మనో- పర్జన్య-పరబ్రహ్మరూపముగా ఉపాసించువాడు కీర్తిమంతుడు వ్యుష్టి (లావణ్య)వంతుడు కాగలడు.

అథ యోఽస్యోర్ధ్వః సుషిః స ఉదానః స వాయుః
స ఆకాశస్తదేతదోజశ్చ మహశ్చేత్యుపాసీతౌజస్వీ
మహస్వాన్భవతి య ఏవం వేద .. 3.13.5..
5. అథ యో అస్య ఊర్ధ్వః
సుషిః స ‘‘ఉదానః’’।
స వాయుః। స ఆకాశః।
తత్ ఏతత్ ఓజః చ మహః చ
ఇతి ఉపాసీత। ఓజస్వీ,
మహస్వాన్ భవతి,
య ఏవం వేద।।
హృదయముయొక్క ఊర్ధ్వ సుషిరము (ఛిద్రము) - ఉదాన ప్రాణోపాసన।
- అట్టి ఊర్ధ్వరంధ్ర ఉదానప్రాణమే వాయువు. అదియే ఆకాశము. అదియే ఓజస్సుగాను , మహత్ స్వరూపముగాను ఉపాసించబడుగాక।
(ఓజస్సు = తేజము; బలము; సారము; పరాక్రమము;, వెలుగు;, శ్రేష్ఠత, Inclination / Inspiration)

ఈ విధంగా : హృదయ ఊర్ధ్వ సుషిరమును (ఛిద్రమును) - ఉదాన ప్రాణముగా, ఉదానప్రాణమును వాయు స్వరూపంగా, ఆకాశ స్వరూపంగా, ఓజస్సుగా, మహత్‌గా ఉపాసించబడు గాక।

అట్టి ఉపాసనను ఎరిగినవాడు ఓజస్విగాను, మహాన్‌గాను అగుచున్నాడు.

తే వా ఏతే పంచ బ్రహ్మపురుషాః స్వర్గస్య లోకస్య
ద్వారపాః స య ఏతానేవం పంచ బ్రహ్మపురుషాన్స్వర్గస్య
లోకస్య ద్వారపాన్వేదాస్య కులే వీరో జాయతే ప్రతిపద్యతే
స్వర్గం లోకం య ఏతానేవం పంచ బ్రహ్మపురుషాన్స్వర్గస్య
లోకస్య ద్వారపాన్వేద .. 3.13.6..
6. తే వా ఏతే ‘‘పంచ బ్రహ్మ పురుషాః’’
స్వర్గస్య లోకస్య ద్వారపాలాః।
స య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మపురుషాః
స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేదాస్య కులే
వీరో జాయతే, ప్రతిపద్యతే స్వర్గం లోకం,
య ఏతాన్ ఏవం పంచ బ్రహ్మ పురుషాన్’’ -
స్వర్గస్య లోకస్య ద్వారపాన్ వేద।।
హృదయము యొక్క సుషి (రంధ్రములు)
(1) ప్రాక్ సుషిః (రంధ్రము) - ‘‘ప్రాణము’’ (చూపు, ఆదిత్యుడు, అన్నాదము)
(2) దక్షిణ సుషిః - ‘‘వ్యానము’’ (శ్రోతము (వినికిడి); చంద్రమసము; సంపద; కీర్తి)
(3) ప్రత్యక్ (పడమర) సుషిః (రంధ్రము) - ‘‘అపానము’’ - వాక్కు, అగ్ని, వర్చస్సు, అన్నాదము.
(4) ఉదన్ (ఉత్తరము) వైపు సుషిః ‘‘సమానము’’ - మనస్సు; పర్జన్యుడు; కీర్తి; అనుగ్రహము.
(5) ఊర్ధ్వసుషిః (ద్వారము) ‘ఉదానము’ - వాయువు, ఆకాశము, బలము.
పై ఐదుగురు బ్రహ్మపురుషులు బ్రహ్మమునకు ద్వారపాలకులు.
ఈ ఐదుగురు బ్రహ్మపురుషులు స్వర్గలోక (ఆత్మతత్త్వ) ‘‘పంచద్వారపాలకులు’’.

ఎవ్వరైతే ఈ పంచ దివ్య ద్వారపాలకులను భక్తితో ప్రార్థనలు సమర్పిస్తూ ఉపాసన చేయుచున్నాడో…
పంచద్వారపాలకులను బుద్ధితో ఎరుగుచూ, ఆరాధిస్తూ ఉంటాడో, అట్టివాడు స్వాభావికంగా స్వర్గలోక ఆనంద నివాసమునకు అర్హుడై, స్వర్గలోక ప్రవేశము పొందుచున్నాడు.

అథ యదతః పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వతః పృష్ఠేషు
సర్వతః పృష్ఠేష్వనుత్తమేషూత్తమేషు లోకేష్విదం వావ
తద్యదిదమస్మిన్నంతః పురుషే జ్యోతిః .. 3.13.7..
7. అథ యత్ అతః పరో దివో జ్యోతిః దీప్యతే।
విశ్వతః పృష్ఠేషు సర్వతః పృష్ఠేషు
అనుత్తమేషు, ఉత్తమేషు లోకేషు
ఇదం వావ తద్యత్ ఇదం
అస్మిన్ అంతః పురుషే జ్యోతిః।।
ఏ పరబ్రహ్మజ్యోతి - ఆవలి లోకమగు దివ్యలోకమునందు (స్వర్గలోకమునందు) - అన్నింటికీ పైనగా, విశ్వమునకు ఆవలగా, అనుత్తమ లోకములలో కూడా అంతటా ప్రకాశించుచున్నదో,
అట్టి ఉత్తమ - అనుత్తమ లోకములలో సర్వత్రా ప్రకాశమానమైయున్న జ్యోతియే (Enlightenment)….ఇక్కడ సమస్త భౌతిక శరీరములలో కూడా (పురుషుని అంతరమున కూడా) జ్యోతి స్వరూపమై వెలుగొందుచున్నది.

ఈ ఎదురుగా కనిపిస్తున్న సమస్తము ‘‘ఆత్మజ్యోతి’’ యొక్క తేజోరూపమే।

తస్యైషా దృష్టిర్యత్రితదస్మింఛరీరే సగ్ంస్పర్శేనోష్ణిమానం
విజానాతి తస్యైషా శ్రుతిర్యత్రైతత్కర్ణావపిగృహ్య నినదమివ
నదథురివాగ్నేరివ జ్వలత ఉపశృణోతి తదేతద్దృష్టం చ
శ్రుతం చేత్యుపాసీత చక్షుష్యః శ్రుతో భవతి య ఏవం వేద
య ఏవం వేద .. 3.13.8..

.. ఇతి త్రయోదశః ఖండః ..
8. తస్య ఏషా దృష్టిః
యత్ర, ఏతత్ అస్మిన్ శరీరే
సగ్ంస్పర్శేన ఊష్ణిమానం విజానాతి।
అట్టి పరంజ్యోతి స్వరూపమే కంటికి సాకారముగా కనబడుచున్న సమస్తముగా వెలుగొందుచున్నది.
అట్టి (ఆత్మానంద) జ్యోతి స్వరూపమే ఒకరి శరీరము స్పృశించినప్పుడు ‘వెచ్చతనము’గా స్పర్శానుభవము అగుచూ, తెలియబడుతోంది.
తస్య ఏషా శ్రుతిః యత్ర ఏతత్
కర్ణావపి గృహ్య నినదం ఇవ,
నదథుః ఇవ, అగ్నేః ఇవ,
జ్వలత ఉపశృణోతి।
తదేతత్ దృష్టం చ,
శ్రుతం చ, ఇతి ఉపాసీత।
చక్షుష్యః శ్రుతో భవతి,
య ఏవం వేద।
య ఏవం వేద।।
అట్టి పరంజ్యోతియే చెవులు (వ్రేళ్ళతో) మూసుకున్నప్పుడు ‘ఉం…..’ నినదముగా వినపడుతోంది. చెవులలో అగ్నిజ్వాల శబ్దమువలె ‘ఉం’కు ఆదిగా (శబ్దరూపంగా) వినబడుతోంది.

ఈ విధంగా యోగాభ్యాసి
- కంటికి కనబడు వెలుగును (వెలుగులో దృశ్యమును),
- చెవులకు వినబడే నినదము (Sound)ను,
- అగ్నిజ్వాల శబ్దమువలె వినబడు ఛటఛట శబ్దములును
ధ్యానపూర్వకంగా ఎరుగుచూ ఉపాసించువాడు ఆత్మతత్త్వము యొక్క దర్శనము, స్పర్శ సిద్ధించుకోగలడు. సర్వత్రా స్వస్వరూపాత్మను, స్వస్వరూపమునందే సమస్తమును గమనించగలడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే త్రయోదశః ఖండః


3–14. తృతీయ ప్రపాఠకః - చతుర్దశః ఖండః - శాండిల్య విద్యా


సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత .
అథ ఖలు క్రతుమయః పురుషో యథాక్రతురస్మిగ్ంల్లోకే
పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి స క్రతుం కుర్వీత .. 3.14.1..
1. సర్వం ఖల్విదం బ్రహ్మ।

తత్ జలాన్ - ఇతి ‘‘శాంత’’ ఉపాసీత।।


అథ ఖలు క్రతుమయః పురుషో యథా
క్రతుః అస్మిన్ లోకే పురుషో భవతి।
తథేతః ప్రేత్య భవతి।


స క్రతుం కుర్వీత।
నామ-రూప-గుణాత్మకంగా ఎదురుగా కనిపిస్తున్న ఈ సమస్తముగా ఉన్నది బ్రహ్మమే।
అట్టి బ్రహ్మమునందే సమస్త దృశ్యము యొక్క ఏర్పడటము, కొనసాగటము, లయము అవటము జరుగుతోంది.

అట్టి పరమశాంతమగు బ్రహ్మమును ఉపాసించెదము గాక!

అట్టి పరమాత్మ క్రతు (యజ్ఞ)మయ పురుషుడు. అట్టి క్రతు (యజ్ఞ)మయ పరుషునిగా పరమాత్మను తెలుసుకొనెదము గాక। పురుషుడే ఈ జీవుడు.
- ఈ జీవుడు సంకల్పములను (నిశ్చయములను) కలిగి ఉంటున్నాడు.
- ఈ జీవుడు ఏఏ సంకల్పములను (నిర్ణయములను, నిశ్చయములను) కలిగి ఉంటాడో, తదనంతరం అదియే అగుచున్నాడు.

అందుచేత, జగత్ యజ్ఞ పురుషుని పురుషకారముగా ఈ జగత్తును భావించువాడు యజ్ఞపురుషుడే అగుచున్నాడు.

మనోమయః ప్రాణశరీరో భారూపః సత్యసంకల్ప
ఆకాశాత్మా సర్వకర్మా సర్వకామః సర్వగంధః సర్వరసః
సర్వమిదమభ్యత్తోఽవాక్యనాదరః .. 3.14.2..
2. మనోమయః। ప్రాణ శరీరో, ‘భా’ రూపః।
సత్య సంకల్ప। ఆకాశాత్మా।
సర్వ కర్మా। సర్వకామః।
సర్వగంధః, సర్వ రసః।




సర్వం ఇదం అభ్యాత్తః।

అవాకీ అనాదరః।।
అట్టి బ్రహ్మము…,
★ మనోమయుడు. ఆయన మనస్సే ఇదంతా!
★ ప్రాణరూపుడు. తేజోరూపుడు.
★ సత్య సంకల్పుడు.
★ ఆకాశమంతా ఆత్మగా కలవాడు.
★ సర్వ కర్మలు ఆత్మయే.
★ సర్వ కామములు ఆత్మయే.
★ సర్వగంధములు, రసములు ఆత్మ విన్యాసమే.

ఈ సమస్తమును అన్నివైపులా వ్యాపించి ఉన్నది - ఆత్మయే.

ఆత్మ - - అవాక్‌మానసగోచరము.
- ఎట్టి అదరము (తొట్రుపాటు) లేనట్టిది.

ఏష మ ఆత్మాంతర్హృదయేఽణీయాన్వ్రీహేర్వా యవాద్వా
సర్షపాద్వా శ్యామాకాద్వా శ్యామాకతండులాద్వైష
మ ఆత్మాంతర్హృదయే జ్యాయాన్పృథివ్యా
జ్యాయానంతరిక్షాజ్జ్యాయాందివో జ్యాయానేభ్యో
లోకేభ్యః .. 3.14.3..
3. ఏష మ ఆత్మా అంతర్ హృదయే
అణీయాన్ వ్రీహేర్వా,
యవాద్వా, సర్షపాద్వా,
శ్యామాకాద్వా, శ్యామాక తండులాద్వా।




ఏష మ ఆత్మా అంతర్ హృదయే జ్యాయాన్ పృథివ్యా
జ్యాయాన్ ‘అంతరిక్షా’। జ్యాయాన్ ‘దివో’।
జ్యాయాన్ ‘ఏభ్యో-లోకేభ్యః’’।
నా ఈ ఆత్మ నాయొక్క అంతరహృదయమునందు
వ్రీహేర్వా - వడ్ల గింజ చివ్వరి మొన కంటె,
యవ - కారు మినుములు, అలసందల కంటె,
సర్ష పాద్వా - ఆవ గింజల కంటె,
శ్యామాకాద్వా - మిరియపు గింజలకంటె,
శ్యామాక - తృణధాన్య విశేషములకంటె,
తండూలాక్వా - బియ్యపు గింజ కంటె,
వీటన్నిటి సూక్ష్మరూపము కంటే సూక్ష్మాతి సూక్ష్మము।
(The Smallest of the Smallest. The Subtlest!)

అంతేకాదు!- అంతర హృదయములో వెలుగుచున్న నా ఆత్మ
పృథివికంటే, అంతరిక్షముకంటే, దేవలోకముకంటే,
సమస్త లోకములకంటే కూడా (14 లోకములలో సమస్త వస్తు జాలము కంటే కూడా) అత్యంత శ్రేష్ఠము. మిక్కిలి వృద్ధము.(The Biggest of the Biggest)


సర్వకర్మా సర్వకామః సర్వగంధః సర్వరసః
సర్వమిదమభ్యాత్తోఽవాక్యనాదర ఏష మ ఆత్మాంతర్హృదయ
ఏతద్బ్రహ్మైతమితః ప్రేత్యాభిసంభవితాస్మీతి యస్య స్యాదద్ధా
న విచికిత్సాస్తీతి హ స్మాహ శాండిల్యః శాండిల్యః .. 3.14.4..

.. ఇతి చతుర్దశః ఖండః ..
4. సర్వకర్మా। సర్వకామః।
సర్వగంధః। సర్వరసః।
సర్వం ఇదం అభ్యాత్తో।



అవాకీ అనాదర,
సర్వకర్మలు, సర్వ కామములు ఆత్మవే।
సర్వగంధానుభవములు, సర్వ రసానుభవములు కలిగియున్నట్టిది - ఆత్మ।
సర్వ దిక్కులందు, సర్వ వైపులా, సర్వత్రా వ్యాపించి ఉన్నది.


నా యొక్క సర్వదా నేనైయున్న, ఆత్మయొక్క సహజరూపము-
☼ వాక్యములచే వర్ణించరానిది.
☼ అదరము (Disturbance) లేనిది. ఈ దృశ్య జగత్తుగా కనిపిస్తున్నా కూడా నిర్వికారమైనది.
ఏతం ఇతః ప్రేత్య అభిసంభవితాఽస్మి - ఇతి
యస్య స్యాదద్ధా న విచికిత్సా అస్తి ।।


హ స్మాహ శాండిల్యః శాండిల్యః।
అట్టి హృదయమునందలి ఆత్మయే బ్రహ్మము.



అట్టి ఆత్మ తత్త్వమునందు ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో, వారికి సంసారమునకు సంబంధించిన ఎట్టి సందేహములు మిగిలి ఉండవు.
ఇతి హ స్మాహ శాండిల్యః శాండిల్యః।
ఇది శాండిల్య జగద్గురువుచే ప్రవచించబడిన ఆత్మతత్త్వ విన్యాసము.
శ్రీ శాండిల్య మునీశ్వరులుచే ప్రబోధించబడిన ఆత్మజ్ఞాన విశేషము.

శాండిల్య జగద్గురవే నమః।

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే చతుర్దశః ఖండః


3–15. తృతీయ ప్రపాఠకః - పంచదశః ఖండః - విరాట్ కోశోపాసన


అంతరిక్షోదరః కోశో భూమిబుధ్నో న జీర్యతి దిశో
హ్యస్య స్రక్తయో ద్యౌరస్యోత్తరం బిలగ్ం స ఏష కోశో
వసుధానస్తస్మిన్విశ్వమిదగ్ం శ్రితం .. 3.15.1..
1. అంతరిక్ష ఉదరః, కోశో భూమి,
బుధ్నో న జీర్యతి।


దిశో హి అస్య స్రక్తయో।

ద్యౌః అస్య ఉత్తరం బిలగ్ం స ఏష కోశో

వసుధానః తస్మిన్ విశ్వం ఇదగ్ం శ్రితమ్।।
ఆత్మకు జీర్యము (నాశనము) అనునదే లేదు. ఈ విశ్వము అట్టి విశ్వేశ్వర రూపమే।
అంతరిక్షము ఉదరము (పొట్ట) గాను, భూమి కోశము (ఖజానా) గాను గల ఈ విశ్వము కూడా వినాశనము లేనట్టిదే।

అట్టి ఈ విశ్వమునకు అష్టదిక్కులు మూలముగా (లేక) కోణములుగా కలిగియున్నట్టిది.

ద్యులోకము (స్వర్గలోకము) పైన ఉండే ఛిద్రము, అనగా బిలము అద్దాని కోశము.

అట్టి విశ్వమునకు రత్నగర్భ అయి భూమి అమర్చబడినదై ఉన్నది.

తస్య ప్రాచీ దిగ్జుహూర్నామ సహమానా నామ దక్షిణా
రాజ్ఞీ నామ ప్రతీచీ సుభూతా నామోదీచీ తాసాం
వాయుర్వత్సః స య ఏతమేవం వాయుం దిశాం వత్సం వేద న
పుత్రరోదగ్ం రోదితి సోఽహమేతమేవం వాయుం దిశాం వత్సం
వేద మా పుత్రరోదగ్ంరుదం .. 3.15.2..
2. తస్య ప్రాచీ దిక్ ‘జుహూః’ నామ।
‘‘సహమానా’’ నామ ‘‘దక్షిణా’।
‘రాజ్ఞీ’ నామ ప్రతీచీ।
‘‘సుభూతా’’ నామ ఉదీచీ।


తాసాం వాయుః వత్సః ।
స య ఏతం ఏవం వాయుం దిశాం
వత్సం వేద, న పుత్ర రోదగ్ం రోదితి।।

సోఽహమ్ ఏతం ఏవం
వాయుం దిశాం వత్సం
వేద, మా పుత్ర రోదగ్ం రుదమ్।
అట్టి విశ్వమునకు
తూర్పు దిక్కు పేరు - ‘జుహూ’’।
దక్షిణ దిక్కు పేరు - ‘సహనామ’
పడమర దిక్కు పేరు - ‘‘రాజ్ఞీ’’
ఉత్తర దిక్కు పేరు - ‘‘సుభూతా’’

అట్టి నాలుగు దిక్కులకు ప్రియమైన బిడ్డ - ‘వాయువు’.
అట్టి ‘4’ దిక్కుల యొక్క ముద్దుబిడ్డ అగు దిశ సమన్వితమగు ‘వాయువు’ను ఎఱిగినవాడు - కుమారునివలన దుఃఖము ఏమాత్రము పొందడు. (పుత్రునివలన ఆనందమునే పొందగలడు).

నేను ఈ విధంగా వాయు వీచికలను దిక్కుల ప్రియ పుత్రునిగా ఎరుగుచున్నాను. అందుచేత పుత్రుని గురించిన దిగులు ఇక నాకు ఉండజాలదు. క్షేమముకొరకై బాధ పడనక్కర్లేదు.
నా పుత్రుని ఆయుష్షు కొరకై వత్స (Young boy) వంటి వాయు దేవుని ఉపాసించుచున్నాను.

అరిష్టం కోశం ప్రపద్యేఽమునామునామునా
ప్రాణం ప్రపద్యేఽమునామునామునా భూః ప్రపద్యేఽమునామునామునా
భువః ప్రపద్యేఽమునామునామునా స్వః ప్రపద్యేఽమునామునామునా .. 3.15.3..
3. ‘‘అరిష్టం కోశం’’ ప్రపద్యే అమునా,
అమునా, అమునా।।

‘ప్రాణం’ ప్రపద్యే అమునా, అమునా, అమునా।
‘భూః’ ప్రపద్యే అమునా, అమునా, అమునా।
‘భువః’ ప్రపద్యే అమునా, అమునా, అమునా।।
‘‘స్వః’’ ప్రపద్యే అమునా, అమునా, అమునా।
అరిష్టము (మేలు, శుభము) కొరకై - అవినాశియగు ‘కోశము’ను ‘‘విశ్వకోశము నాశనము లేనిది - లేనిది - లేనిది’’ - అని ఉపాసించు చున్నాము.

ప్రాణదేవతను కోరికలు నెరవేరుటకై శరణువేడుచున్నాను.
అభీప్సితములు నెరవేరటానికై భూలోకమును ఆశ్రయిస్తున్నాను.
అవసర సిద్ధికై భువర్లోకమును శరణు కోరుకొనుచున్నాను.
వాంఛల సిద్ధికై (స్వర్) సువర్లోకమునకు శరణాగతుడను అగుచున్నాను.


స యదవోచం ప్రాణం ప్రపద్య ఇతి ప్రాణో వా ఇదగ్ం సర్వం
భూతం యదిదం కించ తమేవ తత్ప్రాపత్సి .. 3.15.4..
4. స యత్ అవోచం ప్రాణం
ప్రపద్య, ఇతి ప్రాణో వా।
ఇదగ్ం సర్వం భూతం,
యత్ ఇదం కించ తమ్ ఏవ తత్ ప్రాపత్సి।
ప్రాణోపాసన అనగా
‘‘ఈ సృష్టిలో (లేక) దృశ్యములో కనిపించే ప్రాణులంతా, అస్మత్ (నాయొక్క) - ప్రాణశక్తి యొక్క ప్రదర్శనమే’’ అని గమనిస్తూ ఉన్నవాడనై ఉండటము.
సర్వ స్వరూపుడగు, స్వయం సమస్త ప్రదర్శనా స్వరూపుడగు - ‘‘ప్రాణేశ్వర భగవానుని’’ ప్రార్థనలను సమర్పిస్తూ ఉపాసించటము. ‘‘విశ్వప్రాణ స్వరూపమే నేనై ఉన్నాను’’ అను ప్రాణేశ్వర స్వరూప ధారణము.

అథ యదవోచం భూః ప్రపద్య ఇతి పృథివీం ప్రపద్యేఽన్తరిక్షం
ప్రపద్యే దివం ప్రపద్య ఇత్యేవ తదవోచం .. 3.15.5..
5. అథ యత్ అవోచం భూః ప్రపద్య
ఇతి పృథివీం ప్రపద్యే।
భూ ఉపాసన అనగా -
‘‘భూః’’ కు ప్రపత్తి సమర్పిస్తున్నాను - అనగా భూమికి శరణాగతుడను అగుచున్నాను - అను భావన. భౌతికమైనదంతా ఆత్మగా దర్శించటము.
అంతరిక్షం ప్రపద్యే దివం ప్రపద్య,
ఇతి ఏవ తత్ అవోచమ్।
అంతరిక్షోపాసన అనగా -
అంతరిక్షమును శరణువేడుచున్నాను. ద్యులోకమును ప్రపద్యించుచున్నాను. అనగా ఆ తత్ పరమాత్మనే నేను ఉపాసించటము - ఉపాసకుడనై ఉపాస్యము అగుచుండటము.

అథ యదవోచం భువః ప్రపద్య ఇత్యగ్నిం ప్రపద్యే వాయుం
ప్రపద్య ఆదిత్యం ప్రపద్య ఇత్యేవ తదవోచం .. 3.15.6..
6. అథ యత్ అవోచం భువః ప్రపద్య
ఇతి అగ్నిం ప్రపద్యే వాయుం ప్రపద్య।
ఆదిత్యం ప్రపద్య।
ఇతి ఏవ తత్ అవోచమ్।।
‘‘భువః ప్రపద్య’’ అనగా భువలోక ఉపాసనచే -
- అగ్నిని ఉపాసిస్తున్నాను
- వాయువును ఉపాసిస్తున్నాను
- ఆదిత్య భగవానుని ఉపాసిస్తున్నాను
అనియే నేను చెప్పుచున్నట్లు!

అథ యదవోచగ్ంస్వః ప్రపద్య ఇత్యృగ్వేదం ప్రపద్యే యజుర్వేదం ప్రపద్యే
సామవేదం ప్రపద్య ఇత్యేవ తదవోచం తదవోచం .. 3.15.7..

.. ఇతి పంచదశః ఖండః ..
7. అథ యత్ అవోచగ్ం ‘‘స్వః’’ ప్రపద్య -
ఇతి ఋగ్వేదం ప్రపద్యే।
యజుర్వేదం ప్రపద్యే।
సామవేదం ప్రపద్య
ఇతి ఏవ తత్ అవోచం।
తత్ అవోచం।।
‘‘సువర్లోకమును ఉపాసిస్తున్నాను’’ - అని చెప్పుచున్నప్పుడు ‘‘ఋగ్వేదమును, యజుర్వేదమును, సామవేదమును ఆరాధిస్తున్నాను’’ అని చెప్పుచున్నాను. ‘‘త్రైవేద అంతర్లీనసారమే నేను’’ అను ఆరాధన.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే పంచదశః ఖండః


3–16. తృతీయ ప్రపాఠకః - షోడశః ఖండః - ఆత్మయజ్ఞోపాసన–1


పురుషో వావ యజ్ఞస్తస్య యాని చతుర్విగ్ంశతి వర్షాణి
తత్ప్రాతఃసవనం చతుర్విగ్ంశత్యక్షరా గాయత్రీ గాయత్రం
ప్రాతఃసవనం తదస్య వసవోఽన్వాయత్తాః ప్రాణా వావ వసవ
ఏతే హీదగ్ంసర్వం వాసయంతి .. 3.16.1..
1. పురుషో వావ యజ్ఞః।
తస్య యాని చతుర్విగ్ంశతి (24) వర్షాణి
తత్ ‘‘ప్రాతః సవనమ్’’।
చతుర్విగ్ంశతి (24) అక్షరా
గాయత్రీ గాయత్రం ప్రాతః సవనం।
తదస్య వసవో అన్వాయత్తాః।
ప్రాణా వావ వసవ,
ఏతే హి ఇదగ్ం సర్వం వాసయంతి।
పురుషుడే (వ్యక్తియే) నిశ్చయముగా యజ్ఞము. (నా యొక్క పురుషకారము జగత్ -యజ్ఞవిభాగమే)।
ప్రాతః సవనం
ప్రాతః స్తుతులు
- అట్టి పురుషుడు గడిపిన 24 సంవత్సరముల జీవితము ప్రాతఃకాల యజ్ఞ సవనము.
- అట్టి ప్రాతఃకాల సవనము ‘24’ అక్షరములు కలిగియున్నది.
- (ఈ విధంగా) గాయత్రీమంత్రము 24 అక్షరములు.
- ఉదయ యజ్ఞము ‘‘ప్రాతఃకాల గాయత్రీసవనము’’ - వసువులకు సంబంధించినది.

ప్రాణములు సర్వత్రా విస్తరించి అంతటా నిండి ఉండటంచేత, వసించినవి అవటంచేత - ప్రాణములే ‘‘వసువులు’’.

తం చేదేతస్మిన్వయసి కించిదుపతపేత్స బ్రూయాత్ప్రాణా
వసవ ఇదం మే ప్రాతఃసవనం మాధ్యందినగ్ంసవనమనుసంతనుతేతి
మాహం ప్రాణానాం వసూనాం మధ్యే యజ్ఞో విలోప్సీయేత్యుద్ధైవ
తత ఏత్యగదో హ భవతి .. 3.16.2..
2. తం చేత్ ఏతస్మిన్ వయసి
కించిత్ ఉపతపేత్,
స బ్రూయాత్ ప్రాణా! వసవ।
ఇదం మే ప్రాతఃసవనం,
మాధ్యం దినగ్ం సవనం అనుసంతనుతేతి।
మా అహం ప్రాణానాం వసూనాం
మధ్యే యజ్ఞో విలోప్సీయ ఇతి।
ఉద్ధైవ తత ఏతి అగదో హ భవతి।।
ఈ 24 సంవత్సరముల వరకు ఏదైనా వ్యాధివలన కించిత్ బాధ కలుగుతూ ఉంటే - ఇట్లా ప్రార్థన చేయాలి.

‘‘ఓ ప్రాణ రూపులగు వసువులారా! నేను మీకు భక్తితో సమర్పిస్తున్న ఈ ‘‘ప్రాతఃకాల యజ్ఞ సవనము’’ను ‘‘మాధ్యందిన సవనము’’తో ఏకము చేయండి. కలపండి!
ప్రాతఃకాల యజ్ఞసవన నిష్టుడనైయున్న నేను ప్రాణరూపులగు వసువుల మధ్యలో ఉండి, నాశనము లేనివాడనగుదును గాక। నశించకుండెదను గాక।’’

ఇట్టి ప్రాతః చతుర్వింశతి అక్షరగాయత్రీ - సవనము చేయువాడు సర్వ దైహిక - మానసిక రోగములనుండి విముక్తుడవగలడు.

అథ యాని చతుశ్చత్వారిగ్ంశద్వర్షాణి తన్మాధ్యందినగ్ం
సవనం చతుశ్చత్వారిగ్ంశదక్షరా త్రిష్టుప్త్రైష్టుభం
మాధ్యందినగ్ంసవనం తదస్య రుద్రా అన్వాయత్తాః ప్రాణా
వావ రుద్రా ఏతే హీదగ్ంసర్వగ్ంరోదయంతి .. 3.16.3..
3. అథ యాని చతుఃచత్వారిగ్ంశత్ (44)
వర్షాణి తత్ ‘‘మాధ్యన్దినగ్ం సవనం।’’
చతుఃచత్వారిగ్ంశత్ అక్షరా।
త్రిష్టుప్। త్రైష్టుభం మాధ్యన్‌దినగ్ం సవనం।
తదస్య రుద్రా అన్వాయత్తాః।
ప్రాణా వావ రుద్రా
ఏతే హి ఇదగ్ం సర్వగ్ం రోదయన్తి।।
మధ్యన్దినగ్ం సవనం
మధ్యాహ్న స్తుతులు
ప్రాతః దిన సవనం తరువాత 44 సంవత్సరముల వరకు ‘‘మధ్యందిన సవనము’’ - చెప్పబడుతోంది.
- అక్షరములు = ‘44’
- ఛందస్సు = ‘త్రిష్టుప్’
- ‘‘త్రిష్టుప్’’చే మధ్యాహ్న సవనము గానము చేయబడుతోంది.

అట్టి మధ్యందిన సవనము (ఏకాదశ) రుద్రులకు సంబంధించినది.
- రుద్రులు ఈ విశ్వమునకు రోదనము (ఆక్రందనము, అణచటము) కలిగించువారు. కనుక రుద్రులు.
- ప్రాణములు రోదనములు కలిగించేవి కాబట్టి ప్రాణములే రుద్రులు.

తం చేదేతస్మిన్వయసి కించిదుపతపేత్స బ్రూయాత్ప్రాణా రుద్రా
ఇదం మే మాధ్యందినగ్ంసవనం తృతీయసవనమనుసంతనుతేతి
మాహం ప్రాణానాగ్ంరుద్రాణాం మధ్యే యజ్ఞో విలోప్సీయేత్యుద్ధైవ
తత ఏత్యగదో హ భవతి .. 3.16.4..
4. తం చేత్ ఏతస్మిన్ వయసి
కించిత్ ఉపతపేత్ స బ్రూయాత్।
‘‘ప్రాణా! రుద్రా! ఇదం మే మాధ్యన్ దినగ్ం
సవనం తృతీయ సవనం అనుసన్తనుతేతి।
మా అహం ప్రాణానాగ్ం రుద్రాణాం మధ్యే
యజ్ఞో విలోప్సీయేత్ ఇతి
ఉద్ధైవ తత ఏతి అగదో హ భవతి।।
ఈ మధ్యందిన సవనకాలమగు 44 సంవత్సరములు వ్యాధులు కలుగుచున్నప్పుడు ఈ విధంగా ప్రార్థించెదరు గాక।

“ప్రాణదేవతలారా! రుద్రులారా! ఈ మా మధ్యాహ్న సమయ సవనము (లేక) యజ్ఞమును మూడవ (తృతీయ) యజ్ఞముగా (వరకు) మలచమని రుద్ర దేవతా స్వరూపులగు మిమ్ములను శరణు వేడుచున్నాను. యజ్ఞపురుషుడనైయున్న నేను ప్రాణదేవతలైనటువంటి రుద్రుల మధ్యగా మిగిలిపోయి రుద్రస్వరూపుడనగుదును గాక। ముందుముందుకు ఉద్ధరించబడెదము గాక।”

అట్టివాడు బాధలనుండి విడివడి ఆరోగ్యవంతుడు కాగలడు.

అథ యాన్యష్టాచత్వారిగ్ంశద్వర్షాణి
తత్తృతీయసవనమష్టాచత్వారిగ్ంశదక్షరా
జగతీ జాగతం తృతీయసవనం తదస్యాదిత్యా అన్వాయత్తాః
ప్రాణా వావాదిత్యా ఏతే హీదగ్ంసర్వమాదదతే .. 3.16.5..
5. అథ యాని అష్టాచత్వారిగ్ంశత్ (48)
వర్షాణి తత్ తృతీయ సవనం।
అష్టాచత్వారిగ్ంశదక్షరా ‘‘జగతీ’’।
జాగతం తృతీయ సవనం
తత్ అస్య ఆదిత్యా అన్వాయత్తాః।
ప్రాణా వావ ఆదిత్యా ఏతే హి
ఇదగ్ం సర్వం ఆదదతే।
తృతీయ సవనము
ఆ తరువాత ‘‘48’’ సంవత్సరముల మూడవ సవనము (యజ్ఞము)
ఛందస్సు - ‘జగతీ’।
అక్షరములు - ‘48’
ఈ జగతీ మూడవ సవనము ఆదిత్యులకు సంబంధించినది.
సర్వము సర్వత్రా ప్రాణములు గ్రహిస్తూ ఉన్నాయి. అందుచేత ప్రాణదేవతలే ‘‘ఆదిత్యులు’’ అయి ఉన్నారు.

తం చేదేతస్మిన్వయసి కించిదుపతపేత్స బ్రూయాత్ప్రాణా
అదిత్యా ఇదం మే తృతీయసవనమాయురనుసంతనుతేతి మాహం
ప్రాణానామాదిత్యానాం మధ్యే యజ్ఞో విలోప్సీయేత్యుద్ధైవ
తత ఏత్యగదో హైవ భవతి .. 3.16.6..
6. తం చేత్ ఏతస్మిన్ వయసి
కించిత్ ఉపతపేత్, స బ్రూయాత్।
‘‘ప్రాణా ఆదిత్యా। ఇదం మే తృతీయ సవనం’’।
ఆయుః అనుసన్తనుతేతి।
మా అహం ప్రాణానామ్ ఆదిత్యానాం
మధ్యే యజ్ఞో విలోప్సీయేత్ ఇతి।
ఉద్ధైవ తత ఏతి అగదో హ భవతి।
అట్టి (పైన చెప్పిన) 48 సంవత్సర జీవిత విభాగములో ఏవైనా కష్టములు, బాధలు సందర్భమగుచున్నప్పుడు ఈ విధంగా ప్రార్థించెదరు గాక।

ఓ ప్రాణదేవా! ఆదిత్య స్వరూపా। ఇదే మా తృతీయ (సాయంకాల) సవనం। దయతో స్వీకరించండి. ఈ తృతీయ సవనం ఆయుష్షు ఉన్నంతవరకు నిర్వర్తించుటకై అనుగ్రహించండి. యజ్ఞభావనతో ‘‘జగతీ మూడవ సవనము’’ సమర్పిస్తున్న యజ్ఞకార్యము ప్రాణరూపులగు ఆదిత్యుల మధ్యలో ముగియకుండా కొనసాగింపజేయండి. ఆదిత్య స్వరూపము ప్రసాదించి నన్ను మాయనుండి సముద్ధరించండి.

ఇట్టి ఉపాసన చేయువాడు అన్ని బాధలనుండి విముక్తుడై ఆరోగ్యవంతుడుగా ఉండగలడు.

ఏతద్ధ స్మ వై తద్విద్వానాహ మహిదాస ఐతరేయః
స కిం మ ఏతదుపతపసి యోఽహమనేన న ప్రేష్యామీతి
స హ షోడశం వర్షశతమజీవత్ప్ర హ షోడశం
వర్షశతం జీవతి య ఏవం వేద .. 3.16.7..

.. ఇతి షోడశః ఖండః ..
7. ఏతద్ధ స్మ వై తత్ విద్వాన్ ఆహ
మహిదాస ఐతరేయః
స కిం మ ఏతత్ ఉపతపసి।
యో అహం అనేన న ప్రేష్యామి ఇతి
స హ షోడశం వర్ష శతం (116)
అజీవత్‌ప్ర హ షోడశం
వర్ష శతం (116) జీవతి,
య ఏవం వేద। య ఏవం వేద।
శ్రీ ఐతరేయ మహిదాస మునీంద్రులవారు ఈ యజ్ఞవిధిని పూర్తిగా ఎరిగినవారై, విద్వాంసులై - ఈ విధంగా ప్రవచనము చేస్తున్నారు.

‘‘నేను 116 సంవత్సరములు ఎట్లా జీవించాను? ఈ
(1) ప్రాతఃకాల గాయత్రీ మంత్ర 24 సంవత్సరముల 24 అక్షరముల సవనమును,
(2) మధ్యాహ్న త్రిష్టుప్ రుద్ర మంత్ర 44 సంవత్సరముల 44 అక్షరముల సవనమును,
(3) సాయంకాల జగతీ ఛందో 48 సంవత్సరముల 48 అక్షరముల సవనమును
- ఈ మూడిటిని ఉపాసించుట చేతనే।"

ఎవ్వరు ఇది ఎరుగుచున్నారో వారు 116 సంవత్సరముల దీర్ఘాయుష్మంతులు (24+44+48=116) కాగలరు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే షోడశః ఖండః


3–17. తృతీయ ప్రపాఠకః - సప్తదశః ఖండః - ఆత్మయజ్ఞోపాసన–2


స యదశిశిషతి యత్పిపాసతి యన్న రమతే తా అస్య
దీక్షాః .. 3.17.1..
1. స యత్ అశిశిషతి, యత్ పిపాసతి,
యత్ న రమతే, తా అస్య‘‘దీక్షాః’’।
యజ్ఞదీక్షలు : ఆకలి అనుభవించటము, దాహము కలిగి ఉండటము, రమించకపోవటము ఇవన్నీ యజ్ఞదీక్షలు.

అథ యదశ్నాతి యత్పిబతి యద్రమతే తదుపసదైరేతి .. 3.17.2..
2. అథ యత్ అశ్నాతి యత్ పిబతి, యత్ రమతే,
తత్ ఉపసదైః ఏతి।
భుజించటము, త్రాగటము, రమించటము - ఇవన్నీ కూడా ఉపసదములు (గురు ఆజ్ఞ ప్రకారం నియమముగా చేయవలసినవి)

అథ యద్ధసతి యజ్జక్షతి యన్మైథునం చరతి స్తుతశస్త్రైరేవ
తదేతి .. 3.17.3..
3. అథ యద్ధసతి, యజ్జక్షతి యత్ మైథునం చరతి
స్తుత శస్మైః ఏవ తత్ ఏతి।।
నవ్వటము, తినటము, సంభోగము - ఇవన్నీ స్తోత్రములు, శస్త్రములు.

అథ యత్తపో దానమార్జవమహిగ్ంసా సత్యవచనమితి
తా అస్య దక్షిణాః .. 3.17.4..
4. అథ యత్ తపో దానం ఆర్జవమ్
అహిగ్ంసా సత్యవచనం। ఇతి తా అస్య దక్షిణాః।।
తపస్సులు, దానములు, ఆర్జవములు అహింసా - ఇవన్నీ సత్యవచనములు. ‘‘ఇవన్నీ యజ్ఞ దక్షిణములు’’.

తస్మాదాహుః సోష్యత్యసోష్టేతి పునరుత్పాదనమేవాస్య
తన్మరణమేవావభృథః .. 3.17.5..
5. తస్మాత్ ఆహుః సోష్యతి అసోష్టేతి
పునః ఉత్పాదనం ఏవ అస్య।
తత్ మరణం ఏవ ‘‘అవభృథః’’
ఇక్కడ ఫలించునవి, ఫలించనివి అవన్నీ యజ్ఞముయొక్క సత్ఫలితములు, అవియే పునఃఉత్పాదనములు
తల్లి ప్రసవించటమే పునర్జన్మ।
మరణమే అవభృథ స్నానము.

తద్ధైతద్ఘోర్ ఆంగిరసః కృష్ణాయ
దేవకీపుత్రాయోక్త్వోవాచాపిపాస ఏవ స బభూవ
సోఽన్తవేలాయామేతత్త్రయం ప్రతిపద్యేతాక్షితమస్యచ్యుతమసి
ప్రాణసగ్ంశితమసీతి తత్రైతే ద్వే ఋచౌ భవతః .. 3.17.6..
6. తద్ధ ఏతత్ ఘోర ఆఙ్గీరసః
కృష్ణాయ దేవకీ పుత్రాయ ఉక్త్వా ఉవాచ।
అపిపాస ఏవ స బభూవ।
సో అంతవేళాయాం ఏతత్
త్రయం ప్రతిపద్యేత।।
అక్షితమసి। అచ్యుతమసి।
ప్రాణసగ్ంశితం అసీతి।
తత్ర ఏతే ద్వే ఋచౌ భవతిః।।
ఘోర అంగీరస ముని ఒక సందర్భములో దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణునికి ఈవిధంగా వివరించి చెప్పుచూ పైవిధంగా పలికారు.
అప్పుడు శ్రీకృష్ణుడు ఏ ఇతర విద్యల పట్ల తృష్ణ లేనివారయ్యారు.

ఉత్తమ సాధకుడు మరణ సమయంలో ఈ మూడు మంత్రములను జపించునుగాక।
- నీవు క్షీణించనివాడవు।
- చ్యుతి లేనివాడవు।
- సూక్ష్మ ప్రాణస్వరూపుడవు।

ఈ విషయమై రెండు ఋక్కులు ఉన్నాయి.

ఆదిత్ప్రత్నస్య రేతసః .
ఉద్వయం తమసస్పరి జ్యోతిః పశ్యంత ఉత్తరగ్ంస్వః
పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ
జ్యోతిరుత్తమమితి జ్యోతిరుత్తమమితి .. 3.17.7..

.. ఇతి సప్తదశః ఖండః ..
7. ఆదిత్ ప్రత్నస్య రేతసః।
(జ్యోతిః పశ్యంతి వాసరమ్।
పరోయత్ ఇధ్యతే దివి)।
ఉద్వయం తమసః పరి జ్యోతిః
పశ్యన్త ఉత్తరగ్ం స్వః। పశ్యంత ఉత్తరం దేవం
దేవత్రా సూర్యమగన్మ।
జ్యోతిః ఉత్తమం ఇతి।।
జ్యోతిః ఉత్తమం ఇతి।।
బ్రహ్మజ్ఞులగు మహనీయులు ఎల్లవేళలా ఈ దృశ్యజగత్తును (సనాతనము, జగత్కారణము అగు) పరబ్రహ్మముయొక్క రేతస్సుగా (తేజోరూపముగా) దర్శిస్తూ ఉంటారు. జ్యోతికే జ్యోతిని, సమస్తమునకు పరమై - దివ్యమైయున్న తత్త్వమును సర్వే సర్వత్రా గాంచుచున్నారు.

ఆత్మజ్ఞానమును అధ్యయనము చేస్తూ ఉన్న మేము కూడా
- నిత్యోదితము, చీకటికి ఆవల
- సమస్తమునకు పరము
అయిన పరంజ్యోతినే దర్శిస్తున్నాము.

‘‘మేము ఆత్మజ్యోతి స్వరూపులము’’ - అను భావన, అనుభూతులను ఆశ్రయిస్తూ ఉన్నాము.
సర్వదేతలకు ఆవలగా సమస్త దేవాతీతముగా, సూర్యునికి కూడా ఆవలగా ప్రకాశించు తత్త్వమును చూస్తూ ఉన్నాము. ఉత్తమ స్వయం జ్యోతి స్వరూపంగా స్వస్వరూప - సర్వస్వరూప ‘ఆత్మ’ను ఆరాధిస్తున్నాము.

అది ఉత్తమపురుష (First Person) జ్యోతి స్వరూపమే। అదియే నేను - నీవు కూడా।

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే సప్తదశః ఖండః


3–18. తృతీయ ప్రపాఠకః - అష్టాదశ ఖండః - చతుష్పాద బ్రహ్మోపాసనా


మనో బ్రహ్మేత్యుపాసీతేత్యధ్యాత్మమథాధిదైవతమాకాశో
బ్రహ్మేత్యుభయమాదిష్టం భవత్యధ్యాత్మం చాధిదైవతం చ .. 3.18.1..
1. ‘‘మనోబ్రహ్మా’’ - ఇతి ఉపాసీత ఇతి అధ్యాత్మం।
అథ అధిదైవతం।
ఆకాశో బ్రహ్మేతి।
ఉభయం ఆదిష్ఠం భవతి,-
అధ్యాత్మం చ అధిదైవతం చ।।
ఈ మనస్సు బ్రహ్మమే। కనుక, ‘‘మనస్సు యొక్క సహజ-వాస్తవ స్వరూపము ఆత్మయే’’ అని ఉపాసించుచున్నాము.

అట్టి బ్రహ్మమును సర్వ జీవులలో వేంచేసినదై ఉండటంచేత ‘‘అధ్యాత్మము’’ అని, సర్వ దైవతా స్వరూపము కాబట్టి ‘‘అధి-దైవతము’’ అని ఆరాధిస్తున్నాము. ‘ఆకాశము’ బ్రహ్మమే। అధ్యాత్మము (దేహము), దేవతలు (అధిదైవతము) కూడా ఆది స్వరూపమగు బ్రహ్మమే।

కనుక సమస్త జీవులలో ‘అహమ్-నేను’ రూపమున మాకు ప్రదర్శనము అగుచున్నట్టిదే - ‘‘అధి దైవతము’’. అధిదైవమే పరబ్రహ్మము.

తదేతచ్చతుష్పాద్బ్రహ్మ వాక్పాదః ప్రాణః పాదశ్చక్షుః
పాదః శ్రోత్రం పాద ఇత్యధ్యాత్మమథాధిదైవతమగ్నిః
పాదో వాయుః పాదా అదిత్యః పాదో దిశః పాద
ఇత్యుభయమేవాదిష్టం భవత్యధ్యాత్మం చైవాధిదైవతం చ .. 3.18.2..
2. తత్ ఏతత్ చతుష్టాద్ బ్రహ్మ।
వాక్ పాదః, ప్రాణః పాదః,
చక్షుః పాదః శ్రోత్రం పాద - ఇతి అధ్యాత్మమ్।।
అథ అధిదైవతం। అగ్నిః పాదో।
వాయుః పాద ఆదిత్యః పాదో।
దిశః పాద - ఇతి ఉభయం ఏవ
ఆదిష్టం భవతి। అధ్యాత్మం చ ఏవ।
అధిదైవతం చ।।
అట్టి పరబ్రహ్మమునకు పాదములు–4.

అధ్యాత్మము (దేహమునకు సంబంధించి)

1. వాక్ ఇంద్రియ పాదము
2. ప్రాణ పాదము
3. నేత్రములు (కళ్ళు) - పాదము
4. చెవులు (వినికిడి) - పాదము.
ఇది ‘‘అధ్యాత్మము’’।

అధి దైవతము

దేవతలకు సంబంధించిన పాదములు.
1. అగ్ని 2. వాయువు 3. ఆదిత్యుడు 4. దిక్కులు
ఇదియే (శరీరము - దేవతల) అధిదైవతోపాసన.

ఇవి అధ్యాత్మ - అధిదైవతోపాసనములు.

వాగేవ బ్రహ్మణశ్చతుర్థః పాదః సోఽగ్నినా జ్యోతిషా
భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్యా యశసా
బ్రహ్మవర్చసేన య ఏవం వేద .. 3.18.3..
3. వాక్ ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః।
సో అగ్నినా, జ్యోతిషా భాతి చ,
తపతి చ। భాతి చ తపతి చ కీర్త్యా
యశసా బ్రహ్మవర్చసేన య ఏవం వేద
వాక్కు బ్రహ్మమే। బ్రహ్మముయొక్క నాలుగు పాదములలో ఒకటి ఈ వాక్కు.

బ్రహ్మమే అగ్నిగా, వెలుగుగా (జ్యోతిస్వరూపమై) వెలుగొందుచున్నది.

సమస్తమును తపింపజేయుచున్నది. ఈవిధంగా బ్రహ్మమే సర్వముగా భాసిస్తూ, సమస్తమును తపింపజేయుచున్నదని ఎవరు ఎరుగుచున్నారో, అట్టివారు కీర్తి, యశస్సు, బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించగలరు.

ప్రాణ ఏవ బ్రహ్మణశ్చతుర్థః పాదః స వాయునా జ్యోతిషా
భాతి చ తపతి చ్ భాతి చ తపతి చ కీర్త్యా యశసా
బ్రహ్మవర్చసేన య ఏవం వేద .. 3.18.4..
4. ప్రాణ ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః।
స వాయునా జ్యోతిషా భాతి చ।
తపతి చ। భాతి చ।
తపతి చ కీర్త్యా యశసా
బ్రహ్మవర్చసేన య ఏవం వేద।
ప్రాణమే బ్రహ్మము. ప్రాణము బ్రహ్మముయొక్క నాలుగు పాదములలో ఒకటి.

అట్టి ప్రాణము వాయు స్పర్శచే జ్యోతి స్వరూపమై ప్రకాశించుచూ ప్రదర్శనమగుచున్నది. సమస్తమును ప్రాణము తపింపజేయుచున్నది. అన్నిటినీ వెలిగించుచున్నది. ప్రాణమును ఆత్మయే తపించుచు, ప్రాణమునకు ‘ప్రాణి’ అయి ఉన్నది.

ఎవ్వరు ప్రాణమును పరబ్రహ్మ స్వరూపంగా ఎరిగి ఉపాసిస్తారో, అట్టి వారు గొప్ప తపోవంతులు, కీర్తివంతులు, యశోసంపన్నులు, బ్రహ్మవర్చస సంపన్నులు అగుచున్నారు.

చక్షురేవ బ్రహ్మణశ్చతుర్థః పాదః స ఆదిత్యేన జ్యోతిషా
భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్యా యశసా
బ్రహ్మవర్చసేన య ఏవం వేద .. 3.18.5..
5. ‘‘చక్షుః’’ ఏవ ‘‘బ్రహ్మణః’’ చతుర్థః పాదః।
స ఆదిత్యేన జ్యోతిషా భాతి చ।
తపతి చ। భాతి చ తపతి చ
కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన య ఏవం వేద।।
ఈ చక్షువులు (చూపు) బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మము యొక్క నాలుగు పాదములలో ఒకటి - ‘చక్షువులు’.

నేత్రములోని తేజస్సే ఆకాశంలో సూర్య ప్రకాశముగా వెలుగొందుచున్నది. సూర్య ప్రకాశ చైతన్యమే కళ్ళలో తేజస్సుగా ప్రకాశముగా, చైతన్యమై వెలుగొందుచున్నది.

ఈ విధంగా ‘‘కళ్ళలోని వెలుగు’’, ‘‘సూర్యునిలోని వెలుగు’’ - ఏకము, అఖండము అగు బ్రహ్మప్రకాశమే - అని గ్రహించి తపస్సు నిర్వర్తించు వారు తపోఫలము, కీర్తి, యశస్సు, బ్రహ్మవర్చస్సు పొందుచున్నారు.

శ్రోత్రమేవ బ్రహ్మణశ్చతుర్థః పాదః స దిగ్భిర్జ్యోతిషా
భాతి చ తపతి చ భాతి చ తపతి చ కీర్త్యా యశసా
బ్రహ్మవర్చసేన య ఏవం వేద య ఏవం వేద .. 3.18.6..

.. ఇతి అష్టాదశః ఖండః ..
6. శ్రోత్రం ఏవ బ్రహ్మణః చతుర్థః పాదః
స దిగ్భిః జ్యోతిషా భాతి చ।
తపతి చ। భాతి చ తపతి చ
కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన
య ఏవం వేద। య ఏవం వేద।।
చెవి-వినికిడి బ్రహ్మమే అయి ఉన్నాయి. ఇది బ్రహ్మమునకు నాలుగవ పాదము.

ఇది దిక్ దేవతా రూపమై నాలుగు దిక్కులలో జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తోంది. నాలుగు దిక్కులను తపింపజేస్తోంది. తాను వెలుగుతూ, దిక్కులన్నీ వెలిగిస్తోంది.

ఈవిధంగా బ్రహ్మమే ‘వినికిడి’ రూపంగా దిక్కులన్నీ వెలిగిస్తూ తపింపజేస్తూ ఉన్నదని ఎరిగి ఉపాసించువాడు - బ్రహ్మవర్చస్సు, కీర్తి పొందుచున్నాడు.

ఇతి ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే అష్టాదశః ఖండః


3–19. తృతీయ ప్రపాఠకః - ఏకోనవింశః ఖండః - ఆదిత్యబ్రహ్మోపాసనా


ఆదిత్యో బ్రహ్మేత్యాదేశస్తస్యోపవ్యాఖ్యానమసదేవేదమగ్ర
ఆసీత్ . తత్సదాసీత్తత్సమభవత్తదాండం నిరవర్తత
తత్సంవత్సరస్య మాత్రామశయత తన్నిరభిద్యత తే ఆండకపాలే
రజతం చ సువర్ణం చాభవతాం .. 3.19.1..
1. ‘‘ఆదిత్యో బ్రహ్మా’’ ఇతి ఆదేశః।
తస్య ఉపవ్యాఖ్యానమ్।


‘అసత్’ ఏవ ఇదమ్ అగ్ర ఆసీత్।।
తత్ సదాసీత్, తత్ సమభవత్।



తత్ ఆండం నిరవర్తత।
తత్ సంవత్సరస్య మాత్రామ్ అశయత।


తత్ నిరభిద్యత। తే ఆండకపాలే రజతం చ,
సువర్ణం చ అభవతామ్।
ఆదిత్యుడు (సూర్యుడు) బ్రహ్మమే। ఇది ఆదేశము (This is the order)
తదితర విశేషములన్నీ ఉపవ్యాఖ్యానము (Talking about other relevant details) మాత్రమే।

మొట్టమొదట - ‘‘కేవలము, ‘అన్యము’ అనునది కించిత్ కూడా లేనట్టిది’’ - అగు ‘ఆత్మ’ మాత్రమే ఉన్నది. అట్టి మొట్టమొదటి స్థితియందు ఈ ‘జగత్తు’ అనునది లేదు. అనగా అసత్తు (Non present)! అది ఎప్పటికీ యథాతథము.
మొట్టమొదట ‘సత్’ (existence) అయి, అద్దాని నుండి (లేక) అట్టి ‘ఆసత్’యే ఈ ‘భూమి’ మొదలైనవన్నీగా ప్రదర్శనమగుచున్నది.

అవ్యక్తంలోంచి వ్యక్తము అగుచు, అండాకారము (గ్రుడ్డు ఆకారము) బయల్వెడలుతోంది.
ఆ విధముగా అండాకారము (బ్రహ్మాండము)గా పరిణమించి, అది ఒక సంవత్సర కాలము అట్లే ఉన్నది.

ఆ అండము పగిలి - రెండు ముక్కలుగా (విభాగములుగా) అయి - అవి ఒకటి వెండిరంగుతో మరొకటి సువర్ణము (బంగారము) రంగుతోను రూపుదిద్దుకున్నాయి.

తద్యద్రజతగ్ం సేయం పృథివీ యత్సువర్ణగ్ం సా ద్యౌర్యజ్జరాయు
తే పర్వతా యదుల్బగ్ం సమేఘో నీహారో యా ధమనయస్తా
నద్యో యద్వాస్తేయముదకగ్ం స సముద్రః .. 3.19.2..
2. తత్ యత్ రజతగ్ం సేయం పృథివీ
యత్ సువర్ణగ్ం, సా ద్యౌర్యత్
జరాయు తే, పర్వతా।
యత్ ఉల్బగ్ం, స మేఘో నీహారో
యా ధమన యస్తా నద్యో
యత్ వాస్తేయమ్ - ఉదకగ్ం స సముద్రః।।
Ⅰ. వెండి రంగుగా కనిపిస్తున్న ప్రథమార్థ భాగము (1st Half) - ఈ సమస్త భూతలము (All that is solid) - భూలోకము.
Ⅱ. బంగారపు రంగుతో కనిపిస్తున్న ద్వితీయార్థ భాగము (2nd Half) ద్యులోకము (లేక) స్వర్గలోకము.

బాహ్యమున ఉన్న విభాగం చర్మ భాగము - పర్వతములు.
ఆ అండములోని ఉల్బగము (పొంగుతూ కనిపించు విభాగము) - మేఘములు
ఆ అండములోని ‘నరములు’గా ఉన్న విభాగములు - నదులు
ఆ అండమునకు అడుగున ఉన్నవి - సముద్రములు

అథ యత్తదజాయత సోఽసావాదిత్యస్తం జాయమానం ఘోషా
ఉలూలవోఽనూదతిష్ఠంత్సర్వాణి చ భూతాని సర్వే చ
కామాస్తస్మాత్తస్యోదయం ప్రతి ప్రత్యాయనం ప్రతి ఘోషా
ఉలూలవోఽనూత్తిష్ఠంతి సర్వాణి చ భూతాని సర్వే చ కామాః .. 3.19.3..
3. అథ యత్ తత్ అజాయత,
సో అసావాదిత్యః
తం జాయమానం
ఘోషా ఉలూలవో అనూద తిష్ఠన్
సర్వాణి చ భూతాని, సర్వే చ కామాః।।


తస్మాత్ తస్య ఉదయం ప్రతి ప్రత్యాయనం
ప్రతి ఘోషా ఉలూ లవో అను-ఉత్తిష్ఠన్తి
సర్వాణి చ భూతాని, సర్వే చ కామాః।।
ఆ తరువాత ఏది జనించిందో, అది ఆదిత్యుడు (మొట్టమొదట సృష్టిరూపంగా బయల్వెడలుచున్నట్టి తత్త్వము).
ఆ ఆదిత్యునినుండి ‘ఘోష’ (పెద్ద శబ్దము - Big Bang) బయల్వెడలి, అది అన్నివైపులా విస్తరిస్తూ ఈ సమస్త భూతజాలము, ఆ భూతజాలముల అవసరములు, ఆశయముల రూపంగా విస్తరించసాగింది.



ఈ విధంగా ఆ ఆదిత్యుని ఉదయము, అస్తమయము వాటిననుసరించి జీవులు, ఆ జీవులనుండి ప్రతిఘోష (Resound) సర్వభూతజాలము, వారివారి కోరికలు, ఆశయములు బయల్వెడలటం జరుగుతోంది.
(అహమాత్మా సర్వభూతాశయ స్థితః - భగవద్గీత)।


స య ఏతమేవం విద్వానాదిత్యం బ్రహ్మేత్యుపాస్తేఽభ్యాశో హ
యదేనగ్ం సాధవో ఘోషా ఆ చ గచ్ఛేయురుప చ
నిమ్రేడేరన్నిమ్రేడేరన్ .. 3.19.4..

.. ఇతి ఏకోనవింశః ఖండః ..

.. ఇతి తృతీయోఽధ్యాయః ..
4. స య ఏతం ఏవం విద్వాన్
‘‘ఆదిత్యం బ్రహ్మేతి’’ ఉపాస్తే।।
అభ్యాసో హ యత్ ఏనగ్ం
సాధవో ఘోషా ఆ చ గచ్ఛేయుః
ఉప చ - నిమ్రేడేరన్।
ఈ విధంగా -
- కేవలమగు, నిర్విషయమగు సత్‌రూపాత్మ।
- అద్దాని నుండి అండము।
- అండము ‘రెండుగా’ అవటము।
- అవి భు-స్వర్గ లోకములవటము।
- ఆ ఆదిత్యుని నుండి ఘోష।
- ఆ ఘోష నుండి జీవులు (Individual Beings) వారి ఆశయములు, ఆర్తి, ఆవేదనలు।…….
బయల్వెడలటము ఎరిగినవారై, అట్టి ‘‘ఆదిత్యుడే బ్రహ్మము’’ అని ఉపాసిస్తారో, అభ్యాసపరులై ఉంటారో -
అట్టి ఉపాసకుని నుండి (ఓంకార) ఘోష అనుభూతమై, వేదనాదములు జనిస్తూ సర్వత్రా ఆనందము కలిగించగలవు. ఆతడు ఆనందవంతుడు, సుఖవంతుడు కాగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - తృతీయాధ్యాయే ఏకోనవింశతిః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది - తృతీయో అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅳ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - నాలుగవ అధ్యాయము

4–1. చతుర్థ ప్రపాఠకః - ప్రథమ ఖండము - జ్ఞానశ్రుతి రైక్వ ఉపాఖ్యానము - సంవర్గ విద్యా


.. చతుర్థోఽధ్యాయః ..

జానశ్రుతిర్హ పౌత్రాయణః శ్రద్ధాదేయో బహుదాయీ బహుపాక్య ఆస
స హ సర్వత ఆవసథాన్మాపయాంచక్రే సర్వత ఏవ
మేఽన్నమత్స్యంతీతి .. 4.1.1..
1. ఓమ్।
జానశ్రుతిః హ పౌత్రాయణః
శ్రద్ధాదేయో బహుదాయీ బహుపాక్య ఆస।
స హ సర్వత ఆవసథాన్
మాపయాంచక్రే సర్వత ఏవ
మే - అత్స్యంతి - ఇతి।।

జానశ్రుత వంశీయుడు - జనశ్రుతుని ప్రపౌత్రుడు (మునిమనుమడు) - శ్రీ జానశ్రుత పౌత్రుడు.
ఆ జానశ్రుత పౌత్రుడు ఎంతో శ్రద్ధగా దానములు చేస్తూ ఉండేవారు. గొప్ప ‘అన్నదాత’గా లోకప్రసిద్ధుడైనారు.
‘‘జనులు అన్నదానము స్వీకరించి సుఖముగా ఉండెదరు గాక।’’ - అని భావించి ఆయన అనేకచోట్ల అన్నదాన సత్రములను, ధర్మశాలలను కట్టించారు కూడా।


అథ హగ్ంసా నిశాయామతిపేతుస్తద్ధైవగ్ం హగ్ం సోహగ్ం సమభ్యువాద
హో హోఽయి భల్లాక్ష భల్లాక్ష జానశ్రుతేః పౌత్రాయణస్య
సమం దివా జ్యోతిరాతతం తన్మా ప్రసాంక్షీ స్తత్త్వా
మా ప్రధాక్షీరితి .. 4.1.2..
2. అథ హ హగ్ంసా నిశాయాం అతిపేతుః
తద్ ధ ఏవగ్ం హగ్ంసో హగ్ంసం అభ్యువాద
హో! హో! అయి।
భల్లాక్ష! భల్లాక్ష!
జానశ్రుతేః పౌత్రాయణస్య
సమం దివా జ్యోతిః ఆతతం।
తత్ మా ప్రసాఙ్‌క్షీః।
తత్ త్వా మా ప్రధాక్షీః ఇతి।।
ఒకానొకరోజు సాయం సమయంలో ఆ జానశ్రుతి పౌత్రాయణుడు మేడపై గల విశాల ప్రదేశంలో చల్లటి గాలులు సేవిస్తూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆతనికి ఎదురుగా రెండు హంసలు ఆకాశంలో ఎగిరిపోతూ ఈ విధంగా సంభాషించుకోవటం వినసాగారు.

మొదటి హంస : అహో! అహో! ఆశ్చర్యం! ఓ మిత్రమా! భల్లాక్షా! భల్లాక్షా! అదిగో। ఆ జానశ్రుతి పౌత్రాయణుడిని చూస్తున్నావా? ఈయన చేస్తున్న అన్నదానమునకు లోకశుభముకొరకై కట్టించిన ధర్మశాలలకు, అన్నసత్రములకు - ఈయన ఎంతో తేజోవంతుడైనాడు. ఆయన కీర్తి, తేజస్సు ద్యులోకము (స్వర్గలోకము) వరకు వ్యాపించి ప్రకాశిస్తోంది. ఓ పరిమితమగు కాళ్లు గల మిత్రమా! చూస్తున్నావు కదా!
అదిగో! దేవలోకము వైపుగా ప్రసరిస్తూ ఉన్న ఆయన అన్నదాన తేజస్సును పొరపాటుగా స్పృశించవద్దు సుమా! ఎందుకంటే ఆతని అన్నదాన తేజస్సును నీవు స్పృశించావో, అది నిన్ను తగలబెట్టగలదు.

తము హ పరః ప్రత్యువాచ కమ్వర ఏనమేతత్సంతగ్ం సయుగ్వానమివ
రైక్వమాత్థేతి యో ను కథగ్ం సయుగ్వా రైక్వ ఇతి .. 4.1.3..
3. తము హ పరః ప్రతి ఉవాచ-
కం వర ఏనమ్ ఏతత్
సంతగ్ం సయుగ్వానమ్ ఇవ
రైక్వామ్ ఆత్థేతి?
యో ను కథగ్ం సయుగ్వా, రైక్వ? ఇతి।।
రెండవ హంస : ఏమిటి? అజ్ఞానిలా ఉన్నావే! ఈ జానశ్రుతి పౌత్రాయణుని గురించి నాకు ఇంత గొప్పగా చెప్పుచున్నావేమిటి? ఈ రాజు అల్పుడు మాత్రమే అయి ఉండగా, ఈతనిని బండి రైక్వునితో సమానంగా పొగుడుచున్నావా? సరికాదు. ఆ రైక్వుని (రైక్వుడు అను పేరు గలవాని) ముందు ఈ జానశ్రుతి పౌత్రుడు ఎంతటివాడు? గమనించలేదా?
మొదటి హంస : బండితో కూడిన రైక్వుడా? ఆయన ఎవరు? కాస్త విడమర్చి, వివరించి చెప్పండి.

యథా కృతాయవిజితాయాధరేయాః సంయంత్యేవమేనగ్ం సర్వం
తదభిసమైతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యస్తద్వేద
యత్స వేద స మయైతదుక్త ఇతి .. 4.1.4..
4. యథా కృతాయ విజితాయ
అధరేయాః సంయతి ఏవం ఏనగ్ం
సర్వం తత్ అభిసమేతి।
యత్కించ ప్రజాః సాధు కుర్వంతి,
యః తత్ వేద, యత్ స వేద
స మయా ఏతత్ ఉక్త ఇతి।।
రెండవ హంస : ఒక జూదరి జూదములో 4 పందెములు గెలిచాడనుకోండి. అప్పుడు ఆతనికి 3, 2, 1 పందెములు గెలిచినవారు వశమై ఉంటారు కదా।
అట్లాగే ఆ రైక్వుడు తదితర అన్నదానాది సత్కర్మల ఫలములన్నీ ఏది తెలుసుకొంటే వశమై ఉంటాయో - అవన్నీ తెలుసుకొని ఉన్నట్టివాడు. జనులు చేస్తున్న సత్కర్మలన్నీ (4 పందెములు గెలిచిన జూదక్రీడాకారుని వలె), సమస్త కర్మలు చేసిన ఫలము జ్ఞాని అయి ఆ రైక్వుడు సంపాదించుకున్నారు. అందుచేత ‘‘అట్టి బండి రైక్వుని సత్కర్మ ఫలముల ముందు అన్నదానం చేస్తున్న ఈ జానశ్రుత పౌత్రాయణుని కర్మ ఫలమెంత?’’ - అని ప్రశ్నించాను.

తదు హ జానశ్రుతిః పౌత్రాయణ ఉపశుశ్రావ
స హ సంజిహాన ఏవ క్షత్తారమువాచాంగారే హ సయుగ్వానమివ
రైక్వమాత్థేతి యో ను కథగ్ం సయుగ్వా రైక్వ ఇతి .. 4.1.5..
5. తదు హ జానశ్రుతిః
పౌత్రాయణ ఉపశుశ్రావ।
ఆకాశంలో ఎగురుచూ వెళ్లుచున్న ఆ రెండు హంసల సంభాషణను జానశ్రుత పౌత్రాయణుడు శ్రద్ధగా విన్నారు.
స హ సంజిహాన ఏవ
క్షత్తారమ్ ఉవాచ
అంగారే హ సయుగ్వానం ఇవ
రైక్వమ్ ఆత్థేతి యో?
కథగ్ం సయుగ్వా రైక్వ? ఇతి।
జానశ్రుతపౌత్రాయణుడు - (ఆ మరునాడు నిద్రలేస్తూనే వైతాళిక మాటలు వింటూ తన సేవకునితో)
ఓ ప్రతీహారీ! వైతాళికా! నన్ను సయుగ్వ రైక్వునివలె పొగుడు చున్నావేమిటయ్యా? నేను సయుగ్వా రైక్వుని (బండితో కూడిన రైక్వుని) ముందు అల్పుడనని నీకు ఇంకా తెలియదా? ఆయనను పిలుచుకురండి.
ప్రతిహారి (సేవకుడు) : మహాన్! ఆ ‘సయుగ్వ రైక్వుడు’ అనగా ఎవరు? ఎక్కడుంటాడో మరి?

యథా కృతాయవిజితాయాధరేయాః సంయంత్యేవమేనగ్ం సర్వం
తదభిసమైతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యస్తద్వేద
యత్స వేద స మయైతదుక్త ఇతి .. 4.1.6..
6. యథా కృతాయ విజితాయ ఆధరే యాః
సంయంతి ఏవం ఏనగ్ం
సర్వం తత్ అభిసమేతి
యత్కించ ప్రజాః సాధు కుర్వంతి
యః తత్ వేద - యత్స వేద,
స మయా ఏతత్ ఉక్త - ఇతి।।

జానశ్రుత పౌత్రాయణుడు : ఓ ప్రతీహారీ! వైతాళికా ఆ సాయుగ్యానమివ (నాలుగు చక్రాల బండిని అధిరోహించిన) రైక్వుడే పొగడ తగినవాడుగాని, నేను కాదు.
ఒక జూదగాడు కృతాయమ అనే క్రీడలో నాలుగు ఆటలను గెలిచినప్పుడు - ఆతనికి మిగతా 3–2–1 ఆటలు గెలిచినవారిపై ఆధిపత్యం ఉంటుంది కదా! అట్లాగే, ఆ రైక్వుడు ఏది తెలుసుకున్నాడో, మిగతా ఉత్తమ కర్మపరులంతా వశులై ఉంటారు. తెలుసుకోవలసినది తెలుసుకొని ఉండటంచేత కర్మిష్టులగు మేము ఆ రైక్వుని ముందు స్వల్పులము. మీరు వెళ్లి ఆయన ఎక్కడున్నా చూచి పిలుచుకురండి.


స హ క్షత్తాన్విష్య నావిదమితి ప్రత్యేయాయ తగ్ం హోవాచ
యత్రారే బ్రాహ్మణస్యాన్వేషణా తదేనమర్చ్ఛేతి .. 4.1.7..
7. స హ క్షత్తా అన్విష్య
న అవిదం ఇతి ప్రత్యేయాయ
తగ్ం హ ఉవాచ-
యత్ర, అరే! బ్రాహ్మణస్య
అన్వేషణా తత్ ఏనమ్ అర్చ ఇతి।।
సేవకుడు రైక్వుని కోసం వెతికి, ఆయన కనబడక తిరిగివచ్చి జానశ్రుత పౌత్రాయణునితో ఇట్లు పలికారు.
సేవకుడు : అయ్యా! మునివర్యా! మీరు చెప్పిన ఆ రైక్వుని కోసం చాలా గ్రామాలలో వెతికాము. వారు కనబడలేదు. ఏమి చేయమంటారు?
జానశ్రుత పౌత్రాయణుడు : ఓ సేవకా! వైతాళికా! ఎవ్వరు ఎక్కడ నివాసం కలిగి ఉంటారో - అక్కడ వెతకాలి. ఎక్కడెక్కడో ఆయనకు నివాసము కానిచోట్ల వెతికి ఏమి ప్రయోజనం? ఎక్కడ బ్రహ్మతత్త్వజ్ఞులు నివసిస్తూ ఉంటారో అక్కడ వెతికి, ఆయనను గుర్తించి పట్టుకు రండి!


సోఽధస్తాచ్ఛకటస్య పామానం కషమాణముపోపవివేశ
తగ్ం హాభ్యువాద త్వం ను భగవః సయుగ్వా రైక్వ
ఇత్యహగ్ం హ్యరా3 ఇతి హ ప్రతిజజ్ఞే స హ క్షత్తావిదమితి
ప్రత్యేయాయ .. 4.1.8 ..
8. సో అధస్తాః శకటస్య పామానం
కషమాణం ఉప ఉపవివేశ।
తగ్ం హ అభ్యువాద త్వం ను
భగవః సయుగ్వా, రైక్వ?
ఇతి అహగ్ం హి అరా ఇతి।
హ ప్రతిజజ్ఞే స హ క్షత్తా
అవిదం ఇతి ప్రత్యేయాయ।।

.. ఇతి ప్రథమః ఖండః ..
అప్పుడు ఆ సేవకులు మరల వెళ్లి తత్త్వజ్ఞులు నివసించే పవిత్ర ప్రదేశములలో రైక్వుని కొరకు వెతకనారంభించారు.
అప్పుడు ఒక బండి క్రింద (అధస్తాః శకటస్య) - దురద పొక్కులు గోక్కుంటూ ఒకాయన కనిపించారు. ఆ సేవకులకు ‘‘ఈయన రైక్వుడేమో?’’ - అనే అనువనం వచ్చింది.
ఆయన కూర్చునియున్న బండి క్రింద స్థానమును సమీపించారు.
జానశ్రుత పౌత్రాయుని సేవకులు : హే పూజనీయా! మహానీయా! ‘‘బండితో కూడిన రైక్వుడు’’ అనగా తమరే కదా?
బండి క్రింద కూర్చున్న ఆయన : అవును. మీరు అడిగే ఆ రైక్వుడను నేనే! అనుమానమెందుకు వచ్చింది?

అప్పుడు ఆ సేవకులు ‘‘అమ్మయ్య। మన యజమాని వెతకమని చెప్పిన రైక్వుడు కనిపించారు।’’… అని సంతోషము పొందినవారై,జానశ్రుత పౌత్రేయుని సమీపించి, ‘‘రాజా! మునీశ్వరా! మేము దేవరవారు (మీరు) వర్ణించి చెప్పిన రైక్వుని కనుగొన్నాము. దగ్గరలోనే బండి క్రింద ఏకాంతంగా కూర్చుని ఉన్నారు’’ - అని తెలియజేసారు. అప్పుడు జానశ్రుత పౌత్రుడు గబగబలేచి సయుగ్వా (బండి క్రింద గల) రైక్వుని దర్శనము కొరకై జ్ఞానార్థి అయి బయల్వెడలారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే ప్రథమః ఖండః


4–2. చతుర్థ ప్రపాఠకః - ద్వితీయ ఖండము - జ్ఞానమునకు అర్హత నిరహంకారము, ప్రపత్తి


తదు హ జానశ్రుతిః పౌత్రాయణః షట్శతాని గవాం
నిష్కమశ్వతరీరథం తదాదాయ ప్రతిచక్రమే తగ్ం హాభ్యువాద .. 4.2.1..
1. తదు హ జానశ్రుతిః పౌత్రాయణః
షట్ శతాని గవాం నిష్కం - అశ్వతరీ - రథమ్
తత్ ఆదాయ, ప్రతిచక్రమే తగ్ం హ అభ్యువాద।।
జానశ్రుతి పౌత్రాయణుడు సేవకులు చెప్పిన గుర్తులను అనుసరించి వెళ్లారు. 600 గోవులను, గుఱ్ఱములను, రథములను తీసుకొని మహానుభావుడగు ఆ రైక్వుడు ఉన్నచోటును జ్ఞానార్థి అయి సమీపించారు. శ్రీ రైక్వునికి అభివాదములు సమర్పించారు.

రైక్వేమాని షట్శతాని గవామయం నిష్కోఽయమశ్వతరీరథోఽను
మ ఏతాం భగవో దేవతాగ్ం శాధి యాం దేవతాముపాస్స ఇతి .. 4.2.2..
2. రైక్వేమాని షట్‌శతాని,
గవాం అయం నిష్కో
అయమ్ అశ్వతరీ రథో ను
మ ఏతాం భగవో దేవతాగ్ం శాధి
యాం దేవతామ్ ఉపాస్స ఇతి।
జానశ్రుత పౌత్రేయుడు : బండి క్రింద విశ్రాంతి తీసుకుంటన్న మహామహనీయా! రైక్వమహాశయా! మీ కొరకై 600 ఆవులను, గుఱ్ఱములను, రథములను సమర్పించటానికై తీసుకొచ్చాను. దయతో స్వీకరించండి. అనుగ్రహించండి. మీరు ఏ దేవతా ఉపాసనచే దివ్యజ్ఞానము పొందారో, అట్టి దివ్యతత్త్వవిశేషమును శ్రవణం చేయాలని వచ్చాను. దయతో వివరించమని తమకు నా ప్రార్థన.

తము హ పరః ప్రత్యువాచాహ హారేత్వా శూద్ర తవైవ సహ
గోభిరస్త్వితి తదు హ పునరేవ జానశ్రుతిః పౌత్రాయణః
సహస్రం గవాం నిష్కమశ్వతరీరథం దుహితరం తదాదాయ
ప్రతిచక్రమే .. 4.2.3..
3. తము హ పరః ప్రతి ఉవాచ అహ
హారే త్వా శూద్ర; తవ ఏవ సహ గోభిః అస్తు। ఇతి।
తదు హ పునః ఏవ జానశ్రుతిః
పౌత్రాయణః సహస్రం గవాం,
నిష్కం అశ్వతరీ రథం
దుహితరం తదాదాయ ప్రతిచక్రమే।।
రైక్వుడు : ఓయీ! శూద్రా! నీవు తెచ్చిన గోవులు, గుఱ్ఱములు, రథములు నాకెందుకు? నేనేం చేసుకుంటాను? నీవే దాచుకో!
జానశ్రుత పౌత్రేయుడు : స్వామీ! అట్లాగా! అయితే 1000 గోవులను, చక్కటి గుఱ్ఱములతో కూర్చిన రథమును సమర్పించుకుంటాము. నాకు జ్ఞానము బోధించండి.
రైక్వుడు : అవన్నీ నాకెందుకు చెప్పు?

తగ్ం హాభ్యువాద రైక్వేదగ్ం సహస్రం గవామయం
నిష్కోఽయమశ్వతరీరథ ఇయం జాయాయం గ్రామో
యస్మిన్నాస్సేఽన్వేవ మా భగవః శాధీతి .. 4.2.4 ..
4. తగ్ం హ అభ్యువాద, రైక్వా!
ఇదగ్ం సహస్రం గవాం అయం
నిష్కో అయం అశ్వతరీ రథ
ఇయం జాయా అయం
గ్రామో యస్మిన్ నాస్సే అను ఏవ
మా భగవన్। శాధి। ఇతి।।
జానశ్రుత పౌత్రేయుడు : (మరల మరల అభివాదములు పలుకుచూ) ఓ రైక్వేయ మహాత్మా! నమో నమః। మీకు 1000 గోవులు, శ్రేష్ఠమైన గుఱ్ఱములు, రథములు తెచ్చి సమర్పిస్తున్నాను. స్వీకరించండి.
నా భార్యపుత్రులతో సహా మీకు సేవకులమౌతాము.
ఇదిగో! కంచరగాడిదల రథము. నా కుమార్తెయగు ఈమెను మీకు జీవితభాగస్వామిగా సమర్పిస్తాను. మీరున్న ఈ గ్రామమును మీకు కానుకగా సమర్పిస్తున్నాను.
హే భగవాన్! ఇంకా ఏమి కావాలో కోరుకోండి - స్వామి! నాకు మీరు ఆత్మజ్ఞానము సిద్ధించుకొన్న తీరు దయతో వినిపించండి.

తస్యా హ ముఖముపోద్గృహ్ణన్నువాచాజహారేమాః శూద్రానేనైవ
ముఖేనాలాపయిష్యథా ఇతి తే హైతే రైక్వపర్ణా నామ
మహావృషేషు యత్రాస్మా ఉవాస స తస్మై హోవాచ .. 4.2.5 ..

.. ఇతి ద్వితీయః ఖండః ..
5. తస్యా హ ముఖమ్ ఉపోద్ గృహణాన్ ఉవాచ :
ఆజహార ఇమాః శూద్ర అనేనైవ
ముఖేన ఆలాపయిష్యథా ఇతి।
తే హి ఏతే రైక్వపర్ణా - నామ
మహావృషేషు యత్ర - అస్మా
ఉవాస, స తస్మై హ ఉవాచ।।
రైక్వుడు : జానశ్రుత పౌత్రేయుని కుమార్తె ముఖం వైపుగా చూచారు. ఏదో అవ్యాజమైన బ్రహ్మజ్ఞాన తేజస్సును గమనించారు. ‘‘విద్యా ముఖము’’ అని గ్రహించారు. బ్రహ్మవిద్యను సంభాషించటానికి అంగీకారము పలికారు. ‘‘ఓ శూద్రుడా! మీరు కోరినట్లు మీ కుమార్తె ముఖంలోని బ్రహ్మతేజస్సును గౌరవిస్తూ తత్త్వ సంబంధమై సంభాషించటానికి సంసిద్ధుడను’’ - అని పలికారు.

అప్పటి నుండి ఆ మహావృషల దేశములోని ఆ రైక్వుడు బండిక్రింద ఉండి ఉన్న గ్రామము ‘‘రైక్వపర్ణ’’ అనే పేరుతో ప్రసిద్ధమయింది.
ఆ చోటనే ఉండి ఇక రైక్వుడు జానశ్రుత పౌత్రేయుని విన్నపమును అనుసరించి ప్రసంగించటానికి సిద్ధమైనారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే ద్వితీయః ఖండః


4–3. చతుర్థ ప్రపాఠకః - తృతీయ ఖండము - సంవర్గము (విలీనము, ఆశ్రయము)


వాయుర్వావ సంవర్గో యదా వా అగ్నిరుద్వాయతి వాయుమేవాప్యేతి
యదా సూర్యోఽస్తమేతి వాయుమేవాప్యేతి యదా చంద్రోఽస్తమేతి
వాయుమేవాప్యేతి .. 4.3.1..
1. వాయుః వావ సంవర్గః।

యదా వా అగ్నిః ఉద్వాయతి
‘వాయుమ్’ ఏవ అవాప్యేతి।।
యదా సూర్యో అస్తమేతి,
‘వాయుమ్’ ఏవ అవాప్యేతి।
యదా చంద్రో అస్తమేతి,
‘వాయుమ్’ ఏవ అవాప్యేతి।।

బండి క్రిందనే ఉండే మహనీయుడగు రైక్వుడు ఈ విధంగా ప్రసంగించసాగారు.
ఓ జానశ్రుత పౌత్రేయ మహాశయా! వినండి.

అధిదైవతమునకు ‘వాయువు’యే సంవర్గము, చివరికి ఆశ్రయము వాయువే!
అగ్ని చల్లబడినప్పుడు ఆశ్రయిస్తున్నది ఏది? వాయువునే!
సూర్యుడు అస్తమించినప్పుడు వాయువునందే ప్రవేశము పొందుచున్నారు.
అట్లాగే చంద్రుడు కూడా అస్తమించినప్పుడు వాయువునందే లీనము, మమేకము అగుచున్నారు.

యదాప ఉచ్ఛుష్యంతి వాయుమేవాపియంతి
వాయుర్హ్యేవైతాన్సర్వాన్సంవృంక్త ఇత్యధిదైవతం .. 4.3.2..
2. యదా ఆప ఉచ్ఛుష్యంతి,
‘వాయుమ్’ ఏవ ఆపియంతి।
వాయుర్హి ఏవ ఏతాన్ సర్వాన్ సంవృంక్త
ఇతి ‘‘అధిదైవతమ్’’।।
జలము ఇంకిపోయినప్పుడు ప్రవేశము పొందుచున్నది ఎందులో? వాయురూపమే పొందుచున్నది.
వాయువే సమస్తమును చివరికి మ్రింగివేయుచున్నది. అందుచేత వాయువే ‘‘అధిదైవతము’’।

అథాధ్యాత్మం ప్రాణో వావ సంవర్గః స యదా స్వపితి ప్రాణమేవ
వాగప్యేతి ప్రాణం చక్షుః ప్రాణగ్ం శ్రోత్రం ప్రాణం మనః ప్రాణో
హ్యేవైతాన్సర్వాన్సంవృంక్త ఇతి .. 4.3.3..
3. అథ అధ్యాత్మం।



ప్రాణో వావ సంవర్గః

స యదా స్వపితి ప్రాణమేవ వాక్ అపి ఏతి

ప్రాణం చక్షుః ప్రాణగ్ం శ్రోత్రం ప్రాణం
మనః ప్రాణో హి ఏవ।
ఏతాన్ సర్వాన్ సంవృంక్త ఇతి।।
అధ్యాత్మము
ఇక అధ్యాత్మము. శరీరములోని అంతర్గతంగా ఉండిన శక్తులకు సంబంధించినది.

ప్రాణమే - సంవర్గము (తనలో) తదితరమును విలీనము చేసుకొనునది)

ఈ వ్యక్తి (జీవుడు) నిదురకు ఉపక్రమించగానే వాక్ ఇంద్రియము ప్రాణమునందే విలీనం అవుతోంది.
అట్లాగే చక్షువులు (చూపు), శ్రోత్రము (వినికిడి), మనస్సు కూడా ప్రాణమునందే విలీనమౌతున్నాయి.
‘‘ప్రాణమే వాటన్నిటినీ తనయందు కలుపుకొని (విలీనము చేసుకొని) ఉంటోంది.

తౌ వా ఏతౌ ద్వౌ సంవర్గౌ వాయురేవ దేవేషు ప్రాణః ప్రాణేషు .. 4.3.4..
4. తౌ వా ఏతౌ ద్వౌ సంవర్గౌ వాయుః ఏవ
దేవేషు ప్రాణః ప్రాణేషు।।

దేవతలయందు వాయువు, ప్రాణులయందు ప్రాణము రెండు కూడా - సంవర్గము (విలీనము/చేరిక) పొందటం జరుగుతోంది.


అథ హ శౌనకం చ కాపేయమభిప్రతారిణం చ కాక్షసేనిం
పరివిష్యమాణౌ బ్రహ్మచారీ బిభిక్షే తస్మా ఉ హ న దదతుః .. 4.3.5..
5. అథ హ శౌనకం చ కాపేయం
అభిప్రతారిణం చ కాక్షసేనిం
పరివిష్యమాణౌ బ్రహ్మచారీ బిభిక్షే
తస్మా ఉ హ న దదతుః।।
పూర్వకాలంలో ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఉండేవారు.
(1) కౌపేయ (కపి) గోత్రీకుడైన శౌనకుడు (2) కక్షసేనుని కుమారుడు - అభిప్రతారిణి.
ఒకరోజు వారిద్దరు కలిసి భోజనము చేయటానికి కూర్చుని భుజించటం ప్రారంభించారు.
ఆ సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి ‘‘భిక్షాం దేహి!’’ అని అర్థించారు.
వారు అది విని కూడా ఆ భిక్షకునికి భిక్ష పెట్టలేదు.

స హోవాచ మహాత్మనశ్చతురో దేవ ఏకః కః స జగార
భువనస్య గోపాస్తం కాపేయ నాభిపశ్యంతి మర్త్యా
అభిప్రతారిన్బహుధా వసంతం యస్మై వా ఏతదన్నం తస్మా
ఏతన్న దత్తమితి .. 4.3.6..
6. స హ ఉవాచ మహాత్మనః చతురో దేవ ఏకః
కః స జగార భువనస్య గోపాః తం కాపేయ
న అభిపశ్యంతి మర్త్యా అభిప్రతారిన్ బహుధా
వసంతం యస్మై వా ఏతత్ అన్నం,
తస్మా ఏతత్ న దత్తమ్। ఇతి।
భిక్షకుడు అగు ఆ బ్రహ్మచారి :
ఓ కాపేయ శౌనకమునీ! ఓ కాక్షసేన అభిప్రతారిణీ! మీరు భలేవారే!

(వాక్కు, చక్షువులు, శ్రోతము, మనస్సు అనబడే) నలుగురు దేవతలను తనయందు కలుపుకొని ఉంటున్న (లేక) అపాన - వ్యాన - ఉదాన - సమాన - ప్రాణములను తనయందు ఏకము చేసుకొనియున్న) ముఖ్య ప్రాణస్వరూపుడగు మహాత్ముడగు ప్రజాపతిని, భువన రక్షకుని, మీ మానవులు గుర్తించటం లేదేమిటి? సమస్త ఆహారము ఎవ్వరి కొరకు భుజించబడుచున్నాయో అట్టి ప్రాణేశ్వరుడే ‘‘అన్నము పెట్టండి!’’ - అని అడుగుతుంటే, అట్టి ప్రజాపతి ప్రాణస్వరూపునకే అన్నముపెట్టరెందుకు?

తదు హ శౌనకః కాపేయః ప్రతిమన్వానః ప్రత్యేయాయాత్మా దేవానాం
జనితా ప్రజానాగ్ం హిరణ్యదగ్ంష్ట్రో బభసోఽనసూరిర్మహాంతమస్య
మహిమానమాహురనద్యమానో యదనన్నమత్తీతి వై వయం
బ్రహ్మచారిన్నేదముపాస్మహే దత్తాస్మై భిక్షామితి .. 4.3.7..
7. తదు హ శౌనకః కాపేయః
ప్రతిమన్వానః ప్రత్యేయాయ।

ఆత్మా దేవానాం జనితా ప్రజానాగ్ం
హిరణ్యదగ్ంష్ట్రో బభసో అనసూరిః మహాన్తమ్।
అస్య మహిమానమ్
ఆహుః అనద్యమానో యదన్
అన్నం అత్తి ఇతి వై వయం।
బ్రహ్మచారిన్।
ఆ ఇదమ్ ఉపాస్మహే
దత్తాస్మై భిక్షామ్ ఇతి।।
ఆ మాటలు విన్న (కాపేయముని కుమారుడగు) శౌనకముని, అన్నం తింటున్నవాడల్లా ఆ మాటలు అంతరార్థము మననము చేస్తూ లేచి, ఆ బ్రహ్మచారి వద్దకు వచ్చారు.

శౌనకుడు : ఓ గృహయజమానీ! ప్రజాపతి సర్వదేవతలకు ఆత్మస్వరూపుడు. సర్వజీవులను సృష్టించువారు. ఆయన బంగారు దంతములు కలవాడు. ఈ ప్రాణేశ్వరుని మహిమ ‘‘మహాన్తము, మహత్తరము, బహుగొప్పది’’ - అని వేదములచే కీర్తించబడుతోంది.
ఈయనయే అన్నము, అన్నము కానిది కూడా భక్షించగలిగినట్టివారు.
ఓ బ్రహ్మచారి గారూ! మేము అన్నమునే ఉపాసించుచున్నాము. అందుచేత, వీరికొరకే భుజిస్తూ అన్నము వీరికి - ఎందుకు సమర్పించము. తప్పక సమర్పిస్తాము! అనగా అట్టి మీకు అన్నము సమర్పించ సంసిద్ధము.

తస్మ ఉ హ దదుస్తే వా ఏతే పంచాన్యే పంచాన్యే దశ
సంతస్తత్కృతం తస్మాత్సర్వాసు దిక్ష్వన్నమేవ దశ కృతగ్ం సైషా
విరాడన్నాదీ తయేదగ్ం సర్వం దృష్టగ్ం సర్వమస్యేదం దృష్టం
భవత్యన్నాదో భవతి య ఏవం వేద య ఏవం వేద .. 4.3.8..

.. ఇతి తృతీయః ఖండః ..
8. తస్మా ఉ హ దదుస్తే వా।
ఏతే పంచాన్యే పంచాన్యే
దశ సంతస్తత్ కృతమ్।।
తస్మాత్ సర్వాసు దిక్ష్వన్
అన్నమ్ ఏవ దశ కృతగ్ం
స ఏషా విరాట్ అన్నాదీ
తయా ఇదగ్ం సర్వం దృష్టగ్ం।
సర్వమసి ఇదం దృష్టం భవతి।
అన్నాదో భవతి -
య ఏవం వేద।
య ఏవం వేద।।
అప్పుడు లేచి ఆ బ్రహ్మచారికి భిక్ష సమర్పించారు.

‘ఐదు, ఐదు కలిసి పది’కి వారు అన్నమును ఆ బ్రహ్మచారికి సమర్పించారు.

కాబట్టి (తూర్పు-పడమర-ఉత్తరము-దక్షిణము-ఈశాన్యము- ఆగ్నేయము-నైరుతి-వాయువ్యము-పైన-క్రింద అన్నీ కలిపి) కృతమగు దశదిక్కులు బ్రహ్మమునకు సమర్పించబడుచున్న అన్నమే।

సమస్తము భక్షించువాడు ఆ విరాట్ పురుషుడే। ఆయనయే సమస్తము దర్శిస్తున్న ద్రష్ట.

‘‘ఆ అన్నాదుడగు పరబ్రహ్మమే సమస్తమును చూస్తూ, అనుభవముగా కల్పించుకొని పొందుతోంది’’ - అని ఎరుగుచున్నవాడు - సర్వమును సరి అయిన దృష్టితో దర్శిస్తున్నవాడు, ఆస్వాదిస్తున్నవాడు అగుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే తృతీయః ఖండః


4–4. చతుర్థ ప్రపాఠకః - చతుర్థ ఖండము - సత్యకామ జాబాలుని చరిత


సత్యకామో హ జాబాలో జబాలాం మాతరమామంత్రయాంచక్రే
బ్రహ్మచర్యం భవతి వివత్స్యామి కింగోత్రో న్వహమస్మీతి .. 4.4.1..
1. సత్యకామో హ జాబాలో।
జబాలాం మాతరమ్।
ఆమంత్రయాంచక్రే
బ్రహ్మచర్యం భవతి।
వివత్స్యామి - కిం గోత్రో ను
అహమ్ అస్మి ఇతి।।
సత్యకాముడు ఒక పిల్లవాడు. ఆతని తల్లి జబాల. ఆ సత్యకాముడు గురుకులాశ్రమము చేరి విద్యాభ్యాసము చేయవలసిన సమయము, బ్రహ్మచర్య వ్రతము ప్రారంభించవలసిన వయసు వచ్చింది.
జబాల : బిడ్డా! సత్యకామా! నీవు విద్యార్థివై, బ్రహ్మచర్యవ్రతం ప్రారంభించి గురుకులమునకు వెళ్లవలసిన సమయం వచ్చిందయ్యా!
సత్యకామ : అమ్మా! నేను సంతోషంగా గురుకులం జేరి గురువును విద్యకై ఆశ్రయిస్తాను. అయితే ‘‘ఇదమ్ గోత్రోద్భవస్య అహం భో అభివాదయే।’’ - అని గురువుకు నమస్కరించాలి కదా! నేను ఏ గోత్రజుడను?

సా హైనమువాచ నాహమేతద్వేద తాత యద్గోత్రస్త్వమసి
బహ్వహం చరంతీ పరిచారిణీ యౌవనే త్వామలభే
సాహమేతన్న వేద యద్గోత్రస్త్వమసి జబాలా తు నామాహమస్మి
సత్యకామో నామ త్వమసి స సత్యకామ ఏవ జాబాలో
బ్రవీథా ఇతి .. 4.4.2..
2. సా హ ఏనమ్ ఉవాచ :
న అహమ్ ఏతత్ వేద -
తాత! యత్ గోత్రః త్వమ్ అసి।
బహు అహం చరంతీ పరిచారిణీ యౌవనే
త్వామలభే, సా అహమ్ ఏతత్
న వేద యత్ గోత్రః త్వమ్ అసి।
‘జబాలా’ తు నామ అహమ్ అస్మి।
సత్యకామో నామ త్వమ్ అసి।
స సత్యకామ ఏవ జాబాలో బ్రువీథా ఇతి।।
జాబాలి : బిడ్డా! నేను యౌవ్వనంలో ఉండగా పరిచారికనై, దాసిగా అనేక గృహములలో సేవిస్తూ ఉండగా, నీవు నాకు పుట్టావు. అందుచేత నీవు ఏ గోత్రమునకు చెందినవాడవో నాకు తెలియదు. అందుచేత ఇది అని చెప్పలేను.
నా పేరు ‘జబాలి’, నీ పేరేమో - ‘సత్యకాముడు’ నీవు నా కుమారుడుగా - సత్యకామ జాబాలి అని ఇంతవరకే నేను రూఢిగా చెప్పగలను.
నీ తండ్రి ఎవ్వరో నాకు తెలియదు. నేను చెప్పలేను. అందుచేత ఈ విశేషములతో నీవు గురుకులమును, గురువును ఆశ్రయించి విద్యను అభ్యసించు.

స హ హారిద్రుమతం గౌతమమేత్యోవాచ బ్రహ్మచర్యం భగవతి
వత్స్యామ్యుపేయాం భగవంతమితి .. 4.4.3..
3. స హ హారిద్రుమతం
గౌతమమ్ ఏతి ఉవాచ :
బ్రహ్మచర్యం భగవతి
వత్స్యామి ఉపేయం భగవంతమ్। ఇతి।।
అప్పుడు ఆ సత్యకాముడు బ్రహ్మచర్య - విద్యాభ్యాస దీక్ష కొరకై హరిద్రమతముని కుమారుడగు గౌతముని ఆశ్రమం ప్రవేశించాడు.
సత్యకాముడు : గురుదేవా! గౌతమ మునీంద్రా! భగవాన్! నేను విద్యార్థినై విద్యకొరకు మిమ్ములను ఆశ్రయిస్తున్నాను. శిష్యత్వము అనుగ్రహించండి.

తగ్ం హోవాచ కింగోత్రో ను సోమ్యాసీతి స హోవాచ
నాహమేతద్వేద భో యద్గోత్రోఽహమస్మ్యపృచ్ఛం మాతరగ్ం
సా మా ప్రత్యబ్రవీద్బహ్వహం చరంతీ పరిచరిణీ యౌవనే
త్వామలభే సాహమేతన్న వేద యద్గోత్రస్త్వమసి జబాలా తు
నామాహమస్మి సత్యకామో నామ త్వమసీతి సోఽహగ్ం
సత్యకామో జాబాలోఽస్మి భో ఇతి .. 4.4.4..
4. తగ్ం హ ఉవాచ :
‘‘కిం గోత్రో ను సోమ్య!
అసి’’ - ఇతి?
స హ ఉవాచ :
‘‘న అహమ్ ఏతత్ వేద భో!’’
యత్ గోత్రో అహమ్ అస్మి
- అపృచ్ఛం మాతరగ్ం, సా ప్రత్యబ్రవీత్
‘‘బహు అహం చరంతీ పరాచారిణీ యౌవనే।
త్వామలభే స అహమ్ ఏతత్ న వేద।
‘యత్ గోత్రః త్వమ్ అసి।
గౌతమ మునీంద్రుడు : మంచిది. స్వాగతం. ఓ సౌమ్యా! ప్రియదర్శనా! నీ గోత్రము - నామములతో కూడిన ‘‘ప్రవర’’ చెప్పి, గురుకులాశ్రమములో ప్రవేశించు.

సత్యకాముడు : హే మహనీయా! గురు భగవాన్। నా గోత్రము ఏమిటో నాకు తెలియదు. నేను నా గోత్రమేమిటని నా మాతృదేవతను జబాలను ఇక్కడికి వచ్చేముందు అడిగాను.
మా అమ్మ ఏమన్నదంటే…
‘‘బిడ్డా! నేను యౌవనవతినై ఉన్నప్పుడు అనేక చోట్ల పరిచారిణినై ఉండటం జరిగింది. అందుచేత నీ తండ్రి ఎవ్వరో గోత్రమేమిటో తెలియదు కాబట్టి ఇది అని చెప్పలేను’’.
జబాలా తు నామా అహమస్మి।
సత్యకామో నామ త్వమ్ అసి ఇతి।’’
సో అహగ్ం సత్యకామో
జాబాలో అస్మి భో। ఇతి।।
మా అమ్మ పేరు - జబాల
నా పేరు - సత్యకాముడు
అందుచేత నేను సత్యకామ జాబాలిని మీకు నమస్కరిస్తూ అభివాదము పలుకుచున్నాను.
(చతుస్సాగర పర్యంతం గో - బ్రాహ్మణేభ్యః శుభం భవతు। ‘‘పరమాత్మ’’ ఋషేయ గోత్రోద్భవస్య - గురునిర్ణయ వేదశాఖ అధ్యాయి సత్యకామ జాబాల - అహం భో అభివాదయే.)

తగ్ం హోవాచ నైతదబ్రాహ్మణో వివక్తుమర్హతి సమిధగ్ం
సోమ్యాహరోప త్వా నేష్యే న సత్యాదగా ఇతి తముపనీయ
కృశానామబలానాం చతుఃశతా గా నిరాకృత్యోవాచేమాః
సోమ్యానుసంవ్రజేతి తా అభిప్రస్థాపయన్నువాచ
నాసహస్రేణావర్తేయేతి స హ వర్షగణం ప్రోవాస తా యదా
సహస్రగ్ం సంపేదుః .. 4.4.5..

.. ఇతి చతుర్థః ఖండః ..
5. తగ్ం హ ఉవాచ :
న ఏతత్ అబ్రాహ్మణో వివక్తుం అర్హతి।





సమిధగ్ం సోమ్యా। ఆహర ఉప త్వా
నేష్యే న సత్యాదగా ఇతి।



తమ్ ఉపనీయ
గౌతమ మహర్షి :
బిడ్డా। సత్యకామా! ఈ విధంగా సత్యమును బ్రహ్మవిద్యార్హత కలవాడు (బ్రాహ్మణుడు అయినవాడు) మాత్రమే పలుకగలడు. ఇతరులు చెప్పలేరు. సత్యమును చెప్పావు కాబట్టి నీవు బ్రాహ్మణుడివేవయ్యా! (కర్మణా జాయతే ద్విజాః)। గుణముచేత (సత్యము పలుకుటచేత) నిన్ను బ్రాహ్మణుడుగా గుర్తిస్తున్నాను.

ఓ సౌమ్య! నీవు దగ్గరలోని అడవిలోకి వెళ్లి యజ్ఞమునకు కావలసిన సమిధలు పట్టుకురా! సమిత్పాణివై రమ్ము! నీవు సత్యము నుండి చ్యుతుడవు కాలేదు. ‘సత్యకాముడు’ అనే పేరుకు అర్హుడవు.


ఆ పేరుతోనే ఉపనయనం జరిపిస్తాను”, అని చెప్పి అప్పుడు ఉపనయనము జరిపించారు.
కృశానాం-అబలానాం చతుశ్శతా (400) గాః
నిరాకృత్య ఉవాచేమాః సోమ్యా!
అనుసంవ్రజేతి।




తా అభిప్రస్థాపయన్ ఉవాచ :
న అసహస్రేణ ఆవర్తేయేతి।

స హ వర్షగణం ప్రోవాస
తా యదా సహస్రగ్ం సంపేదుః।
అప్పుడు గురుదేవుడగు గౌతమమహర్షి తన గోసంపదలోని బక్కచిక్కిన, బలములేని ‘400’ గోవులను వేరు చేసి సత్యకామునికి ఇచ్చి మేపుకురమ్మని చెప్పారు.

సత్యకాముడు ఆ బక్కచిక్కిన 400 గోవులను మేపటానికి తోలుకుపోతూ ఇట్లా గురువుగారితో తన విద్యకు సంబంధించిన పట్టుదలకు సంజ్ఞగా (గుర్తుగా) ఇట్లా వినమ్రుడై పలికారు.

సత్యకాముడు : ఈ 400 గోవులు 1000 గోవులు కాగానే మీ వద్దకు తిరిగివస్తాను. 1000 గోవులు కాకుండా మీ దర్శనం చూసుకోనని నా మనవి.

సత్యకాముడు ఆ విధంగా 400 గోవులను మేపసాగాడు. సంవత్సర కాలానికి ఆ ‘400’ గోవులు ‘1000’ గోవులు అయినాయి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే చతుర్థః ఖండః


4–5. చతుర్థ ప్రపాఠకః - పంచమ ఖండము - ప్రకాశవాన్ - చతుష్కలా బ్రహ్మము యొక్క మొదటి పాదము


అథ హైనమృషభోఽభ్యువాద సత్యకామ3 ఇతి
భగవ ఇతి హ ప్రతిశుశ్రావ ప్రాప్తాః సోమ్య సహస్రగ్ం స్మః
ప్రాపయ న ఆచార్యకులం .. 4.5.1..
1. అథ హి ఏనం ఋషభో
అభ్యువాద సత్యకామ! ఇతి
భగవ! ఇతి!
హ ప్రతిశుశ్రావ ప్రాప్తాః, సోమ్య!
సహస్రగ్ం స్మః ప్రాపయ
న ఆచార్య కులమ్।
ఒకరోజు ఆ గోసంపదలోని వృషభము (ఎద్దు) సత్యకాముని వద్దకు వచ్చి ఎదురుగా నిలుచున్నది.
వృషభము : ఓ సత్యకామా!
సత్యకాముడు : భగవాన్। వృషభరాజమా? చెప్పండి. ఏమి కావాలి? ఏమి ఆజ్ఞ?
వృషభము : మేము వేయి సంఖ్యగా గో సంపద అయ్యాము. మీరు చేపట్టిన కార్యము పూర్తి అయింది కదా! ఓ సౌమ్యా! ఇక మమ్ములను ఆచార్యులవారు విద్య బోధిస్తున్న గురుకులమునకు చేర్చండి.

అప్పుడు సత్యకాముడు లేచి నిలబడి, ఆ వృషభమునకు ప్రదక్షిణ నమస్కారములు సమర్పించి ‘‘వృషభదేవా! మీ ఆజ్ఞను నిర్వహిస్తాము!’’ అని పలికారు.

బ్రహ్మణశ్చ తే పాదం బ్రవాణీతి బ్రవీతు మే భగవానితి
తస్మై హోవాచ ప్రాచీ దిక్కలా ప్రతీచీ దిక్కలా
దక్షిణా దిక్కలోదీచీ దిక్కలైష వై సోమ్య చతుష్కలః
పాదో బ్రహ్మణః ప్రకాశవాన్నామ .. 4.5.2..

2. బ్రహ్మణః చ తే పాదం బ్రవాణి - ఇతి।।


బ్రవీతు మే భగవాన్। - ఇతి।।

తస్మై హ ఉవాచ
- పాచీ దిక్ - కలా,
- ప్రతీచీ దిక్ - కలా
- దక్షిణా దిక్ - కలా
- ఉదీచీ దిక్ - కలా
ఏష వై సౌమ్య - చతుష్కలః
పాదో బ్రహ్మణః ప్రకాశవాన్ నామ।
వృషభము : మా కోరిక నెరవేరుస్తున్నారు కదా. సరే! అందుకుగాను - మీకు బ్రహ్మముయొక్క చతుష్పాదముల గురించి చెప్పుతాను.

సత్యకాముడు : భగవాన్! వృషభదేవా! దయచేసి చెప్పండి. విద్యార్థినై వింటాను.

వృషభము : ఆ నాలుగు పాదములు 4 అంశలు (కళలు).
(1) తూర్పు (2) పడమర (3) దక్షిణము (4) ఉత్తరము
ఈ నాలుగు దిక్కులు బ్రహ్మమునకు ‘ప్రకాశరూపము’ అని పిలువబడును. నాలుగు దిక్కులను బ్రహ్మము ప్రకాశింపజేయు చున్నది. కాబట్టి పరమాత్మ (లేక) పరబ్రహ్మము ‘ప్రకాశవాన్’ అనబడుచున్నారు. ఈ నాలుగు దిక్కులుగా ప్రకాశిస్తున్నది పరబ్రహ్మమే। ఈ నాలుగు కళలుగా బ్రహ్మముయొక్క మొదటి పాదమును ఉపాసించు.

స య ఏతమేవం విద్వాగ్ంశ్చతుష్కలం పాదం బ్రహ్మణః
ప్రకాశవానిత్యుపాస్తే ప్రకాశవానస్మిగ్ంల్లోకే భవతి
ప్రకాశవతో హ లోకాంజయతి య ఏతమేవం విద్వాగ్ంశ్చతుష్కలం
పాదం బ్రహ్మణః ప్రకాశవానిత్యుపాస్తే .. 4.5.3..

.. ఇతి పంచమః ఖండః ..
3. స య ఏతం ఏవం విద్వాగ్ం
చతుష్కలం పాదం బ్రహ్మణః।
‘ప్రకాశవాన్’ ఇతి ఉపాస్తే,
ప్రకాశవాన్ అస్మింల్లోకే భవతి।
ప్రకాశవతో హ లోకాన్ జయతి।
య ఏతమ్ ఏవం విద్వాగ్ం
చతుష్కలం పాదం బ్రహ్మణః
‘ప్రకాశవాన్’ ఇతి ఉపాస్తే।
ఎవ్వరైతే బ్రహ్మమును ‘4’ దిక్కులలో ప్రకాశమానుడైయున్న ‘ప్రకాశవాన్’ అని తెలుసుకొని, నాలుగు దిక్కులను పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసిస్తారో ఆతడు సమస్త లోకములలో ప్రకాశవంతుడై ఉండగలడు.

తనయొక్క ప్రకాశముచే ఆతడు లోకములను జయించగలడు. ‘‘లోకములన్నీ నాలోనే, నా యొక్క ఆత్మ ప్రకాశములోనే ఉన్నాయి’’ - అని గమనించగలడు.

ప్రకాశపూర్ణుడై సమస్త లోకములను దాటివేయగలడు కూడా!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే పంచమః ఖండః


4–6. చతుర్థ ప్రపాఠకః - షష్ఠః ఖండము - అనంతవాన్ - చతుష్కలా బ్రహ్మము యొక్క రెండవ పాదము


అగ్నిష్టే పాదం వక్తేతి స హ శ్వోభూతే గ
ఆభిప్రస్థాపయాంచకార తా యత్రాభి సాయం
బభూవుస్తత్రాగ్నిముపసమాధాయ గా ఉపరుధ్య సమిధమాధాయ
పశ్చాదగ్నేః ప్రాఙుపోపవివేశ .. 4.6.1..
1. అగ్నిష్టే పాదం వక్తేతి।
సత్యకాముడు : వృషభదేవా! దయచేసి బ్రహ్మముయొక్క రెండవ పాదము గురించి బోధించండి.
వృషభము : అదా! అది నేను కాదు. అగ్నిదేవుల వారు మాత్రమే బోధించగలరు. నేను కాదు.

ఇట్లా పలికి పూజనీయుడగు వృషభము చెప్పటమును విరమించింది.
స హ శ్వో భూతే గా
అభిప్రస్థాప్రయాంచకార।
తా యత్ర అభిసాయం బభూవుః
తత్ర అగ్నిం ఉపసమాధాయ గా
ఉపరుధ్య సమిధమ్ ఆధాయ
పశ్చాత్ అగ్నేః ప్రాఙుపోపవివేశ।।
ఆ మరునాడు సత్యకాముడు గోవులను మేపటానికి అడవికి తీసుకొనిపోయి ఇక మేపనారంభించాడు.

అక్కడ కొన్ని ఎండు కట్టెలు తెచ్చి అగ్నిని వెలిగించారు.

తూర్పు దిక్కుగా కూర్చుని అగ్నిదేవుని ప్రతిష్ఠించి ఆహ్వానము - సుస్వాగతము మొదలైనవి స్తుతులు పలుకుచూ ఆరాధించసాగారు. అప్పుడు అగ్నిదేవుడు పలుకసాగారు.

తమగ్నిరభ్యువాద సత్యకామ3 ఇతి భగవ ఇతి
హ ప్రతిశుశ్రావ .. 4.6.2..
2. తమ్ అగ్నిః అభ్యువాద,
సత్యకామ! - ఇతి-
భగవ! ఇతి హ ప్రతిశుశ్రావ।।
అగ్ని భగవానుడు : ఓ సత్యకామా?
సత్యకాముడు : హే భగవాన్! అగ్నిదేవా! నమోనమః।
అగ్నిదేవుడు : నన్ను ఎందుకొరకై ఉపాసిస్తూ ఆహ్వానించావయ్యా?

బ్రహ్మణః సోమ్య తే పాదం బ్రవాణీతి బ్రవీతు మే భగవానితి
తస్మై హోవాచ పృథివీ కలాంతరిక్షం కలా ద్యౌః కలా
సముద్రః కలైష వై సోమ్య చతుష్కలః పాదో
బ్రహ్మణోఽనంతవాన్నామ .. 4.6.3..
3. ‘‘బ్రహ్మణః సోమ్య! తే పాదం బ్రవాణి’’ ఇతి।
‘‘బ్రవీతు మే భగవాన్’’ ఇతి।
తస్మై హ ఉవాచ :
పృథివీ కలా। అంతరిక్షం కలా।
ద్యౌః కలా। సముద్రః కలా।
ఏష వై సోమ్య। చతుష్కలః పాదో
బ్రహ్మణో అనంతవాన్ నామ।।
సత్యకాముడు : అగ్నిదేవా! బ్రహ్మముయొక్క రెండవ పాదము గురించి మీరు బోధిస్తారు కదా - అని మిమ్ములను భక్తితో ఆహ్వానించాను. భగవాన్! దయతో బోధించండి.
అగ్నిదేవుడు : సరే! విను. చెప్పుతాను.
బ్రహ్మముయొక్క రెండవ పాదమునకు చెందిన నాలుగు కళా ప్రదర్శనములు ఇట్లు ఏర్పడి ఉన్నాయి.
(1) పృథివీ కళ (2) అంతరిక్ష కళ (3) ద్యులోక (స్వర్గలోక) కళ (4) సముద్ర కళ
ఈ నాలుగు బ్రహ్మముయొక్క 4 కళలై అంశలై బ్రహ్మమువలెనే అనంతములై ఉన్నాయి. ఈ 4 కళలను బ్రహ్మముయొక్క రెండవ పాదపు - 4 అంశలుగా ఉపాసించు.

స య ఏతమేవం విద్వాగ్ంశ్చతుష్కలం పాదం
బ్రహ్మణోఽనంతవానిత్యుపాస్తేఽనంతవానస్మిగ్ంల్లోకే
భవత్యనంతవతో హ లోకాంజయతి య ఏతమేవం విద్వాగ్ంశ్చతుష్కలం
పాదం బ్రహ్మణోఽనంతవానిత్యుపాస్తే .. 4.6.4..

.. ఇతి షష్ఠః ఖండః ..
4. స య ఏతమ్ ఏవం విద్వాగ్ం
చతుష్కలం పాదం బ్రహ్మణో
‘అనంతవాన్’ ఇతి - ఉపాస్తే,
అనంతవాన్ అస్మిన్ లోకే భవతి।
అనంతవతో హ లోకాన్ జయతి,
య ఏతమ్ ఏవమ్ విద్వాగ్ం
చతుష్కలం పాదం బ్రహ్మణో
అనంతవాన్ ఇతి ఉపాస్తే।।
ఎవ్వరైతే బ్రహ్మముయొక్క రెండవ పాదమునకు చెందిన కళలు (Art of the Artist)గా పృథివిని, ఆకాశము (అంతరిక్షము)ను, (అశరీర దివ్యపురుషుల) దేవతా లోకము, సముద్రములను అనంతరూపంగా ఎరిగి ఉపాసిస్తాడో, అట్టివాడు దృశ్యముచే పరిమితము కానివాడై - అనంతుడు, అపరిమితుడు అగుచున్నాడు.
- అనంతుడై లోకములను జయించుచున్నాడు.
- లోకములను తనయందు దర్శిస్తున్నాడు.
ఈ బ్రహ్మముయొక్క చతుష్పాదముల అనంతత్వము ఆరాధించువాడు అనంతుడై వెలుగొందగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే షష్ఠః ఖండః


4–7. చతుర్థ ప్రపాఠకః - సప్తమ ఖండము - జ్యోతిష్మాన్ - చతుష్కలా బ్రహ్మముయొక్క మూడవ పాదము


హగ్ంసస్తే పాదం వక్తేతి స హ శ్వోభూతే గా
అభిప్రస్థాపయాంచకార తా యత్రాభి సాయం
బభూవుస్తత్రాగ్నిముపసమాధాయ గా ఉపరుధ్య సమిధమాధాయ
పశ్చాదగ్నేః ప్రాఙుపోపవివేశ .. 4.7.1..
1. హగ్ంసః తే పాదం వక్త ఇతి।
స హ శ్వో భూతే గా అభిప్రస్థాపయాంచకార
తా యత్ర అభిసాయం బభూవుః
తత్ర అగ్నిమ్ ఉపసమాధాయ
‘గా’ ఉపరుధ్య సమిధమ్ ఆధాయ
పశ్చాత్ అగ్నేః ప్రాఙ్ ఉప ఉపవివేశ।।
సత్యకాముడు : స్వామీ! బ్రహ్మముయొక్క 3వ పాదము గురించి చెప్పరూ!
అగ్నిదేవుడు : బిడ్డా! నీవు అడిగిన ‘3’వ పాదము గురించి ‘హంస’ను అడుగు చెప్పగలదు. ఆ హంస నీకు 3వ పాదము యొక్క అంశలను విశదీకరించగలదు.

ఇట్లా ఆ మరునాడు ఉదయం మరల ఆవులను తోలుకొని అడవికెళ్ళారు.
ఆవులను మేతకు త్రోలారు. అక్కడ కొన్ని సమిధలు పేర్చి అగ్నిని ప్రజ్వలింపజేసారు.
తూర్పుముఖంగా అగ్నికి ఎదురుగా ఆశీనులైనారు. ‘హంస’ను ధ్యానం చేసారు. హంస ప్రత్యక్షమైనది.

తగ్ంహగ్ంస ఉపనిపత్యాభ్యువాద సత్యకామ3 ఇతి భగవ
ఇతి హ ప్రతిశుశ్రావ .. 4.7.2..
2. తగ్ం హగ్ంస ఉపనిపత్యాభ్యువాద,
సత్యకామ! ఇతి।।
భగవ! ఇతి హ ప్రతిశుశ్రావ।
హంస : ఓ సత్యకామా!
సత్యకాముడు : భగవాన్! హంసదేవా! నమో నమః।
హంస : ఏమిటయ్యా? నన్నెందుకు అగ్న్యోపాసన పూర్వకంగా ఆహ్వానించావు?

బ్రహ్మణః సోమ్య తే పాదం బ్రవాణీతి బ్రవీతు మే భగవానితి
తస్మై హోవాచాగ్నిః కలా సూర్యః కలా చంద్రః కలా
విద్యుత్కలైష వై సోమ్య చతుష్కలః పాదో బ్రహ్మణో
జ్యోతిష్మాన్నామ .. 4.7.3..
3. బ్రహ్మణః సోమ్య తే పాదం
బ్రవాణి। ఇతి।।
బ్రవీతు మే భగవాన్! ఇతి।
తస్మై హ ఉవాచః
అగ్నిః కలా। సూర్యః కలా।
చంద్రః కలా। విద్యుత్ కలా।
ఏష వై, సోమ్య। చతుష్కలః।
పాదో బ్రహ్మణో జ్యోతిష్మాన్ నామ।।
సత్యకాముడు : ఓ సౌమ్యా! బ్రహ్మముయొక్క ‘3’వ పాదము గురించి చెప్ప ప్రార్థన. భగవాన్! దయతో వివరించండి.
హంస : చెప్పుచున్నాను. వినండి.
బ్రహ్మముయొక్క ‘4’ కళలు / అంశలు - 3వ పాదముయొక్క అంశలు.
(1) అగ్ని (2) సూర్యుడు (3) చంద్రుడు
(4) విద్యుత్తు (తేజస్సు)
ఓ సౌమ్యా! బ్రహ్మముయొక్క అంశలుగా వీటిని ఎరిగినవాడు జ్యోతిష్మాన్ లోకములను జయించగలడు.

స య ఏతమేవం విద్వాగ్ంశ్చతుష్కలం పాదం బ్రహ్మణో
జ్యోతిష్మానిత్యుపాస్తే జ్యోతిష్మానస్మిగ్ంల్లోకే భవతి
జ్యోతిష్మతో హ లోకాంజయతి య ఏతమేవం విద్వాగ్ంశ్చతుష్కలం
పాదం బ్రహ్మణో జ్యోతిష్మానిత్యుపాస్తే .. 4.7.4..

.. ఇతి సప్తమః ఖండః ..
4. స య ఏతం ఏవం విద్వాన్ చతుష్కలం।
‘‘పాదం బ్రహ్మణో జ్యోతిష్మాన్’’ ఇతి ఉపాస్తే
జ్యోతిష్మాన్ అస్మిన్ లోకే భవతి।
జ్యోతిష్మతో హ లోకాన్
జయతి య ఏతమ్ ఏవం
విద్వాన్ చతుష్కలం పాదం
బ్రహ్మణో ‘‘జ్యోతిష్మాన్’’ ఇతి ఉపాస్తే।।
బ్రహ్మముయొక్క పాదములుగా, కళలుగా అగ్ని - సూర్య - చంద్ర - విద్యుత్తులను భావించి ఉపాసించువాడు జ్యోతిష్మంతుడు। జ్యోతిష్మంత లోకాలను జయించగలడు. అనగా జ్యోతిష్మంత లోకములను తనయందు దర్శించగలడు. జ్యోతిస్వరూపుడై ప్రకాశించగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే సప్తమః ఖండః


4–8. చతుర్థ ప్రపాఠకః - అష్టమ ఖండము - అయతనవాన్ - చతుష్కలా బ్రహ్మము యొక్క నాలుగవ పాదము


మద్గుష్టే పాదం వక్తేతి స హ శ్వోభూతే గా అభిప్రస్థాపయాంచకార
తా యత్రాభి సాయం బభూవుస్తత్రాగ్నిముపసమాధాయ గా
ఉపరుధ్య సమిధమాధాయ పశ్చాదగ్నేః ప్రాఙుపోపవివేశ .. 4.8.1..
1. మద్గుష్టే పాదం వక్త ఇతి
స హ శ్వోభూతే
గా అభిప్రస్థాపయాంచకార
తా యత్రాభిసాయం బభూవుః
తత్ర అగ్నిం ఉపసమాధాయ
గా ఉపరుధ్య, సమిధమ్ ఆధాయ।
పశ్చాత్ అగ్నేః ప్రాఙ్ ఉప ఉపవివేశ।।
సత్యకాముడు : తరువాతి, (4వ) పాదము గురించి కూడా చెప్పండి.
హంస : మిత్రమా! అది నీకు మద్గుష్టము (నీటి కాకి) చెప్పగలదులే।
అని హంస మౌనము వహించింది.

ఆ మరునాడు సత్యకాముడు దినచర్యగా ఆవులను తోలుకువెళ్ళారు. అవి మేత మేయనారంభించాయి. ఆతడు సమిధలు ప్రోగుచేసి, అగ్నిని వెలిగించి, తూర్పుగాను - అగ్నికి ఆవలగా కూర్చుని నీటి కాకి గురించి ప్రార్థనలు సమర్పించారు.

తం మద్గురుపనిపత్యాభ్యువాద సత్యకామ3 ఇతి భగవ ఇతి
హ ప్రతిశుశ్రావ .. 4.8.2..
2. తం మద్గుః ఉపనిపత్య
అభ్యువాద ‘‘సత్యకామ!’’ ఇతి
‘‘భగవ!’’….ఇతి హ ప్రతిశుశ్రావ।।

మద్గుష్టము (నీటికాకి) : ఓ సత్యకామా!
సత్యకాముడు : ఓ జలజంతు దేవతా। జ్ఞానియగు నీటికాకి। భగవాన్! నమస్కారము। అని స్తుతించారు.


బ్రహ్మణః సోమ్య తే పాదం బ్రవాణీతి బ్రవీతు మే భగవానితి
తస్మై హోవాచ ప్రాణః కలా చక్షుః కలా శ్రోత్రం కలా మనః
కలైష వై సోమ్య చతుష్కలః పాదో బ్రహ్మణ ఆయతనవాన్నామ .. 4.8.3..
3. బ్రహ్మణః సోమ్య! తే పాదం బ్రవాణి ఇతి।
బ్రవీతు మే భగవన్। ఇతి।।
తస్మై హ ఉవాచ
ప్రాణః కలా। చక్షుః కలా।
శ్రోత్రం కలా। మనః కలా।
ఏష వై, సోమ్య। చతుష్కలః
పాదో బ్రహ్మణ ఆయతనవాన్ - నామ।।
సత్యకాముడు : హే బ్రహ్మన్। భగవాన్। బ్రహ్మము గురించిన (4వ) పాదము గురించి నాకు చెప్పమని విన్నపము.
మద్గుష్టము : చతుష్కళలు
(1) ప్రాణకళ (2) చక్షువులు (చూపు) కళ (3) శ్రోత (వినికిడి) కళ (4) మనస్సు కళ
హే సౌమ్య! ఈ చతుష్కళ సమన్విత బ్రహ్మముయొక్క పాదమును తెలుసుకొన్నవాడు ఆయతనవంతుడు (ఉత్తమస్థానము కలవాడు) అగుచున్నాడయ్యా।

స యై ఏతమేవం విద్వాగ్ంశ్చతుష్కలం పాదం బ్రహ్మణ
ఆయతనవానిత్యుపాస్త ఆయతనవానస్మిగ్ంల్లోకే
భవత్యాయతనవతో హ లోకాంజయతి య ఏతమేవం
విద్వాగ్ంశ్చతుష్కలం పాదం బ్రహ్మణ ఆయతనవానిత్యుపాస్తే .. 4.8.4..

.. ఇతి అష్టమః ఖండః ..

4. స య ఏతం ఏవం విద్వాన్
చతుష్కలం పాదం బ్రహ్మణ
ఆయతనవాన్ - ఇతి ఉపాస్త।
ఆయతనవాన్ అస్మిన్ లోకే భవతి।
ఆయతనవతో హ లోకాన్ జయతి।
య ఏతం ఏవమ్ విద్వాన్
చతుష్కలం పాదం
బ్రహ్మణ ఆయతనవాన్ ఇతి ఉపాస్తే।
4 పాదములగు (1) ప్రాణము, (2) చక్షువులు (కళ్ళు - చూపు) (3) శ్రోతము (వినికిడి) (4) మనస్సు (ఆలోచన స్థానము)లను బ్రహ్మముయొక్క కళలుగా ఉపాసించువాడు ఆయతనుడు (ఉత్తమ గృహము కలవాడు) అవగలడు. సమస్త లోకములు ఆతనికి సొంత ఇంటితో సమానము అవుతాయి. లోకములను జయించగలడు. లోకములను తనయందు దర్శించగలడు.
ఉపాసనచే బ్రహ్మమును ఉపాసించువాడు, సర్వ సమృద్ధుడు కాగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే అష్టమః ఖండః


4–9. చతుర్థ ప్రపాఠకః - నవమ ఖండము - గురుముఖతా బ్రహ్మవిద్య అభ్యాసము


ప్రాప హాచర్యకులం తమాచర్యోఽభ్యువాద సత్యకామ3 ఇతి
భగవ ఇతి హ ప్రతిశుశ్రావ .. 4.9.1..
1. ప్రాప హ ఆచార్యకులం।
తమ్ ఆచార్యో అభ్యువాద
‘‘సత్యకామ!’’ ఇతి ‘‘భగవ!’’
ఇతి హ ప్రతిశుశ్రావ।।
అప్పుడు సత్యకాముడు గురుకులం చేరాడు.
ఆచార్యులవారు : ఓ సత్యకామా।
సత్యకాముడు : భగవాన్। గురుదేవా! సాష్టాంగ దండ ప్రణామములు స్వీకరించండి।
ఆచార్యులు : సౌమ్య! సత్యకామా! నీ ముఖము చూస్తూ ఉంటే బ్రహ్మమును ఎరిగినట్లుగా కనిపిస్తున్నావు. నీకు ఎవ్వరు బోధించారు?

బ్రహ్మవిదివ వై సోమ్య భాసి కో ను త్వానుశశాసేత్యన్యే
మనుష్యేభ్య ఇతి హ ప్రతిజజ్ఞే భగవాగ్ంస్త్వేవ మే కామే బ్రూయాత్ .. 4.9.2..
2. ‘‘బ్రహ్మవిత్ ఇవ వై సోమ్య।
భాసి? కో ను త్వా అనుశశాసేతి?’’
‘‘అన్యే మనుష్యేభ్య ఇతి
హ ప్రతిజజ్ఞే భగవాన్
త్వయేవ మే కామే బ్రూయాత్।
సత్యకాముడు : మనుష్యులకు వేరైనవారే నాకు (సవిషయ-సాకార) బ్రహ్మముయొక్క కళల గురించి, పాదముల గురించి చెప్పారు. అయితే మాత్రం ఏమున్నది? స్వామీ! మీరు నాకు నేను కోరుకొను చున్న (నిర్విషయ-నిరాకార) బ్రహ్మము గురించి బోధించి భగవాగుడు (ధన్యుడు)గా తీర్చిదిద్దండి.

శ్రుతగ్ంహ్యేవ మే భగవద్దృశేభ్య ఆచార్యాద్ధైవ విద్యా విదితా
సాధిష్ఠం ప్రాపతీతి తస్మై హైతదేవోవాచాత్ర హ న కించన
వీయాయేతి వీయాయేతి .. 4.9.3..

.. ఇతి నవమః ఖండః ..
3. శ్రుతగ్ం హి ఏవ మే భగవద్దృశేభ్య
ఆచార్యాద్ధై వ విద్యావిదితా

సాధిష్ఠం ప్రాపతి - ఇతి।।
తస్మై హి ఏతత్ ఏవో వాచా
అత్ర హ న కించన వీయాయేతి।
వీయాయేతి।।
తమవంటి మహనీయులగు ఆచార్యులు బోధించునది అత్యుత్తమమైన బ్రహ్మవిద్య.
ఆచార్యులగు మీరు బోధించుట చేతనే మేము సాధుత్వము పొందగలమని మీవంటి మహనీయులు చెప్పటం వింటున్నాము. శ్రీ గురుభ్యోన్నమో నమో నమో నమః ।।

అప్పుడు ఆచార్యులగు గౌతమమహర్షి సత్యకామునికి ‘బ్రహ్మవిద్య’ను బోధించారు.

అప్పుడు ‘లోటు’ అనునదంతా తొలగిపోయి, ఆ సత్యకాముడు ఏలోటు లేనివాడైనాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే నవమః ఖండః


4–10. చతుర్థ ప్రపాఠకః - దశమ ఖండము - ఉపకోసల విద్య


ఉపకోసలో హ వై కామలాయనః సత్యకామే జాబాలే
బ్రహ్మచార్యమువాస తస్య హ ద్వాదశ వార్షాణ్యగ్నీన్పరిచచార
స హ స్మాన్యానంతేవాసినః సమావర్తయగ్ంస్తం హ స్మైవ న
సమావర్తయతి .. 4.10.1..
1. ఉపకోసలో హ వై కమలాయనః
సత్యకామే జాబాలే బ్రహ్మచర్యం ఉవాస।
తస్య హ ద్వాదశ వర్షాణి అగ్నీన్ పరిచచార।
స హ స్మ అన్యాన్ అన్తేవాసినః
సమావర్తయగ్ం తగ్ం హ
స్మ ఏవ న సమావర్తయతి।।
కమలాయని మునీంద్రుని కుమారుడు ‘‘ఉపకోసల కమలాయనుడు’’ అనేవారు, ఆయన సత్యకామ జాబాలి ఆశ్రమంలో ఉండి బ్రహ్మచర్య వ్రతమును (బ్రహ్మము గురించిన ఉపాసనా వ్రతమును) నిర్వర్తించసాగారు. 12 సంవత్సరముల కాలము ఆయన తోటి విద్యార్థులతో కూడి శాస్త్ర ప్రవచనానుసారంగా అగ్నికార్యము దైనందిక హోమము) మొదలైన వాటిని నిర్వర్తించారు.
ఆ విధంగా 12 సంవత్సరముల కాలము గడచిన తరువాత సత్యకామ జాబాలి ఒకరోజు శిష్యులందరికీ ‘వీడ్కోలు ఆశీర్వాద సభ’ ఏర్పాటు చేసారు. కానీ ఉపకోసలునుని మాత్రం ఆ సభకు పిలువలేదు.

తం జాయోవాచ తప్తో బ్రహ్మచారీ కుశలమగ్నీన్పరిచచారీన్మా
త్వాగ్నయః పరిప్రవోచన్ప్రబ్రూహ్యస్మా ఇతి తస్మై హాప్రోచ్యైవ
ప్రవాసాంచక్రే .. 4.10.2..
2. తం జాయ ఉవాచ :
తప్తో బ్రహ్మచారీ కుశలమ్
అగ్నీన్ పరిచచారీన్।
మా త్వా అగ్నయః పరిప్రవోచన్
ప్రబ్రూహి అస్మా ఇతి।
తస్మై హ అప్రోచ్యైవ ప్రవాసాంచక్రే।
అప్పుడు సత్యకాముని భార్య (గురుమాత) సత్యకామునితో ఇట్లా పలికారు.
‘‘పతిదేవా! తమరు శిష్యులందరికీ వీడ్కోలు ఆశీర్వాదము ప్రసాదించారు. కానీ మీ శిష్యులలో ఉపకోసలుని మాత్రం వీడ్కోలు సభకు పిలువలేదు. ఉపకోసలుడు అందరికంటే కూడా గురుకుల (ఆశ్రమ) సేవ అధికంగా చేసి ఉన్నవాడు. ఇది మీరు గమనించియే ఉంటారు.
బ్రహ్మచర్య వ్రతమును దీక్షగా నిర్వర్తించి ఉన్నాడు కూడా. నిత్యాగ్నిదేవత ఈ విషయంలో మిమ్ములను ఆక్షేపించవచ్చునేమో గదా?’’.

సత్యకాముడు అది విని కూడా ఉపకుశలనకు వీడ్కోలు ఉపదేశము ఇవ్వకుండానే, ఎటో ప్రహసమునకు (సంచారమునకు) వెళ్లారు.

స హ వ్యాధినానశితుం దధ్రే తమాచార్యజాయోవాచ
బ్రహ్మచారిన్నశాన కిం ను నాశ్నాసీతి స హోవాచ
బహవ ఇమేఽస్మిన్పురుషే కామా నానాత్యయా వ్యాధీభిః
ప్రతిపూర్ణోఽస్మి నాశిష్యామీతి .. 4.10.3..
3. స హ వ్యాధినా అనశితుం దధ్రే
తమ్ ఆచార్య జాయా ఉవాచ :
బ్రహ్మచారిన్ అశాన
‘కిం ను న - అశ్నాసి?’ ఇతి।
స హ ఉవాచ :
బహవ ఇమే అస్మిన్ పురుషే
కామాన్ అనాత్యయా
వ్యాధిభిః ప్రతిపూర్ణోఽస్మి।
న అశిష్యామి ఇతి।।
అది తెలుసుకొన్న ఉపకుశలుడు మనోవేదన చెంది ఉపాసములతో కృశించిపోసాగాడు. అప్పుడు ఆచార్యపత్ని (సత్యకాముని జీవిత భాగస్వామి) - అది గమనించారు. ఉపకుశలునితో ఇట్లు పలికారు.
గురుమాత (ఆచార్యుల వారి ధర్మపత్ని) : ఓ బ్రహ్మచారీ। చిరంజీవి। ఉపకుశలా। ఏమిటి, నీవు ఆహారం తీసుకోవటం మానావా? ఎందుకు?
ఉపకుశలుడు : గురుమాతా! అనుకున్నది జరగకపోవటంచేత నేను మనోవ్యాధిచే ప్రతిపూర్ణుడను అయ్యాను. భోజనముపై మనస్సు పోవటం లేదు.
{ఆ నిరుత్సాహం చూచి గురుమాత ‘‘అయ్యో! బిడ్డ ఏమౌతాడో!’’ అని అనుకోసాగారు.}

అథ హాగ్నయః సమూదిరే తప్తో బ్రహ్మచారీ కుశలం నః
పర్యచారీద్ధంతాస్మై ప్రబ్రవామేతి తస్మై హోచుః ప్రాణో బ్రహ్మ
కం బ్రహ్మ ఖం బ్రహ్మేతి .. 4.10.4..
4. అథ హ అగ్నయః సమూదిరే,
తప్తో బ్రహ్మచారీ కుశలం
నః పర్యచారీత్।
హ అంతా, అస్మై ప్రబ్రవామి - ఇతి।
తస్మై హ ఊచుః
ప్రాణో బ్రహ్మ। ‘‘కం’’ బ్రహ్మ।
‘‘ఖం’’ బ్రహ్మ। ఇతి।।
అప్పుడు ఉపకుశలుని నిరాహారము (ఆహారము తీసుకోకపోవటము) గమనించిన యజ్ఞాగ్నీ దేవతలు ఒకచోట కలుసుకొన్నవై ఇట్లా సంభాషించుకోసాగారు.
యజ్ఞాగ్ని దేవతలు : ఓ మిత్ర అగ్నిశిఖా దేవతలారా! ఈ పిల్లవాడు ఉపకుశలుడు ఆహారం తీసుకోక ఎంతో బాధపడుచున్నాడు. ఈతడు సుదీర్ఘకాలంగా సేవానిరతుడై అహూతులను అందించటంలో శ్రమలు తీసుకొని ఉన్నాడు. ఈతనిని ఊరడించి, శాంతపరచటం మనయొక్క ప్రత్యుపకార ధర్మము।
యాజ్ఞాగ్ని దేవతలు : చిరంజీవా! ఉపకోసలా! నీకు ఉపదేశము ప్రసాదించదలిచాము. విను! ప్రాణమే బ్రహ్మము. ‘కం’ బ్రహ్మము. ‘ఖం’ - బ్రహ్మము అని ఎరుగుదువా?

స హోవాచ విజానామ్యహం యత్ప్రాణో బ్రహ్మ కం చ తు ఖం చ న
విజానామీతి తే హోచుర్యద్వావ కం తదేవ ఖం యదేవ ఖం తదేవ
కమితి ప్రాణం చ హాస్మై తదాకాశం చోచుః .. 4.10.5..

.. ఇతి దశమః ఖండః ..
5. స హ ఉవాచ :
విజానామి అహం యత్ ప్రాణో బ్రహ్మ।
కం చ తు ఖం చ
న విజానామి ఇతి।।
తే హ ఊచు :
యత్ వావ ‘కం’ తత్ ఏవ ‘ఖం’।
యత్ ఏవ ‘ఖం’ తత ఏవ ‘కం’ ఇతి।
ప్రాణం చ హ అస్మై తత్
ఆకాశం చ ఊచుః।
ఉపకోసలుడు : ఓ యజ్ఞాగ్ని శిఖ దేవతలారా! నమోనమః। ‘‘ప్రాణము బ్రహ్మమే’’ - అనే విషయం నేను ఎరిగి ఉన్నాను.
కానీ మీరు ‘కం బ్రహ్మమే’ ‘ఖం బ్రహ్మమే’ అంటున్నారే! ఆ విషయం నేను ఎరిగి ఉండలేదు. దయచేసి విశదపరచండి.
అగ్నిదేవతలు :
ఏది ‘కం’యో, అదియే ‘ఖం’।
ఏది ‘ఖం’యో, అదియే ‘కం’ కూడా।
(కం = సుఖము; ఖం = ఆకాశము)

అప్పుడు యజ్ఞాగ్ని దేవతలు ఆ ఉపకోసలునికి సుఖమయరూపమగు ‘‘ప్రాణము’’ గురించి, ‘‘ఆకాశము’’ (చిదాకాశము) గురించి కూడా ఉపదేశించారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే దశమః ఖండః


4–11. చతుర్థ ప్రపాఠకః - ఏకాదశ ఖండము - గార్హపత్యాగ్ని అనుశాసనము (1)


అథ హైనం గార్హపత్యోఽనుశశాస పృథివ్యగ్నిరన్నమాదిత్య
ఇతి య ఏష ఆదిత్యే పురుషో దృశ్యతే సోఽహమస్మి స
ఏవాహమస్మీతి .. 4.11.1..
1. అథ హి ఏనం గార్హపత్యో అనుశశాస
‘‘పృథివిః - అగ్నిః - అన్నమ్ - ఆదిత్య’’ - ఇతి।।
య ఏష ఆదిత్యే పురుషో
దృశ్యతే, - సోఽహమస్మి।
స ఏవ అహం అస్మి - ఇతి।।
గార్హపత్యాగ్ని పురుషుడు -
‘‘నేను సర్వదా ఆత్మ స్వరూపుడను।
- ఈ సమస్తము ఆత్మస్వరూపమే। కాబట్టి భూమి, అగ్ని, అన్నము ఆదిత్యుల రూపముగా ఉన్నది నేనే। ఇది అనుశాసనము.
ఆదిత్యునియందు ఏ పురుషుడు (Worker of the whole) కనిపిస్తూ ఉన్నారో,
- ఆ ఆదిత్య పురుషుడను నేనే।
- ఆ ఆదిత్యపురుషుడనే నేను।
అంతేగాని, జీవమాత్రుడను కాను. అగ్ని - కట్టెల రూపమాత్రుడను కాను."

స య ఏతమేవం విద్వానుపాస్తేఽపహతే పాపకృత్యాం లోకీ భవతి
సర్వమాయురేతి జ్యోగ్జీవతి నాస్యావరపురుషాః క్షీయంత ఉప
వయం తం భుంజామోఽస్మిగ్ంశ్చ లోకేఽముష్మిగ్ంశ్చ య ఏతమేవం
విద్వానుపాస్తే .. 4.11.2..

.. ఇతి ఏకాదశః ఖండః ..
2. స య ఏతం ఏవం విద్వాన్
ఉపాస్తే అపహతే
పాప కృత్యాం లోకీ భవతి।
సర్వమ్ ఆయురేతి। జ్యోగ్జీవతి।
న అస్య అవరపురుషాః క్షీయంతే।।
ఎవ్వడైతే ఆత్మగురించి ఈ విధంగా - ‘‘ఈ సమస్తము ఆత్మయే। నేను ఆత్మ స్వరూపుడనే। ఈ సమస్తము నేనే’’ - అని ఆత్మజ్ఞానవిద్వాంసుడై నిశ్చలుడౌతాడో
- ఆతని పాపదృష్టులన్నీ తొలగిపోతాయి.
- ఉత్తమ లోకములు సిద్ధించుకోగలడు.
- ఆయుష్షు పవిత్రమౌతుంది.
- ఉజ్వలుడై జీవించగలడు.
- ఆతనిని ఆశ్రయించినవారు, సంబంధీకులు క్షీణత పొందరు.
ఉప వయం తం భుంజామో
అస్మిగ్ంశ్చ లోకే అముష్మిగ్ంశ్చ
య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే।।
అట్టి ఆముష్మిక లోకతత్త్వము ఎరిగినవారు మా చే ఇహ - పరములందు కూడా మార్గదర్శకులుగా, తత్త్వజ్ఞులుగా గౌరవించబడుచున్నారు. (ఈవిధంగా పలికి గార్హపత్యాగ్ని పురుషుడు మౌనం వహించారు)

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే ఏకాదశః ఖండః


4–12. చతుర్థ ప్రపాఠకః - ద్వాదశ ఖండము - గార్హపత్యాగ్ని అనుశాసనము (2)


అథ హైనమన్వాహార్యపచనోఽనుశశాసాపో దిశో నక్షత్రాణి
చంద్రమా ఇతి య ఏష చంద్రమసి పురుషో దృశ్యతే సోఽహమస్మి
స ఏవాహమస్మీతి .. 4.12.1..
1. అథ హి ఏనమ్
అన్వాహార్య పచనో అనుశశాసా
‘‘ఆపో దిశో నక్షత్రాణి చంద్రమా’’ - ఇతి
య ఏష చంద్రమసి పురుషో దృశ్యతే -
సోఽహమస్మి। స ఏవ అహమస్మి ఇతి।।
గార్హపత్యాగ్ని అనుశాసనం -
అప్పుడు అన్వాహార్య పచనాగ్ని గురించి గార్హపత్యాగ్ని దేవత ఇంకా ఈ విధంగా బోధించసాగారు.
గార్హపత్యాగ్ని పురుషుడు (దేవత) : ఓ ఉపకోసలా। ఇది కూడా విను.
(1) జలము (2) దిక్కులు (3) నక్షత్రములు (4) చంద్రమా…అయి ఉన్నది చంద్రమ పురుషకారమే। అట్టి చంద్రమసముగా కనబడుచూ ఉన్నదంతా నేనే అయి ఉన్నాను.
అది నేను। నేనే అదంతా।

స య ఏతమేవం విద్వానుపాస్తేఽపహతే పాపకృత్యాం లోకీ భవతి
సర్వమాయురేతి జ్యోగ్జీవతి నాస్యావరపురుషాః క్షీయంత ఉప
వయం తం భుంజామోఽస్మిగ్ంశ్చ లోకేఽముష్మిగ్ంశ్చ య ఏతమేవం
విద్వానుపాస్తే .. 4.12.2..

.. ఇతి ద్వాదశః ఖండః ..
2. స య ఏతం ఏవం విద్వాన్
ఉపాస్తే - అపహతే
పాపకృత్యాం, లోకీ భవతి।
సర్వమాయురేతి। జ్యోగ్జీవతి।
న అస్య అవరపురుషాః క్షీయంత।
ఉప వయం తం భుంజామో
అస్మిగ్ంశ్చ లోకే అముష్మిగ్ంశ్చ
య ఏతం ఏవం
విద్వాన్ ఉపాస్తే।।
ఇది ఎరిగి ఉపాసిస్తున్న విద్వాంసుడు ‘అది నేనే’ అనే భావనను నిశ్చలపరచుకొన్నవాడు,
- సర్వపాప దృష్టులనుండి విడివడగలడు.
- సర్వ లోకములు తన స్వరూపమే అయి ఆనందించగలడు.
- ఉత్తమ ఆయుష్షు పొందగలడు.
- స్వయం ప్రకాశమగు జ్యోతి స్వరూపుడై విరాజిల్లగలడు.
- అట్టివాని వంశము క్షీణించదు.
- వారు ఆముష్మిక లోకవాసులుగా మాచే దర్శించబడుచున్నారు. గౌరవించబడుచున్నారు. లోకంలో అట్టివారు మాకు ఆరాధ్య పురుషులగుచున్నారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే ద్వాదశః ఖండః


4–13. చతుర్థ ప్రపాఠకః - త్రయోదశ ఖండము - ఆహవనీయాగ్ని అనుశాసనం (1)


అథ హైనమాహవనీయోఽనుశశాస ప్రాణ ఆకాశో ద్యౌర్విద్యుదితి
య ఏష విద్యుతి పురుషో దృశ్యతే సోఽహమస్మి స
ఏవాహమస్మీతి .. 4.13.1..
1. అథ హి ఏనం ఆహవనీయో అనుశశాస
‘‘ప్రాణ। ఆకాశో। ద్యౌః। విద్యుత్’’ - ఇతి।
య ఏష విద్యుతి పురుషో దృశ్యతే…
సోఽహమస్మి। స ఏవ అహమస్మి - ఇతి।।
ఆహవనీయాగ్ని పురుషుడు (దేవత) :
ఏ విద్యుత్ పురుషుడు ప్రాణ, ఆకాశ, ద్యులోక, విద్యుత్తు (తేజోమయము)గా అగుపిస్తున్నారో అట్టి విద్యుత్ (తేజో) పురుషుడను నేనే। నేనే అవన్నీగా ఏర్పడి ఉన్నాను.

స య ఏతమేవం విద్వానుపాస్తేఽపహతే పాపకృత్యాం లోకీ భవతి
సర్వమయురేతి జ్యోగ్జీవతి నాస్యావరపురుషాః క్షీయంత ఉప
వయం తం భుంజామోఽస్మిగ్ంశ్చ లోకేఽముష్మిగ్ంశ్చ య ఏతమేవం
విద్వానుపాస్తే .. 4.13.2..

.. ఇతి త్రయోదశః ఖండః ..
2. స య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే,
అపహతే పాపకృత్యాం లోకీ భవతి।
సర్వమ్ ఆయుః ఏతి। జ్యోగ్జీవతి।
న అస్య అవరపురుషాః క్షీయంత।
ఉప వయం తం భుంజామో
అస్మిగ్ంశ్చ లోకే అముష్మిగ్ంశ్చ
య ఏతమ్ ఏవం విద్వాన్ ఉపాస్తే।।
ఈ విధంగా ఎవ్వరైతే తన ఆత్మస్వరూపము గురించి తాను తెలుసుకొని విద్వాంసుడై ఉపాసిస్తాడో….
- అట్టివాడు పాపకృత్యములనుండి విడివడి, సర్వలోకహితుడు అవుతాడు.
- ఆయుష్మంతుడు కాగలడు.
- జ్యోతి స్వరూపుడై జీవితమును ప్రకాశింపజేసుకోగలడు.
- ఆతని వంశము పావనము అవుతుంది.
- ఆతని ఆముష్మక జ్ఞానమును మేము భజించుచున్నాము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే త్రయోదశః ఖండః


4–14. చతుర్థ ప్రపాఠకః - చతుర్దశ ఖండము - ఆహవనీయాగ్ని అనుశాసనం (2)


తే హోచురుపకోసలైషా సోమ్య తేఽస్మద్విద్యాత్మవిద్యా
చాచార్యస్తు తే గతిం వక్తేత్యాజగామ
హాస్యాచార్యస్తమాచార్యోఽభ్యువాదోపకోసల3 ఇతి .. 4.14.1..
1. తే హ ఊచుః।
ఉపకోసల ఏషా, సోమ్య!
తే అస్మత్ విద్యా - ఆత్మ విద్యా చ।
ఆచార్యస్తు తే గతిం వక్తా ఇతి
అజగామ హ అస్య ఆచార్యః।
తమ్ ఆచార్యో అభ్యువాదా
ఉపకోసలా! ఇతి।।

ఆ అగ్ని పురుషులు ఇంకా ఇట్లా ప్రవచించసాగారు.

త్రయాగ్ని పురుషులు : ఓ ప్రియ ఉపకోసలా! సౌమ్యా! మేము మీకు ఆత్మ విద్య గురించి చెప్పాము. ఇంకా కూడా మీ గురుదేవులు సత్యకాములవారు మరింతగా బోధించగలరు.

అప్పుడు ఆచార్యులవారు (సత్యకాములవారు) సంచారమునుండి తిరిగివచ్చారు.

ఆచార్యులు : ఓ ఉపకోసలా!


భగవ ఇతి హ ప్రతిశుశ్రావ బ్రహ్మవిద ఇవ సోమ్య తే ముఖం భాతి
కో ను త్వానుశశాసేతి కో ను మానుశిష్యాద్భో ఇతీహాపేవ
నిహ్నుత ఇమే నూనమీదృశా అన్యాదృశా ఇతీహాగ్నీనభ్యూదే
కిం ను సోమ్య కిల తేఽవోచన్నితి .. 4.14.2..
2. ‘భగవ।’ - ఇతి హ।
ప్రతిశుశ్రావ బ్రహ్మవిద ఇవ,
సోమ్య, తే ముఖం భాతి కా ను?
త్వా అనుశశాసేతి కో, ను!
మా అనుశిష్యాత్ భో,
ఇతీ హ అప ఏవ నిహ్నుతే।
ఇమే నూనం ఈదృశా అన్యాదృశా
ఇతీ హ అగ్నీన్ అభ్యూదే।
కిం ను, సోమ్య!
కిల తే అవోచన్? ఇతి।।

ఉపకోసలుడు : భగవాన్! గురుదేవా! నమోనమః
ఆచార్యులు : సౌమ్యా! ప్రియదర్శనుడా! నీ ముఖము బ్రహ్మవేత్త ముఖంలాగా ప్రకాశిస్తోందే! నీకు ఎవ్వరైనా బ్రహ్మవిద్యను ఉపదేశించారా?
ఉపకోసలుడు : స్వామీ గురుదేవా! మీ శిష్యుడనగుటచే మీరే కదా, నాకు బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించాలి!

ఆయా విధములుగా (గార్హపత్యాగ్ని-ఆహవనీయాగ్ని స్వరూపుడగు) అగ్నిదేవుడు దృశ్యంలో సందర్భములగు కొన్ని విశేషములపట్ల సోఽహమ్ భావమును బోధించారు.


ఇదమితి హ ప్రతిజజ్ఞే లోకాన్వావ కిల సోమ్య తేఽవోచన్నహం
తు తే తద్వక్ష్యామి యథా పుష్కరపలాశ ఆపో న శ్లిష్యంత
ఏవమేవంవిది పాపం కర్మ న శ్లిష్యత ఇతి బ్రవీతు మే
భగవానితి తస్మై హోవాచ .. 4.14.3..

.. ఇతి చతుర్దశః ఖండః ..
3. ‘ఇదమ్’ ఇతి హ ప్రతిజజ్ఞే లోకాన్ వావ
కిల సోమ్య! తే అవోచన్
అహం తు తే తత్ వక్ష్యామి!
యథా పుష్కరపలాశా ఆపో
న శ్లిష్యంత ఏవం,
ఏవం విది పాపం కర్మ న శ్లిష్యత - ఇతి।
బ్రవీతు మే భగవాన్! ఇతి
తస్మై హ ఉవాచ।।
ఆచార్యులు : ఓహో! అగ్నిపురుషుడు లోక విశేషములను సోఽహమ్ దృష్టితో దర్శించుచూ ఉపాసించు విశేషములన్నీ చెప్పారా? మంచిది.
ఇప్పుడు నీకు బ్రహ్మము గురించిన విశేషమునే బోధిస్తాను. నీ మనస్సులోని బ్రహ్మజిజ్ఞాసాభిలాషను తీరుస్తాను.
పద్మముపై ఉన్న జలబిందువులు పద్మమును తాకని విధంగా, బ్రహ్మతత్త్వజ్ఞానముచే నిన్ను పాపదోషములు స్పృశించజాలవు.
ఉపకోశలుడు : ఆచార్యదేవా! నాకు ఇంకను బ్రహ్మజ్ఞానము పూర్తిగా బోధించండి.
అప్పుడు గురుదేవులు ఇట్లా పలుకసాగారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే చతుర్దశః ఖండః


4–15. చతుర్థ ప్రపాఠకః - పంచదశ ఖండము - అక్షిణి పురుష ఉపాసన


య ఏషోఽక్షిణి పురుషో దృశ్యత ఏష ఆత్మేతి
హోవాచైతదమృతమభయమేతద్బ్రహ్మేతి
తద్యద్యప్యస్మిన్సర్పిర్వోదకం వా సించతి వర్త్మనీ ఏవ
గచ్ఛతి .. 4.15.1..
తస్మై హ ఉవాచ :
1. య ఏషో ‘‘అక్షిణి పురుషో’’
దృశ్యత - ఏష ‘‘ఆత్మ’’ ఇతి।
హ ఉవాచ :
ఏతత్ అమృతమ్। అభయమ్।
ఏతత్ బ్రహ్మా ఇతి।।
తత్ యత్ అపి అస్మిన్ సర్పిర్వ
ఉదకం వా సించతి వర్త్మనీ ఏవ గచ్ఛతి।।
సత్యకామ జాబాలి :
ఓ ప్రియశిష్యా! ఉపకోశలా! విను.

ఈ కంటిలో చూపును ఉపయోగించుచూ ఏ ‘చూచువాడు’ (అక్షిణిపురుషుడు) వేంచేసి ఉన్నాడో - ఆతడు ఆత్మయే అయి ఉన్నాడు.

ఆ చూపు తనదైన అక్షిణి పురుషుడు ‘కన్ను’ అనే ఉపకరణము కంటే ముందే ఉన్నాడు. చూచేవాడే కంటితో పుట్టడు, కంటితో చావడు. ఆ చూచేవాడే అమృత పురుషుడు. అభయ స్థానమునకు చెందినవాడు. బ్రహ్మమే అయిఉన్నాడు.

అట్టి చూచువాడుగాని, చూపుగాని చూడబడే దానిచే ప్రవేశించబడటం లేదు. వెన్నగాని, నీటిబిందువుగాని కళ్లపై జల్లితే, అవి బయటకు వెళ్తాయేగాని, లోనికి ప్రవేశించవు గదా! చూపులో చూడబడేది ప్రవేశించక తిరిగి బయటకే వెళ్లుచున్నది.

ఏతగ్ం సంయద్వామ ఇత్యాచక్షత ఏతగ్ం హి సర్వాణి
వామాన్యభిసంయంతి సర్వాణ్యేనం వామాన్యభిసంయంతి
య ఏవం వేద .. 4.15.2..
2. ఏతగ్ం సంయద్వామ - ఇతి
ఆచక్షత, ఏతగ్ం హి
సర్వాణి వామాని అభిసంయంతి।
సర్వాణి ఏనం వామాని
అభిసంయంతి - య ఏవం వేద।।
అట్టి అక్షిణి పురుషుడే (One who is seeing) ఆత్మపురుషుడు.

ఆయనను ‘‘సంయద్వామ’’ (యత్ వామ సంయత్ - విడిగా ఉన్నవాడు) - అని కూడా అంటారు. ఎందుకంటే, అన్ని నామములు (అభినందనములు) ఆయనకే చేరుచున్నాయి. ఎవ్వడైతే ‘‘సర్వస్తుతులు, దృశ్యసేవనములు చెందుచున్నది ఆ ద్రష్ట పురుషునికే’’ - అని గ్రహిస్తాడో, ఆతడు సర్వ నామములు (అభినందనలు) పొందినవాడగుచున్నాడు.

అందుచేత నీవు చూచేవన్నీ చూచువానికే సమర్పించు!

ఏష ఉ ఏవ వామనీరేష హి సర్వాణి వామాని నయతి
సర్వాణి వామాని నయతి య ఏవం వేద .. 4.15.3..
3. ఏష ఉ ఏవ వామనీః।
ఏష హి సర్వాణి వామాని నయతి।
సర్వాణి వామాని నయతి య ఏవం వేద।।
అట్టి ఆత్మస్వరూపుడగు అక్షిణిపురుషుడే (కేవల ద్రష్టయే) -
వామనీ → సర్వము తనకు చెందినవాడు, దృశ్యమంతా తన సంపదగా కలవాడు.
ఈ విధంగా కంటిలో ప్రవర్తమానుడై ఉన్న ద్రష్ట (లేక) అక్షిణి పురుషుని ఆత్మగా ఎరిగినవాడు - తాను చూస్తున్నదంతా తన సంపదగా ఎరిగి, ఆత్మానందుడగుచున్నాడు.

ఏష ఉ ఏవ భామనీరేష హి సర్వేషు లోకేషు భాతి
సర్వేషు లోకేషు భాతి య ఏవం వేద .. 4.15.4..
4. ఏష ఉ ఏవ భామనీః
ఏష హి సర్వేషు లోకేషు భాతి।
సర్వేషు లోకేషు భాతి -
య ఏవం వేద।।
ఆ కంటిలో నివాసము కలిగి సమస్తమును చూస్తూ ఉన్న దృక్ - పురుషుడే -
భామనీ → సమస్తమును తన చూపు తేజస్సుతో వెలిగించుచున్నాడు.

భాతి = ఈ సమస్త లోకములుగా భాసించుచున్నది ఆ అక్షిణి పురుషుడే। ఇదంతా ఆయన పురుషకారమే।

ఇది తెలుసుకొన్నవాడు ‘‘నేనే ఈ కనబడే సమస్తమును దృశ్యముగా వెలిగిస్తూ వెలుగుచున్నదంతా నేనే అయి ఉన్నాను’’ అని ఎరుగగలడు.

అథ యదు చైవాస్మింఛవ్యం కుర్వంతి యది చ
నార్చిషమేవాభిసంభవంత్యర్చిషోఽహరహ్న
ఆపూర్యమాణపక్షమాపూర్యమాణపక్షాద్యాన్షడుదఙ్ఙేతి
మాసాగ్ంస్తాన్మాసేభ్యః సంవత్సరగ్ం
సంవత్సరాదాదిత్యమాదిత్యాచ్చంద్రమసం చంద్రమసో విద్యుతం
తత్ పురుషోఽమానవః స ఏనాన్బ్రహ్మ గమయత్యేష దేవపథో
బ్రహ్మపథ ఏతేన ప్రతిపద్యమానా ఇమం మానవమావర్తం నావర్తంతే
నావర్తంతే .. 4.15.5..

.. ఇతి పంచదశః ఖండః ..
5. అథ యత్ ఉ చ ఏవ
అస్మిన్ శవ్యం కుర్వంతి,
యది చ న అర్చిషం ఏవ
అభిసంభవంతి,
అర్చిషో అహరహ్న
ఆపూర్యమాణపక్షమ్
ఆపూర్యమాణపక్షాతి ఆన్షట్ ఉదఙ్
ఏతి → మాసాగ్ం।
తాన్ మాసేభ్యః సంవత్సరగ్ం।
సంవత్సరాత్ → ఆదిత్యమ్।
ఆదిత్యాత్ → చద్రమసమ్।
చంద్రమసో → విద్యుతమ్।
ఈ విధంగా - (1) నేత్రములో నివసించుచూ అక్షిణి పురుషుడై (2) చూడబడుచున్నదంతా తానే అయి, సమస్త దృశ్యముగా వెలుగొందుచున్నాడు అని ఆత్మను (స్వస్వరూప-దృక్‌ద్రష్ట స్వరూపముగా) - ఉపాసించువాడు -
→ ఆతడు సంతానము మొదలైన ఇతరులచే గుర్తింపకున్నా (లేక) స్తుతించబడకున్నా, దేవ పితృకార్యములు పొందినా, పొందకపోయినా కూడా → ఆతడు - అర్చిస్సులను (అర్చన కిరణములను) చేరుచున్నాడు.
→ పగటి తేజోపుంజములలోను, కాంతిలోను ప్రయాణములు పొందుచున్నాడు.
→ ఆపూర్యమాణ పక్షము (శుక్లపక్షము)లో ప్రవేశిస్తున్నాడు.
→ శుక్లపక్ష దేవత నుండి ఉత్తరాయణ దేవతను ఆశ్రయిస్తున్నాడు. ఉత్తరాయణములో ప్రవేశిస్తున్నాడు.
→ అందులోంచి సంవత్సర దేవతను పొందుచున్నాడు.
→ అక్కడనుండి ఆదిత్యలోకము (సూర్యుని) చేరుచున్నాడు.
→ అక్కడి నుండి చంద్రమసము.
→ చంద్రమసము నుండి తేజమయమగు ‘విద్యుత్’ రూపమును పొందుచున్నాడు.
తత్పురుషో అమానవః
స ఏనా(త్) బ్రహ్మ గమయతి।
అట్టి తేజోమయ విద్యుత్ స్థానమునుండి తత్పురుష సంబంధమైన, మానవాతీతమైన బ్రహ్మలోకము జేరి ‘‘బ్రహ్మము’’ను పొందుచున్నాడు.
ఏష ‘‘దేవ పథో’’ ‘‘బ్రహ్మపథ’’
ఏతేన ప్రతిపద్యమానా।
ఇమం మానవం ఆవర్తం
న ఆవర్తంతే। న ఆవర్తంతే।।

ఇదియే ‘‘దేవపథము’’. ఇదియే ‘‘బ్రహ్మపథము’’. అదియే ‘‘బ్రహ్మమే తానవటము’’. అట్టివాడు బ్రహ్మమే తానై, ఇక ‘‘నేను జీవుడను’’ అనబడు స్వయం కల్పిత పరిమితమగు మానవలోకమునకు తిరిగిరాడు. బ్రహ్మమే తానై సర్వత్రా విరాజిల్లగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే పంచదశః ఖండః


4–16. చతుర్థ ప్రపాఠకః - షోడశ ఖండము - యజ్ఞోపాసన


ఏష హ వై యజ్ఞో యోఽయం పవతే ఏష హ యన్నిదగ్ం సర్వం పునాతి
యదేష యన్నిదగ్ం సర్వం పునాతి తస్మాదేష ఏవ యజ్ఞస్తస్య
మనశ్చ వాక్చ వర్తనీ .. 4.16.1..
1. ఏష హ వై యజ్ఞో
యో అయం పవత
ఏష హ యన్నిదగ్ం సర్వం పునాతి।।
ఈ జగత్తులో వాయువు (పవనము) వీచుచు సమస్తము నిర్వర్తిస్తోంది. జీవులకు జీవనము ప్రసాదిస్తూ ఉన్నది. కదిలే వాయువు వెనుక ‘‘కదిల్చే చైతన్యము’’ ప్రవర్తమానమై ఉన్నది.
అట్టి (పవతము) వీచువాయువే, అగ్నిజ్వలనంగా ఇక్కడి యజ్ఞ కార్యక్రమమునకు నాంది. అట్టి వాయువుయొక్క వీచికలు సమస్తమును పవిత్రము చేస్తున్నాయి.
యత్ ఏష యన్నిదగ్ం సర్వం పునాతి -
వాయువు వీచుచుండగా అది యజ్ఞరూపంగా సమస్తమును పవిత్రము - ఉత్తేజము చేయుచున్నది.
యజ్ఞమునకు ప్రారంభమును ప్రసాదిస్తోంది.
తస్మాత్ ఏష ఏవ యజ్ఞః
తస్య మనః చ వాక్ చ వర్తనీ।।
కావున, వాయు సంచలనమే మహత్తరమగు సృష్టి యజ్ఞము. (నమస్తే వాయు! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి।)
యజ్ఞమునకు (1) మనస్సు (2) వాక్కు మార్గములు. ఆ రెండు ప్రధానములు.

తయోరన్యతరాం మనసా సగ్ంస్కరోతి బ్రహ్మా వాచా
హోతాధ్వర్యురుద్గాతాన్యతరాగ్ంస యత్రౌపాకృతే ప్రాతరనువాకే
పురా పరిధానీయాయా బ్రహ్మా వ్యవదతి .. 4.16.2..
2. తయోః అన్యతరాం మనసా
సగ్ంస్కరోతి, బ్రహ్మా వాచా
హోతా, అధ్వర్యుః ఉద్గాతా అన్యతరామ్।।
స యత్ర ఉపాకృతే ప్రాతః అనువాకే।
పురా పరిధానీయాయా
బ్రహ్మ వ్యవవదతి।।
యజ్ఞములోని మనస్సు - వాక్కు మార్గములలో,
మనస్సును → ‘‘బ్రహ్మ’’ అగు ఋత్విక్కు మనస్సుతో సంస్కరిస్తున్నారు.
వాక్కును → హోత - ఆధ్వర్యుడు - ఉద్గాత, వీరు తమ వాక్కుతో ‘వాక్కు’ను సంస్కరిస్తున్నారు. ఈ రెండవ మార్గము - వారిచే సంస్కరించబడుతోంది.

ముందుగా ప్రాతరనువాకము. ఆ తరువాత యజ్ఞము మొదలౌతోంది. ‘‘పరిధానీయము’’ అనే ఋక్కు యజ్ఞగుండమును, కుండలను పవిత్రము చేయటమునకు ముందుగా ఋత్విక్కు ఋక్కులను గానం చేస్తారు. ఋక్కుల గానము ముగించి, ఋత్విక్కు మౌనము వీడగానే ‘‘మనో సంస్కరణము’’ అనే మొదటి మార్గము పూర్తి అయినట్లు.

అన్యతరామేవ వర్తనీగ్ం సగ్ంస్కరోతి హీయతేఽన్యతరా
స యథైకపాద్వ్రజన్రథో వైకేన చక్రేణ వర్తమానో
రిష్యత్యేవమస్య యజ్ఞోరిష్యతి యజ్ఞగ్ం రిష్యంతం
యజమానోఽనురిష్యతి స ఇష్ట్వా పాపీయాన్భవతి .. 4.16.3..
3. అన్యతరామ్ ఏవ వర్తనీగ్ం,
సగ్ంస్కరోతి। హీయతే అన్యతరా।
స యథ ఏకపాద్ వ్రజన్
రథో, వైకేన చక్రేణ
వర్తమానో రిష్యతి।
ఏవమ్ అస్య యజ్ఞో రిష్యతి।
యజ్ఞగ్ం రిష్యంతం
యజమానో అనురిష్యతి।
స ఇష్ట్వా పాపీయాన్ భవతి।।

మనస్సు సంస్కరించబడిన తరువాతనే వాక్కు కూడా సంస్కరించబడాలి. అట్లా కాకుండా (మనో సంస్కార ఋక్‌గానం) లేకుండా వాక్ సంస్కారం మాత్రమే ఆశ్రయించటం ఎటువంటిదంటే
→ యజ్ఞ కర్మ పవిత్రత చెందదు.
→ ఒంటి కాలితో మనుష్యుడు నడవటము వంటిది.
→ ఒక చక్రముతోనే రథమును ముందుకు త్రోయటము వంటిది.
యజ్ఞము కూడా ఆ విధంగా ఉత్తమంగా ప్రయోజనకారి కాదు.
మనో సంస్కారము + వాక్ సంస్కారము → ఉభయము అనుసరించకపోతే యజ్ఞము కుంటుపడినట్లు అవుతుంది. యజమాని పాపి కూడా అగుచున్నాడు.


అథ యత్రోపాకృతే ప్రాతరనువాకే న పురా పరిధానీయాయా బ్రహ్మా
వ్యవదత్యుభే ఏవ వర్తనీ సగ్ంస్కుర్వంతి న హీయతేఽన్యతరా .. 4.16.4..
4. అథ యత్ర ఉపాకృతే ప్రాతః
అనువాకే న పురా పరిధానీయాయా
బ్రహ్మా వ్యవవదతి
ఉభే ఏవ వర్తనీ సగ్ంస్కుర్వంతి।
న హీయతే అన్యతరా।।
‘‘ప్రాతరనువాకము’’ (Pre Praying chants) తరువాత పరధీయ ఋక్కులకు ముందుగా ఋత్విక్కు మౌనము వీడకుండా ఉంటే - అప్పుడు అటు
(1) ప్రాతరనువాకము (2) పరాధీయు ఋక్కులు - ఉభయము సంస్కరించబడినవి అవుతాయి.
రెండూ కూడా ఇక లోపభూయిష్టము కావు.

స యథోభయపాద్వ్రజన్రథో వోభాభ్యాం చక్రాభ్యాం వర్తమానః
ప్రతితిష్ఠత్యేవమస్య యజ్ఞః ప్రతితిష్ఠతి యజ్ఞం ప్రతితిష్ఠంతం
యజమానోఽనుప్రతితిష్ఠతి స ఇష్ట్వా శ్రేయాన్భవతి .. 4.16.5..

.. ఇతి షోడశః ఖండః ..
5. స యథా ఉభయ పాద్,
వ్రజన్ రథో వోభాభ్యాం
చక్రాభ్యాం వర్తమానః ప్రతితిష్ఠతి।
ఏవం అస్య యజ్ఞః ప్రతితిష్ఠతి।
యజ్ఞం ప్రతితిష్ఠంతం
యజమానో అనుప్రతితిష్ఠతి।
స ఇష్ట్వా, శ్రేయాన్ భవతి।।
ఏ విధంగా అయితే…
- మానవుడు రెండుకాళ్ళతో అయితే చక్కగా నడుస్తున్నాడో,
- రెండు చక్రములతోనే రథము చక్కగా ముందుకు నడవగలదో,
అదే విధంగా ప్రాతరనువాకము, పరాధీయ ఋక్కులు ఇవన్నీ మనో సంస్కార మంత్రముల - ‘‘వాచా సంస్కార మంత్రములతో’’ కూడుకొని యజ్ఞము ప్రతితిష్ఠము అగుచున్నది.

యజ్ఞకర్త, ఋత్విక్కు, ఆధ్వర్యుడు, హోత, ఉద్గాత మొదలైన యజ్ఞదీక్షా భాగస్తులంతా అనుప్రతిష్ఠితులు కాగలరు.
యజ్ఞము తృప్తిగా జరుగుచూ ఉండగా, యజమానికి, యజ్ఞవీక్షకులకు క్షేమము కాగలదు.
యజ్ఞము (ఇష్టము)చే యజమాని శ్రేయము పొందగలడు. యజ్ఞభాగస్తులు, యజ్ఞవీక్షకులు - సర్వశ్రేయస్సులు పొందగలరు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే షోడశః ఖండః


4–17. చతుర్థ ప్రపాఠకః - సప్తదశః ఖండః - వ్యాహృత్యుపాసన


ప్రజాపతిర్లోకానభ్యతపత్తేషాం తప్యమానానాగ్ం
రసాన్ప్రావృహదగ్నిం పృథివ్యా వాయుమంతరిక్షాతాదిత్యం దివః .. 4.17.1..
1. ప్రజాపతిః లోకాన్ అభ్యతపత్।
తేషాం తప్య మానానాగ్ం
రసాత్ ప్రావృహత్।
అగ్నిం పృథివ్యా వాయుమ్
అంతరిక్షాత్ ఆదిత్యం దివః।।

‘‘ప్రజాపతి - ‘సృష్టి’ని లీల - క్రీడ - వినోదముగా కల్పన చేసెదను గాక’’ - అనే ఇచ్ఛ పొందారు. తపన రూపంగా తపస్సుచే ధ్యానరూపంగా సృష్టి రసమును పండించసాగారు.

తపనయే - తపస్సు। ధ్యాసయే - ధ్యానము।

కొన్ని మహత్తర వస్తువులను సృష్టి కల్పనా లీలకొరకై వెలికితీయసాగారు.
భూమి.
భూమి నుండి - అగ్నిని,
ఆకాశము నుండి - వాయువును
ద్యు(దేవతా) లోకమునుండి - ఆదిత్యుని (సూర్యుని)
రసరూపంగా - బహిర్గతపరచారు.

(గమనిక - సృష్టి క్రమము అనేక వేదోపనిషత్తులలో అనేక విధములుగా చెప్పబడినా, సృష్టికి మూలము మాత్రము ఆత్మ (బ్రహ్మము) అనియే నిర్ధారణ చేయబడినది.)


స ఏతాస్తిస్రో దేవతా అభ్యతపత్తాసాం తప్యమానానాగ్ం
రసాన్ప్రావృహదగ్నేరృచో వాయోర్యజూగ్ంషి సామాన్యాదిత్యాత్ .. 4.17.2..
2. స ఏతాః తిస్రో దేవతా అభ్యతపః।
తాసాం తప్యమానానాగ్ం
రసాన్ ప్రావృహత్।
అగ్నేః ఋచో।
వాయోః యజూగ్ంషి।
సామాని ఆదిత్యాత్।।
ఈ విధంగా కొనసాగిస్తూ ముగ్గురు దేవతలను (త్రిమూర్తులను) గురించి ధ్యానతపస్సులచే ఆ దేవతల రసతత్త్వము స్వీకరించారు.
అగ్ని నుండి → ఋక్కులను (ఋగ్వేదమునందలి ఆత్మదేవుని గురించి స్తుతులను),
వాయువు నుండి → యజుర్వేద మంత్రములను (యజస్సులను)
ఆదిత్యుని నుండి → సామ వేదగానములను
రసముగా (సృష్టికొనసాగించటానికి) స్వీకరించారు.
ఈ విధంగా 3 వేదములు రూపుదిద్దుకున్నాయి.

స ఏతాం త్రయీం విద్యామభ్యతపత్తస్యాస్తప్యమానాయా
రసాన్ప్రావృహద్భూరిత్యృగ్భ్యో భువరితి యజుర్భ్యః స్వరితి
సామభ్యః .. 4.17.3..
3. స ఏతాం త్రయీం విద్యామ్
అభ్యతపః, తస్యాః తప్యమానాయా
రసాత్ ప్రావృహత్ ‘భూః’ ఇతి ఋగ్భ్యో।
‘భువః’ ఇతి యజుర్భ్యః।
‘‘స్వః’ ఇతి సామభ్యః।।
ఆ ‘‘ఋక్ - యజుర్ - సామ’’ త్రయీ (3) వేదములనుండి మరల తపస్సుచే ‘రసము’ను వేదసారమును స్వీకరించారు.
ఋగ్వేద ఋక్కుల నుండి - భూమి (Zone of Matter)
యజుర్వేద మంత్రముల నుండి - భువర్లోకమును (Zone of Thought)
సామవేద సామముల నుండి - ‘స్వః’ వ్యాహృతులను
(సృష్టికొరకై) తీసుకొన్నారు (స్వీకరించారు).

తద్యదృక్తో రిష్యేద్భూః స్వాహేతి గార్హపత్యే జుహుయాదృచామేవ
తద్రసేనర్చాం వీర్యేణర్చాం యజ్ఞస్య విరిష్టగ్ం సందధాతి .. 4.17.4..
4. తత్ యద్య ఋక్తో రిష్యేత్
‘‘భూస్స్వాహా’ ఇతి గార్హపత్యే జుహుయాత్।
ఋచామ్ ఏవ తత్ రసేనర్చాం, వీర్యేణర్చాం,
యజ్ఞస్య విరిష్టగ్ం సందధాతి।।
యజ్ఞములో ఋగ్వేద ఋక్కులవలన ఏవైనా దోషములు అనిపిస్తూ ఉంటే ‘‘భూస్స్వాహా’’ అని చెప్పుచూ ‘గార్హపత్యాగ్ని’లో హవిస్సులను వ్రేల్చాలి. (హోమము చేయాలి).
ఈ విధంగా ఋక్కుల సారముచే ఋక్కుల వీర్యత్వము (శక్తి)చే హోమద్రవ్యములను హోమాగ్నిలో వ్రేల్చుచుండగా ఋక్కులకు చెందిన లోటులు తొలగిపోతాయి.

స యది యజుష్టో రిష్యేద్భువః స్వాహేతి దక్షిణాగ్నౌ
జుహుయాద్యజుషామేవ తద్రసేన యజుషాం వీర్యేణ యజుషాం యజ్ఞస్య
విరిష్టగ్ం సందధాతి .. 4.17.5..
5. అథ యది యజుషో రిష్యేత్ ‘‘భువస్స్వాహా’’ ఇతి,
దక్షిణాగ్నౌ జుహుయాత్ యజుషామ్ ఏవ
తత్ రసేన యజుషాం వీర్యేణ
యజుషాం యజ్ఞస్య
విరిష్టగ్ం సందధాతి।।
అటుపై యజుర్వేద యజస్సుల (లేక) మంత్రముల కారణంగా ఏవైనా ‘లోటు’ కలుగుచుండటము గురించి - ‘దక్షిణాగ్ని’ యందు ‘‘భువస్వాహా’’ అని పలుకుచు హవిస్సులను దక్షిణాగ్నికి సమర్పించాలి. (దక్షిణాగ్నియందు హోమద్రవ్యములను వ్రేల్చాలి).
అట్టి యజస్సుల వీర్యత్వము (బలము)చే యజస్సుల దోషములు ఏమైనా ఉంటే ఆ అరిష్టములు తొలగగలవు.

అథ యది సామతో రిష్యేత్స్వః స్వాహేత్యాహవనీయే
జుహుయాత్సామ్నామేవ తద్రసేన సామ్నాం వీర్యేణ సామ్నాం యజ్ఞస్య
విరిష్టం సందధాతి .. 4.17.6..
6. అథ యది సామతో రిష్యేత్ ‘స్వః స్వాహా’ ఇతి
ఆహవనీయే జుహుయాత్,
సామ్నామ్ ఏవ తత్ రసేన,
సామ్నామ్ వీర్యేణ సామ్నామ్ యజ్ఞస్య
విరిష్టగ్ం సందధాతి।।
అప్పుడు ఇక -
సామవేద సామగాన - మంత్రములలో ఏదైనా ‘లోటు’ (యజ్ఞదోషములు) కలిగితే ‘‘స్వస్స్వాహా’’ అనే మంత్రముతో అహవనీయగ్నికి ఆహుతులు సమర్పించెదరు గాక।
అట్టి సామవేద సామముల రసము చేతను, సామ్నమంత్ర ఉచ్చారణ బలము చేతను యజ్ఞము యొక్క సర్వదోషములు తొలగుతాయి.

తద్యథా లవణేన సువర్ణగ్ం సందధ్యాత్సువర్ణేన రజతగ్ం
రజతేన త్రపు త్రపుణా సీసగ్ం సీసేన లోహం లోహేన దారు
దారు చర్మణా .. 4.17.7..
7. తత్ యథా లవణేన
సువర్ణగ్ం సందధ్యాత్,
సువర్ణేన రజతగ్ం, రజతేన త్రపు,
త్రపుణా సీసగ్ం సీసేన లోహం
లోహేన దారు దారు చర్మణా!
ఈ విషయం (దోషనివారణ) ఎటువంటిదంటే
- బంగారమును టంకము మొదలైన క్షారద్రవ్యములతో అతిగించగలము.
- వెండిని అతికించటానికి బంగారమును ఉపయోగించాలి.
- తగరమును వెండితో అతిగించగలం.
- సీసమును - తగరంచే అతిగించగలం.
- ఇతర లోహములను (ఇనుమును) - సీసముతో అతిగించగలం.
- కొయ్యను - ఇనుముతో అతిగించగలం.

ఏవమేషాం లోకానామాసాం దేవతానామస్యాస్త్రయ్యా విద్యాయా
వీర్యేణ యజ్ఞస్య విరిష్టగ్ం సందధాతి భేషజకృతో హ వా
ఏష యజ్ఞో యత్రైవంవిద్బ్రహ్మా భవతి .. 4.17.8..
8. ఏవం ఏషాం లోకానాం ఆసాం,
దేవతా నామస్య అస్త్రయ్యా,
విద్యయా వీర్యేణ యజ్ఞస్య
విరిష్టగ్ం సందధాతి,
భేషజకృతో హ వా ఏష యజ్ఞో,
యత్ర ఏవం విత్ బ్రహ్మా భవతి।।
అదే విధంగా - లోకములయొక్క దుష్టత్వము దేవతా నామముల అస్త్రములు తొలగించుతీరుగా
- వేద రూపమగు రసరూపశక్తితో (శబ్దవీర్యత్వముతో) దోషములు తొలగించవచ్చును. యజ్ఞము యొక్క లోటులను పూరించవచ్చును.

ఈ విధంగా ఋక్ - యజుర్ - సామ మంత్రములచే యజ్ఞముల లోటును పూరించగల భిషజుల (Doctor) వంటి ‘బ్రహ్మ’ ఏ యజ్ఞకార్యమును పర్యవేక్షిస్తూ ఉంటారో - అట్టి యజ్ఞము దోషరహితము కాగలదు. వ్యాహృతి హోమరూప ప్రాయశ్చిత్తము ఎరిగిన ఋత్విక్కు గల యజ్ఞము దిగ్విజయమవగలదు.

ఏష హ వా ఉదక్ప్రవణో యజ్ఞో యత్రైవంవిద్బ్రహ్మా భవత్యేవంవిదగ్ం
హ వా ఏషా బ్రహ్మాణమనుగాథా యతో యత ఆవర్తతే
తత్తద్గచ్ఛతి .. 4.17.9..
9. ఏష హ వా ఉదక్ ప్రవణో యజ్ఞో
యత్ర ఏవం విత్ బ్రహ్మా భవతి।
ఏవం విదగ్ం హ వా ఏషా
బ్రహ్మాణమ్ అనుగాథా
యతో యత ఆవర్తతే,
తత్ తత్ గచ్ఛతి।
ఒక మంచి గుఱ్ఱము సరి అయిన సమయంలో రౌతును రక్షిస్తుంది కదా! అట్లాగే బ్రాహ్మణములు, అంతరార్థములు ఎరిగిన ఋత్విక్కు మాత్రమే యజ్ఞమును, యజమానిని, తదితరులందరినీ యజ్ఞం జరుగు పర్యంతము కాపాడుతూ ఉండగలడు.
ఆతడు యజ్ఞములో ఎక్కడెక్కడ ఎంతెంతవరకు సరిచేయుట అవసరమైయున్నదో - అక్కడక్కడకు వెళ్లి పొరపాటులను, లోటులను సరిచేయగలడు. అందరికీ శాస్త్రీయతను బోధించి, యజ్ఞమును నడిపించగలడు.

మానవో బ్రహ్మైవైక ఋత్విక్కురూనశ్వాభిరక్షత్యేవంవిద్ధ
వై బ్రహ్మా యజ్ఞం యజమానగ్ం సర్వాగ్ంశ్చర్త్విజోఽభిరక్షతి
తస్మాదేవంవిదమేవ బ్రహ్మాణం కుర్వీత నానేవంవిదం నానేవంవిదం .. 4.17.10..

.. ఇతి చతుర్థోఽధ్యాయః ..
10. మానవో బ్రహ్మ ఏవ ఏక ఋత్విక్ కురూన్
అశ్వా అభిరక్షతి ఏవం విద్ధ వై
బ్రహ్మా యజ్ఞం యజమానగ్ం
సర్వాగ్ంశ్చః ఋత్విజో అభిరక్షతి।।
మానవీయుడగు బ్రహ్మ ఒక్కడే ఋత్విక్కు. అందరికీ యజ్ఞవిధులలో రక్షకుడు. అశ్వమును రక్షించుచున్నారు.
- బ్రహ్మయజ్ఞమును / (బ్రహ్మతత్త్వము) తెలియజేయుచున్నారు.
- యజమానిని అపరాధములను నివృత్తింపజేయుచున్నాడు.
- సర్వజనులను శ్రద్ధావంతులుగా చేయుచున్నాడు.
ద్విజుడై అన్నివైపులా రక్షించగలడు.
తస్మాత్ ఏవం విదం ఏవ బ్రహ్మాణం కుర్వీత
నానేవం విదం। నానేవం విదం।।
కాబట్టి యజ్ఞముయొక్క విధివిధానమంతా అంతర్హృదయముతో సహా చక్కగా తెలిసియున్నవానిని మాత్రమే యజమాని బ్రహ్మగా నియమించుకోవాలి. యజ్ఞవిధిని తెలియనివానిని బ్రహ్మగా నియమించుకోకూడదు. ఇది యజ్ఞవిధి సూచనము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - చతుర్థాధ్యాయే సప్తదశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది - చతుర్థ అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅴ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - ఐదవ అధ్యాయము

5–1. పంచమ ప్రపాఠకః - ప్రథమ ఖండము - ప్రాణదేవతా ఉపాసన


.. పంచమోఽధ్యాయః ..

యో హ వై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద జ్యేష్ఠశ్చ హ వై శ్రేష్ఠశ్చ
భవతి ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ .. 5.1.1..
1. ఓం।
యో హ వై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద,
జ్యేష్ఠశ్చ హ వై శ్రేష్ఠశ్చ భవతి।
ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ।।
ఎవ్వరైతే సర్వజ్యేష్ఠమైనది, సమస్తమునకు శ్రేష్ఠమైనది తెలుసుకుంటాడో - అట్టివాడు అంతటా జ్యేష్ఠుడై, శ్రేష్ఠుడై ఉండగలడు.
ప్రాణమే సర్వదా జ్యేష్ఠము, శ్రేష్ఠము కూడా

యో హ వై వసిష్ఠం వేద వసిష్ఠో హ స్వానాం భవతి
వాగ్వావ వసిష్ఠః .. 5.1.2..
2. యో హ వై వసిష్ఠం వేద, వసిష్ఠో
హ స్వానాం భవతి।
వాగ్వావ వసిష్ఠః।

ఎవ్వరైతే వసిష్ఠుని (మిక్కిలి శ్రేష్ఠుని) తెలుసుకొనుచున్నాడో, ఆతడు వసిష్ఠుడే (అందరిలో శ్రేష్ఠుడు) అగుచున్నాడు.
వాక్కుయే వసిష్ఠము।


యో హ వై ప్రతిష్ఠాం వేద ప్రతి హ తిష్ఠత్యస్మిగ్ంశ్చ
లోకేఽముష్మిగ్ంశ్చ చక్షుర్వావ ప్రతిష్ఠా .. 5.1.3..
3. యో హ వై ప్రతిష్ఠాం వేద
ప్రతి హ తిష్ఠతి అస్మిగ్ంశ్చ,
లోకే అముష్మిగ్ంశ్చ।।

చక్షుర్వావ ప్రతిష్ఠా।
ఎవ్వరైతే ప్రతిష్ఠమైనది (స్థిరత్వమును ఇచ్చునది) తెలుసుకొంటాడో, అట్టివాడు చంచలములను జయించి సుప్రతిష్ఠితుడు అగుచున్నాడు. అట్టివాడు ఐహిక - ఆముష్మికములందు ప్రతిష్ఠితుడు (Wel-Placed) అగుచున్నాడు.
(యథాతథంగా ఉంటూనే అనేక వేరువేరు విషయములు చూడగలదు కాబట్టి -) ఈ నేత్రములే ప్రతిష్ఠితము.

యో హ వై సంపదం వేద సగ్ంహాస్మై కామాః పద్యంతే
దైవాశ్చ మానుషాశ్చ శ్రోత్రం వావ సంపత్ .. 5.1.4..
4. యో హ వై సంపదం వేద
సగ్ం హ అస్మై కామాః
పద్యంతే దైవాశ్చ, మానుషాశ్చ।।
శ్రోత్రం వావ సంపత్।।
ఎవరైతే వాస్తవమైన ‘సంపద’ ఏదో - అది తెలుసుకుంటాడో - అట్టి వానిని దేవతలు కోరికలు తీర్చుకొన్న వారుగా చేయగలరు. అన్ని కోర్కెలు తీర్చగలరు.
వేదముల శ్రవణము, గురువులు చెప్పు సద్బోధ వినగలగటమే సంపద. అందుచేత జీవునకు చెవులే - నిజమైన సంపద।

యో హ వా ఆయతనం వేదాయతనగ్ం హ స్వానాం భవతి
మనో హ వా ఆయతనం .. 5.1.5..
5. యో హ వా ఆయతనం వేద
ఆయతనగ్ం హ స్వానాం భవతి।।

‘మనో’ హ వా ఆయతనమ్।।
ఎవ్వడైతే - అన్నీ కూడా దేనిని ఆశ్రయించినవై ఉంటున్నాయో - అట్టి ‘ఆయతనము’ను తెలుసుకుంటాడో, అట్టివాడు - తదితరులకు ఆయతనుడు (ఆశ్రయింపతగినవాడు) అయి ప్రకాశిస్తున్నాడు.
(ఇంద్రియములకు భోక్త మనస్సు. ఇంద్రియములు దృశ్యమునుండి తెచ్చే సమాచారమంతా మనస్సుకే చేర్చబడుతోంది. కనుక మనోవృత్తుల రూపమగు) మనస్సే ఆయతనము (సర్వాశ్రయము).

అథ హ ప్రాణా అహగ్ంశ్రేయసి వ్యూదిరేఽహగ్ంశ్రేయానస్మ్యహగ్ం
శ్రేయానస్మీతి .. 5.1.6..
6. అథ హ ప్రాణా అహగ్ం
శ్రేయసి ‘వ్యూదిరే అహగ్ం’
శ్రేయానస్మి అహగ్ం।
శ్రేయాన్ అస్మి ఇతి।।
ఒకప్పుడు ప్రాణశక్తి సమన్వితములగు ఇంద్రియములన్నీ ఒకచోట సమావేశమైనాయి. ఒక్కొక్క ఇంద్రియము ‘‘నేనే జీవునికి ముఖ్య శ్రేయము’’ కలుగజేస్తున్నాను. ‘‘శ్రేయోదాయకుడిని నేనే’’ - అని ఎవరికివారే (కళ్ళు, చెవులు, నోరు మొదలైనవి) వివాదము పొందసాగాయి.

తే హ ప్రాణాః ప్రజాపతిం పితరమేత్యోచుర్భగవన్కో నః
శ్రేష్ఠ ఇతి తాన్హోవాచ యస్మిన్వ ఉత్క్రాంతే శరీరం
పాపిష్ఠతరమివ దృశ్యేత స వః శ్రేష్ఠ ఇతి .. 5.1.7..
7. తే హ ప్రాణాః ప్రజాపతిం
పితరమ్ ఏతి ఊచుః
‘‘భగవాన్। కో నః శ్రేష్ఠ? ఇతి।
తాన్ హ ఉవాచ :
‘‘యస్మిన్ వ ఉత్క్రాన్తే
శరీరం ‘పాపిష్ఠతరమ్’ ఇవ
దృశ్యేత, స వః శ్రేష్ఠ।’’
ఇతి।।
అప్పుడు ప్రాణశక్తి రూపములగు ఇంద్రియ దేవతలందరు పితృదేవులగు సృష్టికర్త వద్దకు వెళ్లారు. ఈవిధంగా అడిగారు.

‘‘హే భగవాన్। పితృదేవా! శరీరములో గొప్ప ధర్మములు (Functions) నిర్వర్తిస్తూ ఉన్న మాలో గొప్పవారు ఎవ్వరో శ్రేష్ఠులెవరో జ్యేష్ఠులెవరో కొంచం వివరించి చెప్పండి."

ప్రజాపతి: ఓ! అదా! వినండి, చెపుతాను. మీలో ఎవ్వరు దేహమును వదలి లేచిపోతే శరీరము అత్యంత అశుచి అయి, పాపభూయిష్ఠము, (ఆవల పారవేయవలసినది) అవుతుందో - వారే శ్రేష్ఠులు. సరేనా?

ఇంద్రియములు తిరిగివచ్చి దేహములో ప్రవేశించాయి.

సా హ వాగుచ్చక్రామ సా సంవత్సరం ప్రోష్య పర్యేత్యోవాచ
కథమశకతర్తే మజ్జీవితుమితి యథా కలా అవదంతః
ప్రాణంతః ప్రాణేన పశ్యంతశ్చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ
ధ్యాయంతో మనసైవమితి ప్రవివేశ హ వాక్ .. 5.1.8..
8. సా హ ‘వాక్’ ఉచ్చక్రామ,
సా సంవత్సరం
ప్రోష్య పర్యేత్య ఉవాచ
‘‘కథమ్ అశకతర్తే
మజ్జీవితుమ్?’’ - ఇతి।

యథా కలా అవదన్తః।
ప్రాణంతః ప్రాణేన
పశ్యంతః చక్షుషా
శృణ్వంతః శ్రోత్రేణ
ధ్యాయంతో మనసైవమ్।

ఇతి ప్రవివేశ హ వాక్।
[వాగింద్రియ దేవత]
అప్పుడు ‘‘వాక్కు(Talking)" శరీరమును విడచి పైకి వెళ్లింది. మరల సంవత్సరము తరువాత తిరిగి వచ్చింది.

వాక్ దేవత : ఓ తదితర ఇంద్రియములారా ‘‘నేను లేనప్పుడు కూడా మీరు ఈ శరీరములో ఎట్లా జీవిస్తున్నారు? ఈ శరీరము ఇంకా జీవిస్తూ ఉన్నదేమిటి? నాకు ఆశ్చర్యమేస్తోంది.

తక్కిన ఇంద్రియములు : ఓ వాక్ ఇంద్రియ దేవతా! ఒక మూగవాడు ప్రాణము కలిగి, ప్రాణముల శక్తిచే కళ్ళతో చూస్తూ, చెవులతో వినుచూ, మనసుతో ధ్యాసలు కలిగి ఉండనే ఉంటాడు కదా! అట్లాగే, ఈ జీవుడు వాక్కు తొలగినప్పటికీ శరీరముతో జీవించియే ఉన్నాడు.

అప్పుడు వాక్కు తిరిగి శరీరములో ప్రవేశించి - (నేను లేకున్నా ఈ జీవుడు జీవించియే ఉన్నాడు, కాబట్టి అత్యంత శ్రేష్ఠుడను కాదు - అని తలచింది)

చక్షుర్హోచ్చక్రామ తత్సంవత్సరం ప్రోష్య పర్యేత్యోవాచ
కథమశకతర్తే మజ్జీవితుమితి యథాంధా అపశ్యంతః
ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా శృణ్వంతః శ్రోత్రేణ
ధ్యాయంతో మనసైవమితి ప్రవివేశ హ చక్షుః .. 5.1.9..
9. చక్షుః హ ఉచ్చక్రామ
తత్ సంవత్సరం
ప్రోష్య పర్యేత్య ఉవాచ :

‘‘కథమ్ అశకతర్తే
మజ్జవితుమ్?’’ - ఇతి।
[చక్షురింద్రియము]
అప్పుడు చక్షు (చూపుదేవత) - (‘‘నేను లేకపోతే ఈ దేహము అశుచి, నిస్తేజము అవుతుంది కదా’’ అని తలచి) - ఆ జీవుని దేహమును వదలి పైకివెళ్లి పోయింది. ఒక సంవత్సరము తరువాత తిరిగి శరీరమును సమీపించింది. అప్పటికీ ఆ శరీరి జీవిస్తూనే ఉన్నాడు.

చక్షురింద్రియ దేవత : ఓ తదితర ఇంద్రియములారా! నేను సంవత్సరకాలం లేకపోయినా ఈ దేహము శిథిలం కాలేదే? మీరంతా ఎటూ పోలేదే? ఈ సంవత్సరకాలం ఈ జీవుడు ఏదీ చూడలేకపోయాడు కదా।
‘‘యథా అంధా అపశ్యంతః।’’
ప్రాణంతః ప్రాణేన వదంతో
వాచా, శృణ్యంతః శ్రోత్రేణ
ధ్యాయంతో మనస ఏవం ఇతి
తదితర ఇంద్రియములు : ఓ చక్షుదేవతా! ఏదైనా కారణం చేత ఒకనికి చూపుపోయిందనుకోండి. ఆతని ప్రాణము, ప్రాణిగా ఆతడు వాక్కు, చెవులతో శ్రవణము, మనసుతో ధ్యానము కొనసాగుతూనే ఉంటుంది కదా! అదేవిధంగా మీరు శరీరంను వీడి పైకి వెళ్లినప్పుడు ప్రాణము, ప్రాణశక్తులైన వినికిడి, వాక్కు, శ్రవణము - ఇవన్నీ కొనసాగుచూనే ఉన్నాయి.
ప్రవివేశ హ చక్షుః।।
అప్పుడు చక్షు శక్తి (చూపు) నేను లేనంతమాత్రంచేత తదితర శరీరం నిష్ప్రయోజనం కాదన్నమాట అనుకొన్నది. శరీరములో పునః ప్రవేశించింది.

శ్రోత్రగ్ం హోచ్చక్రామ తత్సంవత్సరం ప్రోష్య పర్యేత్యోవాచ
కథమశకతర్తే మజ్జీవితుమితి యథా బధిరా అశృణ్వంతః
ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా
ధ్యాయంతో మనసైవమితి ప్రవివేశ హ శ్రోత్రం .. 5.1.10..
10. శ్రోత్రగ్ం హ ఉచ్చక్రామ।
తత్ సంవత్సరం ప్రోష్య పర్యేత్య - ఉవాచ :-
‘‘కథం అశకతర్తే మజ్జీవితుమ్?’’ - ఇతి।
యథా బధిరా అశృణ్వంతః।
ప్రాణన్తః ప్రాణేన వదంతో వాచా
పశ్యంతః చక్షుషా
ధ్యాయంతో మనసైవమ్ ఇతి ప్రవివేశ హ శ్రోతమ్।
శ్రవణ (వినికిడి, చెవి) దేవత అప్పుడు శరీరమునుండి బయల్వెడలి సంవత్సరకాలం తరువాత మరల శరీరమును సమీపించింది.
నేను సంవత్సరకాలం ఈ శరీరం వదలివేసి ఉన్నా కూడా ఇది ఎట్లా మనగలుగుతోంది? ‘‘ప్రాణము, చూపు, స్పర్శ మొదలైనవన్నీ ఎట్లా ఉండి ఉన్నాయి?
తదితర ఇంద్రియముల సమాధానం: ‘‘ఒకడు చెవిటివాడు అయినప్పటికీ ప్రాణము, మనస్సు, ఆలోచన మొదలైనవి ఉంటాయి కదా! ఇదీ అంతే।’’ అప్పుడు వినికిడి తిరిగి శరీరంలో ప్రవేశించింది.

మనో హోచ్చక్రామ తత్సంవత్సరం ప్రోష్య పర్యేత్యోవాచ
కథమశకతర్తే మజ్జీవితుమితి యథా బాలా అమనసః
ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా
శృణ్వంతః శ్రోత్రేణైవమితి ప్రవివేశ హ మనః .. 5.1.11..
11. మనో హ ఉచ్చక్రామ।
తత్ సంవత్సరం ప్రోష్య
పర్యేత్య ఉవాచ :
‘‘కథమ్ అశకతర్తే మజ్జీవితుమ్’’ - ఇతి
అప్పుడు మనస్సు దేహమును విడచి ఎటో వెళ్లిపోయింది. ఒక సంవత్సరకాలం తరువాత తిరిగివచ్చింది.
మనస్సు : ఇదేమిటి? నేను సంవత్సర కాలము ఈ దేహమును త్యజించినప్పటికీ ఇది ఇంకా కూడా జీవించి ఎట్లా ఉండగలిగింది? మీరంతా ఎట్లా ఈ దేహంలో ఉండగలిగారు?
‘‘యథా బాలా అమనసః’’।
ప్రాణంతః ప్రాణేన
వదంతో - వాచా,
పశ్యంతః - చక్షుషా,
శృణ్వంతః - శ్రోత్రేణైవమ్ ఇతి
ప్రవివేశ హ మనః।।
సమాధానము : మనస్సు ఏమాత్రము వికసించని, అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణశక్తితో వినటము, ఏడవటము, నొప్పి అనుభవించటము, ఆకలి, చూడటము - చేయటం లేదా? అట్లాగే మనస్సు సంవత్సర కాలం లేనప్పటికీ ఈ దేహము ప్రాణశక్తితో (ప్రాణములు కలిగి ఉండి) మాట్లాడుతోంది, చూస్తోంది, వింటోంది, వినిపిస్తోంది.

అప్పుడు మనస్సు, మరల శరీరములో ప్రవేశించింది. తాను లేనంతమాత్రంచేత శరీరము నశించదు కాబట్టి తాను సర్వ శ్రేష్ఠము కాదని గమనించింది.

అథ హ ప్రాణ ఉచ్చిక్రమిషన్స యథా సుహయః
పడ్వీశశంకూన్సంఖిదేదేవమితరాన్ప్రాణాన్సమఖిదత్తగ్ం
హాభిసమేత్యోచుర్భగవన్నేధి త్వం నః శ్రేష్ఠోఽసి
మోత్క్రమీరితి .. 5.1.12..
12. అథ హ ప్రాణ ఉత్ చక్రమిషన్ సః।
యథా సు-హయః
పడ్వీశ శంకూన్ సంఖిదేత్
ఏవమ్ ఇతరాన్
ప్రాణాన్ సమఖిదత్।
తగ్ం హ అభిసమేత్య ఊచు :-
‘‘భగవన్! నేధి! త్వం నః శ్రేష్ఠోఽసి।
మా ఉత్క్రమీః ఇతి।
అప్పుడు ముఖ్యప్రాణము శరీరమునుండి నిష్క్రమించటానికి సంసిద్ధమవసాగింది.
ఒక ఉత్తమమైన గుర్రము తనను కాళ్ళు కట్టి ఉంచిన గింజను పెరికి ఛంగ్‌న బయలుదేరుచున్నది చూచారా!
అట్లా ప్రాణము బయటకు వెళ్లటానికి ఉద్యమిస్తూ ఉండగా శరీరములోని చూపు, వినికిడి, మాట, ఆలోచన - భావన - స్పర్శ - మొదలైనవి కూడా దేహము నుండి పెరికివేయబడసాగాయి.

అప్పుడా ఇంద్రియశక్తులన్నీ (పంచేంద్రియములు) మనస్సుతో సహా ప్రాణదేవతను సమీపించి ఇట్లా పలికాయి.
‘‘భగవాన్! ప్రాణదేవా! మీరు ఈ శరీరంలో శ్రేష్ఠులు, జ్యేష్ఠులు అయి ఉన్నారు. ఇది ఇప్పుడు మేము గమనిస్తున్నాము. దయచేసి శరీరమునుండి బయటకు వెళ్ళకండి. మీరు ఉంటేనే మేము దేహములో మనగలమని తెలుసుకున్నాము’’.

అథ హైనం వాగువాచ యదహం వసిష్ఠోఽస్మి త్వం
తద్వసిష్ఠోఽసీత్యథ హైనం చక్షురువాచ యదహం
ప్రతిష్ఠాస్మి త్వం తత్ప్రతిష్ఠాసీతి .. 5.1.13..
13. అథ హ ఏనం వాక్ ఉవాచ:-
‘‘యత్ అహం వసిష్ఠో అస్మి
త్వం తత్ వసిష్ఠో అసి’’ ఇతి।
అథ హ ఏనం చక్షుః ఉవాచ :-
‘‘యత్ అహం ప్రతిష్ఠాఽస్మి।
త్వం తత్ ప్రతిష్ఠా అసి’’। ఇతి।।
ఇంద్రియములు ప్రాణదేవతను ఇట్లా స్తుతించాయి.

వాక్కు : నేను ఈ దేహములో వసిష్ఠుడను (అందరికంటే పెద్దవాడను) అయి ఉన్నమాట నిజమే. అయితే మీరు దేహంలో ప్రతిష్ఠితులై ఉండబట్టే నేను వసిష్ఠుడను.
చక్షువులు : నేను దేహంలో ప్రతిష్ఠుడనై ఉన్న మాట నిజమేకాని, అదంతా మీయొక్క ‘‘ప్రతిష్ఠ’’ యొక్క ప్రభావమే

అథ హైనగ్ంశ్రోత్రమువాచ యదహం సంపదస్మి త్వం
తత్సంపదసీత్యథ హైనం మన ఉవాచ యదహమాయతనమస్మి
త్వం తదాయతనమసీతి .. 5.1.14..
14. అథ హ ఏనగ్ం శ్రోత్రమ్ ఉవాచ:
‘‘యత్ అహగ్ం ‘సంపద్’ అస్మి,
త్వం తత్ సంపద్ అసి ఇతి।
అథ హ ఏనం ‘మన’ ఉవాచ :-
యత్ అహమ్ ‘ఆయతనమ్’
అస్మి త్వం తత్ ఆయతనమ్ అసి ఇతి।।
శ్రోతము (వినికిడి - చెవులు) : నేను ఈ దేహముయొక్క ‘సంపద’ అయి ఉండటమనేది - అదంతా కూడా - ప్రాణదేవా! మీరు సంపద కలిగి ఉండటం చేతనే।
మనస్సు : ఓ ప్రాణదేవా! సమస్తమునకు మీరే ఆధారము అయి ఉండగా, ఆ ఆధారమే (ఆశ్రయమే) నాచే ప్రదర్శించబడుతోంది.

న వై వాచో న చక్షూగ్ంషి న శ్రోత్రాణి న
మనాగ్ంసీత్యాచక్షతే ప్రాణా ఇత్యేవాచక్షతే ప్రాణో
హ్యేవైతాని సర్వాణి భవతి .. 5.1.15..

.. ఇతి ప్రథమః ఖండః ..
15. న వై వాచో, న చక్షూగ్ంషి
న శ్రోత్రాణి, న మనాగ్ంసి ఇతి అచక్షతే।।

‘‘ప్రాణా’’ ఇత్యేవ ఆచక్షతే।
ప్రాణో హి ఏవ ఏతాని
సర్వాణి భవతి।
ఈ విధంగా వాక్కుగాని, కళ్ళుగాని, చెవులుగాని, ఆలోచన (మనస్సు)గాని స్వయముగా చైతన్యవంతము కావు. స్వయంగా శక్తి కలిగియున్నవి కావు. అందుచేత జీవుడు అనగా ‘‘వాక్కు, కళ్ళు, చెవులు, ఆలోచన’’ - అని అనరు.
‘‘ప్రాణమే - జీవుడు’’ అనబడుచున్నాడు.
ప్రాణశక్తియే శరీరంలో వాక్కుగాను, చూపుగాను, వినికిడిగాను ఆలోచన (మనస్సు)గాను ప్రదర్శనం అగుచున్నది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ప్రథమః ఖండః


5–2. పంచమ ప్రపాఠకః - ద్వితీయ ఖండము - ప్రాణ విద్య


స హోవాచ కిం మేఽన్నం భవిష్యతీతి యత్కించిదిదమా
శ్వభ్య ఆ శకునిభ్య ఇతి హోచుస్తద్వా ఏతదనస్యాన్నమనో
హ వై నామ ప్రత్యక్షం న హ వా ఏవంవిది కించనానన్నం
భవతీతి .. 5.2.1..
1. స హ ఉవాచ :-
కిం మే అన్నం భవిష్యతి - ఇతి।।
యత్ కించిత్ ఇదమా
శ్వభ్య ఆ శకునిభ్య
ఇతి హ ఊచుః।
ప్రాణదేవత : ఓ ఇంద్రియములారా! నాకు ఏది అన్నము (ఆహారము) కాగలదు? మరి నన్ను శరీరంలో ఉండిపోమంటున్నారు కదా! నాకు ఆహారము ఏది?
ఇంద్రియములు : ప్రాణేశ్వరా! ఒక కుక్క నుండి పక్షివరకు ఏదేది అన్నము (ఆహారము) అగుచున్నదో అదంతా మీరు స్వీకరిస్తున్న ఆహారమే కదా!
తద్వా ఏతత్ అనస్య అన్నమ్।
అనో హ వై నామ ప్రత్యక్షం।
న హ వా ఏవంవిది

కించన అనన్నం భవతి - ఇతి।।
ఈ విధంగా ప్రాణదేవతకు సర్వేంద్రియ విషయములు ఆహారమే। - ఇంద్రియములకు ప్రత్యక్షమైనదంతా ఆహారమే। ఈ దృశ్య జగత్తులో ప్రాణములకు ఆహారము కానిదంటూ ఏదీ లేదు. అనన్నము ఏదీ లేదు.
‘‘ప్రాణములకు సమస్తము అన్నమే’’ అని తెలుసుకొన్నవానికి ఇంద్రియములకు విషయమగుచున్న ఈ జగద్దృశ్యమంతా ‘అన్నము’గా అగుచున్నది.

స హోవాచ కిం మే వాసో భవిష్యతీత్యాప ఇతి
హోచుస్తస్మాద్వా ఏతదశిష్యంతః
పురస్తాచ్చోపరిష్టాచ్చాద్భిః పరిదధతి
లంభుకో హ వాసో భవత్యనగ్నో హ భవతి .. 5.2.2..
2. స హ ఉవాచ :-
కిం మే వాసో భవిష్యతి? ఇతి
‘ఆపః।’ - ఇతి హ ఊచుః
ప్రాణదేవత : సరే"! మరి నాకు ధరించటానికి వస్త్రము ఏది?
ఇంద్రియములు : ప్రాణదేవా! జలమే మీరు ధరించు వస్త్రము.
తస్మాత్ వా ఏతత్ అశిష్యంతః
పురస్తాత్ చ ఉపరిష్టాత్ చ
అద్భిః, పరిదధతి
లంభుకో హ వాసో
భవతి అనగ్నో హ భవతి।।
ఈ కారణం చేతనే భోజనానికి కూర్చున్నవారు
- భోజనానికి ముందుగా - భుజించిన తరువాత - కూడా అన్నమును జలముతో ఆచ్ఛాదిస్తున్నారు.
‘‘అట్టి ఆచమనమే ప్రాణమునకు వస్త్రము’’ అని ఎవ్వరు తెలుసుకొంటారో, వారికి వస్త్రములు అక్షయముగా లభించగలదు. వారు ఎప్పటికీ నగ్నముగా ఉండవలసిన పని ఉండదు.

తద్ధైతత్సత్యకామో జాబాలో గోశ్రుతయే వైయాఘ్రపద్యాయోక్త్వోవాచ
యద్యప్యేనచ్ఛుష్కాయ స్థాణవే బ్రూయాజ్జాయేరన్నేవాస్మింఛాఖాః
ప్రరోహేయుః పలాశానీతి .. 5.2.3..
3. తద్ధైతత్ (తత్ హి ఏతత్) సత్యకామో జాబాలో

గో శ్రుతయే వైయాఘ్రపద్యాయ
ఉక్త్వ ఉవాచ।।

యద్యపి ఏతత్ శుష్కాయ స్థాణవే బ్రూయాత్
జాయేరన్ ఏవ అస్మిన్ శాఖాః ప్రరోహేయుః
పలాశాని - ఇతి।।
మనము చెప్పుకొన్న ఈ ‘‘ప్రాణవిద్య’’ను జగద్గురువగు శ్రీ సత్యకామ జాబాలుడు - తనను ప్రాణతత్త్వము గురించి శ్రవణము చేయటానికి వచ్చి ఆశ్రయించిన వ్యాఘ్రపదుని కుమారుడగు గోశ్రుతి… అనే వారికొరకు కూడా ఉపదేశించారు.

సత్యకామ జాబాల : ఓ ప్రియ వ్యాఘ్రపద ప్రియకుమారుడవగు గోశ్రుతా! ఈ ‘ప్రాణవిద్య’ను మీరు ఎండిపోయిన మ్రానుకు చెప్పటం జరిగినా సరే - ఆ ఎండిపోయిన చెట్టు మరల చిగురించగలదు। ఇతి ఫలశ్రుతి।

అథ యది మహజ్జిగమిషేదమావాస్యాయాం దీక్షిత్వా పౌర్ణమాస్యాగ్ం
రాత్రౌ సర్వౌషధస్య మంథం దధిమధునోరుపమథ్య జ్యేష్ఠాయ
శ్రేష్ఠాయ స్వాహేత్యగ్నావాజ్యస్య హుత్వా మంథే
సంపాతమవనయేత్ .. 5.2.4..
4. అథ యది మహత్ జిగమిషేత్
అమావాస్యాయాం
దీక్షిత్వా పౌర్ణమాస్యాగ్ం
రాత్రౌ సర్వ - ఔషధస్య
మంథం దధి మధునోః
ఉపమథ్య
పైన చెప్పబడ్డ ప్రాణవిద్యామంత్రములన్నీ కూడా మహత్వసిద్ధులు ప్రసాదించగలిగినట్టివిగా మంత్రశాస్త్రవేత్తలచే ఉచ్చరించ బడుచున్నాయి. ‘‘మంథనము’’ అనే యజ్ఞములో విధి విధానములుగా చెప్పబడుచున్నాయి.

ప్రాణవిజ్ఞానము తెలిసినవారు - మహత్వసిద్ధి కొరకు ఈ యజ్ఞ
విధానము ఆచరించుచున్నారు. ఆ విధానము చెప్పుకుందాము.

మహత్ సిద్ధికొరకై - అమావాస్య రోజున ‘యజ్ఞదీక్ష’ను స్వీకరించాలి.
‘‘జ్యేష్ఠాయ - శ్రేష్ఠాయ
స్వాహా’’ - ఇతి అగ్నావాజ్యస్య
హుత్వా మంథే
సంపాతమ్ అవనయేత్।।
- 15 రోజులు దీక్షగా గడిపి పౌర్ణమినాటి రాత్రి యందు
☘︎ పెరుగు - తేనెలో నవధాన్యములు పిండిని - వీటన్నిటినీ పిష్ఠము (ముద్ద)గా చేయాలి (మంథపిష్ఠము).
☘︎ అట్టి పిష్ఠమును జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు అగు ప్రాణదేవతకు నివేదనగా సమర్పించాలి.

హవిస్సును యజ్ఞాగ్నికి ‘‘జ్యేష్ఠాయ - శ్రేష్ఠాయ స్వాహా’’ అని మంత్రములను పలుకుచూ అగ్నికి ఆజ్యము (నేయి) సమర్పించాలి. ఆ తరువాత మాలిన్యము తీసి వేరేచోట ఉంచాలి.

వసిష్ఠాయ స్వాహేత్యగ్నావాజ్యస్య హుత్వా మంథే
సంపాతమవనయేత్ప్రతిష్ఠాయై స్వాహేత్యగ్నావాజ్యస్య హుత్వా
మంథే సంపాతమవనయేత్సంపదే స్వాహేత్యగ్నావాజ్యస్య హుత్వా
మంథే సంపాతమవనయేదాయతనాయ స్వాహేత్యగ్నావాజ్యస్య హుత్వా
మంథే సంపాతమవనయేత్ .. 5.2.5..
5. ‘‘వసిష్ఠాయ స్వాహా।’’ - ఇతి
అగ్నావాజ్యస్య హుత్వా
మంథే సంపాతమ్ అవనయేత్
‘‘ప్రతిష్ఠాయై స్వాహా’’ ఇతి
‘‘వసిష్ఠాయ స్వాహా’’ ( వసిష్ఠము - అంతటికి పెద్దదైనట్టి దానికొరకు హోమద్రవ్యము సమర్పిస్తున్నాను) అని మరల మంత్రములతో అగ్నితో నేతిని వ్రేల్చుచూ, మంథపిష్ఠముపై నేతిని సంప్రోక్షించాలి.

‘‘ప్రతిష్ఠా ప్రాణదేవతకు సమర్పిస్తున్నాము’’ అంటూ అగ్నికి సమర్పించి పిష్ఠముపై కూడా నేతిబొట్లు వేయాలి.
అగ్నా వాజ్యస్య హుత్వా
మంథే సంపాతమ్
అవనయేత్ సంపదే స్వాహా ఇతి।
అట్లాగే ‘‘సంపదాయ స్వాహా’’ మంత్రము ఉచ్చరిస్తూ, అగ్నికి నేయి హోమం చేస్తూ మంథపిష్ఠముపై నేయిబొట్లు వదలాలి.
సంపత్ గుణ సమన్వితమగు ప్రాణదేవతకు ఆహుతులు సమర్పిస్తూనే, సంపదే స్వాహా అంటూ మంథ పిష్ఠముపై కూడా నేయి బొట్లు విడువాలి.
‘‘ఆదాయతనాయ స్వాహా’’ ఇతి।
అగ్నా వాజ్యస్య హుత్వా
మంథే సంపాతమ్ అవనయేత్।।
‘‘ఆదాయము (సమస్తమునకు ఆశ్రయము, ఆధారము) అగు ప్రాణ దేవతకు సమర్పిస్తున్నాను’’ - అని పలుకుచూ (‘‘ఆదాయనాయ స్వాహా’’ అని మంత్రము చదువుచూ) స్రువముతో నేయిని తీసుకొని హోమాగ్నికి సమర్పించాలి. స్రువమునకు అతుక్కుకొని ఉన్న నేతి బొట్లను మంథపిష్ఠముపై వేయాలి. శ్రువమున శేషించిన నేతి చుక్కలు సంపాతము చేయాలి (చల్లాలి).

అథ ప్రతిసృప్యాంజలౌ మంథమాధాయ జపత్యమో నామాస్యమా
హి తే సర్వమిదగ్ం స హి జ్యేష్ఠః శ్రేష్ఠో రాజాధిపతిః
స మా జ్యైష్ఠ్యగ్ం శ్రైష్ఠ్యగ్ం రాజ్యమాధిపత్యం
గమయత్వహమేవేదగ్ం సర్వమసానీతి .. 5.2.6..
6. అథ ప్రతిసృప్య అంజలౌ
మంథమ్ ఆధాయ జపతి।
ఆ తరువాత అగ్నిగుండమునకు కొంచము దూరముగా జరిగి, మంథన మలిన భస్మమును దోసిలియందు ఉంచుకొని ఇట్లా ప్రార్థించాలి.
‘‘అమో’’ నామ అసి।
అమా హి తే సర్వం ఇదమ్।।
స హి జ్యేష్ఠః శ్రేష్ఠః ।।
రాజా అధిపతిః సః మా
జ్యైఇష్ఠ్యగ్ం శ్రైష్ఠ్యగ్ం।
ఓ ప్రాణదేవా! మీరు ‘అమో’ అనే పేరు గలవారు. (ప్రాణము ఆహారము వెంటనంటి దేహమునందు సంచరిస్తూ ఉండటంచేత) మంథద్రవ్యము అగ్నికి ఆహారము కాబట్టి ‘ఆమో’ అని అగ్ని పిలువబడుతోంది.
‘‘సర్వమిదదగ్ం స హి జ్యేష్ఠః శ్రేష్ఠో రాజ్యాధిపతిః’’ - అను మంత్రముతో ‘‘ఓ ప్రాణదేవా? మీరు జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, ఈ దేహరాజ్యమునకు అధిపతులు కూడా!" - అని భావిస్తూ పూజించాలి.
రాజ్యమ్ ఆధిపత్యం గమయతి।
అహమేవ ఇదగ్ం
సర్వమ్ అసాని। - ఇతి।।
ఓ ప్రాణదేవా! ప్రకాశమానులగు మీరు నాకు జ్యేష్ఠత్వము, శ్రేష్ఠత్వము ఈ శరీరముపై ఆధిపత్యము ప్రసాదించండి। సర్వము అగు ఆత్మయే నేనై ఉండెదను గాక.

అథ ఖల్వేతయర్చా పచ్ఛ ఆచామతి తత్సవితుర్వృణీమహ
ఇత్యాచామతి వయం దేవస్య భోజనమిత్యాచామతి శ్రేష్ఠగ్ం
సర్వధాతమమిత్యాచామతి తురం భగస్య ధీమహీతి సర్వం పిబతి
నిర్ణిజ్య కగ్ంసం చమసం వా పశ్చాదగ్నేః సంవిశతి చర్మణి వా
స్థండిలే వా వాచంయమోఽప్రసాహః స యది స్త్రియం
పశ్యేత్సమృద్ధం కర్మేతి విద్యాత్ .. 5.2.7..
7. అథ ఖలు ఏతయః ఋచా
పచ్ఛ ఆచామతి
తత్ సవితుః వృణీమహ
ఇతి ఆచామతి।।

వయం దేవస్య భోజనం
ఇతి ఆచామతి।
ఆ తరువాత ఋక్కు మంత్రము పఠిస్తూ ఒక్కొక్క అడుగులోను ఆచమనం చేయాలి.
ఋక్కులు : ‘‘తత్సవితుః వృణీమహే’’। వయం దేవస్య భోజనం।।
‘‘శ్రేష్ఠం సర్వధా తమమ్।। తురం భగస్య ధీమహి।’’
ఈ విధంగా ప్రతి ఋక్కుకు ఆచమనం చేస్తూ ఉండాలి.
ఆ సవితృ దేవత యొక్క మహిమను స్తుతిస్తున్నాను’’ - ఆచామతి (ఆచమనం)
‘‘సవితృ దేవతారూపము పొందుటకై మేము ఈ దివ్యమగు దైవీ ప్రసాదము పొందెదము గాక’’ - అని ఆచమనం చేయాలి. (ఉద్ధరిణితో నీళ్ళు తీసుకోవాలి
శ్రేష్ఠగ్ం సర్వధాతమమ్
ఇతి ఆచామతి।
‘‘తురం భగస్య ధీమహి’’
ఇతి సర్వం పిబితి।
నిర్ణిజ్య కగ్ంసం చమసం వా
పశ్చాత్ అగ్నేః సంవిశతి
చర్మణి వా స్థండిలే వా
వాచంయమో అప్రసాహః
(దేవస్య - ప్రకాశరూపుడైన సవితుః)
యజ్ఞ ప్రసాదము అన్ని అన్నములకంటే మిక్కిలి శ్రేష్ఠము. సర్వ జగత్తులను ఉత్పన్నము చేయునది, నిలబెట్టునది - యజ్ఞప్రసాదమే.
వేగముగా, తేజోరూపముయొక్క (సవితృదేవతయొక్క) మహిమ ఎరిగిన బుద్ధి పొందెదము గాక! అన్నీ త్రాగుచున్నది! ఆ ప్రాణ దేవతయే సమస్త ప్రదర్శనము - అను బుద్ధి పొందెదము గాక। ప్రాణమే ఈ సమస్తము.
అని పలుకుచూ కాంస్య పాత్రను శుభ్రం చేసి, పాత్రకు అతుకుకుని ఉన్న మంథన యజ్ఞద్రవ్యములను నీటితో కడిగి - నీటిని త్రాగాలి. లేదా వేరే కంచుపాత్రతో నీరు త్రాగాలి
స యది స్త్రియం
పశ్యేత్ సమృద్ధం
కర్మ - ఇతి విద్యాత్।।
ఆ తరువాత అగ్ని కుండమునకు ప్రక్కగా - జింకచర్మము పరచుకొని (లేదా) నేలను శుభ్రం చేసుకొని మౌనం పాటిస్తూ, అలజడి లేని ప్రశాంత చిత్తముతో యజమాని పరుండును గాక!
నిదురించినప్పుడు స్వప్నములో ‘‘స్త్రీయొక్క దర్శనం’’ అయితే - అప్పుడు యజ్ఞకర్మ చక్కగా సమృద్ధముగా ఫలితం ఇచ్చినట్లుగా భావించాలి.

తదేష శ్లోకో యదా కర్మసు కామ్యేషు స్త్రియగ్ం స్వప్నేషు
పశ్యంతి సమృద్ధిం తత్ర జానీయాత్తస్మిన్స్వప్ననిదర్శనే
తస్మిన్స్వప్ననిదర్శనే .. 5.2.8..

.. ఇతి ద్వితీయః ఖండః ..
8. తత్ ఏష శ్లోకో।
యదా కర్మసు కామ్యేషు స్త్రియగ్ం
స్వప్నేషు పశ్యతి సమృద్ధం,
తత్ర జానీయాత్
తస్మిన్ స్వప్న నిదర్శనే।
తస్మిన్ స్వప్న నిదర్శనే।
ఈ విషయమై ఈ విధంగా శ్లోకము చెప్పబడుతోంది.
‘‘ఎప్పుడైతే కామ్య కర్మలయందు (ఏదైనా ఇహలోక (లేక) స్వర్గాదిలోక సంబంధమైన ఉద్దేశ్యముతో) యజ్ఞము మొదలైన కర్మలు నిర్వర్తిస్తూ ఉండగా, అప్పుడు ‘స్త్రీ దేవత’ యొక్క దర్శనము స్వప్నములో అయితే - అది ‘‘యజ్ఞకర్మ సమృద్ధమైనది’’ అని అనుకోవటానికి నిదర్శనము’’ అని చెప్పబడుతోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ద్వితీయః ఖండః


5–3. పంచమ ప్రపాఠకః - తృతీయ ఖండము - పంచాగ్ని విద్య

గమనిక: ప్రవణ మహారాజు మరియు శ్వేతకేతుల మధ్య ఇదే సంభాషణ “బృహదారణ్యక ఉపనిషత్, అష్టమ అధ్యాయము, ద్వితీయ బ్రాహ్మణము [bRhadāraNyaka 8–2]”లో కూడా ఉన్నది.


శ్వేతకేతుర్హారుణేయః పంచాలానాగ్ం సమితిమేయాయ
తగ్ం హ ప్రవాహణో జైవలిరువాచ కుమారాను
త్వాశిషత్పితేత్యను హి భగవ ఇతి .. 5.3.1..
1. శ్వేతకేతుః - ఆరుణేయః
పంచాలానాగ్ం సమితిమేయాయ।
అరుణి ఋషి కుమారుడు ఆరుణి. ఆరుణి ‘గౌతమ’ నామధేయుడు. అట్టి గౌతమారుణి కుమారుడు శ్వేతకేతువు. ఆ శ్వేతకేతువు ఒకానొక సందర్భములో పాంచాలరాజ్య రాజభవనానికి విచ్చేశారు. ఆ కాలంలో జైవలుని కుమారుడు ప్రహవణుడు అనే రాజు రాజ్యము ఏలుతూ ఉండేవారు. రాజు ప్రవాహణుడు శ్వేతకేతు మునికి రాజప్రసాదానికి స్వాగతం పలికారు.
తగ్ం హ ప్రవాహణో జైవలిః ఉవాచ।
‘‘కుమారాను త్వా
అశిషత్ పితే ఇతి।
‘‘అను హి భగవ’’ ఇతి।।
ప్రవాహణుడు : కుమారా! శ్వేతకేతూ! రండి! సుస్వాగతం। ఆశీనులుకండి. ఇప్పుడు చెప్పండి. మీ నాన్నగారు పూజ్యులు ఆరుణిగౌతములు నీకు విద్యలన్నీ నేర్పించినారు కదా! మీ విద్య పూర్తి అయినదా?
శ్వేతకేతు : అవును. మా నాన్నగారు ఆరుణి మునివర్యులు నాకు అన్నీ నేర్పియున్నారు. నాయొక్క విద్య పూర్తి అయినదని ఆశీర్వదించారు.

వేత్థ యదితోఽధి ప్రజాః ప్రయంతీతి న భగవ ఇతి వేత్థ
యథా పునరావర్తంత3 ఇతి న భగవ ఇతి వేత్థ
పథోర్దేవయానస్య పితృయాణస్య చ వ్యావర్తనా3 ఇతి
న భగవ ఇతి .. 5.3.2..
2. వేత్థ యదితో అధి
ప్రజాః ప్రయంతి?’’ - ఇతి।
‘‘న భాగవ!’’ - ఇతి
ప్రవాహణుడు : సరే"! సంతోషము. అయితే ఒక విశేషము అడుగుతాను. ఈ జగత్తులో సృష్టించబడుచూ ఉన్న జీవులంతా (మరణానంతరము) పైకి పోవుచున్నారు కదా! ఎటు / ఎక్కడికి వెళ్లుచున్నారో - మీకు తెలుసు కదా!
శ్వేతకేతువు : ఈ విషయం నాకు తెలియదు.
‘‘వేత్థ యథా పునః
ఆవర్తంత ఇతి?
‘‘న భగవ!’’ - ఇతి।
ప్రవాహణుడు : సరే“! రెండవ ప్రశ్న. ఈ జీవులు తిరిగి ఏవిధంగా పునరావర్తులు అవుతారు? ఎట్లా తిరిగివస్తారు? (How are they getting back to material Forms?)
శ్వేతకేతువు : ఈ విషయం కూడా నాకు తెలియదే”!
‘‘వేత్థ పథోః
దేవయానస్య పితృయాణస్య చ
వ్యావర్తనా ఇతి।
న భగవ। - ఇతి
ప్రవాహణుడు : ఈ సృష్టిలో ‘జీవులు’ అనే ప్రయాణీకులకు సంబంధించిన (1) దేవయానము (2) పితృయానము అనే రెండు మార్గములు సంకల్పితమై వర్తిస్తున్నాయి. ఆ రెండు మార్గముల గురించి మీకు తెలుసు కదా! అవి రెండూ విడిపోయే స్థానము మీకు తెలుసా?
శ్వేతకేతువు : తెలియదే"! దేవయాన - పితృయానములనే మార్గముల గురించి కూడా నాకు తెలియనే తెలియదు. అవి ఏ చోట రెండు మార్గములుగా విడిపోతున్నాయో కూడా అస్సలు తెలియదు.

వేత్థ యథాసౌ లోకో న సంపూర్యత3 ఇతి న భగవ ఇతి
వేత్థ యథా పంచమ్యామాహుతావాపః పురుషవచసో
భవంతీతి నైవ భగవ ఇతి .. 5.3.3 ..
3. ‘‘వేత్థ యథా అసౌ లోకో
న సంపూర్యత 3?’’ ఇతి।
- న భగవ।’’ ఇతి।।
‘‘వేత్థ యథా పంచమ్యాం
ఆహుతావా ఆపః పురుషవచసో భవంతి?’’ - ఇతి?
‘‘న ఏవ భగవ!’’ - ఇతి।
ప్రవాహణరాజు : ఈ జగత్తులో అసంఖ్యాక జీవులు దేహములు త్యజించి ఊర్ధ్వలోకములు చేరుచున్నారు కదా! మరి ఊర్ధ్వలోకములు (పితృలోకములు) మరణించినవారితో నిండిపోవటం లేదేమి?
శ్వేతకేతువు : ఇది కూడా నాకు తెలియనే లేదు.
ప్రవాహణుడు : ‘‘పంచమ హవిస్సునందు జలము’’ పురుషుడు అనే పేరును పొందుచున్నాడు’’ - అనే వాక్యము యొక్క సవివరణ మీరు ఎరిగియే ఉన్నారు కదా?
శ్వేతకేతువు : ఈ విషయం కూడా నాకు కొంచెము కూడా తెలియదే!

అథాను కిమనుశిష్ఠోఽవోచథా యో హీమాని న
విద్యాత్కథగ్ం సోఽనుశిష్టో బ్రువీతేతి స హాయస్తః
పితురర్ధమేయాయ తగ్ం హోవాచాననుశిష్య వావ కిల మా
భగవానబ్రవీదను త్వాశిషమితి .. 5.3.4 ..
4. ‘‘అథాను కిమ్ అనుశిష్టో
అవోచథా యో హీమాని న విద్యాత్ కథగ్ం
సో ‘అనుశిష్టో’ బ్రువీతి ఇతి?
ప్రవాహణరాజు : అనగా మీరు విద్యను పూర్తిగా నేర్చుకోలేదా? మరి మీరు ‘‘నేను విద్యను నేర్చుకోవటం పూర్తి చేసినవాడనైనాను. అనుశిష్టుడను’’ అని అంటున్నారేమిటి?
స హాయస్తః పితుః
అర్ధం ఏయాయ?
తగ్ం హ ఉవాచ -
‘‘అననుశిష్య వావ
కిల మా, భగవాన్।
అబ్రవీత్ అను త్వా
అశిషమ్?’’ - ఇతి।
అప్పుడు శ్వేతకేతు : ‘‘ప్రవణ మహారాజా! మరల మీ దర్శనం చేసుకుంటాను’’ - అని చెప్పి అక్కడి నుండి బయలుదేరారు.
శ్వేతకేతువు : పితృదేవా? ఆరుణిమహర్షీ! రాజర్షియగు ప్రవాహణ మహారాజుగారు వేసిన ప్రశ్నలకు నాకు సమాధానం తెలియలేదు. ‘‘విద్య పూర్తి అయినదని ఎట్లా అన్నారు?’’ - అని ఆయన నన్ను ప్రశ్నించారు కూడా!
భగవాన్! నేను విద్యను పూర్తి చేసానని మీరు అన్నారు కదా!? ఆ మాట ఎట్లా అన్నారు?

పంచ మా రాజన్యబంధుః ప్రశ్నానప్రాక్షీత్తేషాం
నైకంచనాశకం వివక్తుమితి స హోవాచ యథా మా త్వం
తదైతానవదో యథాహమేషాం నైకంచన వేద
యద్యహమిమానవేదిష్యం కథం తే నావక్ష్యమితి .. 5.3.5..
5. పంచ మా రాజన్యబంధుః
ప్రశ్నాన్ అప్రాక్షీః తేషాం
నైకంచన అశకం వివిక్తుమ్ - ఇతి।
ఆ రాజన్య బంధువు (దుష్టుడు) అడిగిన 5 ప్రశ్నలలో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయానే? ఏమిటి నాకు ఈ దుస్థితి? ఈ విధంగా అడుగుతూ రాజు అడిగిన ‘5’ ప్రశ్నలు తండ్రికి శ్వేతకేతువు - వినిపించాడు.
స హ ఉవాచ :-
యథా మా త్వం తత్ ఏతాన్ అవదో।
యథా అహమ్ ఏషాం నైకంచన వేద।
యది అహమ్ ఇమాన్ అవేదిష్యం,
కథం తే న అవక్ష్యం? ఇతి
ఆరుణీ మునీంద్రులు : బిడ్డా! శ్వేతకేతూ! నీవు అడిగిన ఐదు ప్రశ్నలకు సమాధానము ఏమిటో నాకు ఏమాత్రం తెలియదు. అందుచేత నాకు తెలియని ప్రశ్నలు, ప్రశ్నల సమాధానం నేను బోధించలేను కదా!
నేను కనుక ఆ ప్రశ్నలు వాటి సమాధానము ఎరిగిఉండి ఉంటే, నేను నీకు ఎందుకు బోధించను? బోధించి ఉండేవాడినే!

స హ గౌతమో రాజ్ఞోఽర్ధమేయాయ తస్మై హ ప్రాప్తాయార్హాం చకార
స హ ప్రాతః సభాగ ఉదేయాయ తగ్ం హోవాచ మానుషస్య
భగవన్గౌతమ విత్తస్య వరం వృణీథా ఇతి స హోవాచ తవైవ
రాజన్మానుషం విత్తం యామేవ కుమారస్యాంతే
వాచమభాషథాస్తామేవ మే బ్రూహీతి స హ కృచ్ఛ్రీ బభూవ .. 5.3.6..
6. స హ గౌతమో రాజ్ఞో అర్థమ్ ఏయాయ,
తస్మై హ ప్రాప్తాయ అర్హాంచకార।
స హ ప్రాతః సభాగ ఉదేయాయ।
గోతమ గోత్రీయుడగు ఆరుణి అప్పటికప్పుడే బయలుదేరి ఆ మరునాడు ఉదయమే జావలుని కుమారుడగు పాంచాల దేశరాజు ప్రవాహణుడు ఉన్నచోటుకు వెళ్లారు. పంచ ప్రశ్నలకు సమాధానం వివరించవలసినదిగా అర్థించారు
తగ్ం హ ఉవాచ :-
‘‘మానుషస్య, భగవాన్ గౌతమ!
విత్తస్య వరం వృణీథా।’’ ఇతి
ప్రవాహణ రాజర్షి : పూజనీయుడగు గౌతమా! ఆ సమాధానాలెందుకు? మనుష్య సంబంధమైన సంపదను అడగండి. మీకు సమర్పించుకోగలను.
స హ ఉవాచ :
తవ ఏవ, రాజన్। మానుషం విత్తం యామేవ।
కుమారస్య అంతే వాచమ్
అభాషథాః తామ్ ఏవ
మే బ్రూహి - ఇతి
స హ కృచ్ఛ్రీ, బభూవ।
ఆరుణీ మునీంద్రుడు : మీరు ఇస్తానన్న మనుష్య సంపదతో నాకు పనిలేదు. మీ వద్దనే ఉంచుకోండి. మా కుమారుడు (మరియు) శిష్యుడు అగు శ్వేతకేతువును మీరు అడిగియున్న ‘5’ ప్రశ్నలకు సవివరణ ప్రసాదించండి.

ప్రవాహణ రాజర్షి (తనలో)
అయ్యో! ఏమిటి ఇవి అడుగుచున్నారు? - అని ఇబ్బందిగా భావించారు.

తగ్ం హ చిరం వసేత్యాజ్ఞాపయాంచకార తగ్ం హోవాచ
యథా మా త్వం గౌతమావదో యథేయం న ప్రాక్త్వత్తః పురా విద్యా
బ్రాహ్మణాన్గచ్ఛతి తస్మాదు సర్వేషు లోకేషు క్షత్రస్యైవ
ప్రశాసనమభూదితి తస్మై హోవాచ .. 5.3.7

.. ఇతి తృతీయః ఖండః ..
7. ‘‘తగ్ం హ చిరం వసేతి।’’
అజ్ఞాపయాంచకార।
తగ్ం హ ఉవాచ :-
యథా మా త్వం, గౌతమా।
అవదో యథా ఇయం
న ప్రాక్త్వతః పురా
విద్యా బ్రాహ్మణాన్ గచ్ఛతి
తస్మాత్ ఉ సర్వేషు లోకేషు
క్షత్రస్యైవ ప్రశాసనమ్ అభూత్ - ఇతి।।
తస్మై హోవాచ।।
ప్రవాహణ రాజర్షి : గౌతమా! ఆరుణిమునీంద్రా! మీరు కొంతకాలం ఇక్కడ ఉండండి!…ఈ విధంగా (గురువువలె) ఆదేశించారు. కొంతకాలమైన తరువాత
ప్రవాహణ రాజర్షి : ఓ ఆరుణి మహాశయా! గౌతమా! మీరు నన్ను ఆ ‘5’ ప్రశ్నలకు సమాధానం అడుగుచున్నారు. అవి బ్రాహ్మణులకు మేము ఎప్పుడూ చెప్పలేదు.
ఇతః పూర్వము బ్రాహ్మణులకు చెప్పబడని అవశేషములు క్షత్రియజాతికి ఉపదేశ్యము (బోధించతగినవి) మాత్రమే। మీవంటి మహనీయులగు బ్రహ్మతత్త్వాశయము గలవారికి కాదు.
అయినా కూడా మీరు అడుగుచున్నారు.
సరే"! వివరిస్తాను. వినండి. మీరు మాకు పూజనీయులు కదా, మరి

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే తృతీయః ఖండః


5–4. పంచమ ప్రపాఠకః - చతుర్థ ఖండము - ప్రథమ విశ్వయజ్ఞ హోమము


అసౌ వావ లోకో గౌతమాగ్నిస్తస్యాదిత్య ఏవ
సమిద్రశ్మయో ధూమోఽహరర్చిశ్చంద్రమా అంగారా నక్షత్రాణి
విస్ఫులింగాః .. 5.4.1..
1. అసౌ వావ లోకో,
గౌతమా! ‘‘అగ్నిః’’।
తస్య ఆదిత్య ఏవ సమిత్
రశ్మయో ధూమో।
అహః అర్చిః।
చంద్రమా అంగారా।
నక్షత్రాణి విస్ఫులింగాః।।
గౌతమా! వినండి.
ప్రథమ దేవతా హోమమునకు
(భూలోకంలో అగ్నిహోత్రమునకే ఆహవనీయాగ్ని ఆశ్రయమయే తీరుగా)

☼ ద్యులోకము (స్వర్గ లోకము) - అగ్ని
☼ ద్యులోకమనే అగ్నికి ఆదిత్యుడు - సమిధలు (కట్టెలు)
☼ ఆదిత్య (సూర్యకిరణములు) - ‘పొగ’
☼ చంద్రుడు పగలు - బొగ్గులు (జ్వాల చల్లారిన తరువాత మిగిలేవి)
☼ నక్షత్రములు - కిరణములు. విస్ఫులింగములు

తస్మిన్నేతస్మిన్నగ్నౌ దేవాః శ్రద్ధాం జుహ్వతి
తస్యా అహుతేః సోమో రాజా సంభవతి .. 5.4.2 ..

.. ఇతి చతుర్థః ఖండః ..
2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ
దేవాః ‘‘శ్రద్ధాం’’ జుహ్వతి।
తస్యా ఆహుతేః
‘సోమో రాజా’ - సంభవతి।
ఈ విధంగా ఇంద్రియాభిమాన దేవతలు ‘శ్రద్ధ’ అనే ఆహుతిని ప్రాణాగ్నికి సమర్పిస్తున్నారు.

అట్టి ఆహుతిని ఇంద్రియ - అభిమాన దేవతలు {నేత్ర (చూపు) దేవత, చెవులు (శ్రవణ) దేవత, స్పర్శ (చర్మ) దేవత, రుచి (నాలుక) దేవత, గంధ (ముక్కు) దేవత} -

‘‘శ్రద్ధ’’ అనే ఆహుతిని సమర్పిస్తూ - పవిత్రులగుచున్నారు. ఆ హవిస్సులవలన ‘‘సోమరాజు’’ (జీవుడు - Experiencer) జనించుచున్నాడు (సంభవించుచున్నాడు).

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే చతుర్థః ఖండః


5–5. పంచమ ప్రపాఠకః - పంచమ ఖండః - ద్వితీయ విశ్వయజ్ఞ హోమము


పర్జన్యో వావ గౌతమాగ్నిస్తస్య వాయురేవ సమిదభ్రం ధూమో
విద్యుదర్చిరశనిరంగారాహ్రాదనయో విస్ఫులింగాః .. 5.5.1..
1. పర్జన్యో వావ గౌతమ! అగ్నిః।
తస్య వాయుః ఏవ సమిత్।
అభ్రం ధూమో। విద్యుత్ అర్చిః।
అశనిః అంగారా।
హ్రాదనయో విస్ఫులింగాః।।
ద్వితీయ దేవతా హోమము
☼ పర్జన్యుడు (వర్ష దేవతయే) - ‘‘అగ్ని’’
☼ దానికి వాయువే - ‘‘సమిధ’’
☼ మేఘములే - ‘‘పొగ’’
☼ విద్యుత్ (మెరుపు) - ‘‘జ్వాల’
☼ పిడుగులే - బొగ్గు (జ్వాల తరువాత శేషించేది)

తస్మిన్నేతస్మిన్నగ్నౌ దేవాః సోమగ్ం రాజానం జుహ్వతి
తస్యా ఆహుతేర్వర్షగ్ం సంభవతి .. 5.5.2..

.. ఇతి పంచమః ఖండః ..
2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవాః
సోమగ్ం రాజానం జుహ్వతి।
తస్యా ఆహుతేః వర్షగ్ం సంభవతి।।
అట్టి అగ్నియందు దేవతలు ఆహుతిని సమర్పిస్తున్నారు.
అట్టి ఆహుతిని చంద్రుని (సోమరాజుకు) సమర్పించటం చేత ‘‘వర్షము’’ సంభవిస్తోంది. (శ్రద్ధయే చంద్రుని రూపము పొందుచూ - అగ్నిచే వర్షాకారము పొందుతోంది)

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే పంచమః ఖండః


5–6. పంచమ ప్రపాఠకః - షష్ఠ ఖండము - తృతీయ విశ్వయజ్ఞ హోమము


పృథివీ వావ గౌతమాగ్నిస్తస్యాః సంవత్సర ఏవ
సమిదాకాశో ధూమో రాత్రిరర్చిర్దిశోఽఙ్గారా
అవాంతరదిశో విస్ఫులింగాః .. 5.6.1..
1. పృథివీ వావ, గౌతమా! అగ్నిః।
తస్యాః సంవత్సర ఏవ సమిత్।
ఆకాశో ధూమో।
రాత్రిః - అర్చిః।
దిశో - అంగారా।
అవాంతరదిశో - విస్ఫులింగాః।।
తృతీయ దేవతా హోమము
☼ ఈ పృథివి (భూమి)యే - ‘‘అగ్ని’’
☼ దీనికి సంవత్సరము (Time Factor) - సమిధ
☼ ఆకాశమే - ధూమము (పొగ)
☼ రాత్రి - జ్వాల
☼ (తూర్పు-పడమర-ఉత్తర-దక్షిణ) దిక్కులు - ఉష్ణము
(మండే బొగ్గులు-జ్వాల తరువాత మిగిలేవి)
☼ అవాంతర దిశలు - విస్ఫులింగము
(ఈశాన్య-ఆగ్నేయ-నైరుతి - వాయవ్యములు)

తస్మిన్నేతస్మిన్నగ్నౌ దేవా వర్షం జుహ్వతి
తస్యా ఆహుతేరన్నగ్ం సంభవతి .. 5.6.2..

.. ఇతి షష్ఠః ఖండః ..
2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ
దేవా ‘వర్షం’ - జుహ్వతి।
తస్యా ఆహుతేః అన్నగ్ం సంభవతి
అట్టి ఆ యొక్క అగ్నియందు దేవతలు ‘‘వర్షము’’ను హోమము చేయుచున్నారు.
అట్టి అగ్నియందు దేవతలు వర్షమును వాహనము చేస్తూ ఉండగా, అట్టి ఆహుతుల వలన ‘‘అన్నము’’ (ఆహారము) పుడుతోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే షష్ఠమః ఖండః


5–7. పంచమ ప్రపాఠకః - సప్తమ ఖండము - చతుర్థి విశ్వయజ్ఞ హోమము


పురుషో వావ గౌతమాగ్నిస్తస్య వాగేవ సమిత్ప్రాణో ధూమో
జిహ్వార్చిశ్చక్షురంగారాః శ్రోత్రం విస్ఫులింగాః .. 5.7.1..
1. పురుషో వావ గౌతమా। అగ్నిః।
తస్య ‘వాక్’ ఏవ సమిత్।
ప్రాణో - ధూమో।
జిహ్వా - అర్చిః।
చక్షుః - అంగారాః।
శ్రోత్రం - విస్ఫులింగాః।
4వ దేవతా హోమము
☼ అన్నము నుండి జనించిన పురుషుడే - ‘‘అగ్ని’’
☼ వాక్కు - ‘సమిధ’
☼ ప్రాణము - పొగ
☼ జిహ్వ - జ్వాల
☼ చక్షువులు (చూపు) - మండే బొగ్గు కణములు
☼ చెవులు (వినికిడి) - విస్ఫులింగములు

తస్మిన్నేతస్మిన్నగ్నౌ దేవా అన్నం జుహ్వతి తస్యా
ఆహుతే రేతః సంభవతి .. 5.7.2..

.. ఇతి సపతమః ఖండః ..
2. తస్మిన్ - ఏతస్మిన్ అగ్నౌ
దేవా ‘అన్నం’ జుహ్వతి।
తస్యా ఆహుతే ‘రేతః’ సంభవతి
అట్టి అగ్నియందు అన్నమును దేవతలు ఆహుతులుగా సమర్పిస్తున్నారు. అప్పుడు ఆ ఆహుతులనుండి ‘‘రేతస్సు’’ జనిస్తోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే సప్తమః ఖండః


5–8. పంచమ ప్రపాఠకః - అష్టమ ఖండము - పంచమ విశ్వయజ్ఞ హోమము


యోషా వావ గౌతమాగ్నిస్తస్యా ఉపస్థ ఏవ సమిద్యదుపమంత్రయతే
స ధూమో యోనిరర్చిర్యదంతః కరోతి తేఽఙ్గారా అభినందా
విస్ఫులింగాః .. 5.8.1..
1. యోషా వావ, గౌతమా! అగ్నిః।
తస్యా ‘ఉపస్థ’ ఏవ సమిత్।
యత్ ఉపమంత్రయతే స ధూమో।
యోనిః అర్చిః
యత్ అంతః కరోతి - తే అంగారా।
అభినందా - విస్ఫులింగాః।
5వ దేవతా హోమము
☼ స్త్రీ - అగ్ని
☼ ఉపస్థ (జననేంద్రియము) - సమిధలు
☼ స్త్రీ పురుషుని ఆకర్షించు ఉప మంత్రమే - ధూమము
☼ జననేంద్రియమే - జ్వాల
☼ సంభోగమే - బొగ్గు కణములు
☼ రతిసుఖమే - అగ్ని కిరణములు

తస్మిన్నేతస్మిన్నగ్నౌ దేవా రేతో జుహ్వతి
తస్యా ఆహుతేర్గర్భః సంభవతి .. 5.8.2 ..

.. ఇతి అష్టమః ఖండః ..
2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా
‘‘రేతో’’ జుహ్వతి।
తస్యా ఆహుతేః ‘గర్భః’ సంభవతి।।
అట్టి ఆ యొక్క అగ్ని కార్యమునందు అగ్నికి దేవతలు ‘రేతస్సు’కు ఆహుతిగా సమర్పిస్తున్నారు. అట్టి ఆహుతుల నుండి ‘‘గర్భము’’ సంభవిస్తోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే అష్టమః ఖండః


5–9. పంచమ ప్రపాఠకః - నవమ ఖండము - పంచమ హవిస్సునందు జల ‘పురుషుడు’


ఇతి తు పంచమ్యామాహుతావాపః పురుషవచసో భవంతీతి
స ఉల్బావృతో గర్భో దశ వా నవ వా మాసానంతః శయిత్వా
యావద్వాథ జాయతే .. 5.9.1..
1. ఇతి తు పంచమ్యామ్ ఆహుతాః
ఆపః పురుష వచసో భవంతి - ఇతి

స ఉల్బావృతో గర్భో దశ
వా నవ వా మాసానంతః
శయిత్వా యావత్ వా అథ జాయతే।।
ఈ విధంగా 5వ ఆహుతి దేవతలచే సమర్పించబడుచుండగా జలము ‘పురుషుడు (జీవుడు)’ శబ్దమునకు వాచ్యముగా (Main Meaning) అగుచున్నాయి.
‘‘జరాయువు’’ అనే గర్భసంచిలో ‘10’ నెలలో, ‘9’ నెలలో గడుపుచూ అక్కడ నిదురిస్తూ, చివరికి ఆ తరువాత జీవుడు జన్మించటం జరుగుతోంది.

స జాతో యావదాయుషం జీవతి తం ప్రేతం దిష్టమితోఽగ్నయ
ఏవ హరంతి యత ఏవేతో యతః సంభూతో భవతి .. 5.9.2..

.. ఇతి నవమః ఖండః ..
2. స జాతో యావత్ ఆయుషం జీవతి।

తం ప్రేతం దిష్టం ఇతో
అగ్నయ ఏవ హరంతి, యత ఏవేతో
యతః సంభూతో భవతి।।
ఆ విధంగా ‘జీవుడు’గా జనియించిన శిశువు (జీవుడు) ఆయుష్షు ఉన్నంతవరకు పాంచభౌతిక జగత్తులో జీవిస్తున్నాడు.
మరణించిన తరువాత ఆ జీవుడు ‘ప్రేతము’ అనబడుచున్నాడు. అట్టి ప్రేతము (ఆ మరణించిన వానిని) కర్మఫలానుసారంగా ఏ అగ్ని నుండి ఈ లోకమునకు వచ్చియున్నాడో - ఆ అగ్నియే హరించి మరొక లోకములోనికి తీసుకొనిపోవటము, అక్కడ తిరిగి ప్రతిష్ఠించటము జరుగుతోంది. అనగా ఈ జీవుడు దేహానంతరము మరొక దేహమునందు తనను తాను అనుభవముగా పొందుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే నవమ ఖండః


5–10. పంచమ ప్రపాఠకః - దశమ ఖండము - దేవయాన పితృయాన మార్గములు


తద్య ఇత్థం విదుః. యే చేమేఽరణ్యే శ్రద్ధా తప ఇత్యుపాసతే
తేఽర్చిషమభిసంభవంత్యర్చిషోఽహరహ్న
ఆపూర్యమాణపక్షమాపూర్యమాణపక్షాద్యాన్షడుదఙ్ఙేతి
మాసాగ్ంస్తాన్ .. 5.10.1..
1. తత్ య ఇత్థం విదుః
యే చ ఏమే అరణ్యే ‘శ్రద్ధా’ తప,
ఇతి ఉపాసతే, తే ‘అర్చిషమ్’
అభిసంభవంతి।
అర్చిషో అహరహ్న
ఆపూర్యమాణ పక్షమ్।
ఆపూర్యమాణపక్షాద్యాన్
షడుదన్ ఏతి మాసాగ్ంస్తాన్।।
దేవయాన పంథా
ఎవ్వరైతే ఈ విధంగా (1) శ్రద్ధ (2) వర్షము (3) అన్నము (4) రేతస్సు (5) గర్భము అనబడే ‘5’ దేవతా హోమములవలన ఈ శరీరయానము, జీవాత్మ (పురుషుడు) వ్యవహారము సంభవిస్తోందని గ్రహిస్తాడో, అరణ్యము (Beyond worldly events and happenings)లో ఉండి, శ్రద్ధతో ఈ ఐదిటికీ ఆవల గల పరమాత్మ స్వరూపము ఉపాసిస్తారో, అర్చిస్తారో - వారు కాంతివంతమగు లోకములు పొందుచున్నారు. వారు అర్చిష్మంతుడు అనబడే అగ్నిజ్వాల అభిమాని దేవతను పొందుచున్నారు. జ్వాలనుండి పగలును, పగలు నుండి శుక్లపక్షమును, ఉత్తరాయణ 6 నెలల (షణ్మాసామ్) చివర ఉత్తరగతిని పొందుచున్నారు.

మాసేభ్యః సంవత్సరగ్ం సంవత్సరాదాదిత్యమాదిత్యాచ్చంద్రమసం
చంద్రమసో విద్యుతం తత్పురుషోఽమానవః స ఏనాన్బ్రహ్మ
గమయత్యేష దేవయానః పంథా ఇతి .. 5.10.2..
2. మాసేభ్యః సంవత్సరగ్ం
సంవత్సరాత్ - ఆదిత్యమ్।
ఆదిత్యాత్ - చంద్రమసమ్।
చంద్రమాసో - విద్యుతమ్।
తత్పురుషో - అమానవః।
స ఏనాత్ ‘బ్రహ్మ’ గమయతి ఏష
దేవయానః పంథా ఇతి।।
ఉత్తరాయణ షణ్మాసము నుండి - సంవత్సరమును,
సంవత్సరము నుండి - ఆదిత్యుని
ఆదిత్యుని నుండి - చంద్రమసమును (చంద్రుని)
చంద్రమసము నుండి - విద్యుత్తును (తేజస్సును)
- అక్కడి నుండి మానవపరిధికి ఆవలగల ‘తత్పురుషము’ అనబడే బ్రహ్మము వైపుగా ప్రయాణిస్తూ ఉంటారు.
ఈ పంథా (మార్గము, విధి విధానము)ను ‘‘దేవయాన పంథా’’ అని పిలుస్తున్నారు.

అథ య ఇమే గ్రామ ఇష్టాపూర్తే దత్తమిత్యుపాసతే తే
ధూమమభిసంభవంతి ధూమాద్రాత్రిగ్ం
రాత్రేరపరపక్షమపరపక్షాద్యాన్షడ్దక్షిణైతి
మాసాగ్ంస్తాన్నైతే సంవత్సరమభిప్రాప్నువంతి .. 5.10.3..
3. అథ య ఇమే గ్రామ ఇష్టాపూర్తే,
దత్తమ్ ఇతి ఉపాసతే,
తే ‘ధూమం’ అభిసంభవంతి
ధూమాత్- రాత్రిగ్ం
రాత్రేః - అపర పక్షమ్।।
అపరపక్షాద్యాన్ - ‘షట్’
దక్షిణ ఏతి మాసాగ్ం।
తాన్ న ఏతే ‘సంవత్సరం’
అభిప్రాప్నువంతి।
పితృయాన మార్గము
ఎవ్వరైతే తామున్నచోట
- ఇష్టా పూర్తములను (యజ్ఞ యాగములు, లోకసేవా కార్యక్రమములను) నిర్వర్తిస్తూ ఉంటారో, దాన-ధర్మములు మొదలైనవి నిర్విర్తిస్తూ, అట్టి ఆశయములు మాత్రమే కలిగి ఉంటారో, అట్టివారు ధూమ (పొగ) లోకములు చేరుచున్నారు.
ధూమము నుండి - ‘రాత్రి’కి
రాత్రి నుండి - కృష్ణపక్షమునకు,
కృష్ణపక్షము నుండి - దక్షిణాయణ షట్ మాసములను,
అక్కడి నుండి - సంవత్సరమును పొందుచున్నారు.

మాసేభ్యః పితృలోకం పితృలోకాదాకాశమాకాశాచ్చంద్రమసమేష
సోమో రాజా తద్దేవానామన్నం తం దేవా భక్షయంతి .. 5.10.4..
4. మాసేభ్యః - పితృలోకం
పితృలోకాత్ - ఆకాశమ్
ఆకాశాత్ - చంద్రమసమ్
ఏష సోమో రాజా తత్
దేవానాం - ‘అన్నం’
తం దేవా భక్షయంతి।।
మాసముల నుండి - పితృలోకములకు,
పితృలోకముల నుండి - ఆకాశమునకు,
ఆకాశము నుండి - చంద్రమసమునకు,
(ఆయా అభిమాన దేవతలకు) చేరుచున్నారు.
ఈతడే సోమరాజు. ఈతడు దేవతలకు ఆహారము అగుచున్నాడు. దేవతలు ఆతనిని అన్నముగా (ఆహారముగా) భుజించుచున్నారు.

తస్మిన్యవాత్సంపాతముషిత్వాథైతమేవాధ్వానం పునర్నివర్తంతే
యథేతమాకాశమాకాశాద్వాయుం వాయుర్భూత్వా ధూమో భవతి
ధూమో భూత్వాభ్రం భవతి .. 5.10.5..
5. తస్మిన్ యావత్ సంపాతమ్ ఉషిత్వా,
అథ ఏతమ్ ఏవ అధ్వానం పునః నివర్తంతే।
అక్కడ పురాకృత కర్మల ఫలములను పొందుచు తిరిగి పునరావృత్తిగా క్రింద జన్మలను పునః పొందుచున్నారు.
యథా ఏతమ్ - ‘‘ఆకాశమ్’’।
ఆకాశాత్ - ‘‘వాయుం’’।
వాయుః భూత్వా ‘‘ధూమో’’ భవతి।
ధూమో భూత్వా - ‘‘అభ్రం’’ భవతి।
పునరావృత్తి యానము
ఇది శరీరము విడిచినప్పుడు ఏ మార్గంలో ప్రయాణం చేసి ఉన్నారో, ఇప్పుడు ఆ మార్గంగానే తిరిగి దేహముల ధారణ వైపుగా తిరిగివస్తున్నాడు.
(ఇదివరకు వెళ్లినది మాసములు - పితృలోకము - ఆకాశము - చంద్రమసము)
ఇప్పుడు తిరిగి రాక…
చంద్రమసము నుండి - ఆకాశము
ఆకాశము నుండి - వాయువులో ప్రవేశము
వాయువు నుండి - ‘ధూమము’ (పొగ)
ధూమము నుండి - మేఘము అగుచున్నాడు.

అభ్రం భూత్వా మేఘో భవతి మేఘో భూత్వా ప్రవర్షతి
త ఇహ వ్రీహియవా ఓషధివనస్పతయస్తిలమాషా ఇతి
జాయంతేఽతో వై ఖలు దుర్నిష్ప్రపతరం యో యో హ్యన్నమత్తి
యో రేతః సించతి తద్భూయ ఏవ భవతి .. 5.10.6..
6. అభ్రం భూత్వా - మేఘో భవతి।
మేఘో భూత్వా - ప్రవర్షతి।।
త ఇహ వ్రీహియవా ఓషధి - వనస్పతయః
తిలమాషా ఇతి జాయంతే।
అతో వై ఖలు దుర్నిష్ప్రపతరమ్।
యో యో హి ‘అన్నం’ అత్తి।
యో ‘‘రేతః’’ సించతి।
తత్ భూయ ఏవ భవతి।।
దట్టమైన మేఘమై - వర్షించు మేఘము అగుచున్నాడు.
మేఘము నుండి - చినుకుల ద్వారా వర్షించువాడగుచున్నాడు.
అట్లా వర్షించి భూమిపై -
వ్రీహి (ధాన్యముగా, వడ్లుగా)
యవ - (ధాన్య విశేషములుగా, గోధుమలు మొదలైనవి)
ఓషధులు - (అరటి వంటి మొక్కలు మొదలైనవిగా)
వనస్పతులు - (చెట్లుగా)
తిల - (నువ్వులుగా)
మాషా - (మినుములుగా)
ఆయా రూపములు పొందుచున్నాడు.

ఈ విధంగా ఈ జీవుడు తిరిగి దేహరూపముగా అవటమనేదంతా అనేక కష్టము - బాధ - దుర్ఘటనములతో కూడినదే! ఆయా రూపములలో బయటకు వచ్చుటకు అనేక కష్టములు పొందుచున్నారు.

ఆయా పదార్థముల రూపము పొంది, ఆ తరువాత
- జీవుల ఆహారము రూపముగా అయి,
- ఆహారము రేతస్సుగా అయి, విడుబడి ఆయా రూపములు కలదిగా అగుచున్నది.

తద్య ఇహ రమణీయచరణా అభ్యాశో హ యత్తే రమణీయాం
యోనిమాపద్యేరన్బ్రాహ్మణయోనిం వా క్షత్రియయోనిం వా వైశ్యయోనిం
వాథ య ఇహ కపూయచరణా అభ్యాశో హ యత్తే కపూయాం
యోనిమాపద్యేరఞ్శ్వయోనిం వా సూకరయోనిం వా
చండాలయోనిం వా .. 5.10.7..
7. తద్య ఇహ రమణీయ చరణా అభ్యాశో,
హ యత్తే రమణీయాం యోనిమ్ ఆపద్యేరన్। బ్రాహ్మణ యోనిం వా, క్షత్రియ యోనిం వా,
వైశ్య యోనిం వా అథ య ఇహ
కపూయ చరణా అభ్యాశో
హ యత్తే కపూయాం యోనిం ఆపద్యేరన్
‘శ్వ’ యోనిం వా, ‘సూకర’ యోనిం వా,
చణ్డాల యోనిం’ వా।
అట్టి జీవులలో ఇతఃపూర్వము రమణీయమైన, పుణ్యప్రదమగు ఆచరణ, అభ్యాసము కలవారు రమణీయమైన యోనులు (జన్మలు) పొందటం జరుగుతోంది.

బ్రహ్మతత్త్వముపై ధ్యాసగల - బ్రాహ్మణ కార్య సమర్థత గల - క్షత్రియ వ్యవహార వ్యాపార దక్షత గల - వైశ్య యోనులందు జన్మిస్తున్నారు.

అట్లా కాకుండా, దుష్టమైన ఆచరణ అభ్యాసములు కలవారు, చెడు నడవడి గలవారు కపూయ (అల్ప) యోనులలో, కుక్క - పంది - చణ్డాల యోనులలో జన్మ పొందుచున్నారు.

అథైతయోః పథోర్న కతరేణచన తానీమాని
క్షుద్రాణ్యసకృదావర్తీని భూతాని భవంతి జాయస్వ
మ్రియస్వేత్యేతత్తృతీయగ్ంస్థానం తేనాసౌ లోకో న సంపూర్యతే
తస్మాజ్జుగుప్సేత తదేష శ్లోకః .. 5.10.8..
8. అథ ఏతయోః పథోః న కతరేణ చ న
తాని ఇమాని క్షుద్రాణి అసకృత
ఆవర్తీని భూతాని భవంతి।
జాయస్వ మ్రియస్వ ఏతి
ఏతత్ తృతీయం స్థానం।
తేన అసౌ లోకో స సంపూర్యతే।

తస్మాత్ జుగుప్సేత। తత్ ఏష శ్లోకః।।
కొందరు పై మార్గములు కాకుండా, అల్పమగు దోమవంటి క్రిమికీటక క్షుద్ర ప్రాణులై మరల మరల జన్మిస్తూ ఉంటారు.

జన్మిస్తూ మరణిస్తూ ఉండటంచేత వారు ఈ లోకములోనే సంచారములు, రాకపోకలు కలిగి ఉంటూ ఉన్నారు. అందుచేతనే (స్వర్గము, పితృలోకము మొదలైన) ఊర్ధ్వలోకములు నిండటము జరగటము లేదు.

పైన చెప్పుకొన్నరీతిగా - ఉత్తరోత్తర స్థితిగతులలో గల భీకర దుఃఖస్థితులు గమనించి ముందుగానే నిషిద్ధకర్మలు, క్రూరప్రవర్తనలు పట్ల అత్యంత జాగరూకులై ఉండాలి. ఈ విషయము వివరిస్తూ పాఠ్యాంశములున్నాయి.

స్తేనో హిరణ్యస్య సురాం పిబగ్ంశ్చ గురోస్తల్పమావసన్బ్రహ్మహా
చైతే పతంతి చత్వారః పంచమశ్చాచరగ్ంస్తైరితి .. 5.10.9..
9. స్తేనో హిరణ్యస్య, సురాం పిబగ్ంశ్చ,
గురోః తల్పమ్ ఆవసన్, బ్రహ్మహా చ
ఏతే పతంతి చత్వారః
పంచమశ్చ ఆచరగ్ం స్రైరితి।।
ఉత్తరోత్తర సుదీర్ఘదుఃఖస్థితులను దృష్టిలో పెట్టుకొని పంచ (5) నిషిద్ధ మహాపాతకములు ఈ విధంగా చెప్పబడుచున్నాయి.
(1) బంగారము అపహరించువాడు.
(2) సురాపానము చేయువాడు
(3) గురుపత్నీ సంగమము
(4) బ్రహ్మహత్య చేయువాడు
ఇవి పతనమునకు కారణము.
(5) పై దోష ప్రవర్తన కలవారితో కూడి సంచరించటము పంచమ మహాపాతకముగా చెప్పబడుతోంది.

అథ హ య ఏతానేవం పంచాగ్నీన్వేద న సహ
తైరప్యాచరన్పాప్మనా లిప్యతే శుద్ధః పూతః పుణ్యలోకో భవతి
య ఏవం వేద య ఏవం వేద .. 5.10.10..

.. ఇతి దశమః ఖండః ..
10. అథ హ య ఏతాన్
ఏవం పంచాగ్నీన్ వేద,
న సహ ఏతైః అపి
ఆచరన్ పాప్మనా లిప్యతే।
శుద్ధః పూతః
పుణ్య లోకో భవతి
య ఏవం వేద।
య ఏవం వేద।।
అయితే, ఎవ్వరైతే - ఈ పంచమ పాఠకములో చెప్పుకొన్న పంచాగ్నులను ఎఱిగినవాడై, వాటియొక్క అంతర్లీన తత్త్వమును ఉపాసిస్తూ ఉంటారో పైన చెప్పిన పంచ మహాపాతకముల దోషములనుండి, తదితర పాపదోషములను పొందడు.

పరిశుద్ధుడు, నిర్మలుడు, పునీతుడు కాగలడు.
- పుణ్యలోకములలో ప్రవేశము పొందగలడు.

అందుచేత అట్టి పంచాగ్ని తత్త్వములను ఎఱిగి, ఆత్మోపాసనను ఆశ్రయించెదరు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే దశమః ఖండః


5–11. పంచమ ప్రపాఠకః - ఏకాదశ ఖండము - వైశ్వానరాత్మోపాసన


ప్రాచీనశాల ఔపమన్యవః సత్యయజ్ఞః
పౌలుషిరింద్రద్యుమ్నో భాల్లవేయో జనః శార్కరాక్ష్యో
బుడిల ఆశ్వతరాశ్విస్తే హైతే మహాశాలా మహాశ్రోత్రియాః
సమేత్య మీమాగ్ంసాం చక్రుః కో న ఆత్మా కిం బ్రహ్మేతి .. 5.11.1..
1. ప్రాచీనశాల ఔపమన్యవః
సత్యయజ్ఞః పౌలుషిః,
ఇంద్రద్యుమ్నో భాల్లవేయో జనః శార్కరాక్ష్యో,
బుడిల అశ్వతరాశ్విః
ఒకానొక సందర్భంలో కొందరు మహనీయులు సత్సంగపూర్వకంగా ఒకచోట సమావేశమవటం జరిగింది.
(1) ఉపమన్యుని కుమారుడు - ప్రాచీనశాలుడు.
(2) పులిషియొక్క కుమారుడు - సత్యయజ్ఞుడు.
(3) భల్లవి పుత్రుడు - ఇంద్రద్యుమ్నుడు.
(4) శర్కరాక్షుని పుత్రుడు - జనుడు.
(5) అశ్వతరాశ్వుని పుత్రుడు - ఋడిలుడు.
తే హైతే మహాశాలా,
మహా శ్రోత్రియాః సమేత్య
‘‘మీమాగ్ంసాం’’ - చక్రుః।
కో నః ఆత్మా? కిం బ్రహ్మే-తి।
వీరు గొప్ప శాస్త్రకోవిదులు. గొప్ప శిష్యగణము గల గృహస్థులు. శ్రుతుల గురించి అధ్యయనము చేసియున్న శ్రోత్రీయులు వీరంతా సమావేశమై ‘‘మన ఆత్మ అనగా ఎవరు? పరాబ్రహ్మము అనగా ఏది?’’ - అని సమాలోచన చేయసాగారు.

తే హ సంపాదయాంచక్రురుద్దాలకో వై భగవంతోఽయమారుణిః
సంప్రతీమమాత్మానం వైశ్వానరమధ్యేతి తగ్ం
హంతాభ్యాగచ్ఛామేతి తగ్ం హాభ్యాజగ్ముః .. 5.11.2..
2. తే హ సంపాదయాం చక్రుః
ఉద్దాలకో వై భగవంతో
అయమ్ ఆరుణిః
సంప్రతి ఇమం ఆత్మానం
వైశ్యానరం అధ్య ఇతి।
తం హన్త అభ్యాగచ్ఛాం ఏతి।
తగ్ం హాభ్యాజగ్ముః।
కొంతసేపు సమాలోచన చేసిన తరువాత, ‘‘ఇట్లా కాదు, మనము వేదతత్త్వము తెలిసిన సద్గురువును ఆశ్రయిద్దాము’’ అని అనుకొన్నారు. ఆరుణి ఋషి కుమారుడైన ఉద్దాలకమహర్షి (ఆరుణి) దర్శనం చేసుకొని, వారి వద్ద ‘‘వైశ్వానరోపాసనా విద్య’’ గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు.
వెంటనే ఆరుణీ నామధేయ ఉద్దాలక మహర్షి ఆశ్రమానికి వచ్చి తత్త్వవేత్త అగు ఆ మహర్షిని సందర్శించారు.
హే మహాత్మా! మాకు వైశ్వానర విద్యను బోధించ ప్రార్థన!

స హ సంపాదయాంచకార ప్రక్ష్యంతి మామిమే
మహాశాలా మహాశ్రోత్రియాస్తేభ్యో న సర్వమివ ప్రతిపత్స్యే
హంతాహమన్యమభ్యనుశాసానీతి .. 5.11.3..
3. స హ సంపాదయాంచకార
ప్రక్ష్యన్తి - మామ్ ఇమే
మహాశాలా మహాశ్రోత్రియాః
తేభ్యో న సర్వమివ ప్రతిపత్స్యే హంత।
అహమ్ అన్యమ్ అభ్యనుశాసాని। ఇతి।।
ఉద్దాలక మహర్షి : ఈ విధంగా తలచారు. ‘‘ఈ వచ్చినవారు పెద్ద శిష్యబృందము గల గృహస్థులు. వీరు అనేక వివరణల గురించి నన్ను ప్రశ్నించగలరు. వీరికి వైశ్వానర విద్య గురించి సంపూర్తిగా బోధించలేను. అందుచేత వీరికి మరొక మహనీయుడగు గురువును ఆశ్రయించటానికై దారి చూపిస్తాను’’ ఇట్లా అనుకొని ఈ విధంగా పలుక సాగారు.

తాన్హోవాచాశ్వపతిర్వై భగవంతోఽయం కైకేయః
సంప్రతీమమాత్మానం వైశ్వానరమధ్యేతి
తగ్ంహంతాభ్యాగచ్ఛామేతి తగ్ంహాభ్యాజగ్ముః .. 5.11.4..
4. తాన్ హ ఉవాచ :-
అశ్వపతిర్వై భగవన్తో
అయం కైకేయః సంప్రతి
ఇమమ్ ఆత్మానం ‘వైశానరమధ్య’ ఇతి।
తం హన్త అభ్యాగచ్ఛామ్
ఏతి తం హాభ్యాజగ్ముః ।।
ఉద్దాలక మహర్షి : ఓ మహాశాలా - మహాశ్రోత్రియులారా! పూజనీయులారా! నాకన్నా కూడా వైశ్వానరోపాసన గురించి ఎరిగియున్నవారు, మహనీయుడు అగు ఒకరున్నారు. వారు - ఆయన కేకయరాజ కుమారుడగు అశ్వపతి. మహారాజు వారు వైశ్వానరుని ఎరిగియున్నవారు. మనము ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి వైశ్వానరవిద్య గురించి శ్రవణము, అధ్యయనము చేద్దాము పదండి.

తేభ్యో హ ప్రాప్తేభ్యః పృథగర్హాణి కారయాంచకార
స హ ప్రాతః సంజిహాన ఉవాచ న మే స్తేనో జనపదే న
కర్దర్యో న మద్యపో నానాహితాగ్నిర్నావిద్వాన్న స్వైరీ స్వైరిణీ
కుతో యక్ష్యమాణో వై భగవంతోఽహమస్మి యావదేకైకస్మా
ఋత్విజే ధనం దాస్యామి తావద్భగవద్భ్యో దాస్యామి
వసంతు భగవంత ఇతి .. 5.11.5..
5. తేభ్యో హ ప్రాప్తేభ్యః పృథక్
అర్హాణి కారయాంచకార
స హ పాత్రః సంజిహాన ఉవాచ
ఆ మరునాడు వారంతా అశ్వపతి మహారాజు వద్దకు వెళ్లి, వారిని సందర్శించారు. అప్పుడు అశ్వపతి మహారాజు ఆ వచ్చినవారందరికి సుస్వాగతము పలికారు. ఒక్కొక్కరికి సత్కారములు సపర్యలు అందజేసారు. ఆ మరునాడు ఉదయము వారందరినీ సమీపించి రాజు ఇట్లా పలికారు.
‘‘న మే స్తేనో జనపదే।
న కదర్యో న మద్యపో।
నానాహితాగ్నిః న అవిద్వాన్।
న స్వైరీ, స్వైరిణీ కుతః?
యక్ష్యమాణో వై భగవన్తో అహమస్మి।
అశ్వపతి మహారాజు : ఓ పూజనీయులారా! ఈ మా రాజ్యములో దొంగలుగాని, లోభులుగాని లేరు. మద్యపానం చేయువారు లేరు. అహితాగ్నినిష్ఠులు కానివారు లేరు. అవిద్వాంసులు లేరు.
వ్యభిచారులు గాని, కుంటలు గాని లేరు. మీరు నిశ్చింతగా మా రాజ్యంలో కొంతకాలము ఉండి ఆనందించండి.

భగవాన్! నేను ఇప్పుడు ఒక యజ్ఞమును ప్రారంభించబోతూ, దీక్ష తీసుకోబోతున్నాను.
యావత్ ఏకైకస్మా ఋత్విజే
ధనం దాస్యామి,
తావత్ భగవద్భ్యో దాస్యామి
వసంతు భగవంత। ఇతి।।
ఈ జరగబోయే యజ్ఞమునకు ఋత్విజులు వచ్చియున్నారు. ఒక్కొక్క ఋత్విజునికి ఎంతెంత సమర్పించుకోబోవుచున్నానో - అంతంత ధనము మీలో ప్రతి ఒక్కరికి కూడా సమర్పించుకుంటాను. మీ మహనీయత్వమును గౌరవించుకుంటాను.
నాచే మీరు పూజింపబడుచూ ఇక్కడ ఉండండి. ఇది నా అభ్యర్థన, ప్రార్థన.

తే హోచుర్యేన హైవార్థేన పురుషశ్చరేత్తగ్ంహైవ
వదేదాత్మానమేవేమం వైశ్వానరగ్ం సంప్రత్యధ్యేషి తమేవ నో
బ్రూహీతి .. 5.11.6..
6. తే హి ఊచు :-
‘‘యేన హ ఏవ అర్థేన
పురుషశ్చః ఏత్తగ్ం హైవ
వదేత్ ఆత్మానమ్
ఏవేమం వైశ్వానరగ్ం
సంప్రత్యధ్యేషి తమేవ
నో బ్రూహి - ఇతి।
ఉద్దాలక ఋషి, ప్రాచీనశాలుడు, సత్యయజ్ఞుడు, ఇంద్రద్యుమ్నుడు, జనుడు, బుడిలుడు :
మహారాజా! అశ్వపతీ! మీ స్వాగత వచనములకు, అభ్యాగతి మర్యాదలకు, ధనసమర్పణ సంసిద్ధతకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మీకు సర్వదా శుభమగు గాక! మీ యజ్ఞ కార్యక్రమము దిగ్విజయమగు గాక! అయితే ఇక్కడ ఒక విషయం మీకు విన్నవించుకొంటున్నాము. మేము సంపదల కొరకై మీవద్దకు రాలేదు. ఎవరు ఏ ప్రయోజనము కొరకై వస్తారో, అదియే మీవంటి మహనీయులు సిద్ధింపజేయటము ఆచరిస్తూ ఉంటారు కదా!

మీరు ‘వైశ్వానరవిద్య’ను సవివరంగా, సశాస్త్రీయంగా ఎరిగి ఉన్నవారనునది లోకప్రసిద్ధము. అందుకొరకై విద్యార్థులమై వచ్చాము. దయతో వైశ్వానరవిద్యను మాకు బోధించవలసినదిగా అర్థిస్తున్నాము. అనుగ్రహించండి.

తాన్హోవాచ ప్రాతర్వః ప్రతివక్తాస్మీతి తే హ సమిత్పాణయః
పూర్వాహ్ణే ప్రతిచక్రమిరే తాన్హానుపనీయైవైతదువాచ .. 5.11.7..

.. ఇతి ఏకాదశః ఖండః ..
7. తాన్ హ ఉవాచ :-
ప్రాతర్వ: ప్రతివక్తాఽస్మి,
ఇతి తే హ సమిత్
పాణయ: పూర్వాహేణా
ప్రతిచక్రమిరే తాన్ వా
అనుపనీయైవ…
ఏతత్ ఉవాచ।।
అశ్వపతి మహారాజు : మహనీయులారా! అట్లాగే! అయితే, అట్టి విద్య మనం అభ్యసించటానికై మీరు ప్రాతఃకాల ఉదయ సమయములలో సంసిద్ధులై ఉండండి. అప్పుడు మాత్రమే నాకు తీరిక.
ఆ మరునాడు ఉదయమే ఉద్దాలకఋషి మొదలైనవారు సమిత్ ప్రాణులై (సమిధల కట్టెలను గురుసమర్పణగా చేతబూనినవారై) సిద్ధమై ఉన్నారు.
వారికి ‘‘ఉపనయన దీక్ష’’ - నియమించకుండానే అశ్వపతిరాజు ఈ విధంగా బోధించటము ఆరంభించారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ఏకాదశః ఖండః


5–12. పంచమ ప్రపాఠకః - ద్వాదశ ఖండము - ద్యులోక వైశ్వానరోపాసన


ఔపమన్యవ కం త్వమాత్మానముపాస్స ఇతి దివమేవ భగవో
రాజన్నితి హోవాచైష వై సుతేజా ఆత్మా వైశ్వానరో యం
త్వమాత్మానముపాస్సే తస్మాత్తవ సుతం ప్రసుతమాసుతం కులే
దృశ్యతే .. 5.12.1..
1. ఔపమన్యవ కం త్వమ్
ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।
(ఔపమన్యుడు) దివమేవ భగవో, రాజన్!
అశ్వపతి మహారాజు : మహనీయుడగు ఉపమన్య మునీంద్రుల ప్రియ కుమారుడగు ఔపమన్యా! ప్రాచీనశాలా! మీరు ‘ఆత్మ’ను ఏవిధంగా ఉపాసిస్తూ ఉన్నారో ముందుగా అది వివరించి మాకందరికీ చెప్పండి.
ఔపమన్యుడు / ప్రాచీనశాలుడు : రాజా! ద్యులోకమును (దేవతా లోకమును) వైశ్వానరాత్మగా ఉపాసిస్తున్నాను.
ఇతి హ ఉవాచ :
‘‘ఏష వై సుతేజా - ‘‘ఆత్మా
వైశ్వానరో - యం।’’
త్వమ్ ఆత్మానం, ఉపాస్సే
తస్మాత్ తవ ‘సుతం’,
‘ప్రసుతం’, ‘ఆసుతం’ కులే దృశ్యతే।
అశ్వపతిరాజు : అయితే, మీరు ఉపాసిస్తూ ఉన్నది ఆత్మయొక్క ఒక ‘సంతేజము’ అయినట్టి వైశ్వానరాత్మను మాత్రమే! అది పూర్ణాత్మ యొక్క ఉపాసన కాదు.

మీరు ‘సుతేజా’ అనబడే ఆత్మయొక్క కళను మాత్రమే ఉపాసిస్తున్నారు. సుతేజ వైశ్వానరాత్మ కేవలమగు ఆత్మకు ఒక అవయవము వంటిది. మీరు ఉపాసిస్తూ వస్తున్నది -

(1) సుతము = {వైదిక కర్మ (అగ్నిష్టోమము) నందు సోమలతను దంచి వేరుచేయబడిన ‘‘సోమరసము’’}

(2) ప్రసుతము = {క్రతువులలో (వాజపేయము వాటియందు) సంపాదించబడే సోమరసము}

(3) అసుతము = {యాగములందు (సత్రయాగము మొదలైన వాటియందు) నిరంతరము ఉపయోగించు సోమరసముగా సుస్పష్టము అవుతోంది}

అత్స్యన్నం పశ్యసి ప్రియమత్త్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య
బ్రహ్మవర్చసం కులే య ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే
మూధా త్వేష ఆత్మన ఇతి హోవాచ మూర్ధా తే
వ్యపతిష్యద్యన్మాం నాగమిష్య ఇతి .. 5.12.2..

.. ఇతి ద్వాదశః ఖండః ..
2. అత్స్యన్నం పశ్యసి।
ప్రియం అత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులే
య ఏతమ్ ఏవం
ఆత్మానం వైశ్వానరం
ఉపాస్తే మూర్ధాతి,
ఏష ఆత్మన - ఇతి।
మీరు ఆహారము చక్కగా పొంది భుజించగలరు. ప్రియమగు పదార్థములు పొందగలరు.

ఎవ్వరైతే పరబ్రహ్మమును (లేక) వైశ్వానరాత్మను దివ్యలోకముగా పూజిస్తారో - అట్టి వారి కులంలో సత్కర్మానుష్ఠానపరులే పుడతారు. అట్టివారి కులంలో బ్రహ్మవర్చస్సు అగుపడుతూ ఉంటుంది.

అయితే అట్టివారిది పూర్ణాత్మకు చెందిన శిరస్సుయొక్క ఉపాసన మాత్రమే। సంపూర్ణమైన ఉపాసన కాదు.
హ ఉవాచ :
మూర్ధా తే వ్యపతిష్యత్ యత్
మాం న ఆగమిష్య। ఇతి।।
ఓ ఔపవన్యా! ఒకవేళ మీరు ఇప్పుడు నా దగ్గిరకు వచ్చి, నేను చెప్పబోవు వైశ్వానరాత్మ యొక్క వివరణ వినకపోతే - ఎప్పుడో మీ తల క్రింద పడిపోయి ఉండేదే। అనగా, మీరు అసంపూర్ణ ఉపాసనచే తలవంచవలసి వచ్చేది।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ద్వాదశః ఖండః


5–13. పంచమ ప్రపాఠకః - త్రయోదశ ఖండము - ఆదిత్య వైశ్వారోపాసన


అథ హోవాచ సత్యయజ్ఞం పౌలుషిం ప్రాచీనయోగ్య కం
త్వమాత్మానముపాస్స ఇత్యాదిత్యమేవ భగవో రాజన్నితి
హోవాచైష వై విశ్వరూప ఆత్మా వైశ్వానరో యం
త్వమాత్మానముపాస్సే తస్మాత్తవ బహు విశ్వరూపం కులే
దృశ్యతే .. 5.13.1..
1. అథ హ ఉవాచ :
సత్యయజ్ఞం పౌలిషిం,
ప్రాచీనయోగ్య కం త్వమ్
ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।
ఆదిత్యమేవ భగవో, రాజన్। ఇతి।।
అశ్వపతి మహారాజు : ఓ ప్రాచీన యోగ్యుడా! మానవీయుడగు పులిష మునీశ్వరుని కుమారా? సత్యయజ్ఞా! మీరు చెప్పండి. మీరు దేనిని ఆత్మగా ఉపాసిస్తున్నారు?
సత్యయజ్ఞుడు: భగవాన్! రాజన్! గురుదేవా! నేను సూర్య భగవానుని వైశ్వానరాత్మ దేవునిగా (లేక) పరమాత్మగా ఉపాసిస్తున్నాను.
హ ఉవాచ :
ఏష వై విశ్వరూప ఆత్మా
వైశ్వానరో యం త్వమ్ ఆత్మానమ్ ఉపాస్సే,
తస్మాత్ తవ బహు
విశ్వరూపం కులే దృశ్యతే।।
అశ్వపతి మహారాజు : నీవు ఏ సూర్యుని ఉపాసిస్తున్నావో ఆయన వైశ్వానరాత్మ యొక్క ఒక (అంశ) రూపమే ఉపాసిస్తున్నారు. అట్టి ఆత్మ స్వరూపోపాసన చేస్తూ ఉన్నారు కాబట్టి ; ఆదిత్యుడే విశ్వరూపుడు కనుక - ఆయనను ఉపాసించటం వలన మీ కులములో (వంశములో) అనేక ఇహ-పర సుఖములు ఇచ్చే సాధనములు కనబడుచున్నాయి. సాధన సంపత్తి సమగ్రంగా లభించగలదు.

ప్రవృత్తోఽశ్వతరీరథో దాసీనిష్కోఽత్స్యన్నం పశ్యసి
ప్రియమత్త్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య బ్రహ్మవర్చసం కులే
య ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే చక్షుషేతదాత్మన ఇతి
హోవాచాంధోఽభవిష్యో యన్మాం నాగమిష్య ఇతి .. 5.13.2..

.. ఇతి త్రయోదశః ఖండః ..
2. ప్రవృత్తో, అశ్వతరీరథో దాసీ నిష్కో
అత్స్యన్నం పశ్యసి।
అశ్వతర (గుర్రము/కంచరగాడిద) రథములు, దాసదాసీజనులు, శుభ్రమైన ఆహారము కలిగియుండగలరు. ప్రియమగు అన్నము సర్వదా లభించగలదు.
ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం అత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి।
అస్య బ్రహ్మవర్చసం కులే య
ఏతమేవమ్ ఆత్మానం ‘వైశ్వానరమ్’ ఉపాస్తే
చక్షుష్ట్వ ఏతత్ ఆత్మన ఇతి।
హ ఉవాచ :
అంధో అభవిష్కో యత్
మాం న ఆగమిష్య। ఇతి।।
ప్రియమైన విషయములు చూస్తూ ఉండగలరు. బ్రహ్మవర్చస్సు కలిగి యుంటారు. కనుక ఈ విధంగా ఆత్మను ఆదిత్యరూపంగా ఉపాసించటము శుభప్రదమే!

అయితే మీరు ఉపాసించునది వైశ్వానరాత్మ యొక్క ‘కన్ను’ మాత్రమే। అందుచేత అది సంపూర్ణమైన వాశ్వానరోపాసన కాదు.

ఏది ఏమైతేనేమి. మీరు మాత్రం నా దగ్గిరకు ఇప్పుడు వచ్చి వైశ్వానరాత్మ యోగము ఉపాసనల గురించి శ్రవణం చేయబోతున్నారు. కాబట్టి మంచిదే. అట్లా వచ్చి ఉండకుంటే మీరు పూర్ణాత్మ జ్ఞాన విషయంలో గ్రుడ్డివారు అయిపోయేవారే!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే త్రయోదశః ఖండః


5–14. పంచమ ప్రపాఠకః - చతుర్దశ ఖండము - వాయు వైశ్వానరోపాసన


అథ హోవాచేంద్రద్యుమ్నం భాల్లవేయం వైయాఘ్రపద్య కం
త్వమాత్మానముపాస్స ఇతి వాయుమేవ భగవో రాజన్నితి
హోవాచైష వై పృథగ్వర్త్మాత్మా వైశ్వానరో యం
త్వమాత్మానముపాస్సే తస్మాత్త్వాం పృథగ్బలయ ఆయంతి
పృథగ్రథశ్రేణయోఽనుయంతి .. 5.14.1..
1. అథ హ ఉవాచ ఇంద్రద్యుమ్నం
భాల్లవేయం వైయాఘ్రపద్యకం
త్వమ్ ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।

అశ్వపతి మహారాజు : ఓ భల్లవి మునీశ్వరుని పుత్రులగు ఇంద్రద్యుమ్న మహాశయా! వైయాఘ్రపద్యా! మీరు కూడా చెప్పండి. మీరు ఆత్మ అనగా ఏదని ఉపాసిస్తున్నారు?

వాయుమేవ భగవో, రాజన్! - ఇతి।
హ ఉవాచ :
ఏష వై పృథక్ వర్త్మా ఆత్మా
వైశ్వానరో యం త్వమ్
ఆత్మానమ్ ఉపాస్సే
తస్మాత్ త్వాం పృథక్ బలయ ఆయంతి।
పృథక్ రథ శ్రేణయో అనుయంతి।
ఇంద్రద్యుమ్నుడు : గురువర్యా! మహారాజా! నేను వాయుదేవుని పరమాత్మగా ఉపాసిస్తున్నాను. (నమస్తే వాయో! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి।)
అశ్వపతి మహారాజు : అనగా, ఓ ఇంద్రద్యుమ్నమునీ! మీరు ‘‘పృథక్ వర్త్మ’’ అను వైశ్వానరాత్మ అంశను ఉపాసిస్తున్నారన్నమాట.
వాయువు నానాగతి కలది కదా! అందుచేత మీరు అనేక దిక్కులనుండి బలమును పొందగలరు.
అనేక రథములు మీ వెనుకగా (మీరు ఎక్కడికి వెళ్లితే అక్కడికి) నడచివస్తూ ఉండగలరు.

అత్స్యన్నం పశ్యసి ప్రియమత్త్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య
బ్రహ్మవర్చసం కులే య ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే
ప్రాణస్త్వేష ఆత్మన ఇతి హోవాచ ప్రాణస్త
ఉదక్రమిష్యద్యన్మాం నాగమిష్య ఇతి .. 5.14.2..

.. ఇతి చతుర్దశః ఖండః ..
2. అత్స్యన్నం పశ్యసి।
ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి।
అస్య బ్రహ్మవర్చసం కులే,
య ఏతమేవమ్ ఆత్మానం
వైశ్వానరం ఉపాస్తే,
ప్రాణస్త్వేష ఆత్మన ఇతి।।

మీరు పవిత్రము, ప్రియము అగు ఆహారము ఎల్లప్పుడు పొందుచూ ఉండగలరు. అన్నభోక్త అయి ఉంటారు.
అందరికీ ప్రీతిపాత్రులు అవుతారు. బ్రహ్మవర్చస్సు కలిగి ఉంటారు. ఆ విధంగా వాయువును వైశ్వానరాత్మగా ఉపాసించటం చేత మీ వంశము పవిత్రమై ఉండగలదు.
అయితే మీరు వైశ్వానరాత్మ యొక్క ‘‘ప్రాణాంశ’’ను మాత్రమే ఉపాసించినవారగుచున్నారు. అనగా మీయొక్క వైశ్వానరోపాసన సమగ్రము కానేకాదు.

హ ఉవాచ :
ప్రాణస్త ఉదక్రమిష్యయత్
మాం న ఆగమిష్య। ఇతి।।
ఒకవేళ మీరు నా వద్దకు వైశ్వానరోపాసన యొక్క వాస్తవ తత్త్వము శ్రవణము చేయటానికి వచ్చి ఉండకపోతే - మీరు ప్రాణము పోగొట్టుకొని ఉండేవారు సుమా!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే చతుర్దశః ఖండః


5–15. పంచమ ప్రపాఠకః - పంచదశ ఖండము - ఆకాశ వైశ్వానరోపాసన


అథ హోవాచ జనగ్ంశార్కరాక్ష్య కం త్వమాత్మానముపాస్స
ఇత్యాకాశమేవ భగవో రాజన్నితి హోవాచైష వై బహుల
ఆత్మా వైశ్వానరో యం త్వమాత్మానముపస్సే తస్మాత్త్వం
బహులోఽసి ప్రజయా చ ధనేన చ .. 5.15.1..
1. అథ హ ఉవాచ జనగ్ం।
శార్కరాక్ష్య
‘‘కం’’ త్వమ్ ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।।
అశ్వపతి మహారాజు : ఓ శర్కరాక్ష్య మునీశ్వరుని ప్రియకుమారా! జన మహాశయా! మీరు చెప్పండి. మీరు ఇంతవరకు వైశ్వానరాత్మగా ఎవరిని (లేక) దేనిని ఉపాసిస్తున్నారు? అది ఈ మన ‘సభ’కు వివరించి చెప్పండి।
ఆకాశమేవ భగవో,
రాజన్! ఇతి!
జనుడు : మహాత్మా! అశ్వపతి మహారాజా! గురువర్యా! నేను ఆకాశమును భగవానునిగాను, ‘‘వైశ్వానరాత్మ’’ గాను ఉపాసిస్తూ ఉన్నాను.
హ ఉవాచ :
ఏష వై బహుల ఆత్మా వైశ్వానరో
యం త్వమ్ ఆత్మానం ఉపాస్సే।
తస్మాత్ త్వం బహులో అసి
ప్రజాయా చ। ధనేన చ।
అశ్వపతి మహారాజు : ఓ జన మహాశయా! మీరు ఆత్మను ఆకాశరూపంగా ఉపాసించటము - ‘బహుళోపాసన’ అని చెప్పబడుతూ ఉంటోంది.
అందుచేత మీరు బహుళమగు అష్టసంపదలతోను, ఉత్తమ జన సంపదతోను, ధనముతోను సర్వదా సమృద్ధులై ఉంటారు.

అత్స్యన్నం పశ్యసి ప్రియమత్త్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య
బ్రహ్మవర్చసం కులే య ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే
సందేహస్త్వేష ఆత్మన ఇతి హోవాచ సందేహస్తే వ్యశీర్యద్యన్మాం
నాగమిష్య ఇతి .. 5.15.2..

.. ఇతి పంచదశః ఖండః ..
2. అత్స్యన్నం పశ్యసి। ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి। అస్య బ్రహ్మవర్చసం కులే
య ఏతమేవమ్ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే,
సందేహస్త్వ ఏష ఆత్మన ఇతి।
హ ఉవాచ
సందేహః తే వ్యదీర్యతి యత్ మాం
న ఆగమిష్య। ఇతి।।
సమృద్ధిగాను, ప్రియముగాను ఎల్లప్పుడు మీరు ఆహారము పొందుతూ ఉంటారు. అందరికి ప్రియము అవుతారు. మీ వంశము బ్రహ్మవర్చస్సుతోను, జ్ఞానులతోను విరాజిల్లగలదు.
అయితే మీరు ఉపాసిస్తున్న వైశ్వానరోపాసన - ఆత్మయొక్క మధ్యభాగము మాత్రమే ఉపాసించువారగుచున్నారు సుమా.
మీరు ఇక్కడికి (నావద్దకు) వచ్చి ఉండకపోతే మీ శరీరమధ్యభాగము నశించిపోయి ఉండేదే!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే పంచదశః ఖండః


5–16. పంచమ ప్రపాఠకః - షోడశ ఖండము - జల వైశ్వానరోపాసన


అథ హోవాచ బుడిలమాశ్వతరాశ్విం వైయాఘ్రపద్య కం
త్వమాత్మానముపాస్స ఇత్యప ఏవ భగవో రాజన్నితి హోవాచైష
వై రయిరాత్మా వైశ్వానరో యం త్వమాత్మానముపాస్సే
తస్మాత్త్వగ్ంరయిమాన్పుష్టిమానసి .. 5.16.1..
1. అథ హ ఉవాచ
బుడిలం అశ్వతరాశ్విం
వైయాఘ్రపద్య!
కం త్వమ్ ఆత్మానమ్ ఉపాస్స? ఇతి।।
‘అప’ ఏవ భగవో, రాజన్। ఇతి।
అశ్వపతి మహారాజు : ఓ అశ్వతరాశ్వ మునీశ్వర కుమారా! బుడిల మహాశయా! వైయాఘ్రపద్య। మీరు ఆత్మను ఏ ఆలంబనంతో ఉపాసిస్తున్నారు? ఏ రూపము ఆశ్రయించి ఆత్మయొక్క ‘‘సమగ్రము’’ను సమీపంచ యత్నిస్తున్నారు?
బుడిల ముని : నేను జలదేవతను భగవానుని స్వరూపంగా భావించి వైశ్వానరోపాసన చేస్తున్నాను.
హ ఉవాచ :
ఏష వై రయిః ఆత్మా వైశ్వానరో యం త్వమ్
ఆత్మానం ఉపాస్సే తస్మాత్ త్వగ్ం
రయిమాన్, పుష్టిమాన్ అసి।

అశ్వపతి మహారాజు : మీరు ఆపః (జలమును) ఆత్మోపాసన కొరకై ఉపాసించటము ‘‘రయి-వైశ్వానరాత్మోపాసన’’ అని అంటూ ఉంటారు.
(జలమునుండి పంటలు, వాటి నుండి ధనధాన్య సంపద లభిస్తాయి. కనుక) మీరు శరీర పుష్టిని పొందుచున్నారు.


అత్స్యన్నం పశ్యసి ప్రియమత్త్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య
బ్రహ్మవర్చసం కులే య ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే
బస్తిస్త్వేష ఆత్మన ఇతి హోవాచ బస్తిస్తే వ్యభేత్స్యద్యన్మాం
నాగమిష్య ఇతి .. 5.16.2..

.. ఇతి షోడశః ఖండః ..
2. అత్స్యన్నం పశ్యసి।
ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి, అస్య బ్రహ్మవర్చసం కులే।
య ఏతమ్ ఏవ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే
బస్తిస్త్వ ఏష ఆత్మన ఇతి।
అన్నమును సమృద్ధిగా పొందగలరు. అంతా ప్రియంగా ఉండగలదు. బ్రహ్మవర్చస్సు పొందగలరు. మీ కులము (వంశము) లోని వారు ఆహారము, బ్రహ్మవర్చస్సు చక్కగా పొందగలరు.
అయితే అట్టి జలమును ఉపాసించటమనేది వైశ్వానరాత్మయొక్క మూత్రాశయ - అంశము ఉపాసించటము వంటిది.
హ ఉవాచ
బస్తిస్తే వ్యభేత్స్యత్ యత్ మాం న ఆగమిష్య। ఇతి।।
మీరు నా వద్దకు వచ్చి ఉండకపోతే మూత్రాశయము పగిలి ఉండేదే

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే షోడశః ఖండః


5–17. పంచమ ప్రపాఠకః - సప్తదశ ఖండము - భూమి వైశ్వానరోపాసన


అథ హోవాచోద్దాలకమారుణిం గౌతమ కం త్వమాత్మానముపస్స
ఇతి పృథివీమేవ భగవో రాజన్నితి హోవాచైష వై
ప్రతిష్ఠాత్మా వైశ్వానరో యం త్వమాత్మానముపాస్సే
తస్మాత్త్వం ప్రతిష్ఠితోఽసి ప్రజయా చ పశుభిశ్చ 5.17.1..
1. అథ హ ఉవాచ ఉద్దాలకం ఆరుణిం :
గౌతమ। కం త్వమ్ ఆత్మానం
ఉపాస్స? - ఇతి
‘‘పృథివీమ్’’ ఏవ, భగవో రాజన్।’’ - ఇతి।

అశ్వపతి మహారాజు : అరుణిమహర్షి పౌత్రులు, పూజ్యులగు ఆరుణి మునీంద్రులవారి కుమారుడు అగు ఓ ఉద్దాలక మహర్షీ! గౌతమా? మీరు ఆత్మను ఏ ఉపాయంగా - రూపంగా ఉపాసిస్తున్నారు?
ఉద్దాలకుడు : ఈ భూమియే ఆత్మస్వరూపము - అని వైశ్వానరోపాసన చేస్తూ ఉన్నాను, భగవాన్! రాజన్!

హ ఉవాచ :
ఏష వై ప్రతిష్ఠా ఆత్మా వైశ్వానరో యమ్ త్వమ్
ఆత్మానం ఉపాస్సే, తస్మాత్ త్వం
ప్రతిష్ఠితోఽసి ప్రజయా చ, పశుభిః చ।।
అశ్వపతి మహారాజు : మీరు వైశ్వానరోపాసనగా భూమిని ఆత్మస్వరూపంగా భావించి ఉపాసించటము మంచిదే. అది ‘ప్రతిష్ఠా’ అనబడుచున్న వైశ్వానరాత్మోపాసన.
ఈ ఉపాసనచేత మీరు ప్రజా - పశు సంపదచే ‘‘ప్రతిష్ఠ’’ కలిగి ఉంటారు.

అత్స్యన్నం పశ్యసి ప్రియమత్త్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య
బ్రహ్మవర్చసం కులే య ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే
పాదౌ త్వేతావాత్మన ఇతి హోవాచ పాదౌ తే వ్యమ్లాస్యేతాం
యన్మాం నాగమిష్య ఇతి 5.17.2..

.. ఇతి సప్తదశః ఖండః ..

2. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్త్యన్నం పశ్యతి।
ప్రియం భవతి। అస్య బ్రహ్మవర్చసం కులే య
ఏతమేవమ్ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే,
పాదౌ త్వేతావా ఆత్మన ఇతి।
హ ఉవాచ :
పాదౌ తే వ్యమ్లాస్యేతాం
యత్ మాం న ఆగమిష్య - ఇతి।।
ఉత్తమమైన ‘అన్నము’ (ఇంద్రియములకు ఆహారము) పొందుచూ ప్రీతిని పొందుచూ ఉంటారు. మా వంశంలో బ్రహ్మవర్చస్సు వేంచేసినదై ఉండగలదు.
ఇటువంటి ఉపాసన వైశ్వానరాత్మ యొక్క పాదములను (పాద అంశను మాత్రమే) మీరు ఉపాసిస్తూ ఉన్నట్లు!
నా వద్దకు వచ్చి ఉండకపోతే మీ పాదములు శుష్కించి ఉండేవే!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే సప్తదశః ఖండః


5–18. పంచమ ప్రపాఠకః - అష్టాదశ ఖండము - పూర్ణ వైశ్వానరాత్మోపాసన


తాన్హోవాచైతే వై ఖలు యూయం పృథగివేమమాత్మానం
వైశ్వానరం విద్వాగ్ంసోఽన్నమత్థ యస్త్వేతమేవం
ప్రాదేశమాత్రమభివిమానమాత్మానం వైశ్వానరముపాస్తే స సర్వేషు
లోకేషు సర్వేషు భూతేషు సర్వేష్వాత్మస్వన్నమత్తి .. 5.18.1..
1. తాన్ హ ఉవాచ :
ఏతే వై ఖలు యూయం పృథక్ ఇవ
ఏవం ఆత్మానం వైశ్వానరం విద్వాగ్ం
సో అన్నమత్థ యస్తు।
ఏతమ్ ఏవం ప్రాదేశ మాత్రమ్
అభివిమానమ్ ఆత్మానం
వైశ్వానరం ఉపాస్తే,
వైశ్వానరాత్మోపాసన - ముఖ్య విధానము
అశ్వపతి మహారాజు : [అ ఉద్దాలకుడు మొదలైన వైశ్వానరోపాసన (లేక) ఆత్మోపాసన అధ్యయనం చేయవచ్చిన వారందరితో] :
ఓ ఉద్దాలకుడు మొదలైన మహనీయులారా! మీరంతా కూడా వైశ్వానరాత్మను వేరువేరుగా తెలుసుకొంటూ ఉపాసన చేస్తున్నారు. అన్నమును (ఆహారమును / ఇంద్రియ విషయములను) ఆస్వాదిస్తూ ఉన్నారు. అంతటితో ‘పరమాత్మను ఉపాసిస్తున్నాను’ - అని తృప్తిపడుచున్నారు. పరమాత్మను ఒక్కచోట మాత్రమే (ప్రాదేశమాత్రుడై) ఉన్నాడనే అభినివేశము (Emotion)తో మాత్రమే ఆరాధన చేస్తున్నారు.

పరమాత్మ ఒక్క రూపంగానో, ఒకచోటనే, పంచ భూతములలో ఒకటి మాత్రమేగానో పరిమితుడు కాదు కదా! కాబట్టి మీది పరిమితమైన ఉపాసనయేగాని పూర్ణాహుతి కాదు.
స సర్వేషు లోకేషు,
సర్వేషు భూతేషు,
సర్వేషు ఆత్మ సు అన్నమత్తి।।
ఆ వైశ్వానరాత్మ భగవానుడు సర్వ లోకములలోను, సర్వ భూతములందు (పంచ భూతములందు) సర్వజీవులందు వేంచేసి, సర్వత్ర ప్రకాశమానులై ఉన్నారు. ఇట్టి ఉపాసన చేయువారు సమస్తము అన్నముగా, స్వానుభూతిగా, స్వస్వరూపముగా ఆస్వాదించగలరు.

తస్య హ వా ఏతస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధైవ
సుతేజాశ్చక్షుర్విశ్వరూపః ప్రాణః పృథగ్వర్త్మాత్మా సందేహో
బహులో బస్తిరేవ రయిః పృథివ్యేవ పాదావుర ఏవ వేదిర్లోమాని
బర్హిర్హృదయం గార్హపత్యో మనోఽన్వాహార్యపచన ఆస్యమాహవనీయః .. 5.18.2..

.. ఇతి అష్టాదశః ఖండః ..

2. తస్య హ వా ఏతస్య ఆత్మనో
వైశ్వానరస్య మూర్ధ ఏవ సుతేజాః చక్షుః
విశ్వరూపః ప్రాణః పృథక్ వర్త్మా ఆత్మా
సందేహో బహులో బస్తిః ఏవ రయిః
పృథివి ఏన పాదౌ। ఉర ఏవ
వేదిః। లోమాని బర్హిః।
హృదయం ‘గార్హపత్యో’।
మనో ‘అన్వాహారి’। అపచన
ఆస్యమ్ ‘ఆహవనీయః’।
అట్టి మన స్వస్వరూపుడే అగు వైశ్వానరాత్మ ఎట్టివాడంటే (పరమాత్మ ఎంతటి వాడంటే),
ఆయన మూర్ధమే (శిరస్సే) - తేజోమయమై కనిపిస్తున్న సమస్త సుతేజస్సు. ఆ తేజస్సే ద్యులోకము (స్వర్గలోకము)
ఆయన చక్షువులే! చూపుయే - ఈ సమస్త విశ్వము యొక్క రూపము - ఆదిత్యుడు (All that beeing seen)
ఆయన ప్రాణశక్తియే - ఈ వేరువేరుగా కనిపించే పృథక్ (multiple) వర్తనమంతా - వాయువు (The vapour and its Air waves)
ఆయన శరీరమధ్యభాగమే - ఈ విస్తారము, సువిశాలము అగు ‘‘ఆకాశము’’ (Total Space) ఆయన మూత్రాశయమే - ఈ సమస్త జలము (All Liquid)
ఆయన యొక్క పాదములే - ఈ సమస్తమైన పృథివి (All that is solid)

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే అష్టాదశః ఖండః


5–19. పంచమ ప్రపాఠకః - ఏకోనవింశ ఖండము - ప్రాణాయ స్వాహా


తద్యద్భక్తం ప్రథమమాగచ్ఛేత్తద్ధోమీయగ్ం స యాం
ప్రథమామాహుతిం జుహుయాత్తాం జుహుయాత్ప్రాణాయ స్వాహేతి
ప్రాణస్తృప్యతి .. 5.19.1..
1. తద్యత్ భక్తం ప్రథమమ్
ఆగచ్ఛేత్ తత్ హోమీయం
స యాం ప్రథమామ్
ఆహుతిం జుహుయాత్తాం
జుహుయాత్ ‘‘ప్రాణాయ స్వాహా’’ - ఇతి
ప్రాణః తృప్యతి।
ప్రాణ - ఆహుతులు
(1) ప్రథమ ఆహుతి - ‘‘ప్రాణాయస్వాహా’’
(మొదటి హోమము)
(భోజన కాలములో) ఏది మొదటగా లభిస్తుందో - అది ప్రథమ హోమ సమర్పణగా
‘‘ప్రాణాయ స్వాహా’’ అని హోమద్రవ్యముగా భావనచేసి వైశ్వానరాగ్నికి (లేక) వైశ్వానరాత్మకు సమర్పించాలి.
అప్పుడు ‘‘ప్రాణము’’ తృప్తి పొందగలదు.

ప్రాణే తృప్యతి చక్షుస్తృప్యతి చక్షుషి
తృప్యత్యాదిత్యస్తృప్యత్యాదిత్యే తృప్యతి ద్యౌస్తృప్యతి
దివి తృప్యంత్యాం యత్కించ ద్యౌశ్చాదిత్యశ్చాధితిష్ఠతస్తత్తృప్యతి
తస్యానుతృప్తిం తృప్యతి ప్రజయా పశుభిరన్నాద్యేన తేజసా
బ్రహ్మవర్చసేనేతి .. 5.19.2..

.. ఇతి ఏకోనవింశః ఖండః ..
2. ప్రాణే తృప్యతి - చక్షుః తృప్యతి।।
చక్షుషి తృప్యతి
ఆదిత్యః తృప్యతి।
ఆదిత్యే తృప్యతి।
ద్యౌః తృప్యతి।
దివి తృప్యంత్యాం।
ఎప్పుడైతే ‘‘పంచప్రాణములలో మొదటిదైనట్టి వైశ్వానర తేజో ప్రథమరూపమగు ప్రాణము తృప్తి చెందుతుందో
- నేత్రేంద్రియములు తృప్తి చెందుతాయి.
- నేత్రేంద్రియ తృప్తిచే ‘ఆదిత్యుడు’ తృప్తి చెందుతారు.
- ఆదిత్యతృప్తిచే దేవతా లోకము (ద్యులోకము) తృప్తి చెందగలదు.
- ద్యులోక తృప్తిచే దివి (ఊర్ధ్వమంతా) తృప్తి పొందగలదు.
యత్ కిం చ ద్యౌః చ
ఆదిత్యః చ అధితిష్ఠతః తత్ తృప్యతి।
ఏది ద్యులోకము (దివ్య తత్త్వముల)చే, ఆదిత్యునిచే అధితిష్ఠితము (occupied) అయి ఉన్నదో - అట్టి సమస్తము తృప్తి చెందగలదు.
తస్య అనుతృప్తిం తృప్యతి।
ప్రజయా పశుభిః అన్నాద్యేన
తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।।
అప్పుడు సర్వ అసంతృప్తులు తొలగిపోయినవై తృప్తిచేత తృప్తిపొందగలము. ఇట్టి ‘‘ప్రాణాయస్వాహా’’ అంటూ మొదట లభించిన అన్నమును ప్రాణాహుతిగా సమర్పించుటలో అంతరార్థము ఎరిగి, ఆచరించువాడు - ప్రజలు, పశుసంపద, అన్నము సమృద్ధిగా, శ్రేయోదాయకంగా పొందుచూ, బ్రహ్మవర్చస్సుతో ‘‘అహంబ్రహ్మాస్మి’’ అని ప్రకాశించగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ఏకోనవింశః ఖండః


5–20. పంచమ ప్రపాఠకః - వింశ ఖండము - వ్యానాయ స్వాహా


అథ యాం ద్వితీయాం జుహుయాత్తాం జుహుయాద్వ్యానాయ స్వాహేతి
వ్యానస్తృప్యతి .. 5.20.1..
1. అథ యాం ద్వితీయాం
జుహుయాత్తాం జుహుయాత్
‘వ్యానాయస్వాహా’ ఇతి
వ్యానః తృప్యతి।
(2) ద్వితీయ ఆహుతి - ‘‘వ్యానాయస్వాహా’’
(రెండవ హోమము)
ఇప్పుడు రెండవ ఆహుతిని ‘‘వ్యానాయ స్వాహా’’ అని చెప్పుచూ హోమము చేయాలి. ఈ ద్వితీయ హోమమును సర్వాత్మేశ్వరుడగు వైశ్వానరాత్మ దేవునికి సమర్పించాలి.

వ్యానే తృప్యతి శ్రోత్రం తృప్యతి శ్రోత్రే తృప్యతి
చంద్రమాస్తృప్యతి చంద్రమసి తృప్యతి దిశస్తృప్యంతి
దిక్షు తృప్యంతీషు యత్కించ దిశశ్చ చంద్రమాశ్చాధితిష్ఠంతి
తత్తృప్యతి తస్యాను తృప్తిం తృప్యతి ప్రజయా పశుభిరన్నాద్యేన
తేజసా బ్రహ్మవర్చసేనేతి .. 5.20.2..

.. ఇతి వింశః ఖండః ..
2. వ్యానే తృప్యతి - శ్రోత్రం తృప్యతి।
శ్రోత్రే తృప్యతి చంద్రమాః తృప్యతి।
చన్ద్రమసి తృప్యతి దిశః తృప్యంతి।
దిక్షు తృప్త్యంతీషు యత్ కిం చ దిశశ్చ,
చన్ద్రమాశ్చ అధితిష్ఠన్తి, తత్ తృప్యతి।
తస్సాను తృప్తిం తృప్యతి,
ప్రజయా పశుభిః అన్నాద్యేన
తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।।
అట్టి ‘‘వ్యానాయ స్వాహా’’ - అంటూ ఆహుతిని హోమము చేయుచుండగా వ్యాన వాయువు తృప్తి చెందగలదు.
వ్యాన వాయు తృప్తిచే - శ్రోత్రేంద్రియము (వినికిడి) తృప్తి చెందగలదు.
తృప్తి పొందిన శ్రోత్రేంద్రియము (చెవి)చే చంద్రుడు తృప్తి చెందగలడు.
చంద్రమసి తృప్తిచే - దిక్కులన్నీ తృప్తి చెందగలవు.
దిక్కుల తృప్తిచే ఈ దిక్కులుకు, చంద్రునికి ఆధారమైయున్న సమస్తము తృప్తి చెందగలదు.
అప్పుడు అసంతృప్తి తొలగి అనుతృప్తి (ఆత్మతృప్తి) తృప్తి పొందగలదు.
అట్టి ‘అపానాయస్వాహా’ రూపమగు రెండవ ఆహుతి హోమ విధానము (తత్త్వము) ఎరిగినవాడు - ప్రజా (మిత్రులు, కుటుంబసభ్యులు), సంపద, పశు సంపద, అన్నము, బ్రహ్మవర్చస్సులతో ప్రకాశించగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే వింశః ఖండః


5–21. పంచమ ప్రపాఠకః - ఏకవింశ ఖండము - అపానాయ స్వాహా


అథ యాం తృతీయాం జుహుయాత్తాం జుహుయాదపానాయ
స్వాహేత్యపానస్తృప్యతి .. 5.21.1..
1. అథ యాం తృతీయాం
‘‘జుహుయాత్తాం జుహుయాత్
అపానాయస్వాహా’’ - ఇతి
అపానః తృప్యతి।
(3) తృతీయ ఆహుతి - ‘‘ఆపానాయస్వాహా’’
(తృతీయ హోమము)
ఆ తరువాత ‘‘అపానాయ స్వాహా’’ అంటూ అపాన ప్రాణమునకు మూడవ ఆహుతి హోమము చేయాలి. అప్పుడు అపాన వాయువు తృప్తిపొందగలదు.

అపానే తృప్యతి వాక్తృప్యతి వాచి తృప్యంత్యామగ్నిస్తృప్యత్యగ్నౌ
తృప్యతి పృథివీ తృప్యతి పృథివ్యాం తృప్యంత్యాం యత్కించ
పృథివీ చాగ్నిశ్చాధితిష్ఠతస్తత్తృప్యతి
తస్యాను తృప్తిం తృప్యతి ప్రజయా పశుభిరన్నాద్యేన తేజసా
బ్రహ్మవర్చసేనేతి .. 5.21.2..

.. ఇతి ఏకవింశః ఖండః ..
2. అపానే తృప్యతి వాక్ తృప్యతి।
వాచి తృప్యన్త్యామ్ అగ్నిః తృప్యతి।
అగ్నౌ తృప్యతి, పృథివీ తృప్యతి।
అపానవాయు తృప్తిచే ‘వాక్కు’ తృప్తి చెందగలదు.
వాక్ తృప్తిచే - అగ్ని తృప్తి పొందుతుంది.
అగ్ని తృప్తిచే - పృథివి తృప్తి చెందుతుంది.
పృథివ్యాం తృప్యన్త్యాం యత్కిం చ
పృథివీ చ, అగ్నిశ్చ అధితిష్ఠతః తత్ తృప్యతి।
పృథివీ తృప్తిచే - అట్టి పృథివికి, అగ్నికి అధిష్ఠానము అయినట్టిది (ఆత్మ) తృప్తి చెందగలదు.
తస్య అనుతృప్తిం తృప్యతి।
ప్రజయా, పశుభిః అన్నాత్
ఏన తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।
అట్టి అనుతృప్తి (ఆత్మ తృప్తి)చే తృప్తి సిద్ధించుకొన్నవాడు ప్రజ-పశు-అన్న-బ్రహ్మ తేజస్సులను పొందగలడు

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ఏకవింశః ఖండః


5–22. పంచమ ప్రపాఠకః - ద్వావింశ ఖండము - సమానాయ స్వాహా


అథ యాం చతుర్థీం జుహుయాత్తాం జుహుయాత్సమానాయ స్వాహేతి
సమానస్తృప్యతి .. 5.22.1..
1. అథ యాం చతుర్థీం
జుహుయత్తాం జుహుయాత్
‘‘సమానాయ స్వాహా’’ ఇతి
సమానః తృప్యతి।
(4) చతుర్థ ఆహుతి ‘‘సమానాయ స్వాహా’’
(4వ హోమము)
ఇప్పుడిక 4వ ఆహారమును (ఆహుతిని) ‘‘సమానాయ స్వాహా’’ అని చెప్పుచూ సమాన వాయువు కొరకై హోమము చేయాలి.
అప్పుడు సమాన వాయువు తృప్తి చెందగలదు.

సమానే తృప్యతి మనస్తృప్యతి మనసి తృప్యతి పర్జన్యస్తృప్యతి
పర్జన్యే తృప్యతి విద్యుత్తృప్యతి విద్యుతి తృప్యంత్యాం యత్కించ
విద్యుచ్చ పర్జన్యశ్చాధితిష్ఠతస్తత్తృప్యతి తస్యాను తృప్తిం
తృప్యతి ప్రజయా పశుభిరన్నాద్యేన తేజసా బ్రహ్మవర్చసేనేతి .. 5.22.2 ..

.. ఇతి ద్వావింశః ఖండః ..
2. సమానే తృప్యతి - మనః తృప్యతి।
మనసి తృప్యతి - పర్జన్యః తృప్యతి ।
పర్జన్యే తృప్యతి - విద్యుత్ తృప్యతి।
సమాన ప్రాణము తృప్తి చెందటంచేత - మనస్సు తృప్తి చెందుతుంది.
మనోతృప్తి చేత పర్జన్యుడు (వర్షదేవత) తృప్తి చెందగలరు.
పర్జన్యతృప్తి చేత విద్యుత్ (తేజస్సు / కాంతి) తృప్తి చెందగలదు.
విద్యుతి తృప్యన్త్యాం - యత్కిం చ విద్యుచ్చ
పర్జన్యశ్చ అధితిష్ఠతః తత్ తృప్యతి।
తస్య అనుతృప్తిం తృప్యతి।
విద్యుత్ తృప్తి చేత - అట్టి పర్జన్యునికి (వర్షమునకు), విద్యుత్తుకు (కాంతికి) అధిష్ఠానము (Root) అయి ఉన్న (అధిష్ఠానమగు) ఆత్మ - తృప్తి చెందగలదు. ‘‘అనుతృప్తి’’ - తృప్తి పొందగలదు.
ప్రజయా పశుభిః అన్నాద్యేన
తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।।
అనుతృప్తిచే (అధిష్ఠానము యొక్క తృప్తిచే) - అట్టి హోమము చేయువానికి సత్సంతానము, పశుసంపద, అన్నము, బ్రహ్మతేజస్సు స్వాభావికంగానే లభిస్తాయి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే ద్వావింశః ఖండః


5–23. పంచమ ప్రపాఠకః - త్రయోవింశ ఖండము - ఉదానాయ స్వాహా


అథ యాం పంచమీం జుహుయాత్తాం జుహుయాదుదానాయ
స్వాహేత్యుదానస్తృప్యతి .. 5.23.1..
1. అథ యాం పంచమీం
జుహుయాత్తాం జుహుయాత్
‘‘ఉదానాయ స్వాహా’’ ఇతి
ఉదానః తృప్యతి।
(5) పంచమ ఆహుతి ‘‘ఉదానాయ స్వాహా’’
(5వ హోమము)
ఇప్పుడిక ‘‘ఉదానాయ స్వాహా’’ అను మంత్రము పలుకుచు వైశ్వానరాత్మకు ‘‘ఐదవ ఆహుతి’’ సమర్పించాలి. అప్పుడు ఉదాన ప్రాణము తృప్తిచెందగలదు.

ఉదానే తృప్యతి త్వక్తృప్యతి త్వచి తృప్యంత్యాం వాయుస్తృప్యతి
వాయౌ తృప్యత్యాకాశస్తృప్యత్యాకాశే తృప్యతి యత్కించ
వాయుశ్చాకాశశ్చాధితిష్ఠతస్తత్తృప్యతి తస్యాను తృప్తిం
తృప్యతి ప్రజయా పశుభిరన్నాద్యేన తేజసా బ్రహ్మవర్చసేన .. 5.23.2..

.. ఇతి త్రయోవింశః ఖండః ..
2. ఉదానే తృప్యతి త్వక్ తృప్యతి,
త్వచి తృప్యన్త్యాం వాయుః తృప్యతి।
వాయౌ తృప్యత్య ఆకాశః తృప్యతి।
ఉదానప్రాణ తృప్తిచే - చర్మము తృప్తి చెందగలదు.
చర్మము యొక్క తృప్తిచే - వాయువు తృప్తి పొందుతోంది.
వాయు తృప్తిచే ఆకాశము తృప్తి పొందగలదు.
ఆకాశే తృప్యతి యత్కిం చ వాయుశ్చ,
ఆకాశశ్చ, అధితిష్ఠతః తత్ తృప్యతి।
ఆకాశ తృప్తిచే ఆకాశమునకు, వాయువుకు కూడా అధిష్ఠానము అయినట్టిది (ఆత్మ) తృప్తి చెందగలదు.
తస్య అనుతృప్తిం తృప్యతి।
ప్రజయా పశుభిః అన్నాద్యేన
తేజసా బ్రహ్మవర్చసేన ఇతి।।
అప్పుడు అనుతృప్తిరూపంగా సమస్తము తృప్తి చెందగలదు.
అట్టి హోమము చేయువాడు ప్రజలను, పశువులను, అన్నమును సమృద్ధిగా పొందగలడు.
అట్టి పవిత్రమగు అన్నముచే - బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తూ సంతృప్తుడై ఉండగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే త్రయోవింశః ఖండః


5–24. పంచమ ప్రపాఠకః - చతుర్వింశ ఖండము - వైశ్వానర పంచ ఆహుతి సమర్పణ ఫలము


స య ఇదమవిద్వాగ్నిహోత్రం జుహోతి యథాంగారానపోహ్య
భస్మని జుహుయాత్తాదృక్తత్స్యాత్ .. 5.24.1..
1. స య ఇదమ్ అవిద్వాన్
అగ్నిహోత్రం జుహోతి
యథా అంగారాన్ అపోహ్య
భస్మని జుహుయాత్
తాదృక్ తత్ స్యాత్।
అశ్వపతి మహారాజు : ఓ ఉద్దాలకాది మహనీయులారా! మనం వైశ్వానరాత్మ ‘‘పంచప్రాణాహుతులు’’ గురించి చెప్పుకున్నాం కదా! ఇట్టి వైశ్వానరాత్మ విజ్ఞానమును అభ్యసించకుండా అగ్నిహోత్రము చేస్తే యజ్ఞము, యాగము, హోమము మొదలైనవి నిప్పులే లేని బూడిదలో హోమము చేయు విధంగా వ్యర్థమే అవుతుంది.

అథ య ఏతదేవం విద్వానగ్నిహోత్రం జుహోతి తస్య సర్వేషు లోకేషు
సర్వేషు భూతేషు సర్వేష్వాత్మసు హుతం భవతి .. 5.24.2..
2. అథ య ఏతత్ ఏవం విద్వాన్
అగ్నిహోత్రం జుహోతి,
తస్య సర్వేషు లోకేషు,
సర్వేషు భూతేషు, సర్వేషు ఆత్మసు హుతం భవతి।
వైశ్వానరాత్మ పంచ ప్రాణాహుతులు ఎరిగి అగ్నిహోత్రము ప్రారంభించి హోమము చేయటంచేత సర్వాలోకములకు, సర్వజీవులకు, సర్వుల ఆత్మకు ఆహుతులు సమర్పించి హోమము చేసిన ప్రయోజనము, హుతము చేసిన ఫలము లభించగలదు.

తద్యథేషీకాతూలమగ్నౌ ప్రోతం ప్రదూయేతైవగ్ంహాస్య సర్వే
పాప్మానః ప్రదూయంతే య ఏతదేవం విద్వానగ్నిహోత్రం జుహోతి .. 5.24.3..
3. తత్ యథా ఈషీకాతూలమ్ అగ్నౌ
ప్రోతం ప్రదూయేత్
ఏవగ్ం హాస్య సర్వే పాప్మానః ప్రదూయన్తే
య ఏతత్ ఏవం విద్వాన్
అగ్నిహోత్రం జుహోతి।
ఎవ్వరు ‘‘వైశ్వానర పంచ ఆహుతి సమర్పణ హోమ విధానము’’ పై విధంగా అంతరార్థపూర్వకంగా ఎరిగి, మననం చేస్తూ పంచాహుతులను సమర్పించి, అటుపై యజ్ఞము, క్రతువు, హోమము ప్రారంభిస్తారో వారియొక్క పాపములన్నీ అగ్నిలో వ్రేల్చబడుచున్న ముంజగడ్డి చివరలవలె సలసల కాలి బూడిద అయిపోగలవు. తినే ఆహారమును హోమము చేయు భావనతో భావించువాడు సర్వలోకములందు హుతం చేసిన ప్రయోజనము పొందగలడు.

తస్మాదు హైవంవిద్యద్యపి చండాలాయోచ్ఛిష్టం
ప్రయచ్ఛేదాత్మని హైవాస్య తద్వైశ్వానరే హుతగ్ం స్యాదితి
తదేష శ్లోకః .. 5.24.4..
4. తస్మాదు హ ఏవం విత్ యద్యపి
చణ్డాలాయ ఉచ్ఛిష్టం
ప్రయచ్ఛేత్ ఆత్మని హ
ఏవ అస్య, తత్
వైశ్వానరే హుతం స్యాత్।
ఇతి। తత్ ఏష శ్లోకః।
పంచహోమములు ఎరిగి అగ్నికార్యము, తదితర కార్యక్రమములు నిర్వర్తించువారు ఇతరులను హింసించు స్వభావము గల చండాలునికి తెలిసి కూడా దానము చేసిన పాపము కూడా తొలగగలవు. ముందుగా ‘వైశ్వానరాహుతి’ తెలిసి (మనస్సుతో) నిర్వర్తిస్తూ భుజించువారు, యజ్ఞహోమములు చేయువారివలెనే అన్ని దోషములన్నీ తొలగించుకోగలరు. ఈ విధంగా శ్లోకించబడుతోంది.

యథేహ క్షుధితా బాలా మాతరం పర్యుపాసత ఏవగ్ం సర్వాణి
భూతాన్యగ్నిహోత్రముపాసత ఇత్యగ్నిహోత్రముపాసత ఇతి .. 5.24.5..

.. ఇతి చతుర్వింశః ఖండః ..

.. ఇతి పంచమోఽధ్యాయః ..
5. యథా ఇహ క్షుధితా
బాలా మాతరం పర్యుపాసతే,
ఏవగ్ం సర్వాణి భూతాని
‘అగ్నిహోత్రమ్’ ఉపాసత ఇతి।
‘అగ్నిహోత్రమ్’ ఉపాసత। ఇతి।।
ఆకలిగొన్న పసిబిడ్డలు తల్లిని ‘రావాలి’ అని కోరుకొంటూ తల్లి చుట్టూ చేరి బ్రతిమలాడుతూ ఉపాసిస్తారు చూచారా? ఆ విధంగా యజ్ఞ, యాగ, క్రతు, హోమ సందర్భములలో యజ్ఞకర్త మొదలైన వారంతా అగ్నిహోత్రమును ఉపాసించాలి. ఉపాసించెదరు గాక!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - పంచమాధ్యాయే చతుర్వింశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది పంచమ అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅵ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - ఆరవ అధ్యాయము

6–1. షష్ఠః ప్రపాఠకః - ప్రథమ ఖండః - సమస్త శాస్త్రముల అంతిమ ఆదేశం


.. షష్ఠోఽధ్యాయః ..

శ్వేతకేతుర్హారుణేయ ఆస తగ్ం హ పితోవాచ శ్వేతకేతో
వస బ్రహ్మచర్యం న వై సోమ్యాస్మత్కులీనోఽననూచ్య
బ్రహ్మబంధురివ భవతీతి .. 6.1.1..
1. ఓం
శ్వేతకేతుః హ ఆరుణేయ ఆస।
తం హ పితా ఉవాచ :-
శ్వేతకేతో వస బ్రహ్మచర్యమ్।
న వై, సోమ్యా! అస్మత్
కులీనో అననూచ్య
బ్రహ్మబంధుః ఇవ భవతి ఇతి।।
ఓం! అరుణి మహర్షి మనుమడు మరియు ఆరుణిమహర్షి (ఉద్దాలకుని) కుమారుడు - శ్వేతకేతువు.
ఒకరోజు ఉద్దాలకారుణి మహర్షి పంచవర్షములు గల పుత్రునితో ఈ విధంగా సంభాషించారు.
ఉద్దాలకారుణి మహర్షి : బిడ్డా! శ్వేతకేతూ! నీవు మన వంశానుచారములు ఆశ్రయించాలి.
శ్వేతకేతువు : పితృదేవా! ఆజ్ఞాపించండి। ఏమి చేయవలసియున్నది?
ఉద్దాలకుడు : బిడ్డా! సోమ్యా! శ్వేతకేతూ। నీవు సద్గురువును ఆశ్రయించాలి. బ్రహ్మచర్య దీక్షను గ్రహించి వేదవేదాంగములు అధ్యయనము చేయాలి. వేదములను, అందలి శిరోభాగమువంటి ఉపనిషత్తులను అధ్యయనము చేయాలి. మన వంశములో వేదములను, అందలి శిరోభాగమువంటి ఉపనిషత్తులను అధ్యయనము చేసినవారే అందరూ కూడా! అంతేకాని, నామమాత్ర బ్రాహ్మణులు మన వంశంలోఎవరూ లేరు.

స హ ద్వాదశవర్ష ఉపేత్య చతుర్విగ్ంశతివర్షః
సర్వాన్వేదానధీత్య మహామనా అనూచానమానీ స్తబ్ధ
ఏయాయ తగ్ంహ పితోవాచ .. 6.1.2..

శ్వేతకేతో యన్ను సోమ్యేదం మహామనా అనూచానమానీ
స్తబ్ధోఽస్యుత తమాదేశమప్రాక్ష్యః యేనాశ్రుతగ్ం శ్రుతం
భవత్యమతం మతమవిజ్ఞాతం విజ్ఞాతమితి కథం ను భగవః
స ఆదేశో భవతీతి .. 6.1.3..
2. స హ ద్వాదశ (12) వర్ష ఉపేత్య
చతుర్వింశతి (24) వర్షః
సర్వాన్ వేదాన్ అధీత్య
మహామనా అనూచానమానీ స్తబ్ధ ఏయాయ।
శ్వేతకేతువు 12 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల వయసువరకు (12 సంవత్సరముల కాలము) 4 వేదములు అధ్యయనం చేశారు.
విద్యార్థి దశ పూర్తయినది, ఇంటికి తిరిగి వచ్చారు. తాను విద్య నేర్చుకొని మహా బుద్ధి గలవాడనని తలచుచూ విద్యాగర్వముతో, అభిమానముతో ఉండసాగారు.
తం హ పితా ఉవాచ :-
శ్వేతకేతో! యన్ను సోమ్య! ఇదం మహమనా
అనూచానమానీ స్తబ్ధో? అస్యుత।
తమ్ ఆదేశమ్ అప్రాక్ష్యః।
ఉద్దాలకుడు : కుమారా! సౌమ్య! శ్వేతకేతూ! నీవు అన్నీ తెలుసుకున్నానని, విద్యావంతుడనని, గొప్పవాడివైనావని తలచుచూ, స్తబ్ధుడవై కనిపిస్తున్నావే? మంచిది. అయితే సరే"! మంచిదే! అయితే ఒక ముఖ్య విషయం.
3. యేన అశ్రుతం శ్రుతం భవతి, అమతం మతం
అవిజ్ఞాతం విజ్ఞాతం ఇతి
కథం ను భగవః
స ఆదేశో భవతి - ఇతి?
ఏది లోకంలో వినబడదో అట్టిది విని ఉన్నావా? ఏది అమతమో (లోకాభిప్రాయములచే సిద్ధించదో) అట్టిది (బ్రహ్మజ్ఞానము) సిద్ధించుకున్నావు కదా! ఏది లోక జీవనములో తెలియబడజాలదో అట్టి దాని గురించి తెలుసుకున్నావు కదా? శాస్త్రముల ఆదేశమేమిటో గ్రహించావా?
శ్వేతకేతువు : తండ్రీ! అట్టి ఆదేశము ఏమిటి? ఎటువంటిది? విశదీకరించండి. జ్ఞానము ఏమిటో ఉపదేశించండి.

యథా సోమ్యైకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతగ్ం
స్యాద్వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం .. 6.1.4..
4. యథా, సోమ్య!
ఏకేన మృత్పిండేన సర్వం
మృణ్మయం విజ్ఞాతం స్యాత్,
‘‘వాచారమ్భణం వికారో నామధేయం,
మృత్తిక ఇతి ఏవ సత్యమ్’’।
ఉద్దాలకారుణి : తత్త్వశాస్త్రము యొక్క, సమస్త శాస్త్రముల అంతిమ ఆదేశము (The Final Message) ఏమిటో కొన్ని విశేషాలు చెబుతాను విను. ఓ సోమ్య! నీవు, నేను తెలుసుకోవలసిన సత్యము - స్వస్వరూపమునకు అనన్యము అయి ఉండినట్టి బ్రహ్మమే కదా! అంతకుమించి తెలుసుకోవలసినది మరేముంటుంది?
శ్వేతకేతువు : ఏది సత్యము? ఏది కల్పన? ఏది బ్రహ్మము? ఏది అనన్యము? దయతో నాకు చెప్పండి.
ఉద్దాలక మహర్షి : బ్రహ్మము గురించి శాస్త్రముల ఆదేశమేమిటో కొన్ని దృష్టాంతములతో కూర్చి చెప్పుతాను. విను.

ఈ దృశ్య జగత్తు అనేకమంది జీవరాసులతో, అనేక భేదములతో లోకన్యాయంగా అనభవమౌతోంది కదా! అయితే -
మృత్తికా - కుంభ న్యాయము :- అనేక ఆకారములు గల కుండలు ఒకానొకచోట ఉన్నాయి. ఆ కుండల వేరు వేరు ఆకారములు, కుండ మూత, మట్టి బాన….మొదలైనవన్నీ సత్యమా? కాదు. కుండలన్నీ మట్టితో తయారైనాయి కనుక ‘వేరు వరు కుండలు’ అనునది సత్యమా? కాదు. మట్టి మాత్రమే నిత్యము సత్యము. ‘‘కుండ-బాన-మూత’’ - మొదలైనవి మాటవరసవరకే.
మట్టియొక్క అనేక ఆకారములు కల్పించబడినవి మాత్రమే। అట్లాగే అనేక జీవులుగా కనిపిస్తున్నప్పటికీ సమస్తమునకు ‘‘అధిష్ఠానమగు బ్రహ్మము’’ మాత్రమే సత్యము.

యథా సోమ్యైకేన లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతగ్ం
స్యాద్వాచారంభణం వికారో నామధేయం లోహమిత్యేవ సత్యం .. 6.1.5..
5. యథా సోమ్య! ఏకేన లోహ మణినా సర్వం లోహమయం విజ్ఞాతం స్యాత్,
వాచారమ్భణమ్ వికారో నామధేయమ్,
- లోహం ఇతి ఏవ సత్యమ్।

బంగారు ఆభరణ న్యాయము :- బంగారముతో చేయబడిన అనేక ఆభరణములు ఆయా పేర్లతో చెప్పబడుచున్నాయి. (ఉదాహరణకు గాజులు, అరవంకె, ఉంగరము, పాపిడిబిళ్ల మొదలైన ఆయా పేర్లు) బంగారము ఒక్కటేగాని ఆయా అనేకములు అవటం లేదు కదా! ఆ పేర్లన్నీ పేర్లుగా కల్పన మాటవసరకేగాని మొదలే (బంగారము దృష్ట్యా) వేరుకానివే. బంగారము - గాజు వేరు చేసి ఇద్దరికి ఇవ్వగలమా? లేదు. అందుచేత। ‘‘గాజు’’ అనే మాట వాచారంభము. (మాటకేగాని వస్తుతః గాజు బంగారమునకు వేరుగా లేదు. ఆకార వికారమునకు చెప్పే పేరు) అందుచే ‘వికారము’ నకు పెట్టిన పేరు.
ఇనుము లోహమే సత్యము. ఆభరణము, సూది, సుత్తి, పలుగు, గొలుసు - మొదలైనవి సత్యము కాదు. వాచారంభము. వికారో నామధేయము.

యథా సోమ్యికేన నఖనికృంతనేన సర్వం కార్ష్ణాయసం విజ్ఞాతగ్ం
స్యాద్వాచారంభణం వికారో నామధేయం కృష్ణాయసమిత్యేవ
సత్యమేవగ్ంసోమ్య స ఆదేశో భవతీతి .. 6.1.6..
6. యథా, సోమ్య। ఏకేన
నఖ నికృంతనేన సర్వం
కార్‌ష్ణాయసం విజ్ఞాతం స్యాత్,
వాచారమ్భణం వికారో నామధేయం
- కృష్ణాయసమ్ ఇతి ఏవ సత్యం!

ఏవం సోమ్య! స ఆదేశో భవతి। ఇతి।।

కొయ్యతో గొప్పదేవతా విగ్రహం ఒక కళాకారుడు తయారు చేశారు. అందరు ఆ దేవతా విగ్రహమును పూజిస్తున్నారు. అట్టి ఆ విగ్రహమునకు నఖ-శిఖ పర్యంతము, పాదములగోళ్లు, పాదములు, పిక్క, మోకాలు, నడుము, భుజములు, పొట్ట, హృదయము, ముఖము, కళ్లు, చెవులు, నుదురు, శిరస్సు, కిరీటము - ఇవన్నీ కొయ్య యందు చెక్కబడ్డాయి. అయితే అక్కడ ఉన్నది ఏకమగు కొయ్య మాత్రమే! మిగతాదంతా వాక్కుచే ఆరంభమై మొత్తమంతా ఆయా వికారములకు పెట్టబడిన కల్పితమగు పేర్లు - మాత్రమే!


న వై నూనం భగవంతస్త ఏతదవేదిషుర్యద్ధ్యేతదవేదిష్యన్కథం
మే నావక్ష్యన్నితి భగవాగ్ంస్త్వేవ మే తద్బ్రవీత్వితి తథా
సోమ్యేతి హోవాచ .. 6.1.7..

.. ఇతి ప్రథమః ఖండః ..
7. న వై నూనం భగవన్తః
స ఏతత్ అవేదిషుః
యద్ధ్యేతత్ (యత్ హి ఏతత్) అవేదిష్యన్
కథం మే నా వక్ష్యన్? ఇతి।
భగవాన్। త్వ ఏవ మే
తత్ బ్రవీతు - ఇతి।
తథా సోమ్య! ఇతి హ ఉవాచ।।
శ్వేతకేతు : ‘‘స్వామీ!‘‘బొమ్మలన్నీ మట్టివే। ఆభరణములన్నీ బంగారమే। కొయ్య విగ్రహములోని అవయవములన్నీ కొయ్య మాత్రమే. తదితరంగా భేదంగా పిలువబడేదంతా వాక్కుచే కల్పనగా ఆరంభించబడిన కల్పన. వికారములకు ఈయబడిన పేర్లు మాత్రమే। అక్కడ మట్టి, బంగారము, కొయ్య మాత్రమే సత్యము’’ - అను ఒకానొక పాఠ్యాంశము. శాస్త్రముల ఆదేశము (The order of Learning Text Book) అనేది ఒకానొక కొత్త కోణముగా వింటున్నాను.

నాకు ఈ విషయం భగవంతునితో సమానులు, పూజ్యులు అగు గురువులు బోధించి ఉండలేదు. వారి దృష్టిలో మీరు చెప్పే వివరణ తెలియదేమో! వారు చెప్పందే నాకు తెలియదు కదా! (లేక) ఇతః పూర్వము నేను అర్హుడనై ఉండలేదో! అందుచేత మీరు నాకు వివరించమని ప్రార్థన.

ఉద్దాలకుడు : సోమ్యా! ప్రియకుమారా! చెపుతాను. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే ప్రథమః ఖండః


6–2. షష్ఠః ప్రపాఠకః - ద్వితీయ ఖండః - జగత్ కూడా సత్ రూపమే!


సదేవ సోమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం .
తద్ధైక ఆహురసదేవేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం
తస్మాదసతః సజ్జాయత .. 6.2.1..
1. ‘‘సత్’’ ఏవ సోమ్య।
ఇదమ్ అగ్ర ఆసీత్।
ఏకం ఏవ - అద్వితీయం!
తత్ హి ఏక ఆహుః అసత్ ఏవ
ఇదమ్ అగ్ర ఆసీత్।
ఏకమేవ - అద్వితీయం

తస్మాత్ అసతః సత్ జాయతా!

ఉద్దాలకుడు : ఈ దృశ్య మానమగుచున్న జగత్తుకు మునుముందుగా ‘‘నేను ఉన్నాను’’ అను రూపముగల ‘‘సత్’’ మాత్రమే ఉన్నది. నేను ఉన్నాను అనునది ఎవ్వరూ మనకు చెప్పకుండానే మనము స్వానుభవంగా కలిగి ఉంటున్నాము కదా! అప్పుడు అట్టి ‘సత్’ ఏకము అయి ఉన్నది. అనేకముగా కాదు. అద్దానికి (నేను ఉన్నాను - అనుదానికి) ద్వితీయ సైతం ఏదీ లేదు. ఇదియును అర్థం చేసుకో.

అట్టి ఏకము, అద్వితీయము అయి ఉన్న ‘సత్’ యే ‘అసత్’గా కూడా ప్రదర్శనమౌతోంది.


కుతస్తు ఖలు సోమ్యైవగ్ంస్యాదితి హోవాచ కథమసతః
సజ్జాయేతేతి. సత్త్వేవ సోమ్యేదమగ్ర
ఆసీదేకమేవాద్వితీయం .. 6.2.2..
2. కుతస్తు ఖలు, సోమ్య।
ఏవం స్యాత్ ఇతి?
హోవాచ :
కథమ్ అసతః సత్ జాయతే - ఇతి?
సత్త్వ ఏవ, సౌమ్య!
ఇదమ్ అగ్ర ఆసీత్
ఏకమేవ - అద్వితీయమ్।
శ్వేతకేతు : అయితే ఉన్నదానినుండి (సత్ నుండి) లేనిది (అసత్) బయల్వెడలుతోందా? సత్ నుండి అసత్ ఎట్లా జనిస్తోంది?
ఉద్దాలకుడు : ఉన్నదాని నుండి ‘లేనిది’ వెడలటమేమిటి? లేనిది ఉన్నదాని నుండి జనించటమేమిటి?
సౌమ్యా। మొట్టమొదట ‘సత్’ యే ఉన్నది. ఇప్పటికీ ‘సత్’యే ఉన్నది. ఉన్నది ఎప్పటికీ ఉన్నది. లేనిది ఎప్పుడూ లేదు. సత్‌యే (ఉనికియే) సర్వదా ఏకమై, అద్వితీయమై ఉన్నది.

తదైక్షత బహు స్యాం ప్రజాయేయేతి తత్తేజోఽసృజత తత్తేజ
ఐక్షత బహు స్యాం ప్రజాయేయేతి తదపోఽసృజత .
తస్మాద్యత్ర క్వచ శోచతి స్వేదతే వా పురుషస్తేజస ఏవ
తదధ్యాపో జాయంతే .. 6.2.3..
3. తత్ ఐక్షత బహు స్యాం ప్రజాయేయేతి।
తత్ తేజో అసృజత।
తత్ తేజ ఐక్షత
బహు స్యాం ప్రజాయేయేతి।
తత్ అపో అసృజత।
తస్మాత్ యత్ర క్వ చ
శోచతి, స్వేదతే వా పురుషః।
తేజస ఏవ తత్ అధి ఆపో జాయన్తే।
ఆ మొట్టమొదటే ఉన్న సత్ (తత్) - ‘‘నేను అనేకములుగా అగుదునుగాక। బహురూపములు ధరించెదనుగాక।’’ - అని భావించుచున్నది. ఆ సత్ (తత్) ముందుగా తేజస్సు (Enlightenment) ను సృజించుకుంటున్నది.
అట్టి తన నుండి బయల్వెడలిన తేజస్సును ‘‘అనేకముగా అగునుగాక।’’ - అని అనుకుని అట్టి భావననుండి ‘జలము’ను సృజిస్తోంది. అందుచేతనే ఈ పురుషుడు దేనిగురించైనా వేదన (ఆదుర్దా) చెందగానే ముందుగా స్వేదము (చెమట) పుట్టుకొస్తున్నది.
ఆ సమయములో తేజస్సు నుండి జలము ఉత్పన్నమౌతోంది. అందుకే ముఖము తేజోమయమై కనిపిస్తోంది.

తా ఆప ఐక్షంత బహ్వ్యః స్యామ ప్రజాయేమహీతి తా
అన్నమసృజంత తస్మాద్యత్ర క్వ చ వర్షతి తదేవ భూయిష్ఠమన్నం
భవత్యద్భ్య ఏవ తదధ్యన్నాద్యం జాయతే .. 6.2.4..

.. ఇతి ద్వితీయః ఖండః ..
4. తా ఆప ఐక్షంత బహ్వ్యః
స్యామ ప్రజాయేమహీతి।
తా అన్నమ్ అసృజన్త।
తస్మాత్ యత్ర క్వ చ
వర్షతి తత్ ఏవ
భూయిష్ఠమ్ ‘అన్నం’ భవతి।
ఆ జలము ‘‘మేము అనేకముగా అయ్యెదము’’ - అని ఈక్షణము (Perceiving, Feelings) చేస్తున్నది.
అనేక రూపములుగా అవసాగుతోంది.
ఆ జలము తన నుండి అన్నమును పుట్టింపజేసుకొంటోంది. (అన్నము = ఆహారము; పంచేంద్రియానుభవములు)
అందుచేతనే - ఎచ్చటైనా ఎప్పుడు ‘వర్షము’ కురిస్తే, అక్కడ జీవులకు అన్నము సమృద్ధిగా అగుచున్నది. ‘పరిపోషణ ధర్మము’ బయల్వెడతలుతోంది.
యద్భ్య ఏవ తదధి
‘అన్నాద్యం’ జాయతే।
జలము అన్నాద్యము (ఆహారము ఉత్పత్తి చేసి ప్రసాదించునదిగా) ఈ సృష్టిలో - అగుచున్నది సృష్టికి ఆహారప్రదాతగా ప్రదర్శనమౌతోంది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే ద్వితీయః ఖండః


6–3. షష్ఠః ప్రపాఠకః - తృతీయ ఖండః - సత్‌యే జీవరూపములు


తేషాం ఖల్వేషాం భూతానాం త్రీణ్యేవ బీజాని
భవంత్యాండజం జీవజముద్భిజ్జమితి .. 6.3.1..
1. తేషాం ఖలు ఏషాం భూతానం
త్రీణి ఏవ బీజాని భవన్తి
అణ్డజం। జీవజమ్। ఉద్భిజమ్ - ఇతి।
సమస్త జీవులు జనిస్తున్న బీజము (Types of source of generation) - మూడు విధములు.
(1) అండజములు : (గ్రుడ్డు నుండి ఉత్పన్నములు, జనితములు, ఉదాహరణకు పక్షులు, పాములు మొదలైనవి).
(2) జీవజములు : దేహంలోంచి, పుట్టేవి. ఉదాహరణకు జరాయుజములగు మానవులు, పశువులు మొదలైనవి.
(3) ఉద్భిజములు : నేలను (పైభాగంలోంచి) చీల్చుకొని పుట్టుచున్నవి. (ఉద్భిద్-స్థావరములు)
[ స్వేదజములు (చెమట నుండి పుట్టేవి), వేడి నుండి పుట్టే ఉష్మకజములు జీవజములని ఇక్కడ మహర్షి ఉద్దేశ్యము ]

సేయం దేవతైక్షత హంతాహమిమాస్తిస్రో దేవతా అనేన
జీవేనాత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణీతి .. 6.3.2..
2. సేయం దేవత ఐక్షత, హన్త।
అహమ్ ఇమాః త్రిస్రో
దేవతా ‘‘అనేన జీవేన
ఆత్మనా అనుప్రవిశ్య,
నామరూపే - వ్యాకరవాణి’’ - ఇతి।
‘‘కేవల సత్’’ స్వరూపుడగు ఆ ఆత్మ భగవానుడు - ‘‘ఇక నేను అగ్ని - జల - అన్నములనబడే ముగ్గురు దేవతలుగా ప్రవేశించి నామ రూపములను వ్యక్తపరిచెదను గాక।’’- అని తలచుచున్నారు.

తాసాం త్రివృతం త్రివృతమేకైకాం కరవాణీతి సేయం
దేవతేమాస్తిస్రో దేవతా అనేనైవ జీవేనాత్మనానుప్రవిశ్య
నామరూపే వ్యాకరోత్ .. 6.3.3..
3. తాసాం త్రివృతం।
త్రివృతం ఏకైకాం
కరవాణి - ఇతి।
స ఇయం దేవతా ఇమాః తిస్రో దేవతా
అనేన ఏవ జీవేన ఆత్మన
అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్।
ఈ మూడిటిలో ఒక్కొక్క దానిని తిరిగి మిగతా రెండు కలుస్తూ ఆయా సమ్మిళతములు (permutations and combinations) ఏర్పడుచూ ఆత్మదేవునిచే ధారణ పూర్వకంగా స్వయం స్వరూపమై కల్పించబడుతోంది. అట్టి ‘‘తివృత్ x తివృత్ కరణము’’చే అసంఖ్యాక నామరూపములు ఆత్మచే పరికల్పించబడి (ఒక రచయితే తన నవలయందు అనేక పాత్రల స్వభావములను, పరస్పరములను కల్పిస్తున్నట్లుగా) వ్యవహారితమై (Transactionally) విస్తరింపజేయబడుతోంది.

తాసాం త్రివృతం త్రివృతమేకైకామకరోద్యథా తు ఖలు
సోమ్యేమాస్తిస్రో దేవతాస్త్రివృత్త్రివృదేకైకా భవతి
తన్మే విజానీహీతి .. 6.3.4 ..

.. ఇతి తృతీయః ఖండః ..
4. తాసాం త్రివృతం। త్రివృతం
ఏకైకామ్ అకరోతి।
యథా తు ఖలు, సోమ్య।
ఇమాః తిస్రో దేవతాః త్రివృత్।
త్రివృత్ త్రివృత్ ఏకైకా భవతి।
తత్ మే (తన్మే) విజానీ హి। ఇతి।।
ఈ విధంగా మొట్టమొదటగా ఉన్న ‘సత్’ దేవత ఏకమే అయి ఉండి 3x3x3గా అనేకముగా అనుకోబడుతోంది. ఓ సౌమ్య! అదంతా - యథాభావం తథా భవతి’’ - గా భావించబడుతోంది. అట్టి తివృత్ భావనచే కల్పనగా అనుభవమగుచున్న ఇంద్రియజగత్ దృశ్యమంతా - మరోకప్పుడు కలలోని దృశ్యము కల తనదైనవాడిలో లయం పొందుచున్నట్లు) - తిరిగి తనయందే తిరోధానము (withdrawal) పొంది అనేకమంతా ఏకమునందు (నాయందే) లయమై ‘తత్’ రూపముగా అగుచున్నది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే తృతీయః ఖండః


6–4. షష్ఠః ప్రపాఠకః - చతుర్థః ఖండః - త్రివృత్‌కరణం - వాచారంభణం వికారో నామధేయం


యదగ్నే రోహితగ్ంరూపం తేజసస్తద్రూపం యచ్ఛుక్లం తదపాం
యత్కృష్ణం తదన్నస్యాపాగాదగ్నేరగ్నిత్వం వాచారంభణం
వికారో నామధేయం త్రీణి రూపాణీత్యేవ సత్యం .. 6.4.1..
1. యత్ అగ్నే, ‘‘రోహితం’’
రూపం ‘‘తేజసః’’ తత్ రూపమ్।
యత్ ‘‘శుక్లం’’, తత్ ‘‘అపాం’’।
యత్ ‘‘కృష్ణమ్’’ తత్ ‘‘అన్నస్య’’।
అపాగాత్ అగ్నేః అగ్నిత్వం వాచారంభణం
వికారో నామధేయం।
త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం।
( △ మూడు రేఖలు కలిస్తే త్రిభుజం (Triangle). ఈ ‘3’ రేఖలు తీసి ప్రక్కన పెడితే త్రిభుజము ఎక్కడున్నది?)
అగ్నిరూపం
అగ్నిలో ఎరుపు, తెలుపు, నలుపు కలిసి ఉన్నాయి.
ఎరుపు - తేజోరూపము.
తెలుపు - జలరూపము
నలుపు - అన్నము రూపము (పృథివి)

ఈ రక్తవర్ణము (తేజస్సు), శ్వేతవర్ణము (జలము), నల్లటి రూపము (అన్నము) - ఈ మూడు తొలగించి చూస్తేనో, అగ్నిలో ఈ మూడు (తేజోతత్త్వము, జలతత్త్వము, పృథివీతత్త్వము) ప్రక్కన పెడితే - ‘‘అగ్ని, అగ్నిత్వం’’ అనునవి [‘బంగారపుగాజు’లో గాజు (Bangle) వలె] వాచారంభము - మాటవరుసగా చెప్పుకునేది.

వికారో నామధేయము - ఒక వికారమునకు (త్రిభుజములాగా) చెప్పునది. మూడు (తేజస్సు, జలం, అన్నం) రకములుగా ఉన్నవే సత్యము.

యదాదిత్యస్య రోహితగ్ంరూపం తేజసస్తద్రూపం యచ్ఛుక్లం తదపాం
యత్కృష్ణం తదన్నస్యాపాగాదాదిత్యాదాదిత్యత్వం వాచారంభణం
వికారో నామధేయం త్రీణి రూపాణీత్యేవ సత్యం .. 6.4.2..
2. యత్ ఆదిత్యస్య రోహితం
రూపం ‘తేజసః’’ తత్ రూపం।
యత్ శుక్లం, తత్ ‘‘అపాం’’।
యత్ కృష్ణం తత్ ‘‘అన్నస్య’’
అపాగాత్ ఆదిత్యాది ఆదిత్యత్వం
వాచారమ్భణం వికారో నామధేయం।
త్రీణి రూపాణి। ఇత్యేవ సత్యం।।
సూర్యబింబము
ఆదిత్యునిలో (సూర్య బింబములో) :
రోహితరూపం (ఎరుపు) - తేజస్సు.
తెల్లటి రూపము - జలము.
నల్లగా ఉన్నది - అన్నము (పృథివి).
ఈ మూడు విడదీసి ఆవలపెట్టి ఇప్పుడు సూర్యబింబమును చూస్తేనో?
ఆదిత్యుడు (సూర్యబింబము అనునది - వాచారంభణం (మాటవరసకు చెప్పుకొనేది మాత్రమే)।
నామధేయం (ఆదిత్యుడు అనునది) వికారమునకు చెప్పుకొనేది (మట్టిబొమ్మలో మట్టికి బొమ్మవలె). త్రిరూపములే సత్యము.
అంతేగాని ‘ఆదిత్యుడు’ - అనునది ఆ మూడిటి (తేజస్సు, జలం, అన్నం) కలయికకు వేరుగా లేదు.

యచ్ఛంద్రమసో రోహితగ్ంరూపం తేజసస్తద్రూపం యచ్ఛుక్లం తదపాం
యత్కృష్ణం తదన్నస్యాపాగాచ్చంద్రాచ్చంద్రత్వం వాచారంభణం
వికారో నామధేయం త్రీణి రూపాణీత్యేవ సత్యం .. 6.4.3..
3. యత్ చంద్రమసో ‘‘రోహితం’’
రూపం, ‘తేజసః’ - తత్ రూపం।
యత్ ‘‘శుక్లం’’ తత్ ‘‘అపాం’’।
యత్ ‘‘కృష్ణం’’ తత్ ‘‘అన్నస్య’’।
అపాగాత్ చంద్రాః।
చంద్రత్వం - వాచారమ్భణం
వికారో నామధేయం।
త్రీణి రూపాణి। ఇత్యేవ సత్యం।।
చంద్రమసము (చంద్రబింబము)
‘‘చంద్రబింబము’’ అనే దానిలో
ఎర్రని రూపము - తేజస్సు
తెల్లటి విభాగము - జలము
నలుపు విభాగము - అన్నము (అనుభవమయ్యేదంతా)
వీటిని వదలి (ప్రక్కకు పెట్టి) చూచినప్పుడు? - ‘చంద్రత్వము’ అనబడేది -
వాచారంభణం - మాటకోసం అనుకునేది మాత్రమే।
పేరు - వికారము (ఆకారరహితం)।
పైమూడే సత్యముగాని ‘చంద్రుడు’ అనేది ‘మాటలగారడీ’యే।

యద్విద్యుతో రోహితగ్ంరూపం తేజసస్తద్రూపం యచ్ఛుక్లం తదపాం
యత్కృష్ణం తదన్నస్యాపాగాద్విద్యుతో విద్యుత్త్వం వాచారంభణం
వికారో నామధేయం త్రీణి రూపాణీత్యేవ సత్యం .. 6.4.4..
4. యత్ విద్యుతో ‘రోహితగ్ం’
రూపం - తేజసః తత్ రూపమ్
యత్ శుక్లం, తత్ ‘‘అపాం’।
యత్ కృష్ణం, తత్ ‘అన్నస్య’।
అపాగాత్ విద్యుతో,
విద్యుత్త్వం - వాచారమ్భణం।
వికారో నామధేయం।
త్రీణి రూపాణి - ఇత్యేవ సత్యం।
విద్యుత్తు - తేజస్సు
విద్యుత్ (తేజస్సు) యొక్క రూపం
విద్యుత్ యొక్క రక్తవర్ణమే - తేజస్సు
తెల్లటి రూపమే - జలము
నల్లటి రూపమే - అన్నము
ఈ మూడు విడదీసి చూస్తేనో? విద్యుత్తులో ‘విద్యుత్తత్త్వము’’ అనేది వాచారంభము (వాక్కు యొక్క కల్పనయే).
అద్దాని నామధేయము (‘విద్యుత్’ అనే శబ్దము) ఒక వికారము వంటిది. ఆ తేజస్సు, జలము, అన్నము కలిస్తేనే విద్యుత్తు. కనుక మూడు రూపములు సత్యము. విద్యుత్తు సత్యము కాదు.

ఏతద్ధ స్మ వై తద్విద్వాగ్ంస ఆహుః పూర్వే మహాశాలా
మహాశ్రోత్రియా న నోఽద్య
కశ్చనాశ్రుతమమతమవిజ్ఞాతముదాహరిష్యతీతి హ్యేభ్యో
విదాంచక్రుః .. 6.4.5..
5. ఏతత్ హ స్మ వై తత్
విద్వాంస ఆహుః-
పూర్వే మహాశాలా
మహాశ్రోత్రియా న నో-ద్య
కశ్చన అశ్రుతం
అమతమ్, అవిజ్ఞాతమ్
ఉదాహరిష్యతి - ఇతి।
హ్యేభ్యో విదాంచక్రుః।।
ఓ శ్వేతకేతూ! పూర్వకాలంలో అనేకమంది పూర్వీకలగు మహాగృహస్థులు, మహాశ్రోత్రియులు మనము చెప్పుకొన్న ‘‘తివృత్కరణము’’ను తెలుసుకొనియున్నవారు ఉన్నారు. మన వంశంలో నా పితృదేవులు (అరుణి మునీంద్రులు మొదలైనవారు) శ్రోత్రియులు ఉన్నారు. మీ గురువులు కూడా ఎరిగియే ఉన్నారు. అందుచేత మనము చెప్పుకొన్నది అమితము, అశ్రుతము, అవిజ్ఞాతము కాదు. ఎందుకంటే, ఎందరో మహనీయులు ‘అగ్ని’ ఇత్యాది దృష్టాంతములు ద్వారా సమస్తము తెలుసుకొనియే ఉన్నారు. వారు వచించి ఉన్నారు కూడా।

యదు రోహితమివాభూదితి తేజసస్తద్రూపమితి తద్విదాంచక్రుర్యదు
శుక్లమివాభూదిత్యపాగ్ంరూపమితి తద్విదాంచక్రుర్యదు
కృష్ణమివాభూదిత్యన్నస్య రూపమితి తద్విదాంచక్రుః .. 6.4.6..
6. యదు రోహితమ్ ఇవ ఆభూత్
ఇతి ‘తేజసః’ తత్ రూపమ్ - ఇతి।
తత్ విదాంచక్రుః।
యదు ‘శుక్లమ్’ ఇవ
ఆభూత్ ఇతి ‘అపాం’ రూపమితి।
తద్విదామ్ చక్రుః యదు
‘కృష్ణమ్’ ఇవ ఆభూత్
ఇతి అన్నస్య రూపమ్ ఇతి
తద్విదాం చక్రుః।
వారంతా కూడా ఈ ఈ విశేషము తెలుసుకొనియే శాస్త్రీయంగా ఎలుగెత్తి చాటుచున్నారు.
- రోహితము (ఎర్రగా) కనిపించేది తేజోరూపమని.
- ఏది తెల్లవలె కనిపిస్తోంది అది జలము యొక్క రూపమని.
- ఏది శుక్ల (నలుపు) వర్ణంగా కనిపిస్తోందో - అదంతా అన్నము (అనుభవముగా పొందబడు) రూపమని వారు గమనిస్తూ ప్రవచించి ఉన్నారు. వారు సర్వజ్ఞులై ప్రకాశిస్తున్నారు.

యద్వవిజ్ఞాతమివాభూదిత్యేతాసామేవ దేవతానాగ్ంసమాస ఇతి
తద్విదాంచక్రుర్యథా తు ఖలు సోమ్యేమాస్తిస్రో దేవతాః
పురుషం ప్రాప్య త్రివృత్త్రివృదేకైకా భవతి తన్మే విజానీహీతి .. 6.4.7..

.. ఇతి చతుర్థః ఖండః ..
7. యత్ విజ్ఞాతమ్ ఇవ ఆభూత్
ఇతి ఏతా సామేవ దేవతానాం
‘సమాస’ ఇతి, తత్ విదాం చక్రుః।
యథా ను ఖలు, సోమ్యే।
మాః త్రిసో దేవతాః
పురుషం ప్రాప్య త్రివృత్।
త్రివృత్ ఏకైకా భవతి
తత్ మే విజానీహి। ఇతి।।
ఈ విధంగా విజ్ఞాతంగా (తెలియబడుచున్న రూపంగా) కనిపిస్తున్నదంతా భూ-జల-అగ్ని-వాయు-ఆకాశ దేవతా సంయోగము చేతనేనని వారు దర్శించుచున్నారు.
ఓ సోమ్యా। ఏ తేజ - జల - అన్న త్రిదేవతలు పురుషునియందు త్రివృత్ రూపములు కలిగియుండి ఏకము అగుచున్నారో - అది చెప్పుతాను. శ్రద్ధగా శ్రవణం చేసెదవు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే చతుర్థః ఖండః


6–5. షష్ఠః ప్రపాఠకః - పంచమః ఖండః - త్రివృత్ కరణం


అన్నమశితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్ఠో
ధాతుస్తత్పురీషం భవతి యో మధ్యమస్తన్మాగ్ంసం
యోఽణిష్ఠస్తన్మనః .. 6.5.1..
1. అన్నమ్ అశితం
త్రేధా విధీయతే।
అన్న - జల - అగ్నుల త్రివిధ పరిణామములు
ఈ జీవుడు అన్నము భుజించిన తరువాత (జఠరాగ్నిచే పచనము అయిన తరువాత) - మూడు విభాగాలుగా ఆ అన్నము విభాగము/ విభజనము పొందుతోంది.
తస్య యః స్థవిష్ఠో ధాతుః,
తత్ పురీషం భవతి।
యో మధ్యమః - తత్ మాగ్ంసం।
(1) అన్నమునకు చెందిన స్థూల భాగము / ధాతు విభాగము - అది మలము రూపంగా బయటకు వెళ్లుచున్నది.
(2) అన్నముయొక్క మధ్యాంశము - రసముగా మారి, ఆ తరువాత మాంస రూపముగా పొందుచున్నది.
యో అణిష్ఠః
తత్ మనః ।
(3) అణుతమమగు సూక్ష్మ అంశము - ఊర్ధ్వముగా (పైవైపుగా) వెళ్లి సూక్ష్మ (హిత) నాడులలో ప్రవేశించి (మనస్సులో ప్రవేశించి, ఆలోచనను వృద్ధిపరుస్తోంది. మనస్సునుండి పంచేంద్రియములు కార్యములను ప్రవర్తిస్తున్నాయి.

ఆపః పీతాస్త్రేధా విధీయంతే తాసాం యః స్థవిష్ఠో
ధాతుస్తన్మూత్రం భవతి యో మధ్యమస్తల్లోహితం యోఽణిష్ఠః
స ప్రాణః .. 6.5.2..
2. ఆపః పీతాః త్రేధా విధీయన్తే।
తాసాం -
యః స్థవిష్ఠో ధాతుః
- తత్ మూత్రం భవతి।
యో మధ్యమః - తత్ లోహితం।
యో అణిష్ఠః - స ప్రాణః।।
త్రాగిన నీరు ‘3’ విధములుగా రూపము దాల్చుచున్నది.
(1) జలము యొక్క స్థూలభాగము ధాతు విభాగం - మూత్రముగా అగుచున్నది.
(2) మధ్య భాగము - రక్తముగా అగుచున్నది.
(3) సూక్ష్మ విభాగము - ప్రాణములో ప్రవేశించుచు, శరీరములో ప్రాణముయొక్క ఉత్తేజతకు తోడు అవుతోంది.

తేజోఽశితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్ఠో
ధాతుస్తదస్థి భవతి యో మధ్యమః స మజ్జా
యోఽణిష్ఠః సా వాక్ .. 6.5.3..
3. తేజో అశితం త్రేథా విధీయతే।
తస్య - యః స్థవిష్ఠో
‘‘ధాతుః’’ - తత్ ‘అస్థి’ - భవతి।
యో మధ్యమః - స ‘మజ్జా’।
యో అణిష్ఠః - సా ‘వాక్’।।
తేజస్సు (నేయి మొదలైన) మూడు విధములుగా ప్రవర్తనమానమౌతోంది.
తేజస్సుయొక్క స్థూల - ధాతు విభాగము - ఎముకల రూపము పొందుచూ, శరీరంలో గట్టి తనమును పరిపోషిస్తోంది.
తేజస్సు (వేడిమి) యొక్క మధ్య విభాగము - మజ్జ (ఎముకలలోని నూనె వంటి విభాగముగా అవుతోంది)
తేజస్సుయొక్క సూక్ష్మవిభాగము - వాక్కుగా రూపుదిద్దుకుంటోంది.

అన్నమయగ్ంహి సోమ్య మనః ఆపోమయః ప్రాణస్తేజోమయీ
వాగితి భూయ ఏవ మా భగవాన్విజ్ఞాపయత్వితి తథా
సోమ్యేతి హోవాచ .. 6.5.4..

.. ఇతి పంచమః ఖండః ..
4. అన్నమయం హి, సోమ్య!
మన। ఆపోమయః ప్రాణః ।
తేజోమయీ ‘వాక్’ ఇతి।
శ్వేతకేతు : భూయ ఏవ
మామ్, భగవాన్! విజ్ఞాపయతి। ఇతి।
ఆరుణి : తథా। సోమ్య।
ఇతి హ ఉవాచ।।
ఈ మనస్సు - అన్నమయము,
ప్రాణము - జలమయము
వాక్కు - తేజోమయము
(ఈ మూడు విడదీస్తే - ‘శరీరము’ అనే శబ్దము వాచారంభణమ్। వికారో నామధేయమ్।)

శ్వేతకేతువు : గురుదేవా! ఆరుణి మహర్షీ! దయతో మరికొంతగా వివరించి చెప్పండి.
ఆరుణిమహర్షి : నాయనా! శ్వేతకేతూ! సరే"! అట్లాగే వివరించి చెప్పుతాను, విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే పంచమః ఖండః


6–6. షష్ఠః ప్రపాఠకః - షష్ఠః ఖండః - అన్నమే మనస్సు, నీరే ప్రాణము, అగ్నియే వాక్


దధ్నః సోమ్య మథ్యమానస్య యోఽణిమా స ఉర్ధ్వః సముదీషతి
తత్సర్పిర్భవతి .. 6.6.1..
1. దధ్నః సోమ్య! మథ్యమానస్య
యో అణిమా, స ఊర్ధ్వః
సముదీషతి, తత్ సర్పిః భవతి।
పెరుగును చిలికినప్పుడు ఆ పెరుగుయొక్క సూక్ష్మభాగము పైకి చేరి మీగడగాను, అదే వెన్న, ఆ తరువాత ‘నేయిగాను అగుచున్నది.

ఏవమేవ ఖలు సోమ్యాన్నస్యాశ్యమానస్య యోఽణిమా స ఉర్ధ్వః
సముదీషతి తన్మనో భవతి .. 6.6.2..
2. ఏవమ్ ఏవ ఖలు, సౌమ్య।
అన్నస్య ఆశ్యమానస్య
యో - అణిమా, స ఊర్ధ్వః
సముదీషతి - తత్ ‘మనో’ భవతి।
ఓ సోమ్య! అదే విధంగా తిన్న అన్నముయొక్క అత్యంత సూక్ష్మవిభాగము పైకి తేలియాడుచు అదియే ‘మనస్సు’గా రూపుదిద్దుకొనుచున్నది. (అనగా ఇంద్రియములకు విషయములతో ఆలోచనలే ‘మనస్సు’ అగుచున్నది.)

అపాగ్ంసోమ్య పీయమానానాం యోఽణిమా స ఉర్ధ్వః సముదీషతి
సా ప్రాణో భవతి .. 6.6.3 ..
3. అపాగ్ం సోమ్య। పీయమానానాం
యో అణిమా, స ఊర్ధ్వః
సముదీషతి స ‘ప్రాణో’ భవతి।।
త్రాగబడిన నీరు యొక్క సూక్ష్మభాగము పైకివచ్చి అదియే ‘ప్రాణము’ రూపమును ప్రత్యుత్సాహపరచుచున్నది.

తేజసః సోమ్యాశ్యమానస్య యోఽణిమా స ఉర్ధ్వః సముదీషతి
సా వాగ్భవతి .. 6.6.4..
4. తేజసః, సోమ్య! అశ్యమానస్య
యో అణిమా స ఊర్ధ్వః
సముదీషతి సా ‘వాక్’ భవతి।।
స్వీకరించబడిన తేజస్సు యొక్క (అగ్నియొక్క) సూక్ష్మ విభాగము పైకి వచ్చి అదియే ‘వాక్’ అవుతోంది.

అన్నమయగ్ం హి సోమ్య మన ఆపోమయః ప్రాణస్తేజోమయీ వాగితి
భూయ ఏవ మా భగవాన్విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ .. 6.6.6..

.. ఇతి షష్ఠః ఖండః ..
5. అన్నమయం హి, సోమ్య!
‘మన’ ఆపోమయః ‘ప్రాణః’।
తేజోమయీ ‘వాక్’ - ఇతి।
ఓ సోమ్యా! శ్వేతకేతూ!
మనస్సు అన్నమయము (అన్నమయం మనః)
☼ ఇంద్రియ విషయానుభవములే మనోరూపముగా అవుతోంది.
☼ ప్రాణములు జలమయము.
☼ వాక్కు తేజోమయము.
శ్వేతకేతువు : భూయ ఏవ, భగవాన్।
విజ్ఞాపయత్వ ఇతి।




శ్రీ ఆరుణి : తథా సోమ్య।
ఇతి హోవాచ।
శ్వేతకేతు : పితృదేవా! సద్గురుదేవా! మీరు చెప్పు పెరుగుయొక్క సూక్ష్మవిభాగం ‘నేయి’ అగుచున్న విధంగా -
తినే అన్నముయొక్క అత్యంత సూక్ష్మవిభాగం ‘‘మనస్సు’’గాను, త్రాగే జలముయొక్క అత్యంత సూక్ష్మవిభాగం - ప్రాణరూపంగాను, తేజస్సు (అగ్ని) యొక్క అత్యంత సూక్ష్మవిభాగం - ‘వాక్కు’గాను అగుచున్నాయనే విషయం నేను ఏమాత్రము ఎరిగి ఉండలేదు. ఇది నాకు విజ్ఞాపనం (To practically learn) ప్రసాదించండి.

ఉద్దాలకుడు : సోమ్యా! శ్వేతకేతూ! నీకు అనుభవమవటానికై ఈ ఈ విషయాలు (For practically experiencing) చెపుతాను. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే షష్ఠః ఖండః


6–7. షష్ఠః ప్రపాఠకః - సప్తమః ఖండః - అన్న-జల-తేజస్సు యొక్క సూక్ష్మాంశములు


షోడశకలః సోమ్య పురుషః పంచదశాహాని మాశీః
కామమపః పిబాపోమయః ప్రాణో నపిబతో విచ్ఛేత్స్యత
ఇతి .. 6.7.1..
1. షోడశ కలః సోమ్య!
పురుషః పంచదశాహాని,
మాశీః కామమ్। అపః పిబ।
ఆపోమయః ప్రాణో న పిబతో
విచ్ఛేత్ స యత। ఇతి।।
బిడ్డా! ఈ పురుషుడు భుజించిన అన్నముయొక్క సూక్ష్మతమమైన (సూక్ష్మాతి - సూక్ష్మమైన) అంశము - మనస్సులో శక్తి సంచారము కలిగిస్తోంది.
అన్నము ద్వారా బలము సంతరించుకొన్న మనస్సు - 16 భాగములుగా విభాజ్యము (Divided) అగుచున్నది. అనగా 16 కళలు ప్రదర్శనమై పురుషుడు షోడశకళారూపుడై ప్రదర్శనం అగుచున్నాడు.
అట్టి షోడశ కళలు ఉన్నప్పుడే ఈ పురుషుడు - ద్రష్ట, శ్రోత, మన (మననము), బోద్ధ (బోధింపబడువాడు), కర్త, విజ్ఞాత అగుచూ ఆయా సమస్త కళలు నిర్వర్తించగలడు.

షోడశ కళాపూరుణాడవగు నీవు ఇప్పుడు 15 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు. కానీ జలము మాత్రము కావలసినంత త్రాగుచూ ఉండు. ప్రాణము జలమయము కాబట్టి, జలము త్రాగకపోతే ప్రాణము పోతుంది సుమా!

స హ పంచదశాహాని నశాథ హైనముపససాద కిం బ్రవీమి
భో ఇత్యృచః సోమ్య యజూగ్ంషి సామానీతి స హోవాచ న వై
మా ప్రతిభాంతి భో ఇతి .. 6.7.2..
2. స హ పంచదశాహాని న అశా
అథ హ ఏనమ్ ఉపససాద।
కిం బ్రవీమి, భో ఇతి ఋచః సోమ్య।
యజూంషి సామాని ఇతి।
స హ ఉవాచ : న వై మా
ప్రతిభాన్తి, భో - ఇతి।।
ఆ చెప్పిన విధంగా నీరు మాత్రమే త్రాగుచు 15 రోజులు నిరాహారంగా ఉపవాసము ఉండి, శ్వేతకేతువు 15 రోజుల తరువాత తండ్రిని ఉద్దాలక మహర్షి దర్శనం చేసుకున్నారు.

శ్వేతకేతువు : తండ్రీ! మీరు చెప్పిన విధముగా నీరు మాత్రమే త్రాగుచూ 15 రోజులు ఉపవాసం ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు?
ఉద్దాలకుడు : సోమ్యా! నీవు 12 సంవత్సరాల కాలం గురుకులంలో వేద పఠనము నేర్చుకొని ఉన్నావు కదా! ఏదీ? ఋక్-యజుః సామవేదములలోని కొన్ని మంత్రములు సశాస్త్రీయంగా స్వరయుక్తంగా చెప్పు.
శ్వేతకేతువు : నాన్న గారూ! అవేమీ ఇప్పుడు నాకు జ్ఞాపకానికి రావటం లేదు. క్షమించాలి.

తగ్ం హోవాచ యథా సోమ్య మహతోఽభ్యా హితస్యైకోఽఙ్గారః
ఖద్యోతమాత్రః పరిశిష్టః స్యాత్తేన తతోఽపి న బహు
దహేదేవగ్ంసోమ్య తే షోడశానాం కలానామేకా కలాతిశిష్టా
స్యాత్తయైతర్హి వేదాన్నానుభవస్యశానాథ మే విజ్ఞాస్యసీతి .. 6.7.3..
3. తం హోవాచ : యథా, సోమ్య।
మహతో అభ్యాహితస్య,
ఏకో అంగారః ఖద్యోత
మాత్రః పరిశిష్టః స్యాత్ తేన తతో-పి
న బహు దహేత్ ఏవం
సోమ్య! తే షోడశానాం
కలానామ్ ఏకా కల
అతిశిష్టా స్యాత్ తయై తర్హి వేద
అన్న అనుభవసి
అశాన అథ మే విజ్ఞాస్య, ఇతి।।
ఉద్దాలకుడు : ఎందుకు జ్ఞాపకం రావటంలేదు? ఎందుకో చెపుతాను విను.

ఒకచోట అగ్ని జ్వాజ్వల్యంగా మండుతూ ఉన్నది. ఆ జ్వాజ్వలంగా వెలుగుచున్న అగ్ని క్రమంగా ఆరిపోయి, చివరకు కొద్ది నిప్పురవ్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ చిన్న నిప్పురవ్వలు ఒక కట్టెను కాల్చలేవు కదా!

అట్లాగే ఓ సోమ్యా! నీయొక్క (పైన పురుషుని గురించి చెప్పుకొన్న) షోడశ (16) జీవకళలలో ఒక్క జీవకళమాత్రమే మిగిలి ఉండటంచేత నీకు ఇప్పుడు గురుకులంలో నేర్చుకొన్న వేదపాఠములు గుర్తుకు రావటంలేదు.
అందుచేత ఇప్పుడు నీవు అన్నము భుజించు. అన్నీ గుర్తుకు వస్తాయి.

స హశాథ హైనముపససాద తగ్ం హ యత్కించ పప్రచ్ఛ
సర్వగ్ంహ ప్రతిపేదే .. 6.7.4..
4. స హ అశ అథ హి ఏనమ్ ఉపససాద।
తగ్ం హ యత్ కించ పప్రచ్ఛ
సర్వగ్ం హ ప్రతిపేదే।
శ్వేతకేతువు తృప్తిగా ఆహారము స్వీకరించి మరల ఉద్దాలకమహర్షి వద్దకు వచ్చారు. అప్పుడు ఇక వేదములలో తండ్రిగారు ప్రశ్నిస్తున్నవన్నీ జ్ఞాపకమువచ్చి, ఆతడు తండ్రి కోరిన విధంగా చెప్పగలిగారు.

తగ్ం హోవాచ యథా సోమ్య మహతోఽభ్యాహితస్యైకమంగారం
ఖద్యోతమాత్రం పరిశిష్టం తం తృణైరుపసమాధాయ
ప్రాజ్వలయేత్తేన తతోఽపి బహు దహేత్ .. 6.7.5..
5. తగ్ం హోవాచ
యథా సోమ్య।
మహతో అభ్యాహితస్య ఏకమ్
అంగారం ఖద్యోత మాత్రమ్ పరిశిష్టం
తం తృణైః ఉపసమాధాయ
ప్రజ్వలయేత్ తేన తతో-పి బహు దహేత్।।

ఉద్దాలకమహర్షి : శ్వేతకేతూ సౌమ్య! ఇప్పుడేమి జరిగింది?
ప్రజ్వలిస్తూ ఉన్న అగ్ని చల్లారిన తరువాత శేషించిన చిన్న నిప్పుకణములపై ఎండుగడ్డిపరకలను వేసినప్పుడు మరల మంటలుగా మారగా, అప్పుడు ఆ అగ్ని అనేక తృణములను కాల్చగలుగుతుంది కదా!


ఏవగ్ం సోమ్య తే షోడశానాం కలానామేకా
కలాతిశిష్టాభూత్సాన్నేనోపసమాహితా ప్రాజ్వాలీ
తయైతర్హి వేదాననుభవస్యన్నమయగ్ంహి సోమ్య మన ఆపోమయః
ప్రాణస్తేజోమయీ వాగితి తద్ధాస్య విజజ్ఞావితి విజజ్ఞావితి .. 6.7.6..

.. ఇతి సప్తమః ఖండః ..
6. ఏవం సోమ్య! తే షోడశానాం
కలానామ్ ఏకా కలా అతిశిష్టాభూత్।
సా అన్నేన ఉపసమాహితా
ప్రాజ్వాలితః య ఏతర్హి వేదాననుభవసి
అన్నమయం హి సోమ్య! మన।
ఆపోమయః - ప్రాణః । తేజోమయీ వాక్।
ఇతి తత్ హ అస్య
విజజ్ఞావితి। విజజ్ఞావితి।।
అట్లాగే, సోమ్య! నీవు ఉపవాసము చేసియున్నప్పుడు చివరికి మిగిలియున్న ఒక్క కళను నీవు అన్నము తినటంచేత ఉపసమాహితము అయి తక్కిన 15 కళలను కూడా వెలిగించగలిగింది. అప్పుడు నీవు మనస్సు ప్రత్యుత్సాహము పొందగా వేద మంగళ శ్లోకములు గుర్తుకు వచ్చి గానం చేయగలుగుచున్నావు.

అన్నము తినగానే మనస్సు ఉత్తేజము పొందసాగుతోంది.
కనుక,
★ మనస్సు - అన్నమయము (తస్మాత్ అన్నమయం మనః)
★ ప్రాణము - ఆపో (జల) మయము
★ తేజస్సు - వాక్‌మయము
అని అర్థము చేసుకొనెదవు గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే సప్తమః ఖండః


6–8. షష్ఠః ప్రపాఠకః - అష్టమః ఖండః - సత్‌యే జీవులకు మూలము


ఉద్దాలకో హారుణిః శ్వేతకేతుం పుత్రమువాచ స్వప్నాంతం మే సోమ్య
విజానీహీతి యత్రైతత్పురుషః స్వపితి నామ సతా సోమ్య తదా
సంపన్నో భవతి స్వమపీతో భవతి తస్మాదేనగ్ం
స్వపితీత్యాచక్షతే స్వగ్ంహ్యపీతో భవతి .. 6.8.1..
1. ఉద్దాలకో హి ఆరుణిః
శ్వేతకేతుం పుత్రం ఉవాచ
‘‘స్వప్నాన్తం మే సోమ్య! విజానీహి ఇతి।


యత్ర ఏతత్ పురుషః
స్వపితి నామ సతా, సోమ్య!
తదా సంపన్నో భవతి।
స్వమపీతో భవతి।
తస్మాత్ ఏనగ్ం స్వపితి, ఇతి ఆచక్షతే
స్వగ్ం హి అపీతో భవతి।।
శ్వేతకేతువు : తండ్రీ! ‘స్వప్నము’ రూపము ఎట్టిది?
ఉద్ధాలకుడు : కుమారా! శ్వేతకేతా!
ఇప్పుడు ఇక నీకు స్వప్నము యొక్క స్వరూపము ఏమిటో వివరిస్తాను. స్వప్న పురుషకారము గురించి విను.

జాగ్రత్‌లో దృశ్యము పొందుచున్నట్టి ఈ పురుషుడు (జీవుడు), అట్టి దృశ్యము యొక్క భౌతికమైన ఇంద్రియములద్వారా - ఆస్వాదనము విరమించి, స్వప్నస్థితిని స్వీకరిస్తున్నాడు.
స్వప్నస్థితిలో (ఇంద్రియములను ఉపయోగిస్తున్నప్పుడు కనిపిస్తూ ఉన్న) భౌతిక జాగ్రత్ జగత్ దృశ్యమునుండి విడివడి ఉంటున్నాడు కాబట్టి - తనయందు తానే ఉనికి పొందుచున్నాడు. అందుచేత ‘‘స్వమపి’’ గా అగుచున్నాడు. అందుచేత ‘స్వపితి’ - స్వం అపీతః - తన స్వరూపము తానే త్రాగువాడు - అగుచున్నాడు. తనయందు తాను ఏకము అగుచున్నాడు.

స యథా శకునిః సూత్రేణ ప్రబద్ధో దిశం దిశం
పతిత్వాన్యత్రాయతనమలబ్ధ్వా బంధనమేవోపశ్రయత
ఏవమేవ ఖలు సోమ్య తన్మనో దిశం దిశం
పతిత్వాన్యత్రాయతనమలబ్ధ్వా ప్రాణమేవోపశ్రయతే
ప్రాణబంధనగ్ం హి సోమ్య మన ఇతి .. 6.8.2 ..
2. స యథా శకునిః సూత్రేణ
ప్రబద్ధో దిశమ్ దిశమ్ పతిత్వా
అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా
బంధనమేవా ఉపశ్రయత।


ఏవమేవ ఖలు సోమ్య।
తన్మనో దిశం దిశం పతిత్వా,
అన్యత్ర ఆయతనమ్ అలబ్ధ్వా
ప్రాణమేవ ఉపశ్రయతే।

ప్రాణబంధనం హి సోమ్య।
‘మన’ - ఇతి।
ఒక పంజరమునకు ఒక పక్షి యొక్క కాలును బారైన దారము (Long Thread) తో కట్టిన తరువాత, పంజరముయొక్క తలుపులు తీసిబెట్టినప్పటికీ ఆ పక్షి అటు దిక్కు, ఇటు దిక్కు ఎగిరి ఎగిరి, ఎటు వెళ్లలేక తిరిగి పంజరములోనే ప్రవేశిస్తుంది కదా! పంజరమును వదలి ఎటూ దూరంగా వెళ్లలేదు కదా!


ఓ సోమ్యా! అదే విధంగా మనస్సు కూడా ‘ప్రాణము’ అనే దారముతో బంధించబడి ఉన్నది. అందుచేత ఈ మనస్సు అటు - ఇటు తిరిగినా కూడా, బయట ఎక్కడా స్థిరమైన, నిశ్చలమైన ఆశ్రయము దొరకక, తిరిగి ప్రాణమునే ఆశ్రయించునదై ఉంటోంది.

అందుచేత - మనస్సు ‘ప్రాణము’ అనే బంధము కలిగియే ఉంటుంది.

అశనాపిపాసే మే సోమ్య విజానీహీతి
యత్రైతత్పురుషోఽశిశిషతి నామాప ఏవ తదశితం నయంతే
తద్యథా గోనాయోఽశ్వనాయః పురుషనాయ ఇత్యేవం తదప
ఆచక్షతేఽశనాయేతి తత్రితచ్ఛుంగముత్పతితగ్ం సోమ్య
విజానీహి నేదమమూలం భవిష్యతీతి .. 6.8.3..
3. అశనా పిపాసే మే, సౌమ్య!
విజానీ హి। ఇతి।

యత్ర ఏతత్ పురుషో
అశిశిషతి నామ ‘ఆప’ ఏవ।
తత్ అశితం నయన్తే
తత్ యథా గోనాయో
అశ్వనాయః, పురుషనాయ
ఇత్యేవం తదప ఆచక్షతే అశనాయ ఇతి।

తత్ర ఏతత్ శుంగమ్
ఉత్పతితగ్ం, సోమ్య! విజానీ హి
న ఇదం అమూలమ్ భవిష్యతి - ఇతి।।
శ్వేతకేతువు : పితృదేవా! ఆకలి - దప్పికలు ఏతీరైనవి?
ఉద్దాలకుడు : ఆకలి దప్పికల గురించి చెప్పుచున్నాను. విను.

ఈ జీవుడు ఆకలి పొందినప్పుడు అట్టివాడు తినుచున్నాడు. జలము చేతనే ఆహారము శరీరములోని అన్ని భాగములలోకి తీసుకొనిపోబడుతోంది. అందుచేత జలమును ‘‘అశితి’’ అని అంటారు. గోవులను తోలుకొని పోవు వానిని ‘గోనాయ’ అని, అశ్వములను తీసుకొనిపోవు వానిని అశ్వనాయ, సేనాపతిని ‘పురుషనాయ’ అంటారు కదా!
అట్లాగే ఆహారరసమును తీసుకొని శరీరములోనికి తీసుకుపోతుంది, కనుక ‘అశనాయ’ అని అంటారు.

ఓ శ్వేతకేతూ! మొక్కకు మూలము (వేరు) లేకుండా అంకురము (మొలక) రాదు కదా!
అట్లాగే, ‘జలము’ చేతనే ఈ శరీరము యొక్క శుంగము (అంకురము) ఉత్పన్నమౌతోంది. అంకురము కార్యరూపముగా శరీరము రూపుదిద్దుకుంటోంది. కనుక మూలము (జలము) లేకుండా ఈ శరీరము ఉండజాలదు.

తస్య క్వ మూలగ్ం స్యాదన్యత్రాన్నాదేవమేవ ఖలు సోమ్యాన్నేన
శుంగేనాపో మూలమన్విచ్ఛాద్భిః సోమ్య శుంగేన తేజో
మూలమన్విచ్ఛ తేజసా సోమ్య శుంగేన సన్మూలమన్విచ్ఛ
సన్మూలాః సోమ్యేమాః సర్వాః ప్రజాః సదాయతనాః
సత్ప్రతిష్ఠాః .. 6.8.4..
4. తస్య క్వ మూలం స్యాత్ అన్యత్రాత్
అన్నాత్ ఏవం ఏవ ఖలు సోమ్య!
అన్నేవ శుంగేన ‘‘ఆపో మూలమ్’’
అన్విచ్ఛాత్ అద్భిః సోమ్య!
శుంగేన ‘‘తేజో మూలమ్’’ అన్విచ్ఛ।
తేజసా సోమ్య। శుంగేన
‘సన్మూలమ్’ అన్విచ్ఛ।
సన్మూలాః, సోమ్య! ఇమాః
సర్వాః ప్రజాః ‘సత్’
ఆయతనాః సత్యప్రతిష్ఠాః ।।
జలము కంటే వేరైన మూలము, కారణరూపము ఈ శరీరమునకు మరొకటేమున్నది? లేదు.

అన్నరూపమగు శుంగము (అంకురము) ద్వారా జలరూపమగు మూలము అన్వేషణం చేయి.
జలరూపమగు శుంగము (అంకురము) ద్వారా తేజముయొక్క మూలము అన్వేషించు.
తేజముయొక్క అంకురము (ఉత్పత్తి) ద్వారా ‘సత్తు’ మూలమును గుర్తించు.

ఈ జీవులంతా ‘‘సత్’’యే మూలముగా కలిగియున్నారు.
సమస్త జనులకు ‘సత్తు’ ఆశ్రయము, ఆధారము కూడా।


అథ యత్రైతత్పురుషః పిపాసతి నామ తేజ ఏవ తత్పీతం నయతే
తద్యథా గోనాయోఽశ్వనాయః పురుషనాయ ఇత్యేవం తత్తేజ
ఆచష్ట ఉదన్యేతి తత్రైతదేవ శుంగముత్పతితగ్ం సోమ్య
విజానీహి నేదమమూలం భవిష్యతీతి .. 6.8.5..
5. అథ యత్ర ఏతత్ పురుషః
పిపాసతి నామ తేజ ఏవ
తత్ పీతం నయతే, తత్ యథా,
గోనాయో అశ్వనాయః, పురుషనాయ
ఇత్యేవం తత్ ‘తేజ’ ఆచష్ట ఉదన్యేతి।
తత్ర ఏతత్ ఏవ ‘శుంగమ్’
ఉత్పతితం, సోమ్య।
విజానీహి న ఇదం
అమూలమ్ భవిష్యతి।। ఇతి।।
ఇక ఇప్పుడు -
ఈ పురుషుడు దప్పిక (దాహము) పొంది నీరు త్రాగగానే ఆ జలమును తేజస్సు తీసుకొని పోవుచున్నది. అప్పుడు పిపాసతి - అనబడుచున్నాడు.

(గోవులు తోలుకెళ్లువాడు ‘గోనాయ’, అశ్వములను తోలుకెళ్లువాడు ‘అశ్వనాయ’, జనులను గొనిపోవువాడు ‘పురుషనాయ’ అనబడునట్లుగా) తేజస్సు జలమును తీసుకొనిపోవు ధర్మముచే ‘ఉదన్య’ - అనే పేరు కూడా పొందుచున్నది.

జలరూపమగు ‘మూలము’ చేతనే ఈ ‘శరీరము’ రూపమగు అంకురము ఏర్పడుతోంది. మూలము లేకుండా ఏదీ జనించదదు కదా! ఈ శరీరమునకు మూలము జలమే.

తస్య క్వ మూలగ్ం స్యాదన్యత్రాద్భ్య్ఽద్భిః సోమ్య శుంగేన తేజో
మూలమన్విచ్ఛ తేజసా సోమ్య శుంగేన సన్మూలమన్విచ్ఛ
సన్మూలాః సోమ్యేమాః సర్వాః ప్రజాః సదాయతనాః సత్ప్రతిష్ఠా
యథా తు ఖలు సోమ్యేమాస్తిస్రో దేవతాః పురుషం ప్రాప్య
త్రివృత్త్రివృదేకైకా భవతి తదుక్తం పురస్తాదేవ భవత్యస్య
సోమ్య పురుషస్య ప్రయతో వాఙ్మనసి సంపద్యతే మనః ప్రాణే
ప్రాణస్తేజసి తేజః పరస్యాం దేవతాయాం .. 6.8.6..
6. తస్య క్వ మూలం స్యాత్
అన్యత్ర అద్భ్యో అద్భిః, సోమ్య।
శుంగేన ‘తేజో మూలమ్’ అన్విచ్ఛ।
తేజసా సోమ్య। శుంగేన ‘సన్మూలమ్’ అన్విచ్ఛ।
సన్ములాః సోమ్య! ఇమాః సర్వాః
ప్రజాః ‘సత్’ ఆయతనాః, ‘సత్’ - ప్రతిష్ఠా।
యథా ను ఖలు,
సోమ్య। ఇమాః తిస్రోః దేవతాః
పురుషం ప్రాప్య, త్రివృత్।
త్రివృత్ ఏకైకా భవతి।
తదుక్తం పురుసాత్ ఏవ భవతి।
జలముయొక్క పరిణామమే అయి ఉన్న ఈ శరీరమునకు వేరే మూలమేమున్నది?
జలముయొక్క మూలము ‘తేజస్సు’ను గుర్తించు.
తేజో అంకురమునకు మూలము ‘సత్’ అని గుర్తించు.

ఈ జవులంతా ‘సత్’యే మూలముగా ఆధారముగా కలిగి ఉన్నారు. ‘సత్’యందే సమస్తము ప్రతిష్ఠము (Established) అయి ఉన్నది.

పుత్రా! ఏవిధంగా అయితే (తేజో-జల-అన్నములు)గా తివృత్ - తివృత్ ‘‘3x3’’ = 9 దేవతా పురుషరూపములు అగుచూ, ఏకమగు పరమాత్మగానే (ఆదిపురుషుడుగానే) ఉన్నారో అదివరకు చెప్పియున్నాను.
అస్య, సోమ్య। పురుషస్య ప్రయతో
వాక్-మనసీ సంపద్యతే।
మనః ప్రాణే
ప్రాణః తేజసి
తేజః పరస్యాం - తేవతాయామ్।
ఈ జీవుడు ప్రకృతి సిద్ధదేహము త్యజిస్తున్నప్పుడు -

వాక్కు మనస్సునందు లయిస్తోంది.
మనస్సు ప్రాణమునందు లయిస్తోంది.
ప్రాణము తేజస్సునందు ఏకము అవుతోంది.
తేజస్సు పరమగు ఆత్మయందు లయము పొందుతోంది.

అట్టి పరమాత్మ తత్త్వము సూక్ష్మాతిసూక్ష్మము.

స య ఏషోఽణిమైతదాత్మ్యమిదగ్ం సర్వం తత్సత్యగ్ం స
ఆత్మా తత్త్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా
భగవాన్విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ .. 6.8.7..

.. ఇతి అష్టమః ఖండః ..
7. స య ఏషో అణిమ ఏతత్
ఆత్మ్యమ్ ఇదం।
సర్వం। తత్ సత్యం।
స ఆత్మా తత్త్వమసి, శ్వేతకేతో। ఇతి।
ఈ విధంగా ఈ కనబడే సర్వము ఆత్మయే। అట్టి ఆత్మయే సత్యము.

ఓ శ్వేతకేతూ। ఆ ‘ఆత్మ’ అనబడేది ‘నీవే’ అయి ఉన్నావు.
శ్వేతకేతువు : భూయ ఏవ మా, భగవాన్।
విజ్ఞాపయతి - ఇతి।

ఉద్దాలకుడు : తథా, సోమ్య! ఇతి - హోవాచ।
శ్వేతకేతువు : హే భగవాన్! మీరు నాకు చెప్పుచున్న ‘తత్త్వమసి’ అనే విషయము (లేక) మహావాక్యము నాయొక్క సునిశ్చిత, అనునిత్య, అప్రతిహత, నిస్సందేహ స్వానుభవము కొరకై మరింతగా బోధించమని అర్థిస్తున్నాను.
ఉద్దాలక మహర్షి : బిడ్డా। సరే। చెపుతాను విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే అష్టమః ఖండః


6–9. షష్ఠః ప్రపాఠకః - నవమః ఖండః - తత్త్వమసి!


యథా సోమ్య మధు మధుకృతో నిస్తిష్ఠంతి నానాత్యయానాం
వృక్షాణాగ్ంరసాన్సమవహారమేకతాగ్ంరసం గమయంతి .. 6.9.1..
ఆరుణి :
1. యథా, సోమ్య।
మధు మధుకృతో నిస్తిష్ఠన్తి,
నానాత్యయానాం వృక్షాణాం
రసాన్ సమవహారమ్
ఏకతాం రసం గమయన్తి।
ఉద్ధాలకుడు : కుమారా! సమస్తము పరమాత్మయొక్క స్వయం ప్రదర్శనా చమత్కారమే - అని మనం సుస్పష్టం చేసుకోవటానికి దృష్టాంతాలు కొన్ని చెపుతాను విను.
కొన్ని తేనెటీగలు - అనేక వృక్షాల పూలమొక్కలను సమీపించి పూవులపై వ్రాలి, రసమును గ్రహించి, తేనెపట్టులో తేనెను తయారుచేసి ఉంచుతున్నాయి. ఏ తేనె బొట్టు ఏ వృక్షం నుండి లభించిందో తెలుసుకోగలమా? లేదు కదా! తేనె అంతా ఒకటే అయి ఉన్నది కదా!

తే యథా తత్ర న వివేకం లభంతేఽముష్యాహం వృక్షస్య
రసోఽస్మ్యముష్యాహం వృక్షస్య రసోఽస్మీత్యేవమేవ ఖలు
సోమ్యేమాః సర్వాః ప్రజాః సతి సంపద్య న విదుః సతి
సంపద్యామహ ఇతి .. 6.9.2 ..
2. తే తథా తత్ర స వివేకం
లభన్తే ‘అముష్య అహం’
వృక్షస్య రసోఽస్మి అముష్యాహం
‘వృక్షస్య రసో అస్మి।’
ఇతి ఏవ ఖలు।
ఆ తేనె బొట్టుకు - ‘‘నేను ఈ వృక్షం నుండి వచ్చాను. ఆ వృక్షం నుండి వచ్చాను’’ - అనేది ఏమాత్రము తెలియటము లేదు కదా।
ఆరుణి:
సోమ్య। ఇమాః సర్వాః ప్రజాః
సతి సంపద్య న విదుః ‘సతి-
సంపద్యామ్ అహమ్’’ ఇతి।।
అదే విధంగా ఈ జీవులంతా కూడా ‘సత్తు’ నుండి బయలుదేరి ‘సత్’ నే పొందుచూ కూడా, ‘సత్’ గురించి ‘మేము సత్తును సర్వదా పొందియే ఉంటూ, సత్ స్వరూపమే అయి ఉన్నాను’’ - అనునది దృష్టిలో లేకయే ఉంటున్నారు.

త ఇహ వ్యఘ్రో వా సిగ్ంహో వా వృకో వా వరాహో వా కీటో వా
పతంగో వా దగ్ంశో వా మశకో వా యద్యద్భవంతి తదాభవంతి .. 6.9.3 ..
3. త ఇహ వ్యాఘ్రో వా,
సింహో వా, వృకో వా, వరాహో వా,
కీటో వా, పతంగో వా,
దంశో వా, మశకో వా
యద్యత్ భవన్తి, తదా భవన్తి।।
‘సత్’యే సమస్తము అయి ఉండి కూడా, అట్టి కేవలమగు సత్స్వరూపదేవత ఎప్పుడు ఎట్లా అవాలని భావిస్తుందో - అట్లాగే పులిగానో, సింహముగానో, తోడేలుగానో, పందిగానో, కీటకముగానో శీతాకోక చిలుకగానో, అడవి ఈగగానో, దోమగానో అగుచున్నది. తన కల్పనయందు తానే ప్రవేశించి తాను కల్పించుకొన్న రూపములను తానే నిరాటంకముగా ధారణ చేస్తున్నది. అయితే తన సత్ స్వరూపము వీడకయే ఉన్నది.

స య ఏషోఽణిమైతదాత్మ్యమిదగ్ం సర్వం తత్సత్యగ్ం స ఆత్మా
తత్త్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్విజ్ఞాపయత్వితి
తథా సోమ్యేతి హోవాచ .. 6.9.4..

.. ఇతి నవమః ఖండః ..
4. స య ఏషో ‘అణిమ’
ఏతత్ ‘ఆత్మ్యమ్’ ఇదం సర్వం।
తత్ సత్యగ్ం। స ఆత్మా।
తత్త్వమసి, శ్వేతకేతో। ఇతి।
శ్వేతకేతువు :
భూయ ఏవ మా భగవాన్।
విజ్ఞాపయతు। ఇతి।
ఆరుణి :
తథా సోమ్యా!
ఇతి హో వాచ।।
ఒక అణువు దగ్గరి నుండి ఏదేది ఉన్నదిగా కనిపిస్తూ అనిపిస్తూ ఉన్నదో - అట్టి సమస్తము ఆత్మయే ‘‘ఇన్ని రూపములుగా అగుచూ ఉన్నది. సర్వదా సమస్తము తానే అగుచున్న ఆత్మమాత్రమే సత్యము. తదితరమైనదంతా కల్పన.

ఓ శ్వేతకేతూ! ఇంకొక ముఖ్యమైన, అసలైన సత్యము విను.
పరమసత్యమగు, ఈ సమస్తము తానే అయి ఉంటున్న దానినే ‘ఆత్మ’ అంటున్నారు. ఆత్మయే సత్యము. అంతేకాదు అట్టి ‘ఆత్మ’ నీవే అయి ఉన్నావు. ఇదియే వేదవాక్కు। తత్త్వజ్ఞానము. ఉపనిషత్ వాణి।

శ్వేతకేతువు : అట్టి నేనే అయి ఉన్న పరమసత్యమగు పరమాత్మ గురించి ఇంకా వినాలని ఉన్నది. స్వామి! పితృదేవా! ఇంకా వివరించి చెప్పండి!
ఉద్దాలకుడు : సరే! మరికొంతగా సత్యము, ఆత్మ అయి ఉన్న దాని గురించి చెప్పుకుందాము. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే నవమః ఖండః


6–10. షష్ఠః ప్రపాఠకః - దశమః ఖండః - ఆత్మతత్త్వము - నది దృష్టాంతము


ఇమాః సోమ్య నద్యః పురస్తాత్ప్రాచ్యః స్యందంతే
పశ్చాత్ప్రతీచ్యస్తాః సముద్రాత్సముద్రమేవాపియంతి స సముద్ర
ఏవ భవతి తా యథా తత్ర న విదురియమహమస్మీయమహమస్మీతి .. 6.10.1..
ఆరుణి :
1. ఇమాః సోమ్య! నద్యః పురస్తాత్
ప్రాచ్యః స్యందన్తే।
పశ్చాత్ ప్రతీచ్యస్తాః సముద్రాత్
సముద్రం ఏవ అపియన్తి
స సముద్ర ఏవ భవతి,
తా యథా తత్ర న విదుః,
‘‘ఇయమ్ అహమస్మి।
ఇయమ్ అహమస్మి’’ ఇతి।
ఉద్ధాలకుడు : సోమ్యా! శ్వేతకేతు! మరొక దృష్టాంతం సహాయంతో సత్యమగు ఆత్మగురించిన మరికొంత విశేషము చెప్పుకుందాము.

నదులు చూడు। కొన్ని తూర్పుగా ప్రవహించి, అలా అలా సముద్రంలో జేరుచున్నాయి. మరికొన్ని పడమరదిక్కుగా ప్రవహించి సముద్రంలో జేరుచున్నాయి.
సముద్రంలో నదుల జలము ప్రవేశించిన తరువాత ‘‘నేను ఈ నదీ జలమును। ఆ పేరుగల నదీజలము అనేది ఏమైనా తెలుస్తోందా? లేనే లేదు కదా! సముద్ర జలంలో ఏ జలం ఏ నది నుండి వచ్చిందనే గుర్తింపు ఏమున్నది?

ఏవమేవ ఖలు సోమ్యేమాః సర్వాః ప్రజాః సత ఆగమ్య న విదుః
సత ఆగచ్ఛామహ ఇతి త ఇహ వ్యాఘ్రో వా సిగ్ంహో వా
వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దగ్ంశో వా మశకో వా
యద్యద్భవంతి తదాభవంతి .. 6.10.2..
2. ఏవం ఏవ ఖలు సోమ్య!
ఇమాః సర్వాః ప్రజాః,
సత-ఆగమ్య (ఆగత్య) న విదుః
సత ఆగచ్ఛామ్ అహమ్ ఇతి।
త ఇహ వ్యాఘ్రో వా
సింహో వా, వృకో వా, కీటో వా,
పతంగో వా, దగ్ంశో వా,
మరకో వా - యద్యత్ భవన్తి,
తదా భవన్తి।
అట్లాగే ఈ జీవులంతా ‘సత్’ నుండీ బయలుదేరి ప్రదర్శనమగుచూ కూడా - ‘నేను సర్వత్రా సమస్వరూపమై, సమస్తము అయి ఉన్న ‘సత్త’ నుండే వచ్చాను’’ - అనునది లోకదృష్టిగా తెలియనట్లే అయి ఉంటోంది.

సత్ నుండే బయలుదేరి సత్ స్వరూపుడే సర్వదా అయి ఉండి కూడా - ఈ జీవుడు ఇక్కడ దృశ్యములో పులిగానో, సింహముగానో, తోడేలుగానో, కీటకము (చీమ) గానో, పతంగము (ఎగిరే తేనెటీగ) గానో, అడవి ఈగగానో ఏది అవాలనుకొంటే అదిగా అగుచూ ‘సత్’ యందు భావనగా సంచారములు పొందుచున్నారు.

స య ఏషోఽణిమైతదాత్మ్యమిదగ్ం సర్వం తత్సత్యగ్ం స ఆత్మా
తత్త్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్విజ్ఞాపయత్వితి
తథా సోమ్యేతి హోవాచ .. 6.10.3..

.. ఇతి దశమః ఖండః ..
3. స య ఏషో అణిమా
ఏతత్ ‘‘ఆత్మ్యమ్
ఇదమ్ సర్వమ్’’।
తత్ సత్యమ్। స ఆత్మా।
తత్ త్వమ్ అసి, శ్వేతకేతో। ఇతి।।
శ్వేతకేతువు : ‘‘భూయ ఏవ మా
భగవాన్। విజ్ఞాపయతు ఇతి।
ఆరుణి : తథా ‘సోమ్య!’
ఇతి హో వాచ।।
అట్టి అతి సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మయే ఈ సర్వముగా అయి ఉంటోంది. అదియే సత్యము। ఏది సత్యామో అదియే సత్। ఏది సత్‌యో అదియే ఆత్మ। ఏది ఆత్మయో అదియే నీవు। నిత్యము అయి ఉన్నావు.

శ్వేతకేతువు : ఈ సమస్తము ఆత్మయే అయి, అట్టి ఆత్మయే నేనై ఉన్న సత్యము (సత్) గురించి ఇంకా వినాలని ఉంది. ఓ గురుదేవా! పితృదేవా! మరికొంత వివరిస్తూ, వర్ణించి చెప్పండి.
ఉద్దాలకుడు : ఇంకా కూడా చెప్పుకుందాము విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే దశమః ఖండః


6–11. షష్ఠః ప్రపాఠకః - ఏకాదశః ఖండః - ఆత్మతత్త్వము - వృక్ష దృష్టాంతము


అస్య సోమ్య మహతో వృక్షస్య యో మూలేఽభ్యాహన్యాజ్జీవన్స్రవేద్యో
మధ్యేఽభ్యాహన్యాజ్జీవన్స్రవేద్యోఽగ్రేఽభ్యాహన్యాజ్జీవన్స్రవేత్స
ఏష జీవేనాత్మనానుప్రభూతః పేపీయమానో మోదమానస్తిష్ఠతి .. 6.11.1..
ఆరుణి :
1. అస్య, సోమ్య! మహతో వృక్షస్య
యో ‘మూలే’’ అభ్యాహన్యాత్ జీవన్।
స్రవేద్యో ‘‘మధ్యే’’ అభ్యాహన్యాత్ జీవన్।
స్రవేద్యో ‘‘అగ్రే’’ అభ్యాహన్నాత్ జీవన్।
స్రవేత్స ఏష జీవేన ‘‘ఆత్మన’’ అను ప్రభూతః
పేపీయమానో, మోదమానః తిష్ఠతి।।
ఉద్దాలకుడు : ఒక మహావృక్షము యొక్క ఒక కొమ్మను ఖండిస్తే, అది రసము స్రవిస్తూ, మిగిలిన కొమ్మలు, వృక్షము జీవిస్తూనే ఉంటుంది. మధ్యభాగముగాని, అగ్రభాగముగాని ఖండించినా కూడా, మిగిలిన భాగము జీవిస్తూ, రసము స్రవిస్తూ ఉంటుంది. వృక్షము జీవిస్తూనే, జీవాత్మత్వము కొనసాగుతూ జలపానము చేస్తూ ప్రమోదము, ఆనందము కొనసాగిస్తూ, వృద్ధిని కలిగియే ఉంటోంది.

అస్య యదేకాగ్ం శాఖాం జీవో జహాత్యథ సా శుష్యతి
ద్వితీయాం జహాత్యథ సా శుష్యతి తృతీయాం జహాత్యథ సా
శుష్యతి సర్వం జహాతి సర్వః శుష్యతి .. 6.11.2..

ఏవమేవ ఖలు సోమ్య విద్ధీతి హోవాచ జీవాపేతం వావ కిలేదం
మ్రియతే న జీవో మ్రియతే ఇతి స య ఏషోఽణిమైతదాత్మ్యమిదగ్ం
సర్వం తత్సత్యగ్ం స ఆత్మా తత్త్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ
మా భగవాన్విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ .. 6.11.3..

.. ఇతి ఏకాదశః ఖండః ..
2. అస్య యత్ ఏకాగ్ం శాఖాం జోవో జహాతి।
అథ సా శుష్యతి।
ద్వితీయాం జహాత్।
అథ సా శుష్యతి।
తృతీయం జహాతి। అథ సా శుష్యతి।
సర్వం జహాతి। సర్వః శుష్యతి।
ఏవం ఏవ ఖలు సోమ్య।
విద్ధి। ఇతి హోవాచ।।
వృక్షజీవుడు వృక్షముయొక్క శాఖను వీడినప్పుడు - ఆ శాఖ శుష్కించి పోవుచున్నది. జీవత్వముచే వృక్షజీవుడు రెండవ శాఖను కొనసాగింప జేయుచున్నాడు. అది విడిస్తే, మూడవశాఖను కూడా విడిస్తే ఆ మూడవ శాఖ శుష్కిస్తూ ఉన్నాయి. మొత్తము వృక్షమును వృక్షజీవుడు త్యజించినప్పుడు వృక్షమంతా శుష్కిస్తోంది. అట్టి జీవరసమే ఆత్మతత్త్వము అను గమనించు.
3. జీవాపేతం వావ కిల
ఇదం మ్రియతే, న జీవో మ్రియత। ఇతి।
స య ఏషో అణిమై
తదాత్మ్యమ్ ఇదగ్ం సర్వం।
తత్ సత్యగ్ం। స ఆత్మా।
తత్ త్వమ్ అసి
శ్వేతకేతో! ఇతి।
శ్వేతకేతువు :
భూయ ఏవ మా భగవాన్।
విజ్ఞాపయతు ఇతి।
ఆరుణి : తథా। సోమ్య।
ఇతి హో వాచ।
అదేవిధంగా జీవుడు ఈ దేహమును త్యజించినప్పుడు దేహము నశిస్తోంది. కానీ ‘జీవుడు’, ఆతని ‘జీవనము’ ఈ రెండూ నశించటము లేదు. అట్టి జీవుని ఆత్మ చైతన్యము అత్యంత సూక్ష్మము. అట్టి సూక్ష్మమగు ఆత్మయే ఈ కనబడేదంతా।

అట్టి ఆత్మయే సత్యము। సత్యము నాశనము లేనిది, నిత్యమైనదే ఆత్మ। అట్టి ఆత్మయే నీవై ఉన్నావు.

శ్వేతకేతువు : మహనీయా! సంతోషము, ఇంకా కూడా వివరించి, నాకు తెలియజేయ ప్రార్థన.
ఉద్దాలకుడు : సరే! సోమ్య! ఇంకొంత వివరిస్తాను. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే ఏకాదశః ఖండః


6–12. షష్ఠః ప్రపాఠకః - ద్వాదశః ఖండః - ఆత్మతత్త్వము - మఱ్ఱిగింజ దృష్టాంతము


న్యగ్రోధఫలమత ఆహరేతీదం భగవ ఇతి భింద్ధీతి భిన్నం
భగవ ఇతి కిమత్ర పశ్యసీత్యణ్వ్య ఇవేమా ధానా భగవ
ఇత్యాసామంగైకాం భింద్ధీతి భిన్నా భగవ ఇతి కిమత్ర
పశ్యసీతి న కించన భగవ ఇతి .. 6.12.1..
ఆరుణి :
1. న్యగ్రోధ ఫలమ్ అత ఆహరేతి।
ఇదమ్ భగవ।
ఇతి భింధీతి।
భిన్నమ్ భగవ - ఇతి।
కిమ్ అత్ర పశ్యసి? ఇతి।
అణ్వ్య ఇవ ఇమే ధానా,
భగవ! ఇత్యాసాం అంగైకాం భింధీతి।
భిన్నా భగవ ఇతి।
కిమ్ అత్ర పశ్యసి? ఇతి।
‘‘న కించన భగవ!’’ …ఇతి।
ఉద్దాలక మహర్షి : నాయనా! శ్వేతకేతూ అదిగో। ఆ మఱ్ఱి చెట్టు ఉన్నది కదా! ఒక మఱ్ఱి పండును ఇట్లా తీసుకురా.
ఉద్దాలక మహర్షి : ఏదీ! ఈ మఱ్ఱిపండును చీల్చు.
శ్వేతకేతువు : భగవాన్। ఇదిగో। చీల్చాను.
ఉద్దాలక మహర్షి : ఇప్పుడు ఇందులో ఏమి కనిపిస్తోంది?
శ్వేతకేతువు : ఇందులో అణువువంటి చిన్న చిన్న గింజలు కనిపిస్తున్నాయి, భగవాన్।
ఉద్దాలక మహర్షి : ఆ గింజను కూడా పగలగొట్టు.
శ్వేతకేతువు : ఈ చిన్న గింజను కూడా పగలగొట్టాను.
ఉద్దాలకుడు : ఆ చిన్నగింజను పగలగొట్టి చూస్తే ఇంకా నీకేమి కనిపించింది?
శ్వేతకేతువు : భగవాన్! నాకు ఇంక ఏమీ కనిపించటము లేదు.

తగ్ం హోవాచ యం వై సోమ్యైతమణిమానం న నిభాలయస
ఏతస్య వై సోమ్యైషోఽణిమ్న ఏవం మహాన్యగ్రోధస్తిష్ఠతి
శ్రద్ధత్స్వ సోమ్యేతి .. 6.12.2..
2. తం హోవాచ (ఆరుణి ఉవాచ) :
యం వై సోమ్య। ఏతమ్ అణిమానం
న నిభాలయస ఏతస్య వై, కిల సోమ్య।
ఏషో అణిమ్న ఏవం
మహాన్ న్యగ్రోధః తిష్ఠతి।।
శ్రద్ధత్స్వ సోమ్య! ఇతి।
ఉద్దాలక మహర్షి : చిన్న గింజను చీల్చితే నీకు ఏదీ కనిపించటము లేదు. అత్యంత సూక్ష్మ భాగమేదో నీకు కనిపించటము లేదు. అట్టి కంటికి ఏ మాత్రము కనిపించిన సూక్ష్మాతి సూక్ష్మభాగమునుండి అనేక శాఖలు, ఫలములు, ఆకులుగల సువిశాలమైన మఱ్ఱి మహావృక్షము పుట్టుకువస్తోంది. మహావృక్షముయొక్క ఆకారములు తదితర వస్తు ధర్మములు అట్టి మఱ్ఱి సూక్ష్మ గింజలోని ఖాళీ స్థానములోనుండి, కాలక్రమంగా అంతటా ప్రదర్శనమౌచున్నాయి.

స య ఏషోఽణిమైతదాత్మ్యమిదద్గ్ం సర్వం తత్సత్యగ్ం స ఆత్మా
తత్త్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్విజ్ఞాపయత్వితి
తథా సోమ్యేతి హోవాచ .. 6.12.3..

.. ఇతి ద్వాదశః ఖండః ..
3. స య ఏషో ‘అణిమ’ ఏతత్
ఆత్మ్యమ్ ఇదమ్ సర్వం
తత్ సత్యం। స ఆత్మా।
తత్ త్వమ్ అసి, శ్వేతకేతో। ఇతి।
శ్వేతకేతువు : భూయ ఏవ, మా భగవాన్।
విజ్ఞాపయతి ఇతి।
ఆరుణి : తథా సోమ్య ఇతి!
హో వాచ।।
అట్టి సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మాకాశ సూక్ష్మ విభాగంలో ఈ సమస్త సువిశాల బ్రహ్మాండమంతా తిష్ఠితమైయుండి, కాలక్రమేణా ప్రదర్శనము అవుతోంది.
ఎట్టి సూక్ష్మాతిసూక్ష్మ విభాగ చమత్కారము నుండి ఈ బ్రహ్మాండాలన్నీ బయల్వెడలుచున్నాయో అదియే - సత్యము (యత్ - సత్)! అదియే ఆత్మ।
ఓ శ్వేతకేతూ! అట్టి ఆత్మయే నీ సత్యస్వరూపము। నీవే అయి ఉన్నావు। ఇది ఆత్మజ్ఞుల, వేదముల నిర్వచన సారము.
శ్వేతకేతువు : భగవాన్! ఇంకా కూడా మీ వద్ద మమానంద స్వాభావికమగు ఆత్మగురించి తెలుసుకోగోరుచున్నాను.
ఉద్దాలక మహర్షి : సరే"! మరికొంతగా చెప్పకుందాము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే ద్వాదశః ఖండః


6–13. షష్ఠః ప్రపాఠకః - త్రయోదశః ఖండః - ఆత్మతత్త్వము - లవణం దృష్టాంతం


లవణమేతదుదకేఽవధాయాథ మా ప్రాతరుపసీదథా ఇతి
స హ తథా చకార తగ్ం హోవాచ యద్దోషా లవణముదకేఽవాధా
అంగ తదాహరేతి తద్ధావమృశ్య న వివేద .. 6.13.1..
ఆరుణి :
1. లవణమ్ ఏతత్ ఉదకే
అవధాయ అథ మా ప్రాతః
ఉపసీదథా ఇతి।।
స హ తథా చకార
తం హోవాచ : (ఆరుణీ ఉవాచ)
యద్దోషా లవణమ్ ఉదకే
అవాధా (అబాధా) అంగ తత్ ఆహః ఏతి।
తత్ ధావమృశ్య న వివేద
ఉద్ధాలక మహర్షి : ఓ ప్రియ శ్వేతకేతూ! కొంచము ఉప్పు తీసుకురా. ఆ ఉప్పురాళ్ళను నీటిలో వేయి. తెల్లవారిన తరువాత నా దగ్గరకు రా. మాట్లాడుకుందాము.
(అప్పుడు శ్వేతకేతువు ఉప్పును ముంచి నీళ్ళలో వేసారు. ఆ మరునాడు తెల్లవారిన తరువాత ఉదయం తిరిగి పితృదేవుల సమక్షానికి వచ్చారు.)
శ్రీ ఉద్దాలకుడు : శ్వేతకేతూ! రాత్రివేళ నీళ్లల్లో ఉప్పు వేశావు కదా! అదే ఉప్పు ఆ నీళ్లలోనుండి తీసుకునిరా!
నీళ్లలో వెతికినా కూడా ఉప్పు గడ్డలు కనిపించనేలేదు.
శ్వేతకేతు : ఆ ఉప్పుగడ్డలు నీళ్లలో విలీనమై పోయినాయి.

యథా విలీనమేవాంగాస్యాంతాదాచామేతి కథమితి లవణమితి
మధ్యాదాచామేతి కథమితి లవణమిత్యంతాదాచామేతి
కథమితి లవణమిత్యభిప్రాస్యైతదథ మోపసీదథా ఇతి
తద్ధ తథా చకార తచ్ఛశ్వత్సంవర్తతే తగ్ం హోవాచాత్ర
వావ కిల తత్సోమ్య న నిభాలయసేఽత్రైవ కిలేతి .. 6.13.2..
2. యథా విలీనం ఏవ అంగ
అస్య అన్తాత్ ఆచామ్ ఏతి।
కథమ్ ఇతి?
శ్వేతకేతువు : లవణమ్ ఇతి।
ఆరుణి : మధ్యాత్ ఆచామేతి!
కథమితి?
శ్వేతకేతువు : లవణం ఇతి।
ఆరుణి : అంతాత్ ఆచామేతి।
కథమితి?
శ్వేతకేతువు : లవణమ్ ఇతి।
ఆరుణి : అభిప్రాస్యై, తత్ అథమ్
ఉపసీదథా ఇతి।
తద్ధ తథా చకార। తత్ శశ్వత్ సంవర్తతే।
తం హోవాచ (ఆరుణీ ఉవాచ) : అత్ర వావ కిల
‘సత్’ సోమ్య! న నిభాలయసే
అత్రైవ కిల। ఇతి।।
ఉద్దాలక మహర్షి : సరే! ఉప్పు ఏమైనాగానీ, నీళ్లు పైపై రుచి ఎట్లా ఉన్నదో? అది గమనించు.
శ్వేతకేతు : నీరు ఉప్పగా ఉన్నది.
ఉద్దాలకుడు : అడుగున (క్రిందగా) రుచి చూచి చెప్పు.
శ్వేతకేతు : ఉప్పగానే ఉన్నది.
ఉద్దాలకుడు : ఆ నీరు ఆవల పారబోసి నా దగ్గరకురా!
శ్వేతకేతువు ఆ ఉప్పగా ఉన్న నీరు ఆవల పారబోసి తండ్రి దగ్గరకు వచ్చాడు.
ఉద్దాలకుడు : నీవు నీటిలో వేసిన ఉప్పు నీటిలో ఎక్కడ ఉండి ఉన్నది?
శ్వేతకేతు : నీటిలో కలిసిపోయి అంతటా ఉండి ఉన్నది.

ఉద్దాలకుడు : నీటిలో ఉప్పు కలిసిపోయి, ఉప్పు చేతికి దొరకక, రుచిగా మాత్రమే తెలియవచ్చింది చూచావా? అట్లాగే సత్‌రూపమగు బ్రహ్మము సర్వత్రా నిండి ఉన్నప్పటికీ కళ్లకు కనపించటం లేదు. స్థూలమైన ‘‘ప్రత్యక్షము’’ మొదలైన ప్రమాణములకు తెలియరావటం లేదు.

స య ఏషోఽణిమైతదాత్మ్యమిదగ్ం సర్వం తత్సత్యగ్ం స ఆత్మా
తత్త్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్విజ్ఞాపయత్వితి
తథా సోమ్యేతి హోవాచ .. 6.13.3..

.. ఇతి త్రయోదశః ఖండః ..
3. స య ఏషో అణిమ ఏతత్ ‘ఆత్మ్యమ్’
ఇదగ్ం సర్వం। తత్ సత్యం।
స ఆత్మా। తత్ త్వమ్ అసి, శ్వేతకేతో । ఇతి।
శ్వేతకేతువు : భూయ ఏవ మా భగవాన్
విజ్ఞాపయతు ఇతి।
ఆరుణి : తథా సోమ్య।
ఇతి హోవాచ।।
అట్టి సూక్ష్మమగు ‘సత్’ చేతనే (నీళ్లల్లో కరిగిన ఉప్పువలె) ఈ సమస్తము తదాత్మ్యము కాబడి ఉన్నది. అటి సత్ యే సత్యము.

ఆ సత్యమే ఆత్మ। ఓ శ్వేతకేతూ! అట్టి ఆత్మయే నీవై ఉన్నావు.

శ్వేతకేతు : భగవాన్! అట్టి నా ఆత్మస్వరూపం గురించి ఇంకా కొంత చెప్పండి.
శ్రీ ఉద్దాలక మహర్షి : సరే! ఇంకా చెపుతాను. విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే త్రయోదశః ఖండః


6–14. షష్ఠః ప్రపాఠకః - చతుర్దశః ఖండః - ఆత్మతత్త్వము - దొంగలచే బంధింపబడినవాని దృష్టాంతము


యథా సోమ్య పురుషం గంధారేభ్యోఽభినద్ధాక్షమానీయ తం
తతోఽతిజనే విసృజేత్స యథా తత్ర ప్రాఙ్వోదఙ్వాధరాఙ్వా
ప్రత్యఙ్వా ప్రధ్మాయీతాభినద్ధాక్ష ఆనీతోఽభినద్ధాక్షో
విసృష్టః .. 6.14.1..
ఆరుణి :
1. యథా, సోమ్య! పురుషం గాంధారేభ్యో
అభినద్ధ అక్షమానీయ తం తతో
అతిజనే విసృజేత్ స యథా తత్ర ప్రాఙ్‌వోదఙ్ వాధరాఙ్ వా
ప్రత్యన్ వా ప్రధ్మాయీ త
అభినద్ధాక్ష ఆనీతో। అభినద్ధాక్షో విసృష్టః।।
శ్రీ ఉద్ధాలక మహర్షి : ఒకసారి కొందరు దొంగలు గాంధర దేశము నుండి ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి తీసుకొనివచ్చి ఎక్కడో ఒక మహారణ్యంలో విడచి పెట్టి వెళ్లిపోయారు.
అప్పుడు ఆ కీకారణ్యంలో కళ్లు కట్టివేయబడి ‘‘అయ్యా! ఎవ్వరైనా దగ్గరలో ఉన్నారా? నా కనులకు గంతలు కట్టి ఇక్కడ ఎక్కడో పడవేశారు. కనులు కనిపించటం లేదు’’ - అని ఏడవటం ప్రారంభించాడు.

తస్య యథాభినహనం ప్రముచ్య ప్రబ్రూయాదేతాం దిశం గంధారా
ఏతాం దిశం వ్రజేతి స గ్రామాద్గ్రామం పృచ్ఛన్పండితో మేధావీ
గంధారానేవోపసంపద్యేతైవమేవేహాచార్యవాన్పురుషో వేద
తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష్యేఽథ సంపత్స్య ఇతి .. 6.14.2..
2. తస్య యథా అభినహనం
ప్రముచ్య ప్రబ్రూయాత్ ఏతాం
దిశం గంధారా, ఏతాం దిశం వ్రజేతి।
స గ్రామాత్ గ్రామం పృచ్ఛన్ పండితో
మేధావీ గంధారానేవ ఉపసంపద్యేత్।
ఎవ్వరో బాటసారులు ఆతని కేకలు విన్నారు. కట్లు విప్పి కనులకు గంతలు తొలగించారు. ‘‘ఎటు వెళ్లాలి?’’ అని అడిగి ‘‘ఇదిగో! ఈ దిశగా ఈ బాటగా వెళ్ళండి. మీరు మీ గాంధార దేశం తిరిగి చేరగలరు’’ - అని త్రోవ చూపించారు.
ఆతడు పండితుడు, మేధావి, అవటంచేట త్రోవలో ఆయా బాటసారులను, ఆయా గ్రామ యజమానులను అడుగుచూ, త్రోవ తెలుసుకుంటూ చివరికి గాంధార దేశం చేరాడు. తిరిగి తన ఇంటికి సుఖంగా చేరాడు.
ఏవం ఇవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద
తస్య తావత్ ఏవ చిరం,
యావత్ న విమోక్ష్యే
అథ సంపత్స్య। ఇతి।
అదేవిధంగా సంసారారణ్యంలో కామ - క్రోధ - లోభ - మోహ ఇత్యాది దొంగలు సంసారాంధకారములో పడవేయగా, ఈ జీవుడు తన సంసార బాధలను గమనించి అరచి, శాస్త్రములచే గంతలు తొలగించబడుచున్నాడు. ఆచార్యులవారిని దర్శించి, ప్రయత్నశీలుడై సత్యమును ఎరిగి ముక్తిని సిద్ధించుకొంటున్నాడు.

స య ఏషోఽణిమైతదాత్మ్యమిదగ్ం సర్వం తత్సత్యగ్ం స ఆత్మా
తత్త్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్విజ్ఞాపయత్వితి
తథా సోమ్యేతి హోవాచ .. 6.14.3..

.. ఇతి చతుర్దశః ఖండః ..
3. స య ఏషో ‘ఆణిమా’ ఏతత్
‘ఆత్మ్యమ్’ ఇదం సర్వమ్।
తత్ సత్యమ్। స ఆత్మా।
తత్ త్వమసి - శ్వేతకేతో! ఇతి।।
శ్వేతకేతువు :-
భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి।
ఉద్దాలకారుణి:
తథా సోమ్య!
ఇతి - హోవాచ।।
అట్టి సాంసార జీవుడు చేరు స్వస్థానమ్ అతి సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మ। అట్టి ఆత్మయే ఈ సమస్తము అయి ఉన్నది. అట్టి ఆత్మయే సత్యము. సత్యమగు ఆత్మయే నీవై ఉన్నావు. ఇదియే వేద హృదయం। ఉపనిషత్ వాణి।

శ్వేతకేతువు : తండ్రీ! భగవాన్! ఇంకా కూడా ఆత్మ గురించి మరికొంత నాకు తెలియజేయండి.
శ్రీఉద్దాలక మహర్షి : బిడ్డా! ఇంకా కూడా చెపుతాను. విను.
(అరుణి పుత్రుడు ఆరుణి ఉద్దాలకుడు అని పేరు. ఆయన కుమారుడు శ్వేతకేతువు).

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే చతుర్దదశః ఖండః


6–15. షష్ఠః ప్రపాఠకః - పంచదశః ఖండః - ఆత్మతత్త్వము - మరణశయ్యపై ఉన్నవాని దృష్టాంతము


పురుషగ్ం సోమ్యోతోపతాపినం జ్ఞాతయః పర్యుపాసతే జానాసి
మాం జానాసి మామితి తస్య యావన్న వాఙ్మనసి సంపద్యతే
మనః ప్రాణే ప్రాణస్తేజసి తేజః పరస్యాం దేవతాయాం
తావజ్జానాతి .. 6.15.1..
ఆరుణి :
1. పురుషం సోమ్య! అత ఉపతాపినం
జ్ఞాతయః పర్యుపాసతే - ‘‘జానాసి
మాం? జానాసి మాం?’’ ఇతి।
తస్య యావత్ న వాక్ - మనసి
సంపద్యతే, మనః ప్రాణే, ప్రాణః తేజసి
తేజః పరస్యాం దేవతాయం
తావత్ జానాతి।।
ఉద్ధాలక మహర్షి : ఒకానొకడు వ్యాధిపీడితుడై మరణశయ్యపై ఉన్నప్పుడు - ఆతని బంధువులు ‘‘ఇదిగో। నన్ను గుర్తుపట్టావా? నేనెవరు? నేనెవరు? ఈతడెవరు?’’ అని అడుగుచూ ఉంటారు. ‘‘నా గుర్తు నీకు ఉన్నదా?’’ అని పలుకరిస్తూ ఉంటారు.
ఆతని వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు ఆవలదగు పరదేవతా స్వరూపమునందు ఏకమవనంతవరకు గుర్తు పడతాడు.
(ఇక ఆతడు ఆ తరువాత ఎవ్వరినీ గుర్తుపట్టడు)
- బంధువు, అయినవాడు మొదలైన గుర్తులు ఆతనికి ఇక ఉండవు.

అథ యదాస్య వాఙ్మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసి
తేజః పరస్యాం దేవతాయామథ న జానాతి .. 6.15.2..
2. అథ యదా అస్య వాక్ - మనసి
సంపద్యతే, మనః - ప్రాణే,
ప్రాణః తేజసి, తేజః పరస్యాం
దేవతాయామ్ - అథ న జానాతి।।
ఆ తీరుగా వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు ఆత్మయందు లయము పొందుచున్నదో అట్టి ఆత్మ జగద్దృష్టిచే కప్పబడినవి తొలగుచుండగా ఆతడిక బంధువులను గుర్తుపట్టడు.

స య ఏషోఽణిమైతదాత్మ్యమిదగ్ం సర్వం తత్ సత్యగ్ం స ఆత్మా
తత్త్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్విజ్ఞాపయత్వితి
తథా సోమ్యేతి హోవాచ .. 6.15.3..

.. ఇతి పంచదశః ఖండః ..
3. స య ఏషో ‘‘అణిమా’’
ఏతత్ ఆత్మ్యమ్ - ఇదమ్ సర్వం।
తత్ సత్యం। స ఆత్మా।
తత్త్వమసి - శ్వేతకేతో। ఇతి।
శ్వేతకేతువు :
భూయ ఏవ మా భగవాన్
విజ్ఞాపయతు ఇతి।
ఆరుణి :
తథా సౌమ్య। ఇతి
హో వాచ।
అట్టి సూక్ష్మమగు ఆత్మయే ఈ సమస్తము. అదియే సత్యము. సత్యమైనదే ఆత్మ. ఓ శ్వేతకేతూ! అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. తత్ త్వమ్ అసి।

శ్వేతకేతువు : భగవాన్। ఇంకా కూడా ‘ఆత్మ’ గురించి (అనగా సహజ స్వరూపము గురించి) ఇంకా ఇంకా కూడా బోధించ ప్రార్థన.
ఉద్దాలక మహర్షి : సరే! ఇంకా విను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే పంచదశః ఖండః


6–16. షష్ఠః ప్రపాఠకః - షోడశః ఖండః - ఆత్మ విజ్ఞానిని దృశ్యము బంధించలేదు


పురుషగ్ం సోమ్యోత
హస్తగృహీతమానయంత్యపహార్షీత్స్తేయమకార్షీత్పరశుమస్మై
తపతేతి స యది తస్య కర్తా భవతి తత ఏవానృతమాత్మానం
కురుతే సోఽనృతాభిసంధోఽనృతేనాత్మానమంతర్ధాయ
పరశుం తప్తం ప్రతిగృహ్ణాతి స దహ్యతేఽథ హన్యతే .. 6.16.1..
ఆరుణి (ఉద్దాలకుడు):-
1. పురుషం సోమ్య! ఏత
హస్త గృహీత మానయన్తి
అపహార్షీత్ స్తేయమ్ అకార్షీత్
పరశుమ్ అస్మై తపతి ఏతి।
స యది తస్య కర్తా భవతి,
తత ఏవ అనృతమ్ ఆత్మానం
కురుతే, సో అనృత-అభిసంధో
అనృతేన ఆత్మానమ్ అంతర్ధాయ
పరశుం తప్తం ప్రతిగృహాణాతి,
స దహ్యతే, అథ హన్యతే।।
ఉద్ధాలకుడు : ఒకనిపై దొంగతనము ఆపాదించబడినది. కానీ ఆతడు ‘‘నేను దొంగతనము చేయలేదు’’ - అని చెప్ప ప్రారంభించాడు.

అప్పుడు ఇనుప కడ్డీ కాల్చి ‘‘తాకి-ప్రమాణము చేయి’’ అని ఊరి పెద్దలచే సత్య-అసత్య నిరూపణకై నిర్దేశించబడింది.

ప్రమాణముయొక్క ప్రయోజనంగా →
- దొంగతనము చేసి ఉంటే కాల్చిన ఇనుప కడ్డీ చేతిని కాల్చగలదు.
- దొంగతనము చేయకపోతే చేతిని ఇనుపకడ్డీ కాల్చదు. ఆతడు వెంటనే విడుదల చేయబడతాడు.

అథ యది తస్యాకర్తా భవతి తతేవ సత్యమాత్మానం కురుతే
స సత్యాభిసంధః సత్యేనాత్మానమంతర్ధాయ పరశుం తప్తం
ప్రతిగృహ్ణాతి సన దహ్యతేఽథ ముచ్యతే .. 6.16.2..
2. అథ యది తస్య అకర్తా భవతి,
తత ఏవ ‘సత్యమ్’ ఆత్మానం
కురుతే, స సత్యాభిసంధః
సత్యేన ఆత్మానమ్ అన్తర్ధాయ
పరశుం తప్తం ప్రతిగృహాణాతి
స న దహ్యతే - అథ ముచ్యతే।
అట్లాగే సత్యమగు ఆత్మను ఎరిగి ‘‘ఆత్మయే సత్యము ఆత్మయే నేను’’ - అను ‘సత్యము’ను ధారణ చేయువానిని (కాలిన పలుగు సత్యము చెప్పువాని చేయి కాల్చని తీరుగా) దృశ్యము బంధించలేదు.

స యథా తత్ర నాదాహ్యేతైతదాత్మ్యమిదగ్ం సర్వం తత్సత్యగ్ం స
ఆత్మా తత్త్వమసి శ్వేతకేతో ఇతి తద్ధాస్య విజజ్ఞావితి
విజజ్ఞావితి .. 6.16.3..

.. ఇతి షోడశః ఖండః ..

.. ఇతి షష్ఠోఽధ్యాయః ..
3. స యథా తత్ర నాదాహి
ఏత ఏతత్ ఆత్మ్యమ్ ఇదగ్ం
సర్వం। తత్ సత్యగ్ం।
స ఆత్మా। తత్ త్వమసి, శ్వేతకేతో! ఇతి
శ్వేతకేతువు :
తత్ హ అస్య విజజ్ఞావితి, విజజ్ఞావితి।
ఈ సమస్తము ఆత్మయే। ఆత్మయే సత్యము. సత్యమగు ఆత్మను ధారణచేయువాడు అట్టి సత్యము దర్శిస్తాడు. అట్టి ఆత్మయే సత్యము. అదియే నీవు।

శ్వేతకేతువు : మీరు చెప్పిన దృష్టాంతములను మననము చేస్తూ ఉండగా ఆత్మను ఎరుగుచున్నాను. చక్కగా ఆత్మను తెలుసుకుంటున్నాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - షష్ఠాధ్యాయే షోడశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది - షష్ఠ అధ్యాయః సమాప్తః।। 🌺


సామవేదాంతర్గత

Ⅶ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - ఏడవ అధ్యాయము - నారదునకు సనత్కుమారుని ఉపదేశము

7–1. సప్తమ ప్రపాఠకః - ప్రథమ ఖండము - “నామ ఉపాసన”


.. సప్తమోఽధ్యాయః ..

అధీహి భగవ ఇతి హోపససాద సనత్కుమారం నారదస్తగ్ం
హోవాచ యద్వేత్థ తేన మోపసీద తతస్త ఊర్ధ్వం వక్ష్యామీతి
స హోవాచ .. 7.1.1..
1. ఓం
అధీహి భగవ। ఇతి
హ ఉపససాద సనత్కుమారం నారదః।
తం హ - ఉవాచ :
(సనత్కుమారౌవాచ:)
యత్ వేత్థ తేనమ్ ఉపసీద।
తతస్త ఊర్ధ్వం వక్ష్యామి ఇతి।

దేవర్షి త్రిలోక సంచారి అగు శ్రీనారదమహర్షి ఒక సందర్భములో సద్గురువు, బ్రహ్మ మానసపుత్రుడు - శ్రీ సనత్కుమారులవారిని సమీపించి తత్త్వము ఉపదేశించమని విన్నవించుకొన్నారు.

సనత్కుమారుడు : మంచిది అయితే ముందుగా మీరు తత్త్వము ఏవిధంగా తెలుసుకొన్నవారై ఉన్నారో అది వివరించండి. ఆ తరువాత నేను తప్పక చెపుతాను.

ఋగ్వేదం భగవోఽధ్యేమి యజుర్వేదగ్ం సామవేదమాథర్వణం
చతుర్థమితిహాసపురాణం పంచమం వేదానాం వేదం పిత్ర్యగ్ం రాశిం
దైవం నిధిం వాకోవాక్యమేకాయనం దేవవిద్యాం బ్రహ్మవిద్యాం
భూతవిద్యాం క్షత్రవిద్యాం నక్షత్రవిద్యాగ్ం
సర్పదేవజనవిద్యామేతద్భగవోఽధ్యేమి .. 7.1.2..
2. స హ ఉవాచ (నారదౌవాచ) :
ఋగ్వేదం, భగవో। అధ్యేమి।
యజుర్వేదం; సామవేదం ;
అథర్వణం చతర్థం;
ఇతిహాస పురాణం పంచమం;
వేదానాం వేదం, పిత్ర్యం,
రాశిం, దైవం, నిధిం;
వాకోవాక్యమ్ ఏకాయనం
దేవవిద్యాం, బ్రహ్మవిద్యాం;
భూతవిద్యాం, క్షత్రవిద్యాం;
నక్షత్ర విద్యాం, సర్ప దేవ జన
విద్యాం ఏతత్, భగవో। అధ్యేమి।

నారద మహర్షి : గురుదేవా। సనత్కుమారా! భగవాన్! ఋక్ - యజః - సామ - అథర్వణ చతుర్వేదములు, పంచమవేదముగా చెప్పబడే భారతాది పురాణ - ఇతిహాసములు, వేదములకు వేదము అగు వ్యాకరణము, పిత్ర్యము అనబడే శ్రాద్ధ కర్మ విధాన శాస్త్రము, (శ్రాద్ధకల్పము), రాశి (గణితవిద్య), దైవము (ధూమకేతు ఉత్పాతములను చెప్పే ఉత్పాత శాస్త్రము), నిధి (మహాకాలాది కాలశాస్త్రము), వాకోవాకము (తర్కశాస్త్రము - Logic), ఏకాయనము (నీతిశాస్త్రము), దేవవిద్య, నిరుక్తము (పదముల అవయవార్థ వివరణ విద్య), శిక్ష, కల్పము మొదలైన విద్యలు, ఛందస్సు, చితులు మొదలైనవి అంశములుగాగల బ్రహ్మవిద్య, పంచభూతములను వశం చేసుకొనే భూతవిద్య, (ధనుర్వేదము మొదలైన) క్షత్రవిద్య, నక్షత్ర శాస్త్రము, (జ్యోతిషశాస్త్రము), సర్పవిద్య (సర్పశాస్త్రము), దేవజనవిద్య (నృత్యగీతాది లలిత కళలు) - ఇవన్నీ నాకు వచ్చు.

సోఽహం భగవో మంత్రవిదేవాస్మి నాత్మవిచ్ఛ్రుతగ్ం హ్యేవ మే
భగవద్దృశేభ్యస్తరతి శోకమాత్మవిదితి సోఽహం భగవః
శోచామి తం మా భగవాంఛోకస్య పారం తారయత్వితి
తగ్ం హోవాచ యద్వై కించైతదధ్యగీష్ఠా నామైవైతత్ .. 7.1.3..
3. సోఽహం భగవో మన్త్రవిదే
వాఽస్మి। న ఆత్మ విత్।
శ్రుతం హి ‘‘ఏవ మే భగవన్
దృశేభ్యః ‘‘తరతి శోకం ఆత్మవిత్’’ - ఇతి।
సోఽహం భగవః శోచామి।

తం మా భగవాన్। శోకస్య
పారం తారయతు - ఇతి।

తం హోవాచ : యత్ వై
కిం చ ఏతత్ అధ్యగీష్ఠా నామ ఏవ ఏతత్।।

ఇవన్నీ తెలుసుకొని నేను మంత్ర వేదుడను అయ్యానేగాని ఆత్మవిత్ (ఆత్మతత్త్వవేత్త) కానేలేదు. ఆత్మవిత్ మాత్రమే సర్వ శోకముల నుండి విడివడగలడని నేను సత్యద్రష్టల వద్ద విని ఉన్నాను. నేను శోకము (worry) తొలగించుకోలేక, శోకము వదలక ఉన్నాను.

భగవాన్। నన్ను శోకము అనే సముద్రము దాటించండి. సంసార సాగరం నుండి కాపాడండి.


శ్రీ సనత్కుమారుడు : ఓ నారదా! ఇప్పటిదాకా మీరు చెప్పినదంతా నామము మాత్రమే.

నామ వా ఋగ్వేదో యజుర్వేదః సామవేద ఆథర్వణశ్చతుర్థ
ఇతిహాసపురాణః పంచమో వేదానాం వేదః పిత్ర్యో రాశిర్దైవో
నిధిర్వాకోవాక్యమేకాయనం దేవవిద్యా బ్రహ్మవిద్యా భూతవిద్యా
క్షత్రవిద్యా నక్షత్రవిద్యా సర్పదేవజనవిద్యా
నామైవైతన్నామోపాస్స్వేతి .. 7.1.4 ..
4. నామ వా ఋగ్వేదో యజుర్వేదః
సామవేద అథర్వణః
చతుర్థ; ఇతిహాస పురాణః పంచమో
వేదనాం వేదః
పిత్ర్యోః, రాశిః
దైవో నిధిః వాకో వ్యాకమ్,
ఏకాయనం దేవవిద్యా
బ్రహ్మవిద్యా భూతవిద్యా
క్షత్రవిద్యా, నక్షత్రవిద్యా
సర్ప దేవ జన విద్యా
నామ ఏవ ఏతత్ నామా ఉపాస్స్వ ఇతి।।

నామోపాసన
అనగా - ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు, పంచమ వేదములనబడే భారతము మొదలైన ఇతిహాస పురాణములు, వేదవేదమనబడే వ్యాకరణము, శ్రాద్ధకల్పము అనబడే పితృదేవోపాసనా శాస్త్రము, గణితము, నిధిజ్ఞానము, తర్కశాస్త్రము, మీమాంస, నీతిశాస్త్రము, నిరుక్తము (శబ్దశాస్త్రము), వేదమంత్రోచ్చారణ అగు వేద విద్య, భూతవిద్య, [ధనుర్వేదము (Medical), జ్యోతిషము, గారడి మొదలైన] క్షేత్రవిద్య, జ్యోతిష్యము (నక్షత్ర విద్య), గారుడము, సంగీతము, నృత్యము మొదలైన కళలు, శిల్పవిద్య ఇవన్నీ నామములే!
నామమాత్ర విద్యలే! భౌతిక విద్యలే! ఈ నామవిద్యను బ్రహ్మముగా ఉపాసించాలి. బ్రహ్మముగా ఉపాసిస్తేనే ప్రయోజనం.

స యో నామ బ్రహ్మేత్యుపాస్తే యావన్నామ్నో గతం తత్రాస్య
యథాకామచారో భవతి యో నామ బ్రహ్మేత్యుపాస్తేఽస్తి
భగవో నామ్నో భూయ ఇతి నామ్నో వావ భూయోఽస్తీతి తన్మే
భగవాన్బ్రవీత్వితి .. 7.1.5..

.. ఇతి ప్రథమః ఖండః ..
5. స యో నామ బ్రహ్మ ఇతి ఉపాస్తే
యావత్ నామ్నో గతం తత్ర
అస్య యథా కామచారో భవతి
యో ‘‘నామ బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।।
నారదుడు :
అస్తి, భగవో! నామ్నో భూయ? - ఇతి।
సనత్కుమారుడు :
నామ్నో వావ భూయో అస్తి ఇతి।
నారదుడు :
తత్ మే, భగవాన్।
బ్రవీతు - ఇతి
అట్టి ‘నామము’ను బ్రహ్మముగా ఉపాసించువాడు, నామ విషయకమగు జ్ఞానమును పొంది - అట్టి ఆత్మ (బ్రహ్మ) జ్ఞానమునందు ఉదయిస్తున్నాడు. పొందుచున్నాడు.
నామము యొక్క వ్యాప్తి ఎంతవరకో గ్రహించి, అంతవరకు వ్యాప్తి కలవాడై సంపూర్ణమైన బ్రాహ్మీ ఫలము పొందుచున్నాడు.

నారద మహర్షి : ‘నామము’ కంటే గొప్పదైనది మరేదైనా ఉంటుందా?
సనత్కుమారుడు : అవును. నామ విద్య కంటే మహత్తరమైన విద్య ఉన్నది.
నారద మహర్షి : అయితే భగవాన్! అట్టి భూరి (ఇంకా గొప్పదైన) విద్య నాకు దయచేసి బోధించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ప్రథమః ఖండః


7–2. సప్తమ ప్రపాఠకః - ద్వితీయ ఖండము - ‘‘వాక్ ఉపాసన’’


వాగ్వావ నామ్నో భూయసీ వాగ్వా ఋగ్వేదం విజ్ఞాపయతి యజుర్వేదగ్ం
సామవేదమాథర్వణం చతుర్థమితిహాసపురాణం పంచమం వేదానాం వేదం
పిత్ర్యగ్ంరాశిం దైవం నిధిం వాకోవాక్యమేకాయనం దేవవిద్యాం
బ్రహ్మవిద్యాం భూతవిద్యాం క్షత్రవిద్యాగ్ం సర్పదేవజనవిద్యాం
దివం చ పృథివీం చ వాయుం చాకాశం చాపశ్చ తేజశ్చ
దేవాగ్ంశ్చ మనుష్యాగ్ంశ్చ పశూగ్ంశ్చ వయాగ్ంసి చ
తృణవనస్పతీఞ్శ్వాపదాన్యాకీటపతంగపిపీలకం
ధర్మం చాధర్మం చ సత్యం చానృతం చ సాధు చాసాధు చ
హృదయజ్ఞం చాహృదయజ్ఞం చ యద్వై వాఙ్నాభవిష్యన్న ధర్మో
నాధర్మో వ్యజ్ఞాపయిష్యన్న సత్యం నానృతం న సాధు నాసాధు
న హృదయజ్ఞో నాహృదయజ్ఞో వాగేవైతత్సర్వం విజ్ఞాపయతి
వాచముపాస్స్వేతి .. 7.2.1..
1. వాక్ వావ నామ్నో భూయసీ।
వాగ్వా ఋగ్వేదం విజ్ఞాపయతి।


యజుర్వేదం, సామవేదం,
అథర్వణం చతుర్థమ్,
ఇతిహాస పురాణం పంచమమ్,
వేదానాం వేదం, పిత్ర్యం,
రాశిం దైవం నిధిం వాకోవాక్యం
ఏకాయనం దేవవిద్యాం బ్రహ్మవిద్యాం
భూతవిద్యాం, క్షత్రవిద్యాం,
నక్షత్ర విద్యాం, సర్ప - దేవ -
జన విద్యాం దివం చ,
వాక్కు నామముకంటే గొప్పది, వాక్కు చేతనే ఈ క్రింది విద్యలన్నీ నిర్మితమైనవి. అట్టి వాక్కును బ్రహ్మముగా ఉపాసించాలి.







వాక్ నిర్మితములు :- చతుర్వేదములు, ఇతిహాస పురాణ పంచమము, వ్యాకరణము, శ్రాద్ధ - కల్ప - గణిత శాస్త్రములు, దైవజ్ఞానము, నిధిశాస్త్రము, తర్కము, నీతిశాస్త్రము, నిరుక్తము, కల్పము, శిక్ష, భూతతంత్ర విద్య, ధనుర్వేదము, జ్యోతిషశాస్త్రము, గారుడివిద్య, ద్యులోకవిద్య, భూతవిద్యా, అస్త్రవిద్య, నక్షత్రవిద్య, సర్ప-దేవ-జన విద్య - ఇవన్నీ వాక్ విద్యలే.
పృథివీం చ, వాయుం చ, ఆకాశం చ ఆపశ్చ
తేజశ్చ దేవాంశ్చ మనుష్యాంశ్చ
పశూంశ్చ వయాంసి చ
తృణ - వనస్పతీన్ శ్వాపదా
అన్యా కీట - పతంగ - పిపీలికం,
ధర్మం చ, అధర్మం చ, సత్యం చ,
అనృతం చ, సాధు చ, అసాధు చ
హృదయజ్ఞం చ, అహృదయజ్ఞం చ
యద్వై వాక్జ్ఞా భవిష్యత్।
సమస్తము వాక్కు చేతనే తెలియబడుతోంది.
పంచభూతములైనటువంటి పృథివి, వాయు, ఆకాశ, ఆప (జల) తేజస్సులు; దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు;
తృణములు (గడ్డిపరకలు), వనస్పతులు (వృక్షములు), శ్వాపదములు (పులి మొదలైన హింసక క్రూర జంతువులు), తదితర జంతువులు, కీటకములు, పతంగములు (తుమ్మెదలు), పిపీలికములు (పురుగులు, చీమలు)
ధర్మ - అధర్మములు, సత్య - అసత్యములు, సాధు - అసాధులు మనోజ్ఞ - అమనోజ్ఞము (మనస్సుకు తెలిసేవి, తెలియనివి ఇవన్నీ) వాక్కు లేకపోతే తెలిసేవే కావు.
న ధర్మో న అధర్మో వ్యజ్ఞాపయిష్యత్।
న సత్యం, న అనృతం న సాధు న అసాధు
న హృదయజ్ఞో - న అహృదయజ్ఞో
వాక్ ఏవ ఏతత్ సర్వం విజ్ఞాపయతి
వాచమ్ ఉపాస్స్వ ఇతి।।
వాక్కు కనుక లేకపోతే ఏది ధర్మమో, ఏది కాదో, తెలియజేయు వీలు కాదు.
సత్యమేమో, అసత్యమేమో, ఏది సాధు, ఏది అసాధు - గుర్తు తెలిసేది కాదు. మనోజ్ఞ - అమనోజ్ఞములైనవన్నీ వాక్కు చేతనే గుర్తింపబడుచున్నాయి. అందుచేత వాక్కునే బ్రహ్మముగా ఉపాసించు.

స యో వాచం బ్రహ్మేత్యుపాస్తే యావద్వాచో గతం తత్రాస్య
యథాకామచారో భవతి యో వాచం బ్రహ్మేత్యుపాస్తేఽస్తి
భగవో వాచో భూయ ఇతి వాచో వావ భూయోఽస్తీతి తన్మే
భగవాన్బ్రవీత్వితి .. 7.2.2..

.. ఇతి ద్వితీయః ఖండః ..
2. స యో వాచం బ్రహ్మేతి ఉపాస్తే
యావత్ వాచో గతం తత్ర అస్య
యథా కామచారో భవతి
యో వాచం బ్రహ్మేతి ఉపాస్తే।
అస్తి భగవో వాచో, భూయ? ఇతి।
వాచో వావ భూయో ‘అస్తి’ ఇతి।
తత్ మే, భగవాన్! బ్రవీతు। ఇతి।
ఎవ్వరైతే ‘వాణి’ లేక వాక్కును బ్రహ్మముగా ఉపాసిస్తారో, వారు వాక్కు విస్తరించి ఉన్నంతవరకు స్వేచ్ఛాగతి (కామగతి - ఇష్టముగా విస్తరించటము)ను సిద్ధించుకోగలరు. వాక్కు వ్యాప్తి అగు స్థానము వరకు యథేచ్ఛగా విహరించగలరు.
నారదమహర్షి : గురుదేవా! భగవాన్! వాక్కు కంటే గొప్పదైనది మరేదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఓ! వాక్కు కంటే ఉన్నతమైనది ఉన్నది.
నారదమహర్షి : భగవాన్! వాక్కుకన్నా భూరి (గొప్పది, విస్తారమైనది) ఏదో దానిగురించి చెప్పండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ద్వితీయః ఖండః


7–3. సప్తమ ప్రపాఠకః - తృతీయ ఖండము - ‘‘మనో ఉపాసన’’


మనో వావ వాచో భూయో యథా వై ద్వే వామలకే ద్వే వా కోలే
ద్వౌ వాక్షౌ ముష్టిరనుభవత్యేవం వాచం చ నామ చ
మనోఽనుభవతి స యదా మనసా మనస్యతి
మంత్రానధీయీయేత్యథాధీతే కర్మాణి కుర్వీయేత్యథ కురుతే
పుత్రాగ్ంశ్చ పశూగ్ంశ్చేచ్ఛేయేత్యథేచ్ఛత ఇమం చ
లోకమముం చేచ్ఛేయేత్యథేచ్ఛతే మనో హ్యాత్మా మనో హి లోకో
మనో హి బ్రహ్మ మన ఉపాస్స్వేతి .. 7.3.1 ..
సనత్కుమారుడు:
1. ‘మనో’ వావ వాచో భూయో।
యథా వై ద్వే వా ఆమలకే,
ద్వే వా కోలే, ద్వౌ వా అక్షౌ,
ముష్టిః అనుభవతి….
ఏవం వాచం చ నామ చ
‘మనో’ → అనుభవతి।
శ్రీ సనత్కుమారుడు : ఓ నారదా! వాక్కు కంటే కూడా అధికమైనది మనస్సు.

దృష్టాంతపూర్వకంగా చెపుతాను. విను. ఒకడు రెండు ఉసిరిక పండ్లను, (లేక) రెండు వాక్కాయలను, రేగుకాయలను (లేక) రెండు రుద్రాక్షలను గుప్పిటతో (పిడికిలియందు) పెట్టుకొన్నప్పుడు మనస్సునందు - ఆ నామములు, ఆ వాక్కు ఇముడుకొన్నట్లుగా - అనుభవము అవుతోంది.
స యదా మనసా మనస్యతి
మంత్రాన్ అధీయీయేతి,
యథాధీతే కర్మాణి కుర్వీయేతి।
అథ కురుతే పుత్రాగ్ంశ్చ
పశూంశ్చ ఇచ్ఛేయేతి।
యథా ఇచ్ఛత ఇమం చ లోకం
అముంచేత్ ఇచ్ఛేయేత్ యథేచ్ఛతే।

మనో హి ఆత్మా।
మనో హి లోకో।
‘‘మనో హి బ్రహ్మ।’’
మన ఉపాస్స్వ - ఇతి।।
మనస్సుతో ఎప్పుడైతే అనుకుంటాడో
- అప్పుడు ఆతడు మంత్రమును మననము చేస్తాడు. ఉచ్చరిస్తాడు.
- అప్పుడే ఆతడు ఆయా కర్మలు నిర్వర్తిస్తాడు.
- పశువులు, సంతానము మొదలైనవి మనస్సుతో కోరుకొన్నప్పుడే అవన్నీ పొందుతాడు.
- మనస్సుతో కోరనివేవీ పొందనేపొందడు.
- మనస్సుతో ఇహ పరలోకములలో ఎక్కడ యథేచ్ఛగా సంచరించాలని అనుకుంటాడో అక్కడే ఇష్టంగా సంచారములు చేస్తాడు.

అంతేకాదు. మనస్సు ఆత్మ స్వరూపమే!
మనసు యందే లోకము!
మనస్సు ‘బ్రహ్మమే’ కూడా!
అందుచేత మనస్సును బ్రహ్మముగా ఉపాసించెదరు గాక।

స యో మనో బ్రహ్మేత్యుపాస్తే యావన్మనసో గతం తత్రాస్య
యథాకామచారో భవతి యో మనో బ్రహ్మేత్యుపాస్తేఽస్తి
భగవో మనసో భూయ ఇతి మనసో వావ భూయోఽస్తీతి
తన్మే భగవాన్బ్రవీత్వితి .. 7.3.2..

.. ఇతి తృతీయః ఖండః ..
2. స యో మనో బ్రహ్మేతి
ఉపాస్తే, యావత్ మనసో
గతం తత్ర అస్య
యథా కామచారో భవతి।
యో ‘‘మనో బ్రహ్మ’’ - ఇతి ఉపాస్తే।।
ఎవ్వరు మనస్సును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసిస్తారో, - అట్టివారు మనస్సు విస్తరించి ఉన్నంతవరకు ఇచ్ఛాపూర్వకంగా ప్రియస్వరూపులై ఉండగలరు.
నారదుడు :
అస్తి, భగవో। మనసో
భూయ? ఇతి।
సనత్కుమారుడు :
మనసో వావ భూయో అస్తి ఇతి।
నారదుడు :
తత్ మే భగవాన్
బ్రవీతు - ఇతి।।
శ్రీ నారదులవారు : స్వామీ! మనస్సుకన్నా భూయ (అధికమైనది, ఉన్నతమైనది) ఏదైనా ఉన్నదా?
శ్రీ సనత్కుమారుడు : మనస్సు కన్నా అధికమైనది ఉన్నది.
శ్రీ నారద మహర్షి : భగవాన్! అట్టి మనస్సు కంటే కూడా విస్తారము, పెద్దది ఏదై ఉన్నదో అది వివరించ ప్రార్థన!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే తృతీయః ఖండః


7–4. సప్తమ ప్రపాఠకః - చతుర్థ ఖండము - ‘‘సంకల్ప ఉపాసన’’


సంకల్పో వావ మనసో భూయాన్యదా వై సంకల్పయతేఽథ
మనస్యత్యథ వాచమీరయతి తాము నామ్నీరయతి నామ్ని
మంత్రా ఏకం భవంతి మంత్రేషు కర్మాణి .. 7.4.1..
సనత్కుమారుడు:
1. సంకల్పో వావ మనసో భూయాన్।
యదా వై సంకల్పయతే, అథ ‘మనసి’।
అతి అథ వాచమ్ ఈరయతి।
తాము నామ్నీరయతి।
నామ్ని మన్త్రా ఏకమ్
భవన్తి - మంత్రేషు కర్మాణి।।
శ్రీ సనత్కుమారుడు : మననరూపమగు మనస్సు కంటే ‘‘సంకల్పము’’ - విస్తారమైనట్టిది. ఎప్పుడైతే ఈ జీవుడు సంకల్పించటానికి ఉపక్రమిస్తాడో - అప్పుడు మనస్సుతో ఆ సంకల్పించిన దానిని కోరుకుంటాడు.
- ఆ మనస్సు వాక్కును ప్రేరేపిస్తోంది.
- వాక్కు నామరూపములను ప్రేరేపిస్తోంది.
అనగా, వాక్కులో నామము చేరియుంటోంది.
నామము మంత్రములో ఏకమగుచున్నది. మంత్రము (మననము) కర్మలలో చేరుచున్నది.

తాని హ వా ఏతాని సంకల్పైకాయనాని సంకల్పాత్మకాని
సంకల్పే ప్రతిష్ఠితాని సమకౢపతాం ద్యావాపృథివీ
సమకల్పేతాం వాయుశ్చాకాశం చ సమకల్పంతాపశ్చ
తేజశ్చ తేషాగ్ం సం కౢప్త్యై వర్షగ్ం సంకల్పతే
వర్షస్య సంకౢప్త్యా అన్నగ్ం సంకల్పతేఽన్నస్య సం కౢప్త్యై
ప్రాణాః సంకల్పంతే ప్రాణానాగ్ం సం కౢప్త్యై మంత్రాః సంకల్పంతే
మంత్రాణాగ్ం సం కౢప్త్యై కర్మాణి సంకల్పంతే కర్మణాం
సంకౢప్త్యై లోకః సంకల్పతే లోకస్య సం కౢప్త్యై సర్వగ్ం
సంకల్పతే స ఏష సంకల్పః సంకల్పముపాస్స్వేతి .. 7.4.2 ..
2. తాని హ వా ఏతాని సంకల్ప
ఏకాయనాని, సంకల్పాత్మకాని,
సంకల్పే ప్రతిష్ఠితాని
సమక్లృపతాం ద్యావా - పృథివీ
సంకల్ప ఏతాం।
వాయుశ్చ ఆకాశం చ, సమకల్పంత ఆపశ్చ। తేజశ్చ।


తేషాం సంక్లృప్త్యై వర్షం సంకల్పతే।
వర్షస్య సంక్లృప్త్యా, అన్నగ్ం సంకల్పతే।
అన్నస్య సంక్లృప్త్యై ప్రాణాః సంకల్పన్తే ।
ప్రాణానాం సంక్లృప్త్యై మంత్రాః సంకల్పన్తే ।
మంత్రాణాం సంక్లృప్త్యై కర్మాణి సంకల్పన్తే ।
కర్మాణాం సంక్లృప్త్యై లోకః సంకల్పతే
లోకస్య సంక్లృప్త్యై సర్వం సంకల్పతే।
స ఏష సంకల్పః।

సంకల్పం ఉపాస్య ఇతి।।

మనస్సు, వాక్కు, నామము మొదలైనవన్నీ సంకల్పమునందు, సంకల్పము సంకల్పించుకొని అందు ప్రతిష్ఠితమై ఉంటున్నాయి.
అన్నిటికీ మూలము సంకల్పమే! సమస్తము సంకల్పమునే ఆధారముగా కలిగి ఉన్నాయి. దివ్యలోకము, భూలోకము కూడా సంకల్పమాత్రములే. వాయువు, ఆకాశము కూడా సంకల్పించబడి, ఉనికి పొందినవే. తేజస్సు కూడా సంకల్పము చేతనే ఏర్పడుతోంది.


సూర్యతేజస్సుచే (నీరు ఆవిరి అయి, మేఘములుగా అయి) వర్షముగాను, వర్షమువలన అన్నము, అన్నమువలన కర్మలు, కర్మలవలన (14) లోకములు, ఇవన్నీ కూడా సంకల్పములచేతనే సిద్ధిస్తున్నాయి. లోకములవలన మరల సంకల్పములు కలుగుచున్నాయి.
లోకములు మొదలైనవి, పైన చెప్పుకొన్న సమస్తము సంకల్పముచేతనే కలుగుచున్నాయి.


అంతెందుకు? ఈ ‘సృష్టి’ అంతా సంకల్పము చేతనే సృష్టించబడుతోంది.


అందుచేత ఓ నారదా! నీవు ‘సంకల్పము’ను బ్రహ్మముగా ఉపాసించు.

స యః సంకల్పం బ్రహ్మేత్యుపాస్తే సంకౢప్తాన్వై స లోకాంధ్రువాంధ్రువః
ప్రతిష్ఠితాన్ ప్రతిష్ఠితోఽవ్యథమానానవ్యథమానోఽభిసిధ్యతి
యావత్సంకల్పస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి యః
సంకల్పం బ్రహ్మేత్యుపాస్తేఽస్తి భగవః సంకల్పాద్భూయ ఇతి
సంకల్పాద్వావ భూయోఽస్తీతి తన్మే భగవాన్బ్రవీత్వితి .. 7.4.3..

.. ఇతి చతుర్థః ఖండః ..
3. స యః ‘‘సంకల్పం బ్రహ్మ’’
ఇతి ఉపాస్తే, సంక్లృప్తాన్ వై
స లోకాన్ ధృవాన్ ధృవః ప్రతిష్ఠితాన్।
ప్రతిష్ఠితో అవ్యథమానాన్।
అవ్యథమానో అభిసిద్ధ్యతి।
యావత్ సంకల్పస్య గతం
తత్ర అస్య యథా కామచారో
భవతి, యః ‘‘సంకల్పం బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।।
నారదుడు :
అస్తి భగవః సంకల్పాత్ భూయ? ఇతి।
సనత్కుమారుడు :
సంకల్పాత్ వావ భూయో అస్తి - ఇతి
నారదుడు :
తత్ మే భగవాన్। బ్రవీతు। ఇతి।।
ఎవ్వరైతే ‘‘సంకల్పము బ్రహ్మమే’’ - అని భావించి సంకల్పమును ఉపాసిస్తారో - ఆతను తాను సంకల్పించిన లోకముతో - ధృవముగా ధృవమైన నివాసము పొందగలడు. ప్రతిష్ఠితుడు కాగలడు.
‘సంకల్పము’ను బ్రహ్మముగా దర్శించువాడు - ఎట్టి వ్యథలు లేనివాడై, వ్యథలేని స్థితి స్థానములను ఉత్తమముగా సిద్ధించుకోగలడు. దుఃఖరహితుడు కాగలడు.
‘సంకల్పము’ ఎంతవరకు విస్తరించి ఉండగలదో - అంతవరకు తన ఇచ్ఛానుసారంగా స్వేచ్ఛగా సంచరించువాడై ఉండగలడు.


నారదమహర్షి : గురుదేవా! సనత్కుమారా? సంకల్పము కంటే కూడా ఇంకా శ్రేష్ఠమైనది, అధికమైనది ఉన్నదా?
సనత్కుమారుడు : అవును. ‘సంకల్పము’ కంటే కూడా పెద్దదైనది, శ్రేష్ఠమైనది - ఉన్నది.
నారదమహర్షి : అట్టి సంకల్పమునకు మించినది, శ్రేష్ఠమైనది ఏమై ఉన్నదో - అది నాకు బోధించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే చతుర్థః ఖండః


7–5. సప్తమ ప్రపాఠకః - పంచమ ఖండము - ‘‘చిత్త ఉపాసన’’


చిత్తం వావ సం కల్పాద్భూయో యదా వై చేతయతేఽథ
సంకల్పయతేఽథ మనస్యత్యథ వాచమీరయతి తాము నామ్నీరయతి
నామ్ని మంత్రా ఏకం భవంతి మంత్రేషు కర్మాణి .. 7.5.1..
సనత్కుమారుడు:
1. చిత్తం వావ సంకల్పాత్ భూయో।
యదా వై చేతయతే। అథ సంకల్పయతే।
అథ ‘మనస్యతి’ అథ వాచమ్ ఈరయతి।
తాము నామ్నీరయతి।
నామ్ని మంత్రా ఏకం భవన్తి।
మంత్రేషు కర్మాణి।।
సనత్కుమారుడు : చిత్తము సంకల్పము కంటే - శ్రేష్ఠము, అధికము.
ఈ జీవుడు తాను ‘చిత్తము’ను ఉపయోగిస్తూ (చేతనము చేస్తూ) ఉన్నప్పుడే సంకల్పించగలడు.
చిత్తము - ఇష్టము, వాంఛరూపము, చిత్తము ఉన్నప్పుడే - సంకల్పము, మనస్సు, వాక్కు - ప్రేరణము పొందుతాయి.
చిత్తము (ఆసక్తి) యొక్క ప్రవర్తన చేతనే…వాక్కు నామమునందు ప్రేరణ ప్రదర్శించగలదు. నామము - మంత్రము అప్పుడు ఏకము కాగలుగుతాయి. మంత్రము వలన కర్మలు ప్రవర్తమానమగు చున్నాయి.

తాని హ వా ఏతాని చిత్తైకాయనాని చిత్తాత్మాని చిత్తే
ప్రతిష్ఠితాని తస్మాద్యద్యపి బహువిదచిత్తో భవతి
నాయమస్తీత్యేవైనమాహుర్యదయం వేద యద్వా అయం
విద్వాన్నేత్థమచిత్తః స్యాదిత్యథ యద్యల్పవిచ్చిత్తవాన్భవతి
తస్మా ఏవోత శుశ్రూషంతే చిత్తగ్ంహ్యేవైషామేకాయనం
చిత్తమాత్మా చిత్తం ప్రతిష్ఠా చిత్తముపాస్స్వేతి .. 7.5.2 ..
2. తాని హ వా ఏతాని చిత్త ఏకాయనాని।
చిత్తాత్మని। చిత్తే ప్రతిష్ఠితాని।
నామము, వాక్కు, మనస్సు, సంకల్పము - ఇవన్నీ చిత్తమునందే ఏకత్వము పొందుచున్నాయి. చిత్తమే వాటన్నిటికీ ‘ఆత్మ’. అవన్నీ చిత్తమునందే ప్రతిష్ఠితమై ఉంటున్నాయి.
తస్మాత్ యద్యపి బహువిద చిత్తో భవతి,
‘‘న అయం అస్తి - ఇతి ఏవ ఏనం
ఆహుః యత్ అయం వేద’’,
యద్వా అయం విద్వాన్నేత్థమ
చిత్తః స్యాత్ ఇతి అథ
యది అల్పవిచ్చిత్తవాన్ భవతి।
తస్మా ఏవోత శుశ్రూషన్తే ।
అందుచేతనే - ఒకానొకడు ఎన్నో విషయములు తెలిసికొని ఉన్నవాడు అయినప్పటికీ - అతని చిత్తము ఒక విషయముపై ఏకాగ్రత (concentration) కలిగి ఉండకపోతే, ‘‘ఈతనికి ఈ విషయము ఏమాత్రము తెలియదు. ఈతడే గనుక ఈ విషయం తెలిసి ఉంటే, దీనిపట్ల అజ్ఞుడై ఉంటాడా?’’ - అని జనులు అనుకుంటూ ఉంటారు.
ఆ చిత్తము కొంతమాత్రమే ఏకాగ్రమైతే (If his interest is only partially involved) ఆతడు కొంతమాత్రమే తెలుసుకోగలడు. ఒక విషయముపై ఎవరికి చిత్తము ఏకాగ్రమై ఉంటుందో, వారితోనే జనులు ఆ విషయం సంభాషిస్తారు.
చిత్తం హి ఏవ ఏషామ్ ఏకాయనం।
చిత్తం ఆత్మా।
చిత్తం ప్రతిష్ఠా।
చిత్తం ఉపాస్స్వ ఇతి।
చిత్తమే చివరికి అన్నిటినీ ఏకీయము (united) చేయు ఆశ్రయము.
చిత్తము ఆత్మయే।।
చిత్తమే సమస్తమునకు ప్రతిష్ఠితమైయున్న స్థానము।
అందుచేత ‘‘చిత్తము పరబ్రహ్మమే।’’ అని ఉపాసించెదవు గాక.

స యశ్చిత్తం బ్రహ్మేత్యుపాస్తే చిత్తాన్వై స లోకాంధ్రువాంధ్రువః
ప్రతిష్ఠితాన్ప్రతిష్ఠితోఽవ్యథమానానవ్యథమానోఽభిసిధ్యతి
యావచ్చిత్తస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి యశ్చిత్తం
బ్రహ్మేత్యుపాస్తేఽస్తి భగవశ్చిత్తాద్భూయ ఇతి చిత్తాద్వావ
భూయోఽస్తీతి తన్మే భగవాన్బ్రవీత్వితి .. 7.5.3..

.. ఇతి పంచమః ఖండః ..
3. ‘‘స యత్ చిత్తం బ్రహ్మేతి’’ ఉపాస్తే చిత్తాన్త్వై ।
స లోకాన్ ధృవాన్। ధ్రువః ప్రతిష్ఠితాన్
ప్రతిష్ఠితో - అవ్యథమానా।
అవ్యథమానో - అభిసిద్ధ్యతి।
ఎవ్వరైతే - ‘‘చిత్తము బ్రహ్మమే అయి ఉన్నది’’ - అని చిత్తమును ఉపాసిస్తారో, అట్టివారు దృఢచిత్తులు అగుచున్నారు.
ఆతడు లోకములలో ఎక్కడ ఉంటే అక్కడ ధృవముగా ప్రతిష్ఠితుడు కాగలడు. ఆతని చిత్తము చాంచల్యము త్యజించినదై ఉండగలదు. ఆతడు ఏ వ్యథలు లేనివాడై (Sans all worries) ఎక్కడైనా ప్రతిష్ఠ కలిగి, వ్యథరాహిత్యము సిద్ధించుకొని ఉండగలడు.
యావత్ చిత్తస్య గతం, తత్రాస్య
యథా కామచారో భవతి।
‘యత్ చిత్తం బ్రహ్మ’ ఇతి ఉపాస్తే।
నారదుడు : అస్తి, భగవన్।
చిత్తాత్ భూయ ఇతి?
సనత్కుమారుడు : చిత్తాత్ వావ భూయో అస్తి - ఇతి।
నారదుడు : భగవాన్! బ్రవీతు - ఇతి।
చిత్తము ఎంతవరకు విస్తరించి ఉండగలదో - అంతవరకు ఆతడు తన ఇచ్ఛానుసారంగా ఉండగలడు. చిత్తము బ్రహ్మముగా ఉపాసించు వాడు బ్రహ్మమే కాగలడు.

శ్రీనారదమహర్షి : గురు రాజన్ ! చిత్తముకంటే శ్రేష్ఠము, ‘బహు’ అయినది మరొకటేదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : చిత్తముకంటే కూడా మహత్తరమైనది ఉన్నది.
శ్రీ నారదుడు : భగవాన్। చిత్తముకంటే కూడా బృహత్తరము ఏదో దాని గురించి చెప్పండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే పంచమః ఖండః


7–6. సప్తమ ప్రపాఠకః - షష్ఠ ఖండము - ‘‘ధ్యాన (ధ్యాస) ఉపాసన’’


ధ్యానం వావ చిత్తాద్భూయో ధ్యాయతీవ పృథివీ
ధ్యాయతీవాంతరిక్షం ధ్యాయతీవ ద్యౌర్ధ్యాయంతీవాపో
ధ్యాయంతీవ పర్వతా దేవమనుష్యాస్తస్మాద్య ఇహ మనుష్యాణాం
మహత్తాం ప్రాప్నువంతి ధ్యానాపాదాగ్ంశా ఇవైవ తే భవంత్యథ
యేఽల్పాః కలహినః పిశునా ఉపవాదినస్తేఽథ యే ప్రభవో
ధ్యానాపాదాగ్ంశా ఇవైవ తే భవంతి ధ్యానముపాస్స్వేతి .. 7.6.1..
1. ధ్యానం వావ చిత్తాత్ భూయో।
ధ్యాయతి ఇవ పృథివీ। ధ్యాయతీవ
అంతరిక్షం। ధ్యాయతీవ ద్యౌః। ధ్యాయన్తీవ ఆపో
ధ్యాయన్తీవ పర్వతా।
ధ్యాయన్తీవ దేవమనుష్యాః।
సనత్కుమారుడు : చిత్తము కంటే కూడా ధ్యానము - బహుళము, శ్రేష్ఠము.
పృథివి (భూమి), అన్తరిక్షము (ఆకాశము), ద్యౌః (దేవతాలోకము), జలము, పర్వతములు, దేవతప్తమనుష్యులు - అందరూ ధ్యాస (లేక) ధ్యానమునందే నిమగ్నమై కనిపిస్తున్నారు. (ధ్యాసయే ధ్యానము)
తస్మాత్ య ఇహ
మనుష్యాణాం మహతాం ప్రాప్నువన్తి।
ధ్యానాపాదాంశా ఇవ ఏవ తే భవంత్యథ।
యే అల్పాః కలహినః, పిశునా ఉపవాదినస్తే।
అథ యే ప్రభవో ధ్యానాపాదాగ్ంశా
ఇవైవ తే భవంతి। ధ్యానం ఉపాస్స్వ ఇతి।
అందుచేత మానవులంతా ఎవ్వరైతే మహదత్వము పొందుచున్నారో అదంతా ధ్యాసరూపమగు ‘ధ్యానము’ చేతనే ప్రాప్తించుకొంటున్నారు.
ధ్యానముయొక్క అభ్యాసము లేనివారు క్రింద దశలోనే అల్పులుగా, కలహప్రియులుగా (పోట్లాడటం అలవాటు గల వారుగా), పిశునులుగా (కొండెములు చెప్పువారుగా) నీచ-దుష్ట-ద్రోహ స్వభావులుగా, నిందలు ఆరోపించువారుగా ఉండిపోవుచున్నారు.

స యో ధ్యానం బ్రహ్మేత్యుపాస్తే యావద్ధ్యానస్య గతం తత్రాస్య
యథాకామచారో భవతి యో ధ్యానం బ్రహ్మేత్యుపాస్తేఽస్తి
భగవో ధ్యానాద్భూయ ఇతి ధ్యానాద్వావ భూయోఽస్తీతి
తన్మే భగవాన్బ్రవీత్వితి .. 7.6.2..

.. ఇతి షష్ఠః ఖండః ..
2. స యో ‘‘ధ్యానం బ్రహ్మేతి’’ ఉపాస్తే
యావత్ ధ్యానస్య గతం, తత్రాస్య
యథా కామచారో భవతి,
యో ‘‘ధ్యానం బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।
నారదుడు :
అస్తి భగవో! ధ్యానాత్ ‘‘భూయ’’ ఇతి?
సనత్కుమారుడు :
‘‘ధ్యానాత్ వావ భూయో అస్తి’’ - ఇతి।
నారదుడు :
తత్ మే భగవాన్। బ్రవీతు।’’…ఇతి।
సమర్థులైన వారంతా తమయొక్క ధ్యాసరూపమగు ధ్యానముచేతనే ధ్యానలాభంగా సమర్థత పొందుచున్నారు.
ఎవ్వరైతే ‘‘ధ్యానము బ్రహ్మమే’’ - అని ఉపాసిస్తారో, అట్టివారు వారి ధ్యానము (ధ్యాస) ఎక్కడివరకు విస్తరిస్తోందో, అంతవరకు తమ ఇచ్ఛానుకూలంగా (As they like it) ఉండగలరు. ‘‘ధ్యానము బ్రహ్మమే’’ అని ఉపాసించబడు గాక।

నారద మహర్షి : ధ్యానము కంటే మించినది ఇంకేమైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఆ! ధ్యానముకంటే ‘భూరి’ (శ్రేష్ఠము) అయినది ఉన్నది.
నారద మహర్షి : అది ఏది? గురు సత్తమా? దయచేసి చెప్పం&

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే షష్ఠః ఖండః


7–7. సప్తమ ప్రపాఠకః - సప్తమ ఖండము - ‘‘విజ్ఞాన ఉపాసన’’


విజ్ఞానం వావ ధ్యానాద్భూయః విజ్ఞానేన వా ఋగ్వేదం విజానాతి
యజుర్వేదగ్ం సామవేదమాథర్వణం చతుర్థమితిహాసపురాణం
పంచమం వేదానాం వేదం పిత్ర్యగ్ంరాశిం దైవం నిధిం
వాకోవాక్యమేకాయనం దేవవిద్యాం బ్రహ్మవిద్యాం భూతవిద్యాం
క్షత్రవిద్యాం నక్షత్రవిద్యాగ్ంసర్పదేవజనవిద్యాం దివం చ
పృథివీం చ వాయుం చాకాశం చాపశ్చ తేజశ్చ దేవాగ్ంశ్చ
మనుష్యాగ్ంశ్చ పశూగ్ంశ్చ వయాగ్ంసి చ
తృణవనస్పతీంఛ్వాపదాన్యాకీటపతంగపిపీలకం
ధర్మం చాధర్మం చ సత్యం చానృతం చ సాధు చాసాధు చ
హృదయజ్ఞం చాహృదయజ్ఞం చాన్నం చ రసం చేమం చ లోకమముం
చ విజ్ఞానేనైవ విజానాతి విజ్ఞానముపాస్స్వేతి .. 7.7.1 ..
సనత్కుమారుడు:
1. విజ్ఞానం వావ ధ్యానాత్ భూయో।

విజ్ఞానేన వా ఋగ్వేదం విజానాతి।
యజుర్వేదం, సామవేదగ్ం, అథర్వణం చతుర్థమ్,
ఇతిహాస పురాణం పంచమమ్;
వేదానాం వేదం, పిత్ర్యం, రాశిం, దైవం,
నిధిం, వాకోవాక్యమ్, ఏకాయనం,
దేవ విద్యాం, బ్రహ్మవిద్యాం,
భూతవిద్యాం, క్షత్రవిద్యాం,
నక్షత్రవిద్యాగ్ం, సర్ప దేవ జన విద్యాం,
దివం చ పృథివీం చ - వాయుం చ
ఆకాశం చ - ఆపశ్చ - తేజశ్చ
దేవాంశ్చ, మనుష్యాగ్ంశ్చ,
పశూగ్ంశ్చ, వయాంసి చ
తృణ వనస్పతీన్ చ శ్వాపద
అన్యాకీట పతంగి పిపీలికం
సనత్కుమారుడు : ధ్యానము కంటే విజ్ఞానము - భూరి (గొప్పది / పెద్దది, శ్రేష్ఠము)

‘విజ్ఞానము’ చేతనే ఈ మానవుడు ఋగ్వేద - యజుర్వేద - సామవేద - అథర్వణ వేద (చతుర్వేదములు) పంచమ వేదమగు భారతము మొదలైన ఇతిహాస - పురాణములు, వేదనాం వేదము అయినట్టి వ్యాకరణము, పిత్ర్యము (శ్రాద్ధ, తంత్రము), కల్పము, గణితశాస్త్రము, దైవతత్త్వములు, నిధి శాస్త్రము, ఏకోవాక్యము (తర్కము), ఏకాయతనము (నీతిశాస్త్రము), దేవతల గురించిన విద్య, బ్రహ్మవిద్య, భూతప్రేత పిశాచ సంబంధమైన విద్య, క్షత్రియ (యుద్ధ) విద్య, నక్షత్రవిద్య (జ్యోతిష్యశాస్త్రము), సర్వదేవతాజనవిద్య, దేవతల దివ్యలోకముల గురించి, పృథివి గురించి, వాయువు గురించి, ఆకాశము గురించి, జలము గురించి, తేజస్సు గురించి, దేవ - మనుష్య - పశు - పక్షి - తృణ - వనస్పతి - ఓషధి - కీటకము గురించి పతంగముల (పిట్టల) గురించి, పురుగుల గురించి,
ధర్మం చ - అధర్మం చ,
సత్యం చ - అనృతం చ,
సాధు చ - అసాధు చ,
హృదయజ్ఞం చ - అహృదయజ్ఞం చ
అన్నం చ - రసం చ,
ఇమం చ లోకం - అముం చ
విజ్ఞానేన ఏవ విజానాతి। విజ్ఞానమ్ ఉపాస్స్వ ఇతి।।
ధర్మ - అధర్మ, సత్య - అసత్య, సాధు - అసాధు, హృదయానికి ఆనందము కలిగించే - కలిగించని వాటి గురించి.
అన్నము (ఆహారము) గురించి, అన్నరసము గురించి, ఇహ -పర (తరువాతి, ఊర్ధ్వ) లోకముల గురించి వీటన్నిటి గురించి తెలుసుకొంటున్నాడు.

‘‘తెలుసుకోవటము’’ అనేది ‘‘విజ్ఞానము’’ చేతనే సిద్ధిస్తోంది. కనుక ‘విజ్ఞానము బ్రహ్మమే’ - అని ఉపాసించెదవు గాక।

స యో విజ్ఞానం బ్రహ్మేత్యుపాస్తే విజ్ఞానవతో వై స
లోకాంజ్ఞానవతోఽభిసిధ్యతి యావద్విజ్ఞానస్య గతం తత్రాస్య
యథాకామచారో భవతి యో విజ్ఞానం బ్రహ్మేత్యుపాస్తేఽస్తి భగవో
విజ్ఞానాద్భూయ ఇతి విజ్ఞానాద్వావ భూయోఽస్తీతి తన్మే
భగవాన్బ్రవీత్వితి .. 7.7.2..

.. ఇతి సప్తమః ఖండః ..
2. స యో ‘విజ్ఞానం బ్రహ్మేతి’
ఉపాస్తే విజ్ఞానవతో వై
స లోకాన్ జ్ఞానవతో అభిసిద్ధ్యతి।
యావత్ విజ్ఞానస్య గతం,
తత్ర అస్య యథా కామచారో భవతి యో
‘‘విజ్ఞానం బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।।

నారదుడు :
‘‘భగవో। విజ్ఞానాత్ భూయ? ఇతి।
సనత్కుమారుడు :
‘‘విజ్ఞానాత్ వావ భూయో అస్తి। ఇతి’’
నారదుడు :
‘‘తత్ మే, భగవాన్! బ్రవీతు - ఇతి’’।
‘‘విజ్ఞానము బ్రహ్మమే’’ - అను విధంగా ఎవరు ఉపాసిస్తారో - అట్టి వారు విజ్ఞానమయ లోకములలో జ్ఞానవంతులతో సంగము పొందగలరు.
విజ్ఞానము ఎంతవరకు విస్తరించి ఉన్నదో - అంతవరకు విజ్ఞానమును బ్రహ్మముగా ఉపాసించువారు - తమ ఇచ్ఛానుకూలంగా ఉండగలరు. తదితరములకు బద్ధులు కారు.

నారదమహర్షి : విజ్ఞానము కంటే కూడా ఉన్నతమైనది ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : విజ్ఞానము కంటే కూడా ఉత్కృష్టమైనది (మహత్తరమైనది) ఉన్నది.
నారదుడు : అది ఏది? భగవాన్! దయచేసి వివరించండి!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే సప్తమః ఖండః


7–8. సప్తమ ప్రపాఠకః - అష్టమ ఖండము - ‘‘బల ఉపాసన’’


బలం వావ విజ్ఞానాద్భూయోఽపి హ శతం విజ్ఞానవతామేకో
బలవానాకంపయతే స యదా బలీ భవత్యథోత్థాతా
భవత్యుత్తిష్ఠన్పరిచరితా భవతి పరిచరన్నుపసత్తా
భవత్యుపసీదంద్రష్టా భవతి శ్రోతా భవతి మంతా భవతి
బోద్ధా భవతి కర్తా భవతి విజ్ఞాతా భవతి బలేన వై పృథివీ
తిష్ఠతి బలేనాంతరిక్షం బలేన ద్యౌర్బలేన పర్వతా బలేన
దేవమనుష్యా బలేన పశవశ్చ వయాగ్ంసి చ తృణవనస్పతయః
శ్వాపదాన్యాకీటపతంగపిపీలకం బలేన లోకస్తిష్ఠతి
బలముపాస్స్వేతి .. 7.8.1..
సనత్కుమారుడు:
1. బలం వావ విజ్ఞానాత్ భూయో అపి
హ శతం విజ్ఞానవతాం ఏకో
బలవాన్ ఆకంపయతే
స యదా బలీ భవతి,
అథ ఉత్థాతా భవతి ఉత్తిష్ఠన్
పరిచరితా భవతి।
పరిచరన్ ఉపసత్తా భవతి।
ఉపసీదన్ ద్రష్టా భవతీ
శ్రోతా భవతి। మన్తా భవతి।
బోద్ధా భవతి। కర్తా భవతి।
విజ్ఞాతా భవతి।
సనత్కుమారుడు :
విజ్ఞానము కంటే కూడా (ధైర్య) బలము గొప్పది. (బుద్ధి - logic - ఉన్నతమైనది).

వందమంది విజ్ఞానవంతులను (పండితులను) కూడా ఒక్క ఆత్మబలం భావన చేయువాడు - వణికించగలడు. ఓపిక ఉంటేనే ఏదైనా చేయగలడు.
ఈ జీవుడు (మానవుడు) బలవంతుడైతే ధైర్యము కలవాడు కాగలడు. లేచి నిలుచోగలడు. ఉత్తిష్ఠుడై సద్గురువులను సమీపించగలడు. బలములేని బలహీనుడు ఎక్కడికి వెళ్లగలడు? కూర్చున్నవాడు లేవనే లేవలేడు కదా?
బలవంతుడైనప్పుడే ఈ మానవుడు ఉపసత్తు - శ్రోతము కాగలడు.
❋ బోద్ధా (బోధించుటకు) అర్హుడు కాగలడు.
❋ బలముంటేనే ఒక పనికి కర్త కాగలడు.
❋ బలమున్నప్పుడే ఏదైనా తెలుసుకొన్నవాడు కాగలడు.
బలేన వై పృథివీ తిష్ఠతి।
బలేన అంతరిక్షం।
బలేన ద్యౌః। బలేన పర్వతా।
బలేన దేవ మనుష్యా।
బలేన పశవశ్చ వయాంసి చ
తృణ వనస్పతయః
శ్వాపదా అన్యా కీట - పతంగ పిపీలికం।
బలేన లోకః తిష్ఠతి।
బలమ్ ఉపాస్స్వ - ఇతి।
❋ బలముచేతనే భూమి పడిపోకుండా నిలిచి ఉండగలుగుతోంది.
❋ బలము చేతనే అంతరిక్షము నిలిచి ఉన్నది.
❋ బలము చేతనే పర్వతము తనపై చెట్లు, మృగములు సంచరించ గలిగి ఉంటున్నాయి.
❋ బలము ఉండటంచేతనే దేవతలు, మనుష్యులు మనగలుగుతున్నారు.
పశువులు, పక్షులు, తృణములు, వనస్పతులు, (పులి మొదలైన) క్రూరమృగములు, కీటకములు, పక్షులు, పురుగులు జీవించటం కొనసాగించగలుగుచున్నాయి.
బలముయొక్క ఆధారము చేతనే లోకములు కొనసాగుచూ, తిష్ఠితమై ఉన్నాయి.
అందుచే ‘బలము’ను పరబ్రహ్మముగా ఉపాసించు.

స యో బలం బ్రహ్మేత్యుపాస్తే యావద్బలస్య గతం తత్రాస్య
యథాకామచారో భవతి యో బలం బ్రహ్మేత్యుపాస్తేఽస్తి భగవో
బలాద్భూయ ఇతి బలాద్వావ భూయోఽస్తీతి తన్మే
భగవాన్బ్రవీత్వితి .. 7.8.2..

.. ఇతి అష్టమః ఖండః ..
2. స యో ‘బలం బ్రహ్మేతి’
ఉపాస్తే యావత్ బలస్య గతం,
తత్రాస్య యథా కామచారో భవతి,
యో ‘బలం బ్రహ్మ’ - ఇతి ఉపాస్తే।

నారదుడు :
‘‘అస్తి, భగవో। బలాత్ భూయ? - ఇతి’’।
సనత్కుమారుడు:
‘‘బలాత్ వావ భూయో అస్తి - ఇతి’’।
నారదుడు :
‘‘తత్ మే భగవాన్, బ్రవీతు’’ - ఇతి।।
ఎవ్వరైతే ‘‘బలము బ్రహ్మమే అయి ఉన్నది’’ అను భావనను ఆశ్రయించి ఉపాసిస్తూ ఉంటారో, అట్టివారు - ఎక్కడివరకు బలము విస్తరించి ఉన్నదో - అక్కడి వరకు వారు ఇచ్ఛాపూర్వకంగా (The way they like) ఇష్టమైన విధంగా ఉండగలుగుతారు। బలమును ఉపాసించువారు బలవంతులవగలరు.



నారదమహర్షి : హే భగవాన్! ‘‘బలము’’ కంటే కూడా గొప్పది (భూయ) ఇంకా ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఎందుకు లేదు? బలము కంటే అధికమైనది ఉన్నది.
నారదమహర్షి : బలముకంటే అధికమైనది ఏమున్నదో అద్దానిగురించి వివరించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే అష్టమః ఖండః


7–9. సప్తమ ప్రపాఠకః - నవమ ఖండము - ‘‘అన్న ఉపాసన’’


అన్నం వావ బలాద్భూయస్తస్మాద్యద్యపి దశ
రాత్రీర్నాశ్నీయాద్యద్యు హ
జీవేదథవాద్రష్టాశ్రోతామంతాబోద్ధాకర్తావిజ్ఞాతా
భవత్యథాన్నస్యాయై ద్రష్టా భవతి శ్రోతా భవతి మంతా
భవతి బోద్ధా భవతి కర్తా భవతి విజ్ఞాతా
భవత్యన్నముపాస్స్వేతి .. 7.9.1..
సనత్కుమారుడు:
1. అన్నం వావ బలాత్ భూయః।
తస్మాత్ యద్యపి దశరాత్రీః - న
అశ్నీయాత్ యద్యు హ జీవేత్।
అథవా అద్రష్టా, అశ్రోతా, అమన్తా,
అబోద్ధా, అకర్తా, అవిజ్ఞాతీ భవతి।
అథ అన్నస్యాయై ద్రష్టా
భవతి। శ్రోతా భవతి।
మన్తా భవతి। బోద్ధా భవతి। కర్తా భవతి।
విజ్ఞాతా భవతి।
అన్నమ్ ఉపాస్స్వ ఇతి।
సనత్కుమారుడు : ‘బలము’ కంటే గొప్పది (భూరిః) ‘‘అన్నము’’.
అందుచేతనే ఒకానొకడు 10 రోజులు అన్నము తినకపోతే - ఏమౌతోంది? తనకున్న బలము పోగొట్టుకొని, బలహీనుడై, జీవించటమే కష్టముగా అగుచున్నాడు.
10 రోజులు ఆహారము తీసుకోకపోవటం చేత మరణించనైనా మరణిస్తాడు. లేదా ఒకవేళ ఇంకా జీవిస్తూ ఉన్నా కూడా కళ్ళతో చూడలేడు. బుద్ధితో ఏమీ విశ్లేషించి తెలుసుకోలేడు. ఏ పనీ చేయలేడు. ఏమీ తెలుసుకోలేడు. ఆహారము తీసుకోనప్పుడు స్థితి ఇట్టిది.
ఆహారము తీసుకొన్న తరువాతనో?
ద్రష్ట కాగలడు. శ్రోత కాగలడు. మనస్సుతో మననము చేయగలడు. బుద్ధితో తెలుసుకోగలడు. తెలుసుకొన్నది ఆకలింపు చేసుకుంటూ ‘విజ్ఞాత’ కాగలడు.
అందుచేత ‘అన్నము’ను పరబ్రహ్మముగా ఉపాసించెదవు గాక।

స యోఽన్నం బ్రహ్మేత్యుపాస్తేఽన్నవతో వై స
లోకాన్పానవతోఽభిసిధ్యతి యావదన్నస్య గతం తత్రాస్య
యథాకామచారో భవతి యోఽన్నం బ్రహ్మేత్యుపాస్తేఽస్తి
భగవోఽన్నాద్భూయ ఇత్యన్నాద్వావ భూయోఽస్తీతి తన్మే
భగవాన్బ్రవీత్వితి .. 7.9.2..

.. ఇతి నవమః ఖండః ..
2. స యో ‘‘అన్నం బ్రహ్మేతి’’
ఉపాస్తే। అన్నవతో వై।
స లోకాన్ పానవతో అభిసిద్ధ్యతి
యావత్ అన్నస్య గతం
తత్ర అస్య యథా కామచారో
భవతి। యో ‘అన్నం బ్రహ్మ’
ఇతి - ఉపాస్తే।


నారదుడు :
‘‘అస్తి, భగవో। అన్నాత్ భూయ?’’ - ఇతి
సనత్కుమారుడు :
‘‘అన్నాత్ వావ భూయో అస్తి’’ - ఇతి
నారదుడు :
‘‘తన్మే భగవాన్ బ్రవీతు।’’ - ఇతి।।
‘‘అన్నము బ్రహ్మమే’’ అను భావముతో ఉపాసించువాడు అన్నవంతుడు కాగలడు. తృప్తిగా ఆహారము పొందగలడు.
అన్నము పొందువాడు అన్ని విధాలా భాగ్యవంతుడే। ఎందుకంటే దేహ, ఇంద్రియ, మనో, బుద్ధి, చిత్తములు మొదలైన వాటన్నిటికీ అన్నమే ఆధారము.
‘‘అన్నము బ్రహ్మమే’’ అని ఉపాసించువానికి - ఇచ్ఛానుసారంగా దేహ - మనో - బుద్ధి - చిత్తములు రూపుదిద్దుకోగలవు.



నారద మహర్షి : మహాత్మా! ‘అన్నము’ కంటే అధికమైనది ఇంకా మరొకటి ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుల వారు : నారదమహర్షీ! అన్నము కంటే ఇంకా గొప్పదైనది ఉన్నది.
నారద మహర్షి : అది ఏదో సెలవియ్యండి, భగవాన్।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే నవమః ఖండః


7–10. సప్తమ ప్రపాఠకః - దశమ ఖండము - ‘‘ఆపో ఉపాసన’’


ఆపో వావాన్నాద్భూయస్తస్మాద్యదా సువృష్టిర్న భవతి
వ్యాధీయంతే ప్రాణా అన్నం కనీయో భవిష్యతీత్యథ యదా
సువృష్టిర్భవత్యానందినః ప్రాణా భవంత్యన్నం బహు
భవిష్యతీత్యాప ఏవేమా మూర్తా యేయం పృథివీ యదంతరిక్షం
యద్ద్యౌర్యత్పర్వతా యద్దేవమనుష్యాయత్పశవశ్చ వయాగ్ంసి చ
తృణవనస్పతయః శ్వాపదాన్యాకీటపతంగపిపీలకమాప
ఏవేమా మూర్తా అప ఉపాస్స్వేతి .. 7.10.1..
సనత్కుమారుడు:
1. ‘ఆపో’ వావ అన్నాత్ భూయస్యః

తస్మాత్ యదా సువృష్టిః న భవతి,
వ్యాధీయన్తే ప్రాణా
అన్నం కనీయో భవిష్యతి ఇతి।
అథ యదా సువృష్టిః భవతి - ఆనందినః,
ప్రాణా భవన్తి, అన్నం బహుభవిష్యతి। ఇతి।

‘ఆప’ - ఏవ ఇమా మూర్తా
యేయం పృథివీ। యత్ అంతరిక్షం।
యత్ ద్యౌః। యత్ పర్వతా।
యత్ దేవ - మనుష్యా।
యత్ పశవశ్చ వయాంసి చ।
తృణ వనస్పతయః శ్వాపదా।
అన్యాకీట - పతంగ - పిపీలకమ్
‘‘ఆపః’ ఏవ ఇమా మూర్తా।

ఆప ఉపాస్స్వ ఇతి।।

సనత్కుమారుడు : జలము అన్నము కంటే కూడా అధికమైనది.

అందుచేతనే సువృష్టి (బాగుగా, సమయానుకూలంగా వర్షము) వర్షించనప్పుడు అన్నము సరిగా లభించదు. శరీరములకు వ్యాధులు కలుగుచూ ఉంటాయి కూడా.
సకాల - సమృద్ధి వర్షము కురిసినప్పుడు (వర్షపాతము సరిగా ఉన్నప్పుడు) - ‘‘అన్నము బహుగా లభిస్తుంది’’ - అన్ని జీవులు ఆనందిస్తున్నారు.


మూర్తీభవించిన (రూపము గల) సర్వ పదార్థములలోను జలము ఉనికి కలిగియున్నది.
సమస్త పదార్థములకు ఆధారము జలమే।
పృథివి (భూమి), అంతరిక్షము (ఆకాశము), ద్యులోకము (దేవతాలోకము, స్వర్గలోకము), పర్వతములు, దేవ-మనుష్యులు, పశువులు, పక్షులు, క్రిమి-కీటకములు, తృణములు (గడ్డిపరకలు), వనస్పతులు (వృక్షములు), మృగములు, కీటక-పతంగ -పిపీలికములు (చీమలు) - సమస్తము (అన్నీ కూడా) జలము చేతనే మూర్తీభవించినవై ఉన్నాయి.



అందుచేత జలమును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించెదవు గాక।

స యోఽపో బ్రహ్మేత్యుపాస్త ఆప్నోతి సర్వాన్కామాగ్ంస్తృప్తిమాన్భవతి
యావదపాం గతం తత్రాస్య యథాకామచారో భవతి యోఽపో
బ్రహ్మేత్యుపాస్తేఽస్తి భగవోఽద్భ్యో భూయ ఇత్యద్భ్యో వావ
భూయోఽస్తీతి తన్మే భగవాన్బ్రవీత్వితి .. 7.10.2..

.. ఇతి దశమః ఖండః ..
2. స యో ‘‘అపో బ్రహ్మ’’ ఇతి ఉపాస్త
ఆప్నోతి సర్వాన్ కామాం,
తృప్తిమాన్ భవతి।
యావత్ అపాం గతం, తత్రాస్య
యథా కామచారో భవతి।
యో ‘అపో బ్రహ్మ ఇతి’ ఉపాస్తే

నారదుడు :
‘‘అస్తి భగవో। అద్భ్యో భూయ? ఇతి
సనత్కుమారుడు :
‘అద్భ్యో వావ భూయో అస్తి’ - ఇతి।
నారదుడు :
‘‘తత్ మే భగవాన్। బ్రవీతు।’’ ఇతి।।
ఎవ్వరైతే ‘‘జలము పరబ్రహ్మస్వరూపము’’ - అని ఉపాసిస్తారో, వారు కోరుకొనేవన్నీ లభించి తృప్తివంతులు కాగలరు.
అట్టివారు - జలము విస్తరించి ఉన్నంతవరకు, వారి ఇచ్ఛానుసారం సంచారములు చేయగలరు.
అందుచేత ‘‘జలము బ్రహ్మమే’’ అని ఉపాసించుము.

నారద మహర్షి : జలము కంటే కూడా అధికమైనది ఉన్నదా?
సనత్కుమారుడు : జలము కంటే కూడా ఉపాసనకొరకై అధికమైనది ఉన్నది.
నారద మహర్షి : అట్టి అధికమైనది మా ఉపాసన కొరకై శలవియ్యండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే దశమః ఖండః


7–11. సప్తమ ప్రపాఠకః - ఏకాదశ ఖండము - ‘‘తేజో ఉపాసన’’


తేజో వావాద్భ్యో భూయస్తద్వా ఏతద్వాయుమాగృహ్యాకాశమభితపతి
తదాహుర్నిశోచతి నితపతి వర్షిష్యతి వా ఇతి తేజ ఏవ
తత్పూర్వం దర్శయిత్వాథాపః సృజతే తదేతదూర్ధ్వాభిశ్చ
తిరశ్చీభిశ్చ విద్యుద్భిరాహ్రాదాశ్చరంతి తస్మాదాహుర్విద్యోతతే
స్తనయతి వర్షిష్యతి వా ఇతి తేజ ఏవ తత్పూర్వం దర్శయిత్వాథాపః
సృజతే తేజ ఉపాస్స్వేతి .. 7.11.1..
సనత్కుమారుడు:
1. తేజో వావ అద్భ్యోః భూయః తద్వా,
ఏతత్ వాయుమ్ ఆగృహ్య,
ఆకాశమ్ అభితపతి।
తత్ - ఆహుః - నిశోచతి నితపతి।
వర్షిష్యతి వా ఇతి।
తేజ ఏవ, తత్ పూర్వం
దర్శయిత్వాధ ఆపః సృజతే।
సనత్కుమారుడు : తేజస్సు జలముకంటే కూడా గొప్పది. అట్టి తేజస్సు ఎప్పుడైనా వాయువును నిశ్చలం చేసి, ఆకాశమును అన్నివైపులా తపింపజేస్తూ (వేడి కలిగిస్తూ) ఉంటే, అప్పుడు ‘‘బాగా వేడిగా ఉండి ఆకాశము ఉక్కబోస్తోంది. అందుచేత వర్షము రావచ్చును’’ - అంటారు. ఈ విధంగా వర్షమునకు తేజస్సే ప్రథమ కారణము.

ఈ విధంగా తేజస్సే అన్నిటికంటే ముందుగా ప్రదర్శనమై జలమును సృష్టించుచున్నది. తేజస్సువల్లనే నీటి ఆవిరిరూపంగా మేఘములు ఉత్పన్నమై వర్షమునకు కారణము అగుచున్నది.
తత్ ఏతత్ ఊర్ధ్వా అభిశ్చ,
తిరశ్చీభిశ్చ విద్యుద్భిః
ఆహ్రాదాః చరన్తి।
తస్మాత్ ఆహుః విద్యోతతే
స్తనయతి, వర్షిష్యతి వా
ఇతి ‘తేజ’ ఏవ।
తత్పూర్వం దర్శయిత్వా।
అథ ఆపః సృజతే
తేజ ఉపాస్స్వ ఇతి।
తేజస్సు ఎప్పుడైతే పైకి - క్రిందకు విస్తారమగుచు పైకి, వెనుకకు ఊర్ధ్వగామి, తిర్యక్‌గామి అగుచు ఉన్నదో, ఆ సందర్భములో మేఘములలో విద్యుత్తుతో కూడిన గర్జనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే విద్యుత్ (మేఘములో మెఱుపు) మేఘగర్జనలతో ప్రదర్శనమౌతుందో అప్పుడు ‘‘ఆకాశంలో మెఱుపులు సంభవిస్తూ ఉన్నాయి. మేఘగర్జనలు వినిపిస్తున్నాయి. కనుక వర్షింపబడవచ్చు’’ -అని అనుకుంటూ ఉంటారు.
అందుచేత తేజస్సే మొదటిగా ఉండి వర్షమును వర్షింపజేస్తోంది.
కనుక జలమును సృష్టిస్తున్నది ‘తేజస్సే’।
అట్టి తేజస్సు ఆత్మగా ఉపాసించ బడుగాక।

స యస్తేజో బ్రహ్మేత్యుపాస్తే తేజస్వీ వై స తేజస్వతో
లోకాన్భాస్వతోఽపహతతమస్కానభిసిధ్యతి యావత్తేజసో గతం
తత్రాస్య యథాకామచారో భవతి యస్తేజో బ్రహ్మేత్యుపాస్తేఽస్తి
భగవస్తేజసో భూయ ఇతి తేజసో వావ భూయోఽస్తీతి తన్మే
భగవాన్బ్రవీత్వితి .. 7.11.2..

.. ఇతి ఏకాదశః ఖండః ..
2. స యః ‘తేజో బ్రహ్మేతి’’
ఉపాస్తే తేజస్వీ వై,
స తేజస్వతో లోకాన్ భాస్వతో
అపహత తమస్కాన్ అభిసిద్ధ్యతి।
యావత్ తేజసోగతం
తత్ర అస్య యథా కామచారో భవతి,
యః ‘తేజో బ్రహ్మ’ ఇతి ఉపాస్తే।

నారదుడు :
‘‘అస్తి, భగవ! తేజసో భూయ?’’ ఇతి
సనత్కుమారుడు :
‘‘తేజసో వావ భూయో అస్తి - ’’ ఇతి।।
నారదుడు :
‘‘తత్ మే భగవాన్, బ్రవీతు’’ - ఇతి।।
ఎవ్వరైతే ‘‘తేజస్సు బ్రహ్మమే’’ అని దర్శిస్తూ బ్రహ్మోపాసన చేస్తారో - తేజోవంతుడౌతాడు. తన తేజస్సుతో లోకములకు వెలుగు ప్రసాదిస్తూ ఉంటాడు. చీకటిలేని లోకములలో ప్రవేశించి, తేజోమయం చేస్తూ ఉంటాడు. తేజోమయ లోకములలో తన ఇచ్ఛానుసారం విహరించగలిగినవాడై ఉంటాడు. తేజస్సు బ్రహ్మముగా దర్శిస్తూ బ్రహ్మముగా ఉపాసించుదురు గాక।


నారద మహర్షి : స్వామీ! తేజస్సు కన్నా అధికమై ఉపాసించవలసినది ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : అవును. తేజస్సుకన్నా ‘భూరి’ అయిన ఉపాసనా వస్తువు ఉన్నది.
నారద మహర్షి : భగవాన్! అదేమిటో కూడా దయచేసి నాకు ఉపదేశించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ఏకాదశః ఖండః


7–12. సప్తమ ప్రపాఠకః - ద్వాదశ ఖండము - ‘‘ఆకాశ ఉపాసన’’


ఆకాశో వావ తేజసో భూయానాకాశే వై సూర్యాచంద్రమసావుభౌ
విద్యున్నక్షత్రాణ్యగ్నిరాకాశేనాహ్వయత్యాకాశేన
శృణోత్యాకాశేన ప్రతిశృణోత్యాకాశే రమత ఆకాశే న రమత
ఆకాశే జాయత ఆకాశమభిజాయత ఆకాశముపాస్స్వేతి .. 7.12.1..
సనత్కుమారుడు
1. ఆకాశో వావ తేజసో భూయాన్।
ఆకాశే వై సూర్యాచన్ద్రమసా ఉభౌ।
విద్యుత్ నక్షత్రాణి అగ్నిః।
ఆకాశేన ఆహ్వయతి।
ఆకాశేన శృణోతి।
ఆకాశేన ప్రతిశృణోతి।
ఆకాశే రమత - ఆకాశే న రమత।
ఆకాశే జాయత।
ఆకాశమ్ అభిజాయత
ఆకాశమ్ ఉపాస్స్వేతి।।
సనత్కుమారుడు : తేజస్సు కంటే ఆకాశము అధికతరమైనది. ప్రాధాన్యమైనది.
ఆకాశములో సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ (తేజస్సు), తారలు (నక్షత్రములు), అగ్ని - ఇవన్నీ స్థానము కలిగి ఆహ్వానితమై ఉన్నాయి.
ఆకాశమువలననే శబ్దమును వినగలుగుచున్నాము. మనము చేసిన శబ్దము కూడా (Resound) మనము ఆకాశము వలననే వినగలుగుచున్నాము.
మనమంతా రమిస్తున్నది, రమించనిది కూడా- ఆకాశమునందే।
ఆకాశము నుండే పుట్టుచున్నాము.
ఆకాశములోనికే తిరిగి వెళ్లుచున్నాము.
అందుచేత ‘‘ఆకాశము బ్రహ్మమే’’ అని ఉపాసించబడు గాక।

స య ఆకాశం బ్రహ్మేత్యుపాస్త ఆకాశవతో వై స
లోకాన్ప్రకాశవతోఽసంబాధానురుగాయవతోఽభిసిధ్యతి
యావదాకాశస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి
య ఆకాశం బ్రహ్మేత్యుపాస్తేఽస్తి భగవ ఆకాశాద్భూయ ఇతి
ఆకాశాద్వావ భూయోఽస్తీతి తన్మే భగవాన్బ్రవీత్వితి .. 7.12.2..

.. ఇతి ద్వాదశః ఖండః ..
2. స య ‘ఆకాశమ్ బ్రహ్మ’’
ఇతి ఉపాస్తే, ఆకాశవతో వై
స లోకాన్ ప్రకాశవతో,
అసం బాధాన్ ఉరుగాయవతో అభిసిద్ధ్యతి।
యావత్ ఆకాశస్య గతం
తత్రాస్య యథా కామచారో
భవతి, య ‘‘ఆకాశం బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।
నారదుడు : ‘‘అస్తి భగవ, ఆకాశాత్ భూయ?’’ - ఇతి
సనత్కుమారుడు : ‘‘ఆకాశాత్ వావ భూయో అస్తి’’ - ఇతి। నారదుడు :
తత్ మే, భగవాన్। బ్రవీతు।’’…ఇతి।।
ఎవరైతే ఆకాశమును ‘‘ఇది బ్రహ్మము’’ అని ఉపాసిస్తాడో, అట్టివాడు ప్రకాశవంతమైనట్టి, సంబంధ బంధములు ఉండనట్టి, బహువిస్తారములైనట్టి లోకములను బాగుగా సిద్ధించుకోగలడు.
‘‘ఆకాశము బ్రహ్మము’’ - అని ఉపాసించువాడు - ఆకాశము ఎంతవరకు విస్తరించి ఉంటే అంతవరకు ఇచ్ఛాపూర్వకంగా ఉనికి, సంచారములు పొంది ఉండగలడు.

నారద మహర్షి : మహాత్మా! ఆకాశము కంటే కూడా అధికమైనది ఉపాసనకై ఇంకా కూడా ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఆకాశము కంటే కూడా భూరి (అధికము, విస్తారము) అయినది ఉన్నది.
నారద మహర్షి : భగవాన్। అది ఏమై ఉన్నదో దయతో వివరించండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ద్వాదశః ఖండః


7–13. సప్తమ ప్రపాఠకః - త్రయోదశ ఖండము - ‘‘స్మర ఉపాసన’’


స్మరో వావాకాశాద్భూయస్తస్మాద్యద్యపి బహవ ఆసీరన్న
స్మరంతో నైవ తే కంచన శృణుయుర్న మన్వీరన్న విజానీరన్యదా
వావ తే స్మరేయురథ శృణుయురథ మన్వీరన్నథ విజానీరన్స్మరేణ
వై పుత్రాన్విజానాతి స్మరేణ పశూన్స్మరముపాస్స్వేతి .. 7.13.1..
సనత్కుమారుడు:
1. ‘స్మరో’ వావ ఆకాశాత్ భూయః।
తస్మాత్ యత్ అపి బహవ
ఆసీః, అన్న స్మరన్తో,
నైవ తే కంచన శృణుయుః।
న మన్వీః। న విజానీరన్।
సనత్కుమారుడు : ఆకాశము కంటే కూడా స్మరణము (Remembrance) గొప్పది. ‘బహు’ అయినట్టిది.

ఒకచోట చాలామంది ఆశీనులై ఉన్నారనుకో. వారంతా ఒకరి గురించి మరొకరు ఏమాత్రము స్మరించనప్పుడు - ఒకరు చెప్పేది మరొకరు వినరు. ఒకరి గురించి మరొకరు ఆలోచించరు. ఒకరి గురించి మరొకరు తెలియబడరు కూడా.
యదా వావ తే స్మరేయుః,
అథ శృణుయుః,
అథ మన్వీరన్,
అథ విజానీరన్,
స్మరేణ వై పుత్రాన్ విజానాతి।
స్మరేణ పశూన్
స్మరమ్ ఉపాస్స్వ। ఇతి।
వారంతా పరస్పరము స్మరించటము ప్రారంభించినప్పుడు మాత్రమే - ఒకరు చెపుతున్నది మరొకరు వినగలరు.
- ఒకరి గురించి మరొకరు మనస్సు పెట్టగలరు.
- ఒకరి గురించి మరొకరు తెలుసుకోగలరు. స్మరణచేతనే ‘‘ఈతడు నా కుమారుడు, ఇది పశువు’’ - మొదలైన సమస్తము గుర్తించబడుచున్నాయి. అనుభూతపరచుకోబడుచున్నాయి.

కాబట్టి నీవు ‘‘స్మరణశక్తి’’ని బ్రహ్మముగా ఉపాసించెదవు గాక।

స యః స్మరం బ్రహ్మేత్యుపాస్తే యావత్స్మరస్య గతం తత్రాస్య
యథాకామచారో భవతి యః స్మరం బ్రహ్మేత్యుపాస్తేఽస్తి భగవః
స్మరాద్భూయ ఇతి స్మరాద్వావ భూయోఽస్తీతి తన్మే
భగవాన్బ్రవీత్వితి .. 7.13.2..

.. ఇతి త్రయోదశః ఖండః ..
2. స యః ‘స్మరమ్ బ్రహ్మ’
ఇతి ఉపాస్తే, యావత్ స్మరస్య గతం,
తత్ర అస్య యథా కామచారో భవతి,
యః ‘‘స్మరమ్ బ్రహ్మ’’ ఇతి ఉపాస్తే।

నారదుడు : ‘‘అస్తి, భగవః స్మరాత్ భూయ?’’ ఇతి।।
సనత్కుమారుడు : ‘స్మరాత్ వావ భూయో అస్తి।’ - ఇతి।।
నారదుడు : ‘‘తన్మే భగవాన్। బ్రవీతు।’’ ఇతి।।
ఎవరైతే స్మరణశక్తిని బ్రహ్మముగా ఉపాసిస్తూ ఉంటాడో, అట్టివాడు స్మరణము ఉన్నంతవరకు స్వేచ్ఛగా ఇచ్ఛాపూర్వకమై (బంధరహితుడై) స్థితి పొంది ఉండగలడు.


నారదమహర్షి : మహానుభావన్। భగవాన్। ‘స్మరణము’ కంటే మించినది, అధికమైనది (ఉపాసనకై) ఏదైనా ఉన్నదా?
సనత్కుమారుడు : ఉన్నది. ‘స్మరణము’ కంటే అధికమైనది కలదు.
నారదమహర్షి : ఏమిటది? దయచేసి వివరించి చెప్పండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే త్రయోదశః ఖండః


7–14. సప్తమ ప్రపాఠకః - చతుర్దశ ఖండము - ‘‘ఆశా ఉపాసన’’


ఆశా వావ స్మరాద్భూయస్యాశేద్ధో వై స్మరో మంత్రానధీతే
కర్మాణి కురుతే పుత్రాగ్ంశ్చ పశూగ్ంశ్చేచ్ఛత ఇమం చ
లోకమముం చేచ్ఛత ఆశాముపాస్స్వేతి .. 7.14.1..
సనత్కుమారుడు:
1. ‘ఆశా’ వావ స్మరాత్ భూయస్య।
ఆశేద్ధో వై స్మరో మంత్రాన్ అధీతే।
కర్మాణి కురుతే।
పుత్రాగ్ంశ్చ పశూగ్ంశ్చ ఇచ్ఛత।
ఇమం చ లోకం అముం చ ఇచ్ఛత
ఆశామ్ ఉపాస్స్వ। ఇతి।।
సనత్కుమారుడు : ‘ఆశ’ (కామము) అనునది స్మరణము (జ్ఞాపకము) కన్నా కూడా అధికమైనది.

జీవునిలోని స్మరణశక్తి ’ఆశ’చే ప్రేరేపించబడినప్పుడు మాత్రమే ఆతడు ‘మంత్రము’ను ఉపాసించగలడు.
- ‘ఆశ’ చేతనే జీవుడు కర్మలు చేస్తున్నాడు.
- ఆశ చేతనే సంతానము, పశుసంపద మొదలైనవాటికొరకు ప్రయత్నశీలురై ఈ జీవుడు ఉంటున్నాడు. ఇహ-పర లోకములు ప్రయోజనములను ‘ఆశ’ చేతనే ప్రయత్నించటము, పొందటము జరుగుతోంది.
అందుచేత ‘ఆశయే బ్రహ్మము’’ - అని ఉపాసించబడు గాక।

స య ఆశాం బ్రహ్మేత్యుపాస్త ఆశయాస్య సర్వే కామాః
సమృధ్యంత్యమోఘా హాస్యాశిషో భవంతి యావదాశాయా
గతం తత్రాస్య యథాకామచారో భవతి య ఆశాం
బ్రహ్మేత్యుపాస్తేఽస్తి భగవ ఆశాయా భూయ ఇత్యాశాయా వావ
భూయోఽస్తీతి తన్మే భగవాన్బ్రవీత్వితి .. 7.14.2..

.. ఇతి చతుర్దశః ఖండః ..
2. స య ‘‘ఆశాం బ్రహ్మ’’
ఇతి - ఉపాస్తే, ఆశయాస్య సర్వే
కామాః సమృద్ధ్యన్త।
అమోఘా హా అస్య ఆశిషో భవన్తి।
ఎవ్వరైతే ‘ఆశ పరబ్రహ్మ స్వరూపమే’ అని ఉపాసిస్తాడో, ఆతడు కోరుకొనే సమస్త కోరికలను (వాంఛితార్థములను) పూర్తిగా, సమృద్ధిగా పొందగలడు.
అమోఘముగా అవన్నీ సిద్ధించగలవు.
యావత్ ఆశాయా గతం,
తత్రాస్య యథా కామచారో భవతి।
య ‘ఆశాం బ్రహ్మ’ ఇతి ఉపాస్తే।
‘ఆశ’ అనునది ఎంతవరకు విస్తరించి ఉంటుందో - అంతవరకు ఆతనికి ఇష్టముగా అనిపించినదంతా పొందగలడు.
‘ఆశయే బ్రహ్మము’ అని ఉపాసించబడు గాక।
నారదుడు : ‘‘అస్తి భగవ। ఆశాయా భూయా?’’ - ఇతి!
సనత్కుమారుడు : ‘‘ఆశాయా వావ భూయో అస్తి’’ - ఇతి।।
నారదుడు : ‘‘తన్మే భగవాన్। బ్రవీతు।’’ - ఇతి।।
శ్రీ నారద మహర్షి : గురువరేణ్యా। ‘ఆశ’ కంటే అధికమైనది ఉపాసనకొరకై ఇంకేమైనా ఉన్నదా?
శ్రీ సనత్కుమారుడు : ఎందుకులేదు! ‘ఆశ’ కంటే అధికమైన ఉపాసన వస్తువు ఉన్నది.
శ్రీ నారద మహర్షి : అది ఏది? భగవాన్। దయచేసి చెప్పండి.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే చతుర్దశః ఖండః


7–15. సప్తమ ప్రపాఠకః - పంచదశ ఖండము - ‘‘ప్రాణోపాసన’’


ప్రాణో వా ఆశాయా భూయాన్యథా వా అరా నాభౌ సమర్పితా
ఏవమస్మిన్ప్రాణే సర్వగ్ంసమర్పితం ప్రాణః ప్రాణేన యాతి
ప్రాణః ప్రాణం దదాతి ప్రాణాయ దదాతి ప్రాణో హ పితా ప్రాణో
మాతా ప్రాణో భ్రాతా ప్రాణః స్వసా ప్రాణ ఆచార్యః
ప్రాణో బ్రాహ్మణః .. 7.15.1..
సనత్కుమారుడు:
1. ప్రాణో వావ ఆశయా భూయాన్।
యథా వా అరా నాభౌ సమర్పితా ఏవమ్,
‘అస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం।’
ప్రాణః ప్రాణేన యాతి।
ప్రాణః ప్రాణం దదాతి।
ప్రాణాయ దదాతి।
శ్రీ సనత్కుమారులవారు : ‘ప్రాణము’ ఆశ కంటే భూయిష్టమైనది. అధికమైనది. ఉన్నతమైనది. గొప్పది.
ఒక రథచక్రము యొక్క నాభి (Central hub) వద్ద ఆకులు (spokes of wheel) బిగించి ఉంచిన తీరుగా - ప్రాణమునందు దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్తములు అన్నీ కూడా బిగించబడినవై (సమర్పితమై) ఉన్నాయి. ప్రాణము ప్రాణశక్తి చేతనే చేతనమౌతోంది. ప్రాణమే ప్రాణమునకు ప్రాణము ప్రసాదిస్తోంది.
ప్రాణో హ పితా। ప్రాణో మాతా।
ప్రాణో భ్రాతా। ప్రాణః స్వసా।
ప్రాణ ఆచార్యః। ప్రాణో బ్రాహ్మణః।
ప్రాణము - అనగా, ప్రియత్వము (ఆశ) యొక్క శక్తిరూపమే। ప్రాణము తండ్రి! ప్రాణమే ‘అమ్మ’। ప్రాణమే సోదరుడు। ప్రాణమే సోదరి (తోడబుట్టినది) । ఆచార్యులవారు ప్రాణస్వరూపులు। బ్రహ్మతత్త్వజ్ఞులగు బ్రాహ్మణులు - ప్రాణస్వరూపులే। ప్రాణమే ఆయా ప్రియరూపాలన్నీ కూడా!

స యది పితరం వా మాతరం వా భ్రాతరం వా స్వసారం వాచార్యం
వా బ్రాహ్మణం వా కించిద్భృశమివ ప్రత్యాహ
ధిక్త్వాస్త్విత్యేవైనమాహుః పితృహా వై త్వమసి మాతృహా వై
త్వమసి భ్రాతృహా వై త్వమసి స్వసృహా వై త్వమస్యాచార్యహా
వై త్వమసి బ్రాహ్మణహా వై త్వమసీతి .. 7.15.2..
2. స యది పితరం వా, మాతరం వా
భ్రాతరం వా, స్వసారం వా,
ఆచార్యం వా, బ్రాహ్మణం వా,
కించిత్ భృశమ్ ఇవ
ప్రత్యాహ ‘ధిక్’ త్వ అస్తి।
ఇతి ఏవ ఏనం ఆహుః-
అందుచేతనే నీకు ప్రాణస్వరూపులే అయి ఉన్న తండ్రినిగాని, తల్లినిగాని, సోదరునిగాని, సహోదరినిగాని, ఆచార్యులవారినిగాని, బ్రహ్మజ్ఞులగు బ్రాహ్మణునిగాని కించిత్ అనుచితంగా మాట్లాడితే అప్పుడు ఆ ప్రక్కవారు ‘‘భృశమివ - తగనివిధంగా మాట్లాడుచున్నావేమయ్యా! ధిక్। నీకు ధిక్కారము అగుగాక।’’ అంటూ ఉంటారు కదా.
‘‘పితృ హా వై త్వమ్ అసి।
మాతృ హా వై త్వమ్ అసి।
భ్రాతృ హా వై త్వమ్ అసి।
స్వసృ హా వై త్వమ్ అసి।
ఆచార్య హా వై త్వమ్ అసి।
బ్రాహ్మణ హా వై త్వమ్ అసి। - ఇతి।।
ఇంకా కూడా ఆ దగ్గిరవారు (స్వతంత్రముగా ఉండువారు - తదితర బంధువులు) ఇట్లా ఉంటారు।
✘ మీ నాన్నగారిని దూషణగా మాట్లాడకు. వారిని చంపినంత పాపం నీకు వస్తుంది.
✘ అమ్మను ఏమీ అనకు! అమ్మను చంపినంత పాపం.
✘ సోదరునితో దుర్భాషలాడవద్దు! చంపినంత పాపం.
✘ సహోదరుని దూషించకు! చంపినంత దోషం సుమా!
✘ ఆచార్యులవారిని దూషించకు. వారిని చంపినంత దుష్ఫలితం!
✘ బ్రహ్మజ్ఞానులను చెడుమాటలనకు. బ్రహ్మహత్య అంత పాపం!
అని అతనితో మాట్లాడటం మానివేస్తారు.

అథ యద్యప్యేనానుత్క్రాంతప్రాణాంఛూలేన సమాసం
వ్యతిషందహేన్నైవైనం బ్రూయుః పితృహాసీతి న మాతృహాసీతి
న భ్రాతృహాసీతి న స్వసృహాసీతి నాచార్యహాసీతి
న బ్రాహ్మణహాసీతి .. 7.15.3..
3. అథ యద్యపి ఏనాన్
ఉత్క్రాన్త ప్రాణాన్,
శూలేన సమాసం వ్యతిషంద హి
ఏన న ఏవ ఏనం బ్రూయుః
పితృహాసీతి। న మాతృహాసీతి।
అదే మరొక సందర్భంలో తండ్రి గాని, తల్లిగాని, తదితరులుగాని మరణించినప్పుడు వారిని శ్మశానంలో (పితృవనంలో)దహనము చేసినప్పుడో-
‘‘నీవు పితృ హంతకుడవు. మాతృహంతకుడవు. భ్రాతృ హంతకుడవు. సహోదరీ హంతకుడవు. ఆచార్య హంతకుడవు. బ్రాహ్మణ హంతకుడవు అని ఎవరైనా అంటారా? అనరు.
న భ్రాతృహాసీతి। న స్వసృహాసీతి।
న ఆచార్యహాసీతి।
న బ్రాహ్మణహాసీతి।
ఎందుచేత? ఆ దేహములో ఎప్పుడో ప్రాణము తొలగిపోయింది కనుక! శూలముతో ముక్కలు చేసినా, కాకులకు, గ్రద్ధలకు ఆహారంగా వేసినా కూడా ‘‘వీరిని చంపి బాధించావు. ప్రాణహాని చేసావు’’ అని ఆపాదించరు.

ప్రాణో హ్యేవైతాని సర్వాణి భవతి స వా ఏష ఏవం పశ్యన్నేవం
మన్వాన ఏవం విజానన్నతివాదీ భవతి తం
చేద్బ్రూయురతివాద్యసీత్యతివాద్యస్మీతి బ్రూయాన్నాపహ్నువీత .. 7.15.4..

.. ఇతి పంచదశః ఖండః ..
4. ‘ప్రాణో’ హి ఏవ ఏతాని
సర్వాణి భవతి।
స వా ఏష ఏవం పశ్యన్ ఏవం,
మన్వాన ఏవం, విజానన్,
న అతివాదీ’’ భవతి।
తం చేత్ బ్రూయుః
అతివాద్యసీది।
‘‘అతివాది అస్మి’’ ఇతి బ్రూయాత్ -
న అపహ్నువీత।।
మనం పైన చెప్పుకున్నవారంతా ప్రాణస్వరూపులే అయి ఉన్నారు.

‘‘ఈ జీవులంతా నా ప్రాణస్వరూపులే. అందుచేత అంతా నాకు ప్రియమైన వారే। వారిని నేను బాధించలేను’’ అని అన్నప్పుడు ఎవ్వరైనా
‘‘నీవు అతివాదివిగా అగుచున్నావు. అతివాదివి కావద్దయ్యా!’’ - అంటే అనవచ్చు గాక।

అప్పుడు మనము వారితో ఏమని అనాలంటే, ‘‘అవును. నేను ఈ ప్రాణము బ్రహ్మముగా, ప్రియముగా భావించటములో అతివాదినే!’’ అనియే అనాలి. అంతేగాని వారన్నారని ‘‘ప్రాణస్వరూపభావన’’ నుండి తప్పుకోకూడదు.

సమస్తము తన ప్రాణస్వరూపంగా దర్శించేవాడు. ఆత్మభావన చేయువాడు ఆ విధంగానే భావిస్తాడు మరి!

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే పంచదశః ఖండః


7–16. సప్తమ ప్రపాఠకః - షోడశ ఖండము - సత్యము కొఱకు తీవ్ర విజిజ్ఞాస కలిగియుండాలి


ఏష తు వా అతివదతి యః సత్యేనాతివదతి సోఽహం భగవః
సత్యేనాతివదానీతి సత్యం త్వేవ విజిజ్ఞాసితవ్యమితి సత్యం
భగవో విజిజ్ఞాస ఇతి .. 7.16.1..

.. ఇతి షోడశః ఖండః ..
ఏష తు వా అతివదతి యః సత్యేన।
అతివదతి సోఽహం, భగవః। సత్యేన
అతివదాని ఇతి।
సత్యం తు ఏవ విజిజ్ఞాసితవ్యం। - ఇతి।
‘‘సత్యం’’ - భగవో
విజిజ్ఞాస - ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : ఓ నారద మహర్షీ! సత్యజ్ఞానసంబంధమైన కేవలాత్మ గురించి చెప్పువాడు (లోకసంబంధమైన సంభాషణల దృష్ట్యా చూచినప్పుడు) - అతివదతి (అతివాది)యే అయి ఉంటున్నాడు.
శ్రీ నారద మహర్షి : స్వామీ! గురుదేవా! పరమార్థ సత్యవిజ్ఞానమును ఆశ్రయిస్తూ నేను అతివాదనుడను, అతివాదిని అయి అతివాదనము చేయు సంసిద్ధుడనై ఉన్నాను.
శ్రీ సనత్కుమారుడు : మనము పరమ సత్యముల పట్ల తీవ్ర జిజ్ఞాసువులము అయితేనే సత్యము అనుభవమై సిద్ధించగలదు. సత్యము పట్ల మాత్రమే విజిజ్ఞాసితులమై ఉండాలి.
శ్రీ నారద మహర్షి : హే సద్గురూ! భగవాన్, మీరు సూచన చేస్తున్నట్లు నేను పరాకాష్ఠ సత్యము కొరకే తెలుసుకోవటానికి సంసిద్ధుడనై (విజిజ్ఞాసుడనై) ఉంటాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే షోడశః ఖండః


7–17. సప్తమ ప్రపాఠకః - సప్తదశ ఖండము - సత్యము గురించిన విజ్ఞానమే తెలుసుకోవాలి


యదా వై విజానాత్యథ సత్యం వదతి నావిజానన్సత్యం వదతి
విజానన్నేవ సత్యం వదతి విజ్ఞానం త్వేవ విజిజ్ఞాసితవ్యమితి
విజ్ఞానం భగవో విజిజ్ఞాస ఇతి .. 7.17.1..

.. ఇతి సప్తదశః ఖండః ..
యదా వై విజానాతి,
అథ సత్యం వదతి।
న అవిజానన్ సత్యం వదతి।
విజానన్ ఏవ సత్యం వదతి।
విజ్ఞానం త్వ ఏవ విజిజ్ఞాసితవ్యమ్
ఇతి విజ్ఞానం, భగవో - విజిజ్ఞాస ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : ఈ జీవుడు సత్యము తెలియనంతవరకు అసత్యమునే ఆశ్రయిస్తూ అట్టి అసత్యము గురించియే తర్జన భర్జనలు, వాదోపవాదములు, వ్యవహారములు సంభాషిస్తూ ఉంటాడు. ‘సత్యము’ ఏమిటో తెలిసిందా - ఇక ‘సత్యము’ మాత్రమే సంభాషిస్తాడు. అందుచేత సత్యమును గురించిన విజ్ఞానము కొరకే విజ్ఞాని తవ్యుడవై ఉండాలి. వాంఛించాలి.
శ్రీ నారదమహర్షి : గురువర్యా! మీరు గుర్తు చేస్తున్న విధంగా సత్యము గురించే విజ్ఞానవిశేషుడను కాగలను. సత్యము కొరకే నిమగ్నుడను అయి ఉంటాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే సప్తదశః ఖండః


7–18. సప్తమ ప్రపాఠకః - అష్టాదశ ఖండము - మతితో సత్యమును మననము చేస్తూ ఉండాలి


యదా వై మనుతేఽథ విజానాతి నామత్వా విజానాతి మత్వైవ
విజానాతి మతిస్త్వేవ విజిజ్ఞాసితవ్యేతి మతిం భగవో
విజిజ్ఞాస ఇతి .. 7.18.1..

.. ఇతి అష్టాదశః ఖండః ..
1. యదా వై మనుతే అథ
విజానాతి నామత్వా విజానాతి।
మత్వైవ విజానాతి।
మతిస్త్వేవ విజిజ్ఞాసి తవ్యేతి।
మతిం, భగవో। విజిజ్ఞాస। ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : అయితే సత్యము స్వానుభవమై నిర్దుష్టంగా తెలిసేది ఎట్లా? అందుకు ‘‘సత్యము యొక్క మననము’’ - మార్గము. మానవుడు సత్యమును మననము చేతనే తెలుసుకోగలడు. మననము లేకపోతే తెలుసుకోవటము అనుభవమునకు రాదు. మననముచే సత్యమును తప్పక తెలుసుకోగలడు. మననము ద్వారా మతి (బుద్ధి) తో ‘సత్యము’ను ధృవీకరించుకోవాలి.

శ్రీ నారద మహర్షి : భగవాన్! ఆత్మపట్ల, పరమసత్యముపట్ల మననము చేయుటకై విజిజ్ఞాసుడనై (సమోత్సాహినై, తెలివిని వినియోగిస్తూ) ఉంటాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే అష్టాదశః ఖండః


7–19. సప్తమ ప్రపాఠకః - ఏకోనవింశ ఖండము - శ్రద్ధ చేతనే మననము సాధ్యము


యదా వై శ్రద్దధాత్యథ మనుతే నాశ్రద్దధన్మనుతే
శ్రద్దధదేవ మనుతే శ్రద్ధా త్వేవ విజిజ్ఞాసితవ్యేతి
శ్రద్ధాం భగవో విజిజ్ఞాస ఇతి .. 7.19.1..

.. ఇతి ఏకోనవింశతితమః ఖండః ..
1. యదా వై శ్రద్ధధాతి
అథ మనుతే।
న అశ్రద్ధధన్ మనుతే।
శ్రద్ధధత్ ఏవ మనుతే।
శ్రద్ధా త్వేవ విజిజ్ఞాసి తవ్యేతి।
శ్రద్ధాం భగవో విజిజ్ఞాస - ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : అయితే సత్యము గురించిన మననము ఎప్పుడు సాధ్యపడుతుంది? శ్రద్ధచేతనే మననము సాధ్యం. అశ్రద్ధ కలవాడికి ఆత్మ గురించిన మననము ఘనీభూతమవదు.
(శ్రద్ధావంతుడు) శ్రద్ధ కలిగి ఉంటేనే మననము వలననే విజిజ్ఞాసము (సత్యము తెలియరావటము) జరుగగలదయ్యా!
శ్రీ నారదమహర్షి : గురుదేవా! శ్రద్ధను కలిగి సత్యమును తెలియటానికై ప్రయత్నవంతుడను - మీరు చెప్పే విధంగా - అగుచున్నాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ఏకోనవింశః ఖండః


7–20. సప్తమ ప్రపాఠకః - వింశ ఖండము - నిష్ఠ చేతనే శ్రద్ధ బలపడుతుంది


యదా వై నిస్తిష్ఠత్యథ శ్రద్దధాతి
నానిస్తిష్ఠంఛ్రద్దధాతి నిస్తిష్ఠన్నేవ శ్రద్దధాతి
నిష్ఠా త్వేవ విజిజ్ఞాసితవ్యేతి నిష్ఠాం భగవో
విజిజ్ఞాస ఇతి .. 7.20.1..

.. ఇతి వింశతితమః ఖండః ..
1. యదా వై నిస్తిష్ఠతి అథ శ్రద్ధధాతి।
న అనిస్తిష్ఠన్ శ్రద్ధధాతి।
నిస్తిష్ఠన్ ఏవ శ్రద్ధ ధాతి।
నిష్ఠా త్వేవ విజిజ్ఞాసితవ్యేతి।

నిష్ఠాం, భగవో। విజిజ్ఞాస। ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : శ్రద్ధ ఎట్లా ఏర్పడుతుంది? నిశ్చయముతో కూడిన నియమరూపమగు ‘నిష్ఠ’ చేతనే శ్రద్ధ బలపడుతుంది. నిష్ఠ (ప్రాతఃమధ్యాహ్న సాయం ఇత్యాది సమయములలో సాధనకు సంబంధించిన నియమ పాలన) లేనివాడు అశ్రద్ధవంతుడే అవుతాడు.
(కాలనియమము మొదలైనవి) చేతనే శ్రద్ధ బలపడగలదు. అందుచేత నిష్ఠతో ఆత్మతత్త్వము పట్ల విజిజ్ఞాసితుడవు (తెలుసుకొన్నవాడు అగుము. నిష్ఠను తెలుసుకొని ఉండుము)
శ్రీ నారదమహర్షి : హే భగవాన్! నిష్ఠతో నియమములను ఆశ్రయించి ఆత్మ గురించి విజిజ్ఞాసుడను అవుతాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే వింశః ఖండః


7–21. సప్తమ ప్రపాఠకః - ఏకవింశ ఖండము - కర్మానుష్ఠానము చేతనే నిష్ఠ బలపడుతుంది


యదా వై కరోత్యథ నిస్తిష్ఠతి నాకృత్వా నిస్తిష్ఠతి
కృత్వైవ నిస్తిష్ఠతి కృతిస్త్వేవ విజిజ్ఞాసితవ్యేతి
కృతిం భగవో విజిజ్ఞాస ఇతి .. 7.21.1..

.. ఇతి ఏకవింశః ఖండః ..
1. యదా వై కరోతి అథ నిస్తిష్ఠతి।
న అకృత్వా నిస్తిష్ఠతి।
కృత్వైవ నిస్తిష్ఠతి।
కృతిస్త్వ ఏవ విజిజ్ఞాసితవ్యేతి।
కృతిం భగవో విజిజ్ఞాస - ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : అయితే, నారదమహర్షీ! ‘‘నేను నిష్ఠ-నియమముగానే ఉంటాను’’ అంటే సరిపోదు. కర్మానుష్ఠానము చేతనే నిష్ఠ బలపడుతుంది. కర్మను అనుష్ఠిస్తూ ఉన్నప్పుడే ఒకడు నిష్ఠాపరుడు - అని అనిపించుకోగలడు. ‘‘అంతేగాని మాకు చాలా నియమాలు ఉన్నాయి’’ - అనునది ‘నిష్ఠ’ అని అనిపించుకోదు. విజ్ఞానము కొరకై ‘‘ప్రాణాయామము, మంత్రోపాసన, లోకకళ్యాణార్థం కర్మలు’’ - మొదలైనవి నిర్వర్తిస్తున్నవాడవై ఉండండి. తద్వారా ఆత్మ గురించిన ఎరుక నిశ్చలం చేసుకోండి.
శ్రీ నారదమహర్షి : భగవాన్! కర్మానుష్ఠానముతో నిష్ఠను వృద్ధి చేసుకొంటూ ఆత్మజ్ఞానమును సుస్థీకరించుకుంటూ ఉంటాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ఏకవింశః ఖండః


7–22. సప్తమ ప్రపాఠకః - ద్వావింశ ఖండము - హఠంతో కాకుండా సుఖముగా కర్మలను ఆచరించాలి


యదా వై సుఖం లభతేఽథ కరోతి నాసుఖం లబ్ధ్వా కరోతి
సుఖమేవ లబ్ధ్వా కరోతి సుఖం త్వేవ విజిజ్ఞాసితవ్యమితి
సుఖం భగవో విజిజ్ఞాస ఇతి .. 7.22.1..

.. ఇతి ద్వావింశః ఖండః ..
1. యదా వై సుఖం లభతే,
అథ కరోతి న అసుఖం లబ్ధ్వా కరోతి।
సుఖమేవ లబ్ధ్వా కరోతి।
సుఖం తు ఏవ విజిజ్ఞాసితవ్యమ్ ఇతి।
సుఖం, భగవో।
విజిజ్ఞాస - ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : కర్మానుష్ఠానము దేహానుకూలమును దృష్టిలో పెట్టుకొని సుఖముగా చేయాలి. ఇంద్రియములను బాధించి హఠంగా కర్మలు చేసి ఇంద్రియ బలహీనతలను తెచ్చిపెట్టుకోరాదు. ఎందుకంటే సుఖంగా ఉన్నప్పుడే ఈ మానవుడు అనుష్ఠానం నిర్వర్తించి, నిష్ఠాపరుడై శ్రద్ధను పరిపోషించుకుంటూ, సత్యము కొరకై విజిజ్ఞాసుడు కాగలడు. అనుష్ఠానము తనను, ఇతరులను శారీరకంగా, మానసికంగా బాధించేది కాకూడదు. ఆత్మసుఖమే ఆశయం కావాలి.
శ్రీ నారదమహర్షి : భగవాన్। ప్రాణమును సుఖంగా ఉంచుతూనే కర్మానుష్ఠానము నిష్ఠతో శ్రద్ధగా నిర్వర్తిస్తూ ఆత్మజ్ఞాన తత్పరుడను అవుతాను. సుఖమును కోల్పోయి విజిజ్ఞాసుడను అవను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే ద్వావింశః ఖండః


7–23. సప్తమ ప్రపాఠకః - త్రయోవింశ ఖండము - భూమా సుఖమే లక్ష్యము


యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైవ సుఖం
భూమా త్వేవ విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో
విజిజ్ఞాస ఇతి .. 7.23.1..

.. ఇతి త్రయోవింశః ఖండః ..
1. యో వై భూమా తత్సుఖం।
న అల్పే సుఖమస్తి।
భూమా ఏవ సుఖం।
భూమా తు ఏవ విజిజ్ఞాసితవ్య ఇతి।
భూమానం భగవో।
విజిజ్ఞాస ఇతి।।
శ్రీ సనత్కుమారుడు : ఆత్మానందము సుఖప్రదమైనదేగాని, శరీరమును శోషించటము, జీవితమును కష్టతరం చేసుకోవటము కాదు. అయితే ఆత్మసుఖములు (ఇంద్రియ సుఖములు) జీవితాశయం కానేకాదు. అది అనేక దుఃఖములకు, బంధములకు దారి తీసేవే। ఆత్మసుఖమే (ఆత్మజ్ఞానమే) భూమా సుఖము. భూమా సుఖమే ఆత్మజ్ఞానము. ఆత్మను ఎరుగుట ఆనందమైన విషయమని ఎరిగి ఉండాలి. భూమా సుఖమే జీవితాశయము.
శ్రీ నారద మహర్షి : భగవాన్! శ్రీ సనత్కుమార గురుదేవా! అట్టి భూమానందమే కర్మలయొక్క మహదాశయముగా ఎరిగి విజిజ్ఞాసుడనై ఉంటాను.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే త్రయోవింశః ఖండః


7–24. సప్తమ ప్రపాఠకః - చతుర్వింశ ఖండము - భూమా స్వరూపము


యత్ర నాన్యత్పశ్యతి నాన్యచ్ఛృణోతి నాన్యద్విజానాతి స
భూమాథ యత్రాన్యత్పశ్యత్యన్యచ్ఛృణోత్యన్యద్విజానాతి
తదల్పం యో వై భూమా తదమృతమథ యదల్పం తన్మర్త్య్గ్ం స
భగవః కస్మిన్ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్ని యది వా
న మహిమ్నీతి .. 7.24.1..
1. యత్ర న అన్యత్ పశ్యతి,
న అన్యత్ శృణోతి,
న అన్యత్ విజానాతి, స ‘భూమా’।



అథ యత్ర అన్యత్ పశ్యతి,
అన్యత్ శృణోతి, అన్యత్
విజానాతి - తత్ ‘అల్పమ్’।
శ్రీ నారద మహర్షి : ‘భూమ’ (The Beyond, the Highest) మరియు ‘‘అల్పము’’ అని దేనిదేనిని శాస్త్రంలో అంటూ ఉన్నారు?
శ్రీ సనత్కుమారుడు : ఏ స్థితి (లేక) స్థానమునందు ‘అన్యము’ అనేదే కనిపించదో, ‘అన్యము’ అనేది వినిపించదో, అన్యము ఏదీ తెలియరాదో - అట్టి అనన్యమును, సమము - సమస్తము అగు దానిని - ‘‘భూమా’’ అని అంటారు.

ఏ స్థితి (లేక) స్థానము నుండి అన్యము అనుభవమగుచున్నదో (జీవుడు వేరు - పరమాత్మ వేరు, జీవుడు బద్ధుడు - మొదలైనవి) అధికాధికంగా తెలియబడుచున్నదో - అద్దానిని ‘‘అల్పము’’ అని పిలుస్తూ ఉంటారు.
యో వై భూమా, తత్ అమృతమ్।
అథ యత్ అల్పమ్ తత్ మర్త్యమ్।
స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి?
స్వే మహిమ్ని।
యది వా న మహిమ్ని - ఇతి।
ఏది భూమమో - అది ‘అమృతము’. ఏది అల్పమో - అది ‘మర్త్యము’.
శ్రీ నారదమహర్షి : గురుదేవా! అట్టి ‘‘భూమ’’ అనునది దేనియందు ప్రతిష్ఠితమై (Placed in) ఉన్నది?
శ్రీ సనత్కుమారుడు : అట్టి ‘‘భూమ’’ తన మహిమ యందు తానే ప్రతిష్ఠితమైయున్నది. ఇంకా చెప్పాలంటే, తన మహిమయందు తాను ప్రతిష్ఠితమై లేదు కూడా! ఎందుకంటే, అది సర్వదా నిరాలంబము. సమస్తము.

గోఅశ్వమిహ మహిమేత్యాచక్షతే హస్తిహిరణ్యం దాసభార్యం
క్షేత్రాణ్యాయతనానీతి నాహమేవం బ్రవీమి బ్రవీమీతి
హోవాచాన్యోహ్యన్యస్మిన్ప్రతిష్ఠిత ఇతి .. 7.24.2..

.. ఇతి చతుర్వింశః ఖండః ..
2. గో అశ్వమ్ ఇహ మహిమేతి అచక్షతే।
హస్తి హిరణ్యం దాస భార్యం
క్షేత్రాణి ఆయతనాని - ఇతి।
‘‘న అహమ్ ఏవం బ్రవీమి - ఇతి।’’
హోవాచ :
అన్యోహి అన్యస్మిన్
ప్రతిష్ఠిత’’ - ఇతి।।
కొందరు ఈ విధంగా అంటూ ఉన్నారు.
అట్టి అమృతమగు ‘‘భూమ’’ గోవునందు, గుఱ్ఱముయందు, ఏనుగు యందు, బంగారమునందు, దాస జనమునందు, భార్యయందు- సర్వక్షేత్రములందు మహిమా - సమన్వితమై ఉన్నది.

కానీ, నేను అట్లా అనుకోవటము లేదు. సమస్తము ఆత్మయే అయి, ఆత్మయొక్క మహిమ స్వరూపులే అయి ఉన్నారు. ఆత్మయే అన్యమునందు అన్యముగా ప్రతిష్ఠితమైయున్నది.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే చతుర్వింశః ఖండః


7–25. సప్తమ ప్రపాఠకః - పంచవింశ ఖండము - భూమా సమస్తము నేనే


స ఏవాధస్తాత్స ఉపరిష్టాత్స పశ్చాత్స పురస్తాత్స
దక్షిణతః స ఉత్తరతః స ఏవేదగ్ం సర్వమిత్యథాతోఽహంకారాదేశ
ఏవాహమేవాధస్తాదహముపరిష్టాదహం పశ్చాదహం పురస్తాదహం
దక్షిణతోఽహముత్తరతోఽహమేవేదగ్ం సర్వమితి .. 7.25.1..
మం. శ్లో।। (స-ఆదేశ ఏవ)
1. ‘‘స’’ ఏవ అధస్తాత్ స ఉపరిష్ఠాత్।
స పశ్చాత్ స పురస్తాత్ । స దక్షిణతః।
స ఉత్తరతః। స ఏవ ఇదగ్ం సర్వం।
ఇతి అథాతో ‘అహంకార’ ఆదేశ ఏవ।
అహమ్ ఏవ అధస్తాత్
అహమ్ ఏవ ఉపరిష్టాత్।
అహమ్ పశ్చాత్
అహమ్ పురస్తాత్।
అహమ్ దక్షిణతో।
అహమ్ ఉత్తరతో।
అహమేవ ఇదగ్ం సర్వమ్ ఇతి।।
సనత్కుమారుడు : (నవలా రచయిత నవలంతా నిండి ఉన్నట్లు, స్వప్న ద్రష్టయే స్వప్నమంతా ఊహారూపంగా ఉన్నట్లుగా) - సర్వజీవుల స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మయే (భూమయే)
క్రింద, పైన, వెనుకవైపున, ముందువైపున అన్ని ప్రక్కలయందు (All Sides) అంతటా అప్రతిహతంగా నిండి ఉన్నది. దక్షిణ, ఉత్తర దిక్కులలో (నిండుకుండలోని నీరులాగా) నిండి ఉన్నది. ఈ కనబడేదంతా ఆత్మయొక్క ప్రత్యక్ష స్వరూపమే।

‘‘భూమ’’యే సమస్తమునందు ఆక్రమించి, సమస్తముగా వేంచేసి ఉన్నదని చెప్పుకున్నాము కదా! ఇప్పుడు ‘భూమ’యే సర్వజీవులలో ‘నేను’గా (అహమ్)గా కూడా ఏర్పడి ఉన్నట్లే కాబట్టి ‘ఆత్మ’ శబ్దమునకు ‘భూమాఽహమ్’ను ఆదేశము చెప్పుకుందాము.

ఆత్మయే నేను కాబట్టి ఆత్మనగు నేనే సమస్త దృశ్యమునకు క్రింద, పైన, ఆవల, ఈవల, ముందు - వెనుక, దక్షిణంగాను, ఉత్తరంగాను, తూర్పు-పడమరగాను ఏర్పడి ఉన్నవాడనై, ఈ సమస్తము నేనే అయి ఉన్నాను.

అథాత ఆత్మాదేశ ఏవాత్మైవాధస్తాదాత్మోపరిష్టాదాత్మా
పశ్చాదాత్మా పురస్తాదాత్మా దక్షిణత ఆత్మోత్తరత
ఆత్మైవేదగ్ం సర్వమితి స వా ఏష ఏవం పశ్యన్నేవం మన్వాన ఏవం
విజానన్నాత్మరతిరాత్మక్రీడ ఆత్మమిథున ఆత్మానందః స
స్వరాడ్భవతి తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి
అథ యేఽన్యథాతో విదురన్యరాజానస్తే క్షయ్యలోకా భవంతి
తేషాగ్ం సర్వేషు లోకేష్వకామచారో భవతి .. 7.25.2..

.. ఇతి పంచవింశః ఖండః ..
2. అథాత ‘‘ఆత్మా’’ ఆదేశ ఏవ।
ఆత్మైవ అధస్తాత్। ఆత్మా ఉపరిష్టాత్।
ఆత్మా పశ్చాత్। ఆత్మా పురస్తాత్।
ఆత్మా దక్షిణత। ఆత్మా ఉత్తరతా।
ఆత్మైవా ఇదగ్ం సర్వమ్ ఇతి।
‘‘భూమా అహమ్’’ గురించి చెప్పుతీరుగానే ‘‘ఆత్మ’’ అనే దానికి కూడా ఆదేశము - ఎట్లా అంటే -
ఆత్మయే సమస్తమునకు క్రింద, పైన, ఆవల, ఈవల, ముందు, వెనుక, తూర్పు - పడమర - దక్షిణ - ఉత్తరంగాను ఆక్రమించి ఉండి, సమస్తము ఆత్మయే అయి ఉన్నది.
స వా ఏష ఏవం పశ్యన్ ఏవం మన్వాన,
ఏవం విజానన్….
ఆత్మ రతిః। ఆత్మ క్రీడ।
ఆత్మ మిథున। ఆత్మానందః స స్వరాట్ భవతి।
తస్య సర్వేషు లోకేషు
కామచారో భవతి।
ఈ విధంగా ఎప్పుడైతే స్వస్వరూపమగు ఆత్మను చూస్తూ, మననం చేస్తూ ఎరుక కలిగి ఉంటామో…ఇకప్పుడు
❇︎ ఆత్మయందే సర్వదా రమిస్తూ ఉన్నవారమై ఉంటాము.
❇︎ ఆత్మ అనే ‘ఆట’ స్థలంలో ఎల్లప్పుడు క్రీడించువారమై ఉంటాము.
❇︎ ఆత్మతో మాత్రమే పరస్పరము కలసి ‘‘నేను - ఆత్మ’’ సయోగపరులమై (మిథునమై) ఉంటాము.
❇︎ ఆత్మానంద స్వారాజ్య సామ్రాజ్యమునందు రాజాధిరాజుగా అభిషిక్తులమై ఉంటాము.
❇︎ ఆత్మయందే సర్వలోకములందు ఇష్టానుసారముగా చరిస్తూ ఉంటాము.
అథ యే అన్యథాతో విదుర
అన్య రాజానః తే
‘క్షయ’ అలోకా భవన్తి।
తేషాం సర్వేషు లోకేషు
అకామచారో భవతి।।
అట్టి ఆత్మ గురించిన దర్శన, మనన , ఎరుకలను సిద్ధింప జేసుకొన్నవాడు -
- సమస్త లోకములలో ఇచ్ఛాపూర్వకంగా నిత్య స్వాతంత్రుడై సంచరించగలడు.

‘‘ఎవ్వడైతే ఆత్మ (లేక) పరమాత్మ (లేక) భూమ - అనునది నాకు వేరుగా ఎక్కడో ఉన్నది. ఎన్నటికో అది సిద్ధించాలి’’ - అని అనుకుంటాడో - అట్టివాడు మరొక ‘రాజు’కు లోబడి జీవిస్తున్నవానివలె ఉంటాడేగాని స్వాతంత్ర్యమగు మోక్షస్వరూపుడు కాలేడు.
❇︎ క్షయించు స్వభావముగల లోకములలోనే తిరుగాడుతూ ఉంటాడు.
❇︎ ఇచ్ఛానుసారంగా కాకుండా, అస్వతంత్రుడై ఉంటాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే పంచదశః ఖండః


7–26. సప్తమ ప్రపాఠకః - షడ్వింశ ఖండము - భూమా విద్యా ఉపాసన, అభ్యాస ఫలశృతి


తస్య హ వా ఏతస్యైవం పశ్యత ఏవం మన్వానస్యైవం విజానత
ఆత్మతః ప్రాణ ఆత్మత ఆశాత్మతః స్మర ఆత్మత ఆకాశ
ఆత్మతస్తేజ ఆత్మత ఆప ఆత్మత
ఆవిర్భావతిరోభావావాత్మతోఽన్నమాత్మతో బలమాత్మతో
విజ్ఞానమాత్మతో ధ్యానమాత్మతశ్చిత్తమాత్మతః
సంకల్ప ఆత్మతో మన ఆత్మతో వాగాత్మతో నామాత్మతో మంత్రా
ఆత్మతః కర్మాణ్యాత్మత ఏవేదగ్ంసర్వమితి .. 7.26.1..
1. తస్య హ వా ఏతస్య ఏవం
పశ్యత
ఏవం మన్వానస్య ఏవం విజానత
ఆత్మతః ప్రాణ। ఆత్మతః ఆశా।
ఆత్మతః ‘స్మర’ ఆత్మతః ఆకాశ।
ఆత్మతః తేజ। ఆత్మతః ఆప।
ఆత్మత ఆవిర్భావ - తిరోభావావ।
ఆత్మతో అన్నమ్।
ఆత్మతో బలమ్।
ఆత్మతో విజ్ఞానమ్।
ఆత్మతో ధ్యానమ్।
ఆత్మతః చిత్తం।
ఆత్మతః సంకల్ప।
ఆత్మతో మన।
ఆత్మతో వాక్।
ఆత్మతో నామా।
ఆత్మతో మంత్రా
ఆత్మతః కర్మాణి।
ఆత్మతః కార్యాత్।
ఆత్మత ఏవ ఇదగ్ం
సర్వమ్ - ఇతి।।
ఓ నారదా! ఎవ్వరైతే తమయొక్క వాస్తవ, అనునిత్య ఆత్మ (లేక) భూమా స్వరూపము గురించి చూడటము, మననము చేయటము, ఎరిగి ఉండటము సిద్ధించుకుంటారో - అట్టి ఆత్మతత్త్వజ్ఞాని (లేక) తత్త్వదర్శికి….ఈవిధంగా స్వాభావికానుభవం అవుతోంది.
✳︎ ఆత్మ వలననే ‘ప్రాణము’ - ప్రాణము ఆత్మయే।
✳︎ ఆత్మ వలననే ‘ఆశ’ - ఆశ ఆత్మస్వరూపమే।
✳︎ ఆత్మ వలననే స్మరణము - స్మరణము ఆత్మ స్వరూపమే।
✳︎ ఆత్మ వలననే తేజస్సు - తేజస్సు ఆత్మస్వరూపమే।
✳︎ ఆత్మ వలననే జలము - జలము ‘ఆత్మస్వరూపమే’।
✳︎ ఆత్మ వలననే ఆవిర్భావ - తిరోభావములు (రాక-పోకలు, జన్మ-మృత్యువులు). అట్టి ఆవిర్భావ తిరోభావములు ఆత్మస్వరూపమే।
✳︎ ఆత్మ వలననే అన్నము। అన్నము ఆత్మస్వరూపమే।
✳︎ ఆత్మ వలననే బలము। బలము ఆత్మస్వరూపమే।
✳︎ ఆత్మ చేతనే విజ్ఞానము (తెలివి)। విజ్ఞానము (తెలివి) ఆత్మ స్వరూపమే.
✳︎ ఆత్మ చేతనే ధ్యానము। ధ్యానము (ధ్యాస) ఆత్మస్వరూపమే।
✳︎ ఆత్మ చేతనే చిత్తము- చిత్తము ఆత్మ స్వరూపమే।
✳︎ ఆత్మ చేతనే మననము - మననము ఆత్మ స్వరూపమే!
✳︎ ఆత్మ చేతనే వాక్కు। వాక్కు ఆత్మస్వరూపమే।
✳︎ ఆత్మ చేతనే నామాత్మకమైనదంతా। నామరూపాత్మకమైనదంతా ఆత్మయే।
✳︎ ఆత్మ చేతనే మంత్రము। ‘మనావాత్ త్రాయతే’ అనబడు మంత్రము ఆత్మస్వరూపమే।
✳︎ ఆత్మ చేతనే కార్యము। సమస్త కార్యములు ఆత్మస్వరూపమే।
ఆత్మచేతనే ఈ కనబడుచున్న సమస్తము
సంకల్ప మాత్రంగా పరిఢవింపజేయబడుతోంది.

ఆత్మయే సత్యము.
ఆత్మ అనన్యము.
ఆత్మకు వేరై ఎక్కడా ఏదీ లేదు.


తదేష శ్లోకో న పశ్యో మృత్యుం పశ్యతి న రోగం నోత దుఃఖతాగ్ం
సర్వగ్ం హ పశ్యః పశ్యతి సర్వమాప్నోతి సర్వశ ఇతి
స ఏకధా భవతి త్రిధా భవతి పంచధా
సప్తధా నవధా చైవ పునశ్చైకాదశః స్మృతః
శతం చ దశ చైకశ్చ సహస్రాణి చ
విగ్ంశతిరాహారశుద్ధౌ సత్త్వశుద్ధౌ ధ్రువా స్మృతిః
స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్షస్తస్మై
మృదితకషాయాయ తమసస్పారం దర్శయతి
భగవాన్సనత్కుమారస్తగ్ం స్కంద ఇత్యాచక్షతే
తగ్ం స్కంద ఇత్యాచక్షతే .. 7.26.2..

.. ఇతి షడ్వింశః ఖండః ..

.. ఇతి సప్తమోఽధ్యాయః ..
2. తత్ ఏష శ్లోకః।
న పశ్యో మృత్యుం। పశ్యతి
న రోగం। నోత దుఃఖతామ్।
సర్వం హ పశ్యః పశ్యతి సర్వం
ఆప్నోతి సర్వశ ఇతి।
ఆత్మ గురించిన శ్లోకము (గానము) ఈ రీతిగా తత్త్వదర్శులచే చెప్పబడుతోంది.

ఆత్మగురించి భూమ, సమస్తము, స్వస్వరూపము దర్శిస్తూ, మననము చేస్తూ సవిజ్ఞాతుడైనవాడు -
❤︎ ఆతడు మృత్యువును చూడడు. ఆవల ఈవల ఏర్పడి ఉన్న ఆత్మామృతమునే చూస్తాడు.
❤︎ రోగమును చూడడు. దేహమునకు సాక్షి అగు దేహినే గమనిస్తాడు.
❤︎ దుఃఖమును చూడడు. సర్వత్రా ఆత్మానందమునే ఆస్వాదిస్తాడు.
❤︎ చూడబడేది చూడడు. ద్రష్టకు కూడా సాక్షి అగు ‘ఆత్మ’ లేక భూమ చూస్తాడు.
❤︎ సర్వము తానే అయి, సమస్తమును సర్వదా పొందినవాడై ఉంటాడు.
స ఏకధా (1) భవతి। త్రిధా (3) భవతి।
పంచధా (5) సప్తదా (7) నవధా (9) చ ఏవ।
పునశ్చ ఏకాదశః (11) స్మృతః।
శతం చ (100) దశ చ (10) ఏకశ్చ
సహస్రాణి (1000) చ వింశతిః (20)
✻ అట్టి ఆత్మ - మొట్టమొద{గా ఏకమే అయి ఉన్నది.
✻ ఆ ఏకమే త్రివిధములుగా (అనుభవి-అనుభవము-అనుభవింపబడునది Experiencer, Experiencing, Experienced)గా అగుచున్నది.
✻ ఆ తరువాత ‘5’గా, ‘7’గా, ‘9’గా అగుచున్నది.
✻ మరల ‘‘11’ స్మృతమగుచున్నది.
ఆ పరమాత్మయే ‘100’గా ‘10’గా, ఏకముగా, కూడా అగుచు లీలాగా కడు వేలాది రూపములుగా అయి వినోదిస్తున్నారు.
ఆహార శుద్ధౌ - సత్త్వశుద్ధిః।
సత్త్వశుద్ధౌ - ధ్రువా స్మృతిః।
స్మృతి లమ్భే…సర్వగ్రంథీనాం విప్రమోక్షః।
ఇదంతా కూడా స్వస్వరూపాత్మయొక్క ఆనంద లీలావినోదమే.
తస్మై మృదిత కషాయాయ
తమసః పారం దర్శయతి।
భగవాన్ సనత్కుమారః!
తం ‘స్కంద’ ఇతి ఆచక్షతే।।
తం ‘‘స్కంద’’ ఇతి ఆచక్షతే।।
అట్టి స్వస్వరూపాత్మకంగా సమస్తము కూడా సర్వదా అయి వినోదిస్తున్న భౌమానుభవం అప్రతిహతము, అనునిత్యము అవటానికై
‘‘ఇంద్రియానుభవముల శుద్ధి’’ అనబడే ఆహారశుద్ధిచే - సత్త్వము (బుద్ధి) శుద్ధి పొందగలడు.
బుద్ధియొక్క శుద్ధిచే - స్మృతి (ఆత్మగురించిన అనంతత్త్వ, అప్రమేయత్వ- ఇత్యాదుల జ్ఞాపకము) ధ్రువమౌతుంది.
స్మృతి లభిస్తూ ఉండగా - బ్రహ్మ - విష్ణు - రుద్ర గ్రంథులు విడివడతాయి. ‘సృష్టి నిజమే’ అనే నమ్మకము పటాపంచలౌతుంది.
దృశ్య సంబంధమైన భేదులన్నీ తొలగిపోగా తమస్సుకు (Ignorance) ఆవలగల ఆత్మయొక్క తత్త్వము సందర్శనమౌతుంది.

నారద మహర్షి: హే భగవాన్। సనత్కుమార సద్గురు వరేణ్యా। మీరు జీవాత్మ - పరమాత్మల తత్త్వము స్కందము (ఖండనము) చేసి ఏకస్వరూపమగు భూమా విద్యను ప్రసాదించారు.
అందుచేత మీరు ‘స్కందులు’గా స్తుతిస్తూ, నమస్కరిస్తున్నాము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - సప్తమాధ్యాయే షడ్వింశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది - సప్తమ అధ్యాయః సమాప్తః ।। 🌺


సామవేదాంతర్గత

Ⅷ.     ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పమ్ - ఎనిమిదవ అధ్యాయము

8–1. అష్టమ ప్రపాఠకః - ప్రథమః ఖండః - దహర విద్య


.. అష్టమోఽధ్యాయః ..

అథ యదిదమస్మిన్బ్రహ్మపురే దహరం పుండరీకం వేశ్మ
దహరోఽస్మిన్నంతరాకాశస్తస్మిన్యదంతస్తదన్వేష్టవ్యం
తద్వావ విజిజ్ఞాసితవ్యమితి .. 8.1.1..
1. హరిః ఓం। అథ।
యత్ ఇదమ్ అస్మిన్ బ్రహ్మపురే
దహరం పుణ్డరీకం వేశ్మ।
దహరో అస్మిన్ అంతరాకాశః।
తస్మిన్ యత్ అంతః
తత్ అన్వేష్టవ్యం।
తత్ వావ విజిజ్ఞాసితవ్యమ్।। ఇతి।।
అంతా ఓంకారానంద స్వరూపమే!
శిష్యుడు : గురువర్యా! నమో నమః శరీరధారులమై, దృశ్యములో సంచారము చేస్తున్న మేము - బ్రహ్మమును ఎట్లా వెతకాలి? ఎట్లా అన్వేషించి తెలుసుకోవాలి?
గురుదేవుడు : ఓ ఆత్మానంద స్వరూపులారా। వినండి. బ్రహ్మము, బ్రహ్మపురి గురించి - ఈ శరీరమే బ్రహ్మము ఉనికి కలిగియున్న ‘బ్రహ్మపురము’.
- అట్టి ఈ బ్రహ్మపురములో సమస్తమునకు ఉత్పత్తి స్థానమగు దహర (హృదయ) ఆకాశము.
- అట్టి దహరాకాశములో అంతర్ - హృదయమగు అంతరాకాశము అనే పుష్పము.
- అట్టి మనయొక్క అంతరాకాశములో అంతరముగా ఉన్నదే ఏమై ఉన్నదో…
- అద్దాని కోసము అన్వేషణ చేయాలి.
- అదియే తెలుసుకోవలసియున్నట్టిది.

తం చేద్బ్రూయుర్యదిదమస్మిన్బ్రహ్మపురే దహరం పుండరీకం వేశ్మ
దహరోఽస్మిన్నంతరాకాశః కిం తదత్ర విద్యతే యదన్వేష్టవ్యం
యద్వావ విజిజ్ఞాసితవ్యమితి స బ్రూయాత్ .. 8.1.2..
2. తం చేత్ బ్రూయుః యత్ ఇదమ్?
అస్మిన్ బ్రహ్మపురే
దహరం పుండరీకం వేశ్మ।
దహరో అస్మిన్ అంతరాకాశః।
కిం తత్ అత్ర విద్యతే యత్ అన్వేష్టవ్యం
యత్ వావ విజిజ్ఞాసితవ్యం?
ఇతి।। - స బ్రూయాత్।।
శిష్యుడు : అట్టి హృదయాకాశాంతర్గత పద్మములోగల అంతరాకాశములో ఏమి ఉన్నదో? ఎట్లా తెలుస్తుంది?
గురుదేవుడు : అట్టి బ్రహ్మపురములోని దహరాకాశములోని పుండరీకము (పద్మము)ను శోధన చేయాలి సుమా! అందులో అంతరాకాశము ఉన్నదయ్యా!
శిష్యుడు : అట్టి బ్రహ్మపుర - హృదయాకాశపు అంతరాకాశంలో ఏది వెతుకవలసినదో, ఏది తెలుసుకోవలసినదో - మాకు ఎట్లా అవగాహన కావాలి? జిజ్ఞాస కలిగి ఉండవలసినది దేని గురించి?

యావాన్వా అయమాకాశస్తావానేషోఽన్తర్హృదయ అకాశ
ఉభే అస్మింద్యావాపృథివీ అంతరేవ సమాహితే
ఉభావగ్నిశ్చ వాయుశ్చ సూర్యాచంద్రమసావుభౌ
విద్యున్నక్షత్రాణి యచ్చాస్యేహాస్తి యచ్చ నాస్తి సర్వం
తదస్మిన్సమాహితమితి .. 8.1.3..
3. యావాన్ వా అయమ్ ఆకాశః।
తావాన్ - ఏషో అంతర్ హృదయ ఆకాశ।
ఉభే అస్మిన్ ద్యావా - పృథివీ అంతరేవ సమాహితే।
ఉభావః అగ్నిశ్చ
వాయుశ్చ - సూర్యాః - చంద్రమసా।
గురుదేవుడు : బిడ్డా। ఈ ఎదురుగా కనిపిస్తున్న (పంచ భూతముల లోని) భౌతికాకాశము ఎంతగా అనంతమైయున్నదో అంతగానూ హృదయపద్మములోని ఆకాశము విస్తారము, అనంతము అయి ఉన్నది.
ఇక్కడి ఆకాశము, భూమి కూడా కళ్లకు బాహ్యముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ - ఈ రెండూ కూడా అంతరాకాశమునందే సమాహితము (Situated) అయి ఉన్నాయి.
అట్టి దహర (హృదయ) ఆకాశములోనే అగ్ని - వాయువు, సూర్య-చంద్రులు ఏర్పడినవై ఉన్నారు.
ఉభౌ విద్యుత్ - నక్షత్రాణి।
యత్ చ అస్య ఇహ అస్తి, యత్ చ నాస్తి…
సర్వం తత్ అస్మిన్
సమాహితం - ఇతి।।
ఇక్కడి విద్యుత్ (తేజోశక్తి), నక్షత్రములు ఉభయము కూడా హృదయాకాశములోనే ఉన్నాయి.
ఇక్కడ ఉన్నవన్నీ కూడా హృదయ పద్మములోని అంతరాకాశములోనే స్థానము కలిగియున్నవి.
అంతేకాదు. ఇక్కడ లేనివి కూడా। సర్వము అట్టి అంతరాకాశములో సమాహితమై (Having their place) ఉన్నాయి.

తం చేద్బ్రూయురస్మిగ్ంశ్చేదిదం బ్రహ్మపురే సర్వగ్ం సమాహితగ్ం
సర్వాణి చ భూతాని సర్వే చ కామా యదైతజ్జరా వాప్నోతి
ప్రధ్వగ్ంసతే వా కిం తతోఽతిశిష్యత ఇతి .. 8.1.4..
4. తం చేత్ బ్రూయుః
అస్మింశ్చేత్ ఇదం
బ్రహ్మపురే సర్వం సమాహితం।
సర్వాణి చ భూతాని। సర్వే చ కామా।
యత్ ఏతత్ జరా వా ఆప్నోతి
ప్రధ్వంసతే వా, కిం
తతో అతిశిష్యత? ఇతి।।
శిష్యుని ప్రశ్న : స్వామీ! ఈ ఇంద్రియములకు కనబడుచున్న సమస్తము ఈ భూత (జీవ) జాలము, సర్వజీవుల కామనములు (కోరికలు, ఆశలు, లక్ష్యములు) బ్రహ్మపురములోనే (హృదయము లోపలే) సమాహితమై ఉన్నాయని మాకు ఒక క్రొత్త విషయం బోధిస్తున్నారు.
అట్టి భూతజాలములు, వారి వారి కామనములు (Desires and Expectations) ఇవన్నీ కాలక్రమేణా వృద్ధాప్యము, మరణము పొందటం చూస్తున్నాము కదా! మరణము సంభవించిన తరువాత భూతజాల మంతా ఏమౌతోంది? ఇవన్నీ నశిస్తే ఆపై ఏమి శేషించి ఉంటోంది?

స బ్రూయాత్నాస్య జరయైతజ్జీర్యతి న వధేనాస్య హన్యత
ఏతత్సత్యం బ్రహ్మపురమస్మికామాః సమాహితాః ఏష
ఆత్మాపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో
విజిఘత్సోఽపిపాసః సత్యకామః సత్యసంకల్పో యథా హ్యేవేహ
ప్రజా అన్వావిశంతి యథానుశాసనం యం యమంతమభికామా
భవంతి యం జనపదం యం క్షేత్రభాగం తం తమేవోపజీవంతి .. 8.1.5..
5. స బ్రూయాత్।
న అస్య జరయ ఏతత్ జీర్యతి।
న వధేన అస్య హన్యత।
ఏతత్ సత్యం బ్రహ్మపురమ్
అస్మిన్ కామాః సమాహితా।
ఏష ఆత్మా అపహత పాప్మా,
విజరో విమృత్యుః విశోకో,
విజిఘత్సో అపిపాసః

సత్యకామః సత్యసంకల్పో
ఆచార్యులవారు : ఈ భౌతికశరీరము వార్ధక్యముచే బలహీనమవ వచ్చుగాక। కాల క్రమంగా నశించవచ్చు గాక। మనము చెప్పుకొన్న హృదయాకాశాంతర్గత పద్మములోని అంతరాకాశ స్వరూపమగు ఆత్మ వార్ధక్యము పొందదు. వధింపబడదు. మరణించదు. కామ సమాహితమగు బ్రహ్మపురము సత్యము. సర్వకామములు అట్టి బ్రహ్మస్వప్రకాశమునందు ఏర్పడినవై ఉంటాయి.
అట్టి బ్రహ్మమును పాపదోషములు స్పృశించవు. అది కాంతివలె నిత్యనిర్మలము. దానిని జర, మృత్యువు, శోకము, దాహము మొదలైనవి తాకలేవు. అది సత్యకామము. ఆత్మ ఏది కోరుకొంటుందో - అది సత్యమగుచున్నది.

సత్యసంకల్పము - ఆత్మ ఏది సంకల్పిస్తే అది సత్యము (ఏర్పడినదై) ఉండగలదు.
యథా హి ఏవ ఇహ ప్రజా।
అన్వావిశంతి, యథా అనుశాసనం
యం యమన్తమ్ అభికామా భవన్తి।
యం జనపదం, యం క్షేత్రభాగం,
తం తం ఏవ ఉపజీవంతి।
రాజుగారి ఆజ్ఞను అనుసరించే ఏవిధంగా ప్రజలు అనువర్తిస్తూ ఉంటారో, రాజు గారు కోరుకొనే విధంగా ఆయా స్థానములలో ఉంటారో, రాజాజ్ఞననుసరించే జనపదములు, క్షేత్రభాగములు ఏర్పడి ఉంటాయో, అట్లాగే హృదయాంతర్గతంగా చైతన్యమై వెలుగొందుచున్న ఆత్మయొక్క సంకల్పానుసారంగా, ఆజ్ఞానుసారంగా సంకల్పములు, భావములు, కామనలు, దేహముల వ్యవహారములు సంప్రవర్తితమై ఉంటున్నాయి. ఆత్మయే సమస్తమును ఉపజీవింపజేస్తోంది.

తద్యథేహ కర్మజితో లోకః క్షీయత ఏవమేవాముత్ర పుణ్యజితో
లోకః క్షీయతే తద్య ఇహాత్మానమనువిద్య వ్రజంత్యేతాగ్ంశ్చ
సత్యాన్కామాగ్ంస్తేషాగ్ం సర్వేషు లోకేష్వకామచారో
భవత్యథ య ఇహాత్మానమనివుద్య వ్రజంత్యేతగ్ంశ్చ
సత్యాన్కామాగ్ంస్తేషాగ్ం సర్వేషు లోకేషు కామచారో భవతి .. 8.1.6..

.. ఇతి ప్రథమః ఖండః ..
6. తత్ యథా ఇహ కర్మజితో
లోకః క్షీయత, ఏవం ఏవ
అముత్ర పుణ్యజితో, లోకః క్షీయతే।
శిష్యుడు : ఏఏ కర్మలఫలముగా మాకు ఆత్మజయము, మోక్షము, ఈ లోకముల నుండి బంధవిముక్తి లభించగలదు?
గురుదేవులవారు : కర్మలచేతనే ఇహ లోకము పొందబడుతోంది. కర్మల ఫలములు క్షీణిస్తూ ఉండగా ఇహలోకము ఆ కర్తపట్ల క్షీణము పొందగలదు. అట్లాగే పుణ్యఫలముచేత లభించే పుణ్య (స్వర్గాది) సుఖలోములు - కర్మఫలములు ఖర్చు అగుచుండగా - అవి క్షీణిస్తూ ఉంటాయి.
తత్ య ఇహ ఆత్మానం అననువిద్య వ్రజంతి
ఏతాంశ్చ సత్యాన్ కామాన్,
తేషాం సర్వేషు లోకేషు
అకామచారో భవతి।
ఎవ్వరైతే ఇక్కడనే తత్ ఆత్మవిద్య గురించిన మననముచే ఆత్మ స్వరూపము గురించి సునిశ్చితులు కారో - అట్టివారు సత్యకాములు కాలేరు. అట్టివారు ఆయా లోకములలో యథేచ్ఛానుసారంగా పొందరు. వారు కర్మవశులై పుణ్యపాప లోకములలో తిరుగాడుతూనే ఉండవలసివస్తోంది.
అథ య ఇహ ఆత్మానం అనువిద్య వ్రజంతి,
ఏతాంశ్చ సత్యాన్ కామాన్
తేషాం సర్వేషు లోకేషు
కామచారో భవతి।
ఎవ్వరైతే ఆత్మతత్త్వమును ఆత్మయొక్క ఔన్నత్యమును మనన విద్యచే తెలుసుకుంటారో -
వారు సత్యకాములౌతారు. వారు ఇచ్ఛానుసారంగా కోరుకొన్నది పొందగలరు. వారు సర్వలోకములలో తమ ఇష్ట సంకల్పములను అనుసరించి పొందగలుగు సామర్థ్యము పొందుచూ కామచారులు - (Wanderers as they wish) అగుచున్నారు. స్వాతంత్రులౌతారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే ప్రథమః ఖండః


8–2. అష్టమ ప్రపాఠకః - ద్వితీయః ఖండః - ఇచ్ఛానుసారం లోక ప్రాప్తి


స యది పితృలోకకామో భవతి సంకల్పాదేవాస్య పితరః
సముత్తిష్ఠంతి తేన పితృలోకేన సంపన్నో మహీయతే .. 8.2.1..
1. స యది పితృలోక కామో భవతి,
సంకల్పాత్ ఏవ అస్య పితరః సముత్తిష్ఠన్తి।
తేన పితృలోకేన సంపన్నో మహీయతే।
ఆత్మజ్ఞానము, ఆత్మదృష్టి, ఆత్మయేవాహమ్ భావన సిద్ధించుకున్నవాడు :
→ ఆతడు పితృలోకము కోరుకొంటే, సంకల్పమాత్రంగానే పితృగణములో ప్రవేశించి పితరుల మధ్య సముత్తిష్ఠత (Blossoming) పొందగలడు. పితృలోకములో సుసంపన్నుడై గౌరవించబడ గలడు. పూజనీయుడు కాగలడు. (ఉత్పత్తికి కారణమగుచున్నవారు పితరులు)

అథ యది మాతృలోకకామో భవతి సంకల్పాదేవాస్య మాతరః
సముత్తిష్ఠంతి తేన మాతృలోకేన సంపన్నో మహీయతే .. 8.2.2..
2. అథ యది మాతృలోక కామో భవతి,
సంకల్పాత్ ఏవ అస్య మాతరః సముత్తిష్ఠన్తి।
తేన మాతృలోకేన సంపన్నో మహీయతే।।
→ ఆతడు (ఆత్మవంతుడు) మాతృలోకము కోరుకొంటే సంకల్పము చేతనే (కర్మలయొక్క ఆవస్యకత లేకుండానే) మాతృగణము మధ్య ఉపస్థితుడు కాగలడు.
మాతృలోకప్రాప్తి సంపన్నుడై పూజింపబడగలడు.
ఆతని ప్రవేశముచే మాతృలోకము సుసంపన్నమై ప్రకాశించగలదు.

అథ యది భ్రాతృలోకకామో భవతి సంకల్పాదేవాస్య భ్రాతరః
సముత్తిష్ఠంతి తేన భ్రాతృలోకేన సంపన్నో మహీయతే .. 8.2.3….
3. అథ యది భ్రాతృలోక కామో భవతి,
సంకల్పాత్ ఏవ అస్య భ్రాతరః సముత్తిష్ఠన్తి।
తేన భ్రాతృలోకేన సంపన్నో మహీయతే!
→ భ్రాతృలోకం కోరుకుంటే భ్రాతృలోకంలో సంకల్పము చేతనే ప్రవేశించి ఆశీనుడు కాగలడు.
ఆతడు ప్రవేశము పొంది భ్రాతృలోకంలో సుసంపన్నుడై కీర్తించబడగలడు.

అథ యది స్వసృలోకకామో భవతి సంకల్పాదేవాస్య స్వసారః
సముత్తిష్ఠంతి తేన స్వసృలోకేన సంపన్నో మహీయతే .. 8.2.4..
4. అథ యది స్వసృలోక కామో భవతి
సంకల్పాత్ ఏవ అస్య స్వసారః సముత్తిష్ఠన్తి।
తేన స్వసృలోకేన సంపన్నో మహీయతే!
→ ఆతడు స్వసృ (అక్క-చెల్లెళ్ళ) లోకము కోరుకొనువాడైతే, ఆతడు సంకల్పించినంతమాత్రంచేత సహోదరీమణులు ఆతడు ఉన్నచోట ఉపస్థితులు కాగలరు. సోదరీలోకము (భగినీలోకము)చే సుసంపన్నుడై ఆతడు ‘మహిమాన్వితుడు’ అగుచున్నాడు.

అథ యది సఖిలోకకామో భవతి సంకల్పాదేవాస్య సఖాయః
సముత్తిష్ఠంతి తేన సఖిలోకేన సంపన్నో మహీయతే .. 8.2.5..
5. అథ యది సఖిలోక కామో భవతి
సంకల్పాత్ ఏవ, అస్య సఖాయః సముత్తిష్ఠన్తి,
తేన సఖిలోకేన సంపన్నో మహీయతే।।
→ సఖీ లోకము కావాలని కోరుకుంటే సంకల్పంచేతనే సఖీలోక వాసులు ఆతని వద్దకు రాగలరు. ఆతనిని సమీపించి ఆశీనులు కాగలరు. ఆతడు సఖీ లోకముచే మహిమ పొందగలడు.

అథ యది గంధమాల్యలోకకామో భవతి సంకల్పాదేవాస్య
గంధమాల్యే సముత్తిష్ఠతస్తేన గంధమాల్యలోకేన సంపన్నో
మహీయతే .. 8.2.6..
6. అథ యది గంధమాల్య లోక కామో భవతి,
సంకల్పాత్ ఏవ అస్య (గంధమాల్యే) సముత్తిష్ఠతః,
తేన గంధమాల్య లోకేన సంపన్నో మహీయతే।।
→ ఆతడు గంధమాల్య లోకము ఇచ్ఛరిస్తే, సంకల్పించినంత మాత్రంచేత గంధర్వలోకమువారు ఆయన వద్దకు వచ్చి కూర్చుంటారు. గంధర్వ లోకవాసులతో సుసంపన్నుడై మహిమాన్వితుడవగలడు.

అథ యద్యన్నపానలోకకామో భవతి సంకల్పాదేవాస్యాన్నపానే
సముత్తిష్ఠతస్తేనాన్నపానలోకేన సంపన్నో మహీయతే .. 8.2.7..
7. అథ యది అన్నపాన లోక కామో భవతి,
సంకల్పాత్ ఏవ అస్య అన్నపానే సముత్తిష్ఠతః।
తేన అన్నపాన లోకేన సంపన్నో మహీయతే।।
→ ఆతడు అన్నపాన లోకవిశేషాలు కావాలనుకుంటే సంకల్పం చేతనే అన్నపానములు ఆయన వద్దకు చేరగలవు. అన్నపానములచే సంపన్నుడై శ్రీపూజ్యుడు కాగలడు.

అథ యది గీతవాదిత్రలోకకామో భవతి సంకల్పాదేవాస్య
గీతవాదిత్రే సముత్తిష్ఠతస్తేన గీతవాదిత్రలోకేన సంపన్నో
మహీయతే .. 8.2.8..
8. అథ యది గీతవాదిత్ర లోక కామో భవతి,
సంకల్పాత్ ఏవ అస్య గీతవాదిత్రే సముత్తిష్ఠతః।,
తేన గీతవాదిత్ర లోకేన సంపన్నో మహీయతే।।
→ ఆతడు గీతవాద్యములు (Music / Music Instruments) కోరుకుంటే సంకల్పముచే గీతావాద్యములు ఆతని సమక్షమును చేరగలవు. గీతవాద్యములచే సుసంపన్నుడై పూజనీయుడు కాగలడు.

అథ యది స్త్రీలోకకామో భవతి సంకల్పాదేవాస్య స్త్రియః
సముత్తిష్ఠంతి తేన స్త్రీలోకేన సంపన్నో మహీయతే .. 8.2.9..
9. అథ యది స్త్రీ లోక కామో భవతి,
సంకల్పాత్ ఏవ అస్య స్త్రియః సముత్తిష్ఠన్తి।
తేన స్త్రీలోకేన సంపన్నో మహీయతే।।
→ స్త్రీలోకము కోరుకుంటే సంకల్పమాత్రంచేత స్త్రీలు ఆతని వద్ద ఆశీనులు కాగలరు. అటు స్త్రీ లోకవాసులచే సుసంపన్నుడై గౌరవనీయుడు అగుచున్నాడు.

యం యమంతమభికామో భవతి యం కామం కామయతే సోఽస్య
సంకల్పాదేవ సముత్తిష్ఠతి తేన సంపన్నో మహీయతే .. 8.2.10..

.. ఇతి ద్వితీయః ఖండః ..
10. యం యం అన్తమ్ అభికామో భవతి,
యం కామం కామయతే, సో అస్య
సంకల్పాత్ ఏవ సముత్తిష్ఠతి।
తేన సంపన్నో మహీయతే।।
ఈ సమస్తము స్వస్వరూపాత్మగా దర్శించుచూ, ఉపాసించుచు, విజ్ఞేయుడైనవాడు.
- దేనిదేనికి ఆవల ఆతడు ఇచ్ఛగిస్తాడో,
- ఏదేది కోరుకొంటాడో అవన్నీ ఆతడు సంకల్పించినంత మాత్రంచేత పొందగలడు. ఆతనిని అవి సమీపించగలవు. వాటితో సుసంపన్నుడై మహిమాన్వితుడై ఉండగలడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే ద్వితీయః ఖండః


8–3. అష్టమ ప్రపాఠకః - తృతీయః ఖండః - సత్యమును ఆవరించియున్న అసత్యమును వివేకముతో దర్శించుట


త ఇమే సత్యాః కామా అనృతాపిధానాస్తేషాగ్ం సత్యానాగ్ం
సతామనృతమపిధానం యో యో హ్యస్యేతః ప్రైతి న తమిహ
దర్శనాయ లభతే .. 8.3.1..
1. త ఇమ సత్యాః కామా
అనృతాపిదానాః, తేషాం
సత్యానాం సతాం
అనృతమ్ అపిధానం।
యో యో హి అస్య ఏతః
ప్రైతి, - న తమ్ ఇహ
దర్శనాయ లభతే।
(కిం తు తత్ ప్రియమ్ సంబంధమ్ న తు సత్యమ్)।
గురువరేణ్యుడు : ఆత్మస్వరూపులగు ప్రియ అధ్యయనులారా! సత్యకామములు ఇక్కడ అనృతము (అసత్యము)చే కప్పబడి ఉంటున్నాయి. సత్యము సర్వదా సత్యమే అయి ఉండి కూడా, అనృతము (అసత్యము) అసత్యమే అయి ఉండి కూడా - సత్యమును అసత్యము కప్పి ఉంచుతోంది. ఎంతటి చమత్కారం! లోక సంబంధమైన భావ - అనుభూతి ఆవేశములు మొదలైనవి చేస్తున్నదేమిటి? ‘లేనిది’ వచ్చి ఉన్నదానిని కప్పి ఉంచటం!

ఇందుకు ఒక దృష్టాంతం చెప్పుకుందాము
ఈ జీవునికి తల్లి, తండ్రి, సోదరులు, భార్య, పిల్లలు, స్నేహితులు - ఇటువంటి ఆయా తదితరులతో అనేక ప్రియసంబంధములు ఏర్పడినవై ఉంటున్నాయి. అయితే ఆతనికి అత్యంత ప్రియమైన బంధువు మరణించిన తరువాత - ఆతడు మరల కనిపిస్తున్నాడా? లేదు. అనగా ఈ కనబడేవి అశాశ్వత - కల్పిత సంబంధములే కదా!

అథ యే చాస్యేహ జీవా యే చ ప్రేతా యచ్చాన్యదిచ్ఛన్న
లభతే సర్వం తదత్ర గత్వా విందతేఽత్ర హ్యస్యైతే సత్యాః
కామా అనృతాపిధానాస్తద్యథాపి హిరణ్యనిధిం నిహితమక్షేత్రజ్ఞా
ఉపర్యుపరి సంచరంతో న విందేయురేవమేవేమాః సర్వాః ప్రజా
అహరహర్గచ్ఛంత్య ఏతం బ్రహ్మలోకం న విందంత్యనృతేన హి
ప్రత్యూఢాః .. 8.3.2..
2. అథ యే చ అస్య ఇహ
జీవా యే చ ప్రేతా, యత్ చ
అన్యత్ ఇచ్ఛన్ న లభతే సర్వం।
తత్ అత్ర గత్వా విందతే।
ఈ జీవుడు జాగ్రత్‌లో జీవించిననాటి నుండి మరణించేవరకు అనేక ఇచ్ఛలు (Expectations) కలిగి ఉండి, అవన్నీ నెరవేరక - ‘‘అయ్యో! పిల్లలు నా మాట వినరు కదా! ఈ బంధువులు నేను అనుకున్నట్లు ఉండరు’’ - అని తలుస్తూ ఏదీ ఇచ్ఛానుసారంగా ఉండక దుఃఖితుడు అగుచున్నాడు. ఆతడే గాఢనిద్రలోకి జారుకున్నప్పుడో? ఆ అసంతృప్తులు ఉండక నిద్రపోయి ‘‘రాత్రి హాయిగా నిద్రపోయాను కదా’’ అని అనుభవము పొందుచున్నాడు. నిద్రపోయినప్పుడు అన్నీ మరచి నిద్రలో ఆనందంగా ఎట్లా ఉండటం జరుగుతోంది?
అత్ర హి అస్య ఏతే సత్యాః
కామాః అనృతాపిధానాః।
ఎందుకంటే ఆతని సత్యకామము (ఆత్మపట్ల అనుభవము) జాగ్రత్‌లో అసంఖ్యాకమైన విషయములచే కప్పబడి ఉంటోంది కాబట్టే।
తత్ యథ అపి హిరణ్యనిధిం
నిహితమ్ అక్షేత్రజ్ఞా
ఉపరి ఉపరి సన్చరన్తో న విందేయుః।
అది ఏవిధంగానంటే - ఇక్కడ ఒక దృష్టాంతం చెప్పుకుందాము.
ఒకడు తీర్థయాత్రలకు వెళ్లుచూ బంగారు మూటను దొడ్లో నేలలో పాతిపెట్టాడు. కొన్నాళ్ళ తరువాత తిరిగివచ్చి, ఎక్కడ పాతిపెట్టాడో తెలియక, పాతిపెట్టినచోటే నేలపై తిరుగాడుతూనే తన బంగారు నిధి - నిక్షిప్తమును ఏమరచి, పేదతనము యొక్క దుఃఖము అనుభవించటము వంటిది అది.
ఏవం ఏవ ఇమాః సర్వాః
ప్రజా అహరహః
గచ్ఛన్తి య ఏతం
బ్రహ్మలోకం న విన్దన్తి
అనృతేన హి ప్రత్యూఢాః।
ఈ జీవుడు నిద్రలోకి వెళ్లినప్పుడు స్వస్వరూప బ్రహ్మము వేంచేసియున్న బ్రహ్మలోకమునకు వెళ్లి, నిర్విషయ బ్రహ్మానందమును రుచి చూచి వస్తూ ఉన్నాడు, కాబట్టే - ‘‘నిద్రలో హాయిగా ఉన్నాను’’ - అని అనుకొంటున్నాడు. నిద్ర లేచి ఆ (నిద్రలోని) హాయిని ఏమరచి, ఆ బ్రహ్మానుభావముపై అనృతమగు లోక (బంధు ఇత్యాది) సంబంధములను (అసత్యములైన వాటిని) కప్పి ఉంచటం చేత -‘‘నాకు ఆనందం లేదేమి? అని వేదన పడుచున్నాడు. ఆ దుఃఖములు దృశ్యము నుండి ప్రాప్తిస్తున్నాయేమో?’’ అని అనుకుంటున్నాడు. తన దగ్గర గల బ్రహ్మానందమును వదలి, బంధువులనుండి, తదితరుల నుండి ఆనందంకోసం దేవులాడుచున్నాడు.

స వా ఏష ఆత్మా హృది తస్యైతదేవ నిరుక్తగ్ం హృద్యయమితి
తస్మాద్ధృదయమహరహర్వా ఏవంవిత్స్వర్గం లోకమేతి .. 8.3.3..
3. స వా ఏష ఆత్మా హృది।
తస్య ఏతత్ ఏవ నిరుక్తం
హృద్యమ్ ఇతి।
తస్మాత్ హృదయం అహరహర్వా
ఏవం విత్ స్వర్గం లోకం ఏతి।
ఏ పరమాత్మ కోసమై ఈ జీవుడు తచ్చాడుచున్నాడో, అది సర్వదా ఆతని హృదయమునందే వేంచేసియుండి, వేయికాంతులతో వెలుగొందుతోంది.

హృదయము - శబ్దార్థము (నిరుక్తము) ఎట్లా అంటే - ‘‘హృత్-అయమ్’’

అయమ్ ఋత్ -హ ‘‘పరమసత్యమగు ఆత్మ ఇక్కడే ఉన్నది’’ పరమాత్మ హృదయమునందే విద్యమానమై ఉన్నది. నీలోనే ఆత్మ ఉన్నది. మరెక్కడో కాదు. ఈ విధంగా ‘‘ఆత్మగల స్థానమే హృదయము’’ అని ఎరిగినవాడు - స్వర్గలోకము (బ్రహ్మము) ఇప్పుడే ఇక్కడే అనునిత్యంగా పొందగలడు.

అథ య ఏష సంప్రసాదోఽస్మాచ్ఛరీరాత్సముత్థాయ పరం
జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యత ఏష ఆత్మేతి
హోవాచైతదమృతమభయమేతద్బ్రహ్మేతి తస్య హ వా ఏతస్య
బ్రహ్మణో నామ సత్యమితి .. 8.3.4..
4. అథ య ఏష సంప్రసాదో
అస్మాత్ శరీరాత్ సముత్థాయ
పరంజ్యోతిః ఉపసంపద్య।
స్వేన రూపేణ అభినిష్పద్యత ఏష ఆత్మ ఇతి।

హ ఉవాచ : ఏతత్ అమృతమ్
అభయమ్। ఏతత్ బ్రహ్మేతి।।
తస్య హ వా ఏతస్య బ్రహ్మణో
నామ సత్యమితి।।
ఎవ్వడైతే సత్ (బాహ్మీదృష్టి)చే జాగ్రత్ -స్వప్నములోని అసత్‌భావనల సంయోగముచే ఏర్పడే కాలుష్యమును పరిశుభ్రపరచుకొని ప్రసాదుడు (నిర్మలుడు, ప్రసన్నుడు) అవుతాడో - అట్టి సంప్రసాదుడు - ఈ శరీర సంబంధ భావములను దాటివేసి, పరంజ్యోతి స్వరూపమును సంతరించుకున్నవాడై, తనయొక్క సహజ రూపమునందు సుసంపన్నుడు అగుచున్నాడు. ఈ జీవుని సహజరూపం ‘ఆత్మ’ కాబట్టి ‘జీవాత్మ’ - అనబడుచున్నాడు.

(గురుదేవులు ఇంకా ఇట్లా అంటున్నారు)
అట్టి ఈ జీవుని నిత్యసత్య సహజరూపము ఇప్పటికిప్పుడు స్వానుభవమవటమే - అమృతము। అభయమ్। అదియే బ్రహ్మము! అట్టి బ్రహ్మమే నామాత్మకంగా సత్యము - అయి ఉన్నది.

తాని హ వా ఏతాని త్రీణ్యక్షరాణి సతీయమితి
తద్యత్సత్తదమృతమథ యత్తి తన్మర్త్యమథ యద్యం తేనోభే
యచ్ఛతి యదనేనోభే యచ్ఛతి తస్మాద్యమహరహర్వా
ఏవంవిత్స్వర్గం లోకమేతి .. 8.3.5..

.. ఇతి తృతీయః ఖండః ..
5. తాని హ వా ఏతాని త్రీణి
అక్షరాణి ‘‘సతీయమ్’’ ఇతి।
తత్ యత్ సత్ తత్ అమృతమ్।
అథ యత్తి। తన్మర్త్యమ్।
అథ యద్యం తేన ఉభే యచ్ఛతి।
యత్ అనేన ఉభే యచ్ఛతి।
తస్మాత్ యమ్ అహరహర్వా
ఏవం విత్ స్వర్గం లోకం ఏతి।
‘‘సత్యము’’ అను శబ్దము - ‘స’ కారముతో, ‘త’ కారముతో, ‘యమ్’ కారముతో కూడి త్రీణి (3) అక్షరములతో ‘‘సతీయమ్’’ అగుచున్నది.
అందులో
‘‘స’’ = సత్ - తత్ = ‘‘అమృతము’’
‘‘తీ’’ = ఇతి - ఇదం = ‘‘మర్త్యము’’
‘‘యమ్’’ = ఏదైతే - ఏదైతే ‘స’ ‘త’లను ఏకము చేయుచున్నదో…
ఏది ‘‘పర-ఇహము’’లను ఏకము చేయునో అదే ‘యమ్’.
అందుచేత రాత్రింబవళ్లు సత్యమును అనగా పర-ఇహములను అభేదదృష్టితో ఏకము చేసి దర్శించువాడు - స్వాభావికంగానే ఇప్పుడే, ఇక్కడే స్వర్గలోకము (బ్రాహ్మీస్థానము) సిద్ధించుకుంటున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే తృతీయః ఖండః


8–4. అష్టమ ప్రపాఠకః - చతుర్థః ఖండః - జీవితమును ఆత్మానుభవమునకు సేతువుగా దర్శించుట


అథ య ఆత్మా స సేతుర్ధృతిరేషాం లోకానామసంభేదాయ
నైతగ్ం సేతుమహోరాత్రే తరతో న జరా న మృత్యుర్న శోకో న
సుకృతం న దుష్కృతగ్ం సర్వే పాప్మానోఽతో
నివర్తంతేఽపహతపాప్మా హ్యేష బ్రహ్మలోకః .. 8.4.1..
1. అథ య ఆత్మా, స సేతుః విధృతిః।
ఏషాం లోకానామ్ అసంభేదాయ
నైతం సేతుం అహోరాత్రే।
ఈ జీవాత్మ సందర్భము - పరమాత్మ సిద్ధికై సేతువువలె (Like a Bridge) ధారణము చేయబడినట్టిది.
అట్టి బ్రహ్మలోకము (బ్రహ్మీస్థానము)తో అహోరాత్రములు ఆత్మోపాసన - ఇహమును పరముతో ఏకము చేయటమే సాధన.
తరతో న జరా। న మృత్యుః।
న శోకో, న సుకృతం న దుష్కృతం।
సర్వే పాప్మానో అతో నివర్తన్తే,
అపహత పాప్మా హి।
ఏష ‘బ్రహ్మలోకః’।
అట్టి అనుక్షణికమగు ‘‘సత్యము’’ (అమృత-మర్త్య - Changeless and Changing zones of Self) యొక్క ఆత్మసిద్ధి పొందినవారికి
- వార్ధక్యము ఉండదు. దానిని వారు బాహ్య వస్తువుయొక్కమార్పు చేర్పులుగా చూస్తారు.
- అప్పుడు మృత్యువు లేనిదే అవుతుంది. ఈ శరీరములు వారికి దుస్తులు మార్చటముతో సమానము.
- శోకము ఉండదు. లోకభావనలు దాటివేసి, సర్వత్రా తనకు వేరుకాని ఆత్మనే చూస్తున్నవానికి ఇక దేనికొరకు శోకించాలి.
- సుకృత - దుష్కృతాలు ఉండవు. జాగ్రత్తు - స్వప్నం అసత్ మాత్రమైనప్పుడు అవెక్కడుంటాయి? సర్వపాపదృష్టులు (దోష - అల్పదృష్టులు) తొలగిపోగా సర్వత్రా బ్రహ్మమే దర్శిస్తూ ఉంటాడు.
అదియే ‘‘బ్రహ్మలోకము’’ అనబడుతోంది.

తస్మాద్వా ఏతగ్ం సేతుం తీర్త్వాంధః సన్ననంధో భవతి
విద్ధః సన్నవిద్ధో భవత్యుపతాపీ సన్ననుపతాపీ భవతి
తస్మాద్వా ఏతగ్ం సేతుం తీర్త్వాపి నక్తమహరేవాభినిష్పద్యతే
సకృద్విభాతో హ్యేవైష బ్రహ్మలోకః .. 8.4.2..
2. తస్మాత్ వా ఏతం సేతుం తీర్త్వా, అంధః,
సన్ అనంధో భవతి।
విద్ధః సన్నవిద్ధో భవతి।
ఉపతాపీ సన్ అనుపతాపీ భవతి।।
‘‘ఇహ-పర’’, ‘‘జీవాత్మ-పరమాత్మ’’ ద్వంద్వముల ఏకత్వరూపసేతువు, అగు ‘‘సత్యము’’ను సిద్ధించుకున్నవాడు.
ఇతఃపూర్వపు అజ్ఞానాంధకారమంతా తొలగిపోయి, కళ్లు తెరచి, సమస్తమును ‘ఆత్మ’ (లేక) సత్యము అనే వెలుగులో చూస్తూ ఉన్న వాడగుచున్నాడు.
విద్ధుడు - ఎడబాటు పొందుతూ కూడా ఎడబాటు (Missing) లేనివాడై ఉంటున్నాడు.
బాధలు, తాపములు పొందుతూ కూడా ఏ తాపములు, బాధలు లేనివాడై ఉంటున్నాడు. సంకటములు ఉండి కూడా అవేవీ లేనివాడై ఉంటున్నాడు.
తస్మాత్ వా ఏతం సేతుం తీర్త్వా అపి నక్తమ్ -
అహరేవ - అభినిష్పద్యతే।
సకృత్ విభాతో హి ఏవ ఏష బ్రహ్మలోకః।।

జీవాత్మ - పరమాత్మల భేదము జయించి సత్యమును ఆశ్రయించువాడు రాత్రిని కూడా పగలుతో సమానంగా ఆస్వాదించగలడు.
ఆతడు బ్రహ్మముగా ప్రకాశిస్తూ బ్రహ్మలోకము సిద్ధించుకొంటున్నాడు.


తద్య ఏవైతం బ్రహ్మలోకం బ్రహ్మచర్యేణానువిందంతి
తేషామేవైష బ్రహ్మలోకస్తేషాగ్ం సర్వేషు లోకేషు కామచారో
భవతి .. 8.4.3..

.. ఇతి చతుర్థః ఖండః ..
3. తత్ య ఏవ ఏతం బ్రహ్మలోకం,
బ్రహ్మచర్యేణ అనువిన్దన్తి
తేషామ్ ఏవ ఏష బ్రహ్మలోకః।
తేషాం సర్వేషు లోకేషు
కామచారో భవతి।।
ఎవ్వరు అట్టి ‘‘బ్రహ్మమునందే ఆచారము-సంచారము’’ సంసిద్ధింపజేసుకుంటారో - వారు బ్రహ్మలోకవాసులై బ్రహ్మానందమును ఆస్వాదించగలరు.
బ్రహ్మముగా సమస్తమును దర్శిస్తూ అమృత-జీవాత్మలను వారధిచే ఏకము చేయుచుండటమే ‘‘బ్రహ్మలోకము’’.
అట్టివారు 14 లోకములలో తమ ఇష్టానుసారం, స్వాతంత్రులై విహారము సిద్ధించుకొనుచున్నారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే చతుర్థః ఖండః


8–5. అష్టమ ప్రపాఠకః - పంచమః ఖండః - యజ్ఞవిధిలో బ్రహ్మచర్య ఆశయము దర్శించుట


అథ యద్యజ్ఞ ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ
హ్యేవ యో జ్ఞాతా తం విందతేఽథ యదిష్టమిత్యాచక్షతే
బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ హ్యేవేష్ట్వాత్మానమనువిందతే .. 8.5.1..
1. అథ యత్ ‘యజ్ఞం’ ఇతి ఆచక్షతే,
బ్రహ్మచర్యమేవ।
తత్ బ్రహ్మచర్యేణ హి ఏవ యో
జ్ఞాతా తం విన్దతే।
అథ యదిష్టమ్ ఇతి
ఆచక్షతే,…బ్రహ్మచర్యమేవ।
తత్, బ్రహ్మచర్యేణ హి ఏవ
ఇష్ట్వా ఆత్మానమ్ అనువిందతే।।
బ్రహ్మచర్యము అనగా : బ్రహ్మము యొక్క అధ్యయనము, ‘‘బ్రహ్మమునందు బ్రహ్మమై చరిస్తున్నాను’’ అను రూపమగు ‘‘బ్రహ్మవిద్య’’, బ్రహ్మము గురించిన అధ్యాయన విద్యార్థిత్వము.
‘‘యజ్ఞము నిర్వర్తించటము’’ - అనగా అది బ్రహ్మము గురించిన అభ్యాసమే। బ్రహ్మచర్యమే।
బ్రహ్మచర్యములో ఏ బ్రహ్మజ్ఞాన - ఆనందము లభిస్తూ వస్తుందో - అది ఇష్టము (యజ్ఞకర్మ సంస్కారము, శాస్త్రవిహిత పూజ ఇత్యాదిగా) - అనబడుతోంది. ఇష్టములు - బ్రహ్మచర్యమే!
ఎందుచేతనంటే - అట్టి బ్రహ్మ చర్యము చేత ఆత్మతత్త్వప్రాప్తియే సిద్ధించగలదు. అట్లాగే యజ్ఞయాగముల ముఖ్యాశయము కూడా అదే.

అథ యత్సత్త్రాయణమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ
హ్యేవ సత ఆత్మనస్త్రాణం విందతేఽథ యన్మౌనమిత్యాచక్షతే
బ్రహ్మచర్యమేవ తబ్బ్రహ్మచర్యేణ హ్యేవాత్మానమనువిద్య మనుతే ’.. 8.5.2..
2. అథ యత్ సత్రాయణమ్
ఇతి ఆచక్షతే, బ్రహ్మచర్యమేవ।।
తత్ బ్రహ్మచర్యేణ హి ఏవ
సత ఆత్మనః ‘‘త్రాణం’’ విన్దతే।
అథ యత్ ‘‘మౌనం’’ ఇతి
ఆచక్షతే బ్రహ్మచర్యం ఏవ
తత్ బ్రహ్మచర్యేణ హి ఏవ
ఆత్మానమ్ అనువిద్య మనుతే।।
ఏది ‘సత్రయాగము’ అని (వేదములలో) అభివర్ణించబడి, విధివిధానంగా వేదములచే మానవాళికి ప్రసాదించబడుచున్నదో - అది బ్రహ్మచర్యమే।
ఎందుకంటే ఆ సందర్భంలో బ్రహ్మచర్యము చేతనే - సత్ ‘‘ర’’ యాగము - పరమాత్మతో త్రాణ (Lively) పొందుచున్నాడు.
ఇప్పుడిక ఏది ‘మౌనము’ అని చెప్పబడుచున్నదో - అది బ్రహ్మచర్యమే।
ఎందుకంటే, అట్టి మౌనము (ఇంద్రియ విషయములను అంటించు కోకుండా ఉండటము)- బ్రహ్మము పట్ల మనస్సును ఉంచు అనువిద్య (లేక) విద్యార్జనయే। (ఇదియే ప్రత్యాహారము కూడా।)

అథ యదనాశకాయనమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తదేష
హ్యాత్మా న నశ్యతి యం బ్రహ్మచర్యేణానువిందతేఽథ
యదరణ్యాయనమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తదరశ్చ హ వై
ణ్యశ్చార్ణవౌ బ్రహ్మలోకే తృతీయస్యామితో దివి తదైరం
మదీయగ్ం సరస్తదశ్వత్థః సోమసవనస్తదపరాజితా
పూర్బ్రహ్మణః ప్రభువిమితగ్ం హిరణ్మయం .. 8.5.3..
3. అథ యత్ అనాశకాయనమ్
ఇతి ఆచక్షతే।
బ్రహ్మచర్యమేవ -
‘‘తత్, ఏష హి ఆత్మా న నశ్యతి,
యం బ్రహ్మచర్యేణ అనువిన్దతే।
ఆహారము స్వీకరించకుండా ఉండే ‘‘ఉపవాసము’’ అనే వ్రతము కూడా ‘‘బ్రహ్మచర్యమే’’ అని చెప్పబడుతోంది.
ఏది ‘‘నాశనము లేదు’’ అని అనుకోబడుతూ, భావించబడుతోందో అది కూడా బ్రహ్మచర్యమే। అదే నష్టము చెందనిది, ఆకాశము, బ్రహ్మ విద్య కూడా।
బ్రహ్మచర్యముచే ‘‘ఆత్మ నాశనము లేనిది’’ అని ఆనందించబడుచున్నది. - అది ‘‘బ్రహ్మచర్యము’’ వైపుగానే ఉద్దేశ్యించ బడుతోంది కదా!
అథ యత్ అరణ్యాయనమ్
ఇతి - ఆచక్షతే…,
బ్రహ్మచర్యమేవ।
ఏది అరణ్యాయనము (వనవాసము) అని (సాధన కొరకై అరణ్యములో ప్రవేశించి, సాధన కొనసాగించటము) అది కూడా ‘బ్రహ్మచర్యము’ గానే చూడబడుతోంది.
తత్ తత్ అరః చ హ వై ణ్యః చ
ఆర్ణవౌ బ్రహ్మలోకే।
తృతీయస్యాం ఇతో దివి
తేదైరం మదీయం సరస్తత్
అశ్వత్థః సోమ సవనః
తత్ అపరాజితా పూః - బ్రహ్మణః
ప్రభువిమితం - హిరణ్మయమ్।।
బ్రహ్మలోకములో (1) ‘అర’ (త్వరితము, విచారణ) (2) ణ్య (మననము, Application)) అనే రెండు సముద్రములున్నాయి. ఈ రెండు బ్రహ్మలోకమార్గములు (భూమి, అంతరిక్షములు). ఇక మూడవది ఐరము. దివి (దేవలోకము) ‘మదీయ’ సరస్సు (తనకు ఉపయోగించువానికి ముదము కలిగించునది). ‘‘ఐర, మదీయం’’ అని కూడా ఈ సరస్సుకు పేరు. అక్కడ ‘‘సోమసవనము’’ అనే అశ్వత్థవృక్షము. ఇది అమృత వృక్షము. బ్రహ్మచర్య సాధన గల వారిచేత మాత్రమే దాటబడగలదు. అక్కడనే ‘‘అపరాజిత’’ పురము. అందులో ‘‘ప్రభు నిమిత్తము’’ సువర్ణ మండపము.

తద్య ఏవైతవరం చ ణ్యం చార్ణవౌ బ్రహ్మలోకే
బ్రహ్మచర్యేణానువిందంతి తేషామేవైష బ్రహ్మలోకస్తేషాగ్ం
సర్వేషు లోకేషు కామచారో భవతి .. 8.5.4..

.. ఇతి పంచమః ఖండః ..
4. తద్య ఏవైతావరం చ
‘‘ణ్యం’’ చ ఆర్ణవే బ్రహ్మలోకే
బ్రహ్మచర్యేణ అనువిన్దన్తి।।
తేషామ్ ఏవైష బ్రహ్మలోకః।
తేషాం సర్వేషు లోకేషు
కామచారో భవతి।।
బ్రహ్మచర్య దీక్షాబలం చేత మాత్రమే అట్టి ‘‘అర’’, ‘‘ణ్య’’ అని పిలువబడే రెండు సముద్రములను పొందగలరు. దాటగలరు. అట్టివారలకే బ్రహ్మలోకము (సర్వత్రా బ్రహ్మముగా దర్శించు అవలోకనము) ప్రవేశము లభించగలదు. అట్టివారు సర్వలోకములలో ఇచ్ఛానుసారంగా సంచారము చేయువారు అగుచున్నారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే పంచమః ఖండః


8–6. షష్ఠః ఖండః - హృదయ నాడులలో ఆదిత్యుని దాటించు నాడీ ఉపాసన


అథ యా ఏతా హృదయస్య నాడ్యస్తాః పింగలస్యాణిమ్నస్తిష్ఠంతి
శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్యేత్యసౌ వా ఆదిత్యః
పింగల ఏష శుక్ల ఏష నీల ఏష పీత ఏష లోహితః .. 8.6.1..
1. అథ యా ఏతా హృదయస్య
నాడ్యస్తాః పింగళస్య
అణిమ్నః తిష్ఠన్తి - శుక్లస్య,
నీలస్య - పీతస్య - లోహితస్య
ఏతి అసౌ వా ఆదిత్యః
పింగళ। ఏష శుక్ల।
ఏష నీల। ఏష పీత।
ఏష లోహితః।
(మాంసపిండరూపమగు) మానవుని హృదయమునుండి నాడులు, అట్టి నాడులు - పింగళ (గోరోజనరంగు) అనే పేరుగల వర్ణ విశేషము కలిగియుండి - ‘‘సూక్ష్మరసము’’ తమయందు కలిగి ఉంటున్నాయి. ఆ నాడులు తెలుపు, నీలము, పచ్చని, ఎరుపు రంగు రసము కలిగి ఉంటున్నాయి.

ఏ విధంగా అయితే పింగళవరుణాడగు సూర్యునియందు పింగళ, శుక్ల (తెలుపు), నీల, పీత (పచ్చ), లోహిత కిరణములు బయల్వెడలు చున్నాయో, ఆ విధంగా హృదయమునుండి నాడులు బయలుదేరి, శరీరమంతా విస్తరించినవై ఉంటున్నాయి.

తద్యథా మహాపథ ఆతత ఉభౌ గ్రామౌ గచ్ఛతీమం చాముం
చైవమేవైతా ఆదిత్యస్య రశ్మయ ఉభౌ లోకౌ గచ్ఛంతీమం చాముం
చాముష్మాదాదిత్యాత్ప్రతాయంతే తా ఆసు నాడీషు సృప్తా
ఆభ్యో నాడీభ్యః ప్రతాయంతే తేఽముష్మిన్నాదిత్యే సృప్తాః .. 8.6.2..
2. తత్ యథా మహాపథ ఆతత
ఉభౌ గ్రామౌ గచ్ఛతి ఇమం చ
అముంచ ఏవమేవ ఏతా ఆదిత్యస్య
రశ్మయ ఉభౌ లోకౌ గచ్ఛన్తి ఇమం చ,
అముం చ ఆముష్మాత్ ఆదిత్యాత్ ప్రతాయంతే।
తా ఆసు నాడీషు
సృప్తా ఆభ్యో నాడీభ్యః ప్రతాపయన్తే।
తే ఆముష్మిన్ ఆదిత్యే సృప్తాః।।
ఒక సుదీర్ఘమైన రాజమార్గము దగ్గర - దూర గ్రామాల వరకు విస్తరించినదై ఉంటుంది, చూచావా? సూర్యకిరణములు క్రిందకు, ఊర్ధ్వమునకు విస్తరించి ప్రసరిస్తూ ఉంటున్నాయి కదా!

అట్టి కిరణములు సూర్యుని నుండి బయలుదేరి దేహములోని నాడులలో కూడా చేరుచున్నాయి.

నాడులలో ప్రసరించి, అటు తరువాత తిరిగి సూర్యుని వరకు విస్తరించి ఉంటున్నాయి.

తద్యత్రైతత్సుప్తః సమస్త్ః సంప్రసన్నః స్వప్నం న విజానాత్యాసు
తదా నాడీషు సృప్తో భవతి తం న కశ్చన పాప్మా స్పృశతి
తేజసా హి తదా సంపన్నో భవతి .. 8.6.3..
3. తత్ యత్ర ఏతత్ సుప్తః సమస్తః। సంప్రసన్నః।
స్వప్నం న విజానాత్యాసు,
తదా నాడీషు సృప్తో భవతి।
తం న కశ్చన పాప్మా స్పృశతి,
తేజసా హి తదా సంపన్నో భవతి।।
ఎప్పుడైతే ఈ జీవుడు నిద్రకు ఉపక్రమిస్తాడో అప్పుడు ఈతడు నాడులందు ప్రవేశించి సృప్తుడు (Silence) అగుచున్నాడు.

ఈతడు ఆ విధంగా గాఢనిద్ర పరవశుడై ఉన్నప్పుడు - ఎటువంటి దృశ్య సంబంధమైన పాపదృష్టుల చేతను స్పృశించబడనివాడై ఉంటాడు. ఆత్మ తేజస్సుచే సుసంపన్నుడై ఉంటాడు.

అథ యత్రైతదబలిమానం నీతో భవతి తమభిత ఆసీనా
ఆహుర్జానాసి మాం జానాసి మామితి స
యావదస్మాచ్ఛరీరాదనుత్క్రాంతో భవతి తావజ్జానాతి .. 8.6.4..
4. అథ యత్ర ఏతత్
అబలిమానం నీతో భవతి,
తమ్ అభిత ఆసీనా ఆహుః ‘‘జానాసి మాం?
జానాసి మాం?’’ - ఇతి। స యావత్
అస్మాత్ శరీరాత్ అనుత్క్రాన్తో,
భవతి….తావత్ జానాతి।
ఈ జీవుడు శారీరకంగా కూడా బలహీనుడు అయినప్పుడు, ఆ చుట్టూ ఉన్న దగ్గరవారు
‘‘బాబూ! నాన్నా! తాతా! నన్ను గుర్తిస్తున్నావా? నేను ఎవరు? ఈయన ఎవరు?’’ - అని అడుగుతూ ఉంటారు.
దేహములో జీవుడు ఉన్నంతవరకు ఆతడు ఆ బంధువులను గుర్తిస్తూ ఉంటాడు.

అథ యత్రైతదస్మాచ్ఛరీరాదుత్క్రామత్యథైతైరేవ
రశ్మిభిరూర్ధ్వమాక్రమతే స ఓమితి వా హోద్వా మీయతే
స యావత్క్షిప్యేన్మనస్తావదాదిత్యం గచ్ఛత్యేతద్వై ఖలు
లోకద్వారం విదుషాం ప్రపదనం నిరోధోఽవిదుషాం .. 8.6.5..
5. అథ యత్ర ఏతత్ అస్మాత్
శరీరాత్ ఉత్క్రామతి,
అథ ఏతైరేవ రశ్మిభిః
ఊర్ధ్వం ఆక్రమతే।
స ‘ఓం’ ఇతి వా హోద్వా మీయతే।
స యావత్ క్షిప్యేత్ మనః,
తావత్ ఆదిత్యం గచ్ఛతి।
ఏతత్ వై ఖలు లోకద్వారం
విదుషాం ప్రపదనం - నిరోధో అవిదుషామ్।।
దేహము విడచి వెళ్లుచూ ఉన్నప్పుడు ఈ జీవుడు శరీరము వదలి కిరణములలో ప్రవేశించి ఊర్ధ్వముగా వెళ్లుచున్నాడు.

‘ఓం’ అని పైకి పోవుచున్నాడు.

ఆతడు మనస్సు వెళ్లుచున్నంతవరకు ఆదిత్యునివైపు (సూర్యునివైపు) వెళ్లుచున్నాడు.

ఆదిత్య లోకప్రవేశమే లోకద్వారము.

(ఆత్మజ్ఞులు ఆ ద్వారము దాటి వెళ్లుచున్నారు). అజ్ఞానులు ఆ ద్వారము వద్ద ఆగిపోయి వెనుకకు మరలుచున్నారు.

తదేష శ్లోకః . శతం చైకా చ హృదయస్య నాడ్యస్తాసాం
మూర్ధానమభినిఃసృతైకా . తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి
విష్వఙ్ఙన్యా ఉత్క్రమణే భవంత్యుత్క్రమణే భవంతి .. 8.6.6..

.. ఇతి షష్ఠః ఖండః ..
6. తత్ ఏష శ్లోకః।

శతం చ ఏకా చ హృదయస్య నాడ్యః।
తాసాం మూర్ధానమ్ అభినిః సృత ఏకా।
తయోః ఊర్ధ్వమ్ ఆయన్ అమృతత్వం ఏతి
విష్వన్ అన్యా ఉత్క్రమణే భవన్తి।
ఉత్క్రమణే భవన్తి।
అట్టి దేహానంతర ప్రయాణం గురించి శాస్త్ర ప్రవచిత శ్లోక - గానములు ఈ విధంగా ఉన్నాయి.

హృదయమునుండి 101 నాడులు బయల్వెడలుచున్నాయి.
ఈ నాడులలో జీవుడు దేహానంతరము ప్రయాణమునకు ఉపక్రమిస్తున్నాడు.
ఆ 101 నాడులలో ఒక్క నాడి మాత్రమే శిరస్సుయొక్క ఉపరితల స్థానానికి బయల్వెడలుతోంది. అట్టి ఊర్ధ్వమునకు పోవుచున్ననాడిలో ప్రయాణము చేయు జీవుడు - ‘మృతము’ పరిధులను దాటి అమృతత్వము పొందుచున్నాడు. ఇక తక్కిన (100) నాడులలో ప్రయాణము చేయువాడు ఇంద్రియ విషయములవైపుగా ప్రయాణిస్తూ పునర్జన్మలవైపుగా ఎక్కుబెట్టబడి వెళ్లుచున్నాడు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే షష్ఠః ఖండః


8–7. అష్టమ ప్రపాఠకః - సప్తమః ఖండః - కన్నులలో చూచువాడే ఆత్మ!


య ఆత్మాపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో
విజిఘత్సోఽపిపాసః సత్యకామః సత్యసంకల్పః సోఽన్వేష్టవ్యః
స విజిజ్ఞాసితవ్యః స సర్వాగ్ంశ్చ లోకానాప్నోతి
సర్వాగ్ంశ్చ కామాన్యస్తమాత్మానమనువిద్య విజానాతీతి హ
ప్రజాపతిరువాచ .. 8.7.1..
1. య ఆత్మా - అపహత పాప్మా!
విజరో విమృత్యుః। విశోకో।
విజిఘత్సో అపిపాసః!
సత్యకామః। సత్య సంకల్పః।
సో అన్వేష్టవ్యః। స విజిజ్ఞాసితవ్యః
స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి।
సర్వాంశ్చ కామాని అస్తమ్,
ఆత్మానమ్ అనువిద్య విజానాతి।
ఇతి - హ ప్రజాపతిః ఉవాచ।।
గురుదేవుడు : ప్రజాపతి సృష్టించుచూ ఈ విధమైన సృష్టి మర్యాదను కల్పించారు. సమస్త దేవతలారా! మానవులారా!

ఓ సమస్త జీవులారా! ఆనందము కొరకై బాలా లీలా వినోదంగా, మీ అందరు ఆడుకోవాలనే నిమిత్తంగా క్రీడామైదానము వంటి (Play ground) - ఈ సృష్టిని గ్రహించి గమనించి ఆటలాడుకొంటూ పరస్పరము వినోదించండి. అయితే మిమ్ములను మీరు మరచిపోకండి. మీరు ఆత్మ స్వరూపులని జ్ఞాపకము పెట్టుకోండి .

ఆత్మ ఎటువంటిదంటే…
- ఆత్మ పాపదోషములు అంటజాలనిది.
- ఆత్మకు జరామృత్యువులు ఉండవు. శోకరహితము. విజిఘత్సము (ఆకలి దప్పికలు లేనట్టిది)
- అత్మ ఏది కోరితే అది అట్లే సిద్ధించగలదు.

సత్యకామము - అందుచేతనే నా ఇష్టమును అనుసరించి సృష్టించగలుగుచున్నాను.

సత్యసంకల్పము - ఏది ఎట్లా సంకల్పిస్తే అది ఆ తీరుగానే అనుభవము కాగలదు.

మీరు నిష్కారణంగా ఈ నా సృష్టియందు (ఇది లీలా వినోదమే అయినప్పటికి) దుఃఖితులు అవుతున్నారు. అందుకు ఉపాయం వినండి.

ఆత్మ గురించి శ్రద్ధగా అన్వేషించండి. అదియే తెలుసుకోండి. ఆత్మగురించి తెలుసుకున్నారా - సర్వలోకాలు, సర్వైచ్ఛలు సిద్ధించగలవు. అందుచేత ఆత్మ గురించి తెలుసుకొని, మననం చేసి స్వానుభవంగా సిద్ధించుకోండి - అని ఒక సందర్భంలో ప్రజాపతి ప్రకటించారు.

తద్ధోభయే దేవాసురా అనుబుబుధిరే తే హోచుర్హంత
తమాత్మానమన్వేచ్ఛామో యమాత్మానమన్విష్య సర్వాగ్ంశ్చ
లోకానాప్నోతి సర్వాగ్ంశ్చ కామానితీంద్రో హైవ
దేవానామభిప్రవవ్రాజ విరోచనోఽసురాణాం తౌ
హాసంవిదానావేవ సమిత్పాణీ ప్రజాపతిసకాశమాజగ్మతుః .. 8.7.2..
2. తద్ధా (తత్ హ) ఉభయే దేవ
అసురా అనుబుబుధిరే।
తే హ ఊచుః :
హంత తమ్ ఆత్మానమ్
అన్విచ్ఛామో యం
ఆత్మానమ్ అన్విష్య
సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి।
సర్వాంశ్చ కామాన్ ఇతి
ఇంద్రో హ ఏవ దేవానాం అభిప్రవవ్రాజ,
విరోచనో అసురాణం
తౌ హా సంవిదానావేవ
సమిత్పాణీ ప్రజాపతిః
సకాశమాజగ్మతుః।।
‘ఆత్మజ్ఞానముచే సర్వలోకాలు ఇచ్ఛానుసారంగా సంచరించి వినోదించగలరు’’ - అను బ్రహ్మభగవానుని వాక్యములను దేవతలు, రాక్షసులు, మానవులలో కొందరు విన్నారు.

దేవతల, అసురుల వారి వారి రాజసభలలో పై బ్రహ్మ దేవ ఆత్మజ్ఞాన సూచన వాక్యములు సుదీర్ఘంగా చర్చించుకున్నారు.

‘‘ఆత్మగురించి అన్వేషించండి. అప్పుడు సర్వలోకాలు ఇచ్ఛానుసారంగా సంచారాలు చేస్తూ వినోదించగలరు’’ - అని చెప్పిన వాక్యములు వారంతా చర్చించారు.
దేవసభలో దేవతలు ఇంద్రుని, అసురసభలో అసురులు విరోచనుని - బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవటానికై పంపారు.
‘‘ఆత్మ గురించిన అన్వేషణ’’ ఏవిధంగా చేయాలో తెలుసుకొని తిరిగి సభలో ప్రసంగించి తెలియజేయటానికి సభా నిర్ణయము చేసారు.

అప్పుడు ఇంద్రుడు, విరోచనుడు గురుసేవా చిహ్నంగా సమత్పాణులై (చేత యజ్ఞ సమిధలు ధరించినవారై) బ్రహ్మలోకమునకు వెళ్లి ప్రజాపతియగు బ్రహ్మదేవుని దర్శనం చేసుకొన్నారు.

తౌ హ ద్వాత్రిగ్ంశతం వర్షాణి బ్రహ్మచర్యమూషతుస్తౌ హ
ప్రజాపతిరువాచ కిమిచ్ఛంతావాస్తమితి తౌ హోచతుర్య
ఆత్మాపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో
విజిఘత్సోఽపిపాసః సత్యకామః సత్యసంకల్పః సోఽన్వేష్టవ్యః
స విజిజ్ఞాసితవ్యః స సర్వాగ్ంశ్చ లోకానాప్నోతి సర్వాగ్ంశ్చ
కామాన్యస్తమాత్మానమనువిద్య విజానాతీతి భగవతో వచో
వేదయంతే తమిచ్ఛంతావవాస్తమితి .. 8.7.3..
3. తౌ హ ద్వాత్రింశతం
వర్షాణి బ్రహ్మచర్యం ఊషతుః।
తౌ హ ప్రజాపతిః ఉవాచ।
కిమ్ ఇచ్ఛన్తావవాస్తమ్ ఇతి।
తౌ హ ఊచతుః య ఆత్మా
అపహత పాప్మా, విజరో, విమృత్యుః,
విశోకో, విజిఘత్సో అపిపాసః
సత్యకామః సత్యసంకల్పః।
సో అన్వేష్టవ్యః।
స విజిజ్ఞాసితవ్యః।
స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి।
సర్వాంశ్చ కామాన్
యః తం ఆత్మానమ్ అనువిద్య
విజానాతి - ఇతి, భవగతో
వచో వేదయన్తే
తమ్ ఇచ్ఛన్తావవాస్తమ్। ఇతి।।
అప్పుడు ప్రజాపతి - ఆ ఇంద్ర విరోచనులిద్దరికి బ్రహ్మతత్త్వాణ్వేషణ కొరకై 32 సంవత్సరములు బ్రహ్మచర్యము నియమించారు. ఆ ఇద్దరు బ్రహ్మలోకంలో 32 సంవత్సరాలు తపస్సు చేసి స్వామిని సమీపించారు. అప్పుడు ప్రజాపతి ఇట్లు సంభాషించసాగారు.

ప్రజాపతి : ఓ ఇంద్ర విరోచనులారా! ఏమి వాంఛించినవారై ఇక్కడ తపస్సు చేస్తున్నారో, ఏమి కోరుకొంటున్నారో అడగండి.

ఇంద్ర - విరోచనులు :
‘‘ఏ ఆత్మ స్వరూపమునకైతే ఎట్టి పాపదోషములు అంటజాలవో, జరా - మృత్యువులు ఏమాత్రము ఉండజాలవో, శోకరహితమో, ఆకలి దప్పికలు ఉండవో, తాను కోరుకొన్నది కోరుకొన్నట్లుగా సత్యము కాగలదో, ఏది ఎట్లా సంకల్పిస్తే అది ఆ తీరుగానే సత్యము కాగలదో అట్టి ఆత్మనే అన్వేషించాలి, బాగుగా తెలుసుకోవాలి. అట్టి ఆత్మగురించి ఎరుగుటచే సర్వ కామములు (Desires) తీరగలవు’’ అని మీ వచనములు మేమంతా విన్నాము. అట్టి ఆత్మ యొక్క అన్వేషణ గురించిన ఇచ్ఛతో మీ దర్శనం చేసుకొని, మీ ఆజ్ఞానుసారం ‘32’ సంవత్సరములుగా ముని వేషధారులమై తపస్సు చేసే వచ్చాము. దయతో అనుగ్రహించండి.

తౌ హ ప్రజాపతిరువాచ య ఏషోఽక్షిణి పురుషో దృశ్యత
ఏష ఆత్మేతి హోవాచైతదమృతమభయమేతద్బ్రహ్మేత్యథ యోఽయం
భగవోఽప్సు పరిఖ్యాయతే యశ్చాయమాదర్శే కతమ ఏష
ఇత్యేష ఉ ఏవైషు సర్వేష్వంతేషు పరిఖ్యాయత ఇతి హోవాచ .. 8.7.4..

.. ఇతి సప్తమః ఖండః ..
4. తౌ హ ప్రజాపతిః ఉవాచ
య ఏషో ‘‘అక్షిణి పురుషో’’
దృశ్యత - ఏష ఆత్మేతి।
హ ఉవాచ।
ఏతత్ అమృతమ్, అభయమ్
ఏతత్ బ్రహ్మ ఇతి।
అథ యో అయం,
భగవో - అప్సు పరిఖ్యాయతే
యశ్చ అయం ఆదర్శే కతమ
ఏష ఇత్యేష ఉ ఏవ
ఏషు సర్వేషు అన్తేషు
పరిఖ్యాయత। ఇతి హోవాచ।।
ప్రజాపతి (సృష్టికర్త, బ్రహ్మ భగవానుడు) : బిడ్డలారా! చెప్పుచున్నాను. వినండి. ఈ కళ్లలో ఎవ్వరైతే వేంచేసియుండి, సమస్తము చూస్తూ ఉన్నారో (సమస్తమునకు కేవల ద్రష్టయో) - అట్టి ‘‘దృక్ పురుషుడే’’ పరమాత్మ! ఆయనయే అమృతము, అభయము అగు బ్రహ్మము.

ఇంద్ర - విరోచనులు :
(1) నీటిలోను (2) అద్దములోను ఏ పురుషుడు ప్రతిబింబితులై కనిపిస్తున్నాడో… వీరిలో ఆత్మపురుషుడు ఎవరు?

ప్రజాపతి : ఆత్మభగవానుడే ఇదంతా సమస్తమునకు ఆవలగాను, ఈవలగా కూడా! ‘‘ఎవ్వరు’’ కనిపిస్తూ ఉన్నారో ఆతడే ఆత్మపురుషుడు. సమస్తమునకు ఆవలగా పరిచ్యాయతము (Proclaimed) అగుచున్నది ఆ అక్షిణి పురుషుడే।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే సప్తమః ఖండః


8–8. అష్టమ ప్రపాఠకః - అష్టమః ఖండః - ఇంద్ర - విరోచనులు నీటి పాత్రలో తమ ప్రతిబింబములు చూసి ఆత్మ అనుకొనుట


ఉదశరావ ఆత్మానమవేక్ష్య యదాత్మనో న విజానీథస్తన్మే
ప్రబ్రూతమితి తౌ హోదశరావేఽవేక్షాంచక్రాతే తౌ హ
ప్రజాపతిరువాచ కిం పశ్యథ ఇతి తౌ హోచతుః
సర్వమేవేదమావాం భగవ ఆత్మానం పశ్యావ ఆ లోమభ్యః ఆ
నఖేభ్యః ప్రతిరూపమితి .. 8.8.1..
1. ఉదశరావ ఆత్మానమ్ అవేక్ష్య।
యత్ ఆత్మనో న విజానీథః
తన్మే ప్రబ్రూతమ్ ఇతి।।
తౌ హ ఉదశరావే అవేక్షాం చక్రాతే।
తౌ హ ప్రజాపతిః ఉవాచ :
‘‘కిం పశ్యథ’’ ఇతి
తౌ హ ఊచుతుః।
సర్వం ఏవేదం అవాం, భగవ!
ఆత్మానం పశ్యావ, ఆ లోమభ్యః।
ఆ నఖేభ్యః - ప్రతిరూపమ్ ఇతి।
ప్రజాపతి : ఓ ఇంద్ర, విరోచన బిడ్డలారా! మీరిద్దరూ కలసి - ఒక పెద్ద ఉదశరావమును (మూకుడు వంటి పెద్ద పాత్రను) తీసుకు రండి. అందులో నిండుగా నీళ్లు పోయండి. మీ రూపములు ఆ నీళ్లలో ప్రతిబింబిస్తాయి కదా! చూడండి. ఆ తరువాత నా దగ్గరకు రండి. మీరు ఆత్మ గురించి ఇంకా ఏమి తెలుసుకోలేకపోయారో అది నన్ను అడగవచ్చు.
ఆ ఇంద్ర-విరోచనులు ఇద్దరు ఆ విధంగానే నీళ్లల్లో ప్రతిబింబము చూచుకొని తిరిగి వచ్చారు.

ప్రజాపతి : బిడ్డా! మీకు ఏమి కనబడింది? ఏమి అర్థమైనది?

ఇంద్ర-విరోచనులు : భగవన్! మేము అంతా చూచాము. జలములో నఖ-శిఖ పర్యంతము మా మా పూర్ణ ప్రతిబింబాన్ని చూచాము. బయట ఎట్లా ఉన్నామో - ఆత్మ ప్రతిబింబముగా జలంలో అట్లాగే కనిపించాము.

తౌ హ ప్రజాపతిరువాచ సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ
భూత్వోదశరావేఽవేక్షేథామితి తౌ హ సాధ్వలంకృతౌ
సువసనౌ పరిష్కృతౌ భూత్వోదశరావేఽవేక్షాంచక్రాతే
తౌ హ ప్రజాపతిరువాచ కిం పశ్యథ ఇతి .. 8.8.2..
2. తౌ హ ప్రజాపతిః ఉవాచ
సాధు అలంకృతౌ, సువసనౌ,
పరిష్కృతౌ భూత్వా….
ఉదశరావే అవేక్షేథామ ఇతి।
తౌ హ సాధు - అలంకృతౌ
సువసనౌ, పరిష్కృతౌ
భూత్వా ఉదశరావే అవేక్షాంచక్రాతే।
ప్రజాపతి : మంచిది. సంతోషము. ఇప్పుడు మీ మీ మునివేషధారణా సంబంధమైన (గడ్డము మొదలైన) ఇవన్నీ తొలగించండి. క్షురకర్మ చేయించుకొని మామూలు వస్త్రములు ధరించి మీరు మీ మీ అంతఃపురములో ఉండే విధంగా సామలంకృతులవండి. సువసునులై రాజవస్త్ర-అలంకరణలతో రండి.

ఇంద్ర-విరోచనులు : స్వామీ! భగవన్ మీరు ఆజ్ఞాపించిన తీరుగానే క్షురకర్మ మొదలైనవి చేయించి, రాజ వస్త్రములు మొదలైనవి ధరించి, తపోవనమునకు వెళ్లక ముందువలె చక్రవర్తి అలంకారములతో వచ్చాము.

ప్రజాపతి : వచ్చారా? ఇప్పుడు మీరు మరల ఉదశరావ పాత్ర (పెద్ద బానవంటి పాత్ర)లో గల జలములో మీ రూపములు చూచుకోండి.

ఇంద్ర-విరోచనులు : పితామహా! అట్లాగే చూచుకుంటున్నాము. ఇప్పుడు ఏమి మీ అనుజ్ఞ?
తౌ హ ప్రజాపతిః ఉవాచ
కిం పశ్యథ - ఇతి?
ప్రజాపతి : జలములో ఏమి కనిపించింది?

తౌ హోచతుర్యథైవేదమావాం భగవః సాధ్వలంకృతౌ సువసనౌ
పరిష్కృతౌ స్వ ఏవమేవేమౌ భగవః సాధ్వలంకృతౌ సువసనౌ
పరిష్కృతావిత్యేష ఆత్మేతి హోవాచైతదమృతమభయమేతద్బ్రహ్మేతి
తౌ హ శాంతహృదయౌ ప్రవవ్రజతుః .. 8.8.3..
3. తౌ హ ఊచతుః
యథ ఏవ ఇదం ఆవామ్ భగవః,
సాధు అలంకృతౌ సువసనౌ
పరిష్కృతౌ స్వ ఏవమ్।
ఎవేమౌ భగవః।
సాధ్వలంకృతౌ సువసనౌ
ప్రరిష్కృతావిత్యేష ఆత్మేతి।
హ ఉవాచ :
ఏతత్ అమృతమ్। అభయమ్।
ఏతత్ బ్రహ్మేతి।
తౌ హ శాంత హృదయౌ ప్రవవ్రజతుః।
ఇంద్ర-విరోచనులు : ఏవిధంగా మేము అంతఃపురములో ఉత్తమ వస్త్రములు ధరించి సాలంకృతులమై, సువాసన (Good Living) పరిష్కృతులము (Modified) అయి బయట ఉన్నట్లే జలములో ప్రతిబింబిస్తూ నఖ శిఖ పర్యంతం మేమే కనిపించాము.

ప్రజాపతి : బయట మునుల రూపము కలిగియున్నప్పుడు నీటిలో నఖశిఖపర్యంతరం ఆ రూపములుగానే ప్రతిబింబిస్తూ కనిపించారు కదా।
బయట-లోపల అదియే (లేక) ఆతడే అమృతము। అభయము। బ్రహ్మము।

అప్పుడు ఆ ఇద్దరు ‘‘బయట ఏదై ఉన్నదో, అదే జలమునందువలెనే ఈ దృశ్యమునందు కూడా యథాతథంగా ప్రతిబింబిస్తున్నదే ఆత్మ’’ - అని అనుకొన్నారు కాబోలు! ఇద్దరు (అర్థమైనదనే భావనతో) శాంతచిత్తులై వారివారి నివాసములకు వెళ్లిపోయారు.

తౌ హాన్వీక్ష్య ప్రజాపతిరువాచానుపలభ్యాత్మానమననువిద్య
వ్రజతో యతర ఏతదుపనిషదో భవిష్యంతి దేవా వాసురా వా తే
పరాభవిష్యంతీతి స హ శాంతహృదయ ఏవ
విరోచనోఽసురాంజగామ తేభ్యో హైతాముపనిషదం
ప్రోవాచాత్మైవేహ మహయ్య ఆత్మా పరిచర్య ఆత్మానమేవేహ
మహయన్నాత్మానం పరిచరన్నుభౌ లోకావవాప్నోతీమం చాముం చేతి .. 8.8.4..
4. తౌ హ అన్వీక్ష్య, ప్రజాపతిః ఉవాచ :
అనుపలభ్యమ్ ఆత్మానమ్
అనువిద్య - వ్రజతో, యతర
ఏతత్ ఉపనిషదో
భవిష్యన్తి, దేవా వా, అసురా వా
తే పరా భవిష్యన్తి - ఇతి।
వారిద్దరు ఆ విధంగా మాకు ‘ఆత్మ గురించి అర్థమైనది’ అని తలచుచూ శాంతహృదయులై సంతోషించి తిరిగి వెళ్లుచుండగా అది చూచి ప్రజాపతి ఈ విధంగా అనుకున్నారు.

ప్రజాపతి : ఆత్మగురించిన విద్యను సరిగ్గా అర్థం పొందకుండానే ‘అర్థమయింది’ అని వెళ్లిపోతున్నారే? ఎవ్వరైతే ఇప్పుడు నేను చెప్పినదే ఆత్మ అనుకొని సంపూర్ణమైన ఆత్మసాక్షాత్కారము పొందకయే అధ్యయనమును విరమిస్తారో - వారు దేవతలైనా, అసురులైనా పరాభవము (ఇక్కడ ఉన్నదే పరస్వరూపము) అనే ఓటమి పొందక తప్పదు కదా!
స హ శాంతహృదయ ఏవ।
విరోచనో అసురాన్ జగామ।
తేభ్యో హి ఏతామ్ ఉపనిషదం
ప్రోవాచ : ‘‘ఆత్మైవ ఇహ మహయ్య।
ఆత్మా పరిచర్య। ఆత్మానం ఏవ ఇహ మహయన్
ఆత్మానం పరిచరన్ ఉభౌ లోకౌ అవాప్నోతి।
ఇమం చ - అముం చ - ఇతి।
అప్పుడు విరోచనుడు తన సహచరులైనట్టి ఇతర అసురులను కలిసారు. వారికి ఆత్మతత్త్వము గురించి తాను నేర్చుకున్నది ఈ రీతిగా బ్రహ్మదేవుని బోధగా చెప్పారు.
‘‘నా యొక్క ఇహంలో కనిపిస్తున్న రూపమే ఆత్మ। ఆత్మ అనగా ఛాయా మాత్రమే। ఛాయాత్మనే పూజించాలి. సేవించాలి’’ అట్టి ఛాయాత్మను సేవిస్తే మనము ఇహపరములు ఉత్తమముగా పొందగలము. ఇక్కడి ప్రయత్నములే మనకు ముఖ్యము.

తస్మాదప్యద్యేహాదదానమశ్రద్దధానమయజమానమాహురాసురో
బతేత్యసురాణాగ్ం హ్యేషోపనిషత్ప్రేతస్య శరీరం భిక్షయా
వసనేనాలంకారేణేతి సగ్ంస్కుర్వంత్యేతేన హ్యముం లోకం
జేష్యంతో మన్యంతే .. 8.8.5..

.. ఇతి అష్టమః ఖండః ..
5. తస్మాత్ అపి అద్య ఇహ అదదానమ్।
అశ్రద్ధధానమ్, అయజమానమ్,
ఆహుః ‘‘ఆసురో’’ బతేతి।
అసురాణాం హి ఏష
ఉపనిషత్ ప్రేతస్య శరీరం భిక్షయా వసనేన
అలంకారేణ ఇతి సంస్కుర్వన్తి ఇతి।
ఏన హి అముంలోకం
జేష్యన్తో మన్యంతే।।
అందుచేతనే ఈ లోకంలో త్యాగభావములు లేనివాడు, దానము చేయాలని అనుకోనివాడు (దానము చేయుటయందు) అశ్రద్ధకలవాడు, యజనము చేయనివాడు - ‘‘ఈతడు రాక్షసుడురా!’’ - అని జనులు చెప్పుకుంటూ ఉంటారు.

అసురులకు ఈ శరీరమే, జీవాత్మయే సత్యం అనునదే ఉపనిషత్తు. ప్రేత శరీరమునకు ‘‘ఈతడు ఆ తరువాత కూడా ఆహార పదార్థములు, సంపదలు కోరుకుంటాడు’’ - అని తలచి చనిపోయినవాని శరీరమును గంధ, పుష్ప అన్నాదులు ప్రక్కన ఉంచుతారు. అలంకారాలతో సంస్కరిస్తారు. వాటి ద్వారా ఆ మరణించినవాడు ఆముష్మిక (పర) లోకము పొందగలడని విశ్వసిస్తారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే అష్టమః ఖండః


8–9. అష్టమ ప్రపాఠకః - నవమః ఖండః - నీటిలో ప్రతిబింబించు తన రూపమే ఆత్మయా?


అథ హేంద్రోఽప్రాప్యైవ దేవానేతద్భయం దదర్శ యథైవ
ఖల్వయమస్మింఛరీరే సాధ్వలంకృతే సాధ్వలంకృతో భవతి
సువసనే సువసనః పరిష్కృతే పరిష్కృత
ఏవమేవాయమస్మిన్నంధేఽన్ధో భవతి స్రామే స్రామః పరివృక్ణే
పరివృక్ణోఽస్యైవ శరీరస్య నాశమన్వేష నశ్యతి
నాహమత్ర భోగ్యం పశ్యామీతి .. 8.9.1..
1. అథ హ ఇంద్రో అప్రాప్య ఏవ
దేవాన్, ఏతత్ భయం దదర్శ!
దేవతల నాయకుడగు ఇంద్రుడు ‘‘ఏది జలములో ప్రతిబింబిస్తూ ఉన్నదో అదియే ఆత్మ’’ అనునది మననం చేస్తూ దేవలోకానికి బయలుదేరారు. ఆయన త్రోవలో ఉండగానే, దేవతలను ఇంకా కలవకముందే - ఏదో సందేహము, దానివలన భయము కలగసాగింది.
యథైవ ఖలు వయమ్ అస్మిన్
శరీరే సాధ్వలంకృతే, సాధ్వలంకృతో భవతి।
సువసనే సువసనః।
పరిష్కృతే పరిష్కృత -
ఏవం ఏవ అయమ్ అస్మిన్
అన్ధే… అన్ధో భవతి।
స్రామే స్రామః। పరివృక్షేణా పరివృక్షోణా
అస్యైవ శరీరస్య నాశమ్ అన్వేష… నశ్యతి।
‘‘నేను తపోమునిరూపంలో ఉన్నప్పుడు, నీటిలో ముని వంటి రూపం కనిపించింది. సాధు (Fashion) అలంకృతమైనప్పుడు - సాధు (Royal) రూపం కనిపించింది. వస్త్రములు ధరించినప్పుడు సుందర వస్త్రములతోను, పరిష్కృత (సర్వాలంకారమైన) రూపము ధరించినప్పుడు పరిష్కృతంగాను కనిపించింది.

అట్లాగే ఒక గ్రుడ్డివాడు జలంలో చూస్తుంటే గుడ్డివాడే కనిపిస్తాడు. స్రామము (ఒంటి కన్ను ఉంటే) అతడు నీళ్లల్లో ఒంటికన్ను కలవానివలెనే ప్రతిబింబిస్తాడు. (కన్ను, ముక్కు మొదలైనవి వంకర టింకరగా ఉంటే, నీళ్లలో ప్రతిబింబము అట్లాగే కనిపిస్తుంది. శరీరము ఏ కారణంచేతనైనా నశిస్తే నీటిలో ప్రతిబింబము నశిస్తుంది. కానీ ఆత్మకు నాశనము లేదు కదా! మరి పితామహులు నీటిలో ‘‘ఏది’’ ప్రతిబింబిస్తోందో - అదే ఆత్మ అని అన్నప్పుడు నేను బహుశ సరిగ్గా అర్థం చేసుకోలేదు’’.
న అహమ్ అత్ర భోగ్యం పశ్యామి ఇతి।। ‘‘నేను విన్నదానిలో నేను ఆత్మానందము పొందే విషయమేదీ నాకు కనబడటం లేదు’’.

స సమిత్పాణిః పునరేయాయ తగ్ం హ ప్రజాపతిరువాచ
మఘవన్యచ్ఛాంతహృదయః ప్రావ్రాజీః సార్ధం విరోచనేన
కిమిచ్ఛన్పునరాగమ ఇతి స హోవాచ యథైవ ఖల్వయం
భగవోఽస్మింఛరీరే సాధ్వలంకృతే సాధ్వలంకృతో భవతి
సువసనే సువసనః పరిష్కృతే పరిష్కృత
ఏవమేవాయమస్మిన్నంధేఽన్ధో భవతి స్రామే స్రామః
పరివృక్ణే పరివృక్ణోఽస్యైవ శరీరస్య నాశమన్వేష
నశ్యతి నాహమత్ర భోగ్యం పశ్యామీతి .. 8.9.2..
2. స సమిత్పాణిః పునరేయాయ।
తం హ ప్రజాపతిః ఉవాచ।
ఈ విధంగా యోచించి ఇంద్రుడు మరల సమిత్పాణుడై (గురువులకు యజ్ఞము కొరకై ధరించే సమిధలు చేతబూని) - వెనుకకు మరలి - తిరిగి ప్రజాపతి దర్శనం చేసుకొన్నారు.
మఘవన్, యత్ శాంత హృదయః ప్రావ్రాజీః
సార్థం విరోచనేన - ‘‘కిమ్
ఇచ్ఛన్ పునరాగమ?’’ - ఇతి।
ప్రజాపతి : ఓ మఘవన్। ఇంద్రదేవా! అప్పుడు నేను చెప్పినదానికి ఆత్మగురించిన వివరణకు శాంతచిత్తుడవై విరోచనునితో సహా వెళ్లి యున్నావు కదా! ఇంకా ఏమి తెలుసుకోగోరి వచ్చావు?
స హ ఉవాచ :
యథైవ ఖలు అయం భగవో।
అస్మిన్ శరీరే సాధ్వలంకృతే
సాధ్వలంకృతో భవతి।
సువసనే సువసనః।
పరిష్కృతే పరిష్కృత।
ఏవం ఏవ అయం అస్మిన్
అంధే అంధో భవతి।
స్రామే స్రామః।
పరివృకేణా పరివృకోణా
అస్య ఏవ శరీరస్య నాశమ్ అన్వేష - నశ్యతి।
న అహం అత్ర భోగ్యం పశ్యామి - ఇతి।
ఇంద్రుడు : పితామహా! మీరు - ‘నీటిలో ఏదైతే ప్రతిబింబిస్తోందో అదియే ఆత్మ’’ అని చెప్పినట్లున్నారు. భగవాన్! మీరు చెప్పినదానితో భోగము (ఆత్మానుభవము) నాకు లభించనే లేదు. ఎందుకంటే - సాధువుగా (Beautiful) అలంకరించుకొని చూస్తే, జలములో ప్రతిబింబము సాధువుగా కనబడుతోంది. చక్కటి వస్త్రములు ధరించి నీటిలో ప్రతిబింబము చూచుకుంటే - అట్లాగే కనబడుతోంది. అన్నీ సరిచేసుకొని పరిష్కృతుడై నీళ్లలో ప్రతిబింబము చూస్తే - ప్రతిబింబము పరిష్కృతమై కనిపిస్తోంది. గుడ్డివాడు నీళ్లల్లో గుడ్డివాడుగానే అగుపిస్తాడు. ఒంటికన్నువాడు ఒంటికన్నువాడుగాను, వంకర టింకర శరీరము కలవాడు వంకరటింకరగాను అగుపిస్తాడు. ఖండితమైనవాడు ఖండితమైనట్లే అగుపిస్తాడు.
ఈ శరీరము నశిస్తే నీళ్లల్లో ప్రతిబింబము నశించినట్లే అగుపిస్తుంది. మరి ఆత్మ నాశనము లేనిది కదా! జలములోని ప్రతిబింబం అత్మ ఎట్లా అవుతుంది?
నాకు ఇందులో భోగ్యమగు ఆత్మ యొక్క భోగము అగుపించలేదు.

ఏవమేవైష మఘవన్నితి హోవాచైతం త్వేవ తే
భూయోఽనువ్యాఖ్యాస్యామి వసాపరాణి ద్వాత్రిగ్ంశతం వర్షాణీతి
స హాపరాణి ద్వాత్రిగ్ంశతం వర్షాణ్యువాస తస్మై హోవాచ .. 8.9.3..

.. ఇతి నవమః ఖండః ..
3. ఏవం ఏవ ఏష మఘవన్ ఇతి।
హ ఉవాచ : ఏతం త్వ ఏవ, తే
భూయో అనువ్యాఖ్యాస్యామి।
వసాపరాణి ద్వాత్రింశతం వర్షాణి ఇతి।
స హ అపరాణి ద్వాత్రింశతం
వర్షాణి ఉవాస।
తస్మై హ ఉవాచ।
పజాపతి : అవును. ఆత్మను అర్థం చేసుకోవటం అంతటి చమత్కారమైన విషయమే మరి. నీకు మరల కూడా బోధిస్తాను.
అయితే నీవు 32 సంవత్సరములు ఇక్కడ ఉపాసన చేయి. మరల ఈ విషయం చెప్పుకుందాము.

ఆ విధంగానే ఇంద్రుడు 32 సంవత్సరములు బ్రహ్మచర్యదీక్షలో వ్రతము నిర్వర్తించారు. అప్పుడు ప్రజాపతి ఇట్లా చెప్పనారంభించారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే నవమః ఖండః


8–10. అష్టమ ప్రపాఠకః - దశమః ఖండః - స్వప్న పురుషుడే ఆత్మయా?


య ఏష స్వప్నే మహీయమానశ్చరత్యేష ఆత్మేతి
హోవాచైతదమృతమభయమేతద్బ్రహ్మేతి స హ శాంతహృదయః
ప్రవవ్రాజ స హాప్రాప్యైవ దేవానేతద్భయం దదర్శ
తద్యద్యపీదగ్ం శరీరమంధం భవత్యనంధః స భవతి యది
స్రామమస్రామో నైవైషోఽస్య దోషేణ దుష్యతి .. 8.10.1..
1. య ఏష స్వప్నే మహీయమానః
చరతి, ఏష ఆత్మేతి।।
హ ఉవాచ : ఏతత్ అమృతమ్।
అభయమ్। ఏతత్ బ్రహ్మేతి।
స హ శాంతహృదయః ప్రవవ్రాజ।
ప్రజాపతి : ఎవ్వడైతే మహిమాన్వితుడై స్వప్నమునందు చరిస్తూ ఉంటాడో, ఆతడే ఆత్మ। ఆయన అమృత - అభయస్వరూపుడే। అదియే బ్రహ్మము।

ఆ మాటలు విని ఇంద్రుడు శాంతించిన హృదయము కలవాడై దేవలోకమునకు వెళ్లసాగారు.
స హ అప్రాప్యైవ దేవాన్
ఏతత్ భయం దదర్శ।
తత్ యది అపి ఇదం శరీరమ్
అంధం భవతి అనంధః స భవతి।
యది స్రామమ్ - అస్రామో
న ఏవ ఏషో అస్య దోషేణ దుష్యతి
ఇంకా దేవలోకం చేరకముందే ఆయనకు (దేవతలకు అసలైన విషయం ఏం చెప్పాలి?) - అనే భయం మరల పట్టుకొన్నది. సంశయము మిగిలియే ఉన్నది.
ఇంద్రుడు ఇట్లా ఆలోచించసాగారు.

ఒకనికి ఏదో కారణం చేత గుడ్డితనం వచ్చినప్పటికీ ఆత్మ గుడ్డిది అవదు కదా! శరీరములోని కళ్లు మొదలైన వాటి నుండి దుర్వాసన జలము (స్రామము) కారుచున్నప్పుడు కూడా, తద్వారా ‘ఆత్మ’ నుండి ఏ దుష్టజలము కారదు కదా! ఆయా దోషములు ఆత్మకు అంటవు. ఆత్మ వాటిచే దుష్యము (దూషణార్హము) పొందదు.

న వధేనాస్య హన్యతే నాస్య స్రామ్యేణ స్రామో ఘ్నంతి త్వేవైనం
విచ్ఛాదయంతీవాప్రియవేత్తేవ భవత్యపి రోదితీవ నాహమత్ర
భోగ్యం పశ్యామీతి .. 8.10.2..
2. న వధేన అస్య హన్యతే।
న అస్య స్రామ్యేణ స్రామో।
ఘ్నంతిత్వ ఏవ ఏనం విచ్ఛాదయన్తి ఇవ
అప్రియవేత్తేవ భవతి అపి రోదితి ఇవ।
న అహమ్ అత్ర భోగ్యం
పశ్యామి - ఇతి।।
దేహము వధించబడినప్పుడు కూడా ఆత్మ వధించబడేది కానేకాదు.
శరీరం నుండి చీము, నెత్తురు వంటివి కారినా కూడా ఆత్మ నుండి అవన్నీ స్రామించవు (స్రవించవు). అట్లే కొట్టబడినా, కోయబడినా శరీరముయొక్క రోత (Bad smell) చే ఆత్మ రోత పొందదు.
అందుచేత నేను పితామహులు ప్రజాపతులువారి వద్ద ఇంతవరకు విన్నదానిని అనుసరించి నాకు ఇంకా ఆత్మయొక్క ఆనందానుభవం లభించటంలేదు.

స సమిత్పాణిః పునరేయాయ తగ్ం హ ప్రజాపతిరువాచ
మఘవన్యచ్ఛాంతహృదయః ప్రావ్రాజీః కిమిచ్ఛన్పునరాగమ
ఇతి స హోవాచ తద్యద్యపీదం భగవః శరీరమంధం భవత్యనంధః
స భవతి యది స్రామమస్రామో నైవైషోఽస్య దోషేణ దుష్యతి .. 8.10.3..
3. స సమిత్పాణిః పునరేయాయ।
తం హ ప్రజాపతిః ఉవాచ :
‘‘మఘవన్। యత్ శాంత హృదయః
ప్రావ్రాజీః కిమ్ ఇచ్ఛన్
పునరాగమ?’’ - ఇతి।
స హోవాచ : తత్ యద్యపి ఇదం
భగవః శరీరం అంధం
భవతి, అనంధః స భవతి।
యది స్రామమ్ అస్రామో
నైవ ఏషో అస్య దోషేణ దుష్యతి।
ఇంద్రుడు మరల సమిత్పాణి అయి చేతితో యజ్ఞౌపకరణములు అగు సమిధలు పట్టుకొని మరల సృష్టికర్తయగు ప్రజాపతిని దర్శించారు.

ప్రజాపతి : ఓ మేఘనాయకా! మఘువన్! నేను చెప్పినదానిని విని శాంతి హృదయులై (సంతోషించినవాడివై) వెళ్లావు కదా! మరలా వచ్చావేమి? ఏమి కోరివచ్చావు?
ఇంద్రుడు : పితామహా। బ్రహ్మదేవా। భగవాన్। ఈ శరీరము గుడ్డిది అయినప్పటికీ స్వప్నాత్మ గ్రుడ్డిది అవటం లేదు మరి? ఏది గుడ్డిది (Blind) కాదో అది కదా ఆ ఆత్మ।
- (బొంగవంటి, కన్నీరువంటి స్రావము) శారీరకమైన స్రామముచేత తాను స్రామము పొందినా, ఆ దోషము అద్దానికి (ఆత్మకు) అంటదు.

న వధేనాస్య హన్యతే నాస్య స్రామ్యేణ స్రామో ఘ్నంతి త్వేవైనం
విచ్ఛాదయంతీవాప్రియవేత్తేవ భవత్యపి రోదితీవ నాహమత్ర
భోగ్యం పశ్యామీత్యేవమేవైష మఘవన్నితి హోవాచైతం త్వేవ తే
భూయోఽనువ్యాఖ్యాస్యామి వసాపరాణి ద్వాత్రిగ్ంశతం వర్షాణీతి
స హాపరాణి ద్వాత్రిగ్ంశతం వర్షాణ్యువాస తస్మై హోవాచ .. 8.10.4..

.. ఇతి దశమః ఖండః ..
4. న వధేన అస్య హన్యతే।
న అస్య స్రామ్యేణ స్రామో ఘ్నంతి
త్వేవైనం విచ్ఛాదయంతి ఇవ
అప్రియవేత్త ఏవ భవతి అపి రోదితి ఇవ।
న అహమ్ అత్ర భోగ్యం పశ్యామి।
దేహము వధించబడినా ఏది వధించబడదో, చావదో, ఏది రక్తము స్రవించటము మొదలైన వాటిచే తాను విచ్ఛేదము పొందదో,
- శరీరము రోత (దుర్వాసన) పొందినా కూడా ఏది రోత పొందదో, అట్టి మహాభాగ్యమగు ఆత్మను నేను ఇంకా కూడా దర్శించలేకపోతున్నాను.
స్పప్నంలో ఒకడు తాను చచ్చినట్లు కూడా కలగంటున్నాడు. ఆత్మకు చావు లేదు కదా! ఈఈ కారణాలచేత - ‘‘ఆత్మ ఇట్టిది’’ అని నేను నిర్ణయించుకోలేకపోతున్నాను.
ఇత్యేవమేవ ఏష మఘువన్ ఇతి।
హ ఉవాచ: ఏతం త్వేవ
తే భూయో అనువ్యాఖ్యాస్యామి
వసాపరాణి ద్వాత్రింశతం
వర్షాణి - ఇతి।
స హ అపరాణి ద్వాత్రింశతం
వర్షాణి - ఉవాస।
తస్మై హ ఉవాచ।
ప్రజాపతి : అవును. ఆత్మ గురించిన నిశ్చయానుభవము అంతటి కష్టమైనదే మరి! నీవు కావాలంటే మరల వివరణగా వ్యాఖ్యానించుకుందాము. అయితే నీవు ‘‘32’’ సంవత్సరములు బ్రహ్మచర్య దీక్షతో ఇక్కడ తపస్సు చేయి.

ప్రజాపతి సూచించిన విధంగానే ఇంద్రుడు మరల 32 సంవత్సరములు బ్రహ్మచర్యము చేసి తిరిగి ప్రజాపతివద్దకు వచ్చారు. అప్పుడు ప్రజాపతి ఇట్లు అన్నారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే దశమః ఖండః


8–11. అష్టమ ప్రపాఠకః - ఏకాదశః ఖండః - సుషుప్త పురుషుడే ఆత్మయా?


తద్యత్రైతత్సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాత్యేష
ఆత్మేతి హోవాచైతదమృతమభయమేతద్బ్రహ్మేతి స హ శాంతహృదయః
ప్రవవ్రాజ స హాప్రాప్యైవ దేవానేతద్భయం దదర్శ నాహ
ఖల్వయమేవగ్ం సంప్రత్యాత్మానం జానాత్యయమహమస్మీతి
నో ఏవేమాని భూతాని వినాశమేవాపీతో భవతి నాహమత్ర
భోగ్యం పశ్యామీతి .. 8.11.1..
1. తత్ యత్ర ఏతత్
సుప్తః సమస్తః సం ప్రసన్నః
స్వప్నం న విజానాతి ఏష।
‘‘ఆత్మ’’ - ఇతి।।
హ ఉవాచ : ఏతత్ అమృతమ్।
అభయమ్। ఏతత్
‘‘బ్రహ్మ’’ - ఇతి।।
స హ శాంత హృదయః ప్రవవ్రాజ!
స హ అప్రాప్యైవ దేవాన్,
ఏతత్ భయం దదర్శ
ప్రజాపతి : ఏదైతే గాఢనిద్రపొందుచూ సమస్తమును సంప్రసన్నముగా సమ్యక్ రూపముగా ఆనందించుచూ, జాగ్రత్ - స్వప్నములు తనకు అప్పుడు తెలియబడకయే ఉన్నదో - అదియే ఆత్మ। అద్దాని గుర్తులు ఏమిటంటే
- అది అమృతము
- అభయము
- అదియే బ్రహ్మము

ఆ సమాధానము విని ఇంద్రుడు తృప్తి పొంది, శాంతహృదయుడై బ్రహ్మలోకమునుండి వెనుకకు మరలాడు. ఇంకా దేవలోకము చేరకముందే ఆత్మయొక్క అవగాహన విషయంలో మరల కొంత భయం వచ్చింది. (అభయము సిద్ధించలేదు)
న అహ ఖలు అయం ఏవం సంప్రతి ఆత్మానం
జానాతి। ‘అయమ్ అహమ్ అస్మి’
ఇతి నో ఏవ ఇమాని
భూతాని। వినాశమేవ అపి అతో భవతి।
‘‘న అహం అత్ర భోగ్యం పశ్యామి’ ఇతి।।
ఇంద్రుడు (తనలో) : పితామహుల వారు సూచిస్తున్న దశలో ‘నేను ఇది’ అని తెలియదు. అంతేకాదు. ‘‘వీరు ఈ ఈ తదితర జీవులు - అనేది కూడా తెలియదు కదా! ఆ గాఢ నిద్రా సమయంలో ఈ జీవుడు మరణించిన వానివలె ఉంటాడు।
అందుచేత నాయొక్క వాంఛిత ఫలము అయినట్టి - ‘ఆత్మ’ యొక్క అనుభవము ఈ సూచనచే కూడా సిద్ధించటం లేదే?

స సమిత్పాణిః పునరేయాయ తగ్ం హ ప్రజాపతిరువాచ
మఘవన్యచ్ఛాంతహృదయః ప్రావ్రాజీః కిమిచ్ఛన్పునరాగమ ఇతి
స హోవాచ నాహ ఖల్వయం భగవ ఏవగ్ం సంప్రత్యాత్మానం
జానాత్యయమహమస్మీతి నో ఏవేమాని భూతాని
వినాశమేవాపీతో భవతి నాహమత్ర భోగ్యం పశ్యామీతి .. 8.11.2..
2. స సమిత్పాణిః పునరేయాయ
తం హ ప్రజాపతిః ఉవాచ -
మఘవన్! యత్ శాంతహృదయః
ప్రావ్రాజీ కిం ఇచ్ఛన్ పునరాగమ ఇతి।
స హ ఉవాచ - న అహం ఖలు అయం,
భగవ! ఏవం సంప్రతి ఆత్మానం జానాతి
అయం అహం అస్మి ఇతి, నో ఏవ ఇమాని
భూతాని వినాశం ఏవ అపి అతో భవతి।
న అహం అత్ర భోగ్యం పశ్యామి ఇతి।
ఇంద్రుడు సమిధులను చేతిలో పట్టుకొని మరలా వెళ్లగా,
ప్రజాపతి ఇట్లు అడిగెను - మేఘనాయకా! చెప్పినదానికి సంతృప్తిచెంది వెళ్లినవాడివి మరలా ఏమి కోరి తిరిగి వచ్చావు?
ఇంద్రుడు ఇట్లా చెప్పెను - భగవాన్! నిశ్చయముగా ఇదే నేను (ఆత్మ) అని సుషుప్తిలో తానే తెలుసుకొనలేడు. ఇక ఇతర భూతముల వినాశము తెలుసుకోలేడు. అందు ఆత్మీభావము నాకు కనబడుటలేదు.

ఏవమేవైష మఘవన్నితి హోవాచైతం త్వేవ తే
భూయోఽనువ్యాఖ్యాస్యామి నో ఏవాన్యత్రైతస్మాద్వసాపరాణి
పంచ వర్షాణీతి స హాపరాణి పంచ వర్షాణ్యువాస
తాన్యేకశతగ్ం సంపేదురేతత్తద్యదాహురేకశతగ్ం హ వై వర్షాణి
మఘవాన్ప్రజాపతౌ బ్రహ్మచర్యమువాస తస్మై హోవాచ .. 8.11.3..

.. ఇతి ఏకాదశః ఖండః ..
3. ఏవం ఏవ ఏష మఘవన్ ఇతి।
హోవాచ : ఏతం త్వేవ తే
భూయో అనువ్యాఖ్యాస్యామి।
నో ఏవ, అన్యత్ర ఏతస్మాత్
వసాపరాణి। పంచవర్షాణి ఇతి।
స హ అపరాణి పంచవర్షాణి ఉవాస।
తాని ఏక శతం సంపేదుః
ఏతత్ తద్యత్ ఆహుః।
ఏకశతం హ వై వర్షాణి
మఘవాన్ ప్రజాపతౌ
బ్రహ్మచర్యమ్ ఉవాస।
తస్మై హోవాచ।।
ఇంద్రుడు : మరల వెనకకు వెళ్లి ప్రజాపతితో ‘‘నేను ఆత్మానుభవం పొందలేక పోతున్నాను స్వామీ!’’ అని చెప్పారు.
ప్రజాపతి : ఔను. అది అలాగే ఉంటుంది మరి. మరల నీకు ఆత్మ విషయం గురించి అనువ్యాఖ్యానం చేస్తాను. అట్టి ఆత్మకు వేరుగా ఎక్కడా ఏదీ ఏమాత్రము లేదయ్యా। సరే! నీవు ‘5’ సంవత్సరములు మాత్రం ‘బ్రహ్మము ఎరుగుట’ అనే బ్రహ్మచర్య దీక్షవహించి తపస్సుచేయి.

ఆ విధంగానే ఇంద్రుడు ఇంద్రలోకములోని భోగములన్నీ త్యజించి 32+32+32+5 = 101 సంవత్సరములు తపస్సు చేసారు.

అప్పుడు ప్రజాపతి ఈ విధంగా పలుకసాగారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే ఏకాదశః ఖండః


8–12. అష్టమ ప్రపాఠకః - ద్వాదశః ఖండః - ఆత్మయే శరీరాదులుగా ప్రకటనమైనది


మఘవన్మర్త్యం వా ఇదగ్ం శరీరమాత్తం మృత్యునా
తదస్యామృతస్యాశరీరస్యాత్మనోఽధిష్ఠానమాత్తో వై
సశరీరః ప్రియాప్రియాభ్యాం న వై సశరీరస్య సతః
ప్రియాప్రియయోరపహతిరస్త్యశరీరం వావ సంతం న
ప్రియాప్రియే స్పృశతః .. 8.12.1..
1. మఘవన్। మర్త్యం వా ఇదం
శరీరం। ఆత్తం మృత్యునా।
తదస్య అమృతస్య అశరీరస్య
ఆత్మనో అధిష్ఠానం ఆత్తో వై,
ప్రజాపతి : హే మఘవన్! ఇంద్రదేవా! ఈ శరీరము ‘మరణించటము’ అనే స్వభావము కలిగియున్నది. అందుకే ఇది ‘‘మర్త్యము’’ - అనబడుతోంది. ఈ భౌతికశరీరం ముత్యువుచేత ఆత్తము (గ్రస్తము) అయి ఉన్నది.
అయితే ఈ శరీరము ఒక ఉపాధి (లేక) ఉపకరణముగా కలిగియుండి, దీనికి వేరైనవాడు - ‘శరీరి’. ‘శరీరి’కి మృత్యువు లేదు. కనుక ‘అమృతుడు’.
శరీరమునకు వేరై ఉన్నాడు.
శరీరమునకు మునుముందే ఉన్నాడు.
ఈ శరీరము జడమై, దీనికి ఆధారము - అధిష్ఠానము, కనుక ‘అశరీరి’ ।
సశరీరః ప్రియ - అప్రియాభ్యాం న హ
వై సశరీరస్య సతః ప్రియ - అప్రియయోః అపహతిః
అస్తి అశరీరం వావ సన్తం న ప్రియ
అప్రియే స్పృశతః।
అశరీరమగు ఆత్మ శరీరమును చేతనము చేయుచు ‘సశరీరము’ అనిపించుకుంటోంది.
‘‘నేను శరీరము కలవాడను’’- అను భావముచే పరమగు ఆత్మ ‘శరీరి’గా అయి ‘‘ప్రియ-అప్రియములు’’ పొందుతోంది.
ఎంతెంతవరకైతే ఆత్మ ‘‘నేను శరీరమునకు చెందినదానను’’ - అనే తాదాత్మ్యము ఏర్పడి ఉంటుందో, అంతంతవరకు ప్రియ - అప్రియములచే శరీరము బాధింపబడుచూనే (అపహతమై)ఉంటుంది.
వాస్తవానికి :
- సశరీరంగా ప్రియాప్రియములు ఉన్నప్పటికీ…
- (శరీరమునకు ముందే ఉన్న….కేవల చైతన్యముగా) అశరీరిని (శరీర-దృశ్య సంబంధమైన) ప్రియాప్రియములు స్పృశించలేవు.

అశరీరో వాయురభ్రం విద్యుత్స్తనయిత్నురశరీరాణ్యేతాని
తద్యథైతాన్యముష్మాదాకాశాత్సముత్థాయ పరం జ్యోతిరుపసంపద్య
స్వేన రూపేణాభినిష్పద్యంతే .. 8.12.2…
2. అశరీరో వాయుః అభ్రం
విద్యుత్ స్తనయిత్నుః అశరీరాణి
ఏతాని। తత్ యథా ఏతాని
అముష్మాత్ ఆకాశాత్ సముత్థాయ
‘‘పరంజ్యోతిః’’ ఉపసంపద్య
స్వేన రూపేణ అభినిష్పద్యన్తే।
‘‘ఈ జీవుడు వాస్తవానికి శరీరమునకు వేరై ఉండటంచేత అశరీరుడే’’ అనవచ్చును కూడా।

- వాయువునకు శరీరము ఉన్నదా? లేదు। అశరీరమే।
- అట్లాగే అభ్రము (ఆకాశము)నకు శరీరము లేదు। అశరీరమే।
- విద్యుత్తు (తేజస్సు/వెలుగు)కు శరీరము ఉన్నదా? లేదు.
- స్తనయత్నువు (ఉరుము, పిడుగు)కు మాత్రం శరీరమున్నదా? లేదు. ఇవన్నీ కూడా అశరీరములే.

ఇవన్నీ కూడా నిర్విషయము, అశరీరము అగు ఆకాశమునుండి సముత్థాయమ్ (Get generation) పొంది, పరంజ్యోతి (Basic Enlightenment) పొంది ప్రవర్తించిరి. వాటి వాటి స్వరూప స్వభావములతో సహా పరంజ్యోతినందే లీనమగుచున్నాయి.

ఏవమేవైష సంప్రసాదోఽస్మాచ్ఛరీరాత్సముత్థాయ పరం
జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యతే స ఉత్తమపురుషః
స తత్ర పర్యేతి జక్షత్క్రీడన్రమమాణః స్త్రీభిర్వా యానైర్వా
జ్ఞాతిభిర్వా నోపజనగ్ం స్మరన్నిదగ్ం శరీరగ్ం స యథా
ప్రయోగ్య ఆచరణే యుక్త ఏవమేవాయమస్మింఛరీరే
ప్రాణో యుక్తః .. 8.12.3..
3. ఏవం ఏవ ఏష సంప్రసాదో అస్మాత్
శరీరాత్ సముత్థాయ పరంజ్యోతిః
ఉపసంపద్య, స్వేన రూపేణ అభి నిష్పద్యతే।
(ఏవిధంగా అయితే వాయువు, ఆకాశము, విద్యుత్తు, ఉరుములు శరీరం కాక, ఆత్మాకాశమునుండి బయల్వెడలి తిరిగి ఆత్మ తేజస్సునందు లీనము అగుచూ ఉన్నాయో) ఆ విధంగానే - (నిర్మలమైన, సునిశితమైన, విస్తారమైన, బలముతో కూడిన బుద్ధిగల) సంప్రసాదుడు (జీవుడు) ఈ శరీరస్థితి నుండి (లేక) ‘‘శరీర భావన’’ నుండి తనను తాను సముత్థరించుకొని, (సమస్తజ్యోతులలోని మూలజ్యోతి స్వరూపము వలె) సర్వజీవులలో, సమముగా వేంచేసియున్న పరంజ్యోతి స్వరూపుడై స్వస్వరూపధారణ అనుక్షణికం చేసుకొని ఉంటున్నాడు.
స ఉత్తమ పురుషః।
స తత్ర పర్యేతి జక్షత్క్రీడన్ రమమాణః
స్త్రీభిః వా యానైః వా జ్ఞాతిభిః వా
న ఉపజనం స్మరన్।
ఇదం శరీరం స యథా ప్రయోగ్య
ఆచరణే యుక్త ఏవం ఏవ అయం
అస్మిన్ శరీరే ప్రాణో యుక్తః।
ఆతడే ఉత్తమ పురుషుడు (First Person - ‘‘I’’).

అట్టి సమస్తము నందు ఉన్నట్టి అంతరాత్మస్వరూపుడగు పరమాత్మ - తన సర్వాత్మత్వమును ఏమరచుచున్నాడు.
- ‘‘లీలావినోదమా?’’
- అన్న తీరుగా (జక్షన్-నవ్వుకొంటూనే) - క్రీడించుచున్నాడు. స్త్రీ, వాహన, గృహ, బంధువులు మొదలైనవన్నీ స్మరించుచు నవ్వుచూ, ఆడుచూ, ఆనందిస్తూ విహరిస్తున్నాడు. అరుస్తూ పరిమితమునందు చక్రభ్రమణం చేస్తున్నాడు.

తనకు ఎక్కడి నుండో ప్రాప్తించిన ఈ పాంచభౌతిక శరీరము ఎటువంటిదో, తాను ఎటువంటివాడో విచారణ చేయకుండానే దృశ్యములో పరివర్తిస్తూ ఉన్నాడు.

ఈ విధంగా బండికి ఎద్దు కట్టబడియున్న విధంగా ఆతని ప్రాణము (ప్రాణశక్తి) జడమగు శరీరమునకు కట్టబడినదై ఉంటోంది.

అథ యత్రైతదాకాశమనువిషణ్ణం చక్షుః స చాక్షుషః
పురుషో దర్శనాయ చక్షురథ యో వేదేదం జిఘ్రాణీతి స ఆత్మా
గంధాయ ఘ్రాణమథ యో వేదేదమభివ్యాహరాణీతి స
ఆత్మాభివ్యాహారాయ వాగథ యో వేదేదగ్ం శృణవానీతి
స ఆత్మా శ్రవణాయ శ్రోత్రం .. 8.12.4..
4. అథ యత్ర ఏతత్ ఆకాశం
అనువిషణ్ణం చక్షుః స చాక్షుషః
పురుషో దర్శనాయ చక్షుః అథ యో
వేద ఇదం ‘జిఘ్రాణి’ ఇతి।
స ఆత్మా గంధాయ ఘ్రాణం
అథ యో వేద ఇదమ్ అభివ్యాహరాణి ఇతి।।
స ఆత్మా అభివ్యాహారాయ
వాక్ అథ యో వేద,
ఇదం శృణవాని ఇతి స ఆత్మా
‘‘శ్రవణాయ’’ శ్రోత్రమ్।।
- ఎక్కడ చూచువాడు (చాక్షుష పురుషుడు) దర్శనము నిర్వర్తించగలడో అట్టి స్థానమే ‘‘కన్ను’’. ఈ కన్ను అనేది ఉన్నదే కేవలం చూచువాని యొక్క ఉపయోగము కొరకు. అట్టి కళ్లలోని చూచువాడే, (మరియు) దర్శనచైతన్యమే ‘‘ఆత్మ’’.

గంధము (Smell) యొక్క ఎరుక - అనుభవముల కొరకే ఘ్రాణము (ముక్కు) ఆత్మకు వాసనయొక్క అనుభవైకస్థానముగా (ఘ్రాణాకాశముగా) ఉన్నది.

ఆత్మయొక్క అనుభవము నిమిత్తమే (అభివ్యవహారము కొరకే) ఆత్మాకాశమునందు వాక్కు నోటి స్థానమునందు రూపుదిద్దుకొంటోంది.

ఆ వాక్కు వినటానికే ఆత్మాకాశము చెవులవద్ద శ్రవణతత్త్వముగా ఏర్పడి ఉంటోంది.

అథ యో వేదేదం మన్వానీతి సాత్మా మనోఽస్య దైవం చక్షుః
స వా ఏష ఏతేన దైవేన చక్షుషా మనసైతాన్కామాన్పశ్యన్రమతే
య ఏతే బ్రహ్మలోకే .. 8.12.5..

తం వా ఏతం దేవా ఆత్మానముపాసతే తస్మాత్తేషాగ్ం సర్వే చ
లోకా ఆత్తాః సర్వే చ కామాః స సర్వాగ్ంశ్చ లోకానాప్నోతి
సర్వాగ్ంశ్చ కామాన్యస్తమాత్మానమనువిద్య విజానాతీతి హ
ప్ర్జాపతిరువాచ ప్రజాపతిరువాచ .. 8.12.6..

.. ఇతి ద్వాదశః ఖండః ..
5. అథ యో వేద ఇదం మన్వాని ఇతి।
స ఆత్మా ‘మనో’। అస్య దైవం ‘చక్షుః’।
స వా ఏష ఏతేన దైవేన
చక్షుషా మనసి ఏతాన్
కామాన్ ‘పశ్యన్’ రమతే।
ఆత్మయొక్క శ్రవణము (Hearing) కొరకే శ్రవణాయము (చెవులు) అవర్తమానమై ఉన్నది.

‘‘నేను మననము చేసెదను గాక’’ అని ఎవరి నిర్ణయమో, అదియే ‘‘ఆత్మ’’. ఆ విధంగా ఆత్మయే మనోరూపము దాల్చుచున్నది. ఆత్మయొక్క దివ్యచక్షువులు (కళ్లు) - మనస్సు.

అట్టి ఆత్మ తనయొక్క మనోచక్షువులచే భోగములను, మధురమగు భావములను, వస్తువులను దర్శించుచూ తనయందు తానే దృశ్యరూపముగా రమించుచున్నది.
6. య ఏతే బ్రహ్మలోకే
తం వా ఏతం దేవా ఆత్మానం ఉపాసతే।
తస్మాత్ తేషాం సర్వే చ
లోకా ఆత్తాః సర్వే చ కామాః।
స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి।
ఓ ఇంద్రదేవా। బ్రహ్మలోకములో దేవతలు అట్టి శ్రవణము, చూపు, మనస్సు తనయొక్క స్వకీయ ప్రదర్శనమే అయి ఉన్న పరమాత్మనే ఉపాసించుచున్నారు.
నీవు కూడా ‘‘ఈ సమస్తము ఆత్మయే’’ అని ఉపాసించు!

ఎవ్వరైతే ఆత్మయే ఈ సమస్త జీవులుగాను, చూపు - వినికిడి - మాట్లాడటము - స్పర్శ - వాసనగా, మనస్సుగా తనకొరకు తానే తనయందు ప్రదర్శనమగును అని, ఈ సమస్త లోకములగాను ప్రదర్శనమగుచున్నదని, ఆత్మయే ఈ అంతటి వాస్తవరూపమని గ్రహిస్తారో అట్టివారు - సర్వలోకములను తమయందే పొందుచున్నారు. వారు ఏ లోకములో ఏది కోరుకొంటే అవన్నీ సిద్ధించగలవు. వారు కోరుకొన్న లోకము పొందగలరు.
సర్వాంశ్చ కామాని అస్తమ్
ఆత్మానం అనువిద్య విజానాతి ఇతి।
హ ప్రజాపతిః ఉవాచ।
ప్రజాపతిః ఉవాచ।
ఎవ్వరైతే ఈ ఆత్మశాస్త్రమును ఆచార్యోపాసన చేస్తూ అధ్యయనము చేస్తారో, ఆత్మవిద్యను తెలుసుకొని, ఆత్మయే తామై ప్రకాశమానులై ఉంటారో వారు వాంఛించినవన్నీ పొందగలరు.
ఈ విధంగా ఆత్మవిద్యను ప్రజాపతి ఇంద్రునికి విశదీకరించారు. తెలియపరచారు.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే ద్వాదశః ఖండః


8–13. అష్టమ ప్రపాఠకః - త్రయోదశః ఖండః - కర్మలు దాటి బ్రహ్మలోకము పొందవలెను


శ్యామాచ్ఛబలం ప్రపద్యే శబలాచ్ఛ్యామం ప్రపద్యేఽశ్వ
ఇవ రోమాణి విధూయ పాపం చంద్ర ఇవ రాహోర్ముఖాత్ప్రముచ్య
ధూత్వా శరీరమకృతం కృతాత్మా
బ్రహ్మలోకమభిసంభవామీత్యభిసంభవామీతి .. 8.13.1..

.. ఇతి త్రయోదశః ఖండః ..
1. శ్యామాత్ శబలం ప్రపద్యే।
శబలాత్ శ్యామం ప్రపద్యే।
అశ్వ ఇవ రోమాణి
విధూయ పాపం, చంద్ర ఇవ రాహోః
ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీరం
అకృతం కృతాత్మా బ్రహ్మలోకం
అభిసంభవామి ఇతి।
అభి సంభవామి ఇతి।
నీలిలోహిత వర్ణమగు హృదయమును, హృదయంలో విలసిల్లుచున్న శ్యామము (ఆత్మ)ను ఉపాసించుచూ ఆత్మనే పొందుచున్నాము.

- గుఱ్ఱము తన రోమమలు విదల్చి ధూళి పోగొట్టుకొనువిధంగా
- రాహువు నోటిలో నుండి బయటకు వచ్చివేసిన చంద్రునివలెను
కృతకృత్యుడనై సర్వకర్మదోషములను తొలగించివేసుకొని సమస్తము బ్రహ్మముగా చూచు బుద్ధిస్థితియందు బ్రహ్మలోకములో ఉనికిని పొందుచున్నాము. బ్రహ్మలోకమునందు నివాసయోగ్యులము అగుచున్నాము.

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే త్రయోదశః ఖండః


8–14. అష్టమ ప్రపాఠకః - చతుర్దశః ఖండః - బ్రహ్మము నామరూపములకు ఉపాదాన కారణమైనా మార్పు చేర్పులు లేనిది


ఆకాశో వై నామ నామరూపయోర్నిర్వహితా తే యదంతరా
తద్బ్రహ్మ తదమృతగ్ం స ఆత్మా ప్రజాపతేః సభాం వేశ్మ ప్రపద్యే
యశోఽహం భవామి బ్రాహ్మణానాం యశో రాజ్ఞాం యశోవిశాం
యశోఽహమనుప్రాపత్సి స హాహం యశసాం యశః
శ్యేతమదత్కమదత్కగ్ం శ్యేతం లిందు మాభిగాం లిందు
మాభిగాం .. 8.14.1..

.. ఇతి చతుర్దశః ఖండః ..
1. ఆకాశో వై నామ। నామ -
రూపయోః నిర్వహితా।
తే యత్ అన్తరా, తత్ బ్రహ్మ।
తత్ అమృతం। స ఆత్మా।
ప్రజాపతేః - సభాం వేశ్మ ప్రపద్యే।
- ఆకాశము (హృదయాకాశము) నామాత్మకమైయున్నది.
- అట్టి (దహర లేక హృదయ) ఆకాశమునందు నామరూపములు నిర్వహించబడుచున్నాయి.
- (ఆభరణములకు - బంగారమువలె, మట్టిబొమ్మలకు మట్టివలె, తరంగములకు జలమువలె) - నామరూపాత్మకమైన ఈ సమస్తమునకు అంతరమున బ్రహ్మము విరాజమానమైయున్నది.

అట్టి అంతరాంతర్గతమగు బ్రహ్మమే మార్పు చేర్పులకు విషయమే కానిదై, అమృతస్వరూపమై యున్నది. అదియే ‘‘ఆత్మ’’.

అట్టి బ్రహ్మమును, (లేక) ఆత్మను ఉపాసిస్తూ ఉన్నాను. ‘‘ప్రజాపతి సభ’’ అనే బ్రహ్మలోకమును ప్రవేశించి బ్రహ్మమునే సర్వత్రా సమస్వరూపంగా ఉపాసించుచున్నాను.
యశో అహం భవామి।
బ్రాహ్మణానాం యశః। రాజ్ఞాం యశః।
విశాం యశో। అహం అనుప్రాపత్సి,
స హ అహం యశసాం యశః శ్యేతం
అదత్కం - అదత్కం।
శ్యేతం లిన్దు మాభిగామ్।।
అధ్యయనము : బ్రాహ్మణములు అధ్యయనం చేస్తూ, బ్రహ్మము గురించి ఎరిగియున్న బ్రాహ్మణుల యశస్సు ‘నేనే’ అయి ఉన్నాను.

రక్షణ : ‘రక్షణ’ ధర్మము నిర్వర్తించు క్షత్రియులలోని క్షత్రియ యశస్సును కూడా నేనే।

క్రియాసామర్థ్యము : వైశ్యులలోని క్రియా సామర్థ్య యశస్సునూ నేనే।

యశస్సు : అట్టి యశస్సుల శోభచేత యశస్సుకే యశస్సును అయి ఉన్నాను.

ఆత్మనగు నేను ఆత్మతత్త్వమునే దర్శిస్తూ సమస్తము ఆత్మగా పొందెదనుగాక। దంతవిహీనమై సర్వభక్షకమగు, స్వతఃగా లేని ‘మాయ’కు ఎర కాకుండెదను గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే చతుర్దశః ఖండః


8–15. అష్టమ ప్రపాఠకః - పంచదశః ఖండః - ఆత్మ బోధ పరంపర


తధైతద్బ్రహ్మా ప్రజాపతయై ఉవాచ ప్రజాపతిర్మనవే మనుః
ప్రజాభ్యః ఆచార్యకులాద్వేదమధీత్య యథావిధానం గురోః
కర్మాతిశేషేణాభిసమావృత్య కుటుంబే శుచౌ దేశే
స్వాధ్యాయమధీయానో ధర్మికాన్విదధదాత్మని సర్వైంద్రియాణి
సంప్రతిష్ఠాప్యాహిగ్ంసన్సర్వ భూతాన్యన్యత్ర తీర్థేభ్యః
స ఖల్వేవం వర్తయన్యావదాయుషం బ్రహ్మలోకమభిసంపద్యతే
న చ పునరావర్తతే న చ పునరావర్తతే .. 8.15.1..

.. ఇతి పంచదశః ఖండః ..

.. ఇతి అష్టమోఽధ్యాయః ..
1. తద్ధైతత్ బ్రహ్మా ప్రజాపతయ ఉవాచ :
ప్రజాపతిః మనవే।
మనుః ప్రజాభ్యః
ఆచార్య కులాత్
వేదమ్ అధీత్య।
యథా విధానం
గురోః కర్మా అతిశేషేణ
అభి- సమావృత్య।
ఈ ఆత్మజ్ఞానమును సృష్టి సంకల్పియగు బ్రహ్మ సృష్టి అభిమానియగు ప్రజాపతికి ఉపదేశించారు.
ప్రజాపతి మనువుకు, మనువు జనులకు బోధించారు.
★ ఆత్మతత్త్వజ్ఞులగు ఆచార్యులను ఆశ్రయించి, వేదము అధ్యయనము చేసెదరు గాక।
★ గురువు బోధించిన యథావిధిగా కర్మానుష్ఠానమును నిర్వర్తిస్తూ ఆత్మభావనను నిర్దుష్టము చేసుకొనెదరు గాక।
కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయం అధీయానో।
ధార్మికాన్ విదధత్।
ఆత్మని సర్వేన్ద్రియాణి సంప్రతిష్ఠ అపి
అహింసః సర్వభూతాని,
అన్యత్ర తీర్థేభ్యః।
స ఖలు ఏవం వర్తయన్ యావత్
ఆయుషం బ్రహ్మలోకం
అభిసంపద్యతే।
న చ పునః ఆవర్తతే।
న చ పునః ఆవర్తతే।।
★ తరువాత కుటుంబము (గృహస్థాశ్రమము) నిర్వర్తించెదరు గాక।
★ శుచి అయిన ప్రదేశము ఎన్నుకొని స్వాధ్యాయనము నిర్విర్తించెదరు గాక।
★ ధార్మికమైన అభ్యాసములు కార్యక్రమములు కలిగి ఉండండి.
★ ఇంద్రియములను సర్వత్రా ఆత్మదర్శనమునందు నియమించండి.
★ తదితర జీవులపట్ల ఆప్యాయత కలిగి ఉండండి.
★ సహజీవులపట్ల అహింసను వ్రతంగా నిర్వర్తిస్తూ ఉండండి.
★ పురుషార్థములు చక్కగా శాస్త్రానుకూలంగా నిర్వర్తించండి. జీవితము మహత్తరమైన అవకాశంగా భావించండి.

పునరావృత్తిలేని బ్రహ్మలోక నివాసము సిద్ధించుకోండి!

ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుః
శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి .
సర్వం బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ
నిరాకరోదనికారణమస్త్వనికారణం మేఽస్తు .
నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణంం మేఽస్తు .
తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే
మయి సంతు తే మయి సంతు ..

.. ఓం శాంతిః శాంతిః శాంతిః ..

.. ఇతి ఛాందోగ్యోఽపనిషద్ ..
ప్రార్థన
2. ఓం ఆప్యాయస్తు మమ
అంగాని, వాక్ ప్రాణః చక్షుః
శ్రోత్రమ్ అథో బలం ఇన్ద్రియాణి
చ సర్వాణి।
సర్వం బ్రహ్మ ఉపనిషదం।

మా అహం బ్రహ్మ నిరాకుర్యాం।
మామా బ్రహ్మ నిరాకరోత్।
అనిరాకరణం అస్తు।
అనిరాకరణం మే అస్తు।
తత్ ఆత్మని నిరతే
య ఉపనిషత్ సు ధర్మాస్తే మయి సన్తు।
తే మయి సన్తు।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।
ఉపనిషత్తులన్నిటిలో ఎలుగెత్తి గానం చేయబడుచు, ప్రబోధించ బడుచున్న ఆత్మ-తత్త్వజ్ఞానము సంపాదించుకోవటానికి నా వాక్కు, ప్రాణము, చక్షువులు (కన్నులు), చెవులు ఆప్యాయము కలిగి తోడు అగును గాక।

❊ బ్రహ్మము నన్ను నిరాకరించకుండును గాక। నిరాదరణ చేయకుండును గాక.
❊ నేను తత్త్వార్థసారమగు బ్రహ్మము (సోఽహమ్ తత్త్వమ్ రూప సర్వస్వరూప, స్వస్వరూపము) పట్ల నిరాదరణ కలిగి ఉండ కుండెదను గాక।
❊ బ్రహ్మము నన్ను నిరాకరణము చేయకుండా అనుగ్రహించు చుండును గాక।
❊ ఉపనిషత్తులు చెప్పుచున్న ఆత్మధర్మము పట్ల నిరతి కలిగి ఉండెదను గాక.
❊ ఉపనిషత్తులు చెప్పుచున్న ఆత్మధర్మము మా హృదయమునందు సుస్థిరమగును గాక।

ఇతి - ఛాందోగ్యోపనిషత్ - అష్టమాధ్యాయే పంచదశః ఖండః

🌺 ఇతి - ఛాందోగ్యోపనిషది అష్టమ అధ్యాయః సమాప్తః ।। 🌺


🌺🌹 ఇతి ఛాందోగ్యోపనిషత్ సమాప్తా 🌹🌺

🦢 ఓం శాంతిః। శాంతిః। శాంతిః। 🦢


సామవేదాంతర్గత

16     ఛాందోగ్యోపనిషత్ - అధ్యయన వచన పుష్పము

16–1.     ఛాందోగ్యోపనిషత్ - అధ్యయన వచన పుష్పము - ప్రథమ అధ్యాయము

‘‘ఓం’’ →
(1) పరమాత్మ యొక్క (మరియు) ఈ జీవుని యొక్క సహజ స్వరూపమైయున్నట్టి సంజ్ఞ.
(2) సమస్తము తనకు అనన్యమైయున్న ఏకము (Indivisible Unity).
(3) అక్షరము (కాలము, సంఘటనలు మొదలైన వాటిచే క్షరము పొందనిది) అగు తత్త్వమునకు సంజ్ఞ (గణితములో ‘x’ అనుకొనుము - వంటిది)
(4) దేవతా ప్రతిమ వలె ‘‘పరమాత్మకు ప్రతీక’’. ఈ ఈ లక్షణములు గల ఆత్మకు చిహ్నాక్షరము. ‘అ’, ‘ఉ’ ‘మ’ల సమాహారము.


ఉద్గీథము : ఉత్ + గీథము : కర్మ యొక్క అంగములతో సంబంధము కలిగి, కర్మ యొక్క ఫలమునకు అతిశయము (Superiority) కలిగించునది. ‘ఓం’కారము కూడా ఉద్గీథముగా అభివర్ణితము.


ఉపాసన = చిత్తమును శుద్ధము చేయుటము ద్వారా ఆత్మ వస్తువును ప్రకాశింపజేయటానికై శాస్త్రముచే చెప్పబడే నియమము - నిష్ఠ

ఉపనిషత్ =
(1) ఆత్మజ్ఞానము
(2) ఆత్మజ్ఞానము సిద్ధించటానికై ఉపాసనలు

విధి విధానములతో కూడిన శాస్త్రీయ ‘‘కర్మలు’’:
‘నేను’ అనునది సమస్తమునకు ఆవల, కేవలమై ఉన్నప్పటికీ - ‘‘నేను కర్తను, భోక్తను’’ అను భావము కేవలమును కప్పి ఉంచుతోంది.
కర్తృత్వ భోక్తృతృములకు, ఉపాయముగా శాస్త్రములు కర్మలు సూచిస్తూ -



16–1–1. ప్రథమ అధ్యాయము - ప్రథమ ఖండము - ‘‘ఉద్గీథ విద్య’’

‘‘ఓం’’

సమస్త జీవులుగాను, వారి యొక్క బహిరంగ జగదానుభవము గాను, అంతరంగ చతుష్టయమగు మనోబుద్ధి చిత్త అహంకారములుగాను సంప్రదర్శనమగుచూ, తాను సమస్తమునకు పరమై ఉన్నట్టి ‘‘ఆత్మ-తత్త్వము’’నకు ‘బ్రహ్మము’ అను పేరు.

‘‘ఓం’’ అను అక్షర సంజ్ఞ: (ఒకని తండ్రికి ఆ తండ్రి యొక్క ఫొటో సంజ్ఞయగు తీరుగా) (సంహిత- బ్రాహ్మణ - ఆరణ్యక - ఉపనిషత్ - మొదలగునవి గల) వేదము యొక్క సమస్త విభాగములలోను, మంత్రానుష్ఠానములలోను ఉపయోగించబడుచున్న అక్షరము - ‘‘ఓం’’.

అట్టి ‘ఓం’ను - ‘‘ఇది ఏకము, అక్షరము అగు ఆత్మయే’’ - అను ఎరుకచే ఆయా సమస్త కార్యక్రమముల నిర్వహణ చేస్తూ, ఉపాసించెదరు గాక!

‘ఓం’ ఇతి ఉద్గాయతి - ఈ దృశ్యమునకు ఆవల గల ఆత్మతత్త్వము వైపుగా గానము చేయిస్తూ, పరమగు స్వరూపము వైపుగా నడిపించు శాస్త్ర విభాగమునకు, ఉపవ్యాఖ్యానమునకు ‘ఓం’ అని పేరు. అట్టి ఉపవ్యాఖ్యానమును ఇప్పుడు ఈ ఛాందోగ్యోపనిషత్తులో సవివరించుకుంటున్నాము.

(రసము = గతి। ఉత్పత్తికి కారణము। పరాయణము - స్థితికి కారణము। విలీనమయ్యే స్థానము)

ఈ చర అచర భూతజాలమునకు ‘‘రసము’’ - ‘‘పృథివి’’ (దేహములన్నీ భూమి నుండి బయల్వెడలే అన్న రసము చేతనే నిర్మితమౌచున్నాయి కాబట్టి)

ఓంకార రసమే - రసతమము (Superlative), పరము, సారములలో ఎనిమిదవదగు ‘ఓం’కారము.

(1) పృథివి (2) జలము (3) ఓషధులు (4) పురుషుడు (5) వాక్కు (6) ఋక్కులు (7) సామగానము (ఉద్గీథము, కర్మ వ్యవహారములు) (8) ఓంకారము - 8వది పరమాత్మ పరాకాష్ఠయగు ‘ఓం’కార స్వరూపుడు.

ఋక్కు - సామ - ఉద్గీథ - ఏమేమై ఉన్నాయి? దీనిని మనము విమర్శించుకొని చెప్పుకొందాము.

‘‘వాక్కుయే ఋక్కు’’ : ఋగ్వేదములోని పరమాత్మ గురించు స్తుతి - వర్ణనల రూపములగు ఋక్కులు, వాక్కునకు ఋక్కు (అనుభవము) ఉత్పత్తి స్థానము.

‘‘ప్రాణమే సామము’’ : ప్రాణమే సామము(గానము)నకు ఉత్పత్తి స్థానము.

‘‘ఓం’’ అను అక్షరమే ఉద్గీథము (కార్యక్రమము) - (Programme of Action / Following a procedure).

వాక్కులోంచి ఋక్కులు; ప్రాణము నుండి సామము. ఆ రెండింటి ఏకత్వము సిద్ధించటానికి ‘ఓం’ అనునది సాధన వస్తువు. కనుక ‘ఓం’ ఉద్గీథమే;

ఋక్కులు (స్తుతులు), సామములు (గానము) - ఈ రెండూ కూడా ‘‘ఓం’’ అను అక్షర పరబ్రహ్మమును సిద్ధించుకోవటానికి మార్గములు, ఉపాయములే.

అందుచేత ఋక్ - సామములు మరియు వాక్-ప్రాణములు ‘‘మిథునము’’ (పరస్పర దాంపత్య ఏకత్వము, కలయిక)చే ‘ఓం’ను పొందుచున్నాయి.

‘ఓం’కారము నందు ఆ రెండింటి సంయోగమే మిథునము. ఆ రెండు ప్రకృతి - పురుషుల వలె పరస్పరము ఇచ్ఛాపూరితము అగుచున్నాయి. అట్టి వాక్-ప్రాణములు రెండు అక్షరమునందు ఏకము (ఉద్గీథము) చేయు కార్యక్రమము ‘ఓం’గా తెలుసుకున్న విద్వాంసుడు తాను కోరుకొన్న లోకాంతర్గత లోకాతీత స్థితులు మొదలైనవన్నీ పొందుచున్నాడు.

ఒకడు తాను కోరుకొను వస్తువును మరొకరిని అడిగినప్పుడు ఆ రెండవవాడు ‘‘ఓ! ఇస్తాను’’ - అంటాడు. అందుకని ‘ఓం’ ‘‘అనుజ్ఞాతాక్షరము’’ అని కూడా అంటారు.

అనుజ్ఞ (Permission) ఇస్తున్నప్పుడు మనుజుడు "Oh, Yes! తప్పకుండా ఇస్తాను. (Oh, Alright) అట్లాగే చేస్తాను. ఓ! అట్లాగా?’’ (Is it so?) మొదలైన మాటలలో ఓంకారము అంగీకారాక్షరముగా ఏర్పడి ఉంటోంది.

‘‘ఓం’’ - అనుజ్ఞ - అవగాహన - అనుమతి - సమృద్ధి - సమర్ధత = తద్వా ఏతత్ అనుజ్ఞాక్షరమ్,

యద్ధి కించ - అనుజానాతి = ‘తెలుసు’ అనటానికి, పని ఒప్పుకోవటానికి, విషయము అంగీకరించటానికి, సమృద్ధి (Plenty) అని సూచించటానికి, సమర్థత తెలియజేయటానికి, సహాయం చేస్తాను’ అనటానికి, ‘తప్పకుండా’ అని అనటానికి, అంతేలే - అని ప్రోత్సాహపరచటానికి, ‘అట్లాగా’ అని అర్థం చేసుకొనుచున్నట్లు ప్రకటించటానికి - మొదలైన ఆయా సందర్భాలలో ‘ఓ’ అని ఉపయోగిస్తున్నారు కదా! ఇన్ని అర్థాలు కలుపుకొని ‘ఓం’ అను అక్షరము ఉపాసించబడుగాక! సమర్థయితా హ వై కామనాం భవతి య ఏతత్ ఏవం విద్వాన్ అక్షరమ్ ఉద్గీథమ్ ఉపాస్తే।

ఎవ్వరైతే అక్షరము అగు ఆత్మ గురించిన తత్త్వమును అధ్యయనము చేయాలనుకుంటాడో - అట్టి విద్వాంసుడు ‘ఓం’ను అక్షరమగు ఆత్మకు సంజ్ఞగాను, ఆత్మభావన సిద్ధించటానికి ఉపకరించే ఉపాసనా విధానము (కార్యక్రమము)గాను, ఆశ్రయించటం చేత స్థితులు, స్థానములు, ఉత్తరోత్తర జన్మలు, లోకములు తాను ఇష్టపడు విధంగా సిద్ధించుకోగలడు. (He can become independent of them all).

‘ఓం’కార ఏకాక్షరోపాసనచే ఇంకా కూడా…,
- ఋక్కులు, యజస్సులు, సామములు (మరియు) ధర్మ-అర్థ-కామములు అనే త్రయీ విద్య యందు (ఓంకారముతో అర్థయుతంగా ప్రారంభించుచుండగా) ఉత్తమ ప్రవృత్తి సిద్ధించగలదు.

‘ఓం’ ఇతి ఆశ్రవయతి! ‘ఓం’ అని ఆధ్వర్యుడు (లేక) అగ్నీధ్రుడు అగ్నిమంత్రము ప్రారంభిస్తూ, ఋత్విక్కు అయి ఋగ్వేదమంత్రము (ఋక్కు) పలుకుచూ, ‘‘అగ్ని దేవా! ఇదిగో! హవిస్సులు మేము సిద్ధము చేస్తున్నాము’’.. అను అంతరార్థముతో పలుకుచున్నాడు. ‘‘మేము యజ్ఞోపాసన ప్రారంభిస్తున్నాము. అంతా సిద్ధము. యజ్ఞ పురుషా! దయచేయండి (Welcome)! ’’ - అని ‘ఓం’ యొక్క ఉచ్చారణను ఆ ఋత్విక్కు పలుకుచున్నాడు. (‘‘ఓం! అగ్ని మీళే పురోహితే’’ - మొదలైన ఋక్కులు) ఓంకారముతోనే సుస్వాగతం పలుకుచున్నాయి. ‘‘సర్వము సిద్ధము’’ అనునది ఋక్కుగా పలుకబడుతోంది. అదియే ఓంకారార్థము.

ఓం ఇతి శగ్ంసతి! ‘‘దేవతా శంసనములు (దేవతా స్తుతులు) - ‘ఓం’ అను అక్షరార్థముతో ప్రారంభించి అభివర్ణములు కొనసాగించబడుచున్నాయి. యజ్ఞపురుషుని ఆహ్వానము, తదితర సాంగ సపరివార సపత్నీ దేవతల ఆహ్వానములు, మహిమా వర్ణనలు ‘ఓం’ అను అక్షరార్థముతో ప్రారంభించి ‘వర్ణన’ రూపముగా కొనసాగించబడుచున్నాయి. (శంసనములు = యజుర్వేద యజ్ఞపురుష సంబంధమైన స్తుతి వాక్యాలు)

‘ఓం’ ఇతి ఉద్గాయతి! ‘ఓం’ అని ఉద్గానములు సామము (గానపూర్వక ‘భావ తన్మయములు’) గానరూపంగా ఆరంభించబడుచున్నాయి. సామవేద హృదయము యజ్ఞవిధులలో ఆవిష్కరించబడుచున్నది.

ఏతస్యైవ అక్షరస్యాత్ మహిమ్నరసేన। ఈ విధంగా ఋక్కులు, శంసనములు, గానములు (మంత్రములు, స్తుతులు, గానములు) - ఇవన్నీ కూడా అక్షరమగు ఆత్మ రసము యొక్క మహిమను ఎలుగెత్తి ప్రకటించటానికే ఉద్దేశ్యము కలిగిఉన్నాయి.

త్రైయీ (ఋక్-యజుః-సామ) వేదముల హృదయము - ఏకము అక్షరము అయి, ‘ఓం’ సంజ్ఞార్థము అగు ‘ఆత్మ’ యొక్క ఔన్నత్యము ప్రకటించటమే అయిఉన్నది.

ఒకడు ‘ఓం’ను ఏకము - అక్షరము అగు ఆత్మయొక్క తత్త్వార్థము తెలిసికొని ఉంటున్నాడు. మరొకడు ఓంకారోపాసనగా తదితర ఉద్గీథములు (స్తుతులు, మంత్రములు, గానములు, (లౌకిక) క్రియలు) ‘ఓం’కారముతో ప్రారంభించి, నిర్వర్తిస్తున్నాడు. ఇంకొకడు ‘ఓం’కారము యొక్క పరార్థమును అర్థం చేసుకోకుండానే ‘ఓం’తో ఆయా యజ్ఞ కార్యక్రమములు (లౌకిక) క్రియలు చేస్తున్నాడు. తత్త్వార్థము తెలియకపోయి కూడా ఓంకారముతోనే ప్రారంభిస్తున్నాడు. ‘‘తెలిసినవాడు, తెలియనివాడు’’ కూడా ‘ఓం’కారముతోనే ప్రారంభిస్తున్నాడు. అనగా అక్షరమును ఉపాసిస్తున్నవాడు, అక్షరమును ఉపాసించకయే ఉన్నవాడు - ఇద్దరు కర్మలు చేస్తూనే ఉన్నారు. ఎవ్వడైనా (అక్షరము తెలిసినా తెలియకపోయినా) - కర్మలు చేయటము మాత్రము అనివార్యము (Doing is Unavoidable).

నానా తు విద్యా చ, అవిద్యా చ। అక్షరమగు ఆత్మ గురించి తెలిసి కర్మలు చేస్తూ ఉంటే అది ‘విద్య’. అదంతా తెలియకయే చేస్తూ ఉంటే అది ‘అవిద్య’.

మొత్తం మీద కర్మలు చేయకుండా మాత్రం ఎవ్వడూ ఉండలేదు. (న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠితి అకర్మకృత్- భగవద్గీత).

అయితే, ఏకర్మ చేసినా కూడా…,
యదేవ విద్యయా కరోతి, ‘‘శ్రద్ధయా ఉపనిషదా’’, తదేవ వీర్యవత్తరం భవతి
నేను చేస్తున్న ఈ కర్మను (లేక) కార్యక్రమమును ఏకము, అక్షరము అగు ఆత్మ యొక్క (ఓం యొక్క) ఉపాసనగా చేస్తూ ఉన్నాను. ఆత్మ భగవానుని ఉద్దేశ్యము నెరవేరుస్తున్నాను.
అని ఎరిగి శ్రద్ధగా, ఆత్మ యొక్క భావనా సామీప్యతతో (అంతా ఆత్మప్రదర్శనమే అనే ఎరుకతో) నిర్వర్తిస్తూ ఉంటే - అది వీర్యవత్తరము అవుతుంది.

ఆత్మ ‘‘తత్త్వప్రాప్తి’’ అనే ఉత్తమ ప్రయోజనకరము-అని జనులు గమనిస్తూ గ్రహించి ఉండెదరుగాక!

ఖలు ఏతస్యైవ అక్షరస్య ఉపవ్యాఖ్యానం భవతి। ఏకము, అక్షరము అగు పరమాత్మ యొక్క ఉపాసన - భావనలతో కూడి సమస్త కర్మలు నిర్వర్తించటమే ‘‘అక్షరోపాఖ్యానము’’ అనబడుతోంది. అగుచున్నది.


16–1–2. ప్రథమ అధ్యాయము - ద్వితీయ ఖండము - మహదాశయ సందర్భాశయములు

దేవతలు = కర్మలు చేస్తూ ఉన్నప్పుడు అక్షరమగు ప్రయోజనము మహదాశయముగా కలవారు. అక్షరమగు ఆత్మయొక్క భావనను ఉద్దేశ్యించి కార్యక్రమము సాత్వికమగు సందర్భాశయముతో కౌశలముగా నిర్వర్తించువారు. (యోగః కర్మసు కౌశలమ్ - భగవద్గీత)

Maintaining and executing Incidental objectives for the purpose of the Main objective of entering the zone of Alpervading Absolute Self (బ్రహ్మపదము).
(1) ద-ఏవత్ = ‘‘నేను ప్రపంచమునకు ఏమి ఇస్తున్నాను’’ అనే మహదోద్దేశ్యము పునికి పుచ్చుకున్నవారు, సేవా భావనిరతులు.
(2) నేను చేస్తున్న పనులు లోకమునకు ప్రయోజనకరములు అగుగాక.
(3) ఈ నా పనులు పరమాత్మను సేవించుచూ పరమాత్మతో ఉపనిషదము (సామీప్య - సారూప్యతలను సంపాదించటము) నా ముఖ్యోద్దేశ్యము.
(4) అంతేగాని క్షరమగు ప్రపంచములో ఏదో ఇంకా పొందాలి - అనేది నా ముఖ్యాశయము కాదు.
ఇట్టి మహదాశయము కలవారు దేవతలు.

అసురులు = ప్రాపంచక కర్మలు, శాస్త్రీయ ఉపాసనోత్యాది కార్యక్రమములు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ‘క్షరము’ అను ధర్మము గల దృశ్యములోని ఏవో ప్రయోజనములు ముఖ్యోద్దేశ్యముగా కలవారు.

(Maintaining main objective as - for what to get and own something in the world) (1) అసురులు : ‘‘నేను ఏమి పొందాను?’’ అనే భావము పునికి పుచ్చుకొన్నవారు. ‘‘అధికారము, సొంతము’’ (Controlling, Owning) - ఇటువంటివి ముఖ్యాశయములుగా కలవారు.
(2) నేను చేస్తున్న కర్మలు నాకు మాత్రమే (లేక) మాకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండాలి - అని భావించువారు.
(3) దృశ్యసంబంధమైన క్షరమగు విషయములే మహదాశయముగా భావించువారు.
(4) ‘‘నేను చేస్తున్న కర్మలు, కార్యక్రమములు పరమాత్మ యొక్క సామీప్యత ప్రసాదించు గాక’’ అనే ముఖ్యాశయమును ఏమరచినవారు.

ఈ దేవతలు, అసురులు - ఉభయులు అంతరమున జీవుని హృదయంలో చోటుచేసుకొనియున్నారు.

‘‘పరమాత్మ కొరకు - లోకములోని నా కొరకు’’ - అను రెండు వేరైన ఉద్దేశ్యముల సంఘర్షణయే దేవ-అసుర యుద్ధము.
అయితే ఉభయులు, సృష్టి కల్పనా చమత్కారములే!

- - -

ఒకానొక సందర్భంలో ప్రజాపతి పుత్రులు అయినట్టి దేవతలు, అసురులు ఒకరితో మరొకరు వైరము పెంచుకొని యుద్ధము ప్రారంభించారు. ఆ యుద్ధంలో అసురులదే పైచేయి కాసాగింది. అప్పుడు గురుదేవులగు బృహస్పతులవారి సూచనను అనుసరించి దేవతలు అసురులను జయించే ఆశయముతో ‘‘అక్షరమగు పరమాత్మ గురించిన ఉపాసన’’ - సంబంధమైన ఉద్గీథము ప్రారంభించారు. ఏకము - అక్షరము అగు ఓంకారోపాసన చేయసాగారు.

అందుకు సాధన మార్గంగా ప్రాణోపాసనకు ఉపక్రమించారు.

ఘ్రాణేంద్రియోపాసన (ఘాణేంద్రియ ఉద్గీథము)

మొట్టమొద{ దేవతలు ముక్కులోగల ఘ్రాణేంద్రియముగా (As Energy of Smell) ను విశ్వశక్తి రూపుడగు పరమాత్మను ఉద్గీథము (ఉపాసనా కార్యక్రమము) నిర్వర్తించసాగారు. ‘‘సువాసనా రూపుడే పరమాత్మ’’ అను భావనతో మానసిక పూజ ప్రారంభించారు.

ఇది గమనించి అసురులు తమ అసుర భావ సంపత్తితో ముక్కులో ప్రవేశించి, అక్కడ ‘సువాసన’ ప్రక్కగా పాపము కల్పించారు. అప్పుడిక జీవులకు సువాసన - దుర్వాసనలు ఉభయము అనుభవము కాసాగాయి. పుణ్యపాపఫలములగు సువాసనలు, దుర్వాసనలు ప్రవర్తించసాగాయి. అందుచేత అక్షరోపాసన దేవతలకు సిద్ధించనేలేదు.

చక్షురింద్రియ ఉద్గీథము

అథ హ చక్షుః ఉద్గీథమ్ ఉపాసాం చక్రిరే। ఆ తర్వాత దేవతలు చూపును విశ్వశక్తి స్వరూపముగా ఉద్గీథము చేయనారంభించారు. చూపు - సాత్వికమైన, ప్రశాంతమైన దృష్టి రూపము పొందసాగింది. ఇది గమనించి అసురులు చూపులో ‘‘పాపము’’ (False Look) మంత్రముగ్ధంగా (మానస రూపంగా) ప్రవేశింపజేయసాగారు. అప్పుడు చూపు పాపదృష్టిని పొందసాగింది.

తస్మాత్ తేన ఉభయం పశ్యతి దర్శనీయం చ, అదర్శనీయం చ। ఇక చూపు చూడతగినవి, చూడకూడనివి కూడా చూడటం ప్రారంభించింది. చూపు పాపముచే వేధించబడసాగింది.

శ్రోత్రేంద్రియ ఉద్గీథము

అప్పుడు దేవతలు చెవులను (వినికిడిని) ఆత్మోపాసనగా ఆశ్రయించి ఉద్గీథము (ఉత్-గీథము = కర్మలచే ఉత్తమ స్థానమునకు మార్గము చేయునది) చేయసాగారు. అప్పుడిక ఆత్మ గురించిన శ్రవణము (అమృత వాక్కులు) శ్రవణము చేయబడసాగాయి. ఇది గమనించిన అసురులు ‘వినికిడి’లో ‘పాపము’ను ప్రవేశింపజేయసాగారు. ఇక అప్పుడు చెవులు వినతగినవి, వినకూడనివి కూడా వినటము ప్రారంభించాయి. పాపముచే వినికిడి (Hearing) వేధించబడసాగింది. ఆత్మోపాసన కుంటుపడసాగింది.

మానస ఉద్గీథము

అప్పుడిక దేవతలు మనన రూపమగు తపస్సుతో అక్షరుడు, పరము అయి ఉన్న పరమాత్మను ఉపాసించటము చేయసాగారు. అప్పుడు మనస్సు ఏకము - నిత్యము అయిన పరమాత్మ గురించిన మనన సాధనలకు ఉద్గీథము కాసాగింది. ఇది తెలిసి అసురులు మనస్సును పాపపు ఆలోచనలతో, పాప భావనలతో వేధించసాగారు. అందుచేత మనస్సు ‘‘సంకల్పించతగినవి - సంకల్పించకూడనివీ’’ కూడా సంకల్పించనారంభించింది.

తస్మాత్ తేన ఉభయం సంకల్పనీయం చ,
అసంకల్పనీయం చ - పాప్మనా హి ఏతత్ విద్ధమ్।

సర్వ సమస్వరూపమగు ఆత్మ గురించిన ఆలోచనలకు అడ్డుగా పాపపు ఆలోచనలు వచ్చి చేరసాగాయి. దానితో ఆలోచనలు పుణ్యపాపముల ఉభయము పొందసాగాయి. ఇక ఆత్మ పట్ల మననము వెనకబడసాగింది. ఈ విధంగా మనస్సు పాప-పుణ్య (Negative and Positive) ఆలోచనలు కొనసాగుచుండగా మనస్సు పరమగు ఆత్మదేవుని పట్ల ఏకాగ్రము పొందలేకపోవటం జరుగసాగింది.

ప్రాణ ఉద్గీథము

ఇక ఆపై దేవతలు అసురులను జయించే నిమిత్తము ‘‘ముఖ్యప్రాణము’’ను ఆత్మశక్తికి ఉపకరణంగా తీసుకొని పరమాత్మ యొక్క తత్త్వమును ఉపాసించు ఉద్గీథము (ప్రాణాయామాది సాధన క్రియలు) నిర్వర్తించ ప్రారంభించారు. బ్రహ్మమును ఉపాసించసాగారు.

అప్పుడు అసురులు పాప భావములను కవ్వించే నిమిత్తమై ముఖ్య ప్రాణమును సమీపించారు. తగ్ం హ అసురా ఋత్వా విదద్వంసుః। ఎప్పుడైతే రాక్షసులు ప్రాణమును పాపభూయిష్టము చేయటానికై సమీపించారో, వారంతా ప్రాణమును ఏమాత్రము వేధించలేకపోయారు. పైగా ప్రాణాగ్నికి వారే ధ్వంసము (వినష్టము) అయిపోసాగారు. బండరాయిని వేగముగా తాకిన మట్టిగడ్డవలె ముక్కలు ముక్కలై చెదిరిపోయారు.

ప్రాణమును ఉద్గీథము చేయుచు, ప్రాణమును ఆత్మగా భావించి ఉపాసనా క్రియలను నిర్వర్తించువాడు ఆత్మత్వము సిద్ధించుకోగలడు. అట్టి వాని ఆత్మోపాసనను విచ్ఛిన్నం చేయ తలచువాడు, తానే విధ్వంసము పొందగలడు. ఎవ్వడైతే ప్రాణాత్మను ఉపాసిస్తూ ఉంటాడో - అట్టివానిని పాపదృష్టులు, అల్పబుద్ధులు వైపుగా దృష్టిని మరల్చే ప్రయత్నము చేయువాడు, దూషణ చేయువాడు, సాంసారికమైన బాధలు కలుగజేయటానికి యత్నించువాడు, తానే నష్టపోగలడు.

ప్రాణమును ఆత్మగా ఉపాసించువాడు చెడు దృశ్యము, చెడు సంభాషణ, చెడు వాసన, చెడు పలుకులు - మొదలైన వాటిచే - (పువ్వులతో కొట్టబడిన నాపరాయి వలె) - చెక్కుచెదరకయే ఉంటాడు.

ముఖ్యప్రాణమునకు సుగంధ - దుర్గంధ దోషములు అంటజాలవు. ప్రాణాగ్ని సమస్త పాపములను భస్మము చేయగలదు. ‘ఘ్రాణము’ పొందు వాసన భోగము ముక్కుకే పరిమితము. చూపు కంటికే పరిమితము. వినికిడి చెవులకే పరిమితము. కానీ ప్రాణము - తాను పొందు ఆహారముతో సర్వదా సర్వేంద్రియముల సంరక్షణ కొరకు వినియోగము చేస్తోంది.

ఏష తేన యత్ అశ్నాతి, యత్ పిబతి, తేన ఇతరాన్ ప్రాణానవతి। తాను పొందిన త్రాణను (బలమును) ప్రాణము సకలేంద్రియములకు పంచిపెట్టు త్యాగము కలిగి ఉంటోంది.

ముఖ్యప్రాణము ఇంద్రియములకు అన్నపానములు ప్రసాదించి మనుగడ (Ability to Servive) ప్రసాదిస్తోంది. ముఖ్యప్రాణము నుండి మనుగడ పొందనప్పుడు ఇంద్రియములు క్షీణించిపోతాయి. ఆ జీవుడు తినలేడు, త్రాగలేడు, తిరగలేడు. ఇంద్రియములు చచ్చుబడి శబ్దస్పర్శరూపరసగంధాలు గాలిలో కలిసిపోతాయి. అందుచేతనే మరణానంతరం శరీరములోని ఇంద్రియములన్నీ నోరు వెళ్ళబెడతాయి.

దృష్టాంతములు

మహనీయుడగు అంగీరస మహర్షి ప్రాణమును బ్రహ్మముగా ఉపాసించుటలో గల ఔన్నత్యమును ప్రకటించి ఉన్నారు. అందుచేత ‘‘ప్రాణరూప ఉద్గీథోపాసన’’కు అంగీరసము అని పేరు. అంగముల రసము ప్రాణము కాబట్టి అంగీరసము.

ప్రాణము దేహము యొక్క సర్వస్వము అయి ఉండటం చేత కూడా ప్రాణ ఉద్గీథోపాసనను ‘అంగీరసము’ అని అంటారు.

🍎🍎🍎

→ ప్రాణోద్గీథమును దేవగురువగు బృహస్పతులవారు ఉపాసించి ఉండి, లోకములకు ప్రకటించి ఉండటం చేత ‘‘బృహస్పతి ఉద్గీథోపాసన’’ అని కూడా అంటారు.
ప్రాణమును ‘బృహస్పతి’ అని కూడా శబ్దార్థంగా పిలుస్తారు. ఎందుకంటే -

శబ్దార్థంగా : ‘‘వాక్ హి బృహతి’’ = వాక్కు దేహములో అన్నిటికన్నా మహత్తరమైనది.
బృహత్ - పతి = వాక్కుకు కూడా ప్రాణము పతి కాబట్టి ప్రాణము ‘బృహస్పతి’గా అనబడుచున్నది. ప్రాణమే వాక్ ఇంద్రియమునకు రక్షకుడు.

🍎🍎🍎

→ ఆయాస్య ఋషి ప్రాణ ఉద్గీథోపాసన నిర్వర్తించి సిద్ధిని పొందియున్నారు. అందుచేత ప్రాణమునకు ‘‘ఆయాస్యము’’ అనే పేరు వచ్చింది.
శబ్దార్థము : ప్రాణము నోటి నుండి (వాక్కు రూపంగా) బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాణమే ఆయాస్యము.

🍎🍎🍎

దాల్భ్య మహర్షి కుమారుడు బక మహర్షి ప్రాణ ఉద్గీథము ఇట్టిదని (పైవిధంగా) స్వకీయ తపస్సు నందు గమనించి లోకమునకు ప్రకటించియున్నారు. వారి ప్రకటనను అనుసరించి నైమిశారణ్యంలోని అనేకమంది తదితర ఋషులు ప్రాణ ఉద్గీథమును ఉపాసించి ఉత్తమ ప్రయోజనము పొందియున్నారు.

ఏ ఉపాసకులైతే అక్షరమగు ఆత్మను ప్రాణస్వరూపంగా ఉద్గీథోపాసన చేస్తారో - అట్టివారు విద్వాంసులు అయి కోరుకొన్న విధంగా కోరుకొన్న లోకములో నివసించు స్వాతంత్ర్యము పొందగలరు.
(ప్రాణోపాసన = (1) ప్రాణాయామము. (2) సమస్తము ప్రాణ ప్రదర్శనగా దర్శించటము)

ఇతి - అధ్యాత్మమ్


16–1–3. ప్రథమ అధ్యాయము - తృతీయ ఖండము - ఆదిత్యోపాసన

ఇప్పుడు మనము ఆధిదైవిక ఉపాసనా రూపమగు ఉద్గీథము గురించి చెప్పుకుంటున్నాము. దేవోపాసనా మార్గముగా అక్షరమును సిద్ధించుకోవటం గురించి వివరించుకుంటున్నాము.

య ఏవ అసౌ తపతి, తమ్ ఉద్గీథమ్ ఉపాసీత్।। ఏ సూర్యుడు తేజోరూపుడై ఆకాశములో ప్రకాసించుచూ సమస్తమును తపింపజేస్తున్నాడో, అట్టి ఆదిత్యుని (సూర్య నమస్కారము, ఆదిత్య హృదయము, మహాసౌరము మొదలైన ఆయా విధములుగా) ఉపాసించెదరు గాక!

సూర్యుడు ఉదయించిన మరుక్షణం భూమి అంతా ఉత్తేజము పొందుచున్నది. ‘‘బిడ్డలారా! నిదురలేవండి! జన్మించినందుకు మీ యొక్క అక్షరస్వరూపమును స్వాభావికము, అనుక్షణికము చేసుకోండి!’’ అని ఉషోదయ గానము వినిపిస్తూ ఉద్గానము (Song of Upliftment) పలుకుచున్నారు.

ఉద్యగ్ం తమో భయం అపహన్తి। ఉదయిస్తూనే సూర్యుడు జీవులందరికీ చీకటి భయము తొలగించు అభయప్రదులు. ‘‘సూర్యుని ఉదయము - తమోభేదము’’ను ఉపాసించువాడు సమస్త భయముల నుండి ఉపశాంతి పొందుచున్నాడు.

ముఖ్యప్రాణోపాసన - లోపలికి వచ్చు వాయు ఉపాసన

ప్రాణము, సూర్యుడు సమస్వరూపులే. రెండు ఉష్ణమును కలిగించేవే! అందుచేతనే ప్రాణము బయటకు వెళ్లిన శరీరము చల్లబడి వెచ్చదనము కోల్పోతుంది.

ప్రాణమును → ‘స్వరము’ అని అంటారు. (ప్రాణము తొలగితే తిరిగి దేహములోనికి రాదు)  
సూర్యుని →  ‘స్వర’ అని ‘ప్రత్యస్వర’ అని కూడా అంటారు. (సూర్యుడు అస్తమించినా ఆ మరునాడు ఉదయిస్తారు.

(1) ప్రాణము మరియు (2) ఆదిత్యుని ఆధిదైవిక రూప ఉద్గీథోపాసన నిర్వర్తించెదరు గాక!

(పంచ ప్రాణములలోని) వ్యాన ఉద్గీథము

ఇప్పుడు ‘వ్యానము’ను ఉద్గీథముగా ఉపాసించే ఉపాసన గురించి చెప్పుకుంటున్నాము.

‘‘వ్యానము’’ అనగా ఏది?

యద్వై ప్రాణీతి స ‘‘ప్రాణో’’ = ఈ జీవుడు తననుండి ప్రాణశక్తిని బయటకు పంపుచున్నాడు. అదియే ‘ముఖ్యప్రాణము’ అంటారు. అద్దాని భౌతిక ప్రదర్శనగా - ‘‘ఈ జీవుడు నోటితో ముక్కుతో గాలిని విడిచిపెట్టుచూ ఉన్న ప్రక్రియ ‘ప్రాణము’. అట్టి వాయువు యొక్క విశిష్టవ్యాపారం ‘ప్రాణము’
( యద్వై పురుషః ప్రాణితి ముఖనాసికాభ్యాం బహిః నిస్సారయతి - స ప్రాణః - శ్రీశంకర భాష్యం )

యద్వై అపాణి - ఇతి అపానః। ప్రాణశక్తిని లోనికి తీసుకొనుచున్నాడు. ఇది ‘అపానము’. వాయువును లోపలికి పీల్చటము అనే వాయువు యొక్క విశిష్ట వ్యాపారము అపానము.
(యత్ పానితి అపశ్యసితి తాభ్యాం ఏవ అంతర-ఆకర్షతి వాయుం-సో అపానః। అపాన అఖ్యావృతిః - శ్రీ శంకర భాష్యం)

అథయః ప్రాణ-అపానయో సంధిః - స‘‘వ్యానః’’। ప్రాణశక్తి (ఆత్మనుండి) బయటకు వెళ్లు వ్యాపారము లోనికి తీసుకొని వచ్చు వ్యాపారముల మధ్యగా గల సంధి ‘‘అపానము’’.

అట్టి ప్రాణ-అపానముల మధ్య - ఆ రెండు మౌనము వహించినట్టి విశిష్ఠమగు ‘వాయువృత్తి’ని ‘వ్యానము’ అంటారు.

అట్టి ప్రాణ- అపానముల మధ్య గల వ్యానము సమస్త భౌతిక వ్యవహారములకు కారణభూతమగు ప్రదర్శనము కలిగి ఉన్నది.

యో వ్యానః స వాక్। - ఏది వ్యానమో అది ‘వాక్కు’. అందుచేతనే ఒకడు మాట్లాడుచూ ఉన్నప్పుడు గాలి బయటకు వెళ్ళకుండా - లోనికి పోకుండా ఉన్న స్థితి కలిగినవాడై ఉంటాడు.

యా వాక్ - స ఋక్ - ఏది వాక్కుయో అదియే ‘ఋక్’ (మంత్రము, ఉచ్చారణ). అందుచేతనే ఋక్కులు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ప్రాణ-అపానములు కదలక, ఆ మధ్యలో గల వ్యానమునుంచే ఋక్ శబ్దము పలుకగలుగుచున్నాడు.

యత్-ఋక్ స సామః। శబ్దము పలకటము నుండి సామగానము ప్రదర్శనమౌతోంది. అందుచేత ప్రాణ - అపానములు లేనప్పుడే సామము గానము చేయబడుతోంది.

యత్ సామ, స ఉద్గీథమ్। ఏది సామగానమో అదియే ఉద్గీథము (ఊర్ధ్వ స్థాన యోగము). అందుచేతనే ప్రాణ అపానములు మౌనము వహించి ఉన్నప్పుడే ‘ఉద్గానము’ (Expression of Musical Sound) జరుగుతోంది.

ఈ అన్ని సందర్భములలో ప్రాణ- అపానముల మధ్య గల ‘వ్యానము’ ప్రసాదించే శక్తిచేతనే -
☼ శరీరము వీర్యవంతము పొంది, అట్టి శరీరముతో చేస్తున్నవన్నీ సిద్ధిస్తున్నాయి.
☼ కట్టెలను మధిస్తున్నప్పుడు, కట్టెలను గొడ్డలితో చీల్చుచున్నప్పుడు,
☼ బరువైన ధనుస్సును ఎత్తుచూ ఉన్నప్పుడు,
☼ బరువును ఎత్తి భుజముపై ధరిస్తూ ఉన్న క్షణములలోను,
ఊపిరి బిగబట్టియే అవన్నీ మానవుడు నిర్వర్తిస్తున్నాడు.

అందుచేత - ఆయమనమ్ - అప్రాణన్ - న అపానగ్ం - స్తాని కరోతి। ఏ తస్య హేతోః వ్యానమేవ ఉద్గీథమ్ ఉపానయేత్। - ‘వ్యానము’నే శాస్త్రీయ విధానములతో, క్రియా - కార్యక్రమములతో ఉపాసించెదరుగాక. ప్రాణ-అపానములు స్థంభించినప్పటి ‘ప్రాణనిశ్చలస్థితి’ కొరకు వ్యానప్రాణమును అభ్యసించెదరు గాక।

ఉద్గీథాక్షర ఉపాసన - ఉద్గీథము అనగా?

ఇప్పుడిక ఉద్గీథాక్షరము యొక్క ఉపాసన (ఉద్గీథము) గురించి చెప్పుకుంటున్నాము.
Ⅰ.
ఉత్ = పైకి లేచుట. ప్రాణమే ‘ఉత్’. ప్రాణశక్తిచేతనే మనుష్యుడు కూర్చున్న చోటు నుండి పైకి లేవగలుగుచున్నాడు. ‘ఉత్’ అనే శబ్దమునందు ‘ప్రాణము’ను భావన చేసెదరు గాక.
గీ = వాక్కుయే ‘గీ’, వాక్కునే ‘గిర’ అని అంటున్నారు.
థమ్ = ‘అన్నము. అన్నమునే ‘థమ్’ శబ్దముగా పిలుస్తున్నారు. అన్నము నుండి ఆధారము లభించటం చేతనే అన్నీ నిలచి ఉంటున్నాయి. సమస్తము అన్నమునందే ప్రతిష్ఠితమై ఉంటున్నాం’ - అని భావన చేస్తూ ‘థమ్’ ‘అన్నమ్’ల ఏకావస్థను మననము చేసెదరు గాక।
(అన్నము = సమస్త ఇంద్రియములకు అనుభవముగా అగుచున్న సమస్తము)

‘‘ఉద్గీథమ్’’ అన్నప్పుడు పై ప్రాణ - వాక్ - అన్నములను ఏకము చేస్తూ ఉపాసన చేయుదురు గాక।

ఇంకా ‘ఉద్గీథము’ గురించిన వాచికార్థము ఈ తీరుగా చెప్పబడుతోంది.
Ⅱ.
‘‘ఉత్’’ =
‘‘పై వైపుగా’’ - ‘‘ద్యులోకము (దేవతా లోకము)’’ (వాయువు -పైకి పోవు - పైకి తీసుకుపోవు స్వభావము కలది కాబట్టి - ‘‘వాయువు’’ అనే అర్థం కూడా చెప్పబడుతోంది)
‘‘గీః’’ = గిరణము. గిరణాత్ లోకానామ్। అంతరిక్షము సమస్త లోకములను తన యందు ఇముడ్చుకొన్నది కాబట్టి ‘‘గీం’’ అనగా అంతరిక్షము లోకములన్నీ కలిగియున్నది. అందుచేత ‘గీః’ - అనగా అంతరిక్షమే।
‘‘థమ్’’= పృథివి, ప్రాణులకు స్థానము అవటం చేత పృథివి. పృథివీ థమ్। ధరణియే థమ్।

ఇంకా కూడ ‘‘ఉద్గీథము’’ - గురించి
Ⅲ.
‘‘ఉత్’’ (ఆదిత్యుడు) = ఆదిత్య ఏవ ఉత్ - ఊర్ధ్వమ్। ఆకాశంలో (పైన) ఉండటం చేత ఆదిత్యుడే ‘ఉత్’
‘‘గీః’’ (వాయు ప్రసరణము) = వాయుః గీః (కిం తు) అగ్న్యాదీనామ్ గిరణాత్। అగ్ని, జలము, పృథివి మొదలైనవన్నీ తనయందు కలిగి ఉండటం చేత వాయువే ‘గీః’
‘‘థమ్’’ (సమస్తమునకు అధిష్ఠానము - ఆభరణములన్నిటికీ బంగారమువలె) అధిష్ఠానము. యజ్ఞంలో అగ్నియే సమస్త యజ్ఞ విధి విధానములకు అధిష్ఠానము అవటం చేత అగ్నియే ‘థమ్’.

Ⅳ.
‘‘ఉత్’’ - వేదమే ఉత్. వేదమునకు శబ్దార్థము ‘‘తెలియబడునది’’. తెలియబడేదంతా ‘ఉత్’ అయి ఉన్నది.
‘‘తెలుసుకోవటము, తెలుసుకోవలసినది’’ అని కూడా అర్థము. సామవేదమే ‘‘ఉత్’’. సామ = గొప్ప. గొప్పగా తెలుసుకోవలసినది. సామవేదమే స్వర్గము - స్వర్గే హి సామః - అని నానుడి. సామవేదమే స్వర్గముతో సమానం. గొప్పగా చెప్పబడుతోంది కాబట్టి - సామము ‘ఉత్’.
‘‘గీః’’ (గిరణము) - ‘‘స్వాహా’’। ‘స్వాహా’ అను యజుర్వేద మంత్రముతో అగ్ని ద్వారా సమర్పించు హనిస్సులను దేవతలు స్వీకరించటమును గిరణము అంటారు. అందుచేత యజుర్వేదమే ‘గీః’.
‘‘థమ్’’ (అధిష్ఠమ్) - అధిష్ఠితము. సామము (గొప్పగా తెలుసుకోవలసినది)
→ ఋక్కుల యందు (ఋగ్వేదము నందు) అధిష్ఠితమై ఉన్నది. అందుచేత ఋగ్వేదమ్ ‘‘థమ్’’
ఎవ్వడైతే వేదముచే ప్రవచించబడిన (యజ్ఞ-యాగశాస్త్రములలో ఉపయోగించబడిన) - ‘‘ఉద్గీథము’’ అనే శబ్దమును (మాటను) పై నాలుగు విధానములుగా భావన చేస్తూ ఉపాసిస్తాడో, తెలుసుకొని మననం చేస్తూ ఉంటాడో… అట్టివాడు-
→ వాగ్దోగ్ధి ఆత్మానమేవ దోగ్ధి - పాలు పితుకువానికి పాలు లభించు విధంగా వాక్కు యొక్క సారము వాక్కే ప్రసాదించగలది.
→ ఆతడు అన్నము పొందువాడు, అన్నము ప్రసాదించువాడు కాగలడు.
అందుచేత ‘‘ఉద్గీథాక్షరము ఇట్టిది’’ - అని ఉద్గీథము (స్తుతి, ఉపాసన, మననము, ఉచ్చారణ) నిర్వర్తించబడును గాక.

✤✤✤

ఇష్టకామ్యార్థ సిద్ధికై ఉద్గీథము

(కర్త, హోత, ఉపాసక మొదలైన) యజ్ఞములో పాల్గొనుచున్న వారంతా…,

ఇష్టకామ్య సిద్ధి (కోరుకొన్నవి పొందుటకై) ఈ విధంగా ఉద్గీథ - ఉపాసన చేయుదురు గాక!

✻ ఉద్గాత (సామమంత్రములు చదువుచున్నవారు) ఏఏ దేవతలను ఉద్దేశ్యించి ఉద్గానము (స్తుతి, ఉద్గీతము) చేస్తున్నారో ఆయా సామములను శ్రవణము చేస్తూ, ఆ దేవత యొక్క నామాత్మిక రూపాత్మిక తాత్త్వికాత్మికములను మననము చేయుచుండును గాక!

✻ శ్రవణము చేయు కర్త, కార్యకర్తలు, యజ్ఞమును ఉపాసించుటకై వచ్చిన ఉపాసకులు - వీరందరు కూడా ఆయా దేవతా - ప్రత్యాధి దేవతల నామాత్మిక, రూపాత్మిక, తాత్త్వికాత్మికములను మనస్సుతో ఉపాసించెదరు గాక! మననము చేయుచుండెరు గాక!

✻ ఋక్కులను ఏ ఋషికి చెందినదో, ఏ దేవత గానము చేయబడుచున్నదో - ఆ ఋషికి దేవతలకు హృదయపూర్వకంగా నమస్కరించుచుండెదరు గాక!

✻ ఏ ఛందస్సుచే స్తుతించబడుచున్నదో ఆ ఛందస్సును, అద్దాని మంత్ర (మనన) రూపమును, శబ్ద సౌందర్యమును ఉపాసించెదరు గాక!

✻ ఉద్గాత ఏ దిక్కును ధ్యానము చేయుచున్నారో, ఆ దిక్కును ధ్యానము చేసెదరు గాక.

✻ చివరిగా తన యొక్క ‘‘సాక్షీ కేవలరూపము’’ను ధ్యానము చేస్తూ అప్రమత్తుడై స్తుతించును గాక!

✻ తన యొక్క గోత్ర-నామ-వర్ణ - ఆశ్రమ మొదలైనవి పలుకుచూ ధ్యానించును గాక!

ఈ విధంగా యజ్ఞ సంబరములో పాల్గొను వారంతా శ్రద్ధగా, ఉద్గాత, ఋత్విజులు గానం చేస్తున్న మంత్రములను వినెదరుగాక! అచ్చులు, ఊష్మలు, హల్లులు, విసర్గలు, శ్రద్ధగా ఏకాగ్రతతో వినుచుండెదరు గాక!

భక్తిశ్రద్ధలతో తన కోర్కెను విన్నవించుకొని అభ్యర్థన సమర్పించెదరు గాక! స కామః సమృధ్యేత యత్ కామః స్తువీతేతి। యత్ కామః స్తువీతేతి।

ఋత్త్విక, ఉద్గాత, పురోహిత, అర్చకాచార్యుల సామమును పై విధంగా అనుసరించి శ్రద్ధాభక్తులతో ఏకాగ్రంగా శ్రవణము చేయువాడు తాను కోరిన దానిని పొందగలడు.

✤✤✤


16–1–4. ప్రథమ అధ్యాయము - చతుర్థ ఖండము - ‘‘ఓం’’ ఇతి ఏతత్ అక్షరమ్ ఉద్గీథమ్

‘ఓం’ అను ఏకము అక్షరమును ఉపాసించటం (ఉద్గీథము) గురించి ఇప్పుడు మనము వివరించుకుంటున్నాము.

‘‘ఓం’’ - అని దీర్ఘముగా ఉద్గానము చేయు ఉపాసన గురించి కూడా వ్యాఖ్యానించుకుంటున్నాము.

దేవా వై మృత్యోః బిభ్యతః। ఒకానొకప్పుడు దేవతలు ‘‘మృత్యువు’’ గురించి భయము పొందసాగారు. వారు త్రయీ విద్య (ఋక్ యజుః సామ) మంత్రములలో ప్రవేశించి, ఆ త్రయీవేద ఛందస్సులను ఆచ్ఛాదముగా కలిగి ఉండసాగారు.

మంత్రములను దేవతలు ఆచ్ఛాదనగా కలిగి ఉండటం చేతనే వాటికి ‘ఛందస్సులు’ - అని పేరు. అనగా జపము, హోమము, పారాయణము మొదలైన వాటిచే వారు మృత్యువు దరిచేరకుండా ఉపాయముగా ఆశ్రయించసాగారు.

క్రమంగా వారు, ‘‘ఋక్-యజుర్-సామము’’లలోని కర్మానుష్ఠానములను ఆశ్రయించి, ఆ కర్మలే మహత్తరమని భావించసాగారు. కర్మలలో మునిగి అమృతమగు పరమాత్మ తత్త్వమును ఏమరచారు.

అప్పుడు మృత్యువు ‘‘ఈ దేవతలు ఎక్కడ దాగి ఉన్నారు’’ అని వెతుకసాగింది. వెతకగా వెతకగా మృత్యువుకు దేవతలు కనబడనే కనిపించారు.

తాను తత్ర మృత్యుః-యథా మత్స్యమ్ ఉదకే పరిపశ్యేత్-ఏవం పరిపశ్యత్-ఋచి, సామ్ని యజుషి।। జలజల పారుతున్న నీటి జోరులో చేపలు కనిపిస్తాయి చూచారా! ఆ విధంగా త్రయీ వేదముల కర్మ వ్యవహారములలో దాగి ఉన్న దేవతలు కనిపించారు.

‘ఆహా"! ఈ దేవతలు నాకు కనిపించారు కదా!’’ - అని సంతోషపడి మృత్యువు వారిని సమీపించసాగింది.

ఇది గమనించి ‘‘ఇప్పుడు ఉపాయమేమిటి? ఈ మృత్యువు మనలను ఎట్లా గమనించగలిగింది?’’ అని యోచించారు.

వెంటనే ‘‘ఓహో! మనము ఋక్-యజుర్-సామములలోని కర్మ విభాగములలో ఉండిపోవటం చేతనే మృత్యువు మనలను గమనించగలిగింది’’… అని గ్రహించారు. మరుక్షణం వారు - కర్మలకు ఆవల గల ‘ఓం’ అను ఏకము, అక్షరము అగు స్వరాక్షర- తత్త్వమును ఆశ్రయించారు.

ఋచస్సామమ్నో యజుషః సర్వమేవ ప్రావిశన్। కర్మ విభాగములను దాటి స్వరము నందు ప్రవేశించారు.

ఓంకారోపాసన యందు పూర్తిగా నిమగ్నమైనారు. అప్పుడు మృత్యువు మౌనము వహించింది. దేవతలకు అమృతము సిద్ధించింది.

స్వరములో ప్రవేశించినవాడు ఋక్ - యజు - సామములను ‘‘ఏకము - అక్షరము’’ అగుచూ పరమార్థము, పరమాత్మ సూచకము అగు ‘‘ఓం’’తోనే ప్రారంభిస్తాడు. ‘ఓం’తోనే తదితర మంత్రదేహ విభాగములను విస్తరింపజేస్తూ గానం చేస్తాడు.

‘ఓం’ యే స్వరము.. అదియే అమృతము, అభయము.
అట్టి ఏకము అక్షరము అగు ‘ఓం’లో ప్రవేశించిన దేవతలు అభయము పొందారు.

అట్లాగే, ఎవ్వడైతే ‘ఓం’ను ఏకము, అక్షరముగా తెలుసుకొని ఉపాసిస్తాడో, స్తుతిస్తాడో, అట్టివాడు…



16–1–5. ప్రథమ అధ్యాయము - పంచమ ఖండము - ‘‘సామ ఉద్గీథము’’

ఏది (ఏకము, అక్షరము అగు ఓంకారార్థ) ప్రణవమో అదియే ఉద్గీథము. ఏది ఉద్గీథమో అదియే ప్రణవము కూడా.

ఆకాశములో ప్రకాశించుచున్న ఆదిత్యుడే ఉద్గీథము. ఆదిత్యుడే ప్రణవము అగు ‘ఓం’ కూడా! ఆదిత్యుడే ‘స్వరము’ కూడా.

ఒకప్పుడు ఆదిత్యుడు తన కుమారుడగు కౌషీతకి మహర్షికి ఈ విధంగా బోధించారు.

ప్రియ కుమారా! కౌషీతకీ! నేను ఏకము, అక్షరము అగు ఆదిత్య తత్త్వమును! అనగా మొట్టమొదటిగానే ఉన్న తత్త్వమును! అనేకముగానే కనబడుచున్నప్పటికీ ఏకమ్ నా రూపము, స్వభావము కూడా! సూర్యకిరణములు వేరువేరుగా బయల్వెడలి వేరువేరుచోట్ల ప్రసరించవచ్చు గాక! కాని కిరణములన్నీ బయల్వెడలేది నా ఆదిత్య తేజస్సు నుండియే।

నేను ఏకమగు తత్త్వమును ప్రణవ గానము చేస్తున్నట్లే నీవు కూడా చేయి. నా కిరణములను ఉద్గీథముగా భావించి (సాధనగా స్వీకరించి) అనేకముగా కనిపిస్తూ కూడా ఏకముగా ఉన్నదానిని ఉపాసించెదవు గాక!

ప్రాణము ఏకమే అయి ఉండి అనేక ప్రాణులుగా ప్రదర్శనమగుచున్నది. ప్రాణాగ్ం స్త్వం భూమానమ్ అభిగాయతాత్ బహవో వై మే భవిష్యంతి। నేను ప్రాణ స్వరూపుడనై ఈ అసంఖ్యాక జీవులలో ప్రాణస్వరూపముతో వెల్లివిరిస్తున్నాను.

ఆధ్యాత్మము

ఇంకా విను.
‘‘అధ్యాత్మము’’ అనగా దేహము, ఇంద్రియములను ఉపయోగించి చేయు ‘‘ఉపాసన’’. ‘ఓం’కార ప్రణవగానమే ఉద్గీథము. ఉద్గీథమే ప్రాణము.

- - -

పితృదేవులగు సూర్యభగవానుడు చెప్పిన ఓంకార ప్రణవోపాసనను అర్థం చేసుకొన్న కౌషీతకీ మహర్షి ‘ప్రాణము’ను పుత్రుడుగా చేసుకొని ‘‘ప్రణవోపాసన’’ చేయనారంభించారు. ‘‘నాకు అనేక మంది పుత్రులు’’ అను భావనతో ప్రాణ స్వరూపుడై తదితర సమస్త జీవులను తన ప్రాణస్వరూప తేజో కిరణములుగా భావము సిద్ధించుకున్నారు.

ఆ విధంగా కౌషీతకీ మహర్షి నిర్వర్తించిన ఉపాసనయే ఉద్గీథము. అదియే ప్రాణమును ఉద్గీథ గానము చేయటము.

‘‘ప్రాణస్వరూపుడనగు నేను ఈ సమస్త ప్రాణులలో ప్రాణస్వరూపుడనై ప్రకాశించుచున్నాను’’ - అనునదే ఇక్కడి ఉద్గానము, ఉద్గీథము కూడా!

ఇట్టి ప్రణవోపాసనచే ఉద్గానము చేస్తున్నప్పుడు అపశృతుల దోషము ఉన్నప్పటికీ, అవన్నీ సరి అవగలవు. ఆ ఉద్గాతకు, శ్రవణము చేయువానికి దోషము కలుగదు.


16–1–6. ప్రథమ అధ్యాయము - షష్ఠి ఖండము- అధిదైవత ఉద్గీథోపాసన (‘‘సా’’ + ‘‘ఆమ’’ = ‘‘సామ’’ - ఉపాసన)

ఇయమేవ పృథివీ ఋక్। అగ్నీయేవ సామ।
ఈ పృథివియే ఋక్కు (మంత్రాక్షరములు). అగ్నియే ‘సామము’ అని ఉపాసించెదరు గాక। ఋక్కునందు పృథివిని సామ యందు అగ్నిని భావించి ఉపాసించాలి.

ఋక్కు = అర్థము
సామ = లయ

సంగీతము వాఙ్మయము (Lyric) నందు అధిష్ఠితమై ఉన్న తీరుగా, సామము ఋక్‌పై ఆధారపడియున్నది. ఋక్కు (శబ్ద-అర్థము)ను అనుసరించే సామగానము చేయబడుతోంది. అర్థము లేకుండా గానము చేయటము (Music without word and meaning) - నిరర్థకము.

పృథివియే ‘‘సా’’। అగ్ని - ‘‘ఆమ’’। ఈ రెండూ కలిసి, ‘సామ’… ‘సామ’ శబ్దము సగము పృథివిని, మిగతా సగము అగ్నిని ఉద్దేశ్యించుచున్నది - అని ఉపాసించబడు గాక।

ఇంకా కూడా ‘సామ’ ఈ విధంగా ఉపాసించబడుతోంది.

అంతరిక్షమేవ ఋక్-వాయుః సామ। సమస్త లోకములు తనయందు ఇముడ్చుకొన్న అంతరిక్షమే ఋక్। వాయువు సామ। ఈ విధంగా అంతరిక్షము తనయందు వాయువును ఇముడ్చుకొన్న విధంగా ఋక్కునందు అధిష్ఠితమైయున్న ‘సామ’ గానము చేయబడుతోంది.

= అంతరిక్షము ‘‘సా’’। వాయువు ‘ఆమ’ రెండూ కలిపి ‘సామ’

ద్యు(దేవ)లోకమే ఋక్కు. ఆదిత్యుడు ‘సామ’. ఆదిత్యుడు ద్యు లోకమునందు అధిష్ఠితుడై ఉన్నట్లు ఋక్కునందు అధిష్ఠితమైన సామమే గానము చేయబడుతోంది.

ద్యులోకమే ‘సా’. ఆదిత్యుడు ‘ఆమ’।
ఆ రెండు కలిపి ఉపాసన - సామోపాసన

నక్షత్రములు ఋక్కు. చంద్రుడు సామ. ఈ సామ ఆ ఋక్కునందు అధిష్ఠితము.

నక్షత్రములు ‘సా’. చంద్రుడు ‘ఆమ’.
ఆ రెండింటి కలిపి ఉపాసన ‘‘సామ’’।

ఆదిత్యునిలోని శుక్ల (తెల్లటి) ప్రకాశము ఋక్కు. నీలపు - నలుపు రంగు సామము. సామము ఋక్కులో అధిష్ఠితము.

శుక్లము ‘సా’. నలుపు - నీలము ‘ఆమ’
ఆ రెండింటిని కలిపిన ఉపాసన ‘సామ’

- - -

‘‘హిరణ్మయ పురుషోపాసన’’

అథ ఏష అంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే, - హిరణ్యశ్మస్రుః, హిరణ్య కేశః ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః

హిరణ్మయ పురుషుని ఈ విధంగా ఉపాసించెదరుగాక। - సూర్యునిలో ప్రకాశిస్తూ కనిపిస్తున్న పురుషుడే - హిరణ్మయ పురుషుడు.

హిరణ్ మయ = బంగారపు ఛాయగలవాడు
పురుషుడు = సమస్తము తన పురుషకారముగా ప్రదర్శించువాడు. సత్తాస్ఫూర్తిచే జగత్తులన్నీ నింపి ఉంచుచున్నవాడు.

బంగారు గడ్డము, మీసము; కేశములతో ఉపాసించబడువాడు. గోళ్ళతో సహా సర్వము బంగారు రంగుతో ప్రకాశించువాడు. బంగారు పక్షి వలె కనిపించు గోళ్లు కలవాడు.
- ఆతని కళ్ళు ఎర్రటి ఎరుపుగా ఎర్ర కలువల వలె ప్రకాశిస్తూ ఉంటాయి.
- ఆతనిని ‘ఉత్’ అని అంటారు, సమస్త పాపములు పోగొట్టువాడు కాబట్టి.
అట్టి హిరణ్మయ పురుషుని ఉపాసించటము ఎరిగినవాడు సర్వపాపముల నుండి విముక్తుడు కాగలడు.

ఆ హిరణ్యగర్పుడే ఋక్‌వేదము, సామవేదము తనయొక్క స్వరూపముగా కలిగి ఉన్నారు.

ఆయనయే ఉద్గీథము. హోత ఉద్గీథ। ఆతడు అధిదైవ స్వరూపుడు. దేవతలందరు అట్టి హిరణ్యగర్భునిపై ఆధారపడి ఉన్నవారే। ఇది అధిదైవతోపాస.


16–1–7. ప్రథమ అధ్యాయము - సప్తమ ఖండము - అధ్యాత్మోపాసన (లేక) శారీరకోపాసన

ఇప్పుడు మనము ఈ శరీరమునకు సంబంధించిన ‘ఉద్గీథోపాసన’ గురించి చెప్పుకుంటున్నాము.

వాక్కుయే → ‘‘ఋక్కు’’। ప్రాణము - ‘‘సామము’’। ఈ సామము ఈ ఋక్కుపై ఆధారపడి ఉన్నది. ఋక్కు ఆధారంగా చేసుకొని సామము గానం చేయబడుతోంది. అలాగే-

ప్రాణమును ఆధారము చేసుకొని వాక్కు ప్రదర్శనమౌతోంది. వాక్కు - ‘సా’ ప్రాణము - ‘ఆమ’ ఈ రెండింటి కలయిక ‘సామ’. ఈ విధంగా సామము ఉపాసించబడు గాక.

చక్షువులు (కన్నులు) - ‘ఋక్కు’। ఆత్మ చూచువాడు - సామ। ఈ సామ ఆ ఋక్ నందు అధిష్ఠితము. ఋక్కు నందు అధిష్ఠితమైన ‘సామ’ గానము చేయబడుతోంది.

‘‘కన్ను’’ను ఆధారం చేసుకొని చూచువాడు చూపును ప్రదర్శిస్తున్నాడు. కన్నులు ‘సా’, చూచువాడు ‘ఆమ’
కన్ను - చూచువాడు కలయికయే - చూపు. ఆ కలయికయే ‘సామ’.

శ్రోత్రము (చెవి) ‘ఋక్కు’। మనస్సు ‘సామ’। ఈ సామ ఆ ఋక్కునందు అధిష్ఠితమైయున్నది.

చెవి ‘సా’। మనస్సు ‘ఆమ’। ఆ రెండింటి కలయిక ‘వినికిడి’। అదియే ‘సామ’।

కంటిలోని ‘తెలుపు’ (White) విభాగము ‘ఋక్కు’। నల్లటి గ్రుడ్డు విభాగము ‘సామ’। ఈ సామము ఆ ఋక్కుపై ఆధారపడి ఉన్నది. ఋక్కు ఆధారముగా సామము గానము చేయబడుతోంది.

కంటి యొక్క తెలుపు ప్రకాశము ‘సా’. నల్లటి రంగు ‘ఆమ’. ఈ రెండింటి యొక్క కలయిక - ‘సామ’.
- కంటిలో ఉండి చూచుచూ ఉన్న పురుషుడు (The Perceiver - అంతర‘క్షిణి’ పురుషుడు) - ‘ఋక్కు’.
- ఆతనికి కనబడుచున్నదంతా (దృశ్యతే తత్ - That being perceived) - ‘సామ’।
- ఆతడే ఉక్ధము (చూడటము - Perception) కూడా!

కంటిలో వేంచేసి ఉండి ‘చూపు’ అనే పురుషకారము ప్రదర్శించుచూ, చూడబడుచున్న సమస్తముగా కూడా (ఉక్ధముగా కూడా) వెలయుచున్నాడు.

కంటిలో ఉండి చూచుచూ ఉన్నవాడే ‘పురుషుడు’. ఆతడే యజుస్సు (యజోవేదపురుషుడు). ఆతడే ‘‘బ్రహ్మము’’।

సర్వము సూర్యుని తేజస్సులో కనిపిస్తూ ఉన్నది. అట్టి సూర్యునిలో ‘‘తాను వెలుగుచూ, సమస్తము చూపటము’’ అనే పురుషకారమును ప్రదర్శిస్తూ ‘పురుషుడు’ అనబడుచున్నాడు.

ఆదిత్యుని (సూర్యుని) అంతర్గతుడై ఏ పురుషుడు ఉన్నాడో, ఆతని రూపము ఏదై ఉన్నదో…,

అదియే ఈ భౌతికమున కంటిలో వెలయుచు ‘చూడటము’ అను క్రియను నిర్వర్తిస్తున్న (పురుషకారము ప్రదర్శిస్తూ ఉన్న) అక్షి పురుషుని రూపము కూడా।

“The Executor of showing” who is in the Sun, and “The Executor of seeing” who is in the eye of the Living Being are one and the same.

ఈ ‘కన్ను’లో నివాసము కలిగియుండి సమస్తమును చూస్తూ ఉన్న పురుషుడే…,
- సర్వలోకములకు ప్రభువు.
- ఈ జీవుడు చూడాలనుకొంటూ, చూస్తున్న దృశ్యము కూడా ఆతని ప్రదర్శనమే।

ఆదిత్యుని యందు సమస్తమును వెలిగించు పురుషకారుడై, కన్నులలో సమస్తము చూస్తూ ఉన్న పురుషకారుడై, చూడాలనిపించే సమస్త ప్రదర్శన పురుషకారుడై ఏ ‘పరమ పురుషుడు’ ఉన్నారో…

ఆయనను ఎవరు కీర్తిస్తూ ఉన్నారో, ‘స-రి-గ-మ’ల వీణాగానముతో మహిమను పాడుచున్నారో, అట్టివారు సర్వ సంపదలను తాము కోరుకోకుండానే పొందగలరు. వారే సామవేద సిద్ధులు.

ఎవ్వరైతే ఆ పురాణ పురుషుని, పురుషోత్తముని - పరమాత్మగా, దేవాది దేవునిగా, ఉద్గీథ - భగవానునిగా తెలుసుకొని ‘సామగానము’ చేయుచున్నారో - వారు ‘‘చూపించువాడు - చూచువాడు - చూడబడునది’’ అను మూడిటినీ (జీవాత్మ-పరమాత్మ అనబడే) రెండు విధములుగానూ గానము చేసినవాడు అగుచున్నాడు.

ఈ విధంగా మూడుగా కనిపిస్తూ, రెండుగా (జీవాత్మ పరమాత్మలుగా) అనిపిస్తూ ఒకటిగా అయిన పరాత్పరుని - సూర్య లోకములో వేంచేసియున్న హిరణ్యగర్భుడుగా ఉపాసించెదరు గాక. అట్టి ఏకోపాసన చేయువానిని ఆహ్వానించి, దేవతలు దివ్యలోక ప్రాప్తిని, దివ్యలోక నివాసమును ప్రసాదించుచున్నారు.

నేత్రములో వేంచేసియున్న కేవల - ద్రష్టయగు దివ్యపురుషుని ఉపాసించినా కూడా (ఉద్గీథోపాసన చేసినా కూడా) - అట్టి ఫలము సిద్ధించగలదు.

కోరుకొన్నవారికి దివ్యలోకములు, ఇహములో సర్వభోగములు - అట్టి ‘పురుషోత్తమ స్తుతి చేయువారు - పొందగలరు.

- - -

అందుచేత యజ్ఞ ప్రారంభంలో యజ్ఞకర్తను ఉద్గాత - ‘‘ఓ యజ్ఞ కర్తా! మీరు ఏమేమి లభించాలని కోరుకొంటున్నారు?’’ - అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు యజమాని ‘‘అయ్యా! ఈఈ ప్రయోజనములు ఈ విధంగా సిద్ధించు గాక।’’ - అని తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆ ఉద్గాత యజ్ఞ విధానమునందు ‘ఫలశ్రుతి’ని మంత్ర వాక్యములు జోడించి పలుకుచున్నాడు. అట్టి ఉద్గాతయే యజమానికి ఉత్తమ ప్రయోజనములు యజ్ఞ నిర్వహణ ద్వారా సిద్ధింపజేయటానికి సమర్థుడు. ఎందుకంటే ఉద్గాతయే యజ్ఞపురుష- యజ్ఞకర్తల మధ్య అనుసంధానము.


16–1–8. ప్రథమ అధ్యాయము - అష్టమ ఖండము - స్వర్గలోక - ఇహలోక ఉద్గీథము

పూర్వకాలంలో ‘ఉద్గీథా ఉపాసన’లో అత్యంత నిపుణులు - అని ప్రసిద్ధికెక్కిన ముగ్గురు మహనీయులు ఉండేవారు. వారు ఉద్గీథా గానము నిర్వర్తించటములో గొప్ప ప్రావీణ్యులు.
(1) శాలావంతుని కుమారుడగు శిలక మహర్షి।
(2) దాల్భ్య వంశీయుడైనట్టి చికితాననుని కుమారుడు చైకితాయన దాల్భ్య మహర్షి।
(3) జీవలుని కుమారుడైనట్టి ప్రవాహణ మహర్షి।

ఒకానొక సందర్భములో ఆ ముగ్గురు ఒకచోట సమావేశము అవటం జరిగింది. ఆ ముగ్గురు ఈ విధంగా పరస్పరము చెప్పుకున్నారు.

మనము ముగ్గురము ‘‘ఉద్గీథ గానము’’ నిర్వర్తించు ‘ఉద్గాతలు’గా ప్రావీణ్యులమని మునిలోకము చెప్పుకుంటూ ఉంటుంది కదా! ఈ రోజు మన ముగ్గురము భగవత్కృప చేత ఒకచోట కలిసాము. ఈ సందర్భము సద్వినియోగమగు గాక! అందుకుగాను మనము ఉద్గీథ గానము (లేక) ఉద్గీథోపాసన గురించి సత్సంగపూర్వకంగా సంభాషించుకొందామా?

ముగ్గురు అందుకు అంగీకరించినవారై ఒక చక్కటి ప్రవేశంలో సుఖాసీనులయ్యారు. (ఈ విధంగా పండిత చర్చ జరుగుతున్నప్పుడు సందేహములు పోతాయి. ఒకరిపై మరొకరికి గల అల్పాభిప్రాయములు తొలగుతాయి. విజ్ఞానము మరింతగా వికసిస్తుంది)

ప్రవాహణ మహర్షి : ఓ శిలక, చైకితాయన మహర్షులారా! తావ అగ్రే వదతాం బ్రాహ్మణయోః వదతో, అర్వాచగ్ం శ్రోష్యామి! మీరిద్దరు నాకు పూజనీయులు. అందుచేత మీరిద్దరు ఉద్గీథ గానము గురించి విశేషములు చెప్పటము ప్రారంభించండి. నేను శ్రవణము చేస్తాను.

అందరూ అందుకు అంగీకరించారు.

- - -

శిలక మహర్షి : పూజ్యులగు చికితాయనుని కుమారులుగా ఓ చైకితాయన దాల్భ్య మహర్షీ! మీముందు కొన్ని ప్రశ్నలు వేస్తాను. అందుకు తమకు అంగీకారమేనా?

చైకితాయన మహర్షి : ఓ! తప్పకుండా। నాకు అంగీకారమే। అడగండి. తెలిసినంత వరకు చెప్పుతాను.

శిలక మహర్షి : కా ‘సామ్నో’ గతి - ఇతి? సామము యొక్క గతి (లేక) సారము (లేక) ఆశయము ఏదై ఉన్నది? సర్వోత్తమ గమ్యస్థానము ఏది?

చైకితాయన దాల్భ్య మహర్షి : స్వరము! ధ్వని భేదము! ఎందుకంటే, ‘సామ’ అనేది స్వరమే స్వరూపముగా కలిగి ఉండటం చేత. (స్వరము = అకార ఆది, ఉదాత్త - అనుదాత్తాది, షడ్జమము ఆది - కంఠధ్వని విశేషములు).

శిలక మహర్షి : బాగు। మరి స్వరము యొక్క గతి ఏది? స్వరస్య కా గతిః ఇతి?

దాల్భ్య మహర్షి : స్వరము యొక్క గతి ‘‘ప్రాణము’’. స్వరము యొక్క జనన స్థానము ప్రాణమే। ప్రాణము శక్తి రూపము. శక్తి ఉంటేనే స్వరము పలుకుతుంది.

శిలక మహర్షి : ప్రాణస్య కా గతిః - ఇతి? ప్రాణము యొక్క గతి (లేక) గమ్యము ఏదై ఉన్నది?

దాల్భ్య మహర్షి : ప్రాణము నిలవాలంటే ఆహారము కావాలి. అందుచేత - ప్రాణము యొక్క గతి అన్నమే.
(అన్నావష్ఠంభో ప్రాణః శుష్యతి వై ప్రాణరుతే అన్నాత్’ - అన్నము లేకుంటే ప్రాణము శుష్కించిపోతుంది కదా! ప్రాణమునకు అన్నమే కట్టుత్రాడు - అని శ్రుతివాక్యము. ప్రాణాః అన్నం దామ - ఇతి హి శ్రుతే).

శిలక మహర్షి : అవును అయితే, అన్నస్య కా గతిః? అన్నమునకు గతి ఏది?

దాల్భ్య మహర్షి : అన్నమునకు గతి ‘‘జలము’’ (ఆపః). ఎందుకంటే అప్ సంభవాత్ అన్నస్య। అన్నము జలము నుండే కలుగుతోంది కదా।

శిలక మహర్షి : అపాం కా గతిః? జలమునకు ఆశ్రయము ఏదై ఉన్నది?

దాల్భ్య మహర్షి : అసౌ లోకః ఇతి। ఈ లోకమే జలమునకు ఆశ్రయము. వర్షము వర్షించేది పై నుండే కదా! ఊర్ధ్వ లోకము నుండే కదా! అందుచేత జలము యొక్క గతి స్వర్గలోకమే.

శిలక మహర్షి : అముష్య లోకస్య కా గతిః ఇతి? స్వర్గలోకము యొక్క గతి, ఉత్తరోత్తర స్థానము, అక్కడి నుండి వెళ్ళవలసినది ఏది?

దాల్భ్య మహర్షి : సామము స్వర్గలోకము నుండి మరెక్కడికి తీసుకొని పోదు. ఎవ్వడైనా కూడా స్వర్గలోకం దాటి మరొక లోకం ఏదీ ఆశ్రయము పొందలేడు. సామమునకు ప్రతిష్ఠ (The ultimate objective) స్వర్గమే.
(స్వర్గో వై లోకః సామవేదః - ఇతి శ్రుతేః - సామవేదమ్ స్వర్గలోకము - అని శ్రుతి వాక్యం)

శిలక మహర్షి : ఓ దాల్భ్య మహర్షీ! మీరు ‘సామ’ గురించి ముగింపుగా చెప్పినదానిలో ‘దోషము’ (Something wrong) ఉన్నది. మీరు చెప్పినది ప్రతిష్ఠ (Final placement) కాదు. ఎవ్వరైనా పరాకాష్ఠ తెలుసుకొనియున్న సామవేత్త - మీరు ‘ఇంతే। స్వర్గో వై లోకః। ఇంత మాత్రమే।’’ అని అన్నప్పుడు - ‘‘మీ తల నేలకూలగలదు. అనగా, అంతకుమించిన అసలైన సత్యము గమనిస్తే మీరు తలవంచుతారు - ’’ అని సామవేత్త అనగలడు. అప్పుడు మీరు ‘‘నేను చెప్పినది పరాకాష్ఠ కాదు’’ - అని తలవంచక తప్పదు.

- - -

దాల్భ్య మహర్షి : హంత। అహమ్ ఏతత్, భగవతో వేదాని - ఇతి। హే భగవాన్! శిలక మహర్షి! ఇంతకుమించిన ‘సామ’ గురించిన ‘‘ఉత్తరోత్తర గతి’’ నాకు తెలియదు. మీకు తెలిసి ఉండవచ్చు. దయతో వివరించండి. నేను తెలుసుకోవటానికి నేర్చుకోవడానికి సంసిద్ధుడనై ఉన్నాను. స్వర్గలోకస్య కా గతిః ఇతి?
స్వర్గలోకము దాటిన ఆవల గతి ఆశ్రయం ఏది?

శిలక మహర్షి : అటులనే సంభాషించుకుందాము. స్వర్గలోకమునకు ఆశ్రయము ‘‘ఇహలోకమే’’। ఈ భూలోకమే। ఎందుకంటే, - ఆయం హి లోకో యాగ దాన హోమ అభిః అముం, లోకం పుష్యతి - ఇతి। యాగము, దానము, హోమము మొదలైన వాటితో ఈ లోకమే స్వర్గలోకమును పోషిస్తోంది. కనుక స్వర్గము - ఈ లోకం నుండి సమర్పించిందే ‘ప్రతిష్ఠ’ పొందుతోంది. ‘‘యజ్ఞములో సమర్పించబడే హనిస్సులే దేవతలకు ఆహారము’’ - అని ప్రతులు చెప్పుచున్నాయి కదా!

దాల్భ్య మహర్షి : అస్య లోకస్య కా గతిః? ఈ లోకమునకు గతి, తరవాతి స్థానము ఏది?

శిలక మహర్షి : న ప్రతిష్ఠాం లోకమ్ అతినయేత్ ఇతి। ఈ సామము యొక్క గతి విషయమై ఈ లోకమును (భూలోకమును) అతిక్రమించిపోకూడదు. అందుచేత ఈ లోకమునకు అభిముఖంగానే సామము యొక్క మంత్ర-ఫలములను ప్రతిష్ఠ చేయటము ‘హోత’గా మన విధి. సామమునకు ప్రతిష్ఠగా ఈ పృథివియే స్తుతించబడుతోందని శ్రుతివాక్యం. ఇయం వై ‘‘రథంతరమ్ సామ’’ ఇతి చ శ్రుతిః। ఈ లోకమే నిశ్చయంగా ‘రథంతరము’ - అని శ్రుతులు చెప్పుచున్నాయి.

అది వింటున్న జీవలుని పుత్రుడు ప్రవాహణ మహర్షి ఈ విధంగా స్పందించారు.

ప్రవాహణ మహర్షి : ఓ శాలావత్యా। శిలక మహర్షీ। ‘‘ఈ లోకమే సామము యొక్క పరాకాష్ఠ ఫలము. అటు తరువాత మరే ఫలమునకు మార్గము లేదు’’ - అనే మీ అభిప్రాయము పరిమితము, సంకుచితము అయినట్టిది. అసంపూర్ణము. సామము యొక్క సంపూర్ణార్థము తెలిసిన వాని సమక్షంలో ‘ఇహలోకమునకే యజ్ఞ ఫలము పరిమితము’ అనే మాట మీరు చెప్పితే, - ఆతడు - ‘‘మీ తల నేల కూలుతుంది’’ అని పలికితే అది అట్లే జరుగగలదు. ఎందుకంటే, అంతకంటే ఉత్తమమైన ‘సత్యము’ సామోపాసన విషయమై ఏర్పడినదై ఉండగా, మీరు తలవంచక తప్పదు కదా!

శిలక మహర్షి : భగవన్తా! ప్రహరణ మహర్షీ। నేను చెప్పుదానికంటే ఆవలకు త్రోవచేయు సామోపాసన - తదనంతర ఫలము యొక్క క్రమము ఎట్టిదో నాకు తెలియదు. దయచేసి మాకు నేర్పమని ప్రార్థన.

ప్రవాహణ మహర్షి : ఓ! తప్పక వివరించుకుందాము. నేను సిద్ధముగా ఉన్నాను.


16–1–9. ప్రథమ అధ్యాయము - నవమ ఖండము - ఆకాశ ఉద్గీథ ఉపాసన

శిలక మహర్షి : అస్య లోకస్య కా గతిః? ఈ ఇహ లోకము యొక్క గతి, ఆశ్రయము ఏదై ఉన్నది?

ప్రవాహణ మహర్షి : ఈ ఇహలోకమునకు గతి, ఆశ్రయము - ‘‘ఆకాశము’’. సర్వాణి హ వా ఇమాని భూతాని ఆకాశాత్ ఏవ సముత్పద్యంత। (ఆకాశాత్ వాయుః; వాయుః అగ్నే; అగ్నే ఆపః; ఆపః పథ్వీ అను వేదోపనిషత్ వివరణను అనుసరించి) - వాయు అగ్ని జల పృథ్వి తత్త్వములన్నీ ‘ఆకాశము’ నుండే సముత్పన్నము అగుచున్నాయి (జనించుచున్నాయి). తిరిగి మరొకప్పుడు ఆకాశములోనే లయిస్తూ ఉన్నాయి కూడా. పై భూతములకంటే పంచభూతములలోని ఆకాశమే బహు విస్తారమైనది. అన్నిటికీ ఆధారము, అనంతమైనది. అందుచేత ఉద్గీథములు ఎరిగిన ఉద్గాతలు (ఉద్గీథ గానము తెలుసుకొనియున్న వేద్యులు) ‘ఆకాశము’నే ఉత్తమోత్తమమైన ఉద్గీథముగా ధ్యానము చేస్తున్నారు. అట్టి విద్వాంసులు ఉత్తమోత్తమమైన ఇహ-పరములు, దివ్యలోకములు సిద్ధించుకొంటున్నారు.

ఒకానొకప్పుడు శునక మహాముని కుమారుడు అతిధన్వ మునీశ్వరుడు తన ప్రియశిష్యుడగు ఉదర శాండిల్యునికి ఈ విధంగా బోధించటం జరిగింది.

యావత్ త ఏనం ప్రజయాం ఉద్గీథం వేదిష్యంతే, పరోవరీయో హి అభ్యస్తావత్ అస్మిన్ లోకే జీవనం భవిష్యతి। మీ శిష్యులు, సంతానము ఆకాశ ఉద్గీథ గానము కొనసాగిస్తూ ఉన్నంతకాలం వారివారి జీవితములు ఉత్తమోత్తమమై ప్రకాశించగలవు. వారి కీర్తి స్వర్గలోకములో కూడా విస్తరించి ఉండగలదు.

అట్టి ఆకాశ ఉద్గీథోపాసకులు పై రీతిగా వర్తమాన లోకము నందు, ఉత్తరోత్తర లోకములందు ప్రకాశవంతులై ఇచ్ఛానుసారం ఉండగలరు.


16–1–10. ప్రథమ అధ్యాయము - దశమ ఖండము - ప్రతిహారముల ఉపాసన

పూర్వం ఒకప్పుడు కురుదేశములో ఒక సమయంలో గొప్ప వడగళ్ళ వాన అకస్మాత్తుగా వర్షించం చేత అక్కడి పంటలన్నీ నేలమటమై పాడైపోయాయి. ఆ రాజ్యములోని ‘‘ఇభ్య’’ అనే గ్రామములో ఒకచోట చక్రముని కుమారుడగు ఉషస్తిముని చిన్న వయసు కలదైన భార్యతో ఒక ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవారు. ఆ గ్రామము ఒక మావటీవానికి (ఏనుగులను తొలుచూ, పోషిస్తూ ఉండేవానికి) చెందిన గ్రామము. ఆ ఉషస్తిముని తిండిలేక, చిన్నవయసు గల భార్యను పోషించలేక అగచాట్లు పడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆకలికి తాళలేక అన్నమును భిక్షగా అడగడానికి ఆ మావటీ వాని ఇంటికి వెళ్ళారు.

ఉషస్తి చక్రముని : ఓ గృహస్థా! గృహ యజమానీ! మావటీవాడా! భిక్షాం దేహి! భిక్షాం దేహి! అన్నదానం చేయండి.

మావటివాడు : ఓ అభ్యాగతి! ఉషస్తిమునీ! క్షమించాలి. మా వద్ద ఆహారమేదీ లేదు. అయితే మాయింటిలో ఎప్పటివో - పుచ్చిపోయిన కొన్ని ఉలవలు దాణా మాత్రమే ఉన్నది (లేక పుచ్చిన మినుగులు మాత్రమే ఉన్నాయి).

ఉషస్తి చక్రముని : మీ ఇంటిలో గల ఆ పుచ్చిపోయిన ఉలవగుగ్గిళ్ళనే కొంచెము భాగము అన్నదానముగా భావించి నాకు భిక్ష వేయండి.

మావటివాడు : అట్లా అయితే మావద్ద మిగిలి ఉన్న ఉలవ గుగ్గిళ్ళలో కొంత మీకు సంతోషంగా ఇస్తాను. స్వీకరించండి. కానీ, మా వద్ద శుద్ధమైన మంచినీళ్ళు కూడా లేవు. పశువులకు పట్టే కుడితి నీళ్ళు మాత్రమే ఉన్నాయి. అవి ఎంగిలివి. మురికిగా కూడా ఉన్నాయి.

ఉషస్తి ముని : అయ్యా! ఈ పుచ్చిన గుగ్గిళ్ళు మాత్రం ఎగిలివి కావా? పురుగులు కొంత తిని ఉన్నాయి కదా! అందుచేత మీరు త్రాగే నీరే మాకు కూడా దానం చేయండి. మేము స్వీకరించి సంతోషిస్తాము.

ఇట్లా పలికి ఉషస్తిముని కొన్ని ఉలవలు తిని మరికొని తన ఇంటికి తీసుకొనివెళ్లారు. అయితే, అప్పటికే ఆయన భార్య భిక్షము ఎత్తుకొని కొంచము ఆహారము భుజించి ఉండటం చేత భర్త తెచ్చిన గుగ్గిళ్లను దాచి పెట్టింది.

ఆ మరునాడు నిదుర లేచి ఆయన తన భార్యను పిలచి ఈ విధంగా చెప్పసాగారు.

ఉషస్తి ముని : భార్యామణీ! ఈ రోజున ఇప్పుడు ఆహారము కొంచము ఉండి ఉంటే నేను కొంత ధనం సంపాదించగలిగే వాడినే కదా!

భార్యామణి : స్వామీ! ఎట్లా ధనము సంపాదించగలరు?

ఉషస్తిముని : మనకు కొంత దూరములో ఈ దేశపురాజు ఒక గొప్ప యజ్ఞము చేయటానికి సిద్ధపడుచున్నారు. నేను అడిగితే - ఆయన ఋత్విక్కు కర్మల కొరకై ఋత్విజునిగా నన్ను నియమించి నా సేవలు స్వీకరించగలరు. అప్పుడు కొంత ధనము, ఆహారము మనకు లభించగలదు కదా!

భార్యామణి : ప్రాణేశ్వరా! మీరు రాత్రి తెచ్చిన పుచ్చిపోయిన ఉలవలు కొన్ని ఉన్నాయి కదా! అవి ఉడికించి ఇస్తాను. ఆహారముగా స్వీకరించి, మీరు అనుకొన్న తీరుగానే వెళ్ళిరండి.

ఆ ఉలవలను ఆహారముగా స్వీకరించి, శక్తి తెచ్చుకొని యజ్ఞము జరుగబోవుచున్న చోటికి బయలుదేరి వెళ్ళారు. ఋత్విక్కులు కూర్చుని ఉన్నచోటికి వెళ్ళారు. అక్కడ ఉద్గాతము (మంత్రగానము చేయువారు) స్తోత్రములు చదివే స్థానము చేరి, స్తుతులను చేయబోవుచున్న ఉద్గాతలకు దగ్గిరగా కూర్చున్నారు.

ఉద్గాతృ గణములో ఒక ముఖ్యుడగు ప్రస్తోతను ఉద్దేశించి ఉషస్తిముని ఈ విధంగా సంభాషించసాగారు.

- - -

ఉషస్తి ముని : ఓ ప్రస్తోతా! నమస్కారము. ఒక చిన్న విషయం. మీరు ప్రస్తావము (Description of the Invitee Divinity)కి చెందిన ఏ దేవత ఆహ్వానించబడుచున్నదో, - ఆ దేవత ఏమిటో తెలియకుండా ప్రస్తావన గానము చేస్తున్నారా? లేదు కదా! ఒకవేళ ఆహ్వానిత దేవతను తత్వార్థంగా - తెలుసుకోకుండా (Without understanding the Actual Form of Divinity) ‘ప్రస్తావగానము’ చేయనారంభిస్తే మాత్రం మీ తల నేల కూలగదు. దేవతాతత్త్వము, స్తుతుల శబ్ధార్థములు తెలియకుండానే కేవలము నోటితో పాఠము వలె స్తోత్రములు, (అష్టోత్తర శతనామము వంటి) నామములు వల్లిస్తే ఎప్పటికైనా అర్థము తెలిసినవారి ముందు తలవంచి సిగ్గుపడవలసి రాక తప్పదు.

ఓ ప్రతిహర్తారా! మీకు కూడా పై సూచన వర్తిస్తుంది సుమా! ప్రతిహర్తార్యా దేవత యొక్క తాత్త్వికార్థము తెలియకుండా, కేవలము శబ్దములు నోటితో పలుకుచూ ప్రతిహార గానము చేస్తూ ఉంటే మీ శిరస్సు క్రిందపడగలదు. ప్రతిహార గానమును వల్లె వేస్తే, అంతరార్థము - ముఖ్యోద్దేశ్యము తెలిసిన ప్రతిహార్తారుల సమక్షంలో ఎప్పుడో సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుంది.

- - -

ఈ విధంగా ఉషస్తిముని గొంతు ఎత్తి ప్రస్తోతమ, ప్రతిహర్తారుని (ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రాక్షసాం.. మొదలైన వాక్యములు చెప్పువానిని) హెచ్చరిక చేస్తూ ఉండగా, అక్కడ ఉన్నవారంతా వారువారు చేస్తున్న పనులు ఆపి, ఇటువైపుగా చూడసాగారు. ‘‘ఓహో! ఈయన కర్మ మాత్రమే తెలిసి తాత్త్వికార్థము, ఆహ్వానిత దేవతా మహిమ సరిగ్గా తెలియకపోతే - అట్టివారికి ప్రస్తోతగాను, ప్రతిహర్తారుడుగాను సేవించే అధికారము ఉండదని ఆక్షేపిస్తున్నారే! ఒకవేళ శాస్త్ర ప్రమాణికంగా కర్మలు చేయిస్తూ, మంత్రములు నోటితో పలికినప్పటికీ, - కర్తకు దోషము అంటకపోయినప్పటికీ, ప్రస్తోత - ప్రతిహర్తారులు తమ విధ్యుక్త ధర్మముల ఉత్తమ ప్రయోజనము పొందలేరని గుర్తు చేస్తున్నట్లున్నారు!’’ - అని అనుకొంటూ అక్కడివారు గుసగుసలాడుకోసాగారు.

ఇది గమనించి యజమానియగు ఆ దేశపురాజు ఉషస్తిమునిని ఉద్దేశించి ఇట్లా సంభాషించసాగారు.


16–1–11. ప్రథమ అధ్యాయము - ఏకాదశ ఖండము - ప్రాణ - ఆదిత్య - అన్న ఉద్గీథము

యజమాని అగు మహారాజు : పూజనీయా! మీరు ఎవ్వరో మేము తెలుసుకోవచ్చునా? దయచేసి సభకు పరిచయం చేసుకోండి.

ఉషస్తి ముని : యజ్ఞకర్తయగు మహారాజా! మీకు జయమగుగాక! ఈ యజ్ఞ కార్యక్రమము దిగ్విజయము, లోకకళ్యాణ ప్రదము అగు గాక! మీకు ఇక్కడ ఆహూతులకు, ఋత్విక్కులకు, ప్రస్తోతలకు, పరిహర్తారులకు, హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మహారాజా! నేను మన ఈ కురుదేశ పౌరుడను. నా పితృదేవులు శ్రీ చక్రముని. ఉషిస్తి నామ - అహంభో అభివాదయే।

మహారాజు : ఓహో! మీరు ఉషస్తి మునీశ్వరులా! నమస్కారము. అయ్యా! ‘‘మీరు ఎక్కడ ఉన్నారా?’’ అని చాలా వెతికించాను. మీరు ఎక్కడున్నారో తెలియలేదు. మీరు సమస్త యజ్ఞవిధులలో ప్రావీణ్యులని రాజగురువర్యులవారు మీ గురించి సూచించియే ఉన్నారు.

పూజనీయులగు ఓ ఉషస్తి మునిచంద్రుడా! మీకు సుస్వాగతము.

భగవాన్! అస్తు త్వయేవ మే సర్వైః ఋత్విజైః ఇతి తథేతి। హే భగవాన్! మీరే ఋత్విక్ - కర్మలన్నింటికి పూజనీయులై ఉండండి.

ఉషస్తి ముని : మహారాజా! మీ ఆదర - అభిమానములకు హృదయపూర్వక సంతోషము ప్రకటిస్తున్నాను. ఈ యజ్ఞ - కార్యక్రమము సేవించటానికి నేను సిద్ధము. మీ యొక్క ఆజ్ఞ శిరసా వహించగలను. నేను కూడా ఒక ఋత్విక్‌నై ఉంటాను.

అయితే మీచే ప్రేమగా అనుమతి ఈయబడినవారై ఇక్కడ ఇప్పటికి నియమితులైన ఋత్విజులంతా ఉద్గానము చేసెదరు గాక!

ఓ యజ్ఞకర్తా! మహారాజా! ఇక్కడి ప్రస్తోత, ఉద్గాత మొదలైన ఋత్వికులకు ఎంత ధనమును తాంబూలంగా ఇస్తున్నారో, నాకు కూడా ఒక ఋత్విజునిగా అంత మాత్రమే ఇవ్వండి. అధికముగా వద్దు. వారంతా ముందే ఆహ్వానించబడ్డారు కదా!

మహారాజు : హే ఋత్విజ మహాశయా! ఉషస్తి మునీశ్వరా! మీరు కోరినట్లే జరుగగలదు. ఇక కొద్ది సమయంలో యజ్ఞవిధులను ప్రారంభించటానికి అనుజ్ఞ ఇవ్వండి.

- - -

అప్పుడు అక్కడి ప్రస్తోత ఉషస్తిమునిని సమీపించారు. వినయంగా ఇట్లా ప్రస్తావించారు.

ప్రస్తోత : హే ఉషస్తి భగవాన్! ‘‘ప్రస్తోతము చేయుచున్న దేవతను తెలుసుకోకుండానే ప్రస్తావన గానం చేయటం జరిగితే అట్టి ప్రస్తోత యొక్క శిరస్సు క్రిందపడగలదని మీరు ఇంతకుముందు ప్రస్తావించారు కదా! అట్టి ప్రస్తోత కార్యక్రమమునకు అధిష్ఠానము ఎవరు? (లేక) - గతి, ఆశ్రయము ఎవరు?

ఉషస్తి ముని : ప్రస్తోతమునకు దేవత ‘‘ప్రాణమే’’। ఎందుకంటే ఈ చరాచర జీవులంతా చివరికి ‘‘ప్రాణము’’లోనే లీనము అగుచున్నారు కదా. ప్రలయంలో సమస్తము ప్రాణములోనే ఏకమగుచున్నది. మరల సృష్టి జరుగుచున్నప్పుడు సమస్తము ‘ప్రాణము’ నుండే ఉద్భవించటము జరుగుతోంది కూడా. ప్రస్తానగానమునకు ప్రాణమే దేవత. అందుచేత, ఎవ్వరైనా సరే ప్రాణదేవతను తెలుసుకోకుండా ప్రస్తానగానము చేస్తే, అట్టివారి శిరస్సు క్రిందపడక తప్పదు. వారు ప్రాజ్ఞులముందు తలవంచక తప్పదు.

ఈ విధంగా ‘‘సమస్త యజ్ఞయాగములలోను ప్రస్తుతి ప్రాణదేవత (ప్రాణశక్తి) గురించియే’’ - అని ప్రస్తోత అంతరమును గుర్తు కలిగి ఉండాలి.

- - -

అప్పుడు అక్కడి ఉద్గాత ఈ విధంగా అడిగారు.

ఉద్గాత : ఓ ఉద్గాత ప్రాజ్ఞా! ‘‘ఉద్గీథమునకు చెందిన దేవత తెలియకుండా ‘ఉద్గానము’ చేస్తే అట్టి ఉద్గాత తల తెగగలదు. విజ్ఞుల సభలో తలవంచవలసి వస్తుంది’’ - అని శలవిచ్చారు గదా! మరి ఉద్గీథమునకు ఉద్గాత తెలుసుకొని ఉండవలసిన అధిష్ఠాన దేవత (గతి, ఆశ్రయము అగు తత్త్వము) ఎవరు?

ఉషస్తి ముని : ఉద్గీథ గానమునకు అధిష్ఠాన దేవత ఆదిత్యుడే! సర్వాణి హ వా ఇమాని భూతాని ఆదిత్యమ్ ఉచ్చైః సన్తం గాయన్తి। ఈ సమస్త జీవులు సూర్యోదయంతో బాటు నిదురులేవగానే ఆదిత్యుని నుండి పగటి వెలుగు పొందుచూ ఆదిత్యుని కీర్తిస్తున్నారు. ఆ సూర్యభగవానుడే ఉద్గీథమును అధిష్ఠించినవారై ఉన్నారు. అట్టి ఆదిత్యుని (ఆది-సమస్తమునకు మొట్టమొదటిదగు ‘‘కేవలాత్మ పురుషుని’’) తెలుసుకోకుండా ఉద్గీథగానము ఎవ్వరైనా సరే - చేస్తే,… అప్పుడు విజ్ఞుల సభలో తలదించుకోవలసి వస్తుంది. అందుచేతనే ఆ విధంగా - ‘‘తల తెగిపోగలదు’’ - అని చెప్పటం జరిగింది.

ప్రతిహర్త : ఓ ఉషస్తి మునీశ్వరా! ఋత్విక్ మహాశయా! ప్రతిహారమునకు సంబంధించిన దేవత ఎవరో తెలుసుకోకుండా ప్రతిహారము (సమావయవమును సాంగ, సపరివార, సాయుధ, సపత్నీ సమేతంగా ఆహ్వానించటము) నిర్వర్తిస్తే తల తెగగలదని చెప్పినారుకదా! హే పూజనీయా! అట్టి ప్రతిహార దేవత ఎవరు?

ఉషస్తి ముని : ఆ ప్రతిహార దేవత - ‘‘అన్నమే। ప్రాణులంతా అన్నము తీసుకొనియే జీవిస్తున్నారు కదా. ఆ ఈ దేవతయే యజ్ఞములో ‘‘ప్రతిహార క్రియావిభాగము’’ మాత్రమే. ఇది ఎరిగి ప్రతిహారమునకు సమావయవమునకు అధిష్ఠాన దేవత అగు ‘అన్నము’ యొక్క తత్త్వము, తత్ ఉపాసనా దృష్టి కలిగి ఉండకపోతే - అది నామమాత్రపు ప్రతిహార వృత్తి మాత్రమే. అన్నము స్వీకరించుట చేతనే జీవులంతా జీవించగలుగుచున్నారు.

ప్రతిహరణము = లోపలికి తీసుకొనుట.

ఈ విధంగా
- ప్రస్తావము (Introduction)నకు ‘ప్రాణము’.
- ఉద్గీథ (Uplifting)కు ‘‘ఆదిత్యుడు’’.
- ప్రతిహార భక్తి (Inviting into inside)కి ‘‘అన్నము’’.

దేవతలుగా అర్థం చేసుకొని ప్రస్తోత, ఉద్గాత, ప్రతిహార్తుడు అనబడే ఋత్విజులు తమ యజ్ఞవిధులు నిర్వర్తించెదరు గాక - అని నా మనవి!


16–1–12. ప్రథమ అధ్యాయము - ద్వాదశ ఖండము - శునకములకు (ఇంద్రియముల) ఆహారము కొరకు - ‘‘ఉద్గీథము’’

ఇక ఇప్పుడు శునకములు (ఇంద్రియములు) ఆహారము కొరకై ఉద్గీథము చేయు విధిని చెప్పుకుంటున్నారు.

ఒకప్పుడు దల్భ్యుని కుమారుడగు దాల్భ్య బక ముని వేదాధ్యయనము, స్వాధ్యాయము నిర్వర్తించే నిమిత్తమై మేత్రేయ గ్లావ మహర్షి ఆశ్రమం ప్రవేశించారు. ఆ గురుకులములో వేదాధ్యయనము, అభ్యాసము చేస్తూ ఉండేవారు.

ఒకరోజు దాల్భ్యముని సహపాఠకులతో కలిసి ఆ ఆశ్రమమునకు దగ్గరలో గల గ్రామమునకు సమీపించారు. గ్రామమునకు చివరలో ఒక నిర్జన - ఏకాంత ప్రదేశములో వేదమంత్రములను పెద్దగాను, ఆరోహణ - అవరోహణ క్రమంగాను, ‘అ’కారాది - ‘ఉ’దాత్తాది - ‘అను’దాత్తాది షడ్జాది స్వరయుక్తంగా వల్లెవేయటం ప్రారంభించారు.

అప్పుడు వేదగాన దేవతలు (ఇంద్రియ దేవతలు) కుక్కల రూపంగా ప్రత్యక్షమైనారు. ఆ కుక్కలలో ఒక తెల్లని కుక్క (ప్రాణదేవత) - ‘‘ఓ వేదగానమును వల్లె వేస్తున్న పూజనీయులగు మునికుమారులారా! మేము చాలా ఆకలిగొని ఉన్నాము. అందుచేత మీరు ఆకలితీర్చే శక్తిని ఇచ్చే ఆహారమునకు సంబంధించిన ఉద్గీథ గానము చేసి మాకు తద్వారా ఆహారము సిద్ధము చేయండి’’!

అప్పుడు దాల్భ్య బక ముని ఆ తెల్ల కుక్కతోను తదితర కుక్కలతోను ఇట్లా పలికారు. ‘‘మీరు చెప్పిన ఆహార రసము ప్రసాదించే ఉద్గీథము ఉదయంలోనే గానం చేయాలని శాస్త్రములు సూచిస్తున్నాయి కదా! అందుచేత మీరు రేపు ఉదయం రండి. మీరు కోరినట్లే ఆహార వేదగానము చేసి ఆహారశక్తిని అందునట్లు చేయగలము!’’

ఆ మరునాడు ఉదయము దాల్భ్య బక ముని, మైత్రేయగ్లావ మహర్షి, తదితర వేద అధ్యయనులు - వారంతా ఆ కుక్కలు కనబడిన చోటికి వచ్చి నిరీక్షించారు. అప్పుడు క్రిందటి రోజు వచ్చిన కుక్కలు ఆ ఉదయం అక్కడికి వచ్చాయి. అప్పుడు దాల్భ్య బక ముని, గ్లావమహర్షి మొదలైనవారు అక్కడ - బహిష్పవమాన స్తోత్రములను ఋత్విక్కులై గానం చేశారు.

అప్పుడు ఆ శునకములు ఒకదానితో మరొకటి జతకట్టి, ఒకదాని తోకను మరొకటి నోటితో పట్టుకొని బహిష్పవమాన స్తోత్రములను శ్రవణం చేస్తూ గుండ్రముగా స్థానము స్వీకరించి (taken position), కాసేపు గుండ్రముగా తిరుగాడినాయి. ఆ తరువాత గుండ్రముగా        ⃝    ఆసీనములై ఈ విధంగా ‘హిం’ కారము చేయసాగాయి. మధురముగా ఆహారమునకు సంబంధించిన వేదమంత్రములు ‘వంతపాట’గా గానం చేయసాగాయి.

‘‘ఓం ఆదా’’.. మేము ఇప్పుడు తినుచున్నాము।
‘‘ఓం పిబా’’.. మేము ఇప్పుడు త్రాగుచున్నాము।
‘‘ఓం దేవోవరుణః’’ ఓం ప్రకాశరూపుడగుటచేత ‘‘ఆదిత్యుడు’’ దేవదేవుడు,
‘‘ప్రజాపతిః సవితా’’ వర్షము ప్రసాదించటం చేత ‘‘వరుణుడు’’.
జీవులకు ఆహారము ఇచ్చి పోషించటం చేత ‘‘ప్రజాపతి’’,
ప్రాణుల ఉత్పత్తి నిర్వర్తించటం చేత ‘‘సవిత’’.

ఈ విధంగా ‘హిం’కారము చేసి ఆ శునకములు (ఇంద్రియదేవతలు, ప్రాణదేవత) - ఇంకా ఇట్లా పలికాయి.

ఓం అన్నమిహా అహరద। మమ్ములను అన్నము తిననిండు.

అన్నపతే! అన్నమిహా అహర అహర ఓం ఇతి।। ఓ అన్నపతీ! ప్రతి దినము అన్నమును తిని, పానీయము త్రాగనిండు.

వరుణ దేవుడు, ప్రజాపతి, సూర్యభగవానుడు సమస్త జీవులకు అన్నము సమకూర్చుటకై యజ్ఞనిష్ఠులై ఉండెదరు గాక!

ఓ అన్నపూర్ణాదేవి! మాకు ఇక్కడ మేమున్న చోట అన్నమును ప్రియముగా సమకూర్చి ఇచ్చెదవు గాక!

ఈ విధముగా వేదమంత్రములలోని అన్నమంత్రముల ఉద్గీథముచే జీవులకు అన్నప్రదాతలగు ఆదిత్యుడు, వరుణదేవుడు, ప్రజాపతి, సవితృదేవత ప్రత్యుత్సాహము పొంది జీవులకు అన్నప్రదాతలై కరుణించటము కొనసాగించగలరు.


16–1–13. ప్రథమ అధ్యాయము - త్రయోదశ ఖండము - సామగానము - ‘‘స్తోభ’’

‘‘భక్తి’’ - గానముగా ప్రదర్శనమౌతుంది. ‘‘గానము’’- ‘సామ’కు సంబంధించినది. ‘సామ’ (లేక) సంగీతములో ‘స్తోభాక్షరములు’ ఉంటాయి. అట్టి స్తోభాక్షరములు వాఙ్మయము (Lyric / Language) కాదు. సంగీతములో పలికే శబ్దములను కలుపుతూ ఉండే శ్రుతి రూపములే స్తోభాక్షరములు.

ఉదాహరణకు
‘‘హా’’ - ఉ…। ‘‘హా’’ - ‘‘ఇ’’. ‘అథ్’ ‘‘ఈ’’ ‘‘ఊ’’ ‘‘ఇహా’’ ‘‘ఈ’’

ఇవన్నీ సంగీతమును లయబద్ధంగా ఉండటానికి అక్షరాల ఉచ్చారణ మధ్య పలుకుతారు. సంగీత విద్వాంసులు శబ్దము (musical sound)గా ఉపయోగిస్తారు. ఇవన్నీ సంగీతమునకు (సామకు) అవయవములుగా ఉంటూ ఉంటాయి. సామము (సంగీతము)నకు స్తోభాక్షరములకు, ‘‘అర్థముగల అక్షరములకు’’ తేడా లేనట్లే సంగీత విద్వాంసులు పలుకుతారు. అట్టి స్తోభాక్షరములను దృష్టాంతంగా తీసుకొని, ఈ స్వప్న సమానమైన దృశ్య వ్యవహారమును దర్శించు ఉపాసనను (ఉద్గీథమును) మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాము.

- - -

స్తోభ = మాయమాట! గుర్తు! అర్థమును ఆపాదించే శబ్దరూపము.

అయం వావ లోకో ‘‘హా ఉకారో’’ ఈ సమస్త లోకము ‘‘హా..ఉ’’ స్తోభాక్షరము

వాయుః ‘‘హా ఇకారః’’ - వాయువు ‘‘హా-ఇ’’ స్తోభాక్షరము

చంద్రమా.. ‘అ’ ‘థ’ కారః। చంద్రుడు ‘అథ’ -అనే స్తోభ . చంద్రుడు ‘ఆహార’ రూపుడు. ‘‘అథ - అన్నము’’లలో ‘అ’కారము

ఆత్మే హ కారో - శ్రుతి - లోని ‘హ’రమే ఆత్మ।

అగ్నిః ‘ఈ’ కారః ఆదిత్యః ‘ఊ’ కారః।‘ అగ్ని - ‘ఇ’ కారము. ఆదిత్యుడు (సూర్యుడు) - ‘ఊ’కారము.

నిహరే ‘ఏ’కారా - ప్రార్థన (లేక) ఆహ్వానము ‘ఏ’కారము (ఏహి = రమ్ము)

విశ్వేదేవా ‘‘ఔ హో ఇ’’ కారః - విశ్వే దేవతలు (Workers of the Universe) ‘‘ఔ హో ఇ’’ కారము. ‘‘వైశ్య దేవ్య సామము’’లోను, అన్న సూక్తములోను ఇట్టి విశ్వేదేవతలకు అభ్యర్థన చెప్పబడుతోంది.

ప్రజాపతిః ‘హిం’ కారః - సృష్ట్యభిమానియగు ప్రజాపతిని తలచుచు ‘హుం’ కారము. ‘హుం’ అనునది కూడా ‘స్తోభ’యే!

ఈ విధంగా ప్రజాపతిని కూడా (సృష్టి సంకల్పమును కూడా) నామవర్ణాత్మకంగా చెప్పలేము కనుక ‘హిం’ అన్నది కూడా స్పష్టమైన ‘వర్ణము’ కాదు. స్తోభయే.

ప్రాణము → స్వరము  
అన్నము - స్తోభ!  
స్వరమునకు (వాక్కుకు) ప్రాణము మూలకారణము.

అందుచేత ‘‘స్వరము’’ అనే స్తోభయందు ‘‘ప్రాణశక్తి’’ని స్వరాంతర్గతంగా భావన చేస్తూ, ప్రాణమును ఉపాసించెదరు గాక!

‘‘యా’’ స్తోభ య = పొందుట.

‘యా’ అనునదే ‘అన్నము’నకు స్తోభ। ‘యా’ అనే స్తోభ (స్వరము)నందు అన్నమును భావించి ఉపాసించెదరు గాక।

‘య’ - అనగా పొందటం. ఈ జగత్తు అన్నముచే ఉనికిని పొందుతోంది. అందుచేత ‘య’ అనగా - (1) అన్నము (2) జగత్తు కూడా.
అందుచేత ‘యా’ అనే స్తోభ వచ్చినప్పుడెల్లా అన్నము, జగత్తులను ఉపాసనా వస్తువులుగా అనుకొంటూ ఉండెదరు గాక!

అట్లాగే ‘వాక్’ అనే స్తోభ’ ‘విరాట్’ యొక్క ఉపాసనగా (విరాట్ స్వరూపుని గుర్తు చేసుకొనుచున్నట్లుగా) భావించెదరు గాక!

సామ (గానము) లేక సంభాషణ యందు
‘‘హా ఉ అథ హ ఇ ఏ ఓ హో ఈ ఈం హి’’ (12)

ఈ విధంగా స్తోభాక్షరములు పలకబడుచుండగా ఇవన్నీ హావభావ ప్రకటనా రూపమగుచూ, స్పష్టమైన అర్థమంటూ ఏదీ లేనట్టి స్తోభాక్షరములు. గాన సిద్ధి కొరకై ప్రయోగించబడే అర్థము లేని అక్షరాలు. అయితే ఈ స్తోభలను పైన చెప్పినట్లుగా ఉపాసనా పూర్వకంగా భావించి, ప్రయోగించబడుచుండెదరు గాక!

అనిరుక్తాః త్రయోదశః స్తోభః సంచరో ‘హుం’ కారః

ఈ విధంగా, ‘‘వాక్కు… హుంకారము’’

అనిర్వాచ్యమగు 13వ అక్షరము ‘‘స్తోభ’’ (స్వరము) అనిర్వాచ్యమగు ఆత్మక సూచనగా భావించి గానము చేసెదరు గాక. పై విధంగా ఎరిగి స్తోభాక్షరములను, వాఙ్మయాక్షరములను ఎరిగి గానము (సామగానము) చేయువారి యొక్క వాక్కు ‘అమృతము’.

అట్టి స్తోభ- స్వర - అర్థాక్షరములు ఎరిగి గానము చేయువారికి అన్నము సమృద్ధిగా లభించగలదు. వారు తృప్తిగా భుజించగలరు.

అట్టి పవిత్ర సామగానము చేయువారు పూతాత్ములు (పవిత్రాత్ములు).

ఈ విధంగా సామముల యొక్క ఉపాసన తెలుసుకొని అనుష్ఠించువారికి
🍎 వారి వాక్కు పితికిన పాలవలె మాధుర్యము సిద్ధించి ఉండగలదు.
🍎 స్వరము, ఉచ్చారణ మధురార్థసారభూతమై ఉండగలవు.
ఆతడు ఆహార సమృద్ధి, జీర్ణశక్తి కలిగి ఉండగలడు.

అట్టివాని వాక్కుతో మాధుర్యమగు ఆత్మగానము వెంటనంటినదై
‘‘అఖండాత్మమేవాహమ్’’ భావన క్రమంగా సుస్థిరము, నిశ్చలము, నిశ్చితము అవగలదు!
ఇతి ఫలశ్రుతిః


ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్
ప్రథమ అధ్యాయః సమాప్తః




16–2.     ఛాందోగ్యోపనిషత్ - అధ్యయన వచన పుష్పము - ద్వితీయ అధ్యాయము


16–2–1. ద్వితీయ అధ్యాయము - ప్రథమ ఖండము - ‘సామ’ ఇతి సాధుః

ఓం ఇతి ఏకమ్ - అక్షరమ్

ఇప్పుడు మనము సర్వశ్రేష్ఠము, శుభప్రదము అగు ‘సామ’ యొక్క గానము, ధ్యానముల గురించి వివరించుకుందాము.

ముందుగా.. ‘‘సామ’’ - శబ్దార్థము

సామ = మధురమగు వేదగానము, ‘మంచి’ని కలిగించేది. మంచి మాట. అనుకూల ప్రవర్తనము. శుభము. శోభ కలిగించ గల ఉపాయము - సాత్వికము.

సామరస్యము = స్నేహము, కలిసి ఉండి పనిచేయటము, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకొని ప్రవర్తించటము.

సమస్తస్య ఖలు సామ్న : అన్ని అవయవములు కలిసియుండి, సమవర్తనమై, ‘సమస్తము’గా సంతరించుకొని ఉండటము.
‘సామ’ ఉపాసన సాధు (మంచిది).

యత్ ఖలు సాధు - తత్ ‘సామ’ ఇతి ఆచక్షతే।। ‘‘ఇది మంచిదే।’’ - అది చెప్పటానికి ‘సామ’ అని అంటారు. ‘‘మంచిదే। అట్లాగే చేయి అనటానికి ‘సామ’ శబ్దము ఉపయోగించబడుతోంది.

‘‘ఇదిగో అట్లా చేయవద్దు! అది మంచిది కాదు!’’ అని చెప్పునప్పుడు అది ‘అసామ’ అనబడుతోంది.
యత్ అసాధు, తత్ అసామ। ‘సాధు’కు (మంచికి) వ్యతిరేకమైన సూచన చేసేటప్పుడు ‘‘అసామ’’ అనబడుతోంది.

‘‘ఆతడు ‘సామ’ను కోరుకొని వచ్చారు’’ అనగా - లేక ‘‘సామగానముతో అభ్యర్థిస్తున్నారు’’ - అని అన్నప్పుడు - ‘‘ఆతడు మనలను సద్బుద్ధితో అర్థించటానికి వచ్చాడు’’ - అని వార్త అందిస్తున్నట్లు. అట్లా కాకుండా, ‘‘అదిగో! ఆతడు ‘అసామ’ అయి వస్తున్నాడు’’ అని అన్నప్పుడు ‘‘ఆతడు కామ్యబుద్ధితో తన స్వార్థమును దృష్టిలో పెట్టుకొని మనలను ఇబ్బంది పెట్టటానికే వస్తున్నాడు! జాగ్రత్త’’ - అని సూచించటమే అగుచున్నది.

‘ఇది సామగానము’ - అన్నప్పుడు ‘‘అయ్యా! శ్రద్ధతో వినండి! ఇది మనకు శుభమును, సద్బుద్ధిని ప్రసాదించగలదు. సంతోషము కలిగించగలదు’’ - అని చెప్పటము.

‘‘అది అసామగానము’’ - అన్నప్పుడు ‘‘బాబూ! ఆతని గానము వినటం వలన ఆవేశకావేశములు పెచ్చుపెరిగి, మనకు అశుభమును, దుర్బుద్ధిని పెంచి పోషించగలదు. చివరికి దుఃఖమే పర్యవసానము. అందుచేత జాగరూకులై విని ఆతనిని త్వరగా పంపివేయండి!’’ - అని జాగరూకత చెప్పటం వంటిది.

‘సామము’గా మాట్లాడువారు ‘సాధువులు’గా స్తుతించబడుచున్నారు.

‘‘మీరు అసామంగా చెప్పుచున్నారు’’ - అని అంటున్నప్పుడు మీరు కామ్య బుద్ధితో, సరి అయిన - సమగ్రమైన అవగాహన లేకుండా మాట్లాడుచున్నారు. మీరు చెప్పేది మాత్రమే వింటే మాకు దోషము, పాపము కలుగగలదు’’ అని అనటము అవుతుంది.

‘‘సామగానంగా మీరు చెప్పుచున్నారు!’’ - అని అన్నప్పుడు - ‘‘మీరు వివరములన్నీ తెలుసుకొని శుభ-శోభాయమానంగా చెప్పుచున్నారు. మేము అనుసరించటం చేత సంపదలు పొందగలము’’ అని చెప్పటము వంటిది.

‘సామ’గా మాట్లాడువారు, గానము చేయువారు శుభములు పొందగలరు. తదితరులకు శుభము కలిగించగలరు.
అందుచేత సామగానమే చేయాలి। ‘సామము’గా సంభాషించాలి. ‘‘సామము’’నే ఉద్దేశ్యించాలి.


16–2–2. ద్వితీయ అధ్యాయము - ద్వితీయ ఖండము - పంచవిధ (5) సామగాన ధ్యానములు

లోకంలో ‘‘సామగానోపాసన’’ (లేక) సామ ధ్యానము ఐదు తీరులుగా జరుగుచూ ఉన్నది। (లేక) లోకములో కనిపించే ఈ ఐదింటిని ‘సామ’గా భావించాలి, చూడాలి, ఉపాసించాలి. ఈ ఐదు సామగుణ విశిష్టమగు ‘‘పూర్ణసామము’’గా ఎరుగబడును గాక!

Ⅰ. ఊర్ధ్వ లోక సామోపాసన:
(1) పృథివీ ‘‘హిం’’కారః : ఈ భూమి, ఈ ఘనీభూతమైన సమస్తము ఆత్మభగవానుని ‘హిం’కార సామగానము (లేక) ఉద్గీథ గానము.

‘హిం’ అను బీజాక్షరముతో ఘనీభూతమైన సమస్త - దర్శనమును ఆత్మోపాసన చేయుదురు గాక!

పంచభూతములలో పృథివి మొదటిది. (అట్లాగే) సావయవములలో ‘హ్రీం’ అనునది మొదటి బీజాక్షరము. (ఓం-హ్రీం- క్లీం-శ్రీం-ఓం).

(2) ‘అగ్నిః’ ప్రస్తావో : అగ్నియే ప్రస్తావము, అగ్నియందే కర్మలన్నీ ప్రస్తుతము (materialize) అగుచున్నాయి. అగ్నియే ‘‘సమాయవయ ముఖ్యము’’గా యజ్ఞమునందు ప్రస్తుతించబడుచున్నది. ఆత్మను ప్రస్తుతించువాడు ‘తేజస్సు’ను దర్శిస్తున్నాడు.

(3) అంతరిక్షమ్ ఉద్గీథ : అంతరిక్షమే (లేక) గగనమే (లేక) ఆకాశమే ఉద్గీథము. ఆత్మవలెనే అంతరిక్షము శూన్యమే అయి ఉండి కూడా తన యందు గ్రహ-ఉపగ్రహ- నక్షత్రమండలములో సహా సమస్తము తన యందు కలిగి ఉంటున్న లక్షణము ఉపాసించుచున్నారు.

(4) ఆదిత్యః ప్రతిహారో : సూర్యుడే ప్రతిహారము. సూర్యుడు కళ్ళకు ఎదురుగా జీవులకు కనిపించటం చేత ‘ప్రతిహారము’. ప్రతిజీవుడు ఆదిత్యుని తనకు అభిముఖంగా దర్శిస్తూ ఉన్నాడు కదా!

(5) ద్యౌః నిథనమ్। : ద్యులోకము (దేవతాలోకము, స్వర్గలోకము). ఇక్కడి నుండి వెళ్ళిన పుణ్యజీవులు ద్యులోకమునందే ప్రతిష్ఠితులగుచున్నారు కదా!

ఈ విధంగా ఊర్ధ్వలోక విషయములన్నీ ఈ ఐదింటి ఉపాసనచే - ప్రార్థన చేయబడినవి అగుచున్నాయి.

Ⅱ. ఇహ (అథో) లోకముల ‘‘పంచసామ’’ సామ ఉపాసన (ఉద్గీథము) :
ఈ లోకములలో జీవులు రావటము - పోవటము జరుగుచుండు ధర్మము కలిగి ఉంటున్నాయి. కాబట్టి ‘అథోలోకములు’ అనబడుచున్నాయి. (The Reverse of “I” Above)

(1) ద్యౌః - ‘హిం’ కార। ద్యు (లేక) దివ్యలోకములు ‘హిం’కారము

(2) ఆదిత్యః-ప్రస్తావో। ఆదిత్యము ప్రస్తావము. సూర్యుడు ఉదయించగానే జీవులు వారి వారి పనులు ప్రారంభిస్తున్నారు కదా!

(3) అంతరిక్షమ్ ఉద్గీథో। అంతరిక్షము (లేక) ఆకాశము (లేక) గగనము ఉద్గీథము.

(4) అగ్నిః ప్రతిహారః। అగ్నియే-ప్రతిహారము. ప్రాణులు అగ్నిని వెలిగించి ఆ వెలుగులో అటూ ఇటూ తిరుగుచున్నారు కదా!

(5) పృథివీ నిధనమ్। భూమియే నిధనము. భూమి యొక్క స్వరమే నిధనము (సమాప్తి, ముగింపు). దేవతాలోకం నుండి తిరిగి భూమిపైకి వచ్చి ప్రతిష్ఠితులు అగుచున్నారు కదా!

ఈ విధంగా అధోలోకముల గురించి వెలిసియున్న యోగులు పంచ విధములుగా సామగానోపాసన చేయుచున్నారు. (ఒక్కొక్కచోటు బుద్ధిని నిలిపి ఆత్మోపాసన నిర్వర్తిస్తున్నారు)


16–2–3. ద్వితీయ అధ్యాయము - తృతీయ ఖండము - ‘‘వృష్టి’’ పంచవిధ సామోపాసన

వృష్టి = వర్షము; విజ్ఞులగు తత్త్వోపాసకులు వర్షమునందు ‘5’ రకముల ఉపాసనను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది అభ్యాసులచే అధ్యయనము చేసి ఉపాసించబడుతోంది. ప్రాణులు జీవించాలంటే ‘వర్షము’ అత్యావస్యకము కదా! అందుచేత ‘‘లోకోపాసన’’ తరువాత ఈ ‘వర్షోపాసన’ చేయబడుచున్నది.

(1) పురోవాతో ‘హిం’కారో। : తూర్పు నుండి వీచుచున్న వాయువు ‘హిం’కారముగా ఉపాసించబడుగాక। ‘‘తూర్పు గాలితో మొదలై వర్షమునకు సంబంధించిన ప్రక్రియ వర్షము వెలియమవటముతో అంతము అవటము’’-ను ఉపాసిస్తూ ఉన్నారు.

(2) మేఘోజాయతే స ప్రస్తావో। మేఘము ఆకాశములో ఉత్పన్నమవటము ‘‘ప్రస్తావము’’ మేఘాలు ఆవరిస్తేనే వర్షం వస్తుంది కదా!

(3) వర్షతి స ఉద్గీథో। మేఘము వర్షించటమే ‘‘ఉద్గీథము’’ (స్తుతి, గానము)గా ఉపాసించటము.

(4) విద్యుత్ - మెరుపులు స్తనయతి - మేఘగర్జనలు - ప్రతిహారము - నలువైపులా చెల్లాచెదరమవటమును ఉపాసించటము ‘‘ప్రతిహారము’’

(5) ఉద్గృహ్ణాతి - తత్ నిధనమ్ : అంతటా జలము విస్తరించటము - నిధనము (పరిసమాప్తి)

ఈ వివరణ తెలిసిన ఉపాసనా యోగి పంచవిధ సామగానములచే ‘వర్షము’ను ఎరిగి సాధన కొరకై ఆరాధిస్తున్నాడు. ఆత్మ భావనా సిద్ధికై ఉపాసన ఉపకరణముగా ‘అవగాహన’ను తీర్చిదిద్దుకుంటున్నాడు.


16–2–4. ద్వితీయ అధ్యాయము - చతుర్థ ఖండము - ‘జల’ - పంచవిధ సామోపాసన

సమస్త జలమును ఈ విధంగా ‘5’ రీతులుగా ఉపాసన కొరకై (కొందరు) ఉపాసించుచున్నారు. ఈ ‘5’ రకములైన ‘‘సామ’’ (ఉపాసనాభ్యాసము) నిర్వర్తించబడుచున్నది.

(1) మేఘే యత్ సంప్లవతే, స ‘హిం’కారో। : మేఘములు దట్టముగా క్రమ్ముకోవటము - ‘హిం’కారము.
(2) యః వర్షతి - స ‘‘ప్రస్తావో’’। - వర్షించటమే ‘‘ప్రస్తానము’’.
(3) యాః ప్రాచ్యస్స్యందంతే స ఉద్గీథః - జలము ప్రాచీదిశ (తూర్పుదిశ)గా ప్రవహించు నదులు ‘‘ఉద్గీథము’’.
(4) యా ప్రతీచ్యస్స ప్రతిహారః। - పడమరవైపుగా ప్రవహించు నదులు ‘‘ప్రతిహారము’’.
(5) సముద్రో నిధనమ్। సముద్రములో నదీ జలములు కలియటము ‘‘నిధనము’’ (ముగింపు).

ఈ విధమైన భావనతో ఎవరైతే సకల జలములను పంచవిధ జల - సముద్ర సామముగా ఉపాసన చేస్తూ ఆత్మోపాసన చేస్తూ ఉంటారో - అట్టివానికి జల గండము ఉండదు. జల సమృద్ధి కలిగి ఉంటాడు.


16–2–5. ద్వితీయ అధ్యాయము - పంచమ ఖండము - ఋతు పంచవిధ సామోపాసన

ఋతువులను పంచ విధమగు సామోపాసన (ధ్యానము) చేయు విధిని చెప్పుకుంటున్నాము.

(1) వసన్తో ‘హింకారో’ - వసంత ఋతువు - ‘‘హింకారము’’.
(2) గ్రీష్మః ‘ప్రస్తావో’ - గ్రీష్మ ఋతువు - ‘‘ప్రస్తావము’’.
(3) వర్షా ఉద్గీథః - వర్షఋతువు - ‘‘ఉద్గీథము’’.
(4) శరత్ ప్రతిహారో - శరద్రుతువు - ప్రతిహారము.
(5) హేమన్తో నిధనమ్ - హేమంత ఋతువు - నిధనము.

ఇట్టి సామగానము చేయువారు అన్ని ఋతు బాధల నుండి రక్షించబడగలరు. ఆయా ఋతువుల సంపదలు వారిని ఆశ్రయించి ఉంటాయి.


16–2–6. ద్వితీయ అధ్యాయము - షష్ఠి ఖండము - పశు పంచవిధ సామోపాసన

పశు సంతతి / సంపద గురించి పంచవిధ సామగానము (మరియు) ధ్యానము ఈ విధంగా నిర్వర్తించబడుతోంది.

(1) అజా ‘హిం’ కారో - మేకలను ‘హిం’కారముగాను,
(2) అవయవః ప్రస్తావో - గొఱ్ఱెలను ‘ప్రస్తావము’గాను,
(3) గావ ఉద్గీథో - గోవులును ‘ఉద్గీథము’గాను,
(4) అశ్వాః ప్రతిహారః - గుఱ్ఱములను ‘ప్రతిహారము’గాను,
(5) పురుషో నిధనమ్ - పశువులు మానవుని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి - మానవుడు ‘నిధనము’గాను

ఈ విధంగా భావిస్తూ ఉపాసించువారికి - భవంతి హాన్మ పసవః - పశు సంపద వృద్ధి కాగలదు. సంపదవంతులు కాగలరు.


16–2–7. ద్వితీయ అధ్యాయము - సప్తమ ఖండము - ఇంద్రియ పంచవిధ సామోపాసన

ప్రాణము యొక్క సర్వోత్కృష్టమైన (పరోవరీయమైన) ఐదు ఇంద్రియ ప్రదర్శనములను ఆత్మశక్తి ప్రదర్శనా భావంగా (సామగానంగా) ఉపాసించుచున్నారు.

(1) ఘ్రాణో ‘హిం’కారో = ఘ్రాణేంద్రియము - హింకారము.
( ప్రాణోహి హింకారో ) పాఠాంతరము - ప్రాణము - హింకారముగా ఉపాసించుట.
(2) ‘వాక్’ ప్రస్తావః - వాక్కు - ప్రస్తావము. సర్వ తదితర ఇంద్రియములను ప్రస్తావము (తెలియజేయునది) చెప్పగలుగునది వాక్కుయే కదా!
(3) చక్షుః ఉద్గీథః - కన్నలు ఉద్గీథము
(4) శ్రోత్రం ప్రతిహారో - చెవులు ప్రతిహారము
(5) మనో నిధనం - మనస్సు నిధనము

ఇవన్నీ ఒకటి కంటే ఆ తరువాతది విస్తారమైనది. ఈ విధమైన శ్రేష్ఠమైన గాన వివరములు పంచవిధ సామగానము ఎవరు నిర్వర్తించెదరో, అట్టి వాడి జీవితము సర్వోత్కృష్టము కాగలదు. లోకములను జయించగలడు. ‘‘లోకములన్నీ మమాత్మయందే ప్రదర్శనమై ఉన్నాయి’’ అని ఆత్మతత్త్వానుభవము సిద్ధించుకోగలడు.


16–2–8. ద్వితీయ అధ్యాయము - అష్టమ ఖండము - సప్తవిధ వాక్ సామోపాసన

ఇప్పుడిక ‘7’ అవయవములు గల వాక్కుకు సంబంధించిన ‘‘సప్తవిధ సామోపాసన’’ వివరించుకుంటున్నాము.

(1) వాచో ‘హుమ్’ ఇతి ‘హిం’ వాక్కు యొక్క ‘హమ్/హుమ్’’ అనే స్వరము - ‘హిం’ కారము
(2) యత్ ప్రేతి స ప్రస్తావో ‘‘ప్ర’’ అను శబ్ద రూపము (స్వరము) - ప్రస్తావము.
(3) యదేతి స ఆదిః ‘యత్’ ఏతి అను స్వరము - ‘‘ఆది’’ సర్వమునకు ఆది కాబట్టి ‘ఓం’!
(4) యత్ ఉత్ స ఉద్గీథో। ‘‘ఉత్’’ అను శబ్ద రూపము - ఉద్గీథము
(5) యత్ ప్రతీతి - ప్రతిహారో ‘‘ప్రతి’’ అనే స్వరము - ప్రతిహారము
(6) యత్ ‘ఉప’ ఇతి స ఉపద్రవో - ‘ఉప’ - అను స్వరము ఉపద్రవము
(7) యన్నీతి - తత్ నిధనం - ‘‘నీ’’ - అను స్వరము - నిధనము

‘‘హమ్’’ ‘‘ప్ర’’ ‘‘యత్’’ ‘‘ఉత్’’ ‘‘ప్రతి’’ ‘‘ఉప్’’ ‘‘నీ’’ - స్వరములు

ఈ విధంగా స్వరము ఎరిగి వాక్కును ‘7’ విధములుగా ధ్యానము చేసెదరుగాక! (సప్తవిధ సామోపాసన) - అట్టివారికి ‘వాక్ - అమృతము’ లభిస్తుంది. అప్పుడే పితికిన పాల వలె వారి వాక్కు మాధుర్యమును, నవ్యతను సంతరించుకోగలదు. అన్న సంపదను సమృద్ధిగా పొందగలరు. ఇతరులకు తృప్తిగా ఆహారము అందించగలరు. ఉత్తమ జీర్ణశక్తి కలిగియుండగలరు.


16–2–9. ద్వితీయ అధ్యాయము - నవమ ఖండము - ఆదిత్య సప్తవిధ సామోపాసన

ఇప్పుడిక ‘ఆదిత్య’ సామగానోపాసన గురించి ప్రస్తావించుకుంటున్నాము.

‘7’ అవయవముల సామమును ఆదిత్య భగవానుని (ప్రకాశిస్తున్న సూర్యుని) ఉద్దేశించి ఉపాసించబడుగాక। అనగా, ఆదిత్యుని ‘పూర్ణసామము’ కొరకై అవయవ విభాగ క్రమంగా ‘7’ విధములైన సామములు ఉపాసించెదరు గాక!

దేని నుండి ఆదిత్యుడు ఉద్గీథము (ఉత్-గీథము=పైకి ప్రజ్వలితుడు) అగుచున్నాడో - ‘సామగానము’ కూడా అద్దాని నుండే బహిర్గతంగా ప్రకాశమానమగుచున్నది.

ప్రతి జీవుడు సూర్యుని చూస్తున్నప్పుడు ‘‘ఈ సూర్యుడు నన్ను సమీపిస్తున్నాడు’’ - అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ‘‘సూర్యుడే సామగానము’’ అని సామవేద వాక్కు.

సూర్యుని విశేషములు:
(1) సూర్యుడు అందరి పట్లా సమానముగా ప్రకాశించుచున్నారు.
(2) జీవులంతా సూర్యునితో నిత్యము సంబంధము కలిగియున్నారు.
(3) సమస్త జీవులు సూర్యునిపైనే జీవించుటకై ఆధారపడి ఉన్నారు.

ఈ భావనలు ‘ఆదిత్య సామము’లో ఉపాసకుడు ఉపాసన కలిగి ఉంటున్నాడు.

ఇంకా –
(4) పైన ప్రకాశిస్తూ ఉండటం చేత ఉద్గీథుడు
(5) లోకములన్నిటికీ మొట్టమొదటివాడు కాబట్టి ‘ఆదిత్యుడు’

ఆదిత్య సప్త సామోపాసనలు

(1) తస్య యత్ పురోదయాత్ స ‘హిం’ కారః (ఉదయానికి ముందు తెల్లవారుఝాము)
ఉదయించటానికి పూర్వము ఉదయించు ధర్మము కలిగియున్న సూర్యుడు ‘హిం’ కారము. అట్టి సూర్యోదయానికి ముందటి రూపము సంధ్యావందనము మొదలైన ధర్మకార్యములచే ప్రోత్సాహము కలుగజేయువాడు. సమస్త జంతువులు ఆదిత్యుని ఉదయించటానికి ముందటి రూపము యొక్క ‘‘హింకారము’’పై ఆధారపడి ఉంటున్నాయి. ‘‘సూర్యుడు ఉదయించబోతున్నాడు’’ - అనుదానికి గుర్తుగా తెల్లవారుఝామున పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తూ ఉంటాయి. అదియే ‘హింకార సామగానము’గా శ్రవణము అగుచున్నది. (ఇది పశువులచే ఆరాధ్యము).

(2) అథ యత్ ప్రథమ - ఉదితా స ‘‘ప్రస్తావః’’ (ఉదయిస్తూ ఉన్నప్పటి సూర్యబింబ ప్రతిరూపము)
సూర్యుడు ఉదయిస్తూ ఉండగా మునుముందుగా కనిపించే ఉదయసూర్యుని (బాలసూర్యుని) రూపము - ప్రస్తావము. ప్రస్తాన రూపములుగా (సామవేదములోను, తదితర పురాణములలోని ఉదయించు సూర్యున్ని మానవులు అనుసరిస్తూ నిదురలేవటం, కాలకృత్యములు మొదలైనవన్నీ) నిర్వర్తించుకుంటున్నారు. అట్టి ఉదయించు సూర్యుని ప్రత్యక్షముగాను, పరోక్షముగాను (భావనలో) ఆరాధిస్తూ మానవులు వాంఛితార్థములు పొందగలరు.
(ప్రస్తుతి = ప్రత్యక్షంగా; ప్రశంస = పరోక్షంగా) (మానవులకు ఈ ఉషోదయము సంబంధించనదై ఉంటుంది).

(3) అథ యత్ సంగవేలాయాగ్ం స ఆదిః।
(సూర్యోదయము అయి 2 గం।। తరువాత మధ్యాహ్నం లోపు సూర్యబింబము)
ఆ తరువాత సూర్యకిరణములు జగత్తునందు అంతటా విస్తరించటమే ‘‘ఆది’’ - అని ఉపాసించబడుతోంది. (సూర్యోదయం తరువాత 2 గం।। వరకు ‘ఆది’గా భావన చేయుదురు).
అట్టి విస్తరిత కిరణ సూర్యుని సామగాన బలము పొంది పక్షులు ఆకాశంలో తిరుగగలుగుచున్నాయి. పక్షులు ఈ రూపమును అనుసరిస్తూ ఉంటాయి. (ఇది పక్షులకు ఆరాధ్యము)

(4) అథ యత్ సంప్రతి మధ్యం దినే స ఉద్గీథమ్। (మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు)
మధ్యాహ్నము ప్రకాశిస్తూ కనబడు సూర్యుడు ఉద్గీథము.ఈ మధ్యాహ్న తేజోప్రకాశ తేజస్సు దేవతలచే అనుసరించబడుతోంది. అట్టి సేవచే ప్రజాపతి సంతానములో శ్రేష్ఠులు అగుచున్నారు.

(5) అథ యత్ ఊర్ధ్వం మధ్యం దినాత్ ప్రాక్- అపరాహ్నత్ ప్రతిహారః।
(పగటి మూడవ భాగము సూర్యాస్తమయ సమయంలోపు సూర్యబింబము మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు)
పగలు ఆఖరి మూడవ భాగ - (అపరాహ్ణ) సూర్యుడి ఉపాసనము ప్రతిహారము. ఆదిత్యుని ఈ అపరాహ్నరూపము గర్భస్థ పిండములచే అనుసరించబడుతోంది. ఈ సమయములో పిండము గట్టిపడుతుంది. సూర్యుని ప్రతిహార భక్తిచేతనే గర్భస్థ శిశువులు క్రిందపడక గర్భమునందు నిలిచి ఉండగలుగుచున్నారు.

(6) అథ ఊర్ధ్వమ్ అపరాహ్ణాత్ ప్రాక్ అస్తమయాత్ ఉపద్రవః।
(మధ్యందినము తరువాత సూర్యాస్తమయ సమయానికి ముందు సూర్యబింబము )
అపరాహ్ణము తరువాత - సూర్యాస్తమయమునకు ముందు సూర్యుని రూపము ‘ఉపద్రవము’(సమావయవము) ఈ సూర్యాస్తమయమునకు ముందు సూర్యుని రూపమును అడవి జంతువులకు అనుసరణీయము. అందుకే ఆ అడవి జంతువులు మనుష్యులను చూచినప్పుడు పొదలలోకి, గుహలలోకి పరుగులు తీస్తూ ఉంటున్నాయి. అవి ఆదిత్యుని ఉపద్రవమును సేవిస్తూ ఉన్నాయి.

(7) ‘‘అథ యత్ ప్రథమ - అస్తమితే → తత్ నిధనమ్’’
(సూర్యుడు అస్తమిస్తూ ఉన్న సూర్యబింబ రూపము)
సూర్యుడు అస్తమించిన తరువాత ప్రకాశము నిధనము. అట్టి నిధనముపై పితృదేవతలు అస్తమయానంతర సూర్యతేజో విభవముపై ఆధారితులు. వారు అనుసరించువారై ఉంటారు. ఈ సూర్యుని రూపమునే పితృ కార్యము చేయు కర్త దర్భలపై తండ్రి - తాత - ముత్తాతల రూపంగా పిండముల రూపంగా స్థాపించి ఉపాసిస్తున్నారు.

సూర్యాస్తమయంలో పగలు సమాప్తము అవుతుంది. సాయం నిధనమును పితృదేవతలు ఆదిత్యరూపమగు సామమును సేవిస్తూ ఉన్నారు.

ఈ విధంగా సప్తాశ్వ సమారూఢుని గాను, సప్తావయవిగాను ఎవ్వరైతే సూర్యభగవానుని ఉపాసిస్తూ ఉంటారో, - అట్టివారు ‘‘ఆదిత్య సాయుజ్యము’’ - అనే ఉత్తమ ఫలము పొందగలరు.

ఈ విధంగా ఫలశ్రుతి పలుకుచూ ‘‘ఆదిత్య సామోపాసన’’ చెప్పబడుచూ ఉన్నది.


16–2–10. ద్వితీయ అధ్యాయము - దశమ అధ్యాయము - ‘‘అతిమృత్యు సప్తవిధ సామోపాసన’’

ఆదిత్యుడే ‘‘రాత్రి - పగలు - రోజులు - నెలలు - సంవత్సరములు - దశాబ్దములు - శతాబ్దములు - యుగములు’’ మొదలైన రూపములు గల కాలమును నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ దృశ్యములోని సమస్తము కాలమాయచే ఉత్పత్తి అగుచూ, కాలముచేతనే దిగమ్రింగబడుతోంది. అందుచేత కాలమునకు నియామక సంజ్ఞయగు ఆదిత్యుడే (కాలముచే హరించుచూ) అతిమృత్యు స్వరూపుడు కదా! క్షరము మృత్యు ధర్మము. అక్షరోపాసనయే అట్టి మృత్యువును దాటివేయు సాధనగా అభ్యాసులకు ఈ ‘‘అపమృత్యు సప్త సామ ఉపాసన’’ గా చెప్పబడుతోంది.

ఆత్మ యొక్క స్వానుభవమునకై - ‘‘ఆత్మ సమ్మతమ్ అతిమృత్యు సప్త (7) విధ సామోపాసన’’ ఈ విధంగా అభ్యాసము చేయబడుచున్నది.
(1) ‘‘హింకారః’’ - 3 అక్షరములు (Preparation)
(2) ‘‘ప్రస్తావః’’ - 3 అక్షరములు (Introduction)
తత్సమమ్ - ఈ రెండు సమాన శక్తి గలవు. (సమరూపముగా భావించి ఉపాసించెదరు గాక)!
(3) ‘‘ఆది’’ - 2 అక్షరములు
(4) ‘‘ప్రతిహారః’’ - 4 అక్షరములు
ఆది + ప్రతిహారము = ఆవల + ఈవల. ‘‘ప్రతిహారః’’ నుండి ఒక అక్షరము తీసి ‘‘ఆది’’ యొక్క రెండు అక్షరములతో కలిపితే ఇవి కూడా (3+3) (తత్సమము) సమము అవగలవు.
(5) ‘‘ఉద్గీథః’ - 3 అక్షరములు
(6) ‘‘ఉపద్రవ’’ - 4 అక్షరములు
రెండింటిలోను ‘3’ ‘3’ అక్షరములు తీసుకుంటే ఇవి సమము ‘‘ఉద్గీథ - ఉపద్రవ’’ చేసి తీసుకుంటే ఇంక ఒక అక్షరం మాత్రము మిగిలిపోతోంది. ఆ ఒక్క అక్షరము (e) - విభాగము (Divisibility) - ‘‘నిమిత్తము’’।
(7) నిధనం = ‘3’ అక్షరములు పేరు. ఇది సమమే అగుచున్నది (మిగతా వాటితో సమానమే).
ఇవన్నీ కలిపి ‘‘సప్త విధ సామగానము’’నకు 22 అక్షరములు.

హింకార = 3
ప్రస్తావ = 3
ఆది = 2
ప్రతిహార = 4
ఉద్గీథ = 3
ఉపద్రవ = 4
నిధన = 3
22

‘‘సప్తవిధ అతిమృత్యు ద్వావింశతి అక్షర సామోపాసన’’ ఎరిగి ఉపాసించువారు ఆదిత్యునికి ఆవల గల ‘‘కేవలమగు స్వస్వరూపము’’తో సోఽహమ్’ను సిద్ధించుకొని ఉంటున్నారు. ‘‘కేవలమగు నా స్వరూపము నిశ్చలము. యథాతథము. అది మార్పు చేర్పులకు (మృత్యువుకు) సాక్షియేగాని, జనన-మరణాది కాలచక్రములో ప్రవేశించదు’’- అని భావన చేస్తూ తనయందు ‘త్వమ్’ యందు, ఈ ‘జగత్తు’నందు అట్టి కేవల రూపమును కప్పి సమాహ్వానించి ఉపాసించటమే ‘‘అతిమృత్యు ఉపాసన’’.


16–2–11. ద్వితీయ అధ్యాయము - ఏకాదశ ఖండము - గాయత్ర పంచవిధ సామోపాసన

ఇప్పుడు ‘‘గాయత్రము’’ అనబడే ప్రాణసామోపాసన ఎట్లా చేయబడుచున్నదో చెప్పుకుంటున్నాము..
(యజ్ఞకర్మయందు యాగ యజ్ఞశాస్త్రముచే చెప్పబడిన వరుసయే ఇక్కడ ఉదహరించబడుతోంది)

(1) ‘మనో’ హింకారో। - ఇంద్రియ వ్యాపారములన్నిటిలో మొట్టమొదటిది, మననమే రూపముగా గల మనస్సు ‘‘హింకారము’’

(2) ‘వాక్’ ప్రస్తావః। - మనస్సులో వచ్చే ఆలోచనలు మాటలతో చెప్పితేనే మరొకరికి తెలుస్తుంది కాబట్టి - వాక్కు ‘‘ప్రస్తావము’’

(3) చక్షుః ఉద్గీథః। చూడటం వలన వాక్కు, మనస్సు విషయములు పొందుచున్నాయి. కనుక చక్షువులు (కళ్ళు) ఉద్గీథము.

(4) శోత్రం ప్రతిహారః। చెవులు (వినికిడి) ప్రతిహారము. శబ్దములే ప్రతిహృతం అవుతుంది కాబట్టి.

(5) ప్రాణో నిధనమ్। ప్రాణము నిధనము. నిద్రాసమయంలో ఇంద్రియములన్నీ ప్రాణము నందే విలీనము అవుతాయి కాబట్టి ప్రాణమే నిధనము.


ప్రాణమే ఇంద్రియములందు ళి వాక్కు, కళ్లు, చెవులు, చర్మము (స్పర్శ), నాలుక (రుచి) యందురి - ప్రతిష్ఠితమైయున్నది. ప్రాణమే గ్రాయత్ర సామము.

ఈ ఇంద్రియములు, ఇంద్రియార్థములు, వాటివాటి విషయములు గాయత్ర సామము. (గాతయత్ త్రాయతే!) ప్రాణమే గానము చేస్తూ, ఇంద్రియములన్నిటికీ ‘కాపలా’ కాస్తోంది!

ఎవ్వరైతే ఈ విధంగా ‘గాయత్ర ప్రాణము’ను తెలుసుకొంటాడో, అట్టివాడు సుఖప్రాణి అగుచున్నాడు. పూర్ణమైన ఆయుష్షు కలవాడగుచున్నాడు. తేజోవంతుడై జీవిస్తూ ఉంటాడు. ఉత్తమ ప్రజలను (సానుకూలురగు పుత్రులు), మిత్రులు మొదలైన సహజనమును, పశుసంపదను కలవాడు, కీర్తిమంతులు కాగలరు.

మహామనస్యాత్ - తత్ వ్రతమ్। ‘‘అట్టి ప్రాణశక్తియందు ఇంద్రియములను ఏకము చేసి దర్శించటము’’ అనే మహామనో - ఉపాసనావంతులు అగుదురు గాక! ఇది వ్రతముగా అగును గాక!


16–2–12. ద్వితీయ అధ్యాయము - ద్వాదశ ఖండము - రథంతర పంచవిధ సామ ఉపాసన

(అగ్ని యొక్క అంతరమున పుట్టిన సామ ఉపాసన)

(1) అభిమందతి-స ‘హింకారో’। అగ్నికై మధించే (జనింపజేసే) అరణికొయ్యలు (Wood pieces used to generate “Fire” at the Begining of యాగ/యజ్ఞ)
‘హింకార’ (యజ్ఞకర్మలో అరణి కొయ్యలతో అగ్నిని పుట్టించటము మొట్టమొదటి విధి).

(2) ధూమో జాయతే, స ప్రస్తావో!
అగ్ని నుండి పొగ బయల్వెడలటము - ‘ప్రస్తావము’ (అగ్ని మండించగానే మొదట పొగ జనిస్తుంది కాబట్టి)

(3) జ్వలతి స ఉద్గీథో। అగ్ని ప్రజ్వలనము అవటము ఉద్గీథము. జ్వలించే అగ్నియందు మాత్రమే హవిస్సు హోమం చేయబడుతుంది కదా!

(4) అంగారా భవంతి - స ప్రతిహార।
మండే బొగ్గులుగా ఏర్పడేది - అది ప్రతిహారము. మంటలకు మండే నిప్పుకణికలు క్రింద ఉంటాయి కదా.

(5) ఉపశామ్యతి - తత్ నిధనం। అగ్నిచల్లారటము నిధనము (నిధనమ్ = సమాప్తి)

అట్టి రథంతర సామ (5 విశేషాలు) అగ్నియందు ప్రతిష్ఠితమైయున్నది. అగ్నిలో జరుగుచున్న అట్టి ‘రథంతర సామ’ను ఎవరు ఈ విధంగా తెలుసుకొని సామగానము నిర్వర్తిస్తూ ఉంటారో (ఉపాసిస్తారో), అట్టివారు బ్రహ్మవర్చస్సు కలిగి ఉంటారు. అన్నాదులై (అన్నము పొందువారై) ఉంటారు. పూర్ణాయుష్కులౌతారు. జ్యోతిష్మంతులై జీవిస్తారు. చక్కటి బంధుజనమును, పశుసంపదను పొందగలరు. కీర్తిమంతులై ఉంటారు.

అగ్నికి అభిముఖంగా కూర్చుని ఏదీ తినరాదు. త్రాగరాదు. న ప్రత్యన్ అగ్నేః అభిముఖో+ న ఆచమేత్, న భక్షాయేత్ కించిత్। అగ్నికి ఎదురుగా ఉమ్మివేయరాదు, న నిష్ఠీవేత్ శ్లేష్మనిరసనం చ।

ఇతి ఉపాసకులకు నియమై (వ్రతమై) ఉండు గాక!


16–2–13. ద్వితీయ అధ్యాయము - త్రయోదశ ఖండము - వామదేవ- మిథున పంచవిధ సామోపాసన

(1) ఉపమంత్రయతే స ‘హింకారః’। - ఉపమంత్రణము (పిలుపు, బుజ్జగించటం) - ‘హింకారము’

(2) జ్ఞపయతే స ‘ప్రస్తావః’। జ్ఞపము - (తెలియజేయటము) - ప్రస్తావము

(3) ‘స్త్రీ’ యా సహశేతి స ఉద్గీథః। - పురుషుని నుండి ప్రసరించు శుక్లము! వీర్యము - ఉద్గీథము

(4) ప్రతిస్త్రీ సహ శేతి ప్రతిహారః। స్త్రీకి చెందిన శోణితము ప్రతిహారము

(5) కాలం గచ్ఛతి - తత్ నిధనమ్। ‘పారం’ గచ్ఛతి తత్ నిధనమ్। కాలగతి, దేహ నిర్మాణము, జీవుని జీవితము - జీవితాంతము - నిధనము.

అట్టి (స్త్రీ, పురుష) మిథునమును ఉపాసనగా ఉద్గీథ గానము తెలుసుకొన్నవారు ఉత్తమ దాంపత్యము, ఆరోగ్యము - ఉత్తమ గుణములు గల సంతతిని పొందు మిథునము (జంట) అవగలరు. మిథునము యజ్ఞమై ఉత్తమ ప్రజలు, ఆయుష్షు ప్రసాదించగలదు. వారి దాంపత్యము జ్యోతి (తేజో) ప్రదము కాగలదు.

పశు సంపద వర్థిల్లగలదు. కీర్తిని పొందగలరు.

న కాంచ న పరిహారే। తత్ వ్రతమ్। పరకాంతను, పరధనమును ఏమాత్రము ఆశించరాదు. ఇది ‘వ్రతము’గా నిర్వర్తించబడు గాక। ‘‘ఏకపత్నీ వ్రతము, అపరిగ్రహము’’ ఈ రెండూ వామదేవ మిథునోపాసన యందు ముఖ్య నియమములు.


16–2–14. ద్వితీయ అధ్యాయము - చతుర్దశ ఖండము - బృహత్ ఆదిత్య పంచవిధ సామోపాసన

(1) ఉద్యన్ దిన - హింకార। ఉదయిస్తూ దర్శనమిస్తున్న సూర్యుడు ‘హింకారము’

(2) ఉదితః - ప్రస్తావో। ఉదయించిన తరువాత సూర్యుడు జీవులను కర్మలయందు ప్రేరేపిస్తున్నారు కనుక ఉదయానంతర సూర్యుడు - ‘‘ప్రస్తావము’’

(3) మధ్యందిన - ఉద్గీథా। గొప్ప ప్రకాశము కలవారు కాబట్టి మధ్యందిన(మధ్యాహ్న) సూర్యుడు ‘‘ఉద్గీథము’’ (మధ్యాహ్నం - 12 గం।।).

(4) అపరాహ్ణః ప్రతిహారో। మధ్యాహ్నం తరువాత - సాయంకాలం వరకు సూర్యుడు ‘‘ప్రతిహారము’’. పశువులు మొదలైనవాటికి తిరిగి ఇళ్ళకు త్రోలుకువచ్చే ప్రతిహరణ (వెనుకకు మళ్ళించటము) చేస్తారు కదా!

(5) అస్తం యత్ - నిధనమ్। సూర్యాస్తమయము, ఆ తరువాత సమయము ‘నిధనము’. జీవులు పనులను విరమించి ఇళ్ళల్లో ఉంటారు కాబట్టి నిధనము (విరమించటము).

ఈ బృహత్ సామము సూర్య భగవానుని యందు ప్రతిష్ఠితమైయున్నది. అందుచేత అధిష్ఠాన దేవత సూర్యుడు.

ఆదిత్యునియందు ప్రతిష్ఠితమైయున్న ఈ బృహత్సామ ప్రకృతి యజ్ఞమును ఎవ్వరైతే ఉపాసిస్తారో,… అట్టివారు తేజోసంపన్నులు కాగలరు. ఉత్తమ జీర్ణశక్తి, మధురమగు అన్నము, ఉత్తమ ఆయుర్దాయము జన-పశు సంపద, జ్యోతిత్వము, మహత్ కీర్తి పొందగలరు. అట్టి సూర్యభగవానుని ప్రేమతో ఉపాసించండి. యండ- వేడిమి ఇటువంటి సూర్య తేజస్సును నిందించకూడదు. ఆరాధించాలి. (సూర్యో) మహత్ కీర్త్యా తపంతమ్। న నిందేత్। ఇతి వ్రతమ్।

ఇది వ్రతమై ఉండును గాక।


16–2–15. ద్వితీయ అధ్యాయము - పంచదశ ఖండము - పర్జన్య పంచవిధ సామోపాసన - నైరూపోపాసన

వర్షమును ఉపాసన చేస్తూ ఆత్మోపాసనగా తీర్చిదిద్దుకోవటము గురించి చెప్పుకుంటున్నాము.

(1) అభ్రాణి సంప్లవంతే స ‘హిం కారో’। - అభ్రము (నీటి ఆవరి) ఒకచోట సమావేశమగుచూ ఉండటము, హింకారము. మేఘము రూపుదిద్దుకొనే ప్రకృతిలోని ప్రక్రియ - ‘హిం’కారము.

(2) మేఘోజాయతే స ప్రస్తావో। - వర్షజలముతో నిండుగా కనిపించే కారు మేఘముల - ‘ప్రస్తావము’

(3) వర్షతి - స ఉద్గీథో। - మేఘము వర్షించటము - ‘ఉద్గీథ’।

(4) విద్యోతతే స్తనయతి స ‘ప్రతిహార’ - ఉరుములు, మెఱుపులు - ప్రతిహారము.

(5) ఉద్గృహ్నాతి తత్ నిధనో - మేఘములు వర్షించటము ముగించి అదృశ్యమవటము - ‘నిధనము’.

ఇది మేఘములను ఉపాసించే ‘‘వైరూప సామగానము’’. ఇట్టి సామగానము చేయు ఉపాసకుడు రంగురంగుల పశువుల సంపదను, పూర్ణమగు ఆయుర్దాయమును, ప్రశస్తమగు జీవనమును, సంతానమును, కీర్తిని పొందగలడు.

వర్షంతం న నిన్దేత్। ఇతి వ్రతమ్। వర్షము కురియటమును నిందించరాదు.

ఇది వ్రతము।


16–2–16. ద్వితీయ అధ్యాయము - షోడశ ఖండము - ‘వైరాజ ఋతు’ పంచవిధ సామ ఉపాసన

(1) వసంతో హింకారో। :- ఋతువులలో మొదటిదగు వసంత ఋతువు - ‘హింకారము’

(2) గ్రీష్మః ప్రస్తావో। :- గ్రీష్మఋతువు - ‘‘ప్రస్తావము’’

(3) వర్ష ఉద్గీథః। :- వర్షఋతువు ‘‘ఉద్గీథము’’

(4) శరత్ ప్రతిహారో। - శరదృతువు - ‘ప్రతిహారము’ (మార్గము / Procedures)

(5) హేమన్తో నిధనమ్। హేమన్త ఋతువు - ‘‘నిధనము’’ (ఉపసంహారము)

ఇట్టి వైరాజ ఋతుసామోపాసన ఎరిగి ఉపాసించువారు ప్రజలు, పశుసంపద, బ్రహ్మవర్చసు, ఉత్తమ ఆయుష్షు, స్వయంజ్యోతి స్వరూపము, సుసంతానము, పశుసంతతితో గొప్పకీర్తిని పొందుచున్నారు.

వైరాజ ఋతుమ్ న నిన్దేత్। తత్ వ్రతమ్। ఋతువులను స్తుతించి ఆత్మోపాసన చేయాలి. అంతేగాని నిందించరాదు. ఇది వ్రతమై ఉండు గాక।


16–2–17. ద్వితీయ అధ్యాయము - సప్తదశ ఖండము - శక్వరీ - లోకప్రతిష్ఠిత పంచవిధ సామ ఉపాసన

ఈ ఎదురుగా తారసబడుచున్న లోకమును సామోపాసన చేయటము గురించి.

(1) పృథివీ ‘హింకారో’ : - ఈ సమస్త పృథివి (All that is Solidly Visible) - ‘‘హింకారము’’

(2) అంతరిక్షం ‘ప్రస్తావో।’ - ఆకాశము ‘ప్రస్తావము’

(3) ద్యౌః ఉద్గీథో :- దేవతా (స్వర్గము మొదలైన) లోకములు ‘ఉద్గీథము’

(4) దిశః ప్రతిహారో। : - 10 దిక్కులు - ప్రతిహారము

(5) సముద్రో నిధనమ్ : - సముద్రము నిధనము

ఈ శక్వరీ సామగాన విధానము తెలిసి అనుష్ఠించువాడు పూర్ణమగు ఆయుష్షును, ప్రశస్తమగు జీవితమును, సత్-సంతానమును పశుసంపదను, కీర్తిని పొందగలడు.

లోకాః న నిందేత్. ఇతి వ్రతమ్। లోకములను ఉపాసించాలేగాని, నిందించరాదు. ఇది వ్రతము.


16–2–18. ద్వితీయ అధ్యాయము - అష్టాదశ ఖండము - రేవతీ పంచవిధ సామోపాసన

(1) అజా హింకారో। :- జంతువులలో మేకలు - ‘హింకారము’

(2) అవయవః ప్రస్తావో। :- గొర్రెలు - ‘ప్రస్తావము’

(3) గావ ఉద్గీథో। :- ఆవులు - ఉద్గీథము

(4) అశ్వాః ప్రతిహారః। - గుఱ్ఱములు - ప్రతిహారము

(5) పురుషో నిధనమ్ :- పురుషుడు - నిధనము (పరిసమాప్తి)

ఈ ‘రేవతీ పశు సామోపాసన’ను ఎరిగి ఉపాసించు యోగి - పశుసంపద, ఆయుష్షు యొక్క ఉత్తమ ప్రయోజనము, పూర్ణాయుర్దాయము, సత్సంతానము, ఉత్తమ పశుసంతతి, వంశవృద్ధి - ఇవన్నీ పొందగలరు.

పశూన్ న నిన్దేత్। ఏతత్ వ్రతమ్। పశువులు మనకు పాలు, వస్త్రములు మొదలైనవి ప్రసాదిస్తూ ఉన్నాయి కదా! అందుచేత పశువులను దూషించకూడదు.


16–2–19. ద్వితీయ అధ్యాయము - ఏకోనవింశ ఖండము - ‘‘అంగ - యజ్ఞా-యజ్ఞీయ’’ పంచవిధ సామోపాసన

దేహములో నిత్య ప్రకాశిత - ప్రదర్శనమైయున్న ఆత్మ చైతన్యమును ఈ యజ్ఞా - యజ్ఞీయ సామోపాసనగా ఉపాసించెదరుగాక।

(1) లోమ హింకారో। ‘వెంట్రుకలు ‘హింకారము’।

(2) త్వక్ ప్రస్తావో। చర్మము ప్రస్తావము।

(3) మాగ్ంసం ఉద్గీథో। మాంస విభాగము - ఉద్గీథము।

(4) అస్థి ప్రతిహారో। దేహము దహించిన తరువాత ఎముకలు తీసుకొని పోతారు కాబట్టి - ఎముకలు ‘‘ప్రతిహారము’’

(5) మజ్జా నిధనమ్। ఎముకలలోని మెత్తటి మూలుగు విభాగము - చివరిది కాబట్టి - ‘నిధనము’

ఈ విధంగా అంగ సంబంధమైన అంగ - యజ్ఞా-యజ్ఞీయ సామోపాసన ఎరిగి, భావనచే ఉపాసించువారు - ఉత్తమమైన దేహ ఇంద్రియ పుష్టి, పూర్ణాయుర్దాయము, సుసంతానము, పశుసంపద, కీర్తి పొందగలరు. సంవత్సర కాలము మజ్జ - మాంసములను తినకపోవటము వ్రతము। శాఖాహార జీవనము వ్రతమైయుండు గాక!


16–2–20. ద్వితీయ అధ్యాయము - వింశ ఖండము - రాజన (ప్రకాశక) పంచవిధ సామదేవతా ప్రతిష్ఠోపాసన

ప్రకాశ రాజనమును ఈ విధంగా ఉపాసించెదరు గాక।

(1) అగ్నిః హింకారో। :- దేవతల సమావయవ హింకారము మొదటిది. కాబట్టి అగ్ని - ‘హింకారము’.

(2) వాయుః ప్రస్తావమ్। :- వాయువు ప్రస్తావము.

(3) ఆదిత్య ఉద్గీథో। :- సూర్యుడు ఉద్గీథము.

(4) నక్షత్రాణి ప్రతిహార। :- నక్షత్రములు ప్రతిహారము.

(5) చంద్రమా నిధనమ్। :- చంద్రుడు - నిధనము.

ఈ రాజనము (ప్రకాశము) సామవేద దేవతలలో ప్రతిష్ఠితము అయి ఉన్నది.

ఇట్టి రాజనము (Enlightening/Firing) దేవతల ప్రతిష్ఠిత సామగానము తెలిసి ఉపాసించువారు - ఆయా అట్టి దేవతా లోకములలో సమానమైన ఐశ్వర్యమును, సాయుజ్యమును పొందుచున్నారు.

పూర్ణాయుర్దాయము, గోసంపద, జన సంపద, ప్రశస్త జీవితము, ఉత్తమ జన-పశు సంతానము, కీర్తి పొందుచున్నారు.

బ్రాహ్మణో న నిందేత్। తత్ వ్రతమ్। బ్రహ్మజ్ఞులగు బ్రాహ్మణులను ఉపాసించాలి. నిందించకూడదు. ఇది ‘వ్రతము’గా ఆచరించబడు గాక।


16–2–21. ద్వితీయ అధ్యాయము - ఏకవింశ ఖండము - సర్వస్మిన్ పంచవిధ సామోపాసన

(1) త్రయీ విద్యా హింకారః। ఋక్ సామ యజుర్వేద విద్య ‘హింకారము’.

(2) త్రయ ఇమే లోకాః ప్రస్తావో। ఈ పాతాళ - భూ-స్వర్గ త్రిలోకములు ‘‘ప్రస్తావము’’.

(3) అగ్నిర్వాయు ఆదిత్యః స ఉద్గీథో। అగ్ని - వాయువు- ఆదిత్యుల ఉపాసన - ఉద్గీథము.

(4) నక్షత్రాణి వయాగ్ంసి మరీచయః ప్రతిహారం। నక్షత్రములు, పక్షులు, సూర్యకిరణములు ప్రతిహారము.

(5) సర్వా గంధర్వాః పితరః తత్ నిధనమ్। సర్పములు, గంధర్వులు, పితృదేవతలు - నిధనము.

ఈ విధం 5 x 3 = 15 స్తుతులు మించిన సామ గానము మరింకొకటి లేదు.

ఈ వివరములు తెలుసుకొని ఉపాసించువారు - సర్వజ్ఞులు కాగలరు. 10 దిక్కులు అట్టి వానికి సహాయ కారకములు అవుతాయి.

సర్వమస్మి - ఇతి ఉపాసీత। ‘‘ఈ సమస్తముగా ఉన్నది నేనే’’ అని ఉపాసించెదరు గాక। తత్ వ్రతమ్। తత్ వ్రతమ్।।


16–2–22. ద్వితీయ అధ్యాయము - ద్వావింశ ఖండము - వినర్ది వృణే సప్తవిధ సామోపాసన

వినర్ది - (శబ్దార్థము) = ఒక విశిష్టమైన స్వరము - ఎద్దు యొక్క శబ్దముతో సమానమైనది.

సామము యొక్క ‘వినర్ది’ అనే గానము మరియు ఉపాసన గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాము. పశువులకు (జీవులకు) ఇది శుభప్రదము హితకరము అయి ఉన్నది.

(1) అగ్నే ఉద్గీథరో। అగ్నికి సంబంధించినది ఉద్గీథము (పశువులకు ఆనందకరం).

(2) అనిరుక్తః ప్రజాపతే। ప్రజాపతికి సంబంధించినది ఉద్గీథము. అనిరుక్తము (సృష్టికర్త రూపము ‘‘ఇది’’ అని చెప్పలేము కాబట్టి ‘అనిరుద్ధము’).

(3) నిరుక్తమ్ సోమస్య। చంద్రునికి సంబంధించిన ఉద్గీథము ‘‘ఇది’’ అని నిర్వచించి చెప్పగలిగినది - ‘నిరుక్తము’.

(4) మృదుః శ్లక్‌ష్ణం వాయో (శ్లక్‌ష్ణం = Soft)। వాయువుకు సంబంధించినది ఉద్గీథము మృదువు మరియు సరళము అయినట్టిది.

(5) శ్లక్‌ష్ణం బలవత్ ఇంద్రస్య। ఇంద్రునికి సంబంధించినది - సరళము మరియు బలముతో కూడినది.

(6) క్రౌంచం బృహస్పతే। బృహస్పతికి సంబంధించిన ఉద్గీథము - క్రౌంచ పక్షి (ఒకానొక జాతి కొంగ) యొక్క కూతను పోలి ఉంటుంది.

(7) అవధ్యాంతం వరుణస్య। వరుణుని గురించి అవధ్యాంతము. పగిలిన కంచు శబ్దముబోలినది ఈ వరుణ గానము విడచి పెట్టవలసినది.

ఈ విధమైన సామగానోపాసన నిర్వర్తించబడునుగాక। ఈ క్రింది విధంగా ఫలశ్రుతి చెప్పబడుతోంది.

‘‘అమృతత్వము కొరకై (To Cognise state beyond Death/change) దేవతలను ఉపాసన చేస్తున్నాను।’’

నేను చేస్తున్న ఈ సామగానము వలన…,
⌘ దేవతలకు అమృతత్వము,
⌘ పితృదేవతలకు ‘స్వాహా’ - తర్పణములు,
⌘ మానవులకు వారి వాంఛితములు,
⌘ పశువులకు నీరు, గడ్డి,
⌘ యజమానికి స్వర్గలోకము,
⌘ నాకు శుభము, సుఖము, రుచికరము అగు ఆహారము లభించుటకై సమర్పిస్తున్నాను.

ఈ విధంగా భావన చేస్తూ అత్యంత శ్రద్ధతో గానము చేయుదురు గాక।

ఉద్గాథ గానము చేస్తూ ఈ విధంగా ప్రార్థన చేస్తూ ప్రారంభించెదరు గాక।


సర్వే స్వరా ఇంద్రస్య ఆత్మానః - స్వరములన్నీ కూడా దేవేంద్రుని రూపములు  
‘‘యది స్వరేషు ఉపాలభేత్, ఇంద్రగ్ం శరణం ప్పన్నో అభూవం।  
స త్వా ప్రతివక్ష్యతి ఇత్యేనమ్’’ - బ్రూయాత్।।  

‘‘స్వరములన్నీ ఇంద్రుని ఆత్మస్వరూపమే! నేను ముందుగా దేవేంద్రుని భక్తితో శరణువేడి - గానమునకు ఉపక్రమిస్తున్నాను. కనుక ఇంద్రుడు నా స్వరములలోని దోషములు తొలగించెదరు గాక - ఎవరైనా తప్పుపడితే ‘‘అయ్యా! ఇంద్రుని నేను శరణువేడాను. దోషములు చెప్పండి. అవసరమైనంతగా సరిచేసుకోగలను’’ - అని అనెదరుగాక।

సర్వ ఊష్మాణః ప్రజాపతేః ఆత్మానః।  
అథ యద్యేనమ్ ఊష్మసు తథైవ ఉపాల భేత,  
ప్రజాపతిం శరణం ప్రపన్నో అభూవం  
స త్వా త్వాం ప్రతి ప్రేక్ష్యేతి। సంచూర్ణయిష్యతి

‘‘ఊష్మములన్నీ సృష్టికర్తయగు ప్రజాపతి యొక్క ఆత్మయే’’.
ఊష్మములు = (1) గాలిని ఊదుచూ పలుకు - వర్ణములు (2) ‘‘శ ష స హ’’ అను వర్ణములు (3) ‘అనుస్వారము’ (బిందువు; సున్న, విణ - స్వరమును అనుసరించి వచ్చేవి). ఊష్మముల తప్పులు దొర్లకుండా ప్రజాపతిని శరణు వేడెదరు గాక। ఎవ్వరైనా ‘‘మీ ఊష్మములు తప్పులు’’ - అని అంటే మేము ప్రజాపతిని శరణు వేడాము, వారే సమాధానం. తప్పులుంటే సరిచేసుకుంటాము’’ - అనెదరు గాక।

సర్వే స్పర్శాః మృత్యో ఆత్మానస్తం।  
యది ఏనగ్ం స్పర్శేషు ఉపాలభేత - ‘‘మృత్యుగ్ం శరణం ప్రపనో అభూవం।  
సత్వాప్రతిధక్ష్యతి- ఇత్యేనం భ్రూయాత్

స్పర్శలన్నీ (వర్గాక్షరములన్నీ) మృత్యుదేవత యొక్క ఆత్మ
(వర్గములు -
(1) ‘క’వర్గము - క-ఖ-గ-ఘ-ఙ
(2) ‘చ’వర్గము = చ-ఛ-జ-ఝ-ఞ
(3) ‘ట’వర్గము - ట-ఠ-డ-ఢ-ణ
(4) ‘త’ వర్గము = త - థ - ద-ధ-న
(5) ‘ప’ వర్గము = ప- ఫ - బ -భ - మ
వర్గ యుక్కులు = వర్గము నందలి రెండు - నాలుగు వర్ణములు. ఇవే ‘మహాప్రాణములు’ - ‘‘ఖ-ఘ-ఛ-ఝ-ఠ-ఢ-థ-ధ-ఫ-భ")

మృత్యుదేవతకు నమస్కరించి వీటి ఉత్తమ ఉచ్చారణ సంపాదించుకొంటున్నాము. ఎవరైనా తప్పుపడితే ‘‘మృత్యుదేవతను ప్రార్థించాము. పొరపాట్లు సరికాగలవు’’ - అని చెప్పాలి.

సమస్త స్వరములకు (అచ్చులను; స-రి-గ-మ-ప-ద-ని లను) బలముగా, సుశబ్దంగా, నిర్దుష్టంగా భావయుక్తంగా పలికెదరు గాక।

‘‘త్రిలోక పాలకుడగు ఇంద్రునకు సుశబ్దయుక్తమగు ఉత్తమ పరిపాలనకు శక్తి కలుగును గాక’’- అని ఉష్మాణములు ఎలుగెత్తి, అగ్రములుగా, అనిరస్తములుగా, వివృత్తములుగా భావయుక్తంగా పలికెదరు గాక. స్పష్టముగా, నిర్దుష్టముగా స్వరములు (హల్లులు మొదలైనవి) పలుకుటచేత పరిపాలించువారి వలన ప్రజలకు శుభము సిద్ధించు ప్రయోజనము లభించగలదు.

ప్రజాపతేః ఆత్మానం పరి దదాని - ఇతి సర్వే స్పర్శాః - ‘‘విరాట్టు అగు ప్రజాపతికి ఆత్మసమర్పణము చేయుచున్నాను’’ అని భావించి స్పర్శలను నిదానంగా పలకాలి. ఆయా అక్షరములు ఒకదానితో మరొకటి కలిసిపోకుండాను, భావయుక్తంగాను విడివిడి చేస్తూ పలకాలి.

పై విధములైన ఉపాసనలచే, అట్టి గానము చేయువాడు మృత్యు పరిధులను జయించి వేయగలడు. మృత్యోః ఆత్మానం పరిహరాణీతి।।


16–2–23. ద్వితీయ అధ్యాయము - త్రయోవింశ ఖండము - ‘‘ధర్మము’’ యొక్క త్రయీ స్తంభములు

‘‘ధర్మము’’నకు స్కందములు (ఆధార స్తంభములు) మూడు.

(1) యజ్ఞము = అధ్యయనము - దానము. ఇవి నిర్వర్తించువాడు గృహస్థుడు.
అగ్నికార్యములు, వైదిక కర్మలు - వేదమంత్రముల అభ్యాసము. అర్థవిచారణ

(2) తపస్సు = సత్యము, నిత్యము అయిన దాని గురించి ‘తపన’.

(3) బ్రహ్మచర్యము = ఆచార్యకుల వాసము (గురుకులవాసము)

గురుకులవాసములో బ్రహ్మచారి ఆచార్యులవారిని సేవిస్తూ విద్యనేర్వటము - గొప్ప ఉపాసన అయి ఉన్నది. ఆచార్య సేవనముచే పుణ్యలోక ప్రాప్తి, బ్రహ్మలోక నివాసము, బ్రహ్మదేవుని సామీప్యము, అమృతత్వము లభించగలదు. బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి।

సృష్టి చమత్కారము - ఓంకారమేవ ఇదగ్ం సరమ్।

ప్రజాపతి ‘‘లోకములను నేను సృష్టించెదను గాక।’’ అని సంకల్పము కలవాడై, అందుకొరకై తపస్సు చేయసాగారు.

❋ తపస్సు చేసి లోకములను సృష్టించారు.
❋ లోకములకొరకై త్రయో విద్యలగు ఋక్ - యజుర్ - సామ వేదములు సృష్టించారు.
❋ అట్టి త్రైయీ వేదముల నుండి ‘‘భూః’’ ‘భువః’ ‘‘సువః’’ (Matter - Thought - Divine workers of the Universe) అను అక్షర తత్త్వములు / వ్యాహృతులు (Parmanent platforms) ఆవిర్భవించాయి. అట్టి త్ర్యైక్షరములకు (త్రివ్యాహృతులకు) అభిముఖుడై మరల తపస్సు చేసారు. అట్టి ధ్యానము నుండి ఎదురుగా ‘‘ఓంకారము’’ ఆవిర్భవించింది.

తత్ యథా శంకునా సర్వాణి పర్ణాని సంతృణ అన్యేవ ‘ఓం’కారేణ ‘వాక్’సంతృణ। ఒక ఆకులో ఈనెలు, ఆ ఈనెల వెంట ఈనె-ఉప ఈనెలతో విస్తరించు తీరుగా ‘ఓం’కారము వాక్కుగా (సమస్త అక్షర-శబ్ద-వాక్య-వాఙ్మయముగా) విస్తరించినది.

‘‘ఈ సమస్తము - ఓంకారమే’’
‘‘ఓం కార ఏవ ఇదగ్ం సర్వమ్’’


16–2–24. ద్వితీయ అధ్యాయము - చతుర్వింశ ఖండము - యజ్ఞాంగములు : సామగానము -హోమము

మంత్రము - ఉత్థానములు:

‘‘బ్రహ్మతత్త్వము’’ ఎరిగిన బ్రహ్మజ్ఞులు బ్రహ్మయజ్ఞము గురించి ఈ విధంగా విభజిస్తూ విశదీకరించి చెప్పుచున్నారు.

యత్ వసూనాం ప్రాతఃసవనగ్ం - ప్రాతః సమయంలో (Early in the morning): వసువులను (That which is present - అందరిలో వసించు దేవతారూపము)ను ఉపాసించెదరు గాక! - ఈ దృశ్య ప్రపంచము వసువుల వశము.

రుద్రాణాం మధ్యన్దివగ్ం సవనగ్ం। మధ్యాహ్న సమయంలో సమస్తముపై తన తేజస్సును ప్రసరింపజేయు - రుద్రుడు ఉపాసనా దైవము। అంతరిక్షము రుద్రుల వశము.

ఆదిత్యానాం చ, విశ్వేషాం చ, దేవానామ్ చ తృతీయం సవనగ్ం। ఆదిత్యుడు, విశ్వేదేవుడు మాడవ (సాయం) సవన - ఉపాస్యులు, దేవతాలోకము వారికి వశమై ఉంటోంది.

ఈ విధంగా పురుషుడు యజ్ఞము చేయువాడు, భూ-ఆకాశ -స్వర్గ లోకములు ఉపకరణములుగా భావించి యజ్ఞము చేస్తున్నాడు.

మరి యజ్ఞకర్త ఆశయముగా కలిగి ఉండవలసిన లోకము ఏది? క్వ తర్హి యజమానస్య లోక ఇతి? తాను ఏ లోకము ఆశయముగా కలిగి ఉండాలో, అది తెలియనప్పుడు ఏ తెలివిగలవాడైనా యజ్ఞము ఎందుకు నిర్వర్తిస్తాడు? స యస్తం న విద్యాత్, కథం కుర్యాత్ అథ విద్వాన్ కుర్యాత్?

తాను పొందవలసినది - ‘‘తానున్న చోటే! తన స్వస్వరూపము యొక్క సహజమగు అఖండత్వ, అప్రమేయత్వ, నిత్యత్వ, సత్యత్వముల యొక్క స్వాభావిక అనునిత్య స్వానుభవ సిద్ధియే సమస్త యజ్ఞముల యొక్క పరాకాష్ఠ ప్రయోజనము.


(1) యజ్ఞ విధులలో ప్రాతః సవన - వసువుల స్తుతి

ఉదయ శస్త్రము = గానముగా చేయని, మంత్రయుక్తంగా మాత్రమే చదివే ఋక్) (Non-musical chanting)ను పఠిస్తున్నారు.

అట్టి ప్రాతారనువాకము ప్రారంభించటానికి మును-ముందుగానే - యజమాని ‘‘గార్హపత్యాగ్ని’’కి వెనుకగా ఉత్తరాభిముఖం (Facing North)గా కూర్చొనుగాక! ఆ యజమాని (యజ్ఞకర్త) వసువులను అధిష్ఠాన దేవతలుగా గల సామగానము చేయాలి.

ఈ విధంగా అగ్నిదేవుని స్తుతించాలి.

లోక ద్వారమ్ అపావారూణా  పశ్యేమ।  
త్వా వయగ్ం రా। హు। మ్।  
ఆ! జ్యా! యో! ఆ! ఇతి।।

ఓ అగ్ని దేవా! మేము ఈ చోటనే బ్రహ్మమును స్వానుభవము చేసుకోదలచాము. కనుక ఈ లోకమునకు ద్వారమును తెరువండి। భూలోకరాజ్యము (భౌతిక ప్రపంచము/ ఈ దృశ్య ప్రపంచము)నందు మీ యొక్క తేజోరూపమే (కనులు తెరిచి, మూసి కడా) దర్శించెదము గాక।

అప్పుడు యజ్ఞకర్త (యజమాని), ఆహుతులను సమర్పించాలి. సమర్పిస్తూ, ఇంకా ఇట్లా స్తుతించాలి. (హోమము చేస్తూ, చేసిన తరువాత ప్రార్థన)

శ్లో।।  అథ జుహోతి। నమో అగ్నయే  
    పృథివీ క్షితే। లోక క్షితే।  
    లోకం మే యజమానాయ। వింద ఏష వై  
    యజమానస్య లోక ఏతాఽస్మి।।

యజమాని (మరియు) యజ్ఞమునందు పాల్గొనుచున్నవారు - ఇట్లా గానం చేయాలి! భూమిలోను, లోకమంతా తేజోరూపులై, ప్రకాశమానులై వేంచేసియున్న ఓ అగ్ని భగవాన్! మీకు నమస్కరిస్తున్నాము. ఈ ఆహుతులను సమర్పిస్తూ హోమము చేయుచున్నట్టి మాకు విశ్వమును తేజోమయం చేస్తూ దర్శనము ప్రసాదించండి. ఈ యజ్ఞము చేయుచున్న మా కొరకు ఈ స్థానమునకు ‘‘దివ్య ప్రసాద సంకల్పులై’ వేంచేయండి। యజమానినగు నాకు దర్శనమివ్వండి। అనుగ్రహించండి. ఈ యజ్ఞములో పాల్గొనుచున్న జనులందరికీ శుభ శాంతి ఐశ్వర్య ఆనందములు ప్రసాదించండి.

‘‘ఓ అగ్నిదేవా!’’
(యజ్ఞమునకు) యజమానినగు నేను ఆయుర్దాయము కొనసాగునంత వరకు నా యొక్క సమస్త కార్యక్రమములు తేజోస్వరూపుడగు మీకు ఆహుతులుగా సమర్పిస్తూ ఉంటాను. ‘‘స్వాహా’’ - అని ఘృతము (నేయి) సమర్పిస్తూ ఉన్నాను. లోకము యొక్క మూసిన ద్వారమునకు ఉండే ‘అడ్డగడియ’ను తొలగించండి।’’

ఈ విధంగా ప్రాతః సవనము (Early Morning Yagna Programme)చే సామ-మంత్ర-హోమ ఉత్థానములను సమర్పించబడు గాక। అప్పుడు వసువులు యజమాని కొరకై ప్రాతః సవన దివ్య ప్రయోజనము ప్రసాదించగలరు.

‘‘ఈ స్థానము యొక్క ద్వారములోనే’’ - అని మేల్కొని చెప్పుచున్న స్తుతికి వసువులు ఆయా కోరుకొన్న ప్రయోజనములు సిద్ధించగలరు.

(2) యజ్ఞ విధులలో మధ్యందివస (మధ్యాహ్న) సవనము - రుద్రస్తుతి

శ్లో।।  పురా మధ్యన్ దినస్య సవనస్య ఉపాకరణాత్  
    జఘనేన అగ్నీ ధ్రీయస్య ఉదఙ్మఖ ఉపివిశ్వ  
    స రౌద్రగ్ం సామాభిగాయతి।

మధ్యాహ్న యజ్ఞ విధిని ప్రారంభించటానికి ముందుగా దక్షిణాగ్ని (ధ్రియాగ్ని)కి ప్రక్కగా ఆసీనుడు అవాలి. ఉత్తర దిక్కుగా చూచుచూ రుద్రుల గురించి సామగానము చేసెదరు గాక!

శ్లో।।  లోక ద్వారమ్ అపావారూణా।  పశ్యేమ।  
    త్వా వయం వైరా హుమ్  
    ఆ। జ్యా। యో। ఆ।  ఇతి।।

ఆకాశములో స్వేచ్ఛగాను, ప్రాణప్రదాతగాను, హాయిగాను సంచారములు చేస్తున్న ఓ వాయుదేవా! మీకు నమస్కారము. ఈ లోకము యొక్క (భువః యొక్క) ద్వారమును తెరవండి. ‘విరాట్ పదము’ కొరకై మిమ్ములను దర్శించుచున్నాము. ఆహుతులు ఇస్తూ ఉపాసిస్తున్నాము.

శ్లో।।  అథ జుహోతి। నమో వాయవే! అంతరిక్ష క్షితే।  
    లోకక్షితే। లోకం మే యజమానాయ వింద ఏష వై యజమానస్య లోక ఏతాఽస్మి।

యజమాని హోమము చేస్తూ, ఆహూతులను సమర్పిస్తూ చేసే ప్రార్థన. ఓ వాయుదేవా! నమో నమో నమో నమః. అంతరిక్షమునందు నివాసము కలిగి అంతరిక్షమంతా సంచారములు చేస్తున్న మీకు నమస్కారము. ఇక్కడ యజ్ఞములో మధ్యందివస కార్యక్రమము ప్రారంభించబోవుచున్నాను. ఇక్కడికి రండి! లోకగతుల గురించిన విజయము నాకు ప్రసాదించండి.

    అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహా।  
    ‘‘అపజహసి పరిఘమ్’’ ఇతి ఉక్త్య, ఉత్తిష్ఠతి।  
    తస్మై ‘‘రుద్రా మాధ్యందినగ్ం సవనగ్ం’’ సంప్రయచ్ఛంతి।।

‘‘ఈ యజ్ఞ కార్యక్రమమునకు యజమానినగు నేను ఆయుర్దాయము ఉన్నంతవరకు సమస్త కార్యక్రమములను మీకు హోమద్రవ్యములుగా సమర్పిస్తున్నాము. మేము సమర్పిస్తున్న సమస్తము స్వీకరించండి. ఈ లోక సంబంధమైన అడ్డగడియలను తొలగించండి’’.
ఈ విధంగా పలికి యజమాని పైకి లేచి నిలబడి రెండు చేతులు జోడించి రుద్రుల కొరకు ‘‘రుద్రా మాధ్యందినగ్ం సవనమ్’’ను భక్తి పూర్వకంగా సమర్పించాలి. ఆ తరువాత మధ్యాహ్న యజ్ఞ కార్యక్రమమును కొనసాగించును గాక!

(3) యజ్ఞ విధులలో తృతీయ-సాయం- ఆదిత్య విశ్వేదేవ సవనము

శ్లో।।  అథ జుహోతి।నమ ఆదిత్యేభ్యశ్చ। విశ్వేభ్యశ్చ।  
    దేవభ్యో దివిక్షిత్‌భ్యో। లోక క్షిత్‌భ్యో।

సాయంకాల హోమము ప్రారంభిస్తూ యజమాని ఈ విధంగా ప్రార్థన చేయును గాక!
ద్యులోకవాసులగు ద్వాదశాదిత్యులారా! విశ్వేదేవా! మీకు నమస్కరించుచున్నాను. యజ్ఞము చేస్తూ ఉన్న నా కొరకు ఇక్కడికి వేంచేయండి. నాకు లోకజయము ప్రసాదించండి.

‘‘ఏష వై యజమానస్య లోక ఏతా అస్మి।  
అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహా। అపహత పరిఘమ్!’’  
ఇతి ఉక్త్వా ఉత్తిష్ఠతి।

‘‘ఈ లోకములో ఈ యజ్ఞమునకు యజమానినై ఈ కార్యక్రమము సమర్పణగా సాయం సవనము ప్రారంభిస్తున్నాము. ఈ సమస్త యజ్ఞవిధులను హోమముగా సమర్పిస్తున్నాము. ఓ ఆదిత్య దేవతలారా! ఓ విశ్వేదేవా! (O! Woker of the Universe!) ఈ లోక పరిమితములు అడ్డగడియలు తెరవండి!’’ అని పలుకుచూ పైకి లేచును గాక!

తస్మా ఆదిత్యాశ్చ విశ్వే చ దేవాః ‘‘తృతీయ సవనగ్ం’’ సంప్రయచ్ఛన్తి।  
ఏష వై యజ్ఞస్య మాత్రాం వేద।  
య ఏవం వేద।  
య ఏవం వేద।

స్వర్గభూములలో నివసించు ఆదిత్య, విశ్వేదేవతలకు ఈ విధంగా ఆరాధన సమర్పిస్తూ యజమానినగు నాకు స్వర్గ లోక ద్వారములు తెరువండి। ఇదియే స్వర్గ ద్వారము. ‘‘స్వాహా’’! అని పలుకుచూ లేచి హోమద్రవ్యము సమర్పిస్తూ ఉండగా - ఆదిత్యులు, విశ్వేదేవతలు వేంచేసి యజ్ఞ ఫలమును యజమానికి, ప్రసాదిస్తున్నారు. ఇది ఎరిగి యజమాని సాయం సవనములను కొనసాగించును గాక!

ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్
ద్వితీయ అధ్యాయః సమాప్తః




16–3.     ఛాందోగ్యోపనిషత్ - అధ్యయన వచన పుష్పము - తృతీయ అధ్యాయము


16–3–1. తృతీయ అధ్యాయము - ప్రథమ ఖండము - మధు విద్య - ఆదిత్య తూర్పు దిక్ కిరణములు - సామోపాసన

ఈ సృష్టి అంతా పరమాత్మ యొక్క మాధుర్య రూపము. (‘‘మధురాధిపతే। సర్వమ్ మధురమ్।’’ అని శ్రీకృష్ణ తత్త్వము గానము చేస్తాము కదా!)

2వ అధ్యాయము చివరలో యజ్ఞము యొక్క చతురంగములైనట్టి సామ-హోమ-మంత్ర-ఉత్థాన సంబంధమైన త్రికాల ప్రారంభ సవనములు చెప్పబడినాయి. వాటి యొక్క విశేష ఫలములు కూడా చెప్పుకున్నాము.

ఇప్పుడిక కర్మసాక్షి, కర్మఫల ప్రదాత అగు ఆదిత్యుని శోభ మాధుర్యముల గురించి (ఇంకా) సృష్టి యొక్క మాధుర్యమును గమనిస్తూ, ఉపాసిస్తూ సృష్టికర్తతో ‘‘అనన్యత్వము’’ సిద్ధించుకోవటము గురించి చెప్పుకోబోవుచున్నాము.

- - -

ఓం! అసౌ వా ఆదిత్యో దేవ మధు। (ఎదురుగా కనిపిస్తున్న) ఈ ఆదిత్యుడు మానవులకు, సర్వజీవులకు, దేవతలకు ఆనందము కలిగిస్తూ ఉన్నారు. అందుచేత ఆదిత్యుడు దేవతలకు ‘తేనె’ వంటివారు.

ఆయన సకల యజ్ఞముల ఫలరూపము. ఆదిత్య లోకమే ఉత్తమ యజ్ఞఫలము.

దేవతలకు మధువు ‘‘ఆదిత్యుడు’’.

అట్టి ఆదిత్యునికి ద్యులోకము తేనెపట్టు వ్రేలాడు అడ్డముగా ఉండే వెదురు కట్టె (తిరశ్చీనము)! ద్యౌరేవ తిరశ్చీనవగ్ంశమ్।

అంతరిక్షము - వ్రేలాడు తేనెపట్టు. అంతరిక్షమ్ ఆపూపో।

సూర్యకిరణములు - తేనెటీగల సంతానములు. మరీచయః పుత్రాః।

సూర్యుని తూర్పువైపు కిరణములు - తూర్పువైపు తేనెపట్టు మధునాడ్యములు (తేనెపట్టు అరలు), తేనె నిలువ ఉండే నాడులు.
ఋగ్వేదములోని ఋక్కులు - తేనెటీగలు.

ఋగ్వేదము - తేనెటీగలు తేనె రసమును పీల్చి తెచ్చే ‘‘పుష్పము’’ - ఋగ్వేదము నియమించు కర్మలు, ఉపాసనలు పుష్పములు వంటివి.

అమృతము (జనన-మరణ రహితమగు స్వస్వరూప నిశ్చల - సుస్థిరానుభవము) - ఆ తేనె పట్టులోని తేనె (మధు)

కీర్తి, ప్రకాశము, ఇంద్రియ బలము, వీర్యము, భుజించుటకు ఆహారము లభ్యమవటము మొదలైనవి - రసము పొంగిపోవటము.
అట్టి అమృతరసము (హృదయము నుండి) విశేషముగా బయల్వెడలి ఆదిత్యునికి అభిముఖంగా ఆశ్రయించినదై ఉంటోంది.
తత్ ఆదిత్యగ్ంస్య రోహితగ్ం రూపమ్। ఆ విధమైన రసము సూర్యుని చుట్టూ రూపుదిద్దుకొనటముచే సూర్యబింబము ఉదయము అరుణ రూపము వలె కనిపించగలదు.


16–3–2. తృతీయ అధ్యాయము - ద్వితీయ ఖండము - ఆదిత్య దక్షిణ దిక్ కిరణములు - సామోపాసన

సూర్యుని దక్షిణ దిక్కు కిరణములు → తేనె పట్టు యొక్క దక్షిణము వైపు ‘తేనె’ నిలువ ఉండ గల నాడులు తేనెపట్టు యొక్క దక్షిణ నాడ్యములు. (నాడ్యములు = Bits wherein Honey gets preserved).

యజుర్వేద ‘యజస్సులు’ అనబడే యజుర్వేదమంత్రములు - తేనెటీగలు.

యజుర్వేదము - తేనెటీగలు తేనెను తెచ్చే పుష్పము.

అమృతజలములు - ఆ నాడ్యములలోని తేనె.

యజుర్వేద మంత్రముల గానము ‘యజుర్వేదము’ అనే తేనె తుట్టెకు ‘వేడి’ కలుగజేస్తోంది. అట్టి వేడి (Boiling) చేసిన ‘యజుర్వేదము’ అనే తేనెతుట్టె నుండి కీర్తి, తేజస్సు, ఇంద్రియములు, వీర్యము, అన్నాద్యములు ఇవన్నీ రసరూపంగా జనిస్తున్నాయి.

అట్టి యజుర్వేదగాన అమృతరసము - (అట్టి వేదగాన అభ్యాసి నుండి) - బయల్వెడలి ఆదిత్యుని ఆశ్రయిస్తున్నాయి. అదియే ఆదిత్యునిలో కనిపించే - ‘‘శుక్లగ్ం రూపమ్’’ - తెల్లటిరూపము (మధ్యాహ్న సూర్యుడు)


16–3–3. తృతీయ అధ్యాయము - తృతీయ ఖండము - ఆదిత్య పడమర దిక్ కిరణములు - సామోపాసన

సూర్యుని పడమర దిక్కు కిరణములే - ‘‘తేనెపట్టు’ యొక్క పడమర వైపు తేనె నిలువ ఉండే నాడ్యములు.

సామగానములు = తేనే టీగలు
సామవేదము = పుష్పము

ఆ సామవేద పుష్పముపై తేనెటీగలు తెచ్చే జలములే ‘అమృతము’ అనబడే తేనె రసము. అట్టి సామ మంత్రముల పఠనముచే సామవేదము ‘అనే’ తేనెతుట్టె ఉష్ణము పొంది - ఆ గానము చేయువానికి కీర్తి, తేజస్సు, బలమైన ఇంద్రియములు, వీర్యము, అన్నాద్యము - ప్రసాదించగలవు.

అట్టి ‘‘గాన (పఠన) విశేషము’’ అనే రసము ఆదిత్యుని అభిముఖముగా ఆశ్రయిస్తున్నాయి. ఆదిత్యునియందు నల్లని రంగుగా అలంకారము అగుచున్నాయి.


16–3–4. తృతీయ అధ్యాయము - చతుర్థ ఖండము - ఆదిత్య ఉత్తర దిక్ కిరణములు - సామోపాసన

సూర్యుని ఉత్తర దిక్కు వైపు ప్రసరించు కిరణములు - తేనెపట్టు యొక్క ఉత్తరము వైపు తేనె నిలువ ఉండే నాడ్యములు (ఉదీచీ మధు నాడ్యములు) (నాడ్యము = Bits wherein Honey is getting preserved).

అథర్వణ వేదమంత్రములు - తుమ్మెదలు.

ఇతిహాస పురణములు - ఆ తుమ్మెదలు వ్రాలే పుష్పము అథర్వణ వేదము.

ఇతిహాస పురాణములు అధ్యయనము చేయుటచే జనించే ‘‘కీర్తి తేజస్సు, ఇంద్రియ బలము, వీర్యము, అన్నాద్యము’’ అనే రసము పుట్టుచున్నది.

‘అట్టి రసము’ అనే తేనె సూర్యునికి అభిముఖమై సూర్యుని యందు నీలపు రంగుగా అగుచున్నది.


16–3–5. తృతీయ అధ్యాయము - పంచమ ఖండము - ఆదిత్య ఊర్ధ్వ దిక్ కిరణములు - సామోపాసన

రహస్య బోధలు అమృతమును ఆలింగనము చేస్తున్నాయి. అట్టి ఆలింగనము వలన - రసము, కీర్తి, అవయవముల బాహ్య సౌందర్యము, ఇంద్రియముల ప్రత్యుత్సాహము, వీర్యము, భుజించటానికి ఆహారము కలుగుచున్నది.

అట్టి ఊర్ధ్వము వైపు జనించిన అమృతరూపమగు మధువు పొంగి పొరలి సూర్యుని చుట్టూ రూపము దిద్దుకుంటోంది.
అదియే సూర్యమండలములో మధ్యభాగమున ‘క్షోభ’ వలె కనిపిస్తోంది.

ఆ మధునాడ్యములే రసములు।
వేదములే ఆ రసములు।

ఇవన్నీ వేదామృతములు. మధు నాఢ్యములన్నీ మధువు యొక్క అమృతమే।

వేదములన్నీ నాద-తాత్త్విక మధువు యొక్క అమృతమే.


16–3–6. తృతీయ అధ్యాయము - షష్ఠి ఖండము - ఆదిత్యామృతము - ఆదిత్యుని మొదటిదగు ఎరుపు రంగు రూపము

ఇంతవరకు మనము ‘‘అమృతమును సూర్యుని ఆశ్రయించటములో’’ - ‘‘ఎరుపు’’, ‘‘తెలుపు’’, ‘‘నలుపు’’, ‘‘నీలము’’ మొదలైన ఆదిత్యుని రంగులకు కారణమగుచున్న ‘‘చతుర్వేద-పురాణ - ఇతిహాస సారము’’ - అను మధుతత్త్వము గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఇంకా ఉపాసన విధిగా మరికొన్ని విశేషాలు చెప్పుకోబోవుచున్నాము.

[ వసువుల భోగ కాలమునకు రెట్టింపు రుద్రుల భోగ కాలము. దానికి రెట్టింపు ఆదిత్యులది. దానికి రెట్టింపు మరుత్తులది. దానికి రెట్టింపు సాధ్యులది. (ఇది కాక) సూర్యుడు మేరు పర్వతము చుట్టూ ప్రదక్షిణము చేస్తున్నప్పుడు - దిక్కులు తారుమారు అవుతాయి. ఈ రెండు పౌరాణిక విశేషాలు ఇక్కడ (బహుశా) దృష్టాంతము కొరకు తీసుకొనబడుచున్నాయి ]

ఆదిత్యుని మొదటిదగు ‘ఎరుపురంగు’ (అరుణ) లక్షణము గల అమృతము.

అమృతమునకు నాయకుడు అగ్నిదేవుడు.

ఆధారపడి జీవించువారు / అనుభవముగా పొందువారు / భుజించువారు వసువులు.

దేవతలు అవి భుజించరు. ఏత దేవా అమృతం దృష్ట్యా తృప్యంతి। వారు ఆ రూపములలో (ఎరుపు రంగులో) లీనమగుచున్నారు. ఆ రూపములో మునిగి తృప్తి కలిగి ఉంటున్నారు. ఆ రూపము వలననే ఉద్యమిస్తూ ఉంటారు.
(దేవతలు = ఇంద్రియములు. ఇంద్రియములు స్వయముగా ఏదీ అనుభవించవు)

ఎవరు ఈ విషయము తెలిసికొనుచున్నారో -
→ వారు వసువుల రూపము పొందుచున్నారు.
→ అగ్నిని తమ నాయకునిగా రక్షణ పొందుచున్నారు.
→ అమృతపానము (దర్శనము)చే తృప్తి పొందుచున్నారు.
→ ఆదిత్యుని రూపములో లీనమై, ఆ రూపమునే పొందుచున్నారు.
→ అట్టివారు సూర్యుడు తూర్పున ఉదయించి, పడమర ఆస్తమించునంత కాలము వసువుల ఐశ్వర్యము పొందుచున్నారు. ఆధిపత్యము, స్వారాజ్యము ఆస్వాదించుచున్నారు.


16–3–7. తృతీయ అధ్యాయము - సప్తమ ఖండము - ఆదిత్యామృతము - ఆదిత్యుని రెండవదగు శుక్ల రూపము

సూర్యునిలోని శుక్ల (తెలుపు) అమృతరూపమునకు :-

నాయకుడు = ఇంద్రుడు.
అనుభవించువారు = రుద్రులు.

(ఇంద్రియ) దేవతలు భుజించరు. త్రాగరు. చూచుచూ తృప్తి చెందుతూ ఉంటారు. వారు ఆ ‘తెలుపు’ రూపములో లీనమై ఉంటారు.

ఇది ఎరిగినవారు…
- రుద్రులలో ఒకరు కాగలరు.
- ఆదిత్యునిలో తెలుపు రూపము పొందుచున్నారు.
- ఇంద్రుడు వారికి నాయకుడు కాగా, దేవతలవలె అమృతపానము చూచినంత మాత్రంచేత తృప్తి పొందగలరు.

సూర్యుని ఉదయాస్తమయములు జరుగుచున్నంత వరకు అద్దానికి రెట్టింపు (2 times) కాలము (లేక)
సూర్యుడు దక్షిణ దిక్కులో ఉదయించి ఉత్తర దిక్కులో అస్తమించునంతకాలము…,
రుద్రుల ఐశ్వర్య భోగములు అనుభవించుచుండగలరు.


16–3–8. తృతీయ అధ్యాయము - అష్టమ ఖండము - ఆదిత్యామృతము - ఆదిత్యుని మూడవదగు నల్లని రూపము

సూర్యునిలోని నల్లని రూపమే మూడవ అమృతమునకు -

నాయకుడు = (చంద్రుడు) వరుణుడు
అమృతము అనుభవించువారు = ఆదిత్యులు

దేవతలు మాత్రం పై విధంగానే భుజించక, పానము చేయక చూచుచూ తృప్తి చెందుచున్నారు. వారు ఆ మూడవ అమృతము పొందుచున్నారు.

ఇది ఎరిగినవారు - ఆదిత్యులలో ఒకడు అగుచున్నారు. వరుణుడు వారికి నాయకుడు (రక్షకుడు) అగుచున్నారు.

దేవతలు తినక, త్రాగక - చూచుచూ తృప్తిపొంది ఉంటున్నారు.

అట్టి వివరణ ఎరిగినవాడు - ఆదిత్యులలో ఒకడై, వరుణుడు రక్షించువాడై, అమృత దర్శనముచే తృప్తి పొంది ఉంటున్నాడు.

ఆదిత్యులలో ఒకడై
(1) ఆదిత్యులతో సమానమైన సంపదను - సూర్యుడు దక్షిణము ఉదయించుచు ఉత్తర దిక్కులో అస్తమించునంత కాలము (లేక) రెండు అంతలు;
(2) సూర్యుడు పడమట ఉదయించి తూర్పు దిక్కులో అస్తమించునంత కాలము ఆదిత్యులలో సమానమైన దేవభోగములు, సంపదలు అనుభవించుచున్నారు.


16–3–9. తృతీయ అధ్యాయము - నవమ ఖండము - ఆదిత్యామృతము - నాలుగవదగు అమృతము - ఆదిత్యుని నీలపు రంగు రూపము

సూర్యుని నీలపు నాలుగవ అమృతరూపమునకు ‘‘సోముడు’’ నాయకుడు.

ఆ అమృతమును ‘‘మరుత్తులు’’ అనుభవించువారు.

దేవతలు భుజించరు, త్రాగరు. అభిముఖులై చూచి తృప్తిచెందుచున్నారు. లీనమై ఉంటున్నారు. ఇది ఎరిగినవారు మరుత్తులలో ఒకరు అయి మరత్తులతో సమానమైన సంపద అనుభవించగలరు.

(1) పడమట దిక్కు ఉదయము - తూర్పు దిక్కు అస్తమయము, దానికి రెట్టింపు కాలము
(2) ఉత్తర దిక్కులో ఉదయించి - దక్షిణ దిక్కులో అస్తమించు కాలము

అంతకాలము మరుత్తుల సంపద - ఆనందములు పొందగలరు.


16–3–10. తృతీయ అధ్యాయము - దశమ ఖండము - ఆదిత్యామృతము - ఐదవదగు అమృతము - ఆదిత్యుని అంతరామృత రూపము

సూర్యుని లోపలగా గల ‘అమృతము’ 5వది.

ప్రధానుడు - ప్రజాపతి.
అనుభవము పొందువారు - సాధ్యులు.

దేవతలు ఈ అమృతమును దర్శించుచూ తృప్తులై ఉంటున్నారు. తినరు, త్రాగరు, అభిముఖలై ఆనందిస్తూ ఉంటారు.

ఇట్టి ఉపాసన చేయువాడు సాధ్యులలో ఒకడై, ప్రజాపతి తన రక్షకుడుగా కలిగి ఉంటారు. అమృతము వైపు అభిముఖుడై తృప్తుడౌతారు. సాధ్యుల రూపుడై ఉద్యమిస్తూ ఉంటారు.

(1) ఎంతకాలము ఆదిత్యుడు ఉత్తరమున ఉదయించి దక్షిణమున అస్తమిస్తాడో… - దానికి రెట్టింపు కాలము
(2) పై వైపు ఉదయించి క్రింద వైపు అస్తమించుకాలము
…. సాధ్యుల ఆనందము, స్వయం ప్రకాశత్వము పొంది ఉండగలరు.


16–3–11. తృతీయ అధ్యాయము - ఏకాదశ ఖండము - మధు జ్ఞానము ఫలశ్రుతి

పై విధమైన ఉపాసనలు ఎరిగినవాడు, నిర్వర్తించువాడు క్రమంగా సమస్తమునకు పైన (ఊర్ధ్వుడై), స్వస్వరూపమునందు ఉదయాస్తమయములు లేనివాడై, (ఏకోసత్-ఒంటివాడు - చుట్టమొకడు లేడు - అను వాక్యముల అర్థమగు) - ఒంటరివాడుగా, మధ్యగా నిలచిఉండగలడు. సూర్యదేవుని తన ఆత్మగా పొందగలడు.

ఈ విశేషము మంత్రయుక్తంగా ఇట్లు చెప్పబడుతోంది.

‘ఉదయాస్తములు పొందడు’ అనునది ఏ విధంగానంటే - సూర్యునకు భూమి యొక్క మన ఉనికి దృష్ట్యా ఉదయాస్తమయములు కనబడుచున్నాయి.
ఎప్పుడూ కూడా స్వయంప్రకాశరూపుడగు సూర్యునికి ఉదయించటమేమిటి? అస్తమించటం ఎక్కడున్నది?

అదే విధంగా ఆత్మను ఎరిగినవానికి ఉదయాస్తమయములు ఉండవు. జనన-మరణములు, జన్మ-పునర్జన్మలు ‘‘లేనివే’’ అవుతాయి.

‘‘దేవా! అస్తేన అహగ్ం సత్యేన। మా విరోధషి బ్రహ్మణేతి।
ఓ దేవతలారా! నేను సత్యమును ఆశ్రయించినవాడనై ఉండెదను గాక! స్వయంప్రకాశకము, సమస్తము అయి ఉన్న బ్రహ్మదేవునితో (బ్రహ్మముతో) విరోధము కలవాడను కాకుండెదను గాక! (అనగా బ్రహ్మజ్ఞానమునకు విముఖుడను అవకుండా ఉండెదము గాక!). ఓ దేవతలారా! మీవలెనే సర్వసాక్షినై ఉండెదను గాక।’’

ఈ ఉపాసన చేయువాడు చీకటిని, సూర్యాస్తమమును పొందడు. సర్వత్రా తేజోరూపము దర్శించువాడై ఉంటాడు.

- - -

ఈ విధముగా ‘‘మధుజ్ఞానము’’ను బ్రహ్మదేవుడు (భావికుడు) ప్రజాపతికి (నిర్వాహకుడికి), ప్రజాపతి మనువుకు, మనువు సర్వజనులకు బోధించటం జరిగింది. ఇట్టి విశేషముల రహస్యమును ఎరిగినవాడు అర్హుడైన కుమారునికి లేదా శిష్యునికి బోధించును గాక। తపస్సు, ధ్యానము, భక్తిలేని వారికి బోధించరాదు. అట్టివారు రాజ్యమిచ్చినా కూడా లేక మరేది ఇవ్వజూపినా కూడా - ‘‘మధు విజ్ఞానము’’ బోధించటము నిషేధము.


16–3–12. తృతీయ అధ్యాయము - ద్వాదశ ఖండము - గాయత్రీ ఉపాసన

ఇప్పుడు మనము ‘‘గాయత్రీ తత్త్వము’’ ద్వారా బ్రహ్మవిద్యను చెప్పుకుంటున్నాము.

బ్రహ్మము ‘‘నిర్విషయము’’ ఎందుకంటే,… సమస్త విషయములు నిషేధించగా శేషించునది ‘‘బ్రహ్మము’’
బ్రహ్మజ్ఞానము యొక్క బోధ కొరకై గాయత్రీ ఛందస్సు ఉత్తమ ఉపకరణముగా శాస్త్రములచే స్వీకరించబడుతోంది.

- - -

గాయత్రీ వా ఇదగ్ం సర్వం భూతం। ఈ సమస్త జీవజాలము గాయత్రీ స్వరూపమే। ఇదంతా ‘వాక్’ (expression) స్వరూపమే। గాయత్రియే వాక్కు.

ఇదగ్ం సర్వం భూతం గాయతీ చ। త్రాయతే చ। ఈ సమస్త చరాచరములంతా గాయత్రీ గానమే। గాయత్రియే రక్షణ। గాతయత్ త్రాయతే।

- ఈ పృథివి గాయత్రీ స్వరూపమే। ఈ సకల ప్రాణులు పృథిపైనే నిలచియున్నాయి. పృథివిని అతిక్రమించలేవు.
- అట్టి పృథివీ తత్త్వము చేతనే ఈ భౌతిక శరీరము నిర్మితమౌతోంది.
- అట్టి భౌతిక శరీరములో ‘గాయత్రీ జగత్ శక్తి’ చేతనే ప్రాణము ప్రవేశిస్తోంది. ప్రాణము శరీరములో ‘గాయత్రీ’ చేతనే నిలుస్తోంది. ప్రాణములు గాయత్రీ స్వరూపమే।

దేహములో ఉండే హృదయము, ప్రాణము, ఇంద్రియములు… ఇవన్నీ కూడా గాయత్రీ స్వరూపములే।

అట్టి గాయత్రి ‘4’ పాదములుగాను, ‘6’ ప్రకారములుగాను ఉన్నది. పైషా చతుష్పదా (4) షట్ (6) విధా గాయత్రీ, తత్ ఏతత్ ఋచా అభ్యసూక్తమ్। ‘6 6 6 6’ అక్షరములుగల 4 పాదములతో కూడియున్న ఛందస్సు (6 x 4 = 24 అక్షరములు) 6 రూపములు = (1) వాక్కు (2) ప్రాణులు (3) పృథివి (4) దేహము (5) హృదయము (6) ప్రాణములు.

ఈ సమస్తము గాయత్రీ రూపమగు బ్రహ్మము యొక్క సాకారవికారమే। ఇదంతా గాయత్రీ మహిమయే! అద్దాని పురుషకారమే! పురుషకారమునకు ఆవల పురుషుడు। ఇదంతా ప్రకృతి స్వరూపం. దానికంతటికీ ఆవల, ఇదంతా దాటివేసినట్టి శ్రేష్ఠాతిమగు పురుషుడు - గాయత్రియే।

అట్టి పురుషునకు ‘‘నాలుగు పాదములు’’.

(A) ఈ మార్పు-చేర్పులతో కూడినదంతా, సమస్త జగత్తు ఒక పాదము (1/4th). మార్పు చెందుతుంది కాబట్టి మృతము (All that undergoes change is “Mrutham”).

(B) మిగతా ‘3’ పాదములు (3/4) అమృతము (that does not have any change)

ఉదా :
- మనస్సులోని విషయాలు మృతము. ‘మనస్సు’ - అమృతము.
- బుద్ధికి తెలియవచ్చేవి మృతము. తెలివి (బుద్ధి) - అమృతము.
- చిత్తము (ఇష్టము) అయ్యే విషయాలు మృతము. చిత్తము అమృతము.
‘అహం’ (నేను) అనునది పురుషుడు. మిగతావన్నీ ‘నేను’ యొక్క పురుషకారములే।

బహిర్పురుషాకాశము

అట్టి పరబ్రహ్మము గురించి

(1) యద్వైతత్ బ్రహ్మేతి ఇదం వా। తత్ యోయం బహిర్థా పురుషాత్,
ఆకాశో యో వై - స బహిర్థా పురుషాత్ ఆకాశః।

ఈ సమస్తము కూడా బ్రహ్మమే అయిఉన్నది. బ్రహ్మము యొక్క బాహ్య పురుషకారము ఏదై ఉన్నదో - అదియే ఈ బాహ్యాకాశముగా వ్యాపించి ఉన్నది.


అంతర్ పురుషాకాశము

(2) అయం వావ స యో అయమ్।
అన్తర్‌పురుష ఆకాశో యో వై సో ‘‘అన్తర్పురుషాకాశః।

బాహ్యము ఆకాశముతో సహా ఆయా పంచ భౌతిక జగత్తుగా విస్తరించియున్నట్లే, అంతరాకాశము (హృదయాకాశము)గాను (మనోబుద్ధిచిత్త అహంకారముల రూపంగాను) విస్తరించి వ్యాపించి ఉన్నది.
→ ఒకే భూతాకాశము (పంచభూతములలో మొదటిది) దేహమునకు బాహ్య - అభ్యంతరములలో వేంచేసి ఉన్నట్లే,
→ చిత్తాకాశము కూడా ఈ జీవునికి బయట - లోపల ఏకరూపమున విస్తరించి ఉన్నది. ఆ పరబ్రహ్మమే భూతాకాశముగాను, చిత్తాకాశముగాను - చిదాకాశముగాను శరీరమునకు విశ్వమునకు కూడా బయట, లోపల ఏకరూపమై వ్యాపించినదై ఉంటోంది.

అయం వావ స యో అయమ్ అంతర్హృదయ ఆకాశః తదేతత్ పూర్ణమ్ అప్రవర్తినీగ్ం।

బాహ్య-అభ్యంతరములలో విస్తరించి యున్న ఆకాశమే అంతరహృదయమున చిదాకాశముగా ఉన్నది. అనగా చిదాకాశమే చిత్తాకాశముగా, భూతాకాశముగా కూడా భావించబడుచూ ఉన్నది. అట్టి అంతర్హృదయములో ఏర్పడినదై ఉన్న చిదాకాశమే ‘‘పరబ్రహ్మము’’. అది పూర్ణము. అప్రవర్తితము.

భూతాకాశముగా అనుభవమయ్యేదంతా చిత్తము యొక్క కల్పనా విన్యాసమే।
చిత్తాకాశమంతా ఆత్మాకాశము యొక్క స్వకీయ కల్పిత లీలా వినోదమే।
ఈ విధంగా సమస్తము చిదాకాశమే అయి ఉన్నది.
అట్టి చిదాకాశమే ‘బ్రహ్మము’గా కూడా పిలువబడుతోంది.

హృదయములోంచే ఆలోచన, భావన అనునవన్నీ పుడుచున్నాయి. భావన నుండే జగత్తుల అనుభవము ఏర్పడుతోంది. కనుక ఈ జగద్దృశ్యమంతా అనుభవమగుచున్నది అంతర్హృదయములోనే। అట్టి అంతర్హృదయాకాశము సర్వదా పూర్ణము. అది ఎప్పుడూ తన పూర్ణత్వము నుండి చ్యుతి పొంది జీవుడు, జగత్తు, జాగ్రత్ స్వప్న సుషుప్తులుగా ఏమాత్రమూ అగుటయే లేదు.

అట్టి అంతర్హృదయాకాశము (లేక) చిదాకాశమునకు ‘‘బయట-లోపల’’ వంటివేమీ లేవు. న బాహ్యం। నో అంతరమ్।

సమస్తము తానే అయి, ఏ మార్పు - చేర్పులు ఏమాత్రము పొందకయే ఉన్నది. అది ‘పరబ్రహ్మము’గా చెప్పబడుచున్నది.

అట్టి పరబ్రహ్మము సర్వదా యథాతథంగానే ఉన్నదిగాని ఏదీగా ప్రవర్తించటం లేదు. అప్రవర్తితం। అది అప్రవర్తనీయం।

ఎవ్వరైతే స్వకీయ హృదయస్థము, హృదయరూపము, స్వాభావిక స్వస్వరూపము అగు పరబ్రహ్మమును ‘‘పూర్ణము, అప్రవర్తనీయము (దేనిచేతను ప్రవర్తింపజేయబడేది కాదు), అప్రవర్తితము’’ - అని తెలుసుకుంటారో, - పూర్ణ అప్రవర్తనీగ్ం,… శ్రియం లభతే య ఏవం వేద। → అట్టివారు మహత్తరమగు శ్రేయస్సు, యశస్సు, భాగ్యము పొందగలరు.


16–3–13. తృతీయ అధ్యాయము - త్రయోదశ ఖండము - గాయత్రీ బ్రాహ్మీసిద్ధికి పంచ సుషి ద్వారములు

హృదయాంతర్గత - బాహ్యాభ్యంతరస్థిత గాయత్రీ బ్రహ్మము చేరుటకు ‘5’ దారులు (సుషులు / ద్వారములు)

‘గాయత్రి’ అనే బ్రహ్మము యొక్క ఉపాసన (సామీప్యత పొందటము) కొరకై ఐదు ద్వారములు, (సుషులు, సుషిరగము) మరియు వాటి యొక్క ఐదు ద్వారపాలకులు (ఈ ఉపనిషత్‌చే) సూచించబడుచున్నాయి.

మనము ఒక రాజు వద్దకు వెళ్ళాలంటే, ద్వారపాలకులు ఆపేస్తారు. అట్టి ద్వారపాలకులను ఉపాసనా ప్రీతులను చేస్తే, వారు లోనికి వెళ్లనిస్తారు. రాజు దర్శనానికి మార్గము చూపిస్తారు కూడా!

        ఉపాసన - శ్రద్ధకొరకు।  
        శ్రద్ధ - ఉత్తమ గుణముల కొరకు.
- - -

తస్య హ వా ఏతస్య హృదయస్య పంచ దేవ సుషయః। హృదయాంతరతుడై జగత్పాలకుడయి, బాహ్యాభ్యంతర స్వరూపుడైయున్న ‘‘పరమాత్మ’’ (లేక) ‘‘పరబ్రహ్మము’’ - అనే చక్రవర్తిని దర్శించటానికై ‘5’ దేవ సుషులు(లేక) దేవతలచే కాపలా కాయబడుచున్న ఐదు ద్వారములు ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము.

(1) హృదయము యొక్క తూర్పు వైపు ద్వారము - ‘‘ప్రాణము’’

స యో అస్య ప్రాక్ సుషిః - స ప్రాణః।
హృదయము యొక్క తూర్పు వైపున (పంచ ప్రాణములలోని) ప్రాణమే ద్వార పాలక దేవత.
ఈ ప్రాణ దేవతయే శరీరములో నేత్రము. చూపు రూపమున ఉన్నవారు.
ప్రాణము ఉంటేనే చూపు. లేకుంటే చూపు ఉండదు.
ఆయనయే ఆకాశమున సూర్యుడై ప్రకాశించుచున్నారు. ఆయనయే ఆదిత్యుడు. (బుద్ధిరూపుడు). ఆయనయే తేజస్సు (అగ్ని).
అన్నాదుడు (ఆహార ప్రదాత). తినిన ఆహారము జీర్ణము చేసి శక్తిగా మారుస్తున్న వైశ్వానరుడు కూడా ఆయనయే।
ఈ విధంగా ఎవ్వరైతే - చూపును, ఆదిత్యుని, అన్నాదమును, జీర్ణశక్తిని - ప్రాణేశ్వర రూపంగా ఉపాసిస్తాడో - అట్టివాడు తేజో సంపన్నుడు, అన్నాదుడు (సమస్తము తనకు రుచికరము ఆహారము వంటిదిగా) పొందుచున్నాడు.

(2) హృదయము యొక్క దక్షిణము వైపు ద్వారము - ‘‘వ్యానము’’

అథ యో అస్య దక్షిణః సుషిః సవ్యానః। సశ్రోత్రగ్ం। స చంద్రమాః।
‘హృదయము’ అనే ముఖ్యపట్టణమునకు దక్షిణము వైపు సుషి (ద్వారము)నకు ద్వారపాలకుడు - (పంచ ప్రాణేశ్వరులలో) - ‘వ్యానము’ అను వ్యానప్రాణేశ్వరుడు.

ఆయనయే - చెవి (వినికిడి).
ఆయనయే - చంద్రుడు (మనోరూపుడు).

తత్ ఏతత్ శ్రీశ్చ। యశశ్చ।

అట్టి వ్యానమే శ్రీ (సంపద).

చెవి జ్ఞానమునకు (శృతము), చంద్రుడు ఆహారమునకు కారణభూతము.

ఈ సమస్తము వ్యానబ్రహ్మ (వ్యాన ప్రాణేశ్వరుడు) యొక్క కీర్తి, సంపదయే!

అట్టి వ్యానమును పై రీతిగా (శ్రవణము, చంద్రుడు రూపములుగా) ఉపాసించువాడు సంపద, కీర్తి పొందగలడు.

(3) హృదయము యొక్క పడమర వైపు (ప్రత్యన్) ద్వారము - ‘‘అపానము’’

హృదయాంతఃపురము ప్రవేశించటానికి పడమర (West) వైపు ద్వారము - ‘‘అపానము’’. ఇది ‘‘వాక్కు’’, ‘‘అగ్ని’’గా ఉపాసించబడు గాక।

అపానము = మూత్రము, పురీషములను శరీరము నుండి బయటకు పంపి శరీరము నుండి తొలగించునది కాబట్టి అపానము. (అప-అనితి)

అట్టి అపానమును బ్రహ్మవర్చస్సుగాను, అన్నాద్యము (పరిపోషకము)గాను ఉపాసించెదరు గాక।

అపానమును పైవిధంగా ఉపాసించుచుండగా అట్టివాడు బ్రహ్మవర్చస్సు, సమృద్ధి అయిన ఆహారము, జీర్ణశక్తి పొందగలడు.

(4) హృదయము యొక్క ఉత్తర (ఉదన్) సుషి (ద్వారము) - ‘‘సమాన ప్రాణము’’

హృదయము యొక్క ఉత్తర (ఉదన్) దిక్కువైపు ఛిద్రము (ద్వారము) - ‘‘సమానప్రాణము’’

సమాన ప్రాణమును సమాన బ్రహ్మ కీర్తి, లావణ్యముగా ఉపాసించెదరు గాక।

సమాన ప్రాణము = తినబడుచున్న, త్రాగబడుచున్న ఆహార పానీయములను శరీరమంతా ‘సమము’గా అందించగ విశేషము స్వభావముగా గల వాయువు.

ఈ వాయువుకు అంతఃకరణముతో సంబంధము ఉన్నది.

సమాన ప్రాణమే వర్షరూపములో ఉండే దేవత.

మనస్సు యొక్క విజ్ఞానము, కీర్తికి సమానప్రాణము కారణము అవుతోంది.

ఈ విధంగా సమాన ప్రాణమును గమనిస్తూ ఉపాసించువాడు కీర్తివంతుడు, లావణ్యవంతుడు కాగలడు.

(5) హృదయము యొక్క పై భాగమున గల సుషి (ద్వారము) - ‘‘ఉదాన ప్రాణము’’

హృదయమనే ఇంటికి పైనగా ఉండే ద్వారము (ఛిద్రము) ఉదాన ప్రాణము. ఇది వాయు ఆకాశ రూపములుగా ఉపాసించబడు గాక।

ఉదాన ప్రాణము = ఇది ఈ దేహము యొక్క → అరికాళ్ళు మొదలు శిరస్సు వరకు ‘పైకి లేచుట’ అను క్రియకు శక్తి ప్రసాదకము. పైకి లేచుటకై ఉపాసన వస్తువు కాబట్టి ‘ఉదానము’. ఆకాశమునకు ‘ఉత్’ అని పేరు. ఉదాన ప్రాణ ప్రదర్శనమే ఆకాశముగా ఉపాసిస్తున్నారు.

ఉదాన బ్రహ్మ - బలము. ఆకాశము యొక్క విస్తార రూపము. అట్టి ఉదాన బ్రహ్మను బ్రహ్మముగా ఉపాసించువాడు బలము, విస్తారము మొదలైన విశేషములు పొందుచున్నాడు.


ఈ విధంగా (1) ప్రాణ బ్రహ్మ పురుషుడు (2) వ్యాన బ్రహ్మ పురుషుడు (3) అపాన బ్రహ్మ పురుషుడు (4) సమాన బ్రహ్మ పురుషుడు (5) ఉదాన బ్రహ్మ పురుషుడు - ఈ ఐదుగురు బ్రహ్మ పురుషులు.

తేవా ఏతే పంచ బ్రహ్మపురుషాః స్వర్గస్య లోకస్య ద్వారపాః।
వీరు ఐదుగురు స్వర్గ (ఊర్ధ్వ)లోక ద్వారపాలకులు.

ఈ ఐదుగురు ద్వారపాలకులను ఉపాసనచే ఆశ్రయించువాడు, ఎల్లప్పుడు ప్రార్థనలు సమర్పించువాడు -

వీరు ‘బ్రహ్మ’ అనే స్వర్గలోకమునకు ద్వారపాలక దేవతలవంటివారు.

కన్ను - చెవి - వాక్కు - మనస్సు - ప్రాణము - అనే ఐదుగురు ద్వారపాలకులు ఈ భౌతికదేహమున తిష్ఠించుకొని ఉండటము మనమందరము చూస్తూనే ఉన్నాము కదా।

[ఏతైర్హి చక్షుః శ్రోత్ర వాక్ మనః ప్రాణైః బహిర్ముఖ ప్రవృత్తైః బ్రహ్మణో హార్దస్య ప్రాప్తిః ద్వారాణి నిరుద్ధాని - శంకర భాష్యం]
ఇవన్నీ కూడా బహిర్ముఖమై దృశ్యమువైపు ఎక్కుపెట్టి ఉండటము చేత, - అంతర్హృదయములోనే వేంచేసియున్న పరమాత్మ (లేక) పరబ్రహ్మము వైపు మార్గదర్శకమైయుండే ఛిద్రములు (ద్వారములు) (సుషిలు) మూసుకుపోయి ఉంటున్నాయి.

‘‘ఇంద్రియ విషయములు నిజమే। నిత్యమే’’ అని తలచుచూ ఉన్నంత కాలము, వాటి పట్ల ఆసక్తి (Inquisitiveness) కొనసాగించునంత కాలము - ‘‘అసత్యము’’నందే మనస్సు తగుల్కొని ఉంటోంది. అట్టి మనస్సు హృదయమునందు సర్వదా వేంచేసియున్న బ్రహ్మమునందు నిలవటము లేదు.

అందుచేత ఈ ఐదుగురు బ్రహ్మపురుషులను ఉపాసించి నేత్ర - శ్రోత్ర - వాక్ - మనో - ప్రాణములను ద్వారములుగాను, ప్రాణ - వ్యాన - అపాన - సమాన - ఉదాన దేవతలను ద్వారపాలక పురుషులుగాను భావించి ఉపాసన, అధ్యయనములు చేయమని ఉపనిషత్తు మార్గసూచకము మనకు చేస్తున్నది.

అఖండ జ్యోతి

అసంఖ్యాక దీపములు (ఉదా: సహస్ర దీపార్చన) ఒకచోట వెలుగుచూ ఉండవచ్చు గాక! కానీ, అన్ని దీపములలో తేజోరూపమగు అగ్ని సర్వదా ‘ఒక్కటే’ గాని, అనేక దీపములు కారణంగా అనేకములుగా అవటం లేదే!

అట్లాగే ఈ లోకములన్నీ కూడా విశ్వజ్యోతి యొక్క తేజోరూప చమత్కారమే। అంతే కాదు, ద్యు(దేవ) లోకముతో సహా సమస్త లోకములకు ఆవల ఏ జ్యోతి స్వరూపాత్మ వెలుగొందుచున్నదో, - ఆ అఖండజ్యోతియే।

ఈ అట్టి జ్యోతి - పురుషుని యందు, సమస్త జీవుల దేహములలో బాహ్య - అభ్యంతరముగా వెలుగొందుచున్నది.

తస్య ఏషా దృష్టి యత్ర ఏతత్ - అస్మిన్ శరీరే సగ్ంస్పర్శేన ఉష్ణిమానం - విజానాతి।

ఒకని శరీరము స్పృశించినప్పుడు ఆ స్పర్శగా ఆ ఆత్మజ్యోతియే స్పర్శానుభవమై వెచ్చదనము అనుభూతమౌతోంది. ‘‘స్పర్శగా అనుభవమైయ్యే అట్టి ఉష్ణము ఆత్మ యొక్క ఉనికి - స్పర్శయే’’ - అని భావించబడు గాక।

తస్య ఏషా శ్రుతిః యత్ర ఏతత్ కర్ణావపి గృహ్య నినదమివ, నదథురివ,
అగ్నేరివ జ్వలత ఉపశృణోతి - తత్ ఏతత్ దృష్టం చ, శ్రుతం చ ఇతి ఉపాసీత।

రెండు చెవులను (రెండు చూపుడు) వ్రేళ్లతో మూసుకొన్నప్పుడు రథము వెళ్లుచూ ఉన్నప్పటి ఘోషవలెను, ఎద్దు మెడకు కట్టిన గజ్జెల ధ్వని వలెను, ఫటఫట మండే అగ్ని యొక్క ధ్వనివలెను వినపడుతుంది. అట్టి ధ్వనిని వింటూ ‘‘ఇది అఖండాత్మ జ్యోతి యొక్క విశేష శబ్ద చమత్కారమే’’ - అని ఉపాసించెదరు గాక!

ఎవ్వరైతే ఈ సమస్తము ఆత్మ దృష్టితో చూస్తారో, వింటారో - వారు ఏది చూడాలో అది చూస్తున్నవారు, ఏది వినాలో అది వినుచున్నవారు అగుచున్నారు.


16–3–14. తృతీయ అధ్యాయము - చతుర్దశ ఖండము - శాండిల్య విద్య - సమస్తము బ్రహ్మమే।

సర్వం ఖలు ఇదం బ్రహ్మ।
నామరూపాత్మకంగా అనేక భేదములతోను, సామాన్య- అసామాన్య విశేషములతోను, ఇంద్రియములకు విషయముల రూపముగా కనిపిస్తున్న ఈ సమస్తము ‘‘బ్రహ్మమే’’ అయి ఉన్నది. ప్రతి జీవునిలో అఖండముగా కేవలుడై వెలుగొందుచున్నది ఆ ఆత్మపురుషుడే! సమస్తమునకు కారణకారణమై వెలుగొందుచున్న పరమాత్మ యొక్క స్వయం ప్రదర్శనారూపమే ఇదంతా!

తత్ జలాన్।
జలములో నుండి బుడగలు, తరంగములు బయలుదేరి జలములో సాకారంగా కనిపిస్తూ తిరిగి జలము నుందే లయము పొందినవి అగుచున్నాయి కదా! అట్లాగే ‘ఆత్మ’ అనే జలము నుండి అసంఖ్యాక తరంగాల వలె అసంఖ్యాక జీవాత్మలు బయల్వెడలి, 14 లోకములలో సంచారములు చేస్తూ తిరిగి ఆత్మయందే లీనము అగుచున్నాయి.

తత్ జవాని → ఇదంతా ఆత్మయందలి గర్భస్త పిండమే।
అట్టి సమస్తమునకు సర్వదా అధిష్ఠానమైయున్న ‘‘ఆత్మ’’నే దర్శించాలి. ఉపాసించాలి. అనన్య భావనను అనుక్షణీకరించుకోవాలి.

పరమాత్మయే ఈ కల్పిత జగత్తు యొక్క నిర్మాత (The worker of the Universe). అందుచేత పరమాత్మ క్రతుమయుడు. యజ్ఞకర్త. ఈ సృష్టియే - ‘‘యజ్ఞము’’.

ఈ జీవుడు పరమాత్మయే అయి ఉండి కూడా, ‘‘స్వయం కృత లీలా వినోదరూపమా?’’ - అన తగిన ఈ ‘‘సృష్టి’’ క్రతువులో ‘జీవుడు’ అనే పురుషకారము ఆశ్రయించి ఉంటున్నాడు. అట్టి స్వయంకృత సృష్టి కల్పనలో ఆత్మ యొక్క ఒక అంశగా ప్రవేశించి ఈ జీవుడు జన్మ-కర్మల పరంపరలను పొందుచున్నాడు. ఆతడు ఏది ఎట్లు సంకల్పిస్తే అట్లాగే ఈ దేహమున్నప్పుడు దేహానంతరము కూడా పొందుచున్నాడు. ఈ విధంగా జీవుడు సంకల్పమయుడు.

తాను ఏది ఎట్లు నిశ్చయించుకుంటే ఆ రూపమునే తనకు తాను దాల్చుచున్నాడు. ఆ లోకములోనే ప్రవేశము పొందుచున్నాడు. మరణ సమయంలో ఏ సంకల్పములు, నిశ్చయములు కలిగి ఉంటే, వాటిని అనుసరించే తదనంతర ఉపాధికి మరల ఉపక్రమించుచున్నాడు. సంకల్పములచేతనే ‘మనస్సు’ రూపుదిద్దుకుంటోంది. అయితే…,

బ్రహ్మమే మనస్సు రూపముగా ప్రకటనమగుచున్నది. బ్రహ్మమునకు మనస్సు మొదలైన అన్యమేదీ మొదలే లేదు.

బ్రహ్మము ఇంకా ఎట్టిదంటే -

మనోమయః : మనస్సునంతా ఆక్రమించియున్నది బ్రహ్మమే। బ్రహ్మము మనోమయము కూడా.
ప్రాణ శరీరో : బ్రహ్మము ‘‘ప్రాణశక్తి’’ని శరీరముగా కలిగి ఉంటున్నది.
భారూపః : బ్రహ్మము స్వయం తేజోరూపము - స్వయం ప్రకాశరూపము.
సత్య సంకల్ప : బ్రహ్మము ఏది ‘సత్యము’ అని సంకల్పిస్తే అది అట్లే సత్యము అయి ఉండగలదు.
సర్వకర్మా : అంతరంగమగు మనో బుద్ధి చిత్త అహంకారములకు మరియు బాహ్యములగు ఈ జగదనుభవములకు తానే ‘కర్త’ అయి ఉంటోంది.
సర్వకామ : సమస్తము బ్రహ్మము యొక్క ఇచ్ఛా శక్తి నుండే బయల్వెడలుచున్నది. బ్రహ్మము యొక్క కోరిక చేతనే జగన్నాటకమంతా పరిఢవిల్లుతోంది.
సర్వగంధ। సర్వరస। సర్వమిదమ్ అభ్యత్తో। ఇంద్రియానుభములగు సర్వవాసనలు, సర్వరుచులు… ఇదంతాగా విస్తరించుచున్నది బ్రహ్మమే।
అవాక్య నాదరః : ‘‘వాక్కు మొదలైన ఇంద్రియములు లేనిదే’’ - అయి ఉండి కూడా, సర్వేంద్రియ వాక్యములు బ్రహ్మమునందే
జగద్దృష్టిచే కనబడుచున్నవగుచున్నాయి.

బ్రహ్మమునకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. బ్రహ్మము మరింకొకటేదీ అగుట లేదు.

- - -

అట్టి నా-నీ-సర్వుల స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మ స్వకీయ హృదయములోనే వేంచేసియున్నది. సూక్ష్మాతిసూక్ష్మమగుటచే హృదయకమలములోని ఆత్మ ఇంద్రియములకు అనుభవ విషయమే కాదు।

సర్వాంతర్యామి అయి, సర్వహృదయ నివాసియగు ఆత్మ :-

అణీయాన్ : అణువుకే అణువు. పరమసూక్ష్మము. నీవారశూకము (వడ్ల గింజ) యొక్క చిట్టచివరి అణువిభాగము కంటే, ఆవగింజలో దాగియున్న అంకురశక్తి కంటే, యవములు (మినపగింజ) కంటే, సర్షపము (ఆవగింజ) కంటే, శ్యామాకములకంటే (పెసలు మొదలైన తృణ ధాన్య విశేషముల కంటే)… అత్యంత సూక్ష్మాతిసూక్ష్మము. వాటన్నిటిలో దాగిఉండే ‘‘అంకురము’’ కంటే కూడా సూక్ష్మాతిసూక్ష్మము.

ఇంకా కూడా… బ్రహ్మము గురించి
నా హృదయములో నివసించు నీ ఆత్మ, నీ హృదయములో నివసించు నా ఆత్మ ఎటువంటిదంటే…
→ సమస్త సృష్టికి కర్మాధికారి.
→ సర్వ కామములు కూడా సర్వభూతాశయ స్థితమగు ఆత్మకు చెందినవే.
→ సకల గంధములు, సర్వ రసములు తనవే అయి ఉండి - (నాటకములోని సర్వపాత్రలు, వర్తనములు నాటక రచయిత యొక్క రచనా కళలోనివే వలె) - సమస్తము తనయందే కలిగి ఉంటోంది.
→ వాక్కు లేకపోయినా సర్వ శబ్దములు ఆత్మలోనివే। కాళ్ళు లేకపోయినా నడకలన్నీ ఆత్మవే! చేతులు లేకపోయినా సర్వ చేతలు ఆత్మకు చెందినవే. ఇంద్రియములు లేకపోయినప్పటికీ సర్వేంద్రియముల అనుభూతములు ఆత్మదేవునివే!
→ సంభ్రమము లేనిదే అయినప్పటికీ, ఈ 14 లోకములలోని సంభ్రమములన్నీ ఆత్మయందే - దర్పణంలో దృశ్యములాగా - ప్రతిబింబితము అగుచున్నాయి.
→ అట్టి ఆత్మ భూగోళము కంటే, ఆకాశము కంటే, దేవలోకము కంటే, సమస్త లోకముల కంటే ‘‘పెద్దది’’.
→ నా - నీ హృదయములో నివసించు బ్రహ్మమే సృష్టికర్త. సర్వకామములు, సర్వగంధములు, సర్వరసములు - ఆత్మభగవానుని రూపమే। ఆతడే పరబ్రహ్మము.

ఎవరు ఈ సత్యము పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో - వారికిక ఏ సందేహములు ఉండవు.

ఈ విధంగా శాండిల్య ముని ప్రకటించి ఉండటం చేత, ఇది - ‘‘శాండిల్య విద్య’’ -గా లోక ప్రసిద్ధము.


16–3–15. తృతీయ అధ్యాయము - పంచదశ ఖండము - విరాట్ కోశ - ఉపాసన।

ఈ విశ్వమునకు ఆకాశమే పొట్ట. అనగా లోపలగా ఖాళీ ప్రదేశము. ఆ ఖాళీలో అనేక విశేషములు కలిగియున్నది. అట్టి ఈ విశ్వమునకు పీఠము ‘భూమి’. న జీర్యతి! అట్టి ఈ ‘విశ్వము’ అనబడునది అనాది. నాశనము లేనిది. (ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావసి - భగవద్గీత)।

ఈ విశ్వమునకు మూలములు - అష్టదిక్కులు, పై భాగము - స్వర్గము.

ఈ విశ్వము సర్వమునకు ఆధారము, ఆలవాలము కూడా! అట్టి ఈ ‘విశ్వము’ అనే గృహంలో జీవులందరు విశ్రమిస్తున్నారు. తమ స్వరూపమును తామే ఏమరచి (స్వప్నములో వలె) ఈ విశ్వములోని దృశ్య జగత్తునందు ఇంద్రియముల ద్వారా తన్మయులై చూస్తూ ఉంటున్నారు. ఆత్మవిషయమై కునుకులు తీస్తూ ఉన్నారు.

ఈ విశ్వము యొక్క :-
తూర్పు దిక్కు పేరు - ‘‘జుహూ’’।
దక్షిణ దిక్కు పేరు - ‘‘సహమానా’’।
పడమట దిక్కు పేరు - ‘‘రాజ్ఞీ’’।
ఉత్తర దిక్కు పేరు - ‘‘సుభూతా’’।
వాటి యొక్క వత్స (దూడ) / ప్రియపుత్రుడు - ‘‘వాయువు’’।

స య ఏతమేవం వాయుం దిశాంవత్సం వే, న పుత్ర రోదనం రోదతి। ఈ విధంగా నాలుగు దిక్కుల యొక్క వత్స (దూడ) వంటిదే ‘వాయువు’ - అని ఎవరు ఉపాసిస్తారో - అట్టివారు సంతానము వలన ఎట్టి దుఃఖము, కష్టము పొందరు. సంతానము ఆతనికి ఆనందము కలిగించువారు అవగలరు.

నేను ఆ తీరుగా వాయువును దిక్కుల యొక్క (మధ్యలోగల) వత్సగా (ప్రియపుత్రుడు, ఆవుదూడ)గా ఉపాసిస్తున్నాను. నాకు పుత్రశోకము ఉండదు. నా సంతానము పూర్ణాయుష్కులై ఉంటారు. నా ‘‘జీవాత్మ’’ అనే పుత్రుడు నాకు సంతోషము కలిగించువాడే అవుతాడు.

విశ్వోపాసన
→ ఈ విధంగా ‘‘అంతరిక్షము - భూమి - దిశలు - దిశావత్సయగు వాయువు’’తో సహా ‘అవినాశి’యగు ‘‘విశ్వకోశము’’ను (వాంఛలు ఈడేరుటకై) ఉపాసిస్తున్నాను.
→ వీటితో బాటుగా ‘‘ప్రాణము’’ను శక్తి కొరకై ప్రాణాభ్యాస పూర్వకంగా శరణువేడుచున్నాను.
→ వీటన్నిటితోబాటు భూలోకమును ఆరాధిస్తూ దైవీ - సంపత్తి కొరకై శరణాగతుడనై ఉంటున్నాను.
→ ‘అమరము’ అయి ఉన్న స్వర్గలోకమును కూడా అవసరములు తీరుటకై ఆరాధిస్తూ ఉన్నాను.
→ సంతానము యొక్క ఆయుర్దాయము కొరకై వాయువును ఉపాసిస్తున్నాను.
✻ ప్రాణమును శరణు వేడుచున్నాను. సర్వభూతజాలము ప్రాణస్వరూపమే। కనుక ప్రాణోపాసనచే సర్వభూతజాలము ఉపాసించువాడను అగుచున్నాను. ప్రాణస్వరూపముగా దర్శించుచున్నాను.
✻ భూలోకమును ఆరాధిస్తున్నాను. భూలోకములో ఆకాశము అంతర్ - బహిర్ సంస్థము కాబట్టి ఆకాశమునకు నమస్కరించువాడనే అగుచున్నాను.
✻ ఆకాశమునకు నమస్కరిస్తూ ఉన్నప్పుడు ఆకాశమునందు అంతర్లీనమైయున్న ద్యులోకమును, ద్యులోక దేవతలను స్తుతించువాడను అగుచున్నాను. సువర్లోకమును శరణువేడుచున్నట్లే అగుచున్నది.
✻ సువర్లోకమును ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వేదముల గానమునకు నమస్కరిస్తూ ఉన్నట్లే।
✻ ఈ తీరుగా ఋగ్వేదమునకు, యజుర్వేదమునకు, సామవేదమునకు నమస్కారము సమర్పిస్తున్నవాడను అగుచున్నాను.


16–3–16. తృతీయ అధ్యాయము - షోడశ ఖండము - పురుషోవా యజ్ఞః

ఈ జీవుడు పురుషకారము కలిగి ఉన్నాడు - (He has quality of workmanship). కనుక ‘పురుషుడు’ అనబడుచున్నాడు. జాగ్రత్-స్వప్న - సుషుప్తులు స్వకీయ పురుషకార చమత్కారములే కాబట్టి కూడా ‘పురుషుడు’ - అనబడుచున్నాడు.

అట్టి ఈ జీవుని పట్ల ‘జీవితము’ అనబడునది ‘యజ్ఞము’గా అభివర్ణించబడుచున్నది.

యజ్ఞమునందు (1) ‘‘ప్రాతః’’ సవనము (ఉదయము సమయము యజ్ఞకార్యక్రమము) (2) ‘‘మధ్యాహ్న’’ సవనము (మధ్యాహ్న యజ్ఞ విధులు) (3) ‘‘సాయం’’ సవనము (సాయంకాల యజ్ఞ విధానములు) ఉంటాయి.

జీవుని జీవిత కాలము కూడా అట్టిదే (బాల్య యౌవన వార్థక్యములు ఆ తీరైనవే)।

(1) ప్రాతః పురుష సవనము

ఈ జీవుడు పుట్టినప్పటి నుండి 24వ సంవత్సరము వరకు - పురుష ప్రాతః సవనము (లేక) ప్రాతఃకాల యజ్ఞము.

ప్రాణములు ఉన్నప్పుడే పంచేంద్రియములు (మరియు) పంచేంద్రియార్థములైనట్టి శబ్ద స్పర్శ రూప రస గంధములు శరీరములో నిలచి ఉంటాయి. కాబట్టి ప్రాణములకే ‘వసువులు’ అనే బిరుదు ఇవ్వబడుతోంది.

తం చేత్ అస్మిన్ వయసి కించిత్ ఉపతపేత్, స భ్రూయాత్ :…। ఈ పురుష ప్రాతః సవనమగు 24 సంవత్సరముల ప్రారంభ జీవిత కాలంలో ఏదైనా వ్యాధి వలన బాధ కలుగుచూ ఉంటే, వసు రూపులగు ప్రాణములను ఈ విధంగా ప్రార్థించాలి.

ప్రాణాః! వసవ ఇదం మే ప్రాతః సవనం మాధ్యన్దినగ్ం సవనమ్ అనుసన్తనుతేతి।
మాఽహం ప్రాణానాం మధ్యే యజ్ఞో విలోప్సేయేత్ ఉద్ధైవ।

ఓ ప్రాణదేవతలారా! ఈ ఉదయ సవనమును నా చేత చక్కగా చేయిస్తూ, మధ్యాహ్న సవనమునకై నన్ను చక్కగా సంసిద్ధుడయేట్లు తీర్చిదిద్దండి. యజ్ఞము మధ్యలోనే నేను వినష్ఠుడను కాకుండెదను గాక! (యజ్ఞరూపుడగు నేను మీ మధ్యలో విచ్ఛేదము పొందకుండెదను గాక!)

ఈ విధమైన ప్రార్థనచే అప్పుడు ఆతడు రోగము నుండి విముక్తుడై (వ్యాధినుండి కోలుకొని) ఆరోగ్యవంతుడు కాగలడు.

(2) పురు మాధ్యందిన సవనము

ఆ తరువాత 44 సంవత్సరముల వరకు (68 సంవత్సరముల వయసు వరకు) - పురుషుడు (జీవుడు) నిర్వర్తించు జీవితము యొక్క ఆయుష్షును మాధ్యందిన సవనము (మధ్యాహ్నము నిర్వర్తించు యజ్ఞ విభాగము) అని అంటారు.

ఇది 44 సంవత్సరాల కాలము అవటం చేతనే త్రిష్టుమ్ ఛందస్సు ‘‘44’’ అక్షరములతో కూర్చబడింది. మధ్యం దిన సవనము త్రిష్టుప్ ఛందస్సుకు చెందినది. అది రుద్రులకు సంబంధించి ఉంటోంది.

రుద్రులు = రోదనము కలిగించునవి. సకల ప్రాణులను రోదింపజేయుచూ ఉండటం చేత రుద్రులు.

ప్రాణములే రుద్రులు. ఎందుకంటే ప్రాణులందరినీ ప్రాణములే తపింపజేస్తాయి, రోదింపజేస్తాయి - కాబట్టి! ఈ జీవుల దేహములలో ఉండి ఏడ్చునని, ఈ జీవుని ఏడ్పించునవి - ప్రాణములే కాబట్టి, ప్రాణములే ‘రుద్రులు’.

తమ్ చేత్ ఏతస్మిన్ వయసి కించిత్ ఉపతపేత్ - స బ్రూయాత్ -
అట్టి రుద్రులకు సంబంధించిన మధ్యాహ్న జీవిత సవనము (24 సంవత్సరాలు నుండి 68 సంవత్సరాలు వరకు) ఏవైనా శారీరక వ్యాధులుగాని, మానసిక వేదనలు (ఆధులు)గాని సందర్భమైనప్పుడు ఈ విధంగా మధ్యాహ్న సవన రుద్రప్రార్థన (స్తుతి) సమర్పించెదరు గాక!

ప్రాణా రుద్రా! ఇదం మే మధ్యం దినగ్ం సవనం తృతీయ సవనమ్ అనుసంతనుతేతి।
మాఽహం ప్రాణానాగ్ం రుద్రాణాం మధ్యే యజ్ఞో విలోప్సీయేత్ ఉద్ధైవ।।

ప్రాణరూపులగు ఓ రుద్ర దేవతలారా! ఈ మా మాధ్యందిన సవనమును క్షేమముగా తృతీయ (మూడవ) సవనములో ఏకం చేయండి. ఈ మధ్యాహ్న యజ్ఞమును మూడవ యజ్ఞముతో కలపండి. యజ్ఞస్వరూపుడనైయున్న నేను ప్రాణదేవతలైన రుద్రుల మధ్యలో వినష్టుడను, నశించువాడను కాకుండెదను గాక।

ఈ విధమైన ప్రార్థనచే ఆ రోగి శారీరక, మానసిక బాధల నుండి విముక్తుడై ఆరోగ్యవంతుడు కాగలడు.

(3) తృతీయమగు పురుష సాయం సవనము

24+44 సంవత్సరముల తరువాత (68 సంవత్సరముల తరువాత) - ఆపై 48 సంవత్సరముల జీవితకాలము (ఆయుష్షు)ను ‘‘పురుష తృతీయ సవనము’’ అని పిలుస్తున్నారు.

ఈ 48 సంవత్సరముల తృతీయ సవన ఆయుష్షును (జీవితమును) దృష్టిలో పెట్టుకొనే ‘‘జగతీ ఛందస్సు’’ నిర్మితమైనది. అందుచేతనే జగతీ ఛందస్సు 48 అక్షరములు కలిగి ఉంటోంది. ఈ మూడవ విభాగమనే జీవిత యజ్ఞము జగతీ ఛందస్సుకు చెందినది అగుచున్నది.

కనుక ప్రాణములే శరీరమునకు బాహ్య - అభ్యంతరములందు వేంచేసియున్న ‘ఆదిత్యులు’:
శబ్దస్పర్శాది సర్వ విషయములు - ఆదిత్యులు ప్రాణ స్వరూపులై స్వీకరించుచున్నారు.

అట్టి ఈ తృతీయ సవన ఆయుఃకాలములో ఏవైనా శారీరకమైన (లేదా) మానసికమైన రోగములు, వేదనలు (ఆధులు) కలుగుచున్నప్పుడు-

తం సేత్ ఏతస్మిన్ వయసి కించిత్ ఉపతపేత్, స బ్రూయాత్… ప్రాణ స్వరూపులగు ఆదిత్యులను ఈ విధంగా పార్థనలు చేసి ఉపశమనము పొందెదరు గాక।

ప్రాణా ఆదిత్యా। ఇదం మే తృతీయ సవనమ్ ఆయుః అనసన్తనుతేతి।
మాఽఽహం ప్రాణానామ్ ఆదిత్యానాం మధ్యే యజ్ఞో విలోప్సియేత్ ఉద్ధైవ।।

ఓ ప్రాణస్వరూప ఆదిత్యులారా! ఈ మూడవ సవనము (యజ్ఞము) నిర్వర్తించబడుటకై ఆయుష్షు ప్రసాదించండి. నేను పూర్ణాయుర్దాయుడను అగుదును గాక! ‘యజ్ఞరూపుడనే’ అయి ఉన్న నేను ప్రాణరూపులగు ఆదిత్యుల మధ్య వినష్టుడనై, నాశనము పొందకుండెదను గాక।

తత ఏత్యగదో హైవ భవతి। అప్పుడు అట్టివాడు ఆ శారీరక రోగముల నుండి, మానసిక రుగ్మతుల నుండి విముక్తుడు కాగలడు.

- - -

ఈ యజ్ఞ సిద్ధాంతమును అనేకులు ఆచరిస్తూ శారీరక, మానసిక రుగ్మతల నుండి విముక్తిని పొందుచున్నారు. తదితరులకు ఆయురారోగ్యములను ఆశీర్వదించు వాక్ శుద్ధి పొందుచున్నారు.

- - -

ఒక సందర్భములో ఐతరేయ మహిదాస మునీశ్వరునితో ఆయన శిష్యులు ఈ విధంగా సత్సంగపూర్వక సంభాషణ నిర్వర్తించారు.

శిష్యులు : గురుదేవా! ఐతరేయ మహిదాస మునీంద్రా! మీరు 116 సంవత్సర పూర్ణాయుష్కులై, మా యొక్క శారీరక మానసిక రుగ్మతలను మీ ఆశీర్వాదములచే తొలగిస్తూ మమ్ములను ఆత్మవిద్యావంతులుగా తీర్చుదిద్దుచున్నారు. మీకు సాష్టాంగ దండప్రణామములు సమర్పిస్తున్నాను.

గురు మహరాజ్! మీ ఇట్టి అత్యంత శుభఫలప్రదమగు దీర్ఘాయుష్షు సిద్ధించుటకు కారణము ఏమిటి? ఎట్టి ఉపాసనా సంపన్నులై ఉన్నారు?

ఐతరేయ మహిదాస మునీంద్రులు : నేను ప్రాతఃసవన (24 సంవత్సరాలు) - మాధ్యందిన సవన (44 సంవత్సరాలు) సాయంసవన (48 సంవత్సరాలు) పురుష జీవిత యజ్ఞమును నిర్వర్తిస్తూ ఉన్నాను. మీరు కూడా స్తుతించండి. ఉపాసించండి. మహిమను తెలుసుకోండి. అంతేగాని నన్ను ప్రశ్నించటమెందుకు?

ఈ విధంగా శ్రీ ఐతరేయమహిదాస మునీంద్రులవారు నిండు 116 సంవత్సరాలు జీవించి ఆధ్యాత్మక మార్గదర్శకులై అనేక మంది అధ్యయన విద్యార్థులను తీర్చిదిద్దారు. అట్టి ఈ జీవిత యజ్ఞమును (జీవన సవనమును) ఎవరు ఎరుగుచూ, ఉపాసిస్తూ ఉంటారో, అట్టివారు 116 సంవత్సరాల పూర్ణాయుష్కులు కాగలరు. శక్తిమంతులై జ్ఞానవంతులై జీవించగలరు.

‘‘ఓ రోగమా! నీవు నాకు తాపము కలిగించలేవు. ఎందుకంటే యజ్ఞ రూపుడనగు నేను నీవు కలిగించబోవు తాపముచే మరణించువాడను కాను!’’ - అని రోగి రోగమును ప్రార్థన చేయును గాక! నిశ్చయము కలిగి ఉండును గాక!


16–3–17. తృతీయ అధ్యాయము - సప్తదశ ఖండము - జీవితమే యజ్ఞము

యజ్ఞము - ఆత్మ నిర్వర్తిస్తూ ఉన్న ‘‘సృష్టికల్పన’’ అనే యజ్ఞములోని ఒక కర్తృత్వ కల్పనా స్వరూపమే - ఈ ‘జీవుడు’!

యజ్ఞ దీక్షలు - ఈ జీవుడు ఆకలి దప్పికలు కలిగి ఉంటున్నాడు. అస్వతంత్రుడైనట్లు అనుభవమంతా పొందుచున్నాడు. సుఖదుఃఖములు అనుభవిస్తున్నాడు. ఏవేవో కోరికలు (Expectations, Anticipations and wishes) కలిగి ఉంటున్నాడు. ఊరకే నవ్వుచున్నాడు. ఊరకే ఏడుస్తున్నాడు. కొన్ని కోరికలు తీరినప్పుడు ‘‘నేను బలముచే, సంపదచే, బంధువులచే సమృద్ధుడను’’ అని తలచుచున్నాడు. ఇంతలోనే కొన్ని లోటు-పాట్లను గమనించి, ‘‘ఇదీ నా గతి! ఏమి చెప్పాలి? దేవుడు నా పట్ల సుముఖుడు కాదు’’ - అని బాధితుని వలె ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. యజ్ఞవిధులు పాటించటములో కర్తకు కొన్ని కష్టములు, దుఃఖములు ఉంటాయి కదా! ఇక్కడి జీవుని జీవిత యజ్ఞము కూడా అట్టిదే।

ఉపసత్తు (అనుభూతులు) - ఈతడు ఆహార పదార్థములు తినుచున్నాడు. పానీయములు త్రాగుచున్నాడు. కోరుకొన్న పదార్థములు మొదలైనవి ఆస్వాదిస్తూ, రమిస్తూ ఉండటము, ఆయా నవ్వుకోవటము మొదలైన ఉల్లాసములన్నీ యజ్ఞ విధులలోని ఉపసత్తులు (ఓపిక కొరకు యజమాని తీసుకొనే పాలు, పళ్ల రసము మొదలైన పానీయములు) వంటివి.

స్తుత-శస్త్రములు - యజ్ఞములో స్తుతులు, ఋక్కుల పఠణములు అనే శస్త్రములు ఉంటాయి కదా! ఈ జీవుని ‘జీవితము’లో నవ్వులు తిని ఆనందించటము, మైథునము (సంభోగించటము)… ఇవన్నీ జన్మ సంబంధమైన స్తుత- శస్త్రములు (దైవస్తుతులు, వేద పఠణములు మొదలైన) యజ్ఞ విభాగముల వంటివి.

దక్షిణలు - యజ్ఞంలో దక్షిణలు ఇస్తారు కదా! అట్లాగే తపస్సు చేయటం; దానము ఇవ్వటం, మాటలో ఆర్జవము (కుటిలత్వము లేకపోవటము); ఎవ్వరిని బాధించనట్టి అహింసా స్వభావము; సత్యమే చెప్పటము - ఇవన్నీ - యజ్ఞములో దక్షిణ ఇవ్వటము వంటివి.

ఇష్ట - ఈతడు తల్లి గర్భంలోనుండి బయటపడి పుట్టాడు. ఇదియే యజ్ఞములో ఇష్ట విభాగము. ప్రారంభ స్తుతులు, గానములు వంటివి.

పునరుత్పాదనము - ‘‘జన్మ’’ అనగా అంతకుముందు శరీరము వదలి క్రొత్త శరీరము తీసుకోవటము వంటిదే కదా! కనుక పుట్టటమే ‘పునరుత్పాదనము’.

అవభృథ స్నానము - యజ్ఞము సమాప్తి అయిన తరువాత యజ్ఞకర్త దంపతులచే ఋత్విక్కులు మంత్రజలముతో స్నానం చేయిస్తారు కదా! మరణించినవాని భౌతిక దేహము స్నానము చేయించటమే - జీవిత యజ్ఞము యొక్క ‘‘అవభృథ స్నానము’’

ఇట్టి ఈ ఆత్మయజ్ఞోపాసన (లేక) ‘‘జీవిత యజ్ఞము’’ అనే విశేషమును యజ్ఞ విధానమును ఒకానొక సందర్భములో ఘోర అంగీరస మునివర్యులవారు దేవకీపుత్రుడు, నారాయణ అవతారమూర్తి అగు శ్రీకృష్ణ భగవానునికి బోధించటము జరిగింది.

‘‘ఈ ఆత్మ యజ్ఞోపాసన → సమస్త యజ్ఞముల అనివార్య ఆవస్యకత (అవసరము) లేకుండా చేయగలదు’’ - అని శ్రీకృష్ణునికి అంగీరసముని బోధించారు. అది అట్లే ప్రసంశించబడి శ్రీకృష్ణునిచే స్వీకరించబడింది. అన్యము పట్ల అతీతత్వము సిద్ధించుకొని శ్రీకృష్ణుడు అనన్యులు అచ్యుతులు అయ్యారు. సమస్తమునకు పరమగు, సమస్తము అయి ఉన్న స్వస్వరూపమునందు స్వస్థితిని, సుస్థితిని స్వాభావికము చేసుకొన్నవారైనారు.

ఘోర ఆంగీరస మహాశయులవారు ఇంకా ఇట్లా బోధించారు.

ఓ శ్రీకృష్ణా! స్వతఃగానే ఆత్మగా చ్యుతి లేనివాడవు. మార్పు లేనివాడవు. ప్రాణశక్తికే సూక్ష్మాతి సూక్ష్మమగు ఆత్మవు!


ఆత్మయజ్ఞము నిర్వర్తించు యోగి ‘3’ మంత్రములు ఆశ్రయించువాడై ఉంటున్నాడు.

సో అంతవేలాయామ్ ఏత త్రయం ప్రతిపద్యేత। అధ్యాత్మ జ్ఞాన యోగాభ్యాసి నిరంతరము తన కేవలమగు పరస్వరూపము గురించి (లేక) పూర్ణమగు ఆత్మ గురించి ఈ విధమైన ‘3’ ధ్యానములు (లేక) ‘3’ మననములు నిర్వర్తించుచుండును గాక! ఈ విధంగా ఆత్మ గురించిన గానము చేయుచుండును గాక।

(1) అక్షితమసి।
నా యొక్క పరాత్పరత్వమగు ఓ ఆత్మస్వరూప భగవాన్!
మీరు క్షీణించటము అనే ధర్మము ఏమీ లేనివారు. సదా యథాతథమైయున్నవారు। అందుచేత మమ ‘అక్షితమ్’ (క్షితము లేనివారు)!
ఆత్మ తత్త్వమా! నీవు సమస్తమునకు వేరైన కేవల ద్రష్టవు.

(2) అచ్యుతమసి।
ఓ స్వస్వరూప నిర్మల పరాత్మా! నీవు నీ యొక్క స్వస్థానమునందు నిశ్చలమయ్యే ఉన్నారు. అంతేగాని జీవాత్మగా గాని, జగత్తుగా గాని అగుటలేదు. కేవలము, నిర్మలము, అఖండము నుండి చ్యుతి పొందటం లేదు. అందుచేత అచ్యుతము (క్షిత్రము లేనివారు).

(3) ప్రాణసగ్ంశితిమసీతి।
సూక్ష్మమగు ప్రాణ(శక్తి) స్వరూపము అయి ఉన్నావు. సూక్ష్మమగు ప్రాణమునకే ప్రాణేశ్వరుడవు.
ఈ విధమైన ‘3’ సవనములను జీవాత్మగా (As a Unit) ‘‘తన యొక్క, సమస్త జీవుల యొక్క, ఈ జగత్తు యొక్క ఆత్మ’’ అగు ‘పరమాత్మ’ (Unity) గురించి గానము, సవనము, స్తుతి, మననము, బుద్ధి యొక్క ఏకాగ్రతను నిర్వర్తించునుగాక।

ద్వే-ఋక్ గానములు

ఆత్మ గురించి విచారణ తపస్సులను చేసిన మహనీయులు ఆత్మ గురించి అనుభవము పొందినవారై, ఆత్మ - తత్త్వమును గానం చేసి ప్రపంచమునకు వినపించినవే ‘‘ఋక్కులు’’. పరమ సత్యము గురించి స్తుతి - ప్రబోధము - గుర్తు చేయటము - సూచనము అగు మార్గదర్శక సూత్ర వాక్యములు ఋక్కులు. అనుభవం నుండి వచ్చిన శాస్త్ర వాక్యములు కాబట్టి ఋక్కులు (ఋక్= పరమసత్యము); అవి గానము చేసిన వారిని ‘ఋషులు’ అని, అవి గ్రంథస్థమైన వేద విభాగమును ఋగ్వేదము అని చెప్పబడుతోంది.

అనగా ఋక్కులు గాని, సమస్త వేదములు గాని - ‘‘తెలుసుకొన్నవారు’’ → తెలుసుకోవాలని అనుకునే వారిని తీర్చిదిద్దడానికి ఎలుగెత్తి గానము చేయబడినవి.

అనుభవమే గ్రంథకర్తగాని ఒకరు మాత్రమే గ్రంథకర్త కాదు. అందుచేత వేదములు ‘అపౌరుషేయములు’ అని, విని తెలుసుకోవలసినవి కాబట్టి ‘శ్రుతులు’ అని అనబడుచున్నాయి.

అక్షితము (వేరై చూచుచున్నట్టిది), అవినాశి (నాశము లేనిది), అచ్యుతము (చ్యుతి లేనిది) ‘ప్రాణసంశితము’ అగు ఆత్మ గురించి (About the one’s own Absolute I) - రెండు ఋక్కులు ఇక్కడ చెప్పుకుంటున్నాము.

ఓ సర్వజనులారా! శృణ్వంతి విశ్వే। ఈ రెండు ఋక్కులు వినండి।

(1) ఆది తత్ పత్నస్య రేతసః। జ్యోతిః పశ్యంతి వాసరమ్। పరో యదిధ్యతే దివి।
సమస్తమునకు ముందే ఉండటం చేత ‘‘ఆది’’ (సనాతనము). ఈ జగత్తుకు తానే కారణం కాబట్టి ‘జగత్ కారణము’. అట్టి బ్రహ్మమును సర్వవ్యాపకతా విశేషముగా తత్త్వజ్ఞులగు మహనీయులు సదా దర్శిస్తున్నారు. అగ్నికి ప్రకాశమువలె బ్రహ్మము యొక్క ప్రకాశ స్వరూపమే ఈ జగత్స్వరూపము. ఈ ఇంద్రియములకు తారసబడుచున్న సమస్తము చైతన్యరూపమగు బ్రహ్మమునందే సుప్రతిష్ఠితము.
ఇట్టి సందర్శనము అభ్యసిస్తూ క్రమంగా బ్రాహ్మీదృష్టిని స్వాభావికము, అనునిత్యము, అచ్యుతము చేసుకోండి.

(2) ఉత్ వయం తమసః పరిజ్యోతిః పశ్యన్త। ఉత్తరగ్ం స్వః పశ్యన్త।
ఉత్తరం దేవం దేవత్రా సూర్యమ్ అగన్మ జ్యోతిః ‘ఉత్తమ’మితి। జ్యోతిః ‘ఉత్తమమ్’ ఇతి।।

మేము తమస్సును దాటినట్టి ఆవల గల పరిజ్యోతిని చూస్తున్నాము. ఆవల గల స్వస్వరూపమునే అట్టి పరంజ్యోతిగా దర్శిస్తున్నాము. అది దేవతా లోకమునకు కూడా ఉత్తరము (ఆవల). సూర్యునివలె మహత్తరమగు ఆవల గల జ్యోతి స్వరూపమే నేను. సర్వదా పరంజ్యోతి స్వరూపమును పొందియే ఉన్నాను.
సకల దేవతలయందు ప్రకాశరూపుడై తన రస స్వరూప కిరణములచే సర్వదా ప్రేరేపించుచున్న జ్యోతిని గమనిస్తున్నాము. జ్యోతులకే ఉత్తమ జ్యోతిని పొందుచున్నాము.

ఈ విధంగా సర్వాత్మకమగు స్వస్వరూపము గురించి గానము చేయుచుండెదరు గాక!


16–3–18. తృతీయ అధ్యాయము - అష్టాదశ ఖండము - బ్రహ్మము గురించిన చతుష్పాద ఉపాసన

అధ్యాత్మోపాసన - మనో ఉపాసన : మననము చేయుటమే మనస్సు యొక్క రూపము.
అద్దము నిశ్చలముగా (కదలక) ఉండగా, అందులో ప్రతిబింబించే దృశ్యములు (కదులుతూ) అనిశ్చలము కదా! ‘మనస్సు’ అనేది దర్పణము వంటిది.
దృశ్యముగా అనుభవమయ్యేదంతా మనోదర్పణ - అంతర్గత ప్రతిబింబ వ్యవహారము వంటిది.

అందుచేత -
మనో బ్రహ్మేతి। ‘‘మనస్సే బ్రహ్మము’’। ఈ భౌతిక దేహములో ఏ మనస్సు ప్రవర్తించుచూ కనిపిస్తోందో - అట్టి మనస్సు బ్రహ్మముగా ఉపాసించబడుగాక! (గమనిక : నిజమునకు సూక్ష్మమైన మనస్సులోనే దేహములు ప్రకటితమగుచున్నాయి).

మననము చేయటమే మనస్సు. ‘‘మననము చేయటము’’ అనుదానిని బ్రహ్మముగా ఉపాసించటమే ‘‘మనో బ్రహ్మోపాసన’’ తనలోని మనస్సే బ్రహ్మముగా ఉపాసించటమును ‘‘తనయందు తాను- ఆత్మోపాసన’’ కాబట్టి ‘‘అధ్యాత్మోపాసన’ అనబడుతోంది.

అధ్యాత్మము (దేహము యొక్క తత్త్వము) ఉపాసించటము : దేహమునకు సంబంధించిన ఈ ధ్యానము (అధ్యాత్మ ధ్యానము) ‘4’ పాదములు కలిగి ఉన్నది.
తదేతత్ చతుష్పాదే బ్రహ్మ।
(1) వాగింద్రియము (2) ప్రాణము (3) నేత్రములు (చూపు) (4) శ్రోత్రియము (వినికిడి) - ఇవి ‘మనస్సు’ అనే బ్రహ్మము యొక్క 4 పాదములు.

వీటి గురించి వివరించుకుంటున్నాము.

అధ్యాత్మిక ‘4’ పాదముల గురించి (లేక) ‘మనస్సు’ యొక్క ‘4’ పాదముల గురించి

1.) వాక్ ఏవ బ్రహ్మణః

మనస్సు యొక్క మొదటి పాదము : వాక్ ఇంద్రియము : ఇది అగ్ని యొక్క జ్యోతి (తేజో) రూపమైనట్టి పాదము. ఒకడు తాను మనస్సుతో ఏది యోచిస్తాడో ఆ ఆలోచించినది ఎదుటివాడికి చెప్పాలంటే - అది చెప్పగలిగేది వాక్కు ద్వారానే కదా! వాక్కుగా ప్రదర్శనమయ్యేది ఆత్మస్వరూపమగు మనస్సు చేసే భావన యొక్క తేజో ప్రదర్శనమే.

వాగేవ బ్రహ్మణః చతుర్థ పాదః। సో అగ్నినా జ్యోతిషా భాతి చ। తపతి చ।
బ్రహ్మము యొక్క అగ్ని - జ్యోతి స్వరూపమే ‘వాక్కు’గా జీవునియందు, దేహమునందు వెలుగొందుచున్నది.

భాతి చ తపతి చ కీర్త్య యశ, సా బ్రహ్మవర్చసేన య ఏవం వేద!
ఎవ్వరైతే ‘‘బ్రహ్మమే వాక్కు రూపంగా ప్రకాశించుచు, సమస్తమును శబ్దములుగా, వాక్యములుగా, వేదమంత్రములుగా, ఉపనిషత్ పరమార్థములుగా ప్రదర్శనమగుచున్నది’’ - అని ‘‘వాక్కు’’ను ‘‘బ్రహ్మము’’గా ఉపాసిస్తారో, తపస్సు చేస్తూ ఉంటారో - అట్టివారు గొప్ప కీర్తిని, యశస్సును పొందగలరు. బ్రహ్మము యొక్క వర్చస్సును పొందుచూ, క్రమంగా తమ యొక్క స్వరూపము బ్రహ్మముగా దర్శించువారై ఫలశ్రుతిగా బ్రహ్మానందము సిద్ధించుకోగలరు.

2.) ప్రాణ ఏవ బ్రహ్మణః

ప్రాణమే బ్రహ్మము. అట్టి ప్రాణ బ్రహ్మమే పూర్ణ బ్రహ్మము యొక్క 4 పాదములలో ఒకటి.
‘ప్రాణము’ అనగా ‘శక్తి’. ఆ శక్తి చేత వాయువులో చలనములు ఏర్పడి వాయు తరంగములు అంతటా విస్తరించి కదలికలు ప్రదర్శించుచున్నాయి. కదిలించేది ప్రాణబ్రహ్మము. కదిలేది వాయు తరంగములు.

స వాయునా జ్యోతిషా భాతి చ। తపతి చ। అట్టి శక్తిచే కదలించి వాయు తరంగములు కల్పించుటచే వాయు చేతనముల నుండి (వాయు తరంగముల కదలిక నుండి) కాంతి, వేడి కలుగుచున్నాయి. అట్టి వాయువుగా ఆత్మజ్యోతియే భాసించుచున్నది. సమస్తమును తపింపజేయుచున్నది.

ఎవ్వరైతే వాయు చలనమును ఆత్మచైతన్య ప్రదర్శనముగా ఉపాసిస్తారో, తపస్సు చేస్తారో - అట్టివారు కీర్తి, యశస్సు, బ్రహ్మవర్చస్సు పొందినవారగుదురు. బ్రహ్మమే తామై వాయు చలనమును చైతన్యపరచుచూ ప్రకాశింపజేయువారై ఆనందించగలరు. సర్వత్రా స్వాభావిక ప్రాణ నిరోధమును సిద్ధించుకోగలరు.

3.) చక్షురేవ బ్రహ్మణః

బ్రహ్మము యొక్క 4 పాదములలో మరొక పాదము ‘‘చక్షువులు - చూపు’’, ఆదిత్యుడగు సూర్యభగవానుని తేజస్సే సమస్త జీవుల నేత్రములలో ‘చూపు’ అనే తేజోరూపమై విలసిల్లుతోంది. చక్షుః తేజో। చూపు తేజోరూపమై దృశ్యమంతా సాకారముగా తపింపజేయుచు ఆస్వాదిస్తూ ఉన్నది. అట్టి దృష్టి (చూపు)యే నేత్ర ప్రకాశము, ఆత్మ యొక్క స్వయం తేజో - చైతన్య స్వరూపము అయి ఉన్నది.

ఎవడైతే నేత్రములలోని చూపును బ్రహ్మము యొక్క తేజస్సుగాను, బ్రహ్మము యొక్క ఒక పాదముగాను తెలుసుకొని ఉపాసిస్తాడో, - అట్టివాడు కీర్తిని, యశస్సును, బ్రహ్మతేజస్సును పొంది జీవితమును పావనము చేసుకోగలడు.

4.) శ్రోత్రమేవ బ్రహ్మణః

‘‘చెవి- వినికిడి’’ బ్రహ్మము యొక్క చతుఃపాదములలో ఒకటి. ఆత్మచైతన్యమే - చెవులలో ‘వినుట’ అనే రూపముగాను, దిక్కులలో చైతన్యప్రకాశముగాను ప్రభవించుచున్నది.

ఎవరు చెవులలో వినికిడి రూపముగాను, 10 దిక్కులలో శబ్దరూపముగాను గల ఆత్మతేజోచైతన్యమును ఎరిగి ఆత్మ యొక్క పాదముగా ఉపాసిస్తారో - వారు కీర్తిని, యశస్సును, బ్రహ్మతేజస్సును పొంది జీవితమును సాఫల్యము, ఆత్మ తేజోమయము చేసుకోగలరు.


16–3–19. తృతీయ అధ్యాయము - ఏకోనవింశ ఖండము - ఆదిత్యో బ్రహ్మ - ఇతి ఆదేశః

ఏ తేజస్సు సూర్యునిలో వెలుగొందుచున్నదో, ఆ తేజస్సే సమస్త దేహములలో ప్రాణశక్తిగాను, చూపు-వినికిడి - స్పర్శ మొదలైన తేజస్సులుగా వెలుగొందుచున్నది. సమస్తమునకు ‘ఆది’ అయినట్టి అట్టి ఆదిత్య తేజస్సే బ్రహ్మము. అది బ్రహ్మము యొక్క పాదము. అందుచేత ఆదిత్యుని యందు ‘పూర్ణ బ్రహ్మోపాసన’ను విధించటము గురించి చెప్పుకుంటున్నాము.

- - -

ఆదిత్యో బ్రహ్మ - ఇతి ఆదేశః। ‘‘ఆదిత్యుడు (సూర్యుడు) బ్రహ్మమే।’’ - అని ఉపాసించాలి. ఇది ఆదేశము (This is an order to be complied with). అట్టి ఆదేశము గురించి ఇప్పుడు వ్యాఖ్యానించుకుంటున్నాము.

మొట్టమొదట బ్రహ్మమే ఉన్నది. అట్టి తరువాతిదంతా బ్రహ్మము యొక్క వ్యాఖ్యానము మాత్రమే (Interpretation of Brahman). బ్రహ్మము యొక్క స్తుతియే!

ఆదిత్య తేజస్సే ఈ కనబడే దృశ్యము యొక్క సమస్తమునకు ముందు ఏర్పడినదై ఉన్నది. అనగా మొట్టమొదట ఈ జగత్తు లేదు (అసత్తు). ఆత్మ తేజము మాత్రమే ఉండిఉన్నది. అట్టి కేవల తేజస్సు ‘‘నేను ఉన్నాను’’… అను రూపము గల ‘‘సత్’’గా అగుచున్నది.

అట్టి ‘సత్’ - అంకురించినది (The Feature of generating commenced). అట్టి అంకురము నుండి అండము బయల్వెడలింది. ఇదియే ‘‘బ్రహ్మాండము’’ అనబడుతోంది. అట్టి అండము (బ్రహ్మమాన) సంవత్సర కాలము అదే అండము ఆకారముగా ఉండి, ఆ తరువాత పగిలింది (Blasted big bang).

బ్రహ్మాండము పగిలి - రెండు విభాగములుగా అయినది. ఆ రెండు భాగములలో ఒక ఒర (part) వెండి రంగులోను, మరొకటి బంగారపు రంగులోను మెరువసాగాయి.

(1) తత్ యత్ రజతగ్ం సేయం ‘‘పథివీ’’।
రజతము (వెండి)గా వెలుగొందుచూ ఉన్నట్టిది ‘‘పృథివి (భూమి)’’.

(2) యత్ సువర్ణగ్ం సా ‘ద్యౌః’’। బంగారపు రంగులో ప్రకాశించునది ద్యు(స్వర్గ) లోకము.

(3) బ్రహ్మాండము యొక్క బాహ్యమున చర్మముగా ఉన్నట్టిది.
యత్ జరాయుజే పర్వతా। అవియే పర్వతములు - పర్వత శిఖరములు.

(4) యత్ ఉద్బలగ్ం స మేఘో, నిహారో।
ఉద్బలము (మావి) వంటివి - మేఘములు. మేఘములతో కూడిన ‘మంచు’.

(5) యా ధమన, యస్తా నద్యో।
శరీరములోని నాడులు నదుల వంటివి.

(6) యద్వ అస్తేయమ్ ఉదకగ్ం స సముద్రః।
సముద్రములు అడుగు భాగమున ఉన్న జలము - మూత్రాశయములోని జలములు వంటివి.

‘‘బ్రహ్మాండము శరీరము వంటిది’’

ఆ బ్రహ్మాండము నుండి ఆదిత్యుడు (సూర్యగోళ తత్త్వము) జనించారు. అట్టి సూర్యగోళము జనించిన తరువాత పెద్దపెద్దగా ఘోషశబ్దములు (Big Bang) జనించాయి. ఆ ఘోష శబ్దముల నుండి సర్వ జీవరాశులు, ఆయా వివిధ వస్తు జాలములు పుట్టుకువచ్చాయి.

‘‘ఆదిత్యుడు బ్రహ్మాండమునకు ‘శరీరి’ వంటివాడు’’ అందుచేతనే సూర్యోదయము కాలమునందు, అస్తమయ కాలమునందు సునిశితమైన చెవులు కలవారికి వేదఘోషల వంటి శబ్దముల వినబడుచూ ఆనందము కలిగిస్తున్నాయి. ఈ సృష్టి సర్వదా ఆనందము కొరకే!

అభ్యాసో హ యదేనగ్ం సాధవో ఘోషా
ఆ చ గచ్ఛేయుః ఉప చ నిమ్రేడేరన్। నిమ్రేడేరన్।

పైన మనము చెప్పుకొన్న ఉపాసనలు నిర్వర్తించుచూ బ్రహ్మమునే ఉపాసించువారికి (భావించువారికి) ఉత్తమము, శోభాయమానము, సముద్ధరించునవి అగు ఘోష శబ్దములు వినబడగలవు. అవి ఆతనికి ఆత్మ సుఖమును కలిగించగలవు.
బ్రహ్మానందము, సర్వానందము కలిగించగలవు.


ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్
తృతీయ అధ్యాయః సమాప్తః




16–4.     ఛాందోగ్యోపనిషత్ - అధ్యయన వచన పుష్పము - చతుర్థ అధ్యాయము


16–4–1. చతుర్థ అధ్యాయము - ప్రథమ ఖండము - దానము మొదలైన కర్మల తేజస్సు - ఆత్మోపాసనా తేజస్సు

మనము బ్రహ్మము యొక్క 4 పాదముల (వాక్కు, ప్రాణము, చూపు, వినికిడి) గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాము కదా!
ఇప్పుడు వాటిని ‘‘సాక్షాత్ బ్రహ్మము’’గా ఉపాసించే (త్వమేవ ప్రత్యక్షమ్ బ్రహ్మాసి।) విధానము గురించి ఒక దృష్టాంతము సహాయముతో వివరించుకుంటున్నాము.

విద్యను నేర్చుకోవటానికి శ్రద్ధ, దానము, నిగర్వము, తత్పర మొదలైన లక్షణముల ఆవస్యకత దృష్టిలో పెట్టుకొని ఒక సంఘటన చెప్పుకుంటున్నాము.

- - -

‘‘ఓం’’! మహావృషల దేశమును వంశపారంపర్యంగా పరిపాలించే జనశ్రుతి వంశములో పుట్టినవాడు, ఆ జనశ్రుతుని మునుమనుడు జానశ్రుతుడు - రాజుగా ఉండేవారు. ఆయనకు ‘దానము’ విషయములో ఎంతో ఇష్టము, మరెంతో శ్రద్ధ ఉండేవి. అనేక దానములు చేస్తూ ఉండేవారు. గొప్ప యజ్ఞాలు చేస్తూ, అన్నదానమే మహాయజ్ఞంగా భావించేవారు. స్వయముగా అనేక ధర్మసత్రములు కట్టించారు. ఆ ధర్మశాలలో కూడా బాటసారులకు, పేదవారికి అన్నదానం నిర్వర్తించేవారు. ఈ విధంగా ఆ రాజ్యంలో ఎవరికీ ఎక్కడా ఆకలి బాధ ఉండేదేకాదు.

ఒకానొకరోజు సాయంకాలం చీకటిపడుచున్న సమయంలో జానశ్రుతుడు రాజమందిరపు మేడపై గల విశాల ప్రదేశంలో (రాజప్రాసాదము పైభాగముపై) అటూ ఇటూ పచార్లు చేస్తూ, నిండు పున్నమి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ఇష్ట దైవ ప్రార్థన చేసుకొంటూ ఉన్నారు.

అప్పుడు ఆకాశంలో రెండు రాజహంసలు ఆ మేడ పైభాగపు విశాలాకాశంలో ఏదో సంభాషించుకొంటూ, విహారములు చేస్తూ తన వైపు చూస్తూ ఉండటము ఆయనకు కనిపించింది. ‘‘ఈ రాజహంసలు ఏదో ముఖ్యమైన విషయం నా గురించి సంభాషించుకుంటున్నట్లు ఉన్నాయి. ఏమిటది? విందాము’’ అని తలిచారు. బుద్ధిని సూక్ష్మతరం చేసి, పక్షుల భాషను ఎరిగి ఉండటం చేత, ఆ సంభాషణను ఏకాగ్రంగా వినసాగారు.

- - -

మొదటి రాజహంస : (ముందుగా ఉండి ఎగురుచున్న రెండవ రాజహంసను చూచి) మిత్రమా! భల్లాక్షా! ఆగు"! ఏమిటా పరుగు? ఇక్కడ మనం సంచరించేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఎగరాలయ్యా! కళ్లు తెరచి చుట్టూ చూస్తూ ఎగరండి మరి!

రెండవ రాజహంస : ఏం? ఎందుకట? జాగ్రత్తగా చూస్తూ ఎగరమని మీరు ఎందుకు అంటున్నారు? ఇక్కడి ప్రత్యేకత ఏమిటి?

మొదటి రాజహంస : హోహోయి! భల్లాక్ష! భల్లాక్ష! ఇదిగో“ మీరు అటూ ఇటూ సరిగా గమనించకుండా ముందుకు పోతున్నారేమోనని ‘‘భల్లాక్షా!’’ హ్రస్వదృష్టి! రోష దృష్టి కలవాడా!’’ - అన్నాను లే”!

రెండవ హంస : ఇక్కడ ఏ ప్రత్యేకత ఉన్నది? ఏమి ప్రమాదము మీకు కనిపిస్తోంది?

మొదటి హంస : ఏమున్నదని అడుగుచున్నారేమిటి?
అక్కడి జానశ్రుతుని చూస్తున్నారా? జానశ్రుతేః పౌత్రాయణస్య సమం దివాజ్యోతిరాతతం! ఈయన యొక్క అన్నదానము, ధర్మశాల నిర్మాణములు మొదలైన కార్యక్రమముల పుణ్యతేజస్సు ఊర్ధ్వ స్వర్గలోకము (ద్యులోకము) వరకు తేజో అగ్నిరూపంగా వ్యాపిస్తూ ఉండటం గమనించటం లేదా ఏమి? అందుచేత ఈ జానశ్రుతి పౌరాయణుని అన్నదానము చేసిన పుణ్యతేజస్సు తాకవద్దు. తాకారో … అది మిమ్ములను కాల్చగలదు సుమా! అందుకని జాగ్రత్తగా ఎగురుచూ ఉండండి! హెచ్చరిక చేసి చెప్పుతున్నాను. సరేనా"!

రెండవ హంస : (పకపక నవ్వుచూ) ఓయీ! అజ్ఞాన మిత్రమా! అదా, మీరు అనేది! ఈతని అన్నదాన - అన్న సత్ర నిర్మాణ పుణ్య తేజస్సు చూసి అంత గొప్పగా చెప్పుచున్నారే? కొంచెము చూసి ‘ఘనం’ అంటున్నారేం? మీరు విషయం సమగ్రంగా చూడటం లేదు. అన్నివైపులా సరిగ్గా గమనించక అజ్ఞానంగా మాట్లాడుచున్నారే? ఈ జానశ్రుతునిది ఒక గొప్పా? ఇందులో ఏమి ఘనత మీకు కనిపిస్తోంది? కం వర ఏనమ్ ఏతత్ సంతగ్ం - సయుగ్వానమివ రైక్వమ్ ఆత్థేతి? అన్నదానము చేసిన ‘‘కర్మ’’ తేజస్సు గురించి ఇంతగా హెచ్చరికగా చెప్పుచున్నారే? అటు చూడండి! అది ఆ బండి రైక్వుని (బండి క్రింద విశ్రాంతి తీసుకొంటున్న రైక్వుడు అను పేరు గలవాడు యొక్క) ‘‘జ్ఞాన’’ తేజస్సు అద్దానిని స్తుతించటం లేదేమి?

మొదటి హంస : యో ను కథం సయుగ్వా రైక్వ - ఇతి? బండి క్రింద ఉన్న ఆ రైక్వుడు ఎవరు? ఎట్టివాడు? ఆతని కీర్తి ఎట్టిది? ఎందుచేత జానశ్రుతుని కీర్తి - తేజస్సుల కంటే శ్రేష్ఠము? ఏదీ! ఆయా వివరాలన్నీ చెప్పండి। నేను శ్రద్ధగా వింటాను।

రెండవ హంస : ఆ రైక్వుడు సుస్పష్టముగా, ఆత్మసాక్షాత్కార యుక్తంగా, నిస్సందేహంగా, అనునిత్య స్వానుభవ పూర్వకంగా ఏదైతే తెలుసుకొని ఉంటున్నాడో అట్టివాడు ‘కృతాయము’ అనే ఆటను గెలిచినవాడితో సమానం. మిగతావారు గెలిచిన ఆటలన్నీ ఆతడు గెలిచినట్లే!

జూదములో 1, 2, 3 పందేములు నెగ్గినవానికంటే 4 పందములు నెగ్గినవాడు - ‘కృతయామ’।

‘కృతాయమ’వలె సమున్నతుడు. అందరికంటే శ్రేష్ఠుడు. అనగా ఆ రైక్వుడు 4 పందెములు గెలిచినవాడితో సమానము. సమస్తము ఎరిగినవాడు. జనులు ఏఏ సత్కర్మలు చేస్తూ ఉంటారో, అవన్నీ ‘కృతాయమ’ వలె ఆతనికి వశమై ఉంటాయి.

జనులు ఏ ఏ ధర్మకార్యములు చేస్తారో, అవన్నీ ఆ రైక్వుని ధర్మమునందు స్వాభావికంగానే అంతర్భాగమై ఉంటాయి.

ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకున్న తరువాత ఇక అట్టివాడు ఎవరైనా సరే, - అట్లే సమస్త ధర్మములు పరాకాష్ఠగా నిర్వర్తించినవాడు కాగలడయ్యా! సమస్త ఉత్తమ కర్మ ఫలములు ఆతనికి అభిముఖమై ఉండగలవు. ఆతడు కృతాయమ (4 ఆటలు గెలిచినాడు) అగుచున్నాడు.

- - -

తనను అల్పుడుగా నిందిస్తూ రైక్వుని ప్రశంసిస్తూ ఆకాశంలో సంభాషించుకుంటున్న ఆ రెండు హంసల మాటలు జనశ్రుతి పౌత్రాయణుడు అయిన జానశ్రుతుడు - సూక్ష్మబుద్ధితో అత్యంత శ్రద్ధగా విన్నాడు. తను ఆ మాటలలోని అంతరార్థము యోచిస్తూ ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించాడు. ఆ తెల్లవార్లూ ఆతని ఆలోచనల మూలంగా సరిగ్గా నిద్రపట్టలేదు. మరునాడు తెల్లవారగానే అంతరంగిక మిత్రుడు రథసారధి, వైతాళికుడు కూడా అయిన సేవకుడు జనశ్రుతుని సమీపించాడు.

రథసారధి : ఓ జనశ్రుతి ప్రపౌత్రుడా (మునిమనుమడా)! జానశ్రుత మహారాజా! నిదురలేవండి. తెల్లవారింది. మీ యొక్క అన్నదాన, ధర్మసత్ర సేవలకు సంతోషించనివారు లేరు. మీ పుణ్యఫలము దేవలోకమును కూడా ఆశ్చర్యంలో ముంచివేస్తోంది. మీ దాన ధర్మములు విశ్వమంతా మార్మ్రోగుచున్నాయి. మీకు శుభమగు గాక! సూర్యుడు కూడా మీ దాన - ధర్మములు చూచి సంతోషించటానికై అదిగో! తూర్పున ఉదయిస్తున్నారు. మీవంటి దానగుణము కలవారు ఇతః పూర్వం లేరు. ఇక ఉండబోరు!

జానశ్రుతుడు : ఓ ఆంతరంగిక మిత్రమా! రథసారథీ! నీవు నన్ను బండితో కూడిన రైక్వునితో సమానం చేసి పొగడుచున్నావే? అది సరికాదు కదా?

రథసారథి : యజమానీ! బండితో కూడిన రైక్వుడా? ఆయన ఎవరు?

జానశ్రుతుడు : ఆతడా? ఆయన సర్వ పుణ్యఫలములు ఆయనను ఆశ్రయించి ఉన్నట్టివాడు. ఎక్కడో దగ్గిరలోనే ఉన్నారు. పోయి, ఎట్లాగైనా సరే, ఆతనిని నీవు పిలుచుకురమ్ము. ఆయనతో సంభాషించి మనము తరిద్దాము.

రథసారథి : ఆ రైక్వుడు అనగా ఎట్టివాడు?

జానశ్రుతుడు : జూదము నందు 4 పందెములు గెలిచి కృతాయనుని వలె -ఏది ఆ బండి క్రింద రైక్వుడు తెలుసుకొనియున్నాడో, ఆతడు ‘4’ పందెములో గెలిచినట్లు. ఇక 1, 2, 3 పందెములు గెలిచినవారు ఆతనికి వశమై ఉన్నవారే! జనులు చేస్తున్న సమస్త కర్మల ఫలములు ఆతనికి వశమై ఉంటాయి. ఆతనికి ఉండియున్న జ్ఞానమే జ్ఞానము. ఇక నావంటివారి పుణ్యకర్మలు ఎంతటివి చెప్పు? ఇవన్నీ సుఖలోక ప్రాప్తివరకే పరిమితము. శాశ్వతమగు ఆత్మానందమును ప్రసాదించలేవు.

రథసారథి: అట్లాగా? ఓ యజమానీ! మీరు చెప్పేది ఆశ్చర్యం కలిగిస్తోంది.

జానశ్రుతుడు : ఔను! ఆశ్చర్యమే! మరి! సరే"! నీవు వెళ్లు. సమస్త సుకృతాత్ముడు, జ్ఞానవంతుడు అగు ఆ బండి రైక్వుని ఆదరణ - మర్యాదలతో ఇప్పుడే రథముపై తీసుకొని రమ్ము.

రథసారథి : స్వామీ! ఆతడు ఎక్కడ ఉంటాడు?

జానశ్రుతుడు : అది నాకూ తెలియదు. కానీ మన ఈ ప్రదేశమునకు సమీపములోనే ఉండి ఉంటారు.

రాజుగారి ఆజ్ఞను స్వీకరించి ఆ ‘‘రైక్వుడు ఎక్కడ?’’ అని నగరంలోను, గ్రామాలలోను అడుగుతూ వెతికాడు. కానీ కనబడలేదు. అప్పుడు ఆ రథసారథి తిరిగివచ్చి ‘‘యజమానీ! అంతటా వెతికాను. కానీ మీరు చెప్పిన ఆ ‘రైక్వుడు’ అనే ఆయన ఎక్కడా కనిపించలేదు’’ - అని పలికారు.

జానశ్రుతుడు : ఓ సారథీ! మీరు వెతికారు, బాగానే ఉన్నది. కానీ, బ్రహ్మవేత్త ఎక్కడ ఉంటారో ఆయా చోట్లు వెతకాలి. అంతేగాని, ఏదో గ్రామ-పట్టణ వీధులలో, కొన్ని గృహములలో వెతికి ఏమి లాభం?

రథసారథి : బ్రహ్మవేత్తలు ఉండేది ఎక్కడ?

జానశ్రుతుడు : ఏకాంతంగా ఉండవచ్చు. అరణ్యంలోనో, నదీ-సముద్ర తీరాలలోను, ఏవైనా దేవాలయాది పవిత్ర స్థలాలలోనో ఉండవచ్చు. అన్యుల సాంసారిక వ్యవహారములు వారిని ఆకర్షించవు కదా! మరల వెతకండి.

ఆ సేవకులు మరల వెతుకుచుండగా వారికి ఒకచోట బండి క్రింద ఉండి దురద పొక్కులను గోక్కుంటూ ఒకాయన కనిపించారు. అప్పుడు ఆ జనశ్రుత సేవకుడు - ‘‘ఓ బండి క్రింద ఆశీనులై ఉన్న మహానుభావా! ‘రైక్వుడు’ అనగా తమరే కదా?’’ అని అడిగారు.

అప్పుడు ఆ బండి క్రింద పొక్కులు గోక్కుంటూ కూర్చున్న ఆయన - ‘‘అవును! నేనే! మీకు సందేహమెందుకు?’’ - అని పలికారు.

అప్పుడు ఆ సేవకుడు ‘‘ఈయనే రైక్వుడు’’ అని నిశ్చయించుకొని గబగబా జానశ్రుతుని మందిరానికి పరుగుపరుగున వెళ్లి - ‘‘అయ్యా! మీరు అడుగుచున్న రైక్వుడు దగ్గిరలో గల గ్రామములో ఒక బండి క్రింద ఆశీనుడై ఉన్నాడు’’.. అని తెలియజేసారు.


16–4–2. చతుర్థ అధ్యాయము - ద్వితీయ ఖండము - విద్యార్హత - 6 లక్షణములు

అప్పుడు జానశ్రుతుడు గోవులను, ఒక రతనాల హారమును, కంచరగాడిదల రథమును తీసుకొని రైక్వుడు ఉన్న స్థానమునకు వెళ్లాడు.

జానశ్రుతుడు : మహనీయుడవు, ఆత్మతత్త్వము ఎరిగినవాడవు. బండి క్రింద ఆశీనులైనవాడవు అగు - ఓ రైక్వ మహాశయా! నమస్కారము! జనశ్రుత వంశోద్భవస్య, జనశ్రుత ప్రపౌత్రస్య జానశ్రుత నామధేయస్య - అహంభో అభివాదయే!

రైక్వుడు : (బండి క్రింద నుండి బయటకు వచ్చి) ఓహో! జానశ్రుత నామధేయుడా? మంచిది. శుభమగు గాక! ఎందుకు నన్ను పిలిచి నమస్కరిస్తున్నారు?

జానశ్రుతుడు : అయ్యా! తమకు సమర్పించే ఉద్దేశ్యముతో 600 గోవులను, కంఠహారమును, రెండు కంచరగాడిదలు లాగుచున్న రథమును తీసుకొచ్చాను. దయతో స్వీకరించండి.

రైక్వుడు : ఓ జానశ్రుత రాజా! ‘ఈ సంపదలతో నాకేమి పని? అయినా, ఎందుకు సమర్పించ వచ్చారు?

జానశ్రుతుడు : భగవో దేవతాగ్ం శాధి, యాం దేవతామ్ ఉపాస్స - ఇతి? స్వామీ! మీరు బ్రహ్మజ్ఞులు అవటానికి ఏ దేవతను ఏరీతిగా ఉపాసించారు? అదంతా దయతో నాకు ఉపదేసిస్తూ, వివరించి చెప్పండి. నేను కూడా ఉపాసించగలను.

రైక్వుడు : ఓయీ! శూద్రుడా! ఆ గోవులు, ఆ ఆభరణములు, ఆ రథము మీరే ఉంచుకోండి.
(శూద్రుడు అని సంబోధించుటలో - నీవు ఇంద్రియములకు తారసబడే దృశ్యమునందే ఆనందము యొక్క ముఖ్యాశయముగా కలిగి ఉండటమును కొనసాగిస్తూ ఉన్నావు అను సూచన.)

జానశ్రుతుడు : పోనీ, మీకు ‘1000’ గోవులను తదితర కంఠహారాదులను, కంచరగాడిదలు పూన్చిన రథమును సమర్పించుకుంటాను. మీరు ఉపాసించే తీరు, నాకు మార్గదర్శక - ‘బోధ’గా ప్రసాదించండి.

రైక్వుడు : శూద్రుడా! అవి కూడా నీవే ఉంచుకో!

జానశ్రుతుడు : భగవాన్! ఈ వేయి గోవులు, కంఠహారము, కంచరగాడిదల రథముతో బాటుగా నా కుమార్తె మీకు భార్యగా సమర్పిస్తున్నాను. అంతే కాదు! మీరు ఉన్న ఈ గ్రామమును సమర్పిస్తున్నాను. ఓ పూజనీయా! ఈ సర్వము స్వీకరించండి. మీరు ఆత్మానుభవము సిద్ధించటానికై నిర్వర్తించిన దేవోపాసనను నాకు దయతో ఉపదేశించండి. ఇక నుండి ఈ గ్రామము ‘‘రైక్వపర్ణ’’ పేరుతో ప్రసిద్ధమై మీకు సేవార్హము కాగలదు.

రైక్వుడు : ఓ జనశ్రుతపౌత్రేయా! మీ కుమార్తె జానశ్రుతపుత్రిక ముఖమును చూస్తూ ఉన్నాను. ఓ శూద్రా! ఈమె ముఖము పరమశాంతముగా, బ్రహ్మవర్చోయుతముగా, విద్యాదానమునకు తీర్థముగా నాకు అగుపిస్తోంది. బ్రహ్మవిద్య గురించిన మీ అర్హత గురించి కొంచము పరీక్షించాను. అంతే!
(1) బ్రహ్మచారి (2) దానము ఇచ్చేవాడు (3) బుద్ధిమంతుడు (4) బహుశ్రుతుడు (వినగలిగిన సామర్ధ్యము కలవాడు) (5) ప్రియమైనవాడు (6) విద్యను గ్రహించు ఉత్సాహము కలవాడు - ఈ ఆరుగురు నాకు తీర్థములతో సమానము. ఇవన్నీ సమర్పించి నీవు నన్ను బోధకుడుగా సంపాదించుకొనుచున్నావు. ఈ లక్షణములన్నీ మీలో కనిపిస్తున్నాయి. కనుక మీరు బోధకు అర్హులు.

ఇట్లా పలికి రైక్వుడు అక్కడే జనశ్రుత మహారాజుకు తన ఉపాసన గురించి బోధించటము ప్రారంభించారు.


16–4–3. చతుర్థ అధ్యాయము - తృతీయ ఖండము - సంవర్గ విద్య

రైక్వుడు : పూజ్యులగు జనశ్రుత ప్రపౌత్రా! జానశ్రుత మహారాజా! సర్వత్రా ఆత్మసందర్శనమునకై నేను అనుసరించిన, అనుసరిస్తున్న - ఉపాసన గురించి వినండి!

ఆధిదైవోపాసనా। ‘‘వాయుర్వావ సంవర్గో’’ (వాయువే సంవర్గము, సమస్తము తనయందు లీనము చేసుకొనుచున్నట్టిది)
వాయుః = చలనము స్వభావము గల వాయువే
వావ = నిశ్చయముగా
సంవర్గః = అన్నీ తనయందు లీనము చేసుకొంటున్నట్టిది. సంసర్జనము చేసుకొనుచున్నది. (క్రితం అధ్యాయంలో కృతాయనము - 4 ఆటలు గెలిచినవాడు - 1,2,3 ఆటలు గెలిచినవాడిని అధిగమించి తనయందు కలుపుకొనుతీరుగా)

వాయువు నిశ్చయముగా సంవర్గమే! ఎందుచేత?

యదా వా ‘‘అగ్నిః’’ ఉద్యాయతి → వాయుమేవ ఆప్యేతి! అగ్ని ఆరిపోయినప్పుడు ఎక్కడికి పోతోంది? వాయువునందే ఆ ఆరిన అగ్ని లీనము అవుతోంది. (మరల మరొకప్పుడు వాయువు నుండే పుడుతోంది కూడా)।

యదా ‘‘సూర్యో’’ అస్తమేతి వాయుమేవ ఆప్యేతి। సూర్యుడు అస్తమించిన తరువాత రోజంతటి సూర్యతేజస్సు ఎక్కడికి వెళుతోంది? వాయువునే పొంది, వాయువులో లీనము అవుతోంది.

యదా ‘‘చంద్రో’’ అస్తమేతి వాయుమేవ ఆప్యేతి। చంద్రుడు అస్తమించిన తరువాత భూమిపై అప్పటివరకు వెల్లివిరిసిన చంద్రకిరణములు, భూమిపై ప్రసరించిన వాటి తేజోమాధుర్యము ఎక్కడికి వెళ్లుచున్నాయి? వాయుత్వమును పొంది, వాయువునందే లీనమౌతున్నాయి.

యదా ‘‘అప’’ ఉచ్ఛుష్యంతి, వాయుమేవ ఆపియంతి। జలము ఎండిపోయినప్పుడు ఆ జలము ఏమగుచున్నది? ఆవిరి అయి వాయుత్వము పొంది, వాయువునందే లీనమగుచున్నది.
వాయుర్హి ఏవ ఏతాన్ సర్వాన్ సంవృంక్త। ఈ విధంగా వాయువే అగ్నిని, సూర్యుని, జలమును తనయందు ఏకము చేసుకొనుచున్నది. అందుచేత నేను వాయువును సమస్తము లీనము చేసుకొను దేవతగా గమనించి ప్రాణాయామము మొదలైన శాస్త్ర ప్రవచిత విధి విధానముల ద్వారా వాయు దేవతను ఉపాసిస్తూ ఉన్నాను.

(నమస్తే వాయో! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి। త్వామేవ ‘‘ప్రత్యక్షం బ్రహ్మ’’ వదిష్యామి) -
ఈ విధంగా (1) వాయువు యొక్క చలనమును, (2) ఆ వాయువును కదల్చు శక్తిని కలిపి - దేవతా రూపంగా భావించి వాయోపాసన చేయుచున్నాను. ఇది నా ‘‘అధిదైవతోపాసన’’।
విశ్వమందలి శక్తులన్నీ వాయు రూపంగా భావిస్తూ వాయు దైవోపాసన చేస్తూ ఆత్మను సమీపించసాగాను.

- - -

ఆధ్యాత్మోపాసన! ‘‘ప్రాణో వావ సంవర్గః’’ (అన్నీ చివరికి కలిసిపోయేది ప్రాణమునందే)
ఓ జానశ్రుత మహారాజా! ఈ విధంగా వాయువును ‘‘అగ్ని-సూర్య-జల’’ ఇత్యాదులకు ‘‘లయమయే స్థానము’’గా ఉపాసిస్తూ ‘‘బాహ్య దృశ్యమును ఉపాసించటము’’ (లేక) ‘‘విశ్వశక్తులను ఉపాసించటము’’ అనే నా యొక్క అధిదైవోపాసన’’ గురించి విన్నారు కదా!

ఇప్పుడు ఈ శరీరములో ఏ ఉపాసన నిర్వర్తించసాగానో అట్టి నా యొక్క ‘‘అధ్యాత్మోపాసన’’ గురించి వినండి. అనగా, ఈ శరీరములోని శక్తులను ఈఈ విధములుగా ఉపాసిస్తున్నాను.

ప్రాణోపాసన - ప్రాణ సంవర్గము

ఈ శరీరంలో వాక్కు, చూపు, వినికిడి, మనస్సు ఇవన్నీ తమ తమ ధర్మములు నిర్వర్తిస్తున్నాయి కదా! ఇవన్నీ ఎందులో ఏకము అగుచున్నాయి?

ప్రాణో వావ సంవర్గః। ప్రాణశక్తియే నిశ్చయముగా సంవర్గము.

ఒకడు మెలకువగా ఉన్నప్పుడు నోటితో మాట్లాడుచున్నాడు. కళ్లతో చూస్తున్నాడు. చెవులతో వింటున్నాడు. మనస్సుతో ఆయా దృశ్య విషయముల అనుభవము పొందుచున్నాడు.

సరే! ఇప్పుడు ఈతడు నిద్రించినప్పుడు (యదా యస్మిన్ కాలే స్వపితి) ఇంద్రియశక్తులన్నీ ఏమౌతున్నాయి?

యదా స్వపితి ప్రాణమేవ వాక్ ఆప్యేతి। నిద్రపోయినప్పుడు శరీరములోని ‘వాక్‌శక్తి’ → ప్రాణమును చేరి, ప్రాణశక్తితో ఏకము పొందుతోంది. (అగ్ని వాయువులో లీనమగుచున్న తీరుగా) వాక్కు ప్రాణమునందు లీనమౌతోంది.

చక్షుః ప్రాణగ్ంః। చక్షు (చూపు ఇంద్రియము) ప్రాణమునందే లీనమౌతోంది.

శ్రోత్రం ప్రాణగ్ం : శ్రవణేంద్రియము (వినికిడి) కూడా ప్రాణమునందే లీనము అవుతోంది.

మనః ప్రాణో : దృశ్య విశేషములను మాట్లాడుతూ చూస్తూ వింటూ ఉన్న మనన రూపమగు మనస్సు కూడా ‘ప్రాణము’ నందే విలీనము పొందుతోంది.

ప్రాణో హి వై తాన్ సర్వాన్ సంవృంక్తమ్ ఇతి।। ప్రాణమే అన్నిటినీ తనయందు కలిపేసుకుంటోంది. లీనము చేసుకుంటోంది. అందుచేత వాక్కుతో (నోటితో) మాట్లాడేది, కళ్లతో చూచేది, చెవులతో వినేది, నాలుకతో రుచి చూచేది, చర్మముతో స్పర్శించేది - ఇదంతా ప్రాణస్వరూపమే! సమస్తమును ప్రాణమే భుజిస్తోంది. సమస్తమును ప్రాణమే భరిస్తోంది కూడా!

ఈ విధంగా:-
(1) దేవతలయందు వాయువు సంవర్గము. వాయు ఉపాసనచే దేవతలంతా ఉపాసించబడువారగుచున్నారు.
(2) ఇంద్రియములందు ప్రాణశక్తి సంవర్గము. ప్రాణశక్తి యొక్క ఉపాసనచే ఇంద్రియములు ప్రియము కాగలవు.

తే వా ఏతే ద్వే సంవర్గౌ। వాయువు, ప్రాణము ఈ రెండు సంవర్గములు - అని గ్రహించి అధిదైవతోపాసన, అధ్యాత్మికోపాసన నిర్వర్తిస్తున్నాను.

ఈ వాయు-ప్రాణములు రెండూ కూడా బాహ్య - అభ్యంతరములను ‘‘తమయందు విలీనము చేసుకోవటము’’ అనే ధర్మమును నేను గమనించి, ఆ రెండింటినీ ‘‘అధి దైవోపాసన, ఆధ్యాత్మికోపాసన’’ అనుక్షణికంగా నిర్వర్తిస్తూ ఉన్నాను.

అట్టి వాయు- ప్రాణములను బాహ్య-అభ్యంతర పుష్పములతో స్తుతిస్తూ ఉన్నాను. ఆరాధిస్తూ ఉన్నాను. సమస్త ఇంద్రియ విషయములతో, యోచనలతో ఆరాధిస్తూ ఉన్నాను.

అట్టి నాయొక్క అధి దైవిక - ఆధ్యాత్మికోపాసనలను మరికొంత వివరణగా చెప్పటానికి ఈ సందర్భములో ఒక గాధ (Event) చెపుతాను. వినండి.

✡︎ ✡︎ ✡︎

ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఉండేవారు.
(1) శునకముని కుమారుడు, కౌపేయ గోత్రీకుడైన శౌనకుడు.
(2) కక్షసేనముని కుమారుడు అగు అభిప్రతారి.

ఈ స్నేహితులిద్దరూ ఒకరోజు ఆశ్రమంలో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మధ్యాహ్న భోజన సమయమైనది.

ఇద్దరూ భోజనమునకు కూర్చున్నారు. ఆశ్రమములోని వంటవారు (cooks) వారికి భోజనము వడ్డించబోతూ ఉన్నారు.

ఇంతలో వేదాధ్యయనములో దిట్ట (expert) అయిన ఒక బ్రహ్మచారి అక్కడకి వచ్చి - ‘‘వేదాధ్యయనము చేసిన వేద పండితుడను. బిక్షాం దేహి। అన్నము ప్రసాదించండి’’ అని పెద్దగా పలికాడు.

శౌనకుడు, అభిప్రతారి అది విని కూడా - ‘‘ఈతనికి వేద పండితుడననే గర్వం కొంచం ఉన్నట్లుగా కనబడుతోంది. మనము ఏమీ మాట్లాడ వద్దు. ఏమంటాడో చూద్దాము..’’ అని అనుకొన్నారు. ఆ ఇద్దరు ఏమీ మాట్లాడకుండా ఊరుకొని ఉన్నారు.

అప్పుడు అభ్యాగతి (Unexpected Guest) అగు ఆ బ్రహ్మచారి ఈ విధంగా సంభాషించసాగాడు.

బ్రహ్మచారి : ఓ కౌపేయగోత్ర శౌనకమునీ! మహాత్మన్ చతురో ఏకః కః స జగార గోపాః। ఈ శరీరంలో (వాక్కు, చూపు, వినికిడి, మనస్సు అనబడే) నలుగురు మహాత్ములగు దేవతలు వేంచేసియున్నారు. ఈ నలుగురు మహాత్ములను మ్రింగివేస్తున్న ఏకస్వరూపుడగు ప్రాణేశ్వరుడు ఈ దేహమంతా వేంచేసి ఉన్నారు. ఆయనయే ప్రజాపతి అయి భువనములను, తదితర సమస్తమును రక్షించుచూ ఉన్నారు.

తాం న అభి పశ్యంతి మర్త్యా?
అట్టి ప్రాణశక్తి ఈ ప్రాణులకు సర్వశక్తిమంతుడుగా, సర్వసంరక్షకుడుగా ఉన్నారు కదా! అట్టి ప్రాణప్రదాత, సర్వరక్షకుని ఈ మానవులు గమనించటమే లేదేమి? ఆయనను ఉపాసించటమే కాదు. రక్షణ పొందుతూ కూడా రక్షకుని చూచుచూ గుర్తించరేమీ? ఆ సమస్త సంరక్షకుని ఉపాసించరేమి? సమర్పించరేమి?

ఓ శౌనక మునీ! ఏమిటి మీ సమాధానం?
ఓ కక్షసేనముని కుమారుడగు అభిప్రతారీ! బహుధా వసంతం - యస్మై వా ఏతత్ అన్నం, తస్మా ఏతత్ న దత్తమ్ - ఇతి? ఎవ్వరైతే సమస్తమైన అన్నమును ప్రసాదిస్తూ ఉండగా మీరు ఆ అన్నమును తినబోతూ కూడా, ఆ అన్నదాత వచ్చి వాకిట నిలుచుని ‘‘భిక్షాం దేహి।’’ అని అన్నమును అడిగినప్పుడు కూడా, ఆయనకు అన్నము సమర్పించరేమి? నిరంతరము యజ్ఞము మొదలైన వాటిచే యజ్ఞవేత్తలు ఎవరిని సంతృప్తి పరుస్తున్నారో అన్నమంతా వారి ప్రసాదమే కదా?

శౌనక కాపేయుడు ఆ బ్రహ్మచారి పలికిన మాటలన్నీ అత్యంత శ్రద్ధగా విన్నారు. ‘‘ఈయన మాటల యొక్క అంతరార్థము ఏమిటి?’’ అని మనస్సుతో విశ్లేషణ చేస్తూ ఆ బ్రహ్మచారి వద్దకు వెళ్లారు.

శౌనకముని : వేదార్థములు సమీకరించుచూ పలుకుచున్న ఓ బ్రహ్మచారీ! నమస్తే! అభ్యాగతులుగా వేంచేసియున్న మీకు నమస్కరిస్తూ ఉన్నాము. దయచేయండి! మేము సమర్పించు అన్నము స్వీకరించెదరు గాక!

మీరు చెప్పినది నిజమే! మేము ఈ విధంగా ఉపాసిస్తున్నాము :-

ఆత్మా సర్వస్య స్థావర జంగమస్య। ఈ జగత్తులో స్థావర - జంగమ (కదలని మరియు కదిలే) సమస్తమునకు ‘ఆత్మ’ (The Self) ఆ ప్రజాపతియే! దేవతలకు ఆత్మ ఆయనయే। ఆయనే అంతటికీ సృష్టికర్త। వాయు రూపుడై అగ్ని ఆదిత్యుడు మొదలైన దేవతలందరిని తనయందు ఉపసంహరించుచు మ్రింగివేయుచు, (మరల) తన నుండి అగ్ని, ఆదిత్యాది దేవతలను పునః ఆవిర్భవింపజేయుచున్నది ఆ ప్రజాపతియే! ఇది ఆయన యొక్క అధిదైవతా విన్యాసము.

ఆయనయే ప్రాణశక్తి రూపుడై వాక్కు, కన్ను, చెవి మొదలైన ఇంద్రియ దేవతలను ఒకప్పుడు తనయందు ఉపసంహారము (withdrawal) చేసి ఇంకొకప్పుడు లీలాక్రీడా వినోదంగా ఆవిర్భవింపజేయుచున్నారు. సమస్త ప్రాణులకు ఆ ప్రజాపతియే ప్రాణప్రదాత! ఆయన అందరికి ప్రాణేశ్వరుడు! వాక్కు- ఆకాశము, అగ్ని - ఆదిత్యుడు, మనస్సు - చంద్రుడు మొదలైన వాటికి ‘ఆత్మ’ (The self) ఆ ప్రజాపతియే! ఆయన అనసూరి (సూరి, అసూరి కానివాడు).

ఆయనయే బంగారు దంతములతో సమస్తము భక్షించువారు. ‘అన్నము’ అయినదానిని, అన్నము కానిదానిని కూడా భక్షిస్తున్నది ఆయనయే! ఆయన దేనికీ ఆహారము కాదు. భక్షింపబడువాడు కాడు. అన్నము ఆయన రూపమే! భక్షించేదీ, భక్షించబడేదీ ఆయనయే!

ఓ బ్రహ్మచారీ! బ్రహ్మమునే సర్వత్రా మేము భావన చేస్తున్నాము. అట్టి మహాంతమగు మహిమగల సృష్టికర్తయగు ప్రజాపతి స్వరూప బ్రహ్మమునే ఉపాసిస్తున్నాము. సమస్తమునందు బ్రహ్మమే మాకు కనబడుతోంది. బ్రహ్మమే స్వరూపముగల బ్రహ్మచారీ! మీరు మేము ప్రియముగా సమర్పిస్తున్న ఈ ఆహారము (అన్నము) స్వీకరించండి. మీరు చెప్పిన వాక్యముల సారము మేము స్వీకరిస్తున్నాము.

‘‘ఓ వడ్డన చేయు సేవకులారా! ఈ బ్రహ్మచారికి సుష్టుగా భోజనము వడ్డించండి’ - అని అక్కడి వారికి శౌనకుడు ఆజ్ఞ ఇచ్చారు. ఆ విధంగా ఆ బ్రహ్మచారికి భిక్షపెట్టారు. ఆయన భోజనము చేసి తృప్తి చెంది, ఆశీర్వదించారు.

✡︎ ✡︎ ✡︎

అంతరార్థము :

వారు బ్రహ్మచారికి భిక్షను ఇచ్చారు. ఏ భిక్షను? తస్మా ఉ హ దదుస్తే వా ఏతే పంచాన్యే (5) పంచాన్యే (5) - దశ (10) సంతస్తత్ కృతమ్। కృతము అగుచున్న ‘‘5+5 =10’’ ఆత్మభగవానునికి సమర్పించారు.

Ⅰ. ఆధిదైవిక పంచకము : (1) భుజించుచున్నట్టి వాయువు; (2) అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము ‘‘4’’ - మొత్తము ఐదు (5)
Ⅱ. ఆధ్యాత్మిక పంచకము : (1) సమస్తము భుజించుచున్న ప్రాణము (2) వాక్కు, నేత్రము, చెవి, మనస్సు అను ‘‘4’’ - మొత్తం ఐదు (5)
Ⅲ. ఈ దిక్కులన్నిటియందు ఆ అన్నమే ‘10’ అయిన కృతము - విరాట్ భగవానుడే - సమస్తము భక్షించువాడు.

ఇవన్నీ ప్రజాపతి యొక్క అన్నములే। ఈ అన్నమే ప్రజాపతిచే కృతము (Worked out by the worker of the Universe).

✻ ఆ విరాట్ ప్రజాపతియే అన్నము సృజించువాడు.
✻ ఆయనయే అన్న భక్షకుడు కూడా!
✻ అన్నమే ‘‘కృతము’’।
✻ ఆయనయే సమస్తమును ‘‘సాక్షి’’గా సర్వదా చూస్తూ ఉన్న ఆత్మ।
✻ ఈ జీవుడు సర్వదా స్వతఃగా ఆత్మస్వరూపుడే।

అన్నము = భక్షింపబడుచున్నది / ‘‘కృతము’’.
అన్నాదము = భక్షించువాడు / ‘‘కృతుడు’’. అన్నము ప్రసాదించునది.

ఈ విధంగా పరమాత్మను ఎరిగి ఆరాధించువాడు అన్నము (దృశ్యమును) జీర్ణించుకోగలడు. అన్నాదుడై సమస్తమును ఆత్మయందు ప్రతిక్షేపించి, ఆత్మకు అనన్యుడై, ఆత్మానందము పొందుచుండగలడు. కృతకృత్యుడు కాగలడు।


16–4–4. చతుర్థ అధ్యాయము - చతుర్థ ఖండము - సత్యకామ గురుకుల ప్రవేశము

జబాలి అనే ఒకావిడ ఉండేవారు. వారి కుమారుడు ‘‘సత్యకాముడు’’.

ఒకరోజు జబాలి తన కుమారుని కూర్చోబెట్టి ఇట్లా బుజ్జగించింది.

జబాలి : బిడ్డా! సత్యకామా! ఏమిటి కొంచము ఆలోచనగా కనిపిస్తున్నావు?

సత్యకామ : అమ్మా! నేను ఇక విద్యాభ్యాసము చేయాలి కదా! గురుకులము చేరి గురువులను విద్యకొరకై శరణు వేడదలిచాను. అందుకు నీ అనుమతిని అర్థించుచున్నాను. అనుజ్ఞ ఇచ్చి నా ఆశయము నెరవేర్చెదవు గాక।

జబాలి : నాయనా! మంచి ఆలోచన. శుభస్య శీఘ్రం. వెంటనే వెళ్లి గురుకులంలో ప్రవేశించు. గురువు అనుజ్ఞ తీసుకొని వారి వద్ద విద్య అభ్యసించు. వారు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా సేవించి, గురు అనుగ్రహం పొందు. విద్యావంతుడవు అగుము!

సత్యకామ: అమ్మా! గురువును దర్శించగానే గోత్రనామాలు చెప్పి నమస్కరించాలి కదా!

జబాలి : అవును నాయనా! ‘‘చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు।’’
‘‘ఇదమ్’’ ఋషిస్య,
‘‘ఇదమ్’’ గోత్రోద్భవస్య
‘‘ఇదమ్’’ నామధేయస్య
‘‘ఇదమ్ - వేద శాఖా అధ్యాయీ అహంభో అభివాదయే।’’
అని గురుదేవుల పాద పద్మములను కళ్లకు అద్దుకొని విద్యాభ్యాసమునకు గురుకులంలో చేరటానికి బ్రహ్మచర్య దీక్షకు అనుజ్ఞను అర్థించాలి.

సత్యకామ : అమ్మా! అట్లాగే చేస్తాను. అయితే నేను నా గోత్రము, ఋషులు ఏమని చెప్పాలి? తండ్రి పేరు అడిగితే ఏమని బదులివ్వాలి? అసలు నేను ఏ గోత్రమునకు చెందినవాడను?

జబాలి : న అహమ్ ఏతత్ వేద, తాత! - యత్ గోత్రమ్ - ఇతి। నాయనా! నీది ఏ గోత్రమో నాకు తెలియదు.

సత్యకామ : కస్మాన్ న వేత్సి? నా గోత్రము, ఋషులు ఎవ్వరో ఎందుచేత నీకు తెలియదు?

జబాలి : బహు అహం చరంతీ పరిచారిణీ యౌవనే । త్వామ్ అలభే సా అహమ్ ఏతత్ న వేద। నేను యౌవనవతిగా ఉన్నప్పుడు చాలా ఇళ్లల్లో పరిచారికగా పనిచేస్తూ ఉండేదానను. ఆ కాలంలో నీవు నా కడుపున పడ్డావు. నీవు ఎవరివలన నాకు పుట్టావో - నేను కూడా చెప్పలేను. ఎవరికి పుట్టావో తెలుసుకొనే అవకాశమే లేదు కదా! అందుచేత నీ గోత్రమేమిటో నాకు తెలియదు. తెలిసియున్నంతవరకు సత్యము ఇది।

☼ నేను ‘జబాల’ అనే పేరుతో పరిచారికగా చెప్పబడుచూ వచ్చాను. అందరు ఆ పేరుతో నన్ను పిలిస్తూ ఉండేవారు. - జబాలాతు నామాహమస్మి।
☼ నీకు ‘సత్యకాముడు’ అనే పేరు పెద్దలు పెట్టారు. సత్యకామో నామ త్వమసి.

తల్లి పేరు మాత్రమే తెలుసు కాబట్టి గోత్రము తెలియదు. అందుచేత ‘‘సత్యకామ జాబాల’’- … అని పేరు గురువులకు చెప్పు.

✡︎ ✡︎ ✡︎

అప్పుడు ఆ సత్యకాముడు హరిద్రుమత మునీంద్రులవారి కుమారుడగు గౌతముని ఆశ్రమమునకు చేరారు. గౌతమ గురుదేవుని పాదపద్మములకు సాష్టాంగ దండప్రణామములు చేసి వినమ్రుడై నిలుచున్నారు.

సత్యకాముడు : బ్రహ్మచర్యం భగవతి వత్స్యామి ఉపేయం భగవంతమితి।
హే భగవన్! హారిద్రుమత గౌతమ గురుదేవా! నమోనమః। బ్రహ్మచర్య వ్రతము స్వీకరించి తమ పర్యవేక్షణలో విద్యాభ్యాసము చేయటానికై గురుకులవాసమునకు వచ్చాను. తమకు శిష్యుడై విద్యను అభ్యాసించటానికి అనుజ్ఞ ప్రసాదించ వేడుకొంటున్నాను. విద్యకై మిమ్ములను శరణు వేడుచున్నాను.

హారిద్రుమత గౌతముడు : ప్రియదర్శనా! సౌమ్యా! పేరు చెప్పు। కిం గోత్రో ను సోమ్యా! ఏ గోత్రమునకు చెందినవాడవు?

సత్యకామ జాబాల : న అహమ్ ఏతత్ వేద భో! యత్ గోత్రో అహమ్। గురుదేవా! నేను ఏ గోత్రమునకు చెందినవాడనో నాకు తెలియదు. నా గోత్రము గురించి నేను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా మాతృదేవతను ప్రశ్నించాను। అప్పుడు మా అమ్మ ‘‘బిడ్డా! నేను యౌవనంలో ఉన్నప్పుడు అనేక చోట్ల పరిచారికగా పనిచేసాను. ఆ కాలంలో నీవు జన్మించావు. నీ గోత్రము తెలియదు. అయితే నా పేరు ‘జబాల’ అని లోకప్రసిద్ధము. నీకు ‘సత్యకాముడు’ అనే పేరు నిర్ణయించబడింది’’ అని చెప్పెను.

నా పేరు సత్యకాముడు.
నా తల్లి పేరు జబాల.
అందుచేత నేను సత్యకామ జాబాలి।
అహం భో అభివాదయే!

ఇంతవరకే చెప్పగలను. ఓ పూజనీయా! గురుభగవాన్। నన్ను అనుగ్రహించండి।

హారిద్రమత గౌతముడు : స్వభావతః నీవు బ్రాహ్మణుడవే! ఇంత చిన్న వయస్సులో బ్రహ్మ విద్య పట్ల ఆశయము కలవాడు మాత్రమే నీ వలె ఉన్నది ఉన్నట్లు చెప్పగలడు. సత్యము చెప్పావు కాబట్టి సత్యకామ నామధేయుడవగు నీవు ‘బ్రాహ్మణుడవు’ అని సిద్ధాంతీకరిస్తున్నాను. ఇప్పుడే అడవికి వెళ్లి హోమము కొరకు యజ్ఞ విధులకు సమిధలు (కట్టెలు) తీసుకొని రమ్ము. నీవు సత్యము నుండి దూరము కాలేదు. ఉపనయనమునకు సంసిద్ధుడువు అగుము. మేము దంపతులము నీకు ఉపనయనము జరుపుతాము.

✡︎ ✡︎ ✡︎

ఈ విధంగా పలికి, తానే పీటలపై దంపత సమేతంగా కూర్చుని సత్యకామునకు ఉపనయనము జరిపించారు.

ఆ మరునాడు గురుకులములోని గోసంపదలో బక్కచిక్కిన ‘400’ గోవులు విడి చేయబడ్డాయి.
గురుదేవులు ‘‘ఓ సత్యకామా! నీవు ఈ ‘400’ గోవుల వెంట అడవికి వెళ్లు. వాటిని చక్కగా మేపి తిరిగి తీసుకువస్తావు కదా!’’.. అని ఆజ్ఞాపించారు.

సత్యకాముడు : గురువర్యా! తమ ఆజ్ఞను నిర్వర్తిస్తాను. ఈ ‘400’ గోవులు ‘1000’ గోవులు అయిన తరువాత తిరిగి గోసంపదతో వచ్చి మీ దర్శనం చేసుకుంటాను.

కొన్ని సంవత్సరములు ఆ గోవులను సంరక్షించగా అవి 1000 గోవులు అయ్యాయి.

ఒకరోజు ఆ గోవులతో ఉన్న వృషభము (ఎద్దు) - సత్యకాముడు కాపలాగా కూర్చున్న చోటికి వచ్చి ఇట్లా సంభాషించసాగింది.


16–4–5. చతుర్థ అధ్యాయము - పంచమ ఖండము-బ్రహ్మము యొక్క ‘‘ప్రకాశవాన్’’ పాదము - ‘‘4’’ దిక్కులు

తూర్పు - పడమర - దక్షిణ - ఉత్తర :-

వృషభము : ఓయీ! సత్యకామా! సత్యకామా! సత్యకామా!

సత్యకాముడు : భగవాన్! పూజనీయా! వృషభరాజమా? చెప్పండి. ఏమి మీ అవసరము (లేక) సందేశము?

వృషభము : మేము వేయి (1000) ఆవులము అయ్యాము. గురుదేవుల వద్ద మీరు చేసియున్న ప్రతిజ్ఞ నెరవేరినట్లే కదా! ఇక మమ్ములను గురుకులము ఉన్న ప్రదేశమునకు తోలుకువెళ్లండి. ఆచార్యుల వారికి, ఆశ్రమవాసులకు పాలు ఇచ్చి సేవించుకుంటాము.

సత్యకాముడు : అట్లాగే చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. అయితే ‘‘గురుదేవుల వద్ద బ్రహ్మవిద్య కొరకై నేను అర్హుడను అగుదునో? కానో?’’ - అని కొంచము మీమాంసపడుతూ ఉన్నాను.

వృషభము : ఓహో! అదియా నీ అనుమానము? అయితే ఒకపని చేద్దాం. నీ కొరకు నేను బ్రహ్మము యొక్క పాదము బోధిస్తాను. బోధించమంటావా? బ్రహ్మంశ్చ తే పాదం బ్రవాణీతి?

సత్యకాముడు : బ్రవీతు మే భగవన్! ఓ వృషభ దేవా! పూజనీయులగు తమరు దయచేసి ‘బ్రహ్మము’ యొక్క పాదము నాకు బోధించండి.

బ్రహ్మము యొక్క మొదటి పాదము - ‘‘ప్రకాశవాన్’’ పాదము.

వృషభము :
బ్రహ్మమునకు

ఈ నాలుగు దిక్కులు బ్రహ్మము యొక్క ఒక పాదము యొక్క నాలుగు కళలు. ఇది ప్రకాశవాన్ (Function of manifesttaion) పాదము.

ఎవ్వడైతే ‘‘ఈ నాలుగు దిక్కులు బ్రహ్మము యొక్క ఒక పాదమునకు సంబంధించిన నాలుగు కళలు’’… అని భావించి నాలుగు దిక్కులను బ్రహ్మోపాసనగా స్వీకరిస్తాడో అట్టివాడు ప్రకాశమయ లోకములలో (బ్రహ్మము గురించిన జ్ఞానబోధ, బ్రహ్మభావన కలుగుచోట్లకు) పోగలడు. ఆతడు భౌతిక లోకములను జయించగలడు. (లోకములు బ్రహ్మమునకు అన్యము - అనే భ్రమ తొలగగలదు).

ప్రకాశవంతుడై ప్రకాశపూర్ణ లోకములకు వెళ్లగలడు. (దేవతలు, గంధర్వులు ఉండే) ప్రకాశవంతుల లోకము సిద్ధించుకోగలడు.

ఇట్లా చెప్పి వృషభము బోధను విరమించింది.

సత్యకాముడు : ఓ వృషభ రాజ గురూ! మీరు చెప్పినట్లు 4 దిక్కులను బ్రహ్మ చతుష్పాదములలో ఒక పాదము యొక్క కళలుగా 4 దిక్కులను ఉపాసిస్తూ ఉంటాను.

వృషభము : సంతోషము

సత్యకాముడు : వృషభ రాజమా! మరి బ్రహ్మము యొక్క రెండవ పాదము గురించి శ్రవణము చేయటానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను. దయచేసి బోధించండి.

వృషభము : సత్యకామా! బ్రహ్మము యొక్క రెండవ పాదము గురించి నీకు బోధించటానికి అగ్నిదేవుడే తగినవారు. వారిని అర్థించు.


16–4–6. చతుర్థ అధ్యాయము - షష్ఠి ఖండము - బ్రహ్మము యొక్క ‘‘అనంతవాన్’’ పాదము

(పృథివి - అంతరిక్షము - ద్యులోకము - సముద్రము)

ఆ మరునాడు తెల్లవారగానే సత్యకాముడు రోజూలాగానే ఆవులను త్రోలుకొని, వాటిని మేపటానికై అడవికి వెళ్లాడు. ఆవులు మేస్తూ ఉన్నాయి. అవి ఉన్నచోటే ఒక చెట్టు క్రింద కూర్చుని అక్కడి రాళ్లతో అగ్నిని పుట్టించి, ఎండుపుల్లలు ఏరుకొచ్చి (అగ్నిని) ప్రజ్వలింపజేయసాగాడు. మండుచున్న అగ్నికి దగ్గరగా తూర్పు ముఖంగా ఆశీనుడైనాడు. అగ్నిదేవుని మనసా వాచా ప్రార్థించసాగాడు. అగ్నిదేవుడు సాకారుడై ప్రత్యక్షమైనారు.

అగ్ని : ఓ సత్యకామా! సత్యకామా! సత్యకామా!

సత్యకాముడు : భగవాన్! అగ్నిదేవా! నమోనమః।

అగ్ని : సత్యకామ జాబాలా! నన్ను ఎందుకు, ఏమికోరి ఆహ్వానిస్తున్నావు?

సత్యకాముడు : హతాశనుడవు, హవ్యవాహనుడవు అగు ఓ అగ్నిదేవా! మీకు శ్రమ ఇస్తున్నందుకు క్షంతవ్యుడను. బ్రహ్మము గురించి మీరు చెప్పగా వినదలచి మిమ్ములను ఆహ్వానించాను.

అగ్ని : మంచిది। బ్రహ్మణః సోమ్య తే పాదం బ్రవాణీతి।
నీ ప్రార్థనను మన్నించి నీకు బ్రహ్మము యొక్క (ఒక) పాదము గురించి బోధించగలను,

సత్యకాముడు : అగ్ని భగవాన్। బ్రహ్మచర్యవ్రతుడనై జగత్ తేజోవిహారులగు మీకు శరణు। శరణు। దయచేసి గురువై బోధించండి.

అగ్నిదేవుడు : బ్రహ్మము యొక్క రెండవ పాదమునకు ‘4’ అంశలు (కళలు) ఉన్నాయి.
(1) పృథివి (భూమి) (2) అంతరిక్షము (ఆకాశము) (3) ద్యులోకము (స్వర్గలోకము) (4) సముద్రము
ఇవి ఈ 4 రూపములు బ్రహ్మము యొక్క కళలే. ఈ నాలుగు అనంతములు.. అనంతమగు బ్రహ్మము యొక్క అనంత ప్రదర్శనములు. ఇది అనంతవాన్ పాదము.

ఈ పృథివి, అంతరిక్షము, ద్యులోకము, సముద్రములను ఎవ్వరైతే బ్రహ్మము యొక్క అనంతవాన్ పాదములుగా ఉపాసిస్తారో, అట్టివారు ఆత్మ యొక్క అనంతత్వము సంతరించుకోగలరు.

ఓ సత్యకామా! ఇక నేను బ్రహ్మము యొక్క పాదము గురించిన బోధను విరమించుచున్నాను. బ్రహ్మము గురించిన ‘3’వ పాదము గురించి - హగ్ంసః తే పాదం వక్త ఇతి। - హంస నీకు బోధించగలదు.

ఈ విధంగా పలికి అగ్నిదేవుడు అంతర్థానమైనారు.


16–4–7. చతుర్థ అధ్యాయము - సప్తమ ఖండము - బ్రహ్మము యొక్క ‘‘జ్యోతిష్మాన్’’ పాదము

(అగ్ని - సూర్యుడు - చంద్రుడు - విద్యుత్)

ఆ మరురోజు యథావిధిగా సత్యకాముడు మేతకై గోవులను అడవిలోకి తోలుకొని మేపసాగాడు. సాయం సమయంలో ఒకచోట సత్రాగ్ని (రాళ్ల ఒరిపిడితో తయారు చేసిన అగ్ని)ని వెలిగించారు. వెనుకగా తూర్పుముఖంగా ఆసీనులైనారు. ‘‘హంస’’ను భక్తితో ధ్యానం చేసారు. ఒక హంస వచ్చి ఎదురుగా నిలుచున్నది.

హంస : సత్యకామా! సత్యకామా! సత్యకామా! నన్ను ఉపాసించావు కదా! ఎందుకొరకు?

సత్యకాముడు : హే సోఽహమ్ ప్రతీతి గల హంస భగవాన్! నమస్కారము. నాకు బ్రహ్మము యొక్క ‘3’వ పాదము గురించి బోధించగలరని అగ్నిదేవులవారు నిన్న చెప్పి ఉన్నారు. నాపై అనుగ్రహముతో బ్రహ్మము యొక్క ‘3’వ పాదము ఉపదేశించండి.

హంస : బ్రహ్మము యొక్క ‘3’వ పాదమునకు ‘4’ కళలు.
(1) అగ్ని (2) సూర్యుడు (3) చంద్రుడు (4) విద్యుత్తు(తేజస్సు). ఇవి బ్రహ్మము యొక్క ‘జ్యోతిష్మాన్’ పాదము - యొక్క ‘4’ కళలు.

ఈ విధముగా జ్యోతిష్మాన్ పాదము యొక్క 4 కళలు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు (మెరుపు/వెలుగు) అని తెలుసుకుని ఎవరు ఉపాసిస్తారో, అట్టివారు జ్యోతిర్మయ లోకములను జయించగలరు. ఆత్మయందే జ్యోతిర్మయ లోకములను ఆత్మకు అనన్యముగా దర్శించగలరు.

ఓ సత్యకామా! ఈ ‘జ్యోతిష్మాన్’ అను బ్రహ్మము యొక్క ‘3’వ పాదము గురించి చెప్పాను కదా! నేను బోధను విరమించుచున్నాను.

ఇక బ్రహ్మము మొక్క నాలుగవ పాదమును గురించి ‘ముద్గుష్ట’ అనే నీటికాకి నీకు బోధించగలదు.

ఈ విధంగా పలికి హంస అంతర్థానమైనది.


16–4–8. చతుర్థ అధ్యాయము - అష్టమ ఖండము - బ్రహ్మము యొక్క ‘ఆయతన’ పాదము

(ప్రాణశక్తి-చూపు-వినికిడి-ఆలోచన)

ఆ మరునాడు తెల్లవారగానే గోవులను తోలుకుపోయి, అవి గుమికూడినచోట సత్యకాముడు అగ్నిని ప్రజ్వలింపజేసాడు. అగ్నికి వెనుకవైపుగా తూర్పుదిక్కుగా ఆసీనుడై ‘‘ముద్గుష్ట జలచపక్షి దేవత’’ను ఉపాసించసాగారు. ముద్గుష్ట ఎదురుగా ప్రత్యక్షమైనది.

మద్గురు - ముద్గుష్ట (జలచర పక్షి) : ఓ సత్యకామా! సత్యకామా! సత్యకామా!

సత్యకాముడు : ఓ మద్గురు జలచరదేవతా! నమోనమః

ముద్గుష్ట : సత్యకామా! నన్ను ఎందుకు తలచుకున్నావు?

సత్యకాముడు : నాకు బ్రహ్మము యొక్క నాలుగవ పాదము గురించి దయతో బోధించండి.

ముద్గుష్ట : సత్యకామా! వినండి. బ్రహ్మము యొక్క 4వ పాదమునకు 4 అంశలు-
(1) ప్రాణము (2) చక్షుః (కనులు) (3) శ్రోతం (చెవులు) (4) మనస్సు (ప్రాణశక్తి - చూపు - వినికిడి - ఆలోచన)

ఈ నాలుగు బ్రహ్మము యొక్క పాదముగా బ్రహ్మోపాసకుల సమక్షములో సుప్రసిద్ధము.

ఈ విధమైన ఈ పాదము యొక్క (ప్రాణ - చక్షు - శ్రోత్ర - మనస్సులనబడే) 4 కళలను బ్రహ్మము యొక్క పాదముగా ఎవడు ఉపాసిస్తాడో, ఆతడు సర్వలోకములలో సర్వాశ్రయుడు కాగలడు. ఏది ఆశ్రయిస్తే అది పొందగలడు. లోకములను జయించగలడు. ‘14’ లోకములను తన యందు దర్శించగలడు. ఇది ఆయతన పాదము.


16–4–9. చతుర్థ అధ్యాయము - నవమ ఖండము - గురుచరణాశ్రయము - (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ)

400 బక్కచిక్కిన గోవులతో సుదూరమైన అడవులకు వెళ్లిన సత్యకాముడు కొన్ని సంవత్సరముల తరువాత తాను ప్రతిజ్ఞ చేసిన ప్రకారము ‘1000’ గోవులను చేసి హరిద్రుమత గౌతమాచార్యుల వారి ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు.

హరిద్రుమత గౌతమాచార్యులు : సత్యకామా! సత్యకామా! సత్యకామా!

సత్యకాముడు : గురుదేవా! పూజనీయా! భగవాన్! సాష్టాంగ దండప్రణామమ్ స్వీకురు।

హరిద్రుమత గౌతములు : బిడ్డా! శుభమగుగాక! సౌమ్యా। నీవు బ్రహ్మవేత్త వలె ప్రకాశిస్తున్నావయ్యా! బ్రహ్మ విదివ వై, సోమ్య। భాసి కో।

సత్యకాముడు : గురోత్తమా! అన్యే మనుష్యేభ్య। నాకు మనుష్యులెవ్వరు బోధించలేదు. మానవులకు వేరైన వారు బ్రహ్మము యొక్క నాలుగు పాదముల గురించి బోధించారు. ధేనువు, అగ్ని, హంస, నీటి కాకి (మద్గు) నాకు ఉపదేశించారు. అయితే నేను మీకు శిష్యుడను కదా! అందుచేత ఆత్మతత్త్వము యొక్క పరాకాష్ఠను మీరే నాకు బోధించి ధన్యునిగా తీర్చిదిద్ద ప్రార్థన. మీ వంటి ఉత్తమోత్తములగు ఆచార్యుల దగ్గర అధ్యయనము చేస్తేనే సర్వసందేహాలు విడివడతాయి. సద్గురువు షోడశకళా విద్యలను బోధించినప్పుడే మేము సాధుత్వము పొందగలము. అదియే బ్రహ్మజ్ఞానము అవగలదని ఆర్యుల సూక్తి కదా!

అప్పుడు హరిద్రుమత గౌతమ గురువరేణ్యులు సత్యకామునకు బ్రహ్మము గురించిన 4 పాదములు మరియు బ్రహ్మము యొక్క అంతర్గత తత్త్వము గురించి సమగ్రంగా, సవివరంగా ప్రసాదించారు. ఏ విధంగా ‘‘తత్ త్వమ్’’ను ఉపాసిస్తూ, ‘‘సోఽహమ్’’ను సిద్ధించుకొని, ‘‘త్వమేవాహమ్’’ నిశ్చలము చేసుకొని, ‘‘సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ’’ భావనను అనుక్షణికము, స్వాభావికము, అనునిత్యము, అప్రతిహతము చేసుకోవాలో - అవన్నీ బోధించి, సత్యకాముని పూర్ణకామునిగా తీర్చిదిద్దారు. సగుణ బ్రహ్మోపాసన ఫలము గురించి, అగ్న్యోపాసన గురించి కూడా వివరించారు.


16–4–10. చతుర్థ అధ్యాయము - దశమ ఖండము - ఉపకోసల విద్య

(ప్రాణో బ్రహ్మ - కం బ్రహ్మ - ఖం బ్రహ్మ)

పూర్వము ఒకప్పుడు కమలుని కుమారుడు - ‘‘ఉపకోసల కామలాయనుడు’’ అనే ముని ఉండేవారు. ఆయన బాల్యములోనే సత్యకామ జాబాలి సన్నిధిలో బ్రహ్మచర్య వ్రతము స్వీకరించారు. ఆయన నిరంతరంగా ఆశ్రమంలో 12 సంవత్సరములు అగ్నికార్యములకు ఎంతో శ్రద్ధతో పరిచర్యలు చేసారు.

ఇప్పుడు మనము వారి గురించి దృష్టాంతంగా
- సగుణ బ్రహ్మోపాసనా ఫలము గురించి,
- అగ్ని ఉపాసన యొక్క మహత్తర ప్రయోజనము చెప్పుకుంటున్నాము. శ్రద్ధ మరియు తపస్సు బ్రహ్మోపాసనకు ముఖ్య సాధనములవటం గురించి వివరించుకోబోతున్నాము.


ఒకరోజు సత్యకామ జాబాలాచార్యులవారు 12 సంవత్సరాలు విద్య ముగించి, వేదాధ్యయనము పూర్తి చేసుకొని, గృహస్థులు అవవలసిన వారందరిని సమావేశపరచారు. వీడ్కోలు సభ జరిపి వీడ్కోలు - ఉపదేశములు ప్రసాదించారు.

అయితే 12 సంవత్సరాల విద్య ముగించినప్పటికీ - ఉపకోసల కామలాయునుని మాత్రం ఆ వీడ్కోలు సభకు పిలువలేదు.

ఇది గమనించి గురుమాత సత్యకామజాబాల మహర్షితో ఇట్లా సంభాషించారు.

గురుమాత : ప్రాణనాథా! మీరు 12 సంవత్సరముల కాలము విద్య అభ్యసించి, అధ్యయనము పూర్తి చేసిన వారందరికి వీడ్కోలు సభకు పిలిచి ‘గృహస్థాశ్రమము’ స్వీకరించుటకై అనుజ్ఞ - అభిభాషణము ప్రసాదించారు. కానీ ఉపకోసల కామలాయనుని మాత్రం ఆ సభకు పిలువలేదు. ఆతడు 12 సంవత్సరముల కాలము విద్యను అభ్యసించాడు. విద్యలో ప్రావీణ్యుడైనాడని మీరే అంటూ ఉంటారు. అంతే కాకుండా, ఆ ఉపకోసలుడు అందరికంటే అధికమైన భక్తితో ఆశ్రమమును సేవించి ఉన్నాడు. బ్రహ్మచర్యదీక్ష శ్రద్ధగా నిర్వర్తించాడు. ఈ పిల్లవానికి వీడ్కోలు ప్రసాదించలేదేమి? అగ్నిదేవతలను ఈతడు ఎంతో శ్రమతో సేవించాడు కూడా కదా! అందుచేత నిత్యాగ్ని దేవతలు మీ పట్ల తప్పుపట్టుకోవచ్చునేమో? ఈ విషయము దయచేసి ఆలోచించి, తగిన విధంగా చేయండి. ఆ పిల్లవానికి వీడ్కోలు - గృహస్థాశ్రమమునకు అనుజ్ఞ ఇస్తే బాగు - అని నా మనవి.

సత్యకామ జాబాలుడు తన ధర్మపత్ని చెప్పినదంతా శ్రద్ధగా విన్నారు. అందుకు ఏ సమాధానమూ చెప్పకుండానే ఆశ్రమము విడచి సంచారమునకు బయల్వెడలారు. (చాతుర్మాస్యమునకు, వేద అధ్యయన సభలకు, రాజులు జరిపే సత్సంగ సభలకు ఆచార్యులు సంచారములు చేస్తూ ఉంటారు కదా!)

సహ వ్యాధినా అనశితుం। తనను గురువర్యులు వీడ్కోలు సభకు పిలువకపోవటము, గురుమాత చెప్పినా పట్టించుకోక సంచారమునకు వెళ్లటము - ఈఈ విషయాలకు ఉపకోసల కామలాయనుడు గమనించి ఎంతో మనోవ్యాధిగ్రస్తుడు అయినాడు. ఆ దిగులుతో ఆహారము తినటము మానివేశాడు. అగ్నిహోత్ర గృహములో నీరసముగా పడి ఉండిపోయాడు. ఇది గమనించి గురుమాత ఉపకోసలునితో ఈ విధంగా పలకరించారు.

గురుమాత : బిడ్డా! ఉపకోసలా! బ్రహ్మచారీ! అన్నము తినటము మానివేస్తున్నావేమి? అది సరికాదు. నాయనా! భగవంతుని కృపచే దేహము నీకు ఉపకరణముగా ప్రసాదించబడింది. దీనిని బలహీనము చేయరాదు. లే"। లేచి చక్కగా భోజనము చేయి. అన్నముపై కోపగించటము నిషిద్ధమని నీకు తెలుసు కదా!

ఉపకోసల కామలాయనుడు : గురుమాతా! మీకు తెలియనిది ఏమున్నది? ఈ పురుషుడు (జీవుడు) ఏదైనా తీవ్రంగా కోరుకొంటే, ఒకవేళ అది నెఱవేరకపోతే, ఆతనికి ఆకలి చచ్చిపోతుంది. ఈ జీవునిలో అనేక కోరికలు దాగి ఉంటాయి. అవి విషయ భోగములవైపుగా లాగుతూ ఉంటాయి. నేను మానసిక చింతలో పడిపోయాను.

⌘ అయ్యో! గురువర్యుల దృష్టిలో నేను నేర్చిన విద్య గృహస్థాశ్రమ స్వీకారమునకు అనుమతి ఇవ్వబడిన సహవిద్యార్థులతో సరితూగదా?
⌘ నా తల్లితండ్రులను త్వరలో చూస్తానేమోనని ఆశించాను. ఆ ఆశ నిరాశయేనా?
⌘ మా గ్రామములోని స్నేహితులను, బంధువులను ఎప్పటికి చూస్తానో!
…. మొదలైన చింతలు ఏవేవో మనస్సులో దాగి ఉండి ఉంటాయి. నేను ఆత్మజ్ఞానిని అయిండలేదు. అందుకే ఈఈ విషయాలు నా యొక్క ‘శాంతి’కి విఘ్నములు కలిగిస్తూ ఉన్నాయి. అందుచేత ఆహారము భుజించనని నిర్ణయము చేసుకున్నాను. కనుక క్షమించండి మాతా!

- - -

అగ్నిహోత్ర గృహములో ఉపాసించబడే త్రైయాగ్ని దేవతలు సమావేశమై ఇట్లా సంభాషించుకున్నారు.

‘‘ఈ బ్రహ్మచారి తీవ్రమైన తపస్సు చేసాడు. మనలకు ప్రతిరోజు తెల్లవారుఝామునుండి రాత్రి అయి యజ్ఞాగ్ని ముగింపు వరకు ఎన్నో సేవలందించి, మనలను ఎంతగానో సంతోషింపజేసాడు. కనుక ఈతడు మనము బ్రహ్మతత్త్వము బోధించటానికి అర్హుడు. మనము ఇప్పుడు ఉపదేశము ఇద్దాము.’’

ఈ విధంగా నిర్ణయించుకొని సాకారము ధరించినవారై త్రైయాగ్ని దేవతలు ఇట్లా సంభాషించసాగారు.

పంచాగ్నిహోత్ర దేవతలు : బిడ్డా! ఉపకోసలా! లేచి ఈ ఆహారము తిని, పానీయం త్రాగు. మేము యజ్ఞాగ్ని దేవతలము. నీకు ఏది క్షేమమో అది ప్రసాదించటానికి వచ్చాము. నీవు మా సంకల్పముచే సమస్త శారీరక బలహీనతలు తొలగి శారీరకంగా ఓపిక కలవాడవై బలవంతుడవు, తేజోవంతుడవు అయ్యెదవు గాక!

ఉపకోసల కామలాయనుడు : ఓ యజ్ఞాగ్ని దేవతలారా! నమో నమః। మీ దర్శనమాత్రం చేతనే, మీ అనుగ్రహం చేత నేను ఉపావాస సంబంధమైన నీరసములన్నీ తొలగి బలవంతుడనయ్యాను. ఇప్పుడు మీ బోధకై సిద్ధముగా ఉన్నాను. అయ్యలారా! బ్రహ్మము గురించి శ్రవణం చేయ ఇచ్ఛగిస్తున్నాను. దయతో నాకు బోధించండి.

త్రయీయజ్ఞాగ్ని దేవతలు : ప్రాణో బ్రహ్మ। కం బ్రహ్మ। ఖం బ్రహ్మేతి। ఈ ప్రాణమే బ్రహ్మము. ‘కం’ అనునదీ బ్రహ్మమే। ‘ఖం’ బ్రహ్మమే।

ఉపకోసల కామలాయణుడు : పూజ్యాతి పూజ్యులగు ఓ అగ్ని దేవతలారా! మీరు చెప్పుచున్న దానిలో నాకు కొంత అర్థము కాలేదు. దయచేసి నా సందేహములు వినండి.

(1) ప్రాణో బ్రహ్మ! ‘ప్రాణము’ యొక్క అర్థము లోకవిదితమే. ప్రాణము ఉంటేనే ఈ భౌతిక దేహము జీవించి ఉండగలదు. ప్రాణము తొలగితే ఇది నిస్సారమగు ఎండుకట్టె వంటిదే. ఏది పోతే ఈ దేహము జడవస్తువు వంటిదో - అట్టి ‘‘ప్రాణము బ్రహ్మమే’’ అనేది నేను అర్థం చేసుకోగలుగుచున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. నాకు సువిదితమే కూడా! కానీ రెండు, మూడు శబ్దములైనట్టి ‘‘కం’’, ‘‘ఖం’’ ఎట్లా బ్రహ్మము అయి ఉండగలవో నేను సమన్వయించుకోలేకపోతున్నాను. నాకు అది తెలియదు.

(2) ‘కం’ బ్రహ్మ : ‘కం’ అనగా శబార్థము ‘సుఖము’ అని కదా। కాసేపు సుఖముగా ఉన్నా కూడా ఇంతలోనే ఏవేవో కారణాలచేత దుఃఖం వచ్చిపడుతోంది కదా! సర్వదా సుఖంగా మాత్రమే ఉండేవాడు ఎవ్వడూ ఉండడు. బ్రహ్మము సర్వదా యథాతథమై ఉండగా ‘సుఖము బ్రహ్మము’ అనేది ఎట్లా నేను అన్వయించుకోవాలి. ‘‘సర్వం ఖల్విదం బ్రహ్మ’’ అనే వేదోపనిషత్ మహావాక్యము కదా!
‘కం’ (సుఖము) బ్రహ్మమైనప్పుడు, దుఃఖము బ్రహ్మము కాదా! సుఖము మాత్రమే బ్రహ్మమా?

(3) ‘ఖం’ బ్రహ్మ : ‘ఖం’ అనగా శబ్దార్థము ‘ఆకాశము’ కదా! ఈ ఆకాశము స్వతఃగా జడము కదా! బ్రహ్మము సర్వదా చైతన్యస్వరూపము. మరి ‘ఆకాశము బ్రహ్మము’ అనేది ఎట్లా సమన్వయించుకోవాలి?

ఓ యజ్ఞాగ్ని దేవతలారా! మీరు అనృతము (అబద్ధము) చెప్పరు. కానీ నా వివేచనకు ‘కం’, ‘ఖం’ పట్ల ‘బ్రహ్మము’ అనేది ఆయా లక్షణముల దృష్ట్యా నాకు యుక్తియుక్తము (Logical) అని అనిపించటం లేదే? దయచేసి వివరించండి.

త్రయాగ్ని దేవతలు : యద్వావ ‘కం’ తదేవ ‘ఖం’। యదేవ ‘ఖం’, తదేవ ‘కం’ ఇతి। ఏది ఆకాశమో అదియే సుఖము. ఏది సుఖమో అదియే ఆకాశము.

‘‘ఆకాశము’’ అనే శబ్దమునకు అర్థము ‘‘భూతాకాశము’’ అనునది సంకుచితార్థము. ఎందుకంటే ‘ఆకాశము’ మూడు తీరులు.
(1) భూతాకాశము - జడము
(2) చిత్తాకాశము - మనో నిర్మితము
(3) చిదాకాశము - ఆత్మాకాశము

‘ఆకాశము’ అనగా చిదాకాశమే। ఆత్మాకాశమే। కేవలమగు ఆత్మయొక్క స్వకీయకల్పిత ఆనందరూపమే ఈ ఇంద్రియ జగత్తు. ఆత్మాకాశము తన ఇచ్ఛానుసారంగా చిత్తాకాశము, భూతాకాశము కల్పించుకొంటోంది.

ఇంకా చెప్పాలంటే ‘ఆత్మాత్ ఆకాశమ్’ అను వేదవాక్కు ప్రకారము ఆత్మనుండియే భూతాకాశము బయల్వెడలుతోంది. ఆత్మ నుండి బయల్వెడలునట్లు చెప్పబడేవన్నీ ఆత్మకు అన్యము కాదు.

ఆత్మ జగత్ కల్పనను లీలగా, క్రీడగా, వినోదముగా మాత్రమే స్వీకరిస్తోంది.

అంతేగాని ఆత్మ తన కేవలానందము నుండి ‘చ్యుతి’ పొందటం లేదు. కనుక ‘కం’ అనగా ఆత్మా యొక్క కేవలానంద స్వరూపము. ‘ఖం’ అనగా ఆత్మాకాశము.

‘మట్టిబొమ్మ’లో మట్టి, బొమ్మ వేరు కావు కదా! అట్లాగే ఆ ఆత్మ, ఆనందము వేరు వేరు కాదు.

అందుచేత - యద్వావ ‘కం’, తదేవ ‘ఖం’, యదేవ ‘ఖం’ తదేవ ‘కం’ - ఇతి। ఏది ఆత్మానందమో అదియే ఆత్మాకాశము. ఏది ఆత్మాకాశమో, అదియే ఆత్మసుఖము - అని మేము సిద్ధాంతీకరించి చెప్పుచున్నాము.

ఇంకా కూడా ప్రాణము శక్తి రూపమని, ప్రాణము ఆత్మశక్తియేనని, ‘‘శక్తి - శక్తి తనదైనవాడు ఒక్కటే’’ - అను తీరుగా ప్రాణమే ఆత్మ అని, ఆత్మ ప్రాణ స్వరూపమేనని కూడా త్రైయాగ్ని దేవతలు విశదీకరించి చెప్పారు.

‘‘ప్రాణమే హృదయము. ప్రాణమే ఆత్మ. హృదయమే ఆత్మ’’ - అని వివరించారు.


16–4–11. చతుర్థ అధ్యాయము - ఏకాదశ ఖండము - గార్హపత్యాగ్ని పురుష ఉపదేశము

‘‘పృథివి - అగ్ని - అన్నమ్ - ఆదిత్యమ్ బ్రహ్మ’’

ఉపకోసల కామలాయనుడు : ఓ త్రైయగ్ని దేవతలారా! ఇప్పుడు ‘‘ప్రాణము బ్రహ్మము. సుఖము బ్రహ్మము. ఆకాశము బ్రహ్మము’’… అన్న మీ వాక్యములను నేను అర్థము చేసుకోగలుగుచున్నాను.

‘ప్రాణము (శక్తి) - సుఖము - ఆకాశము’ అనునవి భౌతిక రూప రహితములు కాబట్టి నిర్గుణ బ్రహ్మము గురించి మీరు బోధించినవారయ్యారు.

ఓ ఆత్మానంద స్వరూప త్రైయాగ్నులారా! ఇప్పుడు బ్రహ్మము యొక్క గుణసహితత్వము (సగుణత్వము) గురించి మీ వద్ద శ్రవణం చేయాలని భావిస్తున్నాను. దయతో బోధించండి.

గార్హపత్యాగ్ని పురుష బోధ - పృథివి అన్నమ్ అగ్నిః। ఆదిత్య - సోఽహమస్మి।।

గార్హపత్యాగ్ని : ఓ ఉపకోసలా! ఆత్మ సగుణము, గుణాతీతము (నిర్గుణము) కూడా కాబట్టి శాస్త్రములు సగుణోపాసనను కూడా సూచిస్తూ ఉన్నాయి. ఉపాసనచే ఆత్మతత్త్వానుభూతి తప్పక పొందవచ్చు. అది సగుణమైనా ఫరవాలేదు; నిర్గుణమైనా ఫరవాలేదు.

ఇప్పుడు నీకు నీ స్వస్వరూపము, ఈ జగత్తు యొక్క వాస్తవ రూపము, తదితరులుగా కనిపిస్తున్న స్థావర - జంగమ (నీవు-ఆతడు - అది - ఇది) రూపముల సహజ-వాస్తవ రూపమగు ఆత్మను ఏ విధంగా ఉపాసించాలో అనుశాసనము (Thumb-Rule Approach) చేస్తూ చెప్పుతున్నాను. విను.

‘‘పృథివి అగ్నిః అన్నమ్ ఆదిత్య’’ ఇతి య ఏష
ఆదిత్యే పురుషో దృశ్యతే, సోఽహమస్మి। స ఏవ అహమస్మి’’

సమస్తమునకు మొట్టమొదటే ఏర్పడియున్న ఏ పురుష కారణమైతే ‘ఆదిత్య పురుషుడు’ అయి ఉన్నాడో, ఆతడే ‘‘పృథివి, అగ్ని, ఆహారము, సూర్యుడు’’ - రూపములుగా ప్రదర్శనమగుచున్నారు. అట్టి సమస్త సంప్రదర్శనుడగు ఆదిత్య పురుషుడే నేనై ఉన్నాను. నేనే ఆ ఆదిత్య పురుషుడై ఉన్నాను.

నేనుగా ఉన్నది ఆ ఆదిత్య పురుషుడే। ఆ ఆదిత్య పురుషుడుగా ఉన్నది నేనే।

ఈ గార్హపత్యాగ్నిగా నేనే ఆదిత్యునిలో ఉన్నది కూడా। ఆదిత్యునిలో ఉన్న నేనే నాలో నేనుగా ఉన్నది. నాలో ‘నేను’గా ఉన్నదే పృథివి-అగ్ని - ఆహారము - సూర్యుల యందు ‘నేను’గా ప్రకాశమానమై ఉన్నది.

✻ ఎవ్వరైతే అగ్నిని ఆదిత్య పురుష భావనతో ఉపాసిస్తారో,
✻ ఎవ్వరైతే ఈ విధంగా - ‘‘నాలోని ‘నేను’ అనే పురుషకార పురుషుడే భూమియందు, అగ్నియందు, అన్నమునందు, సూర్యునియందు ప్రకాశమానులై ఉన్నారు. ఆ పురుషోత్తముడే నాలో ‘నేను’ అయి ఉన్నారు. నేనే ఆ పురుషోత్తముడను’’ - అని ఉపాసిస్తారో
- సర్వ సంసార దృష్టిదోషములను తొలగించుకోగలరు - అపహతే పాపకృత్యం।
- సమస్త లోకములను తమయందు దర్శించగలరు - లోకీ భవతి।
- పూర్ణాయుర్దాయము కలవాడు అవగలరు. ఆయుర్దాయము సద్వినియోగ పరచుకొన్నవారగుచున్నారు - సర్వమయురేతి।
- జ్యోతిస్వరూపుడై జీవించగలడు - జోగ్జీవతి।
- వారి వంశము లోనివారు క్షీణత, అజ్ఞానము పొందరు. - న అస్య అవర పురుషాః క్షీయన్తే।।

ఉప వయం తం భుంజామో - అస్మిగ్ంశ్చలోకే, అముష్మిగ్ంశ్చ ఏతమ్ ఏవం ఉపాసతే।

ఎవ్వరైతే ఆదిత్య పురుషుడై భూమి - అగ్ని - అన్నము - సూర్యుడుగా వెలుగొందుచున్నారో - ఆయనయే నేనుగా ఉన్నారు. నేనే ఆ ఆదిపురుషుడనై ఉన్నాను.
→ అని ఉపాసిస్తూ ఉంటారో, వారి యొక్క ఐహిక (ఇహలోక) - ఆముష్మిక (పరలోక) సంపదలను, ఫలములను గార్హపత్యాగ్నినగు నేను సంరక్షించు ధర్మము కలవాడనై ఉంటున్నాను. ఇహ- పరములను కాపాడువాడనై ఉంటున్నాను.

ఈ విధంగా గార్హపత్యాగ్ని పురుషుడు (దేవత) ఉపకోసల కామలాయనునికి ఉపదేశించి మౌనము వహించారు.


16–4–12. చతుర్థ అధ్యాయము - ద్వాదశ ఖండము - దక్షిణాగ్ని పురుష ఉపదేశము

జల-దిక్-నక్షత్ర-చంద్రమసో బ్రహ్మ-సోఽహమస్మి

అప్పుడు ‘‘అన్వాహార్యము’’ అనబడే హవిస్సును వండించువాడగు ‘‘దక్షిణాగ్ని పురుషుడు’’ (దేవత) ఈ విధంగా బోధించసాగారు.

చంద్రునిలోని చంద్రమస పురుషకారమే జలము, దిక్కులు, నక్షత్రములు, చంద్రుడు రూపములను దాల్చుచున్నది.

య ఏష చంద్రమసి పురుషో దృశ్యతే - సోఽహమస్మి। స ఏవ అహమస్మి।
చంద్రునిలో ఏ పురుషకారము కనిపిస్తోందో, ఆ చాంద్రమస పురుషకారమే నాలో ‘నేను’గా ఉన్నది. నేనే ఆ చాంద్రమస పురుషకారమై ఉన్నాను.

(దక్షిణాగ్నితో అన్నము వండగా, అది ‘అన్వాహార్యము’ అగుచున్నది. అట్టి అన్వాహార్యము అగ్నికి హవిస్సుగా సమర్పించుచున్నప్పుడు, అది చంద్రలోకము పొంది ‘అన్నము’ అగుచున్నది. అది తిరిగి అన్నమై జీవులను పరిపోషిస్తోంది).

అన్వాహార్య పచనాగ్ని (హవిస్సు వండబడే అగ్ని) పురుషుడు (లేక) దక్షిణాగ్ని పురుషుడు ఇంకా ఇట్లా ఉపదేశించారు.

ఓ ఉపకోసలా!

ఎవ్వరైతే ఈ విధంగా -
‘‘జలము, దిక్కులు, నక్షత్రములు, చంద్రుడుగా ఉన్న చాంద్రమస పురుషకారమే (లేక పురుషుడే) నాలో ‘నేను’గా ఉన్నది. నేనుగా ఉన్నది ఆ చాంద్రమస పురుషుడే। కనుక నేనే జలము, దిక్కులు, నక్షత్రములు, చంద్రుడుగా ఉన్న పురుషకారుడను। చాంద్రమస పురుషుడను’’
- అని ఎరిగి హవిస్సులు నాకు (దక్షిణాగ్నికి) సమర్పిస్తారో…,
⌘ అట్టివారి పాపములు తొలగి పవిత్రులౌతారు.
⌘ ఆయుష్షు సదుపయోగమౌతుంది.
⌘ స్వయంజ్యోతి జీవనులౌతారు.
⌘ ఆతని వంశములో బలహీనులు పుట్టరు.

అట్టివారి ఇహ-పరములను అగ్ని స్వరూపులమై మేము సర్వదా రక్షిస్తూ ఉంటాము. కనుక ఈ విధంగా అగ్ని గురించి తెలుసుకొని హవిస్సులను సమర్పిస్తూ ఉపాసించెదవుగాక।

ఈ విధంగా బోధించి దక్షిణాగ్ని పురుషుడు తన బోధను విరమించి మౌనము వహించారు.


16–4–13. చతుర్థ అధ్యాయము - త్రయోదశ ఖండము-ఆహవనీయాగ్ని పురుష ఉపదేశము

(ప్రాణ-ఆకాశ-ద్యౌ-విద్యుత్ బ్రహ్మ - సోఽహమస్మి)

ఆ తరువాత ఆహవనీయాగ్ని దివ్యపురుషుడు చెప్పటం ప్రారంభించారు.

‘‘ప్రాణము ఆకాశము స్వర్గము విద్యుత్తు - ఈ నాలుగు నా రూపములే।

అట్టి ఆకాశ ప్రాణ స్వర్గ విద్యుత్ (మెఱుపు) రూపుడగు విద్యుత్ పురుషుడే ‘నేను’। నేనే అట్టి విద్యుత్ పురుషుడుగా దృశ్యమానమగుచున్నాను! య ఏతత్ విద్యుతి పురుషో దృశ్యతే సోఽహమస్మి, స యేవ అహమస్మి।

ఇట్టి స్వస్వరూపాత్మ నిర్వచనమును ఎవరు ఉపాసిస్తారో, వారికి సంసార దోషములు అంటవు. ఆయుష్షు సద్వినియోగమౌతుంది. జ్యోతిష్మతులు అవుతారు. ఏ ఆత్మజ్ఞాన విద్వాంసుడైతే ఈ విధంగా ఉపాసిస్తాడో అట్టి వాని ఇహ - పరములు అగ్ని స్వరూపుడనై కాపాడుతాను.

ఓ బ్రహ్మచారీ! ఉపకోసలకామలాయనా!

ఏ పరమాత్మ అయితే విద్యుత్ పురుషుడై ప్రాణ, ఆకాశ, దేవలోక, విద్యుత్ రూపమై ఉన్నాడో అదియే నేను, నేను అది అయి ఉన్నాను.
అని ఉపాసన చేయి. ఇదియే ఆత్మోపాసన యొక్క సాకారోపాసన।

త్రైయాగ్ని దేవతలు (గార్హపత్య-దక్షిణ - ఆహవనీయాగ్ని దేవతా పురుషులు): మేము ఇంతవరకై నీ కొరకై ఈ ఈ కొన్ని విషయాలు బోధించాము.

ఓ సౌమ్యా! ప్రియదర్శనా! ఇక మరికొంత ఆత్మోపాసనా - ఉత్తమ ఫలము కొరకు ఆచార్యులగు సత్యకామ జాబాల మహర్షులవారిని ఆశ్రయించు. వారు పూర్ణబోధను ప్రసాదించగలరు. వారు విద్య యొక్క ఫలము పొందే మార్గమేమిటో చెప్పుతారు.

ఈ విధంగా పలికి, ఆ త్రైయాగ్ని దివ్యదేవతలు తమ బోధను విరమించి అంతర్థానం అయినారు.


16–4–14. చతుర్థ అధ్యాయము - చతుర్దశ ఖండము - లోకోపాసన - బ్రహ్మోపాసన

కొన్నిరోజులు గడిచి, ఒకానొకరోజు గురుదేవులు శ్రీ సత్యకామ జాబాలమహర్షి సంచారము పూర్తి చేసుకొని నిజాశ్రమమునకు తిరిగివచ్చారు. ప్రయాణం చేసిన శ్రమ అంతా తీరిన తరువాత విశ్రాంతిగా ఆసీనులైయున్న గురువర్యులను ఉపకోసల కామలాయనుడు సమీపించి వారి పాదపద్మములను రెండు చేతులతో స్పృశించి కళ్లకద్దుకొని - నమస్కరిస్తూ వినమ్రుడై ఎదురుగా నిలుచున్నారు.

సత్యకామ : ఉపకోసలా! ఉపకోసలా! ఉపకోసలా!

ఉపకోసలుడు : పూజనీయా! ఆచార్యా!

సత్యకామ : సౌమ్యా ప్రియదర్శనా! బ్రహ్మ విద్య ఏవ తే ముఖం భాతి। నీ ముఖము బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవేత్తవలె భాసిస్తోంది! ఏమిటి విశేషం! నీవు ఎవరి దగ్గర బ్రహ్మము గురించి శ్రవణం చేశావు?

ఉపకోశలుడు : ఆచార్యా! పూజనీయా! నాకు మానవులెవ్వరు ఉపదేశించలేదు. మీరు సంచారము వెళ్లగా, నాకు మానవులెవ్వరు ఉపదేసిస్తారు?
అయితే తమరు సంచారమునకు వెళ్లే ముందు నిర్వర్తించిన బ్రహ్మచర్య - వీడ్కోలు సభకు నన్ను పిలువనందుచేత నాకు ఎంతో వేదన కలిగింది. ఆహారము మానివేసి యజ్ఞ వేదికా గృహంలో నీరసంగా పరుండిపోయాను. గురుమాత ఆహారము తినమని బ్రతిమలాడినా నేను వినలేదు. అప్పుడు గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహావనీయాగ్ని దేవతా పురుషులు వచ్చి ఆయా ఉపాసనలు బోధించారు.

సత్యకామ జాబాల : అట్లాగా? వారు ఏమేమి నీకు బోధించారు?

ఉపకోసల కామలాయనుడు : వారు ఈ విధంగా ఉపదేశించారు.

గార్హపత్యాగ్ని దివ్య పురుషుడు

‘‘ఆదిత్య పురుషుడనగు నేనే పృథివి (భూమి) - అగ్ని - అన్నము - సూర్యుడనై ప్రకాశిస్తున్నాను. ఆ ఆదిత్య పురుషుడే ‘నేను’గా నేనే ఆ ఆదిత్య పురుషుడుగాను ఉన్నాము’’ - అను ఉపాసన।

అన్వాహార్య పచనాగ్ని (దక్షిణాగ్ని) దివ్య పురుషుడు

‘‘చంద్రమస పురుషుడనగు నేనే ఆపో(జలము) - దిశో (దిక్కులు) - నక్షత్రాణి - చంద్రమా (చంద్రుడు) రూపములుగా వెలుగొందుచున్నాను. ఆ చంద్రమ పురుషుడే నాలోని నేను. నేనే చంద్రమస పురుషుడను’’ - అను ఉపాసన.

ఆహవనీయాగ్ని దివ్య పురుషుడు

విద్యుత్ పురుషుడనగు నేనే సర్వజీవులలోని ప్రాణశక్తి-ఆకాశము-దేవతాలోకములు-విద్యుత్ (మెఱుపు) రూపములుగా భాసిస్తున్నాను. ఆ విద్యుత్ పురుషుడే నాలోని ‘నేను’ కూడా! నేనే ఆ విద్యుత్ పురుషుడను - అను ఉపాసన।

ఇంకా కూడా ఆ యజ్ఞాగ్ని దివ్య పురుషులు ఇట్లా చెప్పారు.

నీవు ఈ విధంగా ఆత్మోపాసన నిర్వర్తిస్తూ ఉండు, ఇవి నీ ఉపాసన కొరకై చెప్పాము.
త్వరలో ఆచార్యులవారు వస్తారు కదా. వారైతే వీటి ఫలములను, గతిని బోధించగలరు.

అందుచేత గురుదేవా! ‘‘పూర్ణాత్మజ్ఞానము’’ బోధించవలసినదిగా మిమ్ములను వేడుకుంటున్నాను. అప్పుడిక గురుదేవులు సత్యకాములవారు బోధించటం ప్రారంభించారు.

సత్యకామ జాబాల : బిడ్డా! ఉపకోసలా! ఆ త్రైయాగ్ని దివ్యపురుషులు నీవు యజ్ఞ పురుషునికి చేసిన సేవలకు సంతోషించినవారై ‘‘ఇది - ఇది నేనే! నేనే ఇది - ఇది’’ అనే ఆత్మవిద్యను నీ సాధన కొఱకు ఉపదేశము చేసారు. మంచిదే. సాధన చేతనే ఆత్మజ్ఞానము సిద్ధించగలదు. అట్లాగే నిర్వర్తించు.

అయితే, వారు పృథివి, అగ్ని, ద్యు మొదలైన లోకముల గురించి మాత్రమే ఉపదేశించారు. మరి నీ మనస్సులో ఉన్న కోరిక ‘‘బ్రహ్మజ్ఞానము’’ గురించి - అని నీ గురువుగా నేను ఎఱిగియే ఉన్నాను. అందుచేత నీకు నేను బ్రహ్మజ్ఞానము గురించియే బోధిస్తాను.

యథా పుష్కర పలాశా ఆపో న శ్లిష్యంత, ఏవమేవం విది, పాపం కర్మ న శ్లిష్యత- ఇతి।।
తామరాకును నీరు అంటని విధంగా బ్రహ్మజ్ఞాన ప్రభావము చేత ఈ ఇంద్రియ దృశ్య వ్యవహారములేవీ నిన్ను స్పృశించజాలవు.

ఉపకోసల కామలాయనుడు : గురుమహాదేవా! మీరు చెప్పు ఆత్మజ్ఞాన విద్యను బ్రహ్మచారినైన నేను శ్రవణ - మనన - నిదిధ్యాసలకు సంసిద్ధుడను. మీకు శరణాగతుడను. దయతో ఆత్మవిద్య నాకు బోధించండి. మీరు చెప్పబోవు బ్రహ్మవిద్యను శ్రద్ధగా శ్రవణం చేసి హృదయస్థము చేసుకొనగలను. బ్రవీతు మే భగవన్!


16–4–15. చతుర్థ అధ్యాయము - పంచదశ ఖండము-కంటిలోంచి దృశ్యమును చూస్తూ ఉన్న పురుషుడే ‘ఆత్మ’

తస్మై హోవాచ! అప్పుడు సత్యకామజాబాల ఆచార్యులవారు ఉపకోసల కామలాయనునికి ఇట్లా బోధించసాగారు.

కనులలో నివసిస్తూ కనులతో చూస్తున్న ద్రష్ట - పురుషుడే ‘‘ఆత్మ’’ య ఏషో అక్షిణి పురుషో దృశ్యత - ఏష ఆత్మేతి

Two-Eyes

కనబడేవన్నీ మారుచూన్నాయి. చూచేవాడో! చూస్తున్నప్పుడు, చూడనప్పుడు కంటిలో పురుషకారుడై (చూచువాడై) ఉన్నాడు. తాను మారక, సమస్త మార్పుచేర్పులను దృశ్యంగా చూస్తూ ఉన్నదే ఆత్మ! అట్టి దృశ్యమును చూస్తూ ఉన్న దృక్ పురుషుడు.

అమృతమ్ : కన్ను ఉన్నా లేకున్నా, (లేక) దేహము ఉన్నా లేకున్నా కూడా ‘‘చూచుచున్నవాడు’’ మాత్రం మృతించడు. చూడబడేది మారవచ్చు గాక! చూచుచున్నవాడు మారడు. అందుచేత చూచువాడే (One who is using the Eyes to see all else) అమృతమగు ఆత్మస్వరూపుడు- ‘‘యత్ దృశ్యమ్, తత్ నశ్యమ్’’ చూడబడేదానికి ‘నశించటము’ అనే ‘ధర్మము’ ఉన్నది. కానీ ‘చూచువాడు’ నశించు ధర్మమే లేదు.

అభయమ్ : చూచువాడే చూడబడే సమస్తముగా స్వకీయమైన ‘చూపు’ చేత విస్తరించి ఉంటున్నాడు. ఆతడు స్వకీయమైన ‘చూపు’ చేత విస్తరించి ఉంటున్నాడు. ఆతడు తనకు ద్వితీయము లేనివాడు. (ఆతనికి చూడబడేదంతా వేరుకాదు). ‘చూపు’లోని అంతర్విభాగమే. అందుచేత ఆత్మగా ఆతనికి భయము లేదు. అభయమ్।
[ (చూడబడునది, చూపు, చూచువాడు) అనే త్రిపుటి యొక్క ఏకత్వం అవగాహనతో ఏర్పడే అనుభూతియే దైవ దర్శనము ]

ఏతత్ బ్రహ్మేతి : అట్టి చూచువాడే ఈ జీవునిలో బాహ్య-అభ్యంతరముల కంటే మనో బుద్ధి చిత్త అహంకారము మొదలైన వాటి కంటే మునుముందువాడు. మహత్తరుడు. ముఖ్యుడు. ఆ చూచేవాడే బ్రహ్మము.
ప్రతి దేహములోను ‘చూచేవాడు’గా ఉన్నది బ్రహ్మమే। చూచువాడు సర్వదా కనబడే సమస్తమునకు పరమై ఉన్నాడేగాని, చూడబడుదానిచే తాకబడేవాడు కాదు. తాకబడి దోషము పొందేవాడు కాడు. అనగా దృశ్యము యొక్క దోషములు గాని, దృశ్యము యొక్క రాకపోకలు గాని చూచువానిని తాకజాలవు.

దృష్టాంతంగా…, (తామరాకును నీరు అంటని తీరుగా) నేయిగాని నీరుగాని కళ్లకుతాకిస్తే అవి కనెరెప్పలకు అంటుతాయేగాని, కనుగ్రుడ్డులకు అంటవు కదా! కంటిలోని స్థానము కలిగియున్న పూర్ణాత్మ నిర్దోషము (నిత్యనిర్మలము). అసంగము (Non Related / concerned with what is being experienced).

అట్టి ఆత్మను ‘‘సంయద్వామ’’ (యత్ - ఏదైతే, సం - సత్ స్వరూపమై, వామ- సమస్తమునకు వేరై ఉన్నదో) అని పిలుస్తున్నారు. సమస్త దృశ్య వస్తువులు అట్టి దృష్టి ప్రసరించుటచేతనే ‘దృశ్యము’ రూపము దాల్చుచున్నది.

ఎవ్వడైతే అట్టి కంటిలోని అక్షిపురుషుని (‘చూచుట’ అను పురుషకారత్వము నిర్వర్తిస్తూ ఉన్న కేవల పురుషుని) ఆత్మస్వరూపముగా ఉపాసిస్తాడో - ఆతనికి సర్వలోకముల తత్త్వము సుస్పష్టమై తెలియగలవు. అట్టి భానుని (ప్రకాశ స్వరూపుని) గురించి ఎరిగి ఆత్మగా దర్శించువాడు ఏ లోకములో ఉన్నా కూడా శ్రేష్ఠుడై ప్రకాశించగలడు.

అక్షిణి పురుషుని ఆత్మగా దర్శిస్తూ ఉపాసించువాని - ఫలశ్రుతి (ఉత్తరోత్తరా పొందు ప్రయోజనములు) (Travel from Ignorance to Bliss) .

✤ అట్టి కనులలో చూచువానిని ఆత్మోపాసన చేస్తున్నవాడు స్వాభావికంగానే ప్రకాశ దేవతను పొందగలడు. పితృకార్యము - ఆతని పట్ల నిర్వర్తించబడినా, నిర్వర్తించబడకున్నా కూడా ఆతడు ‘చీకటి’ని వీడి వెలుతురు (Englightenment) ఆశ్రయించువాడై ఉంటాడు. అర్చిస్సులలో (కాంతి కిరణములలో) ప్రవేశిస్తాడు. (Optimistic Rays)
✤ అర్చిస్సుల నుండి (సూర్యకిరణముల నుండి) పగటి కాంతి (పగటి వెలుగు)లో ప్రవేశించి ప్రయాణము సాగించగలడు. (Positive Frame of mind)
✤ పగటి కాంతి నుండి ‘‘శుక్లపక్ష దేవతలో ప్రవేశించి ప్రయాణించగలడు. (Progress towards Divinity i.e. opposite to worldly differences)
✤ శుక్లపక్షము నుండి (ఉత్తరాయణము నుండి) సంవత్సర దేవతను చేరుచున్నాడు. (Witness of Time)
✤ సంవత్సర దేవత నుండి ఆదిత్యుని యందు ప్రవేశము పొందుచున్నాడు. (సంవత్సరమ్ ఆదిత్యామ్)
✤ ఆదిత్యుని నుండి చంద్రమసము చేరుచున్నాడు. - (ఆదిత్యాత్ చంద్రమసమ్)।
✤ చంద్రుని నుండి విద్యుత్ (తేజోమయ) దేవతను పొందుచున్నాడు (చంద్రమసో విద్యుతమ్)।
✤ విద్యుత్ (తేజస్సు) నుండి ‘బ్రహ్మము’ను పొందుచున్నాడు. విద్యుతం తత్పురుషో।

అమానవః - జనన మరణ చక్రముల నుండి విడివడి మానవాతీతలోకములో స్థానము పొందగలడు.

స ఏనాత్ ‘బ్రహ్మ’ గమయత్యేష దేవపథో బ్రహ్మపథ।
అట్టి కంటిలోని అక్షిపురుషుని (one who is seeing through the eyes) - బ్రహ్మముగా సమస్త నేత్రములలో దర్శిస్తూ ఉపాసించువాడు దేవపథములో బ్రహ్మపథములలో ప్రవేశించి బ్రహ్మమే తానగుచున్నాడు.

అట్టివాడు జనన మరణ చక్రాంతర్గతమగు మనుష్య జన్మకు తిరిగిరాడు. జన్మ-కర్మల పరిధులను అధిగమించి అఖండమగు బ్రహ్మమే తానై వెలుగొందగలడు.


16–4–16. చతుర్థ అధ్యాయము - షోడశ ఖండము - యజ్ఞోపాసన - యజ్ఞఫలము

ఏష హ వై యజ్ఞో యోయం పవత।
వాయువు వీచికలు : ‘‘వాయువు వీచటము’’ - (సృష్టి కార్యక్రమమునందు) జరుగుచున్న యజ్ఞమే। యన్నిదగ్ం సర్వం పునాతి। ఆ వాయువు వీచికలు ఈ సమస్త జగత్తును పునీతము, స్వచ్ఛము చేయుచున్నది.

అట్టి వాయు వీచికలు మనస్సు, వాక్కు రూపముగా కూడా వర్తించుచున్నాయి. వాయువు యొక్క ప్రసరణకు → మనస్సు వాక్కు మార్గములు అయి ఉన్నాయి.

‘‘మంత్రము’’ → ఉచ్చరించే వాక్కును, ‘వాక్’ → ఇంద్రియమును ఉచ్చరింపజేసే మనస్సును యజ్ఞమునందు వాయు ప్రసరణమును విస్తరింపజేస్తూ నియమించుచున్నది. వాక్ - మనస్సులను విస్తరింపజేసేది వాయువే।

ఉచ్ఛ్వాస-నిశ్శ్శ్వాసల చేతనే వాక్కునకు భావనను జత చేర్చే మనస్సునకు ముందు (వెనుకలందు) - వాయువు చలనము కారణమవటమే యజ్ఞము.

- - -

ఎవ్వరు యజ్ఞము చేయుచున్నారో - వారు సర్వమును వాయువుచే మొదట పవిత్రముగా చేయుచున్నారు. వాయువుచే ఆరంభింపబడిన యజ్ఞమునకు వాక్కు, మనస్సు అత్యంత ప్రాధాన్యములు.

వాక్కు మనో సంస్కారములు

మనో సంస్కారము : తయో అన్యతరాం మనసా సగ్ంస్కరోతి బ్రహ్మా! ధర్మాధర్మ విచక్షణ చేస్తూ ‘‘బ్రహ్మ’’ - అనే ఋత్విక్కు యజ్ఞక్రియనంతటినీ మనస్సుతో (ఉపాసనచే) సంస్కరిస్తూ ఉంటారు.
అధిదేవత, ప్రత్యధి దేవతల ఆహ్వానమును ఉపాసనను మనస్సుతో సంకల్ప విధులు నిర్వర్తిస్తూ యజ్ఞపురుషునికి సమర్పిస్తూ ఉంటారు.

వాక్ సంస్కారము : వాచా హోతా ఆధ్వర్యుః ఉద్గాతా అన్యతరామ్। యజ్ఞ విధానమును వాక్కుతో సంస్కరించువారు హోత (హోమము చేయువాడు), ఆధర్యుడు (యజ్ఞమునందు యజుర్వేదమంత్రములు చదువువాడు), ఉద్గాత (యజ్ఞమునందు సామవేద మంత్రములు గానము చేయువాడు), ఋత్విక్ (మంత్రములను, విధానమును నడిపించువాడు) - వీరందరూ యజ్ఞమునకు వాక్ సంస్కార సేవ నిర్వర్తిస్తూ ఉంటారు.

యజ్ఞప్రారంభంలో-

ఆ తరువాత బ్రహ్మ మౌనం వహిస్తారు. ఇక ఋత్విక్కు ‘‘పరిధానీయము’’ (యజ్ఞ దిగ్విజయముకై దేవతా ప్రార్థనలు/ అభ్యర్థములు/ అనుమతి వేడుకొనుటములకు సంబంధించిన వేదమంత్రములు) చదువుతారు.

అవన్నీ పూర్తి అయ్యే వరకు బ్రహ్మ (ముఖ్య ఋత్విక్కు) మౌనము వహించి ఉంటారు.

బ్రహ్మతో సహా అందరూ ఆ పరిధానీయ మంత్రములతో తమ మనస్సును ఆయా దేవతలకు అభ్యర్థనపూర్వకంగా నియమిస్తూ, మంత్రములను శ్రద్ధగా, భక్తిగా ‘శ్రవణం’ చేయుదురు గాక। ఆ సమయంలో వాక్కు, మనస్సు యజ్ఞ విధుల కొరకై సంస్కరించబడి, సంసిద్ధత సంతరించుకుంటూ ఉంటాయి.

యజ్ఞము → ‘‘వాక్కు- మనస్సు’’ల కలయికచేతనే ఉత్తమ ఫలితము ప్రసాదించగలదు. అర్థము - విధి విధానము - ఈ రెండింటినీ బ్రహ్మ, తదితర ఋత్విక్కులు అందరికీ తెలియజేస్తూ ఉంటారు. ‘‘ఏమి చేయాలి? ఎట్లా చేయాలి? ఎందుకు చేయాలి’’… ఇవన్నీ ఋత్విక్కు, ఆధ్వర్యుడు మొదలైనవారు తెలిసియున్నవారై, వేదసభికులకు తెలియజేయుచుండెదరు గాక!

మానవుడు రెండు కాళ్ళతోనే నడవగలడు. రెండు చక్రములు కదిలితేనే రథము కదలగలదు.
యజ్ఞము కూడా…,

మొదలైన ద్వంద్వములు యజ్ఞకార్యక్రమంలో అంతర్లీనగానములై ఉండాలి.

ఈ విధంగా ప్రతిష్ఠ పొందినప్పుడు యజమానికి, సందర్శకులకు, యజ్ఞము చేయించు ఋత్విక్కు మొదలైన వారికి ఉత్తమ యజ్ఞఫలము లభించగలదు.

యజ్ఞము అశ్రద్ధ, అన్యచింతన మొదలైన వాటిచే లోపభూయిష్టము కారాదు. యజ్ఞము తృప్తిగా జరగటము అందరికీ క్షేమము.

యజ్ఞపురుషుడు ఆత్మతత్త్వజ్ఞానమునకు మార్గదర్శకుడై ఉంటారు. యజ్ఞము లోకక్షేమము, వ్యక్తిగత శోభ ప్రసాదించగలదు.


16–4–17. చతుర్థ అధ్యాయము - సప్తదశ ఖండము-‘‘వ్యాహృతి ఉపాసన’’

యజ్ఞము జరుగుచున్న సందర్భంలో బ్రహ్మ (ముఖ్య ఋత్విక్కు) సమస్తము పర్యవేక్షిస్తూ మౌనము వహించి ఉంటారు. ‘‘మౌనము పాటించవలెను’’ అనునది శ్రుతి నిర్ణయము.

ఎక్కడైనా కర్మలయందు పొరపాటో, లోపమో వచ్చినప్పుడు - అప్పుడు శ్రుతి ప్రాయశ్చిత ‘‘భూస్స్వాహా। భువస్స్వాహా। సువస్స్వాహా’’ మొదలైన మంత్రములతో ‘‘ప్రాయశ్చిత్తం కొరకై ఘృతము (నేయి) హోమముగా సమర్పణ’’ చెప్పబడుతోంది.

ప్రజాపతి (సృష్టికర్త) - ‘‘నేను లోకములను కల్పన చేసెదను గాక।’’.. అని భావించి ధ్యాసను నిలిపి ‘‘ధ్యానము’’ చేయసాగారు. ధ్యానము చేయు ‘రసము’ను, ఆ రసము (Essence) నుండి రసాత్మకమైన - సారభూతమైన - కళాత్మకమైన వస్తు సమూహములను - భావనామాత్రంగా కల్పించ (సృష్టించ)సాగారు.

అట్టి అగ్ని-వాయు-ఆదిత్యుల నుండి అనేక కల్పనా పరంపరల కొరకై ధ్యానము చేశారు. ఆ ముగ్గురు దేవతల నుండి అనేక సారభూతములైనవాటిని వెలికితీసి సృష్టిలో స్థానము ఇవ్వసాగారు.

అగ్ని నుండి - ఋక్కులను (ఋగ్వేదమంత్రములను)
వాయువు నుండి - యజుర్వేద యజస్సులను (యజుర్వేద మంత్రములను)
ఆదిత్యుని (సూర్యుని) నుండి - సామములను (సామవేద సంగీత-స్తుతి గానములను) రసముగా ప్రజాపతి స్వీకరించారు.

ఆ ప్రజాపతి - అట్టి త్రైవేదముల నుండి మరల ధ్యానం చేసి కొన్ని సారభూతమగు వస్తువులను ‘ధ్యానము’చే వేరు చేసారు.

ఋక్కుల నుండి (ఋగ్వేదము నుండి) - ‘‘భూః’’ (Solid) అనే వ్యాహృతిని, (భూలోకమును)
యజస్సుల నుండి (యజుర్వేదము నుండి) - ‘‘భువః (Thought / Feelings) అనే వ్యాహృతిని, (భువర్లోకమును)
సామముల నుండి (సామవేదము నుండి) ‘‘స్వః’’ (Thinker/Feeler) అనే వ్యాహృతిని (స్వర్గలోకమును)
అట్టి ‘‘భూః’’ మొదలైన వ్యాహృతులు - లోకముల, దేవతల, వేదముల సారము.

అట్టి సృష్టియే ‘‘యజ్ఞము’’ ద్వారా ఆత్మజ్ఞానముగా ఉపాసించబడుచున్నది. అనగా ముముక్షువుకు ఈ సమస్త సృష్టి ఆత్మజ్ఞానము కొరకు ఉపకరణము (పంచపాత్ర, ఉద్ధరిణ వంటిది) అగుచున్నది.

అట్టి యజ్ఞము విధి విధానంగా, మంత్రయుక్తంగా నిర్వర్తించబడు గాక!

యజ్ఞ శాస్త్రములో దోషములు దొర్లితేనో? వాటికి కొన్ని దోష ప్రాయశ్చిత్తములు (వృత్త ఉపశాంతులు) కూడా చెప్పుచున్నాయి.

Ⅰ. ఋక్కుల విభాగములో ఏవైనా దోషములు దొర్లితే → ‘‘భూస్స్వాహా’’ ఇతిగార్హపత్యే జుహుయాత్। ‘‘భూస్స్వాహా’’ అని గార్హపత్యాగ్ని యందు నేయి హోమము చేసెదరుగాక। ఇది ఋక్కుల ఉచ్చారణలో పొరపాట్లకు పాయశ్చిత్తము. ఈ విధంగా ఋక్కుల శక్తి - సారములచే ఋక్కులకు చెందిన దోషములు లోటు నివారణము కాగలదు.

Ⅱ. యజుర్మంత్ర - యజస్సులలో ఏవైనా లోటుగాని, దోషములు గాని జరిగితే → ‘‘భువస్స్వాహా’’ ఇతి దక్షిణాగ్నే జుహుయాత్। ‘‘భువస్స్వాహా’’ అని మంత్రము చెప్పుచు దక్షిణాగ్ని యందు నేయి హోమము చేయుదురు గాక! అది అన్ని దోషములకు ప్రాయశ్చిత్తము.

Ⅲ.సామముల (సామవేద మంత్ర ధ్యాన విధులలో) ఏవైనా లోటు దోషములు జరిగితే…
‘‘స్వస్స్వాహా’’ ఇతి ఆహవనీయే జుహుయాత్। ‘‘స్వస్స్వాహా’’ అను మంత్రము చెప్పుచూ నేయిని ఆహవనీయాగ్ని యందు హోమము చేసెదరు గాక! ఇది దోషములకు ప్రాయశ్చిత్తము.

ఒకవేళ బ్రహ్మ (ముఖ్య ఋత్విక్కు) మౌనము వీడటము మొదలైన ఏవైనా దోషములు జరిగినప్పుడు మాత్రము పాయశ్చిత్తంగా - గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని - త్రీగ్నులకు (నేయిని) హోమము చేయటము - ప్రాయశ్చిత్తమగుచున్నది. ‘‘బ్రహ్మ’’ యొక్క దోషము - వేద విద్య చేతనే అగుచున్నది - అని శ్రుతి ప్రవచనము.

దృష్టాంతంగా→
క్షారద్రవ్యము చేతనే (Borox) బంగారముతోనే తెగిన బంగారం ముక్కలను అతికించగలము.
తగరముతోనే - సీసము అతికించగలము.
సీసముతోనే - ఇనుమును అతికించగలం.
ఇనుముతోనే - కట్టె (wood)ను అతికించగలము.
ఈ తీరుగానే దేనికి ఏది ప్రాయశ్చిత్తమో ఆ విధంగానే (పైన చెప్పబడినట్లు) - యజ్ఞ విధులలో లోటు, పొరపాటు, దోషములను నివారించుకొనెదరు గాక!

ఋత్విక్కు లోకముల యొక్క, యజ్ఞపురుషుని యొక్క, యజ్ఞ విధుల ప్రకారము ఆహ్వానించి పూజించవలసినట్టి దేవత - ప్రత్యధి దేవతల యొక్క మంత్రతంత్రములకు సంబంధించి ఉత్తమ పరిజ్ఞానము కలిగి ఉండాలి.

ఆతడు వేద విద్యాశక్తితో యజ్ఞములోని లోటుపాటులను మంత్ర-తంత్రముగ్ధంగా సరిచేయటము ఎరిగినవాడై ఉండును గాక! అట్టి బ్రహ్మ ముఖ్య ఋత్విక్కు) ఒక వైద్యుని వంటివాడు. యజ్ఞ విధి, ప్రాయశ్చిత్తము, వ్యాహృతి హోమము తెలిసిన బ్రహ్మ యజ్ఞము దిగ్విజయమై ఉత్తమోత్తమ ప్రయోజనము ప్రసాదించగలడు.

గుఱ్ఱము రౌతును రక్షించుతీరుగా యజ్ఞమును బ్రాహ్మణ ఋత్విక్కు యజ్ఞము పూర్తి అయ్యే వరకు రక్షించాలి. యజమానిని, కార్యకర్తలను, హోత - ఆధ్వర్యుడు - ఉద్గాత - మొదలైన యజ్ఞమును నిర్వర్తింపజేయు ఋత్విజులను సర్వదా కాపాడుకుంటూ ఉండాలి.
యజ్ఞము మొదలు - చివర వరకు ఉత్తమ ఫలితము లభించుటకై ప్రోత్సహించాలి. హెచ్చరించాలి. దోషములు జరిగితే ప్రాయశ్చిత్తం చేయించాలి. సరీయిన విధి - విధానములను ఆచరించునట్లు నడిపించాలి.

బ్రహ్మ, ఋత్విజుడు, హోత మొదలైనవారు ఏకాగ్రతతో తమ తమ విధులను నిర్వర్తిస్తూ ఉండాలో తెలుసుకొని ఉండాలి.

బ్రహ్మ (ముఖ్యఋత్విజుడు) శాంతపురుషుడై ఉండాలి. మౌనంగా ఉంటూనే అన్నీ పర్యవేక్షించాలి. ఆతనికి కోపము, ఆవేశము, అరుపులు ఉండరాదు.

ఈ విధంగా బ్రాహ్మణ బ్రహ్మ యజ్ఞమును, యజ్ఞ విధులను ప్రాయశ్చిత్త మంత్రములను నిర్వర్తించేవారి శారీరక మానసిక సౌకర్యములను తెలిసి, జ్ఞప్తి యందు కలిగినవాడై ఉండాలి. పరమశాంత స్వభావుడై ఉండాలి. అందరినీ స్నేహపూరితంగా కలుపుకుంటూ యజ్ఞమును సమర్థవంతముగా నడిపించగలవాడై ఉండాలి.

అందుచేత ముఖ్యఋత్విక్కుగా (బ్రహ్మగా) శ్రేష్ఠుని ఎన్నుకొని (యజమాని) నియమించుకోవాలి. పై గుణ విశేషములు కలవానిని ఎన్నుకోవాలి.

అన్నివైపులా యజ్ఞమును వేదమంత్ర పఠన నిష్ఠులను తదితర హోత మొదలైనవారిని రక్షించవలసిన ధర్మజ్ఞుడు బ్రహ్మయే (ముఖ్య ఋత్విజుడే).

ఆతనికి ‘‘పరమశాంతము’’ నియమము. ఎప్పుడైనా కోపగించటము, విసుగుకోవటము, ఏవైనా పొరపాట్లను గమనించక పోవటము, తెలియక నిర్వహణలోని వారిని తొందరపెట్టటము - ఇటువంటి పొరపాట్లు జరిగితే, అప్పుడు బ్రహ్మ (ముఖ్య ఋత్విజుడు)
- యజ్ఞకర్త హోమద్రవ్య సమర్పణ ముగిస్తూ ఉండగానే - బ్రహ్మ లేచి హోమమును ‘3’ ‘3’ సార్లు ఈ విధంగా చేయాలి.

(1) ‘‘తత్ తత్ర యజ్ఞే యద్యఋక్త ఋక్ సంబంధాత్ ఋత్ నిమిత్తం రిష్యేత్ - యజ్ఞః క్షతం ప్రాప్నుయాత్ -‘‘భూస్స్వాహా’’। ‘‘ఇతి - గార్హపత్యే జుహుయాత్।।
అని ‘3’ సార్లు చదువుతూ ‘3’సార్లు గార్హపత్యాగ్నికి హోమద్రవ్యము (నేయి) సమర్పించాలి.

(2) అథ యది యజుషో రిష్యేత్ - యజుర్నిమిత్తం ‘‘భువస్స్వాహా।’’ - ఇతి - దక్షిణాగ్నౌ జుహుయాత్।।
అని 3 సార్లు చదువుచూ 3సార్లు దక్షిణాగ్నికి హోమద్రవ్యము సమర్పించాలి.

(3) అథ యది సామతో రిష్యేత్ సామ నిమిత్తం ‘‘స్వస్స్వాహా।’’ - ఇతి - ఆహవనీయే జుహుయాత్।
అని ‘3’ సార్లు చదువుతూ ‘3’ సార్లు ఆహవనీయాగ్నికి హోమద్రవ్యము సమర్పించాలి.

ఈ విధంగా బ్రహ్మ అనే ఋత్విక్కు త్రై అగ్నులకు సమర్పించాలి.

అదేవిధంగా హోత, అధర్వుడు, ఉద్గాత కూడా వారు సేవించిన విభాగములకు హోమము ముగియటానికి ముందు పై మంత్రములతో హోమద్రవ్యమును ఆయా గార్హపత్య, దక్షిణ, ఆహవనీయాగ్నులకు ప్రాయశ్చిత్త త్రయీద్రవ్య సమర్పణ (దోష నివారణ కొరకు) సమర్పించెదరు గాక!

ఈ విధంగా ఋత్విక్కుల మౌనభ్రంశమునకు తదితరములైన హోతము - ఓద్గాత్రములకు - కర్మలలో లోపము కలిగినప్పుడు ‘వ్యాహృతులతో హోమము’ అనే ప్రాయశ్చిత్తముగా (ఆరణ్యకములలో) చెప్పబడినది నిర్వర్తించి శాంతిని పొంది ఉండెదరు గాక!


ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్
చతుర్థ అధ్యాయః సమాప్తః




16–5.     ఛాందోగ్యోపనిషత్ - అధ్యయన వచన పుష్పము - పంచమ అధ్యాయము


16–5–1. పంచమ అధ్యాయము - ప్రథమ ఖండము - ప్రాణము యొక్క జ్యేష్ఠత్వ శ్రేష్ఠత్వములు

ఎవ్వరైనా సరే, ‘‘నేను ఈ రోజు నుండి అత్యంత శ్రద్ధగా ఉపాసించటము ప్రారంభిస్తాను’’ - అని అనుకుంటే, అప్పుడు ఆయన

‘‘ఏది అత్యంత శ్రేష్ఠమో, ఏది అత్యంత జ్యేష్ఠమో (That which is very importantly Special and the Biggest / Finest) - అద్దానినే ఉపాసించు వస్తువుగా, గమ్యముగా ఎన్నుకుంటాను!….’’

అని అనుకోవటము స్వాభావికమే కదా!

🙏🙏🙏

ఈ శరీరములో చూపు, వినికిడి, వాక్కు, రుచి, స్పర్శ, వాసన, ఆలోచన, తెలివి, ఇష్టము మొదలైన అనేక విశేషాలు ఉన్నాయి. అయితే వీటిలో ఉపాసనకై ఏది జ్యేష్ఠము (The Biggest), శ్రేష్ఠము (The most important) అయి ఉన్నది?

ఈ ప్రశ్నకు ఋషి సమాధానము -

ప్రాణో వావ జ్యేష్ఠః - శ్రేష్ఠశ్చ। ప్రాణమే వాక్కు, చూపు, వినికిడి, ఆలోచన, విచక్షణ మొదలైన వాటికంటే మునుముందే ఉన్నట్టిది. అట్టి ప్రాణశక్తితో జీవుడు గర్భమునందు ప్రవేశించగా, ఆ తరువాత కాళ్లు, చేతులు, చర్మము, చెవులు, ముక్కు, కళ్లు మొదలైనవన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. ముందుగా గర్భస్థ శిశువుకు క్రమంగా కన్ను - చెవి గోళకములు ఏర్పడుచున్నాయి. శిశువు భూమిపై పుట్టిన తరువాతే చెవులు, కళ్లు మొదలైన ఇంద్రియములు వ్యవహరించటం ఆరంభిస్తున్నాయి. కాబట్టి ప్రాణమే అన్నిటికంటే పెద్దది అగుచున్నది.

ఎవ్వడైతే అతిశయించి అన్నిటినీ కప్పి ఉంచు వసిష్ఠమైన దానిని (అనగా - ప్రాణమును) ఉపాసిస్తాడో - అట్టివాడు అందరిలో ‘వసిష్ఠుడు’ (శ్రేష్ఠుడు) అగుచున్నాడు.

వాగ్వా వసిష్ఠః। వాక్కు నిశ్చయముగా శరీరములో వసిష్ఠమైనది (అతి ముఖ్యమైనది). చక్కగా మాట్లాడటము తెలిసినవాడు (వాక్ చాతుర్యము కలవాడు) అందరిచేత గౌరవించబడగలడు. ఇష్టబడగలడు. అందుచేత వాక్కు వసిష్ఠముగా (Very effectively) ఉపయోగించబడు గాక।

= మాట మంచిగా ఉంటే ఊరు మంచిది అవుతుంది.  
(వాక్ తపస్సు : అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియం, హితం చ యత్, స్వాధ్యాయాభ్యాసనం చ ఏవ ‘‘వాక్‌మయం తపః’’ ఉచ్యతే।। - భగవద్గీత - 17-15)

వసిష్ఠమగు వాక్కును ఉపాసనగా ఉపయోగించువాడు లోకమున వసిష్ఠుడు అగుచున్నాడు.

చక్షుర్వావ ప్రతిష్ఠా! : ఎవ్వడైతే ప్రతిష్ఠమైన దానిని (అంతటా ఏర్పడినదై ఉన్నదానిని) దర్శిస్తూ ఉపాసిస్తాడో, అట్టివాడు లోకములో ప్రతిష్ఠవంతుడు అవుతాడు. దృష్టియే సృష్టి. అట్టి దృష్టిని (చూపును) ఎవడు ఆత్మగా ఉపాసిస్తాడో - స అస్మిం లోకే, అముష్మిగ్ంశ్చ (పరే) ప్రతితిష్ఠతి హ। అట్టి ప్రతిష్ఠితమగు చూపు (దృష్టి)ని ‘‘పరమాత్మ’’ భావనతో ఉపాసించువారు ఇహమునందు, పరమునందు కూడా సుప్రతిష్ఠత సముపార్జించుకోగలరు.

శ్రోత్రం వావ సంపత్ : చెవియే జీవునికి సంపద. వినటము చేతనే వేదములు, వేదార్థములు, గురువాక్యముల శ్రవణ మననములు చేయగలరు. శ్రద్ధగా వినినప్పుడే జీవుడు బుద్ధిమంతుడు, సత్కర్మనిష్ఠుడు కాగలడు. శ్రవణము చేతనే జీవితము సమృద్ధమవగలదు. ఉత్తమ శ్రవణము చేయువాడు దేవతల - మానవుల సంపదలు పొందగలడు.

మనో హ వా ఆయతనమ్ : ఎవడు మనో - ఆయతనమును (ఆశ్రయమును) ఉపాసిస్తాడో, అట్టివాడు ఉత్తమమైనవి ఆశ్రయించగలడు. మనస్సే ఆశ్రయించు ధర్మము కలిగి ఉన్నది. కనుక మనస్సే ఆయతనము. పంచేంద్రియములు దృశ్య సమాచారములను తీసుకువచ్చి ‘మనస్సు’కు అందిస్తున్నాయి. మనస్సు తన వృత్తులను ఉపయోగించి ‘ప్రతిస్పందనము’ను ఇంద్రియములకు ఆజ్ఞాపిస్తోంది. అందుచేత ‘మనస్సే ఆయతనము’ అని చెప్పబడుతోంది.

సమస్తమునకు ఆశ్రయము మనస్సే। బంధమోక్షములకు కూడా మనస్సే ఆశ్రయము (మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో)।

ఇంద్రియములు పరస్పరం విరోధించుట

ఒకానొక సందర్భములో మనము పైన చెప్పుకున్న ‘‘వసిష్ఠము’’, ‘‘ప్రతిష్ఠ’’, ‘‘సంపద’’, ‘‘ఆయతనము’’ మొదలైన విశేషములు గల ‘ప్రాణదేవతలు’గా వర్ణించబడు ఇంద్రియములు శరీరములో ఒకచోట సమావేశమైనాయి. అవి తాము శరీరమునకు కల్పిస్తున్న శ్రేయస్సు గురించి సంభాషించుకోసాగాయి. ఇంతలో వారి సంభాషణ ‘చర్చలు’గా మారి, వాదనలై తీవ్రతరం కాసాగాయి. ‘‘అహం శ్రేయసి। అహం శ్రేయానస్మి। అహం శ్రేయోనస్మి।’’ - ‘‘మేమే ఈ శరీరమునకు గొప్పగా శ్రేయస్సు కలిగిస్తున్నాం’’ - అని వాదించుకుంటూ, ఒకరికొకరు గురించి విరుద్ధంగా కూడా వాదోపవాదములు చేసుకోసాగాయి. ఆత్మ స్తుతి, పరనింద చేసుకోసాగాయి.

ఆ సమావేశములో ‘‘వాక్కు - చూపు - వినికిడి - మనస్సులలో ఏది గొప్ప?’’ అనేది అవి ఇదమిత్థంగా తేల్చుకోలేకపోయాయి. అప్పుడా ఇంద్రియ దేవతలు తమ పితృదేవులగు ప్రజాపతిని సమీపించాయి.

ఇంద్రియ దేవతలు : పితృదేవా! ప్రజాపతీ! వాక్కు - చూపు - వినికిడి - మనస్సులను జీవులకు ప్రసాదిస్తున్న మా ఇంద్రియ దేవతలలో ఎవరు గొప్పయో మేము తేల్చుకోలేకపోతున్నాము. పూజనీయా! దయచేసి మీరు నిర్ణయించండి, మాలో ఎవరు శరీరములో గొప్పయో!

ప్రజాపతి : ఓ ఇంద్రియ దేవతలారా! శరీరములో మీరంతా ముఖ్యులే!

ఇంద్రియ దేవతలు : పితృదేవా! అది సరేలెండి. మాలో అత్యంత ప్రాధాన్యులెవరో, అది మీరు నిశ్చయించి చెప్పండి.

ప్రజాపతి : ఆదా! అది మీరే తేల్చుకోండి. అయితే అందుకు పరీక్షించుకొనే ఒక విధానము మాత్రం నేను చెపుతున్నాను, వినండి!

యస్మిన్ వ ఉత్క్రాన్తే (ఇదం) శరీరమ్ పాపిష్ఠతరమివ దృశ్యేత స వః ‘‘శ్రేష్ఠ’’ ఇతి।

మీలో ఎవ్వరైతే శరీరమును వీడిపోయినప్పుడు, ఈ శరీరము ఎందుకూ కొరగాకుండా (ఉపయోగించకుండా) పోతుందో, పాపిష్ఠతరము అవుతుందో అదియే (ఆ దేవతయే) శ్రేష్ఠాతిశ్రేష్ఠమని, జ్యేష్ఠమని మీరు కావాలంటే నిర్ణయించుకోవచ్చును.
- ఈ విధంగా చెప్పి ఆ ఇంద్రియ దేవతలకు కోపం రాకుండా సంతోషపరచి తిరిగి పంపారు.
- ఇంద్రియ దేవతలు యథాప్రకారం శరీరములో ప్రవేశించారు.

వాక్ ఇంద్రియము ఉత్క్రమ్యము (లేచిపోవటము)

అప్పుడు వాక్ ఇంద్రియము - ‘‘నేనే లేకపోతే ఈ జీవుడు నోరు విప్పి మాట్లాడనే లేడు కదా! అందుచేత శరీరమునుండి బయటికి వెళ్లి నా గొప్ప చూపిస్తాను’’ - అని తలచింది. శరీరమునుండి పైకి వెళ్ళిపోయింది. ఆ జీవుడు మూగగా అయిపోయాడు. సంవత్సరకాలము గడచిన తరువాత తిరిగి వాక్కు శరీరంలో ప్రవేశించింది. ఆశ్చర్యం! శరీరము ఇంకా జీవించటము కొనసాగిస్తూనే ఉన్నది.

వాక్ ఇంద్రియము : ఇదేమిటి? నేను శరీరమును విడచి వెళ్లి సంవత్సరకాలము అయినప్పటికీ, ఈ శరీరము ఇంకా జీవించటము కొనసాగిస్తూనే ఉన్నదే? ఇది ఎట్లా జరుగుతోంది?

తదితర ఇంద్రియ దేవతలు : ఏమున్నది? మూగవాడు జీవించటం లేదా? అట్లాగే మీరు పైకి వెళ్లి సంవత్సరకాలమైనా ఈ జీవుడు జీవితమును కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రాణము నిలచియే ఉన్నది. కళ్ళతో చూస్తున్నాడు. చెవితో వింటున్నాడు. మనసుతో కల్పనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మేమంతా శరీరంలో జీవిస్తూనే ఉన్నాము.

వాక్ ఇంద్రియము : ఓహో! కాబట్టి- ఆత్మనో అశ్రేష్ఠతాం। నేను శ్రేష్ఠుడు కాదన్నమాట।
- ఈ విధంగా నిర్ణయించుకొని సిగ్గుపడుతూ మరల శరీరంలో వాక్‌ధర్మము నిర్వర్తించసాగించి
- అప్పటి నుండి ఆ శరీరి మరల ఇదివరకటివలె మాట్లాడగలగటం ప్రారంభించాడు.

చక్షురింద్రియ - ఉత్క్రమ్యము (లేచిపోవటము)

అప్పుడు దృష్టి (చూపు) దేవత - ‘‘మేమెంత ముఖ్యమో ఇప్పుడు అందరికీ తెలియజేస్తాను’’….అని చెప్పి శరీరము నుండి పైకి వెళ్ళిపోయింది. ఆ జీవుడు గ్రుడ్డివాడైనాడు.

ఒక ఏడాది గడిచిన తరువాత తిరిగి శరీరములో ప్రకాశించింది. అప్పటికే జీవుడు, తదితర ఇంద్రియములు తమ పని తాము కొనసాగిస్తూనే ఉన్నారు.

‘‘ఇది ఎట్లా? ఈ సంవత్సరకాలం ఎట్లా మీరంతా జీవిస్తూనే ఉన్నారు?’’ - అని అడిగింది.

ఔను! గుడ్డివాడు మనస్సు - వాక్కు - వినికిడిలతో జీవిస్తూనే ఉన్నాడు కదా! అట్లాగే ఇది।’’ - అని తదితరం ఇంద్రియములు సమాధానమిచ్చాయి.

‘‘అనగా నేను వరిష్ఠము (The Most Important) కాదన్నమాట’’ - అని తలచి సిగ్గుతో తిరిగి శరీరంలో ప్రవేశించింది.

శ్రోత్రేంద్రియ - ఉత్క్రమ్యము (లేచిపోవటము)

అప్పుడు శ్రోత్రేంద్రియ దేవత శరీరమునుండి లేచి పైకి వెళ్లిపోయింది. ఆ జీవుడు చెవిటివాడయ్యాడు.

సంవత్సరకాలం గడచిన తరువాత తిరిగి ఆ శ్రోత్రేందియము శరీరంలోకి వచ్చి చూస్తే, ఆ శరీరము జీవిస్తూనే కనిపించింది.

"ఇది ఎట్లా సాధ్యం? మిగతా ఇంద్రియ దేవతలు శరీరంలో ఉండియే ఉన్నారే?’’ - అని ప్రశ్నించింది.

తదితర ఇంద్రియ దేవతలు : అవును మరి. ఒక చెవిటివాడిలో తదితర ఇంద్రియములు ఎట్లా కొనసాగుతూనే ఉంటాయో అట్లాగే - కళ్లు చూస్తూనే ఉంటాయి, మనస్సు సంకల్పములు చేస్తూనే ఉంటాయి కదా! ఇదీ అంతే।

అప్పడు శ్రోత్రేంద్రియము - ‘‘ఓహో! ప్రజాపతి చెప్పిన సిద్ధాంతం ప్రకారం నేను వరిష్ఠము కాదన్న మాట।’’ - అని పలికి సిగ్గుతో తిరిగి శరీరంలో ప్రవేశించింది.

మనో హ ఉచ్చక్రామ (లేచిపోయింది)

అప్పడు మనస్సు శరీరమునుండి నిష్క్రమించి (బయటకువెళ్లి) సంవత్సరము కాలము తరువాత తిరిగి వచ్చింది.

జీవుడు, పంచేంద్రియాలు జీవించియే ఉన్నాయి.

‘‘అదేమిటి? కథం అశకతర్తే మత్ - జీవితుమితి? నేను లేకుండా ఈ జీవుడు సంవత్సర కాలంగా ఎట్లా జీవిస్తున్నాడు?’’ - అని ఆశ్చర్యంగా పలికింది.

తదితర ఇంద్రియములు ఇట్లా సమాధానమిచ్చాయి:

యథా బాలా అమనసః ప్రాణన్తః ప్రాణేన, వదంతో వాచా, పశ్యంతః చక్షుషా, శృణ్వంతః శ్రోత్రేణైవమ్ - ఇతి
‘‘అప్పుడే పుట్టిన ఒక పసిపిల్లవాడు జగత్తు గురించిన మనస్సు ఏమాత్రము లేకపోయినప్పటికీ ప్రాణముతో జీవిస్తూ, నోటితో ‘ఆ’ ‘ఉ’ ‘ఏ’ అని పలుకుచూ, కళ్లతో అటు - ఇటు చూస్తూ, చెవులతో అమ్మపాడే లాలిపాటలు వింటూ జీవించటం లేదా? అట్లాగే మనస్సు బహిర్గతమైనప్పటికీ ఒక పసిపిల్లవానిలాగానో, పిచ్చివానిలాగానో - జీవిస్తూనే ఉన్నాడు. పంచేంద్రియాలు తమ పని కొనసాగిస్తూనే ఉన్నాయి’’

‘‘అనగా, ప్రజాపతి చెప్పిన సూత్రమును అనుసరించి నేను అన్నిటికంటే శ్రేష్ఠము, జ్యేష్ఠము కాదన్నమాట!’’ అని తలచి మనస్సు తిరిగి యథాస్థానం సిగ్గుతో ప్రవేశించి తన పని తాను నిర్వర్తించసాగింది.

ప్రాణ ఉచ్చిక్రమిషన్ (లేచిపోబోవటం)

అప్పుడు ప్రాణము శరీరమునుండి లేచిపోవటానికై సిద్ధమై కదలసాగింది. అంతే! గుర్రము కాళ్లకు కట్టిన త్రాళ్ళను త్రెంచుకొని గుర్రపుశాలనుండి బయటకు ఉదకసాగుతుంది చూచారా? ఆ విధంగా శరీరములోని వాక్కు, చూపు, వినికిడి, మనస్సు, స్పర్శ మొదలైన ఇంద్రియములన్నీ కట్టుతాడు తెగినట్లు బయటపడసాగాయి. ప్రాణము తనవెంట ఇంద్రియములన్నిటినీ పెకలించి వేయసాగింది. అప్పుడు పంచేంద్రియములు, మనస్సు ప్రాణదేవతకు అభిముఖమై ఇట్లు ప్రార్థించసాగాయి.

ఇంద్రియ దేవతలు, (ఆరవదగు) మనస్సు : ఓ ప్రాణేశ్వరా! పూజనీయా! మీరు వెళ్ళకండి। ఉండండి। ఉండండి। నిష్క్రమించండి। మా అందరిలో మీరే గొప్ప. మీరు లేకుంటే ఈ దేహము మేము నివసించటానికి ఎందుకూ పనికిరాదు ప్రభూ! దేహమును వీడి పైకి పోవద్దు.

వాక్ దేవత : ఓ ప్రాణమా! వాక్కుగా నేను ఏవిధముగా వసిష్ఠమో, మీరు అంతగానూ ఈ శరీరములో వసిష్ఠము (Highly Important) అయి ఉన్నారు. వెళ్ళకండి.

చూపు (చక్షు) దేవత : ఓ ప్రాణశక్తీ! నేను ఏవిధంగా దృశ్యమంతటికీ ఆశ్రయమైయున్నానో, మీరూ అంతగానూ సమస్తమునకు ఆశ్రయమైయున్నారు. అందుచేత మీరు ఈ శరీరమును వీడకండి.

అందుకే ఒక జీవిని చూచి..
- ఈతడు ‘వాక్కు’ అని చెప్పరు. ‘చూపు’ అని పిలువరు. ‘చెవులూ!’’ అని పిలువరు.

మరి ఏమని పిలుస్తారు? ‘‘ప్రాణీ!’’ అని అంటారు.

ఒకేశక్తి అనేక రూపములు ధరిస్తున్నట్లు ప్రాణశక్తియే దేహములో వాక్కు, చూపు వినికిడి, స్పర్శ, రుచి మొదలైన ఇంద్రియ శక్తులుగా ప్రదర్శితము అవుతోంది.

సమస్త జీవులు ప్రాణస్వరూపులే! అన్నిటికీ భోక్త ప్రాణములే! ‘‘ప్రాణం హాయిగా ఉన్నది।’’, ‘‘ప్రాణం బాగోలేదు’’, ‘‘ఆతడంటే నాకు ప్రాణము’’ మొదలైన వాక్యములు జనులు ‘‘పరాకాష్ఠ ప్రాణకర్తృత్వము’’ చేతనే సంభాషించుకుంటున్నారు.

ఈ విధంగా ప్రాణము ‘‘పూజ్యాతిపూజ్యము’’ - అయి ఉన్నది. ‘‘ప్రాణోపాసన’’చే సమస్తము సిద్ధిస్తున్నాయి.


16–5–2. పంచమ అధ్యాయము - ద్వితీయ ఖండము - ప్రాణమునకు ఆహారము ఏది?

ప్రాణదేవత : ఓ ఇంద్రియ దేవతలారా! మీరు అభ్యర్థిస్తున్నట్లు నేను దేహమును విడచివెళ్ళను. దేహములో ఉంటూ, మీ మీ శక్తులను ప్రదర్శింపజేస్తాను. అయితే మరి నాకు అన్నము (ఆహారము) ఏమి? కిం అన్నం భవిష్యతి - ఇతి?

ఇంద్రియ దేవతలు : ఓ ప్రాణేశ్వరా! కుక్కలకు, పక్షులకు, మానవులకు, తదితర సమస్త జీవులకు ఏదేది ఆహారముగా ఉన్నదో, అదంతా మీకు ఆహారమే। సమస్తము ప్రాణదేవతలగు మీకు అన్నమే. సమస్తము భక్షించేది మీరే.

ఏదేది వాక్కుచే మాట్లాడబడుచున్నదో, ఏదేది కళ్ళతో చూడబడుతోందో, ఏదేది చెవులకు వినబడుతోందో, ఏదేది చర్మముచే స్పృశించబడుతోందో, ఏదేది రుచి చూడబడుతోందో, ఏదేది త్రాగబడుతోందో - అట్టి సమస్తము ప్రాణదేవతకు ఆహారమే। ఇంద్రియములగు మేము మీకు ఆహారము అందించు మీ హస్తములవంటివారము।

ఎవ్వరు ఏది ఎక్కడ ‘అన్నము’గా తినినా, అది ప్రాణమునకే ఆహారము అవుతుంది.

- - -

ఈ విషయము తెలుసుకొని ప్రాణదేవతను సర్వజీవరాసులలోను, సర్వ ఆహార పదార్థములందు ఉపాసించువారు - అన్నోపాసన చేసినవారు కూడా అగుచున్నారు. వారికి అన్నములోటు ఉండదు.

అన్ని చేష్టలందు ప్రాణమే వ్యాపించి ఉన్నది. అందుచేతనే ప్రాణమునకు ‘‘అనము’’ - అని శాస్త్రీయ నామము.

అన = గతి శీలము సూచించే ధాతువు।
ప్ర = విశేషమగు ‘గతి’।
ప్రాణము = విశేషమైన గతి గలది।
అన్నము = ప్రాణము అన్నిచోట్ల స్వీకరిస్తూన్న ఆహారము.

ప్రాణోపాసన
(1) నేను ప్రాణదేవతా స్వరూపుడను.
(2) సకల దేహములలో ప్రాణస్వరూపుడనై ఆహారమును భుజించుచున్నాను.
ఇట్టి ఉపాసనయే ప్రాణోపాసన (మరియు) అన్నోపాసన కూడా।

ఇట్టి ఉపాసనను ఎరిగినవానికి ‘‘ఇది తినకూడదు’’ అన్న నిషిద్ధము ఉండదు. అన్నీ ఆతనికి ప్రియ ఆహారములే అవగలవు.

‘సమస్తము ప్రాణదేవతా ప్రదర్శనమే’ అని ఎరిగినవాడు, ఉపాసించువాడు - తానే ప్రాణదేవత అయి, సమస్తమును తన ప్రియ - ప్రాణ రూపముగా దర్శిస్తూ ఆనందించగలడు. ఈ విధంగా ప్రాణేశ్వర రూపము సిద్ధించుకున్నవాడు సూర్యుని ఉదయ - అస్తమయములు తనయందే దర్శించగలడు.

- - -

ఇంకా కూడా ప్రాణదేవత ఇంద్రియములతో ఈ రీతిగా సంభాషణ కొనసాగించింది.

ప్రాణశక్తి (ప్రాణదేవత) : ఓ ఇంద్రియములారా! నా ఆహారము గురించి మీరు చెప్పినదానికి సంతోషమే। మరి నాకు ‘‘వస్త్రము’’ సంగతి ఏమిటి?

ఇంద్రియములు : సమస్త జలములు మీకు వస్త్రములే.
అందుచేతనే భోజనము చేసేముందు, భోజనము చేసిన తరువాత కూడా జలము స్వీకరిస్తాము. జలము ప్రాణమును కప్పి ఉంచుతుంది కాబట్టి , - ఆ జలము ప్రాణమునకు ‘‘వస్త్రము’’ అగుచున్నది. పితృదేవతలకు పితృకార్యములలో అనేకమార్లు జలతర్పణము సమర్పిస్తున్నది అందుకే!
భోజనం చేయునప్పుడు ‘‘ఆచమనము’’ను ‘‘ప్రాణదేవతకు వస్త్రము సమర్పిస్తున్నాను’’ - అని ఉపాసించువానికి, ఇక వస్త్రముల ‘లోటు’ ఉండదు.

- - -

ఈ ‘‘ప్రాణోపాసన విద్య’’ను ఒకప్పుడు సత్యకామ జాబాల మహర్షి ‘గోశ్రుతి’ అనే పేరు గల వ్యాఘ్రపదముని కుమారినికి - (ఆతడు ప్రాణతత్త్వము గురించి బోధ అర్థించినప్పుడు) - చెప్పియున్నారు.

ఒక ఎండిన మోడుకు ఈ ప్రాణతత్త్వ వివరణను ప్రాణోపాసకుడు చెప్పితే, అట్టి మోడు కూడా తిరిగి చిగురించగలదు. ఇక జీవించియున్నవాడు శ్రవణము చేస్తే ఉత్తమ ప్రయోజనము ఎందుకు ప్రసాదించదు? తప్పక ప్రసాదిస్తుంది।

ప్రాణోపాసన - మంథన విద్య

ఇప్పుడు మనము ‘‘మంథనము’’ అనబడే ప్రాణోపాసనా విధానము గురించి చెప్పుకుంటున్నాము. ఉపాసకి ఔన్నత్యము కొరకై ఇది ఉపకరించగలదు.

- - -

❇︎ అమావాస్యనాడు ‘‘ప్రాణోపాసన’’ను దీక్షగా స్వీకరించాలి. (యాగదీక్ష స్వీకరించాలి) (1) నేలపై పరుండటము (2) సత్యమునే పలకటము (3) బ్రహ్మచర్యము (4) కొంతసేపు తపస్సు నిర్వర్తించటము - ఈ విధంగా అంతఃకరణ శుద్ధికి నియమములు పాటించాలి.
❇︎ పౌర్ణమి రోజున ‘సంపూర్తి’ చేయాలి.

పున్నమి నాటి రాత్రి :

Ⅰ. నవ ధాన్యముల గింజలను పిండిలాగా చేయాలి.

Ⅱ. ఆ పిండిని పెరుగు - తేనెలయందు కలిపి (అన్నిటినీ కలిపి) పిష్ఠము (ముద్ద) తయారు చేయాలి.
[ ఇంకొక విధానము:
(1) బియ్యము (2) అడవిలో దొరికే నివ్వెర ధాన్యము మొదలైన వాటిని పొట్టుతీసి - పిండిని తేనె - పెరుగులో కలిపి పిష్ఠము (ముద్ద) చేయటము ]

Ⅲ. ఆ పిష్ఠమును జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు అగు ప్రాణదేవతను పూజిస్తూ నివేదనగా (నైవేద్యముగా) సమర్పించాలి.

Ⅳ.
❤︎ వసిష్ఠ వాక్ స్వరూప ప్రాణదేవాయ నమః।
❤︎ ప్రతిష్ఠ చక్షు స్వరూప - ప్రాణ దేవాయ నమః।
❤︎ సంపత్ శ్రోత్రం స్వరూప - ప్రాణదేవాయ నమః।
❤︎ ఆయతన మనో స్వరూప - ప్రాణదేవాయ నమః।
❤︎ ఓం జ్యేష్ఠాయ స్వాహా। శ్రేష్ఠాయ స్వాహా।
అని హవిస్సుకు పిండితో చేసిన ముద్దను అగ్నిలో తేల్చాలి.

Ⅴ. అగ్నికి నేతితో హోమము చేసి, ఆ తరువాత స్రువము (గరిటె)కు అంటుకొన్న నెయ్యిబొట్లను పిష్ఠము (పిండిముద్ద) పై వేయాలి.

Ⅵ. ఆ పిష్ఠమును ‘‘వరిష్ఠాయ స్వాహ! శ్రేష్ఠాయ స్వాహా!’’ అని చెప్పుచూ అగ్నికి సమర్పించాలి.

Ⅶ. స్వాహా అని పలుకుచు ప్రత్యేకముగా ఏర్పరచిన అగ్నిలో హవిస్సులు సమర్పించాలి.

Ⅷ. మిగిలిపోయిన పిష్ఠమును, భస్మమును ఒక మూలగా పారవేయాలి.

ఐశ్వర్యము, ఆరోగ్యము కోరుకొనువారు కూడా పైవిధంగా ఆజ్యమును అగ్నికి హవిస్సులుగా సమర్పిస్తూ యజ్ఞవిధి (ప్రాణోపాసనా యజ్ఞము) నిర్వర్తించెదరు గాక!

హవిస్సులను ఉంచిన కుండలను చేతితో పట్టుకొని -

‘‘ఇదం హి జ్యేష్ఠః। ఇదం హి శ్రేష్ఠః।’’
ఇదం హి రాజాధిపతిః। ఇదం హి - అన్నపతిః। అన్నభక్షకః’’

అను మంత్రములతో హవిస్సులను మునుముందుగా ఉపాసించుచుండెదరు గాక।

మంథనము చేతిలో ఉంచుకొని చదువవలసిన మంత్రము -

‘అమ’ ఇతి ప్రాణస్య నామ। అన్నేన హి ప్రాణః।
ప్రాణితి దేహ। ఇత్యతో మంథద్రవ్యం ప్రాణస్య అన్నత్వాత్ ప్రాణత్వేన స్తూయతే అమో నామాసి।

మంథనము చేతిలో ఉంచుకొని చదువవలసిన మంత్రము -

ప్రాణస్తుతి ఓ ప్రాణదేవా!
- అమా హి తే సర్వమిదమ్ ఈ సమస్తము తమ సమక్షములోనే ఉన్నది।
- స హి జ్యేష్ఠః శ్రేష్ఠః మీరే జ్యేష్ఠులు। శ్రేష్ఠులు।
- రాజా అధిపతిః స మా జ్యైష్ఠ్యగ్ం శ్రైష్ఠ్యగ్ం మీరే జ్యేష్ఠులు, శ్రేష్ఠులు అగు రాజాధిపతులు।
రాజ్యమాధిపత్యం గమయతి - అహమేవ ఇదగ్ం సర్వమ్ అసానీతి।। నాకు జ్యేష్ఠము, శ్రేష్ఠము, ఆధిపక్షము, ప్రకాశత్వము, ప్రసాదించండి. నేను ఈ సర్వము అగుదను గాక।

ఈ విధంగా ప్రాణోపాసన చేయుదురు గాక। ఆ తరువాత ప్రతిపాదనము చేయబడిన ప్రసాదము భక్షించాలి.

ఆ తరువాత ఋక్కు (మంత్రము)ను పఠిస్తూ (ఒక్కొక్క అడుగుకు ఒక ఋక్‌మంత్రము చదువుచూ) ప్రతి అడుగుకు ఆచమనము చేయాలి.

తత్సవితుః వృణీమహ - ఇతి ఆచామీతి              - అని ప్రసాదము భక్షించాలి.
త్వా వయమ్ దేవస్య భోజనమ్ ఇతి ఆచామీతి।     - ఆచమనము చేయాలి.
శ్రేష్ఠగ్ం సర్వధాతమం ఇతి ఆచామీతి।                 - మరల ఆచమనము చేయాలి.
‘‘తురమ్ భగస్య ధీమహి’’ ఇతి సర్వం పిబతి        - కంచన పాత్ర (ఉద్ధరణ)ను కడిగి, పంచపాత్రలోని నీరు త్రాగాలి.

ఆ తరువాత
- అగ్నికి వెనుకగా
- తూర్పు దిక్కుగా
- చర్మ ఆసనముపై (లేక) నేలపై
- మౌనము పాటిస్తూ
- అలజడి లేని ప్రశాంతమైన చిత్తముతో పరుండాలి.

యదా కర్మసు కామ్యేషు స్త్రియగ్ం స్వప్నేషు పశ్యతి సమృద్ధం తత్ర జానీయాత్ తస్మిన్ స్వప్న నిదర్శనే। తస్మిన్ స్వప్న నిదర్శనే।।

ఆతనికి పరుండినప్పుడు స్త్రీ ఆకారము కనబడితే వేదమాత సంతోషించి దర్శనము ప్రసాదించినట్లు భావించెదరు గాక।


16–5–3. పంచమ అధ్యాయము - తృతీయ ఖండము - పంచప్రశ్నలు

గమనిక: ప్రవణ మహారాజు మరియు శ్వేతకేతుల మధ్య ఇదే సంభాషణ “బృహదారణ్యక ఉపనిషత్, అష్టమ అధ్యాయము, ద్వితీయ బ్రాహ్మణము [bRhadāraNyaka 8–2]”లో కూడా ఉన్నది.

అరుణిముని పుత్రుడు ఆరుణి. ఆరుణి కుమారుడు శ్వేతకేతువు.

ఆ శ్వేతకేతువు తండ్రి వద్ద విద్య ముగించుకొని ఆనాటి ఆచారము ప్రకారము లోకజ్ఞానము కొరకై దేశసంచారము ప్రారంభించారు. ఆ సందర్భముగా పాంచాల రాజ్యమునకు వెళ్లారు. ఆ పాంచాల దేశమునకు అప్పటికి జీబలుని కుమారుడగు ‘ప్రవాహణుడు’ రాజుగా ఉన్నారు. శ్వేతకేతువు పాంచాల దేశములోని అనేక విశిష్ఠ ప్రదేశములు, ఆశ్రమములు దర్శించారు.

ఆ తరువాత రాజదర్శనానికి రాజ సభకి వెళ్లారు. ప్రవాహణరాజు శ్వేతకేతువును ఆరుణి మునీంద్రుల కుమారుడుగా తెలుసుకొని ఆహ్వానము పలికి తన అంతఃపురములోనే అతిథి మర్యాదలు సమర్పించారు. ఆ తరువాత ఈ విధంగా సంభాషించసాగారు.

ప్రవాహణ మహారాజు : వత్సా! క్షేమమా? తమ పిత్రుదేవులు అగు ఆరుణి మునీంద్రులు సకుశలమే కదా! గురుకులాశ్రమ వ్యవహారములన్నీ చక్కగా జరుగుచున్నాయి కదా? వారు మాకు పూజ్యులు. వారి గురుకులాశ్రమ సేవకై మేము సర్వదా సంసిద్ధులము.

శ్వేతకేతువు : మహారాజా! అంతాక్షేమమే! గురుకులము సర్వవిధముల దిగ్విజయంగా జరుగుతోంది. నేను విద్య ముగించుకొని దేశాటనకై పాంచాల దేశము వచ్చాము. జ్ఞానులు, ప్రజ్ఞావంతులు అగు మీ దర్శనము చేసుకోమని మా నాన్నగారు ఆదేశించియున్నారు. అందుచేత సంచారములో భాగముగా మీ దర్శనము చేసుకుంటున్నాను.

ప్రవాహణ మహారాజు : మంచిది. సంతోషము. మీ పిత్రుదేవుల పాదపద్మములకు హృదయపూర్వకంగా మననపూర్వకంగాను నమస్కరించుచున్నాను. ఓ బ్రహ్మచారీ! కుమారా! మీ నాన్న గారి వద్ద విద్యాభ్యాసము చేస్తున్నారా? తండ్రిగారి వద్ద విద్యాబుద్ధులు చక్కగా నేర్చుకొనుచున్నారు కదా!

శ్వేతకేతువు : పూజనీయా! నా విద్యాధ్యయనము పూర్తి అయినది. నాన్నగారు విద్యలన్నీ నాకు నేర్పి ఉన్నారు కూడా! పారంగతుడను అయ్యాను. విద్య పూర్తి అయిన తరువాత లోకజ్ఞానము కొరకై దేశసంచారములు నిర్వర్తిస్తూ ఉన్నాను.

ప్రవాహణ మహారాజు : ఓ! సంతోషము. అయితే మనము వేదాత్మకమగు విద్యా విషయమై కొన్ని విశేషాలు, ప్రశ్న-సమాధానాలు చెప్పుకుందామా!

శ్వేతకేతువు : తప్పకుండా. మీరు బ్రహ్మవిద్య, వేదవిద్య విషయమై ఏవైనా ప్రశ్నించదలిస్తే అడగండి. మనము సత్సంగపూర్వకంగా సంభాషించుకుందాము.

ప్రవాహణ మహారాజు : అయితే కొన్ని ప్రశ్నలు మీముందు ఉంచుతాను.

శ్వేతకేతువు : అడగండి!

ఒకటవ ప్రశ్న - ఈ జీవులంతా భూమిపై జీవించిన తరువాత ఎక్కడికి వెళ్లుచున్నారు?

ప్రవాహణ మహారాజు : వేత్థ యదితో అధి ప్రజాః ప్రయంతి - ఇతి? ఈ జీవులంతా భూమిపై జీవించిన తరువాత ఎక్కడికి వెళ్లుచున్నారో ఆ స్థానము మీకు తెలుసు కదా? దయచేసి చెప్పండి!

శ్వేతకేతువు : న భగవ ఇతి! భగవాన్! ఈ జీవులు మరణానంతరము ఎటు వెళ్లుచున్నారో, ఆ స్థానము గురించి నాకు తెలియదే!

రెండవ ప్రశ్న - పైకి వెళ్లిన జీవులు పునరావృత్తులై ఏ ప్రకారం తిరిగి ఏ విధముగా భూలోకములో జన్మిస్తారు?

ప్రవాహణ మహారాజు: వేత్థ యథా పునరావర్తంత-ఇతి? పైకి వెళ్లిన జీవులు పునరావృత్తులై ఏ ప్రకారం తిరిగి ఏ విధముగా భూలోకములో జన్మిస్తారో మీకు తెలుసు కదా?

శ్వేతకేతువు: న భగవ ఇతి! పైకి వెళ్లిన జీవులు తిరిగి ఏ విధములుగా భూమిపై జన్మించుటకు వస్తున్నారో - ఇది కూడా నాకు తెలియదే!

మూడవ ప్రశ్న - దేవయానము మరియు పితృయానము రెండు మార్గములుగా చీలిపోయేది ఎక్కడ?

ప్రవాహణ మహారాజు: వేత్థ పథోః దేవయానస్య, పితృయాణస్య చ వ్యావర్తనా ఇతి? ఒకానొక గొప్ప పథము (బాట) ఉన్నది. అందులో ఈ అసంఖ్యాక జీవులు ప్రయాణిస్తూ ఉంటారు. ఆ బాట (పథము) ఒకచోట రెండు వేరు వేరు మార్గములుగా చీలిపోతోంది. ఆ వేరుమార్గములు (1) దేవయానము (2) పితృయానము. ఆ రెండు మార్గములుగా చీలిపోయేది ఎక్కడ? ఆ యానములో ఎవరెవరు, ఎటు వెళ్లుచున్నారు? అట్టి పథము, చీలుచున్న చోటు, ఆ వేరువేరైన మార్గములు ఏమో మీకు తెలియునా?

శ్వేతకేతువు : ఇతి న, భగవ! ఈ మీ ప్రశ్నకు ఏమి సమాధానమో, ఇది కూడా నాకు తెలియదు.

నాలుగవ ప్రశ్న - ప్రతిరోజు ఎందరో జీవులు మరణిస్తూ ఉన్నా కూడా ఏ కారణం చేత పితృలోకము నిండటమే లేదు?

ప్రవాహణ మహారాజు : వేత్థ యథా అసౌ లోకో న సంపూర్యత ఇతి? ప్రతిరోజు ఎందరో జీవులు మరణిస్తూ ఉన్నారు. అయినా కూడా పితృలోకము నిండటమే లేదు. ఏ కారణం చేత?

శ్వేతకేతువు : ఈ విషయానికి కూడి ఏమి సమాధానమో నాకు ఏ మాత్రము తెలియదు.

ఐదవ ప్రశ్న - యజ్ఞములో సమర్పించబడిన ఆహుతులు యజ్ఞ పురుషుడుగా అగు క్రమము ఎట్టిది?

ప్రవాహణ మహారాజు : యథా పంచమ్యామ్ ఆహుతావ ఆపః పురుషవచసో భవన్తి ఇతి? యజ్ఞములో ఆహుతులు సమర్పిస్తాము కదా! ఒకానొక యజ్ఞములో ఐదవ (5వ) ఆహుతి హోమము చేయబడిన తరువాత, అట్టి 5వ ఆహుతిచే రూపము పొందిన జలములు క్రమంగా ఆరవ (6వ) ఆహుతి రూపము పొందుచున్నాయి. ఆ ఆరవ ఆహుతి రూపము ‘పురుషుడు’ అనే పేరుగా ప్రసిద్ధమౌతోంది. అట్టి ఐదవ, ఆరవ ఆహుతులు ‘పురుషుడు’గా అవటము - అను క్రమము ఏమిటో మీకు తెలియునా?

శ్వేతకేతువు : ఓ పాంచాల దేశమహారాజా! మహాప్రాజ్ఞా! మీ ఈ ప్రశ్నకు ఏమి సమాధానమో నాకు కొంచము కూడా తెలియదు? మీరు అడిగిన ప్రశ్నలలో ఒక్కదానికి కూడా నేను సమాధానము తెలుసుకొని ఉండలేదు.

ప్రవాహణ మహారాజు : వత్సా! శ్వేతకేతూ! ఈ ప్రశ్నలకు మీరు సమాధానము తెలుసుకొని ఉండలేదు కదా! మరి ‘‘నేను విద్యను పూర్తిగా పూర్తి చేశాను’’ - అని మీరు ఎట్లా చెప్పారు? నేనడిగిన ప్రశ్నలకు సమాధానము తెలియనివాడు విద్యను పూర్తిచేసినవాడవు ఎట్లా అవుతారు? మహాపండితులగు మీ తండ్రిగారు ఆరుణి మునీంద్రుల వద్ద శిక్షణ పొందినట్లు ఎట్లా అనుకోగలరు?

ప్రవాహణ మహారాజు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానము ఎరిగి ఉండకపోవటమునకు, రాజు యొక్క ‘‘విద్యను పూర్తి చేసానని ఎట్లా అంటారు?’’ అను అభిప్రాయమునకు - శ్వేతకేతువు ఎంతగానో కలత చెందారు. సిగ్గుతో తలవంచారు. ప్రవాహణ మహారాజు వద్ద శలవు తీసుకుని వెనువెంటనే దేశసంచారము ముగించుకొని ఆరుణి మునీశ్వరుని ఆశ్రమానికి తిరిగివచ్చారు.

ఆరుణీ మునీంద్రులు : కుమారా! శ్వేతకేతూ! నీ లోకసంచారము పూర్తిగా జరిగినదా? ఇంత తొందరగా తిరిగి వచ్చావేమి? ఏమి నీ అనుభవములు? ఏమి నేర్చుకొన్నావు?

శ్వేతకేతువు : తండ్రీ! నా లోక సంచారము భాగంగా పాంచాల దేశము సందర్శించాను. అక్కడ జీవలుని కుమారుడగు ప్రవాహణుడు రాజ్యము పాలిస్తున్నారు. ఆయనకు మీరు తెలుసు. మీ గురించి ఎంతో గౌరవంగా సంభాషించారు. నన్ను కూడా అంతఃపురమునకు ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి గౌరవించారు. 5 ప్రశ్నలు అడిగారు. ఆ ‘5’ ప్రశ్నలలో ఏ ఒక్క ప్రశ్నకు నాకు సమాధానము తెలియలేదు. ‘‘ఈ ప్రశ్నలకు సమాధానం తెలియకుండా విద్య ఎట్లా పూర్తి చేసినట్లు?’’ - అని ఎగతాళిగా మాట్లాడారు. నేను విద్యను పూర్తి చేసాను - అను దానిని కించపరచారు. ఆ రాజబంధువు అడిగిన ‘5’ ప్రశ్నలకు సమాధానము చెప్పలేకపోటవమే నాకు అవమానమనిపించింది. ఇక ఆ దుష్టుడు దెప్పిపొడవటము ఎంతో బాధ అనిపించి, లోక సంచారమును విరమించి మీ వద్దకు వచ్చాను. (రాజబంధువు = రాజును బంధువుగా కలిగియుండి, అది చూపి జనులను ఇబ్బంది పెట్టువాడు, చెడు నడవడిక గలవాడు)

ఆరుణీ మునీంద్రులు : బిడ్డా! పెద్దలను ‘‘రాజబంధువు, దుష్టుడు’’ మొదలైన మాటలతో కించపరచవచ్చునా? కూడదు సుమా! ఆ పాంచాల రాజ్యపరిపాలకుడగు ప్రవాహణ మహారాజు మాకు తెలిసినవాడే! మునుల సభలో ఆతడు ప్రశంసనీయుడు కూడా“! సరే”! ఇంతకీ ఆయన అడిగిన ‘5’ ప్రశ్నలు ఏమేమని? నీవు ఎందుకు సమాధానాలు చెప్పలేకపోయావో నన్ను తెలుసుకోనీ, (Let me know)!

శ్వేతకేతువు : పితృదేవా! ఆ పాంచాలరాజు ప్రవాహణోజైవలి అడిగిన ‘5’ ప్రశ్నలు చెపుతాను వినండి.

(1) ఈ లోకమునుండి బాటసారులవంటి ఈ జీవులు పైకి ఎక్కడికి, ఏ స్థానమునకు వెళ్లుచున్నారు? యదితో ప్రజా ప్రయాతి ఇతి?

(2) వెళ్లుచున్న ఈ జీవులంతా ఏవిధంగా ఈ లోకమునకు తిరిగి వస్తున్నారు? యథా పునరావర్తంత ఇతి?

(3) ఈ లోకమునుండి బయలుదేరే (మరణించే) జీవులు ఏ బాటలో వెళ్లుచున్నారో - ఆ బాట ఒకచోట రెండు మార్గములుగా విడిపోతూ ఉన్నది. ఆ విడిపోతున్న రెండు బాటలు (i) దేవయానము (ii) పితృయానము.

ప్రశ్న-ఉపనిషత్-పరం-అపరం

ఆ విధంగా దేవ - పితృ యానములుగా విడిపోతున్న మార్గములు ఏ స్థానములో ఏర్పడి ఉన్నాయి? పథోః దేవయానస్య, పితృయానస్య వ్యావర్తనా ఇతి?

(4) ఈ అసంఖ్యాక జీవులు మరణిస్తూ పితృలోకమువైపు ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ - ఆ పితృలోకము ప్రవేశించినవారితో నిండిపోవటము లేదు. ఎందుచేత? యథా అసౌ లోకో న సంపూర్యత?

(5) ఐదవ ఆహుతిలో జలము హోమము చేయుబడుచూ ఉండగా ఆ జలము ‘పురుషుడు’ రూపమును పొందుచున్న క్రమము ఏమిటి? యథా పంచమ్యామ్ ఆహుత్వా ఆపః ‘పురుష’ వచసో భవంతి ఇతి? - (తథా కం)?

ఈ ఐదు ప్రశ్నలలో ఒక్కదానికి కూడా నేను సమాధానము చెప్పలేకపోయాను. ‘నాకు తెలియదు’ అని మాత్రమే అన్నాను.

ఓ పూజనీయా! పితృదేవా! తమరు నాకు శిక్షణ పూర్తి చేయకుండానే విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత నిర్వర్తించే వైదిక కర్మ అయినట్టి ‘సమావర్తన’ - నిర్వర్తించారా ఏమి?

ఆరుణి : కుమారా! యథా మా త్వం తదైతాన్ అవదో, యథా అహమ్ ఏషాం న ఏకంచన వేద। నీవు నాకు వినిపించిన ప్రవాహణోజైవలి ఐదు ప్రశ్నలు నాకే తెలియదు. సమాధానము అసలే తెలియదు. యది అహమ్ ఇమాన వేదిష్యం, కథం తే న అవక్ష్యమ్? నాకు ఈ ప్రశ్నల గురించియే తెలియనప్పుడు, వాటికి సమాధానాలు ఏం తెలుస్తాయి? నాకు తెలియని ప్రశ్నలు వాటి సమాధానాలు నేనెట్లా బోధించగలను?

నీ విద్యాభ్యాసము ముగించిన తరువాత సమావర్తన వైదిక కర్మ నిర్వర్తించినది - ‘‘గురువుగా నాకు తెలిసి, నేను నేర్పవలసిన విధిని అనుసరించి విద్య బోధించటము పూర్తి చేసాను’’ అను ఉద్దేశ్యము. అంతేగాని వేదవిద్యనంతా నీకు బోధించానని కాదు. అనంతమైన వేదవిద్య విషయంలో ‘‘నాకు మొత్తము తెలిసింది’’ అని నేనెట్లా అనగలను? ‘‘వేదవిద్యనంతా నేర్పాను’’ అని ఎట్లా అనుకోగలను? ‘‘అంతా నేర్చుకున్నాను!’’ - అని నీవెట్లా అనగలవు? వేదవిద్యలో అసంఖ్యాక విశేషాలు ఉన్నాయి. ఎందరో వేదవిద్యాపారంగతులు ఉన్నారు. అవన్నీ మన ఊహకు అందనివి. వేదవిద్యయొక్క విశేష ప్రాశస్త్యత ‘‘వేదమనన్తమ్’’ అను సూత్రమును అర్థము చేసుకోవటానికేగదా, నీవు ‘లోకసంచారము’ అనే ప్రయత్నములో శీలుడవై ఉన్నావు! మహనీయుల, ఆశ్రమముల సందర్శనము అప్పటి వరకు నేర్చుకొన్న విద్యను పదునుపెట్టుకోవటానికే కదా!

సరే! పుత్రా! ఆ ప్రవాహణజైవలి యొక్క ఐదు ప్రశ్నలకు సమాధానము కొరకై వారినే ఆశ్రయిద్దాము.

ఈ విధంగా పలికి ఆరుణిముని అప్పటికప్పుడే శిష్య సమేతులై పాంచాల రాజదర్శనముకొరకై గురుకులము నుండి బయలుదేరారు. గౌతమగోత్రీయుడైన ఆ ఆరుణిముని పాంచాలరాజ్యమునకు వచ్చి రాజదర్శనము చేసుకొన్నారు. ప్రవాహణజైవలి మహారాజు ఆరుణిమునికి సుస్వాగతము పలికి అనేక విధములుగా సత్కారములు చేసారు. ప్రయాణపు బడలికతో ఉన్న ఆరుణి మునికి వారి శిష్యబృందమునకు ఆ రోజు రాత్రి విశ్రాంతి గృహములో వసతి చూపబడింది.

ఆ మరునాడు ఉదయము ఆరుణి మునీశ్వరులు రాజదర్శనము చేసుకొన్నారు.

ప్రవాహణ జైవలి : గురుదేవా! గౌతమకులదీపకా! ఆరుణి మునీంద్రా! నమోనమః! సుస్వాగతం! మానుషస్య-భగవాన్! గౌతమ! - విత్తస్య వరం వృణీథ! మానవులకు కావలసిన సంపదలు ఏమేమి కావాలో, గ్రామములు, ధనము మొదలైనవి కోరుకోండి. మీకు సమర్పించుకోవటానికి సంసిద్ధుడను.

ఆరుణి: రాజా! మానవులకు సంబంధించిన సంపదలు నాకేమీ వద్దు. మీరు నా కుమారుడగు శ్వేతకేతువును ఐదు (5) ప్రశ్నల రూపంగా ఏ మాటలు పలికియున్నారో, ఆ వచనములు నాకు బోధించమని ప్రార్థన.

అప్పుడు ప్రవాహణుడు ‘‘ఇదేమి? ఈ మునీంద్రులు ఇట్లా అడిగారు? నేను అడిగిన ఐదు ప్రశ్నలు, వాటి సమాధానాలు నేర్చుకొవాలనుకుంటున్నారా? వారేమో మునివర్యులు. నేనో, ఒక సామాన్య రాజును. అయినా వేదవేత్తలు ఏదైనా కోరితే అది తిరస్కరించరాదు కదా! విద్యా నియమమును పాటిస్తూ విద్యను బోధించవలసినదే కదా? వేరే త్రోవలేదు’’ - అని తలచారు. మునీశ్వరునితో ఇట్లా పలికారు.

ప్రవాహణ జైవలి : స్వామీ! గౌతమా! ఆరుణీ! మీరు ఆజ్ఞాపించినట్లే ఆ ఐదు ప్రశ్నలు, వాటి సమాధానములు మీతో సంభాషిస్తాను. అయితే ఒక విన్నపము. తగ్ం హ చిరం కాలం వసేతి, ఆజ్ఞాపయాంచకార! తమరు కొంత కాలము ఇక్కడ ఉండి మా ఆతిథ్యము స్వీకరించండి. మీరు కోరినట్లు అప్పుడు బోధించగలను. అంతేకాకుండా మరో ముఖ్య విషయం కూడా! యథా మా త్వం, గౌతమ! అవేదో యథేయం న ప్రాక్ త్వత్తః పురా విద్యా బ్రాహ్మనాన్ న గచ్ఛతి। ఓ గౌతమా! మీరు వేదవేత్తలు! తెలుసుకోవలసింది తెలుసుకొనియున్న బ్రాహ్మణోత్తములు అయి కూడా నేను అడిగిన ‘పంచప్రశ్నవిద్య’ చెప్పమని మీరు అడుగుచున్నారు. బ్రహ్మవిద్య సమస్త విద్యలకు పరాకాష్ఠ కదా!

ఈ పంచ ప్రశ్న విద్య బ్రాహ్మణులకు (బ్రాహ్మణములు, బ్రహ్మతత్త్వము ఎరిగియున్నవారికి) - చెప్పబడియుండలేదు. బ్రాహ్మణులు (బ్రహ్మవిద్యా వరేణ్యులు) ఇదివరకు వారి శిష్యులకు బోధించటమనేది గురుకులములలో జరగటము లేదు.

ఇతఃపూర్వము ఈ విద్య క్షత్రియులలో ప్రసిద్ధము. క్షత్రియులు క్షత్రియులకే బోధించటము ఆనవాయితీ అయిఉంటూ వచ్చింది. అయినా కూడా మునివరేణ్యులగు మీరు అడిగితే ‘చెప్పను’ అనే అహంకారము మీముందు ప్రదర్శించలేను. ఎందుకంటే మీరు జగద్గురువులు. గురుకులములో అనేకమంది బ్రహ్మచారులను తీర్చిదిద్దటములో లోకవిదితులు.

మీకు నేను ఈ ‘‘పంచాగ్ని విద్య’’ అనబడే పంచప్రశ్న - సమాధానములను బోధిస్తాను. మీరు మీ శిష్యులకు పరంపరగా బోధించవచ్చు. అప్పుడు ఈ విద్య బ్రాహ్మణములను ఉపాసంచే బ్రహ్మవేత్తలలో కూడా ప్రసిద్ధి పొందగలదు.

మీరు మానవ సంబంధమైన కోరికలతో రాలేదని, అధ్యాత్మ సంబంధమైన విద్యకొరకై వచ్చారని నేను ముందే ఊహించాను. అయినా కూడా శాస్త్ర మర్యాదానుసారం లోకసంబంధమైన సంపదలను ఇవ్వపలికాను. అందుకు నేను క్షంతవ్యుడను. మీరు, మీ ప్రియశిష్య బృందము కొద్దిరోజులు మా పాంచాలదేశంలో విశ్రాంతి తీసుకోండి. మా ఆతిధ్యము, అతిధి మర్యాదలు స్వీకరించండి. కొద్దిరోజులలో మీరు అడిగిన ‘‘పంచాగ్నివిద్య’’ గురించి సవివరంగా సంభాషించగలను. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక యజ్ఞకార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము.


16–5–4. పంచమ అధ్యాయము - చతుర్థ ఖండము - ‘శ్రద్ధ’ సృష్ట్యభిమాని ఇంద్రియాధిష్ఠాన దేవతలు - ‘శ్రద్ధ’ ఆహుతులు - సృష్ట్యభిమాని ఆవిష్కరణ

కొద్దిరోజుల తర్వాత ఒకరోజు ఒక ప్రశాంత స్థలములో ఆరుణి మునీంద్రుడు, ప్రవాహణ జైవలిరాజు మరియు తదితర విద్యార్థులు (వేదవిద్యాభ్యాసులు) సమావేశమైనారు.

ప్రవాహణ జైవలిరాజు: ఓ గౌతమ గోత్రీయ ఆరుణి మహాశయా! నేను అడిగిన ఐదు ప్రశ్నలు - సమాధానములు వేదములలో (శతపథ బ్రాహ్మణము మొదలైన చోట్ల) వివరించబడినవే. ఆహుతులు - సూక్ష్మశరీరము - పుణ్యలోకములు, పుణ్యలోక నివాసము, జన్మకై మరలిరావటం, మరల పుణ్యలోకములకొరకై దేహము నుండి బయలుదేరటము మొదలైన వివరములకు సంబంధించిన ఆత్మ భగవానుని సృష్టి కల్పనా యజ్ఞవిశేషములకు సంబంధించిన విద్య అని ముందుగా గమనిద్దాము.

ఐదవ ఆహుతియందు జలములు పురుషుడు (పురుషకారము కలవాడు) అనే పేరు ఎట్లా పొందుతోంది? [ఐదవ ప్రశ్నకు సమాధానము]

మనము ముందుగా ఐదవ ప్రశ్న అయినట్టి ‘‘ఐదవ ఆహుతియందు జలములు పురుషుడు (పురుషకారము కలవాడు) అనే పేరు ఎట్లా పొందుతోంది?….అనే ప్రశ్నకు సమాధానము వివరించుకుంటున్నాము.

(శతపథ బ్రాహ్మణములోని వివరములు)
యజ్ఞములో సమర్పించబడిన ‘హోమము’ గురించి ఇట్లా వివరించబడుతోంది.
- ‘హోమము’ చేయబడిన మొదటి రెండు ఆహుతులు పైకి లేచుచున్నాయి.
- పైకి లేచి అంతరిక్షం (ఆకాశం)లో వ్యాపిస్తున్నాయి.
- అవి ఆకాశంతో యజ్ఞవిధిని నిర్వర్తిస్తున్నాయి.
✳︎ అంతరిక్షము (ఆకాశము)ను ఆహవనీయాగ్నిగాను
✳︎ వాయువును (వాయువీచికలను) సమిధలుగాను (కట్టెపుల్లలుగాను)
✳︎ సూర్యకిరణములను ఆహుతిగాను చేయబడి
అవి అంతరిక్షమును తృప్తిపరచుచున్నాయి.

ఆ తరువాత ద్యులోకమునందు ప్రవేశించి ‘తృప్తి’ పరచుచున్నాయి.
ద్యులోకము = దేవతల లోకము. చూపు, వినికిడి, స్పర్శ, రుచి, వాక్కు (పంచ తన్మాత్రలు) మొదలైన శక్తులే దేవతలే ‘ద్యులోకము’.
- ఆ రెండు ఆహుతులు మరల భూలోకములో ప్రవేశించి భూలోకమును తృప్తిపరచి మగవానిలో ప్రవేశిస్తున్నాయి.
- వాని నుండి స్త్రీయందు వ్యాపించి ‘జీవుడు’గా పుట్టుచున్నాయి.
- ఆ జీవులలో ఉత్తమ కర్మలు నిర్వర్తించి పుణ్య లోకములు చేరుచున్నాయి.

ఈ విధంగా జరుగుచున్న సృష్టియజ్ఞ విశేషము దృష్ట్యా ఇప్పుడు బ్రాహ్మణములు (శ్రుతులు) ‘అగ్నిహోత్ర కర్మ’ విధి గురించి చెప్పుచున్నాయి. (‘అగ్ని’, ‘సమిధలు’, ‘ధూమము’, ‘జ్వాల’, మండే ‘బొగ్గులు’, మిణుగురులు - అను ఆహుతుల యొక్క ‘6’ రూపములు అభివర్ణిస్తున్నాయి.)
- ఆ ఆహుతులు అంతరిక్షంలో ప్రవేశించటము.
- సూక్ష్మరూపంగా ద్యులోకము (సూక్ష్మశక్తులు ఏర్పడి ఉన్న లోకము)లో ప్రవేశము.
- అవి జలరూపము దాల్చటము.
- అవి సృష్టి కార్యము నిర్వర్తించటము అనే తతంగమంతా ఇప్పుడు భూలోక అగ్నిహోత్రముతో పోల్చుచూ చెప్పబడుతోంది.

దేవతల యజ్ఞము - సోమరాజు (సృష్టికర్త) సంభవము

మొట్టమొదట (ఆత్మనుండి) పంచాగ్ని దేవతలగు శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ దివ్యశక్తులు (దేవతలు) సమావేశమై సృష్టికొరకై ‘శ్రద్ధ’ అని పిలువబడే హోమము ప్రారంభిస్తున్నారు. వారు నిర్వర్తిస్తున్న హోమమునకు (చిదగ్నికుండ సంభూత! దేవకార్య సముద్యత! - అని లలితా సహస్రంలో వర్ణించినట్లు) పరమాత్మయే యజ్ఞపురుషుడు, దేవతలే యజ్ఞకర్త.

ఈ విధంగా ఇంద్రియాభిమాన దేవతలు ‘‘శ్రద్ధ’’ అనే ఆహుతులను అగ్నికి సమర్పించుచుండగా ఆ హవిస్సు నుండి ‘‘సృష్టికల్పనాభిమాన పురుషుడు’’ - పుట్టుకొస్తున్నాడు. ఆతనికి ‘‘సోమరాజు’’ - అను శాస్త్రీయ నామము. ‘శ్రద్ధ’ కు ‘జలము’ అని కూడా మరొక పేరు.


16–5–5. పంచమ అధ్యాయము - పంచమ ఖండము - ఇంద్రియాభిమాన దేవతల - సోమరాజుకు ఆహుతులు

ఆ ఇంద్రియాధిదేవతలు ఇంకా కూడా సృష్ట్యభిమాని అగు ‘సోమరాజు’ (సృష్టి పురుషుడు)కు ఆహుతులు వర్షము కొరకై సమర్పిస్తున్నారు.

పర్జన్యుడే - ‘‘అగ్ని’’ మేఘముల అభిమాన దేవతయే పర్జన్యుడు (ఇంద్రుడు)
వాయువు - ‘‘సమిధ’’ వాయువు వీస్తూ ఉంటే వర్షము. వాయువు పర్జన్యుడు (మేఘదేవత) అనే అగ్నిని ప్రజ్వలింపజేయుచున్నారు.
మేఘము - పొగ మేఘము పొగవలె ఆకారము కలిగి ఉంటుంది. పొగ మేఘాకారము పొందుతోంది.
మెఱుపు - జ్వాల ప్రకాశించు ధర్మము కలిగి ఉన్నది కాబట్టి.
పిడుగులు - మండే బొగ్గులు పిడుగులు మండే బొగ్గువలె కఠినము కాబట్టి
మేఘగర్జనలు, ఉరుములు -విస్ఫులింగములు మేఘగర్జనలు - మిణుగురులు (అగ్గి రవ్వలు).

16–5–6. పంచమ అధ్యాయము - షష్ఠి ఖండము - దేవతల వర్షహవనము - అన్నము యొక్క ఉత్పత్తి

అప్పుడు ఇంద్రియాధిష్ఠాన దేవతలు ‘అన్నము’ కొరకు హవనము సమర్పించసాగారు. అట్టి అన్నము కొరకు-

పృథివియే → అగ్ని
సంవత్సరమే → సమిధ
సంవత్సర కాలములో ఆహార ధాన్యములు, పెసలు - మినుగులు వంటి అపరాలు లభిస్తాయి కనుక।
ఆకాశము → పొగ ఆకాశము నుండి పృథివి (మేఘ రూపంలో) పొగ వలె బయల్వెడలుతోంది కనుక।
రాత్రియే → జ్వాల (అర్చిః) వెలుగు లేనప్పుడు భూమి చీకటైపోతుంది కనుక!
దిక్కులు(తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ)→ మండే అంగారములు (బొగ్గులు) మండిన తరువాత బొగ్గులు మిగిలినట్లు (చీకటిపోతే దిక్కులు కనబడతాయి కాబట్టి)
అవాంతరదిక్కులు (ఈశాన్యము, అగ్నేయము, నైరుతి, వాయువ్యము)→ విస్ఫులింగములు (నిప్పురవ్వలు)

ఈ విధంగా దేవతలు ‘వర్షము’ను అగ్నియందు హోమము చేయగా ఆ ఆహుతి నుండి ‘ఆహారము’ పుట్టుచున్నది.


16–5–7. పంచమ అధ్యాయము - సప్తమ ఖండము - దేవతల అన్నహోమము - రేతస్సు ఉత్పత్తి

పురుషుని అగ్నిగాను, వాక్ ఇంద్రియమును సమిధిగాను, ప్రాణమును ధూమముగాను, జిహ్వను జ్వాలగాను, కన్నులు అంగారములు (మండే బొగ్గులు)గాను, వినికిడి విస్ఫులింగములుగాను దేవతలు హోమము నిర్వర్తించసాగారు.

ఈ విధంగా అన్న హోమము చేయుచుండగా ఆ ‘ఆహుతి’ నుండి ‘రేతస్సు’ పుట్టుకువస్తోంది.


16–5–8. పంచమ అధ్యాయము - అష్టమ ఖండము - గర్భయజ్ఞము

యోషా వావ అగ్నిః - యువతియే అగ్ని
ఉపస్థ ఏవ సమిధః - జననేంద్రియమే సమిధ
ఉపమంత్రయతే సధూమో। యువతియొక్క పురుషుని ఆహ్వానము ధూమము
యోనిః అర్చిః - యోనియే జ్వాల
యదన్తః కరోతి తే అంగారా - తినుట అంగారకము
మైథునమే - అగ్ని
అభినన్దా విస్ఫులింగా - విస్ఫులింగములు
(రతిసుఖమ్) - (బొగ్గు కిరణములు)

ఆ అగ్నియందు దేవతలు “ప్రాణములు” అనే రేతస్సును హోమము చేస్తున్నారు. అట్టి ఆహుతుల హోమము నుండి “గర్భము” జనిస్తోంది.

ఈ విధంగా జలములే ‘‘శ్రద్ధ - చంద్ర - వర్ష - అన్న - రేతస్సు’’ అనే ఐదు ఆహుతుల హోమములుచే పురుషుడు (The Experiencer) జనిస్తున్నాడు. యథా పంచమ్యామ్ ఆహుతావ ఆపః ‘పురుష’-వచసో భవంతి’’ - ఇది ఐదవ ప్రశ్నకు (5) మనము చెప్పుకున్నదంతా సమాధానము.

ఇది దేవతలు యజ్ఞము కొరకు (for the sake of the entirity) చేయుచున్న హోమము.

ఆహుతులతో జలమునకు విడరాని బంధము కాబట్టి ‘పంచమ ఆహుతి జలము’ అని ఇక్కడ ప్రయోగించబడుతూ ఉన్నది.


16–5–9. పంచమ అధ్యాయము - నవమ ఖండము - నేను అగ్ని స్వరూపుడను అను ఉపాసన

ఇప్పటివరకు చెప్పబడిన సృష్టి పంచాగ్ని హోమము, జీవుల దేహ ప్రవేశ- నిష్క్రమములు, ఉత్తమ కర్మలచే స్వర్గలోకప్రాప్తి - మొదలైన విషయములు తెలుసుకొన్నవారు, తెలుసుకొని తపస్సు శ్రద్ధగా ఆచరించువారు - స్వయం ప్రకాశ కాంతివంతమగు లోకములు సిద్ధించుకోగలరు. ఏ చమే అరణ్యే శ్రద్ధా ఉపాసతే - ఎవ్వరైతే శ్రద్ధగా గ్రహించి అరణ్యము నందు బుద్ధిని నిలిపి (న-రణ్యము, Beyond the world - Head in the forest (God) and Hands in the world) దృశ్యమునకు ఆవల గల తత్త్వమును ఉపాసిస్తూ ఉంటారో, (అనగా)

‘‘మేము ద్యులోకము, పర్జన్యుడు, ‘వర్షము’ ‘అన్నము’ ‘రేతస్సు’ల నుండి క్రమముగా జన్మించిన అగ్విస్వరూపులము.

ఈ ఐదు అగ్నిలే మా యొక్క స్వరూపము’’ అని ఎరిగి ఉపాసిస్తారో, శ్రద్ధాతత్పరులై ఉంటారో…అట్టివారు→

అట్టి జీవుడు - ‘‘అమాన తత్పురుషుడు’’ - (మానవాతీతమైన ‘తత్’ అను పురుషస్థానము) చేరుచున్నాడు. ‘ఈ సమస్తము నా పురుషకారమే’ అనే కేవల స్థాన తత్పురుషత్వము మానవాతీత్వము (జనన-మరణ చక్ర అతీతత్వము) సిద్ధించుకుంటున్నాడు. ఆతడు బ్రహ్మమే తానగుచున్నాడు. ఈ సమస్తము ఏదై ఉన్నదో, ఏది నేను - నీవు మొదలైనవాటిగా ప్రదర్శనమగుచూనే సమస్తమునకు వేరై ఉన్నదో - ‘‘అదియే తానగుచున్నాడు’’ - ‘బ్రహ్మవేత్త’ బ్రహ్మమే అగుచున్నాడు.


16–5–10. పంచమ అధ్యాయము - దశమ ఖండము - దేవయాన - పితృయాన - భౌతికలోక తిరోగమన మార్గములు

ఈ జీవులు ఈ లోకము విడచినప్పుడు ఎక్కడికి వెళ్లుచున్నారు? [మొదటి ప్రశ్నకు సమాధానము]

(1) దేవయాన మార్గము

కుమ్మరివాని చక్రము తిరుగు విధంగా ఈ జీవుడు తనయొక్క కర్మలయొక్క - జ్ఞానములయొక్క స్థితిగతులను అనుసరించి త్రిలోకములలో అనేక ఉపాధులుగా రాక - పోకలు అవిశ్రాంతంగా, చర్వితచర్వణంగా కొనసాగిస్తున్నాడు.

ఏ పంచాగ్నులనుండి ఈ జీవుడు భౌతిక రూపము పొంది జీవిస్తున్నాడో, మరల అవే అగ్నులచే కొనిపోబడుచున్నాడు.

తన మూలకారణమైన అగ్నిని పొందుచూ, తిరిగి అగ్నిచేతనే దేహ దేహాంతరములకు తీసుకొనిపోబడుచున్నాడు. ఇందుచేత కూడా అగ్నికి ‘హవ్యవాహనుడు’ అనే పేరు వచ్చింది. అగ్నిచే ఈ దేహము అర్పితమైన ‘ఆహుతి’ రూపము సంతరించుకుంటున్నది.

ఇది దేవయానమార్గము (లేక) ‘దేవయాన పంథా’ అని, ఉత్తరాయణ మార్గము అని పిలువబడుతోంది. ఇది ఆత్మోపాసనా మార్గము. ద్రష్టవైపు మార్గము. జ్ఞానమార్గము - అని కూడా అంటారు.

(2) పితృయాన మార్గము - దక్షిణాయన పంథా

(కర్మిష్ఠుల మార్గము)

ఇది దృశ్యము వైపుగా మార్గము. ‘‘ఉత్తమ లోకములు పొంది ఆనందించాలి’’ అనేది ముఖ్యాశయమై యుండి, - ఈ లోకములో ఈ ఈ విధమైన అభ్యాసములు చేయుచున్నారు.
- ఇష్టము (వేదోక్తములైన అగ్నిహోత్రము, వైశ్వ దేవతలు, పూజ, వ్రతములు మొదలైన కర్మలు).
- పూర్తము (అన్నదానము, నూతులు - చెరువులు త్రవ్వించటము, సత్రములు కట్టించటము, తదితర సంఘ సేవలు, దానము మొదలైనవి)

వీరు ఆత్మతత్త్వానుభవమును ముఖ్యాశయముగా కలిగి ఉండక, దృశ్యములోనే ఉత్తమ స్థితిగతులు పొందాలనే ముఖ్యాశయము కలిగి ఉంటున్నవారు. అందుచేత ఇది ‘‘దక్షిణాయణ మార్గము, ధూమ మార్గము’ - అని కూడా అంటారు. అట్టివారి ముందుముందు మార్గము ఏవిధంగా ఉంటుందో చెప్పుకుంటున్నాము.

☘︎ ఇట్టివారు మొదట ధూమమార్గము పొందుచున్నారు. ధూమమ్ అభిసంభవంతి। ప్రాపంచక (దృశ్య సంబంధమైన, ఇంద్రియానుభవ సంబంధమైన) ఆశయములు → నిర్మలమగు స్వస్వరూపాత్మను కప్పి ఉంచేవి కాబట్టి దీనిని ‘ధూమమార్గము’ అని పిలుస్తున్నారు.
☘︎ ధూమలోకములు ప్రవేశించి, అక్కడినుండి ‘రాత్రి’ (చీకటి)ని చేరుచున్నారు.
☘︎ రాత్రి నుండి ‘కృష్ణపక్షము’ (ఆత్మానుభూతిని ఏమరచుచు, దృశ్యానుభవ ఆశయము) చేరుచున్నారు.
☘︎ కృష్ణపక్షము నుండి దక్షిణాయనము, దక్షిణాయనము నుండి ‘సంవత్సరము’ చేరుచున్నారు.
☘︎ సంవత్సరము నుండి ‘ఆకాశము’ను, ఆకాశము నుండి ‘చంద్రమార్గము’ను చేరుచున్నారు.
☘︎ చంద్రుడే సోమరాజు. ఆయన బ్రాహ్మణులకు (బ్రాహ్మణములు అధ్యయనము చేయువారికి) ప్రభువు. దేవతలకు ఆహారము. ఓషధరూపుడు. ఇంద్రుడు, అగ్నిలకు ఆహారము ఇచ్చువారు.

ఈ విధంగా ఇంద్రియభోగములే ఆశయముగా కలవారు ఆయా దేవతలు ప్రసాదించే సుఖానుభవములు పొందుచున్నారు.


భౌతిక లోక తిరోగమన మార్గము [రెండవ ప్రశ్నకు సమాధానము]

ఆ విధంగా సుఖమయ ఇంద్రియానుభవ లోకములు ప్రవేశించిన ఆ ‘‘దక్షిణాయన బాటసారి జీవుడు’’ అట్టి (దేవతలచే ప్రసాదించబడే) సుఖానుభవములు (స్వర్గలోక నివాసము వంటివి) ఎంతకాలం పొందుతాడు? తస్మిన్ యావత్ సంపాతమ్ ఉషిత్వా అథ ఏతం ఏవ అధ్వానం పునః నివర్తంతే। ఏ పుణ్య కార్యముల ఫలానుభవముకోసమై పుణ్య (సుఖమయ) లోకములు పొంది ఉన్నాడో, అట్టి పుణ్యకర్మఫలము ఖర్చు అయ్యేంతవరకు చంద్రమండలములో నివాసముండి తిరిగి భౌతిక లోకములకు వస్తున్నారు. ‘‘ఇష్టా-పూర్వ-దాన’’ కర్మల ఫలములను, సంస్కారములను అనుసరించి మరల పుణ్యకార్యములు నిర్వర్తిస్తూ ధూమ మార్గంలో చంద్రమండలము చేరుచున్నారు. ఈ విధంగా ఇది ‘‘పునరావృత్తిమార్గము’’ (రావటము-పోవటము అగుమార్గము) అగుచున్నది.

భౌతిక లోకము నుండి చంద్రమండలము (పితృలోకము) చేరిన మార్గముననే - ఆకాశము, ఆకాశమునుండి వాయువు, వాయువునుండి ధూమము, ధూమమునుండి పృథివి (Solid Form) పొందుచున్నాడు.
- చంద్రమండలము (పితృలోకము) నుండి ఆకాశము
- ఆకాశము నుండి మేఘమును చేరుచున్నారు.
- మేఘము వర్షించినపుడు భూలోకములో ధాన్యము, యవలు, మొక్కలు, చెట్లు, నువ్వులు, మినుములు రూపముగా అగుచున్నారు.

అతో వై ఖలు దుర్నిష్ప్రవతరమ్। ఈ విధంగా పితృలోకమునుండి భూలోకమునకు జరిగే తిరుగు ప్రయాణము అనేక దుఃఖములతో కూడినవై ఉన్నది. అనేకచోట్ల ఎండుచూ, తినబడుచూ బహుయాతనలు పడుతూ ‘మానవస్థితి’కి సుదీర్ఘతర/కష్టతర ప్రయాణము చేయుచున్నాడు.

ఆహారము రూపము పొందిన జీవుడు ఎవరు ఏ అన్నము తింటే ఆ సంబంధమైన ‘రేతస్సు’ రూపమే పొందుచున్నాడు. ఆ జీవ జాతి జీవుని రూపమే సంతరించుకుంటున్నాడు. యో యో అన్నమ్ అత్తి, యో రేతః సించతి, తత్ భూయ ఏవ భవతి।। జీవులు ఏ అన్నము భుజిస్తారో, ఏ రేతస్సు విడుస్తాడో, స్త్రీ నుండి ఆ అన్నగత ప్రాణులుగానే పుట్టుచున్నారు. మనిషి నుండి మనిషే పుట్టుచున్నాడు. ఆవు నుండి ఆవే పుట్టుచున్నది. [ (భగవద్గీత 3–14) అన్నాత్ భవంతి భూతాని ].

ఏ జీవులైతే రమణీయమగు ఆచరణము, నడవడిక, అభ్యాసములు ఇతఃపూర్వము కలిగియున్నారో వాటి ఫలితంగా వారు తిరిగి ఉత్తమ యోనులలో జన్మింతురు.

ఇతఃపూర్వము శుభప్రదమైన అభ్యాసములు

(1) శమము, దమము, తపస్సు, శౌచము, ఆర్జవము (లోపల ఒకటి బయట మరొకటి భావించకుండటము, అకుటిలత్వము) జ్ఞానము, విజ్ఞాన ఆస్తిక్యము (పరమాత్మను గుర్తెరుగు అభ్యాసములు కలవారు)
అట్టివారు బ్రాహ్మణ యోనులందే జనిస్తారు.
(సత్వగుణ సంపన్నులు, వివేకము, అధ్యయన దృష్టి కలవారు)

(2) శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్షణ్యము, విజయము పట్ల పట్టుదల, దానము, ఈశ్వరభావన కలవారు
అట్టివారు క్షత్రియ యోనులందు జన్మలు పొందుచున్నారు (సత్వ-రజోగుణ సంపన్నులు)

(3) కృషి, గోరక్షణ, వాణిజ్యము అనే వైశ్వకర్మ సంస్కారములు కలవారు
వైశ్య యోనులందు జన్మిస్తున్నారు (రజోగుణ సంపన్నులు).

(చాతుర్వర్ణములు కూడా త్రిగుణములు, కర్మలకు సంబంధించిన స్వభావ విభాగములేగాని, లోకములో ప్రసిద్ధి అయి ఉన్న సాంఘిక విభాగ కులము సంబంధమైనవి కావు - అని ఉపనిషత్ వాఙ్మయ హృదయము)

కపూయచరణా అభ్యాశో హ యత్తే కపూయాం యోనిం
ఆపద్యేరన్ శ్వ యోనిం వా, సూకర యోనిం వా, చాణాణాల యోనిం వా।।

ఎవ్వరైతే పైన చెప్పబడిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణితమైన కర్మ-జ్ఞానములు ఆశ్రయించక తమోగుణ స్వభావములైనట్టి దురాచారములు (కోపము, ద్వేషము, పరహింస మొదలైనవి) అభ్యాసము కలిగియున్నవారు - కుక్క, పంది, చండాల యోనులందు ప్రవేశము పొందుచున్నారు.


పరలోకము ఎందుకు జీవులచే నిండిపోదు? [నాలుగవ ప్రశ్నకు సమాధానము]

కొందరు జీవులు దేవయానముగాని, పితృయానముగాని ఆశ్రయించకపోవటంచేత అల్పప్రాణులుగా (జంతు, కీటక ఇత్యాది) ఉపాధులను మరల మరల పొందటము జరుగుతోంది. అందుచేతనే ‘పితృలోకము’ ‘స్వర్గలోకము’ వంటి ఊర్ధ్వలోకములు జీవులతో నిండటము లేదు.

అందుచేత జీవులు జుగుప్సమగు కర్మలు చేయకుండెదరు గాక। ఏవేవి నిషిద్ధకర్మలో, పర్యవసానము అనేక దుఃఖ స్థితుల ప్రాప్తియో - జాగరూకత కొరకై శ్లోకములు (శాస్త్రములు) ఈ విధంగా చెప్పుచున్నాయి:-

(1) స్తేనో హిరణ్యస్య : బంగారము దొంగిలించటము.
(2) సురాం పిబగ్ం : మత్తుపానీయములు సేవించటము.
(3) గురోః తల్పం ఆవసన్ : గురుపత్నిని కామించటము.
(4) బ్రహ్మ హా : బ్రహ్మజ్ఞులగు బ్రాహ్మణులను చంపటము (బ్రాహ్మణహత్య).

పతంతి చత్వారః। ఈ నలుగురు మానవ జన్మ నుండి పతితులు (downfall) అగుదురు. వీరితో స్నేహపూర్వకంగా కలిసి తిరుగువాడు పతితులలో ‘5’వ వాడు అగుచున్నాడు.

ఓ ఆరుణిమునీంద్రా! ఎవ్వరైతే మనము చెప్పుకున్న పంచాగ్నులను ఉపాసిస్తారో, అట్టివాడు పాపిగా ఇతఃపూర్వం వ్యవహరించినా కూడా ఆ దోషములు ఆతనిని అంటవు. పవిత్రుడై పుణ్యలోకములు చేరగలడు.

★★★

పంచాగ్నుల ఉపాసన

(1) ద్యులోకాగ్ని ఉపాసన - ఆదిత్యుడే సమిధ; కిరణముల పొగ, పగలే మంట; చంద్రుడు అంగారము (బొగ్గులు); నక్షత్రములే విస్ఫులింగములు (మిణుగురులు)
(2) పర్జన్య వర్షదేవతా అగ్ని - వాయువు → సమిధ; మేఘము → పొగ, మెరుపులే ‘జ్వాల’, పిడుగులే మండే బొగ్గులు; గర్జనలు విస్ఫులింగములు (కిరణములు).
(3) పృథివీ అగ్ని - సంవత్సరము → సమిధ; ఆకాశము → పొగ; రాత్రియే - జ్వాల; దిక్కులు → కాలే బొగ్గులు; మూలలు → విస్ఫులింగములు.
(4) పురుషాగ్ని - వాక్ ఇంద్రియము → సమిధ; ప్రాణము → పొగ; జిహ్వయే (నాలుకయే) - జ్వాల; కన్ను → మండే బొగ్గు; చెవి - విస్ఫులింగములు.
(5) యువతియే అగ్ని - జననేంద్రియము ఉపస్థ → సమిధ; సంకేతము → పొగ, రాత్రి బొగ్గులు; యోనియే - జ్వాల; మైథునమే మండే బొగ్గులు; రతి సుఖమే కిరణములు; దీని నుండి గర్భము, జీవుల జననము జరుగుతోంది.

అట్టి పంచాగ్నులను ఎరిగి ఉపాసించువాడు సర్వదోషములు తొలగి ఉత్తమ లోకములు సిద్ధించుకోగలడు.


16–5–11. పంచమ అధ్యాయము - ఏకాదశ ఖండము - వైశ్వానరోపాసన

అశుద్ధకర్మల పర్యవసానంగా ఈ జీవుడు క్రిమికీటములవంటి జన్మలు పొందటము, సంసార దుఃఖములను అనుభవించవలసి రావటము జరుగగలదు. అట్టి దుఃఖములను నిరోధించటానికై ఉపనిషత్‌వాణి ఇప్పుడు ‘వైశ్వానరోపాసన’ అనే ఉపాయము మనకు చెప్పుతోంది. వైశ్వానర సంబంధమైన జ్ఞానబోధ మనకు అందిస్తోంది.

పూర్వకాలంలో ఒకప్పుడు గృహస్థులైన ఐదుగురు స్నేహితులు ఉండేవారు. వారు గొప్ప శ్రోత్రియులుగా (శ్రుతులను ఎరిగినవారు)గా మన లోకములో సుప్రసిద్ధులు.

వారి పేర్లు :
(1) ఉపమన్యముని కుమారుడు - ప్రాచీనశాల ఔపమన్యుడు।
(2) పులుషిముని కుమారుడు - సత్యయజ్ఞ పౌలుషి।
(3) భల్లవిముని కుమారుడు - ఇంద్రద్యుమ్న భాల్లవేయుడు।
(4) శర్కరాక్షముని కుమారుడు - జనశ్శారాక్ష్యుడు।
(5) అశ్వతాశ్వముని కుమారుడు - బుడిల అశ్వతరాశ్వి।

వీరు ఐదుగురు సంపన్నులు. వేదశాస్త్రములు అధ్యయనము చేసియున్నవారు. సదాచార సంపన్నులు కూడా! ఒకానొక సందర్భములో ఈ ఐదుగురు ఒక ప్రదేశములో సమావేశమైనారు. వారు ఒక గొప్ప ఆధ్యాత్మికమైన సంవాదమునకు సంసిద్ధమైనారు.

విషయము
(1) కో ను ఆత్మా? నా ఆత్మ ఎటువంటిది?
(2) కిం బ్రహ్మ - ఇతి? బ్రహ్మము అనగా ఏది?

కొంతసేపు శాస్త్ర సంబంధమైన విషయాలు సంభాషించుకున్నారు - తరువాత ఆ ఐదుగురు ఇట్లా నిర్ణయించుకున్నారు.

‘‘మన ఆత్మ ఎట్టిది? బ్రహ్మము అనగా ఏది? ఈ రెండు ప్రశ్నలయొక్క సమాధానము వేదాంత శాస్త్రముయొక్క (లేక) వేదాంత శాస్త్రముయొక్క పరాకాష్ఠ సారము. అందుచేత మనము శాస్త్రానుభవము, లోకానుభవము, ఆత్మానుభవము గల సద్గురువును ఆశ్రయించి శ్రవణము చేద్దాము. అరుణి మహర్షి కుమారుడు ఉద్దాలకారుణి మహర్షి ‘ఆత్మవిద్య’ అయినట్టి వైశ్వానరవిద్యలో బహుప్రావీణ్యులని మునిలోకము ప్రశంసిస్తూ ఉన్నది. మనము వారిని దర్శించి, ‘ఆత్మవిద్య’ కొరకై శరణువేడుదాము.

ఇట్లా నిర్ణయించుకొని వారు ఐదుగురు అప్పటికప్పుడే ఉద్దాలక మహర్షి ఆశ్రమం సందర్శించారు.

అప్పుడు ఉద్దాలక మహర్షి ఇట్లు పలికారు।

ఓ మునీశ్వరులారా! మీరు ఐదుగురు గొప్ప - శ్రోత్రియులు. ఉత్తమ గృహస్థులు. శాస్త్రములను, లోకమును తరచి తరచి పరిశీలించి ఉన్నవారు. అట్టి మీకు ‘‘వైశ్వానర విద్య’’ అమూలాగ్రము బోధించగల పూర్ణజ్ఞానినని నా గురించి నేను అనుకోవటము లేదు.

ఓ పూజనీయులారా! కేకయు రాజు కుమారుడగు అశ్వపతి రాజు ‘ఆత్మవిద్య’ లేక వైశ్వానర విద్య బోధించటానికి నాకంటే అధికమైన సామర్థ్యము, ప్రజ్ఞకలవారని నేను అభిప్రాయపడుచున్నాను. మనము అందరము ఆయన వద్దకు వెళ్ళి శ్రవణము చేద్దాము।


అప్పుడు ఆ ఆరుగురు (ఉద్దాలకుడు, ప్రాచీనశాలుడు, సత్యయజ్ఞుడు, ఇంద్రద్యుమ్నుడు, జనుడు, బుడిలుడు) - అశ్వపతి రాజు రాజ్యమునకు వెళ్లారు. ఆ వచ్చినవారికి వేరువేరుగా అతిథి మర్యాదలకు సంబంధించిన సత్కారములు అశ్వపతిరాజు సమర్పించారు.

అశ్వపతి : పూజ్యులారా! సుదీర్ఘమైన ప్రయాణం చేసి అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. మా సేవకులు మీకు వసతులు చూపి సేవలు అందిస్తారు. ఈ రోజు రాత్రి హాయిగా విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం ప్రాతఃకాలమే మీ దర్శనం చేసుకోగలను.

ఆ రోజు ఆ విధంగా విశ్రాంతి తీసుకున్నారు. ఆ మరునాడు ఉదయమే - అశ్వపతి మహారాజు ఆ వచ్చిన ఉద్దాలక, ప్రాచీనశాల, సత్యయజ్ఞ, ఇంద్రద్యుమ్న, జడ, బుడిల మునులను కలిసారు.

అశ్వపతి రాజు : మహనీయులు, పూజనీయులు అగు మునివర్యులారా! మీ అందరికి నమస్కరిస్తున్నాను. మా రాజ్యమునకు, మేము ప్రారంభిస్తున్న యజ్ఞాదులకు మీ ఆశీర్వాదము, శుభాకాంక్షలు అర్థిస్తున్నాను. దయచేసి నేను సమర్పిస్తున్న ఈ గోవులు, ధనము స్వీకరించండి.

ఉద్దాలకాది మునులు : మహారాజా! మీ అతిథి మర్యాదలకు సంతోషము ప్రకటిస్తున్నాము. అయితే మీరు ఇచ్చే ధనముతో మాకు పనిలేదు.

అశ్వపతి రాజు : మునీశ్వరులారా! ఒకవేళ మేము సమర్పిస్తున్న ధనము దోషముతో కూడి ఉన్నదేమోనని సందేహిస్తున్నారా? మా రాజ్యములో ఇతరుల ధనము అపహరించే దొంగతనములు లేవు. దొంగలు లేరు. లోభి లేడు. మా దేశములో మద్యపానము నిషేధము. మా ప్రజలందరు అగ్నికార్యము చేస్తున్నారు. లోభులు, వ్యభిచార వృత్తి కలవారు కాదు. ఇక కులట వృత్తి - కులటలు ఉండే మాటయే ఉండదు కదా! న స్వైరీ, స్వైరిణీ! మీవంటి మునిసత్తములకు మేము ధనము మొదలైనవి సమర్పించటానికి అర్హులమే అయి ఉన్నామని నా విన్నపము. అందుచేత మేము సమర్పించే ధనము మొదలైనవి దయచేసి స్వీకరించ ప్రార్థన.

ఉద్దాలకుడు : రాజా! మీరు, మీ ప్రజలు పరమ పవిత్రులు - సందేహమే లేదు. అయితే, మేము మీ వద్దకు ధనము కోరి రాలేదు.

అశ్వపతి రాజు : ఓహో! మేము ఈ రోజు ప్రారంభిస్తున్న యజ్ఞము సందర్శించి ఆశీర్వదించటానికి మీరు వేంచేసి ఉంటారా! అయితే చాలా సంతోషము. మీ రాకతో ఈ యజ్ఞము ధన్యము అవుతోంది. ఈ యజ్ఞము నిర్వర్తించబోతున్న ఋత్విక్కులందరికి ఎంతెంతగా ధనము (సంభావన) సమర్పిస్తానో, అంతగా మీ అందరికీ భక్తితో సమర్పించగలను. యజ్ఞము వీక్షించి యజ్ఞమునకు యజమానినగు నాకు, మా ప్రజలకు మీ ఆశీర్వాదములు ప్రసాదించెదరు గాక।

మునులు : ఏన హి ఏవ అర్థేన పురుషః చరేత్ తగ్ం హి ఏవ వదేత్। ఎవరి వద్దకు ఎందుకోసము వచ్చామో ఆ విషయమే కోరుకోవాలి గాని, తదితరములు కాదు కదా! ఆ అడిగినదే మీవంటి గొప్పదాతలు ఇస్తారు. మేము ధనము కోరి ఇక్కడికి రాలేదు. ఆత్మానమ్ ఏవ ఇమం ‘వైశ్వానరగ్ం’ సంప్రత్యధ్వేషీ! తమేవ నో బ్రూహి - ఇతి। మీరు ‘‘వైశ్వానర విద్య’’ బోధించటంలో బహు ప్రావీణ్యులని మునిలోకము కీర్తిస్తూ ఉంటుంది. అందుచేత మీవద్ద ఆ అట్టి ఆత్మవిద్య నేర్చుకోవటానికై శిష్యులమై ఆశ్రయిస్తున్నాము. దయచేసి మాకు వైశ్వానర విద్య బోధించవలసినదిగా వేడుకొనుచున్నాము. మీరు నిర్వర్తిస్తున్న యజ్ఞమునకు సమిధలు మొదలైన యజ్ఞ పరికరములు గురుభక్తితో తెచ్చి ఉన్నాము. సమర్పించగలము.

అశ్వపతి రాజు : ఓహో! అట్లాగా! ఓ మునివర్యులారా! మీతో ‘‘వైశ్వానర విద్య’’ గురించి నేను ఎరిగినంతవరకు తప్పక సంభాషిస్తాను.
అయితే ఈ రోజు మేము యజ్ఞము ప్రారంభిస్తున్నాము. రోజంతా కార్యక్రమములు ఉంటాయి కదా! అందుచేత రేపటి రోజు నుండి ప్రాతఃకాలములో మీరు నా వద్దకు రండి. మనము ‘‘వైశ్వానర విద్య’’ గురించి మా అంతఃపుర ధ్యాన మందిరములో సుఖాసీనులమై మననము చేద్దాము.

ఆ మరునాడు ప్రాతఃకాలమే ఆ ‘6’ గురుమునులు చేతిలో సమిధలు, యజ్ఞపరికరములు ధరించి (సమిత్పాణులై) అశ్వపతిరాజు ధ్యానమందిరానికి వెళ్ళారు.

అశ్వపతి రాజు : ఓ మునీశ్వరులారా! మనము చెప్పుకోబోతున్న ‘వైశ్వానర విద్య’ బోధించటానికి అగ్నికార్యముతో కూడిన ‘ఉపనయన దీక్ష’ను శ్రవణము చేయువారికి విధించటము ఆచారమైయున్నది. అయితే మీరంతా తపోధనులు. అనేకమందికి గురువులై ఉండి కూడా శిష్యులుగా మానసిక దీక్ష స్వీకరించగలరు. నిరహంకారులు. అందుచేత నేను మీకు ఉపనయనదీక్ష నియమించకుండానే ‘వైశ్వానర విద్య’ వివరించబోవుచున్నాను. మీరందరు శ్రద్ధగా ఈ ప్రశ్నలకు సమాధానములు ఇస్తూ శ్రవణ, మనన, నిదిధ్యాసలు నిర్వర్తించెదరు గాక।

మునివర్యులు : ఓ గురుదేవా! అశ్వపతి మహారాజా! యజ్ఞకార్యముల ప్రయత్నములలో నిమగ్నమైయుండి కూడా, మీరు శ్రమ తీసుకొని ఉదయ సమయాలలో ‘వైశ్వానర విద్య’ బోధించటానికి సంసిద్ధులైనందుకు మేము కృతజ్ఞులము. శిష్యులముగా భావించి మీరు అడగబోవు ప్రశ్నలకు వినమ్రులమై సమాధానము ఇవ్వగలము. ఆ తరువాత భక్తిశ్రద్ధలతో శరణాగతులమై మీ బోధ వినటానికి సంసిద్ధులమైయున్నాము. బ్రాహ్మీముహూర్త ప్రారంభములో ఉపనయన సంస్కారములు నిర్వర్తించియే (ఏకాగ్రమైన సామీప్య దృష్టిని సంస్కరించుకొనియే) మేము వస్తున్నాము.

మాపై దయతో మీ బోధామృతమును మాకు ప్రసాదించ వేడుకొనుచున్నాము.


16–5–12. పంచమ అధ్యాయము - ద్వాదశ ఖండము - ద్యులోకో (స్వర్గలోకో) నామ ఆత్మోపాసన

అశ్వపతి రాజు : పూజనీయులగు మునివర్యులారా! ఇక మనము ‘వైశ్వానర విద్య’ గురించి వివరించుకొనే సంభాషణము ప్రారంభిస్తున్నాము.

మేము గురుతుల్యులుగా భావించు ఉపమన్య ఋషీశ్వరుని కుమారులగు ఔపమన్యా! ప్రాచీనశాలా! మీరు ఇంతవరకు ఆత్మోపాసన చేస్తూనే ఉన్నారు కదా!

ఔపమన్య ప్రాచీనశాలుడు : మహాత్మా! అవును నేను ఆత్మభగవానుని ఉపాసిస్తూనే ఉన్నాను.

అశ్వపతి రాజు : మీరు దేనిని ‘ఆత్మ’గా ఉపాసిస్తున్నారు?

ప్రాచీనశాలుడు: పూజనీయా! నేను ‘ద్యులోకము’ అనబడే దేవతాలోకము (లేక) స్వర్గలోకమును ఆత్మగా ఉపాసిస్తూ ఉన్నాను. అది పుణ్యాత్ములగు దివ్యపురుషులు, తపో తేజః సంపన్నులు చేరు స్థానము కదా!

అశ్వపతి రాజు : మీరు చేసే ‘ద్యులోక-ఆత్మోపాసన’ను వైశ్వానర విద్యకు ‘సుతేజ ఉపాసన’ అనబడే ‘వైశ్వానరాత్మ’ యొక్క ఒక ‘అంశ’ మాత్రమే! అనగా ‘ఆత్మ శోభాయమైన తేజస్సు గలది’ అని ఆత్మను ఉపాసించినట్లుగా అవుతోంది.

అట్టి సుతేజ-ఆత్మోపాసన వలన ‘సుతము’ అనబడే వైదిక కర్మలు మీ వంశము వారంతా నిర్వర్తిస్తూ ఉన్నవారగుచున్నారు.
ఈ విధంగా (సుతేజముగా) ఆత్మోపాసన చేయటం చేత ‘సోమరసము’ను పొందుచూ మీ వంశమువారంతా సత్కర్మానుష్ఠానపరులై ఉండగలరు. ప్రియమైన ఆహారము పొందగలరు. వంశములోని వారంతా పవిత్రమగు బ్రహ్మతేజస్సు కలిగినవారగుచున్నారు. అందరిచే గౌరవించబడుచున్నారు.

అయితే, మీ సుతేజ - వైశ్వానరోపాసన (ఆత్మోపాసన)చే ఆత్మయొక్క శిరస్సును మాత్రమే పూజించినవారగుచున్నారు. అనగా, మీరు నిర్వర్తిస్తున్నది సమగ్రమైన పూర్ణాత్మోపాసన కాదు - అని నా మనవి. అందుచేత మీరు ఇప్పుడు నా దగ్గరకు పూర్ణాత్మరూపమగు ‘వైశ్వానర విద్య’ కొరకై వచ్చి ఉండకపోతే, ఏమయ్యేదంటే - మూర్ధా తే వ్యపతిష్యతి యద్యత్ మాం న ఆగమిష్యతి - ఇతి।।
పూర్ణాత్మజ్ఞానము (వైశ్వానర విద్య) ఎరిగినవారి సభలో మీ తల తెగి ఉండేది (తల వంచవలసివచ్చేది) - ఎందుకంటే మీ ఉపాసన ఆత్మధ్యాన ఆత్మోపాసన విషయమై సమగ్రము (comprehensive) కాదు కాబట్టి!


16–5–13. పంచమ అధ్యాయము - త్రయోదశ ఖండము - ఆదిత్య-విశ్వరూప ఆత్మోపాసన

కేకయ కుమారుడగు అశ్వపతి మహారాజు : మహాశయా! శ్రేష్ఠులగు పులిషముని కుమారా! పౌలిష సత్యయజ్ఞా! ప్రాచీనయోగ్యా!
మీరు ‘ఆత్మ’ అనగా దేనిని ఉపాసిస్తున్నారో చెప్పండి!

సత్య యజ్ఞుడు : భగవాన్! మహారాజా! నేను ఆదిత్యుని (సూర్యుని) ఆత్మభావనతో ఉపాసిస్తున్నాను - ఆదిత్యుడే జగత్తు అంతటికీ తేజోరూపుడై, సమస్తమును వెలిగించుచున్నారు కదా! చీకట్లు తొలగిస్తున్నారు కదా!

అశ్వపతి మహారాజు : మంచిది। శుక్ల నీలాది రూపత్వాత్ విశ్వరూపత్వమ్ ఆదిత్యస్య। సర్వరూపత్యాద్వా। తెలుపు-నలుపు మొదలైన రూపములు గలవాడు గనుక, ‘ఆదిత్యుడే విశ్వరూపుడు’ అనబడుతోంది. రూపములన్నీ ఆదిత్యునివే కాబట్టి కూడా ఆదిత్యుడే విశ్వరూపుడు.

ఆదిత్యుని ఆత్మపురుషునిగా ఉపాసిస్తున్నారు కాబట్టి మీ కులము (వంశము)లోని వారికందరికీ సాధన సంపత్తి సమృద్ధిగా లభించగలదు. మీకు, మీవారికి గుర్రములు, కంచరగాడిదల రథములు, దాస-దాసీజనులు, వెండి, బంగారము - ఇవన్నీ చక్కగా ప్రాప్తిస్తూ ఉంటాయి. సమస్త భోగములు మిమ్ములను చేరి ఉంటాయి. మీ కులములో బ్రహ్మవర్చస్సు ప్రకాశమానమై ఉంటుంది.

అయితే మీరు వైశ్వానరాత్మ యొక్క ‘విశ్వరూపము’ అనే ‘అంశ’ను మాత్రమే ఉపాసిస్తూ ఉన్నవారగుచున్నారు. అనగా మీ విశ్వరూపాత్మోపాసన సమగ్రము (Full Form) కాదు. వైశ్వానరాత్మ యొక్క కన్ను మాత్రమే ఉపాసిస్తున్నట్లు.

వైశ్వానరాత్మను ఆదిత్యునిగా ఉపాసించేవారు ప్రియమగు భోజనము పొందగలరు. బ్రహ్మవర్చస్సు వంశమువారినందరిని ఆశ్రయించి ఉండగలదు.
అయితే కూడా, ఆత్మ యొక్క కన్నులను మాత్రమే ఉపాసిస్తున్నారు కదా! అందుచేత సమగ్రమగు వైశ్వానరాత్మను ఉపాసించువారి సభలో మీరు సిగ్గుతో తలవంచవలసి వస్తుంది.
మీరు నా దగ్గరకు ‘వైశ్వానర విద్య’ శ్రవణము చేసి, తెలుసుకోవటానికి వచ్చి ఉండకపోయి ఉంటే అట్టి పండితులు సభలో మీ తల తెగేదే (తల వంచుకొనవలసి వచ్చేదే) మరి!


16–5–14. పంచమ అధ్యాయము - చతుర్దశ ఖండము - ‘‘వాయు-ఆత్మోపాసన’’

అశ్వపతి మహారాజు : భల్లవి మునీంద్రుని ప్రియకుమారుడవగు ఇంద్రద్యుమ్నా! వైయాఘ్రీపద్యా! మీరు ఆత్మను ఏ అర్థముగా ఉపాసిస్తున్నారు?

ఇంద్రద్యుమ్నుడు : అశ్వపతి మహారాజా! నేను వాయువును ఆత్మభావనతో (ప్రాణాయామాది సాధనలచే) ఉపాసిస్తున్నాను. వాయువే విశ్వమంతా సంచరిస్తూ సమస్త జీవులను ఉజ్జీవింపజేయుచున్నది కదా.

అశ్వపతి మహారాజు : మీరు చేస్తున్న ‘‘వాయువును ఆత్మగా ఉపాసించునది (సమస్తే వాయో। త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాఽసి - అను ఉపాసన) - వైశ్వానరుని యొక్క ‘‘పృథక్ వర్త్మాత్మోపాసన’’ అని ‘వైశ్వానరోపాసన’లోని ఒక విభాగముగా చెప్పబడుతోంది. గాలి - ఎదురుగా వీచే గాలి, పైకి లేచే గాలి, సుడిగాలి, దేహములలో సంచరించే గాలి - ఈ విధముగా అనేక వర్తనములుగా కలిగి ఉంటోంది కాబట్టి ‘‘పృథగ్వర్త్మా’’గా అనబడుతోంది.

అటువంటి పృథక్ - వర్త్మ రూపుడగు వైశ్వానర రూపమును ఉపాసించటము చేత -
- మీ దగ్గరకు అనేక దిక్కులనుండి బలిదానములు (ఉపాహారములు) చేరుతూ ఉంటాయి.
- అనేక వైపులనుండి బలములు మీకు చేకూరుతూ ఉంటాయి.
- అనేక రథశ్రేష్ఠులు (Groups of Travelling Vehicles) మీరు ఎక్కడికి వెళ్లితే అక్కడికి మీసేవకై వెంటనంటి నడుస్తూ ఉంటాయి.
- మీరు చక్కటి ఆహారము భుజించగలరు. ఉత్తమ భోక్త అయి ఉంటారు.
- ప్రియం భవత్యసి। అందరికీ ప్రీతిపాత్రులౌతారు.
- మీ కులములోని వారంతా బ్రహ్మవర్చస సంపన్నులు అయి ఉంటారు.

అయితే మీరు పృథక్ వర్త్మ ఆత్మ వైశ్వానరోపాసనగా పరమాత్మ యొక్క ఒక ‘అంశ’ అయినట్టి ‘ప్రాణము’ను మాత్రమే ఉపాసించువారు అగుచున్నారు. అనగా అది సమగ్రమైన ‘వైశ్వానరోపాసన’ కాదు. మీరు సమర్థమగు ‘వైశ్వానరవిద్య’ యొక్క శ్రవణ - మననములకు నా వద్దకు రాకుండా ఉండి ఉంటే, ‘వైశ్వానర సమగ్ర విద్య’ తెలిసియున్నవారి సభలో మీ తల తెగేదే! అనగా మీరు ‘నాది సమగ్రమైన ఉపాసన కాదు’ - అని ఎరిగి తలవంచవలసి వచ్చేది.


16–5–15. పంచమ అధ్యాయము - పంచదశ ఖండము - ‘ఆకాశ’ వైశ్వానరోపాసన

అశ్వపతిరాజు : మహనీయుడగు శర్కరాక్ష్యుని ప్రియకుమారా! జన మహానుభావన్! మీరు ఆత్మను ఏ పరమార్థముగా ఉపాసన చేస్తున్నారు? చెప్పండి!

జనుడు : మహాశయా! నేను నిర్విషయము, అనంతము అయినట్టి ‘ఆకాశము’ను ఆత్మభావనగా ఉపాసిస్తున్నాను. ఆకాశము ఆత్మయొక్క అనంతత్వము, అప్రమేయత్వము మొదలైన లక్షణములు కలిగి ఉన్నది కదా!

అశ్వపతిరాజు : మీరు నిర్వర్తిస్తున్న ‘ఆకాశోపాసన’ను ‘వైశ్వానరోపాసన విద్య’ యొక్క ‘బహుళము’ అని ప్రసిద్ధి (బహుళ వైశ్వానరోపాసన). అట్టి బహుళ వైశ్వానరోపాసన (ఆకాశమును ఆత్మోపాసనగా నిర్వర్తించటము) వలన బహు సంతానము, సంపదలతో వర్థిల్లగలరు. శ్రేష్ఠమగు అన్నము పొందగలరు. అందరికి ఇష్టము కాగలరు. సర్వత్రా ప్రియమును దర్శించగలరు. వంశములో అందరు బ్రహ్మవర్చసులు కాగలరు.

అయితే మీరు వైశ్వానరుని యొక్క సందేహము (దేహమధ్యభాగము)ను మాత్రమే ఉపాసించుచున్నట్లౌతుంది. అనగా సమగ్రము కాదు. కాబట్టి వైశ్వానర సమగ్రార్థము తెలిసినవారి సభలో తల తెగేదే! నా వద్దకు వైశ్వానర విద్య శ్రవణము చేయకపోతే అక్కడ తలవంచవలసివచ్చేది।


16–5–16. పంచమ అధ్యాయము - షోడశ ఖండము - జలమును ఆత్మగా ఉపాసన (రయి ఉపాసన)

అశ్వపతి రాజు : జ్ఞానులు అయినట్టి అశ్వతరాశ్యుని కుమారులగు బుడిల మునీ! మీరు ఆత్మను ఏ రూపముగా ఉపాసిస్తున్నారు?

బుడిలముని : పూజనీయా! భగవాన్! (‘‘యో ఆపో మాం ఆయతనం వేద’’ అను వేదవాక్యానుసారం) నేను ‘జలము’ను ఆత్మతేజోవిభవముగా ఉపాసిస్తున్నాను. జలము లేకపోతే జీవనము, జీవ - జంతు - వృక్షజాతులు మనలేవు కదా.

అశ్వపతి రాజు : మీరు నిర్వర్తిస్తున్న జలతత్త్వ ఆత్మోపాసన ‘రయి’ అను వైశ్వానరాత్మోపాసనయే।
అట్టి రయీ వైశ్వానరోపాసనచే పుష్టి, సంపద బహుళముగా పొందగలరు. అన్నమును తృప్తిగా భుజించగలరు. బ్రహ్మవర్చస్సు మీ వంశజులను ఆశ్రయించి ఉండగలరు.

అయితే మీది వైశ్వారుని సమగ్ర ఉపాసన కాదు. అది వైశ్వానర వస్తి (మూత్రపిండము) ఉపాసన మాత్రమే. నా దగ్గరకు వచ్చి వైశ్వానర సమగ్రోపాసన విని ఉండకపోతే విజ్ఞుల సభలో మీ మూత్రపిండము పగిలిఉండేదే మరి! అనగా, మీ ఉపాసన అసమగ్రమని ఎరిగి తలవంచవలసి వచ్చేది.


16–5–17. పంచమ అధ్యాయము - సప్తదశ ఖండము - పృథివీ వైశ్వానరోపాసన

అశ్వపతి రాజు : గౌతమా! బ్రహ్మజ్ఞులగు ఆరుణి మహర్షి ప్రియకుమారులగు ఉద్దాలక మునివర్యా! కం త్వం ఆత్మానం ఉపాస సః ఇతి? మీరు దేనిని ఆత్మతత్త్వభావనకై ఉపాసిస్తున్నారు?

ఉద్దాలకుడు : మహారాజన్! భగవాన్! నేను పృథివిని ఆత్మతత్త్వముగా ఉపాసించుచున్నాను.

అశ్వపతి రాజు : పూజనీయా! ఉద్దాలకా! మీరు నిర్వర్తిస్తున్న ‘‘పృథివీతత్వ-ఆత్మోపాసన’’ను ‘ప్రతిష్ఠ’ అని ప్రసిద్ధి చెందిన వైశ్వానరోపాసన అంటారు.

అట్టి ‘పృథ్వి-ప్రతిష్ఠా వైశ్వానరోపాసన’ చేస్తున్న మీరు సంతానము, పశుసంపద, గొప్పదగు ఆహారము, సర్వత్రా ప్రియత్వము, బ్రహ్మ వర్చస్సుతో కూడిన వంశపారంపర్యము సిద్ధించుకోగలరు.

అయితే మీరు వైశ్వానర పూర్ణోపాసన చేయటం లేదని నా మనవి. వైశ్వానరుని పాదములవరకే ఉపాసిస్తున్నట్లు అవుతుంది. మీరు నా దగ్గరకు సమగ్రమైన వైశ్వానరోపాసన గురించి వినటానికి వచ్చి ఉండకపోతే, - మీ రెండు పాదములు శిథిలమైపోయేవి. (అనగా) పూర్ణమగు వైశ్వానరోపాసన ఎరిగిన పండితుల సమక్షంలో ‘‘నాది సమగ్రమైన ఉపాసన కాదు’’ - అని గ్రహించి సిగ్గుతో తలవంచవలసి వస్తుండేది.


16–5–18. పంచమ అధ్యాయము - అష్టాదశ ఖండము - వైశ్వానరాత్మ విద్య

అశ్వపతిరాజు : ఓ మునిపుంగవులారా! మనము ఇప్పుడు వైశ్వానరాత్మ విద్య యొక్క ‘సమగ్రమగు ఆత్మోపాసన’ గురించి చెప్పుకుంటున్నాము. యూయం పృథగివేమమ్ ఆత్మానం వైశ్వానరం విద్వాగ్ం। సో అన్నమత్థ।

మీరంతా కూడా…ప్రాదేశ మాత్రంగా (confined at one area) ఉపాసిస్తున్నారు.

అనగా,
ద్యులోకముగా - ‘‘సుతేజా’’
ఆదిత్యుడుగా - ‘‘విశ్వరూపా’’
వాయువుగా - ‘‘పృథక్ వర్త్మాత్మా’’
ఆకాశముగా - ‘‘బహుళ’’
జలముగా - ‘‘రయి’’
పృథివిగా - ‘‘ప్రతిష్ఠ’’
గా ‘‘ఆత్మ’’ను ఉపాసిస్తూ ఉన్నామని వివరించి ఉన్నారో అది ప్రాదేశమాత్రోపాసన.

వేరువేరు కాకుండా, ‘ఒక్కటే’ అయి ఉన్న ఆత్మను వేరువేరు రూపాలుగా ఉపాసిస్తూ ఆయా ఆహారములను (ఫలములను) స్వీకరించుచున్నారు. ఇది ఎటువంటిదంటే కొందరు గ్రుడ్డివారు ఏనుగుయొక్క వేరువేరు అవయవములను సృశించి,
ఒకడు (చెవులను తాకి) ‘చాట’వలె ఉంటుందని, మరొకడు (తోకను తాకి) ‘‘పాము’’వలె ఉంటుందని, ఇంకొకడు (నడుమును తాకి) ‘‘గోడ’’వలె ఉంటుందని, వేరొకడు (తొండము తాకి) ‘‘పెద్దగొట్టము’’ వలె ఉంటుందని ఏనుగు గురించి నమ్మిక కలిగి ఉండటము వంటిది.

సమగ్రోపాసన

అనగా, మీరు ఏ ‘వైశ్వానరాత్మ’ను ప్రాదేశమాత్రంగా (As if confined to one zone / area / place)గా భావించి ఉపాసిస్తున్నారో, అట్టి వైశ్వానరాత్మ సమగ్రోపాసనచే ఎట్టివాడని తెలుస్తాడో? ఇంకా గమనిద్దాము.

ఏతమేవం ప్రాదేశమాత్రమ్ అభివిమానమ్ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే
- స సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు, సర్వేషు ఆత్మసు అన్నస్తుతి।

‘‘లోకంలో పరమాత్మను ఒక రూపమనో, ఒక నామమనో ఒక ప్రదేశమనో (శ్రీకృష్ణుడుగానో, శ్రీరాముడుగానో, శివుడుగానో అల్లాగానో, యెహోవా అనియో మరింకేదైనా నామ-రూప-ప్రదేశాత్మకంగా) ఉపాసిస్తున్నారో అట్టి పరమాత్మ
       - సర్వలోకములలో…,
       - సర్వజీవులలో ….,
       - సర్వాత్మకుడై సర్వత్రా సర్వదా వెలయుచున్నాడు!’’
- అను ఉపాసనను ‘‘వైశ్వానరాత్మోపాసన’’ అని ఎరిగి ఉండెదరు గాక! అట్టి వైశ్వానరాత్మ యొక్క దేహమే ఈ సమస్తము కూడా!

ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య…

మూర్ధ ఏవ సుతేజా! ‘సుతేజము’ అను ద్యులోకమే (దివ్యలోకమే దేవలోకమే) మూర్ధము (శిరస్సు/ముఖము)
చక్షుః విశ్వరూపః। ‘విశ్వరూపుడు’ అగు ఆదిత్యుడే నేత్రములు
ప్రాణః పృథ్వగ్వర్త్మా అనేక వర్తనములతో కూడిన ఆయన యొక్క -‘‘పృథక్ వర్త్మాత్మత్వమే’’ వాయువు, వాయు వీచికలు
సందేహో బహుళో ‘బహుళము’గా సర్వత్రా ఏర్పడి ఉండటమే ఆకాశము
బస్తిరేవ రయిః। ‘రయి’ అగు శరీరమధ్య భాగమే జలము
పృథివ్యే చ పాదౌ। ‘ప్రతిష్ఠ’ అగు పృథివియే పాదములు

ఇంకా…యజ్ఞ పరిభాషగా….
   యజ్ఞవేదికయే        - ఆయనకు వక్షఃస్థలము
   దర్భలు           - ఆయనకు రోమములు (వెంట్రుకలు)
   గార్హపత్యాగ్ని        - ఆయనకు ‘హృదయము’
   దక్షిణాగ్ని        - ఆయనకు ‘మనస్సు’
   ఆహవనీయాగ్ని        - ఆయనకు ‘నోరు’

‘‘సమస్త విశ్వయజ్ఞము, విశ్వపురుషుడు ఆ వైశ్వానరాత్మయే’’ - అనునది ‘సమగ్రోపాసన’ అగుచున్నది.


16–5–19. పంచమ అధ్యాయము - ఏకోన వింశతి ఖండము - వైశ్వానరాత్మోపాసన - ‘‘ప్రాణాయ స్వాహా’’।

‘‘యాం ప్రథమాహుతిం జుహుయాత్, తాం జుహుయాత్ ప్రాణాయ స్వాహేతి।’’ -

భోజనము చేయునప్పుడు ‘భోక్త’ వైశ్వానరుని ఉపాసించే విధము.

మొదటగా లభించిన ఆహారమును బొటనవ్రేలితో కొంచము తీసుకొని నోటిలో వేసుకొనుచూ… ఓం ప్రాణాయ స్వాహా అని ఆత్మపురుషుడగు వైశ్వానరాగ్నికి హోమము చేయుదురు గాక! (నోటితో మ్రింగెదరు గాక!)

అప్పుడు ఇట్టి ‘భావన’ను చేస్తూ ఈ విధంగా వైశ్వానర ప్రాణదేవతను (ఓం ప్రాణాయస్వాహా మంత్రముచే)

ప్రాణే తృప్యతి
చక్షుః తృప్యతి।
పంచ ప్రాణములలో మొదటిదగు ‘ప్రాణము’ తృప్తిపొందుచున్నది.
ప్రాణతృప్తిచే చక్షువులు ‘తృప్తి’ చెందుచున్నాయి.
చక్షుః తృప్యతి
ఆదిత్యః తృప్యతి
నేత్రముల తృప్తిచే ఆదిత్యుడు తృప్తి చెందుచున్నారు.
(సూర్యుడు సేవించబడుచున్నారు)
ఆదిత్యే తృప్త్యతి
ద్యౌః తృప్యతి
ఆదిత్యుడు తృప్తిపొందటం చేత ద్యులోకము
(దేవతాలోకము) తృప్తి చెందుచున్నది.
దివితృప్యన్త్యాం, యత్ కించ ద్యౌశ్చ ఆదిత్యశ్చ ‘‘అధిష్ఠతః’’ తత్ తృప్యతి। ద్యులోకతృప్తిచే దేవతలపై, ఆదిత్యునిపై ఆధారపడినవైయున్న ఈ సమస్తము తృప్తి చెందుచున్నది.

ఈ విధంగా పంచ ప్రాణములలో మొదటిదగు ప్రాణము ‘‘ప్రాణాయ స్వాహేతి’’ - అని ఉపాసించటంచేత ఆ వైశ్వానరోపాసకునకు ప్రజలు (జనసంపద), పశుసంపద, అన్నము, బ్రహ్మతేజస్సు లభించగలవు. జీర్ణశక్తి, ఆయురారోగ్యములు పొందుచున్నాడు. ఈ ఉపాసన చేయువాడు సంతృప్తుడై, సంతృప్తిని తదితరులకు పంచిపెట్టగలడు.


16–5–20. పంచమ అధ్యాయము - వింశ ఖండము - వైశ్వానరాత్మోపాసన - ‘‘వ్యానాయ స్వాహా’’

అథ-యాం ద్వితీయాం జుహుయాత్ తాం జుహుయాత్ వ్యానాయ స్వాహేతి।

రెండవదిగా లభించిన ఆహారమును బొటనవ్రేలుతో కొంచము తీసుకొని నోటిలో వేసుకొని ‘‘ఓం వ్యానాయ స్వాహా’’ అంటూ ఆత్మపురుషుడగు వైశ్వానరాత్మ దేవునకు హోమద్రవ్యముగా సమర్పించెదరు గాక। (నోటితో స్వీకరించెదరు గాక।)

అట్టి సమర్పణచే (ఓం వ్యానాయ స్వాహా మంత్రముచే-‘వ్యానము’ అను ప్రాణపంచకములో రెండవదగు వ్యానదేవత తృప్తి పొందుచున్నది.

వ్యానే తృప్యతి - శ్రోత్రం తృప్యతి వ్యానము తృప్తి చెందుచుండగా శ్రోత్రేంద్రయము (వినికిడి దేవత) తృప్తి చెందుతోంది.
శ్రోత్రే తృప్యతి - చంద్రమాః తృప్యతి శ్రోత్రేంద్రియము (చెవి) తృప్తి చెందటంచేత చంద్రమసము (చంద్రదేవత) తృప్తిచెందగలరు.
తృప్యతి చంద్రమాః తృప్యతి దిశః। చంద్రదేవత తృప్తిచే దిక్కులు తృప్తి చెందగలవు.
దిక్షు తృప్యన్తీషు యత్కించ దిశశ్చ, చంద్రమాశ్చ అధితిష్ఠన్తి తృప్యతి దిక్కులు తృప్తిచే దిక్కులు, చంద్రుడు అధిష్ఠానమైన సమస్తము (ఆహారము, ఓషధులు, వనస్పతులు, దృశ్యము మొదలైన సమస్తము) తృప్తి పొందుచున్నాయి.

ఈ విధమైన ‘వ్యానాయ స్వాహాయేతి’ అను మంత్ర మనన-సమర్పణలచే అట్టి యజ్ఞకర్త బంధు-పశు-అన్న-బ్రహ్మవర్చస సంపదలు సమృద్ధిగా పొందుచున్నాడు.

జీర్ణశక్తి, ఆయురారోగ్యములు సిద్ధించుకొనగలడు. తాను సంతృప్తుడై, సర్వజనులను సంతృప్తింపజేయగలడు.


16–5–21. పంచమ అధ్యాయము - ఏకవింశ ఖండము - వైశ్వానరాత్మోపాసన - ‘‘అపానాయ స్వాహా’’

అథ యాం తృతీయం జుహుయాత్ తాం జుహుయాత్
‘‘అపానాయ స్వాహేతి’’ అపానః తృప్యతి

మూడవదిగా లభించిన ఆహారము - బొటనవ్రేలుతో కొంచము తీసుకొని నోటిలో వేసుకొని
       ‘‘ఓం అపానాయ స్వాహా’’
అని చెప్పుతూ ఆత్మపురుషుడైనట్టి వైశ్వానర భగవానునకు హోమద్రవ్యముగా సమర్పించెదరు గాక! (నోటితో మింగెదరు గాక)

ఈ విధమైన ‘సమర్పణ’చే (ఓం-‘అపానాయస్వాహా’ ఇతి మంత్రముచే) ‘‘అపానము’’ అను పంచ ప్రాణములలోని మూడవ ప్రాణము తృప్తిచెందగలదు.

అపానే తృప్యతి - ‘వాక్’ తృప్యతి। అపానతృప్తిచే ‘వాక్’ ఇంద్రియము తృప్తి చెందుతోంది.
వాచి తృప్యతి - అగ్నిం తృప్యన్తి వాక్కు తృప్తిచే ‘‘అగ్నిదేవత’’ తృప్తి చెందగలదు.
అగ్నిస్తృప్యతి - పృథివీ తృప్యతి అగ్ని తృప్తిచే ‘‘పృథివి’’ (భూమి) తృప్తిచెందగలదు.
పృథివ్యాం తృప్యన్తాం యత్కించ పృథివీ చ, అగ్నిశ్చ అధితిష్ఠన్తః తృప్యతి పృథివీ తృప్తిచే - అగ్నులు వేనివేనియందు (మట్టిబొమ్మలలో మట్టిలాగా) అధితిష్ఠితమై ఉన్నాయో, అవన్నీ కూడా తృప్తిచెందగలవు.

ఆ విధంగా అవన్నీ తృప్తిచెందటంచేత వైశ్వానరాత్మ (సర్వాత్మకుడు) తృప్తిచెందినవారై ఆ ఉపాసకునకు పశుసంపద, ఉత్తమ సంతానము, పవిత్రమగు అన్నము, బ్రహ్మ తేజస్సు ప్రసాదించగలదు. ఆతడు సుసంపన్నుడు, సంతృప్తుడు అవగలడు.


16–5–22. పంచమ అధ్యాయము - ద్వావింశ ఖండము - వైశ్వానరాత్మోపాసన - ‘‘సమానాయ స్వాహా’’

అథ యాం చతుర్థీం జుహుయాత్ తాం జుహుయాత్
‘‘సమానాయ స్వాహేతి’’। సమానః తృప్యతి

నాలుగవదిగా లభించిన ఆహారమును బొటనవ్రేలుతో కొంచము తీసుకొని
       ‘‘ఓం సమానయ స్వాహా’’ ఇతి
అని పలుకుచూ సమస్త స్వరూపాత్మ పురుషుడు అయి ఉన్న వైశ్వానర భగవానునికి హోమద్రవ్యముగా సమర్పించెదరు గాక (మ్రింగెదరు గాక)

‘‘ఓం సమానాయ స్వాహా’’ అను చతుర్థ ఆహార (హోమద్రవ్య) సమర్పణచే 4వది అగు ‘సమానము’ తృప్తిచెందగలదు.

సమానే తృప్యతి - మనః తృప్యతి। సమాన వాయు తృప్తిచే ‘‘మనస్సు’’ తృప్తి చెందగలదు.
మనః తృప్యతి - పర్జన్యః తృప్యతి। మనస్సు తృప్తి పొందితే ‘వర్షము’ తృప్తి చెందగలదు.
పర్జన్యే తృప్యతి - విద్యుత్ తృప్యతి। పర్జన్యము (వర్షము) తృప్తి చెందితే మెఱుపు (తేజస్సు) తృప్తి చెందగలదు.
విద్యుతి తృప్యన్తాం యత్ కించ విద్యుచ్చ పర్జన్యశ్చ అధితిష్ఠః తత్ తృప్యతి। విద్యుత్ (ప్రకాశము) తృప్తి చెందితే, ఏవేవి వర్షమును, విద్యుత్తును అధితిష్ఠముగా కలిగి ఉన్నాయో - అవన్నీ తృప్తి చెందగలవు.

అట్టి 4వదగు ‘సమానము’నకు హోమద్రవ్యముగా ఆహారము సమర్పించు అభ్యాసి (ఉపాసకుడు) పశుసంపద, జనసంపద, ఆరోగ్యకరమగు అన్నము, బ్రహ్మతేజస్సు కలవాడై సంతృప్తుడవగలడు.


16–5–23. పంచమ అధ్యాయము - త్రయోవింశ ఖండము - వైశ్వానరాత్మోపాసన - ‘‘ఉదానాయ స్వాహా’’

అథ యాం పంచమీం జుహుయాత్ తాం జుహుయాత్
‘‘ఉదానాయ స్వాహా’’ ఇతి। ఉదానః తృప్యతి

ఇప్పుడు ఐదవదిగా లభించిన ఆహారమును బొటనవ్రేలుతో కొంచము తీసుకొని
       ‘‘ఓం ఉదానాయ స్వాహా।’’ ఇతి
అని అంటూ సర్వాత్మకుడు, స్వస్వరూపుడు అగు వైశ్వానరాత్మదేవునికి సమర్పిస్తూ మ్రింగెదరు గాక।

ఈ విధమైన ‘ఉదానము’ అను 5దవ ప్రాణశక్తికి చేయు వైశ్వానరాగ్ని సమర్పితముచే ‘ఉదానప్రాణము’ తృప్తి పొందగలదు.

ఉదానే తృప్యతి - త్వక్ తృప్యతి। ఉదాన తృప్తిచే స్పర్శ (చర్మము) తృప్తి చెందగలదు.
త్వచి (త్వక్‌చి) తృప్యతాం వాయుః తృప్యతి। స్పర్శ యొక్క తృప్తిచే ‘‘వాయువు’’ తృప్తి చెందగలదు.
వాయౌ తృప్యతి ఆకాశే తృప్యతి వాయు తృప్తిచే పంచభూతములలో మొట్టమొదటిదగు ‘ఆకాశము’ తృప్తి చెందగలదు.
ఆకాశే తృప్యతి యత్‌కించ వాయుశ్చ, ఆకాశశ్చ అధితిష్ఠతః తృప్యతి ఆకాశ తృప్తిచే, వాయు - ఆకాశములు వేటివేటియందు అధితిష్ఠితమై ఉన్నాయో - అవన్నీ తృప్తి పొందగలవు.

తస్య అనుతృప్తిం తృప్యతి। అద్దానిచే వైశ్వానరాత్మ స్వరూపుడే అయి ఉన్న ఈ జీవుడు తనకు తాను తృప్తి పొందగలడు.

అట్టి ఉపాసకుడు సత్సంతానము, పశుసంపద, ఉత్తమమగు ఆహారము, బ్రహ్మవర్చస్సు మొదలైనవన్నీ పొంది సంతృప్తుడవగలడు.


16–5–24. పంచమ అధ్యాయము - చతుర్వింశ ఖండము - ఆత్మజ్ఞాన ఫలశ్రుతి

అశ్వపతి రాజు : ఓ ఉద్దాలక, ప్రాచీనశాల, సత్యయజ్ఞ, ఇంద్రద్యుమ్న, జన, బుడిల మునివర్యులారా! ఈ విధంగా సమస్తము అయి ఉన్న ‘సర్వాత్మకుడు - స్వస్వరూపాత్ముడు’ అగు వైశ్వానర ఆత్మదేవుని స్మరిస్తూ సమస్త ఇంద్రియ వ్యాపారములు నిర్వర్తించటము - ’‘వైశ్వానరోపాసన’’ అని మహనీయులచే నిర్వచించి బోధించబడుతోంది. ఇదియే ‘వైశ్వానరవిద్య’ అని మహర్షుల సభలలో ప్రసిద్ధమైయున్నది.

ఫలశ్రుతి

అథ ఏతత్ ఏవం విద్వాన్ అగ్నిహోత్రం జుహోతి, తస్య సర్వేషు లోకేషు, సర్వేషు భూతేషు, సర్వేషు ఆత్మసు హుతం భవతి।।
ఎవ్వరైతే మనము చెప్పుకున్న ‘వైశ్వానరోపాసన’ ఎరిగియుండి అగ్నిహోత్రమునకు సమస్త ఇంద్రియ వ్యవహారములు సమర్పించు భావన కలిగి ఉంటాడో, (మరియు) హోమము మొదలైన దైవీ కార్యక్రమములు నిర్వర్తిస్తాడో - అట్టివాడు - సకల లోకములయందు, సకల ప్రాణులయందు, సకల దేహేంద్రియములయందు, సమస్త దృశ్యమునందు ‘‘హోమము’’ చేసిన ఉత్తమ ప్రయోజనము పొందుచున్నాడు. తానే సర్వాత్మకుడై సర్వ తత్త్వస్వరూపుడై వెలయుచున్నాడు.

ఇట్టి వైశ్వానర విద్యను (నేను సమర్పిస్తున్నదంతా సర్వాత్మకుడగు వైశ్వానరాగ్ని భగవానునికే - ) అనే అవగాహన లేకుండా అగ్నిహోత్రమునకు హోమద్రవ్యము సమర్పించువాని సమర్పణ - మండే కట్టెలను ప్రక్కకు నెట్టి, ఆ మిగిలియున్న బూడిదలో హోమము చేసినట్లే అవుతుంది. బూడిదలో పోసిన పన్నీరువలె నిష్ప్రయోజనమే! (అత్యుత్తమ ప్రయోజనము చేతికందదు)

ఎవ్వరైతే సర్వతత్త్వస్వరూపముగా వైశ్వానరాత్మశోభను ఎరిగి పైరీతిగా పంచప్రాణోపాసన పూర్వకంగా ఎరిగి సమస్త స్వీకారములు నిర్వర్తిస్తాడో (ఆహారాదులు పొందుతాడో) అట్టివాని జన్మజన్మల పాపములన్నీ కూడా (కర్మ దోషములన్నీ కూడా) - నిప్పులో వేయబడిన ఎండుగడ్డిపోచవలె భగభగమండి కాలిపోగలవు. అనేక జన్మల కర్మఫలములు భస్మమై ఆత్మజ్ఞానము వెలుగొందగలదు. (జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణుః)!

అట్టివాడు తాను తినగా మిగిలిన ఆహారమును పశుహింసకునికి (పాపికి) ఇవ్వటము జరిగినా కూడా - అది వైశ్వానరాగ్నికి హోమము చేసినట్లే అవుతుంది. ఇక పేదవారికి, అర్హత కలిగిన అతిథి అభ్యాగతులకు, ‘దేహీ’ అని అడిగినవారికి సమర్పించినది హోమద్రవ్యము కాక ఏమౌతుంది?

దానికి సంబంధించిన మంత్రము ఇట్లున్నది :

యథేహ క్షుధితా బాలా మాతరం పర్యుపాసతే, ఏవగ్ం సర్వాణి భూతాని అగ్నిహోత్రం ఉపాసత ఇతి। అగ్నిహోత్రం ఉపాసత ఇతి।।

ఏవిధంగా అయితే ఆకలిగొన్న పిల్లలు తల్లిచుట్టూ చేరి ‘‘అమ్మా! అన్నము పెట్టవా? ఆకలేస్తోందమ్మా!’’ అని అమ్మను ఉపాసిస్తారో ఆ విధంగా వైశ్వానరాగ్ని హోత్రమునే అందరూ (తెలిసినా, తెలియకున్నా) ఉపాసిస్తున్నారు.

అందుచేత తెలిసి వైశ్వానరాగ్ని భగవానుని సర్వదేహములలో దేహిగా సందర్శించుచూ వైశ్వానరాగ్న్యుపాసన (వైశ్వానరోపాసన) నిర్వర్తించి ధన్యులయ్యెదరు గాక.

ఇతి వైశ్వానర విద్యేతి।।

వైశ్వానరాయ విద్మహే! లాలీలాయ ధీమహి। తన్నో అగ్నిః ప్రచోదయాత్।।


ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్
పంచమ అధ్యాయః సమాప్తః।।




16–6.     ఛాందోగ్యోపనిషత్ - అధ్యయన వచన పుష్పము - షష్ఠి అధ్యాయము


16–6–1. షష్ఠి అధ్యాయము - ప్రథమ ఖండము - వాచారంభణం వికారో నామధేయం - మృత్తికైవ సత్యం

(1 నుండి 5 అధ్యాయములు - ఉపాసనా విభాగములు) (6 నుండి 8 అధ్యాయములు - జ్ఞానోపదేశము)

వేదము (బ్రాహ్మణము, ఉపనిషత్తుల) ముఖ్యపాఠ్యాంశము
(శాస్త్రముల అంతిమ ఆదేశము)

సమస్త జగత్తు బ్రహ్మమునందే జలంలో తరంగాలవలె ఉదయిస్తోంది. బ్రహ్మమునందే లయిస్తోంది కూడా! కనుక సమస్తము బ్రహ్మమే అయి ఉన్నది.

ఇప్పుడు - ‘‘ఏవిధంగా జగత్తు ఉత్పన్నమౌతోంది? ఏవిధంగా చరిస్తోంది? ఏవిధంగా బ్రహ్మమునందే లయిస్తోంది?’’ అనే ప్రశ్నలకు సమాధానములు 6వ అధ్యాయములో సంభాషించబడుచున్నాయి. ఆత్మయొక్క ‘‘ఏక-అక్షర-అఖండత్వము’’లు నిరూపిస్తూ వివరణలు చెప్పబడుచున్నాయి.

అరుణి మహర్షి కుమారుడు ఉద్దాలక ఆరుణి. ఆయన కుమారుడు శ్వేతకేతు. 12 సంవత్సరాల వయసు గల శ్వేతకేతువును ఒకరోజు ఉద్దాలకుడు తన దగ్గరకు పిలిచారు.

ఉద్దాలకుడు (ఆరుణి) : కుమారా! శ్వేతకేతు! నీవు చతుర్వేదములు అధ్యయనము చేయవలసిన సమయము వచ్చింది. ‘బ్రహ్మచర్యదీక్ష’ తీసుకోవాలి. ‘సద్గురువు’ను ఆశ్రయించాలి. (‘‘నీవు బ్రహ్మమే’’ - అని నిరూపిస్తూ బోధించువారు సద్గురువు).

నాయనా! మన వంశములో అందరూ వేదములు అధ్యయనం చేసి బ్రాహ్మణ నామధేయమునకు అర్హత పొందారు. అంతేగాని జన్మతః బ్రాహ్మణ వంశములో పుట్టి, మన వంశములో వేదములు అధ్యయనము చేయకుండా కేవలము నామకః బ్రాహ్మణులు (బ్రాహ్మణబంధువులు) ఎవ్వరూ లేరు. వేదములు, వేద హృదయము అధ్యయనము చేయకపోతే నీవు ‘బ్రాహ్మణ బంధువు’ అనిపించుకుంటావేగాని, బ్రాహ్మణుడవు కాలేవు. అందుచేత వెనువెంటనే గురుకులము జేరి, సద్గురువును ఆశ్రయించి, వేదములు అధ్యయనము చేసి బ్రాహ్మణ నామధేయమునకు అర్హుడవు అయ్యెదవు గాక।

తండ్రి ఉద్దాలకముని చెప్పినదంతా విని, వెనువెంటనే శ్వేతకేతు గురుకులాశ్రమం చేరారు. 4 వేదములు, యజ్ఞవాఙ్మయము మొదలైనవి 12 సంవత్సరముల కాలము అభ్యాసము చేసారు. విద్య పూర్తి చేసుకొని తోటి విద్యార్థులలో శ్రేష్ఠుడు - అని అనిపించుకున్నారు.
అధ్యయనము పూర్తి అయినట్లుగా గురువులవద్ద వీడ్కోలు సంస్కారము / అనుజ్ఞ పొంది విద్యా గర్వ అభిమానములు కలవాడై తిరిగి ఇంటికి చేరారు.
రోజులు గడుస్తూ ఉన్నాయి.

తండ్రి ఉద్దాలకుడు కుమారుడు శ్వేతకేతు యొక్క ప్రవర్తనను గమనించి - ‘‘నేను 4 వేదములు ఆమూలాగ్రము అధ్యయనము చేసి తెలుసుకున్నాను’’ - అనే అభిమానముతో ప్రవర్తిస్తూ ఉండటం గమనించారు.
‘‘నేను అనేక మందికన్నా వేదవిద్యలో విద్యాధికుడను’’ - అనే అభిమానము చూచి, ఒకరోజు కుమారుని దగ్గరకు పిలిచి ఏకాంతంగా సంభాషించసాగారు.

ఉద్దాలకుడు : కుమారా! శ్వేతకేతూ! నీవు ఈ 12 సంవత్సరముల కాలము శ్రద్ధగా వేదములు అధ్యయనం చేసి విద్యా పారంగతుడవయ్యావా?

శ్వేతకేతు : తండ్రీ! మీరు చెప్పిన విధంగా నేను 4 వేదములు, ఉపాంగములు, మంత్ర తంత్ర జ్యోతిష్య మీమాంస శాస్త్రములు అధ్యయనము చేసి నేర్చుకున్నాను. అస్మత్ గురువులు నా అధ్యయనము తదితర సహ విద్యార్థులకంటే గొప్పగా ఉన్నదని నన్ను అనేకసార్లు మెచ్చుకున్నారు. వీడ్కోలు సభలో కూడా నా విద్యాధిక్యతను ప్రశంసించారు కూడా!

ఉద్దాలకుడు : అవునా? అందుచేతనా, నీలో కించిత్ విద్యా గర్వము, అభిమానములతో కూడిన గాంభీర్యత కనిపిస్తోంది!

శ్వేతకేతువు : ఓహో! అవునా? ఏమో మరి!

ఉద్దాలకుడు : సోమ్యా! నీ ముఖము చూస్తున్నప్పుడు అన్నీ తెలిసిన ‘అనుచానమాని’విగాను ప్రత్యేకతగలవాడిని అనే స్తబ్దత కనిపిస్తోంది. చిన్నతనములోనే విద్యావంతుడవు, అనేకుల కంటే గొప్పవాడివి అయినట్లు భావిస్తున్నావని అనిపిస్తోంది.

శ్వేతకేతు : మరి, గురుకులములో అనేక వేద - వేదాంగ విద్యలు శ్రద్ధగా కష్టపడి చదువుకున్నాను, తండ్రీ!

ఉద్దాలకుడు : చాలా సంతోషము. అయితే శాస్త్రముల అంతిమ ఆదేశము (the Finest Order) ఏమో గ్రహించావు కదా? గురువులను అడిగి అట్టి ‘ఆదేశము’ ఏమో తెలుసుకున్నావా? ఆదేశమ్ అప్రాక్ష్యో?

శ్వేతకేతు : ఆదేశమా? ఏమిటా ఆదేశము?

ఉద్దాలకుడు : ఏమిటా? యేన అశ్రుతగ్ం శ్రుతం భవతి, అమతం మతమ్, అవిజ్ఞాతం విజ్ఞాతమ్ - ఇతి।
ఓ భగవత్ ఆనంద స్వరూపా! ప్రపంచములోని వస్తు విశేషములలో వినిపించేది కాదో, అది విని ఉన్నావా? ఏది అభిప్రాయములలో దొరకనిది (అమతమ్) అని తెలియగలదో, అది తెలుసుకున్నావా? దేనిచేత తెలియనిదంతా కూడా తెలిసినవే అగుచున్నదో, అదియే ఆదేశము. అట్టి సద్గురు - సత్‌శాస్త్ర హృదయమగు ఆదేశము నీవు నేర్చుకున్నావా? ఏది తెలుసుకున్న తరువాత మోహము ఉండదో, ఇంక తెలుసుకోవలసినది ఇంకేమీ శేషించదో - అది గ్రహించావా మరి?

శ్వేతకేతు : కథం ను భగవః స ఆదేశో భవతి ఇతి? భగవాన్! మీరు చెప్పుచున్న విశేషణములతో కూడి వేదహృదయమగు ‘ఆదేశము’ అనగా ఏమిటో నాకు అర్థం అగుటలేదే?

ఉద్దాలకుడు : అయితే కొన్ని దృష్టాంతాల సహాయముతో వేదముల ‘ఆదేశము’ ఏమిటో గుర్తు చేస్తూ చెపుతాను, సోమ్యా (నాయనా)! విను!

యథా సోమ్య! ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణమ్ వికారో నామధేయమ్। మృత్తిక - ఇత్యేవ సత్యమ్।। ఒకచోట మట్టితో తయారైన కుండ, కూజా, మూత, మట్టి బొమ్మ-ఇవన్నీ ఉన్నాయి. ఒకనికి అవన్నీ మట్టితో తయారైనవేనని తెలిసింది. అతడు మట్టి గురించి తెలిసిన తరువాత - కుండ, కూజ, మూత, బొమ్మ మొదలైనవన్నీ ‘వాక్కు’తో కల్పించబడ్డాయని, అవన్నీ నీళ్లల్లో కలిపితే? ‘మట్టి’ గానే అవుతుంది. మట్టియే సత్యమని కుండలు మొదలైనవి సత్యము కాదని తెలుస్తుంది కదా!
యథా సోమ్య! ఏకేన లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతగ్ం స్యాత్ వాచారంభణం। వికారో నామధేయమ్। లోహం - ఇత్యేవ సత్యమ్।। ఒకచోట కొన్ని లోహమణి (బంగారము)తో తయారైన గాజులు, గొలుసు, ఉంగరము, పాపిడిబిళ్ల మొదలైనవి ఉన్నాయి. అంతా బంగారమే అని బంగారము గురించి తెలిసిన తరువాత ఆ ఆభరణములలో ఒక్కొక్కదాని గురించి తెలుసుకోవలసినది ఏముంటుంది? గాజులు, గొలుసు మొదలైనవి వాచారంభణము (మాటల తేడా) యేగాని, ఆకారముల అనేకత్వమేగాని - వాటన్నిటిలో బంగారమే సత్యము - అని (బంగారము గురించి తెలిసినవాడికి) తెలిసిపోతుంది కదా!
యథా సోమ్య! ఏకేన నఖ నికృంతనేన వాచారంభణమ్ వికారో నామధేయమ్। ‘కృష్ణాయసమ్’ - ఇత్యేవ సత్యమ్। లోహము (ఇనుము)తో పార, పలుగు, తీగలు, పాత్రలు మొదలైనవి అనేకం సర్వం కార్‌ష్ణాయసం విజ్ఞాతగ్ం స్వాత్ కనబడవచ్చుగాక। ‘ఇనుము’ గురించి తెలిస్తే అన్నిటి గురించి తెలిసినట్లేగదా! ఆయా పేర్లన్నీ మాటల విశేషమే. లోహమే సత్యము.

సోమ్యా! ప్రియకుమారా! అట్టి సమస్త జీవులకు సంబంధించి ఏది సత్యమో - జీవజాతులు, గుణములు ఏ ‘ఎరుక’ చేత వాచారంభణము (మాటల భేదము మాత్రమే) గాను, వికార విశేషములుగాను తెలియవచ్చి, ‘ఆత్మయే సత్యము’ అగుచున్నదో- అదియే వేద విజ్ఞానము యొక్క ‘‘ఆదేశము’’.

శ్వేతకేతు : తండ్రీ! పూజనీయులగు ఉద్దాలక మహర్షివర్యా! నేను 4 వేదములు క్షుణ్ణంగా నేర్చుకున్నాను. నా గురువులు వద్ద మీరు చెప్పిన ‘వేద - ఆదేశము’ విద్య గురించి నేను నేర్చుకొని ఉండలేదు. మా గురువులు అది ఎరిగి ఉన్నారో లేదో మరి? వారికి అది తెలిసి ఉండి ఉంటే, నాకు తప్పక చెప్పేవారేనేమో! పితృదేవా! వేదశాస్త్రము యొక్క ‘ఆదేశము’ అను మీరు ఉదహరిస్తున్న విషయమై నాకు శాస్త్రీయ విశేషమంతా మీరే నాకు బోధించండి. నేను అధ్యయనుడనై శ్రవణం చేయటానికి శ్రద్ధ-ఆసక్తులతో సంసిద్ధుడను. పితృదేవా! మీకిప్పుడు ఆదేశవిద్యకై అధ్యయన విద్యార్థినై శరణు వేడుచున్నాను. గురు నమస్కారం సమర్పిస్తున్నాను.

అప్పుడు ఉద్దాలక మహర్షి - ‘‘సరే"! నాయనా! అట్లాగే వివరించుకుందాము’’ అని పలికి, ఇక ఈ విధంగా చెప్పసాగారు. అందుకుగాను ఉద్దాలకుడు, శ్వేతకేతు, కొందరు ఉద్దాలక శిష్యులు ఒక ప్రశాంతమైన ప్రదేశముతో సమావేశమైనారు.


16–6–2. షష్ఠి అధ్యాయము - ద్వితీయ ఖండము - సదేవ సోమ్య। ఇదమ్ అగ్రమ్ ఆసీత్। ఏకం ఏవ అద్వితీయం।

సత్ =
(1) ఉనికి. ‘‘నేను ఉన్నాను’’ - అను స్వకీయ స్వాభావిక అనునిత్య అనన్యానుభవము. అదియే ‘అస్తిత్వము’ అని కూడా అనబడుచున్నది.
(2) అట్టి ‘ఉనికి’ చేతనే సమస్తము అనుభవమౌతోంది. నేనే లేకపోతే అనుభవము ఎక్కడుంటుంది?
(3) అనుభవమయ్యే ‘ఉనికి’కే ఉన్నదంతా అనుభవమౌతోంది. అందుచేత సమస్తము ఉనికి (సత్) లోనే ఉన్నది.

ఏవ = నిశ్చయముగా; ‘‘అదియే! అంతే! ఇంకేమి కాదు’’ - అని అనటము.

ఇదమ్ = ‘ఇది’ అను రూపముగా అనుభవమౌతున్న సమస్తము. తెలియబడుచున్నదంతా కూడా ‘చిత్’ అని కూడా అనబడుతోంది. నేను(First person) - నీవు (Second person) - అది/అతడు/ఆమె (Third person)లతో కూడిన జగద్దృశ్యమంతా - ‘ఇదమ్’ యే!

అగ్రమ్ = ముందుగా! మొట్టమొదటగా! ఇది ఉండనప్పుడు కూడా!

ఆసీత్ = ఉన్నది;

బంగారు ఆభరణము అను దానిలో ఆభరణము ఏర్పడటానికి ముందుగా బంగారము ఏర్పడి ఉండి ఉన్నట్లు,
తరంగానికి ముందు జలము ఏర్పడి ఉండి ఉన్నట్లు,
మట్టి బొమ్మకు ముందు ‘మట్టి’ ఉండి ఉన్నట్లు -
= ‘సత్’ యే (ఇచ్చట) ‘‘ఏర్పడి ఉన్నది’’
(సోమ్య! = అధ్యయన సామర్థ్యము కలవాడా! సోమ = పరాక్రమము)

సత్ ఏవ సోమ్య! ఇదమ్ అగ్రమ్ ఆసీత్ - ఏకం ఏవ అద్వితీయమ్।

శ్రవణము, గ్రహించటములలో సామర్థ్యవంతుడా! బిడ్డా। ఈ కనబడే సమస్తమనకు ముందుగా (బంగారు ఆభరణమునకు ముందు బంగారపు లోహము ఉన్న తీరుగా) - సత్ (The Existence, The Presence) ‘ఉండటము’ అనే తత్త్వము మాత్రమే ఉన్నది. అట్టి సత్ (ఉనికి) అద్వితీయమై యున్నది. అనగా దానికి ‘రెండవది’ అంటూ ఏదీ లేదు.
- అట్టి సత్ మాత్రమే ‘అస్తిత్వము’ కలిగి ఉన్నది.

శ్వేతకేతు : మరి ఈ నేను - నీవు - దృశ్యానుభవము - దృశ్యములతో కూడిన ‘జగత్తు’ అనబడేది ఎక్కడి నుండి వచ్చింది?

ఉద్దాలకుడు :

ఈ ఇంద్రియానుభవమై కనిపించేదంతా స్వతఃగా ఉండక, సత్ (అస్తి)కి తరువాతనే ఏర్పడినది.
అందుచేత ఇదంతా మొట్టమొదట అసత్తు (లేనిది)గా ఉండి ఆ తర్వాత సత్‌గా (ఉన్నదానిగా, అస్తిగా) బయల్వెడలుతోంది.

అని కొందరు (జగదీశ్వర) వాదులు చెప్పుచూ ఉన్నారు. అనగా వారి అభిప్రాయము ప్రకారము - ఇదంతా ఒకప్పుడు ‘నాస్తి’లో ఉండి ఆ తరువాత అస్తిగా అగుచున్నదని!

శ్వేతకేతు : అనగా, ఈ జగత్తు ఒకప్పుడు సత్తులో ‘అసత్తు’గా ఉండి, ఎప్పుడో సత్తుగా రూపుదిద్దుకుంటోందనియా?

శ్వేతకేతు : ‘సత్తు’ అనుదానిలో అసత్తు ఎట్లా ఉంటుంది? కుతస్తు ఖలు, సోమ్యా! ఏవగ్ం స్యాత్ ఇతి। ‘ఇతి’ అనే ఈ జగత్తు మొట్టమొదట అసత్తే, సత్తులో ఉన్నదని ఎట్లా అంటాము? కథం అసతః సత్ జాయతే! ఉన్నదానిలో లేనిదానికి ఉనికి ఎక్కడ ఉంటుంది? ఉన్నదానిలో ఉన్నదే ఉంటుంది కదా! కనుక సత్ ఏవ సోమ్య! ఇదమ్ అగ్రం ఆసీత్। అందుచేత ఇదంతా మొదట ‘సత్తు’ (ఉన్నదే) అయి ఉన్నది. ఇదంతా ‘అస్తి’లోనే ఉన్నది.

అయితే…
అట్టి ‘అస్తి’ అనబడు ‘సత్తు’లో ‘ఉనికి-ఇది’ (సత్-జగత్) అనే రెండు ఉన్నాయా? సత్తులో సత్తుయే ఉంటుంది. ‘అస్తి’ (ఉండటము) అనునది ఏకమే అయి ఉంటుంది. అనగా బంగారు ఆభరణములో ఆభరణము అను విభాగము లేని విధంగా, జగత్తుగా ఉన్నది సత్తుయే! ఎందుకంటే -

‘‘సత్ ఏవ అగ్రం ఆసీత్ - ఏకం ఏవ - అద్వితీయమ్।’’

‘బంగారపు ఉంగరము’ అను దానిలో బంగారమే ఉన్నది. ఒక ఆకారమునకు ‘ఉంగరము’ అని అన్నామే కాని, ఉంగరము బంగారములో ఉన్నదనిగాని, బంగారం ఉంగరంగా మారుతోందనిగాని ఏమాత్రము మన ఉద్దేశ్యము కాదు. అట్లాగే ‘సత్’యే వ్యవహారరీత్యా ‘ఇదమ్ జగత్’గా చెప్పబడుతోందేగాని ‘సత్’ మరొకటేదీగా (జగత్తు మొదలైనవిగా) అవటం లేదు. అనగా ఉంగరము అనబడునది బంగారమే అయిఉన్న తీరుగా, ‘జగత్తు’ అనబడేది ‘సత్’ రూపమేగాని సత్ నుండి వేరొకటేదీ అయి ఉండలేదు.

అనగా ‘జగత్’గా మనము ఏది చెప్పుకుంటున్నామో అది సర్వదా ‘సత్’యే గాని మరొకటేదీ కాదు.


ఒకప్పుడు, ఇప్పుడు, మరొకప్పుడు కూడా సర్వదా ‘సత్’యే అస్తి / ఉన్నది. నాటకంలో పాత్రధారుడు పాత్రకు వేరై ఉన్న తీరుగా అది ‘పరము’ (Beyond) అయి అప్రమేయమై ఉన్నది కాబట్టి ‘పరబ్రహ్మము’ అని వేదవాఙ్మయముచే చెప్పబడుతోంది. ‘‘అదియే నీవు’’ అని (నిరూపించే ‘తత్త్వశాస్త్రము’చే) శబ్దీకరించబడుతోంది.

శ్వేతకేతు : సద్గురువర్యా! పితృదేవా! ‘‘బంగారములో ఉంగరము అనబడునది వేరే లేనట్లే సర్వదా సర్వత్రా సత్తు (పరబ్రహ్మము, అస్తి)యే ఉన్నది’’ - అనేది యుక్తియుక్తమే. ఒప్పుకుంటున్నాను. కానీ మాకు ఈ జగత్తు, ఇందులో అనేక భేదవిశేషాలు (జ్ఞాని-అజ్ఞాని, చదువుకున్నవాడు-చదువుకోలేనివాడు, సద్గుణుడు-దుర్గుణుడు మొదలైన) అనేక విశేషాలతో ఈ జగత్తు అనుభవమౌతోంది కదా! అనుభవమగుచూ ఉండటమే కాకుండా, ఇక్కడ మేము సుఖ-దుఃఖములు, బంధము - ఇటువంటివన్నీ పొందుచున్నామే!

ఉద్దాలకుడు : ఓహో! అదా? ఈ జగత్తు సద్రూప పరబ్రహ్మము (లేక) స్వస్వరూపానందరూపమగు ‘ఆత్మ’గా కాకుండా (అనన్యముగా కాకుండా) ‘అన్యము’వలె ఎందుకు అనుభూతమౌతోందో - ఆత్మజ్ఞుల, శాస్త్రముల విశ్లేషణము చెప్పుచున్నాను- విను!

ద్రష్టత్వము అనే ‘తేజస్సు’

మొట్టమొదట, ఇప్పుడు, ఇక ఎప్పటికీ ‘సమస్తము తానే’ అయిన సద్రూపము ‘‘తత్ ఈక్షత బహుస్యాం ప్రజాయేతి।’’ - ఏకముగా ఉన్న నేను ‘అనేకము’ అనే బహుళత్వము కల్పించుకొని ఆస్వాదించెదను గాక।’’ - అని భావించుచున్నది.
‘‘ఏకమగు నేను అనేక ప్రకారములుగా అయ్యెదను గాక। (Let me Diversify myself as many for the pleasure of it)" - అని ఈక్షణము (perception) కల్పించుకొంటున్నది. అప్పుడు కేవలమగు సత్తు (అస్తి) నుండి ‘ద్రష్టత్వము’ అనే తేజోవిభజనము సృష్టించుకోవటం లీలగా, క్రీడగా జరుగుతోంది - తత్ తేజో సృజత।।

తేజస్సు నుండి జలము

తత్ తేజ ఐక్షత బహుస్యాం ప్రజాయేతి। ‘‘అనేకమును సృష్టించుకొని చూద్దాము’’ అనునది ఏకమగు సత్తు నుండి బయల్వెడలుతోంది. అట్టి కల్పనా తేజోభిమాని మొట్టమొదట ‘అపో’ (జలము)ను సృష్టించారు. అందుచేత ఈ జీవుడు ఏకారణంచేతనైనా శోకించినప్పుడు (శోచతి-దుఃఖించినప్పుడు) (లేక) తప్తుడు (Worried) అయినప్పుడు స్వేదము (చెమటలు) పుట్టుకొస్తోంది. పురుషః తేజస ఏవ తదత్ ఆపో జాయన్తే। అ సత్‌స్వరూపుడగు పురుషుని ‘అనుభవి’ అనే తేజస్సే జలమును పుట్టిస్తోంది.

జలము నుండి అన్నము

తేజస్సు జలమును వీక్షించింది కదా! ఆ జలము ‘మేము అనేకముగా అయ్యెదము’ అని తలచింది. (ఈక్షణము - Perceiving చేయసాగింది). ఆ విధంగా అనేక ప్రకారములుగా అయ్యెదననే జలముయొక్క తలంపునుండి ‘‘అన్నము’’ జనిస్తోంది.

అందుచేతనే, ఎక్కడ వర్షము ఎక్కువగా కురుస్తూ ఉంటే అక్కడ పంటలు పండి అన్నము సృజించబడుతోంది.
జలము - అన్నాద్యము (అన్నము ప్రసాదించునది) - అగుచున్నది.


16–6–3. షష్ఠి అధ్యాయము - తృతీయ ఖండము - అగ్ని - జల - అన్న దేవతలు

ఉద్దాలకుడు : బిడ్డా శ్వేతకేతూ! ‘అన్నము’ నుండి ఆ అన్నము తిని జీవించటానికై (జీవనము అనే సంఘటనను ప్రదర్శించటానికి) - ‘జీవులు’ బయల్వెడలుచున్నారు. అట్టి జీవ జాలము (లేక) భూతజాలము మూడు విధములైన ఉత్పత్తి చమత్కారములు ఏర్పడినవి అగుచున్నాయి.

(1) అండజములు : గ్రుడ్డు (అండము) నుండి జనించే పక్షులు, సర్పములు మొదలైనవి.
(2) జరాయుజములు : మానవులు, పశువులు మొదలైనవి.
(3) ఉద్భిజ్జములు : భూమి నుండి పైభాగమువైపుగా మొలుచుకొస్తున్నట్టివి.

ఉద్భిదములు = ఆహార ధాన్యము, పెసలు - మినుగులు వంటి ఆహారములు
స్వేదజములు = చెమట నుండి పుట్టే క్రిములు మొదలైనవి.

ఈ విధంగా సత్ నుండి బయలుదేరిన సంకల్పశక్తి ‘‘నేను జీవాత్మరూపంగా ‘అగ్ని జల అన్నములు’ అనే ముగ్గురు దేవతలుగా (‘3’ దివ్యశక్తుల రూపముగా) ప్రవేశించి అనేకములైన నామరూపాత్మకములుగా ప్రదర్శనమయ్యెదను గాక’’ అని సృష్టి సంకల్పమును ప్రదర్శించుచున్నది, వ్యక్తీకరించుచున్నది.

ఈ విధంగా అనేక శబ్దరూపములగు నామములు, అనేకములగు రూపములు బయల్వెడలసాగాయి. అందుచేత ఈ సృష్టి భావనా మాత్రమే। సమస్త జీవులకు ఏకమగు సత్ పరబ్రహ్మమే అఖండమగు అంతర్యామి. ‘సత్’యే సత్యము. తదితరమైనదంతా భావనాకల్పితము కనుక ‘అసత్’ - అనబడుచున్నది.

తివృత్‌కరణము 3 x 3

అంతేకాకుండా ‘అగ్ని జల అన్నము’లనబడే దేవతలను మూడు - మూడుగా త్రివృత్ కరణము (సత్‌చే) చేయబడుతోంది.
(1) నామము (2) రూపము (3) వ్యావృత్తి (ఆలోచన, స్వభావము) (ఈ నామము గలది. ఈ రూపముగలది. ఈ ధర్మములు(Functions) గలది)-గా ‘త్రివృత్ కరణము’ రూపము దిద్దుకుంటోంది.

ఒక్కొక్క దివ్యతత్త్వము (అగ్ని జల అన్నములను) ఏవిధంగా మూడు - మూడుగా (త్రివృత్‌కరణముగా) అగుచున్నదో కొన్ని విశేషాలు వివరించుకుందాము.


16–6–4. షష్ఠి అధ్యాయము - చతుర్థ ఖండము - త్రివృత్‌కరణమునకు దృష్టాంతములు

అగ్ని - జల - అన్న (భూ) (Heat, Liquid, Solid) కలయికలే ఈ కనబడే సమస్త పదార్థములు. అట్టి ‘త్రివృత్కరణము’ గురించి మనము దృష్టాంతముల ద్వారా వివరించుకుంటున్నాము.

- మూడు పుల్లలను (లేక) రేఖలను ఒకవిధానంగా జేరిస్తే అది త్రిభుజము (Triangle) అగుచున్నది.
ఆ మూడు పుల్లలు తీస్తే? త్రిభుజము ఎక్కడ ఉన్నది? ‘‘మొదలే లేనిది’’ అగుచున్నది.
ఈ జగదనుభవం
→ సత్‌పురుషుడు- తేజోరూపమగు అనుభవి - కల్పనా పురుషకారము ఒకచోట ఏకమైతే ‘జగత్తు’
→ అవి విడివిడిగా తీసి చూస్తే త్రిభుజమువలెనే ‘జగత్తు’ అనబడునదే లేదు.

స్వప్నానుభవము కూడా → సత్‌పురుషుడు - తేజోరూపుడగు స్వప్నద్రష్ట - ఊహ, అపోహలరూపమగు స్వప్నభావన కలిస్తేనే స్వప్నము అనే త్రిభుజమువంటి అనుభవం ఏర్పడి ఉంటుంది. స్వప్నద్రష్ట లేకుంటే స్వప్నము ఎక్కడ ఉంటుంది?

పై ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ దృశ్య వ్యవహారము యొక్క ‘ఆత్మతో అనన్యత్వము’ వివరించుకుంటున్నాము.

దృశ్యము (లేక) జగత్తు స్వతఃగా ఉన్నది కాదని, భావనచే అన్యముగా అనుభవమౌతోందని నిరూపించుకుంటున్నాము.

తేజస్సు-జలతత్త్వము-అన్న (భూ)తత్త్వములను (light, liquid and solid) విడదీస్తే ఆ పదార్థము యొక్క నామ - రూపములు గలిగినదేదీ ఉండదని గమనించబడుతోంది.

‘త్రివృత్కరణము’ - స్వతఃగా లేదు.

అగ్ని :
(1) యత్ అగ్నే రోహితగ్ం రూపం తేజసః

(2) యత్ శుక్లం తత్ రూపం

(3) యత్ కృష్ణం తత్ ‘అన్నం’

(1) అగ్నిలో ఎరుపు తేజస్సు

(2) అగ్నియొక్క తెలుపు జలము

(3) అగ్నిలో నల్లటి రూపం పృథివి (అన్నము)
ఈ మూడు వర్ణములు తొలగిస్తే అగ్నిత్వము వాచారంభణమే! వికార నామధేయమే! ఈ మూడింటిని ఎరిగినవానికి అగ్నిత్వ బుద్ధి తొలగిపోగలదు. తేజో-బల-పృథివియే సత్యము.
ఆదిత్యుడు :
(1) యత్ ఆదిత్యస్య రోహితగ్ం। తేజోః తత్‌రూపం

(2) యత్ శుక్లమ్ తత్ అపామ్

(3) యత్ కృష్ణం తత్ అన్నమ్।

(1) ఆదిత్యుని రోహిత రూపము (ఎరుపు) తేజస్సు

(2) శుక్లరూపము జలము

(3) ఆదిత్యునిలోని నల్లటి ఛాయ అన్నరూపము
తేజోరూపము, జలము, అన్నరూపము విడివిడిగా తీసి వేరేచోట ఉంచితే - అప్పుడు అక్కడ “ఆదిత్యరూపము” ఎక్కడ ఉన్నది? ఆదిత్యుడు (సూర్యుడు) అనునది వికార నామమాత్రమే!
చంద్రుడు :
(1) యత్ చంద్రమసో రోహితం రూపమ్
- తత్ తేజసః

(2) యత్ శుక్లం తత్ అపామ్

(3) యత్ కృష్ణమ్ తత్ అన్నమ్

(1) చంద్రునిలో ఎర్రటి రూపము - ‘తేజస్సు’


(2) తెల్లటి రూపము - జలము

(3) నల్లటి విభాగము - అన్నము
ఈ మూడు విడివిడిగా చేసి చూస్తే అక్కడ “చంద్రుడు” అనేది (గొలుసు అను మాటలాగా) వాచారంభమ్! పేరుకు సంబంధించిన వికారమే!

పైవన్నీ విడివిడిగా (త్రీణిరూపాణి) మాత్రమే సత్యము. ఒకచోటికి తేజస్సు - జలము - అన్నము (Light, Liquid and Solid) వచ్చినప్పుడు మాత్రమే అగ్ని, ఆదిత్య, చంద్రమస నామరూపాత్మక వాచారంభములు, నామధేయ వికారములు చెప్పుకొనబడుచున్నాయి. ఈ జగత్తులో ప్రతి వస్తువు ఇంతే।

విద్యుత్తు (మెఱుపు) :
యత్ విద్యుతో రోహితగ్ం రూపం తేజసఃfn

యత్ శుక్లం సద్రూపం అపాం

యత్ కృష్ణం తత్ అన్నమ్।
మెఱుపులోని ఎరుపు ‘తేజస్సు’కు సంబంధించినది

తెలుపుగా కనిపించేది జలతత్త్వము

ఏది నలుపుయో అది ‘అన్నము’
తేజో-జల-అన్న(భూ) తత్త్వములను విడదీసి ఆవల పెట్టితే అక్కడ “విద్యుత్” అనునదేమీ ఉండదు. అనగా “విద్యుత్” అన్నది వాక్కు కల్పన, మూడిటి కలయిక యొక్క నామ రూపాత్మ వికారమే!

ఈ విధంగా సమస్త వస్తువులలో అగ్ని (తేజో), జల (ద్రవ్య), అన్న (భౌతిక) తత్త్వములను విడదీసి ఆవల పెట్టి చూస్తే - ఈ ప్రపంచంలో కనిపించే బంగారము, ఇనుము, చెట్లు, చేమలు, దేహాలు ఇవన్నీ కూడా వాచారంభణము (మాటవరసకు కల్పించి చెప్పేవి) నామరూప వికారాత్మకము (త్రిభుజమువలెను, పైన చెప్పుకొన్న విశేషములవలెను) అయి ఉన్నాయి.

అందుచేత ఈ జగత్తంతా కూడా కల్పితమాత్రము (వాచారంభణము, వికారో నామధేయము) - అని చెప్పబడుతోంది.

ఎరుపురంగు ‘తేజస్సు’ (Heat) అని, తెలుపు రంగు (Liquid) జలస్వరూపమని, నలుపురంగు అన్నతత్త్వము (Solid) అని, ఈ సమస్త పదార్థములు అగ్ని - జల - భూ కలయికలేనని ఎవరు గ్రహిస్తారో అట్టివారిపట్ల సమస్తమును ‘‘అశ్రుతము (విననది) అమతము (ఏదో వేరైనది), అవిజ్ఞాతము (తెలియనిది)’’ అగు ఏదీ ఈ సమస్త దృశ్యజగత్తులో శేషించి ఉండదు. ఆ మూడు తత్త్వములు తెలిసియున్నవారు సమస్త పదార్థముల మూలము తెలిసియున్నవారే అగుచున్నారు.

ఈ సమస్తము అగ్ని - జల - భూ తత్త్వముల వేరు వేరు పాళ్ల (ratios) కలయికయేనని గ్రహించి సమస్త వస్తుజాలము పట్ల - ఆశ్చర్యము, అలభ్యము, అశ్రవణము మొదలైన భావాలు జయించి వేసి ఉంటారు.


16–6–5. షష్ఠి అధ్యాయము - పంచమ ఖండము - మనస్సు అన్నమయము, ప్రాణము జలమయము, వాక్కు తేజోమయము

శ్వేతకేతు : సద్గురూ! పితృదేవా! సాకారమైన పదార్థములన్నీ అగ్ని (తేజో) - జల (ద్రవ) - అన్న (స్థూల) తత్త్వముల అనేక పాళ్ల (ratios) కలయికయేనని మీరు చెప్పినది, తదితర నామరూపములన్నీ వాచారంభణము అనునది - అత్యంత యుక్తియుక్తమే। తండ్రీ! మరి మనస్సు మాట ఏమిటి? వాక్కు, చూపు శక్తులు ఎట్టివి?

ఉద్దాలకుడు : అన్నమ్ అశితన్ త్రేధా విధీయతే।

జీవులంతా ఆహారము స్వీకరించి మాత్రమే జీవించగలుగుచున్నారు. అట్టి భుజించిన అన్నము దేహములో ప్రవేశించిన తరువాత ‘3’ భాగములుగా అగుచున్నది.

(1) తిన్న (స్థూల) ఆహారము యొక్క (అన్నము యొక్క) :
(i) తస్య యః స్థవిష్ఠో ధాతుః తత్ పురీషం భవతి : అత్యంత స్థూలభాగము ‘మలము’గా అగుచున్నది.
(ii) యో మధ్యమః తత్ మాంసమ్ : మధ్యభాగము దేహములో ‘మాంసము’గా అగుచున్నది.
(iii) యో అణిష్ఠః తత్ మనః - అత్యంత సూక్ష్మభాగము ‘మనస్సు’గాను అగుచున్నది.

(2) అట్లాగే త్రాగబడుచున్న జలము (ద్రవము) యొక్క :
(i) అత్యంత స్థూల భాగము - ‘మూత్రము’ (Urine) గా అగుచున్నది.
(ii) మధ్య భాగము - ‘‘అస్థి’ (బొమికల విభాగము)గా అవుతోంది.
(iii) అత్యంత సూక్ష్మవిభాగము - ‘ప్రాణశక్తి (ఉత్తేజము)’గా అగుచున్నాడు.

(3) ఆహారముగా స్వీకరించబడుచున్న తైలము (Oils) యొక్క :
(i) స్థూల విభాగము - శరీరములో ఎముకల పుష్టిగా వృద్ధి రూపము చెందుతోంది.
(ii) మధ్య విభాగము - ‘మజ్జ’ (ఎముకలలోని మెత్తటి నేయి - Oily) విభాగముగా అవుతోంది.
(iii) అత్యంత సూక్ష్మ విభాగము - ‘వాక్’ ఇంద్రియముగా అవుతోంది.

ఓ సోమ్యా! కుమారా! శ్వేతకేతూ!

ఈ విధంగా మనస్సు అన్నమయము (అన్నమయో మనః), ప్రాణము ఆపో (జల)మయము, వాక్కు తేజోమయము అయి ఉన్నాయని తెలుసుకొనెదవు గాక।

శ్వేతకేతువు : గురుదేవా! తండ్రీ! ప్రాణము జలమయమని, వాక్కు తేజోమయమని మీరు చెప్పినది యుక్తియుక్తమేనని విన్నాను. వేదములలో అనేక చోట్ల ఈ విధంగా స్తుతించబడింది. గురుకులంలో గురువులవద్ద నేర్చాను.

కానీ ‘‘మనస్సు అన్నమయము’’ అనే వాక్యము నేను తగినంతగా సమన్వయించుకోలేకపోతున్నాను. కాబట్టి ఈ విశేషములను ఏవైనా దృష్టాంతములతో బోధించ ప్రార్థన.


16–6–6. షష్ఠి అధ్యాయము - షష్ఠి ఖండము - అన్నిటి యొక్క సూక్ష్మాంశమే ‘మనస్సు’

ఉద్దాలకుడు : నీకు మరింత స్పష్టమవటానికి నీవు అడిగినట్లుగా ఒక దృష్టాంతము తీసుకొని చెపుతాను విను!

పెరుగు (Curd) ను చల్లకవ్వముతో చిలికినప్పుడు (మథించినప్పుడు) ఆ పెఱుగులోని సూక్ష్మ భాగము పైకి తేలి వెన్న అగుచున్నది. ఆ వెన్న కాచినప్పుడు కమ్మటి ‘నేయి’ (Ghee) అగుచున్నది కదా!

సోమ్యా! అదే విధంగా,
ఏవమేవ ఖలు సోమ్య। అన్నస్య అశ్యమానస్య యో అణిమా, స ఊర్ధ్వః సముదీషతి - తత్ మనో భవతి।

అదే విధంగా ఈ జీవునిచే తినబడుచున్న అన్నమునందలి సూక్ష్మాంశము వాయువుతో కూడిన ‘జఠరాగ్ని’ ద్వారా మథించినదై పైకి తేలుచున్నది. ఆ విధంగా తేలుచున్న విభాగమే ‘మనస్సు’నకు పుష్టిని కలిగిస్తోంది.

అట్లాగే, త్రాగబడుచున్న ‘జలము’లోని అణిమా (సూక్ష్మాంశము) పైకి తేలి ప్రాణములో చేరి ప్రాణమును ఉత్తేజపరుస్తోంది.

భుజించబడుచున్న తేజోపదార్థములైనట్టి నేయి, నూనె మొదలైనవాటి యొక్క సూక్ష్మాంశము (సూక్ష్మవిభాగము) పైకి తేలి ‘వాక్కు’ను ప్రత్యుత్సాహముగా పలకటానికి తోడు అగుచున్నది.

అన్నమయం హి మనః।        మనస్సు అన్నమయము
ఆపోమయః ప్రాణః।        ప్రాణము ఆపో(జల)మయము
తేజోమయీ వాక్।        వాక్కు తేజోమయము

శ్వేతకేతు : పితృదేవా! గురువర్యా! భగవాన్। భూయ ఏవ మాం విజ్ఞాపయతు - ఇతి। ఇంకా మరికొంత విస్తరించి చెప్పండి.

ఉద్దాలకుడు : ఇంకా చెప్పాలా? సరే! తథా సోమ్య! ఇతి। అట్లాగే మరికొంత దృష్టాంతంగా కూడా చెప్పుచున్నాను. విను.


16–6–7. షష్ఠి అధ్యాయము - సప్తమ ఖండము - షోడశ కళా మనో పురుష న్యాయము

ఉద్దాలకుడు : శ్వేతకేతూ! ఇంధనము వాహనమునకు చలనము కలిగించు విధంగా, ‘‘తిన్న అన్నము యొక్క సూక్ష్మాంశ మనస్సునందు చేరి, మనస్సుకు శక్తి, సంచారత్వము కలిగిస్తోంది’’. అప్పుడు మనస్సు యొక్క శక్తి ‘16’ విభాగములుగా విభాజ్యమై ఈ పురుషుని (జీవుని) దేహములో పంచేంద్రియములు పనిచేయనారంభిస్తున్నాయి. ఈ జీవుడు అప్పుడు ‘‘ద్రష్ట’’ (చూచువాడు), ‘‘శ్రోత’’ (వినువాడు), ‘‘స్పర్శి’’ (స్పర్శించువాడు), ‘‘మన్త’’ (ఆలోచించువాడు), బోద్ధ(అర్థము చేసుకొనువాడు), ‘‘కర్త’’ (పనిచేయువాడు), ‘‘విజ్ఞాత’’ (తెలుసుకొనువాడు), ‘‘ఆనంది’’ (రమించువాడు) మొదలైన సమస్త క్రియలు చేయ సమర్థుడు అగుచున్నాడు. ‘‘షోడశకళా పురుషుడు’’ అగుచున్నాడు.

అన్నము వలన - శక్తి
శక్తి వలన - మనోబలము
మనోబలముచే - ఇంద్రియ వ్యాపార సమర్థత పొందుచున్నాడు.

అయితే కొందరు ‘ధ్యానము’ చేతనే ఆహారము పొందుచూ ధ్యానాహారులు కూడా అగుచున్నారు. ధ్యానముచే ప్రకృతి నుండి ఆహార రసశక్తి పొందవచ్చును కూడా!
- అన్నము సర్వస్వరూపము
- అన్నము వలననే మానసిక బలము కలుగుతోంది.
- మనస్సు చేతనే సమస్తము ఆస్వాదించబడుతోంది.

శ్వేతకేతు : మీరు చెప్పిన ఈ ‘‘షోడశ కళాపురుషకారము’’ గురించి మరికొంత ప్రయోగాత్మకంగా (Practically) నాపై దయతో నాకు బోధించండి.

ఉద్దాలకారుణి : ఓహో! నీకు ప్రయోగాత్మకంగా ‘షోడశ కళా పురుష న్యాయము’ గురించి వివరించి చెప్పమంటావా! అయితే ఒక పని చేయి. ఈ రోజు నుండి 15 రోజులు ఏమీ తినకుండా ఉపవాసము చేయి. అయితే మంచినీళ్లు మాత్రం త్రాగుతూ ఉండు. 16వ రోజు నా దగ్గరకు రా! జలము త్రాగుతూ ఉంటావు కాబట్టి నీ ప్రాణము నిలచి ఉండగలదు.

శ్వేతకేతు : తండ్రీ! మీరు సూచించినట్లే నిర్వర్తిస్తాను.

శ్వేతకేతువు 15 రోజులు ఏదీ భుజించలేదు. నీరు మాత్రము త్రాగుచూ ఉన్నాడు. 16వ రోజు తండ్రి సమక్షమునకు నీరసముగా వచ్చాడు.

శ్వేతకేతు : నాన్నగారూ! మీరు చెప్పినట్లే 15 రోజులు ఏమీ తినక నీరు మాత్రము త్రాగుతూ గడిపాను. ఇప్పుడు ఏమి చేయమంటారు?

ఉద్దాలకుడు : అయినదా! మంచిది! నీవు గురుకులంలో ఋక్కులు, యజస్సులు, సామములు క్షుణ్ణంగా పఠించి, పారాయణము చేసి ఉన్నావు కదా!

శ్వేతకేతు : అవును ధారాళంగా చదివాను. ఋక్కు సామ యజస్సులు పఠనము చేయగలవాడనే.

ఉద్దాలకుడు : అయితే కొన్ని ఋక్కులు, యజస్సులు, సామములు నాకు పారాయణం చేస్తూ వినిపించు.

శ్వేతకేతు : తండ్రీ! న వై మా ప్రతిభాన్తి భో ఇతి। నాకు అనేవీ జ్ఞాపకము రావటం లేదు. గురువుల దగ్గర నేర్చుకొన్న మంత్రోచ్ఛారణలు తెలిసినా పలకటానికి జ్ఞప్తికి రావటం లేదు, క్షమించండి.

ఉద్దాలకుడు: మండుచున్న అగ్నిలో పుల్లలన్నీ తీసివేస్తే, అప్పటికీ ఉండి ఉన్న చిన్న నిప్పురవ్వలు - మరల కట్టెలు అగ్నిలో ఉంచినా - ఆ కట్టెలను వెలిగించలేదు కదా! అట్లాగే నీ దగ్గర 16 జీవకళలలో ఒక్క ప్రాణకళ మాత్రమే మిగిలి ఉన్నది. అది వాక్కు, వినికిడి, చూపు, గ్రహణము, జ్ఞాపకము, వల్లెవేయగలగటం - మొదలైన వాటిని వెలిగించలేకపోతున్నాయి. కాబట్టి శ్వేతకేతూ! నీవు వెళ్లు, వెళ్ళి అమ్మను అడిగి సుష్టుగా భోజనము చేయి. కొంచము విశ్రాంతి తీసుకొని, ఆ తరువాత సాయంకాలము నా దగ్గరకు రమ్ము.

శ్వేతకేతు తల్లి దగ్గరకు వెళ్లి, సుష్టుగా భోజనం చేసి ఆ సాయంకాలము ప్రశాంత సమయములో మరల తండ్రి వద్దకు వచ్చారు.

శ్వేతకేతు : పిత్రుదేవా! శుభ్రముగా అమ్మచేతి భోజనము చేశాను. ఇప్పుడు చెప్పండి. ఏమి మీ ఆజ్ఞ?

ఉద్దాలకారుణి : కుమారా! ఋగ్వేదములోని ఋక్కుల, యజుర్వేదములోని యజస్సుల, సామవేదములోని సామముల కొన్ని ‘పనసలు’ శ్రవణానందకరంగా వినిపించు.
అప్పుడు శ్వేతకేతు కొన్ని పనసలను అవరోహణ - ఆరోహణ - భావ - రాగయుక్తంగాను, అమోఘంగాను వినిపించారు.

ఉద్దాలకుడు : నీవు గురుకులం నుండి రాగానే చదివిన పనసలకంటే ‘‘అగ్నిమీళే పురోహితే’’ మొదలైన ఋక్కులు, యజుఃసామములు రసవత్తరంగాను, మనోహరంగాను మధురంగా వినిపించావు.

అనేక కట్టెలతో మండుచున్న అగ్ని - ఆ కట్టెలు తొలగించగా కొన్ని నిప్పు కణికలు మాత్రమే మిగిలి ఉండగా, కొన్ని ఎండుగడ్డి పరకలు వేసినప్పుడు ఇతఃపూర్వంకంటే తేజోవంతముగా వెలుగొందుచున్నది కదా!

ఆ రీతిగా నీ స్వరము మరింతగా ఎంతో మాధుర్యము సంతరించుకొన్నది.

అట్లాగే 15 రోజులు ఉపవాసము తరువాత నీ యొక్క 16 కళలలో ఒక్కటి మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పుడు భోజనము చేసిన తరువాత వేదగానములన్నీ జ్ఞాపకమునకు వచ్చి, సుమధురంగా పాడావు. నీ యొక్క మనస్సు ఎంతో ఉత్సాహము పుంజుకున్నది.

కాబట్టి :
- మనస్సు అన్నమయము।
- ప్రాణము జలమయము।
- వాక్కు తేజోమయము।

అని ప్రయోగాత్మకంగా (Practically) నిరూపించబడుతోంది.

తద్ధాస్య (తత్ హ అస్య) విజజ్ఞావితి। విజజ్ఞావితి।

శ్వేతకేతువు తన తండ్రి ఉద్దాలకుడు వద్ద తివృత్ - కరణ విద్యా విశేషములు తెలుసుకున్నారు. వివరముగా, సుస్పష్టముగా తెలుసుకున్నారు.


16–6–8. షష్ఠి అధ్యాయము - అష్టమ ఖండము - సుషిప్తి సమయములో జీవుని స్థితి ఎట్టిది?

శ్వేతకేతు : తండ్రీ! జాగ్రత్‌లో మనము ఈ ఇంద్రియ విషయ జగత్తును మనస్సు ద్వారా అనుభవిస్తూ ఉన్నాము. ఇక నిద్రపోయిన తరువాత స్వప్నము (Dream)ను పొందుచున్నాము. అట్టి స్వప్నస్థితి (వేదాంత విద్యానుసారము) ఎట్టిది? ఎట్లా ఏర్పడుతోంది? మెలకువవచ్చి ‘జాగ్రత్’లో ప్రవేశించగా, కల (స్వప్న) యొక్క దృశ్య వ్యవహారమంతా ఏమౌతోంది? దయచేసి ఈ విషయాలు నాకు బోధించవలసినదిగా నా అభ్యర్థన.

ఉద్దాలకుడు : స్వప్నాన్తం, సోమ్య! మే విజానీ హి - ఇతి। స్వప్నాంతము (కలయొక్క తత్త్వము, స్వరూపము) గురించి నీవు కోరినట్లు వివరిస్తాను.

ఈ జీవుడు ‘జాగ్రత్’లో ప్రాణశక్తి ఉపయోగిస్తూ పంచేంద్రియముల ద్వారా శబ్ద స్పర్శ రూప రస గంధ విషయములను బాహ్యమున అనుభవముగా పొందుచున్నాడు. మనస్సుతో వాటి అర్థ-అపార్థములన్నీ ఆపాదించుచూ అనుభవ పరంపరలుగా పొందుచున్నాడు. కొంత సమయమైన తరువాత ‘‘ఇక వీటితో చాలు. కొంతసేపు విరామమును ఆశ్రయిస్తాను’’ అని నిర్ణయించుకుంటున్నాడు.

అప్పుడిక మనస్సును ఇంద్రియ విషయములనుండి ఇంద్రియములనుండి వెనుకకు మరల్చుచున్నాడు. క్రమంగా బాహ్యమునకు వెళ్లియున్న మనో విభాగమును కేవల రూపమగు మనస్సునందు ఏకము చేసి ఉంటున్నాడు. అప్పుడు ఈ ఈ విశేషములు ఏర్పడుచున్నవగుచున్నాయి.

(1) దృశ్యము నుండి విరమించటము
మనస్సు భౌతికమగు ఇంద్రియములను, వాటి సూక్ష్మ బాహ్యశక్తులగు - చూడటము, వినటము, స్పర్శించటము, మాట్లాడటము, రుచిచూడటము, వాసనానుభవము - ఇవన్నీ పూర్తిగా వదలినదై ఉంటోంది.

ఈ విరామం పొందటం ఎటువంటిదంటే

- ధ్యాయతీవ లేలాయతి ఇవ స ధీః స్వప్నో భూత్వ ఇమం లోకమ్ అతిక్రామతి। ధ్యానము చేస్తున్నవాడు ప్రాపంచక విశేషములనుండి ఈవలకు రావటము వంటిది. ఇంద్రియ - ఇంద్రియ విషయములను నుండి ధ్యాసను ఈవలకు తేవటము వంటిది (వాజనేయ శ్రుతి)

- ఒకడు ఉద్యోగరీత్యా అనేక వ్యాపకములలో మునిగి ఉంటూ, సాయంత్రము అవన్నీ అక్కడే వదలి, ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులతో ఒకడై వ్యవహరించటము ఎట్లా జరుగుతోందో - ఈ జీవుడు ఇంద్రియ విషయములను బయటనే వదలి, తన ప్రాణశక్తితో సామీప్యము పొందటము అట్టిది. ప్రాణాన్నేవ ప్రాణో నామ భవతి। ప్రాణము ఇంద్రియములను వదలి ప్రాణముతో ఏకమై ఉండు స్థితి!

- ఒకడు వాహనమును అనేక జాగరూకతలతో నడుపుచూ, ఇంటికి వచ్చిన తరువాత ఆ జాగరూకతతో కూడిన నడిపించటము (Driving) ను విరమించి ఆ ధ్యాసలను (Avocations) తన యొక్క వాహనము నడుపు కళ (Art of Driving) యందు విరమింపజేయడము వంటిది.

(2) స్వస్వరూప సామీప్యత
యత్ర ఏతత్ పురుషః స్వపితి నామ - ఇప్పుడు అట్టి జగద్దృశ్యము నుండి విరమించిన తరువాత తనయొక్క సామీప్యతను తాను పొందటము జరుగుతోంది. అనగా స్వకీయ తేజో రూపమగు ఆత్మతో తాను తిరిగి సామీప్యము పొందటము. సతా తదా సంపన్నో భవతి। సద్రూపమగు ఆత్మతో ‘లయము’ పొందుచున్నాడు. అందుచేత ‘స్వప్నము’ అనుదానిని ‘స్వం + అపీతో’ = ‘స్వమపీతో’ ఇతి భవతి। - అంటున్నారు. తనయందు తానై తాను ఉంటున్నాడు.

తస్మాత్ ఏనగ్ం ‘స్వపితి’ ఆచక్షతే। తనను తానే ఆస్వాదిస్తూ ఉన్నాడు - అని చెప్పుకోబడుచున్నాడు. (స్వగ్ం అపీతో భవతి।)

(3) స్వప్నానుభవము
ఇంతకుముందు ఇంద్రియములతో శ్రమిస్తూ వస్తున్న మనస్సు, అద్దాని నుండి విరామము పొంది తనయందు తానే విరమించటం ప్రారంభిస్తోంది.

స్వప్నాన్తమ్ స్వప్నమధ్యమ్ ‘స్వప్న’ ఇతి దర్శన వృత్తేః ‘స్వప్న’స్య ఆఖ్యా।
దేనియందైతే వాసనా రూపమగు విషయములు జీవునిచే కల్పించబడి, అనుభవించబడుచున్నాయో - అట్టి అంతర్వృత్తి మనో అనుభవమే ‘స్వప్న’గా చెప్పబడుతోంది.

‘స్వ’ (తనను తాను) ఆప్నోతి (అట్లు పొందుచున్నాడు) ఇతి స్వప్నః।

అయితే స్వప్నము చివరివరకు ఈ జీవుడు దృశ్యానుభవములాగానే (1) బాహ్య వస్తురహితంగా కానీ (2) బాహ్య వస్తువులు ఉన్నట్లుగానే ఊహించి కానీ సుఖదుఃఖములు అనుభవముగా పొందుచున్నాడు.

జాగ్రత్‌లో ‘స్వప్నము అసత్యము’ అని అనుకుంటున్న తీరుగానే, స్వప్నానుభవ సందర్భములో ‘జాగ్రత్ అసత్యము’ అను భావము తనయందు కలిగినవాడై ఉంటున్నాడు.

(4) స్వప్నములో సంచారములు
స్వప్నములో ఏవేవో ప్రదేశములలో ఏవేవో సంఘటనలు కల్పించుకొని తనకు బాహ్యముగా ఉన్నట్లు అనుభవము పొందుచున్నాడు. కాని ‘ప్రాణము’ అనే కట్టుకొయ్యకు ‘దృశ్యమననము’ అనే త్రాడుతో కట్టబడియే ఉంటున్నాడు.

స యథా శకునిః సూత్రేణ ప్రబద్ధో దిశమ్ దిశమ్ పతిత్వా - త్రాడుతో కాలు కట్టబడిన పక్షివలె పది దిక్కులవైపుగా ఎగురుచూ అక్కడక్కడే తిరుగుచున్నాడు. అన్యత్ర ఆయతనమ్ అలబ్ద్వా, బంధనమేవ ఉపశ్రయత। బయటకు వెళ్ళటం చేతకాక ప్రాణ-బంధనము కలిగి ఉంటున్నాడు. మనో దిశం దిశం పతిత్వా అన్యత్ర ఆయతనమ్ అలబ్ద్వా ప్రాణమేవ ఉపశ్రయతే। మనస్సు అన్ని దిక్కులా తిరిగి తిరిగి కాలు త్రాడుతో కట్టుకొయ్యకు కట్టబడిన పక్షివలె ఎటూ వెళ్ళలేక తిరిగి ప్రాణమునే ఆశ్రయించుచూ ఉంటోంది. మనస్సు ప్రాణరూపంగా బంధనము కలిగి ఉంటోంది. ఇదియే స్వప్నానుభవము.

ఈ విధంగా ఉద్దాలకమహర్షి ‘స్వపితి’ (స్వ-అపితి) నామము యొక్క విశ్లేషణచే ‘జీవునియొక్క సత్ స్వరూపమే జగత్తునకు మూలము. (The Experience of the World has its roots in one’s own self)’ అను ఉపనిషత్ సత్యవాక్కును స్వానుభవంగా ఏర్పరచి శ్వేతకేతుకు సుస్పష్టపరచారు.

ఆకలి దప్పికల తత్త్వము

శ్వేతకేతు : స్వామీ! చాలా సంతోషము. ఇప్పుడిక ఈ జీవుడు దేహమువలన పొందుచున్న ‘అశన-పిపాసల (ఆకలి-దాహముల)’ స్వరూప-స్వభావ తత్త్వముల గురించి వినగోరుచున్నాను. దయతో వివరించండి.

ఉద్దాలకుడు : సరే! ‘‘అశన-పిసాసలు’’ అనబడే ఆకలి - దప్పికల స్వరూపముల గురించి వివరించుకుందాము.

ఈ జీవునిలో ప్రాణశక్తి జ్వలిస్తూ ఉంటుంది. కట్టెలు తరుగుతూ ఉంటే అగ్ని తగ్గువిధంగా ప్రాణశక్తి ఆహారము తగ్గినప్పుడు బలహీనపడసాగుతుంది. అప్పుడు అగ్నికి ఇంధనమువలె ఆహారమును దేహమునకు సమార్చు అవసరము, అగత్యము ఏర్పడుతోంది.

అప్పుడు ఈ జీవుడు ‘అశిషతి’ (అన్నము ఆకలి తీరటానికై కోరుకొనువాడు) అగుచున్నాడు. ప్రకృతిచే ప్రసాదించబడుచున్న అన్నము (ఆహారము) తినుచున్నాడు. నీరు త్రాగుచున్నాడు. ఆ విధంగా తినిన అన్నమును జలము వ్యవస్థాబద్దంగా (In a Very Systematic Way) ప్రాణశక్తిచే శరీరములలోని అన్ని భాగములకు తీసుకొనిపోతోంది.

అదేవిధంగా జలము ఆహారమును శరీరమంతా తీసుకొనిపోతుంది. కాబట్టి ‘అశనాయ’ అని పిలుస్తున్నారు. విత్తనమునకు నీరు లేకుండా ‘వేరు’కు ‘అంకురము’ రాదు కదా! అదేవిధంగా ఈ దేహము జలవృద్ధి చేతనే ఉత్సాహ సృజనాత్మకములు పొందుతోంది.

✤ అన్నమునకు మూలము (వేరు) - జలము
✤ జలమునకు మూలము (వేరు) - తేజస్సు
✤ తేజస్సునకు మూలము (వేరు) - సత్ (ఉనికి / Existence)

ఈ జీవులంతా సత్ స్వరూపులే! ఈ సమస్తము ‘సత్’ పైనే ఆధారపడినదై ఉన్నది.

మనము పైన చెప్పుకొనియున్న గోనాయ, అశ్వనాయ, పురుషనాయ వలెనే తేజస్సుకు జలమును అందించు దానిని ‘ఉదన్య’ అంటారు. తేజస్సుకు మూలము జలము. మూలము లేకుండా ఏదీ ఉండజాలదు కదా! జలముచేతనే దేహ మనోబుద్ధులు తేజోవంతమగుచున్నాయి.

జలమే ఈ దేహముయొక్క మూలము.

ఇమాః సర్వాః ప్రజాః సదాయతనాః సత్ ప్రతిష్ఠా।
సత్తయే సర్వ జీవులకు ఆశ్రయము. సర్వులు సత్ - స్వరూపులే। సమస్తము ‘సత్’ నందే ప్రతిష్ఠమైయున్నది.

ఓ శ్వేతకేతూ! ఈ విధంగా ఈ జీవునియందు ‘తేజ-జల-అన్నము’ అనబడే ముగ్గురు దేవతల ‘త్రివృత్‌కరణము’ ఈ పాంచభౌతిక జగత్తుగాను, అంతరంగ చమత్కారముగాను నిర్మితమవటము గురించి చెప్పుకున్నాము. ‘ఒక్కొక్కటి’ మూడు మూడుగా అవటం గురించి కూడా మనము చెప్పుకొని ఉన్నాము. ఇంకేమీ తెలుసుకోవాలనుకుంటున్నావు?

మరణము - త్రివృత్‌కరణము

శ్వేతకేతు : తండ్రీ! ఈ జీవుడు మరణించునప్పుడు ఏది ఏ తీరుగా అవుతోంది?

ఉద్దాలకుడు : సోమ్యా!

పురుషస్య ప్రయతో వాక్ → మనసి సంపద్యతి - ఈ జీవుడు దేహమును త్యజించినప్పుడు వాక్కు మనస్సునందు లయమౌతోంది.
మనః → ప్రాణే। - మనస్సు ‘ప్రాణము’నందు లయము పొందుతోంది.
ప్రాణః → తేజసి । - ప్రాణము తేజస్సునందు లయమౌతోంది.
తేజః → పరస్యాం దేవతాయాం। - తేజస్సు పరదేవత (పరస్వరూపము, పరమాత్మ) యందు లయము అవుతోంది।

అట్టి అణిమ (సూక్ష్మాతిసూక్ష్మము) అగు పరదేవతా స్వరూపమే పరబ్రహ్మ స్వరూపము. అదియే సత్యము (తదితరమైనదంతా కల్పనా చమత్కారము మాత్రమే)। అదియే ఆత్మ. శ్వేతకేతో! తత్ త్వమ్ అసి। అట్టి ఆత్మయే నీవై ఉన్నావు’’.


16–6–9. షష్ఠి అధ్యాయము - నవమ ఖండము - ఈ జీవుడు ఉపాధిగా భావన చేసినప్పటికి సత్స్వరూపుడే।

శ్వేతకేతు : తండ్రీ! ఈ జీవులంతా కూడా స్వతఃగానే (By one’s own self) - నిర్మలము, స్వాతంత్ర్యము, సర్వమునకు అతీతము, నిత్యము అగు ‘సత్’ స్వరూపులే అయి ఉన్నారు కదా! మరి మేము ఇంద్రియ విషయపరంపరల, ‘దేహముల రాక-పోకల’ ప్రహసనములలో చిక్కుకున్నాము। బద్ధులము! మోక్షము మాకు సుదూరంగా ఎప్పటికో, ఎన్నటికో, ఎంతో ప్రయత్నం చేసి పొందాలి - అని మాత్రమే అత్యధికులు తలచుచున్నారు - ఎందుచేత?

ఉద్దాలకారుణి : సోమ్యా! తేనెటీగలు (మధుకృతములు) తేనెపట్టునుండి బయలుదేరి, ఎకడెక్కడో ఏవేవో అనేక పుష్పములపై వ్రాలి, పుష్పములోని రసమును తెచ్చి తేనెపట్టులో నింపుతాయి. అట్టి తేనెలోని ఒక బిందువు (Drop of Honey)ని ‘‘ఏవమ్మా! తేనెచుక్కా! నీవు ఏ పుష్పమునకు చెందినదానవై ఉండగా తేనెటీగలచే పీల్చబడి ఇక్కడకు తేబడ్డావు?’’ అని అడిగితే ఆ తేనె బిందువు ఏమాత్రము చెప్పలేదు కదా! అట్లాగే సమస్త జీవులు సత్తులో లీనమైయుండి, సత్‌స్వరూపులే అయి ఉండి కూడా, ‘‘మేము సత్‌స్వరూపులమే। సత్‌యే మా స్వభావము’’ - అనేది గమనించలేకపోవుచున్నారు. ఏవ ఖలు ఇమాః సర్వాః ప్రజాః ‘సత్’ సంపద్య, న విదుః సతి సంపద్యామ్ అహమ్ - ఇతి।

ఈ జీవుడు ‘‘నేను సత్ (కేవలమగు ఉనికి) స్వరూపుడనే’’ అని అనుకోవటము లేదు. ‘‘నేను పులిని, సింహమును, తోడేలు. వరాహము (పంది)ని। కీటకమును, మానవుడను’’ - అని ఏదేది అనుకుంటే ఈ సత్తు (సంత్యసంకల్పుడు కాబట్టి) - ఆ రూపమే తానని (కలలో జరుగు తీరుగా) అనుకొనుచున్నారు. ఉన్న సత్యము ఏమిటంటే…,

పరమాత్మయే సమస్త జీవులలోని ప్రతి ఒక్కరి యొక్క సహజమగు సత్యస్వరూపము. అదియే ‘ఆత్మ’ అనబడుచున్నది.
ఓ శ్వేతకేతూ! తత్త్వమసి। అట్టి ఆత్మయే నీవై ఉన్నావు.


16–6–10. షష్ఠి అధ్యాయము - దశమ ఖండము - నది సముద్ర ప్రవేశ దృష్టాంతము

శ్వేతకేతు : భగవాన్! భూయ ఏవ మా విజ్ఞాపయతు। తత్ ఆత్మ! తత్ త్వమసి అను పరమ సత్యమగు మహావాక్యము యొక్క మా స్వానుభవము కొరకై మరికొంత సవివరణ, దృష్టాంతముల పూర్వకంగా మరల వివరించ ప్రార్థన.

ఉద్దాలకుడు : ‘సత్-తత్త్వమసి’ గురించిన విశేషమును మరొక దృష్టాంతముతో చెప్పుచున్నాను. విను.

- - -

సముద్రములో యండ వేడిమికి నీరు ఆవిరి అయి మేఘములుగా కొండలపైన, కోనలపైన వర్షిస్తున్నది. ఆ జలము కొండలనుండి జాలువారి నదీ ప్రవాహములుగా అగుచున్నాయి. నదులలో కొన్ని తూర్పుదిక్కుగా ప్రవహిస్తున్నాయి. మరికొన్ని పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తున్నాయి. ‘‘నదీనాం సాగరో గతిః’’ అను సూత్రముగా నదీ జలములన్నీ సముద్రజలమును చేరుచున్నాయి. సముద్రములో జేరిన తరువాత సమస్త నదీజలములు సముద్ర జలరూపమే అవుతాయి. అంతేగాని - జలబిందువులకు ‘‘నేను గంగానదీ జలమును. నేను సింధూనదీ జలము. నేను యమునా నదికి చెందిన జలమును’’ అన్న భేదముంటుందా?

మనము సముద్రములోని ఒక బిందెడు జలమును తీసుకొని ‘‘నీవు ఎప్పుడు ఆవిరి అయినావు? ఎప్పుడు వర్షించావు? ఏ నదిలో వర్షించావు? తూర్పు-పడమరలలో ఏ దిక్కు నుండి ప్రవహించి సముద్రములో కలిసావు?’’….అని ప్రశ్నిస్తే ఆ బిందెలోని సముద్రజలము సమాధానము చెప్పగలదా? లేదు.

అదే విధంగా - ఏవమేవ ఖలు, సోమ్యా! ఇమాః ప్రజాః ‘సత’ ఆగమ్య, న విదుః - సత్ ఆగచ్ఛామి అహమ్। ఈ జీవులంతా ‘సత్త’ నుండి బయల్వెడలి సత్తులోనే పునఃఏకమగుచు, సత్‌స్వరూపులే అయి ఉండి కూడా తమ యొక్క సత్స్వరూపమును ఆస్వాదించటము లేదు. ‘సత్‌భావన’ను కలలో లాగా ఏమరచి దేహభావమును ఆశ్రయించి ‘‘నేను పులిని। సింహమును। పందిని। కీటకమును। దోమను, మానవుడను। దేవతను’’ అను శరీర భావమును మాత్రమే కలిగి ఉంటున్నాడు.

ఏదైతే అణిమ (సూక్ష్మము) అయి ఉన్నదో - అత్మయే ఇదంతా। అదియే సత్యము। అదియే ఆత్మ। ఓ శ్వేతకేతూ! అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు। ఆత్మ నీవై ఉన్నది।


16–6–11. షష్ఠి అధ్యాయము - ఏకాదశ అధ్యాయము - వృక్షాభిమాన జీవ దృష్టాంతము

ఉద్దాలకుడు : ఇప్పుడు మనము వృక్షము - ఆ వృక్షమును తన శరీరముగా భావించు ‘వృక్షాభిమానజీవుడు’ గురించి చెప్పుకుందాము.

ఒక మహావృక్షము యొక్క (రావిచెట్టువంటిదాని యొక్క) మూలమును నరికామనుకో ఆ వృక్షము మరల చిగురిస్తుంది. రసము ద్రవిస్తూనే ఉంటుంది కాని చావదు. అట్లాగే కొమ్మలు నరకటం జరిగిందనుకో, అప్పుడు కూడా రసము ద్రవిస్తూ ఉండవచ్చు గాక. అంతే గాని, చావదు. చెట్టుయొక్క అగ్రభాగం కత్తిరించినా కూడా ఆ చెట్టు స్రవిస్తూ జీవిస్తూనే ఉంటుంది. కాని ఆ మహావృక్షము మొదలంట్లా పెరికి ప్రక్కకు పడేస్తేమాత్రం ఆ వృక్ష జీవుడు ఆ వృక్షమును త్యజించి వెళ్ళిపోతాడు. అందుచేత ఆ మహావృక్షము ఎండిపోతుంది.

- ఆ వృక్షముయొక్క ఒక శాఖ (Branch)ని ఖండిస్తే ఆ శాఖ ఎండిపోతుంది.
- రెండవ శాఖను ఖండించి ఆవల పారవేస్తే అది కూడా ఎండిపోతుంది.
- మూడవ శాఖను ఖండిస్తే - ఆ శాఖ ఎండిపోతుంది.
- మొత్తము వృక్షమును ఖండిస్తే మొత్తము మహావృక్షము ఎండిపోగలదు.
అట్లాగే
- ఈ జీవుడు దేహమును త్యజిస్తే అప్పటివరకు జీవిస్తూ ఉన్న శరీరము మాత్రమే మరణిస్తుంది.
- దేహి (లేక) జీవుడు మరణించడు.

అందుచేత ఎప్పుడైతే ఈ జీవుడు ‘జీవితము ముగించబడితే నేను ముగుస్తాను (I will end with the Body) - అనే బుద్ధిని త్యజిస్తే అప్పుడు ఈ జీవుడు ‘దేహి’గా (లేక) ‘జీవుడు’గా నాకు శరీరముతో ప్రారంభ-ముగింపులు లేవు’’ - అని గ్రహించి అమృతత్వము సిద్ధించుకోగలడు.

కనుక ఓ చిరంజీవా! శ్వేతకేతూ! నీవు దేహముతో ప్రారంభమయ్యేవాడివి కావు, దేహము నశిస్తే నీవు నశించవు. (దేహే జాతే న జాతోసి। దేహే నష్టే న నశ్యసి - యోగవాసిష్ఠము). నీవు ‘దేహి’గా ‘నిర్దోషము, సర్వాతీతము సూక్ష్మాతిసూక్ష్మము’ (అణిమ)’’ అగు ఆత్మవే।

ఓ శ్వేతకేతూ! తత్త్వమసి। ఏది కాలబద్ధము, దేహబద్ధము, దృశ్యబద్ధము, గుణబద్ధము కాదో - అట్టి తత్ స్వరూపుడవే అయి ఉన్నావు. నీవు ఆత్మవే అయి ఉన్నావు.

శ్వేతకేతువు : పితృదేవా! నేను ఇంకా కూడా నా సహజస్వరూపమగు ‘ఆత్మ’ గురించి మీవద్ద మరికొంత శ్రవణం చేయాలని అభిలషిస్తూ ఉన్నాను. అందుకని నా సంశయములు మీ ముందు ఉంచటానికి అనుజ్ఞ ఇవ్వండి.


16–6–12. షష్ఠి అధ్యాయము - ద్వాదశ ఖండము - నిర్విషయాకాశము (శూన్యము) నుండి సవిషయ జగత్తు

శ్వేతకేతు : ‘‘అదియే నేనై ఉన్నాను (సో-హమ్)’’ అని మీరు సిద్ధాంతీకరించి చెప్పుచున్న ఆత్మతత్త్వ నిర్వచనమునకు కృతజ్ఞుడను. అయితే నాదొక సంశయము.

మాకు సుస్పష్టముగా ఘనీభూతమై అనుభవమగుచున్న ఈ దృశ్యజగత్తుకు ఉత్పత్తి స్థానము ఏది? ఎట్లు ఏర్పడినదై ఉంటోంది? ఎందులో ఇదంతా ఉన్నది?

ఉద్దాలకుడు : ఇదంతా ఆత్మయందే ఆత్మకు అనన్యమై వెలయుచున్నది. నీవు చూస్తున్నదంతా - నీవు నీ ఆత్మనే ఈ రీతిగా చూస్తున్నావు.

శ్వేతకేతు : ‘‘నిర్విశేషమగు ఆత్మనుండి సవిశేషమగు ఈ జగత్తు ప్రదర్శనమౌతోంది’’ - అనునది నాకు మరికొంత దృష్టాంత పూర్వకంగా దయచేసి చెప్పండి. ‘శూన్యము’ నుండి వస్తుజాలమంతా పుట్టుకొస్తోంది - అనునది ఎట్లా అర్థం చేసుకోవాలి?

ఉద్దాలకుడు : అవును. ఆత్మ శూన్యమే। అయితే, పూర్ణము కూడా! ఆ రెండు పరస్పర వ్యతిరేక శబ్దములు ఒకదానికొకటి యుక్తియుక్తమే అగుచున్నాయి కూడా! అట్లా అనేక దృష్టాంతాల సహాయముతో తత్త్వశాస్త్రము చెప్పుకొస్తూనే ఉన్నది.

ఒక నవలా రచయిత వ్రాసిన నవలలోని పాత్రలు, సంఘటనలు మొదలైనవన్నీ రచయిత నుండి వచ్చినవే! రచయిత పాత్రలచే ‘పూర్ణుడు’.
కానీ రచయితలో వెతికి చూస్తే - ఆ పాత్రలు లేవు. సంఘటనలు ఉండవు. కనుక, కథా విషయాల దృష్ట్యా ‘శూన్యుడు’ కూడా।

బంగారపు ఆభరణములో ఆభరణముగా (లేక) ఆకారముగా కనిపించేదంతా బంగారమే। కనుక ఆభరణమంతా బంగారముచే ‘పూర్ణము’.
కానీ బంగారమునకు ‘ఇది’ అనబడే ఆకారమేదీ ఉండదు. కనుక ఆకారము దృష్ట్యా బంగారము ఎల్లప్పుడు నిరాకరమే. కాబట్టి, ‘శూన్యము’ (నిరాకారము).

ఈ జీవుడు స్వతఃగా పరమాత్మ స్వరూపుడే కాబట్టి, ‘పూర్ణుడే’ .
కాని జీవుడు కాల - దేశ - సందర్భ పరిమితుడు. తనకు చెందినదేదీ వాస్తవానికి దృశ్యమునుండి / దృశ్యమునందు లేనివాడు కనుక, శూన్యుడే।

ఈ విధంగా ఈ జగత్తంతా కూడా ఆత్మకు అనన్యము కాబట్టి, ఆత్మ పూర్ణము! ఈ జగత్తు పూర్ణమే। ఎందుకంటే ఇది ఆత్మకు వేరు కాదు కాబట్టి.

కానీ, ఈ జగత్తు మనో కల్పన - స్వప్న సదృశము - స్వతఃగా లేనిది - స్వకీయ భావనను అనుసరించే అనుభవమగుచున్నట్టిది కాబట్టి - వ్యవహారరీత్యా కనబడుచున్నప్పటికీ - వాస్తవానికి శూన్యమే।

శ్వేతకేతు : తండ్రీ! ‘‘పరమాత్మ పూర్ణుడు - శూన్యుడు కూడా। ఈ జగత్తు పూర్ణము - శూన్యము కూడా! ఈ జీవుడు పూర్ణుడు - శూన్యుడు కూడా! నేను పూర్ణుడను - శూన్యుడను కూడా’’ - అని నాకు మీ నుండి వినబడే మహత్తర సిద్ధాంతము నాకు అంగీకారమే అగుచున్నప్పటికీ నేను ఇంకా నిస్సందేహుడను (One who is doubtless) అవలేకపోతున్నాను. ఏదైనా ప్రయోగాత్మకమైన విధానంగా (As a Practically shown methodology) నాకు బోధించండి.

ఉద్దాలకుడు : ఓ“! అట్లాగా, ప్రయోగాత్మకంగా చెప్పాలా? సరే”! మంచిది. నీవు ఒక పని చేయి. చూడు! అక్కడ అంత దూరంగా మఱ్ఱివృక్షము (వటవృక్షము) కనిపిస్తోంది కదా!

శ్వేతకేతు : అవును తండ్రీ! అక్కడ పెద్ద మఱ్ఱివృక్షము ఉన్నది. ఉన్నమాట నిజమే కదా!

ఉద్దాలకుడు : అక్కడికి వెళ్లి ఒక మఱ్ఱి పండును పట్టుకురా. న్యగ్రోధఫలం అత ఆహరేతి। (వెంటనే శ్వేతకేతువు వెళ్లి ఒక మఱ్ఱి పండు (న్యగ్రోధ ఫలము) తెచ్చారు).

శ్వేతకేతు : భగవ ఇతి। భగవాన్। మీరు ఆజ్ఞాపించినట్లు ఈ మఱ్ఱిపండును తెచ్చాను. ఎదురుగా ఇక్కడ పెట్టుచున్నాను.

ఉద్దాలకుడు : మంచిది! ఇప్పుడు ఈ మఱ్ఱి పండును పైపెచ్చు చీల్చి తొలగించు. భింధీతి।

శ్వేతకేతు : సద్గురూ! మీరు చెప్పినట్లే చీల్చాను. భిన్నం భగవ।

ఉద్దాలకుడు : ఏమి కనిపించింది? కిం అత్ర పశ్యసి?

శ్వేతకేతు : అణుః। అణు ప్రమాణమైన చిన్న చిన్న బీజములు కనిపిస్తున్నాయి.

ఉద్దాలకుడు : సరే। ఆ అణు ప్రమాణగింజను కూడా పగలగొట్టు. సామ్ అంగైకాం భిధీతి।

శ్వేతకేతు : భిన్నా భగవాన్ ఇతి। అట్టి సూక్ష్మమైన గింజను కూడా పగలగొట్టాను.

ఉద్దాలకుడు : ఆ మఱ్ఱి పండులో కనిపించిన చిన్న గింజ (విత్తు)ను పగలగొట్టితే నీకు ఇంకా ఏమి కనిపించింది? కిం అత్ర పశ్యసి ఇతి?

శ్వేతకేతు : న కించన, భగవ ఇతి। ఈ మఱ్ఱివిత్తు గింజను పగలకొట్టి చూస్తే, అందులో నాకు ఏదీ కనిపించడం లేదు.

ఉద్దాలకుడు : యం వై సోమ్య। ఏతమ్ అణిమానం న నిభాలయ - బిడ్డా! శ్వేతకేతూ! చూచావా! ఆ మఱ్ఱిపండులోని చిన్న మఱ్ఱి విత్తు (సూక్ష్మగింజ)ను పగలగొట్టగా, ఏషో అణిమ్న ఏవం ఏమీ కనబడని శూన్యాకాశము నుండి - మహాన్ న్యగ్రోధః తిష్టతి! అనేక కొమ్మలు, ఆకులు, కాయలు, పూవులు మొదలైన వాటితో సువిశాలంగా విస్తరించియున్న వటవృక్షము (మఱ్ఱి వృక్షము) కాలానంతరము బయలుదేరుతోంది కదా!
శ్రద్ధస్య! శ్రద్ధగా విను!

శ్వేతకేతు : బీజములోగల శూన్యమునుండి అనేక విశేష పరంపరలన్నీ బయల్వెడలి సంప్రదర్శనమగుచున్నాయి.

ఉద్దాలకారుణి : అవును. అతి సూక్ష్మమగు ‘అణిమ’ అగు ‘శూన్యాకాశము’ నుండి వృక్ష విశేషాలన్నీ బయల్వెడలుచున్నట్లే నిర్విశేషము నిరాకారము అగు చిదాకాశము నుండి ఈ సాకార ‘‘ఆకాశ - వాయు - అగ్ని - ఆపః - పృథ్వీ సంపుటీ ఉపసంపుటీకరణములు రూపుదిద్దుకుంటున్నాయి. సూర్య-చంద్ర-నక్షత్ర-గ్రహ-అసంఖ్యాక దేహి-దేహ పరంపరలన్నీ- బయల్వెడలి ప్రదర్శనమగుచున్నాయి. ఈ అంతరంగ (మనోబుద్ధి చిత్త అహంకార) - బహిరంగ (పాంచభౌతిక సృష్టి) విశేషాలు ఆ నీళ్ళలో బుడగలవలె ఆత్మయందే బయల్వెడలి, ఆత్మయందే సంచారములు చేస్తూ, ఆత్మయందే లయమైపోతున్నాయి. అంతేకాదు ఇదంతా సర్వదా ఆత్మకు అభిన్నమై ఉంటున్నాయి.

‘‘ఆత్మనుండి ఆకాశము, ఆకాశము నుండి ఈ సమస్తము ఏర్పడుచున్నాయి’’ - అను వేదవాక్యము ఈ విధంగా సుస్పష్టమౌతోంది.

స య ఏషో అణిమాది ఆత్మ్యమిదమ్ పరమ్। - అట్టి సూక్ష్మమగు ఆత్మ చమత్కారమే ఈ సమస్తము కూడా!
తత్ సత్యమ్। - అదియే (ఆత్మయే) సత్యము - తదితరమైనదంతా సందర్భ కల్పిత చమత్కారము మాత్రమే!
స ఆత్మా తత్త్వమసి। - ఓ శ్వేతకేతూ! అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. ‘‘అహమ్ ఆత్మ’’ అను భావనను ఆశ్రయించినవాడవై తత్ నిశ్చలత కొరకు అభ్యాసవంతుడవై ఉండుము.

16–6–13. షష్ఠి అధ్యాయము - త్రయోదశ ఖండము - లవణ దృష్టాంతము - ఆత్మ ఎక్కడ ఉన్నది?

శ్వేతకేతు : తండ్రీ! గురువర్యా! అట్టి ఆత్మ మా స్వరూపమే అయి ఉండి కూడా, మేము జగత్తును తెలుసుకుంటున్నట్లుగా స్వస్వరూపమగు ఆత్మను ఎందుకు తెలుసుకొని ఉండలేకపోతున్నాము? ఎట్లా తెలుసుకొని ఉండాలి? ఈ విషయమై ఇంకా కూడా దయచేసి వివరించండి. ఇంకా ఏవైనా దృష్టాంతముల సహాయముతో బోధించండి.

ఉద్దాలకారుణి : తెలుసుకోబడుతూ ఉంటూ కూడా, ఒక్కొక్కటి తెలియబడనిదానివలెనే అనిపిస్తూ ఉంటుంది. ‘ఆత్మ’ కూడా జీవునిపట్ల తెలిసియున్నదే అయి ఉండి కూడా, ‘తెలియబడనట్లే’ ఉండే తీరు గురించి ఒక దృష్టాంతముతో చెప్పుకుందాము. సోమ్య! కుమారా! విను.

ఇప్పుడు నీవు వెళ్ళి ఉప్పురాళ్ళను (లవణము)ను తీసుకో - ఒక గాజుపాత్రలో జలము పోయి, ఆ జలములో ఆ ఉప్పురాళ్ళు వేయి. రేపు ఉదయం ఆ పాత్రను తీసుకొని నా దగ్గరకు రా.

శ్వేతకేతు ఆ విధంగానే కొన్ని ఉప్పురాళ్ళను ఒక పాత్రలోగల నీటిలోవేసి, ఆ మరునాడు ఆ పాత్రతో సహా తిరిగి తండ్రి వద్దకు వచ్చారు.

ఉద్దాలకుడు : బిడ్డా నిన్ను నేను చెప్పినట్లు చేసావా?

శ్వేతకేతు : భగవాన్! మీరు చెప్పినట్లు కొన్ని ఉప్పుగడ్డలను రాత్రి నీటిలో వేసాను. ఇదిగో ఆ పాత్ర.

ఉద్దాలకుడు : సరే! ఇప్పుడు నీవు ఒక చిన్న పని చేయి. నిన్న నీటిలో జార్చిన ఉప్పు గడ్డలను ఇటు పట్టుకురా. నా చేతిలో పెట్టు.

శ్వేతకేతు : (ఉప్పు గడ్డలు జార్చిన పాత్రలో చేతులతో వెతకి) - తండ్రీ! నిన్న చేతులతో ఈ నీళ్ళలో వేసిన ఆ ఉప్పుగడ్డలు చేతికి తగలటం లేదు. అవి రాత్రే ఈ నీళ్లలో కరిగిపోయి ఉంటాయి కదా! అందుచేత నిన్న నీళ్లలో జార్చిన ఉప్పుగడ్డలను తేలేను.

ఉద్దాలకుడు : అనగా నిన్నటి ఆ ఉప్పుగడ్డలు లేకుండా పోయినాయా? (లేక) నీటిలో ఎక్కడున్నాయి?

శ్వేతకేతు : అంతేకదా, తండ్రీ? కరిగిపోయినాయి కదా!

ఉద్దాలకుడు : అట్లాగా! అయితే ఈ జలము లోని పైభాగములో కొంచము జలము నోటిలో వేసుకొని చూడు. ఎట్లా ఉన్నాయో చెప్పు.

శ్వేతకేతు : అలాగే చేస్తున్నాను (కొంచము పై జలము నోట్లో పోసుకొని) - నోట్లో వేసిన నీరు ఉప్పగా ఉన్నది.

ఉద్దాలకుడు : పోనీ! మధ్యభాగంలోని నీటిని తీసుకొని రుచి చూచి చెప్పు.

శ్వేతకేతు : (ఆవిధంగానే చేసి) - ఈ నీరు కూడా ఉప్పగానే ఉన్నది.

ఉద్దాలకుడు : ఇక ఆ నీటిలో అడుగున ఉండే నీరు కొంచెము తీసుకొని రుచి చూడు.

శ్వేతకేతు : (అట్లాగే రుచి చూచి) ఈ నీరు కూడా ఉప్పగానే ఉన్నది.

ఉద్దాలకుడు : సరే! ఈ నీరంతా పారపోసి చూడు. అప్పుడు నీవు రాత్రి నీటిలో విడచిన ఉప్పుగడ్డలు సాకారముగా లభిస్తాయేమో గమనించి నాకు చెప్పు.

శ్వేతకేతు : (నీరంతా బయట పారబోసి) తండ్రీ! నీరు మొత్తము పారబోసాను. కానీ నిన్న నీటిలో వేసియున్న ఉప్పుగడ్డలు నామరూపాత్మకంగా కనబడనే లేదు. అయినా ఎట్లా కనబడతాయి? నీటిలో ఉప్పుగడ్డలు కరిగిపోయాయి. అవి నీటిలో ‘ఉప్పురుచి’గా మారాయి. నీరు పారబోసినప్పుడు ఉప్పుదనము కూడా నీటివెంటే పారబోయబడినట్లు అవుతుంది కదా.

ఉద్దాలకారుణి : సోమ్యా! శ్వేతకేతూ! నీటియందు ఏవిధంగా ఉప్పు గడ్డలను సాకారంగా చూడలేకపోయావో, కానీ నీవు వేసిన ఉప్పుగడ్డలు నామరూపములు త్యజించి ‘ఉప్పునీరు’ గా అయినదో, ఆ నీటిలో నీవు ఉప్పుగడ్డలను చేతితోగాని - కళ్ళతోగాని గమనించలేకపోయావో, కానీ రుచి చూసి ఉప్పు గమనించేవో - అట్లాగే

⌘ (ఉప్పునీటిలో అంతటా ఉప్పు ఉన్నట్లే) సద్రూపమగు ‘బ్రహ్మము’ నీవు అనుభవముగా పొందుచున్న జగద్దృశ్యమంతా వ్యాపించి ఉన్నది.

⌘ (1) తేజస్సు (2) జలము (3) అన్నముల కార్యభూతమగు ఈ ‘శరీరము’ రూపంగా కారణరూప బ్రహ్మమే కనిపిస్తున్నది. పై మూడిటి కారణరూపమగు బ్రహ్మము (లేక) సత్తు సర్వత్రా వేంచేసియే ఉన్నది.

⌘ అట్టి ఇంద్రియములకు విషయమై (ఉపలబ్ధముగా) పొందలేకపోతున్నావు.

⌘ శాస్త్ర గురుప్రసాదితమగు వివేచన - విచక్షణలచే (నాలుక చేత నీటిలో ఉప్పు ఉన్నదని గ్రహించినట్లు) ఈ జగత్తులోని సర్వత్రా బ్రహ్మమును స్వవివేకము సహాయంతో (with your own common sense) తప్పక గమనించవచ్చును.

అట్టి ‘అణిమ’యే బ్రహ్మము! ఈ సమస్తము కూడా అదియే! అదే సత్యము! అదియే ‘ఆత్మ’। స ఆత్మా। తత్త్వమసి శ్వేతకేతో।
ఓ ప్రియ సోమ్యా! శ్వేతకేతూ! అట్టి ఆత్మ ‘నీవు’ అయి ఉన్నది. నీవు అట్టి ఆత్మవే అయి ఉన్నావు.


16–6–14. షష్ఠి అధ్యాయము - చతుర్దశ ఖండము - కళ్ళకు కట్టిన గంతలు విప్పి త్రోవ చూపితే స్వస్థలానికి వెళ్లటము

శ్వేతకేతు : ఆత్మగురించి తెలుసుకొని మరల ఆత్మభావన సిద్ధించుకోవటము గురించి ఇంకా కూడా మీవద్ద వినాలని ఉత్సుకత కొనసాగుతోంది. తండ్రీ! ఇంకా ఏదైనా మరొక దృష్టాంతము సహాయంతో ఆత్మను ఏమరచిన మేము ఆత్మభావనకు చేరటము గురించి చెప్పండి.

ఉద్దాలకారుణి : సరే! నీవు అడిగిన విషయమై శాస్త్రములలో ప్రసిద్ధమైన - మరొక దృష్టాంతము ద్వారా చెపుతాను విను.

⌘⌘⌘

గాంధార దేశములో ఒక ధనికుడు ఉండేవాడు. ఒకరోజు రాత్రి కొందరు దొంగలు ఆ ధనికుని (జమీందారు) ఇంట్లో దొంగతనంగా ప్రవేశించారు. దొరికిన ధనమంతా నిశ్శబ్దంగా మూటకట్టుకున్నారు. ఇక ఆ ఇల్లు విడచి వెళ్లబోతున్నారు. ఈలోగా జమీందారు తమను చూచాడేమోనని అనుమానం వచ్చింది. వెంటనే ఆ దొంగలు ఇట్లా తలచారు.

‘‘అయ్యబాబోయ్! ఈ జమీందారు మన ముఖాలు చూచాడేమోరా? ఒకవేళ మనలను ఎక్కడన్నా గుర్తుపట్టి రాజభటులకు చూపిస్తే, మన పని అయిపోయినట్లే! అందుచేత ఈ జమీందారుని బందీగా చేసి తీసుకువెళ్లిపోదాము’’.

ఇట్లా తలచి ఆ దొంగలు జమీందారును నెమ్మదిగా మెలకువరాకుండా పట్టుకొని కళ్లకు గంతలు కట్టారు. కాళ్లు చేతులు తాడుతో కట్టి తమవెంట తీసుకొనిపోయారు. ఎక్కడో దూరంగా ఉండే అరణ్యంలో ఒకచోట వదలి, ధనము తీసుకొని తమ త్రోవ తాము వెళ్ళిపోయారు.
ఆ జమీందారుకు మెలకువ వచ్చింది. ఇక తాను బంధించిన చోటునుండి కేకలు వేయటం ప్రారంభించాడు!

‘‘అయ్యా! ఎవ్వరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరో నా కళ్ళకు గంతలు కట్టారు. రండి. నా ఈ కట్లు ఊడదీయండి! రక్షించండి!’’ అని అరవటం ప్రారంభించాడు.

అటుగా వెళ్లుచూ ఉన్న కొందరు బాటసారులు ఆ జమీందారు వేస్తున్న కేకలు విన్నారు. దగ్గరగా వెళ్లి చూచారు. కళ్ళకు గంతలు, చేతులకు, కాళ్లకు బంధనములు ఉండటము చూచారు.

‘‘అయ్యో! పాపం! ఈతనిని ఎవరో త్రాళ్ళతో బంధించి కళ్ళకు గంతలు కట్టి ఇక్కడ పడవేసారు’’ అని గమనించి జాలిపడ్డారు.
గబగబా ఆతని వద్దకు వెళ్లి
- గంతలు తొలగించారు. ఆతడు పరిసరాలు చూడగలగటం ప్రారంభించాడు. ‘ఓహో! నేనిప్పుడు ఈ అడవిలో ఉన్నానా?’’ అని తెలుసుకొన్నాడు.
- కాళ్లకు త్రాళ్ళ ముడులు తొలగించారు. ఆతడి కాళ్లు కదల్చి నడువగలుగు స్థితికి వచ్చాడు.
- చేతుల త్రాళ్ళ - ముడులు తొలగించారు. ఆతని చేతులు కదల్చగలుగసాగాడు.

జమీందారు : ఓ బాటసారులారా! కళ్ళకు కట్టిన గంతలు, కట్టుత్రాడులు తొలగించినందుకు మీకు కృతజ్ఞుడను.

బాటసారులు : మిత్రమా! మీరు ఇక్కడ ఎందుకు బంధించబడ్డారు?

జమీందారు : ఎవరో దొంగలు మా ఇంటిలో ప్రవేశించి, దొంగతనము చేసి, ఆ తరువాత నా కళ్ళకు గంతలు, కాళ్లు, చేతులకు బంధనములు కట్టి తెచ్చి ఇక్కడ వదలి వెళ్లినట్లున్నారు. మెలకువ వచ్చేసరికి - ఇక్కడ ఉన్నాను.

బాటసారులు : సరే! వెళ్లండి.

జమీందారు : ఓ బాటసారులారా! ఈ అరణ్యం ఎక్కడిదో, నేను ఎటు వెళ్లితే గాంధార దేశం చేరగలనో తెలియదు. దయచేసి దారి చెప్పండి.

బాటసారులు : ఇదిగో! ఈ తూర్పు వైపుగా గల బాటలో ప్రయాణించండి.

ఏతాం దిశం వ్రజేతి। స గ్రామ గ్రామాత్ పృచ్ఛన్।
అప్పుడు ఆ బాటసారులు చూపిన త్రోవలో నడవటం ప్రారంభించాడు. త్రోవలో కొన్ని గ్రామములు కనిపించసాగాయి. పండితుడు, మేధావి అయిన జమీందారు అక్కడి గ్రామవాసులను అడుగుచూ, వారు చెప్పుచున్న గుర్తులను వింటూ, జ్ఞాపకం పెట్టుకొంటూ, కొంత సమయంలో గాంధారదేశము ప్రవేశించాడు.

‘‘అమ్మయ్య! గండం గడిచిందిరా బాబూ!’’ అని తలచి, తన ఇంటిలో ప్రవేశించాడు. ప్రశాంతుడైనాడు. సుఖవంతుడైనాడు.

⌘⌘⌘

ఓ శ్వేతకేతూ! ఏవమేవహి ఆచార్యాన్ పురుషో వేద, తావదేవ చిరం యావత్ న విమోక్ష్యే, అథ సంపత్స్య - ఇతి।

ఆ బాటసారి లాగానే ఈ జీవుడు ఇంద్రియ దొంగలచే జ్ఞాన ధనము పోగొట్టుకొన్నాడు. ఆ దొంగలు అంతటితో వదలలేదు. ‘అజ్ఞానము’ అనే కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్య (అరిషట్) మృగములున్న కారడివికి తెచ్చి, కళ్ళకు (వివేకమునకు) గంతలుకట్టి, కాళ్లు-చేతులు సత్కార్యములు చేయకుండా కట్టివేసి వదలారు.

ఈ సంసారారణ్యములో ఈ జీవుడు తెలివి తక్కువవాడై ఏమిచేయాలో తోచక దుఃఖముతో కేకలు వేస్తున్నాడు. ‘నేను ముక్తుడను కావాలి’ అని ఆశయము పొందుచున్నాడు.

అట్టి సూక్ష్మమగు ఆత్మత్వమే ‘‘సత్యము’’! ఓ శ్వేతకేతూ! అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. ‘నీవు’గా ఉన్నది ఆత్మయే అయి ఉన్నది.


16–6–15. షష్ఠి అధ్యాయము - పంచదశ ఖండము-మరణశయ్యపై పురుషుని దృష్టాంతము

శ్వేతకేతు : నాన్నగారూ! గురుదేవా! ఇంకా కూడా ‘తత్త్వమ్’ అను తత్త్వశాస్త్ర మహావాక్యము గురించి ఏదైనా మరొక దృష్టాంతముచే బోధ ప్రసాదించండి.

ఉద్దాలకుడు : మరొక దృష్టాంతం విను. ఒకడు మరణశయ్యపై మరణించటానికి సిద్ధమై ఉన్నాడు. చుట్టూ బంధువులు కూర్చుని ఉన్నారు. అక్కడి దగ్గిర బంధువులు ‘‘(నాన్నా! బాబాయి! మావయ్య! ఏమండీ! అంటూ) నన్ను గుర్తుపడుచున్నావా?’’
జానాసి మాం? జానాసి మాం? - ఇతి।। నన్ను గుర్తు పడుచున్నావా?’’ అని అడుగుచూ ఉన్నారు. ‘‘ఆ“! ఆ”!’’ అని ఆతడు కళ్ళతో ముఖము యొక్క కించిత్ కదలికతోనో ‘‘గుర్తుపడుతున్నాను’’ - అని సంజ్ఞగా చెప్పుచూ ఉన్నాడు.

క్రమంగా ఆ మరణించువాని

ఆ విధంగా లీనముకానంతవరకు మాత్రమే ఆతడు ఇహమును, ఇహములోని బంధువులను గుర్తుపడతాడు. ఆ తరువాత గుర్తుపట్టలేడు. ఈ విధంగా వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు ‘పరదేవత’ (ఆత్మ) యందు లీనమవగా ఈ జీవునియొక్క ఏ నిజస్వరూపము శేషిస్తోందో - అట్టిది సూక్ష్మాతిసూక్ష్మము.

స ఏషత అణిమ, ఏతద్మ్యామ్ ఇదగ్ం సర్వమ్।
అట్టి సూక్ష్మస్వరూపమునందే (నీటిలో ఉప్పు గడ్డలులాగా, తరంగము జలంలో లాగా) ఈ సమస్తానుభవములు, మనో చిత్త బుద్ధి అహంకారములు లీనమై ఉంటున్నాయి.
ఎందులో లీనమౌతున్నాయో అట్టి నీ స్వరూపమే ఆత్మ। ఓ శ్వేతకేతూ! తత్త్వమసి। అదియే నీవు। నీవే ఆత్మవు। ఆత్మయే నీవు।


16–6–16. షష్ఠి అధ్యాయము - షోడశ ఖండము - సత్యనిష్ఠ - దృశ్యము యొక్క అస్పృశ్యత - ఆత్మ నమ్మకము

శ్వేతకేతు : మీ బోధలకు కృతజ్ఞుడను! ఇంకా కూడా దృష్టాంతపూర్వకంగా నిజస్వరూపమగు ‘ఆత్మ’ గురించి చెప్పవలసినదిగా అర్థిస్తున్నాను. వినటానికి ఉత్సాహపడుచున్నాను.

ఉద్దాలకుడు : ఇంకొక దృష్టాంతము విను. పూర్వకాలంలో ఒక న్యాయాధికారి దగ్గరకు ఇద్దరు పౌరులను తీసుకువచ్చారు.

న్యాయాధికారి : రక్షక భటులారా! వీరిద్దరి గురించి ఏమిటి అభియోగము?

రక్షకభటులు : న్యాయాధికారీ! ఈ మొదటివాడు ఆ రెండవ వాడినుండి కొన్ని రత్నములు దొంగిలించాడని ఆ రెండవ వాని అభియోగము. ఈతని వద్ద మాకు ఆ రత్నము కనబడినది. అందుకని న్యాయస్థానమునకు తీసుకువచ్చాము.

న్యాయాధికారి : ఓ మొదటి పురుషుడా? నీవు ఈ రత్నములు రెండవ పురుషుని నుండి దొంగిలించావా?

మొదటి పురుషుడు : హే! న్యాయాధినేతా! ఈ అభియోగము నిజము కాదు. నేను ఈ రత్నము దొంగిలించలేదు.

రెండవ పురుషుడు : న్యాయాధికారీ! ఆ రత్నము నాదే అయి ఉన్నది.

న్యాయాధికారి : మొదటి పురుషుడా! ఈ రత్నము రెండవ పురుషుడు తనకు చెందినదని ఈతడు అంటున్నాడు కదా! మరి నీ సమాధానమేమిటి?

మొదటి పురుషుడు : ‘‘ఈ రత్నము ఈ రెండవ పురుషునదే’’ అనేది నిజమే ప్రభు!

న్యాయాధికారి : ఆతనికి చెందినదేనన్నప్పుడు మరి అతడు అభియోగము చేస్తున్నట్లు నీవు దొంగతనము చేసినట్లే కదా మరి?

మొదటి పురుషుడు : కాదు అధికారీ! ఎందుకంటే నేను దొంగతనము చేయలేదు. ఆతనికి ధనము ఇచ్చి ఇది నేను ఖరీదు చేసాను. అతడు డబ్బు తీసుకొని కూడా, రక్షక భటులకు నాపై అభియోగము చేసాడు. నేను దీనిని ప్రమాణపూర్తిగా చెప్పుచున్నాను.

న్యాయాధికారి : ఏమయ్యా! రెండవ పురుషా! ఈ మొదటి పురుషుని వద్ద ధనము తీసుకొని నీవు అమ్మావని, తనది దొంగతనము కాదని చెప్పుచున్నాడు. మరి ఈతడు చెప్పేదానికి నీ సమాధానం?

రెండవ పురుషుడు : లేదు. నేను ఈతనికి అమ్మలేదు. నేను ధనము పుచ్చుకోలేదు. ఈతడు నావద్ద దొంగిలించిన మాట నిజము. నేను ప్రమాణపూర్తిగా చెప్పుచున్నాను.

న్యాయాధికారి : మీరిద్దరు ఒకడు తాను దొంగిలించలేదని (కొన్నానని), రెండవవాడు తాను అమ్మలేదని, అది దొంగతనమేనని ప్రమాణము చేసి చెప్పుచున్నారు.
మీరిద్దరిలో ఎవరో ఒకరు నిజము చెప్పుచున్నారు. రెండవవాడు అబద్ధము పలుకుచున్నారు. ‘‘అమ్మకమా? దొంగతనమా? అనటానికి మీ ఇద్దరి వద్ద ఏ సాక్ష్యము లేదు.

అందుచేత ఇందుకు నేను ఒక పరీక్ష పెడతాను. మనము అనుసరిస్తున్న ఒక ‘ఆచారము’ను ఇప్పుడు నిర్వర్తించాలని నిర్ణయిస్తున్నాము.

ఓ రక్షకభటులారా! మీరు బొగ్గులతో అగ్నిని వెలిగించండి. ఒక పరశువు (గొడ్డలి)ని పట్టుకురండి. ఆ బొగ్గులలో బాగుగా కాల్చండి. ముందుగా ముద్దాయి అయిన మొదటి పురుషుడు ఆ ఎర్రగా కాలిన పరశువును (గొడ్డలిని) రెండు చేతులతో పట్టుగొనుగాక! ఈతడు ‘కొన్నాను’ అనేది నిజమైతే ఈతని చేతులు కాలవు. కాదూ, దొంగతనమే అయి ఉంటే ఈతని చేతులు కాలుతాయి. చేతులు కాలితే ఈతడు దొంగతనము చేసినట్లే కాబట్టి రత్నము రెండవ పురుషునికి ఇవ్వటము జరుగుతుంది. అంతేకాకుండా, ఈ మొదటివాడు పరిహారము చెల్లించవలసివస్తుంది. అందుకు సిద్ధమేకదా!

మొదటి పురుషుడు : సత్య ప్రమాణకంగా నేను ఈ రెండవ పురుషునివద్ద ధనము ఇచ్చి కొన్నానే గాని నాది దొంగతనము కాదు. అందుచేత ‘‘కాలుచున్న గొడ్డలిని రెండు చేతులతో పట్టుకోవటము’’ అను న్యాయనిర్ణయ విధానమునకు నేను సంసిద్ధుడను.

ఈ విధంగా మొదటి పురుషుడు నిజమే చెప్పుతూ ఉంటే ఆతని చేతులు కాలవు. ఒకవేళ ఆతను చెప్పేది అసత్యమైతే ఆతని చేతులు కాలగలవు. ఆతనికి న్యాయాధికారిచే శిక్ష నిర్ణయించబడుతుంది కూడా!

ఏవడు సత్యమునందు నిష్ఠ కలిగిఉంటాడో, అట్టివాని ఆత్మనమ్మకము కారణంగా ఆ కాలుచున్న గొడ్డలి ఆతనిని ఏమీ చేయదు.

అదేవిధంగా…
ఏ పురుషుడైతే సత్యమగు ఆత్మయందు నిష్ఠ, అవధానము కలిగి ఉంటాడో, అట్టివాడు ఈ ప్రాపంచక విషయములను స్పృశిస్తూ ఉండవలసి వస్తున్నా కూడా, ఆతనిని వేదన, కామ క్రోధ లోభములు మొదలైనవి తాకవు. ఇవేమీ ఆతనిని బాధించలేవు. ఆతడు బద్ధుడు కాడు.

అట్లా కాకుండా, ఎవడు ‘ఈ సమస్తము ఆత్మయే’ అను సత్యము నోటితో శాస్త్రీయంగా సంభాషించగలిగినప్పటికీ, వాస్తవమగు ఆత్మనిష్ఠ లేక, ‘చ్యుతి లేని ఆత్మభావన’ సుస్థీకరించకపోయి ఉంటే, ఈ దృశ్య విషయములు ఆతనిని బాధించగలవు. అంతే కాకుండా అనేక భ్రమాత్మకమగు అజ్ఞాన జన్మ పరంపరలోనికి ఆతడు త్రోసివేయబడగలడు.

సత్యము పట్ల (ఆత్మయొక్క సమస్తత్వము పట్ల) నమ్మిక కలిగియున్నవాడు ఈ జన్మ కర్మల రూపమగు జగద్విషయములచే సంతప్తుడు (తాపములు పొందువాడు) అవనే అవడు.

ఓ శ్వేతకేతూ!

ఇదంతా కూడా ఏతత్‌రూపమే।

ఇదంతా కూడా తత్‌రూపమగు సత్యమే।

సమస్తము బ్రహ్మమే। సత్యమగు ఆత్మయే ఇదంతా।

అట్టి ఆత్మయే నీవై ఉన్నావు. ఆత్మయే సర్వదా ‘నీవు’గా అగుపిస్తోంది.

ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్
6వ అధ్యాయము సంపూర్ణము
ఓం తత్‌సత్




16–7.     ఛాందోగ్యోపనిషత్ - అధ్యయన వచన పుష్పము - సప్తమ అధ్యాయము


16–7–1. సప్తమ అధ్యాయము - ప్రథమ ఖండము - శ్రీ నారద - శ్రీ సనత్కుమార సంవాదము

లోకంలో అనేక విద్యలు ఉన్నాయి. అవన్నీ ఆశ్రయించటంచేత ఈ జీవునికి పేరు - ప్రతిష్ఠలు, ధనము తదితరులపై ఆధిపత్యము, ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించగలవు. ఈ జీవుని ఉన్నతస్థితికి జేర్చగలవు.

అయితే, ఈ జీవునియొక్క మూల శోక కారణములు (Root causes of Inner Worries) మొదలంట్లా తొలగించగలిగినది మాత్రము ‘ఆత్మవిద్య’ ఒక్కటే. మిగతావన్నీ అందుకు పనికివచ్చేవి కావు.

‘‘ఆత్మవిద్య’’ అనగా? అది జగత్తులోని విశేషములకు సంబంధించినది కాదు. అపరావిద్య కాదు, మరి? ఆ విద్యను అభ్యాసించు వానియొక్క - ‘‘ఈవల’’ (ఇహ జగత్‌లోని), ‘‘ఆవల’’ (జగత్తుకు పరమైయున్న) స్వరూపముల సమన్వయ - ఏకత్వములు బోధించే విద్య, ఆ అధ్యయనుడు తనయొక్క పూర్ణత్వము గురించి తెలుసుకోగల విద్య! పరమాత్మము సంతరించుకొని ఉండగల నేర్పరితనము ప్రసాదించు విద్య. అదియే ‘బ్రహ్మవిద్య’ భూమా విద్య. ‘‘తనలో లోకములను - లోకములలో తనను’’ - సమగ్రంగా తెలుసుకొని ఏకత్వము సిద్ధింపజేయు విద్యయే ఆత్మ విద్య (భూమా విద్య). ఎవ్వడు ఎక్కడ ఎంతకాలము ఎన్ని విద్యలు నేర్చినప్పటికి, ఎప్పటికైనా ‘ఆత్మవిద్య’ నేర్చుకోనంత కాలము ఈ జీవునికి శాంతి ఉండదు.

⌘⌘⌘

బ్రహ్మమానస పుత్రుడగు శ్రీ నారదమహర్షి ఒక సందర్భములో బ్రహ్మవిద్యారేణ్యులగు శ్రీ సనత్కుమారుని ఆశ్రమమునకు వచ్చి హృదయపూర్వక నమస్కారము సమర్పించారు.

శ్రీ నారదమహర్షి : గురుదేవా! సనత్కుమార భగవాన్! పరమేశ్వరా! బ్రహ్మవిద్యా ప్రావీణ్యా! ఆత్మతత్త్వవేత్తా! నమో నమః। నమో నమః। నమో నమః।

శ్రీ సనత్కుమారుడు : ఆత్మానంద స్వరూపా! లోకశుభకరా! బహువిద్యాప్రావీణ్యా! నారదా! సుస్వాగతము. అంతా క్షేమమే కదా! ఏమిటి ఇటువచ్చారు?

శ్రీ నారదమహర్షి : గురువర్యా! అంతాక్షేమమే. హ ఉపససాద। తమ వద్ద ‘ఉపదేశము’ పొందటానికై శరణు వేడుతూ వచ్చాను.

శ్రీ సనత్కుమారుడు : ఉపదేశమా? మీరు అనేక విద్యలు నేర్చినవారు గదా! దేనిగురించి నేను ఉపదేశించాలి?

శ్రీ నారదమహర్షి : అవును. అనేక విద్యలు నేను సుదీర్ఘకాలం అధ్యయనము చేసాను.

శ్రీ సనత్కుమారుడు : అనేక విద్యలలో మీరు ప్రావీణ్యులైనారు కదా! ఏ విద్య కొరకై నావద్దకు వచ్చారు?

శ్రీ నారదమహర్షి : సోఽహం భగవో! మంత్రవిదేవాస్మి। న ఆత్మవిత్। అనేక విద్యలు నేను నేర్చిన మాట నిజమేగాని, వాటన్నిటి చేత ‘మంత్రవేత్త’ను మాత్రమే అయ్యాను. ‘ఆత్మవేత్త’ను కాలేదని నాకు అనిపిస్తోంది.
ఈ విషయం ఆలోచించాను. ‘మీరే దిక్కు’ అని గ్రహించాను. ఆత్మవేత్తను అవటానికై ఉపదేశము కొరకు మిమ్ములను ఆశ్రయిస్తున్నాను.

శ్రీ సనత్కుమారుడు : మంచిదే! అయితే ముందుగా మీరు ఏ ఏ విద్యలు నేర్చి ఉన్నారో చెప్పండి. ఆ తరువాత మనము ‘ఆత్మవిద్య’ గురించి ప్రస్తావించుకుందాము.

శ్రీ నారదమహర్షి : గురువర్యా! మీరు ఆజ్ఞాపిస్తున్నట్లే నేను ఇప్పటివరకు నేర్చిన విద్యలు ఏమేమిటో ప్రస్తావిస్తాను. దయతో వినండి.

ఈ విధంగా నేను అనేక విద్యలు అధ్యయనం చేసాను. ఇవన్నీ చదివి కర్తవేత్తను మంత్రవేత్తను అయ్యానేగాని, ఆత్మవేత్తను కాలేకపోయాను. శబ్దార్థజ్ఞానం సంపాదించినవాడనయ్యాను. అంతమాత్రమే! అంతేగాని ‘రాజవిద్య’గా చెప్పబడు స్వస్వరూప విద్య నేను ఇంకా సిద్ధించుకోలేదు - అని అనుకుంటున్నాను.

శ్రుతగ్ం హి ఏవ మే భగవద్దృశేభ్యః తరతి శోకమ్ ఆత్మవిత్’’। తమవంటి మహనీయులచే ‘‘ఆత్మవేత్త మాత్రమే శోకము జయించగలడు’’ - అని సిద్ధాంతీకరించబడుతోంది. సోఽహం భగవన్ శోచామి। భగవన్! ఈ విషయమై ఎంతో ఆలోచించి తమను ఆశ్రయించవచ్చాను.

‘నామ’ బ్రహ్మోపాసన

సనత్కుమారుడు : యద్వై కించిత్ ఏతత్ అధ్యగీష్ఠా ‘నామ’ ఏవ ఏతత్। మీరు చెప్పిన విద్యలన్నీ (The big list of learnings) - అన్నీ కూడా ‘నామము’ పై ఆధారపడి ఉన్నవి. వికారమంతా ‘నామము’పై ఆధారపడి ఉంటోంది కాబట్టి ‘నామమాత్రవిద్యలు’ అని తత్త్వజ్ఞుల అభిప్రాయము. పేరుకు విద్యలేగాని అసలైన విద్యకాదు.

ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము, ఐదవ వేదమగు ఇతిహాస పురాణములు, వ్యాకరణము, శ్రాద్ధకల్పము, గణితము, సిద్ధాన్త శాస్త్రము, నీతి శాస్త్రము, తర్క శాస్త్రము, నిరుక్త శాస్త్రము (పదముల అవయవార్థ వివరణలు), శిక్ష, కల్పము, భూత తంత్ర - మంత్రములు, ధనుర్వేదము, జ్యోతిషము, క్షత్రవిద్య, నక్షత్రవిద్య, సర్పవిద్య, సర్వదేవవిద్య, సంగీత నృత్య శిల్పాది కళలు - ఇవన్నీ బ్రహ్మము యొక్క నామములే. అయితే ఈ నామ విద్యలతో బ్రహ్మమును తప్పక ఉపాసించవచ్చు.

ఎవ్వరైతే ఇవన్నీ ‘నామవిద్య’గా భావించి వాటి సహాయముతో ‘బ్రహ్మము’ను ఉపాసిస్తాడో, అట్టివాడు నామము యొక్క గతి (Extension of Nomenlature) (లేక) నామము యొక్క వ్యాప్తి ఉన్నంతవరకు ‘వ్యాప్తి’ కలవాడై ఆత్మ యొక్క పూర్ణఫలమును తప్పక పొందగలడు.

‘‘నామాత్మకమైనదంతా బ్రహ్మమే’’ అను ఉపాసనచే బ్రహ్మమే పొందబడగలదు. నామ్నో భూయ ఇతి।


16–7–2. సప్తమ అధ్యాయము - ద్వితీయ ఖండము - ‘వాక్’ బ్రహ్మోపాసన

శ్రీ నారదుడు : గురువర్యా! సనత్కుమారా! బ్రహ్మము గురించిన ఉపాసనలో ‘నామము’ కంటే ఉత్తమమైనది ఏదైనా ఉన్నదా?

సనత్కుమారుడు : ఉన్నది. నామము కంటే ‘వాక్కు’ గొప్పది. ఒక ‘నామము’ (పేరు) చెప్పాలంటే వాక్కు (Speaking) ఉండాలి కదా! వాక్కుచేతనే ఋగ్వేదము విజ్ఞాపితము (బోధించటము) జరుగగలదు. 4 వేదములు, ఇతిహాసపురాణములు, వ్యాకరణ, శ్రాద్ధ, కల్ప, గణిత, దైవజ్ఞ, నిధి, తర్క, నీతి, నిరుక్తి, కల్ప, శిక్షా భూతతంత్ర, ధనుర్వేద, జ్యోతిష, గారుడ, దేవజన అనే విద్యలుబీ ద్యులోక, భూలోక, పంచభూత దేవతల, మానవ, పశుపక్ష్య, తృణ వనస్పతి, కీటక ధర్మాధర్మ, సత్యాసత్య ప్రియ - అప్రియ…మొదలుగా గల సమస్త విశేషములు - ఇవన్నీ ‘వాక్కు’ చేతనే తెలియజేయబడుచున్నాయి.

అందుచేత నారదా! మీరు ‘వాక్కు’ను బ్రహ్మముగా ఉపాసించండి. అట్టి వాక్ బ్రహ్మోపాసకుడు వాక్కు విస్తరించి ఉన్నంతవరకు స్వేచ్ఛగా విహరించగలడు. ఆతనికి ‘వాక్‌బంధనము’ అనేది ఉండదు. వాచో భూయ ఇతి।


16–7–3. సప్తమ అధ్యాయము - తృతీయ ఖండము - ‘మనః’ బ్రహ్మోపాసన

శ్రీ నారదుడు : భగవాన్! సనత్కుమారా! ఆత్మోపాసనకై వాక్కుకంటే కూడా గొప్పదైన వస్తువేదైనా ఉన్నదా?

శ్రీ సనత్కుమారుడు : ఉన్నది. మనో వావ వాచో భూయో! వాక్కు కంటే మనస్సు మరింత అధికమైన ఉపాసన వస్తువు.

ఒకడు తన పిడికిలి (గుప్పిట / ముష్టి)లో రెండు ఉసిరికాయలు (ఆమలకములు), (లేదా) రెండు రేగుపండ్లు, (లేదా) రెండు కరక్కాయలు (అక్షములు) ఉంచుకొనుతీరుగా మనస్సే (1) వాక్కు (2) నామములను తనయొక్క గుప్పిటలో ఉంచుకొని వ్యవహరిస్తోంది. అనగా నామము, వాక్కు మనస్సు యొక్క వ్యావహారిక - అంతర్భాగములుగా ఉంటున్నాయి.

(మననయేవ మంత్రః) ఒకడు మనస్సులో ‘‘నేను ఇప్పుడు మంత్రమును పఠిస్తాను. మననం చేస్తాను’’ అని మనస్సుతో కోరుకొన్నప్పుడే మంత్రమును ఆతడు ఉచ్చరిస్తాడు. ‘కర్మలను నిర్వర్తించాలి’ అని మనస్సుతో అనుకుంటేనే కర్మలు నిర్వర్తిస్తాడు. ‘నా సంతానము, నా పశుసంపద నేను పొంది ఉండాలి’ అని మనస్సుతో అనుకున్న తరువాతయే అవన్నీ విలువైన వస్తువులుగా పొందబడుచున్నాయి.
(మనో యః కరోతి, తత్ కృతం భవతి। మనో య న కరోతి తత్ న కృతం భవతి। అతో మననయేవ కర్తృః। న దేహః - యోగ వాసిష్ఠము).

మనస్సుతో ఏది చేస్తే అదియే ‘చేయబడినది’ అవుతుంది. మనస్సుతో చేయనిది ‘చేయబడనిది’యే అవుతుంది. అంతేగాని, దేహానికి స్వకీయమైన కర్తృత్వము లేదు. ఇహలోక-పరలోకములందు మనస్సు ఏది కోరుకుంటే అదియే ఆ జీవుడు పొందటము జరుగుతోంది.
కాబట్టి…

మనస్సే ఆత్మ। మనస్సే లోకము। మనస్సే బ్రహ్మము।

అందుచేత ప్రియ నారద మహర్షి! మీరు అట్టి ‘మనస్సు’ను ‘బ్రహ్మమే’ - అని ఉపాసించండి. ఎవ్వడైతే మనస్సును బ్రహ్మముగా ఉపాసిస్తాడో - అట్టివాడు ఎంతవరకైతే మనస్సు విస్తరించి (వ్యాపించి) ఉంటుందో, అంతవరకు యథేచ్ఛగా విహరించగలడు. ఆతనికి మనస్సు వలన బంధము ఉండదు! మనసో భూయ ఇతి। మనస్సును బ్రహ్మముగా ఉపాసించువానికి మనోబంధము ఉండదు.


16–7–4. సప్తమ అధ్యాయము - చతుర్థ ఖండము - ‘సంకల్పో’ బ్రహ్మేతి - ఉపాసన

శ్రీ నారద మహర్షి : గురుదేవా! భగవాన్! మనస్సు కంటే కూడా ఇంకా ఏదైనా ఉపాసనా వస్తువు ఉన్నదా?

శ్రీ సనత్కుమారుడు : అవును. ఉన్నది. మనస్సు కన్నా కూడా ‘సంకల్పము’ (Assumption and Presumption) అనబడేది గొప్ప ఉపాసన వస్తువు. మానవుడు ముందుగా సంకల్పించి, ఆ తరువాత మనస్సును నియమించుచున్నాడు. అప్పుడు ఆ మనస్సు వాక్కును ప్రేరేపిస్తోంది. వాక్కు నామమును పలికింపజేస్తోంది. నామము మంత్రములతోను, మంత్రము కర్మలతోను చేరి ఉంటోంది.

❋ మనస్సు మొదలైనవాటికన్నిటికీ సంకల్పమే ఆధారము.
❋ నామము, వాక్కు మొదలైనవన్నీ మనస్సునందు సంకల్పము చేతనే ఉనికిని పొందుచున్నాయి.
❋ స్వర్గలోకము, భూలోకము, వాయువు, ఆకాశము, తేజస్సు, అన్నము, ప్రాణము, మంత్రము మొదలైనవన్నీ కూడా ‘సంకల్పము’ వలననే కలుగుచున్నాయి.
❋ సంకల్పము వల్లనే కర్మ - కర్మఫలములు ఉనికిని పొందగలుగుచున్నాయి. సంకల్పించకపోతే అవి లేనివే అవుతాయి.

ఓ నారదమహర్షీ! ఈ సమస్త సృష్టి కూడా సంకల్పముచే నిర్మించబడి, సంకల్పమయమే అయి ఉన్నది. ‘‘దృష్టియే సృష్టి’’ అన్నప్పుడు సంకల్పమునే ‘దృష్టి’ - అని అంటున్నాము. అందుచేత ‘సంకల్పము’నే బ్రహ్మముగా ఉపాసించండి.

ఎవ్వడైతే ‘సంకల్పము’ అనుదానిని పరబ్రహ్మస్వరూపముగా ఉపాసిస్తాడో, అట్టివాడు

❋ ధృవలోకములందు ధృవముగా ఉండగలడు (స్వాతంత్రుడు కాగలడు).
❋ ప్రతిష్ఠితమైన లోకములలో ప్రతిష్ఠితుడై ఉండగలడు (ఉన్నచోటే ఆత్మగా ప్రకాశించగలడు).
❋ దుఃఖములు (worries) లోకములలో ప్రవేశించినా కూడా దుఃఖరహితుడు కాగలడు.

ఎంతవరకైతే సంకల్పము వ్యాపించి ఉంటుందో అంతవరకు (సంకల్పమును బ్రహ్మముగా ఉపాసించునట్టి) ఆతడు స్వేచ్ఛగా సంచారములు చేయగలడు. (He can be free and Independent). యావత్ సంకల్పస్య గతం, తత్ర అస్య యథా కామచారో భవతి - యః సంకల్పం బ్రహ్మేతి ఉపాస్తే।

కనుక నారదా! ‘సంకల్పము’ను బ్రహ్మముగా ఉపాసిస్తూ ఉండండి.


16–7–5. సప్తమ అధ్యాయము - పంచమ ఖండము - ‘‘చిత్తం బ్రహ్మ’’ ఇతి - ఉపాసన

(చిత్తము-ఇష్టము-అభిరుచి)

శ్రీ నారద మహర్షి : బ్రహ్మన్! ఆత్మోపాసన గురించినదై ‘సంకల్పము’ కంటే గొప్పదైన ఉపాసన మరింకేదైనా ఉన్నదా?

శ్రీ సనత్కుమారుడు : చిత్తమును బ్రహ్మముగా ఉపాసించటము సంకల్పబ్రహ్మోపాసన కన్నా గొప్పదై ఉన్నది. ఈ జీవుడు ‘ఇష్టము’ రూపముచే చేతనవంతుడు అయి ఉన్నప్పుడే సంకల్పము చేయుచున్నాడు. చిత్తముచేతనే ఏదైనా కోరుకొనుచున్నాడు. చిత్తము చేతనే వాక్ ఇంద్రియము ప్రేరణ (Inspiration) పొందుతోంది. అప్పుడు వాక్కు నామమును పలుకుచున్నది. నామము మంత్రముతో ఏకమగుచున్నది. మంత్రము (మననము) కర్మలతో ఏకత్వము పొందుతోంది.

చిత్తము చేతనయిత్వమై కాలముతో ఏకత్వము (Inspiration getting related to contexts) పొందుతోంది. సంకల్పము మొదలైనవన్నీ చిత్తములోనే ప్రతిష్ఠితమౌతున్నాయి. (చిత్తము = Factor of Attention). ఒకానొకడు అనేక విషయములు తెలిసియున్నవాడు అయినప్పటికీ కూడా, ఆతడు మనము చెప్పే విషయము పట్ల చిత్తుడు (Paying Attention) కాకుండా అచిత్తుడు (Not Paying Attention) అయి ఉంటే ఆతని గురించి మనము ‘‘ఈతడు కొంచెము తెలిసియున్నాకూడా మనము చెప్పేదంతా వినేవాడే। కానీ ఏం లాభం? మనము చెప్పేదానిపట్ల చిత్తము లేనివాడై (అచిత్తుడై) ఉంటున్నాడు’’ - అని అతని గురించి మనము వ్యాఖ్యానించుకుంటాము. చిత్తము ఉన్నవానికే ఏదైనా చెప్పగలము.

ఎవ్వడైనా అల్పజ్ఞుడు (Poorly knowing) అయినప్పటికీ ఆతడు చిత్తము కలిగి ఉంటే ఆతనికి మనము చెప్పగలుగుతాము. అందుచేత..

✡︎ చిత్తమే ఆత్మ.
✡︎ చిత్తమే అన్నిటికీ మూలము.

ఎవ్వడైతే చిత్తము (Interested involvement)ను పరబ్రహ్మస్వరూపముగా ఉపాసిస్తాడో, అట్టివాడు దృఢమైన చిత్తము పొందగలడు. చిత్త-చాంచల్యమును జయించగలుగుతాడు.

చిత్తమును పరమాత్మగా ఉపాసించువాడు సర్వత్రా ఆత్మను దర్శించుచు
వ్యథలేని లోకములలో ప్రవేశించి వ్యథలేనివాడు కాగలుగుచున్నాడు.

అట్టివాడు చిత్తము విస్తరించియున్నంత వరకు స్వేచ్ఛా గతిని ప్రాప్తించుకోగలడు.
అందుచేత ‘చిత్తము’ను మీరు బ్రహ్మముగా ఉపాసించండి.


16–7–6. సప్తమ అధ్యాయము - షష్ఠ ఖండము - ‘ధ్యానం’ బ్రహ్మేతి - ఉపాసన

(ధ్యానము యొక్క మహతత్త్వము)

శ్రీ నారదుడు : మహనీయా! చిత్తము కంటే కూడా అధికంగా ఉత్తమమైన ఆత్మభావనోపాసన మరొకటేదైనా ఉన్నదా?

శ్రీ సనత్కుమారుడు : ‘చిత్తము’ కంటే ధ్యానము శ్రేష్ఠమైనది. ధ్యానం వావ చిత్తాత్ భూయో।

‘‘ఈ భూమి (పృథివి), ఆకాశము (అంతరిక్షము), ద్యులోకము (స్వర్గలోకము), నీరు, కొండలు, దేవతలు, మానవులు’’
ఇవన్నీ ధ్యాన స్వరూపములే. అవన్నీ ధ్యానము చేస్తున్నవిగానే కనబడుచున్నాయి కూడా.

ఎవ్వరైనా ఎక్కడైనా ఒకానొక మహతత్త్వము (Something great, something special) - పొందుచున్నారంటే దానికి కారణము ధ్యానమే। ధ్యానసిద్ధి వలననే వారు ఆ ఔన్నత్యము పొందుచున్నారు సుమా!

ఎవరు ధ్యానమును ఆశ్రయించుచూ ఉండరో అట్టివారు అల్ప విషయములను పట్టుకు వ్రేలాడువారు (క్షుద్రులు) గాను, పోట్లాడటం స్వభావంగా కలవారు (కలహప్రియులు) గాను, త్యాగబుద్ధి లేనివారు (పిసినారులు)గాను, వెనక-ముందు చూడకుండా ఇతరులను దూషించువారుగాను, ఇతరుల తప్పుల గురించి అధికంగా సంభాషించువారుగాను అగుచున్నారు.

అథ యే అల్పాః, కలహినః, పిశునా, ఉపవాదినస్తే। ధ్యాన అపాదాంశా ఇవైవ తే భవన్తి। ప్రపంచంలో అనేకులు ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క గొప్ప ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు కదా! వారంతా ‘ధ్యానము’ వలననే ఆయా సమర్థతలు పొందుచున్నారు.

అందుచేత ఓ నారదా! మీరు ‘ధ్యానము బ్రహ్మమే’ అని ఉపాసించెదరు గాక।

ధ్యానము బ్రహ్మముగా ఉపాసించువారు వారి ధ్యానము విస్తరించి ఉన్నంత దూరము ‘స్వేచ్ఛ’ (Freedom) కలిగి స్వాతంత్రులై ఉండగలరు.


16–7–7. సప్తమ అధ్యాయము - సప్తమ అధ్యాయము - ‘విజ్ఞానం’ బ్రహ్మేతి - ఉపాసన

శ్రీ నారదుడు : స్వామీ! బ్రహ్మము గురించిన ఉపాసన కొరకై ‘ధ్యానము’ కంటే శ్రేష్ఠమైనది ఏదైనా ఉన్నదా?

శ్రీ సనత్కుమారుడు : అవును. ఉన్నది. విజ్ఞానం వావ ధ్యానాత్ భూయో। ధ్యానము కంటే ‘విజ్ఞానము’ (తెలివి, ఎరుక) - శ్రేష్ఠమైనది.

విజ్ఞానము (Intellectual Factor) చేతనే ఋక్ యుజుర్ సామ అథర్వణ చతుర్వేదములను, పంచమ వేదములనే ఇతిహాస పురాణములను, వ్యాకరణము, శ్రాద్ధకల్పము, గణితము, ఉత్పాతశాస్త్రము (శకునశాస్త్రము), నిధిశాస్త్రము (నిక్షేపముల శాస్త్రము), తర్కశాస్త్రము (Logic), నీతిశాస్త్రము, శబ్దముల ఉత్పత్తి శాస్త్రమగు నిరుక్తము, బ్రహ్మవిద్య, భూతవిద్య, ధనుర్వేదము, జ్యోతిషము, గారుడ విద్య, శిల్ప విద్య, ద్యులోక (దేవతాలోక) విద్య, పృథివి, వాయువు, ఆకాశము, జలము, తేజస్సు, దేవ-మానవ-పక్షి ఇత్యాది జీవుల గురించి, ధర్మాధర్మములు, సత్యాసత్యముల గురించి, సాధు అసాధులు, హృదయజ్ఞ-అహృదయజ్ఞములు, అన్నరసములు, ఇహ - పరలోకములు గురించి-ఇవన్నీ జీవుడు తెలుసుకోగలుగుచున్నాడు.

అందుచేత ఓ నారదా! మీరు ‘విజ్ఞానము’ను బ్రహ్మముగా ఉపాసన చేయండి. అప్పుడు ‘విజ్ఞానము’ యొక్క గతి విస్తరించి ఉన్నంతవరకు గల విజ్ఞానమయ లోకములలో స్వతంత్రులై సంచారములు చేయగలరు.


16–7–8. సప్తమ అధ్యాయము - అష్టమ ఖండము - ‘బలం’ బ్రహ్మేతి - ఉపాసన

‘‘ ‘విజ్ఞానము’ కంటే విశేషమైన ఉపాసనా వస్తువు ఏదైనా ఉన్నదా?’’ - అను నారదమహర్షి ప్రశ్నకు - సనత్కుమారుడు ఈ విధంగా సమాధానము చెప్పసాగారు.

శ్రీ సనత్కుమారుడు : బలం వావ విజ్ఞానాత్ భూయో। విజ్ఞానము కంటే కూడా ‘బలము’ ఆత్మోపాసనకై శ్రేష్ఠమగు ఉపాసనా వస్తువు అయిఉన్నది.

శతం విజ్ఞానవతాం ఏకో బలవాన్ అకంపయతే। నూరుమంది విజ్ఞానవంతులు (తెలివిగల వాళ్లు) కూడా ఒక్క బలవంతుని చూచి వణుకుతారు.

పరిచరన్ ఉపసత్తా భవతి। బలవంతుడే గొప్ప పరిచరితుడు (Efficient) అవగలడు. గురువు సమక్షంలో ఏకాగ్రతకలవాడై మననములు చేయగల - ఉపసీదనుడు (కదలక కూర్చునువాడు) కాగలడు.

ఉపసీదన్ - ద్రష్టా భవతి। శ్రోతా భవతి। మన్తా భవతి। ఉపసీదనుడే బలవంతుడై నిశ్చలముగా ఆసీనుడై చక్కగా విషయములను సరిగ్గా (నిత్యానిత్యములు) దర్శించగలడు. సూక్ష్మమగు గురుబోధల అంతరార్థములు ఏకాగ్రంగా శ్రవణము చేయగలడు. శ్రవణము చేసినది సరి అయిన త్రోవలో మననము చేయగలడు.

బోద్ధా భవతి। సరి అయిన రీతిగా అర్థము తెలుసుకొనగలడు.

కర్తా భవతి। ‘‘ఏది చేయాలి, ఎట్లా చేయాలి? ఏది చేయకూడదు? చేయకుండువాడై ఎట్లా ఉండాలి’’ - మొదలైనవి ఎరిగినవాడై సరి అయిన కర్మలు, ధర్మములు నిర్వర్తించువాడు అవగలడు.

విజ్ఞాతా భవతి। బలము చేతనే అన్నీ అర్థము చేసుకొన్నవాడు కాగలడు. ‘బలము’ అనగా కేవలము శారీరక బలమునకు పరిమితమైనది కాదు.

బలము అనగా : శారీరక రోగ్యము; మనోనిశ్చలత్వ బలము (మనస్సు చాంచల్యమును జయించి ఉండటము); బుద్ధియొక్క ఏకాగ్రతా బలము (బుద్ధి సాధికారికమైన అనేక విషయముల గురించిన ప్రాధాన్యత (Multi Priorities) కలిగి ఉండకపోవటము; యోగాభ్యాస బలము; తపో సంపదా బలము; సత్యవాక్ బలము; దానపుణ్య బలము; స్వధర్మనిరతి బలము; గురువులను, ఆర్యులను సేవించినప్పటి సేవా బలము - ఇవన్నీ కూడా! ఇవన్నీ సుదీర్ఘ సాధన, సాత్విక కర్మలచేతనే సిద్ధించగలవు.

బలము చేతనే - నేల, నింగి (ఆకాశము), పర్వతములు, పక్షులు, దేవ-మనుష్య-జంతువులు, పతంగములు నిలుస్తున్నాయి. ఇంతెందుకు? ఒక పురుగు నుండి సమస్త ప్రాణులు బలము చేతనే సుస్థితులై ఉన్నారు. బలముచేతనే ఈ సమస్తము (గడ్డిమొక్క నుండి కూడా) ప్రాణులు జీవించువారై ఉన్నారు.

‘బలో బ్రహ్మేతి’ ఉపాసనచే అట్టి ఉపాసకుడు - తన బలము ఎంతవరకు విస్తరించుచున్నదో - అంతవరకు స్వేచ్ఛాయుతుడై ఉండగలడు. బలమును బ్రహ్మముగా ఉపాసించువాడు సర్వత్రా బలవంతుడై ఉండగలడు.

అందుచేత ఓ నారదా! ‘‘బలో బ్రహ్మేతి’’ సూత్రమును సుస్పష్టపరచుకొన్నవాడవై, బలమునే బ్రహ్మముగా ఉపాసించండి.


16–7–9. సప్తమ అధ్యాయము - నవమ ఖండము - ‘అన్నం’ బ్రహ్మేతి ఉపాసన

శ్రీ నారద మహర్షి : మహనీయా! ఆత్మ తత్త్వోపాసనకై ‘బలము’ కంటే అధికమైనది ఇంకా కూడా ఏదైనా ఉన్నదా?

శ్రీ సనత్కుమారుడు : అన్నం వావ బలాత్ భూయః। అన్నము బలముకంటే ఎక్కువైన ఆత్మోపాసనా సాధనము.

తస్మాత్ యద్యపి దశరాత్రీః న అశ్నీయాత్, యద్యుహ జీవేత్ అథవా, - ఒకడు ఒక 10 రోజులు కనుక అన్నము తినకపోవటం జరిగితే, ఒకవేళ అతడు ఇంకా జీవిస్తూ ఉండి ఉన్నప్పటికి కూడా…ఓపిక పోయి కళ్లు తెరచి చూడలేడు -

న ద్రష్టా! న శ్రోతా। (చెవులతో వినలేడు)।
న మన్తా। (మననము చేయలేడు. మనస్సు పనిచేయదు)
న బోద్ధా। (ఆతడు బోధించబడలేడు)।
న కర్తా। (దేనికీ కర్త (చేయువాడు) అయిఉండలేడు)
న విజ్ఞాతా। (అధ్యయనం చేసి నేర్చుకొని విజ్ఞాతుడు కాలేడు)।

11వ రోజు అన్నం తింటేనో? ద్రష్ట, శ్రోత, మన్తా, బోద్ధ, కర్త, విజ్ఞాత - ఇవన్నీ తిరిగి అవగలడు.

అందుచేత ‘‘అన్నం బ్రహ్మ’’ అని ఉపాసించెదవు గాక!

అన్నమును బ్రహ్మముగా ఉపాసించువాడు సమృద్ధి అయిన అన్నము, ఉత్తమమైన ఉదకములు లభించు లోకములు పొందుతాడు. అవి తృప్తిగా పొందగలడు. అన్నముయొక్క గతి ఎంతవరకో, అంత స్థానము వరకు కామచారుడు (స్వేచ్ఛా విహారుడు) కాగలడు। అన్నముచే భాగ్యవంతుడై ఉండగలడు.


16–7–10. సప్తమ అధ్యాయము - దశమ ఖండము - ‘జలం’ బ్రహ్మేతి ఉపాసన

శ్రీ నారదుడు అడిగిన తరువాత ప్రశ్నకు -

శ్రీ సనత్కుమారుడు : జలముయొక్క బ్రహ్మోపాసన అన్నోపాసన కంటే అధికము.

అందుచేతనే -

వర్షము కాలయుక్తంగా, తగినంతగా వర్షిస్తే ‘అమ్మయ్య! ఈ సంవత్సరం అన్నమునకు లోటు ఉండదు’ - అని జనులు సంతోషిస్తూ సంక్రాంతి పండుగ సందడిగా చేసుకుంటారు.

ఆప ఏవ మూర్తాయేయం పృథివీ। ఈ భూమి మూర్తీభవించిన (ఘనీభవించిన) జలము రూపమే।

యత్ అన్తరిక్షం, యత్ ద్యౌః, యత్ పర్వతా
యత్ దేవ మనుష్యా, యత్ పశవశ్చ వయాంసి చ,
తృణవనస్పతయః శ్వాపద అన్యా కీటక పతంగ పిపీలికమ్ ‘‘ఆప’’ ఏవ ఇమా మూర్తా।

ఇక్కడ కనిపిస్తున్న ఆకాశము, ద్యు(తేజో-దేవతా) లోకము, పర్వతములు, దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, తృణవనస్పదులు, శ్వాపదములు (ఇతర జంతువులను హింసించు పులి, సింహము మొదలైన జంతువులు), తదితర కీటకములు, పతంగములు (మిడతలు), పురుగులు (పిపీలికములు) - ఇవన్నీ మూర్తీభవించిన (లేక) ఘనీభవించిన జలము యొక్క రూపములే।

(ఆపోవా ఇదగ్ం సర్వం। విశ్వాభూతాని ఆపః।
అన్నమ్ ఆపో। సమ్రాడ ఆపో! విరాడ ఆపః। స్వరాట్ ఆపో।
ఛందాగ్ంసి ఆపో। యజుగుస్య ఆపో। సర్వమ్ ఆపో భూర్భువస్స్వః ‘ఓం’)

అందుచేత ఓ నారదా! మీరు జలమును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించెదరు గాక। అట్టి ఉపాసనచే ఈ జీవులు సర్వము పొందగలరు. కోరుకొన్నవన్నీ లభించగలవు. జనులు తృప్తి పొందగలరు.

అట్టి ‘ఆపో బ్రహ్మేతి’ అని జలమును పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసించువాడు బ్రహ్మమును పొందగలడు.


16–7–11. సప్తమ అధ్యాయము - ఏకాదశ ఖండము - ‘తేజో’ బ్రహ్మేతి - ఉపాసన

శ్రీ నారదులవారు మరల అడిగిన ‘జలముకంటే గొప్పదైన ‘‘ఉపాసన వస్తువు’’ గురించి శ్రీ సనత్కుమారులవారు ఇట్లా చెప్పుకొస్తున్నారు.

శ్రీ సనత్కుమారుడు : తేజస్సు జలముకంటే ఉత్కృష్టమైనది. గొప్ప ఉపాసన వస్తువు.

కనుక మొట్టమొదట తేజస్సే కనిపిస్తోంది. (ఇది యోగాభ్యాసుల శ్రేష్ఠానుభవము కూడా!) అందుచేత ఓ నారదా! మీరు ‘‘తేజస్సు బ్రహ్మమే’’ అని ఉపాసించండి.

ఆ విధంగా ‘‘తేజో బ్రహ్మేతి’’ అని ఉపాసించువారు తేజస్సులు, తేజో సంపన్నులు అగుచున్నారు. తేజో భాస్కరులై సర్వత్రా చీకట్లను తొలగించివేయగలరు. అట్టివారు - ఎంతవరకు తేజస్సు విస్తరించి ఉన్నదో, అంతవరకు- ఇచ్ఛాపూర్వకంగా సంచరించగలరు (కామచారులు అవగలరు). అందుచేత తేజస్సును ‘‘తేజోబ్రహ్మేతి’’ అని ఉపాసించెదవు గాక!


16–7–12. సప్తమ అధ్యాయము - ద్వాదశ ఖండము - ‘ఆకాశో’ బ్రహ్మేతి - ఉపాసన

శ్రీ నారదమహర్షి : మహానుభావన్! సనత్కుమార మహాశయా! తేజస్సు కంటే గొప్పదైన ఉపాసనా వస్తువు ఇంకొకటి ఏదైనా ఉన్నదా?

శ్రీ సనత్కుమారుడు : ఆకాశో వావ తేజసో భూయాన్। తేజస్సు కంటే ఆకాశము మహత్తరమైనది.

అందుచేత ఓ నారద! మీరు ‘అకాశో బ్రహ్మేతి’ - అని తలచుచు ఆకాశమును పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించండి. అప్పుడు ఆకాశము విస్తరించి ఉన్నంతవరకు ఆకాశవంతులు, ఇచ్ఛాసిద్ధులు, సర్వస్వాతంత్రులు అయి ఆనందమయ విశాల లోకములలో బ్రహ్మానందముగా సంచారములు చేయగలరు.


16–7–13. సప్తమ అధ్యాయము - త్రయోదశ ఖండము - ‘స్మరో’ బ్రహ్మేతి - ఉపాసన

శ్రీనారదమహర్షి : ఆకాశముకంటే ఉత్తమమైనదేది? ఉపాసనకొరకై ఇంకా కూడా ఉత్తమమైనది ఉన్నదా?

శ్రీ సనత్కమారుడు : ఆకాశము కంటే కూడా ఆత్మోపాసనకొరకై ఉత్తమమైనది - ‘స్మరణము’ (లేక) జ్ఞప్తి (జ్ఞాపక శక్తి).
(స్మరణము = ఆలోచన; జ్ఞాపకము; మననము; జ్ఞప్తి; గుర్తించటము; గమనించటము).

స్మరణము (జ్ఞాపకము) లేకపోతే అనేకమంది ఒకచోట కూర్చుని ఉన్నా కూడా ఒకరినొకరు గుర్తించలేరు. ఒకరితో మరొకరు మాట్లాడుకోలేరు.

స్మరణము వలననే ఒకడు కళ్ళతో ఏదైనా చూడగలడు, చెవులతో వినగలడు, స్పర్శించి గుర్తించగలడు, మననము చేయగలడు.

స్మరణమువలననే ఒకడు భార్య-పుత్ర-బంధు-పశు సంపదలను గుర్తించగలుగుచున్నాడు.

అందుచేత స్మరణము (The Factor of Remembrance) ను బ్రహ్మముగా ఉపాసించెదరు గాక!

ఆ విధంగా స్మరణమును బ్రహ్మముగా ఉపాసించువారు - యావత్ స్మరస్య గతం తత్ర అస్య యథా కామచారో భవతి। - స్మరణము విస్తరించి ఉన్నంత వరకు కామచారుడు (స్వేచ్ఛగా వర్తించువాడు) అగుచున్నాడు. బంధము లేనివాడై ఉండగలడు.


16–7–14. సప్తమ అధ్యాయము - చతుర్దశ ఖండము - ‘ఆశా’ బ్రహ్మేతి - ఉపాసన

శ్రీ నారదమహర్షి : ‘స్మరణ’ కంటే కూడా ఉత్తమ ఆత్మోపాసన-ఉపకరణము ఉన్నదా? ఉంటే అది ఏది?

శ్రీ సనత్కుమారుడు : ‘స్మరణము’ కంటే ‘ఆశ’ అధికమైన ఆత్మోపాసనా ఉపకరణము. ఒకడు ఆశ చేతనే స్మరణము, స్మరణ చేతనే మంత్రములు (మననములు) స్మరించటము, పఠించటము నిర్వర్తిస్తూ ఉన్నాడు. ‘ఆశ’ చేతనే సంతానము, పశుసంపద కోరుకొనుచున్నాడు. (కామికానివాడు మోక్షకామికాడు). ఇహ పరలోకములన్నీ కూడా ‘ఆశించటము’ చేతనే కల్పనా మాత్రమై సిద్ధిస్తున్నాయి. అందుచేత నీవు ‘ఆశ’ (లేక) ఆశించటము పరబ్రహ్మముగా భావించి, ఉపాసించు. ‘ఆశ’ను బ్రహ్మముగా భావన చేయువానియొక్క సమస్త కామనములు, చేసే సకల ప్రార్థనలు సిద్ధించ గలవు. ఈ విధంగా ‘ఆశించటము’ అనేది బ్రహ్మమే అయి ఉన్నది.


16–7–15. సప్తమ అధ్యాయము - పంచదశ ఖండము - ‘ప్రాణో’ బ్రహ్మేతి - ఉపాసన

శ్రీ నారదమహర్షి : ‘ఆశ’ కన్నా అధికమైనదేదైనా ఉన్నదా?

శ్రీ సనత్కుమారుడు : ‘నామము’ నుండి ‘ఆశ’ వరకు కార్య-కారణ, నిమిత్త-నైమిత్త సంబంధములు కలిగి ఉంటున్నాయి. ఆశచేతనే మానవుడు బద్ధుడు అగుచున్నాడు. అట్టి ఆశవరకు ప్రాణముచే పూదండలో దారమువలె విస్తరించి, సమస్తము ప్రాణమునందే సమర్పితమై (ఉనికి కలిగి) ఉన్నాయి. ఈ విధంగా ప్రాణము ఆశ కంటే కూడా అధికమైన ఆత్మోపాసన ఉపకరణము అయి ఉన్నది. రథముయొక్క అరలన్నీ నాభియందు, నాభి రంధ్ర చక్రమునందు సమర్పితమైన తీరుగా సమస్తము ‘ప్రాణము’ నందే సమర్పితమైయున్నది.

అదే!…, ఒకని తల్లిగాని, తండ్రిగాని మరణించినప్పుడు ‘‘చూడండి! అతడు అమ్మ నాన్నల ప్రాణం తీస్తున్నాడు’’- అని ఎవ్వరూ అనరు.

ప్రాణం ఉంటేనే శారీరకంగాను, మానసికంగాను బాధ గాని, సుఖము గాని ఉండగలవు.

అందుచేతనే ‘‘(దేహమునకు సంబంధించిన) జన్మ-జీవన-మరణములు, బాధ-అబాధలు, (మనస్సుకు సంబంధించిన) సుఖ-దుఃఖ మాన-అవమానములు - ఇవన్నీ ప్రాణ సంబంధమైనవే’’ అని చెప్పబడుతోంది. ‘‘నా ప్రాణము బాగుండక నేను అదంతా గమనించలేకపోయాను’’ అని జనులు అంటూ ఉంటారు. కాబట్టి దేహ మనో బుద్ధి చిత్తములు ప్రాణమునందే సమర్పితమై (అలంకరించబడినవై, అమర్చబడినవై) ఉన్నాయి.

ప్రాణో హి ఏవ ఏతాని సర్వాణి భవతి। తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, ప్రియమైన బంధువులు మొదలైనవారంతా ఈ జీవునికి ప్రాణస్వరూపులే అయిఉన్నారు. అందుచేత…
‘‘ఈ సమస్తము నీ ప్రాణ స్వరూపమే!’’…. అని జగద్దృశ్యముపట్ల భావన చేయును గాక। ఎవ్వడైతే సమస్తము తన ప్రాణ స్వరూపముగా చింతన చేయునో, ఆ విధంగా గ్రహించువాడు ప్రాణస్వరూపుడే అవుతాడు.

ఈ విధంగా ప్రాణమును బ్రహ్మముగా ఉపాసన చేయువాడు - ‘‘బ్రహ్మాది స్తంభపర్యంతస్య హి జగతః ‘ప్రాణ’ ఆత్మాహమితి’’। - బ్రహ్మదేవుని నుండి ఒక తృణము వరకు సమస్తమునకు ప్రాణస్వరూపుడను నేనే!’’ - అని ఎలుగెత్తి గానము చేస్తూ చెప్పుచున్నాడు.

అట్టి ‘‘సమస్త జీవుల ప్రాణస్వరూపుడను నేనే’’ - (అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయ స్థితః - భగవద్గీత) - అని చేతులెత్తి ప్రకటించువాడు - ఇతరులచే ‘‘ఈతడు అతివాది। విజానన్ అతివాదీ భవతి।’’ - అని అనబడవచ్చు గాక.
అప్పుడు మీరు ఇట్లా అనాలి -
తం చేత్ బ్రూయః ‘‘అతి వాద్యసీతి।’’ అతి వాద్యస్మి ఇతి। ఔను! నేను సమస్త సృష్టికి ప్రాణస్వరూపుడనే। ఉన్న సత్యమైతే ఇదే! ఇందులో సందేహము లేదు. ఒకవేళ నేను ‘అతివాదిని’ - అని మీరు అనుకోదలిస్తే, అది మీ ఇష్టము - సత్యము అతివాదమనుకుంటే నేను అతివాదినే మరి!’’ - అని అనాలి.
అంతేగాని అట్టి ప్రాణదర్శన-ఉపాసన-అవగాహనలనుండి మీరు చ్యుతి పొందనక్కర్లేదు! న అపహ్నువీత। సత్యము నుండి తప్పుకోవలసిన పని - ప్రాణోపాసకునికి (ప్రాణమును ఆత్మగా దర్శించువానికి) - ఏమాత్రము ఉండదు.
అందుచేత ‘ప్రాణము’ను పరబ్రహ్మముగా ఉపాసించెదరు గాక!


16–7–16. సప్తమ అధ్యాయము - షోడశ ఖండము - స్వాత్మయే సర్వాత్మక సర్వప్రాణాత్మకము

స ఏష నారదః - ‘‘సర్వాతిశయం ప్రాణం స్వమాత్మానం।’’
‘‘అన్నిటికంటే ఉత్కృష్టమైన స్వాత్మరూపమగు ప్రాణమే సర్వాత్మ స్వరూపము’’ - అను శ్రీ సనత్కుమారుని ప్రాణతత్త్వ ప్రవచనమును శ్రీ నారదమహర్షి శ్రద్ధగా విన్నారు.
‘‘ప్రాణమునకు మించి మరొక ఉపాసనా వస్తువు ఉన్నదా?’’ - అని ఇతఃపూర్వము వలె అడగాలని అనిపించలేదు.
‘‘నేను సర్వదేహములలోని ప్రాణస్వరూపుడనై ఉన్నాను కదా! ఇంకా కొత్తగా అంతకుమించిన ఉపాసనతో పని ఏముంటుంది?’ - అని భావించి సంతోషము పొందారు. ఏమీ అడగక ఊరుకున్నారు.

⌘⌘⌘

అయితే సనత్కుమారుడు ఈవిధంగా అనుకోసాగారు.
‘‘ఈ నా శిష్యుడు నారదుడు ఇంకా అకృతార్థుడు. అట్లా అయి ఉండి కూడా తనను పరమార్థమగు సత్యవాదిగా అనుకుంటున్నాడు. వికార రూపము, మిథ్య అయిన బ్రహ్మజ్ఞానముతో సంతృప్తి చెంది మరల ప్రశ్నించక ఊరుకుంటున్నాడు. అయితే ఈతడు ఉత్తమార్హత గల శిష్యుడు. గురువుగా నన్ను ఆశ్రయించినప్పుడు ఈతని మిథ్యాజ్ఞానము తొలగించి ఏది పరమసత్యమో, అటువైపుగా మార్గము చూపాలి కదా!
కాబట్టి ఇప్పటికి అయోగ్యుడైయున్న ఈ శిష్యుని మిథ్యాగ్రహణము నుండి చ్యుతి పొందిస్తాను’’ - అని తలచాడు.

⌘⌘⌘

శ్రీ సనత్కుమారుడు : ఓ నారదా! ఇప్పటిదాకా మనము సంభాషించుకున్నదంతా శ్రద్ధగా విన్నారు కదా! వాస్తవానికి ‘ప్రాణము’ గురించి తెలుసుకున్నంత మాత్రంచేత అట్టివాడు అతివాదిత్వము (వాదనలకన్నిటికీ ఆవల ఉన్నట్టిది) సిద్ధించుకొన్నట్లు కాదు సుమా! ‘ప్రాణోపాసన’ వరకు వాస్తవానికి ఇంకా నామాదుల దృష్టి మాత్రమే.

శ్రీ నారదమహర్షి : గురుదేవా! నేను ప్రాణముయొక్క సర్వాత్మకత్వము మీవద్ద శ్రవణం చేసి, ‘‘నేను అతివాదిని అయ్యాను’’ …అని తృప్తి చెంది ఇక మిమ్ములను ప్రశ్నించలేదు.

‘‘మీరు చెప్పినదాన్నిబట్టి ‘‘ఆత్మ తత్త్వజ్ఞానము’’ లేక ‘‘ఆత్మ తత్త్వోపదేశము’’ యొక్క సర్వోత్తమమగు పాఠ్యాంశము నేను ఇంకా మీవద్ద విననేలేదని తెలుసుకున్నాను. ఇంకా నేను ప్రాణతత్త్వముతో సహా నామాదుల దృష్టిలో మాత్రమే ఉన్నాను గాని ఆత్మదృష్టికి ఇంకా చేరలేదని మీరన్న మాటలుబట్టి గ్రహించాను.

ఇప్పుడు ఆత్మ దృష్టి గురించిన తరువాత పాఠ్యాంశమును మీరు నాకు బోధించుటకై శరణాగతుడను అగుచున్నాను.

శ్రీ సనత్కుమారుడు : ఓ పరమాత్మానందస్వరూపా! నారదా! మనము ఆత్యంతిక సత్యమును ఆశ్రయించి సమస్త ఉపాసనల అంతిమ ప్రయోజనము సిద్ధించుకోవాలి కదా! అట్టి స్థానము ‘‘భౌమా’’ అని ‘అతివాదము’ అని, అద్దానిని సిద్ధించుకున్నవానిని ‘అతివాదన కర్త’ అని అంటారు. వాస్తవానికి ప్రాణము యొక్క తత్త్వము (సర్వత్రా ఏకత్వము) తెలుసుకున్నంతమాత్రం చేత ‘అతివాది’ కాడు. ఎవడు అంతిమ (పరాకాష్ట) సత్యము కొరకై ‘అతివాదనము’ చేయునో, ఆతడే అతివాదనుడు అవగలడు.

శ్రీ నారదమహర్షి : సోఽహం భగవః సత్యేయన అతివదానీతి। భగవాన్! సామీ! గురుదేవా! నేను పరమార్థ సత్య విజ్ఞానము పొంది అతివాదనుడను అగుటయే లక్ష్యముగా కలిగి ఉన్నాను.

శ్రీ సనత్కుమారుడు : మంచిదే! అయితే నీవు సాధనపరంగా నీ వెంటనంటి వస్తూ ఉన్న సర్వజిజ్ఞాసలు ప్రక్కకుపెట్టుచూ, పరమసత్యమే (The Finest and The Final Truth) కొరకు మాత్రమే నీయొక్క జిజ్ఞాసను కేంద్రీకృతం చేయాలి మరి! సత్యం తు ఏవ విజిజ్ఞాసితవ్యమితి।

శ్రీ నారదమహర్షి : సత్యం భగవో విజిజ్ఞాస ఇతి। అవును, ప్రభూ! నేను అంతిమ సత్యముకొరకే విజిజ్ఞాసుడను (Determination to know) అగుచున్నానని మరల మనవి చేసుకుంటున్నాను।
మీ నుండి విశేషమగు పరమ సత్యమును తెలుసుకోవాలని వాంఛిస్తున్నాను.


16–7–17. సప్తమ అధ్యాయము - సప్తదశ ఖండము - దేనితో తెలుసుకొనుచున్నావో అదియే తెలుసుకోవలసినట్టిది

విజ్ఞానం బ్రహ్మ / ప్రజ్ఞానం బ్రహ్మ - విజ్ఞానం విజిజ్ఞాసితవ్య

శ్రీ సనత్కుమారుడు : ‘‘నేను ఉన్నాను’’ అనబడునది మరొకరు ఎవ్వరూ చెప్పకుండానే (తల్లిగాని, తండ్రిగాని - అమ్మ-నాన్న మాటలు నేర్పకముందే) ఈ జీవునికి తనకు తనకే తెలుస్తోంది కదా. అట్టి దానిలో రెండు విశేషాలు.
(1) ‘ఉనికి’ (I Exist)
(2) ‘ఎరుక’ (తన ఉనికి తనకే తెలియటము - Knowing - విజ్ఞానము).
సత్ = ఉనికి :: చిత్ = ఎరుక.

యదావై విజానాతి అథ సత్యం వదతి। పురుషుడు (పురుషకారము ప్రదర్శిస్తున్న జీవుడు) ఎప్పుడైతే ‘సత్యము’ (యమ్ సత్)ను తెలుసుకుంటాడో, అప్పుడే ఆతడు సత్యమును మాట్లడుతాడు. తెలియని సత్యము ఎవ్వడు మాత్రం మాట్లాడగలడు?

విజానన్నేవ సత్యం వదతి।
ఈ సత్యము తెలుసుకోవటం జరిగితేనే సత్యము మాట్లాడగలడు కదా!

తెలసుకోవటమే → విజ్ఞానము

ఒకడు ఏమి తెలుసుకొనుచున్నాడు? అనేది ప్రక్కనపెట్టి , ‘‘తెలుసుకోవటము’’ అనే లక్షణము గురించి (About Feature of Knowing, but not what is being known)ను తెలుసుకోవటములో (గమనించటంలో) జిజ్ఞాసులై ఉండెదరు గాక! అదియే బ్రహ్మము.

శ్రీ నారదమహర్షి : మహాత్మా! నేను ఇప్పుడు అట్టి ‘‘విజ్ఞానము’’ యొక్క విశేషరూపమునే తెలుసుకోగోరుచున్నాను. విజ్ఞానం భగవో। విజిజ్ఞాస ఇతి।
అనగా…
వేరు వేరు దీపములు వేరు వేరు వస్తువులను వెలిగిస్తూ ఉండవచ్చు. అన్ని దీపములలోని జ్యోతి (తేజస్సు), ఉష్ణము ‘ఒక్కటే’.
అట్లాగే-
నాకు గాని, సమస్త జీవులకుగాని ఏదేది తెలియబడుచున్నదో…అద్దానిలో ‘అనేకత్వము’ ఉండవచ్చు గాక। ‘‘తెలుసుకోవటము’’ (The Future of Knowing) మాత్రము సర్వదా ఏకమే అయి ఉన్నది. అట్టి ఏకమగు ప్రజ్ఞానము (లేక) విజ్ఞానమునే తెలుసుకొనుచున్నవాడనై ఉన్నాను. అది సర్వత్రా సమరూపమై ఉన్నది. అట్టి బ్రహ్మము గురించి ఎరుగుచున్నాను.


16–7–18. సప్తమ అధ్యాయము - అష్టాదశ ఖండము - మతిస్తు ఏవ విజిజ్ఞాసితవ్యేతి। మననము (మతి) గురించే తెలుసుకోవాలి।

శ్రీ సనత్కుమారుడు : ఓ నారదా! మననయేవ మనః। ‘మనస్సు’ అనగా ‘మననము’ యొక్క రూపమే, ఒకడికి ఒక విషయము తెలియాలంటే..
(1) తాను ఉండాలి! (ఉనికి - సత్యమ్).
(2) తాను తెలుసుకొనేవాడై ఉండాలి (విజ్ఞానం/ప్రజ్ఞానం-చిత్). అంతటితో సరిపోదు.
(3) యదా వై మనుతే, అథ విజానాతి। తద్విషయము మననము చేసినప్పుడే ఆ సత్యమును ఆతడు తెలుసుకొని చెప్పగలడు.

న అమత్వా విజానాతి। ఆ విషయము మననము చేయకపోతే ‘ఇది ఇక్కడ ఇట్లా జరిగింది’-అని చూచి కూడా చెప్పలేడు.

ఈ జనులు మననము చేస్తున్న విషయాలు వేరు వేరు. ఒకడు మననము చేస్తున్నట్లుగా మరొకరు మననము చేయటము లేదు. వేరువేరు మననములననుసరించి మంచి-చెడు-జ్ఞానము-అజ్ఞానము కనిపిస్తున్నాయి. అట్టి మననమే మనోరూపము.

ఇప్పుడు నీవు… నామము నుండి → ప్రాణము వరకు మననము చేయబడు విషయాలను ఆవల పెట్టు.

ఏ మతిచే మనమంతా మననము చేయుచున్నామో, దానిని గురించి తెలుసుకొనెదవు గాక! మతి (తెలుసుకొనుచున్నవాని మనన శక్తి) గురించి తెలుసుకొనుచున్నవాడవై ఉండు. అట్టి ‘మతి’ మాత్రమే అసలైన తెలుసుకోవలసినట్టిది (జ్ఞేయము)- ‘మతిస్తు ఏవ విజిజ్ఞాసితవ్యేతి।’

శ్రీ నారదమహర్షి : గురుదేవా!
మతిం భగవో విజ్ఞాస ఇతి। ఏదేది జీవులచే మననము చేయబడుచున్నదో - అట్టి దానినిబట్టి భేదములన్నీ కనిపిస్తున్నాయి. మనన శక్తి ఒక్కటే.
అందుచేత,
సమస్త జీవులలో మననము రూపమగు మనస్సును వ్యక్తీకరించుచున్న మతిని మాత్రమే తెలుసుకొంటూ ‘‘మనో విజిజ్ఞాసితవ్యుడను’’ అగుచున్నాను. సమస్త జీవులలో ఏకరూపమై ఉన్న ‘మతి’ని మాత్రమే తెలుసుకొంటున్నవాడనై, మననము చేయబడువాటిని అధిగమించినవాడనై ఉంటాను.


16–7–19. సప్తమ అధ్యాయము - ఏకోనవింశ ఖండము - ‘‘శ్రద్ధ’’యే తెలుసుకొనతగినది - తెలుసుకోవలసినది

ఇప్పుడు - ఇక శ్రద్ధ గురించి!

ఎవ్వడైనా ఏదైనా ‘మననము’ చేయాలంటే ఆతడు శ్రద్ధ (Attention) ఆ విషయము పట్ల కలిగి ఉండాలి. (లేక) మననము చేస్తే (అనుకుంటూ) ఉంటే సరిపోదు. శ్రద్ధను వినియోగిస్తేనే ఆ పని చేయగలడు.

‘‘నేను చదువుకోవాలనే అనుకుంటున్నాను. కాని చదువుపై శ్రద్ధ కలిగి ఉండను. మరకటేదో ఆటలు వంటి వాటిపై శ్రద్ధ చూపుతాను’’ - అని అంటే ఆ విద్యార్థికి చదువు వస్తుందా? రాదు. ఎందుచేత? శ్రద్ధ లేదు కాబట్టి.

⌘⌘⌘

ఒక పని చేయాలంటే శ్రద్ధ ఉంటేనే మననము చేయగలడు. శ్రద్ధ లేకపోతే ఆ పని చేయాలనే మననము ఆరూఢమవదు. యదా వై శ్రద్ధధాతి అథ మనుతే। న అశ్రద్ధధన్ మనుతే। శ్రద్ధధత్ ఏవ మనుతే।

ఈ జనులంతా వేరు వేరు విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటున్నారు. శ్రద్ధ వేరు వేరు విషయములపై ఎక్కుబెట్టబడినప్పటికీ అందరిలోనూ ‘‘శ్రద్ధ’’ (Attention) అనేది ఒక్కటే! ‘శ్రద్ధా తు ఏవ విజిజ్ఞాసితవ్యేతి। నీవు ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ‘‘శ్రద్ధ’’ అను దాని గురించి (The concept of Attention) తెలుసుకోవాలి. అందుచేత శ్రద్ధ గురించి విజిజ్ఞాసితవ్యుడవు అగుము. అప్పుడు ‘ఆత్మ’ (లేక) ‘బ్రహ్మము’ గురించి దానంతట అదే తెలుస్తుంది.

శ్రీ నారదుడు : మహాత్మా! ‘‘ఎవరి శ్రద్ధ ఎటువైపు ఉన్నది?’’ - అనే విషయము ఆవలబెట్టి, అసలు ‘‘శ్రద్ధ’’ గురించి తెలుసుకోనారంభిస్తున్నాను. శ్రద్ధాం భగవో విజిజ్ఞాస ఇతి।


16–7–20. సప్తమ అధ్యాయము - వింశ ఖండము - నిష్ఠాయేవ విజిజ్ఞాస ఇతి

శ్రీ సనత్కుమారుడు : ఒకడికి శ్రద్ధతో బాటు నిష్ఠ (Commitment Functioning) ఉండాలి. నిష్ఠ లేకుండా ‘‘నాకు శ్రద్ధ ఉన్నది’’ అంటే ఏమి లాభము?

యదా వై నిస్తిష్ఠతి అథ శ్రద్ధధాతి। ‘‘నిష్ఠ’’ ఉంటేనే (If only determined to do) ‘శ్రద్ధ’ అనేది రూపుదిద్దుకుంటుంది. శ్రద్ధ ఉంటేనే మననము చేయగలడు. మననము చేస్తేనే తెలుసుకోగలడు. తెలుసుకుంటూ ఉంటేనే ఉనికిని చాటుకోగలడు.

నిష్ఠ లేని వానికి శ్రద్ధ ఎక్కడ ఏర్పడుతుంది? ఏర్పడదు. న అనిస్తిష్ఠన్ శ్రద్ధధాతి। నిష్ఠ (Determination) ఉన్నవాడికే శ్రద్ధ బలపడుతోంది. నిస్తిష్ఠన్ ఏవ శ్రద్ధధాతి।

ఓ నారదా! సమస్త జీవులలో ఏర్పడియే ఉన్నట్టి ‘నిష్ఠ’ గురించి మీరు విజ్ఞాతులై ఉండండి (Be aware of the concept of Determination)! అనగా, ఒకడు దేనిపట్ల నిష్ఠ కలిగి ఉంటున్నాడో, అది ఆవలపెట్టి, ‘నిష్ఠ’ గురించే తెలుసుకోండి. నిష్ఠా తు ఏవ విజిజ్ఞాసతవ్యేతి।
(నిష్ఠ = నిష్ఠ గురించి - నిష్ఠా గురుశుశ్రూషాదిః తత్పరత్వం బ్రహ్మ విజ్ఞానాయ! - బ్రహ్మతత్త్వము కొరకై తత్పురుడై ఉంటూ గురుసేవ వంటి కార్యములను నిర్వర్తించటమే నిజమైన నిష్ఠ అని చెప్పబడుతోంది)

శ్రీ నారదమహర్షి : భగవాన్! సనత్కుమారుడా! నేను ‘నిష్ఠ’ అను దాని గురించి తెలుసుకొనువాడనై ఉంటాను. సమస్త జీవులలోని ‘నిష్ఠ’ను తెలుసుకొంటూ, వేరువేరు భేదములను జయిస్తాను. నిష్ఠా భగవో! విజిజ్ఞాస - ఇతి।


16–7–21. సప్తమ అధ్యాయము - ఏకవింశ ఖండము - కృతియేవ విజిజ్ఞాసితవ్యమ్ - కర్మానుష్ఠానము

శ్రీ సనత్కుమారుడు : మానవునికి బద్దకమే పెద్ద శత్రువు. అందుచేత కర్మానుష్ఠానపరుడై ఉండాలి. అది శాస్త్రానుకూలంగాను, లోకానుకూలంగాను, గురు శుశ్రూషానుకూలంగాను ఉండును గాక। యదా వై కరోతి అథ నిస్తిష్ఠతి। ‘నిష్ఠ’ అనేది, శ్రద్ధ అనేది కర్మలను నిర్వర్తించటముపైన ఆధారపడి ఉంటాయి. ప్రయత్నించేవానికే ప్రయోజనం. బుద్ధి కూడా కర్మలను అనుసరించే రూపుదిద్దుకుంటోంది (బుద్ధిః కర్మానుసారిణీ)। న అకృత్వా నిస్తిష్ఠతి। కృత్వైవ నిస్తిష్ఠతి। కర్మలు నిర్వర్తించని వానికి నిష్ఠ ఏర్పడదు. కర్మలు చేయువానికే నిష్ఠ ఉంటుంది. అందుచేత సత్కర్మలను ఈ జీవుడు చక్కగా తెలుసుకొని ఉండాలి. సత్కర్మలను నిర్వర్తించాలి. దుష్టకర్మల నుండి విరమించాలి. ‘కృతము (కర్మ)’ గురించి తెలుసుకోండి.

శ్రీ నారదమహర్షి : కృతిం భగవో। విజిజ్ఞాస ఇతి। భగవాన్! కర్మ, అకర్మ, వికర్మల గురించి తెలుసుకొనువాడనై ఉంటాను.


16–7–22. సప్తమ అధ్యాయము - ద్వావింశ ఖండము - సుఖం విజిజ్ఞాసితవ్యేతి।

శ్రీ సనత్కుమారుడు : కర్మలు సుఖప్రదంగా ఉండాలి. సాధ్యమయినదే సాధన. యదా వై సుఖం లభతే అథ కరోతి। తనకు, సహజనులకు సానుకూల్యంగా ఉండేటట్లుగా కర్మలు తీర్చిదిద్దుకోవాలి.
న అసుఖం లబ్ధ్వా కరోతి। సుఖమేవ లబ్ధ్వా కరోతి। కర్మలు సుఖప్రాప్తి కొరకే నిర్వర్తించాలిగాని బాధలు పర్యవసానంగా కలిగి ఉండకూడదు.
(ప్రారంభే విషమివ - పరిణామో అమృతో భవతి - అన్నట్లుగా కర్మలు ఉండాలి).
సుఖం తు ఏవ విజిజ్ఞాసితవ్యమ్ ఇతి। కర్మలు సుఖప్రదమయ్యేది ఎట్లాగో తెలుసుకొని ఉండాలి.

శ్రీ నారదుడు : కర్మలు సుఖప్రదంగా తీర్చిదిద్దుకునేటట్లు ఎరిగినవాడనై ఉంటాను. సుఖం, భగవో! విజిజ్ఞాస ఇతి।


16–7–23. సప్తమ అధ్యాయము - త్రయోవింశ ఖండము - ‘‘భూమా’’ సుఖమితి।

శ్రీ సనత్కుమారుడు : ఇంద్రియ సుఖము వాస్తవమైన సుఖము కాదు. అనేక దుఃఖములకు దారి చూపేదే। ( యే హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే - భగవద్గీత). ఏది మహత్తరమో (బ్రాహ్మీసుఖమో, ఆత్మసుఖమో, గొప్పదో) అదియే ‘భూమ’’।
యా వై భూమ, తత్ సుఖమ్। న అల్పే సుఖమస్తి। ఏది మహత్తరమైయున్నదో, అదియే ‘సుఖము’, అల్పవైనవి సుఖము కాదు. ఏది ‘భూమ’ అయి ఉన్నదో అది తెలుసుకొని ఉండాలి. ఆత్మయే సుఖము. ఆత్మ గురించే తెలుసుకొనుచూ ఉండాలి.

శ్రీ నారదుడు: భూమానం, భగవో! విజిజ్ఞాస - ఇతి। గురువర్యా! భూమానము అయినదేదో అట్టిదాని గురించియే తెలుసుకుంటూ ఉంటాను.


16–7–24. సప్తమ అధ్యాయము - చతుర్వింశ ఖండము - ‘‘భూమా’’ స్వరూపము ఎట్టిది?

శ్రీ సనత్కుమారుడు : కిం లక్షణో అసౌ ‘భూమా?’ అట్టి ‘భూమా’ అని మనము చెప్పుకొంటున్న దానియొక్క లక్షణములు ఏమిటి? వినండి.
యత్ర న అన్యత్ పశ్యతి। ఎద్దానిని చూస్తూ ఉన్నప్పుడు అద్దానికి ‘అన్యము’ అంటూ ఏదీ కనిపించదో…
న అన్యత్ శృణోతి। దేనికైతే వేరు అయినది వినబడనే వినబడదో (బంగారు గాజులు, బంగారు ఉంగరము - అన్నప్పుడు బంగారమే శ్రేష్ఠమై వినిపిస్తుంది కదా!)
న అన్యత్ విజానాతి। దేనికైతే వేరుగా ఏదీ తెలియబడటము లేదో… సమస్తము కూడా ‘అదియే’ అని తెలియబడుతోందో…
అదియే ‘భూమా’।
అట్టి ఆత్మకు వేరుగా ఏదైనా కనబడుచూ, వినబడుచూ, తెలియబడుచూ ఉన్నదో, అది ‘అల్పము’ (Very low way of seeing hearing and knowing). సత్యమును వీడి కల్పనలో సంచరించటము వంటిది.

శ్రీ నారదమహర్షి : అట్టి అమృతము, అనన్యము అగు ‘భూమా’ - ఎందులో ప్రతిష్ఠితమైయున్నది? స, భగవః। కస్మిన్ ప్రతితిష్ఠత?

శ్రీ సనత్కుమారుడు : అట్టి అమృతము, అనన్యము, మహిమాన్వితము అగు భూమా (ఆత్మ) మరింకేదానియందు ప్రతిష్ఠితమై లేదు.
స్వే మహిమ్ని। తన మహిమయందు తానే ప్రతిష్ఠితమై ఉన్నది.
అంతేకాదు. న మహిమ్నీతి? తన మహిమయందు తాను ప్రతిష్ఠితమై లేదు కూడా।
ఎందుకంటే అద్దాని మహిమ అద్దానికి అన్యము కాదు కాబట్టి। అది అనన్యము కాబట్టి।
లోకరీతిగా ‘గో సంపద, అశ్వ సంపద, ఏనుగుల సంపద, దాసులు- భార్య-గృహములు ఇవన్నీ ఆత్మయొక్క మహిమయే।’’ అని అంటూ ఉంటారు.

న అహం బ్రవీమి। నేనైతే అట్లా చెప్పను. అనను. నేనేమంటానంటే…పై విశేషములే కాకుండా సమస్త జీవులు, సమస్త దృశ్యము ఆత్మయందే ప్రతిష్ఠితమై, ఆత్మకు అనన్యమై ఆత్మస్వరూప కారణంగా మహిమాన్వితమై ఆత్మకే స్వానుభవమగుచున్నాయి - అని।


16–7–25. సప్తమ అధ్యాయము - పంచవింశ ఖండము - ‘భూమా’యే నేను।

ఒక రచయిత యొక్క రచనా కళయే రచన అంతా నిండి ఉన్న రీతిగా, ప్రతి ఒక్క జీవునియందు ‘భూమా’ అయి

నేనే ఇదంతా

అట్టి ‘‘భూమా’’యే నేనై ఉన్నాను - ‘‘నేను’’ పై ఆదేశము!
నేనే క్రింద, పైన, వెనుక, ముందు, కుడి, ఎడమ, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలలో (ఆభరణములో బంగారము వలె) నిండిఉన్నాను.
సమస్తము ఆత్మపై ఆరోపించబడుతోంది. కానీ సర్వదా ఆత్మయే సమస్తమునందు అంతరసత్యమై, బాహ్యప్రదర్శనమై, ఉభయత్రా అభేదమై వెలుగొందుచున్నది.

ఆత్మయే ఇదంతా।

ఇప్పుడు మనము ‘‘ఆత్మ’’పై ఆదేశము (Attribution) చేసి చెప్పుకుందాము.
- ఆత్మయే క్రింద, పైన, ఆవల, ఈవల, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము యందు నిండి ఉన్నది. ఆత్మయే నిండుకుండలో అంతటా నీరువలె, పాలలో సర్వత్రా వెన్నవలె ఏర్పడి ఉన్నది.
- ఆత్మ ఏవ ఇదం సర్వమితి। ఈ కనబడేదంతా ఆత్మయే।

ఎవ్వడైతే ఆత్మను ఈ విధంగా సర్వత్రా విస్తరించియున్నట్లు , సర్వులలో బాహ్య-అభ్యంతరములలో ప్రదర్శనమగుచున్నట్లు తెలుసుకోవటము, మననము చేయటము నిర్వర్తిస్తూ ఉంటాడో అట్టివాడే…

అట్టివాడు స్వరాట్ అయి ఇచ్ఛానుసారంగా సమస్త లోకములందు యథేచ్ఛగా సంచారవంతుడై ఉండగలడు. అమృత లోకములలో ప్రవేశించగలడు.

యే అన్యథా అతో విదుః, అన్యరాజాన్ అస్తే, క్షయ్య లోకా భవన్తి। ఎవడు ఆత్మను ఒక బాహ్య దేవతగానో, అన్యలోక నివాసిగానో, ఎప్పటికో - ఎప్పటికో సిద్ధించవలసినట్టిదిగాను భావిస్తాడో (లేక) ఉపాసిస్తాడో…


16–7–26. సప్తమ అధ్యాయము - షట్‌వింశ ఖండము - ఫలశ్రుతి

ఎవ్వరైతే ‘ఈ సమస్త లోక - లోకాంతరములుగా లోకాంతర్గత సర్వ - స్థావర జంగములుగా పాంచభౌతికముగా, అభౌతికముగా కనిపిస్తున్నదంతా ఆత్మానంద స్వరూపమే’’ - అని దర్శన - మనన - ఉపాసన - భావనలు చేస్తారో… ఎరిగి ఉంటారో…అట్టివారికి →

ఆత్మ తత్త్వము శ్రవణ మనన నిదిధ్యాసలచే ఎరిగి ఉన్నవాడు…దర్శించటము, అనుకోవటము, అనిపించటములను ఆశ్రయిస్తాడో - అట్టివాడు →

ఏకమాత్రుడై…,
- మూడు రూపములు (జాగ్రత్ స్వప్న సుషుప్తులు) దర్శించువాడై ఉండగలడు.
- (ఏకమే అయిన బ్రహ్మము) స్వకీయ మాయచే రెండు, మూడు, పది, వంద, వేయి, వేలాది అనేక రూపములుగా తానే తనలో కలిగియున్నవాడు అయి ఉండగలడు.

శాస్త్ర హృదయము

ఆహారశుద్ధిః : ముందు ఆహారము పరిశుద్ధముగా ఉండాలి (సాత్వికాహారము, న్యాయార్జితాహారము, దైవార్పితాహారము, మితాహారము) ఆహారశుద్ధి = శబ్దాది విషయ శుద్ధి।

ఆహారశుద్ధే సత్త్వశుద్ధిః : ఆహార శుద్ధిచే సత్త్వశుద్ధి (అంతఃకరణ శుద్ధి) సిద్ధించగలదు.

సత్త్వ శుద్ధే ధ్రువా స్మృతిః : అంతఃకరణ శుద్ధిచే స్మృతి చాంచల్యము త్యజించి ధృవము (Stronger, Pure) అగుచున్నది. జ్ఞాపకశక్తి సునిశితమౌతుంది. బుద్ధియందు ధృవత్వము ఏర్పడగలదు. అనేక జన్మల బుద్ధిదోషములు, బుద్ధి చాంచల్యములు తొలగగలవు.

స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః : స్మృతియొక్క ధృవత్వముచే సృష్టి - స్థితి - లయముల పట్ల ఏర్పడియున్న అనేక విషయవాసనల - మనోసంబంధ పాశముల విమోచనము (ప్రమోక్షము = Relieving) జరుగగలదు.

అనేక జన్మలలో సంబంధములు కలిగియున్న కారణంగా నిర్మించుకొనియున్న కఠినీకృత భావనలతో ఏర్పడిన అవిద్యారూప అనర్థపాశములు తెగిపోగలవు.

⌘⌘⌘

కనుకనే నారదా! మీరు సర్వాత్మకమైన మీ కేవలాత్మయొక్క ఔన్నత్యము ఎరిగినవారవండి.

అట్టి ఆత్మయొక్క స్వకీయ స్వప్నమువంటి కల్పిత చమత్కారముగా ఈ జగత్తులను, జన్మకర్మలను, సంబంధ-బాంధవ్యములను వీక్షించండి.

సమస్తము మీ స్వరూపమేనని, సమస్తమునకు వేరు కూడా అయి ఉన్నారని మీ సహజస్వరూపమును దర్శించుచూ,
- సర్వాత్మకులై,
- సర్వతత్త్వస్వరూపులై,
- ప్రకృతి - పురుషుల సమాగమ చమత్కారమును సాక్షిగా వీక్షించుచు,
- సర్వలోకములు మీయందే ఉన్నట్లు గ్రహించినవారై

14 లోకములలో లీలగా, క్రీడగా కామచారులై (ఇచ్ఛాపూర్వకంగా సంచారములు చేయువారై) విహరించండి.

⌘⌘⌘

ఈ విధంగా శాస్త్రముల హృదయమును సనత్కుమారుడు - వేద హృదయమేమిటో - యుక్తియుక్తంగా నారదమహర్షికి విశదీకరించి బోధించారు.

కషాయము వలన శారీరక రోగములైనట్టి పైత్య జఠర దోషములు పొట్టలో తొలగి, జీర్ణశక్తి వృద్ధియై తిన్న ఆహారము జీర్ణమయి రసరూపంగా శరర భాగములన్నిటికీ శక్తి చక్కగా అందగలదు కదా।

శ్రీ సనత్కుమార - నారద సంవాదము యొక్క శ్రవణ మననములచే మనోబుద్ధులలో పేరుకొనియున్న భవరోగము (జగత్తు నిజమే అను) సాంసారిక దోషములు ఆ విధంగా తొలగిపోగలవు. సమస్తము ఆత్మభావనయందు జీర్ణమైపోగలవు.
ఈ ఉపనిషత్ విశేషములు అజ్ఞానమును చీల్చివేయగలదు.

కాబట్టి జగద్గురువగు శ్రీ సనత్కుమారుడు స్కందుడు (చీల్చివేయగలవాడు) అని స్తుతించబడుచున్నారు. తం ‘స్కన్ద’ ఇతి ఆచక్షతే। తం ‘స్కన్ద’ ఇతి ఆచక్షతే।

ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్
సప్తమ (7వ) అధ్యాయః సమాప్తః ఇతి।
ఓం తత్ సత్ బ్రహ్మార్పణమస్తు।




<\td> <\td>

16–8.     ఛాందోగ్యోపనిషత్ - అధ్యయన వచన పుష్పము - అష్టమ అధ్యాయము


16–8–1. అష్టమ అధ్యాయము - ప్రథమ ఖండము - హృదయ పుండరీకము (పద్మము) - బ్రహ్మోపాసన

ఒక రాజుగారు ఉన్నారు. ఆయన రాజు కాబట్టి సమస్తమునకు అధికారి. ఆయన ముఖ్య పుర (పట్టణ) రాజాంతఃపురంలోను, రాజసభలోను వేంచేసినవారై ఉన్నారు. ఆ పట్టణములో అనేకమంది ప్రజలు, ఆయన అంతఃపురములో అనేకమంది సేవకులు ఉన్నారు. వారంతా రాజుగారిచ్చిన అధికారముతో రాజుయొక్క ఉద్దేశ్యములు, సంకల్పములు, ఆజ్ఞలు నిర్వర్తిస్తూ వారివారి విద్యుక్తధర్మములను నిర్వర్తిస్తూ ఉన్నారు. మంత్రులు సమాలోచనలు రాజుగారికి అందిస్తూ ఉన్నారు. సైన్యాధికారి రాజ్యపరిరక్షణ నిర్వర్తిస్తూ ఉన్నారు. బ్రహ్మాండముగా రాజ్యపాలన లీలగా జరుగుతోంది. రాజుగారి అధికారము ఆ రాజ్యములో ఎక్కడ ఉన్నది? సామ్రాజ్యమంతా విస్తరించి ఉన్నది.

ఇట్టి దృష్టాంతము సహాయముతో ఇప్పుడు గురుశిష్యుల మధ్య జరుగుచున్న హృత్ పుండరీక (పద్మ) - అంతరాకాశ - హృదయాంతఃపుర జగత్ కల్పనా - ‘‘ఆత్మ’’ యొక్క పరివేష్ఠిత్వము, మనోబుద్ధి చిత్త అహంకారముల సేవనములు శాస్త్రములచే బోధించబడుతోంది.

- - -

కొందరు శిష్యులు గురుదేవులవారిని ఆత్మజ్ఞాన భిక్షకై ఆశ్రయించారు.

- - -

శిష్యులు : గురుదేవా! బ్రహ్మపురము - అన్వేషణ అను విశేషముల గురించి మీ సవివరణను శ్రవణం చేయాలని ఉత్సుకత పొందుచున్నాము. దయతో వివరించ ప్రార్థన. మేము అన్వేషించవలసిన పరాకాష్ఠ వస్తువు ఏది?

గురుదేవుడు : పరబ్రహ్మ స్వరూపులగు ఓ విద్యాధ్యయునులారా! మీరు అడిగిన దానిగురించి వేదాంత విజ్ఞాన సంబంధమైన ఆర్య వచనములను దృష్టిలో పెట్టుకొని వివరించి చెపుతాను. శ్రద్ధగా వినండి.

- - -

దేహిచే ధారణ చేయబడుచున్న ఈ దేహములో ‘‘విశ్వానంద స్వరూపుడు, విశ్వగతుడు, విశ్వుడు, అవిశ్వుడు’’ అగు పరబ్రహ్మమూర్తి వేంచేసినవారై ఉన్నారు. అందుచేత ఇది ‘‘బ్రహ్మపురము’’ అని పిలువబడుతోంది.

అట్టి ఈ బ్రహ్మపురములో దహరము (హృదయము) అనే సూక్ష్మమగు ఆకాశ గృహము, ఆ దహరాకాశ గుహలో ఒక తెల్లటి పద్మము (పుండరీకము) (జ్ఞాన పుష్పము), ఆ పద్మములో మరెంతో సూక్ష్మమగు అంతరాకాశము, అట్టి అంతరాకాశములో గల దానిని మీరంతా చక్కగా పరిశోధించి తెలుసుకొని ఉపాసించండి. దానిపట్ల జిజ్ఞాసువులై ఉండండి. గురు ఆశ్రయము, శ్రవణ మననములు నిర్వర్తించండి.

శిష్యులు : గురుదేవా!
- ఈ (దేహ) బ్రహ్మపురమునందుగల సూక్ష్మమైనట్టి కమలాకార హృదయాకాశమును ఎట్లా గుర్తించాలి? అట్టి హృదయ పద్మములోగల అంతరాకాశమును మేము దర్శించేది ఎట్లా? అట్టి అంతరాకాశములో మేము దర్శించవలసినది దేని గురించి?

గురుదేవులు :

ఈ బాహ్యకాశము అంతుపొంతు లేనిదై కనిపిస్తోంది కదా! అట్లాగే హృదయములోని ఆకాశము కూడా అనంతమైనది. ఈ దృశ్య బ్రహ్మాండములో కనిపించే దేవతాలోకములు, భూమి (పృథివి) - ఉభయము ఈ అంతరాకాశములోనే సంవేద్యమై (Encompassed) ఉన్నాయి. అంతేకాదు! ఇక్కడ కనిపిస్తున్న అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు (తేజము), నక్షత్రములు, ఇంకా ఇక దృశ్యములో కంటికి - అనుభవానికి లభించనివి- మొదలైనవన్నీ హృదయాకాశములోనే సంస్థితమై ఉన్నాయి. సర్వజగత్తులు అట్టి హృదయాకాశమునందే కథలోని వర్ణనములు వలె, అద్దములో ప్రతిబింబములు వలె కల్పించబడి, ఉనికిని పొందుచున్నాయి.

శిష్యులు : గురువర్యా! ఆకాశమే ఉపాధి రహితం కదా! ఇక ‘బ్రహ్మపురము’ అనదగు ఈ శరీరములోని హృదయాకాశములోనే ఈ కనబడే సర్వభూతములు (జీవులు), వారివారి ఇచ్ఛలు (కామములు) మొదలైనవన్నీ ఏర్పడి ఉన్నట్లుగా గమనిస్తూ ఉపాసించవలసినదిగా మీరు ఆజ్ఞాపిస్తున్నారు.

ఇప్పుడు ఒక సందేహము.

అట్టి ఈ శరీరము ఒకప్పటికి వార్ధక్యదశ పొంది, ఆ తరువాత నశించి పోవటం జరుగుచున్నప్పుడు, అప్పుడు హృదయాకాశములోని లోకాలు, భూతజాలము మొదలైనవన్నీ ఏమౌతున్నాయి? అవి కూడా నశిస్తున్నాయా? దేహము నశించిన తరువాత ఇంకా కూడా ఏమేమి శేషిస్తున్నాయి?

కుండ పగిలినప్పుడు కుండలోని పాలు నేలపై పడి నశించిపోయినట్లు, దేహము నశించవచ్చు గాక। హృదయాకాశములోని అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు,విద్యుత్తు, నక్షత్రములు, లోకములు మొదలైనవి కూడా నేలపై పాలు కారినట్లు కారి నశిస్తాయా? అప్పటికీ హృదయంలో అంతటికీ భిన్నంగా ఏదైనా శేషిస్తున్నదా? అద్దానిగురించి వివరించండి.

గురుదేవుడు : ఆత్మ స్వరూపులగు తత్త్వాధ్యయనులారా! మీ ప్రశ్నకు సమాధానము సూక్ష్మ దృష్టితో వినండి.
ఆకాశములో ఏర్పడినవైయున్న వస్తువులు, నశించినప్పుడు (అనగా) అగ్ని ఆరిపోయినప్పుడు గాని, గాలి తొలగినప్పుడు గాని - ఆకాశము నశిస్తుందా? నశించదు కదా!

అట్లాగే - న అస్య జరయ ఏతత్ జీర్యతి? న వధేన అస్య హన్యత। దేహము యొక్క వార్ధక్యము చేతగాని, దేహము నశించటము చేతగాని హృదయాకాశము నశించదు. కలలో చూచిన జీవులకు, సమస్త వస్తుజాలమునకు ‘నశించటము’ అనే ధర్మము ఏముంటుంది? అవన్నీ మొదలే సత్యము కావు కదా! ఈ దేహము, అద్దాని జనన - మరణములు హృదయాకాశము దృష్ట్యా కలలో చూచిన సంగతి, సందర్భముల వంటివి మాత్రమే! మిథ్యయే! ఆత్మ వేరు. దేహము వేరు. దేహమునకు దెబ్బ తగిలితే, అది ఆత్మకు తగలదు.

‘‘బ్రహ్మపురము’’లో ప్రకాశమైయుంటున్న బ్రహ్మాకాశము (దహరాకాశము, హృదయాకాశము) ‘సత్యము’. ఇక ఈ దేహమో? కలలో కనబడిన వస్తువువంటిది. కాబట్టి సత్యము కాదు.

సమస్త కామములు (చూడాలని అభిలషించేవన్నీ) ‘బ్రహ్మము’ అని పిలువబడే ఆత్మయందే - దర్పణంలో దృశ్య పరంపరలవలె - సమాహితమై ఉన్నాయి. రాజు కోరినట్లు సభ ఉన్నట్లే - ‘ఆత్మ’ కోరుకున్నట్లే సమస్తము రూపము పొంది వర్తిస్తున్నాయి.

అట్టి ‘‘కేవలము, నిత్యము, సత్యము’’ అగు మనందరి అఖండాత్మ ఎట్టిది? ఎట్టిదో వినండి.

దేనియందు సమస్తము సమాహితమై (ఏర్పడినదై) ఉన్నదో, …అట్టి ఆత్మ -

అపహత పాప్మా : సమస్త దోషములు తొలగించుకోగా అనుభవమయ్యేది. ఎట్టి దోషములు అంట జాలనిది.
విజరో : జరామరణములు లేనట్టిది. వార్థక్యము, నశించటము అనుధర్మములచే స్పృశించబడనది.
విమృత్యో : శరీర ధర్మమైనట్టి ‘మృత్యువు’ అనునది ఆత్మకు (బ్రహ్మాకాశమునకు) లేదు.
విశోకో : ఇష్టమైనవి లభించినప్పుడు సంతోషించటము, అవి కోల్పోయినప్పుడు శోకించటము - ఇవన్నీ మనస్సు యొక్క ధర్మములు. ఆత్మ నిత్య ప్రకాశకము. అద్దానికి శోకించటము, ఆదుర్దాపడటము, వేదన చెందటము, విసుగుపడటము - మొదలైన ధర్మములు (Features) ఏమాత్రమూ లేవు. మానసిక సంతాపములు మనస్సుకు సంబంధించినవేగాని ఆత్మకు సంబంధించినవే కావు.
విజిఘత్సో అపిపాసః : ఆకలి - దప్పిక అను భౌతిక ధర్మములు లేనట్టిది. భోజనేచ్ఛ, పిపాసేచ్ఛలచే బద్ధము, పరిమితము కానట్టిది.
సత్యకామః : అది ఏది కోరుకొంటే అదే సత్యమౌతుంది. అది ఏది ఇష్టమని తలిస్తే అది అట్లే ఇష్టముగా అనుభూతమౌతుంది. ‘సత్యము’గా ప్రాముఖ్యత పొందగలదు.
సత్యసంకల్పః : అది దేనిని ఏదిగా (తుచ్ఛముగానో, అధికమనియో, జీవుడనో, ఈశ్వరుడనో, పరమాత్మ అనో) సంకల్పిస్తే - అది అట్లే సంకల్పితము అవుతుంది. ‘ఈ దృశ్యము సత్యమే’ అని సంకల్పిస్తే సత్యమనియే అనుభూతమవగలదు.

అట్టి ఆత్మ గురించియే తెలుసుకోవాలి సుమా! ఈ విశ్వ సభలో ఆత్మయే రాజాధిరాజు.

ఒకవేళ అట్టి ఆత్మను తెలుసుకోపోతేనో? ఏవిధంగా రాజు వద్ద తమ ఆయా విద్యుక్త ధర్మములు నిర్వర్తించే మంత్రి, సేనాని, సైనికుడు, సేవకులు, ద్వారపాలకులు మొదలైనవారంతా రాజాజ్ఞకు రాజశాసనమునకు లోబడి అస్వతంత్రులై కర్మలు నిర్వర్తించుచూ ఉంటారో - ఆ తీరుగా ఈ జీవుడు అస్వతంత్రుడై ఉంటాడేగాని ఆత్మ స్వాతంత్ర్యమును అనుభూతపరచుకోలేడు. (ఆత్మవాన్ ఏవ బలవాన్। ఆత్మవాన్ ఏవ జీవతి। ఆత్మవాన్ ఏవ సుఖవాన్। తస్మాత్ ఆత్మమయో భవ - యోగవాసిష్ఠము)

శిష్యులు : అయితే కర్మఫలములు ప్రయోజనములు ప్రసాదించేవి కావా? కర్మలచే ఉత్తమ లోకములు లభించవా? ‘సత్కర్మలు సుఖ లోకములను ప్రసాదించటము’ ఉంటుంది కదా!

గురువర్యులు : ఇహ కర్మలకు ఉత్తమ - అధమ లోక ప్రవేశముల ప్రయోజనము దృశ్యముపై దృఢమైన నమ్మకము ఉన్నంత వరకు ఉంటాయి. అయితే ఇక్కడే ఎవరైనా డబ్బు సంపాదించి, ఆ తరువాత ఖర్చు చేసివేస్తూ ఉంటే ఆ డబ్బు కరిగిపోతుంది కదా! అట్లాగే పుణ్యకర్మల వలన లభించిన పుణ్యలోకములు కూడా (సుఖమయ లోకములు కూడా) పుణ్యక్షయముచే ఆతనిపట్ల నశించగలవు.

అయితే ఆత్మజ్ఞానముచే పుణ్య - పాప లోకములు, కర్మలు, కర్మఫలములు స్వప్నములోని వస్తువువలె లేనివే అవుతాయి.

ఎవ్వరైతే ఆత్మ తత్త్వజ్ఞానము (ఆత్మయొక్క సత్యకామన జగత్కల్పనా చమత్కారములు) తెలుసుకోకుండానే పరలోకము (State of Post death) ప్రవేశిస్తారో, వారు కర్మఫలవశులై ఉంటారు. ‘‘యథేచ్ఛా గమనము, యథేచ్ఛా సంచారము (Wandering as they themselves like it) సిద్ధించుకోలేదు.

ద్వంద్వ మోహములు ఆత్మజ్ఞానికి ఆత్మతత్త్వానుభవము సిద్ధిస్తుండగా దీపము వెలిగిన తరువాత చీకట్లు వలె తొలగిపోతాయి.

ఎవరైతే ‘‘ఆత్మయొక్క సత్యకామ - సత్య సంకల్ప’’ విశేష లక్షణములు తెలుసుకొనినవారౌతారో అట్టివారు సర్వలోకములలో కామచారులై (యథేచ్ఛగా సంచరించగలుగువారై) ఉంటారు. సమస్త లోకములను తయమందు దర్శిస్తూ, సమస్త లోకములలో వారు కోరుకొన్న తీరుగా, కోరుకొన్నచోట స్థితి - స్థానములను లీలగా, క్రీడగా ఆస్వాదించగలరు.

కనుక బిడ్డలారా!
శాస్త్ర - గురు వాక్యముల పరమార్థమును శ్రవణం చేసి స్వతంత్రులు (Liberated, Independent) అయ్యెదరు గాక! అందుకు ఉపాయము ఆత్మజ్ఞానమే! (తరతి శోకమ్ ఆత్మవిత్)


16–8–2. అష్టమ అధ్యాయము - ద్వితీయ ఖండము - ఆత్మ ఇచ్ఛాలోక విహారి

ఆత్మయొక్క ‘‘సత్యకామ-సత్యసంకల్ప’’ తత్త్వములు ఎట్టివో ఎరిగినప్పుడు - అట్టివాడు స్వేచ్ఛావిహారుడై, సర్వలోకపూజ్యుడై వెలుగొందగలడు. సర్వత్రా ఆత్మను దర్శిస్తూ, సమస్తమునందు ఆత్మను ఉపాసించుచూ, ఆత్మయందే సమస్తము చూచువాడు సర్వశ్రేష్ఠుడై ఉంటాడు.

అట్టివాడు పితృలోకము కోరుకుంటే - జీవుల ఉత్పత్తికి కారణమై సుఖరూప హేతు భూతములైన పితృలోకములలో సంకల్పమాత్రంగా ప్రవేశించగలరు. శుద్ధచిత్త ప్రభావముచేత పితృలోక సంపన్నుడగుచూ, పితృలోకములో మహిమాన్వితుడై పూజింపబడగలడు.

ఆతడు మాతృలోకములో ప్రవేశము కోరుకొంటే - మాతృవాత్సల్యముతో నిండిన మాతృలోకమును సంకల్పమాత్రంగా ప్రవేశించి - సముత్తిష్ఠత (శ్రేష్ఠత్వము) పొందగలడు. మాతృలోక ప్రవేశ సంపన్నుడై, మాతృలోకములో గౌరించబడగలడు.

భ్రాతృలోక ప్రవేశము కోరుకుంటే - సంకల్పమాత్రంగా భ్రాతృలోకము (Zone of Brotherhood) ప్రవేశించి భ్రాతృగణములో ఒకడై ఉపస్థితుడు కాగలడు. భ్రాతృలోక సిద్ధి మహిమలను పొందగలడు.

ఒకవేళ సోదరీ (స్వప్న) లోకము ప్రవేశించ ఇచ్ఛగిస్తే - సంకల్పము చేతనే ‘సోదరీ’ లోకములో ప్రవేశించి, సోదరీలోక సంపన్నుడై గౌరవించబడగలడు. సోదరీ లోకములో పూజింపబడువాడు అవగలడు.

సర్వత్రా ‘‘స్వస్వరూత్మ’’ యొక్క విన్యాసముగా దర్శించు ఆతడు - ‘‘సఖీ (స్నేహితుల) లోక కాముడు’’ అయితే సంకల్పమాత్రం చేత సుఖాలతో సుసంపన్నుడై మహిమాన్వితుడు కాగలడు.

గంధమాల్యలోకము పట్ల ఇష్టుడైతే - సంకల్ప మాత్రంచేతనే గంధమాల్య లోకవాసుడై అక్కడ పూజనీయుడు కాగలడు.

అన్న - పాన సంబంధ లోక కాముడైతే - సంకల్పమాత్రంచేత అన్న పానములచే సముపత్తిష్ఠుడు అయి సుసంపన్నుడు పూజనీయుడు కాగలడు.

గీతావాద్య సంబంధ లోకమును ఆతడు కావాలని అనుకుంటే - గీతావాద్యముల ప్రాప్తిచే సంపన్నుడై, శ్రేష్ఠుడు కాగలడు.
ఆతడు స్త్రీలోక కాముడైతే - స్త్రీ లోకములో సంకల్పమాత్రంగా ప్రవేశించి, శ్రేష్ఠుడుగా పూజించబడగలడు.

ఆ సమస్తము ‘‘ఆత్మ’’గా ఎరుగుచు, దర్శించుచు ఆత్మయందు ప్రవేశము పొందినవాడు ఏఏ భోగములు వాంఛిస్తే అవన్నీ సంకల్పమాత్రం చేతనే ఆతనికి ప్రాప్తించగలవు.

ఆత్మజ్ఞాని స్వేచ్ఛావిహారి అయి లోకములలో సంచరించుచూనే సమస్త లోకములను (దర్పణంలో ప్రతిబింబమువలె) తనయందే దర్శించగలడు కూడా.


16–8–3. అష్టమ అధ్యాయము - తృతీయ ఖండము - ‘‘సత్యమును ఆవరించి ఉంటున్న అసత్యము’’

శిష్యులు : ఆత్మ సర్వస్వాతంత్ర్యమైనదని, ఈ జీవుడు స్వతఃగా ‘‘ఆత్మస్వరూపుడే’’ అని, ఆత్మయొక్క ఔన్నత్యము ఎరిగినప్పుడు, సంకల్పమాత్రముచే ఇష్టానుసారము సమస్త లోకములలో ప్రవేశము పొంది, ప్రతిష్ట కలిగియుండగలడని తమరు ప్రవచించుచున్నారు కదా! మరి ఈ జీవుడు ‘నేను స్వర్గలోకము చేరెదను గాక’’ అని అనుకున్నప్పటికీ ‘‘కర్మానుసారంగా భూ-పాతాళాది లోకములు చేరును’’ అని శాస్త్రములు ఎందుకు హెచ్చరిస్తున్నాయి?

ఈ జీవుని నడిపేది ఆతని ఇచ్ఛయా? లేక కర్మలా? కాక మరింకేదన్నానా? ఈ ప్రశ్నకు మరల సమాధానము ప్రసాదించండి.

గురుదేవుడు : ప్రియ ఆత్మ స్వరూపులారా! ముముక్షు శ్రేష్ఠులారా! ఈ జీవుడు స్వతఃగా ఆత్మస్వరూపుడే! ఆత్మయే సత్యము. ఇందులో సందేహము ఉండవలసిన పనిలేదు. ఇది వేద వాఙ్మయము వాక్కు కదా! అయితే మీరు చెప్పినట్లు ఈ జీవుడు సుఖమయ లోకాలు కావాలనుకొని కూడా దుష్టకర్మల ప్రభావంచేత ‘దుఃఖము-బంధము’ రాజ్యమేలు లోకాలకు రాకపోకలు కొనసాగిస్తున్నాడు. ఎందుచేతా? వినండి.

సత్యాః కామా అనృతా అపిధానాః।

ఈ జీవుని ‘‘సత్యకామము, సత్యసంకల్పము’’ ఈ రెండూ కూడా ‘‘అసత్యము, మిథ్య’’ అయిన విశేషాలతో కప్పబడుచున్నాయి. (అపిధానము అగుచున్నాయి. The Truth is being covered by false and merely illusionary perceptions).

‘‘సత్యము - యమ్ సత్ - ఎప్పటికీ ఉండేది అయి ఉంటుంది.

స్వస్వరూపము స్వతఃగా ఆనందరూపమే! కానీ అద్దానిపై…
- బంధుమిత్రుల గురించిన సంబంధ అనుబంధ బాంధవ్యములు
- ధన - భూ - గృహ - బంగారు - పశు సంపదలపట్ల ఉచ్ఛ - నీచ భావావేశములు,
- ఆశ-నిరాశ-భయ-ఆందోళనలు
మొదలైనవన్నీ దృశ్యముతో ఏర్పడుచున్న అవిచక్షణాపూర్వక సంబంధముల రూపం దాల్చి జన్మజన్మాంతరములుగా రూపుదిద్దుకొని ఉంటున్నాయి.

ఆత్మయొక్క వాస్తవానుభవమును, స్వస్వరూపముయొక్క నిత్యస్వాతంత్ర్యమును ఏమరిపింపజేయుచున్నాయి.

సత్యకామ-సత్యసంకల్పరూప ‘‘ఆత్మకామమే - ఆత్మ సంకల్పములే’’ సత్యము అని ప్రతి జీవునికి తెలిసి కూడా సందర్భమాత్రములు అగు అనృతములే (Falsehood) దృష్టిని (అభ్యాసవశంగా) ఆక్రమించుకొని ఉంటున్నాయి.

మిథ్యయగునది ఎప్పటికీ (సర్వవేళలో) మిథ్యయే అయి ఉన్నది. మిథ్య అయినది మరల ‘సత్యము’గా మారుతుందా? మారదు. కలయే సత్యము కదా! మరి ‘కలలో అదే చూడాలి. ఇది చూడనే కూడదు’’ అను రూపముగల సంకల్పములు అసత్య సంకల్పములు, అసత్యకామములు అగుచున్నాయి. అందుకే అవి సిద్ధించటము లేదు.

శిష్యులు : గురుదేవా ! ఈ తల్లి, తండ్రి, పుత్ర, పుత్రికా, మిత్ర, గృహ ఇత్యాది ఆశించు విషయాలన్నీ ఎదురుగా ఘనీభూతమై ప్రాప్తిస్తూ ఉండగా, అవి ‘అనృతము’ అనేది కుదురకున్నది కదా! ఇవి ‘నిజము కాదు’ అనేది ఎట్లా యుక్తి యుక్తం? అట్టి ఆశ మొదలైనవన్నీ అసత్య సంకల్ప - అసత్య కామములేనని మీ ఉద్దేశ్యమా?

గురుదేవుడు : యో యో హి అస్యేతః ప్రైతి, న తమ్ ఇహ దర్శనాయ లభతే।। ‘‘ఈ దృశ్యములో జీవులకు ఒకరితో ఒకరికి బంధు-మిత్ర-శత్రు-ప్రియ-అప్రియ-జాతి…ఇత్యాది పరస్పర సంబంధములు ఎంతవరకు శాశ్వతము?’’ - ఇది గమనించి జీవులచే నిత్య అనిత్యా వివేకము ఆశ్రయించబడుగాక। ఎందుకంటే ఈ ప్రాణియొక్క ఏ ఏ తల్లి-తండ్రి - తాత-ముత్తాత ఇత్యాది బంధువులున్నారో వారంతా కూడా వారి మరణానంతరము - ఆ ప్రాణి ఎంతగా కోరుకున్నా తిరిగి ఈ లోకములో లభించటమే లేదు కదా!
అయితే జీవించియున్న, మరణించియున్న ప్రియమైన బంధువుల జ్ఞాపకాలు మాత్రం హృదయమునందు ఈ ప్రాణి కలిగి ఉంటున్నాడు.

అనగా ఇక్కడి ప్రియానుభవములన్నిటికీ స్థానము హృదయమే।

అట్టి హృదయములో ఆత్మస్వరూప స్వభావములు నిత్యసత్యమై ఉన్నప్పటికీ, ‘‘సత్యకామ సత్య సంకల్ప ఆత్మ’’ను ఇహ సంబంధమైన జ్ఞాపకములు కప్పి ఉంచుచున్నాయి. సత్యమును అనృతము కప్పి ఉంచుతోంది. అదియే ‘మాయ’, ‘సంసారము’, భవబంధము - మొదలైన శబ్దములచే ఉద్దేశించబడుతోంది.

వాస్తవానికి ఈ జీవుడు (ప్రాణి) ఆత్మస్వరూపుడేనని చెప్పుకున్నాము కదా! కనుక ఆత్మ యొక్క మహదత్వము సత్యకామము, సత్యసంకల్పముల గురించి తెలియని జీవుడు (ప్రాణి) ఎవ్వడూ లేడు. (గాఢనిద్రలో నిర్విషయమగు ఆత్మ యొక్క సామీప్యము ప్రతి జీవునికి అనుభవమగుచున్నదే కూడా)। అయితే స్వప్న-జాగ్రత్తులలో తనను తాను ఏమరచుచూ లీలగానో, క్రీడగానో, ఏమరపుగానో-అసత్యకాముడు అసత్యసంకల్పుడు అయి సంచారములు చేస్తున్నాడు.

అందుకు ఒక దృష్టాంతము చెపుతాను, వినండి.

ఒక ధనికుడు ఉన్నాడు. ఆతడు తీర్థయాత్రలకు బయలుదేరబోతున్నాడు. దొంగల బాధను దృష్టిలో పెట్టుకొని తన తోటలో ఒకచోట భూమిని త్రవ్వి ‘రత్నములు, బంగారము’ మొదలైన వస్తువులను రహస్యంగా పాతిపెట్టి ఇక తీర్థయాత్రలకు బయలుదేరాడు. సుదీర్ఘకాలం తరువాత తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికొచ్చాడు. తాను నేలలో పాతిపెట్టి దాచి ఉంచిన ప్రదేశ స్థలమునకు వెళ్లాడు. అక్కడ గడ్డి మొక్కలు పెరగటంచేత ఏ స్థలములో పాతిపెట్టాడో గుర్తుపట్టలేక ‘‘ఎక్కడ త్రవ్వాలి’’…అనుకుంటూ అక్కడక్కడే తచ్చాడుతూ ఉండసాగుచున్నాడు. మధ్యమధ్యలో తాను దేనికి వెతుకుచున్నాడో అది మరచి ‘‘ఈ మొక్కలు ఏ జాతివి? ఈ పూలు ఎటువంటివి?- ఇటువంటి విషయాలు దీర్ఘకాలంగా పరిశీలించటం, పరిశోధించటం చేస్తున్నాడు.

అదే విధంగా ఈ జీవుడు తన ఆత్మస్వరూపమును దాచి, జన్మకర్మల చమత్కార రూపముగా దృశ్యపరంపరలలో ప్రవేశించి సుదీర్ఘ కాల గమనానంతరము తన హృదయమునందు దాచి ఉంచిన ఆత్మానుభవజ్ఞానమును తానే గుర్తించలేక రాత్రింబవళ్ళు వెతుకుచున్నాడు. కాని లభించటం లేదు.

ఈ జీవులంతా కూడా నిత్యము బ్రహ్మలోకమునకు (గాఢనిద్రా సమయంలో) వెళ్ళి వస్తూ ఉన్నప్పటికీ బ్రహ్మమును గుర్తించకపోవటము జరుగుతోంది. ఇమాః సర్వాః ప్రజాః అహరహః గచ్ఛన్త్య, ఏతం బ్రహ్మలోకం న విన్దన్తి।
ఎందుచేత?
అనృతే న హి ప్రత్యుఢాః। అసత్యము (అనృతము) చేత మోహితులై ఉన్నందువలననే తమ సత్య-నిత్య నిర్గుణ-నిరాకార-అప్రమేయ ఆత్మస్వరూపము యొక్క అనుభవమును ఆరూఢము (Fix up) చేసుకోలేక పోవుచున్నాడు.

సంప్రసాదుడు

శిష్యులు : స్వామీ! ఆత్మను ఎక్కడ దర్శించాలి? ఎట్లా దర్శించాలి?

గురుదేవుడు : ఈ విషయం మరల చెప్పుచున్నాను. వినండి.

అమృత స్వరూపమగు ఆత్మ మీలో ప్రతి ఒక్కరి యొక్క, నాయొక్క ప్రతి ప్రాణియొక్క హృదయముననే వేంచేసి ఉన్నది. ‘హృదయము’ అను శబ్దము నిరుక్త శాస్త్రానుసారము (శబ్దోత్పత్తి శాస్త్రానుసారము) ఈ విధంగా చెప్పబడుతోంది.

హ+ఋత్+ఇ = సత్యమగు ‘అహమ్’ రూపంగా
హృదయము = హృది (అంతరముననే) = (హృదయమునందే)
అయమ్ = ఏర్పడి ఉన్నదై ఉన్న ‘‘ఆత్మ’’

- సత్యమగు ఆత్మ అందరికి అంతరముననే ఉన్నది.
- అనగా తాను చూడలేకపోతున్న ఆత్మ తనయందే ఉన్నది.

తనయందే ఉన్న ఆత్మను తెలుసుకున్నవాడు ‘‘సంప్రసాదుడు’’ అని పిలువబడుచున్నాడు.

సంప్రసాదము = ‘‘దేహాత్మ భావము, దృశ్యాంతర్గతాత్మ భావము’’ - అనే ‘‘అజ్ఞానము’’ నుండి ఈవలికి వచ్చి ‘‘పరంజ్యోతి స్వరూపమగు ఆత్మ’’ను ఆశ్రయించి అట్టి ఆత్మతో మమైక్యమవటము.

ఈ జీవుడు తానే ఆత్మ అయి ఉన్నాడు. ‘‘జీవాత్మ’’ అనగా జీవుడుగా ఉన్న ఆత్మ। అంతేగాని ‘ఆత్మకు వేరైన జీవుడు’ అని కాదు సుమా!

అట్టి ‘‘ఆత్మ’’యే

అట్టి మన సహజ సత్ (Sense of Existence) అనునదే ‘‘యత్ - సత్’’ = సత్యము.

అదియే ఈ జీవునికి సంబంధించిన పరాకాష్ఠ సత్యము కాబట్టి ‘బ్రహ్మము’ అనబడుతోంది.

ఈ విధంగా ఈ జీవుడు సత్ - చిత్ - ఆనందస్వరూపమగు బ్రహ్మము - సత్యము - నిత్యము అయియే ఉన్నాడు.

- - -

ప్రియ శ్రోతలారా! బిడ్డలారా! ఇప్పుడు మనము ‘సత్యము’ అను శబ్దముయొక్క వ్యుత్పత్యార్థము నిరుక్తశాస్త్రార్థము (మరల) చెప్పుకుందాము.

‘‘సత్యమ్’’

‘‘స’’ ‘‘తీ’’ ‘‘యమ్’’ - అనునది ‘3’ నామాక్షరములు.
‘‘స’’ కారము: ఎప్పటికీ యథాతథమై ఉండేది. మృతము లేనిది. ‘అమృతము’
సత్ లో ‘త్’ = సద్ - ధాతువు → అమృతమునకు వాచకము.
‘‘తి’’ = (‘త’కారము) మర్త్యము ‘మార్పు’ అను ధర్మము కలిగి ఉన్నట్టిది.
‘‘యమ్’’ = ‘స’ కార అమృతమునకు - తకార ‘మర్త్యము’నకు రెండు అక్షరములను నియమనము (coincide) చేయునది కలుపునది.

సత్-యమ్= సత్యము
మర్త్-యమ్ = మర్త్యము - ‘యమ్’ చే ‘సత్యమ్’ అని పలుకువాడు ఆ రెండిటిని నియమనము (వశీభూతము) చేసుకొనగలడు.
యమ్ = నియమనము - నియమించువాడు.

‘నియమనము’ చేయువాడే - ‘‘ఎరిగినవాడు’’! తెలుసుకొనుచున్నవాడు।’’ ఏవమ్ ఏవ ‘విత్’।

ఈ విధంగా సత్యము, బ్రహ్మముల గురించి తెలుసుకొన్నవాడు దివ్యలోక ప్రవేశము, దివ్యత్వము సిద్ధించుకోగలడు.

అట్టి సత్యము, బ్రహ్మము తానే అయి సర్వత్రా ప్రకాశమానుడై ఉండగలడు. తాను ఆద్యంతరహితుడై తనయందు తానే సమస్త లోకముల రూపముగా వినోదిస్తూ విహరించగలడు.


16–8–4. అష్టమ అధ్యాయము - చతుర్థ ఖండము - ‘‘పరమాత్మ సేతువు వంటిది’’

శిష్యులు : గురుభగవాన్! ‘‘సేతురాత్మ’’, ‘‘ఆత్మైవహి సేతుః’’ - అని చెప్పుకోబడే ఆత్మతత్త్వ వివరణ సూత్రము తత్త్వశాస్త్రములో ప్రసిద్ధమైయున్నది కదా! అట్టి ‘ఆత్మ సేతువు వంటిది’ (Athma is like a bridge that connects two ends) గురించి వివరించమని మీకు వినతి! (సేతురాత్మ, సేతు మాధవ, సేతుశివ మొదలైన శబ్దముల అంతరార్థము చెప్పండి - అని శిష్యుల అభ్యర్థన).

గురుదేవుడు : ప్రియ బిడ్డలారా! మనము ఇప్పుడు ‘‘ఆత్మ ఏవ హి సేతుః’’ అను ఆధ్యాత్మిక విశేషము గురించి ప్రవచించుకుంటున్నాము. మీరంతా శ్రద్ధ, ఏకాగ్రతలతో వినండి.

జీవుడు ఎల్లప్పుడు
       ఒక ఆలోచన నుండి → మరొక ఆలోచనకు
       ఒక సందర్భమునుండి → మరొక సందర్భమునకు
       ఒక విషయజ్ఞానము నుండి → మరొక విషయ జ్ఞానమునకు
ప్రయాణీకునివలె అనుక్షణము ప్రయాణిస్తూనే ఉంటున్నాడు. బహుదూరపు బాటసారివలె దేహమునుండి దేహమునకు, లోకమునుండి లోకమునకు ప్రయాణములు సలుపుచున్నాడు.

ఆత్మ ఎక్కడున్నది?
       ఆలోచన - ఆలోచనల మధ్యగా
       సందర్భము - సందర్భము మధ్యగా
       విషయము - విషయము మధ్యగా
వారధివలె (సేతువువలె) ఏర్పడినదైయున్నదని ఆత్మ గురించిన గుర్తును విశ్లేషించు మహనీయులు మనకు చెప్పుచున్నారు. య ఆత్మ స సేతుః విధృతిః। ఇటు ఇహము - అటు పరము (నాటక పాత్ర - నటుడు)లను విశేషమైన ధృతితో (గట్టిగా) పట్టుకొని ఉన్నట్టిదే ‘ఆత్మ’. (నటుడు -నాటకంలోని పాత్రల మధ్యలో నిర్విషయమై ఏర్పడి ఉన్నదే ఉపాసనకై ఆత్మవస్తువు).

అట్టి ఆత్మను అతిక్రమించి ఎక్కడా ఏదీ లేదు.

కాలము, కాల విశేషములగు పగలు - రాత్రి మొదలైనవి ఆత్మకు ఈవలనే లోబడినవై ఉంటాయి. ఆత్మ కాలాతీతము, కాలమును కల్పించి నియమించునది కూడా!

జీవుడు అను ‘అనుభవి (The Experiencer)’ - (మరియు) అనుభవములు (Experiences) రెండిటినీ నియమించునది కూడా ఆత్మయే!

అట్టి ఆత్మను శారీరక ధర్మములైనట్టి జన్మ-జరా-మృత్యువులు, మనోధర్మములైనట్టి శోక-మోహములు, సుఖదుఃఖ కారణములైనట్టి పుణ్య-పాపములు కించిత్ కూడా సమీపించలేవు, స్పృశించలేవు.

ఈ జగత్తులో కనిపించే అనేకములైనట్టి జాతుల-వర్ణాశ్రమముల, క్రియల, కారకముల, కర్మఫలముల భేదములు ఆత్మచేతనే ‘ధారణ’ చేయబడుచున్నప్పటికీ ‘ఆత్మ’ను తాకజాలవు. అవన్నీ ఈశ్వరుడే ధరించి యుండటంచేత ‘‘ఈశ్వరుడే (ఆత్మయే) సేతువు’’గా చెప్పబడుతోంది.

ఎవ్వరైతే ఆత్మను లేక బ్రహ్మజ్ఞానమును ఉపాసిస్తాడో, అట్టివాడు సర్వపాప దోషముల నుండి నివృత్తుడై నిర్మలమగు ‘బ్రహ్మలోకము’ నందు ప్రవేశము పొందగలడు.

ఎవరి దృష్టిలో శరీరమే కల్పితమాత్రమో, అట్టివాని దృష్టి పుణ్య-పాప పరిధులనుండి దాటివేయక ఏం చేస్తుంది?

ఈ జీవుడు ‘ఆత్మజ్ఞానము’ చేతనే ‘ఆత్మ’ గురించి తెలుసుకొని, సేతు సహాయంగా అజ్ఞానము నుండి సుజ్ఞానమును చేరగలడు అట్టివాడు -
✳︎ అంధః సన్-న అంధో భవతి। గ్రుడ్డివాడైనప్పటికీ గ్రుడ్డివాడై ఉండడు.
✳︎ విద్ధః సన్-అవిద్ధో భవతి। శరీరముతో సంబంధము కలిగి ఉండి కూడా, శరీరముతో సంబంధమే లేనివాడై ఉంటాడు.
✳︎ ఉపతాపీ సన్ - అనుపతాపీ భవతి। - అనారోగ్యముచే బాధపడుతూ కూడా, బాధలు లేనివాడై ఉంటాడు. సంకటములు ఉన్నప్పుడు కూడా అవి లేనివాడై ఉంటాడు.

‘‘ఆత్మ’’ అనే సేతువును ధరించినవానికి చిమ్మచీకటి రాత్రి కూడా ‘‘పగలు’ (Day Time)తో సమానము అవుతుంది. ఎందుచేతనంటే- సూర్యున్ని చీకటి ఎట్లా తాకుతుంది? స్వయంప్రకాశకమగు బ్రహ్మమునందు చీకటి, దుఃఖము మొదలైనవి ఎట్లా ఉంటాయి?

శిష్యులు : అట్టి నిర్మలము, స్వయం ప్రకాశకము అగు బ్రహ్మలోకము ఎట్టివారికి లభిస్తుంది?

గురుదేవుడు : ఎవ్వరైతే ‘ఇదంతా బ్రహ్మమే’ అని ‘అనుకోవటము’ అనే ఆచరణ కలిగి ఉంటారో, అట్టి బ్రహ్మచర్యము (బ్రహ్మాచరణము) చేత బ్రహ్మలోకము వారికి తప్పక సిద్ధించగలదు.

అట్టి బ్రహ్మలోకము సిద్ధించుకున్నవాడు - తదితర స్వర్గ లోకములలో తన ఇచ్ఛానుసారంగా స్వేచ్ఛా విహారి కాగలడు. తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి। (ఇతి తథ్యమ్।)


16–8–5. అష్టమ అధ్యాయము - పంచమ ఖండము - ‘‘బ్రహ్మచర్యము’’ - అనగా ఏమి?

శిష్యులు : గురువర్యా! ‘బ్రహ్మచర్యము’ శబ్ద - అర్థ - అంతరార్థములు తెలుపండి.

గురుదేవుడు : యజ్ఞము - బ్రహ్మచర్యము (యద్యజ్ఞం ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ)

యజ్ఞము = యః జ్ఞమ్ = పరమాత్మను తెలుసుకోవటము
యో జ్ఞాతా - ఇతి యజ్ఞమ్।

చర్యము = చరించటము

బ్రహ్మచర్యము = బ్రహ్మము నందు ఆచరణము

ఈ విధంగా ఏది ‘యజ్ఞము’ అని చెప్పబడుతోందో - అది ‘‘బ్రహ్మచర్యమే’’ - అయి ఉన్నది. జ్ఞాని బ్రహ్మచర్యము (బ్రహ్మమును ఉపాసించటము) అను చర్యలచే ‘‘పరమాత్మ గురించిన ఎరుక’’ అను అర్థముగల యజ్ఞఫలము పొందుచున్నాడు.

ఇష్టము - బ్రహ్మచర్యము

‘‘ఇష్టము ’’ = యత్ ‘ఇష్టమ్’ ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ

ఇష్టము = ఉపనయనము మొదలైన సంస్కారములు జగత్తుకు విహిత కార్యక్రమములు. పూజించబడేవి, యజించబడేవి (ఉపాసించబడేవి). ‘‘ఇష్టము’’ అని చెప్పబడేవి కూడా బ్రహ్మచర్యమే అయి ఉన్నది. బ్రహ్మచర్యముచే బ్రహ్మమును పొందటమే కాబట్టి యజ్ఞము (ఈశ్వర పూజ) మొదలైన ‘ఇష్టము’లచే ‘ఆత్మప్రాప్తి’యే పొందుచున్నాము. ‘ఏషణ’ కారణంగానే ఇష్టము బ్రహ్మచర్యమే అవుతోంది.

సత్త్రాయణము - బ్రహ్మచర్యము - యత్సత్త్రాయణమ్ ఇతి బ్రహ్మచర్యమేవ। సత్త్రాయణము = సత్ (పరమాత్మతో) + త్రాయణము (రక్షణ పొందటము)
- సత్ ఆత్మనః త్రాణం విన్దతే।

‘పరమాత్మా! నేను అజ్ఞానిని। మీరు ఆర్తత్రాయణ పరాయణులు। దయతో రక్షించండి’’ - అని ప్రార్థనలు, గానములు, శరణాగతులు ‘‘బ్రహ్మము’’ యొక్క సిద్ధి కొరకే కాబట్టి సత్త్రాయణము బ్రహ్మచర్యమే.

మౌనము - బ్రహ్మచర్యము

యత్ ‘మౌనమ్’ ఇతి ఆచక్షతే, తత్ బ్రహ్మచర్యమేవ। ‘మౌనము’ అని దేనిని అంటున్నారో అది బ్రహ్మచర్యమే అయి ఉన్నది. ఎందుకంటే మౌనము అను శబ్దార్థములు రెండు ప్రక్రియలు కలిగి ఉన్నది.
(1) ప్రాపంచక విషయములు ‘‘మననము చేయకపోవటము’’
(2) పరమాత్మ గురించిన మననము కలిగి ఉండటము.

తత్ బ్రహ్మచర్యేణ హి ఏవ ఆత్మానమ్ అనువిద్య మనుతే। బ్రహ్మచర్య - మౌనములు రెండు. ఆత్మవిద్య యొక్క మననమే। కనుక మౌనము బ్రహ్మచర్యమే అయి ఉన్నది.

అనాశకాయనము - బ్రహ్మచర్యము - యదనాశకాయనమ్ ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ।

అశనము = ఆహారము తినటము.
అనాశకాయనము= ఆహారము స్వీకరించకుండా ఉండు ‘ఉపవాసము’. నష్టము పొందకుండటము.
ఉపవాసము = ఆత్మతో వసించటము.

బ్రహ్మచర్యముచే సిద్ధించే ఆత్మకు నాశనము లేదు. అనాశకాయనము - అట్టి నాశనరహితమగు ఆత్మకొరకే ‘అనశనము’. అందుచేత అనాశకాయ వ్రతములన్నీ బ్రహ్మచర్యమే. ఏకాదశి ఉపవాసము మొదలైనవన్నీ బ్రహ్మచర్యమే.

అరణ్యాయనము - బ్రహ్మచర్యము

(అథ) యత్ అరణ్యాయనమ్ ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ। ఏది ‘అరణ్యవాసము’ అనే ‘ఉపాసన’గా చెప్పబడుతోందో, అది కూడా బ్రహ్మచర్యమే.
🌹 అరణ్యము అనగా సన్న్యాసము.
🌹 సన్న్యాసము = సత్ న్యాసము (అసత్తును అసత్తుగా చూస్తూ, ‘సత్తు’ను ఆశ్రయించి ఉండటము)
ఈ సమస్తము బ్రహ్మమే।

అట్టి ఈ బ్రహ్మలోకము ‘3’ విభాగములు
(1) భూమి (2) అంతరిక్షము (3) ద్యులోకము
{(1) Zone of Matter (2) Zone of Thought / Feeling (3) Zone of Self అని కూడా ఇక్కడ మనము అనుకోవచ్చు.}

అట్టి ‘3’వది అగు బ్రహ్మలోకము
🌻 రెండు సముద్రములు (1) అర (2) ణ్య
🌻 ఆ రెండిటికీ ఆవల ద్యులోకము
🌻 ఆ మూడవదానిలో (ద్యులోకములో)

‘ఐరం మదీయ’ అనే సరోవరము.
- ఐర = అన్నము (ఇరా)। ఐరము,
మదీయ = నిండియున్నది
అన్నము = ఇంద్రియ విషయములు / హర్షములు కలిగించునది. మదము (సంతోషము కలుగజేయునవి)

అక్కడ ‘‘సోమరసము’’ అనే అశ్వత్థ వృక్షమున్న వనము, ‘అపరాజిత’ అనే బ్రహ్మపురము, ఆ బ్రహ్మపురములో హిరణ్యగర్భునిచే సంకల్పించబడిన ‘సభా మంటపము’.

ఎవ్వరైతే తమయొక్క ‘‘సమస్తము బ్రహ్మముగా దర్శించటము’’ అను అనునిత్యమగు బ్రహ్మచర్యవ్రత ఫలముగా ‘అర’, ‘ణ్య’ ములనే సముద్రములను దాటి బ్రహ్మలోకము ప్రవేశించి శాశ్వత బ్రహ్మలోక నివాసులౌతారో, అట్టివారు - ‘‘తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి।।’’ - సర్వలోకములలో స్వతంత్రులై ఇచ్ఛానుసారం సంచరించువారు కాగలరు. సమస్త లోకములు తమయందే దర్శించగలరు.


16–8–6. అష్టమ అధ్యాయము - షష్ఠి ఖండము - హృదయ నాడీ విస్తరణము

హృదయము నుండి (72000) సూక్ష్మనాడులు బయల్వెడలి శరీరమంతా ఒక మహావృక్షముయొక్క శాఖ - ఉపశాఖలవలె విస్తరించి ఉన్నాయి.

ఇవన్నీ పింగళ (గోరోజనము) వంటి రంగుగల రసముతో నిండి ఉంటున్నాయి.
ఆ నాడులన్నీ కూడా పింగళ, తెలుపు, నీల, పసుపు పచ్చని, ఎరుపు రంగుల రసము కలిగినవై ఉంటున్నాయి.
సూర్యకిరణములు ఏవిధంగా పింగళ, తెలుపు, నీల, పసుపుపచ్చని, ఎరుపు రంగులలో ఉంటాయో ఈ సూక్ష్మ నరములు కూడా అట్లే ఉంటున్నాయి. రంగుల రసమయమై ఉంటున్నాయి.

ఆదిత్యుని సంబంధముచేతనే నాడులలో అనున్యూతమైన ఆయా రంగులతో కూడిన రసము తమయందు కలిగియుండటము జరుగుతోంది.

నాడులలోని రసములు సప్తవర్ణములుగా ఎట్లా ఏర్పడుచున్నాయి? రసము → వాత, పిత్త, రక్తముల వేరువేరు మిశ్రమములు వలన.

పిత్తము అనే సూర్యతేజస్సు పరిపక్వమై (దట్టమై) కొంచము కఫముతో సంపక్కరమైనప్పుడు - ‘పిత్తము’ అనే సౌర తేజస్సు పింగళవర్ణం పొందుతోంది.

వాతముయొక్క ఆధిక్యతచేత కఫము యొక్క ఆధిక్యతచే - నీలవర్ణము, తెలుపు
కఫ-వాతములు సమపాళ్లలో కలిసనవె→తే - పీత (పసుపుపచ్చ) వర్ణము
రక్తము అధికంగా ప్రవేశించు నాడులలో - ఎరుపురంగు

ఇవన్నీ సూర్యునితో సంబంధము వలననే ఈ సప్తవర్ణముల రసములు ఏర్పడుచున్నాయి.

ఒక మహాపథము (Long Main Road - రాజమార్గము) కొన్నిచోట్ల కుడి, ఎడమల వైపుగా కూడా విస్తరించి, రెండు వేరువేరు గ్రామములకు (చోట్లకు) చేరుతూ ఉంటుంది కదా! అట్లాగే ఆదిత్య తత్త్వమగు తేజస్సు అటు సూర్యమండలములోను, ఇటు జీవుని శరీర మండలములోను ప్రవేశించి ఆయా వ్యాపారములు (Functions) నిర్వర్తిస్తున్నాయి.

ఆదిత్యస్య రశ్మయ ఉభౌలోకౌ గచ్ఛన్తి - ఇమంచ అముంచ।
అముష్మాత్ ఆదిత్యాత్ ప్రతాయన్తే తా ఆసు నాడీషు సృప్తా ఆభ్యో నాడీభ్యః ప్రతాయన్తే।
తే ఆముష్మిన్ ఆదిత్యే సృప్తాః।

సూర్యుని నుండి బహిర్గతమైన కిరణములు శరీర నాడులలో ప్రవేశిస్తున్నాయి.
నాడుల నుండి బహిర్గతమైన కిరణములు సూర్యమండలములో (సృప్తా) ప్రవేశిస్తున్నాయి.
పరము నుండి ఇహములోనికి, ఇహమునుండి పరములోనికి కిరణములు ప్రవేశించటము జరుగుచూ ఉన్నది.

సప్తకిరణములు పరమునుండి ఇహమునకు, ఇహము నుండి పరమునకు ప్రసరించటము -
జాగ్రత్ : జాగ్రత్‌లో ఉన్నప్పుడు ఈ జీవుని వృత్తులు దృశ్యములోనికి, దృశ్యమునుండి వృత్తులు జీవునిలోనికి ప్రసరిస్తున్నాయి. అట్టి వృత్తులు సప్తవిధములై ఉంటున్నాయి.
స్వప్నము : స్వప్నదశలో కూడా వృత్తులు జీవుని నుండి స్వప్నములోనికి, స్వప్నములో నుండి జీవునిలోనికి విస్తరిస్తూ ఉంటున్నాయి. (నిద్రపోయినప్పుడు రెండు అవస్థలు (1) స్వప్న (2) సుషుప్తి)
సుషుప్తి : మానవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ జీవుడు వృత్తులన్నీ ఉపసంహరించి నాడులలో ప్రవేశించి (సృప్తుడై) - వృత్తి రహితుడుగా ఉంటున్నాడు. అట్టి నివృత్తి (వృత్తి రహిత గాఢ నిద్రాస్థితిలో ఉన్నప్పుడు - తన్న కశ్చిన పాప్మా స్పృశతి। ఏ పాప (దోష) వృత్తులచేతను (లేక) దోష భావనలచేతను స్పృశించబడటము లేదు. ఎందుచేతనంటే - తేజసా హి తదా సంపన్నో భవతి। గాఢనిద్రా సమయంలో ఈ జీవుడు కేవలమగు ‘ఆత్మతేజో సంపన్నుడు’ అయి ఉంటున్నాడు. ఆత్మతేజో వ్యాప్తుడై ఉంటున్నాడు. తనకు అన్యము లేనివాడై ఉంటున్నాడు.

నాడీమండలమునుండి ఆదిత్య మండల ప్రవేశము

ఈ జీవుడు దేహము ఉన్నంతవరకు శరీరమునుండి ఆదిత్యమండలమునకు, ఆదిత్యమండలము నుండి శరీరమునకు తేజోరూపంగా నాడుల ద్వారా నిత్యము ప్రయాణము చేస్తున్నాడు.
ఇది ఇహము నుండి → పరమునకు, పరము నుండి → ఇహమునకు చిత్తవృత్తుల ప్రయాణము కూడా. ఇదియే - సహజము నుండి → సందర్భములకు, సందర్భముల నుండి →సహజమునకు ప్రయాణము కూడా!
(ఆదిత్యుడు = జీవుని సహజరూపము; దేహము = జీవుని సందర్భ రూపము)

ఛాందోగ్య-ఉపనిషత్-సహజము-సందర్భము

ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు దేహ భావన ఉన్నంతవరకు ఆదిత్యాత్మ - జీవాత్మల మధ్య అవిశ్రాంత బాటసారివలె ప్రయాణిస్తూ ఉన్నాడు.

శిష్యులు : గురువర్యా! ఈ విధంగా ‘‘గాఢనిద్ర జాగ్రత్ స్వప్నములు సందర్భములలో, ఈ జీవుడు ‘‘నిర్వృత్తి’’ నుండి వృత్తులలోనికి, ‘‘వృత్తులలోనుండి- నిర్వృత్తికి చేయు ప్రయాణములే ఆదిత్యుని నుండి నాడులలోనికి, నాడులలో నుండి ఆదిత్య మండలమునకు నిత్య ప్రయాణము అని మేము అర్థము చేసుకుంటున్నాము.

గాఢనిద్రా సమయంలో ఆ ప్రయాణములు కట్టబెట్టి ఆత్మతేజస్సుయొక్క సామీప్యత పొందుచున్నాడని కూడా మీరు బోధిస్తున్నట్లు తెలుసుకుంటున్నాము. బాగానే ఉన్నది. మరి ఈ జీవుడు మరణించినప్పుడు ఏమి జరుగుతోంది?

గురుదేవుడు : చెపుతాను వినండి. యత్రైతత్ అబలిమానం నీతో భవతి : ఈ జీవుని భౌతికశరీరము దుర్బలమై, క్షీణిస్తూ ‘మరణము’ అను సంఘటనను సమీపిస్తున్నప్పుడు ‘మరణశయ్య’ (The Bed of Death)ను అవధరించాడు’’ అని అంటూ ఉంటారు.

ఆ విధంగా మరణశయ్యపై ఉన్నప్పుడు (మరణించటానికి సిద్ధమగుచున్నప్పుడు) - చుట్టూ ఆతని బంధువులు చేరి ‘‘తమభిత ఆసీనా ఆహుః - జానాసి మాం? జానాసి మాం? - ఇతి।’’ - ‘‘ఏమయ్యోయ్! నన్ను గుర్తుపడుచున్నావా? నన్ను గుర్తుపడుచున్నావా?’’ అని అడగటం లోకంలో జరుగుచూ ఉంటుంది కదా! అట్టి మరణ సమయంలో ఈ జీవుడు ఈ శరీరము నుండి ఉత్క్రమణము (vacate and get out) చేయనంతవరకు ఆయా పలకరించుచున్న బంధువులను గుర్తిస్తూ ‘‘ఆ“! తెలుసు! ఊ”! గుర్తుపడుతున్నాను’’! అన్నట్లుగా తల ఊపుతాడు. యావత్ అస్మాత్ శరీరాత్ అనుత్క్రాన్తో భవతి, తావత్ జానాతి।

- - -

అథ యత్రైతత్ అస్మాత్ శరీరాత్ ఉత్క్రామత్ అథ ఏతైరేవ రశ్మిభిః ఊర్ధ్వమ్ ఆక్రమతే। ఎప్పుడైతే ఈ శరీరము శిథిలమగుచూ, ఇక నివాసయోగ్యము కాకుండాపోతుందో, ఒకప్పుడు ఈ జీవుడు తన ప్రాణశక్తిని కూడగట్టుకొని శరీరమునుండి కిరణములలో ప్రవేశించి బయల్వెడలుచున్నాడు. అనగా శరీరము నుండి ‘ఊర్ధ్వగతి’ (Path upward / way out) ఆశ్రయిస్తున్నాడు.

దేహము వదిలి పెట్టినప్పటికీ మనస్సు (The Form of Thinking and Feeling) చావదు. అందుచేత - స ‘ఓం’ ఇతి వా హోద్వా మీయతే, స యావత్ క్షిప్యేత్ మనః, తావత్ - ఆదిత్యం గచ్ఛేత్।

‘ఓం’ అని ఆత్మను మననము చేయుచు, మనస్సు ఎంతవరకు విస్తరించి ఉంటుందో, అంతవరకు ప్రయాణించి - క్రమంగా ‘ఆదిత్య లోకము’ (The point where the concept of Bodies has been begining. The State where external Factor has been taking off) వరకు చేరుచున్నాడు.

ఈ విషయమే (నాడీ ప్రయాణ యోగమే) ఈ విధంగా వేదజ్ఞులచే, వేదోపనిషత్తులచే మరొక విధంగా గానము చేయబడుతోంది. (ఊర్ధ్వనాడీ అయనము)

‘‘శతం చ ఏకా (101)’’ హృదయస్య నాడ్యః।
హృదయస్థానము నుండి ‘101’ నాడులు బయల్వెడలి శరీరమంతా విస్తరించినవై ఉంటున్నాయి.

తాసాం మూర్ధానమ్ అభినిః సృత్ ‘ఏకా’ (1)
ఆ నాడులలో ఒక్కనాడి మాత్రమే (సుషుమ్న నాడి) శిరస్సు వైపుగా (ఊర్ధ్వముగా) పోవుచూ ఉన్నది.

‘తయో ఊర్ధ్వమ్’ అయన అమృతత్వమేతి।
ఆ ఊర్ధ్వమునకు పోవుచున్న ఒక నాడిలో ఎవరు ప్రయాణిస్తూ ఉన్నారో వారు మృత పరిధులను దాటి ‘అమృతత్త్వము’ పొందుచున్నారు. అమరత్వము వానికి సిద్ధిస్తోంది.

విష్వన్ అన్యా ఉత్క్రమణే భవన్తు ఉత్క్రమణే భవన్తి।
ఇక తక్కిన 100 నాడులలో ప్రయాణించువాడు ఉత్క్రమణము (ప్రయాణము) పొందుచూ మరల మరల ఆయా అనేక దిక్కులుగా ప్రయాణిస్తూ జనన-మరణ చక్రములో తిరుగాడుచూ ఉన్నాడు.


16–8–7. అష్టమ అధ్యాయము - సప్తమ ఖండము - ఆత్మతో అనుసంధానము ఎట్లా?

ఇంద్ర విరోచనుల యుద్ధము - ప్రజాపతి సందర్శనము

ఒకప్పుడు దేవతలకు దానవులకు ఆకాశంలో గొప్ప యుద్ధము ప్రారంభమైనది. ఆ యుద్ధము భీకరం కాసాగింది. మానవులు, తదితర లోకజనులు ఎంతో ‘అశాంతి’ పొందసాగారు. యుద్ధాలు జరుగుతుంటే ఎవ్వరికిమాత్రం ‘శాంతి’ లభిస్తుంది?

దేవతల నాయకుడు ఇంద్రుడు, అసురుల నాయకుడు విరోచనుడు (ప్రహ్లాదుని పుత్రుడు) ఇరువైపులా నాయకత్వం వహిస్తున్నారు.

ఆ విధంగా భయంకరంగా దేవ - దానవ యుద్ధం జరుగుచూ ఉండటము, లోకములన్నీ అల్లకల్లోలం అవటము సృష్టికర్తయగు ప్రజాపతి భగవానుడు గమనించారు.

అప్పుడు ‘అశరీర వాణి’తో ఈ విధంగా పలకసాగారు.
ఓ దేవ - దానవులారా?

ప్రజాపతియొక్క ‘అశరీరవాణి’ని అటు దేవతలు, ఇటు అసురులు విన్నారు. కొంతసేపు యుద్ధము విరమించి ‘అశరీర వాక్కు’ చెప్పిన పాఠ్యాంశము ఏమిటో ఎవరికివారే విశ్లేషణము చేసి అర్థం చేసుకోవటానికై ఇట్లా తలచారు.

మనము ఈ అశరీర వాక్కును విన్నాము కదా! దేనివలన మనము సమస్త కోరికలు తీరిన వారమై సమస్త లోకములు జయించిన వారమౌతామో, అద్దాని గురించి ప్రజాపతి అశరీరవాక్కు ద్వారా మనలను హెచ్చరించారు.
మనకు కావలసినది కూడా
(1) మనకు సమస్త లోకములపై ఆధిపత్యము
(2) మన కోరికలన్నీ తీరటము
- ఇదే కదా! కాబట్టి ప్రజాపతులవారు సూచిస్తున్న ఆత్మ గురించిన అన్వేషణను ‘అమృతసిద్ధి’ కొరకు యోచన చేద్దాము. తెలుసుకుందాము.

ఈ విధంగా ఇంద్రుని నాయకత్వములోని దేవతలు, విరోచనుని నాయకత్వములోని అసురులు అనుకొని వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. దేవతలు స్వర్గలోకము, అసురులు పాతాళలోకము చేరారు. వారి వారి లోకాలలో సమావేశము అయ్యారు.

వారి వారి సభలలో దేవతలు స్వర్గములోను, అసురులు పాతాళములోను విడివిడిగా ఈ విధంగా నిర్ణయములు చేసుకొన్నారు.

మనకు కావలసింది సమస్త లోకములపై ఆధిపత్యము, సుఖంగా ఉండటము - ఇవియే కదా! అశరీరవాణి సలహా ఇచ్చినట్లు మనము ఆత్మ గురించియే అన్వేషిద్దాము. కాని ఎట్లా? ఈ విషయము మనకు తెలియటము లేదు. అందుచేత మనము మన నాయకులను సత్యలోకం పంపించి, పరమాత్మ అగు ప్రజాపతి వద్ద సత్యకామ-సత్య సంకల్ప సమన్వితమగు ఆత్మ గురించి అన్వేషణ, ఆత్మసిద్ధి గురించి త్రోవ ఏమిటో తెలుసుకొందాము. ఆ తరువాత ఏమి చేయాలో ఆలోచిద్దాము.

ఈ విధంగా దేవదానవ ఉభయ సభలలో తమ తమ నాయకులైనట్టి ఇంద్ర విరోచనులను ప్రజాపతి వద్ద ‘ఆత్మాన్వేషణ గురించిన విద్య నేర్వటానికై పంపించ నిర్ణయించుకున్నారు.

అప్పటికప్పుడే ఇంద్ర-విరోచనలు ఒకరికి తెలియకుండా ఒకరు సత్యలోకము ప్రవేశించారు. అఖండానంద జ్యోతి స్వరూపులై వెలుగొందుచున్న సమస్త సృష్టి నిర్ణేత ప్రజాపతి నామాంకితులు అగు బ్రహ్మదేవులవారిని సమిత్పాణులై (చేతిలో యజ్ఞ సమిధలు ధరించినవారై) దర్శనం చేసుకొన్నారు. శ్రీ సరస్వతీ సమేతులై కోటి సూర్యుల కాంతితో వెలుగొందుచున్న ప్రజాపతికి త్రిప్రదక్షిణ - సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు.

ప్రజాపతి : ఇంద్ర-విరోచనులారా! దీర్ఘాయుష్మాం భవ। ఏమిటి ఇద్దరు ఇక్కడికి వచ్చారు? ఏమి మీ కోరిక?

ఇంద్ర - విరోచనులు : పితామహా! లోక కళ్యాణమూర్తీ! ప్రజాపతి భగవాన్! నమో నమో నమో నమః! కొన్ని కారణాల వలన దేవ - దానవులమగు మేము ఆకాశంలో ఒకరితో మరొకరము యుద్ధము చేస్తూ ఉండగా ‘‘సృష్టిని ఆస్వాదిస్తూ ఆనందించండి. ఆత్మకై అన్వేషించండి. అప్పుడు సత్యకామ సత్యసంకల్పులై సమస్త లోకములపై ఆధిపత్యము, ఆనందము పొందగలరు. యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు?’’ …అనే అశరీరవాణి యొక్క హెచ్చరిక వినిపించింది.

‘ఆత్మను అన్వేషించటమెట్లా?’ అనే విషయం మీవద్ద శ్రవణం చేసి తిరిగి రావాలని దేవ దానవ సభలలో నిర్ణయము చేయబడింది. అందుచేత ఆత్మ గురించిన అన్వేషణ ఎట్లా చేయాలో, ఆత్మ సాక్షాత్కారము పొంది లోకములపై ఆధిపత్యము ఎట్లా పొందాలో - అట్టి బోధకొరకై మిమ్ములను శరణువేడుచున్నాము.

శ్రీ ప్రజాపతి : ఓహో! అట్లాగా! చాలా సంతోషము. అయితే ఏదైనా సిద్ధించాలంటే, అందుకు ‘తపస్సు’ చేయవలసి ఉంటుందని మీకు తెలిసిన విషయమే కదా! అందుచేత మీరిద్దరు కలసి ఇక్కడ ఆశ్రమంలో బ్రహ్మచర్య వ్రతములో కూడిన తపస్సు నిర్వర్తించండి. యోగ సంసిద్ధులై రండి. అప్పుడు మీరు ఏమి తెలుసుకోదలచుకున్నారో అడగండి.

అప్పటికప్పుడే వారు తమ రాజా అలంకారములన్నీ ఒకచోట పెట్టి ముని కుమారుల రూపము దాల్చారు. ఒక ఆశ్రమము నిర్మించుకొని, ఆ ఇంద్ర విరోచనులు ఇద్దరు భక్తి-ప్రపత్తి-శ్రద్ధలతో కూడిన బ్రహ్మచర్య వ్రతరూపమగు తపస్సు ప్రారంభించారు. అప్పటినుండి 32 సంవత్సరములు తపస్సు చేశారు. వారి గడ్డాలు, మీసాలు పెరిగిపోయి, మునివర్యులవలె రూపములు దాల్చారు.

32 సంవత్సరములు గడచిన తరువాత ఒకరోజు ప్రజాపతి వారిద్దరిముందు ప్రత్యక్షమైనారు.

ప్రజాపతి : బిడ్డలారా! ఇంద్ర విరోచనులారా! మీ బ్రహ్మచర్య దీక్షకు సంతోషించాను. ఏమి వరము కావాలో కోరుకోండి.

ఇంద్ర విరోచనులు : భగవాన్! జీవులందరికీ త్రాణను ప్రసాదించు దేవాదిదేవా! ఏదైతే పాపదోషరహితమో, దేనికి జరామరణముల ప్రసక్తి ఉండదో, ఎద్దానియందు శోకము ఏమాత్రము కానరాదో - దుఃఖ రహితమో, దేనియందు ఆకలి దప్పికల ఊసు ఉండదో, ఏది సత్యకామమై సత్య సంకల్పమై వెలయుచున్నదో (ఏది పొందుటచే కోరుకొన్నదంతా సిద్ధించటము, సంకల్పించినది నెరవేరటము స్వాభావికమో) - అట్టి ఆత్మ గురించి మేము అన్వేషించదలచాము.

ఎవడు ఆత్మను అన్వేషించి తెలుసుకుంటాడో అట్టివాడు - విజిజ్ఞాసితవ్యః స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాన్ ఆప్నోతి - సర్వలోకములు జయిస్తాడు, సర్వకోరికలు నెరవేరినవౌతాయి’’ అని మీరు అశరీర స్వరముతో పలికినదంతా శిష్టజనులు చెప్పుచున్నారు. వేదములు కూడా ఎలుగెత్తి గానం చేస్తున్నాయి.

అట్టి ‘ఆత్మాన్వేషణ’ గురించి తెలుసుకోవటానికై తమరి దర్శన - ప్రవచనములకై ఎదురుచూస్తున్నాము. ఈ రోజు సుదినము. సృష్టికర్త అగు మీ దర్శనం మాకు అయింది. మాపై దయతో ఆత్మాన్వేషణ సాక్షాత్కార విధి గురించి బోధించండి.

ప్రజాపతి : (వారిద్దరు తపస్సుచే దోషములు పోగొట్టుకొని ఉంటారు. ఆత్మబోధకు అర్హులు - అని తలచి) సరే! ఇప్పుడు చెప్పుకుందాము వినండి.

య ఏషో అక్షిణి పురుషో దృశ్యత - ఏష ఆత్మేతి।
ఏ పురుషకారము ప్రదర్శించు పురుషుడైతే ఈ కనులలో కానవచ్చుచున్నారో, దర్శనమిస్తూ ఉన్నారో ఆ పురుషుడే అన్వేషించవలసినవారు.
ఆతడే ఆత్మ। అభయుడు। బ్రహ్మము। పరబ్రహ్మము। ఆయన యొక్క ఛాయయే ఈ దృశ్యమానమగుచున్న సమస్తము.

ఛాయా పురుషోపదేశము - నేత్రములలోని అంతర్గత పురుషుడే ఆత్మ

ఇంద్ర-విరోచనులు : ‘‘ఏ పురుషుడైతే కనులలో కనబడుచున్నాడో - ఆతడే ‘ఆత్మ’ - అని మీరు సెలవిస్తూ ఉన్నారు కదా! ఇప్పుడు మాదొక చిన్న సందేహము ఇది తీర్చండి!
(1) ఏ పురుషుడైతే జలములో అంతటా పరిఖ్యాతుడై (పరి = అన్నివైపులా; ఖ్యాతుడై = ప్రదర్శితుడై) ఉన్నారో - ఆ నీటిలో ప్రతిబింబించు పురుషుడు ఆత్మయా? (లేక)
(2) ఏది అద్దములో (దర్పణములో) ప్రతిబింబిస్తూ కనిపిస్తోందో - అది ఆత్మయా?
(అప్పుడు ప్రజాపతి ‘‘కళ్ళలో కనబడు పురుషుడు’’ బ్రహ్మమని నేను గుర్తు చేస్తూ ఉంటే, వీళ్లేమో నీళ్లలోను అద్దములోను కనిపించే ప్రతిబింబములలో ఏది ఆత్మ? - అని అడుగుచున్నారే? - అని తలచారు).

ప్రజాపతి : ఇంద్ర విరోచనులారా! నేను ‘‘నేత్రములలోని అంతర్గత పురుషుడే ఆత్మ’’ - అని ఎవరిని వర్ణించి చెప్పానో - ఆయన అన్నిట్లా, సర్వత్రా పరిఖ్యాతుడై (ప్రతీతుడై, సంప్రదర్శితుడై) ఉన్నారు సుమా! ఏవైష సర్వే పరిఖ్యాయత। (ఆత్మయే సమస్తమునందు కనబడుతోంది - అని ప్రజాపతి రహస్యార్థముగా సూచించారు).


16–8–8. అష్టమ అధ్యాయము - అష్టమ ఖండము - ఎవరైతే నీటి పాత్రలో కనబడుచున్నారో అదియే ‘‘ఆత్మ’’

ఇంద్ర విరోచనులు : పితామహా! ‘‘మీరు అన్నిట్లా సర్వత్రా కనిపిస్తున్నదే ఆత్మ’’ అని బోధిస్తున్నారు కదా! అనగా ‘‘అద్దములోను - జలములోను కనిపిస్తున్న ఇరువురూ ఆత్మయే’’ - అని అభిప్రాయం కదా?

ప్రజాపతి : (వారు ఇంకా ఆత్మయొక్క సమస్తమును గ్రహించక అద్దము(దర్పణము)లోనో, జలములోనో, మరి ఒకచోటో ఎక్కడో ఒకచోట ప్రతిబింబమగుచున్న దానిని మాత్రమే ఆత్మగా అనుకుంటున్నారని ప్రజాపతి గమనించారు. ‘‘వీళ్ళకు ముఖాముఖిగా, ప్రత్యక్షంగా, కించిత్ ప్రయోగాత్మకంగా (Like in a lab) చెప్పితే గాని గ్రహించలేరు’’ - అని తలచారు).

ఓ ఇంద్రపురుషులారా। నేను చెప్పు ఆత్మ గురించిన వచనములు మీరు పూర్ణార్థంగా గ్రహించినట్లు లేరు. సరే"! మీరిద్దరు ఆశ్రమంలోకి వెళ్లి ఒక విశాలపాత్రను ఏదైనా తీసుకురండి.

ఇంద్ర విరోచనులు : స్వామీ! ఆజ్ఞ! (అంటూ లోనికి వెళ్ళి పెద్ద మూకుడు వంటి పాత్రను తెచ్చి బ్రహ్మభగవానునికి ఎదురుగా ఉంచారు).

ప్రజాపతి : నిండుగా నీరు పోయండి.

ఇంద్ర విరోచనులు : భగవాన్! మీరు చెప్పినట్టే ఇదిగో నిండుగా జలము (నీరు) పోసాము.

ప్రజాపతి : మంచిది. ఇప్పుడు ఈ జలపాత్ర (ఉదశరావ, మూకుడు) యందు మీ మీ ముఖములు చూచుకొని, అప్పుడు రండి.

ఇంద్ర విరోచనులు : (తమను తాము జలములో శ్రద్ధగా చూచుకొని తిరిగివచ్చి) - పితామహా। మీరు చెప్పినట్లు మమ్ములను మేము జలపాత్రలో సవివరంగా చూచుకొని వచ్చాము.

ప్రజాపతి : చూచారు కదా! సరే! మీరు అడిగిన ఆత్మ గురించిన అన్వేషణను దృష్టిలో ఉంచుకొని - మీకు ఏమి కనిపిస్తూ ఉన్నదో ఇప్పుడు వివరించి చెప్పండి.

ఇంద్ర విరోచనులు : మేము మా మా ఈ రూపముల యొక్క కాలిగోళ్ళ నుండి - తలవెంట్రుకల వరకు (నఖ శిఖ పర్యంతరము) మా ప్రతిరూపమే (ప్రతిబింబరూపమే) మాకు కనిపించింది.

ప్రజాపతి : అంతమాత్రమేనా?

ఇంద్ర విరోచనులు : జలము - అందులో నఖశిఖ పర్యంతము ఈ పెరిగిన గడ్డము - మీసములతో కూడి ‘ముని రూప ప్రతిబంబములు’’ అగుపించాయి.

ప్రజాపతి : ఆహా! సరే! ఇతఃపూర్వ 32 సంవత్సరముల క్రితం ఇక్కడికి మీ దేవతల - అసురుల నాయక - అలంకారములతో వచ్చారు కదా! ఈ ముని వేషములు తొలగించుకొని, ఇదివరకటిలాగా చక్రవర్తి అలంకారాలన్నీ ధరించి రండి. వచ్చి ఆ పాత్రలోని జలములో మీ మీ రూపములు చూచుకోండి.

- - -

అప్పుడు ఇంద్ర విరోచనులిద్దరు తపస్సుకు సంబంధించిన వస్త్రములు, దీర్ఘ గడ్డములు, కేశములు త్యజించి, నాయకుల కిరీటము, పట్టు వస్త్రములు మొదలైనవన్నీ ధరించారు. తిరిగి పాత్రలోని జలములో తమ తమ రూపురేఖలన్నీ ప్రతిబింబరూపంగా చూచుకొని వచ్చి ప్రజాపతి ముందు నిలుచున్నారు.

ఇంద్ర విరోచనులు : పితామహా! ప్రజాపతీ! మేము మా మా ఆభరణములు, పట్టు వస్త్రములు మొదలైనవి ధరించి మీరు చెప్పినట్లు నీటిలో మా మా ప్రతిబింబములను పరిశీలనగా చూచుకొని, ఇదిగో - వచ్చాము. ఇప్పుడు ఆజ్ఞాపించండి.

ప్రజాపతి : ఇప్పుడు మీరు ఏమి చూచారు? ఆత్మాన్వేషణను దృష్టిలో పెట్టుకొని వివరించి చెప్పండి.

ఇంద్ర విరోచనులు : మా మా సాధు - అలంకృతమైన (As per our usual decorations) రాజవస్త్రములు ధరించిన, (మునివేషముల కంటే) పరిష్కృతము (Re-arranged) అయిన రూపములగు మా రూపములు జలములో ప్రతిబింబించటం మాకు కనిపించింది. మేము అలంకరించుకొన్న తీరుగానే మమ్ములను మేము నీటిలో చూచాము.

ప్రజాపతి : ‘‘ఏదైతే’’ - జలములో ప్రతిబింబిస్తూ ఉన్నదో ‘‘తత్బ్రహ్మ! అదియే బ్రహ్మము।’’
అదియే మీరు అన్వేషించి తెలుసుకోవలసిన ‘ఆత్మ’ అయి ఉన్నది! అదియే బ్రహ్మము, ఏదైతే ప్రతిబింబిస్తోందో అట్టి ఆత్మను తెలుసుకుంటే మీరు సర్వలోకములపై ఆధిపత్యము సంపాదించగలరు.

శాంతహృదయౌ ప్రవ్రజతుః। ఆ ఇంద్రవిరోచనులు ఇద్దరూ ‘‘ఆ"! తెలిసింది।’’ అని తలచుచూ శాంతహృదయులైనారు. ‘మేము ఆత్మ గురించి తెలుసుకొని కృతార్థులము అయినాము’’ - అని అనుకున్నారు. లేచి నిలబడి, ప్రజాపతికి హృదయపూర్వకంగా నమస్కరించారు. ఇక తమ తమ స్వస్థానములకు బయలుదేరారు.

ఆ ఇంద్ర విరోచనులిద్దరూ ఆ విధంగా ‘అర్థమైనది’ అని శాంతిని పొంది అక్కడి నుండి బయల్వెడలటము మౌనంగా చూస్తూ ప్రజాపతి ఏమీ అనలేదు. కానీ, వాళ్ళు వెళ్లగానే ఇట్లా అనుకోసాగారు.

ప్రజాపతి : (తనలో) అనుపలభ్యం ఆత్మానం అనువిద్య వ్రజతో వీళ్లిద్దరూ ‘ఆత్మజ్ఞానము గురించి పూర్తిగా పరిశీలించి తెలుసుకోకుండానే వెళ్లిపోవుచున్నారే? దేవత అయినా, అసురుడైనా సరే - నేను చెప్పినది సరిగా వివరము తెలుసుకోకుండా ‘‘ఇంతే బ్రహ్మజ్ఞానము’’ - అనుకున్నచో వారు పరాభవము (పర-అభవము = పరవస్తుజ్ఞానము చేతికి అందక పోవటము) పొందక తప్పదు కదా! ఎందుకంటే సరి అయిన అవగాహన లేకపోతే దేహాత్మ బుద్ధికి పరిమితులై పరిమితమైనదానిని ఆత్మగా జీవులు భావించటం జరుగగలదు.

- - -

విరోచనుడు అసురుల సభకు తిరిగివచ్చారు.

విరోచనుడు : ఓ అసురమిత్ర జనులారా! ‘‘జలములోగాని, అద్దములోగాని ‘‘ఏది ప్రతిబింబిస్తుందో’’ అదియే ఆత్మ’’ - అని ప్రజాపతులవారు బోధించారు. కాబట్టి ఏ మన రూపము ఈ జగద్దృశ్యములో ప్రతిబింబిస్తూ ఉన్నదో అదియే ఆత్మ. అందుచేత, జగత్తులో చరించే మన రూపములే మనము ఆత్మగా, పూజనీయముగా ఉపాసించాలి. సేవించతగినదిగా భావించాలి. ఈ విధంగా జగత్తులో కనిపించే మన ఈ రూపమును ఉపాసిస్తూ ఉంటే, మనము క్రమంగా సర్వలోకములపైన ఆధిపత్యము సంపాదించగలము. పూర్ణ సుఖము పొందగలము. దృశ్యములో కనిపించే మన రూపమునకు సమస్త ఉపాసనా కార్యక్రమములచే ఔన్నత్యము కల్పించటమే ఆత్మకొరకై చేయవలసిన అన్వేషణ.

మరల చెప్పుకుందాము :
(1) జీవుల ఆనంద విహారము కొరకే (like Amusement Park) ఈ జగత్తు ప్రజాపతి కల్పించారు.
(2) అట్టి జగత్తులో కనిపించే మన రూపమునకు ఔన్నత్యము కల్పించటమే ఆత్మాన్వేషణ.

అసురులంతా “అర్థమయింది! అట్లాగే ఆత్మాన్వేషణ, ఆత్మోపాసన చేద్దాము” అని నిర్ణయించుకొని వారివారి పనులలో నిమగ్నమైనారు.

- - -

అందుచేతనే ఈ లోకంలో దానము చేయనివానిని, వ్యష్ఠిగతాత్మ పారాయణమునకు పరిమితమై సర్వగతాత్మ గురించిన శ్రద్ధలేనివానిని, యజ్ఞార్థము కర్మలు నిర్వర్తించాలని తలచనివానిని ‘‘అరె"! ఈతడు ఆసురీస్వభావి! రాక్షసుడు!’’ - అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు. ‘‘తనకోసమే తాను బ్రతుకుతాడురా! ఏం ప్రయోజనం?’’ అని తలచుచూ ఉంటారు.

ఎవడు తనను తాను లోకములో గొప్పవానిగా గుర్తించబడాలని ఉపాసనలు మొదలైనవి నిర్వర్తిస్తూ ఉంటాడో, అట్టివాడు ఆసురీస్వభావుడే!

ఇదియే ‘‘దేహాత్మబుద్ధి’’ అని కూడా చెప్పబడుతోంది. కొందరు మరణించినవారి శరీరమునకు (శవమునకు) గంధ-పుష్ప-అన్న-భిక్ష ఇత్యాది అలంకారములతో మరణించిన వాని శరీరమును లోయలలో విడువటమో, ఖననము చేయటమో చేస్తూ ఉంటారు. ‘‘ఈతడు మనము చేసే భౌతికమైన అలంకారములు, వస్త్రములు, రుచికరమగు ఆహారములు, మణులు మొదలైనవి పరలోకంలో కూడా పొందగలడు’’ - అని మరణించినవాని గురించి భావిస్తూ ఉంటారు. ‘‘ఇది ఆసురోపనిషత్’’ అని ‘‘శరీర పరిమిత ఆత్మోపాసన’’ అని ఆత్మశాస్త్రజ్ఞులచే చెప్పుకోబడుతోంది. అట్టివారు ఆత్మయొక్క వాస్తవ తత్త్వమేమిటో గమనించటము లేదు.


16–8–9. అష్టమ అధ్యాయము - నవమ ఖండము - ప్రజాపతితో ఇంద్రుని పునఃసమాగమం

ఇంద్రుడు దేవలోక సభకు బయల్వెడలారు. కొంత దూరము వచ్చిన తరువాత విజ్ఞతకు సంబంధించి ఏదో భయము ఆయనలో తొనికిసలాడింది. దేవాన్ ఏతత్ భయం దదర్శ। అంతేగాని, ఆత్మజ్ఞానము ప్రసాదించే ‘అభయస్థితి’ ఆయనకు కానరాలేదు.

‘‘ఏదైతే’’ ఆ పాత్రలోని జలములో కనిపిస్తోందో అదియే ‘‘ఆత్మ’’ - అని పితామహులవారు అని ఉన్నారు. ఆయన బ్రహ్మజ్ఞానమునకు పరాకాష్ఠ. సమస్త సృష్టిని సృష్టించుచున్న మహాప్రజ్ఞావంతులు. వారు సూనృతమే (సత్యమే) చెప్పుతారుగాని అనృతము (అబద్ధము) చెప్పరే! అయితే వారు చెప్పిన వాక్యము నేను సరిగా అర్థము చేసుకొన్నానో లేదో అని నా అనుమానము.

నేను ముని రూపధారణలో ఉన్నప్పుడు జలములో ముని రూపమే కనిపించింది. ఇంద్రప్రస్థానమునకు అధిపతినగు నన్ను ఆభరణ-వస్త్రధారణలతో చూచినప్పుడు జలంలో సాలంకృతంగానే ప్రతిబింబిస్తూ కనిపించాను. మంచిబట్టలు ధరించినవాడు నీళ్లలో అట్లాగే కనిపిస్తాడు. గ్రుడ్డివాడు నీళ్లల్లో గ్రుడ్డివాడుగానే కనిపిస్తాడు. స్రామ (వంకరటింకర అంగములు కలవాడు) అట్లానే కనిపిస్తాడు. శరీరం నశించిపోయినప్పుడు జలంలో శరీరము కూడా నశించిపోతుంది.

నీటిలో కనిపించిన ప్రతిబింబము సత్యకామ, సత్యసంకల్ప ఆత్మ ఎట్లా అవుతుంది? ఆత్మ అమృతము, సర్వదా యథా తథము, అపహత పాప్మము, విజరము, విమృత్యువు, విశోకము కదా! కనుక నాకు తెలిసింది సరికాదు. దేవలోక సభలో నేను ప్రతిబింబమే ‘ఆత్మ’ అని పలికితే అనుమానము చాలామందికి వస్తుంది. అందుచేత తిరిగి పితామహులు ప్రజాపతివారినే మరల ఆశ్రయిస్తాను. ఈ విధంగా ఆలోచించి ఇంద్రుడు వెనుకకు తిరిగారు. ‘‘నేను యదార్థమేమిటో, సత్యమేమిటో గుర్తించలేదు. నాకు అర్థమైనది - నీటిలో ప్రతిబింబంగా కనిపించేది మాత్రం ఆత్మ అయి ఉండదు’’ - అని ఆలోచనలు చేస్తూ సమిత్పాణులై (చేతిలో యజ్ఞపరికరములు ధరించి) ప్రజాపతి ఆసీనులై ఉన్నచోటికి తిరిగివచ్చారు.

ప్రజాపతి : మఘువన్ (మేఘనాయకా)! ఏమిటి మళ్ళీ వచ్చావు? ఇంతకుముందే ‘ఆత్మ’ గురించిన (నేను చెప్పిన) వివరణను విని నీవు, విరోచనుడు కూడా సంతృప్తిపడి వెళ్లినారు కదా!

ఇంద్రుడు : అవును ప్రభూ! కానీ స్వర్గలోకమును సమీపిస్తూ ఉండగా, నేను మీ ఉద్దేశ్యమును సరిగా అర్థం చేసుకొని ఉండలేదని నాకు సందేహముతో కూడిన భయము కలిగింది?

ప్రజాపతి : ఏమా సందేహము?

ఇంద్రుడు : ఆత్మ ఎల్లప్పుడు అమృతము - మార్పుచేర్పులు లేనట్టిదికదా?

ప్రజాపతి : అవును. ‘‘విజరో। విమృత్యు। విశోకో। పరిణామ రహితము। సర్వదా ‘అస్తి’ ధర్మము కలిగియున్నట్టిది’’। - అనునది సశాస్త్రీయమే కదా.

ఇంద్రుడు : ‘‘ఏదైతే జలము, అద్దములలో ప్రతిబింబిస్తూ కనిపిస్తోందో - అదియే ఆత్మ (లేక) బ్రహ్మము’’ అని మీరు ప్రవచించారు కదా!

ప్రజాపతి : అవును. ‘ఏతత్ బ్రహ్మేతి’ అని చెప్పుకున్నాము కదా!

ఇంద్రుడు : జలములోని ప్రతిబింబము - నేను మునిరూపంగా ఉన్నప్పుడు మునిరూపంగాను, అలంకారములతో దేవతానాయకుడై ఉన్నప్పుడు అట్లాగే కనిపించాను. గ్రుడ్డివాడు నీటిలో చూస్తే గ్రుడ్డివాడుగాను, వంకరటింకరవాడు వంకరటింకరగాను కనిపిస్తారు. ప్రతిబింబించువాడు తొలగితే ప్రతిబింబము కూడా తొలగుతుంది. మరి ఆత్మ అమృతమై మార్పు చేర్పుల ధర్మం లేనిదై ఉండగా, ‘‘జలములో ఏది ప్రతిబింబిస్తుందో - అది ఆత్మ ఎట్లా అవుతుంది?’’. ‘ఆత్మ నిర్వికారము’ అని చెప్పబడుచుండగా, ‘‘వికారములుగల ప్రతిబింబము ఆత్మ’’ - అని మీరు అంటారని నేననుకోను. మీరు చెప్పినది ‘‘ఏది నీటిలో ప్రతిబింబిస్తోందో అదే ఆత్మ’’ - అన్న వాక్యములో ఏదో గూఢార్థం ఉండి ఉంటుంది. నేను ఆలోచించి కూడా అదేమో కనిపెట్టలేకపోయాను. అందుకని ‘ఆత్మాన్వేషణ’కై మరల బోధించ ప్రార్థన.

ప్రజాపతి : దేవేంద్రా! తే భూయో అనువాఖ్యాస్యామి. సరే"! ఆత్మాన్వేషణ గురించి మరల మరికొంతగా చెప్పుకుందాము. అయితే నీవు ‘‘ఆత్మతత్త్వము తెలుసుకోవాలి’’ అనే ఆశయ సిద్ధికొరకై మరల వెళ్లి 32 సంవత్సరముల కాలము తపస్సు చేయి.

ప్రజాపతి చెప్పిన విధంగా ఇంద్రుడు 32 సంవత్సరములు నియమ నిష్ఠలతో తపస్సు చేసి తిరిగి ప్రజాపతి సమక్షమునకు వచ్చారు.


16–8–10. అష్టమ అధ్యాయము - దశమ ఖండము - స్వప్నములో ఏదైతే విహారము చేస్తూ ఉన్నదో - అదే ‘ఆత్మ’.

ప్రజాపతి : మఘువన్! ఇంద్రదేవా! నీవు శ్రద్ధగా 32 సంవత్సరములు ‘ఆత్మ’ గురించి తెలుసుకోవటానికి తపస్సు చేసావు. సంతోషము. ఇప్పుడు ఆత్మ గురించి నీవు ఎక్కడ అన్వేషించాలో ఒక స్థానం చెపుతాను విను.

య ఏష స్వప్నే మహీయమానః చరతి, ఏష ఆత్మేతి!
ఏదైతే తనయొక్క మహిమచే (మహీయమానమై / మహత్మ్యము కలిగినదై స్వప్నములో సంచారములు చేస్తోందో, స్వప్న దృశ్యమును అనుభవిస్తోందో) - అది ఆత్మయే అయి ఉన్నది.

అది అమృతము, అభయము। ఏతత్ బ్రహ్మేతి। అది బ్రహ్మమే అయి ఉన్నది.

- - -

ప్రజాపతి యొక్క ‘ఆత్మవివరణ’ను శ్రద్ధగా విని ఇంద్రుడు కాసేపు మననం చేసారు. ‘‘ఆ! అవును! ఇప్పుడు ‘ఆత్మ’ గురించి అర్థమైనది’’ - అని శాంత హృదయుడైనారు. మరింకేమీ ప్రశ్నించలేదు. లేచి, ప్రజాపతికి కృతజ్ఞతలు తెలిపి, పాదాభివందనము చేసి అక్కడినుండి బయలుదేరారు. ఇంద్రోలోక సభకు చేరటానికి ప్రయాణించసాగారు. ‘‘ఇంద్ర సభలో దేవతలందరికీ ప్రజాపతి చెప్పిన ‘‘ఏష స్వప్నేతి మహిమానః చరతి - ఏష ఆత్మేతి’’ - అనునది ఉపన్యసించి చెప్పాలని అనుకుంటూ ఉండగా, దేవలోకము చేరకముందే, మరింకేదో సందేహము ఆయనలో బయలుదేరింది. ఆ సందేహము వలన ‘భయము’నే దర్శించారు గాని ‘అభయము’ను పొందలేకపోయారు. ఇట్లా ఆలోచించసాగారు. ‘‘ఏదైతే స్వప్నము ఆస్వాదించుచున్నదో అది ఆత్మ’’ అని కదా పితామహ వాక్యం.

అందుచేత ‘‘ఎవడు’’ స్వప్నములో పూజితుడై, ఆధిక్యము పొంది సంచరిస్తున్నాడో ఆతడే ‘‘ఆత్మ’’ - అనే బోధతో ‘ఆత్మబోధ’ వలన కలుగవలసిన శ్రేయస్సును నేను పొందలేకపోతున్నాను.

ఈ విధంగా తలచి ఆ ఇంద్రుడు వెనుకకు తిరిగి మరల ప్రజాపతిని దర్శించారు.

ఇంద్రుడు : పితామహా! ‘‘ఏష పురుషః స్వప్నే మహీయతే - ఎవడు స్వప్నములో పురుషుడుగా శ్రేష్ఠత్వము కలిగి ఉంటున్నాడో, ఆతడే ఆత్మ’’ - అనే బోధచే నేను ‘ఆత్మ’ గురించిన అన్వేషణ అవగాహన పూర్తి చేసుకొన్నానని అనిపించటము లేదు. భయము తొలగి అభయము సిద్ధించలేదు. అందుచేత మరల మీ నుండి ‘ఆత్మాన్వేషణ’ గురించి బోధించబడటానికై మీ సమక్షమును శరణువేడుచున్నాను.

ప్రజాపతి : అట్లాగా! ఇంకా కూడా ఆత్మయొక్క అమృతత్త్వము అభయత్వము నీకు సిద్ధించలేదన్న మాట. అవును. ఆ విషయం అటువంటిదేమరి! మరల 32 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మచర్య వ్రతము నిర్వర్తించి ఇటురా! అప్పుడు మరల వ్యాఖ్యానించుకుందాము.

ఇంద్రుడు మరల తపస్సు చేసి విద్యార్థి అయి తత్త్వ జ్ఞాన శ్రవణమునకై ప్రజాపతిని ఆశ్రయించారు.

ప్రజాపతి : మఘువన్। ఏమిటి విశేషము?

ఇంద్రుడు : ‘‘ఎవ్వడైతే స్వప్నములో పురుషుడో’’ అను మీ వ్యాఖ్యానముచే నాపట్ల ఆత్మాన్వేషణ గురించిన సందేహము తొలగలేదు. స్వామీ! మీరు ఆజ్ఞాపించినట్లు ‘32’ సంవత్సరములు తపస్సు చేసి మీ వ్యాఖ్యానము వినటానికై వచ్చాను.

ప్రజాపతి : అయితే విను।


16–8–11. అష్టమ అధ్యాయము - ఏకాదశ ఖండము - ‘సుషుప్తి పురుషుడు ఆత్మయే’

తత్ యత్ర ఏతత్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న వివిజానాతి ఏష ఆత్మేతి।

ఏదైతే సంపూర్ణమైన ప్రసన్నతతో సుషుప్తి (గాఢనిద్ర) పొందుచూ, స్వప్న దృశ్యము పొందకయే ఉంటోందో- అదియే ‘ఆత్మ’.

అట్టి ఆత్మ అమృతము, అభయము। అదియే ‘‘బ్రహ్మము’’ గా పిలువబడుతోంది.

ఇంద్రుడు అది విని ….‘‘నేను సమాధానము పొందాను’’ అని తలచినవాడై బ్రహ్మలోకమునుండి దేవసభకు బయల్వెడలారు. దేవతలను చేరకముందే మరల అనుమానముతో కూడిన భయము రాసాగింది. అభయము సిద్ధించనేలేదు.

నాహ ఖలు అయమేవం సంప్రతి ఆత్మానం జానాతి అయమహమస్మి। ఈ జీవుడు గాఢనిద్రాపరవశుడై ఉన్న సందర్భములో అట్టి గాఢనిద్రలో ఆ సుషుప్త్యాత్మము ‘‘నేను ఇట్టివాడను కదా!’’ - అనే తెలివియే (ఎరుకయే) ఉండటములేదు. ‘‘వారు అది - వీరు ఇది’’ అనునది కూడా గాఢనిద్రా పురుషునికి తెలిసినవై ఉండవు.

ఏ నిశ్చయము జ్ఞానము కూడా సుషుప్త పురుషునికి ఉండదు. అట్టి గాఢనిద్రలో ఉన్న జీవుడు మరణించినవానివలెనే ఉంటాడాయె। అందుచేత ‘‘సత్యకామ-సత్యసంకల్ప’’ అను ఆత్మయొక్క లక్షణములేమి ఉంటాయి?

ఈ విధంగా తలచినవాడై ఇంద్రుడు సమిత్పాణి అయి మరల ప్రజాపతి దర్శనము చేసుకున్నారు.

ప్రజాపతి : ఓ మఘవన్! నేను చెప్పినది విని శాంతమగు మనస్సుతో వెళ్లావు కదా! మరల వచ్చావేమిటి?

ఇంద్రుడు : భగవాన్। పితామహా। గురోత్తమ। ఆత్మ గురించిన విషయములో ‘నేను సుషుప్తి మాత్ర పురుషుడనే।’’ - అనేది నాకు తృప్తి కలగటము లేదు. గాఢనిద్రలో ఉన్నప్పుడు నన్ను నేను ‘ఇట్టివాడను’ అని తెలుసుకోలేను. ఇతర జీవులను తెలుసుకోలేను. అప్పుడు నేను వినాశనము పొందినవానివలె ఉంటానుగాని, ఆత్మను ఎరిగినవాడివలె ఉండను కదా! అందుచేత అభయము, అమృతము అగు శుభమును శోభను పొందలేకపోయాను. నాహం అత్ర భోగ్యం పశ్యామి। అందుకే మరల మిమ్ములను శరణువేడి మరికొంత వ్యాఖ్యానము వినగోరుచున్నాను.

ప్రజాపతి : ఏవమేవైష మఘువన్ ఇతి। మేఘనాథా! ఇంద్రదేవా! అది అంతే మరి! దీనికి వేరుగా ఎక్కడా ఏదీ లేదు కదా! ఏతంతు ఏవ తే భూయో అనువ్యాఖ్యాస్యామి। మరల నీకు వ్యాఖ్యానించి చెపుతాను. అయితే నీవు ‘‘5’’ సంవత్సరములు బ్రహ్మచర్యోపాసన చేసి రమ్ము.

ఇంద్రుడు అట్లాగే 5 సంవత్సరములు బ్రహ్మచర్యవ్రతము నిర్విర్తించారు. ఈవిధంగా 32+32+32+5 = 101 (బ్రహ్మమాన) సంవత్సరములు ఇంద్రుడు బ్రహ్మచర్యనిరతిలో తపస్సు చేసినవారైనారు.

తాని ఏకశతం సంపేదుః ఏతత్ అద్యత్ ఆహుః ఏకశతం హ వై వర్షాణి మఘవాన్ ప్రజాపతౌ బ్రహ్మచర్యమ్ ఉవాస!’

అందుకే - దేవేంద్రుడు సకలభోగములు విడచి బ్రహ్మజ్ఞానముకొరకై 101 సంవత్సరములు కఠోర తపస్సు చేసినట్లే - ఎన్ని కష్టములకైన సిద్ధపడి జీవుడు ఆత్మజ్ఞానము కొరకు ప్రయత్నించును గాక।


16–8–12. అష్టమ అధ్యాయము - ద్వాదశ ఖండము - అమృతము, అశరీరము అగు ఆత్మకు దేహము ఉపాధి

ప్రజాపతి : ఓ మఘవన్। 101 సంవత్సరములు ఇంద్ర వైభవములన్నీ విడచిపెట్టి కఠోరమగు బ్రహ్మచర్య వ్రతము నిర్వర్తించిన నీ బుద్ధి ఆత్మాన్వేషణకై అత్యంతకమైయున్నదని తలచుచున్నాను. ఇప్పుడిక మనము ‘ఆత్మ’ (లేక) ‘బ్రహ్మము’ గురించి సూటిగా మరికొన్ని ముఖ్యమైన విశేషాలు వ్యాఖ్యానించుకుందాము.

సమస్త జీవులు ‘‘శరీరము + శరీరి’’ అనే రెండు విశేషముల సమ్మేళనము అయి ఉన్నారు, శరీరి ఆత్మయొక్క చేతనా చమత్కారమే!

శరీరము : ఇది పాంచభౌతిక నిర్మితము. ఒకప్పుడు రూపుదిద్దుకొని, బాల్య యౌవన వార్ధక్యములు పొందుచూ, మరొకప్పుడు మరణించు స్వభావము కలిగియున్నది. మృత్యుగ్రస్తము (will be inevitably swallowed by Death).

ఆత్మ : మరణధర్మము లేనిది. అమృతస్వరూపము. అట్టి ఈ ఆత్మకు శరీరము అధిష్ఠానము (అనగా) ఇది ఆత్మకు ఉపాధి. ఆత్మచే ఉపయోగించబడుచున్న ఒక ఉపకరణ వస్తువు. భోగవస్తువు.

జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఆత్మయొక్క ‘3’ దశలైన స్వయంకృత - స్వయంకల్పిత అనుభవములు (The Zones of experiencing).

ఆత్మ దేహమునందు తన యొక్క ఒక అంశచే వేంచేసినదై ఉన్నది.

ఆత్మ స్వతః అనన్తము.

జీవుడు : మానవునికి ‘బట్ట’ (Wearing clothes) అనేది స్వరూపము కాదు, స్వభావము కాదు కదా। అట్లాగే ఆత్మకు స్వతఃగా ‘శరీరము’ అనేది స్వరూపము కాదు, స్వభావము కాదు. అయినా ఒకప్పుడు స్వకీయ లీలావినోదముగా శరీరమును ధారణ చేసి ‘శరీరి’ అని అనిపించుకొనుచున్నది.

‘‘నాకు శరీరముతో సంబంధము, పరిమితత్వము ఉన్నది’’ అని ఆత్మ తలచినపుడ ‘‘సశరీరి’’ అని (ఆత్మయే) చెప్పబడుతోంది.

‘‘నేను శరీరము కంటే సర్వదా వేరు. శరీరముయొక్క లక్షణములు అయినట్టి జన్మ, జరా, మరణములు ఆత్మగా నాకు లేవు’’ అని ఆత్మ తలచినప్పుడు ‘‘అశరీరి’’ అని (ఆత్మయే) పిలువబడుతోంది.

సశరీరము : శరీర సంబంధంచేత ‘జీవాత్మ’ అని పిలుస్తున్నారు. సశరీరభావముచే శరీరము దృష్ట్యా ఈ జీవునకు
‘‘- జన్మ మృత్యువులు
- ధర్మ - అధర్మములు; ప్రియ-అప్రియములు’’
ఏర్పడి ఉంటున్నాయి. ఎందుచేత? ఆత్మయే ఒక సందర్భముగా - ‘‘నేనే ఈ శరీరమును। ఈ శరీరమే నేను’’ - అనే భావనతో, స్వస్వరూపమగు కేవలాత్మ గురించిన జ్ఞానమును ఏమరువటము చేతనే దేహభావనతో తదాత్మ్యము చేతనే పాప-పుణ్యములు, ప్రియాప్రియములు, సుఖదుఃఖములు మొదలైన ద్వంద్వములు మోహరూపముగా వచ్చిపడుచున్నాయి (ఉన్నట్లు అనిపిస్తున్నాయి).
✤ దేహాత్మ బుద్ధి ఉన్నంతవరకు రాగద్వేషములు తొలగవు.
✤ అశరీరి అయిన ఆత్మకు పైన చెప్పిన ద్వంద్వములు లేవు.

ఎప్పుడైతే జీవుడు ‘దేహానుభవము’ నుండి నిదురలేచి, ‘‘అశరీరమునకు సంబంధించిన విజ్ఞానము’’ చేత తనయొక్క అవివేక జ్ఞానమునుండి నివృత్తుడౌతాడో, అప్పుడు -
- అట్టి జీవుడు ఆత్మ స్వరూపుడే అవుతాడు. అనగా తనను తాను సమస్తమునకు పరమైనట్టి ‘ఆత్మస్వరూపము’ గానే దర్శించుచూ, సమస్తమునకు వేరైనట్టి ‘తత్త్వ స్వరూపుడు’ అగుచున్నాడు.

ఇంద్రుడు : శరీరము లేకుంటే ఈ జీవునికి ఉనికి ఉంటుందా? ఉండదేమో కదా? ఆతడు శరీరము లేనప్పుడు ఏ కర్మ కూడా నిర్వర్తించలేడు కదా!

ప్రజాపతి : బిడ్డా! ఈ దేహికి ‘‘దేహము లేకుంటే నేను లేను’’ - అనేది ఐహికమైన (ఇహ సంబంధమైన) మోహము (Illusion) మాత్రమే.
- వాయువుకు శరీరము ఉన్నదా? లేదు. కానీ వాయువు (శరీరము లేకపోయినా) ఉన్నది. అనేక కార్యక్రమములు నిర్వర్తిస్తోంది.
- అట్లాగే మేఘమునకు శరీరము లేదు. ఆకాశము, విద్యుత్తు, పిడుగు వీటికి కూడా శరీరము లేదు. ఇవి అశరీరములే అయి కూడా ఆకాశములో ఆయా ప్రయోజనములు నిర్వర్తిస్తున్నాయి. ఆ తరువాత తమ పుట్టుక స్థానమగు ఆకాశమునందే లీనమగుచున్నాయి.

అట్లాగే ఆత్మాకాశమునుండి జనించిన జీవుడు నిరాకారుడే. అయితే సాకారము ధరించి ‘‘నేను ఈతని కుమారుడు. ఈమెకు పుట్టాను. ఇప్పుడు ముసలివాడను. ఇప్పుడు మరణిస్తూ ఉన్నాను’’ - మొదలైనవి పొందుచూ ఉన్నాడు. ఆత్మాకాశమునందే తాను జనించినా ఆత్మశరీరము (చిదాకాశము) గుర్తుకు రావటంలేదు. స్త్రీ-బంధు-ధన- ప్రతిష్ట వంటి వ్యవహారములతో రమిస్తూ ఆత్మయందు రమించకయే ఉంటున్నాడు. తన ’ధారణ’చే పట్టిన ఈ శరీరమునకు బద్ధుడై రోజులు గడపుచున్నాడు.
- ఒక బండికి గుర్రము (లేక) ఎద్దు కట్టబడతాయి చూచావా? అట్లాగే ‘ప్రాణము’ అనే విశ్వశక్తి ఈ శరీరమునందు కట్టబడి ఉన్నది.

ఈ జీవుడు పరంజ్యోతి స్వరూపుడే। అట్టి జ్యోతి యొక్క అనేక కిరణములు ఈ దేహములో ప్రవేశించినవై ఉంటున్నాయి. ళిసహస్ర శీర్ష సద్రూపా! శ్రీ సహస్ర శీర్‌షా పురుషా (సూర్యకిరణములు అనేకచోట్ల ప్రసరిస్తూ అనేక వస్తువులను వెలిగిస్తున్నట్లు)రి - పరాత్మయొక్క కిరణములే దేహములో అనేకచోట్ల ప్రసరిస్తూ అనేక కార్యక్రమములు నిర్వర్తిస్తున్నాయి.

ఆత్మ స్వరూపుడే అయి ఉన్న ఈ పరంజ్యోతి స్వరూప జీవునియొక్క -
✡︎ చూపుశక్తి (చూపు అనే కిరణము) - కళ్ళలో ప్రదర్శితమై, కళ్ళ నుండి దృశ్యానుభవముగా విస్తారితమౌతోంది. (Getting Extended) (దృశ్యేంద్రియము)
✡︎ గంధశక్తి (వాసనానుభవ కిరణము) - ముక్కులో ప్రదర్శితమై వాసనా రూపములుగా విస్తారితమౌతోంది (నాశికేంద్రియము.)
✡︎ మాట్లాడుశక్తి (మాట్లాడు కిరణము) - నోటిలో ప్రవేశించి అనేక శబ్ద - వాక్య పరంపరలుగా ప్రదర్శితమౌతోంది (వాగింద్రియము).
✡︎ వినికిడి శక్తి (వినికిడి కిరణము) - చెవులో ప్రవేశించి వినుచుండు సమస్తముగా శ్రవణ శబ్దరూపము దాల్చుచున్నది (శ్రవణేంద్రియము).

నేను చూస్తాను - ఇది చూస్తున్నాను!
నేను వాసన చూస్తున్నాను - ఇది ఇట్టి వాసన।
నేను మాట్లాడుచున్నాను - ఇవి నా మాటలు।
నేను వినుచున్నాను - ఇదంతా నా వినికిడి।

ఇదంతా కూడా జీవాత్మయే ఆ సమస్తముగా విస్తరించి ఆస్వాదిస్తున్నది.

స్వప్నములో ఒకడు చూస్తూ ఉన్నదంతా తాను కోరుకొనుచున్నదే కదా! అట్లాగే ఆత్మ పొందుచున్నదంతా తనను తాను ఇచ్ఛగించునదే! అందుకే ఆత్మ ‘సత్యకామ’, ‘సత్యసంకల్ప’ అయి ఉన్నది.
★ ఆత్మ ఒక్కటే సత్యము।
★ తదితరమంతా ఆత్మయొక్క స్వకీయ లీలా - క్రీడా వినోద చమత్కారమే।
★ ఇహ పరములందు ఆత్మయే సత్యము.
★ సముద్ర జలములో తరంగము బయల్వెడలి, సముద్ర జలంలో సంచరించి, తిరిగి సముద్ర జలమునందే లయమౌతోంది చూచావా! అట్లాగే ‘పరమాత్మ’ అనే మహాసముద్రంలో ‘జీవాత్మలు’ అనే తరంగములు బయల్వెడలుచున్నాయి. పరమాత్మయందే శబ్ద స్పర్శ రూప రస గంధములతో కూడి సమస్త అనుభవములు బయలుదేరి, ఆత్మయందే తిరిగి లయమొందుచున్నాయి.

సమస్తము సర్వదా ఆత్మయే అయి ఉన్నది. ఇదియే నేను గుర్తు చేసిన ఆత్మాన్వేషణ। ఆత్మదర్శనము।

ఓ ఇంద్రదేవా! ఇట్టి సర్వత్రా బ్రహ్మముయొక్క సందర్శనమే ‘బ్రహ్మలోక ప్రవేశము’గా శాస్త్రవర్ణితము.

అంతేగాని పంచభూతములు ప్రవర్తించే మరొక చోటేదో కానేకాదు.

అథ యో వేదేదం మన్వానీతి - స ఆత్మా। మననము చేయువాడు / (లేక) మనస్సు తనదైనవాడు ‘ఆత్మ’
ఏదైతే - ‘‘నేను మననము చేస్తున్నాను’’ - అని తెలుసుకొంటున్నదో - అదియే ఆత్మ - మననము చేయబడేది అద్దాని ఛాయయే।
- జలంలో చూచు నీవు ‘ఆత్మ’. జలంలో కనబడే నీ ప్రతిబింబము - ఆత్మయొక్క ఛాయ (కాబట్టి ఆత్మకు అనన్యమే)
- స్వప్నము నీదైన నీవు - ఆత్మ’ - స్వప్నములోని నీ ద్రష్టత్వము, స్వప్న దృశ్యానుభవములు - ‘ఛాయ’.
- సుషుప్తి నీదైన నీవు ‘ఆత్మ’ - సుషుప్తి యొక్క ఆయా విశేష లక్షణములు ‘ఛాయ’
❋ మననము చేయునది ‘ఆత్మ’।
❋ ఆ మననమును తెలుసుకొనుచూ ఉన్నది ‘ఆత్మ’।
❋ మనస్సు ఆత్మయొక్క దివ్య నేత్రము। మనో అస్య దివ్యంచక్షుః।
❋ ఆత్మ అట్టి ‘మనస్సు’ అనే దివ్య చక్షువుచే జగత్‌కల్పన చేసుకొని లీలగా, క్రీడగా, వినోదముగా సమస్తమును దర్శించుచున్నది. సమస్తమునందు రమించుచున్నది.

‘‘సమస్తము బ్రహ్మమే’’ అను అవలోకనమే బ్రహ్మలోకము.

- - -

అట్టి ఆత్మను దేవతలు ఉపాసించుచున్నారు. అందుచేతనే దేవతలకు సమస్త లోకములలో సమస్త భోగములు లభిస్తున్నాయి.
ఓ ఇంద్రదేవా! సమస్తము ఆత్మగా ఉపాసించువాడు సత్యకామ, సత్యసంకల్పుడై సమస్త లోకములలో స్వేచ్ఛావిహారి అగుచు లోకములన్నీ ఆత్మయందే (తనయందే) దర్శించగలడు.

- - -

ఈ విధంగా పూర్ణార్థపూర్వకంగా పలికిన ప్రజాపతి వాక్యములను ఇంద్రుడు శ్రద్ధగా శ్రవణం చేసారు. ఆత్మాన్వేషణ ఆత్మోపాసనల పరాకాష్ఠార్థము పొందినవారై ‘మోక్షభావులు’ అయ్యారు.


16–8–13. అష్టమ అధ్యాయము - త్రయోదశ ఖండము - శ్యామలా బ్రహ్మము - శబలా బ్రహ్మము

ఈ విధంగా సమాధానము పొందిన ఇంద్రుడు సంతృప్తుడై ప్రజాపతికి నమస్కరించి సెలవు తీసుకొన్నారు. స్వర్గలోకము వచ్చి ‘దేవతాసభను సమావేశపరచారు.

ఇంద్రుడు: ఓ దేవతలారా! నేను సర్వదా స్వయముగా బ్రహ్మమే అయి ఉన్నాను. కానీ శ్యామా - నీలలోహితమైన ‘స్వయంకృత కల్పన’ యందు ప్రవేశించి, స్వస్వరూపమును ఇంతకాలం ఏమరచాను. జగద్గురువగు ప్రజాపతిచే బోధించబడి అరణ్యమువలె సమస్తము తనయందు ఇముడ్చుకొన్నట్టి పరబ్రహ్మస్వరూపమునందు పునఃప్రవేశితుడను అగుచున్నాను.

ఇప్పుడు ‘‘నేను పూర్ణుడను’’ అని ఎరిగి మాయాశబలిత జగద్వ్యవహారమంతా ఆత్మస్వరూపుడగు నాకు అభిన్నమైనదిగా దర్శించుచున్నాను.
- గుర్రము తన వెంట్రుకలను విదిల్చి ధూళిని వదిలించుకొనురీతిగా
- రాహు గ్రహమునుండి విముక్తుడైన పూర్ణచంద్రునివలె
- మకిలి వదలగా తళతళమెరుస్తున్న పంచపాత్రవలె

‘‘దృశ్యము సత్యము, నిత్యము. దృశ్యము నన్ను బాధిస్తోంది. ఏదో చేస్తే ఎప్పటికో ఎట్లాగో ఎవ్వరో చేయి సాయమిస్తేగానీ నాకు దృశ్య (సంసార) బంధము ముడివీడదు’’…మొదలైన బద్దభావములనుండి విడివడుచున్నాను.

దృశ్యమును అధిగమించి ద్రష్టయొక్క కేవలీ తత్త్వమును గ్రహించుచూ కృతకృత్యుడనగుచున్నాను.

శ్యామాః శబలం ప్రపద్యే। (నీలము నుండి తీయబడిన నీల వర్ణము వలె) హృదయస్థ బ్రహ్మమునుండి ‘సమస్తము బ్రహ్మమే’’ అను శబలము (నిశ్చయము) పొందుచున్నాను.
శబలాః శ్యామం ప్రపద్యే। ‘‘సమస్తము బ్రహ్మమే’’ అనే బలముచే సర్వ హృదయాలలో బ్రహ్మము దర్శించుచున్నాము.
⌘ బ్రహ్మములోనే సమస్తము
⌘ సమస్తమునందు బ్రహ్మమును ఉపాసిస్తూ పొందవలసిన బ్రాహ్మీ స్వరూపమును సిద్ధించుకొనుచున్నాను.

మనస్సుచే బ్రహ్మమును దర్శిస్తూ బ్రహ్మమునందే మనస్సును దర్శిస్తూ బ్రహ్మీ స్వస్వరూపమును అమనిత్యముగా తీర్చిదిద్దుకుంటున్నాను.

ఓ దేవతలారా! మనందరము సమస్త లోకములను జయించి, సర్వాత్మస్వరూపులమై ఆనందించటానికి ఇది ఒక్కటే మనకు మార్గము.


16–8–14. అష్టమ అధ్యాయము - చతుర్దశ ఖండము - ఆత్మయే సమస్తము!

ఆకాశో వై నామరూపయోః నిర్వహితా। బ్రహ్మాకాశము (లేక) ఆత్మాకాశమే (లేక) హృదయాకాశమే (దహరాకాశము) (లేక) నిర్విషయ చిదాకాశమే - ఈ కనబడే నామరూపాత్మకమైన సమస్త జగత్తును నిర్వహించుచున్నది. వ్యక్తీకరణము చేయుచున్నది. ఇదంతా దర్పణములో (లేక) జలములో ప్రతిబింబమువలె ఆత్మయందే ఏర్పడినదై ఉన్నది.

తే యత్ అన్తరా తత్ ‘బ్రహ్మ’। తత్ అమృతమ్। ఈ సమస్త ఇంద్రియ విషయరూప జగత్తు ‘దేనియందైతే’ అంతరముగా (భావనామాత్రమై, కల్పనామాత్రమై) నామరూపాత్మకమై కనిపిస్తోందో - అదియే బ్రహ్మము। అట్టి బ్రహ్మమే అమృతము।

ఏ సృష్టికర్త ఇంద్ర దేవునికి, విరోచనునికి అట్టి ‘ఆత్మాన్వేషణ’, ‘ఆత్మోపాసన’ను అశరీరవాణి అయి వినిపిస్తూ మార్గదర్శనం చేయిస్తున్నారో, ….అట్టి ప్రజాపతికి హృదయపూర్వకంగా నమస్కరించుచున్నాము.

స ఆత్మా ప్రజాపతేః సభాం వేశ్మ ప్రపద్యే। ప్రజాపతియొక్క సభలో ప్రవేశించి అట్టి ‘ఆత్మ’ (లేక) బ్రహ్మమును ఉపాసించుచున్నాము.

అట్టి ‘‘సమస్తము ఆత్మయందే। ఆత్మయే సమస్తమునందు’’ అను స్వస్వరూపాత్మ ప్రబోధ - ధ్యాన - ఆరాధనలచే బ్రహ్మజ్ఞానులగు బ్రాహ్మణులయొక్క, అభ్యాస సామర్థ్య సంపన్నులగు క్షత్రియులయొక్క, కృష్ణ గోరక్షణ సంపన్నులగు వైశ్యుల యొక్క యశస్సు (యశోరూపమగు ఆత్మను) పొందియుండెదము గాక।

సమస్తము నేనైన నేను - యశస్సులకే యశస్సును। ఆత్మనగు నేను సర్వదా అఖండాత్మగానే ఉండి ఉన్నాను. ఉండి ఉంటాను. అంతేగాని దంతములు లేకుండానే ‘‘భక్షణ’’ చేయునట్టి రోహితమగు (కుంకుమ రంగు వంటి) ‘మాయ’ అనే గోతిలో మేము పడకుండెదముగాక! మాయయందు చరించము. ఆత్మయందే చరించెదము గాక।


16–8–15. అష్టమ అధ్యాయము - పంచదశ ఖండము - పరంపర - నియమ - ఫలశ్రుతులు

ఇట్టి ఆత్మ తత్త్వజ్ఞానమును (తమ్ ఆత్మయేవ - ఇతి జ్ఞానో)
★ సృష్టికర్తయగు బ్రహ్మ - సృష్ట్యభిమానియగు ప్రజాపతికి ఉపదేశించారు.
★ ప్రజాపతి మానవ సృష్టి నిర్మాత అగు ‘మనువు’కు బోధించారు.
★ ‘మనువు’ ప్రజలకు నేర్పారు.

ఎవ్వరైతే….
★ తమకు నియమితమైన కర్మలను ధర్మబుద్ధితో, సేవక భావనతో, పరమాత్మకు సమర్పిస్తూ నిర్వర్తిస్తూ ఉంటారో…,
★ గురుభక్తి కలిగి ఉంటారో,
★ వేదముల అంతరార్థమును అధ్యయనము చేస్తూ ఉంటారో,
★ సునిశితము, విశాలము, నిర్మలము, తితిక్షా సమన్వితము అగునట్లుగా స్వకీయ ప్రజ్ఞ-అవగాహనలను తీర్చిదిద్దుకుంటూ ఉంటారో,
★ సద్గురువుల సూచనానుసారం ఆశ్రమ ధర్మములను పాటిస్తూ, పరమాత్మకు సమర్పిస్తూ ఉంటారో…,
★ సంతానమును, ఆశ్రితజనులను అధ్యయన సంపన్నులుగా తీర్చిదిద్దుతూ ఉంటారో,
★ శాస్త్ర విహితమైన సాధన సంపత్తిని పెంపొందించుకుంటూ ఉంటారో,
★ అహింసావ్రతులై, జీవితమును భగవత్ - ప్రసాదముగా భావిస్తూ, జీవితము అనే సందర్భమును సద్వినియోగపరచుకుంటూ ఉంటారో…

అట్టివారు ఈ శరీరమున్నప్పుడే బ్రహ్మలోకము ప్రవేశించినవారై, (అనగా సర్వము బ్రహ్మముగా, ఆత్మగా చూడటం సిద్ధించినవారై) బ్రహ్మసాయుజ్యమును తప్పక పొందగలరు.

ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్
అష్టమ (8వ) అధ్యాయః సమాప్తః ఇతి।
ఓం తత్ సత్ బ్రహ్మార్పణమస్తు।

🌺🌹 ఇతి ఛాందోగ్యోపనిషత్ సమాప్తమ్ 🌹🌺

🦢 ఓం శాంతిః। శాంతిః। శాంతిః। 🦢


ఓం। ఆప్యాయన్తు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రమ్ అథో బలమ్ ఇన్ద్రియాణి చ సర్వాణి।
సర్వం బ్రహ్మౌపనిషదం। మా-హం బ్రహ్మనిరాకుర్యాం।
మామా బ్రహ్మ నిరాకరోత్। అనిరాకరణమస్తు। అనిరాకరణం మే-స్తు।
తత్ ‘ఆత్మ’ని నిరతే య ఉపనిషత్తు ధర్మాః తే మయిసన్తు। తే మయిసన్తు।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః ।।