గ్రంథము: శ్రీ వసిష్ఠ - రామ సంవాదము (Volume 1 of 4)
వచన అనువాద రచయత: శ్రీ యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (https://yhramakrishna.com)
ముద్రణ: రామకృష్ణ మఠం, హైదరాబాదు.
సంస్కృత మూల గ్రంథము: వాల్మీకి యోగవాసిష్ఠము
[1] వైరాగ్య, [2] ముముక్షు వ్యవహార, [3] ఉత్పత్తి, [4] స్థితి, [5] ఉపశమన, [6] నిర్వాణ ప్రకరణములు


Page number:67

రఘునాథాయ నాథాయా సీతాయాః పతయే నమః

శ్రీ వసిష్ఠ - రామ సంవాదము
[2.] ముముక్షు వ్యవహార ప్రకరణం


Page number:68

విషయ సూచిక :


Page number:69

మొదటి రోజు - ముముక్షు వ్యవహార ప్రకరణం

0.) పరిచయము

ఈ ప్రకరణం పాఠకుని సదాచారము వివేకపూర్వక విచారణలకు సిద్ధం చేస్తోంది.


Page number:70

1.) శ్రీ శుక విశ్రాంతి

శ్రీరామచంద్రుని వివేక, వైరాగ్య పూరితమైన వాక్యాలు సభలోని వారందరి హృదయాలు పులకింపచేశాయి. అనేక మంది సిద్ధులు, మునులు, ఆ సభలో ప్రవేశించారు. వారందరు ఉచితరీతిన సత్కరింపబడినవారై సభలో ఆశీనులయ్యారు. అంతటా మరల ప్రశాంత వాతావరణం అలముకొన్నది. శ్రీ విశ్వామిత్ర మహర్షి రాముని ఉద్దేశించి మధురస్వరంతో పలుకనారంభించారు.

శ్రీ విశ్వామిత్ర మహర్షి : ఓ రాఘవా! నీవు పరమ పవిత్రమైన సత్యమునే పలికావు. నీ సూక్ష్మబుద్ధిచే గ్రహించవలసినదంతా చక్కగా గ్రహించావు. వాస్తవానికి నీవు క్రొత్తగా ఎరుగవలసినదంటూ ఏదీ లేదు. అయితే, సహజ నిర్మలమగు నీ బుద్ధికి కొంచెము మెరుపు మాత్రం అవసరమై ఉన్నది. ఈ సందర్భంలో ఇతఃపూర్వపు ఒక సంఘటన నాకు గుర్తుకు వస్తోంది. శ్రీ వ్యాస మహర్షి కుమారుడు ’శుకుడు’ అనువాని విషయంలో ఇటువంటిదే… ఒకానొక సంఘటన జరిగింది. అతడు కూడా నీవలెనే తెలుసుకోవలసినదంతా తెలుసుకున్నప్పటికీ, జనక మహరాజుచే బోధింపబడిన తరువాతనే ఆత్మయందు విశ్రమించాడు. నీకు మొట్టమొదటగా, శుభదాయకమగు ఆ శుక మహర్షి వృత్తాంతం చెపుతాను విను.

ఓ రామచంద్రా! అటు చూడు. నీ తండ్రి సింహాసనం ప్రక్కనే, సూర్య తేజస్సుతో వెలుగుచు, ఆసీనుడై ఉన్న … ఆయనే, వ్యాసమహర్షి. ఆయన కుమారుడే శుకుడు. సౌందర్యరాశి వంటి ఆ శుకుడు జన్మతః మహాప్రాజ్ఞుడు. యువకుడగు అతడు ఒకప్పుడు ఒక ఏకాంత ప్రదేశం చేరాడు. ప్రశాంతచిత్తుడై, పద్మాసనము వైచుకొని, ఈ సంసారము యొక్క గతి గురించి, ఇందలి మాలిన్యము గురించి చింతించసాగాడు. అట్లు విమర్శనా పూర్వకంగా విచారించుచు ఉండగా కొంతకాలానికి అతని మనస్సునందు ఉత్తమోత్తమమైన ‘వివేకం’ ఉదయించింది. మహాబుద్ధిమంతుడు అగుటచే నిజబుద్ధి బలంచేత, చిరకాల విచారణచే అతడు అకృత్రిమము, సహజము, సుందరము, సత్యము అయిన “ఆత్మస్థితి యొక్క ఆనందానుభవం” గ్రహించాడు.

అట్లు తనంతట తానే సత్య వస్తువును ఎరిగినప్పటికీ అతని మనస్సు మాత్రం పూర్ణమగు శాంతిని పొందలేదు. “నేను గ్రహించినదే సత్యమా? జీవుడనగు నేను వస్తుతః పరిశుద్ధమగు పరమాత్మనే అయివున్నానా?” అనునట్టి కించిత్ శంక ఇంకా అతనిని వదలలేదు. ఫలితంగా సంసార దుఃఖం ఉండనే ఉన్నది. అతని సుస్థిర చిత్తము క్షణభంగురములగు సర్వ సంసార విషయముల నుండి విడివడింది. అనగా రంగం సిద్ధమైనది. కాని అతడు ఉత్తమ శాంతిని పొందవలసి ఉన్నది. అప్పుడాతడు ధ్యానము చాలించి, తండ్రియగు వ్యాసమహర్షిని సమీపించి, ప్రణామంచేసి ఇట్లు ప్రశ్నించాడు: "స్వతఃగా ఆత్మ స్వరూపుడనగు నాయందు ఈ సంసారాడంబరమంతా ఎట్లా ఉదయించింది? ‘సంసారము’ అని చెప్పబడుచున్నదంతా ఇంతకాలం కల్పించుచున్నవారెవరు?


Page number:71

ఈ ఉపాధియందున్న నేను అఖండుడనై నిత్యుడనై ఉన్నమాట వాస్తవమేనా? నాకున్న శంకను తొలగించండి.” ఆత్మజ్ఞానియగు వ్యాసుడు పుత్రుని ప్రశ్న విని నిర్మల భావంతో యథోచితంగా అనేక శాస్త్ర, లౌకిక యుక్తులతో జీవుని వాస్తవ స్వరూపము వివరించాడు. కాని, శుకుడు, “నా తండ్రి చెపుతున్న ఈ విశేషములన్నీ నేను ఇంతకు ముందే గ్రహించాను కదా!“ అని అనుకోసాగాడు. కుమారుడు తన వివరణ పట్ల నిరాదరణపూర్వకంగా ఉండటం గమనించి వ్యాసుడు, “నాయనా! శుకా! నేను గ్రహించియున్నదంతా చెప్పాను. నేను ఇంతకన్నా ఎక్కువ ఎరుగను. మిథిలానగర రాజు ‘జనకుడు’ అను అతడు నాకన్నా కూడా ఉత్తమమైన జ్ఞాని. నీవు వెళ్ళి ఆయనను శరణు వేడు. ఆయన వద్ద నీవు తెలుసుకొనదలచినది తెలుసుకోగలవు” అని చెప్పి మౌనం వహించారు. శుకదేవుడు తండ్రి పాదాలకు నమస్కరించి, సెలవు తీసుకొని, మిథిలానగరం బయలుదేరాడు.

ద్వారము వద్ద వచ్చి వేచియున్న శుకదేవుని, రాజాంతఃపురములోని ఒక ద్వార పాలకుడు గమనించాడు. వివరాలు తెలుసుకొని జనకమహారాజుకు నివేదించాడు. అప్పుడు జనకుడు ఒక్క క్షణం యోచించి, “సరే. వస్తే రానీ! ఇప్పుడు సమయం లేదు. అనేక రాచకార్యక్రమములలో ఉన్నాను” అని సేవకుణ్ణి పంపివేశాడు. ఏడు రోజులు గడచిపోయాయి. శుకుడు ద్వారం వద్దనే వేచియున్నాడు. అప్పుడు రాజు ఒక భటుని పిలచి "ఓయీ! నీవు పోయి ’శుకుడు’ అను ద్వారంవద్ద వేచియున్న మునికి బసకొరకు మన నగరంలోని ఏదైనా వసతి గృహం చూపించు. రాచకార్యముల వత్తిడి వలన మరొక వారం రోజుల వరకు రాజదర్శనం లభించదని చెప్పు” అని ఆజ్ఞాపించాడు. ఒక విశ్రాంతి గృహంలో ఆయనకు బస చూపించబడింది. మరొక ఏడు రోజులు గడచిపోయాయి. శుకుడు ఏమాత్రమూ ఉద్వేగంలేక అట్లే వేచియున్నాడు. వార్తాహరుల ద్వారా అంతా గ్రహించిన జనకుడు అతనిని మరికొంత పరీక్షించాలనుకొన్నాడు.

అప్పుడు అంతఃపురంలోని ఒక విలాసవంతమైన గదిలో శుకునకు బస ఏర్పాటు చేయబడింది. ఆకర్షణీయమైన పదార్థములు, భోజన పానములు అమర్చబడ్డాయి. మదమత్తులైన స్త్రీలు అతనిని సేవించుటకు నియోగించబడ్డారు. శుకుడు ఆ అంతఃపురంలో కూడా స్థిరచిత్తుడై, మౌనం వహించియున్నాడు. పిల్లగాలులు మఱి వృక్షపు కాండమును కదల్చగలవా? దుఃఖ స్వరూపములే అయివున్న అక్కడి భాగ్యవస్తువులు, సపర్యలు, వందిమాగధ వచనములు, సుందర స్త్రీల సరస - సల్లాపములు అతని మనస్సుకు ఏమాత్రం ఆకర్షితంగా అనిపించలేదు.

ఈ విధంగా ఇంకొక ఏడు రోజులు గడచిపోయాయి. శ్రీ శుకదేవుని చెక్కుచెదరని ప్రశాంత స్థితిని గురించి తెలుసుకొన్న జనకుడు చాలా సంతోషించాడు. స్వయముగా వెళ్ళి శుకదేవుని సభా మధ్యమునకు ఆహ్వానించి పూజించాడు.

శ్రీ జనక మహారాజు : ఓ శుకదేవా! ఇప్పుడు మీ స్వభావమేమిటో గ్రహించాను. నేను మహదానందం పొందాను. ఈ జగత్తులో ఉంటూనే జీవుడు ఏ విధంగా ప్రవర్తించటం ఉచితమో మీరు అట్లే ప్రవర్తించారు.


Page number:72

నాకు చాలా సంతోషంగా ఉన్నదయ్యా! ఇప్పుడు చెప్పండి. మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు?

శ్రీ శుకుడు : గురువర్యా! నన్నొక సందేహం పట్టి పీడిస్తోంది. ఈ జీవుడు ఎవరు? అఖండమగు పరమాత్మయే ఇతడై ఉంటే, మరి “నేను ఈ శరీర పరిమితుడను, నానుండి తదితరులు వేరైనవారు, నేను శ్రమించి మోక్షము పొందవలసి ఉన్నది" ఇటువంటి ఏకానేక రూపములైన చాంచల్యమంతా ఎట్లు ఎందుకు ప్రాప్తిస్తోంది?

అప్పుడు జనకుడు ఈ సంసారము యొక్క వాస్తవ - అవాస్తవముల గురించి పూసగుచ్చినట్లు అంతా వివరించాడు.

{ NOTE: మహా ఉపనిషత్ యందు జనక-శుక సంవాదము ఉన్నది. }

శ్రీ శుకుడు : హే మహావక్తా! మీరీ విషయములన్నీ ఉన్నది ఉన్నట్లు వివరించినందుకు కృతజ్ఞుడను. అయితే వివేక బలం చేత ఈ విషయాలన్నీ ఇదివరకే గ్రహించాను. (ఉపనిషత్తులు మొదలైన) శాస్త్రాలు ఈ విషయమే చెప్పుచున్నట్లు తెలుసుకొన్నాను. నా తండ్రి డా “నిస్సారమగు ఈ సంసారమంతా అజ్ఞానము నుండే వెలువడుచున్నది. అజ్ఞానము తొలగగా, ఈ జీవుడు స్వతహాగా నిత్యుడై, ఆనందమయుడై, పరమేశ్వరుడై ప్రకాశిస్తాడు" అని చెప్పియున్నారు.

మీరు చెప్పినట్లు “జీవుడు జ్ఞానముచే లేక అజ్ఞానము తొలగుటచే బ్రహ్మము అగును” అనే విషయం నాకర్థమగుచున్నది. కాని స్వామీ! "అజ్ఞానము తొలగుట” అనగా ఏమో నాకు సుస్పష్టమైనట్లు లేదు. “నాయందు అజ్ఞానము తొలగినది” అనుటకు గుర్తు ఏది? అట్టి స్థితి ఎప్పటికి లభిస్తుంది? నాకు అఖండత్వము యొక్క అనుభవం ఇంకను లభించలేదేమి? బ్రహ్మమే నేనైతే, మరి ఈ ’జీవుడను’ అనేది ఎందుకు నాపట్ల ఏర్పడి ఉన్నది?

శ్రీ జనకుడు : మునీశ్వరా! సత్యవస్తువగు బ్రహ్మమును మీరు స్వయముగానే స్వవిచారముచే సుస్పష్టంగా గ్రహించారు. ఆపై మీ తండ్రిగారివద్ద సవివరంగా విన్నారు. మీరు గ్రహించినదే బ్రహ్మతత్వము. ఇక మీరు తెలుసుకోవలసినదంటూ వేరే ఏమీ లేదు.

“బ్రహ్మతత్వము గ్రహించాను" అని మీరు నిరభ్యంతరంగా భావించవచ్చు. ఎందుకంటారా? మీ దృష్టిలో దృశ్య పదార్థజాలమంతా అవాస్తవము అయి ఉండుట చేతనే ఈ నగరంలో ఇరువది ఒక్క రోజులు నిర్లిప్తులై ఎట్టి వికారములకు లోను కాకుండా ఉన్నారు. సమృద్ధి - అసమృద్ధులు గాని, మానావమానములు గాని మిమ్ములను స్పృశించలేదు కదా! మీచే దృశ్యము త్యజించబడినట్లే అయినది.

ఈ విధంగా దృశ్యము తిరస్కరించబడగా, అప్పుడు శేషించు “శుద్ధము, అనిర్వచనీయము” అగు స్వస్వరూపమే పరబ్రహ్మముగా వేదజ్ఞులచే ప్రవచించబడినదని గ్రహించండి. ఓ మహర్షీ! అఖండ, నిత్యోదిత చైతన్య స్వరూపుడు, అద్వితీయుడు అగు ఆ ఆత్మ పురుషునికి ఒక్కనికే ఈ జగత్తునందు అస్థిత్వమున్నది. ఇక తక్కినవన్నీ కల్పనా మాత్రములే. అజ్ఞానయుతములగు సంస్కారముల వలననే “నేను, నీవు, పదార్థములు, శుద్ధబ్రహ్మము ఇవి వేరువేరు” అను భ్రమలు కలుగుచున్నాయి.


Page number:73

ఆ భావనలే క్రమక్రమంగా స్వస్వరూపమగు ఆత్మతత్త్వమును బంధింపబడిన దానివలె అగుపింపచేస్తున్నాయి. అట్టి బంధము యొక్క అనుభవము ఉన్న వానిని మనం ’జీవుడు’ అంటున్నాం. ఆ జీవుడు అజ్ఞానము నశించినపుడు ముక్తుడై స్వస్వరూపమగు ఆత్మగా శేషించుచున్నాడు. లేక, బ్రహ్మమే తానగుచున్నాడు.

మహాత్మా! మీరు ఈ భోగములపట్ల, ఈ సర్వదృశ్య వ్యవహారముల పట్ల, “ఇదంతా ఏమాత్రం సత్యము కాదు” అను సుస్థిరమైన బుద్ధి కలిగియున్నారని మీ ప్రవర్తనచే నిరూపించారు. “ఇక తేజోమయమగు ఆత్మనే నేను“ అని గ్రహించుటకు అడ్డేమున్నది చెప్పండి? ఎరుగవలసినది ఎరిగినప్పుడు మాత్రమే అకృత్రిమమగు ‘విరాగము’ ప్రకటితమౌతుంది. అట్లు నిస్సంగత్వం ప్రకటించి మీరు మహావీరులు అయ్యారు. శాస్త్రములచే బోధింపబడు అనేక విధి-విధానములు, వైదిక వ్యవహారములు జీవునకు అనాసక్త బుద్ధిని నేర్పుటకే ఉన్నాయి. అట్టి ’అనాసక్తిని మీరు ఇప్పటికే సాధించారు. ఇక మీకు చెప్పవలసినదిగాని, మీరు వినవలసినదిగాని లేదు. పరిపూర్ణత్వము పొందినవారియందు రాగద్వేషరాహిత్యము, దృశ్యము పట్ల అంతరంగమున నిర్లిప్తత సహజంగానే ప్రాప్తిస్తాయి. మీరు స్వయముగా మీ వివేకబలంచేత పూర్ణత్వం పొందియే ఉన్నారు. మీ తండ్రి, వేదవ్యాసులు కూడా సర్వజ్ఞాననిధి, మహాతపస్వి అయినప్పటికీ, మీవలె ఇంతటి పూర్ణానుభవం పొందియుండలేదు. నేను వ్యాసుని కంటే శ్రేష్ఠుడను. ఇక మీరో, భోగరాగములను ఉద్వేగ - అనుద్వేగములను పూర్తిగా త్యజించి ఉండుటచే నాకంటే కూడా అధికులు అయ్యారు. పొందవలసిన ఉత్తమ స్థితి పొందనే పొందారు. కనుక మీ మనోరథం సిద్ధించినట్లే. ఈ దృశ్య ప్రపంచమున, ముల్లోకములందు మిమ్ములను వివశులను చేయునది, బద్ధులను చేయునది అంటూ ఏదీ లేదు. కనుక మీరు ముక్తులే అయి ఉన్నారు. ఇక మీకు సందేహం దేనికి? ”ఇంతకు మించినది ఏదో ఉన్నది” అనే భ్రమను త్యజించండి. కట్టుకొయ్య త్రెంచుకొన్న ఆవువలె మీరు బంధ విముక్తులు అయ్యారు. ఇక మీకు ఎట్లు ఉచితమనిపిస్తే అట్లే సంచరించండి. ఆత్మ స్వరూపులు, ఆత్మ స్వభావులు అయివున్న మీకు నేను నమస్కరిస్తున్నాను.

శ్రీ విశ్వామిత్ర మహర్షి : ఓ రఘురామా! మహాత్ముడగు జనకుని ఈ ఉపదేశం విన్న ఆ శుకయోగి సర్వ శంకలను అక్కడికక్కడే త్యజించి వేశాడు. మలినరహితమగు ‘ఆత్మ’ అను పరమ వస్తువును అధిష్ఠించి విశ్రాంతి పొందాడు. శోకము, సంశయము, ఆయాసముల నుండి విడివడ్డాడు. జనకునకు ప్రణామంచేసి అక్కడి నుండి బయలుదేరాడు. ’సమాధి’ని అభ్యసించుటకు మేరు పర్వతం చేరాడు. అక్కడ నిర్వికల్పయోగంలో అనేక సంవత్సరములు గడిపాడు. అటు తరువాత తైలరహిత స్వయంజ్యోతివలె ‘ఆత్మ స్వభావము’ అను నిర్వాణస్థితి పొందాడు. సర్వ అజ్ఞాన సంస్కారములు తొలగిపోయాయి. సునిర్మల స్వరూపుడై, పరమపావనుడగు పరమాత్మయందు లీనమై విదేహముక్తుడైనాడు.


Page number:74

ఈ విధంగా వ్యాసపుత్రుడగు శుకదేవునకు కించిత్ ‘గుర్తుచేయుట’ అనే మార్జనం అవసరమైనది కదా! ఓ మునిశ్రేష్ఠులారా! మన ఈ రాముని విషయంలో కూడా ఇప్పుడు అట్టిదే అవసరమగుచున్నది. ఇతనికి కారణ రహితంగానే భోగములందు విరాగము పుట్టుటచే తన వివేకంచేత తెలుసుకోవలసినదంతా తెలుసుకొన్నాడు. భోగజాలము పట్ల అకృత్రిమమైన అరుచియే తత్త్వజ్ఞానిలో కనిపించే ఒక ముఖ్యమైన లక్షణం. ఈ సంసార బంధమంతా స్వతహాగా వాస్తవమైనది కాకపోయినప్పటికీ, “భోగచింతన చే ఇదంతా దృఢపడి ఈ జీవునికి ప్రాప్తిస్తోంది. “వాసనాభివృద్ధే (Increase of tendencies) బంధము. వాసనాక్షయమే మోక్షము" అని మనకు జ్ఞానులైన పెద్దలు చెప్పుచున్నారు.

మరొక్క విషయం. ఆత్మ విషయమై ఆపాత జ్ఞానం (temporary & partial knowledge) అల్పశ్రమతో కూడా కలుగవచ్చు. ఎవరో చెప్పగా వినినంత మాత్రంచేత కూడా (స్వల్పమైన ఆవేశరూపంలో) వైరాగ్యం పొందవచ్చును. కాని, అట్టి వైరాగ్య భావన సుస్థిరపడాలంటే సంగరహితమైన బుద్ధి కావాలి. విషయములపట్ల వితృష్ణ (desirelessness) మాత్రం ఎంతో కష్టించితే కాని పొందుటకు వీలుకాదు. ఎవరి జ్ఞానధనమైతే కామక్రోధాదులచే ప్రతిహతం కాదో - అట్టివాడే తత్త్వజ్ఞుడు, జ్ఞాని, పండితుడు కూడా. ఎప్పుడైతే ఈ జీవుడు తెలుసుకొనవలసినదానిని తెలుసుకొంటాడో (నేను ఎవరు? అను ప్రశ్నకు ఉత్తమ సమాధానం పొందుతాడో), అప్పుడు మాత్రమే అతనికి ఈ శరీర పటాటోపం పట్ల, ఐశ్వర్యముల పట్ల, భోగములపట్ల సహజమైన విముఖత, అరుచి ఏర్పడతాయి. యశస్సు - దంభము కొరకు కాకుండా, వాస్తవదృష్టి వలన అకృత్రిమమైన వైరాగ్యము పొంది ఉండే వారే మానవులలో ఉత్తమోత్తములు. జ్ఞేయమగు (సర్వజ్ఞానుల ఉత్తమ లక్ష్యమగు) ఆత్మవస్తువు గ్రహింపబడనంతవరకు విషయవితృష్ణ కలగటం అసంభవమే.

రమణీయమగు భోగ భాగ్యములు కూడా, ఎంతటి దోషభూయిష్ఠమైనవో మన రామచంద్రుడు స్వవిచారణచే గ్రహించాడు. అందుచేతనే మహత్తరమైన ఆశయములను పొందగలిగాడు. ఓ సభికులారా! ఈ బాలుడు చెప్పినదంతా వాస్తవమే. అయితే ఇతనికి ఇంకా చిత్త విశ్రాంతి కలుగవలసియున్నది. స్వస్వరూపమగు ఆత్మ గురించి విచారణచే ఇతడు తప్పకుండా చిత్తవిశ్రాంతి పొందగలడు. ఇప్పుడు ఈ రాముని బుద్ధి కైవల్య శాంతి మాత్రమే కోరుకుంటోంది.

లోకకళ్యాణార్థం, రాముని చిత్తవిశ్రాంతి కొరకు రఘుకుల గురువు, సర్వము ఎఱిగినవాడు, సర్వసాక్షి, బ్రహ్మజ్ఞాని, త్రికాలవేత్త అయిన వసిష్ఠ భగవానుణ్ణి ఆత్మ విచారణ బోధించవలసినదిగా సభాముఖంగా అర్థిస్తున్నాను.

హే వసిష్ఠ మహర్షీ! ఒకప్పుడు మన ఇరువురి వైరం శాంతింపచేయటానికి భగవంతుడగు బ్రహ్మదేవుడు మీకు, నాకు, తదితర మునులకు ఆత్మజ్ఞానం ఉపదేశించారు కదా! ఆ యుక్తిపూర్వకమైన జ్ఞానోపదేశం చేత సర్వ సంసార వాసనలు తొలగిపోగలవు. ఓ బ్రహ్మజ్ఞా! మీ ప్రియశిష్యుడగు రామచంద్రునకు ఉత్తమమైన ఆత్మ విషయం ఉపదేశించుటచే ఇతడు, ఈ రాజ్యం, ఈ లోకం, భవిష్యత్తులో అనేకమంది జనులు పవిత్రత పొందటం జరుగుతుంది.


Page number:75

వివేక వైరాగ్యములతో ప్రకాశిస్తున్న రాముడు మీ ఉపదేశమునకు అన్ని విధాలా తగినవాడు. ఇతనికి ఉపదేశించటం చేత మీ వాక్యాలు సార్థకమౌతాయి. ధూళిచే కప్పబడక పరిశుభ్రంగా ఉన్న అద్దంలో ముఖం సులువుగా, సుస్పష్టంగా కనిపిస్తుంది కదా!

త్రికాలజ్ఞులగు మీకు మేము చెప్పగలిగేదేమున్నది? భక్తిశ్రద్ధలు కలిగినవాడు, నిగర్వి, వైరాగ్యవంతుడు అయిన శిష్యునకు బోధింపబడు శాస్త్రజ్ఞానమే సార్థకమౌతుంది. ఏ బోధ అయితే అజ్ఞానమును దగ్ధం చేస్తుందో, సర్వ సందేహములను మొదలంట్ల తొలగిస్తుందో, అనిందితమైన ఉత్తమ సత్యమును ప్రతిపాదిస్తుందో అదే ఉత్తమబోధ. అట్టి బోధను మీరు మాత్రమే ప్రసాదించగలరు.

గురుశుశ్రూషబుద్ధి లేనివానికి, విరక్తుడు కానివానికి, అపాత్రునకు ఉపదేశించబడే జ్ఞానం కుక్కతోలులో పోయబడిన పాలవలె అపవిత్రమే అవుతుంది. హే వసిష్ఠ మహర్షీ! మీరు మహావైరాగ్యసంపన్నులు. భయక్రోధములంటూ లేనివారు. నిర్మలమైన స్వభావము కలవారు. సాధుపుంగవులు. అట్టి మీవంటి మహనీయులు ఆత్మ విషయమై ఉపదేశించటంచేత, ఆ ఉపదేశ సమయంలోనే బోధింపబడువాని బుద్ధి వికసించి విశ్రమించగలదు.

అప్పుడు వ్యాస, నారదాది మహర్షులు అభ్యర్థనపూర్వకంగా వసిష్ఠునివైపు చూచి చిరునవ్వు నవ్వారు.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ సభకు వేంచేసిన వ్యాస నారదాది మునిసత్తములారా! నేను మీ ఆజ్ఞను శిరసావహించటానికి సిద్ధంగా ఉన్నాను. సజ్జనుల వాక్యములు ఉల్లంఘించే శక్తి ఎవరికుంటుంది? మీరు నన్ను నియమిస్తున్నట్లుగానే ఈ రామాదులకు జ్ఞానోపదేశం చేసి అజ్ఞానమును నివృత్తింపజేస్తాను. దీపం వెలిగించిన తరువాత చీకటి ఆ సమీపంలో ఉంటుందా?

పూర్వము నా తండ్రియగు బ్రహ్మదేవుడు నాకు, తదితర మునివరేణ్యులకు ఉపదేశించిన ఆత్మజ్ఞానమును నేను ఇప్పుడు స్మరించుచున్నాను. ఈ నా ప్రయత్నము సంసార భ్రమను శాంతింప చేయటానికి, లోక కళ్యాణము కొరకు ప్రవృత్తమగుగాక!

ఇట్లు ఆయన ప్రతిజ్ఞాపూర్వకమైన మంగళాశాసనం పలికారు. కొద్దిక్షణాలు ధ్యాన నిష్ఠులై దృష్టాంతములు, ఉపాఖ్యానములు, ప్రమాణములు మొదలైన పరికరములు చేకూర్చుకొన్నారు.

అప్పటికప్పుడు ఆ సభయందు వక్త-శ్రోతలకు అనుకూలమైనట్టి వాతావరణం, వేదికలు తయారు చేయబడినాయి. అప్పుడు బ్రహ్మర్షివరేణ్యులగు వసిష్ఠ మహర్షి అజ్ఞాన శాంతి కొరకు పరతత్త్వ బోధకమైన “యోగవాసిష్ఠము” లేక “అఖండ రామాయణం" ఇట్లు ప్రవచించ ప్రారంభించారు.


Page number:76

2.) సదేహముక్తి - విదేహముక్తి

శ్రీ వసిష్ఠమహర్షి :

పూర్వమ్ ఉక్తం భగవతా యత్ ‘జ్ఞానం’ పద్మజన్మనా,
సర్గాదౌ, లోకశాంత్యర్థం తదిదం కథయామ్యహమ్ ॥ (III–1)

ప్రియశిష్యా! రామచంద్రా! పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు జగశ్శాంతి కోసమై ప్రవచించిన ఆత్మ తత్త్వశాస్త్రమును నీ ముందు ఉంచబోవుచున్నాను. శ్రద్ధతో వినెదవుగాక!

శ్రీరాముడు : హే భగవంతుడా! వసిష్ఠమహర్షీ! మనం మోక్షశాస్త్రంలో ప్రవేశించే ముందు నాకు ఉన్న ఒక సందేహం నివారించ ప్రార్థిస్తున్నాను. శుకదేవుడు విదేహముక్తి పొందినట్లు విశ్వామిత్రమహర్షి చెప్పియున్నారు. అతని తండ్రి, గురువు, మహామతి, సర్వజ్ఞుడు అయిన ఈ మన వ్యాసమహర్షి ఎందుకు విదేహముక్తి పొందలేదు? శుకుడు మాత్రమే ఎందుకు పొందాడు? తత్త్వజ్ఞానమునకు విదేహముక్తియే ఉత్తమ ఫలితముగదా! శుకయోగి యందుగల ప్రత్యేకత ఏమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! సూర్యునివలె స్వయంజ్యోతి స్వరూపుడగు ఆ ‘పరమాత్మ’ యొక్క చైతన్యశక్తి లేక చిత్ప్రకాశంలో కాంతిరేణువులవలె అనంత సంఖ్యలో బ్రహ్మాండాలు లేచి ప్రవర్తించి, లీనమైపోతున్నాయి. ఈ వర్తమాన క్షణంలో కూడా త్రైలోక్యములతో (స్వర్గ మర్త్య-పాతాళములతో) కూడిన బ్రహ్మాండములు ఇసుకరేణువులవలె లెక్కింప అలవికాదు. అదే విధంగా ఇక ముందు కూడా ఆ ’పరమాత్మ’ అనే మహాసముద్రంలో ప్రపంచ తరంగాలు అసంఖ్యాకంగా లేచి లయించబోతున్నాయి.

అట్టి ఈ ‘జగత్తులు’ అనే రేణువులందు “ఇది సత్యమే" అను బుద్ధితో ఈ మాయామయులైన జీవులు ప్రవర్తిస్తున్నారు. అయితే, జీవన్ముక్త పురుషులకు మాత్రం ఇందలి అసత్యత్వమంతా అవగతం అయ్యే ఉంటుంది. అందుచేత ఇదంతా వారికి స్వప్నతుల్యంగానే ఉంటోంది. అట్టి స్వప్నము వంటివే అయిన ఈ బ్రహ్మాండములలో అంతర్గతమైయున్న ఈ దేహాదులు కూడా నశ్వరము (నశించపోవునవి), స్వప్న తుల్యము, అసత్ తుల్యము (వాస్తవానికి లేనట్టివి) అయి ఉన్నాయి. ఇట్టి దేహాదులు కలిగి ఉండుటలో, (లేక) లేకుండుటలో విశేషమేమున్నది? ఆత్మతత్త్వము చక్కగా ఎరిగిన జ్ఞానుల దృష్టిలో జీవన్ముక్తులకు వచ్చిన లోటేమీ లేదు. అది విదేహముక్తి కన్నా తక్కువైనదిగా వారు ఎంచుట లేదు. ఉన్న రహస్యమంతా తన వాస్తవస్వరూపమగు ‘ఆత్మ’ గురించి పొందియున్న విజ్ఞానపూర్వకమైన జ్ఞానములోనే ఉన్నది.

శ్రీరాముడు : మీరు భూతకాలపు, వర్తమానపు, భవిష్యత్ కాలపు, బ్రహ్మాండముల ఉత్పత్తి, స్థితి, వినాశనముల గురించి చెప్పుచున్నది అత్యంత సమంజసమే. మనకు కనబడుచున్నదంతా అనుక్షణం మార్పు చెందుతూనే ఉన్నది. భూతభవిష్యత్ కాలముల మధ్య ఈ వర్తమానకాలంలో కనబడే బ్రహ్మాండము, ఇందలి పదార్థములు సర్వదా అనిశ్చింతంగా, అస్థిరంగా ఉంటున్నాయి. అందుచేత వర్తమాన బ్రహ్మాండము గురించి, ఇందలి వస్తుజాలము యొక్క ఆయా ధర్మముల గురించి ఎరిగినంత మాత్రంచేత, మనం ‘బ్రహ్మతత్త్వము’ లేక ‘ఆత్మయొక్క వాస్తవ స్వభావము’ ఎరుగజాలమేమోనని నాకు అనిపిస్తోంది.


Page number:77

భూత భవిష్యత్ అనే రెండు గట్ల మధ్య మనకు లభిస్తున్న ఈ వర్తమానమును అట్లే ఉంచి, మనం ఈ బ్రహ్మాండము యొక్క పూర్వాపరాలను (ఇది ఎక్కడి నుండి వస్తోంది? ఎటు పోబోతోంది?) తప్పక విచారించవలసియున్నది. ఈ వర్తమాన బ్రహ్మాండము యొక్క అంతర్గత దృశ్య విశేషాల గురించి విచారణ అనవసర కాలయాపనయే అవుతుందేమో, ఎందుకంటారా? ఈ కనబడే వస్తుజాలమంతా అనుక్షణం భూతకాలం నుండి, భవిష్యత్తుకు పయనిస్తూ - వర్తమానంలో లేకయే ఉన్నాయని అనిపిస్తోంది. ఎప్పటికప్పుడు భూత భవిష్యత్తులచే కప్పివేయబడుతూ ఉన్నట్టి ఈ వర్తమాన “క్షణిక దృశ్యప్రపంచము”ను మనం ఎంత తరచి చూచినా, ఇది మనకు కావలసిన ఉత్తమ అవగాహనను ప్రసాదించజాలదేమో?

శ్రీ వసిష్ఠమహర్షి : ఓహో! తత్త్వగ్రహణ సమర్థమైనట్టి నీ సూక్ష్మబుద్ధికి మెచ్చాను. అయితే భూత-భవిష్యత్, వర్తమానములు, ఈ బ్రహ్మాండములు, ఈ వ్యవహారమంతటిలో ఒకానొక మిథ్యాత్వము అజ్ఞానముచే సత్యమైన దానివలె ప్రవర్తించుచున్నది. అందుచేత, నీ రెండు ప్రశ్నలు దృష్టిలో ఉంచుకొని నేను చెప్పబోవు సమాధానం విను.

కారణ దేహమే (The Self) …. ఆయా ధర్మములను అనుసరించి ప్రత్యగాత్మ తత్వం ‘జీవుడు’, ‘శరీరి’, (‘The Experiencer’) మొదలైన పేర్లతో చెప్పబడుతోంది.

అదియే…. “తత్ - అది (తత్త్వమ్)”, “సః - అతడు (సో2హమ్)”, “స్వస్వరూపాత్మ” ఇత్యాది పదములచే ఉద్దేశించబడుతోంది.

స్థూలం: ఈ పశువులలోను, పక్షులలోను, మృగములలోను, మనుష్యులలోను, దేవతలలోను ‘శరీరత్యాగము’ అను రూపముగల ‘మృతి’ని చూస్తూనే ఉన్నాం కదా! ఈ కళ్ళకు కనబడే రక్తమాంస నిర్మిత శరీరమును జలము - వాయువు - అగ్ని - భూమి - ఆకాశములచే నిర్మించబడుటచే భౌతికశరీరం’ లేక ‘స్థూలశరీరం’ అంటున్నాం.

సూక్ష్మం : ఈ స్థూల దేహం నశించినప్పటికీ, ’మనస్సు-బుద్ధి-చిత్తము అహంకారముల సమన్వయం మాత్రం నశించదు. దానిని ‘సూక్ష్మశరీరం’ లేక ‘అతివాహికదేహం’ అని అంటున్నాం. ’సూక్ష్మశరీరం’ యొక్క రూపమే ఇష్టములు, అయిష్టములు, అవగాహనలు, అభిప్రాయములు, కోరికలు, భావనలు, కోపతాపములు మొ॥ అయి ఉన్నాయి. (మరికొన్ని శాస్త్రములు దీనినే ‘సంస్కారశేషము’ అని కూడా అంటున్నాయి).

స్థూలదేహం నేలకూలినంత మాత్రం చేత అతివాహిక దేహం నశించదు. లేక, లేకుండాపోదు. అయితే, శరీర పరిమితులైన అతని బంధువులు మాత్రం పాంచభౌతిక దేహము వరకు మాత్రమే గ్రహించగలరు కనుక, “అయ్యో! మనవాడు చనిపోయాడే!” అని అనుకొని ఊరుకొంటున్నారు.


Page number:78

ఇప్పుడు భౌతిక శరీరం తొలగిపోగా సూక్ష్మశరీరము మాత్రమే ధరించి ఉన్న ఈ జీవుడు అప్పటికప్పుడు తన వాసనలను (tendencies) అనుసరించి తన హృదయాకాశంలో ముల్లోకములను గాంచుచున్నాడు. దీనినే ‘పరలోకము’ అని అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడబడే ముల్లోకములు కూడా అట్టివే సుమా! ఇది ఇతఃపూర్వమునకు (అనగా ఈ వర్తమాన శరీరధారణకు ముందున్న స్థితికి) పరలోకమే అయివున్నది కదా! అయితే దేహాత్మబుద్ధి లేక పంచభూతములకు పరిమితమైన బుద్ధి కలవారికి - ఇదంతా మరొక చోటగాని, లేక ఆలస్యంగా గాని జరుగుతోందని అనిపిస్తోంది. కాని, అది అట్లేమి కాదు. ఎందుకంటే అతివాహికానుభవం పంచ భూతముల కంటే సూక్ష్మమైనది కదా! అద్దాని అనుభవం పంచభూతములతోను, అవి ఉండనప్పుడు కూడా ఏర్పడగలదు.

ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. మనం ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఈ స్థూల దేహమును జీవుడు తన సూక్ష్మదేహం సహాయంతోనే ధరించి, ప్రవర్తింపచేస్తున్నాడు. కనుక ఇక్కడ మనకు అనుభవమగుచున్నది కూడా, ఈ అతివాహిక దేహపు అభివ్యక్తీకరణే. ఉదాహరణకు, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు “నా ‘మనోబుద్ధి చిత్తాహంకారాలు’ నీయొక్క మనోబుద్ది చిత్తాహంకారాలతో ప్రతిస్పందిస్తున్నాయి” అనునదే సిద్ధిస్తుంది. అంతేకాని భౌతిక పదార్థములు, జడములు అయి ఉన్న చెవులు - నోరు మాట్లాడుకోలేవు కదా!

ఇంతవరకు గ్రహించావు కదా! ఇప్పుడు మనం మరొక విషయానికి వద్దాం. ఇంతకీ “ఇహ-పర” రూపములైన ఈ భూత వర్తమాన భవిష్యత్తుల దర్శనమంతా చేస్తున్నట్టి ఈ ‘జీవుడు’ అనబడువాడు ఎవడు? ఓ రాఘవా! ఇతడు స్వయముగా ఆ ప్రత్యగాత్మయే. ఇతనికి వాస్తవానికి ఈ జన్మ - మొదలైన వికారాలు ఏ సమయమందును లేవు. పరబ్రహ్మమే ఇతని నిజస్వరూపం.

“చిదాకాశ స్వరూపుడైన పరమాత్మయే వాసనామయమగు అతివాహిక శరీరంతో, స్వయముగా, తన హృదయాకాశమునందు, వాసనామయమే అయివున్న ఈ దృశ్యమంతా పొందుచున్నాడు” అనునదే జీవునియొక్క ‘జగత్తు’ అను అనుభవమై ఉన్నది. ఈ శరీరము కూడా అట్టి జగదృశ్యములోని ఒక వస్తువు వంటిదే అగుచున్నది.

ఈ విధంగా ప్రతి ప్రాణి తన చిత్తములోని వాసనలను లేక సంస్కారములను అనుసరించి, తాను భావించి, వాంఛించు అనుభవమునకు అనుకూలమైన ఉపాధులను (శరీరములను) పొందుతూ, త్యజిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ జీవుడు విజ్ఞానమే (ఎరుక - consciousness) తన స్వరూపముగా కలిగి ఉన్నాడు. అతడు దేనినైతే “ఇది ఈ విధమైన సత్యము” అని సంకల్పిస్తున్నాడో అది అట్లే అతనికి సత్యమైన అనుభవమై ప్రాప్తించుచున్నది. అందుకే “ఈ జీవుడు సత్యసంకల్పుడు” అని కూడా చెప్పబడింది.


Page number:79

అట్టి ఈ జీవుడు ఈ భౌతికదేహం త్యజించటం జరిగినప్పుడు (లేక మరణించినప్పుడు) అతని మానస నగరంలో (In the zone of his subtle body) ఏ ఏ కోర్కెలు అగ్రగణ్యంగా ఉంటాయో వాటిని అనుసరించి అందుకు తగినట్టి ఉపాధిని పొందుచున్నాడు. అప్పుడు “ఇతడు పుట్టాడురా” అని జనులు అనుకొంటున్నారు.

kaaraNa-dEham

కనుక ఓ రామా! ఈ జీవుడు తన వాసనలను, కర్మ పరిపాకమును అనుసరించే మనుష్య, పశు, పక్షి, దేవత, రాక్షసాది యోనిభేదం చేత ప్రకాశించే పాంచభౌతిక సమన్వయములైన ఉపాధులను పొందుచున్నాడు. (సింహో వా, వ్యాఘ్ర వా యద్భావంతి, తథా భవతి : జీవుడు తన భావనను అనుసరించే సింహముగానో, వ్యాఘ్రముగానో అగుచున్నాడు - ఉపనిషత్తు వాక్యం). దీనినిబట్టి ఈ దృశ్యవిషయమై ఒక చమత్కారం గమనించావా?

సంకల్పనిర్మాణమివ - మనోరాజ్య విలాసవత్,
ఇంద్రజాలా మాల ఇవ - కథార్ధప్రతిభాసవత్,
దుర్వాత భూకంప ఇవ - త్రస్త బాల పిశాచవత్,
ముక్తాళీవామలే వ్యోమి - నౌస్పంద తరుయానవత్,
స్వప్నసంవిత్తి పురువత్ - స్మృతిజాత ఖపుష్పవత్,
జగత్సంసరణమ్ స్వాంతర్మృతో2నుభవతి స్వయమ్! (III - 11,12,13)


Page number:80

ఈ ఎదురుగా కనిపించే చరాచరములతో కూడిన దృశ్యజగత్తు - ఎవడో అజ్ఞాతమూర్తి తన సంకల్పములచే ఎందుకో రచించినట్లు ఉంటోంది. ఏదో మనోరాజ్యము యొక్క విలాసమువలె తోచుచున్నది. ఎవరో గొప్ప ఐంద్రజాలికుడు తన ఇంద్రజాల చమత్కారంచే ఇది చూపుచున్నట్లు అనిపిస్తోంది. ఒక గొప్ప కవి తన ఊహా చమత్కారంతో రచించిన ఒక పెద్ద కథలోని మధ్యభాగంలాగా స్ఫురిస్తోంది. వాతము క్రమ్మిన రోగియొక్క భూకంపానుభవంవలె అనిశ్చితముగా, అతి చంచలంగా, దుర్భరంగా అనుభవమౌతోంది. ఒక బాలుడు ఏదో పిశాచం కథ విని నిద్రించి, అర్ధరాత్రి మెలుకువ రాగా కనులు తెరచి ఎదురుగా కథలోని భూతమును భ్రమచే చూచుచున్నట్లు కనిపిస్తోంది. తనకు తానే కల్పించుకొనిన భ్రమచేత ఆకాశంలో ఏవేవో ఆకారములు తోచునట్లు భ్రమకొల్పుతోంది. నౌకలో ప్రయాణించే వానికి ఒడ్డున ఉన్న చెట్లు అర్ధచంద్రాకృతితో కదులుచున్నట్లు ప్రాప్తిస్తోంది. ఒకడు స్వప్నంలో అనేక వస్తువులను చూచునట్లు, మరొకడు తన స్మృతి పథంలో ఎక్కడో చెప్పగా విన్న ఆకాశ పుష్పం గాంచునట్లు ఈ జగత్తు ప్రత్యక్షమై ఉంటోంది. కనుక రాఘవా! ఇదంతా మిథ్యయై, చూచువాని యొక్క కల్పనామాత్రమై, స్వయముగా ఏదీ కానిదై ఉన్నది. అయితే, తన అజ్ఞానము చేతనే ఈ జీవుడు మిథ్యారూపమగు ఇట్టి జగత్తును తాను శరీరము కలిగి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా తన హృదయాకాశమునందు స్వయముగా గాంచుచున్నాడు. అనగా, మృతుడు ఇట్టి ఈ జగదృశ్యమును తన అంతరంగాకాశంలో తనకు తానే స్వయంగా అనుభూతపరుచుకొనటం జరుగుతోంది.

ఇట్లు దేనిచేతనూ నిర్దేశించబడజాలని ప్రత్యగాత్మ స్వరూపుడే అయినట్టి ఈ జీవుని సమ్ముఖమునకు ఈ శరీరములు స్వకీయ-అనుభూతి రూపంగా మాటిమాటికీ వస్తున్నాయి. పోతున్నాయి. అట్టి రాకపోకలు గల దేహములు ఒకప్పుడు ఒకే విధంగా, మరొకప్పుడు భిన్న - విభిన్నములుగా ఉంటున్నాయి. అనగా ఒకప్పుడు పూర్వ సంస్కారములన్నీ అట్లే ఉంటున్నాయి. మరొకప్పుడు పాత సంస్కారములన్నీ లయించగా క్రొత్తవి వచ్చి చేరుచున్నాయి. ఇట్టి అనుభవం మనమందరం ప్రత్యక్షంగా ఈ లౌకిక దైనందిన జీవితంలో కూడా చూస్తున్నాం కదా! అభిరుచులు, అభిప్రాయాలు, నమ్మకములు మొదలైనవి ఎప్పటికప్పుడు మారిపోతూ, కొత్తవి సంచరించుకొనుటలేదా?

ప్రతిజీవి పుట్టినప్పటినుండి ఈ దేహము త్యజించే లోపులో అనేక కర్మలు చేసి, వాటి వలన తనకు తానే తన పరలోకములను తయారుచేసుకొంటున్నాడు. తాను కలిగియున్న వాసనలవలన కొన్నిదేహాలు, ఆ దేహముల వలన మరికొన్ని వాసనలు, ఆ వాసనల వలన మరల పురుష, పశు, పక్షి దేహాలు - ఈ విధంగా అరటి స్తంభము లోని మట్టలవలె ఈ సంసార వ్యవహారమంతా పొందుచున్నాడు.


Page number:81

అయితే రామా! వాస్తవమైనట్టి ‘ఆత్మదృష్టి’చే లేక ‘శరీరి’ దృష్టిచే చూచినప్పుడు, ఈ బ్రతికిఉన్న వారికిగాని, శరీరము త్యజించిన వారికిగాని అందరు స్వతహాగా చైతన్యమే రూపముగా కలవారు అగుటచే) ఈ పంచభూతముల సమావేశము, ఈ సృష్టిక్రమములు లేనేలేవు. అయినప్పటికీ ఈ జీవునకు ప్రపంచ భ్రాంతి తప్పుటలేదు. లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేయుటయే ఈ జగత్తు యొక్క వైచిత్ర్యము. ఈ ’జగత్తు’ అను మాయా నాటకమంతా అనాదిగా సిద్ధించియున్న ’అవిద్య’ చేతనే నడుపబడుతోంది.

‘పరమాత్మ’ అనే మహాసముద్రంలో “సృష్టి - ప్రళయములు” అనే తరంగాలు మాటిమాటికీ బయలుదేరుచున్నాయి. లయిస్తున్నాయి. ఇందులో కొన్ని గుణములు, క్రమములు - మనస్సుయొక్క అనుభవం దృష్ట్యా - ఒకేరకంగా ఉంటున్నాయి. కొన్ని వేరువేరుగా ఉంటున్నాయి.

ఇక, నీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్యమునకు వద్దాం. ఈ ‘సృష్టి’ అంతా మాయారచితమే అయినప్పటికీ, నీయొక్క బోధ కొరకు, ఆద్యంతములు లేనట్టి దీనిని నా దృష్టి ప్రసరించ గలిగినంత వరకు పరిశీలించి నేను చూస్తున్నది చెపుతున్నాను. విను.

ఈ సభకు వేంచేసియున్న వ్యాసుడు నాకు ముప్పదిరెండవ వానిగా కనిపిస్తున్నాడు. అందులో మొదటి పండ్రెండు మంది ఆకృతిలోను, చరిత్రలోను సమానులు. వారందరు ‘ఆత్మతదాత్మ్యము’ దృష్ట్యా కొంత అల్పజ్ఞులే. ఇక పదమూడవవాని వంశము మాత్రము భిన్నమైనది.

భవిష్యత్తులో కూడా ఎందరో వ్యాస, వాల్మీకాదులు జన్మించనున్నారు. వారిలో కొందరి శరీరముల ఆకృతులు పూర్వము ఉన్నట్లే ఉంటాయి. మరికొందరి దేహములు వేరువేరుగా ఉంటాయి.

ఎందరెందరో మనుష్యులు, దేవతలు, దేవర్షులు మొదలైనవారంతా ఇతఃపూర్వం లాగానే ఒకేకాలంలో జన్మించి, ఒకే సమయంలో జీవించనున్నారు. ఈ వర్తమాన బ్రహ్మ యుగంలో ఇది డెబ్బది రెండవ త్రేతాయుగం. ఇట్టి బ్రహ్మ యుగములు ఇతః పూర్వం ఎన్నో గడచిపోయాయి. ఇంకా ఎన్నో గడచిపోనున్నాయి. నీవు, నేను కూడా ఎప్పుడో పూర్వకాలంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉంటున్నాం. మనతో మరెందరో క్రొత్త వారు కూడా వచ్చి చేరుచున్నారు. ఇదంతా నేను తెలిసికొనే ఉన్నాను.

ఒకానొక క్రమమును అనుసరించి ఈ వ్యాసమునికి ఇది పదవ అవతారం. వ్యాస వాల్మీకులకు సమకాలికులమై మనం అనేకసార్లు పుట్టాం. మనలో చాలామంది మధ్య మధ్యలో విడివిడిగా పుట్టటం జరిగింది. మనమే కాదు. తదితర జ్ఞానులు, అజ్ఞానులు కూడా ఇట్టివేయగు అనేక శరీరములతో చాలాసార్లు జన్మించియున్నారు. ఈ వ్యాసుడు నా దృష్టిపథం ముందుకు వెళ్ళునంత వరకు చూడగా - మరొక ఎనిమిది సార్లు జన్మించనున్నారు. ఇతడు ‘మహాభారతము” అను ఇతిహాసమును ఎనిమిది సార్లు వ్రాయబోవుచున్నారు. వెనుకటి లాగానే మరల వేదములను విభజించి భరత వంశమునకు గొప్ప కీర్తి తెస్తారు. ఆ తరువాత, బ్రహ్మదేవుడై విదేహముక్తుడు కాబోతున్నారు.


Page number:82

అయితే ఇతడు ఇప్పటికే జీవన్ముక్తుడు. ఉత్తమోత్తమమైన మనోనిగ్రహం కలవాడు. గొప్ప శాంతుడు. ‘మోహము’ అనునది ఏమాత్రం అతని యందు లేదు. అహంకార మమకారాలు లేవు. అందుచేతనే శోకరహితుడై స్వచ్ఛముగా వెలుగొందుచున్నారు.

ఓ రామచంద్రా! ఈ జీవులందరు "భాగ్యము, బంధువులు, ఆయుర్దాయం, ప్రయత్నం, విద్య, జ్ఞానం” – మొదలైనవన్నీ సమంగా స్వీకరించి ఒకప్పుడు ఇట్లాగే ఉంటున్నారు. మరొకప్పుడు ఇట్లా ఉండరు. ఇవన్నీ ఎల్లప్పుడు సమానంగా ఉండుట లేదు. ఇంకొకప్పుడు కొన్ని సృష్టుల వరకు వీరు ఇట్లే ఉంటున్నారు. అయితే, ఇదంతా మాయయే సుమా! దీనికంతటికి అంతము ఉండదని కూడా అనవచ్చు. కొలవటం కోసం ధాన్యపురాశిని ఒకచోట పోశామనుకో. కొలిచిన తరువాత ఆ గింజలు ఒకే తీరుగా కలిసి ఉంటాయా? ఈ ప్రాణులు కూడా భిన్న-భిన్న సృష్టులలో భిన్న భిన్నంగా ఉంటూ ఉంటారు. సముద్రంలోని తరంగాలు గమనించావా? అవన్నీ ఒకప్పుడు ఒకేవిధంగా మరొకప్పుడు మరొకవిధంగా ఉంటాయికదా! ఏ తరంగం ఏ నీరో, ఏది ఏ నీరు కాదో చెప్పటం ఎవరి తరం? ‘కాలము’ అనే మహాసముద్రంలోని ఈ సృష్టి తరంగాలు కూడా అంతే. ఒకప్పుడు ఒక రూపంగాను, మరొకప్పుడు మరొక రూపంగాను ప్రదర్శితమౌతూ ఉంటాయి.

అయితే, తత్త్వజ్ఞాని దృష్టిలో అజ్ఞాన పూరితములగు ఈ వికల్పములన్నీ లేకయే ఉన్నాయి. ఈ సృష్టి తరంగాలన్నీ చూస్తున్నప్పటికీ, అతని అంతరంగము మాత్రం ఏమాత్రం తల్లడిల్లుట లేదు. అతడు తన సహజ సిద్ధమగు ప్రశాంతతను కోల్పోవుట లేదు. స్వయముగా పరబ్రహ్మ స్వరూపుడే అయివున్న ఈ జీవుని దృష్టిలో మాయావరణం తొలగనంత కాలం మాత్రమే ఈ సృష్టి పరంపరలన్నీ ప్రవర్తిస్తున్నట్లు తోస్తాయి. వాస్తవానికి ఇతడు పరమశాంత స్థితి అగు ఆత్మయే స్వరూపముగా కలిగి ఉన్నాడు. పరమాత్మ స్వభావమగు అఖండ స్థితుడే అయున్నాడు. మాయావరణము తొలగినప్పుడు ఇతడు బ్రహ్మస్వరూపముగానే శేషించుచు, బ్రహ్మముగానే వెలుగొందుచున్నాడు.

“జీవన్ముక్తత్వము” అనునది ఎట్లా లభిస్తుంది? తత్త్వజ్ఞానము యొక్క ఫలమే కదా! మన ఈ వ్యాసమహాముని అట్టి తత్వజ్ఞాన ఫలమును పొందే ఉన్నారు.

ఇక్కడ మనం సముద్రమునే దృష్టాంతంగా తీసుకొందాం. సముద్రంలో తరంగములు ఉన్న సమయంలోను, తరంగములు లేని సమయంలో కూడా అందలి జలము జలముగానే ఉంటుంది. కదా! అదే విధంగా జనులు విదేహముక్తులైనా, లేక సదేహముక్తులైనా ఒక్కటే. ఈ రెండిటికీ భేదమేమీ ఉండదు. అసలు ‘ముక్తి’ అంటే ఏమిటి? జీవుడు విషయములకు (దృశ్య - ఇంద్రియ వ్యవహారములకు) స్వాధీనుడు కాకపోవుటయే కదా! అది సదేహమైతే ఏమున్నది? విదేహమైతే ఏమున్నది? విషయములను విషయములుగా గ్రహించని వానికి ఇక ‘భోగము’ అనే అనుభవమే సిద్ధించదు కదా! విషయ భోగములకు సంబంధించిన భావన ఉన్నచోట మాత్రమే “ఈ స్థితి నిర్వాణస్థితి కంటే స్వల్పమైనది" అనే ప్రసక్తి లేక అవకాశం ఉంటుంది. ‘జీవన్ముక్తత్వము’ అను స్థితి యందు విషయభోగ భావనకు చోటే ఉండదు. కాబట్టి అది కూడా నిర్వాణముక్తి వంటిదే.


Page number:83

ఇప్పుడు వ్యాస, శుకదేవుల జీవన్ముక్తి - విదేహముక్తుల విషయానికి వద్దాం. జీవన్ముక్తుడగు ఈ వ్యాసునిగాని, లేక మరొకరిని గాని, “మట్టికుండ - వస్త్రము” వంటి పదార్థములను చూచినట్లు మాత్రమే (ఈ భౌతిక దృష్టిలో ఉన్నప్పుడు మనం చూడటం జరుగుతుంది. ఇది అత్యంత పరిమితమైన దృష్టి మాత్రమే. అతని ఆంతరంగిక స్థితి ఎట్టిదో, అతడు ఈ దృశ్యమును, జగత్తును ఎట్టి దృష్టితో దర్శించుచున్నాడో భౌతిక దృష్టి మాత్రం చేత మనం గుర్తించగలమా? లేదు. అందుచేత ఉపాధిని అనుసరించి ఒకని జ్ఞానం లెక్కించటం సాధ్యం కాదు.

“బోధ స్వరూపులైనట్టి నిర్వాణముక్తులకు, జీవన్ముక్తులకు భేదమేమీ ఉండదు” అని మరల ప్రకటిస్తున్నాను. గాలి వీచినా, వీచకపోయినా - గాలి గాలే కదా! అలలు ఉన్నా లేకున్నా నీరు నీరే కదా! అట్లే ఇందు సందేహించవలసినదంటూ ఏమీ లేదు.

నా యొక్క, ఈ వ్యాస భగవానుని యొక్క లక్ష్యములు ఈ సదేహ - విదేహ ముక్తుల ప్రహసనం కానే కాదు. మా ఇరువురి ఉత్తమ లక్ష్యములు కూడా ద్వైత - ఏకత్వరహితమగు ఈ జీవాత్మ - పరమాత్మల అభేదము లేక ఐక్యతే అయివున్నది. అనగా “జీవుడే - పరమాత్మ” అని నిరూపించుటకే యత్నించుచున్నాము. ఎందుకంటే, ఉన్న సత్యము అదే కనుక.

ఇక మనం ప్రస్తుత విషయానికి వస్తున్నాం. ముముక్షువు శ్రద్ధతో తత్త్వజ్ఞానోపదేశమునకు సిద్ధపడవలసిన తీరు గురించి ఇప్పుడు విచారించబోతున్నాం. ఈ నా వచనములు లోక కళ్యాణకారకములై, అజ్ఞానమును, అంధత్వమును పారద్రోలుగాక! సర్వదా, సర్వమై, సర్వత్రా వెలయుచున్న ఆత్మతత్త్వము శ్రవణ భూషణంగా ప్రకటించబడు గాక.


3.) పురుష ప్రయత్నము

ఓ రఘునందనా! ఈ జగత్తులో ఎవరికైనా, ఏ వస్తువైనా లభించాలంటే పురుషకారమే (Effort) ఉపాయం కదా! పురుషకారం లేకుంటే ఎక్కడా ఏదీ జరుగదు. ప్రాప్తించదు. ఆకాశంలో ఆ చంద్రుని చూడు. అతడు లోకములకు ఆనందమును "శీతలత్వము ప్రసరించుట” అను క్రియ చేతనే ప్రసాదించగలుగుచున్నాడు కదా!

“పరిస్పందఫల ప్రాప్తా పౌరుషాదేవ, నా2న్యతః” (IV–9)

ఏ ఫలితమైనా పురుష ప్రయత్నం చేతనే లభిస్తోంది కాని, మరి దేని చేతనూ కాదు. అదే విధంగా పురుషకారము చేతనే జీవునకు జ్ఞానం ప్రాప్తించుచున్నది. అట్టి జ్ఞానము వల్లనే కామ - క్రోధాది తాపములను నశింపజేసే ‘జీవన్ముక్తి’ కూడా లభించుచున్నది.

పురుషకారము యొక్క రూపమే ‘కర్మ’. అట్టి కర్మ యొక్క పర్యవసానంగానే ఒకడు ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళటం, భుజించటం, కావాలనుకొన్నది చూడటం మొదలైన దైనందిన లౌకిక క్రియలను కూడా నిర్వర్తించగలుగుచున్నాడు. ఇది అందిరికీ నిత్యానుభవమే కదా!


Page number:84

అయితే అనేక విషయ చింతనలచే మోహితులైనవారు, మందబుద్ధి కలవారు మాత్రం “ఆఁ! మాదేమున్నది? అంతా దైవము లేక అదృష్టము యొక్క అధీనములోనే ఉన్నది” అని చెప్పుకొంటూ తమను తామే సముదాయించుకొంటున్నారు.

పౌరుషం స్పందఫలవత్ దృష్టం ప్రత్యక్షతోనయత్
“కల్పితం మోహితైః మందెః దైవం కించిత్ న విద్యతే” (IV–10)

నాయనా రామా! ఈ దైవము, అదృష్టము అనునవి మూఢులు, మోహితులు అగు జనులకొరకై కల్పించబడినవి మాత్రమే. వాస్తవానికి, అవి స్వతహాగా లేవు.

మరి ఈ ప్రాప్తించునవి, కనబడుచున్నవి ఏమంటావా? ఇదంతా కూడా ఇతః పూర్వపు పురుషకారమే (essence of past efforts) ఈ విధంగా జీవునకు ప్రాప్తిస్తున్నాయి. ఇతఃపూర్వపు ప్రయత్నములే అట్టి ప్రభావం అతనిపట్ల కలిగి ఉంటున్నాయి.

అయితే, మా దృష్టిలో ‘పురుషకారం’ అనగా, సాధు పురుషుల ఉపదేశానుసారంగా మనస్సును, వాక్కును, కాయమును నియమించి చేయబడు ప్రయత్నమే అయి ఉన్నది.
(NOTE: త్రికరణశుద్ధిగా - మనోవాక్కాయముల ఏకత్వముచే - నిర్వర్తించబడినది మాత్రమే పురుషకారమని, ఫలప్రదమని వసిష్ఠమహర్షి అభిప్రాయం.)
జ్ఞానము కొరకై అట్లు నిర్వర్తించబడు ప్రయత్నమే జీవుని జ్ఞానిగా తీర్చిదిద్దుతోంది.

ఆ విధంగా కాకుండా, ఇంద్రియానుకూలంగా మాత్రమే ప్రవర్తించుచు “నేను పొందాలనే అనుకొంటున్నాను. కాని, సాధించలేకపోతున్నాను. అయినా, మా వల్ల ఎక్కడౌతుంది? దైవమే ప్రసాదించాలి” అని అనుకొని వగర్చుచూ కూర్చుంటే లాభం ఏమి ఉంటుంది?

ముందుగా నీవు ఏమి సాధించదలచుకొన్నావో, సుస్పష్టంగా నిర్ణయించుకో. ఇప్పుడు, సరైన అవగాహనతో శాస్త్రోక్తమైన (శాస్త్రములచే చెప్పబడిన) ప్రయత్నం చేయి. ఎవడు ఏది కోరుకొంటాడో అద్దాని కొరకు శాస్త్రములచే ఉపదేశించబడిన మార్గమును అనుసరిస్తూ, మధ్యలో తన ప్రయత్నమును
విరమించకుండా ప్రయత్నం కొనసాగిస్తాడో, - అట్టివాడు ఆ లక్ష్యమును తప్పక సాధించి తీరుతాడు.

కాబట్టి రామా! మానవుడు తన జీవిత లక్ష్యమును ముందుగా దృఢీకరించుకొని, ఆపై శాస్త్ర సమ్మతమైన నిజమార్గంలో ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని, ఏదో కొంత ప్రయత్నం చేసి, మరికొంత ఎక్కడో దృష్టి పెట్టి, మధ్యలో తనపై తానే జాలిపడుతూ క్రుంగిపోవటం, మా ఉద్దేశంలో, అర్థం ఉన్న పని కాదు.

ఓ రాఘవా! ఒకానొకడు ఇంద్ర పదవిని పొంది త్రిలోకాధిపత్యం వహిస్తున్నాడు. అతడు అది ఎట్లా పొందగలిగాడు? దైవం ప్రసాదించాడా? లేదు. తన ప్రబలమైన పురుషకారము (Intensified effort) చేతనే ఆతడు దానిని సాధించాడు. మరొక జీవుడు పురుష ప్రయత్న ఫలితంగానే బ్రహ్మ పదవిని అలంకరిస్తున్నాడు. ఇంకొకడు స్వకీయమైన తీవ్రప్రయత్నం చేతనే విష్ణుదేవుడయ్యాడు. వేరొకడు నిజప్రయత్న శీలత్వంచే చంద్రశేఖరుడై కైలాసగిరిని పావనం చేస్తున్నాడు. ఇందులో ‘దైవము’ అను దానికి పాత్ర ఎక్కడున్నది?


Page number:85

ఈ పురుష కారము (ప్రయత్నము) అనేది రెండు విధాలుగా ఉంటోంది -

1.) ప్రాక్తనము = ఇతఃపూర్వం చేసియున్న ప్రయత్నములు (Past deeds / efforts made in the Past)

2.) ఆద్యతనము = వర్తమాన ప్రయత్నములు (Present deeds / efforts)

ఈ రెండింటిలో మొదటిదైనట్టి ’ప్రార్తన పురుషకారము’ను ‘దైవము’ లేక ‘అదృష్టము’ అని జనులు పిలుస్తున్నారు. అయితే ఇప్పటి ప్రయత్నములు ఇతఃపూర్వపు క్రియల యొక్క ప్రభావమును జయించివేయగలవు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. లేకుంటే, శాస్త్రములు ప్రయత్నముల గురించి, సాధనల గురించి, ఉపాసనల గురించి ఎందుకు ప్రబోధిస్తాయి?

ప్రాక్తన పురుష - ప్రయత్నముల ప్రభావమునే ‘సంస్కారములు’ లేక ’వాసనలు’ అని కూడా అంటున్నారు.

యత్నవద్భిః దృఢాభ్యాసైః ప్రజోత్సాహ సమన్వితైః
మేరవో2పి నిగీర్యంతే! కైవప్రాక్పౌరుషే కథా ? (IV–18)

ప్రయత్నము - దృఢమైన అభ్యాసము కలవారు, ఉత్సాహవంతులు అయినట్టి వారు, మేరు పర్వతాన్నైనా సరే,…మ్రింగి జీర్ణం చేసుకోగలరు. ఇక వారికి ఈ దైవము, అదృష్టము అనునవి ఒక లెక్కలోనివి కావు.

శాస్త్రోచితంగా ప్రయత్నించటమే ఉచితం. ‘శాస్త్రోచితం’ అంటే ఏమిటి? అనుభవజ్ఞులగు పెద్దలు సర్వుల సానుకూల్యతను దృష్టిలో పెట్టుకొని, తమ అనుభవమంతా రంగరించి “ఇది ఇట్లు అనుసరించబడుగాక! ఈ విధములైన విధి - విధానములు నిర్వర్తించబడుగాక! ఇట్లు జనులు చేయకుండెదరు గాక” అని చెప్పినదే “శాస్త్రానుశాసితం" అంటున్నాం. వాటిని సూక్ష్మబుద్ధితో గ్రహించి సర్వులకు శుభప్రదం అయ్యేవిధంగా ఆచరించటమే మంచిదని మా ఉద్దేశం. అట్లు కాకుండా, చిత్తమునకు ఆధీనులై, విషయలోలుత్వముచే చేయు ప్రయత్నాలు అనర్థదాయకం, వ్యర్థం అవుతాయి. శాస్త్ర విహితమైన ప్రయత్నమును వదలి యథేచ్ఛగా సంచరించేవానికి కొన్ని రోజులకు రెండుచేతులు ఎత్తి నమస్కరించటం కూడా కష్టతరం కాగలదు. తమ పురుష ప్రయత్నమును త్యజించియుండే మందభాగ్యులను కాపాడకలిగేదెవరు? ఓ రామా! ఈ ప్రపంచంలో అజ్ఞానం, పేదరికం తాండవించటానికి కారణం ప్రజలంతా తగినంత ప్రయత్నశీలురు కాకపోవటమే. ప్రయత్నశీలుడు తాను సమృద్ధుడు అగుటయేకాక, తాను ఉన్నచోట, తన చుట్టుప్రక్కల కూడా సమృద్ధిచే నింపివేయగలడు. అతనికి ఈ ధరణీమండలమంతా ఒక లెక్కలోనిదే కాదు.

ప్రయత్నశీలుడిని అతని లక్ష్యము నుండి దూరం చేయగలిగేది అతని “ప్రయత్నరాహిత్యము” ఒక్కటే కావచ్చునేమోకాని, మరింకేదీ కాదు.


Page number:86

4.) వర్తమాన పురుష ప్రయత్నములు (ఆద్యతన పురుషకారం)

ఓ రఘురామా! అంతరంగమునందు “ప్రవృత్తి”యే సర్వ బాహ్యప్రవర్తనల యొక్క అంతర్లీన కారణం. అట్టి ప్రవృత్తి శాస్త్ర విధిని, శ్రద్ధాసక్తులను అనుసరించి ఆయా ప్రయోజనముల సిద్ధికి కారణమగుచున్నది.

మనసా వాంఛ్యతే యచ్చ యథాశాస్త్రం న కర్మణా,
సాధ్యతే మత్తలీలాసౌ! మోహనీనార్థ సాధనీ ॥ (V–2)

“మనస్సుతో కోరుకోవటం, కాని శాస్త్రవిధిని అనుసరించి ప్రయత్నం చేయకపోవటం” ఇదీ, జీవునియొక్క దౌర్భాగ్యం. ఇది ఉన్మత్త క్రీడగాక మరేమిటి? దీనివలన ఏం ప్రయోజనం సిద్ధిస్తుంది చెప్పు? పైపెచ్చు ఆది మోహకారణమే అవుతుంది.

NOTE: మహాభారతంలోని ఒక శ్లోకం
పుణ్యస్వ ఫలమిచ్ఛంతి పుణ్యం నేచ్ఛంతి మానవః ।
న పాప ఫలమిచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః ॥

ఈ మానవుడు పుణ్యఫలం అయినట్టి సుఖ, శాంతులు కోరుకొంటున్నాడు. కాని పుణ్యకర్మలందు ప్రయత్నశీలుడు అగుట లేదు. పాపఫలమైన దుఃఖాదులు కోరుకోడు. కాని, ప్రయత్నపూర్వకంగా పాపకర్మలందే ప్రీతి కలిగి ఉంటాడు. ఏమి దౌర్భాగ్యం!

ఎవడు ఎట్లు యత్నించుచున్నాడో, వాడు అట్టి కర్మనే పొందుచున్నాడు. దైవకృతం లేక అదృష్టం దానికి వేరు విధంగా ఉండటం లేదు.

ఈ కర్మ రెండు విధాలుగా చెప్పబడుతోంది.

1.) శాస్త్రోచితమైన కర్మలు.
2.) శాస్త్ర విరుద్ధములైన కర్మలు.

శాస్త్రోచితమైనవి పరమార్థము కొరకు, శాస్త్ర విరుద్ధములైనవి అనర్థము కొరకు ప్రవర్తిస్తున్నాయి. అయితే ఒకడు “నేను ఈ విధముగా ప్రవర్తించకుండెదను గాక!" అని అనుకుంటాడు. (ఉదాహరణకు ఇతరులను దూషించుట, దురభ్యాసములు ఆశ్రయించుట, దురుసుగా సంభాషించుట, తీవ్రముగా వాంఛించుట, దీర్ఘముగా దుఃఖించుట, నిష్కారణముగా భయపడుట మొదలైనవి బాహ్య అంతరంగ క్రియా ప్రవృత్తులు).
కాని, తాను అనుకొనుదానికి వేరుగా, బలవంతముగా నియమించబడిన దానివలె, ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఎందుచేతనో చెపుతాను విను.


Page number:87

ప్రతి సందర్భములోను ఈ మనుజుని ఇతఃపూర్వపు శారీరక-మానసిక క్రియాయత్నములు, ఇప్పటి ప్రయత్నములు నిరంతరం రెండు మేక పోతులవలె పోటీపడుచున్నాయి. ఈ ప్రాక్తన - ఆద్యతన ప్రయత్నములలో ఏది బలవత్తరమైనదైతే అదియే జయిస్తోంది. ఒకవేళ, వర్తమాన శ్రద్ధాసక్తులకన్నా, శారీరక-మానసిక యత్నములకన్నా ఇతఃపూర్వపు క్రియలు అధిక బలము కలిగి ఉంటే, అప్పుడాతడు అయిష్టుడైనప్పటికీ బలవత్తరముగా అట్టి కర్మలందే (సంకల్పములందే / లేక ప్రయత్నములందే) ప్రవేశించటం జరుగుతోంది.

అందుచేత రామచంద్రా! మానవుడు శాస్త్రవిధిని అనుసరించి సత్కర్మలకు సంబంధించిన ప్రయత్నములను ఎప్పటికప్పుడు అధికం చేసుకోవాలి. క్రమంగా అట్టి సత్కర్మలు బలవత్తరమై ఉత్తమ సంస్కారములుగా రూపుదిద్దుకుంటాయి. అట్టి సుసంస్కారం వివేకమును నిదురలేపి, శుద్ధ సత్వమగు ఆత్మవస్తువు యొక్క సామీప్యతను ప్రసాదిస్తుంది.

ఒకవేళ, అట్టి శుభకర్మలు ఆచరించటానికి ప్రయత్నములు చేస్తున్నప్పుడు ఏవైనా అవాంతరాలు వస్తున్నాయనుకో, “ఇవన్నీ ఇతఃపూర్వపు నా దుష్కర్మల ప్రబలత్వమే” అని గ్రహించబడుగాక అట్టి సమయములందు స్వప్రయత్నములను విడనాడకూడదు. పళ్ళతో పళ్ళు అదిమి అయినా సరే దృఢంగా శుభకరములగు కర్మలనే ఆశ్రయించాలి. ఫలోన్ముఖములగుచున్న ఇతఃపూర్వపు అమంగళకరములగు కర్మల ప్రభావమును (దుష్ట సంస్కారములను లేక వాసనలను) జయించివేయాలి. అణచివేయాలి. అందుకై ఓర్పు (తితిక్ష), పట్టుదల అవసరమైయున్నాయి. “విధియే బలీయమై నా చేత ఇట్టి దుశ్చర్యలు చేయిస్తోంది" అను రూపముతో మరల మరల తల ఎత్తే మూర్ఖభావములను వర్తమాన ప్రయత్నములచే అణగత్రొక్కివేయాలి.

ప్రత్యక్షముగా ఎదురుగా ఉన్న ఆద్యతన కర్మలను, వాటి ప్రయోజనములను గమనించకుండా “ఏదో శక్తి మమ్ములను నియోగిస్తోంది. లేక నిర్వీర్యులను చేస్తోంది" అని నమ్మువాడు చేతిలో ఉన్న ఫలమును వదలి, ఆకాశమువైపు చూస్తూ ఆ ఆకాశం నుండి ఏదైనా మధుర పదార్థము లభిస్తుందేమోనని ఎదురు చూచేవాడే అగుచున్నాడు. అట్టి దీనాలాపనలచే కలిగే ప్రయోజనమేమున్నది? అందుచేత రామా! ఇతఃపూర్వం ఆర్జించుకొనియున్న మనోదోషములు హరించిపోయేవరకు శాస్త్రోచితమైన సత్కర్మలను శరణువేడవలసిందే.

ఓ రాఘవా! ఇతఃపూర్వపు అశుభకర్మలు ఇప్పటి ప్రయత్నములచే జయించబడతాయి - అను దానిలో నీవు ఏమాత్రం సందేహించవలసిన పనిలేదు. జనులు ఇప్పటి వ్రత-జప-నియమాదులచే రాబోవు దోషములను పరిహరించుకోవటం లేదా? ఇదే మనకు నిదర్శనం. కాబట్టి నీవు ప్రయత్నములతో కూడుకున్నవాడవై ఉండు. తద్వారా నిన్ను ప్రభావితం చేస్తున్న అశుభ - అదృష్టములను దూరంగా నెట్టివేయి. సంసారము నుండి నిన్ను తరింపజేయగల “శమ-దమము”లను సంపాదించటానికే ప్రయత్నించు. (శమము అనగా కామక్రోధాదులు త్యజించి, శాంతము వహించుట; దమము అనగా ఇంద్రియములను నిగ్రహించుట). ప్రయత్నహీనుడు గాడిదతో సమానం. అతడు ఇహమునందే ఉత్తమమైనదేదీ సాధించలేడు. ఇక పరమపదమును పొందే అవకాశమెక్కడ? శాస్త్రానుసారం యత్నించేవాడే ఇహ - పరముల రెండింటిని శుభప్రదం చేసుకోగలుగుచున్నాడు.


Page number:88

సంసారకుహరాదస్మాన్నిర్గంతవ్యం స్వయంబలాత్ |
పౌరుషం యత్నామాశ్రిత్య హరిణేవారిపంజరాత్ II (V–15)

ఓ జనులారా! సింహము తన పంజాతో పంజరమును భేదించి వెలువడునట్లు మీరు ఈ సంసార పంజరము నుండి వెలువడుటకై యోచించండి. అందుకొరకై పురుష ప్రయత్నమును ఆశ్రయించుటయే మీకు శుభప్రదం. అదే మీ తక్షణ కర్తవ్యం. ఎందుకంటారా? ఈ శరీరం స్థిరంగా కలకాలం ఉండేది కాదని మీ అందరికీ తెలుసు కదా! దీని అస్థిరత్వమును దృష్టిలో పెట్టుకొని మీరు విచారణశీలురు కావాలి. నాయనలారా! పశుతుల్యమగు మూఢత్వమును త్యజించండి. సాధుజన సాంగత్యమును, సచ్ఛాస్త్రములను ఆశ్రయిస్తూ, మీ మీ ప్రయత్నములను దృఢత్వం చేయండి. ఈగ కురుపుపై వ్రాలి, అక్కడి చీము నెత్తురు త్రాగుచు సంతోషపడునట్లు మీరు స్వల్ప విషయములగు గృహ అన్నపానాదుల కొరకై మహత్తరమైన మానవజన్మను వృథా చేసుకోకండి. అది ఉచితం కాదు.

శుభకర్మల వలన శుభం చేకూరుతోంది. అశుభకర్మల వలన అశుభం ప్రాప్తిస్తోంది. ఇక ఇందులో ‘దైవము’ లేక ‘అదృష్టము’ అనబడు మూడవ స్వతంత్ర వస్తువుకు అవకాశమెక్కడ? ’ప్రత్యక్షము’గా ఉన్నదానిని వదలిపెట్టి ‘అనుమానము’ను ప్రమాణంగా స్వీకరించేవాడు ఒకానొక రోజున తన చేతులను చూచుకొని, ‘పాములు’ అని భావించి భయముతో బాటలవెంట పరుగెత్తవలసి వస్తుంది. ‘అదృష్టమే నన్ను ఈ పనికి పురమాయించుచున్నది’ అని తలచువారి ముఖమును చూచి లక్ష్మి కూడా విముఖత్వం చూపుతోంది.

అందుచేత మనుజుడు తన పురుషకార బలంచేత మొట్టమొదట సాధన చతుష్టయ సంపత్తిని సమకూర్చుకోవాలి. వివేకమును సునిశితం చేసుకోవాలి. ఆత్మజ్ఞానమును ప్రతిపాదించే మహారపూర్వకమైన శాస్త్రములను విచారించాలి.
[NOTE: “సాధన చతుష్టయ సంపత్తి” అంటే ఏమిటో ఈ ప్రకరణంలోనే ముందుముందు సవివరంగా చెప్పబోవుచున్నారు.]

“నేను ఉత్కృష్టత పొందాలి” అనే లక్ష్యమును (ఆశయమును) కలిగియుండికూడా కొందరు అందుకు అనుకూలమైన శాస్త్ర విహితములైన ప్రయత్నములను ఆశ్రయించుటలేదు. అట్టివారి ఆశయములకు అర్థం ఏమి ఉంటుంది? “ఆ! ఏమి ప్రయత్నములు? ఎంతని ప్రయత్నించాలి? ఈ సత్కర్మల వ్యవహారమునకు అంతు ఎక్కడ?” అని తలచి తాత్సారం చేయరాదు. అప్రయత్నపరులు కారాదు. రాతి నుండి రత్నం ఎలా వస్తుంది? ప్రయత్నములేని వాడు ఏది మాత్రం ఎట్లా పొందుతాడు?

శాస్త్రోదితమైన ప్రయత్నం ఎన్నటికీ వ్యర్థం కాదు. “మట్టి కొద్దీ కుండలు, దారము కొద్దీ వస్త్రములు, పిండి కొద్దీ రొట్టె లభిస్తాయి” అనునది అందరికీ తెలిసిందే కదా! అదేవిధంగా పురుషార్థమును అనుసరించే ప్రయోజనములు కూడా ఉండటం జరుగుతోంది.


Page number:89

చేసిన ప్రయత్నమును బట్టే ఫలితములు సిద్ధిస్తున్నాయి. బాల్యం నుండే మాటిమాటికీ, అధికంగా ఆశ్రయించబడుచున్న సత్సంగము, శాస్త్ర చర్చ, శుభమైన అభ్యాసములు - ఇవన్నీ లక్ష్యమును దృఢతరం, సుస్పష్టం చేస్తున్నాయి. “ఉత్తమ జ్ఞానము కొరకు, తదనుకూలమైన ప్రయత్నములను చేసెదను గాక!” అను సంకల్పము రూపు దిద్దుకుంటోంది. అట్లు ఆశ్రయించుచున్న స్వప్రయత్నమే మానవునకు అమోఘమైన ఫలమును ప్రసాదిస్తోంది.

ఈ విధంగా ప్రత్యక్షములు, అనుభూతములు, దృష్టములు, శాస్త్ర సమ్మతములు అయిన ప్రయత్నములను ఆశ్రయించాలి. అట్లు చేయకుండా “దైవము నాపట్ల లేదు అందుకే నేను ఉత్తమ ప్రయత్నమేదీ చేయలేకపోతున్నాను" అని తలచు మూఢజనులు జ్ఞానుల దృష్టిలో జీవన్మృతులే. చిత్రం ఏమిటంటే, అనేక అవకాశములకు స్థానభూతమైన, ఉత్తమమైన ఈ మానవజన్మ పొందికూడా అనేకులు ఏ ఉత్తమ ప్రయత్నములను ఆశ్రయించకుండా రోజులు గడపివేస్తున్నారు. అనర్థహేతువగు సోమరితనమే లేకపోతే, గొప్ప పండితుడో ధనవంతుడో అవనివాడు ఎవడుంటాడు? సోమరితనము వల్లనే ఈ ధరామండలమంతా అనేకమంది మూర్ఖులతోను, దరిద్రులతోను, నర పశువులతోను నిండి ఉన్నదని నాకు అనిపిస్తోంది. బద్ధకము, సోమరితనము త్యజించిన వారికే ఉత్తమ వస్తువు లభ్యపడుతోంది.

ఓ రఘురామా! సచ్చాస్త్ర విధిని అనుసరించి, సత్సంగశీలుడై సదాచార పూర్వకంగా నిర్వహించబడిన కర్మ సంపూర్ణంగా ఫలప్రదమౌతోంది. లేకుంటే ఉత్తమమైన ప్రయోజనం లభించుటలేదు. పురుష ప్రయత్నము యొక్క, కర్మయొక్క స్వరూప స్వభావములు అట్టివి. ఇదే కర్మ సిద్ధాంతము. దీనిని గ్రహించి చరించు మనుజుడు ఎన్నటికీ విఫలుడు కాడు. హరిశ్చంద్రుడు మొదలైన అనేకమంది ఉత్తములు అనేక దుఃఖ -దారిద్ర్యములు పొందుచున్నప్పుడు కూడా తమ పురుషకారమును, ప్రయత్నమును త్యజించలేదు. అందుచేతనే వారు ఇంద్రతుల్యులు అయ్యారు. మీ పూర్వీకులగు అనేకమంది చక్రవర్తుల చరిత్రలు ఇట్టివే.

బాల్యే గతే విరతకల్పిత కేళిలోలే,
దోర్దండమండితవయః ప్రభృతి ప్రయత్నాత్ |
సత్సంగమైః పదపదార్థవిశుద్ధబుద్ధిః
కుర్యాన్నరః స్వగుణదోష విచారణాని || (V–31)

ఓ జనులారా! ఒక్కసారి ఈ యావత్తు జీవితమును పరికించి చూడండి. బాల్యమంతా అతి చంచలమైన హావభావములతో, కల్పిత క్రీడలతో గడచిపోతోంది. ఉత్తమ కర్మాచరణం సులభంగా అలవడు అవకాశమున్న బాల్యము మూర్ఖత్వంతో, అజ్ఞానంతో వృథా అవుతోంది. ఈ బాల్యంలో సద్భావనలు, ఉత్తమ అభ్యాసములు ఆశ్రయించబడుట లేదు. పోనీ వారికి ఉత్తమ మార్గమును చూపగల విశాల బుద్ధి కలవారి శుశ్రూష (teachers and education system) లభిస్తోందా? లేదు. లభించినా, అనేకులు వినుటయే లేదు. జీవితము యొక్క ఉత్తమ లక్ష్యములను గ్రహించలేకపోతున్నారు.


Page number:90

సరే, బాల్యం గడచిపోయిన తరువాత, ఇక తాత్సారం చెయ్యరాదు. యౌవనమునుండే “ఇది నిత్యము – ఇది అనిత్యము” – అని విచారణ చేయాలి. అట్టి వివేకమును అధికం చెయ్యగల సుగుణములను అలవరచుకోవాలి. సత్సంగం కొరకు ప్రయత్నం చెయ్యాలి. శ్రద్ధగా ప్రయత్నించినప్పుడు లభించనిదంటూ ఏమి ఉంటుంది?

ఎప్పటికప్పుడు స్వీయగుణ దోషములను పరీక్షించుకొంటూ, తగిన చికిత్సా పూర్వకమైన స్వప్రయత్నమును ఆశ్రయించాలి. అంతేగాని, పరుల దోషములు ఎంచుచూ, కాలం వృథాపరచుకోరాదు.

సాయం సమయమైనది. ఆ రోజుకు సభ చాలించబడింది.

(మొదటిరోజు విచారణ పూర్తి అయింది)


Page number:91

రెండవ రోజు - ముముక్షు వ్యవహార ప్రకరణం

5.) ప్రయత్నము - కార్యసిద్ధి

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఓ సభికులారా! నిన్నటిరోజు మనం విచారించినదంతా మననముచే గ్రహించారు కదా! నిన్న చెప్పుకొన్నట్లు “ఇతః పూర్వపు ప్రయత్నరూపములైన కర్మలు” – అనునవి కాకుండా “అదృష్టము” అనబడు ఇంకొక వస్తువు ఏదీ లేదు. కనుక అట్టి అదృష్టమనునది దూరంగా నెట్టి వేయబడుగాక. “మానవుడు సాధుసంగం, సచ్ఛాస్త్రం, స్వవిచారణలను ఆశ్రయించి, స్వప్రయత్నముల ద్వారా ఆత్మ సముద్ధరణకు నడుం కట్టాలి" - అని గుర్తు చేస్తూ రెండవ రోజు విచారణ ప్రారంభిస్తున్నాను. ప్రయత్నమే అన్నిటికన్నా ముఖ్యమైనది.

“యథా యథా ప్రయత్నః స్యాత్, భవేదాశు ఫలం తదా !
ఇతి పౌరుషమేవ అస్తి, ‘దైవమ్’ అస్తు తదేవచ ॥ (VI–2)

చేసే ప్రయత్నములను బట్టే ఫలితములు ఉంటున్నాయి. ‘అదృష్టము’ అనునది కూడా పురుషకారమును అనుసరించే ఉంటోంది.

ఈ లోకులు దుఃఖములు పొందుచున్నప్పుడు “హా! హతవిధీ! ఎంత కష్టం” అంటూ ఉంటారు. ఏదైనా సంతోషకరమైన విషయం ప్రాప్తించినప్పుడు “ఓహో! ఎంతటి అదృష్టం!” అని పలుకుచున్నారు. వారు అట్లు ‘హతవిధి’ అని, ‘అదృష్టము’ అని సంబోధించునది పూర్వకాలపు లేక పూర్వజన్మల పురుష ప్రయత్నములనే అయి ఉన్నట్లు మేము గ్రహిస్తున్నాం. అంటే ’దైవము లేక అదృష్టము’ అను పదములు పురుషకారమునే (పురుష ప్రయత్నములనే) సూచిస్తున్నాయి. ప్రాక్తన కర్మలు కాకుండా వేరుగా జీవుని నియమించగల దైవము అనునది లేదు. ఎందుకంటావా? ఏ విధంగా అయితే బలశాలుడగు పురుషుడు ఒక బాలుని చిటికెలో వశపరచుకోగలడో, అదే విధంగా ప్రయత్నశీలుడైనవాడు అనాయాసంగా ‘అదృష్టము’ అనుదానిని వశపరచుకో గలుగుచున్నాడు.

ఒకడు తాను చేసిన అశుభ కర్మలను ప్రాయశ్చిత్త కర్మలచే శుభములుగా మార్చుకొంటున్నాడు. కదా! అదే విధంగా పూర్వకర్మల దోషములను వర్తమాన ఉత్తమ ప్రయత్నములచే తప్పకుండా శుభప్రదం చేసుకోవచ్చు. అట్లుకాకుండా అల్ప విషయముల పట్ల లోభమును పొంది, “దైవము” అనుదానిని జయించుటకు ప్రయత్నించకుండా, అద్దానికి లోబడి ఉండువారు మా ఉద్దేశంలో దీనులు, మూఢులే.

ఎప్పుడైనా వర్తమాన పురుష ప్రయత్నం విఫలమౌతుంటే అప్పుడు, మనం నిన్నటిరోజు చెప్పుకొన్నట్లు, ఇతఃపూర్వపు ‘వ్యతిరిక్త’ పురుషకారం ప్రబలంగా ఉన్నదని గ్రహించాలి. ఇక ఇప్పుడు శాస్త్రవిధిని, పెద్దలను ఆశ్రయించి యే యే ప్రయత్నములు ఉచితమో, ఉత్తమమో సద్విమర్శనా పూర్వకంగా నిర్ణయించుకోవాలి. మరల మరల ప్రయత్నశీలుడు కావాలి.


Page number:92

ఒక గుత్తిలోని రెండు పండ్లలో ఒకటి తియ్యగా మరొకటి పుల్లగా ఉంటే, ఇందుకు ఆ ఫలభోక్త యొక్క ఇతఃపూర్వపు కర్మాచరణమే కారణం” అని గ్రహించుటే ఉచితం కాని, దైవముపై ఆపాదించుట ఉచితం కాదు. ఎందుకంటే సర్వసాక్షి, అకర్త, అభోక్త అగు పరమాత్మకు కర్మదోషం ఎలా అంటగట్టగలం?

మహాప్రసిద్ధమగు పదార్థములు క్షయం పొందుతున్నప్పుడు కూడా “ఇది క్షయ కర్త యొక్క పురుషకారమే” అని గ్రహించబడుగాక. ఈ జగత్తులోని ప్రతి అభివ్యక్తము వెనుక ప్రయత్నశీలత్వమే అంతర్లీనంగా ఉండి ఉన్నది. ప్రతిజీవుని యందు ప్రతి క్షణం ప్రాక్తన - ఆద్యతన’ పురుషకారములు ఒకదానితో మరొకటి సంఘర్షణ పడుచుండగా అందులో అధికమైన బలముగలది గెలుస్తోంది.

“ఒకానొక రాజ్యంలో రాజవంశం నశించింది. అక్కడి మంత్రివర్యులు తమ రాజును నిర్ణయించుకోవలసి వచ్చింది. వారు ఒక శుభమైన రోజున ఒక ఏనుగును అలంకరించారు. దాని తొండమునకు ఒక పూలమాల అందించి రాజవీథిలో వదిలారు. అనేక ప్రదేశముల నుండి తండోపతండములుగా వచ్చిన జనులు ఆ వీథిలో గుమిగూడి ఉన్నారు. ఆ ఏనుగు ఒకానొక భిక్షకుని మెడలో ఆ దండను వేసి రాజుగా చేసింది. ఆ భిక్షకుడు చాలాకాలం రాజ్యం పాలించాడు. ఈ సంఘటనలో కూడా “అంతా దైవమే చేశాడు” అనటం భావ్యం కాదు. ఇందులో మంత్రుల యొక్క పౌరుల యొక్క ఏనుగుయొక్క, రాజశాసనము యొక్క ప్రయత్నశీలత్వమే (పురుషకారమే) అట్టి సంఘటనకు కారణమైనది. వారి సమానాభిప్రాయబుద్ధి, అందుకు సంబంధించిన ప్రయత్నమే భిక్షకుని రాజుగా చేసింది. ఇక, భిక్షకుడు అంతకు ముందు చేసియున్న ప్రయత్నములను మనం చూడలేం కనుక “ఇది దైవము చేశాడు" అనే పదప్రయోగం చేయటం జరుగుతోంది. అంతేకాని ఈ సంఘటనలో ‘దైవము’ ఎక్కడ పాల్గొన్నది?

ఒకానొకడు ఏదైనా సాధించుటలో సమర్థుడు అగుచున్నప్పుడు అతని ప్రయత్నము దృష్టము కావచ్చు. లేక ఎదురుగా కంటికి కనబడకపోవుటచే ’అదృష్టము’ కావచ్చు. కాని మరొకడు అట్టి సమర్థత వెనుక ఉన్న ప్రయత్నశీలత్వమును గమనించలేడు. కనుక “ఇదంతా దైవమే అతనికి ప్రసాదించింది” అని భావించి ఊరట చెందుచున్నాడు. అయితే అట్టి అభిప్రాయం జ్ఞానుల దృష్టిలో మూర్ఖమగు అభిప్రాయం మాత్రమే. ఈ ప్రపంచంలో మనకు ఒక సమర్థుడైన వ్యక్తి కంటే ఇంకా అధికమైన సమర్థతగల వ్యక్తి తారసపడుచున్నాడు కదా! ఆ భేదం ఎక్కడి నుండి వస్తోంది? ఆ రెండవవాడు అధికమైన ప్రయత్నం చేసియుండట చేతనే. కాబట్టి ‘సమర్థత’ అనునది అదృష్టానుసారం ఉండేది కాదని, స్వప్రయత్నముల అల్పాధిక్యములను బట్టి ప్రాప్తించేదేనని తెలిసిపోతోంది.

ఈ వర్తమానమునందు ఆశ్రయించబడు ప్రయత్నములచే ఇతఃపూర్వపు దుష్కర్మల సంస్కారమును జయించివేయవచ్చునని అనుకున్నాం కదా! అయితే, వర్తమానపు శుభ ప్రయత్నములను ఇతః పూర్వపు అశుభ ప్రయత్నముల (కర్మల ఆకర్షణ ఓడించకుండా చూచుకోవాలి. ఉత్తమమగు లక్ష్యమునుండి చలించనివాడే విజయమును పొందుచున్నాడు.


Page number:93

ఎప్పుడైనా సరే, ఈ ప్రాక్తన - వర్తమాన పురుషకారములు రెండిటిలో ఐహిక (వర్తమాన) పురుషకారమే అధిక బలమైనదిగా భావించాలి. ఈ ఐహిక పురుషకారం ఇప్పుడు మన చేతిలో ఉన్నది. “ప్రయత్నం చేయుటచే నేను ప్రాక్తనమును జయించి వేయగలను” అను నమ్మకం కలిగి ఉండాలి. తనపై, గురువుపై, శాస్త్రముపై విశ్వాసము, నమ్మకము (faith and confidence) కలిగి ఉండాలి. ”అయ్యో! నేనేమి చేయగలను? నేను ఒక స్వల్ప మానవుణ్ణి. ఇది ఇంతే. ఎవరో మహానుభావులే దీనిని అధిగమించగలరు. మా వంటి మామూలు మనుష్యుల వలన ఏమౌతుంది?” - ఇటువంటి దౌర్బల్యములైన భావములు కలిగియుండి, అప్రయత్నశీలురై ఉండేవారికి ధిక్కారమగుగాక!

ఓ రాఘవేంద్రా! ఒక రైతును గమనించు. ఆతడు సంవత్సరమంతా కష్టపడి పండిస్తాడు. ఒక్కొక్కసారి ఒక రోజు వచ్చిన తుపాను తాకిడికి చేతికి వచ్చిన పంట అంతా దెబ్బ తింటుంది. అతడు కొద్ది క్షణాలు నిరుత్తరుడౌతాడు. అయితే అట్టి నిరుత్సాహమునందే కృంగిపోయి ఊరుకుంటున్నాడా? లేదు. మరల “విత్తులు ఎక్కడ? నాగలి ఎక్కడ?” అంటూ పునః ప్రయత్నశీలుడై మంచి పంటను సాధిస్తున్నాడు. వర్షము యొక్క పురుషార్థము వలన దెబ్బతిన్న ఆ రైతు స్వకీయమైన పురుషార్థముచే తిరిగి పుంజుకొంటున్నాడు. ప్రతిజీవుడు ఇందలి పాఠమును గ్రహించాలి. అధిక ప్రయత్నం చేసేవాడు విజయం తప్పక సాధిస్తాడు.

అదే విధంగా ఒక వ్యాపారస్తుడు కష్టపడి ఆర్జించిన విత్తమంతా నష్టపోయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? తిరిగి ప్రయత్నించి లాభములు ఆర్జించటానికి నడుం కట్టుచున్నాడు కదా! అట్లు ప్రయత్నించుటయే ఉచితం. అట్లాకాకుండా, దుఃఖించుచు కాలం గడపటం, ప్రయత్నమును త్యజించటం ఉచితమెట్లా అవుతాయి?

అనువుకాని చోట, చేయకలిగినదేమీ లేనిచోట దుఃఖించటం అనవసరం, నిష్ప్రయోజనం కూడా. అట్లు దుఃఖించ తలచుకొంటే అనివార్యమైన మృత్యువు గురించి మననం చేస్తూ ప్రతి రోజు కొంతసేపు ఓ మూల కూర్చుని దుఃఖించాలి. అట్లా చేస్తున్నామా? లేదు కదా! కాబట్టి ఇప్పటికిప్పుడు ఏది చేయలేమో దానిని గురించి విచారించటం అప్రస్తుతం. చేయకలిగినట్టి ఉత్తమ ప్రయత్నమునకై వెతకి, అద్దానిని విధి - విధానముగా, శ్రద్ధతో, సదవగాహనతో నిర్వర్తించుటయే మనం ప్రస్తుతం చేయవలసినది.

  1. ప్రాక్తనము = ఇతఃపూర్వం చేసియున్న ప్రయత్నములు (Past deeds / efforts made in the past)
  2. ఆద్యతనము = వర్తమాన ప్రయత్నములు (Present deeds / efforts)

Page number:94

6.) దైవ ప్రేరణ - పురుషార్థము

ఈ జగత్తులోని పదార్థాలన్నీ దేశ - కాల - క్రియ - ద్రవ్యముల శక్తిని అనుసరించి ప్రకాశించుచున్నాయి. వీటన్నిటిలో అధిక యత్నశీలి అయినవే జయిస్తున్నది. మానవుడు సర్వదా పౌరుష బలమునే ఆశ్రయించాలిగాని, తెలియని దైవంపై భారంవేసి అప్రయత్నశీలుడగుట ఉచితంకాదు. సాధు సాంగత్యం, శాస్త్ర విచారణ ఆశ్రయించి ముందుగా చిత్తశుద్ధిని సంపాదించాలి. చిత్తశుద్ధి సహాయంచేత దుర్భరమైన సంసార సాగరమును దాటివేయాలి.

ఈ "ప్రాక్తన-ఐహిక పురుషకారములు” అనే ఫలవృక్షాలలో బలమైన వృక్షం బలహీనమైన దానిని కప్పివేస్తోంది. మానవుడైనవాడు నిజప్రయత్నములచే ప్రాక్తన కర్మలను అణగత్రొక్కివేయాలి. ఎవడైతే అట్లు చేయడో, - అట్టి వానికి తన సుఖ దుఃఖముల రెండిటి యందును స్వాతంత్ర్యము ఉండదు. నిజప్రయత్నములను బలవత్తరం చేయలేని పశుతుల్యుడగు జీవుడు ఈశ్వర ప్రేరితుడై స్వర్గ నరకములకు వెళ్ళి వస్తూ ఉంటాడేగాని, స్వతంత్రుడు కాలేడు. అట్టివాడు సర్వదా పరాధీనుడే. ఇక ‘మోక్షము’ అను మాట ఎక్కడిది? సదాచార సంపన్నుడు, ప్రయత్నశీలుడు అగువాడు మాత్రమే ఈ ’జగన్మాయ’ అనే పంజరమును ఛేదించి బయటకు రాగలుగుచున్నాడు. అతనికి తన ఉదారము, చమత్కారము అయినట్టి స్వకీయ ప్రయత్నమే తోడుగా నిలచి బంధవిముక్తిని ప్రసాదించుచున్నది.

కశ్చిన్మాం ప్రేరయిత్యేవమ్ ఇత్యనర్థ కుకల్పనే
యఃస్థితో దృష్టముత్సృజ్య నత్యాజ్యో సౌ దూరతో ధమః || (VI–29)

ఎవ్వరైతే ఎదురుగా (దృష్టమై) కనిపించుచున్నట్టి పురుషప్రయత్నమును, దాని యొక్క ప్రయోజనమును గుర్తించక, “నన్ను ఎవరో ఎక్కడినుండో ప్రేరేపిస్తున్నారు. లేక నా ప్రయత్నముల నుండి నన్ను నిరోధిస్తున్నారు. అందుచేతనే నేను ఇట్లు అగుచున్నాను” అని తలచుచు, కుకల్పనలు చేసుకొంటూ, లక్ష్యశుద్ధి లేకుండా అప్రయత్నశీలురై ఉంటారో, అట్టివారిని దూరంగా త్యజించటం మంచిది.

వేలకు వేలు వ్యవహారాలు ప్రతి రోజు ఈ జీవుని సమక్షమునకు వస్తున్నాయి. పోతున్నాయి. వాటియందు రాగద్వేషాలు కలిగియుండకుండా శాస్త్రానుసారం ఆచరించటమే ఉత్తమం. శాస్త్రానుసారంగా లోకానుకూలంగా స్వీయకర్మలను రక్షించుకొనువాని వద్దకు, రత్నాలన్నీ సముద్రంలోకి వచ్చి చేరుచున్నట్లు, ఉత్తమ గుణములు, అభీష్ట సిద్ధులు వచ్చి చేరుచున్నాయి.

ఏ యత్నములైతే సుఖదాయకములై, దుఃఖనివృత్తికరములై ఉంటున్నాయో, అట్టి యత్నములనే విజ్ఞులైన పెద్దలు “పౌరుషము” అని నిర్ణయిస్తున్నారు. శాస్త్ర విహితములైన అట్టి యత్నములే “పురుషార్థము” అను ప్రయోజనమును కలుగచేస్తున్నాయి. ఇట్టి కర్మయొక్క రహస్యమును (కర్మ సిద్ధాంతమును) గ్రహించినట్టి బుద్ధిమంతులగువారు ఊరకే కాలం వృథాచేయరు. వారికి “అయ్యో! ప్రాప్తిస్తుందో? లేదో?” - అను రూపముగల ప్రాప్తాప్రాప్తములు ఒక లెక్కలోనివి కావు. ప్రయత్నమును అనుసరించే ప్రయోజనము ఉంటుందని వారికి తెలుసు.


Page number:95

అందుచేతనే వారు గురుసేవ, స్వాధ్యాయనము, సాధు సంగం, శ్రవణము, పరోపకారము మొదలైన ప్రయత్నములచే, తమ చిత్తములను దోషరహితం చేసుకొంటున్నారు. తద్వారా ఆత్మోద్ధరణమును సాధించుచు, స్వస్వరూపము, సర్వస్వరూపము అయినట్టి “ఆత్మానుభవము” అను పురుషార్థమును క్రమంగా పొందుచున్నారు. అనిర్వచనీయమగు ప్రశాంతత్వమును అవధరిస్తున్నారు. కనుక ఓ రామా! నీవు సర్వ విధములైన లౌకిక పార లౌకిక ప్రయత్నములన్నీ “చిత్తశుద్ధిని పొందెదను గాక" అను లక్ష్యముతో చెయ్యాలి కాని, మరింకెందుకూ కాదు.

నాయనా! రాఘవా! ఈ ద్వైత వైషమ్యమంతా అజ్ఞానముచేతనే ప్రాప్తిస్తోంది. అట్టి వైషమ్యమును నివృత్తింప చేసి, ‘సమతానందము’ అను దానిని పొందించునదే “పురుషార్థం” అని పెద్దలు పిలుస్తున్నారు. అట్టి అఖండానందమే జీవుని లక్ష్యము కావాలి. అయ్యది ప్రాప్తింపచేసే శాస్త్రములను,
సాధువులను, సత్కర్మలను ఎల్లవేళల సేవించాలి.

ప్రాక్తనకర్మ పరలోకములలో (In the past births) అనుభవించగా మిగిలినదే మనతో ఈ లోకానికి వచ్చి మన ఈ వర్తమాన అనుభవములకు కారణమగుచున్నది. దానినే జనులు ‘దైవము’ అని పిలుస్తున్నారు. “భ్రాంతము” (ఇది కష్టము - ఇది సుఖము అను భావన భ్రాంతియే కాబట్టి వసిష్ఠ మహర్షి ఆ అనుభవమును ‘భ్రాంతము’ అని వర్ణిస్తున్నారు), “అదృష్టము” (ఎదురుగా కనబడునది కాదు కాబట్టి) అయినట్టి ప్రార్తన కర్మను ఉద్దేశించి "అయ్యో! దైవమా! ఇది ఇట్లగుచున్నదేమిటి?” అనునట్టి వాక్యములచే కొంత ఊరట చెందుచున్నారు. వారిని అట్లే పొందనీ, వారిని, నేనేమీ అనుటలేదు. కానీ, వర్తమానంలోని పురుషకారమును త్యజించి, మూఢులచే కల్పించబడిన “అదృష్టము”ను ఆశ్రయించేవారిని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. అట్టి అదృష్టము ఎక్కడ ఉన్నది? ఎక్కడి నుండి లభిస్తోంది? అదృష్టమును నమ్మి ఉండునట్టి నిష్క్రియులు క్షయము వైపే పయనించుచున్నారని గుర్తుచేస్తున్నాను. ఎందుచేతనంటావా? నిజ పౌరుషబలము చేతనే సకల శుభములు చేకూరచుండగా, అట్టి స్వప్రయత్నము విషయంలో అశ్రద్ధ కలిగియుండుట ఉచితము ఎట్లా అవుతుంది? వర్తమాన సత్కార్యములు, ప్రాయశ్చిత్త కర్మలు శుభములుగా మారి భవిష్యత్తునందు శోభను కలుగచేస్తున్నాయి.

అందుచేతనే ఓ రామా! ఈ జీవుడు కార్యశీలుడు కావాలి. బద్ధకమును, అశ్రద్ధను త్యజించాలి. అతడు స్వకీయమైన పురుష కారముచేత కోరుకొన్న ఫలమును అరచేతిలోని ఉసిరికకాయవలె ప్రత్యక్షం చేసుకోగలడు. మూఢుడైనవాడు మాత్రమే ప్రత్యక్షమును పరిత్యజించి ‘అదృష్టము’ అను మోహమునందు నిమగ్నుడగుచున్నాడు. ఓ శుభాశయా! రామచంద్రా! ఈ కార్యకారణములకు సంబంధించిన సమస్త సంశయములను కాస్త ప్రక్కకు పెట్టు. నీయొక్క చిత్తవృత్తి బలంచేత కల్పితము, మిథ్య అయినట్టి ‘దైవము’ అను దానిని అపేక్షించటం మానివేయి. పురుషకారమును (లేక ప్రయత్నమును ఆశ్రయించి ఉద్దారణ పొందెదవుగాక!


Page number:96

ఈ జీవుడు చిత్తశుద్ధి పొందితే అంతా సుస్పష్టమే అవుతుంది. అయితే చిత్తశుద్ధి లభించేదెట్లా? జ్ఞానము వలననే. జీవుని సముద్ధరించగల ఉత్తమోత్తమజ్ఞానం (ఆత్మజ్ఞానం లభించాలంటే, ‘వేదములు’ మొదలైన శాస్త్రములచేతను, సత్పురుషుల ఆచరణ చేతను, వారిచే బోధింపబడుచున్న ప్రవచనముల చేతనే సాధ్యం. అట్లాగే, దేశకాలములను అనుసరించి చెప్పబడే ధర్మములను ఆచరించాలి. అన్ని వేళలలోను హృదయంలో “చిత్తశుద్ధి - జ్ఞానము” అనే మధుర ఫలములను ఉత్పత్తి చేయగలిగినట్టి ఉపాయములకొరకు అన్వేషించాలి. అట్టి నిరంతర ప్రయత్నములను ఆశ్రయించాలి. అందుకొరకై ‘తీవ్రేచ్ఛ’ కలిగియుండాలి.

ఓ రామా! ఒకడు కనుక “చిత్తశుద్ధి - జ్ఞానము” పొందవలెనను తీవ్రేచ్ఛ కలిగి ఉంటే, తదనుకూలమైన సాధనములు, ప్రయత్నములు వాటంతట అవే సమకూరుతాయి. అప్పుడు అట్టి ప్రయత్నశీలునియందు స్ఫురించే కార్యక్రమ వ్యవహారమే “పౌరుషము” అని చెప్పబడుతోంది. మల్లయుద్ధ వీరుడు పోటీలో గెలవాలంటే బలము, తెలివి రెండూ కావాలి కదా! అట్లే జీవుడు కూడా మాయను జయించాలంటే “ఉత్తమ ప్రయత్నములచే (తపస్సు, ధ్యానము, లోకోపకారములగు కర్మలు, నామస్మరణ మొదలైనవి) పొందబడగల “చిత్తశుద్ధి”: సద్గురుసేవ, శాస్త్ర విచారణ, స్వయముగా విచారించుట మొదలైన వాటిచే వివేకము వికసించగా పొందబడగల “జ్ఞానము” ఈ రెండింటిని సంపాదించుకోవాలి.

కనుక ఓ ప్రియ రామచంద్రా! మానవుడైనవాడు మొట్టమొదట బుద్ధిబలంతో పురుషకారమును ఆశ్రయించి, సర్వవేళలా, సర్వవిధములా ప్రయత్నించుటయే ఉచితం. అప్పుడే మానవ జన్మ సార్థకమౌతుంది. ఆ తరువాత, శాస్త్రములను, సాధువులను, పండితులను సేవించి ఆ ప్రయత్నములను సఫలం చేసుకోవటమే కర్తవ్యమైయున్నది.

మహాత్ములగు వివేకశీలురు దైవము-పురుషకారము - ఈ రెండిటి యొక్క బలాబలములను చక్కగా విచారించి, పరిశుద్ధమైన లక్ష్యముతో వర్తమాన ప్రయత్నములను ఉత్సాహపూరితం చేసుకొంటున్నారు. అందుకే వారు జీవించి ఉన్నందుకు ఉత్తమమైన ప్రయోజనమును పొందుచున్నారు. కనుక, నీవు కూడా జ్ఞాన సేవితమైనట్టి శ్రవణ మననాదులను ఆశ్రయించు. సర్వదా ఆత్మోద్ధారణ వైపునకే ప్రయాణించెదవు గాక!

స్వాభావికమైనట్టి ఐహిక (Present) పురుషకారమునే కార్యసిద్ధి యొక్క ఉపాయంగా జీవుడు ఎంచుకోవాలి. ఆత్మజ్ఞానులగు పండితులు ఉన్నారు. వారిని, వారు చెప్పుదానిని ఉపేక్షిస్తూ రోజులు గడపటం ఉచితంకాదు. వారిని సేవించుచూ సత్యాసత్య వివేక రూపమగు జ్ఞానమును సంపాదిస్తూ, సత్కర్మాచరణులై జనన మరణరూపమగు ‘సంసారభ్రమ’ అను రోగము నుండి విముక్తులు అగుటకు ప్రయత్నించెదరు గాక శాంతిని, సమతాభావమును పొందెదరుగాక!

అట్లాగే జీసస్, మహమ్మద్, బుద్ధుడు, గురునానక్ మొదలైన ప్రవక్తలచే బోధింపబడిన గ్రంథాల చేత కూడా.


Page number:97

7.) నిజప్రయత్న ప్రాధాన్యం

ఓయీ! మానవుడా! నీవు ఈ ఉత్తమమైన ఉపాధిని పొందావు. నిత్యానిత్యములను విచారించి గ్రహించగలిగే సూక్ష్మబుద్ధినికూడా పొంది ఉన్నావు. (జంతువుల బుద్ధితో పోల్చినప్పుడు మానవుని బుద్ధి సునిశితమైనదే కదా!) అనేక ఉపాయములకు అవకాశమైయున్న ఈ జీవితమును వ్యర్థపరచుకోవటం తగిన పనేనా? కాబట్టి శ్రద్ధాసక్తుడవై, స్వస్వరూపమగు ఆత్మయందు సమాధానమును పొందు లక్ష్యముతో వ్యవహరించాలి. ఈ దుష్ట సంసార వ్యవహారమును అంతరంగము నుండి తొలగించివేయి.

‘పురుషకారము’చే ‘అదృష్టము’ను నివారింప యత్నించువానికి ఇహ పరలోకముల రెండిటియందు అభీష్టసిద్ధి ప్రాప్తిస్తోంది. అట్లుకాక, అదృష్టమును నమ్మి అప్రయత్న పరులై ఉండేవారు తమకు తామే శత్రువు లగుచున్నారు. తమయొక్క ధర్మార్థ కామములను తామే నశింపచేసుకొంటున్నారు. ఇక మోక్షము విషయమై వేరే చెప్పేదేమున్నది?

పౌరుషము యొక్క స్వరూపములు మూడు

  1. పురుషార్థమును సాధించవలెనను ’ఇచ్ఛ’
  2. కర్మేంద్రియముల ప్రవృత్తి
  3. తత్త్వజ్ఞాన వికాసము

ఈ మూడు, ఒకదానికి మరొకటి ‘తోడు’ అగుచు ఉత్తమ ఫలమును ప్రాప్తింప చేస్తున్నాయి. మనస్సునందు ఎట్టి విషయము స్ఫురిస్తుందో, చిత్తము కూడా అట్టి ఆకారమునే దాల్చుట జరుగుతోంది. అట్టి చిత్తము నుండి ఇంద్రియముల యత్నములు బహిర్గతమౌతున్నాయి. ఒకడు తన బాల్యమునుండి ఏఏ విషయముల గురించి ఏఏ ప్రయత్నములు చేస్తాడో - ఫలితములు కూడా ఆ ప్రయత్నములబట్టే ఉంటున్నాయి. ఇక ‘దైవము’ అనుదానికి వేరే చోటెక్కడ? అందుచేతనే ‘పౌరుషము’ అనునది సర్వమునకు మూలకారణమై ఉన్నదని మేము సిద్ధాంతీకరించటం జరుగుతోంది.

ఓ రాఘవా! తమ పురుషకారము చేతనే ఎవరైనా ఏదైనా ఈ జగత్తులో పొందగలుగుచున్నారు. పురుషకారము వలననే బృహస్పతి దేవతల గురువు అయ్యాడు. అట్లే శుక్రాచార్యుడు రాక్షసులకు ఆచార్యుడై వెలయుచున్నాడు. మనుష్యులలో కూడా కొందరు అనేక దైన్య, దారిద్ర్యములచే పీడింపబడుచూ కూడా, ఉత్తమ పురుషకారమును ఆశ్రయించినవారై ఇంద్రసమానులగుచున్నారు. అదే విధంగా ‘నహుషుడు’ మొదలైన మరికొందరు అనేక సంపదలతో భోగములతో తులతూగుచు, తమ స్వప్రయత్నముల దోషములచే నరకమున కూలిపోయారు. ఎదురుగా ఉన్న ఈ ప్రపంచమునే చూడు. ఇక్కడ జీవులు వేలకువేలుగా సంభవిస్తున్న ఆపదలను, దుర్దశలను తమ పురుష ప్రయత్నము చేతనే అధిగమించుచున్నారు కదా!

శాస్త్రములు ఎందుకొరకు రచించబడ్డాయి? “అశుభ మార్గమున పయనించే చిత్తము సర్వప్రయత్నములచే శుభమార్గమునకు మరలించబడుగాక” అని ప్రతిపాదించి, మానవుని చక్కదిద్దుటకే కదా!


Page number:98

అవి సక్రమంగా అవగాహన చేసుకోబడుగాక! ఆచరించబడుగాక! గురుజనులు కూడా మానవులకు, “నాయనలారా! శుభదాయకము, అనపాయకరము, ఉత్తమ ఫలప్రదము అయున్న ఈ ఈ క్రియావ్యవహారములను యథారీతిగా యత్నపూర్వకంగా ఆచరించండి” అనే ఉపదేశిస్తున్నారు. అంతేగానీ, “దైవమే అన్నీ ఇస్తాడు. మీరు ఇష్టం వచ్చినట్లు తిని-తిరగండి”.. అని చెప్పటం లేదే!

“నేను ఏ రీతిగా ప్రయత్నిస్తున్నానో, ఫలములు కూడా ఆ రీతిగానే ప్రాప్తిస్తున్నాయి. అందుచేత నేను నా ప్రయత్నములనే సరైన మార్గంలో నియమించెదను గాక“ - అని మానవుడు భావించాలి. ఎప్పుడైతే అతడు అట్టి సద్విమర్శ చేయడో, అప్పుడు తనకు దైవము వలననో, అదృష్టము వలననో, ఇతరుల వలననో అశుభములు ప్రాప్తిస్తున్నాయని అనుకోవటం, వాపోవటం జరుగుతోందని మా అభిప్రాయం. అతడు అనేకసార్లు “నా సామర్థ్యము, ప్రయత్నము ఎట్లా ఉన్నాయి?” అని ప్రశ్నించుకోకుండా “వారి వలన నేను ఇది సాధించలేకపోయాను" అని అంటూ పరదూషణకు దిగుచున్నాడు.

పౌరుష బలముచేతనే కార్యసిద్ధి జరుగుతోంది, - అనునది నిర్వివాదాంశము. బుద్ధిమంతులు పౌరుష బలమును ఆశ్రయించే తమ కార్యములచే అనేకులను ప్రభావితం చేయగలుగుచున్నారు. అయితే, జీవితంలో అయిష్టమైనవి, కష్టమైనవి సంభవిస్తున్నప్పుడు అల్పబుద్ధి గలవారిని ఓదార్చుటకు బుద్ధిమంతులైనవారు ‘దైవము’ అనే శబ్దమును ఉపయోగించటం జరిగింది. అట్లు కల్పించబడిన ‘దైవము’ అనుదాని పట్ల విశ్వాసముచే (లేక భీతిచే) ఉత్తమ కార్యాచరణము నిర్వర్తించబడగా, ఆ శిష్యులు ఉత్తమ బుద్ధి సమన్వితులై సర్వము గ్రహించగలరనునదే బుద్ధిమంతుల ఉద్దేశం. ఇది చిన్నపిల్లలకు ప్రమాదరహితమైన సత్ప్రవర్తన నేర్పుట వంటిదే. అయితే ‘దైవము’ అను శబ్దము ఏదీ స్వయముగా ప్రసాదించదు. ప్రయత్నబలమును అనుసరించే సదవగాహన - సత్ప్రవర్తనములనుండే ఔన్నత్యమనేది లభిస్తోందని గ్రహించు.

“పురుషకారమే ఫలవంతమగుచున్నది“ …. అనునది అందరికి, అన్నివేళల ప్రత్యక్షానుభవమే. ఒకడు ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళాలంటే కూడా స్వప్రయత్నమే శరణ్యమగుచున్నది కదా! భుజించినవానికే రుచి తెలుస్తోంది. తృప్తి కలుగుతోంది. ఆకలి తీరుతోంది. భుజించనివానికి ఆకలి ఎలా తీరుతుంది? నడిచేవాడే వెళ్ళగలుగుతాడు. నడువనివాడు వెళ్ళేదెట్లా? మాట్లాడేవాడే చెప్పగలుగుచున్నాడు. మాట్లాడనివాడు తాను అనుకొన్నది ఎట్లా చెప్పగలుగుతాడు? అందుచేత, పౌరుషమే జనులకు సిద్ధిదాయకమగుచున్నదనుటలో ఎవరికీ, ఏమాత్రం సందేహం ఉండవలసిన అవసరం లేదు. అనేకమంది ధైర్యశాలురు పౌరుషమును ఆశ్రయించే గొప్ప సంకటముల నుండి విడివడుచున్నారు. ”మా అదృష్టము ఇంతే కాబోలు” అని నమ్మి ఊరక కూర్చునేవారు ఏమి సాధించగలరో చెప్పు?


Page number:99

ఓ రామా! మరల మరల ప్రకటిస్తున్నాను. ఏ వ్యక్తి ఎద్దానికొరకు ఎంతగా ప్రయత్నిస్తాడో, అతడు అద్దానిని అంతవరకే అట్లే పొందుచున్నాడు. తూప్లీభావం వహించి ఊరుకునే వానికి ఎక్కడా ఏమీ సిద్ధించుట లేదు. శుభ పురుషకారము శుభమునకు, అశుభ పురుషకారము అశుభమునకు దారితీస్తోంది. కాబట్టి నీవు దేనిని కోరుకొంటున్నావో, దాని కొరకే ఉత్తమ ప్రయత్నం చేయి. ఇక ఫలితమంటావా, అది వెనువెంటనే లభించవచ్చు. లేదా ఆలస్యంగా ప్రాప్తించవచ్చు. ఏది ఏమైనా శుభ ప్రయత్నములకు శుభము, అశుభ ప్రయత్నములకు అమంగళము వచ్చి తీరుతాయి. వాటిని ఎవరూ నిరోధించలేరు. ఇది అప్రతిహతమైన విధాన శాసనం.

అయితే, దేశకాలాధీనంగా పౌరుషబలంచే లభిస్తున్న శుభాశుభ ఫలములనే ‘దైవము’ (ద-ఏవమ్ = ఏదైతే / ఇస్తోందో) - అని అందరు పిలుస్తున్నారు. అంతేకాని, ‘దైవము’ అనగా, కనులకు కనబడని ఏదో తెలియరానిశక్తి, లేక, అకస్మాత్తుగా కారణం లేకుండా ప్రవర్తించేది, లేక, ఇంకొకచోట ఎక్కడో ఉన్నట్టిది అయిఉండలేదు.

పురుషుడు ఈ లోకమునందే జన్మిస్తున్నాడు. పెరుగుచున్నాడు. ముదుసలి అగుచున్నాడు. ఈ విధంగా బాల్య, యౌవన, వార్ధక్యాలు ప్రత్యక్షానుభవం అయినట్లుగా ‘అదృష్టము’ అనునది ప్రత్యక్షంగా లభిస్తోందా? లేదుకదా! కనుక మా ఉద్దేశంలో, కారణమే లభించనట్టి ‘అదృష్టము’ అనునది లేనే లేదు.

సత్పురుషులైన వారు "పరమార్థములను సాధించు యత్నములు” - అనువాటినే ‘పౌరుషము’ అను పేరుతో పిలుస్తున్నారు. లౌకిక దృష్టితో చూచినపుడు కూడా పౌరుషము లేక పురుషయత్నము వలననే అభీష్టములన్నీ సిద్ధిస్తున్నాయి. చేతులతో వస్తువులను కదల్చటం, మాట్లాడటం, చూడటం ఇట్లే సర్వేంద్రియ క్రియలు - ప్రయత్నము (లేక) పౌరుషబలం చేతనే జరుగుచున్నాయి. అంతేకాని, దైవబలంచేత కాదే! అయితే, ’అనర్థ కరములు - నిష్ప్రయోజనకరములు” అయిన ప్రయత్నములు అట్టి ప్రయోజనములనే కలుగచేస్తున్నాయి. అల్పాశయముతో కూడినవాటి ప్రయత్నముల వలన పొందేదేముంటుంది? అందుచేత, సత్సంగమందు, సచ్ఛాస్త్ర పర్యావలోకనమందు బుద్ధిని వినియోగిస్తే, ఆ బుద్ది సునిశితమౌతుంది. ఇప్పుడు ’సమగ్ర సదవగాహన’తో కూడిన ప్రయత్నము చేతనే అనుకొన్నది లభిస్తుంది.

అజ్ఞానం చేతనే వైషమ్య మమకార వృత్తులు జనిస్తున్నాయి. ఏ ప్రయత్నములైతే "సర్వవైషమ్య భావములను మొదలంట నివృత్తింపచేసి, అఖండానందమును ప్రాప్తింప చేయటానికి కారణములు కాగలవో, అట్టి ప్రయత్నముల సమూహమునే “పరమ పురుషార్థము” అని తత్త్వజ్ఞులు పిలుస్తున్నారు. అట్టి పురుషార్థమును ప్రాప్తింపచేయగల సదసత్ వివేకులగు సత్పురుషులను, సచ్ఛాస్త్రములను, శరణువేడటం సంసారబద్ధుడగు మానవునకు అత్యంత ఆవశ్యకమైయున్నది.


Page number:100

సరోవరంలో అందమైన తామరలు వృద్ధి చెందాయనుకో. అప్పుడు తామరల వలన సరోవరం, సరోవరం వలన తామరలు పరస్పరం శోభింపచేసుకుంటాయి. అదేవిధంగా, సచ్ఛాస్త్ర - సాధు సాంగత్యాల వలన బుద్ధి, బుద్ధి వలన సచ్ఛాస్త్ర - సాధు సాంగత్యాలు శోభిస్తున్నాయి. అందుచేత, బాల్యము నుండి వాటిని అభ్యసించాలి. వాటి వలన ఆ అభ్యసించువాడు తనను తాను ఉద్ధరించుకొనుటేకాక, అనేకులను తనవలెనే సమున్నతులను చేయగలడు. ఎందుకంటే, అతనికి స్వాత్మలాభమే చేకూరుతుంది కదా!

ఓ రామచంద్రా! ఈ ప్రపంచమంతా అదృష్టముచేత నడుచుచున్నదని భ్రమింప బడకుండుగాక! ఏది ఎక్కడ ఎట్లు జరుగుచున్నా, దాని వెనుక ప్రయత్నమే అంతర్లీనమై ఉండి ఉంటోందని నేను నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాను. భగవంతుడగు విష్ణుదేవుడు నిజప్రయత్నము చేతనే దుష్టులను శిక్షించుట, శిష్టులను రక్షించుట చేస్తున్నాడు. అంతేకాని ఆయనకు అదృష్టము కలసి వస్తోందా? కానే కాదు. ఈ జగత్తులో ఎవరికైనా పురుష ప్రయత్నమే ఇష్టసిద్ధిని ప్రాప్తింపచేస్తోంది. అందుచేత నీవు సర్వదా ప్రయత్నశీలుడవై ఉండు. సర్వ శంకలను త్యజించి ఏ ఏ ప్రయత్నములు ఉచితమో వివేకముచే విచారించి వాటిని ఆశ్రయించు. అంతేకాని ’కొయ్య’ను చూచి "ఇది పాము కాదు కదా?” అని అనుకొంటూ ’దైవము’ అనుదాని విషయమై లేనిపోని భ్రమలు పొందవద్దు. మహత్తరమైన అవకాశములు ఉన్న ఈ జీవితము అను దానిని జనులు లేనిపోని కల్పనలతో వృథా చేసుకోవటం తరచు జరుగుచున్నదని గుర్తు చేస్తున్నాను.

8.) అప్రయత్నశీలుడు - దుర్గతులు

ఓ రామచంద్రా! “దైవము" అని జనులు దేనిని దృష్టిలో పెట్టుకొని సంబోధిస్తున్నారో ఎంత తరచి చూచినా, నాకు అర్థమగుట లేదు. “దైవం” లేక “అదృష్టం” అనునది ఎక్కడ ఉన్నది? అద్దానికి ఆకారముగాని, కర్మగాని, చలనముగాని, పరాక్రమముగాని లేదే? అందుచేత అది మిథ్యాజ్ఞానము చేతనే ఆరూఢమై ఉంటోందని మా అభిప్రాయం. లేదా, ఇతఃపూర్వపు కర్మలు (లేక ప్రయత్నములు) ఫలోదకమగు చున్నప్పుడు (ప్రయోజనత్వము పొందుచున్నప్పుడు) సుదూర దృష్టితోకూడిన సూక్ష్మబుద్ధి లేని జనులచే “ఇవి దైవము యొక్క చేతలే కదా!” అను మాటలచే కల్పించబడినదని చెప్పక తప్పదు. (People who cannot see a little far pacify themselves by attributing the incidents to the unknown ‘DAIVAM’ ). భ్రాంతిచే త్రాడునందు పామును ఆరోపించునట్లు, వారు ‘దైవము’ అను కల్పిత వ్యవహారము నందు సుదృఢులై ఉంటున్నారు.

అయితే ప్రాక్తన కర్మలచే జీవుడు సర్వదా ప్రభావితమగుచు అస్వతంత్రుడుగా ఉండవలసినదేనా? లేదు. ఒక దృష్టాంతము విను.


Page number:101

ఒకడు కొంత చెడ్డగా కొంత కాలం వ్యవహరించటం జరిగిందనుకో. అప్పుడు ఆతడు ప్రాయశ్చిత్తరూపములైన (అనునయ వాక్యాలు, క్షమించ వేడుకొనుట, అధికమైన సేవా సహకారములు అందించుట మొదలైన) శుభకర్మలచే తాను బాధించియున్నవారి యొక్క సానుకూల్యము చూరగొనవచ్చును కదా! అశుభత్వం నుంచి తనయొక్క శుభత్వముచే దోషపరిహారం చేయబడుతోంది. అట్లే ప్రాక్తనకర్మలు (past deeds)చే ప్రాప్తించియున్న దుష్ట సంస్కారములను, వాసనలను (లేక దోషబుద్ధిని) ఇప్పటి ప్రయత్నములచే శుభప్రదం తప్పక చేయవచ్చు. వర్తమాన ఆద్యతన సత్కర్మలు ఇతఃపూర్వపు దోషములను ప్రక్షాళనం చేయగలవు. కాబట్టి రామా! నీవు సర్వదా సత్కార్యములు చేయుటకే యత్నించెదవు గాక!

కొందరు మూర్ఖులు ప్రత్యక్షమును ప్రక్కకునెట్టి అనుమానమును మాత్రమే ఆశ్రయిస్తూ “దైవమే అంతటికి కారణం. మాచేత సత్కర్మలు ఎప్పుడు చేయించాలో దైవమునకు తెలుసు. కనుక మేమేం చేయగలం?” అని చెప్పుకొంటూ వర్తమానంలో ఉత్తమ ప్రయత్నశీలురు కాకుండానే రాత్రింబగళ్ళు గడిపివేస్తున్నారు. అట్టి దుర్మతులు, మూఢులు నీకు తారసపడితే “దైవబలంచేత మమ్ము అగ్ని ఏమి చేయలేదు” అని తలచి అగ్నిలోకి దూకమను. ఒళ్ళు కాలకుండా బయట పడగలరేమో చూద్దాం. అందుచేత “నేను తగినంత ప్రయత్నశీలుడను కాలేదు కనుకనే ఉత్తమజ్ఞానం పొందలేకపోయాను” అని మనిషి భావించటం మంచిదికాని, “దైవం మాకు జ్ఞానం ప్రసాదించలేదు” అని సరిపెట్టుకొని కాలయాపన చేయటం ఉచితం మాత్రం కాదు.

సరే, “ఈ ప్రపంచమున దైవమే సర్వము నిర్ణయిస్తుంది. చూడరాని, చెప్పబడ జాలని ఆ దైవమే అన్నిటికి కర్త. ఇక కర్తృత్వమంటూ మరెవ్వరికీ లేదు” - అనే అనుకొందాం. ఇక పురుష ప్రయత్నమెందుకు? ఎవరో ఎక్కడో ఉండి నీ కాళ్ళు కదల్చుచున్నారా?

"పురుషప్రయత్నము లేదు. దైవమే ఉన్నాడు” అని అనుకోదలచుకొంటే ఇక మానవునకు, యంత్రచలితమైన ఆటబొమ్మకు తేడా ఏమి ఉంటుంది? దైవమే సర్వము చేస్తున్నప్పుడు ఇక స్నాన, దాన, జప తపాదులు ఎందుకు శాస్త్రములచే చెప్పబడుచున్నాయి?

[NOTE: లోకంలో “శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు" అను నానుడి ప్రచారంలో ఉన్నది. అట్లే “నారుద్రో రుద్రమర్చతి” అనునది రుద్రాభిషేకంలోని వాక్యం. (రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు). ఈ రెండిటియొక్క సమన్వయార్థం అతి సూక్ష్మబుద్ధితో గ్రహించాలి.]

దైవ నిర్ణయమే అంతా అయినప్పుడు, శాస్త్రోపదేశం మాత్రం దేనికి? మనం ఇప్పుడు ఈ ఆత్మవిచారణ చేస్తే మాత్రం ఏమి ప్రయోజన ముంటుంది? ఈ విచారణ - ఉపదేశాలను మానివేసి, కాళ్ళు చేతులు గాలికి వదలి కూర్చుంటే సరిపోతుంది కదా! ఆ ’దైవము’నే అన్ని ప్రయత్నములు చేయమని చెప్పి ఇక ఈ జనులను పురుషప్రయత్నం మాని చతికిలపడమందామా? కాబట్టి, దైవమును ప్రతిపాదించి, అప్రయత్నశీలురు కాగోరువారిని మేము లెక్కలోనికి తీసుకోము.

ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు - ఒక్క శవం తప్ప. యత్నము వల్లనే ఫలితమనేది లభిస్తోంది. “ఈ నా యత్న-ఫలితములు అల్పమైనవా? లేక పరమోత్కృష్టమైనవా?” – అనునది జీవుడు తన బుద్ధితో సరి అయిన నిర్ణయం చేసుకోవాలి.


Page number:102

కాని,“యత్నము వలననే ఫలితం" అనునది కర్మల యొక్క సిద్ధాంతము, అప్రతిహతమైన శాసనం అయున్నది. యత్నములను అనుసరించే జీవునకు త్రికాలములు ప్రాప్తిస్తున్నాయి.

అందుచేత, ఓ రామచంద్రా! “ఏది ఎట్లు అగుచున్నదో అదంతా ప్రయత్నాను సారమే ఉంటోంది” అని గ్రహించబడుగాక! ‘దైవము’ లేక ‘అదృష్టము’ అనునవి అర్థరహితమైన పదములేనని మా అభిప్రాయం. ఐనా, నాదొక ప్రశ్న. ”ఆకృతిలేని దైవము, ఆకృతి కలిగిన మనుజుడు చేసే ప్రయత్నములు” ఈ రెంటికీ సమన్వయం ఏకత్వం, సమాధానం ఎట్లా కుదురుతాయి. ఆ రెండిటికి సంబంధం ఎట్లా ఉంటుంది? అందుకే ఆ మాట నిష్ప్రయోజనమైనది. మరొక విషయం. కలము - కత్తి - ఈ రెండిటినీ ఒకేసారి ఉపయోగించటం సాధ్యమా? “దైవమే అంతా చేయిస్తాడు. కాని పురుష ప్రయత్నం కూడా ఉండాలి” అని అనటం అట్టిదే అవుతుంది. కాళ్ళు, చేతులు లేనివానిచే దైవము ఏదైనా చేయించగలదా? లేదు కదా! ఈ జగత్తులో ఒక పసిబాలుని దగ్గరనుండి, మహామేధావి వరకు ‘దైవము’ అనుదానిని తమ మనోబుద్ధులచే ప్రత్యక్షపరచుకొన్న వారెవరైనా ఉన్నారా? ఈ విధంగా ‘దైవము’ అనునది అసత్తేనని తేలుట లేదా?

‘దైవము’ అనబడునది వేరుగా ఎక్కడో ఉన్నదనే కొద్దిసేపు అనుకొందాం. అప్పుడు “ఈ బుద్ధి - దైవము - అనునవి రెండూ ఒక్కటేనా? వేరువేరా?” అనే మరొక ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే, అట్టి భావన చేసేది ఈ బుద్ధితోనే కదా! కనుక ఈ ప్రశ్నకు మనకు సమాధానం కావాలి. "నిశ్చయము అనే ధర్మమును నిర్వర్తించే ‘బుద్ధి’ - ‘దైవము’ అనుబడునవి ఒక్కటే. దైవము యొక్క ప్రభావము చేతనే, దైవమును అనుసరించే బుద్ధి ప్రవర్తిస్తోంది” అని మనం నిర్ణయిస్తామనుకో, అప్పుడారెండింటికి భేదం లేనట్లే కదా! అనగా బుద్ధియే దైవము కనుక ఇక బుద్ధినే మనం ఆశ్రయిస్తే పోతుంది కదా!‘ ’దైవము’ అనబడే మరొక వస్తువును ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకంటావా? ‘బుద్ధి’ అనునది అందరికి అనుభవభూతమై ఉంటోంది. దైవమా, ఎక్కడున్నదో, ఎట్లు ఉన్నదో తెలియదు.

[NOTE: “బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః” - శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత - సాంఖ్య యోగంలో “నాయనలారా! బుద్ధినే శరణు వేడండి. ఫలహేతువు (ఇక్కడ ‘దైవము’గా చెప్పబడుతోంది) చాలా అల్పమైన విషయం” అని హెచ్చరిస్తున్నారు.

[NOTE: “బుద్ధం శరణం గచ్ఛామి” - బుద్ధభగవానుడి ప్రవచనం.]

“దైవము - బుద్ధి వేరువేరు” అని అనుకుంటామనుకో, అప్పుడు, సంబంధంలేని రెండు విషయాలు సంబంధం కలిగి ఎందుకు ప్రవర్తిస్తున్నాయో చెప్పవలసి వస్తుంది. అనిర్వచనీయమగు దైవము ఈ సర్వజీవుల బుద్ధులను ఎందుకు ప్రభావితం చేస్తున్నది? దానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం లభించటం లేదు కనుక, మనం ‘దైవము’ అనుదానిపై ఆధారపడకపోవటమే మంచిది.


Page number:103

అట్లుగాక “సమాన బుద్ధిబలములు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒక ఫలము (లేక ప్రయోజనము) కొరకు ప్రయత్నించినప్పుడు, ఒకడు ఒక రకంగా, మరొకడు మరొక విధంగా ప్రయోజనము పొందుచున్నారు. ఇది దైవముయొక్క పాత్రే కదా!” అని ఎవరైనా అంటారేమో? దీనికి కారణం తెలియని “దైవము” అని ఎందుకు అనటం? వారివారి ప్రయత్నముల తీవ్రతను అనుసరించి అది అట్లున్నదని ఎందుకు అనుకోరాదు?

“మా బుద్ధిలో ఇది ఇట్లు చేయాలనే భావం ప్రతిఫలించింది. ఇది దైవముయొక్క చర్యయే కదా?” అని మరెవరైనా అంటారేమో? ఆయా శారీరక (క్రియలు) - మానసిక (ఆలోచనలు) యత్నములే నిశ్చయమును ప్రభావితం చేస్తున్నాయని ఎందుకు అనుకోరాదు? బుద్ధిచే “ఇది చేయాలి” అనే నిర్ణయం చేయబడుతోంది. అట్లు చేయబడిన యత్నములు మరల బుద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. కనుక ‘దైవము’ అనుదాని పాత్రను ఆశ్రయించే బదులు మనం పురుషకారమునే ఆశ్రయించవచ్చు కదా!

[NOTE: “బుద్ధిః కర్మానుసారిణి” - “కర్మలను అనుసరించే బుద్ధి ఉంటోంది” అనునదే లోక ప్రసిద్ధంగాని, “బుద్ధిః దైవానుసారిణి” అనునది లోకప్రసిద్ధం కాదు కదా!]

9.) కార్య కుశలత

ఆకాశానికి రూపం లేదు. ఈ శరీరానికో, రూపం ఉన్నది. అందుచేత ఈ శరీరము ఆకాశమును తాకజాలదు. అట్లే రూపములేని దైవముతో రూపముగల మనకు కారణాంతరము (ఏదో కారణము) యొక్క కలయిక అసంభవమైయున్నది. ఆకృతిగల రెండు వస్తువులకు పరస్పర సంయోగం సాధ్యమౌతుంది. అందుచేత “దైవము - అనునది లేదు" - అనియే ఏర్పడుచున్నది. ఈ ప్రపంచమున జరుగు సర్వ వ్యవహారములకు నియామక - నిర్ణయాత్మక కర్త దైవమే అయితే, ఈ ప్రజలందరిని హాయిగా పరుండనిమ్ము. ఇక ఆయా ప్రయత్నములు, కార్యకుశలతలు, జాగ్రత్తలు దేనికి? ఆ దైవమే వచ్చి చేయవలసినది చేస్తాడా?

దైవేనతు అభియుక్తో2హం, తత్కరోమీదృశం స్థితమ్
సమాశ్వాసన వాగేషా! న దైవం పరమార్థతః ॥ (VIII - 15)

“నేను అదృష్టముచే ప్రేరేపించబడి పనులన్నీ చేస్తున్నాను. అదృష్టబలం చేతనే ఇవన్నీ ఇట్లు సిద్ధిస్తున్నాయి” అని ఎవరైనా అనుకొంటే, మా ఉద్దేశంలో మాత్రం వారు తమను తాము అట్లు ఓదార్చుకోవటం మాత్రమే జరుగుచున్నది. పరమార్థ దృష్టికి ‘దైవము’ అనునదే లేదు, లభించుటలేదు. మూఢులే ‘అదృష్టము (దైవము)’ యొక్క కల్పన చేయుచున్నారు. అదృష్టపారాయణులగువారు స్వశక్తిపట్ల, స్వప్రయత్నముల పట్ల విశ్వాసము లేకపోవుటచే, వారు ఎప్పటికైనా చెడిపోవటం తథ్యమని మేము అనుకొంటున్నాం.


Page number:104

ఈ ప్రపంచంలో ఎందులో అయినా ఔన్నత్యం సాధించిన బుద్ధిమంతులను ఎవరినైనా తీసుకో. వారికి ఆ సామర్థ్యమును ప్రసాదించింది ఎవరు? నాయనా! రామా! వారందరు తమ పురుషకారం చేతనే, పురుషప్రయత్నము చేతనే, ఆ ఉన్నతిని సాధించారు. అందుకే, మనం వారి చరిత్రలు వ్రాసుకొని చదువుకొంటున్నాం. ప్రయత్నముల ప్రాముఖ్యతే లేకపోతే మనం మాత్రం వారి గురించి తెలుసుకోవటం దేనికి? “అంతాదైవమే" అని గ్రంథాల నిండా వ్రాస్తే సరిపోతుంది కదా!

యే శూరా యే చ విక్రాంతా యే ప్రాజ్ఞా యే చ పండితాః
తైస్త్రైః కిమవ లోకే2స్మిన్ వద! దైవం ప్రతీక్ష్యతే? (VIII - 17)

ఓ రామచంద్రా! నీవు శూరులైనట్టి పరాక్రమవంతులైనట్టి, బుద్ధిమంతులైనట్టి, పండితులైనట్టి అనేకమంది మహాత్ముల గాథలు విన్నావు కదా! వారు తాము సాధించదలచుకున్నది ఎట్లా సాధించారు? ప్రయత్న బలము చేతనే కదా! వారిలో ఎవరు దైవము కొరకు వేచియున్నారు చెప్పు?

దైవమును ప్రతిపాదించువారు, “ఇతడు చిరంజీవి, బహుకాలం జీవిస్తాడు” - అని ’దైవ నిర్ణయం’గా ఒకని గురించి చెప్పారనుకో, అట్టి వానియొక్క తలను తీసినప్పుడు కూడా అతడు బ్రతికితే, అప్పుడే దైవమే గొప్పదని నేను ఒప్పుకొంటాను. అట్లుండుట లేదే? భవిష్యత్తు గురించి (జాతకం చెప్పేవారు), “ఇతడు పండితుడు అవుతాడు” అని చెప్పినప్పుడు, అట్టివాడు చదవకుండానే పండితుడు అవుతున్నాడా? అట్లా జరిగితే, దైవమే లోకంలో అదృష్టమై సర్వము నిర్వర్తిస్తోందని మనం కూడా ఒప్పుకుందాం.

విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః
పౌరుషేణైవ సంప్రాప్తం బ్రహ్మణ్యం! రామ! నా2న్యథా ॥ (VIII - 20)

ఓ రామచంద్రా! ఈ సభకు దేవేంద్రునివలె వేంచేసియున్న బ్రహ్మర్షియగు ఈ విశ్వామిత్ర భగవానుని చూడు! ఇతడు జన్మతః ఒక సామాన్యమైన రాజు. ఈ రోజో, ఒక బ్రహ్మర్షిగా, లోకకళ్యాణ కారకుడుగా ముల్లోకములచే ఎట్లు ప్రశంసలు అందుకుంటున్నారో చూచావు కదా! ఇది ఈయనకు ఎట్లా సాధ్యపడింది? ‘దైవము’ అనబడుదాని కృపచేతనా? కానేకాదు. ఇతడు అదృష్టమును ప్రక్కకునెట్టి పురుష ప్రయత్నమును దృఢంగా ఆశ్రయించాడు. అందుచేతనే బ్రహ్మర్షిత్వము సంపాదించాడు. అంతే కాని అదృష్టము కొరకు వేచియుండి కాదు సుమా!

నేను కూడా పురుషకారమును ఆశ్రయించే ఆకాశ గమన శక్తి, సప్తర్షిమండలములో నివాసము సంపాదించాను. నన్ను ’మహర్షి’ అని అందరు అంటున్నది నాయొక్క అదృష్టం చేతనా? కాదు. నా స్వప్రయత్నము యొక్క దృఢత్వం చేతనే ఈ రోజు అట్లు గుర్తింపబడుచున్నాను. రాక్షసరాజులు పౌరుషమును ఆశ్రయించే, అమరావతి నుండి దేవతలను పారద్రోలి ముల్లోకములలో తమ ఏలుబడి సాగించారు. దేవతలు కూడా పురుషకారము చేతనే శత్రువులను ఛిన్నాభిన్నంచేసి మరల ఈ జగత్తులను పాలిస్తున్నారు. అంతదాకా దేనికి? వెదురుతో అల్లిన బుట్టలో నీరు ఎలా నిలుస్తోంది? అదృష్టంవల్లనా? కాదు. దాని వెనుక పురుషప్రయత్నమే దాగి ఉన్నది.


Page number:105

ఈ లౌకిక కార్యములనే చూడు. కుటుంబ పోషణం, శత్రు రాజ్యాపహరణం, భోగవిలాసం, కోపం, నిగ్రహం, ఇతరులను అరికట్టటం, ఆకట్టుకోవటం - ఇత్యాది అనేక క్లిష్టమైన పనులన్నీ పురుషప్రయత్నబలము చేతనే ఒనగూడుచున్నాయి కదా! ’అదృష్టం’ అనునది ఏదో తెలియని రూపంలో వచ్చి ఇవన్నీ చేయటంలేదే! ఆ దైవము అనుదాని క్రియాశక్తి ఎక్కడా కనబడకయే ఉన్నది.

ఓ శుభాశయా! రాఘవా! ఈ ‘దైవము’ అనబడే పదార్థం కార్య కారణ విమర్శలకు లభించకయే ఉన్నది. అందుచేత, అది వికల్పవశంచేతనే కల్పించబడినట్లు, సుస్పష్ట మౌతోంది. కనుక అవశ్యమై, ఎదురుగా నిలిచియున్నట్టి పురుషకారమును ముందుగా ఆశ్రయించి ఉండు. మనకు ఎదురుగా లభించనట్టి ఈ దైవవ్యవహారమును కొంతసేపు ప్రక్కకుపెట్టు. దాని విషయమై ముందుముందు మన ఈ విచారణలో అనేక విషయములు నీవే గ్రహిస్తావు. ఈ ‘దైవము’ అనుదానిని అపేక్షించక, ఉత్తమమగు పురుషకారమునే ఆశ్రయించి, సమున్నతుడవుకమ్ము.

10.) కర్మవిచారము

శ్రీరాముడు : ఓ సర్వధర్మజ్ఞా! వసిష్ఠమహర్షీ! పురుషప్రయత్నం విషయంలో మీరు చెప్పినట్టి సోదాహరణ పూర్వకమైన విషయాలన్నీ నేను అంగీకరిస్తున్నాను. అయితే, మీరు “దైవము” అనబడునది ఏదీ లేదని కొన్నిచోట్ల అన్నారు. మరికొన్నిచోట్ల, “పూర్వ జన్మలందలి లేక ఇతః పూర్వపు కర్మ పరంపరల (లేక ప్రయత్నముల) సమ్మేళనమే దైవము“ అని అంటున్నట్లు నాకు అర్థమగుచున్నది. ”ప్రయత్నము ముందు దైవము సంగతి తరువాత” అని సూచనగా కూడా అంటున్నారు.

ఈ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచియున్న ఈ “దైవము” అనే పదార్థం అసలు ఉన్నదా? లేదా? అనేకులు అట్టిది కలదని నమ్ముచున్నారు కదా! అందుచేత దైవము-అనునది మీచే ఎట్లు గాంచబడుచున్నదో మరికొంత సుస్పష్టంగా తెలుసుకోవాలనుకొంటున్నాను.

శ్రీ వసిష్ఠమహర్షి : నాయనా! రామచంద్రా! పురుషకారమే సర్వ కార్యక్రమములను ఒనర్చుచున్నది. వాటి ఫలితములను కూడా అదే అనుభవిస్తోంది. ఇక ‘దైవము’ అనబడు మరొక వస్తువు ఏదీ దేనికీ కర్తగాని, భోక్తగాని కాదు. దైవము స్వయముగా ఒనర్చునదంటూ ఏదీ లేదు. అది భోగించునదీ లేదు. అది ఇతరులను ఆదరించునది కూడా లేదు. దానిని ఎవరూ చూచుచున్నది లేదు. అది కేవలం కల్పనామాత్రమే. పౌరుషమే ఫలప్రదమగుచున్నది. అట్టి పురుషకారము (తనకు తానుగా నిర్వర్తించి యున్న ప్రయత్న పరంపరలు) వలన లభించుచున్న శుభాశుభములనే జనులు ’దైవము’ అనే పేరుతో పిలుస్తున్నారు.

తమ పురుషప్రయత్నములచే తాము పొందుచున్నట్టి స్వల్ప - దీర్ఘములైన ఇష్ట - అయిష్టములను అల్పజ్ఞులగువారు ‘దైవము’ అనబడుదానికి ఆపాదించుచున్నారు.


Page number:106

ఈ లోకంలో ఎవరికైనా సరే, ఒక్క పురుషార్థము చేత మాత్రమే ఫలములు (Results) అవశ్యం లభిస్తున్నాయి. అయితే ఒక వ్యవహారము యొక్క ఆది-అంతములు, వేరైన దేశ-కాలములందు ప్రాప్తిస్తున్న ప్రభావములు [The effects (or) results that materialise at a different time and place] గ్రహించలేనట్టి (దూరదృష్టి లేనట్టి) జనులు ఆయా ఫలితములను “ఇవి దైవము ప్రసాదిస్తున్నాడు. లేక దైవమే ఇట్లు శిక్షిస్తున్నాడు” - అని భావన చేయుచున్నారు.

ఓ రాఘవా! రూపమేలేనట్టి ’దైవము’ కారణంగా ఎవరికైనా, ఏదైనా చేకూరినదనుకొంటే, అది మా ఉద్దేశంలో భ్రమయే. “దైవమును ప్రార్ధించటం”, “అభీష్టములు పొందటం” అనే విషయానికివస్తే, ఆ కొంత కాలం అద్దాని కొరకు తీవ్రేచ్ఛచే వారు చేయునది అభ్యర్ధనపూర్వకమగు పురుషప్రయత్నమే కదా! ఆ అభ్యర్థనచే లక్ష్యశుద్ధి ఏర్పడి, సాధించదలచినదానికి (లేక పొందదలచినదానికి సానుకూలంగా ఆలోచన-క్రియాదులు ఒనగూడుతున్నాయి. అప్పుడు ప్రాప్తించినదానికి “ఇది దైవమే ఇచ్చినాడు” అని అనుకొనుట జరుగుతోంది. కనుక, ఇక్కడకూడా, పురుష ప్రయత్నమును అనుసరించే ఆయా శుభాశుభ ఫలములు లభిస్తున్నాయి.

జనులు కొందరు “వీడి అదృష్టము ఇట్లా ఉన్నది" అని అంటున్నప్పుడు, ఆ మాటయే ‘దైవము’గా లోకంలో ప్రసిద్ధికెక్కింది.

ఇక కర్మల ప్రసంగం వచ్చినప్పుడు, “ఇతడు ఇట్లు పలికినాడు. అది విన్న నాకు ఈ బుద్ధి పుట్టింది. అప్పుడు ఈ విధంగా దృఢంగా నిశ్చయించుకొన్నాను. ఇట్లు ప్రయత్నించినాను. ఈవిధమైన ఉత్తమఫలితం పొందాను. కనుక, ఈ ఉత్తమ ఫలితం దైవవశాత్తు లభించింది” - అనునది కొందరికి అనుభవమౌతూ ఉంటుంది. ఇట్టి దృష్టాంతమే లేక సంఘటనయే ’దైవము’ అనబడు కల్పనకు కారణమగుచున్నది. అయితే ఇందులో, "ఇతఃపూర్వపు ప్రయత్నములచే ఏర్పడిన బుద్ధ అందుకు సిద్ధమై ఆ ఆలోచనను స్వీకరించింది. మరల ప్రయత్నముచేతనే ఫలితం ప్రాప్తించింది” - అనునదే మనకు సూక్ష్మదృష్టితో చూచినప్పుడు లభిస్తోంది. ఎందుకంటావా? ఒక పదిమంది ఒకే విధంగా బోధింపబడినా, అందరూ ఒకే విధంగా స్పందించుట లేదు కదా! ఎవరైతే ఇతః పూర్వపు - వర్తమానపు ప్రయత్నములచే ఆ విషయమును స్వీకరించారో, వారు మాత్రమే ఆ ఫలితమును పొందుచున్నారని గ్రహించు.

ఒకనికి ఇష్టమైన, లేక అయిష్టమైన ఫలములు లభించుచున్నాయనుకో, దైవమే అది ప్రాప్తింపచేస్తున్నట్లు అల్పదృష్టి కలవారు భావిస్తున్నారు. సూక్ష్మదృష్టి కలవారో -

“నా ఇష్ట అయిష్టముల రూపమున ఏర్పడియున్న సంస్కారములే (లేక వాసనలే) నాకు ‘ఇది సుఖము ఇది కష్టము’ అను భావనలు కలిగిస్తున్నాయి" - అని గ్రహిస్తున్నారు. ఇంతకుమించి ‘దైవము’ అనునది లేదు. కనుక, ఈ విషయమై నీవు నిశ్చింతుడవగుము. వర్తమానమునందు ఉత్తమ కర్మలను ఆశ్రయిస్తూ ఆత్మయొక్క తత్త్వమేమిటో వివేక దృష్టితో గ్రహించియుండుము.


Page number:107

శ్రీరాముడు : హే మహర్షీ! “మీరు” “పూర్వజన్మల సంచితమే దైవము” అని మరల మరలా అంటున్నారు. ఇంతలోనే “దైవము లేదు” అని నిర్ణయం ప్రకటిస్తున్నారు. ఎందుచేత?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నేను నీకు ఏదైనా చెప్పినప్పుడు, నీవు అత్యంత సూక్ష్మదృష్టితో ఆ విషయం గ్రహించగలవు. నీ గురువుగా, నీపై నాకు ఉన్నట్టి అభిప్రాయం అది. అందుచేత, నేను చెప్పబోవునది సూక్ష్మదృష్టితో, నిర్మలహృదయుడవై, ఉద్వేగాదులు లేనివాడవై విను. నీ బుద్ధి చంచలత్వమును త్యజించి, స్థిరత్వము పొందగలదు. అప్పుడు ’ఉత్తమ సత్యము’ విషయమై చెప్పినది, చెప్పబోవునది గ్రహించగలవు.

ఒకానొకడు తన ‘మనస్సుచే, వాక్కుచే, కాయముచే” ఒకానొక విధంగా కర్మలు నిర్వర్తిస్తున్నాడు. అతడు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అలా ఎందుకు ఆలోచిస్తున్నాడు? అలా ఎందుకు మాట్లాడుచున్నాడు? (Why he is behaving the way he behaves?) దీనికి సమాధానం విను. ఇతః పూర్వపు (మరియు క్రితం జన్మల) స్వకీయ ప్రయత్నముల సారమై ఉన్నట్టి వాసనలను అనుసరించే, వాటిచే ప్రబోధితుడై ఈ వర్తమానమునందు ఆయా విధములుగా భావించుట, మాట్లాడుట ప్రవర్తించుట చేస్తున్నాడు. అనగా, వాసనలే కర్మలుగా పరిణమిస్తున్నాయి. వాసనలను అనుసరించే నేను, నీవు, అట్లే ప్రతి ఒక్కరు ఆయా విధములైన ‘మనోవాక్కాయ’ కర్మలను ప్రదర్శించుచున్నాము. అభిప్రాయములు, భావనలు కూడా వాసనలను అనుసరించే ఉంటున్నాయి. కర్మలు ఒక రకంగా, మనోభావాలు మరొక రకంగా ఉంటాయా? ఉండవు. పల్లెకు పోగోరువాడు పల్లెకే చేరుతాడుగాని, పట్టణం ఎలా చేరుతాడు?

ఎవనికి ఏ వాసనలుంటే, వాడు వాటి నిమిత్తమే ఎల్లప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. “ఎట్లాగైనా సరే, ఈ ఫలమును నేను పొందెదనుగాక” అనునట్టి బలమైన కోర్కెతో తీవ్రముగా నిర్వర్తించబడిన కర్మయే దైవమై పరిణమిస్తోంది. అంటే ఏమిటి? “కర్మల బలమే (ప్రయత్నముల ప్రయోజనమే) దైవబలంగా పరిణమిస్తోంది” అనునదే ఇక్కడ మనకు సిద్ధిస్తోంది. కర్మలకు (లేక ప్రయత్నములకు) వేరుగా ‘దైవము’ అనునది ఎవరికీ, ఏదీ ఇచ్చుట లేదు. ప్రతికర్త తన కర్మలను ఈ విధంగానే నిర్వర్తించటం, తత్ఫలితములను పొందటం జరుగుతోంది. ఇక ఇందులో స్వకీయమైన నిర్ణయంగల దైవము అనుదానికి పాత్ర ఎక్కడున్నది?

[NOTE:
సంచితము = ఇతఃపూర్వపు కూడబెట్టబడిన కర్మలన్నిటి యొక్క సమన్వయ సంస్కార స్థితి.
ప్రారబ్ధము = వర్తమానపు పరిస్థితులకు అనుకూలముగా బహిర్గతమగు (సంచితము మనకు సంబంధించిన) సంస్కారము.
ఆగామి = ప్రాక్తన + ఆద్యతన యొక్క సంస్కారసారము, ముందు ముందు ఆగామి అయి (Accompany) జీవుని ప్రభావితం చేస్తోంది. ]

ఒకనిలో ఏ వాసనలైతే బలమును చేకూర్చుకొని ఉంటాయో - అవే అతని కర్మలు (Deeds)గా పరిణమిస్తున్నాయి. అయితే తనయొక్క ఇతఃపూర్వపు ప్రయత్నముల వ్యవహారమంతా సమగ్రముగా పరిశీలించక పోవుటచే, (లేదా) అతనికి ఎదురుగా కనబడకపోవుటచే అతడు, “నన్ను ఎవరో ఈ కర్మ నిర్వర్తించవలసినదిగా ప్రేరేపిస్తున్నారు” అని తనకు తాను సమాధానం చెప్పుకొంటున్నాడు. కనుక, ‘కర్మ’ అనునది వాసనలకంటే భిన్నము కాదు - అని తేలుతోంది కదా! అయితే ఆ వాసనలు, మననమే ధర్మముగాగల మనస్సుకంటే వేరు కాదు. ఇక ఈ మనస్సు మననము అనే ’కర్మ’కు కర్త అయినట్టి ‘ఆత్మ’ కంటే వేరు కాదు.


Page number:108

కనుక హే సాధూ! ‘దైవము’ అని చెప్పబడుచున్నదే “ప్రయత్నము రూపముగాగల ‘కర్మ’ అయివున్నది. అట్టి కర్మయే ‘మనస్సు’. అట్టి మనస్సే ‘పురుషుడు’ అనబడు ఈ జీవుని స్వరూపము. కనుక ఈ జీవుని స్వరూపము పురుషకారమే కదా! అందుచేత పురుషకారము కంటే వేరొకటి ఎక్కడా ఏదీ లేదని తేలుచున్నది. పురుషకారముకంటే వేరైనదిగా ‘దైవము’ అనుదానిని గాంచదలచుకొంటే, "అట్టి దైవము లేదు” అని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాను. అట్టి దైవము ‘మిథ్య’ మాత్రమే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

ఇక ‘ఆత్మ’ అంటే ఏమిటి? అది ఎక్కడున్నది? అది జీవుని స్వస్వరూపముకంటె వేరైనది కాదు. అట్టి ఆత్మయే వాస్తవ స్వరూపముగా కలిగియున్నట్టి ఈ జీవుడు తన మనోరూపమున చేయు కార్యముల ఫలములను స్వస్వరూపమగు ఆత్మనుండే పొందుచున్నాడు. అదే ‘దైవము’గా కూడా ప్రసిద్ధికెక్కింది. స్వస్వరూపముకంటే దైవము వేరుగా లేకపోవుటయే మనకు ఇక్కడ సిద్ధిస్తోంది. ‘మనస్సు’, ‘చిత్తము’, ‘వాసన’, ‘కర్మ’, ’దైవము’ వాస్తవానికి ఇవన్నీ పర్యాయపదములే. ఈ పర్యాయ పదములన్నీ సత్యమును ధరించినట్టి ద్రష్టలగు సాధువులచే, అజ్ఞానులకు బోధించుట కొరకు, కల్పించబడ్డాయి. “ఇది చిత్. ఇది జడము. ఇది దేహము. ఇది దేహి” - అను నిశ్చయము లేనట్టి అజ్ఞాన జనులు విషయమును గ్రహించటానికి వీలుగా ఇవన్నీ కల్పించబడి, విస్తారంగా చర్చించబడ్డాయి. ఇవి విచారించబడి, గ్రహించబడగా, ‘బోధ’ సుస్థిరమైతే, ఇకప్పుడు సర్వము ఎరుగబడుతుంది. అఖండము, జ్ఞానయుతము అయినట్టి స్వస్వరూప శుద్ధ చైతన్యమే శేషిస్తుంది. అట్లు శేషించు శుద్ధ సత్యమే ఈ జీవుడు. అట్టి ’దేహి’కి సంబంధించిన ఉత్తమజ్ఞానం పరిఢవిల్లే వరకు ఈ శబ్దజాలం యొక్క అవసరం ఉంటోంది.

[NOTE: “సర్వం ఖల్విదం బ్రహ్మ”, “జీవో బ్రహ్మేతినాపరః”, “అహం బ్రహ్మాస్మి” “త్వమేవాహం”, “తత్త్వమసి”, “తత్వమ్” - ఇత్యాది శ్రుతి వాక్యాలన్నీ ఈ సత్యమునే ప్రతిపాదిస్తున్నాయి.]

పురుషుడే అన్నిటికి మూలం. అతడు దృఢమగు భావనాబలంచేత ఎట్లు ప్రయత్నిస్తాడో, ఫలములను కూడా అట్లే పొందుచున్నాడు. కనుక ఓ రఘుపుంగవా! ఒక్క పురుషకారము వల్లనే అభీష్టములన్నీ సిద్ధిస్తున్నాయని గ్రహించు. అంతేకాని అదృష్టం చేత కాదు. “అదృష్టము చేతనే” అని అనుకొంటే ఇక శాస్త్రాలు ఎందుకు? నేను నీకు బోధించటం దేనికి? నీకైనా, నాకైనా, మరెవ్వరికైనా పురుషకారమే శ్రేయోదాయక మగుచున్నది.


Page number:109

శ్రీరాముడు :

ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా,
మునే! తథైవ తిష్ఠామి! కృపణః, కిం కరోమి అహమ్? (IX - 23)

మునీంద్రా! నాదొక ముఖ్యమైన సందేహం. ఇతఃపూర్వం లేక క్రితం జన్మలందు నిర్వర్తించబడిన ‘ప్రాక్తనకర్మలు’ ఉండనే ఉన్నాయి. అవి వర్తమానంలో మమ్ములను ప్రభావితం చేస్తున్నాయని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా! ఆ ప్రాక్తనకర్మలు మమ్ములను ఎట్లా నియమిస్తే మేము అట్లా ప్రవర్తించవలసినదే కదా! ప్రాక్తనకర్మలు మమ్ములను నడిపిస్తుంటే, దీనులమైన మేము ఇప్పుడు చేయగలిగే దేమున్నది? ఆ కర్మలు ఒక విధంగా, మా ప్రవర్తన మరొక విధంగా ఉండే అవకాశం ఎక్కడున్నది చెప్పండి?

శ్రీ వసిష్ఠమహర్షి : నీ ప్రశ్న సుందరంగా ఉన్నది. కాని, నీవు మరల జడత్వమగు ప్రయత్నరాహిత్యమునే ప్రతిపాదిస్తున్నావు. ఈ సంభాషణ యొక్క లక్ష్యము, శ్రోతని ప్రయత్నశీలుని చెయ్యటం. ఎందుకంటే ప్రయత్నరహితుడు ఏమీ చేయలేడు, గ్రహించలేడు. ప్రయత్నపరుడు పొందవలసినది తప్పక పొందుతాడు. సరే, నీ ప్రశ్నకు సమాధానం విను.

‘ప్రాక్తనకర్మలు’ అంటే ఏమిటి? ఒకప్పుడు నీచేత నిర్వర్తించబడిన కర్మలే కదా! అప్పటి పురుషకారము నిన్నిట్లా ప్రవర్తింపచేస్తుంటే, అందుకు ఇచ్చగించని నీవు ఇక చూస్తూ ఊరుకొంటావా?

ఓ రామచంద్రా! నీవు చైతన్యమూర్తివే కాని, ఒకానొక జడపదార్థం కావుకదా! మరి నీవు ఆ ప్రాక్తనకర్మల చేతిలో కీలుబొమ్మ అవటమేమిటి? ఇప్పటి పురుషకారము మాట ఏమిటి? ఇదీ నా ప్రశ్న. ఇప్పుడు అనుసరించబోవు పురుషకారము చేతనే నీకు శాశ్వతమైన శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాని, “ఇది నాకర్మ. నేను ఇట్లు చేయకతప్పదు. ఏదో దైవము నాచేత ఇట్లు చేయిస్తోంది”, అని తలచి నీవు సరయిన మార్గంలో ప్రయత్నమునకు అభిముఖం కాకపోతే, ఇక నిన్ను కాపాడగలిగేవాడెవడు? దైవం వచ్చి కాపాడతాడా?

ప్రతి జీవునియందు శుభ- అశుభములైన ప్రాక్తనకర్మలు (The essence of past deeds) ఉన్నాయి. అందులో శుభ వాసనలు శుభకర్మలవైపు, అశుభవాసనలు అశుభకర్మలవైపు ఈ జీవుని ప్రేరేపిస్తున్నాయి. ఆ రెండింటిలో ఏది బలవత్తరమైతే, అది రెండవదానిని శీఘ్రంగా జయించి జీవుడిని అట్టి ఆచరణములో నియమిస్తోంది. సరే. ఇంతవరకు బాగానే ఉన్నది. కాని, “ఈ వర్తమానంలో ఏది చెయ్యాలి? ఏది చెయ్యకూడదు? దేనిని ఆశ్రయించాలి? దేనిని ఆశ్రయించకూడదు? దేనిని ఎట్లు గ్రహించాలి? దేనిని ఎట్లు గ్రహించకూడదు? (What should not be interpreted in what way)” … ఇవి చైతన్య స్వరూపుడవగు జీవుని చేతిలోనే ఉన్నాయి. అందుకు సన్మార్గం చూపించగల గురువులు, పెద్దలచే చెప్పబడిన విధి-విధానములు మనకు ఇక్కడ వర్తమానంలో లభిస్తున్నాయి.


Page number:110

అవన్నీ ఆశ్రయించటం వదలి, “నేను నిస్సహాయుణ్ణి” అని వగర్చటం ఎంతవరకు ఉచితం? వాటి నన్నిటినీ వివేక బుద్ధితో గ్రహించి, చక్కగా ఉపయోగించుకొంటూ ఎందుకు ఆత్మజ్ఞానము కొరకై ప్రయత్నించరాదు? అల్పములు, దోషభూయిష్ఠములు అయినట్టి దృశ్య పదార్థముల వెంటబడి ఎందుకు దుఃఖకరమగు పరిణామములు తెచ్చిపెట్టుకోవాలి?

అందుచేత, నీవు శుభకర్మలనే ఆశ్రయించెదవు గాక! శుభమగు వాసనలచే ప్రేరేపితులైతే, ఈ జీవులు శుభపురుషకారబలం చేత క్రమంగా శాశ్వతమగు ముక్తిని పొందగలరు. ఒకవేళ, అశుభవాసనలు ప్రబలమై, అశుభ కర్మలందు ప్రవేశింప చేస్తున్నాయా? అయితే, వర్తమానంలో ఉత్తమ ప్రయత్నము అత్యంత ఆవశ్యకమై ఉన్నది. వర్తమాన పురుషకారయత్నం చేత క్రమంగా అశుభవాసనలను బలహీనం చెయ్యాలి. అట్లు ప్రయత్నిస్తూ, ఒక శుభతరుణంలో ఆ అశుభ సంస్కారములను మొదలంట పెకల్చివేయాలి.

ఓ రామచంద్రా! ఈ జడమగు దేహమే ‘నీవు’ అని అనుకొంటున్నావా? కానే కాదు. నీవు చిన్మాత్ర స్వరూపుడవు. ప్రజ్ఞాతత్త్వ స్వరూపుడవు. అట్టి నీవు పూర్వ సంస్కారములకు లొంగి ఉండవలసిన అవసరమేమున్నది? నీకే కాదు. నేనీ వాక్యములు సర్వజనులకు చెప్పుచున్నాను. నాయనలారా! మీరంతా, ‘చిత్’ నందు ఉదితమైన చైతన్యమే స్వరూపముగా కలవారు. అంతేకాని, బైట ఎక్కడినుండో ఎవరిచేతనో కదల్చబడుచున్న జడపదార్థమాత్రులు (Some matter that moves by Remote Control) కారని మరల మరల గుర్తు చేస్తున్నాను. మరి, “ఆఁ! మాదేమున్నది? అంతా దైవలిఖితం. ఇది ఇంతే. ఇది మా కర్మ. ఇక చేసేదేమీ లేదు" - అను రూపముగల దౌర్భాగ్యమంతా ఎక్కడి నుండి వచ్చిపడుతోంది? కొంచెం యోచించండి. మీ అంతట మీరే నిష్కారణంగా, అసంగతమైన నిష్క్రియత్వానికి పాలుపడి, ఆ దోషమును ‘దైవము’ అనబడుదానికి అంటగట్టి సంతృప్తి చెందుచున్నారా? అది సరికాదు.

ఓ రామా! ఎవ్వరో బాహ్యము నుండి నిన్ను చేతితం చేస్తున్నారంటావా? అయితే నాకీవిషయం చెప్పు. అట్లు ఏదైతే నిన్ను చేతితమొనర్చుచున్నదో, అద్దానిని నియమించి చేతితం (operative) చేసేదెవరు? కాబట్టి అట్టి అభిప్రాయానికి అనవస్థా దోషం (A doubtful state - whether it exists or not) సంభవిస్తుంది. ఇట్టి సరళి “వస్తు సిద్ధి ప్రతిబంధకము” (Hurdle to achieve the Truth) అని మా అభిప్రాయం.

నీవు స్వయంగా చేతన స్వరూపుడవు. కనుక, నీ ఈ వర్తమానమునకు నీవే కారకుడవు. నీ ఉత్తమ అధమ ప్రయత్నములే నిన్ను ఒకానొక స్థితికి తెస్తున్నాయి. అట్లే ప్రతిజీవుని విషయం కూడా. అందుచేత ఈ దోషమును మూగవస్తువు అయిన దైవమునకు ఆపాదించకుండెదవు గాక! అట్టి ఆలోచనయే మిథ్య.

జీవునియొక్క ఇతఃపూర్వపు ఇంద్రియ-మనో సంబంధమైన కర్మలే “వాసనలు (tendencies)”గా పరిణమిస్తున్నాయి. అందుచేతనే, ఈ ఇంద్రియ - మనస్సులు తమయందు కలిగియున్న వాసనలను అనుసరించి శుభ-అశుభ మార్గముల రెండిటి వైపు ప్రసరించ యత్నిస్తున్నాయి.


Page number:111

ఇప్పటి పురుష ప్రయత్నం చేత ఇంద్రియ మనస్సులను, ఎట్లాగైనా సరే, శుభమార్గంలో నియోగించాలి. పురుషప్రయత్నమే అందుకు నీకు ఉపయుక్తమైన పరికరం. ఓ మహాపరాక్రమవంతుడా! రామచంద్రా! నీ మనస్సు చెడు త్రోవలలో ప్రవేశిస్తున్నప్పుడు, దానిని మంచిమార్గంలో నియమించటానికి చేసే ప్రయత్నమునే మనం ఇక్కడ “పురుషకారం” అని పిలుస్తున్నాం.

ఈ జీవునియొక్క చిత్తము అల్లరి చేసే పిల్లవానివలె అతిచంచలమైనది. అయితే, ఈ చిత్తమునకు ఒకానొక ప్రత్యేకత ఉన్నది. అద్దానిని మనం ఏ ‘దిశ’ (direction) కు నియమిస్తామో ఆ దిశకు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుంది. దానిని మనం అశుభము నుండి శుభము వైపు త్రిప్పితే క్రమంగా శుభకర్మలనే ఆప్యాయతతో ఆశ్రయిస్తుంది. అట్లా కాకుండా, మంచి నుండి చెడువైపుకు వెళ్లనిచ్చామా, అదేవేగంతో దుష్ట కర్మలను ప్రీతిగా ఆశ్రయిస్తుంది. అందుచేత, ఈ చిత్తమును కొంత పట్టుదలతో బలవంతంగా శుభప్రయత్నముల వైపుకే (శుభప్రదములైన ధ్యాన, సత్ప్రవర్తన, దాన, దయ, దాక్షిణ్యాదులతో కూడిన కర్మల వైపుకే) మరల్చాలి. అంతేకాని, “అట్లే” మాత్రం వదలి వేయరాదు. అశుభకర్మలను (ఇతరులను బాధించుట, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకు చోటిచ్చుట - మొదలైనవి) క్రమంగా క్షీణింపచేస్తూ, త్యజిస్తూ, కరుణ సమదర్శనము మొదలైన ఉత్తమమార్గములను మనుజుడు ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించాలి.

సమతా సాంత్వనేనాశు నద్రాగితి శనైః శనైః
పౌరుషేణైవయత్నేన పాలయేచ్చిత్త బాలకమ్ || (IX - 33)

‘చిత్తము’ అనే బాలుడు అనేక రాగద్వేషములను స్వీకరించి తన ఇచ్ఛ వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. "త్యాగము” అనే కండబలంతో ఈ చిత్తబాలకుణ్ణి ఆ ఆ రాగ - ద్వేష - వైషమ్యాది లంపటం (బురద) నుండి బయటకు లాగాలి. స్వాభావికమైనట్టి సమత్వము, సాంత్వములలో నియోగించాలి. పురుషప్రయత్నములచే మెల్లమెల్లగా వానిని ఓదార్చుచు, క్రమంగా అఖండమగు స్వస్వరూపానుభవమునందు లగ్నం చేయాలి.

పసిపిల్లవాడు అల్లరి చేస్తున్నాడని చితకబాదుతామా? అతడు సరికాకపోగా, ఇంకా మొరాయిస్తాడు కదా! అప్పుడు అసలే మాట వినడు. చిత్తమును కూడా బాలునివలె లాలిస్తూ ఆత్మజ్ఞానము వైపు, ఆత్మానుభవం వైపు మరల్చాలి. అంతేగాని, హఠం మొదలై బలప్రయోగాలతో నిరోధించటం ఉపాయం కాదు.

ఓ రామా! ఇతఃపూర్వం నీవు శుభాశుభములైన రెండు వాసనలందు ప్రవర్తించి ఉండవచ్చు. అయినదేమో అయినది. ఇక మాత్రం శుభవాసనలను మాత్రమే రూఢి చేసుకొనెదవుగాక! ఓ శత్రుమర్దనా! “ఈ వాసనలు అభ్యాసవశం చేతనే దట్టమగు చున్నాయి” అనునది ఎవరూ కాదనటానికి వీలులేనట్టి సత్యం. అందుచేత, శుభ వాసనలనే అలవరచుకొనెదవుగాక. ఇంతకు ముందు నీవు అశుభవాసనలు అభ్యసించి ఉండకపోతే మంచిదే. అప్పుడు అశుభకర్మలు నీ మనోగమనమును అంతగా ఆకర్షించలేవు.


Page number:112

‘వాసనలు’ అనునవి అభ్యాసవశంచేత కానీ, లేక అజ్ఞానవశంచేత కానీ, లేదా మరింకే కారణంచేతనైనా వృద్ధిచెందనీ. అందుకు చికిత్సమాత్రం శుభకర్మలే సుమా! శుభాచరణం సర్వదా మంచిదే". వాటి వలన కీడు ఉండదు. అవి భవిష్యత్తులో - దుర్వాసనలు ఏర్పడే అవకాశమును బలహీనపరచగలవు.

[NOTE:
న హి కళ్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి|
నాయనా! అర్జునా! మంచి పనులు చేసిన మానవుడు ఎన్నడూ దుర్గతి పొందడు. (గీత : ఆత్మసంయమ యోగం - 40)]

ఈ జగత్తులో ఏది ఎట్లా అభ్యసిస్తే, అది అట్లాగే పరిణమిస్తుంది. ఏ భావనతో, ఉద్దేశంతో ఒక కర్మ నిర్వర్తిస్తామో దాని పరిణామం ఆ భావన-ఉద్దేశములను అనుసరించే ఉంటుంది. ఈ విషయం అందరికీ నిత్యానుభవమే. ఇందులో సందేహం అనవసరం. అందుచేత నీవు శుభప్రదములైన ఆశయములు కలవాడవై పౌరుషమును (లేక పురుషకారమును) అవలంబించు. క్రమంగా ఈ పంచేంద్రియములను జయించివేయి. ఉత్తమ పురుషుడవు కమ్ము. ఉత్తమ పురుషకారము ఆశ్రయించినవాడు మాత్రమే ‘పురుషుడు’ అని అనిపించుకొంటాడు. ఈ మనస్సు యొక్క స్థితి గ్రహించ బడనంత కాలం, జ్ఞానం ప్రాప్తించనంత కాలం శుభ కర్మలను ఆశ్రయించవలసిందే. అందుకుగాను ‘శుభకర్మలు’ అంటే ఏమిటో ముందుగా గ్రహించాలి.

1.) గురువు 2.) శాస్త్రము 3.) యుక్తి లేక ఉపాయం 4.) అనుభవం.

ఈ నాలుగిటి సహాయంతో ఉత్తమ ప్రయత్నములను నిర్ణయం చేసుకోవాలి.

ఓ రాఘవా! ఈ జీవుని మనస్సులో జన్మజన్మలుగా అనేక రాగాది దుర్వాసనలు పేరుకొని ఉన్నాయి. వాటిని క్రమంగా శుభకర్మల ప్రభావం చేత ’రహితం’ చెయ్యాలి. అప్పుడు ఆత్మవస్తువు తనంతట తానే స్వయంగా ద్యోతకమౌతుంది. సర్వ మనోవ్యాధులు నామరూపాలు లేకుండా నశిస్తాయి. మనస్సు పరిశుద్ధమైన తరువాత, ఇక శుభవాసనలతో కూడా పని ఉండదు. సర్వే సర్వత్రా ఆత్మనే దర్శిస్తావు. వాసనారహితుడవై, వృత్తిజాడ్యములు లేనివాడవై సూర్యకాంతిమణివలె స్వయముగా ప్రకాశిస్తావు.

అరికాలులో ముల్లు విరిగినదనుకో, అప్పుడు ఏం చేస్తాం? మరొక ముల్లును తీసుకువచ్చి దాని సహాయంతో కాలులోని ముల్లును తీసి, ఆపై ఆ రెండు ముల్లులను త్యజిస్తాం కదా! అదే విధంగా శుభవాసనలతో మనస్సులోని అశుభవాసనలను తొలగించి వేయాలి. ఆ తరువాత క్రమంగా ఆ మనస్సును వాసనారహితం చేయాలి. అప్పుడు శేషించు స్వస్వరూపమగు ఆత్మయందు ప్రశాంతానుభవము పొందెదవుగాక. ఓ రామా! ఈ లోకంలో ఉత్తమ జ్ఞానులందరు అట్లే ప్రయత్నించుచు శుభమగు పదమును పొందుచున్నారు. నీవు కూడా అట్లే అనుసరించి, పరమార్థ వస్తువును సాక్షాత్కారం చేసుకో. స్వత్స్వరూపమునందు అవస్థితుడవుకమ్ము.


Page number:113

11.) జ్ఞానావతరణము

ఓ రామచంద్రా! “బ్రహ్మతత్త్వము” స్వయంప్రకాశమై, అనిర్దేశ్యమై మనోవాక్కులకు అతీతమై ఉన్నది. అయ్యది సత్-చిత్-ఆనంద రూపమున సర్వత్రా వెలయుచున్నది. దాని సత్త వల్లనే తదితరములన్నీ వెలుగొందుచున్నాయి. అదే భవిష్యత్తునందు ‘నియతి’ అని కూడా వ్యవహరించబడుచున్నది. కార్య కారణ స్వరూపము కూడా అదే. దర్పణంలో దృశ్యప్రతిబింబమువలె, అనేక నదీతటాకాదులలో అనేక ప్రతిబింబములుగా ఒకే సూర్యబింబము ప్రతిబింబిస్తున్నట్లు, ఆ పరబ్రహ్మమే “నీవు-నేను-అతడు” - ఇత్యాదులందు ఖండితమువలె ప్రకటితమగుచున్నది. ద్రష్ట యొక్క దృష్టి చమత్కారమే అట్లు ప్రాప్తిస్తోంది.

ఈ జీవుడు వాస్తవానికి స్వభావసిద్ధంగా పరబ్రహ్మస్వరూపుడే. అయితే అజ్ఞాన కారణంగా లేక అనిర్వచనీయమైన ‘మాయ’ కారణంగా, “నేను జీవుడను, ఖండుడను (ఖండానుభవం = Compartmental consciousness). అల్పజ్ఞుడను. బద్ధుడను.

కాళ్ళు, చేతులతో కూడుకొనిన దేహమే (ఈ శరీరమే) నా స్వరూపము” - ఇత్యాది అల్పభావములను తన చిత్తమునందు పొందుచున్నాడు. అట్టి అవాస్తవ భావములచే మూర్ఖుడు, దుఃఖితుడు అగుచున్నాడు. అట్టి అల్పత్వమును తొలగించి జీవునకు తన “అఖండ - సర్వనియమాతీత” స్వరూపమును గుర్తు చేయుటయే ఉపనిషత్తులు మొదలైన ఆత్మతత్త్వ ప్రతిపాదకములగు శాస్త్రములయొక్క ప్రయోజనమై ఉన్నది.

అందుచేత రామా! జీవుడు నిత్యబంధువు అయినట్టి ఈ చిత్తమును పౌరుష బలముచే ఏకాగ్రంచేసి, “ఖండానుభవం” నుండి “అఖండానుభవము”నకు పయనించాలి. (అఖండానుభవం = Comprehensive consciousness. An experience of indivisibility). నాయనా! ఒక్కసారి ఈ ఇంద్రియములను చూడు. ఇవి విషయాభిలాష యందు మిక్కిలి ఆరూఢమై ఉన్నాయి. బురదపై వ్రాలే దోమలులాగా, ఇవి విషయ సుఖములందే విశేషంగా వ్రాలటం జరుగుతోంది. పురుషప్రయత్నం చేత మాత్రమే వాటిని అరికట్టి సంయమనం చేయగలగటం సాధ్యపడుతుంది. మనస్సును “సర్వసమత్వము” లేక “సమాధి” వైపునకు మరలిస్తేగాని, ఈ జీవునకు దుఃఖదోషాలన్నీ తొలగవు.

ఇప్పుడు మనం జ్ఞానదాయకం, పురుషార్థప్రదం, సారయుతం, సవివరం అయినట్టి విచారణలో ప్రవేశించబోతున్నాం. మనం విచారించబోయే “ఆత్మయొక్క స్వరూప స్వభావములు” సర్వలోకములకు వారివారి అధికారభేదమును అనుసరించి మహత్తరముగా ఉపయోగపడుగాక!

దేనివలన జీవుడు ఇక్కడే, ఇప్పుడే, ఈ జగద్వ్యవహారములన్నీ ఇట్లు ఉండగానే (Here and now while everything is “as it is”) తనయందలి పూర్ణత్వమును అనుభవమునకు తెచ్చుకోగలడు?


Page number:114

ఏది గ్రహించుటచే ఈ జన్మమృత్యువుల రహస్యము గ్రహించినవాడై జన్మకర్మల జాడ్యము నుండి సర్వదా విముక్తి పొందగలడు?

ఏది తెలుసుకొనుటచే ఇతడు సుఖ దుఃఖములు మొదలైన ద్వంద్వములకు అతీతుడు కాగలడు? ఈ మనస్సును సమరసమునందు నిలిపినప్పుడు ప్రాప్తించే సమాధానస్థితి ఎట్టిది?

ఈ సర్వకర్మకాండ, జ్ఞానకాండల అర్థవిచారణ చేసినప్పుడు లభించగల ఉత్తమ వస్తువు ఏది? ఈ సర్వసంసార వాసనలను త్యజించినప్పుడు సంపూర్ణ శమ సంతోషముల రూపమున ప్రాప్తించే అనుభవమేది?

ఏది పొందిన తరువాత ఇక అనంత సంఖ్యలో ఎదురుగా నిలిచియున్న ఈ బ్రహ్మాండములో పొందవలసినదేదీ ‘కించిత్’ కూడా మిగిలియుండదు?

అట్టి మోక్షోపాయం మనం విచారించబోతున్నాం. విస్తారంగా నాచే చెప్పబడబోయే ఈ మోక్షకథను వివేకులతో కూడి విచారించటం జరిగితే - ఎవరైనా ఎప్పుడైనా - తప్పక అక్షయము, దుఃఖరహితము అయిన పరమపదమును పొందగలరు. విచారించినంత మాత్రంచేత ఇది దుఃఖమును నశింపజేసి మనశ్శాంతిని ప్రసాదించ గలదు. మనం చెప్పుకోబోయే ఈ మోక్ష కథను పరమేష్ఠియగు బ్రహ్మదేవుడు లోక కళ్యాణార్థమై ప్రవచించియున్నారు. ఆయన కల్పాదిలో బోధించినదే మీముందు ఉంచుచున్నాను.

✤✤✤

11A) బ్రహ్మ - వసిష్ఠ సంవాదం (వసిష్ఠుడు ఆత్మజ్ఞానం పొందిన విధము)

శ్రీరాముడు : మహర్షీ! ఇతఃపూర్వమే (మనం చెప్పుకోబోయే) మోక్షకథను బ్రహ్మదేవుడు ఎవరికి చెప్పారు? ఎందుకు చెప్పారు? అది మీరు ఎట్లా పొందారు? మొట్టమొదటి నుండి ఎట్టి సందేహములు ఉండకపోవుటే మంచిది కనుక ఇట్లు ప్రశ్నించుచున్నాను. అందుచేత, అన్యథా భావించకుండెదరుగాక!

శ్రీ వసిష్ఠమహర్షి : నాయనా! రామా! నీవు కించిత్ సందేహము పొందటం జరిగినా, నిస్సంకోచంగా ప్రశ్నించవలసినదే.

మనం ‘బోధ’ (Main Text) ప్రారంభించకముందే, ఈ చెప్పుకోబోయే “జ్ఞానవిచారణ”ను నేను ఎట్లు పొందానో వివరిస్తాను. ఆ తరువాత వక్తృ (బోధించేవాడు) - పృచ్ఛక ప్రశ్నించేవాడు …. వీరిరువురికి ఉండవలసిన లక్షణముల గురించి, మనం ఉపయోగించబోయే దృష్టాంతములు గ్రహించవలసిన విధానం గురించి, సాధనచతుష్టయం గురించి, సదాచారాదుల గురించి చక్కగా గ్రహించిన తరువాతే మనం (ఉత్పత్తి ప్రకరణము ఆదిగా) తదుపరి విచారణలో ప్రవేశిద్దాం.

ఇప్పుడు ఈ ఆత్మ సమాచారం నేను పొందిన విధమును వివరిస్తున్నాను. విను.

భూత, భవిష్యత్, వర్తమానములచేత అవిభాజ్యమై, వినాశనమనునది లేనట్టి ‘ఆత్మతత్త్వము’ అను ఒకానొకటి ఉన్నది. అదియే ఈ మాయావిలాసమునకంతటికీ మునుముందుగా సర్వమునకు కారణభూతమైయున్నది. సర్వులయొక్క సర్వముయొక్క అంతర్యామి, వాస్తవ స్వరూపము అదియే.


Page number:115

సర్వమునకు ఆధారభూతమై, శాస్త్రాదులచే అయ్యది “చిదాకాశము” అని, “ప్రత్యక్ చిద్రూపము” అని, “పరిశుద్ధ ఆత్మతత్త్వము” అనికూడా పిలువబడుచున్నది. అయ్యది అనిర్వచనీయమై, వేదోపనిషత్తులచే ప్రతిపాదింపబడుచున్నదై, సర్వుల స్వస్వరూపమై వెలయుచున్నది.

సముద్రంలో తరంగాలు ఉన్నా లేకున్నా, జలం జలంగానే ఉంటుంది కదా! నిర్వికారమగు ఆత్మతత్త్వముకూడా మాయ ఒనర్చుచున్నను, ఒనర్చకున్నను ఒకే రీతిగా ఉంటోంది.

అట్టి నిర్వికార ఆత్మతత్త్వము నుండి, ఒక సమున్నత తరంగమువలె “విష్ణు భగవానుడు” స్వయముగా ఉదయించినారు. ఆ విష్ణువు నాభికమలం నుండి “బ్రహ్మదేవుడు” జన్మించారు. ఆ బ్రహ్మదేవుడు దేవతల చేతను, మునులచేతను పరివేష్టించబడినవాడై, ఇక ప్రాణులన్నిటిని సృష్టించ సంకల్పించారు. మనస్సు వికల్పములు సృష్టించుచున్నది కదా! ఇది కూడా అట్టిదే.

అయితే ఈ బ్రహ్మదేవుని సంకల్పబలం చేత, సృష్టించబడిన ఈ ప్రాణులు అనేక ఆధి-వ్యాధులతో, లాభాలాభ వ్యవహార భావనలతో అనుక్షణం మనోచాంచల్యం పొంది తల్లడిల్లుచుండిరి. వారంతా విషయభోగరతులై ఉండటం, అల్పాయుష్కులవటంతో అనేక దుఃఖపరంపరలు పొందటం జరుగుచుండేది. జీవులయొక్క ఈ కష్టదశలను చూచి - పిల్లల కష్టములను చూచి తల్లడిల్లు తండ్రివలె - సకల లోకకర్త యగు బ్రహ్మదేవుని హృదయం ద్రవించింది. “హతాశులు, అల్పాయుష్కులు అయినట్టి ఈ నా బిడ్డలందరి దుఃఖములు తీరేదెట్లా?” అని స్థిరచిత్తులై కొంతసేపు యోచించారు. అప్పుడు, సకల దుఃఖనివారణ సమర్థుడగు ఆయన కొన్ని ఉత్తమ సాధనములను సృష్టించారు.

1.) తపస్సు / ధ్యానము, 2.) ధర్మము, 3.) దానము, 4.) సత్యము, 5.) తీర్థములు.

ఈ ఐదింటిని సృష్టించిన తరువాత ఆయన మరికొంత యోచనచేస్తూ, “ఈ ఐదు సాధనములు బాగానే ఉన్నాయి. కాని, ఇంతమాత్రం చేత ఈ నా బిడ్డల దుఃఖములు సమూలంగా పోతాయా? లేదు. జన్మరహితమైనట్టి నిర్వాణపదము పొందాలంటే వీరికి జ్ఞానమే ముఖ్యమైన ఉపాయం కదా! తపో-ధర్మ-దాన-సత్య- తీర్థాదులచే వీరు కోరుకున్న సమృద్ధములన్నీ తప్పక పొందుతారు. కాని, అంతమాత్రం చేత వీరికి ఉత్తమమైన శాంతి లభించదు. జీవుని ఉద్దరించగలిగేది ’జ్ఞానము’ మాత్రమే. అందుచేత అజ్ఞానమును పూర్తిగా తొలగించగల ఏదైనా ఉపాయం కనుగొని, ఈ జనులకు ప్రసాదించెదను గాక" అని అనుకొన్నారు. అప్పుడు మనస్సుచే సంకల్పమాత్రంగా నన్ను సృష్టించారు. అనగా నేను బ్రహ్మమానసపుత్రుడను.

ఎక్కడో పుట్టిన తరంగాన్ని మరొక తరంగం చేరునట్లు అనిర్వచనీయమగు మాయ వలన జన్మించిన నేను జపమాలను, కమండలమును ధరించినవాడనై నా తండ్రియగు బ్రహ్మదేవుని సమీపించి సాష్టాంగ ప్రణామం చేశాను. ఆయన చిరునవ్వు నవ్వుచు, నన్ను చేరదీసి, “నీ మనస్సు కోతివలె చంచలమగు గాక! అట్టి చంచల మనస్సునందు కొంతసేపు అజ్ఞానం ప్రవేశించును గాక” అని నిర్దేశించారు.


Page number:116

అంతేఁ! ఒక్కక్షణంలో నేను నా నిర్మల స్వరూపం మరచాను. బుద్ధి జడత్వం పొందుటచే, దీనుడనై ఒక నిరుపేదవలె దుఃఖశోకములు పొందసాగాను. “ఆహా! ఈ సంసార దోషమంతా నాకు ఎక్కడి నుండి దాపరించింది?" అని చింతించసాగాను. ఎంత యోచించినా, చింతించినా నాకు దుఃఖవిముక్తి కలుగనే లేదు. అప్పుడు నా తండ్రి నన్ను సమీపించి “ఏమయ్యా! కుమారా! ఎందుకు నిష్కారణంగా నీలో నీవే దుఃఖిస్తున్నావు? ఈ దుఃఖములకు నివారణోపాయ మేమిటో ఎదురుగా ఉన్న నీ తండ్రినగు నన్ను అడుగవచ్చును కదా! అప్పుడు నీకు తగిన ఉపాయమేమిటో వివరిస్తాను!” అని లాలిస్తూ అనునయవాక్యాలు పలికారు.

అప్పుడు నేను ఆయన ప్రక్కన కూర్చుని వినమ్రతతో "తండ్రీ! దుఃఖమయ సంసారంలో ఈ జీవుడు ఎట్లు తగుల్కొనుచున్నాడు? దీనుడై అనేక దుఃఖములను అనుభవిస్తున్న ఇతడు వాటినుండి విడివడేదెట్లా?” అని ప్రశ్నించాను. అప్పుడాయన విస్తారమగు తత్త్వజ్ఞానం ఉపదేశించారు. ఆ అమృతతుల్యమగు జ్ఞాన ప్రవచనమంతా శ్రద్ధగా గ్రహించినవాడనై అత్యంత నిర్మలుడనయ్యాను. నా తండ్రిని మించినట్టి తత్త్వజ్ఞానమునందు అవస్థితుడనయ్యాను. ఏది తెలుసుకొన్నంతమాత్రంచేత జన్మ సార్థకత పొందుతుందో, పవిత్రత చెందుతుందో, అయ్యది తెలుసుకొన్నాను.

ఆ విధంగా తిరిగి స్వస్వరూపమును పొందినట్టి నాతో ఆయన ఇట్లు పలికారు:

"ఓ ప్రియపుత్రకా! ఇంతకుముందు నీవు, అజ్ఞానవశం చేత జీవుడు ఎట్టి దుఃఖములను పొందుతాడో, స్వయముగా రుచి చూచావు కదా! నా సృష్టిలోని ఈ జీవులందరు అజ్ఞాన జాడ్యముచే దుఃఖ-మోహములందు చిక్కుకొని అనేక జన్మ పరంపరలందు బలవంతంగా ప్రవేశిస్తూ కొట్టుమిట్టాడుచున్నారు. అందుకు ఔషధమే ఇప్పుడు నీకు చెప్పిన అఖండ జ్ఞానము. ఈ జ్ఞానము అన్ని తరగతులవారికి ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను నిన్ను శపించి మూఢుడిగా చేశాను. ఇప్పుడు మన ఇరువురి సంభాషణచే నీవు పరమజ్ఞానమును పొందావు. నీవు కూడా నావలెనే ఏకాత్ముడవయ్యావు.

ఇప్పుడు నీవు జనులను అనుగ్రహించటానికి భూలోకం వెళ్లు. కర్మరతులైన వారికి క్రియాకాండను ఉపదేశించు. విరక్త-చిత్తులగు ప్రాజ్ఞులకు ఆనందదాయకమగు జ్ఞానం ఉపదేశించు.”

ఆయనచేత ఆ విధంగా ఆజ్ఞాపించబడిన నేను జంబూద్వీపంలోని ఈ భరతవర్షానికి వచ్చాను. ఈ జ్ఞానము పొందుటకు తగినవారు ఉన్నంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక వేరే కర్తవ్యమంటూ ఏదీ లేదు. అయితే, ఇక్కడ నాకు యథాప్రాప్తములైన కార్యములను మాత్రం అభిమానరహితమైన చిత్తంతో నిర్వర్తిస్తూ ఉంటున్నాను.


Page number:117

ఇట్టి ’జ్ఞానవిచారణ’ వినతగిన లోకకళ్యాణకారకుడవైన నీవంటి ఉత్తమ శిష్యుడు లభించటం నాకు ఆనందకరమైన విషయం. నిన్ను నిమిత్తంగా చేసుకొని లోకములన్నిటికీ ఈ జ్ఞానామృతమును పంచిపెట్టుటకు ఉద్యుక్తుడనయ్యాను.

ఓ రామచంద్రా! నా జన్మవృత్తాంతం ఏమిటో, ఈ భూలోకమునకు ‘జ్ఞానము’ ఎట్లు ప్రవేశించిందో, నాయొక్క నా నా తండ్రియొక్క ఆశయములు ఏమిటో - అంతా విన్నావు కదా! గొప్ప సుకృతం చేయుట చేతనే, స్వస్వరూపానందప్రదమగు ఈ పర- జ్ఞానం వినాలని నీ చిత్తము తహతహపడుతోంది. ఇట్టి మధురమైన సమయం సర్వలోకములకు శుభము, శాంతము, ఐశ్వర్యము, ఆనందము కలుగచేయును గాక!

✤✤✤

12.) సంసార చక్రం - వైరాగ్యం

శ్రీరాముడు : బ్రహ్మదేవునిచే సృష్టించబడిన ఈ లోకములకు జ్ఞానముయొక్క ఆవశ్యకత ఎట్లు కలిగిందో, అది ఏ విధంగా ఈ లోకమునందు ప్రవేశించిందో, దానియొక్క ప్రయోజనము, ఉద్దేశము ఏమిటో మరికొంత వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : జ్ఞానావతరణము గురించి, జ్ఞానము యొక్క ఆవశ్యకత గురించి, ఇందుకు తగియుండుట గురించి, ఆ సంసారచక్రం గురించి మరికొన్ని విశేషాలు చెపుతాను, విను.

సముద్రంలో తరంగాలు ఉదయిస్తాయి చూచావా! అదే విధంగా పరబ్రహ్మమునందు స్వభావానుసారం బ్రహ్మదేవుడు క్రియాశక్తియుతుడై జన్మించారు.

ఆయన తన వలన సృష్టించబడిన జీవరాశులు “మేము పుట్టుచున్నాము - చచ్చుచున్నాము” అను రూపమున గల జరామరణ భావములను పొందటం గమనించారు. ఒక్కసారి భూత - భవిష్యత్తు వర్తమానములనంతా పర్యవలోకించారు. ”ఆహాఁ! అనేక యుగములు గడచిపోతున్నాయి. ‘స్వర్గము’ మొదలైన ఊర్ధ్వగతులు పొందటానికి తగినట్టి సాధన సంపత్తి అంతా సృష్టించాను. ఇవన్నీ బాగానే ప్రవర్తిస్తున్నాయి. కాని, ఈ జన్మలు పొందుచున్న జీవులు మోహబద్ధులే అగుచున్నారు. అంతేకాని, సర్వదా నిత్యమైయున్నట్టి అఖండమైయున్నట్టి స్వస్వరూపమును ఏమాత్రం గాంచుటలేదు” అని గమనించారు. ఇదంతా చూచి కరుణా పరవశులయ్యారు. అప్పుడాయన నన్ను సృష్టించి, చక్కగా ఉపదేశించి ’జ్ఞాని’గా తీర్చిదిద్దారు కదా! ఈ సర్వజనుల అజ్ఞానము బాపటానికి నన్ను ఈ భూలోకం పంపారు. ఒక్క నన్ను మాత్రమే కాదు. అందుకుగాను సనత్కుమార, నారదాది అనేకమంది మహర్షులను కూడా పంపారు. మమ్ములను నిర్ణయించుటలో ఆయన ఉద్దేశం ‘మనోమోహము’ అనే జాడ్యముచే కుంచించుకుపోవుచున్న జీవులను, “క్రియ-పుణ్య-జ్ఞానము”లచే సముద్ధరించుటయే సుమా!


Page number:118

ఆ విధంగా అనేక యుగాలు గడచిపోయాయి. విశుద్ధములైన యజ్ఞాది క్రియలు కూడా అశ్రద్ధ కారణంగా అంతరించిపోవటం ప్రారంభించాయి. అది గమనించిన మహర్షులు కర్మకాండను, శాస్త్ర మర్యాదలను ఉద్ధరించాలని (తిరిగి రక్షించాలని అనుకొన్నారు. ఈ భూమండలమును వేర్వేరు దేశాలుగా విభజించి రాజులను కల్పించారు. ఆ తరువాత, ధర్మార్థకామముల ప్రయోజనం సిద్ధింపచేసే స్మృతి శాస్త్రములను (పురాణములను), యజ్ఞ శాస్త్రములను మరల రచించారు.

ఆ విధంగా కాలచక్రం పరిభ్రమిస్తోంది. కాలమహిమ ఏమని చెప్పాలి? క్రమంగా జనులు ధన, గృహ, అన్నపానాదులందు మాత్రమే ఆసక్తి కలిగి ఉండటం ప్రారంభించారు. ప్రజలలో అనేకులు అనేక నేరాలు చేస్తూ దండార్హులు కావటం అధికమైనది. హింస, యుద్ధము మొదలైన దుష్టక్రియలు నిర్వర్తించకుండా రాజులు, ప్రజలను పాలించటం సాధ్యమయ్యేదికాదు. అటు రాజులు, ఇటు ప్రజలు దీనత్వం పొందటం జరుగుచుండేది. అప్పుడు మావంటి జ్ఞానదృష్టి కలవారు లోకంలో దీనత్వం పోగొట్టటానికి “ఆత్మతత్వము” ప్రచారం చేయవలసి వచ్చింది. ఈ ‘విద్య’ మొట్టమొదట రాజులకు చెప్పటం జరిగింది. అందుచేత దీనిని ‘రాజవిద్య’ అని అంటూ ఉంటారు. ఈ ‘ఆధ్యాత్మవిద్య’ సర్వవిద్యలకు మకుటంవంటిది అవటం చేత దీనికి ‘రాజవిద్య’ అనే పేరు తగినదే అయింది. రహస్యమగు ఈ విద్యను తెలుసుకొన్నట్టి రాజులు, తదితరులు దుఃఖ విముక్తులయ్యారు.

క్రమంగా నిర్మలమైన కీర్తి కలిగినట్టి అనేకమంది రాజులు గతించారు. ఇప్పుడు ఈ దశరథమహారాజు పుత్రునిగా నీవు జన్మించావు. సహజ నిర్మలము, ప్రశాంతశీలము అగు నీ మనస్సులో ఎట్టి కారణం లేకుండానే పరమపవిత్రమైన వైరాగ్యం జనించింది. అట్టి వైరాగ్యం నీయందు ఈ విధంగా జనించటం లోకములకు శుభము కలిగింపచేయటానికే అయివున్నది. రాజసిక వైరాగ్యం, సాత్విక వైరాగ్యం అని వైరాగ్యం రెండు విధాలుగా ఉంటుంది

రాజసిక వైరాగ్యం : ఏవైనా దుస్సంఘటనలు తారసపడినప్పుడు ఏర్పడే వైరాగ్యం. ఉదాహరణకు ధనమునో, రాజ్యమునో, బంధువులనో కోల్పోవటం మొదలైనవి కారణాలుగా కలిగిన వైరాగ్యం.

సాత్విక వైరాగ్యం : ఎట్టి బాహ్యకారణం లేకుండానే, కేవలం పరిశీలనాత్మకమగు బుద్ధిచేత, నిత్యానిత్య వివేకము వలన ప్రాప్తించే వైరాగ్యం.

నీయందు ఇప్పుడు జనించింది సాత్విక వైరాగ్యం. అందుకే సాధు పురుషులు కూడా అది చూచి ఆశ్చర్యపడుచున్నారు.

బీభత్సం విషయం దృష్ట్వా కో నామ న విరజ్యతే?
సతాం ఉత్తమ వైరాగ్యం వివేకాత్ ఏవ జాయతే ॥ (XI - 23)

జీవితంలో బీభత్సమైన విషయాలు చూచినప్పుడు వైరాగ్యం ఎవరైనా పొందుతారు. అది సహజమే. అందులో మహత్తరమైన విశేషమేమున్నది? అయితే సాధుపుంగవుల వైరాగ్యం చమత్కారంగా ఉంటుంది.


Page number:119

వారు ఇతర జనుల కష్ట సుఖములను గాంచినప్పుడో (అర్జునుడు, బుద్ధుడు మొదలైన మహనీయుల ఉదాహరణలు అట్టివే) లేక కేవలం ఏకాంతంలో నిర్వర్తించబడిన స్వవిచారణాపూర్వక వివేకముచేతనో (ఉదా॥ శుకుడు మొదలైనవారు) వైరాగ్యం పొందటం జరుగుతుంది. అట్టివారు మా దృష్టిలో మహనీయులే. వారే మహాప్రాజ్ఞులు. వారి మనస్సు అతి నిర్మలమై ఉంటుంది. అందమైన పూలతో సుందరముగా తయారుచేయబడిన దండ భగవంతునికి అలంకారమగునట్లు, “స్వవిచారముతో కూడిన పరామర్శచే జనించిన వివేకముచే ఈ సంసార గతిని విచారించి, ఇందలి అస్థిత్వ - నాస్థిత్వములను వైరాగ్యాభ్యాసంచే గ్రహించేవారు పురుషశ్రేష్ఠులు. వారు తమను తాము ఉద్ధరించు కొనుటయేకాక, అశుభమార్గమున చనుచున్న తదితర జనులకు కూడా జ్ఞానజ్యోతియై వెలుగొందుతారు.

కాబట్టి, ఓ సభికులారా! వివేకముతో “నేను ఎవ్వరు? ఈ దృశ్యమంతా ఏమిటి? ఇదంతా ఎట్లు ఎక్కడి నుండి ప్రాప్తిస్తోంది? ఈ కనబడే సంబంధ - బాంధవ్యములు ఎచ్చట ఎట్లు ఏర్పడుచున్నాయి?“ అనే విషయాలు చక్కగా, బాగుగా విచారించబూనెదరు గాక! ”ఈ మాయా దృశ్య ప్రపంచము, ఈ దేహ- ఇంద్రియ-తదితర పదార్థములతో కూడిన బాహ్యజగత్తు, ఈ మనో-బుద్ధి-చిత్తాహంకారాలతో కూడిన అభ్యంతర జగత్తు - ఇదంతా అవిద్యయే” - అని గ్రహించినవారై వివేకమును ఆశ్రయించి అవిద్యను త్యజించి వేసెదరు గాక! “వీటిచే స్పర్శించబడజాలని నిత్యోదిత సాక్షితత్త్వమే నేనైయున్నాను" అని గ్రహించెదరు గాక!

ప్రియ రాఘవా! శ్మశానము, ఆపదలు, దైన్యము - మొదలైనవి తారసపడినప్పుడు ప్రాప్తించే విరక్తి కంటే, స్వతహాగా విచారణాదులచే కలిగే వైరాగ్యం మహత్తరమైన ప్రభావం కలిగి ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకుగాను అనేక దృష్టాంతాలు (ఉదాహరణలు) మనం ఈ విచారణలో చూడబోతున్నాం.

[NOTE: బుద్ధుడు, జీనస్, గురునానక్, మహ్మద్ ప్రవక్త వంటి మహనీయులు ఈ లోకుల అజ్ఞాన జనిత దుర్భర స్థితులను గాంచుటచే వైరాగ్యం పొందారు. అంతేకాని, తాము పొందిన వ్యక్తిగత కష్టములచే కాదు. అందుచేతనే వారు తమ ప్రవచనములచే చెడుదారులను, అశుభములను ఆశ్రయిస్తున్న జనులకు దారిచూపారు.]

నీవు ఈనాడు అకృత్రిమమైన వైరాగ్యమును, అతిశయపూరితమైన మహత్వమును పొందావు. చదునైన, తడిసిన నేల విత్తుటకు తగినదై ఉంటుంది కదా! ఇప్పుడు జ్ఞానోపదేశమునకు పాత్రుడవయ్యావు. సర్వాంతర్యామియగు ఆ భగవంతుని అనుగ్రహం చేతనే, నీబోటివారి బుద్ధి యిట్లు వివేకము పొందినదై వికసించటం జరుగుతూ ఉంటుంది.

ఓ రామచంద్రా! ఓ సర్వజనులారా! ఈ మనం చెప్పుకోబోయే బోధ యొక్క ఉత్తమ ప్రయోజనం మీ వివేకము యొక్క ఔన్నత్యము వలననే ఒనగూడగలదు. కనుక మీ ’వివేకము’ విషయంలో జాగరూకులై ఉండండి.


Page number:120

‘వివేకము’ అనునది యజ్ఞయాగాది సత్రియల వలన, గొప్ప తపస్సు వలన, చిరకాలం తీర్థయాత్రలు సేవించుట చేత, ఆయా సత్పురుషులచే, శాస్త్రములచే నిర్ణయించబడిన నియమ-నిష్ఠలు సదవగాహనచే అవలంబించుట వలన, పరోపకార ప్రభావంచేత ఉదయిస్తుంది. అట్టి ప్రయత్నములచే అంతరంగమున పేరుకొని ఉన్న పాప-దృష్టులు నశిస్తాయి. అప్పుడు కాకతాళీయ న్యాయముచే ‘తత్త్వచింతన’ యందు ఆసక్తి కలుగుతుంది.

ఓ రామచంద్రా! ఈ సంసారచక్రము యొక్క భ్రమణమునకు అంతులేదు. “పరమ పదము”ను దర్శించనంతవరకు, జనులు ఇట్లే, ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. అనేక రాగద్వేషాదులచే చుట్టబడినవారై, అంతూ-పొంతూలేనట్టి ఐహిక ఆముష్మికప్రదములైన క్రియావ్యవహారములు ఆచరిస్తూనే ఉంటారు. “ఈ సంసారము అపారము” అనే విషయం, వివేకము ఉదయించినప్పుడు మాత్రమే గ్రహించగలరు. సునిశితమైన బుద్ధిచే వివేకము ఉదయించిందా, ఇకప్పుడు, “త్రాళ్ళు త్రెంచుకొని అరణ్యంలో ప్రవేశించే ఏనుగు“లాగా ఈ జీవుడు ”సంసార బుద్ధి"ని త్యజించి, తన స్వస్వరూపమగు పరమపదమును అందుకొని సుఖించగలడు.

ఓ సభికులారా! ఈ సంసారము యొక్క గతి అతి కుటిలమైనది. దీనికి అంతు లేదు. “ఈ దేహమే నేను” అనునట్టి బంధమున చిక్కుకొన్న ఒక మహాజంతువు వంటి ఈ జీవుడు జ్ఞానమును ఆశ్రయించనంతకాలం ఈ సంసారము యొక్క అంతమును కనుగొనజాలడు. వివేకులైనవారు “జ్ఞానయుక్తి” అనే తెప్ప సహాయంచేతనే ఈ సంసార సాగరమును దాటివేసి, తరించుచున్నారు. అట్టి సంసార సాగరమును దాటించగల ఈ ”జ్ఞాన విచారణ"ను మీరంతా శ్రద్ధాసక్తులతో, విచారణ పూర్వకమైన బుద్ధితో, ఏకాగ్ర మనస్కులై వినండి.

ఓ రామచంద్రా! నీకు సందేహాలుంటే ఎప్పటికప్పుడు ప్రశ్నించు.

ఈ జగత్తును గమనించావా? ఇది అజ్ఞానుల కొరకు నిరంతరం అనేక కామ, క్రోధ, మోహ, భయ, సందేహ సమన్వితములగు సందర్భములను, అనుభవములను నిర్మించుకొంటూ పోతోంది. ఫలితమేమిటి? ఈ జీవుని అంతరంగము అనేక దుఃఖములచే, భ్రమలచే దహించబడుతోంది. ఎక్కడా తృప్తిగాని, దోషరహితమైన ఆనందముగాని లభించుట లేదు. అందుకుగాను ఏదైనా ఉత్తమమైన ఉపాయం అన్వేషించాలి కదా! నిరర్థకంగా రోజులు గడిపివేస్తుంటే ప్రయోజనమేమిటి? “అవివేకమునకు ఏకైక ఔషధం జ్ఞాన విచారణయే” అని మేము మరల మరల ప్రకటిస్తున్నాము.

“ఆ! ఈ ఆత్మవిచారణ మా కెందుకు? ఇప్పటి మా లౌకిక ప్రయత్నములు, అవి ప్రసాదిస్తున్న ప్రయోజనములు మాకు సానుకూలంగానే ఉన్నాయి కదా!” అని తాత్సారం చెయ్యటం ఉచితం కాదు. ఎందుకంటారేమో? అనుక్షణం మార్పులు చెందుతూ ఉండే ఈ ‘ఉపాధి’ని (దేహాన్ని) నమ్మి, ఇందలి దోషములను గమనించకుండా రోజులు గడపటం ఉచితమెట్లా అవుతుంది? శీతల, వాత, తాపాది అనేక వ్యాధులు, దుఃఖాలు, మనోచింతలు, శిథిలత్వం, వృద్ధాప్యం, మృత్యువు - ఇత్యాదులతో కూడుకొనియున్న సంసార వ్యవహారమంతా మనిషిని క్షణకాలంలో దుఃఖ సముద్రమునందు ముంచివేయగలదు కదా! దూరదృష్టి లేనట్టి దుర్బుద్ధులకు నేను కాని, మరెవరు కాని ఏం చెప్పగలం?


Page number:121

సాధుపురుషులగు మహాత్ములు జ్ఞానము - నిగ్రహము - యుక్తి - ఏకాగ్రత (Awareness Self control - discrimination - concentration) చేతనే (ఈ సంసార దుఃఖమును పొందవలసి వస్తున్నప్పటికీ) దీనిని సహించగలుగుచున్నారు. ఈ దృశ్యమునకు అతీతమైనట్టి అకళంకస్థితియందు తమను తాము స్థాపించుకొనుచు, సుస్థిరత శాంతములను పొందగలుగుచున్నారు.

అనుక్షణం మూఢ మానవులను అనేక దుఃఖచింతనలు సమీపించి వారిని -ఎండుగడ్డిని అగ్నివలె - దహించివేస్తున్నాయి. అందుకే “నాయనలారా! తాత్సారం చేయకండి” అని సర్వజనులకు మరల మరల మనవి చేస్తున్నాను. అమృతతుల్యమగు ఆత్మయే స్వరూపముగాగల ఓ సర్వజనులారా! వానకు బాగా తడిసిన ఎండుగడ్డిని నిప్పు దహించగలదా? మీరు ఆత్మ జ్ఞానమును పొందండి. ఆధ్యాత్మ శాస్త్రమును విచారణపూర్వకంగా గ్రహించండి. ఆత్మతత్త్వమును సాక్షాత్కరింప చేసుకోండి. సమ్యక్ దర్శులు (సర్వమును సమరస భావముతో దర్శించువారు) ఎట్టి మానసిక వ్యాధులచే బాధింపబడజాలరు. ఈ ‘సంసారము’ అనే విశాలభూమిలో అనుక్షణం “ఆధివ్యాధులు (మానసిక-శారీరక దోషములు)" అనే సుడిగాలులు లేస్తున్నాయి. ఒక్క తత్త్వజ్ఞుడగువాడు మాత్రమే ఇందులో ’కొండ’వలె నిశ్చలుడై ఉండగలుగుచున్నాడు.

ఏమాత్రం వివేకం కలిగి ఉన్నా, అట్టివాడు తన కాలమును వృథా చేసుకోడు. తత్త్వ జ్ఞానమును గ్రహించినట్టి ప్రాజ్ఞుడు, ప్రబుద్ధాత్ముడు, బుద్ధిమంతుడు అయినట్టి మహనీయుని కోసం వెతుకుతాడు. అట్టివానిని గుర్తించి, సమీపించి, సర్వ సందేహములను నివృత్తి చేసుకొని, శుద్ధజ్ఞానము నందు విలీనుడౌతాడు. నాయనలారా! ఎంతో ప్రయత్నపూర్వకంగా, నిరహంకారంగా, డంబము-దర్పము లేకుండా అన్వేషిస్తే గాని, అట్టి మహనీయుని సామీప్యత లభించదు. ప్రయత్నశీలుడైనవాడు అట్టి వ్యక్తిని సమీపించి, అతనిని నమస్కారాది సపర్యలచే సంతోషింపచేయాలి. ప్రేమపూర్వకంగా, సత్యాన్వేషణాదృష్టితో ప్రశ్నించి తెలుసుకోవాలి. వస్త్రమునకు కుంకుమ రంగు వేసినట్లు, ఈ మనస్సును జ్ఞానులు ప్రసాదించే సమాచారముతో నింపివేయాలి. అత్యంత శ్రద్ధతో సంశయములన్నీ నివర్తింపచేసుకోవాలి. బుద్ధికుశలతతో, ఓర్పు-నేర్పులతో, యత్న పూర్వకంగా, “ఇతడు ఇట్లు చెప్పుటలో ఏ ఉద్దేశమును ప్రకటించుచున్నాడు?” అనునది జాగరూకులై గ్రహించాలి.

13.) ప్రశ్న - సమాధానం

ఓ రామచంద్రా! తత్త్వజ్ఞుడు కాని వానిని, సత్యవస్తువగు ఆత్మను గ్రహించనివానిని, ఉపదేశములేని వానిని ఆత్మవిషయమై ప్రశ్నిస్తే ఏం ప్రయోజనం?

అదేవిధంగా "ఇతడు తత్త్వవేత్త. ఆత్మవిషయమై నాకంటే కూడా అధికంగా ఎరిగినవాడు” అని తెలిసికూడా అతనితో సంభాషించకుండా, అతడు ఏది చెప్పుచున్నాడో అది గ్రహించకుండా, పిడివాదాలతో జ్ఞానవస్తువును తిరస్కరించేవారు - మా ఉద్దేశంలో వృథా వ్యాసంగపరులు మాత్రమే.


Page number:122

ప్రశ్నించువాడు (పృచ్ఛకుడు): ప్రశ్నించే ముందు మనం ప్రశ్నించువాని జ్ఞాన - విజ్ఞానస్థితులను చక్కగా గ్రహించి ఉండాలి. “ఇతడు ఇట్టి విషయమై పండితుడు” అని నిర్ణయించుకొనిన తరువాత ప్రశ్నించాలి. ఎట్టి అనుకూలమైన ప్రశ్నచే అతని వాస్తవమైన అభిప్రాయం మనకు లభిస్తుందో గ్రహించి ఉండాలి. ఆత్మజ్ఞాన జిజ్ఞాసతో ప్రశ్నించాలి కాని “నీవు మూర్ఖుడవు. నీకు ఏమి తెలియదు” అని నిరూపించుటకు ప్రశ్నించరాదు. ఒకనికి తెలియదని భావించినప్పుడు మనకు కావలసిన ఆత్మ సమాచారం లభించే మరొకవ్యక్తి కోసం అన్వేషించుటచే కాలం సద్వినియోగమౌతుంది.

“మనలోని అహంకార మమకారములే ఇతరుల దోషములను ఎంచుటకు ప్రేరేపిస్తాయి” అనే విషయం మనం మరువరాదు. అజ్ఞుడైన వానిని ప్రశ్నించి, అంతటితో ఆత్మ విచార విషయమై దురభిప్రాయములు సమకూర్చుకొని, ఉత్తమ జ్ఞానము తిరస్కరించువాడు మా దృష్టిలో ’మూర్ఖుడు’ మాత్రమే. అతడు పరమార్థజ్ఞానం ఎట్లా పొందుతాడు?

సమాధానమిచ్చేవాడు :  “నన్ను ప్రశ్నించుచున్న ఇతడి పూర్వాపరములు ఏమిటి? ఇతని మనోదోషములు ఎటువంటివి? ఏ ఉద్దేశంతో, ఏమి కోరి ప్రశ్నిస్తున్నాడు? ఏ విధమైన వాక్యములు, దృష్టాంతములు అతనిని ఉద్వేగరహితునిగా, సత్యోన్ముఖునిగా చేస్తాయి? ఇతని అవధారణ సామర్థ్యం ఎట్టిది? అనిందితములైన నిర్ణయములు కలవాడేనా? నూతనమైన ఉన్నత సత్యమును అంగీకరించి, ఆకళింపు చేసుకోగలడా?” అని వితర్కించుకొని అప్పుడు ప్రశ్నించేవానికి తగినట్లుగా సమాధానం ఇవ్వాలి. పశు స్వభావుడగు అధమునకు ఏమీ చెప్పకపోవటమే మంచిది. ప్రశ్నించేవాని సామర్థ్యం విచారించకుండా ఉపదేశం ఇవ్వటం చెవిటివాని ముందు శంఖం పూరించటం వంటిదే కాకుండా, అతనిని తికమక పరచటమే అవుతుంది.

ఓ రామచంద్రా! నీవు సద్గుణశీలివి. సాత్విక వైరాగ్యం ఆశ్రయించినవాడవు. సద్గుణ పక్షపాతివి. అట్టి నీవు ప్రశ్నిస్తున్నావు.

ఇక నేను, బ్రహ్మదేవునిచే ‘బోధ’ కొరకు నిర్ణయించబడినవాడను. లోక కళ్యాణము మాత్రమే శిష్యుల నుండి ప్రతిఫలంగా కోరుకొనేవాడిని. కాబట్టి మన ఇద్దరి ఈ గురు-శిష్య సంయోగం మధురమే కానున్నది.

ఓ రాఘవా! నీవు శబ్దార్థ జ్ఞానమునందు మహా నిపుణుడవు. నేను చెప్పబోవు దానిని “ఇది అనుభవపూర్వకమగు తత్త్వము” అను భావన, గౌరవం, ఉత్తమ విశ్వాసము కలిగియుండుము. ఎందుకంటావా? మేము అనేక సంవత్సరములు సత్యము కొరకు అన్వేషించాం. తపోధ్యానాదులచే మనస్సును పరిపక్వం చేసుకొని ఆపై శాస్త్రవిషయాలు పరిశీలించాం. అనేకమంది ఉత్తమ జ్ఞానులతో కూడి, దీర్ఘకాలం విచారణ చేశాం. “సత్యము ఇది” అనే నిర్ణయానికి వచ్చాం. అందుచేత మా వాక్యములపై కొంత విశ్వాసము కలిగియుండటం ఉచితమే కదా! అప్పుడే ఉత్కృష్టమైన ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయం.


Page number:123

విశ్వాసంలేని వైద్యునివద్ద ఉపశమనం కష్టమగునట్లే గురువుపై విశ్వాసం లేనిచోట అవగాహన ఏర్పడటం అసాధ్యం.

నాయనా! నీవు మహామతివి. అకారణ విరక్తుడవు. స్వవిచారణచే జీవుల ‘గతి’ని గ్రహించినవాడవు. ఈ ‘జీవితము’ అనబడుదానిని, ఇందలి జన్మమృత్యు జరా దుఃఖాది దోషములతో సహా సమగ్రంగా చూస్తున్నావు. నీవంటి శిష్యుడు లభించటం కూడా మాకు సంతోషకరమైన విషయమే. శుభ్రమైన వస్త్రమునకు స్వల్ప ప్రయత్నంతో చక్కగా రంగు అంటుతుంది కదా! ఈ నా బోధ సులభంగా నీయందు ప్రవేశించి అంకితము, సుస్థిరము, పవిత్రము కాగలదని నేను భావిస్తున్నాను. నీవు నిన్నటి రోజు పలికిన దానినిబట్టి, "ఈ రాముని బుద్ధి పరమార్థ విచారణ సలుపుటలో ఏకాగ్రత, సమర్థత కలిగియున్నది” అని మేము మునులందరము నిశ్చయం చేశాం. సూర్యకాంతి నిర్మల జలంలో ప్రవేశించునట్లు, నేను ప్రతిపాదించబోయే తత్త్వార్థము అకృత్రిమంగా (స్వభావ సిద్ధంగా) సుందరంగా నీ హృదయములోనికి ప్రవేశించునుగాక! నేను చెప్పబోయేదంతా బహు యత్నపూర్వకంగా గ్రహించాలి సుమా! అట్లు విని, విచారించి, ఆపై నీవు ఎట్లు నిర్ణయించుకొంటావో అట్లే ఆచరించవచ్చు.

ఆయా సందర్భాలలో ప్రశ్నించవచ్చు. అయితే అనుమాన నివృత్తి కొరకు, ఆత్మజ్ఞాన సముపార్జనయే లక్ష్యముగా కలిగియుండి ప్రశ్నించాలి. వ్యర్థమైన ప్రశ్నలు వేయకుండెదవు గాక! ఇలా ఎందుకంటున్నా నంటావా? చంచలమైన ఈ “మనస్సు” అనే కోతి యథేచ్ఛగా సంసారారణ్యంలో సంచరిస్తోంది. అట్టి మనస్సును శుద్ధ పరచుకోవాలి. లేకుంటే, ’సంసార దృష్టి’యే పెత్తనం చలాయిస్తూ, మనస్సును అల్పత్వము వైపుగా ప్రసరింపచేస్తూ ఉంటుంది. అందుచేత నీ ప్రశ్నలు అల్ప లక్ష్యములు కలిగి ఉండే అవకాశమున్నది. యత్నపూర్వకంగా పరమార్థ తత్త్వమునే వినాలి. మహత్తరమైన ఆశయము కలవాడవై ఆత్మయొక్క స్వరూప స్వభావములు ఎరుగుటకై ప్రశ్నించెదవు గాక!

ఓ మానవులారా! ఈ ‘ఆత్మ విచారణ’ వినటానికి సిద్ధపడుచున్నారు కదా! అవివేకం చేత అజ్ఞత్వకారణంగా (Because of sheer ignorance) అసత్ వ్యవహారములతో క్షణక్షణం ‘సంసర్గము’ ఏర్పడటం ఈ సంసారము యొక్క లక్షణం. అట్టి సంసర్గమును క్షీణపరచుకోండి.

ఆత్మోన్నతి సాధించాలనుకొనేవారు సాధుపుంగవులకై వెతకాలి. వారిని గుర్తించి వారితో జ్ఞాన విచారణ చెయ్యాలి. అప్పుడు సత్యమేమిటో, అసత్యమేమిటో మీరే సుస్పష్టంగా తెలుసుకొనగలరు. సాధనపూనండి, నిరంతర సాధుసంగం ఆశ్రయించే వారికి అప్రయత్నంగానే వివేకము ఉదయించి వికసిస్తోంది. అట్టి వివేక వృక్షము యొక్క మధుర ఫలములలోని రసమే "మోక్షము” అని చెప్పబడుతోంది.


Page number:124

14.) మోక్షోపాయం

ఓ రామచంద్రా! “మోక్షము” అనబడే రాజాధిరాజు యొక్క దర్శనం కావాలంటే నీవు నలుగురు ద్వారపాలకులను ఆశ్రయించాలి.

1) శమము (Inner Calmness)
2) విచారణ (Enquiry)
3) సంతోషము (Contentment)
4) సాధుసంగము (Company of Holy men)

ఈ నాల్గిటిని యత్నపూర్వకంగా అభ్యసించాలి. నాల్గిటిని ఒక్కసారి అభ్యసించటం కష్టమనిపిస్తే, కనీసం ఏ మూడిటినో, రెండిటినో అభ్యసించు. అప్పుడు ఆ ద్వార పాలకులు నీ కొరకు మోక్షద్వారం తెరుస్తారు. అదికూడా కష్టమనుకొంటే, ఆ నలుగురిలో ఏ ఒక్క ద్వారపాలకుడినైనా ప్రాణాలు పణంగా పెట్టెనా సరే, ఆశ్రయించి ఆప్తమిత్రునిగా చేసుకో. ఆ నలుగురిలో ఒకరు నీ వశమైతే మిగతా ముగ్గురు తమంతట తామే వశమౌతారు. శాస్త్రము, జ్ఞానము, తపస్సు, శ్రుతులు (వేదములు) వీటికి వివేకిమాత్రమే యోగ్యుడగుచున్నాడు. అట్టి వివేకి ఆకాశంలో సూర్యునివలె సర్వజనులలో ’శ్రేష్ఠుడు’ అగుచున్నాడు.

‘చల్లదనం’ చేత నీరు గడ్డ కడుతుంది కదా! ప్రయత్న మాంద్యము చేతనే (సరి అయిన ప్రయత్నములను ఆశ్రయించకపోవుటచేతనే) ఈ జీవుని బుద్ధి జడత్వం పొందుతోంది. ఫలితంగా “నేను ఈ కాళ్ళు, చేతులు కలిగినట్టి ఒకానొక భౌతిక శరీరమును. దీని వృద్ధిక్షయాలు నాకు సంబంధించినవే" - అనే భావన దృఢపడుతోంది.

అయితే రామచంద్రా! నీవు మాత్రం “సౌజన్యము, సుగుణములు, శాస్త్రదృష్టుల వలన వికసించిన అంతఃకరణం" పొంది ఉన్నావు. లేళ్ళు తమ చెవులు రిక్కించుకొన్నప్పుడు మంద్రమైన ’వీణధ్వని’ని వినగలుగుతాయి కదా! ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో, జ్ఞాన పిపాసతో ఉన్నట్టి నీవు నేను చెప్పబోవు వాక్యములు విని, సత్య విషయము తప్పక గ్రహించగలవు.

ఏది ఏమైనా నీవు శాస్త్రప్రవచితమైన ధ్యాన భక్తి యోగాది అభ్యాస (Practice) వైరాగ్యము (Analysis) లను మాత్రం వదలవద్దు. వాటి సహాయం చేతనే నీయందు తరగని సౌజన్య సంపద సుస్థిరం కాగలదు. మొట్టమొదట “నేను ఈ సంసారము నుండి విడివడవలసిందే” అని నిశ్చయం చేసుకో. శాస్త్ర, సజ్జన సాంగత్యములను గ్రహిస్తూ “స్వకీయమైన విచారణ” అను రూపముగల తపస్సు నిర్వర్తించు. అద్దాని వలన నీ ప్రజ్ఞాశక్తి వర్ధిల్లుతుంది.

ఓ సర్వజనులారా! శుద్దమగు చిత్తముతో ఈ వాసిష్ఠ - రామాయణాది ఆత్మ తత్త్వబోధకమగు శాస్త్రములు పరిశీలించండి. “ఇప్పుడు అవన్నీ మా కెందుకు?” అను రూపముగల మూర్ఖత్వమును వదలండి.


Page number:125

ఈ సంసార మహావృక్షమును గమనించారా? ఒక ప్రక్క ఆయువు వృథా అగుచున్నది. నిదురలేచి మనోజాడ్యమును త్యజించండి. అజ్ఞులగువారిని (The Ignorant Lot) ఈ సంసారము నిత్యము మోసగించుచునే ఉన్నది. మూర్ఖత్వమును నశింపచేయాలంటే ప్రయత్నమే ఏకైకమార్గం. “బద్ధకము, దురాశ, అవిచారము” - అనే మూడు విష సర్పములు ఈ ‘జీవితము’ అనే ప్రదేశమును సర్వదా విషపూరితం చేస్తున్నాయి. అవి హృదయమును సంకుచితపరుస్తూ ఉంటే మానవుడైనవాడు చూస్తూ ఎలా ఊరుకుంటున్నాడో మాకు అర్థం అవటం లేదు.

ప్రాజ్ఞులగువారియందు నిత్య ప్రసన్నత కానవస్తోంది. ఎందుచేత? తత్త్వదృష్టి చేతనే సుమా! మేఘం లేని ఆకాశంలోని చంద్రుని ఆహ్లాద కిరణములు లోకమునంతా సుఖమయం చేస్తాయి కదా! ఎవని బుద్ధి పూర్వాపర విచారణచే ఆత్మ జ్ఞానమును గ్రహించగలుగుతుందో అట్టివానియందే బ్రహ్మానందము బహిర్గత మౌతోంది. అట్టి బుద్ధి కలవాడే ‘పురుషుడు’ అని అనిపించుకొంటున్నాడు. అట్టి ఉత్తమ విచారణశీలత, తత్త్వదృష్టి లేనట్టి బుద్ధి కలవానిని ఏమని పిలవాలో నన్ను అడుగవద్దు.

అందుచేత ఓ సర్వజనులారా! మీరంతా “తమోరహితము, స్వచ్ఛము, శాంతి మొదలైన ఉత్తమ గుణములతో కూడినది” - అయినట్టి బుద్ధిని పెంపొందించుకోండి.

15.) జగత్భ్రమణ క్రీడ

ఓ రామచంద్రా! నీ మనస్సు చక్కటి సుగుణములతో కూడి ఉన్నది. చెప్పినది గ్రహించగల సూక్ష్మబుద్ధి కలిగియున్నావు. సముచితంగా ప్రశ్నించగలవు. నీపట్ల గల ఆప్యాయతచే, సర్వజనులపైగల అవ్యాజమైన ప్రేమచే లోకకళ్యాణ దృష్టితో ఉత్తమమగు తత్త్వజ్ఞాన విచారణ ప్రారంభించబోవుచున్నాను. అందుకు అనువుగా నీ నీ మనస్సును మరల మరల రజస్తమోగుణరహితం చేయి. ప్రయత్నపూర్వకంగా మనస్సును సుస్థిరపరచుకొని, జ్ఞానము వినటానికి సిద్ధంగా ఉండు. నా తండ్రియగు బ్రహ్మదేవుని ’అభిలాష’ను అనుసరించి, నిన్ను నిమిత్తంగా చేసుకొని, సర్వజనుల ముందు ఈ ఆత్మ విచారణను ఉంచుచున్నాను.

నీ హృదయం వివేకం, అనాసక్తులచే బాల్యమునుండే ఆర్ద్రమైయున్నది. చంద్రుడు లేకుంటే ఆకాశం అందంగా ఉంటుందా? కలువలు వికసిస్తాయా? ఉపదేశమునకు అత్యంత తగినవాడవైన నీ వలన, నీయొక్క సుందరమైన ప్రశ్నల వలన ఈ నా ’ఉపదేశము’ ఉత్తమమై ప్రకాశించగలదు. మన ఈ ‘విచారణ’ యొక్క సారము, లక్ష్యము అయి ఉన్నట్టి "పరమపదము” అను దానిని సముపార్జించుటచే బాహ్యాడంబర దృష్టులన్నీ సమసిపోతాయి.

ఓ రాఘవా! ఈ సంసారము కలుగజేయగల “చిత్తమౌఢ్యం” ఏమాత్రం స్వల్పమైన విషయం కాదు సుమా! ‘జ్ఞానము’ అనబడు ఉపాయం చేత మాత్రమే మనోవృత్తులన్నీ స్వయంగా లయిస్తూ ఉంటాయి.


Page number:126

ఈ సంసారమును జయించటానికి రెండు ఉపాయములు జ్ఞానులు మనకు చెప్పుచున్నారు.
1) యోగము (ప్రాణాయామము, ధారణ మొదలైనవి)
2) విచారణ (Self enquiry)

ఈ రెండు ఉపకరణములలో ‘విచారణ’ అనునది అతి సులభమైనది. పరమార్థ జ్ఞానమును సజ్జనులగు వ్యక్తులతోకూడి విచారించటం జరిగితే అమోఘమైన ప్రయోజనమును ప్రసాదించగలదు. “అట్టి ’జ్ఞానవిచారణ’చే దుఃఖములన్నీ నశిస్తాయి" - అనటంలో ఏమాత్రం సందేహంలేదు. అందుచేత విచారణపరులగు వారిని హేళన చేయకుండెదరుగాక! వారే అనేకమంది జీవులను సంసార నికృష్టత్వము నుండి కాపాడగలరు.

ఓ జనులారా! మీరంతా వివేకులు కావాలి. పాము తన కుబుసమును విడచునట్లు, ’ఆధి’ అను పేరుగల మనోవ్యాధులకు సరైన చికిత్సను ఆశ్రయించండి. విచారణాదులను ఆశ్రయించినవారై, సత్వసంపద, ఆత్మవిషయమై అనుభవమును పెంపొందించుకోండి. క్రమంగా, జ్వర-ఉద్వేగరహితులై, శీతలాంతఃకరణులై ఈ జగత్తునంతా ఒక ఇంద్రజాలమువలె దర్శించుట అభ్యసించండి.

మీరు ఇప్పుడే, ఇక్కడే "సమ్యక్ దర్శనము”ను అలవర్చుకోకపోయారా తత్ఫలితంగా అనేక దుఃఖ పరంరపరలనే పొందబోవుచున్నారని హెచ్చరిస్తున్నాను. ఈ సంసారముపట్ల ఆసక్తి కలిగియుండటమనేది అతిభయంకరమైన విషయం.  

“ఈ సంసారము అనర్థకరమైనదే కదా!” అనే శంకను ఈ జీవుడు కలిగి ఉండాలి. లేకపోతే ఇయ్యది మోహగ్రస్తులగు జీవులను పామువలె కాటువేస్తోంది. ముడులతో కూడిన వస్త్రమువలె బాధిస్తుంది. త్రాడువలె కట్టిపడేస్తుంది. చురకత్తివలె గాయపరుస్తోంది. అగ్నివలె దహిస్తుంది. నిబిడాంధకారమైన రాత్రివలె చూపును పోగొడుతుంది. త్రోవలో పాతబడిన నిలువురాయివలె నేలపై కూలుస్తుంది. ప్రశాంత జలములోనికి విసరబడిన గులకరాయివలె బుద్ధి యందు దోష వృత్తులను పేట్రేపుతుంది. చెప్పనలవి కాని మోహాంధకారకూపం (నుయ్యి)లోనికి త్రోసివేస్తుంది.

దృశ్యాసక్తియే సంసారము యొక్క మూలరూపం. సంసారాసక్తుడగు వాడు అనుభవించని దుఃఖము లంటూ ఉండవు. అట్టి దురంతమగు విషయ విశూచికావ్యాధికి ఇక్కడే తగిన చికిత్స చేసుకోవాలి. లేకుంటే, అది ‘రక్తమాంస నిర్మితములే’ అయి ఉన్నట్టి బంధుజనుల శరీరములందు "ఆహా! వీరంతా నావారే! నాకు సంబంధించినవారే” అనునట్టి భ్రమపూర్వకమైన మమకారమంతా కలుగజేయగలదు. అట్లు ప్రాప్తించబోయే నరకయాతనలకు ‘అంతు - పొంతు’ ఉండదు.

అజ్ఞాని యొక్క యాతనలు ఎట్టివని చెప్పగలం? అతడు ఒకచోట రాళ్ళు భక్షించవలసివస్తోంది. మరొకచోట కత్తికోతలు అనుభవిస్తున్నాడు. కొండలమీద నుంచి దొర్లించబడుచున్నాడు. రాళ్ళపై మోదింపబడుచున్నాడు. నిద్రలేకపోవటం, కొండంత భారీ శరీరాలు పొందటం - ఇత్యాది అనేక యాతనలు అనుభవిస్తున్నాడు.


Page number:127

నాయనలారా! మరల మరల గుర్తు చేస్తున్నాను. పలుచేష్టలతో కూడుకొనిన ఈ సంసార యంత్రం అతి దారుణమైనదిగా మేము గుర్తించాం. దీనిని గమనించకుండా, తగిన విచికిత్సా పూర్వకమైన ఉపాయాలు లభిస్తున్నట్టి ‘మానవ జన్మ’ అను అవకాశమును వృథా చేసుకోవటం ఉచితం ఎట్లా అవుతుంది? కనుక ‘అశ్రద్ధ’ అను జాడ్యమును త్యజించండి. ప్రయత్నశీలురుకండి.

‘శాస్త్ర విచారణ’ వలననే ఉత్తమ శ్రేయస్సు లభిస్తుంది. శాస్త్రము అంటే ఏమిటి? కొందరు మహనీయులు - “ఈ దృశ్యము, ఇందలి పదార్థానుభవం మాత్రమే జీవితము యొక్క ‘లక్ష్యము, ఔన్నత్యము, పరమావధి’ కాదు. ఈ దృశ్యములో ప్రవేశించిన నాకు సంబంధించిన, స్వస్వరూపం
విషయమై సత్యమేదో ఉన్నది” - అని గుర్తించి అత్యంత ప్రయత్నశీలురై ఆ సత్యమును గ్రహిస్తున్నారు. తదితరులపై వారికి గల అవ్యాజమైన ప్రేమ కారణంగా అట్టి సత్యమును విధివిధానములగు ప్రయత్నముల రూపమున, విచారణ రూపమున ప్రకటిస్తున్నారు. అట్టివే ఈ శాస్త్రములు. ’మానవజన్మ’ అను అవకాశము లభించినందుకుగాను, అట్టి శాస్త్రముల సహాయం స్వీకరిస్తూ ఉత్తమ విచారణ ఆశ్రయించాలి. సత్యాసత్యములను, త్యానిత్యములను గ్రహించాలి. "కొందరు వివేకులు సంసార దుఃఖములను ఎట్లా జయిస్తున్నారు? సంసార పీడనం ప్రాప్తిస్తున్నప్పటికీ, నిరంతరం ఆనందచిత్తులై ఎట్లా సంచరించగలుగుచున్నారు?” ఈ విషయము గమనించబడుగాక! ‘జ్ఞానము’ అను కవచమును ధరించియుండుట చేతనే వారికది సాధ్యపడుచున్నది సుమా!

విశుద్ధచిత్తులగు అనేకమంది మానవులు హరి-హర-బ్రహ్మాదుల వలెనే ఈ సంసారంలో, ఈ భూమిపై, కౌతుకరహితంగా, విక్షేపములు లేనివారై సంచరించటం జరుగుతోంది. మానవులలోనే “మహా మోహబద్ధులు” - “మహా మోక్ష స్వరూపులు" కూడా కానవచ్చుచున్నారు. అట్లే దేవతల దానవుల పాతాళ జీవుల విషయం కూడా! అందుచేత రామచంద్రా! ఈ ‘మోహము’ అనునది ఎట్లాగైనా సరే, క్షీణింపచేయబడాలి. అందుకు జ్ఞానోదయమే ఉపాయం. జ్ఞాన ప్రభావంచేత ఆత్మతత్త్వము స్వయముగానే ప్రకటితం కాగలదు.

ఓ జనులారా! ఈ చెప్పబోవు విచారణను చక్కగా పరిశీలించండి. ఈ ’విచారణ’ సహాయంతో మీ విజ్ఞతను సునిశితం చేసుకోండి. హృదయంలో అలుముకొనియున్నట్టి “మోహ-రాగ-కౌతుకములను (Delusion, Attachment, Inquisitiveness with out usefulness) బయల్వెడల కొట్టండి. అప్పుడు ఈ హృదయాకాశమునందే ఆత్మాకాశము పరిఢవిల్లుతుంది. అట్టి స్థితిలో ఈ జీవునకు ఈ జగద్వ్యాపారములన్నీ ’లీల’గా, ’క్రీడ’గానే ఉంటాయిగాని, ’పీడ’గా కాదు. చైతన్యమాత్రమగు (కల్పనారహితమగు, శుద్ధ స్వస్వరూపమగు) “ఆత్మ” ప్రసన్నం కాగా, అప్పుడు పరమశాంతి లభిస్తుంది. ‘సర్వసమత్వము’ అనబడు అమరభావన రూపుదిద్దుకుంటుంది. అంతఃకరణము బ్రహ్మరసమయమౌతుంది.


Page number:128

ఓ రఘునందనా! జ్ఞానులకు ఈ జగద్భ్రమణమంతా క్రీడగానే తోచుచున్నది సుమా! కాబట్టి నీవు జ్ఞానివి అగుము.

ఈ ‘శరీరము’ రథంగాను, ఈ ‘ఇంద్రియములు’ రథచక్రములుగాను, ఈ ‘పంచప్రాణములు’ ఐదు గుఱ్ఱములుగాను, ఈ మనస్సు పగ్గముగాను - పెద్దలు చెపుతూ ఉంటారు. ఆనందమే దీని గమ్యస్థానం.

అట్టి దేహరథమును అధిరోహించిన ఈ జీవుడు “శుద్ధ చిత్తము” యొక్క సహాయం చేత జగద్వ్యవహారమంతా “ఆనందరూపమగు” క్రీడగానే దర్శించగలగాలి గాని దుర్భరంగా కాదు. అదే మా ఈ ప్రయత్నము యొక్క ఏకైక లక్ష్యము.

16.) వివేకులు - అవివేకులు

ఓ రామచంద్రా! ఈ భూమిపై వివేకులు, అవివేకులు కూడా సంచరించుచున్నారు. వారి గురించి కొన్ని విషయాలు చెపుతాను విను.

మనం విచారించబోయే ఈ “అఖండ రామాయణ శాస్త్రము” ఏ వివేకమును ప్రతిపాదిస్తోందో, అట్టి వివేకదృష్టి కలిగి ఉన్నట్టి ఎందరో బుద్ధిమంతులు సన్మార్గమును అనుసరించినవారై ఆత్మసాక్షాత్కారం పొందియున్నారు. ఆత్మజ్ఞాన సమన్వితులై రాజాధిరాజువలె ఈ భూమిపై సంచరించారు, సంచరించుచున్నారు. అట్టివారు ఈ కుటుంబ వ్యవస్థలో ఉండి ఉండవచ్చు లేదా, ఈ వ్యవస్థ (గృహస్థాశ్రమం) త్యజించి వీథిలో (సన్న్యాసాశ్రమంలో) ఉండవచ్చు. ఎక్కడ ఉన్నప్పటికీ వారు దేనికొరకైనా శోకించుట లేదు. హర్షించుట లేదు. దేనినీ కోరరు. త్యజించరు. శుభాశుభములకు వ్యధ చెందరు. శాస్త్ర విరుద్ధములైన వాటికి దూరంగా ఉంటూ ఉంటారు. “పవిత్రత” యందే సర్వదా సుస్థితులై ఉంటారు. వారు ఏది చేసినా శుభముకొరకు, అనేకమంది సుజనుల అనుకూలత కొరకు అయుంటుంది. అన్నివేళల సన్మార్గమునే ప్రయత్న పూర్వకంగా స్వీకరిస్తూ ఉంటారు. “ఈ ఈ పదార్థములన్నీ నాకుండాలి. ఇవి పొందాలి. ఇవి తొలగాలి” - ఇట్టి రూపముగల బుద్ధిపూర్వకమైన పట్టుదలచే వారు బాధింపబడరు. సర్వ సంఘటనల యొక్క “పూర్వాపరములను”, “సత్యాసత్యములను” గ్రహించి ఉండుటచే వారు దేనికీ, ఏమాత్రం ఉద్వేగపడరు. అయినప్పటికీ ఆయా లోక ధర్మములను సర్వుల సానుకూల్యతను దృష్టిలో పెట్టుకొని నిర్వర్తిస్తూ ఉంటారు. బాహ్యమునకు ఏది, ఎప్పుడు, ఎట్లు అనుకూలమో, ఉచితమో అట్లే ప్రవర్తిస్తూ ఉంటారు. అంతరంగమున మాత్రం సర్వదా ఆత్మ నిష్ఠులై ఉంటారు. నిష్క్రియులై ఉంటారు.

ఈ లోకంలోని వారి రాక పోకలు (జన్మ-మృత్యువులు) కూడా బుద్ధిపూర్వకములు కావు. అందుచేత వారు చేసేది, పలికేది నిష్కామమే అవుతుంది. “పరమపదము” అనగా ఏమో గ్రహించబడిన తరువాత, సమస్తకార్యములు, దృష్టులు గ్రాహ్య - త్యాజ్యములు (గ్రహించుట - త్యజించుటలు) శూన్య రూపములుగానే ఉంటాయి.


Page number:129

సర్వవిధములైన ఇచ్ఛలను, కర్తృత్వములను పరిత్యజించినవారై, సర్వదా మధురమైన మనోవృత్తి కలిగి ఉంటారు. శాంత రసమయమగు “బ్రహ్మాకార వృత్తి”చే చంద్రకిరణములవంటి ’ప్రశాంతత’ను అనుభవిస్తూ ఉంటారు. ఆత్మ స్వభావము తెలుసుకొన్నవాడు ఈ మాయమగు "దృశ్యము” అనే ఇంద్రజాలమును చూచి ఆకర్షితుడు కాడు. వికర్షితుడు కాడు. వాటికి కారణమైన వాసనలను అనుసరించడు.

“బాల్యచాపల్య ముస్సృజ్య, పూర్వమేవ విరాజితే"* (XIII.8)

బాల్య చాపల్యమును విడనాడినవాడై ఇతఃపూర్వమే సర్వదా (సిద్ధించియే) ఉన్నట్టి పరమాత్మ సుఖమునందే విరాజిల్లుతూ ఉంటాడు.

[NOTE: ఇక్కడ “పూర్వమేవ విరాజితే“ అని మహర్షి మహత్తరమైన ప్రయోగం చేశారు. ‘మోక్షము’ లేక ’ముక్తి’ అనబడునది క్రొత్తగా పొందబడే వస్తువు కాదు. అయ్యది నిత్యమై జీవుని వాస్తవ స్వరూపమై ఇతఃపూర్వమే సర్వదా సిద్ధించియే ఉన్నది. మరి మనం ప్రయత్నించేదంతా దేని కొరకు? ముక్త స్వరూపులమగు మన స్వరూపమును కప్పియున్నట్టి మాయను (లేదా “నేను జీవుడను - బద్ధుడను” - అను అభిప్రాయ రూపంలో గల అజ్ఞానమును) మాత్రమే తొలగించుకొనుటకు అయిఉన్నది. మన యందు, ఈ సర్వము నందు పూర్ణమైయున్న ఆత్మ వస్తువు దర్శించగల సుందరమైన దృష్టి స్థిరపడాలి. అట్టి దృష్టికే సాక్షీ స్వరూపులమై ప్రశాంతముగా శేషించాలి. అప్పుడు నిత్యనిర్మలత్వమే మన అనుక్షణానుభవం అవుతుంది. “మనమందరము ఏకైక ఆత్మస్వరూపులమే" అనునట్టి ఎరుకను బాల్యచాపల్యము వంటి ‘ఇంద్రియ - లోలుత్వము’ కప్పి ఉంచుతోంది. దృశ్యముపట్ల గల బంధపూర్వకమైన అనుభవం, ఆసక్తి తొలగించటానికే నియమములు, శాస్త్రములు, యజ్ఞములు, విధివిధానములు ఉన్నాయి - అనునది జ్ఞానుల అభిప్రాయం.]

అయితే అట్టి జీవన్ముక్తత్వము ఆత్మదర్శనముచేత మాత్రమే లభిస్తోంది. అంతకు మించి వేరే ఉపాయం లేదు. అందుచేత మనుజుడు విచారణ సమన్వితమైన ‘బుద్ధి’తో యావజ్జీవితము ‘ఆత్మాన్వేషణము’ చేస్తూనే ఉండాలి. ఆత్మతత్త్వమునే ఉపాసిస్తూ జ్ఞానమును పొందాలి. ఈ లౌకిక-పారలౌకిక కర్మలను కూడా అది దృష్టిలో పెట్టుకొని, అందుకొరకే నిర్వర్తించాలి. మరింకెందు కొరకు కాదు.

మరి ఆత్మానుభవం పొందేదెట్లా? అభ్యాసమే అనుభవమును ప్రాప్తింప చేస్తుంది.

శాస్త్రములను ఆశ్రయించి సమాచారమంతా గ్రహించాలి. శాస్త్రానుకూలమైన ప్రయత్నములను ఆశ్రయించాలి. గురువులను సమీపించి చురుకైన బుద్ధితో వారి ఉపదేశములలోని అంతర్లీన సారాన్ని గ్రహించాలి. ఏది ఏమైనప్పటికీ, యత్నము చేసేవాడే ఆత్మవస్తువును పొందుచున్నాడు.

ఓ జనులారా! శాస్త్రార్థములను నిరసించుచు, మహాత్ముల ప్రవచనములను పెడచెవిని పెట్టుచు మూఢత్వముచే నిష్కారణంగా అష్టకష్టములను తెచ్చిపెట్టుకోకండి. మనుజుని “అజ్ఞానం - అవివేకం” బాధించునంతగా వ్యాధులుగాని, ఆపదలుగాని బాధించలేవు. అందుచేత మీరు యేయే అజ్ఞానములచే బాధింపబడుచున్నారో, పరిశీలనాత్మకమైన దృష్టితో గ్రహించండి.


Page number:130

కొంచెము సంస్కరించబడిన దృష్టి కలవారు ఈ శాస్త్రమును పఠిస్తే వారి అజ్ఞానం తప్పకుండా తొలగిపోతుంది. వారికి ఇది తప్పకుండా తోడ్పడగలదు. ఇక “పరమాత్మను పొందుటే మా జీవిత లక్ష్యము” అను నిర్ణయముగల మహనీయులైతే ఇది శ్రవణ మధురమై, ఆత్మ సుఖదాయకము కాగలదు. శ్రుతి-స్మృతులందు (వేదపురాణములందు) కొంత మర్మగర్భంగా చెప్పబడిన విషయమే ఈ ‘యోగవాసిష్ఠము’ నందు అనేక సుందరమైన దృష్టాంతములతో, కథనములతో - సుస్పష్టముగా, ముక్కుకు సూటిగా చెప్పబడింది. అందుచేత ముముక్షువులు దీనిని ఆమూలాగ్రం పఠించి, ఆ తరువాత, నా ఈ అభిప్రాయముయొక్క నిజానిజములు తమకుతామే నిర్ణయించుకొనెదరు గాక!

అసలు, ఈ జీవునకు తుచ్ఛమైన, కుకారణమైన, అనివార్యమైన ఆపదలన్నీ ఎక్కడి నుండి ప్రాప్తిస్తున్నాయి? మూర్ఖత్వమునుండే సుమా! మూర్ఖంగా మూఢునివలె జీవితం గడపడం కంటే, ఒక మూకుడు తీసుకొని అడుక్కుతింటూ ఉండటం ఉచితం. చీకటి నూతిలోనో, చెట్టు తొఱ్ఱలోనో ఒక ‘పురుగు’గా ఒంటరిగా జీవితం గడపటం మంచిది.

మోక్షోపాయమై ఉన్నట్టి ఈ గ్రంథము యొక్క సహాయంచే ’జ్ఞాన కాంతి’ని పొందువారు మోహాంధకారంచేత గ్రుడ్డివారు అవటం జరగదు. ‘తృష్ణ’ అనేది వివేకము ఉదయించనంత కాలమే ఉంటుంది. తృష్ణ ఉన్నంతకాలం వేదనలు తప్పవు.

ఓ జనులారా! లేవండి. ఈ శాస్త్రవిచారణను అనుసరిస్తూ రండి. సంసార బంధమును త్రెంచి వేయుటకు కృతనిశ్చయులు అవండి. మావంటి ఆప్తులు, హితులు, సద్గురువులు, శాస్త్రములు ప్రతిపాదిస్తున్నదేమిటో చక్కగా వినండి. గ్రహించండి. అనేక ప్రమాణముల సహాయంచేత, మనందరిలోని ఆత్మ స్వభావ స్వరూపములేమిటో మీ ముందు ఉంచబోవుచున్నాము. స్వస్వరూపమగు ఆత్మను గ్రహించి, అందు సుస్థిరులగువారు మా మహర్షులవలెనే జీవన్ముక్తులై వెలుగొందగలరు.

ఈ సంసారంలో దుఃఖములు ఒకదాని వెనుక మరొకటి వచ్చి పోతూనే ఉంటాయి. దీనికి అంతు ఉండదు. ఇక ఇందులో మిణుకు మిణుకుమంటూ కనిపించే ‘సుఖము’ లేశ మాత్రమే. అందుచేత రామా! నీవు అల్పునివలె దుఃఖములతో కూడిన ఈ సంసార సుఖములవైపు దృష్టి మరల్చకుండెదవు గాక! వివేకియగువాడు "క్లేశరహితము, అద్వితీయము, అనంతము, స్వస్వరూపమాత్రము” అయినట్టి మోక్షపదము పొందుటకే ప్రయత్నం చేస్తున్నాడు. మనస్సు నుండి కామము క్రోధము మొదలైన దోషములను తొలగించుకొంటున్నారు.

ఈ రాజ్యాది సుఖములతోను, అన్నపానాది భోగములతోను సంతుష్టి పొంది జీవించేవారు మా దృష్టిలో గ్రుడ్డి కప్పల వంటి వారే. ‘అజ్ఞాని’ మాత్రమే ఈ ఇంద్రియ విషయానుభవములు చాలా గొప్పవైనట్లు భావించి, వాటివెంట పరుగులు తీస్తున్నాడు. ఫలితంగా అనేక దుఃఖములచే, ఆపదలచే, మోహములచే అనుక్షణం పీడింప బడుచున్నాడు. అవన్నీ వాస్తవానికి ప్రబల వంచకమైనవని, మిత్రరూపంలో కనబడే శత్రువులేనని నీకు వేరుగా చెప్పవలసిన పని ఏమున్నది? వాటియందు ఆసక్తి కలిగియున్నట్టి జీవులు ‘మోహము’ అనే చీకట్లో చిక్కుకుంటున్నారు. ఆయా ఆసక్తుల ప్రతిఫలంగా అనేక భయములను, నరకములను, దుఃఖములను, కష్టములను పొందటం జరుగుతోంది.


Page number:131

ఈ సుఖదుఃఖాలు పరస్పర నాశకరములగు వెలుగుచీకట్ల వంటివి. పైగా, అవి క్షణభంగురములు కూడా. అవి అత్యంత శ్రేయోదాయకమైన మోక్షమును చేకూర్చగలవా? లేదు. ఈ సుఖము - దుఃఖము - మానము - అవమానము - ఆశించుట - అభిమానించుట - ప్రాపంచిక సంగతి / సందర్భములను ధ్యానించుట - అభియోగములు కలిగియుండుట - రోషము మొదలైన భావములచే బంధింపబడిన వారు విరక్తితో కూడిన వివేకమును పొందజాలరు. వాస్తవానికి ‘వివేకి’ అగువాడు మాత్రమే భోగ - మోక్షముల రెండింటిని అందుకొని, సర్వులకు వందనీయుడగుచున్నాడు.

ఓ జీవుడా! నీవు భయమును ఎందుకు పొందుతావు? "నేను స్వల్పుడను” అనునట్టి అల్పత్వమును, దీనత్వమును కట్టిపెట్టి పరమవివేకమును ఆశ్రయించు. నీ స్వస్వభావమేమిటో ఈ “యోగవాసిష్ఠం” అనే దర్పణమును ఉపయోగించి గ్రహించు. వైరాగ్యాభ్యాసం ఆచరించుటచే ఈ సంసారసాగరమును అతి సులభంగా దాటి వేయగలవు.

అయితే అప్రయత్నశీలుణ్ణి మాత్రం త్రిమూర్తులు కూడా కాపాడలేరు. ’వివేకి’ అయినవాడు అప్రయత్నవంతుడై ఈ సంసారమాయ యందు నిదురించడు. మోక్షం గురించి, శుద్ధమగు స్వస్వరూపము గురించి విచారించకుండా విషయానందములు మాత్రమే లక్ష్యముగా కలిగియుండి, రోజులు గడపటం ఎంతవరకు ఉచితం? ఈ సంసారములో చిక్కుకొని, తన విమోచనమునకై ప్రయత్నించనివాడు తగలబడుచున్న ఇంటిలోని ఒక గడ్డి పాన్పుపై మత్తుడై విశ్రాంతి పొందుచున్నవాడే అవుతాడు.

లోకమాన్యమైన పదము కేవలం జ్ఞానము వలన మాత్రమే లభిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ “బ్రహ్మము - అనునది ఎక్కడున్నది? ఉంటే మాకు కనబడాలి కదా?” అని అంటారేమో! బ్రహ్మము ఉండనీ, లేకుండనీ. విచారణ చేస్తే తప్పేమున్నది? ’విచారణ’ అనగానే ఎందుకు పిరికితనం, బద్దకం వహించి ఉండాలి? “ఇప్పుడు స్వస్వరూపము గురించి తెలిసినదానికన్నా విచారణచే అనేక విషయాలు గ్రహించుటచే స్వస్థత చేకూరగలదు” - అని జనులు భావించెదరుగాక. “అట్టి ప్రయత్నము జీవులను ఈ సంసారసాగరము నుండి దాటించివేయగలదు” అని సర్వజనులకు శుభమును కలుగచేయుటయే ఆశయముగాగల మేము మా అనుభవము యొక్క సారముగా ప్రకటించుచున్నాము.

ఓ సభికులారా! “మోక్షము” అని చెప్పబడుచున్న దృశ్య వ్యవహారమునకు అతీతమైనట్టి, మీయొక్క - నాయొక్క సర్వులయొక్క స్వస్వరూపమే అయినట్టి “స్వసత్తా సామాన్యము (Absolute Existence)” అను రూపముగల ఒకానొక స్థితి కలదు. ఈ వాక్యం మేము మా అనుభవమంతా రంగరించి చెప్పుచున్నాం.


Page number:132

మీరంతా అట్టి మోక్ష భాగులు కావాలి. ఈ విచారణమంతా ప్రకటించటంలో మాకు గల ఉద్దేశం అదే. సద్గురువును, సచ్ఛాస్త్రమును ఆశ్రయించుటచే, స్వవిచారణచే, సర్వాంతర్యామియగు ఈశ్వరుని (ఆత్మదేవుని అనుగ్రహంచే ఎవరైనా అట్టి స్థితిని పొందవచ్చు. అట్టి శుద్ధచైతన్య స్వస్వరూపము గురించి విచారించండి. అప్పుడే స్వస్థత పొందగలరు. ఈ ముల్లోకములలో అట్టి మోక్ష స్థితి కంటే నిరపాయమైనది, భ్రమ - శంకారహితమైనది మరొకటి ఉండదు. ఇంద్రియ సుఖములు, స్వర్గసుఖములు - ఇవన్నీ స్వసత్తసామాన్యమగు మోక్ష స్థితితో పోల్చిచూస్తే సూర్యుని ముందు ‘దివిటీ’ వంటివి మాత్రమే సుమా! మీ హృదయంలో “మేము మోక్షోపాయం తెలుసుకోవాలి” అనే ప్రవృత్తి కనుక కలిగిందా - ఇక మోక్షం పొందటానికి ఎటువంటి ఆటంకం ఉండదు. అందుచేత సత్యదృష్టితో ఇందలి విచారణను గ్రహించండి.

17.) మనోజయం

నాయనలారా! ధనముగాని, బంధుమిత్రులుగాని, తీర్థయాత్రలుగాని, పుణ్య క్షేత్రములలో నివసించుటగాని, ఈ కాళ్ళు చేతులతో నిర్వర్తించబడే కర్మల చేతగాని, ఈ శరీరమును శ్రమింపచేయునట్టి ఉపవాసాదులవలనగాని ‘మోక్షము’ అనునది లభించేది కాదు. మరెట్లా లభిస్తుంది? వినండి.

శ్రవణం = స్వస్వరూపమగు ఆత్మయొక్క స్వరూప - స్వభావముల గురించి శాస్త్రములు, గురువులు చెప్పే సమాచారం శ్రద్ధగా వినటం.

మననం = అందలి వస్తుసారాన్ని హృదయంలో మరల మరల విచారణచేస్తూ సుస్థిరం చేసుకోవటం.

నిధిధ్యాస = మనస్సు పరిపరివిధాల పోకుండా నిలువరించటం. ఆత్మయొక్క స్వభావములైనట్టి అఖండత్వము, నిత్యత్వము, సర్వత్వము, అప్రమేయత్వము అనుభవమునకు తెచ్చుకోవటం. అట్టి అధ్యాస (thought constancy) కలిగి ఉండటం.

ఆత్మ విషయమై ఈ విధములైన పురుషప్రయత్నముల చేతనే మనస్సు జయించబడుతుంది. మనస్సు బ్రహ్మరసము, సర్వసమత్వములచే నింపబడగా అప్పుడు “ఆ మనస్సు, దానికి భోక్తలగు మీరు” కూడా “శుద్ధసత్వము” అయి శేషించగలరు. సమరస భావనను పొందినట్టి మీరు ‘బ్రహ్మము’గానే ప్రకాశిస్తారు. అట్టి స్థితియే ప్రతి జీవునియొక్క వాస్తవమగు పరమలక్ష్యమైయున్నది. ఈ జీవుడు ఎరిగినా, ఎరుగకున్నా - అతని యొక్క సర్వ తాపత్రయములు అందుకొరకే. కాని, ఆ విషయం స్వకీయమగు (తనకు తానే నిర్మించుకొనిన) మాయావరణ కారణంచేత మరచుచున్నాడు. లేక అశ్రద్ధ చేయుచు, “ఈ వస్తుజాల సముపార్జనయే నా ఏకైక లక్ష్యం" అని భావించుచున్నాడు. అందుచేతనే అవి పొందినా, లేక పొందకున్నా ఆతడు పూర్ణత్వము యొక్క అనుభవమును ఏమాత్రం పొందుట లేదు.


Page number:133

వాస్తవానికి, అతనికి అనుభవమగుచున్న అసంతృప్తి ‘ఆత్మస్థితి’ యొక్క సమాచారం సముపార్జించుకోకపోవుట చేతనే కలుగుచున్నది.

సర్వ అసంతృప్తులను తొలగించగల బ్రహ్మపదము (కేవలీ స్థితి, లేక సమాధాన స్థితి) విచారణము (Enquiry) చేతనే సునిశ్చితం కాగలదు. అందుకుగాను, ఈ దేహేంద్రియములను అధిగమించినట్టి ఉత్తమ వివేకము ఆవశ్యకమైయున్నది. ఉత్తమమైన దానికోసం స్వల్పమైనది త్యజించటం లోకవిదితమే కదా! “బ్రహ్మపదము” అనబడు ప్రశాంత స్థితిని కోరుకొనునట్టివారు, దుఃఖజాలమే అయినట్టి (లేక దుఃఖ జాలముగా పరిణమించబోవునట్టి) విషయ వ్యవహారములను పరిత్యజిస్తున్నారు. దృశ్య వ్యవహారమును అధిగమించుటకొరకై తీవ్రప్రయత్నశీలురగుచున్నారు. సమము, సుఖకరము అయినట్టి ఆసనముపై కూర్చుని స్వయంగా సర్వదృశ్య వ్యవహారములను సూక్ష్మబుద్ధితో విచారించుచున్నారు. అట్టి విచారణచే శోకరహితమగు ఆత్మ పదమును పొందినవారై జన్మరహితులగుచున్నారు. అట్టివారి స్వకీయ విచారణ ఎట్టిదో మనం ముందు ముందు పరిశీలించబోతున్నాం. ఓ రాఘవా! మన ఈ సభలోని అనేకులు, అట్లే ఈ భూమిపైగల, అనేకమంది సాధువులు ఆ పరమ పదము గురించి తెలుసుకొనే ఉన్నారు. అయ్యది సమస్త సుఖముల పరమావధి, ఎనలేనిది, నాశనరహితమైనది, అమృత తుల్యమని వారందరికీ తెలుసు. అనేకమంది జ్ఞానుల అభిప్రాయం క్రోడీకరించి, వాటిని కూడా ముందు - ముందు అక్కడక్కడ ప్రకటించబోవుచున్నాను.

నాయనా! రామా! ఈ ప్రపంచంలో కొన్ని మధురమైన పదార్థములు ఉన్నమాట నిజమే. అయితే అవన్నీ ఒకనాటికి నశించబోయేవే కదా! అయినా, ఎండమావులలో నీరు ఎక్కడుంటుంది చెప్పు? ఈ స్వర్గ, మర్త్య, పాతాళ లోకములలో వాస్తవము, శాశ్వతము అయినట్టి సుఖమును ప్రసాదించగల పదార్థమంటూ ఎక్కడా ఏదీ లేదు. అందుచేత శాంతి - సంతోషముల ద్వారా మనోజయం సాధించుటయే ఉచితము, ఉత్తమము కూడా. అట్టి మనోజయము నుండి మాత్రమే ఏకరస స్వరూపమగు ఆనందము లభించుచున్నది. అందుకు వివేకం వికసించాలి. అట్టి వివేకముచే మనశ్శాంతి రూపమైనట్టి “ఆత్మపదం” అనే పరమ సుఖం లభిస్తోంది.

అట్టి ఆత్మజ్ఞానము కొరకు దేవ, దానవ, మనుష్యాది జీవులలో ఎవ్వరైనా సరే, తగియే ఉన్నారు. అది ప్రతి ఒక్కరి స్వస్వరూపమే కనుక “దీనికి ఈ ఈ దేశకాల జాతులకు సంబంధించినవారే తగినవారు” అనునది ఉచితము కాదు. ‘ఈ విచారణ వీరికి మాత్రమే పరిమితం’ అనునది మా ఉద్దేశమే కాదు. [NOTE: “నామ సంకీర్తనే ధ్యానే సర్వయేవాధికారిణః" నామ సంకీర్తనమునకు, ధ్యానమునకు సర్వులు తగినవారే.]

దీనిని పఠించుట ఆత్మవస్తువును ధ్యానించుటయే అవుతుంది. పైగా, ఇట్టి ఆత్మవిచారణ చేయటానికి, (ఆత్మ గురించి సమాచారం గ్రహించటానికి ఏమాత్రం శరీర పరిశ్రమ అవసరం లేదు. అట్టి ముక్తి - సుఖము పొందినవాని అంతరంగము ప్రశాంతంగా, నిర్మలంగా, భ్రమరహితంగా, శ్రమశూన్యంగా, వాంఛాశూన్యంగా ఉండగలదు.


Page number:134

అందుచేత అట్టి ఆత్మ విషయమై ఎరుకగలవాడు “ప్రపంచంలో ఏదో నేను పొందలేక పోయానే?” అనే రుగ్మత కలిగియుండడు. “ఇది ఎట్లైనా తొలగాలి. అప్పుడుగాని మరికొందరివలె నేను సంతుష్టుడను కాలేను” అనునట్టి ఆవేశపూరితమైన అభినివేశము కలిగి ఉండడు. దేనిపట్లా కూడా పట్టుదల గాని, ద్వేష-మోహములు గాని కలిగి ఉండడు. ఈ దృశ్య పదార్థముల వాస్తవ - అవాస్తవములేమిటో అతనికి తెలిసిపోతుంది.

అతడు ప్రవాహపతితములైన కర్మలు ఆచరించినప్పటికీ, “దీనికంతటికీ కర్తను నేను” అను ఉద్వేగం పొందడు. అకర్తాభావమునే సర్వదా, ఆశ్రయించి ఉంటాడు. కనుక, ఆయా కర్మల ఫలితములు అతనికీ అంటవు.

[అకర్త = “నా2హం కర్తా! నైవకించిత్ కరోమి! బంధమోక్షః కుతో మే? - నేను దేనికీ కర్తను కాదు. (ఏదీ నేనైయున్నానో అది) ఏమియు చేయునది కాదు. ఇక నాకు బంధ మెక్కడిది? మోక్షమెక్కడిది?”]

ఓ రామచంద్రా! ఆకాశంలో ఆ సూర్యభగవానుని చూడు. ఆయన దేనినైనా పొందటం గాని, త్యజించటం గాని చేస్తున్నాడా? “ఇది కావాలి? వీరికే సహకరించాలి? ఇది ఇట్లే ఉండాలి" అను భావావేశం లేకుండానే సృష్టిలోని సర్వ పదార్థములకు కారకుడగుచున్నాడు కదా! ఆత్మజ్ఞాని కూడా ఏదీ పొందడు, త్యజించడు. నిర్లిప్తుడై, ఉంటున్నా కూడా, కార్యసమర్థుడై స్వీయ కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాడు.

ఇక ఇప్పుడు మనం “మోక్షము” అనే రాజు యొక్క ద్వారపాలకులగు శమ, విచారణ, సంతోష, సత్సంగమముల గురించి విచారిద్దామా?

18.) శమము (తృష్ణారాహిత్యము - శాంతము) (Inner calmness)

ఇంద్రియనిగ్రహ రూపమగు ప్రశాంత స్థితియే ‘శమము’. “మనస్సు ఆసక్తులను, ప్రాప్తాప్రాప్తములను త్యజించి సర్వదా ప్రశాంతముగా, తృష్ణారహితంగా ఉండుట” అను దానినే ‘శమము’ అని అంటున్నాం. శాంతి, ఆనందములతో సర్వవేళల ఉండి ఉండుటయే ‘శమము’.

“నేను సుఖమును పొందెదనుగాక” అనునదే ‘సుఖాశ’ కదా. అట్టి ’సుఖదాహమ అనే దోషము చేత ఈ సంసార పంజరం నిర్మించబడింది. ఈ విస్తారమైన సంసారపు ఎడారిలో ‘శమము’ అనునది ‘సరస్సు’ (Oasis) వంటిది. సూర్యుడు అస్తమించగా, పూర్ణచంద్రుడు ఉదయించుటచే ఆ చంద్రుని కిరణములు ఇసుక తిన్నెలను ప్రశాంత పరుస్తాయి. అట్లే శమము ఉన్నచోట ప్రశాంతత ఉంటుంది.


Page number:135

’శమము’ వలన శ్రేయస్సు లభిస్తోంది. అది ముక్తిప్రదాత, శుభకరము, భ్రాంతి నివారకము కూడా. ఎవడైతే శమాలంకృతుడై, తృప్తుడై, శాంతుడై, నిర్మలుడై ఉంటాడో, అట్టివానికి శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఆతడు విష్ణువువలె శోభిల్లుతాడు. ఎవరి ముఖంలో శమము సర్వదా శోభిల్లుతుందో, అట్టివారి ముందు పూర్ణచంద్రుడు ఎందుకు పనికివస్తాడు? దానివలన కలిగే ఆనందం ముల్లోకములలోని సంపదలు లభిస్తే మాత్రం ప్రాప్తిస్తుందా?

సూర్యుడు ఉదయిస్తే ఏ విధంగా అయితే చీకటి ఉండటం జరుగదో, అదే విధంగా శాంతచిత్తుని మనస్సులో కూడా దుఃఖములకు, తృష్ణలకు, దుర్భరమైన మనోవ్యాధులకు చోటు ఉండదు. శాంతచిత్తుని యందు లభించే మనోవికాస స్థితికి, ఈ విషయానందములకు, హస్తి - మశకాంతరమైన (ఏనుగుకు-దోమకు ఉండునట్టి) భేదముంటుంది.

శమయుతుడై, సర్వజీవుల పట్ల స్నేహబుద్ధి గల సజ్జనునియందు పరతత్త్వము తనంతటతానే స్ఫురిస్తోంది. శమసమన్వితుని మహా కఠినమైన హృదయము కలవారు కూడా తమ తల్లిని సేవించునట్లు సేవిస్తారు. విశ్వసిస్తారు. ఓ రామచంద్రా! ఇంద్రపదవి వలనగాని, విష్ణుపదవి వలనగాని,“శమము”నందు లభించునంతటి సుఖము లభించదని ఘంటాపథముగా ప్రకటిస్తున్నాను.

ఈ జీవుడు ‘తృష్ణ’ అనే పాశంచేత బంధింపబడి, అనేక శారీరక, మానసిక రుగ్మతలతో కలత చెందుచున్నాడు. అయితే ఈ మనస్సు ‘శాంతి’ అనే అమృతం సేవించటం జరిగితే తృష్ణాపాశాలన్నీ తమంతట తామే విడిపోతాయి. సర్వవేళలందు శాంతిని సేవించుటే ‘శమము’ అయున్నది. వత్సా! శమము వలన శీతలత్వం పొందిన బుద్ధితో ఏది ఆచరిస్తామో, ఏది గ్రహిస్తామో అది మాత్రమే మధురంగా ఉంటుంది. శాంతితో కూడుకొని ప్రాప్తించిన “ఆనందం” యొక్క అంశలో ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏవైనా సంఘటనల కారణంగా విచ్ఛిత్తి (Breaking) పొందినప్పటికీ, కొద్ది సమయంలో అతని మనోబుద్ధులు తిరిగి శాంతిని సంతరించుకోగలవు. ఇంద్రియానందము అట్టిది కాదు.

శమముతో కూడుకొనిన వ్యక్తిని పిశాచములుగాని, రాక్షసులుగాని, విరోధులుగాని, పాములుగాని బాధించలేవు. ద్వేషించలేవు. బాణము ఒక వజ్రమును ఛేదించ గలుగుతుందా? శాంతిసుధ అనే కవచాన్ని ధరించినవానిని ఈ సాంసారిక దుఃఖములు ఏమీ చేయలేవు. ఒకడు సమము, స్వచ్ఛము, ఉపశమనము పొందినట్టి బుద్ధితో కూడుకొని ఉన్నప్పుడు శోభించునట్లు ఒక మహారాజు అంతఃపురంలో కూడా శోభించలేడు. నాయనా! నేను ప్రాణసమానుడైన ఒక స్నేహితుని చూచినప్పటికంటే కూడా శాంతి - ఆనందముతో కూడిన శమయుతుణ్ణి చూచినపుడు ఎక్కువ ఆనందం పొందుతాను.

ఎవడైతే శమయుతుడై సాధుభావయుతుడై, లోకశుభదాయకమగు ప్రవర్తన కలిగియుంటాడో, అతని జీవితమే ధన్యము. ఇక ఇతరుల జీవితములలో ‘వ్యర్థము’ అయ్యే పాలే ఎక్కువ. శమయుతుడే అభినందనీయుడు. నిగర్వి, శాంతియుతుడు అగువాడు నిర్వర్తించు కర్మలు శ్లాఘనీయమౌతాయి. శమయుతుడు ఎట్లా ఉంటాడు?


Page number:136

“ఏ వ్యక్తి అయితే శుభాశుభ వ్యవహారములు చూడటం జరిగినా, వినటం జరిగినా, స్మరించవలసివచ్చినా, అతడు హర్షముగాని, విషాదము గాని పొందడో, అతడే శమయుతుడు.” అట్టి శాంతుడు భూత-భవిష్యత్తు సుఖములేవీ కోరడు. ప్రాప్తించిన విషయములను త్యజించడు. యత్నపూర్వకంగా ఇంద్రియములను మాత్రం జయించి వేసి ఉంటాడు. సర్వభూతములపట్ల ’సమము’ అయినట్టి దర్శనము కలిగి ఉంటాడు. అట్లు ఉండుటయే శమము యొక్క పరాకాష్ఠ. అతడు ఇతరుల కుటిలములైన దుర్గుణములను చూస్తూ కూడా బాహ్య అంతరంగములందు “వ్యర్థ ఆవేశము – ఆవేదన” వంటివి పొందడు. తాను అంతరంగమున శుద్ధుడై ఉంటూ, ఎప్పటికి ఏది సముచితమో అట్లే తదనుకూలంగా మాత్రం ప్రవర్తనను ప్రకటిస్తూ ఉంటాడు. మరొకరి మెప్పు కొరకు కాకుండా కేవలం “మోక్షము” లేక “స్వగుణ దోషనివృత్తి" కొరకు మాత్రమే యథాప్రాప్తములైన ఆయా కర్మలను శాస్త్రోచితంగా ఆచరిస్తూ ఉంటాడు.

స్థితో2పి నస్థితయివ, నహృష్యతి నకుష్యతి
యః సుషుప్తసమః స్వస్థః స ‘శాంత’ ఇతి కథ్యతే ॥ (XIII.75)

ఈ ప్రపంచ వ్యవహారములందు అతడు కూడా ఇతరులవలెనే స్థితి పొంది ఉండవచ్చును. కాని అకర్తృత్వ భావనచే దేనియందు కూడా ‘స్థితుడు’ కాకుండానే ఉంటాడు. అతనికి హర్షముగాని, క్రోధముగాని ఉండదు. సుషుప్తితో సమానమైన స్వస్థతను, శాంతమును అన్నివేళల అన్ని పరిస్థితులందు కలిగి ఉంటాడు. ఎవని మనస్సైతే మరణ సమయమునందు, ఉత్సవ సమయమునందు కూడా ఏ మాత్రం భయ, క్రోధ, భావావేశములు పొందకుండా ఉంటుందో, పూర్ణచంద్రబింబమువలె తన పూర్ణత్వము త్యజించకుండా ఉంటుందో అట్టి మనస్సు కలవాడు శాంతుడు, శమయుతుడు కూడా.

శమము అభ్యసించువాడు అమోఘమైన ప్రభావం కలిగి ఉంటాడు. ఆతని దృష్టి సకల జీవులపట్ల అమృత ప్రవాహంవలె మధురంగా సర్వ సమానత్వంతో ప్రసరితమౌతూ ఉంటుంది. అతడు సర్వదా, సర్వవేళల శీతలాంతఃకరణుడై ఉంటాడు. ఒకవేళ విషయానుభవమునందు ప్రవర్తించవలసి వచ్చినప్పటికీ వాటిపట్ల మూఢము, మూర్ఖశయము కలిగి ఉండడు. అసంగుడై ఈ ఈ దృశ్య సంసార వ్యవహారమంతటినీ ’దూరగ్రామంలో జరిగే ఒక జాతర’లాగా చూస్తూ ఉంటాడు. చిరకాలంగా ఉండే ఆపదలు అతనిని కృంగదీయలేవు. క్షోభింపజేయలేవు.

ఓ రామా! “తపస్సు చేయువాడు - అనేక విషయములు తెలిసినవాడు - యజ్ఞములు చేసినవాడు - రాజు - బలవంతుడు - గొప్ప విశేషములతో కూడుకొనిన గుణవంతుడు” …. వీరందరిలో శాంతుడే మా ఉద్దేశంలో సర్వదా శోభించుచున్నాడు. అతడు పరమానందంతో ఈ భూమిపై సంచరిస్తూ ఉంటే, భూమాత ఆనందపరవశురాలు అవుతుంది. శమము, తృష్ణారహితము అయినట్టి అతని అంతరంగము నుండి అప్రయత్నంగానే ‘ప్రశాంతత - పరమానందము’ అనే కిరణపుంజములు వెలువడుతూ ఉంటాయి.


Page number:137

సంకట సమయములందు, భయ స్థానములందు శాంతియే గొప్ప బల ప్రదర్శనంగా చెప్పబడుతోంది. అట్టి ‘శాంతి సౌజన్యము’ అను బలపరాక్రమములు కలవాడు ఎక్కడుంటే అక్కడ ఆ పరిసరాలు పవిత్రమౌతాయి.

ఓ రఘునందనా! నీవు ‘శమము’ అనే ఆభరణం చేకూర్చుకో. అద్దానిని నీనుండి మరెవరు హరించలేనంతగా ప్రవృద్ధం చేసుకో! మహాత్ములైనవారు ఈ శమమును తమయందు గుప్తముగా పదిలపరచుకొని, ఇక ఆపై బాహ్యమునకు మాత్రం ఆయా స్థితిగతులను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. దీనిని అవలంబించినవారు "మోక్షము” లేక “పరమపదము”ను పొందినట్లే. నీవు కూడా శమ, శాంతియుతుడవై సర్వదా ప్రశాంత గంభీరత్వములను అవలంబిస్తూ లోకమాన్యుడవయ్యెదవు గాక!

19.) విచారణ (Enquiry)

ఈ కార్య - కారణ వ్యవహారమంతా గమనించుచున్న మానవుడు శాస్త్ర జ్ఞానమును ఆశ్రయించాలి. నిర్మలము, పవిత్రము అయినట్టి బుద్ధితో నిరంతరం ఆత్మ విచారణ చేస్తూ ఉండాలి. అట్టి విచారణచే బుద్ధి సునిశితమై పరమ పదమును గాంచగలదు. “దీర్ఘ సంసారము” అనే ఒకానొక దోషము ఈ జీవుని పట్టి పీడిస్తోంది. అందుకు దివ్యమైన ఔషధం విచారణయే సుమా!

ఈ ఆపదలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? రాగద్వేషాది ప్రవృత్తుల నుండే కదా! ‘విచారణ’ అనే చురకత్తితో ఈ నిరంతరం ప్రాప్తిస్తున్న రాగద్వేషములను ఛిన్నాభిన్నం చేయాలి. అసమృద్ధి, బంధువుల మృతి, శారీరక బాధలు మొదలైన కష్ట సమయములలోను, అట్లే సుఖసమయములలోను, ఎక్కడినుండో మోహము వచ్చిపడి ప్రాజ్ఞుడైనవాడి వివేకమును కూడా కప్పివేస్తోంది. మరి అట్టి సంసార స్థితులందు ఉపాయమేమిటి? విచారణయే.

సత్యాసత్య విమర్శ చేయగలుగుచున్న పండితులకు కూడా విచారణయే సాధనమగుచున్నది. విచారణబలం చేతనే సత్పురుషుల బుద్ధి అశుభమును పరిత్యజించి, శుభమును ఆశ్రయించటం జరుగుతోంది. మహనీయులందరు తమ విచారణశక్తి చేతనే - బుద్ధి, బలము, తేజము, సమయోచితమైన స్ఫురణ, ఉత్తమ ప్రయత్నము - మొదలైనవాటిని ఆశ్రయించటం, వాటి సత్ఫలితములను పొందటం జరుగుతోంది.

నాయనా! రామా! “విచారణ” అనేది, “ఇది ఉచితము. ఇది అనుచితము” అనుదానిని ప్రకాశింపజేసే దీపము వంటిది. అభీష్ట సాధనమైనట్టి విచారణను ఆశ్రయించే మహనీయులంతా సంసార సముద్రమును దాటివేయ గలుగుచున్నారు. వివేకమును కప్పివేస్తున్నట్టి మహామోహమంతటినీ, ఒక్క ‘విచారణ’ మాత్రమే పటాపంచలు చేయగలదు.


Page number:138

మూఢులగువారు విచారణ లేకుండుటచేతనే కాలమునకు వశులై అనేక జన్మపరంపరలు పొందుచున్నారు. వారు ఎక్కడో కాకతాళీయంగా విచారణచే ఈ సంసార వ్యవహారమంతా గమనించినవారై “అయ్యో! అసంగతము, అసత్యము, దోషపూరితము అయిన ఏదో భ్రమసమూహంలో చిక్కుకున్నట్లున్నామే? ఇదంతా ఎక్కడి నుండి దాపరించింది? అసలు ఇదంతా ఏమిటి? నేనెవడను?” అను సదసద్విమర్శ (ఏది సత్యము, ఏది అసత్యము? అను మీమాంస)కు వస్తున్నారు. అప్పుడు ఈ సంసారమును దాటుటకు ఉపాయములను వెతకి, పొంది, ఆచరించి ముక్తి నొందుచున్నారు. అట్లు ముక్తినొందగోరు వారికి ఈ శాస్త్రములో చర్చించబడిన విషయము ఎంతగానో సహకరించగలదని అందరికీ మనవి చేస్తున్నాము.

‘ముక్తి’ అనునది, “ఇందు ఏది సత్యము? ఏది అసత్యము? ఏది స్వప్నతుల్యము? ఏది వాస్తవము?” అని విచారించుట చేతనే సాధ్యపడుచున్నది. లౌకికమగు రాజ్యము, సంపదలు, భోగములు, పారలౌకికమైనట్టి మోక్షము - అన్నీ విచారణ - ప్రయత్నము (Enquiry & effort) అను రెండిటిచేతనే సిద్ధిస్తున్నాయి. విచారణ, వివేకములతో కూడిన బుద్ధి ఆపదలందు కూడా కృంగదు. ఎండిన సొరకాయ నీటిలో మునుగుతుందా? పరిశీలన, విచారణ అవలంబించువారు ఈ సంసార పటాటోపంచే మోసగించబడక, శ్రేష్ఠమైన ప్రయోజనమును లక్ష్యముగా కలిగి ఉంటున్నారు.

ఓ జనులారా! దుఃఖమే అంతిమ ప్రయోజనంగా గల అనేక లౌకిక వ్యవహారములు మూర్ఖుల హృదయంలో తిష్ఠ వేసుకొని ఉంటున్నాయి. బహుచిత్రంగా ముముక్షుత్వమును కప్పివేస్తున్నాయి. నాయనలారా! ఈ జీవుడు ’మోహము’లో నిద్రిస్తున్నాడు. అట్టి మోహము అనేక దుర్భర దుఃఖములకు కారణమగుచున్నదని హెచ్చరిస్తున్నాను. అయితే “మోహనిద్ర” అనే పదము, “విచారణారాహిత్యము” అనుదానికి పర్యాయపదమే సుమా! అది కల్లువలె జీవునకు మత్తు గొలుపుతోంది. ఎన్నడైనా తేజః స్వరూపుడగు సూర్యుడు ’చీకటి’లో మునుగుతాడా? లేదుకదా! విచారణతత్పరుడైనవాడు, “విషయములు” అనే బురదతో నిండియున్న దీర్ఘ మోహమునందు నిమగ్నుడు కాడు. మరల మరల గుర్తు చేస్తున్నాను, ‘జీవితము’ అనుదానిలో అవిచారణ చేతనే మోహము అనునది తాండవించటం జరుగుతోంది.

విచారణచే వికసించిన మనస్సే శోభించుచున్నది. అయ్యో! మూఢబుద్ధులగు అనేకులు ‘విచారణ’ లేకుండానే జీవితం గడిపివేస్తున్నారే? ఎదురుగా ఏమాత్రం లేనట్టి దయ్యమును బాలుడు గాంచుచున్నట్లు, విచారణహీనుడు స్వల్ప విషయముల చేతకూడా హింసించబడుచున్నాడు. అతడు ఆపదలను, దుఃఖములను తాను పొందుచు, ఇతరులకు పంచిపెట్టుచున్నాడు. మూర్ఖుడై ‘ఆత్మవిచారణ’కు సంబంధించిన సమాచారమే దరిచేరనీయుటలేదు. “ఇదంతా మాకేమి ఉపకరిస్తుంది? ఎవరో ఏదో చెప్పితే మేము బాగుపడతామా? ఎవ్వరు మాకు చెప్పలేరు. మా గతి ఇంతే” అని ఆత్మ విషయకమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తూ, మొండితనము వహిస్తున్నాడు. “ఏది ఎట్లో అది అట్లే అగుగాక! మేమిట్లే ఉంటాము. దుఃఖములా? రానిండు. ఎవరము ఏమి చేస్తాం?” అని చెప్పుకుంటూ విచారణ చేయుటకుగాని, వినుటకుగాని సిద్ధపడనివారికి ఎవరం ఏమి చెపుతాం? అట్టివారిని దూరంగా త్యజించుటయే మంచిది.


Page number:139

‘దయ్యము’ అనబడుదాని అనుభవం చీకట్లో మాత్రమే ప్రాప్తిస్తుంది కదా! ఈ ప్రపంచంలో విచారణ లేకపోవుట చేతనే ఇతరులను హింసించటం, మానసిక వ్యాధులు మొదలైనవి సంభవిస్తున్నాయి. మా ఉద్దేశంలో వివేకహీనుడు నిర్జన ప్రదేశంలోని చెట్టులాగా నిష్ప్రయోజకుడే. ఏ మనస్సు వాంఛాశూన్యమై, విచారయుతమై ఉంటుందో, అయ్యది పరమానందమే పొందగలుగుతుంది. అట్టి ఉత్తమమైన మనస్సు విచారణ లేనివారికి లభించుట లేదు. విచారణ కలవానిబుద్ధి మాత్రమే పరమార్థ బోధకు తగి ఉంటుంది. “వివేకము” అనునది విచారణయొక్క ఫలితమేకదా! విచారణ సామర్థ్యము కలవారు తాము ఉన్నచోట సర్వ భవభయములను తొలగించుచు, దశదిశల శోభించు చున్నారు. ఒక్క ‘విచారణ’ అనునది మాత్రమే ఈ సంసార భయమును తొలగించ గలదు. అదే ఈ కనబడే దృశ్యమును అభూతమయంగా చేసి చూపగలదు.

ఈ జగత్తులో ఉండే పదార్థములన్నీ విచారించి చూడనంతవరకే మనోహరంగా కనిపిస్తాయి. విచారించి చూస్తేనో, ఇదంతా మట్టి రాయిలాగానే అసారమని తెలిసి పోతోంది. ఓ రామా! ఈ సంసారము అనబడే మనోభూతమును గమనించావా? ఇది మనుజుని మనోమోహంచేత మాత్రమే కల్పించబడింది. అనేక దుఃఖములను కల్పిస్తున్నట్టి ఇది, ‘విచారణ’ చేతనే లయించి పోతుంది.

‘కైవల్యము’ - అనునది సర్వవైషమ్యశూన్యము, సుఖప్రదము, బాధారహితము, అఖండితము అయున్నది. అదియే అనుభవపూర్వకంగా మేము చెప్పునది. అట్టి కైవల్యము సద్విచారణ చేతనే ప్రాప్తిస్తోంది. విచారణచే “నేను ఇట్టి మోక్ష స్వరూపుడనే” అను ఎరుక ఉదయించగా, అప్పుడు ‘నిష్కామత్వం’ (ఒకానొకటి పొందవలెననెడి భావావేశం లేకుండుట) దానంతట అదే ప్రాప్తిస్తోంది. అప్పుడు ఈ జీవుడే స్వయముగా ఉదారుడు, నిశ్చలుడు, ఆనందరస స్వరూపుడు అగుచున్నాడు. శ్రేష్ఠత్వమును ప్రసాదించగల ‘విచారణ’ అనే ఉత్తమ ఔషధం సేవించినవాని చిత్తము, ఇక దేనిని కోరుకొనదు. దేనిని త్యజించదు. స్వీకరించబడని చోట త్యజించటం ఏమి ఉంటుంది? అతడు క్రమంగా గ్రాహ్య-త్యాజ్యములను అధిగమించిన ప్రశాంత స్థితిని నిశ్చలం చేసుకుంటున్నాడు.

చిత్తము బ్రహ్మభావమును ఆశ్రయిస్తే, ఇక వాసనలన్నీ తమంతట తామే నశిస్తాయి. అప్పుడాచిత్తము ‘ఆకాశము’వలె ఉదయాస్తమయములు లేకయే ఉంటుంది. అట్టి వ్యక్తి ఈ విశాల జగత్తును కేవలం సాక్షివలె చూస్తూ ఉంటాడు. ఇక అతడు ఎప్పుడూ లోపలగాని, వెలుపలగాని నివసించడు. ఏ విధమైన దుఃఖమును పొందడు. “ఈ ఈ కర్మలు నేనే చేస్తున్నాను” అను కర్తృత్వముండదు. కనుక కర్మలను ఆచరించనివాడే అవుతాడు. ”ఈ ఈ కర్మలు ఇంకా ఎంతకాలం చెయ్యాలి?” అనునట్టి ఆరాటము కూడా పొందడు. ప్రవాహ పతితంగా ఆయా కర్మలు ఇంద్రియములచే చేయవలసి వస్తున్నప్పుడు ఏవి శుభప్రదమో, శాస్త్రవిహితమో, లోకమునకు అనుకూలమో, - అట్లే ఆ కర్మలనే నిర్వర్తిస్తాడు. తదనుకూలంగానే వ్యవహరిస్తాడు. కోల్పోయేదానికి చింతించడు.


Page number:140

లభిస్తున్న దానికి స్వాభిమానుడు కాడు. దుఃఖించడు. సంతసించడు. సముద్రమును చూచావుకదా! నదులనుండి అనుక్షణం జలం వచ్చి చేరుచున్నప్పుడు, మరియు సూర్య కిరణములు తనలోని జలం త్రాగివేస్తున్నప్పుడు అది తొణుకు బెణుకు లేకుండానే నిర్లిప్తంగా, ప్రశాంతంగా ఉంటుంది కదా!

ఓ రాఘవేంద్రా! చక్కగా విచారణ చేసియున్నట్టి జీవన్ముక్తులగు మహాశయులు, యోగులు అయినవారు తమయొక్క నిండైన మనస్సుతో ఈ జగత్తునందు సంచరించు చున్నారు. ఆ విధంగా వారు చిరకాలం వసించి, అటు తరువాత ఈ ఉపాధి వ్యవహారములను కూడా త్యజించి ఒకానొకప్పుడు అపరిచ్ఛిన్నమగు విదేహముక్తిని స్వభావానుకూలంగా పొందుచున్నారు.

‘విచారణ’ అనునది అత్యంత ముఖ్యమైనదని నేను చేతులెత్తి ప్రకటిస్తున్నాను. దృష్టాంతంగా ఒక చక్రవర్తిని తీసుకో. అతనికి కష్టకాలంలో ఏదైనా సందేహం వస్తే ఏం చేస్తాడు? “ఇది సత్ఫలమైనదా? లేక, నిష్ఫలమైనదా?” అని తన మంత్రులతో కూడి యోచిస్తాడు. చీకట్లో దీపమే ఉపకరణమగుచున్నది కదా! ‘విచారణ’ వలననే మానవుడు ఇటు కర్మకాండలోని, అటు జ్ఞానకాండలోని ధర్మ సూక్ష్మమును గ్రహిస్తున్నాడు. “ఇది ధర్మం. ఇది అధర్మం. ఇది ఉచితం. ఇది అనుచితం" అని లౌకిక విషయాలను నిర్ణయించుకుంటున్నాడు. ఇదంతా మనం చూస్తున్నదే కదా! అదే విధంగా విచారణ చేతనే బ్రహ్మతత్త్వము కూడా గాంచగలరు.

‘విచారణ దృష్టి’ అనునది ఈ భౌతిక దృష్టి వంటిది కాదు సుమా! అందుచేత అది చీకటిచే వినష్టం కావటంగాని, లేక అమిత తేజస్సును చూచి చెదిరిపోవటం గాని జరుగదు. అట్టి విచారణదృష్టికి ఎంతో దూరంగా ఉన్నవి, భూత భవిష్యత్ వర్తమానములలో ప్రాప్తించేవి కూడా కనబడతాయి. మా దృష్టిలో వివేకరహితుడే నిజమైన గ్రుడ్డివాడు. అతని స్థితి అతి శోచనీయం. వివేకము కలవాడే చివరికి అన్నిటిలోను, అందరిలోను ఉత్తముడగుచు, జయిస్తున్నాడు. ఈ ‘ఆపదలు’ అను వాటిని ప్రక్కకునెట్టి ‘ముక్తుడు’ అగుచున్నాడు.

ఓ రామా! వివేకము అనబడే మహత్తరమైన సుందరవస్తువు వలననే పరమాత్మ సులభ్యుడగుచున్నాడు. అందుచేత వివేకమును ఒక్క క్షణమైనా విడిచి ఉండరాదు. జ్ఞానులు వివేకవంతుని మాత్రమే కనికరించి ఆత్మవస్తువును బోధించుచున్నారు.

వివేకమును ఆశ్రయించినవారు మాటిమాటికీ గుంటలలో పడరు. విచారణ లేకపోవటమనేది ఆత్మఘాతుకం, ఆత్మద్రోహం కూడా. అట్టి మూర్ఖుడు జన్మ జన్మాంతరాలుగా అనుభవించే బాధల ముందు విష శస్త్ర ఘాతాలు కూడా ఎందుకూ పనికిరావు. విచారణహీనుడు మనుజుడై పుట్టి లాభమేమున్నది చెప్పు? అంతకంటే బురదలో కప్పగానో, మలములో కీటకముగానో, అంధకారంలో పాముగానో పుట్టడం మంచిది. (కనీసం, ‘మానవజన్మ’ అనే మహత్తర అవకాశం లభించి వృధా అయినట్లన్నా అవదు). పరిశీలనారాహిత్యమే సకల అనర్థముల నివాస భూమి.


Page number:141

అందుచేతనే సాధు పురుషులు విచారణ రహితులగు జనులను తిరస్కార భావంతో చూస్తారు. ఈ జీవుడికి ఎక్కడెక్కడినుండో అనేక దుఃఖములు, అనర్థములు వచ్చిపడుతున్నాయంటే దానికి మూలకారణం అవిచారణ, దూరదృష్టి మాంద్యములేనని గుర్తు చేస్తున్నాను. ‘రాగ ద్వేషములు’ అనే అంధకార కూపంలో (చీకటి నుయ్యిలో) చిక్కుకొన్నజీవుడు నిరంతరం విచారణను ఆశ్రయించి ఉంటేనే, ఎప్పటికైనా, ఆ నుయ్యిలోంచి బయటపడగలడు.

“నేను ఎవడను? ఈ సంసారదోషమంతా నాకు ఎక్కడి నుండి వచ్చిపడింది?” అన ప్రశ్నలకు జీవుడు మొట్టమొదట రావాలి. వాటి సమాధానము కొరకు సాధు పురుషులను, ఆత్మవిషయ ప్రతిపాదకములగు శాస్త్రములను, స్వబుద్ధిని ఆశ్రయించాలి. సునిశితమైన బుద్ధిచే విజ్ఞానపూర్వకమైన పరిశీలనం చెయ్యాలి. అట్టి పరిశీలననే ”విచారణ" అని పిలుస్తున్నాం.

విచారణ హీనుని హృదయం రాయి కంటే మౌఢ్యమైనది. గ్రుడ్డికంటే గ్రుడ్డిది. ఆ హృదయం మోహము వలన మరింత ఘనీభవించి, నిరంతరం అనేక దుఃఖములను చేకూర్చుకుంటోంది.

ఓ రామచంద్రా! ఈ భూమిపై అనంత సంఖ్యలో జీవులు పుట్టుచున్నారు. చస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే సత్యమును గ్రహించుటకు, అసత్యమును పరిత్యజించుటకు ప్రయత్నిస్తున్నారు. అట్టివారు మాత్రమే వందనీయులగుచున్నారు. వారు తత్త్వమును పరిపూర్ణముగా ఎరుగుటకుగాను ‘విచారణ’ అనుదానినే ఆశ్రయిస్తున్నారు. అందుకు వేరే ఉపాయమేమీ లేదు.

విచారణ → తత్త్వజ్ఞానం → ఆత్మవిశ్రాంతి → మనశ్శాంతి → దుఃఖవినాశనము.

కాబట్టి విచారణయే మనశ్శాంతిని, దుఃఖ నాశనమును ప్రసాదించగలదనుటలో సందేహం ఏమాత్రం లేదు. జనులంతా వివేకపూర్వకమైన విచారణను ఆశ్రయించి “ఇది ఇట్లు చేయుట ఉచితము” అని నిశ్చయించుకొని, ఆపై లౌకికమైన, వైదికమైన ప్రయోజనములను పొందుచున్నారు కదా! ‘ఆధ్యాత్మ విషయం’ కూడా అట్టిదేనని మరల మరల ప్రకటిస్తున్నాను. ఉత్తమ విచారణయే లేకపోతే లోకంలో సత్కర్మలు ఉండవు. హింస, లోభము, జాతిద్వేషము, మాత్సర్యము మొదలైనవన్నీ అవిచారణ చేతనే ప్రబలుచున్నాయి. ఓ రాఘవా! అత్యంత శమముతో కూడుకొని ఉన్నట్టి నీకు కూడా ‘విచారణ’ అనునదే ప్రీతికరమగు గాక!

20.) సంతోషము

సంతోషో హి పరంశ్రేయః సంతోషః సుఖముచ్యతే ||
సంతుష్టః పరమభ్యేతి విశ్రామమరిసూదన ॥ (XV.1)

ఓ శత్రుమర్దనా! రామచంద్రా! “సంతోషము” అనునది పరమ శ్రేయస్సు, సుఖము, విశ్రాంతి, మోక్షము కూడా అయివున్నది. అట్టి ‘సంతోషము’ అను దానిని సొంతం చేసుకొన్నవారికి సంపదలు, రాజ్యాధికారములు, వందిమాగధ జనము వంటివి కూడా ఎండుగడ్డి పరకలవలె అతి తుచ్ఛమైనవే అయి ఉంటాయి.


Page number:142

సంతోషముతో కూడిన బుద్ధిని సంపాదించినవారు ఈ సాంసారిక దుఃఖములు వాటిల్లినప్పుడు తల్లడిల్లకుండా ఉంటున్నారు. సుఖములు పొందినప్పుడు తబ్బిబ్బు కాకుండా ఉంటున్నారు. ఆ మహనీయులు స్వయంగా సంతోషమనే అమృతం త్రాగి తృప్తులై, శాంతియుతులై ఈ భూమిపై సంచరిస్తున్నారు. వారికి ఈ భోగసంపదల యొక్క అర్థమేమిటో తెలియదు. (వీటిలో వారికి క్రొత్తగా ప్రాప్తించవలసినదేదీ కనిపించదు). మధురమైన సంతోషం అనే గుణం ఆశ, దైన్యము మొదలైన దుర్భరమైన అల్ప గుణములను నశింపచేస్తుంది. అన్నివైపుల ఆనందం వెల్లివిరియచేస్తుంది. ‘సంతోషం’ అంటే ఏమిటి?

అప్రాప్త వాంఛాముత్సృజ్య సంప్రాప్తే సమతాంగతః
అదృష్టభేదా2భేదో యః ససంతుష్ట ఇహోచ్యతే | (XV.259)

ప్రాప్తించని వాటి గురించి వేదన చెందక, పొందిన వాటి గురించి తబ్బిబ్బుకాక, సుఖ-దుఃఖములచే చంచలుడుగాక, భేదాభేదములకు అతీతుడై ఉండువాడే సంతుష్టుడు. సర్వదా పొందబడియే ఉన్నట్టి స్వస్వరూపముచే ఆనందము పొందుచు సర్వులను, సర్వమును ప్రశాంతముగా దర్శించువాడే సంతుష్టుడు. అట్టివాని మనస్సు తనయందు తానే మౌనస్వరూపమైన తృప్తి, ఆనందములను పొంది ఉంటుంది.

వాస్తవానికి ఈ జీవుడు స్వతహాగా ఆనందస్వరూపుడే కదా! అయితే మనస్సు వివిధ విషయములను కోరుకోవటం ప్రారంభించుటచే, అట్టి వాంఛలనుండే సర్వ మనోరుగ్మతలు వచ్చిపడుచున్నాయి. సంతోషముచే శీతలము పొందిన చిత్తమునందే విశుద్ధమైన విజ్ఞానము వికసిస్తోంది. సంతోష సూర్యుడు ప్రకాశించే చోట “దిగులు - అసూయ - దోషదృష్టి" మొదలైనవాటి రూపమైన అజ్ఞానపు చీకటి తొలగిపోతోంది.

‘ఆశ’ అనుదానికి వివశమై సంతోషం కోల్పోతున్న చిత్తము ధూళిచే కప్పబడిన ‘దర్పణము’ వంటిది. అందు జ్ఞానవాక్యములు ఎట్లా ప్రతిబింబిస్తాయి చెప్పు? “మాకీ లోటుపాట్లన్నీ ఉన్నాయి కదా! మేము జ్ఞాన విషయాలు ఎట్లా వింటాం? మేము పొందాలనుకొన్నవి పొందనివ్వండి. అప్పుడు చూద్దాం” అని జీవుడు ఆశల వెంటే పోవుచున్నాడు. దుఃఖించుట, ద్వేషించుట, ఒకరినొకరు తప్పులు ఎంచుకొనుట - ఇవే అలవాటు అయి ఉంటున్నాయి. “సంతోషముగా ఉండుట” అనునది ఎందుకు అభ్యాసముగా (As a Practice) చేసుకోరాదు? సంతోష మనస్కుని నుండి శారీరక - మానసిక వ్యాధులు దూరంగా ఉంటాయి. ఒకానొకడు నిరుపేదయే అయినప్పటికీ, అతడు కనుక తన మనస్సు నందు ఆకృత్రిమమైన ’సంతోషము’ను నింపుకోవటం జరిగితే అట్టివాడి ముందు ఈ రాజ్యాలు ఏలే వాళ్ళుకూడా ఎందుకూ పనికిరారు. "అట్టి అభ్యాసము తప్పకుండా సాధ్యమే” అని సర్వజనులను దృష్టిలో పెట్టుకొని చెప్పుచున్నాం.


Page number:143

నాభివాంఛత్యసంప్రాప్తం ప్రాప్తం భుంక్తే యథాక్రమమ్
యః సుసౌమ్య సమాచారః సంతుష్ట ఇతి కథ్యతే ॥ (XV. 12)

అప్రాప్తములైన విషయముల గురించి భేదము చెందకుండా, ప్రాప్తములైన వాటిని ఉత్తమ అవగాహనతో అనుభవిస్తూ, సౌమ్యమైన ఆచరణ కలిగియుండే వానికి ’సంతోషము’ ఒక అలవాటుగా అవగలదు. అట్టి సంతోషముతో పరిపూర్ణముగ తృప్తి పొందిన విశుద్ధ చిత్తముగల మహాత్ముని వదనము చూచినవారు అనిర్వచనీయమైన సంతోషానుభవం పొందుతారు. లక్ష్మీదేవి వేంచేసియున్న క్షీరసముద్రం ఎట్లా ఉంటుందో ప్రసన్నత్వము సంతరించుకొనియున్న అతని ముఖము కూడా అట్లే అత్యంత శుభదాయకమై ఉంటుంది.

ఓ జనులారా! మీరు సర్వదా నిరతిశయమైన ఆనందరూపమునే అవలంబించండి. అభ్యాసవశంచేత ఇది తప్పక సాధ్యమే. "మేము ఏమి పొందామని?” అని స్వల్ప విషయములను దీర్ఘ దర్శనం చేయుటచే మీకు అట్టి అభ్యాసం కొరవడుతోంది. స్వయంకల్పిత దోషములైనట్టి తృష్ణ, అసంతృప్తులు అత్యంత ప్రమాదకరమైనవి. అవి మనస్సును అనేక దోషములచే, మోహములచే, అపార్థములచే నింపివేస్తున్నాయి. అందుచేత పౌరుషబలం చేత తృష్ణను జయించి వేయండి. ‘తృష్ణ’ ఉన్నచోట సంతోషమెట్లా ఉంటుంది చెప్పండి?

‘సంతోషము’ అను మాధుర్యముతో నిండియున్న చిత్తము స్వయముగా తనంతట తానే శాంత శీతలమగు బుద్ధి స్థైర్యములను పొందుతోంది. సంపదలు కూడా సంతోష చిత్తుని భృత్యునివలె అనుసరిస్తున్నాయి. తనయందు తానే సంతుష్టుడైన వాడు ఇతరుల శారీరక-మానసిక రుగ్మతలను క్షీణింపచేయగలడు. కళంకరహితము, శీతలము, విశుద్ధము అయినట్టి చిత్తవృత్తి స్వయంగా సంతోషమును పొందుతోంది. అట్టి చిత్తవృత్తి కలవాడు సమబుద్ధితో కూడుకొనినవాడై ప్రశాంతము, మౌనము, ఆనందము, ఉత్సాహము ఒకే సమయంలో తన ముఖమునందు ప్రకటించుచున్నాడు. అట్టి వాని ముఖము చూచినంత మాత్రం చేత మనందరికీ ఆనందము, సుఖము కలుగుచున్నాయి. అట్టి పురుషుడు తారస పడినప్పుడు ఆతనికి దేవతలు, మునులు కూడా నమస్కరించుచున్నారు.

21.) సాధు సాంగత్యం

ఓ రఘురామా! మహాత్ములు సాధుసాంగత్యాన్ని, తద్వారా లభించే ఉత్తమ వివేకమును సర్వదా కాపాడుకుంటూ ఉంటారు. అదే మోక్ష ఫలమును ప్రసాదించగలదని వారు ఎరుగుదురు. ఒక వ్యక్తి యొక్క అభ్యున్నతి - పతనములను అతడు ఆశ్రయించు స్నేహములే నిర్ణయిస్తాయి.

ఈ లోకంలో ఉత్తమ పురుషులైనవారు, విద్వజ్ఞులు, ఆత్మవిషయమై పూర్ణులైనవారు - కొందరు సంచరించుచున్నారు. వారితో సమాగమం శూన్యప్రదేశమును కూడా జనమయం చేస్తుంది.


Page number:144

మృత్యువు కూడా ఉత్సవంగా, ఆపదలు కూడా సంపదలుగా మారిపోతాయి. మోహము కూడా అట్టి స్నేహప్రభావం చేత తప్పక తోక ముడుస్తుంది.

హిమం ఆపత్ సరోజిన్యా, మోహనీహార మారుతః |
జయత్యేకో జగత్యస్మిన్ సాధుః సాధుసమాగమః || (XVI. 4)

“ఆపదలు అనే పద్మములకు మంచును, మోహమనే మంచునకు మారుతమూ అయనట్టిది సాధుత్వము. సాధుత్వము పొంద యత్నించువారే సాధుసాంగత్యము పొందుచున్నారు.” అట్టి సాధువులు - ఆ సాధువులను ఆశ్రయించినవారు కూడా ఈ జగత్తును అతి సులభంగా జయించివేస్తున్నారు. సాధు సాంగత్యం వలన బుద్ధి సునిశితమౌతుంది. అనాదిగా పెరిగి ఊడలు వేసుకొనియున్న ‘అజ్ఞానము’ అనే విశాలవృక్షం, “సాధు సంగం” అనే ఝంఝామారుతం చేత కూకటివ్రేళ్లతో సహా పెకలించివేయబడగలదు. మనోవ్యాధులు వాటంతట అవే నశిస్తాయి. మనోహరమైన సువాసనలు వెదజల్లగల వివేకము ఉదయిస్తుంది. అట్టి సాధుసమాగమములకు సర్వదా దిగ్విజయమగుగాక!

సాధు సంగం పొందుచున్నవాని సంపదలు కూడా అనపాయకరమై, బాధారహితమై, నిత్యప్రవర్ధకమై యజమానికి శుభమే చేకూరుస్తాయి. కొందరు, “అనేక సమస్యలచేత సతమతమగుచున్న మాకు సాధు సంగానికి సమయమెక్కడిది?” అని సరిపుచ్చుకొంటున్నారు. అయితే, మనిషి కష్టముల చేత వివశుడగుచున్నప్పుడు సాధుసంగం మరీ ముఖ్యమని నేను గుర్తు చేస్తున్నాను. అది దీపపు వెలుగువలె హృదయములోని చీకటిని తొలగించివేస్తుంది. ‘జ్ఞానప్రకాశము’ అనే శాశ్వతమైన వెలుగును ప్రసాదిస్తుంది. చిత్తశుద్ధిని, మంచి ప్రవర్తనను మనశ్శాంతిని ప్రసాదించగలిగే సత్పురుషుల సాంగత్యమే ఉంటే ఇక, “గంగాస్నానం చేయలేదే? యజ్ఞ-తపో-ధ్యాన-తీర్థాదులు సేవించలేకపోతున్నామే?” అనే బెంగతో మానవునికి పనిలేదు.

NOTE: (నారదభక్తి సూత్రాలు -) “మహత్సంగస్తు దుర్లభో, అగమ్యో, అమోఘశ్చ, లభ్యతే తత్కృపయైవ"|| మహనీయులతో స్నేహం దొరకటం దుర్లభమే. కాని దొరికిందా, అమోఘమైనది. అది ఆ పరమాత్మయొక్క కృపచేత మాత్రమే లభించగలదు.

NOTE: (ఆదిశంకరులు - వివేకచూడామణి -) దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకమ్ | మనుష్యత్వం, ముముక్షుత్వమ్ మహాపురుష సంశ్రయః ॥ మనుష్యజన్మ, మోక్ష స్వరూపులం కావాలనే లక్ష్యము, మహాపురుషులతో స్నేహం - ఈ మూడు భగవంతుని అనుగ్రహంచేతనే లభిస్తాయి.

అందుచేత మనం మహాపురుషులతో సాంగత్యం కలిగియుండుటకు ప్రయత్నించాలి.


Page number:145

ఓ రామచంద్రా! రాగశూన్యులు, మమకార అహంకారాలు లేనివారు, సందేహ రహితులు అయినట్టి సాధు పురుషులతో స్నేహం లభించటమంటే - అది మహత్తరమైన విషయమే సుమా! నీవు కూడా రాగరహితుడవైతేగాని, వారితో స్నేహము చేయగల బుద్ధి పుట్టదు. వారి స్నేహమును (స్వాభిమాన కారణంగా) పొందలేరు. ఆత్మజ్ఞానులగు మహనీయులతో సామీప్యత గొప్ప తపస్సు, తీర్థములతో సమానం. అది అతి పవిత్రమైనదని సర్వజనులు గ్రహించెదరు గాక! దరిద్రునకు ఒక మణి లభించటం ఎటువంటిదో, జ్ఞానులతో స్నేహం అట్టిదని విజ్ఞుల అభిప్రాయం. కనుక వినయము, గౌరవము, స్నేహము, సహకారము మొదలైన సత్ప్రవర్తనతో, సద్భావముతో జనులు అట్టివారి స్నేహములకై యత్నించాలి.

ఎంత ప్రయత్నం చేసైనా సరే, సాధుపుంగవుల దర్శనం చేసుకోవాలి. వారితో సంభాషణమే పూర్వజన్మ సుకృతం అనక తప్పదు. బుద్ధి, మేధస్సు కూడా సత్సంగమము వలన సౌందర్యమును పొంది, సునిశితమౌతాయి. సాధుసంగం వదలనివాడు నిర్మల విచారణచే తప్పక బ్రహ్మపదమును పొందుతాడు.

బంధరహితులు, తత్త్వజ్ఞులు, సర్వ సమ్మతులు అగు సాధుపుంగవులు మనకు అక్కడక్కడ తారసపడుతూనే ఉంటారు. వారిని తప్పకుండా సేవించాలి. గౌరవించాలి. సర్వ ప్రయత్నములచే సంతసింపచేయాలి. ఎందుకంటావా? ఈ సంసార సముద్రం దాటటానికి వారే ఉపాయ స్వరూపులు సుమా! ఈ జీవుడిని నరకాగ్నులు సమీపిస్తుంటే వారు ఆ అగ్నులను ఆర్పగల వర్షధారలవంటివారు. అంతటి సాధు పురుషులను అనాదరించటం ఎంతటి దౌర్భాగ్యమైన విషయం! అట్టి అనాదరణ చేయువారు నరకాగ్నులకు ఇంధనం కాదలచుకొన్నారా? ఓ రాఘవా! దారిద్య్రం, దుఃఖం, మోహం, అజ్ఞానం మొదలైన సంసార రోగములకు సాధుపుంగవుల సాన్నిధ్యమే ఔషధం. వారి వచనామృతము వలన మాత్రమే పూర్ణార్థపూరితమైన అవగాహన వృద్ధి చెందుతోంది. తద్వారా లోకంలో శాంతి స్థాపించబడగలదు.

22.) మార్గాన్వేషణం

చూచావా రామా!
సాధన చతుష్టయములైనట్టి -
1.) సంతోషము,
2.) శమము,
3.) విచారణ,
4.) సాధు సంగం
- అనేవి సంసార సాగరము నుండి తరింపచేసే ఉపాయాలు.

సంతోషః పరమోలాభః ! సత్సంగః పరమాగతిః !
విచారః పరమం జ్ఞానం ! శమో హి పరమం సుఖమ్ ॥ (XVI.19)

సంతోషమే పరమలాభము. సత్సంగమే పరమగతి. విచారణమే పరమజ్ఞానం. శమమే పరమసుఖం. ఈ నాలుగు రకములైన ఉపాయములను అభ్యసించేవారే ఘనీభూతమైయున్న ఈ మోహజాలమును జయిస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటైనా సర్వశక్తి యుక్తులచే అభ్యసింపబడినప్పుడు, మిగతా మూడు కూడా లభిస్తున్నాయి. అందుచేత రామా! తాత్సారం చెయ్యకుండా ఎంతటికైనా సిద్ధపడి అందులో ఒక్కదానినైనా అభ్యసించాలి.


Page number:146

స్వచ్ఛమైన శమము వలన హృదయం నిర్మలమైనప్పుడు అట్టివాని వద్దకు మిగతా మూడు వచ్చి చేరుచున్నాయి. సంతోష, విచార, సాధు సాంగత్యాలు ఉన్నచోట ‘జ్ఞానం’ రూపు దిద్దుకుంటోంది. సుగుణములన్నీ ఆశ్రయిస్తున్నాయి. విజయలక్ష్మి వరించుచున్నది.

ఓ జనులారా! మీరంతా “స్వప్రయత్నము” అనబడే పురుషకారం చేత మనస్సును జయించి, ఈ నాల్గిటిలో ఏ ఒక్కదానినైనా నిరంతరం ప్రయత్నపూర్వకంగా అవలంబించ కోరుచున్నాను. “శ్రద్ధతో, ఓర్పుతో, నేర్పుతో ఒక్కదానినైనా దైనందికమైన అలవాటుగా మార్చుకోండి” - అని మీ శ్రేయోభిలాషులమగు మేము మరల మరల చెప్పుచున్నాం. కొంచెం కొంచెం ఈ నాల్గిటిని ఆశ్రయిస్తూ పోగా, కొంతకాలానికి అంతా సుసాధ్యమే అవుతుంది. మొదట్లో కొంత పట్టుదల వహించి, ఆ తరువాత, ప్రయత్నము వీడకుండా ఉంటే మీకు సాధ్యము కానిదంటూ ఏదీ ఉండదు. కొంతవరకు సాధించగలిగినా, అక్కడి వరకు, మీకు శుభమే కలుగుతుంది.

అసలు ప్రయత్నమనునదే చేయకుండా, “మానవమాత్రులం! మావల్ల ఏమౌతుంది?" అని మిమ్ములను మీరే సముదాయించుకుంటూ తుచ్ఛ విషయములకై పరుగిడితే అది మూర్ఖత్వమే కదా! ఎందుకంటే మానవులలోనే అత్యంత మహనీయులు, ఆత్మజ్ఞులు … అత్యంత మూర్ఖులు కూడా ఉన్నారు. అందుచేత సాధన పూనండి. అసలు ఉన్న రహస్యమంతా సాధనలోనే ఉన్నదికాని, దైవమునందు కాదు.

ఈ చిత్తము అనుదానిని పురుషకారంతో (పౌరుషంతో) జయించి ఈ నాల్గిటిలో ఒక్కదానినైనా వశం చేసుకుంటేనే ‘ఉత్తమగతి’. అట్లా కాకుండా, చిత్తము యొక్క ఇచ్ఛ ప్రకారం వర్తించటం, ఇంద్రియ విషయములను మాత్రమే ఆశ్రయించటం, కల్పిత వ్యవహారములనే నమ్ముకొని ఉండటం అది శుభప్రదమౌతుందా? పళ్ళతో పళ్ళు నొక్కిపెట్టి ఎట్లాగైనా సరే, ఈ నాల్గిటి కొరకు యత్నించెదరు గాక!

ఒకానొకడు ‘మానవుడు’ అగుగాక! లేదా దేవత అగుగాక! యక్షుడు అగుగాక! లేదా ఒక చెట్టు అగుగాక! ఏది ఏమైనా ఉత్తమ గుణములు ఆర్జించకపోతే గతిలేదని గ్రహించాలి. ఈ చంచల చిత్తము అనుక్షణం అనేక గుణదోషములనే, ప్రీతిపూర్వకంగా, ఆశ్రయిస్తోంది. ఆ గుణదోషములను మొట్టమొదట జాగ్రత్తగా గుర్తించాలి. అయ్యో! ఈ సాంసారిక జీవులు తమ చిత్తమును ఆశ్రయించు గుణ దోషములేమిటో గమనించుటకు కొంచెమైనా ప్రయత్నించకుండా, పరుల దోషములు మాత్రం మహా తెలివితేటలతో ఎంచుచు కాలం వెళ్ళబుచ్చుచున్నారే? ఇది అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం. అట్టి మూర్ఖజనులకు ధిక్కారమగు గాక!

అయితే స్వచిత్తము యొక్క గుణదోషములు తొలగేదెట్లా? సుగుణములను ఆశ్రయించుటయే అందుకు ఉపాయం. "క్రమక్రమంగా సుగుణములను ఆశ్రయిస్తూ పోగా దోషగుణములు సన్నగిల్లుతాయి. దోషగుణములు వృద్ధిచెందుచున్న కొద్దీ, సగుణములు బలహీనపడతాయి” అని కూడా గుర్తు పెట్టుకోండి.


Page number:147

కనుక రామచంద్రా! నీకు ఏ త్రోవ కావాలో ఈ బాల్యంలోనే నిర్ణయం చేసుకో. చక్కగా విచక్షణ చేయి. మార్గాన్ని అన్వేషించు. అనుసరించు. అంతేకాని, దుఃఖిస్తూ కూర్చుంటే నీకుగాని, నీ వలన మరెవరికి గాని ఎట్టి లాభం ఉండదు.

ఈ మనస్సు తనయొక్క వాసనా వేగంతో (force of tendencies) ఎప్పటికప్పుడు జీవుని ముంచెత్తుతోంది. అయితే అట్టి వాసనలు, నదికి రెండువైపుల ఉన్నట్టి గట్లవలె, శుభ-అశుభ రూపములలో ఉంటున్నాయి. ‘శుభం’ అనే ఆవలి ఒడ్డుకు చేరుతావా? ’అశుభము’నే ఆశ్రయిస్తూ రోజులు గడుపుతావా? నీ ఇష్టం. ప్రయత్నమును బట్టే ప్రయోజనం ఉంటుంది. తాత్సారం చేసేవారికి అనేక జన్మలు గడచిపోతున్నాయేగాని, నివృత్తి లభించటం లేదు. కాబట్టి రాఘవా! పురుషకారమును ఆశ్రయించు. అప్పుడు అశుభవాసనలు నిన్ను ఏమాత్రం సమీపించలేవు.

23.) దృష్టాంతములు

ఓ రామచంద్రా! ఏదైనా ఒకానొక క్రొత్త విషయం గురించి ఒకరికి తెలియజేయాలనుకున్నామనుకో. అట్లు తెలియచేయుటకు వీలుగా రోజూ చూచే విషయాలను ఉపమానంగా తీసుకొంటూ ఉంటాము. అట్లు విషయమును గ్రహింప చేయుటకు ఉపకరించే ఉదాహరణనే ’దృష్టాంతము’ అని అంటున్నాం. రాత్రిపూట గదిలోని వస్తువులను దీపం లేకపోతే గ్రహించలేము కదా! దృష్టాంతముల సహాయం లేకపోతే శిష్యునకు ఒకానొక నూతనార్థం బోధించటం చాలా కష్టం. అసాధ్యమేమో కూడా. ఎందుకంటావా? గురువు తపోధ్యానాదులచే ఎంతో ప్రయత్నించి సత్యమును గ్రహించి ఉంటాడు. సత్యమును అత్యంత వివేక దృష్టితో చూస్తూ ఉంటాడు. కాని శిష్యుడో మనస్సునందు అనేక జన్మలలో పేర్చుకొనియున్న దుర్వ్యసనములను, దురభిప్రాయములను పొరలుగా కలిగియుంటాడు. కాని, సత్యమును గ్రహించుటకై ఆరాటపడుతూ ఉంటాడు. వాస్తవానికి ‘సత్యము’ నిర్దుష్టమైనది. సుస్పష్టమైనది. ఒక్క వాక్యంలో చెప్పగలిగేదే. కాని శిష్యుని వివేకము అంతటి సునిశితంగా (అనేకమంది విషయంలో) ఉండదు. అందుకే బోధకులంతా దృష్టాంతాలు ఉపయోగించుచున్నారు.

అయితే ఒక్క విషయం నీవు గమనించాలి. దృష్టాంతాలన్నిటికీ ‘కారణము’ అనేది ఒకటి ఉంటుంది. కాని జ్ఞేయము, సర్వప్రయత్నముల ప్రయోజనకంగా తెలియబడే ఆత్మవస్తువు, సద్వస్తువు అయినట్టి ‘పరబ్రహ్మము’ అనునది సర్వదా కార్య కారణరహితమైయున్నది. కారణము లేదు కనుక నిత్యమైనది కూడా. ఈ విధంగా, ఒక్క పరమాత్మయందు తప్ప తక్కిన ఉపమాన - ఉపమేయములందు కొంత కార్య - కారణ భావములు ఉండనే ఉంటాయి.


Page number:148

ఈ బ్రహ్మోపదేశ సందర్భంలో కూడా నేను కొన్ని దృష్టాంతాలు ఉపయోగించ బోతున్నాను. అయితే, నేను ఒక దృష్టాంతమును ఏ బోధయొక్క అంశమును (విషయమును) దృష్టిలో పెట్టుకొని చెప్పుచున్నానో అది గ్రహిస్తూ ఉండాలి. అంతవరకే ఆ దృష్టాంతము గ్రహించాలి. అందుచేత నీవు నిర్మలమైన, సూక్ష్మమైన బుద్ధితో నేను చెప్పేది విను.

ఉదాహరణకు “త్రాటియందు పామువలె, బ్రహ్మమునందు జగత్తు కలదు” అని మనం చెప్పుకున్నామనుకో. ఇందులో వివర్తాంశమును (that deduced) మాత్రమే గ్రహించాలి. అనగా చీకట్లో త్రాడు ‘సర్పము’ అనే పదార్థంగా తోచుచున్నట్లే బ్రహ్మమే సర్వదా ఉండి ఉన్నది. చూచేవారి భ్రమ వలన జగత్తు అనబడుదానిగా తోచుచున్నది” - అని గ్రహించాలి. అంతేకాని, “ఏ విధంగా బ్రహ్మము నిత్యము, అఖండము, నిరతిశయానందము అయిన స్వభావము కలిగియున్నదో, అట్లే ఈ జగత్తులోని పదార్థజాలం అట్టి స్వభావమే కలిగి ఉన్నది" - అనే నిశ్చయానికి రాకూడదు.

బ్రహ్మమును బోధించటానికి మనం తీసుకొనే ఉపమానాలన్నీ స్వప్న వస్తువుల లాగా, మిథ్య అయినట్టి ఈ జగత్తులోనివే కదా! అయితే ఏం? అట్టి ఉపమానములు మేము ఉపయోగించి శిష్యుని అజ్ఞానం తప్పకుండా పోగొట్టగలుగుచున్నాం. అందుచేత, “నిరాకారమగు బ్రహ్మము విషయంలో సాకారమగు దృష్టాంతాలు ఎందుకు పనికి వస్తాయి?” అని తలచి బోధకు తిరస్కరించకండి.* ఓ సర్వ సభికులారా! నేను ఏది దృష్టిలో పెట్టుకొని ఒకానొక దృష్టాంతము చెపుతూ వస్తున్నానో, అది గ్రహించగలిగినట్టి సుతీక్షమైన బుద్ధి మీరంతా కలిగిఉండాలి సుమా!

పరమవస్తువును ఏ ఒక్క దృశ్య పదార్థముతో కూడా పోల్చి “ఇది ఇట్టిది” అని చెప్పలేని మాట నిజమే. ఎక్కడ వాక్కు, మనస్సు గ్రహించజాలక వెనుకకు మరలుతాయో, ఏదైతే ‘అనుభవమాత్రమే’ అయి శేషించుచున్నదో, అట్టి ఆత్మతత్త్వం విషయంలో ఏది సమగ్రమైన దృష్టాంతముగా ఉపయోగించగలదు చెప్పు? అందుచేత ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విశేషమును ఒక్కొక్క దృష్టాంతమును ఉపయోగించి ప్రతిపాదిస్తున్నాం. దృష్టాంతముల సహాయంతో "ఇది మాత్రం ఇట్లు కాదు” అని తప్పక ప్రతిపాదించి చూపుచున్నాం. నేను ఉపయోగించే ఒక దృష్టాంతమును మాత్రమే దృష్టిలో పెట్టుకొని, “ఈ దృష్టాంతములోని దోషము ఇది. కనుక వీరు చెప్పేది కుదరదు” అని వితండవాదాలు చేసుకోకండి. దృష్టాంతాలను చూచి మాచే ప్రతిపాదించబడుచున్న బ్రహ్మతత్త్వము యొక్క అస్థిత్వమును తిరస్కరించే వారితో వాదించి లాభమేమున్నది?

కొంచెం విచారించిచూస్తే, ఈ జాగ్రదావస్థలోని వస్తువులకు, స్వప్నావస్థలోని వస్తువులకు భేదమేమి లేదు. ఇది కల్పనచే ఇప్పటికి సత్యమువలె అనిపిస్తున్నట్లే స్వప్న సమయంలో కూడా స్వప్నదృశ్యం సత్యమనియే అనిపిస్తోంది. అయితే ఈ రెండూ మిథ్యయే. అందుచేత ఈ జగత్తు సర్వ కాలములందు అవస్తువే అయివున్నది. ఆహా! చూచావా రామా! ఎంతటి చమత్కారమో! సరే, -

*గణితం (Mathematics) లో “X” అనుకొనుము అని అంటాం. “X” అనునది ఒక అక్షరం కదా! ఆ కావలసిన సమాధానం ఒక సంఖ్య కదా? అని అనుకొంటున్నామా?


Page number:149

ఇప్పుడు, "బాల్యము నుండి మనలను ఆవహించియుండే ఈ ‘జగత్తు’ అనే భ్రమ మిథ్యయే” అనునట్టి నగ్న సత్యము బోధించుట ఎట్లా? అందుకుగాను మేము “స్వప్నము, సంకల్పము, ధ్యానము, వరము, శాపము, ఔషధము” - ఇత్యాది అనేక దృష్టాంతాలు సమయోచితంగా తీసుకొని చెప్పుచున్నాం. అప్పుడా శిష్యుడు, “ఔను. నిజమే. ఇది స్వప్నము వంటిదే” అనే నిశ్చయానికి వస్తున్నాడు. ఇదే నియమము తత్త్వబోధన చేసే అన్ని గ్రంథములలోను అనుసరించబడింది.

కనుక మేము దృష్టాంతం చెప్పుచున్నప్పుడు బోధింపబడుచున్న అంశమును సూక్ష్మబుద్ధితో గ్రహించాలి!

మరొక ముఖ్యమైన విషయం. “ఈ జగత్తు స్వప్న - సంకల్పములలోని వస్తు జాలమువలె భ్రమమాత్రమే. లేక అసత్యమే” అనే జ్ఞానం ఈ శాస్త్రం పఠించుటచే తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పలేం. ఎందుకంటావా? విషయం బోధ పడినప్పటికీ, వాసనలు కూడా శమించాలి కదా! కాబట్టి అది సంస్కారమును అనుసరించి క్రమంగా ప్రాప్తించవలసినదే. అయితే, అట్టి ప్రయత్నమునకు సిద్ధంగా ఉన్న జీవులకు తగిన విచారణ, ప్రోద్బలం ఇందు లభిస్తున్నాయి.

ఏది ఏమైనా, నిష్కల్మష సంస్కారవంతులు, విచారశీలురు మాత్రం ఇది పఠించు చుండగానే ఉత్తమమగు సర్వసమత్వం, ఆత్మ తాదాత్మ్యము పొందటం జరుగుతోంది.

ఈ కనబడేదంతా స్వప్న, సంకల్ప, ధ్యానములందలి ‘నగరము’ వంటిదే కనుక, నేను ఈ స్వప్న - సంకల్ప - ధ్యానములను, అందలి అనుభవములను దృష్టాంతంగా తీసుకుంటున్నాను. ఒకడు నిద్రిస్తున్నప్పుడు ఒక ’కల’కంటాడనుకో…. ఆ కలలోని అనుభవములు గుర్తు చేసుకోవటంలోనూ, భూతకాలపు ’జాగృదవస్థ’కు సంబంధించిన అనుభవములను గుర్తు చేసుకోవటంలోనూ భేదమేమున్నది? అది అట్లుండగా, స్వప్నంలోని ఘోర దృశ్యములు (బాధింపబడటం, ప్రేమించటం వంటివి) జాగ్రత్తులో ‘అరవటం, కలవరించటం, వణకటం’ వంటి ప్రతి-స్పందములుగా అప్పుడప్పుడు పరిణమిస్తూ ఉంటాయి కదా! ఈ స్వప్న జాగ్రత్తులు ఎప్పటికప్పుడు, అప్పటికి మాత్రం, వాస్తవమేనని అనిపిస్తూ, మరొకప్పటికి (ఆ రెండూ కూడా) గడచిపోయినట్టి అనుభవమాత్రంగా, జ్ఞాపకమాత్రంగా ఉండిపోతున్నాయి. అందుకే ఆ రెండింటికి భేదంలేదని చెప్పుచూ దృష్టాంతంగా తీసుకొంటున్నాం.

“సువర్ణమే ఆభరణమునకు కారణం కదా” అనే దృష్టాంతము చెప్పాననుకో. నా ఉద్దేశం, “బ్రహ్మమే ఈ జగత్తునకు కారణం” అని చెప్పాలని. అట్లు చెప్పినప్పుడు “బంగారము ఆభరణములుగా ఆకారం పొందునట్లు, బ్రహ్మము జగత్తుగా ఆకారాదులు పొందుచున్నది”… అని గ్రహించవద్దని మరల గుర్తుచేస్తున్నాను. ఎందుకంటే, ఇక్కడ సువర్ణము యొక్క సర్వధర్మములు గ్రహించకుండా ఒకానొక “అంశ (character)” మాత్రమే తీసుకొని తత్త్వవిషయమై బోధిస్తున్నానని గ్రహించాలి.


Page number:150

అట్లాగే, “ఆభరణం రాళ్ళు దాగి ఉంటాయి కదా!“ అనే మీమాంస చేయబడకుండుగాక. చీకట్లోగల వస్తువు చూడాలంటే దీపపు వెలుగే ఉపయోగిస్తుంది కాని, “ప్రమిద - నూనె - వత్తి” కాదు కదా! అదేవిధంగా ఉపమానంలోని ఒకానొక లక్షణం ఉపమేయానికి ఉన్నట్లు గ్రహించటమే శిష్యుని సూక్ష్మబుద్ధికి తార్కాణం.

24.) కుతర్కములు

బ్రహ్మజ్ఞానమే మన ఈ విచారణ యొక్క ఏకైక లక్ష్యము! మహావాక్య బోధను, ఆ బోధయొక్క అర్థమును నిశ్చయపూర్వకంగా గ్రహించుటచే తప్పకుండా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.

1.) ప్రజ్ఞానం బ్రహ్మ = ప్రజ్ఞ (ఎరుక)యే బ్రహ్మము.
2.) అయమాత్మా బ్రహ్మ = ఈ జీవాత్మ బ్రహ్మమే అయివున్నది.
3.) తత్త్వమసి = అదియే (ఆ పరమాత్మ వస్తువే) నీవై ఉన్నావు.
4.) అహం బ్రహ్మా2స్మి = నేను బ్రహ్మమునే అయివున్నాను.

ఈ నాలుగు వాక్యములు పరమ నిత్య-సత్యమును బోధించటానికి నాలుగు వేదములు ఉపయోగించాయి. వీటిని గురుముఖతః విని, వీటి అర్థమును గ్రహించి, ఆ అర్థముయొక్క ధ్యాస అలవర్చుకుంటే (నిరంతర ధ్యానం చేస్తే) బ్రహ్మజ్ఞానం కలుగుతోంది.

ఈ మన సంవాదము అదే అర్థమును, అనేక దృష్టాంతములద్వారా, కథానికల ద్వారా నిరూపిస్తోంది.

ఇంతకన్నా ఉత్తమమైన సత్యము ఏదైనా ఉంటే ఎవరైనా ప్రకటించవచ్చు. లేదా, ఇదే సత్యమును ఇంతకన్నా మధురంగా, సుస్పష్టంగా చెపితే, అదీ మంచిదే. అట్లా కాకుండా, అనుభవం లేకయే, అపవిత్రంగా తర్కంలోకి దిగుటకు ప్రయత్నించే వారికి నేను చెప్పుచున్నదొక్కటే! - నాయనలారా! స్వానుభవముచే మేము చెప్పుచున్న తత్త్వజ్ఞానాన్ని ఎందుకు తిరస్కరిస్తారు? అనేకమంది ముముక్షువులను దృష్టిలో పెట్టుకొని, అనేక సోదాహరణములతో "మీరు బ్రహ్మముకంటే వేరుకాదు” అని మేము నిరూపిస్తున్నాం. ఈ పరమ సత్యమును సర్వజనులపైగల ఆప్యాయత చేతనే ప్రకటిస్తున్నాం.

ఓ కుతర్కము చేయు మిత్రులారా! మీరు అనుభవపూర్వకంగా సత్యమును ఎరుగకుండానే, ఎవరైనా చెప్పినదానిని వ్యతిరేకించుటకు మాత్రమే ఎందుకు ప్రయత్నిస్తారు చెప్పండి? మీపై మాకు ప్రేమయే సర్వదా ఉంటుంది. దయచేసి మొట్టమొదట మీ దృష్టిని శుద్ధపరచుకోండి. యత్నశీలురై ప్రాణాయామ, ప్రత్యాహార, తితిక్షాది అష్టాంగ యోగములచే బుద్ధిని సునిశితం చేసుకోండి. అప్పుడు ఈ శాస్త్రమును విచారించండి. ఇది సత్యమో, కాదో మీరే నిర్ణయం చేసుకోండి. ఇంతకు మించి మీకు మేము ఏమి చెప్పగలం?


Page number:151

ఓ సర్వ జనులారా! మీలోని ప్రతి ఒక్కరిలో స్రవించుచున్న అమృత తత్త్వమును మేము గ్రహించాం. అట్లు ఎరిగినదానినే మీ అందరికీ ఈ ప్రయత్నముచే, ఇట్టివేయగు అనేక ప్రయత్నములచే గుర్తు చేస్తున్నాం. అట్టి మేము శ్రేయోభిలాషులమేకాని, ఏమాత్రం శత్రువులంకామే! ఈ సంసారములోని దోషమేమిటో గ్రహించినట్టి మేము బ్రహ్మ జ్ఞానమును ఉదయింపజేసే వాక్యములనే చెప్పుచున్నాం. అందుచేత శ్రద్ధగా వినండి. వింటూ ఉంటే సత్యమేమిటో మీ అంతట మీరే, మీ మీ హృదయాకాశములోనే గాంచగలరు. పరమార్థసత్యమేమిటో నిర్దుష్టంగా, దోషరహితంగా, ఆనందోత్సాహాలు కలుగజేసేవిధంగా చెప్పటానికే ప్రయత్నిస్తాం. ఏ వాక్యాలైతే పూర్ణమగు మీ స్వరూపము గురించి, ఈ దృశ్యముతోను, శరీరాదులతోను గల సంబంధం గురించి సమగ్రంగా బోధించుట లేదో, అవి ఆప్తవాక్యాలు కాజాలవు సుమా!

ఓ రామచంద్రా! మేము తపోధ్యానాది అనేక ప్రయత్నములచే బ్రహ్మసాక్షాత్కారము కలిగించగల బుద్ధిని కలిగియున్నాము. భగవంతుని సంకల్పముచేతనే ఇట్లు మీ అందరిపై కురుస్తున్న కరుణామృత రసంగా ఈ మా వాక్యాలు చేరుచున్నాయి. మనం చేయబోయే ఈ విచారణ, సమస్త వేదోపనిషత్తులు ప్రతిపాదించుచున్న ఏక వాక్యమగు “అఖండ బ్రహ్మతత్త్వమే” లక్ష్యముగా కలిగియున్నది.

కనుక, సర్వజనులారా! నిస్సంకోచంగా ఇది వినండి. ఇది గ్రహిస్తే పరమ పురుషార్థము లభించగలదని చేతులెత్తి ప్రకటిస్తున్నాను.

జీవుని యందలి పరమాత్మతత్వమును మరుగున పరచు వేదాంత విరోధములగు అనేక శాస్త్రములచే అనేక తర్కములు ప్రతిపాదించబడ్డాయి. “ఈ దృష్టిచే దర్శించబడుటచే ఇట్లు ప్రతిపాదించబడింది" అను రూపమైన విచారణచే ఆయా ప్రచారములో ఉన్న వేఱు వేఱు సిద్ధాంతములు, అభిమతములు మనం ముందు ముందు చర్చించబోతున్నాం. ఈ విచారణ అంతా విజ్ఞానదృష్టితో, పరిశీలనాత్మకమైన వివేచనాపూర్వకంగా చేయబడుచున్నది. “మేము చెప్పుచున్నాము. కనుక మీరు గ్రుడ్డిగా నమ్మవలసిందే” అని చెప్పటం మా ఉద్దేశం ఏమాత్రం కాదు. అందుచేత, చెప్పబోవునదంతా వివేక - విమర్శక దృష్టులచే తప్పక పరిశీలించవచ్చు.

మరొక్క ముఖ్యమైన విషయం. మేము అనేక పురుషప్రయత్నములచే, తపోధ్యానాదులచే మా చిత్తమును పరిశుద్ధపరచుకొని, అప్పుడు మాకు అనుభవమైన సత్యమును మీముందు ఉంచుచున్నాం. జనులలో అనేకమంది తగుయత్నం చేసి ఉండకపోవుటచే, వారి మనస్సులలో పదార్థికదృష్టి (material view point), ప్రాపంచకదృష్టి బలవత్తరమై ఉండిఉండే అవకాశమున్నది. అందుచేత కొంచెము మాపై విశ్వాసముంచి ఈ విచారణను స్వీకరించెదరు గాక! “మేము తపోధ్యానాదులు అధికంగాచేసి ఉండలేదు కదా! మరి ఇది వినటానికి అర్హులమా?” అనే శంకను కూడా త్యజించండి. ఉత్తమ కార్యాచరణము కొరకు ఇందలి విచారణ జీవుని తీర్చి దిద్దగలదు. అందుచేత ఇది పఠించునపుడు, వినునపుడు ఓర్పును, శ్రద్ధను వీడకండి. ఒకచోట కొంచెము అర్థమగుట సులభంగా లేనంతమాత్రం చేత వెనుకకు మరలవద్దు.


Page number:152

అవసరమనుకొంటే, విజ్ఞులైనవారితో సంభాషించి, అనుమాన నివృత్తి చేసుకోండి. గ్రంథమంతా చక్కగా పరిశీలించటం జరిగితే, అటు తరువాత దీని
ప్రయోజనమేమిటో మీరే గ్రహిస్తారు.

"ఈ జీవుడు బ్రహ్మమే కదా! ఇక ప్రయత్నం మాత్రం ఎందుకు?” అనే తర్కమునకు లోబడి, అప్రయత్నశీలత్వం ప్రతిపాదించే వాదోపవాదములను నెత్తిపై మోయటానికి మేము సిద్ధంగా లేము. ఊరకే వాదోపవాదములచే మనస్సు కలత చెందుటయే జరుగుతోంది. జీవితము అమూల్యమైనది. కేవలం తర్క - వితర్కములచే ఉత్తమ వస్తువును సాధించలేమని మా ఉద్దేశం.

అనుభవమాత్రమగు ’పరమాత్మ తత్త్వము’ను పొందుటకు, చివరికి పఠించు వాని అంతరంగమే స్థానము సుమా! మన ఈ విచారణ యొక్క పాత్ర ’లేనిదానిని లేనట్లుగా, ఉన్నదానిని ఉన్నట్లుగా’ చెప్పటం వరకే. గ్రహించువాడు దోషరహితమైన వివేకంతో ఈ బోధను పరిశీలిస్తూ ఉండగా “అద్వితీయమగు ఆత్మను నేనే” అనే అనుభవము పొందగలడు.

మేము ప్రతిపాదించుచున్నదంతా వేద వేదాంగములలోని విజ్ఞానసారమునకు అనుకూలంగానే ఉంటుందని మాత్రం చెప్పగలము. ‘మహావాక్యములు’ అని చెప్పబడే "అహం బ్రహ్మాస్మి” వంటి వేదవాక్యములే మన ఈ విచారణ అంతటికీ ప్రమాణాలయి ఉన్నాయి.

25.) ప్రమాణ నిరూపణ

మనం ఉపయోగించబోయే ప్రమాణముల విషయమై మరికొన్ని విషయాలు చెప్పుచున్నాను విను.

మనం ఒక ఉపమానం తీసుకొనునపుడు, ఆ ఉపమాన ఉపమేయాలలో ఉండే ఒకానొక సమానధర్మం మాత్రమే తీసుకుంటూ ఉంటామని చెప్పాను కదా! ‘ఉపమానము (comparison)’ అంటేనే అది. ఒకవేళ ఉపమాన - ఉపమేయాలు అన్ని అంశములందు ఒకేవిధంగా సమాన ధర్మములు కలిగి ఉండటం జరిగితే, అప్పుడు ఆ రెండింటికీ భేదమే ఉండదు కదా! ఇక ఒకదానిని ‘ఉపమానం’ అని, రెండవదానిని ‘ఉపమేయం’ అని అనటం దేనికి? లోకంలో, ఏ సందర్భాలలోనైనా సరే, ఏ ఉపమానం గ్రహించటం జరిగినా … అట్టి అన్ని సందర్భములలోను “ఒకానొక అంశ” అనునదే ఉద్దేశం. ఉదాహరణకు “ఆమె కనులు కలువలవలె తీర్చిదిద్దినట్లు ఉంటాయి”, అని ఒక కవి వర్ణించాడనుకో “అట్లాగా? అయితే మరి ఆ కళ్ళు తటాకంలో తేలియాడుట లేదేమి?” – అని తర్కం చేయటం ఉచితం కాదు కదా!

జీవబ్రహ్మముల స్వరూపం గ్రహించటానికి ఈ శాస్త్రం చేతను, తదితర ఆధ్యాత్మ శాస్త్రముల చేతను అనేక దృష్టాంతములు తీసుకోబడ్డాయి. (ఉదా : మాండూక్యోపనిషత్తు. కప్ప యొక్క నాలుగు కాళ్ళు దృష్టాంతంగా జాగ్రత్ స్వప్న సుషుప్తి, తురీయములు విశదీకరించబడ్డాయి).


Page number:153

అట్టి దృష్టాంతములను, ప్రమాణములను సరైన రీతిలో అర్థం చేసుకుంటే అప్పుడు అఖండాకార చిత్తవృత్తి ఉదయిస్తుంది. మహావాక్యార్థ బోధ వలన ఆత్మ తత్త్వము స్ఫురిస్తుంది. ఆ ‘స్ఫూర్తి’ వలన అజ్ఞానము, దాని కార్యములైయున్న అనేక వికారములు నశిస్తాయి. సర్వ సంకల్పములు, వాటి స్వభావములు గ్రహించబడగా, వాటన్నిటికీ ఆవల ఉన్న "శుద్ధ స్వస్వరూపము” యొక్క అనుభవము మాత్రమే శేషించుచు, ‘నిర్వాణస్థితి’ అనునది సుస్థిరమౌతుంది. అట్టి ఉత్తమ ప్రజ్ఞ దృష్టాంతజ్ఞానము వలననే లభిస్తోంది.

ఓ జనులారా! మీరు ఉపమాన ఉపమేయముల గురించి ఘర్షణ పడకండి. దానివలన సాధించేదేమీ ఉండదు. ఎందుకంటారా? సర్వవేద - వేదాంతముల యొక్క ఋషుల ప్రవచనముల యొక్క సారమైన విషయం ఇది!

"ఓ జీవుడా! నీవు నిత్యమగు బ్రహ్మమువే! బ్రహ్మమునకు వేరుగా జగత్తు లేదు భూత - భవిష్యత్ - వర్తమాన కాలములో ద్రష్టగా, ద్రష్టాతీతుడుగా కూడా ఉన్నది నీవే.”

మనం ఏ యుక్తిని అనుసరించినా ఫరవాలేదు. “తత్వమ్ - సో2హమ్” మొదలైన వాక్యముల అర్థసారమును ఎంతవరకు అనుభవమునకు తెచ్చుకోగలిగాం? ఎంతవరకు ఆశ్రయించాం” అనునదే మనందరికీ ముఖ్యం. అప్పుడే జీవునకు ‘శాంతి’ లభిస్తుంది. శాంతియే పరమశ్రేయస్సు కదా! అట్టి అంతరంగ ప్రశాంతస్థితి విచారణ చేతనే ప్రాప్తిస్తోంది. ఈ మా ప్రయత్నము యొక్క ఉత్తమ లక్ష్యము అదే. ఇందు విచారించబడిన వస్తువు గ్రహించుటకు సర్వజీవులు తగియే ఉన్నారు.

అసలు విషయం వదలి ఒక ఉపమానమో, ప్రమాణమో విమర్శిస్తూ ప్రక్క త్రోవలు పట్టుటచే లాభమేమి ఉంటుంది? ఆహారం లభించినప్పుడు చక్కగా స్వీకరించాలి. అంతేకాని, "ఈ బియ్యం ఎవరి చేనులో, ఎప్పుడు పండాయి? ఆ చేను పొడవు వెడల్పులు ఎట్టివి?” అనునవి ముఖ్యమైన విషయాలు కావు కదా!

26.) ఏకాగ్రదృష్టి

కారణముతో కూడుకొన్న ఉపమానమునకు (i.e. Simile or example), కారణరహితమగు ఉపమేయమునకు (ఆత్మ వస్తువు Absolute self which is the subject matter of the present book) కొంత భేదముండవచ్చు. అయితే కొంత పోలిక కూడా (ఒకానొక లక్షణము దృష్ట్యా) ఉండుటచేతనే అట్టి ఉపమానము, ప్రమాణము (reference) కొనిరాబడినది. గురువు అట్లు ప్రయోగించుటచే శిష్యునియందు సాదృశ జ్ఞానము ఉదయిస్తోంది.


Page number:154

నాయనలారా! వివేకహీనులై భోగములందు ఆసక్తులైయుండు మనుజులకు, రాతియందు పుట్టి పెరిగి, నశించే గోదురుకప్పలకు జ్ఞానుల దృష్టిలో తేడా లేదు. కనుక, వివేక దృష్టితో శాస్త్రములలో చెప్పబడిన దృష్టాంతములను గ్రహించాలి. పాఠకునిలో ఉండే అనుమానాలు నివృత్తంజేసి, బోధ దృఢపరచుటకే గురువులు ప్రమాణాలు చెప్పుచున్నారు. వీటన్నిటి యొక్క లక్ష్యము శాంతియుతమగు పరమ పదము సాధించుటయే కదా! ఆ పని వదలి, “ఈ దృష్టాంతము - ఉపమానములలో మరొక లక్షణము మాటేమిటి? ఆయా ప్రమాణములు మాకు సరిపడవు” - అని పలుకుచూ, చెప్పే విషయాన్ని ప్రక్కత్రోవ పట్టించకుండెదరుగాక. మీరంతా మహా బలవంతులు కావాలి. మేము భగవత్ప్రేరణచే, శుభ-సంకల్పులమై, పరమశాంతిని ప్రసాదించగల మీ స్వస్వరూపముయొక్క ఔన్నత్యం ప్రకటిస్తున్నాం. మా వాక్యములలోని అంతర్లీన సత్యమును వివేక దృష్టితో గ్రహించుటకు సిద్ధంగా ఉండండి.

ఆత్మజ్ఞానం లభించనంతవరకు శాస్త్రోపదేశములను, సౌజన్య స్వభావమును, సాధు సంగములను ఆశ్రయించవలసిందే. పురుషార్థములను సంపాదించవలసిందే. అట్లు ప్రయత్నించుచున్నవాడే క్రమంగా శాస్త్రముల అంతరార్థమును గ్రహించి ఉత్తమ విచారణ పారాయణుడగుచున్నాడు. తద్వారా ఆత్మానుభవమునకు తగిన వాడగు చున్నాడు. అప్పుడు ‘తురీయము’ అను మరొక పేరుచే చెప్పబడుచున్న పరమ శాంతిని పొందుచున్నాడు. ఎవడైతే భావసముద్రమును దాటివేసి శుద్ధ స్వస్వరూపమగు అట్టి తురీయపదమున సుస్థితుడై ఉంటాడో, అతడే సర్వులకు వందనీయుడు. అట్టివాడు గృహస్థుడు కావచ్చు. సన్యాసి కావచ్చు. అతడు సర్వవిధములైన ఐహిక - ఆముష్మిక ఫలములను మాత్రం త్యజించివేసి ఉంటాడు. ఒకానొక నిశ్చలత్వమును సదా అనుభవిస్తూ ఉంటాడు.

ఓ రామచంద్రా! నీ దృష్టి అంతా ఆశయము పైననే నిలిపెదవుగాక. ఉపమాన, ఉపమేయములను నీ మనోపథంలో ఒక్కసారి ధరించు. ఆ రెండింటిలోని ఏకాంశ ధర్మమును సూక్ష్మబుద్ధితో గ్రహించు. మరల తరువాత చెప్పుచూ పోయేది విను.

అర్థమును నాలుకపై ఉంచుకొని ప్రయోజనమేమున్నది? దానిని చిత్తములోనికి ప్రవేశింపచేసినప్పుడే ఉపయోగం. బోధార్థం సదవగాహన రూపము, అనుభవరూపము పొందాలి. అందుకు యుక్తి ఏదైనా ఫరవాలేదు. అయితే, కొందరు చంచల బుద్ధి కలిగియున్నవారు, తాము భ్రమయందు ఉన్నవారై, భ్రమాత్మకమైన దృష్టితో, యుక్తా యుక్తములను చూడలేకపోవటం మేము గమనిస్తున్నాము. వారిని “బోధచంచువులు” అని పిలుస్తారు. వారు ఉత్తమమైన ఆత్మవస్తువు యొక్క స్వభావ స్వరూపములు నోటితో మాట్లాడకలిగినప్పటికీ “పరమాత్మ ఈ సర్వమునకు వేరైనది కాదు” అనునట్టి అనుభవాత్మకమైన భావన కలిగి ఉండలేకపోతున్నారు.


Page number:155

అనుభవమే స్వరూపముగా కలిగినట్టి బ్రహ్మవస్తువు ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు సర్వజీవులయందు ఉండనే ఉన్నది. అట్టి బ్రహ్మమును గ్రహించునప్పుడు అనర్థములైన కల్పనలను అనుసరించేవానికి ఏమి చెప్పగలం? అల్ప పరిశీలనాత్మకుడగు అతడు అనేక అభిమానరూపములగు కుకల్పనలు కలిగి ఉంటున్నాడు. “అహం బ్రహ్మాస్మి’ - ‘తత్త్వమ్.’ నేను బ్రహ్మము అయున్నాను. నీవుకూడా అదే” … అనునట్టి బ్రహ్మ - భావాకారవృత్తికి అనేక దురభిప్రాయములను ఆపాదిస్తూ, బోధను కలుషితం చేయడం మేము అక్కడక్కడ చూస్తున్నాము. మేఘములు ఆకాశమును కప్పివేయుట లేదా? అయితే ఆకాశమునకు లోటేమి ఉంటుంది? అట్లే సత్యమగు బ్రహ్మతత్త్వము సనాతనమై, శుద్ధమై అన్నివేళలందు ప్రకాశించుచునే ఉంది. సరైన సమయంలో, మేఘాలు తొలగునట్లు, విజ్ఞానదృష్టిచే అజ్ఞానం తొలుగగలదు.

27.) అపరోక్షానుభవం

జలములన్నిటికీ సముద్రమే ఉనికి స్థానమైనట్లు ప్రమాణములన్నిటికీ ప్రత్యక్షమే ఆధారం. అనగా ఇప్పుడు ఇక్కడ మనకు లభించేదే ప్రమాణం కాని, ఎప్పుడో - ఎక్కడో - ఏ మరణించిన తరువాతో లభించేది ప్రమాణం కాజాలదు. అయితే ప్రత్యక్ష జ్ఞానములన్నిటిలోను ఉత్తమమైనది “అపరోక్షానుభూతి” అని మనకు ఆత్మజ్ఞులు చెప్పుచున్నారు.

ఈ దృశ్య ప్రపంచంలో అనేక పాంచభూతాత్మికమైన వస్తువులు మనకు కనిపిస్తున్నాయి! అనగా, ఇవన్నీ ప్రత్యక్షమై మన ఈ ఇంద్రియములకు అనుభవమౌతున్నాయి. కాని ‘ఆత్మ’ అనునది ఇంద్రియములనే ప్రకాశింపచేయునది, ప్రవర్తింపచేయునది. పాంచభూతాత్మకమై ఎదురుగా కనబడే వస్తువు కాదు. కనుక, అది ప్రత్యక్షము అని అనలేము.

పోనీ, ‘ఆత్మ’ అనగా, అది ఎప్పుడో ఎక్కడో - ఎప్పటికో లభించేదా? కాదు. అది అనుభవమే స్వరూపముగాగల నీకంటే నాకంటే వేరైనది కాదు. అందుచేత దానిని “పరోక్షము” అని అనుటకు వీలులేదు. అందుచేత దానిని “అపరోక్షానుభవం" అని అంటున్నారు.

అదియే……..,

“జ్ఞాత - జ్ఞానము - జ్ఞాతృత్వము” (”Perceiver - Object - Perception"]

“తెలుసుకొనువాడు - తెలుసుకొనబడునది - తెలుసుకొనుట” [“Knower - Object to be Known - Process of Knowing”] అగుచున్నది.

అనుభవం, ఎరుక, ప్రతిపత్తి (Experience - Knowing - Reflective Existence) అను మూడిటితో కూడుకొన్న సాక్షి చైతన్యమే అపరోక్షానుభవం యొక్క స్వరూపం.


Page number:156

అట్టి సాక్షి చైతన్యమే ఈ జీవుడు. ఆ సాక్షి చైతన్యము “అహం-నేను” అను భావన కలిగియున్నప్పుడు “పురుషుడు” లేక “ప్రమాత” అని అంటున్నాం.

ఆ సాక్షి చైతన్యము ఉపాధి (body) పట్ల వృత్తి కలిగియున్నప్పుడు అట్టి స్థితిని “సంవిత్తు” అని పిలుస్తున్నాం. “శుద్ధ సంవిత్" - అని ప్రయోగించినపుడు మనం శుద్ధ చైతన్యమునే ఉద్దేశిస్తున్నాము.

అట్టి సంవిత్తు పదార్థములపట్ల ‘దృష్టి’ కలిగి ఉన్నప్పుడు అట్టి పదార్థాకర్షణలను లేక దృశ్యాకర్షణలను "విషయములు” అని చెప్పుకుంటున్నాం. ఆ సంవిత్తును “పదార్థ సవితుడు” అని కూడా అంటున్నాం.

అనగా :

1.) సాక్షి చైతన్యము = వృత్తిరహితము, శుద్ధ తత్త్వము అగు ఆత్మ. ఆత్మయే ఈ జీవుని వాస్తవ స్వరూపము.

2.) సాక్షి చైతన్యము + ’నేను’ అనుభావన (అహంభావన) = పురుషుడు, ప్రమాత

3.) సాక్షి చైతన్యము + ‘నేను’ అను భావన + ఉపాధిపట్ల వృత్తి = సంవిత్తు

4.) సాక్షి చైతన్యము + అహంభావన + ఉపాధిపట్ల వృత్తి + ఇంద్రియములకు ప్రాప్తిస్తున్న పదార్థజ్ఞానం = పదార్థ సవితుడు / విషయములు

ప్రతి శాస్త్రములోను కొన్ని సాంకేతిక శబ్దములు ఉన్న విధంగానే, ఈ శాస్త్రంలో కూడా, “శుద్ధ తత్త్వము, సాక్షీ చైతన్యము, పురుషుడు, ప్రమాత, సంవిత్తు, విషయములు, జీవుడు” …. ఇత్యాది శబ్దములు ఉపయోగించబోతున్నాం. ఈ శబ్దముల అర్థముల ముందు ముందు మరికొం వివరించబడతాయి.

28.) చైతన్యము - జగత్తు

ఈ జీవుని వాస్తవ స్వరూపము “శుద్ధచైతన్యమే” అని అనుకొన్నాం కదా.

ఒకే నీరు అనేక తరంగములుగా, సుడులుగా, బుడగలుగా అనేక రూపములు దాల్చుచుండుట గమనించావా? అదేవిధంగా చైతన్యమే సంకల్ప వికల్పాది నానావిధ భ్రాంతులతో జగత్తు రూపమున ప్రతిభాసితమగుచున్నది. అనగా, అద్దంలో ఎదురుగా ఉన్న దృశ్యం ప్రతిభాసం (reflect) అగుచున్నట్లు చైతన్యమునందే సంకల్పమాత్రంగా ఈ దృశ్య జగత్తు స్ఫురిస్తోంది.

అయితే సృష్టికి పూర్వం, సృష్టి సమయంలోను, సృష్టి లయించినప్పుడు కూడా అట్టి చైతన్యమే సత్యమై, నిత్యమైయున్నది. అట్టి చైతన్యము దేనికి కారణముగాని, కార్యముగాని కాకపోయినప్పటికీ, ఈ ‘సృష్టి’ అనబడే లీలను తనయందుతానే ప్రకాశింప చేయుచున్నది.


Page number:157

తన వాస్తవ స్వరూపము శుద్ధ చైతన్యమే అయినప్పటికీ, ఈ జీవుడు తనయందు విచారించని కారణంగా ఒకానొక అజ్ఞానం పొందుచున్నాడు, చూచుచున్నాడు. అట్టి అజ్ఞానం స్వయముగా అసత్యమే అయినప్పటికీ అది జగత్తు రూపముగా సత్యమువలె అనుభవమగుచున్నది.

అవిచారముతో కూడిన ఆత్మ "ప్రకృతి” అనబడే దృశ్యభావనయందు ప్రవేశించి, ఈ జగత్తును సత్యమైనదానివలె స్ఫురింపచేస్తోంది.

చైతన్య రూపుడగు ఈ జీవుడు ఒకానొకప్పుడు ఈ దృశ్యవిషయమై కొంత విచారణ శీలుడగుచున్నాడు. “ఈ దృశ్య వ్యవహారమంతా నాకు ఎక్కడి నుండి, ఎట్లా ప్రాప్తిస్తోంది? ఇంతకీ నేనెవరు?” అను ప్రశ్నలకు వస్తున్నాడు. అప్పుడు ప్రయత్నశీలుడై, విచారించి చూచి అంతా గ్రహించినవాడై జగద్భావమును త్యజించి వేస్తున్నాడు. "పరమ మహత్” రూపమున ప్రకాశించుచున్నాడు.

అయితే, ఒక ముఖ్యమైన విషయం. కెరటం ఉన్నా, లేకున్నా జలము జలమే కదా. అదేవిధంగా ఈ జీవుడు విచారించకపోవుటచే జగద్భావము కలిగియుండి ఉండవచ్చు. లేదా సర్వ సంకుచిత భావములను త్యజించివేసి ఆత్మానందములో తేలియాడవచ్చు. (అనగా జ్ఞానముచే అజ్ఞానము త్యజించినవాడై విచారణ పూర్వకమగు అఖండత్వమును వహించి ఉండవచ్చు). ఏది ఏమైనా, ఈ జీవుని వాస్తవ స్వరూపము సర్వదా శుద్ధచైతన్యమే అయున్నది సుమా!

అందుచేత ఈ జగత్తునందు చైతన్యమే వ్యాహ్యాళి చేయుచున్నది. అదియే భావనా పూర్వకంగా ఈ జగత్తును ఉత్పత్తి చేయుచు స్థితింపచేసి, చివరకు లయింప చేస్తోంది. అది సర్వజగత్తునకు అతీతమైనట్టి తన విలక్షణత్వమును ఏ క్షణమందును కోల్పోవుచుండుట లేదు. దేనినీ పొందుటలేదు, కోల్పోవుట లేదు, తాను జన్మించుట లేదు, క్షయించుట లేదు. ఇందుకు ఒక దృష్టాంతం చెపుతాను. విను. నీవు ఒకానొక భావన పొందావనుకో అప్పుడు ‘నేను రాముడను’ అనే స్ఫురణను కొంచెము మరచి ఆ భావావేశంలో తాదాత్మ్యము చెందవచ్చునేమో. కాని నీవు రాముడివి కానిది ఎప్పుడు? ఆ భావము జనించునప్పుడు, ప్రభావితమగునప్పుడు, తొలగునప్పుడు నీవు అట్లే ఉన్నావు కదా! జీవునికి ప్రాప్తించుచున్న ఈ సృష్టి స్థితి లయములుకూడా అట్టివే.

ఓయీ జీవుడా! నీ స్వస్వరూపము, “స్వ-సత్త-సామాన్య-అనుభవమగు (Self - Existence - Commonality - Experience) శుద్ధ చైతన్యమే కదా! అట్టి శుద్ధ చైతన్యమునకు చావు-పుట్టుకలు ఎక్కడున్నాయి? మరి నీవు దుఃఖించవలసిన పనేమున్నది? “నేను-నీవు, అట్లే ప్రతి ఒక్కరు అమృతతుల్యమగు ఆ అద్వితీయ చైతన్యమే" - అని ఈ మన విచారణ సర్వులకు నిరూపించగలదు.

ఎవరైతే విచారణపరులై ఆత్మను, దాని స్వభావ - స్వరూపములను గ్రహిస్తారో - అట్టివారు, “సర్వ శబ్దములకు, మనస్సునకు అతీతమైయున్న పరబ్రహ్మమునే నేను” - అను అనుభవముతో ప్రకాశించుచున్నారు.


Page number:158

“ఈ ప్రపంచము నానుండి వేరుగా సత్యమైయున్నది కాదు. స్వకీయ కల్పనచే నేనిదంతా ఇట్లు గాంచుచున్నాను ఇదంతా నా ఆత్మస్వరూపమే!” అని తెలియబడుటచే మనస్సు శూన్యమై శాంతిస్తోంది. అట్టి స్థితిలో జ్ఞానేంద్రియములు తమ తమ కార్యక్రమములు నిర్వర్తించుచున్నప్పటికీ “కర్మఫలము” అనునది అతనిని ఏమాత్రం తాకుట లేదు. "ఇది చేశాను. ఇది ఇట్లున్నదేమి?” అనునట్టి కర్తృత్వ అహంకారమును, స్పర్ధను త్యజించివేస్తున్నాడు. మనస్సు శూన్యమైనచోట వాసనల ప్రభావం మాత్రం ఏమి ఉంటుంది? కర్మేంద్రియములు ఆసక్తులను త్యజిస్తాయి. ‘మనస్సు’ అనే యంత్రం కదలాలంటే ‘విషయవాసనలు’ అనే త్రాడు కావాలి. విషయవాసనలు క్షీణించినప్పుడు మనస్సు శాంతించక ఏం చేస్తుంది? అట్టివాడు జీవన్ముక్తుడే అవుతాడు.

జీవన్ముక్తులు కూడా అనేక సందర్భములలో ఇతరులవలెనే కర్మలు నిర్వర్తిస్తున్నారు. అయితే వారికి ఆసక్తికాని, భ్రమలుగాని ఉండవు. అందుచేత వారి ప్రవర్తనచే లోకులకు శుభమే జరుగుతుంది. ఎవనికి దేనిపట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదో అట్టివాడు ఆ కర్మ విషయంలో ’అకర్మపరుడు’ అనియే చెప్పబడుచున్నాడు.

గాలియందు చలనశక్తి అంతర్హితమై ఉంటుంది కదా. అట్లే ఈ జగత్తు కూడా జీవుని యొక్క వాసనలందే సంస్కార రూపమున ఉన్నది. ఆ సంస్కారములే బాహ్యమున భోగములు మొదలైన అనుభవములుగాను, అంతరంగమున అనేక చింతలుగాను వ్యవహరిస్తున్నాయి.

ప్రాణుల కర్మఫల భోగము కొరకే ఈశ్వరునియందు సత్వగుణ ప్రధానమగు వాసన (tendency) ఉదయిస్తోంది. వెనువెంటనే ఆవాసన విశాల దిక్-మండల రూపముగాను, కాలముగాను, బాహ్య అభ్యంతర* పదార్థములుగాను ప్రకాశిస్తోంది. ఆ తరువాత ఆ ఈశ్వరుడే నానావిధములైన మలిన - ఉపాధులతో సంసర్గమును (స్వకీయమైన self made) మాయచే అంగీకరించుచున్నాడు. అట్లు అంగీకరించి, “ఈ దేహములు మొదలైన దృశ్య స్వరూపములే తనయొక్క వాస్తవ స్వరూపము” అను అసత్ భావనమును పొందుచున్నాడు. “నేను జీవుడను” అనునట్టి ప్రమేయత్వమును, పరిమితత్వమును వహించి ఉంటున్నాడు. ఇక ఈ వస్తువుల స్వభావమంటావా ఇదంతా నిజ (own) స్వభావా సంకల్పానుసారమే ప్రకాశించుచున్నది. వాస్తవానికి సర్వాత్ముడే అయి ఉన్నట్టి ఇతడు ఎచ్చట ఏ భావమున విరాజిల్లుతాడో అచ్చట ఆ రూపమునే (ఆ అనుభవమునే) పొందటం జరుగుతోంది.

‘సర్వదర్శి’యగు ఆ పరమాత్మ సర్వ రూపములందు వెలయువాడేకదా. అతడు (జీవభావమును పొందిన ఈశ్వరుడు) ఎట్లు ఎచ్చట సంకల్పిస్తున్నాడో, ఈ దృశ్యము కూడా అట్లే ప్రాప్తించుచున్నది.

బాహ్య పదార్థములు = ఈ దృశ్యములోని పదార్థజాలం. ఈ శరీరం కూడా అట్టి ’జగదృశ్యము’లోని భాగమే.

అభ్యంతర పదార్థములు = మనసు (మనన స్వభావం). బుద్ధి (నిర్ణయాత్మక స్వభావం) చిత్తము (ప్రియము కలిగియుండు స్వభావం). అహంకారము (నేను - నాది అను స్వభావం).


Page number:159

ద్రష్ట ఉంటేనే కదా, దృశ్యము ఉండేది! కనుక ద్రష్టను అనుసరించే దృశ్యముంటోంది. దర్శించువాడు (ఈశ్వరుడు) దర్శనమునకు మునుముందే ఉన్నాడు.

వాస్తవానికి దృశ్యముగాని, దృశ్యత్వముగాని, ద్రష్టత్వముగాని సత్యమైనవి కావు సుమా! ఈ జగత్తులోని పదార్థజాలమంతా సంకల్పమాత్రం చేతనే (స్వకీయ భావన చేతనే) అనుభూతమగుచున్నది. అందుచేతనే “ఈ జగత్తు మిథ్య" అని చెప్పబడుతోంది.

సత్యరూపము, సర్వుల వాస్తవ స్వరూపము అయిన ‘బ్రహ్మము’ సర్వదా కారణ రహితమే అయి ఉన్నది. ప్రత్యక్ష - అనుమానముల ద్వారా విచారించినప్పుడు ఆ అద్వితీయ బ్రహ్మమే సర్వుల వాస్తవ స్వరూపంగా సిద్ధించుచున్నది.

[NOTE: ఏదైనా గ్రహించాలంటే (మీమాంసయందు) రెండు మార్గములు చెప్పబడుచున్నాయి.

  1. ప్రత్యక్షము : Whatever evidence that can be seen, felt etc., physically here and now, to ascertain truth.

  2. అనుమానము : Something that is logically filtered out basing on circumstances / situations “As
    this is like this …. that must have been like that”.]

ఓ సాధూ! మనం తత్త్వవిషయంలో ప్రవేశించేముందు మరొక్కసారి ఒకానొక నగ్నసత్యమును సర్వజనులకు ప్రకటిస్తున్నాను.

స్వయత్నమాత్రే యదుపాసకోయః తద్దెవశబ్దార్థమపాస్య దూరే |
శూరేణ సాధోపదముత్తమం తత్ స్వపౌరుషేణైవహి లభ్యతేంతః || (XIX.34)

ఇతఃపూర్వపు, వర్తమానపు స్వప్రయత్నములకు వేరుగా, ‘దైవము’ అనబడు స్వయం నిర్ణయాధికారంగల వస్తువేదీ ఎచ్చటాలేదు. నీవు ఆ ‘దైవము’ అనబడు శబ్దార్థములను దూరంగా ఉంచి, ప్రయత్నశీలుడవయ్యెదవుగాక! ‘ముముక్షువు’ అయినవాడు తనను ప్రతి రోజు సమీపిస్తున్న అనేక వ్యవహారములను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. తన ఇంద్రియ-మనస్సులు వాటిపట్ల ఆసక్తిపూర్వకంగా ప్రసరించకుండా చూచుకోవాలి. దృష్టిని అపరోక్షమగు ఆత్మ వైపు తరలించాలి. అప్పుడే అతడు ‘శూరుడు’ అని అనిపించుకొంటాడు. అట్టివాడు దైవము అనుదానిని పరిత్యజించి, పౌరుషప్రభావం చేత తన హృదయంలోనే “ఆత్మసాక్షాత్కారం” పొందుచున్నాడు.

స్వీయ బుద్ధిబలంచేత ’బ్రహ్మము’ను సాక్షాత్కరింపచేసుకొనేవరకు ‘స్వప్రయత్నము’ అనుదానిని ఏమాత్రం విడచిపెట్టరాదు. ఒకవైపు ఆయా ఆచార్యులు నియమించినట్టి విధివిధానపూర్వకమైన ప్రార్థన, పూజ, ధ్యానము మొదలైనవి నిర్వర్తించవలసిందే! మరొకవైపు తత్త్వవిషయమై విచారణచేస్తూ ఉండవలసిందే!

✤✤✤


Page number:160

29.) సదాచార నిరూపణ

ముముక్షువైనవాడు మొట్టమొదట సాధువులతో స్నేహంచేసి వారి ఉపదేశములను, ఆ ఉపదేశముల ఉద్దేశమును, అంతర్లీన సారమును సుతీక్షణమైన బుద్ధితో గ్రహించాలి. వారు బోధించే మార్గంలో ప్రయత్నం చేయాలి. అట్టి ప్రయత్నముల వలన బుద్ధి ఇంకా ఇంకా వికసిస్తుంది.
అప్పుడు క్రమంగా అతడు మహాపురుషత్వమును పొందగలడు.

మహాపురుషత్వం సాధించాలనుకుంటే, అట్టి మహాపురుషుల కొరకై వెతకాలి. వారిని గుర్తించి, సమీపించి సేవాదులచే సంతోషపెట్టాలి. అయితే, నీకు కావలసిన మహాపురుష లక్షణాలన్నీ ఒక్కనియందే లభించకపోవచ్చు. ఒకనిలో కొన్ని విశేషములు మాత్రమే ఉండవచ్చు. అంతమాత్రంచేత అతనిని త్యజించరాదు. ఎవనియందు ఎంతవరకు, ఏ ఉత్తమ లక్షణం నీవు గమనిస్తావో, అంతవరకు అతనిచే బోధింపబడి అద్దానిని గ్రహించాలి. క్రమంగా నీ బుద్ధిని సునిశితం చేసుకోవాలి.

ఓ రాఘవా! ‘శమము’ మొదలైన ఉత్తమగుణములతోకూడిన “ప్రజ్ఞ”యే మహా పురుషుల లక్షణమైయున్నది. నీవు కూడా శమము, శాంతమును ఆశ్రయించు. అయితే ‘సమ్యక్’ జ్ఞానం (comprehension that all are equal) లేకపోతే శమాదులు సిద్ధించవు. బాహ్య అంతరంగ ఇంద్రియములను సరైయిన మార్గంలో నియమించి, సత్ప్రవర్తన, సత్సంగమము ఆశ్రయించినప్పుడేఉత్తమజ్ఞానం పొందటానికి ఈ జీవుడు తగినవాడగుచున్నాడు. జ్ఞాన ప్రభావం వృద్ధి చెందుచుండగా, అట్టి సర్వసమత్వ దర్శనము ఉత్తమ సుఖమును ప్రసాదిస్తోంది. జీవుడిని సంసారబంధము నుండి విముక్తునిగా తీర్చిదిద్దుతోంది.

ఆహారం వలన భూతజాలం, ఆ భూతజాలం చేయు పరిశ్రమ వలన ఆహారం వృద్ధి చెందుతూ ఉంటాయి కదా! అదేవిధంగా జ్ఞానము వలన శమ-దమాదులు, శమ-దమాదుల వలన జ్ఞానం వృద్ధిచెందుతూ ఉంటాయి. పద్మము - సరస్సులు పరస్పరం శోభింపచేసుకొనునట్లు జ్ఞాన శమ-దమాదులు ఒకటి మరొకదానిని శోభింప చేసుకొంటున్నాయి. శమదమాదులే సదాచారము యొక్క స్వరూపం. జ్ఞానమున్న చోట సదాచారం కూడా ఉంటుంది.

అందుకే శమ, ప్రజ్ఞాదులలో నిపుణులైన మహాపురుషుల చరిత్రలు చదివి, అందలి ఆదర్శం గ్రహించాలి. అట్లు ఆదర్శం గ్రహించకపోతే వారి చరిత్రలు చదివి ప్రయోజన మేమున్నది? శమ దమములు, సదాచారములవల్లనే జీవితం పవిత్రమౌతోంది.

వత్సా! రామచంద్రా!  “జ్ఞాన సముపార్జన - సదాచారము” (Acquisition of Knowledge & Good Conduct) ఈ రెండింటినీ ఒక్కసారే సమానంగా ఆచరించాలి. “మేము జ్ఞానము సంపాదిస్తున్నాము కదా. ఇక సదాచారంతో మాకు పనేమున్నది?” - అను మాట ఉచితం కాదు. “సదాచారులమగు మాకు జ్ఞాన విచారణతో పనిలేదు" - అనే మాట కూడా సరికాదు. ఈ రెండింటిలో ఒక దానిని నీవు తిరస్కరిస్తే, రెండవది నిన్ను తిరస్కరిస్తుంది.


Page number:161

పొలంలో పాటలు పాడుతూ, చప్పట్లు చరుస్తూ, పక్షులను పారద్రోలే వనితను చూడు. ఆమె పాటలు పాడటం, పక్షులను తరమటం ఒకేసారి చేస్తోంది కదా! ముముక్షువు కూడా జ్ఞాన, సదాచారములు రెండిటినీ ఒకేసారి అనుసరించాలి.

ఈ లౌకిక వ్యవహారములపట్ల కొంత నిస్సంగత్వమును అలవరచుకోవాలి. “శుద్ధచైతన్య స్వరూపుడనైన నేను దేనికీ, కర్తను కాను. కర్తను కాను కనుక భోక్తను కూడా కాదు” అని అంతరంగమునందు ఉద్వేగరహితమైన అకర్తృత్వ భావనను అలవరచుకొన్నవాడు మా ఈ బోధను సులభంగా గ్రహిస్తున్నాడు. భ్రమ - ప్రమాదము (బద్ధకము) మొదలైన విఘ్నములను వినాశనమొనర్చి, ప్రయత్న - పరాక్రమములతో పరమ పదమును అధిరోహించాలి. అదియే ఈ జన్మల కర్మల ఉత్తమ ప్రయోజనమై ఉన్నదని జనులు గ్రహించెదరు గాక!

ఓ సభికులారా! సదాచారము అత్యంత ప్రాముఖ్యమైనదని మాత్రం కొంచెము కూడా మరువవద్దు. ఇక మనం జ్ఞానవిషయ చర్చలోకి ప్రవేశించబోతున్నాం.

ఈ చెప్పబడబోవు మోక్షశాస్త్రం అందరి మనస్సులకు శాంతిని ప్రసాదించుగాక మానవ జీవితములకు, ఆయుష్షులకు అర్థ-పరమార్థములు ప్రసాదించును గాక! ఆప్తులగు జ్ఞానులచే ఇది అనేకులకు బోధింపబడు గాక! శ్రద్ధాసక్తులు గల అనేక ముముక్షువుల హృదయాలను అలరించును గాక! అనేకులు ముందు ముందు దీనిపై వ్యాఖ్యలు వ్రాయపూనెదరు గాక!

మురికినీటిలో చిల్లగింజలు వేసినప్పుడు, అందలి నిర్మలమైన నీరు పైకి లేచి, ఆ నీటిలోని దోషమంతా క్రిందకు జారిపోతుందికదా! ఈ మన విచారణ వినుచున్నవారి చిత్తములను శుద్ధి పరచి వారికి పరమపరాన్ని ప్రసాదించు గాక!

నాయనలారా! మీ మీ సాధనలు మాత్రం విడచిపెట్టకండి. ఎందుకో తెలుసా? సాధన వలన మనస్సులు పరిశుద్ధమొందుచుండగా, ఈ విచారణ అంతఃకరణమునందు ప్రవేశించినప్పుడు, తత్త్వజ్ఞానం జనిస్తుంది.

సాధనలను, వివేకసహితమైన జ్ఞానార్తిని కలిగి ఉండండి. ఉత్సాహవంతులై సర్వదా ఉత్తమ ప్రయత్నమును నిర్వర్తించండి. జడమైన అభిప్రాయములందు, సంగమములందు రాగద్వేషములందు ఇరుకు కొనియున్న మీ మీ మనస్సులను ఉద్ధరించి, “ఆత్మజ్ఞానము” అను మంచినీటి సరస్సు వద్దకు చేర్చండి. బద్ధకము, అశ్రద్ధ ఆశ్రయించారా మిమ్ములను ఆ హరిహరాదులు కూడా కాపాడలేరు. ఇక నేను చేయగలిగినదేముంటుంది?

శ్రద్ధాసక్తులతో ఈ శాస్త్రమును వినండి. అప్పుడు మీరు కోరకపోయినా మీ బుద్ధి పరమపదమున ప్రవేశిస్తుంది. అజ్ఞానం నశించగా, ఇక అట్టి పరమపదము మీ అంతఃకరణమును మరెప్పటికీ వీడజాలదు.


Page number:162

శ్రీ వసిష్ఠ రామ సంవాదం

ముముక్షు వ్యవహార ప్రకరణం సమాప్తం

బ్రహ్మార్పణమస్తు - లోక కళ్యాణమస్తు
ఓం తత్సత్

✤✤✤