[[@YHRK]] [[@Spiritual]]
Gollakalāpam, Kuchipudi Dance Drama, Philosophical Interpretation by YHRK


కూచిపూడి నాట్య వేద ఆత్మయజ్ఞము

గొల్లకలాపము

అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము

అధ్యయన విద్యార్థి , రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (YHRK)


[Chapters 13 to 19 out of total 48]
విషయ సూచిక :


Page: 47

అధ్యాయము-13.) చాతుర్వర్ణ్యాలు

గొల్లభామ : (కొంచము సేపు మౌనం - ఆ తరువాత...) మరల అడుగుచున్నాను కదా అని, ఏమీ అనుకోకండేం! మీరు, నేను, ఈ సభలోకి వేంచేసిన ప్రేక్షక మహాశయులు - మనందరి యొక్క జగత్తులోనికి 'రాక' - జగత్తునుండి తదితరులు ‘పోక’లు ఒక్క తీరైనవే కదా!

మరి?

“మా బ్రాహ్మణుల జన్మలు ప్రత్యేకమైనవి” అని మీరు ప్రకటించటం ఎట్లా యుక్తి యుక్తం?

బ్రాహ్మణుడు : సరే! "అన్ని దేహముల పుట్టుక ఒక్క తీరైనవే!”... అని కాసేపు అనుకుందాం! అదే నిజమైతే “బ్రాహ్మణులు భూసురులు. భూమిపై జన్మించినవారిలో అగ్రజన్ములు”… అని అనేకులు మమ్ములను ఎందుకు గౌరవిస్తున్నారంటావ్? అట్లా పూజించేవారంతా నీకన్నా తెలివి తక్కువ వారని నీ ఉద్దేశ్యమా ఏమిటి? చెప్పు! అసలు నీవేమనుకుంటున్నావో, అది చెప్పు?

గొల్లభామ : “వేష-భాషలు” మాత్రం చేత “మేము బ్రాహ్మణులము. తదితర జనులందరిచే పూజార్హులము" అని తమకు తామే భావించటం దట్టమైన సాంసారిక సంబంధమైన 'అహంకారము' సూచిస్తుందేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకుంటారేమో! శాస్త్రములపై ఉన్న గౌరవం ప్రదర్శించటానికి బ్రాహ్మణులు పూజార్హులుగా అందరూ గౌరవిస్తూ ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకొని "బ్రాహ్మణుల జన్మలుmఅందరిలో ప్రత్యేకమైనవి" అని మీరు అనటం "అద్వితీయం బ్రహ్మమ్" అనే వాక్యార్థానికి సానుకూల్యమా? చెప్పండి!


Page: 48

బ్రాహ్మణుడు : అట్లాగా? బాగానే ఉన్నది. అయితే, ఇప్పుడు మరొక ప్రశ్న వేస్తాను.

“బ్రాహ్మణులు - క్షత్రియులు - వైశ్యులు - శూద్రులు" అనే పేర్లు గల నాలుగు వర్ణాలు ఉన్నాయని అందరూ దైనందికంగా లోకంలో చూస్తూ ఉన్నదే కదా! ఆయా జాతి ధర్మాలు వివరించి చెప్పే ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఆయా ధర్మాలు బోధించే పాఠ్యాంశాలు అందరికీ అనుభవమగుచున్నదే కదా! అందరిచేత ఒప్పుకోబడుచున్న చాతుర్వర్ణ్యాలు నిజమంటావా? అబద్ధమంటావా? చెప్పు!

గొల్లభామ : స్వామీ! దయయుంచి చిరుకోపం తెచ్చుకోండి. ఈ శుభోదయాన ఇక్కడ వేంచేసియున్న ఈ ప్రేక్షకమహాశయుల సమక్షంలో ఆత్మయజ్ఞపూర్వకంగా 'సత్సంగము' మనందరము ఉపాసిస్తున్నాము కదా.

“4 వర్ణములు ఉన్నాయా? లేవా?” అని అడుగుచున్నారు కదా! మీ ప్రశ్నకు మనం ఉత్తమ సమాచారం పరిశీలించటానికి వీలుగా మరొక ప్రశ్న మీ ముందు ఉంచుచున్నాను.

మీరు చెప్పిన బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనబడే చాతుర్వర్ణ్యములు చతుర్ముఖ బ్రహ్మచేత కల్పించబడినవా? లేక, ఆ నాలుగు విభాగములు సృష్టిలో తమకుతామే ఏర్పడినాయా? కాక నియమితమైన గుణ - కర్మలకు సంబంధించిన విభాగమా? శాస్త్రోక్తంగా వివరించి దయచేసి చెప్పండి!

బ్రాహ్మణుడు :

బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్
బాహూ రాజన్యః కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః
పాద్భ్యాం శూద్రో అజాయత ॥ [- పురుషసూక్తం]

చాతుర్వర్ణ్యం మయా సృష్టమ్
గుణకర్మ విభాగశః ॥ [- భగవద్గీత]

ఆయా శాస్త్రీయ వాక్యాలను అనుసరించి విరాడ్రూపుడగు ఆ పరమపురుషుని (లేక) పరమాత్మ యొక్క ముఖము నుండి, భుజముల నుండి, తొడల నుండి, పాదముల నుండి 4 వర్ణములు పుట్టుచున్నాయి. ఈ 4 కాకుండా మరొక వేరైన వర్ణము కల్పించటానికి ఆ చతుర్ముఖ బ్రహ్మకు కూడా అధికారము లేదు.


Page: 49

గొల్లభామ : హే మహనీయా! ఒక తండ్రికి నలుగురు కొడుకులున్నారనుకోండి. ఆ నలుగురిది ఒకే కులం - వంశం - జాతి అవుతుందే కాని, ఆ నలుగురు వేరు-వేరు వర్ణములవారు కారు కదా?

బ్రాహ్మణుడు : అట్లాఎట్లా? మనం చెప్పుకున్న చాతుర్వర్ణ్య విభాగాలు విషయానికి వస్తే ... వారంతా 'ఒకటే' ఎట్లా అవుతారు?

ముఖం చేసే పనులు పాదాలు నిర్వర్తిస్తాయా? పాదాలు చేయవలసినవి తొడలు చేయలేవు కదా? భుజముల ధర్మాలు - పాదముల ధర్మాలు వేరువేరైనవే కదా?

గొల్లభామ : ఒక ఇంటి ప్రహరీలో బాదము విత్తు నాటామనుకోండి. ఆ బాదము విత్తునుండి పుట్టుకొచ్చిన పెద్ద బాదము వృక్షము యొక్క 4 కొమ్మలు ఒక్క తీరైనవే అవుతాయికాని, 'వేరువేరైనవి' అని ఎక్కడైనా, ఎవ్వరైనా అంటారా చెప్పండి?

బ్రాహ్మణుడు : విత్తు ఒక్కటే అవవచ్చు గాక! అయినప్పటికీ కూడా ఒక మహావృక్షము యొక్క వ్రేళ్ళు, మూలము (కాండము), కొమ్మలు, చిగుర్లు, ఆకులు, పూలు, పిందెలు, కాయలు, ఫలములు - ఇవన్నీ ఒక్కతీరుగా ఉంటున్నాయా? మూలము పని కొమ్మలు చేస్తాయా? కొమ్మలపని ఆకులు చేస్తాయా? ఆకులపని పుష్పాలు చేస్తాయా? పుష్పాల పని ఫలాలు చేస్తాయా? వేటి పని వాటివే కదా! అట్లాగే చాతుర్వర్ణ్యాలు కూడా - అని గమనించవచ్చును కదా?

గొల్లభామ : ఆయా వేరువేరు కార్యముల దృష్ట్యా చూస్తే కాండము - కొమ్మలు - ఆకులు - పుష్పములు వేరువేరైనవిగా లౌకిక దృష్టికి కనిపించవచ్చును గాక!


Page: 50

కానీ, అధ్యాత్మ శాస్త్ర ప్రవచనాలను, వేద మహావాక్యాలను గమనిస్తే "జీవులంతా ఏకస్వరూపుడు - అద్వితీయుడు - అఖండుడు - అప్రమేయుడు అయినట్టి ఒకే పరమాత్మ యొక్క ప్రత్యక్షరూపం"... అని తెలియవస్తుంది. పరమాత్మ యొక్క ప్రత్యక్ష లీలా విన్యాసమే (లేక ) వినోదమే అయినట్టి ఈ జీవుల సమూహాలను చూస్తున్నప్పుడు యోగ ఆరూఢుడగు ఒక ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని ఎట్లా చూస్తున్నాడు? సర్వము ఆత్మస్వరూపంగానే కదా! ఆతనికి జాతి-వర్ణ భేదాలు కనిపిస్తాయా? చెప్పండి.

బ్రాహ్మణుడు : ఓ కాంతామణీ! నీవు చెప్పినట్లు ఎవ్వడైతే ఈ ఈ దృశ్య ప్రపంచ వ్యవహారశూన్యుడై కేవలము ఆత్మభావనను మాత్రమే కలిగి ఉంటాడో, అట్టి వాడు 'విదేహి' అని అధ్యాత్మ శాస్త్రంచే విభాగిస్తాం. దేహం లేని వానికి దేనితోనూ పని ఉండదు. దేహమున్నంత వరకు వ్యవహరించటం, వ్యవహారాలు తప్పేవి కావు. ద్వైతము తప్పేది కాదు. అవునా? కాదా?

ఎవ్వరైతే దేహములకు అతీతుడై, తన దృష్టిలో ఈ దేహ విభాగములు లేనివాడై ఉంటాడో... ఇక అట్టివాడు ఈ దృశ్య ప్రపంచంలో ఉండవలసిన పనేముంటుంది?

అందుచేత చాతుర్వర్ణ్యాలు శాస్త్రములచే నిర్దేశించబడియుండగా... నీవు ఇప్పుడు ఏమి చెప్పదలచుకున్నావు?

అధ్యాయము-14.) దైవార్పిత కర్మ

గొల్లభామ : బ్రాహ్మణోత్తమా! ఈ మనస్సు - వాక్కు - కాయము అనబడే మూడు ఉపకరణాలు ఉపయోగించుకుంటూ దైవార్పితంగా సేవాభావంతో కూచిపూడి దేవర శ్రీరామలింగేశ్వర స్వామి కృతంగా పరమాత్మ తత్త్వము ఎరిగి ఈ లోక సంబంధమైన వర్ణాశ్రమ ధర్మ-కర్మలు నిర్వర్తించే విదేహముక్తునికి ఆ కర్మలు చేయటం వలన వచ్చే లోటు ఏమీ ఉండదు కదా?


Page: 51

బ్రాహ్మణుడు : అవును. అది నిజమే. ఒప్పుకుంటాను.

ఎవ్వరైతే
- ఆత్మయందు నిశ్చలత్వము
- సకల ప్రాపంచక కార్యక్రమముల యొక్క తత్త్వరహస్యము తెలుసుకొని,
- వాటి అంతర్లీన గానమైనట్టి ఆత్మానందమును ఆస్వాదిస్తూ
- సర్వవ్యవహారముల పట్ల ఉదాసీనుడై
ఉంటాడో... ఆతడే తత్త్యవేత్త. (ఉదాసీనో - గతవ్యధః - సర్వారంభ పరిత్యాగీ) - ఆతడు విదేహియే !

అయితే....,
ఒకడు తనయొక్క సహజ వ్యక్తిత్వమును ఏమరచకుండానే తాను నటించే నాటకంలోని పాత్రను ఆ పాత్రకు ఉచితంగా నటిస్తూ ఉంటాడు కదా! అంతేకానీ, నాటకంలో నటిస్తూ,“ఈ నాటకంలోని పాత్రకు భార్య అయిన ఈమె నా భార్య కాదు. నా భార్య మా ఇంట్లో నాకోసం ఎదురుచూస్తూ ఉన్నది".....అని ప్రేక్షకులలోని తన మిత్రుడికి అరుస్తూ చెప్పుతాడా? అది రసాభాస కదా? అట్లాగే తత్త్వవేత్త అయినవాడు కూడా ఈ జగన్నాటకంలో ‘జీవుడు’ అనే పాత్రను వహిస్తున్నప్పుడు ఈ జగత్తులో గల కులగోత్రముల తారతమ్యమును అనుసరిస్తూ జీవించక తప్పదు, ఓ తరుణీమణీ!

అధ్యాయము-15.) ఏకో అనేకః

గొల్లభామ : ఓహెూ! అట్లాగా? అట్లా అయితే 'బ్రాహ్మణుడు' అనే శబ్దము - శబ్దార్థము ఎవరికి వర్తిస్తుందో... అది చెప్పండి! జీవుడికా? విదేహికా? పరమాత్మకా?

బ్రాహ్మణుడు : ఇంకెవరికి? ఈ జీవునికే! పరమాత్మకు బ్రాహ్మణ శబ్దం ఎట్లా వర్తిస్తుంది? విదేహి లోకదృశ్యాతీతుడు కదా!

గొల్లభామ : (నవ్వుతూ) జీవునికా? ఈ జీవునకు “నేను జీవుడిని. జీవితము అనే చట్రమునకు పరిమితుడను"... అని అనుకున్నంత వరకు బ్రహ్మత్వము - బ్రాహ్మణత్వము ఎట్లా సిద్ధిస్తాయి, చెప్పండి?


Page: 52

జీవుడు అని అనగా - “జీవించువాడు. దేహములు - దేహపరంపరలు పొందువాడు" అని కదా, ఉద్దేశ్యం? "నేను అనేక జన్మలు పొందేవాడిని” అని భావించటం కొనసాగించేవాడు బ్రహ్మత్వమును ఎట్లా సిద్ధింపజేసుకోగలుగుతాడు?

బ్రహ్మత్వము ఎప్పుడు సిద్ధించినట్లు? వినండి!

శ్లో॥
మృత్పిండమేకమ్ ... బహుభాండ రూపమ్।
సువర్ణమేకమ్ ... బహుభూషణాఢ్యమ్।
గోక్షీరమేకమ్ ... బహువర్ణధేనుమ్।
శరీరభిన్నమ్ ... పరమాత్మం ఏకమ్।

⁠ మృత్పిండమేకం :- కుండలు అనేక ఆకారాలు కావచ్చుగాక! కానీ, అవన్నీ కార్యరూపాలు. కారణరూపమగు మట్టి (Origin) ఒక్కటే!

కుమ్మరి మన్ను తొక్కి, పదును చేసి 'కులాల చక్రం’ సహాయంతో వేరువేరు ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని అనేకరూపాలైన కుండలు - కూజాలు - మూకుళ్ళు - ప్రమిదలు తయారు చేస్తున్నాడు.

అయితే మాత్రం ఏం? కులాల చక్రము ఒక్కటే. మట్టి కూడా ఒక్కటే.

ఆయా మట్టి పాత్రలకు ఆకారాలు ప్రక్కకు పెట్టి చూశామా... అంతా మట్టియే!

⁠ “మృత్తికేవ సత్యం”! పరమాత్మ - అనేక జీవులు ఇట్టిదే!

⁠ సువర్ణమేకం :- కార్య రూపమైన ఆభరణాలు అనేక ఆకారాలు కలిగి ఉండవచ్చుగాక!

స్వర్ణకారుడు (goldsmith) జనుల అంగముల తీరు, అభిప్రాయములు, అభిరుచులను అనుసరించి అనేక ఆకారాలలో ఆభరణాలు
తయారుచేస్తున్నాడు.


Page: 53

⁠ సృష్టికి మూలం పరమాత్మ. పరమాత్మ బంగారము వంటివాడైతే జీవులంతా బంగారు ఆభరణములవంటివారు.

⁠ గోక్షీరమేకం : కుండలో గల పాలంతా ఒక్కటే!

మా గొల్ల గ్రామ స్త్రీలము కుండనిండా పాలు నింపుకొని పురవీధులలో అమ్ముకుంటున్నాము. కుండలోని పాలు కలసిపోయి తెల్లగా ఉంటాయి. కానీ, ఆ పాలు అనేక ఆవులు ఇచ్చినవి కదా! ఆవులలో కొన్ని తెలుపువి. కొన్ని నల్లవి. కొన్ని గోధుమరంగువి. కొన్ని ఎఱ్ఱవి. పాలలో ఆ భేదం చూడగలమా? కనిపిస్తుందా? ఆ పాల విభాగం తెల్లగోవులిచ్చాయి. ఈ పాల విభాగము నల్ల ఆవులవి” - అని విభేదించగలమా?

అదే విధంగా......
ఈ భౌతిక దేహాలన్నీ రంగు - లింగ - జాతి - నామ - రూప ఇత్యాది భేదాలు ఉండవచ్చు గాక. ఈ ప్రేక్షక మహాశయులలో ఒకొక్కరు ఒకొక్క విధంగా మన కళ్ళకు వేరువేరు వస్త్రధారులై కనిపిస్తూన్నారు కదా! వీరంతా వివిధములైన సన్న - లావు - పొట్టి అంగసౌష్టవాలతో మనం చూస్తూ ఉండవచ్చు గాక!

మనందరి భౌతిక దేహాలను ప్రకాశింపజేస్తున్న ప్రత్యగాత్మ మాత్రం ఒక్కటే! ఏకో-అనేకః. అట్టి అభేద తత్త్వమై సర్వ దేహాలలో సమంగా ప్రకాశిస్తూ - సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ - అని చెప్పబడుచూ, మనచే శ్రీరామలింగేశ్వర స్వామిగా ఉపాసించబడుచున్న సర్వాంతర్యామికి నామ రూప భేదాలు, చాతుర్వర్థ్యాలు ఎట్లా ఆపాదిస్తాం, చెప్పండి?


Page: 54

అది అజ్ఞానపూరితమైన సాంసారిక దృష్టి - దోషదృష్టి మాత్రమే కదా!

ఇక శాస్త్రజ్ఞానం కలవారు - లేనివారు, బ్రహ్మజ్ఞానం కలవారు - లేనివారు ... ఈ భేదమేమిటంటారా?

ఆకాశంలో ప్రకాశించే సూర్యబింబము సర్వదా ఒక్కటే అయిఉండి కూడా, ఆ సూర్య బింబము అనేక చోట్ల ప్రతిబింబిస్తూ ఉంటుంది కదా!

అట్టి సూర్య బింబము మలిన జలంలో ప్రతిబింబిస్తే మలినముగాను, నిర్మల జలంలో ప్రతిబింబిస్తున్నప్పుడు నిర్మలముగాను అగుచున్నదని అనగలమా? అవన్నీ ప్రతిబింబ కల్పితములు మాత్రమే కదా!

ఆ సూర్యబింబము మట్టి కుండలోని నీళ్ళలలో ప్రతిబింబిస్తుంటే మట్టి రంగుగాను, బంగారపు భాండములోని నీటిలో ప్రతిబింబిస్తున్నప్పుడు బంగారపు రంగును పొందుచున్నదనటం భ్రమచే ఆపాదించడం (Illusionary Attribution) వంటిది మాత్రమే కదా!

ఈ విధంగా సూర్య బింబము ఎక్కడ ఏ విధంగా ప్రతిబింబిస్తున్నప్పటికీ, అట్టి ‘ప్రతిబింబించటము' అనే కార్యమునకు “సూర్యబింబము కర్త" - అని అనలేం! అనగా, సూర్యబింబము యొక్క కర్తృత్వమే లేదు, సర్వదా సర్వమునకు సూర్యబింబము అప్రమేయమే.

అట్లాగే, పరమాత్మ మనందరి దేహ - మనో - బుద్ధులలో రకరకాలుగా ప్రతిబింబిస్తూ కూడా, సర్వదేహములకు - గుణములకు పరమై, సర్వ దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాల రూపంగా అకర్తృత్వముతో కూడి ప్రకాశిస్తున్నారు.

వింటున్నారా మహనీయా! విప్రోత్తమా! వేరువేరు ప్రతిబింబములకు ఘటభేదం - స్థలభేదం భౌతికమైన దృష్టులకు కనబడవచ్చుగాక! బింబమునకు ఏమి సంబంధము?

ఇంకా చెప్పుకోవాలంటే....,

అధ్యాయము-16.) జలంలో ఆకాశము ప్రతిబింబించటము

ఒకానొక జలంలో చంద్రుడు నక్షత్రాలు ప్రతిబింబిస్తున్నాయనుకోండి!


Page: 55

చల్లటి గాలి కదలికల కారణంగా జలంలో తరంగాలుగా కదులుచున్నప్పుడు జలంలో ఆకాశము, నక్షత్రాలు వగైరా కదలుచున్నట్లే కనిపిస్తాయి.

"ఈ జలంలో ఆకాశము - నక్షత్రాలు - చంద్రబింబము ఉన్నాయి! ఉండి కదలుచున్నాయి!" .... అని ఎవ్వరైనా సిద్ధాంతీకరిస్తారా? ఒకవేళ అట్టి అభిప్రాయం వెలిబుచ్చితే అది భ్రమయే కదా!

పోనీ, ప్రతిబింబాంశము కర్తయా? జలంలో ప్రతిబింబించే ఆకాశాంతర్గత దృశ్యానికి 'కదలటము' అనే కర్తృత్వమే ఆపాదించలేము.

పైనున్న ఆకాశము కర్తయా? జలంలోని ప్రతిబింబపు కదలికలకు పైనున్న ఆకాశమే 'కర్త' - అని కూడా అనలేము.

అట్లాగే, “దేహత్వమునకు - జీవత్వమునకు బింబరూపమగు ఆత్మయే కర్త” అని కూడా అనలేము.

"ప్రతిబింబరూపమగు జీవుడే జీవదేహత్వభావనలకు కర్త” అనీ అనలేము. అట్టి ఈ దేహములలో “కొన్ని బ్రాహ్మణదేహములు - మరికొన్ని క్షత్రియదేహములు - ఇంకొన్ని వైశ్యదేహములు - వేరేకొన్నేమో శూద్రదేహములు”... అనుదానికి సంబంధించిన కర్తృత్వమును (సూర్యబింబమునకు ఆపాదించలేనట్లే) బ్రహ్మమునకు ఆపాదించలేము! (ప్రతిబింబించటానికి కర్మత్వమును జల - తరంగాలకు ఆపాదించలేనట్లే) దేహములకు అట్లా అని, ఆపాదించలేము.

బ్రాహ్మణుడు : అట్లాగైతే, భామామణీ! “సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ” అని కదా వేదాంత మహావాక్య సూక్తి! సర్వములో దేహములు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ దేహములు 'బ్రహ్మము' అనే రసముతో నిండినవై, బ్రహ్మనిర్మితములే అయి ఉన్నాయని కదా, బ్రహ్మసూత్ర వాక్యాలు చెప్పుచున్నది! అయినప్పుడు ‘దేహములకు బ్రహ్మత్వము లేదు' అని నీవు ఎట్లాఅనగలవు?

అధ్యాయము-17.) సూక్ష్మ దేహనిర్మాణము మరియు జడ-చేతనములు

గొల్లభామ : "బ్రహ్మము దేహములుగా అగుచున్నది" అనిగాని, "ఈ శరీరములు గాని, లేక వాటిలో కొన్ని మాత్రమే బ్రహ్మము"... అనిగాని, అనటం కుదిరేది కాదు స్వామీ!


Page: 56

అన్నమయాత్ అన్నమయమ్! అథవా, చైతన్యమయాత్ చైతన్యమేవ!

... అని శాస్త్రవాక్యం. ఈ వాక్య ప్రమాణమును అనుసరించి "ఈ దేహమే బ్రహ్మము” అనేది నిర్ణయమాత్మకమైన వాక్యము కాజాలదు.

కనుక, “ఈ దేహము యొక్క పుట్టుకచేత మేము బ్రాహ్మణులము అగుచున్నాము. బ్రహ్మరూపులము! మరికొందరు దేహధారులేమో బ్రహ్మరూపులు కాదు!” అనునది ప్రమాణ వాక్యం అవదు.

స్వామీ!
“తల్లిదండ్రుల శరీరాలు” అనే కారణము చేత “కుమారుని శరీరము” అనే కార్యము ప్రకృతిపరమై సిద్ధిస్తోంది.

అంతేకాకుండా,

⁠ పంచ భూతములు : పృథివి + ఆపః + తేజస్సు + వాయువు (ప్రసరణ శక్తి) + ఆకాశము ... అనబడే పంచభూతముల సమన్వయమే ఈ భౌతిక దేహమునకు 'కారణము'. ఈ భౌతిక దేహమేమో - 'కార్యము'గా కనబడుచున్నది.

⁠ పంచ ప్రాణాలు : ప్రాణము + అపానము + వ్యానము + ఉదానము + సమానము ... అనబడే పంచప్రాణాలు ఈ దేహమునకు ఇంధన రూపశక్తిగా కారణమగుచున్నాయి.

⁠ పంచ ఉపవాయువులు : నాగ + కర్మ + కృకర + ధనంజయ + దేవదత్త

⁠ పంచ జ్ఞానేంద్రియాలు : చెవులు + చర్మము + కళ్ళు + నాలుక + ముక్కు

⁠ పంచ జ్ఞాన ఇంద్రియార్థములు : శబ్దము + స్పర్శ + రూప + రస + గంధము

⁠ పంచ కర్మేంద్రియాలు : వాక్ + పాణి (చేతులు) + పాదములు + పాయువు + ఉపస్థ

⁠ పంచ కర్మేంద్రియ విషయములు : వచనము + దానము + గమనము + ఆనందము + విసర్జనము


Page: 57

⁠ మనోచతుష్టయం (అంతరంగ చతుష్టయం) : మనస్సు + బుద్ధి + చిత్తము + అహంకారము

⁠ అరిషట్ వర్గములు : కామము + క్రోధము + లోభము + మోహము + మదము + మాత్సర్యము

⁠ త్రిగుణములు : సత్వము + రజము + తమము

... ఇవన్నీ కలిపి 'సూక్ష్మశరీరము' అని అంటూ ఉంటారు.

వీటన్నిటితో కూడిన మనస్సు 10 ఇంద్రియముల ద్వారా ఇంద్రియ వ్యాపారముల ద్వారా దృశ్యములో సంచారం చేస్తూ ఉన్నది. సంకల్ప - వికల్పములు అనే రెండు చేతులచే మనస్సు చలింపజేయబడుతోంది.

విజ్ఞులు పరిశీలించి చూడగా, ... “ఇవన్నీ కూడా స్వయం చేతనములు కావు. అనగా, వాటికి స్వయంగా ఉనికి - కర్తృత్వములు లేవు. జడములే! వీటన్నిటినీ చలింపజేసేది ఆత్మ!” అని గమనించబడుతోంది. చెప్పబడుతోంది. వీటన్నిటి కలగలపుగా తయారై కనిపించే దేహాలన్నీ ఒక్కతీరైనవే కదా? మహాశయా!

దేహము సకారణము, జడము. బ్రహ్మము కార్యకారణ రహితము.

బ్రాహ్మణుడు : ఏది ఏమైతేనేం! నీ మాటలు నాకు ఎంతో వేడుకను కలుగజేస్తున్నాయమ్మా! చక్కటి పరిశీలనాత్మకమైన శాస్త్ర విశేషములతో కూడిన వివేచన నీ మధురవాక్కుల నుండి వెలువడుతోంది. నీవు మాట్లాడుతుంటే, నాకు - ఈ సభకు వేంచేసిన పెద్దలకు పిన్నలకు సంతోషము కలుగుతోంది.

పంచభూతములు - పంచప్రాణములు - ఉపవాయువులు - జ్ఞానేంద్రియాలు - కర్మేంద్రియములు - వాటి వాటి విషయాలు - అంతరంగ చతుష్టయము - అరిషట్ వర్గాలు - త్రిగుణములు - ఇవన్నీ చెప్పుతూ “అవన్నీ జడము” అని, “అద్వితీయ ఆత్మ మాత్రమే చైతన్యము" అని నీవు అభివర్ణించటం అధ్యాత్మ శాస్త్ర సమ్మతమైన విషయమే! చాలా బాగా వున్నది.


Page: 58

అయితే, 'పంచకోశములు' గురించి కూడా నీ తియ్యటి మాటల ద్వారా వినాలని మాకందరికీ చెవులు ఉవ్విళ్లూరుతున్నాయి.

పంచకోశములు అనగా ఏమిటి? అవి చైతన్య స్వరూపములా? జడములా? ఏదీ, శాస్త్రానుకూలమైన అభిప్రాయం ఏమిటో కూడా వివరించు.

అధ్యాయము-18.) పంచకోశములు - జడమే!

గొల్లభామ : మహాత్మా! మీరేమో వేద-వేదాంగ-వేదాంతవేత్తలు, యజ్ఞకోవిదులు. ఇక నేనో? స్వల్పజ్ఞురాలను. మీ వంటి కొందరు పెద్దలు చెప్పుచుండగా కొన్ని కొన్ని అధ్యాత్మశాస్త్ర విషయాలు విని, కించిత్ యోచనచేస్తూ ఉన్నదానిని.

అయినా,
"కథయామి అహమ్ అజ్ఞోఽపి! కో లంఘయతి సద్వచః?"
"కః సమర్థః సమర్ధోఽపి సతాం లంఘయతుం వచః?"
... అని మహనీయవాక్యం కదా!

మీవంటి మహనీయుల ఆజ్ఞను అజ్ఞానిని అయినప్పటికీ ఉల్లంఘించలేను. కనుక, తెలిసినంత వరకు చెపుతాను. వినండి!

‘జీవుడు’ అనగా ఏమి? మన భౌతికమైన కళ్ళకు ఈ రక్తమాంసమయమైన ఇంద్రియములతో అలంకరించబడిన ఈ భౌతిక దేహము కనిపిస్తోంది కదా! ఇది వాస్తవానికి జడమైనది.

జడము : (Literally speaking, it is passive voice) తనకు తానుగా కదలనిది. ఉదాహరణకు, కదిలే దేహమును కదలించేది వేరుగా ఉన్నది. కదిలించబడేది కాబట్టి ఈ దేహము జడము.

చైతన్యము : (Literally speaking, Active Voice) జడమైన దానిని కదిలించేది వేరుగా ఉన్నప్పుడు, ఆ 'కదిలించునది' అనునది 'చైతన్యము'. అది కాలమునకు అతీతము - సాక్షి కూడా!

ఇప్పుడు మనం పంచకోశముల గురించి,“వాటిలో ప్రతి ఒక్కటీ జడమా (Literally passive)? చైతన్యమా (Literally Active)?”... అను ప్రశ్నకు సమాధాన పూర్వకంగా మీరు అడిగిన విధంగా నాకు తెలిసినది చెప్పుచున్నాను.

ఓ విప్రోత్తమా! ఓ సభాలంకారులారా! నాపై దయతో వినండి.


Page: 59

ఒకడు బ్రాహ్మణుడు కావచ్చు. శూద్రుడు కావచ్చు. మరొకడు కావచ్చు. ప్రతి జీవుని '5' ఆవరణలు" అనే పొరలవంటివి వస్త్రముపై వస్త్రమువలె ఆవరించినవై ఉన్నాయి.

అనగా,
స్వతఃగా, సహజంగా ఆత్మ చైతన్య స్వరూపుడగు ఈ జీవుని వాస్తవ స్వరూపము అజ్ఞానదృష్టికి ఐదు ఆవరణలచే కప్పబడినట్లు అనుభూతమవటం మాయా చమత్కారంగా జరుగుతోంది.

శాస్త్రములు ఆ ఆవరణలను (1) అన్నమయ కోశము, (2) ప్రాణమయ కోశము, (3) మనోమయ కోశము, (4) విజ్ఞానమయ కోశము, (5) ఆనందమయ కోశముగా అభివర్ణించటం జరుగుతోంది.

(1) అన్నమయ కోశము (Zone of Matter) :

స్వామీ!

పితృభుక్తాన్నజాద్వీర్యాత్ జాతో అన్నేనైవ వర్ధంతే ।
దేహస్యాత్ 'అన్నమయో’ న ఆత్మా ప్రాక్-పశ్చాత్ తత్ అభావతః ॥

స్త్రీ పురుషులు భుజించే యవ - వీహ్య (వరి, గోధుమ వంటి ధాన్యములు - పెసర, మినుము వంటి అపరములు) మొదలైనవి భుజించటం చేత ఆ పదార్థముల సార విశేషంగా దేహములలో 'వీర్యము' జనిస్తోంది.

అటువంటి వీర్యము నుండి తయారైన ఈ దేహము మరల ఆ అన్నము మొదలైనవి భుజించటం చేత వృద్ధి పొందుతోంది. 'అన్నము'తో తయారౌతోంది కాబట్టి ఈ భౌతిక దేహమును 'అన్నమయ కోశము' అని అంటున్నాము. ఇది ఆత్మదేవుని అలంకారంగా ఆవరించి ఉన్న స్థూల రూపము.

ఈ భౌతిక దేహము అనేక సరంజామాలతో ఇంద్రియ - ఉపకరణములతో 'యంత్రము' వలె ప్రవర్తిస్తోంది. తన యందు ఆయుర్వేద శాస్త్రానుసారంగా అనేక విశేషములను ఇముడ్చుకొని భిన్నాభిన్న వ్యవహారములకు ఉపయుక్తమయ్యే యంత్రపు బొమ్మలాగా వర్తిస్తోంది.


Page: 60

అయితే...,
ఈ భౌతిక దేహము 'బ్రహ్మము - బ్రహ్మచైతన్యము' అని అనిపించుకోజాలదు. అనగా, జీవుని యొక్క జడ రూపమే ఈ దేహము కాని, ఆత్మ రూపము కాదు. సహజ రూపము కాదు. మహా అయితే, ఈ దేహము సందర్భరూపము మాత్రమే!

బ్రాహ్మణుడు : ఎందుచేత?

గొల్లభామ : ఎందుచేతనో,.... వినండి!

⁠ బ్రహ్మము - బ్రహ్మము త్రికాల అబాధ్యము. భూత వర్తమాన భవిష్యత్తులలో ఏకరూపము. కాలః కాలము. కాలమును తన క్రీడకొరకై నిర్మించుకొనేదే కానీ, ... కాలబద్ధము కాదు. కాలమునకు సాక్షియే గానీ, కాలాంతర్గతము కాదు. కాలమునకు అప్రమేయము. అకారణము కూడా!

మరి ఈ అన్నమయకోశము భౌతిక దేహమో? ఇది కాల బద్ధము. కార్య-కారణ సహితము. అనగా, 'దేహము' అనబడే ఇయ్యది ఒక కాలములో 'అన్నము' అను కారణముచే ఉత్పత్తి అయి మరల మరొక కాలంలో నశించబోవుచున్నది.

ఒకప్పుడు రూపుదిద్దుకొని - మరొకప్పుడు రూపు మాసిపోయేది.

అందుచేత ఈ అన్నమయ కోశము 'బ్రహ్మము' అను శబ్దముకు అర్హమైనది కాదు. దేహము కదల్చబడునది. దేహము వేరు, దేహి వేరు. దేహి దీనిని కదలుస్తూ ఉపయోగిస్తున్నాడు. కనుక, 'అన్నమయ కోశము' అనునది 'జడమే!' అని ఆర్య వచనం కదా స్వామీ!

బ్రాహ్మణుడు : అవును. నీవు అన్నది ఆర్యవచనమే! యుక్తి యుక్తమే! శాస్త్ర సిద్ధాంతానుకూలమే! ఆత్మజ్ఞుల యొక్క స్వానుభవమే!

ఇంకా చెప్పు! ప్రాణమయకోశం గురించి విశేషాలేమిటి! ప్రాణము జడమా? చైతన్యమా?


Page: 61

(2) ప్రాణమయకోశము (Zone of Energy):

గొల్లభామ :

పూర్ణో దేహబలో యశ్చ యక్షణాద్యః ప్రవర్తతే ।
వాయుః ప్రాణమయో నా సావనాత్మా పతస్య వర్ధనాత్ ॥

ప్రాణము అనునది శక్తి రూపము. అట్టి ప్రాణశక్తి ప్రతి ప్రాణి యొక్క శరీరములోను - అరికాలి నుండి శిరస్సు వరకు అణువణువు - వ్యాపించియే ఉన్నది.

అయితే.....,

'శక్తి' అనునది ఎవ్వరిదో .... అట్టి ఆత్మస్వరూపుడగు జీవునికి సంబంధించి కర్తృత్వము - అనుభవములు ఉంటాయి. అంతేగానీ 'శక్తి'కి స్వతఃగా క్రియ - అనుభవాలు ఉండవు కదా!

దృష్టాంతానికి ...,
'కదలిక' అనేది జడము - 'కదలించువాడు' చైతన్య స్వరూపుడు కదా!

ప్రాణమయ కోశము ఒకానొక పరికరము వంటిది. ఆ ప్రాణమునకు ఈశ్వరుడే ఈ జీవుడు. అనగా “జీవుని యొక్క స్వతః (లేక) సహజ స్వరూపం దృష్ట్యా ప్రాణేశ్వరుడు”... అని చెప్పబడుచున్నాడు.

కనుక,
ప్రాణమయ కోశము జడమే! ప్రాణేశ్వరుడో.... 'బ్రహ్మము' (లేక) ‘బ్రహ్మస్వరూపుడు'.

(Energy by itself is Passive Voice. One who owns or exhibits energy is Active Voice)

బ్రాహ్మణుడు : బాగున్నది. ఒప్పుకుంటున్నాను. ఓ విజ్ఞానీమణీ! మనస్సు విషయమేమిటి? మనోమయ కోశము గురించి చెప్పు! అది జడమా? చైతన్యమా? బ్రహ్మమేనా? కాదా? "నేతి" అంటావా?


Page: 62

(3) మనోమయ కోశము (Zone of Thought & Feeling):

గొల్లభామ : స్వామీ! “ఏదైతే స్వతఃగా ప్రవర్తింపజాలక, మరొక దానికి ఉపకరణము మాత్రమే అయిఉన్నదో ... అద్దానిని 'జడము’ అంటాము” ... అనే వేదాంత సిద్ధాంతాన్ని మరొక్కసారి మీ ముందు మననం చేస్తూ ... ఇప్పుడు మనోమయ కోశము గురించి చెప్పుచున్నాను. వినండి.

‘ఆలోచన’ జడము :: "ఆలోచించువాడు" చైతన్యము.

శ్లో ॥
అహం మమాఽయం దేహః దేహాదౌ చ కరోతియః ।
కామాది అవస్థాయా భ్రాంతో నా సావాత్ ఆత్మా మనోమయః ॥

మనస్సు అనగా ఆలోచనా రూపం. ఆలోచన అనునది దృశ్య వ్యవహారమునకు సంబంధమై ఉంటోంది.

⁠ మనోరూపం :- “ఈ దేహమే నేను. ఇది నాది. నాకు చెందినది. ఇల్లు నాది. వీళ్ళంతా నా వారు” అనే దృష్టులతో కూడిన యోచనా సమూహములు.

అయితే....,
'ఆలోచన’... అనేది ఆలోచించువాని చేతనే ఉనికి పొందుతోంది కదా! ‘ఆలోవించువాడు’ లేకుండా 'ఆలోచన' అనేది ఎక్కడా ఉండదు.

కనుక,

"దర్పణంలో కనిపించే దృశ్యము దర్పణముచే కల్పించబడినది" అనగలమా? దర్పణమునకు “అది చూపుతోంది” అనే కర్తృత్వము ఆపాదించగలమా? లేదు కదా!

అట్లాగే, మనో దర్పణానికి కూడా "ఇది ఆలోచిస్తాను! అది ఆలోచించను” అనే రూపమైన కర్తృత్వము లేదు.


Page: 63

పైగా....
ఈ మనస్సు కాలబద్ధమైనది. త్రికాలములచే “అభాద్యము” కానే కాదు. ఎందుకంటే, ఇది జాగ్రత్తులోను - స్వప్నములోను వేరువేరైన రీతిగా ప్రకటితం అగుచూ, సుషుప్తిలో శూన్యమై ఉంటోంది.

మనస్సు వల్లనే జీవులకు “అహమ్” ... అనునది రూపుదిద్దుకున్నదై ఉంటోంది.

బ్రాహ్మణుడు : 'మనస్సు' అనబడేదాని యొక్క వాస్తవమైన రూపమేమిటి?

గొల్లభామ : జీవుని యొక్క భావ పరంపరల రూపమే 'మనస్సు’ అనే శబ్దంచే ఉద్దేశ్యించబడుతోంది. అంతకు మించి మనస్సు - అనబడే దానికి రూపము లేదు. స్వతఃసిద్ధమైన ఉనికి లేదు. స్వతఃగా ఉనికి లేనిది 'బ్రహ్మము' ఎట్లా అవుతుంది?

కనుక, “నేతి” అనే సిద్ధాంతపరంగా విచారణ చేస్తే మనోమయ కోశము బ్రహ్మము కాదు.

బ్రాహ్మణుడు: ఆహా! ఓ గొల్లభామా! నీవు చెప్పే వివరణ - సమీక్షలు నాకు ఎంతో సంతోషమును కలుగజేస్తున్నాయి. మరి ఇక “విజ్ఞానమయ కోశము” గురించి చెప్పు, లలనామణీ!

(4) విజ్ఞానమయ కోశము (Zone of Awareness & Discrimination) :

గొల్లభామ :

శ్లో॥ లీనాసుప్తౌవపుర్బోధే వ్యాప్నుయాత్ నఖాగ్రగా ।
చిత్ ఛాయోపేతధీః న ఆత్మా విజ్ఞానమయ శబ్దభాక్ ॥

ఆలోచనలకు ఆవల "ఏది ఆలోచించాలి? ఏది ఎట్లా ఆలోచించాలి? ఏది ఆలోచించవద్దు?” ... అని విచక్షణ - నిర్ణయము (Discrimination) చేస్తున్న విభాగమున్నది. అద్దానిని 'బుద్ధి' అని శాస్త్రములు పేరు పెట్టాయి. అట్టి 'బుద్ధి' అను ఆవరణచే నిర్మితమైనదే విజ్ఞానమయ కోశము.

అట్టి 'బుద్ధి’ ఒక సమయంలో కొన్ని విషయాలను, వేరు సమయంలో వేరు విషయాలను యోచించటము, మననం చేయటము, అర్థము చేసుకోవటము జరుగుతోంది. దీనినే 'బుద్ధి చాంచల్యము' అని అంటారు.

చిత్ యొక్క కించిత్ ఆభాసచే బుద్ధి చలనత్వం (Motion) పొందుతోంది.


Page: 64

అందుచేత బుద్ధిని చైతన్యము యొక్క ఒకానొక చిత్ కళగా విజ్ఞులు అభివర్ణిస్తున్నారు.

"ఒక విషయము ఒక రీతిగా అర్థము చేసుకోబడుతోంది" అనునదే ಬುದ್ಧಿ యొక్క రూపము.

అర్థం చేసుకోబడటం (Interpretation) వేరు,
అర్థం చేసుకొనువాడు (one who is interpreting) వేరు కదా!

'అర్థం చేసుకొనువాడు' లేకపోతే "అర్థం చేసుకోవటం" అనేది ఎక్కడుంటుంది?

కనుక,

ఈ బుద్ధి జాగ్రత్‌లో శరీరంలో అంతరముగా నఖ-శిఖ పర్యంతరము (కాలి గోరు నుండి - శిరస్సుపై పిలక ఉండే స్థానము వరకు) వ్యానవాయువుతో కూడినదై ఉంటోంది.

అంతే కాదు, మనస్సులాగానే బుద్ధికూడా జాగ్రత్తులో ఒక రీతిగా, స్వప్న సమయంలో మరొక రీతిగా ఉంటూ,... సుషుప్తి సమయంలో రూపము లేనిదై ఉంటోంది. అనగా, బుద్ధి కూడా మనస్సులాగనే 'త్రికాలాబాధ్యము' కాదు.

అందుచేత, బుద్ధితో నిర్మితమైన విజ్ఞానమయ కోశము బ్రహ్మము కాదు!

(5) ఆనందమయ కోశము (Zone of Pleasure and Enjoying):

బ్రాహ్మణుడు : మరి పంచోశములలో ఐదవ కోశమైనట్టి ఆనందమయ కోశమో? అది కూడా జడమేనంటావా? బ్రహ్మము కాదంటావా? నారీమణీ!

గొల్లభామ : మనం చర్చిస్తున్న "నేతి - నేతి" అనే పూర్వ మీమాంసా విచారంగా గమనిస్తూ ఉంటే,.... 'ఆనందో బ్రహ్మ' అనే వర్ణన వాక్యం చెప్పబడుచున్నప్పటికీ,... సిద్ధాంత పూర్వకంగా 'ఆనందమయ కోశము' (Zone of Pleasure) కూడా జడమే గానీ, బ్రహ్మము కాదు.


Page: 65

'ఆనందించువాడు' ఉన్నప్పుడు కదా, ఆనందమునకు ఉనికి?

అనగా 'ఆనందము' అనుదానికి స్వతఃసిద్ధమైన ఉనికి ఎక్కడున్నది?

అసలు 'ఆనందము' అనేది ఎట్లా రూపుదిద్దుకుంటోంది?

శ్లో॥ కాచిత్ అంతర్ముఖావృత్తిః ఆనంద ప్రతిబింబభాక్ ।
పుణ్యభాగే భోగ శాంతౌ, నిద్రారూపేణ లీయతే ॥

ప్రతి జీవుడు ఆనందము కోరుకుంటున్నాడు. జీవులలో అనేకులు ఈ దృశ్యములోని "సంఘటనలు - సందర్భములు - సంబంధములు - సంపద వ్యవహారములు” ఇటువంటి వాటిలో "ఎక్కడ నా ఆనందము?” అని వెతుకుతూ బహుదూరపు బాటసారి వలె సుదీర్ఘ సంచారాలు చేస్తున్నాడు.

అయితే,
"యే హి సంస్పర్శజా భోగా: దుఃఖయోనయ ఏవతే”
... అని గీతాచార్యులవారు "ఆనందము కొరకై ఇంద్రియ విషయములలో వెతకటం బుద్ధి తక్కువ. దుఃఖములు తెచ్చిపెట్టుకోవటమే!... అని ఒక్క ముక్కలో కొట్టిపారేశారు కదా!

“ఆనందమయ కోశము ఎట్లా రూపు దిద్దుకుంటోంది?”అనే విషయం పరిశీలించిన మహనీయులు, అద్దాని గురించి ఇట్లా అంటూ ఉంటారు.

ఈ బుద్ధి (లేక విజ్ఞాన కోశము) యొక్క వృత్తి... "ఈ పంచభూతాత్మికమైన ప్రపంచములో ఏదేదో పొందితేగాని, ఇంకేదో తొలగించుకుంటేగాని ఆనందించలేను కదా”... అనే భ్రమ, మాయా పూర్వకమైన ఏదో అవగాహన కలిగి ఉండి ఇంద్రియ ప్రపంచంలో దేని-దేని కోసమో వెతుకుతోంది. “ఇప్పుడు నేను వర్తమానంలో దుఃఖినే! ఫరవాలేదు. ఈ కొన్నిటిని పొంది - ఈ పరిస్థితులు మార్చుకొని అప్పుడు మనం ఆనందం పొందవచ్చులే" ... అని భావించి అనేక లోకాలలో ఉపాధి పరంపరలను పొందటం జరుగుతోంది.


Page: 66

ఎప్పుడో ఒకానొకప్పుడు మహనీయుల - సద్గురువుల ప్రమాణ పూర్వక శాస్త్ర వాక్య సారాంశములు గ్రహించటం జరిగినప్పుడు ఇక ఈ బుద్ధి తన బాహ్య వృత్తిత్వము కించిత్ త్యజించి, "అంతర్ముఖత్వము"ను ఆశ్రయించటం ప్రారంభిస్తోంది. అనగా, సహజీవుల - దృశ్యముల బాహ్యవృత్తులను త్యజిస్తోంది. వాటన్నిటికీ ఆధారమైయున్న ప్రత్యగాత్మ - అంతర్యామియే - ప్రతి ఒక్కరి సహజ స్వరూపముగా అర్థం చేసుకోవడం - ఆస్వాదించటం ప్రారంభిస్తోంది.

అనగా, సందర్భత్వమును దాటి సహజతత్త్వమును ఆస్వాదించటం మొదలు పెట్టుచున్నది. అట్టి సమయంలో విషయవాసనలు 'మౌనము' వహించటం చేత విషయములకు సంబంధించని ఒకానొక మౌనస్వరూపమైన ఆనందవృత్తి బుద్ధిలో ద్యోతకం కావటం జరుగుతోంది.

అటువంటి “ఆనంద వృత్తి” - కోపము, రాగము, ఆవేశము, ఏదో పొందలేదనే వ్యధ, ఏదో కావాలనే కామము మొదలైన పాప దృష్టులు వాటికి సంబంధించిన కర్మపరంపరలు సన్నగిల్ల చేస్తోంది. రూపుదిద్దుకుంటున్న “ప్రేమ - కరుణ- అమానిత్వము - అదంభిత్వము - అహింస - శాంతి - దానము - ధర్మము - పుణ్య కథా శ్రవణము - తీర్థములు” ఇత్యాది ఆయా పుణ్య కర్మల ప్రభావం చేత - ఆనంద వృత్తి ప్రవృద్ధం అవటం జరుగుతోంది.

బుద్ధిలో ప్రతిబింబించే నిర్విషయత్వమే ఆనందమయకోశము యొక్క రూపము. అట్టి నిర్హేతుక, ఆనంద వృత్తి ఒకప్పుడు రూపుదిద్దుకున్నప్పటికీ..., మరొక సమయానికి దృశ్యసంబంధమై అభిప్రాయాలు - ఆశలచే కప్పబడి ఉంటోంది (A kind of Avocation).

ఆనందము కూడా ఒకానొక వృత్తియే కాబట్టి అది “ఆనందింవాడు” అయిన ఆత్మ యొక్క విన్యాసమే అయి ఉన్నది.


Page: 67

ఆనందము, ఆనందవృత్తి ➜ జడము
ఆనందించువాడు ➜ చైతన్యము

ఆనందించువాడు ఉంటే కదా, ఆనందము యొక్క వృత్తి - ప్రవృత్తి కూడా!

కనుక, ఆనంద కోశము కూడా జడమే!

ఆనందము ఎవరిదో, అట్టి జీవాత్మ ఆనందమునకు కూడా పరమై, చైతన్య స్వరూపుడై, స్వయం బ్రహ్మస్వరూపుడై ఉన్నాడు - అని మనం గమనించవచ్చు.

బ్రాహ్మణుడు : అమ్మా! తరుణీమణీ! నీవు పంచకోశముల గురించి చక్కగా నీ భాషలో వివరించావు. “అవన్నీ జడమే” అని సిద్ధాంతీకరిస్తున్నావు. నీవు చెప్పినదంతా భారతీయ తత్త్వ శాస్త్ర సమ్మతమే! యుక్తి యుక్తమే! ఒప్పుకుంటున్నాను.

అయితే...,

అధ్యాయము-19.) కర్మణా జాయతే ద్విజః

ఇప్పుడు మరొక్కసారి బ్రాహ్మణులమగు మా విషయమై ప్రస్థావిస్తున్నాను. శాస్త్రనిర్ణయమైన బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్ర చాతుర్వర్ణ్య విభాగమును అనుసరించి విను. మేము జన్మతః బ్రాహ్మణులము అయి ఉన్నాము. ఇంకా, శాస్త్రములు నిర్దేశించిన విధంగా ఉపనయనము వేదపఠనము మొదలైన వాటిని నిర్వర్తిస్తూ 'ద్విజులు' అని కూడా పిలువబడుచున్నాము. ఇది ఈ సభకు వేంచేసిన మహనీయులు, అందరూ ఎరిగి ఉన్న విషయమే! పండితమ్మణ్యులంతా ఒప్పుకుంటున్న విశేషమే!

గొల్లభామ : జన్మ మాత్రం చేతనో, జాతి మాత్రం చేతనో 'బ్రాహ్మణత్వము' అనునది సిద్ధించేది కాదు కదా, స్వామీ!

ఎందుకంటారేమో?

మనం పురాణ కథలు, మహనీయుల చరిత్రలు పరిశీలిస్తే....., జన్మతః విప్రుల కులంలో పుట్టి ఉండకపోయినప్పటికీ, తమ యొక్క ఉత్తమ కర్మలచే బ్రాహ్మణత్వము సిద్ధించుకున్నట్టి మహనీయులు ఎంతమంది లేరు, చెప్పండి?


Page: 68

ఉదాహరణకు...,
మతంగ ఋషి పూర్వములో - మతంగకన్యా గర్భమందు జనియించెన్ ।
ప్రీతితో తపమొనరించియు - భూతలమున బ్రాహ్మణుడయ్యె బుధులు గణింపన్ ॥

మహనీయులగు మతంగ మహాముని విషయమే చూడండి. వారు పుట్టుకచే ఒక మాదిగ స్త్రీ గర్భాన జన్మించారు. సద్గురువులను, విజ్ఞులను, శాస్త్రములను ఆశ్రయించారు. పెద్దలు చెప్పిన మార్గంలో తపస్సు ప్రారంభించారు. మహనీయులయ్యారు. వేదజ్ఞుల చేత - బ్రాహ్మణ ప్రముఖుల చేత “ఈయన బ్రాహ్మణత్వము సిద్ధింపజేసుకున్నారు” అని ప్రశంసించబడ్డారు కదా! వారు మనందరికీ పూజనీయులు, ప్రాతఃస్మరణీయులు అయ్యారు. అది మీకు తెలిసిన విషయమే కదా!

ఇంకొక దృష్టాంతము...,
శ్లో ॥ ఊర్వశీ గర్భసంజాతో వశిష్ఠశ్చ మహామునిః ।
తపసా బ్రాహ్మణోఽభవత్, కిం జాతిః తత్ర కారణమ్? ॥

అట్లాగే మహనీయులగు శ్రీ వసిష్ఠ మహర్షి గురించిన విశేషమేమిటి? వారు ఊర్వశి గర్భమున జన్మించారు. తమ యొక్క తపోబలంచేత ఆత్మజ్ఞులై శ్రీరామచంద్రమూర్తి ద్వారా మనకు “వసిష్ఠరామ సంవాదము - యోగ వాసిష్ఠము" అనే మోక్ష శాస్త్రాన్ని ప్రసాదించారు. బ్రహ్మర్షియై సప్తర్షిమండలంలో వెలుగొందుచూ లోక కళ్యాణమూర్తులయ్యారు. వారి పట్ల కుల - జాతి ప్రసక్తి ఏం చెప్పగలము?

అందుచేత,
"జన్మతః సాంఘికంగా కనిపించేదానికి 'జాతి' అనబడుదానికి - బ్రాహ్మణత్వమునకు అవినాభావ సంబంధము ప్రతిపాదించలేమని ఒప్పుకోక తప్పదు కదా? విప్రవర్యా!


Page: 69

బ్రాహ్మణుడు : అవును. నీవు చెప్పిన శ్రీమతంగ మహాముని మహర్షి వంటి మహనీయుల విషయాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను. వారందరూ మాకు కూడా ఆరాధ్య పురుషులే!

అయితే,
బ్రాహ్మణకులజుల యొక్క ఆధిక్యత గురించి నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానో..., ఆ విషయమును నీవు నీ యొక్క విజ్ఞతతో యోచించి, పరిశీలించి గుర్తించటానికి ప్రయత్నిస్తున్నావా? ప్రయత్నించి చెప్పు! ఆలోచించు!

గొల్లభామ : (కొంచెము సేపు కళ్ళు మూసుకొని, ప్రశాంతతతో కూడిన మౌనము వహించి) మహాత్మా! మీరు చెప్పిన "ఆధిక్యత” గురించి ప్రశాంతముగా యోచన చేశాను స్వామీ! ఒకానొక శాస్త్రార్థ విశేషం నా మనస్సుకు స్ఫురిస్తోంది. మీరు శాస్త్రవిహితమైన శబ్దబ్రహ్మోపాసన కులధర్మముగా కలిగి ఉంటున్నారు. "కర్మణా జాయతే ద్విజః”... అను వాక్యమును అనుసరించి ‘ఉపనయనము' ఇత్యాది శాస్త్రవిహితమైన యజ్ఞ - యాగ - క్రతు - వ్రతములు అభ్యసించి లోకహితులై - పురోహితులై కర్మలు నిర్వర్తించటం చేత గౌరవించబడుచున్నారు. పూజించబడుచున్నారు. శ్లాఘించపడుచున్నారు. అదంతా ఉచితమే! మాకు అనుసరణీయమే! వేదశబ్దములతో మమ్ములను పునీతులుగా చేస్తున్నారు. మాకు సదా పూజనీయులే!

అయితే...,
"సర్వం ఖల్విదం బ్రహ్మ", "ఇదమ్ మమాత్మ స్వరూపమేవ", "జీవో బ్రహ్మేతి నా పరః", "అహమ్ బ్రహ్మాస్మి", "అహమ్ సర్వస్య ప్రభవో", "మత్తః పరతరమ్ నాఽన్యత్ కించిదస్తి" ... ఇట్టి వేద - వేదాంగ - ఉపనిషత్ - భగవద్గీతా మహావాక్యాల అనునిత్యానుభవమైన ‘బ్రాహ్మీ స్థితి' అయినట్టి "బ్రాహ్మణత్వము"తో విప్రత్వము సరిసమానము కాదని నా అభిప్రాయము, స్వామీ!

ఇంకొక విషయం!


Page: 70

<ఆటవెలది పద్యం>:
పూర్ణభావమెరిగి పూజ్యులు గాక, మే
మెక్కువందురందుకొక్కటుండె
న్యాయమొప్ప 'కర్మణా జాయతే ద్విజో'

... అనెడి శాస్త్ర వాక్కుననుసరించి ఈ కనబడేదంతా కూడా పరమాత్మ రూపమే (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ) అని వేద - ఉపనిషత్తులు, మంగళశాసనం చేస్తూ గానం చేసి వినిపిస్తున్నాయి కదా!

అందుచేత,
నేనైనా - మీరైనా - మరెవ్వరైనా “సర్వ సమభావము”ను ఆశ్రయించి ఈ దృశ్యమును ఆస్వాదించటం సముచితం కదా!

“ఈ కనబడే నామ రూపాత్మకమైనదంతా, ఈ కళ్ళకు కనిపించే జీవులు - జీవ సమూహములు - అన్నీ కూడా.., స్వతఃగా "బ్రహ్మమే" అయి ఉండి కూడా, నా యొక్క 'మనో వికారము' అనే కారణంగా, అభ్యాసవశంగా 'దృశ్యభావన'చే అనేకంగా అనుభూతమౌతోంది!" అని విజ్ఞతతో గమనించి ఉండటమే బ్రహ్మభావనకు త్రోవ.

క్రమంగా అట్టి భౌతిక - సాంసారిక దృష్టిని అధిగమించి స్వస్వరూపాత్మదృష్టి - 'మమాత్మా సర్వభూతాత్మా' దృష్టి - బ్రాహ్మీ దృష్టిని పెంపొందించుకోవటమే శాస్త్రముల - యజ్ఞ - యాగ - క్రతు - వ్రతాదుల ఆత్యంతికోద్దేశ్యం కదా!

“కనబడేదంతా అదే! ఇక కళ్ళమూతలెందుకు?” అను అవగాహనతో “సర్వము పరమాత్మ తత్త్వమే! - అని అనుకుంటూ ఉంటే - అనిపించకేంచేస్తుంది?” అనే ఆత్మనమ్మకంతో మనందరి కర్మలు - కార్యక్రమములు సర్వేశ్వరుడు - సర్వాంతర్యామియగు శ్రీరామలింగేశ్వర స్వామికి సమర్పిస్తూ మన-మన నియమిత కర్మలు - సాధనలు కొనసాగిస్తూ ఉంటే... మీరు - నేను - ఈ శ్రోతలు కూడా 'బ్రహ్మత్వము' సంతరించుకోగలము కదా!

అంతేగానీ,
జగన్నాటక చమత్కారంగా పంచేంద్రియములకు కనిపించే (లేక) ప్రాప్తిస్తున్న దృశ్య వ్యవహార పరంపరలను తెలివి తక్కువగా నమ్మి ఆశ్రయించటం, జన్మ - కర్మల సంబంధముగా మాయచే కల్పన చేయబడే కుల మత భేదములను నమ్మటం, నిరూపించటానికి ప్రయాసపడటం ఉచితమంటారా?


Page: 71

అది అనవసరమైన - అసంగతమైన ఆయాసం కాదంటారా?

“మేము వారి కంటే జన్మతః గొప్పవారము - వీరి కంటే కూడా అధికులము” అని ప్రయాసగా చెప్పుకోవటం శాస్త్రముల ఉద్దేశ్యము కాదని నాకనిపిస్తోంది.

అందుకే....,
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
... అని శ్రుతులు గానం చేస్తూ గుర్తు చేస్తున్నాయి కదా! “ఉత్తమ కర్మలు ఆశ్రయించువారే ద్విజులు. జన్మమాత్రం చేత కాదు” అని నిర్వచిస్తున్నాయి.

ఇక,
స్వకీయమైన - నిర్మలమైన ఆత్మ దృష్టిచే ఎవ్వరైనా బ్రహ్మత్వమును పుణికి పుచ్చుకోగలరు. అంతే కానీ, బ్రహ్మత్వము జన్మల చేత గానీ - కర్మల చేత గానీ లభించేది కాదు. ఉత్తమమైన ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన అవగాహన చేతనే.

“దృష్టిమ్ జ్ఞానమయం కృత్వా - పశ్యేత్ బ్రహ్మమయం జగత్” అని కదా! పెద్దల అభిప్రాయము.

స్వామీ! మరొక్క విషయం కూడా ఈ సందర్భములో నా అవగాహన ఏమిటో చెపుతాను. వినండి.

బాల్యము నుండి కుల పెద్దలు - మనుశాస్త్రము ఇత్యాదులు చూపిన మార్గములో వేద విహిత కర్మలు సేవిస్తూ ఉండటం చేత మీరు విప్రులై, మావంటి వారికి పూజనీయులు అగుచున్నారు.

అందుచేత, మీరు విప్రులై ఉండటం చేత నిర్వహిస్తున్న వేరు వేరు కర్మల విశేషమేమిటో దయయుంచి నాకు - ఈ సభకు వివరించమని నా కోరిక! విన్నపము!


Page: 72

బ్రాహ్మణుడు : ఓ పడతీ! విప్రులమగు మేము ద్విజులమై ఏమేమి కర్మలు - కార్యక్రమములు నిర్వర్తిస్తూ ఉంటామో చూచాయగా చెప్పియే ఉన్నాను కదా!

అయినా,
మా గురించి మేమే చెప్పుకోవటంలో విశేషమేమున్నది? అది స్వోత్కర్ష అయి శ్రోతలకు రుచి కలిగించకపోవచ్చు. అందుచేత, విప్రులమగు మేము ఏమేమి వివిధ కర్మలు చేస్తూ ఉంటామో, ఏదేది నిర్వర్తిస్తూ ఉంటామో... నీకు తెలిసినంత వరకూ నీవే చెప్పు.

గొల్లభామ : కొన్ని విషయాలు మీరు చెప్పియే ఉన్నారు. యజనము - యాజనము - అధ్యయనము - అధ్యాపనము - దానము - ప్రతిగ్రహణము.

ఇవికాక...., నివాసము, గర్భాదానము, సీమంతము, పుంసవనము, జాతక కర్మలు, నామకరణము, అక్షరాభ్యాసము, ఉపనయనము, వివాహము, శాంతి, పంచమహా యజ్ఞములు - ఇవన్నీ మీరు చేయిస్తూ ఉంటారు. వేద-వేదాంగాలు నేర్వటానికి - పఠించటానికి - నేర్పటానికి మీరు తగి ఉన్నారు.

ఆయా కాలము - సందర్భములను అనుసరించి ఏది ఎప్పుడు ఎట్లా మంత్ర - తంత్ర ముగ్ధంగా చేయాలో - అది చెప్పటం, చేయించగలగటం మీ బ్రాహ్మణులకే, విప్రులకే చెల్లుతుంది. ఇతరులకు ఆ అర్హత లేదు కదయ్యా! స్వామి వారు!

బ్రాహ్మణుడు : ఆహా! హా! భామామణీ! ఇప్పటి దాకా "ఈ భూమిపై పుట్టిన మానవులంతా ఒక్కటే"... అని పలికావ్! ఇక ఇప్పుడేమో, "ఆయా సమయ - సందర్భాలకు ఉచితమైన శాస్త్రవిహితమైన మంత్ర - తంత్ర విధానములలో నేర్పరులు మీ బ్రాహ్మణులే!" అని పొగడుచున్నావ్! దైవోపాసన - శాస్త్రప్రవచితమైన వ్రతములు మొదలైనవన్నీ మేము మాత్రమే చేయిస్తాము. కనుక, మా జన్మలు ప్రత్యేకమైనవే కదా?


Page: 73

గొల్లభామ : కర్మచేత ద్విజులు - బ్రాహ్మణులు అయినంత మాత్రము చేత గర్వించవచ్చునా మహనీయా! అయ్యా! ఉండండి! ఇప్పుడు కాదులేండి. కాసేపాగండి. ‘మేమే అధికులము’ అనే మాట ‘సంసారరూప భ్రమవంటిదే’ అని నిరూపిస్తాను.

బ్రాహ్మణుడు : భామామణీ! -“కర్మల విషయంలో మీరు శ్రేష్ఠులు. పెళ్ళిళ్లు - వ్రతాలు - పూజలు - పితృదేవోపాసనలు చేయించటానికి అర్హత మీకే ఉన్నది”.... అని ఇప్పుడే అన్నావు. “అల్ప సంతోషీ బ్రాహ్మణః” అన్న తీరుగా ఆ మాటకే నేను సంతోషించాను. ఇంతలోనే “కాసేపాగండి! మీ ఆధిక్యత ఏమిటో తేలుస్తాను” అంటున్నావే! నీ మాటలు వింటుంటే, “ఈ ప్రశ్నకు ఈ సమాధానం, ఆ ప్రశ్నకేమో ఆ సమాధానం”... అన్న తీరుగా ఉన్నదే!

గొల్లభామ : అందరికీ ప్రియము - క్షేమము కలుగజేసే వేదయుక్తములైన మంత్రములు - వాటికి సంబంధించిన క్రియా విశేషములు పఠించే - చేయించే అధికారం మీకు మాత్రమే ఉన్నదిలేండి!

బ్రాహ్మణుడు : అవును కదా! యజ్ఞ - యాగ క్రతువులు నిర్వర్తించటానికి, నిర్వర్తింపజేయటానికి, తదితర అనేక వేదవిహిత కర్మలు చేయటానికి, వేదములు చదవటానికి, నేర్పటానికి మేమే కదా అర్హులము!

మేము వేదము చదవటానికి అర్హులమని నీవే చెప్పుచున్నావు కదా! అనగా, మేమే కొంత ఎక్కువ - అని నీవే ఒప్పుకుంటున్నట్లే కదా?

గొల్లభామ : “వేదాలు పఠించటానికి - వ్యాఖ్యానించటానికి మేము మాత్రమే అర్హులము. మాకే అధికారము” అని మీరు అహంకరించవచ్చునా? “కర్మచే ద్విజులు, వేదాధ్యయనం చేత విప్రులు”... మీరు అయి ఉండవచ్చు గాక! అంతవరకు నేను ఒప్పుకుంటున్నాను. అంతమాత్రంచేత ‘బ్రహ్మత్వము’ సిద్ధిస్తుందా? లేదు కదా?


Page: 74

అందుచేత, "ద్విజులు - విప్రులు - జన్మతః బ్రాహ్మణులు”- ఇవన్నీ కూడా ఇహములో ప్రతిష్ఠ కలుగజేయవచ్చు గాక! అవన్నీ పరము దృష్ట్యా - 'బ్రాహ్మణత్వము' సిద్ధించనంత వరకూ కూడా - నిష్ప్రయోజనములే అవుతాయి.

సర్వ భేద దృష్టులు తొలగిపోతే కదా, బ్రాహ్మణత్వము సిద్ధించేది!

బ్రాహ్మణుడు : పోనీ, మరొకమాట అనవచ్చునేమో. ‘జన్మతః శూద్రులు’ అనే చోట మీరు ఉండిపోతున్నారు. మేమో, ఆ స్థితి నుండి 'ద్విజులము - విప్రులము’ అగుచున్నాము కదా! అనగా, మీకంటే మా బ్రాహ్మణ జన్మలు అధికమేనని నీవు ఒప్పుకోవాలి కదా! ఇక చెప్పవలసినదేమున్నది? వాదించవలసినదేమున్నది?

గొల్లభామ : "సర్వమ్ బ్రహ్మమేవ - ఇతీయం సందర్శనం కురుతే తం బ్రాహ్మణమ్" అని కదా బ్రాహ్మణ శబ్దార్థం!
బ్రహ్మము కానిదెవ్వరు? బ్రహ్మమునకు వేరై కనిపించేదంతా కేవలము స్వప్నసదృశమే కదా!

ద్విజులు - విప్రులు అయినంత మాత్రాన చేతనే “మేము మరికొందరి కన్నా - తదితరులకన్నా కూడా అధికులము” అనే అభిప్రాయమును పూర్వపక్షం చేస్తూ నేను నా వాదనను విశదీకరించటానికి అనుమతి ఇస్తారా? స్వామీ!

బ్రాహ్మణుడు : అట్లాగా? అందుకు సరి అయిన విధంగా సమాధాన పరచటానికి నేనూ సిద్ధమే! “ద్విజులు - విప్రులు అధికులు కారు!” అని శాస్త్రీయంగా నిరూపించటానికి ఎవరైనా పండితులనో, వేదవేదాంగములను అధ్యయనము చేసిన వారినో నీవు తోడుగా తెచ్చుకోవటం కూడా నాకు అంగీకారమే!

గొల్లభామ : కోపము వచ్చిందా? స్వామీ!

బ్రాహ్మణుడు : కోపమా? కోపమెందుకు? బుద్ధి కుశలతను అనుసరించి నీవు మాట్లాడుచున్నావు. అంతే! అన్ని విషయాలు నీకు తెలియకపోవచ్చు, నాకూ తెలియక పోవచ్చు! అందుచేత మేము తప్పుపట్టుకోము.


Page: 75

వేదాధ్యయనం ద్వారా గురుముఖంగా పఠణబలంచేత మేము ఏ వేద-వేదాంత విద్యా చాతుర్యము - తత్సంబంధమైన వేద వాక్కు - చాతుర్వర్ణ్య ధర్మాలు ఎరుగుట జరుగుతోందో.... అవన్నీ (లేక) కొన్ని నీవు గమనించి ఉండకపోవచ్చు కదా!

ఓ పూబోడీ! మరల చెప్పుచున్నాను.

"విప్రులు- ద్విజులు అధికమైనవారు కారు" అని నాతో వాదించి గెలవాలనుకుంటే, అందుకు నాకు అభ్యంతరము లేదు. ఏమి చెప్పాలనుకుంటున్నావో, చెప్పు! నీ వాదనల పస ఏమిటో చూస్తాను.

గొల్లభామ : మహాత్మా! పండితోత్తమా! మీరు యజ్ఞ - యాగ కోవిదులు కాబట్టి నాకు మీ పట్ల గౌరవమే! అందుచేత కోపగించరు గాక!

ఎందుకంటే...., మన ఈ వాదోపవాదాలన్నీ ఉభయ శ్రేయస్సులను - దృష్టిలో పెట్టుకొని మన జ్ఞాన - విజ్ఞాన దృష్టులను మరింత ప్రవృద్ధము చేసుకోవటానికి మాత్రమే! “వాదోన అవలంబ్యః” అని నారద భక్తి సూత్రము కదా!

అంతేకానీ,
మనం మనం నమ్మినదానికి మాత్రమే కట్టుబడి ఉండాలనో, ఒకరి తప్పులు మరొకరు ఎంచాలనో కాదు కదా! పండితమ్మన్యులగు మీకు ఈ విషయం చక్కగా తెలుసునని నా నిశ్చితాభిప్రాయము. అందుచేత మన ఈ ఆత్మయజ్ఞ పూర్వకమైన చర్చను మరింతగా కొనసాగిస్తున్నాము. మరల అడుగుచున్నాను. మరి, నా వాదన వినమ్రతా పూర్వకంగా కొనసాగించమని అనుజ్ఞయే కదా?

బ్రాహ్మణుడు : భామామణీ! నీ యొక్క సహృదయతను నేను గమనిస్తున్నాను. సత్య దృష్టితో ముక్కుకు సూటిగా సంభాషించటం నాకు సంతోషమే కలుగజేస్తోంది.

అందుచేత....,
శుభాశయంతో, 'ఆత్మజ్ఞానము - ఆత్మదృష్టి' మరింతగా ఉభయులము సంపాదించుకుందాము. నీవు నిర్మొహమాటంగా చెప్పాలనుకొన్నది చెప్పవచ్చు. మాకు కోపం లేదు. రాదు.