[[@YHRK]] [[@Spiritual]]
Gollakalāpam, Kuchipudi Dance Drama, Philosophical Interpretation by YHRK
[Chapters 20 to 24 out of total 48]
విషయ సూచిక :
Page: 76
అధ్యాయము-20.) బ్రాహ్మణః - కిమర్థమ్? కిముద్దేశ్యమ్? |
గొల్లభామ : పండితోత్తమా! చాలా సంతోషము స్వామీ! ఇప్పుడు మిమ్ములను ఒక్కటడుగుతాను.
అసలు ‘బ్రాహ్మణులు’ అనగా..... ఎవరు?
ఎట్లా ఉంటారు?
• తెల్లగానా? నల్లగానా? ఎర్రగానా?
• కంటి - కడియాలు ధరిస్తూ ఉండేవారా? (మెడలో 'కంటి' అనే ఆభరణాన్ని, చేతులకు లేదా కాళ్లకు 'కడియాలు' అనే ఆభరణాలను వేసుకుంటూ ఉండేవారా?)
• విభూతి - రుద్రాక్షలు ధరించి ఉంటారా?
• ఉంగరాలు - ప్రోగులు - మురుగులు ఇటువంటివి అలంకరించుకొని ఉంటారా?
• పట్టు పంచలు - శాలువా - పిలకలతో కనిపిస్తూ ఉంటారా?
‘బ్రాహ్మణుడు’ అనే శబ్దానికి అర్థమేమిటి? ఉద్దేశ్యము ఏమిటి? కాస్త వివరించరూ!
బ్రాహ్మణుడు : అవును. నీవు చెప్పే అన్ని రకాలుగానూ ఉంటారు. నీవనేదేమిటి? అట్లా ఉండేవారందరూ బ్రాహ్మణులు కాజాలరేమోనని నీ ఉద్దేశ్యమా? చెప్పుతల్లీ! చెప్పు!
నీవు ఏమని అనుకుంటున్నావో.... చెప్పవమ్మా!
గొల్లభామ : అయ్యా! అయ్యా! కోప్పడకండేం! నాకు-మీకు కూడా ఇష్టదైవమైనట్టి ఈ బాలాత్రిపురసుందరీ సహిత రామలింగేశ్వరస్వామి వారి నామరూపాలు - మహిమా విశేషాలు హృదయంలో భక్తితో ఉపాసిస్తూ ‘బ్రాహ్మణులు’ అనగా ఎవ్వరో నాకు తెలిసినది నిఖచ్చిగా చెప్పుచున్నాను.
బ్రాహ్మణుడు : చెప్పమనే కదమ్మా నేనంటున్నది! నేనుగానీ, ఈ సభాసదులుగానీ ఏమనుకుంటారోనని నీవు వెనుకాడనఖర్లేదు. అందరమూ నీ వివేచనను చూచి సంతోషిస్తూ ఉన్నవారమే!
Page: 77
నీవన్నట్లు శ్రీబాలాత్రిపురసుందరీ సహిత శ్రీరామ లింగేశ్వరస్వామిని భక్తితో నేను కూడా స్మరిస్తూనే నీకు సమాధానం చెబుతాను, ఓ లలనా తిలకమా!
గొల్లభామ : మీకూ - మన ఈ సంవాద పూర్వక సత్సంగ ప్రసంగమును ప్రేమగా వింటున్న ఈ ప్రేక్షక మహాశయులకు శ్రోతలకు నమస్కరిస్తూ నా అభిప్రాయాలు ఖరాఖండీగా చెప్పుచున్నాను వినండి.
తత్త్వశాస్త్రం దృష్ట్యా......,
జన్మతః “బ్రాహ్మణ కులము” ఇత్యాది కొన్ని కులాలలో జన్మించినవారు ఉపనయనముచే ద్విజులు, వేదములు అభ్యసించటంచేత విప్రులు అవుతారు. అంత మాత్రం చేత బ్రహ్మము యొక్క సిద్ధిని పొందినట్లు కాదు.
వేదవిహిత కర్మలు : ఒకానొకడు వేదవిహితమైన కర్మలు సశాస్త్రీయంగా, కాల నియమానుసారంగా చక్కగా నిర్వర్తించటం చేత ‘స్వర్గము’ ఇత్యాది సుఖప్రదమైన లోకాలు పొంది భోగములను అనుభవించటానికి అర్హుడౌతాడు.
అయితే......,
పుణ్యవశంగా పొందిన ఆ భోగమయ స్వర్గాది లోకాలలో నివాసం కాలక్రమేణా పుణ్యము ఖర్చుకాగా, పోగొట్టుకొని అతడు మరల భౌతిక లోకాలలో శరీర ధారణ చేయవలసి వస్తోంది.
“తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం ।
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ॥” - భగవద్గీత
మరొక్కసారి చెప్పుతున్నాను. వినండి.
‘స్వర్గము’ మొదలైన భోగమయ లోకాలే ఆశయంగా కలిగి ఉండి యజ్ఞ - యాగాది వైదిక కర్మలు నిర్వర్తించేవారు కొంతకాలం ఆయా స్వర్గలోక సుఖాలు అనుభవించి, ఆ పుణ్యము క్షీణించగానే మానవ లోకానికి తిరిగి రావలసిందే!
Page: 78
అనగా, స్వర్గాది లోకాలలో ప్రవేశించినంత మాత్రంచేత ‘పునర్జన్మలు’ అనే జాడ్యము తొలగటం లేదని అనక తప్పదు. కనుక, స్వర్గాది లోకాలు ‘బ్రాహ్మీసుఖము’నకు మార్గము కాదు. ఈ విషయము భగవద్గీత, ఉపనిషత్తులు తదితర ఆధ్యాత్మశాస్త్ర గ్రంథాలు నొక్కి - నొక్కి చెప్పుచున్న మాటే! వ్యాఖ్యానిస్తున్న విషయమే!
బ్రాహ్మణుడు : అవును. అయితే కూడా, ఒకానొక ముఖ్య విషయం సుమా! ధర్మశాస్త్రములలో నిష్ణాతులైన ధర్మకోవిదులు చెప్పుచున్నదేమంటే...,
• కర్మ - జ్ఞానము ఒక్క తీరైనవే!
• రెండూ కూడా మోక్షమునకు మార్గములే!
(సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి! న పండితాః - భగవద్గీత)
అట్టి ధర్మ కోవిదుల పలుకు విని ఉండలేదా? విని కూడా సరిగ్గా యోచన చేయటం లేదా? మర్మమేమిటో తెలియక “కర్మమార్గం పునరావృత్తి స్వభావం కలిగి ఉన్నది (గతాగతం కామకామాః లభంతి) అని మాత్రమే వ్యాఖ్యానిస్తున్నావే? మర్మము తెలియక కర్మ మార్గమును అల్పమైన దానిగా చిత్రీకరిస్తున్నావా?
నీకు సమగ్రమైన శాస్త్రపరిశీలన కొంచము కుంటుపడిందేమో? మరొక్కసారి చెప్పుచున్నాను, విను.
ఆర్యప్రవచనములైనటువంటి జ్ఞాన-కర్మ విశేషాలలో చతురులైనట్టి పెద్దలు జ్ఞానమార్గమును, కర్మ మార్గమును ఒక్కతీరైనవిగానే సందర్శిస్తూ ఉంటారు. అంతేగానీ బాలురవంటి అజ్ఞులవలె వేరువేరైనవిగా చూడరు. శాస్త్రముల హృదయమేమిటో గమనించక, బాల్యచాపల్యము గలవారి కొరకై శాస్త్రములు చెప్పే కొన్ని విభాగములను మాత్రమే పరిగణలోనికి తీసుకొని “ఇది కర్మమార్గం. అల్పమైనది. అది జ్ఞానమార్గం. మహాగొప్పది”... అని వాదించటానికి ఉబలాటపడుచున్నావా?
తల్లీ! శాస్త్రవాక్యాలు సరిగ్గా చదవక అట్లా మాట్లాడుచున్నావా? సరే! శాస్త్రములు బ్రాహ్మణుల గురించి ఏమి చెప్పాయో... అది కూడా చెప్పు! విందాము.
Page: 79
గొల్లభామ : బ్రాహ్మణుల గురించి శాస్త్రవాక్యాలేమిటో, ఉద్దేశ్యమేమిటో చెపుతాను వినండి.
Page: 80
ఈ ప్రశ్నలన్నిటికీ సరి అయిన సమాధానము ఎంత కష్టపడైనా సరే..., సంపాదించుకోవాలి!
స్వవిచారణచే “మమాత్మా సర్వభూతాత్మా! అహమ్ సర్వస్య ప్రభవో” అనే వాక్యార్థాలను సద్గురు బోధ - స్వవిచారణలచే ధైర్య - సాహసములు గల యుద్ధ వీరునివలె అతిప్రావీణ్యతతో గ్రహించాలి.
ఇక “కనబడే దృశ్యము - తదంతర్గతమైన సర్వజీవరాసులు మమాత్మానంద స్వరూపమే!” అనే అవగాహన - అఖండానుభూతి పెంపొందించుకోవాలి.
తత్త్వ రహస్యమును గమనించి సర్వమును స్వస్వరూపంగా ఆస్వాదించే అనుక్షణానుభవమును క్రమక్రమంగా సిద్ధింపజేసుకోవాలి!
అనగా అఖండాత్మానందరూపమైనట్టి “అహమాత్మా, సర్వభూతాశయ స్థితః” అను కృష్ణచైతన్యానందమును సముపార్జించుకోవాలి.
త్రివేణీ సంగమును - ద్రష్ట-దర్శన-దృశ్యముల ఏకత్వానుభవమును - అనుభూతం చేసుకోవాలి. ఆరురుక్షుత్వము - యోగారూఢత్వముచే ప్రాపంచికమైన మనస్సును ఆత్మభావన యందు - (ఉప్పుబొమ్మ యొక్క పదార్థ - ఆకారములను నీటియందువలె) - లయింపజేయాలి.
శ్లో॥ ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే ।
యోగారూఢైవ తస్యైవ శమః కారణముచ్యతే ॥
ఆరురుక్షు యోగి : కర్మలద్వారా ఉపాసన కొనసాగిస్తూ మోక్షమార్గములో అడుగులు వేస్తూ ఉంటాడు.
యోగ ఆరూఢుడు : కర్మలచే కర్మలను దాటి, కర్మల నుండి ఉపశమిస్తూ ఆత్మజ్ఞానమును పునికి పుచ్చుకుంటాడు.
Page: 81
కొన్ని సిద్ధాంతాలు - జీవితాంతం కర్మలు వదలరాదు. కర్మలు కొనసాగిస్తూనే జ్ఞానమును తీర్చిదిద్దుకోవాలి ... అని చెప్పుచున్నాయి.
మంచిదే! అయితే......,
ఆ కర్మ నిర్వర్తించే కర్త - చాతుర్వర్ణ్యములలోను తనకుగా నియమించిన కర్మల నిర్వహణా పుష్పాలను ఈశ్వరార్పితం చేయాలి. “నాకు నియమితమైన కర్మలే నా ఉపాసన (work is my workship)” అను బుద్ధితో - అవగాహనతో - శ్రద్ధతో భగవదర్పితంగా కర్మలు నిర్వర్తించాలి స్వామీ!
“స్వప్న కల్పితముల వంటి లోక విశేషాలు” అనతగినట్టి ఇక్కడి లౌకికవిద్య - ధనము - జాతి - ప్రతిష్ఠ - కర్మసామర్థ్యములకు సంబంధించిన అహంకారము దగ్గరకు రానీయకుండా లోకానుకూలము - శాస్త్రానుకూలము - భగవదర్పితము - సహజీవులకు సుఖసంతోష ప్రదముగా స్వీయ ధర్మ-కర్మలను తీర్చిదిద్దుకోవాలి.
సాధన చతుష్టయ సమన్వితంగా స్వకర్మలను ఆచరించాలి.
1.) శమము : ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియములను సరి అయిన మార్గంలో నియమించటం, ప్రాపంచిక విషయముల పట్ల రాగరాహిత్యము - మౌనము.
2.) సంతోషము : లభించిన దానితో తృప్తిని పొందుతూ, విషాదము - అసూయ - నిరాశ - కామక్రోధములు దగ్గరకు రానీయకపోవటం, సంతోషమును సర్వదా అభ్యసించటం. లభించిన దానితో ‘తృప్తి’ని "అభ్యాసముగా" అలవరచుకోవటం. ఉత్సాహము - సాహసము - ధైర్యము పరిపోషించుకోవటం.
3.) సత్సంగము : “మహత్సంగస్తు దుర్లభో - అగమ్యో - అమోఘశ్చ” అన్నట్లుగా మహనీయులతో సంగము అభ్యసించటం, మహనీయ వాక్యాలు మననం చేస్తూ మార్గమును సరిచేసుకోవటం. సుగమం చేసుకోవటం.
4.) విచారణ : స్వకీయమైన అవగాహన.
Page: 82
ఈ విధమైన సాధన చతుష్టయము సహాయంతో వేదానుకూలమైన కర్మనిర్వహణాలచే చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి. క్రమంగా “నేను ఈ జగత్తులో - జగత్తుచే బద్ధుడను”... అనే భావనా పరంపరలను మనస్సు నుండి వెడలగొట్టాలి. మొదలంట్లా తొలగించుకోవాలి.
ఈ రీతిగా బ్రాహ్మీభావన - ఆత్మ తత్త్వజ్ఞానం హృదయంలో ఉదయింపజేసుకొని అద్దానిని అకృత్రిమమైన స్వభావంగా తీర్చిదిద్దుకోవాలి.
అదే ‘బ్రహ్మత్వ సిద్ధి’ అంటే!
బ్రహ్మత్వసిద్ధి యొక్క మహదాశయముచే ఈ జీవుడు ‘బ్రాహ్మణుడు’ అను పిలుపుకు అర్హుడగుచున్నాడు.
అదియే ‘అమరత్వ సిద్ధి’ అని కూడా పిలువబడుతోంది.
ధారణ : అట్టివారు మార్గాన్వేషణలో ఉన్న సమయంలో తమ చంచల బుద్ధిని “సుస్థిరము - నిర్మలము - సునిశితము - పవిత్రము”గా తీర్చిదిద్దుకోవటానికి -
... ఇత్యాదుల ‘ధారణ’ కు ఉపక్రమిస్తున్నారు.
సమయాసమయములను అనుసరించి ఒకచోట పద్మాసనాసీనులై ధారణయోగం అవలంబిస్తూ ‘బ్రాహ్మీభావన’ను సుస్థిరపరచుకొనే ఆత్మయజ్ఞమునకు ఉపక్రమిస్తూ ఉన్నారు.
Page: 83
క్రమంగా విషయేంద్రియములను ఆశ్రయించే బుద్ధిని, “కర్మ - ధారణ - జ్ఞాన”ములతో కూడిన సరోవర జలంలో ఉతికి అశుభ్రత తొలగించుకొంటున్నారు.
నేను - నాది - నా వారు - కానివారు - ఇటువంటి రాగ - ద్వేష - మమకార - అహంకార భావములతో కలుషితమైన బుద్ధి విభాగమును సాధనతో కూడిన బుద్ధితో పరిశుభ్రపరచుకుంటున్నారు.
నేను-నీవు... మొదలైనదంతా అఖండమగు ఆత్మస్వరూపమే! సర్వము మమాత్మకు అనన్యమే!” .... అనే అవగాహనతో బ్రాహ్మణులై, భూసురులై ప్రకాశిస్తున్నారు. అట్టివారే బ్రాహ్మణత్వపూర్ణులు.
ఇంద్రియములను జయిస్తూ, బ్రహ్మమును ఆశ్రయిస్తూ ఈ జీవుడు - ఆనందజలధిలో స్నానం చేసి, సుజ్ఞాన వస్త్రము కట్టి, త్రిగుణములను విభూతిగా ధరించి, సర్వవేదాంత సిద్ధాంత భూషితుడు అగుచున్నారు. ఇంద్రియములను విషయములనుండి ఉపశమింపజేస్తున్నారు. నిరాహారం చేస్తున్నారు.
అధ్యాయము-21.) సకామ కర్మ - నిష్కామ కర్మ |
బ్రాహ్మణుడు : అంటే? ఇంద్రియములను శోషింపజేస్తే బ్రాహ్మణ్యము సిద్ధిస్తుందంటావా? కేవలము ఆహారము మానివేసి ఇంద్రియములను శోషింపజేసినంత మాత్రం చేత దృశ్యసంబంధమైన జాడ్యము తొలగుతుందా?
- నేను దృశ్యమునకు సంబంధించినవాడను.
- దృశ్యములోని ఒకానొక దేహపరిమితుడను.
- వీటిలో కొన్ని నాకు సంబంధించినవి. మరి కొన్నేమో కావు.
- నేను వేరు. నీవు వేరు. జీవాత్మ వేరు. పరమాత్మ వేరు. జగత్తు వేరు.
...ఇత్యాది అభిప్రాయములనే మనము ‘సంసారము’ అంటాము.
ఇది తొలగించుకోవటానికే ‘జన్మ’ అనబడేది మహత్తరమైన అవకాశము. అంతేకానీ, జన్మ జీవునికి బంధము కాదు. కర్మ కూడా బంధము కాదు.
అందుచేత, ధీరులైనవారు కర్మలను ఆశ్రయిస్తూనే కర్మబంధముల నుండి విముక్తిని సంపాదించుకొని కర్మలకు అతీతులై బ్రాహ్మణ నామధేయమునకు అర్హులై భూమిపై వెలయుచున్నారు.
Page: 84
కర్మలు వదలక, తమ కర్మలను ఉపాసనగా తీర్చిదిద్దుకుంటున్నారు. కాబట్టే ప్రజ్ఞాదురంధులగు విప్రవర్యులు కూడా తమకు నియమితమైన స్మార్త - యజ్ఞ - యాగాది కర్మలు వదలటం లేదు. వారు అవన్నీ నిష్కామ కర్మ రూపంగా అవలంబిస్తూ ఉంటారు.
ఎవ్వరైతే నిష్కామంగా ఆశ్రమ - కుల - జాతి కర్మలను అవలంబిస్తూ ఉంటారో... అట్టివారు సర్వాత్మకమైన మోక్షభావనను పునికి పుచ్చుకోవటానికి అడ్డేముంటుంది?
అయితే...,
ఓ లలనా! ఎవ్వరి మనస్సు కర్మ నిష్కామమో, ఎవరి మనస్సు సకామమో ... ఎట్లా చెప్పగలం?
ఏది ఏమైనా నిష్కామమైన బుద్ధితో కర్మలను జీవితాంతం కొనసాగించటమే ఉచితం కదా? ఏమంటావు?
గొల్లభామ : అయ్యా! సకల కర్మలు నిష్కామ బుద్ధితో చేస్తూనే ఉండాలని మీరు ప్రతిపాదిస్తున్నట్లున్నారు. మంచిదే!
అయితే, ఒక ప్రశ్న!
ఎప్పుడైనా, ఎక్కడైనా కర్మలు ఫలములు ఇవ్వక మానుతాయా? మానవు కదా! అది సహజం కూడా!
"అవశ్యమ్ అనుభోక్తవ్యమ్ ।
కృతమ్ కర్మ శుభ-అశుభమ్" ॥
... అని కదా శాస్త్ర వాక్యం!
ఒకానొకడు - "కర్మలు చేస్తూనే ఉంటాను. కానీ కర్మఫలములతో నాకు అవసరం లేదు" అని అనుకోవచ్చుగాక! ఏమి లాభం? బీజము మొలవటం ఎంత స్వభావమో కర్మలు ఫలములను ఇవ్వటం అంతే స్వభావము - "ఓ బీజములారా! నేలలో పాతుతాను. నీళ్ళు పోస్తూ ఉంటాను. కానీ మొలవకండి!" అని చెప్పితే మాత్రం అవి మొలవకుండా ఉంటాయా?
Page: 85
అట్లాగే “నాకు కర్మఫలాలు వద్దు” అనుకుంటూ, “అయినప్పటికీ నేను కర్మలు కొనసాగిస్తూనే ఉంటాను”... అనుకున్నవానికి కూడా కర్మఫలములు ప్రాప్తించక మానవు కదా? స్వామీ!
బ్రాహ్మణుడు : కర్మలకు - బీజములకు చక్కటి పోలికయే తెచ్చావమ్మా! అయితే బీజములను అగ్నిలో వ్రేల్చితేనో? కర్మబీజములను “నిష్కామకర్మ” అనే అగ్నిలో దగ్ధం చేసి ఉంటేనో...? ఇక మొలవవు కదా! (జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణః). ఆ విధంగా చూస్తే, “నిష్కామ కర్మయోగి విషయంలో కర్మలు కర్మఫల రహితములు కాగలవు కూడా!” అని ఎందుకు సమన్వయించుకోకూడదు భామామణీ!
గొల్లభామ : విప్రవర్యా! లోకంలో ఎంతటి వెర్రివాడైనా విత్తనము పాతి, “ఈ విత్తనము వృక్షమై ఫలములు ఇస్తుందా? ఇవ్వదా? - నాకు సంబంధం లేదు” ... అనుకుని ఊరుకొని ఉంటాడా? ఫలితంతో (ఫలములతో లేక ఫలసాయముతో) నిమిత్తం లేకపోతే బీజము నాటటమెందుకు? (లేక) పొలంలో దుక్కి, దున్ని నాట్లు వేయుటమెందుకు? అదంతా వృధాశ్రమగా నిర్వర్తించాలా? ఎవ్వడైనా ఒకానొక సత్కర్మను ఏ ప్రయోజనమూ ఉద్దేశ్యించకుండా చేస్తాడా? అట్లా అంటే, అవి ప్రగల్భపు మాటలే అవుతాయి మరి! “ప్రయోజనమ్ అనుద్దిశ్య మందో అపి న ప్రవర్తతే” అని కదా శాస్త్ర ప్రవచనం!
ఒకానొకడు రాగము - ద్వేషము - లజ్జ - మోహము - భయము - అభిలాష - ఈషణ త్రయము....., వాటి వాటి వల్ల పుట్టే ఆయా దోషభూయిష్టమైన భావనా పరంపరలు, తత్సంబంధమైన దుర్గుణాలు త్యజించాడనుకోండి! దూషణ - భూషణ - తిరస్కార - పురస్కార అనుభవములు వచ్చి - పోయేటప్పుడు 'సమత్వము' వహించినవాడై ఉన్నాడనుకోండి! అతనికి - విహిత కర్మలు లేవు. నిషిద్ధ కర్మలు లేవు. అట్టి ఆత్మజ్ఞానికి కర్మలతో పనేముంటుంది చెప్పండి? మమత్వముచేత మాత్రమే కర్మలు-దృశ్యము బంధం అగుచున్నాయి కదా!
Page: 86
అధ్యాయము-22.) స్వధర్మే నిధనం శ్రేయః |
బ్రాహ్మణుడు : ఒకానొకడు ఆత్మకోవిదుడై, “ఈ కనబడేదంతా - నాకు కనబడేవారంతా నా ఆత్మయందే, ఆత్మకు సర్వదా అభిన్నమై వెలుగొందటం జరుగుతోంది. మమాత్మయే అందరియందు - అందరుగా సర్వదా ప్రకాశిస్తోంది” అనే అనుభూతి అనుక్షణికంగా, అకృత్రిమంగా ఆస్వాదిస్తూ ఉండటమే స్వస్వరూప జ్ఞానము. అంతవరకూ నేనూ ఒప్పుకుంటున్నాను.
అయితే .... ఏం?
అటువంటి స్వస్వరూపజ్ఞానము గల పండితుడు కూడా “నేను పూర్ణాత్మజ్ఞానిని కదా!”... అని అనుకుని కర్మల నుండి విరమిస్తాడా? లేదు. తాను నిర్వహిస్తూ ఇతరులను కూడా కర్మల విషయంలో ప్రోత్సహిస్తాడు. అజ్ఞానిని పిలచి “కర్మలు చేయవద్దులే” .. అని బోధించడు. నిష్కామకర్మను గుర్తు చేస్తాడు.
శ్లో॥ ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైః అపి ముముక్షుభిః ।
కురు కర్మ ఎవ తస్మాత్ త్వమ్! పూర్వైః పూర్వతరం కృతమ్ ॥ (భగవద్గీత 4.15)
శ్లో॥ న అనవాప్తమ్ అవాప్తవ్యమ్ వర్త ఏవ చ కర్మణి ॥ (భగవద్గీత 3.22)
యది హి అహమ్ న వర్తేయం జాతు కర్మణి అతంద్రితః ।
మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః, పార్థ! సర్వశః ॥ (భగవద్గీత 3.23)
... అని కదా భగవద్గీతా గానం!
ఆత్మజ్ఞాని కూడా ఆ విధంగా కర్మలను నిందించడు. కర్మల నుండి విరమించడు. అంతేకాదు!
“తత్త్వజ్ఞాని విషయంలో లోక కళ్యాణ పూర్వకమైన గుణములు - ఆశయములు - కార్యక్రమ విధులు స్వభావసిద్ధమే అవుతాయిగాని, నిషిద్ధము కాదు” అని కొన్ని శాస్త్రములు (శాంతి పర్వము - భారతము, మనుధర్మశాస్త్రము ఇత్యాదులు) ఎలుగెత్తి బ్రహ్మజ్ఞాని కీర్తిస్తున్నాయి కూడా!
Page: 87
శ్లో॥ యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమ్ ఆప్నోతి నైష్ఠికీమ్ ।
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ॥ (భగవద్గీత 5.12)
ఇంకొక విషయం. కర్మలు ఆవశ్యకం! అనివార్యం!
లోకంలో ఈ సర్వజనులచే ఆయా ఆశ్రమములకు ఉచితమైన కర్మలు నిర్వర్తించబడకపోతే,.... ఈ లోకము - లోకసంబంధమైన ఆహారాది ఆయా వ్యవహారాలు కొనసాగేదెట్లా?
“నేను కర్మలకు - కర్మఫలములకు ఆవల ఉన్నాను. ఆత్మ జ్ఞానోపాసన నా మార్గము. అందుచేత నేనొక్కడినీ ఆశ్రమమునకు సంబంధించి కర్మలు నిర్వర్తించకపోతే ఏమిలే?” అని ఒకడు తాను కర్మత్యాగి అయి, ఇతరులకు కర్మత్యాగాన్ని ప్రోత్సహించటమో, బోధించటమో జరిగితే? అతడు కర్మ- జ్ఞానముల ఉభయములు కోల్పోయి ఉభయ భ్రష్టుడు అవుతాడని నీతి శాస్త్రం ప్రభోధిస్తూ హెచ్చరిస్తోంది కదా! “కర్మ - జ్ఞానములలో ఒకటి నీవు వదిలితే రెండవది నిన్ను వదులుతుంది” అని వశిష్ఠమహర్షి చెప్పియున్నారు కదా!
శ్లో॥ యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః తత్ తత్ ఏవ తత్ ఇతరః జనాః ।
స యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే ॥
... అని గీతా శ్లోకం కదా! విజ్ఞుడైన వాడు ఆశ్రమ - వర్ణ సంబంధమైన నియమిత కర్మలు వదలితే, కొంత మంది అజ్ఞులు అది దృష్టాంతంగా తీసుకొని తమకు నియమించిన కర్మలు త్యజిస్తేనో...? ఆ దోషము విజ్ఞుడైన ఆ శ్రేష్ఠుడికి అంటుతుంది. తాను అందుకు కారణం కాకూడదనే ఉద్దేశ్యంతోనే శ్రీకృష్ణుడు అర్జునునికి గీతాశాస్త్రం ద్వారా స్వకర్మనిరతిని సూచించారు, ప్రోత్సహించారు కూడా!
అందుచేత,
ఎవ్వరూ కర్మలు త్యజించి ఉండటం ఉచితం కాదు. సాంఘిక జీవనానికి శ్రేయోదాయకం కాదు. అది సాధ్యపడేదీ కాదు!
Page: 88
అందుచేతనే, మేము మమ్ములను ఆశ్రయించ వచ్చిన జనులకు సాంఘికమైన - కుటుంబ సంబంధమైన - లౌకికమైన - శాస్త్రనిర్దేశితమైన కర్మలు నియతి పూర్వకంగా చేయమని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటాము. పురోహితులమగు మేము బ్రాహ్మణులమై, బ్రహ్మజ్ఞులమై ఉండి కూడా “ఆత్మజ్ఞానం ఒక వైపుగా ఆశ్రయిస్తూనే - మరొక వైపు నుండి మీ మీ విహిత కర్మలు శ్రద్ధగా, చక్కగా, కుశలతతో నిర్వర్తించండి” అని చెప్పుచున్నాము.
“యజ్ఞ - దాన - తపః కర్మ న త్యాజ్యం! కార్యమ్ ఏవ తత్” [మోక్షసన్యాసయోగం - భగవద్గీత.]
• మిత్రులారా! శ్రేయో కర్మలు, శాస్త్రవిహిత దైనందిక సత్క్రియలు వదలకండి.
• బద్ధగించకండి.
• యజ్ఞ-యాగాలు నిర్వర్తించండి.
• కర్మయోగముచే సంసిద్ధులు అవుతూ ఉంటే, ఇక మీ హృదయంలో తగిన సమయంలో జ్ఞానపుష్పము స్వయంగా వికశించగలదు.
శ్లో॥ న హి జ్ఞానేన సదృశం పవిత్రమ్ ఇహ విద్యతే ।
తత్ స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి ॥ [భగవద్గీత 4.38]
... అని బ్రాహ్మణులమగు మేము శ్రేయోభిలాషులమై సకల జనులకు గుర్తు చేస్తున్నాము.
మాతృదేవో భవ ।
పితృదేవో భవ ।
ఆచార్య దేవో భవ ।
అతిథి దేవో భవ ।
... అనే ఉపనిషత్ వాక్యాలు, వేదవాక్కు అందరికీ గుర్తు చేస్తున్నాము.
‘కర్మలు మానండి’ అని ఏ గురువు - శాస్త్రము - పురాణము చెప్పటం లేదే!
Page: 89
మరి, నీవు యజ్ఞ - యాగ - క్రతు - వ్రతాదులతో సహా కర్మ విభాగములను తక్కువచేసి కబుర్లాడుచున్నావే? అట్లాఎట్లా చెబుతావు?
అధ్యాయము-23.) క్రియా యజ్ఞము - అత్మ యజ్ఞము |
గొల్లభామ : మహనీయా! నేను కర్మలను - కర్మయోగమును తక్కువ చేయటం లేదు. “యజ్ఞ - యాగ - వ్రత ఇత్యాది కర్మలు స్వర్గసుఖముల ఆశయంగా ఆచరించటమనేది పునర్జన్మ హేతువు కదా!” ... అని మాత్రమే గుర్తు చేస్తున్నాను.
కర్మలు “అసంగము- ఏకము - కేవలీస్థితి - అకర్మబద్ధము” అగు మోక్షసంబంధమైన స్వస్వరూప జ్ఞానంలో (లేక) బ్రాహ్మీ స్థితితో సాదృశత్వము - సరిసమానత్వము - అవినాభావత్వము కల్పించజాలమని మాత్రమే నా విన్నపము.
నిత్యనైమిత్తిక, యజ్ఞ-యాగాది కర్మలు మాత్రమే బ్రహ్మత్వానికి (లేక) ఆత్మోపాసనకు మార్గమని అనలేమని మాత్రమే నా అభిప్రాయము. అనునిత్య ఆత్మోపాసన (లేక) ఆత్మయజ్ఞము అందరికీ అందుబాటుగా ఉండగలదని నా మనవి.
ఆత్మజ్ఞానమును, ఈ కనబడే సర్వము ఆత్మ స్వరూపంగా సందర్శించటమును ఏమరచి కర్మమార్గంలో సంచారాలు సలపటం మహాశయమును ఏమరిచి ఉండటమేనని గుర్తు చేస్తున్నాను.
| క్రియాయజ్ఞము | ఆత్మోపాసన/ ఆత్మజ్ఞానం/ ఆత్మయజ్ఞం |
|---|---|
| పునర్జన్మ హేతువు | జన్మలకంటేముందే సర్వదా వేంచేసియున్న ఆత్మ యొక్క అనుభూతిని ప్రసాదించేది. “జన్మలకు మునుముందే నేనున్నాను” అనే జన్మరాహిత్యత్వమును అందింపజేసేది. |
| సంపదలు ఇచ్చేది | సర్వత్యాగరూపము |
Page: 90
| క్రియాయజ్ఞము | ఆత్మోపాసన/ ఆత్మజ్ఞానం/ ఆత్మయజ్ఞం |
|---|---|
| లౌకికమైనక్రియా దోషములను పరిహరించగలదు | సర్వసాక్షిత్వము - అతీతత్వము - అప్రమేయత్వము నిరూపించగలదు |
| కర్మఫలాలు మరికొన్ని కర్మ వ్యవహారాలకు దారితీసేది. పునరావృత్తి దోషము కలిగి ఉన్నది. | సర్వకాలములకు ఏకమై ఉన్న కేవల సాక్షిత్వము ప్రసాదించేది. పునరావృత్తి దోషరహితమైనది. |
| ద్వంద్వములను, లౌకిక సమాచారములను సరంజామాను, భేదత్వము ఆశ్రయించవలసివస్తుంది. | ద్వంద్వాతీతము - అలౌకికము - అభేదము వైపుగా దారి చూపేది. |
“ఈ విధంగా కర్మల పరిమితిని - రహస్యాన్ని - ముఖ్యాశయాన్ని గమనించి మహాదాశయంతో నిర్వర్తించబడు గాక!” అని నా ఉద్దేశ్యము.
అట్టివానిని మహాశయుడు అనిపిలుస్తాం.
ఆత్మ యొక్క తత్త్వమేమిటో ఎరుగుచూ కర్మలలో ప్రవేశించాలి. అంతేగానీ, సర్వము - సమము - నిత్యము - అఖండము - అప్రమేయము అగు ఆత్మ యొక్క ముఖ్య సమాచారము ఏమరచి “మేము అధికులము - మరొకరు కారు” ఇటువంటి భేదదృష్టులను ఆశ్రయిస్తూ, ప్రోత్సాహిస్తూ కర్మలను ప్రతిపాదించటమనేది దారి-తెన్ను తెలియని కర్మారణ్యములో ప్రవేశించటము వంటిది కాదా! అడవిలో దారితప్పినట్లే - వివేచన చేయకుండా, సర్వసమభావమును బుద్ధిలో గుర్తుగా పెట్టుకోకుండా కర్మారణ్యములో ప్రవేశిస్తే...? ‘ఆత్మ’ అనే స్వగృహము తెలియరాక ‘14 లోకములు’ అనే మహారణ్యంలో జన్మ-కర్మ-మృత్యు పరంపరలలోనే దిక్కుతోచక తిరుగాడటమే కదా!
Page: 91
అందుచేత, కర్మనిరతి తత్త్వజ్ఞానముతో (తత్-త్వమ్ అసి = నాకు ఎదురుగా కనిపించే నీవు ఆ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అయి ఉన్నావు - అనే జ్ఞానముతో) సరిసమానమేనని సిద్ధాంతీకరించలేము. ఏ కర్మ అయినా ఈశ్వరార్పితబుద్ధితో చేస్తే ఆత్మజ్ఞానమే అవుతుంది.
అధ్యాయము-24.) కర్మల ఆవశ్యకత |
బ్రాహ్మణుడు : ఓ పడతీ! భామామణీ! నీవు ఏమి చెప్పుచున్నావమ్మా? ఈశ్వరార్పిత బుద్ధితో కర్మలు చేయాలి. మంచిదే!
అయితే....,
ఏదో ఒక కర్మ చేసి, విధి-విధానాలు లేకుండా, ప్రయోజనాలేమిటో తెలియకుండా “ఈ కర్మ ఈశ్వరార్పితం” అంటే కుదురుతుందా? ఒక పిల్లవాడు “నేను చదువుకోను. అల్లరి-చిల్లరగా తిరుగుతాను. తోటి పిల్లలను బాధిస్తాను. ఆ కర్మ శ్రీరామలింగేశ్వరునికి సమర్పిస్తాను”... అని అంటే మా విప్రుల పెద్దవారుగాని, మీ గొల్లల పెద్దవారు గానీ ఒప్పుకుంటారా? మరొకాయన “దుర్మార్గంగాను, దొంగతనాలు చేసి, తదితరులను మోసగించి డబ్బు సంపాదిస్తాను. ఆ కర్మలు ఈశ్వరునికి సమర్పిస్తాను”.... అని నీతోగానీ, నాతోగానీ అంటూ ఉంటే, అది నీవుగానీ-నేనుగానీ "ఈశ్వరార్పితకర్మ"గా ఒప్పుకుంటామా? లేదు కదా!
అందుచేత.....,
కర్మలు భగవదర్పితముగా చేయాలనునది కర్మయోగ రహస్యమే! శుభప్రదమే! అయితే “ఏ కర్మలు చేయాలి? ఏవి చేయకూడదు?” అని మునుముందుగా ఎరిగి కర్మ చేయాలి కదా!
“కర్మణోహ్యపి బోద్ధవ్యం! బోద్ధవ్యం చ వికర్మణః! అకర్మణశ్చ బోద్ధవ్యం! గహనా కర్మణో గతిః!” ... అని గీతాచార్యులవారు అంటున్నారు.
శాస్త్రములు -
.... ఇవన్నీ జనులకు బోధిస్తున్నాయి. అవన్నీ పఠించి మేము పురోహితులమై లోకులకు గుర్తు చేస్తూ ఉన్నాము.
Page: 92
"చేసే కర్మలు మంత్ర-క్రియా విధానాలు ఎరిగి చేయండి!" అని గుర్తు చేస్తున్నాం!
“మంత్రము - విధానము - దానము - సమర్పణ”... అను నాలుగు అంగములు శాస్త్రములచే నిర్దేశించినవి. నిర్వర్తించబడటానికి కావలసిన కుశలతను మేము పరమాత్మ యొక్క సేవగా జనులకు అందిస్తున్నాము.
“శ్రద్ధగా మేము నలుగురికి ఉపయోగపడతాము. మంచి పనులు చేస్తాము. ఆకలిగొన్న వారికి అన్నము పెడుతాము. పేదవారికి ధన సహాయం చేస్తాము. ఇక శాస్త్రములు, మంత్ర-తంత్ర విధానాలతో సంబంధమైన పూజ-వ్రతాదులతో మాకేమిలే!”... అని అనుకుని సత్కర్మలు చేస్తే మంచిదే! అట్లా కాకుండా కేవలం శాస్త్రవిహిత కర్మలను - సాధనలను - పూజ - వ్రతము మొదలైనవాటిని తిరస్కరించటానికి మాత్రమే సిద్ధపడుతూ, వారివారి అశ్రద్ధ-బద్ధకములకు కొనసాగించువారు, సాధనలను తిరస్కరించువారు పిడివాదులే గానీ ఉత్తమ సిద్ధి కొరకు కర్మలను ఉపయోగించుకునే నేర్పు కలవారు కాదు.
కర్మచేస్తే కదా.... అది సమర్పించటం?
అట్లా కాకుండా....,
... అంటూ రోజులు గడుపుతుంటే? ఓ భామా! అట్టి వారిని మేము లెక్కలోకి తీసుకోము.
Page: 93
... ఇదే మా బ్రాహ్మణ జనులు అందరికీ గుర్తు చేసే కర్మ - నిష్కామ కర్మ మార్గము.
మరొక్కసారి చెప్పుచున్నాను.
జనులు ఎంతవరకు అవకాశముంటే అంత వరకు సర్వ బద్ధకములు త్యజించి, శాస్త్రవిహిత కర్మలు నిర్వర్తించటమే ఉచితం. ఎంతవరకు నిర్వర్తిస్తే అంత వరకు అది శుభప్రదమే!
“న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠతి అకర్మకృత్” ... అని గీతా శాస్త్రవాక్యం కదా! ఏదో కర్మ నిర్వర్తించకుండా ఏ జీవుడూ ఒక్క క్షణం కూడా ఉండజాలడు.
కాలమును వృధా చేస్తూ బుద్ధిని దోషభూయిష్టం చేసే అల్ప కర్మల కంటే శాస్త్రీయమైన - పుణ్య ప్రదమైన - భగవత్ ఉపాసనా సంబంధమైన కర్మలు చేయటమే ఉచితం. శుభప్రదము కూడా!
పైగా..., పురాణ-ఇతిహాసములు, ధర్మ శాస్త్రములు కర్మల రహస్యము బోధిస్తూ “పరిశుద్ధ కర్మలు జ్ఞానమునకు హేతువులు”... అని భోదిస్తున్నాయి. శాస్త్రములు ఘోషిస్తున్నాయి.
“శాస్త్రములు ఎందుకు విజ్ఞులచే రచించబడ్డాయి?” అనే ప్రశ్నకు మహనీయుల సమాధానమేమిటో విను.
శ్లో॥ కర్మణా జాయతే భక్తిః, భక్త్యా జ్ఞానమ్ ప్రజాయతే ।
జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః ఇతి శాస్త్రేషు నిర్ణయః ॥
ఉత్తమ కర్మ భక్తికి, భక్తి ఆత్మజ్ఞానమునకు, జ్ఞానము ముక్తికి దారిచూపుతాయన్నది ఆర్ష వాక్యము.
కాబట్టి ఓ గోపబాలికా! ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదిస్తూ కర్మ నిరతిని, శాస్త్రవిహిత కర్మ విధానములను నిందించటం, తక్కువ చేయటం ఉచితం కాదు.
గొల్లభామ : మహాశయా! విప్రవర్యా! “జ్ఞానము - కర్మ... ఈ రెండూ సమానమే! ఒకే ఫలాన్ని ప్రసాదిస్తాయి... కనుక రెండింటి తీరూ ఒక్కటే”... అని మీరు ప్రతిపాదిస్తున్నారు కదా!
Page: 94
ఈ విషయంలో దయచేసి ఏదైనా ఉపమానం సహాయంతో విశదీకరిస్తే నేను, ఈ సభిక మహాశయులు మరి కొంత సంతోషము పొందుతాము.
బ్రాహ్మణుడు : చెట్టుకు ముందుగా పుష్పము కాస్తోంది. ఆ పుష్పము వికసిస్తోంది. క్రమంగా ఆ పుష్పము నశించి కాయగా, పండుగా అగుచున్నది. పుష్పము ఫలముగా అగుచున్నప్పుడు ఆ పుష్పము స్వయముగా నశిస్తోంది కదా!
అట్లాగే..,
ఆత్మజ్ఞానము వికసించిన తరువాత కర్మ తనను తానే నశింప జేసుకోగలదు. ఆత్మజ్ఞానము వికసించనంత వరకు ఈ జీవునికి 'కర్మలు' అత్యంతావస్యకం. విహిత కర్మలు - శాస్త్రప్రవచిత ఉపాసనా కర్మలు త్యజించకూడదు. నిర్వహించవలసిందే!
గొల్లభామ : మహాత్మా! కర్మలు - భక్తి - జ్ఞానములకు ముక్తికి దారి చూపుతాయని అన్నారు కదా! దయచేసి ఈ విషయం చెప్పండి.
ఏఏ కర్మలు ఏ విధంగా నిర్వర్తిస్తే అవి పరిశుద్ధము - ఉత్తమము అయిన ఆత్మజ్ఞానానికి, ముక్తికి దారితీయగలవు? వివరించమని నా విన్నపము.
బ్రాహ్మణుడు : కర్మలు 3 రకాలు.
విహిత కర్మలు, యజ్ఞార్థాత్ కర్మలు జీవుని బుద్ధిని పరిశుద్ధ పరచి భక్తి - జ్ఞాన - ముక్తి భావ తరంగాలను ప్రసరింపజేస్తాయి.
Page: 95
“యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోఽయం కర్మ బంధనః ॥”
దృశ్య తాదాత్మ్యముచే ఇంద్రియ చాపల్యముతో చేసే కామ-రాగ పూరితమైన కర్మలు బంధము - పునర్జన్మ హేతువులు అగుచున్నాయి.
విహిత - ఉపాసనా కర్మలు వేదముల చేత నిర్దేశించబడుచున్నాయి. వేదములో...? అక్షర పరబ్రహ్మము నుండే బయల్వెడలుచున్నాయి.
ఈ విధంగా సర్వ వ్యాపకుడగు ఆ పరబ్రహ్మమూర్తి యజ్ఞరూపుడై యజ్ఞకర్మల యందు ప్రకాశిస్తూ ఉంటారు. వేంచేసి ఉంటారు.
తస్మాత్ సర్వగతమ్ బ్రహ్మ ।
నిత్యమ్ యజ్ఞే ప్రతిష్ఠితమ్ ॥ - గీతా శాస్త్రం.
కాబట్టి యజ్ఞము పరమేశ్వర స్వరూపమే! ఇందులో సందేహము లేదు.
అందుచేతనే, మా వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి ఉపనయనము చేత ద్విజులమై వేదములచే సూత్రీకరించబడుచున్న యజ్ఞ - యాగ - క్రతు - మంత్ర - తంత్ర విధానములన్నీ గురు సమక్షంలో శ్రద్ధగా అనేక సంవత్సరాలు అభ్యసించి విప్రులమై శ్రద్ధాసక్తులు గలవారిచే యజ్ఞము చేయిస్తూ ఉన్నాము. మేమే నిర్వర్తించి సోమయాజులమగుచున్నాము కూడా! యజ్ఞముల మంత్ర బలముచే బ్రహ్మమును పూజించి, ఉపాసించి బ్రహ్మజ్ఞానము సంపాదిస్తున్నాము. బ్రహ్మభావనచే బ్రాహ్మణులమై జనులచే గౌరవించబడుచున్నాము.
గొల్లభామ : మహనీయా! ద్విజోత్తమా! విప్రవర్యా! మీరు చెప్పినదంతా బాగానే ఉన్నది. అయితే, మీరు జనులచే చేయిస్తున్న యజ్ఞముల విషయమై నాకు కొన్ని విమర్శనా పూర్వకమైన అభిప్రాయములు ఉన్నాయి. నేను ఎవ్వరైనా - ఎప్పుడైనా - ఎక్కడైనా - ఏ బాహ్య ఉపకరణములు లేకుండానే నిర్విఘ్నంగా నిర్వర్తించగల “ఆత్మయజ్ఞము” గురించి ప్రతిపాదించదలచుకున్నాను. అందుకుగాను అగ్ని కార్యములతోనూ - హోమము - జీవహింసలతో కూడి సంపదలు వెచ్చించి చేస్తున్న యజ్ఞముల గురించిన విమర్శనా పూర్వకమైన చిన్న చర్చ మీరు అనుజ్ఞ ఇస్తే మీముందు ఉంచుతాను.