[[@YHRK]] [[@Spiritual]]

ēsāvāsya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


శుక్ల యజుర్వేదాంతర్గత

3     ఈశావాస్యోపనిషత్

మంగళ శ్లోక - తాత్పర్య పుష్పము


శాంతి మంత్రం శాంతి మంత్రము

ఓం
పూర్ణం అదః, పూర్ణం ఇదం

స్వయం ప్రకాశకుడు, స్వస్వరూపుడు అగు - పరమాత్మ సర్వదా పూర్ణుడు! ప్రకాశితమగుచున్న ఈ దృశ్య జగత్తు కూడా సర్వదా పూర్ణమే!

పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే।

పూర్ణమగు పరమాత్మ నుండే ఈ పూర్ణమగు దృశ్య జగత్తు (కాంతి నుండి కాంతి పుంజమువలె) బయల్వెడలుతోంది.

పూర్ణస్య పూర్ణమ్ ఆదాయ

పూర్ణమగు పరమాత్మ నుండి ఈ పూర్ణమగు దృశ్యము బయల్వెడలుచున్నప్పటికీ పరమాత్మ సర్వదా పూర్ణముగానే ఉండియున్నారు. ప్రకాశించువారై - ప్రకాశించబడుచున్నదై కూడా ఉన్నారు. ఈ జగత్తు పూర్ణమగు పరమాత్మ యందు పూర్ణ-ఆనంద స్వరూపమైయున్నది.

పూర్ణం ఏవ అవశిష్యతే॥

పూర్ణమగు పరమాత్మ నుండి పూర్ణమగు ఈ జీవుడు ప్రదర్శితమగుచున్నాడు. అయినప్పటికీ పరమాత్మ సర్వదా పూర్ణుడై ప్రకాశిస్తున్నారు.

వాస్తవానికి ఈ జీవుడు, (సహజంగా చూస్తే), పూర్ణ పరమశాంత స్వరూపుడై సర్వదా పరమాత్మగా వెలుగొందుచున్నాడు!

ఓం శాంతిః శాంతిః శాంతిః॥





ఓం ఈశా వాస్యమిదగ్ం సర్వం యత్కిం చ జగత్యాం జగత్ .
తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం .. 1..
1) ఓం ఈశావాస్యమ్ ఇదగ్ం సర్వం
యత్ కిం చ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథా।
మా గృధః కస్య స్విద్ ధనమ్ ॥
స్వప్నములో కనిపించేదంతా, స్వప్న ద్రష్టయొక్క స్వప్న చైతన్య రూపమే కదా! అట్లాగే, ఈ కనబడే అనునిత్య పరిణామ రూపమగు జగత్ (జ = జనించేది, గత్ = గతించేది) అనబడే దృశ్యమంతా కూడా అణువణువూ ఈశ్వరునిచే ఆక్రమించబడినదైయున్నది. ఇదంతా ఈశ్వర భావనా సంప్రదర్శనమే. అట్టి ఈ జగత్తును పొందుచున్న మనం ఇద్దానిని “ఇది నాది కాదు” అని భావించి (త్యజించి), ఎఱిగియేయుండి మాత్రమే ఆస్వాదించాలి. పరమాత్మకు చెందిన ఇద్దానిని, పరమాత్మకు చెందిన మనం “ఇది నాది” అని, “అది కావాలి" అని కోరుకోకూడదు! త్యాగివై జీవించాలి. ఇతరుల ధనముపై అపేక్ష కూడదు. (ఇది ఏదీ నాది కాదు అని గ్రహించి ఉండాలి).

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగ్ం సమాః .
ఏవం త్వయి నాన్యథేతోఽస్తి న కర్మ లిప్యతే నరే .. 2..
2) కుర్వన్ ఏవ ఇహ కర్మాణి
జిజీవిషేత్ శతగ్ం సమాః।
ఏవం త్వయి న అన్యథేతో అస్తి
న కర్మ లిప్యతే నరే ॥
నిర్వర్తించవలసిన ఆయా విద్యుక్త - శాస్త్రవిహిత కర్మలు నిర్వర్తిస్తూ నిండు నూఱేళ్ళు జీవించాలనే ఉద్దేశ్యం కొనసాగించాలి. భగవదర్పితంగా ఆ కర్మలు నిర్వర్తిస్తే, అప్పుడు కర్మల దోషమే జీవుణ్ణి అంటదు. కర్మలు నిర్వర్తించటం అనివార్యం. భగవదర్పితంగా కర్మలు నిర్వర్తించటం తప్పితే ఇక్కడ వేరే త్రోవయే లేదు.

“నా కొరకే నా కర్మలు” అనుకున్నామా, ... కర్మలు బంధము - దోషము తెచ్చిపెడతాయి.

అసుర్యా నామ తే లోకా అంధేన తమసా వృతాః .
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్ఛంతి యే కే చాత్మహనో జనాః .. 3..
3) అసుర్యా నామ తే లోకా
అంధేన తమస ఆవృతాః ।
తాగ్ంస్తే ప్రేత్య అభిగచ్ఛన్తి
యే కే చ ఆత్మ హనో జనాః ॥
"భగవదర్పితంగా కర్మలు నిర్వర్తించటం" అనే జ్ఞాన బుద్ధి లేకపోతే, అప్పుడీ క్రియా వ్యవహారమంతా బంధమే అవుతోంది. ఈ కనబడే జగదృశ్యమంతా అజ్ఞానాంధకారమే అయిఉంటోంది. "భగవదర్పిత బుద్ధి" అనే త్యాగ భావనతో కూడిన బుద్ధిని సంపాదించనట్టి జీవులు - ముందుముందు అజ్ఞానాంధకారమగు స్థితి-గతులను జన్మ-కర్మలను పొందుచూ తమకు తామే ద్రోహం చేసుకొనుచున్న వారగుచున్నారు.

అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్పూర్వమర్షత్ .
తద్ధావతోఽన్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి .. 4..
4) అనేజత్ ఏకం, మనసో జవీయో,
నైతద్దేవా (న ఏతత్ దేవా) ఆప్నువన్ పూర్వమ్ అర్హత్
తత్ ధావతో అన్యానత్యేతి తిష్ఠత్
తస్మిన్ అపో మాతరిశ్వా దధాతి ॥
ఈ జగత్తంతా ఏ ఆత్మయొక్క ఈశ్వర తత్త్వముచే ఆక్రమించబడినదై ఉన్నదో...అట్టి పరబ్రహ్మము - తాను సర్వదా మార్పు చేర్పులు లేనిదై చలనరహితమై యున్నది. అయితే ఏం? మనస్సుకంటే కూడా అత్యంత వేగయుక్తమైయున్నది.

ఏ ఇంద్రియములకు ఈ దృశ్యజగత్తు అనుభవమౌతోందో అట్టి ఈ ఇంద్రియములు, ఇంద్రియ దేవతలు అద్దానిని గమనించలేవు. దర్శించలేవు. ఎందుకంటే ఈశ్వర స్వరూపం ఈ ఈ ఇంద్రియ మనస్సుల కంటే ముందే ఉండి ఉన్నది. ఈశ్వరుని వాయుతత్త్వము చేతనే ప్రాణ-మనో-ఇంద్రియములు ఏర్పడినవై ఉన్నాయి. ఇక్కడి వ్యాపారములకు ఈశ్వర తత్త్వమే ఆధారమై ఉన్నది. వాటి కార్యకలాపములు ధరించుచున్నది, నియమించునది ఈశ్వర తత్త్వమే!

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే .
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః .. 5..
5) తత్ ఏజతి| తత్ న ఏజతి! 
తత్ దూరే! తత్ ఉ అన్తికే
తత్ అంతరస్య సర్వస్య
తదు సర్వస్య అస్య బాహ్యతః ॥
ఆట్టి ఆత్మ అంతటా - అన్నిటా చలించుచున్నది. కానీ అది సర్వదా చలనరహితం. సర్వ పరిణామములకు ఆధారం. కానీ, పరిణామ రహితం. అది దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాలకు ఆవల ఉన్నది. అందుచేత దృశ్యము దృష్ట్యా అత్యంత సుదూరంగా ఉన్నది. అయితే దృశ్య - ద్రష్ట రూపము తానే అయివుండటం చేత ప్రతి జీవునికి సర్వదా అతిసమీపంలో ఉన్నది. ఆ ఆత్మ సర్వజీవుల అంతరంగ స్వరూపంగాను, సర్వజీవుల బాహ్య జగత్ స్వరూపంగాను ప్రదర్శితమగుచూ అంతా తానే అయివున్నది. సర్వ వ్యాపకము, సర్వజీవుల బాహ్య-అంతర స్వరూపము ఆత్మయే!

యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే .. 6..
6) యస్తు (యః తు) సర్వాణి భూతాని
ఆత్మనీ ఏవ అను-పశ్యతి ,
సర్వ భూతేషు చ ఆత్మానం,
తతో న విజుగుప్సతే ॥
ఏ ద్రష్ట (లేక) జీవుడైతే “సర్వము నా ఆత్మ స్వరూపమే” అని, “సర్వము నా ఆత్మ నా యందే ఉన్నది”... అని దర్శిస్తూ ఉంటాడో... అట్టివానికి ఇక ద్వేషించటానికి గాని, విబేధించటానికిగాని, తిరస్కరించటానికి గాని ఎవ్వరు ఎక్కడ ఏరూపంగా మిగిలి ఉంటారు? ఆట్టి ఆత్మ సాక్షాత్కారం పొందినవానికి ద్వేషానికి స్థానమే లేదు. దేనిని చూచి అసహ్యించుకోడు. (ఒకడు తన చేతి వ్రేళ్ళను చూసి తానే ద్వేషించడు కదా!)

యస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః
తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః .. 7..
7) యస్మిన్ సర్వాణి భూతాని
ఆత్మైవ అభూత్ విజానతః
తత్ర కో మోహః? కః శోకః?
ఏకత్వమ్ అను-పశ్యతః
ఎవ్వడైతే "సర్వ తదితర జీవులు-దేహులు-చరాచర జగత్తు అభూతమగు నా ఆత్మ స్వరూపమే అయిఉన్నది కదా!".. అని గ్రహిస్తున్నాడో అతనికి మోహమెక్కడిది? దుఃఖమెక్కడిది? ద్వేషమెక్కడిది? తనతో సహా అంతటా ఏకత్వమే తాండవించటం గమనించి ఆనందిస్తున్నాడు! ఈ జగత్తంతా ఆతనికి తన అఖండ స్వరూపమై విరాజిల్లుచున్నాడు.

స పర్యగాచ్ఛుక్రమకాయమవ్రణ-
మస్నావిరగ్ం శుద్ధమపాపవిద్ధం .
కవిర్మనీషీ పరిభూః స్వయంభూర్యాథాతథ్యతోఽర్థాన్
వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః .. 8..
8) స పర్యగాః, శుక్రమ్, అకాయమ్, అవ్రణమ్,
అస్నావిరగ్ం, శుద్ధమ్, అపాప విద్ధమ్|
కవిః మనీషీ పరిభూః స్వయంభూః యథా
తథ్యతో అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః ॥ 
అట్టి తనకు తానే ఉదయించినట్టి ఆత్మ సర్వవ్యాపము ఉజ్వలము-నిర్మలము అయినది. దేహాదులచే పరిమితమైనది కాదు! బాధా రహితమైనది. దృశ్యాదుల ఆకారం లేనిది! సర్వదా పరమ శుద్ధము! పాపసంస్కార రహితము! జగత్ ప్రదర్శనమునకు తానే రచయిత. అంతా ఎఱిగియున్నది! అన్నిటినీ తనయందు సర్వదా కలిపివేసుకొనియే ఉన్నది. సర్వదా యథాతథమై (As it is ) ఏర్పడియున్నది. సర్వ అర్ధ పరమార్ధములకు తానే నిర్మాత. సర్వమును తానే పంచి యిచ్చుచున్నట్టిది! ఎల్లప్పుడూ, ఎల్లప్పటికీ సమస్వరూపమై విరాజిల్లుచున్నది! శాశ్వతమైనది!

అంధం తమః ప్రవిశంతి యే అవిద్యాముపాసతే .
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ం రతాః .. 9..
9) అంధం తమః ప్రవిశన్తి
యే అవిద్యామ్ ఉపాసతే
తతో భూయ ఇవ తే తమో
య ఉ విద్యాయాగ్ం రతాః ॥ 
“నేను వేరు - ఈ సహజీవులు వేరు - దైవము వేరు” ... అని తలచుచూ, కామ్యకర్మల రూపమగు అవిద్యను ఎవ్వరు ఉపాసిస్తూ ఉంటారో,... అట్టివారు అజ్ఞానాంధకారములో ప్రవేశించి సంచరిస్తున్నవారగుచున్నారు. "శాస్త్ర పాటవం” అనే విద్యకు పరిమితులైతే కూడా  (నేర్చుకున్నది దృష్టిలో ప్రవేశించకుంటే) అది “అంధకారము” యొక్క కొనసాగింపే అవుతుంది. ఎవ్వరైతే క్రమంగా తమ అజ్ఞానాంధకారం తొలగించుకుంటూ వస్తారో, “అంతా ఆత్మయందు. ఆత్మయే అన్నిటా" తత్ ఆత్మయేవాహమ్ అను - అనుభూతి పెంపొందించుకొంటూ వస్తారో,... వారు మాత్రమే శాస్త్ర పాఠ్యాంశాన్ని అనుభవ రూపంగా మరల్చుకొనుచున్నారు....... అవిద్య నుండి ఆత్మవిద్య వైపు ప్రయాణిస్తున్నారు.

అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా .
ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే .. 10..
10) అన్యత్ ఏవ ఆహుః “విద్యయా”,
అన్యత్ అహుః “అవిద్యయా” ।
ఇతి శుశ్రుమ ధీరాణాం
యే నః ‘తత్’ విచచక్షిరే ॥ 
అంతా నా ఆత్మ స్వరూపమే, ఆత్మయందే అంతా ఉన్నది → 'విద్య’.
ఇదంతా వేఱు వేఱు →‘అవిద్య’. 
‘విద్య' అనే మార్గం - 'అవిద్య' అనే మార్గం, వాటి వాటి ప్రయోజనములు వేఱువేఱై ఉంటున్నాయి. దేనిచేత తత్పదము పొందటానికి మనం అర్హులం అవుతామో, అట్టి పథమును విజ్ఞులు, దార్శనికులు ఆగు మహనీయులు, ఆత్మజ్ఞులగు ధీరులు ప్రవచిస్తూ ఉండగా, వారి వ్యాఖ్యానములు వింటున్నాము. సత్యసుబోధితులమగుచున్నాము.

విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయగ్ం సహ .
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే .. 11..
11) విద్యాం చ అవిద్యాం చ
యః తత్ వేదో ఉభయగ్ం సహ,
అవిద్యయా మృత్యుం తీర్వా,
విద్యయా అమృతమ్ అశ్నుతే ॥
శాస్త్ర సాధనా క్రమములు అవిద్యా నిర్మితాలే! శాస్త్ర సంవిధానములోని విద్య-అవిద్యా విభాగములు ఎవ్వరైతే చక్కగా బుద్ధితో విచక్షించి గ్రహిస్తారో,.... అట్టివారు అవిద్యా రూపసాధనలను ఉపయోగించి మృత్యువు నుండి విడివడినవారై, విద్యను ఉపాసించి అమృత స్వరూపులగుచున్నారు. 'విద్య' కొరకై అవిద్య - 'ఉద్ధరిణ' వలె, ‘పంచపాత్ర’ వలె ఉపకరణము అగుచున్నాయి.

అంధం తమః ప్రవిశంతి యేఽసంభూతిముపాసతే .
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్ం రతాః .. 12..
12) అంధం తమః ప్రవిశన్తి
యే అసంభూతిమ్ ఉపాసతే
తతో భూయ ఇవ తే తమో
య ఉ సంభూత్యాగ్ం రతాః ॥ 
దృశ్య జగత్తు - తదితర జీవులు ఆత్మకు వేఱుగా లేరు. ఏది ఆత్మకు వేఱుగా మొదలే లేదో, అట్టి 'అసంభూతి’ని ఉపాశించేవాడు (సృష్టిని ఉపాసించువాడు) అజ్ఞానాంధకారంలో ప్రవేశించువాడగుచున్నాడు. “అట్లాగే పరమాత్మ దీనికి వేఱుగా ఎక్కడో ఉన్నారు" అనే సంభూతిని (సృష్టికర్తయగు హిరణ్యగర్భుని) అన్యముగా ఉపాసించువాడు కూడా అజ్ఞానం కొనసాగిస్తున్నవాడే అగుచున్నాడు.

అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్
ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే .. 13..
13) అన్యత్ ఏవ ఆహుః 'సంభవాత్'
అన్యత్ అహు ‘అసంభవాత్'!
ఇతి శుశ్రుమ ధీరాణాం
యేనః తత్ విచచక్షిరే ॥ 
జ్ఞాన చక్షువులు గల మహనీయులు ధీచక్షువులతో దర్శించి “జగత్తు ఏర్పడి ఉన్నట్లు కనబడుతోంది. నిత్య సంభవమగు ఆత్మయే ఈ జగద్రూపం. కానీ ఆత్మయందు జగత్తు లేదు (అసంభవము)” …... అని సంభవ - అసంభవములను విశదీకరించగా మనం వింటున్నాము. గ్రహిస్తున్నాము.

సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్ం సహ
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే .. 14..
14) సంభూతిం చ వినాశం చ
యః తత్ వేద ఉభయగ్ం సహ...,
వినాశేన మృత్యుం తీర్త్వా
సంభూత్యా అమృతమ్ అశ్నుతే ॥ 
సర్వదా యథాతథమై సర్వత్రా ఏర్పడియున్నది = "సంభూతి"
అనుక్షణం మార్పుచెందుతూ ఉండేది = “అసంభూతి”
జలానికి గల తరంగాకారం సర్వదా మార్పు పొందుతూ ఉంటుంది (వినాశభూతము). కానీ ಅನ್ನಿ తరంగాలలోని జలము సర్వదా యథాతథము (అవినాశము).
“మార్పు చెందనిది - మార్పు చెందేది” అనే రెండిటి సంయోగమే ఈ జీవుడు-జగత్తు కూడా! విజ్ఞుడైనవాడు ఈ సంభూతి (యథా తథము) వినాశన శీలము (మార్పు చెందేది) అను రెండిటినీ చక్కగా గ్రహించినవాడై, సంభూతి-అసంభూతిల వివేచను వివేకములచే ఆశ్రయించి, మృత్యువును అధిగమించినవాడగుచున్నాడు. 'సంభూతము' అను ధర్మమునకు కూడా అతీతము అగు ఆత్మను సేవించి అమృతత్వమును సంతరించుకొనినవాడు అగుచున్నాడు. అనగా మార్పు చెందని దానిని గమనించి, ఉపాశించి మార్పు - చేర్పుల పరిధిని అధిగమించి తన స్వస్వరూపమును ఆస్వాదించుచున్న వాడగుచున్నాడు.

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం
తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే .. 15..
15) హిరణ్మయేన పాత్రేణ
సత్యస్య అపిహితం ముఖమ్ |
తత్ త్వం, పూషన్! అపావృణు,
సత్య ధర్మాయ దృష్టయే ॥
ప్రతి జీవునియందు ‘ఆత్మజ్ఞానము' అనే విశేషముతో కూడిన ఆత్మజ్యోతి జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది. అయితే ఆ ఆత్మజ్ఞానము అనే 'సత్యము' హిరణ్యగర్భుని కల్పనయగు ‘జగత్ అనుభవం’ అనే బంగారు పాత్రలో 'మోహము' అనే మూసచే కప్పబడినదైయుండి, అనేక మంది జీవులకు అనుభూతం కావటం లేదే! ఏమి ఆశ్చర్యం!

ఓ పరమాత్మా! ‘మోహము' అనే పదార్థముతో తయారుకాబడి ‘జగదనుభవం’ అనే బంగారు పాత్రలో సత్యమగు మా స్వస్వరూపము కప్పబడియున్నది కదా! ఫలితం? మేము అనేక వేదన-రోదనలకు గురి అగుచున్నామే! కాబట్టి సర్వాత్మకుడవగు ఓ పరంధామా! మాయొక్క సత్య-ధర్మములు సాక్షాత్కారము కొరకై ‘లోకాపేక్ష అనే మూసను తొలగించమని మిమ్ము వేడుకుంటున్నాం. "అపేక్ష" రహితమైనట్టి నిర్మల సత్య-ధర్మ దృష్టిని ప్రసాదించండి!

పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్
సమూహ తేజో యత్తే రూపం కల్యాణతమం తత్తే పశ్యామి
యోఽసావసౌ పురుషః సోఽహమస్మి .. 16 ..
16) పూషన్! ఏకరే! యమ! సూర్య! ప్రాజాపత్య!
వ్యూహ రశ్మీన్ సమూహ ।
తేజో యత్ తే రూపం కల్యాణ తమం (అస్తి),
తత్ తే పశ్యామి యో అసావసౌ పురుషః “సోఽహమస్మి" ॥ 
ఓ ఆత్మదేవా! సర్వ పరిపోషకుడా! ఒంటరి బాటసారీ! యముడు - సూర్యుడు - ప్రజాపతులతో సహా సర్వ నియామకుడా! సర్వస్వరూపుడా! అనంతకోటి సూర్యప్రభావా! సర్వజీవుల ఉత్పత్తి స్థానమా! నీ'మాయ' అనే తేజోకిరణములను కొంచెం ఉపసంహరించవయ్యా! లేకుంటే నిన్ను దర్శించలేకపోతున్నామే! కళ్యాణ స్వరూపము - అత్యంత వైభవోపేతము - మంగళకరము అగు ఆత్మ స్వరూపమును నీ అనుగ్రహం చేత మాత్రమే సందర్శించగలుగుతాము కదా! తద్వారా "సర్వ నియామకుడగు పరమాత్మయే నేను” .... అను సోఽహమ్-నకు చేరెదము గాక!

వాయురనిలమమృత
మథేదం భస్మాంతగ్ం శరీరం
ఓం క్రతో స్మర కృతగ్ం స్మర
ఓం క్రతో స్మర కృతగ్ం స్మర .. 17..
17) వాయుః అనిలమ్ అమృతమ్
అథ ఇదం భస్మాంతగ్ం శరీరమ్ ।
ఓం క్రతో స్మర! కృతగ్ం స్మర!
ఓం క్రతో స్మర! కృతగ్ం స్మర ॥ 
ఓ ప్రాణవాయువులారా! మీరు సర్వప్రాణస్వరూపమగు సప్రాణ స్వరూపులై  నాకు అనుభవమయ్యెదరు గాక! ఓ అగ్నిదేవా! మీ కరుణచే ఈ దేహము దేహాతీతానుభవమునకై నాకు సహకరించును గాక! వాయు - అనిలముల ఉపాసనచే మా భౌతిక భ్రమ భస్మమగును గాక!

ఈ జీవాత్మను సర్వాత్మకమగు పరమాత్మయందు లయించే కార్యక్రమము మాచే సర్వదా స్మరించబడుగాక! మా యొక్క సర్వ కార్యక్రమములు అట్టి మార్గములో, అట్టి ఉద్దేశ్యము పొందినవై ఉండుగాక! ఓ క్రతో! స్మరించుము! ఆత్మను స్మరించుము!

అగ్నే నయ సుపథా రాయే
అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో
భూయిష్ఠాం తే నమౌక్తిం విధేమ .. 18..
18) అగ్నే! నయ సుపథా రాయే! అస్మాన్
విశ్వాని దేవ! వయునాని విద్వాన్ ।
యుయోధి అస్మత్ జుహురాణమ్ ఏనో
భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ ॥
ఓ అగ్నిదేవా! కరుణతో నన్ను అసత్మార్గము నుండి విరమింపజేసి సన్మార్గములో ప్రయాణించునట్లు మార్గదర్శకులగుదురు గాక - అని అర్థిస్తున్నాను. స్వామీ! మీరు మాయొక్క సమస్త కర్మ-జ్ఞానములు ఎఱిగియే ఉన్నారు కదా! మాలోని అల్ప-పాప-దోష భూయిష్టనుగు దృష్టులను ప్రేమతో స్పృశించి నశింప జేయండి! దయాసాగరులగు మీ కటాక్ష వీక్షణచే మేము పునీతులం కాగలం. మా స్తోత్ర వాక్యములతో మిమ్ములను భక్తితో స్తుతిస్తూ ఉపాసిస్తున్నాం.

ఇతి ఈసావాస్యోపనిషత్ ।

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥



శుక్ల యజుర్వేదాంతర్గత

3     ఈశావాస్య ఉపనిషత్

అధ్యయన పుష్పము


ఓం పూర్ణమదః పూర్ణమిదమ్, పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే!
పూర్ణస్య పూర్ణమ్ ఆదాయ, పూర్ణమేవ అవశిష్యతే॥

అదః = సహజము - స్వస్వరూపము అగు పరమాత్మత్వము,
ఇదమ్ = సందర్భమాత్రము. జగత్ ద్రష్టత్వము - జగత్తులు. జీవాత్మత్వము.

ఓ సర్వాత్మ స్వరూపా! మీయొక్క పరతత్త్వ స్వరూపము సర్వదా పూర్ణమే !

మీయొక్క “జగత్తు - జీవుడు" రూపమగు ఈ ఇహతత్త్వ స్వరూపము కూడా సర్వదా సర్వత్రా పూర్ణమే । |

ఈ జీవుడు - దృశ్య జగత్తులు మీచే జనించి, మీయందే ఉన్నవై, మీచేతనే ప్రకాశింపజేయబడుచున్నాయి. పూర్ణ స్వరూపులగు మీనుండే పూర్ణ స్వరూపమగు దృశ్యజగత్-జగత్ ద్రష్టలు ఆవిర్భవిస్తున్నాయి.

పూర్ణ స్వరూపులగు మీనుండి పూర్ణ స్వరూపమగు జగత్తు ప్రదర్శించబడుచున్నప్పటికీ మీరు సర్వదా యథాతథ పూర్ణస్వరూపులై సర్వే- సర్వత్రా ప్రకాశిస్తున్నారు. సర్వత్రా శాంతైశ్వర్యముతో నింపి వేస్తున్నారు!

ఈశ = పరమాత్మ. సమస్త జీవులకు ఆత్మ. ఈష్టే ఇతి ఈట్. సర్వస్వతంత్రుడగు కేవలాత్మ!

ఈ కనబడే దృశ్యము నామరూపాత్మకమై - అనుక్షణికంగా అంతటా మార్పుచేర్పులు పొందుతూ అగుపిస్తోంది కదా!
‘జనించటము-గతించటము' అనే ధర్మములను ప్రదర్శిస్తూ 'జగత్' అని చెప్పబడుతోంది. అయితే, అనుక్షణిక పరిణామములతో కూడిన ఈ దృశ్యజగత్తుకు సర్వాత్మకుడగు ఈశ్వరుడే ఆధారము. మార్పులచే చేర్పులచే స్పృశించబడని ఈశ్వరుడు ఈ దృశ్యజగత్తు యొక్క అణువణువునా వ్యాపించినవారై ఉన్నారు. కలలో కనిపించేదంతా కూడా ఆ కల తనదైనవాని స్వప్నచైతన్య రూపమే కదా! కలలో కనిపించే మార్పు చేర్పులకు కల తనదైనవాడు లోను అవుతాడా? లేదు కదా!

ఓ సహజీవుడా! మిత్రమా! అట్టి ఈ జగత్తు నాదీ కాదు నీదీ కాదు! "ఇది నాది కాదు” అని మునుముందుగా గ్రహించి - అటుపై అనుభవమునకు స్వీకరించు. “ఇదంతా ఈశ్వరునిచే ప్రసరించబడియున్నదై, ఈశ్వరునికి చెందినదై యున్నది” ..... అని గమనించి ఉండు.

"హే పరమాత్మా! ఈశ్వరా నాది నాది అని నేను అనుకున్నదంతా నాది కాదయ్యా! నీది” అని గ్రహించి ఉండాలి. అంతేగాని “ఇది నాది, నాకు చెందినది” అని దేనినీ కోరుకోకు. నామ రూప-క్రియలను త్యాగబుద్ధితో దర్శించు. దేనినీ సొంతమని అనుకోకు. అహమిత్యేవ బంధాయః నాహమ్ ఇత్యేవ మోక్షయే|

ఇక కర్మలంటావా! నిర్వర్తించవలసిన కర్మలు ఇక్కడ శాస్త్రానుకూలంగా, లోకానుకూలంగా నిర్వర్తిస్తూనే నిండు నూణేళ్ళ జీవితం కలిగి ఉండాలని ఉద్దేశ్యించు. దేహం వచ్చిందంటే కర్మలు నిర్వర్తించటం అనివార్యం. అయితే కర్మఫలాలు తదనంతర కర్మలు ఇవన్నీ గొలుసు యొక్క రింగులవలె జీవుణ్ణి దృశ్యజగత్తుకు బంధించి అట్టేబెట్టుచున్నాయి. తనకు నియమితమైన కర్మలను ఎవ్వడు భగవదర్పిత బుద్ధితో మాత్రమే, సర్వాంతర్యామి - సర్వస్వరూపుడు అగు భగవానునికి సేవాపరంగాను, సదుద్దేశ్య సమన్వితంగాను నిర్వర్తిస్తాడో, అప్పుడా శుభాశుభ కర్మల దోషం ఆతనికి అంటదు.

దేహాభిమాని - కర్మల అభిమాని అగు జీవునికి - కర్మలు నిర్వర్తించే విషయంలో ఇంతకుమించి త్రోవయే లేదు. ఎందుకంటే, మరింకేవిధంగానైనా సరే, ఏ కర్మ అయినాకూడా అతనిపట్ల బంధమే కాగలదు. అందుచేత యోగ-యజ్ఞ యాగ జ్ఞాన - స్తోత్ర సంబంధమైనట్టివితోసహా సర్వకర్మలు జగదీశ్వరునికి సమర్పించి ఉండాలి.

ఆత్మజ్ఞానం సముపార్జించుకోవటం జీవునికి అత్యంతావశ్యకం. అత్యవసరం. అది అన్ని మనోవేదనలకు సరిఅయిన ఔషధం. ఏ జనుడైతే దేహం సానుకూల్యంగా ఉండగానే ఆత్మజ్ఞాన జ్యోతిని ఉద్దీపింపజేసుకోడో, ఎవ్వడైతే ఈ దృశ్యవస్తు - విషయ సంబంధ - బాంధవ్య - లోకప్రతిష్టాది విశేషములే జీవిత పరమావధి అని తలచి జీవితం గడిపివేస్తూ ఉంటాడో, .... అట్టివాడు అజ్ఞానాంధకారముచే నిబిడీకృతమైన అసుర లోకాలలో కర్మఫల సంబంధమైన ఉపాధి సహస్రాలు పొందటం కొనసాగించవలసి వస్తుంది. ఎవ్వడు ఈ 'మానవజన్మ' అనే అవకాశమును “ఉత్తమమైన ఆత్మావగాహన ఆత్మజ్ఞాన అభ్యాసములు పెంపొందించుకోవటం” అనే ప్రయోజనము కొరకై సద్వినియోగపరచుకోడో, అట్టివాడు తనకు తానే ద్రోహం చేసుకొన్నవాడు అగుచున్నాడు. ఉత్తరోత్తర తనకు ప్రాప్తించగల అధమ స్థితిగతులకు ఔషధం సేవించనివాడు అగుచున్నాడు. అసుర్యా పరమాత్మ భావమ్ అద్వయమ్ అపేక్ష్యా, దేవాదయోనిపి అసురాః ! పరమాత్మ భావన - అద్వయము! కర్మఫలముల దృష్ట్యా పుణ్య ఫలములగు దేవలోకము కూడా, అపేక్షకారణంగా అసురమే!

సర్వజీవుల వాస్తవ స్వరూపమగు ఆత్మ తాను యథాతథ స్థానంలో కదలికలు లేక, మార్పుచేర్పులు లేకయే ఉంటోంది. అయితే ఏం? మనస్సుకే ఆధారమై, మనస్సుకంటే కూడా జవీయః - మిక్కిలి వేగయుక్తమై యున్నది. కనుక అది కదలదు - కదులుతుంది కూడా! అట్టి ఆత్మ ఇంద్రియములకు విషయమా? కాదు. న-అప్నువన్ ఇంద్రియములు పొందజాలవు. అనగా కంటికి కనబడేది, చెవులుకు వినబడేది కాదు. వాటన్నిటికంటే ముందు అది ఏర్పడినదైయున్నది. అయితే, ఆత్మయొక్క చైతన్యము చేతనే జడమగు ఇంద్రియములు - మనస్సు క్రియా సహితమై ప్రవర్తించగలుగుచున్నాయి. కళ్ళకు కనబడకపోయినప్పటికీ అంతటా గాలి ఉండియే ఉన్నట్లు, ఇంద్రియముల బాహ్య-అభ్యంతరములలో ఆత్మ అనునిత్యముగా వెలుగొందుచున్నదైయున్నది.

ఆత్మ అంతటా ప్రసరించుచున్నదై, అన్నిటా చలించుచున్నట్టిది. తత్ ఏజతి. కదలికలన్నీ అద్దానివే! కానీ అది చలనరహితం. పరిణామ రహితం. ఇంద్రియములను ఉపయోగించి వెతకటం ప్రారంభిస్తే, అది అత్యంత సుదూరం. కాని ఆ ఇంద్రియములకే ఆధారమై అది అత్యంత సామీప్యం కూడా! తత్ ఉ అంతః, అస్యసర్వస్య, తత్ ఉ సర్వస్య అస్య బాహ్యతః సర్వ జీవులలోని అంతరాంతరములు వ్యాపించియున్నదై ప్రకాశిస్తోంది. ప్రతి జీవుని అంతరము - బాహ్యము కూడా ఆత్మ స్వరూపమే అయివున్నది.

దృశ్యము - ద్రష్ట కూడా ఆత్మ స్వరూపమే! అంతా అంతటా అన్నిటా అన్నీగా ఏర్పడిఉన్నది ఆత్మయే! జలము తనయందు తరంగములను ధరించినట్లుగా, ఆత్మయే ఈ జగతృశ్య - తదంతర వ్యవహారాదులను, జన్మ-కర్మ-అనుభూతి-అనుభవ పరంపరలను లీలగా ధరిస్తోంది. తన సన్నిధాన మాత్రంచేత ఈ సర్వదేహుల దేహ-మనో-బుద్ధి-చిత్త అహంకారాదులను 'ప్రవర్తన' కలిగి ఉండేటట్లు చేస్తోంది. తాను మాత్రం చలనరహితమై, అంతటా ప్రసరించి యున్నదై, అంతా తానే అయి సత్ చిత్ ఆనంద స్వరూపమై యథాతథంగా ఏర్పడియున్నది.

ఆహాఁ! ఆత్మ చలన రహితం. కానీ అన్నిటినీ తానే తన ఉనికి మాత్రంచేత కదలిస్తోంది! ప్రాణశక్తిని ప్రదర్శింపజేస్తూ, తద్వారా తదితరములన్నిటినీ చలింపచేస్తోంది. తాను పరిణామరహితం. కానీ కనబడే పరిణామాలన్నీ అద్దానివే! అద్దాని యందే! బాహ్య-అభ్యంతరములలో వ్యాపించి, సర్వవ్యాపారములకు తానే కారణం! మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు తమకుతామే ప్రవర్తిస్తున్నాయని అజ్ఞానముచే అనిపిస్తోంది. కానీ, వాటిని నియోగించి ప్రవర్తింపజేసేది ఆత్మయే! జడ జగత్తును చేతనపరచుచున్నట్టిది - ఆత్మయే!

ఈ 'జగత్తు' అనబడేది పదార్థమాత్రమా? బంధపరంపరా సమన్వితమా? ఇష్ట-అయిష్ట సంయోగమా? భావనామాత్రమా? ద్రష్ట స్వరూపమేనా? .... ఈ ప్రశ్నలకు సమాధానం, “ద్రష్ట దేనిపట్ల ఎట్లు ఎట్టి భావనను ఆశ్రయిస్తాడో, అట్లే అనుభవమౌతుంది” అని అనవలసి వస్తోంది. భావనయే జగతూపం. భావన ద్రష్టయొక్క రూపమే! ద్రష్ట ఆత్మరూపుడే! కనుక "నేను - నాకు కనబడే ఈ సర్వ తదితర జీవులు నా ఆత్మ యొక్క స్వరూపమే!” ... అని ఎవ్వరు గ్రహించి, హృదయస్థం చేసుకొంటారో, వారి దృష్టి సమున్నతం. వారికి "అంతా ఆత్మయే” అనువిధంగా కనబడుతోంది.

“ - నేను ఆత్మస్వరూపుడను!
- సర్వ తదితర జీవులు ఆత్మ స్వరూపులే!
- సర్వతదితర జీవులు - నేను కూడా ఆత్మయందే ప్రదర్శితులమగుచూ, ఆత్మకు అభిన్నమై ఉన్నాము!”
అని దర్శించే వారికి, .... ఇక జుగుప్స (అసహ్యం), కోపము, తాపము, పగ, దురభిమానము మొదలైనవి ఎక్కడుంటాయి? అట్టి ఆత్మ సాక్షాత్కారం పొందినవానికి ద్వేషానికి స్థానమే లేదు? ఇంకెక్కడి మోహం? ఇంకెక్కడి దుఃఖం? తత్ర కో మోహః? కో శోకః? అంతా అన్నిటా అప్పుడు-ఇప్పుడు ఎప్పుడు ఆత్మయే తాండవిస్తోంది. ఏకత్వం అనుపశ్యతి।  ఆతడు ఏకత్వమే అన్నిటా సందర్శిస్తున్నాడు. ఆ ఆత్మద్రష్ట తన స్వరూపమునే అన్నిటా దర్శిస్తూ తనను తాను సర్వవ్యాపిగా గమనిస్తున్నాడు. ఆస్వాదిస్తున్నాడు.

దేహరహితం. దేహానికి బాల్య-యౌవన-వార్ధక్యాలు ఉండవచ్చుగాక! వీటిని కదల్చే మన ఆత్మ ఆకారరహితం-అపరిమితం. కాబట్టి దేహము యొక్క దోషాలు (భౌతికమైనవేవీ) అద్దానికి అంటవు. దేహానికి ఆకలి దప్పులు ఉండవచ్చుగాక! ఆత్మకు అవన్నీ లేవు. సదా శుద్దము. ఈ పాప-పుణ్యాలతో ఆత్మస్వరూపానికి సంబంధం లేదు.

స పర్యగాః।  సర్వవ్యాపకము. తాను నిష్క్రియమై ఉండి కూడా..... అన్నిటినీ చూచేది, వాటికి అర్థము సంకల్పించేది అదే! అత్యంత సమున్నతము - ఉజ్వలము అయినది. పరిపూర్ణము. స్వయంభువు. (It is created by itself. It has no creator)! అట్టి ఆత్మ ఏ దృష్టితో చూస్తే అట్లాగే గోచరిస్తుంది. (యథా తథ్యతో అర్థాత్, యత్ భావమ్ - తత్ భవతి). సర్వదా యథాతథము. కాలమునకే సాక్షి. కనుక శాశ్వతము. అంతటా సమ స్వరూపమై వెలుగొందుచున్నట్టిది.

ఆత్మయే సత్యము. తదితరమంతా ఆపాదితము. నవరస నాటకములోని సంఘటనలు సంబంధములవలె తదితరమైనదంతా కల్పితము. ఆత్మ విద్యాస్వరూపము. ఆత్మకు అన్యంగా అనిపించేదంతా అవిద్యయే!

ఏ ఆత్మను ఏమరచి ఉండటం చేత జగత్ దర్శనమంతా అనేకత్వ సమన్వితమై కనిపిస్తూ - అనిపిస్తూ ఉన్నదో అదియే అవిద్య.

ఎవరైతే ఆత్మను ఏమరచి "ఈ దృశ్యమే సత్యము. ఈ దేహమే సత్యము. మనో బుద్ధి అహంకారములు వాటివాటి విషయములు సత్యమే” .... అని ఉపాసిస్తారో . అట్టివారు క్రమంగా అజ్ఞానాంధకారంలో ప్రవేశించుచున్నవారగుచున్నారు.

అట్లాగే “ఆత్మ వేఱు. దృశ్యము వేఱు. ఆత్మదర్శనము ఎప్పుడో-ఎన్నడో-ఎట్లాగో” - అనే ఆశయంతో ఎక్కడెక్కడో వెతుకుతారో, వారు కూడా చీకటిలో వెలుతురు కొరకై వెతుకుచున్నవారే అగుచున్నారు.

స్వస్వరూపమగు ఆత్మ తత్త్వాన్ని ఎఱిగిన ఆత్మజ్ఞులు ఉన్నారు. అట్టి ఆత్మజ్ఞుల అనుభూతి అవగాహనల ప్రవచనములే ఇక్కడ మనకు ఆత్మజ్ఞాన (వేదాంత) శాస్త్రాదుల రూపంగా అందించబడుచున్నాయి. ఆత్మజ్ఞానోపాసకులకు అట్టి విజ్ఞుల వాక్యార్థముల సారము గ్రహించటమే మార్గము.

విద్య-అవిద్య ఇవి రెండు వేరువేరు రీతులుగా, వేరువేరు మార్గాలకు దారితీస్తూ ఈ దృశ్య ప్రపంచంలో లభిస్తున్నాయి. ఆత్మదర్శులు-ధీరులు అగు మహనీయులు చెప్పిన ప్రవచనములను విని, వ్యాఖ్యానములను 'ఆత్మ తత్త్వము' గురించి గానం చేస్తున్నాం. మేము ఉపాసించే “విద్య”ను ప్రకటిస్తున్నాం.

ఓ దేహపుర సుదీర్ఘ బాటసారులారా! విద్యాంచ-అవిద్యాంచ యఃతత్ వేద ఉభయం సహ, విద్య-అవిద్యల విచక్షణను గ్రహిస్తూ మార్గం సారించుకోవాలి సుమా! అవిద్యయా మృత్యుం తీర్వా..., అవిద్య “మార్పు-చేర్పులు” అనే “లోకబంధనములు” అనే వైపుగా జీవులను చేర్చుచున్నది. అదియే మృతస్థానం. విద్యయా అమృతమ్ అశ్నుతే। విద్యయో, మనలను అమృత స్వరూపులుగా తీర్చిదిద్ది పునీతం చేస్తోంది. కాబట్టి మనం జీవితనావను ఉపయోగించి చేరవలసిన స్థానం మన “నిత్య-నిర్మల-అప్రమేయ-అమృత” స్వరూపమగు ఆత్మవైపుకు - అని గమనించెదరు గాక! సర్వజీవులు తానై, సర్వమునకు సాక్షిగా వేరైనట్టి ఆత్మత్వమే విద్యామార్గము.

అన్యత్ ఏవ ఆహుః సంభవాత్। అన్యత్ ఆహుః అసంభవాత్ ॥ ఆత్మ సర్వదా 'సత్-సంభూతము' అయివున్నది. సర్వదా, సర్వే-సర్వత్రా ఏర్పడియున్నదై ప్రకాశిస్తోంది. అది అనన్యము. అనగా, ఆత్మకు తదితరమైనది మొదలే లేదు. కాని అద్దాని అన్యభావనచే మాత్రమే ‘అన్యము' అనునది అనుభూతమౌతోంది. ఏదైతే “భావించబడుటచే మాత్రమే ఉన్నట్లుగా అనిపిస్తోందో, .... వేఱువేఱు భావనలచే వేఱువేఱుగా అనిపిస్తూ ఉంటుందో, స్వతఃగా సత్యము అయిఉండలేదో” అట్టి భౌతిక జగత్తు సత్యము కాదు.

అసంభూతి :  వస్తుతః లేనట్టిది. కొన్ని కల్పనలచే భావనలచే కల్పించబడి అనుభవమునకు వస్తున్నది. (Actually not existent. But is being experienced by the Exercise of Relatedness or RELATIVITY )

ఉదా :
తూర్పు-పడమర మొదలైన దిక్కులు ప్రపంచంలో ఉన్నాయి. సూర్యుడు - భూగోళము ప్రక్కకు పెడితే దిక్కులు ఉన్నాయా?
దూరంగా కొండ నునుపుగా కనిపిస్తోంది → కొండ నునుపుగా ఉన్నదా?
సంబంధ బాంధవ్యాలు సత్యమేనని అందరికీ అనిపిస్తున్నాయి. అయితే క్రమక్రమంగా పాత అనుబంధ - సంబంధ - బాంధవ్య భావాలు తొలగి క్రొత్తవి ఏర్పడుచూ పోతున్నాయి కదా!

ఏదైతే స్వతఃగా లేక, కేవలం ద్రష్ట యొక్క భావన-స్థితి గతిని అనుసరించి సత్యమేనని అనిపిస్తూ, కాల-స్థితి గతులు మార్పుచే అవి కూడా మార్పు-చెందుచున్నాయో .... అట్టిదంతా 'అసంభూతి’.

‘అసంభూతి’ అగుదానిని ఎవ్వరు ఉపాసిస్తూ 'సంభూతి’ అగు ఆత్మయొక్క తత్త్వాన్ని గమనించరో, అట్టివారు అజ్ఞానాంధకారములో ప్రవేశించినవారగుచున్నారు.

సంభూతి :  ఈ దృశ్యమునకు వేరుగా పరమాత్మ మరెక్కడో అనునది కూడా అవిద్యయే!

అట్లాగే,
"ఈ దృశ్యము వేరు - సంభూతి (Actually always present) అగు పరమాత్మ వేరు. ఆయన ఇంకెక్కడో ఎన్నటికో ప్రాప్తించగలరు” .... అని తలచేవారు అజ్ఞానమును కొనసాగించుచున్నవారే అగుచున్నారు.

జగత్తుకు కారణం ఆత్మ కాదు. ఆత్మ సర్వదా నిర్మలం, అప్రమేయము కదా! జగత్తుగా అనుభవమయి, 'సంసారము' అని నిర్వచించబడే దృశ్యమునకు కారణం జడమగు ఈ దేహమూ కాదు. ఆత్మయే ఆత్మకు అజ్ఞాన దృష్టికి జగత్తుగా కనిపిస్తోంది.

జ్ఞానదృష్టిచే జగత్తు ఆత్మయే! ఆత్మ - జగత్తు ఏకరూపమే! ఈ రీతిగా “సంభవ-అసంభవ న్యాయము" ను గ్రహించిన జ్ఞాన చక్షు సమన్వితులగు మహనీయుల ప్రవచనములు మనం వింటున్నాం.

ఓ ప్రియ సహజీవుడా! ప్రతి జీవుడూ కూడా “మార్పు చెందని + అనుక్షణికంగా మార్పుచెందునది” అను రెండింటి చమత్కారమును తనయందు సమావేశముగా పొందియున్నవాడై ఉన్నాడు. ఈ రెండింటిని విచక్షించి గమనించాలి. వినాశేన మృత్యుం తీర్వా, సంభూత్యా అమృతమశ్నుతే!  “వినాశనము” (మార్పు చెందేది)” ... అనుదానికి అతీతత్వం సంపాదించుకొని సర్వదా యథాతథమైయున్న ఆత్మను ఉపాశించి తద్వారా విజ్ఞుడు మృత్యుత్వమును అధిగమించి అమృతత్వమును సంతరించుకుంటున్నాడు. “మృత్యువు తరువాత కూడా నేను సత్యము-నిత్యము - అగు ఆత్మగా యథాతథమై ఉంటాను అనునదే “అమృతత్వము”.

నశించే దానిని ఉపకరణంగా చేసుకొని నశించని ఆత్మను చేరాలి. ప్రతి జీవుని యొక్క 'అంతరంగము' అనే బంగారు పాత్రలో సత్యమగు జ్ఞానము జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నది. అనగా “ఇది వినాశన భూతము - ఇది నాయొక్క అవినాశిత్వము” అని ప్రతి జీవుడు జ్ఞానము కలిగియే ఉన్నాడు. అయితే ఆ పాత్ర అజ్ఞాన దృష్టులచే నిర్మితమైన మూసచే కప్పబడి ఉన్నది.

హే పరమాత్మా! మాకు 'సత్య-ధర్మములు' అనే సముత్సాహం ప్రసాదించండి. మాయందలి అజ్ఞానపు మూతను తొలగించుకొనే శక్తి-యుక్తులను ప్రసాదించండి! మాలోని ఆత్మజ్ఞాన ప్రకాశము ప్రజ్వలింపజేయండి. మా దృష్టులన్నిటిని ఆత్మ దర్శనాభ్యాసము వైపుగా నడిపిస్తూ ఉండండి! ఆత్మత్వము సంతరించుకొనేటట్లుగా అనుగ్రహించండి. సర్వమునకు నియామకుడగు పరమాత్మ యొక్క భక్తిచేతనే ఆత్మయొక్క ఔన్నత్యం, ఆత్మయొక్క యమ-సూర్యాది సర్వ నియామకత్వం, ఆత్మయొక్క సర్వాంతర్యామిత్వం· ఇదంతా ఆత్మ స్వరూపులమగు మాకు అవగతం కాగలదు.

హే పూషన్! జగత్తును పరిపోషిస్తున్న పూషణుడవగు భగవన్! ఋత్-సత్యదేవా! ఏకఋషి- ఇతి గచ్ఛతీతి ఏకర్షీ! ఒంటరి బాటసారీ! సర్వనియామకుడవగు యమా! హే సూర్యభగవన్! ప్రజాపతి నియామకుడవు, స్వరూపుడవు అగు ఓ ప్రాజాపతీ! పరిపరివిధముల చరించు మా బుద్ధిని ఏకాగ్రం చేయండి! కళ్యాణప్రదమగు స్వస్వరూపాత్మ దర్శనమును ప్రసాదించండి!

ఓ ప్రాణమా! నీవు సర్వుల సప్రాణ స్వరూపమై మాకు అనుభవమయ్యెదవుగాక! శరీరాదులకు అతీతమైయున్న మా ఆత్మయొక్క అఖండ - అప్రమేయ - నిర్విశేషత్వములు మాకు అనుభూతమగుగాక! మా జన్మ-జన్మల సంస్కారదేహము ఉపాసనలచే సంస్కరించబడి, తపో అగ్నిచే భస్మమగుగాక! మేము క్రతువు-కృతముల సహాయంతో ఆత్మను స్మరించెదము గాక!

ఓ అగ్నిదేవా! మా మార్గం సుమార్గం చేయండి. సమస్త కర్మ-జ్ఞానములు సర్వాత్మకమగు ఆత్మజ్ఞానైక రసమునందు పరితప్తమై యుండునుగాక! మా హృదయ ఔన్నత్యము మేము ఆస్వాదించెదముగాక!

ఓ అగ్ని దేవా! సుపధా నయ! మంచి మార్గమును మాకు చూపండి! హేదేవా! అస్మాన్ రాయే సుపథాన్ నయ! సోఽహమ్ పరమమ్-ఆత్మానుభవమునకై సరియైన త్రోవలో మమ్ములను నడిపించండి! హే అగ్ని భగవన్! విశ్వాని - వయునాని విద్వాన్! మీరు ఈ విశ్వతత్త్వము ఎరిగినవారు. మాకు మీరు ఉపాస్యులు, మా అంతరంగ స్వరూప - స్వభావములు మీకు తెలుసు. జుహురాణం ఏన అస్మాత్ యుయోధి! మాలోని మోసము 0 పాపము - అల్పము అగు దృష్టులను మా నుండి తొలగించండి! తే భూయిష్ఠాం నమఉక్తిం విధేమ! హే దేవాదిదేవా! స్వామీ! ప్రాణస్వరూపా! పరిపోషకా! మీకు అధికాధికంగా నమోవాక్కములు సమర్పించుకటనుచున్నామయ్యా! విధేయులమై ఆశ్రయిస్తున్నాము. మా గురించి మేము ఎరుగు మార్గములో నడిపించండి!

ఇతి - వాజసనేయ సంహితాంతర్గత

🙏 ఈశావాస్య ఉపనిషత్ 🙏

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥