[[@YHRK]] [[@Spiritual]]

Sārēraka Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణ యజుర్వేదాంతర్గత

24     శారీరకోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



తత్త్వగ్రామోపాయసిద్ధం పరతత్త్వస్వరూపకం .
శారీరోపనిషద్వేద్యం శ్రీరామబ్రహ్మ మే గతిః ..

శ్లో।। తత్త్వ గ్రామ-ఉపాయ సిద్ధం, పరతత్త్వ స్వరూపకమ్,
శారీరోపనిషద్వేద్యమ్, శ్రీరామ బ్రహ్మ మే గతిః।।

పరతత్త్వ స్వరూపమగు తత్త్వ జ్ఞానము పొందటానికై, తత్త్వ స్ధానము చేరటానికై, మహత్తరమగు ఈ ‘శరీరము’ అను ఉత్తమ సాధనోపాయము గురించి ఎరగటానికి, ఆత్మారాముడగు శ్రీరామ బ్రహ్మమే గతి - అని స్తుతించుచున్నాను.


ఓం అథాతః పృథివ్యాదిమహాభూతానాం
సమవాయం శరీరం .
యత్కఠినం సా పృథివీ
యద్ద్రవం తదాపో
యదుష్ణం తత్తేజో
యత్సంచరతి స వాయుర్యత్సుషిఅరం తదాకాశం
ఓం
1. అథ అతః, ‘పృథివి’ ఆది మహాభూతానాగ్ం
సమవాయగ్ం శరీరం।।
యత్ కఠినం సా ‘పృథివీ’।
యత్ ద్రవం తత్ ‘ఆపో’ ।
యత్ ఉష్ణమ్ తత్ ‘తేజో’ ।
యత్ సంచరతి స ‘వాయుః’ ।
యత్ సుషిరమ్ తత్ ‘ఆకాశమ్’।।
‘ఓం’! పరమార్థ స్వరూపుడగు పరమాత్మకు నమస్కరిస్తూ ...,
(‘‘దేహము దేహికి ఐహిక మోహము’’ అను బోధ వాక్యమును దృష్టిలో పెట్టుకొని) - ఇప్పుడు పాంచ భౌతిక విశేషములతో కూడిన భౌతిక శరీర యొక్క రూపము గురించి విచారణ చేసుకొనెదము గాక!
పృథివి మొదలైన మహాభూతముల సమ్మేళనమే - ఈ శరీరము.
ఇందులో
కఠినమైనదంతా → పృథివి (Solid)
ద్రవరూపమైనదంతా → ఆపః। జలము। (Liquid)
ఏది ఉష్ణమో → అది తేజస్సు (Light/Heat)
ఏది సంచరించు ప్రదర్శనమో → అది వాయువు (Vapour)
ఏది రంధ్రము (ఖాళీ) రూపంగా ఉన్నదో సుషిరమో (బెజ్జమో) → అదియే ఆకాశము (Space)

శ్రోత్రాదీని జ్ఞానేంద్రియాణి .
శ్రోత్రమాకాశే వాయౌ త్వగగ్నౌ చక్షురప్సు
జిహ్వా పృథివ్యాం ఘ్రాణమితి .
2. ‘శ్రోత్ర’ ఆదీని జ్ఞానేంద్రియాణి।।
శ్రోతమ్ ఆకాశే। వాయౌ త్వక్।
అగ్నౌ చక్షుః। అప్సు జిహ్వా।
పృథివ్యాం ఘ్రాణమ్। ఇతి।।
పంచ జ్ఞానేంద్రియములు
శ్రోత్రము మొదలైనవి జ్ఞానేంద్రియములు (శ్రోత్రేంద్రియము, త్వక్ ఇంద్రియము, చక్షు రింద్రియములు, జిహ్వేంద్రియము, ఘ్రాణేంద్రియము). అవి క్రమంగా పంచభూతముల అంశలు.
అంశ ఎద్దానియొక్క అంశ
శ్రోత్రమ్ - (వినికిడియే) - ఆకాశము (Hearing from space)
త్వక్ - (స్పర్శ) - వాయువు (Touch from Air/Vapour)
చక్షువులు - (చూపు) - అగ్ని (Seeing from Fire/Light)
జిహ్వ - (రుచి) - అప్సు (జలము) (Taste from Water)
ముక్కు - (వాసన) - పృథివి (Smell from the solid)
అయి ఉన్నాయి

ఏవమింద్రియాణాం యథాక్రమేణ
శబ్దస్పర్శరూపరసగంధాశ్చైతే
విషయాః పృథివ్యాదిమహాభూతేషు
క్రమేణోత్పన్నాః .
3. ఏవమ్ ఇంద్రియాణామ్ యథా క్రమేణ
శబ్ద స్పర్శ రూప రస గంధాశ్చ।
ఏతే విషయాః,
పృథివీ ఆది మహాభూతేషు
క్రమేణ ఉత్పన్నాః।।
పంచ జ్ఞానేంద్రియ విషయములు
శ్రోత్ర-త్వక్ - చక్షు - జిహ్వ - ఘ్రాణములగు (చెవులు, చర్మము, కళ్ళు, నోరు, ముక్కు) ఇంద్రియముల యొక్క విషయములు వరుసగా - శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు అయి ఉన్నాయి.
ఈవిధముగా పృథివి మొదలైన పంచ మహాభూతములనుండి శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు క్రమంగా (Serially), వరుసగా (Respectively) ఉత్పన్నమౌతున్నాయి.

వాక్పాణిపాదపాయూపస్థాఖ్యాని కర్మేంద్రియాణి .
4. వాక్ పాణి పాద పాయు ఉపస్థ ఆఖ్యాని
‘కర్మ - ఇంద్రియాణి’ (కర్మేంద్రియాణి) ।।
పంచ కర్మేంద్రియములు
వాక్కు (నోరు), చేతులు, పాదములు, పాయువు (మల విసర్జనేంద్రియము), ఉవస్థ (మూత్ర విసర్జనేంద్రియము).

తేషాం క్రమేణ వచనాదానగమనవిసర్గానందశ్చైతే విషయాః
5. తేషామ్ క్రమేణ వచన ఆదాన గమన
విసర్గ ఆనన్దాః చ (ఆనన్దాశ్చ)
ఏతే ‘‘విషయాః’’।।
పంచ కర్మేంద్రియ విషయములు (క్రమంగా/వరుసగా)
వచనము (Speaking) (వాక్కునుండి)
ఆదానము (Giving) (చేతులనుండి)
గమనము (Walking) (పాదములనుండి)
విసర్గము (విసర్జనము) (Leaving) (పాయువు నుండి)
ఆనందము (Enjoy) (ఉపస్థ నుండి)

పృథివ్యాదిమహాభూతేషు క్రమేణోత్పనాః .
6. పృథివి ఆది మహాభూతేషు
క్రమేణ ఉత్పన్నాః।
ఈ పంచకర్మేంద్రియములు - విషయములు కూడా - పృథివి మొదలై పంచమహాభూతములు క్రమంగా ఉత్పన్నమగుచున్నాయి.

మనోబుద్ధిరహంకారశ్చిత్తమత్యంతఃకరణచతుష్టయం .
7. మనో బుద్ధిః అహంకారః
చిత్తమ్ ఇతి →
‘‘అంతఃకరణ చతుష్టయమ్’’।।
అంతఃకరణ చతుష్టయమ్
(1) మనస్సు - ఆలోచన (Thought)
(2) బుద్ధి - విశ్లేషణ (Logic)
(3) అహంకారము - ‘‘నేను కర్తను - భోక్తను’’ ...
అను భావన చేయు ప్రజ్ఞ.
(4) చిత్తము - ఇష్టము (Liking)

తేషాం క్రమేణ
సంకల్పవికల్పాధ్యవసాయాభిమానావధారణాస్వరూపశ్చైతే
విషయాః .
8. తేషాం క్రమేణ సంకల్ప - వికల్ప,
అధ్యవసాయ, అభిమాన,
అవధారణా స్వరూపాశ్చ (స్వరూపాః చ)
ఏతే విషయాః।।
అంతఃకరణ చతుష్టయ విషయములు
మనస్సుకు విషయము - సంకల్ప వికల్పములు
బుద్ధిః విషయము - నిర్ణయములను నిర్వర్తించ{ం
అహంకారమునకు విషయము - అభిమానము
చిత్తమునకు విషయము - స్వరూపములపట్ల అవధారణ చేయటము-విషయము- ఇష్టపడటము

మనఃస్థానం గలాంతం
బుద్ధేర్వదనమహంకారస్య హృదయం
చిత్తస్య నాభిరితి .
9. మనః స్థానం → గళ-అన్తం।
బుద్ధేః → వదనమ్।
అహంకారస్య → హృదయమ్।
చిత్తస్య → నాభిః।। - ఇతి।।
శరీరములో అంతఃకరణ చతుష్టయముయొక్క నివాస స్థానములు
మనస్సుకు - గళము (గొంతు) యొక్క చిట్టచివరగా(ఆవలగా)
బుద్ధికి - వదనము
అహంకారమునకు - హృదయము
చిత్తమునకు - నాభి (బొడ్డు)
సంస్థిత స్థానములు

అస్థిచర్మనాడీరోమమాంసాశ్చేతి పృథివ్యంశాః .
10. అస్థి చర్మ నాడీ రోమ
మాగ్ంసాః చ ఇతి పృథివీ అంశాః।।
పృథివి యొక్క అంశలు
ఎముకలు, చర్మము, నరములు, రోమములు (వెంట్రుకలు), మాంసము

మూత్రశ్లేష్మరక్తశుక్రస్వేదా అబంశాః .
11. మూత్ర శ్లేష్మ రక్త
శుక్ల స్వేదా అబంశాః (అప్-అంశాః)।।
జలముయొక్క అంశలు
మూత్రము, శ్లేష్మము, రక్తము, శుక్లము, స్వేదము (చెమట)

క్షుత్తృష్ణాలస్యమోహమైథునాన్యగ్నేః .
12. క్షుత్ తృష్ణ అలస్య
మోహ మైధునాని అగ్నేః (అంశా) ।।
అగ్ని యొక్క అంశలు
ఆకలి, దాహము, సోమరితనము (బద్ధకము), మోహము, మైధునము (శృంగార భావములు, దృశ్యములో సుఖమునకై వెతుకుచూ ఉండటము).

ప్రచారణవిలేఖనస్థూలాక్ష్యున్మేషనిమేషాది వాయోః .
13. ప్రచారణ విలేఖన
స్థూల అక్షి ఉన్మేష
నిమేష ఆది వాయోః (అంశా) ।।
వాయువు యొక్క అంశలు
ప్రసరణము / కదలికలు (Extending / Movements)
విలేఖనము (Experience of forms / భావ తరంగాలు)
స్థూలంగా కనిపించే కనులు తెరవటం, మూయటము మొదలైనవి.

కామక్రోధలోభమోహభయాన్యాకాశస్య .
14. కామ క్రోధ లోభ మోహ
భయాని ఆకాశస్య (అంశా)।
ఆకాశము యొక్క అంశలు
- ‘ఏదో కావాలి’ - అనే ‘కామ స్వభావము’.
- కోపము దీర్ఘంగా కొనసాగించటం చేత రూపు దిద్దుకునే ‘క్రోధము’.
- లోభము (Miserly).
- మోహము (Illusions, Mis-conceptions).
- భయము

శబ్దస్పర్శరూపరసగంధాః పృథివీగుణాః .
శబ్దస్పర్శరూపరసాశ్చాపాం గుణాః .
శబ్దస్పర్శరూపాణ్యగ్నిగుణాః .
శబ్దస్పర్షావితి వాయుగుణౌ .
శబ్ద ఏక ఆకాశస్య .

15. శబ్ద స్పర్శ రూప రస
గన్ధాః పృథివీ గుణాః।।

16. శబ్ద స్పర్శ రూప రసాః
చ అపాం గుణాః।।

17. శబ్ద స్పర్శ రూపాణి
అగ్ని గుణాః।।

18. శబ్ద స్పర్శాః ఇతి వాయు గుణౌ।।

19. శబ్దః ఏక ఆకాశస్య ।।

పృథివి యొక్క గుణములు - 1. శబ్దము 2. స్పర్శ
3. రూపము 4. రసము 5. గన్ధము

జలము యొక్క గుణములు- 1. శబ్దము 2. స్పర్శ
3. రూపము 4. రసము

అగ్నియొక్క గుణములు - 1. శబ్దము 2. స్పర్శ
3. రూపము

వాయువుయొక్క గుణము 1. శబ్దము 2. స్పర్శ

ఆకాశముయొక్క గుణములు ‘శబ్దము’ మాత్రమే

సాత్త్వికరాజసతామసలక్షణాని త్రయో గుణాః ..
20. సాత్త్విక రాజస తామస లక్షణాని
త్రయో గుణాః।।
త్రిగుణ లక్షణములు
1. సాత్విక గుణము 2. రాజస గుణము 3. తామస గుణము

అహింసా సత్యమస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహాః .
అక్రోధో గురుశుశ్రుషా శౌచం సంతోష ఆర్జవం .. 1..

అమానిత్వమదంభిత్వమాస్తికత్వమహింస్రతా .
ఏతే సర్వే గుణా జ్ఞేయాః సాత్త్వికస్య విశేషతః .. 2..

21. అహింసా సత్యమ్
అస్తేయ బ్రహ్మచర్యా
అపరిగ్రహః అక్రోధో
గురు శుశ్రూషా శౌచమ్
సంతోష ఆర్జవమ్ అమానిత్వం
అదంభిత్వమ్ ఆస్తికత్వమ్
అహింసతా - ఏతే
సర్వ గుణా జ్ఞేయాః,
సాత్వికస్య విశేషతః।।
సాత్విక గుణ విశేషములు
✤ అహింస → ఇతరులను బాధకలిగించకుండటము.
✤ సత్యము → ఉన్నది (సత్)ను ఆశ్రయించటం. అసత్‌ను గమనించి ఉండటము.
✤ అస్తేయము → ఇతరులది దొంగిలించకుండ{ము.
✤ బ్రహ్మచర్యము → బ్రహ్మజ్ఞానమును ఆశ్రయించటము,
బ్రహ్మ విద్యార్జనము.
✤ అపరిగ్రహము → నటుడు తాను నటించు నాటకములోని పాత్రకు చెందినవి తనవిగా భావించడు కదా! అట్లాగే జగత్తులోనివి స్వీకరించకపోవటం.
✤ అక్రోధము → ఎవ్వరిపైనా కోపము
కొనసాగించకుండటం. పగతీర్చు కోవాలనే స్వభావము లేకుండటము
✤ గురు శుశ్రూష → గురువును సేవించు స్వభావము.
తనను తాను నేర్చుకొనువానిగా భావించటం, గురు భక్తి.
✤ శౌచము → శుచి అయిన భావాలు. ఇతరులలో
మంచిని గమనించు శుచి అయిన దృష్టి.
✤ సంతోషము → కలిగియున్న దాని పట్ల కృతజ్ఞతా పూర్వక తృప్తి. ‘చాలు’ - అను భావన.
✤ ఆర్జవమ్ → కుటిలత్వం లేకపోవటం. త్రికరణశుద్ధి.
✤ అమానిత్వము → ఇతరులతో తనకున్న గుణములకంటే ఉత్తమమైనవి చూడటం.
✤ అదంభిత్వము → లేని గొప్పలు చెప్పుకోకపోవటం
✤ అహింసత → బాధ కలిగించకపోవటం
ఇవన్నీ కూడా ‘‘సాత్విక గుణ విశేషములు’’గా తెలుసుకొనబడును గాక!

అహం కర్తాఽస్మ్యహం భోక్తాఽస్మ్యహం వక్తాఽభిమానవాన్ .
ఏతే గుణా రాజసస్య ప్రోచ్యంతే బ్రహ్మవిత్తమైః .. 3..

22. అహం కర్తాఽస్మి। అహం భోక్తాఽస్మి।
అహం వక్తా। అభిమానవాన్।
- ఏతే గుణాః ‘రాజసస్య’
ప్రోచ్యన్తే బహ్మవిత్తమైః।।
రాజస గుణ విశేషములు
- నేనే కర్తను! నేనే భోక్తను!
- నేను చెప్పేవాడిని - అందరూ వినాలి!
- ఇది నా అభిమానము!
ఇవన్నీ బ్రహ్మవేత్తలచే - రాజస గుణ విశేషములుగా చెప్పబడుచున్నాయి.

నిద్రాలస్యే మోహరాగౌ మైథునం చౌర్యమేవ చ .
ఏతే గుణస్తామసస్య ప్రోచ్యంతే బ్రహ్మవాదిభిః .. 4..

23. నిద్ర అలస్యే మోహ
రాగౌ మైథునం చౌర్యం
ఏవ చ, ఏతే గుణాః
తామసస్య ప్రోచ్యన్తే
బ్రహ్మ వాదిభిః।।
తామస గుణ విశేషములు
- అతి నిద్ర, సోమరితనము.
- సత్యమును సమగ్రంగా పరిశీలించని ఉద్వేగము. అవగాహనా రహిత రూపమగు మోహము.
- రాగము.
- మైధునము (వస్తువులతో కలయిక / మమేకత్వము).
- దొంగబుద్ధి (చౌర్యము).
మొదలైనవన్నీ ‘‘తామస గుణ విశేషములు’’ - అని బ్రహ్మవాదులచే గుర్తు చెప్పబడుచున్నాయి.

ఊర్ధ్వే సాత్వికో మధ్యే రజసోఽధస్తామస ఇతి .

24. ఊర్ధ్వే ‘‘సాత్త్వికో’’।
మధ్యే ‘‘రాజసో’’।
అధస్తాత్ ‘‘తామసః’’। ఇతి।।
త్రిగుణ ఫలములు
సాత్త్విక గుణముచే - ఊర్థ్వగతులు / లోకములు
రాజస గుణముచే - మధ్యస్థితులు / మధ్యలోకములు
తామస గుణముచే - అధమ లోకములు / స్థానములు
ఈ జీవుడు పొందుచున్నాడు.

సత్యజ్ఞానం సాత్త్వికం . ధర్మజ్ఞానం రాజసం .
తిమిరాంధం తామసమితి .
25. సమ్యక్ జ్ఞానగ్ం ‘‘స్వాతికం’’।
ధర్మజ్ఞానగ్ం ‘‘రాజసం’’।
‘‘తిమిర - అన్థం తామసం’’। ఇతి।।
త్రిగుణ సంబంధ జ్ఞానములు
సర్వత్ర సమరస భావనారూపమగు సమ్యక్ జ్ఞానము - సాత్వికము.
ధర్మములకు సంబంధించిన జ్ఞానము - రాజసికము.
అజ్ఞానముచే పెంపొందు చీకటి, గ్రుడ్డితనము - తామసము.

జాగ్రత్స్వప్నసుషుప్తితురీయమితి చతుర్విధా అవస్థాః .
26. జాగ్రత్ స్వప్నః సుషుప్తిః
తురీయమ్ ఇతి చ చతుర్విధ అవస్థాః।।
చతుర్విధ అవస్థలు
1. జాగ్రత్ 2. స్వప్నము 3. సుషుప్తి 4. తురీయము (చతురీయము)

జ్ఞానేంద్రియకర్మేంద్రియాంతఃకరణచతుష్టయం
చతుర్దశకరణయుక్తం జాగ్రత్ .
27. జ్ఞాన-ఇంద్రియ, కర్మ-ఇంద్రియ
అంతఃకరణ-చతుష్టయం
చతుర్దశ కరణ యుక్తం ‘‘జాగ్రత్’’।।
జాగ్రత్ అవస్థ
పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, అంతఃకరణ చతుష్టము. 5 + 5 + 4. ఈ 14 కరణయుక్తమై ఉండటము - ‘‘జాగ్రదవస్థ’’. (అంతఃకరణము= మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము)

అంతఃకరణచతుష్టయైరేవ సంయుక్తః స్వప్నః .
28. అన్తఃకరణ చతుష్టయైః ఏవ సంయుక్తః ‘‘స్వప్నః’’।।
అంతఃకరణ చతుష్టయం అయినట్టి మనో-బుద్ధి-చిత్త-అహంకారములు మాత్రమే కలిగియున్న అవస్థ - ‘‘స్వప్నావస్థ’’.

చిత్తైకకరణా సుషుప్తిః .
29. చిత్త ఏక కరణా ‘‘సుషుప్తిః।।
చిత్తము అన్యత్వమును త్యజించి ఏకీకరణమై ఉండటము - ‘‘సుషుప్త్యవస్థ’’.

కేవలజీవయుక్తమేవ తురీయమితి .
30. కేవల జీవ యుక్తమ్ ఏవ ‘‘తురీయమ్’’। ఇతి।।
జీవుని కేవలత్వము (ఈతడు కేవలయుక్తుడై యున్న స్థితి - Absolute Oneself) ‘‘తురీయము’’

ఉన్మీలితనిమీలితమధ్యస్థజీవపరమాత్మనోర్మధ్యే
జీవాత్మా క్షేత్రజ్ఞ ఇతి విజ్ఞాయతే ..
31. ఉన్మీలిత-నిమీలిత, మధ్యస్థ జీవ -
పరమాత్మనోః మధ్యే జీవాత్మా ‘‘క్షేత్రజ్ఞః’’
ఇతి విజ్ఞాయతే।।
కనులు తెరవటం - మూయటం - ఈ రెండిటి మధ్యలో సంస్థితుడై ఉన్నవాడు - ‘‘జీవుడు’’
జీవాత్మ - పరమాత్మల మధ్యగా ఉన్న జీవాత్మ స్వరూపము ‘క్షేత్రజ్ఞుడు’ - అని తెలుసుకొనబడు గాక!

బుద్ధికర్మేంద్రియప్రాణపంచకైర్మనసా ధియా .
శరీరం సప్తదశభిః సూక్ష్మం తల్లింగముచ్యతే .. 5..
32. బుద్ధిః - కర్మేంద్రియ (11)
ప్రాణ పంచకైః (5)
మనసా ధియా (2)
శరీరగ్ం సప్త దశభిః (17)
సూక్ష్మం - తత్ ‘లింగమ్’ ఉచ్యతే।।
సూక్ష్మ దేహము / లింగ శరీరము
జ్ఞానేంద్రియములు - 5 (బుద్ధేంద్రియములు)
కరేంద్రియములు - 5
ప్రాణములు - 5 (పంచ ప్రాణములు)
[ఇవి మొత్తం 15]
16. మనస్సు 17. బుద్ధి.
ఈ 17 కలిపి ‘‘సూక్ష్మ శరీరము’’ , (లేక) ‘‘లింగ శరీరము’’ అని అంటారు.

మనో బుద్ధిరహంకారః ఖానిలాగ్నిజలాని భూః .
ఏతాః ప్రకృతయస్త్వష్టౌ వికారాః షోడశాపరే .. 6..

శ్రోత్రం త్వక్చక్షుషీ జిహ్వా ఘ్రాణం చైవ తు పంచమం .
పాయూపస్థౌ కరౌ పాదౌ వాక్చైవ దశమీ మతా .. 7..

శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధస్తథైవ చ .

33. మనో బుద్ధిః అహంకారః
ఖ, అనిల, అగ్ని, జలాని
భూః - ఏతాః ‘‘ప్రకృతః’’ యస్తు
‘‘అష్టౌ’’ - వికారాః షోడశ అపరే।
శోత్రమ్ త్వక్, చక్షుషీ, జిహ్వా
ఘ్రాణం చ ఏవ తు
పంచమమ్ (5),
పాయుః ఉపస్థౌ కరౌ పాదౌ వాక్ చ ఏవ
దశమీ (5+5) మతా।।
శబ్దః స్పర్శః చ రూపం చ రసో గంధః (5)
ప్రకృతి = మనస్సు, బుద్ధి, అహంకారము, పంచ భూతములు (ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి)
ఈ ‘8’ కూడా ‘‘అష్టవిధ ప్రకృతి’’ - అయి ఉన్నది. వాటి వికారములతో కలిపి ‘16’ - ఇవి ‘అపరా ప్రకృతి’గా చెప్పబడుచున్నాయి.

శ్రోత్రము (చెవులు), చర్మము, చక్షువులు, జిహ్వ (నాలుక), ఘ్రాణము - ఇవి ఐదు జ్ఞానేంద్రియములు (5).
పాయువు, ఉపస్ధ, చేతులు, కాళ్ళు, వాక్ -ఇవి ఐదు కర్మేంద్రియములు (5).
ఈ ‘10’ కూడా దశ-ఇంద్రియములు (పంచ జ్ఞాన - పంచ కర్మ ఇంద్రియములు).
శబ్ద స్పర్శ రూప రస గంధములు - ఇవి ఇంద్రియ విషయములు.
(ఇవన్నీ ‘15’ తత్త్వములు.)

త్రయోవింశతిరేతాని తత్త్వాని ప్రకృతాని తు .
చతుర్వింశతిరవ్యక్తం ప్రధానం పురుషః పరః .. 8..

ఇత్యుపనిషత్ ..
తధా ఏవ చ త్రయో వింశతిః (23)
ఏతాని తత్త్వాని ప్రకృతాని తు।।
చతుర్వింశతిః (24) అవ్యక్తమ్।
ప్రధానం ‘‘పురుషః పర’’।।
పైన చెప్పిన అష్ట ప్రకృతులు (8) పంచదశ ఇంద్రియ విశేషములు (15) ఇవన్నీ కలిపి ప్రకృతియొక్క ‘23’ తత్త్వములు.
24వది - అవ్యక్తము. (23 తత్త్వములు వ్యక్తీకరిస్తున్నట్టిది).

వీటి అన్నిటికీ వేరై ‘పురుషుడు’ వేరుగాను, అన్నిటికంటే ప్రాధాన్యము గలవాడుగాను ఉండి ఉన్నాడు. ఆయనయే ‘పరమపురుషుడు’.

ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత శారీరకోపనిషత్।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।




కృష్ణ యజుర్వేదాంతర్గత

25     శారీరక ఉపనిషత్

అధ్యయన పుష్పము


‘‘ఓం’’ ‘సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు’ అగు ‘ఓం’కార పరమార్థ పరమపురుష భగవానునికి నమస్కరిస్తూ....!

ఇప్పుడు మనము సర్వాంగ సుందరంగా మనకు ప్రకృతిచే ప్రసాదించబడిన ఈ ‘శరీరము’ గురించి వివరించుకొనుచున్నాము.

ఎందుకంటే,
➤ శరీరమును గురించి ఎరగటమనేది జీవుని మహదాశయమునకు మహత్తరమైన ఉపాయము. ఈ శరీరమే మోక్షమును ప్రసాదించగల సాధనము.
➤ ఈ శరీరముయొక్క తత్త్వము, ఉపకరణత్వము పరిశీలించక, పరమపురుషత్వము గురించి అధ్యయనము చేయకుండా, ఇంద్రియ విషయములకు పరిమితుడై జీవితము గడుపు వానికి, ఈ శరీరమే అనేక సంసార బంధములను తెచ్చిపెట్టగలదు. ఈ శరీరమే బంధము.

‘శరీరము’ గురించి ఎరిగిన వారికి ఈ దేహము దేవాలయము. యజ్ఞశాల. ఎరుగని వారికి ఇది అనేక బంధనముల, ప్రతిబంధనముల నిలయము. చెఱసాల. అందుచేత ఈ దేహ నిర్మాణ తత్త్వము గురించిన విచారణ ముముక్షువునకు ఆధ్యాత్మికమైన ‘‘అవసరము’’ అయి ఉన్నది. (దేహమ్ దేవాలయమ్ ప్రోక్తః। జీవోప్రోక్తః దేవో సనాతనః।)

పృథివీ ఆది మహాభూతానాగ్ం : ఈ శరీరము పృథివీ (Solid Matter) మొదలైన మహాభూతముల సంయోగము, సమ్మేళనము (An artistic mix-up of materials) అయి ఉన్నది. కొన్ని పుల్లల అమరికచే ఆయా (   ⬡       ⃤   ▭   ) ఆకారములు రూపుదిద్దుకొను విధంగా పంచతత్త్వములచే (లేక మూల పదార్థముల సాకార సారూప్య అమరికచే) ఈ భౌతిక దేహము - అమరిక పొందినట్టిదై యున్నది.

ఈ దేహములో....
💐 కఠిన విభాగము (All that is solid - bones etc.,) ‘పృథివి’।
💐 ద్రవ విభాగము (All that is liquid - Blood, Urine etc.,) ‘ఆపో’।
💐 ఉష్ణ విభాగము (Heat Factor) ‘అగ్ని’ / ‘తేజస్సు’।
💐 సంచరించు స్వభావమై ఏది ప్రదర్శనమగుచున్నదో...అది ‘వాయువు’।
💐 ఏది సుషిరము రూపంగా ఒకదానికి మరొక దానికి ఖాళీ ప్రదేశంగా, రంధ్రముగా ఉన్నదో...అది ‘ఆకాశము’।
అట్టి పంచ మహాభూతములు తమయొక్క పంచకళలను ఈ దేహములో ప్రదర్శించుచున్నాయి.

జ్ఞానేంద్రియములైనట్టి
    శ్రోత్రము (చెవులు) - ఆకాశధర్మము
    త్వక్కు (చర్మము) - వాయుధర్మము
    చక్షువులు (కళ్ళు) - అగ్ని ధర్మము
    జిహ్వ (నాలుక - రుచి) - జల ధర్మము
    ముక్కు - పృథివీ ధర్మము.

ఈ విధంగా పంచ మహాభూతముల ధర్మములు జ్ఞానేంద్రియములుగా ప్రదర్శనమై యున్నాయి. అట్టి పంచేంద్రియముల నుండి (ఆకాశ-వాయు-అగ్ని-జల-భూ నుండి) విషయములు బయల్వెడలుచున్నాయి.

శబ్ద - స్పర్శ - రూప - రస - గంధము
అను పంచజ్ఞానేంద్రియ విషయములు కల్పితమై, బాహ్యమున అనుభవములను - అనుభవించే ఈ శరీరి పట్ల కల్పితమౌతున్నాయి.

అట్లాగే
వాక్ - పాణి - పాదములు - పాయువు - ఉపస్థ
అను పంచ కర్మేంద్రియములనుండి విషయములు పొందబడుచున్నాయి.

వచనము(Talking) - ఆదానము(Giving) - గమనము(Walking) - విసర్జనము(Leaving) - ఆనందము(Enjoying)
కర్మేంద్రియములు ఈఈ విషయములను ప్రదర్శించుచున్నాయి.

మహాభూతములనుండే శరీరము, జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియ విషయములు, కర్మేంద్రియములు, కర్మేంద్రియ విషయములు - ఇవన్నీ బయల్వెడలుచున్నాయి. మహాభూతములో? కేవల స్వరూపుడగు ఆత్మభగవానుని శక్తి ప్రదర్శన రూపములే!

అంతఃకరణ చతుష్టయం

ఇంతవరకు చెప్పుకున్నవి బహిర్ విశేషములు. బహిర్ - కరణములు. (Outer part of the body). ఇవికాక ఈ శరీరములో ‘అంతఃకరణ’ (Zone of Inner Functionary) ఉన్నది. ఇది 4 విభాగములుగా విభజించి చెప్పబడుచున్నది.

అంతఃకరణ చతుష్టయం
(1) ఆలోచనలు, భావనా విభాగము - మనస్సు
(2) విశ్లేషణ - విచక్షణ చేయు విభాగము - బుద్ధి
(3) కర్తృత్వ - భోక్తృత్వ భావనా విభాగము - అహంకారము
(4) ఇష్టము - ప్రియము కలిగియుండు భావనా విభాగము - చిత్తము

అంతఃకరణ చతుష్టయము యొక్క బాహ్య ప్రదర్శనా విషయములు (Releated aspects)

మనస్సుకు విషయములు → సంకల్ప - వికల్పము (Thoughts / Assumptions - their withdrawal).
బుద్ధికి విషయములు → అధ్యవసాయములు (Learnings and analysing of matters events etc.,).
అహంకారమునకు విషయము → అభిమానము (Sense of Individual Self. Sense of Belongingness).
చిత్తమునకు విషయము → అవధారణ (Avocation. Holding the thought. Interestedness in maaters, scenary, contexts, etc.,)

అంతఃకరణ చతుష్టయము యొక్క శరీరములోని స్థానములు

మనస్సుకు ముఖ్యస్ధానము - గళాన్తమ్ (గొంతుకు ఉపరిభాగము)
బుద్ధికి ముఖ్యస్ధానము - వదనము (ముఖము)
అహంకారమునకు ముఖ్యస్ధానము - హృదయము
చిత్తమునకు ముఖ్యస్ధానము - నాభి (బొడ్డు ప్రదేశము).

ఇవన్నీ శరీరములో ప్రాముఖ్య - సంస్థిత స్థానములై ఉన్నాయి.

శరీరములో పంచమహాభూతముల అంశలు

శారీరక ‘పృథివీ’ గత అంశలు : ఎముకలు, చర్మము, నరములు, నాడీ మండలము, రోమము (వెంట్రుకలు), మాంసము మొదలైనవి.

శారీరక ‘జల’ (అప్) గత అంశలు : మూత్రము, శ్లేష్మము, రక్తము, శుక్లము, స్వేదము (చెమట) మొదలైనవి.

శారీరక ‘అగ్ని’ గత అంశలు : ఆకలి, దాహము, సోమరితనము (బద్ధకము), మోహము, మైధునము (శృంగార భావములు), వస్తు - నామ - రూపాదులతో ఇచ్ఛావేశములు మొదలైనవి.

శారీరక ‘వాయు’ గత అంశలు : కదలికలు, ప్రసరణములు, విలేఖనములు (గీతలకు సంబంధించినవి), కనురెప్పల మూత - తెరుచుకోవటములు మొదలైనవి.

శారీరక ‘ఆకాశ’ గత అంశలు : కామము (ఏదో పొందాలనే, కావాలనే వృత్తి విశేషములు), (కోపము వచ్చినప్పుడు దానిని వదలక, కొనసాగించుటచే ఏర్పడు) క్రోధము.
- ‘నాది, నాకే ఉండాలి’ అనే లోభగుణము. వస్తువులపట్ల, విషయములపట్ల - ‘‘నాకే చెందినవి’’ - అనే వ్యష్టి భావన.
- ఊహ-అపోహల ప్రభావమునకు వశమై, వివేక దృష్టిని పదునుచేయని స్థితియగు ‘మోహము’. (Illusionary misconceptions) మొదలైనవి.

పంచ మహాభూతములు శరీరములో ప్రదర్శించు గుణములు (Characteristic Features)

‘పృథివీ’ సంబంధమైన గుణములు 5 : (1) శబ్దము, (2) స్పర్శ, (3) రూపము, (4) రసము, (5) గంథము.

‘అప్సు’ (జలము యొక్క గుణములు) 4 : (1) శబ్దము, (2) స్పర్శ, (3) రూపము, (4) రసము.

‘అగ్ని’ యొక్క గుణములు 3 : (1) శబ్దము, (2) స్పర్శ, (3) రూపము

వాయువు యొక్క గుణములు 2 : (1) శబ్దము, (2) స్పర్శ)

ఆకాశము యొక్క గుణము 1 : శబ్దము మాత్రమే!

శరీరము - త్రిగుణములు

ఇంకా ఈ శరీరములో త్రిగుణములు (శరీరిచే) ప్రదర్శితమగుచున్నాయి. (1) సాత్విక గుణము, (2) రాజస గుణము, (3) తామస గుణము.

త్రిగుణములయొక్క లక్షణములు

(1) సాత్విక గుణ లక్షణములు
★ అహింస : మనో - వాక్ - కాయములచే తదితర జీవులను హింసించకుండటము. బాధించకుండటం. తదితర జనుల - జీవుల పట్ల కరుణ, కారుణ్యము, దయ, ప్రేమ.
★ సత్యము : యమ్ సత్, తమేవ సమాశ్రయమ్! ఏది నిత్యమో అద్దానిని ఆశ్రయించి ఉండటము. సందర్భములకు ఆవల చెక్కుచెదరక, ‘సత్’ను అనుభూతపరచుకుంటూ ఉండటము. అసత్తును అసత్తుగా, సత్తును సత్తుగా దర్శించటము.
★ అస్తేయము : ‘ఇతరులకు చెందింది తానే పొందాలి, దొంగిలించాలి’ అను వృత్తులు లేనివాడై ఉండటము.
★ అపరిగ్రహము : ఇతరుల నుండి ఏదో పొందాలనే ఆశ, (పరిగ్రహించాలనే) ధ్యాస - లేకపోవటం. ‘‘నాది. నాకు చెందినది. నాకు సంబంధించినది’’ - అను భావన లేకుండటము.
★ అక్రోధో : ఎవ్వరిపైనా ‘అసూయ, దురధికారము, పగ, పగతీర్చుకొను ఆవేశము, కోపావేశము మొదలైన వాటితో కూడిన క్రోధము - ఉండకపోవటము.
★ గురుశుశ్రూష : గురువును భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, దైవముతో సమానముగా భావించు అభ్యాసము. గురువు బోధించు పరమసత్యమును ఆకళింపు చేసుకొని, హృదయస్థం చేసుకునే ప్రయత్నము.
★ శౌచము : శుచి అయిన ప్రవర్తన, భావములు, అభిప్రాయములు కలిగియుండటము.(Purity of thinking). ఇతరుల పట్ల దుష్ట - ద్వేష భావాలు ఉండకపోవటము. ప్రేమ దయ దాక్షిణ్యము వంటి శ్రేయోదాయకమగు సంభావముల అనువర్తనము, అభ్యాసము. ఇతరులపై చెడు భావములు. దురభిప్రాయములు మనస్సులో పేరుకోకపోవటము. ఇతరులను అర్థంచేసుకునే ప్రయత్నము.
★ సంతోషము : అసంతృప్తి లేకపోవటము. లభించిన వాటి గురించి ‘సంతృప్తి’ కలిగియుండటము (ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్, తృప్తింజెందని మనుజుడు సప్త ద్వీపములకైన చక్కంబడునే? - పోతనామాత్యుల వారిభాగవతము). కొంచెము లభించినా సంతోషము పొందటము. సంతోషంగా ఉండే అలవాటు.
★ ఆర్జవమ్ : కుటిల భావాలు లేకపోవటం. పైకి ఒకటి, లోన మరొకటి - భావనలు కలిగి ఉండకపోవటము. చెప్పేది ఒకటి, తలచేది మరొకటి, చేసేది ఇంకొకటి కాకపోవటము. మనసా - వాచా - కర్మణా త్రికరణశుద్ధి.
★ అమానిత్వము : ఇతరులలో గల గొప్ప విషయములను దర్శించు స్వభావము. తనను తాను ఎక్కువ చేసుకోకపోవటము. ‘ఆత్మస్తుతి, పరనింద’ కలిగి ఉండకపోవటము.
★ అదంభిత్వము : ఇతరులను తక్కువ చేసి చూడకపోవటము. ‘నా గొప్పలు వినండి! మీ గురించి నాకు చెప్పకండి!’...అను ప్రదర్శనా స్వభావము, ఇతరులు తనను ‘గొప్ప’ అనుకోవాలనే ప్రయత్నశీలత్వము - ఇటువంటివి లేకపోవటము.
★ ఆస్తికత్వము : ఈ దేహమును, తదితర ప్రాప్తములను ప్రసాదించుచున్న ‘భగవత్ శక్తి’ యొక్క ఉనికి పట్ల ‘అస్తి - పరమాత్మ ఉన్నారు. లేకుంటే ఇవన్నీ ఎట్లా లభిస్తాయి’ - అనే ఆస్తికత్వ అంగీకారస్వభావము. కృతజ్ఞత. భక్తితత్పరత.
★ అహింసతా : ఇతరులను నిందించు, బాధించి ఆనందించు, హింసించు భావనలు ఉండక పోవటము. అకారణ కోపము, బాధించే స్వభావం లేకుండటము.

ఏతే సర్వ గుణా జ్ఞేయాః సాత్వికస్య విశేషతః। ఇవన్నీ వృద్ధి అగుచుండటం - సత్వ గుణ లక్షణములు.

2. రాజస గుణ విశేష లక్షణములు
అహం కర్తా-స్మి। అహం భోక్తా-స్మి। అహం వక్తా। అభిమానవాన్।
★ ఇదంతా నా వలననే జరుగుతోంది. నేనే చేస్తున్నాను. దీనికంతటికీ కర్తను నేనే, అహమ్ కర్తా-స్మి!
★ ఇదంతా నాచేత పొందబడుచున్నాయి. ఇవన్నీ నా కొరకే ఉన్నాయి. నాకు చెందినవే అయి ఉన్నాయి. ఇక్కడి సుఖ దుఃఖాలకు నేను భోక్తను. అహమ్ భోక్తా-స్మి!
★ నేను చెప్పేవాడిని! అందరూ వినాలి! అంతే! చెప్పినట్లు చేయాలి! ఇతరుల చెప్పితే నా అంతటివాడు చేయవలసిన పనిలేదు. అహమ్ వక్తా-స్మి!
★ నేను గొప్ప అభిమానము గల వాడిని. నన్ను ఎవ్వరైనా ఏమన్నా అంటే చాలా బాధ. అభిమానవాన్! ఇతరులు నన్ను అభిమానించాలి. నేను ఇతరులను లెక్కబెట్టను. లెక్కచేయనవసరం నాకు లేదు. నేను అభిమానించబడనప్పుడు అది నాకు దుఃఖమే మరి!

ఏతే గుణా రాజసస్య ప్రోచ్యన్తే-బ్రహ్మవిత్తమైః।। ఇటువంటి గుణ విశేషములన్నీ రాజసగుణ లక్షణములు-అని బ్రహ్మవేత్తల నిర్ణయము.

3. తామస గుణ విశేష లక్షణములు
★ అతి నిద్ర: రోజులో ఎక్కువసేపు నిదురించటము. బ్రాహ్మీ ముహూర్తము (తె. 4-7)ను నిద్రలో వృధా చేసుకోవటము.
★ ఆలస్యము: బద్ధకము. సోమరితనము. నెమ్మదితనము.
★ మోహము: ఊహ, అపోహలు - స్వకీయ విచక్షణను కప్పివేసి ఉంచడటము.
★ రాగము: బంధువులు, గృహములు,పేరు - ప్రతిష్ఠలు వీటన్నిటిపట్ల - ‘ఇవి నాకు చెందినవి. నేను వీటికి చెందినవాడను. వీరు నాకు రక్షకులు. నేను వీరికి రక్షకుడను’ అను భావనాపరంపరావేశములు.
★ మైధునము: వస్తువులతో, విషయములతో సంబంధ - బాంధవ్యములపట్ల అవినాభావ పూర్వక ఆవేశము. కామావేశము.
★ చౌర్యము: ఇతరుల సొమ్ములను దొంగిలించాలనే స్వభావము.

ఏతే గుణాః తామసస్య ప్రోచ్యన్తే బ్రహ్మవాదిభిః। ఇవన్నీ తామసగుణ విశేషములుగా బ్రహ్మవాదులు సూచిస్తున్నారు.

┄ ┄ ┄

సాత్విక గుణ విశేషములను అధికం చేసుకోవటం చేత ఈ జీవుడు జ్ఞాన - యోగ - కర్మ మార్గములలో ఊర్థ్వస్థితులు పొందుచున్నాడు. రాజసిక గుణ విశేషములచేత మధ్యలోనే తిరుగాడుచున్నాడు. తామసిక గుణవిశేషములచే అధోగతులు పొందుచున్నాడు. (సాత్విక గుణములచే దేవతా జన్మలను, రాజసిక గుణములచే మానవజన్మను, తామసిక గుణములచే జంతు స్థితి - గతులను పొందుచున్నాడు).

సమ్యక్ జ్ఞానగ్ం-సాత్వికమ్। సాత్విక గుణ ఆధిక్యతచే - సర్వత్ర సమస్వరూపుడగు పరమాత్మయొక్క (సమం సర్వేసుభూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ - అనురూపముగల) సమ్యక్ జ్ఞానము వృద్ధి చెందుతోంది.

ధర్మ జ్ఞానగ్ం - రాజసమ్। రాజసిక గుణముల ఆధిక్యతచే-ధర్మము, చేయవలసినవి - చేయకూడనివి (Do's & Dont's)..... ఇవన్నీ ఆలోచనచేయు జ్ఞాని అయి ఉంటున్నాడు. ధర్మాధర్మ విచక్షణ చేయటము రాజస గుణ స్వభావము.

తిమిరాన్థం - తామసమ్ ఇతి। తామసగుణ - ఆధిక్యతచే, ఈ జీవుడు ఆవేశకావేశములు పొందుచున్నాడు. అజ్ఞానాంధకారము తాండవిస్తున్న స్థానములు చేరుచున్నాడు. మరల మరల జ్ఞానజ్యోతి లభించని చీకటి దేహ పట్టణములలో ప్రవేశ - నిష్క్రమణములను పొందుచున్నాడు. తామసగుణము - గ్రుడ్డివాడు చీకట్లో తారసలాడుచుండటము వంటిది. ఆత్మ గురించిన ఏమరపు.

చతుర్విధ అవస్థలు

ఇంకా కూడా....

ఈ శరీరమును స్వీకరించిన శరీరి - 4 విధములైన అవస్థలలో (ఒక్కొక్కసారి ఒక్కొక్క అవస్థలో) అవస్థితుడై ఉంటున్నాడు.
(1) జాగ్రదవస్థ, (2) స్వప్నావస్థ, (3) సుషుప్త్యవస్థ, (4) తురీయము (చతురీయము - నాలుగవది) వీటిగురించి (సంక్షిప్తంగా) చెప్పుకుంటున్నాము.

(1) జాగ్రత్ అవస్థ: జ్ఞానేంద్రియ (పంచక), కర్మేంద్రియ (పంచక), అంతఃకరణ చతుష్టయమ్-చతుర్దశ (14) కరణ యుక్తం - ‘‘జాగ్రత్’’।।

‘శ్రోత్ర - త్వక్ - చక్షు - జిహ్వ - ఆఘ్రాణము’ అగు పంచ జ్ఞానేంద్రియములు (+)
‘వాక్ - పాణి - పాద - పాయు - ఉపస్థలనే పంచకర్మేంద్రియములు (+)
మనోబుద్ధి - చిత్త - అహంకారములనే అంతఃకరణ చతుష్టయము.

ఈ 14 కరణములు కలిగియుండి, సంవర్తనము (Participating) చేయు శరీరి యొక్క అనుభవ సందర్భము ‘జాగ్రత్’ అయి ఉన్నది.

(2) స్వప్నావస్థ : అంతఃకరణ చతుష్టయైరేవ సంయుక్తః - ‘స్వప్నః’। జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ప్రక్కకు పెట్టి, కేవలము అంతఃకరణ చతుష్టయము మాత్రమే (మనోబుద్ధి చిత్త అహంకారములు మాత్రమే) ప్రవర్తించుచున్నప్పటి - ఈ శరీరియొక్క సంస్థితి (లేక) సందర్భము - స్వప్నము.

(3) సుషుప్త్యవస్థ - చిత్త - ఏకకరణా ‘‘సుషుప్తిః’’! పైన చెప్పుకొన్న జాగ్రత్ - స్వప్న సంబంధమైన జ్ఞానేంద్రియ పంచక - కర్మేంద్రియ పంచక - అంతఃకరణ చతుష్టయ - చతుర్దశ (14) విశేషములు మౌనము వహించిన జడస్థితి - సుషుప్త్యవస్థ.

చిత్తమునకు పై 14 కూడా ఉపకరణములు (Instruments). వాటిని వాడుకొనుచూ, చిత్తము జాగ్రత్ - స్వప్నములను కల్పించుకొని అనుభవ పరంపరలను కొనసాగిస్తోంది. అయితే, జాగ్రత్ స్వప్నములకు వేరైన నిశ్శబ్ధమగు-గాఢనిద్రావస్థలో (లేక) మరొక మౌనరూపమగు సందర్భములో చిత్తము - ఉపకరణ అన్యత్వము ప్రక్కనబెట్టి - ఏకత్వము పొందినదై ఉంటోంది. అట్టి స్థితి (లేక) అవస్థలో చిత్తమునకు జాగ్రత్ లేదు. స్వప్నము లేదు. విషయములన్నీ చిత్తము (అనే పెట్టె)లో దాచి ఉంచి, జడమును ఆశ్రయించు స్థితియే ‘సుషుప్తి’.

ఒకడు రెండు పెద్ద కార్యక్రమములలో మునిగి తేలుచూ మధ్య మధ్యలో ‘విరామము’ ఆస్వాదించు స్థితి వంటిది - సుషుప్తి. సుషుప్తిలో కర్మేంద్రియములు పనిచేయుట లేదు. జ్ఞానేంద్రియములు కూడా ప్రవర్తించటం లేదు. అంతఃకరణము మౌనము వహించి ఉంటోంది. చిత్తము ఏకత్వము పొంది ఉంటోంది. సుషుప్త్యవస్ధలో జాగ్రత్-స్వప్న విశేషాలు లేకుండాపోయినాయా? లేదు. ఉన్నాయి. అయితే ‘‘మౌనము’’ వహించినవై ఉన్నాయి.

మరికొంత సమయము తరువాత ఆ చిత్తము కరణములను స్వీకరించగానే (Immediately after it takes up the instruments) - ఆ మరుక్షణం జాగ్రత్‌యో, స్వప్నమో శరీరికి ఎదురుగా వచ్చి నిలుచుని, ఆతని అంశగా ప్రవేశము పొంది, ఆతనిచే ఆస్వాదించబడుతోంది. సుషుప్త పురుషుడు-సుషుప్తిని ప్రక్కననెట్టి, తననుండి జాగ్రత్ పురుషునో (లేక) స్వప్నపురుషునో అనుభవంగా ఆహ్వానించుచున్నాడు. సుషుప్తిలో ఉన్నవానిపట్ల 14 కరణములు, వాటివాటి విషయానుభవములు దాచిపెట్టబడినవై ఉంటున్నాయి. చిత్తము మౌనము వహించినంతసేపు అవి పనిచేయవు. చిత్తము కరణములు స్వీకరించటానికి ఉద్యుక్తమవగానే తగుదనమ్మా - అని జాగ్రత్, స్వప్నములు వచ్చి చేరుచున్నాయి.

(4) తురీయము : 14 కరణములు చిత్తమునకు ఉపకరణము అగుచుండగా, ఆ చిత్తము చైతన్యస్ఫూర్తి రూపుడగు శరీరికి (జీవునికి) - తాను ఉపయోగించు కరణము (ఉపకరణము - ఉపయోగించబడు వస్తువువంటిది) అగుచున్నది. అనగా శరీరికి (one who is using the physical body) జ్ఞానేంద్రియపంచకము, కర్మేంద్రియ పంచకము, అంతఃకరణ చతుష్టయము - చిత్తము - ఇవన్నీ తాను ఉపయోగించు వస్తువులు. 14 కరణములు లేనప్పుడు కూడా (ఉపయోగించబడనప్పుడు కూడా) చిత్తము ఉన్నది. (చిత్తము శరీరికి ఉపకరణము కాబట్టి). చిత్తమును పక్కకు పెట్టినప్పుడు కూడా శరీరి ఉన్నాడు. శరీరము లేనప్పుడు కూడా ఉండి ఉన్న జీవుడు ఎవరు? చైతన్యస్ఫూర్తి స్వరూపుడగు ఈ ‘జీవుడు’ స్వతఃగా సర్వదా కేవలాత్మయే!

కేవల జీవయుక్తమేవ తురీయమ్ ఇతి। చైతన్య స్ఫూర్తి - ‘జీవితము’ అనే అభిమానము కలిగియున్నప్పుడు - ‘జీవుడు’. అట్టి అభిమానమునకు సాక్షి అయి మాత్రమే ఉంటే? కేవలుడు.

ఈ జీవుడు మొట్టమొదట కేవలుడు.
➤ శరీరమును ఆశ్రయించినప్పుడు - శరీరి.
➤ చిత్తము మాత్రమే ద్వితీయముగా (ఉపకరణంగా) కలిగి ఉన్నప్పుడు - సుషుప్తియుతుడు.
➤ చిత్తముతోబాటు అంతఃకరణ చతుష్టయము ను కూడా ఉపకరణంగా కలిగియున్నప్పుడు - స్వప్నద్రష్ట.
➤ చిత్తము, అంతఃకరణములతో బాటుగా జ్ఞానేంద్రియ - కర్మేంద్రియములు కూడా ప్రదర్శనపూర్వకంగా కలిగి ఉన్నప్పుడు - జాగ్రత్ ద్రష్ట.

తురీయుడు: మూడు అవస్థలగు జాగ్రత్-స్వప్న సుషుప్తులను తనకు సంచారభూమికలుగా తానే కల్పించుకొని, ప్రవేశించి వాటిలో సంచరించువాడు.
ఆత్మయే మహాపురుషుడు.
ఆయననుండి బయల్వెడలుచున్న చతుర్విధ పురుషకారములే జాగ్రత్-స్వప్న-సుషుప్తి తురీయములు.

‘క్షేత్రజ్ఞుడు’

జీవాత్మ కేవలుడై (తురీయుడై) యుండియే (1) చిత్తమును ఉపకరణంగా స్వీకరించి సుషుప్త్యవస్థను, (2) అంతఃకరణమును కూడా స్వీకరించి స్వప్నావస్థను, (3) ‘జ్ఞాన-కర్మ’ పంచ-పంచేంద్రియములను కూడా స్వీకరించి జాగ్రత్ అవస్థను పొందటము (లేక) ఆస్వాదించటము జరుగుతోందని అనుకున్నాము కదా! అట్టి జీవాత్మ మరొక దేనికైనా ఉపకరణమా? అవును! ఈ ‘జీవాత్మత్వము’ను తన కరణము లేక ఉపకరణముగా కలిగియన్నవేరై ఉన్నవాడు - ‘పరమాత్మ’. ఆయనయే ‘‘క్షేత్రజ్ఞుడు’’. పరమాత్మగా ఈ జీవుడు సర్వాంతర్యామి.

ప్రతి ఒక్క జీవుడు సర్వదా అఖండమగు పరమాత్మ స్వరూపుడే! సర్వ దేహములలోని క్షేత్రజ్ఞుడే పరమాత్మ।

పరమ్ = ఆవల
పరమాత్మ → సహజ కేవలుడు
జీవాత్మ → సందర్భ రూపుడు
పరమాత్మ ఎరుక (knowing) చిత్ → నుండి ‘జీవాత్మ’ గా జలమునుండి తరంగమువలె బయల్వెడలుచున్నాడు.

పరమాత్మయొక్క ‘‘ఎరుగుట / చిత్ (consciousness)’’ నుండి జీవాత్మ కల్పించబడుచున్నది.

ఎరుగటయే → కన్నులు తెరవటం వంటిది
ఎరుక మౌనం వహిస్తే → కన్నులు మూయటం వంటిది.

శ్లో।। ఉన్మీలిత నిమీలిత మధ్యస్థ జీవ - పరమాత్మనోః -
మధ్యే, జీవాత్మా ‘‘క్షేత్రజ్ఞః’’ ఇతి విజ్ఞాయతే।।

పరమాత్మ యొక్క నిమీలితము కనులు మూయటం - జీవాత్మ।
పరమాత్మ యొక్క ఉన్మీలిత - కనులు తెరవటం - కేవలాత్మ।
ఈ నిమీలిత - ఉన్మీలితముల మధ్యగాను, ఆవల - ఈవల కూడా ‘ఎరుక’ సర్వదా ఏర్పడినదై ఉన్నది.

అట్టి కేవలమగు ఎరుకయే ఎరుగుచున్న వాడుగా (లేక) ‘క్షేత్రజ్ఞుడు’ గా ప్రదర్శనమగుచున్నాడు - అనునది శాస్త్ర ప్రసిద్ధమైయున్నది.

✤ పరమాత్మ - జీవాత్మల మధ్య గలదే ‘క్షేత్రజ్ఞుడు’ అని పిలువబడుచున్నది.
✤ క్షేత్రజ్ఞుడు - ఎరుగుచున్నట్టివాడు
✤ అట్టి క్షేత్రజ్ఞునికి ఆవల పరమాత్మ (పరమ్) - ఈవల జీవాత్మ (ఇహమ్)
✤ ఒక నాట్య కళాకారుడు ఒక నాటకములో ఒక ‘పాత్ర’ వహించటము వంటిది. పాత్రధారుడు పరమాత్మ. పాత్రయో? జీవాత్మ.

క్షేత్రము = పొలము / శరీరము (అన్యము)
క్షేత్రజ్ఞుడు = తెలుసుకొనే స్వభావి (అనన్యము. కేవలము).

సూక్ష్మ శరీరము (లేక) లింగ శరీరము

బుద్ధి, కర్మేంద్రియ, ప్రాణ - పంచకైః (3 x 5), మనసాధియా, శరీరగ్ం సప్తదశభిః (17) సూక్ష్మం తత్ ‘‘లింగమ్’’ ఉచ్యతే।। ఈ స్థూల (భౌతిక) శరీరముకాక, ఈ జీవుడు తనకు సంబంధించి మరొక శరీరము సూక్ష్మశరీరము కలిగి ఉన్నాడు. (5) పంచ జ్ఞానేంద్రియములు (5) పంచకర్మేంద్రియములు (5) పంచ ప్రాణములు (పాన అవాన వ్యాన ఉదాన సానములు)
5 + 5 + 5 = 15
(16) మనస్సు (Thought factor) (17) బుద్ధి (Intelectual factor)
ఈ 17 కూడా ‘సూక్ష్మ శరీరము’ లేక ‘లింగ శరీరము’ యొక్క స్వీయకల్పనా సూక్ష్మాంగములు.

అనేక పూర్వానుభవములు / జ్ఞాపకములు దాగినవైయున్న స్థానము ‘‘సూక్ష్మ శరీరము’’ లేక ‘‘లింగ శరీరము’’ అని చెప్పబడుతోంది.

అష్ట విధప్రకృతి

మనస్సు బుద్ధి అహంకారము (+) ఖం (ఆకాశము) - అనిల (వాయు) - అగ్ని జల భూః (3 + 5) - ఇవి ‘అష్టవిధ ప్రకృతి’ గా చెప్పబడుచున్నాయి.

షోడశ (16) తత్త్వములు: 1. చెవులు 2. చర్మము 3. కన్నులు 4. నాలుక 5. ముక్కు 6. గుదము 7. ఉపస్థ 8. చేతులు 9. కాళ్లు 10. వాక్కు 11. శబ్దము 12. స్పర్శ 13. రూపము 14. రసము 15. గంధము 16. అనుభవి

ఇవి షోడశ (16) తత్త్వములుగా వర్ణించి చెప్పబడుచున్నాయి.

ప్రకృతి తత్త్వములు

శ్రోత్రము - త్వక్ - చక్షు - జిహ్వ - ఆఘ్రాణ (5) - పంచ జ్ఞానేంద్రియములు
పాయు - ఉపస్థ - కరే - పాదే - వాక్చైవ (5) - పంచ కర్మేంద్రియములు
శబ్ద - స్పర్శ - రూప - రస - గంథములు (5) - పంచ విషయములు
అష్టవిధ ప్రకృతి - (పంచభూతములు, మనో బుద్ధి చిత్తములు) (8).
ఈ ‘23’ కలిపి ప్రకృతి తత్త్వములు. ప్రకృతికి చెందినవి. ‘ప్రకృతి’ శబ్దార్థములు.

పురుషుడు

ఈ చెప్పుకున్న ‘23’ తత్త్వాలు ప్రకృతి స్వరూప విభాగములు. వీటికి వేరై మహత్తరమై, వీటన్నిటికీ ఉత్పత్తి స్థానమై ‘పురుషుడు’ ఉన్నాడు. ఆతని లీలా - క్రీడా వినోదమే ఇదంతా.
- అన్నిటికీ సాక్షి। అన్నీ ఏర్పడుచూ ఉన్న స్థానము। అన్నిటియొక్క లయస్థానము।
అన్నిటికీ ఆవల ఉన్నవాడు। జీవాత్మత్వ-క్షేత్రజ్ఞత్వములకు కూడా పరమైయున్నట్టి ఆ కేవల-స్వస్వరూప అనంతమూర్తియే పరమాత్మ!

ఆయన మూర్తిత్వ చమత్కారమే అష్ట విధ (8), పంచదశ విధ (5), త్రయోవింశతి (23) విధ ప్రకృతి విభాగమంతా కూడా!

ఆయన సత్యము! నిత్యము! అనునిత్యము!

అట్టి పరమ పురుషుడే ఉపాస్య వస్తువు।

ఈ జీవుని వాస్తవ సహజ రూపము, స్వభావము కూడా అట్టి ‘పరమ పురుషుడే।

ఈ జీవుడు పరమాత్మ కాని క్షణమే లేదు.

🙏 ఇతి శారీరక ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।