[[@YHRK]] [[@Spiritual]]
MunDaka Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
|
శ్లో।। ధనుః గృహీత్వా ఉపనిషదం మహాస్త్రం, శరం హి ఉపాసా నిశితం సంధధీత, ఆయమ్య తత్ భావగతేన చేతసా లక్ష్యం తత్ఏవ ‘అక్షరం’, సోమ్య! విద్ధి।। |
ఓ స్నేహితుడా! సోమ్యా! - ఉపనిషత్ సాహిత్యమును అందిస్తున్న గొప్ప ఆయుధరూపమగు ధనస్సును చేత ధరించు. నిత్యోపాసనారూపమైన (యోగాభ్యాసమనే) పదునైన బాణమును అనుసంధానం చేయి. - తత్ భాగవతేన → ఆ బ్రహ్మమును గురించిన చింతనయందు లగ్నమైన చేతనము (మనస్సు) అనే త్రాటిని (వింటినారిని) సారించు! ‘తత్’ - శబ్దార్థము - అక్షరము (అవినాసి) అగు బ్రహ్మమును ఛేదించు. (లక్ష్యముగా కలిగి ఉండుము). అట్టి బ్రహ్మమును ఎరుగుము! అదియే నీవై ఉండుము. |
|
ఓం బ్రహ్మా దేవానాం ప్రథమః సంబభూవ విశ్వస్య కర్తా భువనస్య గోప్తా . స బ్రహ్మవిద్యాం సర్వవిద్యాప్రతిష్ఠామథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ .. 1.. |
|
|
1. ఓం। బ్రహ్మా దేవానాం ప్రథమః సంబభూవ, విశ్వస్య కర్తా। భువనస్య గోప్తా। స బ్రహ్మవిద్యాం సర్వవిద్యా ప్రతిష్ఠామ్ అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ।। |
సృష్టికర్త అగు బ్రహ్మదేవుడు సమస్త సృష్టి - సృష్టి దేవతలకంటే మునుముందే ఆవిర్భవించియున్నారు. • ఆయనయే విశ్వముయొక్క కర్త, భువనమునకు (జగత్తుకు)-రక్షకుడు కూడా • ఆయన సర్వవిద్యలకు ఆశ్రయమైన బ్రహ్మవిద్యను తన మానస పుత్రుడగు పెద్దకుమారుడైన అథర్వునకు బోధించారు. |
|
అథర్వణే యాం ప్రవదేత బ్రహ్మాఽథర్వా తం పురోవాచాంగిరే బ్రహ్మవిద్యాం . స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ భారద్వాజోఽఙ్గిరసే పరావరాం .. 2.. |
|
|
2. అథర్వణే యాం ప్ర-వదేత బ్రహ్మా అథర్వా తాం పురో వాచ అంగిరే బ్రహ్మవిద్యామ్। స భరద్వాజాయ సత్యవాహాయ ప్రాహ। భరద్వాజో అంగిరసే పరావరామ్।। |
బ్రహ్మదేవులవారు దేనిని అథర్వణునకు చెప్పారో..., ఆ బ్రహ్మవిద్యను అథర్వ మహర్షి ఒకానొకప్పుడు మరొక బ్రహ్మమానసపుత్రుడగు అంగిరసునకు చెప్పారు. ఆ అంగిరసమహర్షి భరద్వాజ వంశజుడైన సత్యవాహునకు చెప్పటం జరిగింది. సర్వవిద్యలకు పరాకాష్ఠ (అయిన బ్రహ్మవిద్య)ను (లేక) పరంపరగా వచ్చిన ఆ బ్రహ్మవిద్యను భరద్వాజ వంశీయులు అనేకమందికి తెలియచెప్పారు. బోధించారు. |
|
శౌనకో హ వై మహాశాలోఽఙ్గిరసం విధివదుపసన్నః పప్రచ్ఛ . కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి .. 3.. |
|
|
3. శౌనకో హ వై మహాశాలో అంగిరసం విధివత్ ఉపసన్నః పప్రచ్ఛ: ‘‘కస్మిన్ ను, భగవో! విజ్ఞాతే సర్వమ్ ఇదమ్ విజ్ఞాతం భవతి?’’ ఇతి।। |
శ్రీ శునక ఋషిపుత్రుడు-శౌనక నామధేయుడు. ఆయన మహాశయుడు. మహదాశయుడు. ఆ శౌనకుడు విధివిధానంగా (శిష్యుడు గురువును సమీంచే శాస్త్ర విధిని విధానమును పాటిస్తూ) ఒక సందర్భములో అంగిరసుని సమీపించినవారై ప్రశ్నించారు! ‘‘హే భగవాన్! దేనిని తెలుసుకోవటంచేత ఈ సర్వము తెలియబడినదగుచున్నది?’’ |
|
తస్మై స హోవాచ . ద్వే విద్యే వేదితవ్యే ఇతి హ స్మ యద్బ్రహ్మవిదో వదంతి పరా చైవాపరా చ .. 4.. |
|
|
4. తస్మై స హోవాచ : - ద్వే విద్యే వేదితవ్యే ఇతి హ స్మ యత్ బ్రహ్మవిదో వదంతి। ‘పరా’ చ ఏవ। ‘అపరా’ చ।। |
ఆతడు (అంగిరసుడు) ఆతనికి (శౌనకునికి)....ఇట్లా చెప్పసాగారు! విద్యలుగా తెలుసుకోవలసినవి రెండు అని బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారయ్యా! (1) పరావిద్య (2) అపరావిద్య. |
|
తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదోఽథర్వవేదః శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి . అథ పరా యయా తదక్షరమధిగమ్యతే .. 5.. |
|
|
5. తత్ర అపరా ఋగ్వేదో, యజుర్వేదః। సామవేదో, అథర్వవేదః, శిక్షా, కల్పో। వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిషమ్-ఇతి।। అథ పరా → యయా తత్ అక్షరమ్ అధిగమ్యతే।। |
వాటిలో అపరావిద్య : ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, శిక్షా (శబ్దశాస్త్రం), కల్ప విధులూ, (కాలవిధులు) వ్యాకరణము, నిరుక్తము (అర్థనిర్ణయ శాస్త్రము), ఛందస్సు, జ్యోతిష శాస్త్రము → మొదలైనవన్నీ కూడా. ఇక దేనిచేత తత్ (బ్రహ్మము) - అక్షరము (మార్పులేనిది) పొందబడుతోందో...అది పరావిద్య. |
|
యత్తదద్రేశ్యమగ్రాహ్యమగోత్రమవర్ణ- మచక్షుఃశ్రోత్రం తదపాణిపాదం . నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః .. 6.. |
|
|
6. యత్ తత్ అద్రేశ్యమ్, అగ్రాహ్యమ్, అగోత్రమ్, అవర్ణమ్, అచక్షుః - శ్రోతం, తత్ అపాణి-పాదమ్। నిత్యం, విభుం, సర్వగతం, సుసూక్ష్మం। తత్ అవ్యయం యత్ భూత యోనిం పరిపశ్యంతి ధీరాః।। |
ఏదైతే భౌతికమైన కళ్ళకు కనిపించేది కాదో, చేతులతో పట్టుగోపోతే దొరికేది కాదో..., ఏదైతే దృశ్యజగత్తులో దేనికీ సంబంధించినది కానిదో, రంగు - రూపము లేనిదో వర్ణాశ్రమ ధర్మాలకు సంబంధించినది కాదో... (ఏదైతే) → కళ్ళు - చెవులు లేనిదో (వాటిచే పట్టుబడనిదో), చేతులు - కాళ్ళు లేనిదో (కానిదో)... (ఏదైతే) → ఎల్లప్పుడూ ఉండేదో (నిత్యమైనదో), సర్వమునకు యజమానియో, సర్వత్రా వ్యాపించి ఉన్నదో, అత్యంత సూక్ష్మమైనదో అట్టి ఈ కనబడే సర్వజీవులకు ఉత్పత్తి స్థానమే ‘‘ఆత్మ’’ ధీరులు (ప్రజ్ఞావంతులు) అట్టి ఆత్మను సదా సర్వదా సర్వత్రా దర్శిస్తున్నారు. మమేకమౌతున్నారు. |
|
యథోర్ణనాభిః సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయః సంభవంతి . యథా సతః పురుషాత్కేశలోమాని తథాఽక్షరాత్సంభవతీహ విశ్వం .. 7.. |
|
|
7. యథా ఊర్ణనాభిః సృజతే - గృహణాతే చ, యథా పృథివ్యామ్ ఓషధయః సంభవంతి, యథా సతః పురుషాత్ కేశలోమాని తథా అక్షరాత్ సంభవతి-ఇహ విశ్వమ్।। |
ఏ విధంగా అయితే సాలెపురుగు (సాలెగూడు యొక్క దారములను) సృష్టిస్తూ - లోపలికి తీసుకుంటూ (ఇంతలోనే మ్రింగుతూ) ఉంటుందో..., ఎట్లాగైతే భూమిలో ఓషధులు (మూలాధార రసాలు - తత్త్వాలు) ఏర్పడినవై ఉంటున్నాయో...., ఏ రీతిగా జీవునియొక్క శరీరం మీద, తలమీద వెంట్రుకలు ఉద్భవమై పెరుగుచున్నాయో ఆ విధంగా అక్షరమగు దానినుండి (పరబ్రహ్మమునుండి) ఇక్కడ విశ్వము (జగత్తు) సంభవిస్తోంది (లేక) ఉత్పన్నమౌతోంది. |
|
తపసా చీయతే బ్రహ్మ తతోఽన్నమభిజాయతే . అన్నాత్ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు చామృతం .. 8.. |
|
|
8. తపసా చీయతే బ్రహ్మ। తతో అన్నమ్ అభిజాయతే। అన్నాత్ ప్రాణో మనః సత్యం। లోకాః కర్మసు చ అమృతమ్।। |
ఈ విశ్వము / దృశ్యము బ్రహ్మముయొక్క తపస్సుచే (తపనచే) అభివృద్ధి పొందుతోంది. (బ్రహ్మముయొక్క సృజనాత్మక చింతన నుండే ఆయా విశేషాలన్నీ బయల్వెడలుచున్నాయి. అద్దానినుండి తపస్సు (తపన - తపస్సు నుండి) అన్నము (మూల Matter - Raw Material పదార్థము) అభిజాయతే - జనిస్తోంది. (అన్నము =అనుభవముగా అగుచున్న సమస్తము). అన్నము (అవ్యాకృతము/ పదార్థతత్త్వము) నుండి ప్రాణశక్తి, మనస్సు, సత్యమువలె (యమ్‌సత్ - ఉనికి Presence స్వరూప) కనిపించే లోకాలు, అమృత స్వరూపులు అగు జీవాత్మలు - అనంతముగాను, అసంఖ్యాకము గాను ఏర్పడుచున్నవగుచున్నాయి. |
|
యః సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః . తస్మాదేతద్బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే .. 9.. |
|
|
9. యః సర్వజ్ఞః సర్వవిత్ యస్య జ్ఞానమయమ్ తపః, తస్మాత్ ఏతత్ బ్రహ్మ నామ రూపమ్ అన్నంచ జాయతే।। |
• ఎవ్వడైతే - సర్వజ్ఞుడో (సర్వము తెలిసినవాడో), సర్వవేత్తయో (అంతటా ఎరుక కలిగి ఉన్నాడో), • ఎవనియొక్క జ్ఞానమయమైన తపస్సునుండి సృజనాత్మకమైన చింతన బయల్వెడలిందో... ఆయన నుండియే (1) సృష్టికర్త (2) సృష్టిరూపంగా నామరూపాత్మమై కనిపించే ఈ సమస్తము (దేహాది వస్తువిశేషాలు) (3) అన్నము - కూడా పుట్టుచున్నాయి. (అన్నము = ఆహారము, పంచేంద్రియములయొక్క పంచేంద్రియ విషయములు). |
|
ఇతి ప్రథమ ముండకే - ప్రథమ ఖండే। |
|
తదేతత్సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యంస్తాని త్రేతాయాం బహుధా సంతతాని . తాన్యాచరథ నియతం సత్యకామా ఏష వః పంథాః సుకృతస్య లోకే .. 1.. |
|
|
1. ఓం తత్ - ఏతత్ సత్యం, మంత్రేషు కర్మాణి కవయో యాని అపశ్యమ్। తాని త్రేతాయాం బహుథా సంతతాని। తాని ఆచరథ నియతం, సత్యకామా, ఏష వః పంథాః సుకృతస్య లోకే।। |
(కవయోః) - విజ్ఞులు, ప్రాజ్ఞులు వేదమంత్రముల చేతను - కర్మలచేతను పరమ సత్యముగా దేనినైతే దర్శిస్తున్నారో, ఆ సత్యమే (ఋక్-యజుర్-సామ) త్రి-వేదములలోను, ఉపనిషత్తులలోను, అనేక విధాలుగా విస్తరించి చెప్పబడ్డాయి. అదియే పురాణ, ఇతిహాసములలో కూడా ఎలుగెత్తి గానం చేయబడుతోంది. ఓ సత్యమునే కోరుకొనే సత్యకాములారా! (ఆ త్రివేదములలో గుర్తు చేస్తూ హౌత్రము, ఆధ్వర్యతము, ఔద్గాత్రములుగా చెప్పబడుచున్నట్టి) నియమ - నిష్ఠ - విధి - విధానములను చక్కగా ఆచరించండి! నిర్వర్తించండి! తపోధ్యానములు, సత్కర్మలు వీడకండి. ఈ లోకంలో మీ సుకృతములే మీకు మార్గదర్శకములై యున్నాయి. వేద ప్రవచిన ఉపాసనలు వదలకండి! చేయండి। |
|
యదా లేలాయతే హ్యర్చిః సమిద్ధే హవ్యవాహనే . తదాఽఽజ్యభాగావంతరేణాఽఽహుతీః ప్రతిపాదయేత్ (ప్రతిపాదయేచ్ఛ్రద్ధయా హుతం) .. 2.. |
|
|
2. యదా లేలాయతే హి అర్చిః సమిద్ధే హవ్యవాహనే, తత్ ఆజ్యభాగాః అంతరేణ ఆహుతీః ప్రతిపాదయేత్ శ్రద్ధయా హుతమ్।। |
ఎప్పుడైతే యగ్నగుండమునుండి దేవతలకు హవిస్సును తీసుకొనిపోవు అగ్ని జ్వాలలు అర్చించబడినవై చక్కగా ప్రజ్వలితూ ఉంటాయో..., ఆ కదిలే అగ్నిజ్వాలల మధ్యలో (ఆజ్యబాగాః అంతరేణ) ఆహుతులు శ్రద్ధగా మీచే సమర్పించబడుచూ ఉండును గాక! (మీ మీ అగ్ని (యజ్ఞ) సాధనలు ఆపవద్దు) |
|
యస్యాగ్నిహోత్రమదర్శమపౌర్ణమాస- మచాతుర్మాస్యమనాగ్రయణమతిథివర్జితం చ . అహుతమవైశ్వదేవమవిధినా హుత- మాసప్తమాంస్తస్య లోకాన్ హినస్తి .. 3.. |
|
|
3. యస్య అగ్నిహోత్రం అదర్శమ్, అపౌర్ణమాసమ్, అచాతుర్యాస్యమ్, అనాగ్రయణమ్, అతిథి వర్జితం చ, అహుతం అవైశ్వదేవమ్, అవిధినా హుతమానః। (హుతమా)। సప్తమాం తస్యలోకాన్ హినస్తి।। |
ఎవనియొక్క అగ్నిహోత్రక్రియలు సమయ - అసమయాలు అనుసరించి ఉండవో, అమావాస్య - పౌర్ణిమల సందర్భాలలో విధి విధానంగా నిర్వంచబడక అధర్మము (ధర్మకర్మలేనిది), అపౌర్ణిమము (పౌర్ణమిరోజు నిర్వర్తించ బడవలసినవి చేయకుండటము) అయి ఉంటోందో..., - చాతుర్మాస్యవ్రత నియమిత శాస్త్ర విధులను,నూర్పుల సమయంలో చేయవలసియున్న ప్రథమ ఫలతర్పణలు, అతిథిసేవలు, సమర్పణలు లేకయే కార్యక్రమాలు ఉంటున్నాయో. - శాస్త్ర విధి అనుసరించని ఆహూతులు లేనిది, వైశ్వానర (అన్నదాన) విధి నిర్వర్తించబడనిది (పక్షులకు జంతువులకు ఆహార తృప్తి - సమర్పణ చేయటం జరగనిది) - అగుచున్నదో, - విధి, ఉద్దేశ్యము, ప్రయోజనములను ఉద్దేశ్యించని, పవిత్రాశయము లేని ఆహుతులు అగుచున్నాయో, - యజ్ఞర్ధాత్ కర్మణః మరియు అగ్నిసంబంధిత క్రియలు ఏమరచ బడుచున్నాయో, అట్టివారి పితృ-ఊర్ధ్వసప్తలోక యానములు ఏడు తరములు నష్టమును పొందుచున్నాయి. |
|
కాలీ కరాలీ చ మనోజవా చ సులోహితా యా చ సుధూమ్రవర్ణా . స్ఫులింగినీ విశ్వరుచీ చ దేవీ లేలాయమానా ఇతి సప్త జిహ్వాః .. 4.. |
|
|
4. కాళీ కరాళీ చ మనోజవా చ। సులోహితా యా చ సుధూమ్రవర్ణాః। స్ఫులింగనీ విశ్వరుచీ చ దేవీ। లేలాయమానా ఇతి సప్తజిహ్వాః।। |
అగ్నికార్యములు ఈ జీవుని పవిత్రం చేయగలవు। (1) కాళీ, (2) కరాళీ, (3) మనోజవ, (4) సులోహిత, (5) సుధూమ్రవర్ణ, (6) స్ఫులింగనీ, (7) విశ్వరుచి-అను పవిత్రమైన పేర్లతో పిలువబడే సప్తజిహ్వలతో (ఏడునాలుకలతో - ఏడు విధములైన జ్వాలలతో) అగ్నిదేవుడు లేలాయమానమై (హవిస్సు, ఆహుతులను స్వీకరించేవారై ప్రకాశిస్తూ ఉంటారు (వారిని సేవించి జీవులు తరించెదరు గాక!) |
|
ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు యథాకాలం చాహుతయో హ్యాదదాయన్ . తం నయంత్యేతాః సూర్యస్య రశ్మయో యత్ర (తన్నయంత్యేతాః) దేవానాం పతిరేకోఽధివాసః .. 5.. |
|
|
5. ఏతేషు యః చరతే భ్రాజమానేషు యథా కాలం చ ఆహుతయో హి ఆదదాయన్। తం నయంతి ఏతాః సూర్యస్య రశ్మయో యత్ర దేవానాం పతిః ఏకో అధివాసః।। |
ఎవ్వరైతే దేదీప్యమానమైనట్టి-భ్రాజమానమైనట్టి అగ్నిశిఖలలో యథాకాలము (కాలనియమానుసారం) ఆహుతులు సమర్పిస్తూ ఉంటారో... వారియొక్క ఆహుతులను - సూర్యరస్మి, సూర్యకిరణాలు దేవతలకు పతియగు పరమేశ్వరుని ధామమునకు -(సమక్షానికి) చేరుస్తున్నాయి. |
|
ఏహ్యేహీతి తమాహుతయః సువర్చసః సూర్యస్య రశ్మిభిర్యజమానం వహంతి . ప్రియాం వాచమభివదంత్యోఽర్చయంత్య ఏష వః పుణ్యః సుకృతో బ్రహ్మలోకః .. 6.. |
|
|
6. ‘ఏహి! ఏహి!’ ఇతి। తమ్ ఆహుతయః సువర్చసః సూర్యస్య రశ్మిభిః యజమానం వహన్తి। |
‘‘రండి! రండి!’’ (Welcome, Welcome) - అని పలుకుచు సువర్చస్సులో కళకళలాడే ఆ యాగ ఆహుతులు సూర్యకిరణముల ద్వారా ఆ యజ్ఞకర్తను సూర్యమండలమునకు (మనో సంయోగ మార్గంగా) గొనిపోతున్నాయి. |
|
ప్రియాం వాచం అభివదంత్యో అర్చయంతి య ఏష వః పుణ్యః సుకృతో బ్రహ్మలోకః।। |
ప్రియమై వాక్కులు పలుకుతూ ఆతనిని అర్చిస్తూ కూడా ఉంటున్నాయి. సుకృతులు (మంచి పనులు చేసినవారు), పుణ్యాత్ములు చేరు బ్రహ్మలోకమునకు యజ్ఞకర్తలగు మనలను చేరుస్తున్నాయి. ‘‘ఇదే ఇటువైపే’’ - అంటూ దారిచూపుతాయి. |
|
ప్లవా హ్యేతే అదృఢా యజ్ఞరూపా అష్టాదశోక్తమవరం యేషు కర్మ . ఏతచ్ఛ్రేయో యేఽభినందంతి మూఢా జరామృత్యుం తే పునరేవాపి యంతి .. 7.. |
|
|
7. ప్లవా హి ఏతే అదృఢా యజ్ఞరూపా అష్టాదశ (18) ఉక్తం అవరం యేషు కర్మ। ఏతత్ శ్రేయో యే అభినందంతి మూఢా జరా మృత్యుం తే పునరేవ అపి యంతి।। |
18 రకములైన యజ్ఞరూపములన్నీ కూడా వాటివాటి కర్మ విశేషములతో సహా బలహీనమైన పడవల వంటివి. (అంతటితో సరిపోదు). ఎందుకంటే, ‘స్వర్గలోకము’ వంటి సుఖరూప ఫలాలన్నీ క్షీణించునవే అయి ఉన్నాయి. అవి మాత్రమే శ్రేయోదాయకములని అనుకుంటే, అది తెలివి తక్కువయే! మూఢులే అట్లా అనుకుంటారు ఎందుకుంటే...అవి ‘‘పునరపి జననం - పునరపి మరణం’’ → అను సందర్భములను ఆపలేవు. జన్మమృత్యువులు ఆతనిపట్ల మరల మరల కొనసాగుతూనే ఉంటాయి. |
|
అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితంమన్యమానాః . జంఘన్యమానాః పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః .. 8.. |
|
|
8. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః। |
అవిద్య - అజ్ఞానము యొక్క మధ్యలో (అంతరమున) ఉన్నట్టివారు ‘‘మాకు అంతా తెలుసు ఈ కర్మలు చేయండి! ఆ యజ్ఞాలు చేయండి. మీకు ఆలోకం లభిస్తుంది. ఇది పొందుతారు’’ - అంటూ ‘‘స్వయం, ధీరాః’’ అని భావన చేస్తూ (స్వర్గాది) కర్మఫలాలగురించే మాట్లాడుతూ ఉంటారు. |
|
జంఙ్ఘన్యమానాః పరియంతి మూఢాః, అంధేన ఏవ నీయమానా, యథా అంథాః।। |
ఆ కర్మఫలమార్గతత్పరులు కూడా ఒకటి తరువాత మరొకటిగా అనేక దుఃఖములు పొందుచూ, జన్మ-పునర్జన్మల చక్రములో తిరుగాడుతూ ఉంటున్నారు. గ్రుడ్డివానిచే నడిపించ బడుచున్న మరొకగ్రుడ్డివానివలె కర్మ - కర్మఫలారణ్యాలలో కొందరు జనులు తచ్చాడుచున్నారు. |
|
అవిద్యాయాం బహుధా వర్తమానా వయం కృతార్థా ఇత్యభిమన్యంతి బాలాః . యత్కర్మిణో న ప్రవేదయంతి రాగా- త్తేనాతురాః క్షీణలోకాశ్చ్యవంతే .. 9.. |
|
|
9. అవిద్యాయాం బహుధా వర్తమానాః ‘‘వయం కృతార్థా’’ - ఇతి అభిమన్యంతి బాలాః। యత్ కర్మిణో న ప్రవేదయంతి (తెలుసుకోలేరు) రాగాత్, తేనా ఆతురాః క్షీణలోకాశ్చ అవంతే।। |
(‘‘యజ్ఞ యాగములే - ఉత్తమ లోకములే పరమాశయము’’ అని నమ్మి, - నమ్మించయత్నించే) కొందరు - అనేకమైన, అవిద్యావిషయములందు చిక్కుకున్నవారై, ‘‘మేము యజ్ఞ యాగాది కర్మలచే కృతార్థులమైనాము’’ అని బాలుర వలె భావిస్తున్నారు. వారు కర్మనిరతులై, కర్మ - కర్మఫలముల పట్ల ఆసక్తి, రాగము, అభినివేశము పెంపొందించుకున్నవారై, కర్మలకు - భోగములకు ఆవల గల పరమ-సత్యమును గమనించటము లేదు. వారు రాగముతో ఆశిస్తున్న స్వర్గాది సుఖలోకాలు ‘క్షీణించటం’ అనే స్వభావం కలిగినవే! అవి పొంది కాలక్రమేణా చ్యుతిపొందటమే గతానుగతికంగా జరుగుతోంది. (అందుచేత, కర్మలు రాగరహితమై, ఆత్మజ్ఞానమునకు దారితీసిప్పుడే - ఉత్తమ ప్రయోజనము). |
|
ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠం నాన్యచ్ఛ్రేయో వేదయంతే ప్రమూఢాః . నాకస్య పృష్ఠే తే సుకృతేఽనుభూత్వేమం లోకం హీనతరం వా విశంతి .. 10.. |
|
|
10. ఇష్టా - పూర్తం మన్యమానా వరిష్ఠం న అన్యత్ శ్రేయో వేదయన్తే ప్రమూఢాః నాకస్య పృష్ఠే తే సుకృతే అనుభూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి।। |
‘‘ఇష్టములు (వేదోక్త యజ్ఞకర్మలు), మరియు పూర్తములు (లౌకిక సేవా సంబంధమైన బావులు, త్రవ్వించటం మొదలగునవి) - ఇవే పరిపుష్ఠమైనవి! గొప్పవి! చాలు. వేరే ఏదో (ఆత్మజ్ఞానరూపమైన) శ్రేయోదాయకమైనదేమీ లేదు’’ - అని ఆత్మజ్ఞానాన్ని తిరస్కరించే వారు ప్రమూఢులు. అట్టివారు భోగస్థానములగు స్వర్గము మొదలగు లోకములలో కర్మఫలములగు సుఖములను (ఇంద్రియ- మనో సంబంధమైనవి) అనుభవించి, (ఆకర్మ ఫలాలు ఖర్చుకాగానే) తిరిగి ఈ భూలోకంలోనో, ఇంకా అధోలోకాలలోనో ప్రవేశము పొందుచున్నారు. (జన్మలు పొందుచున్నారు). |
|
తపఃశ్రద్ధే యే హ్యుపవసంత్యరణ్యే శాంతా విద్వాంసో భైక్ష్యచర్యాం చరంతః . సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతః స పురుషో హ్యవ్యయాత్మా .. 11.. |
|
|
11. తపః శ్రద్ధేయే హి ఉపవసంతి అరణ్యే శాంతా విద్వాంసో భైక్ష చర్యాం చరంతః। సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్ర అమృతః స పురుషో హి అవ్యయాత్మా।। |
(ఎవ్వరైతే) తపస్సు - శ్రద్ధలతో అరణ్యంలో (Head in the forest) నివసిస్తూ శాంత మనస్కులై, ఆత్మతత్త్వ విద్వాంసులై, భిక్షాటన వ్రత నియమనిష్ఠులై ఉంటారో..., (అట్టివారు) పాపభావ వినిర్ముక్తులై (విరజాః) → సూర్యమార్గంలో, → ఎచ్చట అమృత - అవ్యయపరమపురుషుడు ప్రకాశిస్తున్నారో...అచ్చటికి చేరుచున్నారు. |
|
పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్త్యకృతః కృతేన . తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం .. 12.. |
|
|
12. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమ్ ఆయాత్ న అస్థి అకృతః - కృతేన। |
(‘‘పరాకాష్ఠ, పరమ పవిత్రము, పరానందము’’ అగు బ్రహ్మమే మహదాశయముగాగల) బ్రహ్మణ్యుడు - యాగకర్మ ఫలములు, సుకృత కర్మఫలములు - అగు స్వర్గము మొదలగు సుఖమయలోకాల (పునరావృత్తి - ఇత్యాది) దోషములను గమనిస్తున్నాడు. పరీక్షగా చూచినవాడై, వాటన్నిటిపట్లా (అట్లాగే), చేయగలుగుచున్నట్టి - చేయలేకపోతున్నట్టి సమస్తకర్మ వ్యవహారములపట్ల నిర్వేదము - వైరాగ్యము కలిగినవాడు అగుచున్నాడు. |
|
తత్ విజ్ఞానార్థమ్ స గురుమేవ అభిగచ్ఛేత్ సమిత్ పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్।। |
ఆత్మతత్త్వమును తెలుసుకోవాలనే ఉత్సుకత, ఆశయము కలవాడై ఆత్మజ్ఞుడగు శోత్రియుడు - బ్రహ్మనిష్ఠుడు అగు సద్గురువును సమిధాదులు (దర్భలు) చేతపట్టుకొని సమీపించెదరు గాక। |
|
తస్మై స విద్వానుపసన్నాయ సమ్యక్ ప్రశాంతచిత్తాయ శమాన్వితాయ . యేనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్త్వతో బ్రహ్మవిద్యాం .. 13.. |
|
|
13. తస్మై స విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ, శమాన్వితాయ। యేన అక్షరం - పురుషం వేద సత్యం ప్రో వాచ తాం తత్త్వతో బ్రహ్మవిద్యామ్।। |
మహదాశయుడగు ముముక్షువు, → ప్రశాంతచిత్తుడు, శమాన్వితుడు ఆత్మజ్ఞుడు అగు విద్వాంసుని యథావిధిగా సమీపించి, శరణు వేడుచున్నాడు. ఆ విధంగా తనను ఆశ్రయించిన సమిత్‌పాణి సమన్వితుడైన (చేత యజ్ఞ దర్భలు ధరించిన) శిష్యునికి ఆ సద్గురువు → సత్యము, అక్షరము - అవ్యయము అగు ఆత్మతత్త్వమును - ఆతడు (శిష్యుడు) చక్కగా తెలుసుకొనే రీతిగా బోధించునుగాక। బ్రహ్మవిద్యను తత్త్వతః సారభూత - సాకల్యమైన వివరణలతో చెప్పాలి. బోధించాలి. బ్రహ్మవిద్యను బోధిస్తూ స్వస్వరూపాత్మయొక్క స్వభావాఉన్నత్యములేమిటో సవివరణ పూర్వకంగా దృష్టాంతపూర్వకంగా స్వానుభవమును రంగరించి బోధించునుగాక। ఇతి ప్రథమ ముండకము - ద్వితీయ ఖండము. |
|
తదేతత్సత్యం యథా సుదీప్తాత్పావకాద్విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః . తథాఽక్షరాద్వివిధాః సోమ్య భావాః ప్రజాయంతే తత్ర చైవాపియంతి .. 1.. |
|
|
1. ‘ఓం’ ‘తత్’ ఏతత్ సత్యం - యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగాః సహస్రశః ప్రభవన్తే సరూపాః తథా అక్షరాత్ వివిధాః సోమ్య! భావాః, ప్రజాయంతే తత్ర చ ఏవ అపి యన్తి।। |
ఓ సోమ్యుడా! ఆ తత్ స్వరూపసత్యమగు బ్రహ్మమునకు - ఈ అసంఖ్యాక జీవరాసులకుగల చమత్కార సంబంధమేమిటో విను! బ్రహ్మమే సత్యము! ఏ విధంగా అయితే, ప్రజ్వలించే అగ్ని నుండి అగ్ని రూపమే (సరూపమే) అయి నట్టి వేల వేల విస్ఫులింగాలు (నిప్పురవ్వలు) పుట్టుకొస్తూ ఉంటాయో... అట్లాగే వివిధ భావికులగు జీవులంతా అక్షరమగు బ్రహ్మమునుండి (విస్ఫులింగాలవలె) బయల్వెడలుచున్నారు. తిరిగే బ్రహ్మమునందే లయిస్తున్నారు. |
|
దివ్యో హ్యమూర్తః పురుషః సబాహ్యాభ్యంతరో హ్యజః . అప్రాణో హ్యమనాః శుభ్రో హ్యక్షరాత్పరతః పరః .. 2.. |
|
|
2. దివ్యో హి అమూర్తః పురుషః స బాహ్య - అభ్యంతరో హి అజః। అప్రాణో హి అమనాః శుభ్రో హి అక్షరాత్ పరతః పరః। |
పరబ్రహ్మము పరమ పురుషుడుగా వర్ణించబడుచూ, దివ్యమై (స్వయంప్రకాశకమై), నిరాకారమై, సర్వవ్యాపకమై, బాహ్య - అభ్యంతరములను ఆవరించి ఉన్నదై, జన్మ - కర్మలు లేనిదైయున్నదయ్యా! అది ప్రాణ రూపము - మనో రూపము కాదు. ప్రాణ - మనస్సులను కల్పించుకొనునది, నియమించుకొనునది సుమా! నిత్య నిర్మలము. క్షరాక్షరములకు అతీతమైనది! |
|
ఏతస్మాజ్జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ . ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ .. 3.. |
|
|
3. ఏతస్మాత్ జాయతే ప్రాణో। మనః సర్వేంద్రియాణి చ। ఖం వాయుః జ్యోతిః ఆపః పృథివీ విశ్వస్య ధారిణీ।। |
ఆ పరబ్రహ్మతత్త్వము నుండే (ఆ పరబ్రహ్మ స్వరూపమగు నీ నుండే) ప్రాణము (జీవనము), ఆలోచన (మనస్సు), ఈ సర్వ ఇంద్రియాలు, ఆకాశము, వాయువు, జ్యోతి (అగ్ని), జలము పృథివి జనిస్తున్నాయి. అట్టి ఈ విశ్వమంతా ధారణ చేస్తున్నది - ధరిస్తున్నది ఆ పరబ్రహ్మమే నయ్యా! అట్టి సహజ - కేవల స్వరూపమే సమస్తమునకు జనన స్థానము. |
|
అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్రసూర్యౌ దిశః శ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదాః . వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా .. 4.. |
|
|
4. అగ్నిః మూర్ధా। చక్షుసీ చంద్ర - సూర్యౌ। దిశః శ్రోత్రే, వాక్ వివృతాశ్చ వేదాః। వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హి ఏష సర్వభూత-అంతరాత్మా।। |
అట్టి పరబ్రహ్మతత్త్వానికి అగ్ని (ద్యులోకము - జ్యోతి - దేవలోకము) శిరస్సు. సూర్యచంద్రులు రెండు కన్నులు. ఇక్కడి దిక్కులన్నీ అద్దాని చెవులు. వేదమంత్రములు - గానములు అద్దాని తెరువబడినోళ్ళు. వాయువు అద్దాని ప్రాణములు - ఊపిరి. ఈ విశ్వమంతా అద్దాని హృదయము. ఈ భూమియే అద్దాని, పాదాలు. అట్టి ఆ (నీ) తత్త్వమే సర్వజీవులయొక్క అంతరాత్మ। |
|
తస్మాదగ్నిః సమిధో యస్య సూర్యః సోమాత్పర్జన్య ఓషధయః పృథివ్యాం . పుమాన్ రేతః సించతి యోషితాయాం బహ్వీః ప్రజాః పురుషాత్సంప్రసూతాః .. 5.. |
|
|
5. తస్మాత్ (దానినుండి) అగ్నిః సమిధో యస్య సూర్యః సోమాత్ పర్జన్య ఓషధయః పృథివ్యామ్। పుమాన్ రేతః సించతి యోషితాయాం బహ్వీః ప్రజాః పురుషాత్ సంప్రసూతాః।। |
ఆ పరబ్రహ్మమునుండే అగ్ని. ఆ అగ్నికి సమిధవంటిది సూర్యుడు. ఆ సూర్యుడి నుండి చంద్రుడు. చంద్రుని నుండి మేఘాలు. మేఘాల నుండి వర్షము. ఆ మేఘ జలము నుండి భూమిపై ఓషదుల ఆహారరూపం. ఆహారము స్వీకరించిన పురుషుని (స్త్రీ యోనియందు) రేతః పాతము చేత ఆ పురుషతత్త్వము నుండి అనేక జీవజాతులు - ఇవన్నీ జనిస్తున్నాయి. (పంచాగ్ని తత్త్వములు : (1) తేజస్సు (అగ్ని), (2) వర్ష్యమేఘాలు, (3) ఓషధులు, (4) పురుషుడు, (5) స్త్రీ). |
|
తస్మాదృచః సామ యజూగ్ంషి దీక్షా యజ్ఞాశ్చ సర్వే క్రతవో దక్షిణాశ్చ . సంవత్సరశ్చ యజమానశ్చ లోకాః సోమో యత్ర పవతే యత్ర సూర్యః .. 6.. |
|
|
6. తస్మాత్ (ఆ తత్త్వమునుండి) ఋచః సామ యజూంషి దీక్షా యజ్ఞాశ్చ సర్వే క్రతవో దక్షిణాశ్చ, సంవత్సరశ్చ యజమానశ్చ లోకాః సోమో యత్ర పవతే యత్ర సూర్యః।। |
ఆ తత్త్వము నుండి హౌత్రములు, ఋక్కుల (మంత్రముల) రూపమగు ఋగ్వేదము, ఔద్గాత్ర-గానముల రూపమగు సామవేదము, యజ్ఞముల రూపములగు యజర్వేదము, దీక్ష (వ్రత దీక్షలు), అగ్నిహోత్ర రూపములగు యజ్ఞములు, (యూపస్తంభపూర్వకమైన) క్రతువులు, మంత్రగానం చేసే ఋత్విక్కులకు దక్షిణలు, కాలరూపమగు సంవత్సరము, యజ్ఞకర్త (యజమాని), లోకాలు, లోకాలను వెలిగిస్తూ పోషిస్తూ, పవిత్రం చేస్తూ ఉన్న సూర్యచంద్రులు - మొదలైనవన్నీ కూడా జనిస్తున్నాయి. |
|
తస్మాచ్చ దేవా బహుధా సంప్రసూతాః సాధ్యా మనుష్యాః పశవో వయాꣳసి . ప్రాణాపానౌ వ్రీహియవౌ తపశ్చ శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ .. 7.. |
|
|
7. తస్మాత్ చ దేవా బహుధా సంప్రసూతాః సాధ్యా మనుష్యాః పశవో వయాంసి। ప్రాణ - అపానౌ వ్రీహియవౌ తపశ్చ శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ।। |
ఆ నిర్గుణ పరబ్రహ్మము నుండే...వివిధ దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మనుష్యులు, పశువులు (జంతువులు), పక్షులు, ప్రాణ - అపానములు (ఉచ్ఛావస - నిశ్వాసలు), వరి - గోధుమ మొదలైన ధాన్యములు - కూడా జనిస్తున్నాయి. అంతే కాక, తపస్సు-శ్రద్ధ-సత్యము(యమ్‌సత్-‘ఉన్నాను’ అనే ఉనికి), బ్రహ్మచర్యము, విధి నియమములు చెప్పే శాస్త్రములు - ఇవన్నీ సంభవిస్తున్నాయి. |
|
సప్త ప్రాణాః ప్రభవంతి తస్మా- త్సప్తార్చిషః సమిధః సప్త హోమాః . సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణా గుహాశయా నిహితాః సప్త సప్త .. 8.. |
|
|
8. సప్తప్రాణాః ప్రభవన్తి తస్మాత్। సప్త - అర్చిషః సమిధః సప్తహోమాః। సప్త ఇమే లోకా యేషు చరంతి। ప్రాణా గుహాశయా నిహితాః సప్త - సప్త।। |
ఆ పరతత్త్వము నుండే → → సప్త ప్రాణములు = ళిపంచేంద్రియాలు, మనస్సు - బుద్ధి, (7)రి → సప్త జ్వాలలు = గ్రహణశక్తులు (7) → సప్త సమిధలు = ఇంద్రియ విషయాలు (7) → సప్త హోమములు = (ఆహూతులు - జ్ఞానములు) → సప్త ఊర్ధ్వలోకములు → సప్త అధోలోకములు → హృదయగుహలో సంచరించే సప్త జీవశక్తులు ఇవన్నీ సప్త - సప్త ఏడేడుగా జనిస్తున్నాయి. |
|
అతః సముద్రా గిరయశ్చ సర్వేఽస్మా- త్స్యందంతే సింధవః సర్వరూపాః . అతశ్చ సర్వా ఓషధయో రసశ్చ యేనైష భూతైస్తిష్ఠతే హ్యంతరాత్మా .. 9.. |
|
|
9. అతః సముద్రా - గిరయశ్చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః। అతశ్చ సర్వా ఓషధయో రసశ్చ యేన ఏష భూతైః తిష్ఠతే హి అంతరాత్మా।। |
అద్దాని నుండే సప్తసముద్రములు, సప్తగిరులు, ప్రవహించే అన్ని నదీ - నదములు, అన్ని ఓషధులు - ఆహార రసాలు వ్యక్తమగుచున్నాయి. బాహ్యమున పంచభూతములుగా, సర్వజీవులయొక్క అంతర్ - హృదయ అంతరాత్మలుగా (అంతరంగ చతుష్టయముగా) ఉంటున్నది ఆ పరబ్రహ్మతత్త్వమే! |
|
పురుష ఏవేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం . ఏతద్యో వేద నిహితం గుహాయాం సోఽవిద్యాగ్రంథిం వికిరతీహ సోమ్య .. 10.. |
|
|
10. పురుష ఏవ ఇదగ్ం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతమ్। ఏతత్ యో వేద నిహితం గుహాయాం సో ‘‘అవిద్యా గ్రంథిం’’ వికిరతి ఇహ, సోమ్య! |
ఈ సమస్తమైన విశ్వము, కర్మ, యజ్ఞ కర్మ, పురుషకారము, తపస్సు - ఇవన్నీ కూడా పరాబ్రహ్మ మృతస్వరూపమేనయ్యా! ఓ సోమ్య! సర్వత్రా నిహితమై నిబిడాకృతిగా ఉన్న అట్టి పరాకాశ బ్రహ్మమును హృదయగుహలో ఎవడు సందర్శిస్తాడో, అట్టివాని యొక్క అజ్ఞానగ్రంధుల ఇప్పుడే ఇక్కడే వీగిపోతున్నాయి. విభేదనమైపోతున్నాయి. |
|
ఇతి ద్వితీయ ముండకః। ప్రథమ ఖండః।। |
- ఇతి ద్వితీయ ముండకం - మొదటి ఖండం. |
|
ఆవిః సంనిహితం గుహాచరం నామ మహత్పదమత్రైతత్సమర్పితం . ఏజత్ప్రాణన్నిమిషచ్చ యదేతజ్జానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యద్వరిష్ఠం ప్రజానాం .. 1.. |
|
|
1. ఓం। ఆవిః సన్నిహితం గుహాచరం నామ ‘మహత్ పదమ్’ అత్ర ఏతత్ సమర్పితం। ఏజత్ ప్రాణన్ నిమిషచ్చ యత్ ఏతత్ ‘జానథ’ - సత్ - అసత్ వరేణ్యం పరం విజ్ఞానాత్ యత్ వరిష్ఠం ప్రజానామ్।। |
ప్రత్యక్షముగా కనిపించేదంతా బ్రహ్మమే! అది ప్రతి ఒక్కరికీ అత్యంత సన్నిహితమైనది (Nearest of the Nearest). సర్వుల హృదయ గుహలలో వేంచేసియే ఉండి, సర్వత్రా సంచారాలు చేస్తున్నది ఆ పరబ్రహ్మమే! ఆ పరంధామము సర్వులకు స్వాభావికమగు ఆశ్రయం. జననస్థానం, లయస్థానం కూడా। ఈ కదిలేవి, శాసించునవి, రెప్పవాల్చేది...ఇవన్నీ బ్రహ్మమునందే అలంకారప్రాయమై అమర్చబడి ఉన్నాయి. అదియే సత్తు. అదియే అసత్తు కూడా. వరేణ్యం - సర్వారాధ్యం। విజ్ఞానాత్ పరమ్. తెలియబడేదానికి ఆవల వేంచేసి ఉన్నది అదే! అట్టి బ్రహ్మమును తెలుసుకో! |
|
యదర్చిమద్యదణుభ్యోఽణు చ యస్మిఀల్లోకా నిహితా లోకినశ్చ . తదేతదక్షరం బ్రహ్మ స ప్రాణస్తదు వాఙ్మనః తదేతత్సత్యం తదమృతం తద్వేద్ధవ్యం సోమ్య విద్ధి .. 2.. |
|
|
2. యత్ అర్చిమత్, యత్ అణుభ్యో - అణు చ, యస్మిన్ లోకా నిహితా లోకినశ్చ। తత్ - ఏతత్ ‘అక్షరం, బ్రహ్మ పరమమ్’ వాక్ - మనః (బ్రహ్మ స ప్రాణః తదు వా మనః) తత్ - ఏతత్ సత్యం! తత్ అమృతం। తత్ వేద్ధవ్యం, సోమ్య! విద్ధి।। |
ఏదైతే (అర్చిమత్) దీప్తివంతమో, ఏది అణువులకంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమో, ఈ లోకాలు - లోకస్థులు ఎందులో ఇమిడి ఉన్నారో, అట్టి పరమపురుషుడే ప్రాణము. ఆతడే వాక్ రూపము. మనస్సు కూడా ఆతడే। అదియే సత్యము - అమృతస్వరూపము। ఓ సోమ్యా! మిత్రమా। ఆ తెలుసుకోవలసినది తెలుసుకో। అక్షరమగు అది నీకు అనన్యము కూడా సుమా! అని నీకు అన్యము కానే కాదు. |
|
ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసానిశితం సంధయీత . (సందధీత) ఆయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సోమ్య విద్ధి .. 3.. |
|
|
3. ధనుః గృహీత్వా ఉపనిషదం మహాస్త్రం, శరం హి ఉపాసా నిశితం సంధధీత, ఆయమ్య తత్ భావగతేన చేతసా లక్ష్యం తత్ఏవ ‘అక్షరం’, సోమ్య! విద్ధి।। |
ఓ స్నేహితుడా! సోమ్యా! - ఉపనిషత్ సాహిత్యమును అందిస్తున్న గొప్ప ఆయుధరూపమగు ధనస్సును చేత ధరించు. - నిత్యోపాసనారూపమైన (యోగాభ్యాసమనే) పదునైన బాణమును అనుసంధానం చేయి. - తత్ భాగవతేన → ఆ బ్రహ్మమును గురించిన చింతనయందు లగ్నమైన చేతనము (మనస్సు) అనే త్రాటిని (వింటినారిని) సారించు! ‘తత్’ - శబ్దార్థము - అక్షరము (అవినాసి) అగు బ్రహ్మమును ఛేదించు. (లక్ష్యముగా కలిగి ఉండుము). అట్టి బ్రహ్మమును ఎరుగుము! అదియే నీవై ఉండుము. |
|
ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే . అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్ .. 4.. |
|
|
4. (ఓం) ప్రణవో ధనుః। శరో హి ‘ఆత్మా’। → → ‘బ్రహ్మ’ తత్ లక్ష్యమ్ ఉచ్యతే। అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ ‘తత్‌మయో’ భవేత్।। |
నీవై ఉండుము. • ‘ఓంకారము’ అనే ప్రణవమే విల్లు। జీవాత్మయే శరము। • బ్రహ్మమే తత్ లక్ష్యము...అని చెప్పబడుతోందయ్యా! అప్రమత్తుడవై బాణము లక్ష్యమును తాకినట్లుగా బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మముతో తన్మయుడవు అగుము. బ్రహ్మమే అయి ఉండుము. |
|
యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షమోతం మనః సహ ప్రాణైశ్చ సర్వైః . తమేవైకం జానథ ఆత్మానమన్యా వాచో విముంచథామృతస్యైష సేతుః .. 5.. |
|
|
5. యస్మిన్ ద్యౌః పృథివీ చ అంతరిక్షమ్ ఓతం మనః సహ ప్రాణైశ్చ సర్వైః। తం ఏవ ఏకం జానథ ఆత్మానమ్ - అన్యా వాచో విమున్చథ అమృతస్య ఏష సేతుః।। |
దేనియందైతే స్వర్గము, భూమి, ఆకాశము, అంతరిక్షము (అంతరాళము) ఇవన్నీ కూడా.... (ఇంకా) - మనో ప్రాణములతో సహా → ఓతము (వస్త్రములో దారమువలె) → అల్లబడి ఉన్నాయో., అట్టి ఆ ఏకము - అఖండము అగు స్వస్వరూపాత్మయే తెలుసుకోవాలి సుమా! ఇక మిగిలిన మాటలన్నీ వదలిపెట్టు. అదియే మృతమునుండి అమృతత్వానికి చేర్చే వారధి. (సేతువు). దేహముల రాక-పోకలకు కూడా అదియే ‘సాక్షి’ అయినట్టి నీ అమృత రూపమునకు వంతెన. |
|
అరా ఇవ రథనాభౌ సంహతా యత్ర నాడ్యః . స ఏషోఽన్తశ్చరతే బహుధా జాయమానః . ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం స్వస్తి వః పారాయ తమసః పరస్తాత్ .. 6.. (పరాయ) |
|
|
6. అరా ఇవ రథనాభౌ సంహతా యత్ర నాడ్యః। స ఏషో అన్తశ్చరతే బహుధా జాయమానః। ‘ఓం’ ఇతి ఏవం ద్యాయథ ఆత్మానం, స్వస్తి వః (మీరు) పారాయ తమసః పరస్తాత్।। |
రథచక్రముయొక్క ఇరుసులో అమర్చబడిన ఆకులవలె - ఈ నాడుల స్పందనలన్నీ ఎక్కడకు చేరుచున్నాయో అదియే ఆత్మ. అయ్యది అనేక విధాలుగా రూపములు ఆశ్రయిస్తూ అంతర్ - హృదయంలోనే చరిస్తూ ఉన్నది. అట్టి ఆత్మను ‘ఓం’ అను శబ్దసంజ్ఞతో ధ్యానము చేస్తూ, అజ్ఞానాంధకారము దాటి పోవుచున్నాము. అజ్ఞానమునకు ఆవలగల ఆత్మభగవానునికి ‘స్వస్తి’। |
|
యః సర్వజ్ఞః సర్వవిద్యస్యైష మహిమా భువి . దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమ్న్యాత్మా ప్రతిష్ఠితః (సంప్రతిష్ఠితః) .. 7.. |
|
|
7. యః సర్వజ్ఞః సర్వవిత్, యస్య ఏష మహిమా భువిః, దివ్యే బ్రహ్మపురే హి ఏష వ్యోమ్న్యా (వ్యోమని) ఆత్మా ప్రతిష్ఠితః।। |
ఏదైతే సర్వజ్ఞమో, సర్వము తెలుసుకొనుచున్నదో,...ఎద్దానియొక్క మహిమయే ఈ దృశ్య చమత్కారమో, ఈ భువి తానే అయి వున్నదో అది ‘బ్రహ్మపురి’ అనబడే ఆత్మాకాశంలోనే ప్రతిష్ఠితమై ఉన్నది. అద్దానిని దర్శించెదముగాక। మాయొక్క ‘‘ఆత్మాకాశము’’నందు ‘‘పరబ్రహ్మము’’గా ప్రతిష్ఠితిమైయున్న ఆత్మదేవుని ఉపాసిస్తున్నాము. |
|
మనోమయః ప్రాణశరీరనేతా ప్రతిష్ఠితోఽన్నే హృదయం సంనిధాయ . తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపమమృతం యద్విభాతి .. 8.. |
|
|
8. మనోమయః ప్రాణశరీర నేతా (నాయకుడు) ప్రతిష్ఠితో అన్నే హృదయం సన్నిధాయ। తత్ విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపమ్ అమృతం యత్ విభాతి।। |
(అస్య ఏష మహిమా? → ఇదంతా ఎవరి మహిమయో) అట్టి ఆత్మ → • మనోరూపము తనదే అయి ఉన్నది (మనోమయము) • ఈ ప్రాణ - శరీరములకు నాయకుడు. • ఈ అన్నమయ శరీరమంతా నిండి ఉడియే ఈ దేహములో హృదయమున ప్రతిష్ఠించి ఉన్నట్టిది. ఆనంద స్వరూపమై - అమృత రూపమై ఏ ఆత్మ ప్రకాశిస్తోందో, అద్దానిని ధీరులగు బుద్ధిమంతులు తమ విజ్ఞానపు వెలుగులో తమయందే సాక్షాత్కరించుకుంటున్నారు. మనము సాక్షాత్కరించుకుందాము. |
|
భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యంతే సర్వసంశయాః . క్షీయంతే చాస్య కర్మాణి తస్మిందృష్టే పరావరే .. 9.. |
|
|
9. భిద్యతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే।। |
అట్టి పర-అపర విజ్ఞాన దృష్టిచే, ‘‘సర్వంతరాత్మణీ’’ యొక్క అనుభూతి - సాక్షాత్కరముచే • ఆతని బ్రహ్మ-విష్ణు-రుద్ర (సృష్టి-స్థితి-లయ) హృదయగ్రంథులు తెగి తన స్వరూపముపైగల ‘అనుమానము’ సంబంధమైన చిక్కుముడులు తెగిపోతున్నాయి. • సర్వసందేహాలు పటాపంచలౌతున్నాయి. • సర్వ ఆగామి - సంచిత - ప్రారబ్ధ కర్మ బంధాలన్నీ ఆతని దృష్టిలో మొదలే నశించినవై ఉండగలవు. |
|
హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం . తచ్ఛుభ్రం జ్యోతిషాం జ్యోతిస్తద్యదాత్మవిదో విదుః .. 10.. |
|
|
10. హిరణ్మయే పరేకోశే విరజం బ్రహ్మ - నిష్కలమ్। తత్ శుభ్రం జ్యోతిషాం జ్యోతిః తత్ యత్ ఆత్మవిదో విదుః।। |
ఇంకా కూడా, స్వస్వరూపమగు ఆత్మ ఎట్టిదంటే... • సృష్టిరూపముగా ప్రదర్శితమౌతోంది. ఇహమంతా తానై అయి ఉంది. • సర్వమునకు పరము (Beyond All) • పంచకోశములకు ఆవల (పరమై) ఉన్నది • జన్మ-కర్మ-మనో-బుద్ధి దోషములచే స్పృశించబడటం లేదు. విరజము. • నిష్కళంకమైనది. కళంకరహితము. • అత్యంత స్వచ్ఛమైనది. శుభ్రమ్। • జ్యోతులకే జ్యోతి అని ఆత్మవిదులు నిర్దుష్టముగా ఆత్మగురించి ఎరుగుచూనే ఉన్నారు. జ్యోతిషాం జ్యోతిః। |
|
న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోఽయమగ్నిః . తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి .. 11.. |
|
|
11. న తత్ర సూర్యోభాతి। న చంద్ర - తారకం। నేమా (న ఇమా) విద్యుతో భాన్తి। కుతో అయమ్ అగ్నిః?
|
అట్టి ఆ వెలుగులకే వెలుగు ‘జ్యోతిర్జ్యోతి’ అయిన ఆత్మ సమక్షంలో.... • సూర్యుడు ప్రకాశించడు. సూర్యుడు ఉదయించటం, చీకటి తొలగటం...ఇది ఆత్మ సంబంధమైనది, ఆత్మకు సమక్షమైనది కాదు! - ఈ భౌతిక సూర్య - చంద్ర నక్షత్రాలు ఆత్మవద్ద ప్రకాశించేవి కావు. (ఆత్మజ్యోతి-భౌతికమైన వెలుగువంటిది కాదు). - అది అగ్నియొక్క వెలుగా? కాదు. - మరి? ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే, అద్దాని ప్రకాశంలో ఇవన్నీ - ఈ సర్వము ఆత్మ తేజస్సులో భాసిస్తున్నాయి. ప్రకాశిస్తున్నాయి. |
|
బ్రహ్మైవేదమమృతం పురస్తాద్బ్రహ్మ పశ్చాద్బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ . అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం .. 12.. |
|
|
12. బ్రహ్మ ఏవ ఇదమ్ - అమృతం పురస్తాత్ బ్రహ్మ। పశ్చాత్ బ్రహ్మ । దక్షిణతశ్చ, ఉత్తరేణ। అధశ్చ, ఊర్థ్వం చ ప్రసృతం బ్రహ్మఏవ ఇదమ్ విశ్వమ్। ఇదం వరిష్ఠమ్।। (బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠమ్)।। |
అంతదాకా దేనికి! ఈ కనబడేదంతా అమృతస్వరూపమగు బ్రహ్మమేనయ్యా! - ఈ ఎదురుగా - వెనుకగా, తూర్పు - పడమర - దక్షిణ - ఉత్తర దిక్కులలో, క్రింద - పైన - అంతటా బ్రహ్మమే వ్యాపించియున్నది. - ఈ విశ్వము బ్రహ్మమే! ఈ విశ్వానుభవము నీది-నాది అయినట్టి నీవు - నేను కూడా సర్వదా బ్రహ్మమే। - బ్రహ్మమే-సర్వదా సర్వత్రా సర్వోత్కృష్టమైయున్నది. అంతా బ్రహ్మమే! (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ) |
|
ద్వితీయోఽధ్యాయ ద్వితీయ ఖండమ్ సమాప్తా |
ఇతి - 2వ ముండక - రెండవ అధ్యాయము |
|
ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్యనశ్నన్నన్యో అభిచాకశీతి .. 1.. |
|
|
1. ‘ఓం’ ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే। తయోః అన్యః పిప్పలం స్వాద్వత్। య అనశ్నన్ అన్యో అభిచాకశీతి।। (చూస్తూ, గమనిస్తూ ఉన్నది)।। (పిప్పలం స్వాద్వత్త్యనశ్నన్నన్యో అభిచాకశీతి) |
అత్యంత ప్రియ స్నేహితులై ఎప్పుడూ కలిసియే ఉంటున్నట్టి రెండు పక్షులు ఉన్నాయయ్యా! ఆ రెండు పక్షులు ఒకే వృక్షముపై పరిషస్వజాతులై - ఒకరినొకరు వదలకుండా ఉంటున్నాయి. (పరిష్వంగము = ఒకరినొకరు కౌగలించుకొని, వీడక ఉన్నట్టివి). ఆ రెండిటిలో ఒకటి చంచలముగా ఆయా ఫలములను రుచులు చూస్తూ (ధ్యాసను ఫలములపైనే ఉంచుతూ), ఉరకలు - గంతులు వేస్తోంది. ఇక ఆ రెండవ పక్షియో...ఏదీ ఏమాత్రం స్వీకరించక, ఏదీ నిర్వర్తించక - మౌనంగా - చూస్తూ ఉన్నది. (1) మొదటి పక్షి = జీవాత్మ (2) రెండవ పక్షి = పరమాత్మ (3) వృక్షము = ఈ దేహము |
|
సమానే వృక్షే పురుషో నిమగ్నో- ఽనీశయా శోచతి ముహ్యమానః . జుష్టం యదా పశ్యత్యన్యమీశ- మస్య మహిమానమితి వీతశోకః .. 2.. |
|
|
2. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీశయా శోచతి ముహ్యమానః। జుష్టం యదా పశ్యతి అన్యమ్ ‘ఈశమ్’, ‘అస్య మహిమానమ్’ ఇతి → వీతశోకః।। |
ఒకే వృక్షముపై సమానులై వ్రాలినవై ఉన్నప్పటికీ, ఒక పక్షి (జీవాత్మ) అనేక పళ్ళ రుచులు (కర్మఫలములు) రుచిచూస్తూ ఉన్నది. అనుకున్నవి అనుకున్నట్లు లేకపోవటంచేత నిర్వీర్యం పొందుతోంది. దుఃఖిస్తోంది కూడా! ఆ (జీవాత్మ) పక్షియొక్క వేదనలు తొలిగేది ఎట్లా? ఇంతలోనే స్వల్ప విషయాలకే వినోదము, స్వోత్కర్ష, గర్వము మొదలగునవి పొందుతోంది. ఎప్పుడైతే తనకు ఆధారము - ఆరాధ్యము, ఈశుడు, తన ప్రభువు అయినట్టి - రెండవ పక్షి (పరమాత్మ) యొక్క మహిమను చూడటం జరుగుతోందో, అప్పుడు ఆ మొదటిపక్షి (జీవాత్మ) శోకం పోగొట్టుకొంటోంది. |
|
యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం . తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి .. 3.. |
|
|
3. యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం కర్తారమ్ ఈశం పురుషం బ్రహ్మయోనిమ్। తదా విద్వాన్ పుణ్య - పాపే విధూయ నిరంజనః (నిష్కల్మషము), పరమం (సర్వోత్తమము), సామ్యమ్ ఉపైతి।। |
ఎప్పుడైతే-జీవాత్మ→ తన ప్రభువగు పరమాత్మను (ఈశ్వరుని): ‘ఋతము’ గాను, సహజసత్యముగాను, బ్రహ్మకు కూడా ‘ఆది’ అయినట్టిదిగాను, సర్వకర్తగాను, విభుడుగాను, ప్రభువుగాను దర్శిస్తుందో, - ఆ మరుక్షణం పుణ్య - పాప ద్వంద్వమును విదళించి వేసి ఆ రెండవ పక్షియగు పరమాత్మతో సామ్యత్వము పొందుతోంది. పరము - నిరంజనము అగు ఆత్మ పక్షితో ఏకమై, జీవాత్మత్వమును అధిగమించి పరమానందిస్తోంది. |
|
ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాదీ . ఆత్మక్రీడ ఆత్మరతిః క్రియావా- నేష బ్రహ్మవిదాం వరిష్ఠః .. 4.. |
|
|
4. ప్రాణో హి ఏష యః సర్వభూతైః విభాతి విజానన్ విద్వాన్ భవతే న అతివాదీ (నాతివాదీ)। ఆత్మక్రీడ ఆత్మరతిః క్రియావాన్, ఏష బ్రహ్మవిదాం వరిష్ఠః।। |
ఏ ప్రాజ్ఞుడైతే - విద్వరేణ్యుడై, సకల జీవులలో ప్రాణ - మనో ఇత్యాదుల ఆది - స్వరూపుడైన ఆత్మను తెలుసుకుంటాడో, సర్వదా సందర్శిస్తూ ఉంటాడో, ఆతడు ఆ ఆత్మయే తానై ప్రకాశిస్తాడు. తదితరమైనదేదీ మాట్లాడడు. (దృష్టిలో కలిగి ఉండడు) - ఆత్మయందే క్రీడిస్తూ ఉంటాడు. రమిస్తూ ఉంటాడు. ఆత్మ సందర్శనమునందే ఆనందిస్తూ ఉంటాడు! అట్టివాడు బ్రహ్మవిదులలో వరిష్ఠుడగుచున్నాడు. |
|
సత్యేన లభ్యస్తపసా హ్యేష ఆత్మా సమ్యగ్జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం . అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః .. 5.. |
|
|
5. సత్యేన లభ్యః తపసా హి ఏష ఆత్మా సమ్యక్ జ్ఞానేన, బ్రహ్మచర్యేణ నిత్యమ్। అంతః శరీరే జ్యోతిర్మయో హి శుభ్రో అయం పశ్యంతి యతయః క్షీణదోషాః।। |
సత్యముచేత, తపస్సుచేత ‘ఆత్మత్వము’ లభించగలదు. నిత్యము సమ్యక్జ్ఞానం చేత, బ్రహ్మచర్యముచేత ఆత్మసంయమయోగులకు (దేహభావము క్షీణిస్తూ ఉండగా) జ్యోతిర్మయము, పరిశుభ్రము అగు ఆత్మ స్వశరీరముగా లభిస్తోంది. (సత్యమ్ = ‘యమ్‌సత్’ = శాశ్వతమగు ‘సత్’ను ఆశ్రయించి ఉండటము. ‘అసత్’ను ఉపేక్షించి ఉండటము) |
|
సత్యమేవ జయతే నానృతం (జయతి) సత్యేన పంథా వితతో దేవయానః . యేనాక్రమంత్యృషయో హ్యాప్తకామా యత్ర తత్సత్యస్య పరమం నిధానం .. 6.. |
|
|
6. సత్యమేవ జయతి। న అనృతమ్। సత్యేన పంథా వితతో దేవయానః। యేన ఆక్రమన్తి ఋషయో హి ఆప్తకామా యత్ర తత్ సత్యస్య పరమం నిధానమ్।। |
నిత్యసత్యమగు ఆత్మభావనయే ఎప్పటికైనా (చివరికి) జయించగలదు. అసత్యము - భ్రమాత్మకము అగు దృశ్య భావన ఎప్పటికో అప్పటికి తప్పక వీగిపోగలదు. సత్యము చేతనే దేవయానమగు మార్గము ఏర్పడినదై ఉన్నది. అట్టి ఆత్మపదమును ఆప్తకాములు (కోరికలు జయించినవారు) అగు ఋషులు (ఋత్ → సత్యమునే ఆశయము అనుభవముగా గలవారు) ఆక్రమించుకొని ఉంటున్నారు. ‘శృణ్వంతి విశ్వే’ - అని మనకు గుర్తు చేయుచున్నారు కూడా. |
|
బృహచ్చ తద్దివ్యమచింత్యరూపం సూక్ష్మాచ్చ తత్సూక్ష్మతరం విభాతి . దూరాత్సుదూరే తదిహాంతికే చ పశ్యత్స్విహైవ నిహితం గుహాయాం .. 7.. |
|
|
7. బృహచ్చ తత్ దివ్యం - అచింత్యరూపం సూక్ష్మాచ్చ తత్ సూక్ష్మతరం విభాతి। దూరాత్ సుదూరే తత్ ఇహ అంతికే (చ) పశ్యత్సు ఇహైవ నిహితం గుహాయామ్।। |
ఆ పరమసత్యమగు బ్రహ్మము బృహత్తరమైనది. (అనంత బ్రహ్మాండాలను తనలో ఇముడ్చుకోగల) విస్తారమైనది. తేజోమయమైనది. ఊహకు అందనిది. (ఊహ అద్దానిదే!). సూక్ష్మాతి సూక్ష్మమై విరాజిల్లుచున్నది. దూరమైన అన్నిటికంటే సుదూరమైనది. కానీ అది ఇక్కడే హృదయంలో వేంచేసి ఉండటం చేత, ఆత్మోపాసకుడు ఇక్కడే తన హృదయగుహలోనే ఆత్మ భగవానుని దర్శిస్తున్నాడు. |
|
న చక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవైస్తపసా కర్మణా వా . జ్ఞానప్రసాదేన విశుద్ధసత్త్వ- స్తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః .. 8.. |
|
|
8. న చక్షుషా గృహ్యతే। న అపి వాచా। న అన్యైః దేవైః తపసా - కర్మణా వా। జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్త్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయ మానః।। |
ఆత్మతత్త్వము చర్మచక్షువులకు కనిపించేది కాదు. వాక్కుచే కూడా లభించేది కాదు. ఇతర దేవోపాసన చేతనో, తపస్సు చేతనో, కర్మల చేతనో కూడా పొందబడేది కాదు. ఎవ్వరైతే ఆత్మభగవానుని తనయొక్క, సర్వులయొక్క అంతరాత్మగా ఉపాసిస్తారో, విశుద్ధమైన బుద్ధియొక్క జ్ఞానప్రసాదము పొందిన ఆ మహనీయులు అట్టి నిష్కళంక బ్రహ్మమును ఇప్పుడే, ఇక్కడే సదా సర్వత్రా సమస్తముగా ప్రదర్శనమగుచూ ఉన్నట్లు దర్శించుచున్నారు. |
|
ఏషోఽణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ప్రాణః పంచధా సంవివేశ . ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్విశుద్ధే విభవత్యేష ఆత్మా .. 9.. |
|
|
9. ఏషో అణుః ఆత్మా, చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశ। ప్రాణైః చిత్తం సర్వమ్ ఓతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవతి ఏష ఆత్మా।। |
అట్టి ఆత్మ పరిశుద్ధమగు సూక్ష్మజ్ఞానం (Sharp Assimilation) చేతనే తెలియబడుచున్నదయ్యా! ఆత్మయే దేహంలో పంచ ప్రాణాల కూపంలో ప్రవేశించి జీవితము యొక్క సమస్త సందర్భముతో ఓతప్రోతమై ఉంటోంది. ఆత్మచేతనే - చిత్తము, ప్రాణము-ఇంద్రియములు చేతనమై ప్రవర్తిల్లుచున్నాయి. ఆత్మచేతనే చిత్తము ప్రాణ - ఇంద్రియ విశేషములచే ఈ దృశ్య జగత్తు అల్లబడుతోంది. ఆత్మయొక్క విశుద్ధతత్త్వమే ఇదంతా! |
|
యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధసత్త్వః కామయతే యాంశ్చ కామాన్ . తం తం లోకం జయతే తాంశ్చ కామాం- స్తస్మాదాత్మజ్ఞం హ్యర్చయేద్భూతికామః .. 10.. |
|
|
10. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్త్వః కామయతే యాంశ్చ కామాన్। తం తం లోకం జయతే తాంశ్చ కామాం తస్మాత్ ఆత్మజ్ఞం హి అర్చయేత్ భూతి కామః।। |
ఆత్మలోనే లోకాలన్నీ ఏర్పడినవై ఉన్నాయి. అందుచేత ఆత్మజ్ఞుడగు ఆత్మోపాసకుడు ఏ లోకంలో ఏ రూపం పొందాలనుకుంటాడో....అది సిద్ధింపజేసుకోగలుగుతాడు. భవిష్యత్ జన్మలు ఆత్మజ్ఞుడు తన అధీనంలో కలిగి ఉంటాడు. అందుచేత అభ్యుదయం కోరువాడు ఆత్మజ్ఞుడై ఆత్మనే అర్చిస్తున్నాడు. (అట్టి ‘జన్మ’ - ఇత్యాదుల పట్ల స్వకీయ - స్వాతంత్ర్యము (Independence) - ‘మోక్షము’ అనబడుతోంది) |
|
ఇతి తృతీయ ముండకః - ప్రథమ ఖండః |
ఇతి 3వ ముండకము - 1వ ఖండము |
|
స వేదైతత్పరమం బ్రహ్మ ధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం . ఉపాసతే పురుషం యే హ్యకామాస్తే శుక్రమేతదతివర్తంతి ధీరాః .. 1.. |
|
|
1. స వేదై తత్ప్రదమం (స వేద ఏతత్ ప్రథమం) బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రమ్। ఉపాసతే పురుషం యే హి కామాః తే శుక్రమ్ ఏతత్ అతివర్తంతి ధీరాః।। |
బ్రహ్మముయొక్క అద్వయ-తత్త్వోపాసనలచే ఆత్మసాక్షారము సిద్ధించుకొని ఈ జీవుడు బ్రహ్మధామము చేరుచున్నాడు. ఏ నిర్మలమైన ఆత్మయందు ఈ లోకాలన్నీ అమరియున్నాయో గ్రహించి ఆ పరమ పురుషుడగు ఆత్మను ఉపాసిస్తూ జన్మ - కర్మ - పునర్జన్మల ప్రహసనాన్ని అధిగమిస్తున్నాడు. వాటిపట్ల స్వాతంత్ర్యుడు అగుచున్నాడు. |
|
కామాన్ యః కామయతే మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర . పర్యాప్తకామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః .. 2.. |
|
|
2. కామాన్ యః కామయతే మన్యమానః స కామభిః జాయతే తత్ర - తత్ర। పర్యాప్తకామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్ర - విలీయంతి కామాః।। |
ఎవ్వడైతే లోకాంతర్గత విశేషాలను కోరుకుంటాడో, ఆతడు ఆ వాంఛలను అనుసరించి ఆయా స్థానాలలో జన్మలు పొందుచున్నాడు. సర్వకోరికలు త్యజించి పర్యాప్తకాముడై కృతకృత్యుడైనవానికి సర్వకోరికలు ఇక్కడే సమసిపోయి ఇక్కడే ఆత్మత్వము ఆస్వాదిస్తున్నాడు. |
|
నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన . యమేవైష వృణుతే తేన లభ్య- స్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం .. 3.. (ఆత్మా వృణుతే) |
|
|
3. నాయమ్ (న అయమ్) ఆత్మా ప్రవచనేన లభ్యో। న మేధయా న బహునా శ్రుతేన। యమ్ ఏవ ఏష వృణుతే తేన లభ్యః తస్య ఏష ఆత్మా వివృణుతే తనూం స్వామ్।। |
అట్టి ఆత్మవస్తువు (లేక) ఆత్మత్వభావన ప్రవచనములు చెప్పటం చేతగాని, సొంత తెలివితేటలచేత గాని, ఎంతెంతగానో వింటేగాని, లభించేది కాదు’’. ఎవ్వడు ఆత్మతత్త్వాన్ని కోరుకుంటాడో అది ఆతనికి లభిస్తుంది. ఆత్మ తన స్వరూపమును ప్రకటిస్తున్నదగుచున్నది. ‘‘ఈ సమస్తము నాలోని నేనైన నేనే’’ అను స్థానమును ఎవరు కోరుకొంటాడో, అతనికి సాధన - అనుకోవటముల అభ్యాసములచే అది లభించగలదు. |
|
నాయమాత్మా బలహీనేన లభ్యో న చ ప్రమాదాత్తపసో వాప్యలింగాత్ . ఏతైరుపాయైర్యతతే యస్తు విద్వాం- స్తస్యైష ఆత్మా విశతే బ్రహ్మధామ .. 4.. |
|
|
4. నాయమ్ (న అయమ్) ఆత్మా బలహీనేన లభ్యో। న చ ప్రమాదాత్, తపసోవ అపి అలింగాత్ ఏతైః ఉపాయైః యతతే యస్తు విద్వాన్ తస్య ఏష ఆత్మా విశతే బ్రహ్మధామ।। |
బలహీనభావాలు కొనసాగించేవానికి, ఆత్మదర్శన విషయంలో బద్ధకించేవానికి అది లభించదు. పరతత్త్వము గురించిన లక్ష్యశుద్ధి లేని తపస్సు చేత అది ఈ జీవుడు పొందలేదు. ఎవడు ఉపాయంతో ఆత్మ వస్తుతత్త్వాన్ని అన్వేషిస్తాడో, ఆతనిని ఆత్మయే బ్రహ్మ పదంలో ప్రవేశింపజేస్తుంది. |
|
సంప్రాప్యైనమృషయో జ్ఞానతృప్తాః కృతాత్మానో వీతరాగాః ప్రశాంతాః . తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరా యుక్తాత్మానః సర్వమేవావిశంతి .. 5.. |
|
|
5. సంప్రాప్త్య ఏనం ఋషయో జ్ఞాన తృప్తాః కృత - ఆత్మానో వీతరాగాః ప్రశాంతాః। తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః యుక్తాత్మానః సర్వమేవా విశంతి।। |
ఆ పరమాత్మతత్త్వాన్ని సముపార్జించుకొన్న సత్యాణ్వేషులగు ఋషులు- - జ్ఞానతృప్తులు, కృతాత్ములు, రాగరహితులు, ప్రశాంతచిత్తులు, సమాహిత స్వభావులు - అగుచున్నారు. అట్టివారు సర్వము బ్రహ్మముగా దర్శిస్తూ క్రమంగా బ్రహ్మమే తామై ‘‘సర్వతత్త్వ స్వరూపులు’’ అగుచున్నారు. |
|
వేదాంతవిజ్ఞానసునిశ్చితార్థాః సంన్యాసయోగాద్యతయః శుద్ధసత్త్వాః . తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే .. 6.. |
|
|
6. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధసత్త్వాః। తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే।। |
- వేదాంత విజ్ఞానముచే సర్వము ఆత్మస్వరూపంగా సునిశ్చితార్థులైనవారు సర్వమును మనస్సుచే సన్న్యసించి, యోగ సాధనచే నిర్మలబుద్ధి పొందుచున్నారు. దేహానంతరము బ్రహ్మలోకములో ప్రవేశించినవారై, పరతత్త్వానుభూతిచే అమృతస్వరూపులై, సర్వదృశ్య విషయముల నుండి విముక్తులగుచున్నారు. |
|
గతాః కలాః పంచదశ ప్రతిష్ఠా దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు . కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మా పరేఽవ్యయే సర్వే ఏకీభవంతి .. 7.. |
|
|
7. గతాః కలాః పంచదశ ప్రతిష్ఠా దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మా పరే - అవ్యయే సర్వ ఏకీ భవంతి।। |
వారియొక్క 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ప్రాణ - మనో - బుద్ధి- చిత్త - దేహ - అహంకారాలు...వాటివాటి యజమానులైన ఆయా అధిదేవతలకు చెందినవిగా భావించబడి వెనుకకు మరలుచున్నాయి. ఆతని కర్మలు, విజ్ఞానమయమగు బుద్ధి - ఇవన్నీ కూడా పరము, అక్షయము అగు ఆత్మతో ఏకీభూతం చెందుచున్నాయి. ఆతడు ఈ సమస్త దృశ్యానుభవమునకు ఆవలగల ‘‘అవ్యయ-ఏక-కేవల’’, ద్రష్ట (దృక్) స్థానము సంతరించుకొంటున్నాడు. |
|
యథా నద్యః స్యందమానాః సముద్రే- ఽస్తం గచ్ఛంతి నామరూపే విహాయ . తథా విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం .. 8.. |
|
|
8. యథా నద్యః స్యందమానాః సముద్రే అస్తం గచ్ఛన్తి నామరూపే విహాయ। తథా విద్వాన్ నామరూపాత్ విముక్తః ‘పరాత్‌పరమ్ పురుషమ్’ ఉపైతి దివ్యం।। |
ఏ విధంగా అయితే జలజలపారే నదీ జలం - నదీ సంబంధమైన నామ - రూపాత్మకమైనదంతా త్యజించి మహాసముద్ర జలంలో ప్రవేశించి సశాంతిస్తుందో...
అదే విధంగా..., ఆత్మజ్ఞాన విద్వాంసుడగు ఆత్మయోగి తన వ్యష్ఠిగత నామరూపాత్మకమైనదంతా త్యజించుచు, దివ్యము - సత్యము అగు పరాత్ - పరమ పురుషత్వములో ప్రవేశించినవాడై ప్రశాంతపడుచున్నాడు. |
|
స యో హ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి నాస్యాబ్రహ్మవిత్కులే భవతి . తరతి శోకం తరతి పాప్మానం గుహాగ్రంథిభ్యో విముక్తోఽమృతో భవతి .. 9.. |
|
|
9. స యో హ వై తత్ - పరమమ్ బ్రహ్మ వేద - బ్రహ్మైవ భవతి। న అస్య అబ్రహ్మవిత్ కులే భవతి। తరతి శోకం। తరతి పాప్మానం। గుహా గ్రంథిభ్యో విముక్తో అమృతో భవతి।। |
ఆ విధంగా ఆతడు (గురుము ఖతః, శాస్త్ర పరిశీలన, స్వవిచారణలచే) బ్రహ్మము ఎట్టిదో, ఏమై ఉన్నదో తెలుసుకొనుచు బ్రహ్మవేత్త అయి, తత్ఫలితంగా బ్రహ్మమే తానై ప్రకాశిస్తున్నాడు. ఆతని పరిసరములలో (వంశములో) అబ్రహ్మవేత్త ఉండజాలడు. బ్రహ్మమే తానై - ‘‘నేను చూస్తున్నదంతా నన్నే కదా’’ - అని గ్రహించినవాడై, - సర్వశోకములు నుండి, సర్వ దోష (బ్రహ్మ వ్యతిరిక్త) భావముల నుండి...తరిస్తున్నాడు. అమృత స్వరూపుడగుచున్నాడు. |
|
తదేతదృచాఽభ్యుక్తం . క్రియావంతః శ్రోత్రియా బ్రహ్మనిష్ఠాః స్వయం జుహ్వత ఏకర్షిం శ్రద్ధయంతః . తేషామేవైతాం బ్రహ్మవిద్యాం వదేత శిరోవ్రతం విధివద్యైస్తు చీర్ణం .. 10.. |
|
|
10. తత్ ఏతత్ ఋచా అభ్యుక్తం - క్రయావంతః శ్రోత్రియా బ్రహ్మనిష్ఠాః। స్వయం జుహ్వత ఏకర్షిం శ్రద్ధయంతః। తేషామ్ ఏవ ఏతామ్ బ్రహ్మవిద్యాం వదేత శిరోవ్రతం విధివత్ యేః అస్తు చీర్ణమ్।। (విధి వద్వైస్తు చీర్ణమ్)। |
ఈ పరమసత్యమే గతానుగతంగా - గురుశిష్యపరంపరంగా బ్రహ్మతత్త్వ పరంగా చెప్పబడుచున్నది! చెప్పబడుగాక!
ఎవ్వరైతే ఉత్తమ కర్మ నిష్ఠులో, శ్రోత్రియులో (వేదార్థముల పట్ల శ్రద్ధగలవారో), బ్రహ్మమునందు నిష్ఠగలవారో, అగ్నికార్యములు నిర్వర్తిస్తూ ఉంటారో, ఏకర్షి యజ్ఞశ్రద్ధాపరులో, అట్టి వారికి మీచే ఈ బ్రహ్మ విద్య బోధించబడుగాక! సశాస్త్రీయంగా శిరోవ్రతాన్ని (సహస్ర స్థాన ఉపాసనాది యోగాభ్యాసములు) అనుష్ఠించే వారికి - అటువంటి వారికి...మీరు తప్పక బోధించండి! |
|
తదేతత్సత్యమృషిరంగిరాః పురోవాచ నైతదచీర్ణవ్రతోఽధీతే . నమః పరమఋషిభ్యో నమః పరమఋషిభ్యః .. 11.. |
|
|
11. తత్ ఏతత్ సత్యం- ఋషిః అంగిరాః పురోవాచ। న ఏతత్ అచీర్ణవ్రతో అధీతే।। నమః పరమ ఋషిభ్యో! నమః పరమ ఋషిభ్యః! |
ఈ పరమసత్యాన్ని ఋషి యగు అంగిరసుడు లోకాలకు ప్రాచీనకాలంలో ఒకానొకప్పుడు బోధించటం - ప్రవచించటం జరిగిందయ్యా! అట్టి గ్రంథ రూపముగా మీ ముందుంచబడుచున్న ఈ సత్యోపదేశము పఠించటానికి వ్రతాచరణ పరుడే అర్హుడగుచున్నాడు! పరమసత్యాన్ని లోకములకు చేతులెత్తి ప్రకటించిన ఋషివరేణ్యులకు నమో నమః |
|
ఇతి తృతీయముండకే ద్వితీయఖండః |
నమో నమో నమః।। ఇతి 3వ ముండకము - 2వ ఖండము |
ఇతి ముణ్డకోపనిషత్ సమాప్తా
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
|
శ్లో।। యథా నద్యః స్యందమానాః సముద్రే అస్తం గచ్ఛన్తి నామరూపే విహాయ। తథా విద్వాన్ నామరూపాత్ విముక్తః ‘పరాత్‌పరమ్ పురుషమ్’ ఉపైతి దివ్యం।। |
ఏ విధంగా అయితే జలజలపారే నదీ జలం - నదీ సంబంధమైన నామ - రూపాత్మకమైనదంతా త్యజించి మహాసముద్ర జలంలో ప్రవేశించి సశాంతిస్తుందో... అదే విధంగా..., ఆత్మజ్ఞాన విద్వాంసుడగు ఆత్మయోగి తన వ్యష్ఠిగత నామరూపాత్మకమైనదంతా త్యజించుచు, దివ్యము - సత్యము అగు పరాత్-పరమ పురుషత్వములో ప్రవేశించినవాడై ప్రశాంతపడుచున్నాడు |
శాంతి పాఠము
ఓం ఓం ఓం
భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః।
భద్రం పశ్యేమ అక్షిభిః యజత్రాః।
స్థిరైః అంగైః తుష్టువాగ్ం సః తనూభిః।
వ్యశేమ దేవహితం యత్ ఆయుః।
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః।
స్వస్తి నః పూషా విశ్వవేదాః।
స్వస్తి నః తార్క్ష్యో (తార్‌క్ష్యః) అరిష్టనేమిః।
స్వస్తి నో బృహస్పతిః దదాతు।
ఓం శాంతి శాంతి శాంతిః।।
ఈ చరాచర సృష్టిని పరిపోషించుచున్న ఓ దేవతలారా! మా ఈ విన్నపము విని మమ్ములను కరుణించండి!
మీచే నిర్మించబడినవై, మీ చేతనే సదా సంరక్షించబడుచు - పరిపోషించబడుచు, మీచే ప్రసాదించబడుచున్నవై, మీకు చెందినవే అగు ఈ చెవులు, కన్నులు, ఈ దేహము - ఇవన్నీ మాపట్ల సద్వినియోగమగును గాక!
ఈ చెవులతో మేము ఎల్లప్పుడు నిరంతరము - భద్రము, శుభప్రదము, శాశ్వతమైన ప్రయోజనములు కలిగియున్నవి....,
అగు ఆత్మజ్ఞాన - ఆత్మానుభవ సమన్వితమైన విశేషములనే వినుచూ ఉండెదము గాక!
ఈ కళ్ళకు ఎదురుగా కనబడుచూ ఉన్నట్టి ఈ సృష్టి అంతా కూడా ఒక ‘‘మహాయజ్ఞము’’. మాయొక్క జన్మ - జీవన - మరణ - జన్మాంతర విశేషాలన్నీ కూడా ఆ మహాయజ్ఞములోని అంతర్ - విశేషాలే కదా! అంతర్గత విభాగాలే కదా! అట్టి యజత్రులము, జీవనయజ్ఞనిష్ఠులము అగు మేము కనులతో ఎల్లప్పుడూ కూడా ‘‘భద్రము - అభ్యుదయకారకము’’ అగు విశేషములనే దర్శిస్తూ ఉండెదము గాక!
మా ఈ భౌతిక దేహములు పుష్టి - బలము కలిగియున్నవై మీకు స్తోత్ర - ధ్యానములు, విధులు, ధర్మములు మొదలగునవి సమర్పించు యజ్ఞవిధులలో సద్వినియోగమగుగాక! అట్టి ప్రయత్నములకై సహకరించును గాక!
ఓ దేవదేవా! ఇంద్రభగవాన్! వృద్ధాశ్రవా! పెద్ద చెవులు గల స్వామీ! త్రిలోకములలోని జీవులందరు చేసే శబ్దములు - వాటి సందర్భార్థములు - పరమార్థములు వింటున్నట్టి మహామహనీయా!
• శాస్త్రములు శ్రద్ధగా వినటం।
• వినినవి ఆకలింపు చేసుకోవటం। అర్థం చేసుకోవటం।
• ఆకలింపు చేసుకొన్నవి సక్రమంగా సమన్వయించుకోవటం।
• నిరూపణగా సమన్వయించుకొని నిర్వర్తించుకోవటం! (Bringing great ideas and messages into everyday practice)
... అను రూపంగా వృద్ధశ్రవణములు, పెద్ద చెవులు మాకు ప్రసాదించి కరుణించండి! మీచే ఇవ్వబడిన ఏనుగు (పెద్ద) చెవులతో మేము వింటున్నది మాకు మీ దయచే మంగళప్రదములగు గాక! స్వానుభవములై అనుక్షణము వర్ధిల్లును గాక!
ఓ విశ్వ దేవతలారా! ఈ జగత్తుల స్థితి - గతులను ఎరిగియుండి, సర్వజీవరాసులను పరిపోషిస్తున్న మీకు నమస్కారము. మాకు స్వస్తిని, ఉత్సాహమును, ఉత్తేజమును, సంతోషమును, ఆనందమును ప్రసాదిస్తూ ఉండెదరుగాక!
ఓ తార్‌క్ష్యు దేవా! విజ్ఞాన - వైరాగ్యములను మాకు ప్రసాదించగల గరుడ భగవాన్! విశ్వవిహంగమా! మాయొక్క అజ్ఞానం చేత మేము పొందే ఆపదల నుండి మమ్ములను సర్వదా రక్షిస్తూ ఉండండి! మాకు స్వస్తిని ప్రసాదించండి! మా జ్ఞాన - వైరాగ్య సంపదను పరిక్షించండి। పరిపోషించండి। ప్రవృద్ధపరచండి।
ఓ దేవతాలోక గురూ! బృహస్పతి మహాత్మా! మాకు బ్రహ్మవర్చస్సును ప్రసాదించండి। మమ్ములను మీ బ్రహ్మజ్ఞతతో పరిపాలిస్తూ, మా బుద్ధులను పవిత్రం చేయండి. అభ్యుదయము వైపుగా మమ్ములను నడిపించండి!
పరమశాంతి స్వరూపులగు పరమాత్మ - మాయొక్క (జాగ్రత్-స్వప్న-సుషుప్తి-, దృశ్య-జీవ-ఈశ్వర, భూత-వర్తమాన-భవిష్యత్, ఇహ-పర-పరాత్పర) త్రివిధ స్థితులందు సాక్షాత్కరించును గాక!
మమ్ములను తీర్చిదిద్దును గాక!
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
1.) ప్రథమ ముండకము - ప్రథమ ఖండము
పర - అపర విద్యలు
(ముండకము = మంగలి కత్తి। అజ్ఞాన క్షౌరము। చురకత్తి। జన్మబంధ పరిమిత భావములను తొలగించునది)
ఒక కార్యము (A Work / A Task) జరుగుచున్నదీ అంటే - ఆ కార్యమును (లేక ఆ పనిని) నిర్వర్తించువాడు అట్టి ఆ కార్యక్రమమునకు మునుముందే ఉండి ఉండాలి కదా! కర్త లేకుండా కార్యనిర్వహణ ఎట్లా జరుగుతుంది?
శ్లో।। ఓం। బ్రహ్మా దేవానాం ప్రథమః సంబభూవ,
విశ్వస్య కర్తా। భువనస్య గోప్తా।
స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్ఠామ్,
అథర్వాయ జ్యేష్ఠ పుత్రాయ ప్రాహ।।
ఈ వివిధ జీవులయొక్క చిత్ర - విచిత్ర జీవ - జీవన స్రవంతులతో కనిపిస్తూ, అనేకవై విధ్యములతో కూడిన ఈ ‘సృష్టి’ అనే కవిత్వాన్ని (లేక) కథనాన్ని రచిస్తున్న - ధారణ చేస్తున్న ప్రప్రథమ ప్రదర్శనమే సృష్టికర్త - బ్రహ్మదేవుడు।
(జలం నుండి మొట్టమొదటి తరంగం వలె) వారు సృష్టియొక్క రచన కొరకై నిర్విషయ - నిష్ప్రపంచ పరబ్రహ్మ పురుషుని నుండి మొట్టమొదటగా సవిషయ-సప్రపంచాభిమానియగు సృష్ఠికర్త - బ్రహ్మదేవుడు ఆవిర్భూతులౌతున్నారు. సంప్రదర్శితులు అగుచున్నారు.
వారు దేవాది దేవులు! జగత్‌రచనా కవీశ్వరులు! జగత్ రూప కళాకారులు! దేవతలకే దేవుడు। దేవతల కంటే మునుముందే ఏర్పడివున్నవారు।
అట్టి బ్రహ్మదేవుడు ‘‘జీవులు (Experiencers) - విషయములు (Incidents) - వస్తువులు (Matters) ’’ .....అనువాటితో కూడిన వ్యవహారమంతా తన ధారణా ప్రక్రియ ద్వారా సృష్టిస్తున్నారు.
జీవుల జీవన విధానమును నడిపించే శాస్త్రములను కల్పిస్తున్నారు.
అట్టి సృష్టించబడిన జగత్తులలో వివిధ జీవులు (సృష్టికర్త యొక్క సంకల్పానుసారంగా) పంచతన్మాత్రలు (శబ్ద - స్పర్శ - రూప - రస - గంథములు) పొందుచున్నవారై,.....ఆహారము అందింపబడుచూ సంచరిస్తున్నారు! వినోదిస్తూ జీవిస్తూ ఉన్నారు।
అయితే....,
క్రమంగా-ఈ జీవులలో అనేకులు - అజ్ఞాన కారణంగా ఓ దేహం తరువాత మరొక దేహ సందర్భాలలో అనేక మనోవ్యాకులతలు ప్రోగుచేసుకొని దుఃఖితులవటం జరుగుతోంది!
తన బిడ్డలు అజ్ఞానంచేత అనవసరమైన దృశ్య సంబంధ వేదనలు పొందటము (untoward and unnecessary worries) గమనించిన సృష్టికర్త బ్రహ్మదేవుడు ‘‘ఇప్పుడు ఏమిటి ఉపాయం?’’ అని యోచించసాగారు.
అప్పుడు బ్రహ్మమానస పుత్రుడు, తన పెద్ద కుమారుడు, శాస్త్ర విద్యాపారంగతుడు అగు అథర్వణమహర్షిని పిలిచారు. సర్వవిద్యలకు, శాస్త్రములకు ఆధారభూతమైనట్టి ‘‘ఆత్మవిద్య’’ (లేక) ‘‘భౌమావిద్య’’ (లేక) ‘‘బ్రహ్మవిద్య’’ (లేక) ‘‘అధ్యాత్మవిద్య’’ను బోధించారు!
‘‘నాయనా! అథర్వా! నీవు ఇప్పుడు బ్రహ్మ విద్యను విని, అర్థం చేసుకున్నావు కదా? ఈ బ్రహ్మవిద్యను నీ శిష్యులకు కూడా బోధించు! మీరంతా కూడా ఈ ఆత్మవిద్యను లోకాలలో పరిఢవిల్లేడట్లు చేసెదరు గాక!’’ - అని బ్రహ్మదేవుడు అనుగ్రహించారు.
అట్టి అధ్యాత్మవిద్యను విని, గ్రహించి, అవగతం చేసుకున్నట్టి శ్రీ అథర్వ మహర్షి పరమానందము పొందారు. నిజాశ్రమం చేరారు. శాస్త్రవిద్యను నేర్చుకుంటున్న తన శిష్యులకు బ్రహ్మానందదాయకమగు ఆ భౌమా విద్యను బోధించారు.
ఆయన శిష్యులలో ఒకడు, కుశాగ్రబుద్ధికలవాడు అగు ‘ఆంగిరసుడు’ అనువాడు అత్యంత శ్రద్ధ - ఆసక్తులతో ఆత్మవిద్యను నేర్చుకున్నారు.
ఆంగిరసుడు ఒక సందర్భంలో భరద్వాజసగోత్రుడైనట్టి ‘సత్యవాహుడు’ అను తన శిష్యునికి, మరికొందరు ఇతర శిష్యులకు విశ్లేషిస్తూ - విశదపరుస్తూ బోధించారు. ఆ సత్యవాహుడు తన శిష్యులకు ఆ భౌమావిద్యను నేర్పారు.
(అంగిరసుడు (లేక) అంగిరుడు :- బ్రహ్మమానసపుత్రులలో ఒకరు. బృహస్పతి, ‘సంవర్తుడు’-ఆయన కుమారులు. ఆయన కూతురు ‘యోగసిద్ధి’. ఆ యోగసిద్ధి అష్టవసువులలో ఒకడగు ప్రభాసుని పెండ్లాడి, దేవశిల్పి ‘విశ్వకర్మ’ను కుమారునిగా కన్నది - మహాభారతము)
ఒకానొకరోజు....,
శౌనకుడు అనే మహానుభావుడు శిష్యగణముతో సహా అంగీరస మౌనీంద్రుల దర్శనార్ధమై వచ్చారు. ‘‘యో మహానుభావన్ సేవతే!’’, ‘‘మహాపురుష సంశ్రయః!’’, ‘‘ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వదర్శినః।’’, ‘‘సంత్సంగత్వే నిస్సంగత్వం’’....అని కదా ఆర్యవాక్యాలు!
బ్రహ్మతత్త్వమును శ్రవణం చేయటానికై శిష్యభావినై శౌనకుడు అంగీరసుని సమీపించారు. శరణువేడారు. శౌనకుడు సునక మహాముని పుత్రుడు, సూతముని ప్రియశిష్యుడు. ప్రాజ్ఞుడు. శిష్యత్వము - శ్రోతత్వము - పౌరాణిక మహత్మ్యము సుస్వభావముగా పుణికిపుచ్చుకున్నవాడు.
శౌనకుడు : మహాత్మా! అంగీరసమునీంద్రా! తమ పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు! మిమ్ములను శరణువేడుచున్నాను. నాకు గల కొన్ని సంశయములను మీకు విన్నవించుకొని, తమ వద్ద ‘బోధామృతపానం’ చేయాలనే అభిలాషతో మిమ్ములను దర్శించవచ్చాను! వినమ్రుడనై మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మీరు జ్ఞానానంద స్వరూపులు! బ్రహ్మజ్ఞులు! సంసార సాగరంలో చిక్కుకొని కొన్ని సందేహముల మధ్య చిక్కియున్న నన్ను సముద్ధరించవేడుకుంటున్నాను.
శ్రీ అంగీరసుడు : నాయనా! శౌనకా! సూతమునీంద్ర ప్రియశిష్యా! మేధావీ! సూక్ష్మగ్రాహీ! పురాణశ్రవణ మననములలో ఉత్తముడవని నీ గురించి విన్నానయ్యా! దీర్ఘాయుష్మాన్ భవ! నీకు సుస్వాగతం! నీ రాకచే మనం ప్రారంభించబోయే సత్సంగ పూర్వక సంభాషణచే లోక కళ్యాణమగుగాక। బిడ్డా! ఈ పండ్లు - ఫలములు భుజించు. ఇక ఆపై నీ సందేహము లేమిటో ప్రకటించు. బ్రహ్మ నుండి - మద్గురు సత్యవాహమహాముని పర్యంతముగాను, తదితర గురుశిష్య పరంపరగాను వస్తున్న ఆత్మవిద్య నుండి నేను గ్రహించినంతవరకు నీకు సమాధానములు ఇవ్వటానికి తప్పక ప్రయత్నిస్తాను!
శౌనకుడు : హే సద్గురూ!
కస్మిన్ను, భగవో! విజ్ఞాతే
సర్వమిదం విజ్ఞాతం భవతి?
హే భగవన్! ఈ ప్రపంచంలో తెలుసుకోవటానికి అనేకానేక విశేషాలు ఉన్నాయి. (అనేకాని చ శాస్త్రాణి। కల్పాయుః। విఘ్నకోటయః। తస్మాత్ సారం విజానీయామ్।).... ఈవిధంగా ప్రపంచం గురించి ఎంతెంతగా తెలుసుకుంటూ ఉన్నప్పటికీ...ఇంకా ఇంకా తెలుసుకోవలసినవి ఎన్నెన్నో విషయాలు అతిదీర్ఘంగా మిగిలిపోతూనే ఉంటాయి. పైగా....ఈ కనబడేదంతా అనుక్షణం గతిశీలం. మార్పు - చేర్పులు పొందుతూనే ఉంటుంది. అందుచేత ‘‘ఈ దృశ్యంలో దేని గురించి ఎంత తెలుసుకొంటే మాత్రం ఏమి లాభం?’’...అని నాకు అనిపిస్తోంది.
ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మిమ్ములను సమీపించి శరణువేడుచున్నాను. ఇప్పుడు నా సంశయం ఏమిటో చెప్పుచున్నాను. వినండి!
ఈ విశ్వమంతా గతి శీలము. సుదీర్ఘము. అనంతము.
(1) ఎదురుగా కనిపిస్తున్న ఈ విశ్వరూప చమత్కారం విషయమై ఏది తెలుసుకొంటే, పరము, అత్యుత్తమము అగు సత్యము మాకు తెలిసిపోతోంది?
(2) దేనిని తెలుసుకొన్న తరువాత, ఇదంతా అర్థమై...ఇక, తెలుసుకోవలసినది మరింకేదీ మిగిలి ఉండదు?
అట్టి విషయమును నాకు బోధించండి!
శ్రీ అంగీరసుడు : చాలా చక్కటి ప్రశ్నతో ప్రారంభించావయ్యా! ‘‘విత్ యత్ తత్ విద్యా’’....అని కదా! తెలుసుకోవలసింది తెలుసుకునే మార్గమే విద్య. అట్టి విద్య రెండు రకములుగా బ్రహ్మవేత్తలచే చెప్పబడుతోంది!
(1) అపరా విద్య (2) పరావిద్య
(1) అపరావిద్య తెలుసుకోవలసింది తెలుసుకోవటానికి సాధనముల రూపం. (Instruments and techniques to learn) సాధనల గురించి, మార్గముల గురించి వివరించేది.
వ్యష్టి - సంఘశ్రేయస్సు - సహజీవుల పరస్పర సానుకూల్యత-ఐకమత్యములను (కూడా) ఉద్దేశ్యించునది.
అపరవిద్యయొక్క విభజన ఏమిటో ముందుగా మరికొంత చెప్పుకుందాం. గమనిద్దాం.
అపరావిద్య :
|
చతుర్వేదములు |
ఋక్ - యజుర్ - సామ - అధర్వణ |
|
శిక్ష |
షట్ వేదాంగములు షడంగములలో ఒకటి శిక్షించటము (Training) విద్యాభ్యాసము. బోధించటము. (పాణిని) |
|
కల్పము |
కర్మలకు సంబంధించిన విధి విధానములు. వ్రత కల్పములు, నిబంధనములు, న్యాయము, షడంగములలో ఒకటి |
|
వ్యాకరణము |
భాషా శాస్త్రము. వాక్య విభజనము. (పాణిని) |
|
నిరుక్తము |
ఒక వేదాంగము - పదముల అవయవార్థ వివరణ. (యాస్కముని) |
|
ఛందస్సు |
పద్య లక్షణములు చెప్పు శాస్త్రము. (యాస్కముని) |
|
జ్యోతిష్యము |
జ్యోతిర్మండలము - గ్రహములు - నక్షత్రమండలము ఇత్యాదుల స్వరూప - స్వభావ ప్రభావములు. జాతకము, జ్యోస్యము వివరించునది. ఒక వేదాంగము. (ఆదిత్యుడు మొదలైనవారు). |
వీటియొక్క పఠనము - గొప్ప పాండిత్యము. ఇదంతా విద్యయే! అయితే ఇది అపరావిద్య! అవన్నీ ఒక దీర్ఘ ప్రయాణికునికి (Long Traveller) - బహుదూరపు బాటసారి)కి దారిలో లభించే వసతులతో పోల్చవచ్చు.
‘భౌమావిద్య’కు అవి దోహదపడగలవు. సహకరించగలవు. ఆయా అవరోధములను తొలగించుకొనే ధీశక్తిని (Intellectual base) ప్రసాదిస్తాయి. (లేక) సంసిద్ధతను పెంపొందిస్తాయి. అంతవరకే। వాటికవే బ్రహ్మవిద్యకు ముఖ్యసాధనములు (ultimate objectives) కావు. విజ్ఞత గలవారికి అవి తప్పక ముఖ్యసాధనములు కాగలవు. (They are all process but not objective)
2. పరావిద్య : అథ పరా యయా తత్ ‘అక్షరమ్’ అధిగమ్యతే!
ఏ విద్యావిశేషము (లేక, విభాగము) - అక్షరము, అమరము అగు స్థానమును విశదీకరిస్తోందో, సందర్భ స్వరూపమును అధిగమించి సహజ రూపమును (లేక) తత్ రూపమును (లేక) తత్ త్వమ్ అను మహావాక్యార్థమును విశదపరుస్తోందో...అదియే పరావిద్య.
శౌనకుడు : పరావిద్యా ప్రయోజనమగు మీరు సూచిస్తున్న పరబ్రహ్మతత్త్వమును మేము సమీపించేది, దర్శించేది ఎట్లా? అది ఎక్కడ ఎట్లా మాకు లభిస్తుంది? అది మాకు చూపండి. మేము అభ్యసించి ధన్యులమౌతాం। దర్శిస్తాము.
శ్రీ అంగీరసుడు : అద్దానిని కళ్ళతో ఎట్లా దర్శిస్తాం, సర్వదేహాలలో ఉండి చూస్తూ ఉన్నవారి గురించినదే-ఆ పరబ్రహ్మమైనప్పుడు?
అదృశ్యమ్ : పరావిద్యావిశేషము భౌతికమైన కన్నులకు కనిపించే ఒకానొక దృశ్యము వంటిది కాదు. కన్నులకు దృశ్యము కనిపిస్తుందేమోగాని, కళ్ళు ఉపయోగించి చూచుచున్నవాడు కళ్ళకు కనిపిస్తాడా? సర్వ నేత్రములతో సర్వము దర్శించుచున్నది- పరబ్రహ్మమే।
అగ్రాహ్యమ్ : ఒక భౌతిక వస్తువు వలె చేతులతో పట్టుకొని తెచ్చుకొనేది కాదు. చేతులను కదల్చుచున్నట్టిది. కదిలే చేతులు కదిలించే తత్త్వమును పట్టుకోజాలదు.
అగోత్రమ్ : గోత్రము, వంశము, సంతతి మొదలైనవాటికి సంబంధించినదే కాదు.
అవర్ణమ్ : పరావిద్య - వర్ణాశ్రమ ధర్మము - నియమములకు సంబంధించినది కాదు. రంగు - రూపములచే స్పృశించబడునది కాదు. ‘‘అద్దాని లక్షణములు - గుణములు ఇవి ఇట్టివి’’ అని కూడా అనలేం! నవలా రచయితకు నవలలోని పాత్రల యొక్క ప్రదేశముల యొక్క లక్షణములు ఆపాదించలేము కదా।
అచక్షుఃశ్రోత్రం, అపాణిపాదం : ఒక జీవుని వలె పరబ్రహ్మమునకు కళ్ళు, చెవులు, చేతులుస కాళ్ళు లేవు. అవన్నీ ఉపయోగిస్తూ తాను వేరైనది. వాటినన్నిటినీ చైతన్యవంతము చేసేది. (విద్యుత్తు బల్బులను వెలిగించవచ్చుగాక! విద్యుత్‌కు బల్బులున్నాయని, యంత్రములు వగైరా ఉన్నాయని అనము కదా!) అయితే ఏం? ‘‘జగత్తులోని సర్వ విషయములకు కారణము - కార్యము అదే!’’ - అద్దానినే సర్వే - సర్వత్రా తత్త్వజ్ఞులు గమనిస్తున్నారు.
నిత్యము : భూత - వర్తమాన - భవిష్యత్తులు కాల సంబంధమైనవి. పరబ్రహ్మమో,- కాలమును నియమించునది. కాలాతీతమైనది. కాలమునకు సాక్షి. దేహి-దేహముకంటే మునుముందుగాను, దేహము తరువాతకూడా ఉండునది! జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు సాక్షి. నిత్యమైనది. నీవు చెప్పినట్లు, ఈ జగత్తులోని సర్వ విషయములు - విశేషములు గతించేవే. పరబ్రహ్మముమాత్రమే సర్వదా యథాతథము. ఆత్మ నిత్యము, అనునిత్యము కూడా!
విభుమ్ : సర్వము ఆత్మకు చెందినవే. ఈ ఎదురుగా కనబడేదంతా కూడా ఆత్మకు - అనన్యము. కనుక సర్వమునకు ఆత్మయే యజమాని. ఈ దృశ్య లోకములను - ఇంద్రియములను - మనో బుద్ధి చిత్త అహంకారములను నియమించి - పాలిస్తున్నట్టిది. (That which appoints and rules) - ఆత్మయే.
సర్వగతమ్ : (నవలలోని నవలా రచయితవలె) పరావిద్యాస్వరూపమగు ఆత్మతత్త్వము సర్వగతమైనది. ఆత్మయే ఇక్కడ వివిధ రూపములుగా సంప్రదర్శనమౌతోంది. స్వప్నచైతన్యమే స్వప్నములో ఆయా వివిధ రూపములుగా అనిపిస్తోంది కదా! ఆత్మయే ఆ బ్రహ్మ - స్తంభ పర్యంతము వివిధ రూపములుగా ద్రష్టచే - దృష్టిద్వారా చూడబడుతోంది.
సుసూక్ష్మం : అత్యంత సూక్ష్మ రూపంగా సర్వే సర్వత్రా (విద్యుత్ శక్తి వలె) విరాజిల్లుచున్నది. దేహము స్థూలము. ఆలోచన - వివేకము - ఇష్టాఇష్టము - మమరూప (నాది అనుకొనే) అహంకారం...ఇవన్నీ సూక్ష్మమైనవి. ఆత్మయో, సూక్ష్మాతి సూక్ష్మము.!
అవ్యయం : మార్పు - చేర్పులు లేనట్టిది. దేహము మార్పుచేర్పులు, ఉత్పత్తి - వినాశనాలు పొందుతాయి. దేహికి (కదల్చువానికి -ఆలోచనలు చేయువానికి)-మార్పు ఏమున్నది? చేర్పు ఏమున్నది? మార్పుచేర్పులు లేనట్టి ‘దేహి స్వరూపమగు’ ఆత్మ-అవ్యయము.
యత్ భూత యోనిం పరిపశ్యన్తి ధీరాః : ఆత్మతత్త్వము ఎరిగియున్న బుద్ధిమంతులు ఆత్మయే సర్వభూత జాలముయొక్క ఉత్పత్తి - ఉనికి - లయస్థానంగా సందర్శిస్తున్నారు. (యతః సర్వానిభూతాని ప్రతిభాంతి, స్థితానిచ। యత్రైవ ఉపశమం యాంతి।। - యోగవాసిష్ఠము)
యథా ఊర్ణ నాభిః సృజతే, గృహణాతే చ: ఒక సాలె పురుగు తన నుండి దారమును బయల్వెడలదీస్తూ... ఆ దారముల నిర్మాణంలో తానే షికార్లు కొడుతూ, మరల అదంతా మ్రింగుతుంది కదా! అట్లాగే ఆ పరబ్రహ్మము జగత్తులను స్వకీయకల్పనలో నిర్మించుకొని, వాటియందు జీవులరూపంగా సంచారములు సల్పుచున్నది. ఈ విధంగా, (సాలె పురుగు నుండి సాలె దారములతో చిత్ర - విచిత్రములైన సాలె గూళ్ళు బయల్వెడలుచున్నట్లు) - పరమాత్మనుండే ఈ విశ్వమంతా బయల్వెడలుతోంది. తరువాత పరమాత్మచేతనే మ్రింగివేయబడుతోంది.
యథా పృధివ్యామ్ ఓషధయః సంభవంతి : భూమి అంతా మట్టిమయమే కదా! అట్టి మట్టిలోంచి మొక్కలకు జీవనాధారమైన, సర్వజీవులకు ఆహారరూపమైన ఓషధులు (ఓజోశక్తి) బయల్వెడలుచున్నాయి. అట్లాగే, ఆత్మ నుండి ఈ విశ్వమంతా బయల్వెడలుతోంది. ఆ పరతత్త్వమునకు చెందిన- ‘సృష్టించటం’ అనే ఓజస్సుచే బ్రహ్మదేవుని నుండి ఒక కీటకము వరకు పరిషోపింపబడుచున్నాయి.
యథా సతః పురుషాత్ కౌశ లోమాని : ఒక జీవుని శిరస్సుపై వెంట్రుకలు మొలుస్తున్నాయి. పెరుగుచున్నాయి. ఇందులో ఆ జీవుని సంకల్పము ఏదీ లేకుండానే స్వభావసిద్ధంగా ఉండిపోవటము జరుగుతోంది కదా! పరబ్రహ్మమునుండి దృష్టిగాని - ఉద్దేశ్యముగాని - సంకల్పముగాని లేకుండానే ఈ విశ్వములు ఆయన నుండి ఆవిర్భవిస్తున్నాయి.
ఈ విధంగా.....,
సాలెపురుగులోని లాలాజలంలోంచి బయల్వెడలి తిరిగి మ్రింగబడే గూడుదారాలలోని చిత్ర - విచత్రమైన అల్లికలవలె, భూమిలోని ఓజోరూపమైన ఔషధ శక్తివలె, జీవించియున్నవాని తలపై వెంట్రుకల వలె, జలములో తరంగములవలె -
- నిర్విషయ పరతత్త్వము నుండి....
- ఆ పరతత్త్వము యొక్క సమక్షంలో....
ఈ సృష్టి పరంపరలన్నీ అనిర్వచనీయంగా, అకారణంగా, స్వభావసిద్ధంగా ప్రదర్శితమగుచున్నాయి. ఇంతలోనే మటుమాయ మగుచున్నాయి.
మరొక చమత్కారం కూడా
ఆత్మయే ఒకానొక దృష్టికి సృష్టిగా అనుభూతమౌతోంది!
ఒకడు తనయందు అనిర్వచనీయంగా, అకారణంగా ఒకానొక సమయంలో ‘ఊహ’ను కల్పించుకొని, ఆ ‘ఊహ’లో విహరిస్తూ, ఊహయొక్క రూపము - ఆది మధ్య అంతము కూడా తానే అయి - తనను తానే విడువకయే ఉంటాడు చూచావా? అట్లాగే ఆ పరబ్రహ్మము కూడా అనిర్వచనీయంగా, అకారణంగా సృష్ట్యనుభవి-సృష్టిల చమత్కారమైన భావనాపరంపరా చమత్కారము’’ (అనే ధారణను) లీలగా, క్రీడగా అవధరించటం జరుగుచున్నది. ఆలోచించువాడు ఏది ఆలోచించినా, ఆలోచించకున్నా కూడా తాను యథాతథమైనవిధంగా, పరబ్రహ్మము జగత్ భావనా పరంపర చమత్కారం నిర్వర్తిస్తూ (లేక) నిర్వర్తించకున్నా కూడా, తాను యథాతథం.
సృష్టి చమత్కారము - అన్నమ్
ఆ పరబ్రహ్మము - యొక్క ‘సృష్టి’ అనే భావనాపరంపర చమత్కారము ఉబుసుపోకగా ధారణ చేసెదనుగాక!’’ అను భావనచే ‘సృష్టి’యొక్క అనుభవము (లేక) అనుభూతి ఏర్పడినదై ఉంటోంది. అట్టి ‘భావన - ఆలోచన’లే ‘సృష్టిరూప యజ్ఞ తపస్సు’గా చెప్పబడుతోంది. అనగా, అట్టి తపస్సు (లేక) తపన (Sense of Avoctaion) నుండి సర్వ చరాచర సృష్టి అనబడే ఆత్మయొక్క రసాస్వాదన ఉదయిస్తోంది. సంప్లుతోదకమౌతోంది. (ఆత్మయొక్క స్వయం కల్పనయే సృష్టి-సృష్ట్యనుభవము).
అనుభవముగా అగుచున్నదంతా ‘అన్నమ్’ అను శబ్దముచే అధ్యాత్మశాస్త్రం ఉద్దేశ్యిస్తోంది. (అన్నం బ్రహ్మ! అన్నం పరబ్రహ్మ స్వరూపమ్! అన్నమిదమ్ సర్వమ్ - ఇత్యాదిశబ్దముల ఉద్దేశ్యార్థం).
అన్నమ్ → భావార్థము : పరమాత్మయొక్క ఆహారము, జగత్ భావకల్పనా విశేషం.
లక్ష్యార్థం → ప్రకృతి : స్వభావము : అనుభూతి : అనుభవము.
అద్వితీయమైనదానియొక్క ద్వితీయ కల్పనా వినోదపూర్వకమైన అభిలాష. (A playful inclination towards experiencing of Duality)
దృష్టాంతం : నిరాకారమగు మట్టిచే మట్టి ముద్దలు , మట్టి రాజు మట్టి మంత్రి - మట్టి గుర్రము మొదలగునవి శతృ - మిత్ర రాజుల కథాదృశ్యం తయారు అగుచున్నట్లు!
అట్టి పరబ్రహ్మము.....,
సృష్టికర్తయగు బ్రహ్మదేవుని, సృష్టికి మూలమైన రజోగుణ చమత్కారమును, అట్టి రజోగుణము నుండి నామ-రూప కల్పనలను, ఆ ఇంద్రియ - ఇంద్రియ విషయములను కల్పన చేసుకొనుచున్నది - ఆత్మయే।
పరబ్రహ్మమునకు సృష్టికర్త - సృష్టి ఆహారము. అయితే...,
ప్రదర్శితమయ్యేదంతా పరబ్రహ్మమే అయి ఉన్నది. సృష్టియొక్క భావన, సృష్టి, ద్రష్ట, దృశ్యము, అనుభూతి, అనుభవము, ఆనందము - దుఃఖము....అంతా పరబ్రహ్మమే. (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ!)
→ కనబడేదంతా అదే। వినబడేదంతా అదే।
→ బ్రహ్మము సర్వదా బ్రహ్మముగానే వున్నది. మరొకటేదీ అవటమే లేదు.
జలము నుండి అనేక ఆకారములుగల - అసంఖ్యాక తరంగాలు ప్రదర్శితమగుచుండవచ్చు గాక! జలము జలమే అయి, తరంగాలు కూడా జలమే అయివున్నది కదా!
జీవుడుగా కనిపిస్తున్నది - జీవుడుగా అనిపిస్తున్నది - జీవుడుగా వున్నది - సత్ చిత్ ఆనందరూపమగు పరబ్రహ్మమే। సదా బ్రహ్మమే। సదాశివమే। సర్వదా బ్రహ్మమే।
అందుకు వేరుగా కనిపిస్తున్నదంతా ద్రష్టయొక్క మనో కల్పితమాయయే।
(1) కేవల చైతన్యము (2) దృక్ (3) ద్రష్ట (4) దృశ్యము → సమస్తము బ్రహ్మమే!
2.) ప్రథమ ముండకము - ద్వితీయ ఖండము
కర్మానుష్ఠానము - తత్ప్రభావము - గురు ఆశ్రయము
శ్రీ అంగిరసుడు : ఓ శౌనకా! తదితర ప్రియశ్రోతలారా! ఈ కనబడే జగత్తంతా మనోదర్పణంలో వివిధ అనేకత్వములతో కూడిన ప్రాతిభాసిక (Reflective) దృశ్యముగాను, వాస్తవానికి పరబ్రహ్మమే అయివున్నట్లుగాను మనం వేద - వేదాంతజ్ఞుల, ఆత్మజ్ఞుల ప్రవచన వాక్యములు చెప్పుకున్నాం. శ్రద్ధగా వింటూ, గమనిస్తున్నారు కదా! జలంలో తరంగాలులాగా,....ఆత్మ మహాసముద్రంలో ‘అన్నము’ అనే ‘‘చిత్ చైతన్య పరమోత్సాహశక్తి’’చే ‘‘జీవులు వారి వారి వ్యక్తిగత అనుభవపరంపరలు’’ అనే తరంగాలు అనిర్వచనీయంగా - అకారణంగా - ఆత్మకు అద్వితీయంగా ప్రదర్శితమౌతున్నాయి.
అయితే..., ఇదంతా సర్వదా అఖండాత్మానంద చైతన్యమే।
ఈ దృశ్యమును పొందుచున్న సందర్భంలో....‘‘ఇదంతా ఆత్మచైతన్య చమత్కారమే’’ - అని ఆశయంగా - సమగ్రంగా అవగాహన అయ్యేది ఎట్లా? సమస్తము ఆత్మగా అనిపించేది ఏ తీరుగా? అందుకు సాధనామార్గంగా వేదములు - శాస్త్రములు కొన్ని కర్మ విధివిధానములను నిర్దేశిస్తూ సూచిస్తున్నాయి.
అటువంటి కర్మసాధనములకు సంబంధించిన కొన్ని వివరాలు ఇక్కడ చెప్పుకుంటున్నాం. వినండి! అటువంటి శాస్త్రపవచితమైన కర్మ విశేషాలన్నీ కూడా...
అను మూడిటి కలయికచే (కర్మసాధనములన్నీ) ఏర్పడినవై ఉంటున్నాయి.
వాటియొక్క మరికొన్ని వివరాలు -
హోమము = దేవతలను మంత్రపూర్వకంగా ఆహ్వానించటం, ఆ దేవతలకు అగ్నిహోత్రము ద్వారా ఆహుతులు ఇవ్వటం.
ఆహోతి : దేవతలకు సమర్పించే కొన్ని ఓషధ సమిధలు, ఆవునెయ్యి మొదలగునవి.
హోత్రము : ఋగ్వేద సంబంధమైన దేవతా - ప్రత్యధి దేవతా మంత్రములు
ఆధ్వర్యము : యజుర్వేదంలో వర్ణించబడిన యజ్ఞవిధి - విధానములు.
ఓద్గాతము : సామవేద గానములు.
1. యజ్ఞవిధులు : ఓ శ్రోతలారా! ఓ శౌనకా! ఆ తీరుగా బ్రహ్మణ్యులచే, వేదవరేణ్యులచే ప్రవచితమై, చెప్పబడిన యజ్ఞకర్మలు మీరు ఇతఃపూర్వం సవివరంగా గురుముఖతః వినియే ఉన్నారు కదా! తపోసంపన్నులు, మహనీయులు, ముముక్షు శ్రేయోభిలాషులు అగు ఏఏ ఋషులు ఏఏ యజ్ఞములను దర్శించి సర్వజనశ్రేయంగా గానం చేసారో, చేస్తూ వున్నారో...అవన్నీ సత్యమే! ఓ సత్యప్రియులారా! సర్వదా సత్యమగు పరమాత్మయొక్క (లేక) పరతత్త్వముయొక్క అనుభూతికి అర్హులు అవటం కొరకై మీరు అవన్నీ అధ్యయనం చేయండి. ఆచరించండి.
మీరు నిర్వర్తిస్తున్న యజ్ఞకర్మలద్వారా ఆహూతులను అగ్నిగుండంలో సమర్పిస్తూ ఉండగా, హవ్యవాహనుడగు అగ్నిదేవ భగవానుడు ఆ ఆహూతులను హవిస్సుగా సృష్టిపరిపోషకులగు దేవతలకు అందిస్తూ ఉంటారు. ఈ విధంగా లోకకళ్యాణ దృష్టితో నిర్వర్తించండి! మోక్షార్హతకు మార్గములో గొప్ప ఉత్తమ ఉపకరణమైన ఈ మానవదేహము లభించినందుకు ఈ లోకముపట్ల కృతజ్ఞతగా అట్టి యజ్ఞములను, కర్మల త్యాగములను నిర్వహించండి! అత్యంత పవిత్రమగు ఆత్మదృష్టిని పొందటానికే ఆ యజ్ఞ నిర్వహణలను మీ అంతరంగంలో ఉద్దేశ్యించండి!
2. సమర్పిత భావనతో స్వధర్మాచరణము : ప్రియ ఆత్మానంద స్వరూపులారా! మీరంతా కూడా మీమీ వర్ణ - ఆశ్రమ సమయోచితమైన, (మరియు) శాస్త్రీయ - లోకహితమైన స్వధర్మములు విడువకండి! ‘‘స్వధర్మ (కర్మ) నిర్వహణ’’ అనే సంపదను పరివృద్ధి చేసుకోండి. శాస్త్రానుసారంగాను, కాలానుగతంగాను మీరు శ్రద్ధతో నిర్వర్తిస్తున్న కర్మలను విశ్వదేవతలకు ప్రేమతో సమర్పించండి. వారు తిరిగి సానుకూల్యులై, మీరున్న ఈ సృష్టియొక్క ఉనికికి, మీమీ జీవనస్రవంతులకు తోడ్పడగలరు.
మీరు నిర్వర్తించే వర్ణాశ్రమ ధర్మములే - స్వధర్మములే మీకు ముండకము (వెంట్రుకలు తొలగించే పదునైన కత్తి) వంటిది కాగలదు. అట్టి కత్తిని మీయొక్క శ్రద్ధతో కూడిన ధర్మ నిర్వహణచే మీకు మీరే తయారుచేసుకోవాలి సుమా!
ఒక హెచ్చరిక!
ఎవ్వరి శాస్త్రవిహితమైన - వేదరహితమైన సాధనారూపములగు కర్మలు.. అనబడే అగ్నిహోత్రము మొదలైనవి :
అట్టి వారి ఆత్మజ్ఞానమును చేరే మార్గంలో నిరుపయోగములౌతాయి. కర్తకు ఉత్తమ ప్రయోజనములు కావు! అల్ప, అశాశ్వత, దుఃఖమిశ్రత ఫలములకు మాత్రమే పరిమితమౌతాయి.
బుద్ధిని నిర్మలం చేసుకోవటానికి - లోకసానుకూల్యత కొరకు కర్మలు నిర్వర్తించాలి. అంతేకాని, అల్పమైన స్వర్గలోక - భవిష్యత్ సుఖప్రాప్తి ఇత్యాది ఆశయములతో అగ్నికార్యము - యజ్ఞము ఇత్యాది కర్మలు, సధర్మములు నిర్వర్తించటం తెలివితక్కువదనమే! (కృపణా ఫలహేతవః - భగవద్గీత). పైగా లౌకికమైన ఆశయములతో యజ్ఞాదులను ఉద్దేశ్యించేవారికి కర్మఫలానుభవము తరువాత, సప్త ఊర్థ్వలోకాలు ప్రాతికూల్యమౌతూ ఉంటాయి.
‘‘లోకసంబంధమైన, ఇంద్రియ సుఖ సంబంధమైన’’ ప్రతిఫలాపేక్ష మాత్రమే ఆశయముగా కలిగియుండి, అగ్నిహోత్రము, యజ్ఞము, యాగము పూజ ధ్యానము తదితర కర్మలు నిర్వర్తిస్తూ ఉండేవారు, (అట్లాగే) లోకహితము - శాస్త్ర విహితము కానట్టి కర్మలు నిర్వర్తించే వారి విషయంలో వారి వారి ఉత్తరోత్తర గతులు ‘‘జ్ఞానమునకు అనర్హము - ప్రాతికూల్యము’’ కాగలవని హెచ్చరిస్తున్నాము.
ఇప్పుడు యజ్ఞము - అగ్ని ఉపాసనల గురించిన కొన్ని విశేషాలు చెప్పుకుందాం.
యజ్ఞము - అగ్నిఉపాసన (అపరో)
‘‘అగ్నిః సప్తజిహ్వః’’ - అగ్ని యొక్క సప్తజిహ్వలు
ఈ విధంగా ఏడు నాలుకలతో అగ్నిగుండంలో అగ్ని భగవానుడు ప్రవేశిస్తూ ఉంటారు.
వెలుగుచున్న అగ్నికి ఆహుతులను సమర్పిస్తూ ఉంటే, అట్టివాని ఆ ఆహుతులు సూర్యకిరణాలలో ప్రవేశించి ఆ కిరణాల ద్వారా ఈ సృష్టియొక్క అధిపతికి జేరుతాయి.
ఓ యజ్ఞకర్తా! రండి! రండి! మిమ్ములను ఇంద్రలోకం మేము జేరుస్తాం!’’....అని ఆ ఆహుతులు యజ్ఞకర్తకు మనో సంబంధమైన శుభవర్తమానాలు పంపుతూ ఉంటాయి.
ఈ విధంగా యజ్ఞ - యాగాలు, అగ్నికార్యాలు వేద ప్రామాణికములు. ఉత్తమలోకాలు చేరటానికి మార్గాలు. సందేహమే లేదు!
అయితే...,
- 16 మంది ఋత్విక్కులు + ‘2’ యజమాని దంపతులు = 18
- అగ్ని, అగ్నిగుండము, సమిధలు,
- అహుతులు - నేయి, పాలు మొదలగునవి,
- సంకల్పము, మంత్రము, ఋత్విక్కులు,
- కర్త, భోక్త, విధి, ఆహ్వానము,
- యజ్ఞపశువు, వప, సంభావన...,
- మంత్రము, తంత్రము
- ఋత్విజుడు, ఋత్విక్కు, హోత, గాత, ప్రత్యాఖ్యాత (నిషేధములు చెప్పువాడు), ప్రతివక్త, ప్రతిగృహీత, ప్రత్యాదేసి..., మొదలైన
వీటినన్నిటినీ ఒకచోటికి చేర్చి ఉత్తమలోకాల కొరకై నిర్వర్తించబడే ‘‘అగ్నికార్యముతో కూడిన యజ్ఞ - యాగములు’’ ఉత్తమలోకాలను ప్రసాదించవచ్చునుగాక!
కానీ, ఏం లాభం?
కర్మలు - కర్మఫలాలు కాలబద్ధము. అట్టి యాగఫలములన్నీ ఊర్థ్వ ఇంద్రాది లోకాలలో ప్రవేశించినప్పుడు - సంపాదించుకున్న డబ్బు ఖర్చు అయిపోతూ వున్న సందర్భము వంటిది మాత్రమే.
అందుచేత ‘‘ఉత్తమ లోకములే మన ఆశయం’’...అని అనుకునేవారి ఆలోచనలు మూర్ఖత్వము మాత్రమే. మా ఉద్దేశ్యములో యజ్ఞ - యాగ - ప్రవచనా పాండిత్యమే సర్వస్వమని తలచేవారు అజ్ఞానముయొక్క నట్టి నడుమ వున్నవారే అగుచున్నారు.
శ్లో।। అవిద్యాయామ్ అన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పండితం మన్యమానాః।
జఙ్ఘన్యమానాః పరియంతి మూఢా
అన్ధేనైవ నీయమానా యథాంథాః (యథా అంధాః)।। 8/ (17)
శ్లో।। అవిద్యాయాం బహుధా వర్తమానాః
‘వయం కృతార్ధా’ ఇత్యభిమన్యన్తి బాలాః।
యత్కర్మిణో న ప్రవేదయన్తి
రాగాత్ తేనా ఆతురాః క్షీణ లోకాశ్చ్యవన్తే ।। 9/(18)
యజ్ఞములు - యాగములలో మునిగి ‘‘మేము గొప్ప లోకాలు పొందుతాం! కనుక కృతార్థులము!’’....అని బాలులవలె భావించటం ఉచితమా? కాదు. గుడ్డివాడిని అనుసరించే గుడ్డివాడు తాను చేరవలసిన చోటుకు చేరగలడా? లేదు. దృశ్య విషయముల గురించి మోహ - రాగ - ఆశ - దృశ్య తాదాత్మ్యము వున్నంతవరకు అట్టి వారు స్వస్వరూపముయొక్క ఔన్నత్యమేమిటో వివరించే పరబ్రహ్మతత్త్వజ్ఞానమును గమనించి ఆస్వాదించలేకపోతున్నారు. తెలుసుకొనవలసిన దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. విదితవేద్యులు కాలేకపోతున్నారు. మరల ఎప్పుడో కర్మఫలభోగానంతరము అథోగతి పాలగుచున్నారు. అవన్నీ దుఃఖమును సమూలంగా తొలగించలేకపోతున్నాయని గుర్తు చేస్తున్నాము.
దుఃఖము (Worry) సమూలంగా తొలగాలంటే? ఆత్మను ఎరిగినప్పుడే దుఃఖం తొలగుతుంది. ఎందుచేతనంటావా? కర్మలు - కర్మఫలములు మాయలోనివే కదా! (తరతి శోకం ఆత్మవిత్)।
మరొక్కసారి చెప్పుచున్నాను :
కర్మఫలములపట్ల లౌకిక ఫలంగా మాత్రమే ఆతురత గలవారు - జ్ఞానమును ఆశ్రయించకపోవటం జరిగితే,....పుణ్యఫలభోగానంతరం మరల క్షీణలోకాలు పొందవలసి వస్తోంది.
యజ్ఞయాగాది కర్మలు → 14 లోకాలలో ఏదో పొందాలనే ఆశయంతో నిర్వర్తిస్తే వాటి ఫలములు కాలబద్ధమే. పునరావృత్తి దోషం చేత మరల మొదటికి రావలసి వస్తోంది.
యాజ్ఞికమైన - స్వధర్మ సంబంధమైన కర్మలన్నీ - ఫలాపేక్షలేని సమర్పిత భావంతో, పార లౌకికాశయంతో నిర్వర్తిస్తే...అవి తప్పక ఆత్మసుఖమునకు దారితీస్తున్నాయి.
కర్మల స్వభావమే అట్టిది మరి!
అందుచేత ఓ బిడ్డలారా! ‘‘యజ్ఞయాగాలు, ఇష్టాపూర్తములు (తనకోసం చేసే ధ్యాన, ప్రార్ధనాదులు - ఇతరుల కోసం చేసే నూతులు త్రవ్వించటం మొదలగునవి) చేస్తున్నాం! మాకు ఆత్మజ్ఞానం ఎందుకు?’’ అని దయచేసి అనుకోకండి.
అనగా....,
యజ్ఞ - యాగ - ఇష్టాపూర్తాలు - ఇవన్నీ చేయండి. అయితే,
మహదాశయము విడిచిపెట్టకుండానే ఉండండి. ‘‘ఆత్మతత్త్వమును ఎరిగినవారమై, దేహ మనో బుద్ధులను అధిగమించి, సర్వత్రా అఖండాత్మ స్వరూపులమై ప్రకాశించెదముగాక!’’ అని భావించండి! ఆత్మ భావనకై సుమర్గానువర్తులై ఉండండి.
ఎవ్వరైతే....,
.... అట్టివారు ఆత్మజ్ఞాన సూర్యునిమార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. ‘‘సర్వుల అంతర్యామి, ఈ సర్వము తనయందు క్రీడగా - లీలగా ధారణ వహిస్తున్నది, సర్వమునకు అప్రమేయమైనది - అగు అట్టి ఆత్మయే నా సహజరూపము. తదితరమైనదంతా స్వకీయ భావనా కల్పితము. మనోకల్పితము’’ ..... అని గ్రహిస్తూ - గమనిస్తున్నవారై ఉంటారు. క్రమంగా ఆత్మసాక్షాత్కారము వైపుగా పయనిస్తూ ఉంటారు. ‘‘అవ్యయము, అమృతరూపము, పరమపురుషుడు’’ అని ఏది వేదములచే గానము చేయబడుచున్నదో, అట్టి అద్వితీయమగు బ్రహ్మమే ‘‘తనయొక్క, తదితరులయొక్క నిత్యసత్యము’’గా నిశ్చలబుద్ధితో జీవితము ఆస్వాదించసాగుచున్నారు! ఆత్మానందమునకు అర్హులగుచున్నారు.
కనుక ఓ శౌనకా!
అధ్యాత్మ చింతన గల నీవంటి ముముక్షువులు ఇహలోక - పరలోక ప్రయోజనములన్నీ ‘‘ఎందుచేత పరిమిత విషయములో, ఎందుకు అపరిమితమగు ఆత్మానంద సుఖమును ప్రసాదించజాలవో’’ గమనిస్తున్నారు. సర్వ ఇహ - పరలోక ప్రయోజనముల, ఆయా లౌకిక ఫలములపట్ల ఉదాశీనులై ఉంటున్నారు!
(సర్వంకర్మాఖిలమ్ జ్ఞానే పరిసమాప్యతే!) సమస్త కర్మలయొక్క అంతిమ ఆశయము, అంతిమ సారము, ఆత్మజ్ఞాన-ఆత్మానందములే. కర్మవ్యవహారములన్నీ కూడా ఆత్మానంద సిద్ధిచేతనే పరిసమాప్తి పొందుచున్నాయి.
అందుచేత ఆత్మతత్త్వజ్ఞానమే (లేక) బ్రహ్మజ్ఞానమే జీవులందరికీ సమస్త దుఃఖముల నివారణకై శరణ్యమై యున్నది!
శ్రీ శౌనకుడు : స్వామీ! సద్గురూ! అంగిరసమునీంద్రా! అట్టి ఆత్యంతికమైన ఆత్మతత్త్వజ్ఞానం లభించటానికి మార్గమేమిటి?
శ్రీ అంగిరసమహర్షి : ఆత్మ తత్త్వజ్ఞానం అనగా ఏమి?
త్వమ్ → తత్ అనగా ఏమి? ‘‘నీవు అదియే అంతేగాని ఇది కాదు’’ → అని కదా! అనగా? నీ స్వస్వరూపమే సర్వస్వరూపము, సర్వము అయి ఉన్నది అని. ఆత్మకు లోక వ్యవహారములతో ఏ మాత్రము ప్రమేయము లేదు. శ్రుతి - స్మృతి - పురాణ - వేద - వేదాంతములనీకూడా- ఆయా వాక్య పరంపరలచే ‘‘నీ సహజ స్వరూపము పరమాత్మయే। తత్త్వమసి।’’....అని చెప్పుకుంటూ వస్తున్నాయి. ఈ జీవుడు తనయొక్క లోకసంబంధమైన, మనో - బుద్ధులరూపమైనట్టి ‘‘సుదీర్ఘము, బలవత్తరము, మూర్ఖము’’ అగు దృష్టిచే కప్పబడి ఉంటున్నాడు. కనుక తత్త్వజ్ఞులగు మహనీయులు విశ్లేషణపూర్వకమైన ఆప్తవాక్యములు జ్ఞానయోగ మార్గములుగా చెప్పుచున్నారు. ఆత్మశాస్త్ర సంబంధమైన వివరణములు, మహనీయుల సోదాహరణములు ఈ జీవునికి తనశివస్వరూపమును నిరూపించి చూపగలవు.
కనుక మహనీయులను శరణువేడి ఆత్మజ్ఞాన సమాచారముల ఉపదేశము పొందటమే ముఖ్యోపాయము.
శ్లో।। పరీక్ష్య లోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణో, నిర్వేదం ఆయాత్ నాస్తి అకృతః కృతేన।
తత్ విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్ఛేత్, సమిత్ పాణిః - శ్రోత్రియం బ్రహ్మ నిష్ఠమ్।।
బ్రహ్మజ్ఞానోపాసకుడైన ముముక్షువు...,
సమిత్పాణి అయి (గురువుకు యజ్ఞమునకై ఉపకరించగల ధర్భలను చేతిలో ఉంచుకొని), ఉత్తమమైన దైవీగుణకర్మలను ఆశ్రయిస్తున్నవాడై ... శ్రోత్రియుడు - బ్రహ్మనిష్ఠుడు అగు గురువును సమీపించుచున్నాడు.
గురుదేవులను శరణువేడాలి. బ్రహ్మజ్ఞానము ప్రసాదించవలసినదిగా అర్థిస్తూ,- తనకున్న సంశయములను ఆ గురువు ముందు ఉంచాలి. వారు ప్రవచించే ఆత్మజ్ఞానసమాచారాన్ని శ్రద్ధగా వినాలి! విచారణ చేయాలి! పరిప్రశ్నించాలి. హృదయస్థం చేసుకోవాలి!
‘‘నేనెవరు? ఈ దృశ్యమేమిటి? ఎక్కడి నుండి ఎందుకొచ్చింది? ఏది తొలగాలి? ఏది ఆశ్రయించాలి? దేనిని ఏ రీతిగా సమన్వయం చేసుకోవాలి?’’....ఇత్యాది ప్రశ్నలను శిష్యుడు గురువు ముందుంచాలి?
ఇక....నిత్యానిత్య వివేకియగు గురుదేవుడు → శిష్యునికి,
అక్షరము (మార్పు చేర్పులు లేనిది),
పరమ పురుషము (జగద్భావనకు ఆవల కేవల పురుషకార రూపమై ఉన్నది),
త్రికాలాబాధ్యము (త్రికాలములలో సత్యమైయున్నది),
తత్ - త్వమ్ నిరూపణము →
అగు బ్రహ్మవిద్యను ప్రవచిస్తున్నారు! బుద్ధిని సంస్కరిస్తూ సర్వ సంశయములు తొలగిస్తున్నారు.
వారు వివరించి చెప్పుచున్న.....
తత్త్వమ్। |
- ‘‘పరమపురుషార్థమగు బ్రహ్మమే నీవై ఉన్నావు’’ అను ‘త్వం’ పట్ల ‘దృష్టి’. |
|
సోఽహమ్। |
- ‘‘అదియే నేను’’ అను రూపమైన - ‘‘సందర్భములకు ఆవలి భావన’’. |
|
జీవో బ్రహ్మేతి నాపరః। |
- ‘‘ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపుడేగాని, అపరము (దేహ-దృశ్య పరిమితుడు కాదు’’ అని ‘‘జ్ఞాపకము’’. |
|
జీవోశివః। శివోజీవః।। |
- (తరంగము జదలమే అయినట్లు) ఈ జీవుడు స్వతఃగా-సర్వాంతర్యామి అగు శివుడే। శివుడే క్రీడా వినోదంగా జీవాంశను ప్రదర్శిస్తున్నారు - అను ‘విద్య’. |
|
శివ తత్త్వ జ్ఞానమ్।। |
- ‘‘త్వమ్ తత్ శివేతి’’-అని సమస్త జీవులను శివస్వరూపంగా అన్వయించుచు ‘‘జ్ఞానము’’. |
| మత్తః పరతరమ్ నాన్యత్ కించిదస్తి |
- ఈ జగద్దృశ్యముగా విస్తరించి ఉన్నది నేనే। నాకు వేరుగా ఏదీ లేదు - అను అవగాహన సందర్శనము. |
ఇత్యాది వేద - వేదాంగ - పురాణాదులు ప్రతిపాదిస్తున్న ‘‘మహావాక్యముల అర్థము’’ను విని - ఆకళింపు చేసుకొని బ్రాహ్మీ దృష్టిని సంపాదించుకోవాలి. మరొకవైపుగా, లోకసంబంధమైన భేదదృష్టిని తొలగించుకోవటానికి ఆ సద్గురువు సూచించే కర్మఫలత్యాగము, ఉపాసనా సంబంధమైన సాధనలు, యోగసాధన ఇత్యాదులను దైనందికంగా ఆశ్రయించి ఉండాలి.
అప్పుడు - ‘‘నేను సర్వదా బ్రహ్మమునే! సదాశివ బ్రహ్మమును!’’....అని గ్రహించిన శిష్యుడు బ్రహ్మమే తానై ప్రకాశిస్తున్నాడు!
3.) ద్వితీయ ముండకము - ప్రథమ ఖండము
ఆ పరబ్రహ్మమే నీ హృదయేశ్వరుడు! నీవు సర్వదా పరబ్రహ్మమే।
శ్రీ శౌనకుడు : హే భగవాన్! అంగిరసమహర్షీ! ఈ కనబడే అసంఖ్యాక జీవులతో కూడిన ఈ భూ-పాతాళ - స్వర్గ ఇత్యాది 14 లోకాలు, ఈ బ్రహ్మాండములు, పంచభూతములు, ఈ వివిధ జీవుల వేరువేరైన స్వభావములు - ఇవన్నీ ఎక్కడి నుండి ఉద్భవిస్తున్నాయి?
శ్రీ అంగిరసమహర్షి : అవన్నీ ఎందులో ఆవిర్భవిస్తున్నాయో, ఎందులో ఉంటున్నాయో, ఎందులో లయిస్తున్నాయో....అదియే నీ-నా కేవల స్వరూపమగు పరబ్రహ్మము. అదియే ‘ఓం’ ‘సత్’ ‘తత్’ అను వేద శబ్దములను సూచిస్తున్న సత్యము (యమ్ సత్).
ఇక ఈ వివిధ జీవుల చమత్కారమంతా ఏమిటంటావా? ఒక దృష్టాంతం ద్వారా చెప్పుచున్నాను. వినండి!
ప్రజ్వరిల్లుచున్న అగ్నినుండి అనేక విస్ఫులింగాలు (నిప్పురవ్వలు) అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్నాయి చూచావా? ఆ విస్ఫులింగాలు మరల విశ్వాగ్నిలో కలిసిపోతున్నాయికదా! అట్టి నిప్పురవ్వలకు ఆకారాలు ఉండవచ్చుగాక! అగ్నికి ‘ఇది ఆకారము’ అనునది ఏమున్నది?
అట్లాగే....
అక్షరము అనిర్దేశ్యము (changeless and undefinable) అగు పరబ్రహ్మమునుండి అనేక జీవులు - జీవరాసులు వాటి - వాటి స్వరూప స్వభావములతో సహా బయల్వెడలుచున్నాయి. పరబ్రహ్మమునందే ఉనికిని కలిగి ఉంటున్నాయి. పరబ్రహ్మమునందే లయిస్తున్నాయి. మట్టితో బొమ్మలు అగుచున్న విధంగానే, ‘పరబ్రహ్మము’తోనే ఈ జీవులంతా తయారగుచున్నారు.
మట్టి చేసిన బొమ్మలో మట్టి అక్షరము - ‘బొమ్మ’ ఆకారము తొలగించినంత మాత్రాన - ‘‘ఆకారము మట్టితో కలిసిపోయింది’’ - అని అనము కదా! అట్లాగే ఈ జీవుడు స్వతఃగా సర్వదా పరబ్రహ్మమే అయి ఉండగా - ‘‘జీవుడు అక్షర పరబ్రహ్మములో కలియుచున్నాడు’’- అనే మాటకు చోటెక్కడిది?
అట్టి అక్షర పరబ్రహ్మము గురించిన కొన్ని చమత్కారమైన విశేషాలు చెప్పుచున్నాను. అందరూ వినండి!
దివ్యము (Divine) : అది స్వయం ప్రకాశమానము. అదియే అన్నిటినీ ప్రకాశింపజేస్తోంది. అద్దానిని ప్రకాశింపజేసేది మరొకటేదీ లేదు! అందుచేతనే - ‘‘పరంజ్యోతి’’, ‘‘ఆత్మజ్యోతి’’, ‘‘అఖండజ్యోతి’’, ‘‘స్వయంజ్యోతి’’ ‘‘జ్యోతిషామపి తత్ జ్యోతి’’ - అను విశేషణములతో స్తుతించబడుతోంది.
అమూర్తః (Formless) : అన్ని రూపములు అద్దానివే అయి ఉండటంచేత అది నిరాకారము. మట్టితో అనేక బొమ్మలు చేస్తే... బొమ్మలకు ఆకారం ఉంటుందిగాని, ‘‘మట్టికి ఈ ఆకారము ఉన్నది’’ అని అనగలమా? లేదు కదా! అగ్నికి రూపం లేదు. కాని, ఏ వస్తువును దహిస్తోందో,...అద్దాని రూపంగా కనిపిస్తుంది. కదిలే దేహమునకు రూపమున్నదిగాని, కదిలించే దేహికి రూపమేమున్నది? అట్లాగే బ్రహ్మమే ఈ జగత్తుగా కనిపిస్తున్నప్పటికీ (జగత్తులోని వస్తువులకు నామ - రూపాలు ఉన్నప్పటికీ), బ్రహ్మము నిరాకారము. అమూర్తము. ఆకారం ఉంటే కదా,...పొడవు-వెడల్పులు, ఎత్తు-పొట్టి మొదలగునవి)? ఆకారము లేదు కాబట్టి, బ్రహ్మము అనంతము కూడా. అయితే ‘‘ఈ సమస్త ఆకారములు పరబ్రహ్మమునకు చెందినవే’’ - అని కూడా యుక్తియుక్తంగా గానం చేయబడుతోంది.
పురుషః (That which is making everything to work) : సర్వజీవులలోని పురుషకారము పరబ్రహ్మమే। అద్దాని ఉత్తేజము - ఉద్దేశ్యములే సర్వ జగత్తులలో పురుషకారముగా ప్రదర్శనమవటం జరుగుతోంది. జీవుడుగా కనిపిస్తున్నది అదే।
బాహ్య - అభ్యంతరోహి (Manifestation as external and internal) : (దృష్టాంతంగా) ఒకాయన ఏదో కలకంటున్నాడు. ఆతని స్వప్నచైతన్య విశేషమే. →
→ స్వప్న సాక్షిగాను (దృక్‌గాను/దర్శించు చున్నవాడుగాను)....,
→ స్వప్నంలోని స్వప్నద్రష్టగాను....,
→ స్వప్నంలోని అనేక సుఖదుఃఖ - ఇష్ట అయిష్ట - ఉత్సాహం నిరుత్సాహ విశేషాలుగాను,
స్వప్నదృశ్యమంతాగాను - కనిపిస్తోంది కదా!
స్వప్నముయొక్క రచయిత ఎవరు? స్వప్నసాక్షియే కదా!
అదే విధంగా ఆ జీవుని ‘‘జాగ్రత్ చైతన్య విశేషమే’’, (లేక) ఈ జీవుని స్వస్వరూప-జాగ్రత్ ప్రజ్ఞయే →
- జాగ్రత్ సాక్షి (దృక్ - దర్శించువాడుగాను)...,
- జాగ్రత్‌లోని జాగ్రత్ ద్రష్టగాను...,
- జాగ్రత్‌లోని సర్వ అనుభూత విశేషాలుగాను...,
ఆతనిపట్ల స్వయంకృతంగా ప్రదర్శితమౌతోంది. జాగ్రత్‌యొక్క సాక్షియే జాగ్రత్ సర్వభావ రచయిత కదా! ఇదియే గుహ్యతమము ((The secret of the secrets).
అదే తీరుగా....సర్వాత్మకమగు మహదాత్మయే ఈ విశ్వముయొక్క విశ్వరచయిత!
విశ్వములోని సర్వజీవులుగా - సర్వదృశ్యజాలములుగా, 14 లోకాలలోని సర్వ విశేషాలుగా ప్రదర్శితమగుచున్నది పరబ్రహ్మమే!
ఆత్మయే....
- జీవుల బాహ్యానుభవాలుగాను,
- జీవుని ఇంద్రియాలు - ఇంద్రియ విషయాలుగాను,
- జీవుల అంతరంగ విశేషాలైనట్టి మనో - బుద్ధి - చిత్త -అహంకారాలుగాను,
ప్రదర్శితమగుచూ వున్నది. ఈ విధంగా ప్రతిజీవుని జగదనుభవము యొక్క బాహ్య - అభ్యంతరములలో ఆత్మయే వేంచేసియున్నది!
అజః : ఈ జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఉత్పత్తి - ప్రదర్శనము - మార్పు చేర్పులు - వినాశనము కలిగియున్నది. ఈ మనందరి భౌతిక దేహాలే వినాశనశీలమని మనమందరము గమనిస్తున్నదే. ఇక తదితర వస్తు సముదాయము గురించి మనం పెద్దగా చెప్పుకోవలసినదేమున్నది.
అట్లాగే మనోబుద్ధి చిత్త అహంకారాలలోని అంతర్గత-బహిర్గత విశేషాలు కూడా మార్పు - చేర్పు చెందుచున్నాయని మనకు తెలుస్తున్న విషయమే! కానీ,.....
మనందరి స్వస్వరూపమే అయివున్న పరబ్రహ్మమునకు జనించటం-గతించటం అనే (జ+గత=జగత్) ధర్మము లేదు.
అప్రాణో : అది ప్రాణము కాదు. ప్రాణములను (వాయుతరంగ రూపములను + శక్తిని) తన ఉత్తేజముచే కదలించునది. కదలిక యొక్క వేరు వేరు విన్యాసలే ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన - సప్రాణములు. ప్రాణశక్తి ఆత్మది. అంతేగాని ఆత్మ - అది ప్రాణము కలిగినట్టి ఒకానొకటి కాదు! పరబ్రహ్మమునకు ప్రాణధర్మములు లేవు. విద్యుత్తు యంత్రమును కదల్చుచుండవచ్చు గాక! విద్యుత్తు యంత్రములు కదల్చు స్వభావము రూపము ఉన్నది - అని అనం కదా!
అమనాః : జలము నుండి తరంగము ప్రదర్శితమౌతోంది. ‘‘తరంగము లేనప్పుడు, ఇక జలమునకు ఉనికి ఉండదు!’’...అని అనగలమా? లేదు. అనలేము. మనస్సు లేనప్పుడు కూడా పరబ్రహ్మము ఉన్నది. జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు ‘సాక్షి’ అయి ఉన్నది.
శుభ్రో : ఏ వికారము లేనిది. అవ్యాకృతము సర్వ వికారములకంటే భిన్నమైనది.
అక్షరాత్ పరతః (అక్షరమునకు ఆవల ఉన్నది) : జీవాత్మ అక్షరము. తదితరమైన లోక - దేహ - గుణాదులన్నీ క్షరము. సర్వాత్మ జీవాత్మకన్నా విశేషమైనది. సర్వజీవాత్మలు తానై యున్నది - (సర్వతరంగములు జలమే అయినట్లుగా)। బంగారు ఖనిజమే (లోహమే) బంగారు ఆభరణముగా వున్నట్లు - పరమాత్మయే జీవాత్మ। పరమాత్మయే ఈ సమస్తము కూడా। ఆయనయే ప్రతి జీవుని స్వాభావికమగు పురుషోత్తముడు (ఉత్తమ పురుష। ""I" in everybody").
(యస్మాత్ క్షరమ్ అతీతో-హమ్ అక్షరాదపి చ ఉత్తమః,
అతో-స్మి లోకే వేదే చ ప్రదిత ‘‘పురుషోత్తమః’’!)
[ఒక వ్యక్తికి దేహమే ఉపాధి. ఒక ఉద్యోగికి ఉద్యోగమే (Officer, General Manager etc.,) గుర్తుగా గల ఉపాధి).]
అట్లాగే...
ఆ పరమపురుషునికి ‘మాయ’యే ఉపాధి.
అట్టి ‘మాయోపాధి’ నుండి ప్రాణశక్తి (Energy Force), మనస్సు (Thought), ఇంద్రియములు (The Physical organs namely -Ears, Skin, Eyes, Tongue and Nose), ఆకాశము (Space), వాయువు (Vapour), అగ్ని (Heat), జలము (Liquid), పృథివి (Solid) ...ఇవన్నీ బయెల్వడలుచు, దృశ్యమానమగుచున్నాయి.
ఓ బిడ్డలారా! ఒక వ్యక్తి → దేహి + దేహము కలిపి కదా, మనకు కనిపిస్తున్నది! ఈ విశ్వమంతా ఒక దేహము → అని...అనుకుంటే...ఈ విశ్వముయొక్క దేహియే పరబ్రహ్మము. అదియే నీలోని నాలోని - జాగ్రత్, స్వప్న, సుషుప్తి సాక్షియగు ‘నేను’ కూడా।
అట్టి విశ్వస్వరూపుడు - విశ్వేశ్వరుడు అగు పరబ్రహ్మమును విరాట్ రూపుడుగా కవులు వర్ణిస్తూ ఉన్నారు.
అట్టి మూర్తీభవించియున్న పరబ్రహ్మమునుండి సూర్యునే సమధ (కట్టె)గా చేసుకొని అగ్ని (Heat) బయల్వెడలుతోంది. సూర్యతత్త్వం నుండి చంద్రతత్త్వం (Cool), చంద్రుని నుండి మేఘాలు, ఆ మేఘాల నుండి ఓషధ రూపమగు భూమి, ఆ ఓషధుల నుండి రేతస్సు, ఆ రేతస్సుకు నుండి స్త్రీ పురుషరూపులగు జీవులు బయల్వెడలుచున్నారు. ఓషధలులోనుండి జీవులను పరిపోషిస్తున్న ‘ఆహారము’ ప్రసాదితమవుతోంది.
ఆ పరబ్రహ్మము నుండే →
పంచభూతాలు, వివిధ లోకములు.
ఒక్కొక్క లోకంలో దేవతలు, మానవులు, జంతువులు, పక్షులు, తదితర అసంఖ్యాక జీవ - జంతు జాతులు, వారి వారి ఉచ్ఛ్వాస - నిశ్వాసలు. ఆహారముగా నవ ధాన్యాలు.
ఆ జీవులకు సంబంధించి తపస్సు, శ్రద్ధ, సత్యము, బ్రహ్మచర్యము, విధులు - నిషేధాలు (Do's and Donts).
ఋక్ - యజుర్ - వేదములు.
పరమాత్మను స్తుతించే గానములతో కూడిన సామవేదం.
సృష్టి తత్త్వమును విశదీకరిస్తున్న అథర్వణవేదము.
యజ్ఞ విధులు, దక్షిణలు, వివిధ యజ్ఞములు, క్రతువులు, యజమాని.
కాలరూపమైన సంవత్సరములు. నెలలు, పక్షములు, రోజులు, గంటలు, నిముషములు, సెకనులు.
పంచాగ్నులు =
సప్త ప్రాణశక్తులు = ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన - సప్రాణములు - ముఖ్య ప్రాణ - ప్రాణేశ్వరులు.
సప్త హోమాలు
సప్త లోకాలు
సప్త సముద్రములు.
సూర్య చంద్రులచే పవిత్రం చేయబడుచున్న అనేక స్థానాలు.
గుహలు, నదులు, సరస్సులు, తటాకములు, పాతాళజలములు.
వివిధ అధిష్ఠాన దేవతలు, దిక్ దేవతలు, స్థలదేవతలు, వారి - వారి పరివారములు, వారి వారి లోకాలు.
తపస్సు - శ్రద్ధ - సత్యము - బ్రహ్మచర్యము - నిష్ఠ -నియమము మొదలగు వాటితో కూడిన కర్మ విధి - విధానములు.
పర్వతములు, పర్వతగుహలు, నదులు, ద్వీపములు, ద్వీపకల్పములు.
.... ఇటువంటి వర్ణనాతీతమగు వస్తు - విషయ - జీవ సముదాయమంతా (ఆ పరబ్రహ్మమునుండే) అభిన్నమై భయల్వెడలుచున్నాయి. ఈ విశ్వమంతా ఆత్మయొక్క విన్యాసమే! ఆత్మయొక్క భావనా చమత్కృతియే! ఈ విశ్వ నిర్మాణమంతా ఆత్మయొక్క పరివృత (Filled up) మూర్తీభవ విశేషమే! ఆత్మ దీనినంతటికీ అనన్యం. ఇదంతా ఆత్మకు అనన్యం! ఈ సమస్త విశ్వముగా మూర్తీభవించిన పరమాత్మయే సమస్త దేహములలో ‘మూర్తి’ అయి వెలయుచున్నారు.
శౌనకుడు : హే భగవాన్! అంగీరస మహర్షీ! అటువంటి పరమాత్మయొక్క ఉనికి ఎక్కడ? అద్దానిని మేము ఎట్లా ఎక్కడ దర్శించగలుగుతాం? అద్దాని ఔన్నత్యమేమిటి? ఇవన్నీ వివరించండి!
శ్రీ అంగీరసమహర్షి :
శ్లో।। పురుష ఏవ ఇదగ్ం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతమ్।
ఏతత్ యో వేద నిహితం గుహాయాం
సో అవిద్యాగ్రంథిం వికిరతీహ। సోమ్య!
ఓ సోమ్యా! శౌనకా! నీకు అనుభవమౌతున్న ఈ విశ్వము, ఇక్కడి సర్వ కర్మ వ్యవహారములు, సర్వజీవులయొక్క తపనలు, (తపస్సులు). అమృతస్వరూపుడగు పరమాత్మయొక్క ప్రత్యక్షరూపమేనయ్యా! పరమాత్మయే ఈ సమస్తము అయిఉండి,...మనో దృష్టికి నామరూపాత్మకమైన (మనం పైన చెప్పుకున్న) సర్వవిశేషాలుగా కనిపిస్తోంది! ఆత్మజ్ఞులకు - ఇదంతా కూడా, అనేకంగా కనిపిస్తూ ఏకమగు పరమాత్మగా అనిపిస్తూ, ఇదంతా తమ హృదయాంతరంగములోనే ఉన్నట్లుగా ఆస్వాదిస్తున్నారు!
ఎవ్వడైతే....
అట్టి పరబ్రహ్మము తన హృదయ గుహలోనే తనకు సర్వదా అనన్యమై ఉన్నదానిగా తెలుసుకొంటున్నాడో, గమనిస్తున్నాడో, దర్శిస్తున్నాడో, ఆస్వాదిస్తున్నాడో,
... అట్టివాడు తనయొక్క - అజ్ఞానము అనే చిక్కుముడిని (అవిద్యా గ్రంథిని) ఇక్కడికిక్కడే, ....ఇప్పుడే తెగవేసి, ఈ జన్మలోనే ముక్తుడగుచున్నాడు. (Having been relieved of all bottlenecks for enjoying sense of Divinity).
‘‘నాకు జగత్తు బంధము కాదు. నేనే సర్వదా జగదాత్మ స్వరూపుడను!’’ అను పరమార్థముతో ప్రకాశిస్తున్నాడు!
4.) ద్వితీయ ముండకే - ద్వితీయ ఖండః
‘‘అది నీ ఆత్మగానే నీయందు ప్రకాశిస్తోంది!’’
శ్రీ అంగిరసమహర్షి : ఓ శౌనక మహాశయా! ఇదంతా వింటున్నట్టి బిడ్డలారా! వేదములచే, వేదాంగములచే, వేదజ్ఞులచే, ఆత్మజ్ఞులచే - ఆత్మయొక్క ఉనికి - స్థానము - ఔన్నత్యముల గురించి ఇంకా కూడా ఏమేమని చెప్పబడుతోందో....అట్టి మరికొన్ని విశేషాలు మీ అందరి ముందు ఉంచుచున్నాను. వినండి!
‘ఆత్మ’యే స్వరూపముగా గల ‘ఓం’ సంజ్ఞాయుతమైన ఆ పరబ్రహ్మము మనలోని ప్రతి ఒక్కరికి అత్యంత సన్నిహితమైయున్నది (That is the closet of all to every body of us). అత్యంత సామీప్యమైనది. ఇంకొంచం నిర్దుష్టంగా చెప్పాలంటే....అద్దాని స్వయం ప్రకాశ ప్రదర్శనమే ఈ మనమంతా కూడా! మనందరి హృదయ గుహలే అద్దానియొక్క ఉనికి - సంచార ప్రదేశము కూడా! ఆత్మకు మించినది, ఆత్మకు వేరైనది మరెక్కడా ఏదీ లేదు! అదియే మహత్తరమైనది. ఆ బ్రహ్మమే మనందరికీ కూడా స్వభావసిద్ధమైన నిత్యాశ్రయము. ఈ ప్రత్యక్ష - అనుభవైక వేద్యమంతా బ్రహ్మమే అయిఉన్నది.
మనమందరము ఉనికిని (సత్) కలిగియున్నది - ఆ బ్రహ్మమునందే! ఇక్కడ మనకు కనిపించేదంతా బ్రహ్మమే। కదిలేవి, కదిల్చేవి, కదలనివి, ప్రాణము లేనివి, ఉన్నవి (జడ - చైతన్యములు), రెప్పలు వాల్చేవి, రెప్పలు వాల్చనివి (భూ-పాతాళ జీవులు - దేవతా జీవులు) - ఇవన్నీ బ్రహ్మమునందే (బంగారమునందు ఆభరణత్వమువలె) - అమర్చబడినవై ఉన్నాయి. తెలియబడేది - తెలుసుకుంటున్నది,... ఉభయము పరబ్రహ్మ చమత్కార ప్రత్యక్షరూపమే!
యత్ ప్రజానాం వరిష్ఠం - ఏదైతే జీవులందరిలో, ప్రతి ఒక్క జీవునిలో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనదియో, ఏది సత్తు - అసత్తుగా అనుభూతమౌతూ ఉన్నదో, ఏది వరేణ్యం - సర్వారాధ్యమో, (ఉపాసించబడుచు, ఆరాధించబడుచూ) - ఆస్వాదించబడుచూనే ఉన్నదో.... అదియే -- మనలో సర్వదా వేంచేసియున్న ‘‘అహం-త్వంలను తనయందు అంతర్భాగముగా కలిగియున్న - అతీత అఖాండాత్మ’’.
ఏదైతే ....
అదియే అక్షరము, మార్పు చేర్పులకు అవిషయము అగు బ్రహ్మము.
ఆ బ్రహ్మమే....
- ప్రాణశక్తి రూపంగాను,
- వాక్ - మనో రూపంగాను - అనుభూతమౌతోంది.
అదియే పరమసత్యము! అమృతస్వరూపము. నాశరహితము. మీ స్వరూపము! నా స్వరూపము! సర్వ స్వరూప సాక్షి!
బిడ్డా! అదియే లక్ష్యముగా లక్ష్యశుద్ధి కలిగి ఉండవలసిన వస్తువు. అదియే మనం సర్వదా తెలుసుకొని ఉండాలయ్యా!
ఓ సోమ్యుడా!
అందుకు మార్గం వివరిస్తున్నాను. విను.
ఉపనిషత్ సాహిత్యం - తత్ - త్వమ్ అసి (నీవు అదియే అయి ఉన్నావు) అనే ఒక మహాస్త్రాన్ని మనందరికి ప్రసాదిస్తోంది. ఆ ధనస్సుతో ఉపాసన (Cogitation - Meditation - Repeated Thought practice - adoration) అనే శరమును పదును చేసుకొంటూ సంధించు.
‘‘ఈ కనబడే జీవులు - సంబంధాలు - అసంబంధాలు పరబ్రహ్మమునకు సదా అద్వితీయం కదా!’’....అనే తత్ భావనచే ఏకాగ్ర దృష్టికి పదును పెట్టుకో (Please by interpreting all this as diverse manifestation of Unity).
బుద్ధిని సునిశితం చేయి!
అట్టి ‘చింతన’ యందు చిత్తమును లగ్నం చేయి!
‘‘అవినాశమగు బ్రహ్మమే నేను కదా!’’ అనే లక్ష్యమును ఛేదించు. చేరుకో!
తత్త్వ దృష్టిని (‘నీవు’గా కనిపిస్తున్నది పరమాత్మయే అను దృష్టిని) హృదయమునందు పదిలపరచుకొని జగత్తులో నివసించు.
బాణము లక్ష్యమును తాకి ఛేదించినట్లు (1) బ్రహ్మమును ఎరుగటం (2) తన్మయమగుట (3) తత్ అద్వితీయంగా నిన్ను నీవే తీర్చిదిద్దుకోవటం - ఇట్టి కార్యక్రమములో నిత్యము అప్రమత్తుడవై ఉండు. ప్రమత్తుడవై ఉండవద్దు.
ఎందులో అయితే...
ద్యులోక (స్వర్గలోకము), భూమి (భూలోకము), అంతరిక్షము (ఆకాశము), సర్వప్రాణులు (సహజీవులంతా), సర్వుల మనస్సులు - మనో విశేషాలు, భూమ్యాకాశాలు, వాటి మధ్యగల అంతరాళము - అమరి ఉన్నాయో, అదొక్కటే నీ లక్ష్యమై ఉండుగాక! అది నీ ఆత్మ స్వరూపమేనని గ్రహించటమొక్కటే పని!
ఇక మిగతా వాక్ ప్రవాహమంతా ప్రక్కకు పెట్టు. తదితరమైనదంతా అర్థం చేసుకుంటూ - క్రమంగా త్యజించి వేయి. సర్వము నీ ఆత్మస్వరూపంగా ఆస్వాదించు. అట్టి ఆత్మజ్ఞానమే ఈ సంసారము నుండి అమృతతత్వమునకు వారధి (Barriage) అయి ఉన్నది.
• రథము యొక్క నాభియందు ఇరుసు నాభివైపుగా - ఆకులు (Designs of leaves) అమరి ఉన్నట్లుగా, నీ దేహములోని నాడులన్నీ హృదయము వైపుగా అనుసంధానము కలిగి ఉన్నాయి.
- అట్టి నీ హృదయం లోపలనే....
- ఆత్మ అనేక రీతులుగా (సర్వజగత్ జీవ -గుణ విశేషాలుగా)....
లీలా వినోదంగా సంచారాలు సలుపుచున్నది. అట్టి సర్వాత్మకమగు స్వస్వరూపాత్మను ‘ఓం’ అనే వేద - వేదాంత ప్రవచిత సంజ్ఞతో ధ్యానించు. ధ్యాసయే ధ్యానం। తద్వారా అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసుకో! అట్టి ‘‘ఆత్మౌపమ్యేవ సర్వత్ర’’ అను సుస్పష్టత వైపుగా అడుగులు వేస్తున్న నీకు స్వస్తి అగుగాక!
నాయనా! ‘‘నేను అజ్ఞానాంధకారంలో చిక్కుకున్నానే’’....అని దిగులు పడకు. జాగుచేయనూ వద్దు.
• ఆత్మ సర్వజ్ఞుడు. ఆత్మకు అంతా తెలిసియే ఉన్నది.
• ఆత్మను సమగ్రంగా (Comprehensively) తెలుసు (సర్వవిత్). సమస్తము ఆత్మయందే అమర్చబడినది.
• నీవు ఆత్మయే అయి ఉన్నావు.
ఈ కనబడే దృశ్యమంతా, ఈ భూ ప్రపంచమంతా నీ ఆత్మయొక్క మహిమయే! ఆత్మ వైభవమే!
హృదయాకాశంలో హృదయాకాశంగా జ్యోతిర్మయమై ప్రకాశిస్తున్నది నీ ఆత్మయే। ఆత్మజ్యోతి స్వరూపుడవై నీవే సమస్త హృదయములలో ‘అహం’ జ్యోతిగా వెలుగొందుచున్నావు. సమస్త జీవులలో ప్రదర్శనమగుచున్న ‘‘పరంజ్యోతి’’వి నీవే।
• మనస్సు అద్దాని వస్త్రము.
• అట్టి ఆత్మ ప్రాణ - శరీరాలకు అధినేత (Owner).
• ఆత్మయే హృదయంలో వేంచేసి నీ శరీరమంతా విస్తరించియున్నది.
వివేకంచేతను, ఉపాసన చేతను ఆత్మజ్ఞులు - అగు ధీరులు అట్టి ఆనందమయ ఆత్మతో అవినాభావత్వం సాక్షాత్కరించుకొని, సర్వే - సర్వత్రా ఆత్మస్వరూపులై వెలుగొందుచున్నారు. నీవు కూడా ఆ మార్గంలో అడుగులు వేయి.
ఈ జీవుని అంతర్గతమైన దిగుళ్ళు తొలగటానికి - ఇది మాత్రమే ఏకైక మార్గము.
ఆత్మస్వరూపుడవై పరాపర దృష్టి విజ్ఞానమయం - అనుభూతమయం చేసుకో.
ఆ విధంగా ‘‘కనబడేదంతా మమాత్మౌతేజోవిశేషమే’’ అనే పరావరదృష్టి అనుభూతమగుచూ ఉండగా...,
నాయనా! ఆత్మవేత్తలు ఉన్నారు.
• నిష్కళంకమై - నిర్దోషమై,
• అవిద్యాదోషములచే స్పృశించబడనిదై,
• బాహ్య - అభ్యంతరములలో - దృశ్య, దేహ, మనో, బుద్ధి, చిత్త, అహంకారాలంతా నిండియున్నదై,
• జ్యోతులకే జ్యోతి స్వరూపమై,
అంతటా అన్నీగా ప్రకాశమానమగుచున్న పరబ్రహ్మము వారు తెలుసుకొనియున్నారు. ఆస్వాదిస్తున్నారు. మనపై కరుణతో ప్రవచిస్తున్నారు.
అట్టి ఆత్మానంద పరవశుల పాఠ్యాంశాలు జాగరూకడవై మరల - మరల విను!
ఆత్మస్వరూపమగు పరబ్రహ్మము సమక్షంలో →
‘‘వీటన్నిటి ప్రకాశంలోనే ఆత్మను వెతకి దర్శిస్తాను’’...అని అనుకోకు!
మరి?
ఇవన్నీ కూడా....
ఆత్మ ప్రకాశములో కాంతులీనుచున్నాయి.
ఆత్మ ప్రకాశం చేత ఇవన్నీ ప్రకాశం పొంది వెలుగుచున్నాయి.
5.) తృతీయ ముండకే - ప్రథమ ఖండః
‘‘జీవ - ఈశ్వర, ఇహ - పర, సందర్భ - కేవల’’
ఒకానొక పెద్ద వృక్షం! ఆ వృక్షమును రెండు పక్షులు ఆశ్రయించి ఉంటున్నాయి.
ఆ రెండు పక్షులు ఒకదానిని మరొకటి వదలక పరస్పర ‘సమక్ష-సందర్శనములు’ కలిగియే ఉంటున్నాయి.
అందులో ఒక పక్షి ఆ వృక్షమునకు కాస్తున్న ఫలములను (పళ్ళను) ఎంతో ఆసక్తి - అభిని వేశములతో రుచిచూస్తూ కొమ్మ - కొమ్మలపై ఎగిరెగిరి గంతులేస్తోంది.
ఇక, రెండవ పక్షి తానేమీ తినక, స్వీకరించక, అతీతంగా - మౌనంగా - ప్రశాంతంగా - ఆనందంగా అన్నీ గమనిస్తూ ఉన్నది.
ఆ రెండు పక్షులు ఒకే వృక్షంమీద నిమగ్నమై ఉన్నాయి. అయితే మాత్రం ఏం? ఒక పక్షి - (జీవాత్మ...)మోహము, భ్రాంతి పొందుచు కొన్నికొన్నిసార్లు నిస్సత్తువగా దుఃఖిస్తూ ఉన్నది. అట్లా దుఃఖిస్తూ - వేదన చెందుతూ ఎప్పుడో ఒక సమయంలో - తన ఆరాధ్యమూర్తి, ప్రభువు అగు మరొక పక్షిని - (పరమాత్మను), అద్దాని వైభవాన్ని చూడటం జరుగుతోంది. అట్లా మహామహితాన్వితమైన రెండవ పక్షియొక్క (ఈశ్వరునియొక్క) దర్శనమవగానే ‘‘ఓహో! నాకేమి లోటు? వీటితో (కొమ్మలతో) నాకేమీ సంబంధము?’....అని ఈ జీవాత్మ పక్షి ప్రశ్నించుకొని ప్రశాంతపడుతోంది. దుఃఖమంతా త్యజించివేస్తోంది. (It is leaving aside all worries at its core).
అనగా...
ఎప్పుడైతే మొదటి పక్షియగు జీవాత్మ →
సర్వోత్తమమైన సమస్థితిని పొందుచున్నాడు.
• పరమాత్మ ప్రాణస్వరూపుడై సర్వప్రాణులయందు శక్తిప్రదాత అయి విరాజిల్లుచున్నారు.
• అట్టి పరమాత్మత్వమే నా సహజ రూపము. తదితరమైనదంతా సందర్భసత్యము. కథలోని పాత్రలవలె కల్పితము.
అని గమనించి, తెలుసుకొనుచున్నవాడు - ఇక ‘వేరు - వేరు’కు సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడడు. అతిగా (ఆత్మకు వేరైన విశ్లేషణలు) సంభాషించడు. వట్టి మాటకారి కాడు. సదా ఆత్మభావనానందమునందు తేలియాడుతూ, తదితర దృశ్య కల్పిత విషయములపట్ల అంతరంగమున మౌనం వహించినవాడై ఉంటాడు.
ఆత్మయందు రమిస్తూ...,
ఆత్మయొక్క క్రీడగా ఇదంతా దర్శిస్తూ...,
ఆత్మయందే ఆసక్తి కలిగినవాడై ఉంటాడు.
తత్సంబంధమైన జ్ఞాన - ధ్యాన - వైరాగ్య ఇత్యాది కార్యక్రమములందు మాత్రమే అభిరుచి - శ్రద్ధ కలిగి ఉంటాడు.
క్రమంగా బ్రహ్మజ్ఞానులలో అగ్రగామిగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఉంటాడు.
ఆత్మయందే నిష్ఠగల మహనీయులు క్రమంగా దృష్టియొక్క దోషములను తొలగించుకుంటూ సత్యము, తపస్సు, ధ్యానము, జ్ఞానము - బ్రహ్మచర్యములను చక్కగా - నిరంతరాయంగా సేవిస్తూ...‘‘నిర్మలము - జ్యోతిస్వరూపము - అఖండము’’ అగు ఆత్మను తమ శరీరమునందే (తమయందే) సిద్ధించుకొంటున్నారు. ఆత్మ మనస్సుచేత మనస్సునందే లభించుచున్నదగుచున్నది.
సత్యమేవ జయతి. నానృతం।
సత్యనిష్ఠులే (యమ్‌సత్ - సత్యరూపమగు ఆత్మపట్ల నిష్ఠగల వారే) - అజ్ఞానభ్రమలను జయిస్తున్నారు. అసత్యమునందు (కల్పిత దృశ్యమునందు) నమ్మకముతో కూడిన ధ్యాస గలవారు అసత్యవాదులు అనబడుచున్నారు. వారు ఆత్మత్వమును పుణికిపుచ్చుకోలేకపోతున్నారు.
- ఆప్తకాములు (ప్రపంచంలో పొందవలసినది ఏమీ లేనివారు, కోరికలు జయించినవారు)
- ఋత్‌ను (సత్యమును) ఉపాసించువారు, పరమపదమును చేరుచున్నారు. అంతా స్వస్వరూపంగా అనుభూతం చేసుకొని ఆస్వాదిస్తున్నారు.(స్వానుభవమ్ ఋత్ ప్రకటితీతి ఋషిః)
ఓ శౌనకా! ఈ ఆత్మ
ఈ విధంగా ఆత్మతత్త్వోపాసకుడగు మహనీయునికి స్వహృదయమునందే అది లభిస్తోంది. ఎందుకంటే ఆత్మయొక్క ఉనికిస్థానము ప్రతిఒక్కని హృదయగుహయే సుమా! (అంతేగాని, బాహ్యమున ఏదో లోకములో కాదు).
ప్రియ శౌనకా! ప్రియ శ్రోతలారా!
ఆత్మ ఎటువంటిదంటే...
పరిశుద్ధమగు అంతఃకరణముతో ఆత్మజ్ఞానము చేత ‘‘మమాత్మయే కదా, ఈ కనబడేవారంతా, ఇదంతా’’...అను నిష్కళంక ధ్యానము (ధ్యాస)చే మీరంతా ఆత్మవిశుద్ధ బుద్ధులైతే తప్పక (బుద్ధితో) ఇక్కడ సందర్శించగలుగుతారు. ఇందులో సందేహమే లేదు.
ఏ ప్రాణశక్తి (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనబడే) పంచప్రాణముల రూపంగా ప్రవేశించిందో, అట్టి ఈ శరీరమునందే అణు (సూక్ష్మాతిసూక్ష్మ subtle to subtle) స్వరూపమగు ఆత్మను శుద్ధమైన - సూక్ష్మమైన - నిర్మలమైన చిత్తముతో సందర్శించాలి.
ఆత్మయొక్క వైభవమును (వైభవరూపమగు జగత్ దృశ్య వ్యవహారమంతా) అంతరంగమునందే విజ్ఞులు తెలుసుకొనుచున్నారు! గాంచుచున్నారు। ఉపాసించుచున్నారు. ఆస్వాదించుచున్నారు। మమేకమగుచున్నారు।।
స్వచ్ఛమైన చిత్తమునకు ఆత్మ అంతరంగమునందే పరిలభ్యమగుచున్నది।
దృశ్య విషయములను, అనేకత్వముతో కూడిన విశేషములను, సంబంధ - అనుబంధ బాంధవ్యములను, ప్రాపంచక సంఘటనలను మననము చేయుటచే ఈ జీవునికి వాటిపట్ల అనురాగము, కామ - క్రోధములు, వాటి నుండి కర్మ పరంపరలు ఏర్పడుచున్నాయి.
కర్మల వెంట పరుగిడుచున్న చిత్తము ఇష్టాయిష్టములకు, ఆశ - నిరాశలకు, భయ - ఉద్వేగములకు వశమై ఈ జీవునికి బలవంతముగా జన్మకర్మ పరంపరలను 14 లోకములలో సంప్రాప్తింపజేస్తోంది.
అట్టి జన్మ - కర్మలన్నీ జీవునికి బంధరూపముగా అగుచున్నాయి. జీవుడు వాటికి బద్ధుడై, ఇష్టము లేకపోయినప్పటికీ, బలవంతముగా జన్మ - కర్మ చక్రములో తిరుగాడుచున్నాడు.
అట్టి జీవుడు పొందుచున్న అజ్ఞానరూప దుఃఖపరంపరలకు ఉపశమనోపాయం?
ఎవ్వడైతే....
- ఆత్మయందే సర్వలోకములను, సర్వలోకములు ఆత్మస్వరూపంగాను దర్శించటం అభ్యసిస్తూ,
- అట్టి ఆత్మోపాసనచే విశుద్ధసత్త్వస్వభావుడై పరిశుద్ధ స్వరూపుడు అగు ప్రయత్నమునందు శీలుడై ఉంటాడో....
అట్టివాడు ‘‘స్వాతంత్ర్యుడు’’ అగుచున్నాడు. సిద్ధపురుషుడు అగుచున్నాడు.
ఆతడు ఏఏ లోకంలో ఏఏ స్వరూపం పొందాలని మనస్సుతో అనుకుంటాడో, తలుస్తాడో, అవన్నీ ఆతనిపట్ల తక్షణమే సిద్ధిస్తాయి.
ఆతడు క్రీడా వినోది అయి తన ఇష్టానుసారంగా జన్మలలో సంచరిస్తాడేగాని, జన్మ - కర్మలచే తాను బద్ధుడు కాడు. జన్మలు ఆత్మోపాసకుని నియమించలేవు. ఆతడు ‘‘సర్వము ఆత్మస్వరూపమేకదా!’’ అను సిద్ధిచే జన్మలకు తానే నియామకుడౌతాడు. అవతారమూర్తి అయి, స్వతంత్రుడై జన్మలయందు లీలావినోదిగా సంచారములు సలుపుతాడు. జన్మలు ఆతని ఆధీనంలో ఉంటాయి.
జన్మల ఆధీనంలో ఆతడుండడు.
కనుక,
ఈ జీవునికి బంధ విముక్తికై ఆత్మజ్ఞానము - ఆత్మసాక్షాత్కారము - ఆత్మాహం భావనయే బంధ విముక్తి ప్రదాత। మోక్ష ప్రదాత।
6.) తృతీయ ముండకే - ద్వితీయ ఖండః
ఓ శౌనకా! ఓ ప్రియ శ్రోతలారా!
ఇంకా వినండి!
బ్రహ్మజ్ఞాని - ఈ ఎదురుగా దృశ్యమానంగా కనిపిస్తున్న బ్రహ్మాండమంతా బ్రహ్మముపై ఆధారపడి ఉన్నట్లు, బ్రహ్మమునకు అభేదమైనట్లు దర్శిస్తూ ఉపాసిస్తున్నాడు. ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాడు. ఎవ్వరైతే నిష్కాములై అట్టి బ్రహ్మవేత్తను శ్రద్ధతో ఆరాధిస్తున్నారో, సేవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో, అట్టివారు కూడా, పరాస్వరూపభావులై ఈ దృశ్య తతంగమును, జన్మపరంపరా న్యాయమును అధిగమించి, వాటినన్నిటినీ అతిక్రమించినవారగుచున్నారు.
అట్లా కాకుండా...
ఎవ్వరైతే అత్యంత భోగాసక్తులై ‘‘కామాన్యః కామయతే’’, - ఏవేవో బాహ్య వస్తువులను పొందాలని కోరుకుంటూ, అట్టివాడు ఆయా భోగములను ‘‘మరల - మరల పొందాలి, అనుభవించాలి’’ అని తలుస్తూ ఉంటే,... దృశ్య సంఘటనలకు, సందర్భములకు దాసులై, మరల మరల జన్మకర్మలకు బానిస అయి తిరుగాడుచూనే ఉంటున్నాడు.
ఎవ్వడైతే...
‘‘ఆత్మయే స్వరూపముగా గల నేను సర్వదా ఆత్మకాముడను. ఆత్మస్వరూపముచే ఎల్లప్పుడు కృతార్థుడనే’’ అని ఆత్మత్వానుభూతిని పదిలపరచుకుంటూ సుస్థిరం చేసుకుంటూ ఉండే ప్రయత్నంలో ఉంటాడో,...ఆతని దృశ్యసంబంధమగు కామములన్నీ (All Expectations and Desires) ఆతని వర్తమాన శరీరమునందే లయించి, రహితమైపోతున్నాయి.
ఆతనికి దేహ - దేహాంతర సందర్భముల పట్ల దృశ్య - వస్తు సంబంధమైన కోరికలు ఇక మిగిలి ఉండవు.
కలిగినా, వాటినన్నిటినీ జగత్తులోనే ఉంచి, సమస్త జగత్తును త్యజించివేస్తున్నాడు. జగత్తు కంటే ఆవల దృష్టిని ఆశ్రయించినవాడై ఉంటున్నాడు.
ఓ శౌనకా!
మనము ఈ సంవాదమును ముగించటానికి ముందుగా, ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం అందరికీ గుర్తుచేస్తున్నాను. పట్టుదల - ప్రయత్నమే ఆత్మతత్త్వ సిద్ధికి ఇంధనము సుమా!
శ్లో।। న అయమ్ ఆత్మా ప్రవచనేన లభ్యో।
న మేధయా న బహునా శ్రుతేన।
యం ఏవ ఏషః వృణుతే తేన లభ్యః,
తస్య ఏష ఆత్మా వివృణుతే తనుం స్వాం।।
ఆత్మజ్ఞానమును సముపార్జించుకొని ఋషులు జ్ఞానతృప్తులై, సర్వ రాగములను తూక్షీ ణాకరించుచున్నవారై, కృతకృత్యులై, ప్రశాంతత్త్వమును సంతరించుకొని ఉంటున్నారు.
ఓ శౌనకా! ఓ ప్రియ మమాత్మస్వరూప శ్రోతలారా! అట్టి ‘‘ఆత్మానుభూతి, స్వస్వరూపానందము’’ మనందరిలోని ప్రతి ఒక్కరికి తప్పక సుసాధ్యమే! అది ప్రతి జీవునికి జన్మహక్కు కూడా! ఎందుకంటే మనమంతా సర్వదా సత్యమగు ఆత్మస్వరూపులమే అయి ఉన్నాము కదా! కనుక ఈ విషయంలో ఎవ్వరూ కూడా నిరుత్సాహపడవలసిన పనిలేదు.
సత్యవ్రతులగు ఋషులు ఆత్మను విని, ఆశ్రయించి, ఆరాధించి సర్వాంతర్యామిత్వమును అనువర్తించి ఆస్వాదిస్తున్నారు. మనపై వాత్సల్యంతో మనకు ప్రకటిస్తున్నారు. అదంతా కూడా వారు మనపై కురిపిస్తున్న అవ్యాజమైన వాత్సల్యము. వారికి మనము కృతజ్ఞులము.
‘అది సుసాధ్యమగు జ్ఞానగమ్యము’. ఇతి ఉపనిషత్ వాణి।
అందుచేత,
మీ ఆత్మతత్త్వమును గ్రహించి ప్రవేశించి బ్రహ్మముగా ప్రకాశించెదరుగాక। జన్మ, కర్మ, మృత్యుహేలపై యుద్ధము ప్రకటించి, అధిగమించెదరుగాక। ‘‘తెలియబడేదానికి ఆవల’’ గల ‘‘తెలుసుకొంటున్నవాని’’ యొక్క వాస్తవ స్వభావమైనట్టి వేదాంత విజ్ఞానమునందు సునిశ్చితమైన బుద్ధి కలవారై న్యాసయోగముచే పరిశుద్ధ మనస్కులు అయి ఇక్కడ ఆత్మను సుస్పష్టం చేసుకుంటున్నారు : -
ఈ దేహాదులను అధిగమించి బ్రహ్మపట్టణములో ప్రవేశిస్తున్నారు. బ్రహ్మమునందు ప్రకాశిస్తున్నారు. అమరులై, సదా ముక్తులై ఈ భూమిని పరమపావనం చేస్తున్నారు.
ఇక ఇక్కడి 15 అంశాలైనట్టి
- పంచ ప్రాణాలు,
- పంచేంద్రియ విషయాలు,
- దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాలు.
వాటివాటి యందు అధిదేవతలయందు లీనమై ఉండియే, బ్రహ్మజ్ఞాని పట్ల ఆభరణములుగాను, సేవకులుగాను ప్రవర్తిస్తున్నాయి.
వారియొక్క జగదంతర్గత వ్యక్తిత్వము, కర్మలు మొదలైనవన్నీ పరము-అక్షయము అగు పరబ్రహ్మమునందు లీనమైనమై ఉంటున్నాయి.
శ్లో।। యథా నద్యః స్యందమానాః సముద్రే
అస్తం గచ్ఛంతి నామరూపే విహాయ,
తథా విద్వాన్ నామరూపాత్ విముక్తః
‘‘పరాత్ పరమ్ పురుషమ్’’ ఉపైతి దివ్యమ్।।
నదులు ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రజలంలో కలసిపోయిన తరువాత ‘‘నేను ఈపేరుగల నదిని’’...అని నదులు నామరూపాలు కలిగి ఉంటున్నాయా? లేదు.
అట్లాగే,...
ఆత్మవేత్తయగు ఆత్మానుభూతిపరుడు నామ - రూపముల నుండి విముక్తుడై (Having been relieved from Individual Name and Form) ‘‘దివ్యము - పరాత్పరము’’ అగు పరబ్రహ్మతత్త్వమునందు లీనమై, బ్రహ్మమే తానై విరాజిల్లుచున్నాడు.
శ్లో।। సయో హ వై తత్ పరమమ్ బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి।।
బ్రహ్మమును ఎఱిగినవాడు బ్రహ్మమే తానై, శోకమును, సుఖ - దుఃఖ, పాప - పుణ్య ద్వంద్వములను అధిగమించివేస్తున్నాడు.
హృదయగుహలోని గ్రంథులయొక్క సర్వచిక్కుముళ్ళు - (All perceptual Blackades) విప్పివేసుకున్నవాడై, సర్వపరిమితులను అంతరంగంలో అధిగమించివేసి, ఇక్కడే ఇప్పుడే అమృతస్వరూపుడగుచున్నాడు.
ఆపై ఇక, దేహముల రాక - పోకలకు - దేహ సంబంధములకు కథ వింటున్నవానివలె కేవల సాక్షి అయి విలసిల్లుచున్నాడు.
ఇక ఆతని వంశంలో అబ్రహ్మవేత్త జన్మించటం లేదు. ఆతడు - తరతి శోకం! తరతి పాప్మానం! తరతి శోకమ్ ఆత్మవిత్)
|
‘‘తదేత్ ఋచ అభియుక్తం’’ |
ఓ ప్రియ శౌనకాది శ్రోతలారా!
ఆత్మతత్త్వమేమిటో, మీ సహజ స్వరూపము సర్వదా వాస్తవానికి ఆత్మయే ఎందుచేత అయి ఉన్నదో,....అటువంటి మూలసూత్ర విశేషాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా। దీనిని ధ్యానించండి. ఉపాసించండి. అనుభవైక వేద్యం చేసుకోండి. ఇది ‘‘ముండక యోగము’’ - అని చెప్పబడుతోంది.
మిమ్ములను ఆశ్రయించి, ఆత్మతత్త్వజ్ఞానము అర్థించిన వారికి అర్హతను అనుసరించి తప్పక విశదపరచండి. ఉపదేశించండి!
అయితే...ఎవ్వరికి అర్హత ఉన్నట్లు?
అట్టి వారికి ఈ బ్రహ్మవిద్య ఆదరణ పూర్వకంగాను వివరణ - సోదాహరణల పూర్వకంగాను మీచే బోధించబడు గాక! తప్పకుండా అట్టివారికి విశదీకరించండి! వదేత! అది బ్రహ్మోపాసనతో సమానము.
ఓ శౌనకా! వింటున్నావు కదా!
ఇప్పుడు నేను చెప్పిన ‘జీవోబ్రహ్మేతి’ అనునది వాస్తవము. పరమసత్యము - చెదరని నిజము.
ఇతి: పూర్వీకుడగు ఋషి అంగిరస ఋషి - భరద్వాజ సగోత్రుడగు సత్యవాహుడు మొదలైనవారికి బోధించిన బ్రహ్మవిద్యానిరూప ఋషి ప్రవచనము. ఉత్తమ వ్రతములు - అభ్యాసములు - ఉపాసనలు నిర్వర్తిస్తున్నవారు, ఉత్తమ ఆశయములు కలవారంతా ఇది వినటానికి ఆశ్రయించటానికి దైనందికం చేసుకోవటానికి అర్హులే! (ఇంతకు మించి జాతి, దేశ, కుల, మత, స్త్రీ, పురుష, ఇత్యాది భేదమేదీ (అర్హతకొరకై) లేదు.
పరమపవిత్రులు, మహనీయులు అగు ఋషిపుంగవులారా!
మీకు ప్రణామము! సాష్టాంగ దండ ప్రణామములు!
కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు!
శరణు...శరణు!
ఇత్యుపనిషత్!
ఇతి ముండకోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।